Haritha Haram program
-
హరితహారం మొక్కలు తిన్న మేకలకు రూ.5వేలు జరిమానా
సాక్షి, భూదాన్ పోచంపల్లి : హరితహారంలో నాటిన మొక్కలు తిన్నందుకు మేకలకు రూ.5వేలు జరిమానా విధించిన సంఘటన సోమవారం నల్గొండ జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం జలాల్‌పురంలో చోటుచేసుకుంది. పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. హరితహారంలో భాగంగా గ్రామపరిధిలో రోడ్డు వెంట, అలాగే పల్లెప్రకృతి వనాల్లో మొక్కలు నాటారు. అయితే పలువురి మేకలు తరుచూ మొక్కలను తింటుండటంతో గతేడాది సెప్టెంబర్‌లో గ్రామసభ నిర్వహించి పశువులు, మేకలు మొక్కలు తిన్నా, లేదా ఏదేని కారణంతో తొలగించినా మొక్కకు రూ.500 చొప్పున జరిమానా విధించాలని తీర్మానించారు. కాగా.. సోమవారం గ్రామానికి చెందిన శాపాక జంగమ్మకు చెందిన మేకలు రోడ్డు వెంట నాటిన మొక్కలతో పాటు, పల్లెప్రకృతి వనంలోనివి కలిపి మొత్తం 10 మొక్కలు తిన్నాయి. దాంతో సిబ్బంది వాటిని పట్టుకొని గ్రామపంచాయతీ కార్యాలయానికి తీసుకొచ్చి బంధించారు. 10 మొక్కలకు గాను రూ. 5000వేల జరిమానా విధించి రసీదును మేకల మెడలో వేశారు. జరిమానా చెల్లించి మేకలు తీసుకెళ్లాలని అధికారులు సదరు యజమానికి సమాచారం ఇచ్చారు. అంతేకాక గతంలో అనేక మార్లు హెచ్చరించినా తీరు మారకపోవడంతో కేసు కూడా నమోదు చేయాలని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చదవండి: ఆ దేశంలో యూనిట్ కరెంటు 14 పైసలే.. ఎక్కడో తెలుసా? చదవండి: ‘పిల్లలను చూసైనా బతకాలనిపించలేదా?’ -
ఓ వైపు అలా.. మరో వైపు ఇలా.. మరి ఇందులో ముందుకెలా?
సాక్షి, ఉప్పల్( హైదరాబాద్): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరిత హార కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా మరో వైపు చెట్లను నరికి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ఉప్పల్ ఏక్ మినార్ మజీద్ పక్కన గల పెంగ్విన్ స్థలంలో ఏపుగా పెరిగిన చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికి ముక్కలు చేసుకుని ఆటోలో తీసుకువెళుతున్నారు. గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు నరికిన కలపను స్వాధీనం చేసుకున్నారు. విచారించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఓ వైపు హరిత హార ద్వారా చెట్లను నాటుతుంటే మరో వైపు కొందరు తమ స్వప్రయోజనాల కోసం ఉన్న చెట్లను తొలగిస్తున్నారు. ఇటీవల అదిలాబాద్ పట్టణ శివారు దుర్గానగర్‌లోని 250 ఎకరాల అటవీ ప్రాంతంలో ఆదివారం 35 వేల మంది గంటలో మూడున్నర లక్షల మొక్కలు నాటారు. ఇది టర్కీలో గతంలో 3.2 లక్షల మొక్కలు నాటిన రికార్డును అధిగమించి వండర్బుక్ ఆఫ్ రికార్డ్స్‌కెక్కిన సంగతి తెలిసిందే. -
బర్త్‌డే: మొక్క నాటిన సీఎం కేసీఆర్
-
బర్త్‌డే: మొక్క నాటిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు సందర్భంగా హరిత విప్లవంలో మరో అపూర్వ ఘట్టానికి నాంది పలికారు. ‘కోటి వృక్షార్చన’ పేరిట గంట వ్యవధిలోనే రికార్డు స్థాయిలో ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. ఉద్యమ స్ఫూర్తితో సాగిన ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులతో పాటు టీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని బుధవారం గ్రేటర్లో పలు కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. లైవ్ అప్డేట్స్ : ► కోటి వృక్షార్చన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ స్వయంగా పాల్గొన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా రుద్రాక్ష మొక్కను నాటారు. సీఎం వెంట ఎంపీ జోగినపల్లి సంతోష్ ఇతర నేతలు ఉన్నారు ►మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జలవిహార్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్పూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంపీలు కేకే, సంతోష్ కుమార్, లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇక కోటి వృక్షార్చన లో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ మొక్కలు నాటారు. ► కేసీఆర్ జీవిత చరిత్రపై డాక్యుమెంటరీ ప్రదర్శన ►సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా బల్కంపేట ఆలయంలో ఎల్లమ్మ తల్లికి రెండున్నర కిలోల బంగారు చీరను బహుకరించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కూన వెంకటేష్ గౌడ్, ఆలయ ఈవో అన్నపూర్ణ. ► సిద్ధిపేట: సీఎం కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా నర్సాపూర్ రోడ్డులో మొక్కలు నాటిన మంత్రి హరీష్ రావు. ►కరీంనగర్ జిల్లా: సీఎం కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి, కోటి వృక్షార్చనలో భాగంగా నగరంలో పలు చోట్ల మొక్కలు నాటిన మంత్రి గంగుల కమలాకర్, మేయర్ వై. సునీల్ రావు. ♦ తన క్యాంప్ కార్యాలయంలో మొక్కలు నాటిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. ►సంగారెడ్డి జిల్లా: జహీరాబాద్ మండలంలోని కేతకి సంగమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మాణిక్యరావు. ♦సంగారెడ్డి కంది జిల్లా కేంద్ర జైలు వద్ద మొక్కలు నాటిన హోం మంత్రి మహమూద్ అలీ, ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డి నగరంలో ఇవీ కార్యక్రమాలు ►అమీర్‌పేటలోని గురుద్వారలో గురుగ్రంధ్ సాహెబ్‌కు ప్రత్యేక పూజలు ►బల్కంపేటలోని ఎల్లమ్మ ఆలయంలో రెండున్నర కిలోల బంగారంతో తయారు చేయించిన చీర అమ్మవారికి సమర్పణ ►సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో కోటి కుంకుమార్చన ►సికింద్రాబాద్ లోని గణేష్ ఆలయంలో గణపతి కల్యాణం, విశేష అభిషేకాలు ►క్లాక్ టవర్ వద్ద గల వెస్లీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు, నాంపల్లి లోని హజ్రత్ యుసిఫెన్ దర్గాలో చాదర్ సమర్పణ ►జలవిహార్‌లో 10.30 గంటలకు జన్మదిన వేడుకలు ప్రారంభం.. 10.30 గంటలకు త్రీ డీ డాక్యుమెంటరీ.. 11.00 గంటలకు కేక్ కటింగ్. -
బాధితుల ధర్నా.. తమ స్థలాల్లో ఎలా చేస్తారంటూ?
