collegium system
-
ఆర్టికల్ 370 రద్దు : ‘సుప్రీం కోర్టు తీర్పు కలవరపరించింది’
ముంబై: న్యాయ కోవిదుడు, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి రోహింగ్టన్ ఫాలీ నారీమన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారి తీశాయి. ఇటీవల సుప్రీం కోర్టు ఆర్టికల్ 370 రద్దుపై వెలువరించిన తీర్పు, కొలీజియం వ్యవస్థ, ఎలక్షన్ కమిషనర్ల నియామకం బిల్లు వంటి అంశాలపై ఆయన శుక్రవారం ఆసియాటిక్ సోసైటీ ఆధ్వర్యంలో ‘కాన్స్టీట్యూషన్: చెక్ అండ్ బ్యాలన్సస్’ మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పు తనని చాలా కలవెరపెట్టిందని తెలిపారు. ఆర్టికల్ రద్దు విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవడానికి నిరాకరించిందని తెలిపారు. అయితే దానివల్ల రాజ్యాంగ విరుద్ధమైన చర్యను కొనసాగించడానికి అనుమతి ఇచ్చినట్లు అవుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకాలకు సంబంధించిన బిల్లు ఇటీవల రాజ్య సభలో ఆమోదం పొందిన విషయం కూడా తనను తీవ్ర కలవరానికి గురి చేసిందని చెప్పారు. ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత.. అసలు ఈ దేశంలో ఏం జరుగుతోందని అసహనం వ్యక్తం చేసినట్లు తెలిపారు. జడ్జిలను ఎంపిక చేసే ప్రస్తుత కొలీజియం వ్యవస్థ కూడా దారుణమైనదని కానీ,అది కొంతమేరకు మేలేనని తెలిపారు. రిటైర్డ్ న్యాయమూర్తులతో కూడిన కొలీజియంను తాను సూచిస్తానని అన్నారు. అందులో ఉండేవారు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతారని తెలిపారు. ప్రధాని న్యాయమూర్తి, సీనియర్ న్యాయమూర్తుల సూచనలు కూడా తీసుకుంటారని అన్నారు. అనంతరం వారు న్యాయమూర్తులను సిఫార్సు చేస్తారని చెప్పారు. చదవండి: ఆధార్‌పై ప్రశ్నలకు భారీ స్పందన.. -
కొలీజియమే అత్యుత్తమం: సీజేఐ
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థా పరిపూర్ణమూ, లోపరహితమూ కాజాలదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామక వ్యవస్థ అయిన కొలీజియాన్ని గట్టిగా సమర్థించారు. కేంద్రం, న్యాయవ్యవస్థ మధ్య కొలీజియం వ్యవస్థ తీవ్ర విభేదాలకు కారణంగా మారడం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఇండియాటుడే సదస్సులో సీజేఐ మాట్లాడుతూ కొలీజియంను అత్యుత్తమ వ్యవస్థగా అభివర్ణించారు. న్యాయవ్యవస్థపై బయటి ఒత్తిళ్లు, ప్రభావాలు లేకుండా కాపాడుకోవాల్సి ఉందంటూ నర్మగర్భ వ్యాఖ్యలు కూడా చేశారు. అప్పుడే అది స్వతంత్రంగా పని చేయగలుగుతుందన్నారు. కొలీజియం చేసిన కొన్ని సిఫార్సులకు ఆమోదం తెలపకపోవడానికి ప్రభుత్వం పేర్కొన్న కారణాలను కొలీజియం బయట పెట్టడంపై కేంద్ర న్యాయ మంత్రి కిరెన్ రిజిజు అసంతృప్తిని సీజేఐ తోసిపుచ్చారు. ‘‘వీటిపై న్యాయ మంత్రితో చర్చకు దిగదలచుకోలేదు. కానీ భిన్నాభిప్రాయాలు సర్వసాధారణం’’ అన్నారు. అయితే కేసుల విచారణ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తమపై ఎలాంటి ఒత్తిడీ లేదని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తాజా తీర్పే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. ఏ కేసులో ఎలాంటి తీర్పు ఇవ్వాలో గత 23 ఏళ్లలో ఎవరూ తనపై ఒత్తిడి తేలేదన్నారు. అలాగే న్యాయమూర్తుల లైంగిక ప్రవృత్తికి, వారి సామర్థ్యానికి సంబంధం లేదంటూ ఈ సందర్భంగా సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కొలీజియం సిఫార్సు చేసిన వారిలో కొందరు తాము స్వలింగ సంపర్కులమని ప్రకటించుకోవడం తెలిసిందే. -
కొలీజియం సిఫార్సులపై సాగదీత...
ముంబై: కొలీజియం వ్యవస్థపై కేంద్ర న్యాయ మంత్రి కిరెణ్ రిజిజు చేస్తున్న విమర్శలను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రోహింటన్ ఫాలీ నారిమన్ శనివారం తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘సాధారణ పౌరునిగా కొలీజియంతో పాటు ప్రతి వ్యవస్థనూ విమర్శించవచ్చు. కానీ ఒక బాధ్యతాయుతమైన మంత్రిగా మాత్రం నియమ నిబంధనలకు, కట్టుబాట్లకు లోబడి ఉండాల్సిందే’’ అన్నారు. కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను కేంద్ర ప్రభుత్వం సుదీర్ఘకాలం పాటు పెండింగ్‌లో పెడుతున్న వైనాన్ని ప్రజాస్వామ్యానికి పెను ముప్పుగా ఆయన అభివర్ణించారు. ‘‘నిర్భీతితో కూడిన స్వతంత్ర న్యాయమూర్తులు లేకుండా పోతే పరిస్థితేమిటి? న్యాయ వ్యవస్థ మన చివరి ఆశా కిరణం. అది కూడా కుప్పకూలితే దేశానికిక చీకటి రోజులే. తప్పో, ఒప్పో.. 1993 నాటి సుప్రీంకోర్టు తీర్పు ద్వారా కొలీజియం వ్యవస్థ పుట్టుకొచ్చింది. దాన్ని గౌరవించడం కేంద్రం విధి. ఎందుకంటే అన్ని వ్యవస్థలూ సుప్రీంకోర్టు తీర్పులకు కట్టుబడాల్సిందే’’ అన్నారు. తనకు అనుకూలమైన కొలీజియం వచ్చి పాత సిఫార్సులపై పునరాలోచన చేస్తుందనేది కేంద్రం వైఖరి అని అభిప్రాయపడ్డారు. అందుకే కొలీజియం సిఫార్సులపై 30 రోజుల్లోగా కేంద్రం స్పందించని పక్షంలో దాన్ని అంగీకారంగానే పరిగణించేలా ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించాలన్నారు. -
తప్పో.. ఒప్పో.. అంగీకరించడం మీ విధి: నారిమన్
ముంబై: న్యాయ కోవిదుడు, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి రోహింగ్టన్ ఫాలీ నారీమన్.. తాజాగా చేసిన కామెంట్లు విస్తృత చర్చకు దారి తీశాయి. కొలీజియం వ్యవస్థకు వ్యతిరేకంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారాయన. ఈ క్రమంలో ఆయన ఆసక్తికర ప్రకటన చేశారు. న్యాయమూర్తుల నియామక ప్రక్రియ(కొలీజియం సిఫార్సులు) ఆలస్యమైతే.. ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లినట్లేనని అభిప్రాయపడ్డారు మాజీ న్యాయమూర్తి నారీమన్. కొలీజియం వ్యవస్థ విషయంలో కేంద్రం వర్సెస్ న్యాయవ్యవస్థ మధ్య కొనసాగుతున్న వైరుధ్యం తెలిసిందే. ఈ క్రమంలో కిరణ్ రిజిజు.. న్యాయ వ్యవస్థ అసలు పారదర్శకంగా లేదని, న్యాయమూర్తుల నియామక ప్రక్రియ కూడా పాత పద్ధతిలోనే (NJAC ద్వారా) కొనసాగాలంటూ కామెంట్లు చేస్తూ వస్తున్నారు. అయితే.. ముంబైలో జరిగిన ఓ లా ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ.. నేరుగా కేంద్ర న్యాయమంత్రిపైనే విమర్శలు ఎక్కు పెట్టారు. కోర్టు ఇచ్చే తీర్పులు తప్పో ఒప్పో.. ఏవైనా సరే వాటిని అంగీకరించాల్సి ఉంటుందని, మీ విధులకు మీరు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ఉందని న్యాయశాఖ మంత్రి రిజిజును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మీడియా సాక్షిగా న్యాయవ్యవస్థను లా మినిస్టర్ కిరెన్ రిజిజు ‘న్యాయవ్యవస్థలో పారదర్శకత అవసరం’ అంటూ విమర్శించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ఇప్పుడు మీరు విమర్శించొచ్చు. ఒక పౌరుడిగా నేనూ విమర్శించొచ్చు. ఎలాంటి సమస్య లేదు. కానీ, మీరిప్పుడు ఒక యంత్రాంగం అనే విషయం గుర్తుంచుకోండి. కోర్టులు ఎలాంటి తీర్పులు ఇచ్చినా కట్టుబడాల్సిందే.. అంగీకరించాల్సిందే’’ అని పేర్కొన్నారాయన. స్వతంత్రంగా, ఏ మాత్రం బెదరక తీర్పులిచ్చే న్యాయమూర్తులు దేశానికి అవసరమని, వాళ్లు గనుక లేకుంటే న్యాయవ్యవస్థ కుప్పకూలిపోతుందని, దేశం కొత్త చీకటి యుగంలోకి నెట్టేయబడుతుందని నారీమన్ అభిప్రాయపడ్డారు. పనిలో పనిగా.. దేశ అత్యున్నత న్యాయవ్యవస్థకు సైతం ఆయన ఓ సలహా ఇచ్చారు. కొలిజీయం ప్రతిపాదలను నిర్వీర్యం చేసే ఆలోచన ఏమాత్రం మంచిది కాదని, అసలు కొలిజీయం సిఫార్సుల మీద కేంద్ర ప్రభుత్వ స్పందన కోసం 30 రోజుల గడువు విధించాలని, ఆలోపు స్పందన లేకుండా ఆ సిఫార్సులు వాటంతట అవే ఆమోదించబడాలని సుప్రీం కోర్టుకు సూచించారు. కొలీజియం స్వతంత్రంగా లేకపోతే దాని నిర్ణయాలు ఒకరిద్దరికే అనుకూలంగా వస్తాయన్నారు. కొలీజియం వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు చర్యలు తీసుకోకుండా దాన్ని తొలగించాలని చూడకూడదని చెప్పారు. ఇదిలా ఉంటే మాజీ న్యాయమూర్తి రోహింటన్ ఫాలి నారీమన్.. ఆగస్టు 2021లో రిటైర్ అయ్యారు. అయితే.. అంతకు ముందు ఆయన కొలీజియం వ్యవస్థలో భాగం పంచుకున్నారు. -
కొలీజియం కాక.. కేంద్రం, న్యాయ వ్యవస్థ మధ్య ముదురుతున్న వివాదం
