Chowtuppal
-
ఈనెల 22న చౌటుప్పల్ లో భారీ బహిరంగ సభ
-
కాలనీలు.. కన్నీళ్లు
సాక్షి, నెట్వర్క్: కుండపోత వానకు పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కురిసిన ఏకధాటి వర్షం మహబూబ్‌నగర్, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, వికారాబాద్ జిల్లాలను కకావిలకం చేసింది. లోతట్టు ప్రాంతాలు నీట మునగగా, ఆయా కాలనీల్లోని ప్రజలు రాత్రంతా కంటిమీద కునుకులేకుండా గడిపారు. వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో వరద నీటిలో పడి ఇద్దరు కొట్టుకుపోగా, ఒకరి మృతదేహం లభ్యమైంది. మహబూబ్‌నగర్ పట్టణం రామయ్యబౌలిలో ఇళ్ల మధ్యే నిలిచిన వర్షపు నీరు పాలమూరు కకావికలం శనివారం అర్ధరాత్రి మొదలై.. ఆదివారం ఉదయం వరకు కురిసిన వానతో మహబూబ్‌నగర్ జిల్లా అల్లాడింది. ఒక్క మహబూబ్‌నగర్ పట్టణంలోనే 10.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్, జడ్చర్ల పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా కేంద్రంలోని పెద్దచెరువు అలుగు పారడంతో దిగువన ఉన్న ఏడు కాలనీల్లోని ఇళ్లలోకి నడుము లోతున నీళ్లు చేరాయి. అర్ధరాత్రి వేళ నీటమునిగిన ఇళ్లలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, ఎస్పీ వెంకటేశ్వర్లు లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. పెద్దచెరువు అలుగు పారడంతో మినీ ట్యాంక్‌బండ్ మీదుగా రాకపోకలను అధికారులు నిలిపివేయించారు. అడ్డాకుల మండలంలోని వర్నె వద్ద మట్టిరోడ్డు వాగులో కొట్టుకుపోయింది. ఈ వర్షంతో మొక్కజొన్న, కంది, పత్తి పంటలకు నష్టమేనని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్‌లో అలుగు పారుతున్న పెద్దచెరువు ఉమ్మడి కరీంనగర్‌ను కుమ్మేసింది.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆదివారం సాయంత్రం భారీవర్షం కురిసింది. రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రాల్లోని శివారు కాలనీలు జలమయమయ్యాయి. కరీంనగర్‌లోని పలు కాలనీలు నీటమునగగా, ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. విపత్తుల బృందం రంగంలోకి దిగి డ్రైనేజీల్లో నిండిన నీటిని దారిమళ్లించింది. పద్మానగర్‌లోని వాల్‌మార్ట్ వద్ద రోడ్డు కొట్టుకుపోయింది. వాహనాల రాకపోకలు స్తంభించాయి. సిరిసిల్లలోని బీవైనగర్, అనంతనగర్‌లోని ఇళ్లలోకి వరదనీరు చేరింది. కొత్తచెరువు మత్తడి దూకడంతో ఆటోనగర్, శాంతినగర్, ఆసిఫ్‌పుర, రాళ్లబావి ప్రాంతాలు జలమయమయ్యాయి. తంగళ్లపల్లిలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీ ప్రహరీ కూలిపోయింది. గంభీరావుపేట మండలంలోని నర్మాల ఎగువమానేరు ఉధృతంగా మత్తడి పోస్తుండటంతో సిద్దిపేట–కామారెడ్డి రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. కొట్టుకుపోయిన ఇద్దరు.. వికారాబాద్ జిల్లాలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రధాన ప్రాజెక్టులు, చెరువులు నిండి అలుగులు పారుతున్నాయి. జిల్లాలో సగటున 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మోమిన్‌పేట్ మండలంలో అత్యధికంగా 104.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగ్నా నదిలో వరద ఉధృతికి యువకుడు కొట్టుకుపోయాడు. ధారూరు మండలం దోర్నాల్కి చెందిన గోరయ్య (35) పీర్ల పండుగలో డప్పులు వాయించేందుకు శనివారం రాత్రి వెళ్లాడు. ఆదివారం ఉదయం తిరిగి వస్తున్న క్రమంలో నదిదాటుతూ కొట్టుకుపోయాడు. రెండు కిలోమీటర్ల దూరంలో మృతదేహం లభ్యమైంది. కాగా, సంగారెడ్డి జిల్లా రేజింతల్ గ్రామ శివారులో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఆదివారం ఉదయం ఓ వ్యక్తి ఝరాసంగం వైపు నుంచి రేజింతల్ వైపు బైక్‌పై వస్తున్న క్రమంలో కల్వర్టు దాటుతూ ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో పడి కొట్టుకుపోయాడు. ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు హద్నూరు పోలీసులు చెప్పారు. జల దిగ్బంధంలో చౌటుప్పల్ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణం జలమయమైంది. శనివారం రాత్రి కురిసిన వర్షంతో ఊర చెరువులోకి ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరి.. ఆదివారం ఉదయం నుంచి అలుగు పారింది. దీంతో ఆర్టీసీ బస్టాండ్, గాంధీపార్క్, సెల్లార్ దుకాణాలు, పలు కాలనీలను నీరు ముంచెత్తింది. పోలీస్ స్టేషన్లోకి సైతం నీరు చేరింది. బస్‌స్టేషన్, హాండ్లూమ్ మార్కెట్, గాంధీపార్క్, విద్యానగర్, శాంతినగర్, రాంనగర్, వినాయకనగర్ ప్రాంతాలపై ప్రభావం ఎక్కువగా పడింది. చిన్నకొండూర్ రోడ్డు వరకు సర్వీస్ రహదారి వెంట వరద నీరు పోటెత్తింది. వరద సాఫీగా వెళ్లేందుకు అనువైన కాలువలు లేకపోవడం, సర్వీస్ రోడ్డు వెంట ఉన్న కాలువ సరిపోకపోవడంతో నీరు చుట్టుపక్కల కాలనీలను ముంచెత్తింది. -
గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ పనులు వడివడిగా..!