కొమురం భీంజిల్లా : తమకు కేటాయించిన ఇళ్లస్థలాల్లో హరితహారం చేపట్టడంపై బాధితులు ధర్నా చేపట్టారు. ఈ ఘటన కొమురం భీం జిల్లా రెబ్బెన మండలం గోలేటిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం గోలేటి శివారులోని సర్వే నంబర్ 141 లోఉన్న భూమిని 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించింది. అయితే తాజాగా రెవెన్యూ అధికారులు.. ఆ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డు ఏర్పాటు చేయడంతో వివాదం తలెత్తింది. నిరుపేద కుటుంబాలకు కేటాయించిన భూమిలో హరితహారం ప్లాంటేషన్ చేస్తామని గ్రామ పంచాయితీ అధికారులు చెప్పడంతో వారిని అడ్డుకున్న బాధితులు ధర్నా చేపట్టారు. తమకు కేటాయించిన స్థలంలో తాత్కాలిక గుడిసెలు ఏర్పాటు చేసుకొని బాధితులు ధర్నాకు దిగారు. -
‘తెలంగాణ ముమ్మాటికీ ధనిక రాష్ట్రమే’
సాక్షి, మెదక్ : తెలంగాణ ముమ్మాటికి ధనిక రాష్ట్రమేనని మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. లాక్డౌన్ సమయంలోనూ రైతులకు రైతుబంధు డబ్బులు ఇచ్చామని గుర్తుచేశారు. ఉద్యోగులకు, ఎమ్మెల్యేలకు జీతాలు ఆపి గ్రామాలకు డబ్బులు అందించామన్నారు. గురువారం ఆయన ఆరో విడత హరితహారాన్ని ప్రారంభించారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో మొక్కలు నాటారు. అనంతరం 15 కోట్లుతో నిర్మించిన అర్బన్ పార్కును సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పచ్చదనం పరిరక్షణ మనందరి బాధ్యత అన్నారు. ప్రజాప్రతినిధులు పచ్చదనాన్ని పెంచేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి గ్రామంలో నర్సరీ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని, అభివృద్ధి పనులకు డబ్బుల కొరతే లేదన్నారు. ‘లాక్డౌన్ వల్ల ఉద్యోగులకు మూడు నెలలు జీతాలు ఇవ్వలేదు. కానీ ఇప్పడు ఆర్థిక పరిస్థితి బాగుంది. తెలంగాణ ముమ్మాటికి ధనిక రాష్ట్రమే ఇందులో డౌటే లేదు. ఇది అధికారికంగా చెబుతున్నా. ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ కావాలంటే మీకు పాలనరాదు అన్నారు. కానీ ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ మారిందన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) చెప్పింది. మన పాలన మనం చేయడం వల్లే ఈ ఫలితం వచ్చింది. మిషన్ భగీరథ నీళ్లు వస్తాయంటే ఎవరైనా నమ్మారా? కానీ వచ్చాయి. రాష్ట్రంలో ఒకప్పుడు విద్యుత్ సమస్యలు ఉండేది కానీ ఇప్పుడు 24 గంటలు కరెంట్ ఉంటుంది. ఈ ఏడాదిలోనే సంగారెడ్డికి కాలేళ్వరం నీళ్లు వస్తాయి. ఇలా అన్ని సమస్యలను తీర్చుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం’ అని సీఎం కేసీఆర్ అన్నారు. కలప స్మగ్లర్లకు సీఎం కేసీఆర్ హెచ్చరిక కలప స్మగ్లర్లకు సీఎం కేసీఆర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కలప దొంగతనం చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. ఇకపై కలప స్మగ్లర్లను దేశంలో ఎవడూ కాపాడలేడన్నారు. చీమ చిటుక్కుమన్నా తనకు సమాచారం వస్తుందని, వెంటనే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
తెలంగాణలో ఆరో విడత ‘హరితహారం’
సాక్షి, మెదక్: తెలంగాణలో ఆరో విడత హరితహారం కార్యక్రమం ప్రారంభమయింది. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అల్ల నేరేడు మొక్క నాటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం 15 కోట్లుతో నిర్మించిన అర్బన్ పార్కును సీఎం ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు నర్సాపూర్ కు రోడ్డు మార్గాన సీఎం చేరుకున్నారు. రాష్ట్ర వ్యాపితంగా 230 కోట్ల మొక్కలు పెంచాలని నిర్ణయించారు. గత ఐదేళ్ల నుంచి 182 కోట్ల మొక్కలు నాటగా, ఈ సారి 48 కోట్ల మొక్కలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అడవుల పెంపకం పై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం ఒక యజ్ఞంలాగా చేపట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా 30 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. -
హరితహారం: మొక్కలు నాటిన కేటీఆర్
సాక్షి, సికింద్రాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆరో విడత హరిత హారం కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా బోయగూడలో నూతన పార్కును మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, అధికారులు పార్కులో మొక్కలు నాటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అధికారులు మొక్కలు నాటారు. హరిత తెలంగాణగా రాష్ట్రాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ ఆశయానికి అనుగుణంగా అందరూ మొక్కలు నాటాలని మంత్రులు పిలునిచ్చారు. -
20 కోట్ల మొక్కలు లక్ష్యంగా..
