Fadnavis
-
మహారాష్ట్ర సీఎం రేసు.. షిండే కీలక ట్వీట్
సాక్షి,ఢిల్లీ:మహారాష్ట్ర కొత్త సీఎం రేసు నుంచి శివసేన చీఫ్, ప్రస్తుత సీఎం ఏక్ నాథ్ షిండే తప్పుకున్నట్లు తెలుస్తోంది. తనకు మద్దతుగా ముంబైకి ఎవరు రావొద్దని,సమావేశాలు పెట్టొద్దని ఏక్‌నాథ్‌షిండే ట్వీట్ చేయడం సీఎం రేసు నుంచి ఆయన తప్పుకున్నారనడానికి నిదర్శనమన్న ప్రచారం జరుగుతోంది. महायुतीच्या प्रचंड विजयानंतर राज्यात पुन्हा एकदा आपले सरकार स्थापन होणार आहे. महायुती म्हणून आपण एकत्रित निवडणूक लढवली आणि आजही एकत्रच आहोत. माझ्यावरील प्रेमापोटी काही मंडळींनी सर्वांना एकत्र जमण्याचे, मुंबईत येण्याचे आवाहन केले आहे. तुमच्या या प्रेमासाठी मी अत्यंत मनापासून ऋणी…— Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) November 25, 2024 త్వరలోనే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని మహారాష్ట్ర ప్రగతికి మహాయుతి కూటమి పనిచేస్తుందని షిండే ట్వీట్లో పేర్కొన్నారు. సీఎం రేసు నుంచి షిండే తప్పుకోవడం దాదాపు ఖాయమవడంతో బీజేపీ నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పగ్గాలు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.మహారాష్ట్ర ఎన్నికల్లో మెజారిటీ మార్కు కు చేరువగా 132 సీట్లను బీజేపీ గెలుచుకుంది. సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్‌కు మద్దతిసస్తామని మహాయుతిలో మరో కీలక భాగస్వామ్య పార్టీ ఎన్సీపీ(అజిత్‌పవార్)ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. -
మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పీఠంపై ఉత్కంఠ
-
ఎన్డీఏ పరిస్థితి ఇప్పుడు మూడు చక్రాలే: ఉద్ధవ్
ముంబై: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై శివసేన(ఉద్ధవ్) అధినేత ఉద్ధవ్ థాక్రే సెటైర్లు వేశారు. గతంలో మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వాన్ని మూడు చక్రాల రిక్షాగా దేవేంద్ర ఫడ్నవిస్ కామెంట్ చేయడాన్ని ఉద్ధవ్ గుర్తు చేశారు. ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానిది రిక్షా పరిస్థితేనని ఎద్దేవా చేశారు. ‘ఇప్పుడు కేంద్రంలో ఉన్నది మోదీ సర్కార్ కాదు.. ఎన్డీయే ప్రభుత్వం. ఇది ఎంతకాలం అధికారంలో కొనసాగుతుందో తెలియదు. నాడు పార్టీని విడిచి మళ్లీ ఇప్పుడు తిరిగి రావాలనుకుంటున్నవారికి మా పార్టీలో చోటు లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని పార్టీలో చేర్చుకోం. అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా ఎంవీయే అధికారంలోకి వస్తుంది. అందుకు సమష్టి కృషి ఇప్పటికే ప్రారంభమైంది’అని ఉద్థవ్ తెలిపారు. -
గడ్కరీని ఓడించేందుకే వారు పనిచేశారు : రౌత్ సంచలన ఆరోపణలు
ముంబై: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవెంద్ర ఫడ్నవిస్‌పై శివసేన(ఉద్ధవ్) కీలక నేత, ఎంపీ సంజయ్‌రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని నాగ్‌పూర్‌లో ఓడించేందుకు షా, ఫడ్నవిస్‌లు పనిచేశారని రౌత్ ఆరోపించారు.‘మోదీ, షా, ఫడ్నవిస్‌లు కలిసి గడ్కరీని ఓడించేందుకు గట్టిగా పనిచేశారు. అయితే గడ్కరీని ఓడించడం సాధ్యం కాదని గ్రహించిన తర్వాత ఫడ్నవిస్ ఆలస్యంగా నాగ్‌పూర్‌లో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ మాటలు నేను కాదు ఆర్ఎస్ఎస్ క్యాడరే బహిరంగంగా చెబుతోంది’ అని శివసేన(ఉద్ధవ్) అధికారిక పత్రిక సామ్నాలో రౌత్ కథనం రాశారు. మరోపక్క అజిత్ పవార్‌కు చెందిన ఎన్సీపీ చెందిన క్యాండిడేట్లను ఓడించేందుకు సీఎం షిండే ఒక్కో నియోజకవర్గంలో రూ.25 కోట్ల నుంచి 30 కోట్ల దాకా ఖర్చు చేశారు. ఈసారి మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగిని మారుస్తారు’అని రౌత్ తన కథనంలో పేర్కొన్నారు. కాగా, రౌత్ రాసిన ఈ కథనంపై మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాంకులే ఫైర్ అయ్యారు. నిజానికి రౌత్ శివసేన అభ్యర్థుల గెలుపు కోసం కాకుండా ఎన్సీపీ(శరద్‌పవార్) అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. రౌత్‌కి దమ్ముంటే 2019లో సీఎం అవడానికి ఆయన చేసిన ప్రయత్నాలపై కథనం రాయాలని సవాల్ విసిరారు. -
బీజేపీలో చేరిన అశోక్ చవాన్
ముంబై: కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్‌చవాన్ బీజేపీలో చేరారు. ముంబైలో ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో మంగళవారం ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా చవాన్‌ను ఫడ్నవిస్ పార్టీలోకి ఆహ్వానించారు. అందరూ ఊహించినట్లుగానే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మరుసటి రోజే బీజేపీలో చేరిన చవాన్‌ను కాషాయ పార్టీ రాజ్యసభకు నామినేట్ చేయడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికలకు ఈ నెల 15 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇదీ చదవండి.. ఎన్సీపీ నాదే.. సుప్రీంకోర్టుకు శరద్‌పవార్ -
ఫ్యామిలీ రాష్ట్ర సమితిగా మార్చుకోండి
కవాడిగూడ: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరును ఫ్యామిలీ రాష్ట్ర సమితిగా మార్చుకోవాలని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ఎద్దేవా చేశారు. గత పదేళ్లుగా కేసీఆర్ కుటుంబం తెలంగాణలోని వనరులను అడ్డగోలుగా దోచుకుందని ధ్వజమెత్తారు. ముషీరాబాద్ బీజేపీ అభ్యర్థి పూసరాజును గెలిపించాలని కోరుతూ మంగళవారం కవాడిగూడ డివిజన్ పరిధిలోని దోమలగూడ ఏవీ కళాశాల నుంచి భారీ బైక్‌ర్యాలీని నిర్వహించారు. ర్యాలీనుద్దేశించి ఫడ్నవీస్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కేవలం తన కుటుంబ ఆస్తులను ఏవిధంగా పెంచుకోవాలనే ఆలోచనతోనే పాలన సాగించారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వ పథకాల ప్రచారానికి చేసిన ఖర్చుతో రాష్ట్రంలోని దళిత కుటుంబాలను మొత్తం అభివృద్ధి చేయవచ్చన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేలను కొనే పార్టీ బీఆర్ఎస్ అయితే, అమ్ముడుపోయే పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలు ఒక్కటేనని ఆరోపించారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే బీఆర్ఎస్కి గొర్రెల్లా అమ్ముడు పోతారని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపిస్తే తెలంగాణలో బీసీల రాజ్యం వస్తుందని భరోసానిచ్చారు. ముషీరాబాద్ బాధ్యత నాదే రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి పూసరాజును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధే తప్ప బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమీలేదన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన పూసరాజును గెలిపిస్తే ముషీరాబాద్ అభివృద్ధి బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ ముషీరాబాద్ నియోజవర్గ కన్వి నర్ రమేష్ రాం, కార్పొరేటర్లు జి. రచనశ్రీ, కె.రవిచారి, సుప్రియా నవీన్‌గౌడ్, పావని వినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
గాడ్సే, ఆప్టే పుత్రులు ఎవరో?.. ఫడ్నవీస్ వ్యాఖ్యలపై ఓవైసీ ఫైర్..
