Gram panchayats
-
త్వరలో రూ.400 కోట్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీల్లో అప్పులు చేసి అభివృద్ధి పనులు చేసిన అప్పటి సర్పంచులకు త్వరలోనే రూ.400 కోట్లు విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. గత ప్రభుత్వం వారితో అభివృద్ధి పనులు చేయించి.. నిధులు విడుదల చేయకుండా వారిని రోడ్డుపై వదిలేసిందని మండిపడ్డారు. అందువల్ల పంచాయతీ బకాయిలపై బీఆర్ఎస్ నాయకులు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని హితవు పలికారు. రూ.10 లక్షలలోపు పెండింగ్‌లో ఉన్న ప్రజాప్రతినిధుల బిల్లులు దాదాపు రూ.400 కోట్లు ఉంటాయని అంచనా వేశామని, వాటిని త్వరలోనే విడుదల చేస్తామని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో భట్టి చెప్పారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వంటి ప్రజాప్రతినిధులు చేసిన అభివృద్ధి కార్యక్రమాల పెండింగ్ బిల్లులు గత సంవత్సరం డిసెంబర్ 7 నాటికి ఉన్న బకాయిలు రూ.1,300 కోట్లు అని వెల్లడించారు. సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పడుతున్న ఇబ్బందులను సీఎం రేవంత్‌రెడ్డి, తాను గమనించి రూ.10 లక్షల లోపు ఉన్న బకాయిలను త్వరలోనే విడుదల చేయాలన్న నిర్ణయానికి వచి్చనట్లు చెప్పారు. ప్రజా ప్రతినిధుల ఇబ్బందులకు కారణమైన బీఆర్ఎస్ నేతలు పెండింగ్ బిల్లుల కోసం ధర్నాలు చేస్తామని ప్రకటించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. పంట పొలాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు ప్రధాన మంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఏవం ఉత్థాన్ మహాభియాన్ (పీఎం–కుసుమ్) పథకం కింద రాష్ట్రంలో రైతుల పంట పొలాల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. 0.5– 2 మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్లాంట్లను ఎండిపోయిన, పాడుబడిన వ్యవసాయ భూముల్లో రైతులతో ఏర్పాటు చేయిస్తామన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసే విద్యుత్‌కు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు యూనిట్‌కు రూ.3.13 చొప్పున ధర చెల్లిస్తాయన్నారు. రైతులు, రైతు బృందాలు, సహకార సొసైటీలు, పంచాయతీలు, రైతు సంఘాలు, నీటి వినియోగ సంఘాలు ఈ పథకం కింద అర్హులన్నారు. -
Telangana: జిల్లాలన్నీ 'ఉడా'లే..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని కొన్ని గ్రామాలు మినహా.. రాష్ట్రమంతా వివిధ పట్టణాభివృద్ధి సంస్థ (యూడీఏ–ఉడా)ల పరిధిలోకి వెళ్లింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 9 ఉడాలు ఉండగా, తాజాగా వాటి పరిధిని రాష్ట్ర ప్రభుత్వం విస్తరించింది. దీంతోపాటు.. ములుగు జిల్లా, ఆసిఫాబాద్ జిల్లాలోని ఐదు మండలాలు, కొన్ని జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలు మినహా ఇప్పటివరకు ఉడాలు లేని అన్ని జిల్లాలు కవర్ అయ్యేలా కొత్తగా మరో 19 ఉడాలను కూడా ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 28 ఉడాలు ఏర్పాటైనట్టయ్యింది. ప్రతి పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోకి ఆ జిల్లాలోని మండలాల్లో ఉన్న దాదాపుగా అన్ని గ్రామాలు చేరాయి. రాష్ట్రంలో సుమారు 12 వేల గ్రామ పంచాయతీలు ఉండగా, దాదాపు 10 వేలకు పైగా గ్రామ పంచాయతీలు ఉడాల పరిధిలోకి రావడం గమనార్హం. ఇప్పటివరకు చుట్టుపక్కల గ్రామాలే ఉడాల పరిధిలో.. రాష్ట్రంలో హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు ఉన్నాయి. దీంతో పాటు వరంగల్, కరీంనగర్, వేములవాడ, సిద్దిపేట, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలతో ఏర్పాటు చేసిన మొత్తం 9 పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఇప్పటివరకు చుట్టుపక్కలున్న గ్రామాలు మాత్రమే ఉండేవి. మిగతా గ్రామాలన్నీ డీటీసీపీ (డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్) పరిధిలోకి వచ్చేవి. దీంతో 800 చదరపు గజాల పైబడి నిర్మాణాలకు, గ్రామాల్లో సాగే లే అవుట్ల అనుమతులన్నీ డీటీసీపీ ద్వారానే తీసుకోవలసి వచ్చేది. ఇప్పుడు జిల్లాల పరిధి మొత్తానికి ఉడాలను విస్తరించడంతో లే అవుట్లతో పాటు 800 చదరపు గజాల నిర్మాణాల అనుమతులు కూడా ఆయా జిల్లాల్లో ఏర్పాటైన ఉడాల ద్వారానే పొందే అవకాశం లభించింది. జిల్లాల వారీగా మాస్టర్ ప్లాన్‌కు అవకాశం రాష్ట్రంలో ఇప్పటివరకు పట్టణాలకు కూడా సరైన మాస్టర్‌ప్లాన్ లేదు. ఉడాల ద్వారా మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు కొన్ని ప్రయత్నాలు గతంలో జరిగినా వివిధ కారణాల వల్ల కొలిక్కి రాలేదు. ఇప్పుడు జిల్లా పరిధినే యూనిట్‌గా పట్టణాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయడంతో జిల్లా మొత్తానికి మాస్టర్‌ప్లాన్ రూపొందించే అవకాశం లభించినట్లయిందని పురపాలక శాఖ అధికారి ఒకరు తెలిపారు. అలాగే ఆయా మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలతో పాటు మండల కేంద్రాల మాస్టర్ ప్లాన్లను కూడా ప్రత్యేకంగా రూపొందించే అవకాశం లభించింది. కేంద్ర నిధులు పెరిగేందుకు దోహదం గ్రామాల్లో సాగే పేదల గృహనిర్మాణ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు పెరిగేందుకు కూడా ఉడాల ఏర్పాటు దోహదపడనుంది. ప్రతి పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోకి పట్టణాలు, కార్పొరేషన్లతో పాటు 10 నుంచి 15 మండలాల్లోని గ్రామాలు వస్తుండడంతో కేంద్రీకృతమైన అభివృద్ధికి ఆస్కారం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. గ్రామ పంచాయతీల అధికారాలు యధాతథం! జిల్లా పరిధిని పూర్తిగా పట్టణాభివృద్ధి సంస్థ కిందికి తీసుకురావడంతో గ్రామ పంచాయతీల అధికారాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పురపాలక శాఖ అధికారులు మాత్రం అలాంటిదేమీ ఉండబోదని అంటున్నారు. డీటీసీపీకి ఉన్న అనుమతుల అధికారం మాత్రమే పట్టణాభివృద్ధి సంస్థలకు దఖలు పడుతుందని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో 800 చదరపు గజాల లోపు నిర్మాణాలకు అనుమతులు ఆయా పంచాయతీలే ఇస్తున్నాయి. ఆ విధానం భవిష్యత్తులో కూడా కొనసాగనుందని ప్రభుత్వం చెబుతోంది. గ్రామ పంచాయతీల అధికారాలు యథాతథం! జిల్లా పరిధిని పూర్తిగా పట్టణాభివృద్ధి సంస్థ కిందికి తీసుకురావడంతో గ్రామ పంచాయతీల అధికారాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పురపాలక శాఖ అధికారులు మాత్రం అలాంటిదేమీ ఉండబోదని అంటున్నారు. డీటీసీపీకి ఉన్న అనుమతుల అధికారం మాత్రమే పట్టణాభివృద్ధి సంస్థలకు దఖలు పడుతుందని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో 800 చదరపు గజాల లోపు నిర్మాణాలకు అనుమతులు ఆయా పంచాయతీలే ఇస్తున్నాయి. ఆ విధానం భవిష్యత్తులో కూడా కొనసాగనుందని ప్రభుత్వం చెబుతోంది. -
పల్లె ముంగిట కొత్త ‘పద్దు’
సాక్షి, అమరావతి: కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ల తరహాలోనే పంచాయతీల స్థాయిలోనూ గ్రామ అభివృద్ధి ప్రణాళిక(జీపీడీపీ) పేరుతో బడ్జెట్లను పకడ్బందీగా రూపొందించే ప్రక్రియ మొదలైంది. ఈమేరకు 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని మొత్తం 13,326 గ్రామ పంచాయతీల్లో అంచనాల తయారీ ప్రారంభమైంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సూచనల మేరకు ఇక పంచాయతీలకు అందే 15వ ఆర్థిక సంఘం నిధులు పూర్తిగా ఆ గ్రామ జీపీడీపీలో పేర్కొన్న పనులకే కేటాయించాల్సి రావడంతో ఈ బడ్జెట్లకు ప్రాధాన్యం ఏర్పడింది. ఫలితంగా గ్రామస్థాయిలో పాలకవర్గం గుర్తించిన పనులను బడ్జెట్లో పొందుపరుచుకునే వెసులుబాటు లభించింది. సప్లిమెంటరీ ప్రణాళిక పేరుతో సవరణ చేసుకునే అవకాశమూ లభించింది. వచ్చే 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని 1,3326 గ్రామ పంచాయతీలతోపాటు 660 మండల పరిషత్‌లు, 13 ఉమ్మడి జిల్లాల పరిషత్‌లకు కలిపి మొత్తంగా రూ.2,152 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. వీటిని గ్రామ బడ్జెట్లో పెట్టిన పనులకే వాడుకోవాలి. ఏడాది మొదట్లో గానీ లేదంటే మధ్యలో సప్లిమెంటరీగాగానీ ఆ గ్రామ బడ్జెట్లో పేర్కొనని పనులకు ఆర్థిక సంఘ నిధులను వాడుకునే అవకాశమే ఉండదు. ఇంటి పన్ను రూపంలో అందజేసే జనరల్ ఫండ్స్ తదితర ఇతర నిధులను మాత్రం బడ్జెట్ ప్రకారం ఖర్చుపెట్టాలన్న నియమేమీ లేదు. అయితే వీలైనంత మేర బడ్జెట్ ప్రణాళికల ఆధారంగానే ఖర్చు చేసేలా ప్రోత్సహించాలన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన ఉద్దేశం. మరోవైపు 