Bores
-
‘వాస్తవాలు తెలియకుండా లోకేష్ ట్వీట్లు’
సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సస్పెండ్ జడ్జి రామకృష్ణ సోదరుడిపై దాడి జరిగితే తమకు అంటగట్టాలని చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. వాస్తవాలు తెలియకుండా లోకేష్ ట్వీట్లు చేస్తే, చంద్రబాబు ఆరోపణలు చేస్తారని దుయ్యబట్టారు. ‘‘జడ్జి సోదరుడిపై దాడి చేసింది టీడీపీకి చెందిన ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి అని తేలింది. ఇప్పుడు చంద్రబాబు ఏమి సమాధానం చెప్తారు. రాష్ట్ర ప్రజలు అంతా గమనించాలి. రామకృష్ణ అనే వ్యక్తి వెనుక టీడీపీ ఉందని తెలిసిపోతోంది. ప్రతాప్ రెడ్డి వైసీపీ అని తేలితే నేను రాజకీయాలు మానుకుంటా. టీడీపీకి దళితులు, మైనారిటిలపై గౌరవం లేదు. అధికారం పోయేసరికి వారిపై చంద్రబాబుకు ప్రేమ పుట్టింది’ అని మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు. (చదవండి: ‘అందుకే చంద్రబాబుకు పెద్దిరెడ్డి అంటే కోపం’) సీఎం వైఎస్ జగన్ ప్రారంభించిన ‘వైఎస్సార్ జలకళ’ పథకం ద్వారా 2 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ‘పాదయాత్ర సమయంలో సీఎం జగన్ కరువుతో అల్లాడుతున్న ప్రాంతాలను గమనించారు. అన్ని జిల్లాల్లోనూ మెట్ట ప్రాంతాలు ఉన్నాయి. ఆనాడే అన్ని ప్రాంతాలకు నీరు అందించాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. సాగునీరందని భూములకు రూ. 2340 కోట్లతో బోర్లు వేయాలనుకున్నారు. కానీ అప్పటికప్పుడు మరో రూ.1600 కోట్లతో మోటార్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.164 నియోజకవర్గాల్లో ఒక్కో రిగ్ అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రతి ఒక్క రైతు వైఎస్ జగన్ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. -
ఉచిత బోర్లు.. పేద రైతులకు మోటార్లు
ప్రతి నియోజకవర్గంలో ఒక బోరు యంత్రం అందుబాటులో ఉంటుంది. రైతులు ఆన్లైన్ ద్వారా లేదా వలంటీర్ల ద్వారా తమ పేరు నమోదు చేసుకోవచ్చు. హైడ్రో జియోలాజికల్, జియో ఫిజికల్ సర్వే ద్వారా ఎక్కడ బోరు తవ్వాలన్నది శాస్త్రీయంగా నిర్ణయిస్తారు. ఆ తర్వాతే బోరు బావి తవ్వుతారు. ఆ సర్వే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఒక్కోసారి ఎంత సర్వే చేసినా నీరు పడకపోవచ్చు. అందుకే రెండో బోరు కూడా వేయాలని ఆదేశాలు జారీ చేశాం. ఇప్పటికే ఉన్న బోరు ఒక వేళ ఫెయిల్ అయితే, అక్కడ కూడా రైతులకు బోరు వేయి స్తాము. వారు దరఖాస్తు చేసుకుంటే చాలు. –సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: అర్హులైన రైతులందరి పొలాల్లో ఉచితంగా బోర్లు వేయడంతో పాటు చిన్న, సన్న కారు రైతులకు ఉచితంగా మోటార్లు కూడా బిగిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఎన్నికల ప్రణాళికలో బోర్లు వేయిస్తామని చెప్పామని, కానీ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి చిన్న, సన్నకారు రైతులకు ఉచితంగా మోటారు కూడా ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు. ఇందుకోసం దాదాపు మరో రూ.1,600 కోట్లు వ్యయం అవుతున్నప్పటికీ వెనకడుగు వేయకుండా అమలు చేస్తామన్నారు. ఇది రైతుల పక్షపాత ప్రభుత్వమని, వారికి ఏనాడూ అన్యాయం చేయదని చెప్పారు. రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించే ‘వైఎస్సార్ జలకళ’ పథకాన్ని సోమవారం ఆయన తన క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాల్లోని రైతులనుద్దేశించి ప్రసంగించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ‘వైఎస్సార్ జలకళ’ను ప్రారంభిస్తున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రులు, ఎంపీ, అధికారులు తదితరులు మాట నిలబెట్టుకుంటున్నాను ► రైతు కోసం మన ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఎన్నికల్లో ఇచ్చిన మరో మాట నిలబెట్టుకుంటున్నాం. నా 3,648 కి.మీ పాదయాత్రలో రైతుల కష్టాలు స్వయంగా చూశాను. వారికి తోడుగా ఉంటానని మాట ఇచ్చాను. ► నాడు ఇచ్చిన మాట ప్రకారం 144 గ్రామీణ నియోజకవర్గాలు, 19 సెమీ అర్బన్ నియోజకవర్గాలు.. మొత్తంగా 163 నియోజకవర్గాల్లో ఇవాళ బోరు యంత్రాలు ప్రారంభిస్తున్నాం. ► దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్లనే ఇది సాధ్యం అవుతోంది. అందుకు ఎంతో సంతోషంగా ఉంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దాదాపు 2 లక్షల బోర్లు తవ్వడమే కాకుండా, వాటికి కేసింగ్ పైపులు కూడా వేస్తాం. ఈ పథకంపై వచ్చే 4 ఏళ్లలో రూ.2,340 కోట్లు ఖర్చు చేస్తామని గర్వంగా చెబుతున్నాము. మరో అడుగు ముందుకు.. ► నాడు 2004లో నాన్నగారు రైతుల కోసం ఉచిత విద్యుత్ ఇచ్చారు. ఇవాళ మరో అడుగు ముందుకు వేస్తూ, రైతులకు ఉచితంగా బోరు బావి తవ్విస్తున్నాము. తద్వారా లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. లక్షలాది మంది రైతులకు మేలు జరుగుతుంది. మెట్ట ప్రాంతాల నుంచి వలసలు తగ్గుతాయి. ► రాష్ట్రంలో దాదాపు 18 లక్షల మోటార్లు (పంపు సెట్లు) ఉన్నాయి. వాటి సగటు సామర్థ్యం 7.5 హెచ్‌పీ. అంటే గంటకు 5 యూనిట్ల విద్యుత్ కావాలి. రోజుకు 9 గంటల సరఫరా అంటే ఒక్క రోజుకు మొత్తం 45 యూనిట్లు. ఇవాళ ఒక్కో యూనిట్ ధర రూ.6.87. ఆ విధంగా నెలకు ఒక్కో రైతుకు బోరు ద్వారా రూ.9,274 మేర ప్రయోజనం కలుగుతుంది. ఫీడర్ల కెపాసిటీ పెంచాం ► ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి, ఉచిత విద్యుత్‌కు సంబంధించి రూ.8,655 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఆ మొత్తం చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వకుండా బకాయి పెట్టింది. అయినా చిరునవ్వుతో చెల్లించాం. ► రైతులకు పగలే ఉచితంగా 9 గంటలు విద్యుత్ ఇవ్వడం కోసం 85 శాతం ఫీడర్ల కెపాసిటీ పెంచాం. తగిన మౌలిక వసతులు కల్పించాం. రానున్న రోజుల్లో మిగతా ఫీడర్ల సామర్థ్యం కూడా పెంచుతాం. ఇందు కోసం గత 16 నెలలుగా రూ.1,700 కోట్లు ఖర్చు చేశాం. నాణ్యమైన విద్యుత్ కోసమే ► ఉచిత విద్యుత్‌కు మీటర్ల ఏర్పాటుపై విచిత్ర వాదనలు చేస్తున్నారు. లోడు తెలుసుకుని మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలి పోకుండా జాగ్రత్త పడడం కోసమే మీటర్లు బిగించాలని నిర్ణయించాం. లోడు, ఓల్టేజీ ఎంతో స్పష్టంగా తెలిసినప్పుడు ఫీడర్ల కెపాసిటీ పెంచి, నాణ్యమైన విద్యుత్‌ను రైతుకు ఒక హక్కుగా ఇస్తాం. ► రైతులు తమ చేతుల మీదుగా ఆ బిల్లులు కడతారు. ఆ మొత్తాన్ని ప్రభుత్వం రైతులకు నేరుగా అందిస్తుంది. అప్పుడు రైతులు నాణ్యమైన విద్యుత్ కోసం డిమాండ్ చేయవచ్చు. ► రైతుల ఉచిత విద్యుత్ కోసం 10 వేల మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా యూనిట్ విద్యుత్ ఉత్పత్తి ఖర్చు రూ.2.50 మాత్రమే. అందువల్ల 30 ఏళ్లు క్వాలిటీ పవర్ ఇస్తాం. రైతుల కోసం ఎన్నెన్నో.. ► గత ప్రభుత్వం వదిలి పెట్టి పోయిన రూ.960 కోట్ల ధాన్యం బకాయిలు, రూ.384 కోట్లు విత్తనాల సేకరణ బకాయిలు చెల్లించాం. ► రైతు భరోసా ద్వారా ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.13,500 సహాయం చేస్తున్నాం. సున్నా వడ్డీ రుణాలు, ఉచిత బీమా ప్రీమియమ్ అమలు చేస్తున్నాం. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ కేవలం రూ.1.50కే సరఫరా చేస్తున్నాం. గత ఏడాది ధరల స్థిరీకరణ కోసం రూ.3200 కోట్లు ఖర్చు చేశాం. ► ఆర్బీకేలు ఏర్పాటు చేశాం. అక్కడి నుంచే నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల సరఫరా చేస్తున్నాం. వ్యవసాయ ట్రాక్టర్లకు రహదారి పన్ను రద్దు చేశాం. ► రాబోయే రోజుల్లో ఈ–క్రాపింగ్ ద్వారా రైతుల పొలం వద్దే పంటల కొనుగోలు జరుగుతుంది. ఆర్బీకేల వద్ద గోదాములు, క్వాలిటీ నిర్ధారణ కోసం అసైన్డ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేస్తాం. ఈ మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఏర్పాటవుతాయి. మండల కేంద్రాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ప్రతి గ్రామంలో జనతా బజార్లు ఏర్పాటు చేస్తున్నాం. ► ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, కె.కన్నబాబు, అనిల్‌కుమార్ యాదవ్, జి.జయరాం, సీదిరి అప్పలరాజు, ఎంపీ పిల్లి సుభాష్‌చంద్ర బోస్, రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ పథకం రైతులకు ఎంతో మేలు ఎందరో సీఎంల వద్ద ఎమ్మెల్యేగా పని చేశాను. కానీ ఏడాదిలోనే దాదాపు 90 శాతం హామీలు నిలబెట్టుకున్న సీఎంను తొలిసారి చూస్తున్నాను. ఏ రాష్టంలో కూడా ఈ స్థాయిలో పథకాలు అమలు చేయడం లేదు. వైఎస్సార్ జలకళ పథకం కింద ఇవాళ 2 లక్షల బోర్లు తవ్వబోతున్నాం. అన్ని జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల రైతులకు ఈ పథకం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నిజంగా ఇది రైతు ప్రభుత్వం వైఎస్సార్ జలకళ పథకంపై ప్రశంసలు ఉచితంగా బోర్లు వేయించడమే కాకుండా చిన్న, సన్నకారు రైతులకు ఉచితంగా మోటార్లు కూడా బిగిస్తామని చెప్పడం సంతోషంగా ఉందని పలువురు రైతులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో తమ సంతోషాన్ని పంచుకున్నారు. వైఎస్సార్ జలకళ పథకాన్ని సీఎం జగన్ సోమవారం ప్రారంభించిన అనంతరం వివిధ జిల్లాల నుంచి రైతులు నేరుగా సీఎంతో మాట్లాడారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. ఎంతో ఉపయోగం నేను చిన్న రైతును, రెండున్నర ఎకరాల మెట్ట భూమి ఉంది. ఆ భూమిలో కొద్దిపాటి పంటలు వేసుకుని జీవిస్తున్నాను. ఈ మూడు నెలల తర్వాత మా పంటలకు నీరుండదు. అప్పుడు ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు మీ నిర్ణయం వల్ల మా లాంటి రైతు లెందరికో ఎంతో ఉపయోగం. బోర్లు వేయించడమే కాకుండా మా లాంటి వాళ్లకు మోటార్లు కూడా ప్రభుత్వమే బిగిస్తుందని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. రైతులందరి తరఫున మీకు కృతజ్ఞతలు. – సింహాచలం నాయుడు, కొమరాడ మండలం, విజయనగరం ఆనందంగా ఉంది నేను గతంలో కూలి పనికి వెళ్లే దాన్ని. నాకు ప్రభుత్వమే 2.70 ఎకరాల భూమి ఇచ్చింది. ఇందులో కరువు పనుల కింద చెట్లు, రాళ్లు తీసి ఇచ్చారు. మామిడి మొక్కలు కూడా ఇచ్చారు. నాకు రైతు భరోసా కూడా వచ్చింది. మీ పథకాల పుణ్యమా అని నా ముగ్గురు పిల్లలు బాగా చదువుకుంటున్నారు. ఇప్పుడు ఉచితంగా బోర్ వేసి, మోటార్ బిగిస్తామంటే చాలా సంతోషంగా ఉంది. – లక్ష్మీదేవి బాయి, దండరాయిపల్లి తండా, బుక్కరాయసముద్రం మండలం, అనంతపురం మీ దయతో చిన్న రైతునవుతున్నా నాకు కొద్ది పాటి పొలం ఉంది. అయితే దీని వల్ల లాభం లేకపోవడంతో ఉపాధి హమీ పనులతో బతుకుతున్నాం. ఇప్పుడు మీరు ఉచితంగా బోరు తవ్వించి.. ఉచితంగా మోటారు బిగించి.. ఉచితంగా విద్యుత్ కూడా ఇస్తామని చెబుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మీకు జీవితకాలం రుణపడి ఉంటాం. ఇది నిజంగా రైతు ప్రభుత్వం. నేను ఎప్పటికీ ఉపాధి కూలీగా మిగిలిపోతానేమో అనుకున్నా. కానీ మీ దయతో చిన్న రైతుగా మారుతున్నాను. – గురుస్వామి, పులిచర్ల మండలం, చిత్తూరు దేశం అంతా మీ వైపు చూస్తోంది వైఎస్సార్ జలకళ ద్వారా మీరు రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారనడంలో సందేహం లేదు. మీరు రెండు అడుగులు కాదు.. మూడు అడుగులు ముందుకు వేశారు. అడక్కుండానే మీరు రైతులకు వరాలిస్తున్నారు. మీరు అధికారంలోకి రాగానే వర్షాలు పుష్కలంగా కురుస్తున్నాయి. రైతు పక్షపాతిగా ఉన్న మీ ప్రభుత్వం పదికాలాల పాటు కొనసాగాలి. దేశం అంతా మీ వైపు చూస్తోంది. – డి.ఏసుపాదం, తిరువూరు మండలం, కృష్ణా -
ఐదేళ్ల అలక్ష్య పాలన.. తీవ్ర దుర్భిక్షం
కరువుకాటకాలతో గ్రామాలు అల్లాడుతున్నాయి..గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీళ్లు లేవు..తినడానికి తిండిలేదు.. చేయడానికి పని లేదు..మనుషులు వలసబాట పడుతున్నారు..కనీస గ్రాసమూ దొరక్క పశువులు కబేళా దారిలో కనిపిస్తున్నాయి..వేసవికి ముందే తీసుకోవలసిన జాగ్రత్తల ఊసేలేదు..ఖరీఫ్‌లో వర్షాభావం దెబ్బతీసినా రబీకి ఏం చేయాలనేదానిపై కసరత్తు లేదు..కమీషన్ల కక్కుర్తే తప్ప సాగునీటి ప్రాజెక్టులపై చిత్తశుద్ధి లేదు..ఇలాంటి అత్యవసర సమయంలో గ్రామీణ నిరుపేదలకు ఎంతో ఉపయోగపడే ఉపాధిహామీకి మంగళం పలికేశారు..ఆ పథకం నిధులన్నీ కైంకర్యం చేసి కూలీల కడుపుకొట్టారు.. అనాలోచిత నిర్ణయాలు.. అస్తవ్యస్థ పాలన ఫలితమే ఇది..ఐదేళ్లుగా ఇదే పరిస్థితి.. ఈ వేసవిలో రాష్ట్రమంతటా పరిస్థితి మరింత విషమించింది.. అనంతపురం జిల్లాలో మేత లేక కబేళాకు తరలించడానికి సిద్ధంగా ఉంచిన లేగదూడలు, గేదెలు - గుక్కెడు నీటి కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. అడుగంటిన బోర్లు (చేతిపంపులు) నుంచి నీటిని తోడుకోవాలన్నా, కిలోమీటర్ల నుంచి కాలినడకన, సైకిళ్లపై నీరు తెచ్చుకోవాలన్నా, ఎప్పుడో వచ్చే ట్యాంకర్ల వద్ద వరుసలో నిలబడి బిందెడు నీరు దక్కించుకోవాలన్నా యుద్ధమే చేయాల్సి వస్తోంది. నీటి క్యాన్ కొనుగోలు చేయాలన్నా ఎదురు చూడాల్సి వస్తోంది. - మా ఊళ్లో చిన్నబావి దగ్గర 1,170 అడుగులు రిగ్గు వేయిస్తే చెంబెడు నీళ్లు కూడా రాలేదు, ఏ బావి, బోరులో కూడా నీళ్లు లేవు, ఏడెనిమిది గంటలు దఫదఫాలుగా మోటార్లు వేస్తున్నా ఒక ఎకరం కూడా తడవడం లేదు, అరటి తోటలు మాడిపోతున్నాయి అని వాపోయాడు కడప జిల్లా పుల్లంపేట మండలం అనంతయ్యగారిపల్లె రైతు. - పదిహేనేళ్ల బత్తాయి తోట సార్. బాగా దిగుబడి ఇవ్వాల్సిన తోటలో ఎండిపోతున్న కొమ్మలను రోజుకు కొన్ని చొప్పున కొట్టేయలేక మొత్తం తోటే నరికేయాల్సి వచ్చిందని కంటతడి పెట్టాడు ప్రకాశం జిల్లా పెద్దారవీడుకు చెందిన రైతు వెంకటేశ్వర్లు. సాక్షి, ప్రత్యేక ప్రతినిధి/సాక్షి నెట్వర్క్: ఎండిపోయిన చెరువులు, కాలువలు, బోర్లు.. పంటలు సాగు చేయక బీళ్లుగా మారిన భూములు.. కబేళాలకు తరలిపోతున్న పశువులు.. పొట్ట చేతపట్టుకుని వలస వెళ్తున్న రైతులు, వ్యవసాయ కూలీలు.. ఇళ్లకు వేలాడుతున్న తాళాలు.. జనం లేక బోసిపోతున్న పల్లెలు.. రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులన్నీ కొత్తగా ఈ రోజే తలెత్తినవి కాదు. రాష్ట్రంలో గత ఐదేళ్లుగా కరువు కాటకాలు కొనసాగుతున్నాయి. తాగు, సాగునీటి సమస్య వేధిస్తోంది. పశుగ్రాసం కొరతతో పశువుల డొక్కలు ఎండుతున్నాయి. దుర్భిక్షాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వానికి ముందుచూపు, సరైన ప్రణాళిక లేకుండా పోయాయి. ఉన్నదల్లా కమీషన్ల కక్కుర్తి, అవినీతి, అక్రమాలు, వనరులను ఇష్టారాజ్యంగా కొల్లగొట్టడం. ఐదేళ్లుగా ప్రజలను గాలికొదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి అంటూ భ్రమలు కల్పించడంలోనే కాలం గడిపేసింది. రాజధాని నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సర్కారు ఆడని డ్రామాలే లేవు. ప్రాజెక్టులపై సమీక్షలు అంటూ పాలకులు కమీషన్లు వసూలు చేసుకోవడంలో తీరిక లేకుండా గడిపారు. నీరు–చెట్టు పేరిట అధికార పార్టీ నాయకులు రూ.