సుప్రీంకోర్టు కొలీజియం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ నడుమ వివాదంగా మారిన అంశం. కొలీజియం వ్యవస్థను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకం, బదిలీల్లో తమ పాత్ర లేకపోవడం ఏమిటంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కొలీజియం వ్యవస్థే రాజ్యాంగ విరుద్ధమంటూ పలువురు కేంద్ర మంత్రులు బాహాటంగా గళం విప్పుతున్నారు. కొలీజియం సభ్యులేమో సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల నియామకానికి తాము సిపార్సులు మాత్రమే చేస్తామని, తుది నిర్ణయం కేంద్రానిదేనని అంటున్నారు. ఏమిటీ కొలీజియం...? సుప్రీంకోర్టు న్యాయమూర్తుతో పాటు దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల నియామకం, బదిలీలను సిఫార్సు చేయడానికి ఉద్దేశించినదే కొలీజియం వ్యవస్థ. సుప్రీంకోర్టు కొలీజియంలో ప్రధాన న్యాయమూర్తి, మరో నలుగురు అత్యంత సీనియర్ న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు. న్యాయమూర్తుల నియామకం, బదిలీల విషయంలో కొలీజియంలో భిన్నాభిప్రాయాలు ఉంటే మెజార్టీ సభ్యులదే తుది నిర్ణయం. అయితే ప్రధాన న్యాయమూర్తిని తప్పనిసరిగా సంప్రదించి, ఆయన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కొలీజియం తన సిఫార్సులను కేంద్రానికి పంపుతుంది. ఇక హైకోర్టు కొలీజియంలో ప్రధాన న్యాయమూర్తి, ఇద్దరు సీనియర్ మోస్ట్ న్యాయమూర్తులు సభ్యులు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సులు పంపుతుంది. ముఖ్యమంత్రి వాటిని కేంద్ర న్యాయ శాఖ మంత్రికి పంపిస్తారు. వాస్తవానికి రాజ్యాంగంలో కొలీజియం ప్రస్తావన లేదు. కొలీజియం చేసే సిఫార్సులపై కేంద్రం తన విచక్షణ మేరకు నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఒకే పేరును కొలీజియం రెండోసారి సిఫార్సు చేస్తే కేంద్రం ఆమోదించాల్సిందేనంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం గతంలో తీర్పు వెలువరించింది. రాజ్యాంగం ఏం చెబుతోంది? రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిలను రాష్ట్రపతి నియమించాలి. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే సీజేఐ మినహా మిగతా నియామకాల్లో సీజేఐ అభిప్రాయం తెలుసుకోవాలి. ఆర్టికల్ 217 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో సీజేఐ, గవర్నర్, హైకోర్టు సీజేలను సంప్రదించాలి. ఏమిటీ వివాదం? 1950 నుంచి 1973 వరకూ కేంద్రం, సీజేఐ కలిసి చర్చించుకుని ఏకాభిప్రాయంతో న్యాయమూర్తులను నియమించే విధానముండేది. సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ న్యాయమూర్తిని సీజేఐగా నియమించడం ఆనవాయితీగా కొనసాగింది. 1973లో మాత్రం ముగ్గురు సీనియర్లను పక్కన పెట్టి జస్టిస్ ఎ.ఎన్.రేను సీజేఐగా అప్పటి ప్రభుత్వం నియమించింది. తర్వాత మరో సీజేఐ నియామకంలోనూ ఇలాగే జరగడం కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య వివాదానికి దారితీసింది. న్యాయమూర్తుల నియామకంలో కార్యనిర్వాహక వ్యవస్థ కంటే న్యాయ వ్యవస్థకే ఎక్కువ అధికారాలుంటాయని ఫస్ట్ జడ్జెస్ కేసు (1981), సెకండ్ జడ్జెస్ కేసు (1993), థర్డ్ జడ్జెస్ కేసు (1998)ల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎలా ఏర్పాటైంది? పార్లమెంట్ చట్టంగానీ, రాజ్యాంగ విధివిధానాలు గానీ లేకుండానే మన దేశంలో 1993లో కొలీజియం వ్యవస్థ మొదలైంది. న్యాయమూర్తుల నియామకంలో ఆర్టికల్ 124(2)లో ఉన్న ‘సంప్రదింపుల అనంతరం’ అర్థాన్ని ‘సమ్మతించిన తర్వాత’గా మారుస్తూ తొమ్మిది మంది సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. తద్వారా న్యాయమూర్తుల నియామకం, బదిలీల అధికారం సీజేఐ నేతృత్వంలోని వ్యవస్థ అయిన కొలీజియానికి దక్కింది. ప్రత్యామ్నాయముందా? కొలీజియంకు ప్రత్యామ్నాయంగా నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్(ఎన్‌జేఏసీ)ని కేంద్రం తెరపైకి తెచ్చింది. ఇది స్వతంత్ర కమిషన్.దీనికి సీజేఐ చైర్‌పర్సన్‌గా ఉంటారు. మరో ఇద్దరు అత్యంత సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్ర న్యాయ మంత్రి ఎక్స్–ఆఫీషియో సభ్యులుగా ఉంటారు. పౌర సమాజం నుంచి ఇద్దరు ప్రముఖులను సభ్యులుగా సీజేఐ, ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేతతో కూడిన కమిటీ నామినేట్ చేయాలి. ఈ ఇద్దరిలో కనీసం ఒకరు ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/మైనార్టీ లేదా మహిళ అయి ఉండాలి. రాజ్యాంగ (99వ సవరణ) చట్టం–2014, నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్స్‌మెంట్ కమిషన్ చట్టం (2014) ద్వారా ఎన్ఏజేసీని కేంద్రం ప్రతిపాదించింది. సంబంధిత బిల్లులు 2014లోనే పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందాయి. కానీ ఈ బిల్లుల రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్‌జేఏసీని కోర్టు కొట్టేసింది. అయితే న్యాయమూర్తుల ఎంపికకు కొలీజియం స్థానంలో కేంద్రం మరో వ్యవస్థను తీసుకొస్తే అభ్యంతరం లేదని ఇటీవలే స్పష్టం చేసింది. కొలీజియంలో ప్రభుత్వ నామినీలు సీజేఐకి కేంద్ర న్యాయ మంత్రి రిజిజు లేఖ న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో చీఫ్ జస్టిస్‌లు, జడ్జిలను నియమించే కొలీజియం వ్యవస్థలో ప్రభుత్వం నామినేట్ చేసేవారికి సైతం చోటుండాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు పునరుద్ఘాటించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు ఆయన తాజాగా లేఖ రాశారు. ‘‘జడ్జిల నియామకంలో పారదర్శకత, జవాబుదారీతనం గురించి ప్రజలకు తెలియజేయడం అవసరం. అందుకే న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వ ప్రతినిధులకు చోటు కల్పించాలి’’ అని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. కొలీజియం వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధమని కిరణ్ రిజిజు ఇటీవల విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోవడానికి కొలీజియమే కారణమని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో సీజేఐకి ఆయన లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. న్యాయ వ్యవస్థకు విషగుళిక: జైరామ్ రమేశ్ న్యాయ వ్యవస్థను పూర్తిగా ఆక్రమించుకొనేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ సోమవారం ఆక్షేపించారు. న్యాయ వ్యవస్థను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. సీజేఐకి రిజిజు లేఖను తప్పు పట్టారు. మంత్రి సూచన న్యాయ వ్యవస్థకు విషగుళిక అన్నారు. అయితే కొలీజియంలో సంస్కరణలు అవసరమేనని జైరాం అభిప్రాయపడ్డారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జడ్జీల నియామకం ప్రభుత్వ హక్కు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం కోసం అమల్లో ఉన్న కొలీజియం వ్యవస్థ పట్ల ప్రభుత్వ అసహనం మరోసారి తేటతెల్లమయ్యింది. కొలీజియం విషయంలో ఇప్పటికే ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ రెండు వర్గాలుగా విడిపోయాయి. ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకంలో ప్రభుత్వం పాత్ర పరిమితంగానే ఉండడం ఏమిటని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన గురువారం రాజ్యసభలో మాట్లాడారు. కోర్టుల్లో పెండింగ్ కేసుల విషయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానామిచ్చారు. ఆయన ఏం చెప్పారంటే.. పెండింగ్ కేసులు ఆందోళనకరం ‘దేశవ్యాప్తంగా కోర్టుల్లో ఐదు కోట్లకుపైగా కేసులు పెండింగ్‌లో ఉండడం ఆందోళకరం. ఇందుకు ప్రధాన కారణం కోర్టుల్లో జడ్జి పోస్టులు ఖాళీగా ఉండడం. పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. కానీ, జడ్జి పోస్టుల భర్తీలో ప్రభుత్వం పాత్ర పరిమితమే. నియమించాల్సిన జడ్జీల పేర్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడిన కొలీజియమే ప్రతిపాదిస్తుంది. అందులో ప్రభుత్వానికి ఎలాంటి హక్కు ఉండదు. మార్పులు చేయకపోతే.. న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు దేశ వైవిధ్యాన్ని, నాణ్యతను ప్రతిబింబించే పేర్లను ప్రతిపాదించాలని కొలీజియంకు ప్రభుత్వం తరచుగా విజ్ఞప్తి చేస్తూనే ఉంది. కానీ, ప్రస్తుతం అమల్లో ఉన్న వ్యవస్థ పార్లమెంట్, దేశ ప్రజల సెంటిమెంట్‌ను ప్రతిబింబించడం లేదు. ఎక్కువ మాట్లాడితే న్యాయ వ్యవస్థలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. అందుకే ఎక్కువ మాట్లాడడం నాకు ఇష్టం లేదు. రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం చూస్తే కోర్టుల్లో జడ్జీలను నియమించడం ప్రభుత్వ హక్కు. కానీ, 1993 తర్వాత ఈ పరిస్థితిని మార్చేశారు. జడ్జిల అపాయింట్మెంట్లలో ప్రభుత్వానికి భాగస్వామ్యం కల్పిస్తూ 2014లో నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్(ఎన్‌జేఏసీ) చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని 2015లో సుప్రీంకోర్టు రద్దు చేసింది. జడ్జిలను నియమించే ప్రక్రియలో మార్పులు చేయకపోతే ఉన్నత న్యాయస్థానాల్లో ఖాళీల సమస్య తలెత్తూనే ఉంటుంది’ అని రిజిజు తేల్చిచెప్పారు. కొలీజియం అనేది దేశ ప్రజలు కోరుకుంటున్న వ్యవస్థ కాదని ఆయన కొన్ని వారాలుగా గట్టిగా వాదిస్తున్న సంగతి తెలిసిందే. కొలీజియంకు వ్యతిరేకంగా పలువురు ప్రస్తుత, మాజీ కేంద్ర మంత్రులు గళం విప్పుతున్నారు. కానీ, కొలీజియం వ్యవస్థను పట్టాలు తప్పించేలా ఎవరూ మాట్లాడొద్దని సుప్రీంకోర్టు ఇటీవలే హెచ్చరించింది. 20 పేర్లను పునఃపరిశీలించండి కొలీజియంకు తిప్పి పంపిన కేంద్ర ప్రభుత్వం హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా నియమించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన 20 పేర్లను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపించింది. ఆ 20 పేర్లను మరోసారి పరిశీలించాలని కోరింది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభలో వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్ 9వ తేదీ నాటికి హైకోర్టుల్లో 331 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. మొత్తం శాంక్షన్డ్ పోస్టులు 1,108 కాగా, 25 హైకోర్టుల్లో ప్రస్తుతం 777 మంది జడ్జీలు ఉన్నారని తెలిపారు. 30 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. పోస్టుల భర్తీ కోసం పలు హైకోర్టుల నుంచి అందిన 147 ప్రతిపాదనలు ప్రస్తుతం ప్రభుత్వం, సుప్రీంకోర్టు కొలీజియం మధ్య వివిధ దశల్లో ఉన్నాయని వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్ 9 నాటికి వివిధ హైకోర్టుల్లో రికార్డు స్థాయిలో 165 మంది జడ్జిలను నియమించినట్లు కిరణ్ రిజిజు వివరించారు. ఒక సంవత్సరంలో ఇంతమందిని నియమించడం ఒక రికార్డు అని పేర్కొన్నారు. -
