Gujarat Chief Minister
-
ప్రజా సేవలో 23 ఏళ్లు
న్యూఢిల్లీ: వికసిత్ భారత్ లక్ష్యం సాకారమయ్యే వరకు మరింత దీక్షతో, అవిశ్రాంతంగా కృషి చేస్తానని ప్రధాని మోదీ ప్రజలకు హామీ ఇచ్చారు. ఎంతో సాధించినా చేయాల్సింది ఇంకా చాలా ఉందన్నారు. గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా ప్రజా ప్రస్థానంలో సోమవారంతో 23 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్న మోదీ సోమవారం ఈ మేరకు ‘ఎక్స్’లో పలు పోస్టులు పెట్టారు. ప్రభుత్వాధిపతిగా తనకు బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా, 23 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న మోదీని బీజేపీ ప్రశంసల్లో ముంచెత్తింది. ‘ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిగా ప్రధాని మోదీ ప్రజా జీవితానికి నేటితో 23 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సుదీర్ఘ ప్రజా సేవ ప్రయాణం ఒక వ్యక్తి తన జీవితాంతం దేశం, ప్రజల సంక్షేమం కోసం ఎలా అంకితం చేయగలడనే అపూర్వ అంకితభావానికి, సజీవ చిహ్నం’అని హోం మంత్రి అమిత్ షా ‘ఎక్స్’లో పేర్కొన్నారు. 2001 అక్టోబర్ 7న మోదీ మొట్టమొదటిసారిగా గుజరాత్ సీఎంగా ప్రమాణం చేశారు. 2014లో ప్రధానిగా పగ్గాలు చేపట్టక మునుపు సీఎం పోస్టులో 13 ఏళ్లపాటు కొనసాగారు. ఈ ఏడాది జూన్‌లో మూడో విడత ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. -
నా పై వచ్చిన అతి పెద్ద ఆరోపణ అదే: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: గుజరాత్ సీఎంగా ఉన్నపుడు తాను ధరించే దుస్తుల విషయంలో మాజీ సీఎం ఒకరు తనపై చేసిన ఆరోపణలను ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. ‘మోదీకి 250 జతల దుస్తులు ఉన్నాయంటూ మాజీ సీఎం అమర్‌సిన్హా చౌధరీ అప్పట్లో ఆరోపించారు. అది నా రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న అతిపెద్ద ఆరోపణ. నాపై వచ్చిన ఆరోపణలను అంగీకరిస్తున్నట్లు ఓ బహిరంగ సభలో చెప్పాను. రూ. 250 కోట్లు దోచుకునే సీఎం కావాలా? 250 జతల దుస్తులున్న సీఎం కావాలా? అని ప్రజలను అడిగాను. ప్రజలు మాత్రం 250 జతల దుస్తులున్న సీఎం పనిచేస్తాడంటూ ముక్తకంఠంతో నినదించారు. ఆ తర్వాత నాపై ఆరోపణలు చేసే ధైర్యం ప్రత్యర్థులు చేయలేదు’ అని మోదీ పాత స్మృతులను పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ తాజాగా గుర్తు చేసుకున్నారు. -
Vibrant Gujarat Summit: 2036 ఒలింపిక్స్‌కు భారత్ బిడ్..?
వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కార్యక్రమానికి హాజరయ్యారు. గ్లోబల్‌గా వివిధ దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీ సీఈవోలతో భారత్‌లోని వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోనున్నారు. ఈ సందర్భంగా గుజరాత్ ముఖ్యమంత్రి మాట్లాడుతూ వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024లో 50 శాతం మేర ‘గ్రీన్ ఎంఓయూ’లు కుదరనున్నట్లు తెలిపారు. జీ20 వంటి అంతర్జాతీయ సదస్సులకు భారత్ ప్రాతినిధ్యం వహించడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సమ్మిట్‌లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 34 దేశాలు పాల్గొననున్నట్లు చెప్పారు. గుజరాత్లో పెట్టుబడి అవకాశాలను పెంచడానికి సేల్స్‌ఫోర్స్, అబాట్, బ్లాక్‌స్టోన్, హెచ్ఎస్బీసీ, యూపీఎస్, మైక్రోన్, సిస్కో, ఎస్‌హెచ్‌ఆర్‌ఎం వంటి దాదాపు 35 ఫార్చ్యూన్ అమెరికన్ కంపెనీలు ఈ సదస్సుకు హాజరవుతున్నాయని తెలిపారు. ఈ సదస్సులో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్అంబానీ మాట్లాడుతూ ప్రపంచంలో ప్రధాని నరేంద్ర మోదీ మాటకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. ఈ సదస్సును 20 ఏళ్ల నుంచి విజయవంతంగా నిర్వహించడం గొప్పవిషయం అన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ గుజరాత్లో భారీ పెట్టుబడులు పెడుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా రూ.12 లక్షలకోట్లు పెట్టుబడి పెట్టినట్లు వివరించారు. అందులో మూడోవంతు గుజరాత్‌లోనే ఉన్నట్లు తెలిపారు. దాంతో ప్రభుత్వ సహకారంతో చాలామందికి ఉపాధికల్పిస్తున్నట్లు చెప్పారు. 2036 ఒలింపిక్స్ కోసం భారత్ బిడ్ వేయాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: 2036 నాటికి 9.3 కోట్ల ఇళ్లకు గిరాకీ.. ఎక్కడో తెలుసా.. ‘వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్’ 2003లో ప్రారంభించారు. ప్రస్తుతం జరుగుతున్న పదో ఎడిషన్ సదస్సుతో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సదస్సులో భాగంగా వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ ట్రేడ్ షో 2024లో డిజిటల్ ఇండియా కార్యక్రమాలు, ఇండియా స్టాక్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ (ఇండస్ట్రీ 4.0, స్మార్ట్ మ్యాన్యుఫ్యాక్ట్, స్మార్ట్ మ్యాన్యుఫ్యాక్ట్), ఛాంపియన్ సర్వీసెస్ సెక్టార్, డిస్ట్రప్టివ్ టెక్నాలజీస్‌ను ప్రదర్శించనున్నారు. -
Gujarat Election 2022: రేపే భూపేంద్రకు పట్టం
గాంధీనగర్: గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ (60) వరుసగా రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. శనివారం జరిగిన సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలంతా ఆయన్ను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయం ‘కమలం’లో జరిగిన ఈ భేటీకి పార్టీ కేంద్ర పరిశీలకులుగా సీనియర్ నేతలు రాజ్‌నాథ్‌సింగ్, యడ్యూరప్ప, అర్జున్ ముండా హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు 2021లో విజయ్ రూపానీ స్థానంలో సీఎంగా భూపేంద్ర పగ్గాలు చేపట్టారు. గురువారం వెలువడ్డ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 182 స్థానాలకు గాను ఏకంగా 156 సీట్లను కొల్లగొట్టి బీజేపీ రికార్డు విజయం సొంతం చేసుకోవడం తెలిసిందే. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా మంత్రివర్గంతో పాటుగా భూపేంద్ర శుక్రవారం రాజీనామా చేశారు. శనివారం ఎల్పీ నేతగా ఎన్నికయ్యాక గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత తెలిపారు. సోమవారం ఆయన రాష్ట్ర 18వ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గాందీనగర్‌లోని హెలిప్యాడ్ మైదానంలో జరిగే కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరవుతారు. ఇదీ చదవండి: హిమాచల్ సీఎంగా సుఖు -
గుజరాత్‌కు బీజేపీ కేంద్ర పరిశీలకులు.. సీఎం ఎంపికపై దృష్టి