వేల కోట్లు మింగేశారు తప్ప భూగర్భ జలాలు అంగుళం కూడా పెరగలేదు. వరుస కరువుల వల్ల పల్లెలు, పట్టణాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంటుందని తెలిసినా ముందస్తు చర్యల్లేవు. పశువులకు మేత అందించాలన్న ఆలోచన సైతం ప్రభుత్వానికి లేకపోవడం గమనార్హం. వర్షాల్లేక వ్యవసాయ పనులు లేకపోవడంతో ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించి, వలసలను నియంత్రించాలన్న స్పృహ సర్కారులో కొరవడింది. ఐదేళ్లుగా దుర్భిక్షంతో బాధలు పడుతున్నా ప్రభుత్వం మొద్దునిద్ర వీడడం లేదని, తమను కనీసం ఆదుకున్న పాపాన పోలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాతాళానికి చేరిన భూగర్భ జలాలు రాష్ట్రంలో కరువు ధాటికి భూగర్భ జలాలు సగటున 14.71 మీటర్ల లోతుకు పడిపోయినట్లు ఈ నెలారంభలోనే లెక్కతేలింది. 208 మండలాల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. 1.65 లక్షలకు పైగా బోరు బావులు ఎండిపోయాయి. రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గత ఏడాది ఏప్రిల్ నెలతో పోల్చితే ఈ ఏడాది రాయలసీమ జిల్లాల్లో భూగర్భ జల మట్టాలు మరింత లోతుకు పడిపోయాయి. సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల్లోనూ వేసవి ఆరంభంలోనే నీరు అడుగంటిపోయింది. రాష్ట్రంలో 12,918 గ్రామ పంచాయతీలు ఉండగా, 4,982 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 3,494 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నట్టు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు. ఇక నగరాలు, పట్టణాల్లో తాగునీటి కొరత వేధిస్తోంది. పలు కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో రెండు, మూడు రోజులకోసారి తాగునీరు సరఫరా చేస్తున్నారు. రైతన్నలను ముంచేసిన ఖరీఫ్, రబీ ప్రస్తుత రబీ సీజన్లో 257 మండలాలను అధికారికంగా కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించినప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి నయాపైసా సాయం కూడా అందలేదు. కరువు సహాయక చర్యలు కనుమరుగయ్యాయి. పంటల నష్ట పరిహారం అటకెక్కింది. గత ఖరీఫ్‌లో 347 మండలాలను కరవు మండలాలుగా సర్కారు ప్రకటించింది. ఏడు జిల్లాల్లో తీవ్ర దుర్భిక్షం ఉన్నట్లు వెల్లడించింది. వరుస కరువులతో అల్లాడుతున్న రాష్ట్రం ప్రత్యేకించి 2018 రబీ నుంచి గత 20 ఏళ్లలో ఎన్నడూ చూడని తీవ్ర దుర్భిక్షాన్ని చవిచూసింది. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు 32 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఫలితంగా అటు ఖరీఫ్, ఇటు రబీ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కరువు నుంచి రైతులు కష్టపడి కాపాడుకున్న పంటలకు కూడా కనీస మద్దతు ధరలు దక్కడం లేదు. రైతుబజార్లు, మార్కెట్లలో కూరగాయల ధరలు మండిపోతుంటే ఉత్పత్తిదారులకు మాత్రం కనీస ఆదాయం రావడం లేదు. కాగా, కరవు పరిస్థితుల్లో ప్రజలకు ఉపాధి చూపాల్సిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రమంగా నీరుగారిపోతోంది. దాదాపు 1,307 గ్రామాల్లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కూలీలకు పనులు కల్పించలేదని సమాచారం. ఉన్న ఊళ్లో వ్యవసాయ పనులు లేక, ఉపాధి హామీ పథకం అమలు కాక ఆయా గ్రామాల నుంచి నిరుపేదలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారు. వేధిస్తున్న పశుగ్రాసం కొరత పాలకుల ఉదాసీనత, పశు సంవర్థక శాఖ మొద్దునిద్ర పశువుల పాలిట శాపంగా మారింది. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర దుర్భిక్షం మనుషులనే కాదు, పశువులను సైతం కాటేస్తోంది. ఆకలి తీర్చుకోవడానికి కాసింత మేత, గొంతు తడుపుకోవడానికి చుక్క నీరు లేక పశువులు విలవిల్లాడుతున్నాయి. ఇన్నాళ్లూ సొంత కుటుంబ సభ్యుల్లాగా పెంచుకున్న పశువుల ఆకలి కేకలు వినలేక రైతులు వాటిని అయినకాడికి అమ్మేస్తున్నారు. పాడి ఆవులు, గేదెలను సైతం పోషించలేక దళారులకు విక్రయిస్తున్నారు. మార్కెట్ యార్డులు, సంతల నుంచి పశువులు లారీల్లో కబేళాలకు తరలిపోతున్న దృశ్యాలు రాష్ట్రమంతటా కనిపిస్తున్నాయి. రైతుల నుంచి దళారీలు తక్కువ ధరకే పశువులను కొనేసి కేరళ, తమిళనాడు, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో వేసవి ప్రారంభంలోనే పశుగ్రాసం కొరత తీవ్రమైంది. గుంటూరు జిల్లా మొదలు రాయలసీమలోని అన్ని జిల్లాలను పశుగ్రాసం కొరత వేధిస్తోంది. ఆయా ప్రాంతాల్లో లారీ వరిగడ్డి ధర రూ.30 వేల నుంచి రూ.40 వేలు పలుకుతోంది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి ప్రతిరోజూ వందల సంఖ్యలో వరిగడ్డి లారీలు రాయలసీమకు రవాణా అవుతున్నాయి. అంత ధర పెట్టి వరి గడ్డిని కొనలేని రైతులు పశువులను అమ్ముకుంటున్నారు. కబేళాలకు తరలిన పశువుల సంఖ్య మూడు నెలల్లోనే రెండు లక్షలకు చేరుకుంది. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల గేదెలు, 12 లక్షల ఆవులు, 40 లక్షల గొర్రెలు, 8 లక్షల మేకలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ వేసవిలో గ్రాసం కొరత లేకుండా చూస్తామంటూ ప్రవేశపెట్టిన ‘ఊరూర పశుగ్రాస క్షేత్రాల పథకం’ ఆచరణలో విఫలమైంది. అనంతపురం జిల్లాలోని 63 మండలాల్లో కేవలం 10 మండలాల్లోనే పశుగ్రాసం లభ్యమవుతున్నట్లు సమాచారం. పిట్టల్లా రాలుతున్న ‘ఉపాధి’ కూలీలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేసే కూలీలు ఎండల తీవ్రతను తట్టుకోలేక కన్నుమూస్తున్నారు. రాష్ట్రంలో ఈ వేసవిలో పదుల సంఖ్యలో కూలీలు మృత్యువాత పడ్డారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే ఐదుగురు మరణించారు. ‘ఉపాధి’ పనులు చేస్తున్న ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవడం వల్ల కూలీలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. నిబంధనల ప్రకారం.. వేసవిలో పనులు చేసే కూలీలకు కచ్చితంగా నీడ కల్పించాలి. ఇందుకోసం టార్పాలిన్ షెడ్లు వేయాలి. కానీ, క్షేత్రస్థాయిలో ఇది ఎక్కడా అమలు కావడం లేదు. కూలీల దాహం తీర్చేందుకు మంచినీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాల్సి ఉన్నా.. ఇవి అందుబాటులో ఉండడం లేదు. ఉదయం ఇళ్ల వద్ద నుంచి బిందెలు, సీసాల్లో తీసుకెళుతున్న నీళ్లు కొద్దిసేపటికే అయిపోతుండడంతో దాహంతో కూలీల గొంతులు ఎండుతున్నాయి. కూలీల తాగునీరుకు ప్రత్యేకంగా ఎలాంటి బడ్జెట్‌ను విడుదల చేయలేదు. పనుల ప్రాంతంలో ప్రథమ చికిత్స చేసేందుకు ఫస్ట్ ఎయిడ్ కిట్లు కూడా అందుబాటులో ఉండడం లేదు. నిలువ నీడ లేదు.. నీరు లేదు ఎండలు మండిపోతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. పనులు చేస్తున్న ప్రాంతంలో సేద తీరేందుకు చెట్లు లేవు. అధికారులు కనీసం టార్పాలిన్ టెంట్లు కూడా వేయడం లేదు. ఎండలకు తట్టుకోలేకపోతున్నాం. తాగేందుకు మంచినీరు సైతం అందుబాటులో ఉంచడం లేదు. – రంగప్ప, కూలీ, తెర్నేకల్, కర్నూలు జిల్లా గ్లూకోజ్ నీరు ఒక్కరోజే ఇచ్చారు ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్న మాకు కేవలం ఒక్కరోజు మాత్రమే గ్లూకోజ్ నీటిని అందించారు. తాగునీరు లేకపోవడం వల్ల దూరంగా ఉన్న వ్యవసాయ బోర్ల దగ్గరకు వెళ్లి బిందెతో తెచ్చుకుంటున్నాం. ఎండలు తట్టుకోలేక చాలామంది అస్వస్థతకు గురవుతున్నారు – వేణుగోపాల్, కూలీ, రాంపురం, కర్నూలు జిల్లా పల్నాడులో ఊళ్లకు ఊళ్లే ఖాళీ ఆర్థిక ప్రగతిలో ఇతర జిల్లాల కంటే గుంటూరు జిల్లా ముందంజలో ఉందని రాష్ట్ర ప్రభుత్వం కాగితాలపై వృద్ధి రేటు గణాంకాలను గొప్పగా చూపిస్తోంది. కానీ, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు సర్కారు గణాంకాలను వెక్కిరిస్తున్నాయి. జిల్లాలో పల్నాడు సహా ఇతర ప్రాంతాల్లో కరువు విలయ తాండవం చేస్తోంది. మండు వేసవిలో గుక్కెడు తాగునీరు దొరక్క జనం అల్లాడిపోతున్నారు. కృష్ణానది పక్కనే ఉన్నప్పటికీ సాగు, తాగు నీరు లేక పల్నాడు ప్రాంత ప్రజలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. స్థానికంగా ఉపాధి అవకాశాలు లేక రైతులు, రైతు కూలీలు ఊళ్లకు ఊళ్లే ఖాళీ చేసి వలస పోతున్నారు. కరువు నివారణ చర్యలు చేపట్టడంతో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాలకు గ్రామాలే ఖాళీ అవుతున్నా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోంది. కనీసం ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని ప్రజలు అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం సున్నా. పల్నాడు ప్రాంతంలోని వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం గండిగనుమల గ్రామంలో 600 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ గ్రామంలో ఆరు బోర్లు ఉండగా, ప్రస్తుతం ఏ ఒక్క బోరులోనూ సరిపడా తాగునీరు లభించడం లేదు. దీంతో గ్రామంలో 400 కుటుంబాలు వలస వెళ్లాయి. చక్రాయపాలెం తండాలో 275 కుటుంబాలు నివసిస్తుండగా, ఇక్కడ తాగునీటికి తీవ్ర కటకట నెలకొంది. మేకలదిన్నె తండా, మన్నేపల్లి తండా, రెవిడిచెర్ల తదితర గ్రామాల్లోనూ బోర్లు పనిచేయడం లేదు. మండలంలో 17కు పైగా పంచాయతీల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. ఇదే మండలం పమిడిపాడు గ్రామంలో వాటర్ ట్యాంకుల వద్ద రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న వివాదంలో ఒక వ్యక్తి మరణించాడంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. బోర్లు వేసి అప్పుల పాలయ్యాం... గ్రామాల్లో ఉన్న బోర్లన్నీ ఎండిపోయాయి. తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకడం లేదు. సాగు నీరు లేక పత్తి, మిర్చి పంటలు ఎండిపోయాయి. నీళ్ల కోసం బోర్ల మీద బోర్లు వేసి అందరం అప్పుల పాలయ్యాం. ఈ దుర్భిక్ష పరిస్థితులను ఎన్నడూ చూడలేదు. – బి.గురువయ్య, రైతు, షోలాయేపాలెం, బొల్లాపల్లి గ్రామాల్లో వృద్ధులు, పిల్లలే ఉన్నారు నేను ఎంటెక్ చదువుతున్నా. ప్రస్తుతం సెలవుల్లో సొంతూరికి వచ్చా. కరువు పరిస్థితుల వల్ల గ్రామంలో అందరూ వలస వెళ్లారు. మా తల్లిదండ్రులు కూడా వేరే ప్రాంతాలకు వెళ్లారు. వృద్ధులు, వేసవి సెలవుల్లో ఇళ్లకు వచ్చిన పిల్లలు మాత్రమే ఊళ్లో ఉన్నారు. – బాణావత్ వెంకటేశ్ నాయక్, గంగుపల్లి తండా -
చేతి పంపులకు మరమ్మతులేవీ?
సరైన వానలు లేక ఏటేటా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో బోర్లు , బావులు, చెరువులు ఎండిపోతున్నాయి. వేసవికాలం పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. కొన్ని గ్రామాల్లో తాగేందుకు గుక్కెడు మంచి నీళ్ళు కూడా దొరకని పరిస్థితి. కనీసం చేతి పంపు నీటితో నైనా గొంతు తడుపు కుందామనుకుంటే అవిమొరాయిస్తున్నాయి. నిధులను అధికారులు ఎక్కడ ఖర్చుచే స్తున్నారో ఏమో తెలియదు కానీ స్వాహచేస్తున్నారనేఆరోపణలు మాత్రం వినిపిస్తున్నాయి. సాక్షి, యాడికి: చేతి పంపుల మరమ్మతుల పేరుతో అధికారులు ధన దాహం తీర్చుకుంటున్నారు. కొంత మంది నాయకులు వీరికి సహకరిస్తున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో 4 మండలాల్లోని గ్రామాలన్నింటిలో మొత్తం దాదాపు 300 పైనే చేతి పంపులున్నాయి. వీటితో పాటు మోటార్ల ద్వారా నీరందించే బోర్లు మరో 200దాకా ఉన్నాయి. వాస్తవంగా ప్రతి 250బోర్లకు ఒక మెకానిక్ ఉండాలి. 500 బోర్లకు కూడా ఒక మెకానిక్ లేడు. దీంతో చేతి పంపుల నీటిపైనే ఆధారపడే గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ మరమ్మతులకు గురైన చేతిపంపులు బాగు చేయాలంటే సంవత్సరాలు పడుతుంది. మెకానిక్‌ల కొరత ఒక కారణమైతే వచ్చిన నిధులు కొందరు అధికారులు, అధికార పార్టీ నాయకులు స్వాహా చేయడం మరో కారణంగా కనిపిస్తోంది. యాడికి మండలంలో 154 చేతిపంపులు ఉంటే వాటిలో 45 బోర్లు పనిచేస్తున్నాయి. మిగిలిన 89 బోర్లు మరమ్మతులకు లోనయ్యాయి. నిధులు కరిగిపోయినా పనిచేయని బోర్లు నియోజక వర్గంలో మొత్తం300 దాకా బోర్లుండగా వీటిలో చాలా బోర్లు చిన్నచిన్న మరమ్మతులతో నిరుపయోగంగా మారాయి. అయితే వీటిని ఉపయోగంలోకి తీసుకొచ్చి వేసవిలో నీటి ఎద్దడి తీర్చాలనే లక్ష్యంతో ఒక్కో బోరుకు ఏడాదికి రూ.2వేల (ఆరు నెలలకోసారి1000) చొప్పున విడుదల చేస్తోంది. ఈ సీజన్‌కు సంబంధించి ఒక్కో బోరుకు రూ.1000 చొప్పున అక్టోబర్‌లోనే ఎంపీడీఓ ఖాతాలోక్లి నిధులు విడుదలైనట్లు సమాచారం. వీటితో అదనపు పైపులు, బోరు మరమ్మతులు, మెకానిక్(కాంట్రాక్టర్æ)ల కూలీ ఖర్చులకు వెచ్చించాలి. కానీ చాలా చోట్ల బోర్ల మరమ్మతులు చేయకుండానే చేసినట్లు చూపి మింగేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సొంత అవసరాలకు సామగ్రి జిల్లాలోని అనేక మంది అధికార పార్టీకి చెందిన సర్పంచులు , చేతిపంపులకు అదనపు పైపులు అవసరమని తీసుకెళ్ళారు. తర్వాత వాటిని వేయకుండా తమ సొంతానికి వాడుకుంటున్నారు. కొందరు పశువుల పాకలకు, రేకుల షెడ్లకు వినియోగించుకుంటున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా చూడనట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం. చాలా బోర్లు పనిచేయడం లేదు గ్రామంలో చాలా బోర్లు పనిచేయడంలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదనపు పైపులు కావాలని అధికారులకు చెప్పినా పట్టించు కోవడంలేదు. వీరారెడ్డిపల్లె బస్టాండులోనీరు దప్పిక ఐతే రెండు కి.మీ. దూరం వరకు పోయి దప్పిక తీర్చుకోవాల్సిందే. బస్టాండు దగ్గర ఉన్న చేతిపంపును మరమ్మతు చేయిస్తే నీటిసమస్య ఉండదు.–భీమేశ్వరెడ్డి, కమలపాడు తాజా మాజీ సర్పంచు, యాడికి సిబ్బంది లేక ఇబ్బందులు అక్కడక్కడా చేతి పంపులు దుస్థితికి చేరిన విషయం తెలిసిందే. చేతిపంపులు దెబ్బతిన్న విషయంపై సర్వే చేయిస్తాం. ఎక్కడైనా నీరుండి బోర్లు శిథిలమై ఉంటే వాటిని మరమ్మతులు చేయించడానికి చర్యలు తీసుకుంటాం. ఐతే మరమ్మతులు చేసేందుకు అవసరమైన సిబ్బందిలేరు. వీలైనంత వరకు వాటిని మరమ్మతులు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. – ప్రవీణ్ కుమార్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, యాడికి -
ఎండిన బోరు, బావిలో పుష్కలంగా నీరు!
