GHMC Election
-
అందరినీ కూడగట్టి కొట్లాడదాం
సాక్షి, హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త ఉద్యమానికి టీఆర్ఎస్ చొరవ చూపుతుందని కేసీఆర్ ప్రకటించారు. బీజేపీపై పోరులో ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. హైదరాబాద్ వేదికగా డిసెంబర్ రెండోవారంలో సమరశంఖం పూరించనున్నట్లు తెలిపారు. ‘కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజల కోసం ఏమీ చేయదు. కొత్త వ్యవసాయ బిల్లుల ద్వారా రైతాంగానికి, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నది. మతవిద్వేషాలను రెచ్చగొట్టి... ప్రజలను విభజిస్తూ, భావోద్వేగాలతో రాజకీయ లబ్దిపొందుతోంది. దేశానికి నష్టం చేసే ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన కాంగ్రెస్ చతికిలపడింది. బడేభాయ్ వెంటే చోటేభాయ్ అన్నట్లు కాంగ్రెస్, బీజేపీలు రెండూ దేశానికి సరైన మార్గం చూపడంలో విఫలమయ్యాయి. దేశం మీద, ప్రజల మీద ఉన్న బాధ్యతతో టిఆర్ఎస్ చొరవ చూపుతుంది. బీజేపీ విధానాలపై పోరాటానికి దేశంలోని ఇతర ప్రతిపక్షాలన్నింటినీ ఒక్కతాటిపై నిలిపేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది’అని రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ భవన్లో బుధవారం నిర్వహించిన ఎంపీలు, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధుల సంయుక్త సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ వ్యూహాన్ని వివరించడంతో పాటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ విధానాలు, దానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరాన్ని వివరించారు. ‘ఇప్పటికే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేరళ సీం విజయన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, డీఎంకే నేత స్టాలిన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, ప్రకాశ్‌సింగ్ బాదల్, కుమారస్వామి, సీపీఐ, సీపీఎం నాయకులతో మాట్లాడాను. బీజేపీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడే విషయంలో కలిసి పనిచేయాలని నిర్ణయించాం. ఈ నాయకులందరితో డిసెంబర్ రెండోవారంలో హైదరాబాద్ నగరంలో సదస్సు నిర్వహించబోతున్నాం. అందులో దేశవ్యాప్త ఉద్యమం గురించి చర్చిస్తాం. దేశానికి ఓ దిశ, దశ నిర్ణయించే విషయంపై మాట్లాడతాం. కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల నష్టపోతున్న రైతులు, కార్మికులు, పేదల పక్షాన నిలుస్తాం’అని కేసీఆర్ స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారంలో దిట్ట మోదీ ప్రభుత్వం ఆరున్నరేళ్లలో తప్పుడు విధానాలు, ప్రచారాలతో దేశాన్ని తిరోగమనం వైపు నెట్టిందన్నారు. కాంగ్రెస్ నిష్క్రియాపరత్వ రాజకీయాల నేపథ్యంలో బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ఇతరపక్షాలపై పడిందన్నారు. ‘దేశ రాజకీయాల్లో ఇప్పుడు భిన్నమైన ట్రెండ్ నడుస్తున్నది. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పి నిజమని నమ్మించే ప్రయత్నం బీజేపీ చేస్తున్నది. ప్రజల కోసం పనిచేస్తున్న వారిపై నిందలు మోపుతూ సోషల్ మీడియాను యాంటీ సోషల్ మీడియాగా మార్చింది. ఎన్నికలప్పుడు రాజకీయ లబ్ధి పొందడానికి పాకిస్తాన్, కశ్మీర్, పుల్వామా అంటూ ప్రచారానికి దిగుతున్నది. సరిహద్దుల్లో ఏదో యుద్ధం చేసినట్లు ప్రచారం చేసుకుంటారు. అదే చైనాకు వ్యతిరేకంగా కోట్లాడలేక చతికిలపడతారు. ఏదో చేసినట్లు తప్పుడు ప్రచారం మాత్రం జోరుగా చేసుకుంటారు’అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. బంగారుబాతులను అమ్మేస్తున్నారు ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ పేరిట మోదీ సర్కారు వాటిని ప్రైవేటు కార్పోరేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తోంది. వాజ్‌పేయి, మన్మోహన్ హయాంలో ప్రారంభమైన పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను కొనసాగిస్తూ మోదీ ప్రభుత్వం ఏకంగా 23 ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించింది. దీంతో లక్షలాది మంది ఉద్యోగులకు తీరని అన్యాయం జరుగుతోంది’అని కేసీఆర్ విమర్శించారు. ‘లాభాల్లో నడుస్తూ ప్రజలకు సేవ, ప్రభుత్వాలకు నిధులు అందిస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను మూసి వేస్తున్నారు. రైల్వేస్టేషన్లో ఛాయ్ అమ్మిన అని చెప్పిన మోదీ ఇప్పుడు రైల్వేస్టేషన్లనే తెగనమ్ముతున్నాడు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి’’అని కేసీఆర్ ప్రశ్నించారు. బంగారుబాతు లాంటి ఎల్ఐసీతో పాటు రైల్వేలు, ఎన్టీపీసీ, బీహెచ్ఈఎల్, బీఎస్ఎన్ఎల్, బీపీసీఎల్ లాంటి నవరత్న కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా వాటిని ప్రైవేటు, కార్పోరేట్ సంస్థలకు కేంద్రం అప్పగిస్తోంది. ఈ సంస్థల్లో పనిచేసే లక్షలాది మంది ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. అవి ప్రైవేటుపరం కాకుండా చూడాలని వేడుకుంటున్నారు. వారికి అండగా నిలవాలని టిఆర్ఎస్ పార్టీ నిర్ణయించిందిని తెలిపారు. ‘1980 వరకు భారతదేశం కన్నా తక్కువ జీడీపీ ఉన్న చైనా నేడు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. కానీ కేంద్ర ప్రభుత్వ చేతగానితనం వల్ల భారతదేశం వెనక్కిపోతున్నది’అని విమర్శించారు. -
'మొన్న హరీష్.. ఇప్పుడు కేటీఆర్‌ను ఓడిస్తాం'
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో వంద డివిజన్లలో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని బీజేపీ నిర్ణయించింది. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే లక్ష్యంతో.. జీహెచ్ఎంసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీని 23 మంది పార్టీ ముఖ్యులతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ఏర్పాటుచేశారు. అనంతరం ఆయన అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ప్రత్యేక మేనిఫెస్టోను రూపొందించి విస్తృత ప్రచారం చేయాలని, సోమవారం నుంచే రంగంలోకి దిగాలని నిర్ణయించారు. ఇంకా మీడియా, పబ్లిసిటీ, కార్యక్రమాల కోఆర్డినేషన్ తదితర పది రకాల కమిటీలను ఏర్పాటుచేశారు. మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు: లక్ష్మణ్ గ్రేటర్ ఎన్నికలు రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్తును నిర్ణయించేవని, అందుకే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు సాగుతున్నట్టు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. మేనేజ్మెంట్ కమిటీ సమావేశం అనంతరం ఎమ్మెల్సీ రాంచందర్‌రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ ప్రజలను పట్టించుకోవట్లేదని, గత ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకున్నారన్నారు. గత ఎన్నికల్లో జీహెచ్ఎంసీలో లక్షల ఇళ్లు కట్టిస్తామని చెప్పి 450 ఇళ్లు కట్టించారన్నారు. అంతకంటే ఎక్కువగా నిర్మిస్తే ఏ సవాల్‌కైనా సిద్ధంగా ఉన్నామన్నారు. ‘అప్పుడు హరీశ్.. ఇప్పుడు కేటీఆర్’ బీజేపీ ఐటీ సెల్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ సోషల్ మీడియా విభాగాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ అధ్య క్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ దుబ్బాక లో హరీశ్‌రావును ఎదుర్కొన్నామని, ఇపుడు కేటీఆర్‌ను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ ఇదే.. బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్‌గా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, కన్వీనర్‌గా జాతీయ పార్టీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మ ణ్, జాయింట్ కన్వీనర్లుగా డాక్టర్ వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్‌రావు, చింతల రాంచంద్రారెడ్డిని నియమించారు. సభ్యులుగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పి.ము రళీధర్‌రావు, రాజాసింగ్, ఎన్.రాంచంద ర్రావు, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు, ఇంద్రసేనారెడ్డి, ఏపీ జితేందర్‌రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మో త్కుపల్లి నర్సింహులు, డి.రవీంద్రనాయక్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కె.రాములు, రాపో లు ఆనందభాస్కర్, ఎం.రఘునందన్‌రావు, జి.ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, బంగారు శృతిని నియమించారు. -
సర్వశక్తులూ ఒడ్డాల్సిందే!