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ఇక నూతన ముఖ్యమంత్రి ఎంపికపై దృష్టి సారించింది. తాజా ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ ఎమ్మెల్యేలు శనివారం ఉదయం గాంధీనగర్‌లో సమావేశమై, తమ పార్టీ శాసనసభా పక్ష(సీఎల్పీ) నేతను ఎన్నుకోనున్నారు. ఈ ప్రక్రియను పూర్తిచేయడానికి కేంద్ర పరిశీలకులుగా సీనియర్ నేతలు రాజ్‌నాథ్ సింగ్, బీఎస్ యడియూరప్ప, అర్జున్ ముండాను బీజేపీ అధిష్టానం నియమించింది. సీఎల్పీ నేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ కొనసాగుతారని బీజేపీ అధిష్టానం గతంలోనే ప్రకటించింది. భూపేంద్ర పటేల్ రాజీనామా గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆచార్య దేవవ్రత్కు అందజేశారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా ఆయన మంత్రివర్గం సైతం రాజీనామా సమర్పించింది. బీజేపీ నిర్ణయం ప్రకారం.. భూపేంద్ర పటేల్ ఈ నెల 12వ తేదీన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు. ఇదీ చదవండి: ఇంతకీ.. గెలిచింది ఎవరు! మూడు రాష్ట్రాల తీర్పు చెప్పిందేంటి? -
గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ రాజీనామా.. 12న ప్రమాణ స్వీకారం
గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ అఖండ విజయం సాధించి మరోసారి అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఆయన మంత్రివర్గం శుక్రవారం రాజీనామా చేశారు. గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌కు చేరుకుని రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్కు రాజీనామా పత్రాలను సమరించారు. సీఎం భూపేంద్ర పటేల్‌తో పాటు గుజరాత్ బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్, పార్టీ చీఫ్ విప్ పంకజ్ దేశాయ్‌లు హాజరయ్యారు. గురువారం వెలువడిన ఫలితాల్లో 182 స్థానాలకు గానూ బీజేపీ 156 సీట్లు గెలుపొంది రికార్డులు తిరగరాసింది. భూపేందర్ పటేల్ మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపడతారని ఎన్నికలకు ముందే ప్రకటించింది బీజేపీ. ఫలితాలు వెలువడిన క్రమంలో గురువారం బీజేపీ రాష్ట్ర చీఫ్ సైతం అదే విషయాన్ని వెల్లడించారు. ఈ క్రమంలో ఫార్మాలిటీ కోసం రాజీనామాలు చేశారు. మరోమారు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 12న ప్రమాణ స్వీకారం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ‘ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఆయన మంత్రివర్గం రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు పటేల్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. గాంధీనగర్‌లోని కమలం పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమవుతారు. మధ్యాహ్నానికి పార్టీ శాసనసభాపక్ష నేత ఎన్నికపై గవర్నర్‌కు తెలియజేస్తాం. గవర్నర్ సూచనల మేరకు సీఎం, కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుంది.’ అని తెలిపారు పార్టీ చీఫ్ విఫ్ పంకజ్ దేశాయ్. మరోవైపు.. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం గాంధీనగర్‌లోని హెలిపాడ్ గ్రౌండ్లో సోమవారం ఉంటుందని పార్టీ చీఫ్ సీఆర్ పాటిల్ ప్రకటించారు. సీఎం ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు హాజరవుతారని చెప్పారు. ఇదీ చదవండి: Gujrat Polls 2022: మున్సిపాలిటీ సభ్యుడి నుంచి సీఎం స్థాయికిపాలిటీ సభ్యుడి నుంచి సీఎంగా -
National Games 2022: సర్వీసెస్‌కు అగ్రస్థానం
అహ్మదాబాద్: జాతీయ క్రీడల్లో మళ్లీ సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ) జట్టే సత్తా చాటుకుంది. ‘సెంచరీ’ని మించిన పతకాలతో ‘టాప్’ లేపింది. సర్వీసెస్ క్రీడాకారులు మొత్తం 128 పతకాలతో అగ్రస్థానంలో నిలిచారు. ఇందులో 61 స్వర్ణాలు, 35 రజతాలు, 32 కాంస్యాలున్నాయి. అట్టహాసంగా ఆరంభమైన 36వ జాతీయ క్రీడలకు బుధవారం తెరపడింది. 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 8000 పైచిలుకు అథ్లెట్లు ఈ పోటీల్లో సందడి చేశారు. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో 38, అక్వాటిక్స్లో 36 జాతీయ క్రీడల రికార్డులు నమోదయ్యాయి. ఆఖరి రోజు వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ముఖ్య అతిథిగా విచ్చేయగా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు పాల్గొన్నారు. తదుపరి జాతీయ క్రీడలకు వచ్చే ఏడాది గోవా ఆతిథ్యమిస్తుంది. ► వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఈ జాతీయ క్రీడలు గోవాలో జరగాలి. కానీ అనూహ్యంగా గుజరాత్‌కు కేటాయించగా... నిర్వాహకులు వంద రోజుల్లోపే వేదికల్ని సిద్ధం చేయడం విశేషం. పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ఇండోర్ స్టేడియంలో ముగింపు వేడుకలు జరిగాయి. ► పురుషుల విభాగంలో ఎనిమిది పతకాలు సాధించిన కేరళ స్విమ్మర్ సజన్ ప్రకాశ్ (5 స్వర్ణాలు, 2 రజతాలు, 1 కాంస్యం) ‘ఉత్తమ క్రీడాకారుడు’గా... మహిళల విభాగంలో ఏడు పతకాలు సాధించిన కర్ణాటకకు చెందిన 14 ఏళ్ల స్విమ్మర్ హషిక (6 స్వర్ణాలు, 1 కాంస్యం) ‘ఉత్తమ క్రీడాకారిణి’గా పురస్కారాలు గెల్చుకున్నారు. గత జాతీయ క్రీడల్లోనూ (2015లో కేరళ) సజన్ ప్రకాశ్ ‘ఉత్తమ క్రీడాకారుడు’ అవార్డు అందుకోవడం విశేషం. ► చివరిరోజు తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ ‘పసిడి పంచ్’తో అలరించాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన హుసాముద్దీన్ సర్వీసెస్ తరఫున ఈ క్రీడల్లో పాల్గొన్నాడు. 57 కేజీల ఫైనల్లో హుసాముద్దీన్ 3–1తో సచిన్ సివాచ్ (హరియాణా)పై గెలిచాడు. ► ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఓవరాల్ చాంప్ సర్వీసెస్‌కు ‘రాజా భళీంద్ర సింగ్’ ట్రోఫీని అందజేశారు. సర్వీసెస్ నాలుగోసారి ఈ ట్రోఫీ చేజిక్కించుకుంది. 39 స్వర్ణాలు, 38 రజతాలు, 63 కాంస్యాలతో కలిపి మొత్తం 140 పతకాలు సాధించి రెండో స్థానంలో నిలిచిన మహారాష్ట్రకు ‘బెస్ట్ స్టేట్’ ట్రోఫీ లభించింది. ఓవరాల్‌గా సర్వీసెస్‌కంటే మహా రాష్ట్ర ఎక్కువ పతకాలు సాధించినా స్వర్ణాల సంఖ్య ఆధారంగా సర్వీసెస్‌కు టాప్ ర్యాంక్ దక్కింది. ► తెలంగాణ 8 స్వర్ణాలు, 7 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి మొత్తం 23 పతకాలతో 15వ స్థానంలో... ఆంధ్రప్రదేశ్ 2 స్వర్ణాలు, 9 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 16 పతకాలతో 21వ స్థానంలో నిలిచాయి. 2015 కేరళ జాతీయ క్రీడల్లో తెలంగాణ 8 స్వర్ణాలు, 14 రజతాలు, 11 కాంస్యాలతో కలిపి మొత్తం 33 పతకాలతో 12వ స్థానంలో... ఆంధ్రప్రదేశ్ 6 స్వర్ణా లు, 3 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి మొత్తం 16 పతకాలతో 18వ స్థానంలో నిలిచాయి. హషికకు ట్రోఫీ ప్రదానం చేస్తున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా -
అసెంబ్లీ ఎన్నికల వేళ గుజరాత్లో కీలక పరిణామం.. ఆ మంత్రులకు షాక్!