వాన నీటిని కందకాల ద్వారా నేలతల్లికి తాపితే.. ఎండిన బోర్లు, బావులు వెంటనే జలకళను సంతరించుకుంటాయనడానికి యువ సేంద్రియ రైతు మార్తి శ్యాంప్రసాద్‌రెడ్డికి కలిగిన తాజా అనుభవమే ప్రబల నిదర్శనంగా చెప్పొచ్చు. ఎనిమిదిన్నరేళ్లు విదేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేసి.. వ్యవసాయంపై మక్కువతో తిరిగి వచ్చేసిన శ్యాంప్రసాద్‌రెడ్డి ఏడాది క్రితం నల్లగొండ జిల్లా నిడమానూరు మండలం గజ్జెనవారిగూడెంలో 20 ఎకరాల ఎర్రగరప నేలను కొనుగోలు చేశారు. గతేడాది 4 ఎకరాల్లో శ్రీవరి, 16 ఎకరాల్లో చిరుధాన్యాలు, దేశీ పుచ్చ (విత్తనం కోసం) సాగు చేశారు. పొలంలో రెండు బోర్లు, బావి ఉన్నాయి. అయితే, ఈ ఎండాకాలంలో ఒక బోరుతోపాటు బావి కూడా ఎండిపోయింది. గత ఏడాది అధిక వర్షపాతం నమోదైనా.. ఈ వేసవిలో బోరు, బావి ఎండిపోయాయి. ఈ దశలో తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి (99638 19074), అధ్యక్షులు సంగెం చంద్రమౌళి (98495 66009)లను సంప్రదించి.. వారి సూచనల మేరకు గత నెలలో కందకాలు తవ్వించారు. తూర్పు నుంచి పడమరకు ఏటవాలుగా ఉన్న ఈ భూమిలోకి పై నుంచి కూడా వాన నీటి వరద వస్తూ ఉంటుంది. వాన నీటిని పూర్తిగా భూమిలోకి ఇంకింపజేసుకోవాలన్న లక్ష్యంతో పొలంలో ప్రతి 50 మీటర్లకు ఒక వరుసలో కందకాలు తవ్వించారు. నెల తిరగక ముందే 4 పెద్ద వర్షాలు పడ్డాయి. వారమంతా వర్షం కురిసింది. కురిసిన 2–3 గంటల్లోనే కందకాల ద్వారా భూమి లోపలికి ఇంకిందని శ్యాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. వర్షాలు కురిసిన వెంటనే బోరు, బావి తిరిగి జలకళను సంతరించుకున్నాయని ఆయన సంతోషంగా చెప్పారు. బోరు రెండించుల నీరు పోస్తున్నదని, 7హెచ్.పి. మోటారుకు రోజుకు ఐదారు గంటలు బావి నీరు అందుతున్నాయన్నారు. ప్రస్తుతం 4 ఎకరాల్లో డ్రమ్ సీడర్‌తో వరి విత్తటానికి దమ్ము చేస్తున్నామని, మిగతా 16 ఎకరాల్లో సిరిధాన్యాలు సాగు చేస్తున్నామని ఆయన తెలిపారు. గతంలో వర్షం కురిస్తే పైనుంచి కూడా వచ్చే వరద వల్ల పడమర భాగంలో భూమి కోసుకుపోయేదని, మట్టి కట్ట వేసినా ప్రయోజనం లేకుండా పోయిన పరిస్థితుల్లో కందకాలు తవ్వటం వల్ల చుక్క నీరు, పిడికెడు మట్టి కూడా బయటకు కొట్టుకుపోలేదన్నారు. ఇంకో 2–3 వానలు పడితే ఈ ఏడాది సాగునీటికి ఇబ్బంది ఉండబోదన్నారు. వర్షాలకు ముందు కందకాలు తవ్వటం వల్ల కొద్ది రోజుల్లోనే బోరు, బావి జలకళను సంతరించుకోవడం సంతోషకరమని యువ రైతు శ్యాంప్రసాద్‌రెడ్డి (84640 76429) తెలిపారు. మార్తి శ్యాంప్రసాద్ రెడ్డి -
‘బోరు’మంటున్న బక్కరైతు
- చుక్కనీరు పడక అప్పులపాలవుతున్న వైనం - ఆర్థికంగా చితికిపోతున్న కుటుంబాలు - చావే శరణ్యమంటున్న రైతులు సాక్షి, గద్వాల: సాగు చేసిన పంటలను కాపాడుకోవాలనే తపన జోగుళాంబ గద్వాల జిల్లాలోని రైతు కుటుంబాలను అప్పులపాలు చేస్తోంది. బోర్లు పడకపోతాయా.. పంటలు పండకపోతాయా.. అప్పులు తీరకపోతాయా.. అని కోటి ఆశలతో పదుల సంఖ్యలో బోర్లు వేస్తున్నారు. తీరా నీళ్లు పడకపోవడం.. ఒకవేళ పడినా భూగర్భజలాలు లేకపోవడంతో పంటలకు సరిపోవ డం లేదు. దీంతో చేసిన అప్పుల తీర్చలేక.. రుణ దాతలకు ముఖం చూపలేక చావే శరణ్యమని భావిస్తున్నారు. ఈ తరుణంలో సీఎం కేసీఆర్‌కు తన ఆవేదనను తెలపాలని గట్టు మండలం ఆలూరుకు చెందిన మల్లేశ్ మంగళవారం క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో బోర్లు వేసి అప్పులపాలైన బక్కరైతుల దైన్యస్థితికి అద్దంపడుతోంది. గట్టు, కేటిదొడ్డి మండలాల్లో అధికం గట్టు, కేటీదొడ్డి మండలాలు సముద్రమట్టానికి ఎత్తైన ప్రాంతంలో ఉండడంతో భూగర్భజలాలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం జూరాల నీళ్లపై ఆధారపడి నెట్టెంపాడు ప్రాజెక్టు నిర్మించినప్పటికీ ఈ ప్రాంతానికి పూర్తిస్థాయిలో నీళ్లు రాలేదు. గట్టు, ధరూర్, కేటీదొడ్డి, మల్దకల్, గద్వాల మండలాల్లో బోర్లు వేసి అప్పుల పాలైన రైతులు సుమారు 200 మంది ఉన్నట్లు అంచనా. కేటీదొడ్డి మండలంలో 30 బోర్లు వేసి నీళ్లుపడక అప్పులపాలైన రైతులు ఉన్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అవగాహన లోపమే కారణం వాల్టా చట్టం ప్రకారం బోర్లు వేయాలంటే రెవెన్యూ అధికారుల అనుమతి, భూగర్భంలో నీళ్లు ఉన్నాయని జియాలజిస్టుల ధ్రువీకరణ ఉండాలి. నిరక్షరాస్యులైన చాలామంది పేదరైతులు ఇవేమీ పాటించకుండానే బోర్లు వేస్తున్నారు. స్థోమతకు మించి బోర్లువేసి నీళ్లుపడక, పంటలు పండక అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొంపముంచుతున్న సీడ్ పత్తిసాగు: జోగుళాంబ గద్వాల జిల్లాలో రైతులు ఎక్కువగా సీడ్‌పత్తి సాగువైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే అదనుగా పత్తి విత్తన వ్యాపారులు, సీడ్ ఆర్గనైజర్లు రైతులకు బోర్లకు డబ్బులిచ్చి పంట పండిన తర్వాత వారి నుంచి వసూలు చేస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు మల్లేశ్ తనకున్న పొలంలో మూడేళ్లుగా సీడ్ పత్తిని సాగుచేస్తున్నాడు. నాలుగు బోర్లు వేసినా వర్షాలు లేకపోవడంతో నీళ్లు పడలేదు. పంట దిగుబడి రాక.. సీడ్ ఆర్గనైజర్లకు డబ్బులు చెల్లించలేక.. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సీడ్‌పత్తి సాగు చేసుకుంటున్న రైతులు బాగుపడటం లేదు కానీ ఆర్గనైజర్లు కోట్లకు పడగలెత్తుతున్నారు. 15 బోర్లు వేసినా.. కాలం కలసి రాలే దు. ఐదేళ్లలో 15 బోర్లు వేశాను. కేవలం మూడు బోర్లలో మాత్రమే నీళ్లు నామమాత్రంగా పడ్డా యి. పదెకరాల వ్యవసా య పొలంలో ఐదెకరాలు వరినా టాను. కానీ పంట గింజపట్టే దశలో మూడుబోర్లు కూడా వట్టిపోవడంతో పంట ఎండిపోయింది. ఇటుపంట నష్టం.. అటు బోర్లు వేసేందుకు తెచ్చిన రూ.15 లక్షల అప్పు మిగిలింది. – గోవింద్, రైతు, కేటీదొడ్డి గ్రామం 20 బోర్లు వేసి అప్పుల పాలైన సాగునీటి కోసం చేయని ప్రయత్నం లేదు. మూడేళ్లలో 20 బోర్లు వేశాను. కేవలం రెండుబోర్లు మాత్రమే పని చేస్తున్నాయి. అరెకరాల పొలం ఉంది. ఐదుగురు అమ్మాయిలు ఉన్నాయి. సాగునీటి కోసం భగీరథ ప్రయత్నం చేస్తూనే ఉన్నా. బోర్ల కోసం చేసిన అప్పులను తీర్చేందుకు రెండు ఎకరాల పొలాన్ని అమ్ముకున్నాను.. –యనుముల ఆంజనేయులు, తారాపురం, గట్టు మండలం -
ఊట బావుల ఊరు..
బావులు తవ్వితే నీళ్లు.. బోర్లు వేస్తే చుక్క రాదు - మహబూబ్‌నగర్ జిల్లా వెంకటాపూర్‌లో చిత్రమిది! - ఈ మర్మమేమిటో తెలియక తలలు పట్టుకుంటున్న అధికారులు సాక్షి, మహబూబ్‌నగర్: జలం కోసం జనం పరితపిస్తున్న రోజులివి. భానుడి విశ్వరూపానికి భూగర్భ జలాలు అడుగంటిపోయి నీటి ఎద్దడితో జనం అల్లాడిపోతున్నారు. అయితే, మహబూబ్‌నగర్ జిల్లా మరికల్ మండలం వెంకటాపూర్ గ్రామం ఇందుకు భిన్నం. ఇక్కడి వ్యవసాయ పొలాల దగ్గర బోర్లు డ్రిల్లింగ్ చేస్తే చుక్క నీరు రాదు. అదే స్థానంలో బావులను తవ్వితే మాత్రం పుష్కలమైన నీరు లభిస్తుంది. 20 అడుగులు తవ్వితే చాలు.. నీరు ఉబికి వస్తోంది. ఊరు ఊరంతా ఇదే పరిస్థితి. దీంతో ఆ గ్రామంలో బోర్లు వేయడం మానేసి ప్రతిఒక్కరూ బావులు తవ్వుకుంటున్నారు. మొదట 20 బావులతో మొదలైన ప్రస్థానం.. ప్రస్తుతం 130 బావులకు చేరింది. ఇంతటి వేసవిలో కూడా ప్రతీ బావి నిండుకుండలా నీటితో కళకళలాడుతుంటుంది. ఇంటింటికి వ్యవసాయం.. ఇంటింటికి బావి ఉండటంతో ఈ గ్రామం సిరుల పంటలకు నిలయంగా మారింది. ఇదే గ్రామానికి పక్కనే ఉన్న తీలేరు, పెద్ద చింతకుంట, బం డ్రవల్లిలలో ఇలాంటి పరిస్థితి కనిపించదు. మరో పక్క ఈ భిన్నమైన పరిస్థితులకు మూల కారణంపై భూగర్భజలశాఖ అధికారులు పరిశోధనలు చేస్తున్నారు. ఇదో ప్రత్యేకత... మరికల్ మండలం తీలేర్ గ్రామ పంచాయతీకి అనుబంధమైన గ్రామమే వెంకటాపూర్. 1950లో పది కుటుంబాలతో గ్రామంగా ఏర్పడిన వెంకటాపూర్‌కు 750ఎకరాల శివారుంది. బావి తవ్విన ప్రతిచోట పుష్కలమైన నీరు రావడంతో కాలక్రమంలో గ్రామం విస్తరించిం ది. మొదట 20 బావులతో మొదలైన వెంకటాపూర్ బావుల ప్రస్థానం ఏటా పెరుగుతూనే ఉంది. ప్రతి కుటుంబానికి ఒక బావి ఉండటంతో తమ పొలాల్లో వరి, వేరుశనగ, తోటలను సాగు చేసుకొని మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. అంతేకాదు బావుల్లో సంవత్సరం పొడువునా నీరు ఉండడంతో చేపల పెంపకం చేపడుతున్నారు. ఇలా రెండు విధా లా రైతులకు లాభసాటిగా మారుతోంది. 15 నుంచి 20 అడుగుల్లోనే నీరు పాలమూరు ప్రాంతమంటే సరైన వర్షాలు లేక భూగర్భజలాలు అడుగంటుతుండడం మనం చూస్తుంటాం. మూడేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో చాలా దారుణంగా భూగర్భజలాలు పడిపోయాయి. చాలా గ్రామాల్లో తాగడానికి నీళ్లు లేక దాదాపు 500 అడుగుల లోతుకు బోర్లు వేస్తున్నా ఫలితం ఉండటంలేదు. ఈ నేపథ్యంలో వెంకటాపూర్ గ్రామం ఇందుకు భిన్నంగా ఉంది. బోర్లు వేస్తే చుక్కనీరు పడకపోయినా.. బావులు తవ్వితే అది కూడా 15 నుంచి 20 అడుగుల లోతులో పుష్కలమైన నీరు అందుతోంది. పరిశోధన చేస్తున్నాం వెంకటాపూర్ గ్రామ ప్రత్యేక పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నాం. కేవలం బావులలో మాత్రమే నీరు రావడానికి కొన్ని పరిస్థితులుంటాయి. భూమిలో అనేక పొరలుంటాయి. నీటిని భూమిలోకి పూర్తిగా ఇంకకుండా వెదడ్ (ప్రత్యేక పొర), హార్డ్‌రాక్ వంటి పరిస్థితులున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నల్లరేగడి పొర ఉన్నా కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. అచ్చం ఇలాంటి పరిస్థితే ఏపీలోని కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని విడుతూరులో కూడా ఉంది. అయినా వెంకటాపూర్ గురించి పరిశోధన చేస్తున్నాం. పూర్తి నివేదిక రాగానే అందజేస్తాం. – కె.లక్ష్మణ్, భూగర్భ జల అధికారి, మహబూబ్‌నగర్ -
బోరు.. బోరుమంది...
