Sakshi Special
-
తెలుగు రాష్ట్రాల్లో క్లెయిమ్స్ సరళతరం: ఐసీఐసీఐ ప్రు లైఫ్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు సంబంధించి క్లెయిమ్స్ ప్రక్రియను సరళతరం చేసినట్లు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ వెల్లడించింది. క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం మూడు ప్రాథమిక డాక్యుమెంట్లను సమరి్పస్తే సరిపోతుందని వివరించింది. ఐఎఫ్ఎస్సీ కోడ్ ఉన్న బ్యాంకు అకౌంటు నంబరు లేదా క్యాన్సిల్ చేసిన చెక్ కాపీ, డెత్ సరి్టఫికెట్ లేదా ఆస్పత్రులు, పోలీసులు, ప్రభుత్వాధికారులు జారీ చేసిన మృతుల జాబితా, ఆధార్ వంటి ధృవీకరణ పత్రాలను ఇవ్వొచ్చని పేర్కొంది. మొబైల్ యాప్ ద్వారా లేదా ఎస్ఎంఎస్ ద్వారా క్లెయిమ్‌ను రైజ్ చేయొచ్చని వివరించింది. ఇరవై నాలుగ్గంటలూ పనిచేసే టోల్ ఫ్రీ క్లెయిమ్కేర్ హెల్ప్‌లైన్ 1800–2660ని ప్రారంభించినట్లు సంస్థ పేర్కొంది. -
S Jaishankar: ఆ విమానంలో నా తండ్రి కూడా ఉన్నారు
జెనీవా: ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఇటీవల విడుదలై వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ‘ఐసీ 814: ది కాందహార్ హైజాక్’వెబ్‌సిరీస్‌పై ఇంకా చర్చ జరుగుతున్న వేళ అలాంటి హైజాక్ ఉదంతంలో తన తండ్రి, మాజీ ఐఏఎస్ అధికారి కృష్ణస్వామి సుబ్రహ్మణ్యం కూడా బాధితుడిగా ఉన్నారని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రకటించారు. 1984 ఏడాదిలో జరిగిన విమాన హైజాక్ ఉదంతంలో తన కుటుంబం సైతం తీవ్ర ఉత్కంఠను ఎదుర్కొందని ఆయన వ్యాఖ్యానించారు. జెనీవాలో ఒక భారతీయసంతతి వ్యక్తులతో భేటీ సందర్భంగా జైశంకర్ తన కుటుంబం గతంలో పడిన వేదనను అందరితో పంచుకున్నారు. ఏడుగురు హైజాకర్లు చొరబడి.. ‘1984 జులై ఐదో తేదీన ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఐసీ 421 విమానం శ్రీనగర్ వెళ్లేందుకు ఢిల్లీ నుంచి టేకాఫ్ అయి మధ్యలో చండీగఢ్ సమీపంలోని పఠాన్‌కోట్‌లో ఆగింది. అప్పుడు ఏడుగురు హైజాకర్లు కాక్‌పిట్‌లోకి చొరబడి విమానాన్ని తమ అ«దీనంలోకి తీసుకున్నారు. విమానాన్ని హైజాక్ చేసిన వారంతా ఆలిండియా సిఖ్ స్టూడెంట్స్ ఫెడరేషన్‌కు చెందిన వాళ్లు. సిక్కు వేర్పాటువాది జరై్నల్ సింగ్ భింద్రన్‌వాలేతోపాటు ఇతర నేతలను విడుదలచేయాలని డిమాండ్ విధించారు. విమానాన్ని లాహోర్‌కు, తర్వాత కరాచీకి, చిట్టచివరకు దుబాయ్‌కు తీసుకెళ్లారు. విమానం విదేశీగడ్డపైకి వెళ్లడంతో భారత విదేశాంగ శాఖ సైతం రాయబారం నడిపేందుకు రంగంలోకి దిగింది. ఇండియన్ ఫారిన్ సరీ్వస్‌లో చేరిన తొలినాళ్లలో.. అప్పుడు నేను ఇండియన్ ఫారిన్ సరీ్వస్(ఐఎఫ్ఎస్) యువ అధికారిగా పనిచేస్తున్నా. ప్రయాణికులన విడిపించేందుకు హైజాకర్లతో చర్చలు జరపాల్సిన బృందంలో నేను కూడా సభ్యునిగా ఉన్నా. అత్యంత కీలకమైన పనిలో నిమగ్నంకావాల్సి ఉన్నందున ఇంటికి రాలేనని చెప్పేందుకు మా అమ్మకు ఫోన్ చేశా. అప్పుడు నా భార్య ఉద్యోగానికి వెళ్లింది. ఇంట్లో పసిబిడ్డగా ఉన్న నా కుమారుడిని మా అమ్మ ఒక్కరే చూసుకుంటోంది. ‘‘ఇంటికి రావడం కుదరదు. ఇక్కడ విమానాన్ని హైజాక్ చేశారు’’అని చెప్పా. అయితే పనిలో సీరియస్‌గా మునిగిపోయాక నాలుగు గంటల తర్వాత నాకో విషయం తెల్సింది. అదేంటంటే నా తండ్రి కృష్ణస్వామి కూడా అదే విమానంలో బందీగా ఉన్నారు. ఓవైపు హైజాక్ విషయం తెల్సి ప్రయాణికుల కుటుంబసభ్యులు భారత ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. బాధిత కుటుంబసభ్యుల్లో నేను ఉన్నా. మరోవైపు ప్రభుత్వం తరఫున మాట్లాడాల్సిన వ్యక్తిని కూడా నేను. ఇలాంటి విచిత్రమైన పరిస్థితి నాది. ఏదేమైనా 36 గంటల ఉత్కంఠ తర్వాత ఖలిస్తాన్ మద్దతుదారులు అధికారుల ఎదుట లొంగిపోవడంతో కథ సుఖాంతమైంది. విమానంలోని 68 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. హైజాక్ ఉదంతం విషాదాంతంగా ముగియకుండా ఒక సమస్యకు పరిష్కారంగా మలుపు తీసుకుంది’’అని అన్నారు. ‘‘నేనింకా కాందహార్ వెబ్‌సిరీస్ చూడలేదు. అయితే హైజాకర్లతో ప్రభుత్వం, మధ్యవర్తులు కాస్తంత వెనక్కి తగ్గి మాట్లాడినట్లుగా అందులో చూపించారట కదా. సినిమాల్లో హీరోను మాత్రమే అందంగా చూపిస్తారు. ప్రభుత్వం సరిగా పనిచేసినా చూపించరు’’అని అన్నారు. అణ్వస్త్ర విధానాల్లో సుబ్రహ్మణ్యం కీలకపాత్ర మాజీ ఐఏఎస్ అధికారి అయిన కృష్ణస్వామి హైజాక్ జరిగిన ఏడాది ఢిల్లీలోని డిఫెన్స్ స్టడీస్, అనాలసిస్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు. ఆ తర్వాత భారత ‘అణ్వస్త్ర’విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ప్రముఖ అంతర్జాతీయ వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడిగా పేరొందారు. ‘‘అణ్వాయుధాలను తొలుత భారత్ తనంతట తానుగా ఏ దేశం మీదా ప్రయోగించకూడదు. ఒక వేళ భారత్ మీద ఎవరైనా అణ్వాయుధం ప్రయోగిస్తే ధీటైన సమాధానం చెప్పే స్థాయికి మనం ఎదగాలి’’అనే ప్రాథమిక సిద్ధాంతాల్లో రూపకల్పనలో ఈయన పాత్ర ఉందని చెబుతారు. జాతీయ భద్రతా మండలి సలహా బోర్డుకు తొలి కనీ్వనర్‌గా వ్యవహరించారు. హైజాకర్లతో చర్చల వేళ ‘‘కావాలంటే మొదట నన్ను చంపండి. ప్రయాణికులను ఏమీ చేయకండి’’అని హైజాకర్లతో కృష్ణస్వామి అన్నారని నాటి పాత్రికేయులు రాజు సంతానం, దిలీప్ బాబ్లు చెప్పారు. -
విదేశాల్లో కీలక ఖనిజాలపై ఎన్ఎండీసీ దృష్టి
న్యూఢిల్లీ: విదేశాల్లో కీలక ఖనిజ వనరులపై దృష్టి సారించినట్టు ప్రభుత్వరంగ ఐరన్ ఓర్ ఉత్పత్తి సంస్థ ఎన్ఎండీసీ ప్రకటించింది. పర్యావరణ అనుకూల శుద్ధ ఇంధన వనరులకు కేంద్రం ప్రాధాన్యం ఇస్తుండడం తెలిసిందే. వీటి కోసం కాపర్, లిథియం, నికెల్, కోబాల్ట్ అవసరం ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రభుత్వరంగ సంస్థలు విదేశాల్లో ఈ కీలకమైన ఖనిజాల అన్వేషణ అవకాశాలను పరిశీలిస్తుండడం తెలిసిందే. ఇందులో ఎన్ఎండీసీ కూడా ఒకటి. ‘‘లిథియం, కోబాల్ట్, నికెల్ తదితర ఖనిజ అవకాశాలను సబ్సిడరీ సంస్థ లెగసీ ఇండియా ఐరన్ ఓర్ ద్వారా పరిశీలిస్తున్నాం. ఆస్ట్రేలియాలో లిథియం మైనింగ్ కూడా ఈ అన్వేషణలో భాగంగా ఉంది’’అని ఎన్ఎండీసీ తన ప్రకటనలో వివరించింది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి 8 మిలియన్ టన్నుల కోకింగ్ కోల్ ఉత్పత్తి ప్రారంభిస్తామని తెలిపింది. దీంతో దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుందని పేర్కొంది. 2030 నాటికి రెట్టింపు స్థాయిలో 100 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ ఉత్పత్తి లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు చెప్పింది. రూ.2,200 కోట్ల పెట్టుబడులు:‘‘కేవలం ఉత్పత్తి పెంపునకే మా కార్యాచరణ పరిమితం కాదు. బాధ్యతతో చేయడం ఇది. పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించి, సమాజానికి సానుకూల ఫలితాలు అందించేందుకు కట్టుబడి ఉన్నాం’’అని ఎన్ఎండీసీ సీఎండీ అమితవ ముఖర్జీ వివరించారు. 45 మిలియన్ టన్నుల నుంచి 100 మిలియన్ టన్నుల ఉత్పత్తికి విస్తరించేందుకు పెద్ద మొత్తం నిధులు అవసరం పడతాయంటూ.. 2024–25లోనే ఇందుకు రూ.2,200 కోట్లు కేటాయించినట్టు ఎన్ఎండీసీ తెలిపింది. స్లర్నీ పైపులైన్, కొత్త ప్రాసెసింగ్ ప్లాంట్లపై పెట్టుబడులు పెట్టనున్నట్టు, సామర్థ్య విస్తరణకు, పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించేందుకు ఇవి కీలకమని వివరించింది. కేకే లైన్ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా రైలు ద్వారా ఐరన్ ఓర్ రవాణాను విస్తరించనున్నట్టు తెలిపింది. ఐరన్ ఓర్ వనరులను గరిష్ట స్థాయిలో వినియోగించుకునేందుకు వీలుగా బచేలీలో 4 మిలియన్ టన్నుల బెనిఫికేషన్ ప్లాంట్, నాగర్నార్లో 2 మిలియన్ టన్నుల పెల్లెట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది. -
భారత్, చైనా సరిహద్దుల్లో సైనికీకరణ ఆందోళనకరం
జెనీవా: తూర్పు లద్ధాఖ్‌లో భారత్–చైనా సరిహద్దులో నాలుగేళ్ల క్రితం మొదలైన ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రయత్నాలు ఊపందుకున్నాయని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చెప్పారు. వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల నుంచి ఇరుదేశాల సైన్యం వెనక్కి వెళ్లిపోయే విషయంలో చైనాతో నెలకొన్న సమస్యలు 75 శాతం పరిష్కారమైనట్లు తెలిపారు. చేయాల్సింది ఇంకా మిగిలే ఉందని పేర్కొన్నారు. గురువారం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఓ చర్చా కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడారు. 2020లో జరిగిన గల్వాన్ లోయ ఘర్షణలు భారత్–చైనా సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపాయని పేర్కొన్నారు. సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితులు ఉంటేనే ఇరుదేశాల మధ్య సంబంధాలు బలపడతాయని ఉద్ఘాటించారు. భారత్, చైనా సైన్యం మధ్య ఘర్షణలకు పూర్తిగా తెరదించడానికి నాలుగేళ్లుగా చర్చలు జరుగుతున్నాయని వివరించారు. తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల వెంబడి భారత్, చైనా సైన్యం వెనక్కి వెళ్తుండగా, మరోవైపు అక్కడ మిగిలి ఉన్న రెండు దేశాల సేనలు ఎదురెదురుగా సమీపంలోకి వస్తుండడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. సరిహద్దుల్లో సైనికీకరణ జరుగుతోందని వెల్లడించారు. ఈ సమస్యను కచి్చతంగా పరిష్కరించాల్సి ఉందన్నారు. సేనలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని భారత్, చైనా నిర్ణయం తూర్పు లద్దాఖ్‌లో వివాదాస్పద సరిహద్దుల నుంచి తమ సేనలను సాధ్యమైనంత త్వరగా పూర్తిగా ఉపసంహరించుకోవాలని భారత్, చైనా నిర్ణయించుకున్నాయి. ఈ దిశగా ప్రయత్నాలను వేగవంతం, రెట్టింపు చేయాలని తీర్మానించుకున్నాయి. భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గురువారం రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశమయ్యారు. సరిహద్దుల్లో శాంతి, సామరస్యం నెలకొనాలని తాము కోరుకుంటున్నామని అజిత్ దోవల్ ఈ సందర్భంగా తేలి్చచెప్పారు. వాస్తవా«దీన రేఖను(ఎల్ఏసీ)ని గౌరవించాలని వాంగ్ యీకి సూచించారు. భారత్, చైనా మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలంటే ఎల్ఏసీని గౌరవించాల్సిందేనని స్పష్టంచేశారు. -
హరియాణా బీజేపీ సర్కారుకు కౌంట్‌డౌన్
న్యూఢిల్లీ/చండీగఢ్/కురుక్షేత్ర: హరియాణాలోని బీజేపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని మాజీ సీఎం భూపీందర్ హుడా వ్యాఖ్యానించారు. అవినీతి, చేతగాని ప్రభుత్వం గద్దెదిగడం ఖాయ మని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం కుంభకోణాలు, తప్పుడు హామీలతో పదేళ్లుగా ప్రజలను దోచుకుందని, అందుకు ఇప్పుడు మూల్యం చెల్లించనుందని ఆయన ఆరోపించారు. నామినేషన్ వేసిన ప్రముఖులు: కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా కుమారుడు ఆదిత్య సూర్జే వాలా, మాజీ సీఎం బన్సీలాల్ మునిమనవరాలు, బీజేపీకి చెందిన శ్రుతి చౌదరి, కురుక్షేత్ర ఎంపీ నవీన్ జిందాల్ తల్లి సావిత్రీ జిందాల్ గురువారం నామినేషన్లు వేసిన ప్రముఖుల్లో ఉన్నారు. -
పెరూ మాజీ అధ్యక్షుడు ఫుజిమొరి కన్నుమూత
