financial results
-
ఐఐపీ, ద్రవ్యోల్బణ డేటాపై దృష్టి
ముంబై: కార్పొరేట్ డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక గణాంకాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు దిశానిర్ధేశం చేస్తాయని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ పరిణామాలు, విదేశీ పెట్టుబడుల తీరుతెన్నులు, బాండ్లపై రాబడులు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. అలాగే డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు కదలికలపై మార్కెట్ వర్గాలు కన్నేయోచ్చంటున్నారు. ఫెడరల్ రిజర్వ్, ఆర్బీఐ బ్యాంకులు సమీప కాలంలో వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలపై నీళ్లు చల్లడంతో గత వారంలో సూచీలు అరశాతం నష్టపోయాయి. ఫైనాన్సియల్, కన్జూమర్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 490 పాయింట్లు, నిఫ్టీ 71 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. ‘‘ అమెరికాతో పాటు బ్రిటన్, భారత్ దేశాల ద్రవ్యోల్బణ డేటా వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించవచ్చు. యూఎస్ పదేళ్ల బాండ్లపై రాబడులు క్రమంగా పెరుగుతున్నాయి. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన మద్దతు 21,800 స్థాయిని కోల్పోయింది. అమ్మకాలు కొనసాగితే దిగువున 21,690 వద్ద తక్షణ మద్దతు ఉంది. ఈ స్థాయిని కోల్పోతే 21,500 పాయింట్ల వద్ద మరో కీలక మద్దతు ఉంది. రికవరీ జరిగి అప్‌ట్రెండ్ మూమెంటమ్ కొనసాగితే ఎగువున 21,800 వద్ద నిరోధం చేధించాల్సి ఉంటుంది’’ అని ఎల్కేపీ సెక్యూరిటీస్ సాంకేతిక నిపుణుడు రూపక్ దే తెలిపారు. నేడు రిటైల్ ద్రవ్యోల్బణం డేటా నేడు (సోమవారం) జనవరి నెలకు సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణ డేటా, డిసెంబర్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు(ఐఐపీ) విడుదల కానున్నాయి. మరుసటి మంగళవారం(ఫిబ్రవరి 13న) అమెరికా సీఐపీ ద్రవ్యోల్బణం వెల్లడి కానుంది. ఫిబ్రవరి 14న(బుధవారం) భారత్‌తో పాటు బ్రిటన్ హోల్‌సేల్ ద్రవ్యోల్బణ డేటా, అమెరికా రిటైల్ అమ్మకాల గురువారం విడుదల కానున్నాయి. వీటితో పాటు పలు దేశాలు ద్రవ్యోల్బణం, ఉపాధి కల్పన, పారిశ్రాకోత్పత్తి డేటాను వెల్లడించనున్నాయి. ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల ఆర్థిక డేటా వెల్లడి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే వీలుంది. చివరి దశకు క్యూ3 ఫలితాలు దేశీయ కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాల ఘట్టం చివరి దశకు చేరింది. మహీంద్రాఅండ్‌మహీంద్రా, ఐషర్ మోటార్స్, హిందూస్థాన్ ఏరోనాటిక్స్, మజగాన్ డాక్ షిప్‌యార్డ్స్, ఫోనిక్స్ మిల్స్‌తో సహా సుమారు 1000కి పైగా కంపెనీలు తమ డిసెంబర్ క్వార్టర్ ఫలితాలు ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అనుపమ్ రసాయన్, కోల్ ఇండియా, సెయిల్, సంర్ధన్ మదర్సన్, హిందాల్కో, ఐఆర్సీటీసీ, భెల్, గ్లాండ్ ఫార్మా, ముత్తూట్ ఫైన్సాన్లూ కంపెనీలు మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించే జాబితాలో ఉన్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. 4 లిస్టింగులు, 2 పబ్లిక్ ఇష్యూలు ఏపీజే సురేంద్ర పార్క్ హోటల్స్ షేర్లు నేడు(ఫిబ్రవరి 12న) లిస్టింగ్ కానున్నాయి. ఎంటెరో హెల్త్‌కేర్ సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూ (మంగళవారం) ముగిస్తుంది. రాశి పెరిఫెరల్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, క్యాపిటల్ బ్యాంక్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్లు (ఫిబ్రవరి 14న) బుధవారం లిస్టింగ్ కానున్నాయి. వి¿ోర్ స్టీల్ ట్యూబ్స్ ఐపీఓ గురువారం ముగియనుంది. డెట్ మార్కెట్లో రూ.15 వేల కోట్లు పెట్టుబడులు డెట్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ఎఫ్ఐఐలు ఫిబ్రవరిలో ఇప్పటి వరకు (ఫిబ్రవరి 09 నాటికి) దేశీయ డెట్ మార్కెట్లో రూ.15,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. భారత ప్రభుత్వ బాండ్లను జేపీ మోర్గాన్ ఇండెక్స్‌లో చేర్చడం పాటు భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైన పనితీరుపై విశ్వాసం ఇందుకు కారణాలని నిపుణులు చెబుతున్నారు. ఈ పెట్టుబడులు జనవరిలో రూ.19వేల కోట్లుగా ఉన్నాయి. ఇక ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. క్రితం నెల(జనవరి)లో రూ.25,743 కోట్లు వెనక్కి తీసుకోగా ఈ ఫిబ్రవరి 09 నాటికి రూ.3,000 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. అమెరికా బాండ్లపై రాబడులు, భారతీయ ఈక్విటీ మార్కెట్ వాల్యూయేషన్లు పెరగడంతో ఈక్విటీ, డెట్ మార్కెట్లలో భిన్న ట్రెండ్ దారితీసింది’’ అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ జోరు
ముంబై: మార్టిగేజ్ దిగ్గజం, మాతృ సంస్థ.. హెచ్డీఎఫ్సీ విలీనం తదుపరి ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర పనితీరు చూపింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్ (క్యూ2)లో రూ. 16,811 కోట్ల నికర లాభం ఆర్జించింది. స్టాండెలోన్ నికర లాభం రూ. 15,976 కోట్లకు చేరింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో విలీన సంస్థ నికర లాభం రూ. 11,162 కోట్లుగా మదింపు వేసింది. ఇక గత క్యూ2 స్టాండెలోన్ లాభం రూ. 10,606 కోట్లుగా లెక్కకట్టింది. మార్జిన్లు డీలా గతంలో 4 శాతానికిపైగా నికర వడ్డీ మార్జిన్లు సాధిస్తూ వచ్చిన నంబర్ వన్ ప్రైవేట్ రంగ బ్యాంక్.. హెచ్డీఎఫ్సీ ప్రస్తుత సమీక్షా కాలంలో 3.4 శాతం మార్జిన్లు ప్రకటించింది. ఇందుకు విలీనం తదుపరి బ్యాలన్స్షీట్లో తక్కువ ఈల్డ్స్ ఆర్జించే సెక్యూర్డ్ ఆస్తులు(రుణాలు) పెరగడం ప్రభావం చూపింది. అంతేకాకుండా విలీనానికి మార్కెట్ రుణ సమీకరణ వ్యయాలు సైతం పెరిగాయి. అయితే నికర వడ్డీ మార్జిన్లు పుంజుకోనున్నట్లు బ్యాంక్ సీఎఫ్‌వో శ్రీనివాసన్ వైద్యనాథన్ పేర్కొన్నారు. అధిక ఈల్డ్స్ అందించే ఆస్తులు పెరగడం, చౌకగా సమీకరించిన డిపాజిట్లతో మార్కెట్ రుణాలను రీప్లేస్ చేసిన తదుపరి మార్జిన్లు మెరుగుపడనున్నట్లు వివరించారు. 30 శాతం అప్ ఈ ఏడాది క్యూ2లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 30 శాతం జంప్‌చేసి రూ. 27,385 కోట్లను తాకింది. గతేడాది క్యూ2లో రూ. 21,021 కోట్ల వడ్డీ ఆదాయాన్ని సాధించాయి. ఇక ఇతర ఆదాయం రూ. 7,596 కోట్ల నుంచి రూ. 10,708 కోట్లకు జంప్ చేసింది. అటు డిపాజిట్లు, ఇటు అడ్వాన్సులు(రుణాలు).. రూ. లక్ష కోట్ల చొప్పున నమోదయ్యాయి. డిపాజిట్లు 5.3 శాతం, అడ్వాన్సులు 4.9 శాతం చొప్పున వృద్ధి చూపాయి. స్థూల మొండిబకాయిలు 1.41 శాతం నుంచి 1.34 శాతానికి తగ్గాయి. మొత్తం ప్రొవిజన్లు రూ. 3,240 కోట్ల నుంచి రూ. 2,903 కోట్లకు వెనకడుగు వేశాయి. ఎడ్యుకేషన్ రుణాలందించే క్రెడిలా విక్రయాన్ని పూర్తి చేయవలసి ఉన్నట్లు వైద్యనాథన్ పేర్కొన్నారు. ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ లిస్టింగ్ ప్రణాళికలేవీ లేవని స్పష్టం చేశారు. నికరంగా 16,000 మంది ఉద్యోగులను తీసుకోవడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 1.98 లక్షలకు చేరినట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు బీఎస్ఈలో 0.5 శాతం క్షీణించి రూ. 1,530 వద్ద ముగిసింది. -
స్థిరీకరణకు అవకాశం
ముంబై: స్టాక్ సూచీలు జీవిత గరిష్ట స్థాయిల వద్ద ట్రేడవుతున్న తరుణంలో.., ఈ వారం కొంత స్థిరీకరణకు లోనయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లను వచ్చే సంకేతాలను అందిపుచ్చుకోవచ్చు. దేశీయంగా కీలక కంపెనీల జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాల విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్ల దృష్టి వాటిపై మళ్లనుంది. అలాగే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొత్త షేర్లు నేడు(సోమవారం) ఎక్చ్సేంజీల్లో లిస్ట్ కానున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గురువారం(జూన్ 20న) ప్రారంభం కానున్నాయి. రుతు పవనాల పురోగతి వార్తలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, డాలర్ మారకంలో రూపాయి, క్రూడాయిల్ కదలికలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే ఇతర అంశాలుగా ఉన్నాయి. ‘‘గరిష్ట స్థాయిల్లో స్వల్పకాలిక కన్సాలిడేషన్‌కు ఆస్కారం ఉంది. జూన్ క్వార్టర్ ఆర్థిక ఫలితాల విడుదల నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌పై దృష్టి సారించడం శ్రేయస్కరం. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వహిస్తూ కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్లు చేయోచ్చు. సాంకేతికంగా నిఫ్టీకి 19650 వద్ద నిరోధం ఉంది. ఈ స్థాయిని చేధిస్తే 19770 వద్ద మరో కీలక నిరోధం ఎదురుకానుంది. లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే దిగువ స్థాయిలో 19300 వద్ద తక్షణ మద్దతును కలిగి ఉంది’’ అని మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అరవిందర్ సింగ్ నందా తెలిపారు. కంపెనీల తొలి క్వార్టర్ ఫలితాలపై ఆశాశహ అంచనాలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్లు, టోకు ధరలు దిగిరావడం, మార్కెట్లో అస్థిరత తగ్గడం తదితర సానుకూలాంశాలతో వరుసగా మూడోవారమూ సూచీలు లాభాలను ఆర్జించగలిగాయి. ఐటీ, మెటల్, రియల్టీ, ఫార్మా షేర్లు రాణించడంతో గత వారం మొత్తంగా సెన్సెక్స్ 781 పాయింట్లు, నిఫ్టీ 233 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. అలాగే వారాంతాన సెన్సెక్స్ 66,160 వద్ద, నిఫ్టీ 19,595 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరుపై దృష్టి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తొలి త్రైమాసిక ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. అలాగే విలీన ప్రక్రియ పూర్తైన తర్వాత అర్హులైన హెచ్డీఎఫ్సీ వాటాదారులకు 311 కోట్లకు పైగా ఈక్విటీ షేర్లను జారీ చేసింది. తద్వారా హెచ్డీఎఫ్సీ షేర్హోల్డర్లు ఇప్పటికే వారు కలిగి ఉన్న షేర్లకు ప్రతి 25 షేర్లకు బదులుగా 42 హెచ్డీఎఫ్సీ షేర్లు అందనున్నాయి. కొత్త షేర్లు నేడు(సోమవారం) ఎక్చ్సేంజీల్లో లిస్ట్ కానున్నాయి. తాజాగా లిస్ట్ అవుతున్న షేర్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత ఈక్విటీ షేర్లతో సమానంగా ఉంటాయని వెల్లడైంది. క్యూ1 ఆర్థిక ఫలితాలపై కన్ను కీలక కంపెనీలు తమ జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ఈ వారంలో ప్రకటించనున్నాయి. ఈ నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు ఆస్కారం ఉంది. ఇండెక్సుల్లోని హెచ్డీఎఫ్ఎసీ బ్యాంక్, ఎల్టీఐమైండ్టీ కంపెనీల క్యూ1 ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ బుధవారం.., ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలివర్ గురువారం.., హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, ఆ్రల్టాటెక్ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీలు శుక్రవారం తమ జూన్ క్వార్టర్ ఫలితాలను ప్రకటించనున్నాయి. అలాగే ఐసీఐసీఐ లాంబార్డ్, ఐసీసీఐ ప్రుడెన్షియల్, ఎల్అండ్టీ టెక్నాలజీ, టాటా కమ్యూనికేషన్స్, యూనిటెడ్ స్పిరిట్, కెన్‌ఫిన్ హోమ్స్, ఎంఫసిస్, టాటా ఎలాక్సీ, క్రిసిల్ కంపెనీలూ ఫలితాలను విడుదల చేసే జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశీతంగా పరిశీలించే వీలుంది. ప్రపంచ పరిణామాలు చైనా కేంద్ర బ్యాంకు సోమవారం కీలక వడ్డీరేట్లపై నిర్ణయాన్ని వెల్లడించనుంది. అలాగే ఆ దేశ రెండో క్వార్టర్ జీడీపీ డేటా వెల్లడి కానుంది. అమెరికా జూన్ రిటైల్ అమ్మకాలు, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు మంగవారం విడుదల అవుతాయి. బ్రిటన్, యూరోపియన్ యూనియన్ సీపీఐ ద్రవ్యోల్బణ డేటా బుధవారం, మరుసటి రోజు గురువారం కరెంట్ ఖాతా గణాంకాలు.., జపాన్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ వెల్లడి కానున్నాయి. జపాన్ ద్రవ్యోల్బణ గణాంకాలు శుక్రవారం విడుదల అవుతుంది. ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులను వెల్లడించే స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. కొనసాగిన ఎఫ్ఐఐల కొనుగోళ్లు దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ప్రవాహం జూలై ప్రథమార్థంలో కొనసాగింది. ఈ నెల తొలి భాగంలో రూ.30,600 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. దేశీయ కార్పొరేట్ ఆదాయాలు, స్థూల ఆర్థిక డేటా మెరుగ్గా నమోదవడం ఇందుకు కారణమయ్యాయి. కాగా మే, జూన్ నెలల్లో వరుసగా రూ.43,838 కోట్లు, రూ.47,148 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ‘‘అంతర్జాతీయంగా డాలర్ క్షీణతతో ఎఫ్ఐఐల కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. బెంచ్‌మార్క్ సూచీలు ప్రస్తుతం జీవితకాల గరిష్టం వద్ద ట్రేడ్ అవుతున్నాయి. చైనాతో పోలిస్తే భారత ఈక్విటీల వ్యాల్యూయేషన్లు అధికంగా ఉన్నాయి. కావున చైనాలో అమ్మకం, భారత్‌లో కొనుగోలు విధానం విదేశీ ఇన్వెస్టర్లు ఎక్కువకాలం కొనసాగించకపోవచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహకర్త వీకే విజయకుమార్ తెలిపారు. -
