Farmers Crop damages
-
Rain Alert: ఈ నెల 27 నుంచి 30 వరకు చలిగాలులతో కూడిన వానలు!
Rain Alert to farmers about the crop పాట్నా: పశ్చిమ దిశగా వీస్తున్నగాలుల కారణంగా రాష్ట్రంలో చలి తీవ్రంగా పెరిగింది. పొగమంచు అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ చలి మాత్రం తారా స్థాయికి చేరుకుంది. కాగా ఈ నెల చివరివారంలో 27 నుంచి 30 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని బీహార్ వాతావరణశాఖ హెచ్చరించింది. దీనివల్ల వ్యవసాయానికి పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవల్సిందిగా సూచించింది. బీహార్‌లోని పలు జిల్లాల్లో ఈ వారంతంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేఅవకాశం ఉందని పాట్నా వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం వరి కోతలు జరుగుతున్నాయి. కుప్పలూడ్చి, పంట ఇంటికి చేరే సమయంలో ఈ వర్షాల కారణంగా రైతులకు నష్టం వాటిల్లే ఆవకాశం ఉందని, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వాతావరణ శాఖ రైతులకు సూచించింది. ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో పశువుల సంరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా వర్షాల అనంతరం రాష్ట్రంలో చలి తీవ్రత కూడా ఒక్కసారిగా గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంచనా. డిసెంబర్ 27 నుంచి 30 మధ్య ఉష్ణోగ్రతలు 18 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని, వర్షం పడే అవకాశంతో పాటు పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. చదవండి: కేఎఫ్‌సీ చికెన్‌లో కోడి తల.. కస్టమర్‌కు చేదు అనుభవం! -
రూ.1,500 కోట్ల కేటాయించినా..రైతన్నకు పనిముట్లు అందలే
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో ఒకరకంగా వ్యవసాయ యాంత్రీకరణ విప్లవం వచ్చింది. తెలంగాణ ఏర్పడక ముందు నాటి పరిస్థితితో పోల్చుకుంటే, రైతులకు యంత్రాల పంపిణీ దాదాపు రెండింతలైంది. ఈ ఏడాది రూ.10 లక్షల వరకు విలువ చేసే వరి నాటు యంత్రాలను సైతం సబ్సిడీపై అందజేయాలనే ఉద్దేశంతో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం బడ్జెట్లో రూ. 1,500 కోట్లు కేటాయించింది. సీజన్ ప్రారంభంలోనే రైతులకు యంత్రాలు చేతికి అందితే సాగుకు బాగా మేలు జరిగేది. కానీ ఇప్పటివరకు పనిముట్ల పంపిణీకి మార్గదర్శకాలే ఖరారు కాలేదు. సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ యాంత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. రైతులకు అవసరమైన ట్రాక్టర్లు, కోత, నూర్పిడి యంత్రాలు, పవర్ టిల్లర్లు వంటి భారీ యంత్రాలతో పాటు స్ప్రేయర్ల వంటి వ్యవసాయ పనిముట్లు సబ్సిడీపై ఇచ్చేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.1,500 కోట్లను ఈ ఏడాది బడ్జెట్లో కేటాయించింది. కానీ ప్రభుత్వ ప్రాధాన్యతకు అనుగుణంగా రైతులకు లబ్ధి చేకూర్చడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. వానాకాలం సీజన్ మొదలుకావడం, పెరిగిన నీటి వనరుల లభ్యత, పెట్టుబడి సాయం (రైతుబంధు) సైతం అందిన నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 30 లక్షల ఎకరాల్లో పంటల సాగుకు రైతులు సిద్ధమయ్యారు. ఈ సమయంలో సర్కారు లక్ష్యం మేరకు వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు అందితే వారికి మరింత ఊతం లభించినట్టయ్యేది. కానీ వ్యవసాయ శాఖ ఈ దిశగా అడుగులు ముందుకు వేయకపోవడంతో, కనీసం తైవాన్ స్ప్రేయర్ వంటివి కూడా రైతులకు సబ్సిడీపై దొరకని పరిస్థితి నెలకొంది. మరోవైపు రైతుల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించాల్సిన రైతు చైతన్య యాత్రల నిర్వహణలో, రైతులకు శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో నిర్మించిన రైతు వేదికల ప్రారంభంలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ఆధునికత సంతరించుకున్న సాగు వాస్తవానికి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వ్యవసాయ యాంత్రీకరణకు టీఆర్ఎస్ ప్రభుత్వం దన్నుగా నిలుస్తోంది. 2018 వరకు పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లతో సహా పలు రకాల యంత్రాలను సబ్సిడీపై రైతులకు ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీలకు ట్రాక్టర్లు సహా కొన్నింటిపై 95 శాతం, ఇతరులకు 50 శాతం సబ్సిడీతో సరఫరా చేసింది. దాదాపు 8 వేల వరకు ట్రాక్టర్లను వ్యవసాయశాఖ రైతులకు సబ్సిడీపై అందజేసింది. దీంతో రాష్ట్రంలో వ్యవసాయం ఆధునికత సంతరించుకుంది. ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులతో కొత్త ఆయకట్టు పెరగడం, మరోవైపు యాంత్రీకరణ జరగడంతో పంటల ఉత్పత్తి, ఉత్పాదకత కూడా గణనీయంగా పెరిగింది. కంపెనీలు సిద్ధంగా ఉన్నా.. గతంలో ట్రాక్టర్లు పెద్ద సంఖ్యలో ఇచ్చినందున ఈ ఏడాది ప్రధానంగా వరినాట్లు పెట్టే యంత్రాలను సబ్సిడీపై ఇచ్చి రైతులకు మేలు చేయాలని ప్రభుత్వం భావించింది. ఒక్కో వరి నాటు యంత్రం రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ధర ఉండే నేపథ్యంలో మండలానికి 10 యంత్రాలను ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అలాగే ఇతర యంత్రాలు అందజేసేందుకు పలు కంపెనీలతో మాట్లాడింది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన 5 వేలకు పైగా వరినాటు యంత్రాలను ఆయా కంపెనీలు కూడా సిద్ధం చేసి ఉంచాయి. వీటితో పాటు ఇతర యంత్రాల కోసం ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపి, నిధులు మంజూరు చేయించుకుని, రైతులకు సబ్సిడీపై పంపిణీ చేయడంలో వ్యవసాయ శాఖ విఫలమయ్యింది. ఇప్పటికే ఆలస్యం వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందే వ్యవసాయ యంత్రాలను రైతులకు సరఫరా చేయాలి. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. వరినాట్ల యంత్రాలను సరఫరా చేయాలంటే పెద్ద తతంగమే ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు రైతుల నుంచి దరఖాస్తులు తీసుకున్నా అర్హులను తేల్చి పంపిణీ చేయడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుందని గతంలో ట్రాక్టర్ల పంపిణీ అనుభవాలు చెబుతున్నాయి. ఇప్పుడు వరినాట్ల యంత్రాల పంపిణీ కూడా పారదర్శక విధానంలో చేపట్టాలంటే ఖచ్చితంగా సమయం తీసుకుంటుందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రభుత్వంరూ.1,500 కోట్ల బడ్జెట్ కేటాయించినా సద్వినియోగం కాని తీరుపై వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రైతు చైతన్య యాత్రలేవీ? వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, ఆధునిక పోకడలు, అధునాతన సాంకేతికత వినియోగంపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించాల్సిన రైతు చైతన్య యాత్రలు గత మూడేళ్లుగా జరగడం లేదు. ఏటా వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందు వేసవిలో 15 రోజుల పాటు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఈ యాత్రలు నిర్వహించేవారు. ప్రస్తుతం అవి జరగకపోవడంతో పంటల సాగులో వస్తున్న మార్పులపై అవగాహన లేకుండా పోతోందని రైతు సంఘాలు చెబుతున్నాయి. అధికారులు మాత్రం రైతుబంధు, రైతు బీమా పథకాల అమల్లో నిమగ్నం అవ్వడం వల్లే ఈ యాత్రలు నిర్వహించలేకపోతున్నామని పేర్కొంటున్నారు. ప్రారంభం కాని రైతు వేదికలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదికలు చాలాచోట్ల ప్రారంభం కాకపోవడం కూడా విమర్శలకు తావిస్తోంది. రైతులంతా ఒకచోట సమావేశమై సాగు సమస్యలు చర్చించుకునేందుకు, రైతులకు అవసరమైన శిక్షణ ప్రధాన లక్ష్యంగా రైతు వేదికలు నిర్మించారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 2,601 వేదికలను నిర్మించినా చాలాచోట్ల ఇవి ప్రారంభానికి నోచుకోలేదు. ఆదిలాబాద్ జిల్లాలో 101 రైతు వేదికలు నిర్మించారు. అయితే పంచాయతీరాజ్ శాఖ ఇంకా ఆ భవనాలను వ్యవసాయ శాఖకు అప్పగించకపోవడంతో అవి ప్రారంభం కాలేదు. ఆసిఫాబాద్‌లో 70కి గాను 46 నిర్మాణాలు పూర్తికాగా, ఇందులో 13 ప్రారంభించలేదు. నిజామాబాద్ జిల్లాలో 103 వేదికలు నిర్మిస్తే 54, పాలమూరులో 88కి 25 ప్రారంభించారు. నారాయణపేట జిల్లాలో 77 రైతు వేదికలు నిర్మిస్తే కేవలం మూడు మాత్రమే ప్రారంభం కావడం ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపాన్ని స్పష్టం చేస్తోంది. సాగుకు రైతులు సిద్ధమయ్యారు. ఈ సమయంలో సర్కారు లక్ష్యం మేరకు వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు అందితే వారికి మరింత ఊతం లభించినట్టయ్యేది. కానీ వ్యవసాయ శాఖ ఈ దిశగా అడుగులు ముందుకు వేయకపోవడంతో, కనీసం తైవాన్ స్ప్రేయర్ వంటివి కూడా రైతులకు సబ్సిడీపై దొరకని పరిస్థితి నెలకొంది. మరోవైపు రైతుల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించాల్సిన రైతు చైతన్య యాత్రల నిర్వహణలో, రైతులకు శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో నిర్మించిన రైతు వేదికల ప్రారంభంలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ఆధునికత సంతరించుకున్న సాగు వాస్తవానికి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వ్యవసాయ యాంత్రీకరణకు టీఆర్ఎస్ ప్రభుత్వం దన్నుగా నిలుస్తోంది. గతంలో కూలీల కొరత సమస్యను అధిగమించడంతో పాటు ఉత్పత్తి పెంపునకు దోహదపడుతుందనే ఉద్దేశంతో పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు సహా పలు రకాల యంత్రాలను సబ్సిడీపై రైతులకు ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీలకు ట్రాక్టర్లు సహా కొన్నింటిపై 95 శాతం, ఇతరులకు 50 శాతం సబ్సిడీతో సరఫరా చేసింది. దాదాపు 8 వేల వరకు ట్రాక్టర్లను వ్యవసాయశాఖ రైతులకు సబ్సిడీపై అందజేసింది. దీంతో రాష్ట్రంలో వ్యవసాయం ఆధునికత సంతరించుకుంది. ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులతో కొత్త ఆయకట్టు పెరగడం, మరోవైపు యాంత్రీకరణ జరగడంతో ప్రభుత్వం ఆశించినట్లుగానే పంటల ఉత్పత్తి, ఉత్పాదకత గణనీయంగా పెరిగింది. -
రూపాయికో పండు : అయినా దిక్కులేదు
కోల్‌కతా : పండ్ల విక్రేతలు, రైతులనూ కరోనా మహమ్మారి వెంటాడుతోంది. కారుచౌకగా లభించే పండ్లనూ కొనేవారు లేక అయినకాడికి అమ్ముకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో.. పోషక విలువల్లో మేటిగా పేరొందిన జామపండు రూపాయికి ఒకటి లభిస్తున్నా కొనేవారు లేక రైతులు, పండ్ల విక్రేతలు ఆవేదన చెందుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తికి ముందు ఏడెనిమిది రూపాయలు పలికిన ఒక్కో జామ ఇప్పుడు కేవలం రూపాయికే అందుబాటులో ఉంది. రూపాయికి ఒక జామపండును అందిస్తున్నా ఎవరూ కొనకపోవడంతో ఒక్కోసారి పండ్లను రోడ్డుపైనే పారబోస్తున్నామని పండ్ల విక్రేతలు ఆవేదన వ్యక్తం చేశారు. గిరాకీ లేక అరకొర రేటుకే పండ్లను తెగనమ్ముతున్నా ఆ ధరకూ ఏ ఒక్కరూ కొనకపోవడంతో జామ రైతులకు నష్టాలు ఎదురవుతున్నాయి. దక్షిణ 24 పరగణాల జిల్లాకు చెందిన విమల్ సర్ధార్ (52) గత ఏడాది తనకున్న ఎకరం తోటలో జామ పంటను సాగుచేసి మంచి దిగుబడి సాధించాడు. జామ పండ్లను విక్రయించగా వచ్చిన డబ్బుతో రూ 60,000 అప్పు తీర్చాడు. ఈ ఏడాది కరోనా వైరస్‌తో పాటు తుపాను బీభత్సంతో పరిస్థితి తారుమారైందని అప్పు ఎలా తీర్చాలో అర్ధం కావడం లేదని వాపోయారు. తమకు ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని ఆందోళన వ్యక్తం చేశారు. పండ్ల రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని అన్నారు. లాక్డౌన్, ఆంఫన్ తుపాన్‌తో పశ్చిమ బెంగాల్లో జామ సాగుదారులు, హోల్‌సేలర్లు తీవ్రంగా నష్టపోయారు. అన్‌లాక్ దశలో అడుగుపెట్టినా లోకల్ ట్రైన్స్‌ను అనుమతించపోవడంతో పండ్ల సరఫరాలూ దెబ్బతిన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సీజన్లో జామ పండ్ల విక్రయాలు దారుణంగా పడిపోయాయని వ్యాపారులు వాపోతున్నారు. చదవండి : ‘కరోనా నుంచి దేవుడే మనల్ని కాపాడాలి’ -