మహారాష్ట్ర: ఔరంగాబాద్ వివాదాస్పద వాట్సప్ స్టేటస్‌ల వివాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలపై ఏఐఎమ్ఐఎమ్ నాయకుడు అసదుద్ధీన్ ఓవైసీ స్పందించారు. ఔరంగజేబు కుమారులు నగరంలో ప్రత్యక్షమయ్యారనే ఫడ్నవీస్ వ్యాఖ్యలకు అసదుద్ధీన్.. గాడ్సే, ఆప్టే పుత్రులు ఎవరో తెలుసుకోవాలని? అన్నారు. కొల్లాపూర్‌లో కొందరు యువకులు ఔరంగజేబు, టిప్పు సుల్తాన్లను కీర్తిస్తూ వాట్సప్ స్టేటస్‌లను పెట్టడం వివాదాస్పదమైంది. తీవ్ర స్థాయిలో ఘర్షణలు కూడా జరిగాయి. అయితే.. ఈ వివాదంపై ఫడ్నవీస్.. నగరంలో కొందరు ఔరంగాజేబు కుమారులు ప్రత్యక్షమయ్యారని, వారెవరో తొందరగా గుర్తిస్తామని అన్నారు. వారు ఎవరి మనుషులో? ఎవరు పంపించారో కనుక్కుంటామని వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన అసదుద్ధీన్ ఓవైసీ.. ఫడ్నవీస్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. 'నాథూరాం గాడ్సే, వామన్ శివరామ్ ఆప్టే కుమారులెవరో తెలుసుకోవాలి. మీకు అన్నీ తెలుసని నేను అనుకుంటున్నాను. ఆ విషయంలో మీరు నిపుణులని తెలుసు?' అని అన్నారు. అయితే.. బుధవారం ఈ వివాదంపై జరిగిన ఘర్షణల కారణంగా స్థానికంగా కర్ఫ్యూ విధించారు. అందోళనకారులపై పోలీసులు లాఠీ ఛార్జ్ కూడా చేశారు. ప్రజలు సంయమనం పాటించాలని సీఎం ఏక్నాథ్ షిండే చెప్పారు. ఇదీ చదవండి:ఔరంగజేబును కీర్తిస్తూ సోషల్ మీడియా పోస్టు.. మిన్నంటిన ఆందోళనలు -
పదవి ఏదైనా అధికారం నాదే!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు, డిప్యూటీ సీఎం పదవి చేపట్టటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్. పదవి అనేది రాజకీయ సామర్థ్యాన్ని నిర్ధారించదని పేర్కొన్నారు. శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండేకు ముఖ్యమంత్రి పదవి అప్పజెప్పినప్పుటికీ అధికారం ఫడ్నవీస్ చేతిలోనే ఉందనే వాదనలు వినిపిస్తున్న క్రమంలో ఈ వ్యాఖ్యలు చేయటం మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి. మరోవైపు.. ఆయన చేతిలోనే ఆరు పోర్ట్‌ఫోలియోలు ఉండటమూ గమనార్హం. ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టకపోవటంపై మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వంలో పలు పోర్ట్‌ఫోలియోలు నిర్వహించటంపై ప్రశ్నించగా.. గతంలో ముఖ్యమంత్రిగా ఆ బాధ్యతలు నిర్వర్తించినట్లు గుర్తు చేశారు దేవేంద్ర ఫడ్నవీస్. ‘మంత్రివర్గ విస్తరణ పెండింగ్‌లో ఉన్నందున ఆ శాఖలు నా అధీనంలోనే ఉన్నాయి. విస్తరణ తర్వాత అందులో కొన్ని ఇతరుల చేతికి వెళ్తాయి. తమ ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖలు ఎవరికైనా ఇవ్వొచ్చు. వారిని ఆ బాధ్యతల్లో విజయవంతం చేయటమే మా బాధ్యతగా విశ్వసిస్తాం. పోర్ట్‌ఫోలియో ఏదనేది పట్టింపులు లేవు.. సుపరిపాలన అందించటమనేదానిపైనే సమష్టి కృషి ఉంటుంది. రాజకీయంలో పోస్టును బట్టి శక్తిసామర్థ్యాలు నిర్ణయం కావు, నీవు ఎవరనేదే ముఖ్యం. నేను రాజకీయంగా బలపడ్డానా లేదా నష్టపోయానా? అనే అంశాన్ని మహారాష్ట్రలోని ఎవరినైనా అడగవచ్చు.’ అని పేర్కొన్నారు దేవేంద్ర ఫడ్నవీస్. థాక్రే వెన్నుపోటుకు ప్రతీకారం.. మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయి.. బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంపైనా స్పందించారు దేవేంద్ర ఫడ్నవీస్. శివసేన నేత ఉద్ధవ్ థాక్రే బీజేపీకి వెన్నుపోటు పొడిచారని, అందుకే కాషాయ పార్టీ ప్రతీకారం తీర్చుకోవాలనుకుందని అసలు విషయం వెల్లడించారు. ముందుగా ప్రభుత్వంలో ప్రాతినిథ్యం వహించకూడదని నిర్ణయించుకున్నానని, అయితే, వెలుపల ఉండి ప్రభుత్వాన్ని నడిపించలేమని, నా అనుభవం అవసరమని పార్టీ నేతలు ఒప్పించినట్లు చెప్పారు. వారి కోరిక మేరకే ప్రభుత్వంలో భాగమయ్యాయని వెల్లడించారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఉపముఖ్యమంత్రిగా ఉండాలని బీజేపీ సూచించినప్పుడు షాక్‌కి గురయ్యానని, అయితే, తనను ఎప్పుడూ డిప్యూటీ అనే ఆలోచన రాకుండా షిండే చూసుకుంటున్నారని ప్రశంసించారు. ఇదీ చదవండి: ఢిల్లీలో డీజిల్ కార్లపై నిషేధం.. ఉల్లంఘిస్తే రూ.20వేల జరిమానా -
ప్రియమైన ఉపముఖ్యమంత్రి గారూ.. మీరు చాలా గ్రేట్!
సాక్షి,ముంబై: ఒకసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి చేపట్టి కూడా ఇప్పుడ ఉపముఖ్యమంత్రి పదవిని పెద్దమనసుతో అంగీకరించిన దేవేంద్ర ఫడ్నవీస్‌ను మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే అభినందించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఫడ్నవీస్‌కు లేఖ రాశారు. గతంలో ముఖ్యమంత్రిగా కొనసాగినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పదవిని స్వీకరించి అందరికీ ఆదర్శంగా నిలిచారని ఫడ్నవీస్‌ను కొనియాడారు. ఎంత ఉన్నత పదవుల్లో ఉన్నవారైనా పార్టీ అధిష్టానం జారీ చేసిన ఆదేశాలను శిరసావహించాల్సిందేనని, ఈ విషయంలో ఫడ్నవీస్ ఏ మాత్రం భేషజాలు ప్రదర్శించకుండా అధిష్టానం ఆదేశాలను పాటించి మంచి వ్యక్తిత్వాన్ని చాటుకున్నారని అభినందించారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి సమర్థవంతమైన పాలన అందించారని, ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎంతో కృషి చేశారని ఈ విషయంలో మీరు నిజంగా ప్రశంసనీయులని కొనియాడారు. ఇప్పుడు మీకు లభించింది ప్రమోషనా లేక డీమోషనా అనేది ముఖ్యం కాదని, బాణాన్ని వదలాలంటే దారాన్ని గట్టిగా వెనక్కి లాగాలని, అప్పుడే ఆ బాణం ముందుకు దూసుకుపోతుందన్నారు. దారం వెనక్కి వెళ్లినంతమాత్రనా దాని విలువ తగ్గినట్లు కాదని ఉదహరించారు. ‘‘మీ కర్తవ్యాన్ని మీరు నెరవేర్చారని, ప్రజలకు సేవ చేయడానికి మీకు మరోసారి అవకాశం లభించిందని, మీకు ఆయురారోగ్యాలను, శక్తిని ఆ జగదాంబ మాత ప్రసాదించాలని కోరుకుంటున్నా’’నని లేఖలో పేర్కొన్నారు. -
మాజీ సీఎం ఫడ్నవిస్‌పై సంచలన ఆరోపణలు చేసిన నవాబ్ మాలిక్
-
మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ పై మాజీ సీఎం ఫడ్నవీస్ సంచలన ఆరోపణలు
-
‘ఎమ్మెల్యే టికెట్ ఇస్తే.. అవమానించినట్టే’
ముంబై: స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన బిహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే ఆదివారం అధికార జేడీయూ తీర్థం పుచ్చుకున్నారు. త్వరలో జరగబోయే బిహార్ ఎన్నికల్లో ఆయన పోటీచేస్తారని వార్తలు వెలువడుతున్నాయి. ఈనేపథ్యంలో మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్పందించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో మహారాష్ట్ర పోలీసులను అవమానించిన గుప్తేశ్వర్ పాండేకు జేడీయూ టికెట్ గనుక కేటాయిస్తే అది తమను మరింత బాధిస్తుందని తెలిపింది. బిహార్ ఎన్నికల బీజేపీ ఇన్చార్జ్గా ఉన్న ఫడ్నవీస్ ఆయనకు జేడీయూ టికెట్ ఇవ్వకుండా అడ్డుకోవాలని సూచించింది. లేదంటే మహారాష్ట్ర ప్రజల మనోభావాలను కించపరిచినట్టు అవుతుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సచిన్ సావంత్ ట్విటర్లో పేర్కొన్నారు. కాగా, బిహార్‌లో వచ్చే నెలాఖరు నుంచి అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభవుతున్నాయి. మూడు విడతల్లో.. అక్టోబర్ 28 న తొలి విడత, నవంబర్ 3 న రెండో విడత, నవంబర్ 7 న మూడో విడత ఎన్నికలు జరుగనున్నాయి. సీఎం నితీష్ కుమార్ మరోసారి మిత్రపక్షం బీజేపీతో జట్టుకట్టారు. (చదవండి: సీఎం అభ్యర్థిపై పోటాపోటీ.. కూటమికి బీటలు) టగ్ ఆఫ్ వార్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (34) ముంబైలోని తన నివాసంలో జూన్ 14న ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. కుమారుడి మృతి పట్ల సుశాంత్ తండ్రి అనుమానం వ్యక్తం చేశాడు. సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తిపై ఫిర్యాదు చేయడంతో బిహార్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ముంబై పోలీసులు దీనికి అభ్యంతరం తెలిపారు. కేసు దర్యాప్తును తామే చేస్తామని స్పష్టం చేశారు. దీంతో తమకు ముంబై పోలీసుల విచారణపై నమ్మకం లేదని డీజీపీగా విధులు నిర్వర్తిస్తున్న గుప్తేశ్వర్ పాండే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం నితీష్‌ని ఒప్పించి సీబీఐ విచారణకు ఆదేశాలు ఇప్పించారు. (చదవండి: నితీష్ సమక్షంలో జేడీ(యూ)లో చేరిక) -