కొలీజియం తీర్మానాలు బయటపెట్టలేం: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం కోసం ఉద్దేశించిన కొలీజియం సమావేశం వివరాలు, తీర్మానాలను బహిర్గతం చేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. 2017 అక్టోబర్ 3న చేసిన తీర్మానం ప్రకారం.. కొలీజియం చర్చల, తీర్మానాల వివరాలను బయటపెట్టలేమని తెలిపింది. తుది నిర్ణయాన్ని మాత్రమే సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని వివరించింది. 2018 డిసెంబర్ 12న కొలీజియం భేటీలో తీసుకున్న నిర్ణయాలను సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద ఇవ్వాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని తోసిపుచ్చింది. కొలీజియం అనేది బహుళ సభ్యులతో కూడిన ఒక వ్యవస్థ అని, కొలీజియం చర్చించిన విషయాలను, చేసిన తీర్మానాలను ప్రజాబాహుళ్యంలోకి తీసుకురాలేమని, సమాచార హక్కు చట్టం కింద ఇవ్వలేమని స్పష్టం చేసింది. కొలీజియంలోని సభ్యులంతా చర్చించుకొని సంతకాలు చేస్తేనే తీర్మానాలు తుది నిర్ణయాలుగా మారుతాయని, అలాంటి వాటినే బయటపెట్టగలమని వివరించింది. తీర్మానాలే ఫైనల్ కాదు 2018 డిసెంబర్ 12 నాటి కొలీజియం సమావేశం అజెండా వివరాలు ఇవ్వాలని కోరుతూ ఆర్టీఐ కార్యకర్త అంజలి భరద్వాజ్ తొలుత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషన్‌కు విచారణార్హత లేదని తేల్చిచెప్పింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ అంజలి భరద్వాజ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ కొనసాగిస్తోంది. పిటిషన్‌ను శుక్రవారం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. కొలీజియం భేటీలో సంప్రదింపుల కోసం చేసే తీర్మానాలు ఫైనల్ అని చెప్పలేమని తెలిపింది. తీర్మానాలపై సభ్యులంతా చర్చించుకొని సంతకాలు చేసే దాకా అవి అస్థిర నిర్ణయాలేనని పేర్కొంది. అందరూ సంతకాలు చేస్తేనే నిర్ణయాలు ఖరారవుతాయని వెల్లడించింది. అంటే కొలీజియం వ్యవస్థలోని సభ్యులందరి ఆమోదం ఉంటేనే తీర్మానాలు నిర్ణయాలవుతాయని వివరించింది. కొలీజియం విషయంలో మీడియాలో వచ్చే రిపోర్టులను విశ్వసించలేమని, ఇదే వ్యవస్థలో పనిచేసిన మాజీ సభ్యుడి ఇంటర్వ్యూను పట్టించుకోలేమని ధర్మాసనం ఉద్ఘాటించింది. కొలీజియం పనితీరు పట్ల మాజీ జడ్జి ఇచ్చిన స్టేట్మెంట్లపై తాము మాట్లాడదలచుకోలేదని వ్యాఖ్యానించింది. 2018 డిసెంబర్ 12న అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని కొలీజియం సమావేశమయ్యింది. పలువురిని సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే పలు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులను బదిలీ చేయాలన్న ప్రతిపాదనపై చర్చించి, తీర్మానాలు చేసింది. అయితే, ఈ తీర్మానాలు, నిర్ణయాలను సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు. 2019 జనవరి 10న జస్టిస్ మదన్ బి.లోకూర్ పదవీ విరమణ సందర్భంగా కొలీజియం మరో నిర్ణయం తీసుకుంది. జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ సంజీవ్ ఖన్నాకు పదోన్నతి కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. 2018 డిసెంబర్ 12 నాటి భేటీలో కేవలం ప్రతిపాదనలపై చర్చించామని, వాటిని ఫైనలైజ్ చేయలేదని పేర్కొంది. అది మనకు పరాయి వ్యవస్థ: కిరణ్ రిజిజు కొలీజియం విషయంలో కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు నడుమ వివాదం కొనసాగుతున్న సంగతి విదితమే. ఈ వ్యవస్థను ప్రభుత్వం తప్పుపడుతోంది. కొలీజియం అనేది మనకు పరాయి వ్యవస్థ అని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇటీవలే ఆక్షేపించారు. అయితే, కేంద్ర మంత్రి వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తిప్పి కొట్టింది. కొలీజియం పూర్తి పారదర్శకంగా పనిచేస్తోందని, అనవసర వ్యాఖ్యలతో దాన్ని పట్టాలు తప్పించవద్దని హితవు పలికింది. ఇదీ చదవండి: ‘సీఎం పీఠం మా నేతకే..’ హిమాచల్‌లో ఆశావహుల మద్దతుదారుల డిమాండ్ -
కొలీజియం కథ మొదటికి
పాత చందమామల్లో కనబడే బేతాళ కథల్లో పట్టువదలని విక్రమార్కుడి మాదిరిగా కేంద్ర ప్రభుత్వం కొలీజియం వ్యవస్థపై నిప్పులు చెరుగుతూనే ఉంది. సందర్భం వచ్చినప్పుడల్లా ఈ వ్యవస్థ ఎంత ఉత్తమమైనదో, ఎందుకు ఉత్తమమైనదో సుప్రీంకోర్టు చెబుతూ వస్తోంది. ఈసారి కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజుతోపాటు ఉపరాష్ట్రపతి స్థానంలో ఉన్న జగదీప్ ధన్కర్ సైతం విమర్శలకు దిగటమే కొత్త పరిణామం. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) చట్టాన్ని గతంలో సుప్రీంకోర్టు కొట్టేయడాన్ని రాజ్యసభలోనూ, వెలుపలా కూడా థన్కర్ నిశితంగా విమర్శించారు. అంతక్రితం కొలీజియం సిఫార్సుల ఆమోదంలో కేంద్రం జాప్యం చేయటంపై వెల్లు వెత్తుతున్న ప్రశ్నలకు రిజిజు ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాగైతే మావద్దకు ఫైళ్లు పంపొద్దని, మీరే అన్నీ చేసుకోండని జవాబిచ్చారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఇలా వ్యాఖ్యానించటం తగునా అని సుప్రీంకోర్టు ధర్మాసనం గట్టిగానే ప్రశ్నించింది. మా మనోభావాన్ని తెలియజేయండంటూ అటార్నీ జనరల్‌కూ, సొలిసిటర్ జనరల్‌కూ ఆదేశాలిచ్చింది. కేంద్రం, న్యాయవ్యవస్థలమధ్య ఘర్షణ పదునెక్కిందనటానికి ఈ పరిణామాలు తార్కాణం. తాజాగా కొలీజియం సిఫార్సులను కేంద్రం తరచు విడగొట్టి ఆమోదించటంవల్ల తలెత్తుతున్న ఇబ్బందుల్ని ధర్మాసనం ప్రస్తావించింది. ఈ అలవాటు మానుకోవాలని సూచించింది. ఎన్‌జేఏసీ చట్టం, అందుకోసం కేంద్రం చేసిన 99వ రాజ్యాంగ సవరణ చెల్లుబాటుకావని అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం 2015 అక్టోబర్‌లో తీర్పునిచ్చింది. ఈ రెండు చర్యలూ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే ప్రయత్నాలుగా పరిగణించింది. ఈ తీర్పుపై అప్పీల్‌కు కూడా అనుమతించలేదు. ఎన్‌జేఏసీ చట్టాన్నీ, రాజ్యాంగ సవరణనూ పార్లమెంటు ఏక గ్రీవంగా ఆమోదించింది. 20 శాసనసభలు సైతం వాటికి ఆమోదం తెలిపాయి. ప్రజల సమష్టి మనోగతాన్ని తెలియజేసే ఈ చర్యలను సుప్రీంకోర్టు తోసిపుచ్చడమేమిటన్న ప్రశ్నలు అప్పట్లో తలెత్తాయి. ఏ చట్టమైనా, రాజ్యాంగ సవరణ అయినా న్యాయసమీక్షకు లోబడే ఉంటుంది గనుక అక్కడితో ఆ ప్రస్తావన ముగియాలి. మరింత పకడ్బందీ నిబంధనలతో చట్టం తీసుకొస్తే తప్ప కొలీ జియం వ్యవస్థ సిఫార్సులకు కేంద్రం లోబడి ఉండాల్సిందే. కానీ ఎప్పటికప్పుడు కేంద్రం తన ఆధిక్యతను ప్రదర్శించుకోవటానికి ప్రయత్నిస్తూనే వస్తోంది. దాని సిఫార్సులపై నిర్ణయం తీసు కోవటంలో జాప్యం చేయటం లేదా కొన్నిటిని మాత్రమే అంగీకరించి, మరికొన్నిటిపై మౌనం పాటించటం రివాజైంది. ప్రభుత్వాలు చేసే చట్టాలు నచ్చినా నచ్చకపోయినా పౌరులందరూ పాటించి తీరాల్సిందే. వాటిని రద్దు చేయాలని పోరాడటం, ప్రభుత్వాలను ఒప్పించటం ఒక పద్ధతి. సాగుచట్టాల విషయంలో రైతాంగం చేసింది అదే. న్యాయవ్యవస్థ తీసుకునే నిర్ణయాలూ, తీర్పులూ కూడా చట్టాలతో సమానం. వాటిపై అభ్యంతరం ఉంటే అప్పీల్‌కు వెళ్లటం ఒక్కటే మార్గం. ప్రభు త్వాలైతే కొత్త చట్టాలను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. వీటిని విడనాడి కొలీజియం సిఫార్సులపై సాచివేత ధోరణి అవంబించటం, ప్రశ్నిస్తే విరుచుకుపడటం సరైంది కాదు. మొన్న సెప్టెంబర్ నెలాఖరున జమ్మూ కశ్మీర్ లద్దాఖ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ పంకజ్ మిత్తల్‌ను రాజస్థాన్ హైకోర్టుకూ, ఒరిస్సా హైకోర్టు చీఫ్ జస్టిస్ మురళీధర్‌ను మద్రాస్ హైకోర్టుకూ బదిలీ చేయాలని కొలీజియం సిఫార్సు చేస్తే ఒక్క మిత్తల్‌ను మాత్రమే కేంద్రం బదిలీ చేసి ఊరుకుంది. జస్టిస్ మురళీధర్ విష యంలో ఇంతవరకూ ఉలుకూ పలుకూ లేదు. అందరూ చట్టాలను గౌరవించేలా, దేశంలో చట్టబద్ధ పాలన సజావుగా సాగేలా చూడాల్సిన ప్రభుత్వాలే అందుకు విరుద్ధమైన పోకడలకు పోరాదు. అయితే