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులకు బిల్లుల చెల్లింపు ప్రక్రియలో సర్పంచులకు గతంలో కంటే ఇప్పుడు మెరుగైన వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. కార్యదర్శులకు మండలస్థాయి అధికారుల సహకారం గ్రామ బడ్జెట్ రూపకల్పన, అమలులో గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సలహాలు, సూచనలు అందించేందుకు ప్రతి మండలంలో ఆరుగురు మండల స్థాయి అధికారులతో కమిటీలను ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీలకు అందుబాటులో ఉండే నిధులకు, ఇతర పథకాల వచ్చే నిధులనూ అవసరమైన మేర అనుసంధానం చేసుకునేలా ఈ ఆరుగురు మండల స్ఙాయి అధికారులు తోడ్పాటు అందిస్తారని వివరించారు. కమిటీల్లో ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీ, పంచాయతీరాజ్ ఏఈ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, ఉపాధి పథకం ఏపీఓ, సెర్ప్ ఏపీఎంలు ఉంటారు. మూడొంతుల పంచాయతీల్లో పూర్తి ఇప్పటికే దాదాపు మూడోంతులకుపైగా అంటే 11,403 గ్రామ పంచాయతీల్లో 2024–25 సంవత్సరపు గ్రామ బడ్జెట్ ప్రణాళికల రూపకల్పన పూర్తయినట్టు పంచాయతీరాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి నెలాఖరులోగా అన్ని పంచాయతీల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలోని 660 మండలాలు, 13 ఉమ్మడి జిల్లాల స్థాయిలోనూ మండల, జిల్లా పరిషత్‌ల వారీగా బడ్జెట్ ప్రణాళికలను మార్చి నెలలో రూపొందించే ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు వివరించారు. -
గ్రామ పంచాయతీలకు గ్రేడ్ –5 కార్యదర్శులు
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీలు, సచివాలయాల మధ్య మరింత సమన్వయం తెస్తూ పాలనాపరంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేకంగా ఒక పంచాయతీ కార్యదర్శి అందుబాటులో ఉండేలా ప్రస్తుతం గ్రామ సచివాలయాల్లో గ్రేడ్ – 5 పంచాయతీ కార్యదర్శుల హోదాలో పని చేస్తున్న వారికి అవకాశం కల్పించనుంది. మిగిలిన నాలుగు కేటగిరీ పంచాయతీ కార్యదర్శుల తరహాలోనే వారికి డీడీవో అధికారాలను కల్పించనున్నారు. గ్రేడ్ – 5 పంచాయతీ కార్యదర్శులు ప్రస్తుతం పనిచేస్తున్న చోట ఆయా పంచాయతీల బాధ్యతలను అప్పగించనున్నారు. ఈమేరకు సిద్ధం చేసిన ప్రతిపాదనలు బుధవారం మంత్రివర్గ సమావేశంలో తుది ఆమోదం కోసం చర్చకు రానున్నాయి. సచివాలయాలతో పాటు గ్రేడ్ – 5 కార్యదర్శుల నియామకం 2019లో సచివాలయాల వ్యవస్థ ఏర్పాటుకు ముందు గ్రామ పంచాయతీల్లో గ్రేడ్ 1, 2, 3, 4 కేటగిరీ పంచాయతీ కార్యదర్శులు మాత్రమే విధులు నిర్వహించారు. చిన్నవైతే మూడు నాలుగు పంచాయతీలకు కలిపి ఒకే కార్యదర్శి బాధ్యతలు నిర్వహించేవారు. పంచాయతీరాజ్ శాఖ దీన్ని క్లస్టర్ పంచాయతీ విధానంగా వ్యవహరిస్తోంది. ప్రతి రెండు వేల జనాభాకు ఒక సచివాలయం చొప్పున సచివాలయాల వ్యవస్థతోపాటు గ్రేడ్ –5 పంచాయతీ కార్యదర్శుల నియామకాన్ని కూడా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. నాటి నుంచి గ్రేడ్ – 1 పంచాయతీ కార్యదర్శి మొదలు కొత్తగా నియమితులైన గ్రేడ్ –5 పంచాయతీ కార్యదర్శి వరకు ఆయా సచివాలయాల్లో కార్యదర్శి హోదాలోనే విధులు నిర్వహిస్తున్నారు. సచివాలయాల ద్వారా అందజేసే 545 రకాల ప్రభుత్వ సేవలతో సహా ప్రతి కార్యక్రమాన్ని వారికే అప్పగించారు. పంచాయతీ వ్యవస్థకు సంబంధించిన కార్యకలాపాలు మాత్రం పాత క్లస్టర్ విధానంలోనే కొనసాగుతున్నాయి. మిగతా కార్యదర్శుల మాదిరిగానే.. సచివాలయాల ఏర్పాటు సమయంలో గ్రేడ్ – 5 పంచాయతీ కార్యదర్శులకు మిగిలిన నాలుగు కేటగిరీ ఉద్యోగుల మాదిరిగానే జాబ్‌చార్టు నిర్ధారించినా ప్రొబేషన్ ఖరారు కానందున పంచాయతీ బిల్లులు తయారీ లాంటి డీడీవో అధికారాలను మాత్రం పూర్తి స్థాయిలో అప్పగించలేదు. ఇప్పుడు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో గ్రేడ్ – 5 పంచాయతీ కార్యదర్శులకు కూడా 1–4 గ్రేడ్ కేటగిరీ పంచాయతీ కార్యదర్శుల తరహాలోనే అన్ని రకాల డీడీవో అధికారాలు దక్కుతాయి. తద్వారా ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేకంగా ఒక కార్యదర్శిని కేటాయించడం ద్వారా పంచాయతీల కార్యకలాపాల నిర్వహణలో వేగం పెరిగే అవకాశం ఉంటుంది. సర్పంచ్లకూ అదనపు అధికారాలు! ప్రభుత్వ తాజా నిర్ణయంతో గ్రేడ్ – 1 మొదలు గ్రేడ్ – 5 పంచాయతీ కార్యదర్శులకు అదనపు అధికారాలు దక్కడంతో పాటు సర్పంచ్‌లకు కూడా మరిన్ని అధికారాలు లభించే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. పంచాయతీ రెగ్యులర్ ఉద్యోగుల (010 పద్దు ఉద్యోగులు) నెలవారీ జీతాల బిల్లులను ప్రతిపాదించే అధికారం కార్యదర్శులతో పాటు సర్పంచ్‌లకు ఉమ్మడిగా మేకర్, చెక్కర్ హోదాలో లభించనుంది. రాష్ట్రంలో 500 పైబడి జనాభా ఉండే ప్రతి గ్రామ పంచాయతీకీ సచివాలయ కార్యదర్శిగానూ, పంచాయతీ కార్యదర్శిగానూ ఒక్కరే కొనసాగనున్నారు. ఆయా పంచాయతీల పరిమాణాన్ని బట్టి కార్యదర్శులకు బాధ్యతలు కేటాయిస్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నెలకొల్పిన సచివాలయాల వ్యవస్థ ద్వారా కొత్తగా ఉద్యోగాలు పొందిన వేలాది మంది గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులు తమ కు చిన్న పంచాయతీల బాధ్యతలు కూడా అప్పగించాలని చాలా కాలంగా కోరుతున్నారు. ఇప్పుడు వారికి కోరిక నెరవేరుతుండటంతో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
అభివృద్ధికి కీలకం... వికేంద్రీకరణ
ఏ రాష్ట్రమైనా సుసంపన్నం కావాలంటే పంచాయతీ రాజ్ వ్యవ స్థను పటిష్ఠపరచాలి. మొత్తంగా దేశం అభివృద్ధి పంచాయతీ రాజ్ వ్యవస్థ బలంపైనా, అది ఏ మేర పాలనను వికేంద్రీకరిస్తుంది అన్న అంశాల పైనా ఆధారపడి ఉంటుంది. స్వర్గీయ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉండగా పంచాయతీరాజ్ వ్యవస్థలోని ప్రాథమిక స్థాయి సంస్థలకు అధికారాలు ఇవ్వడం ఎంత ముఖ్యమో గుర్తించారు. స్థానిక సంస్థలకు అధికారాలు పంచడం కోసం రాజ్యాంగ సవరణకు సైతం వెనుకాడలేదు. ఫలితంగా 1993లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా కొత్త పంచాయతీరాజ్ వ్యవస్థ రూపు దిద్దుకొంది. ఈ వ్యవస్థే గత 30 ఏళ్లుగా కేరళతో పాటు అనేక రాష్ట్రాల్లో అద్భుత ఫలితాలను ఇచ్చింది.కేరళ వంటి రాష్ట్రాల సామా జిక, ఆర్థిక అభివృద్ధికి అక్కడి చైతన్య వంతమైన పంచాయతీ వ్యవస్థ ముఖ్య కారణం. గ్రామ పంచాయతీ స్థాయిలోనే పాలన సమర్థంగా అందడం, మరికొన్ని ఇతర అంశాలు దీనికి కారణం. మన తెలుగు రాష్ట్రాలు కూడా ఈ సంస్థల బలోపేతం, పాలన వికేంద్రీకరణ అంశాల్లో ముందు వరుసలోనే ఉన్నాయి.పరిమితమైన వనరులను దృష్టిలో పెట్టుకుంటే గ్రామాల్లో అన్ని రకాల అభివృద్ధి పనులు చేపట్టడం సాధ్యం కాదు. ఫైనాన్స్ కమిషన్ నుంచి పంచాయతీలకు అందే నిధులు కూడా అంతంత మాత్రమే. ఎందుకంటే ఈ నిధులు తలసరి లెక్కలో విడుదల అవుతూంటాయి. పోనీ పంచాయతీలు సొంతంగా ఏవైనా వినూత్నమైన ఆదాయ వనరులను సమకూర్చుకోగలవా? ఇది కూడా వీలు కాని విషయమే. ఇలా చేసుకోగలిగితే ఆ గ్రామపంచాయతీ చాలా చైతన్యవంతంగా పనిచేస్తున్నట్లు లెక్క. కేరళలో కొన్ని గ్రామ పంచాయతీలు వినూత్నమైన పద్ధతుల ద్వారా కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తూండటం ఇక్కడ చెప్పుకోవా ల్సిన విషయం. 2030 నాటికి ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను అందుకునేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గ్రామ పంచాయతీల బలోపేతం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవు తుంది. ఆర్థిక సహకారం, పాలన పరంగా స్వాతంత్య్రం కూడా అవసరమవుతాయి. వీటితోపాటు గ్రామ పంచాయతీల స్థాయిలో సామర్థ్యాలను పెంచుకోవాల్సి వస్తుంది. రాష్ట్రంలో సమర్థమైన, వికేంద్రీకృతమైన పరిపాలన సాగేందుకు కింది సూచనలను కూడా పరిగ ణనలోకి తీసుకోవచ్చు. దీనివల్ల మానవ వనరుల అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది. ‘2022 నేషనల్ కెపాసిటీ బిల్డింగ్ ఫ్రేమ్‌వర్క్’ ఇచ్చిన సలహా సూచనల సాయంతో పనులు చేపట్టాలి. ప్రణా ళిక రూపకల్పన, అమలులో గ్రామపంచాయతీల్లోని ప్రజలందరూ భాగ స్వాములయ్యేలా చూడాలి. ఇందుకు తగ్గట్టుగా గ్రామ పంచాయ తీలకు అవసరమైన సాధన సంపత్తిని సమకూర్చాలి. దాతృత్వసంస్థల ద్వారా గ్రామ పంచాయతీలకు ఆర్థిక వనరులు సమ కూరేలా వ్యస్థలను ఏర్పాటు చేయాలి. ఈ చర్యలు తీసుకోవడం ద్వారా రాష్ట్రాలు సామాజిక, ఆర్థిక అభివృద్ధి అంశాల్లో సర్వతో ముఖాభివృద్ధి సాధించగలవని నా విశ్వాసం. – డా.డబ్ల్యూ. రాంపుల్లా రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఎన్ఐఆర్డీ మాజీ డైరెక్టర్ జనరల్ -
ఏకరూప పంచాయతీలపై కసరత్తు!