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికలో ఎదురైన చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని త్వరలో జరిగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిల్లోనూ భారీ విజయం సాధించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇందుకోసం సర్వశక్తులూ ఒడ్డడానికి సిద్ధపడుతోంది. ఈ మేరకు ఈ నెల 12న రాష్ట్ర మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ వ్యూహం ఖరారు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావుకు గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి పూర్తి బాధ్యత అప్పగించారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహం, అన్ని స్థాయిల్లో పార్టీ యంత్రాంగం నడుమ సమన్వయ బాధ్యతలను కేటీఆర్ నిర్వర్తిస్తారు. నోటిఫికేషన్‌కు, ఎన్నికల తేదీకి నడుమ ఎక్కువ వ్యవధి ఇవ్వకుండా వేగంగా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే చాన్స్ ఉండటంతో గ్రేటర్ ఎన్నికల్లో మెరుపు వేగంతో కదలాలని టీఆర్ఎస్ భావిస్తోంది. హైదరాబాద్‌కు గులాబీ దండు జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లకు పార్టీపరంగా ఇన్చార్జిల నియామకంపై కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఇన్చార్జిల జాబితాపై స్పష్టత రాగా... ఒకటి రెండు రోజుల్లో ఏయే డివిజన్లో ఎవరు పనిచేస్తారనే అంశంపై స్పష్టత రానుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ వ్యూహాన్ని సమర్థవంతంగా అమలు చేసే సత్తా ఉన్న ఎమ్మెల్సీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో పాటు ఒకరిద్దరు కార్పొరేషన్ ఛైర్మన్ల్లకు డివిజన్ ఇన్చార్జిలుగా బాధ్యతలు అప్పగిస్తారు. మంత్రులు కూడా కేవలం ఒక్కో డివిజన్‌కు మాత్రమే ఇన్చార్జిలుగా వ్యవహరిస్తారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు వంటి జిల్లా స్థాయి ప్రజాప్రతినిధులతో పాటు పార్టీ రాష్ట్ర యంత్రాంగమంతా జీహెచ్ఎంసీలో మకాం వేసి ప్రచారం నిర్వహిస్తారు. ఇప్పటికే మూడు విడతలుగా సర్వే జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే మూడు విడతలుగా పార్టీ పరిస్థితి, కార్పొరేటర్ల పనితీరు... తదితరాలపై టీఆర్ఎస్ సర్వే నిర్వహించింది. గతంలోనే నియోజకవర్గాల వారీగా నియమితులైన పార్టీ ప్రధాన కార్యదర్శులు ఈ సర్వేలో కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. ఈ నివేదికల ఆధారంగా ఇప్పటికే పార్టీ పరిస్థితిపై డివిజన్ల వారీగా పార్టీ అధినేత ఓ అంచనాకు వచ్చినట్లు తెలిసింది. పనితీరు సరిగా లేని కార్పొరేటర్లను పక్కన పెట్టి అవసరమైతే కొత్త వారికి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. విపక్షంలో బలమైన నాయకులు ఎవరైనా ఉంటే వారిని పార్టీలోకి రప్పించడంపైనా దృష్టి పెట్టాలని భావిస్తోంది. సుమారు 15 మంది పార్టీ కార్పొరేటర్ల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని గతంలోనే కేటీఆర్ వెల్లడించిన నేపథ్యంలో చాలా చోట్ల ఔత్సాహికుల నుంచి టికెట్ల కోసం ఒత్తిళ్లు ప్రారంభమయ్యాయి. ఇన్చార్జిల నుంచి మరోమారు నివేదికలు తీసుకుని, షెడ్యూలు వెలువడిన తర్వాత సీఎం, కేటీఆర్ వారితో మరోమారు సమావేశమవుతారు. -
జీహెచ్ఎంసీ చట్టసవరణ బిల్లుకు ఆమోదం
-
గ్రేటర్లో బ్యాలెట్టే
సాక్షి, హైదరాబాద్ : కరోనా మహమ్మారి నేపథ్యంలో జీహెచ్ఎంసీ సహా ఎన్నికలు జరగని పట్టణ స్థానిక సంస్థలకు బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్ పేపర్లతో పోలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ప్రకటించింది. ఎన్నికల నిర్వహణకు అందుబాటులో ఉన్న సమయం, వివిధ అంశాలపై రాజకీయ పార్టీలు వెలిబుచ్చిన అభిప్రాయాలు, ఇతరత్రా విషయాలపై సవివరంగా చర్చించాక ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడిం చింది. జీహెచ్ఎంసీ ఎన్నికలను బ్యాలెట్ బాక్స్‌లు, పత్రాలు లేదా ఈవీఎంలతో నిర్వహించాలన్న దానిపై రాష్ట్రంలో గుర్తింపు పొందిన 11 రాజకీయ పార్టీలు, ఎస్ఈసీ వద్ద రిజిస్టర్ అయి రిజర్వ్ సింబల్స్ పొందిన 39 రాజకీయ పార్టీల అభిప్రాయాలను కోరినట్లు ఎస్ఈసీ తెలిపింది. దీనిపై స్పందించిన 8 గుర్తింపు పొందిన పార్టీల్లో ఐదు బ్యాలెట్ బాక్స్ వైపే మొగ్గుచూపగా ఒక పార్టీ ఈవీఎం ద్వారా ఎన్నికలకు మొగ్గుచూపింది. అలాగే 18 రిజిస్టర్డ్ పార్టీల్లో 11 బ్యాలెట్ బాక్స్‌ల ద్వారానే ఎన్నికలు జరపాలని కోరగా, రెండు పార్టీలు ఈవీఎంల వైపు మొగ్గుచూపాయని తెలి పింది. మిగతా 7 పార్టీలు ఎలాంటి అభిప్రాయాన్ని వెల్లడించలేదని ఎస్ఈసీ పేర్కొంది. బ్యాలెట్‌తో పోల్చితే ఈవీఎంలతో ఎన్నికల వల్ల కరోనా వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. అందుబాటులో లేని వీవీప్యాట్లు... ఈవీఎంలకు వీవీప్యాట్ మెషీన్లను అనుసంధానించాలన్న సుప్రీం తీర్పు నేపథ్యంలో తమ వద్ద వీవీప్యాట్లు అందుబాటులో లేకపోవడంతో వాటి కోసం హైదరాబాద్ ఈసీఐఎల్, బెంగళూరు బీఈఎల్ల నుంచి కొటేషన్లు కోరామని ఎస్ఈసీ వివరించింది. అయితే దీనిపై వీవీప్యాట్ల తయారీకి ఢిల్లీలోని ఈసీ అనుమతి కోరుతూ ఆయా సంస్థలు లేఖలు రాశాయని, ఈసీ నుంచి ఇంకా జవాబు రావాల్సి ఉందని తెలిపింది. వీవీప్యాట్లు అందుబాటులో లేని కారణంగానే 2019లో గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు, 2020 మొదట్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ బాక్స్‌లతో నిర్వహించిన విషయాన్ని ఎస్ఈసీ ఈ సందర్భంగా గుర్తుచేసింది. ఈవీఎం, వీవీప్యాట్లతో హైరిస్క్ వల్లే.. ఎన్నికల్లో ఈవీఎంలు, వీవీప్యాట్ల వినియోగానికి ముందు వివిధ ప్రక్రియలు పూర్తిచేయాల్సి ఉందని, అన్ని దశల్లోనూ తయారీదారుల పక్షాన పెద్ద సంఖ్యలో ఇంజనీర్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల సిబ్బంది ప్రమేయం ఉంటుందని ఎస్ఈసీ పేర్కొంది. అంతేకాకుండా మూసి ఉంచిన గదుల్లో ఈవీఎంలు, వీవీప్యాట్లను శుభ్రం చేయడం, కట్టి ఉంచిన మిషన్లను తెరవడం, మళ్లీ ప్యాక్ చేయడం వంటి పనుల్లో భారీగా సిబ్బందిని నియమించాల్సి వస్తుందని తెలియజేసింది. ఈ విధంగా ‘హైరిస్క్ కమ్యూనిటీ’గా ఉన్న వారిని భాగస్వాములను చేయడం ద్వారా ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తికి అధిక అవకాశాలున్నాయని భావిస్తున్నట్లు ఎస్ఈసీ తెలిపింది. బ్యాలెట్ బాక్స్‌లు, ఈవీఎంలకు సంబంధించి... 1989లో ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని పార్లమెంట్ సవరించాక ఎన్నికల్లో ఈవీఎంల వినియోగానికి వీలు ఏర్పడింది. 2001లో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వాటిని పూర్తిస్థాయిలో వినియోగించారు. ఆ తర్వాత జరిగిన ప్రతి అసెంబ్లీ ఎన్నికలతోపాటు 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలను ఈవీఎంలతో నిర్వహించారు. 1995 నుంచి 2019 వరకు జరిగిన అన్ని గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్ బాక్స్‌లతోనే జరిగాయి. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు 1995, 2000లో బ్యాలెట్ బాక్స్‌లతో... 2005, 2014లలో జరిగిన ఎన్నికలను ఎస్ఈసీ ఈవీఎంలతో(వీవీప్యాట్లు లేకుండా) నిర్వహించింది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి మొదటి సాధారణ ఎన్నికలను 2002లో బ్యాలెట్ బాక్స్‌లతో, 2009, 2016 ఎన్నికలు ఈవీఎంలతో(వీవీప్యాట్లు లేకుండా) జరిగాయి. -
బ్యాలెట్ విధానంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు
-
విష వలయంగా రాజధాని: కేసీఆర్
♦ సరిదిద్దేందుకు నడుం బిగించండి ♦ ప్రజాప్రతినిధులు, అధికారులతో ముఖ్యమంత్రి ♦ 11 నుంచి కార్పొరేటర్లకు శిక్షణ ♦ జీహెచ్ఎంసీ, పురపాలక శాఖపై సమీక్ష సాక్షి, హైదరాబాద్: ‘‘హైదరాబాద్ నగరం ఓ విష వలయంగా మారింది. దీన్నించి నగర ప్రజలను బయట పడేయాలి. నగరం ఎట్లుండేది, ఎట్లుండాలనే అంశాలను బేరీజు వేసుకుని కార్యాచరణ రూపొందించుకోవాలి’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. ‘‘కాంట్రాక్టర్లు ముఠాలుగా ఏర్పడి చేసే దోపిడీకి అడ్డుకట్ట వేయాలి. నగరంలో కాపిటల్ అసెట్స్ పెరగడానికి, రోడ్లు బాగుపడడానికి జీహెచ్ఎంసీ నిధులు కేటాయించాలి. చెత్త, శిథిలాల తొలగింపు, నిధుల వినియోగం, పచ్చదనం, పారిశుద్ధ్యం, భూగర్భ డ్రైనేజీ తదితరాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ జరగాలి. నగరంతో పాటు అందులో విలీనమైన మున్సిపాలిటీల అభివద్ధికి ప్రణాళికలు సిద్ధం కావాలి. మంజూరైన మల్టీ లెవల్ ఫ్లై ఓవర్లు, బస్ బేస్, మార్కెట్లు, పబ్లిక్ టాయిలెట్లు, శ్మశానవాటికల నిర్మాణ పనుల పురోగతిపై దృష్టి పెట్టండి. హైదరాబాద్‌ను మురికివాడల రహిత నగరంగా మార్చే ప్రణాళికను అమలు చేయండి. ప్రతి ఐదు వేల మందికి ఒక ప్రజా కమిటీ పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జీహెచ్ఎంసీలో భాగంగానే కంటోన్మెంట్‌నూ అభివద్ధి చేయండి’’ అని అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీతో పాటు పురపాలక శాఖపై కేసీఆర్ సోమవారం క్యాంపు కార్యాలయంలో సమీక్షనిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి కడియ శ్రీహరి, పురపాలక మంత్రి కె.తారక రామారావు, మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, పద్మారావు గౌడ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు ఓ సునామీలా ఓట్లేసి టీఆర్ఎస్ పార్టీని గెలిపించారని, వారందరి నమ్మకాన్ని నిలబెట్టేల పని చేయాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలు గుర్తెరిగి ప్రజల కోసం పనిచేయాలన్నారు. గత ప్రభుత్వాల విధానాల వల్ల జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి దిగజారిందని ఈ సందర్భంగా సీఎం అన్నారు. వ్యయ ప్రయాసలకోర్చి కరెంటు ఇస్తున్నామని, ఈ విషయాన్ని పారిశ్రామికవేత్తలకు విడమరిచి వారి లో విశ్వాసం నింపాలని చెప్పారు. ‘‘జీహెచ్ఎంసీలో ప్రతి నియోజకవర్గంలో 4,700 డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని చెప్పాం. ఇది ఫలించాలంటే ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కలిసి పనిచేయాలి. అలాగని ప్రతిజ్ఞ చేయాలి. టీం వర్క్ చేయాలి. బృందాలుగా ఏర్పడి హైదరాబాద్‌లో జరగాల్సిన, జరుగుతున్న పనులను పర్యవేక్షించాలి. అందరం కలిస్తే ఏదైనా చేయవచ్చు’’ అని పిలుపునిచ్చారు. కార్పొరేటర్లకు శిక్షణ భావి అవసరాలకు తగ్గట్లు హైదరాబాద్‌ను తీర్చిదిద్దాల్సిన తక్షణ కర్తవ్యం నగర కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులపై ఉం దని సీఎం అన్నారు. చిత్తశుద్ధి, అంకితభావంతో పనిచేయాలని కార్పొరేటర్లకు సూచించారు. ఈ నెల 11, 12 తేదీల్లో హైదరాబాద్ కార్పొరేటర్లకు, 13న వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం కార్పొరేటర్లకు ‘ఆడ్మినిస్ట్రేటీవ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా’(ఆస్కీ) ఆధ్వర్యంలో ప్రగతి రిసార్ట్స్‌లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. శిక్షణ తరగతుల్లో కార్పొరేటర్లను ఏ విధంగా కార్యోన్ముఖులు చేయాలనే అంశంపై ఎజెండా రూపొందించాలని అధికారులను కోరారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వీటిలో పాల్గొనాలన్నారు. ‘‘నాగపూర్, ముంబై, ఢిల్లీ తదితర నగరాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అధ్యయనం చేయండి. ఆయా కార్పొరేషన్ల మేయర్లు, కమిషనర్లను శిక్షణ తరగతులకు పిలిచి వారి అనుభవాలు పంచుకోండి’’ అని సూచించారు. -
తెలంగాణలో బీజేపీది ఇక ఒంటరిపోరే!