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది ఆఖర్లో జరగనున్నాయి. ఈ తరుణంలో బీజేపీ నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఇద్దరు కీలక కేబినెట్ మంత్రులకు కేటాయించిన శాఖలను తగ్గించారు. ఇద్దరు రాష్ట్ర మంత్రుల శాఖలను తగ్గిస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి రాజేంద్ర త్రివేది పోర్టిఫోలియోల నుంచి కీలక శాఖ అయిన రెవెన్యూను, పూర్ణేశ్ మోదీ శాఖల్లోని కీలకమైన రోడ్డు, భవనాల శాఖను ముఖ్యమంత్రి తొలగించారు. కొద్ది నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అకస్మాత్తుగా ఇలా మంత్రివర్గంలో మార్పులు చేయటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాజేంద్ర త్రివేది, పుర్ణేశ్ మోదీల నుంచి తొలగించిన రెండు శాఖలను ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పర్యవేక్షించనున్నారు. రాజేంద్ర త్రివేది వద్ద న్యాయ, విపత్తు నిర్వహణ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖలు ఉన్నాయి. మరోవైపు.. పూర్ణేశ్ మోదీ వద్ద రవాణా, పౌర విమానయాన, పర్యటకం, దేవాదాయ అభివృద్ధి శాఖలు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. భూపేంద్ర పటేల్ ప్రభుత్వంలోని 10 కేబినెట్ ర్యాంక్ మంత్రుల్లో త్రివేది, మోదీలు ఉన్నారు. అయితే, రోడ్లు, భవనాల విభాగం, రెవెన్యూ విభాగల పనితీరు సరిగా లేదని సీఎంకు ప్రభుత్వ వర్గాలు సూచించిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. హర్ష రమేశ్‌కుమార్ సంఘ్వీకి రెవెన్యూ శాఖ సహాయ మంత్రిగా, జగదీశ్ ఐశ్వర్ పంచల్‌కు రోడ్లు, భవనాల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు సీఎం భూపేంద్ర పటేల్. గత ఏడాది సెప్టెంబర్‌లో విజయ్ రూపానీ స్థానంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు భూపేంద్ర పటేల్. ఇప్పుడు సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు జరిగిన తాజా పరిణామం వెనుకున్న కారణం ఏంటన్నది మాత్రం తెలియరాలేదు. Gujarat | In state cabinet rejig before Assembly elections, Revenue ministry taken from Rajendra Trivedi while Road and Building Ministry take from Purnesh Modi, both the ministries will now be handled by CM Bhupendra Patel pic.twitter.com/2VavVSJQBI — ANI (@ANI) August 20, 2022 ఇదీ చదవండి: ‘ఈ జిమ్మిక్కులు ఏమిటి.. మోదీ జీ?’.. ట్రావెల్ బ్యాన్పై మనీశ్ సిసోడియా విమర్శలు -
మార్పు మంత్రం ఫలించేనా?
ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే ఏకంగా సీఎం పీఠం ఎక్కితే అది విశేషమే. అందులోనూ ఆ వ్యక్తి ఏ సొంత పార్టీకో అధినేత కాకుండా, సామాన్య రాజకీయ నేత అయితే అది మరీ విశేషం. బీజేపీ పాలిత గుజరాత్లో ఆ రాష్ట్ర 17వ ముఖ్యమంత్రిగా సోమవారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేసిన 58 ఏళ్ళ భూపేంద్ర ఇప్పుడు అలా వార్తల్లో వ్యక్తి అయ్యారు. కార్పొరేటర్‌గా మొదలై ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎదిగారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా గెలిచిన గాంధీనగర్ లోక్‌సభా స్థానంలో ఒక భాగమైన ఘాట్లోడియా నియోజకవర్గపు ఎమ్మెల్యే భూపేంద్ర. ఒకప్పుడు అదే నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహించి, ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ గవర్నరైన గుజరాత్ తొలి మహిళా ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్‌కు అనుయాయుడు. నియోజకవర్గ అభివృద్ధిపై తన ప్రాంత ఎమ్మెల్యేలతో అమిత్ షా సమీక్షా సమావేశాలు జరిపినప్పుడు ఆ కీలక నేత దృష్టిలో పడ్డారు. షా సారథ్యంలో పైకి ఎదిగారు. ఇప్పుడు షా, మోడీ ద్వయం ఆశీస్సులతోనే కొత్తవాడైనప్పటికీ కిరీటం దక్కించుకున్నారు. అదే సమయంలో మరో 15 నెలల్లో జరిగే గుజరాత్ ఎన్నికలలో పార్టీని గెలిపించే బరువు భూపేంద్ర భుజాలపై పడింది. అలా గుజరాత్ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ప్రపంచంలో శాశ్వతమైనది మార్పు ఒక్కటే! ఈ మార్పు మంత్రాన్ని బీజేపీ ఇప్పుడు బాగా నమ్ముతున్నట్టుంది. పరిస్థితులను బట్టి అధికార పీఠంపై కూర్చోబెడుతున్న మనుషులను మారిస్తేనే వివిధ ఎన్నికల్లో విజయతీరాలు చేరవచ్చని ఆ పార్టీ భావిస్తోంది. జార్ఖండ్‌లో ఓటమితో, మళ్ళీ తప్పు చేయదలుచుకోలేదు. ఎన్నికల్లో ఓటమి కన్నా సీఎంలను మార్చడమే మేలనుకుంది. అధికార యంత్రాంగంతో సఖ్యత లేకపోగా, కరోనా వేళ ప్రభుత్వ వైఫల్యం లాంటివన్నీ నిన్నటి దాకా గుజరాత్ పీఠంపై ఉన్న విజయ్ రూపాణీకి ప్రతికూలమయ్యాయి. అమిత్ షా లానే కీలకమైన జైన్ వర్గానికి చెందినవాడైనప్పటికీ, రూపాణీ సారథ్యంలో ఎన్నికలకు వెళితే ఇబ్బందే అని అధిష్ఠానం గ్రహించింది. ఇప్పుడిలా గుజరాత్ గద్దెపైకి కొత్త సీఎంను తెచ్చింది. గత 6 నెలల్లో బీజేపీ ఇలా వేర్వేరు రాష్ట్రాలలో నలుగురు ముఖ్యమంత్రులను మార్చిందన్నది గమనార్హం. వేర్వేరు కారణాలతో ఉత్తరాఖండ్, అస్సామ్, కర్ణాటక, గుజరాత్‌లు నాలుగూ మార్పులు చూశాయి. నిజానికి, రెండున్నర దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా నిలిచి, కేంద్రంలో ఆ పార్టీ అధికార విస్తరణకు బాటలు వేసిన రాష్ట్రం గుజరాత్. అధికార చక్రం తిప్పుతున్న మోదీ, షాల సొంత రాష్ట్రం. ఇన్నేళ్ళ పాలన తర్వాత సహజంగానే ఓటర్లలో అధికారపక్ష వ్యతిరేకత తలెత్తుతుంది. పైపెచ్చు, పాటీదార్ల (పటేల్) రిజర్వేషన్ల ఉద్యమ ప్రభావంతో గత ఎన్నికల్లో ఓట్లు, సీట్లు తగ్గాయి. ఎలాగోలా అప్పట్లో అధికారం నిలబెట్టుకున్న బీజేపీ ఈసారి మాత్రం రిస్కు తీసుకోదలుచుకోలేదు. పాటీదార్ ఉద్యమకారుడు హార్దిక్ పటేల్‌ను కాంగ్రెస్, సూరత్‌కు చెందిన వ్యాపారవేత్త మహేశ్ సవానీని ఆమ్ ఆద్మీ పార్టీ తమ నేతలుగా చూపెడుతున్నాయి. దాంతో, పాటీదార్ల ఓట్లు ఆ పార్టీలకు చీలిపోకుండా చూడాలని బీజేపీ నిర్ణయించుకుంది. గుజరాత్లో గణనీయ స్థానాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే పాటీదార్ల వర్గపు భూపేంద్రను కొత్త సీఎంను చేసింది. అనేక రాష్ట్రాలలో ఓబీసీ రాజకీయాలు చేస్తున్న బీజేపీ గుజరాత్లో గణనీయ సంఖ్యలో ఓబీసీలున్నా ఆ పని చేయలేదు. కర్ణాటకలో లింగాయత్ వర్గానికి చెందిన ఎస్సార్ బొమ్మైని సీఎంను చేసినట్టే, గుజరాత్ మధ్యతరగతిలో, వృత్తినిపుణుల్లో ఎక్కువున్న పాటీదార్లకు పట్టం కట్టింది. ఓబీసీ బిల్లు, కమిషన్ లాంటి చర్యలతో ఠాకూర్లు, ప్రజాపతులు, బక్షీపంచ్ లాంటి ఓబీసీల నమ్మకాన్నీ నిలబెట్టుకుంటానని భావిస్తోంది. 2014 తర్వాత నుంచి ఎన్నికలలో గెలుపే ధ్యేయంగా బీజేపీ మారిపోయిందని ఓ విమర్శ. ఆ మాటెలా ఉన్నా కాంగ్రెస్ పార్టీనీ, దాని హైకమాండ్ సంస్కృతినీ ఒకప్పుడు దుమ్మెత్తిపోసిన బీజేపీ తీరా ఇప్పుడు అదే కాంగ్రెస్ బాటలో నడుస్తోంది. ప్రజలో, ప్రజాప్రతినిధులో ఎన్నుకున్న నేతల కన్నా అధిష్ఠానానికి విధేయులనే సీఎం కుర్చీలో కూర్చోబెట్టడమనే సీల్డ్ కవర్ సంప్రదాయానికే బీజేపీ ఓటేస్తోంది. గుజరాత్లో పోటీలో ఉన్న పెద్ద పెద్దవాళ్ళందరినీ పక్కనపెట్టి, భూపేంద్ర లాంటి పేరు లేని పెద్దమనిషి పేరును తెర మీదకు తేవడమే అందుకు నిదర్శనం. దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకొని, ఉప ముఖ్యమంత్రి దాకా ఎదిగిన నితిన్ పటేల్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన సీఆర్ పాటిల్ సహా ఉద్దండులకు నో చెప్పి, తనదైన ఎంపికకు వారితోనే జై కొట్టించింది. అలా అధిష్ఠానం రాష్ట్ర స్థాయిలోనూ తన భల్లూకపు పట్టును మరోసారి నిరూపించుకుంది. సివిల్ ఇంజనీరింగ్ చదివి, భవన నిర్మాణాన్ని వృత్తిగా ఎంచుకున్న భూపేంద్ర సైతం సీఎం అవుతాననుకోలేదు. అనుకోకుండా దక్కిన అధికార పీఠం ఆయనకు పెను సవాలు. ఇప్పుడాయన ఒక్కో ఇటుక పేర్చుకుంటూ, ఎన్నికల బరిలో పార్టీని విపక్ష దుర్భేద్యమైన కోటగా మార్చాల్సి ఉంది. మొత్తం 182 స్థానాలున్న గుజరాత్‌లోకెల్లా అత్యధికంగా లక్ష ఓట్ల పైగా మెజారిటీతో గత 2017 ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచారాయన. ఈసారి ఆయన తనతో పాటు పార్టీకీ రాష్ట్రంలో మెజారిటీ దక్కేలా చూడాల్సి ఉంది. అనుభవం లేకున్నా, వ్యాపార వర్గాలతో ఆయనకున్న సత్సంబంధాలు ఓ సానుకూల అంశం. మరోపక్క కనీసం బీజేపీ ఇబ్బందుల్ని సొమ్ము చేసుకొనే పరిస్థితుల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ లేదు. అక్కడ పూర్తిస్థాయి పునర్వ్యవస్థీకరణను ఆ పార్టీ చేపట్టనే లేదు. ఈ పరిస్థితుల్లో సీఎం పీఠంపై మనుషులు శాశ్వతం కాదు. వాళ్ళను మార్చడం వల్ల అధికారం శాశ్వతంగా నిలుస్తుందనేది ఇప్పుడు అధికార బీజేపీ నమ్ముతోంది. మరి, సీఎం మార్పు మంత్రం ఫలిస్తుందా? -
గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం
భోపాల్: గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ (59) సోమవారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా, గుజరాత్ 17వ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌ను అదృష్టం వరించింది. ఆదివారం సమావేశమైన బీజేపీ శాసనసభా పక్షం ఆయనను తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలుండగా, 112 మంది బీజేపీ సభ్యులున్నారు. శాసనసభా పక్ష సమావేశానికి వీరంతా హాజరయ్యారు. తదుపరి సీఎంగా భూపేంద్ర పటేల్ పేరును శనివారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విజయ్ రూపానీ ప్రతిపాదించారు. ఇందుకు బీజేపీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. 2017లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉత్తరప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ ఆనందీబెన్ గతంలో ప్రాతినిధ్యం వహించిన ఘట్లోడియా స్థానం నుంచే భూపేంద్ర 2017 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. 2015-2017 మధ్య అహ్మదాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పనిచేశారు. 2010-2015 మధ్య అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గానూ వ్యవహరించారు. -