సాక్షి, అమరావతి: ఒకే దేశం–ఒకేసారి ఎన్నికలపై విధాన నిర్ణయం తీసుకునేందుకు యోచిస్తున్న నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. దేశంలోని పంచాయతీలలో ఏకరూపత సాధించే దిశగా చర్యలు చేపడుతోంది. కనీస నిర్ణీత జనాభా సంఖ్య ఆధారంగా దేశమంతటా గ్రామ పంచాయతీలను పునర్విభజన జరిపే ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో తీరుగా.. ఒకే రాష్ట్రంలోనూ వేర్వేరు పంచాయతీలలో ఉండే జనాభా సంఖ్య మధ్య ఊహించని స్థాయిలో వేల సంఖ్యలో వ్యత్యాసాలు ఉన్నాయి. ఒక్కొక్క చోట 15 వేల నుంచి 20 వేల జనాభా ఉండే ఓ పెద్ద గ్రామ పంచాయతీగా ఉంటుంటే.. కొన్నిచోట్ల 500 జనాభా ఉండే గ్రామం మరో పంచాయతీగా ఉంటోంది. ఉదాహరణకు రాష్ట్రంలో 13,300కి పైగా గ్రామ పంచాయతీలు ఉండగా.. ఒక్కో పంచాయతీ సరాసరి జనాభా 2,800 వరకు ఉన్నట్టు పంచాయతీరాజ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అక్కడ ఒక్కో పంచాయతీలో 20 వేలకు పైనే.. కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలో సరాసరి జనాభా 20 వేలకు పైబడి ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. కేరళ వంటి రాష్ట్రంలో అతి చిన్న గ్రామ పంచాయతీలో సైతం 10 వేలకు తక్కువ జనాభా ఉండదని చెబుతున్నారు. మన రాష్ట్రంలో వందలోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు సైతం ఉండగా.. 30 వేల జనాభా గల గ్రామాలు కూడా పంచాయతీలుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశమంతటా అన్ని రాష్ట్రాల్లో ఏకరీతిన కనీస ఓ నిర్ధిష్ట జనాభా సంఖ్య ఆధారంగా గ్రామ పంచాయతీలను పునర్విభజన చేయడం ద్వారా గ్రామీణ స్థానిక సంస్థల స్థాయిలోనూ మెరుగైన, సమర్థవంతమైన పరిపాలనకు అవకాశం ఉంటుందా అన్న దానిపై కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రాలతో సంప్రదింపులు చేపట్టింది. నేడు, రేపు వర్క్‌షాప్ చాలా రాష్ట్రాల్లో జిల్లా స్థాయిలో జెడ్పీ చైర్మన్ల ఎన్నిక పరోక్ష పద్ధతిన కొనసాగుతోంది. కానీ ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకునే విధానాన్ని తేవడం వంటి స్థానిక సంస్థల స్థాయిలో పరిపాలనకు సంబంధించి అనేక అంశాలపై అవసరమైతే చట్ట సవరణలు తెచ్చేందుకు సోమ, మంగళవారాల్లో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అన్ని రాష్ట్రాల అధికారులు ప్రతినిధులతో హైదరాబాద్‌లో వర్క్‌షాప్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మన రాష్ట్రం నుంచి 9 మంది, 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మొత్తం 261 మంది హాజరవుతున్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి ప్రతి రెండు విడతలకోసారి రోటేషన్ పద్ధతిన రిజర్వేషన్ల మార్పులు, చేర్పులు చేసుకునే అంశాన్ని వర్క్‌షాప్ అజెండాలో చేర్చారు. -
ప్రకృతి వనం.. కొరవడిన పచ్చదనం.. జీతాలు ఇయ్యకపాయే! ఎట్లా?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : పలు జిల్లాల్లో గ్రామపంచాయతీల సిబ్బందికి రెండు నుంచి నాలుగు నెలల వేతనాలు రాకపోవడంతో మొక్కల సంరక్షణపై దృష్టి సారించడం లేదు. ఇంకొన్ని ప్రాంతాల్లో నీటి వసతిలేదు. కొన్నిచోట్ల అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా పెద్దగా ఫలితం ఉండడం లేదు. వీటికి వేసవి తోడు కావడంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు ఎండిపోతున్నాయి. 12,769 గ్రామపంచాయతీల్లో ఏర్పాటు ఏటా నిర్వహించే హరితహారంలో భాగంగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామపంచాయతీల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. పల్లెవాసులకు పచ్చదనంతో ఆహ్లాదాన్ని పంచేందుకు పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కలను నాటారు. అక్కడ సేద తీరేందుకు వీలుగా బెంచీలు కూడా ఏర్పాటుచేశారు. ఉపాధి హామీ పథకం కింద గత రెండేళ్లు వీటి నిర్వహణ బాగానే సాగింది. నర్సరీల పెంపకం, పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు నాటడం, నీటి వసతి, వన సేవకులకు వేతనం అంతా ఈ పథకం ద్వారా చెల్లించడంతో ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. అయితే గత ఏడాది ఏప్రిల్ నుంచి పల్లె ప్రకృతి వనాల నిర్వహణ బాధ్యతను గ్రామ పంచాయతీ (జీపీ)లకు అప్పగించడంతో పరిస్థితి మారింది. పలు జిల్లాల్లో పూర్తిగా ఎండిపోయి.. ప్రకృతి వనాల్లో మొక్కల సంరక్షణ చూసుకునే బాధ్యత గ్రామపంచాయతీ వర్కర్లకు అప్పగించారు. అయితే వీరికి రెండు నుంచి నాలుగు నెలలుగా వేతనాలు అందడం లేదు. దీంతో వీరు బాధ్యతలపై దృష్టి సారించడం లేదని తెలుస్తోంది. కొన్నిచోట్ల వనాల్లో బోర్లు లేక కూడా మొక్కలు ఎండిపోయాయి. ఆయా ప్రాంతాల్లో పంచాయతీల ట్యాంకర్లతో నీళ్లు పట్టినా.. ట్యాంకర్ల నిర్వహణ జీపీలకు పెనుభారమైన నేపథ్యంలో ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదు. భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లోని గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రకృతివనాలు ఇప్పటికే పూర్తిగా ఎండిపోయాయి. మోడువారిన లక్ష్మీపురం వనం ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని రాఘబోయినగూడెం జీపీ పరిధిలోని లక్ష్మీపురం గ్రామ పల్లె ప్రకృతి వనం. 2020–21లో గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) కింద ఎకరం విస్తీర్ణంలో 913 మొక్కలు నాటారు. రెండేళ్లపాటు నిర్వహణ ఈజీఎస్ చూడటంతో వర్కర్లకు వేతనం అందింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి గ్రామ పంచాయతీకి బాధ్యతలు అప్పగించిన తర్వాత క్రమంగా మొక్కలన్నీ ఎండిపోయాయి. ఇక్కడ నీరందించేందుకు బోరు వేసినా మోటారు బిగించలేదు. అసలే ఎదగలేదు.. ఆపై నీరందక.. ఇది వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని నెక్కొండ తండాలో ఏర్పాటు చేసిన ప్రకృతి వనం. ప్రస్తుతం విపరీతమైన ఎండలతో మొక్కలు ఎండిపోతున్నాయి. ఇక్కడ సారవంతమైన భూమికి బదులుగా చౌడు భూమిలో మొక్కలు నాటారు. దీంతో మొక్కలు మామూలుగానే సరిగా ఎదగలేదు. ప్రస్తుతం వేసవి తాపానికి తోడు తగిన నీరందకపోవడంతో ఎండిపోతున్నాయి. మూడు నెలల డబ్బులు రావాలి.. ప్రకృతి వనంలో మొక్కలను కాపాడేందుకు ఎండనక, వాననక కష్టపడ్డా. నెలకు రూ.3 వేల చొప్పున మూడు నెలల వేతనం రాలేదు. అధికారులను అడిగితే వస్తుందనే సమాధానం తప్ప బ్యాంకులో జమ అయిందే లేదు. –పార్నంది గౌరమ్మ, శివునిపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ జిల్లా నెల నెలా ఎదురుచూపులే.. వన సేవకుడిగా పనిచేస్తున్నా. గత ఐదు నెలలుగా వేతనాలు రావడం లేదు. ఎప్పటికప్పుడు ఈనెల వస్తాయంటూ ఎదురుచూస్తున్నా. చేసిన పనికి ప్రతినెలా డబ్బులిస్తే మాకు ఇబ్బందులు ఉండవు. – బోసి ధర్మయ్య, బజార్ కొత్తూర్, నందిపేట్ మండలం, నిజామాబాద్ జిల్లా జీతాలు లేక.. పనికి రాక నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని అమ్రాద్ తండాలో నాలుగైదు నెలలుగా జీతాలు లేక పంచాయతీ కార్మికులు పనికి రావడం మానేశారు. ఇక నీళ్ల ట్యాంకర్‌కు అవసరమైన డీజిల్ డబ్బు కూడా లేకపోవడంతో వనంలో మొక్కలకు నీరందక ఎండిపోతున్నాయి. అన్నిచోట్లా వేతనాల సమస్యే.. ♦ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 42 మండలాల్లో 1,070 జీపీలు ఉండగా, 3,851 మంది మల్టీ పర్పస్ వర్కర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి సంబంధించి రూ.2 కోట్ల వరకు వేతనాలు అందాల్సి ఉంది. ఈ జిల్లాలో 2,088 వనాలు ఏర్పాటు చేయగా, చాలా చోట్ల బోర్లు వేయకపోవడం, ట్యాంకర్లపైనే ఆధారపడి నీళ్లు పోయాల్సి రావడంతో వేసవిలో మొక్కలు ఎండిపోతున్నాయి. ♦ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 1,509 జీపీలకు గాను 3,406 వనాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ పనిచేస్తున్న 4,924 మంది వర్కర్లకు 2 నుంచి 4 నెలల వరకు వేతనాలు రూ.10.11 కోట్ల మేర పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే రూ.6 కోట్ల వేతనాలు అందాలి. ఈ క్రమంలో వేసవిలో నీరు అందకపోవడంతో అధికారుల దృష్టికి వచ్చిన చోట ప్రత్యామ్నాయ ఏర్పా ట్లు చేసినా మిగతా చోట్ల వనాలు ఎండిపోయాయి. ♦ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1,056 జీపీలకు గాను 1,338 వనాలు ఉన్నాయి. నిధులు లేక వారానికోసారి నీరు పడుతున్నారు. కొన్నిచోట్ల పూర్తిగా వదిలేశారు. ఐదారు నెలలుగా డబ్బు అందక పోవడంతో వన సేవలు పని మానేశారు. ♦ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 963 గ్రామ పంచాయతీలు ఉండగా 965 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. నీరు లేక ఇప్పటికే 92 వనాలు ఎండిపోయే స్థితికి చేరాయి. మొత్తం 3,998 మంది మల్టీ పర్పస్ వర్కర్లకు రెండు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. ♦ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నాగర్‌కర్నూల్‌లో రెండు నెలల నుంచి, వనపర్తి, గద్వాల, నారాయణ్‌పేట జిల్లాల్లో 4 నెలల నుంచి వేతనాలు రావడం లేదు. మొత్తంగా 5,786 మంది మల్టీ పర్పస్ వర్కర్లకు సంబంధించి సుమారు రూ.13 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 4 నెలలుగా 5,666 మంది వర్కర్లకు వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో వారు ప్రకృతి వనాల నిర్వహణపై దృష్టి సారించడం లేదు. -
Kurnool District: గ్రామీణ ప్రాంతాల్లో మందగించిన పన్ను వసూళ్లు