♦ టీడీపీ పొత్తుతో ఎదగలేమన్న కమలనాథులు ♦ 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తామన్న దత్తాత్రేయ ♦ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి సగం మంది డుమ్మా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అవసానదశకు చేరుకున్న తెలుగుదేశంపార్టీతో పొత్తు కొనసాగిస్తే భారతీయ జనతా పార్టీకి నూకలు చెల్లినట్టేనని కమలనాథులు అభిప్రాయపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ బలాన్ని ఎక్కువ ఊహించుకొని బోల్తాపడ్డామని, సైద్ధాంతికంగా బీజేపీకి అండగా నిలిచేవారు కూడా తెలుగుదేశం కారణంగా దూరమవుతున్నారని ఆ పార్టీ నాయకులు కుండ బద్దలు కొట్టారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం పార్టీ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం నగర శివార్లలోని కొంపల్లిలో జరిగింది. సమావేశానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో పాటు పలువురు నేతలు హాజరయినప్పటికీ, సగానికిపైగా కార్యవర్గం డుమ్మా కొట్టింది. కాగా ఈ సమావేశంలో పాల్గొన్న నేతలు టీడీపీతో పొత్తును తెగదెంపులు చేసుకుంటేనే బీజేపీ రాష్ట్రంలో ఎదుగుతుందని ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో అధికార పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకుంటే 2019 ఎన్నికల నాటికి బీజేపీ బలమైన శక్తిగా మారుతుందని పలువురు పేర్కొన్నారు. ‘దేశంలో మోదీ ప్రభంజనం ఉన్నా, రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి దిగ జారడానికి టీడీపీతో పొత్తే కారణం’ అని పేర్కొన్నట్లు తెలిసింది. సమావేశానికి ముందు, అనంతరం కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల విశ్వాసాన్ని చూరగొంటేనే ప్రజాస్వామ్య స్ఫూర్తిని సంపాదించినట్లు అవుతుందని, ఏకపక్ష ధోరణిలో వెళితే మాత్రం అభివృద్ధి కుంటుపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కరువు వైఫల్యాలు, అనేక అంశాలపై నిలదీస్తూనే ఉంటామని, రాష్ట్రంలో పైకి ఆదర్శప్రాయ వాతావరణం కనిపిస్తున్నా ప్రత్యక్షంగా ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై పోరాడతామన్నారు. సగానికి పైగా డుమ్మా! బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి పలువురు ముఖ్యమైన నాయకులతోపాటు సగం మంది కార్యవర్గ సభ్యులు డుమ్మా కొట్టారు. పార్టీ అంతర్గతపోరులో భాగంగా కొంతకాలంగా అంటీముట్టనట్లుగా ఉం టున్న మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌తోపాటు పార్టీ ఆఫీసు బేరర్లు రామకృష్ణారెడ్డి, వెంకటరమణి, కుమార్ వంటి నాయకులు గైర్హాజరయ్యారు. సుమారు 330 మందితో గల రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి 153 మంది మాత్రమే హాజరయ్యారు. ఇక ప్రజాక్షేత్రంలో పోరుబాటే! తెలంగాణలో బలమైనశక్తిగా మారిన టీఆర్ఎస్ను ఎదుర్కోవాలంటే పోరుబాట ఒక్కటే శరణ్యమని బీజేపీ నేతలు గుర్తించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14 నుంచి 24న జరిగే పంచాయతీ దివస్ వరకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. సామాజిక సామరస్యత పేరుతో నాలుగు రోజులపాటు అంబేడ్కర్ విగ్రహాలను శుభ్రపరచడం, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, గ్రామ రైతుసభల పేరుతో 17 నుంచి 20వ తేదీ వరకు పర్యటించడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. -
విశ్వ రూపిణి
విద్య, వైద్య, ఐటీ రంగాల్లో స్త్రీలే టాప్ నేడు మహిళా దినోత్సవం ‘ఆకాశంలో సగం... అవకాశాల్లో సగం’ అనే మాట మహిళల విషయంలో పాతబడి పోయింది. అవకాశాల్లోనూ అధికులమని నిరూపిస్తున్నారు. అవని నుంచి అంతరిక్షం వరకూ ప్రతిచోటా తమ ముద్ర వేస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల పగ్గాలు చేపట్టి.. వ్యాపార సామ్రాజ్యంలో మహరాణులుగా ఎద గడమే కాదు... పాలనలో సైతం పురుషులకు తీసిపోమని నిరూపిస్తున్నారు. కార్పొరేటర్లుగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని... భాగ్యనగరిని ‘విశ్వ’నగరిగా తీర్చిదిద్దే క్రతువులో భాగస్వాములయ్యేందుకు తమదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. సిటీబ్యూరో: ‘విశ్వ’మంత ఆశయంతో... వినూత్న వేగంతో... మహా నగరి మహిళలు దూసుకుపోతున్నారు. అవాంతరాలను... అడ్డంకులను... ఎదుగుదలకు మెట్లుగా మలచుకొని మునుముందుకు సాగుతున్నారు. రాజకీయాలు... సేవ.. క్రీడలు... ఉద్యోగ... పారిశ్రామిక రంగాల్లో ప్రత్యేక ముద్ర వేస్తున్నారు. దేశంలోని మెట్రో నగరాల స్త్రీలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రాజకీయాలనే తీసుకుంటే ఇటీవలి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏకంగా 79 మంది (మొత్తం 150 స్థానాలు) కార్పొరేటర్లుగా ఎన్నికై... స్థానిక పరిపాలనలో కొత్త చరిత్ర సృష్టించారు. గతంలో ఉన్న కోటాను 33 నుంచి 50 శాతానికి పెంచాక... నిర్వహించిన ఎన్నికల్లో తమకు కేటాయించిన 75 స్థానాలతో పాటు అదనంగా బంజారాహిల్స్, వెంకటాపురం, ఫలక్‌నూమా, బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్లలో మహిళలే ఎన్నికయ్యారు.ఈ ప్రభావం వచ్చే సాధారణ ఎన్నికలపై పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మహిళా ఎంపీలు... ఎమ్మెల్యేలు నవ చరిత్రను లిఖించే రోజులు సమీప భవిష్యత్తులోనే సాకారం కాబోతున్నాయనడంలో సందేహం లేదు. సేవల్లో టాప్ నగరంలో స్త్రీ-పురుష నిష్పత్తిలో ఆందోళనకర గణాంకాలు (954-1000) ఉన్నా... విద్య.. ఐటీ.. వైద్య రంగాల్లోసేవలందిస్తున్న మహిళల సంఖ్య తారస్థాయికి చేరుకుంది. వైద్య రంగంలో మహిళల సంఖ్య 60 శాతం దాటగా... ప్రైవేటు పాఠశాలల నిర్వహణ, విద్యా బోధనలోనగర మహిళలు 50 శాతాన్ని మించిపోయారు. హైదరాబాద్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఐటీ సర్వీసుల్లోనూ మహిళా ఉద్యోగుల సంఖ్య మగాళ్లను దాటే స్థాయికి చేరిందని ఇటీవల ఒక ప్రముఖ సంస్థ అంచనా వేసింది. ఇవి కాకుండా బీపీఓ, ఆతిథ్య, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లోనూ మహిళల శాతం గణనీయంగా పెరిగింది. పురుషులతో పోలిస్తే మహిళల్లో అంకితభావం... సమయ పాలన... క్రమశిక్షణ అధికంగా ఉంటోందని... ఈ నేపథ్యంలోనే వివిధ యాజమాన్యాలు మహిళా ఉద్యోగినుల ఎంపికకే ప్రాధాన్యమిస్తున్నాయని హెచ్ఆర్ కన్సల్టెంట్లు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల పోలీస్ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం కేటాయించడంతో వారి సంఖ్య పోలీస్ విభాగంలోనూ భారీగా పెరగనుంది. ప్రస్తుతం పోలీస్ శాఖలో మహిళా ఉద్యోగుల సంఖ్య ఐదు శాతం లోపే. ఇటీవలే పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడటంతో నగర మహిళలు ఆ అవకాశాన్ని అందుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. చదువులోనూ పైచేయి గ్రేటర్‌లోనూ... జంట జిల్లాల పరిధిలోనూ అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే చదువులో పైచేయి సాధిస్తుండడం గమనార్హం. హైదరాబాద్‌లో గత ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షల్లో అబ్బాయిలు కేవలం 56 శాతం పాసైతే.... అమ్మాయిలు 73 శాతం.... రంగారెడ్డి జిల్లాలో అబ్బాయిలు 71 శాతం... అమ్మాయిలు 78.89 శాతం ఉత్తీర్ణులు కావడం... వారి ప్రతిభను చాటి చెబుతోంది. టెన్త్‌లోనూ అమ్మాయిల ఉత్తీర్ణత అబ్బాయిల కంటే పది శాతం అధికంగా నమోదు కావడం విశేషం. ‘ఎక్స్పో’జర్ అతివలకే ఆమెదే ఆధిపత్యం లైఫ్‌స్టైల్‌ప్రతినిధి: నగర మహిళలు అడుగు పెట్టని రంగం దాదాపు లేదనే చెప్పాలి. కొన్ని రంగాల్లో మగవారిని తోసిరాజని మరీ దూసుకుపోతున్నారు. అదే స్థాయిలో విజయాలు సాధిస్తున్నారు. నగరంలో మహిళల ఆధిక్యానికి అద్దం పట్టే రంగాలు, అంశాల్లో కొన్ని... నగరంలో ఈవెంట్ మేనేజ్మెంట్ రంగంలో మహిళల ఆధిపత్యం సుస్పష్టం. రాష్ట్ర స్థాయిలో పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని నిర్వహిస్తున్న రాఖీ కంకారియా ఈ రంగంలో రాణించాలనుకునే వారి కోసం అకాడమీని నెలకొల్పారు. ఈవెంట్ మేనేజర్లుగా రాణిస్తున్న మగవారు ఉన్నప్పటికీ కొన్ని ఈవెంట్లు పూర్తిగా మహిళాధిక్యాన్ని కనబరుస్తున్నాయి. స్టార్ హోటళ్లు, క్లబ్బులలో విభిన్న రకాల ఉత్పత్తులు విక్రయించే ఎక్స్‌పోల నిర్వహణలో మహిళలదే పైచేయిగా చెప్పాలి. వహ్వా... పీఆర్వో... మీడియాకు, ప్రజలకు మధ్య వారథిగా.. చెరగని చిరునవ్వుతో... ఆకట్టుకునే సంభాషణా చాతుర్యంతో విధులు నిర్వర్తించే పీఆర్వో విభాగంలో మహిళల హవా నడుస్తోంది. నగరంలో పదుల సంఖ్యలో ఉన్న పీఆర్ ఏజెన్సీలలో అమ్మాయిలే అధిక సంఖ్యలో కనిపిస్తారు. మీడియా సంబంధాలు నెరపేందుకు సంస్థాగతంగానూ, వ్యక్తిగత పీఆర్వోలుగానూ మహిళలనే నియమించుకోవడానికి పలువురు ప్రముఖులు ఆసక్తి చూపుతున్నారు. ఫ్యాషన్‌లో ఓషన్‌లా... సిటీలో ఫ్యాషన్ అనుబంధ రంగాలు పుంజుకోవడంతో పాటు వాటిలో మహిళల ఆధిపత్యమూ పెరుగుతోంది. స్త్రీ, పురుష డిజైనర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన డిజైనర్లలో వర్ష, శిల్పారెడ్డి, అనుశ్రీరెడ్డి తదితర మహిళలే ముందున్నారు. సిటీలో పేరొందిన డిజైనింగ్ స్కూల్స్ అన్నీ దాదాపు మహిళలు నిర్వహిస్తున్నవే. గాలిలో తేలిపోతూ... గాలిలో ఎగిరే ఎయిర్ హోస్టెస్ జాబ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన నగరానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకతో... ఇక్కడి అమ్మాయిల్లోనూ అనేక మందిలో ఎయిర్ హోస్టెస్ ఉద్యోగంపై ఆసక్తి పెరిగింది. దీనికి అనుగుణంగానే వారికి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్జే.. జేజే ‘గుడ్‌మార్నింగ్ హైదరాబాద్’ అంటూ పలకరింపులు మొదలుపెట్టి ‘ఇది చాలా హాట్ గురూ’ వంటి చమత్కారాలతో శ్రోతలను అలరించే రేడియో జాకీల హవా మొదలై దాదాపు దశాబ్దం కావస్తోంది. ఈ రంగంలో మగవాళ్లు ఉన్నప్పటికీ సిటీలో అత్యధిక ఆదాయం ఆర్జించే ఆర్జేల్లో మహిళలేఎక్కువని చెప్పాలి. భార్గవి, ప్రతీక వంటి కొందరు సినిమా స్టార్లతో సమానంగా ఆదరణ పొందుతున్నారు. ప్రమోటర్‌గా సూపర్ వివిధ ఈవెంట్లలో, పెద్ద పెద్ద సమావేశాల్లో అతిథులను పలుకరిస్తూ, వారికి అవసరమైన సరంజామాను అందిస్తూ చిరునవ్వుతో సందడి చేస్తారు ప్రమోటర్స్. నగరంలో వేల సంఖ్యలో ప్రమోటర్స్ ఉన్నారు. ఈ రంగంలోనూ అమ్మాయిలకే డిమాండ్ ఎక్కువని ఈవెంట్ మేనేజర్ రాజ్‌కిషోర్ చెప్పారు. -
