goutham savang
-
గ్రూప్–1 దరఖాస్తు గడువు 5 వరకు పొడిగింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రూప్–1 కేడర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు గడువును నవంబర్ 5వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని గ్రూప్–1 కేడర్‌లోని 92 పోస్టులకు నియామక ప్రక్రియ కోసం ఏపీపీఎస్సీ సెప్టెంబర్ 30న నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు నిర్వహించే పరీక్షల కోసం అక్టోబర్ 13 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. దరఖాస్తుల స్వీకరణకు నవంబర్ 2వ తేదీతో(బుధవారంతో) గడువు ముగిసింది. అయితే గడువు పొడిగించాలని నిరుద్యోగ అభ్యర్థుల నుంచి వందలాదిగా ఏపీపీఎస్సీకి అభ్యర్థనలు అందడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఏపీపీఎస్సీ చైర్మన్ డి.గౌతమ్ సవాంగ్ తెలిపారు. సంబంధిత ఫీజును 4వ తేదీ రాత్రి 11.59లోపు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. డిసెంబర్ 18న ప్రిలిమ్స్ గ్రూప్–1 పోస్టుల నియామకాలకు సంబంధించి ప్రిలిమినరీ(స్క్రీనింగ్ టెస్టు)ని డిసెంబర్ 18న నిర్వహిస్తున్నట్టు ఏపీపీఎస్సీ చైర్మన్ తెలిపారు. దరఖాస్తు గడువు పొడిగించినా పరీక్ష తేదీల్లో ఎలాంటి మార్పు లేదన్నారు. మెయిన్స్ పరీక్షలను మార్చి రెండో వారం తర్వాత చేపడతామని వెల్లడించారు. -
డీజీపీగా అత్యధిక కాలం పని చేసిన సవాంగ్
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన అనంతరం అత్యధిక కాలం డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించిన పోలీసు అధికారిగా గౌతం సవాంగ్ రికార్డు సృష్టించారు. ఆయన రెండు సంవత్సరాల ఎనిమిది నెలల 18 రోజులపాటు రాష్ట్ర పోలీస్ బాస్‌గా కీలకమైన స్థానంలో కొనసాగారు. డీజీపీలుగా విధులు నిర్వహించిన వారెవరూ ఇంత కాలం ఆ పోస్టులో కొనసాగలేదు. రాష్ట్ర విభజన తర్వాత నుంచి అంటే 2014 జూన్ 2 నుంచి 2022 ఫిబ్రవరి 18 వరకు ఏపీలో ఐదుగురు డీజీపీలుగా వ్యవహరించారు. ప్రస్తుతం నియమితులైన కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆరో డీజీపీ. టీడీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో అంటే 2014 జూన్ నుంచి 2019 మే 30 వరకు నలుగురు పోలీసు అధికారులు డీజీపీగా పని చేశారు. అంటే సగటున ఒక్కో డీజీపీ కేవలం 15 నెలల పాటు ఆ పదవిలో కొనసాగారు. గత ప్రభుత్వంలో కుర్చీలాట! టీడీపీ ప్రభుత్వ హయాంలో డీజీపీ పోస్టును ఓ కుర్చీలాటగా మార్చారని పరిశీలకులు విమర్శిస్తున్నారు. చీటికిమాటికి డీజీపీలను మార్చడం, లేదా తక్కువ సర్వీసు ఉన్న పోలీసు అధికారులను ఆ పోస్టులో నియమించడం టీడీపీ రాజకీయ వ్యూహమని చెబుతున్నారు. అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం నియమించిన తొలి డీజీపీ గౌతం సవాంగ్‌ను రికార్డు స్థాయిలో అత్యధిక కాలం ఆ పోస్టులో కొనసాగేందుకు అవకాశం కల్పించింది. దాంతో పోలీసు అధికారుల నైతిక స్థైర్యం పెరగడంతోపాటు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పటిష్టమైందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. డీజీపీగా చేసిన అనంతరం కూడా గౌతం సవాంగ్‌ను రాజ్యాంగ బద్ధమైన ఏపీపీఎస్సీ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
శాంతిభద్రతలకు అగ్ర ప్రాధాన్యం
సాక్షి, అమరావతి/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు పూర్తి భద్రత కల్పించడమే తన ప్రధాన లక్ష్యాలని నూతన డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రధానంగా మహిళలు, బడుగు, బలహీన వర్గాలు, సామాన్యుల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపడతామని చెప్పారు. పూర్తి అదనపు బాధ్యతలతో రాష్ట్ర డీజీపీగా శనివారం ఆయన మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో గౌతం సవాంగ్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఆయనకు అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యం, సహకారంతో సవాళ్లను దీటుగా ఎదుర్కొంటామని చెప్పారు. మత సామరస్యానికి భంగం కలిగించే, ఇతరత్రా అసాంఘిక చర్యలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. క్షేత్ర స్థాయి నుంచి పోలీసు వ్యవస్థ పూర్తి బాధ్యత, జవాబుదారీతనంతో పని చేసేలా సమన్వయపరుస్తామని చెప్పారు. పోలీసు అధికారులు, సిబ్బంది తమ ప్రవర్తనా నియమావళికి కట్టుబడి నిబద్ధతతో వ్యవహరించాలని, అందుకు భిన్నంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడమని స్పష్టం చేశారు. దిశ యాప్, దిశ మహిళా పోలీసు వ్యవస్థ, గ్రామ, వార్డు సచివాలయాల్లో 15 వేల మంది మహిళా పోలీసుల నియామకం.. తదితర చర్యలతో క్షేత్ర స్థాయిలో పోలీసు వ్యవస్థ మరింత బలోపేతమైందని చెప్పారు. గంజాయి సాగు, సైబర్ నేరాలు, డ్రగ్స్, ఎర్రచందనం స్మగ్లింగ్ మొదలైనవి పూర్తిగా కట్టడి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో తదనుగుణంగా కొత్తగా పోలీసు జిల్లాలు, యూనిట్లను పునర్వ్యవస్థీకరిస్తామని చెప్పారు. అందుకోసం ఇప్పటికే ఓ కమిటీని నియమించామని తెలిపారు. ప్రముఖుల పర్యటనల సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అదనపు డీజీ (శాంతి భద్రతలు) నేతృత్వంలో ఓ కమిటీ అధ్యయనం చేస్తోందన్నారు. దుర్గమ్మ పంచ హారతుల సేవలో డీజీపీ రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌రెడ్డి శనివారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. సతీమణితో కలిసి అమ్మవారి పంచ హారతుల సేవలో పాల్గొన్నారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో భ్రమరాంబలు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, వెస్ట్ ఏసీపీ హనుమంతరావు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు: సవాంగ్ రాష్ట్ర ప్రజలకు డీజీపీగా రెండేళ్ల 8 నెలల పాటు సేవ చేసేందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి గౌతం సవాంగ్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో సవాళ్లను దీటుగా ఎదుర్కొని నిష్పక్షపాతంగా పనిచేసి, పోలీసు వ్యవస్థ ప్రతిష్టను మరింతగా ఇనుమడింపజేశామన్నారు. బదిలీని పురస్కరించుకుని పోలీసు అధికారులు మంగళగిరిలోని ఆరో బెటాలియన్ మైదానంలో శనివారం సవాంగ్ దంపతులున్న ప్రత్యేక వాహనాన్ని అధికారులు తాళ్లతో లాగుతూ ఘనంగా వీడ్కోలు పలికారు. సవాంగ్ మాట్లాడుతూ రాష్ట్ర పోలీసు వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చామని చెప్పారు. దిశ యాప్‌ను 1.10 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారని, స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై 40 వేలకు పైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. ఆపరేషన్ పరివర్తన్ ద్వారా 7,552 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేయడం దేశంలోనే రికార్డని చెప్పారు. తనకు సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
