autos
-
ఆటోలను నిషేధించాలి: జేసీ ప్రభాకర్‌రెడ్డి
సాక్షి,అనంతపురం:ఆటోలపై టీడీపీ సీనియర్ నేత,తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆటోల కారణంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని నిషేధించాలని జేసీ డిమాండ్ చేశారు.అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసిపల్లిలో శనివారం(నవంబర్ 23) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతిచెందడంపై జేసీ స్పందించారు.‘ఆటోలను నిషేధించాలి. రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే. డ్రైవర్ పక్కన ముగ్గురేసి కూర్చోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.ఆటోల వల్లే ప్రతి నెలా 60 మంది చనిపోతున్నారు. తలగాసిపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా సరిపోదు. ఒక్కో బాధిత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఈ విషయం చంద్రబాబునాయుడుకు అధికారులు చెప్పాలి’అని జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఇదీ చదవండి: అసెంబ్లీలో ఆ విషయం మర్చిపోయావా.. అఖిలప్రియా.. -
ఆటో రిపేర్‌కు 3 నెలలు
ఆటోనగర్ (విజయవాడ తూర్పు): విజయవాడను ముంచెత్తిన వరదల కారణంగా ఇక్కడి ఆటోవాలాలకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. వరదలో మునిగిన ఆటోలు మరమ్మతులు చేయడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుందని, అప్పటి వరకు వేచి ఉండాలని, లేదంటే బయట మెకానిక్‌ల వద్ద రిపేర్లు చేయించుకోవాలని షోరూం యజమానులు తెగేసి చెబుతున్నారు. దీంతో కంగుతింటున్న ఆటోవాలాలు అన్ని రోజుల పాటు ఉపాధి కోల్పోతే కుటుంబ పోషణ, ఆటోల ఈఎంఐల చెల్లింపు ఎలా అని ఆందోళన చెందుతున్నారు. ఆటో యజమానులను మరింత ఆందోళనకు గురిచేసేలా షోరూం యజమానులు ఓ ప్రతిపాదన కూడా పెడుతున్నారు. వన్‌టైం సెటిల్మెంట్ చేసుకుని ఆటోను వెనక్కి ఇచ్చేస్తే.. కట్టిన వాయిదాలను, ఆటో కండిషన్‌ను బట్టి రూ. 10 వేల నుంచి రూ. 20 వేల వరకు నగదు ఇస్తామని చెబుతున్నారు. బయట రిపేర్లంటే కష్టమే.. బయట మరమ్మతులు చేయించుకోవాలంటే కష్టమేనని, తాము ఇబ్బంది పడతామని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. కొత్త మోడళ్ల ఆటోల రిపేర్లు బయట మెకానిక్‌లకు తెలియదని, సరిగా చేయకపోతే మళ్లీ మొరాయిస్తాయని వాపోతున్నారు. షోరూం వాళ్లు మూడు నెలల సమయం పెడితే ఈఎంఐ ఎలా చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదల కారణంగా ఇప్పటికే ఉపాధిలేక నానా ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడంలేదని చెబుతున్నారు. వన్‌టైం సెటిల్మెంట్ చేసుకోవాలంటే సంబంధిత ఫైనాన్స్ కంపెనీల నుంచి కచి్చతంగా క్లయిం నంబర్ తీసుకోవాలని, ఆ నంబర్ ఇవ్వడానికి కూడా ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులు రూ. 4 వేల నుంచి రూ. 5 వేలు డిమాండ్ చేస్తున్నారని ఆటోడ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులు, ఇతర ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల నుంచి అప్పులు చేసి ఆటోలు కొనుక్కున్నామని, ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో తీవ్రంగా నష్టపోయామని, ఇప్పుడు షోరూం వాళ్ల తీరుతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నామని పలువురు ఆటో డ్రైవర్లు వాపోయారు. సమస్యను వారంలో పరిష్కరిస్తానని సీఎం చెప్పారు ఆటోల మరమ్మతులు వారం రోజుల్లో చేయిస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇది ఆచరణలో సాధ్యం కాలేదు. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. ఆటో మరమ్మతుకు మూడు నెలల సమయం పడుతుందని షోరూం వారు చెబుతున్నారు.అప్పటి వరకు ఏమి చేసి కుటుంబాన్ని నడపాలి. ఏమి చేయాలో అర్థం కావడంలేదు. వన్‌టైం సెటిల్మెంట్ చేసుకోవడం కుదరదు. గతంలో చెల్లించిన కిస్తీల పరిస్థితి ఏంటో చెప్పడంలేదు. ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించి మమ్మల్ని ఆదుకోవాలి. – ఇ.సింహాచలం, జక్కంపూడి వైఎస్సార్ కాలనీ -
వారిజీవితం ‘ఆటో’.. ఇటో!
సాక్షి, అమరావతి: విజయవాడ వరద విలయం.. సగటు బడుగు జీవితాలను ఒక్కసారిగా తిరగబెట్టింది. నిత్యం ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తూ జీవనాన్ని సాగించే ‘ఆటో వాలాల’ పరిస్థితి దారుణంగా మారింది. రయ్రయ్.. అంటూ రోడ్లపై దూసుకెళ్లే వేలాది ఆటోలు బుడమేరు ఉధృతితో కనబడకుండా పోయాయి. దాదాపు వారం రోజులుగా నీటిలో నానిపోతూ ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి. శుక్రవారం వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ‘సాక్షి’ బృందం పర్యటించగా.. ముంపులో నుంచి ఆటోలను రోడ్లపైకి తీసుకొస్తూ, రహదారుల పక్కనే చేతనైనా మరమ్మతులు చేసుకుంటున్న ఆటో డ్రైవర్లే కనిపించారు. ఇందులో ఎవరిని పలకరించినా కన్నీటి గాథలే వినిస్తున్నాయి. ఊహించని వరదల్లో విలవిల్లాడుతున్న జీవితాలు కళ్లముందు కదలాడుతున్నాయి. సింగ్‌నగర్ కాలనీలతో పాటు పైపుల రోడ్డు, పాయకాపురం, కండ్రిక, రాజరాజేశ్వరిపేట, అంబాపురంలో అత్యధికంగా ఆటోలు నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నారు. విజయవాడ నగరంలో తిరిగే ఆటోల్లో 80 శాతంపైగా ఈ ప్రాంతానికి చెందినవే. ఇక్కడ సుమారు 6 వేలకు పైగా ఆటోలు ఉంటాయని అంచనా. బుడమేరు ఒక్కసారిగా ముంచెత్తడంతో ఆ ఆటోలు, యజమానులు నీటిలో చిక్కుకుపోయారు. వరద నీరు ఇంజిన్లోకి చేరడంతో పాటు, సీట్లు, కవర్లు నీటిలో నానిపోవడంతో పెద్దఎత్తున నష్టపోయారు. 70 శాతం అద్దె ఆటోలే..బుడమేరు వరదల్లో ఇంటి ముందు పెట్టిన ఆటోలు కూడా కొట్టుకుపోయాయి. ఇప్పుడు నీటి ఉధృతి తగ్గడంతో యజమానులు ఆటోలను వెతుక్కునే పనిలో పడ్డారు. వాస్తవానికి ఇక్కడి ఆటో డ్రైవర్లలో 60–70 శాతం మంది అద్దె ఆటోలనే నడుపుకొనేవారే. ఆటోను బట్టి రోజుకు రూ. 450 నుంచి రూ. 500 వరకు అద్దె చెల్లిస్తూ.. సర్వీసులు తిప్పుకుంటున్నారు. రోజులో సర్వీసు ఉన్నా.. లేకున్నా ఆటో అద్దె చెల్లించాల్సిందే. రోజూ వేకువ జాము నుంచి రాత్రి వరకు కష్టపడినా రోజుకు రూ. 500 సంపాదించడం కష్టంగా ఉంటోంది. అలాంటి ఆటోవాలల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది. చేతిలో చిల్లిగవ్వ లేక మరమ్మతులు చేసుకోలేక ఆటోవాలాలు దిక్కులు చూస్తున్నారు. ఒక్కో ఆటోకు సుమారు రూ.10 వేల నుంచి రూ. 20 వేలకుపైగా ఖర్చు చేస్తేకానీ మళ్లీ రోడ్డెక్కే పరిస్థితి కనిపించట్లేదని వాపోతున్నారు. మళ్లీ మొదటికి వచ్చింది..వరద తగ్గిపోయిందని ఇంటిని శుభ్రం చేసుకోవడం మొదలు పెడితే.. మళ్లీ తెల్లారేçÜరికి మెట్లపైకి వరద చేరింది. పైన అంతస్తుల్లో కాలకృత్యాలు తీర్చుకునే వారి వ్యర్థాలు మొత్తం నీళ్లలోకి చేరుతున్నాయి. ఎంత శుభ్రం చేసినా మళ్లీ మొదటికొచ్చింది. నేను గతంలో కరెంట్ కాంట్రాక్టు పనులు చేస్తూ దెబ్బతిన్నాను. ఆరోగ్యం రీత్యా నా కొడుకుతో కలిసి ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. మాకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. వారం రోజులుగా ఆహారం అందించిన నాథుడే లేడు. బలవంతుడికి ఆహారం దొరికింది.. మా లాంటి బలహీనులు పస్తులున్నాం. ఇప్పుడు చలి జ్వరంతో ఇబ్బంది పడుతున్నాం. ఇదేం జీవితమో అర్థం కావట్లేదు. – ఏలియా, పాయకాపురంపాయకాపురం రాధానగర్‌కు చెందిన మణికంఠ. మూడేళ్లుగా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుడమేరు వరద మణికంఠ జీవితాన్ని తల్లకిందులు చేసింది. రేయింబవళ్లు ఆటో నడిపి ఇంటిలో సమకూర్చుకున్న వస్తువులన్నీ దెబ్బతినడంతో సుమారు రూ. లక్షకుపైగా నష్టపోయాడు. నడిరోడ్డుపై నీట మునిగిన ఆటో వద్ద.. ఉబికి వస్తున్న కన్నీళ్లను అదిమిపెట్టుకుని ‘సాక్షి’ వద్ద గోడు వెళ్లబోసుకున్నాడు. ‘నాకు రూ.లక్షలు పోసి ఆటోలు కొనే పరిస్థితి లేదు. రోజూ రూ. 500కు అద్దె ఆటో నడుపుకొంటున్నాను. ఉదయం 5గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆటో నడిపితేనే ఒక్కోరోజు ఇంటికి రూ. వంద కూడా తీసుకెళ్లలేని పరిస్థితి. అలాంటిది వారం రోజులుగా ఉపాధి పోయింది. శనివారం రాత్రి వరద వస్తుందని అధికారులు హెచ్చరించలేదు. మేము రాత్రి నిద్రపోయాం. ఆదివారం ఉదయం 7 గంటలకే మా ఇంటిని వరద చుట్టుముట్టింది. ఆటోను స్టార్ట్ చేసి బయటకు వద్దామంటే ముందుకు కదల్లేదు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కట్టించి ఇచ్చిన అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో అద్దెకు ఉంటున్నాం. ఇంటిలోకి నీళ్లు రావడంతో వంట సామగ్రిని తీసుకుని మొదటి అంతస్తులో కారిడార్‌లో కాలం వెళ్లదీస్తున్నాం. మునిగిపోయిన ఆటోను కిలో మీటరుపైగా మా నాన్నతో కలిసి తోసుకుంటూ వచ్చాను. కనీసం తాడు కట్టుకుని లాక్కుని వెళ్దామంటే మరో ఆటోని పోలీసులు లోపలికి రానివ్వట్లేదు. -