ఇరుపక్షాలూ తమ అధికారాల గురించే పట్టుబడుతున్నాయి తప్ప న్యాయమూర్తుల నియామకాలు పారదర్శకంగా ఉండేందుకు ఏం చేయాలన్న చర్చకు పోవటం లేదు. కొలీజియం వ్యవస్థ ఎలా విఫలమైందో 1993లో ఆ విధానానికి పునాది వేసిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ వర్మ పలుమార్లు చెప్పారు. ఎవర్ని ఎందుకు నియమించారో, నియమించలేదో ఏనాడూ కొలీజియం చెప్పిన పాపాన పోలేదు. ఒకసారి నియామకం పూర్తయి, పూర్తి స్థాయి న్యాయమూర్తిగా మారాక వారు ప్రశ్నార్థకమైన తీర్పులు వెలువరించినా, వారి ప్రవర్తన ఎలా వున్నా, ఏవిధమైన ఆరోపణలొచ్చినా అదే పదవిలో కొనసాగుతున్నారు. నియామకాల్లో అణగారిన వర్గాలకూ, మహిళలకూ పెద్దగా చోటుండటం లేదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ సైతం దీన్ని అంగీకరించారు. సుప్రీంకోర్టు కొట్టేసిన ఎన్‌జేఏసీ చట్టంలోనూ ఎన్నో లోపాలున్నాయి. కొలీజియం స్థానంలో అది రావటం వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. అమెరికాలో మాదిరి న్యాయమూర్తులుగా నియమించదల్చుకున్న వారి పేర్లు, వారి అర్హతలూ, ప్రత్యేకతలూ వెల్లడించటం... వారిపై సాధారణ పౌరులు సైతం తమ అభిప్రాయాలు వెల్లడించటానికి, చర్చించ టానికి అవకాశమీయటం అవసరం. అది వచ్చేలోపు కనీసం కొలీజియం తన నిర్ణయాలకు గల కారణాలేమిటో సాధారణ పౌరులకు విశదపరచాలి. అప్పుడు కేంద్రం జాప్యం చేయటంలోని ఉచితానుచితాలను ప్రజలు నిర్ణయించుకుంటారు. అలాగే ఏ కారణంతో జాప్యం చేస్తున్నారో లేదా తిరస్కరిస్తున్నారో కేంద్రం చెప్పాలి. అంతేతప్ప వ్యవస్థల మధ్య ఎడతెగకుండా వివాదం సాగటం, చివరకు నిర్ణయరాహిత్యమే రాజ్యమేలటం ప్రజాస్వామ్య వ్యవస్థకు శ్రేయస్కరం కాదు. -
కామెంట్లు చేయడం వాళ్లకో ఫ్యాషన్ అయ్యింది: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: జడ్జీల నియామకాల విషయంలో తాము ఎంతో పారదర్శకంగా ఉన్నట్లు సుప్రీం కోర్టు ప్రకటించుకుంది. న్యాయమూర్తుల నియామక వ్యవస్థ పట్టాలు తప్పకూడదు. అందుకోసం ఉన్న న్యాయమూర్తుల కొలీజియం అత్యంత పారదర్శకంగా పని చేస్తోంది. దానిని అలా పని చేయనివ్వండి అంటూ శుక్రవారం ఓ పిటిషన్ విచారణ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పని చేస్తున్న వ్యవస్థను(కొలీజియంను ఉద్దేశించి) నిర్వీర్యం చేయవద్దు. దాని పనిని దాన్ని చేయనివ్వండి. మాది అత్యంత పారదర్శకమైన సంస్థ. కొలీజియం మాజీ సభ్యులకు.. నిర్ణయాలపై కామెంట్లు చేయడం ఓ ఫ్యాషన్‌గా మారింది అంటూ జస్టిస్ షా, జస్టిస్ రవికుమార్ నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు కొలీజియం వివాదాస్పద-2018 సమావేశం వివరాలను సమాచార హక్కు చట్టం కింద కోరుతూ.. ప్రముఖ కార్యకర్త అంజలి భరద్వాజ్ దాఖలు చేసిన అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. సమావేశం అజెండా, తీర్మానం తదితర వివరాల కోసం ఆమె జులైలో కోర్టులో అప్పీల్ పిటిషన్ వేయగా.. కోర్టు పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆమె సుప్రీంను ఆశ్రయించగా.. ఆ పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. శుక్రవారం వాదనల సందర్భంగా.. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ ‘కొలీజియం నిర్ణయాలు ఆర్టీఐ పరిధిలోకి వస్తాయా? తెలుసుకునే హక్కు ఈ దేశ ప్రజలకు లేదా?’ అని బెంచ్‌ను కోరారు. ‘‘ఆర్టీఐ ప్రాథమిక హక్కు అని కోర్టు స్వయంగా చెప్పింది. ఇప్పుడు సుప్రీంకోర్టు వెనక్కి తగ్గింది. ప్రధాన న్యాయమూర్తి- ప్రభుత్వం మధ్య జరిగే అన్ని ఉత్తర ప్రత్యుత్తరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని పేర్కొంది’’ అని ప్రశాంత్ భూషణ్ గుర్తు చేశారు. దీంతో కలుగుజేసుకున్న జస్టిస్ షా.. ఆ కొలీజియం సమావేశంలో ఎలాంటి తీర్మానం ఆమోదించలేదు. మాజీ సభ్యులు చేసిన దేనిపైనా మేము వ్యాఖ్యానించదలచుకోలేదు. కొలీజియం మాజీ సభ్యులు.. ఇక్కడి నిర్ణయాలపై వ్యాఖ్యానించడం ఫ్యాషన్‌గా మారింది. మేం చాలా పాదదర్శకంగా పని చేస్తున్నాం. ఎందులోనూ మేము వెనక్కి తగ్గడం లేదు. పలు మౌఖిక నిర్ణయాలు తీసుకున్నాం అంటూ.. ఈ పిటిషన్‌పై ఆదేశాలను రిజర్వ్ చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం 2018, డిసెంబర్ 12వ తేదీ నిర్వహించిన సమావేశం వివరాలను ఆర్టీఐ ద్వారా కోరుతూ.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు అంజలి భరద్వాజ్. అంతకు ముందు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్(CIC) ద్వారా ఆమె చేసిన ప్రయత్నాలు సైతం ఫలించలేదు. ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్టు పిటిషన్ కొట్టేయడంతో.. ఆమె సుప్రీంను ఆశ్రయించారు. సుప్రీం మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగోయ్ ఆటోబయోగ్రఫీ ‘జస్టిస్ ఫర్ ది జడ్జి’లో.. డిసెంబర్ 2018 సమావేశం గురించి ఆసక్తికర ప్రస్తావన ఉంది. ఆ సమావేశంలో ఆనాడు రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న జస్టిస్ ప్రదీప్ నంద్రజోగ్, ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న జస్టిస్ రాజేంద్ర మీనన్‌లను.. సుప్రీం కోర్టు జడ్జిలుగా ప్రతిపాదించాలని నిర్ణయించింది కొలీజియం. అయితే.. వాళ్ల నియామకాలకు సంబంధించిన సమాచారం బయటకు పొక్కడంతో.. జనవరి 10వ తేదీ 2109లో కొత్త కొలీజియం వాళ్లిద్దరి పేర్లను ఆమోదించలేదు. ఈ విషయాన్నే ప్రముఖంగా తన పిటిషన్లో ప్రస్తావించారు అంజలి భరద్వాజ్. ఇదీ చదవండి: మీరే రూల్స్ ధిక్కరిస్తారా?.. -
ఆయన వ్యాఖ్యలు కరెక్ట్ కాదు: సుప్రీం కోర్టు ఖండన
సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేదని, అనర్హులను న్యాయమూర్తులుగా నియమిస్తున్నారని, న్యాయవ్యవస్థలోనూ రాజకీయాలు నడుస్తున్నాయని పదునైన వ్యాఖ్యలు చేశారు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు. అయితే న్యాయమంత్రి వ్యాఖ్యలను ఇవాళ సుప్రీం కోర్టు తీవ్రంగా ఖండించింది. న్యూఢిల్లీ: కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు ఇవాళ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓ టీవీ చర్చా వేదికలో సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేదన్న ఆయన అభిప్రాయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది అత్యున్నత న్యాయస్థానం. అలా జరిగి ఉండకూదని బెంచ్ వ్యాఖ్యానించింది. కొలీజియం ప్రతిపాదిత పేర్ల ఆమోద జాప్యానికి సంబంధించిన దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఈ సందర్భంలో.. అత్యున్నత న్యాయవ్యవస్థలో నియామకాలను కేంద్రం ఆలస్యం చేస్తోందని ధ్వజమెత్తింది కూడా. కొలీజియంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్ కృష్ణన్ కౌల్, జస్టిస్ ఏఎస్ ఒకా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘ ఒకరు ఉన్నతస్థాయిలో(మంత్రి కిరెన్ను ఉద్దేశించి) ఉన్నప్పుడు.. అలా జరిగి ఉండకూడదు అని పేర్కొంది. అయితే ఆ సమయంలో కేంద్రం తరపున సాలిసిటర్ జనరల్.. ‘‘కొన్నిసార్లు మీడియా తప్పుగా కథనాలు ప్రసారం చేస్తున్నాయ’ని వ్యాఖ్యానించారు. వెంటనే ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్‌ను ఉద్దేశిస్తూ జస్టిస్ కౌల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మిస్టర్ అటార్నీ జనరల్.. నేను కూడా మీడియాలో వచ్చిన కథనాలను పట్టించుకోను. కానీ, ఈ వ్యాఖ్యలు చాలా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి నుంచి.. అదీ ఓ ఇంటర్వ్యూలో వచ్చాయి. ఇంతకంటే ఏం చెప్పలేను. అవసరమైతే నిర్ణయం తీసుకుంటాం అని తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఇక న్యాయశాఖ నియామకాల్లో జాప్యంపై, జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (NJAC) మస్టర్‌ను ఆమోదించకపోవడమే ప్రభుత్వం సంతోషంగా లేకపోవడానికి కారణమా, అందుకే పేర్లను క్లియర్ చేయలేదా? అని కోర్టు సూటిగా కేంద్రాన్ని ప్రశ్నించింది. కొలీజియం సిఫార్సులపై ప్రభుత్వం సిట్టింగ్‌పై సుప్రీంకోర్టు తన రిజర్వేషన్లను పేర్కొనకుండా పేర్లను వెనక్కి తీసుకోదంటూ చెబుతూ.. న్యాయపరమైన నిర్ణయం తీసుకుంటామని కేంద్రాన్ని హెచ్చరించింది. దయచేసి త్వరగతిన పరిష్కరించండి. ఈ విషయంలో మమ్మల్ని న్యాయపరమైన నిర్ణయం తీసుకునేలా చేయొద్దు అంటూ కేంద్రాన్ని ఉద్దేశించి ధర్మాసనం పేర్కొంది. సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసిన పేర్ల జాప్యంపై.. కోర్టు మనోభావాలను కేంద్రానికి తెలియజేయాలంటూ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్‌లను కోర్టు కోరింది. ఈ అంశాన్ని పరిశీలిస్తామని అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ కోర్టుకు హామీ ఇవ్వడంతో కేసు విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేశారు. ఇదీ చదవండి: కొలీజియంపై కిరెన్ రిజిజు.. మౌనంగా ఉంటామనుకోవద్దని వ్యాఖ్య -
కొలీజియం వ్యవస్థ పరిపూర్ణమా?
