Ghosts
-
దెయ్యాలకు బోజనం పెట్టే పండుగ గురించి విన్నారా?
ప్రతీ దేశానికి విభిన్న సంస్కృతి సంప్రదాయాలు ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే. కానీ కొన్ని దేశాల్లో పండుగలు అత్యంత విచిత్రంగా ఉంటాయి. ఆ సంప్రదాయాలను చూస్తే అవాక్కవ్వల్సిందే. అలాంటి విచిత్రమైన సంప్రదాయమే కంబోడియాలో ఉంది. పైగా ఆ పండుగ చేసుకోవడం కోసం ప్రభుత్వం కూడా రెండు రోజులు సెలవు ప్రకటిస్తుందట. కంబోడియాలో జరుపకునే విచిత్రమైన పండుగ దెయ్యాలకు ఆహారం పెట్టే ఫెస్టివల్. ఇది అక్కడ చాలా ఫేమస్ పండుగ. దీన్ని అక్కడ ప్రజలు 'ఖైమర్ పండుగ' అని కూడా పిలుస్తారు. ఇది 15 రోజులు పాటు జరుపుకునే ఉత్సవం. సెప్టెంబర్-అక్టోబర్ మధ్య కాలంలో జరుపుకుంటారు. ఆకలితో ఉన్న దెయ్యాలు ఆ టైంలో నరక ద్వారం నుంచి బయటకు వచ్చి తమ నివాసల వద్ద సంచరిస్తాయిని విశ్వసిస్తారు కంబోడియా వాసులు. ఆ సమయంలోనే నరక ద్వారాలు తెరచుకుంటాయని, అందువల్లే వివిధ రకాల ఆత్మలు తమ నివాసాల వద్దకు వస్తాయని చెబుతున్నారు. ఈ పండుగ రోజున ప్రజలు దెయ్యాల కోసం వివిధ రకాల పిండి వంటలను తయారు చేసి మరీ పెడతారు. అయితే ఇలా రాత్రి సమయాల్లోనే చేస్తారు. ఎందుకంటే దెయ్యాలకు వెలుతురు ఇష్లం ఉండదు. అవి చీకటిలోనే ఉంటాయి. అందుకని ఉదయం లేచి సూర్యోదయం కాకమునుపే తమ కుటుంబంలో చనిపోయిన బంధువులను తలుచుకంటూ ఆహారం పెడుతుంటారు. ఇలా చేస్తే రాక్షసులు సంతోషిస్తారట. అందువల్ల తమకు ఎలాంటి కీడు వాటిల్లకుండా ఉండటమే గాక సంతోషంగా జీవించగలుగుతామని చెబుతున్నారు. ఈ పండుగ రోజును తమ చనిపోయిన ఏడు తరాల బంధువులను తలుచుకుని భోజనం పెడతారు. దెయ్యాలు ఇలా తమ బంధువుల పేరు మీద పెట్టిన భోజనాన్ని వారి దగ్గర నుంచి తీసుకుని తింటాయని అంటున్నారు. దీన్ని "ఫచమ్ బెన్"గా వ్యవహారిస్తారు. ఈ పండుగు 19వ శతాబ్దం కింగ్ ఆంగ్ డుయోంగ్ కాలం నుంచి ప్రజలు ఆచరిస్తున్నారు. అంతేగాదు ఈ పండుగ చివరి రోజున జరుపుకునే ఉత్సవానికి అక్కడి ప్రభుత్వం సెలవు ఇస్తుంది కూడా. పండుగ చివరి రోజున దెయ్యాల కోసం ఓ పడవలో నిండుగా వివిధ రకాల పిండి పదార్థాలన్ని పెట్టి కొంత దూరం వరకు తీసుకెళ్లి వదిలేస్తారు. అక్కడకు వివిధ ఆత్మలు వచ్చి ఆహారపదార్థాలతో ఆకలి తీర్చుకుని తిరిగి నరకానికి వెళ్లిపోతాయని చెబుతున్నారు కంబోడియా ప్రజలు. ఏదీఏమైనా చాలా విచిత్రంగా ఉంది కదూ ఈ పండుగ. (చదవండి: మిస్టీరియస్ 'భాన్గఢ్కోట‘!..ఆ సమయంలో గానీ కోటలోకి అడుగుపెట్టారో అంతే..!) -
దెయ్యాలు కట్టిన గుడి!..అక్కడ ప్రతి అంగుళం ఓ మిస్టరీ..!
మనిషిని నడిపించే శక్తికైనా, యుక్తికైనా.. పాజిటివ్, నెగెటివ్ రెండూ ఉంటాయన్నది కాదనలేని నిజం. దేవుడంటే భక్తి, దెయ్యమంటే భయం. పసివయసు నుంచి దేవుడి పటాన్ని చూపించి.. ‘దండం పెట్టుకో..’ అన్నంత సాధారణంగా దెయ్యాన్ని పరిచయం చేయరు ఎవ్వరూ! గొంతు బొంగురుగా చేసి.. ‘హో..’ అనే ఓ విచిత్రమైన శబ్దంతో ‘అదిగో వస్తుంది’ అనే ఓ అబద్ధంతో బెదరగొడతారు. అలాంటి భయం నుంచి అల్లుకునే కథలకు స్పష్టమైన ఆధారాలుండవు.. అంతుచిక్కని ప్రశ్నలు తప్ప. కాకన్మఠ్ టెంపుల్ మిస్టరీ కూడా అలాంటిదే. మధ్యప్రదేశ్, మురైనాలోని శిథిలమైన ఈ శివాలయం ఎన్నో రహస్యాలకు నిలయంగా మారింది. గ్వాలియర్ నుంచి సుమారు 70 కి.మీ దూరంలో ఉన్న ఈ దేవాలయం ఆసక్తికరమైన సందర్శన స్థలంగా నిలిచింది. కేవలం రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చి, నిర్మించిన ఈ కట్టడం.. చూడటానికి ఎంతో కళాత్మకంగా కనిపిస్తుంది. ఏ నిర్మాణమైనా దృఢంగా ఉండాలంటే సిమెంట్ లేదా సున్నం అవసరం. కానీ ఈ గుడి నిర్మాణంలో ఎలాంటి బైడింగ్ మెటీరియల్ (జిగట పదార్థం) వాడకుండా.. పెద్ద రాళ్లు, చిన్న రాళ్లను నిలువుగా పేర్చి గోపురాన్ని మలచడం ఓ అద్భుతమనే చెప్పుకోవాలి. ట్విస్ట్ ఏంటంటే.. రాత్రికి రాత్రే దెయ్యాలు, ప్రేతాత్మలు కలసి ఈ గుడిని నిర్మించాయని చెబుతుంటారు. అందుకే ఇక్కడికి వెళ్లే సందర్శకులంతా.. అదే భయంతో మెసులుకుంటారు. దీన్ని 9వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం మధ్య నిర్మించారనేది పురావస్తు పరిశోధకుల అంచనా. 115 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం.. నేటికీ చెక్కుచెదరలేదు. అయితే ఈ కట్టడంలో కొంత నిర్మాణం ఆగిపోయినట్లుగా ఒకవైపు కర్రలు కట్టి ఉంటాయి. ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు.. ఆ చుట్టూ ఉండే చాలా పురాతన ఆలయాలను నేలమట్టం చేశాయి. కానీ ఈ టెంపుల్లో ఒక్క రాయిని కూడా కదిలించలేకపోయాయి. ఆలయం మధ్యలో శివలింగం ఉంటుంది. ఈ గుడికి పూజారి లేడు. వాచ్‌మన్ కూడా లేడు. కొందరు హోమ్ గార్డ్స్ మాత్రం.. ఈ గుడికి కాస్త దూరంగా.. రాత్రిపూట ఎవరూ అటువైపు పోకుండా కాపలా కాస్తూంటారు. ఏదో అతీతమైన శక్తి.. ఈ గుడిని కూలిపోకుండా కాపాడుతుందనేది అక్కడివారి నమ్మకం. అయితే ఈ గుడి కట్టడం అసంపూర్ణంగా ఆగిపోవడానికి ఓ కారణం ఉందని చెబుతారు స్థానికులు. ఆ రాత్రి దెయ్యాలు ఆలయాన్ని కడుతుంటే.. ఓ వ్యక్తి ఆ శబ్దాలను విని, అక్కడికి వెళ్లి చూసి.. ప్రేతాత్మలకు భయపడి పెద్దగా అరవడంతో అవి మాయం అయిపోయాయని, దాంతో నిర్మాణం ఆగిపోయిందని చెబుతారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆర్కియాలిజిస్ట్‌లు ఈ ఆలయంపై స్టడీ చేయడానికి వస్తారు. చుట్టుపక్కల పరిశోధనలు చేస్తారు కానీ, ఈ ఆలయాన్ని మాత్రం టచ్ చేసే సాహసం చేయరు. అయితే నేటికీ ఈ ఆలయం చుట్టూ.. ఈ కట్టడానికి ఉపయోగించిన కొన్ని రాళ్లు చెల్లాచెదురుగా పడి ఉంటాయి. అవన్నీ గుడి నిర్మాణంలో వాడాల్సిన రాళ్లేనని, నిర్మాణం మధ్యలో ప్రేతాత్మలు గుడిని వదిలిపోవడంతో అవి అక్కడపడి ఉన్నాయని కొంతమంది నమ్మకం. కానీ కొందరు దాన్ని కొట్టిపారేస్తారు. అవన్నీ కొన్ని శత్రుమూకలు ఈ ఆలయంపై దాడి చేసి, కూల్చిన రాళ్లేనని వాదిస్తారు. అయితే ఈ రాళ్లను తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే ప్రమాదమని.. కిందున్న ఏ రాయిని కదిలించినా, గుడి మొత్తం కదులుతున్నట్లుగా ఒకరకమైన శబ్దం వస్తుందనే పుకార్లూ విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ చిన్న రాయి కూడా మోయలేనంత బరువుగా ఉంటుందంటూ తమకు తెలిసింది చెప్పి భయాన్ని పుట్టిస్తూంటారు చాలామంది. నిజాన్ని నిరూపించే సాహసమైతే ఎవరూ చేయలేదు. దాంతో ఈ ఆలయనిర్మాణం నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. సంహిత నిమ్మన (చదవండి: వందల సంఖ్యల్లో రాతి బంతులు..అవి ఏంటన్నది నేటికి అంతుచిక్కని మిస్టరీ!) -
మీకు తెలుసా? ఒక్క రాత్రిలో దెయ్యాలు ఆలయాన్ని కట్టించాయట
మన దేశంలో ఎన్నో మహిమాన్వితమైన దేవాలయాలు ఉన్నాయి. వాటి వెనుక ఎన్నో వేల ఏళ్ల చరిత్ర ఉంది, సైన్స్‌కు అందని రహస్యాలు కూడా ఉన్నాయి. అయితే ఓ ఆలయాన్ని దయ్యాలు రాత్రికి రాత్రే కట్టించాయట. అసలు దెయ్యాలు నిజంగానే ఉన్నాయా? అయినా వాటికి ఆలయం కట్టించాల్సిన పనేంటి? ఇంతకీ ఈ వింతైన ఆలయం ఎక్కడ ఉంది? దీని వెనుకున్న కథేంటి అన్నది ఈ స్టోరీలో చూసేయండి.. దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్లు దయ్యాలు కూడా ఉంటాయని విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం.. మన దేశంలో కొన్ని ఆలయాలు స్వయంగా దేవతలే నిర్మించాలని విన్నాం. అదే విధంగా దెయ్యాలు కట్టించిన ఆలయాలు కూడా మనదేశంలో ఉన్నాయట. కర్ణాటకలోని దొడ్డబళాపురం-దేవనహళ్ళి మార్గం మధ్యలో వచ్చే బొమ్మావర గ్రామంలోని శివాలయాన్ని దెయ్యాలే కట్టించాయని నమ్ముతారు అక్కడి గ్రామస్తులు. సుందరేశ్వర దేవాలయంగా ఆ గుడికి పేరుంది. సాధారణంగా దేవాలయాలపై దేవుళ్ళ రాతి శిల్పాలు, ప్రతిమలు కనిపిస్తాయి. కానీ దేవాలయంలో మాత్రం రాక్షసుల నమునాలు చెక్కబడి ఉన్నాయి. సుమారు 600 సంవత్సరాల క్రితం నుంచే ఈ ఆలయం ఉందట. ఈ గ్రామంలో వందల ఏళ్ల క్రితం దెయ్యాలు తెగ భయపెట్టేవట. బయటకు రావాలంటనే జనాలు భయపడిపోయేవారట. దీంతో ఆ ఊరు ప్రజలకు ఏం చేయాలో అర్థంకాక మాంత్రికుడిని ఆశ్రయించారు. వాటిని తరిమికొట్టేందుకు మంత్ర విద్యలు నేర్చుకున్నప్పటికీ ఆయనకు సాధ్యం కాలేదు. దీంతో అక్కడ ఓ శివాలయాన్ని నిర్మిస్తే దెయ్యాలు పారిపోతాయని తెలుసుకుని ఊరి ప్రజలందరి సహకారంతో గుడి నిర్మించారు. దెయ్యాలు ఆ గుడిని నాశనం చేసేయడంతో కోపంతో ఊగిపోయిన మాంత్రికుడు మంత్రశక్తితో దెయ్యాలను వశపర్చుకొని బంధీగా చేశాడట. దీంతో బుచ్చయ్యను బతిమాలగా, కూలదోసిన ఆలయాన్ని తిరిగి కట్టివ్వాలని దెయ్యాలకు శరతు విధించాడట. మాంత్రికుడి ఆదేశంతో దిగి వచ్చిన దెయ్యాలు రాత్రికి రాత్రే దేవాలయాన్ని నిర్మించి ఇచ్చాయట. అప్పటి నుంచి దెయ్యాలు కట్టిన దేవాలయంగా ఆ ఆలయాన్ని పిలిచేవారు. ఇక కొన్నాళ్లకు ఆ ప్రాంతంలో మంచినీళ్ల బావిని తవ్వుతుంటే పెద్ద శివలింగం బయటపడిందట. అప్పట్నుంచి ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారట. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఎవరికైనా దెయ్యాలు పట్టినా ఈ ఆలయానికి తీసుకొస్తే దెయ్యం వదులుతుంది అని స్థానికుల నమ్మకం. -
అలాంటి వాటిపై నమ్మకం లేదు.. కానీ భయమేస్తుంటుంది: నయన్
నటి నయనతార ఏం మాట్లాడినా వార్తల్లో నిలుస్తోంది. కారణం ఆమె స్టార్ డమ్, తన వ్యక్తిగత అంశాలే. నయనతార నటన, ప్రేమ, పెళ్లి, పిల్లలు అన్ని సంచలనాలే. తాజాగా నయనతార ప్రధాన పాత్రలో నటించి, తన భర్త విఘ్నేశ్ శివన్‌తో కలిసి రౌడీ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన చిత్రం కనెక్ట్. హార్రర్, థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన చిత్రం ఇది. ఈ నెల 22వ తేదీ విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతోంది. తాను నటించే ఏ చిత్ర ప్రచారానికి రాని నయనతార కనెక్ట్ చిత్ర ప్రచారంలో పాల్గొనడం విశేషం. అలా ఒక కార్యక్రమంలో దెయ్యాలు ఉన్నాయని నమ్ముతారా? అన్న ప్రశ్నకు అలాంటి వాటిపై తనకు నమ్మకం లేకపోయినా ఒంటరిగా ఉన్నప్పుడు భయంగా ఉంటుందని చెప్పారు. నిజం చెప్పాలంటే దెయ్యాల కథా చిత్రాలకు తాను పెద్ద అభిమానినని తెలిపారు. ఇంతకుముందు దెయ్యాల ఇతివృత్తంతో కూడిన చిత్రాలను ఇష్టంగా చూసేదాన్ని అన్నారు. ఇకపోతే నయనతార, విఘ్నేష్ శివన్‌లు ఇటీవల కవల పిల్లలకు సరోగసి ద్వారా తల్లిదండ్రులు అయిన విషయం తెలిసింది. కాగా క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ దంపతులు తమ కవల పిల్లలతో ఇంట్లోనే క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆ వీడియోను తమ ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు. నయనతార విఘ్నేష్ శివన్ చెరొక బిడ్డను ఎత్తుకొని ఆనందంలో పరవశిస్తున్న ఆ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. చదవండి: చిరు, బాలయ్యలో ఉన్న కామన్ క్వాలిటీ అదే: శేఖర్ మాస్టర్ -
ఆ ఊళ్లో దెయ్యం భయం... రాత్రివేళల్లో వింత వింత శబ్దాలు!