యాదాద్రి పైకి ఆటోలు
యాదగిరిగుట్ట : రెండేళ్ల తర్వాత యాదాద్రి కొండపైకి ఆటోల రాకపోకలు షురూ అయ్యాయి. యాదాద్రి ప్రధానాలయ ఉద్ఘాటన జరిగిన 2022 మార్చి 28వ తేదీ నుంచి కొండపైకి ఆటోలు నడపడం నిషేధించారు. దీంతో ఆటోడ్రైవర్లు నిరసనకు దిగారు. మొదటి ఘాట్ రోడ్డులోని యాదరుషి ఆలయం వద్ద వివిధ రూపాల్లో వారు దీక్షలు, ఆందోళనలు చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో పోలీసుల సూచన మేరకు నవంబర్ 2023లో దీక్షలు విరమించారు. అధికారంలోకి వస్తే గుట్టపైకి ఆటోలు నడిచేలా చూస్తామని కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చా క రెండు, మూడుసార్లు ఆటో డ్రైవర్లు, దేవాలయ, పోలీసు అధికారులతో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చర్చలు జరిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖలతో మాట్లాడి ఆదివారం నుంచి కొండపైకి ఆటోలు నడిచే విధంగా చూశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా ఆటోడ్రైవర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. యాదాద్రి కొండపైకి ఆటోలను అనుమతించే కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ హనుమంతు కె.జెండగే, డీసీపీ రాజేష్ చంద్ర, ఈఓ రామకృష్ణారావు, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తిలతో కలిసి జెండా ఊపి పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆటో డ్రైవర్లకు మంచి రోజులు వచ్చాయన్నారు. అనంతరం కలెక్టర్ జెండగే, డీసీసీ రాజేష్ చంద్రా, ఈఓ రామకృష్ణారావులను బీర్ల ఐలయ్య ఆటోలో గుట్టపైకి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి, కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, ఏసీపీ శివరాంరెడ్డి, సీఐ రమే‹Ù, మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధ తదితరులు పాల్గొన్నారు. ఆటోలకు స్టిక్కర్లు.. యాదాద్రి కొండపైకి నడిచే ఆటోలకు ట్రాఫిక్ పోలీసులు, ఆటో కారి్మక యూనియన్ నేతలు సీరియల్ నంబర్, శ్రీస్వామి వారి చిత్రపటంతో కూడిన స్టిక్కర్లు అతింకించారు. ఆటో డ్రైవర్ల డ్రైవింగ్ లైస్సెన్స్, పొల్యూషన్ పత్రాలను పరిశీలించారు. తొలి రోజు అధికారులు చెప్పిన ప్రకారం 100 ఆటోలను కొండపైకి నడిపించారు. -
పేద మహిళలకు మహిళాశక్తి ఆటోలు
సాక్షి, అమరావతి: కిరాయి ప్రాతిపదికన ఆటోలు నడుపుకొంటున్న పొదుపు సంఘాల సభ్యులైన ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రభుత్వం గురువారం ‘మహిళాశక్తి’ పేరుతో ఆటోలను పంపిణీ చేయనుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) పరిధిలో ‘ఉన్నతి’ కార్యక్రమం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మండలానికి ఒకరు చొప్పున 660 మండలాల్లో 660 మందికి ఈ ఆటోలను అందజేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. తొలివిడతగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 231 మందికి వీటిని అందజేయనున్నారు. జిల్లాల వారీగా ఎంపికైన లబ్ధిదారులకు ఆ జిల్లాల్లోనే కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగనుందని సెర్ప్ అధికారులు వెల్లడించారు. గ్రా మీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్, సెర్ప్ సీఈవో ఇంతియాజ్ అహ్మద్ విజ యవాడకు సమీపంలోని గొల్లపూడిలోగల టీటీడీసీ కేంద్రంలో పదిమంది లబ్ధిదారులకు ఆటోలను పంపిణీ చేస్తారని తెలిపారు. మహిళాసాధికారత లక్ష్యంగా నాలుగున్నరేళ్లుగా పొదుపు సంఘాల మహిళలకు వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ పథకాలను, 45–60 ఏళ్ల మధ్య వయసు ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్సార్ చేయూత సహా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొత్తగా స్వశక్తితో ఎదగాలని ఆశపడే పేదింటి మహిళలకు చేయూతనిచ్చేందుకు ‘మహిళాశక్తి’ పేరుతో ఈ కార్యక్రమం చేపట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుకున్న లక్ష్యం మేరకు మిగిలిన లబ్ధిదారుల ఎంపికను ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి నాటికి పూర్తిచేసి వారికి ఆటోలు అందజేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. లబ్ధిదారులు భరించాల్సింది 10 శాతమే ఆటో కొనుగోలుకు అయ్యే ఖర్చులో కేవలం పదిశాతం మేర లబ్ధిదారులు భరిస్తే మిగిలిన 90 శాతం మొత్తాన్ని ప్రభుత్వం సెర్ప్ ద్వారా అందిస్తోంది. ఆ 90 శాతం రుణాన్ని కేవలం అసలు మొత్తం 48 నెలవారీ కిస్తీల రూపంలో చెల్లించే వెసులుబాటు కల్పించింది. సాధారణంగా పేదలు ఆటో కొనుగోలు చేయాలంటే బ్యాంకులు, ఇతర ఆర్థికసంస్థల నుంచి రుణం తీసుకుని, నెలవారీగా కిస్తీలు చెల్లి స్తుంటారు. ప్రభుత్వం ఇప్పడు ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఆటోల కొనుగోలుకు అయ్యే మొత్తం ఖర్చులో 90 శాతం మొత్తాన్ని వడ్డీలేని రుణంగా ఇవ్వడంతో పాటు రుణం మొత్తాన్ని నెలవారీ కిస్తీల రూపంలో చెల్లించేందుకు వీలు కల్పించడంతో వడ్డీ రూపంలో దాదాపు రూ.లక్షన్నర మేర లబ్ధిదారులకు ఆర్థిక ప్రయోజనం కూడా కలుగుతుందని అధికారులు వివరించారు. ఆటోలను లబ్ధిదారుల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి అందజేస్తున్నట్టు చెప్పారు. -
స్వశక్తితో ఎదిగే మహిళల కోసం ‘మహిళా శక్తి’
సాక్షి, అమరావతి: మహిళా సాధికారిత లక్ష్యంగా చేపడుతున్న అనేక కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వశక్తితో ఎదగాలనుకొనే పేదింటి మహిళలకు చేయూతనిచ్చేందుకు మరో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ మహిళలు కేవలం 10 శాతం ఖర్చుతో వారు ఆటోలు సమకూర్చుకొని, వాటి ద్వారా ఆర్థికంగా బలపడేలా ‘మహిళా శక్తి’ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇందుకోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) పరిధిలో ‘ఉన్నతి’ కార్యక్రమంలో వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో డ్రైవింగ్ నైపుణ్యం ఉండీ పలువురు మహిళలు ఆటోలను కిరాయికి తీసుకొని నడుపుకొంటున్నారు. ఇకపై వారు అద్దెవి కాకుండా సొంత ఆటోలు నడుపుకోవడం ద్వారా మరింత ఆదాయం పొందేలా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు ‘మహిళా శక్తి’కి రూపకల్పన చేశారు. ఈ పథకంలో ఆటో కొనుగోలుకు అయ్యే ఖర్చులో పది శాతం లబ్ధిదారు అయిన మహిళ భరిస్తే సరిపోతుంది. మిగతా 90 శాతం సెర్ప్ ద్వారా ప్రభుత్వమే రుణంగా అందిస్తుంది. ఈ రుణానికి వడ్డీ ఉండదు. మొత్తం రుణాన్ని 48 నెలలు కిస్తీ రూపంలో చెల్లించుకునే వెసులుబాటు కల్పించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మండలానికి ఒకరు చొప్పున 660 మందికి ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం చేయూతనందిస్తుంది. ఇప్పటికే 229 మంది లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేసి, వారికి డ్రైవింగ్‌లో నాలుగు రోజుల పాటు అదనపు శిక్షణ ఇచ్చారు. ఆటోలకు వచ్చే చిన్న చిన్న సమస్యల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డ్రైవింగ్ సమయంలో భద్రత తదితర అంశాలపై శిక్షణ కూడ పూర్తి చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా డిసెంబరు 6వ తేదీన లబ్ధిదారులకు కొత్త ఆటోలు అందజేస్తారు. మిగిలిన మండలాల్లో వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోగా లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసి, వారికీ అంబేడ్కర్ జయంతి రోజు ఏప్రిల్ 14న కొత్త ఆటోలు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కొక్కరికీ రూ.లక్షన్నర దాకా అదనపు ప్రయోజనం సాధారణంగా ఆటోల కొనుగోలుకు బ్యాంకులు లేదా ఇతర ప్రైవేటు ఆర్థిక సంస్థలు రుణాలిస్తాయి. దీనిని నెలవారీ కిస్తీల రూపంలో తిరిగి చెల్లించాలి. వీటిపై కనీసం రూ. లక్షన్నర వడ్డీనే అవుతుంది. ఇది ఆటో డ్రైవర్లకు ఆర్థిక భారమే. మహిళా శక్తి ద్వారా ఆటోలు పొందే లబ్ధిదారులకు ఇచ్చే రుణంపై వడ్డీ లేనందున, వారికి ఈ లక్షన్నర ఆర్థిక ప్రయోజనం అదనంగా కలుగుతుందని అధికారులు వివరించారు. -
‘ఉపాధి’కి ఇంధనం..
