Anilkumar singhal
-
ఏపీలో ఇద్దరు ఐఏఎస్ అధికారుల బదిలీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా అనిల్‌కుమార్ సింఘాల్, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎం.టి కృష్ణబాబు బదిలీ అయ్యారు. కృష్ణబాబుకు రవాణాశాఖ అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. చదవండి: మండేకాలం.. జాగ్రత్త సుమా..! -
మాస్క్ తప్పనిసరి నిబంధన పొడిగింపు
సాక్షి, అమరావతి: కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధారణ తప్పనిసరి నిబంధనను ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు పొడిగించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్‌కుమార్ సింఘాల్ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన రాత్రి కర్ఫ్యూ గడువు సోమవారంతో ముగిసింది. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని సవరించిన మార్గదర్శకాలు జారీ చేశారు. నోరు, ముక్కు మూసి ఉండేలా మాస్క్ ధరించని వారికి రూ.100 జరిమానా ఉంటుందని స్పష్టం చేశారు. మాస్క్ లేని వారిని వ్యాపార, వాణిజ్య సముదాయాల్లోకి అనుమతించినట్లయితే యజమానులకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు జరిమానా విధిస్తామన్నారు. కరోనా నిబంధనలు అతిక్రమించిన వ్యాపార, వాణిజ్య సంస్థలను ఒకటి, రెండు రోజులు మూసివేస్తామన్నారు. మార్గదర్శకాలు అమలయ్యేలా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
ఆంధ్రప్రదేశ్‌లో నైట్ కర్ఫ్యూ పొడిగింపు
సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తి దృష్ట్యా రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను ఈ నెల 14వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్‌కుమార్ సింఘాల్ మంగళవారం ఉత్తర్వులు వెలువరించారు. కరోనా మూడో దశ వ్యాప్తి కట్టడికి గత నెల 18 నుంచి 31వ తేదీ వరకు ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూను విధించిన విషయం తెలిసిందే. వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో కర్ఫ్యూను పొడిగించారు. 14వ తేదీ వరకు రాత్రి 11 నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటల దాకా ఆంక్షలు అమలులో ఉంటాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టం 2005, ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం చర్యలు ఉంటాయి. కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు కర్ఫ్యూ అమలుకు చర్యలు తీసుకోవాలని సింఘాల్ ఆదేశించారు. (చదవండి: చిక్కీ, గుడ్ల సరఫరాపై టీడీపీ అవాకులు చెవాకులు) -
పిల్లలకు కోవిడ్ వస్తే ఆ మందులు వాడొద్దు.. మారిన మార్గదర్శకాలు
సాక్షి, అమరావతి: కరోనా బారినపడిన 18 సంవత్సరాలలోపు పిల్లలకు చికిత్సలో యాంటీవైరల్స్, మోనోక్లోనల్ యాంటీబాడిస్ వాడకూడదని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీచేసింది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం సూచనలకు అనుగుణంగా పిల్లల చికిత్స, కోవిడ్, నాన్–కోవిడ్ ప్రాంతాల్లో పనిచేసే వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సవరించిన మార్గదర్శకాలను వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ సోమవారం విడుదల చేశారు. మార్గదర్శకాలు ఇవే.. 5 ఏళ్ల లోపు పిల్లలు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు. ఇబ్బందులు లేకుండా ఉండేలా తల్లిదండ్రుల పర్యవేక్షణలో 6–11 ఏళ్ల పిల్లలు మాస్క్ వినియోగించవచ్చు. 12 ఏళ్లు, ఆ పైబడిన పిల్లలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. 15–18 ఏళ్ల పిల్లలు తప్పనిసరిగా టీకా వేసుకోవాలి. ఆస్పత్రుల్లో, వైద్యుల పర్యవేక్షణలోనే పాజిటివ్ అయిన పిల్లల చికిత్సలో స్టిరాయిడ్లు వినియోగించాలి. 2, 3 రోజులు జ్వరంతో బాధపడుతుండటంతోపాటు ర్యాష్, కళ్లకలక, హైపర్ టెన్షన్, శరీరంపై దద్దుర్లు, దురదలు, డయేరియా లక్షణాలున్నా.. ఈఎస్సార్ 40, సీఆర్పీ 5 కన్నా ఎక్కువగా ఉన్నా మిస్–సీగా పరిగణించి చికిత్స అందించాలి. లక్షణాలు లేనివాళ్లు, స్వల్ప లక్షణాలున్న వారికి యాంటీబాడీలు వాడకూడదు. ఊపిరితిత్తుల్లో ఎక్కువగా ఇన్ఫెక్షన్ ఉన్నవారికి, న్యూమోనియాతో బాధపడేవారికి, సెప్టిక్ షాక్‌కు గురైనవారికి మాత్రమే చికిత్సలో యాంటీబయోటిక్స్ వాడాలి. 3–5 రోజుల్లో సిరాయిడ్స్ వాడకూడదు. రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి 5వ రోజు నుంచి స్టిరాయిడ్స్ వినియోగించాలి. పరిస్థితిని బట్టి 10–14 రోజుల వరకు డోసు తగ్గించుకుంటూ వెళ్లాలి. -
18 నుంచి రాత్రి కర్ఫ్యూ
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ఈ నెల 18 నుంచి 31 వరకూ రాష్ట్ర ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించింది. రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకూ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆసుపత్రులు, మందుల దుకాణాలు, మీడియా, పెట్రోల్ బంకుల కార్యకలాపాలకు.. విమానాలు, రైళ్లు, బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు, ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు, వైద్య సిబ్బంది, ప్రభుత్వ, ఇతర అత్యవసర విధులకు హాజరయ్యే ఉద్యోగులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు. కర్ఫ్యూ, ఇతర నిబంధనలను అమలుచేయడంతోపాటు, పర్యవేక్షించాల్సిందిగా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లను ఆదేశించారు. ఆ నిబంధనలు.. ► బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి. లేనిపక్షంలో రూ.100 జరిమానా. ► మాస్క్‌లేని వారిని దుకాణాలు, షాపింగ్ మాల్స్‌లోకి అనుమతిస్తే యాజమాన్యాలకు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకూ జరిమాన. ► నిబంధనలు అతిక్రమించినట్లయితే స్థానిక పరిస్థితులు, కరోనా వ్యాప్తి తీవ్రతను బట్టి ఒకట్రెండు రోజులు మూసివేత. ► పెళ్లిళ్లు, శుభకార్యాలు, సామాజిక కార్యకలాపాలకు సంబంధించిన సమావేశాలు బహిరంగ ప్రదేశాల్లో అయితే 200 మంది, ఇన్‌డోర్‌లో అయితే 100 మందికి మించకూడదు. వారందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించడంతో పాటు, భౌతిక దూరం నిబంధన పాటించాలి. ► సినిమా హాళ్లలో 50 శాతం మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. సీటు విడిచి సీటులో ప్రేక్షకులు కూర్చోవాలి. ► ప్రజా రవాణా వాహనాల డ్రైవర్లు, వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికులు విధిగా మాస్క్‌లు ధరించాలి. 8 దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో భక్తులు మాస్క్ ధరించడంతో పాటు, భౌతిక దూరం పాటించాలి. ► ఈ నిబంధనలు అతిక్రమించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టం–2004, ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం చర్యలు ఉంటాయి. థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం : ఆళ్ల నాని ఇక రాష్ట్రంలో కరోనా థర్డ్‌వేవ్ వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైద్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్క్‌లు ధరించకపోతే రూ.100 జరిమానా విధిస్తామని స్పష్టంచేశారు. కరోనా కట్టడిలో ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని మంగళవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ కోరారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ అమలును ఈనెల 18కు వాయిదా వేసిందన్నారు. పండగ సమయంలో పట్టణాల నుంచి పెద్దఎత్తున పల్లెలకు ప్రజలు తరలివస్తుండటంతో వారికి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశ్యంతోనే మార్చినట్లు మంత్రి ఆళ్ల నాని చెప్పారు. -