‘తాలు’ తీస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్ : అకాల వర్షాలు.. అనుకోని రోగాలు.. ఈ విపత్కర పరిస్థితులను తట్టుకుని పంట కోతకు నానా అగచాట్లుపడి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెస్తే సవాలక్ష ఇక్కట్లు.. రైతులు తెచ్చిన ధాన్యంలో తాలు ఎక్కువుందంటూ మిల్లర్లు అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి వెళ్లిన ధాన్యానికి మిల్లింగ్ కేంద్రాల వద్ద క్వింటాల్‌కు 5 నుంచి 6 కిలోల మేర కోతపెడుతూ రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. ఎకరంలో 25 క్వింటాళ్లు పండించే రైతు 1.50 క్వింటాళ్ల ధాన్యాన్ని కోల్పోతున్నాడు. ఇంకా, చాలాచోట్ల రంగు మారిందన్న సాకుతో గ్రేడ్–1 ధాన్యానికి సాధారణ రకం ధాన్యం ధరకడుతూ రైతులను నట్టేట ముంచుతున్నారు. మిల్లర్ల మాయాజాలం రాష్ట్రంలో ఈ ఏడాది 40 లక్షల ఎకరాల్లో పంటల సాగు జరగ్గా, 91లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా శనివారం మధ్యాహ్నానికి 2 లక్షల మంది రైతుల నుంచి 5,400 కొనుగోలు కేంద్రాల ద్వారా 13.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. మిగతా ధాన్యం సేకరణ వేగంగా జరుగుతోంది. అయితే ధాన్యం దిగుబడి అధికంగా గల కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఈ జిల్లాల్లో యాసంగిలో మెడవిరుపు, దోమపోటు, కత్తెరరోగం వంటి తెగుళ్లు సోకి పంట దెబ్బతింది. అదీగాక 1010 మినహా 1152, 1156 వంటి విత్తన రకాలు అనుకున్నట్టుగా ఎదగలేదు. దీనికి అకాల వర్షాలు తోడయ్యాయి. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించేప్పుడే ఎండబెట్టి, తాలుతీసి తెస్తున్నారు. ఇక కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చాక తూకం సమయంలో తాలు, 17% తేమ నిబంధనలు అడ్డుపెట్టి కొనుగోలు చేస్తున్నారు. అనంతరం ధాన్యాన్ని కేంద్రం నుంచి మిల్లింగ్‌కు తరలించే సమయంలో అసలు దోపిడీ మొదలవుతోంది. ఇక్కడ ప్రతి 40 కిలోల బస్తాకు 2 నుంచి 3 కిలోలు అంటే క్వింటాల్‌కు సుమారు 5 నుంచి 6 కిలోలు మిల్లర్లు కోత పెడుతున్నారు. దీనిని ప్రశ్నిస్తే లారీలను వెనక్కి పంపుతామని హెచ్చరిస్తున్నారు. దీంతో వంద క్వింటాళ్లు తీసుకొచ్చే రైతు ఏకంగా 6 క్వింటాళ్లు నష్టపోతున్నాడు. క్వింటాలుకు కామన్ రకం ధర రూ.1,815 చెల్లించినా కనీసంగా రైతు రూ.10,890 మేర నష్టపోతున్నాడు. అన్నింటికీ కామన్ ధరే.. ప్రస్తుతం గ్రేడ్–1 ధాన్యానికి క్వింటాల్‌కు రూ.1,835, కామన్ రకానికి రూ.1,815 చెల్లించాలి. కానీ ఇటీవల కురిసిన వర్షాలతో గ్రేడ్–1 రకం ధాన్యం కొంత రంగుమారింది. చాలాచోట్ల టార్ఫాలిన్లు లేక ధాన్యం నల్లరంగుకు మారింది. దీన్ని సాకుగా చూపి మిల్లర్లు గ్రేడ్–1 రకాన్ని కామన్ రకం కింద చూపుతున్నారు. దీంతో ప్రతి క్వింటాల్‌కు రూ.20 మేర రైతు నష్టపోతున్నాడు. దీనికి తోడు లాక్డౌన్ పరిస్థితుల దృష్ట్యా హమాలీల కొరత తీవ్రంగా ఉంది. దీంతో గ్రామాల్లో అందుబాటులో ఉన్న వారు, ప్రభుత్వ గిడ్డంగుల్లో పనిచేస్తున్న వారితో హమాలీ పనిచేయిస్తున్నారు. వీరు గతంలో క్వింటాల్‌కు రూ.32 తీసుకోగా ఇప్పుడు రూ.3 అదనంగా కలిపి రూ.35 వసూలు చేస్తున్నారు. ఇది రైతుకు అదనపు భారమవుతోంది. ఇక కొన్నిచోట్ల గన్నీ సంచుల కొరత.. రైతులకు పరీక్ష పెడుతోంది. చదవండి: ఎత్తివేయాలా.. వద్దా..! మిల్లులను సీజ్ చేయడానికి వెనకాడం ధాన్యం కొనుగోళ్లలో తేమ, తాలు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని, ఇష్టానుసారం కోత విధించవద్దని రైస్‌మిల్లర్లకు స్పష్టంగా ఆదేశాలిచ్చాం. దీన్ని ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే ఆ మిల్లులను సీజ్ చేయడానికైనా వెనుకాడం. మా ప్రభుత్వానికి రైతు ప్రయోజనాలే ముఖ్యం. కేంద్ర ప్రభుత్వం సకాలంలో సబ్సిడీలు ఇవ్వకపోవడం, భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) నుంచి బిల్లులు సరైన సమయంలో రాకపోవడం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతోంది. ఈ సీజన్లోనే ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వంపై దాదాపు రూ.1,000 కోట్ల వడ్డీ భారం పడుతోంది. – పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పొల్లు ఉందని ఇబ్బంది పెడుతుండ్రు నేను ఎకరం పొలంలో వరి వేసిన. పొలమంతా రోగంబడి ఖరాబైంది. ఉన్నకాడికి వడ్లు కొనుగోలు కేంద్రానికి తెస్తే అందులో పొల్లు ఉందని ఇబ్బంది పెడుతుండ్రు. కనీసం పెట్టుబడి కూడా ఎల్లలే. వర్షం వస్తే టార్పాలిన్లు కూడా లేవు. ప్రభుత్వమే ఆదుకోవాలి. – శ్యాగ ఎల్లయ్య, బీబీపేట, కామారెడ్డి జిల్లా గన్ని సంచులు లేవని కొంటలేరు కొనుగోలు కేంద్రంలో వడ్లుపోసి పది రోజులవుతోంది. తేమ పోయిందాక ఆరబెట్టినా, గన్ని సంచులు లేవని కాంట పెట్టడం లేదు. వడ్లు పోసేందుకు పరదాలు కిరాయికి తెచ్చినం. కిరాయిలు పెరుగుతున్నయి. ధాన్యం త్వరగా కొనుగోలు చేయాలి. – ఎలవేణి సుజాత, సుల్తానాబాద్, కరీంనగర్ ఏ–గ్రేడ్ వడ్లు బీ–గ్రేడ్‌గా తీసుకుంటున్నరు తాలు, సంచి, మట్టి పేరుతో క్వింటాల్‌కు రెండు కిలోల చొప్పున తీస్తున్నరు. ఏ–గ్రేడ్ వడ్లను బీ–గ్రేడ్‌గా లెక్కగడుతున్నారు. దీంతో చాలా నష్టపోతున్నం. అధికారులే చొరవ తీసుకొని న్యాయం చేయాలి. – పిడుగు విమల, సుల్తానాబాద్, కరీంనగర్ -
‘కరువు రైతులను ఆదుకునేందుకు రూ. 2వేల కోట్లు’
సాక్షి, వైఎస్సార్ : కరువు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ. 2వేల కోట్లతో కెలావిటి రిలీఫ్ ఫండ్‌ను తీసుకొచ్చిందని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి మధుసూదన్ రెడ్డి తెలిపారు. సోమవారం రాయచోటి నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. పలుచోట్ల పంటల పరిశీలించిన ఆయనకు మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్ రెడ్డి కరువు పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా మధుసూదన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు ఈ ఏడాదిలోనే పెట్టుబడి సాయం క్రింద రూ. 12500, అలాగే ప్రభుత్వమే భీమా భరించడం, 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణనిధి ఏర్పాటు చేశారని వెల్లడించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక బోర్వేల్ వాహనాన్ని ఏర్పాటు చేసి అవసరమైన రైతులకు ఉచితంగా బోరు వేయించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. తీవ్ర వర్షాభావం కారణంగా ఇంతవరకు పంటవేయలేని రైతులకు వందశాతం సబ్సిడీ ఉలవ, పేసర విత్తనాలు పంపిణీ చేస్తామని తెలిపారు. గతేడాది నుంచి జిల్లాకు రూ. 150 కోట్లు, రాష్ట్రానికి రూ. 2 వేల 400 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ కేంద్రం నుంచి అందాల్సివుందన్నారు. వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుని రైతులకు ఉపశమనం కల్గించనుందని పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు. -
వరి రైతులకు అండగా పంటల బీమా
సాక్షి, గుంటూరు: రూపాయితో పంటల బీమా పథకం రైతుకు వరంగా మారింది. దీనిని సద్వినియోగం చేసుకునేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నా తగిన ప్రచార లోపం, ఆన్లైన్లో నమోదుకు సాంకేతిక సమస్య, మీసేవ కేంద్రాల నిరాసక్తత, కొన్ని బ్యాంకుల అవగాహన లోపంతో లక్ష్యం ఆమడదూరంలో నిలుస్తోంది. వాణిజ్య, ఉద్యాన పంటలకు బీమా గడువు ముగిసినందున, వరి పంటకు బీమాలో ఈ సమస్యలను అధిగమించే చర్యలు తీసుకుంటే మరింత సంఖ్యలో రైతులు నమోదు చేసుకొనే అవకాశం ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా వరి సాగు రైతులు 2.05 లక్షల మంది ఉన్నారు. ఇప్పటి వరకు కేవలం 35 వేల మంది మాత్రమే బీమా చేయించుకున్నారు. అన్ని పంటలకుగాను వైఎస్సార్ బీమా ద్వారా 8,40,949 మంది లబ్ధి పొందనున్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలో వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకంగా వ్యవహరిస్తున్నారు. కేవలం రూపాయి ప్రీమియంతోనే పంటకు బీమా చేయటం ఇందులోని వెసులుబాటు. ప్రీమియం తగ్గించటమే కాకుండా పంటల నష్టానికి చెల్లించే పరిహార మొత్తాన్ని పెంపుదల చేయటం, పంట నష్టాన్ని గుర్తించేందుకు నాలుగు రకాలుగా వెసులుబాటు కల్పించటం నూతన పథకంలో విశేషం. ఇంతకు ముందు వరి రైతుకు ఎకరాకు బీమా పరిహారం రూ.25 వేలుండేది. ఈ మొత్తాన్ని తాజా పథకంలో రూ.32 వేలకు పెంచారు. ప్రీమియంలో రైతు వాటాగా 2 శాతం (రూ.640) చెల్లించాల్సి వచ్చేది. బ్యాంకులో పంట రుణాలు తీసుకొనేటపుడు బీమా ప్రీమియం కింద రూ.520 మినహాయించే వారు. నూతన పథకంలో వీరందరి వద్ద కేవలం రూపాయిని టోకెన్ మొత్తంగా తీసుకుని బీమా కల్పిస్తున్నారు. గతంలో పంట వేసి, కోత కోసేవరకు మధ్యలో ఏదైనా కారణంతో పంట దెబ్బతింటేనే బీమా వర్తించేది. పంట వేయలేకపోయినా, పంట కోశాక నష్టం సంభవించినా బీమా పరిహారం పొందేందుకు వీలుండేది కాదు. దీనిని గుర్తించి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకంలో నాలుగు రకాల వెసులుబాట్లు కల్పించారు. ప్రతికూల పరిస్థితుల్లో పంట వేయలేకపోయినప్పుడు బీమా మొత్తంలో 25 శాతాన్ని పరిహారంగా చెల్లిస్తారు. పంట మధ్యకాలంలో వాతావరణ మార్పులు, దోమపోటు ఉధృతితో దెబ్బతింటే 50 శాతం, వడగళ్లవాన, అగ్ని ప్రమాదాలతో నష్టపోతే 50 శాతం పరిహారం ఇస్తారు. డెల్టాలో వచ్చే తుపాన్లను దృష్టిలో ఉంచుకొని పంట కోశాక 14 రోజుల్లోపు పంట దెబ్బతింటే నూరుశాతం పరిహారం చెల్లిస్తారు. కౌలు రైతులకూ వరమే.. పంటరుణానికి వెళ్లని భూమి యజమానులే కాదు, కౌలురైతులు కూడా పంటకు బీమా చేయించేందుకు ముందుకొస్తున్నారు. కామన్ సర్వీస్ సెంటర్లుగా గుర్తించిన మీసేవ కేంద్రాల్లోనే బీమాపై ఆన్లైన్ నమోదుకు అవకాశం కల్పించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం పోర్టల్‌లోకి వెళ్లి నమోదు చేయాలి. ఇందుకోసం రైతులు పట్టాదారు పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం, కౌలురైతులైతే ఒప్పంద పత్రంతో వెళ్లాలి. ఇలా నమోదైన వివరాలన్నీ ప్రభుత్వానికి వెళతాయి. ఆ ప్రకారం ప్రభుత్వం రైతుల తరపున నిర్ణయించుకున్న ప్రీమియంను బీమా కంపెలకు జమ చేస్తుంది. సాంకేతిక సమస్య సర్వర్ మొరాయిస్తుండటం ప్రధాన సమస్యగా మారింది. మీసేవ కేంద్రాల్లో (కామన్ సర్వీస్ సెంటర్లు) విపరీతమైన జాప్యం జరుగుతోంది. మరికొందరైతే ‘మధ్యాహ్నం రండి...రేపు రండి...బిజీగా ఉన్నాం..సర్వర్ ప్రాబ్లం’ అంటూ మీసేవ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. కొన్ని బ్యాంకు శాఖలు కూడా బీమా రెన్యువల్ చేసేందుకు ఆసక్తి చూపటం లేదని రైతుల ఫిర్యాదు చేస్తున్నారు. తెనాలిలోని ఒక గ్రామీణ బ్యాంకులో రుణం తీసుకున్న రైతుకు రూపాయి టోకెన్ మొత్తంగా తీసుకుని బీమా నమోదు చేయమంటే, నీళ్లు నమిలారట! కంప్యూటర్లో కాసేపు వెరిఫై చేసి, తమకు సమాచారం లేదనో/క్లారిఫికేషన్ సరిగా లేదనో? సాధ్యపడదని చెప్పటంతో, ‘మీసేవ’కు వెళ్లి నమోదు చేయించినట్టు పెదరావూరు రైతు ఒకరు చెప్పారు. -
పైసలియ్యకపోతే పనికాదా..?