కర్నూలు(అర్బన్): గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక వనరులను సమీకరించుకోవడం, పన్ను వసూళ్లు, ప్రభుత్వం విడుదల చేసే గ్రాంట్లకు సంబంధించిన నిధుల పరిపుష్టితోనే గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి సాధ్యమవుతుంది. తద్వారా ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించేందుకు వీలు కలుగుతుంది. ప్రస్తుత పాలకవర్గాలు ఆ దిశగా అడుగులు వేయకుండా, కేవలం ప్రభుత్వం విడుదల చేసే గ్రాంట్లపైనే ఆధారపడుతుండటంతో అభివృద్ధి నిదానించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ఆర్థిక సంఘం నిధులకు తోడుగా.. గ్రామ పంచాయతీల్లో పన్నులు, పన్నేతరములపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తే ఆయా గ్రామ పంచాయతీ ఖాతాల్లో నిధులు జమ అయ్యే అవకాశాలు ఉంటాయి. గ్రామ పంచాయతీల్లో వసూలు చేయాల్సిన పన్నులు, పన్నేతరములకు సంబంధించి పంచాయతీరాజ్ కమిషనర్ ప్రతి వారం సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా అధికార యంత్రాంగం పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించింది. 2022–23 ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో రెండున్నర నెలలు మాత్రమే ఉండడంతో పన్నుల వసూలు వేగం పుంజుకుంది. సర్పంచుల పాత్ర కీలకం గ్రామ పంచాయతీ పరిధిలో పన్ను వసూలు చేయడం, వాటిని అభివృద్ధి పనులకు వెచ్చించుకునే విషయంలో గ్రామ సర్పంచులది కీలకపాత్ర. ఆయా గ్రామ పంచాయతీల్లో పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని పూర్తిగా గ్రామాభివృద్ధి కోసం వెచ్చించుకునే సౌలభ్యం ఉంది. అయినా వివిధ గ్రామాల సర్పంచులు పన్ను వసూళ్లపై పెద్దగా దృష్టి సారించనట్లు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం, ఇతర గ్రాంట్ల పైనే గ్రామ పంచాయతీ పాలకవర్గాలు దృష్టి కేంద్రీకరించాయే తప్ప స్థానిక వనరుల నుంచి పంచాయతీలకు వచ్చే ఆదాయాలను పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. గ్రామ పంచాయతీల్లో పన్నులు(ఇంటి పన్ను, లైబ్రరీ సెస్సు, కుళాయి పన్ను ), పన్నేతరముల (మార్కెట్ వేలాలు, షాపింగ్ అద్దెలు, లైసెన్స్ ఫీజులు, కుళాయి ఫీజులు, భవన నిర్మాణ ఫీజులు) రూపంలో సొంత వనరులను సమీకరించుకోవడంలో సర్పంచులు తమ పాత్రను పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పల్లె ఆదాయాన్ని పెంచేందుకు సమష్టి కృషి గ్రామ పంచాయతీలకు ఆదాయాన్ని పెంచుకునే అంశంలో క్షేత్ర స్థాయి అధికారులు సమిష్టిగా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అనేక గ్రామ పంచాయతీల్లో దశాబ్దం క్రితం ఉన్న ఇళ్ల సంఖ్యనే నేటికీ లెక్కల్లో చూపుతున్నారు. జిల్లాలోని 484 గ్రామ పంచాయతీల్లో దాదాపు 50 శాతం గ్రామ పంచాయతీలు భౌగోళికంగా విస్తరించాయి. ఈ నేపథ్యంలోనే ఆయా గ్రామ పంచాయతీల్లో కొత్త కాలనీలు ఏర్పాటయ్యాయి. అయితే కొత్తగా గ్రామ శివారుల్లో ఏర్పాటవుతున్న కాలనీలు, కొత్త ఇళ్లపై సంబంధిత అధికారులు దృష్టి సారించకపోవడం వల్ల ఆయా గ్రామ పంచాయతీలు ప్రత్యక్షంగా పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని కోల్పోతున్నట్లు తెలుస్తోంది. డివిజన్ల వారీగా లక్ష్యాలు పన్నుల వసూళ్లకు సంబంధించి డివిజన్ల వారీగా లక్ష్యాలను నిర్ణయించాం. ఒక్కో డివిజన్ వారానికి రూ.కోటి వసూలు చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించి పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశాం. అలాగే ముగ్గురు డీఎల్పీఓలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించాం. వసూళ్లకు సంబంధించి ప్రతి రోజు జిల్లా కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులు పర్యవేక్షిస్తారు. గ్రామ పంచాయతీల ఆదాయాన్ని పెంచుకునే దిశగా చర్యలు చేపట్టాలని క్షేత్ర స్థాయిలోని ఈఓఆర్డీ, పంచాయతీ కార్యదర్శులను కోరుతున్నాం. – టి.నాగరాజునాయుడు, జిల్లా పంచాయతీ అధికారి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు గ్రామాల్లో పన్నులు చెల్లించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. తాము విధులు నిర్వహిస్తున్న గ్రామాల్లో ప్రజలే స్వచ్ఛందంగా పంచాయతీ కార్యాలయానికి వచ్చి చెల్లిస్తున్నారు. అలాగే డివిజన్, జిల్లా స్థాయి అధికారుల ఆదేశాల మేరకు పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాం. గ్రామ పంచాయతీకి పన్నులు చెల్లించడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి నిర్ణీత లక్ష్యాలను పూర్తి చేస్తాం. – గురుస్వామి, అధ్యక్షులు, జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం -
1.84 లక్షల గ్రామాల్లో భారత్‌నెట్ సేవలు
న్యూఢిల్లీ: భారత్‌నెట్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేసిన బ్రాడ్‌బ్యాండ్ సదుపాయాలతో దేశవ్యాప్తంగా 1,84,399 గ్రామ పంచాయితీలకు (నవంబర్ 28 నాటికి) తక్షణం సేవలు అందించొచ్చని కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ చౌహాన్ లోక్‌సభకు తెలిపారు. అన్ని గ్రామ పంచాయితీలు, గ్రామాల పరిధిలో అధిక వేగంతో కూడిన ఇంటర్నెట్, బ్రాడ్ బ్యాండ్ సేవలను అందించనున్నట్టు చెప్పారు. ‘‘భారత్‌నెట్ ప్రాజెక్ట్ కింద ఫైబర్ ద్వారా మారుమూల ప్రాంతాల్లోని ఇళ్లకు కనెక్షన్లు అందించడం జరుగుతుంది. అలాగే, ప్రభుత్వ సంస్థలకు వైఫై యాక్సెస్ పాయింట్లు, ఇంటర్నెట్ సదుపా యం ఏర్పాటు చేస్తాం. ఇప్పటి వరకు 1,04,664 గ్రామ పంచాయితీల్లో వైఫై యాక్సెస్ పాయింట్లు ఏర్పాటయ్యాయి’’అని మంత్రి చౌహాన్ తెలిపారు. టెలికం రంగానికి సంబంధించి పీఎల్ఐ పథకం కింత ప్రోత్సాహకాల కోసం 31 దరఖాస్తులు రాగా, అర్హత కలిగిన 28 దరఖాస్తులకు ఆమోదం తెలిపినట్టు మరో ప్రశ్నకు సమధానంగా చెప్పారు. -
ఏపీకి 16 కేంద్ర అవార్డులు
సాక్షి, అమరావతి: ఈ నెల 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీలకు కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ ఏకంగా 16 దక్కించుకుని సత్తా చాటింది. గ్రామీణ ప్రాంతాల్లో ‘స్థానిక’ పాలన ఆధారంగా కేంద్రం 2020–21 ఆర్థిక సంవత్సరానికి ఈ అవార్డులను ప్రకటించింది. మన రాష్ట్రం నుంచి మొత్తం 11 గ్రామ పంచాయతీలు, నాలుగు మండల పరిషత్‌లు, ఒక జిల్లా పరిషత్‌కు అవార్డులు లభించాయి. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సునీల్‌కుమార్.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు లేఖ రాశారు. గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారాలను కట్టబెట్టే 73వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన రోజును ప్రభుత్వాలు ఏటా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ అవార్డులు ప్రకటించింది. ఆయా గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు సంబంధించిన ప్రజాప్రతినిధులు/అధికారులకు ఈ నెల 24న అవార్డులు అందజేస్తారు. జమ్మూకశ్మీర్‌లోని పాలి గ్రామ పంచాయతీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే కార్యక్రమంలో ఆన్లైన్ విధానం ద్వారా ఈ అవార్డులు బహూకరిస్తారు. ఈ అవార్డుల కింద కేంద్రం జిల్లా పరిషత్‌కు రూ.50 లక్షలు, ఒక్కో మండల పరిషత్‌కు రూ.25 లక్షలు, గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన రూ.8 నుంచి రూ.16 లక్షలు అందజేయనున్నట్టు పంచాయతీరాజ్ కమిషనర్ కోన శశిధర్ తెలిపారు. -
గ్రామాల్లో ఇళ్లకు, వ్యాపార దుకాణాలకు వేర్వేరుగా ఆస్తి పన్ను!
సాక్షి, అమరావతి: గ్రామాల్లో ఇళ్లకు, వ్యాపార దుకాణాలకు వేర్వేరు ఇంటి పన్ను విధానాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ యోచిస్తోంది. పట్టణాలు, నగరాల్లో ఎన్నో దశాబ్దాల నుంచి వేర్వేరు పన్ను విధానం అమలులో ఉంది. గ్రామాల్లో ప్రస్తుతం ఇళ్లకు, వ్యాపార దుకాణాలకు ఒకే రకమైన ఇంటి పన్నును వసూలు చేస్తున్నారు. అయితే, గ్రామ పంచాయతీలు తమ అవసరాలకు సరిపడా ఆదాయాన్ని అవే సమకూర్చుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ పలుమార్లు రాష్ట్రాలకు సూచించింది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో సామాన్య ప్రజలపై ఏ మాత్రం అదనపు భారం పడకుండా నివాసిత ఇళ్లకు ఇప్పుడు అమలులో ఉన్న ఇంటి పన్ను విధానాన్నే కొనసాగించనున్నారు. వ్యాపార అవసరాలకు ఉపయోగించే ఇళ్లకు, వ్యాపార దుకాణాలకు మాత్రం కొత్త ఇంటి పన్ను విధానం అమలు చేయాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. అయితే, వ్యాపార దుకాణాలకు ఎంత ఇంటి పన్ను విధించాలన్న దానిపై పంచాయతీరాజ్ శాఖే ఒక ప్రాతిపదికను నిర్ధారించనుంది. దీని ఆధారంగా సంబంధిత గ్రామ పంచాయతీలు వ్యాపార దుకాణాలకు పన్ను నిర్ణయించుకునేలా కార్యాచరణను సిద్ధం చేశారు. ముందుగా సర్వే.. గ్రామాలవారీగా ఎన్ని వ్యాపార దుకాణాలు ఉన్నాయో తెలుసుకునేందుకు పంచాయతీరాజ్ శాఖ ఏప్రిల్ మొదటి వారంలో అన్ని గ్రామాల్లో సర్వే నిర్వహించనుంది. పంచాయతీ, గ్రామ సచివాలయ కార్యదర్శుల ఆధ్వర్యంలో ఈ సర్వే జరుగుతుంది. వ్యాపార అవసరాలకు నిర్మించిన షాపులతోపాటు నివాసిత ఇళ్లకు అనుబంధంగా ఆ ఇంటిలోనే నిర్వహిస్తున్న దుకాణాల వివరాలను వేర్వేరుగా సేకరించనున్నారు. సర్వే అనంతరం తుది ఆమోదం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని పంచాయతీరాజ్ శాఖ యోచిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో భారీ వడ్డన నిబంధనల ప్రకారం.. గ్రామాల్లో ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఇంటి పన్నును సవరించాల్సి ఉంది. అయితే, 1996 తర్వాత ఇప్పటివరకు పన్ను సవరణ జరగలేదు. దీనికి బదులుగా 2001 నుంచి ఏటా పాత పన్నుపై ఐదు శాతం చొప్పున పెంచే విధానం అమలవుతోంది. కాగా, గత ప్రభుత్వ హయాంలో 2017–18 ఆర్థిక సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని గ్రామాల్లో అప్పటి ఇళ్ల విలువ ఆధారంగా కొత్త ఇంటి పన్నును నిర్ధారించే ప్రక్రియను చేపట్టారు. దీంతో ఆ జిల్లాలో ఒక్కో యజమాని చెల్లించాల్సిన పన్ను అంతకు ముందున్న ఇంటి పన్నుకు ఐదారు రెట్లు పెరిగిపోయింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే పశ్చిమ గోదావరి జిల్లాలో మాదిరిగా రాష్ట్రమంతా అన్ని గ్రామాల్లో ఇంటి పన్ను పెంపునకు కసరత్తు చేపట్టారు. ఇందుకుగాను 2018లో ప్రిస్ సర్వే పేరిట ప్రతి ఇంటి కొలతలు తీసుకున్నారు. వాటికి ఆ గ్రామంలోని మార్కెట్ ధరను కలిపి ఆ వివరాలన్నింటినీ అన్లైన్లో నమోదు చేశారు. అయితే, 2018 ఆగస్టులో సర్పంచుల పదవీ కాలం ముగియడం, సాధారణ ఎన్నికలకు సమయం దగ్గరపడటంతో ఇంటి పన్ను అమలును టీడీపీ ప్రభుత్వం వాయిదా వేసింది. -