ఐదేళ్లలో 50 బోర్లు వేసిన రైతు సోదరులు - రెండు బోర్లలోనే కొద్దిపాటి నీరు - 60 ఎకరాలున్నా.. నీళ్లు లేవు - మూడెకరాల్లో వరి సాగు - మండుతున్న ఎండలకు అడుగంటుతున్న భూగర్భ జలాలు మరికల్: మండుతున్న ఎండలకు వ్యవసాయ బోర్లలో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. చేతికి వచ్చిన పంటలను ఎలాగైనా కాపాడుకోవాలనే తపనతో వడ్డీలకు అప్పులు చేసి బోర్లు వేస్తున్నా.. ఎండలకు భూమి తల్లి గర్భంలోనుంచి గుక్కెడు నీటిబొట్లు రావడం లేదు. కళ్లెదుటే పంటలు ఎండుముఖం పడుతుంటే అన్నదాతల బాధలు చూసే వారికి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా మరికల్ మండలం కన్మనూర్ గ్రామానికి చెందిన లక్ష్మీకాంత్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి ముగ్గురు సోదరులు. ఈ ముగ్గురికీ కలిపి 60 ఎకరాల భూమి ఉంది. వీరిలో గోపాల్‌రెడ్డి ఉపాధ్యాయుడు కాగా, మిగతా ఇద్దరు వ్యవసాయాన్నే నమ్ముకున్నారు. వీళ్లు వర్షాభావంతో పంటల సాగుకోసం ఐదేళ్లలో 50 బోర్లు వేశారు. వాటిలో కేవలం రెండు బోర్లలో మాత్రమే కొద్దిపాటి నీరు పడింది. ప్రతి ఏడాది ఇద్దరు సోదరులు 2 నుంచి 3 ఎకరాలలోపు వరి పంటలను సాగుచేస్తూ, మిగతా భూమిలో వర్షాధార పంటలనే నమ్ముకున్నారు. వేసవి కాలం వచ్చిందంటే చాలు.. ఉన్న రెండు బోర్లలో కూడా భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. దీంతో లక్ష్మీకాంత్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి ఒకరోజు తప్పించి ఒకరోజు పంటలకు నీళ్లు పారపెడుతున్నారు. ఈ ఏడాది ఉన్నబోర్లు కూడా ఎండిపోయాయి. దీంతో నీళ్లు లేక పొలం మొత్తం నెర్రెలుబాస్తోంది. లక్షలు నష్టపోయాం.. మా ముగ్గురు సోదరులకు కలిపి 60 ఎకరాల భూమి ఉంది. ముందునుంచి వ్యవసాయాన్నే నమ్ముకున్నాం. నీటిజాడ కోసం లక్షల ఖర్చుతో 50 బోర్లను డ్రిల్లింగ్ చేశాం. కానీ కేవలం రెండు బోర్లలోనే కొద్దిపాటి నీరు రావడంతో భాగ పరిష్కారాలు చేసుకున్నాం. వచ్చే కొద్దిపాటి నీళ్లతో 3 ఎకరాల్లో వరి సాగు చేశాం. ఒకరోజు తప్పిం చి ఒకరోజు పంటలకు నీరు పెడుతూ వచ్చిన దిగుబడితోనే సంతృప్తి చెందుతున్నాం. ఈ ఏడాది బోర్లలో భూగర్భజలాలు అడుగంటిపోవడం వల్ల పంటంతా ఎండింది. నమ్ముకున్న ఎవుసం కలిసిరాక నట్టేట మునిగిపోయాం. ఏం చేయాలో, ఎక్కడికి బోవాలో తెలుస్తలేదు. – లక్ష్మీకాంత్‌రెడ్డి, రైతు, కన్మనూర్ -
పేద ఎస్సీ రైతులకు చేయూత
మచిలీపట్నం (చిలకలపూడి) : ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ నిరుపేద రైతులకు వ్యవసాయ సామగ్రిని ఉచితంగా అందజేయనున్నట్లు ఈడీ ఎన్వీవీ సత్యనారాయణ తెలిపారు. ఆయన కార్యాలయంలో ఆదివారం విలేకర్లతో మాట్లాడుతూ కార్పొరేషన్ ద్వారా రెండు ఎకరాలోపు ఉన్న నిరుపేద ఎస్సీ రైతులు బోరుబావులు, ఎలక్ట్రానిక్ మోటారు, విద్యుత్ కనెక్షన్ల కోసం ఉచితంగా నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. కొత్తగా వ్యవసాయం చేస్తూ బోరు, కరెంటు లైను, ఎలక్ట్రానిక్ మోటార్ల ఏర్పాటుకు రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇందుకోసం మీ–సేవా ద్వారా పొందిన కులధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు నకలు, భూమి పత్రాలు, పాస్‌పోర్ట్ సైజు ఫోటో దరఖాస్తుతో పాటు నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. యువస్పూర్తి సమ్మేళనాలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అక్టోబరు 1వ తేదీ నుంచి నియోజకవర్గస్థాయిలో యువస్ఫూర్తి సమ్మేళనాలు నిర్వహించనున్నట్లు ఈడీ తెలిపారు. ఇందులో సంక్షేమ పథకాలపై అవగాహన, అలాగే రుణాల మంజూరుపై లబ్ధిదారులు, బ్యాంకుల మధ్య చర్చలు నిర్వహిస్తామన్నారు. -
అవి ఫౌంటేన్లు కావు.. బోర్లు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: కరువుతో రాష్ట్రం విలవిలలాడుతుండగా.. ఆ గ్రామంలో జల కళ ఉట్టి పడుతోంది. రాష్ట్రంలోని ఏ గ్రామం లో చూసినా భూగర్భజలాలు పాతాళానికి చేరాయి. కానీ, ఈ ఊరిలోని బోర్లు ఫౌంటేన్ల ను తలపిస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 40కి పైగా బోర్లలో నీళ్లు ఫౌం టేన్లా విరజిమ్ముతున్నాయి. ఎలాంటి మోటార్లుగానీ, పంపుసెట్లు కానీ అమర్చకుం డానే నీళ్లు ఎగజిమ్ముతున్నాయి. మండు వేసవిలో కూడా ఈ గ్రామంలో ఏడాది పొడవునా ఇలాగే బోర్ల నుంచి నీళ్లు పైపైకి వస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామ పంచాయతీ పరిధిలోని మామడ గ్రామంలో ఈ అద్భుత దృశ్యం దర్శ నమిస్తోంది. గ్రామంలో సుమారు 50 కుటుం బాలున్నాయి. గ్రామ సమీపంలోనే నీల్వాయి వాగుపై ప్రాజెక్టు ఉంది. ప్రాజెక్టులో నిండా నీరుండటంతో ఆ ప్రాంతంలో భూగర్భ జలా లు బాగా పైకి పెరిగాయి. భూగర్భ జలాలు పుష్కలంగా ఉండటం ఒక రకంగా ఈ గ్రామస్తులకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. అతిగా నీళ్లు పైకి రావడంతో గ్రామంలో నివసించడం, భూములను సాగు చేసుకోవడం కష్టమ వుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లు కుంగిపోయి, గోడలు బీటలు వారుతున్నాయి. పలు ఇళ్ల గోడలు కూలిపోయాయి. తమ ఇళ్లు కూలిపోవడంతో గ్రామానికి దూరంగా గుడిసె వేసుకున్నామని మం చినీళ్ల నాగరాజు ‘సాక్షి’ ప్రతినిధితో పేర్కొ న్నారు. ఇక వర్షాకాలంలో పంట పొలాలను సాగు చేయలేని పరిస్థితి. ట్రాక్టర్లు బురదలో కూరుకుపోతున్నాయి. ఏటా వర్షాకాలంలో నాలుగైదు పశువులు ఈ బురదల్లో కూరుకుపోయి చనిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. మరుగుదొడ్డి కోసం 2, 3మీటర్ల లోతు తవ్వితే నీళ్లు వస్తుండటంతో గుంతలు తీసి వదిలివేశామని గ్రామస్తులు చెబుతున్నారు. -
వాల్టా.. ఇక్కడ ఉల్టా
గాజువాక : నగరంలో నీటి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. నిబంధనలను తోసిరాజని సాగుతున్న ఈ వ్యాపారం పట్ల సంబంధిత అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తుండటంతో వ్యాపారులకు లాభాల వర్షాన్ని కురిపిస్తోంది. ఇప్పటికే నగరానికి నీటి లభ్యత తగ్గిపోయి జనం దాహం కేకలు వేస్తున్న విషయం తెలిసిందే. మరోపక్క వ్యాపారులు సబ్ మెర్సిబుల్ పంపులతో భూగర్భ జలాలను తోడేస్తుండటంతో నగరంలో వేల బోర్లు పనిచేయకుండా మూలకు చేరిపోయాయి. ఇంకోపక్క ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటర్ పేరుతో మరికొంతమంది వ్యాపారులు, సర్వీసింగ్ సెంటర్ల పేరుతో మరికొంతమంది భూ గర్భ జలాలను హరించేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చట్టాలను అమలు చేసి జల సంరక్షణకు నడుం బిగించాల్సిన యంత్రాంగం కిమ్మనకపోవడం నగర ప్రజలకు శాపంగా మారింది. విచ్చలవిడిగా నీటి అమ్మకం...: నగరంలో భూగర్భ జలాలతో విచ్చలవిడి వ్యాపారం సాగుతోంది. ప్రైవేట్ నీటి హ్యాకర్ల సంఖ్య నగరం మొత్తంమీద వందల్లో ఉన్నట్టు చెబుతున్నారు. పారిశ్రామిక ప్రాంతమైన గాజువాక, అగనంపూడి, ఆటోనగర్, చినగంట్యాడ, మింది రామ్‌నగర్, మల్కాపురం తదితర ప్రాంతాల్లో పలువురు వ్యాపారులకు నీటి అమ్మకమే ప్రధాన వ్యాపకంగా ఉంది. ఆరు, ఎనిమిది అంగుళాల బోర్లను తవ్వించి భూగర్భ జలాలను సబ్ మెర్సిబుల్ పంపులతో తోడేస్తున్నారు. కొంతమంది రోజుకు 20 వేల కిలో లీటర్ల సామర్థ్యంగల సుమారు 150 ట్యాంకర్ల నీటిని తోడి అమ్మేస్తున్నారు. దీంతో సంబంధిత ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఇంకిపోయి వ్యక్తిగత బోర్లు పని చేయని పరిస్థితి నెలకొంది. అర్బన్ ప్రాంతంలో సుమారు 35 ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ప్లాంట్లు ఉన్నాయి. వాటికి తోడు ఇటీవల కాలంలో మినరల్ వాటర్ పేరుతో వీధికొకటి వెలసిన విషయం తెలిసిందే. ఫర్మ్ రిజిస్ట్రేషన్ విభాగం వద్ద నమోదు చేయించుకొని నెలకొల్పినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తున్నారని పలు సందర్భాల్లో స్థానికులు అధికారుల దృష్టికి తీసుకొచ్చిన సందర్భాలున్నాయి. వాల్టా చట్టం ప్రకారం...: వాల్టా చట్టం ప్రకారం ప్రైైవేట్ నీటి వ్యాపారాలకు అనుమతి ఇవ్వరు. ఎవరైనా నీటి వ్యాపారానికి పాల్పడితే ఈ చట్టం కింద చర్యలు తీసుకోవడానికి అధికారులకు అన్ని అధికారాలూ ఉన్నాయి. మినరల్ వాటర్ ప్లాంట్లను కూడా మూసేయాల్సిందిగా ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులననుసరించి జిల్లాలో ఉన్న పలు మినరల్ వాటర్ ప్లాంట్లను మూయించాలంటూ ఐదేళ్ల క్రితం అప్పటి జిల్లా కలెక్టర్ ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆ ఆదేశాలను అమలు చేయడానికి కూడా జీవీఎంసీ అధికారులకు తీరిక లేకుండా పోయింది. నీటి వ్యాపారాన్ని అరికట్టాల్సిన అధికారులు హాకర్లతో కుమ్మక్కవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
మరణ మృదంగం
భానుడి దెబ్బకు మూగజీవాలు అల్లాడుతున్నాయి. గుక్కెడు నీటి కోసం ‘అరణ్య’రోదన చేస్తున్నాయి. అడవుల్లో చెలిమలు, వాగులు, వంకలు ఎండిపోవడంతో దాహంతో అలమటిస్తున్నాయి. నీటి జాడ కోసం జనారణ్యంలోకి వస్తూ ప్రాణాలు విడుస్తున్నాయి. గోదావరి, కృష్ణా, మంజీర, ప్రాణహిత నదీపరివాహక ప్రాంతాలు ఎడారిని తలపిస్తున్నాయి. ఇది ఆయా ప్రాంతాల్లోని వన్యప్రాణులకు మరణశాసనంగా మారింది. - సాక్షి, హైదరాబాద్ అడవిలో గుక్కెడు నీళ్లు లేక మూగజీవాల విలవిల * అటవీప్రాంతాల్లో ఎండిపోయిన చెలిమలు, వాగులు, వంకలు * ఎడారిని తలపిస్తున్న నదీ పరివాహక ప్రాంతాలు * నీటి చుక్క కోసం తపిస్తున్న అభయారణ్యాల్లోని జంతువులు ఎక్కడ చూసినా దాహం.. దాహం.. రాష్ట్రంలో 7,260.56 చదరపు కిలోమీటర్ల పరిధిలో సంరక్షక అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఇది 365 జాతుల పక్షులు, 103 జాతుల క్షీరదాలు, 28 జాతుల సరీసృపాలు, 21 జాతుల ఉభయచరాలకు ఆలవాలం. పులులు, చిరుతలు, అడవి దున్నలు, నాలుగు కొమ్ముల జింకలతోపాటు నదుల్లో మార్ష్ జాతి మొసళ్లు ప్రత్యేక ఆకర్షణ. ఆదిలాబాద్ జిల్లాలో కవ్వాల్‌తో పాటు మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రాలుగా ప్రసిద్ధి గాంచాయి. గోదావరి నదిపై నిర్మించిన కడెం జలాశయం పూర్తిగా ఎండిపోవడంతో కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం తీవ్ర నీటి కొరత ఎదుర్కొంటోంది. కృష్ణా నదిలో కొంత భాగం తడారిపోవడంతో అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మిగతా అభయారణ్యాలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల పరిస్థితి సైతం దారుణంగా తయారైంది. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పరిధిలోని సివారం, మెదక్ జిల్లాలోని మంజీర వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లో నీళ్లు లేక మొసళ్లు విలవిలలాడుతున్నాయి. నీటి కోసం తరచూ గ్రామాల్లోని పంట పొలాల్లోకి చొరబడుతున్నాయి. ఆదుకునే ప్రణాళిక ఏదీ..? ఎల్‌నినో ప్రభావం భయంకరంగా ఉంటుందన్న విషయాన్ని శాస్త్రవేత్తలు ఎప్పుడో వెల్లడించారు. దాని వల్ల వన్యప్రాణులకు వచ్చే ముప్పును ఎదుర్కొనే విషయంలో ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించలేదు. కరువు దుష్ర్పభావాన్ని పూర్తిగా అడ్డుకోవటం అసాధ్యమే అయినా.. ముందస్తుగా కొన్ని చర్యలు తీసుకోగలిగితే దాన్ని కొంతమేర నివారించే పరిస్థితి ఉంటుంది. కానీ నీటి కొరత తీవ్రంగా ఉండబోతోందన్న విషయం తెలిసీ ముందస్తు చర్యలు తీసుకోలేదు. అటవీ శాఖ వద్ద నిధులకు కొదవ లేనప్పటికీ ప్రణాళిక లేకుండాపోయింది. నీటి గలగలలు, పచ్చటి పరవళ్లతో సుందరంగా కనిపించే అడవులు ఎండాకాలంలో కళ తప్పటం సహజం. నదులు, వాగులు, వంకలు, చెలమలు, కుంటలు ఎండిపోయి నీటి కొరత ఏర్పడుతోంది. ఇలాంటి సమయంలో జంతువుల దప్పిక తీర్చేందుకు ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయాలి. సిమెంటుతో పెద్దపెద్ద గుంతలు తీసి వాటిలో నీళ్లు నింపాలి. వీటిని ‘సాసర్’లుగా పేర్కొంటారు. కొన్నిచోట్ల గుంత తవ్వి దానిపై మందపాటి షీట్ పరిచి నీళ్లు నింపుతారు. ఒక్కోదానిలో దాదాపు 800 లీటర్ల వరకు నీళ్లుంటాయి. ఇలాంటివి అడవి అంచు(ఫ్రింజ్)న ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో దాదాపు 400 వరకు ఉన్నాయి. వీటిలో ట్యాంకర్ల ద్వారా నీటిని నింపాలి. ఎండ తీవ్రత నేపథ్యంలో ఈసారి వీటి సంఖ్యను మరింత పెంచి ట్యాంకర్ల ద్వారా నీళ్లు నింపే కార్యాచరణ ప్రణాళిక కొరవడింది. కొత్తవి నిర్మించకపోగా.. ఉన్న వాటిల్లోనూ నీళ్లు నింపడం లేదు. ట్యాంకర్లు వెళ్లగలిగే కొన్ని ప్రాంతాలకే ఈ సేవలు పరిమితమయ్యాయి. గుట్టల ఆవల ఉండేవి నీళ్లు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో వన్యప్రాణులు జనారణ్యంలోకి వస్తున్నాయి. మంచి పథకం కూడా శాపమే! చెరువులకు పునర్వైభవం కోసం ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ కూడా మూగజీవాలకు శాపంగా మారింది. పూడిక తీత పనులతో ఆయా చెరువులన్నీ తడి లేకుండా మారిపోయాయి. ఉదాహరణకు ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో నాలుగు ప్రధాన చెరువులున్నాయి. సింగభూపాలం చెరువు 500 ఎకరాలకు నీరందిస్తుంది. ఇందులో 30 శాతం నీళ్లుండగానే కాకతీయ పనుల కోసం తూముల ద్వారా నీటిని బయటకు పంపారు. ఇదే ప్రాంతంలో పెనగడప, కారుకొండ, అనిశెట్టిపల్లెలోని చెరువులను కూడా ఇలాగే ఖాళీ చేశారు. ఇక్కడ ఒక్కచోటే కాదు చాలాచోట్ల చెరువులను ఇలాగే ఖాళీ చేశారు. ఇది మంచి కార్యక్రమే అయినా.. ప్రత్యామ్నాయంగా చెరువుల పక్కన చిన్నపాటి గుంతలో నీళ్లు నింపేలా కార్యాచరణ చేపట్టాల్సిందని, వాటితో మూగజీవాల దాహార్తి కాస్తయినా తీరేదని జంతుప్రేమికులు అంటున్నారు. బోర్లు ఏమయ్యాయి? అడవిలో బోర్లు వేసి సమీపంలోని కొంత ఎత్తులో ట్యాంకులు కట్టి గ్రావిటీ ద్వారా నీటిని సమీపంలోని చిన్నచిన్న కుంటల్లోకి పంపుతారు. కానీ వేసవి తీవ్రతను దృష్టిలో ఉం చుకొని ముందుగా కొత్త ప్రాంతాల్లో బోర్లు వేయించలేదు. వ్యక్తులు వెళ్లి ఆపరేట్ చేయాల్సిన అవసరం లేకుండా సౌరశక్తితో నడిచే డెన్మార్క్ యంత్రాలతో బోర్లు ఏర్పాటు చేసే ప్రాజెక్టును అటవీశాఖ 2008లో ప్రారంభించింది. ఎండ రాగానే మోటార్ దానంతట అదే స్టార్ట్ అయి సమీపంలోని ట్యాంకులోకి నీళ్లు పంపుతుంది. దానికి ఏర్పాటు చేసిన పైపుల ద్వారా నీళ్లు కుంటలకు వెళ్తాయి. ఇలాంటివి అమ్రాబాద్, ఏటూరు నాగారం, హరిణ వనస్థలి, కవ్వాల్, కిన్నెరసాని అభయారణ్యాలు, జంతు సంరక్షణ కేంద్రాల్లో ఉన్నాయి. ఈసారి కవ్వాల్, అమ్రాబాద్‌లో రెండు చొప్పున, పోచారం, కిన్నెరసాని, ఏటూరు నాగారంలలో ఒకటి చొప్పున కొత్తవి ఏర్పాటు చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ ఇప్పటివరకు కార్యాచరణే లేదు. వచ్చేనెలలో వీటిని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ లోపు జంతువుల దాహం ఎవరు తీర్చాలో అధికారులకే తెలియాలి. కేంద్రం నుంచి అందని నిధులు.. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం కింద రాష్ట్రాలకు వన్యప్రాణుల సంక్షేమ నిధులు రావాల్సి ఉంటుంది. కానీ గత రెండేళ్లుగా తెలంగాణకు రూపాయి కూడా అందటం లేదు. అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ ప్రాజెక్టులకు మాత్రం రూ.4 కోట్లు అందాయి. మిగతా అభయారణ్యాలు, అటవీ రక్షిత ప్రాంతాలకు పైసా రాలేదు. ఈ విషయంలో కేంద్రంపై ప్రభుత్వం కూడా పెద్దగా ఒత్తిడి చేయలేదు. ప్రణాళికలు పంపితే రూ.1.82 కోట్లు ఇస్తామని కేంద్రం తాజాగా పేర్కొనటంతో ఇప్పుడు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఆ నిధులు జూన్ నాటికికానీ రావు. అప్పటికి వానాకాలం మొదలవుతుంది. పనులు జరిగే సరికి మళ్లీ వేసవి వస్తుంది. అంటే ఆ నిధులు ఈసారి ఉపయోగపడవన్నమాట! చెక్‌డ్యాంలే పెద్ద అండ అడవుల్లో వాగులు, వంకలకు కొదువ ఉండదు. వాటిపై పెద్ద సంఖ్యలో చెక్‌డ్యాంలు నిర్మిస్తే వానలు కురిసినప్పుడు భారీగా నీళ్లు నిలువ ఉండి వేసవికి ఉపయోగపడతా యి. ఈసారి వాటి సంఖ్య పెం చితే వచ్చే వానాకాలానికి ఉపయోగపడతాయి. కానీ మే సమీపిస్తున్నా ఆ పనుల జాడే లేదు. కనీసం ప్రణాళికలు కూడా సిద్ధం చేయలేదు. వానలు మొదలయ్యాక పనులు చేయటం కష్టం. వచ్చే సంవత్సరం వేసవిలో పనులు చేపట్టే అవకాశం ఉంది. అంటే కొత్త వాటి ఫలితం అందాలంటే రెండు ఎండాకాలాలు దాటాల్సిందే! కానరాని అధ్యయనాలు విదేశాల్లో మంచి పద్ధతులు ఉంటే వాటిని అధ్యయనం జరిపి ఇక్కడ అనుసరించటం సహజం. కానీ ఎండల్లో వన్యప్రాణులకు నీళ్లు ఎలా అందించాలనే విషయంలో మన అధికార యంత్రాంగానికి ఎలాంటి అధ్యయన అవకాశాల్లేకుండా పోయాయి. ఇప్పటి వరకు అలాంటి స్డడీ టూర్లు ఏర్పాటు చేయలేదు. మనకంటే తక్కువ వర్షపాతం ఉన్న ఇజ్రాయెల్ లాంటి దేశాలు వన్యప్రాణుల దప్పిక తీర్చే విషయంలో ప్రత్యేక పద్ధతులు అవలంభిస్తున్నాయి. వాటిపై మన అధికారులకు అవగాహన లేదు. ఇలా విపత్కర పరిస్థితులు ఏర్పడ్డప్పుడు అప్పటికప్పుడు చర్యలు తీసుకోవటంలో అధికారులు చేతులెత్తేస్తున్నారు. -
బోరు.. భోరు!