సీఏ మిస్‌కావడంతో ఫలితాలకు బ్రేక్
ముంబై: చార్టెడ్ అకౌంటెంట్ కనిపించకుండాపోవడంతో ఆర్థిక ఫలితాలను ప్రకటించలేకపోతున్నట్లు ఆఫీస్ ఫర్నీచర్ తయారీ కంపెనీ మైల్స్టోన్ ఫర్నీచర్ తాజాగా బీఎస్ఈకి తెలియజేసింది. సీఏ ఫోన్‌కాల్‌లో సైతం అందుబాటులోకి రావడంలేదని పేర్కొంది. మే 25న నిర్వహించిన సమావేశంలో కంపెనీ సీఏ భూపేంద్ర గాంధీ కనిపించకుండాపోవడం, ఫోన్ కాల్స్‌కు సమాధానం ఇవ్వకపోవడంతో ఆర్థిక ఫలితాలు పెండింగ్‌లో పడినట్లు చైర్మన్ వెల్లడించినట్లు మైల్స్టోన్ బీఎస్ఈకి తెలియజేసింది. అయితే ఈ సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారాన్ని కనుక్కోనున్నట్లు తెలియజేసింది. తద్వారా సాధ్యమైనంత త్వరగా బీఎస్ఈ, ఆర్వోసీ నిబంధనలు పాటించనున్నట్లు పేర్కొంది. కంపెనీ 2018లో బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్ ద్వారా లిస్టయ్యింది. కాగా.. 2022 సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల కాలానికి కంపెనీ ఎలాంటి ఆదాయం ప్రకటించకపోగా.. రూ. 2.6 కోట్ల నికర నష్టం నమోదైంది. -
చమురు ధరలు తగ్గడం ఓఎంసీలకు అనుకూలం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) మొత్తం మీద బలహీన ఆర్థిక ఫలితాలనే నమోదు చేస్తాయని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినప్పటికీ.. విక్రయ ధరలను చాలా కాలంగా నిలిపి ఉంచడం ఇందుకు కారణంగా పేర్కొంది. ఆర్థిక మందగమనం ఆందోళనలతో చమురు ధరలు అంతర్జాతీయంగా తగ్గడం వల్ల మూడు ప్రభుత్వరంగ సంస్థలైన ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో తిరిగి లాభాల బాట పడతాయని అంచనా వేసింది. ‘‘2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో నష్టాలు వచ్చినందున, పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఫలితాలు బలహీనంగానే ఉంటాయి. చమురు విక్రయ ధరలపై పరిమితి పెట్టినందున మొదటి ఆరు నెలల్లో, అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అవి రేట్లను సవరించలేదు’’అని మూడీస్ పేర్కొంది. ఈ మూడు కంపెనీలు 2022 ఏప్రిల్ 6 నుంచి చమురు విక్రయ ధరలను సవరించకుండా, అవే ధరలను కొనసాగిస్తుండడం గమనార్హం. 2022 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా అవి ధరలను సవరించకపోవడం వల్ల, మొదటి ఆరు నెలలకు రూ.21,000 నష్టాలను ప్రకటించాయి. గోరుచుట్టుపై రోకటిపోటులా.. డాలర్ మారకంలో రూపాయి విలువ క్షీణించడం వీటి నష్టాలను మరింత పెంచిందని చెప్పుకోవాలి. ఇవి ముడి చమురును డాలర్ మారకంలోనే కొనుగోలు చేస్తుంటాయని మూడీస్ తెలిపింది. లాభాలు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలతో పోలిస్తే చమురు ధరలు తగ్గినందున, కొనుగోళ్ల వ్య యాలు తగ్గి లాభదాయక వచ్చే కొన్ని నెలల్లో మెరుగుపడుతుందని మూడీస్ అంచనా వేసింది. రష్యా నుంచి చౌకగా ముడి చమురు కొనుగోలు చేయడం ఈ మూడు ప్రభుత్వరంగ సంస్థలకు కలిసొస్తుందని పేర్కొంది. బ్రెంట్ క్రూడ్ కంటే రష్యా చమురు త క్కువ ధరకు వస్తుండడాన్ని ప్రస్తావించింది. అయినప్పటికీ వచ్చే 12నెలల్లో చమురు ధరలు అస్థిరతల మధ్యే చలించే అవకాశం ఉంటుందని అంచనా వేసింది. ఉక్రెయిన్‌పై యుద్ధం తీవ్రతరమైనా లేక చైనా ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నా అది అంతర్జాతీయంగా ధరల పెరుగుదలకు దారితీస్తుందని, అదే జరిగితే ఆయిల్ కంపెనీల లాభాలు పరిమితం కావొచ్చని పేర్కొంది. రుణ పరిస్థితుల్లో మెరుగు.. ‘‘లాభాలు పెరిగితే రుణ భారం తగ్గుతుంది. మూ లధన అవసరాలకు నిధుల వెసులుబాటు లభిస్తుంది. 2022 మార్చి నుంచి సెప్టెంబర్ మధ్య నష్టాలను అదనపు రుణాలు తీసుకుని ఇవి సర్దుబాటు చేసుకున్నాయి. దీంతో వాటి రుణ భారం పెరిగింది’’అని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ పే ర్కొంది. పెరిగే ధరలకు అనుగుణంగా మూలధన అవసరాలు కూడా పెరుగుతాయని, ఫలితంగా కంపెనీల రుణ కొలమానాలు బలహీనంగా ఉంటా యని పేర్కొంది. నియంత్రణపరమైన అనిశ్చితి కూ డా వాటి రుణ నాణ్యతను ప్రభావితం చేస్తుందని తెలిపింది. ‘‘భారత్‌లో చమురు ధరల పరంగా స్ప ష్టత లోపించింది. రిఫైనింగ్, మార్కెటింగ్ కంపెనీలకు ఇది క్రెడిట్ నెగెటివ్. చమురు ధరలపై నియంత్రణలతో కంపెనీల నష్టాలు కొనసాగుతా యి. వాటిని ప్రభుత్వం సకాలంలో సర్దుబాటు చే యకపోతే వాటి క్రెడిట్ నాణ్యత కూడా బలహీనపడుతుంది’’ ఈని మూడిస్ నివేదిక హెచ్చరించింది. కాకపోతే ప్రభుత్వం నుంచి మద్దతు దృష్ట్యా ఈ కంపెనీల తుది రేటింగ్‌ల్లో ఏ మాత్రం మార్పు ఉండదని స్పష్టం చేసింది. రేట్లపై స్వేచ్ఛ లభిస్తేనే.. చమురు రిఫైనింగ్, మార్కెటింగ్ కంపెనీలు అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ విక్రయ రేట్లను సవరించుకునే స్వేచ్ఛ కల్పించినప్పుడే వాటి మార్జిన్లు తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటాయని మూడీస్ తెలిపింది. అయితే ఇది 2024 సాధారణ ఎన్నికల తర్వాతే సాధ్యపడుతుందని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలతో పోలిస్తే ఇటీవల అంతర్జాతీయంగా రేట్లు తగ్గడం కంపెనీలకు సానుకూలిస్తుందని పేర్కొంది. ఇప్పుడున్న స్థాయిలోనే కొనసాగతే వచ్చే కొన్ని నెలల్లో కంపెనీల లాభదాయకత పెరుగుతుందని మూడీస్ తెలిపింది. ‘‘2022–23లో సెప్టెంబర్ 30 నాటికి సగటున చమురు ధర బ్యారెల్ 105 డాలర్లుగా ఉంది. అక్కడి నుంచి డిసెంబర్ 31 నాటికి 16 శాతం తగ్గి బ్యారెల్ 89 డాలర్లకు దిగొచ్చింది’’ అని పేర్కొంది. -
కొత్త రికార్డుల దిశగా సాగొచ్చు
ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందితే.., ఈ వారం దేశీయ స్టాక్ సూచీలు తాజా జీవితకాల గరిష్టానికి చేరే వీలుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరించే అవకాశం లేకపోలేదని అంటున్నారు. దేశీయంగా ద్రవ్యోల్బణ డేటా, అమెరికా మధ్యంతర ఎన్నికలు, విదేశీ పెట్టుబడులు కీలకమని చెబుతున్నారు. చివరి దశకు చేరుకున్న కార్పొరేట్ ఆర్థిక ఫలితాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. ట్రేడింగ్ నాలుగురోజులే జరిగిన గత వారంలో సెన్సెక్స్ 1097 పాయింట్లు, నిఫ్టీ 233 పాయింట్లు చొప్పున ర్యాలీ చేశాయి. అమెరికా అక్టోబర్ రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల కన్నా తక్కువగా నమోదువడంతో ఇకపై ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే ఆశలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి. ‘‘గతేడాది(2021) అక్టోబర్ 19న సెన్సెక్స్ 62,245 వద్ద, నిఫ్టీ 18,604 వద్ద జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. ఈ వారాంతపు రోజున సెన్సెక్స్ జీవితకాల గరిష్టం ముగింపు(61,795) వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో ఏడాది గరిష్టాన్ని(18,362) తాకింది. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందితే సూచీలు జీవితకాల గరిష్టాన్ని అందుకోవచ్చు. ట్రేడర్లు మాత్రం అప్రమత్తంగా ఉండటం మంచిది. నిఫ్టీ 18,300 స్థాయిని నిలుపుకోలిగితే 18,600 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరిగితే డౌన్‌ట్రెండ్‌లో 18,000 –17,800, శ్రేణిలో తక్షణ మద్దతు లభించవచ్చు’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ అన్మోల్ దాస్ తెలిపారు. ► ద్రవ్యోల్బణ డేటా దృష్టి అమెరికా ద్రవ్యోల్బణ డేటా వెల్లడి తర్వాత మార్కెట్ వర్గాలు ఇప్పుడు దేశీయ ద్రవ్యోల్బణ గణాంకాలపై దృష్టి సారించాయి. డిసెంబర్ ఆర్బీఐ ద్రవ్య విధాన వైఖరికి మార్గదర్శకమైన సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు నేడు విడుదల కానున్నాయి. సెప్టెంబర్ ద్రవ్యోల్బణం 7.4%గా నమోదైంది. ఈ అక్టోబర్‌లో ఏడుశాతంలోపే ఉండొచ్చని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు. . ► కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు దేశీయ కార్పొరేట్ ఆర్థిక ఫలితాల అంకం చివరి దశకు చేరింది. ఈ వారంలో సుమారు 1,400కి పైగా కంపెనీలు తమ క్యూ2తో గణాంకాలను ప్రకటించనున్నాయి. ఓఎన్జీసీ, గ్రాసీం ఇండస్ట్రీస్ ఆర్థిక ఫలితాల ప్రకటన(నేడు)తో నిఫ్టీ 50 ఇండెక్స్‌లో లిస్టయిన కంపెనీ త్రైమాసిక ఫలితాల వెల్లడి పూర్తి అవుతుంది. వీటితో పాటు బయోకాన్, భారత్ ఫోర్జ్, అపోలో టైర్స్, ఐఆర్సీటీసీ, స్పైస్‌జెట్‌లు, ఆర్తి ఇండస్ట్రీస్, అబాట్ ఇండియా, బాలకృష్ణ ఇండస్ట్రీస్, హుడ్కో, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, జ్యోతి ల్యాబ్స్, లక్స్ ఇండస్ట్రీస్ కంపెనీలు ఫలితాలు వెల్లడించే జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశీతంగా పరిశీలించే వీలుంది. ► ప్రపంచ పరిణామాలు అమెరికా అధ్యక్షుడి రెండేళ్ల పాలనకు రెఫరెండంగా భావించిన మధ్యంతర ఎన్నికల ఫలితాలను ప్రపంచ మార్కెట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. నేడు యూరో పారిశ్రామికోత్పత్తి డేటా, బ్రిటన్ నిరుద్యోగ రేటు మంగళవారం విడుదల అవుతాయి. అదే రో జున యూరోజోన్, జపాన్ జీడీపీ అంచనాలు వెల్లడికానున్నాయి. ఎల్లుండి(బుధవారం)బ్రిటన్ అక్టోబర్ ద్రవ్యోల్బణ డేటా విడుదల అవుతుంది. ఈ మరుసటి రోజు యూరో జోన్ ద్రవ్యోల్బణం, జపాన్ వా ణిజ్య లోటు గణాంకాలు విడుదల అవుతాయి. ఆర్థి క స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల గణాంకాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. ఎఫ్ఐఐలు వైఖరి ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధానపరమైన ఆందోళనలు తగ్గుముఖంపట్టడంతో దేశీయ మార్కెట్లోకి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు క్రమంగా పెరుగుతున్నాయి. గతవారంలో రూ.6,300 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. ఎఫ్ఐఐలు తమ బుల్లిష్ ధోరణిని కొనసాగిస్తే సూచీలు సులభంగా జీవితకాల గరిష్టాన్ని చేరుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. దిద్దుబాటు సమయంలో కొనుగోళ్లు చేపడుతూ మార్కెట్‌కు అండగా నిలిచే సంస్థాగత ఇన్వెస్టర్లు ఇటీవల అమ్మకాలకు పాల్పడుతున్నారు. ఈ నవంబర్‌లో నికరంగా రూ.5600 కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. -
పరిమిత శ్రేణిలోనే కదలికలు..