మీలో ఒకడిగా.. ‘వాయిస్ ఆఫ్ ది వాయిస్‌లెస్’! ఇవన్నీ ఎవరో చెబితేనో.. ఎవరో ఉద్యమాలు చేస్తేనో తీసుకొచ్చినవి కావు. నా 3,648 కి.మీ. పాదయాత్రలో మీ సమస్యలను కళ్లారా చూశా. మీలో ఒకడిగా నాలుగేళ్లుగా మీ సమస్యల పరిష్కారం కోసం అడుగులు వేస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్ధలో ‘వాయిస్ ఆఫ్ ది పీపుల్..’ అంటారు. మీ బిడ్డ పాలనలో ‘వాయిస్ ఆఫ్ ది వాయిస్‌లెస్’ అంటే... తమ కష్టాన్ని చెప్పుకోలేని, తన ఆర్తిని వినిపించలేని పేదల గొంతుకై వాళ్ల తరపున నిలబడుతున్న ప్రభుత్వం మనది. కాబట్టే అట్టడుగున ఉన్న పేదవాడు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మనసా వాచా కర్మణా మీ బిడ్డ నమ్మాడు కాబట్టి ఆ దిశగా నాలుగేళ్లలో అడుగులు పడ్డాయి. – సీఎం జగన్ సాక్షి, అమరావతి: ఆటోలు, టాక్సీలను నడిపే డ్రైవర్ సోదరులు స్వయం ఉపాధి పొందడమే కాకుండా రోజూ లక్షలమంది ప్రయాణికులకు సేవలందిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. సొంతంగా ఆటోలు, టాక్సీలు కలిగి ఉండి వాటిని నడిపే వారికి ఇన్సూరెన్స్, ఫిట్నెస్తోపాటు ఇతర ఖర్చుల కోసం ఏడాదికి రూ.పది వేల దాకా ఖర్చవుతోందన్నారు. అంత మొత్తం భరించేందుకు ఇబ్బందిపడే పరిస్థితుల్లో ఉన్న అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు మంచి చేసేందుకే ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం అందించేందుకు ‘వైఎస్ఆర్ వాహనమిత్ర’ పథకాన్ని తెచ్చినట్లు తెలిపారు. వరుసగా ఐదో ఏడాది ఈ పథకం ద్వారా మంచి చేస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం విజయవాడలోని విద్యాధరపురంలో నిర్వహించిన కార్యక్రమంలో బటన్ నొక్కి 2,75,931 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.275.93 కోట్ల వైఎస్సార్ వాహన మిత్ర పథకం ఐదో విడత ఆర్ధిక సాయాన్ని నేరుగా బ్యాంకు ఖాతాల్లో సీఎం జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. ఆ వివరాలివీ.. ఐదేళ్లలో రూ.1,301.89 కోట్లు.. ఆటోలు, ట్యాక్సీలు నడుపుకొంటున్న నా అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల చేతుల్లో నేరుగా రూ.10 వేలు పెడుతున్నాం. ఈ డబ్బు ఎలా వాడతారు? దేనికి వినియోగిస్తారన్నది నేను అడగను. కానీ మీ అందరికి సవినయంగా ఒక్కటి విజ్ఞప్తి చేస్తున్నా. మీ వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ కచ్చితంగా ఉండేలా చూసుకోండి. మీ వాహనంలో ప్రయాణికులు ఉన్నారని, మీకూ కుటుంబాలు ఉన్నాయనే విషయాన్ని మర్చిపోవద్దు. ఎంతోమందికి సేవలందిస్తున్న మీకు ప్రభుత్వం తోడుగా నిలబడుతుంది. ఒక్క ఏడాది కూడా ఈ పథకాన్ని ఆపకుండా ఐదేళ్లలో ఐదు విడతల్లో ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున సహాయం చేయడం ద్వారా ఒక్క వైఎస్సార్ వాహన మిత్ర ద్వారానే ఇప్పటివరకు రూ.1,301.89 కోట్లను నేరుగా అందించాం. గడప వద్దకే సంక్షేమం ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాలు, రేషన్ కార్డుల దగ్గర నుంచి పెన్షన్ల దాకా, జనన, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలన్నీ ఇంటివద్దకే తీసుకొచ్చి అందిస్తున్నాం. మీ అవసరాలు ఏమిటో జల్లెడ పట్టి మరీ తెలుసుకుని నవరత్నాల్లోని ప్రతి సంక్షేమ పథకాన్ని నేరుగా గడపవద్దకే చేర్చుతున్నాం. నా పేద అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల పిల్లలు గొప్పగా చదవాలన్న ఆరాటంతో మన గ్రామంలోని ప్రభుత్వ బడికే ఇంగ్లిష్ మీడియం చదువులను తెచ్చాం. లంచాలు, వివక్షకు తావు లేకుండా వలంటీర్, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం. మీ గ్రామానికే విలేజ్ క్లినిక్ తీసుకొచ్చి మీకు అందుబాటులో ఉంచాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను పరిచయం చేయడంతోపాటు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి ఇంట్లో బీపీ, షుగర్, హెచ్‌బీ, కఫం టెస్టులను నిర్వహిస్తూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని తపన పడుతున్నాం. గ్రామ, వార్డు స్ధాయిలోనే మహిళా పోలీసులను ఏర్పాటు చేశాం. ప్రతి అక్కచెల్లెమ్మ ఫోన్లో దిశ యాప్ ఉండేలా చూస్తున్నాం. విత్తనాల నుంచి విక్రయాల దాకా రైతన్నలకు ప్రతి అడుగులోనూ తోడుగా నిలుస్తూ ఆర్బీకేలను తీసుకొచ్చాం. రైతన్నలు.. నేతన్నలు.. గంగపుత్రులు రాష్ట్రంలో 52.39 లక్షల మంది రైతన్నల కష్టాలు, కన్నీళ్లు తెలిసిన ప్రభుత్వంగా వారికి తోడుగా నిలబడుతున్నాం. ఒక్క వైఎస్ఆర్ రైతుభరోసా కోసమే రూ.30,985 కోట్లు ఖర్చు చేశాం. పంటలు వేసే సమయానికి పెట్టుబడి ఖర్చుల కింద రైతన్నల చేతుల్లో డబ్బులు పెట్టాం. ఇలాంటి మేలు చేసిన ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో మరొకటి లేదని అన్నదాతలకు తెలుసు. వేట నిషేధ సమయంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న మత్స్యకార సోదరులకు అండగా నిలుస్తూ మత్స్యకార భరోసా ద్వారా 2.43 లక్షల కుటుంబాలకు ఐదేళ్లలో ఏకంగా రూ.538 కోట్లు అందించాం. మగ్గం కదిలితే తప్ప బతుకు బండి నడవని 82 వేల చేనేత కుటుంబాలకు ఐదేళ్లలో ఒక్క నేతన్న నేస్తం పథకం ద్వారానే రూ.982 కోట్లు అందించి అండగా నిలిచాం. తోడు అందిస్తూ.. చేదోడుగా నిలుస్తూ రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో రోడ్డు పక్కనే, పుట్‌ఫాత్‌ల మీద విక్రయాలు సాగించే చిరువ్యాపారులను ఆదుకునేందుకు జగనన్న తోడు, జగనన్న చేదోడు పథకాలను అమలు చేస్తున్నాం. వాళ్లు వ్యాపారాలు ఎలా చేసుకుంటున్నారు...? అందుకు పెట్టుబడి ఎక్కడ నుంచి వస్తుంది? ఆ పెట్టుబడి కోసం ఎంతెంత వడ్డీకి డబ్బులు తెస్తున్నారో గతంలో ఎవరూ పట్టించుకోలేదు.అలాంటి 15.87 లక్షల మంది చిరువ్యాపారులకు జగనన్న తోడు పథకం ద్వారా ఇప్పటివరకు వడ్డీలేని రుణాల రూపంలో రూ.2956 కోట్లు అందించాం. రజక సోదరులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల కోసం జగనన్న చేదోడు పథకం తీసుకొచ్చి 3.30 లక్షల మందికి ఇప్పటివరకు రూ.927 కోట్లు సాయం అందించాం. అమ్మ ఒడి.. విద్యా దీవెన.. వసతి దీవెన అక్కచెల్లెమ్మలు బాగుంటేనే ఆ కుటుంబాలు బాగుంటాయి. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా మీ బిడ్డ జగనన్న అమ్మఒడి పథకాన్ని తెచ్చాడు. 52 నెలల్లో 44.48 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటూ అమ్మఒడి కోసం రూ.26 వేల కోట్లు విడుదల చేశాం. 26.99 లక్షల మంది తల్లులకు వారి పిల్లల పెద్ద చదువుల కోసం విద్యా దీవెన ద్వారా అందించిన సహాయం రూ.11,317 కోట్లు. జగనన్న వసతి దీవెన బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చులు చెల్లిస్తున్నాం. ఏడాదికి రూ.20 వేలు వరకు అందిస్తూ జగనన్న వసతి దీవెన కోసం రూ.4,275 కోట్లు వెచ్చించాం. అక్కచెల్లెమ్మలను ఆదుకుంటూ... చంద్రబాబు రుణమాఫీ హామీని నమ్మి పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు మోసపోయారు. మాట ప్రకారం వారిని ఆదుకుంటూ వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని తెచ్చి 80 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.19,178 కోట్లు ఇచ్చాం. లేదంటే చంద్రబాబు మోసాలతో 18 శాతం ఉన్న ఎన్పీఏలు, అవుట్ స్టాండింగ్ లోన్స్ 50 శాతం దాటేవి. అక్కచెల్లెమ్మలకు వైఎస్ఆర్ సున్నావడ్డీ కూడా వర్తింపచేసి దాదాపు రూ.5 వేల కోట్లు ఇచ్చి తోడుగా నిలబడ్డాం. 26.40 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా రూ.14,129 కోట్లు వారి చేతుల్లో పెట్టాం. వైఎస్ఆర్ కాపునేస్తం ద్వారా 3.58 లక్షల మంది కాపు అక్కచెల్లెమ్మలకు రూ.2,029 కోట్లు సాయం అందించాం. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా 4.39 లక్షల మంది ఓసీ నిరుపేద అక్కచెల్లెమ్మలకు అందించిన సహాయం రూ.1,257 కోట్లు. 30.76 లక్షలమంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్ధలాలిచ్చాం. ఇప్పటికే 21.32 లక్షల ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. తమకు ఇంతగా మేలు చేసిన ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలోనే కాదు.. దేశ చరిత్రలోనే మరొకటి లేదని నా అక్కచెల్లెమ్మలకు తెలుసు. ఇవన్నీ ఎవరో అడిగితేనో, ఎవరో ఉద్యమాలు చేస్తేనో వచ్చినవి కావు. ఇవన్నీ కూడా మీ బిడ్డ.. మీలో ఒకడు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టే.. మీ కష్టాలు, సుఖాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టే.. ఇది మీ ప్రభుత్వం కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు కార్యక్రమంలో మంత్రులు పి.విశ్వరూప్, జోగి రమేశ్, తానేటి వనిత, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, వసంత కృష్ణ ప్రసాద్, రక్షణనిధి, కైలే అనిల్ కుమార్లతోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రానికి జగనన్న అవసరం నేను విజయవాడలో 15 ఏళ్లుగా సీఎన్జీ ఆటో నడుపుతున్నాను. గతంలో ఇక్కడ 4 సీఎన్జీ స్టేషన్లు మాత్రమే ఉండడంతో గ్యాస్ కోసం రోజంతా పడిగాపులు పడేవాళ్లం. ఆటోలకు ఇన్సూరెన్స్‌లు, ఫిట్ నెస్‌లు చేయించుకోవడానికి కూడా కుదిరేది కాదు. పాదయాత్రలో మా స మస్యలు మీకు చెప్పగానే సానుకూలంగా స్పందించారు. మీరు సీఎం అవ్వగానే వాహనమిత్ర పథకం ద్వారా మాకు సాయం చేస్తున్నారు.ఈ విడతతో కలిపి నాకు రూ.50,000 వచ్చాయి. మీ చొరవతో విజయ వా డలో ఉన్న సీఎన్జీ స్టేషన్లు 4 నుంచి 15 అయ్యాయి. కోవిడ్ వల్ల రవాణా రంగం కుదేలైపోతే మానవత్వంతో మాకు 5 నెలల ముందే వాహనమిత్ర సాయం అందించా రు. నా తల్లి 2 నెలలు గవర్నమెంట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే వలంటీర్ వచ్చి పెన్షన్ ఇచ్చారు. మా అమ్మ చనిపోయే వరకు రూ. 81 వేలు వచ్చాయి. నా కూతురుకి అమ్మ ఒడి సాయం అందింది. నా కుమారుడికి వసతిదీవెన ద్వారా రూ.20 వేలు, ఇంజినీరింగ్ చదువుకు రూ.2,20,320 వచ్చాయి. మొత్తం నా కుటుంబానికి రూ.3,85,300 లబ్ధి కలిగింది. నా ఆటోకు ఇంధనం ఎంత అవసరమో... ఈ రాష్ట్రానికి జగనన్న కూడా అంతే అవసరం. – వినోద్, ఆటో డ్రైవర్, వాహనమిత్ర లబ్ధిదారుడు, విజయవాడ -
అమాంతంగా పెరిగిన క్యాబ్ చార్జీలు...