♦ 190 బోర్లు.. 170 ఫెయిల్ ♦ రంగారెడ్డి జిల్లాలో ఓ గ్రామ ప్రజల భగీరథ యత్నం ♦ రూ.లక్షలు ఖర్చు చేసి అప్పులపాలవుతున్న రైతులు వికారాబాద్ రూరల్: పాతాళగంగను పైకి తెచ్చేందుకు రైతన్నలు చేస్తున్న భగీరథ ప్రయత్నం ఫలించడం లేదు. తిండి గింజలైనా పండించుకుందామని అప్పులు తెచ్చి వేస్తున్న బోర్లు.. రైతులను కోలుకోకుండా చేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం పులుమద్ది గ్రామంలో రైతులు ఆరు నెలలుగా 190 బోర్లు వేస్తే అందులో 170 బోర్లు పూర్తిగా ఫెయిలయ్యాయి. మరో 15 బోర్లలో అరకొర నీళ్లు పడ్డాయి. ఒక రైతును చూసి మరో రైతు బోర్లను వేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు. కానీ నీళ్లు మాత్రం పడడం లేదు. వాల్టా చట్టం ప్రకారం.. బోరుకు బోరుకు మధ్య సుమారు 100 మీటర్ల దూరం ఉండాలి.. కానీ ఈ గ్రామంలోని కొన్ని ప్రాంతాల్లో 100 మీటర్ల పరిధిలోనే సుమారు 10 బోర్లు కూడా ఉన్నాయి. గ్రామానికి చెందిన బల్జ వీరప్ప, బుచ్చమ్మల కుమారుడు మల్లేశం తన పొలంలో రూ.4 లక్షలు ఖర్చు చేసి ఏడు బోర్లు వేశాడు. వాటిల్లో కేవలం ఒక్క బోరులోంచి అరకొర నీరు వస్తోంది. ఇదే రైతు రూ.నాలుగు లక్షలు ఖర్చు చేసి బావినీ తవ్వించాడు. అయినా ఫలితం లేదు. మరో రైతు యాదవరెడ్డి తన పొలంలో ఏకంగా తొమ్మిది బోర్లు వేశాడు. కేవలం ఒక్క బోరు మాత్రమే పనిచేస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే గ్రామానికి చెందిన బోజిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, ఎర్రవల్లి భుజంగరెడ్డి, పాండురంగారెడ్డి, టి.సంజీవరెడ్డి, శ్రీనివాస్‌లతోపాటు చాలా మంది రైతులు వారివారి పొలాల్లో రెండు నుంచి ఐదు బోర్ల వరకు వేయించారు. వీరిలో చాలా మంది జియాలజిస్టు అభిప్రాయం తీసుకుని మరీ బోర్లు వేసిన వాళ్లే. వేస్తున్న సమయంలో కొన్ని బోర్లలో నీళ్లు పడుతున్నా.. పది నుంచి 15 రోజుల వ్యవధిలో అవి వట్టిపోతున్నాయి. యాలాల మండలం నుంచి పులుమద్దికి వచ్చిన ఓ బోరువెల్ యజమాని 15 రోజుల్లో బోర్లు వేసి సుమారు రూ.కోటి ఆదాయం సమకూర్చుకున్నాడని రైతులు తెలిపారు. రూ.4 లక్షలు నష్టపోయాం మా పొలంలో ఏడు బోర్లు వేసినం. ఒకే ఒక్క బోరులోంచి నీళ్లు వస్తున్నయ్. ఉన్న మూడు ఎకరాల్లో టమాటా, క్యాబేజీతోపాటు ఇతర కూరగాయల పంటలు వేసినం. నీళ్లు సరిపోక అవి ఎండుతున్నయ్. బోర్ల వేసి రూ.4 లక్షలు నష్టపోయినం. మరో నాలుగు లక్షలు పెట్టి బాయి తవ్విచ్చినం. నీళ్లు పడలే. - బల్జ బుచ్చమ్మ, పులుమద్ది, వికారాబాద్ మండలం ఒకర్ని చూసి మరొకరు.. మా గ్రామంలో రైతులందరూ ఒకరి తర్వాత ఒకరు బోర్లు వేయబట్టిర్రు. దగ్గరదగ్గర్నే పది, పదిహేను బోర్లు వేస్తుం డ్రు. నేను కూడా రూ.70 వేలు ఖర్చు చేసి గతంలో బోరు వేసిన. నీళ్లు పడ్డయి. ఇప్పుడు దానికి దగ్గర్లనే వేరేటోళ్లు బోర్లు వేస్తున్నరు. మా బోర్ల నీళ్లు వట్టిపోయినయ్. వారం క్రితమే డ్రిల్లింగ్ చేయించిన. కొద్దికొద్దిగా నీళ్లు వస్తున్నయ్. - శ్రీనివాస్, పులుమద్ది, వికారాబాద్ మండలం -
చివరికి మిగిలింది గడ్డే!
♦ ఆశల సాగుకు అప్పుల కుప్పలు! ♦ అడుగంటిన బోర్లు ఎండిన పంటలు ♦ దిక్కుతోచని రైతులు ఈ సారి.. వచ్చే సారి.. మరో సారైనా పంట పండకపోతుందా.. అప్పు తీరకపోతుందా.. అని ఆశల సాగు చేస్తున్న అన్నదాతకు ప్రతిఏటా కష్టాల పెట్టుబడి.. నష్టాల దిగుబడే మిగులుతోంది. ఫలితంగా.. పది మందికి అన్నం పెట్టాల్సిన చేతులు.. పొట్ట చేత పట్టుకుని వలస బాట పడుతున్నాయి. దేవుడు కరుణించక.. సర్కారు సహ కరించక.. సాగు సంక్షోభంలో చిక్కుకున్న పుడమి పుత్రులు.. అప్పుల ఊబిలోంచి ఒడ్డున పడే మార్గం లేక విలవిల్లాడుతున్నారు. - కుల్కచర్ల మూడేళ్లుగా సరైన వర్షాలు లేకపోవడంతో మండల పరిధిలోని చెరువులు, కుంటలు చుక్క నీరు లేకుండా ఎండిపోయాయి. బోరుబావులు ఉన్న కొంతమంది రైతులు ఎకరం, అర ఎకరంలో పంటలు సాగు చేశారు. మండుతున్న ఎండల ప్రభావంతో ఇవి కూడా అడుగంటడంతో దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటున్నారు. కరువు నేపథ్యంలో మండలంలో 2,500 హెక్టార్ల మేర సాగు కావాల్సిన వరి.. ఈ సీజన్లో 500 హెక్టార్లకే పరిమితమైంది. బోరుబావుల కింద సాగు చేసిన 300 హెక్టార్ల పంట ఇప్పటికే నిలువునా ఎండిపోయింది. దీంతో బతుకుదెరువు కష్టమైన కర్షకులు ముంబై, పూణెకు వలస వె ళ్తున్నారు. పోయిన ఏడాది నష్టపోయిన పంటలకు సంబంధించిన పరిహారమే రాలేదని.. ఈ సారి వస్తుందనే ఆశ కూడా చచ్చిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట ఎండింది బోర్లు వేసేందుకు, పంట సాగుకు అప్పులు తెచ్చి రెండు నెలల్లో లక్షా ఎనభై వేల రూపాయలు ఖర్చు చేశా. పంట పండితే కనీసం పెట్టుబడైనా రాకపోతుందా అని ఆశపడ్డా. కళ్ల ముందు ఎండిపోతున్న పంటను కాపాడుకోవడానికి కరువులోనూ బోరు వేశా. పుష్కలంగా నీరు వచ్చినా 15 రోజుల్లోనే ఎండిపోవడంతో కథ మొదటికొచ్చింది. దీంతో వరి పంటలో పశువులను మేపుతున్నా. - హరినాథ్‌రెడ్డి, పుట్టపహాడ్ పరిహారం రాలే వేసిన పంటలు ఎండిపోతున్నాయి. కనీసం పెట్టుబడులు కూడా రావడం లేదు. గతంలో సర్వే చేసి నష్ట పరిహారం అందిస్తామన్నారు.. ఇప్పటికీ రాలేదు. ప్రభుత్వం స్పందించి ఆదుకోకపోతే అన్నదాతల బతుకు అగమ్యగోచరంగా మారక తప్పదు. రైతులు బాగుంటేనే అన్ని వర్గాల ప్రజలు బాగుంటారు. రైతు సంక్షేమానికి నాయకులు, ప్రభుత్వం పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలి - సత్యయ్యగౌడ్ మాజీ ఎంపీపీ కుల్కచర్ల మండల పుట్టపహాడ్‌కు చెందిన రైతు హరినాథ్‌రెడ్డి తనకున్న 10 ఎకరాల పొలంలో నాలుగు బోర్లు వేశాడు. ఒక్క బోరు నుంచి పుష్కలంగా నీరు రావడంతో రూ.60 వేల పెట్టుబడి పెట్టి.. రెండెకరాల్లో వరి నాటేశాడు. దీంట్లో నీరు బాగా రావడంతో పంట పండినట్లేనని సంతోషపడ్డాడు. కానీ ఇతని ఆనందం 15 రోజుల్లోనే ఆవిరైంది.. కొత్త బోరు కూడా ఎండిపోవడంతో.. చేసేది లేక పచ్చని పైరులో పశువులను మేపుతున్నాడు. -
ఐదింట్లో అదే గోస
♦ పినపాక నియోజకవర్గంలో తీవ్ర నీటి ఎద్దడి ♦ అడుగంటుతున్న భూగర్భ జలాలు ♦ శిథిలమవుతున్న తాగునీటి పథకాలు ♦ యథేచ్ఛగా నీటి వ్యాపారం చెంతనే గోదావరి ఉన్నా... మణుగూరువాసులకు తాగునీటి తండ్లాట తప్పడం లేదు. తాగునీటి పథకాలు ప్రారంభానికి నోచుకోవడం లేదు. చివరకు చెలిమల నీరే దిక్కవుతోంది. -మణుగూరు నియోజకవర్గ ప్రజలు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు పనిచేయని పరిస్థితి. మార్చిలోనే ఇలా ఉంటే.. ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితిని తలచుకొని భయపడుతున్నారు. గ్రామీణ నీటి సరఫరా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోగా.. కనీసం అందుబాటులో కూడా ఉండడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మణుగూరు మండలం సమితిసింగారం నుంచి అశ్వాపురం మండలం మొండికుంట వరకు ఉన్న 16 గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన గ్రామీణ నీటి సరఫరా పథకం ప్రారంభించకుండానే అతీగతీ లేకుండా పోయింది. 2011లో సదరు గ్రామాలకు తాగునీరు అందించాల్సి ఉన్నా.. ఏళ్లు గడిచినా చుక్క నీరు అందించలేదు. 2009లో రూ.5కోట్ల అంచనాతో ప్రారంభించిన పథకానికి నిధులు చాలకపోవడంతో మరో రూ.5కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. పనులు ప్రారంభించి ఆరేళ్లు దాటిపోయాయి. ఇందులో భాగంగా చినరావిగూడెం వద్ద గోదావరి ఒడ్డున ఇన్‌టేక్‌వెల్, కమలాపురం వద్ద ఫిల్టర్‌బెడ్, ఓవర్‌హెడ్ ట్యాంక్, అశోక్‌నగర్ వద్ద సంప్, ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మించారు.. పైపులైన్లు సైతం వేశారు. అధికారుల అలసత్వం వల్ల కాంట్రాక్టర్ నాసిరకం పైపులు వేశాడు. దీంతో నీటి సరఫరా ప్రారంభిస్తే పైపులు పగిలిపోయే పరిస్థితి. ప్రస్తుతం ఆ పైపులు మార్చాల్సి ఉన్నప్పటికీ ఆర్డబ్ల్యూఎస్ డీఈ, ఏఈల నిర్లక్ష్యం వల్లే పరిస్థితి ఇలా తయారైందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మణుగూరు మండలంలో మొత్తం 205 బోర్లు ఉండగా.. 25 బోర్లు పనిచేయడం లేదు. రామానుజవరం పంచాయతీలోని చిక్కుడుగుంట, దమ్మక్కపేట గ్రామాల్లో తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చెంతనే గోదావరి ఉన్నా.. అగచాట్లు పడాల్సి వస్తోంది. దీంతో వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు మినరల్ వాటర్ అంటూ సాధారణ నీటిని అమ్ముతూ భారీగా దోపిడీ చేస్తున్నారు. పినపాక మండలంలో 310 చేతిపంపులకు.. 55 పనిచేయడం లేదు. రక్షిత మంచినీటి పథకాలు 30 ఉండగా.. 20 గ్రామాల్లో అలంకారప్రాయంగా ఉన్నాయి. 90 బోరు మోటార్లు ఉండగా.. ఐదు ప్రాంతాల్లో పనిచేయడం లేదు. అశ్వాపురం మండలంలో 405 చేతిపంపులు ఉండగా.. 65 పనిచేయడం లేదు. మిట్టగూడెం, గొందిగూడెం, మనుబోతులగూడెం, మామిళ్లవాయి, వేములూరు గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. కుమ్మరిగూడెంలో వాటర్‌గ్రిడ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. బూర్గంపాడు మండలంలో 528 బోర్లు ఉండగా.. 155 బోర్లు పనికిరాకుండా పోయాయి. మరో 102 బోర్లు మరమ్మతు దశలో ఉన్నాయి. రక్షిత మంచినీటి పథకాలు 15 ఉండగా.. 6 పథకాలు పనిచేయడం లేదు. రెండో దశ మిషన్ కాకతీయ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. గత ఏడాది మిషన్ కాకతీయ పనులు 6 చెరువుల్లో అసంపూర్తిగానే చేశారు. ఉప్పుసాక, జిన్నెగట్టు, వడ్డగూడెం, పినపాక పట్టీనగర్, మోరంపల్లిబంజర, కృష్ణసాగర్, గోపాలపురం గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గుండాల మండలంలో 350 చేతిపంపులు ఉండగా.. 102 పనిచేయడం లేదు. గుండాల, రాయిలంక, ముత్తాపురం, కాచనపల్లి, రాయిపాడు, మర్కోడు, గుండాల, రాఘవాపురం గ్రామాల్లో వాటర్ ట్యాంకులు నిరూపయోగంగా ఉన్నాయి. ఇటీ వల శంభునిగూడెం, నర్సాపురం, రోళ్లగడ్డ గ్రామాల్లో నిర్మించిన వాటర్ ట్యాంకులకు కనె క్షన్ ఇవ్వకపోవడంతో ఆయా గ్రామాలకు నీరందడం లేదు. సాయనపల్లి, చెట్టుపల్లి, మర్కోడు పంచాయతీల్లో డీపీ స్కీంలు నిర్మించగా.. పట్టించుకునే వారు లేక మూలనపడ్డాయి. రూ.22కోట్లతో ఆళ్లపల్లి పంచాయతీలో చేపట్టిన ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. తాగునీటి కోసం ప్రజలు వాగులను ఆశ్రయిస్తున్నారు. మండలంలో ఉన్న 8 రక్షిత మంచినీటి పథకాలు పనిచేయడం లేదు. వాటర్ గ్రిడ్ పనులు సర్వే దశలోనే ఉన్నాయి. -
భూగర్భ శోకం