సాక్షి, చౌటుప్పల్: తెలంగాణకే తలమానికమైన చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామంలో చేపట్టిన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ పనులు వడివడిగా సాగుతున్నాయి. ప్రధాన రహదారి మధ్యన సెంట్రల్ లైటింగ్ సైతం ఏర్పాటు చేశారు. అంతర్గత రహదారులు, ప్రధాన డ్రెయినేజీ నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. పార్క్‌లో ఏర్పాటయ్యే పరిశ్రమలకు విద్యుత్ సరఫరాకు అవసరమైన సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు సైతం పూర్తి కావొచ్చాయి. అయితే పార్క్ శంకుస్థాపన ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడడంతో ఈ సారి అలాంటి పరిస్థితి రాకుండా అధికారులు పక్కా ప్రణాళికతో పనులు చేపడుతున్నారు. చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ పనులు వేగవంతమయ్యాయి. తెలంగాణలోనే ప్రప్రథమ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఇదే కావడం విశేషంగా చెప్పవచ్చు. ఇప్పటికే వివిధ రకాల కారణాలతో రెండు పర్యాయాలు శంకుస్థాపన కార్యక్రమం వాయిదా పడింది. ఈ నేపథ్యంలో మరోసారి కూడా వాయిదా పడొద్దన్న లక్ష్యంతో అధికార యంత్రాంగం పనులను ముమ్మరం చేసింది. ఇప్పటికే 60శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులను వీలైనంత త్వరలో పూర్తి చేసేందుకు రేయింబవళ్లు పనులను కొనసాగిస్తున్నారు. పార్క్ కోసం 1,144 ఎకరాల భూసేకరణ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం 1.144ఎకరాల భూమిని సేకరించారు. సీలింగ్, అసైన్డ్, పట్టా భూములకు సంబంధించి మూడు దఫాలుగా భూసేకరణ చేశారు. మొదటి విడతలో 682, 693, 695, 697, 699, 701, 702, 704, 705, 706, 707, 708, 709, 711, 712, 713, 714, 715, 716, 717 సర్వే నంబర్లలోని 128మంది రైతుల వద్ద 377ఎకరాల సీలింగ్ అసైన్డ్ భూమిని సేకరించారు. రెండో విడతలో 644 సర్వేనంబర్‌లో 98మంది రైతుల నుంచి 194.04ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూమిని సేకరించారు. మూడో విడతలో 727, 735, 736, 737, 753, 755, 756, 757, 765, 758, 754 సర్వేనంబర్లలోని 207మంది రైతుల వద్ద 472 ఎకరాల సీలింగ్, పట్టా భూములను సేకరించి పరిహారం అందజేశారు. అదే విధంగా 698, 701, 703, 704, 705, 710 సర్వేనంబర్లలోని 24మంది రైతుల వద్ద 101.19ఎకరాల పట్టా భూమిని సైతం సేకరించగా పరిహారం విషయంలో రైతులు కోర్టుకు వెళ్లారు. గత ఏడా ది ఆగస్టు నెలలో, ఈ ఏడాది ఏప్రిల్‌లో శంకుస్థాపన జరగాల్సి ఉండగా ఎన్నికల కారణంగా వాయిదా పడింది. కాగా త్వరలోనే పార్క్ శంకుస్థాపన జరిగే అవకాశాలు ఉన్నాయి. ముమ్మరంగా నిర్మాణ పనులు ఇండస్ట్రియల్ పార్క్‌లో ప్రధాన రహదారితో పాటు అంతర్గత రోడ్లు, ఇతర వసతుల కోసం ప్రభుత్వం గత ఏడాది రూ.36కోట్ల నిధులను మంజూరు చేసింది. ప్రధానంగా 65వ నంబరు జాతీయ రహదారి నుంచి రెండు కిలోమీటర్ల దూరం వరకు రోడ్డు నిర్మాణానికి రూ.18కోట్లు కేటాయించగా ఇప్పటికే పనులు పూర్తయ్యాయి. ప్రధాన రహదారి మధ్యన సెంట్రల్ లైటింగ్ సైతం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పార్క్‌లోని అంతర్గత రహదారులు, ప్రధాన డ్రెయినేజీ నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. పార్క్‌లో ఏర్పాటయ్యే పరిశ్రమలకు విద్యుత్ సరఫరాకు అవసరమైన సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు సైతం పూర్తి కావొచ్చాయి. అలాగే పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా పార్క్‌లోని భూమిని చదును చేస్తున్నారు. రూ.12వేల కోట్ల పెట్టుబడులు ఇండస్ట్రియల్ పార్క్‌లో సేకరించిన భూమిలో ఇప్పటికే 377ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా 396మంది పారిశ్రామికవేత్తలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చారు. ఆ మేరకు వారికి అవసరమైన స్థలాల కేటాయింపు సైతం జరిగింది. ఈ పరిశ్రమల ఏర్పాటుతో ప్రభుత్వానికి 12వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయి. ప్రత్యక్షంగా 20వేలు, పరోక్షంగా మరో 20వేల మందికి ఉపాధి లభించనుంది. -
ఎక్కడో చంపి.. ఇక్కడ పడేసి..