భూపేంద్ర పటేల్: ప్రోఫైల్
-
కాసేపట్లో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం
-
ఏడాదిలో నలుగురు సీఎంలను మార్చిన బీజేపీ
-
22 కి.మీ... లక్ష మంది
అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించేందుకు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్‌రూపానీ గాంధీనగర్‌లో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 24న ట్రంప్, ప్రధాని మోదీ అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి 22 కిలోమీటర్ల మేర నిర్వహించే రోడ్‌షోలో పాల్గొంటారు. ప్రస్తుతం ఉన్న ప్రణాళిక ప్రకారం స్వాతంత్య్రోద్యమ కాలంలో జాతిపిత మహాత్మాగాంధీ నడయాడిన సబర్మతి ఆశ్రమాన్ని ట్రంప్, మోదీలు సందర్శిస్తారు. తర్వాత ఆశ్రమం నుంచి ఇందిర బ్రిడ్జి పైనుంచి ఎస్పీ రింగు రోడ్డు మీదుగా ఎయిర్‌పోర్టు వద్దనున్న మొటెరా స్టేడియంకు చేరుకుంటారు. రోడ్‌షోలో భద్రతా ఏర్పాట్లూ, ట్రాఫిక్ తదితర అంశాలు సహా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు గుజరాత్ హోంమంత్రి ప్రదీప్‌సిన్హా జడేజా చెప్పారు. రోడ్ షోకి ఒక లక్ష మంది రోడ్‌షోలో సుమారు లక్ష మంది ప్రజలు భాగస్వాములవుతారని భావిస్తున్నారు. రోడ్‌షోలో 70 లక్షల మంది జనం పాల్గొంటున్నారని ట్రంప్ చెప్పారు. అయితే లక్ష మంది వరకు రోడ్‌షోలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు అహ్మదాబాద్ మున్సిపల్ కమిషనర్ విజయ్ నెహ్రా వెల్లడించారు. మొటెరాలో కొత్తగా నిర్మిస్తోన్న క్రికెట్ స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సభను ఉద్దేశించి ఇరువురు నేతలూ ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో దాదాపు లక్షా పదివేల మంది ప్రజలు పాల్గొననున్నారు. సర్వాంగ సుందరంగా ఆగ్రా తాజ్‌మహల్‌ని ట్రంప్, ఆయన భార్య మెలానియా దర్శించనున్న నేపథ్యంలో తాజ్‌మహల్ పరిసర ప్రాంతాలను యూపీ ప్రభుత్వం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. తాజ్‌మహల్, పరిసర ప్రాంతాలనూ ముస్తాబు చేస్తున్నారు. తాజ్‌మహల్ పక్కనున్న యమునా తీర ప్రాంతంలోని భారీచెత్తను గత రెండు రోజులుగా తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఖెరియా ఎయిర్‌పోర్టు నుంచి తాజ్‌మహల్ వరకు ఎంజీ రోడ్డుపైన భిక్షాటన చేసేవారిని అక్కడి నుంచి ఖాళీచేయించారు. దారిపొడవునా గోడలకు రంగులు వేశారు. భద్రతాకారణాల రీత్యా దారిలో ఉన్న చెట్లను నరికివేశారు. 20వేల మంది విద్యార్థులు జెండాలతో స్వాగతం పలుకుతారు. రామ్‌లీలా, రాస్లీలా, పంచకుల, నౌతంకి సహా ఆగ్రా, మధుర, బృందావన్‌ల నుంచి కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. ప్రభుత్వ పాఠశాలను సందర్శించనున్న మెలానియా మెలానియా దక్షిణ ఢిల్లీలో ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రవేశపెట్టిన ‘హ్యాపీనెస్ కరికులమ్’ పాఠశాలను సందర్శించనున్నారు. 25న ఢిల్లీకి చేరుకోనున్న ట్రంప్, మెలానియాలకు సీఎం కేజ్రీవాల్ స్వాగతం పలుకుతారు. పిల్లల్లో ఒత్తిడిని తగ్గించేందుకు గతంలో ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ‘హ్యపీనెస్’ పాఠ్యప్రణాళికను ప్రవేశపెట్టారు. ఇందులో 40 నిముషాల పాటు మెడిటేషన్, విశ్రాంతి తదితర కార్యక్రమాలుంటాయి. రోడ్ షోకు డీఆర్డీఓ డ్రోన్ నిరోధక వ్యవస్థ ట్రంప్, మోదీ పాల్గొనే రోడ్ షోలో డీఆర్డీఓ(డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) అభివృద్ధి చేసిన డ్రోన్ నిరోధక వ్యవస్థను వాడనున్నారు. అగ్రనేతల భద్రత కోసం స్థానిక పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, యాంటి టెర్రరిస్ట్ స్క్వాడ్, చేతక్ కమాండో, స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌ల సేవలను వినియోగించుకుంటున్నారు. రోడ్ షో జరిగే ప్రాంతంలోని కీలక, వ్యూహాత్మక ప్రదేశాల్లో వీరిని మోహరిస్తామని క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అజయ్ తోమర్ గురువారం తెలిపారు. డ్రోన్‌ను గుర్తించడంతో పాటు, దాన్ని నాశనం చేసేలా ఈ వ్యవస్థను రూపొందించారు. రోడ్ షో సందర్భంగా ఇరువురు నేతలు ఒకే కారులో ప్రయాణిస్తారా? అన్న విషయంపై తమకు సమాచారం లేదని తోమర్ తెలిపారు. అలాగే, ఓపెన్ వెహికిల్‌ను వారు వాడకపోవచ్చన్నారు. ట్రంప్ పర్యటన నేపథ్యంలో తాజ్‌మహల్ పరిసరాలను ముస్తాబుచేస్తున్న దృశ్యం. -
వారు వెళ్లేందుకు 150 దేశాలున్నాయ్..