రఘునాథపాలెం: ప్రభుత్వ శాఖలను అవినీతి జాడ్యం పట్టిపీడిస్తోంది. ఒక వైపు రెవెన్యూ శాఖ తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంటే.. మరోవైపు విద్యుత్ శాఖాధికారులు కూడా తక్కువ కాదంటూ అన్నదాతను ఇబ్బందిపెడుతున్నారు. పొలాల్లో నేలకూలిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు డబ్బులు అడుగుతున్నారని రైతులు ఆరోపిస్తున్నా రు. వివరాలు.. రఘునాథపాలెం మండలంలోని కోయచెలకలో రైతుల పోలాల్లో విద్యుత్ లైన్‌కు చెట్లు అల్లుకున్నాయి. నెలరోజుల క్రితం అధికారులకు చెప్తే పట్టించుకోలేదు. మీరే కొట్టుకొండి అంటే, కొంత మంది రైతులు కలిసి చెట్లు కొట్టారు. ఆ క్రమంలో ఒక చెట్టు కొమ్మ విరిగి విద్యుత్ లైన్‌పై పడి స్తంభం విరిగింది. ఈ విషయం ఆనాడే అధికారుల దృష్టికి తీసుకెళ్లామని రైతులు చెపుతున్నారు. వెంటనే అధికారులు స్పం దించకపోవడంతో తర్వాత వచ్చిన గాలివానకు విరిగిన స్తంభం పక్కనే మరో స్తంభం లోడుతో నేలకూలింది. దాంతో లైన్ మొత్తం నేలపై వాలింది. దీంతో పొలాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మళ్లీ ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్తే మరమ్మతులు చేస్తామని, విరిగిన స్తంభాల వద్దకు కొత్త స్తంభాలను చేర్చాలని చెప్పడంతో ట్రాక్టరు ద్వారా రైతులే తోలుకున్నారు. ఆ తర్వాత అధికారులు పట్టించుకోలేదు. పలుమార్లు రైతులు అధికారులను సంప్రదించి, లైన్ సరి చేయాలని కోరుతుంటే అధికారులు ఖర్చు అవుతుందని, రూ.7వేలు డిమాండ్ చేసినట్టు తెలిపారు. ఉన్నతాధికారులు తమ గోడును విని, ఎండిపోతున్న తమ పత్తి పంటను కాపాడాలని రైతులు వేడుకుంటున్నారు. రైతులంటే ఎందుకంత చులకన? తమ లైన్ సమస్యలపై అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదు. రైతులుంటే వారికి అంత చులకన ఎందుకో అర్థకావట్లేదు. అదును కాలం పోతుంది. పోలం మధ్యలో లైన్ ఇలా నేల పైన ఉంటే సాగు పనులు ఎలా చేసుకోవాలి. పొలాని నీళ్లు ఎలా అందించాలి. – అమరం అప్పారావు, రైతు మీటింగ్‌లో ఉన్న.. కోయచెలకలో రైతులకు సంబంధించిన విద్యుత్ లైన్ మరమ్మతులు చేసేందుకు ఏఈ శ్రీనివాసరావుకు ‘సాక్షి’ ఫోన్లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా తాను మీటింగ్‌లో ఉన్నానని తర్వాత మాట్లాడుతని ఏఈ అన్నారు. -
ధాన్యం..ధర దైన్యం
కర్నూలు, కోవెలకుంట్ల/బనగానపల్లె: ఈ ఏడాది ఎండకారు వరి సాగు రైతులకు నష్టాలు మిగిల్చింది. సాగునీటి కష్టాలు, వివిధ రకాల తెగుళ్లు దిగుబడులపై ప్రభావం చూపాయి. కోవెలకుంట్ల వ్యవసాయ సబ్ డివిజన్లోని ఆరు మండలాల పరిధిలో ఈ ఏడాది రబీలో కుందూనది, చెరువులు, బోర్లు, బావులు, తదితర సాగునీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో 4 వేల హెక్టార్లలో 555 రకానికి చెందిన వరిసాగు చేశారు. పంటకాలం పూర్తి కావడంతో డివిజన్లోని ఆయా గ్రామాల్లో వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. పెరిగిన పెట్టుబడులు.. తగ్గిన దిగుబడులు తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా గత ఏడాది డిసెంబర్ నాటికే కుందూనది ఎండిపోయింది. దీంతో నదితీర రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడ్డారు. నాట్లు వేసిన నెల రోజులకే సాగునీరు అందకపోవడంతో రైతులు సాగునీటికోసం అవస్థలు పడ్డారు. ఎట్టకేలకు అధికారులు కుందూనదికి నీటిని విడుదల చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. రబీ వరిసాగులో పెట్టుబడులు విపరీతంగా పెరిగి దిగుబడులు గననీయంగా తగ్గడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కలుపులు, కోత, నూర్పిడి, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 22 వేల నుంచి రూ. 25వేలు వెచ్చించారు. సాగునీటి కష్టాలు, వాతావరణం అనుకూలించక, దోమపోటు, అగ్గి తెగులు కారణంగా ఎకరాకు 30 బస్తాలకు మించి దిగుబడులు రాకపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. పెట్టుబడులు పెరిగి దిగుబడులు తగ్గడానికి తోడు మార్కెట్లో వరికి గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత మార్కెట్లో బస్తా రూ.1100 మించి ధర లేకపోవడం, ఈ ధరకు విక్రయిస్తే పెట్టుబడులు కూడా రావని రైతులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని వరికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. ఇక్కట్లలో కౌలు రైతులు రైతులకు ఎకరానికి భూములను బట్టి రూ 15–20వేల రూపాయలు కౌలు చెల్లించాలి. ఆ తర్వాత పంటలకు పెట్టుబడి పెట్టాలి. ఇవన్నీ పోను మిగులు లభించాలంటే తప్పనిసరిగా కౌలు రైతులకు గిట్టుబాటు ధర లభించాలి. – నరసయ్య, కౌలు రైతు, ఇల్లూరు కొత్తపేట గిట్టుబాటు ధర లేదు రబీలో సాగు చేసిన వరిపంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ఈ విషయంపై చాలామంది రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, గిట్టుబాటు ధర కల్పించి వరిపంటను కొనుగోలు చేయాలి. – పవన్‌కుమార్, వ్యవసాయాధికారి -
మరో సర్వేకు సన్నద్ధం!
సాక్షి, దోమ: రైతుల ఆర్థిక స్థితిగతులు తెలుసుకొని వారిని అభివృద్ధిపథంలో నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో సర్వేకు శ్రీకారం చుట్టబోతోంది. దీనిద్వారా రైతులకు సంబంధించి పూర్తి సమాచారం పక్కాగా సేకరించనుంది. సర్వేలో పంటల సాగు, ఇతర వివరాలను పొందుపర్చనున్నారు. గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం త్వరలో క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితిపై సర్వే చేసేందుకు సన్నద్ధమవుతోందని సమాచారం. వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు ఈ రైతు సర్వేలో పాలుపంచుకోనున్నారు. అతి త్వరలో సర్వే ప్రారంభం కానుంది. రైతులను ఆర్థికంగా పరిపుష్టి చేసి పంటల దిగుబడులను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే పంట కాలనీల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాల వారీగా ప్రతి రైతు నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరిస్తారు. జిల్లాలోని ఆయా మండలాలు, గ్రామాల నుంచి అన్నదాతల నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది. 39 ఆంశాలపై ఆరా.. రైతుల సమగ్ర సర్వేలో భాగంగా అధికారులు 39కి పైగా అంశాలు రూపొందించి ఫార్మాట్ ప్రకారం పూర్తి వివరాలను సేకరిస్తారు. ఇందులో భాగంగా రైతు వివరాలు, వారికి ఎంత భూమి ఉంది.. ఏఏ పంటలు.. ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. వర్షాధారమా.. ఆయాకట్టు ఉందా.. లేదా బోరుబావుల కింద సాగు చేస్తున్నారా..? తదితర అంశాలను సేకరించనున్నారు. రైతు సాగుచేసిన పంటల దిగుబడి ఎలా ఉంది.. ఆశించిన స్థాయిలో వస్తుందా లేదా అనే సమాచారం సేకరించి ఫార్మాట్లో పొందుపరుచనున్నారు. రైతుకు గిట్టుబాటు ధర లభిస్తోందా.. మార్కెటింగ్ సౌకర్యం ఉందా.. ఆయా పంటలను పండిస్తే ఎంతమేర గిట్టుబాటు అవుతోంది.. అనే వివరాలను అధికారులు సేకరించనున్నారు. భూసారం ఎలా ఉంది.. ఏఏ ఎరువులను ఏఏ పంటలకు ఉపయోగిస్తున్నారనే వివరాలను పొందుపర్చేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. పంట కాలనీల ఏర్పాటు రైతులు పండించిన పంటలను స్థానికంగా విక్రయించి మంచి లాభాలను పొందడమే పంట కాలనీల ఏర్పాటు ప్రధాన ఉద్దేశం. సర్వే అనంతరం ఏఏ పంటల సాగు ఏ ప్రాంతంలో అనుకూలంగా ఉంటుంది.. ఏఏ సీజన్లో పంటలకు మంచి డిమాండ్ ఉంటుందనే అనే విషయాలను సేకరించనున్నారు. నీటి లభ్యతను పరిగణలోకి తీసుకొని వర్షాధామైతే మొట్ట పంటలు, బోరుబావులు, కాల్వల ద్వారా అయితే ఇతర కూరగాయ పంటలను సాగు చేస్తున్నారనే అంశాలు తీసుకుంటారు. మండలం, గ్రామం లేదా నియోజవర్గం యూనిట్‌గా తీసుకుని ఆయా ప్రాంతాల వారీగా సీజన్‌ను బట్టి ఏ పంటలను సాగు చేస్తారని సమాచారాన్ని అధికారులు పూర్తిస్థాయిలో సేకరించనున్నారు. ఆయా ప్రాంత రైతులందరూ డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఇలా రైతులందరు కలిసి ఒకే పంటను సాగు చేసే విధానాన్ని పంట కాలనీ అని వ్యవహరిస్తారు. తద్వారా రైతులకు ఆయా పంటలకు మార్కెట్ సౌకర్యం లభించడంతో గిట్టుబాటు ధర లభించనుంది. గిట్టుబాటు ధరలే లక్ష్యం పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్రాసెసింగ్ చేసి సమభావన సంఘాల ద్వారా ప్రజలకు విక్రయించేందుకు చర్యలు తీసుకోనున్నారు. దీనిద్వారా రైతులకు మంచి గిట్టుబాటు ధరను కల్పించడం పంట కాలనీల ఉద్దేశం. వ్యవసాయ ఉద్యానవన, మార్కెటింగ్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, పరిశ్రమ శాఖల సమన్వయంతో పంట కాలనీల ద్వారా రైతులు పండించిన పంటలను ప్రాసెసింగ్ చేసి మార్కెటింగ్ సౌకర్యం కల్పించనున్నారు. ఆదేశాలు రాగానే ప్రారంభిస్తాం రైతులకు సంబంధించి సమగ్ర సర్వే నిర్వహించాలని అధికారులు చెప్పారు. పూర్తిస్థాయిలో ఇంకా ఆదేశాలు రాలేవు. 39 ప్రశ్నల కాలం గల ఫారం ఉండనుంది. ఫారాలు ఇంకా రాలేదు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు గ్రామాల్లో రైతుల సమగ్ర సర్వే నిర్వహిస్తాం. – శ్వేత, వ్యవసాయాధికారి, దోమ -
భూసార పరీక్ష.. శ్రీరామరక్ష
సాక్షి, జైనథ్(ఆదిలాబాద్): గతంలో భూసార పరీక్షలు అంటేనే గ్రామానికి ఒకరు,ఇద్దరు రైతులు మాత్రమే చేయించేవారు. వ్యవసాయంపై అమితాసక్తి ఉండి చదువుకున్న రైతులు మాత్రమే చేన్లలో మట్టి పరీక్షలు చేయించునేవారు. అయితే చేన్లో మట్టి నమూనాలు సేకరించడం పట్ల అవగాహన లేకపోవడం, మట్టి పరీక్షలతో కలిగే లాభాలు తెలియకపోవడం, నమూనాలు పరీక్షించేందుకు జిల్లా కేంద్రంలోని ల్యాబ్‌కు పంపాల్సి రావడం వంటి కారణాలతో ఆసక్తి ఉన్నా అతికొద్ది మంది రైతులు కూడా మట్టి పరీక్షలు అంటే వెనకాడేవారు. అక్కడక్కడ రైతులు ఎవరైనా తమ చేన్లోని మట్టి నమూనాలకు జిల్లా కేంద్రంలోని ల్యాబ్‌కి పంపించిన కూడా ఫలితాలకోసం నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. దీంతో భూసార పరీక్షల ఫలితాలు రైతులకు సకాలంలో అందకపోయేవి. రైతులు కూడా తమ పక్క రైతులు వాడే ఎరువులనే ఇష్టారీతిగా పంటలకు వేసేవారు. దీంతో దిగుబడి పెరగడం మాట అటు ఉంచితే.. రైతులు పెట్టుబడి తడిసి మోపెడయ్యేది. దీంతోపాటు దీర్ఘకాలంగా ఒకే రకమైన రసాయనిక ఎరువులు విపరీతంగా వాడడంతో భూసారం తగ్గి, నేల నిర్జీవంగా తయారైంది. దీంతో ఏళ్లుగా రైతులు ఆర్థికంగానూ నష్టపోవాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం ఈ పరిస్థితి మారుతోంది. రైతుల్లో మట్టి పరీక్షల పట్ల అవగాహన పెరగడం, వ్యవసాయశాఖ అధికారులు క్లస్టర్ల వారీగా మట్టి పరీక్షల కోసం మినీ ల్యాబ్‌లు ఏర్పాటు చేయడంతో పరీక్షలు చేయించుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా 101 ల్యాబ్‌లు గతంలో మట్టి పరీక్షలు చేయించుకోవాలంటే జిల్లా కేంద్రంలోని ప్రధాన ల్యాబ్‌కు వెళ్లాల్సి వచ్చేది. అయితే రైతులకు ఈ ల్యాబ్ గురించి పెద్దగా అవగాహన లేకపొవడం, దూర ప్రయాణాలు చేయాల్సి రావడం, ఫలితాలు రావడంలో నెలల తరబడి వేచి చూడాల్సి రావడం జరిగేది. దీంతో రైతులు మట్టి పరీక్షల గురించి అంతగా ఆసక్తి కనబరిచేవారు కాదు. కానీ ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో మినీల్యాబ్‌లు ఏర్పాటు చేయడం జరిగింది. క్లస్టర్ పరిధిలోని నాలుగైదు గ్రామాలకు కలిపి క్లస్టర్ గ్రామంలో మినీల్యాబ్ ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 101 క్లస్టర్లలో ఈ మినీ ల్యాబ్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఏఈవోల ఆధ్వర్యంలో నిర్వహణ.. క్లస్టర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఈ మినీల్యాబ్ల నిర్వహణ బాధ్యతలు ఏఈవోలకే అప్పగించడం జరిగింది. దీనికోసం ఏఈవోలకు ప్రత్యేక శిక్షణ కూడా అందించారు. దీంతో రైతులు తమ చేన్లోంచి తెచ్చిన మట్టిని ఇక్కడ పరీక్షించి ఒక్క రోజులోనే ఏఈవోలు ఫలితలు కూడా ఇచ్చేలా వెసులుబాటు కలిగింది. ఈ ల్యాబ్‌లో మట్టిలోని పీహెచ్(గాఢత), ఈసీ(లవణీయత), ఓసీ(సేంద్రియ కర్బనం), ఎన్పీకే(నత్రజని, భాస్వరం, పోటాషియం)లతోపాటు నేలలో ఉన్న సూక్షపోషకాల శాతాన్ని లెక్కించడం జరుగుతుంది. అనంతరం రైతులకు సాయిల్ హెల్త్‌కార్డ్ అనే ప్రత్యేకమైన రిపోర్టులు కూడా అందిస్తారు. దీని ఆధారంగా రైతులు వేసిన పంటలకు ఏ రకమైన ఎరువులు ఎంత మోతాదులో వాడాలి? ఎప్పుడెప్పుడు వాడాలి? ఆ నేలలో ఎలాంటి పంటలు వేయాలి? అనే వివరాలు రైతులకు సూచిస్తారు. దీంతో తగిన మోతాదులో ఎరువులు వాడి రైతులు ఖర్చులు తగ్గించుకోవడమే కాకుండా, లాభాలు ఆర్జించవచ్చని అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా ఈ ఏడాది రైతుబంధు, పీఎం కిసాన్ వంటి ఇతరాత్ర పనుల వలన వ్యవసాయశాఖ అధికారులు భూసార పరీక్షలు పూర్తిస్థాయిలో నిర్వహించలేకపోయారు. జిల్లా వ్యాప్తంగా 1450 మట్టి నమునాలు మాత్రమే పరిశీలించారు. అయితే ఈ ఏప్రిల్ నుంచి అన్ని గ్రామాల్లో మట్టి నమూనాల సేకరణ ఉధృతం చేస్తామని అధికారులు చెబుతున్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలి గ్రామాల్లో రైతులకు మట్టి పరీక్షల సేవలు అందుబాటులోకి తీసుకు రావాలనే ఉద్దేశంతో మండలంలో క్లస్టర్‌కు ఒకటి చొప్పున మినీల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్‌లో రైతులు తీసుకొచ్చిన మట్టి నమూనాలు వెంటనే పరీక్షించి, ఒక్క రోజులోనే ఫలితాలు అందిస్తాం. ఈ ల్యాబ్‌ల నిర్వహణ బాధ్యతలు పూర్తిగా ఏఈవోలకు అప్పగించాం. రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ భూమిలోని పోషకాలశాతం ఆధారంగా అవసరమైన మేరకు మాత్రమే బయట నుంచి ఎరువులు వేసుకోవాలి. దీనిద్వారా పెట్టుబడి తగ్గడమే కాకుండా, దిగుబడి కూడా పెరుగుతుంది. – పుల్లయ్య, వ్యవసాయశాఖ, ఏడీఏ -