♦ గత ఫిబ్రవరిలో సగటున 8.65 మీటర్ల లోతులో.. ♦ ఈ ఏడాది అదే నెలలో 9.16 మీటర్లు ♦ 19 ప్రాంతాల్లో పడిపోయిన నీటిమట్టం ♦ అత్యధికంగా సత్తుపల్లిలో 32.15 మీటర్లు భూగర్భం అడుగంటుతోంది. ప్రమాదకర స్థాయిలో నీటిమట్టం పడిపోతోంది. రెండేళ్లుగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో బోర్లు, బావులు చుక్కనీరూ లేకుండా పోతున్నాయి. జిల్లాలోని 19 ప్రాంతాల్లో అప్పుడే నీటిమట్టం అట్టడుగుకు చేరింది. ఇప్పుడే ఇలా ఉంటే మండువేసవిలో ఎలా ఉండాలి..అని ప్రజలు, అధికారులు బెంబేలెత్తుతున్నారు. - ఖమ్మం సాక్షి ప్రతినిధి సాక్షిప్రతినిధి, ఖమ్మం: వర్షాభావ పరిస్థితులు, వేసవి ప్రారంభానికి ముందే ఎండలు మండిపోతుండటంతో భూగర్భ జలం అడుగంటుతోంది. రెండేళ్లుగా వర్షాలు సరిగా లేకపోవడంతో జిల్లాలోని నీటిమట్టం పడిపోతోంది. వ్యవసాయ, మంచినీటి, బోరు బావులు ఎండిపోతున్నాయి. ఇటు సాగు, అటు తాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది సగటున జిల్లావ్యాప్తంగా ప్రమాదకర స్థితిలో నీటిమట్టం పడిపోయింది. 19 ప్రాంతా ల్లో భూగర్భజలం లోతుల్లోకి వెళ్లింది. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే వేసవి గటెక్కేదెలా అని ఇటు అధికారులు.. ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అడుగంటిన నీరు 2015 ఫిబ్రవరిలో భూగర్భ జల సగటు మట్టం 8.65 మీటర్లుంటే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో 9.16 మీటర్లకు చేరింది. ఇప్పుడే ఇలా ఉంటే మే, జూన్ నాటికి 10 మీటర్ల లోతులోకి కూడా భూగర్భ జలం వెళ్లే అవకాశం ఉంది. తల్లాడ మండలం అంజనాపురం, తిరుమలాయపాలెం మండలం బచ్చోడు, ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు, టేకులపల్లి మండలం బోడు, దుమ్ముగూడెం, కల్లూరు, ఖమ్మం అర్బన్, కొణిజర్ల, కామేపల్లి మండలం కొత్తలింగాల, ఖమ్మం రూరల్ మండలం ఎం.వెంకటాయపాలెం, వెంకటాపురం మండలం మరికల, ముదిగొండ, బోనకల్ మండలం ముష్టికుంట్ల, ఇల్లెందు మండలం నారాయణపురం-ఎస్, చింతకాని మండలం నేరెడ, సత్తుపల్లి మండలం ప్రకాష్‌నగర్, చండ్రుగొండ మండలం రావికంపాడు, టేకులపల్లి మండలం సులానగర్, వేంసూరులలో భూగర్భ జలాలు లోతుల్లోకి వెళ్లాయి. వేసవి ప్రత్యామ్నాయ ప్రణాళికపై అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు చెప్పినా.. ఇప్పటి వరకు చిల్లిగవ్వ కూడా నిధులు జిల్లాకు రాలేదు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ముందే మేల్కొనాల్సిన అధికారులు.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈసారి మంచినీటి ఇబ్బందులు తప్పవని రాజకీయ పార్టీలు అంటున్నాయి. దీనికితోడు కరువు మండలాల జాబితాలో జిల్లా నుంచి ఒక్క మండలానికి కూడా చోటు దక్కకపోవడంతో కేంద్ర సాయం కూడా కొరవడింది. ప్రధానంగా మంచినీటి వసతులపై ఏజెన్సీలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో గిరిజనులు దాహార్తితో రోజులు గడుపుతున్నారు. ఎప్పుడూ ఆ ప్రాంతాల్లోనే... భూగర్భ జల వనరుల శాఖ నివేదికల ప్రకారం జిల్లాలో ఏటా కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు ప్రమాదకర స్థితిలోకి పడిపోతున్నాయని గుర్తించారు. ఇక్కడ ఇదేస్థాయిలో మంచి నీటికి కూడా కటకట ఏర్పడుతోంది. నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో ఉన్న భూముల్లో నీటిమట్టం కొంత వరకు బాగానే ఉన్నా.. ప్రధానంగా ఆయక ట్టేతర ప్రాంతాల్లో మాత్రం ఏటికి ఏడాది భూగర్భ జలాలు పడిపోతుండటం గమనార్హం. టేకులపల్లి మండలం సులానగర్, కల్లూరు, దుమ్ముగూడెం, బనిగండ్లపాడు, ఎం.వెంకటాయపాలెం, బోడు ప్రాంతాల్లో ప్రతి ఏటా నీటిమట్టం తగ్గిపోతోంది. వర్షాభావ పరిస్థితులే ఇందుకు కారణమని భూగర్భ జలవనరుల శాఖ అధికారులు చెబుతుండగా.. ఈ ప్రాంతా ల్లో నీటి వనరులు పెంపొందించేందుకు చర్యలు తీసుకోకపోవడం కూడా మరో కారణం. -
బోర్లు కాదు.. కందకాలు తవ్వండి
వర్షపు నీటిని ఒడిసిపట్టుకున్నప్పుడే భూగర్భ జలనిధి పెరుగుతుంది ‘సాక్షి’-తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల వేదిక ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నల్లగొండ: మెట్ట ప్రాంతాలకు చెందిన రైతులు తరి పంటలు పండించేందుకు బోర్లు తవ్వకుండా కాంటూరు కందకాలను తవ్వుకోవాలని తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల వేదిక అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంగెం చంద్రమౌళి, మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డిలు పిలుపునిచ్చారు. వర్షపు నీటిని ఒడిసిపట్టుకోవడమే భూగర్భ జలనిధి సంరక్షణకు ఏకైక మార్గమని వారు రైతులకు సూచించారు. ‘సాక్షి’, తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం వర్షపు నీటి వినియోగంపై జిల్లాలోని పెద్దఅడిశర్లపల్లి మండల కేంద్రం, జిల్లాకేంద్రంలోని డ్వామా కార్యాలయంలో రైతులకు అవగాహన సదస్సులు జరిగాయి. ఈ సద స్సుల్లో భాగంగా వాటర్షెడ్ల పరిధిలోని రైతాంగానికి ఇరువురు సీనియర్ ఇంజనీర్లు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మేరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాలు చేసే పని అవి చేసుకుంటూ వెళ్లిపోతాయని, వాటి కోసం ఎదురు చూడకుండా తమ పొలాల్లో పంటలను పండించేందుకు రైతులు స్వయంగా ఏం చేయాలనే దానిపై ఆలోచించాలని కోరారు. ప్రాజెక్టులు కట్టేంత వరకు రైతు జాతి బతికి ఉండాలంటే ప్రతి రైతూ తన పొలంలో కందకాలు తవ్వుకునేందుకు పూనుకోవాలని అన్నారు. బోర్ల జిల్లాగా పేరు పడ్డ నల్లగొండ జిల్లాలో కాగితాలపై ఎన్ని ప్రాజెక్టులున్నా, ఎన్ని వాగులు, వంకలు పారినా రైతుల పంటలకు నీళ్లు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు అనేక కారణాలున్నాయని, అయితే ఈ కారణాలను వెతుక్కుంటూ కూర్చోవడం కన్నా తానే తన పొలంలో భూగర్భ జలాలను సంరక్షించుకోవడం ద్వారా వరుసగా రెండేళ్లు కరువు వచ్చినా పంటలు పండించుకోవచ్చని చెప్పారు. ఈ కందకాల తవ్వకం ద్వారా భూగర్భ జలమట్టం పెరిగితే ఫ్లోరోసిస్ పీడ కూడా విరగడవుతుందన్నారు. చంద్రమౌళి మాట్లాడుతూ.. వాన వచ్చినప్పుడు వచ్చే వరదను ఒడిసిపట్టుకోకుండా వరదే కదా అని వదిలేస్తే భూగర్భ జలాలు పెరగవని, అప్పుడు ఎన్ని ఫీట్లు బోర్లు వేసినా నీళ్లు పోయవని చెప్పారు. కందకాల తవ్వకం ద్వారా సాగు ఫలప్రదమవుతుందని ప్రయోగాలు చెపుతున్నాయని, కందకాలు తవ్వుకున్న రైతులు నీళ్లకు ఇబ్బందులు పడకుండా వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు. ‘సాక్షి’ సాగుబడి డెస్క్ ఇన్చార్జి పంతంగి రాంబాబు ఈ అవగాహన సదస్సులకు సమన్వయకర్తగా వ్యవహరించగా, జడ్పీ చైర్మన్ ఎన్.బాలూనాయక్, జిల్లా నీటియాజమాన్య సంస్థ (డ్వామా) ప్రాజెక్టు డెరైక్టర్ కె.దామోదర్‌రెడ్డి, విశ్రాంత ఇంజనీర్ ఎల్లారెడ్డితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లాలోని 8 మండలాలకు చెందిన రైతులు ఈ సదస్సుల్లో పాల్గొన్నారు. -
అన్నదాతను వెంటాడిన అప్పులు
సాగునీటి వేటలో ఐదు బోర్లు తవ్వించగగా.. అన్నీ ఫెయిలయ్యాయి. పంట పెట్టుబడుల కోసం చేసిన అప్పులు కుప్పలుగా పెరిగాయి. సొంత, కౌలు పొలాల్లో సాగు చేసిన పంటల్లో ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. ఈ క్రమంలో అప్పులు తీర్చే మార్గం లేక పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి తన వారితో బంధం తెంచుకుని కుటుంబానికి అంతులేని శోకాన్ని మిగిల్చాడో అన్నదాత. - వర్గల్ - పురుగు మందు తాగి బలవన్మరణం - ఇప్పలగూడలో విషాదం - వీధినపడ్డ కుటుంబం మండలంలోని ఇప్పలగూడ గ్రామానికి చెందిన సొక్కుల వెంకట్‌రెడ్డి (36) తనకున్న రెండెకరాలోపు భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఈ భూమిలో పంటల సాగు కోసం సుమారు ఐదు బోర్లు వేయించాడు. ఒక బోరులో కొద్దిపాటి నీరు మినహా మిగతావన్ని విఫలమయ్యాయి. దీంతో అప్పులే మిగిలాయి. మరోవైపు నీళ్లు లేక సాగు మొక్కుబడిగా మారింది. గత ఖరీఫ్‌లో పొరుగు రైతుకు చెందిన 6 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని దాదాపు రూ. 90 వేలు పెట్టుబడితో పత్తిని సాగు చేశాడు. ప్రతికూల పరిస్థితుల కారణంగా అందులో పది క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. వ్యవసాయం కలిసిరాకపోవడంతో మొత్తం రూ. 4 లక్షలకు పైబడి అప్పులయ్యాయి. ఈ క్రమంలో అప్పులు తీర్చే మార్గం లేక మానసిక వేదనకు గురైన ఆ రైతు ఆత్మహత్యే శరణ్యంగా భావించాడు. దీంతో ఈ నెల 10న ఉదయం 6 గంటలకు తన ఇంటి వెనక వైపు పురుగుల మందు తాగి పడిపోయాడు. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు గజ్వేల్ ప్రభుత్వాస్పత్రిలో ప్రాథమిక చికిత్సలు చేయించి అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా.. అక్కడ వైద్యసేవలు సరిగా అందడం లేదని, డబ్బులు సమకూర్చుకుని మెరుగైన చికిత్స జరిపించాలనే ఆలోచనతో సోమవారం సాయంత్రం రైతు వెంకట్‌రెడ్డిని స్వగ్రామానికి తీసుకువచ్చారు. అదేరోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో రైతు వెంకట్‌రెడ్డి మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, సాయి కిరణ్ (పదో తరగతి), హన్మంతరెడ్డి (ఐదో తరగతి)లు ఉన్నారు. తెల్లారితే మంచి దవాఖానకు తీసుకపోదామనుకున్నం. ఇంతల్నే పాణం పోయిందని మృతుడి భార్య లక్ష్మి బోరుమని విలపించింది. లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు గౌరారం స్టేషన్ హౌస్ ఆఫీసర్ దేవీదాస్ తెలిపారు. -
సారూ.. సంపకండి!
సాక్షి, కడప/లింగాల : అమ్మ పెట్టదు.. అడుక్కోనివ్వదు.. అన్న సామెత అక్షరాల కలెక్టర్ తీరుకు దర్పణం పడుతోంది. తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కారించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోగా, సొంతంగా బోర్లు వేసుకుంటామంటే అనుమతి ఇవ్వడం లేదు. దీంతో జిల్లాలో నీటి సమస్య తీవ్ర రూపం దాలుస్తోంది. ఇప్పటికే పలు వ్యవహారాలలో వివాదాస్పదమవుతున్న కలెక్టర్.. తాగునీటి సమస్యతో గొంతెండుతున్న గ్రామాల్లో కూడా బోర్లకు అనుమతి ఇవ్వకపోవడంపై ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తోంది. ఎంపీ నిధులు, ఇతరత్రా నిధులతో బోరు వేసుకుని దప్పిక తీర్చుకుంటాం మహా ప్రభో అంటున్నా.. కలెక్టర్ కనుకరించక పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమస్య గురించి ఇటీవల జిల్లా పరిషత్ సమావేశంలో పలువురు సభ్యులు లేవనెత్తారు. బోర్లు వేసుకొనేందుకు అనుమతి ఇవ్వాలని, దప్పిక తీరక ప్రజలు అల్లాడిపోతున్నారని.. ట్యాంకర్లతో ఎంత నీరు అందించినా పూర్తి స్థాయిలో అందని పరిస్థితులున్నాయని సభలో వివరించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగునీటి సంగతి పక్కనపెడితే, కనీసం తాగునీటి అవసరాలకు బోర్లు వేసుకునేందుకు అనుమతి ఇవ్వాల్సి ఉంది. సొంతంగా బోరు వేసుకుంటామంటే అనుమతి ఇవ్వక, ప్రభుత్వం సరఫరా చేయక తాము తీవ్ర ఇక్కట్లు పడుతున్నామని శుక్రవారం లింగాల మండలం ఇంటి ఓబాయపల్లె ప్రజలు పులివెందులలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి వివరించారు. తాగునీటి సమస్యతో జనం నెత్తి, నోరు కొట్టుకుంటున్నా మమ్ములను పట్టించుకొనేవారే లేరని.. తాగడానికి కూడా లేక అల్లాడుతున్నామని వైఎస్ జగన్‌కు విన్నవించారు. ఈ సమస్యపై వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో చర్చించారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీ నిధులు ఖర్చు చేసైనా బోర్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నా కలెక్టర్ అనుమతి ఇవ్వడంలేదని గ్రామస్తులు వివరించారు. రెండు నెలలుగా అవస్థలు లింగాల మండలంలోని కామసముద్రం పంచాయతీ పరిధిలోని ఇంటి ఓబాయపల్లెలో సుమారు 500 పైచిలుకు జనాభా ఉంది. గ్రామంలో నాలుగు చేతి పంపులు, రెండు బోరు బావులు ఉన్నాయి. ఆర్‌డబ్ల్యుఎస్‌కు సంబంధించిన పంచాయతీ బోరు ఉన్నా, నీరు అడుగంటిపోయింది. ట్యాంకర్‌తో సరఫరా చేస్తున్న మూడు ట్రిప్పుల నీరు ఎవరికీ సరిపోవడం లేదు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి పులివెందుల నియోజకవర్గంలోని 177 గ్రామాలకు తాగునీరు అందించాల్సిన పార్నపల్లె తాగునీటి పథకం రాను.. రానూ అధ్వాన్నంగా మారుతోంది. ప్రస్తుతం 50 గ్రామాలకు కూడా సక్రమంగా అందించలేని పరిస్థితికి చేరుకుంది. ‘ఇంటి ఓబాయపల్లెకు సంబంధించి పార్నపల్లె పథకం పైపులైన్ ఉన్నా.. ఏనాడూ సక్రమంగా నీరు రావడంలేదు. ఈ గ్రామానికి ప్రత్యేక సంప్, పైప్ లైను ఏర్పాటు చేసినా మూడు రోజులకోమారు అంతంత మాత్రంగా నీరు సరఫరా అవుతోంది. ఇలాగైతే ఎండా కాలంలో ఎలా.. విద్యుత్ ఉన్నప్పుడు వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తోంద’ని గ్రామస్తులు వై.ప్రతాప్‌రెడ్డి, పి.రామచంద్రారెడ్డి వాపోయారు. -
‘నిషేధం’ అమలయ్యేనా?