న్యాయమూర్తులను నియమించే కొలీజియం వ్యవస్థ పనితీరుపై ఇప్పుడు తీవ్ర చర్చ కొనసాగుతోంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి చాలాసార్లు ఈ వ్యవస్థ పారదర్శకత గురించి చర్చ లేవదీశారు. మరోవైపు కొలీజియం కార్యాచరణలు అపారదర్శకంగానూ, చేరుకోలేని విధంగానూ ఉంటున్నాయని సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ చలమేశ్వర్ అన్నారు. కొలీజియం వ్యవస్థలో జవాబుదారీతనం, నిష్పాక్షికత లోపించాయని మరో మాజీ జస్టిస్ కురియన్ స్పష్టం చేశారు. కార్యనిర్వాహక వర్గమైన ప్రభుత్వానికి పాత్ర లేకుండా కొలీజియం కొనసాగడంపై దాని ఏర్పాటుకు కారణమైన తీర్పునిచ్చిన మాజీ చీఫ్ జస్టిస్ వర్మ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొలీజియం వ్యవస్థ పరిపూర్ణమైనదేనా అన్న ప్రశ్న తలెత్తక మానదు. న్యాయమూర్తులను ఎంపిక చేసే కొలీ జియం (తెలుగులో సలహా మండలి అనవచ్చు) వ్యవస్థ పరిపూర్ణమైనదేనా? సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి యు.యు. లలిత్ ఇటీవలి ఇంటర్వ్యూలలో అదే చెబుతున్నారు. అదే సమయంలో, రాజ్యాంగ ప్రాథమిక స్వరూపంలో కొలీజియం అనేది అంతర్గతంగానే ఉందని ఆయన సూచించారు కూడా! అయితే ఈ రెండు అంశాల గురించి ఆయన చెప్పింది సరైం దేనా? దీనిపై ఒక సాధారణ పరిశోధన ఏం చెబుతోందో మీతో పంచుకోనివ్వండి. పైన పేర్కొన్న వాటిలో రెండో అంశాన్ని మొదటగా తీసు కుందాం. కొలీజియం అనే పదాన్ని రాజ్యాంగంలో పొందుపర్చలేదు. మరీ ముఖ్యంగా, ‘చీఫ్ జస్టిస్ సమ్మతి’(కన్కరెన్స్) అనే పదాన్ని జోడించడానికి జడ్జీల నియామక విధానంలో చేసిన సవరణను కూడా రాజ్యాంగ సభలో ఆనాడే ఓడించారు. అయితే 1993లో మాత్రమే సుప్రీంకోర్టు దీన్ని సాధించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 (2)లో ప్రస్తావించిన ‘సంప్రదింపు’ అనే పదం ‘చీఫ్ జస్టిస్ సమ్మతి’ అని నిర్ణయించడం ద్వారా సుప్రీంకోర్టు ఇది చేయగలిగింది. ఈ రెండు పదాలకు ప్రతి నిఘంటువులోనూ వేర్వేరు అర్థాలున్నాయనే వాస్త వాన్ని అలా పక్కన పెట్టారు. కాబట్టి రాజ్యాంగంలో కొలీజియం అనే భావన కనీసంగా భాగం కానప్పుడు, దాని ప్రాథమిక స్వరూపంలోనే కొలీజియం వ్యవస్థ అంతర్గతంగా ఉందని చెబితే నమ్మడానికి కూడా కష్టంగానే ఉంటుంది. దీనికి బదులుగా ఇది ‘హంప్టీ డంప్టీ సూత్రం’ మీద ఆధారపడి చేసినది. అంటే, ‘‘నేను ఒక పదం ఉపయోగిస్తున్నప్పుడు, అది నేను ఎంపిక చేసుకున్న విధంగానే దాని అర్థం ఉంటుంది’’ అనే సూత్రంపైనే కొలీజియం వ్యవస్థను గతంలో రూపొందించినట్లు కనిపిస్తుంది. ఇక పరిపూర్ణతకు సంబంధించిన ప్రశ్నకు వద్దాం. 2015 జాతీయ న్యాయమూర్తుల నియామకాల కమిషన్ కేసు సందర్భంగా జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడుతూ, ‘‘కొలీజియం వ్యవస్థ కార్యాచరణలు నిస్సందేహంగా ప్రజలకూ, చరిత్రకూ కూడా అపారదర్శకంగానూ, చేరుకోలేని విధంగానూ ఉంటున్నాయి’’ అని చెప్పారు. కాగా, జస్టిస్ కురియన్ కూడా ‘‘కొలీజియం వ్యవస్థలో పారదర్శకత, జవాబు దారీతనం, నిష్పాక్షికత లోపించాయి’’ అని అంగీకరించారు. కాబట్టి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు కూడా కొలీజియం వ్యవస్థ పరిపూర్ణమైనదని నమ్మలేదన్నమాట. దీనికి ఇక్కడ కొన్ని కారణాలున్నాయి. న్యాయమూర్తులను ఎలా పరిగణనలోకి తీసుకుంటారు, లేదా వారిని ఏ ప్రాతిపదికన ఎంపిక చేసుకుంటారు అనే ప్రమాణాల గురించి నిజంగానే మనకు తెలీదు. ఇక రెండో అంశం. కొలీజియం అనే న్యాయమూర్తుల నియామక వ్యవస్థ మూసిన తలుపుల వెనుక నడుస్తున్నందున అక్కడ తప్ప కుండా బంధుప్రీతికి అపార అవకాశం ఉంటుంది. కొలీజియంలోని న్యాయమూర్తులు తమ ఛాంబర్లోని జూనియర్లను, చివరకు తమ బంధువులను సైతం జడ్జీలుగా నియమించారని ఆరోపణలు రావ డంలో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. కొలీజియం ఎంపిక చేసిన న్యాయమూర్తుల నాణ్యత మరో పెద్ద సమస్యగా ఉంటోంది. దీనిగురించి మొదలు పెట్టాలంటే, ఈ దేశం లోని అత్యుత్తమ న్యాయమూర్తులను కొలీజియం నిర్లక్ష్యం చేసింది. దీనికి జస్టిస్ అజిత్ ప్రకాశ్ షా, జస్టిస్ అఖిల్ ఖురేషీ రెండు ఉదా హరణలుగా నిలుస్తారు. ఖురేషీ కేసు విషయానికి వస్తే, ఆయనను నియమించేంత వరకూ మరే ఇతర న్యాయమూర్తినీ నియమించ డానికి కూడా జస్టిస్ నారిమన్ తిరస్కరించారు. కానీ అది ఎన్నటికీ జరగలేదు. మరింత ఘోరమైన విషయం ఏమిటంటే, అర్హత లేని వ్యక్తులు తరచుగా న్యాయమూర్తులుగా నియమితులు కావడం. దీనికి అద్భుత మైన ఉదాహరణ జస్టిస్ కర్ణన్. చివరకు ఈయన జైలుపాలయ్యేంతగా అధోగతిపాలయ్యారు. అదే సమయంలో జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎమ్ఆర్ షాల విషయానికి వస్తే, సిట్టింగ్ జడ్జిలుగా ఉండికూడా వారు బహిరంగంగానే ప్రధానమంత్రిని ప్రశంసల వర్షంలో ముంచెత్తారు. ఇది సుప్రీంకోర్టును తీవ్ర ఇబ్బందిలోకి నెట్టింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఇలాంటి బలహీనతలతో కూడిన వ్యవస్థ పరిపూర్ణంగా ఉండగలదా? 1993లో కొలీజియం వ్యవస్థను రూపొందించడానికి మూలమైన తీర్పు చెప్పిన నాటి చీఫ్ జస్టిస్ వర్మ సైతం అలా భావించడం లేదు. ‘బీబీసీ హార్డ్ టాక్’ కోసం జస్టిస్ వర్మ 2004లో నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. కొలీజియం విషయంలో తన అభిప్రాయాన్ని మార్చుకున్నాననీ, కార్యనిర్వాహకవర్గమైన ప్రభుత్వా నికి కూడా పాత్ర కల్పించే జాతీయ న్యాయ కమిషన్‌ను తాను నమ్ము తున్నాననీ ఆయన అన్నారు. న్యాయమూర్తుల నియామకానికి ఇదే ఉత్తమమార్గంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కొలీ జియం రచయితే తన మనసు మార్చుకున్నప్పుడు, ఇక అలాంటి న్యాయ నియామకాల వ్యవస్థ పరిపూర్ణమైనదిగా ఉండగలదా? న్యాయచతురత కలిగిన అభ్యర్థులను ఉన్నత స్థానాల్లో న్యాయ మూర్తులుగా నిలిపినట్లయితే, కార్యనిర్వాహక వర్గం తన వ్యక్తిత్వం, సమగ్రత విషయంలో మరింత ఉత్తమంగా ఉండగలుగుతుందని జస్టిస్ వర్మ వాదించారు. కాబట్టే కొలీజియంలో ప్రభుత్వానికి కూడా తప్పకుండా పాత్ర కల్పించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, వర్మ మరొక అడుగు ముందుకెళ్లారు. 1997లో, ఆయన ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పడు, కొలీజియం ఒక అభ్యర్థిని సిఫార్సు చేసింది. అయితే నిఘా సంస్థలు ఆయన పట్ల తీవ్ర అభ్యం తరాలు వ్యక్తం చేస్తున్నాయని నాటి ప్రధాని ఐకే గుజ్రాల్ చెప్పగానే, జస్టిస్ వర్మ ఆ అభ్యర్థి పేరును వెనక్కు తీసుకున్నారు. పైగా తాను ఎందుకలా నిర్ణయం మార్చుకోవలసి వచ్చిందో తన తోటి అయి దుగురు న్యాయమూర్తులకు వివరించారు కూడా! వీరిలో తర్వాత ముగ్గురు ప్రధాన న్యాయమూర్తులు అయ్యారు. అయితే ఈ ముగ్గు రిలో ఒకరు జస్టిస్ వర్మ చెప్పిన విషయాన్ని పక్కనపెట్టి, ఆయన ఉపసంహరించిన వ్యక్తిని తిరిగి నామినేట్ చేశారు. అలా ఆయన ప్రధాన న్యాయమూర్తి అయ్యేలా చూశారు. అంటే ఒక తప్పుడు వ్యక్తిని కూడా కొలీజియం నామినేట్ చేయగలదనడానికి ఇదే రుజువు అని వర్మ అన్నారు. ఇదేమీ ఏకైక ఉదాహరణ కాదని కూడా ఆయన కొనసాగించారు. ఈ అంశం వద్దే దీన్ని ముగించనివ్వండి. ఒక సాధారణమైన పరిశోధన బయటపెట్టిన వాస్తవాలను, ఆందోళనలను మీ ముందు ఉంచాను. నిస్సందేహంగానే ఇక్కడ చెప్పాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. అయితే నేను న్యాయవాదిని కానీ, న్యాయమూర్తిని కానీ కాదు కాబట్టి వాటి గురించి నేను జాగరూకతతో ఉండలేను. అయితే నేను ఈ కథనం ప్రారంభంలోనే వేసిన రెండు ప్రశ్నలను సమర్థిం చడానికి ఇది సరిపోతుంది మరి. కొలీజియం వ్యవస్థ పరిపూర్ణ మైనదేనా? అది మన రాజ్యాంగ ప్రాథమిక స్వరూపంలోనే అంతర్గ తంగా ఉందని భావించవచ్చా? కరణ్ థాపర్, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
కొలీజియం పరాయి వ్యవస్థ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం కోసం ఉద్దేశించిన కొలీజియం వ్యవస్థపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు మరోసారి విమర్శలు గుప్పించారు. అది మన రాజ్యాంగానికి పరాయి వ్యవస్థ అన్నారు. 1991 కంటే ముందు న్యాయమూర్తులను ప్రభుత్వమే నియమించేదని గుర్తుచేశారు. కొలీజియం వ్యవస్థను తీర్పు ద్వారా సుప్రీంకోర్టే సృష్టించుకుందని శుక్రవారం ఢిల్లీలో ‘టైమ్స్ నౌ’ సదస్సులో ఆయనన్నారు. రాజ్యాంగం దేశంలో అందరికీ, ముఖ్యంగా ప్రభుత్వానికి మత గ్రంథం వంటిదే. కోర్టులు, కొందరు న్యాయమూర్తులు తీసుకున్న నిర్ణయానికి మొత్తం దేశం మద్దతున్నట్టు ఎలా భావిస్తాం? కొలీజియం వ్యవస్థను ఏ నియమం కింద నిర్వచిస్తారో చెప్పాలి. అయితే జడ్జీల నియామకానికి మరో ఉత్తమ వ్యవస్థ అందుబాటులోకి వచ్చేదాకా కొలీజియంను ప్రభుత్వం గౌరవిస్తూనే ఉంటుంది’’ అన్నారు. ఆ ఉత్తమమైన వ్యవస్థ ఏమిటన్న దానిపై తాను చర్చించలేనన్నారు. -
Constitution Day: ఏ రాజ్యాంగమూ పరిపూర్ణం కాదు
న్యూఢిల్లీ: రాజ్యాంగ ప్రజాస్వామ్య వ్యవస్థలో కొలీజియంతో సహా ఏ రాజ్యాంగమూ పరిపూర్ణం, లోపరహితం కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. సమస్యలకు పరిష్కార మార్గాలను ప్రస్తుత ఉన్న వ్యవస్థ నుంచే కనిపెట్టాలని తెలిపారు. రాజ్యాంగానికి లోబడి పని చేయాలన్నారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన రాజ్యాంగ దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. రాజ్యాంగాన్ని అమలుపర్చే న్యాయమూర్తులను విశ్వసనీయమైన సైనికులుగా అభివర్ణించారు. ప్రజాసేవ పట్ల అంకితభావం, అనురక్తి ఉన్నవాళ్లు న్యాయ వ్యవస్థలో చేరాలని సీజేఐ సూచించారు. న్యాయవాద వృత్తిలో వలస పాలన కాలం నాటి ఆచారాలను వదిలించుకోవాల్సిన అసవరం ఉందని అభిప్రాయపడ్డారు. లాయర్లకు కఠినంగా అమల్లో ఉన్న డ్రెస్ కోడ్‌ను పునఃపరిశీలించాలన్నారు. మన జీవన విధానం, మన వాతావరణానికి తగ్గట్టుగా డ్రెస్ కోడ్ ఉండాలని సూచించారు. -