చౌటుప్పల్ మండల పరిధిలో గుర్తు తెలి యని వ్యక్తుల మృతదేహాలు లభించడం నిత్యకృత్యంగా మారింది. ఎక్కడో చంపి గుట్టుచప్పుడు కాకుండా శవాలను వాహనాల్లో తీసుకువచ్చి ఇక్కడ పడేస్తున్నారు. వీటికి సంబంధించిన కేసులు పోలీసులకు స వాల్‌గా మారుతున్నాయి. కేసులను ఛేదిం చేందుకు రోజుల తరబడి పోలీసులు నింది తులను వేటాడాల్సి వస్తోంది. చౌటుప్పల్(మునుగోడు) : హైదరాబాద్–విజయవాడ 65 నంబర్ జాతీయ రహదారి.. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే చౌటుప్పల్ పరిసర ప్రాంతంలో తరుచూ మృతదేహాలు లభ్యమవడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.. పోలీసులకు సవాలుగా మారింది. ఇక్కడ లభిస్తున్న మృతదేహాలన్నీ స్థానికులవి కాదు.. దూర ప్రాంతాలకు చెందిన వ్యక్తులవి. ఎక్కడనో చంపి, గుట్టుచప్పుడు కాకుండా ఇక్కడకు తీసుకొచ్చి పడేసిపోతున్నారు. మృతులకుగానీ, నిందితులకుగాని ఈ ప్రాంతంతో ఎలాంటి సంబంధం కూడా ఉండడం లేదు. ఇవి కూడా జాతీయ రహదారికి సమీప ప్రాంతాల్లోనే లభిస్తుండడం గమనార్హం. జాతీయ రహదారిపై పంతంగి గ్రామం వద్ద ఉన్న టోల్‌ప్లాజా వరకు వెళ్లకుండా ముందుగా ఉన్న గ్రామాల్లోనే శవాలను పడేస్తున్నారు. వివాహేతర సంబంధాల నేపథ్యంలోనే.. మండలంలో లభిస్తున్న గుర్తుతెలియని మృతదేహాల కేసులన్నీ వివాహేతర సంబంధాల నేపథ్యంలో జరిగినవే. ఈ హత్యలన్నీ చౌటుప్పల్‌కు చాలా దూరంలో జరుగుతున్నవే. కానీ మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా అక్కడి నుంచి తీసుకువచ్చి ఇక్కడ పడేసి పోతున్నారు. మృతులంతా 35ఏళ్ల లోపు వారే. మండలంలో ఇప్పటి వరకు లభించిన గుర్తుతెలియని శవాల కేసులన్నీ పోలీసుల విచారణలో వివాహేతర సంబంధాల మూలంగా జరిగిన హత్యలుగా తేలాయి. శవాలను తీసుకువచ్చే వ్యక్తులకు ఈ ప్రాంతంతో ఎలాంటి సంబంధాలు సైతం లేవు.కానీ హైదరాబాద్‌కు సమీపంలో ఉండడం, రవాణా వ్యవస్థ బాగుండడంతో రాకపోకలకు సౌకర్యంగా ఉంటుందని నిందితులు ప్రాంతాన్ని ఎంచుకున్నట్టు పోలీసులు తెలుపుతున్నారు. పోలీసులకు సవాలు మండలంలో లభిస్తున్న గుర్తుతెలియని మృతదేహాల కేసులు పోలీసులకు సవాలుగా మారుతున్నాయి. లభ్యమైన ప్రాంతాల్లో ఎలాంటి ఆనవాళ్లు లభించకపోవడంతో కేసులను చేధించేందుకు పోలీసులకు సమయం పడుతుంది. ఎక్కడో చంపి ఇక్కడకు తీసుకురావడంతో ఆధారాలు దొరకడం లేదు. కేసును ఛేదించేందుకు రోజుల తరబడి పోలీసులు వేటాడాల్సి వస్తుంది. 2015 నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో ఐదు గుర్తుతెలియని మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇందులో నాలుగు కేసులను పోలీసుల ఛేందించారు. తాజాగా గత నెల 31న లభ్యమైన శవానికి సంబంధించిన కేసును ఛేదించాల్సి ఉంది. 2016 జూన్ 6న : మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం బసవాయిపల్లి గ్రామానికి చెందిన కురువ హనుమంతు(28), సాయమ్మ(23)లు భార్యాభర్తలు. సాయమ్మకు అదిలేకి బాలప్ప(20) అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. తాపీమేస్త్రీగా పనిచేసే హనుమంతు భార్యతో కలిసి హైదరాబాద్‌కు వచ్చి పనిచేస్తున్నాడు. తమ బంధానికి అడ్డుగా ఉన్న భర్తను హత్య చేసేందుకు ప్రియుడితో కలిసి పన్నాగం పన్నింది. నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి మద్యం సేవిస్దామని నమ్మించి లక్కారం గ్రామ శివారులోని అటవీ భూమిలోకి తీసుకువచ్చి బండ రాళ్లతో హత్య చేశారు. మృతదేహాన్ని చౌటుప్పల్ మండలం లక్కారం గ్రామ సమీపంలో పడేసి వెళ్లిపోయారు. నెల రోజుల్లో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. 2015 జూన్ 2 : తనతో కాపురం చేయకుండా వేధిస్తున్నాడని భార్య తన భర్తను హత్య చేయించింది. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం చెరువులమాదారం గ్రామానికి చెందిన సంకటి మల్లేష్(35), భారతమ్మ(30)లు భార్యాభర్తలు. వీరివురి మధ్య గొడవలు తలెత్తడంతో వేరుగా ఉంటున్నారు. అందులో భాగంగా మల్లేశ్ చౌటుప్పల్‌కు వచ్చి కూలి పని చేసుకుంటున్నాడు. తనతో సక్యతగా లేని భర్తను అంతమందించాలని చౌటుప్పల్లోనే ఉంటున్న తన తమ్ముడైన నాగరాజుతో కలిసి భారతమ్మ పన్నాగం పన్నింది. విషయాన్ని తమ్ముడకి చెప్పడంతో అంగీకరించిన అతను తన మిత్రులతో కలిసి మల్లేశ్‌ను మాట్లాడుకుందామని చెప్పి లక్కారం శివారులో ఫారెస్ట్‌లోకి తీసుకెళ్లారు. అక్కడే చంపి ఒంటిపై పెట్రోల్ పోసి తగలపెట్టారు. ఈ కేసును పోలీసులు ఛేదించారు. 2017 డిసెంబర్ 30న : ప్రియుడి మోజులో పడిన భార్య కట్టుకున్నవాడిని కడతేర్చింది. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం రాచార్ల గ్రామానికి చెందిన కమ్మరి నాగరాజు(35)కు హైదరాబాద్‌లోని బేగంపేటకు చెందిన జ్యోతి(22)తో వివాహమైంది. జ్యోతికి పెళ్లికి ముందు నుంచే అదే ప్రాంతానికి చెందిన కార్తీక్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. వివాహం జరిగి కుమార్తె, కుమారుడు పుట్టేవరకు సంబంధాన్ని ఆపేసిన జ్యోతి ఆ తర్వాత కార్తీక్‌తో బంధాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. జ్యోతి, కార్తీక్, అతని మిత్రులతో కలిసి పాలల్లో మత్తు కలిపి నాగరాజును హత్య చేశారు. శవాన్ని చౌటుప్పల్ మండలం జిల్లేడుచెల్క గ్రామం వద్ద పడవేశారు. నాలుగు రోజుల్లో పోలీసులు కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధాలు, భూవివాదాలతోనే హత్యలు భూవివాదాలు, వివా హేతర సంబంధాల నేపథ్యంలోనే ఎక్కువ హత్యలు జరుగుతాయి. ఎక్కడో చంపి శవాలను ఇక్కడికి తెచ్చి వేస్తున్నారు. గత నెల 31న అంకిరెడ్డిగూడెం వద్ద శవం లభించింది. కేసును అన్ని విధాల పరి శోధనలు చేస్తున్నాం. త్వరలోనే ఛేదిస్తాము. నిందితులను అరెస్టు చేస్తాం. – ఏరుకొండ వెంకటయ్య, సీఐ -