15లోగా 100% మొదటి డోసు పూర్తవ్వాలి
సాక్షి, అమరావతి: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు అప్రమత్తత చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ డిసెంబరు 15వ తేదీ లోపు మొదటి డోసు టీకా వేయడం 100 శాతం పూర్తి చేయాలని వైద్య శాఖ అధికారులను ఆదేశిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనీల్‌కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వివరాలు.. టీకా బృందాలు ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి ప్రతి ఇంటికీ వెళ్లి టీకా వేసుకోని వారిని గుర్తించి టీకాలు వేయాలి. జిల్లా కలెక్టర్లు కరోనా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలి. ప్రజలంతా మాస్క్ ధరించడం తప్పనిసరి చేయాలి. ఎవరైనా మాస్క్ ధరించకపోయినా, వ్యాపార, వాణిజ్య, ఇతర సంస్థలు కరోనా నిబంధనలు పాటించకపోయినా జరిమానా విధించాలి. కరోనా నిబంధనలు పాటిస్తూ పరిమిత సంఖ్యలో వ్యక్తులతోనే పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు నిర్వహించేలా అధికార యంత్రాంగం దృష్టి సారించాలి. ► ఒమిక్రాన్ కేసులు నమోదైన యూకే, యూరప్, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్, బంగ్లాదేశ్, బోట్స్వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంకాంగ్, ఇజ్రాయేల్ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులతో పాటు, వీరి సన్నిహితులపై ప్రత్యేక నిఘా ఉంచాలి. ► చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుల్లో నెల్లూరు, అనంతపురం, గుంటూరు జిల్లాల కలెక్టర్లు హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. -
గర్భిణులకు భారీగా నగదు ప్రోత్సాహకాలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రిలో ప్రసవం చేయించుకున్న గర్భిణికి శిశు సంరక్షణ కిట్ పేరిట 2016 నుంచి 2019 వరకూ రూ.695 విలువ చేసే కిట్ ఇచ్చేవారని, ఇప్పుడు గర్భిణికి ప్రసవం అనంతరం ఆసరా కింద భారీగా నగదు ఇస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. సోమవారం మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ.. సాధారణ ప్రసవం అయితే రూ.5 వేలు, సిజేరియన్ అయితే రూ.3 వేలను 24 గంటల్లోనే లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తున్నామని స్పష్టం చేశారు. ఆ మొత్తం నుంచే శిశువుల సంరక్షణకు కావాల్సినవి గర్భిణులే కొనుక్కుంటున్నారన్నారు. ‘శిశు సంరక్షణ కిట్లకు కటకట’ శీర్షికన కిట్ల పంపిణీని నిలిపివేసినట్టు ఓ పత్రిక రాసిందని, ఇది సరికాదని ఆయన పేర్కొన్నారు. అప్పట్లో కేవలం శిశు సంరక్షణ కిట్ మాత్రమే ఇచ్చి.. ఎలాంటి నగదు ఇచ్చేవారు కాదన్నారు. ఇప్పుడు గర్భిణికి రూ.3 వేల నుంచి రూ.5 వేల చొప్పున చెల్లిస్తున్నామన్నారు. ప్రసవం కాగానే ప్రతి ఒక్కరికీ నగదు జమ అవుతోందన్నారు. 46.79 శాతం మందికి రెండు డోసులూ పూర్తి రాష్ట్రంలో ఇప్పటివరకూ 46.79 శాతం మందికి కోవిడ్ టీకా రెండు డోసులూ పూర్తయినట్టు సింఘాల్ చెప్పారు. 18 ఏళ్లకు పైబడిన 3.47 కోట్ల మంది టీకాకు అర్హులని గతంలో తాము అంచనా వేయగా.. తాజాగా కేంద్ర ప్రభుత్వం 3.95 కోట్లుగా సమాచారం పంపించిందన్నారు. దీన్ని బట్టి ఇప్పటివరకూ 46.79% మందికి రెండు డోసులు టీకా పూర్తయిందన్నారు. రాష్ట్రంలో 1,84,90,379 మందికి రెండు డోసులు వేశామన్నారు. 1,32,65,148 మందికి తొలి డోసు పూర్తయిందని చెప్పారు. వ్యాక్సినేషన్ విషయంలో జాతీయ సగటు కంటే మన రాష్ట్రం చాలా ముందుందని తెలిపారు. కరోనా కేసులు తగ్గినా 104 కాల్‌సెంటర్‌ను కొనసాగిస్తున్నామని, ఎవరు ఫోన్ చేసినా సమాచారం వస్తుందన్నారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు మొదలుకొని కొత్త మెడికల్ కాలేజీల వరకూ నిర్మాణం జరుగుతున్నాయని, ప్రణాళికాబద్ధంగా నిర్మాణ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆరోగ్యశ్రీలో చికిత్సల జాబితా పెంచామని, గత 6 నెలల్లోనే రూ.1,013 కోట్లను ఆరోగ్యశ్రీ కింద వ్యయం చేశామన్నారు. -
ప్రతి చిన్నారికీ ఆధార్ నమోదు తప్పనిసరి
సాక్షి, అమరావతి: పుట్టిన ప్రతి చిన్నారికీ ఆధార్ నమోదు తప్పనిసరిగా చేయాలని, ఆస్పత్రిలో తల్లి డిశ్చార్జ్ అయ్యేలోగా ఇవన్నీ పూర్తి కావాలని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ ఆదేశించారు. సోమవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో జనన, మరణాల రిజిస్ట్రేషన్లపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సుమారు 24 విభాగాల అధికారులు పాల్గొన్నారు. గర్భిణి ఆస్పత్రిలో చేరి ప్రసవం పూర్తయ్యాక మూడు రోజుల్లో శిశువుకు ఆధార్ ఎన్రోల్ చేయాలని, అప్పటికి వేలిముద్రలు, కంటిపాప ముద్రల్లో స్పష్టత ఉండదు కాబట్టి.. ఐదేళ్లు పూర్తయ్యేలోగా వారిని తిరిగి రప్పించి వేలిముద్రలు, ఐరిస్ తీసుకుని ఆధార్ ఎన్రోల్ చేయాలని ఆదేశించారు. శిశువుల జననాలతో పాటు, మరణాలనూ నమోదు చేయాలని, మృతికి గల కారణాలను పేర్కొనాలని సూచించారు. ఐదేళ్లు నిండేలోగా చిన్నారులకు శాశ్వత ఆధార్ కార్డు అందేలా చూడాలన్నారు. ఆస్పత్రుల్లో చిన్నారులు పుట్టగానే వారికి బర్త్ సర్టిఫికెట్లు జారీ చేయాలని, డిశ్చార్జ్ అయ్యేలోగానే ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నారుల జనన ధ్రువీకరణ పత్రాలకు తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఆక్సిజన్ సరఫరాదారు అలసత్వమే కారణం
సాక్షి, అమరావతి: శ్రీ భారత్ ఫార్మా అండ్ మెడికల్ ఆక్సిజన్ డిస్ట్రిబ్యూటర్ అలసత్వం వల్లే.. సకాలంలో ఆక్సిజన్ అందక తిరుపతి ‘రుయా’ ఘటన జరిగిందని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. ఈ ఘటనపై చిత్తూరు కలెక్టర్‌తో పాటు ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన నివేదికలను ప్రభుత్వం హైకోర్టు ముందుంచింది. మరణాలకు కారణమైన సదరు కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపింది. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబసభ్యులకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లింపునకు ఉత్తర్వులిచ్చినట్లు ప్రభుత్వం వివరించింది. రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక కోవిడ్ బాధితులు చనిపోయిన ఘటనకు బాధ్యులైన అధికారులు, యాజమాన్యంపై కేసు నమోదు చేసేలా ఆదేశాలివ్వాలంటూ టీడీపీ నేత మోహనరావు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం.. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని గతంలో ప్రభుత్వాన్ని ఆదేశించింది. చిత్తూరు కలెక్టర్‌తో పాటు ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన నివేదికలను తమ ముందుంచాలని ఆదేశాలిచ్చింది. దీంతో తాజాగా వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్ అఫిడవిట్ దాఖలు చేశారు. -
మాస్కు లేకపోతే రూ.100 కట్టాల్సిందే!
సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో ఎవరైనా మాస్కు లేకుండా బయటకు వస్తే రూ.100 జరిమానా వేస్తారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మాస్కు విధిగా ధరించాలని, ఒకరినుంచి ఒకరికి కరోనా వ్యాపించకుండా ఉండాలంటే ఈ నిబంధన ఖచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్న కర్ఫ్యూను తిరిగి ఈ నెల 14 వరకు పొడిగించారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలు మినహా మిగతా 11 జిల్లాల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. అంటే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కోవిడ్ నిబంధనల మేరకు అన్ని కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. షాపులు, కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు అన్నీ నిర్వహించుకోవచ్చు. ఏవైనా పబ్లిక్ ప్లేసుల్లో (మాల్స్‌లో గానీ, సినిమాహాళ్లలో గానీ) సీటు మార్చి సీటు నిర్వహణ చేసుకోవచ్చు. మనిషికి మనిషికీ కనీసం 5 అడుగుల దూరం ఉండాలి. గోదావరి జిల్లాల్లో మాత్రం సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. అంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుంది. ఎవరైనా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. కోవిడ్ నిబంధనలు పాటించే విషయంలో కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు పర్యవేక్షణ చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఆంధ్రప్రదేశ్‌లో జూలై 7 వరకు కర్ఫ్యూ
సాక్షి, అమరావతి: కోవిడ్ నేపథ్యంలో రాష్ట్రంలో జూలై 7వ తేదీ వరకు కర్ఫ్యూ పొడిగించారు. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. మిగతా 9 జిల్లాల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుంది. ఈమేరకు కలెక్టర్లు, పోలీస్ అధికారులు కర్ఫ్యూ నిబంధనలు అమలు చేయాలని ఆదేశించారు. ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో కోవిడ్ పాజిటివీటీ రేటు 5 శాతం ఉన్న జిల్లాల్లో సడలింపు సమయాన్ని తగ్గించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఆ రోజుకు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో పాజిటివిటీ 5 శాతానికిపైగా ఉంది. దీంతో ఈ 5 జిల్లాల్లో సడలింపు సమయాన్ని తగ్గించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువగా ఉండటంతో ఆ జిల్లాలో కూడా సడలింపు సమయాన్ని పెంచారు. దీంతో మిగిలిన 4 జిల్లాల్లో మాత్రమే కర్ఫ్యూ సడలింపును ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరిమితం చేశారు. -
ఆరోగ్యశ్రీ పరిధిలోకి మిస్–సి
సాక్షి, అమరావతి: కరోనాతోపాటు బ్లాక్ ఫంగస్ వంటి రోగాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ కోవకే చెందిన మరో కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న పిల్లల్లో ఎదురవుతున్న మిస్–సి (మల్టీసిస్టం ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్) జబ్బును కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి పేదలకు మేలుచేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. పీడియాట్రిక్ కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ సూచనల మేరకు పేదలు, మధ్యతరగతి వర్గాలపై భారం పడకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మిస్–సిలో నాలుగు రకాల జబ్బులుంటాయి. వీటన్నింటినీ ఇందులో చేర్చారు. కేటగిరీలు.. వాటి రేట్లు ఇలా.. ► మిస్–సి విత్ షాక్, లేదా విత్ఔట్ రెస్పిరేటరీ (సివియర్): రూ.77,533తో పాటు ఎన్ఐవీ/వెంటిలేటర్‌కు అదనంగా రూ.25వేలు. దీంతో పాటు ఇమ్యునోగ్లోబులిన్ మందులకు అదనంగా ఉంటుంది. ఐదు రోజులు ఐసీయూ, ఐదు రోజులు నాన్ ఐసీయూలో ఉండాలి. ► మిస్–సి విత్ఔట్ షాక్ (మోడరేట్) : దీనికి రూ.42,233లు (మందులతో కలిపి). ఐదు రోజులు ఐసీయూ, ఐదు రోజులు నాన్ ఐసీయూలో ఉండాలి. ► మిస్–సి కవాసాకి లేదా సివియర్ : రూ.62,533లు (మందులతో కలిపి). దీనికీ ఐదు రోజులు ఐసీయూలోనూ మరో ఐదు రోజులు నాన్ క్రిటికల్ వార్డులో ఉండాలి. ► ఫిబ్రిల్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ (మైల్డ్) : దీనికి రూ.42,183గా నిర్ణయించారు. ఒకరోజు ఐసీయూలో, ఏడు రోజులు నాన్ ఐసీయూలో ఉండాలి. మందులు, వెంటిలేటర్ కోసం.. పైన పేర్కొన్నవి కాకుండా అదనంగా ఐవీ–ఐజీ డ్రగ్స్ అవసరమైతే ప్రతీ ఐదు గ్రాముల వయెల్‌కు రూ.8వేలు, 10 గ్రాముల వయెల్‌కు రూ.13,500 చెల్లిస్తారు. ఇది చిన్నారి శరీర బరువును బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వయెల్ ఫొటోలు, బిల్లులు, బ్యాచ్ నంబర్లు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, కేస్‌షీట్‌ను చూపించాల్సి ఉంటుంది. ఎన్ఐవీ లేదా వెంటిలేటర్‌కు ఒక్కరోజుకు రూ.5వేల వరకూ క్లెయిమ్ చేసుకోవచ్చు. అలా గరిష్టంగా 5 రోజులకు రూ.25వేల వరకూ చెల్లిస్తారు. దీనికి కూడా వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించినట్లు కేస్‌షీట్, ఫొటోలను ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు సమర్పించాల్సి ఉంటుంది. ఏవైనా అదనంగా శస్త్రచికిత్సలు చేసినప్పుడు ప్రత్యేక ప్రీ ఆథరైజేషన్ (ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో ఉన్న జబ్బుల పరిధిలోకి వచ్చేవి అయితే) చేసి పంపించాలి. ఉదా.. జనరల్ సర్జరీ, అపెండిసైటిస్, పీడియాట్రిక్ సర్జరీ వంటివి. మిస్–సి లక్షణాలు ఇవే.. ఇది కోవిడ్ సమయంలో వచ్చే వ్యాధి. ఇది 18 ఏళ్ల లోపు వారికి ఎక్కువగా వస్తుంది. దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే.. ► 24 గంటలపాటు లేదా అంతకంటే ఎక్కువ సమయం బాగా జ్వరం రావడం ► చిన్నారుల్లో వాంతుల లక్షణాలు ఎక్కువగా ఉండటం. వాంతులతో పాటు కొంతమందిలో విరేచనాలు రావడం ► విపరీతమైన కడుపునొప్పి ► చర్మం మీద దద్దుర్లు వంటివి రావడంతో పాటు అలసట ఉండటం ► సాధారణంగా కంటే శ్వాస ఎక్కువగా తీసుకోవడం.. లేదా ఒక్కోసారి అందుకు తీవ్ర ఇబ్బందులు తలెత్తడం ► కళ్లు ఎర్రగా మారి, తలనొప్పి ఉంటుంది ► పెదాలతో పాటు నాలుక కూడా ఎర్రగా మారి కొద్దిగా వాపు వస్తుంది. శరీరం, పెదాలు, గోళ్లు నీలిరంగులోకి మారొచ్చు. -