ఆ నలుగురి మరణం ‘పోలీస్ కుటుంబానికి తీరని లోటు’
సాక్షి, అమరావతి: రోడ్డు ప్రమాదంలో నలుగురు ఏఆర్ పోలీసులు మృతి చెందడం తమ పోలీస్ కుటుంబానికి తీరని లోటు అని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. శ్రీకాకుళంలో జరిగిన ప్రమాద ఘటనపై ఆయన దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం ఘటనా స్థలాన్ని చేరుకొని వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని రేంజి డీఐజీ, ఎస్పీని ఆదేశించారు. (చదవండి: ‘హీరోయిన్లా జట్టు విరబూసుకుని రావొద్దు’ ‘సెల్ఫీలు దిగొద్దు’) ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి వివరాలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. మరణించిన పోలీస్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం, పోలీస్ శాఖ అండగా ఉంటుందని ప్రకటించారు. కలకత్తాలో మరణించిన ఆర్మీ జవాన్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. (చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు పోలీసులు మృతి) -
ఈ ఫేస్బుక్ పేజీ ‘మానవత్వ ధీర’
విజయనగరం క్రైమ్: కోవిడ్‌తో బాధపడుతూ మృతి చెందిన వారిని ‘విజయనగరం యూత్ ఫేస్బుక్ పేజీ’ పేరుతో తమవంతు బాధ్యతగా అంత్యక్రియలు నిర్వహించి పలువురి మన్ననలు పొందిన ఫేస్బుక్ పేజీ బృందాన్ని రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ అభినందించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో విశేషమైన సేవలందించిన స్వచ్ఛంద సంస్థలతో శుక్రవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. కోవిడ్ సమయంలో సంస్థలు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకుని, అభినందించి, భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలను చేపట్టి, రాష్ట్ర ఉన్నతికి పాటుపడాలన్నారు. జాతి, కులం, మతం, ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా మానవత్వమే పరమావధిగా వారి సంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారాలను నిర్వహించి, బాధితుల కుటుంబాల పట్ల ఆపద్బాంధువులయ్యారన్నారు. (విజయనగరం యూత్ ఫేస్బుక్ పేజీ) ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి జిల్లా పోలీసుశాఖకు పంపిన ‘మానవత్వ ధీర’ అవార్డును ఎస్పీ బి.రాజకుమారి విజయనగరం యూత్ ఫేస్బుక్ బృందం సభ్యులు షేక్ ఇల్తమాష్, నడుకూరి ఈశ్వరరావు (శివ), అయ్యప్ప, అమర్‌లకు అందజేశారు. వారిని అభినందించి, శాలువాలతో సత్కరించారు. రెండేళ్లుగా అనేక రకమైన సేవలందిస్తూ ప్రజల మన్ననలను ఈ పేజీ సభ్యులు పొందారని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐలు జి.రాంబాబు, ఎస్పీ పీఏ కె.కృష్ణమూర్తి, పోలీసు పీఆర్ఓ కోటేశ్వరరావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మానవత్వ ధీర అవార్డును ఫేస్బుక్ పేజీ ప్రతినిధులకు అందిస్తున్న ఎస్పీ రాజకుమారి -
పోలీస్ శాఖలో సంస్కరణలతో సత్ఫలితాలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో రెండేళ్ల క్రితం మొదలైన సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. శనివారం ఆయనొక ప్రకటన చేస్తూ.. డిజిటలైజేషన్ దిశగా అడుగులు వేస్తున్న పోలీసు శాఖలో క్రమం తప్పకుండా అర్హత ప్రాతిపదికన ప్రతి ఒక్కరికీ సకాలంలో పదోన్నతులు కలిగే పరిపాలన వ్యవస్థ రూపుదిద్దుకుందని తెలిపారు. రాష్ట్రంలో ఒకేసారి 181 మంది ఎస్సైలకు సీఐలుగా పదోన్నతి కల్పించడం పోలీస్ శాఖ చరిత్రలోనే ఒక మైలురాయి అని పేర్కొన్నారు. ‘రూల్ ఆఫ్ లా’ను పకడ్బందీగా అమలుపరిచేలా, ప్రజల ధన, మాన, ప్రాణాలకు భరోసాగా ఉండేలా పోలీస్ శాఖ 24 గంటలూ పనిచేయాల్సి ఉంటుందన్నారు. పోలీసుల మనసెరిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒకవైపు పోలీసుల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తూŠ, మరోవైపు వృత్తి పరమైన అభ్యున్నతికి ప్రాధాన్యత ఇస్తున్నారని డీజీపీ తెలిపారు. సత్వర స్పందన, జవాబుదారీతనం పరమావధిగా.. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే పోలీస్ శాఖలో సమూల సంస్కరణలు, మార్పు అవసరమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుర్తించారని సవాంగ్ తెలిపారు. అందుకు అనుగుణంగా పారదర్శకత, జవాబుదారీతనం, సత్వర స్పందన, బాధ్యతాయుతమైన సేవలే పరమావధిగా అడుగులు వేశారన్నారు. ఏళ్ల తరబడి శాఖలో విధులు నిర్వహిస్తూ సరైన సమయంలో పదోన్నతులు లభించకపోవడంతో కానిస్టేబుల్ మొదలుకొని ఎస్పీ స్థాయి అధికారి వరకు నిరాశ, నిస్పృహలతో ఉన్నట్టు గుర్తించిన సీఎం ఏడేళ్లుగా పోలీస్ శాఖలో అసంపూర్తిగా మిగిలిపోయిన పదోన్నతులపై తాను ఇచ్చిన నివేదిక మేరకు తక్షణమే చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారని గుర్తు చేశారు. విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలు రేంజ్‌ల పరిధిలోని పోలీస్ అధికారులు, పదోన్నతుల కమిటీ పలుమార్లు సమావేశం నిర్వహించి ఒకేసారి 181 మంది ఎస్సైల పదోన్నతులకు చర్యలు తీసుకున్నట్టు డీజీపీ తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం దాదాపు ఏడేళ్ల పాటు ఇరు రాష్ట్రాల డీఎస్పీల మధ్య సీనియారిటీ సమస్య తెగక పదోన్నతులకు నోచుకోలేదన్నారు. అన్ని సమస్యలను అధిగమించి గత సెప్టెంబర్‌లో డీఎస్పీ సీనియారిటీ లిస్టులను సరిచేసి విభజన ప్రక్రియను దిగ్విజయంగా పూర్తి చేశామన్నారు. దీనివల్ల వందలాది మంది డీఎస్పీలు ప్రమోషన్లు పొందినట్టు వివరించారు. సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్రంలో 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారని, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) ఏర్పాటు వంటి వినూత్న చర్యలు తీసుకోవడంతోపాటు ఖాళీ పోస్టుల భర్తీ, పదోన్నతులు, జీతభత్యాలు, అవార్డులు, రివార్డులు, ఇంక్రిమెంట్లు వంటి అనేక విషయాల్లో మరింత ప్రోత్సాహం అందిస్తున్నారని డీజీపీ వివరించారు. -