సాక్షి, హైదరాబాద్: ‘మొక్క’వోని దీక్షతో మరోసారి హరితహారం కార్యక్రమాన్ని చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 20.8 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్న సర్కారు, హరితహారం కార్యక్రమాన్ని తక్షణమే ప్రారంభించాలని జిల్లా యంత్రాంగాలను ఆదేశించింది. కోటి చింత మొక్కలు.. మియావాకీ వనాలు హరితహారంలో భాగంగా ఈ ఏడాది కోటి చింత మొక్కలను నాటనున్నారు. అటవీ ప్రాంతాల్లో ఫల వృక్షాలు గణనీయంగా తగ్గిపోవడంతో జనావాస ప్రాంతాలకు వస్తున్న కోతుల బెడదను అరికట్టడానికి సాధ్యమైనంతవరకు పండ్ల మొక్కలను అభివృద్ది చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా కోటి చింత మొక్కలకు ప్రాణం పోసేలా కార్యాచరణ ప్రణాళిక తయారు చేశారు. గ్రామ పంచాయతీలు, అటవీ ప్రాంతాలు, ఖాళీ స్థలాలు, ప్రభుత్వ ప్రదేశాల్లో వీటిని విరివిగా నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చింతపండుకు కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నందున ఈ మొక్కల పెంపకానికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మరోవైపు పచ్చదనంతో ఆహ్లాదకరంగా కనిపించే మియావాకీ వనాలను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఒకే చోట గుబురుగా పెరిగే ఈ వనాలతో ఆ ప్రదేశం ఆకుపచ్చగా కనిపించడమేగాకుండా.. పర్యావరణ సమతుల్యతను కూడా కాపాడవచ్చని అంచనా వేస్తున్న ప్రభుత్వం.. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో 4వేల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా, స్థానిక ప్రజలు తమ ఇంటి పెరట్లో పెంచుకునేందుకు వీలుగా మొక్కలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీనికి తగ్గట్టుగా స్థానిక నర్సరీల్లోని మొక్కలను ఇప్పటికే సిద్ధం చేశారు. వ్యవసాయ అటవీ విస్తరణలో భాగంగా వెదురు మొక్కలను బాగా నాటాలని, అప్రోచ్ రోడ్లు, ప్రధాన రోడ్ల కిరువైపులా అవెన్యూ ప్లాంటేషన్‌ను చేపట్టాలని నిర్ణయించింది. జీవాలనుంచి మొక్కలను కాపాడేందుకు ఫైబర్ ట్రీ గార్డులు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. కాగా, పంచాయతీలు, పురపాలికల్లో 85 శాతం మొక్కలు బతకకపోతే స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులపై చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతోంది. అలాగే ప్రతి శుక్రవారం మొక్కలకు నీరుపోసేలా వాటరింగ్ డేను పాటించాలని నిర్ణయించింది. -
'హరితహారం మొక్కుబడిగా భావించొద్దు'
సాక్షి, సిద్దిపేట : రోజురోజుకు వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. రాబోయే తరాలకు విషపూరితమైన గాలి అందే ప్రమా దం ఉంది. దీనిని నివారించేందుకు ఇప్పుటి నుంచే మొక్కలు నాటాలి. ప్రతీ గ్రామం ఆకుపచ్చ గా కనిపించాలి అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు పిలుపునిచ్చారు. వర్షాకాలం ప్రారంభం అయిన నేపథ్యంలో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఆలోచనతో సిద్దిపేట అర్బన్ పార్కులో సిద్దిపేట నియోజకవర్గం పరిధిలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ, ఉపాధిహామీ, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరిత హారంలో రికార్డు స్థాయిలో మొక్కలు నాటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవార్డులు పొందిన ఇబ్రహీంపూర్, చిన్నకోడూరు, ఇర్కొడ్ గ్రామాల సర్పంచ్, ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు వారు మొక్కలు పెంచిన తీరును వివరించారు. అదేవిధంగా జిల్లాలో అత్యధిక మొక్కలు పెరగడానికి తీసుకున్న జాగ్రత్తలు డీఎఫ్‌వో శ్రీధర్‌రావు వివరించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. మానవ మనుగడ మొక్కలతో ముడిపడి ఉందన్నారు. కొత్తగా గ్రామ సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు మొక్కలు నాటడం చాలెంజ్‌గా తీసుకోవాలని సూచించారు. హరితహారం లక్ష్యం గ్రామానికి 10వేలతోపాటు, సర్పంచ్, ఎంపీటీసీలు చెరొక వెయ్యి మొక్కలు నాటాలని అన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని చెప్పారు. ఇందుకోసం గ్రామాల్లోని వివిధ కులవృత్తుల వారికి ఉపయోగరకమైన మొక్కలను ఇచ్చి వారి ప్రొత్సహిస్తే మంచి ఫలితం ఉంటుందన్నారు. రోడ్డుకు ఇరువైపుల, బడి, గుడి, చెరువు కట్టలు, పొలం గట్లు ఇలా దేన్నీ వదలకుండా ఖాళీ స్థలం ఉంటే మొక్కలు నాటాలని చెప్పారు. అదేవిధంగా పుట్టిన రోజు, మరణించిన రోజుల్లో కూడా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. దీంతో స్మృతివనాలు, శ్మశాన వాటికలు కూడా ఆకర్షనీయంగా, ఆహ్లాదంగా కన్పిస్తాయన్నారు. పెద్ద మొక్కలు నాటితే త్వరగా నాటుకుంటాయని, ట్రీగార్డు అవసరం లేకుండా పోతుందన్నారు. గ్రామాల్లో పేదవారు చనిపోతే వారి దహన సంస్కరణలకు గ్రామ పంచాయతీ ఖర్చుచేయాలని, అందుకు రూ.10లక్షల మూల నిధి సిద్ధం చేసుకుంటామని గుర్రాలగొంది సర్పంచ్ ఆంజనేయులు సూచన అభినందనీయమని, జిల్లా అధికారులతో చర్చించి కార్యరూపం దాల్చుతామని తెలిపారు. మొక్కలు నాటుతాం. వాటిని సంరక్షిస్తామని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులతో హరీశ్‌రావు హరిత ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటికే జిల్లా హరితహారం కార్యక్రమంలో ఆదర్శంగా ఉందన్నారు. ఈ విడత రైతులను ఎక్కువగా భాగస్వామ్యం చేసి పొలం గట్లపై కూడా మొక్కలు నాటేలా ప్రోత్సహించాలని చెప్పారు. పేదవారి దహన సంస్కరణలకు గ్రామ పంచాయతీ మూలనిధి కోసం జిల్లా అభివృద్ధి నిధుల నుంచి గ్రామానికో లక్ష కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కలెక్టర్ తెలిపారు. జలశక్తి అభియాన్ కేంద్ర బృందం సభ్యులు అనురాగ్‌శర్మ మాట్లాడుతూ.. హరితహారం, ఇతర కార్యక్రమాల్లో సిద్దిపేట ముందు వరుసలో ఉందన్నారు. ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో సిద్దిపేటను ఆదర్శంగా తీసుకొని మొక్కలు నాటడం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజా శర్మ, డీపీవో సురేష్‌కుమార్, డీఆర్డీవో గోపాల్, సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ మారెడ్డి రవిందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
సంరక్షణే సవాల్!