ఫలించిన మొక్కజొన్న రైతుల పోరాటం
మీర్జాపురం(నూజివీడు): మొక్కజొన్న రైతులు మంగళవారం నాటి నుంచి చేపట్టిన ఆందోళనతో కంపెనీ దిగొచ్చి నష్టపరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. దీంతో రైతులు గురువారం ఆందోళన విరమించారు. రైతుసంఘం ఆధ్వర్యంలో 30 గంటల పాటు జరిగిన ఆందోళనతో ఎకరాకు రూ.62,500 చొప్పున నష్టపరిహారం చెల్లించేందుకు సీపీ కంపెనీ అంగీకరించింది. దాదాపు 5వేల ఎకరాలలో మొక్కజొన్న సాగుచేయగా, కంపెనీ చెప్పిన విధంగా దిగుబడులు రాకపోగా, పూర్తిగా నష్టపోయారు. మద్దతుగా ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు.. నష్టపరిహారం చెల్లించాలని ఆందోళన చేస్తున్న రైతులకు నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌అప్పారావు మద్దతుగా నిలిచారు. మీర్జాపురంలోని సీపీ సీడ్ కంపెనీ వద్ద ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు వెళ్లి చర్చించారు. ఆ తరువాత కంపెనీ ఆర్గనైజర్లతోను, ప్రతినిధితోను మాట్లాడారు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో నష్టపరిహారం ఎంతిస్తారో తేల్చాలని, లేనిపక్షంలో నూజివీడు– హనుమాన్‌జంక్షన్ రోడ్డుపై రైతులతో కలసి ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే ప్రతాప్, పోలీసు అధికారులతోను, తహసీల్దార్‌కు సమాచారం ఇచ్చారు. ఆందోళన జరుగుతున్న ప్రాంతానికి డీఎస్పీ బమ్మిడి శ్రీనివాసరావు రావడంతో ఎమ్మెల్యే ప్రతాప్ మాట్లాడుతూ రైతులు ఎకరాకు రూ.90వేలు నష్టం పరిహారం అడుగుతున్నారని, అసలు ఎంతిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఆర్గనైజర్లు, కంపెనీ ప్రతినిధులతో తహసీల్దార్ తేజేశ్వరరావు, డీఎస్పీ, సీఐలు పలుమార్లు చర్చించి, నష్టపరిహారాన్ని ప్రకటించాలని సూచించారు. చివరకు ఎకరాకు రూ.62,500 నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటించడంతో రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో రైతుసంఘం నాయకులు పగడాల వెంకట ఆంజనేయులు, నిమ్మగడ్డ నరసింహా, గరిశేపల్లి రాజు, చిటికెల రామారావు పాల్గొన్నారు. -
కొండెక్కిన ధాన్యం కొనుగోళ్లు
ప్రభుత్వ ఆదేశాలు లేవంటున్నారు.. అయ్యా...మాది పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు. మా ఊళ్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్లు కొని 20 రోజులు దాటింది. ఎందుకు ఆపారో తెలియదు. అదేమంటే ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడం లేదంటున్నారు. పంట పండించినా, పండించక పోయినా కష్టాలు తప్పడం లేదు. మా గోడు వినేవారే లేరు. ఎక్కడ చావమంటారయ్యా? – శ్రీనివాస్ (కౌలు రైతు) తిప్పి పంపిస్తున్నారు.. తూర్పు గోదావరి జిల్లాలోని 16 మండలాల్లో 294 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ ఘనంగా ప్రకటించారు. ధాన్యాన్ని ఎప్పుడు తీసుకువెళ్లినా ఏదో ఒక వంకతో తిప్పి పంపిస్తూనే ఉన్నారు. – పి.ప్రసాద్ (రైతు, పిఠాపురం) సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి డెల్టాలో ఏ మూలకు వెళ్లినా ధాన్యం పండించే రైతుల గోడు ఇదీ. రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు ఉత్తర్వులు ఇచ్చి రెండు నెలలు దాటినా అధికారిక లెక్కల ప్రకారమే సగానికి కూడా మించలేదు. ఖరీఫ్‌లో 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్టు గత నవంబర్ 13న వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి ప్రకటించగా ఆదివారం నాటికి 19.72 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నట్టు అధికారికంగా ప్రకటించడం గమనార్హం. ఇందులో సగానికిపైగా మిల్లర్లు, కమీషన్ ఏజెంట్లు కొనుగోలు చేసిందే ఉంది. మరోవైపు అక్టోబర్– నవంబర్ నాటికే 1,500 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు కావాల్సి ఉండగా ఇప్పటివరకు 1,332 మాత్రమే ఏర్పాటయ్యాయి. బస్తాకు రూ.200 దాకా నష్టపోతున్న రైతులు.. నిబంధనల ప్రకారం మహిళా స్వయం సహాయక సంఘాలు (వెలుగు), పీఏసీఎస్, డీసీఎంఎస్‌లు ధాన్యాన్ని కొనుగోలు చేస్తాయి. ప్రతి కొనుగోలు కేంద్రంలో గోనె సంచులు, ఇతర సామాగ్రి అందుబాటులో ఉండాలి. ధాన్యం విక్రయించే రైతుల ఖాతాల్లోకి ఆన్లైన్లో నేరుగా డబ్బు జమ చేయాలి. రైతులకు రవాణా ఖర్చులు కూడా చెల్లించాలి. ఒకవేళ మిల్లర్లు రైతుల నుంచి కొనుగోలు చేస్తే కనీస మద్దతు ధర ఇవ్వాలి. మిల్లర్లు కూడా రైతులకు ఆన్లైన్ లేదా చెక్కుల రూపంలో చెల్లించాలి. అయితే క్షేత్రస్థాయిలో వాస్తవాలు దారుణంగా ఉన్నాయి. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకారం 75 కిలోల వడ్ల బస్తాకు గరిష్టంగా రూ.1,312 చొప్పున ధర పలకాల్సి ఉంటే రైతులకు దక్కింది వేయి, రూ.1,150 మధ్యే ఉండటం గమనార్హం. దీంతో రైతులు బస్తాకు కనీసం రూ.రెండు వందలు దాకా నష్టపోతున్నారు. ఏ గ్రేడ్ ధాన్యాన్ని క్వింటాల్ రూ.1,790, సాధారణ రకాన్ని రూ.1,750 చొప్పున కొంటామని మంత్రి సోమిరెడ్డి గతంలో చెప్పారు. 20 రోజులుగా మూత... రైస్ మిల్లర్లతో సయోధ్య కొరవడడంతో గత 20 రోజులుగా ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. 2018–19 ఖరీఫ్ సీజన్లో వరి దిగుబడి 86.17 లక్షల టన్నులు ఉంటుందని అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం కేవలం 45 లక్షల టన్నులే కొనుగోలు చేయాలని నిర్ణయించడంపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ధాన్యం కేంద్రాలలో కొనుగోలు చేసిన వడ్లను రైస్ మిల్లర్లు మర ఆడించి బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు అప్పగించాలి. ధాన్యం కేంద్రాలలో క్రయ విక్రయాలు ఆగిపోవడంతో ఎక్కడి సరకు అక్కడ నిలిచిపోయింది. దీన్ని అవకాశంగా తీసుకున్న కమీషన్ ఏజెంట్లు పెద్దఎత్తున ధాన్యాన్ని తక్కువ రేటుకు కల్లాల్లోనే కొంటూ లబ్ధి పొందుతున్నారు. రైతు సంఘాలు ఈ వ్యవహారాన్ని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం శూన్యమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) సక్రమంగా అందాలంటే విస్తృత ప్రచారం, అవగాహన కల్పించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ఎంటీయూ 1010 రకం కొనరట! తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో పండించే ఐఆర్ 64, ఎంటీయూ 1010, 1001 రకాలను కొనుగోలు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా చెబుతోంది. ధాన్యం కేంద్రాలలో ఈ రకాన్ని కొనుగోలు చేయడం లేదు. ఈ రకం ధాన్యాన్ని రాష్ట్రంలో తినరని పేర్కొంటూ బహిరంగ మార్కెట్, ఇతర రాష్ట్రాల్లో విక్రయించుకోవాలని సూచించడంపై రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సర్కారు దగాకు రుజువు... ’పెథాయ్ తుపానుతో తడిసిన ధాన్యాన్ని కొంటామని మంత్రులు మొదలు ముఖ్యమంత్రి వరకు అంతా చెప్పారు. కృష్ణా జిల్లాలోని ఏ కొనుగోలు కేంద్రానికి వెళ్లినా ససేమిరా అంటున్నారు. ప్రభుత్వం నుంచి మార్చిన నిబంధనలు రాలేదు. మేం ఏమీ చేయలేమని అధికారులు చెబుతున్నారు. సర్కారు దగాకు ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?’ – పి.జమలయ్య (కౌలు రైతుల సంఘం నేత) -
పంట నష్టపోయిన రైతుకు పరిహారమివ్వాలి
సాక్షి, హైదరాబాద్: పంటలకు అవసరమైన నీటిని ప్రణాళికాబద్ధంగా అందించాలని, నీరు లేక ఏ రైతు పంట నష్టపోయినా ప్రభుత్వం పరిహారం చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. వర్షాభావంతో ఖరీఫ్ పంటలు దెబ్బతిన్నాయని, రబీపై ఆశలు పెట్టుకున్నా.. నాగార్జునసాగర్ ఎడమకాలువ, శ్రీరాంసాగర్, జూరాల కింది రైతులకు తైబందీ చేసి నీరివ్వడం లేదన్నారు. నాగార్జునసాగర్ కింద నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో వేసిన పంటలకు ఇవ్వాల్సిన నీటిని మిషన్ భగీరథకు తరలించడానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్లే వేసిన పంటలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రస్తుతం సాగర్‌లో డెడ్‌స్టోరేజీ పోగా 60 టీఎంసీల నీరు ఉన్నందున.. సాగర్ బోర్డును సంప్రదించి రాష్ట్రంలోని మొదటి, రెండో జోన్లకు కావాల్సిన నీటిని సాధించాలన్నారు. శ్రీశైలంలో డెడ్‌స్టోరేజీ పోగా 30 టీఎంసీల నీటి లభ్యత ఉన్నందున, ఇందులో రాష్ట్రానికి రావాల్సిన కోటా రాబట్టాలని కోరారు. ఇప్పటికైనా నీటిపారుదల, వ్యవసాయశాఖలు నీటి లభ్యతను బట్టి ఆయకట్టు ప్రాంతాన్ని నిర్ధారించి కచ్చితంగా అమలుచేయాలని తమ్మినేని సూచించార -
రైతులను ముంచిన తుపాను
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/మంథని/సాక్షి, వరంగల్: పెథాయ్ తుపాను ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులను నట్టేట ముంచింది. చేతికొచ్చిన పంట వర్షం బారిన పడటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోసి ఆరబెట్టిన వరి పనలతోపాటు కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకెళ్లిన ధాన్యం కూడా తడిసిపోయింది. వరితో పాటు మిర్చి, పత్తి పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. మిరప పంట తడవటంతో తెగుళ్లు సోకే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఖమ్మం జిల్లాలో 4.1 సెంటీమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10.92 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తుపాను కారణంగా కురిసిన వర్షం పెద్దపల్లి జిల్లా మంథని మార్కెట్‌ను ముంచెత్తింది. డివిజన్ పరిధిలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. ఉమ్మడి వరంగల్‌లో.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. చాలా చోట్ల కుప్పలుగా పోసిన వరిధాన్యం తడిసింది. వరి చేలు, మిరప తోటలు నేలవాలాయి. కొన్ని ప్రాంతాల్లో వాన నీటికి ధాన్యం కొట్టుకుపోయింది. పత్తి పంటకు కూడా నష్టం వాటిల్లింది. -
తడిసిన ప్రతి గింజ కొనుగోలు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, వారిని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ వెల్లడించారు. జనగామ, జగిత్యాల, నిర్మల్, మహబూబాబాద్, తాండూర్, మేడ్చల్, మంచిర్యాల తదితర ప్రాంతాల్లో అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం, అక్కడి పరిస్థితులను, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శనివారం ఉన్నతాధికారులతో కమిషనర్ సమీక్షించారు. ఆయా అధికారులతో మాట్లాడారు. తడిసిన ధాన్యానికి సంబంధించిన చివరి గింజను కూడా పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేస్తుందని, అకాల వర్షాల ప్రభావం రైతాంగం మీద ఏమాత్రం పడకుండా తీసుకోవలసిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రకటించారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు జిల్లా స్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు పౌరసరఫరాల కమిషనర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, ఫిర్యాదుల కోసం వాట్సాప్ నంబర్ 7330774444, టోల్ ఫ్రీ నంబర్ 1800 425 00333ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తడిసిన ధాన్యాన్ని సరైన పద్ధతిలో, నిబంధనలకు అనుగుణంగా తీసుకురావాలని, ఈ విషయంలో రైతులకు ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉంటుందని తెలిపారు. తేమ శాతం విషయంలో రైతాంగానికి అధికారులు అవగాహన కల్పించాలని, ఈ బాధ్యత ప్రధానంగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులపై ఉంటుందన్నారు. మార్కెటింగ్ శాఖతో సమన్వయం చేసుకొని ఎక్కడైనా టార్పాలిన్ల కొరత ఉంటే దాన్ని అధిగమించాలని, వచ్చే రెండు మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
రైతులకు అందేనా నీరు?