'అజిత్, ఫడ్నవీస్ మైత్రి ముందే తెలుసు'
ముంబై: బీజేపీ నేత, మాజీ సీఎం ఫడ్నవీస్‌తో అజిత్ పవార్ సన్నిహితంగా మెలుగుతున్న విషయం నవంబర్ 23వ తేదీనాటి పరిణామాలకు ముందే తనకు తెలుసునని ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్ వెల్లడించారు. కలిసి పనిచేద్దాం రమ్మంటూ ప్రధాని మోదీ ఆహ్వానించారని సోమవారం మీడియాకు వెల్లడించిన పవార్ మంగళవారం మరో సంచలన వ్యాఖ్య చేశారు. బీజేపీతో చేతులు కలిపి మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేయకమునుపే వారిద్దరి మధ్య చర్చల వ్యవహారం తన దృష్టికి వచ్చిందన్నారు. అయితే, అజిత్ నడిపించిన తంతు అంతా తనకు తెలిసే జరిగిందంటూ వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు. నవంబర్ 23వ తేదీనాటికే శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు దాదాపు ఖరారైందని మీడియాకు ఇచ్చిన ఇంటర్వూ్యలో శరద్ పవార్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో చర్చలు జరపడం అజిత్‌కు ఇష్టం లేదు.. అయితే, అనంతరం అజిత్ అలా చేస్తాడని ఊహించలేదన్నారు. -
మహా మలుపు
-
‘మహారాష్ట్ర’లో మార్పేమీ లేదు!
ముంబై: ‘మహా’ ప్రతిష్టంభన కొనసాగుతోంది. వివిధ పార్టీల నేతల వ్యాఖ్యల మాటెలా ఉన్నా.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఎలాంటి అడుగులు మాత్రం పడటం లేదు. ముఖ్యమంత్రి పీఠం సహా అధికార పంపిణీ సమంగా జరగాలన్న తమ డిమాండ్ నుంచి శివసేన వెనక్కు తగ్గడంలేదు. అదే విషయాన్ని మంగళవారం శివసేన నేత సంజయ్ రౌత్ మరోసారి తేల్చి చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు జరగాలంటే.. అధికారాన్ని సమంగా పంచుకోవడంపై బీజేపీ లిఖితపూర్వక హామీ ఇవ్వాల్సిందేనన్నారు. శివసేన నేతనే మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి అవుతాడని పునరుద్ఘాటించారు. సేన, బీజేపీల కూటమికి మెజారిటీ లభించినా.. రెండు పార్టీల మధ్య అధికార పంపిణీ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అక్టోబర్ 24వ తేదీ నుంచి ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడిన విషయం తెలిసిందే. మరోవైపు, బీజేపీ నుంచి మంగళవారం ఒక ఆశావహ ప్రకటన వెలువడింది. ‘ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన శుభవార్త ఏ క్షణమైనా రావొచ్చు’ అని సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి సుధీర్ ముంగంటివార్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఫడ్నవిస్ నివాసంలో జరిగిన పార్టీ సీనియర్ నేతల భేటీ అనంతరం ఆయన ఆ వ్యాఖ్య చేశారు. ఆ భేటీ అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్పాటిల్ మాట్లాడుతూ.. శివసేన నుంచి సానుకూలమైన ప్రతిపాదన కోసం ఎదురు చూస్తున్నామన్నారు. బీజేపీతో, ఎన్డీయేతో శివసేన సంబంధాలు తెంచుకుంటేనే.. రాజకీయ ప్రత్యామ్నాయంపై ఆలోచిస్తామని శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ప్రకటించింది. ఆరెస్సెస్ చీఫ్‌తో ఫడ్నవిస్ భేటీ ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభనకు పరిష్కారం లభించని నేపథ్యంలో.. ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌తో భేటీ అయ్యేందుకు మంగళవారం రాత్రి నాగపూర్ వెళ్లారు. దాదాపు గంటన్నర పాటు మోహన్ భగవత్‌తో భేటీ అయ్యారు. ఇరువురు ఏం చర్చించారనే విషయంలో ఆరెస్సెస్ వర్గాలు నోరు విప్పడం లేదు -
...అయిననూ అస్పష్టతే!
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. రోజంతా ఎవరికి వారు సమావేశాలు జరిపినా ప్రభుత్వ ఏర్పాటులో స్పష్టతలేదు. అధికారాన్ని పంచుకోవడంలో బీజేపీ, శివసేన మధ్య రేగిన సంక్షోభం ఏ మలుపు తిరుగుతుందో ఎవరి అంచనాలకు అందడం లేదు. శివసైనికులు మహారాష్ట్ర గవర్నర్‌ను కలిస్తే, ముఖ్యమంత్రి∙ఫడ్నవీస్ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాని కలిసి భవిష్యత్ ప్రణాళికపై చర్చించారు. ఈ అధికార పోరాటంలో అవసరమైతే శివసేనకు మద్దతునివ్వాలని భావించిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో చర్చలు జరిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తాము ప్రజాతీర్పుకనుగుణంగా ప్రతిపక్షంలో కూర్చుంటామని స్పష్టం చేశారు. సేనకు మద్దతునిచ్చే అంశంలో ఎవరూ తమను సంప్రదించలేదని, తమకు సంఖ్యా బలం లేదని స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు బీజేపీ, శివసేన తమ తదుపరి వ్యూహాలకు పదును పెడుతున్నాయి. గవర్నర్‌ని కలిసిన శివసైనికులు శివసేన పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్, ఇతర నేతలతో కలిసి సోమవారం మహారాష్ట్ర గవర్నర్ భగత్ కోష్యారీని కలిశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మర్యాదపూర్వకంగానే తాము గవర్నర్‌ని కలిశామన్నారు. ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న ప్రతిష్టంభనకు తాము కారణం కాదని గవర్నర్‌కు చెప్పామని సంజయ్ వెల్లడించారు. అమిత్ షాతో ఫడ్నవీస్ మంతనాలు మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఎలాంటి తొందర లేదని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. సోమవారం ఆయన ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిసి మహారాష్ట్రలో ఏర్పడిన ప్రతిష్టంభనపై చర్చలు జరిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ‘వీలైనంత త్వరగా ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం లేదు. నేను కచ్చితంగా చెబుతున్నా. ప్రభుత్వమైతే ఏర్పాటవుతుంది’అని చెప్పారు. ఆ తర్వాత మహారాష్ట్ర ఎన్నికల ఇన్చార్జ్గా వ్యవహరించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్‌ను ఫడ్నవీస్ కలుసుకున్నారు. రౌత్ ఒక భేతాళుడు: మరాఠీ పత్రిక హేళన మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న సంక్షోభానికి శివసేన నేత సంజయ్ రౌత్ కారణమనే ఉద్దేశంతో ఆయనను ఒక మరాఠీ పత్రిక భేతాళుడిగా చిత్రీకరించింది. ఆరెస్సెస్‌కు మద్దతుగా నిలిచే తరుణ్ భారత్‌లో రాసిన ఒక వ్యాసంలో విక్రమార్కుడి భుజంపై వేళ్లాడే భేతాళుడు సంజయ్ అని, బీజేపీ–శివసేన అధికారంలోకి రాకుండా ఆయన అడ్డుకుంటున్నారని తిట్టిపోసింది. రామజన్మభూమి–బాబ్రీ మసీదు భూ వివాదం కేసులో అత్యంత కీలకమైన సుప్రీంకోర్టు తీర్పు ముందన్న నేపథ్యంలో మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు జరగడం అత్యంత ముఖ్యమని పేర్కొంది. గడ్కరీ మధ్యవర్తిత్వం ? కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని రంగంలోకి దింపితే బీజేపీ, శివసేన మధ్య నెలకొన్న సమస్యను సానుకూలంగా పరిష్కరిస్తారని శివసేన పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేకు సలహాదారుడైన కిషోర్ తివారీ సోమవారం ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌కు ఒక లేఖ రాశారు. గడ్కరీని శివసేనతోచర్చలకు పంపాలని అన్నారు. -