హైదరాబాద్: ఆటోలు, క్యాబ్‌లు ప్రయాణికులను ఠారెత్తిస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆటోవాలాలు, క్యాబ్‌వాలాలు చార్జీలను రెట్టింపు చేసి ప్రయాణికులపైన నిలువుదోపిడీకి పాల్పడుతున్నారు. మరోవైపు బుకింగ్‌లలోనూ తీవ్ర జాప్యం చోటుచేసుకుంటుంది. అత్యవరస పరిస్థితుల్లో క్యాబ్‌లను ఆశ్రయించే వారు గంటల తరబడి పడిగాపులు కాయవలసి వస్తోంది. చివరి నిమిషంలో క్యాబ్ బుక్ అయినా డబుల్ చార్జీలు చెల్లించుకోవలసి వస్తోంది. మంగళవారం తెల్లవారుజాము నుంచే నగరంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో అనేక చోట్ల రహదారులు జలమయమయ్యాయి. దీంతో ప్రజారవాణా అస్తవ్యవస్థమైంది. పలు మార్గాల్లో సిటీ బస్సుల రాకపోకలకు సైతం అంతరాయం కలిగింది. దీంతో ఉదయాన్నే విధులకు వెళ్లవలసిన ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రయాణికులు ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయించారు. సాధారణ రోజుల్లో తార్నాక నుంచి సికింద్రాబాద్‌కు ఆటోలో వెళ్లేందుకు రూ.120 కంటే ఎక్కువ ఉండదు. కానీ మంగళవారం ఏకంగా రూ.250 వరకు చెల్లించవలసి వచ్చినట్లు రమేష్ అనే ప్రయాణికుడు తెలిపారు. బోడుప్పల్ నుంచి ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు ఓలా ఆటో సాధారణంగా అయితే రూ.60 నుంచి రూ.80కి లభిస్తుంది. కానీ వర్షం కారణంగా ఏకంగా రూ.150 దాటింది. ఇక సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి, బేగంపేట్, తదితర రైల్వేస్టేషన్లకు చేరుకున్న దూరప్రాంత ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అమాంతంగా పెరిగిన క్యాబ్ చార్జీలు... సాధారణ రోజుల్లోనే ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్ పేరిట క్యాబ్ సంస్థలు అడ్డగోలుగా చార్జీలు పెంచేస్తాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో క్యాబ్‌ల కొరతను సాకుగా చూపుతూ చార్జీలను రెట్టింపు చేశారు. తార్నాక నుంచి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 వరకు సాధారణ రోజుల్లో రూ.450 నుంచి రూ.500 వరకు ఉంటే మంగళవారం ఇది రూ.870 కి చేరినట్లు ఒక ప్రయాణికుడు విస్మయం వ్యక్తం చేశారు. ఐటీ నిపుణులు, ఉద్యోగులు, ఉదయం పూట ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు వెళ్లే ఉద్యోగుల ఒత్తిడి కారణంగా క్యాబ్‌లకు డిమాండ్ పెరిగింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి అమీర్‌పేట్ వరకు రూ.1650 వరకు వసూలు చేసినట్లు ఒక ప్రయాణికురాలు విస్మయం వ్యక్తం చేశారు. మెట్రో కిటకిట... మెట్రో రైళ్లకు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. వర్షం దృష్ట్యా చాలామంది మెట్రో రైళ్లను ఆశ్రయించారు. నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్ రూట్లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. ఉదయం, సాయంత్రం ఎక్కువ మంది మెట్రోలపైన ఆధారపడి ప్రయాణం చేశారు. దీంతో రెండు రోజులుగా మెట్రో ప్రయాణికుల సంఖ్య సుమారు 5.50 లక్షలకు చేరినట్లు అంచనా. ప్రతి 3 నిమిషాలకో మెట్రో రైలు నడిపించారు. -
ఈ-ఆటోలతో ఆర్థిక భారం తగ్గుతుంది: ఆదిమూలపు
సాక్షి, అమరావతి: ఈ-ఆటోలతో మున్సిపాలిటీలపై ఆర్థిక భారం తగ్గుతుందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలన్న లక్ష్యంతో చిన్న మున్సిపాలిటీల్లోనూ చెత్త సేకరణకు పర్యావరణహితంగా ఉండే విద్యుత్తు ఆటోలను (ఈ–ఆటోలను) ప్రవేశపెట్టారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జెండా ఊపి వీటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ‘‘ఐదు క్వింటాళ్ల సామర్థ్యం కలిగిన వాహనాలను కొనుగోలు చేశాం. వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులను చేపట్టాం. కోటి 20 లక్షల డస్ట్బిన్లను అందించాం. తడి, పొడి చెత్త సేకరణకు ప్రత్యేక ఏర్పాటు చేశాం. మురుగు నీటిని శుద్ది చేసే ప్రాజెక్టులను కూడా నిర్మిస్తున్నాం. రానున్న రోజుల్లో చెత్త రహిత రాష్ట్రం సాకారం అవుతుంది. మున్సిపాలిటీల్లో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు చేశాం.. కానీ ఎల్లో మీడియాలో విష ప్రచారం చేస్తున్నారు. రేపు గుడివాడలో టిడ్కో ఇళ్లు పంపిణీ చేస్తున్నాం. పేదలకు ఇళ్లు ఉండాలనేది సీఎం జగన్ లక్ష్యం’’ అని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. చదవండి: CM Jagan: క్లీన్ ఆంధ్రప్రదేశ్‌లో మరో ముందడుగు -
స్వచ్ఛ సంకల్పం.. ఈ-ఆటోలను ప్రారంభించిన సీఎం జగన్ (ఫొటోలు)
-
CM Jagan: క్లీన్ ఆంధ్రప్రదేశ్‌లో మరో ముందడుగు
సాక్షి, అమరావతి: రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధృడ సంకల్పం. ఈ లక్ష్యంతో చిన్న మున్సిపాలిటీల్లోనూ చెత్త సేకరణకు పర్యావరణహితంగా ఉండే విద్యుత్తు ఆటోలను (ఈ–ఆటోలను) ప్రవేశపెట్టారు. తద్వారా ఆ మున్సిపాల్టి లకు నిర్వహణ భారం కూడా తగ్గుతుంది. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జెండా ఊపి వీటిని ప్రారంభించారు. రూ.4.10 లక్షల విలువైన 516 ఈ–ఆటోలను మొత్తం రూ.21.18 కోట్ల వ్యయంతో కొనుగోలు చేశారు. వీటిని 36 మున్సిపాల్టి లకు పంపిణీ చేస్తారు. ఈ ఆటో సామర్థ్యం 500 కిలోలు. మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తూ ‘ఈ– ఆటోల‘ డ్రైవర్లుగా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ఇప్పటికే రూ.72 కోట్లతో 123 మున్సిపాలిటీల్లోని 40 లక్షల కుటుంబాలకు తడి, పొడి, హానికర వ్యర్ధాల సేకరణకు నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లోని 120 లక్షల చెత్త బుట్టలను ప్రభుత్వం పంపిణీ చేసింది. గ్రేడ్–1 ఆపై మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు 2,525 పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గార్బేజ్ టిప్పర్లను వినియోగిస్తోంది. అలాగే గుంటూరు, విశాఖపట్నంలలో వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులు ప్రారంభించింది. చదవండి: సీఐడీ దర్యాప్తుపైనా..వక్రీకరణేనా రామోజీ? త్వరలో రోజుకు 400 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో మరో ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. రూ.157 కోట్లతో 81 మున్సిపాలిటీలలో 135 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లు నిర్మిస్తున్నారు. 71 సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులు, తడి చెత్త నిర్వహణకు 29 వేస్ట్ టు కంపోస్ట్, నాలుగు బయో మిథనేషన్ ప్రాజెక్ట్‌లు నడుస్తున్నాయి. లక్ష లోపు జనాభా ఉన్న 66 మున్సిపాలిటీల్లో రూ.1,445 కోట్లతో 206 టీపీఐఎస్‌లు, లక్ష లోపు జనాభా ఉన్న 55 మున్సిపాలిటీల్లో ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా చిన్న మున్సిపాలిటీల్లో ఈ–ఆటోలు ప్రవేశపెట్టారు. చదవండి: షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హై స్పీడ్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లను లాంచ్ చేసిన జీరో 21
ముంబై: హైదరాబాద్‌కు చెందిన రెన్యువబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రొవైడర్ జీరో 21 కొత్తగా మూడు ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలను రూపొందించింది. ప్యాసింజర్, కార్గో సెగ్మెంట్ల కోసం ఉపయోగపడే తీర్, స్మార్ట్ మ్యూల్, ఎక్స్ మోడల్స్‌ను సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో రాణి శ్రీనివాస్ వీటిని ఆవిష్కరించారు. వీటితో తమ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో మరింతగా విస్తృతమవుతుందని పేర్కొన్నారు. తీర్ను ఒక్కసారి చార్జి చేస్తే గంటకు 55 కి.మీ. గరిష్ట వేగంతో 110 కి.మీ. మైలేజ్ ఉంటుంది. స్మార్ట్ మ్యూల్–ఎక్స్ రేంజీ 125 కి.మీ.లుగా ఉంటుంది. పాత పెట్రోల్, డీజిల్ వాహనాలను విద్యుత్ వాహనాలుగా మార్చుకునేందుకు అవసరమైన రెన్యూ కన్వర్షన్ కిట్లను కూడా జీరో21 తయారు చేస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో రెన్యూ కిట్లను విక్రయిస్తోంది. అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా మాజీ ఉద్యోగి అయిన రాణి శ్రీనివాస్.. జీరో21ను ప్రారంభించారు. తెలంగాణలోని జహీరాబాద్‌లో ప్లాంటు ఉంది. -
పెండింగ్ చలాన్ వాహనదారులకు హైదరాబాద్ పోలీసులు బంపర్ ఆఫర్
-
రాష్ట్రంలో ట్యాక్సీ.. ఆటోలకు అనుమతి!
రవాణా సేవల పునరుద్ధరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల వైపుగా ట్యాక్సీ, ఆటోలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జూన్ ఒకటో తేదీ నుంచి మెట్రో రైలు పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎంటీసీ బస్సు సేవలకు చర్యలు చేపట్టారు. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో నాలుగో విడత లాక్డౌన్ అమల్లోకి వచ్చినానంతరం ఆంక్షల సడలింపులు ప్రజలకు ఊరటగా మారాయి. మాల్స్, థియేటర్లు, వినోద కేంద్రాల తప్పా మిగిలిన అన్ని రకాలు దుకాణాలు దాదాపుగా తెరచుకున్నాయి. పరిశ్రమల్లో ఉత్పత్తులకు శ్రీకారం చుట్టారు. విమానాల సేవలు మొదలయ్యాయి. చెన్నై, కోయంబత్తూరు, తిరుచ్చి, మదురై నుంచి విమానాల రాకపోకలు సాగుతున్నాయి. అయితే ఆశించిన మేరకు ప్రయాణికులు విమానాశ్రయాల వైపు వెళ్లడం లేదు. దీంతో అనేక విమాన సేవలు రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి. ఇక జూన్ ఒకటి నుంచి రైళ్ల సేవలు మొదలు కానున్నాయి. ప్రస్తుతానికి చెన్నై మినహా, మిగిలిన మార్గాల్లో వలస కార్మికుల కోసం ప్రత్యేక రైలు పట్టాలెక్కుతున్నాయి. ఈపరిస్థితుల్లో జూన్ ఒకటి నుంచి చెన్నై వైపుగా రైళ్లు దూసుకొచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం రవాణా వ్యవస్థను పునరుద్ధరించేందుకు తగ్గ చర్యలపై దృష్టి పెట్టింది. ట్యాక్సీ, ఆటోలకు ఒకే.. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు తెరచుకున్న దృష్ట్యా ఈ సేవలు క్రమంగా విస్తృతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లకు వచ్చే వారి రవాణా కోసం ట్యాక్సీలు, ఆటోలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. చెన్నై, మదురై, కోయంబత్తూరు, తిరుచ్చి విమానాశ్రయాల వైపుగా ట్యాక్సీలకు అనుమతి ఇచ్చారు. అలాగే, ఆటోలకే ఓకే చెప్పేశారు. ఇక రైళ్ల సేవలు మొదలు కానున్న దృష్ట్యా ఆయా స్టేషన్లకు సైతం ఆటో, ట్యాక్సీలకు అనుమతి ఇస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే చెన్నై నగరంలో మెట్రో రైలు సేవలకు చర్యలు చేపట్టారు. జూన్ ఒకటో తేది నుంచి మెట్రో రైలు పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రైళ్లకు ఏసీ సౌకర్యం తప్పని సరి. ఇందుకు ప్రత్యామ్నాయ చర్యలపై మెట్రో వర్గాలు సిద్ధమవుతున్నాయి. ఎంటీసీ బస్సు సేవలు... చెన్నై వంటి నగరాల్లో ఎంటీసీ బస్సుల సేవల పునరద్ధరణ కసరత్తులు మొదలయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా కొన్ని మార్గాల్లో ఎంటీసీ బస్సులు నడుస్తున్నాయి. చెన్నైలో తొలుత ఎంటీసీ సేవలకు శ్రీకారం చుట్టి, ఆ తదుపరి ఇతర నగరాలపై దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎంటిసీ బస్సు సేవల కోసం ప్రత్యేక యాప్‌ను ప్రకటించబోతున్నారు. జీపీఎస్ సౌకర్యంతో, స్టాపింగ్ వివరాలను ఎప్పటికప్పుడు తెలిసే రీతిలో బస్సుల్లో అమరికలు సాగుతున్నాయి. యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న వారికి, ఏ మార్గాల్లో బస్సులు పయనిస్తున్నాయో అన్న వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకున్న వారికి అనుమతి అన్నట్టుగా కసరత్తులు చేపట్టారు. చెన్నై నగరంలో 3200 బస్సులు ఉన్నా, ఇందులో 500 బస్సుల్లో ఈ ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతుండడం గమనార్హం. -
పైసలిస్తే బస్సులు తిప్పం..!