మావోయిస్టు కీలకనేత లొంగుబాటు: రూ.20 లక్షలు ఆయనకే
సాక్షి, అమరావతి/ దుబ్బాక టౌన్: మావోయిస్టు కీలక నేత, ప్రస్తుతం మావోయిస్టు ఆంధ్రా-ఒడిశా సరిహద్దు స్పెషల్ జోన్ కమిటీ (ఏఓబీ ఎస్జెడ్సీ) సభ్యుడిగా ఉన్న ముత్తన్నగారి జలంధర్‌రెడ్డి అలియాస్ కృష్ణ అలియాస్ మారన్న, అలియాస్ కరుణ, అలియాస్ శరత్.. మంగళవారం ఆంధ్రప్రదేశ్ డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ ఎదుట లొంగిపోయాడు. ఇతను 22 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నాడు. నలభై ఏళ్ల జలంధర్‌రెడ్డి స్వస్థలం తెలంగాణలోని సిద్దిపేట జిల్లా (పూర్వపు మెదక్ జిల్లా) దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండలం భూంపల్లి గ్రామం. డిగ్రీ చదువుతుండగా మావోయిస్టు పార్టీలో చేరి, వివిధ హోదాల్లో పనిచేసిన ఇతనిపై రూ.20 లక్షల రివార్డు ఉంది. కాగా జలంధర్ లొంగుబాటు పురస్కరించుకుని ఏపీ డీజీపీ సవాంగ్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల వల్లే.. మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. లొంగిపోయే మావోయిస్టులకు చట్టపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహాయ పునరావాస ఏర్పాట్లు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ఆదివాసీ గిరిజనులు చైతన్యవంతమై మావోయిస్టులకు దూరమవుతున్నారని చెప్పారు. దీంతో ఏఓబీలో మావోయిస్టులు పట్టు కోల్పోయారని, గడిచిన రెండేళ్లలో అనేక మంది లొంగిపోయారని వివరించారు. జలంధర్‌పై ఉన్న రూ.20 లక్షల రివార్డు మొత్తాన్ని ఆయన సహాయ పునరావాస కార్యక్రమానికి వినియోగిస్తామని డీజీపీ చెప్పారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టి అడవి బాట.. రిటైర్డ్ వీఆర్వో ముత్తన్నగారి బాలకృష్ణారెడ్డి, సులోచన దంపతుల ముగ్గురు కుమారుల్లో జలంధర్ చివరివాడు. ఇతని తాత పద్మారెడ్డి పోలీస్ పటేల్. 50 ఎకరాలకు పైగా భూమి ఉంది. గ్రామంలో పేరున్న ఉన్నత కుటుంబంలో జన్మించినప్పటికీ పేద ప్రజల కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం అడవి బాట పట్టాడు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళశాలలో డిగ్రీ చదువుతుండగా ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. 1999–2000లో అప్పటి పీపుల్స్‌వార్ అనుబంధ సంస్థ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్ఎస్యూ)లో పనిచేస్తూ పూర్తిస్థాయి అజ్ఞాతంలోకి వెళ్లాడు. తెలంగాణ, ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో çవివిధ హోదాల్లో, పలు పేర్లతో పనిచేశాడు. 19 ఎదురుకాల్పుల సంఘటనలు, పలు పోలీస్స్టేషన్లపై దాడులతో పాటు 2008లో సంచలనం సృష్టించిన బలిమెల సంఘటనలోనూ జలంధర్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇతని ఇద్దరు సోదరుల్లో ఒకరు వ్యవసాయం చేస్తుండగా, మరొకరు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉన్నారు. బతికుండగా తమ కొడుకును చూస్తామనుకోలేదంటూ జలంధర్ లొంగుబాటుపై తల్లిదండ్రులు బాలకృష్ణారెడ్డి, సులోచన ఆనందం వ్యక్తం చేశారు. చదవండి: కరోనా టీకా.. జనాభాలో యవ్వనులే అధికం చదవండి: బొల్లినేని శ్రీనివాస గాంధీ అరెస్ట్ -
'ఎస్వోపీ'తో సత్వర న్యాయం
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలో భాగంగా దళితులు, గిరిజనుల రక్షణ కోసం రూపొందించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ)తో సత్వర న్యాయం అందుతుందని మంత్రులు పినిపే విశ్వరూప్, మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్ అభిప్రాయపడ్డారు. ఇది దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. బుధవారం సచివాలయంలో హైపవర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి హాజరైన ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వీటిపై అవగాహన క్పలించారు. గత ఏడేళ్లలో ఎన్నడూ జరగని ఈ కమిటీ సమావేశాలను తమ ప్రభుత్వ హయాంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ చెప్పారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై ముఖ్యమంత్రి జగన్ చూపుతున్న ప్రత్యేక శ్రద్ధకు ఇది నిదర్శనమన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి రాష్ట్ర స్థాయిలో, మూడు నెలలకొకసారి జిల్లా స్థాయిలో హైపవర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారన్నారు. ఆగస్టులో రాష్ట్ర స్థాయి సమావేశానికి సీఎం హాజరు కానున్నట్లు చెప్పారు. నేరాలు 13 శాతం తగ్గుముఖం: డీజీపీ సవాంగ్ రాష్ట్రంలో క్రైమ్ రేట్ 13 శాతం తగ్గిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నిందితులుగా ఉన్న వారు తమ శాఖకు చెందిన వారైనా ఉపేక్షించకుండా ఇటీవల ఇద్దరు ఎస్ఐలు, ఒక సీఐపై చర్యలు తీసుకున్నామన్నారు. దర్యాప్తును 38 రోజుల్లో పూర్తి చేస్తున్నామన్నారు. ఉద్వేగానికి గురైన ఎమ్మెల్యే పద్మావతి అనంతపురంలో జోగిని, మాతంగి వ్యవస్థ పేరుతో ఎస్సీ మహిళలను బలి పశువులుగా మారుస్తున్నారని సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్ల బాలికలను సైతం విడిచి పెట్టడం లేదంటూ ఉద్వేగానికి గురయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరారు. కేసుల నమోదులో నిర్లక్ష్యాన్ని సహించం: హోంమంత్రి సుచరిత ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదులో నిర్లక్ష్యం చూపే పోలీసు అధికారులను క్షమించేది లేదని హోం మంత్రి మేకతోటి సుచరిత హెచ్చరించారు. అట్రాసిటీ చట్టం వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. కేసు దర్యాప్తు, పురోగతిపై ఎప్పటికప్పుడు బాధితులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. జిల్లా స్థాయి కమిటీ సమావేశాలకు మంత్రులు హాజరు కావాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత కోరారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎంతో ఉపయోగపడుతుందని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. దీన్ని రూపొందించిన అధికారులను అభినందించారు. 24 గంటల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు బాధితులకు 7 రోజుల్లోగా ఎక్స్‌గ్రేíÙయా అందుతుందని సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సునీత పేర్కొన్నారు. 60 రోజుల్లో చార్జిïÙట్ దాఖలు చేసేలా నిబంధనలు రూపొందించామన్నారు. -
అబ్బురపరిచిన ఆక్టోపస్, బాంబ్ స్క్వాడ్ విన్యాపాలు
-
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా..