బాన్సువాడ : జిల్లాలో విచ్చలవిడిగా బోర్లు వేస్తూ వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వారిపై కనీస చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం రోజూ సగటున 60 వరకు బోర్లు వేస్తున్నారని ఆర్డబ్ల్యూఎస్ శాఖనే ధ్రువీకరిస్తోంది. ఈ బోర్లకు ఏ ప్రాంతంలోనూ అనుమతి తీసుకొ న్న దాఖలాలు లేవు. వాల్టా చట్టం ప్రకారం బోర్లు వేసే సందర్భంలో తప్పకుండా సంబంధిత శాఖ ద్వారా అనుమతి తీసుకోవాలి. అయితే ఈ చట్టం కాగితాలకే పరిమితమైంది. విచ్చల విడిగా బోర్లు వేస్తుండడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జిల్లాలో 127 గ్రామాల్లో బోర్ల తవ్వకాన్ని నిషేధిస్తూ ఇటీవల కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇటీవల పంట పొలాలతో పాటు ఇండ్ల నిర్మాణానికి బోర్లు వేస్తున్న వారి సంఖ్య పెరిగింది. వంద మీటర్లలోపు దూరంలో రెండు బోర్లు వేయకూడదనే నిబంధనలున్నాయి. అయితే వీటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇష్టారాజ్యంగా బోర్లు వేస్తున్నారు. భూమికి చిల్లు పెట్టడమే కాదు జేబుకు చిల్లు పడుతున్నా లెక్క చేయడం లేదు. గ్రామ పంచాయతీల ఆవ రణలో ‘అనుమతి లేనిదే బోరు వేయకూడదు. పర్యావరణానికి విఘాతం కలిగించవ ద్దు. ఎడాపెడా బోర్లు వేయొద్దు’ అని పేర్కొం టూ వాల్టా చట్టం గురించి రాస్తున్నా.. వాటిని అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు. అనేక ప్రాంతాల్లో నీళ్లు లేవనే నిజం గ్రహించకుండానే బోర్ల తవ్వకానికి పూనుకొంటున్నారు. రైతులకు తోడు ప్రస్తు తం పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణాలు వే గం పుంజుకోవడంతో తాగునీటికి సైతం బో ర్లు వేసే వారి సంఖ్య పెరిగిపోయింది. బోరు లేనిదే ఇండ్ల నిర్మాణం చేపట్టమంటూ మేస్త్రీలు మొండికేయడంతో బోర్లు వేసిన తర్వాతే ఇం డ్ల నిర్మాణాన్ని చేపడుతున్నారు. బోరు యం త్రాల యజమానులు సైతం కనీస నిబంధనలను పాటించకుండా బోర్లు వేస్తున్నారు. అనుమతి పత్రం లేనిదే బోరు బండిని పంపకూడదు. కానీ యజమానులు మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం బాన్సువాడ, పిట్లం, బిచ్కుంద, ఎల్లారెడ్డి, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో బోరు బండ్లు అనేకంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బాన్సువాడ, జుక్కల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బోధన్ నియోజకవర్గాల్లో నిత్యం బోరు వేసే యంత్రం చప్పుడు వినిపించని గ్రామాలు లేవంటే అతిశయోక్తి కాదు. వర్షాభావ పరిస్థితులకు తోడు విచ్చలవిడిగా బోర్లు వేస్తుండడంతో భూగర్భ జల మట్టం గణనీయంగా తగ్గిపోయింది. ఒక్కో బోరు 400 నుంచి 500 అడుగుల లోతు వరకు వేస్తున్నాఫలితం ఉండడం లేదు. రోజూ 10 నుంచి 20 బోర్లకు నీళ్లు పడడం లేదని తెలుస్తోంది. చివరికి నీళ్లు పడకపోవడంతో రైతులకు అప్పులే మిగులుతున్నాయి. రైతులు ఈ బోర్లు వేయడానికి రూ. 30 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. ప్రజల అవసరం బోరు యంత్రపు యజమానులకు కాసుల పంట కురిపిస్తోంది. తలసరి నీటి లభ్యత 15 లీటర్లకు తగ్గితేనే భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో అడుగంటినట్లు నిర్ధారిస్తారు. ప్రస్తుతం 40 నుంచి 60 లీటర్ల వరకు తలసరి నీటి లభ్యత ఉంది. రానున్న వేసవిలో బోరు బావులు, చేతి పంపుల నుంచి నీటిని అధికంగా వాడడం వల్ల భూగర్భ జలాలు తగ్గే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా బోర్లు వేసి నష్టపోతున్న పేదరైతులకు అవగాహన కల్పిం చే చర్యలు చేపట్టడం లేదు. జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితి దారుణంగా ఉండడంతో కలెక్టర్ స్పందించారు. 127 గ్రామాల్లో బోర్లు వేయడాన్ని మూడేళ్ల పాటు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కలెక్టర్ ఆదేశాలను కిందిస్థాయి అధికారులు ఎంతవరకు అమలు చేస్తారు అన్నది వేచి చూడాల్సిందే. -
బోరుమంటున్న రైతు
జిల్లాలో నెలకు 5 వేల కొత్త బోర్లు! ⇒ 20 శాతం మేర నిరుపయోగమే.. ⇒ కానరాని జియాలజిస్టులు ⇒ మంత్రగాళ్లను ఆశ్రయిస్తున్న రైతులు ⇒ కొబ్బరికాయ తిరిగిందని కొనితెచ్చుకుంటున్న కష్టాలు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కలిసిరాని కాలంతో అన్నదాతలు పోటీ పడుతున్నారు. పాతాళానికి పైపులు వేసి గంగను పైకి తెచ్చేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. నెర్రెలు బారిననేల మీద నీరు పారించే ప్రయత్నం అపర భగీరథ ప్రయత్నాలే చేస్తున్నారు. సాగునీటి సమస్య తీవ్రంగా జిల్లాలోని రైతన్నలు నెలకు సగటున 5 వేల బోర్లు వేయిస్తున్నట్టు అంచనా. ఈ ఏడాది ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. కేసీఆర్ ప్రభుత్వం సాగు, తాగు నీటి కోసం భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నప్పటి కీ అన్నదాతలు అప్పటి వరకు ఆగలేకపోతున్నారు. అందిన చోట అప్పులు చేసి బోర్ల మీద బోర్లు వేసుకుంటున్నారు. రెండు, మూడు ఎకరాలు ఉన్న సన్న, చిన్నకారు రైతులు కూడా పదుల సంఖ్యలో బోర్లు వేస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. జిల్లాలో రిగ్గులకు డిమాండ్ పెరగటంతో ఆఫ్రికా దేశాలకు పంపించాల్సిన రిగ్గులను కూడా ఇక్కడికే తీసుకు వస్తున్నట్లు బోర్స్వెల్స్ మిషన్ల యాజమానులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 4.5 లక్షల హెక్టార్ల సాగుభూమి ఉండగా, జిల్లా సగటు వర్షపాతం 808.4 మిల్లీమీటర్లు ఉంది. ఈ లెక్కన చూస్తే మెతుకు సీమ అర్ధ ఉష్ణ, అర్ధమెట్ట ప్రాంతంలోనే ఉంది. నల్లవాగు, ఘణపురం ప్రాజెక్టు కింద 27 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు అందుతున్నాయి. మిగిలిన ప్రాంతంలో చెరువులు, కుంటల ద్వారా సాగునీరందుతున్నప్పటికీ, మూడేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులతో చెరువులు కుంటలు అవన్నీ ఎండిపోవడంతో సాగునీటికి సంకటంగా మారింది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయానికి కేవలం బోర్లు మాత్రమే ఆధారం అయ్యాయి జియాలజిస్టుల లేక.... ప్రస్తుతం జిల్లా సగటు భూగర్భ జలాల మట్టం 16.98 మీటర్లు ఉంది. మండలాల వారీగా చూస్తే ములుగు మండల కేంద్రంలో 39.78 మీటర్ల లోతులో నీళ్లు ఉన్నాయి. వర్గల్ మండలం మజీద్‌పల్లిలో అత్యల్పంగా 6.02 మీటర్లలో నీళ్లు ఉన్నట్లు భూగర్భ జలాల నిర్ధారణ శాఖ అధికారులు నిర్ధారించారు. ఈ తారతమ్యాలు రైతులకు తెలియదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లాలో ప్రతి ఏడాది 50 వేల నుంచి 60వేల బోర్లు వేస్తున్నట్లు అంచనా. వీటిలో కేవలం ఇరవై శాతం మాత్రమే ఫలితం చూపుతున్నాయి. భూగర్భ జలాల నిల్వలు ఎక్కడ ఉన్నయో... ఎంత లోతులో ఉన్నయో నిర్ధారణ చేసి, ఆ తర్వాత బోరు వేసుకుంటే అన్నదాతలకు కొంతలో కొంత మేలు జరుగుతుంది. కానీ వాస్తవ పరిస్థితి అలా లేదు. జియాలజిస్టులు అంటే ఎవరో కూడ రైతులకు తెలియని పరిస్థితి. ప్రభుత్వ వైపు ప్రోత్సాహం కూడా అలానే ఉంది. నిజానికి జిల్లాకు 10 మంది జియాలజిస్టులు అవసరం కాగా, ముగ్గురు అధికారులు మాత్రమే ఉన్నారు. ఈ ముగ్గురు కూడా ఆర్డబ్ల్యూఎస్, ఇందిర జలప్రభ తదితర శాఖలు ఇచ్చిన బోర్ పాయింట్లు చూసి నిర్ధారణ చేయడానికే సరిపోతున్నారు. ఇక రైతులను పట్టించుకునే వారే లేరు. దీంతో రైతులు అమాయకత్వంతో ఒక బోరు పడకపోతే... రెండవ బోరైన పడక పోతుందా... మూడోదైన కాకపోతుందా..! అనే ఆలోచనతో బోర్ల మీద బోర్లు వేసి ఇళ్లు గుళ్ల చేసుకుంటున్నారు. దొరికిన వెసులుబాటుతో... ఈ ఏడాది బోర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గతంలో రైతులు షావుకార్ల వద్ద అప్పు చేసి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు తెచ్చుకొని సాగు చేసుకునేవాళ్లు. పంట చేతికి వచ్చినపుడు షావుకారి పంట తీసుకొని, తన బాకీ పట్టుకొని మిగిలినది రైతు చేతిలో పెట్టేవాళ్లు. ఈ మిగిలిన డబ్బు బ్యాంకు లోన్ కట్టేవాళ్లు. ఈ ఏడాది ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసింది, రైతులు కూడా నేరుగా మార్కెట్లోకి తీసుకొచ్చి పంటను అమ్మడంతో వారి చేతికే డబ్బు వచ్చింది. దీంతో రైతులు షావుకారికి వడ్డీ మాత్రమే కట్టి, అసలు మరుసటి పంట మీద ఇస్తానని చెప్తున్నారు. ఈ డబ్బుతో రైతులు బోర్లు వేసుకుంటున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. దీంతో ఏడాది జిల్లాలో బోర్ల సంఖ్య పెరగనున్నట్లు తెలుస్తోంది. కొత్త దేవుళ్లతో మోసం... రైతుల ఆమాయకత్వాన్ని ఆసరా చేసుకొని కొత్త దేవుళ్లు బయలు దేరారు. చేతిలో కర్రతో ఒకరు..కొబ్బరికాయతో మరొకరు...నిమ్మకాయతో ఇంకొకరు పంట పొలాల్లో భూగర్భ జలాలలను చూపిస్తామంటూ మాయమాటలు చెప్పి రైతులను మోసగిస్తున్నారు. ఏదో కుంకుమ బొట్లు పెట్టి, కర్రపుల్ల పట్టుకొని పొలంలో ఐదు, ఆరు బోరు పాయింట్లు చూపిస్తున్నారు. బోరులో నీళ్లు పడితే ఇతగాని క్రెడిట్. లేదంటే రైతు దురదృష్టం. ఇక ఈ మోసగాళ్ల మాయలో పడి రైతులు తమ ఆర్థిక స్థితిని మరిచిపోయి బోర్లు వేస్తున్నారు. జిల్లాలో నాలుగైదు బోర్ల కంటే తక్కువ వేయించని రైతులు లేకపోవడం గమనార్హం. -
ఆ రైతన్నలు.. అపర భగీరథులు
నాడు భగీరథుడు కఠోరమైన తపస్సు చేసి శివుడిని మెప్పించి గంగమ్మను దివి నుంచి భువికి రప్పించాడు. ఇది పురాణ గాథ. నేడు జగిత్యాల మండలం గుల్లకోట రైతన్నలు పాతాళగంగను పైకి తెచ్చేందుకు మరో తపస్సు చేస్తున్నారు. ఒకటికాదు, రెండు కాదు.. ఒక్కో రైతు ఏకంగా పదికి పైగా బోర్లు తవ్వించాడు. అదృష్టం కలిసొచ్చి కొంతమందిని గంగమ్మ కరుణించింది. మరికొంత మంది రూ.లక్షలు ధారబోసినా జలసిరి జాడ కనిపించడం లేదు. అయినా వారు తమ ప్రయత్నాన్ని వీడకుండా అపరభగీరథులు అనిపించుకుంటున్నారు. -జగిత్యాల రూరల్ జగిత్యాల రూరల్: జగిత్యాల మండలం గుల్లకోట గ్రామస్తులు ప్రధానంగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. గ్రామ జనాభా 1920 కాగా, సుమారు 830 ఎకరాల సాగుభూమి ఉంది. రైతులంతా పంటల సాగుకోసం శ్రీరాంసాగర్ ప్రాజెక్టుపైనే నమ్ముకున్నారు. కాల్వనీళ్లు అందనప్పుడు వ్యవసాయ బావులు, బోర్లతో పంటలు పండిస్తున్నారు. ఈ ఏడాది వర్షాభావం కారణంగా తమ వరప్రదాయిని అయిన ఎస్సారెస్పీ నీళ్లు లేక వెలవెలబోతోంది. ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 22 టీఎంసీల నిల్వ మాత్రమే ఉంది. నీటి కొరత వల్ల ఖరీఫ్‌లో ఆయకట్టు భూములకు అరకొరగానే ఎస్సారెస్పీ నీటిని విడుదల చేశారు. వచ్చే వేసవిలో తాగునీటి అవసరాలృు దష్టిలో పెట్టుకుని రబీకి సాగునీరందించే పరిస్థితి లేదని అధికారులు స్పష్టం చేశారు. కానీ వ్యవసాయం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని రైతులు రబీలో వరి, మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో భూగర్భజలాలు అడుగంటిపోవడంతో వ్యవసాయ బావులు, బోర్లు ఎండిపోతున్నాయి. దీంతో ఇప్పటికే వేసిన పంటలను రక్షించుకునేందుకు రైతులు కొత్తగా బోర్లు తవ్వుతున్నారు. ఇలా నెలరోజుల వ్యవధిలోనే దాదాపు 63 మంది రైతులు 123 బోర్లు తవ్వించారు. వాటికి అవసరమైన విద్యుత్ మోటార్లతో పాటు పైపులైన్ల వేసుకున్నారు. నాలుగైదు బోర్లు తవ్వగా కొందరు రైతులకు నీళ్లు రాగా, మరికొందరు రైతులు ఇంకా బోర్ల తవ్వకాలు సాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే గ్రామంలోని రైతులు బోర్ల తవ్వకాలు, మోటార్లు, పైపులైన్ల కోసం సుమారు రూ.2.5 కోట్లు ధారబోయడం గమనార్హం. ఇందుకోసం కొంతమంది రైతులు గతంలో దాచుకున్న డబ్బును ఖర్చు చేస్తుండగా, మరికొంతమంది బ్యాంకులు, ప్రైవేట్ వ్యాపారుల వద్ద అప్పులు చేస్తున్నారు. గ్రామానికి చెందిన రైతులందరికీ వ్యవసాయమే జీవనాధారం కాబట్టి.. ప్రభుత్వం ఓ పక్కన పంటలు సాగుచేయవద్దని చెబుతున్నా వారు మాత్రృం అదష్టాన్ని పరీక్షించుకునేందుకే సిద్ధపడుతున్నారు. బోర్లలో నీళ్లుపడితే విద్యుత్ కోతలు ఉన్నప్పటికీ జనరేటర్ సాయంతో అయినా పంటలను కాపాడుకుంటామని అంటున్నారు. గుల్లకోట రైతుల పరిస్థితి నేడు జిల్లాలోని అన్నదాతల దుస్థితికి అద్దంపడుతోందంటే అతిశయోక్తి కాదు. -
చెరువుకు నీరందిస్తా