ఫలించిన భగీరథ యత్నం
సాక్షి, వరంగల్ : సాగునీటి ప్రాజెక్టుల చరిత్రలో శుక్రవారం సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది... తరతరాలుగా తెలంగాణ ప్రజలు కంటున్న కల సాకారమైంది... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం కావడంతో అందరి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది.. విశిష్ట అతిథిగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యఅతిథులుగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సీఎంలు వైఎస్.జగన్మోహన్రెడ్డి, దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొనగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. మేడిగడ్డ ఆనకట్టను ప్రారంభించిన అనంతరం గోదావరి మాతకు పూజలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్ర పుటల్లోకెక్కింది. గోదావరి జలాలను సద్వినియోగం చేసుకునే దిశగా చేపట్టిన ప్రయత్నం సక్సెస్ కావడంతో గోదారమ్మే మురిసిపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఇంజినీర్లు చేసిన భగీరథ యత్నం ఫలించినట్లయింది. నదీ ప్రవాహానికి అభిముఖంగా ఎదురొడ్డి నడిపించే మహా ఇంజినీరింగ్ అద్భుతంగా ఈ ప్రాజెక్టును వర్ణించాల్సి ఉండగా.. ఇంత భారీ, ఖరీదైన సాగునీటి ప్రాజెక్టు మరొటి లేక పోవడం.. ఎత్తిపోతల పథకాల్లోనే ప్రపంచంలో అరుదైనదిగా గుర్తింపు సాధించడం విశేషం. ప్రాజెక్టు కోసం భూమి మీద సాగిన నిర్మాణాలు... భూగర్భంలో అంతస్తుల లోతులో నిర్మించిన మహా బాహుబలి పంప్‌హౌస్‌లు... కిలోమీటర్ల కొద్దీ సాగిన అండర్ టన్నెల్ (సొరంగాలు) అందరి దృష్టికి ఆకర్షిస్తుండగా.. గోదావరి జలాలతో తెలంగాణను సస్యశ్యామలం కానుండడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తున్న వేళ ఉమ్మడి వరంగల్‌లో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఊరూవాడ సంబరాలు జరుపుకున్నారు. గ్రామాల్లో బాణసంచా పేల్చి.. మిఠాయిలు పంచుకున్నారు. అద్భుత ఘట్టం... తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును శుక్రవారం ఉదయం గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు అతిరథ మహారథుల సమక్షంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. గవర్నర్, పొరుగు రాష్ట్రాల సీఎంలతో పాటు తెలంగాణ మంత్రులు వివిధ బ్యారేజీలు, పంపుహౌస్‌లను ప్రారంభించారు. తెలంగాణలోని 45 లక్షల ఎకరాలకు సాగునీరందించే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభంలో భాగంగా సరిగ్గా ఉదయం 11.23 గంటలకు మేడిగడ్డ బ్యారేజీ వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించి కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ఇక 11.26 గంటలకు మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.07 గంటలకు కన్నెపల్లి పంప్ హౌస్‌లో మోటార్ స్విచ్ ఆన్ చేశారు. అనంతరం సరిగ్గా ఎనిమిది నిమిషాలకు అంటే మధ్యాహ్నం 1.15 గంటల నుండి పంప్ హౌస్ నుంచి నీటి పంపింగ్ ప్రారంభమయింది. దీంతో పవిత్ర గోదావరి జలాలను తెలంగాణలోని బీడు భూములకు మళ్లించే భగీరథ ప్రయత్నమైన బృహత్తర కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఉపయోగంలోకి వచ్చినట్లయింది. అంతకుముందు మేడిగడ్డ బ్యారేజీ వద్ద, కన్నెపల్లి పంప్ హౌజ్ వద్ద శృంగేరి పీఠం అర్చకులు మణిశశాంక్ శర్మ, గోపీకష్ణ శర్మ ఆధ్వర్యంలో 40మంది వేదపండితులు జలాశయ ప్రతిష్టాంగ యాగం, జలసంకల్ప మహోత్సవ యాగం నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీసమేతంగా పాల్గొన్న ఈ యాగం పూర్ణాహుతితో ముగిసింది. ఈ సందర్భంగా వేద పండితులు ముగ్గురు ముఖ్యమంత్రులు, గవర్నర్‌ను ఆశీర్వందించారు. ఎవరెరు పాల్గొన్నారంటే.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఆంధ్రప్రదేశ్ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే.జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి, ఐజీ నాగిరెడ్డి, మహారాష్ట్ర డీజీపీ జైస్వాల్, ఎంపీలు జోగినిపల్లి సంతోష్ కుమార్, బి.వెంకటేష్ నేత, విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, గండ్ర వెంకటరమణారెడ్డి, కరీంనగర్ జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, నీటి పారుదల శాఖ ఈఎన్సీలు మురళీధర్‌రావు, హరే రాం, వెంకటేశ్వర్లు, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాలరావు, ట్రాన్స్‌కో డైరెక్టర్ సూర్యప్రకాష్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఎస్పీ భాస్కరన్ తదితరులు పాల్గొన్నారు. ముగ్గురు ముఖ్యమంత్రులు నదీ జలాల వాటాలు, పంపకాల విషయంలో ఇటు రాష్ట్రాల మధ్య, అటు దేశాల మధ్య ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో గోదావరి నది పరివాహక ప్రాంతానికి చెందిన ముగ్గురు ముఖ్యమంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొనడంపై ఆసక్తికరమైన చర్చ సాగింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరా>్వత మహారాష్ట్ర ప్రభుత్వంతో.. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంతో ముఖ్యమంత్రి కేసీఆర్ స్నేహ పూర్వకంగా నెరిపిన దౌత్య సంబంధాలు ఫలించాయి. గోదావరి జలాలు ప్రతీ ఏటా వేల టీఎంసీల చొప్పున సముద్రం పాలు కావడం కన్నా సమర్థవంతంగా వాడుకునేందుకు ప్రాజెక్టులు నిర్మించుకోవాలనే ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ముగ్గురు ముఖ్యమంత్రులు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఆసక్తిగా మారింది. అతిథులు, బ్యాంకర్లకు సన్మానం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్య అతిథులు గవర్నర్ నరసింహన్, ఏపీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి, దేవేంద్ర ఫడ్నవీస్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా వారికి ఘనస్వాగతం పలికిన కేసీఆర్ వెళ్లేటప్పుడు హెలీకాప్టర్ వరకు వెళ్లి మరీ ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆర్థిక సహకారం అందించిన బ్యాంకుల ప్రతినిధులను కూడా ముఖ్యమంత్రి సన్మానించి జ్ఞాపికలు అందించారు. ఆంధ్రా బ్యాంక్ ఎండీ, సీఈఓ జె.పక్రిసామి, ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎంకే.భట్టాచార్య, ఆర్ఈసీ లిమిటెడ్ డైరెక్టర్(టెక్నికల్) ఎస్.కే.గుప్తా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్(కమ్యూనికేషన్స్) పీ.కే.సింగ్ అలహాబాద్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.రామచంద్ర, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలకృష్ణ అల్సె, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హేమంత్ కుమార్ తమ్తా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ జనరల్ మేనేజర్ బినోద్ కుమార్, నాబార్డ్ సీజీఎం విజయ్ కుమార్, కార్పొరేషన్ బ్యాంక్ డీజీఎం అండ్ జోనల్ హెడ్ ఎం.జే.అశోక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ హెడ్ హైదరాబాద్ ఎస్.వీ.రామకష్ణ, ఆంధ్రా బ్యాంక్ జనరల్ మేనేజర్ శ్యామల్ గోష్ రె, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏజీఎం మహ్మద్ మక్సూద్ అలీ, ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ ఆర్.మనోహర్ తదితరులు సన్మానం అందుకున్న వారిలో ఉన్నారు. -
18% లేదా ఆ లోపే!