ఖమ్మంఅర్బన్: రైతుల పంట పొలాలకు సాగు నీరందించేందుకు ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాలు(లిఫ్టులు) చాలాచోట్ల నిరుపయోగంగా మారాయి. ఆయకట్టులో పంటలు పండించాలనుకున్న రైతుల ఆశలు ఆవిరై.. జలాలందక ఎండిన పైర్లతో వీరి తలరాతలు మారని దైన్యం నెలకొంది. జిల్లాలో సాగర్ కాల్వ నీరే ఆధారం. ఈ కాల్వలపై, అడపా దడపా పారే ఏర్లపై పలుచోట్ల నిర్మించిన ఎత్తిపోతల పథకాల ద్వారా జిల్లావ్యాప్తంగా 50వేల ఎకరాలకు సాగునీటిని అందించాలనేది లక్ష్యం. పైపులు, విద్యుత్ మోటార్ల మరమ్మతులు చేపట్టకపోవడంతో ఈ లిఫ్టులు మూలనపడ్డాయి. రైతుల భాగస్వామ్యంతోనే మరమ్మతులు చేయించుకోవాల్సి ఉండడంతో..పట్టించుకునేవారు కరువయ్యారు. పంటల పెట్టుబడి, నష్టాలతోనే సాగుదారులు అవస్థ పడుతున్న క్రమంలో ఈ మరమ్మతుల వ్యయం వీరికి పెనుభారంగా మారుతోంది. చివరి భూములకు నీరందడం లేదని ఆ రైతులు విముఖత చూపుతుండడంతో మరింత నిర్లక్ష్యం నెలకొంటోంది. ఖమ్మం జిల్లాలో 135 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. 35 లిఫ్టులు పాక్షికంగా పని చేస్తుండగా.. 10,991 ఎకరాలకు నీరందుతోంది. మరో 49 ఎత్తిపోతల పథకాలు అసలు పనిచేయట్లేదు. ఇవి వ్యవసాయ భూములకు చుక్కనీరు అందించలేకపోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 51 లిఫ్టుల ద్వారా 30,247 ఎకరాలకు మాత్రమే పుష్కలంగా నీరందుతోంది. మూడు కొత్త పథకాలకు రూ.29కోట్లు జిల్లాలో మూడు కొత్త లిఫ్టు ఇరిగేషన్ పథకాల నిర్మాణం కోసం గతంలో ప్రభుత్వం రూ.29.41కోట్లు మంజూరు చేసింది. కల్లూరు మండలం కొర్లకుంట, మధిర మండలం మాధవీపురం, బోనకల్ మండలం రాపల్లెలో వీటిని నిర్మించనున్నారు. వీటి ద్వారా నాలుగు వేల ఎకరాలకు సాగునీరందించాలనేది లక్ష్యం. మరమ్మతుల నిధులు ఇలా.. జిల్లాలో మూడు ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు గతంలో రూ.4.12కోట్లు మంజూరయ్యాయి. రఘునాథపాలెం మండలం జాన్‌బాద్‌తండా లిఫ్టు, కూసుమంచి మండలం నరసింహులగూడెం, చింతకాని మండలం కొదుమూరు లిఫ్ట్‌కు అదనపు పైపులైన్ల కోసం కేటాయించారు. జిల్లాలో లిఫ్టుల రిపేర్ల కోసం రూ.2కోట్లతో గతంలోనే అంచనాలు పంపినట్లు సమాచారం. మోటార్ల మరమ్మతులు, పంపు సెట్లు, పైపులైన్ల పనులు చేసే అవకాశముంది. పాలేరు నియోజకవర్గంలోని కామంచికల్ లిఫ్టు నిర్మాణానికి రూ.12కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు వెళ్లాయి. రైతుల భాగస్వామ్యం ఉండాలి.. లిఫ్టు ఇరిగేషన్ల నిర్వహణలో రైతుల భాగస్వామ్యం ఉంటేనే మంచి ఫలితాలు వస్తాయి. జిల్లాలో పనిచేయని ఎత్తిపోతల పథకాల మరమ్మతు కోసం ప్రభుత్వ నిబంధనల ప్రకారం గతంలోనే ప్రతిపాదనలు పంపించాం. కొన్నింటికి నిధులు మంజూరయ్యాయి. కొన్ని కొత్త పథకాలు కూడా వచ్చాయి. ఇంకా.. కొన్నింటి ప్రక్రియ నడుస్తోంది. రైతులంతా కలిసికట్టుగా ఉంటే.. సాగునీటి కష్టాలు తొలగుతాయి. – విద్యాసాగర్, ఐడీసీ ఈఈ -
ఈ ముఖ్యమంత్రికి రైతు సమస్యలేం తెలుస్తాయి
త్రిపురాంతకం: వ్యవసాయం దండగ అన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి రైతుల కష్టాలు ఏం తెలుస్తాయని యర్రగొండపాలెం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ఎద్దేవా చేశారు. త్రిపురాంతకంలో శనివారం వైఎస్సార్ సీపీ రైతు విభాగం ఆధ్వర్యంలో రైతులు సాగర్ నీటి కోసం ఎన్ఎస్పీ కార్యాలయం ముట్టడి, నేషనల్ హైవేపై ప్రదర్శన, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి సురేష్ మాట్లాడుతూ ఈరాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రైతులకు సాగర్ జలాలు అందక నాలుగేళ్లయిందన్నారు. ఈఏడాది సాగునీరిస్తున్నట్లు ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి స్వయంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాకు పదహారు సార్లు వచ్చారని..కనీసం రైతులకు సాగర్ జలాలను సాగుకు అందించలేకపోవడం దారుణమన్నారు. రైతులకు రుణమాఫీ చేయలేదని మభ్యపెడుతున్నారని విమర్శించారు. సాగర్ డ్యాంలో నీరున్నా కుడి కాలువ దిగువన నీరందించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ వచ్చి అధికారుల సమీక్షలు నిర్వహించారు కానీ నీరందలేదన్నారు. రోజుకో విధానం అమలు చేస్తున్నారని..గతంలో నీరు నిరంతరంగా ఇచ్చేవారని చెప్పారు. ఇప్పుడు తొమ్మిది రోజులు ఇచ్చి, ఆరు రోజులు ఆపుతామన్నారని..అది కూడా అమలు జరగడం లేదన్నారు. ఇక నుంచి ఇలా నీరిస్తే పంట పూర్తిగా ఎండిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా ప్రధాన కాలువకు మూడువేల క్యూసెక్కుల నీరు అందించాలని డిమాండ్ చేశారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నీటిని నిరాటంకంగా అందించారని గుర్తు చేశారు. వరుణుడు కరుణించి వర్షంపడి శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు నిండుకుండలా ఉంటే, ఆ నీటిని రైతులకు అందించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ప్రకటనతో రైతులు ఆశించి పంటలు పండించవచ్చనుకుంటే వారికి నీరివ్వక నిలువునా మోసం చేశారని విమర్శించారు. పంటలు వేసేవారికి నీరెప్పుడివ్వాలి, ఎప్పుడు ఎరువులు కావాలి, ఎప్పుడు గిట్టుబాటు ధర కావాలో రైతు బిడ్డకు తెలుస్తుంది కానీ మాటలు చెప్పి కాలయాపన చేసే ఈ ముఖ్యమంత్రికి రైతుల కష్టమేమి తెలుస్తుందని ప్రశ్నించారు. రైతన్నల కష్టాలు తీర్చేందుకు జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందని సురేష్ పిలుపునిచ్చారు. సాగునీటి పోరుకు స్వచ్ఛందంగా తరలివచ్చిన రైతులు: సాగర్ సాగునీటి కష్టాలు తీర్చాలని కోరుతూ వైఎస్సార్ సీపీ ఇచ్చిన పిలుపు మేరకు రైతుల నుంచి విశేష స్పందన లభించింది. రైతులను సాగునీటి పోరాటంలో పాల్గొనకుండా అధికార యంత్రాంగం, పోలీస్‌శాఖ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినా స్వచ్ఛందంగా రైతులు తరలివచ్చారు. త్రిపురాంతకానికి ఎమ్మెల్యే సురేష్ తెల్లవారే సరికి చేరుకున్నారు. ఆయనను గృహనిర్బంధం చేయాలని రాస్తారోకో, కార్యాలయం ముట్టడి కార్యక్రమాలను నిరోధించే ప్రయత్నాలు చేశారు. అయినా ప్రకటించిన విధంగా ఎమ్మెల్యే సురేష్ ఆధ్వర్యంలో అనంతపురం–అమరావతి హైవేపై రైతులు ప్రదర్శన చేశారు. సాగర్ కార్యాలయాన్ని ముట్టడించారు. అక్కడ రైతుల సాగునీటి సమస్యపై మండిపడ్డారు. సాగర్ కాలువల ఎస్ఈ కె.రవి మాట్లాడుతూ సాగర్ ప్రధాన కాలువ ద్వారా తక్కువ నీరు వస్తున్నందున నీటి సరఫరా పెరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎస్ఈ వెంట ఈఈ శ్రీనివాసరెడ్డి, డీఈ నరసింహారెడ్డి, ఏఈలు విజయకుమార్, ప్రసన్నకుమార్ ఉన్నారు. డీఎస్పీ రామాంజనేయులు, సీఐలు మల్లికార్జున్‌రావు, శ్రీరామ్, ఎస్ఐలు కమలాకర్, మాధవరావు, దేవకుమార్‌లు హైవే పై బైఠాయించిన సురేష్‌తోపాటు రైతులను బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. స్టేషన్లో సాగునీటి సమస్య తీవ్రతను వారికి వివరించారు. కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు పి.చంద్రమౌళిరెడ్డి, ఆళ్ల ఆంజనేయరెడ్డి, కోట్ల సుబ్బారెడ్డి, ఎస్.పోలిరెడ్డి, వజ్రాల కోటిరెడ్డి, దగ్గుల గోపాల్‌రెడ్డి, ఆళ్ల కృష్ణారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, గాలెయ్యయాదవ్, ఉడుముల శ్రీనివాసరెడ్డి, రెంటపల్లి సుబ్బారెడ్డి, నక్కా చిన్నత్రిపురారెడ్డి, పిచ్చయ్య, బాలకోటిరెడ్డి, వెంగళరెడ్డి, సత్యనారాయణరెడ్డి, యల్లారెడ్డి, సుబ్రహ్మణ్యం, మల్లికార్జున, కృష్ణారెడ్డి ,శ్రీనివాసరెడ్డి, వెంకటనారాయణ, రంగయ్య, రంగబాబు, నాయకులు పాల్గొన్నారు. ఎట్టకేలకు స్పందించిన సాగర్ ఉన్నతాధికారులు త్రిపురాంతకం: సాగర్ నీటి కోసం వైఎస్సార్ సీపీ రైతు విభాగం ఆధ్వర్యంలో సాగునీటికి ఉద్యమించడంతో ఎట్టకేలకు సాగర్ ఉన్నతాధికారుల బృందం ప్రధాన కాలువపై పర్యటించింది. నాగార్జున సాగర్ ప్రధాన కాలువ జిల్లా సరిహద్దు 85–3 వద్దకు సాగర్ కాలువల చీఫ్ ఇంజినీర్ గోపాల్‌రెడ్డి, ఎస్ఈ రవి, ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, ఈఈ శ్రీనివాసరెడ్డి, డీఈ నరసింహారెడ్డిలు పర్యటించారు. వీరితో పాటు ఎమ్మెల్సీ కరణం బలరాం, ఎమ్మెల్యే డేవిడ్‌రాజు ఉన్నారు. సాగునీటి సరఫరా సక్రమంగా లేనందున వరిపంట దెబ్బతింటుందన్న విషయాన్ని వ్యవసాయశాఖ అధికారులు సాగర్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. కనీసం జిల్లా ఆయకట్టులోని పంటలు దెబ్బతినకుండా సాగునీరందించాలంటే 3300 క్యూసెక్కులు ముందుగా పదిహేను రోజులు ఇవ్వాల్సి ఉంటుందన్న అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం 2046 క్యూసెక్కుల నీటి సరఫరా అవుతోంది. దీనిని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ మేరకు జలవనరుల శాఖ మంత్రితో చర్చించారు. వైఎస్సార్ సీపీ రైతుల సాగునీటి సమస్యపై ముందు నుంచి అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ వచ్చింది. రైతులు పూర్తిగా నష్టపోతున్న తరుణంలో వారి సాగునీటి కష్టాలు తీర్చేందుకు రోడ్డెక్కాల్సిన పరిస్థితులను ప్రభుత్వం కల్పించింది. నీటి సమస్య పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
రోడ్డెక్కిన అన్నదాతలు