ఆక్సిజన్‌కు కొరత లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో అవసరమైనంత ఆక్సిజన్ అందుబాటులోనే ఉందని, కొరత లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ చెప్పారు. ఆక్సిజన్ అందక పేషెంట్లు మృతి చెందారంటూ.. తప్పుడు వార్తలతో అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీయొద్దని కోరారు. సోమవారం ఆయన మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో.. రాష్ట్రంలో ఆక్సిజన్ వినియోగం తగ్గిందని చెప్పారు. ఈ నెల 24న 196 మెట్రిక్ టన్నులు, 25న 169 టన్నులు, 27న 170 టన్నుల ఆక్సిజన్ తీసుకున్నామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో తగినంత ఆక్సిజన్ ఉందని వివరించారు. కానీ ఆక్సిజన్ అందకపోవడం వల్ల పేషెంట్లు మృతి చెందారంటూ వార్తలు వచ్చాయన్నారు. తప్పుడు వార్తలు రాసే వారిపై చట్టపరంగా సంబంధిత జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుంటారని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్వహించే సమీక్షా సమావేశాలపై కూడా అవాస్తవాలు ప్రచురించడం తగదని అనిల్ సింఘాల్ సూచించారు. కాగా, ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,16,90,837 మందికి టీకాలు వేశామని సింఘాల్ చెప్పారు. ఐదేళ్లలోపు పిల్లలు కలిగిన 45 ఏళ్ల లోపు వయసు తల్లులు 18,75,866 మంది ఉండగా.. 12,99,500 మందికి టీకా మొదటి డోసు పూర్తయ్యిందని తెలిపారు. జూలై నెలకు సంబంధించి రాష్ట్రానికి 53,14,740 డోసులు అందజేయనున్నట్లు కేంద్రం సమాచారమిచ్చిందని చెప్పారు. -
ఇ–సంజీవనిలో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇ–సంజీవని కార్యక్రమం వరంలా ఉపయోగపడుతోంది. గ్రామీణ ప్రాంతాలకు స్పెషలిస్టు సేవలు అందుబాటులోకి తెస్తూ ఇ–సంజీవని ద్వారా ప్రయోజనం చేకూర్చడంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో వుంది. దేశంలో జూన్ 7వ తేదీ నాటికి 59.28 లక్షల మందికిపైగా ఇ–సంజీవని ద్వారా సేవలు పొందగా అందులో 11.84 లక్షల మంది ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నారు. ఇ–సంజీవని ఇలా రాష్ట్రవ్యాప్తంగా బోధనాసుపత్రుల్లో 13 టెలీమెడిసిన్ హబ్స్ ఏర్పాటు కాగా ప్రతి హబ్‌లో జనరల్ మెడిసిన్, పీడియాట్రిషియన్, గైనకాలజిస్ట్‌తో పాటు ఇద్దరు ఎంబీబీఎస్ అర్హత ఉన్న మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు. హబ్‌ను పీహెచ్సీలో మానిటర్‌కు అనుసంధానిస్తారు. దీంతో రోగిని నేరుగా హబ్‌నుంచి చూసే అవకాశం ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులను మెడికల్ ఆఫీసర్లు పరీక్షించి వారి పరిధిలో లేనివి, అంతుచిక్కని జబ్బుల బాధితులను అక్కడ నుంచే టెలీహబ్‌కు కనెక్ట్ చేస్తారు. ఇ–సంజీవని హబ్‌లో స్పెషలిస్టు డాక్టర్లు పేషెంటును పరిశీలించి మందులు సూచించడం లేదా పెద్దాసుపత్రికి రిఫర్ చేస్తారు. మొత్తం 13 హబ్‌లలో 39 మంది స్పెషలిస్టు వైద్యులు, 26మంది మెడికల్ ఆఫీసర్లు పనిచేస్తున్నారు. గ్రామీణులకు మెరుగైన సేవలు గ్రామీణ ప్రాంత ప్రజలకు స్పెషలిస్ట్ సేవలతో మేలు జరుగుతోంది. గ్రామాల్లో వైఎస్సార్ హెల్త్‌క్లినిక్స్‌లో ఉన్న మిడ్‌లెవెల్ హెల్త్‌ప్రొవైడర్లు ప్రత్యేక యాప్‌ద్వారా పీహెచ్‌సీకి కనెక్ట్ చేస్తారు. ఎంబీబీఎస్ డాక్టరు పరీక్షించిన అనంతరం తన పరిధిలో లేని జబ్బుల బాధితులను బోధనాసుపత్రిలోని టెలీహబ్‌కు కనెక్ట్ చేసి చూపిస్తారు. దీనివల్ల పేదలు పట్టణాలకు రావాల్సిన అవసరం లేకుండానే స్పెషలిస్టు సేవలు పొందగలుగుతున్నారు. సగటున రోజుకు రాష్ట్రంలో ఇలా 15 వేల మందికిపైగా సేవలు పొందుతున్నట్టు అంచనా. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీలో ఇ–సంజీవని మెరుగ్గా అమలు జరుగుతున్నట్టు తాజా గణాంకాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా లబ్ధిదారుల్లో 19.71 శాతం మంది ఏపీలోనే ఉండటం గమనార్హం. స్పెషలిస్టు సేవలు గ్రామాల్లోకే గతంలో స్పెషలిస్టు డాక్టరు సేవలు పొందాలంటే జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు టెలీహబ్ ద్వారా ఆ భారం తప్పింది. దీన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దితే ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది. ఆ దిశగా కసరత్తు చేస్తున్నాం. –అనిల్‌కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి -
కేసులు తగ్గుతున్నాయ్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు బాగా తగ్గుతున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ చెప్పారు. 3,540 సచివాలయాల పరిధిలో ఒక్క కరోనా కేసు కూడా లేదని, గ్రామాల్లోనూ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయని తెలిపారు. సోమవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో ఆయన మాట్లాడారు. 30 నుంచి 40 కేసులున్న సచివాలయాలు 40 మాత్రమే ఉన్నాయని, 50కి పైన కేసులున్నవి కేవలం 15 మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. చిన్న పిల్లలకు కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చామని, వాటిని నాలుగు చికిత్సలుగా విభజించి చేర్చామని చెప్పారు. టీచింగ్ ఆస్పత్రుల్లో చిన్నారులకు పడకల పెంపు రాష్ట్రంలో బోధనాస్పత్రుల్లో చిన్నారులకు ఐసీయూ, ఆక్సిజన్ పడకలు పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని సింఘాల్ తెలిపారు. ప్రైవేటు టీచింగ్ ఆస్పత్రుల్లోనూ వనరులను బట్టి బెడ్స్ పెంచేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 16చోట్ల మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి భూములను గుర్తించామని చెప్పారు. ఈ ఆస్పత్రులు ఎలా ఉండాలో త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 1,17,97,000 డోసుల టీకా వేశామన్నారు. యాంపొటెరిసిన్ బి ఇంజెక్షన్లు 10వేల వరకూ అందుబాటులో ఉన్నాయని, పొసకొనజోల్ ఇంజెక్షన్లు, మాత్రల నిల్వలు పెంచామని వివరించారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 3.16 లక్షలకు పైగా ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులకు టీకా వేశామన్నారు. -
వైద్య ఆరోగ్య సిబ్బందికి కొండంత భరోసా
సాక్షి, అమరావతి: కోవిడ్ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొంటూ ప్రజలకు అండగా నిలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని విధంగా కోవిడ్, బ్లాక్‌ఫంగస్ చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచితంగా చికిత్సలు అందిస్తోంది. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ విధానంతో కరోనాను కట్టడి చేస్తోంది. ప్రస్తుత కరోనా కష్టకాలంలో ప్రభుత్వానికి తోడుగా వేలాది మంది వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు. వారి కుటుంబాలకు భరోసానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న శాశ్వత (రెగ్యులర్) ఉద్యోగులెవరైనా కోవిడ్‌తో మృతి చెందితే వారికి ఎక్స్‌గ్రేషియా చెల్లించనుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ సోమవారం ఉత్తర్వులిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే పరిహారం.. ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ లేదా ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చేదానికి అదనంగా ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై కలెక్టర్లు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేటగిరీల వారీగా పరిహారం ► కోవిడ్‌తో డాక్టరు మృతి చెందితే రూ. 25 లక్షలు, స్టాఫ్ నర్సులకు రూ. 