రాజీనామాలుండవు... తొలగింపులే...!
జాతీయ పార్టీ, కొన్ని దశాబ్దాల పాటు దేశాన్ని ఏలిన తమ పార్టీ నాయకత్వం తీరే చిత్రవిచిత్రంగా ఉంటుందని కాంగ్రెస్‌పార్టీ నాయకులే గొణుక్కుంటున్నారట. రాష్ర్టంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ జీహేచ్ఎంసీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లకే పరిమితమైన తీరు పట్ల జాతీయనాయకులు సైతం విస్మయం వ్యక్తంచేశారు. ప్రత్యేక రాష్ర్టంగా తెలంగాణను ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు ఇదేమి గతి అంటూ కూడా రాష్ట్రనాయకుల తీరుపై ఒకింత అసహనం కూడా వెలిబుచ్చుతున్నారట. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత టీపీసీసీ ముఖ్యనేత ఒకరు ఢిల్లీ వెళ్లి పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అపాయింట్మెంట్ను కోరారట. అపాయింట్మెంట్ అయితే దొరకలేదు కాని అసలు ఎందుకు కలవాలని అనుకుంటున్నారో చెప్పాలని గట్టిగా అడిగారట. ఆ విషయాన్ని సోనియాగాంధీకే చెబుతానని సదరు నేత చెప్పినా అదేం కుదరదు కారణం చెప్పాల్సిందేనంటూ ఢిల్లీనేతలు రెట్టించారట. జీహేచ్ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పేందుకే అపాయింట్మెంట్ కోరానని ఆ ముఖ్యనేత అసలు విషయం బయటపెట్టారట. దీనికి ప్రతిగా రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఆ పరిస్థితి వచ్చినపుడు తామే పిలిపిస్తామని అధిష్టానం దూతలు ఆ నేతకు చెప్పి పంపించేశారట. కాంగ్రెస్‌లో పార్టీ అధ్యక్షులు రాజీనామాలు చేయడమంటూ ఉండదని, తొలగింపులే ఉంటాయనేది దీనివెనక అసలు రహస్యమని రాష్ర్టపార్టీ నేతలు చెవులు కొరుక్కోవడం కొసమెరుపు. -
అక్రమ పద్ధతులతో టీఆర్ఎస్ రాజకీయం: టీడీపీ
సాక్షి, హైదరాబాద్: అక్రమ పద్ధతుల ద్వారా రాజకీయాలు చేయడమే టీఆర్ఎస్ పార్టీకి తెలిసిన విద్య అని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. అధికారంలో రావడానికి సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకున్న టీఆర్ఎస్, ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిందని ఆ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కర్నాటి విద్యాసాగర్ ఒక ప్రకటనలో విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏకంగా ఈవీఎంలనే ట్యాంపరింగ్ చేసిందని ఆయన ఆరోపించారు. ఏ ఎన్నికలు వచ్చినా ప్రలోభాలకు దిగి బెదిరించడం, దౌర్జన్యం చేయడం ద్వారా పైచేయి సాధించిందని, ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు దక్షిణ భారతదేశంలో తెలంగాణలో అత్యధికంగా నమోదు కావడమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. -
రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడి రాజీనామా
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీ నామా లేఖను టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డికి సోమవారం పంపించారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం బాధాకరమని, ఈ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ చేస్తున్న రాజీనామాను ఆమోదించాలని ఆ లేఖలో మల్లేశం కోరారు. ఇదిలా ఉండగా బల్దియా ఎన్నికల్లో ఓటమి కాంగ్రెస్‌లో చిచ్చు రేపుతోంది. పార్టీ పరాజయం నేపథ్యంలో ఇన్నాళ్లూ పార్టీలో ఉన్న విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. పలువురు పార్టీ నేతలు డీసీసీ అధ్యకుడు క్యామపై మాటల దాడికి దిగడంతో ఆయన మనస్తాపం చెంది అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు తెలిసింది. అలాగే పార్టీ అధిష్టానం నుంచి రాజీనామా చేయాలని ఒత్తిడి రావడంతో ఆయనీ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దానం రాజీనామా ఆమోదం: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు దానం నాగేందర్ చేసిన రాజీనామా ఆమోదానికి అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దానం రాజీనామాను ఆమోదించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ నుంచి సూచనలు అందినట్లుగా తెలిసింది. దీంతో నేడో, రేపో దానం రాజీనామాకు ఆమోదముద్ర వేయనున్నట్లు టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. -
'వాళ్లది రోల్డు గోల్డ్ విజయం'
హైదరాబాద్: జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని కాంగ్రెస్ నాయకుడు, తెలంగాణ శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ తెలిపారు. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు ఇస్తామని చెప్పారు. టీఆర్ఎస్ గెలుపు రోల్డు గోల్డ్ బంగారం తీరుగా ఉందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలపై జనం చాలా ఆశలు పెట్టుకున్నారని, లక్ష ఇళ్ల నిర్మాణం సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని కోరారు. ఇళ్ల నిర్మాణంపై ఇచ్చిన హామీని టీఆర్ఎస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందనే నమ్మకం తనకు లేదన్నారు. గతంలో ఇళ్ల నిర్మాణంపై ఇచ్చిన హామీకి, బడ్జెట్ లో నిధులు కేటాయింపుకు పొంతన లేదని గుర్తు చేశారు. నాడు సాధ్యం కానిది ఇప్పుడు ఎలా సాధ్యమవు తుందని ఆయన ప్రశ్నించారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి నాయకులందరూ సమిష్టి బాధ్యత వహించాలని అన్నారు. ఈవిఎంల ట్యాంపరింగ్ పై పీసీసీ ఐటీ సెల్ ఆధారాలు సేకరిస్తోందని చెప్పారు. -
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్
కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సీఎం కేసీఆర్‌తో కుమ్మక్కయ్యారు నోటా బటన్, ఈవీఎంలకు ప్రింటింగ్ మిషన్లు ఎందుకు ఏర్పాటు చేయలేదు ఎన్నికల అవకతవకలపై ఈసీ దృష్టికి తీసుకెళ్తాం సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబద్ మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ కోసం ఉపయోగించిన ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న అనుమానాలు రోజురోజుకు బలపడుతున్నాయని కాంగ్రెస్ ముఖ్య అధికారప్రతినిధి దాసోజు శ్రావణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఓటింగ్ యంత్రాల్లో అవకతవకలు జరిగినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని, వాటిని కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టి తీసుకెళ్లడంతో పాటు న్యాయస్థానాల్లోనూ ఫిర్యాదు చేస్తామన్నారు. గాంధీభవన్‌లో మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డితో కలసి ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చని ఎన్నికల నిఘా సంస్థ నేత వీవీ రావ్ రుజువు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఓటింగ్ యంత్రాలకు ప్రింటింగ్ మిషన్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగానే బిహార్, ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఈవీఎంలకు ప్రింటింగ్ మిషన్లను అమర్చారు’ అని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈవీఎంలకు ప్రిటింగ్ మిషన్లను ఎందుకు అమర్చలేదని, అలాగే ఈవీఎంలలో నోటా బటన్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. దీన్నిబట్టి చూస్తే రాష్ట్రంలో ఎన్నికల ప్రధానాధికారి, సీఎం కేసీఆర్‌తో కుమ్మక్కైనట్లు తెలుస్తోందని ఆరోపించారు. 2010 ఉప ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ పెట్టాలంటూ టీఆర్ఎస్ నేత ఎస్.నిరంజన్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, అప్పట్లో ఈసీ సమర్థించకపోతే ఒక్కో నియోజకవర్గంలో 100 మంది చేత నామినేషన్ దాఖలు చేయించారని శ్రావణ్ చెప్పారు. జాంబాగ్‌లో తమ పార్టీ అభ్యర్థి విక్రమ్‌గౌడ్ కుటుంబ సభ్యుల ఓట్లు ఒక పోలింగ్‌బూత్ పరిధిలో 125 ఓట్లు ఉంటే కేవలం 20 ఓట్లు మాత్రమే పోలయ్యాయన్నారు. 142వ డివిజన్ అడ్డగుట్టలో ఒక పోలింగ్ కేంద్రంలో 556 ఓట్లు పోలైతే... లెక్కింపులో 992 ఓట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ట్యాంపరింగ్ జరిగిందనడానికి ఇంత కంటే నిదర్శనం ఏం కావాలన్నారు. ఎన్నికలకు ముందే టీఆర్ఎస్కు వంద సీట్లు, తమ మిత్రపక్షం ఎంఐఎంకు 45 సీట్లు వస్తాయని కచ్చితంగా ఎలా చెప్పగలిగారని ఆయన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థులందరూ సోమవారం గాంధీభవన్‌కు రావాలని కోరారు. డివిజన్ వారీగా పోలైన ఓట్లపై సమీక్ష జరిపి తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని శ్రావణ్ చెప్పారు. -
ఏ పూలతో నిను కొలిచినా...