సాక్షి, న్యూఢిల్లీ : ముస్లింలు జీవించేందుకు ప్రపంచవ్యాప్తంగా 150 ఇస్లామిక్ దేశాలున్నాయని, హిందువులకు మాత్రం కేవలం భారతదేశంలోనే తలదాచుకోవాల్సిన పరిస్ధితి ఉందని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని సమర్ధిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చే ముస్లిమేతర శరణార్ధులకు భారత పౌరసత్వ కల్పించే చట్టాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని దుయ్యబట్టారు. సబర్మతి ఆశ్రమం వద్ద పౌర చట్టానికి మద్దతుగా జరిగిన భారీ ర్యాలీని ఉద్దేశించి గుజరాత్ సీఎం మాట్లాడారు. ఈ అంశంపై జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ల వైఖరులకు విరుద్ధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దేశ విభజన జరిగిన సమయంలో పాకిస్తాన్లో 22 శాతంగా ఉన్న భారత జనాభా వారిపై దౌర్జన్యం, హింసాకాండ, లైంగిక దాడుల కారణంగా ప్రస్తుతం కేవలం మూడు శాతానికి పడిపోయిందని అన్నారు. అందుకే హిందువులు భారత్‌కు తిరిగిరావాలని కోరుకుంటున్నారని, వారు మాతృదేశంలో గౌరవంగా జీవించేందుకు తాము చేస్తున్న ప్రయత్నాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని దుయ్యబట్టారు. ముస్లింలు ప్రపంచంలో 150 దేశాల్లో ఎక్కడైనా తలదాచుకోవచ్చని హిందువులకు కేవలం భారత్ ఒక్కటే ఆశ్రయం ఇచ్చే దేశమని, హిందువులు ఇక్కడకు తిరిగి రావాలనుకుంటే సమస్య ఏమిటని ప్రశ్నించారు. -
సీఎం కార్యక్రమంలో రైతు ఆత్మహత్యాయత్నం
అహ్మదాబాద్: గుజరాత్ సీఎం విజయ్ రూపానీ బహిరంగ సభలో ఓ రైతు పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.ఈ సంఘటన గిర్ సోమ్‌నాథ్ జిల్లా ప్రాన్స్లీ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. మశ్రీ భాయ్ దోడియా అనే రైతు తన పొలం వద్ద ఉన్న పంచాయతీ భూమిని ఎవరో ఆక్రమించుకున్నారని, దీన్ని తొలగించడంలో స్థానిక అధికారులు విఫలం చెందడంతో కలత చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని గిర్ సోమ్‌నాథ్ ఎస్పీ రాహుల్ త్రిపాఠి వెల్లడించారు. ‘ఆ రైతు పొలం వద్ద ఉన్న పంచాయతీ భూమిని ఎవరో ఆక్రమించుకున్నారు. ఆక్రమణను తొలగించాలని ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ స్థానిక అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు’ అని తెలిపారు. దోడియాను వెంటనే వెరవల్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా, వైద్యులు అతని పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. -
అహ్మదాబాద్.. ఇకపై కర్ణావతి!
అహ్మదాబాద్: చాలాకాలంగా కాషాయ వర్గాలు డిమాండ్ చేస్తున్న గుజరాత్‌లోని అహ్మదాబాద్ పేరులో మార్పు జరిగే అవకాశం కనిపిస్తోంది. అహ్మదాబాద్ పేరును కర్ణావతిగా మార్చే డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకున్నామని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ గురువారం తెలిపారు. రాష్ట్ర రాజధాని గాంధీనగర్‌లో రూపానీ మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికలలోపే ఈ నిర్ణయం అమలవుతుందని తెలిపారు. ‘అహ్మదాబాద్ అన్న పేరు బానిసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. కర్ణావతి పేరు మన ఆత్మాభిమానాన్ని, సంస్కృతిని, స్వయం ప్రతిపత్తిని సూచిస్తుంది’’ అని డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ వ్యాఖ్యానించారు. -
హింసాత్మక చర్యలకు పాల్పడకండి
అహ్మదాబాద్: హిందీ మాట్లాడే వలసదారుల భద్రత కోసం అదనపు బలగాలను మోహరించామనీ, సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయిన హిందీ భాషీయులు తిరిగి గుజరాత్‌కు రావాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విజ్ఞప్తి చేసింది. హిందీ మాట్లాడేవారిపై దాడులకు పాల్పడిన 431 మందిని ఇప్పటికే అరెస్టు చేశామంది. ఎలాంటి హింసాత్మక చర్యలకూ పాల్పడొద్దని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ప్రజలను కోరారు. గుజరాత్లో జరిగిన ఓ అత్యాచార ఘటన వల్ల అక్కడక్కడ జరిగిన దాడుల నేపథ్యంలో దాదాపు 20 వేల మంది హిందీ మాట్లాడే వలస కూలీలు రాష్ట్రం వదిలి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. అయితే గత 48 గంటల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటుచేసుకోలేదని రూపానీ తెలిపారు. వలస కూలీల భద్రత కోసం పరిశ్రమల ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించినట్లు రాష్ట్ర హోంమంత్రి ప్రదీప్‌సిన్హా జడేజా తెలిపారు. సెప్టెంబర్ 28న గుజరాత్‌లోని సాబర్కాంఠా జిల్లాలో 14 నెలల బాలికపై అత్యాచారం జరిగింది. రూపానీతో మాట్లాడిన నితీశ్ గుజరాత్లో హిందీ మాట్లాడేవారిపై జరుగుతున్న దాడుల విషయమై సీఎం విజయ్ రూపానీతో బిహార్ సీఎం నితీశ్‌కుమార్ మాట్లాడారు. ఈ దాడులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాలికపై జరిగిన దాడిని ఖండించారు. నిందితుడికి శిక్ష పడాల్సిందేనని, అయితే ఒక్కరు చేసిన తప్పునకు మొత్తం వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని దాడుల చేయడం సరికాదన్నారు. దాడుల గురించి గుజరాత్ సీఎంతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫోన్ చేసి మాట్లాడారు. వారి భద్రతపై అక్కడి ప్రభుత్వం పూర్తి భరోసా ఇచ్చిందని యోగి చెప్పారు. -
‘మా రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవదు’
అహ్మదాబాద్: ‘వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో మా రాష్ట్రంలో కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేద’ని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల ఫలితాలే గుజరాత్లో పునరావృత మవుతాయని వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వచ్చే సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో (26 ఎంపీ స్థానాలు) బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పటీదార్, దళితుల నిరసనల వంటి ఇబ్బందులు ఉన్నా, ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకే పట్టం కట్టారని గుర్తుచేశారు. వస్తు సేవల పన్ను అమల్లోకి తేవడాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ జీఎస్టీని ‘గబ్బర్‌సింగ్ ట్యాక్స్’ అంటూ ఎద్దేవా చేసినప్పటికీ వ్యాపారులు బీజేపీపై నమ్మకముంచారని రూపానీ అన్నారు. పెద్ద నోట్ల రద్దుపై మొదట్లో కొంత వ్యతిరేకత వచ్చినప్పటికీ రాష్ట్రంలోని వర్తక, వ్యాపార వర్గం తమ పార్టీకి మద్దతు ప్రకటించిందని తెలిపారు. వారి మద్దతుతో గత అసెంబ్లీ ఎన్నికల్లో సూరత్, వడోదర, అహ్మదాబాద్ ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు గెలుపొందామని వెల్లడించారు. ఆదివారం నాడు రాజ్‌కోట్‌లో దళితుడని కొట్టి చంపిన ఘటనపై రూపానీ స్పందిస్తూ.. ఈ ఘటనపై విచారణ చేపట్టి, బాధ్యులను అరెస్టు చేశామని అన్నారు. మృతుని కుటుంబానికి 8 లక్షల రూపాయలు నష్ట పరిహారం అందించామని తెలిపారు. -