20 లక్షలు, ఎంఎన్‌వో/ఎఫ్ఎన్వో (మేల్ నర్సింగ్ ఆర్డర్లీ/ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ)కు రూ.15 లక్షలు, ఇతర సిబ్బంది మృతి చెందితే రూ.10 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించనుంది. ► ఈ సొమ్మును మృతి చెందిన బాధితుడి కుటుంబ సభ్యులకు అందిస్తారు. ► కోవిడ్ నియంత్రణలో భాగంగా కోవిడ్ హాస్పిటల్, కోవిడ్ కేర్ సెంటర్, లేదా హౌస్ విజిట్స్‌కు వెళ్లినప్పుడు పాజిటివ్‌గా నిర్ధారణ అయి ప్రాణాలు కోల్పోతే ఈ పరిహారం చెల్లిస్తారు. ► ఉద్యోగికి సంబంధించిన గుర్తింపు కార్డును సంబంధిత అధికారి జారీ చేసి ఉండాలి. ► కోవిడ్ పాజిటివ్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్ విధిగా చూపించాలి. అలాగే ఆధార్ కార్డు, సంబంధిత డాక్యుమెంట్లు సమర్పించాలి. ఉద్యోగులకు భద్రత ఆరోగ్యశాఖలో పనిచేసే ఉద్యోగులకు, వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొండంత భరోసా ఇచ్చారు. నేనున్నానంటూ ధైర్యాన్నిచ్చారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు ఆనందంతో ఉన్నారు. – డాక్టర్ జయధీర్, కన్వీనర్, ప్రభుత్వ వైద్యుల సంఘం -
రాష్ట్రంలో చురుగ్గా వ్యాక్సినేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్–19 వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా సాగుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. 45 ఏళ్లు పైబడినవారిలో ఇప్పటికే 53.7 శాతం మందికి వ్యాక్సిన్ వేశామన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వయసుతో నిమిత్తం లేకుండా 1,28,824 మంది ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు, విదేశాలకు వెళ్లే విద్యార్థులకు టీకాలు వేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,13,76,000 డోసులు పంపిణీ చేశామని చెప్పారు. 26,04,000 మందికి రెండు డోసులు, 61,67,700 మందికి మొదటి డోసు వేశామని వివరించారు. 45 ఏళ్లు పైబడినవారిలో 52,52,000 మందికి ఒక డోసు, 18,94,000 మందికి రెండు డోసులు వేశామన్నారు. జూన్ నెలాఖరుకు 47,50,000 డోసులు అందుబాటులో ఉంటాయన్నారు. సింఘాల్ ఇంకా ఏం చెప్పారంటే.. పాజిటివిటీ రేటు తగ్గుతోంది రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు జూన్ 10న 8. 29, జూన్ 11న 8.09గా నమోదైంది. రికవరీ రేటు 94 శాతంగా ఉంది. మరణాలు కూడా తగ్గుముఖం పట్టాయి. జూన్ 10న 67 మంది, 11న 61 మంది ప్రాణాలు కోల్పోయారు. 96,100 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆస్పత్రుల్లో 15,951 మంది, కోవిడ్ కేర్ సెంటర్లలో 8,963 మంది, హోం ఐసోలేషన్‌లో 71,186 మంది వైద్య సేవలు పొందుతున్నారు. ఆక్సిజన్ వినియోగం తగ్గింది కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో 625 ఆస్పత్రుల్లో దానికి చికిత్స అందజేశాం. ప్రస్తుతం తీవ్రత తగ్గడంతో 454 ఆస్పత్రులు కరోనాకు చికిత్స అందిస్తున్నాయి. అన్ని జిల్లాల్లో ప్రస్తుతం 2,231 ఐసీయూ బెడ్లు, 11,290 ఆక్సిజన్ బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ఆక్సిజన్ వినియోగం కూడా తగ్గుతోంది. గత 24 గంటల్లో కేంద్రం నుంచి 423 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను మాత్రమే తీసుకున్నాం. బ్లాక్ ఫంగస్ కేసులను దాచిపెట్టడం లేదు రాష్ట్రంలో ప్రస్తుతం 1,307 బ్లాక్ ఫంగస్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీనితో 138 మంది మృతి చెందారు. ఈ కేసులను దాచిపెడుతున్నామనే ఆరోపణలు సరికాదు. కేసులు దాచిపెట్టడం వల్ల కేంద్రం నుంచి బ్లాక్ ఫంగస్ నివారణకు రావాల్సిన ఆంపోటెరిసిన్–బి ఇంజక్షన్లు రాకుండా పోతాయి. -
ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులకు వ్యాక్సిన్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులందరికీ వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించినట్టు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ చెప్పారు. ఇప్పటివరకు 45 ఏళ్ల వయసు పైన వారికే వ్యాక్సిన్ వేస్తున్నామన్నారు. కానీ చిన్నారుల్లో కరోనా వచ్చినప్పుడు తల్లి అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తల్లులకు కూడా టీకా వేస్తే రక్షణ ఉంటుందని చెప్పారు. ఆయన సోమవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో థర్డ్‌వేవ్ వస్తుందో రాదో ఖచ్చితంగా చెప్పలేమని, ముందస్తు అంచనాలతో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలి కాబట్టి తల్లులందరికీ వ్యాక్సిన్ వేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులు 15 లక్షల నుంచి 20 లక్షల మంది ఉండవచ్చన్నారు. వీరికి వ్యాక్సిన్ ఇవ్వడంపై వయసు నిబంధనలు సడలిస్తూ త్వరలోనే మార్గదర్శకాలు జారీచేస్తామని తెలిపారు. భవిష్యత్ అంచనాలనుబట్టి ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాకుండా ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా వారం రోజుల్లోగా వసతులను పరిశీలించాలని ఆదేశించినట్టు చెప్పారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోనూ ఈ అంచనా వేస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని ఆస్పత్రుల్లో చిన్నారులకు అవసరమైన వెంటిలేటర్లు, వార్డులు తదితరాలు సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో మూడు చిన్నపిల్లల ఆస్పత్రులు నిర్మించాలని సీఎం ఆదేశించారన్నారు. ఈనెల 20వ తేదీ వరకు కర్ఫ్యూ పొడిగించాలని, ఈనెల 11 నుంచి సడలింపు సమయాన్ని 2 గంటలు పెంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకునేవారు పెరిగారు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం చికిత్స చేయించుకునేవారి సంఖ్య పెరిగిందని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 21, 130 మందిలో 17,944 మంది (84.92 శాతం) ఆరోగ్యశ్రీ కింద ఉన్నారని చెప్పారు. కేవలం ప్రైవేటు ఆస్పత్రుల్లో అయితే చికిత్స పొందుతున్న 9,659 మందిలో 6,443 మంది (67 శాతం) ఆరోగ్యశ్రీ కింద ఉన్నారని తెలిపారు. అన్ని జిల్లాల్లో కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. తూర్పుగోదావరి, చిత్తూరు, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా పాజిటివిటీ రేటు భారీగా తగ్గుతోందని తెలిపారు. రాష్ట్రంలో బ్లాక్‌ఫంగస్ చికిత్సకు 91 వేలకుపైగా యాంఫొటెరిసిన్ బి ఇంజక్షన్లకు ప్రభుత్వం ఆర్డర్లు పెడితే ఇప్పటివరకు కేంద్రం 13 వేలకుపైగా ఇంజక్షన్లు ఇచ్చిందన్నారు. పొసకొనజోల్ మాత్రలు, ఇంజక్షన్లను తగినన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో 57,07,706 మందికి వ్యాక్సిన్ తొలిడోసు వేశామని, 25,80,432 మందికి రెండుడోసులు వేశామని చెప్పారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఏ వయసు వారిలో ఎంతశాతం కేసులు వచ్చాయి, రాష్ట్రంలో ఆ కేసుల శాతం ఎలా ఉంది అన్నదానిపై అంచనా వేసినట్లు ఆయన వివరించారు. -
ఆరోగ్య సిబ్బంది వైద్య ఖర్చుల బాధ్యత ప్రభుత్వానిదే..