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారంలో సానుకూల వైఖరి ప్రదర్శిస్తూ, పరిమిత శ్రేణికి లోబడి కదలాడొచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దేశీయంగా కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు, ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ముగింపు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్ మారకంలో రూపాయి విలువ తదితర అంశాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. ప్రపంచ పరిణామాలను పరిశీలిస్తే.. యూఎస్, ఐరోపా మార్కెట్లు తీరుతెన్నులు, డాలర్ ఇండెక్స్, అమెరికా బాండ్లపై రాబడులు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలపై మార్కెట్ వర్గాలు దృష్టి పెట్టొచ్చంటున్నారు. దీపావళి సందర్భంగా స్టాక్ ఎక్సే్చంజీలు నేడు(సోమవారం) గంట పాటు ప్రత్యేక ‘‘మూరత్ ట్రేడింగ్’’ నిర్వహించనున్నాయి. సాయంత్రం 6.15 గంటలకు మొదలై 7.15 గంటలకు ట్రేడింగ్ ముగియనుంది. బలిప్రతిపద సందర్భంగా బుధవారం మార్కెట్లకు సెలవు. అయితే కమోడిటీ, ఫారెక్స్ మార్కెట్లు్ల ఉదయం సెషన్లో మాత్రమే సెలవును పాటిస్తాయి. సాయంత్రం సెషన్లో ట్రేడింగ్ జరుగుతుంది. దేశీయ కార్పొరేట్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాల ప్రకటనతో గతవారం ప్రధాన సూచీలు రెండున్నర శాతం ఎగిశాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 1387 పాయింట్లు, నిఫ్టీ 391 పాయింట్లు లాభపడ్డాయి. ‘‘ప్రస్తుతం మార్కెట్లో సానుకూల సెంటిమెంట్ నెలకొని ఉంది. ఈ వారంలో మూరత్ ట్రేడింగ్‌తో పాటు ఒకరోజు సెలవు కారణంగా ఇన్వెస్టర్లు భారీ పెట్టుబడులకు ఆసక్తి చూపకపోవచ్చు. కావున కీలక సూచీలు పరిమిత శ్రేణికి లోబడి కదలాడొచ్చు. అలాగే నెలవారీ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో ఒడిదుడుకులు సైతం చోటు చేసుకోవచ్చు. నిఫ్టీ 17900–18000 నిరోధ శ్రేణిని చేధిస్తే తదుపరి ర్యాలీకి అవకాశం ఉంటుంది. గరిష్టస్థాయిలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే 17400 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించొచ్చు’’ అని స్వస్తిక్ ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. క్యూ2 ఆర్థిక ఫలితాల ప్రభావం ముందుగా నేడు మార్కెట్ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ త్రైమాసిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక వారంలో సుమారు 100కి పైగా కంపెనీలు తమ క్యూ2తో గణాంకాలను ప్రకటించనున్నాయి. డాక్టర్ రెడ్డీస్, మారుతీ సుజుకీ, ఐఓసీ, టాటా పవర్, వేదాంత, ఎన్టీపీసీ, డాలర్ ఇండియా, గ్లాండ్ ఫార్మా, ఎస్బీఐ కార్డ్స్, టాటా కెమికల్స్ కంపెనీ ఫలితాలు వెల్లడించే జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశీతంగా పరిశీలించే వీలుంది. ప్రపంచ పరిణామాలు ఉక్రెయిన్–రష్యా యుద్ధం, బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా పరిణామాలను ఈక్విటీ మార్కెట్ వర్గా లు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. చైనా క్యూ3 జీడీపీ, పారిశ్రామికోత్పత్తితో పాటు సెప్టెంబర్ నిరుద్యోగ రేటు, వాణిజ్య లోటు గణాంకాలను నేడు విడుదల చేయనుంది. అమెరికా సెప్టెంబర్ క్వార్టర్ ఆర్థిక వృద్ధి అంచనాలను గురువారం ప్రకటించనుంది. యూరప్ సెంట్రల్ బ్యాంక్ గురువారం, బ్యాంక్ ఆఫ్ జపాన్ శుక్రవారం వడ్డీరేట్లను వెల్లడించనుంది. ఇటీవల దిగివచ్చిన క్రూడాయిల్ ధరలు రికవరీ దిశగా సాగుతున్నాయి. భారత్ అధికంగా ఎగుమతి చేసుకునే బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 90డాల ర్లకు పైకి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ఈ గురువారం(అక్టోబర్ 27న) నిఫ్టీ సూచీకి చెందిన ఆగస్టు సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో నిఫ్టీ 17,400–18,000 శ్రేణిలో కదలాడొచ్చని ఆప్షన్ డేటా సూచిస్తోంది. మారిన విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి భారత ఈక్విటీ మార్కెట్ల పట్ల విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి మారింది. గడిచిన మూడు నెలలుగా నికర కొనుగోలుదారులుగా నిలిచిన ఎఫ్ఐఐలు అనూహ్యంగా విక్రయాలకు పాల్పడుతున్నారు. ఈ అక్టోబర్ 21 నాటికి రూ.6వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అంతర్జాతీయంగా డాలర్ బలపడటం ఇందుకు కారణమని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాది(2022)లో ఇప్పటి వరుకు రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ‘భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ పెరుగుదల, బాండ్లపై రాబడులు పెరగొచ్చని అంచనాలతో రానున్న రోజుల్లో ఎఫ్ఐఐల భారత మార్కెట్లపై బేరీష్ వైఖరిని ప్రదర్శించవచ్చు’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. -
Stock Market: కరెక్షన్ కొనసాగొచ్చు
ముంబై: స్టాక్ మార్కెట్లో ఈ వారం కూడా కరెక్షన్ కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్ డెరివేటివ్‌ల గడువు(గురువారం) ముగింపుతో పాటు ఈ వారంలో సుమారు 700కి పైగా కంపెనీలు తమ రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు మొగ్గుచూపవచ్చని వారు అంచనా వేస్తున్నారు. సూచీల గమనాన్ని ప్రపంచ పరిణామాలు నిర్ధేశిస్తాయని అభిప్రాయపడుతున్నారు. అలాగే కరోనా కేసుల నమోదు, వ్యాక్సినేషన్ ప్రక్రియ, విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికలు తదితర అంశాలూ ట్రేడింగ్ పై ప్రభావాన్ని చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘‘బ్యాంక్ నిఫ్టీ తొలిసారి 40,000 స్థాయిని అధిగమించింది. అనేక బ్యాంకులు ఈ వారంలో రెండో క్వార్టర్ ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్న నేపథ్యంలో బ్యాంకింగ్ రంగ షేర్లు అధిక వ్యాల్యూమ్స్‌తో ట్రేడ్ అవ్వొచ్చు. ఎఫ్అండ్ఓ ముగింపు, కార్పొరేట్ల ఆర్థిక ఫలితాల విడుదల నేపథ్యంలో కరెక్షన్(దిద్దుబాటు) కొనసాగేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మార్కెట్ పతనం కొనసాగితే నిఫ్టీకి దిగువ స్థాయిలో 18,050 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు ఉంది. ఎగువస్థాయిలో 18,300–18,350 శ్రేణిలో వద్ద బలమైన నిరోధం ఉంది’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సరీ్వసెస్ హెడ్ సిద్ధార్థ ఖేమా తెలిపారు. వరుస నాలుగు రోజుల పతనంతో గతవారం సెన్సెక్స్ 483 పాయింట్లు నిఫ్టీ 224 పాయింట్లు నష్టపోయాయి. క్యూ2 ఫలితాల జాబితా... సూచీలు ముందుగా గత శుక్రవారం విడుదలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, శనివారం వెల్లడైన ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలపై స్పందించాల్సి ఉంటుంది. ఇక ఈ వారంలో నిఫ్టీ–50 ఇండెక్స్‌లోని షేర్లకు చెందిన 20 కంపెనీలతో సహా సుమారు 700కు పైగా కార్పొరేట్లు తమ రెండో త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇందులో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వీసెస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, ఎల్అండ్టీ, యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకీ, టైటాన్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ తదితర కంపెనీలున్నాయి. ఈ వారంలో రెండు ఐపీఓలు... బ్యూటీ ఉత్పత్తుల సంస్థ నైకాతో పాటు ఫినో పేమెంట్స్ బ్యాంక్స్ ఈ వారం పబ్లిక్ ఇష్యూల(ఐపీఓ) ద్వారా మార్కెట్లోకి రానున్నాయి. ఫినోటెక్ పేమెంట్స్ బ్యాంక్ ఐపీఓ ఈ నెల 29న(శుక్రవారం) ప్రారంభమై.., నవంబర్ 2న ముగుస్తుంది. ధర శ్రేణిని కంపెనీ ఈ వారంలో ప్రకటించనుంది. ఎఫ్ఐఐల ట్రెండ్ రివర్స్... గత రెండు నెలల్లో కనిపించిన పెట్టుబడుల ట్రెండ్‌కు భిన్నంగా విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) దేశీయ ఈక్విటీల అమ్మకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం నికరంగా అక్టోబర్ నెలలో ఇప్పటివరకూ(అక్టోబర్ 24)ఎఫ్‌పీఐలు రూ. 3,825 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇందులో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.2,331 కోట్ల షేర్లను అమ్మగా., డెట్ మార్కెట్లో రూ.1,494 కోట్లు పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఐటీ షేర్ల పట్ల బేరిష్ వైఖరి కలిగి ఉన్నారు. బ్యాంకింగ్ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఐటీ కంపెనీలు రెండో క్వార్టర్లో మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించినప్పటికీ.., ఈ ఏడాది తొలి భాగంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.5,406 కోట్ల ఐటీ షేర్లను విక్రయించారు. సాధ్యమైనంత తొందర్లో ట్యాపరింగ్ చర్యలను చేపట్టడంతో పాటు కీలక వడ్డీరేట్లను పెంచుతామని ఫెడ్ వ్యాఖ్యలతో విదేశీ ఇన్వెస్టర్లు వర్థమాన దేశాల మార్కెట్లలో లాభాల స్వీకరణకు పాల్పడుతున్నారని జియోజిత్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ ప్రధాన వ్యూహకర్త వీకే విజయ్ కుమార్ తెలిపారు. 28 నుంచి నైకా ఐపీవో షేరు ధర శ్రేణి రూ. 1,085–1,125 సౌందర్య సంరక్షణ ఉత్పత్తుల సంస్థ నైకా మాతృసంస్థ ఎఫ్ఎస్ఎన్ ఈ–కామర్స్ వెంచర్స్ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ అక్టోబర్ 28న ప్రారంభమై నవంబర్ 1న ముగియనుంది. దీనికి సంబంధించి షేరు ధర శ్రేణి రూ. 1,085–1,125గా ఉంటుందని సంస్థ వెల్లడించింది. ఐపీవో ద్వారా కంపెనీ రూ. 5,352 కోట్లు సమీకరించనుంది. ఇందులో భాగంగా తాజాగా రూ. 630 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయనుండగా, ప్రమోటర్లు.. ప్రస్తుత షేర్హోల్డర్లు 4,19,72,660 షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయించనున్నారు. కార్యకలాపాల విస్తరణకు, కొత్త రిటైల్ స్టోర్లు.. గిడ్డంగుల ఏర్పాటు కోసం ఐపీవో నిధులను కంపెనీ వినియోగించనుంది. అలాగే కొంత రుణాన్ని తీర్చడం ద్వారా వడ్డీ వ్యయాలను తగ్గించుకుని, లాభదాయకతను మెరుగుపర్చుకోనుంది. -
కార్పొరేట్ల క్యూ2 ఫలితాలు మార్కెట్‌కు కీలకం
ముంబై: కార్పొరేట్ల రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఈ వారం స్టాక్ మార్కెట్ దిశా నిర్దేశం చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అలాగే ద్రవ్యోల్బణ లెక్కలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయవచ్చని చెబుతున్నారు. వీటితో పాటు ప్రపంచ పరిణామాలు, దేశీయ మార్కెట్ పట్ల విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి, డాలర్ మారకంలో రూపాయి విలువ, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ కదలికలు తదితర అంశాలూ స్టాక్ సూచీల గమనాన్ని శాసించవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అయితే దసరా పండుగ సందర్భంగా శుక్రవారం(15న) బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఎక్సే్చంజీలకు సెలవు కావడంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. ‘‘నిఫ్టీకి 17450 స్థాయి వద్ద బలమైన మద్దతు లభించిన తర్వాత బౌన్స్‌బ్యాక్స్ అయ్యింది. ఈ సూచీ ఇప్పటికీ అధిక విలువతో ట్రేడ్ అవుతున్నప్పటికీ.., సాంకేతికంగా దిద్దుబాటయ్యే సూచనలు సూచనలు కనిపించడం లేదు. ఈ వారంలో 18,000 స్థాయిని అధిగమించవచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్స్ హెడ్ రీసెర్చ్ వినోద్ నాయర్ తెలిపారు. అధిక వెయిటేజీ దిగ్గజం రిలయన్స్‌తో పాటు ఐటీ, ఆటో షేర్లు రాణించడంతో సెన్సెక్స్ 1,293 పాయింట్లను ఆర్జించింది. నిఫ్టీ 363 పాయింట్లు పెరిగింది. ఈ వారం స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలను మరింత విశ్లేషిస్తే... కార్పొరేట్ ఫలితాల సీజన్ మొదలు... ఐటీ దిగ్గజం టీసీఎస్ గత శుక్రవారం క్యూ2 ఆర్థిక గణాంకాలను వెల్లడించి ఫలితాల సీజన్‌కు తెరతీసింది. ఆర్థిక ఫలితాల ప్రభావం సోమవారం (11న) ట్రేడింగ్‌లో ప్రతిఫలించే అవకాశముంది. ఈ వారంలోనే ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ ట్రీ, హెచ్‌సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అవెన్యూ సూపర్‌మార్ట్, డెల్టా కార్ప్, హెచ్ఎఫ్సీఎల్, సైయంట్, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్‌తో సహా దాదాపు 50కి పైగా కంపెనీలు తమ రెండో క్వార్టర్ ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత కంపెనీల షేర్లు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. ట్రేడర్లు షేరు ఆధారిత ట్రేడింగ్‌కు ఆసక్తి చూపవచ్చు. ద్రవ్యోల్బణ లెక్కలపై దృష్టి ... కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ మంగళవారం(12న) ఆగస్ట్ నెల పారిశ్రామికోత్పత్తి, సెపె్టంబర్ రిటైల్ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలను వెల్లడించనుంది. సెపె్టంబర్ నెల టోకు ధరల ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) వివరాలు గురువారం(14న) విడుదల కానుంది. సెప్టెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం 4.3 శాతంగా, టోకు ధరల ద్రవ్యోల్బణం 4.3శాతంగా, ఆగస్ట్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు 11.2శాతంగా నమోదుకావచ్చని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. బాండ్ ఈల్డ్స్ భయాలు... భారత పదేళ్ల బాండ్ ఈల్డ్స్ 18 నెలల గరిష్టస్థాయి 6.32 శాతానికి చేరుకుంది. వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడంతో పాటు మార్కెట్లో అధిక ద్రవ్యత లభ్యత ఉండేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ తెలిపింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఒకవేళ ఈల్డ్స్ మరింత పెరిగితే స్టాక్ మార్కెట్‌కు ప్రతికూలాంశంగా మారుతుంది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ లిస్టింగ్ నేడు.. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ లిస్టింగ్ షేర్లు నేడు(సోమవారం) ఎక్సే్చంజీల్లో లిస్ట్‌కానున్నాయి. సెపె్టంబర్ 29 – అక్టోబర్ 1వ తేదిల మధ్య ఇష్యూ పూర్తి చేసుకున్న ఈ ఐపీఓ 5.25 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. ధర శ్రేణిని రూ.712 గా నిర్ణయించి కంపెనీ మొత్తం రూ.2,768 కోట్లను సమీకరించింది. గ్రే మార్కెట్లో ఈ షేర్లు చాలా తక్కువ ప్రీమియం ధరతో ట్రేడ్ అవుతున్నందున ఫ్లాట్ లేదా డిస్కౌంట్లో లిస్టింగ్ ఉండొచ్చని నిపుణుల అభిప్రాయం. బుల్లిష్ వైఖరితో విదేశీ ఇన్వెస్టర్లు... విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) దేశీయ మార్కెట్లో ఈ అక్టోబర్‌లో ఇప్పటికి వరకు రూ.1,997 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇందులో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.1,530 కోట్ల షేర్ల విలువైన షేర్లను కొన్నారు. డెట్ మార్కెట్లో రూ.467 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఇటీవల విదేశీ ఇన్వెస్టర్లు ఐటీ, బ్యాంకింగ్ రంగాల షేర్లను కొనేందుకు ఆస్తకి చూపుతున్నారు. -
ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టం
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ పునాదులు పటిష్టంగా ఉన్నాయని ఆర్థికమంత్రిత్వశాఖ నెలవారీ ఆర్థిక సమీక్షా నివేదిక పేర్కొంది. కరోనా మహమ్మారి సెకండ్‌వేవ్ సవాళ్లు విసిరినప్పటికీ భారత్ ఎకానమీ 2021–22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 20.1 శాతం వృద్ధిని నమోదుచేసుకోవడాన్ని ప్రస్తావిస్తూ, భారత్ ఎకానమీ ‘వీ’ (V) నమూనా వృద్ధి తీరును ఇది ప్రతిబింబిస్తున్నట్లు పేర్కొంది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► మూడవ వేవ్ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేరళ, మహారాష్ట్రల్లో కేసులు పెరుగుతుండడం ఆందోళనలను మరింత పెంచుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లో మహమ్మారి నియంత్రణ, నిర్వహణ యంత్రాంగాలను పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. డెల్టా వేరియంట్ పెద్ద సవాళ్లని వస్తున్న వార్తలు తీవ్ర అప్రమత్తత పాటించాల్సిన అవసరాన్ని ఉద్ఘాటిస్తున్నాయి. పండుగల వాతావరణం కావడంతో ప్రజలు మాస్‌్కలు ధరించడం, భౌతిక దూరం పాటించడంసహా కోవిడ్–19 మార్గదర్శకాలను తు.చ.తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది. ► ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం చక్కటి పనితీరును పోషిస్తోంది. వర్షపాతంలో 9 శాతం లోటు ఉన్నప్పటికీ, ఖరీఫ్ సాగు సెపె్టంబర్ 3 నాటికి సాధారణ స్థాయిలో ఉంది. ► రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ, ట్రాక్టర్ కొనుగోళ్లు పెరగడం వంటి అంశాలు గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ రానున్న నెలల్లో పటిష్టం అవుతుందన్న సంకేతాలను ఇస్తోంది. ► ఇక పారిశ్రామిక రంగం కూడా స్థిరంగా పురోగమిస్తోంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ విస్తృత ప్రాతిపదికన మెరుగుపడుతున్న సంకేతాలు ఉన్నాయి. ఉత్పత్తి విలువలు 2019 జూన్ స్థాయికి రికవరీ అవుతున్నాయి. జూలైలో ఎనిమిది కీలక మౌలిక రంగాల గ్రూప్ వృద్ధి రేటు 9.4 శాతం వృద్దిరేటును నమోదుచేసుకుంది. క్రూడ్ ఆయిల్, రిఫైనరీ ప్రొడక్టులు మినహా అన్ని రంగాలూ కోవిడ్–19 ముందస్తు స్థాయిని అధిగమించాయి. ► ద్యుత్ వినియోగం, రైల్వే రవాణా, రహదారుల టోల్ వసూళ్లు, ఈ–వే బిల్లులు, డిజిటల్ లావాదేవీలు, విమాన ప్రయాణీకులు సంఖ్య, జీఎస్టీ వసూళ్లు ఇలా ప్రతి విభాగంలోనూ సానుకూల రికవరీ సంకేతాలు ఉన్నాయి. సేవలు, తయారీ కలగలిపిన ఇండియా పీఎంఐ కాంపోజిట్ ఇండెక్స్ కూడా 55.4కు పెరగడం హర్షణీయ పరిణామం. -
అదరగొట్టిన రిలయన్స్
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అంచనాలు మించిన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్లో రూ. 13,101 కోట్లు నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఇది రూ. 11,640 కోట్లు. తాజా మూడో త్రైమాసికంలో నికర లాభం సుమారు రూ. 11,420 కోట్లు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. కంపెనీ ఆదాయంలో గణనీయ వాటా ఉండే రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ వ్యాపారం తగ్గినప్పటికీ.. టెలికం, రిటైల్ విభాగాలు రాణించడంతో మెరుగైన ఫలితాలు సాధించగలిగింది. ఏడాది క్రితం దాకా కంపెనీ ఆదాయంలో 37 శాతంగా ఉన్న ఈ రెండు విభాగాల వాటా ప్రస్తుతం 51%కి పెరిగింది. పన్నులకు ముందస్తు లాభంలో దాదాపు 56 శాతం వాటా జియో, రిలయన్స్ రిటైల్‌దే ఉంది. సమీక్షాకాలంలో ఆర్ఐఎల్ ఆదాయం సుమారు 19% క్షీణించి రూ. 1,37,829 కోట్లకు పరిమితమైంది. చమురు, రసాయనాల వ్యాపారం (ఓ2సీ) త్రైమాసికాలవారీగా మెరుగుపడినప్పటికీ.. వార్షికంగా మాత్రం తగ్గింది. ఓ2సీ విభాగం పునర్వ్యవస్థీకరణ.. ‘ఓ2సీ (చమురు, రసాయనాలు తదితర విభాగాలు), రిటైల్ విభాగాలు కాస్త కోలుకోవడంతో పాటు డిజిటల్ సేవల విభాగం నిలకడగా వృద్ధి సాధిస్తుండటంతో మూడో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు సాధించగలిగాం. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ మార్పులు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో పరిశుభ్రమైన, పర్యావరణహిత అభివృద్ధి సాధన దిశగా కొత్త ఇంధన, మెటీరియల్స్ వ్యాపారాలను విస్తరించేందుకు ఇది సరైన తరుణం. దీనికి అనుగుణంగానే ఓ2సీ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించి కస్టమర్లకు మరింత చేరువలోకి తెస్తున్నాం. దేశ ఎకానమీలోని ప్రతీ రంగానికి అవసరమైన ఇంధన, మెటీరియల్స్ సొల్యూషన్స్‌ను దీని ద్వారా అందుబాటు ధరల్లో అందించవచ్చు‘ అని రిలయన్స్ సీఎండీ ముకేశ్ అంబానీ చెప్పారు. ఓ2సీ ప్లాట్‌ఫామ్ పునర్వ్యవస్థీకరణతో ఆయిల్ రిఫైనింగ్, పెట్రోకెమికల్ ఆదాయాలను ఒకే పద్దు కింద రిలయన్స్ చూపించింది. దీనితో రిఫైనింగ్ మార్జిన్లను ప్రత్యేకంగా ప్రకటించలేదు. జియో జోష్..: త్రైమాసికాలవారీగా చూస్తే.. డిజిటల్, టెలికం సేవలందించే జియో ప్లాట్‌ఫామ్స్ లాభం 15 శాతం వృద్ధితో రూ. 3,489 కోట్లకు పెరిగింది. డిసెంబర్ 31 నాటికి జియో మొత్తం కస్టమర్ల సంఖ్య 41 కోట్లుగా ఉంది. ప్రతీ యూజరుపై సగటు ఆదాయం (ఏఆర్పీయూ) రూ. 145 నుంచి రూ. 151కి పెరిగింది. రిటైల్‌కు ఫ్యాషన్ ఊతం..: ఫ్యాషన్, లైఫ్‌స్టయిల్ విభాగాలు గణనీయంగా కోలుకోవడంతో రిలయన్స్ రిటైల్ మెరుగైన పనితీరు కనపర్చింది. పన్నుకు ముందస్తు లాభం సుమారు 12 శాతం పెరిగి రూ. 3,102 కోట్లుగా నమోదైంది. అంతక్రితం క్యూ3లో ఇది రూ. 2,736 కోట్లు. అయితే, ఆదాయం మాత్రం రూ. 45,348 కోట్ల నుంచి దాదాపు 23 శాతం క్షీణించి రూ. 36,887 కోట్లకు పడిపోయింది. మరిన్ని విశేషాలు.. ► కరోనా మహమ్మారి, రేట్లు పడిపోవడం వంటి అంశాలు ఇంధన డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపడంతో ఓ2సీ వ్యాపారం ఆదాయం రూ. 1,19,121 కోట్ల నుంచి రూ. 83,838 కోట్లకు తగ్గింది. ► త్రైమాసికాల వారీగా చూస్తే వడ్డీ వ్యయాలు 29 శాతం తగ్గి రూ. 4,326 కోట్లకు పరిమితమయ్యాయి. ► జియోలో వాటాల విక్రయం ద్వారా రూ. 1,52,056 కోట్లు, రిటైల్‌లో వాటాల విక్రయంతో రూ. 47,265 కోట్లు రిలయన్స్ సమీకరించింది. ► స్థూల రుణ భారం డిసెంబర్ ఆఖరు నాటికి రూ. 2,57,413 కోట్లకు తగ్గింది. 2020 మార్చి ఆఖరు నాటికి ఇది రూ. 3,36,294 కోట్లు. ఇక చేతిలో ఉన్న నగదు రూ. 1,75,259 కోట్ల నుంచి రూ. 2,20,524 కోట్లకు పెరిగింది. కంపెనీ చేతిలో పుష్కలంగా నిధులు ఉండటంతో నికర రుణం మైనస్ రూ. 2,954 కోట్లుగా ఉంది. శుక్రవారం బీఎస్ఈలో రిలయన్స్ షేరు సుమారు 2 శాతం క్షీణించి రూ. 2,050 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలు వెల్లడయ్యాయి. -
టీసీఎస్.. భేష్!
ముంబై: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020–21) మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు కేక పెట్టించాయి. సాధారణంగా ఐటీ కంపెనీలకు డిసెంబర్ క్వార్టర్ బలహీనంగా ఉంటుంది. దీనికి తోడు కరోనా కల్లోలం ప్రభావం కొనసాగుతున్నా, టీసీఎస్ క్యూ3 ఫలితాలు విశ్లేషకుల అంచనాలను మించి పోయాయి. గత తొమ్మిదేళ్లలో ఇవే అత్యుత్తుమ క్యూ3 ఫలితాలని కంపెనీ పేర్కొంది. ఆధ్వాన పరిస్థితులు అంతమయ్యాయని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రెండంకెల వృద్ధిని సాధించగలమని కంపెనీ పేర్కొంది. రూ.8,701 కోట్ల నికర లాభం.... టీసీఎస్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3లో 7 శాతం వృద్ధితో రూ.8,701 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2019–20) ఇదే క్వార్టర్లో నికర లాభం రూ.8,118 కోట్లుగా ఉంది. సీక్వెన్షియల్‌గా చూస్తే 16 శాతం వృద్ధి సాధించింది. ఇక ఆదాయం రూ.39,854 కోట్ల నుంచి 5 శాతం వృద్ధితో రూ.42,015 కోట్లకు పెరిగింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన కూడా 5 శాతం వృద్ధిని సాధించింది. ఇక డాలర్ల పరంగా చూస్తే, ఆదాయం సీక్వెన్షియల్‌గా 5 శాతం వృద్ధితో 57,020 డాలర్లకు పెరిగింది. రూ. 6 మధ్యంతర డివిడెండ్...: ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.6 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. దీనికి రికార్డ్ డేట్ ఈ నెల 16. వచ్చే నెల 3న చెల్లింపులు జరుగుతాయి. నిర్వహణ లాభం 6 శాతం వృద్ధితో (సీక్వెన్షియల్‌గా) రూ.11,184 కోట్లకు పెరిగింది. ఈ క్యూ2లో 26.2 శాతంగా ఉన్న నిర్వహణ లాభ మార్జిన్ ఈ క్యూ3లో 26.6 శాతానికి పెరిగింది. ఉద్యోగులకు వేతనాలు పెంచినప్పటికీ, గత ఐదేళ్లలోనే అత్యధిక నిర్వహణ లాభ మార్జిన్‌ను ఈ క్యూ3లోనే సాధించింది. నికర మార్జిన్ 20.7 శాతంగా ఉంది. గత ఏడాది డిసెంబర్ చివరి నాటికి కంపెనీ వద్ద రూ.65,000 కోట్ల నగదు నిల్వలున్నాయి. అన్ని విభాగాలూ జోరుగానే.... అన్ని విభాగాల్లో పటిష్టమైన వృద్ధిని సాధించామని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వి. రామకృష్ణన్ చెప్పారు. ఈ క్యూ3లో కొత్తగా 15,721 మందికి ఉద్యోగాలిచ్చామని, గత ఏడాది డిసెంబర్ నాటికి కంపెనీలోని మొత్తం ఉద్యోగుల సంఖ్య 4.69 లక్షలకు పెరిగిందన్నారు. ఆట్రిషన్ రేటు(ఉద్యోగుల వలస) జీవిత కాల కనిష్ట స్థాయి....7.6 శాతానికి తగ్గిపోయిందని తెలిపారు. ప్రస్తుతం 3.4 శాతం మంది మాత్రమే ఆఫీసులకు వచ్చి పనిచేస్తున్నారు. మిగిలిన వాళ్లంతా వర్క్ ఫ్రమ్ హోమ్ వినియోగించుకుంటున్నారు. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత, రెండు నెలల పిదప వర్క్ ఫ్రమ్ హోమ్ విషయమై సమీక్ష జరుపుతారు. ఆల్‌టైమ్ హైకి టీసీఎస్... మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలపై ఆశావహ అంచనాలతో ఇటీవలి కాలంలో ఈ షేర్ జోరుగా పెరుగుతోంది. ఇంట్రాడేలో రూ.3,128 వద్ద ఆల్‌టైమ్ హైను తాకిన ఈ షేర్ చివరకు 3 శాతం లాభంతో రూ.3,120 వద్ద ముగిసింది. గత ఏడాది ఈ షేర్ 32 శాతం లాభపడింది. ఆశావహంగా కొత్త ఏడాదిలోకి సీజనల్ సమస్యలున్నా ఈ క్యూ3లో అత్యుత్తమ ఆర్థిక ఫలితాలు సాధించాం. కీలకమైన ట్రాన్స్ఫార్మేషన్ సర్వీసులకు డిమాండ్ పెరగడం, గతంలో కుదుర్చుకున్న భారీ డీల్స్ సాకారం కావడం దీనికి ప్రధాన కారణాలు. కొత్త ఏడాదిలోకి ఆశావహంగా అడుగిడుతున్నాం. గతంలో కంటే మార్కెట్ స్థితి మరింతగా పటిష్టమయింది. డీల్స్, ఆర్డర్లు మరింతగా పెరగడంతో మా విశ్వాసం మరింతగా పెరిగింది. క్లౌడ్ సర్వీసెస్, అనలిటిక్స్ అండ్ ఇన్సైట్స్, కాగ్నిటివ్ బిజినెస్ ఆపరేషన్స్, ఐఓటీ, క్వాలిటీ ఇంజినీరింగ్అండ్ ట్రాన్స్ ఫార్మేషన్ ప్లాట్ఫార్మ్ సర్వీసెస్ల కారణంగా మంచి వృద్ధిని సాధించాం. –రాజేశ్ గోపీనాథన్, సీఈఓ, టీసీఎస్ -