చౌటుప్పల్‌లో భారీగా ట్రాఫిక్ జాం
చౌటుప్పల్: సంక్రాంతి సెలవులు ముగిశాయి. తమ స్వగ్రామాలకు వెళ్లిన వారు అందరూ హైదరాబాద్ వంటి ప్రాంతాలకు తిరుగు పయనమయ్యారు. దీంతో వారు ప్రయాణిస్తున్న వాహనాలతో యాదాద్రి భువనగిరిజిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. దీంతో చౌటుప్పల్‌లో భారీగా ట్రాఫిక్ జాం అయింది. -
మద్యం తాగి వాహనాలు నడపొద్దు
చౌటుప్పల్ : మద్యం తాగి వాహనాలు నడుపవద్దని ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ దివ్యచరణ్రావు అన్నారు. చౌటుప్పల్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరగుతున్నాయన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రమాదాల నివారణకు, శాంతిభద్రతల పరిరక్షణపై కమిషనర్ మహేష్ భగవతి ప్రత్యేక దృష్టిసారించారన్నారు. ఆయన ఆదేశాల మేరకే భువనగిరి, చౌటుప్పల్‌లలో ట్రాఫిక్ పోలీస్స్టేషన్లు ప్రారంభించినట్టు పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించా లన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ శ్యాంసుందర్‌రెడ్డి, సీఐ నవీన్‌కుమార్, ట్రాఫిక్ సీఐ రవికిరణ్, ఎస్ఐ మధుసూదన్ పాల్గొన్నారు. -
ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య
చౌటుప్పల్: మండలంలోని డి.నాగారం గ్రామానికి చెందిన యువకుడు గట్టు యుగేంధర్(21) మంగళవారం రాత్రి వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఇతని తండ్రి గతంలోనే చనిపోయాడు. మంగళవారం తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై రాత్రి వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చెట్టుకు ఉరి వేసుకున్నాడు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు గమనించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి వృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీస్ ఇన్స్పెక్టర్ నవీన్‌కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఉరేసుకుని వృద్ధురాలి ఆత్మహత్య
చౌటుప్పల్: మండలంలోని డి.నాగారం గ్రామానికి చెందిన చీమకండ్ల బుచ్చమ్మ(60) సోమవారం తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈమె గతంలో విషపురుగు కాటుకు గురైంది. నయం కాక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. దీంతో మనస్తాపం చెంది, సోమవారం తెల్లవారుజామున బహిర్భూమికని వెళ్లి, చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీస్ ఇన్స్పెక్టర్ నవీన్‌కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అవసరమైతే విజిలెన్స్ విచారణ జరిపిస్తాం
చౌటుప్పల్ : చౌటుప్పల్ మండలంలో మిషన్ కాకతీయ పనుల్లో జరిగిన అవినీతి, అక్రమాలపై అవసరమైతే విజిలెన్స్ విచారణ జరిపిస్తామని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. చౌటుప్పల్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం ఎంపీపీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. మిషన్ కాకతీయ పనులు సరిగా జరగలేదని, తక్కువ పనిచేసి, ఎక్కువ బిల్లులు తీసుకున్నారని సభ్యులు ఆందోళన చేశారు. దీంతో ఎమ్మెల్సీ ప్రభాకర్ స్పందించి మాట్లాడుతూ అవకతవకలపై విచారణ చేయమని రాష్ట్ర విజిలెన్స్‌కు లేఖ రాస్తానన్నారు. మండలంలోని వివిధ పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేస్తూ చేపట్టే ఒక రోజు దీక్షలో తాను కూడా పాల్గొంటానన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ చౌటుప్పల్ పట్టణాన్ని దీన్‌దయాళ్ పథకానికి ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. రూ.7కోట్లు నిధులు మంజూరవుతాయన్నారు. పలు సమస్యలు, డిమాండ్లను సింగిల్విం డో చైర్మన్ చీరిక సంజీవరెడ్డి, సర్పంచ్ సుర్వి మల్లేష్‌గౌడ్, ఆరెగూడెం ఎంపీటీసీ సభ్యుడు బద్దం అంజయ్య తదితరులు సభదృష్టికి తీసుకొచ్చారు. అనంతరం అమర జవాన్ల మృతికి సంతాప సూచకంగా మౌనం పాటించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, ఎంపీడీఓ రజిత, వైస్ ఎంపీపీ కాయితీ రమేష్‌గౌడ్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. -
ఉద్యమాలతోనే హక్కుల సాధన
చౌటుప్పల్ : ఉద్యమాల ద్వారానే హక్కులను సాధించుకోవాలే తప్ప, కాళ్లవేళ్ల పడి కాదని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి విమర్శించారు. చౌటుప్పల్‌లో శుక్రవారం మాదిగ జేఏసీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ ఉద్యమాన్ని ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణమాదిగ తన స్వార్థానికే వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. గత 20 సంవత్సరాలుగా మంద కృష్ణ మాదిగల పేరు చెప్పుకొని, ఉద్యమిస్తూ తన స్వప్రయోజనాలకు తాకట్టు పెడుతూ ఉద్యమాన్ని నీరుగార్చారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దళితులపై జరుగుతున్న దాడుల పట్ల ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి ఆమోదింపజేయాలన్నారు. నవంబర్ 13న నిజాం కాలేజీ గ్రౌండ్లో జరిగే మాదిగల శక్తి ప్రదర్శన బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు కూరపాటి సుదర్శన్, నియోజకవర్గ అధ్యక్షుడు ఇరిగి వెంకటేష్, బోయ ప్రవీణ్‌కుమార్, ఆల్మాసిపేట కృష్ణయ్య, బొడ్డు గాలయ్య, బక్క శంకరయ్య, సుర్వి నర్సింహ, బోయ రామచంద్రం, ఉప్పు కృష్ణ, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. -