సాక్షి, అమరావతి: కరోనా పేషెంట్లకు వైద్యం చేస్తూ కరోనా బారిన పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న డా.ఎన్.భాస్కరరావు వైద్యానికి అయ్యే వ్యయం మొత్తాన్నిముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరు చేసినట్టు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ చెప్పారు. ప్రకాశం జిల్లా కారంచేడు పీహెచ్సీలో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్ భాస్కరరావు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారని, ఆయన వైద్యానికి రూ.కోటి నుంచి కోటిన్నర వరకూ ఖర్చవుతుందని వైద్యులు చెప్పిన విషయాన్ని సింఘాల్ ప్రస్తావించారు. ఆయన శనివారం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న సిబ్బంది మెరుగైన వైద్యానికి అయ్యే ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందన్నారు. గతేడాది సెప్టెంబర్ నుంచి రూ.70 వేలు పీజీ వైద్య విద్య పూర్తయి సీనియర్ రెసిడెంట్లుగా పనిచేస్తున్న వారికి పెంచిన స్టైఫండ్‌ను 2021 జనవరి ఒకటో తేదీ నుంచి ఇద్దామనుకున్నామని, కానీ సీఎం వైఎస్ జగన్.. 2020 సెపె్టంబర్ నుంచే అమలు చేయాలని చెప్పినట్టు అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. ఈ మేరకు సెపె్టంబర్ నుంచే రూ.70 వేలు ఇస్తున్నామన్నారు. పీజీ పూర్తయినా పరీక్షలు జాప్యమై సీనియర్ రెసిడెంట్లుగా పనిచేస్తున్న వారికీ రూ.70 వేలు ఇస్తున్నామని, జూలైలో పరీక్షలు జరుగుతాయని, ఆ సమయంలోనూ వారికి స్టైఫండ్ చెల్లిస్తున్నట్టు చెప్పారు. రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులిస్తామన్నారు. 45 ఏళ్లు పైబడిన వారికి నెలలో వ్యాక్సినేషన్ పూర్తి ఇప్పటివరకూ టీకా తీసుకున్న హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లను మినహాయిస్తే.. 45 ఏళ్లు దాటిన వారిలో 50 శాతం మందికి సింగిల్ డోసు పూర్తయిందని సింఘాల్ వెల్లడించారు. రాష్ట్రంలో 1,06,47,444 డోసుల టీకాలు వేయగా, రెండు డోసులు తీసుకున్న వారు 25,67,162, సింగిల్ డోసు తీసుకున్న వారు 55,13,120 మంది ఉన్నారన్నారు. 45 ఏళ్లు దాటిన వారు, హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు మొత్తానికి కలిపి 53.8 శాతం ఒక డోస్ పూర్తయిందని చెప్పారు. 45 ఏళ్లు పైబడిన వారికి నెల రోజుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిచేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,460 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయినట్టు తెలిపారు. ఒక వేళ థర్డ్ వేవ్ వచ్చినా ముందస్తు అంచనాలు సిద్ధం చేశామన్నారు. టీకా వేసుకోని వారికే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. నెల్లూరు ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుగుతోందని వివరించారు. -
2 రోజులుగా కోవిడ్ కేసులు తగ్గాయి: ఏకే సింఘాల్
సాక్షి, విజయవాడ : గత రెండ్రోజులుగా కోవిడ్ కేసులు తగ్గాయని, 12,247 మంది కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్నారని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. రాష్ట్రంలో 1460 బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయని వెల్లడించారు. డాక్టర్ భాస్కర్‌రావు వైద్యం కోసం కోటిన్నర వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని, ఆయన ట్రీట్మెంట్కు అయ్యే ఖర్చు మొత్తాన్ని.. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారన్నారు. కోవిడ్ కష్టకాలంలో పనిచేస్తున్న వైద్యులకు అండగా ఉండాలని సీఎం భరోసా ఇచ్చారని, సీనియర్ రెసిడెంట్ వైద్యుల డిమాండ్లపై సీఎం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. సీనియర్ రెసిడెంట్ వైద్యుల స్టైఫండ్ ఇప్పటికే రూ.45 వేల నుంచి 70 వేలకు పెంచామని తెలిపారు. 2020 సెప్టెంబర్ నుంచి పెంచిన స్టైఫండ్ అమలు చేస్తామని అన్నారు. మూడో దశ కోవిడ్‌పై టాస్క్‌ఫోర్స్ కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. -
45 ఏళ్లలోపు ఉన్నా వ్యాక్సిన్
సాక్షి, అమరావతి: ప్రస్తుతం రాష్ట్రంలో 45 ఏళ్ల పైన వయసు ఉన్న వారికే టీకా వేస్తున్నామని, అయితే ఉద్యోగాలు లేదా చదువులకు విదేశాలకు వెళ్లే వారికి 45 ఏళ్లలోపు వయసు ఉన్నా టీకా వేయాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ సింఘాల్ చెప్పారు. చాలా దేశాలు వ్యాక్సిన్ వేయించుకున్న వారినే అనుమతిస్తున్నాయని పలువురు తమ దృష్టికి తేవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆయన బుధవారం మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. కొన్ని దేశాలు వ్యాక్సిన్ సర్టిఫికెట్లో పాస్‌పోర్ట్ నంబర్ కూడా అడుగుతున్నాయని, ఇప్పటికే ఎవరైనా మొదటి డోసు వేయించుకున్న వారు రెండో డోసుకు వెళితే పాస్‌పోర్ట్ నంబర్‌ను చేర్చి వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఇచ్చేలా కోవిన్ సాఫ్ట్‌వేర్‌ను మార్చాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శికి లేఖ రాశామని చెప్పారు. ఆధార్‌తో పాటు పాస్‌పోర్ట్ నంబరును విధిగా ఇవ్వాలన్నారు. సీనియర్ రెసిడెంట్లకు స్టైఫండ్‌ను రూ.45 వేల నుంచి రూ.70 వేలకు పెంచామని, మిగతా సమస్యలను వారంలోగా పరిష్కరిస్తామని చెప్పారు. దీనిపై బుధవారం చీఫ్ సెక్రటరీ వద్ద చర్చలు జరిగాయని, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. కరోనా సమయంలో విధులు బహిష్కరించడం మంచిది కాదని చెప్పామన్నారు. జూన్ 1 నాటికి రాష్ట్రంలో 1,01,68,254 డోసుల టీకా వేశామన్నారు. 45 ఏళ్లు నిండినవారు 1,33,07,889 మంది రిజిష్టర్ చేసుకోగా 61,76,447 మందికి (46.41 శాతం) వేశామన్నారు. జూన్‌లో కేంద్రం నుంచి రావాల్సిన 8,76,870 డోసులు వస్తేనే వ్యాక్సిన్ వేయడానికి ప్రణాళిక రూపొందించాల్సి ఉందన్నారు. పడకల లభ్యత పెరిగిందని, ప్రతి జిల్లాలోను ఐసీయూ పడకలు, ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఒకదశలో ఆక్సిజన్ రోజుకు 800 మెట్రిక్ టన్నులు సరఫరా చేశామని, ఇప్పుడు 490 మెట్రిక్ టన్నులు తీసుకొస్తున్నామని చెప్పారు. -
