endowment department
-
విజయవాడ దసరా ఉత్సవాల్లో ఘోర అపచారం
-
విజయవాడ: దసరా ఉత్సవాల్లో ఘోర అపచారం
సాక్షి, విజయవాడ: దసరా ఉత్సవాల్లో ఘోర అపచారం జరిగింది. భవానీ భక్తులను దేవాదాయ శాఖ దారుణంగా మోసం చేసింది. ఆగమ శాస్త్రానికి తూట్లు పొడిచిన దుర్గ గుడి అధికారులు.. భక్తులకు ఇతర ఆలయాల్లో ప్రసాదాలు పంపిణీ చేశారు. ఇతర ఆలయాల ప్రసాదాలు దుర్గమ్మ ప్రసాదంగా పంపిణీ చేయడం ఆగమ శాస్త్ర విరుద్ధం. దుర్గగుడికి పెదకాకాని, మోపిదేవి, పెనుగంచిప్రోలు ఆలయాల నుంచి తెచ్చిన 37 వేల లడ్డూలు భవానీ భక్తులతో పాటు దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులకు పంపిణీ చేశారు.ఇతర ఆలయాల నుంచి లడ్డూ ప్రసాదం తెచ్చి దుర్గమ్మ ప్రసాదంగా పంపిణీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవాదాయశాఖ, దుర్గగుడి అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు. బెజవాడ దుర్గమ్మ లడ్డూ ప్రసాదం భవానీ భక్తులకు అత్యంత పవిత్రం, ప్రీతికరం. అయితే, లడ్డు ప్రసాదం కొరత రాకుండా ఉండేందుకేనంటూ చేసిన అపచారాన్ని దుర్గగుడి అధికారులు సమర్థించుకుంటున్నారు. సామాన్య భక్తులతో పాటు భవానీ భక్తుల మనోభావాలను దేవాదాయ శాఖ అధికారులు దారుణంగా దెబ్బతీశారు. -
పూజారి.. ఏది దారి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల అర్చకుల బదిలీలపై పీఠముడి ఏర్పడింది. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఇక ఆల య అర్చకులను కూడా బదిలీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అర్చకులు మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నారు. వీరికి ఆ శాఖలోని కొందరు అధికారులు మద్దతిస్తుండగా, మరికొందరు అధికారులు మాత్రం బదిలీ చేయటంలో ఎలాంటి తప్పు లేదని పేర్కొంటున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అర్చకులు.. మంత్రులు మొదలు స్థానిక ఎమ్మెల్యేలను కలుస్తూ, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకునేలా ఒత్తిడి ప్రారంభించారు. వాస్తవానికి ఇప్పటివరకు దేవాలయ ఉద్యోగులను మాత్రమే ఒక ఆలయం నుంచి మరో ఆలయానికి బదిలీ చేసేవారు. అర్చకులు మాత్రం అదే దేవాలయంలో పనిచేస్తూ వస్తున్నారు. అయితే ఉద్యోగులతో సమంగా ఇప్పుడు ఆలయ అర్చకులు కూడా ప్రభుత్వం నుంచి జీతాలు పొందుతున్నందున.. అర్చకులను కూడా ఆలయ ఉద్యోగులుగానే పరిగణిస్తూ బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు దేవాదాయ శాఖ పది రోజులుగా కసరత్తు చేస్తోంది. హైకోర్టు స్టే.. కౌంటర్‌కు ప్రభుత్వం ఏర్పాట్లు.. దేవాదాయ శాఖ చరిత్రలో తొలిసారి అర్చకుల బదిలీలకు రంగం సిద్ధమైన వేళ. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ భద్రాచలం దేవాలయానికి చెందిన నారా యణాచార్యులు, మురళీకృష్ణమాచార్యులు హైకోర్టును ఆశ్రయించటంతో కోర్టు బదిలీ ప్రక్రియను రెండు వారాలపాటు నిలిపేస్తూ స్టే ఇచ్చింది. దీనికి కౌంటర్ దాఖలు చేసేందుకు దేవాదాయ శాఖ సిద్ధమవుతోంది. అర్చకుల వివరాలు, బదిలీ చేస్తే ప్రత్యామ్నాయ దేవాలయాన్ని ఎంచుకునే ఐచ్చికాన్ని తెలపాలంటూ జారీ చేసిన నమూనా పత్రం ఆధారంగా ఈ ఇద్దరు అర్చకులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే స్టే గడువు పూర్తి కాగానే బదిలీలు నిర్వహించాలన్న అభిప్రాయంతో ఉన్నతాధికారులున్నట్టు తెలుస్తోంది. ఐదు దేవాలయాల చాయిస్ ఆయా దేవాలయాల ఉద్యోగుల వివరాలను, వారు బదిలీలో ఏ దేవాలయాన్ని కోరుకుంటున్నారో (ఐదు దేవాలయాల చాయిస్) వెల్లడించాలని పే ర్కొంటూ ప్రొఫార్మాను ఆలయాలకు పంపింది. ఆ వివరాలు సేకరించి.. ఉమ్మడి జిల్లా యూనిట్‌గా అంతరజిల్లా బదిలీలు చేయాలని నిర్ణయించింది. అర్చకులతోపాటు వేద పండితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కూడా నిర్ణయించటం విశేషం. ఎవరికి వర్తిస్తుందంటే. రాష్ట్రంలోని దేవాలయాల ఆదాయం ఆధారంగా వాటి స్థాయిని ప్రభుత్వం విభజించింది. సాలీనా రూ.2 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వాటిని నేరుగా పర్యవేక్షిస్తూ తన ఆ«దీనంలోకి తీసుకుంది. ఈ దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు ఉద్యోగుల తరహాలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా జీతాలను చెల్లిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఇలాంటివి646 దేవాలయాలున్నాయి. వీటిల్లో 2500 మంది వరకు అర్చకులు పనిచేస్తున్నారు. ప్రతి సంవత్సరం 20 శాతం మంది బదిలీ.. దేవాదాయ శాఖలో ప్రతి సంవత్సరం 20 శాతం మంది ఉద్యోగులను బదిలీ చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. బదిలీ ప్రక్రియకు సంబంధించిన గైడ్‌లైన్స్‌ను వెల్లడిస్తూ 2019లో జీఓ నంబరు 64ను జారీ చేసింది. కానీ, అది అమలులోకి రాలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం బదిలీలకు సిద్ధమైంది. ఈమేరకు జీఓ 243ని వారం రోజుల క్రితం జారీ చేసింది. వైష్ణవ ఆగమాలను అనుసరించే దేవాలయాల్లో పద్ధతులకు శైవ ఆగమాలను అనుసరించే దేవాలయాల్లో పద్ధతులకు చాలా తేడా ఉంటుంది. ఏ ఆగమాన్ని అనుసరించే దేవాలయ ఉద్యోగులు అదే ఆగమాన్ని అనుసరించే దేవాలయానికే బదిలీ చేయాలని నిర్ణయించింది. -
పూర్ణాహుతితో పరిపూర్ణం
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అష్టోత్తర శత కుండాత్మక, చండీ, రుద్ర, రాజశ్యామల సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం బుధవారంతో ముగిసింది. వేద మంత్రోచ్ఛారణల నడుమ పీఠాధిపతులు ముందుండి నడిపించగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా మహాయజ్ఞ అఖండ పూర్ణాహుతి కార్యక్రమం వైభవంగా పూర్తైంది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, శాంతి సౌభాగ్యాలు, పాడిపంటలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలతో ప్రజలంతా వర్థిల్లాలని కాంక్షిస్తూ, ప్రకృతి అనుగ్రహం ఎల్లప్పడూ కొనసాగాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్ ఈనెల 12వ తేదీన మహాయజ్ఞ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆరు రోజులపాటు నిత్య పారాయణాలు, వైదిక క్రతువులు, వివిధ క్షేత్రాల కల్యాణోత్సవాలు, పీఠాధిపతుల అనుగ్రహభాషణలు, ప్రవచనాలు, పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించిన మహాయజ్ఞ క్రతువులో 600 మందికి పైగా రుత్వికులు, వేదపండితులు పాలుపంచుకున్నారు. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు, దేవదాయశాఖ కమిషనర్ ఎస్. సత్యనారాయణ దంపతులు దీక్షాధారణ చేపట్టి రోజువారీ యజ్ఞ కార్యక్రమాలలో పాల్గొన్నారు. అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం మహాయజ్ఞం ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సీఎం జగన్‌కు వేద పండితులు మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పాంచరాత్ర, వైదిక స్మార్త, వైఖానస, శైవ ఆగమ యాగశాలలను సందర్శించిన సీఎం జగన్ వేద పండితుల సూచనలకు అనుగుణంగా హోమగుండంలోకి సుగంధ ద్రవ్యాలను జారవిడిచి పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక మండపంలో ఏర్పాటు చేసిన అనంత(మహా)లక్ష్మీ అమ్మవారికి స్వయంగా పంచామృతాలతో అభిషేకం చేసి హారతి ఇచ్చారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులందరి పేర్లతో, గోత్రనామాలతో వేదపండితులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగా రూపొందించిన దుర్గ గుడి మాస్టర్ ప్లాన్ నమూనాను యజ్ఞశాల వద్ద ముఖ్యమంత్రి పరిశీలించారు. ఆశీర్వదించిన పీఠాధిపతులు మహాయజ్ఞం అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో విశాఖ శారదా పీఠాధిపతి శ్రీస్వరూపానందేంద్రస్వామి, మైసూరు దత్తపీఠాధిపతి శ్రీగణపతి సచ్చిదానందస్వామి, రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థస్వామి, విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీస్వాత్మానందేంద్ర స్వామితోపాటు శ్రీత్రిదండి దేవనాథ జియ్యర్ స్వామి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరి బాగోగులు కోరుతూ ప్రత్యేక సంకల్పం తీసుకుని మహాయజ్ఞ దీక్షను నిర్వహించిన సీఎం జగన్‌కు పీఠాధిపతులు వేర్వేరుగా వేదాశీర్వచనం అందజేశారు. ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు, మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, మంత్రులు తానేటి వనిత, జోగి రమేష్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంపూర్ణంగా ఫలప్రదం: ఉప ముఖ్యమంత్రి కొట్టు వేదాలు సూచించిన ఎనిమిది ఆగమాల ప్రకారం దేశ చరిత్రలో తొలిసారిగా ఆరు రోజులు నిర్వహించిన మహాయజ్ఞం, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం సంపూర్ణంగా ఫలప్రదమైందని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. దేవదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ, ఇతర అధికారులతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ కార్యక్రమానికి ముందురోజు వరుణ దేవుడు వర్షం కురిపించి ఆశీస్సులు అందించినట్లు చెప్పారు. ప్రత్యేకంగా శ్రీనగర్ నుంచి తెప్పించిన కల్తీ లేని కుంకుమ పువ్వు, ఎక్కడా దొరకని కస్తూరిని విశేష ద్రవ్యాలతో పూజల్లో ఉపయోగించినట్లు వెల్లడించారు. మహాయజ్ఞం విజయవంతంగా పూర్తి కావడం పట్ల సీఎం సంతోషం వ్యక్తం చేశార న్నారు. సనాతన హిందూ ధర్మం పట్ల ముఖ్యమంత్రికి ఉన్న గౌరవానికి ఇది నిదర్శనమని చెప్పారు. రాష్ట్రమంతా ధర్మ ప్రచారం కోసం ప్రభుత్వం ఇప్పటికే ధర్మపరి రక్షణ పరిషత్‌ను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ఈనెల 25 నుంచి 31వతేదీ వరకు శ్రీశైలంలోని శివాజీ రాజగోపురంపై బంగారు కలశం ఏర్పాటు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా మల్లిఖార్జునస్వామి వారికి మహా కుంభాభిషేకం నిర్వహిస్తామన్నారు. మహాయజ్ఞం క్రతువును నిర్విఘ్నంగా పూర్తి చేసిన అర్చన ట్రైనింగ్ అకాడమీ డైరెక్టర్ వేదాంత రాజగోపాల చక్రవర్తి, గోపాలాచార్యులు, కైతేపల్లి సుబ్రహ్మణ్యం, కండవల్లి సూర్యనారాయణాచార్యులు, మృత్యుంజయప్రసాద్, దుర్గగుడి స్థానాచార్యులు శివప్రసాద్‌ను ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ అభినందించారు. ముఖ్యమంత్రి జగన్‌కు కాణిపాకం గణపతి ఆశీస్సులు యాదమరి (చిత్తూరు జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులను వేదపండితులు అందచేశారు. బుధవారం విజయవాడలో శ్రీలక్ష్మీ మహాయజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్‌ను కాణిపాకం ఆలయం చైర్మన్ మోహన్‌రెడ్డి కలసి స్వామివారి తీర్థ ప్రసాదాలు, వేదపండితుల ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో కొత్తగా 3,000 ఆలయాలు
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ ఆధ్వర్యంలో టీటీడీ శ్రీవాణి ట్రస్టు ద్వారా రాష్ట్రంలో కొత్తగా దాదాపు 3 వేల ఆలయాలను నిర్మిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో ఆలయాల నిర్మాణం కొనసాగుతోందన్నారు. అధికారులతో సమీక్ష అనంతరం శుక్రవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక్కో ఆలయానికి రూ.10 లక్షల చొప్పున 1,072 ఆలయాల నిర్మాణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందన్నారు. వీటిలో 936 చోట్ల ఆలయాలను నిర్మించేందుకు భూమిని గుర్తించామని చెప్పారు. వీటిలో పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారానే మరో 330 ఆలయాల నిర్మాణం హిందూ ధార్మిక సంస్థ సమరసత ఆధ్వర్యంలో కొనసాగుతోందన్నారు. ఇవికాకుండా మరో 1,568 ఆలయాల నిర్మాణానికి స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. మరో 300 చోట్ల కూడా ఆలయాలను నిర్మించాలని అక్కడి ప్రజాప్రతినిధులు కోరుతున్నారన్నారు. వచ్చే ఏడాదిన్నర కాలంలోనే ఆలయాల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు ప్రతి 30 ఆలయాలకు ఒక ఇంజనీరింగ్ అధికారిని నియమించనున్నామని తెలిపారు. దేవదాయ శాఖ ఆలయాల్లో పనిచేసే ఉద్యోగుల బదిలీలకు ఏక విధానంతో కూడిన ప్రత్యేక పాలసీని తీసుకురానున్నట్టు చెప్పారు. అన్నదాన సత్రాల ఏర్పాటుకు 18 దరఖాస్తులు.. శ్రీశైలంలో వివిధ కులసంఘాల ఆధ్వర్యంలో అన్నదాన సత్రాల ఏర్పాటు, ఇతర సేవా కార్యక్రమాల నిర్వహణకు 18 దరఖాస్తులు ప్రభుత్వ పరిశీలనకు వచ్చాయన్నారు. వీటికి ఒక నిర్ణీత విధానంలో భూకేటాయింపులు చేయాలనే యోచన చేస్తున్నట్టు వివరించారు. ముందుగా అక్కడ భక్తులకు వసతి కోసం ఎన్ని గదులతో సత్రాలు నిర్మిస్తారో పూర్తి ప్లాన్‌ను సమర్పించాల్సి ఉంటుందన్నారు. శ్రీశైలంలో భూముల కేటాయింపు ఆలయ అభివృద్ధికి దోహదపడేలా నిబంధనలు తీసుకొచ్చే యోచనలో ఉన్నామని తెలిపారు. శ్రీశైలం ఆలయం– అటవీ శాఖల మధ్య ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న 4,700 ఎకరాల భూమిని అటవీ శాఖ.. ఆలయానికి స్వాధీనం చేసేందుకు ఆమోదం తెలిపిందన్నారు. విజయవాడ దుర్గగుడిలో భక్తులకు అదనపు సౌకర్యాల కోసం పూర్తి స్థాయి మాస్టర్ ప్లాన్ సిద్ధమైందని తెలిపారు. ఆలయాల్లో వివిధ అవసరాలకు వస్తువుల కొనుగోలులో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ప్రతి ఆలయంలో మూడు వేర్వేరు టెండర్ల ప్రక్రియ ఉంటుందన్నారు. దేవదాయ శాఖ భూముల పరిరక్షణకు ప్రత్యేక సెల్ ఉందని తెలిపారు. -
3 ప్రముఖ ఆలయాలకు ట్రస్టు బోర్డుల నియామకం