ముంబై: 99 శాతం వస్తువులు, సేవలను 18 శాతం లేదా అంతకంటే తక్కువ జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) పరిధిలోకి తెచ్చేందుకు తమ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ప్రధాని మోదీ మంగళవారం చెప్పారు. జీఎస్టీని అమల్లోకి తీసుకురాకముందు దేశంలో పన్ను కట్టే వాణిజ్య సంస్థలు 65 లక్షలు మాత్రమే ఉండేవనీ, ఇప్పుడు ఆ సంఖ్య మరో 55 లక్షలు పెరిగిందన్నారు. ముంబైలో జరిగిన ‘రిపబ్లిక్ సమిట్’ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ ‘ఈరోజు జీఎస్టీ పరిధి చాలా పెద్దగా ఉంది. కోటికి పైగా కంపెనీలు ఈ పన్ను వ్యవస్థ కింద నమోదై ఉన్నాయి. 99 శాతం వస్తువులు, సేవలను 18 శాతం లేదా అంతకంటే తక్కువ పన్ను పరిధిలోకి తెచ్చేందుకు మేం కృషి చేస్తున్నాం. విలాసాలకు వినియోగించే అతి కొన్ని వస్తువులపై 28 శాతం పన్ను విధిస్తాం’ అని అన్నారు. నిత్యం చర్చల ద్వారా జీఎస్టీని మెరుగుపరుస్తున్నామనీ, జీఎస్టీ విధానాలను మరింత సరళీకరించి వాణిజ్య సంస్థలకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.. వారికి శిక్ష .. ఎవరూ అనుకోలేదు 1984లో జరిగిన సిక్కుల ఊచకోత కేసులో దోషులకు శిక్ష పడుతుందని ఎవరూ ఊహించలేదని మోదీ అన్నారు. ఈ కేసులో కాంగ్రెస్ నేత సజ్జన్‌కుమార్‌కు ఢిల్లీ హైకోర్టు సోమవారం జీవిత ఖైదు విధించడం తెలిసిందే. ‘సిక్కుల ఊచకోత బాధితులకు న్యాయం దక్కుతుందనీ, కాంగ్రెస్ నేతలకు శిక్ష పడుతుందని నాలుగేళ్ల క్రితం ఎవరూ అనుకోలేదు’ అని మోదీ పేర్కొన్నారు. చరిత్రలో తొలిసారి ఓ అవినీతి అంశం (రఫేల్ యుద్ధ విమానాలు) సుప్రీంకోర్టు వరకు వెళ్లిందనీ, తాము అంతా సక్రమంగానే చేసినట్లు కోర్టు నిర్ధారించిందని చెప్పారు. 41 వేల కోట్ల పనులకు శంకుస్థాపన మహారాష్ట్ర పర్యటనలో ప్రధాని మొత్తం రూ. 41 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రూ. 33 వేల కోట్లతో ముంబై మహానగరంలో ఇళ్ల సముదాయాలు, రెండు మెట్రో రైల్ లైన్లను నిర్మించనున్నారు. ముంబై శివారులోని కళ్యాణ్‌లో రూ. 18 వేల కోట్ల వ్యయంతో నిర్మించనున్న గృహ సముదాయానికి శంకుస్థాపన చేశారు. కళ్యాణ్‌లో మోదీ మాట్లాడుతూ గత కాంగ్రెస్–ఎన్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆదర్శ్ కుంభకోణాన్ని ప్రస్తావించారు. ఆదర్శ్ పథకం కింద పేదల కోసం కట్టిన ఇళ్ల కేటాయింపులో భారీ కుంభకోణం చోటు చేసుకోవడం తెలిసిందే. తమ ప్రభుత్వం గత ప్రభుత్వాల్లా కాకుండా నిజంగా ఆదర్శ సమాజాన్ని ఇళ్ల పథకాల ద్వారా నిర్మిస్తోందని మోదీ అన్నారు. సభ కోసం శ్మశానం బంద్ కళ్యాణ్ ప్రాంతంలో మంగళవారం మోదీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు భద్రత కల్పించడంలో భాగంగా వేదికకు 200 మీటర్ల దూరంలో ఉన్న శ్మశానాన్ని పోలీసులు మూసేయించారు. ఖననం/దహనం చేసేందుకు మృతదేహాలను మరో శ్మశానానికి పంపారు. అలాగే మోదీ సభా వేదిక పరిసరాల్లోని మూడు పెళ్లిళ్లు రద్దయినట్లు ఓ అధికారి చెప్పారు. బాలీవుడ్ ప్రముఖులతో మోదీ భేటీ భారత చలనచిత్ర రంగ సమస్యలపై చర్చించేందుకు బాలీవుడ్ ప్రముఖులు మోదీని మహారాష్ట్ర రాజ్‌భవన్‌లో కలిశారు. సినీ దర్శకుల సమాఖ్య అధ్యక్షుడు సిద్ధార్థ్ రాయ్ కపూర్, సీబీఎఫ్సీ చైర్మన్ ప్రసూన్ జోషి, నిర్మాతలు రితేశ్ సిధ్వానీ, కరణ్ జోహార్, నటులు అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గణ్ తదితరులు మోదీని కలిసిన బృందంలో ఉన్నారు. దూరంగా శివసేన.. ప్రధాని మోదీ కార్యక్రమాలకు బీజేపీ మిత్రపక్షం, మహారాష్ట్రలో ప్రధాన పార్టీ శివసేన దూరంగా ఉంది. శివసేన సీనియర్ నేత ఒకరు మాట్లాడుతూ తమ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేను మోదీ కార్యక్రమాలకు ఆహ్వానించలేదనీ, కాబట్టి శివసేన మంత్రులు, నేతలెవరూ ఆ కార్యక్రమాలకు వెళ్లకూడదని తాము నిర్ణయించుకున్నామని చెప్పారు. బీజేపీ, శివసేనల మధ్య విభేదాలు ఉండటం తెలిసిందే. ‘టైమ్‌లెస్ లక్ష్మణ్’ పుస్తకావిష్కరణ ప్రముఖ దివంగత వ్యంగ్య చిత్రకారుడు, ‘కామన్ మ్యాన్’ సృష్టికర్త ఆర్కే లక్ష్మణ్ జీవితంపై రాసిన ‘టైమ్‌లెస్ లక్ష్మణ్’ పుస్తకాన్ని మోదీ ముంబైలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్, సీఎం ఫడ్నవిస్ పాల్గొన్నారు. ‘కార్టూన్ల ద్వారా గత నాలుగైదు దశాబ్దాల చరిత్రపై పరిశోధన చేయగల విశ్వవిద్యాలయం ఏదైనా ఉందేమో చూడాలని ఫడ్నవిస్‌ను నేను కోరుతున్నా. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు. కోట్లాది ప్రజలను, వారి హృదయాలను కలిపి ఉంచిన మూలాధారం వంటి వారు లక్ష్మణ్. సామాన్య, సాంఘిక శాస్త్రాల బోధనకు లక్ష్మణ్ కార్టూన్లే సులువైన మార్గం’ అని అన్నారు. -
కాంగ్రెస్ పార్టీవి నీచ రాజకీయాలు
సాక్షి, హైదరాబాద్: దేశ రక్షణను పణంగా పెట్టి కాంగ్రెస్ పార్టీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రక్షణకు సంబంధించిన రక్షణ ఒప్పందాలను బయటకు వెల్లడించరాదని తెలిపారు. అయితే దీనిని ఆసరాగా చేసుకొని కాంగ్రెస్ రాజకీయం చేయాలనుకున్నా కుదరలేదని అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కొన్ని నెలలుగా కాంగ్రెస్, రాహుల్‌గాంధీ రఫేల్ డీల్‌పై అనేక ఆరోపణలు చేశారని, అబద్ధాలు చెప్పారని తెలిపారు. వారి ఆరోపణలపై సుప్రీంకోర్టు చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చిందన్నారు. ఈ వ్యవహారంలో రాహుల్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ప్రధాని మోదీ పట్ల వారి భాష దారుణంగా ఉందని, అందుకే మోదీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమ దళారీ లేడనే రాహుల్‌కు నిరాశ.. దేశ హితం, భవిష్యత్తు కోసం ఆలోచించే మోదీ రఫేల్ ఒప్పందం చేసుకున్నారని ఫడ్నవిస్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి దళారుల ప్రమేయం లేకుండా ఫ్రాన్స్, ఇండియా మధ్య ఒప్పందం జరిగిందన్నారు. అదే కాంగ్రెస్ హయాంలో బోఫోర్స్, జీప్, అగస్టా వెస్ట్ ల్యాండ్ స్కాంల్లో దళారుల ప్రమేయం ఉందని అన్నారు. అయితే రఫేల్ ఒప్పందం తమ దళారీ లేకుండా జరిగినందుకు రాహుల్‌కు నిరాశగా ఉందని ఎద్దేవా చేశారు. వాస్తవానికి 2001లో ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోలుకు ప్రయత్నాలు జరిగినా, అప్పట్లో తగిన చర్యలు చేపట్టలేని దుస్థితి నెలకొందన్నారు. యూపీఏ హయాంలో దేశ రక్షణకు డబ్బులు లేవని ఈ ఒప్పందాన్ని గాలికొదిలేశారు. చివరకు 2008లో టెండర్లు పిలిస్తే 6 కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు. 