యాక్సెంచర్ పుష్- ఐటీ షేర్లు గెలాప్
ముంబై, సాక్షి: ఐటీ సేవల దిగ్గజం యాక్సెంచర్ తాజాగా నవంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆశావహ ఫలితాలు ప్రకటించింది. దీంతో దేశీయంగా లిస్టెడ్ దిగ్గజ కంపెనీలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్ఎస్ఈలో ఐటీ ఇండెక్స్ 2 శాతం ఎగసి 23,408 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని చేరుకుంది. అంతేకాకుండా సాఫ్ట్వేర్ సేవల దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ సరికొత్త గరిష్టాలను తాకాయి. వివరాలు చూద్దాం.. (కన్సాలిడేషన్ బాటలో- 47,000కు సెన్సెక్స్) యాక్సెంచర్ జోష్ ఐటీ దిగ్గజం యాక్సెంచర్ తొలి త్రైమాసికంలో డాలర్ల రూపేణా 4 శాతం వృద్ధితో 11.8 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించింది. ఇది అంచనాలకంటే అధికంకాగా.. నిర్వహణ లాభ మార్జిన్లు 0.5 శాతం బలపడి 16.1 శాతానికి చేరాయి. ప్రయాణ వ్యయాలు తగ్గడం, పెరిగిన ఉత్పాదకత వంటి అంశాలు మార్జిన్లకు బలాన్నిచ్చినట్లు కంపెనీ పేర్కొంది. ఈ కాలంలో 25 శాతం వృద్ధితో 12.9 బిలియన్ డాలర్ల విలువైన తాజా డీల్స్‌ను కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. పూర్తి ఏడాదికి ఆదాయం 4-6 శాతం స్థాయిలో పుంజుకోగలదని తాజాగా అంచనా వేసింది. నిర్వహణ లాభం 7 శాతం పెరిగి 1.89 బిలియన్ డాలర్లను తాకింది. (గత నెల అమ్మకాలలో టాప్-3 కార్లు) షేర్ల జోరు యాక్సెంచర్ 4-6 శాతం వృద్ధితో ఆదాయ అంచనాలను ప్రకటించిన నేపథ్యంలో ఐటీ కౌంటర్లు జోరందుకున్నాయి. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఇన్ఫోసిస్ దాదాపు 3 శాతం ఎగసి రూ. 1,193 సమీపానికి చేరింది. ఇక టీసీఎస్ 2 శాతం బలపడి రూ. 2,894ను తాకింది. ఇవి ఇది సరికొత్త గరిష్టాలుకాగా.. హెచ్‌సీఎల్ టెక్ 2.5 శాతం లాభంతో రూ. 901 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో కోఫోర్జ్ 2.3 శాతం పుంజుకుని రూ. 2,569 వద్ద, ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ 1.6 శాతం బలపడి రూ. 3,359 వద్ద, ఎంఫసిస్ 1.6 శాతం పెరిగి రూ. 1,361 వద్ద కదులుతున్నాయి. విప్రొ 1.3 శాతం లాభంతో రూ. 362 వద్ద ట్రేడవుతోంది. -
ఎన్నికల ఫలితాలు, గణాంకాలు కీలకం
బిహార్ ఎన్నికల ఫలితాల ప్రభావం ఈ వారం మార్కెట్‌పై ఉంటుందని నిపుణులంటున్నారు. ఈ వారంలో వెలువడే పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలు, కంపెనీల ఆర్థిక ఫలితాలు, ప్రపంచ రాజకీయ పరిణామాలు కూడా తగినంతగా ప్రభావం చూపుతాయని వారంటున్నారు. వీటితో పాటు డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, దేశీ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, ప్రపంచ మార్కెట్ల పోకడ, కరోనా కేసులు, కరోనా టీకా సంబంధిత పరిణామాలు కూడా కీలకమేనని విశ్లేషకులంటున్నారు. చివరి దశకు క్యూ2 ఫలితాలు.... మూడు దశల్లో జరిగిన బిహార్ ఎన్నికల ఫలితాలు ఈ నెల 10న(మంగళవారం) వెలువడతాయి. ఇక గురువారం (ఈ నెల 12న) సెప్టెంబర్ నెల పారిశ్రామికోత్పత్తి, అక్టోబర్ నెల ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడతాయి. కంపెనీల ఆర్థిక ఫలితాలు చివరి దశకు వచ్చాయి. ఈ వారంలో మొత్తం 2,600 కంపెనీలు తమ తమ ఫలితాలను వెల్లడించనున్నాయి. టాటా స్టీల్, ఓఎన్జీసీ, హిందాల్కో, హిందుస్తాన్ కాపర్, ఐడీఎఫ్సీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఆయిల్ ఇండియా, ఎన్ఎమ్డీసీ, అరబిందో ఫార్మా, ఐషర్ మోటార్స్, గ్రాసిమ్, గెయిల్ కంపెనీలు క్యూ2 ఫలితాలను వెల్లడించనున్నాయి. కొత్త శిఖరాలకు స్టాక్ సూచీలు...! ఎగ్జిట్ పోల్స్ హంగ్ అసెంబ్లీని సూచిస్తున్నాయని, ఇది మార్కెట్‌కు ప్రతికూలాంశమని మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషకులు హేమాంగ్ జని పేర్కొన్నారు. కాగా అమెరికా అధ్యక్షుడిగా జో బైడన్ గెలవడం సానుకూలాంశమని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్కెట్ జోరుగా పెరిగితే ఈ వారంలోనే సెన్సెక్స్, నిఫ్టీలు కొత్త శిఖరాలకు ఎగబాకే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఐదు రోజుల్లో రూ.8,381 కోట్లు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈ నెలలో ఇప్పటివరకూ జరిగిన ఐదు ట్రేడింగ్ సెషన్లలో రూ.8,381 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. కంపెనీల ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడం, వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా రికవరీ అవుతాయనే అంచనాలు, డాలర్ బలహీనపడటం, కరోనా కేసులు తగ్గుతుండటం...ఈ కారణాల వల్ల విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు పెరుగుతోందని నిపుణులంటున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లో రూ.6,564 కోట్లు, డెట్ సెగ్మెంట్లో రూ.1,817 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. కాగా గత నెలలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు రూ.22,033 కోట్లుగా ఉన్నాయి. అమెరికా ఎన్నికలు ముగిసినందున సెంటిమెంట్ మరింత స్థిరంగా ఉండనున్నదని విశ్లేషకులంటున్నారు. ఎమ్ఎస్సీఐ అంతర్జాతీయ సూచీల్లోని భారత షేర్లలో విదేశీ ఇన్వెస్టర్ల యాజమాన్య పరిమితుల పునర్వవ్యస్థీకరణ నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు మరింతగా పెరుగుతాయని వారంటున్నారు. అక్టోబర్‌లో ఈక్విటీల నుంచి ఫండ్స్ భారీ ఉపసంహరణలు... వరుసగా ఐదోసారి ఈక్విటీల నుంచి మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) భారీ మొత్తాన్ని విత్‌డ్రా చేశాయి. అక్టోబర్ నెలలో రూ.14,344 కోట్ల మొత్తాన్ని ఉపసంహరించుకున్నాయి. దీంతో కలిపి జూన్ నుంచి ఎంఎఫ్‌లు ఉపసంహరణ చేసిన మొత్తం రూ.37,498 కోట్లు. ఫండ్ మేనేజర్లు రెస్క్యూ స్టాక్స్‌ను విక్రయించడమే విత్‌డ్రాకు ప్రధాన కారణం. ఈ ఏడాది జనవరి నుంచి మే మధ్య ఎంఎఫ్‌లు స్టాక్ మార్కెట్లో రూ.40 వేల కోట్ల పైనే పెట్టుబడులు పెట్టారని సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) డేటా వెల్లడించింది. అమెరికా ఎన్నికలపై ఆందోళన, మందగించిన దేశీయ ఆర్థ్ధిక వ్యవస్థ వంటి కారణాలతో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో నిరంతర ప్రవాహాన్ని గమనించామని ఫినాలజీ సీఈఓ ప్రంజల్ కమ్రా తెలిపారు. అయితే ఆర్థ్ధిక సంవత్సరం ముగియనుండటం, మార్కెట్ సెంటిమెంట్ సానుకూలంగా మారుతుండటంతో ఇన్‌ఫ్లోలో పెరుగుదల కనబడుతోందని కమ్రా తెలిపారు. సెప్టెంబర్ త్రైరమాసికంలో ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ రూ.7,200 కోట్ల ఔట్‌ఫ్లో ఉందని, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) నుంచి ఔట్‌ఫ్లో తగ్గిపోయిందని తెలిపారు. ‘ ‘ఇది అనిశ్చితి కాలంలో కనిపించే ఒక సాధారణ ప్రక్రియ. క్రాష్ తర్వాత మార్కెట్లు కోలుకున్నప్పుడు, పెట్టుబడిదారులు బ్రేక్ ఈవెన్‌కు చేరుకున్నప్పుడు ఉపసంహరణ సహజమని’’ గ్రోవ్ కో–ఫౌండర్ అండ్ సీఓఓ హర్‡్ష జైన్ అన్నారు. వ్యక్తిగతంగా ఎంఎఫ్‌లు విత్‌డ్రా చేసిన మొత్తం నెలల వారీగా చూస్తే.. సెప్టెంబర్‌లో రూ.4,134 కోట్లు, ఆగస్టులో రూ.9,213 కోట్లు, జూలైలో రూ.9,195 కోట్లు, జూన్‌లో రూ.612 కోట్లుగా ఉన్నాయి. మార్చిలో మార్కెట్ పతనం తర్వాత ఎంఎఫ్ ఇన్వెస్టర్లు తమ నికర ఆస్తి విలువ (ఎన్ఏవీ)లో గణనీయమైన నష్టాలను చవిచూశారు. ఎన్ఏవీలు కోలుకున్న తర్వాత తమ పెట్టుబడుల నుంచి నిష్క్రమించడం వల్లే ఉపసంహరణ జరగిందని క్వాంటమ్ ఏఎంసీ ఫండ్ మేనేజర్ నీలేష్ శెట్టి తెలిపారు. -
టీసీఎస్ మరో బంపర్ బైబ్యాక్
ముంబై: దేశీ సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) భారీ స్థాయిలో షేర్ల బైబ్యాక్ ప్రకటించింది. సుమారు రూ. 16,000 కోట్లతో 5.33 కోట్ల షేర్లను బైబ్యాక్ చేయనుంది. షేరు ఒక్కింటికి రూ. 3,000 వెచ్చించనుంది. బుధవారం బీఎస్ఈలో షేరు ముగింపు ధర రూ. 2,737తో పోలిస్తే ఇది 9% అధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా టీసీఎస్ ఈ విషయం వెల్లడించింది. 2017, 2018లో కూడా టీసీఎస్ భారీ స్థాయిలో షేర్ల బైబ్యాక్ చేసింది. 2018లో దాదాపు రూ. 16,000 కోట్లతో షేరు ఒక్కింటికి రూ. 2,100 రేటు చొప్పున 7.61 కోట్ల షేర్ల బైబ్యాక్ ప్రకటించింది. కంపెనీ వద్ద ప్రస్తుతం రూ. 58,500 కోట్ల మేర నగదు నిల్వలు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీ ఐటీ సంస్థ బైబ్యాక్ ప్రకటించడం ఇదే ప్రథమం. ఇక, మరో ఐటీ సంస్థ విప్రో కూడా అక్టోబర్ 13న షేర్ల బైబ్యాక్‌ను పరిశీలించనున్నట్లు పేర్కొంది. మరోవైపు, క్యూ2లో టీసీఎస్ నికర లాభం రూ. 7,475 కోట్లుగా (కన్సాలిడేటెడ్) నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో రూ. 8,042 కోట్లతో పోలిస్తే సుమారు 7% క్షీణించింది. తాజా క్యూ2లో అమెరికన్ సంస్థ ఎపిక్ సిస్టమ్స్ కార్పొరేషన్‌తో లీగల్ వివాదానికి సంబంధించి రూ. 1,218 కోట్లు కేటాయించాల్సి రావడంతో ఫలితాలపై ప్రభావం పడిందని టీసీఎస్ తెలిపింది. రెండో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 38,977 కోట్ల నుంచి 3% వృద్ధితో రూ. 40,135 కోట్లకు చేరింది. సీక్వెన్షియల్‌గా చూస్తే ఆదాయం 4.7%, లాభం 6.7% పెరిగింది. షేరు ఒక్కింటికి రూ.12 చొప్పున టీసీఎస్ మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. దీనికి రికార్డు తేదీ అక్టోబర్ 15 కాగా నవంబర్ 3న చెల్లింపు జరుగుతుంది. ‘పటిష్టమైన ఆర్డర్ బుక్, మార్కెట్ షేరును పెంచుకుంటూ ఉండటం తదితర అంశాలతో కంపెనీ భవిష్యత్ అవకాశాలపై మరింత ధీమాగా ఉన్నాం‘ అని టీసీఎస్ సీఈవో రాజేశ్ గోపీనాథన్ చెప్పారు. జీతాల పెంపు.. ఉద్యోగుల జీతాల పెంపును అక్టోబర్ 1 నుంచి అమలు చేస్తున్నట్లు టీసీఎస్ తెలిపింది. సెప్టెంబర్ ఆఖరుకి కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 4,53,540గా ఉంది. ‘కష్టకాలంలో అసాధారణ స్థాయి లో పనిచేసిన టీసీఎస్ సిబ్బంది అందరికీ ధన్యవాదాలు. అక్టోబర్ 1 నుంచి జీతాల పెంపును అమలు చేయబోతున్నాం‘ అని సంస్థ గ్లోబల్ హెడ్ (మానవ వనరుల విభాగం) మిలింద్ లాకడ్ తెలిపారు. ఫ్రెషర్లను తీసుకోవడం ప్రారంభించామని, సెప్టెంబర్ క్వార్టర్లో అంతర్జాతీయంగా రిక్రూట్మెంట్ పెంచామని వివరించారు. అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) ఆల్‌టైమ్ కనిష్టమైన 8.9%గా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఇతర విశేషాలు... ► క్యూ2లో విభాగాల వారీగా చూస్తే బీఎఫ్ఎస్ఐ (6.2 శాతం), రిటైల్ (8.8 శాతం), లైఫ్ సైన్సెస్–హెల్త్‌కేర్ (6.9 శాతం), టెక్నాలజీ–సర్వీసెస్ (3.1 శాతం) తయారీ (1.4 శాతం) విభాగాలు వృద్ధి నమోదు చేశాయి. కమ్యూనికేషన్స్ మీడియా విభాగం 2.4 శాతం క్షీణించింది. ► సీక్వెన్షియల్‌గా ఉత్తర అమెరికా మార్కెట్ 3.6 శాతం, బ్రిటన్ 3.8 శాతం, యూరప్ 6.1 శాతం వృద్ధి చెందింది. వర్ధమాన దేశాల్లో భారత మార్కెట్ 20 శాతం వృద్ధి నమోదు చేసింది. ► సెప్టెంబర్ క్వార్టర్లో 8.6 బిలియన్ డాలర్ల విలువ చేసే డీల్స్ కుదిరాయి. తాజాగా డీల్స్ కుదుర్చుకున్న సంస్థల్లో టీపీజీ టెలికం, టయోటా మోటార్స్ నార్త్ అమెరికా మొదలైనవి ఉన్నాయి. ► చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వి. రామకృష్ణన్ 2021 ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయనున్నారు. మే 1 నుంచి ఆయన స్థానంలో సమీర్ సక్సారియా బాధ్యతలు చేపడతారు. 1999లో టీసీఎస్‌లో చేరిన సక్సారియా ప్రస్తుతం ఫైనాన్స్ విభాగం వైస్–ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ► బీఎస్ఈలో టీసీఎస్ షేరు బుధవారం 0.78 శాతం పెరిగి రూ. 2,737 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. -
