City plus
-
షాహీ నాష్టా.. నోరూరించే నిజాంల నాటి వంటకాలు
షాహీ నాష్టా.. అంటే నిజాం కాలంలో ఉదయం పూట అల్పాహారం. పాయారోటీ, గుర్దాభాజీ, ఖీమారోటీ, ఖిచిడీ ఖీమాలాంటి పదార్థాలను నిజాములు అల్పాహారంగా సేవించేవారు. నిజాముల కాలం నాటి వంటకాలు కొన్ని నేటికీ ప్రజాదరణలో ఉన్నాయి. క్రమేణా ఈ వంటకాలన్నీ పాతబస్తీ హోటళ్లు, సికింద్రాబాద్‌లోని ఒకటి రెండు హోటళ్లలో సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చాయి. దీంతో నగరంలో నాన్‌వెజ్ బ్రేక్‌ఫాస్ట్ అందించే రెస్టారెంట్ల సంఖ్య పెరుగుతోంది. జంటనగరాలతోపాటు శివారు ప్రాంతాల్లో నాన్‌వెజ్ అల్పాహార వంటకాల కోసం ఉదయం పూట వందలాది మంది వేచి చూస్తారంటే అతిశయోక్తి కాదు. – సికింద్రాబాద్వయసుతో పని లేకుండా... ప్రతిరోజు 6 గంటల నుంచే వేడివేడిగా మాంసాహారపు వంటకాల అల్పాహారాలను రెస్టారెంట్ల నిర్వాహకులు సిద్ధంగా ఉంచుతున్నారు. భాజీగుర్దా, ఖీమా కర్రీ, పాయ వంటి పురాతన వంటకాలతోపాటు చిల్లిగారె, పూరి, ఇడ్లీ, వడ, దోశ, రాగిముద్ద వంటి బ్రేక్‌ఫాస్ట్‌ను చికెన్, మటన్‌తో కూడిన వివిధ వంటకాలతో రడీగా ఉంచుతున్నారు. మరికొన్ని హోటళ్లు అయితే ఉదయం 5 గంటల నుంచి 11.30 గంటల వరకూ నాన్‌వెజ్ వంటకాలను అందుబాటులో ఉంచుతున్నారు. రాత్రి 12 గంటల లోపే నాణ్యమైన మాంసం, అవసరమైన ఆకుకూరలు, మసాలాలను సిద్ధం చేసుకుని తెల్లవారుజామున ఒంటిగంట, రెండు గంటల ప్రాంతంలో వంటలు ప్రారంభిస్తున్నారు. ఉదయం 5 గంటలకు రెస్టారెంట్లను తెరిచి పూరి, రోటీ ఇతర టిఫిన్లతో కస్టమర్లకు సర్వ్ చేస్తున్నారు.వయసుతో పని లేకుండా... ఉదయం వేళల్లో చోటా ఆరగించేవాళ్లలో అన్ని వయస్కుల వాళ్లూ కనిపిస్తున్నారు. 18 ఏళ్ల నవయువకుల నుంచి 70 ఏళ్ల వృద్ధుల వరకూ ఈ టిఫిన్లు ఆరగిస్తున్నారు. కేవలం నాన్‌వెజ్ కర్రీతో ప్రత్యేకంగా లభించే టిఫిన్లు ఆరగించడం కోసం వచ్చే వాళ్లు మిత్రులుగా మారిన వారూ ఉంటున్నారు. నాన్‌వెజ్ టిఫిన్లు సేవించేవారు మైదానాల్లోనే మిత్రులుగా మారుతున్నారు. కొందరు ఐతే ఏకంగా నాన్‌వెజ్ టిఫిన్స్ కోసం చాట్ గ్రూప్స్ మెయింటెన్ చేస్తున్నారు. వారాంతాల్లో జాతరే!రోజు రోటీ, ఇతర టిఫిన్లు తినేందుకు నాన్‌వెజ్ టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్ల వద్ద కస్టమర్లు బారులు తీరుతున్నారు. శని, ఆదివారం వచి్చందంటే చాలు మాంసాహార టిఫిన్‌సెంటర్ల ముందు జాతర కనిపిస్తుంది. భాజీగుర్దా.. ఖీమాతో రోటీపాటు, ఇడ్లీ, వడ, దోశ వంటి అల్పాహారాలు కూడా మాంసం కూరలతో తినేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో కస్టమర్లతో రెస్టారెంట్ల వద్ద సందడి వాతావరణం కనిపిస్తుంది. మార్నింగ్ వాకర్లు, స్మిమ్మర్లు, జిమ్‌కు వెళ్లేవాళ్లు, క్రికెటర్లు వారాంతపు రోజులు, సెలవు దినాల్లో వ్యాయామం ముగించుకున్నాక నేరుగా మాంసాహార టిఫిన్ సెంటర్ల వద్దకు చేరుకుంటారు. వీళ్లే కాకుండా పలువురు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కూడా సెలవు దినాల్లో నాన్‌వెజ్ టిఫిన్స్ ఆరగించేందుకు ఉవి్వళ్లూరు తున్నారు. -
అమెరి‘ఖానా’...
అమెరికా కేంద్రంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన రెస్టారెంట్ గ్రూప్ ‘చిలీస్’ నగరంలో తన రెండవ శాఖను ఏర్పాటు చేసింది. బంజారాహిల్స్, రోడ్‌నెం..1లోని జలగం వెంగళరావు పార్క్ ఎదురుగా నెలకొల్పిన ఈ రెస్టారెంట్‌ను గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సినీనటి షామిలి హాజరయ్యారు. ఈ సందర్భంగా సంస్థ సీఈఓ అశీష్ సక్సేనా మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఇనార్బిట్ మాల్ తర్వాత బంజారాహిల్స్‌లో రెండవ శాఖను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. దీనితో భారత్‌లో తమ బ్రాండ్ 8 శాఖలు నెలకొల్పినట్టయిందన్నారు. అమెరికాలో అమితాదరణ కలిగిన టెర్లింగ్వా చిలి, బోంబే బర్గర్, ఒరిజినల్ బార్బెక్యూ రిబ్స్, చీజ్ క్యూసొదిల్లాస్, చెర్రీ కోలా.. వంటి రుచులు హైదరాబాదీలను సైతం అమితంగా ఆకట్టుకుంటున్నాయన్నారు. - సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి -
హాయ్..నేను జ్యోతిలక్ష్మిని..
తాను ఎక్కడికి వెళ్లినా జ్యోతిలక్ష్మి వచ్చిందంటున్నారని, ఇది తనకెంతో ఆనందంగా ఉందని కథానాయిక చార్మి పేర్కొన్నారు. బుధవారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హల్లో వంశీ ఇంటర్నేషనల్-వంశీ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో ‘ జ్యోతిలక్ష్మీ’ చిత్ర యూనిట్‌కు అభినందన సభ నిర్వహించారు. ఇందులో హీరోయిన్ చార్మి మాట్లాడుతూ.. మహిళలను తోటి మహిళ గౌరవించే సంస్కృతి వస్తే మిగతా వారు గౌరవిస్తారన్నారు. పురుషుడి అండ ఉంటే మరింత ప్రగతి సాధిస్తారన్నారు. ఈ సందర్భంగా చార్మి, హీరో సత్య, చిత్ర బృందంపై పూలవాన కురిపించారు. నిర్మాత సి.కల్యాణ్, సమాచార హక్కు చట్టం కమిషనర్ పి. విజయబాబు, టీడీపీ నేత నన్నపనేని రాజకుమారి, రచయిత్రి కేబీ లక్ష్మి, జీవీఎల్ఎన్ రాజు, సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్, వంశీ సంస్థ నిర్వాహకురాలు డాక్టర్ తెన్నేటి సుధాదేవి, ప్రధాన కార్యదర్శి సుంకరపల్లి శైలజ తదితరులు పాల్గొన్నారు. - సాక్షి,సిటీబ్యూరో -
సమాజ సేవలో.. నేనున్నానని..