లిమా (పెరూ): పెరూ మాజీ అధ్యక్షుడు అల్బెర్టో ఫుజిమొరి బుధవారం రాజధాని లిమాలో కన్నుమూశారు. దీర్ఘ కాలంగా క్యాన్సర్‌తో పోరాడి మరణించారని ఆయన కుమార్తె కీకో ఫుజిమొరి ‘ఎక్స్’లో ప్రకటించారు. విద్యావేత్త నుంచి పెరూ రాజకీయాల్లోకి మెరుపులా వచ్చిన ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాయి. అవే సంస్కరణలు ఆయన్ను చిక్కుల్లోకీ నెట్టాయి. వామపక్షాల సహకారంతో అధికారంలోకి వచ్చి తిరుగుబాటుదారులపై తీవ్రమైన అణచివేతను అమలు చేశారు. చివరకు దేశం నుంచి పారిపోయి, ఆ తరువాత జైలు పాలై.. తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. పరిస్థితి విషమించడంతో 86 ఏళ్ల వయసులో మృతి చెందారు. 2026 ఎన్నికల్లో అధ్యక్ష పదవికి మళ్లీ పోటీ చేయాలని తన తండ్రి భావిస్తున్నారంటూ కొన్ని నెలల క్రితం కీకో ప్రకటించడం గమనార్హం.ఆర్థిక వ్యవస్థ బలోపేతం.. పెరూ స్వాతంత్య్ర దినం 1938 జూలై 28వ తేదీన రాజధాని లిమాలో ఫుజిమొరి జని్మంచారు. ఈయన కు టుంబం జపాన్ నుంచి వలస వచ్చింది. గణిత శాస్త్రవేత్త, వ్యవసాయ ఇంజనీర్ అయిన ఫుజిమొరి 1990 ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఆయనెవరికీ తెలియదు. తన ప్రచార ర్యాలీల్లో ట్రాక్టర్ నడుపుతూ అందరినీ ఆకట్టుకున్నారు. వామపక్షాల భారీ మద్దతుతో ప్రఖ్యాత రచయిత మారియో వర్గాస్ లోసాను ఓడించి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. ద్రవ్యోల్బణం తగ్గిస్తానన్న హామీతో అధికారంలోకి వచి్చన ఫుజిమొరి రెండో వారంలోనే నిత్యావసరాలపై సబ్సిడీలను ఎత్తివేయడం ‘ఫుజీ–షాక్’గా పేరుగాంచింది. డజన్ల కొద్దీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించారు. వాణిజ్య సుంకాలను తగ్గించారు. ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలు పెరూ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయి. లాటిన్ అమెరికాలో అత్యంత స్థిరమైన ఆర్థిక వ్యవస్థగా మారడానికి పునాదులు వేశాయి. ఇక స్వేచ్ఛా–మార్కెట్ సంస్కరణలు, కఠినమైన ఉగ్రవాద వ్యతిరేక చట్టాల అమలు కోసం రాజ్యాంగాన్ని పునర్నిరి్మంచారు. వ్యతిరేకత.. అణచివేత.. కేసులు.. 1992లో పార్లమెంట్‌పైకి యుద్ధ ట్యాంకులను ఉపయోగించడంతో పెరూ ప్రజల్లో ఆయనపై వ్యతిరేకత పెరిగింది. పదేళ్ల పాలనలో అవినీతి కుంభకోణాలు కూడా ప్రజలను ఆయనకు వ్యతిరేకంగా మార్చాయి. అయినా రెండోసారి అధికారంలోకి వచ్చాక తిరుగుబాటుదారులపై తీవ్రమైన అణచివేత, నిర్బంధం అమలు చేశారు. 2000లో మూడోసారి గెలిచిన తరువాత ఫుజిమొరి ఉన్నత సలహాదారు, గూఢచారి చీఫ్ వ్లాదిమిరో మాంటెసినోస్ రాజకీయ నాయకులకు లంచం ఇస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో ఫుజిమొరి తన పూరీ్వకుల జపాన్‌కు పారిపోయారు. టోక్యో నుంచి ఫ్యాక్స్ ద్వారా రాజీనామా లేఖ పంపారు. రెండు దేశాల పౌరసత్వం ఉన్న ఆయన.. ఆ తరువాత జపాన్ సెనేటర్ పదవికి పోటీపడి ఓడిపోయారు. షైనింగ్ పాత్ మిలిటెంట్ల అణచివేతకు ఆదేశించారనే ఆరోపణలతో ఫుజిమొరిపై పలు కేసులు నమోదయ్యాయి. 25 ఏళ్ల జైలు శిక్ష 2005లో పెరూకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 2007లో చిలీ వచి్చన ఆయన్ను అక్కడి అధికారులు 2009లో పెరూకు అప్పగించారు. పలు కేసుల్లో దోషిగా 25 ఏళ్ల జైలుపాలయ్యారు. తరచూ అనారోగ్యం పాలవ్వడంతో క్షమాభిక్ష కోసం అప్పీలు చేశారు. అయితే జైలు నుంచి బయటకు రావడానికి అదో ఎత్తుగడగా ప్రత్యర్థులు తోసిపుచ్చారు. అప్పటి అధ్యక్షుడు పెడ్రో పాబ్లో కుజిన్స్కి 2017లో ఫుజిమొరికి క్షమాభిక్ష ప్రసాదించారు. కొన్ని నెలల తరువాత కుజిన్‌స్కీ అభిశంసనకు గురయ్యారు. పెరూ న్యాయస్థానం ఫుజిమొరి క్షమాభిక్షను రద్దు చేసి, ప్రత్యేక జైలుకు పంపింది. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయనకు 2023లో కోర్టు క్షమాభిక్షను పునరుద్ధరించింది. అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే మొదటి భార్య సుసానాతో విభేదాలు రావడంతో విడిపోయారు. తరువాత ఆయన కుమార్తె కీకోను ప్రథమ మహిళగా నియమించారు. ఆమె మూడుసార్లు పెరూ అధ్యక్ష పదవికి పోటీ పడి, ఓడిపోయారు. కుమారుడు కెంజో కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. -
పట్టాలపై లైఫ్‌లైన్
నర్సు ఓల్గా.. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంతటా విరామం లేకుండా తిరుగుతూనే ఉన్నారు. రోగుల ఆక్సిజన్ స్థాయిలను తనిఖీ చేసి నోట్ చేసుకుంటున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న రోగులను ఓ కంట కనిపెడుతున్నారు. ఓ ఆస్పత్రిలో ఇదో సాధారణ దృశ్యం. కానీ ఆమె పనిచేస్తున్నది నడుస్తున్న రైలులో. వైద్యం అందిస్తున్నది యుద్ధంలో గాయాలపాలైన సైనికులకు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడానికి ఉక్రెయిన్ ఈ రైలాస్పత్రిని నడుపుతోంది. ఆ దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఇప్పుడిది కీలక భాగంగా మారింది. యుద్ధంలో గాయపడిన సైనికుల కోసం తూర్పు ఉక్రెయిన్‌లోని చాలా నగరాల్లోని ఆసుపత్రుల్లో పడకలు లేవు. అవి ఖాళీ చేయడానికి కొందరిని సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లాల్సి వస్తుంది. అంబులెన్సుల్లో సుదూర ప్రయాణంతో సైనికుల ప్రాణాలకే ముప్పుకావచ్చు. రష్యా దాడుల నేపథ్యంలో హెలికాప్టర్ అంబులెన్స్‌లు కూడా ఉపయోగించలేరు. ఈ క్లిష్ట స్థితిలో రైళ్లు సైనికుల ప్రాణాలను కాపాడుతున్నాయి. గాయపడిన సైనికులను ఆస్పత్రికి తీసుకెళ్లేలోగానే ఇందులోని బోగీలు పూర్తి స్థాయి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లుగా పనిచేస్తున్నాయి. ఆర్మీ డాక్టర్లు, ఇతర సిబ్బంది సైనికులకు రైలులోనే సేవ లు అందిస్తున్నారు. కదులుతున్న రైలులో ఐసీయూ యూనిట్ నడపడం చాలా కష్టమైన పని. అయినా సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. ‘ఇక్కడ మా సామర్థ్యం చాలా పరిమితం. ఏదైనా జరిగితే బయటి కన్సల్టెంట్‌ను పిలవలేం. రక్తస్రావాన్ని ఆపడానికి చిన్న చిన్న ఆపరేషన్లు వంటివి చేస్తాం. పెద్ద పెద్ద శస్త్రచికిత్సలు చేయలేం’అని డాక్టర్స్ చీఫ్ ఒకరు తెలిపారు. పర్యాటక రైలు కాస్తా ఆస్పత్రిగా.. యుద్ధం ప్రారంభంలో ప్రపంచాన్ని ఆకట్టుకున్న ఉక్రెయిన్ సమయస్ఫూర్తికి రైలాస్పిత్రి ఒక ఉదాహరణ. 2022 ఫిబ్రవరిలో దేశంపై రష్యా దాడులు ప్రారంభించినప్పుడు ఉక్రెయిన్ వద్ద ఎటువంటి మెడికల్ రైలు బోగీలు లేవు. గాయపడిన సైనికులను సాధారణ రైళ్లలోకి కిటికీల గుండా బలవంతంగా ఎక్కించేవారు. దీనికి పరిష్కారం ఆలోచించిన ఉక్రెయిన్ రైల్వే.. సాధారణ రోజుల్లో పర్యాటకులను కార్పాతియన్ పర్వతాలకు తీసుకెళ్లడానికి ఉపయోగించే రైళ్లను పునరుద్ధరించింది. అలా ఆస్పత్రి రైలుకు రూపకల్పన జరిగిందని ఉక్రెయిన్ రైల్వే ప్యాసింజర్ ఆపరేషన్స్ సీఈఓ ఒలెక్సాండర్ పెర్తోవ్స్కీ చెప్పారు. గంటకు 50 మైళ్ల వేగంతో.. ఈ రైలు గంటకు 80 కిలోమీటర్లు (50 మైళ్లు) వేగంతో ప్రయాణిస్తుంది. సాధారణ రైలు వేగంలో సగమే అయినప్పటికీ ఐసీయూ మాత్రం అటూఇటూ కదిలిపోతూంటుంది. దీంతో పనిచేసేటప్పుడు సిబ్బంది చాలా అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంబులెన్స్ రైళ్లను మొదట 1850లలో క్రిమియన్ యుద్ధం సమయంలో ఉపయోగించారు. కానీ ఈ ఆధునిక వెర్షన్లలో వెంటిలేటర్లు, లైఫ్ సపోర్ట్ యంత్రాలు, అ్రల్టాసౌండ్ స్కానర్లు, పోర్టబుల్ ఎయిర్ కండిషనర్లు ఉన్నాయి. ప్రతి క్యారేజీలో నిరంతర విద్యుత్ కోసం జనరేటర్లుంటాయి. బోగీల్లో పిల్లల చిత్రాలు, ఉక్రెయిన్ జాతీయ జెండాలు ఉంటాయి. గాయపడిన సైనికులకు ఇవి కొంత ఓదార్పును అందిస్తాయి. రెండు భిన్న దృశ్యాలు.. తొమ్మిది గంటల ప్రయాణం తరువాత రైలాస్పత్రి ఒక నగరంలోని రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశించగానే.. అంబులెన్సులు సైనికుల కోసం ఎదురు చూస్తుంటాయి. ఐసీయూ లోని నర్సులు సైనికులను ప్లాట్‌ఫామ్‌పై ఎదురుచూస్తున్న వైద్యులకు అప్పగిస్తారు. స్టేషన్ నుంచి అంబులెన్సులు బయల్దేరి వెళ్లాక ఊపిరి పీల్చుకుంటారు. వారికి ఎదురుగా కొత్తగా రిక్రూట్ అయిన సైనికులతో ఓ రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉంటుంది. తల్లిదండ్రులకు వీడ్కోలు పలుకుతూ పిల్లలు కనపడతారు. సాయంత్రానికి ఆ యువసైనికులు అపస్మారక స్థితిలోనో, తీవ్ర గాయాలతోనే అదే రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. ఈ రెండు దృశ్యాలకు ప్రత్యక్ష సాకు‡్ష్యలు రైలాస్పత్రి సిబ్బందే. యుద్ధం మిగుల్చుతున్న అంతులేని విషాదమిది. ‘యుద్ధ క్షేత్రం నుంచి తీవ్రంగా గాయపడి వచ్చే సైనికులను చూడటం బాధాకరమైన విషయమే. కానీ, వారికి సేవ చేస్తున్నామన్న తృప్తి మాత్రం మాకు మిగులుతుంది’అని చెబుతున్నారు ఐసీయూ నర్సు ఓల్గా. 2015లో సైన్యంలో నర్సుగా చేరిన ఆమె.. 2022 నుంచి యుద్ధంలో గాయపడిన సైనికులకు చికిత్స అందిస్తున్నారు. అలసిపోయాం.. యుద్ధం చెల్లించుకుంటున్న మూల్యానికి ఈ రైలాస్పత్రి ఓ చిన్న ఉదాహరణ. ‘రష్యన్ విసిరిన గ్రెనేడ్‌తో నా చేతులు, భుజాలు, వీపుపై తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు శబ్దాలు నా వినికిడి శక్తినే దెబ్బతీశాయి. నేనే కాదు.. చాలా మందికి మనోధైర్యం ఉంది. కానీ చాలా అలసిపోయారు. ఇలాంటప్పుడు ఏదేమైనా కానీ భారమంతా దేవుడిదే అనుకుంటాం’అని చెబుతున్నారు రష్యా డ్రోన్ దాడిలో గాయపడి రైలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 35 ఏళ్ల సైనికుడు. అలసట యుద్ధక్షేత్రంలోని సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తోందనడానికి ఇదో ఉదాహరణ. ఇద్దరు పిల్లల తండ్రి అయిన ఈయన 18 నెలల నుంచి డోనెట్స్క్ ప్రాంతంలోని పదాతిదళంలో యాంటీ ట్యాంక్ గన్నర్‌గా పనిచేస్తున్నారు. ఇన్ని రోజుల్లో కేవలం 45 రోజులు మాత్రమే ఫ్రంట్‌లైన్‌కు దూరంగా ఉన్నారు. గాయాల నుంచి ప్రేరణ.. ఈయనకు కొన్ని పడకల దూరంలో కూర్చున్న స్టానిస్లావ్ మూడు నెలల క్రితం స్వచ్ఛందంగా సైన్యంలో చేరారు. అతడున్న కందకంపైన డ్రోన్ దాడి జరగడంతో ఊపిరితిత్తులకు గాయమైంది. పక్కటెముకలు విరిగాయి. అయినా స్టానిస్లావ్ పూర్తి భిన్నమైన మానసిక స్థితిలో కనిపించారు. ‘‘గాయపడ్డాక నాలో ఆత్మస్థైర్యం తగ్గలేదు. నేను మరింత ప్రేరణ పొందాను’’అని చిరునవ్వుతో చెబుతున్నారు. యుద్ధంలో ఉక్రెయిన్ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Mamata Banerjee: రాజీనామాకైనా సిద్ధం
కోల్‌కతా: బెంగాల్ ప్రజల కోసం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. వైద్యురాలికి న్యాయం జరగాలని తాను కూడా కోరుకుంటున్నానని తెలిపారు. ‘వైద్యుల సమ్మెపై ప్రతిష్టంభన ఈ రోజుతో తొలిగిపోతుందని ఆశించిన బెంగాల్ ప్రజలకు క్షమాపణ చెబుతున్నాను. జూనియర్ డాక్టర్లు నబన్నా (సచివాలయం)కు వచ్చి కూడా చర్చలకు కూర్చోలేదు. తిరిగి విధులకు వెళ్లాలని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా’ అని మమత గురువారం విలేకరుల సమావేశంలో అన్నారు. ‘సదుద్దేశంతో గత మూడురోజులుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా మెడికోలు చర్చలకు నిరాకరించారు’ అని సీఎం అన్నారు. ‘ప్రజల కోసం నేను రాజీనామా చేసేందుకు సిద్ధం. కానీ ఇది పద్ధతి కాదు. గడిచిన 33 రోజులుగా ఎన్నో అభాండాలను, అవమానాలను భరించాం. రోగుల అవస్థలను దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పథంతో చర్చలకు వస్తారని భావించా’ అని మమత పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించినా.. తమ ప్రభుత్వం జూనియర్ డాక్టర్లపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోబోదని హామీ ఇచ్చారు. ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న పీజీ ట్రైనీ డాక్టర్ హత్యాచారంతో జూనియర్ డాక్టర్లు నిరసనలకు దిగిన విషయం తెలిసిందే. నెలరోజులకు పైగా వీరు విధులను బహిష్కరిస్తున్నారు. సెపె్టంబరు 10న సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలను బేఖాతరు చేశారు. మమత సమక్షంలో చర్చలకు జూడాలు డిమాండ్ చేయగా.. బెంగాల్ ప్రభుత్వం దానికి అంగీకరించి వారిని గురువారం సాయంత్రం 5 గంటలకు చర్చల కోసం నబన్నాకు రావాల్సిందిగా ఆహా్వనించింది. అయితే ప్రత్యక్షప్రసారం ఉండాలనే జూడాల డిమాండ్‌ను ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో చర్చలు జరగలేదు. రెండుగంటలు వేచిచూశా సమ్మె చేస్తున్న డాక్టర్లను కలవడానికి రెండు గంటల పాటు సచివాలయంలో వేచిచూశానని, వారి నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదని మమత అన్నారు. గురువారం సాయంత్రం 5:25 గంటలకు సచివాలయానికి చేరుకున్న డాక్టర్లు ప్రత్యక్షప్రసారానికి పట్టుబట్టి బయటే ఉండిపోయారు. ప్రత్యక్షప్రసారం డిమాండ్‌కు తాము సానుకూలమే అయినప్పటికీ హత్యాచారం కేసు కోర్టులో ఉన్నందువల్ల న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయనే.. చర్చల రికార్డింగ్‌కు ఏర్పాట్లు చేశామని మమత వివరించారు. ‘పారదర్శకత ఉండాలని, చర్చల ప్రక్రియ పక్కాగా అధికారిక పత్రాల్లో నమోదు కావాలనే రికార్డింగ్ ఏర్పాటు చేశాం. సుప్రీంకోర్టు అనుమతిస్తే జూడాలతో వీడియో రికార్డును పంచుకోవడానికి కూడా సిద్ధం పడ్డాం’ అని మమత చెప్పుకొచ్చారు. రహస్య పత్రాలపై ఇలా బాహటంగా చర్చించలేమన్నారు. గడిచిన నెలరోజుల్లో వైద్యసేవలు అందక రాష్ట్రంలో 27 మంది చనిపోయారని, 7 లక్షల మంది రోగులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ‘15 మందితో కూడిన ప్రతినిధి బృందాన్ని చర్చలకు పిలిచాం. కానీ 34 మంది వచ్చారు. అయినా చర్చలకు సిద్ధపడ్డాం. చర్చలు సాఫీగా జరగాలనే ఉద్దేశంతోనే వైద్యశాఖ ఉన్నతాధికారులెవరినీ పిలువలేదు (వైద్యశాఖ కీలక అధికారుల రాజీనామాకు జూడాలు డిమాండ్ చేస్తున్నారు)’ అని మమతా బెనర్జీ అన్నారు. నబన్నాకు చేరుకున్న జూనియర్ డాక్టర్లను ఒప్పించడానికి ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్, డీజీపీ రాజీవ్ కుమార్‌లు తీవ్రంగా ప్రయత్నించారు. ముమ్మర సంప్రదింపులు జరిపారు. అయినా జూడాలు తమ డిమాండ్‌పై వెనక్కితగ్గలేదు. ప్రభుత్వం జూడాలను చర్చలకు పిలవడం రెండురోజుల్లో ఇది మూడోసారి. రాజకీయ ప్రేరేపితంచర్చలు జరపాలని తాము చిత్తశుద్ధితో ఉన్నామని, అయితే డాక్టర్ల ఆందోళనలు రాజకీయ ప్రేరేపితమని మమతా బెనర్జీ సూచనప్రాయంగా చెప్పారు. ‘డాక్టర్లలో చాలామంది చర్చలకు సానుకూలంగా ఉన్నారు. కొందరు మాత్రమే ప్రతిష్టంభన నెలకొనాలని ఆశిస్తున్నారు’ అని ఆరోపించారు. బయటిశక్తులు వారిని నియంత్రిస్తున్నాయన్నారు. ఆందోళనలు రాజకీయ ప్రేరేపితమని, వాటికి వామపక్షాల మద్దతుందని ఆరోపించారు. మమత రాజీనామా కోరలేదు: జూడాలు ప్రత్యక్షప్రసారాన్ని అనుమతించకూడదనే సర్కారు మొండి పట్టుదలే చర్చలు కార్యరూపం దాల్చకపోవడానికి కారణమని జూనియర్ వైద్యులు ఆరోపించారు. తామెప్పుడూ సీఎం మమతా బెనర్జీ రాజీనామా కోరలేదని స్పష్టం చేశారు. ప్రతిష్టంభనకు వైద్యులే కారణమని మమత పేర్కొనడం దురదృష్టకరమన్నారు. తమ డిమాండ్లు నెరవేరేదాకా విధుల బహిష్కరణ కొనసాగిస్తామని తేలి్చచెప్పారు. -