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ రహదారిపై ఉన్న ప్రజ్ఞాపూర్ కూడలిలో పెద్దసంఖ్యలో ప్రయాణికులు నిలబడి ఉన్నారు. వారిలో అక్కడి నుంచి భువనగిరి రోడ్డులో ఉన్న జగదేవ్‌పూర్ మండల కేంద్రానికి వెళ్లాల్సినవారు అధికం. గంటసేపు ఎదురుచూసినా ఒక్క బస్సు కూడా రాలేదు, అప్పటికే అక్కడ దాదాపు ఇరవై వరకు ఏడు సీట్ల ఆటోలు రారమ్మంటూ ప్రయాణికులను పిలుస్తున్నాయి. ఒక్కో ఆటోలో 15 నుంచి 20 మంది చొప్పున ప్రయాణికులు కిక్కిరిసిపోయి జగదేవ్‌పూర్ వైపు సాగిపోయారు. ఇలా నిరంతరం జరుగుతూనే ఉంది. ఇంతడిమాండ్ ఉన్నా ఈ మార్గం లో ఆర్టీసీ మాత్రం బస్సు సర్వీసుల సంఖ్య పెంచటం లేదు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపో యి సిబ్బంది జీతాలు చెల్లించలేని దుస్థితి ఆర్టీసీది. రాష్ట్రం నలుమూలలా ప్రధాన రహదారుల నుంచి మండల కేంద్రాలు, ప్రధాన గ్రామాలకు వెళ్లే దారుల్లో బస్సుల సంఖ్యను పెంచితే ఆదా యం పెరిగే అవకాశం ఉన్నా, ఆ దిశగా చర్యలు తీసుకోవటం లేదు. అడపాదడపా వచ్చే బస్సు లో జనం వేళాడుతూ వెళ్లాల్సి వస్తోంది. బస్సు కోసం అంత సేపు ఎదురు చూడలేక ఏడుగురు ఎక్కాల్సిన ఆటోల్లో 15 నుంచి 20 మంది వరకు ప్రయాణిస్తున్నారు. బస్సుల కొరత అంటూ భారీగా వసూళ్లు.. ప్రతి ఆర్టీసీ డిపో పరిధిలో సిబ్బంది క్రమం తప్పకుండా రూట్ సర్వే చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. ఏయే మార్గాల్లో ప్రయాణికుల నుంచి డిమాండ్ వస్తోందో తెలుసుకుని కొత్తగా సర్వీసులు ప్రారంభించటం దీని ఉద్దేశం. కానీ కొందరు సిబ్బంది ఆటోవాలాలతో కుమ్మక్కై కొత్త సర్వీసులు ప్రారంభించబోమని చెప్పి ఒక్కో ఆటో నుంచి ప్రతినెలా వసూలు చేసుకుంటున్నారు. ఆటో యూనియన్ నేతలకు ఈ బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. కొత్త బస్సుకోసం డి మాండ్ రాగానే ‘కొనేందుకు నిధులెక్కడివి’ అంటూ అధికారులు తిరస్కరిస్తున్నారు. తిక్క వ్యవహారాలు... గజ్వేల్ మండల కేంద్రం నుంచి జగదేవ్‌పూర్ మండల కేంద్రానికి బాగా డిమాండ్ ఉంది. కానీ, ఆర్టీసీ అధికారులు మాత్రం గజ్వేల్ నుంచి జగదేవ్‌పూర్ మీదుగా భువనగిరి వరకు సర్వీసులు నడుపుతున్నారు. ఇవి పరిమితంగా ఉండటంతో గజ్వేల్‌లో బయలుదేరిన బస్సు భువనగిరి వరకు వెళ్లి తిరిగి వచ్చేందుకు బాగా సమయం పడుతోంది. ఈలోపు ప్రజ్ఞాపూర్ వద్ద వేచిఉన్న ప్రయాణికులు ప్రత్యామ్నాయంగా ఆటోలను ఆశ్రయిస్తున్నారు. సిద్దిపేట మార్గంలో సిద్దిపేట–చేర్యాల, సిద్దిపేట– కొమురవెల్లి, అయినాపూర్, అయినాపూర్–చేర్యాల, సూర్యాపేట–ఆత్మకూరు, ఆదిలాబాద్–మంచిర్యాల రోడ్డు, సిరిసిల్ల–కరీంనగర్ రోడ్డు, మంథని–పెద్దపల్లి రోడ్డులను అనుసంధానం చేసుకుని ఉండే చాలా గ్రామాలవైపు బస్సు సర్వీసులు చాలా తక్కువగా ఉన్నాయి. జగిత్యాల నుంచి చందుర్తి, వేములవాడ, కొండగట్టువైపు వెళ్లే మార్గాల్లో బస్సుల సంఖ్య తక్కువగా ఉంది. ఇటీవల కొండగట్టు వద్ద దాదాపు 90 మంది ప్రయాణికులతో వెళ్తూ బస్సు బోల్తాపడి 70 మందిని మించి చనిపోయిన దుర్ఘటనే దీనికి సాక్ష్యం. తక్కువ ఖర్చు అయ్యే మినీ బస్సులు ఎక్కువ సంఖ్యలో కొను గోలు చేసి గ్రామాలకు తిప్పాల్సి ఉంది. -
ఆటోలు, ట్రాక్టర్లకు పన్ను మినహాయింపు
సాక్షి, అమరావతి: ఆటోలకు జీవిత కాలం, ట్రాక్టర్లకు త్రైమాసిక పన్ను నుంచి మినహాయింపు ఇస్తూ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్లను రెట్టింపు చేయాలన్న ప్రతిపా దనలకు ఆమోదం తెలిపింది. సచివాలయంలో సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను మంత్రి కాలవ శ్రీనివాసులు మీడియాకు వివరించారు. ముగ్గురి నుంచి ఏడుగురు ప్రయాణించే మూడు చక్రాల ఆటోలు, సరకు రవాణా చేసే మూడు చక్రాల ఆటోలు, 3 టన్నుల బరువు తీసుకెళ్లే సామర్థ్యం కలిగిన తేలికపాటి వాహనాలు, వ్యవసాయ అవసరాలకు ఉపయోగించే ట్రాక్టర్లు, ట్రాక్టరు ట్రయలర్లపై పన్ను మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మోటారు వెహికిల్ ట్యాక్స్ ఎరియర్స్ రద్దు ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఆటోలు నడిపేవారికి ఈ ఏడాది రూ.60 కోట్లు , ప్రతి ఏటా రూ.55 కోట్లు లబ్ధి పొందుతారని చెప్పారు. ఆటోలు, ట్రాక్టర్లపై పన్ను మినహాయింపు వల్ల 9.79 లక్షల వాహన యజమానులకు లబ్ధి కలుగుతుందన్నారు. పాసింజర్ ఆటో రిక్షాలు 5.66 లక్షలు ఉన్నాయని, వీటిపై ఏడాదికి రూ.20 కోట్ల జీవిత కాల, త్రైమాసిక పన్ను మినహాయించారని చెప్పారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రస్తుతం రూ. వెయ్యి ఉన్న పెన్షన్‌ను రూ.2 వేలు, రూ.1500 ఉన్న పెన్షన్‌ను రూ.3 వేలు చేశామన్నారు. మంత్రి వర్గం ఆమోదించిన మరిన్ని అంశాలు.. – ఉద్యోగులకు ఇవ్వాల్సిన రెండు డీఏలలో ప్రస్తుతం ఒక డీఏ ఈ జీతం నుంచి సర్దుబాటు. ఒక డీఏ బకాయి మొత్తం రూ.513.13 కోట్లు వాయిదాల రూపంలో చెల్లించేలా ఉద్యోగ సంఘాలతో చర్చించాలని నిర్ణయం. – వివిధ శాఖలలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు రివైజ్డ్ పే స్కేలు 2015 ప్రకారం మినిమం టైమ్ స్కేలు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలు. – చుక్కల భూములు, ఇళ్ల పట్టాల విషయంలో జాయింట్ కలెక్టర్‌కు బదులుగా ఆర్డీవోలకే అధికారం. – 2014 జూన్ నుంచి మంజూరు కాకుండానే నిర్మించుకున్న లక్షా 26 వేల 97 ఇళ్లకు ప్రభుత్వ సాయం అందించాలని నిర్ణయం. ఒక్కో ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి ఇచ్చే రూ.15 వేలతో కలిపి రూ.60 వేల చొప్పున లబ్దిదారునికి ఇవ్వనున్నారు. దీని కోసం రూ.756 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. 1996–2004 మధ్య వివిధ పట్టణ ప్రాంతాలలో నిర్మించిన ఇళ్లకు సంబంధించిన మరమ్మతుల కోసం ఒక్కో ఇంటికి రూ.10 వేల చొప్పున ఇవ్వనున్నారు. మొత్తం 20 వేల యూనిట్లకు రూ.20 కోట్లు ఖర్చు చేయనున్నారు. – అర్బన్ హౌసింగ్ కోసం భీమునిపట్నం మండలం కొత్తవలసలో 94.86 ఎకరాలు, పెందుర్తి మండలం సౌభాగ్యరాయపురంలో 127.46 ఎకరాలు (మొత్తం 222.32 ఎకరాలు) చొప్పున ల్యాండ్ పూలింగ్ చేపట్టేందుకు ఉడాకు అనుమతి. – రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, జుడీషియల్ అఫీషియల్స్‌కు ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లు కేటాయింపుపై నూతన విధానం. మార్గదర్శకాలు రూపొందించేందుకు ఆమోదం. ఆలిండియా సర్వీస్ అధికారులకు 500 గజాలు చొప్పున సొసైటీల ద్వారా స్థలాలు కేటాయిస్తారు. ఈ ప్లాట్లను అభివృద్ధి చేసేందుకు సీఆర్డీఏ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. రెండేళ్లకు మించి రాష్ట్రంలో పని చేస్తున్న అందరికీ స్థలాలు కేటాయిస్తారు. సెక్రటేరియెట్, లెజిస్లేచర్లలో పనిచేసే గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులకు, హైకోర్టులో పనిచేసే సబార్డినేట్ సిబ్బందికి, రాష్ట్ర రాజధానిలోని హెచ్వోడీల్లో పనిచేసే గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులకు స్థలాలు కేటాయిస్తారు. అటానమస్ ఆర్గనైజేషన్లలో పని చేసే వారికి స్థలాలు కానీ, ఫ్లాట్లను కానీ భూమి లభ్యతను బట్టి నామినల్ మార్కెట్ రేటుకు కేటాయిస్తారు. రాష్ట్రంలో రీజినల్, డిస్ట్రిక్ట్, సబ్ డిస్ట్రిక్ట్ వారీగా పనిచేసే ఉద్యోగులకు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి నివాసాలు కల్పిస్తారు. గ్రూపు, లేదా కోఆపరేటీవ్ సొసైటీ ద్వారానే ఈ కేటాయింపులు జరుగుతాయి. – ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు జనరల్ హౌసింగ్ పాలసీ, కేపిటల్ సిటీ హౌసింగ్ ఎంకరేజ్మెంట్ పాలసీలు తీసుకొచ్చేందుకు మంత్రి వర్గం ఆమోదం. – అమరావతి అక్రిడేటెడ్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటీవ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ (జర్నలిస్టులకు సంబంధించి)కు ఎకరం రూ.25 లక్షల చొప్పున 30 ఎకరాలు సీఆర్డీఏ పరిధిలో కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని నగర ప్రాంతంలో హౌస్ సైట్, ఇల్లు ఉన్నవాళ్లు