చేనేత కార్మికులకు వ్యక్తిగత రుణాలు
చౌటుప్పల్ : జిల్లాలోని చేనేత కార్మికులకు సహకార బ్యాంకుల్లో క్రెడిట్‌కార్డుల ద్వారా వ్యక్తిగత రుణాలిస్తామని డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు అన్నారు. మండలంలోని కుంట్లగూడెం గ్రామంలో సోమవారం జరిగిన చేనేత సహకార సంఘం మహాసభకు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని చేనేత సంఘాలకు క్యాష్ క్రెడిట్ మంజూరు చేస్తామన్నారు. సహకార బ్యాంకుల్లో రైతులకు విరివిగా తక్కువ వడ్డీకి రుణాలిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘం అధ్యక్షుడు మిర్యాల గోవర్ధన్, ఆప్కో మాజీ డైరెక్టర్ గర్ధాసు బాలయ్య, సర్పంచ్ వల్లకాటి తులసి, ఎంపీటీసీ సభ్యుడు బత్తుల శంకర్, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. -
డిప్యుటేషన్‌పై పోలీసుల నియామకాలు
చౌటుప్పల్: నల్లగొండ జిల్లా నుంచి సైబరాబాద్ ఈస్ట్ కమిషనరేట్‌లో విలీనమైన పోలీస్స్టేషన్లలో జిల్లాకు చెందిన పోలీసులను డిప్యుటేషన్‌పై నియమిస్తామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ ఎం.భగవత్ తెలిపారు. చౌటుప్పల్ మండలం తుఫ్రాన్‌పేటలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. రంగారెడ్డి జిల్లాలోని పోలీస్స్టేషన్లు కూడా సైబరాబాద్‌లో విలీనమైనప్పుడు సిబ్బందిని డిప్యుటేషన్‌పైనే తీసుకున్నారని, వారు ఇప్పటికీ అలాగే పని చేస్తున్నారన్నారు. సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్ కమిషనరేట్ల విభజనకు సంబంధించి గవర్నర్ ఆర్డినెన్సు ఇచ్చారని, చట్టసభల్లో ఆమోదం కూడా పొందిందన్నారు. ప్రభుత్వం జీఓ జారీ చేయగానే కమిషనర్ పాలన ప్రారంభమవుతుందని తెలిపారు. భువనగిరి టౌన్, రూరల్, వలిగొండ పోలీస్స్టేషన్లను యాదాద్రి జిల్లాలో, సంస్థాన్ నారాయణపురం పోలీస్‌స్టేషన్‌ను ఈస్ట్ కమిషనరేట్‌లో కలపాలని విజ్ఞప్తులు వచ్చాయని, ఈమేరకు పరిశీలన జరుగుతుందన్నారు. ఆయన వెంట చౌటుప్పల్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎస్.నవీన్‌కుమార్ ఉన్నారు. -
విశ్వేశరయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలి
చౌటుప్పల్ : ఇంజనీరింగ్ విద్యార్థులు మోక్షగుండం విశ్వేశరయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ సూచించారు. మండలంలోని తుఫ్రాన్‌పేట శివారులోని ధృవ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం నిర్వహించిన ఇంజనీర్స్ డే వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇంజనీరింగ్ పట్టభద్రులకు ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోవడం, నైపుణ్యం లేని కారణంగా ప్రైవేట్ రంగంలోనూ అవకాశాలు రావడం లేదన్నారు. దీంతో ఎంతో మంది కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ చదివింది కానిస్టేబుల్ ఉద్యోగం కోసం కాదని.. విషయ పరిజ్ఞానం పెంచుకొని ఆ రంగంలో రాణించాలని కోరారు. ఇంగ్లిష్‌పై ప్రావీణ్యం ఉండాలని, కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యక్తిత్వ వికాసం అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో సైబరాబాద్ పరిధిలో సివిల్స్, గ్రూప్–1,2 పరీక్షలకు వారంలో ఒక రోజు శనివారం శిక్షణ ఇప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఘట్కేసర్లోని శ్రీనిధి కళాశాలలో శిక్షణ ప్రారంభమైందన్నారు. విద్యార్థులు తాగి డ్రైవింగ్ చేయవద్దన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడే వారికి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు డీ–అడిక్షన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎగ్జిబిట్ల ప్రదర్శన ఇంజనీరింగ్, డిప్లమా ఫైనలియర్ విద్యార్థులు రూపొందించిన ఎగ్జిబిట్లను కమిషనర్ పరిశీలించారు. వారికి బహుమతులు, ప్రశంసపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కె.పర్వత్‌రెడ్డి, సెక్రెటరీ కె.శశిరేఖ, ప్రిన్సిపాల్ బి.శ్రీధర్‌రెడ్డి, వై.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మిషన్‌భగీరథ అవినీతిమయం
చౌటుప్పల్: ఇంటింటికీ రక్షిత జలాలను అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం అవినీతిమయంగా మారిందని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. చౌటుప్పల్‌లోని రాజీవ్‌స్మారక భవనంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. మిషన్ భగీరథ పనుల్లో 50 శాతం అవినీతి ఉందన్నారు. ప్రభుత్వం కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకే నీటి వసతులు లేని ప్రాజెక్టులను చేపడుతోందన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులకు ప్రాధాన్యమివ్వకుండా, వేల కోట్ల రూపాయలను ప్రాజెక్టుల పేరుతో కేటాయించి, టెండర్లు పిలవకుండానే ప్రభుత్వం అనుచర వర్గానికి కాంట్రాక్టులను కట్టబెడుతోందన్నారు. రెండేళ్లలో అవినీతి పెరిగిపోయిందని, ప్రభుత్వ కార్యాలయాలు అవినీతికి నిలయాలుగా మారాయన్నారు. డబ్బులు ఇవ్వకుంటే ఏ పని కావడం లేదన్నారు. కేసీఆర్ మాటల గారడీతో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. డబల్ బెడ్రూం ఇళ్లు ప్రారంభమే కాలేదన్నారు. రుణమాఫీ ఊసే లేదన్నారు. దళితులకు 3ఎకరాల భూపంపిణీ ఏమైందని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని చెప్పుకుంటూ, హైదరాబాద్‌లోని భూములను కొన్ని సంస్థలకు అప్పగించి రూ.కోట్లు వెనకేసుకున్నాడని ఆరోపించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ సభ్యురాలు పాల్వాయి స్రవంతి, కొండ యాదగిరి, నయీంషరీఫ్, బోయ రామచంద్రం, తిరుపతి రవీందర్, చింతల వెంకట్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, పల్సం సత్యం, చింతపల్లి వెంకట్‌రెడ్డి, జేకే.దశరథ, రాజయ్య, రఘుపతి, జానిబాబు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