హరితహారం పథకం కింద గతేడాది జిల్లాలో భారీ ఎత్తున మొక్కలు నాటారు. ఉపాధి హామీ నిధులతో నాటిన 90.43 లక్షల మొక్కల్లో 35.69 లక్షల మొక్కలు బతికినట్లు రికార్డులు చెబుతున్నాయి. అంటే నాటిన మొక్కల్లో 39 శాతం మొక్కలు మనుగడ సాధించినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ వాస్తవాని కి 20 శాతం కూడా మొక్కలు మనుగడ సాధించలేదు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో హరితహారం పథకం కింద నాటిన మొక్కల సంరక్షణ సవాల్‌గా మారింది. రూ.కోట్లు వెచ్చించి పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నప్పటికీ.. అవి నాటుకుని మనుగడ సాధించడం లేదు. నాటినప్పుడు ఉన్న శ్రద్ధ వాటి సంరక్షణలో ఉండటం లేదనేది స్పష్టమవుతోంది. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు, అటవీ విస్తీర్ణం పెంచేందుకు ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చిస్తోంది. ఏటా కోట్లలో మొక్కలు నాటుతోంది. ఒక్కో గ్రామంలో సుమారు 40 వేల మొక్కలు ఏటా నాటుతూ వస్తోంది. కమ్యూనిటీ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలు, పాఠశాలలు, ఇతర సంస్థల ప్రదేశాలు, దేవాలయాలు, ఈత వనాలు, రహదారికి ఇరువైపున ఉన్న ఖాళీ స్థలాలు, రైతుల పొలం గట్ల మీద ఇలా వివిధ ప్రదేశాల్లో ఏటా భారీ సంఖ్యలో మొక్కలను నాటుతున్నారు. కానీ మొక్కలు మూడు రోజుల ముచ్చటే అవుతోంది. మొక్కలు నాటడంలో చూపిన ఉత్సాహం వాటి సంక్షరణపై పెట్టకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది రెండింతల లక్ష్యం ఈ ఏడాది హరితహారం లక్ష్యం రెండింతలైంది. ఏటా నాటే మొక్కల సంఖ్య కంటే రెండు రెట్లు అధికంగా మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ఇప్పటి వరకు నాలుగు విడతల్లో హరితహారం పథకాన్ని ప్రభుత్వం అమలు చేసింది. ఏటా 1.85 కోట్ల చొప్పున మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఈసారి ఏకంగా 4.80 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యాన్ని నిర్దేశించడం అటవీశాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భారీ సంఖ్యలో మొక్కలు నాటేందుకు అనువైన ప్రదేశాలను గుర్తించే పనిలో అటవీశాఖ పడింది. మరోవైపు లక్ష్యం మేరకు మొక్కల పెంపకం చేపట్టింది. ఉపాధి హామీ పథకం కింద నర్సరీల పెంపకంతో పాటు అటవీశాఖ నర్సరీల్లో ఈ మొక్కలను పెంచుతున్నారు. -
హరితోత్సవం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: పల్లెలు పచ్చలహారం వేసుకోవాలి.. పట్టణాలు పచ్చని మొక్కలతో వనాలుగా మారాలి.. భవిష్యత్ తరాలు ‘హరితహారం’తో మురిసిపోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కొన్నేళ్లుగా మొక్కవోని సంకల్పంతో రాష్ట్రం మొత్తాన్ని పచ్చని హారంలా మార్చేందుకు మొక్కలు నాటడాన్ని ఉద్యమంలా చేపట్టింది. ఈ ఏడాది ఐదో విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలవారీగా లక్ష్యాలను నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలో ఈ ఏడాది హరితహారం కార్యక్రమంలో 3.30 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటికే శాఖలవారీగా లక్ష్యాలను కూడా అధికారులు కేటాయించారు. ఈ క్రమంలో ఆయా శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో పూలు, పండ్లతోపాటు రైతులకు అవసరమైన మొక్కలను పెంచుతున్నారు. నర్సరీల్లో పెంచుతున్న మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండడంతో వర్షాలు పడిన అనంతరం హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. హరితహారం ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం మొత్తంపై నాటాల్సిన మొక్కలపై లక్ష్యాలకు అనుగుణంగా జిల్లాకు లక్ష్యాలను నిర్దేశిస్తుంది. అయితే ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 100 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. దీంతో జిల్లాకు 3.30 కోట్ల మొక్కలను నాటడం లక్ష్యంగా పెట్టారు. అందుకు అనుగుణంగా అధికారులు మొక్కల పెంపకాన్ని ఆయా శాఖల ఆధ్వర్యంలో చేపట్టారు. ప్రతి ఏడాది జూలై నెలలో హరితహారం కార్యక్రమాన్ని చేపడతారు. ఈ ఏడాది కూడా వర్షాలు పడిన తర్వాత జూలైలో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే హరితహారం కార్యక్రమంపై దిశానిర్దేశం చేసేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులకు సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో ఏ శాఖ ఎన్ని మొక్కలు నాటాలి? ఎక్కడెక్కడ నాటాలనే దానిపై వివరిస్తున్నారు. లక్ష్యం 3.30 కోట్ల మొక్కలు.. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 3.30 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. అయితే ఆయా శాఖల ఆధ్వర్యంలో ఇప్పటికే నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. జిల్లాలోని పలు శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలలో 3.95 కోట్ల మొక్కలను పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు. ఖాళీ స్థలాల్లో.. జిల్లాలో హరితహారం కార్యక్రమం ప్రారంభం కాగానే ఆయా శాఖల ఆధ్వర్యంలో అధికారులు విస్తృతంగా మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. గృహ అవసరాల కోసం కూడా మొక్కలను అందజేయనున్నారు. అలాగే విద్యా సంస్థలు, వసతి గృహాలు, రోడ్డుకు ఇరువైపులా, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర పారిశ్రామిక కేంద్రాల ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేందుకు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఖాళీ స్థలాలను గుర్తిస్తున్నారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలోని విద్యా సంస్థలు, కోల్డ్ స్టోరేజీలు, వివిధ పరిశ్రమ కేంద్రాల బాధ్యులను అధిక మొత్తంలో భాగస్వాములను చేయాలని భావిస్తున్నారు. ఎన్నెస్పీ కాల్వ వెంట, చెరువు గట్లపై నాటే మొక్కలను అవసరాలకు అనుగుణంగా ముందస్తుగానే సిద్ధంగా ఉంచనున్నారు. మొక్కలు నాటిన అనంతరం ఆయా మొక్కల సంరక్షణను కూడా చేపట్టనున్నారు. ఏమైనా మొక్కలు చనిపోతే వాటి స్థానంలో కొత్త మొక్కలను నాటేందుకు అదనంగా మొక్కలను సిద్ధంగా ఉంచుతున్నారు. సంరక్షణే ప్రధాన ధ్యేయం.. జిల్లాలో హరితహారం కింద మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షించేందుకు సైతం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాం. కలెక్టర్ కర్ణన్ ఆదేశాల మేరకు హరితహారం కింద నాటే మొక్కలను సంరక్షించేందుకు క్షేత్రస్థాయిలో సమావేశాలు సైతం నిర్వహించి.. అవగాహన కల్పించనున్నాం. మొక్కలు నాటడం ఒక లక్ష్యం కాగా.. సంరక్షించడం మరో ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నాం. మా శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే సిబ్బందికి సూచనలు చేశాం. మిగితా వారికి కూడా ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి.. మొక్కలు నాటే ప్రాధాన్యతను వివరించనున్నాం. – బి.ప్రవీణ, జిల్లా అటవీ శాఖాధికారి, ఖమ్మం -
పంచాయతీకి ‘ఉపాధి’ అనుసంధానం
నల్లగొండ : గ్రామపంచాయతీలకు ఉపాధి హామీ పథకం పనులను అనుసంధానం చేయనున్నారు. కూలీలకు వంద రోజులు తప్పనిసరిగా పనులు కల్పించాలన్న ఉద్దేశంతో గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు గ్రామపంచాయతీలకు ఉపాధి పథకాన్ని అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల పనుల్లో మరింత జవాబు దారీతనం పెరిగే అవకాశం ఉంది. గ్రామాలకు అవసరమైన పనులనే గ్రామ సర్పంచ్, కార్యదర్శుల తీర్మానాల మేరకు చేపట్టి గ్రామాభివృద్ధికి బాటలు వేయనున్నారు. ప్రతి కూలీకి వంద రోజుల పని కల్పిస్తారు. ఉపాధి హామీ పథకం పనులను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు గ్రామీణాభివృద్ధిశాఖ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా గ్రామాల్లో జరిగే ఉపాధి పనులను గ్రామ పంచాయతీల పర్యవేక్షణలోనే చేపట్టాలని నిర్ణయించింది. దీనిని ప్రస్తుతం డీఆర్డీఏ పరిధిలోని సిబ్బందే పర్యవేక్షిస్తున్నారు. పనులపై పెద్దగా పంచాయతీలకు పర్యవేక్షణ ఉండడం లేదు. దాంతో జవాబుదారీతనం లేకపోవడం వల్ల చేపట్టే వాటితో ఇటు గ్రామపంచాయతీకి ఉపయోగపడకపోనూ, కూలీలకు కూడా వంద రోజులు పని కల్పించలేని పరిస్థితి నెలకొంది. అయితే క్షే త్రస్థాయిలోని గ్రామ పంచాయతీ సహాయకులు, ఇటు గ్రామ కా ర్యదర్శులను కూడా భాగస్వాములను చేసే విధంగా గ్రా మీ ణా భివృద్ధి శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రస్తుతం గ్రామాల్లో వన నర్సరీలు ఇప్పటికే చేపడుతున్నారు. ఐదో విడత హరితహారం కార్యక్రమాలను కూడా చేపట్టేందుకు అన్ని ఏ ర్పాట్లు చేస్తున్నారు. వీటికి తోడు ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ పనులను కూడా వారికే అప్పగిస్తే బాగుంటుందనేది వారి ఉద్దేశం. వంద రోజుల పని తప్పనిసరి గ్రామాల్లో నమోదు చేసుకున్న కూలీకి వంద రోజుల పని తప్పనిసరి కల్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రామాల్లో