కొన్నేళ్ల కిందట తెలుగునాట కొన్ని ప్రాంతాల్లో ‘ఓ స్త్రీ రేపు రా’ అనే రాతలు ఇళ్ల గోడల మీద కనిపించేవి. స్త్రీ రూపంలో ఒక దెయ్యం హడలెత్తిస్తోందనే ప్రచారం కారణంగా, ఆ దెయ్యం నుంచి తప్పించుకోవడానికి ఇళ్ల గోడల మీద అలా రాసేవారు. ఇప్పుడు మన ప్రాంతాల్లో ఎలాంటి దెయ్యం భయాలూ లేవు, అలాంటి రాతలూ లేవు. అయితే, కొద్దిరోజుల కిందట మెక్సికోలోని కోకోయోక్ పట్టణంలో దెయ్యం తిరుగుతోందనే ప్రచారం మొదలైంది. రాత్రి పదిగంటల తర్వాత ఆ దెయ్యం వీథుల్లో తిరుగుతోందని కథలు కథలుగా ప్రచారం సాగడంతో ఆ ఊళ్లోని జనాలు రాత్రి పదిగంటల తర్వాత బయటకు రావాలంటేనే భయంతో వణికిపోతున్నారు. కోకోయోక్ పట్టణం, ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ‘నహువా’ తెగకు చెందిన ప్రజలు ఉంటుంటారు. వారికి అతీంద్రియ శక్తులపైన, క్షుద్రప్రయోగాలపైన నమ్మకాలు ఎక్కువ. కొద్దిరోజుల కిందట రాత్రివేళల్లో వింత వింత శబ్దాలు విన్నట్లు స్థానికులు చెప్పుకోవడం మొదలైంది. మెల్లగా ఈ ప్రచారం ఊరంతా వ్యాపించింది. ఇది దెయ్యాల పనే అయి ఉంటుందని కొందరు వృద్ధులు చెప్పడంతో జనాల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఊళ్లో తిరిగే దెయ్యం ఇంట్లో చొరబడకుండా ఉండటానికి ఊళ్లోని ప్రతి ఇంటికీ వీధి తలుపులపై శిలువ గుర్తులు వేయించుకున్నారు. అయినా సరే భయం తీరక రాత్రివేళల్లో పదిగంటలకు లోపే ఇళ్లకు చేరుకుని, తలుపులు బిడాయించేసుకుంటున్నారు. చదవండి: వీడియో: సూపర్ టైపూన్ హిన్నమ్నోర్.. గంటకు 314 కిలోమీటర్ల ప్రచండ గాలులు.. చిగురుటాకులా వణుకు -
దెయ్యాలంటే భయం లేదు.. కానీ ఆరోజు చావును దగ్గర నుంచి చూశా: స్టార్ హీరోయిన్
Kiara Advani Shares Her Near Death Experience In Dharamshala: 'భూల్ భులయ్యా' సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన మూవీ 'భూల్ భులయ్యా 2'. ఇందులో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్, బ్యూటిఫుల్ హీరోయిన్ కియరా అద్వానీ, టబు నటించారు. ప్రస్తుతం ఈ సినిమా హిట్ కావడంతో ఫుల్ జోష్‌లో ఉంది కియరా. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో దెయ్యాల గురించి కియరాను అడగ్గా పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. దెయ్యాలంటే భయమా అని అడిగిన ప్రశ్నకు.. 'నాకు దెయ్యాలంటే భయం లేదు. కానీ దెయ్యం సినిమాలు చూడను. రాత్రిపూట ఒక్కదాన్నే నిద్రపోతుంటే భయపడతాను. అందుకే ఆ జోనర్ సినిమాల జోలికి వెళ్లను.' అని తెలిపింది కియరా. అంతేకాకుండా తన కాలేజ్ రోజుల్లో జరిగిన మరో విషయం గురించి తెలిపింది ఈ ముద్దుగుమ్మ. చదవండి: పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమాయణం ''కాలేజ్ డేస్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి ధర్మశాల టూర్ వెళ్లాను. మంచు ఎక్కువగా కురవడంతో నాలుగురోజులపాటు మేం హోటల్ గదిలోనే ఉండాల్సి వచ్చింది. అప్పుడు కరెంట్ లేదు. తాగేందుకు మంచి నీళ్లు కూడా దొరకలేదు. వేడికోసం ఏర్పాటు చేసుకున్న మంట కూడా ఆరిపోతుందనుకున్నాం. నాలుగోరోజు రాత్రి గదిలో అందరం నిద్రపోతున్నప్పుడు మా పక్కనే ఉన్న కుర్చీకి అనుకోకుండా నిప్పు అంటుకుని మంటలు వ్యాపించాయి. అది చూసిన నా ఫ్రెండ్ మా అందర్నీ నిద్రలేపింది. మేమంతా కేకలు వేయడంతో చుట్టుపక్కవాళ్లు వచ్చి తలుపులు పగలగొట్టారు. ఆరోజు చావుని దగ్గర నుంచి చూసినట్లనిపించింది. అదృష్టం కొద్దీ అక్కడి నుంచి బయటపడ్డాం.' అని కియరా పేర్కొంది. చదవండి: భూమిక ఇంగ్లీషులో భయంకరంగా తిట్టింది: నిర్మాత ఎంఎస్ రాజు -
‘ఔను.. దెయ్యాలు ఉన్నాయి’: ఐఐటీ ప్రొఫెసర్
మనం దెయ్యాలు గురించి ఎవరైనా చెబుతుంటే వారు చదువుకోలేదేమో! లేక వాళ్లు అజ్ఞానంతో మాట్లాడుతున్నారు అని కొట్టిపారేస్తాం. పైగా మూర్ఖులుగా భావించి కాస్త చిన్నచూపు చూస్తాం. కానీ మంచి ఉన్నతోద్యోగంలో పనిచేస్తున్న వ్యక్తి దెయ్యాల గురించి చెబితే ఒకింత ఆశ్యర్యపోతూ వింటాం. పైగా ఎవరతను అని కచ్చితంగా కుతుహలంగా ఉంటుంది. అచ్చం అలానే ఒక ఐఐటీ ప్రొఫెసర్ దెయ్యాల గురించి కొన్ని ఆస్తకికర వ్యాఖ్యలు చేశాడు. అసలు విషయంలోకెళ్తే... ఐఐటి మండికి కొత్తగా నియమితులైన డైరెక్టర్, ప్రొఫెసర్ లక్ష్మీధర్ బెహెరా దెయ్యాలు ఉన్నాయి అని చెబుతున్నాడు. పైగా వాటిని తాను మంత్రాలు, శ్లోకాలు పఠించి దెయ్యాల్ని తరిమికొట్టానంటూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు దెయ్యాలు గురించి చెబుతూ..1993 నాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు. అయితే ఆ సమయంలో చెన్నైలోని తన స్నేహితుడి కుటుంబాన్ని కొన్ని దుష్టాత్మలు ఏడిపించాయని చెప్పాడు. పైగా తాను అప్పుడు తన స్నేహితుడికి ఇంటికి వెళ్లి 'హరే రామ హరే కృష్ణ' మంత్రాన్ని పఠించడంతో పాటు "భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు సాధన చేయడం ప్రారంభించానని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఆ దెయ్యాలు తన స్నేహితుడి భార్యని, అతని తండ్రిని పట్టుకున్నాయని, వారు చాలా వింతగా ప్రవర్తించడం కూడా చూశానని చెప్పాడు. ఇలా ఒక ఐఐటీ ప్రోఫెసర్ దెయ్యాలు గురించి ఆసక్తి కరంగా చెబుతున్నా వీడియో ఒకటి యూట్యూబ్‌లో "లెర్న్ గీత లైవ్ గీత" పేరుతో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త ఆసక్తికరమైన వీడియోగా వైరల్ అవుతోంది. అయితే బెహరా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్. పైగా అతను ఐఐటీ ఢిల్లీ నుండి పీహెచ్డీ కూడా చేయడమే కాక రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో పేరుగాంచిన ప్రోఫెసర్ కావడం విశేషం. (చదవండి: కలలో కూడా ఊహించని గిఫ్ట్.. అవేమిటో తెలిస్తే షాక్..!) (చదవండి: రైళ్లు గమ్యానికి చేరక మునుపే సరకు అంతా స్వాహా...దెబ్బకు ఈ కామర్స్ సంస్థలు కుదేలు) -
అల్లు అర్జున్ ఇంట్లో క్యూట్ దెయ్యాలు.. వీడియో వైరల్
అల్లు అర్జున్ ఇంట్లో రెండు దెయ్యాలు పడ్డాయి. అవును.. అవి మాములు దెయ్యాలు కావు.. అల్లరి చేసే పిల్ల దెయ్యాలు. ఇళ్లంతా తిరుగుతూ నానా హంగామా చేసే క్యూట్ దెయ్యాలు. ఈ పిల్ల దెయ్యాలు ఎవరో కాదు అల్లు అర్జున్ పిల్లలు అర్హ, అయాన్. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే అల్లు అర్జున్ సతీమణి ఈ క్యూట్ దెయ్యాల వీడియోని తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన పిల్లలకు ఉన్నచోటే వినోదాన్ని అందిస్తోంది స్నేహ. పిల్లలకు రకరకాల గెటప్ వేసి ఆడిస్తోంది. వాటికి సంబంధిన వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చేరవేస్తుంది స్నేహ. తాజాగా ఆమె షేర్ చేసిన దెయ్యాల వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. అందులో అర్హ, అయాన్లు తెల్లటి వస్త్రాలు ధరించి, దెయ్యాల గెటప్‌లో ఉన్నారు. ముఖాలకు కళ్లద్దాలు పెట్టుకొని క్యూట్ డ్యాన్స్ చేస్తూ భయపెట్టే ప్రయత్నం చేశారు. . ఇక ఇందులో బుల్లి అర్హ వేసిన చిన్న స్టెప్పులు మాత్రం అందరినీ ఆకట్టుకుంటున్నాయి. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
‘దెయ్యాల పనే అంటారా?!’
లక్నో: ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోను చూస్తే.. ఒక్క క్షణం మనకు కూడా నిజంగానే దెయ్యాలు ఉన్నాయేమో అనిపిస్తుంది. ఇంతకు ఈ వీడియోలో ఏం ఉందంటే.. ఓ పార్కులోని జిమ్ పరికరం దానంతట అదే కదులుతుంది. దాని చుట్టూ చేరిన పోలీసులు ఈ అసాధరణ విషయాన్ని వీడియో తీయడంలో నిమగ్నమయ్యారు. నిమిషాల వ్యవధిలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. నెటిజనులు దీని గురించి రకరకాల వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. ఎక్కువ మంది మాత్రం ‘మానవ ప్రయత్నం లేకుండా ఈ పరికరం కదులుతుంది అంటే ఖచ్చితంగా ఇది దెయ్యాల పనే’ అంటూ ప్రచారం చేయడం ప్రారంభించారు. ఈ వార్తలు జోరుగా షికారు చేస్తుండటంతో ఝాన్సీ పోలీసులు రంగంలోకి దిగారు. ఇలా జరగడానికి గల కారణాన్ని వివరించారు. Fitness freak ghost 👻?@jhansipolice got a tip off about an open gym being used by ghosts!Team laid seige & soon found t real ghosts-Some mischievous person made video of moving swing & shared on #socialmedia. Miscreants will b hosted in a ‘haunted’ lockup soon #NoHostForGhost pic.twitter.com/JUaYt4IJMS — RAHUL SRIVASTAV (@upcoprahul) June 12, 2020 ‘ఓ పార్కులోని జిమ్ పరికరం దానంతట అదే కదులుతున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఝాన్సీ పోలీసులు ఇందుకు గల కారణాన్ని కనుగొన్నారు. గ్రీజు ఎక్కువ కావడంతో ఆ పరికరం దానంతట అదే కదులుతుంది. ఇది దెయ్యాల పని కాదు. దయచేసి ఇలాంటి పుకార్లను ప్రచారం చేయకండి ’అంటూ ఝాన్సీ పోలీసులు ట్వీట్ చేశారు. అసలు కారణం తెలియడంతో జనాలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. तेजी से वायरल हो रहे वीडियो जिसमें झूला अपने आप झूलता हुआ दिखाई दे रहा है, सत्यता की जाँच @COCityjhansi द्वारा मौके पर जाकर की गयी तो झूले में अधिक ग्रीस लगे होने से एक बार हिला देने पर कुछ समय तक हिलता रहता है। आप सभी से अपील है कि भूत आदि होने की अफ़वाह न फैलाएं #FakeNewsAlert pic.twitter.com/kvqpQCMCSv — Jhansi Police (@jhansipolice) June 13, 2020 -
పెళ్లి కాకపోవడానికి దెయ్యం పట్టడమే..