హీరో అంటే.. వందమందిని ఇరగదీయాలి. డ్యూయెట్లు పాడాలి. తనవారి కోసం విలన్‌ను ఎదిరించి నిలవాలి.. ఇది ‘రీల్ హీరో’ సంగతి. మరి నిజ జీవితంలో కష్టాల్లో ఉన్నవారికి సాయం చేసేవారు.. తనకన్నా సమాజం కోసం పాటుపడేవారు.. ‘రియల్ హీరో’ అవుతారు. ఈ కోవకు చెందిన వ్యక్తే వేణు శ్రావణ్. వెండి తెరపై హీరో కావాలన్న కలతో సిటీకి వచ్చిన అతడు పేదల సాయంలో నిమగ్నమయ్యాడు. ఓ పక్క రేడియో జాకీగా, మరోపక్క బుల్లితెర నటుడిగా కొనసాగుతున్నాడు. తాను సేకరించిన పాత, కొత్త దుస్తులను ఆదివారం ధర్నా చౌక్‌లో పేదలకు పంచాడు. వారికి భోజనం సైతం పెట్టాడు. ఈ సందర్భంగా అతడిని ‘సాక్షి’ పలకరిస్తే ఎన్నో విషయాలు చెప్పాడు. ఆయన మాటల్లోనే.. - సాక్షి,సిటీబ్యూరో అలా ‘చలో హైదరాబాద్’ ‘మాది ఖమ్మం జిల్లాలోని బ్రాహ్మణపల్లి. డిగ్రీ వరకు ఖమ్మంలోనే చదువుకున్నాను. పాఠశాల, కళాశాల రోజుల్లో నాటకాలు వేశాను. అలా సినిమా హీరో కావాలనుకున్నా. డిగ్రీ పూర్తయ్యాక ఇండస్ట్రీని ఇరగదీయాలని చలో హైదరాబాద్ అన్నా. భాగ్యనగరంలో కొన్నాళ్లు టీచరుగా పనిచేశాను. తర్వాత రెయిన్బో ఎఫ్ఎంలో ఆర్జేగా మారాను. మరో పక్క ‘విధి, రాధా-మధు, చక్రవాకం, ఆమె, శుభలగ్నం’ వంటి సీరియల్స్‌లో నటించాను. ఇదే సమయంలో యాంకర్ గానూ చేస్తున్నా. తర్వాత సమాజంలో ఒక్కో ఘటనతో ఒక్కో అనుభవం. దీంతో ఆశయం ముందు హీరో కావలన్న ఆశ చిన్నదైపోయింది. అలా పుట్టుకొచ్చింది ‘కలర్స్’ ‘కొన్నాళ్ల క్రితం వృద్ధుల దినోత్సవం రోజు నిజాంపేట్‌లోని ఓ వృద్ధాశ్రమంలో ఈవెంట్ కోసం యాంకర్‌గా వెళ్లాను. ఆరోజు ఉదయం నుంచి తమ బిడ్డల కోసం వృద్ధులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎంత సేపటికీ వారు రాలేదు. నా వాక్ చాతుర్యంతో వారిని ఆడించి మెప్పించాను. వారు నన్ను నిజమైన బిడ్డవంటూ ముద్దాడారు. ఒకసారి చిన్న బాబుకి లివర్ ఆపరేషన్ చేయాలి. ఖమ్మంకు చెందిన దంపతులిద్దరూ నా రూములో 15 రోజులు ఉన్నారు. ‘సాక్షి చానెల్’ వారిని సంప్రదిస్తే బాబు సమస్యను టీవీలో టెలికాస్ట్ చేశారు. దీంతో రూ.14 లక్షలు పోగయ్యాయి. ఆ డబ్బుతో ఆ బాబు బతికాడు. సమయానికి సరైన సాయం అందక చాలామంది పేదలు కష్టాలు పాలవుతున్నారు. చర్లపల్లి జైల్లో కార్యక్రమాలు చేశా. క్షణికావేశంతో చేసిన తప్పులకు నేరస్తులు జైల్లో ఉంటే వారి కుటుంబాలు ఎలా నష్టపోతున్నాయో తెలుసుకున్నా. ఇలాంటి వారికి సాయం చేయాలనుకున్నా. ఇందుకోసం డబ్బు కావాలి. ఇందుకు 2013లో ‘కలర్స్ సర్వీస్ అండ్ ఎంటర్టైన్మెంట్’ పేరుతో సంస్థను స్థాపించా. దీనిద్వారా లైవ్ షోలు చేసి విరాళాలు సేకరిస్తున్నా. ఫేస్బుక్ స్నేహితులతో మాట్లాడి ఆదివారాల్లో ఏదో ఒక సామాజిక కార్యక్రమం చేస్తున్నా. ఎంత కాలం బతికామన్నది కాదు.. ఎలా బతికామన్నదే నాకు ముఖ్యం’.. అని ముగించాడు. -
దత్తతకు పిల్లలు కావలెను..!
లైఫ్ ఛేంజ్ ఎఫెక్ట్ సిటీలో పెరుగుతున్న సంతానలేమి జంటలు దత్తత కోసం శిశువిహార్‌కు దరఖాస్తుల వెల్లువ ఎదురు చూపుల్లో వెయ్యికి పైగా జంటలు ఆలస్యపు పెళ్లిళ్లు.. మారిన జీవనశైలి.. రోజంతా పని ఒత్తిడి.. ఆపై అధిక బరువు.. వెరసి నవ దంపతుల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఎన్ని మందులు వాడినా సంతానం కలగక పోవడంతో తోడు కోసం అనాథ పిల్లలపై ఆసక్తి పెంచుకుంటున్నారు. దత్తతకు పిల్లలు కావాలని కోరుతూ ఇప్పటికే అనేక మంది శిశువిహార్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే, వారికి పిల్లలు మాత్రం దొరకడం లేదు. ఏడాది లోపు బిడ్డ కావాలంటే సుమారు ఆరేళ్లు ఆగాల్సి వస్తోంది. దీంతో చాలామంది దంపతులు ఆందోళన చెందుతున్నారు. - సాక్షి, సిటీబ్యూరో కప్పుడు పాతికేళ్లకే పెళ్లి చేసుకుని, ఏడాదిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చేవారు. ప్రస్తుతం చాలా మంది ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాల వేటలో పడి 30 ఏళ్లు దాటిన తర్వాతే పెళ్లికి సిద్ధపడుతున్నారు. అధిక పని ఒత్తిడితో పాటు ఉష్ణోగ్రతలకు హార్మోన్లలో సమతుల్యత లోపిస్తుంది. ఆకలి తీర్చుకునేందుకు పిజ్జాలు, బర్గర్లతో కడుపు నింపుకోవడంతో స్త్రీ, పురుషుల హార్మోన్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనికి తోడు భార్య ఒక షిఫ్ట్.. భర్త మరో షిఫ్ట్‌లో ఆఫీసుకు వెళ్తుండడం వల్ల వారు కనీస దాంపత్యానికి నోచుకోలేకపోతున్నారు. వీకెండ్లో పార్టీల పేరుతో మద్యం తీసుకోవడం వల్ల శృంగార సమస్యలు తలెత్తుతున్నాయి. పెళ్లై నాలుగైదేళ్లు దాటినా పిల్లలు పుట్టకపోవడంతో చివరకు సంతాన సాఫల్య కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ (ఐవీఎఫ్), ఇంట్రాసైటో ప్లాస్మి క్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ఐసీఎస్ఐ) చికిత్సలు సైతం ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇదే అంశంపై 2013లో నగరానికి చెందిన ఇద్దరు దంపతులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తను ఆశ్రయించడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒంటిరిగా జీవించలేక, పిల్లలపై మమకారం చంపుకోలేక అనాథలను దత్తత తీసుకునేందుకు దంపతులు ముందుకు వస్తున్నా, పిల్లలు దొరకని పరిస్థితి తలెత్తింది. దత్తతకు ఆరేళ్లు ఆగాల్సిందే.. గతంతో పోలిస్తే దంపతుల వైఖరిలో చాలా మార్పులు వచ్చాయి. ఆడపిల్లలు భారమని భావించే రోజులు పోయాయి. శిశు విహార్‌లో పిల్లలను దత్తత తీసుకుంటున్న దంపతుల జాబితాను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతోంది. ప్రస్తుతం పిల్లల కోసం 1100 మందికిపైగా ఎదురు చూస్తున్నారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఆడశిశువు కావాలంటే కనీసం మూడేళ్లు సమయం పడుతుండగా, మగ శిశువుకు ఐదు నుంచి ఆరే ళ్లు పడుతోంది. పిల్లల దత్తత కోసం దరఖాస్తు చేసుకున్నా.. అది కూడా గ్యారంటీ లేదు. ఇదిలా ఉంటే గత పదమూడేళ్లలో శిశువిహార్ ద్వారా మొత్తం 2047 మందిని దత్తత ఇవ్వడం గమనార్హం. ఐటీ అనుబంధ ఉద్యోగుల్లో అధికం నగరంలో 30కి పైగా ఫెర్టిలిటీ సెంటర్లు ఉండగా, మా ఆస్పత్రికి ప్రతి రోజూ సగటున 30 కేసులు వస్తున్నాయి. వీరిలో అధిక శాతం ఐటీ, కాల్ సెంటర్స్, మీడియా అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న దంపతులే. ముందు వీరికి పరీక్షలు చేసి లోపాన్ని గుర్తిస్తాం. తొలుత మందులతో ప్రయత్నిస్తాం. అయినా ఫలితం లేకపోతే ఐవీఎఫ్, ఐసీఎస్ఐ వంటి కృత్రిమ పద్ధతుల్లో టెస్ట్‌ట్యూబ్ బేబీకి సిఫారసు చేస్తాం. చిన్న వయసులోనే మోనోపాజ్ వస్తుండటం వల్ల నగరంలో చాలా మంది రెండో సారి గర్భధారణకు నోచుకోవడంలేదు. - డాక్టర్ చందన, నోవా ఇన్ఫెర్టిలిటీ సెంటర్ -
ఆలోచింపజేసే రేపేంటి?