చౌటుప్పల్: 65వ నంబరు జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం మల్కాపురం శివారులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాపురం గ్రామానికి చెందిన ఎస్కె.మున్నా(22), తోటకూరి నరేష్‌లు తుఫ్రాన్‌పేటలో వెల్డింగ్ పనులు చేస్తున్నారు. ఆదివారం రాత్రి బైకుపై తుఫ్రాన్‌పేట నుంచి మల్కాపురానికి వస్తుండగా, బైకును వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో, తీవ్ర గాయాలపాలై మున్నా అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు వచ్చి తీవ్రంగా గాయపడ్డ నరేష్‌ను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మున్నా మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్ఐ హరిబాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రాచకొండకు చారిత్రక గుర్తింపు
చౌటుప్పల్: రాచకొండకు చారిత్రక గుర్తింపు లభించింది. దేశంలోనే రెండో అతిపెద్ద పోలీస్ కమిషనరేట్ సైబరాబాద్‌ను ఈస్ట్, వెస్ట్ పోలీస్ కమిషనరేట్లుగా ప్రభుత్వం విభజించింది. అందులో ఈస్ట్ కమిషనరేట్‌కు రాచకొండ పోలీస్ కమిషనరేట్‌గా నామకరణం చేసింది. దాదాపు 600వ సంవత్సరాల చారిత్రక నేపథ్యమున్న రాచకొండ ప్రాంతానికి ప్రభుత్వం తగిన ప్రాధాన్యమిచ్చింది. రాచకొండ ప్రాంతమున్న సంస్థాన్ నారాయణపురం మండలాన్ని కమిషనరేట్‌లో కలిపితేనే, ఆ పేరుకు సార్థకత చేకూరనుంది. రాచకొండ చారిత్రక నేపథ్యమిదీ.. క్రీ.శ 13వ శతాబ్దంలో ప్రస్తుత 10జిల్లాలున్న తెలంగాణ ప్రాంతమంతటిMీ రాచకొండను రాజధానిగా చేసుకుని రేచర్ల పద్మనాయక వంశీయులు పాలించారు. అప్పట్లో రాచకొండకు రాజాద్రి, రాజగిరి అనే పేర్లు కూడా వాడకంలో ఉన్నాయి. కాకతీయ రాజ్య పతనానంతరం పద్మనాయక వంశీయులు స్వతంత్రంగా రాజ్యాన్ని స్థాపించారు. వీరి కాలంలో నిర్మించిన దుర్గములలో రాచకొండ, దేవరకొండ ముఖ్యమైనవి. రాచకొండ దుర్గాన్ని అనపోతనేడు అనే ప్రభువు నిర్మాణం చేయించారు. ఈయన కాలంలోనే రాజధానిని ఆమనగల్లు నుంచి రాచకొండకు తరలించి, రాచకొండను రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించాడు. అనంతరం వారి వంశీయులందరూ రాచకొండను రాజధానిగా చేసుకునే పాలన సాగించారు. వీరిపాలనలోనే పతనమవుతున్న హైందవ సంస్కృతిని పునరుద్ధరించారు. దేవాలయాలను నిర్మించారు. శిథిలమైన కళాసంపదను పునరుద్ధరించారు. కవి, పండితులను పోషించారు. సంస్కృతాంధ్ర భాషలను ఆదరించారు. ఏంతో కీర్తిని పొందారు. క్రీ.శ.1360 నుంచి 1475వ సంవత్సరం వరకు పద్మనాయకుల పాలన కొనసాగింది. ఇక్కడ అపురూపమైన కట్టడాలున్నాయి. రాచకొండ పేరుతోనే మావోయిస్టు ఉద్యమం.. ప్రస్తుతం ఈ ప్రాంతమంతా నల్లగొండ–రంగారెడ్డి జిల్లాల సరిహద్దులోని దాదాపు 35వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రభుత్వ భూములు పెద్ద ఎత్తున ఉన్నాయి. దట్టమైన గుట్టల ప్రాంతం. దీంతో 1986లో రాచకొండ దళం పేరుతో మావోయిస్టులు(పీపుల్స్‌వార్) నక్సలైట్ ఉద్యమాన్ని ప్రారంభించారు. దట్టమైన అటవీ ప్రాంతం, ఎల్తైన గుట్టలు, శత్రుదుర్బేద్యమైన రక్షణ స్థావరాలు ఉండడంతో, మావోయిస్టుల ఉద్యమానికి కేంద్ర బిందువైంది. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా మావోయిస్టు ఉద్యమం ఉధృతంగా నడిచింది. రాష్ట్రంలోనే రాచకొండ దళానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత రాచకొండ దళం కనుమరుగైంది. రాచకొండపై కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ.. ఇంతటి ఘన చరిత్ర ఉన్న రాచకొండపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారు. సమైక్య పాలనలో రాచకొండను పట్టించుకోలేదని గుర్తించిన సీఎం కేసీఆర్ తాను అధికారం చేపట్టగానే రాచకొండపై దృష్టి సారించారు. రాచకొండకు చారిత్రక గుర్తింపు తేవాలని, హైదరాబాద్‌కు అతిదగ్గరలో ఉన్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని తలంచారు. ఫిలింసిటీగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో, ఇప్పటికే రెండు మార్లు హెలికాఫ్టర్‌లో ఏరియల్ సర్వే నిర్వహించారు. శంషాబాద్ విమానాశ్రయానికి కేవలం 25కి.మీ.ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో స్పోర్ట్‌సిటీ, ఎడ్యుకేషన్‌హబ్, ఇండస్ట్రియల్ కారిడార్లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌ను ఈస్ట్, వెస్ట్ కమిషనరేట్లుగా విభజించారు. ఇందులో ఈస్ట్ కమిషనరేట్‌కు రాచకొండ పోలీస్ కమిషనరేట్‌గా నామకరణం చేశారు. కాగా, రాచకొండ ప్రాంతమంతా సంస్థాన్ నారాయణపురం మండల రెవిన్యూ పరిధిలో ఉంది. హైదరాబాద్‌కు 40కి.మీ.ల దూరంలో, శంషాబాద్‌కు 25కి.మీ.ల దూరంలో ఉన్న ఈ ప్రాంతాన్ని సైబరాబాద్ పరిధిలో కలిపితేనే, రాచకొండ కమిషనరేట్ అనే పేరుకు సార్థకత చేకూరనుంది. -