సాక్షి, అమరావతి/ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలో దేవదాయ శాఖ పరిధిలోని మూడు ప్రముఖ ఆలయాలకు ప్రభుత్వం మంగళవారం ట్రస్టు బోర్డులను నియమించింది. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీవీరవెంకటసత్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి ఆ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఐ.వి.రోహిత్‌ను ట్రస్టు బోర్డు చైర్మన్‌గా, మరో 13 మంది ట్రస్టు బోర్డు సభ్యులుగా నియమిస్తూ దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి హరిజవహర్‌లాల్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానానికి ఆ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఎస్వీ సుధాకరరావును ట్రస్టు బోర్డు చైర్మన్‌గా, మరో 14 మంది ట్రస్టు బోర్డు సభ్యులుగా నియమించారు. అదే విధంగా విజయవాడ శ్రీదుర్గమల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి 15 మంది ట్రస్టు బోర్డు సభ్యులను నియమించారు. ఈ మూడింటికి వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ దుర్గగుడి ట్రస్టు బోర్డు చైర్మన్‌ను సభ్యులు ప్రమాణ స్వీకారం అనంతరం సమావేశమై ఎన్నుకుంటారు. అదనంగా ఆయా ఆలయాలలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్న వారు ఆయా ట్రస్టు బోర్డులో ఎక్స్ అఫిషియో సభ్యులుగా కొనసాగుతారని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయా ఆలయాల ట్రస్టు బోర్డులలోని సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి రెండేళ్ల పాటు ఆ పదవుల్లో కొనసాగుతారని తెలిపింది. దుర్గమ్మ ఆలయ చైర్మన్‌గా కర్నాటి రాంబాబు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం మంగళవారం జరిగింది. చైర్మన్‌గా కర్నాటి రాంబాబు, సభ్యులుగా కేసరి నాగమణి, కట్టా సత్తెయ్య, బుద్దా రాంబాబు, దేవిశెట్టి బాలకృష్ణ, చింతా సింహాచలం, బచ్చు మాధవీకృష్ణ, అనుమోలు ఉదయలక్ష్మి, నిడమనూరి కళ్యాణి, నంబూరి రవి, చింకా శ్రీనివాసరావు, మారం వెంకటేశ్వరరావు, అల్లూరి కృష్ణవేణి, తొత్తడి వేదకుమారి చేత ఈవో భ్రమరాంబ ప్రమాణ స్వీకారం చేయించారు. కొలుకులూరి రామసీత ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. -
పండుగలు, ప్రత్యేక పర్వదినాల్లో.. వీఐపీ దర్శనాలకు పరిమితులు
సాక్షి, అమరావతి: పండుగలు, జాతరలు, ఇతర ప్రత్యేక పర్వదినాల్లో ఉదయం సాయంత్రం వేళ నిర్ణీత సమయంలో ఒకట్రెండు గంటలు మాత్రమే ఆలయాల్లో వీఐపీ దర్శనాలను పరిమితం చేయాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. సాధారణ భక్తులకు సంతృప్త స్థాయిలో తొందరపాటు లేని దర్శనాన్ని సజావుగా అందించడం అత్యంత ప్రాధాన్యతగా దేవదాయ శాఖ భావిస్తోంది. ఆయా రోజుల్లో వృద్ధులు, చిన్నపిల్లల తల్లులతో పాటు దివ్యాంగుల దర్శనాలకు ప్రత్యేక ఏర్పాట్లుచేస్తారు. ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ సూచన మేరకు దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ అన్ని ఆలయాల ఈఓలకు ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. ఉత్తర్వుల్లో ముఖ్యాంశాలు.. ► పండుగ, జాతర రోజులతో పాటు ఇతర ప్రత్యేక పర్వదినాల్లో వీఐపీలకు, ఉదయం, సాయంత్రం ఒకట్రెండు గంటల పాటు నిర్ణీత సమయం కేటాయిస్తారు. ఆ సమయంలో కూడా ఒకటి లేదా రెండు సాధారణ భక్తుల క్యూలైన్లు కొనసాగించాలి. ► సామాన్య భక్తులకు సాఫీగా సంతృప్త స్థాయిలో దర్శనాలను అందించడం ఆయా ఆలయాల ఈఓల ప్రాథమిక విధి. ► వీఐపీ, అతని కుటుంబ సభ్యులు మొత్తం ఆరుగురు మించకుండా చూసుకోవాలి. అంతకుమించి ఉంటే వారు దర్శన టికెట్లు కోనుగోలు చేయాలి. ► పండుగ, ప్రత్యేక పర్వదినాల రోజుల్లో ఆలయానికి వచ్చే వీఐపీలకు ఆలయ ఈఓ అవసరమైన మర్యాదలు చేసేందుకు వీలుగా వారు ఆలయ సందర్శన షెడ్యూల్‌కు ఒక్క రోజు ముందు వీఐపీలు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ► ప్రత్యేక పర్వదినాల్లో వీఐపీలతో పాటు సాధారణ భక్తులకు అంతరాలయ దర్శనాలపై నియంత్రణ ఉండాలి. ► ఈ రోజుల్లో అన్ని రకాల దర్శన టికెట్లను ఆన్లైన్ విధానంలో మాత్రమే విక్రయించాలి. ఇంటర్నెట్ సమస్యలు తలెత్తితే పీఓఎస్ వంటి ప్రత్యేక పరికరాల ద్వారా కేటాయించాలి. ► ఈ టికెట్లను క్యూలైన్లో స్కాన్‌చేసే విధానం ఏర్పాటుచేసుకోవాలి. అలాగే, స్కానింగ్ జరిగే ప్రాంతంలో సీసీ కెమెరాలను విధిగా ఏర్పాటుచేసుకోవాలి. ఈ ఫుటేజీ కనీసం 15 రోజుల పాటు బ్యాకప్‌తో ఉండాలి. ► ఉచిత దర్శనం క్యూలైన్లు ఆలయం తెరిచినంతసేపు కొనసాగించాలి. ► దర్శనాలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక అధికారి బాధ్యత తీసుకోవాలి. -
గుళ్లలో అరిటాకులు లేదా విస్తళ్లలోనే అన్నదానం
సాక్షి, అమరావతి: ఆలయాల్లో నిర్వహించే అన్నదానంలో భక్తులకు అరిటాకులు లేదా విస్తరాకుల్లో మాత్రమే వడ్డించాలని దేవదాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్రంలోని ఆలయాల ఈవోలకు దేవదాయశాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలోని దేవదాయశాఖ పరిధిలోని అన్ని ప్రధాన ఆలయాల్లో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మంగళవారం కూడా రాష్ట్రంలోని పది ప్రధాన ఆలయాల్లోనే కేవలం మధ్యాహ్నం వేళ 2,24,727 మంది భక్తులకు అన్నదానం జరిగింది. కొన్ని ఆలయాల్లో స్టీల్‌ప్లేట్లలో అన్నదాన కార్యక్రమం కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో.. ఆలయాల్లో అన్నదానం పేరుతో అందజేసే ఆహారానికి మరింత పవిత్రతను కల్పించేందుకు భక్తులకు అరిటాకులు లేదా విస్తరాకుల్లో మాత్రమే భోజనం వడ్డించాలని నిర్ణయించినట్టు దేవదాయశాఖ కమిషనర్ ఈవోలకు ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఒకవేళ స్టీల్ప్లేట్లోనే వడ్డించాల్సి వస్తే.. ప్లేట్లో ఆకువేసి వడ్డించాలని సూచించారు. ఇందుకు సంబంధించి ఉపముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఇటీవల ప్రధాన ఆలయాల ఈవోలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలోను సూచించిన విషయాన్ని కమిషనర్ తన ఆదేశాల్లో ఉదహరించారు. -
పెద్ద ఆలయాల్లో ఆన్లైన్ సేవలు
సాక్షి, అమరావతి: రూ.25 లక్షలకు పైబడి వార్షికాదాయం కలిగిన 175 పెద్ద ఆలయాల్లో జనవరి నెలాఖరుకు ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. దేవదాయ శాఖలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలపై బుధవారం విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికే 16 ప్రధాన ఆలయాల్లో పూర్తి స్థాయి ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్, అదనపు కమిషనర్ చంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
జేసీ దివాకర్ రెడ్డికి దేవాదాయ శాఖ నోటీసులు
-
16 నుంచి అయ్యప్ప దర్శనం
సాక్షి, అమరావతి: నిర్దిష్ట వేళల్లో మాత్రమే కొనసాగే శబరిమల అయ్యప్పస్వామి దర్శనాలు ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది జనవరి 18వ తేదీ వరకు ఈ విడత దర్శనాలు కొనసాగుతాయి. కేరళలోని శబరిమల అయ్యప్ప దర్శనానికి రాష్ట్రం నుంచి ఈసారి 5 లక్షలకు పైగా భక్తులు తరలివెళ్తారని అంచనా. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టే చర్యల్లో భాగంగా ఏటా శబరిమల యాత్ర ప్రారంభానికి ముందు కేరళ రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వివిధ దక్షిణాది రాష్ట్రాల దేవదాయ శాఖ మంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ ఏడాదికి సంబంధించిన ఏర్పాట్లపై కేరళ మంత్రి రాష్ట్ర దేవదాయ శాఖ అధికారులతో పాటు వివిధ దక్షిణాది రాష్ట్రాల అధికారులతో మూడు రోజుల క్రితం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే దర్శనం కరోనా నేపథ్యంలో మూడేళ్లగా శబరిమల ఆలయానికి సంబంధించిన ‘వర్చువల్ క్యూ సిస్టమ్’ ప్రత్యేక వెబ్ పోర్టల్‌లో ముందుగా పేర్లు నమోదు చేసుకున్న వారిని మాత్రమే ఆలయ అధికారులు దర్శనాలకు అనుమతిస్తున్నారు. ఈ ఏడాది కూడా ముందుగా పేర్లు నమోదు చేసుకున్న వారినే అనుమతిస్తున్న విషయాన్ని ఏపీలోని భక్తులకు తెలిసేలా ప్రచారం చేయాలని కేరళ మంత్రి విజ్ఞప్తి చేశారు. భక్తుల సౌకర్యార్థం శబరిమలకు వచ్చే మార్గంలోని నిలక్కల్, ఎడతావళం ప్రాంతాల్లో ప్రత్యేకంగా స్పాట్ బుకింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఆలయాల్లో ప్రత్యేక బోర్డులు శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు పాటించాల్సిన నిబంధనల్ని తెలియజేసేలా రాష్ట్రంలోని పెద్ద ఆలయాల్లో ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేసేలా రాష్ట్ర దేవదాయ శాఖ చర్యలు చేపట్టింది. రూ.25 లక్షలకు పైబడి ఆదాయం వచ్చే దాదాపు 270 ఆలయాల్లో ఈ బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్టు దేవదాయ శాఖ అధికారులు వెల్లడించారు. కేరళ ప్రభుత్వం చేసిన సూచనలతో తెలుగులో బుక్లెట్ రూపొందించి, వాటిని ఆయా ఆలయాల వద్ద ఆయ్యప్ప భక్తులకు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఈ నిబంధనలు తప్పనిసరి ► దర్శనాలకు వచ్చే భక్తులు వైద్యుడు ఇచ్చే మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లను తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. ► భక్తులు ప్లాస్టిక్, వాడి పడేసే కొన్ని రకాలైన పేపర్లు వంటివి కలిగి ఉండకూడదని.. కప్పులు, గ్లాస్లు వంటివి ఒకసారి వాడిన తర్వాత కడుక్కొని తిరిగి వాడుకోవడానికి అవకాశం ఉండేవి మాత్రమే వెంట తీసుకెళ్లాలి. అన్నిరకాల ప్లాస్టిక్ వస్తువులు, యూజ్ అండ్ త్రో కవర్ల వినియోగంపై కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ► గుడ్డ సంచులను మాత్రమే భక్తులు వెంట తీసుకువెళ్లాలి. ► పంబ, అయ్యప్పస్వామి ఆలయ సన్నిధానం ప్రాంతాల్లో సెల్ఫోన్ల వాడకంపై నిషేధం అమలులో ఉంటుంది. -
వచ్చే నెలాఖరుకు శ్రీశైల దేవస్థానం సరిహద్దులు
సాక్షి, అమరావతి: శ్రీశైలం దేవస్థానం భూముల సరిహద్దులను అక్టోబరు నెలాఖరుకల్లా ఖరారు చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. గురువారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీశైలం దేవస్థానం అభివృద్ధిలో భాగంగా మాస్టర్ ప్లాన్ తయారు చేసేందుకు భూ సరిహద్దులు సక్రమంగా లేకపోవడం ఆటంకంగా మారిందన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావుతో కలిసి సమీక్ష నిర్వహించామన్నారు. అటవీ, రెవెన్యూ, సర్వే అండ్ లాండ్ రికార్డ్స్, దేవదాయ శాఖ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో భూ సర్వే చేపడతామన్నారు. 1879లో దాదాపు 4,130 ఎకరాలుండగా.. 1967లో మరో 145 ఎకరాలను ప్రభుత్వం శ్రీశైల దేవస్థానానికి కేటాయించిందన్నారు. నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్టులో ఈ భూములు ఉండటంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే సరిహద్దుల ఖరారు తప్పనిసరైందన్నారు. రిజర్వ్ ఫారెస్టు నిబంధనలను అతిక్రమించకుండా దేవస్థానానికి చెందిన భూముల్లో పర్యావరణ, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. కాగా, బెజవాడ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఉప ఆయన చెప్పారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సమావేశంలో దేవదాయ శాఖ కమిషనర్ హరి జవహర్లాల్ పాల్గొన్నారు. -
శ్రీవారి సేవలో సీఎం
సాక్షి ప్రతినిధి, తిరుపతి/తిరుమల/సాక్షి నెట్వర్క్: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువ్రస్తాలు సమరి్పంచారు. ప్రతిఏటా నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువ్రస్తాలను సమర్పించటం ఆనవాయితీ. అందులో భాగంగా ధ్వజారోహణతో మంగళవారం ప్రారంభమైన బ్రహ్మోత్సవాల తొలి రోజున ఆయన తిరునామం పెట్టుకుని.. పంచెకట్టు, కండువాతో శ్రీవారికి పట్టు వ్రస్తాలను తీసుకొచ్చారు. సీఎం హోదాలో వైఎస్ జగన్ ఇలా శ్రీవారికి పట్టు వ్రస్తాలు సమర్పించడం ఇది నాలుగవసారి. అంతకుముందు బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్న అనంతరం.. అక్కడ అర్చకులు ఆలయ సంప్రదాయం మేరకు సీఎం తలకు పరివట్టం చుట్టారు. పట్టువస్త్రాలను తలపై పెట్టుకున్న ముఖ్యమంత్రి వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, ఆశ్వ, గజరాజులు వెంటరాగా ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. బలిపీటానికి, ధ్వజస్తంభానికి మొక్కుకుని వెండివాకిలి మీదుగా బంగారువాకిలి చేరుకుని గరుడాళ్వార్‌ను దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి సన్నిధిలో అర్చకులకు పట్టువస్త్రాలను అందజేసి స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు స్వామి వైభవాన్ని తెలియజేయగా జీయర్లు శేషవస్త్రంతో íసీఎంను సత్కరించారు. అనంతరం వకుళమాతను దర్శించుకున్న ముఖ్యమంత్రి ప్రదక్షిణగా ఆనందనిలయంపై ఉన్న విమాన వేంకటేశ్వరస్వామిని, సబేరా, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామిని దర్శించుకున్నారు. హుండీలో కానుకలు సమర్పించి రంగనాయకుల మండపానికి చేరుకున్న ఆయనకు వేదపండితులు చతుర్వేద ఆశీర్వచనం అందజేశారు. టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి.. శ్రీవారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీవారి ఆలయంలో బియ్యాన్ని తులాభారంగా సమర్పించారు. 2023 శ్రీవారి కేలండర్, డైరీ, టేబుల్ కేలండర్లను, అగ్గిపెట్టెలో పెట్టిన చీరను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. తరువాత శ్రీవారి వాహన మండపానికి చేరుకున్న సీఎం.. పెద్దశేషవాహన సేవలో పాల్గొన్నారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని దర్శించుకున్నారు. అనంతరం పద్మావతి అతిథిగృహానికి చేరుకున్నారు. తిరుమలలో బియ్యాన్ని తులాభారంగా సమర్పిస్తున్న సీఎం జగన్. చిత్రంలో సుబ్బారెడ్డి, మంత్రి రోజా అభిమానం.. అభివాదం శ్రీవారి దర్శనాంతరం ఆలయం వెలుపలకు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వాహన మండపానికి వెళ్తున్న సమయంలో అక్కడ ఉన్న వారికి అభివాదం చేశారు. కొందరు భక్తులు సీఎంను చూసిన ఆనందంలో సీఎం సార్, సీఎం సార్ అంటూ కేకలు వేశారు. వారందరికీ అదే అభిమానంతో రెండుచేతులతో నమస్కరిస్తూ ఆయన ముందుకు సాగారు. ముందు తిరుపతి గంగమ్మను దర్శించుకున్న సీఎం ఆచారాలు, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 400 ఏళ్ల ప్రాచీన సంప్రదాయాన్ని పునరుద్ధరించారు. తిరుమల శ్రీవారికి చెల్లెలుగా భావించే తిరుపతిలోని శ్రీతాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్న తర్వాతే భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకునే సంప్రదాయం 900 ఏళ్లుగా ఉన్నట్లు చరిత్ర ఉంది. కాలక్రమేణా 400 ఏళ్ల నుంచి ఈ సంప్రదాయం కనుమరుగైంది. ఈ విషయాన్ని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ముఖ్యమంత్రికి వివరించారు. ఘనచరిత్ర కలిగిన అమ్మవారి ఆలయ సంప్రదాయాన్ని పునరుద్ధరించేందుకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు తిరుమల వెళుతూ ముందుగా శ్రీతాతయ్యగుంట గంగమ్మ దర్శనం చేసుకున్నారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం అఖిలాండం వద్ద కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమతో కూడిన సారెను సమర్పించారు. దర్శనానంతరం అర్చకులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం చేశారు. అమ్మవారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ సందర్శన పుస్తకంలో సీఎం సంతకం చేశారు. తిరుమలలో అర్చకుల ఆశీర్వాదాలు అందుకుంటున్న సీఎం జగన్. చిత్రంలో డిప్యూటీ సీఎం కొట్టు ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభం అనంతరం తిరుపతి–తిరుమల మధ్య నడిపే పది ఎలక్ట్రికల్ బస్సులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అలిపిరిలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిక్ బస్సు ప్రత్యేకతలను ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు, చైర్మన్ మల్లికార్జునరెడ్డి సీఎంకు వివరించారు. ఒలెక్ట్రా కంపెనీ నుంచి వంద ఎలక్ట్రికల్ బస్సులు రానున్నాయని తెలిపారు. 