సంప్రదాయ మందుగా వాడవచ్చు
సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య తయారుచేసిన మందును సంప్రదాయ మందుగా వాడవచ్చని, దాన్ని ఆయుర్వేద మందుగా గుర్తించడంలేదని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ చెప్పారు.మందు వాడకం వల్ల లాభం గురించి కాకుండా, ఎలాంటి నష్టాలు జరగలేదని భావించి ఆమోదం ఇచ్చామన్నారు. సోమవారం ఆయుష్ కమిషనర్ కల్నల్ రాములుతో కలిసి మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. మందులో వాడుతున్న పదార్థాల్లో హానికారకాలు లేవని తేలిందని చెప్పారు. కోవిడ్ వైరస్ నియంత్రణకు పనిచేస్తుందన్న ఆధారాలు కూడా ఏమీ లేవని, ఎవరి నమ్మకాన్ని బట్టి వారు వాడుకోవచ్చని పేర్కొన్నా రు. ఇతర మందులు వాడుతున్న వారు వాటిని వాడుతూనే ఈ మందును కేవలం సప్లిమెంట్‌గా వాడాలని సూచించారు. పాజిటివ్ పేషెంట్లెవరూ క్యూలలో లేకుండా వారి సహాయకులు వచ్చి మందు తీసుకెళ్లడం మంచి దని,కంట్లో వేసే మందుకు అనుమతి లేదన్నారు. కర్ఫ్యూతో కేసులు తగ్గుముఖం కర్ఫ్యూ కారణంగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. గతంలో కొన్ని పత్రికలు 144 సెక్షన్ అమలు, కర్ఫ్యూపై మీడియాలో విమర్శలు చేశాయని, కానీ ఇప్పుడు ఈ విధానమే మంచి ఫలితాలనిచ్చిందని చెప్పారు. అందుకే జూన్ 10 వరకు కర్ఫ్యూ పొడిగించామన్నారు. రాష్ట్రంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు ఇదే మొదటిసారి అని తెలిపారు. రూ.7,880 కోట్లతో నిర్మిస్తున్న 16 మెడికల్ కాలేజీల్లో 14 కాలేజీలకు సోమవారం శంకుస్థాపన చేశారని, రెండు కాలేజీలకు ఇంతకుముందే శంకుస్థాపన చేశారని చెప్పారు. రాష్ట్రంలో 1,179 మంది బ్లాక్‌ఫంగస్ బాధితులున్నారని, వీరిలో 97 మంది పూర్తిగా కోలుకోగా, 14 మంది మృతిచెందారని తెలిపారు. 1,179 మందిలో 40 మంది మినహా మిగతావారు కరోనా సోకినవారేనని చెప్పారు. బ్లాక్‌ఫంగస్ కేసుల్లో 370 మంది ఆక్సిజన్ సపోర్టు తీసుకున్న వారు, 687 మంది స్టెరాయిడ్స్ వాడిన వారు ఉన్నారని తెలిపారు. మధుమేహ బాధితులు 743 మంది ఉన్నారన్నారు. కోవిడ్ కేసులు బాగా తగ్గుముఖం పట్టడంతో ఐసీయూ బెడ్లు, ఆక్సిజన్ బెడ్లు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయన్నారు. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లకు బాగా డిమాండు తగ్గిందన్నారు. ఆక్సిజన్ స్టోరేజీ సామర్థ్యం తక్కువగా ఉండటంతో రోజుకు 590 మెట్రిక్ టన్నులు మాత్రమే తెస్తున్నామని, ఆక్సిజన్ వినియోగం కూడా తగ్గిందని తెలిపారు. 10 రోజుల్లోనే ప్రక్రియ పూర్తిచేశాం ఆయుష్ కమిషనర్ కల్నల్ రాములు మాట్లాడుతూ కృష్ణపట్నం మందుపై తమశాఖ ఈనెల 21, 22 తేదీల్లో పరిశీలన మొదలుపెట్టిందని చెప్పారు. చెప్పినట్లుగానే అన్ని పరిశీలనలు పూర్తిచేసి 10 రోజుల్లో ఫలితాలు ఇచ్చామన్నారు. దీన్నిబట్టి ఈ మందుపై ప్రభుత్వం ఎంత వేగంగా స్పందించిందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. చట్టం, శాస్త్రం ప్రకారం దీన్ని ఆయుర్వేద మందుగా గుర్తించలేదని, స్థానిక, సంప్రదాయ మందుగానే ఇవ్వాలని ప్రభుత్వం సూచించిందని తెలిపారు. కోవిడ్ నిబంధనల మేరకు ఈ మందును పంపిణీ చేయాలన్నారు. ఆనందయ్యతో మాట్లాడిన తరువాత మందు పంపిణీపై తేదీలు ప్రకటిస్తామని ఆయన చెప్పారు. -
50 పడకలు దాటితే ఆక్సిజన్ ప్లాంటు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పటికే 57 ఆస్పత్రుల్లో పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ 50 పడకలు దాటితే ఆక్సిజన్ ప్లాంటు కచ్చితంగా ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. వారం రోజుల్లో దీనికి సంబంధించిన మార్గదర్శకాలు వస్తాయన్నారు. శనివారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు పరిశ్రమల శాఖ రాయితీలు ఇస్తుందని, భవిష్యత్‌లో ఎక్కడా ఆక్సిజన్ కొరత లేకుండా ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. రాష్ట్రంలో 16 చోట్ల సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి ప్రభుత్వం ఆహ్వానిస్తోందని, రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టే వారికి భూమిలో రాయితీ ఇస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. దీనికోసం భూములు కేటాయించాలని కలెక్టర్లను ఆదేశించామన్నారు. రాష్ట్రంలో 808 బ్లాక్‌ఫంగస్ కేసులు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 808 బ్లాక్‌ఫంగస్ కేసులు నమోదయ్యాయన్నారు. బ్లాక్‌ఫంగస్ చికిత్సకు సంబంధించిన యాంఫోటెరిసిన్–బి ఇంజక్షన్లు కేంద్రం ఇస్తేనే తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని, దీనికి మరో మార్గం లేదన్నారు. ఇంజక్షన్ల కోసం అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి కేంద్రం 7,726 ఇంజక్షన్లు కేటాయించిందన్నారు. ప్రస్తుతం ఉన్న 2,475 యాంఫోటెరిసిన్–బి ఇంజక్షన్లు