పర్యావరణాన్ని కాలుష్యం చేస్తే రానున్న రోజుల్లో పరిస్థితి ఏంటి? పాలిథిన్ కవర్ల బదులు పేవర్ కవర్లు వాడాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో కాకుండా మట్టితో చేసిన వినాయకులే ఎంతో మేలని.. ఇంకుడు గుంతలు ఉపయోగకరమని.. ప్రకృతి వ్యవసాయంతో రైతులకు ఆత్మహత్యలు ఉండవని అంటున్నారు సొసైటీ ఫర్ అవేర్నెస్ అండ్ విజన్ ఆన్ ఎన్విరాన్మెంట్(సేవ్) సంస్థ ప్రతినిధులు. ప్రతి ఒక్కరూ నేల తల్లి పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరుతున్నారు సేవ్ సంస్థ వ్యవస్థాపకుడు విజయ్‌రాం. సేవ్ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరాపార్కు వద్ద ఏర్పాటు చేసిన రేపేంటి? ఎంతో ఆలోచింపజేసింది. ప్రకృతి సేద్యం కోసంఅరకిలో వరి విత్తనాలు ఉచితంగా ఇవ్వనున్నామని, పేపరు బ్యాగులు, మట్టి వినాయకులు, సీడ్‌బాల్, ఇంటి పంటపై ఇందిరా పార్కు వద్ద శని, ఆదివారాల్లో కూడా ప్రదర్శన నిర్వహించడంతో పాటు ఔత్సాహికులకు శిక్షణ కూడా ఇస్తామని విజయ్‌రాం చెప్పారు. -దోమలగూడ -
శారీలో శ్రావ్యం..
తరాలు మారినా చీరకట్టుకు ఆదరణ తగ్గదని, చీరకట్టుతో వచ్చే అందం మరే వస్త్ర సౌందర్యంలో రాదని ‘కాయ్ రాజా కాయ్’ కథానాయిక శ్రావ్య అన్నారు. శుక్రవారం ఆమె బషీర్‌బాగ్‌లో అవంతి స్కిల్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె షోరూంలోని వస్త్ర అందాలను తిలకించారు. భారతీయ సంస్కృతిలో చీర కట్టుకు విడదీయరాని బంధమని, తాను ఎక్కువగా చీరలనే ఇష్టపడతానని పేర్కొన్నారు. అనంతరం అవంతి స్కిల్స్ నిర్వహకులు మహేష్ అవస్తి, మాట్లాడుతూ హ్యాండ్లూమ్ వస్త్ర ఉత్పత్తి, హోల్ సెల్ రంగంలో 20 ఏళ్ల అనుభవాన్ని రంగరించి ఈ షోరూంను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన కళాంకారి, హ్యాండ్ పెయింటింగ్, బాతిక్, బనారస్, మహేశ్వరి వంటి రకాలు అందుబాటులో ఉంటాయన్నారు. -హిమాయత్‌నగర్ -
రంగుల డాన్...
మురిపించెన్.. ఓ ఊసరవెల్లి చెట్టుపై నుంచి కిందకు దిగి ఠీవీగా లాన్లో నడుచుకుంటూ వెళ్తోంది.. అక్కడే ఆడుకుంటున్న చిన్నారులు, స్థానికులు దాన్ని చూశారు. చూడముచ్చటగా ఉండటంతో దాంతో కాసేపు ఆడుకున్నారు. ఫొటోలు తీసుకున్నారు. అనంతరం దాన్ని ఓ డబ్బాలో బంధించారు. శుక్రవారం కుత్బుల్లాపూర్‌లోని కృష్ణకుంజ్ గార్డెన్లో చోటుచేసుకున్న ఈ దృశ్యాలు సాక్షి కెమెరాకు చిక్కాయి. ఫొటోలు: దశరధ్జ్రువా -
కాన్వాసుపై చారిత్రక పండగ
♦ తెలంగాణ సంస్కృతిని చాటుతున్న చిత్రకారులు ♦ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఎగ్జిబిషన్ ఇద్దరు చిత్రకారులు.. పేర్లు దేవేందర్‌గౌడ్, రామ్మోహన్. ఒకరిది మహబూబ్‌నగర్ జిల్లా బోయినపల్లి. మరొకరిది వరంగల్ జిల్లా పరకాల మండలం నర్సక్కపల్లి. ఇద్దరిలోనూ కామన్‌గా ఉన్నది.. కళలపై మమకారం. ఇదే వీరిద్దరినీ కలిపింది. కలిసి కాన్వాసుపై తెలంగాణ చరిత్రను పరిచి.. సంస్కృతిని ఇనుమడింపజేస్తున్నారు. తెలంగాణ కల్చర్‌ను ప్రమోట్ చేసేందుకు దేశ పర్యటన చేపట్టారు. ఆయా రాష్ట్రాల్లో వారు తెలంగాణ ‘చిత్రాన్ని’ ఆవిష్కరిస్తున్నారు. తొలిసారిగా జరుగుతున్న రాష్ట్ర అవతరణ వేడుకలను పురస్కరించుకుని వీరు బంజారాహిల్స్‌లోని గ్యాలరీ స్పేస్ ఆర్ట్ గ్యాలరీలో ‘కాకతీయన్ హెరిటేజ్’ పేరుతో గ్రూప్ షో ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను స్పీకర్ మధుసూదనాచారి, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్రకారులను ‘సాక్షి’ పలకరించినప్పుడు చిత్రాల చరిత్రను వివరించారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. - సాక్షి, సిటీబ్యూరో ‘ఈ సిటీని చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఈ నగరమే నా కళకు ప్రాణం పోసింది’ అని సంతోషంగా చెప్పారు దేవేందర్‌గౌడ్. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల తాలూకా బోయినపల్లి గ్రామానికి చెందిన ఈ చిత్రకారుడు.. మూడేళ్లుగా ఢిల్లీలో ఉంటున్నారు. తెలంగాణ సంస్కృతిని, కాకతీయుల పాలనలో వెలసిన చారిత్రక కట్టడాల గొప్పతనాన్ని చాటేందుకు ఫుల్ టైమ్ ఆర్టిస్ట్‌గా అవతారమెత్తారు. పరకాల మండలం నర్సక్కపల్లి గ్రామానికి చెందిన మరో ఆర్టిస్టు రామ్మోహన్ మాట్లాడుతూ.. ‘చిన్నప్పటి నుంచీ వరంగల్‌లో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరను వెళుతుండేవాడిని. కుంభమేళా తర్వాత అంత పెద్దగా జనాలు వచ్చే ఈ జాతర ప్రత్యేకతను నలుగురికీ చెప్పాలనుకున్నా. అందుకు కుంచె పట్టా’ అని చెప్పారు. కళే కలిపింది ఇద్దరిని.. ‘మా ఇంట్లో నేను చిన్నోడిని. మా నాన్న ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి. చిన్నప్పటి నుంచి నాకు కళలపై ఉన్న ఆసక్తి కుంచె పట్టేలా చేసింది. అలా శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ నుంచి బీఎఫ్ఏ చేశా. ఇదే సమయంలో నాకు దేవేందర్ గౌడ్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి అభిరుచులు ఒక్కటే. ఓసారి సమ్మక్క-సారలమ్మ జాతరను చూశాం. అప్పటి నుంచే మన తెలంగాణ చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని ఫిక్స్ అయిపోయాం’ అని చెప్పుకొచ్చారు రామ్మోహన్. ఢిల్లీలో కూడా చేశాం.. ‘తెలంగాణ కల్చర్‌ను ప్రమోట్ చేసేందుకు ఢిల్లీలోని ఆలిండియా ఫైన్ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ సొసైటీలో ఇప్పటికే ఎగ్జిబిషన్ చేశాం. తొలిసారిగా జరుగుతున్న రాష్ట్ర అవతరణ వేడుకలను పురస్కరించుకొని మరికొన్ని కొత్త పెయింటింగ్స్‌తో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశాం. మన తెలంగాణలోనైనా మన చారిత్రక కట్టడాలకు తగిన గుర్తింపు లభిస్తుందని కోరుకుంటున్నా’మన్నారు ఈ కళా ద్వయం. ఓ కుంచెది ‘శిల ్ప’ చరిత్ర.. ‘800 ఏళ్ల క్రితం