గుంటూరు /పేరేచర్ల: నాలుగేళ్ల నుంచి సరైన గిట్టుబాటు ధరలు, కౌళ్లు, పెరిగిన ఏరువుల ధరలు, సక్రమంగా లేని సాగునీటితో సతమతమైన రైతులు ప్రస్తుత సంవత్సరంలో ప్రభుత్వం తీసుకొన్న రైతు వ్యతిరేక నిర్ణయాలతో కడుపు మండి రోడ్డెక్కారు. మిర్చి సాగు మీద ఆశలు పెట్టుకొన్న తరుణంలో ప్రభత్వం తీసుకొన్న వారబందీ నిర్ణయం రైతుకు గోరుచుట్టు మీద రోకటి పోటు చందంగా మారింది. ప్రాజెక్టులో సాగునీరు పుష్కలంగా ఉన్నా వారబందీ పెట్టటం వలన దిగువన సాగు చేసే భూములకు నీరందక పంటలు ఎండిపోతున్నాయని వైఎస్సార్ సీపీ నాయకులు, అన్నదాతలు శనివారం పేరేచర్ల గుంటూరు బ్రాంచ్ కెనాల్ వద్ద గుంటూరు–హైదరాబాద్ ప్రధాన రహదారిపై «బైఠాయించి ధర్నాకు దిగారు. గంటకుపైగా ఆందోళన : తాడికొండ, రావెల, మందపాడు, లాం, పొన్నెకల్లుతో పాటు మేడికొండూరు మండలం నుంచి పెద్ద సంఖ్యలో రైతులు ట్రాక్టర్లలో పేరేచర్ల గుంటూరు బ్రాంచ్ కెనాల్ వద్దకు చేరుకొని ప్రధాన రహదారిపై బైఠాయించి గంటకుపైగా ధర్నా నిర్వహించారు. వారబందీ పేరిట ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని, ప్రభుత్వ విధానాల వలన రైతులు తీవ్రస్థాయిలో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వారబందీ వలన పంటలకు నీరు సక్రమంగా అందడం లేదని వారు తెలిపారు. విషయం తెలుసుకొన్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని వైఎస్సార్ సీపీ నాయకులు, రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన రైతులు ససేమిరా అంటూ ఎక్కడివారు అక్కడే బైటాయించారు. ఇరిగేషన్ అధికారులు రావాలని, అప్పుటి వరకు కదిలే ప్రసక్తి లేదని రైతులు మొండికేశారు. విషయం తెలుసుకొన్న ఇరిగేషన్ ఏఈ ఉమాశంకర్ ఘటనా స్థలానికి వచ్చి రైతులతో మాట్లాడి తప్పనిసరిగా దిగువ భూములకు నీరందిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. గంటకు పైగా ధర్నా నిర్వహించడంతో గుంటూరు–హైదరాబాద్ ప్రధాన రహదారిపై రాకపోకలు స్తంభించాయి. పాలడుగు అడ్డరోడ్డు వద్ద రాస్తారోకో ధర్నా విరమించిన కొద్ది సేపటికి పాలడుగు అడ్డరోడ్డు వద్ద కొర్రపాడు, పాలడుగుతో పాటు వివిధ గ్రామాలకు చెందిన వందలామంది రైతులు అక్కడ రాస్తారోకోకు దిగారు. దీంతో పోలీసులు వారికి స్పష్టమైన హామీ ఇప్పించి ఆందోళన విరమింపజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మేడికొండూరు, తాడికొండ మండల కన్వీనర్లు కందుల సిద్ధయ్య, బ్రహ్మారెడ్డి, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి ఆవుల సంజీవరెడ్డి, పేరేచర్ల ఎంపీటీసీలు చీలి నాగేశ్వరరావు, నేతలు ఉడతా శ్రీనివాసరావు, అబ్బాస్, కొరివి కిషోర్, సయ్యద్ సుభాని, రసూల్, పల్లెపోగు బుజ్జి, బుల్లా పంతులు, అల్లు శ్రీనివాసరెడ్డి, అవుతు శ్రీనివాసరెడ్డి, తాళ్ల శ్రీనివాసరెడ్డి, ఆళ్ల హనుమంతరావు, దేవదాసు, దాసరి రాజు, వెంకటస్వామి, వీరారెడ్డి, బాజి తదితరులు పాల్గొన్నారు. పంటలు ఎండిపోతున్నాయి పత్తి, మిరప పంటలు సాగు చేశాను. సాగునీరు ఇప్పటి వరకు సక్రమంగా అందలేదు. ఏం చేయాలో తోచని పరిస్థితి. పత్తికి వర్షం సరిగా లేనందున దిగుబడి ఆశించినంత రాలేదు. ఐదు క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితి దాపురించింది. వారబందీ వలన మరింత ఇబ్బంది పడుతున్నాం. వి.లక్ష్మీనారాయణ, రైతు, రావెల వారబందీ ఎత్తివేయాలి ప్రభుత్వం వారబందీ పెట్టటం ద్వారా రైతులు తీవ్రస్థాయిలో నష్టపోతున్నారు. మిర్చి సాగు చేసే రైతులకు బొబ్బ రు తెగులు వచ్చి కొన్ని చోట్ల పంట పీకేస్తున్నారు. సాగు నీరు సక్రమంగా అందించి వారబందీ ఎత్తివేయక పోతే పెద్ద ఎత్తున ఉద్యమించటానికి వైఎస్సార్ సీపీ సిద్ధంగా ఉంది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని తక్షణమే మార్చుకోవాలి. –ఆవుల సంజీవరెడ్డి, వైఎస్సార్ సీపీ, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి -
కోతల వేళ.. ఓట్ల గోల
సాక్షి, సదాశివనగర్(ఎల్లారెడ్డి): ఏం మల్లయ్య.. హడావుడిగా వెళ్తున్నావ్. ఏంటా తొందరా! అడిగాడు రచ్చబండపై పేపర్ చదువుతున్న కృష్ణయ్య. ‘ఉన్న నాల్గెకరాలు కౌలికిచ్చి కాలు మీద కాలేసుకుని రచ్చబండ మీద కూర్చుని ఎన్నికల రాజకీయాలు చెప్తున్నావ్.. కూలీలు దొరక్క యంత్రాలు సకాలంలో రాక నా తంటాలేమని చెప్పమంటావ్’ అని వేదనతో నిండిన హృదయంతో తన బాధను వెలిబుచ్చాడు మల్లయ్య.‘ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులవి ఇబ్బందులు చూశావా.. కూరగాయలు అమ్ముతున్నారు. చిన్న పిల్లలను ఎత్తుకుని మూతులు తుడుస్తూ గల్లీ గల్లీ తిరుగుతున్నారు చూడు మల్లయ్య. గాళ్లు రాజకీయాల కోసం పాట్లు.. నా పాట్లు తిండిగింజలు పండే ఐదెకరాల పొలం తూరిపోతుందని. గొడ్లకు గడ్డి కావాలని. కూలీల కోసం రాత్రి పగలూ తిరుగుతున్నా కృష్ణయ్యా..’ ‘అదేం మల్లయ్య వాళ్లవి రాజకీయాలని అంతగా తీసేస్తివి. గాళ్లదీ వ్యవసాయామే. కాకపోతే రాజకీయ ఎగసాయం. నువ్వు ఎకరాకు రూ.30 వేలు సొప్పున మొత్తం ఐదెకరాలకు రూ.1.50 లక్షలు ఖర్చు చేస్తవ్. వంద రోజులు కష్టపడతవ్. వాళ్లు నియోజకవర్గానికి మూడు నాల్గు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుండ్రు. మూడు నాల్గు కోట్లేమి సరిపోతయ్ మామ’ అంటూ మధ్యలో అందుకున్నాడు పక్కన ఉన్న కొండలు. నువ్వు ఆగురా అల్లుడు అంటూ మళ్లీ మొదలు పెట్టాడు కృష్ణయ్య. ‘వాళ్లు కోట్లు ఖర్చు చేసి 335 రోజులు పెద్ద పెద్ద నాయకుల చుట్టూ తిరిగిన్ర. వారిని ప్రసన్నం చేసుకుని 30 రోజుల ఎన్నికల పంట వేస్తే అది చేతికందే వరకు ఎన్ని కష్టాలు పడుతున్నారో చూడు. ఎన్నికలు రాగానే దేశం గాని దేశాల్లో జాబులు, యాపారాలు వదిలేసి మరీ ఇక్కడ ఎవసాయం చేయడానికి వచ్చారటా’ అంటూ మనస్సులో మాటను చెప్పేశాడు కృష్ణయ్య. ‘అవును ఒక్కసారి వాళ్ల పంట పండితే చాలు ఇక జీవితంలో మళ్లీ ఏ ఎవుసం చేయాల్సిన పని లేదట.. నిజమేనా’ అని సందేహం వెలిబుచ్చాడు మల్లయ్య. ‘అలా అని అందరూ కాదు. వాళ్లు మాత్రం ఏం చేస్తరు. ఓటరు ఓటును అమ్ముకుంటుంటే అంతేనంటావా.. ఏమోలే మా మేస్త్రీ దొరకడంలే. వాళింటిదాక పోయొస్తా’ అంటూ మల్లయ్య వెళ్లి పోవడంతో కృష్ణయ్య మళ్లీ పేపర్లో తలదూర్చాడు. -
భూములిచ్చి రోడ్డునపడ్డాం..
‘అడిగిన జీతం బియ్యని మిడిమేలుపు దొరనుగొల్చి మిడుకుట కంటెన్, వడిగల యెద్దుల గట్టుక మడిదున్నక బతుకవచ్చు మహిలో సుమతి’ అని శతకారుడు చెప్తాడు. అంటే జీతం ఇయ్యని దొర దగ్గర పనిచేసే కంటే రెండు చురుకైన ఎద్దులను నమ్ముకుని పొలాన్ని దున్నుకుంటే లాభముంటుందని అర్ధం. అదే ఎద్దులను, కాడిని కూడా లాగేసుకునేవాడు పరిపాలకుడైతే పరిస్థితి ఎలా ఉంటుందన్నదానికి ఈ దంపతులే ఉదాహరణ. అదిగో అమరావతి.. ఇదిగో ఉజ్వల భవిష్యత్’ అన్న పాలకుల బురిడీ మాటలు నమ్మి ఆర్థికంగా ఆదుకుంటున్న పొలాన్ని అప్పనంగా అప్పచెప్పిన నేరానికి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు ఆ దంపతులు. ఉద్యోగాలిచ్చామని చెప్పి.. రెండేళ్లు పని చేయించుకుని తీరా ఇప్పుడు మెడపట్టుకుని బయటకు గెంటేస్తే తమ పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నిస్తున్న బాధితుల మాటల్లో నిజం లేకపోలేదు. ఇది అమరావతి కథ. అందులోని ఓ రైతు వ్యథ. కృష్ణాజిల్లా, మంగళగిరి: రాజధాని భూసమీకరణ గ్రామాల్లో ఒకటి కృష్ణాయపాలెం. గ్రామానికి చెందిన రైతు వేమూరి సోమయ్య, వేమూరి మరియమ్మలకు సర్వే నెంబర్ 121,122లలో 23 సెంట్లు భూమి ఉంది. రాజధాని రాకముందు ఆ కొద్దిపాటి భూమిలోనే ఆకుకూరలు సాగు చేసుకుంటూ హాయిగా జీవనం కొనసాగించే వారు. మూడు రకాల ఆకుకూరలు సాగు చేసుకుంటే వారానికి రూ.3 వేల నుంచి 4 వేల ఆదాయం వచ్చేది. ఖాళీ సమయంలో వేరే రైతుల పొలాల్లో కూలీకి వెళ్లి వచ్చినదాంతో జీవనం సాగించే వారు. అయితే రాజధాని రావడంతో ఉన్న 23 సెంట్ల భూమి రాజధాని భూ సమీకరణలో ఇచ్చారు. దీంతో కూరలు సాగు చేసేది లేకపోవడంతో గ్రామంలోని భూములు రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం తీసుకోవడంతో కూలి పని లేకుండా పోయింది. దీంతో కొద్దికాలం వేరే గ్రామాల్లో పనులు చేసుకుని జీవనం గడిపారు. ఇంతలో తాత్కాలిక సచివాలయం ప్రారంభం కావడంతో అక్కడ క్లీనింగ్ విభాగంలో ఇద్దరూ పనికి చేరారు. తాము భూ సమీకరణకు ఇచ్చిన భూమి వివాదంలో ఉందనే కారణంతో కౌలు నిలిపివేసిన అధికా రులు, రాజధాని గ్రామాలలో రైతు కూలీలకు ఇచ్చే రూ.2500 పింఛన్లు సోమయ్య పేరు మీద భూమి మీద ఉందనే సాకుతో నిలిపివేశారు. భూమి సోమయ్య పేరున ఉంటే కౌలు చెల్లించకుండా ఆపి, భూమి ఉందనే ఫించను ఇవ్వకుండా అధికారులు ద్వంద్వవైఖరి అవలంభించడం గమనార్హం. సదరు భూమిలో తనకు వాటా ఉం దంటూ తన సోదరి తనయుడు సీఆర్డీఏ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఒరిజినల్ పట్టా ఆధారంగా గ్రామంలో విచారించి నిర్ణయం తీసుకోవాల్సిన అధికారులు ఆ పని చేయకుండా పక్కన పడేశారు. తాత్కాలిక సచివాలయంలో క్లీనింగ్ విభాగంలో రెండు సంవత్సరాలు నుంచి పని చేస్తుండగా కొద్ది కాలం క్రితం మరియమ్మ అనారోగ్యానికి గురైంది. ఆస్పత్రిలో చికిత్స నిమిత్తమై దంపతులు ఇరువురు పనికి హాజరు కాలేకపోగా సమస్యను సం బంధిత విభాగంలోని వారికి తెలియజేశారు. వారం రోజుల అనంతరం విధులకు హాజరయ్యేం దుకు వచ్చిన సోమయ్య, మరియమ్మలను ‘మిమ్మల్ని పనిలోంచి తీసివేశామని’ సదరు కాంట్రాక్టరు చెప్పడంతో అవాక్కయిన వారు మూడు నెలలుగా తాత్కాలిక సచివాలయం చుట్టూ తిరుగుతూ కనిపించిన ప్రజాప్రతినిధులు, అధికారులను కలసి తమగోడు వెళ్లబోసుకుంటున్నారు. అయినా ఒక్కరూ కనికరించకపోవడంతో తాము ఎలా బతకాలని ఆవేదన చెందుతున్నారు. రాజధాని భూసమీకరణ సమయంలో భూములిచ్చిన రైతులతో ఆయా గ్రామాల్లోని రైతు కూలీలకు, చేతివృత్తిదారులకు పింఛన్లు, ఇంటికో ఉద్యోగం, ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం, ఉచితంగా ఇళ్ల నిర్మాణం అంటూ ఎన్నో హామీలను ఇచ్చి భూములు లాక్కుని ఒక్క హామీని నెరవేర్చలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమతో ఎంతో మంది రైతులు, రైతుకూలీలు ఉద్యోగాలలో చేరారని, వారిని ఎలాంటి కారణం లేకుండా ఇంటికి పంపుతూ మళ్లీ వారి స్థానంలో అధికార పార్టీ నేతలు చెప్పిన వారిని నియమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నదంతా అప్పచెప్పాం... గ్రామంలో ఉన్న 23 సెంట్లు రాజధానికి ఇచ్చాం. రాజధాని రాకముందు ఉన్న కొద్దిపాటి భూమిలోనే ఆకుకూరలు పండించుకుని జీవించే వాళ్లం. భూసమీకరణలో భూమి తీసుకున్న అధికారులు పొలం వివాదంలో ఉందనే నెపంతో కౌలు ఇవ్వడం లేదు. భూమి ఉందనే పేరుతో పింఛను ఇవ్వడం లేదు. ఆడపిల్ల పెళళ్లి చేసి అప్పులు పాలయ్యాం. ఇంటికో ఉద్యోగమని చెప్పారు. డిప్లమా చదివిన అబ్బాయి నిరుద్యోగిగా ఉన్నాడు. ఉన్న ఉద్యోగాలు తీసేయడంతో మా బ్రతుకులు అగమ్యగోచరంగా మారాయి. సొంత ఇళ్లు కూడా లేకపోవడంతో అద్దె కట్టే పరిస్థితి లేదు. వెంటనే ప్రజాప్రతినిధులు, అధికారులు తమకు బ్రతుకుతెరువు కల్పించేలా చర్యలు తీసుకోవాలి. -
ఎటుచూసినా ఎండిపోయిన పంటలు.. బీడుపడిన భూములే!