సాక్షి, సిటీబ్యూరో: ఇదో వెరైటీ ‘మాట్రిమోనియల్’ సైబర్ నేరం. వెబ్‌సైట్స్‌లో పెట్టిన ప్రొఫైల్ నచ్చిందంటూ పెళ్లి ప్రతిపాదన చేసి దండుకున్న కేసులు...విదేశీ వధూవరుల పేరుతో ఆన్లైన్లో పరిచయాలు చేసుకుని, బహుమతులు పంపిస్తానంటూ ఎర వేసి దండుకున్న వ్యవహారాలు... ఇవన్నీ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు సుపరిచితమే. అయితే మంగళవారం వచ్చిన ఓ ఫిర్యాదు చూసి అధికారులే కంగుతిన్నారు. పెళ్లి కాకపోవడానికి దెయ్యం పట్టడమే కారణమంటూ చెప్పిన సైబర్ నేరగాడు..అది వదిలిస్తానంటూ రూ.5 లక్షలు కాజేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నగరానికి చెందిన ఓ యువతికి కొన్నాళ్లుగా వివాహం కావట్లేదు. ఈ విషయాన్ని ఆమె ఇటీవల తనకు పరిచయం ఉన్న వారితో చెప్పి బాధపడింది. దీంతో వారు నీ మీద చేతబడి చేసి ఉంటారని, అది వదిలించుకుంటే తప్ప పెళ్లి కాదంటూ ఓ ‘ఉచిత సలహా’ ఇచ్చారు. ఈ విషయం విని షాక్‌కు గురైన ఆ యువతి ‘గూగుల్ తల్లి’ని ఆశ్రయించింది. చేతబడులకు విరుగుడు చేసే వారి వివరాల కోసం నెట్లో అన్వేషించింది. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఉత్తరాదికి చెందిన ఓ వ్యక్తి వివరాలు, ఫోన్ నెంబర్ లభించాయి. దానికి కాల్ చేసిన యువతి తన బాధను, పరిచయస్తులు చెప్పిన చేతబడి అంశాన్నీ చెప్పుకుంది. ఇదంతా విన్న అతగాడు ఆమె గతం–వర్తమానం–భవిష్యత్తు అధ్యయనం చేస్తున్నట్లు నటించాడు. ఆపై వివాహం కాకపోవడానికి చేతబడి కారణం కాదని.. మీ కుటుంబంలో ఒకరికి దెయ్యం పట్టిందని భయపెట్టాడు. దాన్ని వదిలిస్తే తప్ప పెళ్లి కాదంటూ చెప్తూ తన మాటలతో మాయ చేశాడు. ఇతడి ట్రాప్‌లో పడిపోయిన నగర యువతి దెయ్యం వదిలించేందుకు ఏం చేయాలంటూ కోరింది. అందుకు ప్రత్యేక పూజలు ఉంటాయని, వాటి నిమిత్తం కొంత ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పిన ఆ మాయగాడు తన బ్యాంకు ఖాతా వివరాలు అందించాడు. ఓ దఫా తన బ్యాంకు ఖాతాలోను, మిగిలిన సార్లు యూపీఐ ద్వారాను మొత్తం రూ.5 లక్షలు యువతి నుంచి కాజేశాడు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో పాటు అతగాడు మరింత మొత్తం కోరుతుండటంతో తాను మోసపోయానని ఆ యువతి భావించింది. దీంతో మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న అధికారులు ప్రాథమిక పరిశీలన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే నేరగాడు వినియోగించిన బ్యాంకు ఖాతా పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌కు చెందినదిగా గుర్తించారు. యూపీఐ వివరాలు సైతం సేకరించి నిందితుడి ఆచూకీ కనిపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
లాలు ఇంట్లో దయ్యాలు!
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ సీఎం తన అధికార నివాసాన్ని వదిలి వెళ్లేముందు అక్కడ దయ్యాలను వదిలేశారా? తన తరువాత ముఖ్యమంత్రి పీఠం చేపట్టిన జేడీయూ అధినేత నితీశ్ కుమార్ లక్ష్యంగా లాలు ఆ పని చేశారా? అంటే అవుననే అంటున్నారు నితీశ్ కుమార్. నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక అనధికార కార్యక్రమంలో ఈ విషయాలను నితీశ్ కుమార్ పంచుకున్నారు. 2005లో ఆర్జేడీ అధికారం కోల్పోయాక, నితీశ్ లాలు కుటుంబం నివాసం ఉన్న 1, అన్నేమార్గ్ భవనంలోకి మారారు. విశాలంగా ఉన్న ఆ ఇంటి వెనక భాగంలో తనకు పెద్ద పెద్ద మట్టికుప్పలు కనిపించాయని, ఇంటి నలుమూలల్లో కొన్ని కాగితపు కవర్లు కనిపించాయని నితీశ్ గుర్తు చేసుకున్నారు. నీ కోసం కొన్ని దయ్యాలను ఆ ఇంట్లో వదిలి వచ్చానని ఆ తరువాత ఒక సందర్భంలో లాలు ప్రసాద్ యాదవ్ స్వయంగా నితీశ్‌తో చెప్పారట. అయితే, ఆ మాటలను లాలు తనదైన స్టైల్లో సరదాగానే అన్నారని నితీశ్ పేర్కొన్నారు. అయితే, నితీశ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం బిహార్‌లో సంచలనం సృష్టించాయి. నితీశ్ గతంలో లాలుకు నష్టం కలిగించే ఉద్దేశంతో పట్నాలోని కాళీమాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారని గురువారం ఆర్జేడీ ఉపాధ్యక్షుడు శివానందతివారీ ఆరోపించారు. ఆ పూజలు చేసిన పూజారులు ఈ విషయాన్ని లాలుకు చెప్పారని, దాంతో లాలు ఆ ప్రభావం తనపై పడకుండా వేరే పూజలు చేశారని తివారీ వివరించారు. ఈ విషయం తనకు లాలునే చెప్పారన్నారు. కాగా, మూఢనమ్మకాలను, మంత్రతంత్రాలను లాలు విశ్వసిస్తారన్నది అందరికీ తెలిసిన విషయమే. అదే సమయంలో నితీశ్‌కు అలాంటి నమ్మకాలేవీ లేవని ప్రచారముంది. -
దెయ్యం దెబ్బకు హాస్టల్ ఖాళీ
సాక్షి, సి. బెళగల్(కర్నూల్) : ఆదర్శ బాలికల హాస్టల్లో దెయ్యం బూచితో బాలికలు హడలిపోతున్నారు. రాత్రిపూట విచిత్ర అరుపులు, కేకలు, పసిపిల్లల ఏడుపులు వినిపిస్తున్నాయని పుకార్లు పుట్టించడంతో వారు భయందోళన చెందుతున్నారు. తల్లిదండ్రులను పిలిపించుకుని ఇళ్లకు వెళ్లిపోతున్నారు. దీంతో శుక్రవారం రాత్రికి హాస్టల్ పూర్తిగా ఖాళీ అయింది. ఒక్క విద్యార్థిని భయంతో మొదలు..హాస్టల్ 9 వతరగతి నుంచి ఇంటర్ వరకు ఉంది. ఇందులో మొత్తం 75 మంది బాలికలు ఉన్నారు. ఇటీవల కొత్తగా 9వ తరగతి విద్యార్థిని చేరింది. ఈ విద్యార్థిని భయపడి మిగతావారు కూడి భయపడేలా చేసింది. సదరు బాలికకు హాస్టల్లో ఉండేందుకు ఇష్టంలేక దెయ్యం బూచి పెట్టిందని హాస్టల్ సిబ్బంది, కొందరు తోటి విద్యార్థినులు చెబుతున్నారు. కొండప్రాంతంలో హాస్టల్ ఉండటంతో పక్షులు, జంతువుల అరుపులు వినిపించి ఉండొచ్చని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. వారిలో భయాన్ని పోగొట్టేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. నిస్సహాయక స్థితిలో ప్రిన్సిపాల్, వార్డెన్ హాస్టల్లో దెయ్యముందని పుకార్లు షికారు చేయడంతో శుక్రవారం సాయంత్రం నుంచి పిల్లల తల్లిదండ్రులు హాస్టల్‌కు క్యూ కట్టారు. తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్తామని స్కూల్ ప్రిన్సిపాల్ కిషోర్‌కుమార్, వార్డెన్ నాగలక్ష్మితో వాదనకు దిగారు. వారు ఎంత సముదాయించినా వినిపించుకోకుండా పిల్లలను తీసుకెళ్లారు. దీంతో హాస్టల్ పూర్తిగా ఖాళీ అయింది. -
ఆకలి పొలం
ఒకరోజు.. రాత్రి.. పార్టీ జరుగుతోంది... ‘‘తమ్ముడూ.. నిజంగానే దయ్యాలు లేవంటావా?’’ అన్నాడు ఆ ఊరి సర్పంచ్ మనసులో కాస్త బెరుకుతోనే. ‘‘దయ్యాల్లేవ్.. గియ్యాల్లేవ్ సర్పంచ్ సాబ్..’’ అని అంటూ‘‘ఏమ్రా అజయ్..ఉన్నయా?’’ అడిగాడు పక్కనే ఉన్న తన కజిన్‌ను. వాడు అదోరకంగా నవ్వాడు. ‘‘మరి అంతకుముందు గీ పొలం కొంటామని వచ్చిన ఆ ఇద్దరు ఎట్లా చనిపోయినట్టు?’’ డౌట్ సర్పంచ్‌కి. ‘‘ఏముందీ.. బ్రెయిన్ హ్యామరేజ్‌తో చనిపోయిన పర్సన్‌కు అంతకుముందే క్లాట్స్ ఏవో ఉండి ఉంటాయి. యాక్సిడెంట్లో పోయిన అతని గురించి చెప్పేదేముంది? తాగి బండి నడుపుతున్నాడు..ఎదురుగా వస్తున్న లారీకి గుద్దుకున్నాడు. ఇక్కడ దయ్యమెక్కడినుంచి వచ్చింది సర్పంచ్ సాబ్?’’ వెటకారంగా రాహుల్. గ్లాస్‌ను పెదవుల దగ్గర పెట్టుకున్న అజయ్.. రాహుల్‌నే చూస్తున్నాడు తదేకంగా. ‘‘ఏమైతేంది.. పొలం కొనుక్కున్నరు. మీరు మంచిగా పండిస్తే మా ఊరోళ్లకు కూడా మస్తు ధైర్యమొస్తది అన్నిరకాలుగా’’ అన్నాడు సర్పంచ్ చికెన్ ముక్కను నములుతూ! మళ్లీ తన కజిన్ భుజమ్మీద చేయివేసి అతనిని చూపిస్తూ ‘‘ఇగో సర్పంచ్ సాబ్.. వీడు నా చిన్నమ్మ కొడుకు. రెండురోజుల కిందట అమెరికా నుంచి వచ్చిండు. నాకు హెల్ప్ చేయడానికే. నాతోనే ఉంటడు.ఇద్దరం కలిసి పొలం దున్ని చూపిస్తం. చాలెంజ్’’ అని సర్పంచ్‌తో సవాల్ చేసి.. మళ్లీ కజిన్ వైపు తిరిగి ‘‘ఏమంటావ్రా..అజయ్? ’’ అన్నాడు అతని భుజాన్ని గట్టిగా నొక్కుతూ.‘‘అంతే అన్నా.. చాలెంజ్. దున్ని చూపించుడే’’ అని అన్నకు జవాబిచ్చి సర్పంచ్ వైపు తిరిగి ‘‘ సర్.. వంచిన నడుము ఎత్తనీయకుండా పొలంల పనిచేయిస్తా మా అన్నతో. చాలెంజ్ ఏందో చెప్పుండ్రీ’’ అన్నాడు అజయ్నవ్వుతూ!ఆ చాలెంజ్‌లో ధీమా కన్నా అతని మాటలతో భయమే కలిగింది సర్పంచ్‌కి. మందు ఎక్కువైనట్టుంది అంటూ సమాధానపడ్డాడు. ఆ రాత్రి గడిచింది. రాహుల్... బిజినెస్ మేనేజ్మెంట్ చదివాడు. పేరున్న ఎమ్ఎన్సీలో హెచ్ఆర్ మేనేజర్‌గా పనిచేస్తూ ఓ స్టార్టప్ కంపెనీకి కూడా ప్లాన్వేస్తూండగా రైతుల ఆత్మహత్యలకు చలించిపోయి అగ్రికల్చర్ చేయాలని నిశ్చయించుకున్నాడు. మెదక్ జిల్లాలోని ఒక ఊళ్లో పొలం కూడా కొనేశాడు. తన బిజినెస్ మైండ్‌తో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతులకు ప్రేరణనివ్వాలని ఆశపడ్తున్నాడు. అమ్మా, నాన్నా, చివరకు జీవితమంతా సేద్యంతోనే గడిపిన తాత చెప్పినా మనసు మార్చుకోలేదు అతను. గతం..రాహుల్ కొనుక్కున్న పొలం మల్లయ్యది. ఆయనకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు ఒమన్‌లో, చిన్న కొడుకు భివండిలో ఉంటారు. భార్యతో ఊళ్లో ఉండేవాడు మల్లయ్య. ఉన్న అయిదు ఎకరాల్లో మూడుఎకరాలు కౌలుకి ఇచ్చి, మిగిలిన రెండు ఎకరాల్లోనే పాక లాంటిది వేసుకొని ఆలుమగలిద్దరూ సాగు చేసుకునేవారు. వరసగా వానలు లేక.. పొలంలో వేసిన బోరులో నీళ్లు పడక.. పంట పండక.. అప్పులపాలయ్యాడు. ఆ బెంగతోనే ఓ రోజు రాత్రి గుండె ఆగి చనిపోయాడు. పెద్ద కొడుకు రానేలేదు. చిన్నకొడుకే వచ్చి కర్మకాండ తంతు నిర్వహించి వెళ్లిపోయాడు. మల్లయ్య భార్య ఒక్కతే ఉండడం మొదలుపెట్టింది. ఊళ్లో వాళ్లంతా ఆమెను చూసి జాలిపడేవారు. భర్త చనిపోయిన షాక్ నుంచి తేరుకోక.. భర్త ఉన్నాడనే భ్రమలోనే ఆమె బతుకుతోందని! రోజూ ఇద్దరికి సరిపోయే భోజనం వండేది. గుడిసెలో తనతోపాటు ఇంకో వ్యక్తి ఉన్నట్లే ప్రవర్తించేది. కొన్నాళ్లకు ఊళ్లో వాళ్లకు అనుమానం వచ్చింది..