కొండంత దేవునికి కొండంత పత్రితో పూజ చేయలేకపోయినా, పరిపూర్ణ మనసుతో మదిలో తలచుకుంటే చాలునని నాయకులందరూ చదువుకున్నవారే. ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులకు, నాయకులకు సహజంగా ఓటరే దేవుడు. ఓటరు దేవుడ్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలనే విషయంలో ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క పద్ధతిని అనుసరించడమూ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఆనవాయితీగా వస్తోంది. గ్రామాల్లో అయితే ఒక ఓటరుపై ఒక అంచనా ఉంటుంది. గ్రేటర్ ఎన్నికల్లో ఓటరు మనసును గెలుచుకోవడానికి మార్గం తెలియక చాలామంది అభ్యర్థులు అవస్థలు పడగా, కొందరైతే ఎదురుదెబ్బలు తిన్నారట. శివారుప్రాంతంలోని ఒక డివిజనులో రిటైర్డు మిలిటరీ ఆఫీసరును మచ్చిక చేసుకోవడానికి పోటీచేసిన అభ్యర్థి ఒకరు సాయంత్రం పూట వస్తానని టైం తీసుకుని కలిశారట. ఎన్నికల్లో మద్దతుకోసం వట్టి చేతులతో పోవడం ఎట్లా అని ఒక మోస్తరు మందుబాటిల్ తీసుకుని వెళ్లాడట. పది నిమిషాలు మంచిచెడూ మాట్లాడిన తర్వాత ఈ అభ్యర్థి తీసుకుపోయిన బాటిల్‌ను టేబుల్ మీద పెట్టాడట. ఆ బాటిల్‌ను కింద నుంచి మీదకు చూసిన ఆ మిలిటరీ ఆఫీసరు తన పనిమనిషిని పిలిచి ఇంటిలో ఉన్న బాటిల్‌ను తెమ్మన్నాడట. మిలిటరీ ఆఫీసరు తెచ్చిన చాలా ఖరీదైన మందుసీసాను పనిమనిషితో మూత తెరిపించి, పోటీచేస్తున్న అభ్యర్థి తెచ్చిన బాటిల్‌ను తాగుపో అని పనిమనిషికి ఇచ్చాడట. మద్దతు అడగడానికి వచ్చిన ఆ అభ్యర్థి మారుమాట్లాడకుండా మిలిటరీ అధికారి చెప్పిన మాటలు విని, పోసిన మందు తాగి బయటపడ్డాడట. -
డిప్యూటీ సీఎం ఇలాకాలో పతంగి పాగా
మలక్‌పేట... దిల్సుఖ్నగర్: మలక్‌పేట్ నియోజకవర్గంలో ఎంఐఎం మరోసారి పట్టు నిలుపుకొంది. మొత్తం 6 డివిజన్లకుగాను నాలుగు డివిజన్లలో ఆ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. గత బల్దియా ఎన్నికల్లో ఎంఐఎం మూడు డివిజన్లు సాధించగా ఈ సారి మరో సీటును అదనంగా గెలుపొందడం విశేషం. కాగా ఇదే నియోజకవర్గ పరిధిలోని ఆజంపురా డివిజన్‌లోనే డిప్యూటీ సీఎం మహమూద్ అలీ నివాసం ఉంది. ఆయన తన సొంత ఇలాకాలో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడంలో విఫలమయ్యారు. గత బల్దియా ఎన్నికల్లో మూడు డివిజన్లలో ఎంఐఎం, మూడు డివిజన్లలో టీడీపీ, ఒక స్థానంలో ఎంబీటీ గెలుపొందింది. ఈసారి పునర్విభజనతో డివిజన్ల సంఖ్య ఆరుకు తగ్గినా ఎంఐఎం తన ప్రాబల్యాన్ని మరింత పెంచుకుంది. కాగా గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అనూహ్యంగా పుంజుకుంది. మూసారాంబాగ్‌లో తీగల సునారితారెడ్డి, సైదాబాద్ నుంచి సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి టీఆర్ఎస్ తరఫున ఘన విజయం సాధించడం విశేషం. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ 11378 ఓట్లు సాధించగా, తాజా ఎన్నికల్లో 26 వేల పైచిలుకు ఓట్లు సాధించి ఓటు బ్యాంక్‌ను గణనీయంగా పెంచుకోగలిగింది. గతంలో నియోజకవర్గంలో తిరుగులేని తెలుగుదేశం పార్టీ ఈ సారి తుడుచుపెట్టుకుపోవడం గమనార్హం. పార్టీ తరఫున హేమాహేమీలు బరిలోకి దిగినా పరాజయం పాలయ్యారు. గత ఎన్నికల్లో అజాంపురా నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికైన ఎంబీటీ నాయకుడు అమ్జదుల్లాఖాన్ ఈ సారి అక్భర్భాగ్ డివిజన్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. -
పట్టు నిలుపుకున్న మజ్లిస్
బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట స్వీప్ యాకుత్‌పురా, చార్మినార్‌లో నాలుగేసి డివిజన్లు కైవసం చార్మినార్: పాతబస్తీలో మజ్లీస్ హవా కొనసాగింది. చార్మినార్, బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా నియోజకవర్గాల్లోని 25 డివిజన్లలో 22 డివిజన్లు తన ఖాతాలో వేసుకొని పాతబస్తీలో జయుకేతనం ఎగురవేసింది . సిట్టింగ్ సీట్లన్నీ తిరిగి కైవసం చేసుకుంది. బహదూర్‌పురా నియోజకవర్గంలోని ఫలక్‌నుమా, నవాబ్‌సాబ్‌కుంట, జహనుమా, కిషన్‌బాగ్, రామ్నాస్పురా, దూద్‌బౌలి తదితర డివిజన్లన్నీ మజ్లీస్ ఖాతాలోకి చేరాయి. చార్మినార్ నియోజకవర్గంలోని మొత్తం ఐదు డివిజన్లలో మొఘల్‌ఫురా, పత్తర్‌గట్టి, శాలిబండ, పురానాపూల్‌లలో మజ్లీస్ అభ్యర్థులు విజయం సాధించగా...ఘాన్సీబజార్ డివిజన్లో మాత్రం బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో చాంద్రాయణగుట్ట, బార్కాస్, రియాసత్‌నగర్, కంచన్‌బాగ్, ఉప్పుగూడ, జంగమ్మెట్, లలితాబాగ్ డివిజన్లను మజ్లీస్ కైవసం చేసుకుంది. గతంలో ఈ డివిజన్లన్నీ మజ్లీస్వే. యాకుత్‌పురా నియోజకవర్గంలో ఏడు డివిజన్లు ఉండగా... డబీర్‌ఫురా, తలాబ్‌చంచలం, సంతోష్‌నగర్, రెయిన్‌బజార్, కుర్మగూడ తదితర ఐదు డివిజన్లను మజ్లీస్ పార్టీ తన ఖాతాలో వేసుకోగా... మిలిగిన గౌలిపురాలో బీజేపీ, ఐ.ఎస్.సదన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. -
శివార్లలోనూ... అదే హోరు!