నాటి రామప్ప గుడి నన్ను ఎంతో ప్రభావితం చేసింది. ఇంత అద్భుత శిల్ప సంపద ఉన్నా అనుకున్నంత గుర్తింపు రాకపోవడం ఆలోచింపచేసింది. రామప్ప ఓ శిల్పి. కళాకారులకు కాకతీయులు గుర్తింపు ఇచ్చినా ఇప్పటివారు నిర్లక్ష్యం చేయడం బాధించింది. ఈ శిల్పాలు శివుని అనాటమీ (స్ట్రక్చర్).. విష్ణువు ఆకృతిని పోలి ఉంటాయి. రామప్ప గుడి శిల్ప సంపదను కళ్లకు కట్టినట్టు చూపేందుకు కుంచెను ఆయుధంగా వాడుకున్నా’ అని గర్వంగా చెప్పారు దేవేందర్‌గౌడ్. మరో కుంచెది ‘మహా జాతర’.. ‘భారతదేశంలో భారీగా భక్తులు హాజరయ్యేది కుంభమేళాకే. తర్వాత అంత భక్తజనం తరలి వచ్చేది ‘సమ్మక్క- సారక్క’ జాతరకే. తమకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించేందుకు ఈ గిరిజన అక్కాచెల్లెళ్లు చూపిన తెగువను ప్రపంచమే చెప్పుకుంటుంది. మిగతా జాతర్లకు ఈ తిరునాళ్లకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. మిగతా చోట్ల బంగారంతో మొక్కులు చెల్లిస్తారు. ఇక్కడ బెల్లాన్ని సమర్పిస్తుంటారు. ఇదే సీన్‌ను పెయింటింగ్ ద్వారా చూపించా. సమ్మక్క గద్దె, సారక్క గద్దెను చూస్తే అలానే నిలబడి చూడాలనిపిస్తునే ఉంటుంది. అందుకే ఆ చిత్రాలను గీశా’ అంటూ చెప్పారు రామ్మోహన్. -
దేహానికి సమ్మర్ గార్డ్స్
మండే ఎండల్ని ఇచ్చే ప్రకృతే వాటి నుంచి కాపు ‘కాచే’ కాయల్నీ మనకు ఇచ్చింది. అందుకేనేమో... వాటికి తమ పేరుకు (ఆంగ్లంలో) ‘గార్డ్స్’ను జత చేసుకున్నాయి. నగరంలో మండుతున్న వేసవి నుంచి సిటీజనుల్ని రక్షించేందుకు అందుబాటులోనే ఉన్న కొన్ని కూరగాయలు తీసుకుంటే చాలంటున్నారు వైద్యులు. కూల్ డ్రింక్స్నో, మరో కృత్రిమ పానియాలనో ఆశ్రయిస్తూ ఎండ నుంచి తాత్కాలిక ఉపశమనాన్ని, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నాం. వాటికి బదులు కొన్ని రకాల కూరగాయల్ని ఆహారంలో భాగం చేయడం ద్వారా మండే ఎండల్నీ చల్లగా సాగనంపవచ్చని నగరానికి చెందిన పలువురు పోషకాహార నిపుణులు చెబుతున్నారు. - సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి బిట్టర్ గార్డ్ ఇది సమ్మర్ నుంచి రక్షించే ‘బెటర్ గార్డ్’. కాకర కాయగా మనకు అత్యంత చిరపరిచితమైన ఈ కూరగాయ వేసవికి తోడు పని ఒత్తిడి కారణంగా తలెత్తే హైపర్ టెన్షన్‌ను నివారిస్తుంది. సీజనల్‌గా ఏర్పడే పుండ్లు, దద్దుర్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్, రింగ్ వార్మ్ వంటి వాటిని అదుపు చేయడంలో సహకరిస్తుంది. డయాబెటిస్ నియంత్రణకు ఇది చక్కని ఆహారం. స్నేక్ గార్డ్ పేరులో పామున్నా.. స్నేక్ గార్డ్.. తెలుగులో పొట్లకాయగా మనకు చిరపరిచితమే. ఇది దేహానికి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. వేడిమి కారణంగా పేరుకుంటున్న పొడి తత్వాన్ని దూరం చేసి శరీరంలో ఫ్లూయిడ్స్ ఉత్పత్తిని పెంచుతుంది. శరీర విధి నిర్వహణ సాధారణంగా జరిగేలా దోహదపడుతుంది. యాష్ గార్డ్ పేరులో బూడిద ఉన్నా తీరులో బంగారం అనిపిస్తుంది యాష్గార్డ్.. అదే బూడిద గుమ్మడికాయ. దేహాన్ని చల్లగా ఉంచి వడదెబ్బ నుంచి కాపాడుతుంది. ఇది దాదాపు 96 శాతం నీటిని కలిగి ఉంటుంది. విటమిన్- బి,ఎ (థయామిన్), బి3 (నియాసిన్)ను పుష్కలంగా అందిస్తుంది. దీనిలోని హై పొటాషియం రక్తపోటు సరైన క్రమంలో ఉండేలా చూస్తుంది. కిడ్నీలో రాళ్లు వంటి సమస్యల నివారణకు మంచి మందు. రిడ్జెడ్ గార్డ్ బీరకాయనే ఆంగ్లంలో రిడ్జెడ్ గార్డ్ అంటారు. ఇది రక్తాన్ని శుద్ధి చేసి రక్తంలోని చక్కెర శాతాన్ని నియంత్రిస్తుంది. వేసవి కారణంగా తలెత్తే జీర్ణకోశ వ్యాధులకు చక్కని పరిష్కారం చూపుతుంది. బాటిల్ గార్డ్ అత్యధికంగా నీటి శాతాన్ని కలిగి ఉన్న బాటిల్ గార్డ్.. సొరకాయగా తెలుసు. ఇది మినరల్ వాటర్ బాటిల్స్‌ను మించిన పోషకాలను అందిస్తూ దేహానికి రక్షణగా నిలుస్తుంది. ఎండ కారణంగా కడుపులో తలెత్తే ఎసిడిటీ సమస్యకు సొరకాయ మేలైన పరిష్కారం చూపుతుంది. విపరీతమైన చెమట కారణంగా కోల్పోయే సోడియంను శరవేగంగా భర్తీ చేస్తుంది. అతి దాహాన్ని, అలసటను దూరం చేస్తుంది. -
నా భార్య నాకన్నా ఎత్తుంటే తప్పేముంది?
ఈడు జోడు మారింది చూడు కాంబినేషన్లో కొత్త మార్పులు ‘అమ్మాయి ఆకాశంలో ఉంటే వీడేమో భూమ్మీద. పెళ్లంటే ఈడూ జోడూ కుదరకపోతే ఎలా?’ ఇలాంటి ప్రశ్నలకు కాలం చెల్లింది. ఈతరహాపాత తరపు అభిప్రాయాలను పట్టించుకోని నవతరం.. ఈడు విషయంలో అబ్బాయి కన్నా అమ్మాయి చిన్నగా ఉండాలంటూ పెట్టిన ఆంక్షలను ఇప్పటికే స్పష్టంగా తిప్పికొట్టేసింది. అదే వేగంతో ఇప్పుడు జోడు విషయంలోనూ మార్పులకు సై అంటోంది. తనకన్నా ఎత్తున్న అమ్మాయిలను తలెత్తుకుని చూడడానికి మాత్రమే కాదు ఆమెతో కలిసి ఏడడుగులు నడవడానికి కూడా అబ్బాయిలు ముందుంటున్నారు. పెళ్లి అనే వ్యవస్థలో పురుషుడికి ఎక్కువ అధికారాలు కట్టబెట్టిన సంప్రదాయం.. వయసులోనూ, ఆకారంలోనూ.. కూడా పురుషాధిక్యతకే పెద్ద పీట వేసింది. అమ్మాయికన్నా అబ్బాయి వయసు, ఎత్తు ఎక్కువుండాలని నిర్ధేశించింది. ప్రస్తుత తరం ఈ కాంబినేషన్ రూల్‌ని తోసిరాజంటోంది. హైటెక్కినా.. ఓకే ‘నా భార్య నాకన్నా ఎత్తుంటే తప్పేముంది? అందులో నాకు చిన్నతనం అనిపించాల్సిన అవసరం ఏముంది?’ అని ప్రశ్నించారు పంజ గుట్టలో నివసించే మల్లీశ్వరరావు. తనకన్నా ఎత్తున్న శ్రీదేవిని ఆయన భార్యగా చేసుకున్నారు. ఈ విషయంలో ఆయన బంధువుల్లో కొందరు గుసగుసలాడకపోలేదు. అయితే దీన్ని ఆయన తేలిగ్గా తీసుకున్నారు. ‘మాది చింతపల్లి అనే పల్లెటూరు. అక్కడ భార్యకన్నా భర్త ఎత్తు తక్కువ ఉండడం అనేది నవ్వుకునే విషయమే. అయితే ఇదంతా తొలినాళ్లలోనే. ఇప్పుడు వాళ్లు కూడా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. మనసులు కలిసిన జంటలకు ఇవన్నీ చాలా చిన్న విషయాలు’అని చెప్పారాయన. అత్యాధునిక పోకడలను మోసుకొచ్చే ఫ్యాషన్ ర్యాంప్ మీద తరచూ మెరిసే సిటీ జంట ఆయేషా లఖోటియా, అజహర్ లఖోటియాలు సైతం ఈ విషయాన్ని ఎంతమాత్రం పట్టించుకోరు. ‘నా భార్య నాకన్నా హైట్ అనే విషయం నాకు గర్వంగానే అనిపిస్తుంది. నిజానికి షి ఈజ్ వెరీ గుడ్ లుకింగ్’ అంటారు అజహర్. ‘నేను హైట్ తక్కువున్నాను. నా కంటే తక్కువ హైట్ ఉన్న అమ్మాయిని చేసుకుంటే ఇద్దరికీ పుట్టే పిల్లలు మరీ పొట్టిగా పుట్టే అవకాశముంది. అందుకే నాకన్నా రెండు అంగుళాలు ఎక్కువున్న అమ్మాయిని పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నా’నన్నాడు శశాంక్. సినిమాలూ స్ఫూర్తి.. ‘నా హైట్ చూసి హీరోలు నా పక్కన నటించడానికి ఇబ్బంది పడుతున్నారు. అదే నాకు మైనస్ అయింది’ అంటూ వాపోయింది కొంత కాలం క్రితం మాజీ మిస్ యూనివర్స్ సుస్మితాసేన్. అయితే, ఇప్పుడా పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. దీపికా పదుకునే వంటి పొడుగుకాళ్ల బ్యూటీతో షారూఖ్, రణవీర్‌సింగ్ తదితర హీరోలు, సోనాక్షి సిన్హాతో షాహిద్ కపూర్ హాయిగా జట్టు కట్టేస్తున్నారు. ఆమీర్‌ఖాన్ (5.6 ఫీట్స్) కత్రినాకైఫ్ (5.9 ఫీట్స్)తో జంటగా నటనను పండిస్తున్నారు. రియల్ లైఫ్‌లోనూ ఒకరికొకరు అంటుకు తిరిగే సల్మాన్ (5.7), కత్రినాకైఫ్‌లు ఈ తరహా కాంబినేషన్‌కు నిలువెత్తు నిదర్శనం అని చెప్పొచ్చు. ఇప్పుడు టాలీవుడ్ కూడా అదే బాట పట్టింది. కృతి సనన్ (5.9 ఫీట్స్) వంటి టాల్గాళ్తో నాగచైతన్య (5.7 ఫీట్స్) లాంటి కుర్ర హీరోలు హైట్‌ను పక్కన పెట్టి మరీ జోడి కట్టారు. ప్రముఖుల పెళ్లిళ్లూ... తనకన్నా వయసు, హైట్ కూడా ఎక్కువున్న అమ్మాయిని పెళ్లాడిన సచిన్ టెండూల్కర్ జంట కూడా ఈ విషయంలో యూత్‌కి ఇన్స్పిరేషనే. ‘నా భార్య నాకన్నా ఎత్తు ఎక్కువుండడం వల్ల నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది’ అని చెప్పే రాజ్‌పాల్ యాదవ్ లాంటి బాలీవుడ్ నటులు ఈ తరహా ట్రెండ్‌కు ప్రమోటర్లుగా మారారు. ఇక సినీనటి దేవయాని, డెరైక్టర్ రాజకుమరన్ల జంట కూడా మరో ఎగ్జాంపుల్. రానున్న కాలంలో ఈడు జోడు అనేది రివర్స్ అయి అబ్బాయికన్నా అమ్మాయే ఎక్కువ వయసుండాలని, ఎత్తుండాలని కొత్త సంప్రదాయం పుట్టుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పొడవుతో గుడ్ లుక్.. చిన్న తనం నుంచే పొడుగున్న అమ్మాయిలంటే ఇష్టం. వాళ్లలో కనబడే కాన్ఫిడెన్స్, గుడ్‌లుక్స్ బాగా ఇష్టం. అందుకేనేమో నాకన్నా ఎత్తుగా ఉందని అందరూ అంటున్నా వెనుకాడకుండా ఆయేషాని పెళ్లి చేసుకున్నాను. మీ వల్ల హైహీల్స్ వేసుకోవాలనే నా కోరిక తీరడం లేదు.. అంటూ ఆయేషా అనే సరదా మాటలు తప్ప మా మధ్య మరే సమస్య లేదు. - అజహర్ లఖోటియా ఆదివారం ఆర్గానిక్ సందడి ఆర్గానిక్ ఫ్రూట్స్, కూరగాయలు, ఇంట్లో చేసిన బ్రెడ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ.. ఇలా ఎన్నో ఆదివారం అంగట్లో లభిస్తాయి. అలాగే టై గార్డెనింగ్, క్రియేటివ్ డిజైన్ స్పేస్ గురించి తెలుసుకోవచ్చు. బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు ఇది కొనసాగుతుంది. వీర్‌దాస్ షో... ప్రసిద్ధ భారతీయ స్టాండప్ కమెడియన్ వీర్‌దాస్ నగరంలో తన ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ‘అన్బిలీవబులిష్-ట్రూ వర్డ్స్ ఫ్రమ్ ది మౌత్ ఆఫ్ ఎ లయర్’ పేరుతో నిర్వహించే ఈ ప్రదర్శన ఆదివారం రాత్రి 8 గంటలకు శిల్పకళావేదిక లో ఉంటుంది. బాటిల్ ఆఫ్ బ్యాండ్స్.. నగరానికి చెందిన పలు రాక్ బ్యాండ్స్ పోటాపోటీగా తమదైన శైలి సంగీతంతో హోరెత్తిస్తూ సాగే బాటిల్ ఆఫ్ బ్యాండ్స్... కార్యక్రమం పంజాగుట్టలోని సెంట్రల్మాల్లో జరుగనుంది. ఈ బ్యాండ్స్ వార్ ఆదివారం సాయంత్రం 5గంటలకు ప్రారంభమవుతుంది. ఎంబ్రాయిడరీ వర్క్‌షాప్ బంజారా ఎంబ్రాయిడరీతో చేసే చేతి సంచులు, పర్సులు, రకరకాల గృహాలంకారాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కలర్‌ఫుల్ ఎంబ్రాయిడరీ నేర్చుకోవాలనుకునే వారి కోసం వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. ఎప్పుడు: మే 30, 31 ఎక్కడ: సికింద్రబాద్ అవర్ సేక్రెడ్ స్పేస్ ఉర్దూ గజల్స్‌కి ప్రాముఖ్యత ఎందుకు..! ఈ అంశం గురించి ప్రత్యేక చర్చా కార్యక్రమం జూన్ 2న సాయంత్రం 7 గంటలకు లామకాన్‌లో జరగనుంది. హైదరాబాద్, లక్నోకి చెందిన ప్రముఖ ఉర్దూ ప్రొఫెసర్లు పాల్గొంటున్న ఈ కార్యక్రమానికి ప్రవేశం ఉచితం. -
ఆర్ట్స్ ఆన్లైన్ - ఆర్ట్స్ ఆఫ్‌లైన్
మీరు చేసిన ఆర్ట్ వర్క్ ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో అమ్మటం ఎలాగో తెలుసుకోవాలనుకుంటే ఈ మీటప్ మీ కోసమే అంటున్నారు ఈ కార్యక్రమ నిర్వాహకులు. వివరాలు: ది గ్యాలరీ కఫే, బంజారాహిల్స్ రోడ్ నెం.10లో, ఉదయం 8.30కు -
లంబాడీ స్టైల్ ఎంబ్రాయిడరీ వర్క్‌షాప్
బంజారా ఎంబ్రాయిడరీతో చేసే చేతి సంచులు, పర్సులు, రకరకాల గృహాలంకారాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కలర్‌ఫుల్ ఎంబ్రాయిడరీ నేర్చుకోవాలనుకునే వారి కోసం వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. ఎప్పుడు: మే 30, 31 ఎక్కడ: సికింద్రబాద్ అవర్ సేక్రెడ్ స్పేస్ -
బాటిల్ ఆఫ్ బ్యాండ్స్..
నగరానికి చెందిన పలు రాక్ బ్యాండ్స్ పోటాపోటీగా తమదైన శైలి సంగీతంతో హోరెత్తిస్తూ సాగే బాటిల్ ఆఫ్ బ్యాండ్స్... కార్యక్రమం పంజాగుట్టలోని సెంట్రల్మాల్లో జరుగనుంది. ఈ బ్యాండ్స్ వార్ ఆదివారం సాయంత్రం 5గంటలకు ప్రారంభమవుతుంది. -
వీర్‌దాస్ షో...
ప్రసిద్ధ భారతీయ స్టాండప్ కమెడియన్ వీర్‌దాస్ నగరంలో తన ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ‘అన్బిలీవబులిష్-ట్రూ వర్డ్స్ ఫ్రమ్ ది మౌత్ ఆఫ్ ఎ లయర్’ పేరుతో నిర్వహించే ఈ ప్రదర్శన ఆదివారం రాత్రి 8 గంటలకు శిల్పకళావేదిక లో ఉంటుంది. -
క్లాసికల్ డ్యాన్స్‌తోనే భవిష్యత్తు..
బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్ సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి : ‘ఏ డ్యాన్స్‌లో రాణించాలనుకున్నా ముందస్తుగా సంప్రదాయ నృత్యం సాధన చేయాల్సిందే. క్లాసికల్ డ్యాన్స్‌లో ప్రావీణ్యం సాధిస్తే ఏ డ్యాన్సయినా సులువుగా చేయవచ్చు. నృత్యంలో రాణించాలనుకున్నవారు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి’ అని సూచించారు ప్రసిద్ధ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్. నగరానికి చెందిన ప్రసిద్ధ ఒడిస్సీ నృత్యకారిణి సోనాలి ఆచార్జీ మాదాపూర్‌లోని సోనాలి అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మోడ్రన్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ను ఆమె శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సరోజ్‌ఖాన్ మాట్లాడుతూ తాను ప్రాథమికంగా క్లాసికల్ డ్యాన్సర్‌ని కాబట్టే విభిన్న రకాల పాటలకు నృత్యాలను అందించగలిగానన్నారు. అయితే ఇప్పుడు సినిమాల్లో వచ్చే డ్యాన్స్‌లు చూస్తుంటే అవేమిటో తనకే అర్థం కావడం లేదన్నారు. కొన్ని సినిమాల్లో కొరియోగ్రాఫర్‌తో సంబంధం లేకుండానే డ్యాన్స్‌లు చేసేస్తున్నారని, ఈ మధ్య వచ్చిన ఒక సినిమాలో పాటకు హీరోనే డ్యాన్స్ డెరైక్షన్ చేసేశాడని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో, పొట్టి పొట్టి దుస్తుల హీరోయిన్లతో పనిచేయలేకే బాలీవుడ్లో కొరియోగ్రఫీ చేయడం లేదన్నారు. హైదరాబాద్‌లో సోనాలితో కలిసి ఇన్స్టిట్యూట్ ప్రారంభించడం సంతోషంగా ఉందంటూ ప్రతి 2 నెలలకు ఒకసారి నగరానికి వచ్చి స్టూడెంట్స్ ప్రతిభను పరిశీలిస్తానని, అలాగే రానున్న దీపావళికి 11 రోజుల పాటు ప్రత్యేకంగా వర్క్‌షాప్ నిర్వహించి పెద్ద ప్రదర్శన నిర్వహిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాతపస్వి తెలుగు సినీ దర్శకులు కె.విశ్వనాథ్ మాట్లాడుతూ సంప్రదాయ నృత్యం, సంగీతం మనసుకు ఆహ్లాదాన్ని అందిస్తాయన్నారు. సంగీతం, పాటలు తప్ప ఏముంటాయి ఆయన సినిమాలో అంటూ కొందరు విమర్శించినా... సిరిసిరిమువ్వ దగ్గర్నుంచి తన ప్రతి సినిమాలో వాటికే పెద్ద పీట వేశానని గుర్తు చేశారు. మన సంప్రదాయ మూలాల్ని మరిచిపోతే మనకంటూ ఉన్న గుర్తింపు కోల్పోతామని పిల్లలకు ఈ విషయంలో అవగాహన పెంచాల్సిన బాధ్యత పెద్దలదేనన్నారు. ఇన్స్టిట్యూట్ నిర్వాహకురాలు సోనాలి మాట్లాడుతూ సంప్రదాయ ఒడిస్సీతో పాటు బాలీవుడ్ నృత్యాల్లో కూడా తాము శిక్షణ అందిస్తామన్నారు. -
సమర మే చేద్దామిలా..
సూర్య@42.9 నిన్నా మొన్నటి దాకా కాస్త చూసీ చూడనట్టు ఉన్న సూరీడు.. ‘మే’ నెల, రోహిణీ కార్తె రోజుల్లో ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చాడు. కేవలం 4 రోజుల్లో అమాంతం పెరిగిన ఎండలు.. నగరవాసిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మండే ఎండలను ఎదుర్కోవడంలో మనకి తోడ్పడేందుకు వైద్యులు, ఫిట్నెస్ ట్రైనర్లు విలువైన సూచనలు అందిస్తున్నారు. - సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి గ్రీష్మ భానుడు ఉగ్రరూపం దాల్చాడు. రెండు రోజులుగా నగరంపై విరుచుకు పడుతున్నాడు. ఉదయం నుంచే తన విశ్వరూపం చూపుతూ ప్రజలను ఠారెత్తిస్తున్నాడు. ఎండలు ఒక్కసారిగా పెరగడంతో సిటీజనులు అల్లాడుతున్నారు. నీడ లేకుండా క్షణం నిలవలేకపోతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఒకవేళ వెళ్లినా గొంతు తడుపుకొనే మార్గం కోసం వెదుకుతున్నారు. బుధవారం ఎండకు తట్టుకోలేక ప్రజలు పడే పాట్లు ఇలా ‘సాక్షి’ కెమెరాకు చిక్కాయి. దాహమేస్తే ఇలా.. మూలు రోజులకన్నా ఈ సీజన్లో కనీసం 3 రెట్లు నీళ్లు అధికంగా తీసుకోవాలి. పళ్ల రసాలు, మజ్జిగ, రాగి మాల్ట్, నిమ్మరసం వంటివన్నీ ఉపయుక్తమైన ద్రవాహారాన్ని అందించేవే. ఫ్రిజ్ నీటిని తాగకుండా కుండలు, కూజాలే ఉత్తమం. విపరీతమైన దాహం వేసే వరకూ ఆగకుండా ఈ సీజన్లో తరచుగా నీరు, బార్లీ వంటి ద్రవాహారం తీసుకుంటుండాలి. సహజాహారమే సరైంది.. వేసవికాలం రుచికరమైన, ఆరోగ్యకరమైన సీజనల్ ఫ్రూట్స్‌కి విడిది. యాంటీ ఆక్సిడెంట్స్ నిండిన తాజా పండ్లు, కూరగాయలు దేహాన్ని చల్లబరచడంలో, విటమిన్లు, మినరల్స్‌ను అందించడంలో ఉపకరిస్తాయి. వీటిలో.. బ్లాక్ బెర్రీస్, బ్లూ బెర్రీస్, స్ట్రా బెర్రీస్, రాస్ బెర్రీస్, బొప్పాయి, పచ్చి మామిడి, చెర్రీస్, యాపిల్, పుచ్చకాయ, ఉసిరి.. వంటివి విరివిగా ఉపయోగించడం మంచిది. కూరగాయల్లో కాకరకాయ, క్యాబేజి, కాలిఫ్లవర్, బ్రాక్కొలి, దోస, గ్రీన్‌బీన్స్, ఆస్పారెగస్, అల్ఫా అల్ఫా, పెద్ద వంకాయ, ఐస్‌బర్గ్, పుదీనా... వంటివి నీటి పరిమాణాన్ని దేహంలో సమపాళ్లలో ఉంచేందుకు ఉపకరిస్తాయి. మాంసాహారం పరిమితం చేయాలి. చెమట కారణంగా కోల్పోయే శక్తిని సులభంగా పొందేందుకు ప్రోటీన్ షేక్స్ తీసుకోవచ్చు. ఓట్మీల్, బ్రౌన్ రైస్, తియ్యటి బంగాళ దుంపలు ఆహారంలో భాగం చేస్తే బెటర్. ఆహారంతో ఓ టేబుల్ స్పూన్ ఫ్లాక్స్‌సీడ్ ఆయిల్‌ను రోజుకు ఒకటి లేదా రెండు సార్లు కలిపి తీసుకుంటే దేహానికి అవసరమైన ఫాటీ యాసిడ్స్ అందుతాయి. స్నానమే పరిష్కారం.. చమట పూర్తిగా ఆరాక మాత్రమే స్నానం చేయాలి. కనీసం రోజుకు 2 లేదా వీలైతే 3 సార్లు స్నానం, దీనికి వినియోగించే నీళ్లలో రోజ్ వాటర్, ఆల్మండ్ ఆయిల్ లాంటి మెడికేటెడ్ ఉత్పత్తులు కలపడం మేలు. ఉదయపు స్నానం వంట్లో బడలికను పోగొట్టి హుషారుగా చేసేందుకు సహకరిస్తే, రాత్రి వేళ స్నానం మలినాలను తొలగించి చక్కని నిద్ర కు తోడ్పడుతుంది. మంచి నిద్ర మజిల్ పునరుత్తేజానికి అవసరం. ఆరోగ్య సమస్యలేమీ లేకపోతే చన్నీళ్ల స్నానం బెటర్ అంటున్నారు కేర్ క్లినిక్స్‌కు చెందిన ‘ఫిజియో’ శశిశేఖర్. మేలైన మార్గం యోగా వేసవిలో యోగా చాలా మంచిదని కపిలమహర్షి యోగా రీసోర్స్ సెంటర్‌కు చెందిన యోగా నిపుణులు సి.ఎస్.రావు చెబుతున్నారు. సూర్య నమస్కారం 12 భంగిమలు లెక్కిస్తూ చేయాలి. భంగిమకి 5 సెకన్లు చొప్పున కేటాయిస్తూ ఓ నిమిషం సమయంలో పూర్తి చేయాలి. వేసవి కాలానికి తగ్గట్టుగా నిదానంగా చేసే ఈ సూర్య నమస్కారాలను రోజులో 6 సార్లు ఆచరిస్తే వేసవి కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు దరిచేరవు. ఉష్ట్రాసనం, భద్రాసనం, ఏకన్ముక్తాసనం, శశాంకాసనం, అర్ధకోణాసనం, ప్రశాంతాసనం, యోగనిద్ర, షణ్ముఖి ముద్ర ఆసనాలు కూడా మంచివే. నేలపై కూర్చుని, పడుకుని చేస్తూ ఒక ఆసనం లోంచి మరో ఆసనంలోకి మారేటప్పుడు సాధారణ శ్వాస తీసుకుంటూ రెండు శ్వాసల వ్యవధి ఉండేలా చూడాలి. శీతలి, ఉజ్జయి, చంద్రఖేధిని, నాడిశోధన చేయడం ద్వారా ఎండ వేడిమి వల్ల కలిగే శారీర క ఇబ్బందులన్నింటినీ అధిగమించవచ్చు. -