ఎవరు కూలీలు అనేది పంచాయతీ పాలకవర్గానికి కచ్చితంగా తెలుస్తుంది. దాంతో ఎవరికైతే వంద రోజులు పని రాదో వారిని గుర్తించి కల్పించే విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పంచాయతీ పాలక వర్గం, కార్యదర్శి పర్యవేక్షణలోనే పనులు డీఆర్డీఏ ఆధ్వర్యంలో జరిగే ఉపాధి హామీ పనులన్నీ పంచాయతీ పాలకవర్గం, కార్యదర్శి పర్యవేక్షణలో చేపట్టనున్నారు. పనుల గుర్తింపుతో పాటు పనుల నిర్వహణలో కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షించనున్నారు. దీనికి తోడు వచ్చే ఫిర్యాదులను కూడా పరిష్కరించాల్సిన బాధ్యత వారిపైనే ఉంది. ఇప్పటికే నూతన కార్యదర్శుల నియామకం పంచాయతీలో ఇప్పటికే నూతన కార్యదర్శుల నియామకం ప్రభుత్వం చేపట్టింది. వారికే ఉపాధి పనుల అదనపు బాధ్యతలను కూడా అప్పగించనున్నారు. ఇక పంచాయతీలకు అవసరమైన పనులను సర్పంచ్, కార్యదర్శులు ఆ గ్రామాభివృద్ధికి వాటిని గుర్తించి చేపట్టుకునేందుకు కూడా ఆస్కారం ఉంది. గ్రామాల అభివృద్ధికి మరింత అవకాశం పంచాయతీలకు ఉపాధి పనులు అనుసంధానం చేయడం వల్ల మరింత అభివృద్ధి పనులు జరగనున్నాయి. సర్పంచులు ప్రత్యేక దృష్టిని సారిస్తే కోట్లాది రూపాయల విలువ చేసే పనులు గ్రామాల్లో చేపట్టే అవకాశం ఉంది. పారిశుద్ధ్య పనులకు సంబంధించి డంపింగ్ యార్డుల నిర్మాణానికి పంచాయతీ నిధులు కాకుండా ఉపాధి నిధులను వాడవచ్చు. చెత్తను తరలించడం ద్వారా కూలీలకు నిత్యం పని కల్పించే అవకాశం ఉంది. ఈ నిధులతోనే వైకుంఠదామాలు నిర్మించుకునేందుకు కూడా అవకాశం ఉంది. అంతే కాకుండా ప్రతి ఇంట్లో భూగర్భజలాలు పెరిగేందుకు ఇంకుడుగుంతల నిర్మాణం చేపట్టేందుకు ఉపాధి పథకం ద్వారా రూ. 4వేలు ఇవ్వనుంది. స్వచ్ఛభారత్ కా>ర్యక్రమాలు, మరుగుదొడ్లు, పశువులకు నీటితొట్లు, వర్మికంపోస్టు తదితర వాటిని చేపట్టేందుకు ఎంతో అవకాశం ఉంటుంది. గ్రామాభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయి ఉపాధి హామీ పనులు పంచాయతీలకు అనుసంధానం చేయడం వల్ల గ్రామాల్లో ఏయే పనులు అవసరమో గుర్తించడంతోపాటు అత్యవసరమైనవాటికి ప్రాధాన్యత ఇవ్వొచ్చు. పనుల గుర్తింపు పంచాయతీల పరిధిలోనే జరుగుతుండడం వల్ల ఆ గ్రామంలో ఏది అవసరమో వారికి తెలుస్తుంది. తద్వారా గ్రామంలో ప్రజలకు అత్యవసరమైన పనులను వెంటనే చేసుకునే అవకాశం ఉంటుంది. ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా గ్రామ పంచాయతీ భవనంలోనే ఉంటారు. తద్వారా అంతా కలిసి గ్రామాభివృద్ధికి బాటలు వేసుకునే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. – డీపీఓ విష్ణువర్థన్ రెడ్డి -
పల్లెల్లో హరితశోభ
పల్లెల్లో పచ్చదనం సంతరించుకోనుంది. తరిగిపోతున్న అడవుల శాతాన్ని తిరిగి పెంచడంతోపాటు వాతావరణ సమతుల్యతను కాపాడడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఐదో విడత హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాలు పడగానే హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సాక్షి, జనగామ: పల్లెకు పచ్చదనం పర్చుకోనుంది. హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో మొక్కలు నాటేందుకు తగిన కార్యా చరణను అధికారులు రూపొందిస్తున్నారు. తరిగి పోతున్న అడవుల శాతాన్ని తిరిగి పొందడంతో పా టు వాతావరణ సమతుల్యతను కాపాడడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం విధితమే. వర్షాలు పడగానే హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేశారు. ఐదో విడత లక్ష్యం 1.80కోట్లు.. జిల్లాలో ఐదో విడత హరితహారంలో భాగంగా 1.80కోట్ల మొక్కలను నాటేందుకు అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలోని 12 మండలాల్లో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ(ఎన్ఆర్ఈజీఎస్), తెలంగాణ అటవీశాఖ ఆధ్వర్యంలో వేర్వేరుగా మొక్కలను పెంచుతున్నారు. ఉపాధి హామీపథకంలో భాగంగా 1,24,50,000 మొక్కలను 252 నర్సరీలో పెంచుతున్నారు. గ్రామానికో నర్సరీ ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. గతంలో మండల కేంద్రాల్లో మొక్కలను పెంచితే రవాణా చేయడం కష్టంగా మారేది. ఇప్పుడు అలా కాకుండా గ్రామాల్లోనే నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. పంచాయతీలకు బాధ్యత.. గతంలో మాదిరిగా కాకుండా ఈ సారి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి గ్రామపాలక వర్గాలకు బాధ్యత అప్పగించారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారంగా మొక్కల పెంపకాన్ని