ఖైరతాబాద్ కారుకు స్పీడెక్కువ ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు మాత్రం టీఆర్ఎస్కు బహ్మ్రారథం పట్టారు. ఈ స్థానంలో టీడీపీ బలపరిచిన బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ కూటమి ఒక్క సీటును కూడా గెలువ లేకపోయింది. నియోజకవర్గ పరిధిలోని ఆరు డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించి , తిరుగులేని అధిక్యతను చాటారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 19,768 ఓట్లు రాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 69,886 ఓట్లు సాధించి, గతం కంటె 50,118 ఓట్ల అధిక్యత సాధించింది. బీజేపీ-టీడీపీ కూటమికి గతంలో 53,102 ఓట్లు రాగా, ఈ ఎన్నికల్లో మాత్రం 35,793 ఓట్లతో సరిపెట్టుకోవాల్సివచ్చింది. కాంగ్రెస్ గత ఎన్నికల్లో 32,256 ఓట్లు రాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం 17,834 ఓట్లు వ చ్చాయి. జూబ్లీహిల్స్‌లో... సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కారు జోరుతో సైకిల్ పంక్చర్ కాగా, కమలం వాడిపోయింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో టీడీపీ-బీజేపీ కూటమికి ప్రజలు కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఈ నియోజకవర్గాల్లో ఆయా పార్టీల ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నా ఒక్క సీటును గెలిపించుకోలేక పోయారు. గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ అధ్యక్షుడు మాగంటి గోపినాథ్ ప్రాతినిథ్యం వహిస్తున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయకు 50,898 ఓట్లు రాగా, టీఆర్ఎస్ 18,436 ఓట్లతో మూడవ స్థానంలో నిలిచింది. ఎంఐఎం 41,656 ఓట్లు సాధించి రెండవ స్థానంలో నిలిచింది. ప్రస్తుత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం 33,634 ఓట్లు సాధించి రెండవ స్థానాన్ని నిలుబెట్టుకున్నా, టీడీపీ-బీజేపి కూటమి 21,329 ఓట్ల చావుదెబ్బతింది. కాంగ్రెస్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో 33,642 ఓట్లు రాగా, ఈ ఎన్నికల్లో మాత్రం 20,135 ఓట్లతో సరిపెట్టుకున్నా గ తంలో కంటే 13,507 ఓట్లు తగ్గాయి. ఈ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లలో టీఆర్ఎస్ నాలుగు, ఎంఐఎం రెండు స్థానాల్లో విజయం సాధించాయి. సికింద్రాబాద్ ఏకపక్ష తీర్పు సికింద్రాబాద్: సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలు ఏకపక్ష తీర్పు ఇచ్చారు. తార్నాక మినహా మిగతా నాలుగు డివిజన్లలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పద్మారావుగౌడ్‌కు 36, 600 మెజార్టీ కట్టబెట్టిన లష్కర్ ఓటర్లు ప్రస్తుత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 59,987ఓట్ల భారీ మెజారిటీ ఇచ్చారు. నగరంలోనే రికార్డు సీతాఫల్మండి టీఆర్ఎస్ అభ్యర్థి సామలహేమ భారీ మెజారిటీ సాధించారు. టీడీపీ అభ్యర్థి మేకల కీర్తికి 4208ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి ఆర్.వాణికి 1899ఓట్లు రాగా. సామలహేమ 19,279ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు. డిపాజిట్ దక్కించుకున్న మాజీ మేయర్ నియోజకవర్గ పరిధిలోని తార్నాక డివిజన్ నుంచి పోటీచేసిన గ్రేటర్ మాజీ మేయర్ బండ కార్తీకారెడ్డి మాత్రమే డిపాజిట్ దక్కించుకున్నారు. తార్నాక డివిజన్లో 29,367 ఓట్లు పోలవగా అధికార టీఆర్ఎస్ అభ్యర్థి ఆలకుంట సరస్వతికి 18,051 ఓట్లు పడగా, మాజీ మేయర్ బండ కార్తీకారెడ్డి కేవలం 5110 ఓట్లతో సరిపెట్టుకుని డిపాజిట్ దక్కించుకున్నారు. మట్టికరిచిన మాజీలు నియోజకవర్గంలోని రెండు డివిజన్ల నుంచి ముగ్గురు మాజీ కార్పొరేటర్లు పోటీచేసినా అందరూ పరాజయం పాలయ్యారు. తార్నాక డివిజన్ నుంచి పోటీచేసిన మాజీ మేయర్, కాంగ్రెస్ అభ్యర్థి బండ కార్తీకారెడ్డి, బౌద్దనగర్ డివిజన్ నుంచి ఇద్దరు మాజీ కార్పోటర్లు ఆదం ఉమాదేవి (కాంగ్రెస్), పీ.స్వరూపాగౌడ్ (బీజేపీ)లు పరాజయం పాలయ్యారు. ఐదు డివిజన్లలో విజయదుంధుభి మోగించిన ఐదుగురు మహిళలు రాజకీయాలకు కొత్త కావడం గమనార్హం. ఎల్బీ నగర్... ఎల్బీనగ ర్లో కారు జోరు ఎల్బీనగర్: ఎల్బీనగర్ నియోజకవర్గంలో కారు దూసుకెళ్లింది. ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ కారు స్పీడును ఎక్క డా అందుకోలేకపోయాయి. 11 డివిజన్లకు గాను అన్ని డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. కొన్ని డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు అధికార టీఆర్ఎస్ పార్టీకి చెప్పుకోదగ్గ రీతిలో పోటీ ఇవ్వగలిగారు. సెటిలర్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ఇళ్ల పట్టాల పంపిణీ, ఇంటి స్థలాల క్రమబద్దీకరణ తదితర హామీలు టీఆర్ఎస్ విజయం చేకూర్చాయని భావిస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ గెలుపు బాధ్యతలు తీసుకున్న మంత్రి జగదీష్‌రెడ్డి తమ అభ్యర్థులను గెలిపించుకోవడంలో సఫలీకృతులయ్యారు. కాగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్కు 71791 ఓట్లు రాగా ఈసారి పార్టీ రెట్టింపు స్థాయిలో ఓట్లు దక్కించుకోవడం విశేషం. కాంగ్రెస్‌కు 56489 ఓట్లు, టీడీపీ, బీజేపీ కూటమికి 84,316 ఓట్లు దక్కాయి. తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడంలో ఆయా పార్టీలు విఫలమయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు. హస్తానికి షాక్.. ఇదిలా ఉండగా అన్ని డివిజన్లలోనూ కాంగ్రెస్‌పార్టీ మూడో స్థానానికి పరిమితం కావడం విశేషం. బీఎన్‌రెడ్డి నగర్లో ఆ పార్టీ వెయ్యి ఓట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒక్క కార్పొరేటర్‌ను గెలిపించుకోని సిట్టింగ్ ఎమ్మెల్యే ఎల్భీనగర్ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య నియోజకవర్గంలో ఒక్క డివిజన్‌లోనూ తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోకపోవడం గమనార్హం. పరువు నిలబెట్టుకున్న రామ్మోహన్ గత సార్వత్రిక ఎన్నికల్లో 71791 ఓట్లు సాధించి ఓటమి పాలయినప్పటికీ బల్దియా ఎన్నికల్లో గణనీయంగా పుంజుకుంది. ఈ సారి 11 డివిజన్లలో పాగా వేయడంతో పరువును నిలబె ట్టుకున్నట్లైంది. అంబర్‌పేట తారుమారు అంబర్‌పేట: అంబర్‌పేట నియోజకవర్గంలో అనుహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజకీయ పార్టీల బలాబలాలు పూర్తిగా మారిపోయాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందగా, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆయన దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు. అయితే ప్రస్తుత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పరిస్థితి పూర్తిగా తారుమారైంది. నియోజకవర్గంలో 48 శాతం పోలింగ్ నమోదు కాగా, ఐదు డివిజన్లను టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం గమనార్హం. 2009 బల్దియా ఎన్నికల్లో నియోజకవర్గ పరిధిలోని ఏడు డివిజన్లో మూడింటిలో కాంగ్రెస్, ఒకటి బీజేపీ, ఒకటి టీడీపీ, ఒకటి ఎంఐఎం, ఒకదానిలో స్వతంత్య్ర అభ్యర్థి గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో అందుకు భిన్నంగా ఒకే పార్టీకి ఓటర్లు పట్టం కట్టడం విశేషం. ముషీరాబాద్ అయ్యో... లక్ష్మణా..! సిటీబ్యూరో; బీజేపీ శాసనసభ పక్షనేత లక్ష్మణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ముషీరాబాద్ నియోజకవర్గంలో కారు జోరందుకుంది. నియోజకవర్గ పరిధిలోని ఆరు డివిజన్లలో బీజేపీ ఒక్క సీటును కూడా గెలువలేకపోయింది. ఇందులో ఐదు డివిజన్లలో టీఆర్ఎస్ హవా కొనసాగగా, మిగిలిన మరో స్థానాన్ని ఎంఐఎం కైవసం చేసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే..బీజేపీ-టీడీపీ కూటమి హోరంగా దెబ్బతినగా, టీఆర్ఎస్ మాత్రం రెట్టింపు బలాన్ని పుంజుకుంది. కాంగ్రెస్ పార్టీ చతికిలపడింది. ఎంఐఎం ఒక స్థానాన్ని గెలుచుకొని, నియోజకవర్గంలో పాగాకు ప్రయత్నిస్తున్నట్లు జీహెచ్ఎంసీ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ కూటమికి 65,209 ఓట్లు రాగా, ఈ ఎన్నికల్లో 28,762 ఓట్లతోనే సరి పెట్టుకోవాల్సివచ్చింది. ఎంఐఎం 12,122 ఓట్లు సాధించి ఉనికిని చాటుకుంది. మల్కాజిగిరి కారుకు బ్రహ్మరథం సిటీబ్యూరో : మల్కాజిగిరి నియోజకవర్గంలోని 9 డివిజన్లలోనూ టీఆర్ఎస్ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. మచ్చబొల్లారం, అల్వాల్, వెంకటాపురం, నేరేడ్మెట్, ఈస్ట్ఆనంద్బాగ్, మల్కాజిగిరి, వినాయక్‌నగర్, మౌలాలీ, గౌతమ్నగర్లలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. అల్వాల్‌లో పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్ధి, ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు చింతల విజయశాంతి 10,616 ఓట్లతో సమీప ప్రత్యర్ధి బీజేపీ అభ్యర్ధిపైన విజయం సాధించారు. అల్వాల్‌లో బీజేపీ అభ్యర్ధికి 3,072 ఓట్లు మాత్రమే లభించడం గమనార్హం. మచ్చబొల్లారం డివిజన్ నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్ధి జితేందర్నాగ్ను రెండవ సారి కూడా ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారు. ఆయన ఏకంగా 13,557 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తంగా గత మెజారిటీని అధిగమించి ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. .2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 77,132 ఓట్లు లభించగా, ప్రస్తుత గ్రేటర్ ఎన్నికల్లో 90 వేలకు పైగా ఓట్లు లభించాయి. -
5 ఓట్ల విజేత..
జాంబాగ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎం. ఆనంద్ కుమార్ గౌడ్‌పై మజ్లిస్ అభ్యర్థి డి. మోహన్ స్వల్ప తేడాతో విజయం సాధించారు. మోహన్‌కు 8,583 ఓట్లు రాగా, టీఆర్ఎస్ అభ్యర్థి ఆనంద్ కుమార్ గౌడ్‌కు 8,578 ఓట్లు పోలయ్యాయి. కేవలం 5 ఓట్ల తేడాతో మజ్లిస్ అభ్యర్థి మోహన్ విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి భజరంగ్ శర్మకు 5,235 ఓట్లు రాగా, కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా బరిలో దిగిన మాజీ మంత్రి ఎం. ముఖేష్‌గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ 3,382 ఓట్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నారు. - అబిడ్స్ -
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీల బలాబలాలు
నెం అసెంబ్లీ సెగ్మెంట్ మొత్తం స్థానాలు టీఆర్ఎస్ ఎంఐఎం టీడీపీ- బీజేపీ కాంగ్రెస్ 1 ఉప్పల్ 10 09 -- -- 01 2 ఎల్ బీ నగర్ 10 10 -- -- -- 3 మహేశ్వరం 03 02 -- 01 -- 4 మలక్ పేట్ 06 02 04 -- -- 5 చార్మినార్ 06 -- 05 01 -- 6 యాకుత్ పూరా 06 01 04 01 -- 7 చాంద్రాయణగుట్ట 07 -- 07 -- -- 8 బహుదూర్ పూరా 06 -- 06 -- -- 9 గోషామహల్ 06 03 02 01 10 రాజేంద్రనగర్ 05 03 02 -- -- 11 కార్వాన్ 06 01 05 12 నాంపల్లి 07 01 06 -- -- 13 ఖైరతాబాద్ 05 05 -- -- -- 14 జూబ్లీహిల్స్ 07 05 02 -- -- 15 ముషీరాబాద్ 06 05 01 -- -- 16 సనత్ నగర్ 06 06 -- -- -- 17 అంబర్ పేట్ 05 05 -- -- -- 18 శేరిలింగంపల్లి 10 10 -- -- -- 19 పటాన్ చెరు 03 02 -- -- 01 20 కూకట్ పల్లి 08 07 -- 01 -- 21 కుత్బుల్లా పూర్ 08 08 -- -- -- 22 మల్కాజ్ గిరి 09 09 -- -- -- 23 సికింద్రాబాద్ 05 05 -- -- -- మొత్తం 150 99 44 05 02 -
నాడు ప్రేమకు... నేడు వివాదాలకు వారధి!