సాక్షి, అమరావతి : చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఏపీ పోలీస్ ఒకేసారి 48 జాతీయ అవార్డులు పొందటం గర్వించదగ్గ విషయయని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన సహకారం, ప్రోత్సాహంతోనే ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకోగలిగామని తెలిపారు. టెక్నాలజీ వినియోగంతో పోలీస్ సేవలను ప్రజలకు మరింత చేరువయ్యేలా చేశామన్నారు. 'మహిళా భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దిశా యాప్‌కి బంగారు పతకం వచ్చింది. పోలీస్ సేవలను ప్రజలకు అందించేందుకు విప్లవాత్మక మార్పులు తెచ్చాం. పోలీస్ సేవా యాప్ ద్వారా ఇంటినుంచే కావాల్సిన సమాచారం తెలుసుకొనే అవకాశం కల్పించాం. యాప్ ద్వారా 29 రోజుల్లోనే 32000 ఎఫ్ఐఆర్లు డౌన్ లోడ్ చేశారు. దాంతో పోలీస్ సేవా యాప్‌కి కూడా బంగారు పతకం వచ్చింది' అని గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. (ఏపీ పోలీస్ నంబర్ వన్ ) సామాన్యులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ సేవలు అందాలన్నది ప్రభుత్వ ఆదేశమని, టెక్నాలజీ వినియోగంతో అవినీతిని రూపుమాపాలన్నది సీఎం జగన్ లక్ష్యమని తెలిపారు పారదర్శకత ,జవాబుదారీతనంతో ఏపీ పోలీస్ ముందుకు సాగుతోందని భవిష్యత్తులో టెక్నాలజిని పూర్తి స్థాయిలో వినియోగించి ఇంకా మార్పులు తెస్తామన్నారు. ఆన్లైన్ గేమింగ్ ,గ్యాంబ్లింగ్ ,బెట్టింగ్‌లపై ప్రత్యేక దృష్టి సారించామని గంజాయి, డ్రగ్స్‌పై స్పెషల్ డ్రైవ్‌లు పెట్టి వాటిపై కూడా ఉక్కుపాదం మోపుతామని డీజీపీ వెల్లడించారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేసే వారిపై నిఘా పెట్టామని, టెక్నాలజీ వాడి తప్పించుకోవాలని చూసినా ట్రాక్ చేస్తామని హెచ్చరించారు. (48 స్కోచ్ గ్రూపు అవార్డులు దక్కించుకున్న ఏపీ ) -
పోలీస్.. మరింత ఫ్రెండ్లీ
పోలీస్ వ్యవస్థ ఉన్నది ప్రజల కోసమే. వారికి మరింత సమర్థవంతంగా సేవలు అందించడంలో భాగంగా ఇంకో అడుగు ముందుకు వేస్తూ.. ఇవాళ ఈ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ యాప్ ద్వారా చాలా సమస్యలకు పరిష్కారం పొందవచ్చు. ఈ సందర్భంగా పోలీసులు చట్టాన్ని కాపాడటం కోసమే అధికారాలు ఉపయోగించాలనే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నా. –ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: పోలీసులు అంటే సేవకులని, వారిని చూసి భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వారు కూడా మన కుటుంబ సభ్యులే అని భావించి ఆశ్రయించవచ్చని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ప్రజలకు మరింత చేరువైందన్నారు. పౌరులకు మరింత మెరుగైన సేవలందించే లక్ష్యంతో ఏపీ పోలీస్ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన ‘ఏపీ పోలీస్ సేవ (సిటిజెన్ సర్వీసెస్ అప్లికేషన్) యాప్’ను సోమవారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 1000 కేంద్రాల నుంచి పాల్గొన్న 46 వేల మంది పోలీస్ యంత్రాంగాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. యాప్ ద్వారానే ఫిర్యాదు చేయొచ్చు – పోలీసులు అంటే ఒక బలగం లేదా ఒక శక్తిగా కాకుండా, సేవలందించే వారిగా ఈ సమాజం చూసినప్పుడే సిటిజన్ ఫ్రెండ్లీకి అర్థం ఉంటుంది. ఇప్పుడు ఈ యాప్ ద్వారా పౌరులకు ఆరు విభాగాలలో 87 రకాల సేవలు అందుతాయి. ఇళ్ల భద్రత మొదలు ఏ అవసరం కోసం అయినా యాప్ ఉపయోగపడుతుంది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం చాలా తగ్గుతుంది. – సర్టిఫికెట్ కావాలన్నా, డాక్యుమెంట్లు పోయినా, ఏవైనా లైసెన్స్‌లు రెన్యువల్ చేయించుకోవాలన్నా, ఎన్ఓసీ కావాలన్నా పోలీస్ స్టేషన్‌కు పోవాల్సిన అవసరం లేదు. మొబైల్ యాప్‌లోనే ఫిర్యాదు చేయవచ్చు. కేసు నమోదు చేస్తే, ఎఫ్ఐఆర్ కూడా పొందవచ్చు. ఆ తర్వాత ఎప్పటికప్పుడు పూర్తి సమాచారం ఎస్ఎంఎస్ ద్వారా అందుతుంది. మహిళల భద్రత, రక్షణకు అత్యంత ప్రాధాన్యం – మహిళల భద్రత, రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ 12 మాడ్యూల్స్ చేర్చారు. దిశ యాప్ కూడా అనుసంధానం చేశారు. రోడ్ సేఫ్టీకి సంబంధించి కూడా 6 మాడ్యూల్స్ ఉన్నాయి. చిన్న ప్రమాదం జరిగినా, దాన్ని రిపోర్టు చేయడంతోపాటు, ఆస్పత్రికి తరలించే వరకు పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. – సైబర్ నేరాలకు సంబంధించి కూడా దాదాపు 15 మాడ్యూల్స్ ఉన్నాయి. ఆ నేరాలకు సంబంధించి ఎవరికి ఏ సమస్య ఉన్నా యాప్ ఉపయోగపడుతుంది. సోషల్ మీడియాలో వచ్చే సమాచారంలో వాస్తవం ఏమిటన్నది కూడా తెలుసుకోవచ్చు. “ఫ్యాక్టŠస్ చెక్’ అన్న ఫీచర్ కూడా ఇందులో ఉంది. – పోలీసులే సరైన సమాచారం ఇచ్చే సోషల్ మీడియా కూడా ఈ యాప్‌లో అందుబాటులో ఉంటుంది. గ్రామ పోలీసులతో అనుసంధానం – ఇప్పటికే పోలీస్ సేవలు గ్రామ గ్రామానికి చేరాయి. ప్రతి 2 వేల జనాభాకు గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటయ్యాయి. వాటిలో మహిళా పోలీసులను కూడా నియమించాం. వీరి ద్వారా ఎన్నో సేవలు అందుతున్నాయి. ఈ యాప్‌లో గ్రామ పోలీసులను కూడా అనుసంధానం చేశాం. – దేశంలోనే తొలిసారిగా దిశ యాప్ తీసుకొచ్చాం. ఇది ఎంతో సక్సెస్ అయింది. 11 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇది గర్వకారణం. దిశ యాప్ ద్వారా 568 మంది నుంచి ఫిర్యాదులు అందగా, వాటిలో 117 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి చర్యలు తీసుకున్నాం. – సైబర్ సేఫ్టీ కోసం సైబర్‌మిత్ర అనే వాట్సాప్ నంబర్‌ను ఫేస్బుక్లో అందుబాటులోకి తెచ్చాం. – న్యాయ ప్రక్రియలో కేసులు త్వరగా పరిష్కారమయ్యే విధంగా గత నెలలో “ఇంటర్–ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్’ (ఐసీజెఎస్) ప్రవేశపెట్టాం. ఈ విధానం ద్వారా ఆన్లైన్లోనే ఎఫ్ఐఆర్, చార్జ్షీట్లు పంపిస్తున్నారు. దీని ద్వారా కేసుల విచారణ వేగంగా జరుగుతుంది. ప్రజల కోసమే పోలీస్ వ్యవస్థ – నేరాన్ని నిరోధించడం, నేరాలపై విచారణ చేయడం, శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత, సమాజంలో నేరాలు జరగకుండా చేయడమే లక్ష్యం. వారి పని ఇంకా సులభతరం చేయడం కోసం ఈ వ్యవస్థను తెచ్చాము. – వీలైనంత పారదర్శకంగా వ్యవస్థను మార్చుకోవడం, ఒక ఫిర్యాదు చేయాలన్నా, ఒక ఎఫ్ఐఆర్ కాపీ పొందాలన్నా, లేదా దాన్ని ఆపాలన్నా ఎక్కడా పెద్దల జోక్యం ఉండకూడదు. – ఈ కార్యక్రమంలో సీఎం జగన్ యాప్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. పోలీస్ ఫీల్డ్ ఆఫీసర్లకు అత్యాధునిక ట్యాబ్‌లను అందజేశారు. పోలీస్ శాఖ పక్షాన డీజీపీ గౌతమ్ సవాంగ్ ఒక శాటిలైట్ ఫోన్‌ను సీఎంకు అందజేశారు. మహిళలకు మరింత భద్రత మహిళల రక్షణ కోసం దిశ చట్టం చేశారు. ఇప్పుడు 6 విభాగాల్లో 87 రకాల సేవలందించేలా యాప్ అందుబాటులోకి తీసుకొచ్చారు. పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారానికి ఒక వారోత్సవం నిర్వహిస్తే బాగుంటుంది. – మేకతోటి సుచరిత, హోం మంత్రి పోలీస్ చరిత్రలో మరిచిపోలేని రోజు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నందుకు ఎన్నో అవార్డులు వచ్చాయి. ఇవాళ ఈ యాప్ ఆవిష్కరణ వల్ల ఏపీ పోలీస్ చరిత్రలో మరిచిపోలేని రోజు. – గౌతమ్ సవాంగ్, డీజీపీ -
దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద నిరంతర నిఘా
సాక్షి, అమరావతి: దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద నిరంతర నిఘా ఉండేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీలను డీజీపీ గౌతం సవాంగ్ ఆదేశించారు. అన్ని దేవాలయాలు, ప్రార్థనా మందిరాలను జియో ట్యాగింగ్ చేయాలని సూచించినట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. డీజీపీ ప్రకటనలోని అంశాలు.. ► పెట్రోలింగ్‌ను పటిష్టపరచడంతో పాటు సోషల్ మీడియా పుకార్లపై నిఘా పెట్టాలి. మత సామరస్యానికి సంబంధించిన విషయాల్లో ప్రజలు పుకార్లు నమ్మకుండా శాంతిభద్రతలు కాపాడేందుకు సహకరించేలా అన్ని చర్యలు తీసుకోవాలి. ► బహిరంగ ప్రదేశాల భద్రతా చట్టం– 2013 ప్రకారం దేవాలయాలు, ప్రార్థనా మందిరాల పరిసర ప్రాంతాలు స్పష్టంగా కనిపించే విధంగా లైట్లు అమర్చాలి. సీసీ కెమెరాలు, అగ్ని ప్రమాద నియంత్రణ పరికరాలు ఏర్పాటు చేసుకోవాలి. దేవాలయాలకు ఫైర్, ఎలక్ట్రిసిటీ ఆడిట్ నిర్వహించడంతో పాటు రక్షణ ఏర్పాట్లు పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాలి. ► ఈ అంశాలపై నిర్వాహకులకు పోలీసు సిబ్బంది అవగాహన కల్పించాలి. ► అంతర్వేది ఆలయంలో స్వామి వారి రథం అగ్నికి ఆహుతవ్వడం అత్యంత దురదృష్టకరం. ► ‘ఈ ఘటనను ఆసరాగా చేసుకుని మత సామరస్యానికి ప్రతీకగా ఉండే రాష్ట్రంలో కొందరు ఆకతాయిలు మతాల మధ్య చిచ్చు పెడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి చర్యలను పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’.. అని డీజీపీ పేర్కొన్నారు. ఈమేరకు ట్వీట్ కూడా చేశారు. -
ఈ అలజడి ఎవరి మనోరథం?
సాక్షి, అమరావతి: అంతర్వేది శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆలయ రథం దగ్ధం ఘటనలో ప్రభుత్వం విచారణను వేగవంతం చేసింది. ఘటనపై తక్షణం స్పందిస్తూ వెనువెంటనే చర్యలకు ఉపక్రమించింది. పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించింది. ఈ ఘటన దురదృష్టకరమని, బాధ్యులు ఎవరైనాసరే విడిచిపెట్టే ప్రసక్తే లేదని ప్రకటించింది. ఇంత చిత్తశుద్ధితో ప్రభుత్వం వ్యవహరిస్తుంటే కొందరు పనిగట్టుకుని దీన్ని రాజకీయం చేస్తూ.. ప్రజల్లో అలజడి సృష్టించాలని పన్నాగం పన్నినట్లు జరుగుతున్న ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి వాటిని ఉపేక్షించే ప్రసక్తే లేదని, ఈ ఘటన ఆధారంగా రాజకీయ ప్రయోజనాల కోసం కుట్రలకు పాల్పడే అసాంఘిక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. సత్వరమే స్పందించిన ప్రభుత్వం – జిల్లా మంత్రి వేణుగోపాలకృష్ణ, కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, ఏలూరు రేంజ్ డీఐజీ మోహనరావు, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఇతర అధికారులు ఆదివారం ఉదయమే ఆలయానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంలు ఆధారాలు సేకరించాయి. అన్ని కోణాల్లో విచారణ సాగుతోంది. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి అగ్నిమాపక, దేవాదాయ, రెవెన్యూ అధికారులతో ఓ కమిటీని నియమించారు. – విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న ఆలయ కార్యనిర్వాహణ అధికారి(ఈవో) నల్లం సూర్య చక్రధరరావును ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో యర్రశెట్టి భద్రజీరావును కొత్త ఈవోగా నియమించింది. సీసీ కెమెరాల పర్యవేక్షణ సిబ్బంది, భద్రతా సిబ్బందిపై చర్యలు తీసుకుంది. – రాష్ట్ర దేవాదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌తోపాటు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మంత్రులు వేణగోపాలకృష్ణ, పినెపి విశ్వరూప్ రెండవసారి మంగళవారం అంతర్వేది వెళ్లి దర్యాప్తు తీరును సమీక్షించారు. – కొత్త రథం నిర్మాణానికి రూ.95 లక్షలు వెంటనే మంజూరు చేసింది. వచ్చే ఫిబ్రవరి నాటికి కొత్త రథం తయారవుతుందని మంత్రి వెలంపల్లి ప్రకటించారు. కుట్రకు యత్నిస్తున్న అసాంఘిక శక్తులు – ఈ ఘటనలో ప్రభుత్వం ఇంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం దీన్ని రాజకీయ లబ్ధికి వాడుకోవాలని కుట్రలు పన్నుతుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా బయట నుంచి అసాంఘిక శక్తులను అంతర్వేదిలోకి పంపించి మరీ ఉద్రిక్తతలను సృష్టించడానికి యత్నించడం వారి కుట్రను తేటతెల్లం చేస్తోంది. – ప్రతిపక్ష నేత చంద్రబాబు తమ పార్టీ నేతలు ముగ్గురితో కమిటీ వేశారు. ఆ కమిటీ ఆలయాన్ని పరిశీలించి రాజకీయ విమర్శలు చేయడం ద్వారా ప్రజల మనోభావాలను రెచ్చగొట్టేందుకు యత్నించడం గమనార్హం. – ఆ మర్నాడే కొందరు అసాంఘిక శక్తులు అంతర్వేదిలో ఉద్రిక్తతలు సృష్టించేందుకు రంగంలోకి దిగడం ఆందోళన కలిగిస్తోంది. ముగ్గురు మంత్రుల పర్యటనను అడ్డుకునేందుకు మంగళవారం నానా రభస చేయడమే కాకుండా దాడులకు తెగించడం గమనార్హం. విజయవాడ నుంచి వచ్చిన కొందరు ఈ దాడులకు పాల్పడినట్టు తెలుస్తోంది. – వారు ఏకంగా అంతర్వేదిలో ఓ ప్రార్థనా మందిరంపై రాళ్లు రువ్వడం ఆందోళనకరంగా మారింది. ఉద్దేశ పూర్వకంగా ఉద్రిక్తతలు సృష్టించడానికే ఇంతకు తెగించారన్నది స్పష్టమవుతోంది. ప్రశాంతంగా ఉన్న గోదావరి జిల్లాలో వర్గ ఘర్షణలను రేకెత్తించడానికి రాజకీయ శక్తులు పకడ్బందీగా పన్నాగం