50 బస్సులను తిరుపతి–తిరుమల, 14 బస్సులను రేణిగుంట–తిరుమల, 12 బస్సులను తిరుపతి–మదనపల్లి, 12 బస్సులను తిరుపతి–కడప, 12 బస్సులను తిరుపతి–నెల్లూరు మధ్య నడపనున్నట్టు చెప్పారు. తిరుపతి–తిరుమల మధ్య నడిపే ఎలక్ట్రికల్ బస్సులను అలిపిరిలో జెండా ఊపి ప్రారంభిస్తున్న సీఎం జగన్ సీఎం వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించేందుకు తిరుపతి చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌కు రేణిగుంట విమానాశ్రయం, తాతయ్యగుంట గంగమ్మ ఆలయం, అలిపిరి, తిరుమల పద్మావతి అతిథిగృహం వద్ద ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో టీటీడీ చైర్మెన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, లోక్‌సభ ప్యానల్ స్పీకర్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎంపీలు గురుమూర్తి, రెడ్డప్ప, జెడ్పీ చైర్మెన్ గోవిందప్ప శ్రీనివాసులు, డీసీసీబీ చైర్మెన్ రెడ్డమ్మ, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆదిమూలం, మేడా మల్లికార్జునరెడ్డి, కిలివేటి సంజీవయ్య, వరప్రసాద్, ఆర్టీసి వైస్ చైర్మన్ విజయానందరెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, టీటీడీ జేఈవో సదాభార్గవి, ఆర్టీసీ ఈడీలు గోపీనాథరెడ్డి, కృష్ణమోహన్, తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్‌రెడ్డి, ముద్ర నారాయణ, కమిషనర్ అనుపమ అంజలి, తాతయ్యగుంట గంగమ్మ ఆలయ చైర్మన్ కట్టా గోపీయాదవ్, జిల్లా దేవదాయశాఖ అధికారి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దేవుడితో ఆటలొద్దు.. దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ధ్వజం
సాక్షి, అమరావతి: వినాయక చవితి వేడుకలు, ఇతర సమయాల్లో ప్రతిపక్ష పార్టీలు భగవంతుడి పేరుతో రాజకీయాలు, అసత్య ప్రచారాలను మానుకోవాలని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ సూచించారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చవితి ఉత్సవాలపై అసత్య ప్రచారం చేస్తున్న విపక్షాల వైఖరిపై మండిపడ్డారు. వారు చేస్తున్న దుష్ప్రచారం భగవంతుడిపై చేస్తున్నారని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. దేవుడితో ఆటలొద్దని హెచ్చరించారు. భగవంతునికి ఆగ్రహం వస్తే ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని అన్నారు. గణేష్ మండపాల ఏర్పాటులో ప్రభుత్వం కొత్తగా ఎలాంటి నిబంధనలు పెట్టలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న నిబంధనలే ఇప్పుడూ ఉన్నాయన్నారు. కాగా అన్ని ప్రధాన అమ్మవారి దేవాలయాల్లో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పలు ఆలయాల ఈవోలు, డిప్యూటీ, అసిస్టెంట్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. ఆలయాల్లో ఏర్పాట్లు, ప్రత్యేక కార్యక్రమాలపై ఆరా తీశారు. ఈ సమావేశంలో దేవదాయ శాఖ కమిషనర్ హరి జవహర్లాల్ పాల్గొన్నారు. -
ప్రసాదానికి త్వరలో ఫుడ్ సేఫ్టీ సర్టిఫికెట్
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ పరిధిలోని 11 ప్రముఖ ఆలయాల్లో భక్తులకు పంచిపెట్టే ప్రసాదాలకు కేంద్ర ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ సర్టిఫికెట్లు దక్కబోతున్నాయి. కేంద్ర ఫుడ్ సేఫ్టీ విభాగం ఇటీవల ప్రసాదాల నాణ్యత ఆధారంగా భోగ్(దేవునికి సమర్పించే పరిశుభ్రమైన నైవేద్యం) పేరుతో సర్టిఫికెట్లు జారీ చేసే విధానానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో శ్రీశైలం, శ్రీకాళహస్తి, బెజవాడ దుర్గగుడి, సింహాచలం, కాణిపాకం, అన్నవరం, పెనుగంచిప్రోలు, విశాఖపట్నం కనకమహాలక్ష్మీ, కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి, మహానంది, ద్వారకా తిరుమల ఆలయాల్లోని ప్రసాదాలకు సర్టిఫికెట్ జారీ చేసేందుకు ఫుడ్ సేఫ్టీ విభాగం ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో 11 ప్రధాన ఆలయాల ఈవోలు ప్రసాదాలకు భోగ్ సర్టిఫికెట్ కోసం వెంటనే ఫుడ్ సేఫ్టీ విభాగానికి దరఖాస్తు చేయాలని దేవదాయ శాఖ కమిషనర్ హరి జవహర్లాల్ శనివారం ఆదేశాలిచ్చారు. -
'దేవాదాయశాఖలో ధార్మిక పరిషత్ నిర్ణయాలే కీలకం'
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో 21 మంది సభ్యులతో పూర్తిస్థాయి ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేసినట్లు దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఈమేరకు సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'టీడీపీ ప్రభుత్వంలో కోట్లాది రూపాయల ఆస్తులు అన్యాక్రాంతం అయినా పట్టించుకోలేదు. కొన్ని మఠాలలో అక్రమాలు జరిగినా చర్యలు తీసుకోలేదు. ధార్మిక పరిషత్‌కి మాత్రమే ఆ అధికారం ఉంటుంది. దేవాదాయశాఖలో ధార్మిక పరిషత్ నిర్ణయాలే కీలకం. అందుకే 21 మందితో ధార్మిక పరిషత్‌ని ఏర్పాటు చేశాము. సీజీఎఫ్ కమిటీని పూర్తిస్థాయిలో నియమించాం. గతంలో నలుగురు మాత్రమే ఉన్నారు. అందులో మరో ముగ్గురిని చేర్చాం. కలికి కోదండరామిరెడ్డి, మలిరెడ్డి వెంకటపాపారావు, కర్రి భాస్కరరావులను సభ్యులుగా నియమించాం. హిందూ ధర్మ పరిరక్షణ కోసమే ఈ కమిటీలను నియమించాం. చదవండి: (21 మందితో ధార్మిక పరిషత్) కనీసం గ్రామానికి ఒక దేవాలయానికి దూప, దీప నైవేధ్యం పథకం అమలు చేసేలా చర్యలు తీసుకుంటాం. అన్ని జిల్లాల అధికారులకు దరఖాస్తులను పరిశీలించాలని కోరాం. దీని ద్వారా ప్రతి గ్రామంలో హిందూ దేవాలయలను పరిరక్షించే బాధ్యతను తీసుకున్నాం. ట్రిబ్యునల్ కేసులకు సంబంధించిన వెబ్‌సైట్‌ని ఏర్పాటు చేస్తున్నాం. దేవాలయాలకు 4లక్షల 9వేల ఎకరాల భూములున్నాయి. వాటిలో కొన్ని ఆక్రమణలో ఉన్నాయి. వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని' మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. చదవండి: (ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఇంటికి సీఎం జగన్) -