టీసీఎస్ ఫలితాలు, అంతర్జాతీయ సంకేతాలు కీలకం
ఐటీ కంపెనీ టీసీఎస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్‌కు కీలకం కానున్నది. దీంతో పాటు మారటోరియం రుణాలపై వడ్డీ మాఫీ అంశంపై సుప్రీం కోర్టు విచారణ... తదనంతర పరిణామాలు, కరోనా కేసులు, వ్యాక్సిన్ సంబంధిత వార్తలు, అంతర్జాతీయ సంకేతాలు కూడా మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కరోనా సోకడం... ఆయన ఆరోగ్య స్థితిగతులు కూడా ఈ వారం ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్‌పై కూడా ప్రభావం చూపుతాయి. ఈ నెల 7న టీసీఎస్ ఫలితాలు.... మారటోరియం రుణాలపై, వడ్డీ మాఫీపై సుప్రీం కోర్టులో నేడు(సోమవారం) విచారణ జరగనున్నది. ఈ కేసు విషయమై సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పు బ్యాంక్ రంగ షేర్లపై ప్రభావం చూపనున్నది. సోమవారం నాడే∙సేవల రంగం పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎమ్ఐ) గణాంకాలు వస్తాయి. ఇక ఈ నెల 7 (బుధవారం) టీసీఎస్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నది. గత వారం సెన్సెక్స్, నిఫ్టీలు బాగా పెరిగినందున ఈ వారం లాభాల స్వీకరణకు అవకాశముందని కొందరు నిపుణులంటున్నారు. మూడు నెలల తర్వాత ‘విదేశీ’ అమ్మకాలు.... విదేశీ ఇన్వెస్టర్ల మూడు నెలల కొనుగోళ్లకు సెప్టెంబర్‌లో బ్రేక్‌పడింది. కరోనా కేసులు పెరుగుతుండటం, అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో మార్కెట్లో అనిశ్చితి నెలకొనడం దీనికి కారణం. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.7,783 కోట్ల నికర అమ్మకాలు జరపగా, డెట్ సెగ్మెంట్లో రూ. 4,364 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు. వెరశి మన క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.3,419 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకుంటే, భారత మార్కెట్ విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఆకర్షించగలదని నిపుణులంటున్నారు. మెరుగుపడుతున్న వ్యాపార సెంటిమెంట్ సీఈవోలతో సీఐఐ సర్వే క్రమంగా దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆశలు రేకెత్తిస్తూ.. వ్యాపార సంస్థల్లో సెంటిమెంట్ మెరుగుపడుతోంది. కంపెనీల పనితీరు కూడా క్రమేపీ మెరుగుపడగలదని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు (సీఈవో) భావిస్తున్నారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన సీఈవోల సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మెటల్స్, మైనింగ్, తయారీ, ఆటో, ఫార్మా, ఇంధనం, ఇన్ఫ్రా, నిర్మాణ తదితర రంగ సంస్థల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు ఇందులో పాల్గొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో సామర్థ్యాల వినియోగం 50 శాతానికి పైగా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. అంటువ్యాధుల కట్టడిలో లాక్డౌన్ల ప్రయోజనాలు తక్కువగా ఉంటాయని సర్వే అభిప్రాయపడింది. ఎకానమీని పూర్తిగా తెరిస్తేనే డిమాండ్ మెరుగుపడుతుందని, తద్వారా ఉత్పత్తికి ఊతం లభిస్తుందని పేర్కొంది. -
ధనాధన్ రిలయన్స్
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) అదరగొట్టే ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(2020–21, క్యూ1)లో రూ. 13,248 కోట్ల రికార్డు స్థాయి కన్సాలిడేటెడ్ (అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) నికర లాభా న్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.10,141 కోట్లతో పోలిస్తే 31 శాతం వృద్ధి నమోదైంది. ప్రధానంగా జియో లాభాల మోత మోగించడం ఆర్ఐఎల్ మెరుగైన ఫలితాలకు దోహదం చేసింది. ఇంధన రిటైలింగ్ వెంచర్లో 49 శాతం వాటాను బ్రిటిష్ పెట్రోలియం(బీపీ)కు విక్రయించడం ద్వారా క్యూ1లో రూ.4,966 కోట్ల అసాధారణ వన్‌టైమ్ రాబడి లభించిందని రిలయన్స్ వెల్లడించింది. ఇది కూడా రికార్డు లాభాలకు కారణమైంది. కరోనాతో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా మందగించిన తరుణంలో క్యూ1లో కంపెనీ ఫలితాలపై ప్రభావం ఉండొచ్చన్న విశ్లేషకుల అంచనాలను మించి కంపెనీ మెరుగైన పనితీరును కనబరచడం గమనార్హం. కాగా, 2019–20 ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో రూ.11,640 కోట్ల నికర లాభం ఇప్పటిదాకా కంపెనీ అత్యధిక త్రైమాసిక లాభంగా రికార్డుల్లో నిలిచింది. దీన్ని ఇప్పుడు అధిగమించింది. కాగా, భారతీయ కంపెనీల్లో అత్యధిక త్రైమాసికం లాభం ఆర్జించిన రికార్డు మాత్రం ఇప్పటికీ ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ)దే. 2012–13 ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్లో ఈ సంస్థ రూ.14,513 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. చమురు, పెట్రోకెమికల్ వ్యాపారాలపై ప్రభావం... క్యూ1లో కంపెనీ స్థూల లాభం(ఎబిటా) 11.8 శాతం క్షీణించి రూ.21,585 కోట్లకు తగ్గింది. పెట్రోలియం ఇంధనం, పాలిస్టర్ ఉత్పత్తుల డిమాండ్ తీవ్రంగా పడిపోవడంతో చమురు, పెట్రోకెమికల్ వ్యాపారాలు దెబ్బతినడమే దీనికి ప్రధాన కారణమని కంపెనీ పేర్కొంది. ఎగుమతులు క్షీణించడం కూడా లాభదాయకతపై ప్రభావం చూపిందని తెలిపింది. ‘కరోనా వైరస్ కల్లోలంతో స్టోర్స్ మూసివేత, దేశవ్యాప్తంగా కార్యకలాపాలపై నియంత్రణల వల్ల రిటైల్ వ్యాపార ఎబిటా దిగజారింది. అయితే, డిజిటల్ సర్వీసుల వ్యాపారంలో మార్జిన్లు మెరుగుపడటం వల్ల ప్రతికూలతలను తట్టుకోగలిగాం’ అని కంపెనీ వెల్లడించింది. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలు... ► పెట్రోకెమికల్స్ వ్యాపార ఆదాయం క్యూ1లో 33 శాతం పడిపోయి రూ.25,192 కోట్లకు దిగజారింది. ► చమురు రిఫైనింగ్ ఆదాయం 54.1 శాతం తగ్గుదలతో రూ.46,642 కోట్లకు క్షీణించింది. ► క్యూ1లో స్థూల రిఫైనింగ్ మార్జిన్(గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్–జీఆర్ఎం) 6.3 డాలర్లుగా నమోదైంది. గతేడాది ఇదే క్వార్టర్లో జీఆర్ఎం 8.1 డాలర్లు కాగా, క్రితం క్వార్టర్(2019–20, క్యూ4)లో 8.9 డాలర్లుగా ఉంది. ఒక్కో బ్యారెల్ ముడిచమురును పెట్రోలియం ఉత్పత్తులుగా మార్చడం ద్వారా లభించే రాబడిని జీఆర్‌ఎంగా వ్యవహరిస్తారు. ► చమురు–గ్యాస్ వ్యాపారం 45.2 శాతం క్షీణతతో రూ.506 కోట్లకు పరిమితమైంది. ► లాక్‌డౌన్‌తో 50 శాతం స్టోర్స్ పూర్తిగా మూసేయడం, 29% స్టోర్స్ పరిమిత స్థాయిలో కార్యకలాపాలను నిర్వహించినప్పటికీ రిలయన్స్ రిటైల్ వ్యాపారం మెరుగైన స్థాయిలో రూ. 31,633 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. రూ.1,083 కోట్ల స్థూల లాభాన్ని ఆర్జించింది. ఆర్ఐఎల్ షేరు గురువారం బీఎస్ఈలో 0.61 శాతం లాభంతో రూ.2,109 వద్ద స్థిరపడింది. మార్కెట్ ముగిసిన తరవత కంపెనీ ఫలితాలను ప్రకటించింది. నిధుల సునామీ... జియో ప్లాట్‌ఫామ్స్‌లో దాదాపు 33 శాతం వాటాను ఫేస్బుక్, గూగుల్ ఇతరత్రా పలు ప్రపంచస్థాయి కంపెనీలకు విక్రయించడం ద్వారా రిలయన్స్ రూ.1,52,056 కోట్ల నిధులను సమీకరించింది. అదేవిధంగా రైట్స్ ఇష్యూ ద్వారా రూ.53,124 కోట్లు లభించాయి. ఇంధన రిటైలింగ్ వ్యాపారంలో 49 శాతం వాటాను బీపీకి అమ్మడం ద్వారా రూ.7,629 కోట్లను దక్కించుకుంది. తద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ నికర రుణ రహిత కంపెనీగా ఆవిర్భవించింది. దుమ్మురేపిన జియో... ఆర్ఐఎల్ టెలికం అనుబంధ సంస్థ జియో లాభాల మోత మోగించింది. క్యూ1లో కంపెనీ నికర లాభం రూ.2,520 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.891 కోట్లతో పోలిస్తే 183 శాతం వృద్ధి నమోదైంది. ఇక జియో ఆదాయం కూడా 33.7 శాతం ఎగబాకి రూ.16,557 కోట్లకు చేరింది. నెలకు ఒక్కో యూజర్ నుంచి ఆదాయం(యావరేజ్ రెవెన్యూపర్ యూజర్–ఏఆర్పీయూ) క్యూ1లో రూ.140.3గా నమోదైంది. క్రితం క్వార్టర్(2019–20, క్యూ4)లో ఏఆర్పీయూ రూ.130.6గా ఉంది. ఈ ఏడాది మార్చి నాటికి జియో మొత్తం యూజర్ల సంఖ్య 38.75 కోట్లు కాగా, జూన్ చివరినాటికి ఈ సంఖ్య 39.83 కోట్లకు వృద్ధి చెందింది. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్స్ ప్రకటించడంతో హైడ్రోకార్బన్స్ వ్యాపారం డిమాండ్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. అయితే, కార్యకలాపాల్లో వెసులుబాటు కారణంగా దాదాపు సాధారణ స్థాయిలోనే నిర్వహణ సాధ్యమైంది. దీంతో పరిశ్రమలోకెల్లా ధీటైన ఫలితాలను ప్రకటించగలిగాం. కరోనా లాక్డౌన్ కాలంలోనూ కంపెనీ క్యూ1లో రికార్డు స్థాయిలో నిధులను దక్కించుకుంది. భారతీయ కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద నిధుల సమీకరణను ఏప్రిల్–జూన్ క్వార్టర్లో మేం పూర్తిచేశాం’. – ముకేశ్ అంబానీ, రిలయన్స్ అధినేత -
ఆర్థిక ఫలితాల సమర్పణకు గడువు పొడిగింపు
కోవిడ్-19 వ్యాధి వ్యాప్తి ప్రభావంతో కంపెనీల ఆర్థిక ఫలితాల సమర్పణ గడువును మరో నెలరోజుల పాటు పొడిగిస్తున్నట్లు సెబీ తెలిపింది. ఆయా కంపెనీలు తమ త్రైమాసిక, అర్థ, వార్షిక ఆర్థిక ఫలితాల గణాంకాలను సమర్పించేందుకు కాలపరిమితిని జూలై 31వరకు పొడగిస్తున్నట్లు మార్కెట్ రెగ్యూలేటరీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. లాక్‌డౌన్‌తో నేపథ్యంలో గతంలో కంపెనీల ఫలితాలను జూన్ 30 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ గడువును జూన్ 31వరకు పొడిగిస్తున్నట్లు సెబీ పేర్కోంది. అనేక లిస్టెడ్ కంపెనీలు, ప్రముఖ ఛార్టర్డ్ అకౌంటెంట్లు, ఆయా పరిశ్రమ సంస్థలు అభ్యర్థన మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్న సెబీ పేర్కోంది. ఆయా కంపెనీల అనుబంధ, భాగస్వామ్య సంస్థలు కంటెన్మెంట్ జోన్లలో ఉండటం వల్ల అడిట్ ప్రక్రియతో ఇతర నిర్వహణ సవాళ్లను దృష్ట్యా కంపెనీలకు ఈ వెసులుబాటును కలిగిస్తున్నట్లు సెబీ తెలిపింది. -
గణాంకాలు, ఫలితాలు కీలకం
ఈ వారం వెలువడే వివిధ గణాంకాలు, కంపెనీల ఆర్థిక ఫలితాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులంటున్నారు. కరోనా వైరస్ కేసుల తీవ్రత, ఈ వైరస్ వ్యాక్సిన్ సంబంధిత వార్తలు, అమెరికా–చైనా వాణిజ్య ఒప్పందం పరిణామాలు కూడా కీలకమేనని వారంటున్నారు. వీటితో పాటు ప్రపంచ మార్కెట్ల పోకడ, దేశీ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, ముడి చమురు ధరల గమనం, వివిధ దేశాల్లో లాక్డౌన్ సంబంధిత వార్తలు... ఇవన్నీ కూడా తగిన ప్రభావం చూపనున్నాయని విశ్లేషకులంటున్నారు. ఈ నెల 12న(మంగళవారం) మార్చి నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వస్తాయి. అదే రోజు ఏప్రిల్ నెల రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడతాయి. ఇక ఏప్రిల్ నెల టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ నెల 14న (గురువారం) వస్తాయి. మారుతీ సుజుకీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బంధన్ బ్యాంక్ తదితర మొత్తం 50కు పైగా కంపెనీలు ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటం, కంపెనీల ఆర్థిక ఫలితాలు– ఈ రెండు అంశాలు పెట్టుబడులపై ప్రభావం చూపుతాయి. రిలయన్స్ రైట్స్ ఇష్యూకి రికార్డు తేది మే14 ప్రతిపాదిత రైట్స్ ఇష్యూకి మే 14ను రికార్డు తేదీగా నిర్ణయించినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. ఇష్యూ ప్రారంభ, ముగింపు తేదీలను తర్వాత ప్రకటించనున్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. -
మెప్పించిన ఇన్ఫీ!
బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఆశావహ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (2019–20, క్యూ1) కంపెనీ రూ.3,802 కోట్ల కన్సాలిడేటెడ్ (అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో లాభం రూ.3,612 కోట్లుగా నమోదైంది. ఇక మొత్తం ఆదాయం కూడా 13.9 శాతం ఎగబాకి రూ.19,128 కోట్ల నుంచి రూ.21,803 కోట్లకు చేరింది. మార్కెట్ విశ్లేషకులు కంపెనీ క్యూ1లో రూ. 3,702 కోట్ల నికర లాభాన్ని, రూ.21,776 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందని అంచనా వేశారు. దీనికి మించి ఫలితాలు వెలువడ్డాయి. సీక్వెన్షియల్‌గా ఇలా... గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (2018–19, క్యూ4) నికర లాభం రూ.4,078 కోట్లతో పోలిస్తే సీక్వెన్షియల్‌గా కంపెనీ లాభంలో 6.8% తగ్గుదల నమోదైంది. ఆదాయం మాత్రం 1.2 శాతం పెరిగింది. గతేడాది క్యూ4లో రూ.21,539 కోట్లుగా ఉంది. గైడెన్స్ అప్... ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయ వృద్ధి అంచనాను (గైడెన్స్) ఇన్ఫీ పెంచింది. గడిచిన క్వార్టర్ ఫలితాల సందర్భంగా ఈ ఏడాది ఆదాయ వృద్ధి 7.5–9.5% ఉండొచ్చని అంచనా వేయగా.. దీన్ని ఇప్పుడు 8.5–10 శాతానికి పెంచింది. ఇక నిర్వహణ మార్జిన్ గైడెన్స్ 21–23 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ► డాలర్ల రూపంలో కంపెనీ నికర లాభం వార్షిక ప్రాతిపదికన క్యూ1లో 534 మిలియన్ డాలర్ల నుంచి 546 మిలియన్ డాలర్లకు పెరిగింది. 2.3 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం 2.83 బిలియన్ డాలర్ల నుంచి 3.13 బిలియన్ డాలర్లకు ఎగబాకింది. 12.4 శాతం వృద్ధి సాధించింది. ► క్యూ1లో 2.7 బిలియన్ డాలర్ల విలువైన భారీస్థాయి కాంట్రాక్టులను ఇన్ఫీ దక్కించుకుంది. 100 మిలియన్ డాలర్ల కేటగిరీలో రెండు కాంట్రాక్టులు, 10 మిలియన్ డాలర్లకు మించిన విభాగంలో ఆరు కాంట్రాక్టులు లభించాయి. ► కంపెనీకి డిజిటల్ విభాగం నుంచి 1,119 మిలియన్ డాలర్ల ఆదాయం క్యూ1లో సమకూరింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే 41.9 శాతం ఎగసింది. కంపెనీ మొత్తం ఆదాయంలో ఈ విభాగం వాటా 35.7 శాతానికి చేరింది. ► ఇంధనం–యుటిలిటీస్ విభాగం ఆదాయం 4.7 శాతం(సీక్వెన్షియల్), కమ్యూనికేషన్ 4.6 శాతం చొప్పున వృద్ధి చెందాయి. ► ఇక ప్రాంతాలవారీగా చూస్తే... ఉత్తర అమెరికా నుంచి ఆదాయం సీక్వెన్షియల్‌గా 3 శాతం వృద్ధి చెందింది. మిగత దేశాల నుంచి ఆదాయంలో 2.3 శాతం వృద్ధి నమోదైంది. ► కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య ఈ ఏడాది జూన్ చివరినాటికి 2,29,029కి చేరింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి (2018–19, క్యూ4) ఈ సంఖ్య 2,28,123 మాత్రమే. దీనిప్రకారం చూస్తే నికరంగా 906 మంది ఉద్యోగులు మాత్రమే జతయ్యారు. ఇక ఉద్యోగుల వలసల రేటు(అట్రిషన్) క్యూ1లో 23.4 శాతానికి పెరిగింది. క్యూ4లో ఇది 20.4 శాతం మాత్రమే. ► డేటా ప్రిపరేషన్ సాఫ్ట్వేర్ సేవల అనుబంధ సంస్థ ట్రైఫాక్టాలో అదనంగా 6 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. దీంతో మొత్తం పెట్టుబడి 10 మిలియన్ డాలర్లకు చేరుతుందని ఇన్ఫీ పేర్కొంది. ఇన్ఫీ షేరు ధర శుక్రవారం బీఎస్ఈలో 1% లాభపడి రూ.727 వద్ద ముగిసింది. ట్రేడింగ్ మగిశాక ఫలితాలను ప్రకటించింది. కాగా, అమెరికా నాస్డాక్ ఎక్సే్ఛంజ్‌లో ఇన్ఫీ షేరు(ఏడీఆర్) శుక్రవారం కడపటి సమాచారం మేరకు 6 శాతానికిపైగా లాభాలతో ట్రేడవుతోంది. ఇక లాభాల్లో 85% ఇన్వెస్టర్లకే.. ఇన్వెస్టర్లకు మరింత విలువ జోడించేందుకు తమ నిధుల కేటాయింపు ప్రణాళికను మారుస్తున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఇందులో భాగంగా వచ్చే ఐదేళ్లకుగాను కంపెనీ వార్షిక నికర లాభాల్లో (ఫ్రీ క్యాష్‌ఫ్లో) 85 శాతం వరకూ తిరిగి ఇన్వెస్టర్లకు పంచేయాలని నిర్ణయించినట్లు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) నీలాంజన్ రాయ్ తెలిపారు. ప్రస్తుత 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచే ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడున్నట్లే డివిడెండ్లు లేదా ప్రత్యేక డివిడెండ్లు లేదా షేర్ల బైబ్యాక్‌ల రూపంలో ఇది ఉంటుందన్నారు. కంపెనీ బ్యాలెన్స్ షీట్ చాలా పటిష్టంగా ఉందని, ఇప్పటికీ తమవద్ద 3.5 బిలియన్ డాలర్ల నగదు నిల్వలున్నాయని రాయ్ వివరించారు. ఇప్పటివరకూ ఏటా 70 శాతం వరకూ ఫ్రీ క్యాష్‌ను ఇన్వెస్టర్లకు తిరిగి ఇచ్చే విధానాన్ని ఇన్ఫీ అనుసరిస్తోంది. కాగా, రూ.8,260 కోట్ల షేర్ల బైబ్యాక్ కొనసాగుతోందని ఇప్పటివరకూ రూ.5,934 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుత త్రైమాసికంలోనూ బైబ్యాక్ కొనసాగింపునకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. కాగా, తాజా బడ్జెట్లో 20 శాతం బైబ్యాక్ పన్ను విధించిన నేపథ్యంలో భవిష్యత్తులో కంపెనీల షేర్ల బైబ్యాక్‌లకు అడ్డుకట్ట పడొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. ఈ తరుణంలో ఇన్వెస్టర్లకు మరింతగా నగదు నిల్వలను పంచే ప్రణాళికను ఇన్ఫీ ప్రకటించడం గమనార్హం. ‘ఈ ఆర్థిక సంవత్సరాన్ని చాలా పటిష్టమైన ఫలితాలతో మేం బోణీ చేశాం. డాలర్ల రూపంలో ఆదాయం 12.4 శాతం ఎగబాకడం, ముఖ్యంగా డిజిటల్ విభాగం నుంచి 41.9 శాతం ఆదాయ వృద్ధి నమోదు కావడం శుభపరిణామం. క్లయింట్లతో మెరుగైన సంబంధాలు, వారిపై మరింత దృష్టిపెట్టడం, తదనుగుణంగా మేం చేస్తున్న పెట్టుబడులే మెరుగైన ఫలితాలకు తోడ్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆదాయ గైడెన్స్‌ను కూడా పెంచాం’. – సలీల్ పరేఖ్, ఇన్ఫీ సీఈఓ, ఎండీ -
ఆదాయం తగ్గుతుంది
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం కాగ్నిజంట్ కంపెనీ మార్చి క్వార్టర్ ఆర్థిక ఫలితాలు నిరాశపరిచాయి. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నా, భారత్‌లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉద్యోగులు ఉన్న ఈ కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పాటిస్తోంది. ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్లో కంపెనీ నికర లాభం 15 శాతం తగ్గి 44.1 కోట్ల డాలర్లకు చేరింది.. గత ఏడాది ఇదే క్వార్టర్లో నికర లాభం 52 కోట్ల డాలర్లు వచ్చింది. ఆదాయం 5 శాతం ఎగసి 411 కోట్ల డాలర్లకు చేరింది. సగం తగ్గిన ఆదాయ అంచనాలు..: నిరాశకర ఫలితాలను ప్రకటించిన ఈ కంపెనీ పూర్తి ఏడాది ఆదాయం అంచనాలను సగానికి పైగా తగ్గించింది. ఈ ఏడాది ఆదాయం 7–9 శాతం రేంజ్లో వృద్ధి చెందగలదని ఒక నెల క్రితం ఈ కంపెనీ పేర్కొంది. తాజాగా ఈ అంచనాలను 3.6–5.1 శాతానికి తగ్గంచింది. ఆర్థిక సేవలు, హెల్త్‌కేర్ విభాగాల్లో వృద్ధి మందకొడిగా ఉండే అవకాశాలుండటంతో ఆదాయ అంచనాలను తగ్గించామని పేర్కొంది. ఈ ఏడాది రెండో క్వార్టర్ ఆదాయం అంచనాలు 3.9–4.9 శాతం రేంజ్లో ఉండగలవని వివరించింది. విఫలమయ్యాం..: మార్కెట్ అవకాశాలను సమర్థవంతగా అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యామని కంపెనీ సీఈఓ బ్రియాన్ హంఫ్రిస్ పేర్కొన్నారు. ఫ్రాన్సిస్ డిసౌజా నుంచి ఏప్రిల్ 1 నుంచి సీఈఓ పగ్గాలను హంఫ్రిస్ తీసుకున్నారు. -
ప్రాఫిట్ 10 వేల కోట్లు!!