భద్రాచలం బంద్ విజయవంతం
భద్రాచలం: రాష్ట్ర విభజన సమయాన ఏపీలో కలిపిన అయిదు గ్రామ పంచాయితీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలనే డిమాండ్‌తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అఖిలపక్షం ఆధ్వర్యాన చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం చేపట్టిన బంద్ విజయవంతమైంది. భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో బంద్‌కు పిలుపునివ్వగా వ్యాపారులు, వర్తకులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూతపడ్డాయి. పెట్రోల్ బంకులు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు నడవలేదు. ఉదయం నుంచే ఇతర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో బస్టాండ్ నిర్మానుష్యంగా కనిపించింది. ఏకపక్షంగా ఏపీలో కలిపిన ఐదు పంచాయితీలను తిరిగి తెలంగాణలో కలపాలనే డిమాండ్‌తో శుక్రవారం తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ సరిహద్దులను దిగ్బంధం చేయనున్నట్టు అఖిలపక్షం నేతలు తెలిపారు. యూబీ సెంటర్లో మూతపడిన దుకాణాలు -
చెత్త నుంచి సంపద సృష్టించిన గ్రామాలు
సాక్షి, అమరావతి: చెత్తే కదాని తేలిగ్గా తీసి పడేయకండి.. ఎందుకంటే ఇప్పుడది సంపదను సృష్టించే వనరుగా మారింది. దాని నుంచి వర్మీ కంపోస్ట్‌ను తయారు చేస్తూ ఆయా గ్రామ పంచాయతీలు ఆదాయార్జనకు బాటలు వేసుకుంటున్నాయి. గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామ పంచాయతీ గడిచిన మూడు నెలల్లో ఇలా రూ.1,62,800 ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఇంటింటి నుంచి సేకరించిన చెత్తను వర్మీ కంపోస్ట్‌గా మారుస్తూ.. దానిని రైతులకు అమ్ముతూ ఆ డబ్బును కూడబెట్టాయి. ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 198 గ్రామ పంచాయతీలు ఇలా చెత్త నుంచి వర్మీ కంపోస్ట్, అమ్మకం ద్వారా రూ.14,06,994ను సంపాదించాయి. క్లీన్ ఆంధ్రప్రదేశే లక్ష్యంగా గతేడాది అక్టోబర్ రెండో తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదగా జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ప్రారంభించాక.. పట్టణాల తరహాలో గ్రామాల్లోనూ చెత్త సేకరణ ప్రక్రియ మొదలైంది. గ్రామాల్లో చెత్త సేకరణకు అవసరమైన ఆటో రిక్షాలు, ఇతర సామగ్రిని ప్రభుత్వమే సమకూర్చడంతో పాటు చెత్త సేకరణలో పనిచేసే క్లాప్ మిత్రలకు గౌరవ వేతనాలనూ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం చెల్లిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో 98.73 లక్షల ఇళ్లు ఉన్నట్టు అంచనాకాగా, వాటిలో 95.63 లక్షల ఇళ్ల నుంచి ఇప్పటికే రోజు వారీ చెత్తను గ్రామ పంచాయతీ సిబ్బంది సేకరిస్తున్నారు. ఇక ఆ చెత్త నుంచి వర్మీ తయారీపై పంచాయతీరాజ్ శాఖ అధికారులు దృష్టి పెట్టారు. 198 గ్రామాల్లో ఇప్పటికే వర్మీ తయారీ అమ్మకాలు మొదలు కాగా.. రానున్న వారం రోజుల్లో మరో 656 గ్రామాల్లో వర్మీ తయారీ, అమ్మకాల ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 40 రోజుల్లో వర్మీ రెడీ చెత్తను వర్మీగా తయారు చేసేందుకు కనీసం 40 రోజులు పడుతుందని పంచాయతీరాజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను గ్రామాల్లో ప్రభుత్మం నిర్మించిన సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్లకు తరలిస్తారు. ఇప్పటికే ఉన్న షెడ్లకు తోడు ప్రభుత్వం కొత్తగా మరో 1,794 గ్రామాల్లో షెడ్ల నిర్మాణాన్ని చేపడుతోంది. ఈ షెడ్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తొట్టెల్లో ఆ చెత్తను వేసి, దానిపై వాన పాములను ఉంచుతారు. ఆ తర్వాత వాటిపై గోనె పట్టలను ఉంచి ఎప్పటికప్పుడు వాటిని తడిచేస్తూ నిర్ణీత ఉష్ణోగత్ర కొనసాగేలా జాగ్రత్తలు చేపడతారు. 40 రోజుల తర్వాత వాన పాములు ఉంచిన ఆ చెత్త మిశ్రమం వర్మీగా మారుతుందని అధకారులు చెబుతున్నారు. కిలో వర్మీ రూ.10 చెత్త నుంచి తయారు చేసిన వర్మీని కిలో రూ.10 చొప్పన అమ్మాలని పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే గ్రామ పంచాయతీలకు సూచనలిచ్చింది. ప్రస్తుతం చాలా తక్కువ గ్రామాల్లో వర్మీ తయారీ ప్రక్రియ మొదలవడంతో.. తయారైన కొద్దిపాటి వర్మీ అమ్మకానికి పెద్దగా ఇబ్బందుల్లేవని అధికారులంటున్నారు. స్థానిక రైతులతో పాటు ఇళ్లల్లో మొక్కలు పెంచుకునే వారు కూడా వర్మీని కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో వర్మీ తయారీ ప్రక్రియ ఊపందుకుని, పెద్ద మొత్తంలో అందుబాటులోకొస్తే.. అప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా అమ్మేందుకు ఇప్పటికే వ్యవసాయ శాఖ అనుమతి కోరుతూ పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు లేఖ రాశారు. అన్ని గ్రామాల్లో మొదలైతే రూ.300 కోట్ల వరకూ ఆదాయం పంచాయతీరాజ్ శాఖ ముందస్తుగా తయారు చేసుకున్న ప్రణాళిక ప్రకారం రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో చెత్త నుంచి వర్మీ తయారీ ప్రక్రియ మొదలైతే గ్రామ పంచాయతీల ఆదాయం భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ తరహా వర్మీ తయారీ ద్వారానే గ్రామాలకు ఏటా రూ.300 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని వారు స్పష్టం చేస్తున్నారు. -
జీపీఎస్ అటెండెన్స్ వద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎవరికీ లేని సర్వీసు నిబంధనలు తమకెందుకని గ్రామపంచాయతీ కార్యదర్శులు ప్రశ్నిస్తున్నారు. మొబైల్ యాప్‌తో అటెండెన్స్ నమోదు, రోజంతా కార్యకలాపాలు, విధుల నిర్వహణపై జీపీఎస్ ద్వారా ట్రాకింగ్ ఎందుకని వాపోతున్నారు. సోమవారం నుంచి కొత్తగా అమల్లోకి తెచ్చిన జీపీఎస్ అటెండెన్స్‌ను పాటించలేమంటూ పర్మినెంట్ గ్రామ కార్యదర్శులతోపాటు జూనియర్ పంచాయతీ సెక్రటరీలు సైతం జిల్లా కలెక్టర్లు మొదలు పీఆర్ కమిషనర్, కార్యదర్శి, సీఎస్‌దాకా వినతిపత్రాలను ఇస్తున్నారు. ఉదయం 8:30 గంటలకే... ఉదయం 8.30 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట గ్రామకార్యదర్శులు సెల్ఫీ దిగి కొత్త డీఎస్ఆర్ మొబైల్ పీఎస్ యాప్ ‘క్యాప్చర్ జీపీ లొకేషన్’ఆప్షన్ ద్వారా అటెండెన్స్ నమోదు చేయాలి. రోజుకు 12 గంటలకు పైబడి విధులు, కింది నుంచి పైస్థాయి వరకు పదిమంది దాకా బాస్‌లు, రోజూ వారడిగే నివేదికలు ఇలా అనేక బరువు బాధ్యతలతో పనిచేస్తున్న తమపై ఇప్పుడు జీపీఎస్ అటెండెన్స్ విధానాన్ని తీసుకురావడం సరికాదని అంటున్నారు. దీంతోపాటు రోజూ డీఎస్ఆర్ యాప్‌లో రోడ్లు, డ్రైన్లు తదితరాలతోపాటు పల్లె ప్రకృతివనాలు, వైకుంఠధామాలు, అవెన్యూ ప్లాంటేషన్, ఇంటింటి చెత్త సేకరణ వంటి ఐదు ఫొటోలు లైవ్‌లో అప్లోడ్ చేయాలి. జీపీఎస్ ద్వారా అటెండెన్స్ నమోదు చేశాకే డీఎస్ఆర్ యాప్‌లో మిగతా ఆప్షన్లు ఎంట్రీ చేయడానికి వీలవుతుంది. మాకెందుకు నాలుగేళ్ల ప్రొబేషన్ రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామ పంచాయతీలున్నాయి. దాదాపు మూడువేల మంది పర్మినెంట్ పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు. రెండున్నరేళ్ల కింద ఏడున్నరవేల జూనియర్ పంచాయతీ సెక్రటరీలను (జేపీఎస్) నియమించారు. మరో రెండువేల మంది దాకా ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ జూనియర్ సెక్రటరీలు కూడా పనిచేస్తున్నారు. తొలుత జేపీఎస్‌లకు మూడేళ్ల ప్రొబేషన్ పీరియడ్ ఉండగా.. దాన్ని నాలుగేళ్లకు పెంచారు. మహిళా జేపీఎస్‌లకు ప్రసూతి సెలవులు సైతం ఇవ్వడం లేదు. ఇతర ప్రభుత్వోద్యోగులకు రెండేళ్ల ప్రొబేషన్ ఉంటే తమకు నాలుగేళ్లు ఎందుకని అంటున్నారు. నిర్దిష్ట పనివేళలు నిర్ణయించాలి జీపీఎస్ ద్వారా ఫిజికల్ టచ్ లైవ్ లొకేషన్ అటెండెన్స్ నమోదు రద్దుచేయాలి. సెక్రటరీలకు నిర్దిష్ట పనివేళలు నిర్ణయించాలి. ఉపాధి హామీ పనులకు ఒక క్షేత్రస్థాయి సహాయకుడిని ఇవ్వాలి. పంచాయతీల్లో సాంకేతిక పనుల నిర్వహణకు ట్యాబ్లెట్, సిమ్‌కార్డు, ఇంటర్నెట్, డేటా కార్డు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి. పంచాయతీలను జనాభా ప్రాతిపదికన 4 గ్రేడ్లుగా విభజించాలి. ప్రస్తుత సర్వీస్ రూల్స్ ప్రకారం 4 గ్రేడ్లు కొనసాగించాలి. –పి.మధుసూదన్‌రెడ్డి, అధ్యక్షుడు, పంచాయతీ సెక్రటరీల సంఘం పని ఒత్తిడి ఎక్కువ యాప్ ద్వారా జీపీఎస్ పద్ధతిలో అటెండెన్స్ నమోదు చేయొద్దని కలెక్టర్లను కోరాం. మేము లేవనెత్తిన అంశాలపై కలెక్టర్లు, పీఆర్ ఉన్నతాధికారుల నుంచి వచ్చే స్పందనను బట్టి మా కార్యాచరణను ఖరారు చేస్తాం. సోమవారం నుంచి అటెండెన్స్ మాత్రం నమోదు చేయడం లేదు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు విధుల నిర్వహణతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాం. –నిమ్మల వెంకట్ గౌడ్, అధ్యక్షుడు, జూనియర్ సెక్రటరీల సంఘం -
పంచాయతీ పటిష్టం!