21 మందితో ధార్మిక పరిషత్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 21 మంది సభ్యులతో పూర్తిస్థాయి ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేవదాయ శాఖ పరిధిలో ఉండే ఆలయాలు, మఠాలు, సత్రాలు, ఇతర హిందూ ధార్మిక సంస్థల వ్యవహారాలపై ప్రభుత్వ పరంగా తీసుకొనే విధాన నిర్ణయాల్లో అత్యంత కీలకంగా వ్యవహరించే ధార్మిక పరిషత్ పదేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో ఏర్పాటయింది. దేవదాయ శాఖ మంత్రి చైర్మన్‌గా, ఇద్దరు మఠాధిపతులు, ఇద్దరు ఆగమ పండితులు, ఓ రిటైర్డు హైకోర్టు జడ్జి, ఓ రిటైర్డు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి, ఓ రిటైర్డు ఐఏఎస్ అధికారి, ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఒక రిటైర్డు దేవదాయ శాఖ అధికారితో పాటు ఆలయాల నిర్మాణంలో ముఖ్య భూమిక ఉండే ఇద్దరు దాతలు, వివిధ ఆలయాల పాలక మండళ్లకు చైర్మన్లుగా ఉన్న ఆరుగురుని సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. అధికారవర్గాల నుంచి దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ ఈవో సభ్యులుగా, దేవదాయ శాఖ కమిషనర్ సభ్య కార్యదర్శిగా (మెంబర్ సెక్రటరీ) ఉంటారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో నెంబరు 571 విడుదల చేసింది. పరిషత్ పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి మూడేళ్లు కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఉమ్మడి ఏపీలోగానీ, ప్రస్తుత విభజిత ఏపీలోగానీ ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేయడం ఇది రెండోసారి కావడం గమనార్హం. కమిటీ సభ్యులు ధార్మిక పరిషత్‌లో దేవదాయ శాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి, కమిషనర్, టీటీడీ ఈవో మినహా మిగిలిన 17 మంది పేర్లు.. మఠాధిపతులు: 1) పెద్ద జియ్యంగార్ మఠం, తిరుమల 2) పుష్పగిరి మఠం, వైఎస్సార్ జిల్లా రిటైర్డు హైకోర్టు జడ్జి: మఠం వెంకట రమణ రిటైర్డు ప్రిన్సిపల్ జడ్జి: కె. సూర్యారావు రిటైర్డు ఐఏఎస్ అధికారి: అజేయ కల్లం ఆగమ పండితులు: పీవీఎస్‌ఎస్‌ఆర్ జగన్నాథాచార్యులు, సీహెచ్ శ్రీరామ శర్మ చార్టెడ్ అకౌంటెంట్: శ్రీరామమూర్తి దేవదాయ శాఖ రిటైర్డు అధికారి: ఏబీ కృష్ణారెడ్డి (రిటైర్డు అడిషనల్ కమిషనర్) దాతలు: ఎస్ నరసింహారావు, యూకే విశ్వనాథ్‌రాజు ఆలయ, సత్రాల పాలక మండళ్ల సభ్యులు: ఎం.రామకుమార్ రాజు, భీమవరం (జగన్నాథరాజు సత్రం), ఇనుగంటి వెంకట రోహిత్ (అన్నవరం), జ్వాలా చైతన్య (యడ్ల పిచ్చయ్య శెట్టి సత్రం, కడప), చక్కా ప్రభాకరరావు (చాకా వారి సత్రం, పాలకొల్లు), మాక్కా బాలాజీ, రంజన్ సుభాషిణి. దేవదాయ శాఖలో పరిషత్‌వి విస్త్రత అధికారాలే.. దేవదాయ శాఖ పరిపాలన, కార్యనిర్వాహక వ్యవహారాల్లో ధార్మిక పరిషత్ అత్యంత ఉన్నత కమిటీ. శాఖ పరిధిలోని రూ.25 లక్షల నుంచి రూ. కోటి లోపు వార్షికాదాయం ఉండే ఆలయాలు, అన్ని రకాల మఠాల పాలన, ధార్మిక వ్యవహారాలు పూర్తి పరిషత్ ఆధీనంలో కొనసాగాలి. రాష్ట్రంలో చిన్నా పెద్దవి కలిపి మొత్తం 128 మఠాలు ఉన్నాయి. మంత్రాలయం, హథీరాంజీ మఠం వంటివి ఈ కేటగిరిలోకే వస్తాయి. ► ఏటా రూ. 25 లక్షలకు పైబడి కోటి రూపాయలకు తక్కువ వార్షికాదాయం వచ్చే ఆలయాలకు ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో పాలక మండళ్ల నియామకం జరుగుతుంది. ► దేవదాయ శాఖ పరిధిలో ఉండే అలయాలు, సత్రాల కార్యకలాపాలపై తీసుకొనే విధాన పరమైన నిర్ణయాల్లో పరిషత్ కీలకంగా వ్యవహరిస్తుంది. ► వందేళ్లు దాటిన ఆలయాల పునర్నిర్మాణానికి ముందుగా పరిషత్ అనుమతి తీసుకోవాలి. ► హిందూ ధార్మిక పరమైన కార్యక్రమాల నిర్వహణలో ధార్మిక పరిషత్‌తో చర్చించే నిర్ణయాలు జరుగుతాయి. ► నిబంధనల ప్రకారం ధార్మిక పరిషత్ మూడు నెలలకొకసారి తప్పనిసరిగా సమావేశమవ్వాలి. అవసరమైతే ప్రతి నెలా సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఉమ్మడి ఏపీలో ధార్మిక పరిషత్‌ను తొలిసారి ఏర్పాటు చేసింది వైఎస్సే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేక చట్టం తీసుకొచ్చి ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేశారు. ధార్మిక పరిషత్‌కు దఖలు పడిన అధికారాలన్నీ అంతకు ముందు ప్రభుత్వం ఆధీనంలో ఉండేవి. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిన వెంటనే తొలిసారి ధార్మిక పరిషత్ ఏర్పాటుకు చకచకా ప్రయత్నాలు జరిగాయి. అయితే, పరిషత్ ఏర్పాటు జీవో విడుదలకు ముందే వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం చెందారు. ఆ తర్వాత రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జీవో విడుదలైంది. అప్పుడు ఏర్పడిన పరిషత్ పదవీకాలం 2012లో ముగిసింది. ఉమ్మడి ఏపీలోనే 2014లో మరోసారి ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేస్తూ అప్పటి ప్రభుత్వం జీవో విడుదల చేసినప్పటికీ, అది బాధ్యతలు చేపట్టక ముందే సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో పరిషత్ ఏర్పాటుకు ముందే రద్దయింది. ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్‌లో 2014 – 19 మధ్య రెండు విడతలు ధార్మిక పరిషత్ ఏర్పాటుకు దేవదాయ శాఖ నుంచి ప్రతిపాదనలు వెళ్లినప్పటికీ, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. నిబంధనల ప్రకారం 21 మంది సభ్యులతో పూర్తి స్థాయిలో ధార్మిక పరిషత్ ఏర్పాటుకు ముందుకు రాలేదు. తిరిగి పదేళ్ల తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ధార్మిక పరిషత్‌ను రెండో విడత పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది. -
అన్నదాత నుంచే ఆలయాలకు ఆహార ధాన్యాలు
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ పరిధిలో ఉండే ఆలయాల్లో పురుగుమందుల ఆనవాళ్లు లేని ప్రసాదాలు, అన్న ప్రసాదాన్ని భక్తులకు అందించాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. ఇందుకోసం సేంద్రియ పద్ధతిలో పండించే రైతుల నుంచి నేరుగా ఆహార ధాన్యాలు కొనాలని నిర్ణయించింది. ప్రసాదాలు, అన్నదానంలో ఉపయోగించే 12 రకాల ఆహార ధాన్యాలను దేవదాయ శాఖ రైతుల నుంచి కొంటుంది. వీటి కొనుగోలులో మార్క్‌ఫెడ్ మధ్యవర్తిత్వం వహిస్తుంది. తొలుత 11 ప్రధాన ఆలయాల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ అంశంపై ఇంతకు ముందే ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డిల స్థాయిలో ప్రాథమిక చర్చలు జరిగాయి. బుధవారం ఆలయాల ఈవోలతో దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్, మార్క్‌ఫెడ్ ఎండీ ప్రద్యుమ్న, రైతు సాధికార సంస్థ సీఈవో రామారావు సమావేశమయ్యారు. తదుపరి దశలో ఆయా ఆలయ పాలక మండలి సమావేశాల్లో రైతుల నుంచే సేంద్రియ ఆహార ధాన్యాల కొనుగోలుపై చర్చించి, ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసే అవకాశం ఉందని దేవదాయ శాఖ వర్గాలు తెలిపాయి. తదుపరి దశలో నిత్య అన్నదానం జరిగే మరో 175 ఆలయాల్లో ఈ విధానం అమలుకు కసరత్తు జరుగుతోంది. రైతులకు కేవలం 15 రోజుల్లోనే డబ్బు చెల్లించాలని కూడా దేవదాయ శాఖ భావిస్తోంది. ఆ 11 ఆలయాలకే ఏటా 8 వేల టన్నుల ఉత్పత్తులు శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ, పెనుగంచిప్రోలు, ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం, వాడపల్లి, విశాఖ కనకమహాలక్ష్మీ ఆలయం, మహానంది ఆలయాల్లో ముందుగా ఈ విధానాన్ని ప్రవేశ పెడుతున్నారు. ఈ ఆలయాల్లో ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలకు ఏటా దాదాపు 8 వేల టన్నుల ఆహార ధాన్యాలు అవసరం ఉంటుందని అంచనా. రెండు దశలో చేపట్టే 175 ఆలయాలకు 35 – 40 వేల టన్నుల ఆహార ధాన్యాల అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. సాధారణ పురుగు మందులు ఉపయోగించి పండించే ఆహార ధాన్యాలకు బదులు సేంద్రియ పద్ధతిలో పండించిన ధాన్యం వినియోగం ద్వారా భక్తులకు మరింత నాణ్యమైన ప్రసాదం అందించవచ్చని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయ విధానానికి ప్రభుత్వ పరంగానూ అదనపు ప్రోత్సాహం అందించినట్టవుతుందని చెప్పారు. టీటీడీలో సేంద్రియ శనగల కొనుగోలు తిరుమల తిరుమల దేవస్థానం (టీటీడీ)లో ప్రసాదాల తయారీలో ఇప్పటికే ఈ విధానాన్ని అమలు పరుస్తున్నారు. టీటీడీలో ఏటా 24 వేల టన్నుల ఆహార ధాన్యాలు వినియోగిస్తారు. వీటిలో శనగలను మార్కెఫెడ్ మధ్యవర్తిత్వంతో సేంద్రియ వ్యవసాయం చేసే రైతుల నుంచి నేరుగా కొంటున్నారు. మిగతా ఆహార ధాన్యాలను కూడా సేంద్రియ పద్ధతిలో పండించే రైతుల నుంచి కొనాలన్న ప్రక్రియ పురోగతి దశలో ఉంది. -