NCPCR: మదర్సాల్లో బాలల హక్కుల ఉల్లంఘన
న్యూఢిల్లీ: మదర్సాల్లో విద్యార్థులకు సరైన విద్య బోధించడం లేదని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్) ఆందోళన వ్యక్తం చేసింది. చాలావరకు మదర్సాలు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని, అక్కడి పాఠ్యపుస్తకాల్లో అభ్యంతకర అంశాలు కనిపిస్తున్నాయని పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో తాజాగా సమగ్ర అఫిడవిట్ సమరి్పంచింది. నాణ్యమైన, సమగ్రమైన విద్య పొందడం బాలల ప్రాథమిక హక్కు కాగా, ఆ హక్కు మదర్సాల్లో ఉల్లంఘనకు గురవుతోందని ఆక్షేపించింది. విద్యాహక్కు చట్టం–2009 సైతం ఉల్లంఘనకు గురవుతున్నట్లు తెలియజేసింది. మదర్సాల్లో తగిన విద్యా బోధన జరగకపోగా, మరోవైపు ఆరోగ్యకరమైన వాతావరణం, జీవితంలో పైకి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడం లేదని అఫిడవిట్లో స్పష్టంచేసింది. బిహార్, మధ్యప్రదేశ్, పశి్చమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో ముస్లిమేతరులను సైతం చేర్చుకొని, ఇస్లామిక్ మత విద్య బోధిస్తున్నారని తప్పుపట్టింది. ఇలా చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 28(3)కు విరుద్ధమేనని తేలి్చచెప్పింది. ‘‘మదర్సాల్లో బోధిస్తున్న విద్య పిల్లలకు పూర్తిగా ఉపయోగపడేది కాదు. అక్కడ సరైన పాఠ్యప్రణాళిక లేదు. విద్యాహక్క చట్టం సెక్షన్ 29లో పేర్కొన్న మూల్యాంకన విధానాలు అమలు కావడం లేదు. అర్హత లేదని ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. నిధుల విషయంలోనూ పారదర్శకత కనిపించడం లేదు. క్రీడలు, సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించడం లేదు. విద్యాహక్కు చట్టం నిర్దేశించిన ప్రమాణాలను లెక్కచేయకుండా చాలావరకు మదర్సాలు సొంతంగానే ఉపాధ్యాయులను నియమించుకుంటున్నాయి. వారికి తగిన విద్యార్హతలే ఉండడం లేదు. మదర్సాల్లో సంప్రదాయ విధానాల్లో ఖురాన్‌తోపాటు ఇతర మత గ్రంథాలు బోధిస్తున్నారు. ఇదంతా అసంఘటితమైన, అసంబద్ధమైన విద్యా వ్యవస్థగా రూపుదిద్దుకుంటోంది. పాఠ్యాంశాలు అభ్యంతకరంగా ఉంటున్నాయి. అత్యున్నత మతం ఇస్లాం మాత్రమే అని పిల్లల మెదళ్లలోకి ఎక్కిస్తున్నారు’’ అని పేర్కొంది. -
Russia-Ukraine war: ‘ఖైదీ’ సైనికులు
వాళ్లంతా కొన్ని నెలల క్రితం దాకా ఖైదీలు. పలు నేరాలకు శిక్షను అనుభవిస్తున్న వారు. కానీ ఇప్పుడు మాత్రం దేశ రక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి మరీ పోరాడుతున్న సైనిక వీరులు! రష్యాతో రెండేళ్లకు పైగా సాగుతున్న యుద్ధంలో నానాటికీ పెరుగుతున్న సైనికుల కొరతను అధిగమించేందుకు ఉక్రెయిన్ తీసుకున్న వినూత్న నిర్ణయం వారినిలా హీరోలను చేసింది. ఎంతోమంది ఖైదీలు పాత జీవితానికి ముగింపు పలికి సైనికులుగా కొత్త జీవితం ప్రారంభించారు. ఫ్రంట్ లైన్లో పోరాడుతూ, కందకాలు తవ్వడం వంటి సహాయక పనులు చేస్తూ యుద్ధభూమిలో దేశం కోసం చెమటోడుస్తున్నారు.రష్యాతో రెండున్నరేళ్ల యుద్ధం ఉక్రెయిన్ను సైనికంగా చాలా బలహీనపరిచింది. ఈ లోటును భర్తీ చేసుకుని రష్యా సైన్యాన్ని దీటుగా ఎదుర్కోవడానికి ఖైదీల వైపు మొగ్గు చూపింది. ఇందుకోసం ఉక్రెయిన్ కొత్త చట్టం చేసింది. దాని ప్రకారం వాళ్లను యుద్ధంలో సైనికులుగా ఉపయోగించుకుంటారు. అందుకు ప్రతిగా యుద్ధం ముగిశాక వారందరినీ విడుదల చేస్తారు. అంతేకాదు, వారిపై ఎలాంటి క్రిమినల్ రికార్డూ ఉండబోదు! దీనికి తోడు ఫ్రంట్లైన్లో గడిపే సమయాన్ని బట్టి నెలకు 500 నుంచి 4,000 డాలర్ల దాకా వేతనం కూడా అందుతుంది!! అయితే శారీరక, మానసిక పరీక్షలు చేసి, కనీసం మూడేళ్లు, అంతకు మించి శిక్ష మిగిలి ఉండి, 57 ఏళ్ల లోపున్న ఖైదీలను మాత్రమే ఎంచుకున్నారు. ఈ లెక్కన 27,000 మంది ఖైదీలు పథకానికి అర్హులని ఉక్రెయిన్ న్యాయ శాఖ తేలి్చంది. కనీసం 20,000 మంది ఖైదీలన్నా సైనికులుగా మారతారని అంచనా వేయగా ఇప్పటికే 5,764 మంది ముందుకొచ్చారు. వారిలో 4,650 మంది ఖైదీలు సైనికులుగా అవతారమెత్తారు. ఈ ‘ఖైదీ సైనికు’ల్లో 31 మంది మహిళలున్నారు! 21 రోజుల శిక్షణ తర్వాత వీరు విధుల్లో చేరారు. గట్టి రూల్సే ఖైదీలను ఇలా సైన్యంలోకి తీసుకునేందుకు కఠినమైన నిబంధనలే ఉన్నాయి. హత్య, అత్యాచారం, ఉగ్రవాదం, మాదకద్రవ్యాల నేరాలు, దేశద్రోహం, ఇతర తీవ్ర నేరాలకు పాల్పడిన వారికి పథకం వర్తించబోదు. నేరాలకు పాల్పడిన ఎంపీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా అనర్హులే. అయితే హత్యకు పాల్పడిన ఖైదీలను తమతో చేర్చుకునేందుకు అనుమతివ్వాలని ష్క్వాల్ బెటాలియన్ కోరుతోంది. ఫ్రంట్ లైన్లో అవసరమైన నైపుణ్యాలు వారికి బాగా ఉంటాయని వాదిస్తోంది. కొన్ని కేసుల్లో డ్రగ్స్ నేరాలకు పాల్పడ్డ వారినీ తీసుకుంటున్నారు. జైలరే వారి కమాండర్! తూర్పు ఉక్రెయిన్‌లోని పోక్రోవ్స్్కలో 59 బ్రిగేడ్‌లో 15 మందితో కూడిన పదాతి దళ సిబ్బంది విభాగానికి ఓ గమ్మత్తైన ప్రత్యేకత ఉంది. బ్రిగేడ్ కమాండర్ ఒలెగ్జాండర్ వాళ్లకు కొత్త కాదు. ఆయన గతంలో జైలు గార్డుగా చేశారు. 2022 ఫిబ్రవరిలో యుద్ధం మొదలవగానే సైనిక కమాండర్‌గా మారారు. ఇప్పుడు అదే జైల్లోని ఖైదీలు వచ్చి ఈ బ్రిగేడ్‌లో సైనికులుగా చేరారు. ఆయన కిందే పని చేస్తున్నారు! ‘‘యుద్ధభూమిలో వారు నన్ను మాజీ జైలు గార్డుగా కాక అన్నదమ్ములుగా, కమాండర్‌గా చూస్తారు. అంతా ఒకే కుటుంబంలా జీవిస్తాం. వీరికి తండ్రి, తల్లి, ఫిలాసఫర్... ఇలా ప్రతీదీ నేనే’’ అంటారాయన. సదరు జైలు నుంచి మరో పాతిక మంది దాకా ఈ బ్రిగేడ్‌లో చేరే అవకాశముందట.మట్టి రుణం తీర్చుకునే చాన్స్ జైల్లో మగ్గడానికి బదులుగా సైనికునిగా దేశానికి సేవ చేసే అవకాశం దక్కడం గర్వంగా ఉందని 41 ఏళ్ల విటాలీ అంటున్నాడు. అతనిది డ్రగ్ బానిసగా మారి నేరాలకు పాల్పడ్డ నేపథ్యం. నాలుగు నేరాల్లో పదేళ్ల శిక్ష అనుభవించాడు. ‘‘మా ఏరియాలో అందరు కుర్రాళ్లలా నేనూ బందిపోట్ల సావాసం నడుమ పెరిగాను. ఇప్పటిదాకా గడిపిన జీవితంలో చెప్పుకోవడానికంటూ ఏమీ లేదు. అలాంటి నాకు సైన్యంలో చేరి దేశం రుణం తీర్చుకునే గొప్ప అవకాశం దక్కింది. ఇలాగైనా మాతృభూమికి ఉపయోగపడుతున్నాననే తృప్తి ఉంది. కానీ సైనిక జీవితం ఇంత కష్టంగా ఉంటుందని మాత్రం అనుకోలేదు. కాకపోతే బాగా సరదాగా కూడా ఉంది’’ అని చెప్పుకొచ్చాడు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇదిగో కూజా..!
ఇదేమిటో గుర్తు పట్టారా? దాదాపు మూడు వారాల క్రితం ఇజ్రాయెల్‌లోని హెక్ట్ మ్యూజియంలో ఏరియల్ గెలర్ అనే నాలుగేళ్ల చిన్నారి పొరపాటున తాకడంతో కింద పడి ముక్కలైపోయిన 3,500 ఏళ్ల నాటి అరుదైన కూజా ఇది. పట్టి చూస్తే తప్ప పగిలిన ఆనవాళ్లు కని్పంచకుండా రిస్టొరేషన్ నిపుణుడు రో షెఫర్ సారథ్యంలోని బృందం దాన్ని అత్యంత నైపుణ్యంతో ఇలా తిరిగి అతికించింది. బుధవారం నుంచి కూజాను మ్యూజియంలో మళ్లీ ప్రదర్శనకు ఉంచారు. ఇంతటి అరుదైన కూజా పగిలిపోయినా మ్యూజియం సిబ్బంది హుందాగా స్పందించిన తీరు అందరి మనసులూ గెలుచుకుంది. బాలున్ని గానీ, అతని తల్లిదండ్రులను గానీ వాళ్లు ఏమాత్రమూ నిందించలేదు. పైగా ‘పిల్లలన్నాక ఇలా చేస్తుంటారు, మరేం పర్లే’దంటూ ఊరడించారు. జరిమానా చెల్లిస్తామన్నా అలాంటిదేమీ అక్కర్లేదన్నారు. మ్యూజియం చీఫ్ దగ్గరుండి మరీ వారికి మ్యూజియం అంతా తిప్పి చూపించారు. గిల్టీ ఫీలింగ్ నడుమ సరిగా చూశారో లేదోనని పది రోజులు పోయాక మరోసారి మ్యూజియం సందర్శనకు ఆహా్వనించారు. ఆ సందర్భంగా చిన్నారి గెలర్ ఒక మట్టి కూజా తీసుకెళ్లి బహూకరించడంతో సిబ్బంది తెగ ఆనందపడిపోయారు. బాలునితో చాలాసేపు గడపడమే గాక పగిలిన కూజాలను ఎలా అతికిస్తారో ప్రత్యక్షంగా చూపించారు. ‘‘పురాతత్వ వస్తువులను తాకి చూస్తే వాటిపై అనురక్తి కలుగుతుంది. వాటిని తాకి చూస్తే చరిత్ర, పురాతత్వ శా్రస్తాల పట్ల పిల్లల లేత మనసుల్లో గొప్ప ఆస్తకి పుట్టవచ్చు. ఎవరికి తెలుసు?! అందుకే అవి సందర్శకులకు చేతికందే సమీపంలోనే ఉండాలి తప్ప అద్దాల అరల్లో కాదన్నదే ఇప్పటికీ మా అభిప్రాయం’’ అని మ్యూజియం చీఫ్ చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే అతికించిన కూజాను రక్షణ వలయం వంటివేవీ లేకుండా తాజాగా మళ్లీ సందర్శకులకు అందుబాటులోనే ఉంచడం విశేషం! -
USA Presidential Elections 2024: కమలదే పై చేయి
డిబేట్ కోసం ప్రత్యర్థులిద్దరూ ఏబీసీ వేదికపైకి రాగానే హారిసే చొరవ తీసుకుని ట్రంప్ దగ్గరికి వెళ్లి కరచాలనం చేశారు. తద్వారా ముందే పైచేయి సాధించారు. డిబేట్ చక్కగా సాగాలని ఆమె ఆకాంక్షించగా, ‘హావ్ ఫన్’ అంటూ ట్రంప్ స్పందించారు.గంటా నలభై ఐదు నిమిషాల పాటు సాగిన డిబేట్ ముగిశాక మాత్రం కరచాలనం వంటివేమీ లేకుండానే ఎవరికి వాళ్లు వేదిక నుంచి నిష్క్రమించారు.డిబేట్ పొడవునా హారిస్ పదేపదే ట్రంప్‌ను ఉడికించే వ్యాఖ్యలు చేశారు. పలు కేసుల్లో ఆయన దోషి అని ఇప్పటికే నిరూపణ అయిందంటూ ఎత్తిచూపారు. ఆయనపై మరెన్నో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. ట్రంప్ మాట్లాడుతుండగా పదేపదే నవ్వులు, ప్రశ్నార్థక చూపులతో ఆయన్ను ఒత్తిడిలోకి నెట్టారు.ఈ ఎత్తుగడలన్నీ బాగా ఫలించాయి. హారిస్ ఇలాంటి విమర్శలు చేసినప్పుడల్లా ట్రంప్ తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఆగ్రహంలో అదుపు తప్పి పదేపదే అబద్ధాలు, అవాస్తవాలు చెప్పారు.ఆఫ్రో అమెరికన్ల ఓట్ల కోసం హారిస్ ఇటీవల ఆమె నల్లజాతి మూలాలను పదేపదే చెప్పుకుంటున్నారన్న తన గత వ్యాఖ్యలపై స్పందించేందుకు ట్రంప్ నిరాకరించారు. హారిస్ మాత్రం పలు సందర్భాల్లో ట్రంప్ చేసిన వివాదాస్పద జాతి వివక్షపూరిత, విద్వేష వ్యాఖ్యలన్నింటినీ ఏకరువు పెట్టారు.వాషింగ్టన్: అంతా అత్యంత ఉత్కంఠతో ఎదురు చూసిన తొలి, బహుశా ఏకైక ప్రెసిడెన్షియల్ డిబేట్లో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59)దే పై చేయి అయింది. ఆమె దూకుడు ముందు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (78) వెలవెలబోయారు. మంగళవారం రాత్రి పెన్సిల్వేనియాలో ఏబీసీ వార్తా సంస్థ వేదికగా జరిగిన డిబేట్లో మాజీ అధ్యక్షునిపై హారిస్ ఆద్యంతం స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించారు. దాదాపుగా ప్రతి అంశంలోనూ ట్రంప్‌ను చిత్తు చేశారు. ఆమె పక్కాగా హోం వర్క్ చేసి వచి్చన తీరు డిబేట్లో అడుగడుగునా కని్పంచింది. తొలుత కాస్త తడబడ్డా డిబేట్ సాగుతున్న కొద్దీ హారిస్ దూకుడు కనబరిచారు. పదునైన పంచ్‌లతో, టైమ్లీ వన్ లైనర్లతో ఎక్కడికక్కడ ట్రంప్‌ను ఇరుకున పెట్టారు. ఆర్థిక వ్యవస్థ మొదలుకుని విదేశీ విధానం, వలసలు, అబార్షన్ల దాకా ప్రతి అంశం మీదా చర్చను తను కోరుకున్న దిశగా నడిపించడంలో విజయవంతమయ్యారు. పూర్వాశ్రమంలో లాయర్ అయిన హారిస్ వాదనా పటిమ ముందు ట్రంప్ నిలువలేకపోయారు. చాలావరకు ఆమె ప్రశ్నలకు, లేవనెత్తిన అంశాలకు వివరణలు ఇచ్చుకోవడానికే పరిమితమయ్యారు. తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్లో అధ్యక్షుడు జో బైడెన్‌ను ట్రంప్ ఓ ఆటాడుకోవడం తెలిసిందే. ట్రంప్ పచ్చి అబద్దాలు చెప్పినా బైడెన్ కనీసం వాటిని వేలెత్తి చూపలేకపోయారు. పైగా ప్రసంగం మధ్యలో పదేపదే ఆగుతూ, పదాల కోసం తడుముకుంటూ, వయోభారంతో వణుకుతూ అభాసుపాలయ్యారు. ఈ దారుణ వైఫల్యంతో చివరికి పోటీ నుంచే బైడెన్ తప్పుకోవాల్సి వచి్చంది. ఆయన స్థానంలో అధ్యక్ష రేసులోకి వచ్చిన హారిస్ మాత్రం తాజా డిబేట్లో ట్రంప్‌కు చెమటలు పట్టించారు. ‘‘మన దేశాన్ని ఎలా నడపాలన్న ప్రధానాంశంపై ఈ రాత్రి మీరు ఇంతసేపూ రెండు భిన్నమైన వాదనలు విన్నారు. ఒకటి భవిష్యత్తుపై దృష్టి పెట్టిన నా వాదన. రెండోది గతం గురించి మాత్రమే మాట్లాడిన, దేశాన్ని వెనక్కే తీసుకెళ్లజూస్తున్న ట్రంప్ వాదన’’ అంటూ డిబేట్‌ను అంతే ప్రభావవంతంగా ముగించారు హారిస్.