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీల్లో కొత్తగా స్టాండింగ్ కమిటీల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. పంచాయతీ వార్డు సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, వ్యవసాయ కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు తదితర గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధులను ఈ స్టాండింగ్ కమిటీల్లో సభ్యులుగా నియమిస్తూ.. ఒక్కో గ్రామ పంచాయతీలో కనీసం ఆరు కమిటీలు ఏర్పాటు కానున్నాయి. స్థానిక అవసరాలకు అనుగుణంగా గ్రామ పంచాయతీ స్థాయిలో అదనంగా ఎన్ని కమిటీలైనా ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రామ పంచాయతీలో ఉండే వార్డు సభ్యులందరినీ ఏదో ఒక స్టాండింగ్ కమిటీలో తప్పనిసరిగా సభ్యునిగా నియమించాల్సి ఉంటుంది. ఒక్కో వార్డు సభ్యుడు రెండుకు మించి స్టాండింగ్ కమిటీలలో ఉండకూడదు. ప్రభుత్వ అధికారులు, సంబంధిత అంశంలో గ్రామ స్థాయి నిపుణత ఉన్న పౌరులను ఈ కమిటీలలో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించుకోవచ్చు. ఈ మేరకు తగిన చర్యలు చేపట్టాలంటూ అన్ని రాష్ట్రాలకు కేంద్రం ప్రతిపాదించింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు అనుగుణంగా తమ రాష్ట్రంలోని పంచాయతీరాజ్ చట్టానికి తగిన సవరణలు తీసుకు రావడంతో పాటు, సంబంధిత శాఖ ఆదేశాలు ఇవ్వాలంటూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సునీల్ కుమార్ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు తాజాగా లేఖ రాశారు. సుస్థిర అభివృద్ధే లక్ష్యం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణకు మన రాష్ట్రంలో స్థానిక సంస్థల ప్రభుత్వాలలో స్టాండింగ్ కమిటీల విధానం ఇప్పటికే అమలులో ఉంది. అయితే నగర పాలక సంస్థలు, మునిసిపాలిటీలు, జిల్లా పరిషత్‌లలో మాత్రమే ప్రస్తుతం స్టాండింగ్ కమిటీల విధానం కొనసాగుతోంది. మండల పరిషత్‌లలో, గ్రామ పంచాయతీ స్థాయిలో ఈ తరహా ప్రక్రియ అమలులో లేదు. చట్ట సవరణ ద్వారా కొత్తగా గ్రామ పంచాయతీలలో కూడా స్టాండింగ్ కమిటీల ఏర్పాటు వల్ల సుస్థిర అభివృద్ధితో పాటు పనుల్లో వేగం, పారదర్శకత పెరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. ఆస్తుల పరిరక్షణ, వివిధ కార్యక్రమాల అమలు సులువవుతుందన్నారు. గ్రామ పంచాయతీల్లో స్టాండింగ్ కమిటీల బాధ్యతలు 1.జనరల్ స్టాండింగ్ కమిటీ : పంచాయతీ పాలన, గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్వహణ, గ్రామ పంచాయతీ ఆస్తుల నిర్వహణ, గ్రామంలో రేషన్‌షాపుల పర్యవేక్షణ– కార్డుదారుల ప్రయోజనాలను కాపాడడం తదితర అంశాలు. 2.గ్రామ వైద్య, పారిశుధ్య, పోషకాహార స్టాండింగ్ కమిటీ : గ్రామ పరిధిలో వైద్య సంబంధిత, పారిశుధ్య సంబంధిత అంశాల అమలు. ఎక్కువ షోషకాలు ఉండే వాటినే ఆహారంగా తీసుకునేలా స్థానిక ప్రజలలో అవగాహన కల్పించడం. 3.ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ కమిటీ : గ్రామ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయడం. పంచాయతీ నిధుల పర్యవేక్షణ, ఆడిట్, ఇతర పేదరిక నిర్మూలన కార్యక్రమాల అమలు. 4. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ : అంగన్ వాడీ కేంద్రాలతో పాటు గ్రామ పరిధిలో విద్యా సంస్థలపై పర్యవేక్షణ, ఆయా విద్యా సంస్థలలో మధ్యాహ్న భోజన కార్యక్రమం అమలు తీరుపై పర్యవేక్షించడం. 5.సోషల్ జస్టిస్ కమిటీ : ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, వృద్ధులు, పిల్లలు, మహిళల భద్రతకు సంబంధించిన అంశాల పర్యవేక్షణ. 6.మంచినీటి సరఫరా, పర్యావరణ కమిటీ : గ్రామంలో మంచినీటి సరఫరా, వర్షపునీటిని ఆదా చేసేందుకు తగిన చర్యలు చేపట్టడం, వ్యవసాయానికి సాగునీటి సరఫరా వ్యవస్థ పర్యవేక్షణ, మొక్కల పెంపకం తదితర అంశాలు. -
5 సంవత్సరాల్లో గ్రామాల్లో పరిశుభ్రత, మంచినీటికి 6,140 కోట్లు
సాక్షి, అమరావతి: గ్రామాల్లో మెరుగైన పరిశుభ్రత, మంచినీటి సరఫరా సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లలో భారీగా నిధులు వెచ్చించనుంది. గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు కేటాయించే 15వ ఆర్థిక సంఘం నిధుల్లో రూ.6,140 కోట్లను ఇందుకోసం ఖర్చు చేయనున్నారు. అదనంగా ఇతర కార్యక్రమాలు, పథకాల నిధులను వీటికి జతచేసి ఈ అవసరాల కోసం వినియోగిస్తారు. ఈ మేరకు ఆర్థిక సంఘం నిధుల వినియోగం నిబంధనల్లో మార్పులు తేనున్నారు. దీనికి సంబంధించిన ముసాయిదాను ప్రభుత్వం సిద్ధం చేసింది. 60 శాతం నిధులు.. స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం ఏటా కేటాయించే నిధుల్లో 60 శాతం పరిశుభ్రత, మంచినీటి అవసరాలకు ఖర్చు చేయాలని ముసాయిదాలో పంచాయతీరాజ్ శాఖ పేర్కొంది. ప్రతి గ్రామంలో ఏడాది పొడవునా తాగునీటి లభ్యత సౌకర్యాల కల్పన, రోజూ ప్రతి ఇంటికీ నీటి సరఫరాకు మౌలిక వసతుల ఏర్పాటు, పర్యవేక్షణ, రహదారులు, ఇతర ఖాళీ స్థలాల్లో మురుగు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడం, క్రమ విధానంలో చెత్త సేకరణ తదితరాల కోసం ఈ నిధులను వెచ్చిస్తారు. ప్రతి గ్రామానికి ఐదేళ్ల ప్రణాళిక.. గ్రామంలో పరిశుభ్రత, మంచినీటి సరఫరా సౌకర్యాల కోసం ప్రతి పంచాయతీకి ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న వనరులు, అదనపు సౌకర్యాలను పరిగణనలోకి తీసుకొని ప్రణాళిక రూపొందిస్తారు. తుపాన్లు లాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక రూపొందించాలని ముసాయిదాలో పేర్కొన్నారు. గ్రామసభలో ప్రణాళికపై చర్చించి తుది ఆమోదం తీసుకోవాలి. ప్రణాళికల అమలుకు సర్పంచ్ నేతృత్వంలో 15 మంది సభ్యులతో కమిటీని నియమించుకోవచ్చు. కమిటీలో మహిళలు, అట్టడుగు వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు వారి సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. -
‘పచ్చ’పాతం: ఇదేమి వైపరీత్యం!
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే నాయకుడొకాయన ఆమధ్య పంచాయతీ ఎన్నికలకూ మేనిఫెస్టో విడుదల చేసి ‘చరిత్ర సృష్టించారు’. జనం అంతా విస్తుపోయే వింతను తెరపైకి తెచ్చారు. ప్రజల అదృష్టం బాగుండి.. ఆయన మద్దతు ఇస్తామన్న వారిలో చాలామందిని జనం తిరస్కరించారు. కానీ.. కొద్దిగా ఎన్నికైన వారితో కూడా ఆయన.. ఆయన పార్టీ పెద్దలు అప్పుడే విచిత్రాలు చేయిస్తున్నట్టున్నారు. అభిజ్ఞ వర్గాల సమాచారం ప్రకారం.. తమ పరిధిలోని పంచాయతీ కార్యాలయాలకు పచ్చ రంగు పులమాలని పెద్దలు ఆదేశించారంటున్నారు. ఇందుకు నిదర్శనంగా.. కొత్త ఉత్సాహం కాస్త అతి కావడంతో ఓ సర్పంచ్ పంచాయతీ ఆఫీసుకు పచ్చ రంగు వేయించేశారు. అధికారులు.. ఆచి తూచి మాట్లాడుతున్నారు. మరి తదనంతర పరిణామాలపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారు? సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పంచాయతీ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం వేసిన రంగులపై టీడీపీ నాయకులు కోర్టుకు వెళ్లారు. ఆ రంగులన్నీ తొలగించాలని పిటిషన్ వేశారు. రాజకీయంగా పెద్ద రాద్ధాంతమే చేశారు. చీప్ పబ్లిసిటీతో లబ్ధి పొందాలని చూశారు. కానీ ఎన్నికల్లో బొక్క బోర్లా పడ్డారు. ఇప్పుడు.. టీడీపీ మద్దతుదారులు గెలిచిన గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాలకు పసుపు రంగు పూస్తున్నారు. అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలతో అధికారుల అనుమతి లేకుండా ఏకపక్షంగా రంగులు వేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఆమదాలవలస మండలం కనుగులవలస పంచాయతీ కార్యాలయానికి పసుపు రంగు వేసేశారు. టీడీపీ నేతల ద్వంద్వ నీతి జనాలకు ఈ పనితో అర్థమైంది. ఆ నేతల దుర్నీతిని చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాలపై ఏ నిర్ణయమైనా రాష్ట్రంలో అధికారంలో ఉన్న సర్కార్ తీసుకోవాలి. ప్రభుత్వ ఆదేశాలు, అధికారుల అనుమతి మేరకే పంచాయతీ కార్యాలయాలకు సంబంధించిన ఏ చర్యలైనా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా అధికారుల అనుమతి లేకుండా ఇష్టారీతిన పంచాయతీ కార్యాలయానికి పసుపు రంగు వేసేశారు. తాజాగా ఎన్నికైన సర్పంచ్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. కనీసం పంచాయతీ పాలకవర్గం తీర్మానం కూడా చేయలేదు. ఎక్కడా లేని విచక్షణాధికారంతో ఆగమేఘాలపై పంచాయతీ కార్యాలయానికి రంగులు వేయడం విమర్శలకు తావిస్తోంది. రౌడీషీటర్ బుద్ధి చూపించారా? కనుగులవలస సర్పంచ్‌గా ఎన్నికైన నూక సూరప్పలనాయుడు (నూకరాజు)పై రౌడీ షీట్ ఓపెన్ చేసి ఉంది. వివాదాస్పదమైన వ్యక్తిగా ముద్ర పడ్డారు. గొడవలు, కొట్లాటకు ముందుంటారు. గతంలో ప్రస్తుత శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. తాజాగా సర్పంచ్‌గా గెలిచిన వెంటనే అదే మూర్ఖత్వం చూపించారు. అధికారుల అనుమతి లేకుండా పంచాయతీ కార్యాలయానికి పసుపు రంగు వేయించారు. ఎవరొచ్చి ఏం చేస్తారన్నట్టుగా వ్యవహరించారు. అంతటితో ఆగకుండా పసుపు రంగు వేసిన కార్యాలయంలో విధులు నిర్వహించాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఇక్కడికొచ్చి విధులు నిర్వర్తించాలని కూడా సతాయించారు. దీనికి సిబ్బంది ఒప్పుకోలేదు. గ్రామ పంచాయతీ పాలకవర్గమంతా తీర్మానం చేయాలని సుతిమెత్తగా చెప్పారు. మీమాంసలో తెలుగు తమ్ముళ్లు.. సర్పంచ్‌లుగా టీడీపీ మద్దతుదారులు గెలిచిన పంచాయతీల్లో పసుపు రంగులు వేయాలని ఆ పార్టీ అ ధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. దీంతో కొందరు అధిష్టానం మాట మేరకు పసుపు రంగు వేసేందుకు యత్నిస్తుండగా, మరికొందరు మనికెందుకని మీమాంసలో పడ్డారు. మొత్తానికి రంగుల రాజకీయం చేసేందుకు టీడీపీ యతి్నస్తుందనేది స్పష్టమవుతోంది. పసుపు రంగు తొలగిస్తాం.. రంగుల విషయం మా దృష్టికి వచ్చింది. రెండు రోజుల క్రితమే పంచాయతీ కార్యాలయానికి రంగులు వేశారు. ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మాకు వచ్చిన ఫిర్యాదు మేరకు పసుపు రంగు తీసేసి తెలుపు రంగు వేయిస్తాం. – పేడాడ వెంకటరాజు, ఎంపీడీఓ, ఆమదాలవలస చదవండి: రేణిగుంట ఎయిర్‌పోర్టులో చంద్రబాబు హైడ్రామా వైఎస్సార్ సీపీ కార్యకర్తపై టీడీపీ నేత హత్యాయత్నం -