జిల్లాలకు పంపించామని, పొసకొనజోల్ ఇంజక్షన్లు, మాత్రలు కూడా కొనుగోలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో రోజువారీ ఆక్సిజన్ వినియోగం తగ్గిందని, ఒక దశలో 620 టన్నుల వినియోగం జరిగిందని, ఇప్పుడు 510 టన్నులు వినియోగం అవుతోందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై 66 విజిలెన్స్ కేసులు నమోదయ్యాయని, వీటిలో 43 ఆస్పత్రులపై పెనాల్టీలు వేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కర్ఫ్యూ వంటి నిర్ణయాల వల్ల రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, అన్ని జిల్లాలో తగ్గిన ప్రభావం కనిపిస్తోందన్నారు. రెండ్రోజుల్లో 10 లక్షల మందికి వ్యాక్సిన్ ‘రాష్ట్రంలో గతంలో ఒకేరోజు 6.28 లక్షల మందికి టీకా వేశాం. ఇప్పుడు రెండ్రోజుల్లో 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేశాం. రాష్ట్రానికి టీకా వేసే సామర్థ్యం ఎక్కువగా ఉంది కాబట్టి కేటాయింపులు కూడా ఎక్కువగా చేయాలని కేంద్రాన్ని కోరాం’ అని సింఘాల్ తెలిపారు. నేటితో అంటే మే 30వ తేదీతో ఉన్న స్టాకు అయిపోతుందన్నారు. ఆ తర్వాత కేంద్రం వ్యాక్సిన్ పంపించే వరకు రాష్ట్రంలో వ్యాక్సిన్ వేయడానికి లేదని, ఈ నేపథ్యంలో కాస్త కేటాయింపులు పెంచి త్వరగా వ్యాక్సిన్ పూర్తయ్యేలా చేయాలని లేఖ రాసినట్టు తెలిపారు. ఇప్పటి వరకు 94,74,745 డోసుల టీకాలు పంపిణీ చేశామని, వీరిలో రెండు డోసులు తీసుకున్న వారు 24.12 లక్షల మంది ఉండగా, మొదటి డోసు తీసుకున్న వారు 46.48 లక్షల మంది ఉన్నారన్నారు. వ్యాక్సిన్లు ఎక్కడైనా దుర్వినియోగం జరిగాయని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
జిల్లాలకు 3 వేల బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఇప్పటి వరకు బ్లాక్‌ఫంగస్ నియంత్రణకు వాడే యాంఫోటెరిసిన్–బి ఇంజక్షన్లు 3 వేలు పంపిణీ చేశామని, ఎప్పటికప్పుడు కేసుల పరిశీలన చేస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. ఇంజక్షన్ల లభ్యతను బట్టి రాష్ట్రానికి తెప్పిస్తున్నామన్నారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేస్తున్న మందుపై నాలుగు రోజుల్లో స్పష్టత ఇస్తామన్నారు. ఇప్పటికే ఈ మందు నమూనాలు హైదరాబాద్ ల్యాబొరేటరీతో పాటు సెంట్రల్ ఆయుర్వేదిక్ ల్యాబొరేటరీకి వెళ్లాయని, ఫలితాలు రెండు మూడు రోజుల్లో రానున్నాయని, వచ్చిన వెంటనే నిర్ణయం వెలువరిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రుల నుంచి రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల డిమాండ్ బాగా తగ్గిందని, గడిచిన 24 గంటల్లో 5,640 ఇంజక్షన్లు మాత్రమే ప్రైవేటు ఆస్పత్రులకు ఇచ్చామన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో 22 వేల ఇంజక్షన్లు అందుబాటులో ఉండగా, ఇప్పుడు 41 వేలకు పైగా ఉన్నాయన్నారు. బుధవారం నాటికి ప్రభుత్వాస్పత్రుల్లో 75 వేల ఇంజక్షన్లు అందుబాటులో ఉంటాయన్నారు. గత 24 గంటల్లో 767 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాష్ట్రానికి తీసుకొచ్చామని, 650 మెట్రిక్ టన్నుల వినియోగం జరుగుతోందన్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆక్సిజన్ నిల్వ చేస్తున్నామన్నారు. బ్లాక్ ఫంగస్‌తో మృతిచెందినట్టు తమకు సమాచారం లేదన్నారు. నేడు, రేపు కోవాగ్జిన్ సెకండ్ డోసు పంపిణీ చేస్తున్నామన్నారు. 78 వేల కోవాగ్జిన్ డోసులు రావాల్సి ఉందన్నారు. 45 ఏళ్లు దాటి, ప్రజలతో సత్సంబంధాలు కలిగిన ఉద్యోగులకు కోవిషీల్డ్ మొదటి డోస్ ఇవ్వాలని ఆదేశించినట్టు తెలిపారు. ప్రస్తుతం ఉన్న స్టాకును జూన్ 15 వరకు మొదటి డోసుగా వేస్తామని, తర్వాత కేంద్రం నుంచి వచ్చే స్టాకును బట్టి రెండో డోస్ వేస్తామన్నారు. -
అనాథలైన చిన్నారులకు రూ.10 లక్షల డిపాజిట్
సాక్షి, అమరావతి: కోవిడ్ సోకి తల్లిదండ్రులు మృతిచెంది అనాథలైన చిన్నారులకు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనుంది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇలాంటివారిని గుర్తించి తక్షణమే నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఎక్స్‌గ్రేషియాకు అర్హులైనవారి పేరుతో ఏదైనా జాతీయ బ్యాంకులో రూ.10 లక్షలు జమ చేసి బాండ్‌ను వారికి అప్పగిస్తారని ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. వారికి 25 ఏళ్ల వయసు నిండాక మాత్రమే ఈ డబ్బు తీసుకునేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. అప్పటివరకు ఈ డిపాజిట్‌పై వచ్చే వడ్డీని నెలవారీగానీ, మూడు నెలలకు ఒకసారిగానీ తీసుకోవచ్చని తెలిపారు. ఎక్స్‌గ్రేషియాకు అర్హులైన అనాథ చిన్నారులను గుర్తించేందుకు జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా కమిటీ వేశారు. జిల్లా వైద్యాధికారి సభ్యులుగా ఉండే ఈ కమిటీకి స్త్రీ శిశుసంక్షేమశాఖ పీడీ మెంబర్ కన్వీనర్‌గా ఉంటారు. వచ్చిన దరఖాస్తులను ముందుగా స్త్రీ శిశుసంక్షేమశాఖ పీడీ పరిశీలించి కలెక్టర్‌కు పంపిస్తారు. ఎక్స్‌గ్రేషియాకు ఇవీ అర్హతలు ► దరఖాస్తు తేదీ నాటికి 18 ఏళ్లలోపు వయసు ఉండాలి ► కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు ఇద్దరూ మరణించిన వారి పిల్లలు ► తల్లిదండ్రుల్లో ఒకరు ఇంతకుముందే మరణించి, ఇప్పుడు కోవిడ్ కారణంగా మరొకరు మృతిచెందిన వారి పిల్లలు ► కుటుంబ ఆదాయం దారిద్య్రరేఖకు దిగువన ఉండాలి ► కోవిడ్ పాజిటివ్ రిపోర్టును విధిగా చూపించాలి ► ఇతర బీమా సంస్థల నుంచి లబ్ధి పొందనివారు మాత్రమే అర్హులు.