ఇప్పేరు.. కూడేరు మండలంలో ఉన్న ఈ గ్రామంలో 350 నుంచి 500 అడుగుల వరకు బోర్లు వేసినా చుక్క నీరు లభించడం గగనం. ఒకప్పుడు కళకళలాడిన పంట పొలాలు వర్షాభావంతో ఇప్పుడు బీళ్లుగా మారాయి. పనుల్లేక జనం వలసబాట పడుతున్నారు. పాతాళంలోని గంగమ్మ తల్లిని పైకి తెచ్చేందుకు అన్నదాతలు లక్షలాది రూపాయలు ఖర్చు చేసినా ఫలితం మాత్రం శూన్యం. ఆర్థికంగా చితికిపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయి రైతులు దుర్భర జీవితం గడపాల్సి వస్తోంది. అలాంటి ఈ గ్రామాన్ని ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్ హోదాలో శనివారం ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి సందర్శించారు. జనంతో మమేకమై వారి కష్టాలు తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి బతుకుపై భరోసా కల్పించారు. విశ్వేశ్వరరెడ్డి : ఓ పెద్దాయన వద్దకు వెళ్లి ఏమన్నా ఎంత భూముంది. బోర్లలో నీరు బాగానే వస్తున్నాయా? బోయ దానమిక : 20 ఎకరాలుందన్నా. పదెకరాల్లో పత్తి, వేరుశనగ పెట్టా. బోరులో నీరు తగ్గిపోయింది. పంటలు ఎండిపోతాన్నాయ్. 5 లక్షల రూపాయలు ఖర్చు చేసి 40 బోర్లు వేయించా. ముగ్గురు ఆడ పిల్లలకు రూ.3 లక్షలు పెట్టి పెళ్లిళ్లు చేశా. అసలు, వడ్డీ దాదాపు రూ.10 లక్షల దంకా ఉంది. భూముండీ ఏం ప్రయోజనం లేకపాయె. ఊర్లో ఉన్న చెరువుకు నీరు వస్తే బోర్లే కాకుండా చెరువు చుట్టూ ఉన్న నాగిరెడ్డిపల్లి, అంతరగంగ, కూడేరు, అరవకూరు, ముద్దలాపురం, మర్తాడు గ్రామాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయి. విశ్వేశ్వరరెడ్డి : ఏమక్కా బాగున్నావా? నీ పేరేంటి? ఈశ్వరమ్మ : ఎలా బాగుంటామన్నా. గ్రూపుల్లో లోన్ తీసుకున్నా. ఎలక్షన్లప్పుడు సంద్రబాబు ఆడోళ్లు సంఘాలకు డబ్బు కట్టొద్దని, అధికారంలోకి వత్తే అప్పు లేకుండా సేత్తామని చెప్పినాడు. సంబరపడిపోయి ఓటేత్తే ఇబ్బుడు దాని ఊసేలేదు. బ్యాంకోళ్లు అప్పు కట్టమని ఒత్తిడి చేస్తాండారు. వడ్డీ పెరిగిపాయ. అప్పు తీర్చలేక ఇబ్బంది పడతాన్నాం. విశ్వేశ్వరరెడ్డి : ఏమ్మా.. తీరిగ్గా కూర్చున్నారే? సరస్వతి : ఏం చెప్పేదన్నా.. పంటలు పండకపాయె. చేత్తామంటూ కూలి పనులు కూడా లేవు. పని లేక డబ్బు లేక కుటుంబం గడవక నానా అవత్తలు పడతాన్నాం. విశ్వేశ్వరరెడ్డి : ఉపాధి పనులు పెట్టడం లేదామ్మా? సరస్వతి : పనులు అడుగుతాన్నాం. ఆ సారోళ్లు సక్రమంగా పనులు పెట్టలేదు. పనులు కల్పిస్తే వచ్చే డబ్బులతో నెట్టుకురావచ్చు. పిల్లలను బాగా సదివించుకునేదాన్ని. విశ్వేశ్వరరెడ్డి : ఏమన్నా.. ఏ పంట సాగు చేస్తున్నారు? దిగుబడులు ఎలా ఉన్నాయి? పూల తిమ్మారెడ్డి : బోర్లలో గంగమ్మ తల్లి లోలోపలికే పోతాంది. ఏ పంట సాగు చేయాలన్నా ధైర్యం చాలడం లేదు. 9 ఎకరాల భూమి ఉంది. అందులో 4 ఎకరాలు తోట ఉంది. ఈ పొలంలో 10 బోర్లు వేయించినా చుక్క నీరు పడలేదు. ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. పిల్లల పెళ్లిళ్లకు, బోర్లకు దాదాపు రూ. 3 లక్షల వరకు అప్పులు చేశా. వ ర్షాధారం కింద వేరుశనగ పంట పండలేదు. పెట్టుబడులు కూడా దక్కలేదు. అప్పులు అధికమైపోతున్నాయి. ఎలా తీర్చాలో దిక్కుతోచడం లేదు. కూలి పనులకు వెళదామంటే చేతకావడం లేదు. విశ్వేశ్వరరెడ్డి : అవ్వా పింఛన్ తీసుకున్నావా?( ఇంటి ముందు మూలన కూర్చున్న రెండు కళ్లులేని అవ్వతో) మీనుగ రామక్క : నాయనా నా రెండు కళ్లు కనబడవు. ఏమి చేప్పేది తండ్రీ..పించెన్ కోసం వె ళితే మధ్యలో మనుషులు డబ్బు అడుగుతున్నారు. వాళ్లకిచ్చే స్తోమత నాకు లేదు. రెండు కళ్లు లేక కదిలే పరిస్థితి లేని నా పై ఎవ్వరికీ కనికరం లేకపోయే. అర్జీలు ఇచ్చేందుకే సరిపోతాంది. ఏమి సేత్తామునాయనా. విశ్వేశ్వరరెడ్డి : తమ్ముడూ ఎంత రుణ మాఫీ అయింది? జయరాం : ఏమి చెబుతామన్నా. ఎన్నికల ముందు ఇంటి గోడలపై చంద్రబాబు అధికారంలోకి వస్తే రైతు రుణాలు మాఫీ చేస్తామని రాతలు రాశారు. అది నమ్మి ఓట్లు వేత్తే రుణమాఫీ పై ఖచ్చితమైన మాటే చంద్రబాబు చెప్పక పోయే . రూ. 74 వేలు బ్యాంకులో అప్పు తీసుకున్నా. ఇప్పుడు రూ. 10 వేలు మాఫీ చేసినట్లు రుణమాఫీ జాబితాలో వచ్చింది. రుణమాఫీ అంతా మాయే. విశ్వేశ్వరరెడ్డి : ఏం తమ్ముడు ఉద్యోగం చేస్తున్నావా? ఎక్కడి నుంచి వస్తున్నావు? (తన వద్దకు ఆత్రుతగా యువకుడితో) ప్రదీప్ : సార్.. బీఏ,బిఈడీ వరకు చదివా. ఉద్యోగాల కోసం తిరుగుతున్నా. కానీ ఉద్యోగం రావడం లేదు. ఏదైనా సంపాదించి ఇంట్లో ఇస్తామన్నా ఉద్యోగాల పనిపై తిరగడమే సరిపోతోంది. ఎన్నికలప్పుడు చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నాడు. ఉద్యోగం ఇవ్వకపోతే కనీసం నెలకు రూ. 2 వేలు నిరుద్యోగ భతి కల్పిస్తామని చెప్పారు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పట కీ ఉద్యోగ, నిరుద్యోగ భృతి ఊసే ఎత్తలే దు. విశ్వేశ్వరరెడ్డి : ఏమ్మా సంఘాల ద్వారా లబ్ధిపొందుతున్నారా? సంఘాలు ఎలా నడుస్తున్నాయి? సాకమ్మ, నీలమ్మ,అంజలి : ఏమి లబ్ధి పొందుతామన్నా. మా సంఘం పేరు ఎస్టీ ధనలక్ష్మి. సంఘంలో 10 మంది ఉన్నాం. రూ. 3 లక్షలు అప్పు తీసుకున్నాం. ఎన్నికల టైంలో చంద్రబాబు అప్పు కట్టవద్దంటే కట్టలేదు. అప్పటికే రూ. 1.50 లక్షలు చెల్లించాం. ఇపుడు మళ్లీ బ్యాంక్ అధికారులు బకాయి రుణాన్ని కట్టమంటున్నారు. వడ్డీ , అప్పు పెరిగిపోయింది. బాబు మాటలు విని సంఘాలు సరిగా జరగకపోయా. అప్పు తీరకపోయా. కొత్త రుణాలు పొందలేక లబ్ధిని పొందకుండా పోయాం. విశ్వేశ్వరరెడ్డి : ఏం తాతా..పింఛన్ వస్తోందా? ముసలప్ప : ఆ..ఏమి పింఛన్ నాయనా. నాకు 79 ఏళ్లు దాటే. ఆ సారోళ్లు చెప్పినట్టల్లా ఆధారు, బియ్యం కార్డులిత్తి. పించెన్ రాకపాయ. పించెన్ ఇప్పిత్తామంటే మధ్యలో వాళ్లకి డబ్బు ఇత్తి. ఆ డబ్బు పాయా..పించెన్ రాకపాయా. మాలాంటోళ్లకి ఎలా వత్తాయి నాయనా. అసెంబ్లీలో గళం విప్పుతా ఇప్పేరులో వ్యవసాయ బోర్లలో నీరు లేక రైతులు పంటలు సాగు చేసుకోక భూములన్నీ బీడుగా పెట్టుకున్నారు. పనులు చేసేందుకు ఉపాధి పనులు లేక వలస బాట పడుతున్నారు. గ్రామం దుర్భిక్షం నుంచి బయట పడడానికి ఇక్కడి సమస్యలను సీఎం చంద్రబాబు , జిల్లా కలెక్టర్ దష్టికి తీసుకుపోతా. అసెంబ్లీలోనూ దీనిపై గళం విప్పుతా. పి.నారాయణపురం- చోళసముద్రం గ్రామాల మధ్య వె ళుతున్న హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ నుంచి ఇప్పేరు చెరువు వరకు కాలువను ఏర్పాటు చేయించి సాగు,తాగు నీరు అందేలా కృషి చేస్తా. కూలీలకు ఉపాధి పనులు వెంటనే కల్పించేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతా. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేసేంత వరకు ప్రభుత్వంతో పోరాటం చేస్తా. - వై.విశ్వేశ్వరరెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే -
పాతాల గంగమ్మా.. పైకి రావమ్మా
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో పాతాళగంగ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకు భూగర్భ జలాలు క్షీణిస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు వెంటాడటంతో ఁఅనంత* జలాలు అడుగంటిపోతున్నాయి. బోరుబావుల నుంచి గుక్కెడు నీరు రావడం గగనంగా మారింది. చాలా బోర్లు ఇప్పటికే కట్టిపెట్టారు. వచ్చే వేసవిలో జిల్లా ప్రజలకు తాగునీటి గండం పొంచివుందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. 190 ఫిజోమీటర్ల నుంచి భూగర్భ జల శాఖ తాజాగా సేకరించిన వివరాల ప్రకారం సగటు నీటి మట్టం 20 మీటర్లుగా పేర్కొన్నారు. రానున్న కాలంలో నీటి మట్టం మరింత లోతుకు పడిపోయే ప్రమాదం ఉందని ఆ శాఖ డెప్యూటీ డెరైక్టర్ (డీడీ) పి.పురుషోత్తమరెడ్డి చెబుతున్నారు. 44 శాతం తక్కువగా వర్షపాతం ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకు సాధారణ వర్షపాతం కన్నా 44 శాతం తక్కువగా వర్షాలు పడటంతో కనీసం ఒక్క మండలంలో కూడా సాధారణం కన్నా ఎక్కువగా వర్షం కురిసిన దాఖలాలు లేవు. జిల్లా వార్షిక వర్షపాతం 552 మిల్లీమీటర్లు (మి.మీ)కాగా అందులో ఇప్పటి వరకు 484 మి.మీ నమోదు కావాల్సివుండగా 44 శాతం తక్కువగా 276 మి.మీ కురిసింది. ఫలితంగా కేవలం 9 మండలాల్లో సాధారణం, 20 నుంచి 59 శాతం తక్కువగా 43 మండలాల్లో, 60 నుంచి 99 శాతం తక్కువగా 11 మండలాల్లో వర్షాలు పడ్డాయి. ఈ గణాంకాలు పరిశీలిస్తే జిల్లాలో వరుణుడి కటాక్షం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకట్రెండు భారీ వర్షాలు మినహా ఎక్కడా ఎపుడూ చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు పడలేదు. అనంతపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో 475 మి.మీ పడాల్సివుండగా 41 శాతం తక్కువగా 280 మి.మీ వర్షం పడింది. ధర్మవరం డివిజన్లో 463 మి.మీ గానూ 47 శాతం తక్కువగా 247 మి.మీ, కదిరి డివిజన్లో 549 మి.మీ గానూ 54 శాతం తక్కువగా 251 మి.మీ, కళ్యాణదుర్గం డివిజన్లో 404 మి.మీ గానూ 16 శాతం తక్కువగా 341 మి.మీ, పెనుకొండ రెవెన్యూ డివిజన్లో 517 మి.మీ వర్షం పడాల్సి వుండగా 50 శాతం తక్కువగా 257 మి.మీ వర్షపాతం నమోదైంది. 39 మండలాల్లో పరిస్థితి దారుణం తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల 39 మండలాల్లో రోజురోజుకు పాతాళగంగ పడిపోతోంది. అందులో 100 శాతం నీటిని తోడేస్తున్న మండలాల (ఓవర్ఎక్సాప్లయిటెడ్) జాబితాలో 24 మండలాలు ఉన్నాయి. రొద్దం, తలుపుల మండలాల్లో 90 శాతంకు పైబడి నీటిని వినియోగిస్తుండటంతో సెమీ క్రిటికల్ జాబితాలో ఉన్నాయి. 70 నుంచి 90 శాతం నీటిని వాడుతున్న క్రిటికల్ జాబితాలో 16 మండలాలు ఉన్నాయి. మరో 24 మండలాల్లో పరిస్థితి కొంత వరకు ఫరవాలేదని అధికారులు చెబుతున్నారు. పెనుకొండ, కదిరి, అనంతపురం డివిజన్ పరిధిలో ఎక్కువ మండలాలు ఒత్తిడికి గురవుతున్నాయి. అతిగా వినియోగిస్తున్న మండలాలు నీటిని అతిగా వినియోగిస్తున్న మండలాల్లో అగళి, అమడగూరు, బత్తలపల్లి, బ్రహ్మసముద్రం, గాండ్లపెంట, హిందూపురం, కళ్యాణదుర్గం, కంబదూరు, కొత్తచెరువు, కుందుర్పి, లేపాక్షి, మడకశిర, పరిగి, పెద్దపపప్పూరు, పుట్లూరు, రొళ్ల, తాడిమర్రి, తాడిపత్రి, యాడికి, యల్లనూరు ఉన్నాయి. 70 నుంచి 90 శాతం వినియోగిస్తున్న మండలాల జాబితాలో బెళుగుప్ప, బుక్కపట్టణం, ధర్మవరం, గార్లదిన్నె, గుడిబండ, గుమ్మగట్ట, కనగానపల్లి, కూడేరు, నార్పల, ఓడీ చెరువు, పెనుకొండ, పుట్టపర్తి, రాప్తాడు, రాయదుర్గం, సోమందేపల్లి, తనకల్లు ఉన్నాయి. సురక్షిత జాబితాలో అనంతపురం, ఆత్మకూరు, బుక్కరాయసముద్రం, బొమ్మనహాల్, చెన్నేకొత్తపల్లి, చిలమత్తూరు, డి.హిరేహాల్, గుత్తి, గోరంట్ల, గుంతకల్లు, కదిరి, కనేకల్లు, ముదిగుబ్బ, ఎన్పీ కుంట, నల్లచెరువు, నల్లమాడ, పామిడి, పెద్దవడుగూరు, రామగిరి, శెట్టూరు, శింగనమల, ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్ ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో దారుణం 190 ఫిజోమీటర్ల నుంచి భూగర్భ జలశాఖ సేకరించిన వివరాలను బట్టి చూస్తే 12 ప్రాంతాల్లో 2 నుంచి 5 మీటర్లలోతులో ఉండగా 24 గ్రామాల్లో 5 నుంచి 10 మీటర్లు, 10 నుంచి 20 మీటర్ల లోతులో 60 గ్రామాలు, 20 నుంచి 30 మీటర్ల లోతులో 34 గ్రామాలున్నారుు. 30 మీటర్లకు పైబడి నీటి మట్టం కలిగిన గ్రామాలు 25 ఉండటం విశేషం. అందులోనూ అగళి మండలం మధూడి గ్రామంలో 70.98 మీటర్ల లోతుకు చేరుకున్నాయి. కక్కలపల్లి, పుట్లూరు, యల్లనూరు, మడ్డిపల్లి, కోన ఉప్పలపాడు, నగరూరు, తిమ్మంపల్లి, గాండ్లపర్తి, పిన్నదరి, అమడగూరు, మహమ్మదాబాద్, మారాల, గాండ్లపెంట, తలుపుల, హనిమిరెడ్డిపల్లి, బ్రహ్మసముద్రం, తాళ్లకెరె, కనేకల్లు క్రాస్, పులగూర్లపల్లి, మనేసముద్రం, కొండూరు, పులమతి, శిరవరం, ఆర్.అనంతపురం, పరిగి, కోగిర, చాలకూరు, సోమందేపల్లి గ్రామాల్లో భూగర్భ జలాల పరిస్థితి దయనీయంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వచ్చే వేసవిలో తాగునీటికి సైతం కటకటలాడే దుస్థితి పొంచివుందనే హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నారుు. -
జిల్లాలో భూగర్భజల్లాలు అట్టడుగు స్థాయికి ....
సాక్షి, మంచిర్యాల : ఇంకా చలికాలం పూర్తిస్థాయిలో ప్రారంభం కానేలేదు. వేసవికి ఇంకా మూడు నాలుగు నెలల సమయం ఉంది. కానీ.. అప్పుడే జిల్లాలో భూగర్భజల్లాలు అట్టడుగు స్థాయికి చేరుతున్నాయి. వేసవికి ముందే వేసవిని గుర్తుచేస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల బోర్లు, బావులు ఎండిపోయాయి. 16 మండలాల్లో పది మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే గతనెల అక్టోబర్ వరకు 14 మండలాల్లో భూగర్భ జలాలు లోతులోకి వెళ్లాయి. ఇది ఆందోళన కలిగించే విషయమేనని భూగర్భ జల శాఖ అధికారులే స్వయానా చెబుతున్నారు. వేసవి ప్రారంభంలోగా రెండు..మూడు మండలాలు మినహా అన్ని మండలాల్లోనూ తాగునీటి సమస్య జఠిలంగా మారే ప్రమాదం ఉందని అంచ నా వేశారు. ముందస్తు చర్యలో భాగంగా యుద్ధప్రాతిపదికన జిల్లాకు రూ.12.20 కో ట్లు అవసరమని ప్రభుత్వానికి ఇటీవల నివేదికలు పంపారు. జిల్లాలో 52 మండలాలుం డగా.. ప్రతినెలా సుమారు 30 మండలాల్లో భూగర్భ జల శాఖ అధికారులు సర్వే చేయ గా ఆసిఫాబాద్, బెల్లంపల్లి, బెజ్జూర్, బోథ్, దహెగాం, దిలావర్పూర్, కాగజ్‌నగర్, కెరమెరి, లోకేశ్వరం, ముథోల్, సారంగాపూర్, తాండూర్, తానూర్ మండలాల్లో నీటి మట్టం భూ ఉపరితలం నుంచి 10 మీటర్ల లోతుకు పడిపోయినట్లు గుర్తించారు. ఖానాపూర్, మందమర్రి, తాంసి, వాంకిడి మండలాల్లో ఎనిమిది మీటర్లకు చేరాయి. ఇప్పటికే 200లకు పైగా ఆవాసాల్లో నీటి సమస్య నెలకొంది. రూ.12.20 కోట్ల పనులకు ప్రతిపాదనలు.. జిల్లాలో దారుణంగా పడిపోయిన భూగర్భ జల మట్టంతో రానున్న రోజుల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొనే ప్రమాదం ఉన్నందునా.. గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో ఏర్పడనున్న నీటి ఎద్దడి నివారణకు అత్యవసరంగా రూ.12.20 కోట్లు విడుదల చేయాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇందు లో బావుల లీజు, ట్యాంకుల నీటి సరఫరా కోసం రూ.3.80 కోట్లు కా వాలని నివేదించారు. జిల్లాలో 3,490 తాగునీటి పథకాలుండగా.. అందులో 425 పథకాలు పని చేయడం లేదని వాటి మరమ్మతు, నిర్వహణ కోసం రూ.10.40 కోట్లు అవసరమని ప్రభుత్వాన్ని కోరారు. క్షేత్రస్థాయిలో అధికారులు ఇప్పటికే బోర్‌వెల్స్ మరమ్మతు, నీటి ట్రాన్స్‌పోర్టేషన్, బావులు అద్దెకు చర్యలు ప్రారంభించారు. గ్రామాల్లో కాలిపోయిన మోటార్ల మరమ్మతు, కొత్త మోటార్లు, పైప్‌లైన్ లీకేజీ పనులపై దృష్టి సారించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 21,682 బోర్వెల్లలో సుమారు తొమ్మిది వేల బోర్లు పనిచేయడం లేదు. 13వ ఫైనాన్స్ నిధులు రూ.2.50 లక్షల (మూడు నెలలకోసారి)తో వీటి మరమ్మతు చేయించుకోవాలని ఎంపీడీవోలకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రతిపాదనలు పంపాం.. - ఇంద్రసేన్, ఎస్ఈ, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈ సారి వేసవికి ముందే నీటి సమస్య జఠిలంగా మారే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఈ నెలారంభంలో భూగర్భ జల శాఖ ఇచ్చిన నివేదికలు చూసి మరింత అప్రమత్తమయ్యాం. బావుల లీజు, ట్యాంకుల నీటి సరఫరా కోసం రూ.3.80 కోట్లు, పనిచేయని 425 నీటి పథకాల నిర్వహణకు రూ.10.40 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరాం. నిధులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తాం.