పన్నుతున్నాయన్నది తేటతెల్లమవుతోంది. శాంతిభద్రతల పరిరక్షణకు అగ్రప్రాధాన్యం – ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు యత్నించే అసాంఘిక శక్తులపట్ల కఠినంగా ఉండాలని పోలీసు, రెవెన్యూ ఉన్నతాధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అదనపు పోలీసు బలగాలను అంతర్వేదికి పంపింది. – రాళ్లు రువ్వి అంతర్వేదిలో అలజడులు సృష్టించేందుకు యత్నించిన దాదాపు 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ యాక్ట్ 30ని విధించారు. బయట వ్యక్తులు ఎవరూ అంతర్వేదిలోకి ప్రవేశించకుండా నిషేధాజ్ఞలు విధించారు. – అదనపు డీజీ(శాంతిభద్రతలు) రవిశంకర్ అయ్యన్నార్ అంతర్వేదిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఆయన మంగళవారం రాత్రి విజయవాడ వచ్చి డీజీపీ గౌతం సవాంగ్‌కు పరిస్థితిని వివరించారు. – ఏలూరు రేంజ్ డీఐజీ మోహన్‌రావును అంతర్వేదిలో క్యాంప్ చేయాల్సిందిగా డీజీపీ సవాంగ్ ఆదేశించారు. ప్రస్తుతం అంతర్వేదిలో పరిస్థితి అంతా అదుపులో ఉంది. ఎంతటివారినైనా ఉపేక్షించం అంతర్వేది ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేశాం. కేసు దర్యాప్తులో ఇప్పటికే పురోగతి సాధించాం. పూర్తి వాస్తవాలు త్వరలో వెల్లడిస్తాం. దోషులు ఎంతటి వారైనాసరే ఉపేక్షించం. మరోవైపు ఈ సంఘటనను అవకాశంగా చేసుకుని సమాజంలో ఉద్రిక్తతలు సృష్టించాలని యత్నించే అసాంఘిక శక్తులపట్ల కఠినంగా వ్యవహరిస్తాం. పరిస్థితి అంతా అదుపులో ఉంది. ప్రజలు వదంతులను నమ్మొద్దు. ప్రభుత్వానికి పోలీసులకు సహకరించాలని కోరుతున్నాం. – గౌతం సవాంగ్, డీజీపీ -
సైబర్ క్రైమ్‌పై అవగాహనకు ఈ-రక్షాబంధన్
సాక్షి, అమరావతి : మహిళలపై సైబర్ నేరాల నిరోధానికి తీసుకొచ్చిన ఈ-రక్షాబంధన్ బాగా పాపులర్ అయ్యిందని సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ తెలిపారు. దీనిపై అవగాహన కల్పించేందుకు ఇప్పటికే మీమ్స్, యూట్యూబ్ మాధ్యమాల ద్వారా 6 కోట్లమంది వీక్షించారని అయితే పలాస్ సినిమాకు వచ్చిన పాపులారిటీ ఈ-రక్షాబంధన్‌కు సైతం రావాలన్నారు. సైబర్ క్రైమ్ జరిగినపుడు ఎలా కంప్లైంట్ ఇవ్వాలో తెలిపాం. police4u.com ద్వారా ఎవరైనా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆన్ లైన్ క్లాసులు, బ్యాంకింగ్ కోసం ఎక్కువమంది ఇంటర్నెట్ వాడుతున్నారు. అయితే బ్యాంకు వివరాలు ఏ ఆన్ లైన్ గేమ్‌లోనూ ఇవ్వద్దు. 80% మంది సైబర్ క్రైమ్ ద్వారా డబ్బు పోగొట్టుకున్నారు. ఇప్పటికే 2,28,982 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో యువకులే అధికం. సైబర్ క్రైమ్ విషయంలో పోలీసు స్టేషన్‌కు వెళ్ళాలని చాలామందిలో అవగాహన ఉందని సునీల్ కుమార్ వెల్లడించారు. (ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం) భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు మహిళలకు, పిల్లలకు సైబర్ క్రైమ్ మీద అవగాహన కల్పించడమే ఈ-రక్షాబంధన్ ఉద్దేశమని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. సైబర్ స్పేస్ లో ఎక్కువగా ఉంటున్నందున ముఖ్యంగా మహిళలు ఈ అవగాహన కార్యక్రమాలలో భాగస్వాములు కావాలన్నారు. దిశ ఒక చట్టమే కాకుండా, ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక కోర్టులు కలిగి ఉందని తెలిపారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో మహిళ భద్రత కోసం మరిన్ని కార్యక్రమాలు తీసుకొస్తామని పేర్కొన్నారు. దీంట్లో భాగంగా కాలేజీలు, స్కూళ్ళ విద్యార్ధినుల చేసిన అభిప్రాయాలు అభినందనీయమన్నారు. సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారూ ఈ-రక్షాబంధన్ ద్వారా లబ్ధి పొందారని వివరించారు. సైబర్ బుల్లింగ్ ఎక్కువగా ఉంది : సమంత మహిళలను, పిల్లలను ఆన్ లైన్ మోసాల నుంచీ రక్షించడం చాలా అభినందనీయమన్నారు సినీనటి అక్కినేని సమంత. ప్రస్తుతం సైబర్ బుల్లింగ్ చాలా ఎక్కువగా ఉందని పేర్కొన్న సమంత..దీని అడ్డుకట్ట వేయడంలో ఈ- రక్షాబంధన్ విజయవంతమైందన్నారు. ఈ-రక్షాబంధన్ ద్వారా మహిళలకు రక్షణ కల్పించడం పట్ల సంతోషిస్తున్నాను.ఈ కార్యక్రమం స్త్రీలకు ఒక సోదరుడిలా పనిచేసిందని సమంత పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కల్పించేందుకు ఇచ్చిన యూట్యూబ్ శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉందని టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ , భారత మహిళా క్రికెటర్ రావి కల్పన తెలిపారు. సీఎం జగన్ ఆలోచనల నుంచి పుట్టిన దిశా చట్టం మహిళలకి కొండంత భరోసా ఇస్తోందని ఈ సందర్భంగా ఆమె కొనియాడారు. -
సుగాలి ప్రీతి కుటుంబసభ్యులతో డీజీపీ వీడియోకాన్ఫరెన్స్
సాక్షి, విజయవాడ : సుగాలి ప్రీతి కేసుపై డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో సుగాలి ప్రీతి కుటుంబసభ్యులతో సవాంగ్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీబీఐకి కేసు అప్పగించడంలో జాప్యానికి గల కారణాలను లా అండ్ ఆర్డర్ ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్ డీజీపీకి తెలిపారు. కేసు విషయంలో సుగాలి ప్రీతి తల్లి అనుమానాలను రవిశంకర్ నివృత్తి చేశారు. సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ఇప్పటికే సీబీఐ ఎస్పీ విక్రమాధిత్యకు కేసు వివరాలు అందించామని రవిశంకర్ తెలిపారు. డీవోపీటీ నుంచి అనుమతి రాగానే సీబీఐ కేసు విచారణ మొదలుపెడుతుందని పేర్కొన్నారు. కేసుని సీబీఐకి అప్పగించేందుకు రాష్ట్రప్రభుత్వం ఎక్కడా జాప్యం చేయలేదన్నారు. -
జాతీయ స్థాయిలో సత్తా చాటిన ఏపీ పోలీస్‌శాఖ
సాక్షి, అమరావతి : టెక్నాలజీ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు అవార్డుల పంట పండింది. జాతీయ స్థాయిలో ఏపీ పోలీస్‌శాఖ పది అవార్డులను సొంతం చేసుకుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే 26 అవార్డులను దక్కించుకోగా తాజాగా వివిధ విభాగాల్లో మరో పది అవార్డులను కైవసం చేసుకుంది. దీంతో ఏడాది వ్యవధిలో రికార్డు స్థాయిలో 36 అవార్డులను గెలుచుకొని పోలీస్ శాఖ సత్తా చాటింది. టెక్నాలజీ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ అవార్డుల ప్రదానోత్సవానికి డీజీపీ గౌతమ్ సవాంగ్ వెబినార్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీస్ శాఖకు ఇస్తున్న ప్రాముఖ్యతతోనే సత్ఫలితాలు వస్తున్నాయని వివరించారు. (చదవండి : స్పందన కార్యక్రమంపై కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్) -