పెయింటింగ్ వర్క్‌షాప్
ఆలోచనలకు రంగులద్ది, చక్కటి పెయింటింగ్స్ వేయాలని అనుకునే వారికోసం సికింద్రాబాద్‌లోని అవర్ సాక్రెడ్ స్పేస్‌లో వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. ఈనెల 16, 17 తేదీల్లో జరిగే వర్క్‌షాప్ చిత్రలేఖనంలో బేసిక్స్ తెలుసుకోవాలనుకునే వారికి చక్కటి అవకాశం. వాటర్ కలర్స్‌ను వాడుతూ అందమైన ఊహలకు రూపమివ్వడానికి ఉపకరించేలా ఇది కొనసాగుతుంది. -
‘పర్సనల్ సేఫ్టీ’పై అవగాహన
పిల్లలు, పెద్దలకు వ్యక్తిగత భద్రత పట్ల అవగాహన కలిగించేందుకు ఈనెల 16న సాయంత్రం 4.30 గంటలకు బంజారాహిల్స్ లామకాన్‌లో చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆలోచనా విధానాలు, యంత్రాంగాలు ఇలా వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అన్ని కోణాలపై చర్చించనున్నారు. పిల్లల భద్రత గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించడానికి సిద్ధంగా ఉన్న టీనేజర్, యంగ్‌స్టర్, పేరెంట్స్ అందరూ ఈ చర్చలో పాల్గొనవచ్చని కార్యక్రమ నిర్వాహకులు మిహిరా అపరేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 15 ఏళ్లు పైబడిన వారు ఎవరైనా పాల్గొనవచ్చు. ప్రవేశం ఉచితం. తబలా క్లాసెస్ సుహాస్ ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో ఉదయం 10 నుంచి 11 వరకు బంజారాహిల్స్ లామకాన్‌లో తబలా శిక్షణా తరగతులు నిర్వహిస్తారు. -
ఫ్లాట్ డిస్కౌంట్
సిటీలోని బ్రాండ్ ఫ్యాక్టరీ ఫ్లాట్ 40 శాతం రాయితీని ప్రకటించింది. పురుషులు, మహిళలు, పిల్లలకు సంబంధించిన అన్ని వస్త్రాలపై ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. స్పోర్ట్స్ షూస్, లగేజి, ఉమెన్ హ్యాండ్ బాగ్స్కు కూడా వర్తించే ఈ డిస్కౌంట్ ఈనెల 15 నుంచి 24 వరకు అందుబాటులో ఉంటుంది. యునెటైడ్ కలర్స్ ఆఫ్ బెనెటన్, కలర్ ప్లస్, జాన్ ప్లేయర్, పార్క్స్, పార్క్ అవెన్యూ, రేమండ్స్, మినరల్, లీ, రాంగ్లర్, నైకీ, పూమా, జీని అండ్ జానీ తదితర బ్రాండ్స్ అందుబాటులో ఉన్నాయని బ్రాండ్ ఫ్యాక్టరీ ప్రతినిథి రాక్ డిసౌజా తెలిపారు. -
హోటల్ మేనేజ్మెంట్లో ఉచిత శిక్షణ
హయత్‌నగర్: నిథం-ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ ఆధ్వర్యంలో హోటల్ మేనేజ్మెంట్లో ఉచిత శిక్షణను ఇస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి పాసై, 18-30 సంవత్సరాల వయసుగల వారు దరఖాస్తులు చేసుకోవాలని వారు తెలిపారు. వివరాలకు 9959173183, 9989313278 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. -
ఆన్లైన్ మార్కెటింగ్ కోర్సు
ఆన్లైన్ మార్కెటింగ్ మెళకువలను నేర్పేందుకు ఈనెల 18 నుంచి కొత్త బ్యాచ్‌ను ప్రారంభిస్తోంది మాదాపూర్‌లోని డిజిటల్ మార్కెటింగ్ సంస్థ. ఇప్పటికే బిజినెస్ రంగంలో ఉన్నవారితో పాటు గృహిణులు, స్టార్టప్ యజమానులు, ఎంటర్‌ప్రెన్యూర్స్, మేనేజ్మెంట్ స్టడీస్, అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ ప్రొఫెషనల్స్‌కు ఈ ఆన్లైన్ మార్కెటింగ్ లాభదాయకమని సంస్థ తెలిపింది. డిజిటల్ మార్కెటింగ్‌లో వస్తున్న నయా ట్రెండ్ విషయాలను చెప్పేందుకు ఫ్రీ డెమో క్లాస్‌లను నిర్వహిస్తోంది. ఆసక్తి గలవారు 088015 66566 నంబర్లో సంప్రదించవచ్చు. -
నా ప్రతి అడుగులో అమ్మ ఉంది..
‘శాంత బయోటెక్’ ఫౌండర్‌గా పరిచయం అవసరంలేని ప్రముఖ వ్యాపారవేత్త, శాస్త్రవేత్త వరప్రసాద్ రెడ్డి. ఎన్ని పదవులు వరించినా.. ఎంత పెద్ద హోదాలో ఉన్నా అమ్మకు నచ్చిన తనయుడిగా ఉంటే చాలనుకునే వరాల పుత్రుడు ఆయన. తాను ఎదిగిన ప్రతి మలుపులో అమ్మ తోడ్పాటు ఉందని.. అమ్మ పుట్టిన రోజును (మే 9) ‘మాతృ దినోత్సవం’గా జరుపుకుంటున్నారాయన. ‘నాఎదుగుదలకు కారణం అమ్మ’ అని ఆయనంటే.. ‘నేనేం చేసానయ్యా నీకు జన్మతహా వచ్చింది.. సాధించావు’.. అంటుందా తల్లి. మాతృదినోత్సవం సందర్భంగా ఆ తల్లి, తనయుల మాటలు.. ‘ఇంట్లో స్త్రీ చదువు, సంస్కారవంతమైనది అయితే ఆ ఇంట్లో అందరూ సంస్కారవంతులవుతారు. బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే ఆమె ఆలోచనలు, తినే ఆహారం, చదివే పుస్తకం, వినే శబ్దాలు, సంగీతం అన్నీ బిడ్డ మీద ప్రభావం చూపిస్తాయి. అవి సహజంగానే బిడ్డకు అబ్బుతాయి. ప్రణాళికాబద్ధ మైన జీవితం, ఆధ్యాత్మిక చింతన, ఏ విషయానికి ఉద్రేక పడకుండా ఉండే స్వభావం ఆమె నుంచే వచ్చాయి. గురువు చదువు నేర్పిస్తే.. సంస్కారం అమ్మ నేర్పుతుంది. సంస్కారం లేకపోతే సంపూర్ణమైన వ్యక్తిత్వం రాదు’.. కృతజ్ఞతగా చెప్పారు కొడుకు వరప్రసాద్ రెడ్డి. ‘అమ్మ నాలుగున్నర కల్లా లేస్తారు. ఆ సమయానికి లేచి ఆమెతో పాటు కాసేపు కూర్చుని మిగతా పనులు మొదలుపెడతాను. నేనున్న వృత్తిలో ప్రయాణాలు ఎక్కువ. దానివల్ల అమ్మను రోజూ చూసే అవకాశం ఉండదు. చాలా బాధగా ఉండేది. రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు ఎక్కువగా ఆఫీస్‌కి వెళ్లడం లేదు. అమ్మతో ఎక్కువ టైం గడుపుతున్నాను. నేనొక్కడినే ఆమెకు సంతానం. ఈ వయసులో ఆమెకు ఇవ్వగలిగిన బహుమతులు ఏం ఉంటాయి..! మధ్య వయస్కులకు, చిన్న పిల్లలకు బహుమతులు ఇస్తాం. ఈ వయసులో ఆమె నగలు, చీరలు వేసుకోలేదు. అందుకే ఏడేళ్ల క్రితం ఆమెకు ఉత్తరం రాశాను. ఆమె దాన్ని చదువుకుని, మనసంతా తడైపోయింది. ‘మడిచి జేబులో పెట్టుకునే ఉత్తరం కాదు, నీ బిడ్డలు దీన్ని చూడాలి. వాళ్ల తల్లిని వారు అలాగే చూసుకోవాలి. పటం కట్టించు’ అంది. అమ్మకు నేనిచ్చిన బహుమతి నచ్చింది’. కొడుకు సంతోషం. ‘ఏదో రామాయణం, భారతంలో కథలు చెప్తే ఊ.. కొట్టేవాడు. నిద్దరొస్తే పడుకునేవాడు. ఇంట్లో పది మంది పిల్లలున్నా వారితో చేరి అల్లరి చేసేవాడు కాదు. అతిశయంగా చెప్పటం లేదు. చెప్పింది వినేవాడు. ఒక్కమాట ఎవరినీ అనేవాడు కాదు. దేవుడి నైవేద్యం కూడా పెట్టేవరకూ తాకేవాడు కాదు. పుట్టుకతో