సాక్షి, అమరావతి: కనుచూపు మేరలో ఎటు చూసినా ఎండిపోయిన పంటలు.. బీడుపడిన భూములే. చిన్న కొండల్లా గడ్డివాములుండాల్సిన రైతుల కళ్లాలన్నీ బోసిపోతున్నాయి. మేతలేక లారీల్లో కబేళాలకు తరలుతున్న పశువులు.. చినుకు జాడలేక, బతుకుతెరువు కనిపించక కంటతడి పెట్టుకుంటున్న రైతన్నలు... రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతోపాటు ఇతర జిల్లాల్లో కనిపిస్తున్న హృదయవిదారక దృశ్యాలివీ. రాష్ట్రంలో కరువు విలయతాండవానికి ప్రత్యక్ష నిదర్శనాలవీ. రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్షం వల్ల పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. ఖరీఫ్ ఆరంభంలో జూన్‌లో కురిసిన వర్షాలను చూసి రైతులు శ్రమకోర్చి విత్తిన పంటలు తదుపరి చినుకు జాడలేక పూర్తిగా ఎండిపోయాయి. రాష్ట్రంలో దాదాపు 80 శాతం మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని అనధికారిక గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ పంట చేతికి రాకుండాపోయింది. పత్తి, కంది, ఉల్లి, సజ్జ, మొక్కజొన్న తదితర పంటలతోపాటు టమోటా, మిరప తదితర కూరగాయల తోటలు మాడిపోయాయి. పంటల సాగుకోసం అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టిన అన్నదాతలు కుంగిపోతున్నారు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక దిక్కులు చూస్తున్నారు. సెప్టెంబరుతో ముగిసిన ఖరీఫ్‌లోనే కాకుండా ప్రస్తుత రబీ సీజన్లోనూ తీవ్ర దుర్బిక్ష పరిస్థితులే కొనసాగుతున్నాయి. కురవాల్సిన దాంట్లో సగం వర్షమే ఖరీఫ్‌లో వరుస కరువుల వల్ల సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోతోంది. అధికారిక గణాంకాల ప్రకారమే.. రాష్ట్రంలో జూన్ 1తో ఆరంభమైన ఖరీఫ్ సీజన్లో ఇప్పటిదాకా(అక్టోబరు 21) కురవాల్సిన కనీస సగటు వర్షం కంటే 27.4 శాతం తక్కువ కురిసింది. వైఎస్సార్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో కనీసం కురవాల్సిన దానిలో సగం వర్షమే కురవడం గమనార్హం. రాష్ట్రంలో 689.4 మిల్లీమీటర్ల కనీస సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 500.8 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. జూన్ 1 నుంచి ఇప్పటివరకూ శ్రీకాకుళం జిల్లా మినహా అన్ని జిల్లాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలోనూ లోటు వర్షపాతమే ఉండేది. అక్టోబర్ రెండోవారంలో తిత్లీ తుపాన్ వల్ల కురిసిన భారీ వర్షంతో అక్కడ 7.3 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ముప్పావు ప్రాంతంలో దుర్భిక్షమే అధికారిక వర్షపాత గణాంకాల ప్రకారం... రాష్ట్రంలో ముప్పావు ప్రాంతంలో తీవ్ర కరువు నెలకొంది. రాష్ట్రంలో మొత్తం 670 మండలాలుండగా, 470 మండలాల్లో కురవాల్సిన కనీస వర్షం కంటే 19 నుంచి 52.9 శాతం తక్కువ వర్షం పడింది. శ్రీకాకుళం మినహా అన్ని జిల్లాల్లో లోటు వర్షపాతమే ఉన్నప్పటికీ.. సాధారణం కంటే 19 శాతం మించి తక్కువ వర్షం కురిస్తేనే ప్రభుత్వం లోటు వర్షపాత మండలాలుగా గుర్తిస్తుంది. అందువల్లే వర్షాభావ మండలాల జాబితాలో 470 మండలాలే ఉన్నాయని, లేకపోతే 600కు పైగా ఉండేవని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో కేవలం 19 మండలాల్లోనే సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. రైతుల కష్టాలపై కనికరం లేని సర్కారు రాష్ట్రంలో 470 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఖరీఫ్ సీజన్లో కేవలం 296 మండలాలనే కరువు ప్రాంతాలుగా ప్రకటించి చేతులు దులుపుకుంది. కరువు వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తోంది. గత ఏడాది రెయిన్గన్లతో ఒక్క సెంటు కూడా పంటలు ఎండిపోకుండా కాపాడామని ప్రచారం చేసుకున్న ప్రభుత్వం ఈ ఏడాది రెయిన్ గన్ల ఊసే ఎత్తడం లేదు. రూ.2,250 కోట్ల పెట్టుబడి మట్టిపాలు ఎకరా పొలంలో వేరుశనగ సాగుకు సగటున రూ.15,000 ఖర్చవుతుంది. సెప్టెంబరుతో ముగిసిన ఖరీఫ్ సీజన్లో 16.50 లక్షల ఎకరాల్లో రైతులు వేరుశనగ పంట వేయగా, 15 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది. దీనివల్ల రైతులు ఈ పంట సాగు కోసం పెట్టిన రూ.2,250 కోట్ల పెట్టుబడి మట్టిపాలైంది. - 2016 ఖరీఫ్‌లో 450 మండలాల్లో వర్షాభావ పరిస్థితి ఉండగా ప్రభుత్వం 301 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. - 2017 ఖరీఫ్ సీజన్లో ఆగస్టు మూడో వారం వరకూ 241 మండలాల్లో వర్షాభావ పరిస్థితి ఉండేది. ఆగస్టు చివరల్లోనూ, సెప్టెంబరులోనూ అల్పపీడనాల వల్ల వర్షం కురవడంతో లోటు వర్షపాత మండలాల సంఖ్య 93కు తగ్గింది. అయితే ప్రభుత్వం ఒక్క మండలాన్ని కూడా కరువు ప్రాంతంగా ప్రకటించలేదు. - 2018లో 470 మండలాల్లో వర్షాభావ పరిస్థితి ఉన్నప్పటికీ ప్రభుత్వం 296 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. - 2016లో 38.62 లక్షల హెక్టార్లలో పంటలు సాగుకాగా, 301 మండలాలను దుర్భిక్ష ప్రాంతాలుగా ప్రకటించారు. ఈ ఏడాది 3 లక్షల హెక్టార్లలో పంటల సాగు తగ్గినా కరువు మండలాలను పెంచాల్సిందిపోయి తగ్గించడం గమనార్హం. రబీలో 12 జిల్లాల్లో లోటు వర్షపాతమే రాష్ట్రంలో ప్రస్తుత రబీ సీజన్లో (అక్టోబరు 1 నుంచి 20వ తేదీ మధ్య) ఏకంగా 65 శాతం సగటు లోటు వర్షపాతం నమోదైంది. కోస్తాంధ్రలో 61 శాతం, రాయలసీమలో 74 శాతం లోటు వర్షపాతం రికార్డయ్యింది. ఖరీఫ్‌లో కంటే రబీలో కరువు తీవ్రత మరింత అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 21 రోజుల్లో కురవాల్సిన దానికంటే 65 శాతం లోటు వర్షపాతం నమోదైంది. కోస్తాలోని తొమ్మిది జిల్లాల్లో సగటున 109.6 మిల్లీమీటర్ల సాధారణ వర్షం కురవాల్సి ఉండగా, 43.2 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. రాయలసీమ జిల్లాల్లో 78 మిల్లీమీటర్ల కనీస వర్షం కురవాల్సి ఉండగా. 20.1 మిల్లీమీటర్లు (74 శాతం లోటు) కురిసింది. శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాన్ వల్ల భారీ వర్షం కురవడంతో సాధారణం కంటే 66 శాతం అధిక వర్షపాతం నమోదైంది. మిగిలిన 12 జిల్లాల్లో కురవాల్సిన దానికంటే చాలా తక్కువ వర్షం కురవడం గమనార్హం. పెట్టిన పెట్టుబడులు కూడా రాలేదు ‘‘వరుసగా నాలుగేళ్లు కరువు వల్ల పంటలు పండక పెట్టుబడులు కూడా చేతికి రాలేదు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో మూడు ఎకరాల్లో వేరుశనగ వేశా. వర్షాల్లేక మొక్కలు గిడసబారి పోయాయి. పెట్టిన పెట్టుబడులు పోయాయి. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి’’ – భాస్కర్‌రెడ్డి, రైతు, వేపలపల్లె, చిత్తూరు జిల్లా పంటల బీమా, పెట్టుబడి రాయితీ ఇవ్వాలి ‘‘వేరుశనగ పంటే కాదు మిగిలిన పంటలూ కరువు వల్ల ఎండిపోయాయి. ఎకరాకు 15 నుంచి 20 బస్తాల వేరుశనగ రావాల్సి ఉండగా ఒకటి రెండు బస్తాలు కూడా రావడం లేదు. ప్రభుత్వం తక్షణమే పంటల బీమా, పెట్టుబడి రాయితీ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి’’ – సరస్వతి, మహిళా రైతు, కురబలకోట, చిత్తూరు జిల్లా చివరకు అప్పులే మిగిలాయి ‘‘నాకున్న రెండు ఎకరాల్లో వేరుశనగ సాగు చేశా. విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చు కలిపి రెండెకరాలకు రూ.30 వేలు పెట్టుబడి పెట్టా. జూన్‌లో కురిసిన వానకు విత్తనాలు వేశా. ఆ తరువాత వానల్లేక పైరంతా ఎండిపోయింది. రూపాయి కూడా ఆదాయం రాలేదు. చివరకు అప్పులే మిగిలాయి’’ – దుగ్గిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, దేవలంపల్లి, లక్కిరెడ్డిపల్లె మండలం, వైఎస్సార్ జిల్లా ఇంతటి కరువు ఎన్నడూ చూడలేదు ‘‘నాలుగేళ్లుగా పశ్చిమ ప్రకాశంలో వర్షాలు లేక పంటలన్నీ ఎండిపోయి తీవ్రంగా నష్టపోయాం. ఈ ఏడాది కూడా వర్షాలు లేకపోవడంతో పత్తి, మిర్చి పంటలు ఎండిపోయాయి. నేను ఎకరా మిర్చి సాగు చేయగా రూ.25 వేలు పెట్టుబడి అయింది. పత్తికి రూ.12 వేల ఖర్చు వచ్చింది. వానల్లేక పంటలు ఎండిపోయాయి. పొట్టకూటి కోసం వలస పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇంతటి కరువు గతంలో ఎన్నడూ చూడలేదు’’ – కె.వెంకటరెడ్డి, రైతు, వేములపేట, మార్కాపురం మండలం, ప్రకాశం జిల్లా కబేళాలకు పశువులు.. రైతన్నల వలసలు దుర్బిక్షం ప్రభావం వ్యవసాయంతోపాటు పశు సంపదపైనా పడింది. పశువులకు మేత, నీరు సమకూర్చే పరిస్థితి కూడా లేక రైతన్నలు వాటిని నిస్సహాయంగా కబేళాలకు అమ్మేస్తున్నారు. కన్నబిడ్డల్లా పెంచుకున్న పాడిపశువులను కోతకు ఇవ్వడం ఇష్టంలేని కొందరు గోశాలలకు తరలిస్తున్నారు. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో నీటి ఎద్దడి భయం గొలుపుతోంది. కందుకూరు, కొండెపి, వై.పాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఈ ఐదు నియోజకవర్గాల్లోని 320 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తేనే ప్రజలు గొంతు తడుపుకోగలుగుతున్నారు. వరుణుడి కరుణ లేక పంటలు పండక, సొంత ఊళ్లల్లో పనులు లేక రైతులు వలసబాట పడుతున్నారు. బెంగళూరు, చెన్నై, సూరత్ నగరాలకు చేరుకుని, కూలీ పనులు చేసుకుంటున్నారు. చాలామంది రైతులు తిరుపతి, బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లో భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్నారు. -
ఖరీ...ఉఫ్