రూపానీదే గుజరాత్ పీఠం
గాంధీనగర్: గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు అత్యంత విధేయుడైన విజయ్ రూపానీనే రెండోసారీ గుజరాత్ సీఎం పీఠం వరించింది. శుక్రవారం గుజరాత్ బీజేపీ శాసనసభా పక్షం రూపానీని తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. కొత్తగా ఎన్నికైన బీజేపీ శాసన సభ్యులతో భేటీ తర్వాత పార్టీ కేంద్ర పరిశీలకుడు అరుణ్ జైట్లీ వివరాలు వెల్లడిస్తూ.. శాసనసభా పక్ష నేతగా రూపానీని, ఉప నేతగా నితిన్ పటేల్‌ను ఎన్నుకున్నారని తెలిపారు. బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గుజరాత్ ఎన్నిక ల్లో వరుసగా ఆరోసారి బీజేపీ అధికారం కైవ సం చేసుకున్నా తక్కువ మెజార్టీతో గట్టెక్కింది. ఈ నేపథ్యంలో రూపానీని మరోసారి సీ ఎంగా కొనసాగించే అంశంపై ఊహాగానాలు కొనసాగాయి. అయితే పార్టీ అగ్ర నాయకత్వంతో రూపానీకి ఉన్న సాన్నిహిత్యం.. ఎలాంటి మచ్చలేని రాజకీయ జీవితం, తటస్థ కుల వైఖరి వంటి అంశాలు పూర్తిగా ఆయన వైపు మొగ్గు చూపేలా చేశాయి. బీజేపీ శాసనసభాపక్ష నేత, ఉప నేత పదవులకు రూపానీ, పటేల్ పేర్లను ఎమ్మెల్యే భూసేంద్ర సిన్హ్ చుదాసమ సూచించారని.. మరో ఐదుగురు సభ్యులు చుదాసమ ప్రతిపాదనను సమర్ధించారన్నారు. నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ముందు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో రూపానీ సంప్రదింపులు జరుపుతారని జైట్లీ చెప్పారు. 182 మంది సభ్యులున్న అసెంబ్లీలో బీజేపీ 99 సీట్లతో.. 1995 అనంతరం తొలిసారి అతి తక్కువ స్థానాలు సాధించింది. ఇక మూడు దశాబ్దాల అనంతరం మొదటిసారి కాంగ్రెస్ 77 స్థానాల్ని సొంతం చేసుకుంది. మిత్రపక్షాలతో కలిసి కాంగ్రెస్ 80 స్థానాల్లో విజయం సాధించింది. గుజరాత్లో స్వతంత్ర అభ్యర్థి రతన్ సిన్హ్ రాథోడ్ బీజేపీకి మద్దతు ప్రకటించారు. హిమాచల్ బీజేపీ ఎమ్మెల్యేలతో పార్టీ పరిశీలకుల భేటీ మరోవైపు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతోంది. పార్టీ కేంద్ర పరిశీలకులైన కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నరేంద్ర సింగ్ తోమర్ పాటు హిమాచల్ ప్రదేశ్ బీజేపీ ఇన్చార్జ్ మంగళ్ పాండేలు శుక్రవారం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. తర్వాత మీడియాను కలవకుండానే ఢిల్లీ బయల్దేరారు. శాసనసభా పక్ష భేటీలో ఎమ్మెల్యేలు వ్యక్తం చేసిన అభిప్రాయాల్ని ఈ బృందం పార్టీ అధినాయకత్వానికి సమర్పించనుంది. ఆ నివేదిక ఆధారంగా సీఎం పేరుపై త్వరలో నిర్ణయం వెలువడుతుందని పార్టీ వర్గాలు పేర్కొన్నారు. కంగ్రా ఎంపీ శాంతా కుమర్, మండీ ఎంపీ రామ్ స్వరూప్, సిమ్లా ఎంపీ కశ్యప్, మరో సీనియర్ నేత సురేశ్ భరద్వాజ్‌లు... పార్టీ కేంద్ర పరిశీలకుల్ని కలిసి తమ అభిప్రాయాలు చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ సీఎం రేసులో కేంద్ర మంత్రి నడ్డా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఠాకూర్లు ముందు వరుసలో ఉన్నారు. మయన్మార్ టు భారత్ విజయ్ రూపానీ(61) మయన్మార్ రాజధాని యాంగాన్(అప్పట్లో రంగూన్)లో జన్మించారు. ఆ దేశంలో రాజకీయ అనిశ్చితి కారణంగా 1960లో రూపానీ కుటుంబం గుజరాత్‌కు తరలివచ్చి రాజ్‌కోట్‌లో స్థిరపడింది. విద్యార్థి దశలోనే ఆయన ఆర్ఎస్ఎస్లో చేరారు. కొన్నాళ్లు ఏబీవీపీలో పనిచేశాక బీజేపీలో చేరి వివిధ హోదాల్లో పనిచేశారు. జైన వర్గానికి చెందిన రూపానీ గుజరాత్లో బీజేపీ పటిష్టానికి ఎంతో కృషి చేశారు. 2006 నుంచి 2012 వరకూ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. 2014లో గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ వజూభాయ్ వాలా కర్ణాటక గవర్నర్‌గా వెళ్లడంతో.. రాజ్‌కోట్ వెస్ట్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందారు. ఫిబ్రవరి 19, 2016లో గుజరాత్ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అయితే ఆగస్టు, 2016లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ రాజీనామాతో ఆయనను సీఎం పీఠం వరించింది. 2006లో గుజరాత్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న సమయంలో రాష్ట్రంలో పర్యాటక రంగం ప్రోత్సాహానికి చేసిన కృషి ప్రశంసలు అందుకుంది. -
గుజరాత్ సీఎంగా విజయ్ రూపాణీ
-
సీఎం రేసుపై స్మృతి క్లారిటీ
న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీని కొనసాగిస్తారా? లేదా కొత్త ముఖాన్ని తెర మీదకు తీసుకోస్తారా? దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో ఆరోసారి అధికారాన్ని కైవసం చేసుకున్న బీజేపీ ఎవరికి ముఖ్యమంత్రి పదవి కట్టబెడుతుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. కేంద్ర జౌళి, ప్రసార శాఖ మంత్రి స్మృతీ ఇరానీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాల, మరో మంత్రి మాన్సుఖ్ మాందివా పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే తాను సీఎం రేసులో లేనని స్మృతీ ఇరానీ స్పష్టం చేశారు. తనను వివాదంలోకి లాగేందుకే ఇటువంటి వదంతులు సృష్టిస్తున్నారని ఆమె అన్నారు. కాగా, కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ ఆర్. వాలా పేరు కూడా వినిపిస్తోంది. 2012 నుంచి 2014 వరకు ఆయన గుజరాత్ అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. పలుమార్లు రాజ్‌కోట్ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికైయ్యారు. 1997 నుంచి 2012 వరకు గుజరాత్ మంత్రిగా పలు రకాల శాఖలు నిర్వహించారు. మరోవైపు విజయ్ రూపానీతో ఉప ముఖ్యమంత్రిగా నితిన్ పటేల్‌ను కొనసాగించేందుకే బీజేపీ అధిష్టానం సుముఖంగా ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. 2019 సాధారణ ఎన్నికలు జరగనున్నందున ముఖ్యమంత్రిని మార్చడం మంచిదికాదన్న అభిప్రాయంతో కమలం పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. గుజరాత్ కేబినెట్లో 12 కొత్త ముఖాలకు చోటు దక్కనుందని సమాచారం. ఈనెల 25న కొత్త ప్రభుత్వం కొలువుతీరే అవకాశముంది. -
విజయ్ రుపానీకి జై కొడతారా? ఝలక్ ఇస్తారా??