అర్హులు కారు. గతంలో ప్రభుత్వ లబ్ధి పొందని జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయం. – రూ.10 కోట్ల బడ్జెట్‌తో చేనేత కార్మికుల వైద్య ఆరోగ్య బీమా పథకం. కుటుంబానికి రూ.20 వేల చొప్పున బీమా. – ఇప్పటికే ఉన్న రూ.50 కోట్ల డిపాజిట్లతో కలిపి అగ్రిగోల్డ్ బాధితులకు రూ.300 కోట్లు ముందస్తుగా చెల్లించేలా కోర్టును కోరాలని నిర్ణయం. – చిత్తూరు, నెల్లూరు జిల్లాలు.. పుంగనూరులోని కేబీడీ షుగర్స్, నిండ్రాలోని ప్రొడెన్షియల్ షుగర్స్, బీఎన్ కండ్రిగలోని సుదలగుంట షుగర్స్, పొదలకూరులోని సుదలగుంట షుగర్స్, నాయుడుపేటలోని ఎంపీ షుగర్స్ సంస్థలకు రూ.47.54 కోట్ల మేర పన్ను మినహాయింపు. కోఆపరేటీవ్, నిజాం షుగర్స్ (పబ్లిక్ సెక్టారు), ఖండసారి షుగర్ మిల్లులకు సంబంధించి కొనుగోలు పన్ను, వడ్డీలు, పెనాల్టీలకు సంబంధించి రూ.227,04,59,292 మినహాయింపు. – పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన ఏపీ అర్బన్ వాటర్ సప్లయ్ అండ్ సెప్టేజ్ మేనేజ్మెంట్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు కింద రూ.2,685.58 కోట్లతో చేపట్టే పనులకు ఆమోదం. – బందరు డీప్ వాటర్ పోర్టు, పోర్టు ఆధారిత పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి అవసరమైన భూమి ఎకరం రూ.40 లక్షల చొప్పున 122.95 ఎకరాలను ల్యాండ్ పర్చేజ్ స్కీమ్ కింద మేకవానిపాలెం, పోతిపల్లి గ్రామాల్లో కొనుగోలు చేయాలన్న కృష్ణా జిల్లా కలెక్టర్ ప్రతిపాదనలకు ఆమోదం. – రాజధానిలోని ఐనవోలులో వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్) భవనాలను 45 మీటర్ల మేర ఎత్తుకు నిర్మించుకునేందుకు అనుమతి. – ఏపీ కో–ఆపరేటీవ్ సొసైటీల చట్టం–1964లో తగిన మార్పులు చేస్తారు. – గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూములిచ్చిన ల్యాండ్ పూలింగ్ రైతులకు రాజధానిలో కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్స్ ఎక్సే్ఛంజ్ డీడ్ రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ మినహాయింపు. – రాజధానిలోని తుళ్లూరు మండలం వెంకటపాలెంలో శ్రీవేంకటేశ్వర స్వామి దివ్య క్షేత్ర నిర్మాణానికి సీఆర్డీఏ కేటాయించిన 25 ఎకరాల భూమి సేల్ డీడ్, సేల్ అగ్రిమెంట్ పత్రాలపై స్టాంపులు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ పన్ను రూ.1,00,20,600 మినహాయింపు. – విజయవాడ లబ్బీపేట బృందావన్ కాలనీలో 1052.86 చదరపు గజాల మునిసిపల్ ల్యాండ్‌ను మంత్రాలయం శ్రీరాఘవేంద్ర మఠం వారికి ప్రస్తుత రిజిస్ట్రేషన్ విలువలో నాలుగో వంతు ధరకు కేటాయింపు. – ఆర్మ్డ్ కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుళ్లుగా, హెడ్ కానిస్టేబుళ్లు ఏఎస్ఐలుగా పదోన్నతికి ఆమోదం. – హైకోర్టుకు కొత్తగా తొమ్మిది రిజిష్ట్రార్ పోస్టులు మంజూరు. – జాతీయ, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు సూపరాన్యుయేషన్ వయసు కంటే తక్కువగా ఉంటే ఒక ఏడాది పదవీకాలం పొడిగింపు. – తూర్పుగోదావరి జిల్లా చింతూరు గ్రామంలోని నూతన డిగ్రీ కళాశాల ఏర్పాటుకు అవసరమయ్యే 27 టీచింగ్, 14 నాన్ టీచింగ్ ఉద్యోగాలు మంజూరు. విశాఖ జోన్–1 కు జాయింట్ డెరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పోస్టు మంజూరు. ఏపీ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోసం ఒక చీఫ్ ఇంజనీర్, రెండు సూపరింటెండెంట్ ఇంజనీర్లు, ఆరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ల పోస్టులు మంజూరు. – శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రామకృష్ణాపురంలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల పార్కు నిర్మాణం కోసం 30 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు. – శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం కంచరం గ్రామంలో పట్టణ ప్రాంత పేదల గృహ నిర్మాణం కోసం మునిసిపల్ కమిషనర్‌కు 23.36 ఎకరాల ప్రభుత్వ భూమి ముందస్తుగా స్వాధీనం. – కృష్ణా జిల్లా చల్లపల్లిలో శ్రీ విజయ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ సొసైటీకి ఐదు ఎకరాల భూమి 20 ఏళ్ల పాటు లీజు. – అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కోమిటికుంట గ్రామం వద్ద సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం నెడ్‌క్యాప్‌కు 2.44 ఎకరాల భూమి కేటాయింపు. – వైఎస్సార్ జిల్లా తొండూరు మండలం బూచుపల్లి, మల్లెల, తొండూరు ప్రాంతంలో విండ్ పవర్ ప్రాజెక్టు కోసం నెడ్‌క్యాప్‌కు 42.70 ఎకరాల భూమి కేటాయింపు. – బాబు జగ్జీవన్ రామ్ సమతా స్ఫూర్తివనం నిర్మాణానికి రూ.50 కోట్లు, 10 సెంట్ల భూమి కేటాయింపు. అమరావతిలో సీఆర్డీఏ నిర్మాణ స్థలాన్ని గుర్తించాక మరో రూ.50 కోట్లు చెల్లించాలని నిర్ణయం. -
ఈ-రిక్షా.. ట్రాఫిక్‌కు శిక్ష!
సాక్షి, హైదరాబాద్: ఈ-రిక్షాలు రోడ్డెక్కకముందే అటకెక్కాయి. హైదరాబాద్ నగరంలో తీవ్రంగా పెరుగుతున్న వాహన కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఈ-రిక్షాలు ఉపయోగ పడతాయని భావించినా.. ట్రాఫిక్ చిక్కులు వాటికి ప్రతిబంధకంగా మారాయి. నెమ్మదిగా తిరిగే ఈ వాహనాలు ట్రాఫిక్ సమస్యను తీవ్రం చేస్తాయని భావించిన పోలీసు శాఖ, వాటిని అనుమతించేందుకు ససేమిరా అంటోంది. దీంతో వాటిని నగరంలో తిప్పేందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తోంది. ఢిల్లీ తరహాలో ఈ-రిక్షాలను ప్రవేశపెట్టి వీలైనంత మేర వాహన కాలుష్యాన్ని నియంత్రించేందుకు చేసిన ప్రయత్నం దాదాపు నీరుగారిపోయింది. వీటికి అనుమతి వస్తుందన్న ఉద్దేశంతో దాదాపు ఐదు కంపెనీలు ఈ-రిక్షాల సరఫరాకు ముందుకు వచ్చినప్పటికీ, ప్రస్తుతం ఆర్డర్లు లేక బిచాణా ఎత్తేసేందుకు సిద్ధమయ్యాయి. ఢిల్లీలో లక్ష ఈ-రిక్షాలు: రాష్ట్రంలో వాహనాల సంఖ్య బాగా పెరిగిపోతోంది. ప్రస్తుతం కోటి వాహనాలతో తెలంగాణ కిటకిటలా డుతోంది. ఇందులో మూడొంతులు భాగ్యనగరం, శివారు ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఫలితంగా నగరంపై కాలుష్య మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఢిల్లీలో వాహన కాలుష్యం తీవ్రంగా ఉండటంతో అక్కడి ప్రభుత్వం బ్యాటరీ రిక్షాలను ప్రోత్సహించింది. ప్రస్తుతం అక్కడ దాదాపు లక్ష ఈ-రిక్షాలు తిరు గుతున్నాయి. ఇదే తరహాలో ఇక్కడ కూడా వాటిని ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి వినతులు రావటంతో, రవాణా శాఖ అనుమతించింది. ప్రస్తుతం నగరంలో 1.20 లక్షల సాధారణ ఆటోలు తిరుగుతున్నాయి. కొత్త ఆటో పర్మిట్లపై సిటీలో నిషేధం ఉన్నా, వేరే జిల్లాలు, నగర శివారు ప్రాంతాల చిరునామాలతో ఆటోలు కొని అక్రమంగా తిప్పుతున్న వారి సంఖ్య ఎక్కువే ఉంది. చాలామంది ఆటోవాలాలు ఖర్చు తగ్గించుకునేందుకు డీజిల్‌లో కిరోసిన్ కలుపుతుం డటం కాలుష్యాన్ని మరింత పెంచుతోంది. గంటకు 25 కిలోమీటర్లే.. ఈ-రిక్షాలు అందుబాటులోకి వస్తే కాలుష్యాన్ని తగ్గించొచ్చన్న అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. కానీ ఈ-రిక్షాలు గంటకు 25 కి.మీ. కంటే తక్కువ వేగంతో ప్రయాణిస్తాయి. ఇది ట్రాఫిక్ ఇబ్బందులకు కారణమవుతుంది. మరోవైపు సాధారణ ఆటోలపై నిషేధం ఉన్నా, ఈృరిక్షాలకు అనుమతిస్తే వాటి సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగటం ఖాయం. దీంతో ట్రాఫిక్ చిక్కులు పెరుగుతాయని పోలీసు శాఖ నివేదించడంతో రాజధానిలో ప్రస్తుతానికి ఈ-రిక్షాల ప్రవేశానికి ప్రభుత్వం అనుమతించలేదు. శివారు ప్రాంతాలు, ఇతర జిల్లాలకు మాత్రం అనుమతి కొన సాగిస్తోంది. కానీ వేరే చోట్ల వీటికి అంత డిమాండ్ లేకపోవటంతో రోడ్లపై అరుదుగానే కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో సాధారణ ఆటోలకు కొత్త పర్మిట్లు మంజూరు చేసే సమయంలో, వాటికి బదులుగా ఈ-రిక్షాలను మాత్రమే కొనేలా ఆంక్షలు విధిస్తే ఫలితముంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ దీనిపై ప్రభుత్వం పెద్దగా దృష్టి సారించినట్లు కనిపించటం లేదు. -
‘మృత్యు’ ప్రయాణం!