► ప్రతిసారీ మారుతున్న రిజర్వేషన్లు ► మజ్లిస్ పార్టీకి కంచుకోటగా పురానాపూల్ ► కాంగ్రెస్‌లో చేరిన మహ్మద్ గౌస్ మారిన సమీకరణలు చార్మినార్: పురానాపూల్... పోలింగ్ నాటి సంఘటనలు...రీ పోలింగ్‌తో ఈ ప్రాంతం ఒక్కసారి వార్తల్లోకి వచ్చింది. గ్రేటర్ ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచే కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల నడుమ ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలింగ్ మొదలైనప్పటినుంచి రెండు పార్టీల నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తలకు అక్కడక్కడ వాగ్వాదాలు, ఆందోళనలతో పాటు అరెస్ట్‌లూ చోటుచేసుకున్నాయి. పరిస్థితులను సమీక్షించిన ఉన్నతాధికారులు పురానాపూల్ డివిజన్లో శుక్రవారం రీ-పోలింగ్‌కు ఆదేశాలు జారీ చేశారు. మారుతున్న రిజర్వేషన్లు 1986 నాటి బల్దియా ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్‌గా ఉన్న పురానాపూల్ డివిజన్ 2002లో బీసీలకు కేటాయించారు. 2009లో మహిళలకు రిజర్వ్ చేశారు. ఇలా 1986 నుంచీ మారుతూ వస్తోంది. పునర్విభజన అనంతరం తాజాగా బీసీ జనరల్‌గా మారింది. 2009లో 23,863 మంది ఓటర్లు ఉండగా... ప్రస్తుతం ఈ సంఖ్య 34,407. రాజకీయ నేపథ్యం 1986లో పురానాపూల్ డివిజన్ ఎస్సీలకు రిజర్వు కావడం తో అప్పట్లో బీజేపీ అభ్యర్థి విజయ్ కుమారి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 2002లో మజ్లిస్ పార్టీ అభ్యర్థి సున్నం రాజ్‌మోహన్ విజయం సాధించారు. అనంతరం మహిళా రిజర్వేషన్ కావడంతో మజ్లిస్ అభ్యర్థి సున్నం శ్రీలత గెలుపొందా రు. అప్పటి నుంచీ మజ్లిస్‌కు కంచుకోటగా మారింది. ప్రస్తుతం పునర్విభజన అనంతరం రాజకీయ సమీకరణలు మారాయి. మహ్మద్ గౌస్ కాంగ్రెస్‌లో చేరడంతో.... పురానాపూల్ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ కార్పొరేటర్ మహ్మద్ గౌస్ పోటీ చేస్తున్నారు. ఆయనతో పాటు కుమారుడు, భార్య కూడా రంగంలోకి దిగారు. దీంతో ఒవైసీ సోదరులకు, మహ్మద్ గౌస్‌కు నడుమ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దశాబ్దాలుగా మజ్లిస్ పార్టీ కార్యకర్తగా కొనసాగిన గౌస్... 2002లో చార్మినార్ డివిజన్ నుం చి, 2009లో శాలిబండ నుంచి మజ్లిస్ పార్టీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో విజయం సాధిం చారు. ఉన్నట్టుండి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాతబస్తీలో రాజకీయాలు వేడెక్కాయి. అంతేకాకుండా తన కుటుంబ సభ్యు లు పోటీ చేస్తున్న మూ డు డివి జన్ల నుంచి విజయం సాధిం చాలనే బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మహ్మద్ గౌస్‌కు అప్పగిం చింది. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టినంతా పురానాపూల్, ఘాన్సీబజార్, శాలిబండ డివి జన్లపై పెట్టింది. మజ్లిస్ పార్టీ తప్పొప్పులను స్థానిక ప్రజ లకు చెబుతూ ప్రజల్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసిన మహ్మ ద్ గౌస్ బహిరంగ సభల ద్వారా ఒవైసీ సోదరులకు సవాళ్లు విసిరారు. ఖిల్వత్ మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ మహ్మద్ అలీ షబ్బీర్‌లను రప్పిం చారు. రోడ్ షోలతో ప్రజలను ఆకట్టుకునేప్రయత్నం చేశారు. మజ్లిస్ వ్యూహాత్మకంగా... కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులతో పాటు మహ్మద్ గౌస్‌కు చెక్ పెట్టాలని ఒవైసీ సోదరు లు భావించారు. దీనికి అనుగుణంగానే బహిరంగ సభను నిర్వహించిన మజ్లిస్...కాంగ్రెస్‌కు దీటుగా జవాబిచ్చింది. తమ పార్టీకి కంచుకోటగా ఉన్న పాతబస్తీలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కనుమరుగవుతుందని... ‘పతంగ్’ను ఎవరూ ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేసింది. పోలింగ్ రోజు ఏం జరిగిందంటే... చార్మినార్ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ (మజ్లిస్), పురానాపూల్ కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ గౌస్ మంగళవారం ఉదయం నుంచీ పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. పోలింగ్ స్టేషన్లను సందర్శిస్తూ.. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యం లో మధ్యాహ్నం 1.30 గంటలకు జలాల్‌కుంచా ప్రాంతంలో ఎమ్మె ల్యే, కాంగ్రెస్ అభ్యర్థి ఒకరికొకరు ఎదురు పడ్డారు. దీం తో ఇరువర్గాల్లో ఆగ్రహం కట్టలు తెం చుకుంది. వాగ్వాదాలతో ప్రారంభమై దాడులకు దారి తీసింది. విష యం తెలుసుకున్న దక్షిణ మండల డీసీ పీ వి.సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకొని ఇరువురినీ అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేను చార్మినార్ పోలీ స్ స్టేషన్‌కు... మహ్మద్ గౌస్‌ను మీర్‌చౌక్ పోలీస్‌స్టేషన్ కు తరలించారు. విషయం తెలుసుకుని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, పరిగి ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి ... ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తమ అనుచరులతో వేర్వేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసి దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ప్రేమకు వంతెన... ప్రేమకు వారధిగా నిర్మించిన పురానాపూల్ బ్రిడ్జి పేరుతో ఈ డివిజన్ ఏర్పడింది. ప్రిన్స్ మహ్మద్ కులీ కుతుబ్‌షా మూసీ నది ఇవతల ఉన్న భాగమతిని ప్రేమించారు. ఆమెను కలవడానికి మూసీ నదిని దాటుతూ వచ్చేవారు. దీనిని గమనించిన ఆయన తండ్రి సుల్తాన్ ఇబ్రహీం కులీకుతుబ్‌షా 1578లో నదిపై ప్యారానాపూల్ బ్రిడ్జిని నిర్మించారు. ప్యార్ అంటే ప్రేమ. పూల్ అంటే బ్రిడ్జి. ప్రేమకు గుర్తుగా నిర్మించిన ఈ ‘ప్యారానాపూల్’ కాలక్రమంలో పురానాపూల్‌గా మారిం ది. పురానా అంటే పురాతన అని అర్థం. దక్షిణ భారతదేశంలోనే అతి పురాతనమైనదిగా పేరొందిన ఈ వంతెన హైదరాబాద్ నగరంలో మొట్టమొదటిది. -
కౌంట్‌డౌన్
⇒ నేడే జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ⇒ మధ్యాహ్నం 3 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం ⇒ సాయంత్రం 5 గంటల తర్వాతే ప్రకటన ⇒ మొదటి రెండు గంటల్లో 26 వార్డుల ఫలితాలు ⇒ 4 గంటల్లో పూర్తి చేయాలని యత్నం ⇒ జీహెచ్ఎంసీ కమిషనర్, ఎన్నికల అధికారి జనార్దన్‌రెడ్డి వెల్లడి సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల జాతకాలు శుక్రవారం తేలనున్నాయి. గెలిచేదెవరో.. ఓడేదెవరో మరికొన్ని గంటల్లో వెల్లడి కానుంది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. పురానాపూల్ వార్డుకు రీపోలింగ్ జరుగుతున్న దృష్ట్యా నిర్ణీత సమయం ముగిసే వరకు (సాయంత్రం 5 గంటలు) ఫలితాలను వెల్లడించరు. సాయంత్రం 5 గంటల తర్వాతే వార్డుల ఫలితాలు ప్రకటిస్తారు. కౌంటింగ్ ఏర్పాట్లు, ఇతర వివరాలను జీహెచ్ంఎసీ కమిషనర్, ఎన్నికల అధికారి డా.బి.జనార్దన్‌రెడ్డి గురువారం మీడియా సమావేశంలో వివరించారు. ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌ల నుంచి లెక్కింపు కౌంటర్లకు చేర్చేటప్పటి నుంచి పూర్తయ్యే వరకు మొత్తం కౌం టింగ్ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేస్తామన్నారు. కౌం టింగ్ ఏర్పాట్లు చేసిన దాదాపు 25 ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని చెప్పారు. ప్రతి టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, అడిషనల్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు. వీరిని ఎన్నికల పరిశీలకులు, రిట ర్నింగ్ అధికారులు ర్యాండమ్‌గా నియమిస్తారు. ఓట్ల లెక్కిం పు మొత్తం ఎన్నికల పరిశీలకుల పర్యవేక్షణలో జరుగుతుంది. ఇంకా.. ⇒తొలుత మాక్ కౌంటింగ్ నిర్వహిస్తారు. ⇒మొదటి అరగంట పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. ⇒దీని కోసం రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద ప్రత్యేక టేబుల్ ఉంటుంది. ⇒నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తారు. జనరేటర్లు అందుబాటులో ఉంచుతారు. ⇒కౌంటింగ్ హాళ్లలోకి సెల్ఫోన్లు నిషిద్ధం. ⇒ఫలితాల వివరాలు తెలియజేసేందుకు మీడియా కేంద్రా లు ఉంటాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి లెక్కింపు ప్రారంభిస్తారు. ఫలితాలు తెలిసినప్పటికీ సాయంత్రం 5 గంటల వరకు వెల్లడించరు. కౌంటింగ్ మొదలైన రెండు గంటలకు తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది. ⇒ మొత్తం ఫలితాల వెల్లడికి నాలుగు గంటల సమయం పడుతుందని అంచనా. ⇒ మొత్తం 1,674 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ⇒ కౌంటింగ్ సిబ్బంది 5,626 మంది. ⇒827 రౌండ్లలో మొత్తం లెక్కింపు పూర్తవుతుంది. ⇒ లెక్కింపు కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ మీడియాను అనుమతించరు. ⇒ తొలి రెండు గంటల్లో 26 వార్డుల ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ⇒ నాలుగు గంటల్లో అన్ని వార్డుల ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ⇒ కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పాసులు ఉన్న వారికే అనుమతి. ⇒ పాసులు లేకుండా ఎవరూ రావద్దని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి. ⇒ పోలీసుల అనుమతి ఉంటేనే విజేతలు ర్యాలీలు నిర్వహించాలి. 