అమెరికాలో దుర్గమ్మకు కుంకుమార్చనలు
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): బెజవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్లకు అమెరికాలోని పలు నగరాల్లో కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. ప్రవాసాంధ్రుల కోసం ఏటా దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో అమెరికాలో ఆర్జిత సేవలు జరిగేవి. కోవిడ్ వల్ల రెండేళ్లుగా ఈ సేవలను నిలిపివేశారు. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది నుంచి ఆర్జిత సేవలను పునఃప్రారంభించాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దుర్గమ్మ దేవస్థానం నుంచి అమెరికాకు ఉత్సవమూర్తులను తీసుకెళ్లారు. అమ్మవారికి అలంకరించేందుకు ఆభరణాలను అమెరికాకు పంపించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. గురువారం శాన్హోస్లోని శ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానంలో ఆది దంపతులకు ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శాంతి కల్యాణం, చండీ హోమాలు నిర్వహించారు. 3 రోజుల పాటు ఈ ఆలయంలో పూజలు జరుగనున్నాయి. 29 నుంచి లాస్ఏంజెల్స్లో.. ఈ నెల 29 నుంచి 31 వరకు లాస్ఏంజెల్స్లోని శ్రీ శివకామేశ్వరి దేవస్థానంలో, జూన్ 2 నుంచి 4 వరకు న్యూజెర్సీలోని సాయి దత్తపీఠం, శ్రీ శివవిష్ణు ఆలయాల్లో, జూన్ 5 నుంచి 7 వరకు బాల్టిమోర్‌లోని శ్రీ షిర్డీసాయి మందిర్‌తో పాటు మరికొన్ని ఆలయాల్లో ఆర్జిత సేవలు నిర్వహిస్తారు. జూన్ 11న ఆలయ అర్చకులు దేవతా విగ్రహాలతో తిరిగి భారత్‌కు చేరుకుంటారు. -
ఆలయాల్లో అక్రమాల కట్టడికి విజిలెన్స్ సెల్
సాక్షి, అమరావతి: ఆలయాల్లో అవినీతి, అక్రమాలను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు ఐజీ స్థాయి పోలీస్ అధికారి నేతృత్వంలో ప్రత్యేకంగా విజిలెన్స్ సెల్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ఉప ముఖ్యమంత్రి(దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) పథకం కమిటీ సమావేశం జరిగింది. అనంతరం కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే కామన్ గుడ్ ఫండ్ పథకం కింద ప్రభుత్వం మంజూరు చేసిన 584 ఆలయ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని.. వాటిని నిర్ణీత కాల పరిమితిలో పూర్తి చేసేందుకు ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తామని చెప్పారు. దాదాపు రూ.58.80 కోట్లతో మరో 142 ఆలయాల నిర్మాణానికి ప్రతిపాదనలు అందగా, అందులో 43 ప్రతిపాదనలకు సంబంధించి స్థానికులు మ్యాచింగ్ గ్రాంట్ రూపంలో కొంత మొత్తం చెల్లించారన్నారు. ప్రజాప్రతినిధుల నుంచి మరో 99 ప్రతిపాదనలు రాగా, వాటిపై త్వరలో కమిటీ మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకోనుందని చెప్పారు. ధూపదీప, నైవేద్య పథకాన్ని మరిన్ని ఆలయాల్లో అమలు చేయాలని కోరుతూ ఇప్పటివరకు 653 దరఖాస్తులు అందాయని, వాటిలో 73 ప్రతిపాదనలను ఆమోదించామని తెలిపారు. మిగిలిన దరఖాస్తులను కూడా త్వరలో పరిష్కరిస్తామన్నారు. దేవుడి భూముల పరిరక్షణ చట్ట సవరణ దేవదాయ భూముల ఆక్రమణను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు రానున్న కేబినెట్లో ఎండోమెంట్ చట్ట సవరణకు ప్రతిపాదించనున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. దేవదాయ భూముల ఆక్రమణను కట్టుదిట్టంగా నియంత్రించేందుకు ఎండోమెంట్ చట్టంలోని సెక్షన్–83, 84 నిబంధనలలో కొన్ని ఆటంకాలు ఉన్నట్టు గుర్తించామని, వాటిని సవరిస్తామని వివరించారు. -
ప్రధాన దేవాలయాల్లో ప్లాస్టిక్ నిషేధం
సాక్షి, అమరావతి: ఇక నుంచి దేవాలయాల్లో ప్లాస్టిక్ వస్తువులకు దేవదాయ శాఖ స్వస్తి పలకనుంది. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లతోపాటు ప్లాస్టిక్ కవర్లలో పూజా సామగ్రిని ఆలయాల్లోకి అనుమతించరు. అలాగే ఆలయానికి అనుబంధంగా ఉండే దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల అమ్మకాలను నిషేధించనున్నారు. ప్రసాదాల పంపిణీలోనూ చిన్నచిన్న ప్లాస్టిక్ సంచుల వినియోగానికి పూర్తిగా చెక్ పెడతారు. తొలి దశలో జూలై 1 నుంచి 6 (ఏ) కేటగిరీగా వర్గీకరించిన ప్రధాన ఆలయాలన్నింటిలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని పూర్తి స్థాయిలో నిషేధించనున్నారు. ఏడాదికి రూ.25 లక్షలు, ఆపైన ఆదాయం ఉండే ఆలయాలను దేవదాయ శాఖ 6(ఏ) కేటగిరీగా వర్గీకరించింది. దేవదాయ శాఖ పరిధిలో రాష్ట్రంలో మొత్తం 24,699 ఆలయాలు, మఠాలు, సత్రాలు ఉన్నాయి. ఇందులో 174 ఆలయాలు, 28 సత్రాలు, మఠాలు 6 (ఏ) కేటగిరీ కిందకు వస్తాయి. జూలై 1 నుంచి ఆయా ఆలయాలు, మఠాలు, సత్రాలలో ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేధించేందుకు తగిన చర్యలు చేపట్టాలని దేవదాయ శాఖ ఇప్పటికే ఆయా ఆలయాలు, సత్రాల ఈవోలకు ఆదేశాలిచ్చింది. టీటీడీ తరహాలో మంచినీటి సరఫరా.. తిరుమలలో గత కొద్ది నెలల నుంచి ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో అమలు జరుగుతున్న తరహాలోనే ప్రధాన దేవాలయాల్లో శుభ్రమైన మంచినీటి సరఫరాకు చర్యలు చేపడతారు. అలాగే మంచినీటి సరఫరా పాయింట్ల వద్ద స్టీల్ గ్లాస్‌లను అందుబాటులో ఉంచుతారు. భక్తులు ఇంటి నుంచి మంచినీరు తెచ్చుకున్నా గాజు సీసాలు లేదంటే స్టీల్ బాటిళ్లలో తెచ్చుకునేలా విస్తృత ప్రచారం చేయాలని అధికారులు యోచిస్తున్నారు. పర్యావరణానికి, జీవజాలానికి హాని.. ప్లాస్టిక్ కవర్లు పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. అలాగే ఆలయాల వద్ద సంచరించే గోవులతోపాటు ఇతర జంతువులు కవర్లను తిని మృత్యువాత పడుతున్నాయని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో క్రమంగా అన్ని ఆలయాల వద్ద ప్లాస్టిక్ వస్తువుల వినియోగానికి స్వస్తి పలకాలని దేవదాయ శాఖ నిర్ణయించినట్టు అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేవదాయ శాఖ కార్యక్రమాలపై ఇటీవల సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా టీటీడీలో అమలులో ఉన్న మంచి విధానాలను అన్ని ఆలయాల్లో అమలు చేయాలంటూ స్పష్టమైన ఆదేశాలిచ్చారని అధికారులు తెలిపారు. -
ఆంజనేయుడికే ఆ భూములు..