ఆయన్ని ఎలా నియమించారు?.. కేంద్రం తీరుపై సుప్రీం అసహనం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంలో సభ్యుల నియామకాల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీం కోర్టు.. బుధవారం మరో కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకం కోసం కొలీజియంలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ సందర్భంగా.. నవంబర్ 19వ తేదీన రిటైర్డ్ బ్యూరోక్రాట్ అరుణ్ గోయల్‌ను కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించడంపై పలు సందేహాలు వ్యక్తం చేసింది. ఈ క్రమంలో.. ఆయన నియామకానికి సంబంధించిన దస్త్రాలను తమకు సమర్పించాలని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం.. కేంద్రాన్ని ఆదేశించింది. జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం.. స్వచ్ఛంద పదవీ విరమణ ఇచ్చిన వెంటనే ఆయన్ని ఎన్నికల విభాగానికి కమిషనర్‌పై నియమించడంపై కేంద్రాన్ని సూటిగా నిలదీసింది. గురువారం వరకు సెక్రెటరీ లెవల్ ఆఫీసర్‌గా అరుణ్ గోయెల్ ఉన్నారని, శుక్రవారం ఆయన వీఆర్ఎస్ తీసుకున్నారని, ఆ వెంటనే ఆయన్ని ఎన్నికల కమిషనర్‌గా నియమించారని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ బెంచ్‌కి వివరించారు. ఒకవేళ ఈసీగా ఆయనకు అవకాశం దక్కకపోయి ఉంటే.. డిసెంబర్లో ఆయన రిటైర్మెంట్ అయ్యే వారని తెలిపింది. ఆపై కేంద్రం తరపున అటార్నీ జనరల్ వాదనలు వినిపిస్తూ.. నియామకం సక్రమంగా జరిగిందని చెప్పే యత్నం చేశారు. ఈ క్రమంలో.. జోక్యం చేసుకున్న బెంచ్.. ఏజీ వాదనను తోసిపుచ్చింది. రాజ్యాంగ ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తమకు అనుకూలంగా ఉండే వ్యక్తిని.. సీఈసీగా నియమిస్తుందంటూ అసహనం వ్యక్తం చేసింది బెంచ్. ఎన్నికల అధికారులు రాజకీయ పార్టీ ప్రభావం నుంచి దూరంగా ఉండాలని, ప్రధాన ఎన్నికల అధికారి నియామక కమిటీలో సీజేఐను చేర్చాలని సుప్రీం కోర్టు కేంద్రానికి సూచించింది. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పని చేయాలి. ప్రధాని లాంటి వ్యక్తిపై ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకునేంత పారదర్శకత కమిషన్ సభ్యుల్లో ఉండాలి అని పేర్కొంది. ఒకవైపు సీఈసీ, ఈసీల నియామక పిటిషన్లపై కోర్టులో విచారణ జరుగుతుండగా.. ఆయన్ని(అరుణ్ గోయల్) ఎలా నియమించారంటూ కేంద్రాన్ని నిలదీసింది. అరుణ్ గోయల్ నియామకానికి సంబంధించిన ఫైళ్లను తమకు సమర్పించాలని కోరిన బెంచ్.. విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
దేశానికి అలాంటి ఎన్నికల కమిషనర్ కావాలి: సుప్రీం
న్యూఢిల్లీ: దేశ ప్రధాన మంత్రిపై సైతం చర్యలు తీసుకునేంత సత్తా ఉన్న ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రస్తుతం మన దేశానికి అవసరమని దేశ సర్వోత్తమ న్యాయస్థానం అభిప్రాయపడింది. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తుల ఎంపిక సరైందంటూ అభిప్రాయపడింది సుప్రీం కోర్టు. కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి.. ఎన్నికల కమిషనర్ల నియామకానికి ప్రస్తుతం నడుస్తున్న వ్యవస్థ సరికాదని.. కొలీజియంలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో.. బుధవారం విచారణ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలే చేసింది బెంచ్. ప్రధాన మంత్రికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునే ప్రధాన ఎన్నికల కమిషనర్ మనకు అవసరం. ఉదాహరణకు.. ప్రధానికి వ్యతిరేకంగా ఆరోపణలు వచ్చాయనుకుందాం. ఆ సమయంలో సీఈసీ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సీఈసీ గనుక బలహీనంగా ఉంటే ఎలాంటి చర్యలు తీసుకోలేరు కదా అని జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ హృషీకేశ్ రాయ్, జస్టిస్ సి.టి.రవికుమార్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనే ఉన్నత స్థానం రాజకీయ ప్రభావం నుంచి రక్షించబడాలి. స్వతంత్రంగా ఉండాలి. కానీ, అలా జరగడం లేదు. ఇది పూర్తిగా వ్యవస్థ విచ్ఛిన్నం కాదా అని కేంద్రం తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ఎన్నికల కమిషనర్ నియామకంలో అనుసరిస్తున్న యంత్రాంగాన్ని తమకు చూపాలని కేంద్రం తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో ప్రభుత్వం తరపున వాదిస్తున్న అటార్నీ జనరల్ & బృందం వివరణలు ఇచ్చుకుంది. కేంద్ర మంత్రివర్గం సలహా మేరకు ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమించాలని రాజ్యాంగంలో ఉందని, ఇంతవరకు అదే అమలవుతోందని ఏజీ ఆర్.వెంకటరమణి బెంచ్‌కు వివరించారు. అంతకు ముందు మంగళవారం వాదనల సందర్భంగా.. సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సున్నితంగా ఉండే ఎన్నికల సంఘం భుజాలపై అపారమైన అధికారాలను రాజ్యాంగం మోపిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సర్వోత్తముడైన వ్యక్తిని ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమించేలా ఓ వ్యవస్థను రూపొందించాలని కేంద్రానికి సూచించింది. ఈ క్రమంలో మాజీ సీఈసీ టీఎన్ శేషన్‌ను గుర్తు చేస్తూ.. అలాంటి గట్టి వ్యక్తి, సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. సమర్థతే కాకుండా దృఢమైన వ్యక్తిత్వం ఉన్నవారిని సీఈసీగా నియమించేందుకు సరైన విధానం రూపొందించాలని అటార్నీ జనరల్ (ఏజీ) ఆర్.వెంకటరమణికి సూచించింది. ఏజీ వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన బెంచ్.. 2004 నుంచి ఒక్క సీఈసీ కూడా ఆరేళ్ల పదవీ కాలాన్ని పూర్తిచేయలేదని తెలిపింది. యూపీఏ, ఎన్డీయే హయాంలో సీఈసీలు మారిన విషయాన్ని గుర్తు చేసింది. అందువల్ల దృఢమైన వ్యక్తులను నియమించేందుకు స్పష్టమైన విధానం ఉండాలని అభిప్రాయపడింది. ఎన్నికల కమిషనర్ల నియామకానికి కొలీజియంలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలంటూ పిల్ దాఖలైంది గతంలో. ఈ పిల్‌ను అక్టోబర్ 2018లో సీఈసీ, ఈసీలతో కూడిన ఐదుగురు జడ్జిల బెంచ్‌కు సిఫార్సు చేసింది. అయితే కేంద్రం మాత్రం అలాంటి వ్యవస్థ అవసరం లేదంటూ వాదిస్తూ వస్తోంది. ఇదీ చదవండి: మోర్బీ విషాదం.. తుప్పుపట్టిన కేబుళ్లు, వదులైన బోల్టులు!! -
కొలీజియంలో పారదర్శకత లేదు.. న్యాయవ్యవస్థలో రాజకీయాలు
ముంబై: సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేదని కేంద్ర న్యాయ మంత్రి కిరెన్ రిజిజు అభిప్రాయపడ్డారు. పూర్తి అర్హతలున్న వారిని మాత్రమే న్యాయమూర్తులుగా నియమించాలే తప్ప కొలీజియంకు తెలిసిన వారినెవరినో కాదంటూ పదునైన వ్యాఖ్యలు చేశారు. ‘‘పైగా ఈ పద్ధతి న్యాయవ్యవస్థలోనూ రాజకీయాలకు తావిస్తోంది. న్యాయమూర్తులు బయటికి చెప్పకపోవచ్చు. కానీ అక్కడ లోతైన రాజకీయాలే ఉన్నాయి’’ అంటూ సునిశిత విమర్శలు కూడా చేశారు. బుధవారం ఇండియాటుడే కాంక్లేవ్‌లో న్యాయవ్యవస్థను సంస్కరించే అంశంపై మంత్రి మాట్లాడారు. ‘‘నేను న్యాయవ్యవస్థను గానీ, న్యాయమూర్తులను గానీ విమర్శించడం లేదు. కానీ ప్రస్తుత కొలీజియం వ్యవస్థ పట్ల మాత్రం నాకు చాలా అసంతృప్తి ఉంది. కొలీజియంలోని న్యాయమూర్తులు తమకు తెలిసిన సహచరుల పేర్లనే సిఫార్సు చేస్తున్నారు. ఇవి కేవలం నా అభిప్రాయాలు మాత్రమే కాదు. లాయర్లతో పాటు కొందరు న్యాయమూర్తుల్లో కూడా ఉన్న అభిప్రాయాలనే చెబుతున్నాను. ఏ వ్యవస్థా పరిపూర్ణం కాదు. నిత్యం మెరుగు పరుచుకుంటూ పోవాలి. ప్రతి వ్యవస్థలోనూ జవాబుదారీతనం, పారదర్శకత ఉండాలి. అలా లేనప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ సంబంధిత మంత్రి కాక ఇంకెవరు మాట్లాడతారు?’’ అని ప్రశ్నించారు. న్యాయవ్యవస్థ కార్యనిర్వాహక పాత్ర పోషించరాదని కుండబద్దలు కొట్టారు. ‘‘నియామక ప్రక్రియలో కేంద్రం కూడా పాలుపంచుకుంటే ఎలా ఉంటుంది? ఎందుకంటే న్యాయమూర్తుల కొలీజియం సిఫార్సు చేసే పేర్లను ఆమోదించేముందు వాళ్లను గురించి అన్నిరకాల సమాచారం సేకరించే స్వతంత్ర యంత్రాంగం ప్రభుత్వం సొంతం. న్యాయవ్యవస్థకు, న్యాయమూర్తులకు ఈ వెసులుబాటు లేదు. పైగా, వాళ్లు దృష్టి పెట్టాల్సింది న్యాయమూర్తుల నియామకాల వంటి పాలనపరమైన పనుల పైనా, లేక ప్రజలకు న్యాయం అందించడం మీదా?’’ అంటూ ప్రశ్నలు సంధించారు. జడ్జిలూ... వ్యాఖ్యలెందుకు? నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఏర్పాటును సుప్రీంకోర్టు కొట్టేయడాన్ని రిజిజు ప్రస్తావించారు. ఈ చర్యపై కేంద్రం తన వైఖరిని ఇంకా స్పష్టం చేయలేదని గుర్తు చేశారు. ‘‘నిజానికి వాళ్లలా కొట్టేసినప్పుడు కేంద్రం కావాలనుకుంటే ఏదో ఒకటి చేసేది. కానీ న్యాయవ్యవస్థ పట్ల గౌరవమున్న కారణంగా ఆ పని చేయలేదు. ఎందుకంటే న్యాయవ్యవస్థ స్వతంత్రంగా ఉండాలన్నది మోదీ సర్కారు అభిప్రాయం’’ అన్నారు. అంతమాత్రాన తామెప్పుడూ మౌనంగానే ఉంటామని అనుకోవద్దంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలను కూడా రిజిజు తప్పుబట్టారు. ‘‘ఏం చెప్పినా తీర్పుల ద్వారానే చెప్పాలి తప్ప అనవసర వ్యాఖ్యలు చేసి విమర్శలు కొనితెచ్చుకోవద్దు’’ అని సూచించారు. -
మా సిఫారసులనే తిరస్కరిస్తారా?