మల్లయ్య దయ్యమయ్యాడా ఏంటీ అని! మల్లయ్య పొలంవైపుగా వెళ్లిన కొంతమంది.. గుడిసెలో మగ గొంతుతో మాటలు వినిపిస్తున్నాయంటూ ఆ అనుమానాన్ని రూఢీ చేసేసుకున్నారు. ఆ ఊరి సర్పంచ్ మల్లయ్య పెద్ద కొడుక్కి ఫోన్ చేసి సంగతి చెప్పాడు. ఒమన్ నుంచి వచ్చాడు పెద్దోడు. భివండి నుంచి తమ్ముడినీ పిలిపించాడు. తల్లిని ఆ ఊళ్లోనే ఉన్న ఆశ్రమంలో చేర్పించి ఉన్న పొలం అమ్మేసుకొని చెరిసగం పంచుకొని వెళ్లిపోదామని నిర్ణయించుకున్నారు. తల్లిని ఆశ్రమంలో చేర్పించారు కూడా. ఆ పొలం కొందామని బేరం కుదుర్చుకున్నాడు అదే ఊళ్లోని ఓ మోతుబరి. డబ్బులిచ్చే సమయానికి హఠాత్తుగా చనిపోయాడు. ఖంగుతిన్నారు అన్నదమ్ములిద్దరూ. మరో పదిరోజులకు ఇంకో వ్యక్తి ముందుకొచ్చాడు కొనడానికి. తెల్లవారి డబ్బులు తెస్తూ అతనూ చనిపోయాడు యాక్సిడెంట్లో.దీంతో ఊళ్లో వాళ్లకు మల్లయ్య నిజంగానే దయ్యమయ్యాడనే రుజువు దొరికినట్టయింది. కాని అన్నదమ్ములిద్దరూ నమ్మలేదు. పొలం అమ్మే బాధ్యతను తమ చిన్నాన్నకు అప్పగించి పెద్దోడు ఒమన్‌కు, చిన్నోడు భివండికి బయలుదేరారు. తర్వాత చాలా రోజులు ఆ పొలం అలాగే ఉంది. మల్లయ్య ఉన్నప్పుడు మూడు ఎకరాలు తీసుకున్న కౌలు రైతు కూడా భయపడి కౌలు చేయడం మానేశాడు. ఈ వ్యవహారమంతా వ్యవసాయం చేస్తున్న స్నేహితుల ద్వారా తెలుసుకున్న రాహుల్ చాలా చవకకు ఆ పొలాన్ని కొనేశాడు. ఆ సందర్భంగానే సర్పంచ్‌కి ఇచ్చిన పార్టీ అది. ప్రెజెండ్ డే... ఉదయం... తాత్కాలికంగా సర్పంచ్ ఇంట్లోనే అద్దెకు ఉంటున్న రాహుల్ నిద్ర లేచాడు. సెల్ ఫోన్లో టైమ్ చూశాడు. ఎనిమిది అయింది. ‘‘అమ్మో’’ అంటూ దిగ్గున లేచాడు. పక్కనున్న మంచం మీద అజయ్ కనిపించలేదు. బాత్రూమ్కి వెళ్లాడేమో అనుకొని ఓనరకి, టెనెంట్‌కు కామన్‌గా ఉన్న వసారాలోకి వచ్చాడు. పేపర్ చదువుతూ కనిపించాడు సర్పంచ్. ‘‘గుడ్ మార్నింగ్ సర్పంచ్ సాబ్!’’‘‘గుడ్ మార్నింగ్ సార్.. గిప్పుడు లేచిండ్రా..? మీ తమ్ముడు ఎప్పుడో పొలంకి పాయే’’ అన్నాడు నవ్వుతూ సర్పంచ్. ‘‘అవునా?’’ ఆశ్చర్యపోయాడు రాహుల్. ‘‘మాటలే గాదు.. షేతల్లో చూపిస్తుండు మీ తమ్ముడు’’ మెచ్చుకోలుగా సర్పంచ్ పేపర్లోంచి తల తిప్పకుండానే. ఆదరాబాదరాగా దినచర్యకు దిగాడు రాహుల్. అరగంటలో అన్నీ పూర్తి చేసుకొని పొలానికి వెళ్లాడు. అక్కడ..ఎవరో స్త్రీ మూర్తితో మాట్లాడుతూ కనిపించాడు అజయ్ అల్లంత దూరం నుంచి. దగ్గరకు వచ్చాక చూస్తే.. మల్లయ్య భార్య. చాలా నవ్వుతూ మాట్లాడుతోంది అజయ్‌తో. ఆమె ఇక్కడికి ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది?ఆ సందేహాన్నే ప్రశ్నలుగా సంధించాడు ఆమె వెళ్లిపోయాక. ‘‘మనం ఈ పొలం కొన్నమని ఎవరో చెప్పిన్రట అన్నా. మంచిగ పండించుకోండ్రి అని చెప్పడానికొచ్చింది’’ అన్నాడు అజయ్ అదేదో అంతగా పట్టించుకునే విషయం కాదన్నట్టు. ‘‘ఊ’’ అంటూ చెట్టు కిందకు వెళ్తున్న రాహుల్ ఫోన్ మోగింది. విస్మయం.. ఆ భావంతోనే ఫోన్ లిఫ్ట్ చేశాడు రాహుల్. ‘‘హలో అన్నగా.. ఏంరా.. నేను రాకుండా.. లేకుండానే కల్టివేషన్ చేస్తవా? నేను వచ్చేదాకా ఆగు. ఈ వారంలో వస్తున్నా. జాబ్గీబ్ అన్నిటికీ గుడ్‌బై చెప్పేశ్న. కలిసి వ్యవసాయం చేసుకుందాం..మన దేశం.. మన మట్టి..’’ అంటూ ఇంకేదో చెప్తూనే ఉన్నాడు అవతల నుంచి. రాహుల్ మొహం నిండా చెమటలు. నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాడు. చెవి దగ్గరున్న ఫోన్‌ని పట్టుకున్న చేయి వణుకుతోంది. కాళ్లూ కంపిస్తున్నాయి. - సరస్వతి రమ -
శివరాజ్
‘ధైర్యమిచ్చే అబద్ధాన్ని చాటి చెప్పాలి. భయపెట్టే నిజాన్ని పాతిపెట్టాలి.’ చివరి వాక్యం రాసి వేళ్లు విరుచుకున్నాడు శ్రీధన్ శివరాజ్. డెబ్భై ఏళ్లు ఉంటాయి అతడికి. పొడవుగా, బక్క పలుచగా ఉంటాడు. కళ్లు లోతుగా ఉంటాయి. ఆ లోతుల వెనుకాల పూర్వజన్మల్లోంచి చూస్తున్నట్లుగా సూక్ష్మంగా, నిశితంగా ఉంటుంది శివరాజ్ చూపు. ఎంతటి మనిషినైనా పట్టేస్తాడు. దెయ్యాల్ని పట్టేయడం గొప్పగానీ, మనుషుల్ని పట్టేయడం ఏం గొప్ప అన్నారు ఎవరో ఎప్పుడో. అప్పుడు పెద్దగా నవ్వాడు శివరాజ్. నవ్వాడు అంతే. ఏమీ అనలేదు. శివరాజ్ ఎవరికీ అంతుపట్టడు. అంతుపట్టకపోవడానికి ఒక కారణం అతడు పెద్దగా మాట్లాడడు. భార్య పోయినప్పుడు, పిల్లలు వెళ్లిపోతున్నప్పుడూ అతడు మౌనంగానే ఉన్నాడు. ‘‘ఉండు పార్వతీ’’ అని మాత్రం తన అరవై ఏళ్ల వయసులో భార్య చేతిని పట్టుకుని అడిగాడు. వెళ్లిపోయాక ఎక్కడి నుంచి వస్తుంది పార్వతి? పార్వతి అనే ఆత్మ వెళ్లిపోయాక, శివరాజ్ అనే దేహం ఒక్కటే మిగిలింది భూమి మీద. ఎప్పుడూ ఆత్మలో ఉండే ఈ దేహానికి ఏకాంతాన్ని కల్పించాలని అనుకున్నారేమో పిల్లలు.\ ఊళ్లోనే ఉన్నా, విదేశాల్లో ఉన్నట్లుగా వేరే ఇంటికి మారిపోయారు. ఇల్లు, ఆ ఇంట్లో శివరాజ్.. ఇద్దరే మిగిలారు. పార్వతి ఫొటో ఉన్న గదిలో కూర్చుంటాడు రోజంతా అతడు. పార్వతి బతికి ఉన్నప్పుడు కూడా అతడు ఆమెతో మాట్లాడిందీ, ఆమెను చూస్తూ కూర్చున్నదీ లేదు. పార్వతితో మాట్లాడ్డం అంటే శివరాజ్‌కు తనతో తను మాట్లాడుకోవడమే. ఎవరైనా తమతో తాము మాట్లాడుకుంటారా? శివరాజ్ ఎవరికీ అంతుబట్టకపోవడానికి ఇంకో కారణం అతడు రచయిత. దెయ్యాల రచయిత. ఎప్పుడూ ఆ ఆలోచనల్లో ఉంటాడు. నలభై ఏళ్లుగా అతడు పత్రికలకు దెయ్యాల కథలు రాస్తున్నాడు. పరభాషల్లోకి కూడా అవి తరచూ అనువాదం అవుతుంటాయి. శివరాజ్ రాసేవి పేరుకు దెయ్యాల కథలే కానీ.. దెయ్యాలు ఉన్నాయనీ, దెయ్యాలు లేవనీ చెప్పే కథలు కావు. ‘‘మరెందుకు రాస్తున్నట్లు?’’ అని ఓసారెప్పుడో ఇంటర్వ్యూ చెయ్యడానికి వచ్చినవాళ్లు అడిగారు. నవ్వాడు శివరాజ్. ‘‘దెయ్యాలు ఉన్నాయనుకునే వాళ్ల కోసం, దెయ్యాలు లేవనుకునేవాళ్ల కోసం రాస్తున్నాను’’ అన్నాడు. ‘‘మీరేం చెప్పదలచుకున్నారు. దెయ్యాలు లేవనా? దెయ్యాలు ఉన్నాయనా?’’.. అడిగారు ఇంటర్వ్యూ వాళ్లు.‘‘నేను చెప్పదలచుకున్నదే కదా రాస్తున్నాను’’ అన్నాడు శివరాజ్. ‘‘మీ ఉద్దేశం ఏంటి? దెయ్యాలు ఉన్నాయనా? లేవనా?’’ ‘‘తెలీదు. కానీ దెయ్యాల మీద నాకు రెస్పెక్ట్ ఉంది’’‘‘రెస్పెక్ట్ ఎందుకు?’’‘‘మీలా అవి ప్రశ్నలు వేయవు కాబట్టి..’’ఇలాగే ఉంటుంది శివరాజ్ మాట్లాడ్డం. శివరాజ్‌తో మాట్లాడ్డం. ‘ధైర్యమిచ్చే అబద్ధాన్ని చాటి చెప్పాలి. భయపెట్టే నిజాన్ని పాతిపెట్టాలి.’చివరి వాక్యం రాశాక.. ఫొటోలో పార్వతివైపు చూశాడు శివరాజ్. నవ్వు ముఖం. మనసు నిండా ప్రశాంతతను నింపే ముఖం. ఫొటోని చేతుల్లోకి తీసుకుని మెత్తటి గుడ్డతో తుడిచి, మళ్లీ గోడకు పెట్టేశాడు. పెరట్లోని తాజా పూలతో తానే గుచ్చిన దండను పార్వతి ఫొటోకి తగిలించాడు.అతడు రాసిన చివరి వాక్యం తను రాస్తుండే దెయ్యం కథల్లోని ముగింపు వాక్యం కాదు. తన బయోగ్రఫీలోని ‘ది ఎండ్’ సెంటెన్స్. అతడి జీవిత చరిత్రను సీరియల్‌గా వేసుకుంటామని పెద్ద పెద్ద పత్రికలు, పెద్ద పెద్ద పారితోషికాలతో ముందుకు వచ్చాయి. ఆసక్తి లేదన్నాడు. ఒకేసారి రిలీజ్ చేస్తానన్నాడు. పబ్లిషర్స్ వచ్చారు. ఇవ్వలేనన్నాడు. ప్రచురణ హక్కులు తన భార్యకు ఇచ్చేశానన్నాడు! పార్వతీ పబ్లికేషన్స్ పేరు మీద పుస్తకం వస్తుందన్నాడు. పార్వతే పుస్తకాన్ని ఆవిష్కరిస్తుందని కూడా చెప్పాడు! శివరాజ్ భార్య ఎప్పుడో చనిపోయింది కదా, ఆవిడ ఆవిష్కరించడం ఏంటని కొందరికి సందేహం వచ్చింది. శివరాజ్‌కి మతి భ్రమించినట్లుందని కొందరనుకున్నారు. ‘‘పూర్తయింది పార్వతీ’’ అన్నాడు శివరాజ్ పార్వతి ఫొటో వైపు చూస్తూ. ఫొటోలోని పార్వతి నిశ్చలంగా, కోనేటి పువ్వులా ఉంది. దేవుడి చెట్టు మీది నుంచి రాలిపడినట్టు. ‘‘పూర్తయింది’’ అని పత్రికల ఎడిటర్లకు ఫోన్ చేసి చెప్పాడు! ‘‘ఆల్రెడీ ఇచ్చేశారు కదా శివరాజ్ గారూ.. నెక్స్ట్ వీక్ కదా మీరు ఇవ్వాల్సింది ’’ అన్నారు వాళ్లు. ‘‘పూర్తయింది’’ చెప్పేశాడు శివరాజ్. అరగంటకు టీవీలో స్క్రోలింగ్ మొదలైంది! ప్రముఖ దెయ్యాల కథా రచయిత శ్రీధన్ శివరాజ్ (70) ‘కథాధర్మం’.మొదటి కథ çఫలానా సంవత్సరంలో. చివరి కథ ఫలానా పేరుతో.. అంటూ ఇంకా వివరాలేవో స్క్రోల్ అవుతున్నాయి. నవ్వుకున్నాడు శివరాజ్. వెళ్లి టీవీ కట్టేశాడు. రిమోట్ పనిచేయడం ఎప్పుడో మానేసింది. పార్వతికి టీవీలో ఆ డబడబలు ఇష్టం ఉండదు. ఆమె చనిపోయినప్పట్నుంచీ టీవీని మ్యూట్‌లోనే చూస్తున్నాడు శివరాజ్. టీవీ కట్టేశాక, పార్వతి ఫొటో వైపు ఒకసారి చూసి, గది తలుపులు వేసుకున్నాడు శివరాజ్. శివరాజ్ కథలు రాయడం మానేశారనే అర్థంలో ‘కథాధర్మం’ అని మొదటి బ్రేకింగ్ న్యూస్ ఇచ్చిన చానల్‌ను చూసి, తక్కిన చానళ్లు కొన్ని.. ‘శివరాజ్ కాలధర్మం’ అని టెలికాస్ట్ చేసేశాయి! శివరాజ్ పోయారనే వార్త తెలిసి ఆయన అభిమానులు నివ్వెరపోయారు. ఆయనకు డెబ్భై ఏళ్లా అని కొందరు ఆశ్చర్యపోయారు. అందరికంటే ముందుండే టీవీ చానల్ వ్యాన్ ఒకటి లైవ్ టెలికాస్ట్ కోసం శివరాజ్ ఇంటి ముందు ఆగింది. ‘కథాధర్మం’ అని క్రియేటివ్ బ్రేక్ ఇచ్చింది ఆ చానలే. శివరాజ్ ఇంటి బయటి గేటు తెరిచే ఉంది. లోపలికి వెళుతూ, తన పక్కనే ఉన్న కెమెరామన్‌ని అడిగింది ఆ చానల్ నుంచి వచ్చిన రిపోర్టర్.. ‘దేవాలయాలు ఎక్కడైనా పాడుబడతాయా?’ అని. తెలియదన్నాడు కెమెరామన్. ‘మేము వెళ్లేటప్పటికి పాడుబడిన దేవాలయంలా ఉంది శివరాజ్ ఉంటున్న ఇల్లు’ అని మొదలు పెడితే బాగుంటుందని అనిపించినట్లుంది ఆ రిపోర్టర్‌కి. హాల్లోకి, అక్కడి నుంచి శివరాజ్ గది దగ్గరికి వెళ్లి తలుపుల్ని మెల్లిగా నెట్టారు ఆ రిపోర్టర్, కెమెరామన్. లోపల.. మంచం మీద పడుకుని ఉన్నాడు శివరాజ్. అతడి పక్కనే కుర్చీ ఉంది. ఆ కుర్చీలో అతడి బయోగ్రఫీ స్క్రిప్ట్ కాగితాలు ఒక బొత్తిగా తాడుతో కట్టి ఉన్నాయి. ఆ కాగితాల బొత్తికి ఆన్చి శివరాజ్ భార్య ఫొటో ఉంది. ఆమె ఫొటోకి ఉండాల్సిన తాజా పూల దండ, శివరాజ్ స్క్రిప్టు పేపర్స్‌కి వేసి ఉంది!‘‘సార్..’’ అని దగ్గరికి వెళ్లి లేపేందుకు ప్రయత్నించారు చానల్ వాళ్లు. కళ్లు తెరవలేదు శివరాజ్. స్క్రిప్టులోని చివరి కాగితం.. బొత్తి నుంచి వేరుగా ఉంది. ‘ధైర్యమిచ్చే అబద్ధాన్ని చాటి చెప్పాలి. భయపెట్టే నిజాన్ని పాతిపెట్టాలి’ అనే వాక్యం ఉన్న కాగితం అంది. రెండో రోజు న్యూస్ పేపర్లలో ఆ వాక్యాన్ని చూసి.. శివరాజ్‌ని గతంలో అనేకసార్లు ఇంటర్వ్యూ చేసినవారు అనుకున్నారు:‘దెయ్యాలు లేవని అబద్ధం చెప్పారా? దెయ్యాలు ఉన్నాయనే నిజాన్ని దాచిపెట్టారా?’ -
నవ్వు ముఖం
‘‘నాకు తెలిసిన వ్యక్తి ఒకరు నన్ను ఫాలో అవుతున్నారు డాక్టర్’’ చెప్పింది అన్విత. ‘‘ఇందులో మీ సమస్యేమిటీ?’’ అడిగాడు డాక్టర్ తరుణ్. సైకియాట్రిస్ట్ ఎదురుగా కూర్చొని ఉంది అన్విత. ‘‘చెప్పండి’’ అన్నాడు సైకియాట్రిస్ట్ గట్టిగా గుండె లోపలికి గాలి పీల్చుకుని.అన్వితకు పాతికేళ్ల వరకు ఉంటాయి. పెళ్లి కాలేదు కాబట్టి పద్దెనిమిదేళ్ల అమ్మాయిలా ఉంది. ఆయన ఎందుకంత గాఢంగా గుండె లోపలికి గాలి పీల్చుకోవలసి వచ్చిందో ఆమెకు అర్థం కాలేదు. బీపీ చెక్ చేసే డాక్టర్లా ఈ సైకియాట్రిస్ట్‌లు దేహం లోపలి విపత్తుల్ని, విలయాలను సంకేతపరిచే ఫీలింగ్స్ ఏవో అప్పుడప్పుడూ పెడుతుండటం గురించి ఆమెకు తెలుసు. ఇప్పుడీ సైకియాట్రిస్ట్ కూడా ఏ కారణమూ లేకుండానే అదే విధమైన ఫీలింగ్‌ని ఎక్స్‌ప్రెస్ చెయ్యడానికి గుండె లోపలికి గాలిని పీల్చుకొని ఉండి ఉండొచ్చని ఆమె అనుకుంది. ‘‘మీవన్నీ అనవసర భయాలు’’ అన్నాడు డాక్టర్ తరుణ్.ఆ నగరంలో పేరున్న సైకియాట్రిస్ట్ అతను. మనిషి డాక్టర్లా ఉండడు. దెయ్యాలు పట్టేవాడిలానో, దెయ్యాల పనిపట్టేవాడిలానో ఉంటాడు. కానీ నవ్వు ముఖం. దెయ్యాల భయం ఉన్నవారికి అతడిని చూస్తే మందు చీటీ రాయకుండానే ధైర్యం వచ్చేస్తుంది. ‘దెయ్యాల్ని మించినవాyì దగ్గరికే వచ్చాం’ అన్న దగ్గరి భావం ఏదో అతడి పట్ల కలుగుతుంది రోగికి. అయితే అలాంటి భావం అన్వితకు కలిగినట్లు లేదు. ‘‘ముందసలు మిమ్మల్ని మీరు ఒక రోగి అనుకోవడం మానండి’’ అన్నాడు డాక్టర్ తరుణŠ . అతడికో అలవాటుంది. వచ్చినవాళ్లు ఏ సమస్యతో వచ్చారో తెలుసుకోడానికి ముందే.. ‘మీవన్నీ అనవసర భయాలు, ముందసలు మిమ్మల్ని మీరు ఒక రోగి అనుకోవడం మానండి’’ అంటుంటాడు. ఇప్పుడు అన్వితతోనూ ఆ రెండు మాటలు అన్నాడు. అన్విత ఆశ్చర్యంగా చూసింది.‘‘నన్ను నేను రోగి అనుకోవడం లేదు డాక్టర్. భయపడుతున్నానంతే. ఆ భయమే రోగం అని మీరు అంటే కనుక.. ‘అప్పుడు.. ధైర్యం కూడా రోగమే అవ్వాలి కదా డాక్టర్’ అని నేను మిమ్మల్ని ప్రశ్నించడానికి సంకోచించను’’ అంది అన్విత. ఆ మాటకు నివ్వెరపోబోయి ఆగాడు డాక్టర్ తరుణ్. ‘‘మీ లాజిక్ బాగుంది. మీరు ఫిలాసఫీ స్టూడెంట్ అయి ఉంటారని నాకు నమ్మబుద్ధేస్తోంది’’ అన్నాడు. ‘‘నమ్మబుద్ధి కావడం ఏంటి డాక్టర్?’’ అని ప్రశ్నించింది అన్విత విస్మయంగా. ‘‘నా ఉద్దేశం.. మీరు ఫిలాసఫీ స్టూడెంట్‌నని నాతో చెప్పుకున్నారనీ, మీరు ఫిలాసఫీ స్టూడెంట్‌లా నాకు అనిపించకపోయినప్పటికీ.. మీరు ఫిలాసఫీ స్టూడెంట్ అని నాకు నమ్మబుద్ధేస్తోందని చెప్పడం కాదు మిస్ అన్వితా’’ అన్నాడు తరుణ్. ‘‘మరి!’’ అంది అన్విత.‘‘మీరు ఫిలాసఫీ స్టూడెంట్ అయి ఉండడం అన్న నా ఫీలింగ్‌ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అంతే.’’ ‘‘ఓకే.. డాక్టర్. నా సమస్య భయమూ కాదు, ధైర్యమూ కాదు. జస్ట్ సమస్య. ఆ సమస్యను నేను మానసిక ఆరోగ్యమనీ, మానసిక అనారోగ్యమనీ అనుకోవడం లేదు. దానర్థం చికిత్స కోసం నేను మీ దగ్గరకు రాలేదని కాదు. నేనూ మీతో కొన్ని ఫీలింగ్స్‌ని షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను’’ అంది. చెప్పమన్నట్లు చూశాడు తరుణ్. ‘‘నాకు తెలిసిన వ్యక్తి ఒకరు నన్ను ఫాలో అవుతున్నారు డాక్టర్’’ చెప్పింది అన్విత. ‘‘ఇందులో మీ సమస్యేమిటీ?’’ అడిగాడు డాక్టర్ తరుణ్. అన్విత అందంగా ఉంటుంది. తెలిసిన వ్యక్తులే కాదు, తెలియని వ్యక్తులకు కూడా ఆమెను ఫాలో అవ్వాలని అనిపించడానికి అవకాశాలు లేకపోలేదు. ‘‘ఒకప్పుడు నేనతన్ని ప్రేమించాను. ఇప్పుడు ప్రేమించే స్థితిలో లేను. తను మాత్రం నన్నింకా ప్రేమిస్తూనే ఉన్నాడు’’‘‘చివరిసారి మిమ్మల్ని ఎప్పుడు ఫాలో అయ్యాడు?’’ అడిగాడు తరుణ్. ‘‘చివరిసారి, మొదటిసారి అనేం లేదు డాక్టర్. ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్నప్పుడు కూడా నన్ను ఫాలో అయ్యాడు’’ చెప్పింది అన్విత. ‘‘ఫాలో అయి ఏం చేస్తాడు?’’‘‘నువ్వంటే ఇష్టం అంటాడు. నువ్వు లేందే బతకలేనంటాడు. నీతో పాటు వచ్చేస్తానంటాడు’’‘‘హెడ్డేక్గా తయారయ్యాడంటారు. అంతేనా?’’అన్నాడు తరుణ్. ‘‘లేదు లేదు. అలాంటిదేం లేదు’’ ‘‘మరేంటి’’? ‘‘మా నాన్న నాకు వేరే సంబంధం తెచ్చారు. మా ఇద్దరికీ ఉన్న ప్రేమబంధం గురించి చెప్పాను. ‘వాణ్ణి చంపేస్తాను’ అని పెద్దగా అరిచారు. ‘వద్దు నాన్నా.. నా ప్రేమను చంపుకుంటాను. అతన్ని చంపకు’ అని నాన్న కాళ్లు పట్టుకున్నాను. నాన్న కన్నీళ్లు పెట్టుకున్నాడు. నన్ను దగ్గరకు తీసుకున్నాడు. ‘నా మాట విను. నీ జీవితం బాగుంటుంది’ అన్నాడు. నాన్నకు నేనంటే ప్రాణం. నాన్న మాట వింటే నా జీవితం బాగుంటుందా, బాగుండదా అని నేను ఆలోచించలేదు. నాన్న మాట వినదలచుకున్నాను. నాన్న కోసం.. అతనిపై నాకున్న ప్రేమను చంపుకోడానికి నేను తయారైపోయాను కానీ, నాపై ఉన్న ప్రేమను చంపుకోడానికి అతను సిద్ధంగా ఉంటాడా అని ఆలోచించలేకపోయాను’’ అంది అన్విత. డాక్టర్ తరుణ్ మౌనంగా వింటున్నాడు. ఈ అమ్మాయి తన సమస్యను ఎక్కడికి తెచ్చి ఆపుతుందా అని అతడు ఎదురుచూస్తున్నాడు. ‘‘అతను నాకు సమస్య కాదు డాక్టర్. నేనే అతనికి సమస్యగా మారానేమోనని సందేహంగా ఉంది’’ అంది అన్విత.తరుణ్ నివ్వెరపోయాడు. మనసులోని విషయం గ్రహించినట్లే మాట్లాడింది అనుకున్నాడు. ‘‘అతన్ని చూడాలని అనిపించినప్పుడు అతనికి కనిపించకుండా దూరం నుంచి చూడొచ్చు. కానీ నేను అతన్ని చూస్తున్నప్పుడు అతను నన్ను చూడాలన్న కోరిక అతనికి నేను కంటపడేలా చేస్తోంది. ఆవెంటనే అతను నా వెంటపడుతున్నాడు’’ చెప్పింది అన్విత. ‘‘ఇందులో మీకొచ్చిన సమస్యేమీ కనిపించడం లేదు అన్వితా. అతను మిమ్మల్ని ఫాలో అవడం మీకూ సంతోషమే కదా. నిజానికి మీరే అతన్ని మీ వెంటపడేలా చేసుకుంటున్నారు’’ అని నవ్వాడు తరుణ్. ‘‘నా భయం కూడా అదే డాక్టర్. నా సంతోషం కోసం అతన్నేమైనా నేను దుఃఖంలో ముంచేస్తున్నానా అని. ఆ ఫీలింగ్‌ని షేర్ చేసుకోడానికే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను’’ అంది అన్విత. ‘‘కానీ.. నాదొక సందేహం అన్వితా. మీ నాన్నతో అన్నారు కదా. అతనిపై మీకున్న ప్రేమను చంపుకుంటానని. మళ్లీ ఇదేమిటి?’’ అన్నాడు తరుణ్. ‘‘అవును డాక్టర్.అయితే ప్రేమను చంపుకోవడం కష్టమని నాకు తర్వాత తెలిసింది’’. ‘‘తర్వాత అంటే?’’‘‘ఆత్మలు మనుషుల మీద ప్రేమను చంపుకోలేక ఆ మనుషుల చుట్టూ తిరుగుతున్నట్లే.. ఆత్మలు కనిపించినప్పుడుమనుషులూ ఆత్మల మీద ప్రేమను చంపుకోలేక ఆ ఆత్మ చుట్టూ తిరుగుతారని నాకు తెలిశాక’’.. చెప్పింది అన్విత.డాక్టర్ తరుణ్‌ది నవ్వు ముఖం.అన్విత అలా చెప్పాక.. ముఖం మాత్రమే మిగిలింది. - మాధవ్ శింగరాజు -
దెయ్యం – భయం