అబార్షన్‌పై హారిస్ → ట్రంప్ గెలిస్తే అబార్షన్లను నిషేధిస్తూ చట్టం తెస్తారు. → గర్భధారణలు, అబార్షన్లను ప్రభుత్వం వేయి కళ్లతో గమనిస్తుంటుంది. → అమెరికన్ల శరీరాలకు సంబంధించిన కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోరాదన్నదే నా వైఖరి. → ట్రంప్ మాత్రం మహిళల శరీరాలపై హక్కులు ప్రభుత్వాలవేనంటున్నారు.ట్రంప్ → అబార్షన్లపై నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉండాలన్నదే నా విధానం. → అదిప్పటికే అమల్లో ఉంది. కనుక దీనిపై అసలు గొడవ గానీ, భిన్నాభిప్రాయాలు గానీ లేవు. → అంతే తప్ప నేనేమీ అబార్షన్లను నిషేధించబోవడం లేదు. → ఈ విషయంలో హారిస్ చెప్పేవన్నీ అబద్ధాలే.ఎన్నికల ర్యాలీలపైహారిస్ → ట్రంప్ ఎన్నికల ర్యాలీలు ఆద్యంతం పరమ బోరుగా సాగుతున్నాయి.→ జనాన్ని ఆకట్టుకునేలా మాట్లాడటంలో ఆయన ఘోరంగా విపలమవుతున్నారు. → విండ్ మిల్లుల వల్ల క్యాన్సర్ వస్తుంది వంటి కామెంట్లతో అభాసుపాలవుతున్నారు. → ట్రంప్ ప్రసంగం వినలేక జనం మధ్యలోనే వెళ్లిపోతున్నారు.ట్రంప్ → అన్నీ శుద్ధ అబద్ధాలు. బైడెన్–హారిస్ విధానాలతో అమెరికా అన్ని రంగాల్లోనూ కుదేలవుతోంది. అందుకే అమెరికన్లు పాత రోజులను కోరుకుంటున్నారు.→ దాంతో నా ర్యాలీలకు జనం పోటెత్తుతున్నారు. → వాటికి అమెరికా చరిత్రలోనూ అపూర్వమైన ఆదరణ దక్కుతోంది. → హారిస్ తన ర్యాలీలకు డబ్బులిచ్చి జనాన్ని రప్పించుకుంటున్నారు.ఆర్థిక వ్యవస్థపైట్రంప్: ఈ విషయంలో నేనేం చేయబోతున్నదీ అందరికీ తెలుసు. నా హయాంలో కరోనా కల్లోలాన్ని తట్టుకుంటూ అమెరికా ఆర్థిక వ్యవస్థను గొప్పగా మలిచా. దాన్ని మరోసారి చేసి చూపిస్తా. పన్నులకు భారీగా కోత పెడతా. హారిస్ మార్క్సిస్టు. మార్క్సిస్టు తండ్రి నుంచి పాఠాలు నేర్చుకున్నారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్థిక విధానాల్లో ఆమె ఇప్పుడు నా భాషనే మాట్లాడుతున్నారు. కానీ గెలిచారంటే మాత్రం దేశాన్ని సర్వనాశనం చేస్తారు. బైడెన్‌కు, ఆమెకు తేడా లేదు. హారిస్: నేను బైడెన్నూ కాను, ట్రంప్‌ను అంతకన్నా కాను. ఈ విషయంలో నేను చెప్పదలచుకున్నది ఒక్కటే. దేశానికి కొత్త తరం నాయకత్వాన్ని అందిస్తా. ఉత్త మాటలే తప్ప నిజానికి ఆర్థిక వ్యవస్థను మెరుగు పరిచేందుకు ట్రంప్ వద్ద ఎలాంటి ప్రణాళికా లేదు. తన క్షేమం తప్ప ఆయనకు మీరెవరూ పట్టరు. మధ్యతరగతి నేపథ్యం నుంచి వచి్చన నాకు ఆర్థికంగా దేశానికి ఏం కావాలో బాగా తెలుసు.వలసలపైట్రంప్ సరిహద్దుల నుంచి లక్షలాది మంది చొరబడుతున్నారంటే వలసల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న హారిసే ప్రధాన కారణం. వాళ్లు మన పెంపుడు జంతువులను కూడా తినేస్తున్నారు. ఈ చొరబాట్లు అమెరికాకు చాలా చేటు చేస్తాయి.హారిస్ ట్రంప్ వల్లే వలసల బిల్లు బుట్టదాఖలైందని విమర్శించడం మినహా ఈ అంశంపై పెద్దగా ఏమీ మాట్లాడలేదు. వలసదారులు పెంపుడు జంతువులను తింటున్నారన్న ట్రంప్ వ్యాఖ్యలపై అమెరికన్లే పెదవి విరుస్తున్న నేపథ్యంలో వాటిపై వ్యూహాత్మక మౌనం పాటించారు.యుద్ధాలు, విదేశీ వ్యవహారాలపై... ట్రంప్ → నేను గెలిస్తే ఉక్రెయిన్ యుద్ధానికి ఒక్క రోజులో ముగింపు పలుకుతా. నేను ప్రెసిడెంట్‌గా ఉంటే యుద్ధం జరిగేదే కాదు. (ఉక్రెయిన్ గెలవాలనుకుంటున్నారా అన్న మోడరేటర్ల ప్రశ్నకు బదులు దాటవేశారు. పైగా యుద్ధానికి మిలియన్ల మంది బలయ్యారని అవాస్తవాలు చెప్పారు) → 2021లో అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సైన్యం వైదొలగడం దేశ చరిత్రలోనే అత్యంత సిగ్గుచేటైన సందర్భం. → ఇజ్రాయెల్‌ను హారిస్ ద్వేషిస్తారు. హారిస్ గెలిస్తే రెండేళ్లలోనే ఇజ్రాయెల్ సర్వనాశనం ఖాయం. అరబ్బులన్నా ఆమెకు ద్వేషమే.హారిస్ → అఫ్గాన్ నుంచి వైదొలగాలన్న బైడెన్ నిర్ణయం నాటి పరిస్థితుల్లో పూర్తిగా సబబే. ట్రంప్ తాలిబన్లతో అత్యంత బలహీన ఒప్పందం చేసుకున్నారు.→ నియంతలంటే ట్రంప్‌కు మహా ఆరాధన.→ నేను ఇజ్రాయెల్‌ను ద్వేషిస్తానన్నది పచ్చి అబద్ధం. యూదు రాజ్యాన్ని మొదటినుంచీ సమర్థిస్తున్నా. అక్టోబర్ 7 దాడి తర్వాత ఇజ్రాయెల్‌కు స్వీయరక్షణకు అన్ని హక్కులూ ఉన్నాయి. కానీ అమాయక పాలస్తీనియన్లు భారీ సంఖ్యలో యుద్ధానికి బలవుతున్నారన్నది కూడా వాస్తవమే. కనుక యుద్ధం తక్షణం ఆగాలి. కాల్పుల విరమణ, బందీల విడుదలే అందుకు మార్గం. దానికోసం కృషి చేస్తా.2020 ఎన్నికల ఫలితాలపైట్రంప్: వాటిలో నిజమైన విజేతను నేనే. క్యాపిటల్ హిల్ భవనంపై దాడితో నాకు సంబంధం లేదు. హారిస్: అమెరికా చరిత్రపై చెరగని మచ్చ ఏదన్నా ఉంటే అది కాపిటల్ హిల్‌పై దాడే. దాన్ని మర్చిపోయి ముందుకు సాగాలి. ట్రంప్‌పై హారిస్ పంచ్‌లు → ట్రంప్ ఓ బలహీన నాయకుడు. తప్పుడు నేత. ఆయన్ను చూసి ప్రపంచ దేశాధినేతలంతా నవ్వుతున్నారు. → అధ్యక్ష పదవికి ట్రంప్ కళంకమని ఆయనతో కలిసి పని చేసిన సైనిక ఉన్నతాధికారులే అంటున్నారు. → ట్రంప్ అంటేనే అబద్ధాలు, అభూత కల్పనలు. ఈ డిబేట్లో కూడా ఆయన చేసేదదే. → ట్రంప్ ఎంతసేపూ తన గురించే మాట్లాడతారు. ప్రజలు ఆయనకు అసలే పట్టరు. దేశానికి కావాల్సింది ప్రజల కోసం పాటుపడే నాయకుడే తప్ప ట్రంప్ వంటి స్వార్థపరుడు కాదు. → ఆయన 2020 ఎన్నికల్లో ఓడిపోయారు. 8.1 కోట్ల మంది ఆయనకు అధ్యక్ష పదవి నుంచి ఉద్వాసన పలికారు (బైడెన్‌కు ఓటేసిన వారి సంఖ్యను ఉటంకిస్తూ). దాన్ని ట్రంప్ ఇప్పటికీ అస్సలు జీరి్ణంచుకోలేకపోతున్నారు.హారిస్‌కే 63 శాతం మంది ఓటు → డిబేట్లో ట్రంప్‌ను హారిస్ చిత్తు చేశారని సీఎన్ఎన్ వార్తా సంస్థ నిర్వహించిన ఫ్లాష్ పోల్‌లో 63 శాతం మంది పేర్కొన్నారు! → ట్రంప్‌కు బాగా అనుకూలమని పేరున్న ఫాక్స్ న్యూస్ కూడా డిబేట్ విజేత హారిసేనని అంగీకరించడం విశేషం. → చర్చకు వేదికైన ఏబీసీ న్యూస్ అభ్యర్థులిద్దరి వ్యాఖ్యలు, ప్రకటనలను లైవ్‌లో అప్పటికప్పుడు ఫ్యాక్ట్ చెక్ చేసింది.ట్రంప్ చెప్పిన వాటిలో చాలావరకు అవాస్తవాలేనని తేలడం విశేషం. -
గాలి నిండా మీథేన్!
పర్యావరణానికి ప్రధాన శత్రువు మనిషేనని మరోసారి రుజువైంది. శిలాజ ఇంధనాల వాడకం, పారిశ్రామికీకరణ వంటి మానవ కార్యకలాపాల వల్ల 20 ఏళ్లలోనే ఏకంగా 67 కోట్ల టన్నుల మేరకు ప్రమాదకర మీథేన్ వాయువు వాతావరణంలోకి విడుదలైందట. స్టాన్‌ఫర్డ్ వర్సిటీ సైంటిస్టుల తాజా అధ్యయనంలో తేలిన చేదు నిజమిది. ఈ దెబ్బకు పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే గాలిలో మీథేన్ పరిమాణం ఏకంగా 2.6 రెట్లు పెరిగిపోయిందని ఆ నివేదిక పేర్కొంది. పైగా, ‘‘ఇవి 2020 నాటి గణాంకాల ఆధారంగా వేసిన లెక్కలు. ఈ నాలుగేళ్లలో పరిస్థితి మరింత దిగజారింది’’ అంటూ హెచ్చరించింది... 2000 నుంచి కొన్నాళ్ల పాటు వాతావరణంలో మీథేన్ పెరుగుదల కాస్త అదుపులోనే ఉంటూ వచ్చింది. కానీ ఆ తర్వాత పలు దేశాలు శిలాజ ఇంధనాల ఉత్పత్తి, వాడకాలను విచ్చలవిడిగా పెంచేయడంతో ప్రమాదకర స్థాయిలో పెరుగుతూ వస్తోంది. బొగ్గు, చమురు, సహజవాయువు తదితరాల వెలికితీత, వాడకం వల్ల వెలువడుతున్న మీథేన్ పరిమాణం గత 20 ఏళ్లలో ఏకంగా 33 శాతం పెరిగిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అలాగే వ్యర్థాలు తదితరాల నుంచి మీథేన్ విడుదలవుతున్న 20 శాతం, వ్యవసాయం వల్ల మరో 14 శాతం పెరిగిందని అధ్యయనం తేలి్చంది! ‘ప్రపంచం పెద్దగా పట్టించుకోవడం లేదు గానీ, వాతావరణంలో పెరిగిపోతున్న మీథేన్ పరిమాణం పర్యావరణానికి పెద్ద విపత్తుగా పరిణమిస్తోంది’ అని అధ్యయనానికి సారథ్యం వహించిన గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ హెడ్, స్టాన్‌ఫర్డ్ వర్సిటీలో పర్యావరణ శాస్త్రవేత్త రాబ్ జాక్సన్ హెచ్చరించారు. ఈ ప్రాజెక్టు గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను ఎప్పటికప్పుడు గమనిస్తుంటుంది. ‘‘2000 సంవత్సరంలో వాతావరణంలోని మొత్తం మీథేన్ పరిమాణంలో మనిషి వాటా 60 శాతంగా ఉండేది. ఇప్పుడది ఎకాయెకి 65 శాతానికి పెరిగింది. భూ వాతావరణంలో మీథేన్ పెరుగుదల కార్బన్ డయాక్సైడ్ (సీఓటూ) కంటే చాలా ఎక్కువగా నమోదవుతోంది. 2015లోనైతే వాతావరణంలో మీథేన్ సాంద్రత గత 80 లక్షల ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీగా నమోదైంది! వాతావరణంలో వేలాది ఏళ్లపాటు ఉండిపోయే సీఓటూతో పోలిస్తే మీథేన్ ఉండేది 12 ఏళ్లే అయినా అది కలగజేసే నష్టం మాత్రం ఎక్కువ. ఎందుకంటే పర్యావరణానికి సీఓటూ కంటే మీథేన్ 82 రెట్లు ఎక్కువ నష్టం చేస్తుంది’’ అని జాక్సన్ వివరించారు. ‘‘మీథేన్, సీఓటూ ఉద్గారాలు ఇలాగే కొనసాగితే 2050 నాటికి ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు ఏకంగా 3 డిగ్రీలకు మించి పెరిగిపోతాయి. అది వినాశనానికి దారితీస్తుంది’’ అని ఆందోళన వెలిబుచ్చారు. ఈ అధ్యయన ఫలితాలు ‘ఎని్వరాన్మెంటల్ రీసెర్చ్ లెటర్స్’లో మంగళవారం ప్రచురితమయ్యాయి.కాగితాల్లోనే లక్ష్యం...మీథేన్ ముప్పుపై అంతర్జాతీయ వేదికలపై ఎన్నోసార్లు చర్చోపచర్చలు జరిగాయి. పర్యావరణ శాస్త్రవేత్తల వరుస ఆందోళనల ఫలితంగా 2021లో దేశాలన్నీ దీనిపై లోతుగా చర్చించాయి. వాతావరణంలో మీథేన్ పరిమాణాన్ని తగ్గిస్తామంటూ ప్రతినబూనాయి. ‘గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్’గా పిలిచే ఒప్పందంపై 100కు పైగా దేశాలు సంతకాలు చేశాయి. మీథేన్ ఉద్గారాలను 2030 నాటికి 30 శాతానికి పైగా తగ్గించాలన్నది దీని లక్ష్యం. ఫలితంగా 2050 నాటికి గ్లోబల్ వార్మింగ్‌లో 0.2 డిగ్రీ సెల్సియస్ మేరకు తగ్గుదల నమోదవుతుందని అంచనా. కానీ ఆచరణలో ఏ దేశమూ చేసింది పెద్దగా ఏమీ లేకపోవడంతో ఈ లక్ష్యం కాగితాలకే పరిమితమైంది. – సాక్షి, నేషనల్ డెస్క్ మీథేన్‌తో పెను ప్రమాదమే⇒ ఏటా 5.8 కోట్ల టన్నుల మీథేన్ వాతావరణంలోకి విడుదలవుతోందని అంచనా. ఇందులో మనిషి వాటాయే ఏకంగా 60 శాతం. ⇒ వ్యవసాయం, శిలాజ ఇంధనాల వెలికితీత, వాటి వాడకం తదితరాల వల్ల 60 శాతం మీథేన్ విడుదలవుతోంది. ⇒ అమెరికాలో కేవలం గ్యాస్ డ్రిల్లింగ్ కారణంగా 2005 నుంచి ఇప్పటిదాకా ఏకంగా 1.17 కోట్ల టన్నుల మీథేన్ విడుదలై ఉంటుందని అంచనా! ⇒ గాల్లో మీథేన్ పరిమాణం పెరిగితే వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ⇒ గ్లోబల్ వార్మింగ్‌కు ప్రధాన కారణమైన గ్రీన్‌హౌజ్ వాయు ఉద్గారాల్లో మీథేన్దే పెద్ద వాటా. ⇒ పారిశ్రామికీకరణ అనంతరం గత 150 ఏళ్లలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు ప్రమాదకరంగా పెరిగిపోతుండటం తెలిసిందే. అందులో మూడో వంతు పెరుగుదల మీథేన్ వల్లే సంభవిస్తోంది! ⇒ వాతావరణంలోని వేడిని మీథేన్ నిర్బంధించి దాన్ని తిరిగి భూమిపైకే పంపుతుంది. మరోలా చెప్పాలంటే భూ ఉపరితలంపై ఓజోన్ పొరలాంటి దాన్ని ఏర్పరుస్తుంది. అలా భూ ఉష్ణోగ్రతలు పైకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. తద్వారా పర్యావరణం నానాటికీ వేడెక్కుతోంది. ⇒ వాయు నాణ్యతను కూడా మీథేన్ బాగా దెబ్బ తీస్తుంది. దాంతో మనుషులతో పాటు జంతువుల్లో కూడా శ్వాసకోశ సంబంధిత సమస్యలు పెరుగుతాయి. ⇒ పర్యావరణానికి కార్బన్ డయాక్సైడ్ కంటే మీథేన్ వల్ల జరిగే నష్టం ఏకంగా 82 రెట్లు ఎక్కువ! ⇒ తాజా అధ్యయనం కేవలం 2020 నాటికి అందులో ఉన్న డేటా ఆధారంగా చేసినదే. ఈ నాలుగేళ్లలో మీథేన్ ప్రభావం మరింత వేగంగా పెరుగుతూ వస్తోందన్నది పర్యావరణవేత్తల మాట. తక్షణం దిద్దుబాటు చర్యలు తప్పవని వారంటున్నారు.భూ సగటు ఉష్ణోగ్రతల పెరుగుదలను అంతర్జాతీయంగా అంగీకరించిన 1.5 డిగ్రీ సెల్సియస్ స్థాయికి పరిమితం చేయాలంటే సీఓటూ ఉద్గారాలను సగానికి, మీథేన్ ఉద్గారాలను మూడో వంతుకు తగ్గించాలి. ఈ దిశగా తక్షణ కార్యాచరణ అత్యవసరం – బిల్ హేర్, క్లైమేట్ అనలిటిక్స్ సీఈఓ, పర్యావరణ శాస్త్రవేత్త -
Covert Creatures: పావురాల నుంచి డాల్ఫిన్ల దాకా..