3 నుంచి 10 రౌండ్లు కౌంటింగ్ కేంద్రాల్లోని సదుపాయాలు.. పోలింగ్ కేంద్రాలను బట్టి మూడు నుంచి పది రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుంది. మొత్తం వార్డుల సంఖ్య 150. వీటిలో 99 వార్డుల లె క్కింపు ఒకేసారి (మధ్యాహ్నం 3 గంటలనుంచి) ప్రారంభమవుతుంది. అవి పూర్తయ్యాక మరో రెండు, మూడు దఫాల్లో లెక్కింపు జరుగుతుంది. తొలి దశలో ఫలితాలు వెలువడే వార్డులు: తొలి రెండు గంటల్లో ఫలితాలు వెలువడనున్న వార్డుల్లో కాప్రా, మీర్‌పేట హెచ్‌బీ కాలనీ, చిలుకానగర్, రామంతాపూర్, అక్బర్‌బాగ్, రెయిన్‌బజార్, లలితాబాగ్, సంతోష్‌నగర్, ఫలక్‌నుమా, నవాబ్‌సాహెబ్‌కుంట, శాలిబండ, జియాగూడ, దత్తాత్రేయనగర్, లంగర్‌హౌస్, టోలిచౌకి, మెహదీపట్నం, హిమాయత్‌నగర్, కాచిగూడ, అడిక్‌మెట్,ముషీరాబాద్, షేక్‌పేట, గచ్చిబౌలి, మాదాపూర్, చింతల్, నేరేడ్మెట్ ఉన్నాయి. మూడు గంటల్లో ఫలితాలు వెలువడనున్న వార్డుల్లో సైదాబాద్, సులేమాన్‌నగర్, శాస్త్రిపురం, మైలార్‌దేవ్‌పల్లి, గుడిమల్కాపూర్, ఆసిఫ్‌నగర్, విజయనగర్ కాలనీ, అహ్మద్‌నగర్, రెడ్‌హిల్స్, జాంబాగ్, గన్‌ఫౌండ్రి, గోల్నాక, బాగ్‌అంబర్‌పేట, రామ్‌నగర్, ఖైరతాబాద్, మియాపూర్, భారతీనగర్, ఆర్సీపురం, ఓల్డ్‌బోయిన్‌పల్లి, గాజులరామారం, రంగారెడ్డినగర్, వెంకటాపురం, అడ్డగుట్ట, మెట్టుగూడ, బౌద్ధనగర్, రామ్‌గోపాల్‌పేట ఉన్నాయి. -
'కాంగ్రెస్ ను మేమే నడుపుకుంటాం'
హైదరాబాద్: తమ పార్టీ నేతలపై దాడి చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అక్బరుద్దీన్ బిన్ లాడెన్ లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ను ఖతం చేసేందుకు మోదీ కూడా కలుస్తామని అక్బరుద్దీన్ అనడం మజ్లిస్ అవకాశవాద రాజకీయలకు పరాకాష్ట అన్నారు. ఒవైసీ సోదరులను తమ పార్టీ నేతలే నెత్తికి ఎక్కించుకున్నారని గుర్తు చేశారు. ఒవైసీ సోదరులను కట్టడి చేయాలని సీఎం కేసీఆర్ కు సూచించారు. కాంగ్రెస్ ను వాడుకుని వదిలేసినట్టే రేపు టీఆర్ఎస్ పార్టీని కూడా వాడుకుని వదిలేస్తారని హెచ్చరించారు. పీసీసీ అధ్యక్షుడిపైనే దాడి జరిగితే తమ పార్టీ ఏమీ చేయలేకపోయిందని, దీనికి ఉత్తమ్ కుమార్, జానారెడ్డి, షబ్బీర్ అలీ నాయకత్వమే కారణమన్నారు. ఇక నుంచి హైదరాబాద్ కాంగ్రెస్ ను తామే నడుపుకుంటామని హనుమంతరావు పేర్కొన్నారు. -
గ్రేటర్ పోలింగ్ 45.27 శాతం
లెక్క తేల్చిన అధికారులు గత ఎన్నికలతో పోలిస్తే స్వల్ప పెరుగుదల సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.27 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు లెక్క తేల్చారు. బుధవారం ఈ వివరాలు వెల్లడించారు. పోలింగ్ జరిగిన మంగళవారం సాయంత్రం వరకు పూర్తి సమాచారం అందకపోవడంతో సాయంత్రం 4.30 గంటల వరకు తమవద్ద ఉన్న సమాచారం మాత్రమే వెల్లడించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ దాదాపు 45 శాతం పోలింగ్ జరిగినట్లు మీడియా సమావేశంలో వెల్లడించడం తెలిసిందే. దాదాపుగా అంతే పోలింగ్ నమోదైంది. వివిధ వర్గాల ద్వారా, సామాజిక వేదికల ద్వారా, వీఐపీల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించడంతో ఈసారి కనీసం 50 నుంచి 60 శాతం వరకు పోలింగ్ నమోదు కాగలదని అంచనా వేశారు. అయితే నగర ప్రజల్లో పోలింగ్‌పై ఇంకా చైతన్యం పెరగాల్సి ఉందని తేలింది. గత జీహెచ్ఎంసీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి దాదాపు 3 శాతం పోలింగ్ పెరిగింది. గత ఎన్నికల్లో, ఈ ఎన్నికల్లో తక్కువ శాతం పోలింగ్ నమోదైన వార్డు విజయనగర్ కాలనీయే కావడం విశేషం. ఇవీ వివరాలు.. 2002లో ఎంసీహెచ్‌గా ఉన్నప్పుడు.. మొత్తం ఓటర్లు : 26,78,009 పోలైన ఓట్లు: 11,58,913 పోలింగ్ శాతం: 43.27 2009లో జీహెచ్ఎంసీ తొలి ఎన్నికల్లో.. మొత్తం ఓట్లు: 56,99,639 పోలైన ఓట్లు: 23,98,105 పోలింగ్ శాతం: 42.07 2016.. ప్రస్తుత ఎన్నికల్లో మొత్తం ఓట్లు: 74,23,980 పోలైన ఓట్లు: 33,60,543 పోలింగ్ శాతం: 45.27 -
‘గ్రేటర్’ గొడవలపై 14 కేసులు
ఉత్తమ్, షబ్బీర్‌లపై దాడి కేసులో ముగ్గురు అరెస్టు ఎంపీ అసదుద్దీన్ సమక్షంలోనే వారిపై దాడి: డీసీపీ హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో చోటుచేసుకున్న పలు ఉదంతాలకు సంబంధించి పోలీసులు 14 కేసులు నమోదు చేశారు. వీటిలో అత్యధికం మజ్లిస్‌పై నమోదయ్యాయి. పశ్చిమ మండలంలో నాలుగు, తూర్పు మండలంలో మూడు, మధ్య మండలంలో ఒకటి, దక్షిణ మండలంలో ఆరు కేసులతో పాటు ముందస్తు అరెస్టుకు సంబంధించి దక్షిణ మండల పోలీసులు మరో రెండు కేసులు నమోదు చేశారు. వీటి దర్యాప్తు తీరుతెన్నులను నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి బుధవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. మంగళవారం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహ్మద్ షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి కార్ల అద్దాలు ధ్వంసం, షబ్బీర్ పై దాడి ఘటనల్లో ముగ్గురు నిందితులను బుధవారం అరెస్టు చేసినట్లు సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ వెల్లడించా రు. ఈ ఘటనలో హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీపైనా కేసు నమోదు చేశామని, వీడియో ఫుటేజీలను పరిశీలించి ఆయనపై చర్యలు తీసుకుంటామన్నారు. ‘‘ఈ కేసులో ఓల్డ్ మలక్‌పేట్‌కు చెందిన సయ్యద్ అబ్దాహు ఖాద్రీ అలియాస్ కషఫ్(21), కాలాపత్తర్‌కు చెందిన షేక్ ఆబేద్(38), డబీర్‌పురాకు చెందిన మహ్మద్ మసీవుద్దీన్ అలియాస్ మసీ (34)లను అరెస్ట్ చేశాం. అసద్ సమక్షంలోనే దాడి జరిగినట్లు ఆధారాలున్నాయి. జంగంమెట్ బీజేపీ అభ్యర్థి కౌడి మహేందర్‌పై మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ దాడి చేసిన సంఘటనలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్ట కింద కేసు నమోదు చేశాం. రెయిన్‌బజార్, సంతోష్‌నగర్ పోలీస్స్టేషన్లలో కూడా పోలింగ్ కేసులు నమోదయ్యా యి. మజ్లిస్ పార్టీ వెబ్ మీడియా నిర్వహిస్తున్న సయ్యద్ అబ్దాహు ఖాద్రీ ఇంజనీరింగ్ చేశాడు. షబ్బీర్ అలీపై మీర్ చౌక్ పోలీస్‌స్టేషన్ వద్ద పిడిగుద్దులతో దాడి చేశారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదా అని తేల్చేందుకు నిందితుల సెల్‌ఫోన్‌లోని కాల్ డేటాలను పరిశీలించనున్నాం’’ అన్నారు. మరోవైపు మలక్‌పేట మజ్లిస్ ఎమ్మెల్యే అహ్మద్ బలాలపై స్థానిక ఠాణాలో కేసు నమోదైంది. అసద్, అక్బర్ ప్రోద్బలంతోనే బలాల తన అనుచరులతో కలసి హత్యాయత్నం చేశారని అక్బర్‌బాగ్ డివిజన్ ఎంబీటీ అభ్యర్థి అంజదు ల్లా ఖాన్ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆయనపై, అనుచరులపై కేసు నమోదు చేశారు. ఐపీసీ 147,148,149,188,109, 120బి, 307 సెక్షన్ల కింద ఎమ్మెల్యే బలాల, ఆయన గన్‌మెన్ జానీ, అలీ(కాలా డేరా), అక్బర్‌బాగ్ మజ్లిస్ అభ్యర్ధి మినాజుద్దీన్లపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ గంగారెడ్డి తెలిపారు. అసద్, అక్బర్‌లపై 109, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.