అహ్మద్‌బాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబోటీ మెజారిటీ బీజేపీ గట్టెక్కిన సంగతి తెలిసిందే. బీజేపీ అధినేత అమిత్ షా గుజరాత్లో 'మిషన్-150' టార్గెట్‌గా పెట్టుకున్నారు. కానీ, బీజేపీ సెంచరీ మార్కు దాటలేకపోయింది. 182 స్థానాలు ఉన్న గుజరాత్లో ఆ పార్టీ 99 స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరు అవుతారన్నది ఆసక్తిగా మారింది. సహజంగానే సీఎం పదవికి విజయ్ రుపానీ ఫెవరెట్ అని వినిపిస్తున్నా.. అనూహ్యంగా కొత్త పేరు తెరపైకి వచ్చే అవకాశముందని వినిపిస్తోంది. మరో పర్యాయం కూడా ముఖ్యమంత్రిగా విజయ్ రుపానీనే కొనసాగిస్తామని గత ఏడాది అమిత్ షా తమకు చెప్పినట్టు బీజేపీ అగ్రనేతలు అంటున్నారు. బీజేపీ తాజా ఎన్నికల్లో అనుకున్నంతగా ఫలితాలు రాబట్టలేకపోయిన నేపథ్యంలో నాయకత్వాన్ని మారిస్తే తప్పుడు సంకేతాలు పంపినట్టు అవుతుందని, ఈ విషయంలో అధినాయకత్వం ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశముందని కమలం నేతలు అంటున్నారు. ఒకవేళ రుపానీని కాదని సీఎం పదవికి మరొకరిని తెరపైకి తెస్తే.. రాష్ట్ర నాయకత్వంపై ఆయన నమ్మకం కోల్పోయినట్టు అవుతుందని బీజేపీ గుజరాత్ నేతలు అంటున్నారు. అంతేకాకుండా రుపానీ అమిత్ షాకు సన్నిహితుడు. క్లీన్ ఇమేజ్ ఉండి.. కులముద్రలేని నాయకుడు. కాబట్టి ఈసారి కూడా ఆయననే సీఎం పదవి వరించవచ్చునని అంటున్నారు. అయితే, అమిత్ షా వైఖరి బాగా తెలిసినవాళ్లు మాత్రం రుపానీ ఫెవరేట్ అని ఇప్పుడే అనడం సరికాదని పేర్కొంటున్నారు. అనూహ్యంగా నిర్ణయాలను తీసుకొని ప్రజలను సర్ప్రైజ్ చేయడంలో అమిత్ షాకు మంచి పేరుంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత యోగిఆదిత్యనాథ్ పేరును, హరియాణాలో మనోహర్‌లాల్ ఖట్టర్ పేరును ఇలా అనూహ్యంగా తెరపైకి తెచ్చి ఆయన ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆనందిబేన్ రాజీనామా తర్వాత విజయ్ రుపానీ పేరును కూడా సర్ప్రైజ్ రూపంలోనే షా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా గుజరాత్ సీఎంగా కొత్త పేరు తెరపైకి వచ్చే అవకాశం లేకపోలేదని, చివరినిమిషం వరకు సస్పెన్స్ కొనసాగించి.. సర్ప్రైజ్ నిర్ణయాన్ని బీజేపీ అధినాయకత్వం ప్రకటించినా ప్రకటించవచ్చునని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే గుజరాత్ సీఎం ఎంపిక కోసం కేంద్రమంత్రి అరుణ్ జైట్లీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ నెల 25లోపు గుజరాత్ సీఎంను ఖరారుచేయవచ్చునని తెలుస్తోంది. -
వ్యాట్‌తో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయ్
మోతెక్కుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీకి కోత పెడుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్‌పై 5 శాతం మేర వ్యాట్ తగ్గించాలంటూ పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు ఇంధనాలపై 4 శాతం వ్యాట్‌ను తగ్గిస్తూ గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంధన ధరలపై వ్యాట్‌ను తగ్గించిన తొలి రాష్ట్రం కూడా ఇదే. వ్యాట్ తగ్గడంతో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా కిందకి దిగొచ్చాయి. వ్యాట్‌ను తాము 4 శాతం తగ్గించామని, ఈ మేరకు లీటరు పెట్రోల్ రూ.2.93, లీటరు డీజిల్ రూ.2.72 కిందకి దిగొచ్చాయని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని చెప్పారు. గుజరాత్‌తో పాటు మహారాష్ట్ర కూడా వ్యాట్‌ను తగ్గించింది. లీటరు పెట్రోల్ ధరను రూ.2, లీటరు డీజిల్ ధరను రూ.1 తగ్గించినట్టు ప్రకటించింది. వ్యాట్ నుంచి రాష్ట్రాలు ఎక్కువగా లబ్ది పొందుతుంటాయి. వ్యాట్ సేకరణతో పాటు 42 శాతం ఎక్సైజ్ డ్యూటీ కలెక్షన్లు వీరికి అందుతాయి. రాష్ట్రాలకు ఇవ్వగా మిగిలిన మొత్తాన్ని కేంద్రం, రాష్ట్రాల్లో అమలుచేస్తున్న పథకాలకు వినియోగిస్తోంది. కాగ, పెట్రోల్‌పై ఉన్న ఎక్సైజ్ డ్యూటీని రూ.21.48 నుంచి రూ.19.48కు, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని రూ.17.33 నుంచి రూ.15.33కు తగ్గించింది. ఈ ప్రభావంతో లీటరు పెట్రోల్ ధర రూ.2.5, లీటరు డీజిల్ ధర రూ.2.25 తగ్గాయి. -
గుజరాత్లో బ్లూవేల్ బ్యాన్
అహ్మదాబాద్: చిన్నారులను బలిగొంటున్న బ్లూవేల్ గేమ్‌ను తమ ప్రభుత్వం నిషేధిస్తుందని గుజరాత్ సీఎం విజయ్ రూపాని చెప్పారు. రాష్ట్రంలో ఈ మృత్యు క్రీడను నిషేధించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని హోంశాఖకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ గేమ్ ఫలితంగా చిన్నారులు, యువత ఆత్మహత్యలకు పాల్పడుతుండటం ఆందోళనకరమని, ఇలాంటి గేమ్‌లకు అడ్డుకట్ట వేయాల్సి ఉందని సీఎం మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. గుజరాత్లో ఈ క్రీడను బ్యాన్ చేసేందుకు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకువస్తుందన్నారు. బ్లూవేల్ ఛాలెంజ్ గేమ్‌తో చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితిని అనుమతించబోమని, వీలైనంత త్వరలో దీన్ని నిషేధించేందుకు అవసరమైన అన్ని చర్యలూ సత్వరమే చేపట్టాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.