బెలుగా జాతికి చెందిన అరుదైన పెద్ద గూఢచారి తిమింగలం ‘హవాల్దిమీర్’దక్షిణ నార్వే తీరంలో బుల్లెట్ గాయాలతో విగతజీవిగా కనిపించడం ఇటీవల అంతర్జాతీయ వార్తాంశంగా నిలిచింది. దీంతో అసలు మనిషి ఇంతవరకు ఏ జాతుల జీవులను నిఘా కోసం గూఢచారులుగా వినియోగించుకున్నాడన్న చర్చ మొదలైంది. గూఢచారులుగా ఈ జంతువులు నిర్వర్తించిన విధుల్లేంటి. వాటిల్లో అత్యుత్తమ గూఢచారి ఏది? వంటి ఆసక్తికర అంశాలపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.. గూఢచార జీవులు... అత్యాధునిక పరికరాలు, చిన్న నిఘా కెమెరాలు రాకముందు సుదూర ప్రాంతాలకు రహస్య సమాచారాన్ని సురక్షితంగా చేరవేయడం ఓ సవాలుగా ఉండేది. దీంతో సందేశాలు పంపడానికి పావురాలను ఉపయోగించేవారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో నిఘా కోసం జర్మన్ సైన్యం ప్రత్యేకంగా బుల్లి కెమెరాలు రూపొందించి వాటిని పావురాలకు కట్టింది. వాటిల్లో రికార్డయ్యే సమాచారంతో శత్రు జాడ తెల్సుకునేది. రెండో ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాలూ గూఢచర్యానికి పావురాలనే నమ్ముకున్నాయి. 1970లలో అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) తన ప్రత్యేక నిగా ఆపరేషన్ ‘టకానా’లో భాగంగా బుల్లి కెమెరాలు అమర్చిన పావురాలను సోవియట్ రష్యాలోకి పంపింది. ఇలా పావురాలు మాత్రమే కాదు.. పిల్లులు, తిమింగలాలు, డాల్ఫిన్లు, ఇంకొన్ని రకాల పక్షులు, చనిపోయిన జంతువులు కూడా కోవర్ట్ ఆపరేటర్లుగా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాయి. డాల్ఫిన్లతో ప్రత్యేకంగా.. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో సోవియట్ నావికాదళం సముద్ర క్షీరదాలతో వివిధ కార్యక్రమాలను చేపట్టింది. వీటిలో ఒకటి డాల్ఫిన్లకు శిక్షణ ఇవ్వడం. అమెరికా నావికాదళం సముద్ర క్షీరదాల కార్యక్రమం(ఎంఎంపీ) కింద సముద్రజలాల్లో నిఘా కోసం డాల్ఫిన్లను ఉపయోగించింది. 1960లలో ప్రాజెక్ట్ ఆక్సిగాస్లో భాగంగా శత్రు నౌకలకు పేలుడు పరికరాలను అమర్చేందుకు సీఐఏ డాల్ఫిన్లకు శిక్షణ ఇచి్చంది. ఈ కార్యక్రమానికి సముద్రాల్లో స్వేచ్ఛగా తిరిగే రెండు ‘బాటిల్‌నోస్’డాల్ఫిన్లను ఉపయోగించారు. ప్రపంచంలోని అత్యంత తెలివైన జంతువులుగా డాల్ఫిన్లు ప్రసిద్ధి చెందాయి. క్రిమియాలోని సెవాస్టోపోల్ నల్లసముద్రంలోని నౌకాదళ స్థావరంలో శత్రు డైవర్లను గుర్తించడానికి, ఎదుర్కోవడానికి డాల్ఫిన్లకు శిక్షణ ఇచ్చేందుకు రష్యా గత సంవత్సరం ఒక క్షీరద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని బ్రిటిష్ ఇంటెలిజెన్స్ నివేదిక బహిర్గతంచేసింది. 2023 ఏప్రిల్ నుంచి జూన్ వరకు సెవాస్టోపోల్ నౌకాశ్రయంలో తేలియాడే క్షీరదాల బోనుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు బ్రిటిష్ సైనిక నిఘా ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడైంది. పిల్లుల చెవులకు మైక్రో ఫోన్లు పిల్లులను తెలివైన జంతువులుగా భావిస్తారు. సీఐఏ 1960వ దశకంలో పిల్లులను ఉపయోగించి ‘ఆపరేషన్ అకౌస్టిక్ కిట్టీ’అనే ప్రాజెక్టును అభివృద్ధి చేసింది. దీని కోసం 2 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. ప్రాజెక్టులో భాగంగా పిల్లుల చెవుల్లో మైక్రోఫోన్లను ఏర్పాటు చేసింది. ఇవి సోవియట్ దౌత్యవేత్తలు, ఏజెంట్ల సంభాషణలను రహస్యంగా రికార్డ్ చేస్తాయి. పిల్లి పెంపుడు జంతువు. అది బహిరంగ ప్రదేశాలు, కొన్ని రహస్య ప్రదేశాల్లో అవి ప్రత్యక్షమవడం శత్రు దేశాలకు అనుమానాలు పెంచే అవకాశం ఉంటుంది. అదీగాక పిల్లులను నియంత్రించడం అంత సులభం కాదు. శిక్షణాసమయంలో వాటిని శిక్షకులు నియంత్రించలేక చేతులెత్తేశారు. పిల్లులు వాటికి సూచించిన ప్రాంతాలకు కాకుండా తమకిష్టమైన ప్రదేశాల్లో చక్కర్లు కొట్టాయి. దీంతో చేసేదిలేక చివరికి 1967లో ఈ కార్యక్రమానికి ఫుల్స్టాప్ పెట్టేశారు. టాప్ ఏజెంట్.. పావురం పిల్లులు, చనిపోయిన ఎలుకల వంటివాటిని రంగంలోకి దింపి పని కానిచి్చనప్పటికీ వివిధ దేశాల నిఘా సంస్థలు శతాబ్దాలుగా ఎక్కువ నమ్మకం పెట్టుకున్నది పావురం మీదనే. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ ఇంటెలిజెన్స్ నిర్వహించిన అత్యంత విజయవంతమైన గూఢచారి కార్యక్రమం ‘ఆపరేషన్ కొలంబా’పావురాలతోనే విజయంవంతమైంది. జర్మన్ సైనిక కార్యకలాపాలను, సున్నితమైన సైనిక స్థానాలపై నిఘాను హోమింగ్ జాతి పావురాలు సేకరించాయి. పేపర్‌పై రాసిన సందేశాలను సూక్ష్మ డబ్బాల్లో పెట్టి పక్షి కాలికి కట్టేశారు. ఈ రహస్య సందేశాలలో నాజీ దళాల కదలికలు, నాజీల కొత్త ఆయుధాలపై నివేదికలు, ప్రణాళికాబద్ధమైన రాకెట్ దాడుల వివరాలను వేగులు సేకరించి పావురాల ద్వారా ప్రధాన కేంద్రానికి రహస్యాన్ని పంపేవారు. రచయిత గోర్డాన్ కోరేరా ‘ఆపరేషన్ కొలంబా: ది సీక్రెట్ పీజియన్ సరీ్వస్’పుస్తకంలో ఇలాంటి ఎన్నో వివరాలు ఉన్నాయి. బ్రిటిష్ ఇంటెలిజెన్స్ 1941 నుంచి 1944 మధ్య నాజీ ఆక్రమిత ఐరోపాపై 16,000 హోమింగ్ జాతి పావురాలను వాడారు. అన్నింటికన్నా ముఖ్యంగా పక్షుల ద్వారా గూఢచర్యం విజయవంతంకావడంతో నూతన టెక్నాలజీలకూ కపోతమే స్ఫూర్తిగా నిలిచింది. గత నెలలో చైనా అచ్చం పావురంలాగా ఉండే చిన్నపాటి నిఘా డ్రోన్‌ను ఆవిష్కరించడం తెల్సిందే. గూఢచార పావురాలని... భారత ఉపఖండంలో సందేశాలను పంపించడానికి పావురాలను ఉపయోగించినట్టుగా చరిత్ర చెబుతోంది. 2020 మేలో కశ్మీర్‌లోని ఓ గ్రామంలో నంబర్ల సెట్ ఉంగరం కలిగిన పావురం కనిపించింది. దానిని పట్టుకున్న గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. పాకిస్తాన్‌కు చెందిన గూఢచారి పావురమై ఉంటుందని, దానిపై ఉన్నది కోడ్ అని అనుమానించిన పోలీసులు.. డీ క్రిప్ట్ చేయడానికి ప్రయట్నించారు. చివరికది గూఢచారి పావురం కాదని తేలడంతో విడిచిపెట్టారు. 2016 అక్టోబర్‌లో భారత ప్రధానిని బెదిరిస్తూ మరో పావురం కనిపించింది. పంజాబ్‌లోని పఠాన్ కోట్లో ఈ పావురాన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 2023 మేలో ముంబైలో దొరికిన పావురాన్ని చైనా గూఢచారిగా అనుమానిస్తూ ఎనిమిది నెలల పాటు బోనులో ఉంచి దాని ఆనుపానాలు సేకరించారు. ఆ పావురం కాలుకు ఉంగరాలు కట్టి, దాని రెక్కల కింది భాగంలో చైనీస్ భాషలో ఏదో రాశారు. అయితే అది తైవాన్‌లో రేసింగ్ పోటీలో పాల్గొన్న పక్షి అని ఫిబ్రవరిలో తేలడంతో ఎట్టకేలకు దానిని అధికారులు వదిలేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
70 ఏళ్ల వయసులో మెడికల్ గ్రాడ్యుయేట్‌గా
వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే. అనుకున్న లక్ష్యం సాధించేందుకు వయసు ఏమాత్రం అడ్డురాదని మలేసియాకు చెందిన 70 ఏళ్ల తోహ్ హాంగ్‌కెంగ్ నిరూపించారు. ఇప్పటికే రిటైర్డ్ అయిన తోహ్ ఇటీవల మెడికల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఔరా అనిపించారు. 70 ఏళ్ల వయసులో మెడిసిన్ చేసి ప్రపంచంలో అత్యంత ఎక్కువ వయసులో మెడిసిన్ చేసిన వారిలో ఒకరిగా తోహ్ రికార్డ్ సృష్టించారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ గుర్తుందా..! చిరంజీవి స్టైల్‌గా క్లాస్‌లోకి వస్తుంటే అందరూ ఆయనను ప్రొఫెసర్ అని పొరబడతారు. ఫిలిప్పీన్స్‌లోని సెబులో ఉన్న సౌత్ వెస్ట్రన్ యూనివర్సిటీ పీహెచ్ ఎంఏ విద్యార్థులు సైతం తోహ్ మొదటిసారి క్లాసులో అడుగుపెట్టినప్పుడు అలాగే అనుకున్నారు. కానీ తోటి విద్యార్థి అని తర్వాత తెల్సుకుని ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఆయనను ‘సర్ తోహ్’అంటూ గౌరవంగా పిలుచుకుంటున్నారు. అయితే ఆయన చిన్నతనం నుంచే డాక్టర్ కావాలనేమీ కలలు కనలేదు. అప్పటికే ఆర్థికశాస్త్రం, రసాయన శాస్త్రం, ఎల్రక్టానిక్ ఇంజనీరింగ్ చదివేశారు. తర్వాత ఆయన మనసు మెడిసిన్ వైపు మళ్లింది. 2018లో కిర్గిజిస్తాన్ విహారయాత్రలో ఉండగా ఇద్దరు యువ భారతీయ వైద్య విద్యార్థులను కలిశారు. ఆ పరిచయం ఆయనను వైద్య విద్య పట్ల అమితాసక్తిని పెంచిందని తోహ్ చెప్పారు. 2019లో కార్పొరేట్ ప్రపంచం నుంచి పదవీ విరమణ పొందాక మెడిసిన్ ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యారు. కానీ అన్నిచోట్లా వైద్యవిద్య చదవడానికి వయోపరిమితి అడ్డుగా ఉందని తర్వాత అర్థమైంది. ఈ వయసులోనూ తనను మెడిసిన్ చదివేందుకు అనుమతించే కాలేజీ కోసం తెగ తిరిగారు. అయితే తమ పని మనిషి కూతురు చదివిన ఫిలిప్పీన్స్‌లోని వైద్య పాఠశాలలో వయోపరిమితి లేదని తెలుసుకుని ఎగిరి గంతేశారు. వెంటనే దరఖాస్తు చేసుకోవడం, ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ, తర్వాత సెలక్షన చకచకా జరిగిపోయాయి. పెట్టే బేడా సర్దుకుని అక్కడికి వెళ్లిపోయి స్కూల్లో చేరారు. 2020లో కరోనా విజృంభించడంతో హాంకాంగ్‌కు మకాం మార్చేసి తన క్లాసులన్నీ ఆన్లైన్లో విన్నారు. కుటుంబం, సహాధ్యాయిల సహకారంతో గత జూలైలో మెడిసిన్ పట్టా అందుకున్నారు. రెసిడెన్సీ అనుభవంతో పూర్తిస్థాయి లైసెన్స్డ్ డాక్టర్‌గా మారడానికి ఆయనకు మరో పదేళ్లు పట్టొచ్చు. విదేశీ విద్యార్థుల ట్యూషన్ ఫీజుల కోసం.. మెడికల్ బోర్డు పరీక్ష కోసం ఏడాది పాటు ఇంటర్న్íÙప్, మరింత అధ్యయనం అవసరం. దానికి బదులుగా అతను హాంకాంగ్‌లో స్నేహితుడి సంస్థ అలెర్జీ అండ్ ఇమ్యునాలజీ డయాగ్నస్టిక్స్‌లో కన్సల్టెంట్‌గా పని చేయాలని యోచిస్తున్నారు. త నలాగా మెడిసిన్ చేస్తున్న పేద పిల్లలకు సాయం చేద్దామని భావించారు. ట్యూషన్ ఫీ చెల్లించడానికి కష్టపడే విదేశీ వైద్య విద్యార్థుల కోసం స్కాలర్íÙప్ ఫండ్‌ను ఏర్పాటుచేశారు. అసోసియేషన్ ఆఫ్ అమెరికన్ మెడికల్ కాలేజెస్ ప్రకారం అమెరికాలో ప్రభుత్వ వైద్య పాఠశాలలలో స్థానిక విద్యార్థులకు సంవత్సరానికి సగటు ట్యూషన్ ఫీజు సుమారు 60,000 డాలర్లు. విదేశీ విద్యార్థు లకు 95,000 డాలర్లు ఖర్చు అవుతుంది. ప్రైవేటు వైద్య పాఠశాలల్లో విదేశీయులకు ట్యూషన్, ఫీజులు 70 వేల డాలర్ల వరకు ఖర్చవుతోంది. అంతర్జాతీయ విద్యార్థుల విషయానికొస్తే ఈ మొత్తం చాలా ఎక్కువ. ఫిలిప్పీన్స్‌లో ట్యూషన్ ఫీజులు అంత ఎక్కువగా లేవు. తోహ్ సౌత్ వెస్ట్రన్ వర్సిటీ ఏడాదికి దాదాపు 5,000 డాలర్లు ఖర్చు చేశారు. ఆసియాలో అభివృద్ధి చెందుతున్న దేశాల విద్యార్థులకు ఇది పెద్దమొత్తమే. ఇలాంటివారికి ఆ నిధిని ఖర్చు చేయనున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Russia-Ukraine war: నిప్పులు చిమ్మే డ్రాగన్ డ్రోన్