కౌంటింగ్ వీడియో తీయండి
సాక్షి, అమరావతి: సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామ పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను తప్పనిసరిగా వెబ్‌కాస్టింగ్ లేదా సీసీ కెమెరా లేదా వీడియోగ్రఫీ ద్వారా రికార్డు చేయించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు కమిషన్ కార్యదర్శి కన్నబాబు కలెక్టర్లతో పాటు డీపీవోలు, ఎస్పీలకు లేఖలు రాశారు. మొత్తం నాలుగు విడతల పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో ఇప్పటికే రెండు దశలు పూర్తవగా.. మూడు, నాలుగో దశ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో చేపట్టాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ► కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఆ ప్రాంతంలో కరెంటు సరఫరాకు అంతరాయం కలుగకుండా విద్యుత్ శాఖ అధికారులకు తగిన సూచనలు జారీ చేయాలి. అదే సమయంలో జనరేటర్లు కూడా ఏర్పాటు చేసుకోవాలి. ► కౌంటింగ్ అనంతరం పోటీలో ఉన్న ప్రధాన అభ్యర్థుల మధ్య అతి స్వల్పంగా ఒక అంకె (సింగిల్ డిజిట్) ఓట్ల తేడా ఉన్నప్పుడు మాత్రమే నిబంధనల ప్రకారం ఒక్కసారి రీ కౌంటింగ్‌కు అనుమతించాలి. రెండు అంకెల (డబుల్ డిజిట్) ఓట్ల తేడా ఉంటే అనుమతించవద్దు. ► కౌంటింగ్ కేంద్రాలలోకి ముందుగా అనుమతి పొందిన వ్యక్తులను మాత్రమే అనుమతించాలి. ఇతరులను రానీయకూడదు. ► సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక, పెద్ద గ్రామ పంచాయతీల్లో కౌంటింగ్ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలి. -
ఇంటివద్దకే సంక్షేమ ఫలాలు
సాక్షి, కడప: వైఎస్సార్ జిల్లాలో గ్రామసీమల రూపు రేఖలు మారుతున్నాయి. ఒకనాడు పల్లెల్లో అంతం త మాత్రంగా జీవనం సాగిస్తున్న ప్రజల జీవనశైలి లో పూర్తిగా మార్పులు కనిపిస్తున్నాయి. గ్రామాల్లో అధునాతన వసతులు సమకూరడం, ఆరోగ్యానికి అభయం లభించడంతో పల్లెలు నవజీవనంతో వెలిగిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ఎక్కడికక్కడ ప్రాజెక్టులు, చెరు వుల్లో నీరు నిండడంతో పల్లె సీమలు పచ్చని పంట లతో కళకళలాడుతున్నాయి. పల్లెల్లో పరిస్థితి చూస్తే ఆనాడు జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కళ్లెదుటే కనిపి స్తోంది. మనం పరు గెత్తే పరిస్థితి నుంచి అధికారులే ఇంటి వద్దకు వచ్చి సంక్షేమ ఫలాలు అందించే పరిస్థితి వచ్చింది. పెన్షన్, బియ్యం కార్డు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డు, అవసరమైన సర్టిఫికెట్లు.. ఇలా అవసరమైనవన్నీ ఊళ్లోని సచివాలయంలోనే ఇస్తున్నారు. సచివాలయానికి వెళ్లలేనివారికి వలంటీరే ఇంటివద్దకు వచ్చి అందజేస్తున్నారు. రూ.400 కోట్లకు పైగా నిధులతో గ్రామాల్లో పనులు వైఎస్సార్ జిల్లాలో 807 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పల్లెసీమల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నడుం బిగించింది. పల్లెలను అభివృద్ధి బాట పట్టిస్తున్నారు. పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (పాడా) ఆధ్వర్యంలో పులివెందుల నియోజకవర్గంలోను, పంచాయతీ రాజ్‌శాఖ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగాను విస్తృతంగా అభివృద్ధి పనులు జరిగాయి. సిమెంటు రోడ్లు, వీధిలైట్లు, డ్రైనేజీ నిర్మాణాల కోసం రూ.400 కోట్లకుపైగా ఖర్చుచేశారు. వైద్యానికి భరోసా జిల్లాలో 74 పీహెచ్‌సీలు, 17 పట్టణ ఆరోగ్య కేం ద్రాలు, 14 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల చెంతకే వైద్యం తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లను ప్రారంభించింది. దీన్లో భాగంగా జిల్లాలో రూ.87.50 కోట్లతో 500 హెల్త్ క్లినిక్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వీటిలో 10 భవనాలు పూర్త య్యాయి. 450 భవన నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. మార్చి నాటికి వీటిని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుని పనులు చేస్తున్నారు. కమలాపురంలో ఇటీవల ప్రారంభించిన రైతు భరోసా కేంద్రం ఆధునిక టెక్నాలజీ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 2012–13 పంటల బీమా మొదలు అన్నింటినీ ప్రభుత్వం ఒక్కొక్కటి అన్నదాతలకు అందిస్తూ వస్తోంది. ఆధునిక సాం కేతిక పరిజ్ఞానంతో కూడిన రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకేల) ద్వారా అనేక సేవలు అందిస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వీటి ద్వారా సత్వరం అందిస్తున్నారు. జిల్లాలో 621 ఆర్బీకేల నిర్మాణానికి ప్రభుత్వం రూ.135.38 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే రూ.21.77 కోట్లు వెచ్చించి 14 భవనాలను పూర్తిచేశారు. ప్రజలకు సత్వరసేవలు గ్రామాల్లో ప్రజలకు వేగవంతమైన సేవలు అందిం చడమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగు తోంది. జిల్లాలో 631 సచివాలయాలున్నాయి. వీటి భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.233 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే రూ.88.65 కోట్లు ఖర్చుచేసి 142 భవనాలను పూర్తిచేశారు. మరో 430 భవనాల నిర్మాణాలు పూర్తయ్యే దశలో ఉన్నా యి. 59 భవనాల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఆహ్లాదకర వాతావరణంలో విద్య శిథిలావస్థకు చేరిన భవనాలు, ఫర్నిచర్ లేని తరగతి గదులు, మరుగుదొడ్ల కొరత.. వంటి సమస్యలతో కునారిల్లుతున్న పాఠశాలలు కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. జిల్లాలో తొలివిడతలో 1,040 పాఠశాలలను నాడు–నేడులో భాగంగా తీర్చిదిద్దేందుకు రూ.185 కోట్లు మంజూరు చేశారు. ఇప్పటికే దాదాపు అన్ని పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించారు. 300 పాఠశాలలకు సంబంధించి పెయింటింగ్ పనులు మిగిలి ఉన్నాయి. మార్చి చివరి నాటికి పనులన్నీ పూర్తిచేసేలా కసరత్తు చేస్తున్నారు. రెండో విడత కూడా మరో 1000కి పైగా పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు ఏప్రిల్ నుంచి పనులు చేపట్టాలని భావిస్తున్నారు. చదువుకునేందుకు మంచి వాతావరణం నాడు–నేడు ద్వారా పాఠశాలల్లో వసతులు కల్పించడంతో చదువుకునేందుకు మంచి వాతావరణం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పెద్దపీట వేయడంతో ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి దాదాపు 20 వేలమందికి పైగా విద్యార్థులు వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ఇప్పటికే నాడు–నేడు పనుల్లో భాగంగా పాఠశాలలకు తుది మెరుగులు దిద్దుతున్నాం. – డాక్టర్ అంబవరం ప్రభాకర్‌రెడ్డి, సమగ్రశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి, కడప వేగవంతంగా పనులు చేయిస్తున్నాం జిల్లాలో ప్రభుత్వ అభివృద్ధి పనులను వేగవంతంగా నడిపిస్తున్నాం. జిల్లాలో రైతుభరోసా కేంద్రాలతోపాటు సచివాలయాల నిర్మాణం, హెల్త్ క్లినిక్‌ల పనులు కూడా చేయిస్తున్నాం. మార్చి చివరి నాటికి వీలైనన్ని ఎక్కువ భవన నిర్మాణాలు పూర్తిచేసి అప్పగించే దిశగా అడుగులు వేస్తున్నాం. – వెంకటసుబ్బారెడ్డి, ఎస్ఈ, పంచాయతీరాజ్‌శాఖ, కడప -
ఊరు ఉంది.. పేరు లేదు
పెదపాడు: పట్టణ స్థాయికి ఎదిగిన హనుమాన్‌జంక్షన్ అంటే అందరికీ తెలుసు. కానీ ఆ పేరు ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కడా లేదు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దుగా కల్లూరు టు మచిలీపట్నం రహదారి ఉంది. ఈ రహదారి లోని జంక్షన్లో పెదపాడు మండంలోని అప్పన వీడు, ఏపూరు.. కృష్ణా జిల్లా బాపులపాడును కలుపుకుని హనుమాన్ జంక్షన్‌గా పిలుస్తారు. నాలుగు రోడ్ల కూడలి కావడంతో ఈ జంక్షన్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ తెలుసు. మూడు మేజరు గ్రామ పంచాయతీల కలయిక అని మాత్రం ఎక్కువమందికి తెలియదు. (చదవండి: సినిమాలో చూస్తాడు.. బయట చేస్తాడు) అంతర్మథనం: గోడ మీద టీడీపీ తమ్ముళ్లు..! -
ఏపీ పంచాయతీ ఎన్నికలు: ఒక్క ఓటుతో సర్పంచ్ పదవి