2011లో టెండర్లు ఓపెన్ చేయగా డసాల్ట్ తక్కువకు కోట్ చేసిందన్నారు. 2015లో మోదీ ప్రభుత్వం యుద్ధ విమానాల ఆవశ్యకతను గుర్తించి కొనుగోలుకు చర్యలు చేపట్టిందన్నారు. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. రఫేల్ డీల్ విషయంలో వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ చర్యలు చేపట్టిందన్నారు. ఈ నెల 18న అన్ని రాష్ట్రాల్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 19న అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు కాంగ్రెస్, రాహుల్‌గాంధీ ఆరోపణలకు వ్యతిరేకంగా ధర్నాలు నిర్వహించి, కలెక్టర్ల ద్వారా రాష్ట్రపతికి సమాచారం అందించేలా చర్యలు చేపట్టామన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ రాంచంద్రరావు, ఎమ్మెల్యే రాజాసింగ్, పార్టీ ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి, అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు పాల్గొన్నారు. -
ఆరెస్సెస్ ‘గ్రాండ్ ఇఫ్తార్’ ఆపండి
ముంబై: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ముస్లింలకు ఇవ్వనున్న ‘గ్రాండ్ ఇఫ్తార్’ విందుకు మరో దెబ్బ తగిలింది. ఆరెస్సెస్ నాయకులే ఈ విందును అడ్డుకునే యత్నం చేస్తున్నారు. మలబార్‌హిల్స్‌లోని సహ్యాద్రి ప్రభుత్వ అతిథి గృహంలో సోమవారం సాయంత్రం ఆరెస్సెస్ ‘గ్రాండ్ ఇఫ్తార్’ విందు ఏర్పాటు చేయనున్నసంగతి తెలిసిందే. అయితే, ప్రభుత్వ అతిథి గృహంలో ఇఫ్తార్ విందు నిర్వహించొద్దని ఆరెస్సెస్ ముస్లిం విభాగం (ముస్లిం రాష్ట్రీయ మంచ్) కార్యకర్తలు అదిల్ ఖత్రీ, షకీల్ అహ్మద్ షేక్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. 2015 జూలై నెలలో మహారాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం.. ప్రభుత్వ కార్యాలయాల్లో, అతిథి గృహాల్లో పబ్లిక్ మీటింగ్‌లు, ప్రైవేటు కార్యక్రమాలు నిర్వహించరాదు. గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఉత్తర్వులపై స్పందించాలనీ, ఆరెస్సెస్ ఇఫ్తార్ విందుని అడ్డుకోవాలని ముస్లిం రాష్ట్రీయ మంచ్ కార్యకర్తలు కోరారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ముస్లింలకు దగ్గరవుదామని ఆరెస్సెస్ భావిస్తోందనీ, ముస్లిం వ్యతిరేక చర్యలు ఆపనంత వరకు ఎలాంటి విందుల్లో పాల్గొనబోమని వివిధ ముస్లిం సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. సోమవారం నాటి గ్రాండ్ ఇఫ్తార్‌లో పాల్గొనబోమని తేల్చి చెప్పాయి. కాగా, ఆరెస్సెస్ ఇవ్వనున్న ఈ విందుకు 30 దేశాల ముస్లిం ప్రముఖులు, 100 మంది స్వదేశీ ప్రముఖులు హాజరుకానున్నారు. -
మిత్రపక్షాలతో చర్చించాకే..
రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై అమిత్ షా ముంబై: అన్ని మిత్రపక్షాలతో చర్చించాకే రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటామని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. భారత హరిత విప్లవ పితామహుడు ఎం.ఎస్. స్వామినాథన్ పేరును రాష్ట్రపతి ఎన్నిక కోసం శివసేన చేసిన సూచనపై ఆయన స్పందించారు. బీజేపీ బలోపేతం కోసం మహారాష్ట్రలో పర్యటిస్తున్న షా శనివారం మాట్లాడుతూ.. భారత్, పాకిస్తాన్ల మధ్య త్వరలో ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలు పునఃప్రారంభం అవుతాయన్న వార్తల్ని తోసిపుచ్చారు. ‘అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో భారత్, పాకిస్తాన్‌లు కలిసి ఆడడం కొనసాగుతుంది. అయితే పాకిస్తాన్లో భారత్ గానీ, భారత్‌లో పాకిస్తాన్ గానీ ఆడవ’ని సమాధానమిచ్చారు. మహారాష్ట్రలో ముందస్తు ఎన్నికలకు బీజేపీ సిద్ధమన్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘ఒకవేళ మధ్యంతర ఎన్నికలుS తప్పనిసరైతే వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధమనేదే ఫడ్నవిస్ అభిప్రాయమని వివరణిచ్చారు. రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థి రేసులో ఉన్నానంటూ వస్తోన్న వార్తల్ని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తోసిపుచ్చారు. శనివారం విలేకరుల ప్రశ్నకు సమాధానమిస్తూ..‘అవన్నీ పుకార్లు.. నేను విదేశాంగ శాఖ మంత్రిని.. అయితే మీరు పార్టీ అంతర్గత విషయంపై ప్రశ్నిస్తున్నార’ని చెప్పారు. కాగా రాష్ట్రపతి ఎన్నికల కోసం శనివారం రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఉద్యమ వరద
స్వాతీ నఖేత్ 18 జూలై 2016. అపోజిషన్ అరుపులు, కేకలతో మహారాష్ట్ర అసెంబ్లీ ప్రతిధ్వనిస్తోంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నాయకులు రాధాకృష్ణ పాటిల్, పృథ్వీరాజ్ చవాన్ సభలో చర్చకు పట్టుపట్టారు. మరో ప్రతిపక్ష నేత (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) అజిత్ పవార్.. ‘‘ఇది నిర్భయ ఘటన కంటే కూడా హేయమైన నేరం’’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరికి అంతా కలసి... ఫడ్నవీస్ నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆ వర్షాకాల సమావేశాలలో వాళ్లను అంతగా తరుముకొచ్చిన ఉద్యమ వరద... స్వాతీ నఖేత్ పాటిల్! - మాధవ్ శింగరాజు కోటు దర్పాన్ని ఇస్తుంది. చిరుగుల్నీ దాస్తుంది. అగ్రవర్ణాలకు కులం ఒక కోటు. ఉన్నవాళ్లు ఉన్నదర్పాన్ని కనబరిస్తే, లేనివాళ్లు లేనిదర్పాన్ని ప్రదర్శించారు. ఇన్నాళ్లూ ఇలాగే నడిచింది, గడిచింది. ఇప్పుడు అలా లేదు. కోటులో గుద్దులాటలు అనవసరం అనుకుంటున్నారు. ‘మాకూ రిజర్వేషన్లు కావాలి. మాకూ రక్షణ కావాలి’ అని ఉద్యమిస్తున్నారు. వాళ్లు డిమాండ్ చేస్తున్నది ఉద్యోగాలలో రిజర్వేషన్. వాళ్లు అడుగుతున్నది కొన్ని ‘రక్షణ చట్టాల’ నుంచి రక్షణ! అందుకే ఉద్యమానికి ఆసరాగా చిన్న కొమ్మ దొరికినా దాన్ని పట్టుకుంటున్నారు. ఉద్యమ ఆవేశాన్ని రగిల్చే చిన్న నాయకత్వం దొరికినా అనుసరిస్తున్నారు. ఇప్పుడు మహారాష్ర్టలో ‘మరాఠా’లు చేస్తున్నది అదే. మొన్నటి వరకు గుజరాత్లో ‘పటేల్ ’లు చేసిందీ అదే. అక్కడి నాయకుడు హార్దిక్ పటేల్. ఇక్కడి నాయకురాలు స్వాతీ నఖేత్. ఇద్దరూ పాతికేళ్ల లోపు వారు. ఇద్దరూ రూలింగ్ పార్టీకి నిద్రలేకుండా చేస్తున్నవారు. గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం హార్దిక్ పటేల్‌ని విజయవంతంగా అణచివేసింది. మహారాష్ట్రలో ఉన్నది కూడా బీజేపీనే కానీ, స్వాతీ నఖేత్‌ని ఏమీ చేయలేకపోతోంది. అక్కడ ప్రతిపక్షం స్ట్రాంగ్‌గా ఉంది. అంతకన్నా స్ట్రాంగ్ స్వాతీ నఖేత్! అందుకే మహారాష్ట్రలో రెండు పెద్ద అపోజిషన్ పార్టీలు ఇప్పుడు స్వాతి వెనుక నడుస్తున్నాయి. అమ్మాయి కాదు... ఆదిపరాశక్తి! గుజరాత్లో పటేళ్లు 24 శాతం. మహారాష్ట్రలో మరాఠాలు 32 శాతం. వీళ్లని కాదని గేమ్స్ ఆడితే బ్యాలెట్ బద్దలౌతుంది. ఆ సంగతి అక్కడి ప్రభుత్వాలకు తెలుసు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కి ఇంకాస్త ఎక్కువ తెలుసు. ‘ఆ అమ్మాయి ఎవరో కనుక్కోండి’ అన్నాడు. ‘అమ్మాయి కాదు, ఆదిపరాశక్తి’ అన్నారు ఎవరో. ‘అయితే మనమూ ఆ శక్తిని ఫాలో అయిపోదాం’ అన్నారు ఫడ్నవీస్! రూలింగ్ పార్టీ ఎప్పుడూ ఫాలో అవదు. ఫాలో అయినట్లు కనిపిస్తుందంతే. ఫడ్నవిస్ వ్యూహం వేరు. మరాఠా ఉద్యమాన్ని ‘ఓన్’ చేసుకుని, స్వాతీ నఖేత్‌ని ఉద్యమానికి ‘డిసోన్’ చేయాలని అతడి ఆలోచన. ప్రతిపక్షాల ఆలోచన వేరు. స్వాతి గానీ, మరాఠాలు గానీ వాళ్ల సమస్య కాదు. ఫడ్నవీస్‌కు క్రెడిట్ గానీ, మరోసారి పవర్‌గానీ దక్కకూడదు! ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. ఎవరి భయాలు వారికి ఉన్నాయి. అందుకే అంతా స్వాతి చెంత చేరారు. స్వాతి అజెండాకు తమ జెండాలను కలిపి కుట్టేశారు. మరాఠాల ‘స్వాభిమాన’ నాయిక మరాఠా రిజర్వేషన్ పాత ఇష్యూ. స్వాతి వచ్చాక మళ్లీ ఫ్రెష్‌గా మొదలైంది. మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్.సి.పి. ప్రభుత్వం ఉన్నప్పుడు మరాఠాలకు చదువుల్లో, కొలువుల్లో, అసెంబ్లీ హాల్లో 16 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని రాణె కమిటీ రికమండ్ చేసింది. అన్ని పార్టీలూ చచ్చినట్టు మద్దతు ఇచ్చాయి. కానీ కోర్టులో కమిటీ సిఫారసులు తేలిపోయాయి. కాంగ్రెస్, ఎన్.సి.పి. బి.జె.పి.. మూడు గవర్నమెంట్లు మారాయి. రిజర్వేషన్ల తుట్టె అలా ఉండిపోయింది. దాన్నిప్పుడు స్వాతి కదిలించారు. ముందు చిన్న చిన్న ర్యాలీలతో మెల్లిగా పొగబెట్టారు. తర్వాత.. ఇటీవలి ఒక రేప్ కేసును దుప్పటిగా కప్పుకుని తుట్టె వైపు కదిలారు. అలాగని రేప్ కేసు ముసుగులో స్వాతి చేస్తున్న రిజర్వేషన్ ఉద్యమం కాదు ఇది. తనకొక ఆయుధం దొరికింది. ఆ ఆయుధాన్ని ఈ మరాఠా యువతి మరాఠాల కోసం తిప్పుతున్నారు. యూత్ కదా! వాట్స్‌యాప్, సోషల్ మీడియా గ్రూప్ ఆయుధాలు ఎలాగూ ఉంటాయి. మొత్తం మూడు ఆయుధాలతో స్వాతీ నఖేత్ మరాఠాలను ఇప్పుడు సంఘటితం చేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని మునివేళ్లపై పరుగులెత్తిస్తున్నారు. పవార్‌కీ లేనంత ఫాలోయింగ్! రిజర్వేషన్లు ఒక్కటే మరాఠాల సమస్య కాదు. దళిత చట్టాల నుంచి వాళ్లకు రక్షణ కావాలి! వాళ్లపై వీళ్లు కంప్లైంట్ చెయ్యడానికి వెళ్లినప్పుడు చట్టాన్ని అడ్డుపెట్టుకుని దళితులు రివర్స్ కేసులు వేస్తున్నారని వీరి ఆరోపణ. దళిత సంరక్షణ చట్టంలో సవరణలు చేయాలని వీళ్ల డిమాండ్. అదీ జరగడం లేదు. పెపైచ్చు రాజకీయ నాయకులు దళితుల్ని బుజ్జగించడానికి నానా పాట్లూ పడడం మరాఠాలకు నచ్చడం లేదు. శరద్ పవార్ అంతటి నాయకుడు కూడా దళితుల ముందు కుప్పిగంతులు వేయడం వారికి నచ్చలేదు. పవార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరాఠాల అభీష్టానికి వ్యతిరేకంగా మరాఠ్వాడా యూనివర్శిటీ పేరును డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మరాఠ్వాడా యూనివర్శిటీగా మార్చారు. అది మరాఠాలకు ఆగ్రహం తెప్పించింది. తర్వాతి ఎన్నికల్లో అంతకంతా తీర్చుకున్నారు మరాఠ్వాడా ప్రాంత ఓటర్లు. పవార్ పార్టీని కోలుకోని విధంగా దెబ్బతీశారు. ఒక విషయం వాళ్లకు స్పష్టం అయింది. ఈ రాజకీయ నాయకులంతా ఒకటేనని. స్వాతీ నఖేత్ రాజకీయాల నుంచి రాలేదు. రాజకీయాల కోసం రాలేదు. అందుకే మహారాష్ట్రలోని మూడు ప్రధాన మరాఠా ప్రాంతాలు... పశ్చిమ మహారాష్ట్ర, ఉత్తర మహారాష్ట, మరాఠ్వాడా.. స్వాతి వెంట నడుస్తున్నాయి. ఉద్యమానికి ముందువైపు స్వాతి ఉంది కాబట్టే గుజరాత్లో పటేళ్ల ఉద్యమంలా, హర్యానాలో జాట్ల ఉద్యమంలా మరాఠా ఉద్యమం రక్తసిక్తం కాలేదు. పద్ధతిగా కదం తొక్కుతోంది. అవును. స్వాతీ నఖేత్ పద్ధతైన అమ్మాయి. ‘లా’ చదువుకుంది. మరాఠాల మనోభావాలను లోతుగా అధ్యయనం చేసింది. అంతే లోతుగా మహారాష్ట్ర రాజకీయ నాయకుల్ని! విమర్శలకు జడవని వ్యక్తిత్వం మరాఠా బాలిక మీద జరిగిన అత్యాచారాన్ని అడ్డుపెట్టుకుని మరాఠా ఉద్యమాన్ని భుజాన వేసుకున్నారనే ఆరోపణను ప్రస్తుతం స్వాతీ నఖేత్ ఎదుర్కొంటున్నారు. అంతేకాదు, ఈ ఉద్యమం కారణంగా మరాఠాలు, దళితుల మధ్య తలెత్తబోయే విభేదాలకు, వాటి పర్యవసానాలకు కూడా నఖేత్ బాధ్యత వహించాలని ప్రత్యర్థులు ఆమెను దోషిని చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటికీ స్వాతీ నఖేత్ జడవడం లేదు. ‘‘దళితుల అభివృద్ధి జరగందే మహారాష్ట్ర అభివృద్ధి జరగదు. ఒక్క దళితులు అనే కాదు... వంజరులు, ముస్లింలు, మరాఠాలు అందరూ పురోగమిస్తేనే రాష్ట్ర పురోగతి. సరైన రోడ్లు లేక, విద్యుత్ సౌకర్యం లేక అందరం ఇక్కట్లు పడుతున్నవాళ్లమే. మేము దళితులతో కలిసి ఉంటామనే అంటున్నాం. అయితే మమ్మల్ని కలవనివ్వకుండా, మాలో మాకు విభేదాలు సృష్టించడానికి రాజకీయనాయకులు కుల రాజకీయాలను రాజేస్తున్నారు’’అని నఖేత్ ఆరోపిస్తున్నారు. బెస్ట్ లాయర్... ది బెస్ట్ లీడర్ మరాఠా క్రాంతి మోర్చా! పెద్ద పార్టీ కాదు. పొలిటి కల్ పార్టీ కాదు. కానీ ఇప్పుడది మహారాష్ట్రలోని పెద్దపార్టీలను, పొలిటికల్ పార్టీలను వెనక్కు నెట్టేస్తోంది. స్వాతి నఖేత్.. మోర్చా నాయకురాలు! ముంబై హైకోర్టు (ఔరంగాబాద్ బెంచ్) న్యాయవాది. బెస్ట్ క్రిమినల్ లాయర్ అవాలని స్వాతి కల. మరాఠీ మ్యూజిక్ అంటే ఇష్టం. గో సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ ఆమె అభిరుచులు. జిజియా మాత హైస్కూల్లో చదువుకున్నారు. మాణిక్‌చంద్ పహాడే లా కాలేజ్‌లో పట్టభద్రురాలయ్యారు. ఎం.పి. లా కాలేజ్, డాక్టర్ బాము కాలేజీలలో న్యాయవాద విద్యలో అప్‌గ్రేడ్ అయ్యారు. తను చదువుకున్న న్యాయశాస్త్రాన్ని మరాఠాలు అడుగుతున్న సామాజిక న్యాయం కోసం ఒక అస్త్రంలా ఉపయోగిస్తున్నారు స్వాతీ నఖేత్. స్వాతి చేతుల్లోకి వచ్చేసింది క్రాంతి మోర్చా ప్రధానంగా ఇప్పుడు నాలుగు అంశాలపై ఉద్యమిస్తోంది. ఒకటి: మరాఠాలకు రిజర్వేషన్లు. రెండు: అఘాయిత్యాలనుంచి ఎస్సీ, ఎస్టీలకు రక్షణకల్పించే చట్టం దుర్వినియోగం కాకుండా ఆ చట్టానికి సవరణలు చేయడం. మూడు: అరేబియా సముద్రంలో ఛత్రపతి శివాజీ స్మారక చిహ్నాన్ని స్థాపించడం. నాలుగు: తమ మరాఠాల అమ్మాయిపై పాశవికంగా అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేసిన దళిత నేరస్థులకు ఉరిశిక్ష విధించడం. ఇప్పుడీ ఉమ్మడి అంశాల ఉద్యమం స్వాతీ నఖేత్ చేతుల్లోకి వచ్చేసింది. రేప్ ఘటన ఆ ఉద్యమానికి ఇప్పుడు ప్రధాన చోదకశక్తి అయింది. 