తమ భూభాగాన్ని దురాక్రమించిన రష్యా సైన్యంతో నెలల తరబడి అలుపెరగక పోరాడుతున్న ఉక్రెయిన్ బలగాల చేతికి కొత్త అస్త్రమొచ్చింది. రష్యా స్థావరాలపై భారీ స్థాయిలో మంటలు చిమ్ముతూ, పొగ వెదజల్లే కొత్త తరహా డ్రోన్‌ను ఉక్రెయిన్ యుద్ధరంగంలోకి దింపింది. అటవీప్రాంతాల్లో నక్కిన రష్యా సైనికులు, వారి యుద్ధట్యాంకులపైకి బుల్లి డ్రోన్లు ఏకధాటిగా నిప్పులు వెదజల్లుతున్న వీడియోను ఉక్రెయిన్ రక్షణ శాఖ ‘ఎక్స్’లో విడుదలచేయడంతో ఈ డ్రోన్ల సంగతి అందరికీ తెల్సింది. రణరీతులను మార్చేస్తున్న అధునాతన డ్రాగన్ డ్రోన్ గురించి అంతటా చర్చమొదలైంది. ఏమిటీ డ్రాగన్ డ్రోన్? చైనాలో జానపథ గాథల్లో డ్రాగన్ పేరు ప్రఖ్యాతిగాంచింది. నిప్పులు కక్కుతూ ఆకాశంలో చక్కర్లు కొట్టే డ్రాగన్ గురించి అందరికీ తెలుసు. అచ్చం అలాగే నిప్పులను వెదజల్లుతూ ఆకాశంలో దూసుపోతుంది కాబట్టే ఈ డ్రోన్‌కు డ్రాగన్ అని పేరు పెట్టారు. సంప్రదాయక డ్రోన్లకు భిన్నంగా పనిచేస్తున్న ఈ డ్రోన్లతో రష్యా బలగాలకు నష్టం పెద్దగా ఉంటుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ డ్రోన్ ప్రత్యేకత ఏంటి? థర్మైట్ ఈ డ్రోన్‌లో ఉన్న ఏకైక ఆయుధం. అత్యధికంగా మండే స్వభావమున్న ఖనిజాన్ని, అల్యూమినియం, ఐరన్ ఆక్సైడ్ పొడి, ఇంకొంచెం ఇనుప రజను మిశ్రమాన్ని మందుగుండుగా వాడతారు. అయితే మిగతా డ్రోన్లలాగా ఇది పేలే బాంబును లక్ష్యంగాపైకి జాడవిడచదు. తనలోని మిశ్రమాన్ని మండించి తద్వారా విడుదలయ్యే మంటను కొంచెం కొంచెంగా అలా దారి పొడవునా వెదజల్లుకుంటూ పోతుంది. ఊపిరి ఆడకుండా దట్టమైన పొగను సైతం వెదజల్లుతుంది. ద్రవరూపంలోకి వారిన ఖనిజం మండుతూ ఏకంగా 4,000 డిగ్రీ ఫారన్‌హీట్ వేడిని పుట్టిస్తుంది. ఇంతటి వేడి శత్రు స్థావరాలను కాల్చేస్తుంది. ఈ ద్రవఖనిజం మీద పడితే మిలటరీ గ్రేడ్ ఆయుధాలు ఏవైనా కరిగిపోతాయి. సముద్రతీర ప్రాంతాల్లో నీటి అడుగున నక్కిన శత్రువుల ఆయుధాలను ఇది కాల్చేస్తుంది. ఎందుకంటే ఇది నీటిలో కూడా మండగలదు. ఇది మీద పడితే సైనికుల శరీరం, ఎముకలు కాలిపోతాయి. మరణం దాదాపు తథ్యం. ఒకవేళ తృటిలో తప్పించుకున్నా మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు థర్మైట్ ఆయుధంతోపాటు అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యంపైకి దూసుకెళ్లడం ఈ డ్రాగన్ డ్రోన్ ప్రత్యేకత. సంప్రదాయక రక్షణ ఉత్పత్తులతో పోలిస్తే ఇది అత్యంత ప్రమాదకరమైందని బ్రిటన్‌లోని యుద్ధవ్యతిరేక దౌత్య సంస్థ ‘యాక్షన్ ఆన్ ఆర్మ్డ్ వయలెన్స్’ పేర్కొంది. దాడి చేయడంతో పాటు నిఘా పనులూ ఇవి ఒకే సమయంలో పూర్తిచేయగలవు. ఎందుకంటే వీటికి స్పష్టమైన కెమెరాలను బిగించారు. యుద్ధట్యాంక్, సైనికుడు, మరేదైనా స్థావరం.. ఇలా శత్రువుకు సంబంధించిన దేనిపై దాడి చేస్తుందో కెమెరాలో ఉక్రెయిన్ బలగాలు స్పష్టంగా చూడొచ్చు.అంకుర సంస్థ చేతిలో.. ఈ డ్రాగన్ డ్రోన్‌ను ఉక్రెయిన్‌లోని స్టార్టప్ సంస్థ ‘స్టీల్ హార్నెట్స్’ తయారుచేసినట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ తయారుచేసిన శక్తివంతమైన థరై్మట్ సాయంతో 4 మిల్లీమీటర్ల మందమైన లోహ ఉపరితలానికి సైతం కేవలం 10 సెకన్లలో రంధ్రం పడుతుందని తెలుస్తోంది. యుద్దం మొదలైననాటి నుంచి ఉక్రెయిన్‌కు అన్ని రకాల ఆయుధాలు అందిస్తూ అమెరికా ఆదుకుంటోంది. అమెరికా తన అమ్ములపొదిలోని థర్మైట్ గ్రనేడ్లను ఉక్రెయిన్‌కు ఇస్తోందా లేదా అనేది తెలియాల్సి ఉంది. అమెరికా ఇస్తేగనక రష్యా సైతం ఇలాంటి ఆయుధాలనే ప్రయోగించడం ఖాయం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అతి పలుచని వాచీ
ప్రపంచంలోనే అతి పలుచని చేతి గడియారాన్ని తయారు చేయడానికి యూరోపియన్ హోరాలజీ దిగ్గజాలన్నీ తెగ పోటీ పడుతుంటేం రష్యాకు చెందిన ఓ స్వతంత్ర వాచ్ మేకర్ ఆ అద్భుతాన్ని సాధించేశాడు. ప్రతిష్ఠాత్మక అకాడెమీ హోర్లోగెర్ డెస్ క్రిటెపెండెంట్స్ ఇండిపెండెంట్స్లో ఏకైక రష్యన్ సభ్యుడైన కాన్స్టాంటిన్ చైకిన్ అనే వ్యక్తి అత్యంత పలుచనైన చేతి గడియారాన్ని రూపొందించారు. దీని మందం కేవలం 1.65 మిల్లీమీటర్లు. బరువైతే 13.3 గ్రాములే! ఆ లెక్కన ప్రపంచంలోనే అతి తేలికైన గడియారమూ ఇదే. గత వారం స్విట్జర్లాండ్‌లో జరిగిన ‘జెనీవా వాచ్ డేస్ ఫెయిర్’లో ఈ వాచీని ప్రదర్శించారు. స్టెయిన్లెస్ స్టీల్, టంగ్స్టన్ కార్బైడ్ వాడటంతో ఇది తేలిగ్గా ఉన్నా చాలా దృఢంగా ఉంటుంది.కాగితం ముక్కంత పలుచన.. విశ్వసనీయమైన, ఖచి్చతమైన, ధరించేంత మన్నికైన అ్రల్టా–స్లిమ్ గడియారాలను ఉత్పత్తి చేయడం ప్రపంచంలోని గడియారాల తయారీదారులకు ఓ సవాలుగా ఉండేది. కానీ ఇటీవలి కాలంలో పలుచని గడియారాల తయారీ పోటీ ఊపందుకుంది. స్విస్ బ్రాండ్ పియాజెట్ 2018లో 2 మిల్లీమీటర్ల మందం కలిగిన గడియారాన్ని తయారు చేసింది. ఇది రెండేళ్ల తరువాత ఉత్పత్తిలోకి వచి్చంది. లగ్జరీ దిగ్గజం బుల్గారి కేవలం 1.8 మిల్లీమీటర్ల మందంతో వాచీని తెచ్చింది. వీటిని తలదన్నుతూ వాచ్ మేకర్ రిచర్డ్ మిల్లే 2022లో కాగితం ముక్కంత పలుచనైన గడియారాన్ని తయారు చేసింది. దాని ఖరీదు 500,000 డాలర్లకు పై చిలుకే! పాకెట్ వాచ్ ప్రేరణతో... 2003లో తన పేరుతోనే వాచ్ మేకింగ్ బ్రాండ్ స్థాపించిన చైకిన్ 20 ఏళ్ల క్రితం 19వ శతాబ్దానికి చెందిన బాగ్నోలెట్ పాకెట్ వాచ్‌ను చూసి పలుచని వాచీలపై ఆసక్తి పెంచుకున్నాడట. సొంతంగా అల్ట్రాథిన్ వాచ్ డిజైన్ చేయాలని ఒక క్లయింట్ సవాలు చేయడంతో రంగంలోకి దిగాడు. ఇప్పుడు తయారు చేసిన బుల్లి వాచీకి మున్ముందు నీలమణి లేదా వజ్రాలను పొదిగే ఆలోచన ఉందట! అనేక పేటెంట్లకు దరఖాస్తులు చేసినా ఇంకా ఏదీ ఖరారు కాలేదని చెప్పుకొచ్చాడు. వచ్చే ఏప్రిల్‌లో జెనీవాలో జరిగే వాచ్స్ అండ్ వండర్స్ ట్రేడ్ షోలో తన డిజైన్ తుది వెర్షన్‌ను సమరి్పస్తానని చెబుతున్నాడు. అప్పటికల్లా తన డిజైన్ మరింత కచ్చితత్వం, పవర్ సంతరించుకుంటుందని చెప్పాడు. ఈ వాచీకి ఇంకా ధర నిర్ణయించలేదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
రెండో ప్రపంచయుద్ధవీరుడికి ఘనంగా పుట్టినరోజు వేడుకలు
రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొన్న సైనికుడు, ప్రతిష్టాత్మక ‘బర్మా స్టార్ అవార్డ్’ గ్రహీత రిటైర్డ్ లాన్స్ నాయక్ చరణ్ సింగ్ 100వ పుట్టినరోజు వేడుకలను భారత సైన్యం ఘనంగా నిర్వహించింది. శనివారం హిమాచల్ ప్రదేశ్‌లోని స్వగృహంలో ఆయనతో కేక్ కట్చేయించి జన్మదిన వేడుకలను ఆరంభించారు. ఆర్మీ తరఫున సైతం బ్రిగేడియర్ అధికారి, సైనికులు పాల్గొనడంతో కార్యక్రమం సందడిగా మారింది. 1924 సెపె్టంబర్ ఏడో తేదీన జన్మించిన చరణ్‌సింగ్ 1942 ఆగస్ట్ 26వ తేదీన భారత్‌లో బ్రిటిష్ సైన్యం ఫిరోజ్పూŠ కంటోన్మెంట్ యూనిట్లో చేరారు. రెండో ప్రపంచయుద్ధంలో వీరోచితంగా పోరాడారు. సింగపూర్ నుంచి లాహోర్ దాకా పలు దేశాల్లో యుద్ధక్షేత్రాల్లో తన ధైర్యసాహసాలను ప్రదర్శించారు. తర్వాత హిమాచల్‌ప్రదేశ్‌లోని యోల్ కంటోన్మెంట్‌లోనూ పనిచేశారు. ‘‘ 17 ఏళ్లపాటు సైన్యంలో చూపిన ప్రతిభకు బర్మా స్టార్ అవార్డ్‌ను, ఇండియన్ ఇండిపెండెన్స్ మెడల్‌ను ఆయన పొందారు. 1959 మే 17న పదవీవిరమణ చేశారు. తర్వాత ప్రస్తుతం తన శేషజీవితాన్ని రోపార్ జిల్లాలోని దేక్వాలా గ్రామంలో గడుపుతున్నారు. ఆయనకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. సొంతింట్లో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో బ్రిగేడియన్ అధికారి, సైనికులు పాల్గొన్నారు. దేశసేవలో తరించిన మాజీ సైనికులను గుర్తుపెట్టుకుని వారిని తగు సందర్భంలో గౌరవిస్తూ భారతసైన్యం పలు కార్యక్రమాలు చేస్తున్న విషయం విదితమే. ఇందులోభాగంగానే శనివారం చరణ్‌సింగ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించినట్లు సైన్యాధికారి ఒకరు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘ దశాబ్దాల క్రితం సైన్యంలో పనిచేసినా సరే ఆర్మీ దృష్టిలో అతను ఎప్పటికీ సైనికుడే. సైన్యంలో భాగమే. సైన్యానికి, పౌరులకు స్ఫూర్తిప్రదాతలుగా వారిని సదా స్మరించుకోవాలి. వారి నుంచి నేటి సైనికులు ఎంతో నేర్చుకోవాలి’ అని సైన్యం పేర్కొంది. – న్యూఢిల్లీ -
వామ్మో మంకీపాక్స్!.. భారత్‌లో అనుమానిత కేసు
ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక మంకీపాక్స్ (ఎంపాక్స్) వైరస్ సెగ భారత్‌కూ తాకింది. మన దేశంలో తాజాగా ‘అనుమానిత’ ఎంపాక్స్ కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఎంపాక్స్ వ్యాప్తి అధికంగా ఉన్న ఓ దేశం నుంచి వచి్చన యువకుడిలో వైరస్ లక్షణాలను గుర్తించినట్లు ఆదివారం ప్రకటన విడుదల చేసింది. ‘‘బాధితుడిని ఆసుపత్రిలో చేర్చి ఐసోలేషన్‌లో ఉంచాం. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అతడితో కలిసి ప్రయాణించిన వ్యక్తులను గుర్తిస్తున్నాం. అతనికి నిజంగా ఎంపాక్స్ సోకిందీ లేనిదీ నిర్ధారించడానికి నమూనాలు సేకరించి పరీక్షిస్తున్నాం’’ అని పేర్కొంది. ‘‘ఇది అనుమానిత కేసే. ఇంకా నిర్ధారణ కాలేదు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని తెలిపింది. వైరస్ విషయంలో ఏ పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు వివరించింది. 99,176 కేసులు.. 208 మరణాలు యూరప్, ఆఫ్రికా దేశాల్లో ఇటీవల మంకీపాక్స్ వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌ను ‘అంతర్జాతీయ ఆరోగ్య విపత్తు’గా ఆగస్టు 14న ప్రకటించింది. ఈ వైరస్ వ్యాప్తి 2022లో వెలుగులోకి వచి్చంది. ఇటీవల ఆఫ్రికాలో కొత్త రకం ఎంపాక్స్ పుట్టుకొచి్చనట్లు తేలింది. 2022 వైరస్ కంటే ఇది మరింత ప్రాణాంతకమని తేలింది. కొత్త వైరస్ లైంగిక సంబంధాల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. 2022 నుంచి 2023 దాకా 116 దేశాల్లో 99,176 ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. 208 మంది మరణించారు. 2024లో 15,600కు పైగా కేసులు నమోదయ్యాయి. 537 మంది మృతిచెందారు. 2022 నుంచి భారత్‌లో కనీసం 30 ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. చివరిసారిగా ఈ మార్చి నెలలో ఒక కేసు బయటపడింది.ఏమిటీ ఎంపాక్స్? 1958లో తొలిసారిగా కోతుల్లో ఈ వైరస్‌ను కనుగొన్నారు. అందుకే దీనికి మంకీపాక్స్ పేరు స్థిరపడిపోయింది. అప్పట్లో పరిశోధన కోసం డెన్మార్క్‌కు తరలించిన కోతుల్లో కొత్త రకం వ్యాధి లక్షణాలు కనిపించడంతో ల్యాబ్ పరీక్షలు జరిపి ఈ వైరస్ ఉనికి కనిపెట్టారు. మనుషుల్లో దీన్ని 1970లో తొలిసారిగా గుర్తించారు. కాంగోలో తొమ్మిదేళ్ల బాలుడికి ఈ వైరస్ సోకింది. మనుషులు, చిట్టెలుకలకూ వైరస్ సోకుతుండటంతో ఎంపాక్స్ అనే పొట్టిపేరు ఖరారుచేశారు. దశాబ్దాల క్రితం లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న మశూచి కారక వైరస్, ఎంపాక్స్ ఒకే జాతికి చెందినవి. గోవులకు సోకే గో మశూచి, వసీనియా వంటి వ్యాధులను కల్గించే వైరస్ కూడా ఈ రకానిదే.ఇలా సోకుతుంది→ అప్పటికే వైరస్ సోకిన మనుషులు లేదా జంతువులను తాకినా, వారితో దగ్గరగా గడిపినా వైరస్ సోకుతుంది. → కుక్క లేదా ఇతరత్రా పెంపుడు జంతువులకు వైరస్ సోకితే అవి మనుషులను కరిచినా, తాకినా, వాటి లాలాజలం, రక్తం, ఇతర స్రావాలు అంటుకున్నా సోకుతుంది. → చర్మంపై గాయాలు, శరీర స్రావాలు, తుమ్మినపుడు పడే తుంపర్లు, నోటి లాలాజలం ఇలా వైరస్‌కు ఆవాసయోగ్యమైన ప్రతి తడి ప్రాంతం నుంచీ సోకుతుంది. → రోగి వాడిన దుస్తులు, వస్తువులను ముట్టుకున్నా, వాడినా, ముఖాన్ని ముఖంతో తాకినా, కరచాలనం చేసినా, ముద్దుపెట్టుకున్నా సోకొచ్చు. → తల్లి నుంచి బిడ్డకు సంక్రమించవచ్చు.వ్యాధి లక్షణాలు ఏమిటీ?→ ఎంపాక్స్ సోకితే చర్మం ఎర్రగా మారి పొక్కులొస్తాయి. సొన చేరి పొక్కులు ఇబ్బంది పెడతాయి. → చర్మంపై దద్దుర్లతోపాటు జ్వరం, భరించలేని తలనొప్పి, కండరాల నొప్పి, వెన్ను నొప్పి వస్తాయి. → 90 శాతం కేసుల్లో ముఖంపై, 75 శాతం కేసుల్లో అరచేతులు, పాదాల మీద, 30 శాతం కేసుల్లో జననాంగాల మీద పొక్కులొస్తాయి. → నీటి బొడిపెలుగా పెద్దవై సొన చేరి ఎర్రగా, నల్లగా మారి పగులుతాయి. → నీరసంగా ఉంటుంది. గొంతెండిపోతుంది.వ్యాక్సిన్ ఉందా? స్వల్ప లక్షణాలు కనిపిస్తే వ్యాధి దానంతట అదే తగ్గిపోతుంది. ప్రస్తుతానికి ఎంపాక్స్‌కు నిర్దిష్టమైన చికిత్స విధానం, వ్యాక్సిన్ లేవు. మశూచికి వాడే టికోవిరమాట్ (టీపీఓఎక్స్ ఎక్స్) యాంటీ వైరల్‌నే దీనికీ వాడుతున్నారు. అమెరికాలో మశూచికి వాడే జెనియోస్ (ఇమ్వామ్యూన్, ఇంవానెక్స్) డ్రగ్స్‌నే 18 ఏళ్ల పై బడిన రోగులకు ఇస్తున్నారు. కోవిడ్ దెబ్బకు సంపన్న దేశాల్లో మాదిరిగా నివారణ చర్యలు, నిర్ధారణ పరీక్షల వంటివి లేక ఆఫ్రికా దేశాల్లో వైరస్ విజృంభిస్తోంది.అప్రమత్తంగా ఉండండి: కేంద్రం పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల్లో ఎంపాక్స్ కేసులు పెరిగిపోతుండటంతో సరిహద్దులతోపాటు ఎయిర్‌పోర్టులు, ఓడరేవుల్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సర్క్యులర్ జారీ చేసింది. ఎంపాక్స్ లక్షణాలు గుర్తించడానికి విదేశాల నుంచి వచ్చేవారికి పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ఎంపాక్స్ సన్నద్ధతపై ప్రధాని ముఖ్య కార్యదర్శి పి.కె.మిశ్రా తాజాగా ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ఈ కేసుల్లో సమర్థ చికిత్స కోసం ఆసుపత్రులను ఇప్పట్నుంచే సిద్ధం చేసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
తిరిగొచ్చిన స్టార్‌లైనర్
వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్తో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) వెళ్లిన స్టార్ లైనన్ స్పేస్‌క్రాఫ్ట్ ఒంటరిగానే తిరిగొచ్చింది. ఆరు గంటల ప్రయాణం తర్వాత స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 9.31 గంటలకు అమెరికాలో న్యూమెక్సికో ఎడారిలోని వైట్ శాండ్ స్పేస్ హార్బర్ సమీపంలో క్షేమంగా దిగింది. ఐఎస్ఎస్ నుంచి కేవలం 10 రోజుల్లో తిరిగి రావాల్సిన స్టార్ లైనర్ సాంకేతిక లోపాల వల్ల మూడు నెలలకు పైగా ఆలస్యంగా భూమిపై అడుగుపెట్టింది. స్టార్ లైనర్‌లో వెనక్కి రావాల్సిన సునీత, విల్మోర్ ఐఎస్ఎస్లోనే ఉండిపోయారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వారు భూమిపైకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. అప్పటిదాకా ఐఎస్ఎస్లోనే ఉండి, అంతరిక్ష పరిశోధనల్లో పాలుపంచుకోనున్నారు. ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో వ్యోమగాములతో అంతరిక్షంలోకి వెళ్లి, ఒంటరిగా తిరిగివచ్చిన మొట్టమొదటి స్పేస్‌క్రాఫ్ట్‌గా స్టార్ లైనర్ రికార్డుకెక్కింది. ఏమిటీ స్టార్ లైనర్? ప్రఖ్యాత బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసిన తొలి అంతరిక్ష వాహక నౌక స్టార్ లైనర్. ఈ ఏడాది జూన్ 5వ తేదీన ప్రయోగాత్మకంగా ఇద్దరు వ్యోమగాములతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపించారు. సునీతా విలియమ్స్, విల్మోర్ స్టార్ లైనర్‌లో ఐఎస్ఎస్కు చేరుకున్నారు. ప్రయాణం మధ్యలో ఉండగానే సాంకేతిక లోపాలు తలెత్తాయి. ఇంజన్‌లోని కొన్ని థ్రస్టర్లు విఫలమయ్యాయి. హీలియం గ్యాస్ లీకైనట్లు గుర్తించారు. తాత్కాలిక మరమ్మత్తులతో స్టార్ లైనర్ ఐఎస్ఎస్తో అనుసంధానమైంది. వాస్తవానికి సునీతా విలియమ్స్, విల్మోర్ 8 రోజులపాటు అక్కడే ఉండి, ఇదే స్టార్‌లైనర్‌లో వెనక్కి తిరిగిరావాలి. మరమ్మత్తులు చేయడం సాధ్యం కాకపోవడంతో వారిని వెనక్కి తీసుకొచ్చే అవకాశం లేకుండాపోయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్పేస్ఎక్స్ సంస్థకు చెందిన ‘డ్రాగన్’ స్పేస్‌క్రాఫ్ట్‌లో వారిద్దరూ భూమిపైకి తిరిగి రానున్నారు. ‘డ్రాగన్’లో నలుగురు వ్యోమగాములు ప్రయాణించడానికి వీలుంది. కానీ, ఇద్దరే ఐఎస్ఎస్కు వెళ్లనున్నారు. వచ్చేటప్పుడు సునీతా విలియమ్స్, విల్మోర్ను కూడా తీసుకురానున్నారు. – వాషింగ్టన్ -
Nostradamus: కమలా హారిస్‌దే విజయం
నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ విజయం సాధిస్తారని అమెరికా ఎన్నికల నోస్ట్రడామస్‌గా పేరొందిన చరిత్రకారుడు అలాన్ లిచ్‌మన్ జోస్యం చెప్పారు. గత నాలుగు దశాబ్దాలుగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అలాన్ దాదాపు ఖచ్చితంగా ఊహించి చెప్పడం విశేషం. అధ్యక్ష రేసు నుంచి ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ని్రష్కమిస్తే వాళ్ల పార్టీ గెలుపు కష్టమేనన్న ఆయన.. ఇప్పుడు హారిస్ వచ్చాక తప్పక విజయం సాధిస్తారని చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. డెమొక్రాట్లు అప్పగించిన కీలక బాధ్యతను స్వీకరించిన కమలా హారిస్ అంతే ధీమాతో దూసుకెళ్తూ మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ను ఓడించేందుకు రెడీ అయ్యారని అలాన్ అభిప్రాయపడ్డారు. ‘‘ఫలితం ఏమిటన్నది మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి బయటకు వచ్చి ఓటు వేయండి’’అని తాజాగా న్యూయార్క్ టైమ్స్‌కు ఇచి్చన 7 నిమిషాల వీడియో ఇంటర్వ్యూలో చెప్పారు. 1984 నుంచి విశ్లేషణలు 1984 ఏడాది నుంచి అమెరికాలో 10 సార్లు అధ్యక్ష ఎన్నికలు జరిగితే తొమ్మిది సార్లు ఈయన చెప్పింది నిజమైంది. దీంతో ఆయన్ను అమెరికా అధ్యక్ష ఎన్నికల నోస్ట్రడామస్‌గా అందరూ పిలుస్తారు. అమెరికన్ విశ్వవిద్యాలయంలో గత యాభై సంవత్సరాలుగా అధ్యాపకుడిగా పనిచేస్తున్న లిచ్‌మాన్ ‘గెలుపునకు 13 సూత్రాలు’అనే విధానాన్ని ప్రతిపాదించారు. ఈ 13 అంశాల ప్రాతిపదికన ఏ పార్టీ, అభ్యర్థి గెలుస్తారని అంచనావేస్తానని చెప్పారు. 2016లో ట్రంప్ గెలుస్తాడని, 2020లో బైడెన్ గెలుస్తాడని చెప్పిన మాటలు నిజం కావడం విశేషం. 2000లో అల్‌గోర్‌పై జార్జి డబ్ల్యూ బుష్ విజయం సాధించడం మినహా మిగిలిన ఫలితాలన్నీ ఆయన చెప్పినట్లుగా రావడం గమనార్హం. 2016 ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ విజయం సాధిస్తారని ప్రధాన ఒపీనియన్ పోల్స్ చెప్పగా.. లిచ్‌మన్ మాత్రం ట్రంప్ తిరుగులేని విజయం సాధిస్తారని అంచనా వేశారు. ట్రంప్ అధ్యక్ష పదవిలో ఉండగా అభిశంసనకు గురవుతారని చెప్పారు. అలాన్ చెప్పినట్లే ట్రంప్ రెండుసార్లు అభిశంసనకు గురయ్యారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏ దేశమేగినా... బొజ్జ గణపయ్యే!
నేడు వినాయక చవితి. విఘ్నాలను తొలగించి, సర్వ కార్యాల్లో విజయం సిద్ధించాలని కోరుకుంటూ గణనాథుడికి పూజలు చేస్తాం. ఆసేతుహిమాచలం మాత్రమే కాదు భారతదేశానికి ఆవల సైతం పూజలందుకుంటున్న అతికొద్ది మంది దేవుళ్లలో వినాయకుడు సైతం ఉన్నాడు. థాయిలాండ్ మొదలు కాంబోడియా, జపాన్, చైనా ఇలా ఎన్నో దేశాల్లో బొజ్జ గణపయ్య ఘనంగా పూజలందుకుంటున్నాడు. ప్రతి ఏటా గణేష్ చతురి్థని జరుపుకుంటూ మహదానందం పొందుతున్నాడు ఆయా దేశాల ప్రజలు. వాణిజ్య, ధారి్మక సంబంధాల కారణంగా ఆగ్నేయాసియాలో అనేక హిందూదేవతలను పూజించడం పరిపాటి. భారత్‌లో మాదిరే వరసిద్ధి వినాయకుడు విదేశాల్లోనూ చక్కని పూజలందుకుంటున్నాడు. అయితే గణపతిని ఆయా దేశాలు వివిధ రూపాల్లో కొలుస్తుండటం విశేషం. విఘ్ననాయకుడిని విశేష రూపాల్లో ఏ దేశం? ఎలా ఆరాధిస్తుందో ఓసారి పరికిద్దాం.. థాయిలాండ్‌లో.. థాయిలాండ్ బౌద్ధులకు వినాయకుడూ ఆరాధ్య దైవమే. క్రీ.శ 550–600 ప్రాంతంలో థాయిలాండ్‌లో లంబోదరుని విగ్రహాలు వెలిశాయి. థాయిలాండ్‌లో మన మోదకప్రియుడిని ఫిరా ఫికానెట్గా కొలుస్తారు. విజయానికి చిహ్నంగా, అడ్డంకులను తొలగించే శక్తిగా భావిస్తారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు, వివాహం సందర్భంగా మహాగణపతిని పూజిస్తారు. గజాననుడి ప్రభావం థాయ్ కళ, వాస్తుశిల్పంలోనూ స్పష్టంగా గోచరిస్తుంది. గణపతి ఆలయాలు దేశవ్యాప్తంగా కోకొల్లలుగా ఉన్నాయి. కాంబోడియాలో ఆగ్నేయాసియా అంతటా మన విఘ్నరాజును పూజిస్తారు. ఈ సంప్రదాయ ఈ ప్రాంతానికి ఎలా వచి్చందనేది మాత్రం తెలియడం లేదు. ఐదు, ఆరో శతాబ్దాలకు చెందిన గణాధ్యక్షుడి శాసనాలు, చిత్రాలు ఆగ్నేయాసియాలో ఉన్నాయి. కంబోడియాలో గణా«దీశుడు ప్రధాన దైవం. ఏడో శతాబ్దం నుంచి ఆయనను దేవాలయాలలో పూజించారు. భక్తులకు మోక్షాన్ని ప్రసాదించే శక్తి ఈ దేవుడికి ఉందని ఇక్కడ నమ్ముతారు. టిబెట్‌లో టిబెట్‌లోనూ మన మంగళప్రదాయుడిని బౌద్ధ దేవుడిగా పూజిస్తారు. ఇక్కడ మహారక్త గణపతిగా, వజ్ర వినాయకుడిగా విభిన్న రూపాల్లో ఆరాధిస్తారు. భారతీయ బౌద్ధ మత నాయకులు అతిసా దీపంకర శ్రీజ్ఞ, గాయధర వంటివారు క్రీస్తుశకం 11వ శతాబ్దంలో టిబెట్ బౌద్ధమతానికి వినాయకుడిని పరిచయం చేసినట్లు చరిత్ర చెబుతోంది. గణేశుడిని టిబెట్, మంగోలియాలో ఉద్భవించిన బౌద్ధమత రూపమైన లామాయిజం పుట్టుకతో ఈ దేశ పురాణాలు ముడిపడి ఉన్నాయి. ధర్మ రక్షకుడిగా, చెడును నాశనం చేసే శక్తిగా, అడ్డంకులను తొలగించే మూర్తిగా వినాయకుడిని బౌద్ధం బోధిస్తోంది. అందుకే ఇక్కడి గణపతి విగ్రహం దృఢంగా, బలమైన కండరాలు, కవచం, దంతాలు, ఆయుధాలతో అలరారుతుంటాయి. ఇతర టిబెటన్ దేవతల మాదిరిగా కోపం కొట్టొచి్చనట్లు ఎరుపు, నలుపు, గోధుమ వర్ణాల్లో విగ్రహాలు కనిపిస్తాయి. ఇండోనేసియాలో.. ఇండోనేసియాలోని జావా ద్వీపంలో కృతనాగర మహారాజు మాంత్రిక కర్మలలో అడ్డంకులను తొలగించే తాంత్రిక దేవతగా వినాయకుడిని పూజించారు. ఇది క్రీ.శ 14–15 వ శతాబ్దాల నాటికి ఇక్కడ అభివృద్ధి చెందిన తాంత్రిక బౌద్ధం, శైవ మతాల కలయికగా గణపతిని ఇక్కడ ఆరాధిస్తారు. పుర్రెలు ధరించి పుర్రెల సింహాసనంపై కూర్చున్న రూపంలో వినాయకుడు పూజలందుకుంటున్నారు. భారత్‌లో సాధారణంగా కనిపించే విగ్రహరూపాల్లోనూ గణపతిని ఇక్కడ పూజిస్తారు. తూర్పు జావా ప్రాంతంలోని తెన్గెర్ సెమెరూ జాతీయ వనంలోని బ్రోమో పర్వతం ముఖ ద్వారం వద్ద 700 సంవత్సరాలనాటి గణనాథుని విగ్రహం ఉంది. బ్రహ్మదేవుని పేరు మీద ఈ పర్వతానికి బ్రోమో పేరు వచి్చంది. అగి్నపర్వతాల విస్ఫోటం నుంచి ఈ విగ్రహం తమను రక్షిస్తుందని స్థానికులు నమ్ముతారు.చైనా, అఫ్గానిస్తాన్‌లలో.. చైనాలో లంబోదరుడిని ‘హువాంగ్ సీ టియాన్’అని పిలుస్తారు. ఆయనను ఒక విఘ్నంగా భావిస్తారు. అఫ్గానిస్తాన్ రాజధా ని కాబూల్ సమీపంలోని గార్డెజ్‌లో క్రీ.శ 6 లేదా 7వ శతాబ్దంలో చెక్కిన ప్రసిద్ధ వినాయ క విగ్రహం బయలి్పంది. గార్డెజ్ గణేశుడుగా పిలువబడే ఆయనను జ్ఞానం, శ్రేయస్సునందించే దేవుడిగా స్థానికులు ఆరాధిస్తారు. జపాన్‌లో.. గణాలకు అధిపతి అయిన వినాయకుడిని జపాన్‌లో కంగిటెన్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇక్కడి వాణిజ్యవేత్తలు, వ్యాపారులు, జూదగాళ్ళు, నటులు, ‘గీషా’లుగా పిలవబడే కళాకారి ణులు ఎక్కువగా గణేషుడిని కొలుస్తారు. అయితే ఇక్కడ కొందరు ప్రత్యేకమైన రూపంలో ఉన్న వినాయకుడిని ఆరాధిస్తారు. ఈ వినాయక విగ్ర హంలో స్త్రీ, పురుష రూపాలు ఆలింగనం చేసుకు ని ఉంటాయి. జపనీస్ వినాయక రూపాల్లో ఒక రూపం నాలుగు చేతులతో, ముల్లంగి, మిఠాయి పట్టుకొని ఉండటం విచిత్రం.– సాక్షి, నేషనల్ డెస్క్ -
లోపలికి తొంగిచూడొచ్చు
1897లో వచ్చిన హెచ్‌జీ వేల్స్ ప్రసిద్ధ సైన్స్ ఫిక్షన్ నవల ‘ద ఇన్విజిబుల్ మ్యాన్’ గుర్తుందా? ఒంట్లో కణాలన్నింటినీ పారదర్శకంగా మార్చేసే ద్రావకాన్ని హీరో కనిపెడతాడు. దాని సాయంతో ఎవరికీ కని్పంచకుండా ఎంచక్కా మాయమైపోతాడు. దీని స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. తాజాగా సైంటిస్టులు అలాంటి ఆవిష్కరణే చేశారు! అది కూడా సాదాసీదా ఫుడ్ కలరింగ్ ఏజెంట్ సాయంతో!! దాని సాయంతో తయారు చేసిన సరికొత్త ‘ద్రావకం’ చర్మాన్ని పారదర్శకంగా మార్చేస్తోంది. దాంతో ఒంట్లోని అవయవాలన్నింటినీ మామూలు కంటితోనే భేషుగ్గా చూడటం వీలుపడింది. దీన్నిప్పటికే ఎలుకలపై విజయవంతంగా ప్రయోగించి చూశారు. ఈ ప్రయోగం మనుషులపైనా విజయవంతమైతే బయో జీవ రసాయన, వైద్య పరిశోధన రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టగలదని భావిస్తున్నారు... ఇలా సాధించారు... టార్ట్రాజైన్ అనే మామూలు పసుపు రంగు ఫుడ్ కలరింగ్ ఏజెంట్‌ను నీళ్లలో కలపడం ద్వారా చర్మాన్ని మాయం చేసే ద్రావకాన్ని సైంటిస్టులు తయారు చేశారు. ఈ మేజిక్‌ను సాధించేందుకు ఆప్టిక్ రంగ పరిజ్ఞానాన్ని వాడుకున్నారు. పసుపు రంగు కలరింగ్ ఏజెంట్‌లోని అణువులు మామూలుగానైతే కాంతిని విపరీతంగా శోషించుకుంటాయి. ముఖ్యంగా నీలి, అతినీల లోహిత కాంతిని తమగుండా వెళ్లనీయవు. కానీ దాన్ని నీటితో కలిపిన మీదట వచ్చే ద్రావకం పూర్తిగా పారదర్శక ధర్మాలను కలిగి ఉంటుంది. దాన్ని చర్మంపై రుద్దితే దాని కణజాలాలకు కాంతి పరావర్తక సామర్థ్యం లోపిస్తుంది. దాంతో ద్రావకం లోపలికి ఇంకుతూనే చర్మం కని్పంచకుండా పోతుంది! మరోలా చెప్పాలంటే ‘మాయమవుతుంది’. ఈ ద్రావకాన్ని తొలుత కోడి మాంసంపై రుద్దారు. ఫలితం సంతృప్తికరంగా అని్పంచాక ప్రయోగాత్మకంగా ఒక ఎలుకపై పరీక్షించి చూశారు. దాని తల, పొట్టపై ఉన్న చర్మం మీద ద్రావకాన్ని పూశారు. దాంతో ఆయా భాగాల్లో చర్మం తాత్కాలికంగా పారదర్శకంగా మారిపోయింది. ఫలితంగా తల, పొట్ట లోపలి అవయవాలు స్పష్టంగా కని్పంచాయి. ద్రావకాన్ని కడిగేసిన మీదట చర్మం ఎప్పట్లాగే కన్పించింది. పైగా ఈ ప్రక్రియలో ఎలుకకు ఎలాంటి హానీ కలగలేదు. రక్తనాళాలన్నీ కన్పించాయి ఎలుకల తలపై ద్రావకం రుద్దిన మీదట మెదడు ఉపరితలం మీది రక్తనాళాలు మామూలు కంటికే స్పష్టంగా కని్పంచాయి. అలాగే పొట్ట భాగంలోని అవయవాలు కూడా. ‘‘మౌలిక భౌతిక శాస్త్ర నియమాలు తెలిసినవారికి ఇదేమీ పెద్ద ఆశ్చర్యం కలిగించదు. కానీ ఇతరులకు మాత్రం అచ్చం అద్భుతంగానే తోస్తుంది’’ అని అధ్యయన సారథి, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో ఫిజిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జిహావో యూ అన్నారు. ‘‘పొట్టపై ఈ ద్రావకాన్ని రుద్దితే చాలు. పొద్దుటినుంచీ ఏమేం తిన్నదీ స్పష్టంగా కని్పస్తుంది. చూడటానికి చాలా సింపులే గానీ, ఈ పద్ధతి చాలా ఎఫెక్టివ్’’ అని వివరించారు. అయితే దీన్నింకా మనుషులపై ప్రయోగించాల్సి ఉందని ఆయన చెప్పుకొచ్చారు.లాభాలెన్నో... మనుషులపై గనక ఈ ప్రక్రియ విజయవంతమైతే వైద్యపరంగా ఎనలేని లాభాలుంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. → రక్తం శాంపిళ్ల సేకరణ, రోగి ఒంట్లోకి అవసరమైన ఫ్లూయిడ్స్ ఎక్కించడం వంటివి మరింత సులభతరం అవుతాయి. ముఖ్యంగా రక్తనాళాలు దొరకడం కష్టంగా మారే వృద్ధులకు ఇది వరప్రసాదమే కాగలదు.→ చర్మ క్యాన్సర్ వంటివాటిని తొలి దశలోనే గుర్తించడం సులువవుతుంది. → ఫొటోడైనమిక్, ఫొటోథర్మల్ థెరపీల వంటి కణజాల చికిత్సల్లోనూ ఇది దోహదకారిగా మారుతుంది. → లేజర్ ఆధారిత టాటూల నిర్మూలన మరింత సులువవుతుంది.కొన్నిపద్ధతులున్నాకణజాలాలను పారదర్శకంగా మార్చేందుకు ప్రస్తుతం పలు ద్రావకాలు అందుబాటులో ఉన్నా అవి ఇంత ప్రభావవంతమైనవి కావు. పైగా పలు డీహైడ్రేషన్, వాపులతో పాటు కణజాల నిర్మాణంలోనే మార్పుల వంటి సైడ్ ఎఫెక్టులకు దారి తీస్తాయి. టార్ట్రాజైన్ ద్రావకంతో ఈ సమస్యలేవీ తలెత్తలేదు. అయితే టార్ట్రాజైన్ మనుషులకు హానికరమంటూ తినుబండారాల్లో దీని వాడకాన్ని అమెరికాలో పలువురు కోర్టుల్లో సవాలు చేశారు. దీన్ని చిప్స్, ఐస్‌క్రీముల్లో వాడతారు.కొసమెరుపు: ఇన్విజిబుల్ మ్యాన్ నవల్లో మాదిరిగా మనిíÙని పూర్తిగా మాయం చేయడం ఇప్పుడప్పట్లో సాధ్యపడేలా లేదు. ఎందుకంటే టార్ట్రాజైన్ ద్రావకం ఎముకలను పారదర్శకంగా మార్చలేదట. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వాతావరణం లో అపరిచిత ధోరణులు