సుపరిపాలనకే జిల్లాల విభజన
చౌటుప్పల్ : ప్రజలకు పారదర్శకమైన సుపరిపాలనను అందించేందుకు ప్రభుత్వం జిల్లాలను విభజిస్తోందని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తెలిపారు. చౌటుప్పల్‌లో ఆదివారం రూ.5 కోట్లతో చేపట్టిన కులవృత్తుల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం అంకిరెడ్డిగూడెంలో సీసీ రోడ్డు నిర్మాణానికి, మహిళల కుట్టుశిక్షణ భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత తాళ్లసింగారం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి, ఎస్.లింగోటంలో సీసీ రోడ్డు, అసంపూర్తిగా ఉన్న గౌడ సంఘం భవనాన్ని పూర్తి చేసే పనులను ప్రారంభించారు. అనంతరం జైకేసారంలో సీసీ రోడ్డు, గౌడ సంఘం భవన నిర్మాణానికి పునాదిరాయి వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల పునర్విభజనను ప్రజల అభీష్టం మేరకే చేస్తున్నామన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా 5 కోట్ల తాటి, ఈత, ఖర్జూర మొక్కలను నాటిస్తామన్నారు. చౌటుప్పల్‌లో రూ.1.50 కోట్లతో నీరా‡ పరిశ్రమను ఏర్పాటు చేయిస్తాననిపేర్కొన్నారు. స్థానిక పరిశ్రమల్లో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలిప్పించేందుకు కృషి చేస్తానన్నారు. దివీస్ కంపెనీలో ఉద్యోగాల కోసం కంపెనీ ఎండీతో మాట్లాడుతానన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ మహిళాభివృద్ధే దేశాభివృద్ధి అన్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు పెద్దిటి బుచ్చిరెడ్డి, వైస్‌ఎంపీపీ కాయితీ రమేష్‌గౌడ్, సర్పంచ్‌లు బొంగు లావణ్య, సుర్వి మల్లేష్‌గౌడ్, చెన్నగోని విజయలక్ష్మీ, జీండ్రు నిర్మల, ఎం.దయాకరాచారి, ఎంపీటీసీ సభ్యుడు బత్తుల వరలక్ష్మీ, దాసోజు సుధారాణి, పిట్టల శంకరమ్మ, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. -
ఆలయ నిర్మాణానికి భూమి పూజ
చౌటుప్పల్: ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మండలంలోని ధర్మోజిగూడెంలో సీతారామచంద్ర స్వామి దేవాలయ నిర్మాణానికి ఆదివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొంతం రాంరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు కాసర్ల శ్రీనివాస్‌రెడ్డి, ఉపసర్పంచ్ బత్తుల శ్రీహరి, కొంతం కృష్ణారెడ్డి, బుచ్చిరెడ్డి, సుశీల, పద్మ, పగిళ్ల నర్సిరెడ్డి, భూపాల్‌రెడ్డి, సామిడి అంజిరెడ్డి, రాంచంద్రారెడ్డి, కొంతం దామోదర్‌రెడ్డి, లింగారెడ్డి, రాఘవరెడ్డి, సింహాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆదర్శవంతంగా జీవించాలి
చౌటుప్పల్ : ఆదర్శ వివాహం చేసుకున్న వధూవరులు ఆదర్శవంతంగా జీవించాలని సీపీఎం డివిజన్ కార్యదర్శి చింతల భూపాల్‌రెడ్డి సూచించారు. చౌటుప్పల్‌లో సీపీఎం ఆధ్వర్యంలో శనివారం ఒరిస్సా రాష్ట్రంలోని మల్కానిగిరి జిల్లా సిమిలిబంచా గ్రామానికి చెందిన కుర్మి గంగ, ఒడి భీమలకు ఆదర్శ వివాహం చేశారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మంచి జీవితాన్ని గడపాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రొడ్డ అంజయ్య, ఎండీ.పాషా, బత్తుల శ్రీశైలం, దండ అరుణ్‌కుమార్, గోశిక కర్ణాకర్, ఆకుల ధర్మయ్య, ఆనగంటి వెంకటేష్, రాగీరు కిష్టయ్య, చెర్కు జంగయ్య, బత్తుల దాసు, నర్సిరెడ్డి, జయమ్మ, విజయలక్ష్మీ, యాదమ్మ, నర్సమ్మ, అండాలు తదితరులు పాల్గొన్నారు. -
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
చౌటుప్పల్ : ప్రతి మహిళ స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి సాధించాలని నాబార్టు జనరల్ మేనేజర్ బి.దయామృత అన్నారు. మండలంలోని దామెర గ్రామంలో నాబార్డు, శాంతి గ్రామీణాభివృద్ధి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు స్కూల్ బ్యాగుల తయారీలో శిక్షణ ఇచ్చారు. వీరికి శుక్రవారం ఆమె సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు నూపుణ్యంతో స్కూల్ బ్యాగులు, ట్రావెల్ బ్యాగులు, పర్సులను తయారు చేయాలన్నారు. తద్వారా స్వయం ఉపాధిని పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు బక్క యాదయ్య, కోఆర్డినేటర్ చెక్క బాలకిషన్, విమల, సరస్వతి, స్వాతి, విజయమ్మ, రజిత, అనిత, సునీత, రజని తదితరులు పాల్గొన్నారు. -
వలిగొండకు వచ్చిన జగన్
వలిగొండ/చౌటుప్పల్/నకిరేకల్/చిట్యాల: సోమవారం వలిగొండ మండలం మాందాపురంనకు వచ్చిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్. జగన్మోహన్రెడ్డికి ప్రజలు, నాయకులు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్‌లో న్యాయవాదిగా పనిచేస్తున్న వలిగొండ మండలం మాందాపురంనకు చెందిన గూడూరు అశోక్‌రెడ్డి తల్లి యశోధాదేవి(78) ఆదివారం మృతిచెందడంతో సోమవారం అశోక్‌రెడ్డిని జగన్ పరామర్శించారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన అనంతరం జగన్ రోడ్డు మార్గాన మాందాపురంనకు చేరుకున్నారు. ఈ సందర్భంగా యశోధాదేవి మృతికి తన ప్రగాఢ సంతాపం తెలిపారు. అనంతరం అశోక్‌రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆయన వెంట వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఇరుగుదిండ్ల సునీల్‌కుమార్, మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మతిన్, రాష్ట్ర