రోజులు గడుస్తున్నాయి. కాలేజీకి వెళ్లడం, రావడం ఇదే పని. ఓ రోజు కాలేజ్ అయ్యాక తొందరగా ఇంటికి వచ్చి బ్యాగ్ బెడ్ మీద పడేసి బయటకు జంప్ అవుతుంటే ‘‘ఒరేయ్! ఏదన్న తిని పోరా’’ అని అమ్మ వంట గది నుంచే అరిచింది. ‘‘ఆకలైతలేదమ్మా!’’ అని గట్టిగా అంటూనే బయటపడ్డా. అదే రోజు రాత్రివరకు బయట షికార్లు కొట్టి, అమ్మకు ఫోన్ చేసి చెప్పా – ‘‘అమ్మా! ఇవ్వాళ లేటయితది’’. అమ్మ తిట్టాల్సిందంతా తిట్టి, జాగ్రత్త చెప్పి ‘సరే’ అంది. నా ఫ్రెండ్ అర్జున్‌తో కలిసి ఓ హాలీవుడ్ హర్రర్ ఫిల్మ్‌కి వెళ్లా. సినిమా ఎంత భయంకరంగా ఉందో మాటల్లో చెప్పలేను. సినిమా చూస్తున్నంతసేపు భయపడుతూనే ఉన్నా, కానీ చూడాలి అనిపిస్తోంది.‘‘ఏంది మామా! హర్రర్ సినిమాలు ఈ రేంజ్లో ఉంటాయా! నాకు భయమైతుంది. పోదామా?’’ అని అర్జున్ నా చెవిలో అరుస్తున్నాడు.‘‘నాకేం తెలుసురా! ఇంట్లో హర్రర్ సినిమాలు చూస్తే పెద్దగా భయం కాలేదు కానీ థియేటర్లో చూస్తే మాత్రం చాలా భయమైతుందిరా! సర్లే, మొత్తం సినిమా చూసే పోదాం’’ అన్నా. ఆ దెయ్యాలు, ఆ సౌండు, దెయ్యాలు మనుషుల రక్తాలు తాగడాలు.. వణుకుతూనే సినిమా చూస్తూ కూర్చున్నాం. సినిమా అయ్యాక, ‘ఇంకోసారి చీకట్లో ఇలాంటి హర్రర్ సినిమాలకు రావొద్దురా’ అనుకున్నాం. అసలే చీకటి. హర్రర్ సినిమా చూసి ఇంటికి వెళ్తున్నాం. ఇద్దరం ఏం మాట్లాడుకోవట్లేదు. సడెన్‌గా, ‘‘రామ్! దెయ్యాలు ఎలా ఉంటాయో తెలుసా’’ అని వాడు నావైపు చూస్తూ అడిగాడు.‘‘ఈ టైమ్‌లో దెయ్యాల గురించి డిస్కషన్ ఏందిరా! నాకేం తెల్వదు.’’ అన్నాను భయపడుతూనే. ‘‘రామ్! నేను దయ్యాన్ని చూశా.’’ అని ఆగాడు. నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. భయమేసింది. ‘‘ఎక్కడరా?’’ అనడిగా. ‘‘నువ్వేం భయపడకు. ఇప్పుడు కాదులే! చిన్నప్పుడు..’’ అని గట్టిగా నవ్వాడు. నాకు ఆ భయంలో వాడి మీద కోపమొచ్చింది. ఇంటికొచ్చేశాం. వాడిల్లు, మా ఇల్లు పక్కపక్కనే. ఇంటికి చేరేసరికి భయం కాస్త పోయింది. రాత్రి కలలు భయపెట్టాయి కానీ, పొద్దున్నే లేచి ఇంట్లోనే ఉన్నా అని నమ్మకం కలిగాక నాకు నేనే నవ్వుకున్నాను. ఆ తర్వాతిరోజు ఏదో ఫంక్షన్ ఉందని ఇంట్లోవాళ్లు ఊరెళ్లారు. నేను, తమ్ముడు ఎప్పట్లానే కాలేజీకి వెళ్లిపోయాం. నేను కాలేజీ నుంచి ఇంటికొచ్చేసరికి ఇంటిముందు జనం. ‘ఏమైంది.. ఏమైంది..’ అని పరిగెత్తాను. అక్కడున్న వాళ్లెవరూ ఏం చెప్పట్లేదు. పక్కింటి ఆంటీని అడిగా – ‘‘ఏమైందాంటీ?’’ అని. ‘‘మీ తమ్ముడు ఇందాకే వచ్చి వెళ్లిండు. తాళంచెవి కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత గంట నుంచి ఇగో.. ఇట్ల సౌండ్..’’ అని భయంతో చెప్పింది. ‘‘అరెయ్ రామ్! కొంపదీసి ఇంట్లో దయ్యముందారా?’’ అన్నాడు నన్ను చూసి అటు దూరంనించి నడుచుకుంటూ వచ్చిన అర్జున్. రాత్రి భయపెట్టింది చాలనట్లు ఇంకా భయపెడుతున్నాడు.డోర్ ఓపెన్ చేసి వెళ్దామంటే కీ లేదు. జనం మొత్తం వచ్చేస్తున్నారు. అయ్యో ఇంట్లో ఏదో చొరబడిందని భయపెట్టిస్తున్నారు. ఓ పెద్ద మనిషైతే ‘‘మొన్ననే ఒక దెయ్యాన్ని చూశిన. ఈ ఇంట్లనే జొరబడ్డదేమో!’’ అన్నాడు. ఈ కాలంలో దయ్యాలుంటాయా అని అనిపించినా నాకూ భయం పెరిగిపోతూనే ఉంది. కీ కోసం తమ్ముడికి కాల్ చేశా. వాడు రావడానికి అరగంట పడుతుందన్నాడు.లాభం లేదు. తాళం పగలగొట్టాలి. కానీ లోపల్నించి వస్తోన్న సౌండ్? భయం పెరుగుతూనే ఉంది. తమ్ముడి కోసం ఎదురుచూశా. వాడు రావడమే అందరం తలుపు పక్కన భయపడుతూ నిలబడ్డాం. కాసేపట్లో నిజంగానే హర్రర్ సినిమా లైవ్‌లో కనబడుతుంది అనుకుంటున్నా. లోపల్నించి ఎవరో బలంగా తలుపును కొడుతున్నారు. ‘‘నా వల్ల కాదు. అమ్మో దయ్యముందేమో!’’ అని నేను దూరంగా పరిగెత్తా. ‘‘ఎవరూ లోపల?’’ అని అరిచా గట్టిగా. అటువైపు నుంచి మాటలు రాలేదు కానీ డోర్‌ను గట్టిగా తంతూ ఓ వింత సౌండ్ మళ్లీ వినిపించింది. ‘తలుపు తీయ్’ అంటున్నారు అందరూ. కానీ ఎవ్వరూ ముందుకు కదలట్లేదు. మా తమ్ముడైతే దూరంగా వెళ్లి నిలబడ్డాడు అప్పటికే.‘‘అర్రె! ఏం భయంరా. అందరం ఉన్నాంగా! మేం దూరంగా నిలబడుతాం’’ అని నన్ను డోర్ దగ్గర వుంచి అందరు దూరంగా వెళ్లిపోయారు. ‘‘తలుపు తీయ్.. తలుపు తీయ్..’’ అని అరుస్తున్నారు. ఇక లాభం లేదని తాళంచెవి పెట్టి, తలుపు తీసి వెంటనే వెనక్కి పరిగెత్తుకొచ్చాను. అందరూ భయంభయంగా తలుపు వైపే చూస్తున్నారు. ఇంట్లోంచి ఎప్పుడూ వినని విధంగా సౌండ్ చేసుకుంటూ ఓ కుక్క బయటకు వచ్చి అందరిని చూసి భయపడి రెండు నిమిషాల్లో సందు దాటేసింది. అది వెళ్లిపోయాక అందరూ ఒకటే నవ్వులు. ‘భయపడి సచ్చినం కదరా!’ అనుకున్నారు అందరూ. అసలు విషయం ఏమైందంటే, మధ్యాహ్నం తమ్ముడు ఇంటికొచ్చి అన్నం తిని వెళ్లాడు. ఆ టైమ్‌లో ఆ కుక్క ఇంట్లో జొరబడింది. ఆ తర్వాత వాడు అది చూసుకోకుండా తాళమేస్కొని బయటికెళ్లాడు. దాన్ని చూసి వీళ్లంతా దయ్యమనుకొని భయపడ్డారు. నన్నూ భయపెట్టి పడేశారు. – రమేశ్ రాపోలు, నల్లగొండ. -
దెయ్యాలు నిజంగానే ఉన్నాయా?
సాక్షి, వెబ్ డెస్క్ : మీరు కళ్లు తెరచి పడుకుంటున్నారా?, నిద్రిస్తున్న సమయంలో ఏవైనా వింత శబ్దాలు మీకు వినిపిస్తున్నాయా?. సహజంగా ఒకసారి, రెండుసార్లు ఇలాంటి సంఘటనలు జరిగితే పట్టించుకోకుండా వదిలేస్తాం. అదే పదేపదే శబ్దాలు వినిపిస్తే మాత్రం అనుమానం(ఏదో ఉందని) మొదలవుతుంది. ఏదో గుర్తించలేని అదృశ్య శక్తి మనల్ని వెంబడిస్తుందని భావిస్తాం. ఒక్కోసారి పడుకున్న చోటును ఎటూ కదలలేకపోతాం. దీంతో మనల్ని ఎవరో వెంటాడుతున్నారన్న భయం పెరిగిపోతుంది. అప్పటినుంచి క్షణక్షణం నరకం అనుభవిస్తాం. చీకటి పడుతుంటుంది. ఇంటికి వెళ్లాలంటే గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటాయి. రాత్రికి మళ్లీ ఏం జరుగుతోందనని హడలెత్తిపోతుంటాం. ఇలాంటి అనుభూతులన్నీ దెయ్యాలు, భూతాల వల్ల కాదని సైకాలజీ ప్రొఫెసర్ ఎలైస్ గ్రెగరీ తేల్చేశారు. గోల్డ్‌స్మిత్ విశ్వవిద్యాలయంలో సైకాలజీ విభాగంలో ఆయన పని చేస్తున్నారు. హఠాత్తుగా నిద్రలో నుంచి లేచి ఇంట్లో ఏదో ఉన్నట్లు భావించే వారు అధికంగా బాగా పొద్దుపోయిన తర్వాత నిద్రిస్తున్నారని చెప్పారు. ఇదే వారిని మానసిక ప్రశాంత నుంచి దూరం చేస్తోందని వెల్లడించారు. నిద్ర పక్షవాతం నిద్ర మొత్తం 3 స్టేజ్లలో ఉంటుందని గ్రేగ్ చెప్పారు. మనుషులు మొదట మెల్లగా నిద్రలోకి జారుకుంటారని, సమయం గడిచే కొద్దీ గాఢ నిద్రలోకి వెళ్తారని, ఆ తర్వాత రకరకాల కలల్లోకి వెళ్తామని గ్రెగరీ పేర్కొన్నారు. ఈ దశలో కలలోని పనులను మనం నిజంగానే చేస్తున్నట్లు భావిస్తామని, బెడ్‌పై కాళ్లు, చేతులు, ముఖ కవళికలు కలకు అనుకూలంగా మారతాయని చెప్పారు. ఈ స్థితిని నిద్ర పక్షవాతం అంటారని చెప్పారు. బాగా పొద్దుపోయిన తర్వాత నిద్రించేవారిలో ఈ మూడు స్టేజ్‌లు పూర్తికావని దాంతో వారు పగటిపూట అవిశ్రాంతిగా ఫీల్ అవుతారని తెలిపారు. ఇదే పరిస్థితి ఎక్కువకాలం కొనసాగితే మెల్కొన్న తర్వాత కూడా కదలలేకపోవడం, ఏదో జరుగుతున్నట్లు ఫీల్ అవ్వడం వంటివి జరుగుతాయని వివరించారు. -
హారర్ ఫిల్మ్ షూటింగ్ పేరుతో యువకుల హల్చల్
-
అర్థరాత్రి దెయ్యాలు.. పట్టుకున్న పోలీసులు..!!
సాక్షి, విజయవాడ : నగరంలో అర్థరాత్రి దెయ్యం వేషాలతో యువకులు ప్రజలను బెంబేలెత్తించారు. హారర్ ఫిల్మ్ షూటింగ్ పేరుతో దెయ్యాల వేషాలు వేసుకుని ఏలూరు రోడ్డుపైకి రావడంతో ప్రజలు హడలిపోయారు. వీరి దెబ్బకు దాదాపు రెండు గంటల పాటు ప్రజలు భయంతో వణికిపోయారు. దీంతో హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్న మాచవరం పోలీసులు యువకులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో షార్ట్ ఫిల్మ్ షూటింగ్ కోసమే వేషాలు వేసినట్లు యువకులు చెప్పారు. సోషల్‌మీడియాలో వదంతులతో అసలే బిక్కుబిక్కుమంటున్న నగరవాసులు దెయ్యం వేషం వేసుకున్న వారిని చూసి మరింత బెదిరిపోయారు. కేవలం షార్ట్‌ఫిల్మ్ కోసమేనా? లేక మరేదైనా కోణం ఈ ఘటనలో ఉందా? అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
శ్మశానంలో సాహసం : దెయ్యం రాకతో హడల్
హాంట్స్, ఇంగ్లండ్ : 800 ఏళ్ల పురాతన శ్మశానంలో సాహసయాత్రకు వెళ్లిన ఫిట్నెస్ ట్రైనర్‌కు షాక్ తగిలింది. ఓ దెయ్యం వెంబడించటంతో అతను హడలిపోయాడు. దెయ్యం తనపై దాడికి వస్తున్న ఘటనను టోని ఫెర్గూసన్ వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. హాంట్స్లో సెయింట్ మెరీ చర్చ్ వద్ద ఏదో ఉందని పుకార్లు వస్తుండటంతో ఫెర్గూసన్ అక్కడకు వెళ్లాడు. శ్మశాన పరిసర ప్రాంతాలను చిత్రీకరిస్తుండగా ఉన్నట్లు ఉండి ఓ ఆత్మ అతనిపైకి వచ్చింది. ఈ ఘటనతో ఫెర్గూసన్ నిర్ఘాంతపోయాడు. వెంటనే అక్కడి నుంచి వచ్చేశాడు. పూర్వీకులకు శ్రద్ధాంజలి ఘటించడానికి వచ్చే వారిని ఈ దెయ్యమే భయపెడుతున్నట్లు చెప్పాడు. అయితే, ఫెర్గూసన్ పోస్టు చేసిన వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇది ఎడిటెడ్ వీడియో అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
దెయ్యం దెబ్బకు ఫిట్నెస్ ట్రైనర్‌కు షాక్
-
ఇద్దరు ధైర్యవంతులు