కేంద్రానికి ఆ హక్కు ఎక్కడిదన్న సుప్రీంకోర్టు కొలీజియం - న్యాయ నియామకాల విధివిధానాల సవరణల్లో మార్పులు చేయాలని సూచన - ‘ఎంఓపీ’ని కేంద్రానికి తిప్పి పంపిన కొలీజియం న్యూఢిల్లీ: న్యాయ నియామకాలకు సంబంధించి తాము చేసిన సిఫారసులను జాతీయ ప్రయోజనాల పేరుతో తిరస్కరించటానికి ప్రభుత్వానికి ఏ హక్కు ఉందని సుప్రీంకోర్టు కొలీజియం ప్రశ్నించింది. సుప్రీంకోర్టుకు, 24 హైకోర్టులకు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి మార్గదర్శకం చేసే విధివిధానాల పత్రం (మెమొరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ - ఎంఓపీ)ని కేంద్ర ప్రభుత్వం సవరించి పంపించగా.. అందులో కొన్ని నియమాలను మార్చాలని సూచిస్తూ కొలీజియం శనివారం నాడు ప్రభుత్వానికి తిప్పిపంపించింది. దీంతో దేశంలో కార్యనిర్వాహక వ్యవస్థ - న్యాయవ్యవస్థకు మధ్య మరోసారి ఘర్షణ తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. భారత ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్.ఠాకూర్ నేతృత్వంలో నలుగురు అత్యంత సీనియర్ న్యాయమూర్తులతో కూడిన కొలీజియం ఈ ఎంఓపీని పూర్తిగా తిరస్కరించలేదని, కొన్ని మార్పులు మాత్రమే సూచించిందని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. ► కొలీజియం చేసిన సిఫారసులను ప్రభుత్వం జాతీయ ప్రయోజనాల రీత్యా తిరస్కరించవచ్చంటూ కేంద్రం తాజాగా చేసిన సవరణ.. ఆ సిఫారసులను కొలీజియం పునరుద్ఘాటించినట్లయితే ప్రభుత్వం తప్పనిసరిగా ఆమోదించేలా ప్రస్తుతం అనుసరిస్తున్న విధానానికి విరుద్ధంగా ఉందని అభ్యంతరం వ్యక్తం చేసింది. ► అలాగే.. కొలీజియం చేసిన ఏదైనా సిఫారసును కేంద్రం ఒకసారి తిరస్కరించినట్లయితే.. కొలీజియం దానిని పునరుద్ఘాటించినప్పటికీ కేంద్రం తప్పనిసరిగా పునఃపరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా తాజా సవరణలో చేర్చటాన్ని కొలీజియం వ్యతిరేకించింది. ► సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం, పదోన్నతుల్లో కేంద్రంలో అటార్నీ జనరల్‌కు, రాష్ట్రాల్లో అడ్వొకేట్ జనరళ్ల నిర్ణయానికి చోటుండాలంటూ కేంద్రం చేసిన సవరణపైనా కొలీజియం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనివల్ల.. న్యాయమూర్తుల నియామకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరోక్షంగా తమ నిర్ణయాన్ని అమలు చేసేందుకు అవకాశం ఉంటుందని కొలీజియం వ్యాఖ్యానించింది. ► అలాగే.. ప్రస్తుతం ఒక సిఫారసు చేసిన తర్వాత న్యాయమూర్తిని నియమించటానికి దాదాపు మూడు నెలల కాలం పడుతోందని.. ఆ సమయాన్ని తగ్గించేందుకు గల మార్గాలను చూపాలని కూడా కొలీజియం కోరినట్లు సమాచారం. ► కొలీజియం వ్యవస్థను మరింత పారదర్శకంగా చేసేందుకు.. న్యాయ నియామకాలకు సంబంధించిన ఎంఓపీని సమీక్షించి, పునఃలిఖించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా.. కేంద్రం ఆ మేరకు ఎంఓపీలో సవరణలు సూచించింది. ఇందులో అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగి కీలక పాత్ర పోషించారు. దీన్ని న్యాయమంత్రి సదానందగౌడ గత మార్చిలో సీజేఐకి పంపించారు. ఈ సవరణలపై కొలీజియం లేవనెత్తిన అంశాల విషయంలో కేంద్రం అటార్నీ జనరల్ అభిప్రాయం కోరినట్లు తెలిసింది. -
కొలీజియంపై ప్రతిపాదనలు ఇవ్వలేం: కేంద్రం
ఢిల్లీ : న్యాయమూర్తుల నియామక నూతన విధానం కొలీజియం వ్యవస్థపై ప్రతిపాదనలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. జడ్జీల నియామకంపై ప్రతిపాదనలు ఇవ్వలేమని దేశంలోని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కేంద్ర వివరించింది. ప్రతిపాదనలు ఇవ్వడానికి సాధ్యం కాదని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టుకు గురువారం వివరించారు. కొలీజియం విధానంపై మార్గదర్శకాలు ఇవ్వాలంటూ ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టును కోరారు. -
ఎన్‌జేఏసీపై కీలకతీర్పు నేడు
న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వం తెచ్చిన జాతీయ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ (ఎన్‌జేఏసీ) రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనుంది. హైకోర్టులు, సుప్రీంకోర్టుల్లో జడ్జిల నియామకాలను సుప్రీం చీఫ్ జస్టిస్ సారథ్యంలోని కొలీజియం చూసేది. కొలీజియం వ్యవస్థలో లోపాలున్నాయని పేర్కొంటూ మోదీ ప్రభుత్వం 99వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎన్‌జేఏసీని ఏర్పాటు చేసింది. జస్టిస్ జే.ఎస్.ఖేహర్ నేతృత్వంలోని జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ అదర్శ్‌కుమార్ గోయల్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం ఈ రాజ్యాంగ సవరణను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను 31రోజుల పాటు విచారించింది. ఈఏడాది జూలై15న తీర్పును రిజర్వు చేసింది. ఎన్‌జేఏసీలో సుప్రీంకోర్టు సీజే, సర్వోన్నత న్యాయస్థానంలోని ఇద్దరు అత్యంత సీనియర్ న్యాయమూర్తులు, న్యాయశాఖ మంత్రితో పా టు ఇద్దరు ప్రముఖులు సభ్యులుగా ఉంటారు. ఈ ఇద్దరు ప్రముఖుల పేరిట న్యాయ నియామకాల్లో బయటి జోక్యం పెరుగుతుందని, న్యాయవ్యవస్థ స్వతంత్రను దెబ్బతీసే ఉద్దేశంతోనే ఎన్‌జేఏసీ ఏర్పాటు జరిగిందని.... దీనిని వ్యతిరేకించిన రాంజెఠ్మలానీ, ఫాలీ నారిమన్, అనిల్ దివాన్ లాంటి లాయర్లు వాదించారు. న్యాయపరిజ్ఞానం లేని వారిని జడ్జిల నియామకాల్లో భాగస్వామ్యం చేయడం వల్ల ఉపయోగం ఉండదని వాదనల సందర్భంగా ధర్మాసనం కూడా అభిప్రాయపడింది. ఇతర కమిషన్లు, ట్రిబ్యునళ్లలో ప్రముఖులు (సంబంధిత చట్టాలపై పరిజ్ఞానం లేకున్నప్పటికీ) ఉంటున్నపుడు జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్‌లో ఎందుకు ఉండకూదని అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగీ వాదించారు. -
కొలీజియంపై ‘బార్’ విమర్శలు
న్యూఢిల్లీ: జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ)కి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ బలంగా మద్దతు తెలిపింది. కొలీజియం వ్యవస్థను తీవ్రంగా విమర్శించింది. సినీ తారలు, రాజకీయ నాయకులకు ఊరటనిస్తూ, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు, 2002 గుజరాత్ అల్లర్ల బాధితులకు న్యాయం ఇవ్వని జడ్జీలను ఈ కొలీజియం వ్యవస్థ అందించిందని ధ్వజమెత్తింది. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే బుధవారం జస్టిస్ జె.ఎస్.ఖేహర్ సారథ్యంలోని ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. మానవ విలువలు, మానవ హక్కుల ఉల్లంఘన కేసుల్లో సామాన్యులకు న్యాయం అందించలేకపోవటం మనకు సిగ్గుచేటని అన్నారు. ఒకవైపు అల్లర్ల కేసులో దోషిగా నిర్ధారితుడైన మాయా కొద్నాని వంటి వ్యక్తులు ఊరట పొందుతుంటే.. మరొకవైపు తీస్తా సెతల్వాద్ వంటి కార్యకర్తలు ముందస్తు బెయిలు కోసం అన్నివైపులా పరుగులు తీయాల్సి వస్తోందని ఆయన ఒక దశలో తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. న్యాయమూర్తుల వల్లే సినీతారలు, రాజకీయ నేతలకు తక్షణం ఊరట లభిస్తోందన్నారు. జడ్జీలు బురఖాలతో కోర్టుల ఆవరణలో తిరిగితే.. న్యాయవ్యవస్థ పరిస్థితిని స్వయంగా తెలుసుకోవచ్చన్నారు. -
‘జడ్జీలను జడ్జీలే నియమించడం’ వ్యాఖ్యపై సుప్రీం ఆగ్రహం
న్యూఢిల్లీ: జాతీయ న్యాయ నియామకాల కమిషన్(ఎన్‌జేఏసీ) చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం తీవ్ర వాద, ప్రతివాదనలు చోటు చేసుకున్నాయి. ఉన్నత కోర్టుల్లో జడ్జీల నియామకానికి సంబంధించి గతంలో అమల్లో ఉన్న కొలీజియం వ్యవస్థను విమర్శిస్తూ ‘జడ్జీలే జడ్జీలను నియమించడం’ అనే పదాన్ని ఉపయోగించిన అటార్నీ జనరల్‌పై కేసును విచారిస్తున్న ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘వాట్ ఈజ్ దిస్?. పదం క్యాచీగా ఉంది కదా అని వాడినట్లున్నారు. ఇది కరెక్ట్ కాదు. జడ్జీలను నియమించేది జడ్జీలు కాదు. రాష్ట్రపతి’ అంటూ ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ అసహనం వ్యక్తం చేశారు. జడ్జీలే జడ్జీలను నియమిస్తారని రాజ్యాంగ రూపకర్తలు అప్పట్లో ఊహించి ఉండకపోవచ్చన్న రోహత్గీ వ్యాఖ్యలను ధర్మాసనం తీవ్రంగా తీసుకుంది. ఈ విషయంలో కార్యనిర్వాహక వర్గం నుంచి అధికారం లాగేసుకున్న తీరును చూసి స్వర్గంలో ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బాధ పడి ఉంటారన్న రోహత్గీ కామెంట్‌పై తీవ్రంగా స్పందించిన జస్టిస్ ఖేహర్.. ‘అవును..జరుగుతున్నదంతా చూసి అంబేద్కర్ చాలాసార్లు బాధ పడి ఉంటార’ని తిరిగి అన్నారు. ‘నా వీపు నీవు గోకు.. నీ వీపు నేను గోకుతా’ అన్నట్లు కొలీజియం వ్యవస్థ ఉండేదని, జడ్జీల నియామకం పారదర్శకంగా, జవాబుదారీగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని, అందువల్లనే ప్రభుత్వం ఎన్‌జేఏసీని ముందుకు తెచ్చిందని రోహత్గీ వివరించారు. -
కొలీజియానికి న్యాయబద్ధత లేదు: కేంద్రం