సాక్షి, అమరావతి బ్యూరో: అది కృష్ణా జిల్లాలోనే బుల్లి పంచాయతీ.. 1975లో కుందేరు నుంచి వేరుపడి పంచాయతీగా ఏర్పాటైంది. 350 మంది జనాభా, 232 మంది ఓటర్లున్న ఆ ఊరి పేరు కందలంపాడు. కంకిపాడు మండలంలో ఉంది. వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసినందుకు గతంలో నిర్మల్ గ్రామ పురస్కారాన్ని అందుకుంది. ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలిచింది.. ఈ పంచాయతీ జనరల్ కేటగిరీకి రిజర్వ్ అవడంతో ఇద్దరు బరిలో నిలిచారు. మంగళవారం నాటి ఓటింగ్‌లో 232 ఓట్లకు గాను 211 పోలయ్యాయి. ఆరు ఓట్లు చెల్లకుండా పోయాయి. ఇందులో బాయిరెడ్డి నాగరాజు (వైఎస్సార్సీపీ మద్దతుదారు)కు 103, మొవ్వ శివనాగ సుబ్రహ్మణ్యానికి 102 ఓట్లు వచ్చాయి. దీంతో ఒకే ఒక్క ఓటు ఆధిక్యంతో నాగరాజు సర్పంచ్ అయ్యారు. ఇక ఆ ఊరిలోని నాలుగు వార్డుల్లో ఒకటి ఏకగ్రీవం అయింది. మిగిలిన మూడు వార్డుల్లో వైఎస్సార్సీపీ మద్దతు అభ్యర్థులే గెలుపొందారు. ఏకగ్రీవంగా ఎన్నికైన నవీన్‌కు ఉప సర్పంచ్ పదవిని కట్టబెట్టారు. దిబ్బపాలెంలోనూ అంతే.. మాడుగుల రూరల్: విశాఖ జిల్లా చీడికాడ మండలంలో ఓ సర్పంచ్ అభ్యర్థి ఒక్క ఓటు మెజారిటీతో గెలుపొందారు. దిబ్బపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ చేశారు. గ్రామానికి చెందిన నందారపు కాసులమ్మ, తుంపాల నిరంజని పోటీ పడ్డారు. మంగళవారం జరిగిన ఎన్నికల్లో నిరంజని కేవలం ఒక్క ఓటు మెజార్టీతో గెలుపొందారు. కాసులమ్మకు 742 ఓట్లు రాగా, తుంపాల నిరంజనికి 743 ఓట్లు వచ్చాయి. కాపవరం పంచాయతీలోనూ.. సామర్లకోట: ఒక్క ఓటు.. కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో ఆయనను విజయం వరించింది. తూర్పుగోదావరి జిల్లా కాపవరం పంచాయతీలో 8 వార్డులున్నాయి. అయితే ఒకే ఒక్క ఓటు తేడాతో కుంచం మాధవరావు గెలుపొందారు. అధికారులు తిరిగి ఓట్లు లెక్కించడంతో అదే ఒక్క ఓటు తేడాతో మాధవరావు గెలుపొందారు. లాటరీతో వరించిన పదవి గోనేడ సర్పంచ్‌గా గంగరాజు ప్రత్తిపాడు : ఇద్దరు అభ్యర్థులకూ ఓట్లు సమంగా వచ్చాయి.. దీంతో అధికారులు లాటరీ తీసి అభ్యర్థిని ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం గోనేడ పంచాయతీ సర్పంచ్ పదవికి జరిగిన ఎన్నికల్లో అల్లు విజయకుమార్, పలివెల గంగరాజులకు 1,207 చొప్పున ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు లాటరీ తీయగా విజయ్‌కుమార్‌ను అదృష్టం వరించడంతో సర్పంచ్ అయ్యారు. -
రెండో విడతలో 539 పంచాయతీలు ఏకగ్రీవం
సాక్షి, అమరావతి: రెండో విడతలో 2,789 గ్రామ సర్పంచ్ పదవులకు ఈ నెల 13వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడత కింద మొత్తం 3,328 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవగా.. అందులో 539 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 2,789 సర్పంచ్ పదవులకు గాను 7,510 మంది పోటీలో ఉన్నారు. ఆయా గ్రామాల్లో మొత్తం 33,570 వార్డు పదవులకు ఎన్నికలు జరుగుతుండగా.. అందులో 12,605 ఏకగ్రీవమవగా, మిగతా 20,965 వార్డు పదవులకు 13న పోలింగ్ జరగనుంది. వార్డు పదవులకు 44,879 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రెండో విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో అభ్యర్థుల ప్రచారానికి గడువు గురువారం రాత్రి 7:30 గంటలతో ముగుస్తుంది. శనివారం ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆ వెంటనే ఓట్ల లెక్కిస్తారు. -
మా గ్రామానికి ఎన్నికలు రద్దు చేయండి
పిడుగురాళ్లరూరల్ (గురజాల): తమ గ్రామంలో పంచాయతీ ఎన్నికలు రద్దు చేయాలని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండల పరిషత్ కార్యాలయం వద్ద న్యూ వెల్లంపల్లి గ్రామస్తులు ఆదివారం ఆందోళన చేపట్టారు. గతంలో మాచవరం మండలంలోని పులిచింతల ముంపు గ్రామంగా వెల్లంపల్లి ఉంది. ఈ ముంపు వాసులకు పిడుగురాళ్ల మండలంలోని బ్రాహ్మణపల్లి శివారులో నివాసం కల్పించారు. ఆ నివాస ప్రాంతాన్ని న్యూ వెల్లంపల్లి గ్రామ పంచాయతీగా పరిగణిస్తున్నట్లు 2020లో ప్రభుత్వం నుంచి ఉత్వర్వులు అందాయి. ఈ పంచాయతీకి 2019 ఓటర్ల లిస్టు ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం గ్రామంలో నివసించేవారంతా వేరువేరు గ్రామాలకు చెందిన వారని, గతంలో తాము కోర్టుకు వెళ్లగా న్యూ వెల్లంపల్లిలో ఇప్పుడు నివసిస్తున్న వారితోపాటు కొత్త ఓటర్ల లిస్టు తయారు చేయాలని కోర్టు ఆదేశించిందని వివరించారు. అయినా అధికారులు స్పందించడం లేదని ఆరోపిస్తూ ధర్నా చేశారు. అధికారులు స్పందించి కొత్త లిస్టు వచి్చన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. దీనిపై ఎంపీడీవో కాశయ్య స్పందిస్తూ ఎన్నికల నిర్వహణ తమ చేతుల్లో లేదని, అధికారుల ఆదేశాల మేరకే పనిచేస్తున్నామని చెప్పారు. -
2,723 గ్రామాల్లో రేపే పోలింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా విజయనగరం మినహా మిగిలిన 12 జిల్లాల పరిధిలో తొలి విడతలో 2,723 గ్రామ పంచాయతీల్లో మంగళవారం పోలింగ్ జరగనుంది. ఉదయం 6.30 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మినహా మిగిలిన చోట్ల మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు. ఆయా గ్రామాల్లో అభ్యర్థుల ప్రచారం ఆదివారం రాత్రి 7.30 గంటలతో ముగిసిందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ప్రకటించింది. నెల్లూరు జిల్లాలో ఒక్కటి మినహా.. తొలి విడతలో 3,249 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్ అధికారులు ఎక్కడికక్కడ నోటిఫికేషన్ జారీ చేయగా 525 గ్రామాల్లో సర్పంచి ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. నెల్లూరు జిల్లాలోని ఒక గ్రామ పంచాయతీలో సర్పంచి పదవికి, వార్డు సభ్యులుగా ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతో మిగిలిన 2,723 గ్రామాల్లో సర్పంచి పదవికి పోలింగ్ జరగనుంది. మొత్తం 32,502 వార్డు సభ్యుల పదవులు ఉండగా 12,185 ఏకగ్రీవమయ్యాయి. మరో 157 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. మిగిలిన 20,160 వార్డు సభ్యుల పదవులకు పోలింగ్ నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు కూడా రేపే.. తొలివిడత పంచాయతీ ఎన్నికలు జరిగే గ్రామాల్లో ఓట్ల లెక్కింపు కూడా మంగళవారమే చేపట్టనున్నట్లు ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులు చెప్పారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఎక్కడికక్కడే ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొదట వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపును చేపడతారు. గ్రామంలో ఒకటో వార్డు నుంచి చివరి వార్డు వరకు లెక్కింపు పూర్తయిన తర్వాత సర్పంచి ఓట్ల లెక్కింపును చేపడతారు. ఫలితాల వెల్లడి తర్వాత వెంటనే వార్డు సభ్యుల ద్వారా ఉప సర్పంచి ఎన్నికను చేపట్టనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఓటు హక్కు విధిగా వినియోగించుకోండి ప్రశాంత వాతావరణంలో పూర్తి భద్రతా ఏర్పాట్ల మధ్య పంచాయతీ ఎన్నికల్లో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓటర్లను కోరారు. ఈ మేరకు కమిషన్ కార్యాలయం ఓ వీడియో సందేశాన్ని మీడియాకు విడుదల చేసింది. ఓటు హక్కు వినియోగం ద్వారా పంచాయతీలకు జవసత్వాలు వస్తాయని నిమ్మగడ్డ పేర్కొన్నారు. విధిగా ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య వ్యవస్థను ఆశీర్వదించాలని కోరారు. తొలి విడత ఇలా ► తొలివిడత ఎన్నికల్లో 2,723 సర్పంచి పదవులకు 7,506 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. 20,160 వార్డు సభ్యుల పదవులకు 43,601 మంది బరిలో ఉన్నారు. ► సర్పంచి, వార్డు సభ్యులను ఎన్నుకునేందుకు ఓటర్లు ఒకేసారి ఓటు వేయాల్సి ఉంటుంది. బ్యాలెట్ పేపరు విధానంలో ఎన్నిక జరుగుతుంది. ► సర్పంచి పదవికి గులాబీ రంగు (పింక్ కలర్) బ్యాలెట్ పేపరుపైనా, వార్డు పదవికి తెలుపు రంగు బ్యాలెట్ పేపరుపైనా ఓటు వేయాలి. ఓటు వేసిన తర్వాత రెండు బ్యాలెట్ పేపర్లను బ్యాలెట్ బాక్స్ వద్దకు తీసుకెళ్లి రెండూ కలిపి అందులోనే వేయాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. ► పోలింగ్ మెటీరియల్‌ను సోమవారం ఆయా మండల పరిషత్‌ల కార్యాలయాల వద్ద సంబంధిత పోలింగ్ సిబ్బందికి అందజేస్తారు. ► బ్యాలెట్ బాక్స్, బ్యాలెట్ పేపర్లు, ఇంకు, కవర్లు తదితర 38 రకాల పోలింగ్ మెటీరియల్స్‌ను పోలింగ్ సిబ్బందికి అందిస్తారు. -
రాష్ట్రానికి 11 పంచాయతీ అవార్డులు
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు సేవలు అందించడంలో మెరుగైన పనితీరును కనబరిచినందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా ఇచ్చే దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తికరణ్ పురస్కార్ (డీడీయూపీఎస్‌పీ)–2020 అవార్డులు ఈ ఏడాది రాష్ట్రానికి 11 దక్కాయి. పారిశుధ్యం, ప్రజా సేవలు (తాగునీరు, వీధి దీపాలు, మౌలికవసతులు), సహజ వనరుల నిర్వహణ, అట్టడుగు వర్గాలు (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, వయో వృద్ధులు), సామాజికరంగ పనితీరు, విపత్తు నిర్వహణ, గ్రామ పంచాయతీల అభివృద్ధికి వ్యక్తిగత సహాయం, ఆదాయ ఆర్జనలో కొత్తవిధానాలు, ఇ–గవర్నెన్స్ విభాగాల్లో ఆయా పంచాయతీరాజ్ సంస్థలు తీసుకునే ఉత్తమ చర్యలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డులు ఇస్తారు. ఈ ఏడాది అవార్డుల జాబితాను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జాయింట్ సెక్రటరీ సంజీబ్ పత్‌జోషి ఇటీవల వెల్లడించారు. రాష్ట్రంలో ఒక జిల్లా పరిషత్, నాలుగు మండల పరిషత్‌లు, ఆరు గ్రామ పంచాయతీలు ఈ ఏడాది అవార్డులను దక్కించుకున్నాయి. అవార్డులు ఇలా.. జిల్లా స్థాయిలో– పశ్చిమ గోదావరి మండల స్థాయిలో– రామచంద్రాపురం, బంగారుపాళెం (చిత్తూరు జిల్లా), మేడికొండూరు (గుంటూరు జిల్లా), చెన్నూరు (వైఎస్సార్ జిల్లా) గ్రామ పంచాయతీ స్థాయిలో– కొండకిందం (విజయనగరం జిల్లా), వేములకోట, కురిచేడు (ప్రకాశం జిల్లా), చెల్లూరు (తూర్పు గోదావరి జిల్లా), అంగలకుదురు, కొట్టెవరం (గుంటూరు జిల్లా).