సాక్షి, అమరావతి: గుంటూరు నగర శివారులో దాదాపు పాతికేళ్లుగా ఆక్రమణదారుల చెరలో ఉన్న రూ.120 కోట్ల విలువచేసే 16 ఎకరాల దేవుడి భూమికి ఎట్టకేలకు మోక్షం సిద్ధించింది. సుదీర్ఘకాలం పాటు నడుస్తున్న ఈ వివాదానికి రాష్ట్ర ప్రభుత్వం ముగింపు పలుకుతూ సోమవారం ఆ భూములను ఆలయానికి అప్పగించింది. గుంటూరు కొరిటపాడు ప్రాంతంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానానికి నగర శివారులోని సర్వేనెం.78లో 17.70 ఎకరాల భూమి ఉంది. అందులో 16 ఎకరాల భూమిపై ఏటా వచ్చే ఆదాయాన్ని జీతభత్యాల కింద వినియోగించుకునేందుకు వీలుగా అర్చకునికి ఆ భూమిని దేవదాయ శాఖ అప్పట్లో ఈనాంగా కేటాయించింది. ఆ తర్వాత.. భూమిని లీజుకు తీసుకున్న కౌలుదారులు తనకు ఏటా లీజు డబ్బులు చెల్లించడంలేదని.. తనకు గుడి నుంచి ప్రతినెలా కొంత మొత్తం జీతం రూపంలోనే చెల్లించాలంటూ సదరు పూజారి ఆ భూమిని 1998లో తిరిగి ఆలయానికే అప్పగించారు. దీంతో ప్రతినెలా జీతం చెల్లించేందుకు దేవదాయశాఖ అంగీకరించింది. అయితే, అప్పటికే ఆ 16 ఎకరాల భూమి ఆక్రమణదారుల చెరలోకి వెళ్లిపోయింది. 2003లో ఆక్రమణదారుల నుంచి భూమిని విడిపించాల్సిన నాటి ప్రభుత్వం.. ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం కుదిరే వరకు ఎకరాకు రూ.5 వేల చొప్పున ఏటా డ్యామేజీ రూపంలో ఆలయానికి చెల్లించాలని ఆక్రమణదారులకు ఆదేశాలిచ్చి సరిపెట్టింది. దీంతో అప్పటినుంచి ఆక్రమణదారులు ఏటా రూ.80 వేలు చెల్లిస్తున్నారు. ఆదాయం సరిపోక అప్పుల బాట విలువైన భూములుండీ ఆ స్వామికి అప్పులు తప్పడంలేదు. ఆక్రమణదారులు ఏటా చెల్లించే రూ.80 వేలే ఆలయానికి ఆదాయం. రెండు లక్షల డిపాజిట్‌పై మరో రూ.పది వేల వడ్డీ వస్తుందని ఆలయ ఈఓ తెలిపారు. పూజారికి అన్నీ కలుపుకుని రూ.12 వేల వేతనం చెల్లిస్తున్నారు. అందులో రూ.5 వేలను ధూపదీప నైవేద్యం కోసం. ఈ నేపథ్యంలో.. పూజారి జీతభత్యం, ఆలయంలో కరెంటు బిల్లులకు ఆదాయం సరిపోక పొరుగున ఉండే కొన్ని ఆలయాల నిధుల నుంచి అప్పులు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆలయం పేరిట రూ.70 వేల దాకా అప్పు ఉంది. ఇటీవలే ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు రూ.40 వేలను పొరుగు ఆలయం నిధుల నుంచి సర్దుబాటు చేశారు. టీడీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం.. ఇక ఆక్రమణలో ఉన్న ఈ ఆలయ భూములను విడిపించేందుకు ఈవో ఎన్నిసార్లు గత టీడీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా స్పందనలేదు. దీంతో దేవదాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఉండే ప్రత్యేక కోర్టులో ఈ భూమి వివాదం పెండింగ్‌లో ఉండిపోయింది. జగన్ ప్రభుత్వం వచ్చాక ఈ భూమి సమస్య పరిష్కరించేందుకు మూడుసార్లు మంత్రి కోర్టు భేటీ అయింది. ఆక్రమణదారుల నుంచి భూమిని విడిపించాలని ఆదేశాలు జారీచేసింది. దీంతో సోమవారం గుంటూరు జిల్లా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సమక్షంలో గుంటూరు జిల్లా దేవదాయ శాఖ అధికారి మహేశ్వరరెడ్డి ఆ భూములను స్వాధీనం చేసుకుని ఆలయ ఈఓకు అప్పగించారు. అప్పట్లో నా రిపోర్టులకు సమాధానం వచ్చేదికాదు.. గుంటూరు జిల్లా నల్లపాడు గ్రూపు టెంపుల్స్‌లో ఇదీ ఒకటి. వాటన్నింటికీ నేను ఈఓగా ఉన్నాను. 2017 నుంచి ఈ వివాదాస్పద భూములను ఆక్రమణదారుల నుంచి విడిపించడానికి ప్రయత్నిస్తున్నా. అప్పట్లో కోర్టు భేటీకి నేను రాసిన రిపోర్టులకు ప్రభుత్వం నుంచి రిప్లయ్ వచ్చేది కాదు. రెండున్నర ఏళ్ల క్రితం నేను చేసిన ప్రతిపాదనకు స్పందనగా ప్రత్యేక కోర్టు భేటీని ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటుచేసి సమస్యను పరిష్కరించింది. – విజయభాస్కరరెడ్డి, శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం, కొరిటపాడు, గుంటూరు -
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వైఎస్సార్
వేంపల్లె/ఇడుపులపాయ/ఒంటిమిట్ట: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ప్రశంసించారు. శనివారం ఆయన వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయకు కుటుంబ సభ్యులతో కలిసి చేరుకున్నారు. ముందుగా గండి వీరాంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకుని దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ దివంగత వైఎస్సార్ అనుచరునిగా తనను గుర్తిస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు కేబినేట్లో మంత్రి పదవి కల్పించడంతో పాటు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించారన్నారు. గండి క్షేత్రంలో వీరాంజనేయస్వామి 100 అడుగుల విగ్రహం ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో మాట్లాడి చర్యలు తీసుకుంటానని తెలిపారు. అనంతరం ఒంటిమిట్టకు చేరుకున్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని పలు ప్రధాన ఆలయాలను తొలిదశలో మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు ఎంపిక చేసినట్లు తెలిపారు. అన్యాక్రాంతమైన, కబ్జాకు గురైన దేవదాయ శాఖ భూములను సంరక్షిస్తామని చెప్పారు. దేవదాయ శాఖలో టీటీడీ తరహా ఆన్లైన్ పద్ధతిని పాటించేలా ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. గండి వీరాంజనేయస్వామి దేవస్థాన చైర్మన్ పి.రాఘవేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా కోదండరాముడి రథోత్సవం
ఒంటిమిట్ట: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు శనివారం రథోత్సవం నిర్వహించారు. దీనికి హాజరైన రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణకు ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు స్వాగతం పలికి గర్భాలయంలోని మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీతాలక్ష్మణ సమేత కోదండ రాములవారు రథాన్ని అధిష్టించి గ్రామ వీధుల్లో విహరించారు. భజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలు చేస్తుండగా భక్తులు రథాన్ని లాగారు. అడుగడుగునా భక్తులు కాయకర్పూర నీరాజనాలు అందించారు. బ్రహ్మోత్సవాల్లో నేడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం కాళీయమర్ధని అలంకారంలో రాములవారు దర్శనమివ్వనున్నారు. ఉదయం 11 గంటలకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు ఊంజల్ సేవ జరుగుతుంది. రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై స్వామి వారు విహరిస్తారు. -
రాష్ట్రంలో 1,072 ఆలయాల నిర్మాణం
తిరుపతి ఎడ్యుకేషన్: శ్రీవాణి ట్రస్టు ద్వారా దేవదాయశాఖ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 1,072 ఆలయాల నిర్మాణానికి టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ (డీపీపీ) కార్యనిర్వాహక మండలి ఆమోదం తెలిపింది. త్వరలో భారీ ఎత్తున కల్యాణమస్తు, సామూహిక వివాహాలు, దేశవ్యాప్తంగా శ్రీనివాస కల్యాణాలు నిర్వహించాలని తీర్మానించింది. తిరుపతిలో గురువారం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన మండలి సమావేశం జరిగింది. టీటీడీ ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, జేఈవో వీరబ్రహ్మం, ధర్మకర్తల మండలి సభ్యురాలు అల్లూరి మల్లీశ్వరి వర్చువల్‌గా, ధార్మిక ప్రాజెక్టుల అధికారి విజయసారథి, ఏఈవో సత్యనారాయణ పాల్గొన్న ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. ► రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార గ్రామాల్లో ఒక్కో ఆలయం రూ.10 లక్షల వ్యయంతో ఏడాదిలోపు 1,072 ఆలయాల నిర్మాణం. ఈ ఆలయాల్లో అర్చకులుగా పనిచేసేందుకు ముందుకొచ్చే వారికి దేవదాయశాఖ సహకారంతో తిరుపతిలో శిక్షణ. ► దేశంలోని ప్రధాన కేంద్రాల్లో ప్రతినెలా శ్రీనివాసకల్యాణం. ► ఏప్రిల్ 23న కర్ణాటక రాష్ట్రం చిక్‌బళ్లాపూర్, మే 8న తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, మే నెలలో ఢిల్లీ, జూన్‌లో హైదారాబాద్, జూన్ 23 నుంచి జూలై 4 వరకు అమెరికాలోని నాలుగు ప్రాంతాల్లో శ్రీనివాసకల్యాణాల నిర్వహణ. ► గోదావరి జిల్లాల్లో త్వరలో శ్రీనివాస కల్యాణాల నిర్వహణకు ఏర్పాట్లు. ► కోవిడ్ పరిస్థితుల నుంచి బయటపడడంతో సామూహిక వివాహాల నిర్వహణకు పండిత మండలి ఏర్పాటు. మండలి నిర్ణయించే పవిత్ర ముహూర్తాల్లో జిల్లా యంత్రాంగాల సహకారంతో భారీ ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహణ. ► తిరుపతిలో ప్రతినెలా టీటీడీ ఆధ్వర్యంలో ఒక యజ్ఞం. మే నెలలో అన్నమయ్య జయంతి ఉత్సవాల నిర్వహణ. ► గుడికో గోమాత కార్యక్రమం ద్వారా ఇప్పటికి దేశంలోని 141 ఆలయాలకు ఉచితంగా గోవు, దూడ అందజేత. ఈ కార్యక్రమాన్ని విస్తృత పరిచే ఏర్పాట్లు. ► రాష్ట్రంలోని టీటీడీ, దేవదాయశాఖ భూముల్లో గో ఆధారిత వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహించి, వారు పండించిన ఉత్పత్తులను శ్రీవారి ప్రసాదాల తయారీకి కొనుగోలు చేయాలి.