న్యూఢిల్లీ: జడ్జీలను జడ్జీలే నియమించే పాత కొలీజియం వ్యవస్థ న్యాయబద్ధమైనది కాదని కేంద్రం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. కొలీజియంలో లోపాలున్నాయని, దానిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నుంచే విమర్శలు వచ్చాయంది. న్యాయమూర్తుల నియామక జాతీయ కమిషన్ చట్టం చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ముందు కేంద్రం వాదనలు వినిపించింది. నూతన వ్యవస్థలో న్యాయవ్యవస్థ నుం చి ముగ్గురు న్యాయమూర్తులు, పౌరసమాజం నుంచి ఇద్దరు సభ్యులుగా ఉంటారని, జడ్జిల నియామకానికి ఇది ఆరోగ్యకరమైన విధానమని పేర్కొంది. -
'జ్యుడీషియల్' కమిషన్ కు రాజ్యసభ ఆమోదం
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం వ్యవస్థ స్థానంలో జ్యుడీషియల్ నియామకాల కమిషన్ ఏర్పాటుకు వీలు కలిగించే చారిత్రాత్మక బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 179 మంది సభ్యులు ఓటువేయగా, ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ వ్యతిరేకించారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల ఎంపికకు ఆరుగురు సభ్యులతో జాతీయ స్థాయి కమిషన్ ఏర్పాటు చేసేందుకు ఈ బిల్లు వీలు కలిగిస్తుంది. ఈ బిల్లుతోపాటుగా, కమిషన్ ఏర్పాటుకు అవసరమైన రాజ్యాంగ సవరణ బిల్లును కూడా సభ ఆమోదించింది. రాజ్యసభ ఆమోదంతో పార్లమెంట్ ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదించినట్టయింది. ఈ బిల్లుకు లోక్‌సభ బుధవారం మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. ఇక నుంచి న్యాయమూర్తుల నియామకం జ్యుడీషియల్ నియామకాల కమిషన్ ద్వారా జరగనుంది. -
‘జడ్జీల బిల్లు’కు లోక్‌సభ ఆమోదం
జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటులో మరో అడుగు {పతిపక్షం డిమాండ్‌పై బిల్లులో ‘ఏకగ్రీవం‘ అన్న పదం తొలగింపు న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం వ్యవస్థ స్థానంలో జ్యుడీషియల్ నియామకాల కమిషన్ ఏర్పాటుకు వీలు కలిగించే చారిత్రాత్మక బిల్లుకు లోక్‌సభ బుధవారం మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల ఎంపికకు ఆరుగురు సభ్యులతో జాతీయ స్థాయి కమిషన్ ఏర్పాటు చేసేందుకు ఈ బిల్లు వీలు కలిగిస్తుంది. ఈ బిల్లుతోపాటుగా, కమిషన్ ఏర్పాటుకు అవసరమైన రాజ్యాంగ సవరణ బిల్లును కూడా సభ ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 367మంది సభ్యులు ఓటువేయగా, వ్యతిరేకంగా ఎవరూ ఓటువేయలేదు. అయితే, కమిషన్ సిఫార్సు చేసిన ఏదైనా పేరును తిరిగి పరిశీలించాలని రాష్ట్రపతి కోరిన సందర్భాల్లో సదరు వ్యక్తి నియామకానికి కమిటీ సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలపాలన్న ప్రతిపాదనకు సంబంధించిన క్లాజును బిల్లునుంచి తొలగించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ క్లాజు తొలగింపునకు, సభలో చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు వీరప్ప మొయిలీ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ డిమాండ్మేరకు బిల్లుకు అధికారిక సవరణకు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆమోదించడంతో వ్యతిరేకత లేకుండానే బిల్లుకు సభ ఆమోదం లభించింది. కేంద్రమంత్రి ప్రవేశపెట్టిన సవరణ ప్రకారం,..ఎవరైన అభ్యర్థి ఎంపికపై కమిషన్ సిఫార్సును రాష్ట్రపతి తిప్పిపంపిన పక్షంలో కమిషన్ సదరు సిఫార్సును మళ్లీ ఏకగ్రీవంగా ఆమోదించాల్సిన అవసరంలేదు. ఏకగ్రీవ ఆమోదం లేకుండా కమిషన్ సిఫార్సును రాష్ట్రపతికి తిప్పిపంపినపుడు సదరు అభ్యర్థిని జడ్జిగా నియమించవలసి ఉంటుంది. కమిషన్ ఏకగ్రీవ ఆమోదం అవసరమంటూ బ్లిలులో పెట్టిన తొలి క్లాజు ప్రకారమైతే కమిషన్‌లోని ఏ ఒక్కసభ్యుడు వ్యతిరేకించినా, సదరు సిఫార్సు చెల్లకుండా పోతుందని ప్రతిపక్షం అభిప్రాయపడటంతో బిల్లులో ఏకగ్రీవం అన్న పదాన్ని తొలగించారు. పదేళ్ల తర్వాత లోక్‌సభలో ప్రధాని ఓటు పదేళ్ల తర్వాత లోక్‌సభలో బిల్లుపై ప్రధానమంత్రి ఓటువేశారు. జడ్జీల నియామకానికి గతంలో నియమించిన కొలీజియం వ్యవస్థ రద్దుచేయడానికి ఉద్దేశించినరాజ్యాంగ సవరణ బిల్లుకు అనుకూలంగా ప్రధాని నరేంద్ర మోడీ ఓటుచేయడంతో పదేళ్లతర్వాత ప్రధానమంత్రి లోక్‌సభలో ఓటుహక్కు వినియోగించుకున్నట్టయింది. గత పదేళ్ల యూపీఏ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు రాజ్యసభ సభ్యుడు కావడంతో ఆయన తన పదవీకాలమంతా లోక్‌సభలో ఓటువేయడం కుదరలేదు. సభలో డివిజన్ నంబర్లను సభ్యులకు కేటాయించనందున ఓటింగ్‌ను ఎలక్ట్రానిక్ పద్ధతిలోకాక, గతంలోని స్లిప్పుల పద్ధతిలోనే నిర్వహించారు. -
‘న్యాయవ్యవస్థ’ను గౌరవిస్తాం!
* పార్లమెంటు ఆధిక్యతా ముఖ్యమే: కేంద్రం * జ్యుడీషియరీ అధికారాల్లో జోక్యం చేసుకునే ఉద్దేశం లేదు * న్యాయమూర్తుల ఎంపికలో న్యాయమైన విధానం కోసమే * లోక్‌సభలో నేడు ఓటింగ్ న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థ అధికారాల్లో జోక్యం చేసుకునే ఉద్దేశం తమకు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకం కోసం ప్రస్తుతం ఉన్న కొలీజియం వ్యవస్థను రద్దు చేస్తూ.. ఆ స్థానంలో న్యాయమూర్తుల నియామక జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన బిల్లులపై మంగళవారం లోక్‌సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్(ఎన్‌జేఏసీ)-2014పై దాదాపు రోజంతా జరిగిన చర్చలో సభ్యుల నుంచి పలు సూచనలు వచ్చాయి. అనంతరం న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చర్చకు సమాధానమిచ్చారు. ‘మాకు న్యాయవ్యవస్థపై సంపూర్ణ గౌరవం ఉంది. అదే సమయంలో ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలించే పార్లమెంటు పవిత్రత, ఆధిక్యత కూడా అంతే ముఖ్యం. న్యాయవ్యవస్థ అధికారాల విషయంలో జోక్యం చేసుకునే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకంలో న్యాయమైన విధానం ఉండాలన్నది మాత్రమే మా ఉద్దేశం. న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడేందుకే మా ప్రయత్నం’ అని వివరించారు. రవిశంకర్ ప్రసాద్ తన సమాధానాన్ని బుధవారం ముగిస్తారు. అనంతరం ఎన్‌జేఏసీ బిల్లుతో పాటు సంబంధిత రాజ్యాంగ సవరణ బిల్లుపై సభలో ఓటింగ్ జరుగుతుంది. సభ్యులకు ప్రత్యేక సంఖ్యలను కేటాయించే ప్రక్రియ ఇంకా పూర్తి కానందున.. ఓటింగ్‌ను ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానం ద్వారా కాకుండా.. పాత పద్దతిలో చిట్టీల ద్వారా జరిపే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఓటింగ్‌కు చాలా సమయం పట్టొచ్చు. ఆల్ ఇండియా జ్యుడీషియల్ సర్వీసెస్ చర్చ సందర్భంగా న్యాయశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సభ్యుడు వీరప్ప మొయిలీ చేసిన సూచనకు పలువురు సభ్యులు మద్దతు తెలిపారు. దిగువ న్యాయస్థానాల్లో ఉన్న నాణ్యమైన, ప్రతిభ కలిగిన న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో విధులు నిర్వర్తించే అవకాశం కల్పించేలా ‘ఆల్ ఇండియా జ్యుడీషియల్ సర్వీసెస్’ను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచించాలని మొయిలీ సూచించారు. వీటో నిబంధనను ప్రస్తావిస్తూ.. కమిషన్‌లోని ఆరుగురు సభ్యుల్లో ఇద్దరు వ్యతిరేకిస్తే.. ఆ నియామకాన్ని నిలిపేయడం అప్రజాస్వామికమన్నారు. కమిషన్‌లోని ఇద్దరు ప్రముఖ వ్యక్తుల్లో ఒకరు కచ్చితంగా మహిళ అయి ఉండేలా బిల్లులో మార్పు చేయాలన్నారు. ‘ప్రఖ్యాత వ్యక్తి’ అనే పదానికి స్పష్టమైన నిర్వచనం ఇవ్వాలని సూచించారు. ‘నిబంధనల్లో నిర్వచనం లేకపోతే.. అంతా ప్రముఖులే అవుతారు’ అని మొయిలీ వ్యాఖ్యానించారు. హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి ప్రత్యేకంగా రాష్ట్రస్థాయి జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఏఐఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ తదితరులు కోరారు. కొలీజియం వ్యవస్థను సమర్థిస్తూ సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయూమూర్తి జస్టిస్ ఆర్ఎం లోధా చేసిన వ్యాఖ్యలను అప్నాదళ్ సభ్యురాలు అనుప్రియ సింగ్ పటేల్ ప్రస్తావించారు. పార్లమెంటు ప్రతిష్టను తక్కువ చేసే ఉద్దేశంతో కావాలనే ఆ వ్యాఖ్యలు చేశారని ఆమె విమర్శించారు. చర్చపై సమాధానమిచ్చిన రవిశంకర్ ప్రసాద్.. ఈ బిల్లుపై న్యాయ నిపుణులు, రాజకీయ పార్టీలతో వీలైనంత విస్తృతంగా సమాలోచనలు జరిపామన్నారు. కొలీజియం వ్యవస్థ సరిగా పనిచేయడం లేదని సాక్షాత్తూ దివంగత న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ వర్మనే అభిప్రాయపడ్డారని తెలిపారు. రాజ్యసభలో కష్టమే న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన బిల్లుపై రాజ్యసభలో ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది. బిల్లులోని వీటో నిబంధనలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. ‘న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసే రెండు మూడు ప్రతిపాదనలను మార్చాలి’ అని పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ డిమాండ్ చేశారు. కమిషన్‌లో కేంద్ర న్యాయశాఖ మంత్రి కూడా సభ్యుడు కనుక ఏదైనా నియామకంపై ఆయన వ్యతిరేకత వ్యక్తం చేస్తే.. ఆ నియామకం నిలిచిపోయే ప్రమాదం కూడా ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని మరో కాంగ్రెస్ నేత హెచ్చరించారు.