హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రంలో గడిచిన ఏడాది బ్యాంకులపై వచ్చిన ఫిర్యాదుల సంఖ్య 17 శాతం తగ్గినట్లు రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని బ్యాంకులపై 2011-12లో 5,167 ఫిర్యాదులు వస్తే అది 2012-13 నాటికి 4,303కి తగ్గినట్లు ఆర్‌బీఐ ఆంధ్రప్రదేశ్ అంబుడ్స్‌మెన్ ఎన్. కృష్ణమోహన్ తెలిపారు. ఇందులో అత్యధికంగా 70 శాతం ప్రభుత్వరంగ బ్యాంకులపైన వచ్చినవేనని, దీనికి ప్రధాన కారణం పీఎస్‌యూ బ్యాంకుల శాఖలు, ఖాతాదారుల సంఖ్య ఎక్కువగా ఉండటమేనని ఆయన పేర్కొన్నారు. బుధవారం ఇక్కడ కృష్ణమోహన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ మొత్తం ఫిర్యాదుల్లో ఎస్‌బీఐ, దాని అనుబంధ శాఖలవే 46 శాతంగా ఉన్నట్లు పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల నుంచి వచ్చే ఫిర్యాదుల సంఖ్యలో తగ్గుదల బాగా కనిపించింది. 2012-13 సమీక్షా కాలంలో గ్రేటర్ హైదరాబాద్ రీజియన్ పరిధిలో ఫిర్యాదులు 37 శాతం నుంచి 27 శాతానికి తగ్గితే, మిగిలిన పట్టణాల్లో 34 శాతం నుంచి 31 శాతానికి తగ్గాయి.
వచ్చే ఫిర్యాదుల్లో అత్యధికంగా ఏటీఎం, డెబిట్ కార్డు లావాదేవీలకు సంబంధించినవే ఉంటున్నాయని, ఆ తర్వాతి స్థానంలో పెన్షన్‌కు సంబంధించినవి ఉంటున్నట్లు మోహన్ తెలిపారు. వరుసగా రెండో సంవత్సరంలో కూడా ఆన్‌లైన్ మోసాలు పెరిగాయని కృష్ణ మోహన్ తెలిపారు. మోసం చేయాలనుకునే వారు మొబైల్ ఆపరేటర్ దగ్గరకెళ్ళి ఫోన్ పోయిందని చెప్పి డూప్లికేట్ సిమ్ తీసుకుంటున్నారని, దీనివల్ల వన్‌టైమ్ పాస్‌వర్డ్ కొత్త సిమ్‌కార్డుకొస్తున్నాయన్నారు. మొబైల్ ఆపరేటర్లు డూప్లికేట్ సిమ్ జారీ చేసేటప్పుడు కఠినమైన కేవైసీ నిబంధనలు పాటిస్తే వీటి ని అరికట్టవచ్చన్నారు. నవంబర్ 1 నుంచి ఏటీఎం, డెబిట్ కార్డుల్లో మరికొన్ని రక్షణాత్మకమైన అంశాలను జోడిస్తున్నట్లు తెలిపారు.
జరిమానా పరిమితి పెంపు
గడిచిన ఏడాది వచ్చిన మొత్తం ఫిర్యాదుల్లో 4,112 పరిష్కరించినట్లు తెలిపారు. ఇందులో 63 కేసుల్లో శిక్షలు విధించడమే కాకుండా రూ.84 లక్షలు జరిమానా విధించినట్లు తెలిపారు. ప్రస్తుతం అంబుడ్స్‌మెన్‌కి గరిష్టంగా రూ.10 లక్షలు వరకు మాత్రమే జరిమానా విధించే అధికారం ఉందని, ఇప్పుడు దీన్ని రూ.25 లక్షలకు పెంచాలని ప్రతిపాదించినట్లు ఆయన తెలిపారు.
బ్యాంకులపై తగ్గిన ఫిర్యాదులు
Published Thu, Aug 22 2013 3:24 AM | Last Updated on Fri, Sep 1 2017 9:59 PM
Advertisement
Advertisement