కర్నూలు(అగ్రికల్చర్) : ఖరీఫ్ సీజన్లో ముందస్తుగా వేసిన దాదాపు అన్ని పంటల్లో దిగుబడులు జీరోగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. జిల్లా ముఖ్య ప్రణాళిక విభాగానికి చెందిన సహాయ గణాంక అధికారులు, వ్యవసాయశాఖకు చెందిన ఏఈవోలు, ఎంపీఈవోలు నిర్వహిస్తున్న పంటకోత ప్రయోగాల్లో ఈ విషయం నిర్ధారణ అయింది. కొద్ది రోజులుగా జిల్లాలోని కర్నూలు, ఆదోని రెవెన్యూ డివిజన్లలో ఖరీఫ్ దిగుబడులను అంచనా వేసేందుకు పంటకోత ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. వరికి గ్రామం యూనిట్‌గా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేస్తున్నందున 1,580 పంటకోత ప్రయోగాలు నిర్వహించాల్సి ఉంది. మిగిలిన పంటల్లో 666 పంటకోత ప్రయోగాలు నిర్వహిస్తారు. వరిలో ఇంకా పంటకోత ప్రయోగాలు మొదలు కాలేదు. మిగిలిన పంటల్లో కొద్దిరోజులుగా దిగుబడులను అంచనా వేస్తున్నారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి సాధారణ సాగు 6,35,327 హెక్టార్లు ఉండగా జూన్, జూలై నెలల్లో 3 లక్షల హెక్టార్ల వరకు సాగు చేశారు. తరువాత సాగు.. 6,24,897 హెక్టార్లకు పెరిగింది. వర్షాభావ పరిస్థితులు నెలకొని పంటలు ఎండిపోవడంతో పలు గ్రామాల్లో దున్నేశారు. కొన్ని గ్రామాల్లో ఉన్నా..దిగుబడులు అసలు కనిపించలేదు. వేరుశనగతో పాటు కొర్ర, సజ్జ, మినుము పంటల్లో ఈ పరిస్థితి కనిపించింది. ఆలస్యంగా వేసిన పంటల్లో ఒక మోస్తరు దిగుబడులు.... సెప్టెంబరు నెలలో వివిధ మండలాల్లో భారీగా, మరికొన్ని మండలాల్లో ఒక మోస్తరుగా వర్షాలు కురిశాయి. ఈ వర్షాల ప్రభావంతో ఆలస్యంగా సాగుచేసిన పంటల్లో 20 నుంచి 40 శాతం వరకు దిగుబడులు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇదిలా ఉండగా..ఖరీఫ్‌లో నిండా మునిగిన రైతులు ర బీలో శనగ, జొన్న వంటి పంటలు వేసుకోవడానికి భూములను సిద్ధం చేసుకున్నారు. వర్షాలు లేకపోవడంతో రబీ సాగు ప్రశ్నార్థకం అయింది. రబీలో సాధారణ సాగు 3.50 లక్షల హెక్టార్లు ఉండగా శనగ 2.20 లక్షల హెక్టార్లలో సాగవుతోంది. రూపాయి దిగుబడి లేదు నేను ఐదు ఎకరాల్లో సజ్జ, కంది, ఆముదం వేశాను. ఎకరాకు సగటున రూ.15వేల వరకు పెట్టుబడి పెట్టాను. ఒక్క రూపాయి విలువ పంట కూడా రాలేదు. ఇంతటి దారుణ పరిస్థితులు ఎన్నడూ లేవు. అప్పులు ఎలా చెల్లించాలో అర్థం కావడం లేదు. పశువులకు మేత కూడా లేకుండా పోయింది. దారుణమైన కరువు పరిస్థితులు ఉన్నా.. ప్రభుత్వం నుంచి చేయూత లేకుండా పోయింది. : ముసలన్న, నేరడుచెర్ల గ్రామం, ప్యాపిలి మండలం దిగుబడులే లేవు : జూన్‌లో వేసిన పంటలన్నీ దెబ్బతిన్నాయి. పంట కోత ప్రయోగాలకు ఎంపిక చేసిన భూముల్లో ఇప్పటికే పంటలను దున్నేశారు. దీంతో రైతులు స్టేట్మెంట్ తీసుకొని.. జీరో దిగుబడులు ఉన్నట్లు నమోదు చేస్తున్నాం. ముందస్తుగా వేసిన వేరుశనగ, కొర్ర, ఆముదం తదితర పంటలన్నీ ఎత్తిపోయాయి. పంట కోత ప్రయోగాలపై విశ్లేషణ అమరావతిలో చేస్తారు. – రమణప్ప, డీడీ, జిల్లా ముఖ్య ప్రణాళిక విభాగం జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు.. (మిల్లీమీటర్లలో) నెల సాధారణ వర్షపాతం నమోదైన వర్షపాతం జూన్ 77.2 65.2 జూలై 117.2 52.9 ఆగస్టు 135.0 65.8 సెప్టెంబరు 125.7 98.7 అక్టోబరు 114.5 32.3 -
తుపాను మిగిల్చిన వేదన తనువు చాలించిన మహిళ
వజ్రపుకొత్తూరు రూరల్/టెక్కలి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తిత్లీ తుపాను మిగిల్చిన నష్టాన్ని భరించలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. తమకు జీవనాధారమైన జీడి పంట కళ్ల ముందే నాశనం కావడంతో తట్టుకోలేకపోయింది. పంట సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఉరి వేసుకుని అర్ధాంతరంగా తనువు చాలించింది. హృదయ విదారకమైన ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం చినవంక గ్రామంలో చోటు చేసుకుంది. సైని నారాయణమ్మ(49) భర్త అనందరావు ఏడేళ్ల క్రితం మృతి చెందాడు. ఆమెకు ఇద్దరు కుమారులున్నారు. వారు పొట్ట చేత పట్టుకుని ఉపాధి కోసం విజయవాడకు వలస వెళ్లారు. తుపాన్ వల్ల పాడైపోయిన పంట నష్టాన్ని అధికారులు నమోదు చేస్తుండడంతో నారాయణమ్మ పెద్ద కుమారుడు దిలీప్ కుమార్ స్వగ్రామానికి వచ్చాడు. ఏళ్ల తరబడి తాము సాగు చేసుకుంటున్న రెండున్నర ఎకరాల జీడితోటను చూసేందుకు నారాయణమ్మ, దిలీప్‌కుమార్ కలిసి శుక్రవారం ఉదయం పొలానికి వెళ్లారు. అక్కడ తిత్లీ తుపాన్ ధాటికి విరిగి పడిపోయిన చెట్లను చూసి నారాయణమ్మ తీవ్ర ఆవేదనకు గురైంది. పంట సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలంటూ విలపించింది. కొడుకును తోట వద్దే వదిలేసి ఇంటికి చేరుకుంది. ఇంటి చూరుకు తాడుతో ఉరివేసుకుంది. ఈ ఘటనపై వజ్రపుకొత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉపిరి ఆగిన ఉద్దానం ఉద్దానం... ఉత్తరాంధ్ర కోనసీమ. ఇది ఒకప్పటి మాట. ప్రకృతి పగబట్టింది. తిత్లీ తుపాన్ ఉద్దానంను కబళించింది. పచ్చటి చేలు, తోటలతో అరారుతున్న ప్రాంతాన్ని మరుభూమిగా మార్చేసింది. శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి డివిజన్లోని 11 మండలాలు, పాలకొండ డివిజన్లోని పాతపట్నం, మెలియాపుట్టి మండలాలను తిత్లీ తుపాన్ దారుణంగా దెబ్బతీసింది. జీడితోటలు గంటల వ్యవధిలో నేలకూలాయి. తిత్లీ తుపాన్ వచ్చి పోయి 10 రోజులు గడిచినా ఉద్దానం ప్రాంతంలో పరిస్థితి ఇప్పటికీ అస్తవ్యస్తంగానే ఉంది. ఉద్దానం ప్రాంతంలో దాదాపు 84 వేల ఎకరాల్లో జీడితోటలు ఉన్నాయి. తుపాన్ ధాటికి ఇందులో దాదాపు 74 వేల ఎకరాల్లో తోటలు ధ్వంసమయ్యాయి. కాపు కొచ్చిన జీడితోటలు నేలకూలడంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. జీడిపప్పు పరిశ్రమపై ఆధారపడిన 19,500 మంది కార్మికులు ఉపాధి కోల్పోయి బజారున పడాల్సిన పరిస్థితి దాపురించింది. తిత్లీ తుపానుతో జీడి పరిశ్రమకు రూ.450 కోట్ల మేర నష్టం వాటిల్లింది. పలాస ప్రాంతంలో 220 వరకు జీడి పరిశ్రమలు ఉండగా, వీటిలో 183 పరిశ్రమలు నేలమట్టం అయ్యాయి. ఉద్దానం ప్రాంతానికి మళ్లీ పూర్వవైభవం రావాలంటే కనీసం దశాబ్ద కాలం పడుతుందని పారిశ్రామికవేత్తలు అంటున్నారు. బోరుమంటున్న జీడి రైతులు 30, 40 సెంట్లు మొదలు 5, 10 ఎకరాల వరకు ఉన్న జీడిరైతుల గోస చెప్పనలవి కాకుండా ఉంది. ఉద్దానం ప్రాంతంలో ఏ రైతును కదిపినా గుండెల్ని పిండేసే కథలే. ఈ ప్రాంతానికి తుపాన్లు, అల్పపీడనాలు కొత్త కాకపోయినా ఇప్పుడు జరిగినంత విధ్వంసం గత 60, 70 ఏళ్లలో ఎన్నడూ జరగలేదని వాపోతున్నారు. తమ తోటల్లో తామే కూలీలుగా మారాల్సి వస్తుందని ఊహించలేదని బావురుమంటున్నారు. ఇప్పుడు కూలిపోయిన చెట్లను తీసివేయాలంటే ఎకరానికి రూ.15 వేల వరకు ఖర్చవుతుంది. ప్రభుత్వం ఇచ్చే నామమాత్రపు సాయం కూలిపోయిన చెట్లను తీసివేయడానికి కూడా సరిపోదు. తిరిగి తోటలు వేస్తే మరో ఐదేళ్ల వరకు పంట చేతికి రాదు, ఎలాంటి ఆదాయం ఉండదు. అప్పటిదాకా తామెలా బతకాలని రైతులు ఆవేదనతో కుమిలిపోతున్నారు. పండుగ నాడూ పస్తులే గత సంవత్సరం దసరా పండుగ సందర్భంగా కోలాహలంగా కనిపించిన ఉద్దానం ప్రాంతం ఈసారి వెలవెలబోయింది. పండగ పూటా పస్తులే మిగిలాయి. పోయ్యిలో పిల్లి లేస్తే ఒట్టు. పండక్కి కనిపించే కోలాటాలు లేవు, కర్రసాములు లేవు, చెక్కభజనలు లేవు. అమ్మవారికి పూజలు లేవు. అరక సామాగ్రికి పూజలు లేవు. పశువుల అలంకరణ లేదు. సొంత వాహనాలకు పసుపు కుంకుమలు లేవు. కూలిపోయిన ఇళ్లు, గాలికెగిరిపోయిన ఇంటి పైకప్పులు, మొండి గోడల మధ్య తుపాన్ బాధితులు దిష్టిబొమ్మల్లా మిగిలిపోయారు. స్వచ్ఛంద సంస్థలు వాహనాల్లో తీసుకొచ్చి పెట్టే తిండి కోసం, ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లు వండి పెట్టే భోజనం కోసం బాధితులు బారులు తీరుతుండడం చూపరులను కలచి వేస్తోంది. మీ కాళ్లు పట్టుకుంటా.. మంచినీళ్లు ఇవ్వండి తులశమ్మ అనే మహిళ ఆమనపాడు వద్ద జీడితోటల్లో నివాసం ఉంటోంది. ఐదారు కుటుంబాలు తోటల మధ్యనే ఇళ్లు కట్టుకుని ఉంటున్నాయి. తిత్లీ తుపాన్ దెబ్బకు తోటలు నామరూపాల్లేకుండా పోయాయి, ఇళ్లు నేలమట్టమయ్యాయి. పిల్లాజెల్లలతో రోడ్డు మీదున్న ఓ ఇంట్లో తలదాచుకుంటున్న తులశమ్మ అక్కడ ఏదైనా వాహనం కనిపిస్తే ఆపండి ఆపండి అంటూ అడ్డం తగులుతోంది. అయ్యా మీ కాళ్లు పట్టుకుంటా, మంచినీళ్లుంటే ఇవ్వండయ్యా అంటూ వేడుకుంటోంది. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని కన్నీళ్లు పెట్టుకుంది. -
అన్నదాత ఆగ్రహం
కొత్తూరు: తిత్లీ తుఫాన్ కారణంగా మండలంలోని పత్తి, బొప్పాయి, అరటి, చెరుకు, వరి, కూరగాయ పంటలు తీవ్రంగా నష్టపోయినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ కొత్తూరు, కర్లెమ్మ, మహసింగి, సిరుసువాడ, మాకవరం, కుంటిభద్ర, వసప, పారాపురం నివగాం గ్రామాలతో పాటు పలు గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు మండల కేంద్రం కొత్తూరు నాలు గు రోడ్ల కూడలిలో ఆదివారం ఆందోళన చేపట్టారు. మండలాన్ని తుఫాన్ ప్రభావిత మండలం గా గుర్తించాలని డిమాండ్ చేశారు. వీరి ఆందోళనతో సుమారు నాలుగు గంటల పాటు ట్రాఫిక్ నిలి చిపోయింది. తుఫాన్ కారణంగా ఇన్ని పంటలు పాడైతే ఒక్క అధికారి కూడా చూడడానికి రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు నాలుగు గంటల పాటు వారు నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఈఓ, తహసీల్దార్లు పట్టించుకోవ డం లేదని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే కూడా పట్టించుకోవడం లేదన్నారు. ఆందోళన ఉద్ధృతం కావడంతో స్థానిక ఎస్ఐ రవికుమార్ తన సిబ్బం దితో ఆందోళన చేస్తున్న రైతులతో చర్చించారు. కానీ ఏఓ, తహసీల్దార్ వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు తెగేసి చెప్పారు. ఏఓ వాహిని రైతులతో మాట్లాడే ప్రయత్నం చేసినా వారు నినాదాలు చేస్తూనే ఉన్నారు. అనంతరం తహసీల్దార్ సావిత్రి వచ్చి పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. ప్రభావిత మండలం ప్రకటన తన పరిధిలో లేదని చెప్పారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు పాలకొండ ఆర్డీవో రెడ్డి గున్నయ్య ఆం దోళన వద్దకు చేరుకుని అధికారులు నదీ తీర గ్రామాలకు వెళ్లినందున ఇక్కడి గ్రామాలు చూడలేకపోయారని సర్దిచెప్పారు. కొత్తూరు మండలాన్ని తుఫాన్ ప్రభావిత మండలంగా ప్రకటిస్తున్నట్లు అర్డీవో చెప్పారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. వెంటనే ఆర్డీవో, తహసీల్దార్, ఏఓలు కర్లెమ్మ రెవెన్యూ గ్రూప్ పరిధిలో పాడైన పంటలను పరిశీలించారు. రెడ్డి శాంతి మద్దతు కొత్తూరు మండలాన్ని తుఫాన్ ప్రభావిత మండలంగా గుర్తించి రైతులకు ఆదుకోవాలని కొత్తూరు నాలుగు రోడ్ల కూడలిలో రైతులు చేసిన ధర్నాకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి మద్దతు తెలిపారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. తుఫాన్ వచ్చి నాలుగు రోజు లు గడుస్తున్నా మండలాన్ని అధికారులు పట్టించుకోక పోవడం దారుణమన్నారు. కూలిపోయిన ఇళ్లకు, పలు రకాల తోటలకు నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే కూడా స్పందించకపోవడం అన్యాయమన్నారు. రెడ్డి శాంతితో పాటు పార్టీ మండల అధ్యక్షుడు సారిపల్లి ప్రసాదరావు, పార్టీ యూత్ అధ్యక్షుడు పడాల లక్ష్మణరావు, జిల్లా ప్రదాన కార్యదర్శి రేగేటి కన్నయ్య స్వామి, పార్టీ నేతలు ఎద్దు హరిదాసు, గండివల్స ఆనందరావు, ప్రసాదరావు, తిరుపతిరావు, వి. శ్రీనివాసరావు,రాజులు నాయుడులతో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. -
తిత్లీ తుపాన్ దెబ్బకు సర్వం కకావికలం..