పీఎస్‌లో యువకుడికి శిరోముండనం
సీతానగరం (రాజానగరం)/ఏలూరు టౌన్/సాక్షి, అమరావతి: కారు అద్దాలు పగులకొట్టాడంటూ ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదుపులోకి తీసుకున్న ఎస్సీ యువకుడికి పోలీస్‌స్టేషన్‌లోనే శిరోముండనం చేసిన ఘటనలో ఇన్చార్జ్ ఎస్సైతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లను మంగళవారం సస్పెండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో జరిగిన ఘటన వివరాలిలా.. ► ఈ నెల 18 రాత్రి మునికూడలి గ్రామం వద్ద ఇసుక లారీ.. బైక్‌ను ఢీకొట్టడంతో బైక్ నడుపుతున్న వ్యక్తికి కాలు విరిగింది. ► దీంతో కొంతమంది ఎస్సీ యువకులు లారీని అడ్డుకుని వాగ్వివాదానికి దిగడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ► అదే సమయంలో కారులో అటుగా వచ్చిన మునికూడలి పంచాయతీ మాజీ సర్పంచ్ భర్త కవల కృష్ణమూర్తి ‘ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది.. లారీని వదిలేయండి’ అని చెప్పడంతో ఆ యువకులు ఆయనతో కూడా గొడవకు దిగి కారు అద్దాలను పగులగొట్టారు. అడ్డుకోబోయిన అడప పుష్కరం అనే అతడిని కొట్టారు. ► దీంతో గొడవ పడిన ఐదుగురు యువకులపై అడప పుష్కరం సీతానగరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ► ఆ ఫిర్యాదు మేరకు సోమవారం ఇన్చార్జ్ ఎస్సై ఫిరోజ్ షా నిందితుల్లో ఒకరైన ఇండుగుమిల్లి ప్రసాద్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి తీవ్రంగా కొట్టారు. అంతటితో ఆగకుండా ట్రిమ్మర్ తెప్పించి అతడి గడ్డం, మీసాలు, తల వెంట్రుకలను తొలగించి విడిచిపెట్టారు. ► ఈ విషయం వాట్సాప్‌లో హల్చల్ చేయడంతో మంగళవారం దళిత సంఘాలు రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ బాజ్‌పాయ్ దృష్టికి తీసుకువెళ్లాయి. ► ఘటనను మంత్రులు సుచరిత, ఆదిమూలపు సురేశ్ ఖండించారు. మంత్రి విశ్వరూప్ రాజమండ్రి ఆస్పత్రిలో బాధితుడు ప్రసాద్‌ని పరామర్శించారు. తక్షణ చర్యలకు సీఎం ఆదేశం దళిత యువకుడికి శిరోముండనం చేసిన ఘటనపై సీఎం వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో స్పందించిన డీజీపీ యువకుడిపై అనుచితంగా ప్రవర్తించిన ఎస్సై ఫిరోజ్ షాతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడంతోపాటు ఎస్సైని అరెస్టు చేశారు. ఎస్సై, కానిస్టేబుళ్లపై సెక్షన్ 324, 323, 506 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ 3(1)(5), 3(2)(వి) ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం కేసులు పెట్టారు. -
ఎస్ఈబీతో మంచి ఫలితాలు
సాక్షి, అమరావతి: అక్రమ మద్యం తయారీ, రవాణా, ఇసుక అక్రమాల నిరోధానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో(ఎస్ఈబీ) మంచి ఫలితాలు సాధిస్తోందని ఏపీ డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాల డీజీపీల కీలక సమావేశం శనివారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా జరిగింది. సమావేశంలో తీర ప్రాంత గస్తీ, మాదక ద్రవ్యాల రవాణా, మావోయిజం, ఉగ్రవాద కార్యకలాపాలు, మనుషుల అక్రమ రవాణా, ఇసుక, మద్యం అక్రమ రవాణా నియంత్రణ తదితర అంశాలలో దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయంపై చర్చ జరిగింది. డీజీపీ సవాంగ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని తీరప్రాంతంలో గస్తీ ముమ్మరం చేశామన్నారు. ఆయుధాల సామర్థ్యాన్ని పరీక్షించిన డీజీపీ మంగళగిరిలోని ఏపీఎస్పీ ఆరో బెటాలియన్‌లో ఫైరింగ్ రేంజ్‌ను శనివారం సందర్శించిన డీజీపీ సవాంగ్.. రాష్ట్ర పోలీసు శాఖ సమకూర్చుకున్న అత్యాధునిక ఆయుధాల సామర్థ్యాన్ని పరీక్షించారు. ► ఇజ్రాయిల్ సహకారంతో రూపొందించిన ఆధునిక ఆయుధాలను టెస్ట్ ఫైర్ చేసి పరిశీలించి, ఐపీఎస్ అధికారులకు అందించారు. ► అత్యాధునిక ఆయుధాలతో ఫైరింగ్ ప్రాక్టీస్, టెస్ట్ ఫైరింగ్ కార్యక్రమాన్ని పీఅండ్ఎల్ నాగేంద్రకుమార్, ఏపీఎస్పీ బెటాలియన్స్ ఐజీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, ఐజీ ట్రైనింగ్ సంజయ్ నిర్వహించారు. -
45 మంది పోలీసులు కోలుకున్నారు
సాక్షి, అమరావతి: ఏపీలో కరోనా బారిన పడిన 45 మంది పోలీసులు పూర్తిగా కోలుకున్నట్లు డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ చెప్పారు. లాక్డౌన్లో ఏపీ పోలీస్ పాత్రపై మీడియాకు ఆయన శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. డీజీపీ ఇంకా ఏమన్నారంటే.. ► పోలీస్ సిబ్బందికి కావాల్సిన మాస్క్‌లు, గ్లౌజులు, శానిటైజర్లు అందిస్తూ, రెడ్జోన్లలో విధులు నిర్వహిస్తున్న వారికి పీపీఈ కిట్లను అందించాం. ► 55 ఏళ్లు పైబడిన వారిని, ఆరోగ్య సమస్యలున్న సిబ్బందిని క్షేత్రస్థాయి విధులకు దూరంగా ఉంచాం. రాష్ట్రంలో కోవిడ్ విధులు నిర్వహిస్తున్న 45 మంది పోలీస్ సిబ్బందికి కరోనా వైరస్ లక్షణాలు బయటపడంతో వారికి వైద్య చికిత్సలు అందించి కోలుకునేలా చేశాం. తగిన జాగ్రత్తల వల్ల గత రెండు వారాలుగా పోలీసు సిబ్బంది ఎవరికీ వైరస్ సోకలేదు. -
‘తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు’
-
అబద్ధపు ప్రచారం క్రాస్ చెక్ ఇలా
సాక్షి, అమరావతి: కరోనాపై సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాన్ని క్రాస్‌చెక్ చేసుకునేందుకు పోలీసు శాఖ ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్ 9071666667ను అందుబాటులోకి తెచ్చింది. సైబర్ క్రైం ఫిర్యాదుల కోసం అందుబాటులోకి తెచ్చిన ఈ వాట్సాప్ నంబర్‌ను డీజీపీ గౌతం సవాంగ్, సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ తదితరులు బుధవారం పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆన్లైన్ వీడియో ద్వారా బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, సినీ నటులు నిఖిల్ సిద్ధార్థ, అడవి శేషు, సామాజిక కార్యకర్త కొండవీటి సత్యవతిలు ఆన్లైన్లో ఇంట్రాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీజీపీ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ► సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలు వాట్సాప్ చేస్తే ...