ఒక బాధ్యతగా పొందుపర్చారు. ప్రతి గ్రామం పచ్చదనంతో ఉండే విధంగా సర్పంచ్‌లు, పాలకవర్గం బాధ్యత తీసుకోవాలని ప్రత్యేకంగా చూసించారు. ఉపాధిహామీ సిబ్బందితోపాటు పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, వార్డు సభ్యులను భాగస్వామ్యం చేస్తోంది. జూలై మొదటివారంలో ప్రారంభం.. రానున్న జూలై నెల మొదటివారంలో హరితహారం కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇప్పటికే నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేశారు. జులైలో వర్షాకాల సీజన్ కావడంతో నాటిన మొక్కలను కాపాడే వీలుంటుంది. ప్రభుత్వం ప్రారంభించే తేదీని బట్టీ జిల్లాలో లాంఛనంగా హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రైతుల వ్యవసాయ భూములు, ప్రభుత్వ స్థలాలు, విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలతోపాటు రోడ్డు పక్కన మొక్కలు నాటేందుకు ప్రణాళికను అధికారులు సిద్ధం చేస్తున్నారు. అటవీశాఖ లక్ష్యం 56 లక్షలు.. అటవీశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 56లక్షల మొక్కలు పెంచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జనగామ, స్టేషన్ ఘన్పూర్ రేంజ్ పరిధిలో 56 లక్షలను పెంచడానికి అధికారులు మొక్కలను పెంచుతున్నారు. 56 నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను సిద్ధం చేస్తున్నారు. అటవీశాఖ వేరుగా లక్ష్యాన్ని నిర్ధేశించుకొని మొక్కలను నాటేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జూలై మొదటివారంలో నాటుతాం జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీలో భాగంగా మొక్కలను పెంచుతున్నారు. గ్రామానికి 40వేల మొక్కలను పంపిణీ చేస్తాం. వర్షాలను బట్టి మొక్కల పంపిణీ ప్రారంభం అవుతుంది. నర్సరీల్లో మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉన్నాయి. గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ ఆధ్వర్యంలో వేర్వేరుగా మొక్కలను పెంచుతున్నాం. జూలై మొదటివారంలో జిల్లా అంతటా మొక్కలను నాటే అవకాశం ఉంది. ప్రభుత్వం నిర్ణయాన్ని బట్టి హరితహారాన్ని ప్రారంభిస్తాం. –రాంరెడ్డి, డీఆర్డీఓ పల్లెల్లో హరితశోభ -
ఊరూరా వన నర్సరీలు
సాక్షి, దామరగిద్ద: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకంతో గ్రీన్‌విలేజ్ నిర్మాణానికి వన్ విలేజ్.. వన్ నర్సరీ నినాదంతో ఊరూరా ప్రారంభించిన నర్సరీల్లో మొక్కల పెంపకం ప్రారంభమైంది. మండలంలోని 30 గ్రామ పంచాయతీల పరిధిలో 30 నర్సరీలను ఏర్పాటు చేస్తున్నారు. ఉల్లిగుండం, కాన్కుర్తి, మొగుల్‌మడ్క, కంసాన్పల్లి, ముస్తాపేట్‌లో అటవీశాఖ ద్వారా 5నర్సీరీలు ఏర్పాటు చేయగా.. మిగిలిన అన్ని గ్రామాల్లో డ్వామా ద్వారా 25 నర్సరీలు ఏర్పాటు చేశారు. ఒక్కో నర్సీరీలో గ్రామ జనాభా, భౌగోళిక విస్తీర్ణం, రైతుల ఆసక్తిని పరిగణలోకి తీసుకొని 40వేల మొక్కల నుంచి లక్ష మొక్కలను పెంచుతున్నారు. 40శాతం టేకు మొక్కలే.. మండలంలోని మొత్తం 30 నర్సీరీల్లో 15 లక్షల మొక్కలు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటిలో ప్రతి నర్సరీలో పెంచే మొక్కల్లో 40 శాతం టేకు మొక్కలు కాగా మిగిలిన 60 శాతం ఇంటి ముందు పరిసరాల్లో పెంచుకునే (హోంస్టేడ్) జామ నిమ్మ, అల్లనేరేడు, వంటి పండ్ల మొక్కలు కరవేపాకు, చింత, మామిడి తదితర మొక్కలకు పెంచుతున్నారు. నర్సరీలకు చేరిన 3.80 లక్షల టేకు వేళ్లు డ్వామా ద్వారా పెంచుతున్న రెండు నర్సరీల్లో టేకు మొక్కల పెంపకం ప్రారంభించారు. ఇప్పటివరకు మండలంలోని 17 గ్రామాల నర్సీరీలకు 3.80 లక్షల టేకు మొక్కలను సరఫరా చేయగా.. వాటిని మట్టి బ్యాగుల్లో నాటి పెంచుతున్నారు. జిల్లా అధికారుల నుంచి ఇప్పటివరకు అందిన టేకు మొక్కల వేళ్లు (స్టంప్స్) అందించగా పండ్ల మొక్కల పెంపకానికి విత్తనాలు సరఫరా కానున్నాయని అధికారులు అంటున్నారు. ఇక మరో రెండు రోజుల్లో 2.20 లక్షల స్టంఫ్స్ సరఫరా కానున్నాయని తెలియజేస్తున్నారు. ఆయా నర్సరీల్లో 60శాతం పెంచే పండ్ల మొక్కల పెంపకానికి ప్రత్యేక పార్మేషన్ బెడ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇంటి పరిసరాల్లో పెంచే మొక్కల పెంపకానికి మట్టి గులికలతోపాటు ఎం45, ఎస్ఎస్పీ, ఒక్కో మీటర్ పొడవు వెడల్పు మట్టిబెడ్‌లను ఏర్పాటు చేసి వాటిలో విత్తనాలు చల్లి మొక్కలను పెంచనున్నారు. మొలకలు రాగానే వాటిని మట్టితో నింపిన ప్లాస్టిక్ బ్యాగులలో నాటి పెద్ద చేస్తారు. ప్రతి విలేజ్‌ను గ్రీన్‌విలేజ్ మార్చేందుకు నెల క్రితమే నర్సరీల్లో మట్టి బ్యాగ్ ఫిల్లింగ్ పూర్తిచేసి సిద్ధంగా ఉంచారు. వన నర్సరీల ఏర్పాటుకు మూడు నెలల నుంచి కరసత్తు ప్రారంభించాం. అన్ని నర్సరీల్లో ఫిడస్ట్రాల్ ట్యాంకుల నిర్మాణం, మట్లి బ్యాగ్‌ల ఫిల్లింగ్ పూర్తయింది. 17 నర్సరీల్లో ఇప్పటి వరకు పంపిణీ చేసిన 3.80 టేకు స్టంప్స్ నాటి వాటని పెంచుతున్నాం. మరో 2.20 టేకు స్టంఫ్స్ పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మండలంలో టేకుతో పాటు మొత్తం 15 లక్షల మొక్కలను పెంచాలని లక్ష్యంగా నర్సరీలు కొనసాగుతున్నాయి. – సందీప్‌కుమార్, ఎంపీడీఓ, దామరగిద్ద -