13 జూలై 2016 మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రకంపనలకు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా డిమాండ్‌కు దారితీసిన ‘ఆ’ హేయమైన ఘటన జరిగిన రోజు! అహ్మద్‌నగర్ జిల్లా కొపర్డి గ్రామంలో పదిహేనేళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం జరిపి, అతి కిరాతకంగా చంపేశారు! పోపుగింజల కోసం అక్కడికి కిలోమీటరు దూరంలో ఉన్న అమ్మమ్మగారింటికి సైకిలుపై వెళ్లింది ఆ బాలిక. కూతురు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో చూసి రమ్మని తల్లి కొడుకును పంపింది. చెల్లెల్ని వెతుక్కుంటూ వెళ్లాడా అబ్బాయి. చెల్లెలు కనిపించలేదు. చెల్లెలి సైకిల్ కనిపించింది. సైకిల్ నిలబెట్టి లేదు. పక్కకు పడి ఉంది! అతడి మనసు కీడును శంకించింది. ఆ చుట్టుపక్కలే వెతికాడు. ఓ ఫామ్‌హౌస్ దగ్గరలో చెల్లెలి మృతదేహం కనిపించింది. నగ్నంగా! ఆమె ఒంటినిండా దెబ్బలు. ప్రతిఘటించడంతో చిత్రహింసలు పెట్టి చంపేశారు. -
మెగాస్టార్‌ను సీఎం కలిసిన వేళ
ముంబై: మహారాష్ట్రలోని 50 నగరాలను అక్టోబర్ 2 నాటికి క్లీన్ సిటీలుగా మార్చుతామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. శనివారం ముంబైలో నిర్వహించిన 'డెటాల్ మహా క్లీనథాన్' కార్యక్రమంలో ఆ కార్యక్రమ ప్రచారకర్త అయిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఫడ్నవిస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ మీడియాతో మాట్లాడిన సీఎం.. రాష్ట్రంలో 7000 గ్రామాలు ఇప్పుడు బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా మారాయని తెలిపారు. పరిశుభ్ర నగరాల విషయంలో ముందుండేలా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని ఆయన వెల్లడించారు. ఘన వ్యర్థాల మేనేజ్మెంట్ విషయంలో సైతం మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించిందని ఫడ్నవిస్ తెలిపారు. ప్రజల భాగస్వామ్యం లేకపోతే పరిశుభ్రత సాధ్యం కాదన్నారు. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుతుందని భావిస్తున్నానని సీఎం అన్నారు. డెటాల్ మహా క్లీనథాన్ కార్యక్రమంలో అమితాబ్, ఫడ్నవిస్ చీపుర్లు పట్టుకుని రోడ్లు శుభ్రపరిచారు. -
'లెండి' పూర్తికి సహకరించండి
- మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నీవీస్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ - ప్రాజెక్టు జాప్యంతో పెరిగిన అంచనా వ్యయం - రూ.275కోట్ల నుంచి రూ.554కోట్లు పెరిగిన వ్యయం సాక్షి, హైదరాబాద్ అంతరాష్ట్ర ప్రాజెక్టుగా ఉన్న లెండిని త్వరితగతిన పూర్తి చేయాలని, దీనికి సంబంధించిన పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు తోడ్పడాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు విన్నవించారు. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రికి రాసిన లేఖను ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం స్వయంగా ఫడ్నీవీస్‌కు అందించారు. 2014జులై 23న ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖా మంత్రులు లెండిపై చర్చించారని, 2015 ఫిబ్రవరి 17న మరోసారి చర్చించారని ముఖ్యమంత్రి తన లేఖలో గుర్తు చేశారు. లెండికి వసరమైన అనుమతులు తీసుకోవాలని, పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కేసీఆర్ లేఖలో కోరారు. ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జల సంఘం వద్ద అనుమతులు తీసుకోవడంలో వేగం పెంచాలన్నారు. ప్రాజెక్టు కోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రూ.183,83కోట్లు మహారాష్ట్ర ప్రభుత్వానికి డిపాజిట్ చేసిందని, అయితే సుదీర్ఘ జాప్యం వల్ల ప్రాజెక్టు వ్యయం రూ.275.83కోట లనుంచి రూ.554.54కోట్లకు పెరిగిందరి గుర్తు చేశారు. జాప్యం జరుగుతున్నా కొద్దీ వ్యవ అంచనాలు ఇంకా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. 2017 జూన్ నాటికి భూసేకరణ సహా అన్ని సమస్యలు అధిగమించి ప్రాజెక్టు పూర్తిచేయాలని నిర్ణయించామని తెలిపారు. లెండి తొలి దశ రిజర్వాయర్‌ను జూన్ 2018 నాటికి పూర్తిచేసి క్రస్ట్ వరకు నీటి నిల్వ చేసేందుకు సహకరించాలని లేఖలో కోరారు. ప్రాజెక్టు వ్యయం, ఇతర సహకారం విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించేందుకు సిధ్దంగా ఉందని వెల్లడించారు. -
'తెలంగాణలో నీటి కరువు తొలగిపోతుంది'
ముంబయి: రాష్ట్రాలు సామరస్య ధోరణిలో వ్యవహరిస్తే చాలా సమస్యలు పరిష్కారమవుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మూడు ప్రాజెక్టుల నిర్మాణంపై తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ఒప్పందం కుదరడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఒప్పందానికి సహకరించినవారికి పేరు పేరునా కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఒప్పందం వల్ల తెలంగాణలో నీటి కరవు తొలగిపోయే అవకాశం ఏర్పడుతుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా అంతకు ముందు గోదావరి నదిపై మూడు ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. ముంబైలోని... సహ్యాద్రి గెస్ట్‌హౌజ్‌లో గోదావరి అంతర్రాష్ట్ర బోర్డు సమావేశమైంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, దేవేంద్ర ఫడ్నవిస్‌లతో పాటు మంత్రులు, అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. మేడిగడ్డ, తుమ్మిడిహెట్టి, చనఖా-కొరటా ఆనకట్టల ఎత్తుపై.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో అధికారులు సంతకాలు చేశారు. ఇక ఒప్పందానికి సహకరించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌ను కేసీఆర్ సన్మానించారు. శాలువా కప్పి, మెమెంటో ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో ముందుకు వెళ్తే కేంద్రం జోక్యాన్ని నివారించవచ్చని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నదీ జలాల కేటాయింపులు, వినియోగంపై నిత్యం వివాదాలే ఉండేవని, తమ వాదనను నాటి ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఫడ్నవిస్ చెప్పారు. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ చొరవతో ఆ సమస్యలకు పరిష్కారం దొరికిందన్నారు.