...ఇది నక్కర్తమేడిపల్లి నుంచి పల్లెచెల్కతండాకు విద్యార్థులు ఆటోలో వెళుతున్న దృశ్యం. నాగార్జునసాగర్–హైదరాబాద్ రహదారిపై రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రం నుంచి నక్కర్తమేడిపల్లి మార్గంలో ఉన్న మల్కీజ్‌గూడ, నానక్‌నగర్, తాడిపర్తి గ్రామాలకు ప్రయాణించాలంటే ప్రైవేటు వాహనాలే దిక్కు. నిత్యం ఆటోలు, జీపుల్లో ప్రమాదకర పరిస్థితిలో వెళ్లక తప్పని దుస్థితి ఇది. లోపలా పైనా.. జనమే.. సాక్షి నెట్వర్క్ : రాష్ట్రంలో ప్రయాణం ప్రమాదంలో పడింది. మారుమూల పల్లెలు, తండాలు, కొన్నిచోట్ల మండల కేంద్రాల నుంచీ ప్రజలు ప్రైవేటు వాహనాల్లోనే ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు నడవకపోవడం, నడిచినా పొద్దున ఓ ట్రిప్పు, సాయంత్రం మరో ట్రిప్పు మాత్రమే ఉంటుండటంతో జనాలకు ఆటోలు, జీపులే దిక్కు అవుతున్నాయి. ఆటోలు, జీపుల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, పోటీలు పడి పరుగులు తీయించడం, సరిగా లేని రోడ్లు, ఫిట్నెస్ లేని వాహనాల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దాంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవలే నిజామాబాద్ జిల్లా మెండోరాలో ఓ ఆటో వ్యవసాయ బావిలో పడిపోయి 11 మంది మృత్యువాత పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. అందులో ఆరుగురు చిన్నారులుకాగా, ఐదుగురు మహిళలు ఉండటం ఆందోళనకరం. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో నూ ఈ తరహా పరిస్థితి ఉంది. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ నుంచి నారాయణఖేడ్‌కు పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళుతున్న ఆటో ఇది. లోపల 20 మంది, టాప్‌పైన మరికొంత మంది.. అసలే గుంతల రోడ్డు.. మితిమీరిన వేగం.. ఏ మాత్రం తేడా వచ్చినా భారీ దుర్ఘటన జరగక తప్పని పరిస్థితి. నిబంధనలున్నా.. పాటించే వారేరీ? ♦ ఆటోలు, జీపుల్లో కచ్చితంగా పరిమితిని పాటించాలి. దీనిని పాటించేవారే లేరు. ఏదైనా ప్రమాదం జరిగితే అందులో ప్రయాణిస్తున్న వారెవరికీ ప్రమాద బీమా కూడా వర్తించదు. ♦ డ్రైవింగ్ చేసేప్పుడు సెల్ఫోన్లు వాడడం నిషేధం. ప్రైవేటు వాహనాల వారు సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారు. ఆటోల్లో అయితే పెద్ద ధ్వనితో పాటలు పెట్టి నడుపుతూ ఉంటారు. దానివల్ల ఎవరైనా హారన్ కొట్టినా వినపడే పరిస్థితి ఉండదు. అరకొర బస్సులు.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చాలా గ్రామాలకు సరిగా బస్సు సౌకర్యం లేదు. ఉదయం, సాయంత్రం ఒక్కో ట్రిప్పు బస్సు సర్వీసు మాత్రమే ఉన్న గ్రామాలు ఎన్నో. ఇక తండాల పరిస్థితి మరీ దారుణం. రోడ్డు కూడా సరిగా ఉండదు. ఆటోల్లో ప్రయాణం కూడా ప్రమాదకరమే. నాలుగైదు కిలోమీటర్లు నడిచి వెళితేగానీ వాహనం ఎక్కలేని పరిస్థితి. పలు చోట్ల సరైన రోడ్డు ఉన్నప్పటికీ బస్సులు నడపడం లేదు. అన్ని జిల్లా కేంద్రాల్లో వాటికి 20 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల నుంచి ఆటోలు పెద్ద సంఖ్యలో తిరుగుతున్నాయి. రోడ్లు సరిగా ఉండకపోవటం, మితిమీరిన వేగం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, మైనర్లు నడుపుతుండటం, సెల్ఫోన్లో మాట్లాడుతూ, ఇయర్ ఫోన్లో పాటలు వింటూ డ్రైవింగ్ చేస్తుండటం వంటివి ఎక్కడ చూసినా కనిపిస్తుండటం ఆందోళనకరం. ప్రాణాలతో చెలగాటం ♦ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాలకు నాలుగైదు కిలోమీటర్ల దూరం లో విద్యా సంస్థలు ఉన్నాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ వంటి కాలేజీలైతే పది నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటున్నాయి. చాలామంది విద్యార్థులు కాలేజీకి వెళ్లడానికి ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ♦ ఇక తెల్లవారక ముందే కూలీలు ఉపాధి కోసం బయలుదేరుతారు. పనుల కోసం పది ఇరవై కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంటారు. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ఆటోలపైనా ఆధారపడాల్సిన పరిస్థితి. ఇలా కూలీలతో వెళ్తున్న ఆటోలు బోల్తాపడడం, వాహనాలను ఢీకొనడం వంటి ఘటనల్లో పేద కూలీలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మంది బలయ్యారు కిందటేడాది అక్టోబర్ 20వ తేదీన రాత్రి వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై యాదగిరిగుట్ట మండలం బాహుపేట వద్ద భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 9 మంది మృతి చెందారు. వారంతా మేడ్చల్ జిల్లా కాప్రా మండలం నందమూరినగర్‌కు చెందిన వారు. బస్సు రాదు.. రోడ్డు సరిగా లేదు.. ♦ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో సుమారు 60 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. పలు గ్రామాలకు బస్సు సౌకర్యమున్నా.. ఉదయం, సాయంత్రం ఒక్కో ట్రిప్పు తిరుగుతాయి. దాంతో ప్రజలు ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ వందలాది గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ♦ గద్వాల జిల్లాలో రోజూ సుమారు 50 వేల మందికిపైగా ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం చేస్తుంటారని అంచనా. వనపర్తి జిల్లాలో 250కి పైగా జనావాసాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. వారికి ప్రైవేటు వాహనాలే దిక్కు. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోనూ ఇదే తరహా పరిస్థితి. నిత్యం జిల్లాలో ప్రైవేటు వాహనాల్లో రెండు లక్షల మంది వరకు ప్రయాణిస్తున్నారు. ♦ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వేల సంఖ్యలో ఆటోలు, జీపులు తిరుగుతున్నాయి. వాటిలో నిత్యం 2 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా. సూర్యాపేట జిల్లాలో బస్సులు నడవని గ్రామాలు 30 వరకు ఉన్నాయి. ♦ ఉమ్మడి మెదక్ జిల్లాలో సుమారు 35 వేల వరకు ఆటోలు, తుఫాన్లు, జీపులు ఉన్నాయి. వీటిల్లో రోజూ మూడున్నర లక్షల మంది ప్రయాణం చేస్తుంటారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోజూ సుమారు లక్షన్నర మంది వరకు ప్రైవేటు వాహనాల్లో ప్రయాణిస్తారు. బస్సుల్లో ప్రయాణిస్తేనే రక్షణ ప్రయాణికులు తొందరగా గమ్యస్థానాలకు చేరుకోవాలన్న హడావుడిలో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. వారు పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రయాణికులు బస్సుల కోసం వేచి చూడాలి. బస్సుల్లో ప్రయాణిస్తే సురక్షితంగా గమ్యం చేరవచ్చు. – శంకర్‌నాయక్, ఖమ్మం ఇన్చార్జి ఆర్టీవో -
ఆటో, క్యాబ్‌లపై మెట్రో ఎఫెక్ట్
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైలు రాక ఆటోలు, క్యాబ్‌ల గిరాకీపైనా ప్రభావం చూపిస్తోంది. రెండు రోజులుగా వీరు ప్రయాణికులు తగ్గి ఇబ్బందులు పడుతున్నారు. గతంలో రోజూ వచ్చే ఆదాయం ఇప్పుడు సగానికి పడిపోయింది. మరోవైపు మీటర్లు వేయకుండా నిలువు దోపిడీకి పాల్పడే ఆటో రిక్షాల నుంచి కొంత మేరకు ఊరట లభించిందని ప్రయాణికులు భావిస్తున్నారు. సిటీలో సుమారు 1.4 లక్షల ఆటోలుండగా, ప్రతి రోజు సుమారు 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్, అమీర్‌పేట్, ఖైరతాబాద్, ఎస్ఆర్నగర్, కూకట్పల్లి మార్గాల్లో ఆటో ప్రయాణాలపైన మెట్రో ప్రభావం పడింది. నిబంధనల మేరకు మీటర్ రీడింగ్ ప్రకారం చార్జీలు వసూలు చేసే ఆటోడ్రైవర్లు మాత్రం మెట్రో రాక నష్టంగానే భావిస్తున్నారు. ప్రయాణికులు ఎక్కువగా ఉండే నాగోల్–మియాపూర్ మార్గంలోనే మెట్రో అందుబాటులోకి రావడంతో క్యాబ్‌లపైన ప్రభావం స్పష్టంగానే ఉంది. ఉబెర్, ఓలా వంటి అంతర్జాతీయ సంస్థలకు అనుసంధానం చేసి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న క్యాబ్ డ్రైవర్లు, యజమానులకు మెట్రో ఎఫెక్ట్ అశనిపాతమే. మియాపూర్–అమీర్‌పేట్ మార్గంలో, తార్నాక, సికింద్రాబాద్, అమీర్‌పేట్, మియాపూర్ మార్గంలో మెట్రో ప్రభావం వల్ల ట్రిప్పులు తగ్గుముఖం పట్టినట్లు క్యాబ్ డ్రైవర్లు చెబుతున్నారు. మూడో రోజూ అదే జోరు... మెట్రో జోష్ జర్నీ మూడోరోజూ అదే స్థాయిలో కొనసాగింది. శుక్రవారం కూడా మెట్రో రైళ్లలో సుమారు 1.50 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించినట్లు అధికారులు తెలిపారు. శని, ఆదివారాల్లో రైళ్లలో 2 లక్షల మందికి పైగా ప్రయాణించే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నామన్నారు. కాగా మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ లేమి, స్టేషన్ల నుంచి సమీప కాలనీలు, బస్తీలకు చేరుకునేందుకు ఆర్టీసీ ఫీడర్ బస్సులు లేకపోవడం పట్ల ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మెట్రో స్మార్ట్ కార్డుల విక్రయాలు ఊపందుకున్నాయి. గత నాలుగు రోజులుగా సుమారు 25 వేల స్మార్ట్‌కార్డులను విక్రయించినట్లు ఎల్అండ్టీ వర్గాలు తెలిపాయి. స్మార్ట్‌కార్డులతో సాఫీగా ప్రయాణించవచ్చని పేర్కొంది. కాగా స్టేషన్లలో స్మార్ట్‌కార్డుల రీచార్జీకి అవసరమైన సాఫ్ట్వేర్ త్వరలో అందుబాటులోకి వస్తుందని.. అప్పటివరకు పేటీఎం ద్వారా రీచార్జీ చేసుకోవాలని సూచించాయి. గిరాకీ తగ్గింది... మెట్రో రైలు రాకతో గిరాకీలు తగ్గాయి. గతంలో రోజుకు రూ.1200–1500ల వరకు వచ్చేది. మెట్రోతో దూర ప్రయాణం చేసేవారు ఆటోల వైపు చూడడం తగ్గింది. దీంతో ఆదాయం 600–800లకు పడిపోయింది. అసలే కిరాయి ఆటో. రోజుకు రూ.300లు చెల్లించాలి. ఏం చేయాలో పాలుపోవడం లేదు. – పి.నరేశ్, ఆటోడ్రైవర్, సనత్‌నగర్ మూలిగే నక్కపై తాటిపండులా.. ఇప్పటికే ఫైనాన్సర్ల వేధింపులు, అప్పుల బాధలతో రోడ్డున పడ్డ మాకు మెట్రో రాకతో మరిన్ని కష్టాలు వచ్చాయి. ఎయిర్‌పోర్టుకు వెళ్లేవాళ్లు తప్ప సిటీలో తిరిగే వాళ్లు తగ్గిపోయారు. ఒక్క ఎయిర్‌పోర్టు మార్గంలోనే లక్షల వాహనాలు తిరగలేవు కదా. ట్రిప్పు లు గణనీయంగా తగ్గాయి. మూలిగే నక్కపై తాటిపండులా ఉంది మా పరిస్థితి. – శివ, అధ్యక్షుడు, తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు, యజమానుల సంఘం -
రయ్ రయ్.. ఆటోలోయ్..!