వాళ్లలా మాట్లాడుకుంటూ.. ఎప్పుడు వెళ్లిపోయారో, ఎందుకు వెళ్లిపోయారో తెలీకుండానే దెయ్యాల టాపిక్‌లోకి వెళ్లిపోయారు!‘‘స్పెసిఫిక్‌గా దెయ్యాలు ఈ భూమ్మీద చేసే పనేదైనా ఉంటుందా అని నాకో సందేహం’’ అన్నాడు శ్రీజన్ నవ్వుతూ. ‘‘స్పెసిఫిక్‌గా అంటే?’’ అన్నాడు విక్రమ్. ‘‘హెచ్ఆర్కి హెచ్ఆర్ పనులు, అకౌంట్ సెక్షన్‌కి అకౌంటింగ్ పనులు ఉన్నట్లు దెయ్యాలకు సపరేట్గా ఏదైనా జాబ్ ఉంటుందా అని’’ అన్నాడు శ్రీజన్. విక్రమ్ నవ్వాడు. ‘‘నేననుకోవడం మనుషుల్ని పీక్కుతినడం వాటి పనేమోనని’’ అన్నాడు. శ్రీజన్ నవ్వాడు. మనుషుల్ని పీక్కుతినడానికైతే మేనేజర్లు, సెక్షన్ హెడ్లు ఉన్నారుగా.. భూమి నిండా! దెయ్యాలు పనిగట్టుకుని తిరగడం ఎందుకు?’’ అన్నాడు. ఇద్దరూ నవ్వుకున్నారు. విక్రమ్ కొంచెం ఎక్కువగా నవ్వాడు. శ్రీజన్ దెయ్యాల్ని నమ్ముతాడు. విక్రమ్ దెయ్యాలంటే నవ్వుతాడు. అందుకే కొంచెం ఎక్కువగా నవ్వాడు. శ్రీజన్, విక్రమ్ ఇద్దరూ రూమ్మేట్స్. రూమ్మేట్సే కానీ, వాళ్లను రూమ్మేట్స్ అనేందుకు లేదు. ఆ రోజు ఉదయమే వాళ్లు రూమ్ తీసుకున్నారు. వర్కింగ్ మెన్స్ హాస్టల్లోని షేరింగ్ రూమ్ అది. ఇద్దరుండే రూమ్. ఇద్దరూ బ్యాచిలర్స్. ఇద్దరివీ వేర్వేరు ఉద్యోగాలు, వేర్వేరు ఆఫీసులు. హాస్టల్ రూమ్ కోసం వెతుక్కుంటూ ఉన్నప్పుడు అనుకోకుండా ఒకరికొకరు పరిచయం అయ్యారు. మొదట రూమ్స్ ఏమీ ఖాళీగా లేవన్నాడు హాస్టల్ మేనేజర్. వాళ్లేం ఉసూరుమనలేదు. ఇది కాకపోతే ఇంకోటి అన్నట్లు మాటల్లో పడిపోయారు.‘‘ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఈ నెలాఖరుకు ఒక రూమ్ ఖాళీ అవుతుంది’’ అన్నాడు మేనేజర్. ‘వేరే చూద్దాం’ అన్నట్లు చూశాడు విక్రమ్.. శ్రీజన్ వైపు. ‘ఇక్కడైతే బాగుండేది’ అన్నాడు శ్రీజన్. ‘‘అవును’’ అన్నాడు విక్రమ్. ఆ హాస్టల్ ఇద్దరి ఆఫీసులకీ దగ్గరగా ఉంది. ఆ వయసులో ఉన్నవాళ్లు నడుచుకుంటూ వెళ్లి, నడుచుకుంటూ వచ్చేంత దగ్గరగా.‘‘పోనీ, సెకండ్ ఫ్లోర్లో ఉంటారా.. ఒక గది ఖాళీగా ఉంది’’ అన్నాడు మేనేజర్. వీళ్లిద్దరి మాటలూ వింటున్నాడతను. ‘‘ముందు లేదన్నారు?!’’ అన్నాడు విక్రమ్. ‘‘సెకండ్ ఫ్లోర్ హాస్టల్ కిందికి రాదు. సపరేట్ రూమ్ అది. ఒకటే ఉంటుంది. ఎవరైనా ఇమీడియట్గా కావాలి అన్నప్పుడు ఇస్తుంటాం. నచ్చితే మీరు మళ్లీ రూమ్ మారనవసరం లేదు అక్కడే ఉండొచ్చు’’ అన్నాడు మేనేజర్. అడ్వాన్స్ ఇవ్వడానికి ముందు.. రూమ్‌ని ఒకసారి చూసి వచ్చి, ఆఫీస్‌కి వెళ్లిపోయారు శ్రీజన్, విక్రమ్. రూమ్ శుభ్రంగా ఉంది. ఒకటే ఫ్యాన్. రెండు సింగిల్ కాట్ బెడ్లు. గదిలోకి చక్కగా గాలి వీస్తోంది. ఒక కిటికీ ఉంది. గాలి కోసం దాన్నైతే తీసే అవసరం లేదు. పగలు సిటీ లైఫ్‌నీ, రాత్రిపూట సిటీ ౖలైట్స్నీ చూడాలనుకుంటే ఆ కిటికీలోంచి చూడొచ్చు. రూమ్‌కి ఎటాచ్డ్గా వాష్‌రూమ్ ఉంది. అందులో గోడకు చక్కటి ఫ్రేమ్ ఉన్న అద్దం బిగించి ఉంది. అద్దం కింద సింక్. ఇద్దరికీ ఆ రూమ్ నచ్చింది. ఆ రాత్రి బయటే మీల్స్ చేసి హాస్టల్‌కి వచ్చారు. హాస్టల్లో బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్.. మూడూ ఉంటాయి. అయినా, బయటే తిని వచ్చారు. రేపట్నుంచీ ఎలాగూ ఇక్కడే తినాలి కదా అనుకుని ఉండొచ్చు. పక్కపక్కనే, కాస్త ఎడంగా ఉన్న కాట్ల మీద వెల్లకిలా పడుకుని సీలింగ్ వైపు చూస్తూ మాట్లాడుకుంటున్నారు శ్రీజన్, విక్రమ్.. చాలాసేపటిగా. వాళ్లకా రూమ్ బాగా నచ్చింది. కనీసం ఏడాది పాటైనా ఆ రూమ్ మారకూడదని అనుకున్నారు. అంతగా నచ్చింది. అది హాస్టల్ రూమ్‌లా లేదు వాళ్లకు. శ్రీజన్ వాళ్ల గెస్ట్ హౌస్‌లో విక్రమో, విక్రమ్ వాళ్ల గెస్ట్ హౌస్‌లో శ్రీజనో ఉన్నట్లుగా ఉన్నారు. వాళ్లలా మాట్లాడుకుంటూ.. ఎప్పుడు వెళ్లిపోయారో, ఎందుకు వెళ్లిపోయారో తెలీకుండానే దెయ్యాల టాపిక్‌లోకి వెళ్లిపోయారు! దెయ్యాలు ఉన్నాయనీ, లేవనీ వాళ్లేం వాదించుకోలేదు. ఊరికే దెయ్యాల గురించి మాట్లాడుకున్నారంతే. ఆ తర్వాత ఎప్పటికో గాని వాళ్లకు నిద్రపట్టలేదు.‘‘ఖాళీ చేస్తున్నాం’’ అన్నాడు విక్రమ్, ఆ మర్నాడే! ‘‘ఏమైంది?’’ అన్నాడు మేనేజర్. ‘ఏమైంది?’ అని అన్నాడే గానీ, ఏమైందో తెలుసుకోవాలన్న ఆసక్తి అతడిలో లేదు. ‘‘రాత్రి నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. వాళ్లకు తెలిసిన వాళ్లిళ్లు ఖాళీగా ఉందట. ముగ్గురం కలిసి ఉందాం రమ్మన్నాడు’’ అని చెప్పాడు శ్రీజన్. ‘‘అడ్వాన్స్ తిరిగి ఇవ్వలేం’’ అన్నట్లు చూశాడు మేనేజర్. హాస్టల్ రిసెప్షన్ నుంచి బయటికి వచ్చి నిలుచున్నారు శ్రీజన్, విక్రమ్. వాళ్ల ముఖాల్లో రిలీఫ్ కనిపిస్తోంది. ‘‘సార్.. రాత్రే చెబుదామనుకున్నాను మీకు. ఆ రూమ్ మంచిది కాదు సార్’’ అన్నాడు హాస్టల్లో వీళ్లకు కనిపించిన మనిషి, దగ్గరికొచ్చి. రూమ్మేట్స్ ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు. ‘‘ఇప్పుడిది మెన్స్ హాస్టలే కానీ, మొదట్లో ఉమెన్స్ హాస్టల్. ఇప్పుడు మీరు దిగిన రూమ్‌లోనే అప్పుడు ఒకమ్మాయి ఉండేది. తనొక్కతే ఉండేది. ఓ రోజు ఆత్మహత్య చేసుకుంది. అప్పట్నుంచీ ఆ గదిలోనే ఉంటోంది’’ అన్నాడు ఆ మనిషి. ‘‘నువ్వేం చేస్తుంటావ్ ఇక్కడ’’ అన్నాడు విక్రమ్. ‘‘వాచ్‌మేన్‌ని సార్, ఉమెన్స్ హాస్టల్‌గా ఉన్నప్పట్నుంచీ నేనే వాచ్‌మేన్‌ని’’ అన్నాడు ఆ మనిషి. శ్రీజన్, విక్రమ్ ఆ రోజు సాయంత్రం మళ్లీ కలుసుకున్నారు.‘‘నీకెందుకలా అనిపించింది?’’ అడిగాడు శ్రీజన్. ‘‘రాత్రి వాష్‌రూమ్‌కి లేచినప్పుడు అద్దంలో చూశాను’’ అన్నాడు విక్రమ్. ఉలిక్కిపడ్డాడు శ్రీజన్. ‘‘నాకూ ఆ అద్దంలోనే’’ అని చెప్పాడు. ‘‘ఏం చూశావ్.. అద్దంలో?’’ విక్రమ్ అడిగాడు. ‘‘నువ్వు కనిపించావ్’’ అన్నాడు శ్రీజన్. ఈసారి విక్రమ్ ఉలిక్కిపడ్డాడు. ‘‘మరి నీకు?’’ అడిగాడు శ్రీజన్. ‘‘నాకేం కనిపించలేదు’’ అన్నాడు విక్రమ్. ‘‘మరి!’’‘‘అద్దంలో చూసుకుంటున్నప్పుడు నాకు నేనైనా కనిపించాలి కదా’’ అన్నాడు విక్రమ్. - మాధవ్ శింగరాజు -
దెయ్యాలను వదిలారు.. అందుకే ఖాళీ చేశా!
పట్నా : ఎట్టకేలకు ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన లాలూ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ విచిత్రమైన వాదనను వినిపిస్తున్నాడు. ఆ భవనంలో దెయ్యాలు ఉన్నాయనే ఖాళీ చేశామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీలు నన్ను భవనం ఖాళీ చేయించటానికి చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. అందుకే వాళ్లు అందులోకి దెయ్యాలను వదిలారు’ అంటూ తేజ్ పేర్కొన్నాడు. గతంలో నితీశ్ హయాంలో తేజ్ ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసిన సమయంలో ఈ బంగ్లాను కేటాయించారు. దేశ్‌రత్న మార్గ్‌లో ఉన్న ఈ భవనానికి వాస్తు దోషం మూలంగా అప్పుడు తేజ్ మార్పులు కూడా చేయించాడు. అయితే మహాకూటమితో విడిపోయాక ఆ భవనాన్ని ఖాళీ చేయాలంటూ తేజ్‌కు నితీశ్ ప్రభుత్వం నోటీసులు పంపింది. కానీ, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన తల్లి రబ్రీదేవి ఇదే భవనాన్ని ఉపయోగించటం.. అది సెంటిమెంట్‌గా భావించి తేజ్ ఖాళీ చేయలేదు. ఇంతలో ఆర్జేడీ నేతలు ప్రభుత్వ ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు స్టే విధించింది. విచారణ పెండింగ్‌లో ఉండగానే ఇలా ఉన్నపళంగా దెయ్యాలున్నాయంటూ భవనాన్ని ఖాళీ చేసేశాడు. అయితే ఇదంతా అతను చేస్తున్న జిమిక్కుగా జేడీయూ అభివర్ణిస్తోంది. అతని సోదరుడు తేజస్వి యాదవ్ ఈ మధ్య తరచూ మీడియాలో కనిపిస్తున్నాడు. అందుకే మీడియా దృష్టిని తనవైపు మళ్లించుకోవటానికే దెయ్యాలంటూ తేజ్ ప్రతాప్ నాటకాలు ఆడుతున్నాడు అంటూ జేడీయూ నేతలు మండిపడుతున్నారు. -
లోక విరుద్ధం
మంచివే అయినా, లోక విరుద్ధంగా కొన్ని పనుల్ని చేయలేం. ‘‘దెయ్యాలు పాత ఇళ్లల్లోనే ఎందుకుండాలి?! కొత్తగా కట్టిన ఇళ్లల్లో ఉండాలని వాటికుండదా?’’ పెద్దగా నవ్వి అన్నాడు వినోద్. వీచిక కూడా నవ్వింది. అయితే అది నవ్వొచ్చి నవ్వడం కాదు. వినోద్ నవ్వాడని నవ్వింది. ఆవలింతలకు ఉన్న గుణమే నవ్వుకీ, భయానికీ ఉంటుంది.. అంటుకోవడం! అలాంటి నవ్వు కావొచ్చది. ఆ రోజు ఉదయమే వాళ్లు ఆ ఇంట్లోకి వచ్చారు. కొత్తగా పెళ్లయినవాళ్లు, కొత్తగా కట్టిన ఇంట్లోకి, కొత్తగా వచ్చి చేరారు. కొత్తగా రావడం అంటే.. కాళ్ల పారాణి ఆరకముందే ఇటు వచ్చేయడం కాదు. అప్పటివరకు ఉన్న ఇంటిని ఖాళీ చేసి, ఈ ఇంట్లోకి వచ్చి చేరారు. పెద్దగా సామాను లేదు. ఇల్లు మాత్రం పెద్దది. ఓనర్ కూడా పెద్దాయన. ఆయన ఒక్కరే ఉంటారు. పక్క పోర్షన్‌లోనే ఉంటారు. వీళ్లున్న పోర్షన్ కొత్తగా కట్టింది. పెద్దాయన ఉన్నది పాతది. ఆ పాత ఇంటి కంటే కూడా పాత మనిషి ఆయన. ఓ డెబ్భై ఏళ్లు ఉంటాయి. తెల్లగా ఉంటారు. తెల్లటి పైజమా లాల్చీ వేసుకుని ఉంటారు. కొత్త ఇంట్లోకి ఆయనే షిఫ్ట్ అయి, పాత ఇంటినే ఈ దంపతులకు ఇవ్వొచ్చు కానీ ఇవ్వలేదు. ‘ఎందుకలా?’ అని వీళ్లు అడగలేదు. ఆయనకెవరూ లేరా అనే డౌట్ కూడా వచ్చింది. అదీ అడగలేదు. ‘‘హైదరాబాద్‌లో ఇంత తక్కువ అద్దెకు ఇలాంటి ఇల్లు దొరకడం మీ అదృష్టం’’ అని చెప్పి వెళ్లిపోయాడు, ఈ ఇంటిని చూపించిన అతను. నిజమే అనిపించింది వినోద్కీ, వీచికకు. ‘‘నిజానికి రెంటు కూడా నాకు అక్కర్లేదు. మంచివే అయినా, లోక విరుద్ధంగా కొన్ని పనుల్ని చేయలేం. రెంటు లేకుండా మీకు నా ఇంటిని ఇవ్వొచ్చు కానీ అది లోక విరుద్ధం. రెంటు లేకుండా నా ఇంట్లో ఉండడం మీకూ లోక విరుద్ధంగానే అనిపించవచ్చు. పద్ధతులు శుభ్రంగా ఉండటం నాకు ముఖ్యం. రెంటు కాదు’’ అన్నారు పెద్దాయన. వీళ్లిద్దరూ ఆశ్చర్యపోయారు. ‘‘ఇల్లు నచ్చింది. మంచిరోజు చూసుకుని వచ్చి చేరతాం’’ అని చెప్పి.. మెట్లు దిగారు.రోడ్డు మీదకు రాగానే.. ‘‘ఆయన మనకు ఇంటిని రెంట్‌కు ఇచ్చినట్లుగా లేదు. మన ఇంటిని చూసుకోడానికి ఆయనకే మనం జీతం ఇస్తున్నట్లుగా ఉంది’’ అన్నాడు వినోద్ నవ్వుతూ. వీచిక మాట్లాడలేదు. ‘‘పర్లేదంటావా?’’ అంది, అతడి చెయ్యి పట్టుకుని. ‘ఏంటి పర్లేదా?’ అన్నట్లు చూశాడు వినోద్. ‘‘కొత్తగా కట్టిన ఇంట్లో.. అలాంటివేమీ ఉండవు కదా?’’ అంది. ‘‘ఎందుకలా అనిపిస్తోంది!’’ అన్నాడు వినోద్. ‘‘అంత పెద్దింటికి రెంట్ ఇంత తక్కువగా ఉంటేనూ! పైగా.. రెంట్ తీసుకోకపోవడం లోక విరుద్ధం కాబట్టే ఆ మాత్రం రెంట్ అయినా తీసుకోవలసివస్తోంది అని కూడా ఆయన అన్నారు..’’ అంది వీచిక. వినోద్ మాట్లాడలేదు. రోడ్డు దాటే ధ్యాసలో ఉన్నాడు. రోడ్డు దాటాక, ఇద్దరూ వెనక్కి తిరిగి ఒకసారి ఆ కొత్తింటి వైపు చూశారు. తెల్లటి బట్టల్లో ఉన్న ఆ పెద్దాయన ఇంటి బయటికి వచ్చి నిలబడి, వీళ్లనే చూస్తూ ఉండడం కనిపించింది. ‘‘ఆయన్నలా చూస్తూంటే, ఆ ఇంట్లో ఏమీ లేవని నాకు అనిపించడం లేదు’’ అన్నాడు వినోద్ నవ్వుతూ. వీచిక మళ్లీ అతడి చేతిని గట్టిగా పట్టుకుంది. ‘‘బాల్కనీలోంచి ఏదో చప్పుడు వినిపిస్తోంది వినోద్’’ అంది భయంగా వీచిక. అదిగో అప్పుడే అన్నాడు వినోద్ పెద్దగా నవ్వుతూ..‘‘దెయ్యాలు పాత ఇళ్లల్లోనే ఎందుకుండాలి?! కొత్తగా కట్టిన ఇళ్లల్లో ఉండాలని వాటికి మాత్రం ఉండదా?’’ అని.ఆ ఇంట్లో వారికది ఫస్ట్ డే. ఇంట్లోని గదులు విశాలంగా, కంఫర్ట్‌గా ఉన్నాయి. ఉన్న ఒకటీ అరా సామాను హాల్లో ఓ మూలకు ఉంది. కిచెన్‌ని మాత్రం రెడీ చేసుకున్నారు..‘గృహప్రవేశం’ రోజే బయట తినడం ఎందుకని. రాత్రికి కూడా సరిపోయేలా మధ్యాహ్నమే వండేసింది వీచిక. స్నానం అయ్యాక ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు. భోజనం అయ్యాక వినోద్‌కి చెప్పింది వీచిక..‘‘పగలు వేసినట్లే.. రాత్రిళ్లు జోక్‌లు వెయ్యకు వినోద్. నాకు భయం’’ అని. తెల్లారి లేవగానే వినోద్ ముఖం అలజడిగా ఉండడం గమనించింది వీచిక. ‘‘ఏంటలా ఉన్నావు?’’ అని అడిగింది.. టీ కప్పు అందిస్తూ. ‘‘ఏం లేదు’’ అన్నాడు వీచికనే చూస్తూ. తేటగా, అందంగా ఉంది ఆమె ముఖం. అక్కణ్ణుంచి నేరుగా ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్లాడు వినోద్. ‘‘మీకేమైనా కనిపించాయా కొత్తింట్లో? నిజం చెప్పండి’’ అన్నాడు స్ట్రయిట్‌గా.‘‘నీకేమైనా అనిపించిందా?’’ అన్నారు పెద్దాయన!‘‘అనిపించడం ఏంటీ! కనిపిస్తేనూ..’’ అన్నాడు వినోద్ భయంగా. పెద్దాయన నవ్వారు. ‘‘నా మనవరాలికి నచ్చని పనేదో చేసి ఉంటావ్. చూద్దాం పద’’ అని, వినోద్‌తో పాటు కొత్తింట్లోకి వచ్చారు.‘‘ఇదిగో.. రాత్రి స్నానం చేశాక, ఒళ్లు తుడుచుకుని ఈ తడి టవల్ని తలుపు మీద కుప్పగా వేసినట్లున్నావ్’’ అన్నారు పెద్దాయన.‘‘వేస్తే?’’ అన్నాడు వినోద్.. పెద్దాయన్ని కళ్లప్పగించి చూస్తూ. ‘‘చెప్పాను కదా.. నా మనవరాలికి ఇలాంటివి నచ్చవని’’ అన్నారు పెద్దాయన. వినోద్ బిగదీసుకుపోయాడు. ‘‘మీ మనవరాలు.. ?’’ అంటూ ఆగిపోయాడు.‘‘యు.ఎస్.లో ఉంది. తనే ప్లాన్ పంపి ఈ ఇంటిని కట్టించుకుంది. ‘పద్ధతిగా ఉండేవాళ్లెవరికైనా రెంట్కివ్వు తాతయ్యా’ అని చెప్పి వెళ్లింది. రాత్రి నీకు జరిగిన దానిని బట్టి చూస్తే.. తన మనసంతా ఈ ఇంటిపైనే ఉన్నట్లుంది’’ అన్నారు పెద్దాయన. వినోద్ మరింత బిగుసుకుపోయాడు. ‘‘ఏంటీ.. రాత్రి జరగడం?’’ అంటూ వచ్చింది వీచిక... పెద్దాయనకు టీ అందిస్తూ. భార్యనే చూస్తున్నాడు.. వినోద్.తేటగా, అందంగా ఉంది ఆమె ముఖం. వినోద్ నమ్మలేకపోతున్నాడు.రాత్రి తన చెంపలు పగలగొట్టింది వీచికే అంటే నమ్మలేకపోతున్నాడు! పెద్దాయన మనవరాలు వీచికలోకి ప్రవేశించిందా?బతికున్నవారికి కూడా ఆత్మలుంటాయా?! ∙మాధవ్ శింగరాజు -
దెయ్యాల్లేవ్ గియ్యాల్లేవ్
ఆ చీకట్లో వాళ్లను అలా చూస్తే దెయ్యాలు ఉన్నాయనే అనుకుంటారు ఎవరైనా. ఇద్దరు మనుషులు వాళ్లు! ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు. వాళ్ల మధ్యలో ఖరీదైన గుండ్రటి చెక్క బల్ల ఉంది. ఆ బల్ల మీద ఖరీదైన మద్యం సీసా ఉంది. ఉండడానికైతే ఉంది. ఆ ఇద్దరూ తాగడం లేదు. ఆ ఇద్దరికీ తాగే అలవాటు లేదు. చీకట్లో చాలాసేపటిగా చలనం లేకుండాచలికి గడ్డ కట్టుకుపోయినట్లున్న రెండు పొడవాటి చెట్ల మధ్య.. వాళ్లను మనుషులుగా పోల్చుకోవడం ఎంతటి ధైర్యవంతులకైనా కష్టమే. పైగా వాళ్లు తక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఎక్కువగా ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకుంటున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు.. కలర్ టీవీలు అప్పుడప్పుడే అందుబాటులోకి వస్తున్న కాలం నాటి క్షుద్ర రచయిత. ఇంకొకరు ‘ఘోరై’ అనే పెన్ నేమ్‌తో హాబీగా దెయ్యాల కథలు రాస్తూ, దెయ్యాలు లేవని నిరూపించడానికి ట్రై చేస్తున్న ప్రస్తుత రచయిత. ఘోరై అంటే ఘోస్ట్ రైటర్. ‘‘దెయ్యాలు లేవని నిరూపించడానికి నువ్వెవరు? ఆ పని చేయడానికి విజ్ఞాన వేదిక వాళ్లో, అజ్ఞాన దీపిక వాళ్లో ఉంటారు కదా’’ అన్నాడు క్షుర.. చాలాసేపు ఘోరై చెప్పింది విన్నాక. అప్పటికే నడి రాత్రి దాటింది. ‘‘అది నా ధర్మం అనుకున్నాను సార్’’ అన్నాడు ఘోరై. ‘‘పౌరుడిగా.. పాటించడానికి, అవలంబించడానికి, అనుసరించడానికి పౌర సమాజంలో ఇంకా అనేక ధర్మాలు ఉంటాయి. నువ్వు దెయ్యాలనే ఎందుకు పట్టుకున్నావు?’’ అడిగాడు క్షుర. పెద్దగా ఏడ్చేశాడు ఘోరై. ఆ ఏడుపు మనిషి ఏడుస్తున్నట్లుగా లేదు.‘‘ఊరుకో.. ఎందుకు ఏడుస్తున్నావ్?’’ అన్నాడు క్షుర. అతడి వృద్ధాప్యపు దవడ చలికి వణుకుతోంది. ‘‘పాటించడం, అనుసరించడం, అవలంబించడం.. ఎలా ఉండే భాష ఎలా అయిపోయింది సార్.. మీది! మీ దెయ్యం కథలు చదివి వణికి చచ్చిన జనరేషన్ మాది. మీ మాట ఎంత షార్ప్‌గా ఉండేది! శవం కాలుతున్నప్పుడు పుర్రె ‘టప్’మని పేలినట్లు ఉండేది. అదంతా ఏమైపోయింది సార్. అందుకే ఏడుపొచ్చింది’’ అన్నాడు ఘోరై. ‘‘అవన్నీ గుర్తు చెయ్యకు. ఎందుకొచ్చావ్ చెప్పు’’ అన్నాడు క్షుర విసుగ్గా. క్షుర హర్ట్ అయ్యాడని ఘోరైకి అర్థమైంది. తన కథల్లో దెయ్యాల్ని కూడా చాలాసార్లు హర్ట్ చేశాడు ఘోరై. పాఠకులకు ధైర్యం చెప్పడానికి అతడు చేసిన ఘాతుకం అది. అతడి కథల్లో ఒక్కచోటైనా ‘దెయ్యాల్లేవ్ గియ్యాల్లేవ్’ అనే మాట ఉంటుంది. ఆ మాట టెంపరరీగా మనుషులకు ధైర్యం తెప్పించినా, దెయ్యాలను పర్మినెంట్‌గా హర్ట్ చేస్తుందేమోనన్న ఆలోచన అతడికెప్పుడూ కలగలేదు. ‘‘ఏంటి నీ సమస్య?’’ అడిగాడు క్షుర. ‘‘నన్ను రాయొద్దంటున్నారు సార్’’ అన్నాడు ఘోరై.‘‘ఏం రాయొద్దంటున్నారు? ఎవరు రాయొద్దంటున్నారు?’’ ‘‘దెయ్యాల కథల్ని. పాఠకులు’’‘‘ఎందుకట?’’ అడిగాడు క్షుర. ‘‘పిల్లలు భయపడుతున్నారట’’.‘‘మంచిదే కదా. పిల్లలు ఎవరో ఒకరికి భయపడాలి. తల్లిదండ్రులకు భయపడడం లేదు. టీచర్లకు భయపడం లేదు. దేవుడికి భయపడడం లేదు. దెయ్యం భయమైనా లేకపోతే ఎలా? వాళ్లెలా మంచి పౌరుల్లా ఎదుగుతారు?’’ అన్నాడు క్షుర. ఘోరై మనసు మళ్లీ చివుక్కుమంది. తన గురు సమానుడైన క్షుర నోటి నుంచి ‘మంచి పౌరుల్లా ఎదగడం’ అనే దైవ భాష దిగుమతి అయినందుకు కలిగిన బాధ అది. ‘‘కానీ సార్..దెయ్యాలు ఉన్నాయని రాసి నేను పిల్లల్ని భయపెట్టడం లేదు. దెయ్యాలు లేవని రాసి పిల్లల్ని ధైర్యవంతుల్ని చేస్తున్నాను’’ అన్నాడు ఘోరై. ‘‘పిల్లలకు భయమే లేనప్పుడు వాళ్లకు ధైర్యం ఎందుకు చెప్పాలి?’’ అన్నాడు క్షుర. ‘‘అంటే.. సార్, ముందు భయపట్టి, తర్వాత ధైర్యం చెబుతాను. అదీ నా స్టెయిల్ ఆఫ్ రైటింగ్’’ అన్నాడు ఘోరై.. చేతులు నలుపుకుంటూ.ఘోరై వైపు తీక్షణంగా చూశాడు క్షుర.‘‘మరి పాఠకులకు వచ్చిన ప్రాబ్లం ఏంటి?’’ అన్నాడు. ‘‘దెయ్యాలు ఉంటే ఉన్నాయని చెప్పాలి కానీ, లేనప్పుడు లేవని చెప్పడం ఎందుకు అంటున్నారు సార్.’’‘‘నిజమే కదా’’అన్నాడు క్షుర. ‘‘అసలు ఈ పాఠకులకు ఏం కావాలి సార్. పిచ్చి పట్టిపోతోంది నాకు. రాసింది వద్దంటారు. రాయంది కావాలంటారు! చచ్చి, దెయ్యమై పిల్లల్ని తప్ప మిగతా ఇంటిల్లపాదినీ పీక్కుతినాలన్నంత కోపం వస్తోంది సార్’’ అన్నాడు ఘోరై. అతడి ఆవేదనను గమనించాడు క్షుర. ‘‘ఐ కెన్ అండర్‌స్టాండ్. ప్రతి దెయ్యాల రచయితకీ ఉండే ప్రాబ్లమే ఇది’’ అన్నాడు. ఇద్దరూ చాలాసేపు మౌనంగా ఉన్నారు. ‘ఏం చెయ్యమంటారు సార్’ అన్నట్లు చూస్తున్నాడు ఘోరై.క్షుర అతడికి ఏమీ చెప్పలేకపోయాడు. ముప్పై ఏళ్ల క్రితం తనకొచ్చిన సమస్యే ఇప్పుడీ వర్థమాన రచయితకీ వచ్చింది.‘‘రాస్తే ఏమౌతుందట?’’ అడిగాడు ఘోరైని.‘‘చంపేస్తారట సార్. బెదిరిస్తున్నారు’’‘‘రాయడం మానేస్తే ఏమౌతుంది?’’‘‘చచ్చిపోతాను సార్. రాయకుండా ఉండలేను’’.నిట్టూర్పు విడిచాడు క్షుర. ‘‘టేబుల్ మీద ఉన్న ఈ బాటిల్ చూశావా? ఫుల్ బాటిల్. పక్కనే సోడా, గ్లాసులు. తాగడం నాకు ఇష్టం. కానీ మానేశాను. ఇరవై ఏళ్ల క్రితం క్షుద్ర కథలు రాయడం మానేసిన రోజు నేరుగా వైన్ షాపుకు వెళ్లి, కొనితెచ్చుకున్న బాటిల్ ఇది. అప్పట్నుంచీ కథ రాయలేదు, ఈ బాటిలూ ఓపెన్ చెయ్యలేదు. ఎప్పుడైనా మనసు పీకుతుంది. ఒక్క దెయ్యం కథైనా రాయాలని. రాయకుండా ఉండడం కోసం వెంటనే బాటిల్ బయటికి తీస్తాను. ఈ బాటిల్లో నీకు మందు కనిపిస్తోంది కదా. నాకు దెయ్యం కనిపిస్తుంది. దెయ్యం కథ రాయాలన్న నా కోరికను దెయ్యంలా ఈ సీసాలో బంధించాను నేను’’.. మరోసారి నిట్టూర్పు విడిచాడు క్షుర. ఘోరై ఆ బాటిల్ వైపు చూశాడు. ‘మూత తెరవండీ.. మూత తెరవండీ’ అని బాటిల్ లోపల్నుంచి ఎవరో రోదిస్తున్నట్లుగా అనిపించింది. క్షుర వైపు చూశాడు. అతడి కళ్లు చెమ్మగిల్లి ఉన్నాయి. ‘‘ఈ పాఠకులు మనుషులు కాద్సార్’’ అని పైకి లేచాడు.‘‘పాఠకులను అనకు. మనమే మనుషులం కాదు’’ అని క్షుర కూడా పైకి లేచాడు. ఇద్దరూ పైకి లేచిన రెండు క్షణాలకు, అప్పటి వరకు శిలల్లా బిగుసుకుపోయి ఉన్న ఆ రెండు పొడవాటి చెట్లూ ఊగడం మొదలుపెట్టాయి!