ఆయా వర్గాల వివరణ తీసుకొని వాస్తవ సమాచారం అందిస్తాం. ► నిజాలను ప్రచారం చేసి ప్రజలకు భరోసా కల్పిస్తాం. సమాచారంలో నాణ్యత కావాల్సిన సమయం ఇది. ► చాలా మంది కావాలని తప్పుడు ప్రచారం చేసేవారు తప్పించుకోలేరు. ఆలస్యమైనా శిక్ష తప్పకుండా పడుతుంది. ► లాక్డౌన్ సమయంలో మహిళా బాధితులకు అండగా ఉంటాం. ఎంతో మందికి ఉపయోగం కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు సమాచారాన్ని క్రాస్ చెక్ చేసేందుకు పోలీసు శాఖ వాట్సాప్ నంబర్ తీసుకరావడం ఎంతో మందికి ఉపయోగం. –పీవీ సింధు, బాడ్మింటన్ క్రీడాకారిణి వాస్తవాలు వెలుగులోకి వస్తాయి సెలబ్రిటీలు, మహిళలపై సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారు. ఈ పరిజ్ఞానం ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఇంట్లో కుటుంబ పెద్దలు కూడా చాలా సార్లు తప్పుడు ప్రచారాన్ని నమ్ముతుంటారు. వీటిని అధిగమించేందుకు టెక్నాలజీ ఉపయోగపడుతుంది. – అడవి శేష్, సినీ నటుడు -
తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోండి
సాక్షి, అమరావతి: తనను, తమ పార్టీని కించపరిచేలా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్‌లు పెడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డీజీపీ డి.గౌతమ్ సవాంగ్‌ను వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి కోరారు. ట్విట్టర్, ఫేస్బుక్, హెలో తదితర సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టింగ్‌లకు సంబంధించిన ఆధారాలు, వాటి అడ్రస్ లింక్‌లు, పోస్టింగ్‌లను డీజీపీకి మంగళవారం ఆయన అందజేశారు. తన ఫొటోతో కార్టూన్స్ పెట్టి అసభ్య పదజాలంతో కొందరు పోస్టింగ్‌లు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. రాజ్యసభ ఎంపీగా, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న తనను కించపరిచేలా, మనసును గాయపరిచేలా, తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా కొందరు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఆ పోస్టులను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
అత్యవసరమైతే పోలీస్ పాస్ తీసుకోండి!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లాక్డౌన్ పటిష్టంగా అమలవుతున్న తరుణంలో ఎవరైనా అత్యవసర పనులపై ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు ఈ–పాస్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ తెలిపారు. తగిన కారణాలు, ఆధారాలు చూపించి ఈ–పాస్‌కు దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి డీజీపీ తెలిపిన వివరాలివీ. ► లాక్డౌన్ అమల్లో ఉన్న దృష్ట్యా వైద్యం, స్వచ్ఛంద సేవ, ప్రభుత్వ విధులు, అత్యవసర సేవల కోసం వెళ్లే వారు ఇబ్బందులకు గురవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అలాంటి వారికి పోలీస్ శాఖ ద్వారా అత్యవసర రవాణా పాస్‌లను జారీ చేస్తాం. ► జిల్లా పరిధిలో వెళ్లాల్సి వస్తే.. ఆ జిల్లా ఎస్పీకి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. వేరే జిల్లాకు వెళ్లాల్సి వస్తే.. తమ జిల్లా ఎస్పీ ద్వారా ఆ వ్యక్తి వెళ్లాల్సిన జిల్లా ఎస్పీ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ► వేరే రాష్ట్రానికి వెళ్లాల్సి వస్తే.. సదరు వ్యక్తికి సంబంధించిన జిల్లా ఎస్పీ ద్వారా డీఐజీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలి. వివరాలన్నీ పరిశీలించి ఆయా రాష్ట్రాలను సంప్రదించిన అనంతరం డీఐజీ కార్యాలయం అనుమతి మంజూరు చేస్తుంది. ► పాస్ అవసరమైన వారు చిరునామా, ఆధార్, ప్రయాణించే వాహనం నంబర్, ప్రయాణికుల సంఖ్య, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారనే వివరాలు సమర్పించాలి. ► పాస్ కోసం జిల్లా ఎస్పీల వాట్సాప్, ఈ–మెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులను పరిశీలించాక వారి మొబైల్ నంబర్లకే పోలీసులు అనుమతులు పంపిస్తారు. ఈ–పాస్ తీసుకున్న వారు గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. -
కోవిడ్-19 టెస్ట్ కిట్‌ను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తయారైనా కోవిడ్-19 ర్యాపిడ్ టెస్ట్ కిట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ప్రారంభించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరి రజత్ భార్గవ్ ఇతక ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: ‘దేశంలో ఒక్క ఏపీలోనే వాటి తయారీ’ కాగా.. రాష్ట్రంలో తాజాగా మరో 15 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో బుధవారం ఉదయం నాటికి రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 329కు చేరింది. కొత్తగా నమోదైన 15కేసుల్లో నెల్లూరులో 6, కృష్ణాలో 6, చిత్తూరు జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. -
మీ రక్షణ.. మా బాధ్యత
సాక్షి, అమరావతి : కరోనా వైరస్ కట్టడికి తమ వంతు ప్రయత్నంగా అలుపెరుగని యుద్ధం చేస్తున్న ఏపీ పోలీస్ శాఖ ‘మీ రక్షణ.. మా బాధ్యత’అంటూ సందేశాత్మక షార్ట్ ఫిల్మ్‌ను రూపొందించింది. డీజీపీ గౌతమ్ సవాంగ్ సందేశంతో కూడిన రెండు నిమిషాల నిడివిగల వీడియోను శనివారం యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. ► కుటుంబాలకు దూరంగా రోడ్డుపైనే విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల చిత్రాలు, అన్న పానీయాలు రోడ్డు పక్కనే తింటున్న దృశ్యాలతో పాటు.. కరోనా వ్యాప్తి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ఈ వీడియోను రూపొందించారు. ► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు పాటిద్దాం.. మన దేశాన్ని రక్షించుకుందాం. ఆరోగ్యంగా జీవిద్దాం.. అనే సందేశంతో ఈ వీడియో ముగుస్తుంది. ► పోలీసులకు 50 వేల మాస్కులు అందించిన ‘స్పిన్టెక్స్’ ► పోలీస్ సిబ్బంది కోసం స్పిన్టెక్స్ లిమిటెడ్ అధినేత ఎంవీ సుధాకర్ 50 వేల మాస్క్‌లను అందించారు. ► మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో శనివారం డీజీపీ డి.గౌతమ్ సవాంగ్‌కు వీటిని అందజేశారు. ► పోలీస్ శాఖలోని నాలుగు వేల మంది మహిళలకు, వారి కుటుంబాలకు వీటిని అందజేయాలని పోలీస్ అధికారులను డీజీపీ ఆదేశించారు.