ఖమ్మంక్రైం: నగరంలో నిత్యం 25వేల ఆటోలు తిరుగుతున్నాయి. బయటి ప్రాంతాల నుంచి 10వేల వరకు నగరానికి వస్తుండగా.. ఖమ్మంలోనే 15వేల వరకు ఆటోలు ఉన్నాయి. కూసుమంచి మండలంలో ఒక్కో గ్రామంలో 20 నుంచి 30 వరకు ఆటోలు ఉన్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడ, మోతె, మహబూబాబాద్ జిల్లా కురవి, డోర్నకల్, మరిపెడ, ఖమ్మం రూరల్ మండలం, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, రఘునాథపాలెం, కామేపల్లి, కొణిజర్ల, చింతకాని ప్రాంతాల నుంచి ఆటోలు నిత్యం ప్రయాణికులతో వచ్చిపోతుంటాయి. పొద్దంతా నగరంలోని ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతూ.. సాయంత్రం ఇంటిబాట పడతాయి. ఆటో స్టాండ్లు కరువు నగరంలో రోజూ వేలాది ఆటోలు తిరుగుతున్నా కార్పొరేషన్ అధికారులు కనీసం ఒక్క ఆటో స్టాండ్‌ను ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. రైల్వే స్టేషన్లో ఉన్న ఆటో స్టాండ్ తప్ప నగరంలో ఎక్కడా ఆటో స్టాండ్లు కనిపించవు. తప్పని పరిస్థితుల్లో ఆటోవాలాలు 20 స్టాండ్లు ఏర్పాటు చేసుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్ ప్రాంతంలో కనీసం ఇప్పటివరకు ఆటో స్టాండ్ ఏర్పాటు చేయలేదు. ముఖ్యంగా బస్టాండ్, రైల్వేస్టేషన్, కాల్వొడ్డు, నయాబజార్, మయూరిసెంటర్, జెడ్పీ సెంటర్, వైరారోడ్, ఇల్లెందు క్రాస్‌రోడ్, గాంధీచౌక్, వ్యవసాయ మార్కెట్ ప్రాంతం ఆటోలతో రద్దీగా మారిపోయింది. నగరంలో నిమిషానికి 33 ఆటోలు ప్రధాన రహదారుల వెంట వెళ్తున్నాయి. హైదరాబాద్, వరంగల్ తర్వాత ఆటోల సంఖ్యలో ఇక్కడే ఎక్కువగా ఉంది. ఎందుకంత క్రేజ్.. నగరంలోనే 25వేల ఆటోలు తిరుగుతున్నాయంటే దానికి కారణం.. ఖమ్మంకు 60 కిలోమీటర్ల దూరం నుంచి నిత్యం పనులపై వచ్చి వారి సంఖ్య ఎక్కువే. వీరంతా బస్సుల్లో రావాలంటే వాటికోసం వేచిచూసే ఓపిక లేకపోవటం.. సమయం వృథా చేయటం ఎందుకని ఆటోల్లో బయలుదేరుతున్నారు. దీనికి తోడు ఇళ్ల ముందుకే ఆటోలు వచ్చే సదుపాయం ఉండటంతో ఎక్కువగా వీటినే ఆశ్రయిస్తున్నారు. నిరుద్యోగులకు ఉపాధి.. ఆటోల సంఖ్య పెరగడంతో చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి లభిస్తోంది. కొందరు చదువుకుంటూ పార్ట్‌టైంగా ఆటోలు నడుపుతుండగా.. మరికొందరు పొట్టకూటి కోసం నడుపుతున్నారు. దీంతో అద్దెకు ఆటోలు ఇచ్చే యజమానికి రోజుకు రూ.300 చొప్పున చెల్లించి.. ఆటోలు నడిపేందుకు తీసుకెళ్తున్నారు. చాలా మంది గ్రామాల నుంచి వచ్చి ఆటోలను నడుపుతూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. రిజిస్ట్రేషన్లు తగ్గించాలి.. ఖమ్మం నగరంగా మారినప్పటికీ 40, 50 ఏళ్ల క్రితం ఉన్న రోడ్లే ఉన్నాయి. నిత్యం నగరంలో 25వేల ఆటోలు తిరుగుతున్నాయి. వీటికి ఆటో స్టాండ్లు లేవు. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ఆటోలు నిలుపుతున్నారు. ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ఆటోల రిజిస్ట్రేషన్ తగ్గించాలని రవాణా శాఖ అధికారులకు ఇప్పటికే సూచించాం. ఆటో స్టాండ్లు ఏర్పాటు చేయాలని కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. దీనికి తోడు నగర రోడ్లు కూడా వెడల్పు చేయాలి. – నరేష్‌రెడ్డి, ట్రాఫిక్ సీఐ 1994 నుంచి ఆటో నడుపుతున్నా.. నేను 1994 నుంచి ఆటో నడుపుతున్నా. అప్పుడు 80 ఆటోలు ఖమ్మంలో తిరిగేవి. ఇప్పుడు 25వేల ఆటోలు తిరుగుతున్నాయి. అప్పుడు సర్వీస్ చార్జీ రూ.2 ఉండేది. ఇప్పుడు రూ.10 అయింది. డీజిల్ ఖర్చు పెరిగింది. ఒక్క ప్యాసింజర్‌కు దాదాపు 20 ఆటోలు పోటీపడుతున్నాయి. కుటుంబం గడిచే పరిస్థితి లేదు. ఆటోల రిజిస్ట్రేషన్ తగ్గించి.. ఆటో స్టాండ్లను ఏర్పాటు చేయాలి. బి.లక్ష్మణ్‌కుమార్, ఆటో డ్రైవర్ ఆటోలు మరీ ఎక్కువయ్యాయి.. ఎన్నో ఏళ్లుగా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నా. నగరంలో ఆటోలు ఎక్కువ కావటంతో గిరాకీ బాగా తగ్గింది. ఒకప్పుడు జీవనాధారం కోసం ఆటో నడిపా. ఇప్పుడు కిరాయిలు లేక ఖాళీగా కూర్చుంటున్నాం. పోలీసులు జరిమానాలు బాగా విధిస్తున్నారు. లారీ డ్రైవర్లు, హమాలీలు సైతం ఆటోలు నడుపుతున్నారు. వేరే ప్రాంతాల నుంచి వచ్చే వాటిని ఇక్కడ నడపకుండా చూడాలి. షేక్ కరీం, ఆటో డ్రైవర్ -
2010కి ముందు ఆటోలను నిషేధించాలి
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో 2010కి ముందు రిజిస్టరైన బీఎస్1, బీఎస్2 ఆటోలపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. 2010కి ముందున్న వాహనాలు ఎన్ని?.. వాటి వల్ల కలుగుతున్న కాలుష్యం ఎంత? 2010 తర్వాత ఎన్ని వాహనాలు రిజిస్టర్ అయ్యాయి? వాటి వల్ల ఎంత కాలుష్యం ఏర్పడుతోంది? వంటి వివరాలను తెలియజేయాలని ఆదేశించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ మంతోజ్ గంగారావుల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో 2010లో రిజిస్టరైన బీఎస్1, బీఎస్2 ఆటోలపై నిషేధం విధించి, సీఎన్జీ, ఎల్పీజీ ఆటోలనే అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన సంతకుమార్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య వాదనలు వినిపిస్తూ.. పాత ఆటోల వల్ల కాలుష్యం తీవ్రంగా పెరిగిపోతోందన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. కాలుష్యానికి ఆటోలనే కారణంగా చూపడం సరికాదంది. ఆటోలు పేదవాళ్లు నడుపుకునేవని, కార్లు, బస్సుల వల్ల కాలుష్యం రావడం లేదా అని ప్రశ్నించింది. ఆటోలను నిషేధిస్తే వాటిపై ఆధారపడి జీవించే వారి పరిస్థితి ఏమిటని నిలదీసింది. దీనికి కృష్ణయ్య స్పందిస్తూ.. దీపావళి సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రస్తావించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ఈ సారి బాణసంచా కాల్చడం తగ్గిందని, ప్రజల్లో అవగాహన రావడమే దీనికి కారణమని తెలిపింది. మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. -
ఆటోలో కోర్టు విజిట్?!
► ఆటోలో ప్రయాణించిన ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ► కోర్టు పరిసరాలను ఆకస్మిక తనిఖీ చేసిన వైనం న్యూఢిల్లీ: ఆరు ఆటో రిక్షాలు హఠాత్తుగా వచ్చి ఢిల్లీ హైకోర్టు ముందు ఆగాయి. అయితే వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆటోలో ఉన్న వ్యక్తులు యధాలాపంగా బయటకు వచ్చి.. హైకోర్టు పరిసరాలను, న్యాయవాదులను పరిశీలించడం మొదలు పెట్టారు. కొద్దిసేపటి తర్వాత కానీ ఆటోలో వచ్చింది ఎవరో అక్కడివారికి అర్థం కాలేదు. అర్థం అయ్యాక ఆటోల ముందు న్యాయవాదులు, అధికారులు పరుగులు పరుగులు తీశారు. ఆటోలో వచ్చింది.. ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్, ఇతర న్యాయమూర్తులు రవీంద్ర భట్, మురళీధర్, సంజీవ్ ఖన్నా తదితరులు ఢిల్లీ హైకోర్టును ఆకస్మింగా తనఖీ చేసేందుకు సామాన్యుల్లా ఆటోల్లో వచ్చారు. ఢిల్లీ హైకోర్టులోని అధికారులు, న్యాయమూర్తుల పనితీరు, క్రమశిక్షణను పరిశీలించేందుకే ఇలా వచ్చినట్లు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గీతా గీతా మిట్టల్ చెప్పారు. కోర్టు ప్రాంగణంలో మౌలిక వసతులను సైతం వారు పరిశీలించారు. పరిపాలనాపరంగా కొన్ని లోపాలను గుర్తించామని గీతా మిట్టల్ చెప్పారు. వాటిని దిద్దుకునేందుకు తగిన సూచనలు, సలహాలు చేశామని చెప్పారు. -
ఈ ఆటోలు గర్భిణులకే..
గర్భిణుల కోసం ఉచిత ఆటో సర్వీస్‌లను ఐఎంఎం గుత్తి శాఖ ప్రారంభించింది. ఐఎంఎం సమకూర్చిన ఐదు ఆటోలను గుత్తిలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గహంలో ఎస్ఐ చాంద్‌బాషా ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహబూబ్‌బాషా మాట్లాడుతూ... గర్భిణులను ఆస్పత్రికి, కాన్పు తర్వాత ఇంటికి ఎంత దూరమైన తమ ఆటోలలో ఉచితంగా తీసుకెళతారని వివరించారు. -
9 ట్రాక్టర్లు, 6 ఆటోలు సీజ్
కోవూరు: నిబంధనలకు విరుద్ధంగా, సరైన పత్రాలు లేకుండా తిరుగుతున్న 9 ట్రాక్టర్లు, 6 ఆటోలను సోమవారం సీజ్ చేసి కోవూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎస్ఐ అళహరి వెంకట్రావు కోవూరులో తనిఖీలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ వాహనాలు నడిపే వారికి లైసెన్స్ లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లైసెన్స్ లేకపోతే బాధితులకు ఎటువంటి ఆర్థిక భరోసా ఉండదన్నారు. దీన్ని దష్టిలో పెట్టుకుని వాహన చోదకులు సరైన పత్రాలు వెంట ఉంచుకోవాలన్నారు. -
కొత్త ఆటోలకు గ్రీన్ సిగ్నల్
► పాత ప్రొసీడింగ్లపైనే జారీ ► 1407 ఆటోలకు అనుమతి ► జేటీసీ రఘునాథ్ వెల్లడి సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మరిన్ని కొత్త ఆటోలు రోడ్డెక్కనున్నాయి. గతంలో పలు జీవోల కింద విడుదలై గడువు ముగిసిన కారణంగా మిగిలిపోయిన 1,407 ఆటో రిక్షాలకు అనుమతినిస్తూ మంగళవారం రవాణాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. బుధవారం నుంచి కొత్త ఆటోల విక్రయాలకు అనుమతి ఇస్తున్నట్లు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్ తెలిపారు. కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వండి.. గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో పాటు కొత్తవాళ్లకు కూడా ఆటో పర్మిట్లు పొందేందుకు అవకాశం కల్పించాలని ఏఐటీయూసీ కార్యదర్శి బి.వెంకటేశం, తెలంగాణ ఆటోడ్రైవర్ల సంక్షేమ సంఘం ప్రధానకార్యదర్శి ఏ.సత్తిరెడ్డి ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ రెండేళ్లలో పెరిగిన నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని అవకాశం కల్పించాలని కోరారు.