వచ్చిన లక్షణాలే అవి’.. అంటుంది శాంతమ్మ. ‘పది మందికి ఉపయోగపడేలా ఉండమని, నిస్వార్థంగా చేసేది మనకు కలిసొస్తుంది నాయనా.. అని చెప్పానే తప్పా ఫలానా పని చెయ్యి.. వద్దు అంటూ చెప్పలేదు. తినేది నలుగురికి పెట్టేవాడు. ఇప్పటికీ అదే తీరు. ఇంట్లో ఏది చేసినా తీసుకెళ్లి నలుగురు పిల్లకాయలకు పెట్టి తింటాడు. అలా పెరిగిన క్రమంలో వంటపట్టినని ఏమన్నా ఉన్నాయేమో గాని, నేను ప్రత్యేకంగా ఏమీ నేర్పలేదు. తల్లికి పిల్లలు వృద్ధిలోకి రావాలనే ఉంటదిగా. పెద్దోడై, మంచి మనసుతో, మంచి ఉద్దేశంతో, పది మందికి ఉపయోగపడే మనస్తత్వం కలవాడు కావాలని అనుకుంటాం. మాది వ్యవసాయ కుటుంబం. అయిదో తరగతి చదువున్న దాన్ని. గొప్పగా ఏం చెప్పగలను’ అంటుంది భూషణం లాంటి కొడుకుని కన్న ఈ బంగారు తల్లి. ‘ఆ రోజుల్లో 5వ తరగతి వరకే చదువుకున్నప్పటికీ సాహిత్యం, పురాణ, ఇతిహాసాల మీద పట్టు ఉంది. వాటి సారం వివరించేది. మంచి, చెడుల మధ్య విచక్షణ తెలుసుకుంది. చదువు భుక్తి కోసం అయితే సంస్కారం జీవన్ముక్తికి అవసరం. అమ్మ నుంచి మనకొచ్చే ఈ సంస్కారం మనం గుర్తించం. తల్లి దగ్గర అది నేర్చుకున్నాం అని కూడా చెప్పం. అలా ఆమె ఇచ్చిన సౌభాగ్యాన్ని మదర్స్‌డే రోజు బోకే ఇచ్చి తీర్చుకోలేం. ప్రతి రోజు ఆమె కోసం ఆలోచించాలి’. ఇది ఆ కొడుకు కృతజ్ఞత. ‘పద్యం దాని తాత్పర్యం చెప్పేదాన్ని.. బుద్ధిగా వినేవాడు. సుభాషితాలు, వేమన, సుమతి శతకాలు అన్నీ నీతి వాక్యాలే కాబట్టి అవి ఆకట్టుకుని ఉండవచ్చు. అంతేగాని నేను ప్రత్యేకంగా కొట్టి, తిట్టి చెప్పింది, నేర్పించింది ఏమీ లేదు. తోటి పిల్లలతో ఆడుకోవటం కన్నా నా దగ్గరే ఎక్కవ సేపు గడిపేవాడు’. ఆ అమ్మ నిరాడంబరత. ‘స్త్రీ బాగుంటే సమాజం, పరిజనం అంతా బాగుంటాయి. ఆ ఉద్దేశంతోనే తల్లిని బాగా చూసుకోవాలి. అమ్మ రుణం తీర్చుకోవాలంటే అమ్మకు అమ్మగా పుట్టాలి. అప్పుడే ఆమె చేసినంత సేవ ఆమెకు చేయగలం’ అమ్మా నీవే నేను నేనే నీవు నేను నీలో అంతర్భాగానిని నీవు నాలో అంతర్వాహినివి..! -
‘అమ్మ’దనానికి ప్రతీక యశోదమ్మ
‘మాది మధ్యతరగతి కుటుంబం. నాన్న రామచందర్ రావు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆర్ఐ. ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలకు వెళుతుండేవారు. ఇదే క్రమంలో నల్లగొండ జిల్లాలోని గుమ్మడివెల్లి గ్రామం నుంచి హన్మకొండకు మకాం మార్చాం. నాన్న మరో ప్రాంతానికి బదిలీ అయ్యారు. అమ్మ యశోదా దేవి మా చదువుల కోసం హన్మకొండలోని శివారు గ్రామాల్లో భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేశారు. కాజీపేటలోని సెయింట్ గాబ్రియల్ స్కూల్లో పదో తరగతి వరకు చదివించారు. ఇంటర్ తర్వాత బ్రదర్స్ సురేందర్ రావు, నరేందర్ రావు మెడిసిన్‌లో చేరారు. నేను ఇంజనీరింగ్ పూర్తి చేశా. మరో బ్రదర్ సీఏ చేశాడు. మమ్మల్ని సరైన మార్గంలో నడపడంలో మా అమ్మ పాత్ర మరవలేనిది. వృధా ఖర్చులకు ఎప్పుడూ దూరంగా ఉంచేది. తెల్లవారుజామునే లేపి చదివించడంతో పాటు చదువుకుంటేనే జీవితంలో ఏదైనా సాధించవచ్చని పదేపదే చెప్పేది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వం మాకు చిన్నప్పటి నుంచే అమ్మ అలవర్చారు. అమ్మ మీద ప్రేమ, గౌరవంతో యశోద హాస్పిటల్స్ ప్రారంభించాం. 1989లో ఒక చిన్న క్లినిక్‌గా ప్రారంభమైన యశోద హాస్పిటల్ పాతికేళ్ల కాలంలో అగ్రశ్రేణి వైద్య సంస్థగా ఎదగడంలో అమ్మ దీవెనలు ఉన్నాయి. తల్లిగా.. కుటుంబానికి పెద్ద దిక్కుగా.. సంకల్పంతోనూ.. శ్రమించే తత్వంతోనూ.. అంకితభావంతోనూ, క్రమశిక్షణతోనూ ఎందరికో ఆదర్శమూర్తి అయిన అమ్మ జీవితం ఈతరం వారికి స్ఫూర్తి అవుతుందని అనుకుంటున్నా. ఇప్పుడు అమ్మ మా మధ్యలో లేకున్నా... ఆమె చూపిన మార్గంలోనే ముందుకెళుతున్నాం’. - గోరుకంటి రవీందర్రావు, చైర్మన్, యశోద హాస్పిటల్స్ -
'అర్ధగంట చేజింగ్ తర్వాత దొరికాడు'
ఎంతటివారైనా బాల్యాన్ని గుర్తు చేసుకుంటే అమ్మతో గడిపిన క్షణాలే జ్ఞాపకాల దొంతర్లుగా కళ్ల ముందు కదలాడతాయి. ప్రతిచోటా అమ్మ చూపిన ప్రేమానురాగాలే గుర్తుకు వస్తాయి. ఏమిచ్చినా అమ్మ రుణం తీరదు. లోకంలో ఏదీ అమ్మ ప్రేమకు సాటిరాదు. అమ్మతో ఉన్న అనుబంధాన్ని కొందరు ప్రముఖులు ఇలా గుర్తు చేసుకున్నారు. వారి మాటల్లోనే... ‘1950 మార్చి మూడో తేదీ...నెల్లూరు జిల్లా మొలాపేట.. ఒక కుర్రాడి కోసం సందుల్లో నలుగురు పరుగెత్తుతున్నారు. గోడలు దూకేస్తున్నారు. అరగంట చేజింగ్ తర్వాత దొరికాడు. పట్టుకొని ఇంటికి తీసుకొచ్చారు. అక్కడ ఒక ఆవిడ కాళ్ల మీద కుర్రాడిని బలవంతంగా పడుకోబెట్టారు. ఉగ్గుగిన్నెలోని వంటాముదం కుర్రాడి నోట్లో పోశారు. ఆ కుర్రాడు ఇప్పటి నటుడు జయప్రకాశ్ రెడ్డి. కాళ్ల మీద కుర్రాడిని పెట్టుకుంది జేపీ అమ్మ సాంబ్రాజ్యమ్మ. ‘రెండు, మూడు నెలలకోసారి నేను పరుగెత్తే సీన్ రీపిట్ అవుతుండేద’ని అమ్మతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు జేపీ. విసుక్కునేది కాదు.. నాన్న సాంబిరెడ్డి పోలీసు ఆఫీసర్. రోజూ పదుల సంఖ్యలో జనాలు ఇంటికి వచ్చేవారు. వారందరికీ టీతో సరిపెట్టకుండా మా అమ్మ టిఫిన్లు కూడా చేసేది. అస్సలు విసుక్కునేది కాదు. పెద్దయ్యాక నాటకాలు వేస్తూ రాత్రి ఒంటి గంటకు ఇంటికి చేరేవాణ్ని. నాతోపాటు ఐదారుగురు ఆర్టిస్టులు వచ్చేవారు. ఆ టైమ్‌లోనూ అమ్మ ఎంతో ఓపికగా అందరికీ భోజనం పెట్టేది. పూర్తి శాకాహారి.. మా అమ్మ ప్యూర్ వెజిటేరియన్. మా కోసమే నాన్‌వెజ్ వండడం నేర్చుకుంది. ఆమె మాత్రం శాకాహారమే తినేది. అమెరికాలో బ్రదర్స్‌తో కలిసి 18 ఏళ్లు ఉంది. అక్కడ బ్రదర్ ఫ్రెండ్స్ అమెరికా వాళ్లు అమ్మ వంట రుచికి ఫిదా అయిపోయారు. పక్షవాతం వచ్చిన నాన్నను కంటికి రెప్పలా చూసుకోవడం ఇప్పటికీ నా మదిలో కదలాడుతునే ఉన్నాయి. ఇప్పుడు 84 ఏళ్లు.. నేను చిన్నగా ఉన్నప్పుడే అమ్మకు టీబీ సోకింది. చెన్నైలో వైద్యం చేయిస్తే తగ్గిపోయింది. ఇప్పడు అమ్మకు 84 ఏళ్లు. ఓపెన్ హార్ట్ సర్జరీ కావడంతో అమ్మను మూడున్నరేళ్ల క్రితం గుంటూరుకు తీసుకొచ్చా. చంటి పిల్లలా వ్యవహరిస్తున్న అమ్మను చూస్తుంటే నా చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి. తన తల్లికంటే ఎక్కువగా మా అమ్మను జాగ్రత్తగా చూసుకునే భార్య దొరకడం నా అదృష్టం’’.