న్యూఢిల్లీ: దేశీ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అంచనాలు మించిన లాభాలతో అదరగొట్టింది. రిఫైనరీ మార్జిన్లు తగ్గినా.. పెట్రోకెమికల్, రిటైల్, టెలికం రంగాల ఊతంతో క్యూ3లో నికర లాభం 8.8 శాతం వృద్ధితో రూ.10,251 కోట్లకు చేరింది. ఒక త్రైమాసికంలో రూ. 10,000 కోట్ల పైగా లాభం నమోదు చేసిన తొలి ప్రైవేట్ కంపెనీగా రిలయన్స్ రికార్డు సృష్టించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రిలయన్స్ నికర లాభం రూ. 9,420 కోట్లు. అక్టోబర్–డిసెంబర్ మధ్య కాలంలో రిలయన్స్ ఆదాయం 56 శాతం ఎగిసి రూ. 1,71,336 కోట్లకు చేరింది. క్యూ3లో రిలయన్స్ నికర లాభం సుమారు దాదాపు రూ. 9,648 కోట్ల స్థాయిలో ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. ‘ఇటు దేశానికి అటు వాటాదారులకు మరింత లబ్ధి చేకూర్చేందుకు రిలయన్స్ నిరంతరం కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే ఒక త్రైమాసికంలో ఏకంగా రూ. 10,000 కోట్ల లాభాల మైలురాయిని దాటిన తొలి దేశీ ప్రైవేట్ కంపెనీగా నిల్చింది’ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ గురువారం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా చెప్పారు. చమురు ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతూ సవాళ్లు ఎదురైనప్పటికీ.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ3లో మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించగలిగామని ఆయన పేర్కొన్నారు. ‘రిటైల్, జియో వ్యాపార విభాగాలు గణనీయంగా వృద్ధి చెందుతున్నాయి. కంపెనీ మొత్తం లాభదాయకత మెరుగుపడటంలో వీటి పాత్ర కూడా పెరుగుతోంది’ అని ఆయన చెప్పారు. క్యూ3లో రిలయన్స్ నగదు నిల్వలు స్వల్పంగా రూ. 76,740 కోట్ల నుంచి రూ. 77,933 కోట్లకు పెరిగాయి. భారీ పెట్టుబడి ప్రణాళిక పూర్తి కావడంతో 2018 డిసెంబర్ 31 నాటికి మొత్తం రుణ భారం రూ. 2,74,381 కోట్లకు పెరిగింది. గతేడాది మార్చి 31 నాటికి ఇది రూ. 2,18,763. రిఫైనింగ్ మార్జిన్ డౌన్ .. రిలయన్స్ పెట్రో కెమికల్ వ్యాపార విభాగం పన్నుకు ముందస్తు లాభం 43% పెరిగి రూ. 8,221 కోట్లుగా నమోదైంది. అయితే, రిఫైనింగ్ విభాగం ఆదాయాలు వరుసగా మూడో త్రైమాసికంలో తగ్గాయి. మార్జిన్ల తగ్గుదల కారణంగా 18% క్షీణించి రూ.5,055 కోట్లుగా నమోదైంది. ముడి చమురును ఇంధనంగా మార్చే రిఫైనింగ్ ప్రక్రియకు సంబంధించిన స్థూల రిఫైనింగ్ మార్జిన్ (జీఆర్ఎం) ప్రతి బ్యారెల్‌కు 8.8 డాలర్లుగా నమోదైంది. ఇది 15 త్రైమాసికాల్లో కనిష్ట స్థాయి. సెప్టెంబర్ క్వార్టర్లో ఇది 9.5 డాలర్లుగా ఉండగా, 2017 క్యూ3లో ఇది 11.6 డాలర్లు. ఉత్పత్తి తగ్గుదల కొనసాగడం.. చమురు, గ్యాస్ వ్యాపార విభాగం పన్నుకు ముందస్తు నష్టాలు రూ. 185 కోట్లకు తగ్గాయి. క్యూ2లో ఇవి రూ. 480 కోట్లు కాగా, 2017–18 మూడో త్రైమాసికంలో రూ. 291 కోట్లు. జియో లాభం 65 శాతం అప్.. టెలికం విభాగమైన రిలయన్స్ జియో లాభాలు మూడో త్రైమాసికంలో 65 శాతం ఎగిసి రూ. 831 కోట్లకు చేరాయి. నిర్వహణ ఆదాయం 50.9 శాతం పెరిగి రూ. 10,383 కోట్లకు పెరిగింది. అంతక్రితం త్రైమాసికంలో ఆదాయం రూ. 6,879 కోట్లు కాగా, లాభం రూ. 504 కోట్లు. సగటున యూజర్‌పై వచ్చే ఆదాయం 15.5 శాతం క్షీణించి రూ. 154 నుంచి రూ. 130కి తగ్గింది. అయితే, కస్టమర్ల సంఖ్య 16 కోట్ల నుంచి 28 కోట్లకు పెరగడంతో ఆ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ’ప్రస్తుతం జియో కుటుంబ సభ్యుల సంఖ్య 28 కోట్లకు చేరింది. అందుబాటు ధరలో అత్యంత నాణ్య మైన సర్వీసులతో అందర్నీ అనుసంధానించాలన్న మా లక్ష్యాలకు అనుగుణంగా ప్రపంచం లోనే అతి పెద్ద మొబైల్ డేటా నెట్వర్క్ గా ఎదుగుతోంది. గృహాలు, కంపెనీల్లోనూ కనెక్టివిటీకి కొత్త తరం ఎఫ్‌టీటీఎక్స్ సర్వీసులనుపై కసరత్తు చేస్తున్నాం ’ అని అంబానీ చెప్పారు. క్యూ3లో డేటా వినియోగం 431 కోట్ల గిగా బైట్స్ నుంచి 864 కోట్ల గిగాబైట్స్కి చేరింది. సగటున ప్రతి యూజరు డేటా వినియోగం 9.6 జీబీ నుంచి 10.8 జీబీకి చేరింది. రిలయన్స్ రిటైల్ లాభం రూ. 1,680 కోట్లు.. పండుగ సీజన్ అమ్మకాలు, కొత్త స్టోర్స్ ప్రారంభం మొదలైన సానుకూల అంశాల ఊతంతో రిలయన్స్ రిటైల్ విభాగం పన్నుకు ముందస్తు లాభాలు రెట్టింపై రూ.1,680 కోట్లకు పెరిగాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో ఈ లాభం రూ. 606 కోట్లుగా ఉంది. మరోవైపు ఆదాయం 89 శాతం పెరిగి రూ. 18,798 కోట్ల నుంచి రూ. 35,577 కోట్లకు పెరిగింది. రిలయన్స్ రిటైల్‌కి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6,400 పైచిలుకు నగరాలు, పట్టణాల్లో 9,907 స్టోర్స్ ఉన్నాయి. క్యూ3లో 13.9 కోట్ల మంది రిలయన్స్ రిటైల్ స్టోర్స్‌ను సందర్శించారని సంస్థ తెలిపింది. నిత్యావసరాలు విక్రయించే రిలయన్స్ ఫ్రెష్, స్మార్ట్ విభాగాలు కూడా మెరుగైన పనితీరు కనపర్చాయని వివరించింది. ఇక ఫ్యాషన్.. లైఫ్‌స్టయిల్ విభాగంలో కొత్తగా 100 స్టోర్స్ ప్రారంభించామని, దీంతో కొత్తగా మరో 25 నగరాలకు కార్యకలాపాలు విస్తరించినట్లయిందని పేర్కొంది. రిలయన్స్ జ్యుయెల్స్ విభాగం 100 స్టోర్స్ మైలురాయి దాటింది. స్టోర్స్ సంఖ్య ప్రస్తుతం 57 నగరాల్లో 109కి చేరింది. ప్రైవేట్‌లో టాప్.. రూ.10 వేల కోట్ల లాభాల మైలురాయి దాటిన తొలి ప్రైవేట్ కంపెనీగా రిలయన్స్ రికార్డు సృష్టించింది. ఇప్పటిదాకా ప్రభుత్వ రంగంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) మాత్రమే ఒక క్వార్టర్లో రూ.10 వేల కోట్లకు మించి లాభాలు ప్రకటించింది. 2013 జనవరి–మార్చి త్రైమాసికంలో ఐవోసీ రూ.14,513 కోట్ల నికర లాభం నమోదు చేసింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సబ్సిడీ అంతా ఒకే క్వార్టర్లో అందుకోవడంతో అప్పట్లో ఐవోసీ ఈస్థాయి లాభాలు ప్రకటించడం సాధ్యపడింది. మిగతా క్వార్టర్స్‌లో నష్టాలు రావడంతో 2012–13 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఐవోసీ రూ. 5,005 కోట్ల లాభాలు నమోదు చేయగలిగింది. గురువారం బీఎస్ఈలో రిలయన్స్ షేరు 0.30 పైసలు క్షీణించి రూ. 1,133.75 వద్ద క్లోజయ్యింది. -
రిలయన్స్ సామర్ధ్యంపై అంచనాలివే..
సాక్షి, న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ర్టీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) పూర్తిస్థాయిలో సామర్థ్యం కనబరిచే సమయం ఇంకా రాలేదని బ్రోకింగ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. 2018 ఆర్థిక సంవత్సరంలో మెరుగైన ఫలితాలు ప్రకటించినా మున్ముందు ఆర్ఐఎల్ పూర్తిస్థాయిలో సత్తా చాటుతుందని ఆశాభావం వ్యక్తం చేశాయి. జియో రాబడులు ఆశించిన మేర రాకున్నా కంపెనీ పెట్రోకెమికల్ సామర్థ్యం మెరుగ్గా ఉండటంతో 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఆర్ఐఎల్ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని హెచ్ఎస్బీసీ పేర్కొంది. గోల్డ్‌మాన్ శాక్స్.. పెట్రోకెమికల్ డివిజన్ నుంచే ఆర్ఐఎల్ సత్తా చాటిందని ప్రతి క్వార్టర్లో 10 శాతం వృద్ధి కనబరుస్తూ రిఫైనింగ్ రాబడిని మించి అతిపెద్ద రాబడి ఆర్జించే విభాగంగా పెట్రోకెమికల్ ఎదిగిందని గోల్డ్‌మాన్ శాక్స్ పేర్కొంది. రిటైల్ బిజినెస్ నుంచి మెరుగైన వృద్ధితో రిఫైనింగ్ మార్జిన్లపై అంచనాలు తప్పాయని పేర్కొంది. ఇక ప్రతి యూజర్‌పై సగటు రాబడి (ఏఆర్పీయూ) తగ్గినా సబ్‌స్ర్కైబర్ల సంఖ్య గణనీయంగా పెరగడంతో జియో రాబడి అంచనాలకు అనుగుణంగానే ఉందని గోల్డ్‌మన్ శాక్స్ తెలిపింది. ఆర్ఐఎల్ షేర్లు పెరుగుతున్నా ఇంతకుమించి పెరగవని ఇన్వెస్టర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆర్ఐఎల్ మెరుగైన ప్రదర్శన ఇంకా మొదలు కాలేదని పేర్కొంది. మోర్గాన్‌స్టాన్లీ.. ఆర్ఐఎల్ ఇంధన రాబడులు అంతర్జాతీయ కంపెనీలతో పోలిస్తే అత్యంత నిలకడగా ఉన్నాయి. వృద్ధి పరంపరను కొనసాగించే సంకేతాలు పంపుతున్నాయి. ఇక రిటైల్, టెలికాం విభాగాలు రాబడులను మెరుగుపరుస్తాయి. డేటా యూసేజ్ ఇతర యూజర్ల తరహాలోనే ఉంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆర్ఐఎల్ నాలుగో క్వార్టర్లో రిఫైనింగ్ రాబడులను (రూ 6400 కోట్లు) పెట్రోకెమికల్ బిజినెస్ రూ(7700 కోట్లు) అధిగమించింది. జియో కేవలం టెలికాం రంగానికే పరిమితం కాదని ఇది డిజిటల్ సేవల వ్యాపారంలో భాగమని ఆర్ఐఎల్ ప్రస్తావించడం గమనార్హం. రానున్న రోజుల్లో జియో దశల వారీగా ఫైబర్ టూ హోం సేవలను ప్రారంభించనుంది. కొటాక్ సెక్యూరిటీస్ జియో ఊపందుకునే వరకూ ఆర్ఐఎల్ వృద్ధి పరంపర మందగమనంలో ఉండే అవకాశం ఉంది. పెట్రోకెమికల్ ప్రాజెక్టులు పూర్తిస్ధాయిలో ఉపయోగంలోకి వచ్చిన అనంతరం మెరుగైన వృద్ధిని అంచనా వేయవచ్చు. డచ్ బ్యాంక్.. రాబోయే ఆరు నెలల్లో ఇంధన రంగంలో నూతన ప్రాజెక్టుల ఆరంభం, జియో నుంచి రాబడులతో ఆర్ఐఎల్ మెరుగైన సామర్థ్యం కనబరిచే అవకాశం ఉంది. 2018-20 ఆర్థిక సంవత్సరాల్లో ఆర్ఐఎల్ రాబడులు 24 శాతం మేర వృద్ధి సాధించవచ్చు. -
జియోతో రిలయన్స్‌లో జోష్
సాక్షి,ముంబయి: రిలయన్స్ ఇండస్ర్టీస్ లిమిటెడ్ సెప్టెంబర్ 30తో ముగిసిన రెండవ క్వార్టర్లో మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. నికర లాభం 12.5 శాతం వృద్ధితో రూ 8109 కోట్లకు పెరిగింది. కంపెనీ రాబడి 23.9 శాతం పెరిగి రూ 1,01,169 కోట్లకు చేరింది. ఈ క్వార్టర్లో రిలయన్స్ రిటైల్ జెనెసిస్ లగ్జరీ లిమిటెడ్‌లో 40 శాతం వాటా కొనుగోలు చేసింది. మీడియా, ఎంటర్టైన్మెంట్ విభాగంలో ఆర్ఐఎల్ బాలాజీ టెలిఫిల్మ్స్లో వాటా కొనుగోలు చేసింది. ఆర్థిక ఫలితాలపై ఆర్ఐఎల్ సీఎండీ ముఖేష్ అంబానీ సంతృప్తి వ్యక్తం చేశారు. కంపెనీ అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణించిందన్నారు. ఈ క్వార్టర్లో కంపెనీ అద్భుత సామర్ధ్యం కనబరిచిందని, రిలయన్స్ జియో తన తొలి క్వార్టర్లో మెరుగైన ఫలితాలు రాబట్టిందని అన్నారు. తమ రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ వ్యాపార వృద్ధి కంపెనీ ఫలితాలపై సానుకూల ప్రభావం చూపిందని చెప్పారు. కొత్త ప్రాజెక్టుల ద్వారా వ్యాపార అవకాశాల విస్తృతి ఫలితాలు ఇవ్వడం మొదలైందని అన్నారు. రిటైల్ బిజినెస్ ప్రోత్సాహకర వృద్ధిని నమోదు చేస్తోందని చెప్పారు. డిజిటల్ మార్కెట్లో రిలయన్స్ జియో నూతన తరం డేటా విప్లవాన్ని అందిపుచ్చుకుంటుందని అన్నారు. 4జీ టెక్నాలజీలో భారీగా వెచ్చించడంతో పాటు సరైన వ్యాపార వ్యూహాలతో జియో మెరుగైన ఆర్థిక ఫలితాలను సాధించగలిగిందని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. -
ఆధార్ లింక్ చేయపోతే, అన్ని అకౌంట్స్ బ్లాక్!
న్యూఢిల్లీ : ఆధార్ విషయంపై బ్యాంకు, ఫైనాన్సియల్ అకౌంట్ హోల్డర్స్ కు ఆదాయపు పన్ను శాఖ మరోసారి గట్టి హెచ్చరికలు జారీచేసింది. 2014 జూలై 1 నుంచి 2015 ఆగస్టు 31 మధ్యలో బ్యాంకు అకౌంట్లు, ఇన్సూరెన్స్, స్టాక్ వంటి ఇతర అకౌంట్లు ప్రారంభించినవారు ఏప్రిల్ 30లోగా ఆధార్ ను తమ అకౌంట్లకు లింక్ చేసుకోవాలని సూచించింది. గడువులోగా అకౌంట్ హోల్డర్స్ వివరాలను అందించకపోతే, అకౌంట్లను బ్లాక్ చేస్తామని హెచ్చరించింది. బ్యాంకులకు, ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూషన్లకు ఆ అకౌంట్లను బ్లాక్ చేసే అధికారముంటుందని ఐటీ శాఖ తెలిపింది. ఒక్కసారి వివరాలన్ని సమర్పించిన అనంతరం ఎప్పటిలాగే అకౌంట్లను ఆపరేట్ చేసుకోవచ్చని పేర్కొంది. ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కంప్లియెన్స్ యాక్ట్( ఎఫ్ఏటీసీఏ) ప్రొవిజన్స్ కిందకు వచ్చే అకౌంట్ హోల్డర్స్ అందరూ తప్పనిసరిగా ఆధార్ లింక్ చేయాలని ఐటీ శాఖ ఆదేశించింది. ఎఫ్ఏటీసీఏ చట్టం కింద అమెరికా, భారత్ రెండు దేశాలు పన్నులకు సంబంధించిన సమాచారాన్ని మార్పిడి చేసుకోవడానికి వీలుంటుంది. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఆర్థిక సమాచారం పంచుకునేలా ఈ రెండు దేశాలు 2015 జూలైలో ఈ అగ్రిమెంట్ ను కుదుర్చుకున్నాయి. ''2017 ఏప్రిల్ 30 వరకు సెల్ఫీ సర్టిఫికేషన్ సమర్పించండి. లేకపోతే అకౌంట్లు బ్లాక్ చేస్తాం. అకౌంట్ల బ్లాక్ చేస్తే, ఇక అకౌంట్ హోల్డర్ ఎలాంటి లావాదేవీలను జరుపుకోవడానికి వీలుండదు'' అని ట్యాక్స్ డిపార్ట్ మెంట్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ అకౌంట్లలో బ్యాంకులు, ఇన్సూరెన్స్, స్టాక్స్ అన్ని కలిసే ఉంటాయని తెలిపింది. ఈ ఎఫ్ఏటీసీఏ ప్రొవిజన్స్ కిందకు వచ్చే అకౌంట్ హోల్డర్స్ గడువులోగా ఆధార్ నెంబరు సమర్పించాల్సిందేనని పేర్కొంది.