నాయకుడు పడాల శ్రీకాంత్, జిల్లా అధ్యక్షుడు తుమ్మలపల్లి భాస్కర్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జీవన్‌గౌడ్, కార్యదర్శి మొలుగు రాములు, మండల అధ్యక్షుడు ఇంజమూరి కిషన్, కన్నె కొండల్రావు, నాయకులు గూడూరు యాదిరెడ్డి, పైళ్ల నర్సిరెడ్డి, బందారపు లింగస్వామి ఉన్నారు. అడుగడుగునా ఘన స్వాగతం ఖమ్మం జిల్లా నుంచి వలిగొండ మండలానికి వచ్చిన జగన్‌కు జిల్లాలోని మోతె, చివ్వెంల, సూర్యాపేట, కేతేపల్లి, నకిరేకల్, నార్కట్‌పల్లి, చిట్యాల, రామన్నపేటల వద్ద ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, ప్రజలు, మహిళలు ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. నకిరేకల్‌లో దేవీ పెట్రోల్ బంక్ వద్ద జగన్‌కు అభిమాలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆటోలో అటు వైపుగా వెళ్తుండగా జగన్ చూసిన ప్రజలు, మహిళలు అక్కడికి వచ్చి జగన్‌తో కరచాలనే చేశారు. చిన్నారిని తన చేతుల్లోకి తీసుకుని ముద్దాడి ఆప్యాయంగా పలకరించారు. చిట్యాలలో ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఇరుగు సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్‌తో సెల్ఫీ దిగేందుకు యువకులు పోటీ పడ్డారు. జగన్‌కు స్వాగతం పలికిన వారిలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జె. మహేందర్‌రెడ్డి, మైనారిటి సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మతిన్, ఆ పార్టీ జిల్లా కార్యదర్శిలు కొమిరెళ్లి మోహన్‌రెడ్డి, దేవసరి పాపయ్య, చిట్యాల, రామన్నపేట, నార్కట్‌పల్లి మండల అధ్యక్షులు అంశల సత్యనారాయణ, రుద్రారపు శంకరయ్య, బాసోని నర్సింహా, నాయకులు నాతి మల్లేష్‌గౌడ్, ఎండీ ఫయాజ్, కర్ల సుందర్‌బాబు, మేడి యాదయ్య. ఎండీ సలీం, గిరి, మరియదాసు ఉన్నారు. -
రుణమాఫీని ఒకేసారి విడుదల చేయాలి
చౌటుప్పల్ : మూడు, నాలుగో విడత రుణ మాఫీని ఒకేసారి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26న కలెక్టరేట్‌ను ముట్టడించనున్నట్టు సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి తెలిపారు. చౌటుప్పల్‌లో శనివారం జరిగిన సీపీఎం సమావేశంలో మాట్లాడారు. రైతులను ఆదుకోవడంలో.. కౌలుదారులకు గుర్తింపుకార్డులు, రుణాలు ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. భూ నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలన్నారు. కలెక్టరేట్ ముట్టడికి రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బండ శ్రీశైలం, డివిజన్ కార్యదర్శి చింతల భూపాల్‌రెడ్డి, దోనూరి నర్సిరెడ్డి, రొడ్డ అంజయ్య, పాషా, కీసరి నర్సిరెడ్డి, మండల నాయకులు ఆకుల ధర్మయ్య, ఆనగంటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ
చౌటుప్పల్: మండలంలోని తంగడపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో శుక్రవారం హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త సంకా మోహనకృష్ణమూర్తి తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్సిల్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. శాస్త్రవేత్తలుగా, ఇంజినీర్లుగా, డాక్టర్లుగా ఎదిగి, సమాజానికి సేవ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు బి.రవీందర్, ఎ.నాగయ్య, మోటె సత్తయ్య, మాధవరెడ్డి, శ్రీరాములు, మోహన్‌రావు, ముర ళీమోహన్, మంజుల తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు నోట్‌పుస్తకాల పంపిణీ
చౌటుప్పల్: మండలంలోని తాళ్లసింగారంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బుధవారం నార్మ్ ఆధ్వర్యంలో నోట్‌పుస్తకాలు, పలకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నార్మ్ కో–ఆర్డినేటర్ డాక్టర్ సంధ్యాసెనాయ్ మాట్లాడారు. విద్యార్థులు చక్కగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. నార్మ్ ద్వారా అవసరమైన సహాయ, సహకారాలను అందిస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సుర్వి నర్సింహగౌడ్, డాక్టర్ వీకేజే.రావు, ప్రధానోపాధ్యాయుడు హర్షవర్ధన్‌రెడ్డి, అనుపమ, సమత, జంపాల కృష్ణ, సుక్క అమృత, మార్క్, లక్ష్మయ్య, వెంకటేశం పాల్గొన్నారు. -
నూతన కల్లు విధానాన్ని రూపొందించాలి
చౌటుప్పల్ : నూతన కల్లు విధానాన్ని రూపొందించాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాటూరి బాలరాజుగౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సర్ధార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన జైత్రయాత్ర మంగళవారం చౌటుప్పల్‌కు చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్ధార్ సర్వాయిపాపన్న జయంతి ఉత్సవాలను ఈ నెల 18న ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. కల్లుగీత ఫెడరేషన్‌ను ఏర్పాటు చేసి రూ.1వెయ్యి కోట్లు కేటాయించాలన్నారు. తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమలను నెలకొల్పాలన్నారు. నీరా ప్రాజెక్టులను చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జైత్రయాత్ర కన్వీనర్ ఎంవీ.రమణ, పామనగండ్ల అచ్చాలు, సూదగాని రమేష్, జనగాం శ్రీనివాస్, బూడిద గోపి, అబ్బగాని భిక్షం, వెంకటమల్లు, బావయ్య, బత్తుల లక్ష్మయ్య, మునుకుంట్ల ఎల్లయ్య, వర్కాల ఇస్తారి, రాములు, అంజయ్య, వెంకటయ్య, శంకరయ్య, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.