వాన రాకడ, ప్రాణం పోకడ తెలియదంటారు. కొన్నేళ్లుగా మన దేశంలో వానాకాలం ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పటిదాకా కొనసాగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు అకాలంలో భారీ వానలు, సీజన్ మధ్యలో విపరీతమైన ఎండలు పరిపాటిగా మారాయి. వాతావరణ తీరుతెన్నుల్లో ఈ భారీ మార్పులు భారత్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా వర్షాకాల సీజన్ తీరుతెన్నులే మారిపోతున్నాయి. సీజనల్ వానలు సాధారణంగా జూన్ తొలి, లేదా రెండో వారంలో మొదలై సెపె్టంబర్లో తగ్గుముఖం పడతాయి. కానీ ఈ క్రమం కొన్నేళ్లుగా భారీ మార్పుచేర్పులకు లోనవుతోంది. వానలు ఆలస్యంగా మొదలవడం, సెప్టెంబర్‌ను దాటేసి అక్టోబర్ దాకా కొనసాగడం పరిపాటిగా మారింది. దాంతో ఖరీఫ్ పంటలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. సరిగ్గా చేతికొచ్చే వేళ వానల కారణంగా దెబ్బ తినిపోతున్నాయి. ప్రస్తుత వర్షాకాల సీజన్ కూడా అక్టోబర్ దాకా కొనసాగవచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికలు గుబులు రేపుతున్నాయి. ఇదంతా వాతావరణ మార్పుల తాలూకు విపరిణామమేనని సైంటిస్టులు చెబుతున్నారు... భారత్‌లో వర్షాకాలం రాకపోకల్లో మార్పులు ఒకట్రెండేళ్లలో మొదలైనవేమీ కాదు. పదేళ్లుగా క్రమంగా చోటుచేసుకుంటూ వస్తున్నాయి. ఏటా పలు రాష్ట్రాల్లో భయానక వరదలకే గాక తీవ్ర పంట నష్టానికీ దారి తీస్తున్నాయి. ఈ ధోరణి దేశ ఆహార భద్రతకు కూడా సవాలుగా పరిణమిస్తోంది. దీన్ని ఎదుర్కోవాలంటే వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగు పద్ధతులను మార్చుకోవడం మినహా ప్రస్తుతానికి మరో మార్గాంతరమేదీ లేదని వ్యవసాయ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ‘‘మన దేశంలో వర్షాలకు ప్రధాన కారణమైన నైరుతీ రుతుపవనాల కదలికలు కొన్నేళ్లుగా బాగా మందగిస్తున్నాయి. వాటి విస్తరణే గాక ఉపసంహరణ కూడా నెమ్మదిస్తూ వస్తోంది. మనం ఒప్పుకోక తప్పని వాతావరణ మార్పులివి. మన సాగు పద్ధతులనూ అందుకు తగ్గట్టుగా మార్చుకోవాల్సిందే’’ అని చెబుతున్నారు. అంతా గందరగోళమే... సీజన్లో మార్పుచేర్పుల వల్ల ఉత్తర, పశ్చిమ భారతాల్లో కొన్నేళ్లుగా భారీ వర్షపాతం నమోదవుతోంది. గుజరాత్, రాజస్తాన్‌లలో గత దశాబ్ద కాలంగా సగటున ఏకంగా 30 శాతం అధిక వర్షపాతం నమోదవడమే ఇందుకు తార్కాణం. ఆ ప్రాంతాల్లో గతంలో లేని భారీ వర్షాలు ఇప్పుడు మామూలు దృశ్యంగా మారాయి. ఇక గంగా మైదాన ప్రాంతాల్లో అక్టోబర్ దాకా కొనసాగుతున్న భారీ వానలు ఉత్తరాఖండ్, యూపీ, బిహార్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో పంటల సీజన్‌నే అతలాకుతలం చేసేస్తున్నాయి. ఆ రాష్ట్రాల్లో అక్టోబర్ తొలి వారంలో పంట కోతలు జరుగుతాయి. అదే సమయంలో వానలు విరుచుకుపడుతున్నాయి. ‘‘దాంతో కోతలు ఆలస్యమవడమే గాక పంట నాణ్యత కూడా తీవ్రంగా దెబ్బ తింటోంది. మొత్తంగా వరి, మొక్కజొన్న, పప్పుల దిగుబడి బాగా తగ్గుతోంది’’ అని కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ, ఎని్వరాన్‌మెంట్ అండ్ వాటర్‌లో సీనియర్ ప్రోగ్రాం లీడ్ విశ్వాస్ చితాలే అన్నారు. ఆహార భద్రతకూ ముప్పు వర్షాలు సీజన్‌ను దాటి కొనసాగడం వల్ల ఖరీఫ్ పంటలు దారుణంగా దెబ్బ తింటున్నాయి. ఈ ఖరీఫ్‌లో దేశవ్యాప్తంగా 408.72 లక్షల హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు. ఈసారి వర్షాలు అక్టోబర్ దాకా కొనసాగుతాయన్న అంచనాలు ఇప్పట్నుంచే గుబులు రేపుతున్నాయి. ఇది తీవ్ర పంట నష్టానికి, తద్వారా దేశవ్యాప్తంగా బియ్యం, పప్పుల కొరతకు దారి తీయడం తప్పకపోవచ్చంటున్నారు. → ఇలా సీజన్ దాటాక కొనసాగిన భారీ వర్షాలు, వరదల దెబ్బకు 2016 నుంచి 2022 మధ్యలో దేశవ్యాప్తంగా మొత్తమ్మీద 3.4 కోట్ల హెక్టార్ల సాగు విస్తీర్ణంలో పంటలు దారుణంగా దెబ్బ తిన్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. → వాతావరణ మార్పుల దెబ్బకు 2022లో భారత్‌లో జీడీపీ వృద్ధిలో 8 శాతం క్షీణత నమోదైంది. 7.5 శాతం సంపద హరించుకుపోయింది. → సాధారణంగా సెపె్టంబర్ తర్వాత భారీ వర్షాలు కురవని పశి్చమ భారతదేశం ఈ మార్పులకు తాళలేకపోతోంది. అక్కడి నీటి నిర్వహణ వ్యవస్థ ఈ వరదలను తట్టుకోలేకపోతోంది. → ఈ సరికొత్త వాతావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు వినూత్న పద్ధతులు అవలంబించాలని సైంటిస్టులు సూచిస్తున్నారు. → డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచడం, ఇటు వరదలను, అటు కరువు పరిస్థితులను సమర్థంగా తట్టుకునే వంగడాలను అందుబాటులోకి తేవడం, వినూత్న వ్యవసాయ పద్ధతులను అవలంబించడం తప్పదంటున్నారు.మన నిర్వాకమే...! మనిషి నిర్వాకం వల్ల తీవ్ర రూపు దాలుస్తున్న వాతావరణ మార్పులే వానల సీజన్లో తీవ్ర హెచ్చుతగ్గులకు ప్రధాన కారణమని సైంటిస్టులు చెబుతున్నారు. → సముద్రాల ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో వాతావరణంలో తేమ శాతం పెరుగుతోంది. భారీ వర్షాలు, వరదలకు దారి తీస్తోంది. → ఎల్ నినో, లా నినా వంటివి పరిస్థితులను మరింత దిగజారుస్తున్నాయి. → ఎల్ నినోతో వర్షాకాలం కుంచించుకుపోయి పలు ప్రాంతాల్లో కరువు తాండవిస్తోంది. → లా నినా వల్ల వర్షాలు సుదీర్ఘకాలం కొనసాగి వరదలు పోటెత్తుతున్నాయి. → సాగు, నీటి నిర్వహణతో పాటు దేశంలో సాధారణ జన జీవనమే తీవ్రంగా ప్రభావితమవుతోంది.85 శాతం జిల్లాలపై ప్రభావం మన దేశంలో తీవ్ర వాతావరణ పరిస్థితులు గత పదిహేనేళ్లలో ఏకంగా ఐదు రెట్లు పెరిగిపోయాయి. ఈ ధోరణి దేశవ్యాప్తంగా ఏకంగా 85 శాతం పై చిలుకు జిల్లాలను ప్రభావితం చేస్తోంది. వరదలు, తుఫాన్లు, కరువులు, తీవ్ర వడగాడ్పులతో కిందామీదా పడుతున్నట్టు ఐపీఈ–గ్లోబల్, ఎస్రి–ఇండియా సంయుక్త అధ్యయనం తేలి్చంది. అయితే వీటిలో సగానికి పైగా జిల్లాల్లో గతంలో తరచూ వరద బారిన పడేవేమో కొన్నేళ్లుగా కరువుతో అల్లాడుతున్నాయి. కరువు బారిన పడే జిల్లాలు ఇప్పుడు వరదలతో అతలాకుతలమవుతున్నాయి! గత 50 ఏళ్ల వాతావరణ గణాంకాలను లోతుగా విశ్లేíÙంచిన మీదట ఈ మేరకు వెల్లడైంది. వాతావరణ మార్పుల వల్ల దేశానికి ఎదురవుతున్న ముప్పును ఇవి కళ్లకు కడుతున్నాయని అధ్యయనం పేర్కొంది. ఇంకా ఏం చెప్పిందంటే... → పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2036 నాటికి ఏకంగా 147 కోట్ల మంది భారతీయులు తీవ్ర వాతావరణ పరిస్థితుల ప్రభావానికి లోనవుతారు. → దేశంలోని తూర్పు, ఈశాన్య, దక్షిణాది ప్రాంతాల్లో తీవ్ర వరదలు పరిపాటిగా మారతాయి. → ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్నాటకల్లో కరువు పరిస్థితులు పెరిగిపోతాయి. శ్రీకాకుళం, గుంటూరు, కర్నూలు, కటక్ (ఒడిశా) వంటి జిల్లాల్లో ఈ మార్పులు కొట్టొచి్చనట్టు కని్పస్తున్నాయి. → ఏపీతో పాటు ఒడిశా, బిహార్, గుజరాత్, రాజస్తాన్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, మహారాష్ట్ర, అసోం, యూపీల్లో 60 శాతానికి పైగా జిల్లాలు తరచూ ఇటు కరువు, అటు వరదలతో కూడిన తీవ్ర వాతారణ పరిస్థితుల బారిన పడుతున్నాయి. → త్రిపుర, కేరళ, బిహార్, పంజాబ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో కరువు ప్రాంతాల్లో వరదలు, వరద ప్రాంతాల్లో కరువులు పరిపాటిగా మారతాయి. → బెంగళూరు, పుణే, అహ్మదాబాద్, పటా్న, ప్రయాగ్‌రాజ్ వంటి నగరాలు, వాటి పరిసర ప్రాంతాలు ఈ ‘కరువు–వరద’ ట్రెండుతో అతలాకుతలమవుతున్నాయి. → గత శతాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సగటున 0.6 డిగ్రీ సెల్సియస్ మేరకు పెరిగిపోవడమే ఈ విపరీత వాతావరణ పరిస్థితులకు ప్రధాన కారణం.ఏం చేయాలి? → వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు పసిగడుతూ సాగు తీరుతెన్నులను కూడా తదనుగుణంగా మార్చుకోవడం ఇకపై తప్పనిసరి. → ఇందుకోసం సమీకృత క్లైమేట్ రిస్క్ అబ్జర్వేటరీ (సీఆర్ఓ), ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లైమేట్ ఫండ్ (ఐసీఎఫ్) ఏర్పాటు చేసుకోవాలి. → ప్రతి సీజన్లోనూ వాతావరణ శాఖ అంచనాలకు అనుగుణంగా పంటలను మార్చుకుంటూ వెళ్లాలి. → జాతీయ, రాష్ట్ర, జిల్లా, స్థానిక స్థాయిల్లో పరిస్థితిని నిరంతరం అంచనా వేస్తూ అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు ప్రణాళికలను మార్చుకోవాలి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బలవంతంగా దహనం చేశారు
కోల్‌కతా: కూతురు మృతదేహాన్ని భద్రపరచాలని భావించినప్పటికీ పోలీసుల బలవంతంకారణంగానే దహనం చేయాల్సి వచి్చందని కోల్‌కతాలో హత్యకు గురైన జూనియర్ వైద్యురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. వైద్యురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్జీ కర్ వైద్యకళాశాల బయట ఆందోళన చేస్తున్న వైద్యులకు బుధవారం బాధిత వైద్యురాలి తల్లిదండ్రులు, బంధువులు మద్దతు తెలిపారు. ‘న్యాయం జరిగేదాకా నిద్రించేది లేదు’’అని బాధితురాలి తల్లి అన్నారు. ఈ సందర్భంగా బాధితురాలి తండ్రి మాట్లాడారు. డబ్బులు ఇవ్వజూపారు కుమార్తె మృతదేహం తమ ముందు ఉండగానే నార్త్ డెప్యూటీ కమిషనర్ తమకు డబ్బు ఆఫర్ చేశారన్నారు. ‘‘మేము మృతదేహాన్ని భద్రపరచాలని అనుకున్నాం. కానీ ఇంటికి వెళ్లి చూడగా బయట 300 మంది పోలీసులు నిల్చుని ఉన్నారు. ఆమెను దహనం చేయాల్సిందేనని మమ్మల్ని తీవ్రంగా ఒత్తిడిచేశారు. దహన సంస్కారాలకు హడావుడి చేసి, దహనసంస్కారాల ఖర్చు కూడా మా వద్ద ఎవరూ వసూలుచేయలేదు. కనీసం దహనసంస్కారాలకు కూడా మా నాన్న దగ్గర డబ్బులు లేవని నా కూతురికికూడా తెలుసనుకుంటా. అందుకే ఇలా వెళ్లిపోయింది’’అని తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘కొందరు పోలీసు అధికారులు ఖాళీ కాగితంపై సంతకాన్ని పెట్టాలని నన్ను బలవంతపెట్టారు. కోపంతో నేను ఆ పేపర్‌ను చింపేసి విసిరేశా. అసలు మృతదేహాన్ని పరీక్షించకముందే నా కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆసుపత్రి అధికారులు ఎందుకు చెప్పారు?. మా అమ్మాయి ముఖం చూసేందుకు మూడున్నర గంటలు వేచి చూడాల్సి వచి్చంది. చూడనివ్వాలని తల్లి కాళ్ల మీద పడినా ఎవరూ పట్టించుకోలేదు. పోస్ట్‌మార్టమ్ ఎందుకంత ఆలస్యం చేశారు? పోలీసులు అసహజ మరణం కేసు ఎందుకు నమోదు చేశారు? తాలా పోలీస్ స్టేషన్లో రాత్రి 7 గంటలకే ఫిర్యాదుచేస్తే 11.45 గంటల దాకా ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు?’అని తండ్రి ప్రశ్నించారు. అన్నీ అనుమానాలే.. తల్లిదండ్రులు ఆస్పత్రి వచి్చన 10 నిమిషాలకే వారిని ఘటనాస్థలికి తీసుకెళ్లామని సుప్రీంకోర్టుకు సమరి్పంచిన అఫిడవిట్లో కోల్‌కతా పోలీసులు పేర్కొన్నారు. అయితే మూడు గంటలకుపైగా వేచి చూశామని, తమ కుమార్తెను కడసారి చూసేందుకు అనుమతించాలని పోలీసులను వేడుకున్నామని తల్లిదండ్రులు చెబుతున్నారు. పోలీసులు అసహజ మరణం కేసు నమోదు చేశారని, అయినా ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని కలకత్తా హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించడం తెల్సిందే.