అడవిని రక్షిద్దాం!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం సాంకేతికతంగా అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సౌకర్యాలు, వసతులను ఉపయోగించుకుని అడవులు, వన్యప్రాణుల సంరక్షణకు మరింత పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అడవుల పరిరక్షణతో పాటు హరితహారంలో భాగంగా పచ్చదనం గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుండటంతో, ఆయా లక్ష్యాలను మరింత సమర్థవంతంగా సాధించేందుకు వీలుగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని అటవీశాఖ భావిస్తోంది. ఈ పరిజ్ఞానాన్ని అడవుల రక్షణకు ఎలా వినియోగించాలన్న దానిపై దృష్టి పెట్టింది. అడవుల్లో ఆక్రమణలు, అగ్ని ప్రమాదాలను గుర్తించి సాధ్యమైనంత త్వరగా సమాచారం తెలుసుకోవడం ద్వారా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లకుండా నివారణకు ఇదివరకే నేషనల్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ ఏజెన్సీ (ఎన్ఆర్ఎస్ఏ) తో అటవీశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఆర్‌ఎస్‌ఏతో పాటు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా సహకారం కూడా తీసుకుని వివిధ సాంకేతికతల సాయంతో మరింత సమర్థవంతంగా వినియోగించేలా చర్యలు చేపడుతోంది. శాటిలైట్ ఛాయాచిత్రాల ద్వారా అడవుల్లోని వాస్తవ పరిస్థితులను తెలుసుకుని, తదనుగుణంగా అవసరమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇటీవలే తెలంగాణ ఫారెస్ట్ ప్రొటెక్షన్ టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ కూడా భేటీ అయి సాంకేతికను ఏయే పద్ధతుల్లో ఉపయోగించాలన్న దానిపై చర్చించింది. హరితహారానికి చేదోడు వాదోడు.. హరితహారం కార్యక్రమంలో ఈ ఏడాది వంద కోట్ల మొక్కలు పెంచేందుకు వీలుగా కొత్తగా మరిన్ని ఖాళీ ప్రదేశాలు, ప్రాంతాల గుర్తింపునకు రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. దీనిలో భాగంగా నాటుతున్న మొక్కలు, ప్రాంతాలను జియో ట్యాగింగ్ చేయనున్నారు. ఆ తర్వాత ఆయా ప్రాంతాలను సాంకేతికత పరిజ్ఞానం సాయంతోనే ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా అడవుల లోపల, పరిసర ప్రాంతాల్లోనూ చెట్ల నరికివేత, అటవీ ప్రాంతాలను చదును చేయటం తదితర మార్పులను పసిగట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. అడవుల్లో ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరిగితే శాటిలైట్ల ద్వారా వెంటనే గుర్తించి, దీనికి సంబంధించిన క్షేత్ర స్థాయి అటవీ సిబ్బందిని అప్రమత్తం చేసే సాంకేతికతను కూడా అటవీ శాఖ ఇప్పటికే ఉపయోగిస్తోంది. ఎన్ఆర్ఎస్ఏ సహకారంతో అడవుల్లో తరచుగా అగ్నిప్రమాదాలు జరిగేందుకు అవకాశమున్న ప్రాంతాలను గుర్తించింది. ఆయా ప్రాంతాల్లోని అటవీ సిబ్బంది, అడవుల సంరక్షణలో పాలుపంచుకుంటున్న వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలకు చెందిన సెల్ఫోన్లకు అగ్నిప్రమాదాలు, ఇతరత్రా ఘటనలకు సంబంధించి ఎన్ఆర్ఎస్ఏ నుంచి వచ్చే అలర్ట్స్‌ను పంపించే ఏర్పాట్లు కూడా చేసింది. టైగర్ రిజర్వ్‌ల్లో డ్రోన్లు.. రాష్ట్రంలో వన్యప్రాణుల వేటతో పాటు, పులులను లక్ష్యంగా చేసుకుని జరుపుతున్న దాడుల ఘటనలు వెలుగులోకి రావడంతో మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అటవీశాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని రెండు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌ల్లో డ్రోన్ కెమెరాలు వినియోగించాలని యోచిస్తోంది. ఇటీవల హైకోర్టు కూడా అడవుల సంరక్షణపై పలు సూచనలు చేయడంతో రక్షణ చర్యలకు సంబంధించి అత్యాధునిక సాంకేతికత ను ఉపయోగించేందుకు సిద్ధమవుతోంది. మధ్యప్రదేశ్‌లోని కన్హా జాతీయ పార్కులోని టైగర్ రిజర్వ్‌లో డ్రోన్ కెమెరాల ద్వారా పులుల పర్యవేక్షణ జరుపుతున్న విధంగా ఇక్కడ కూడా చర్యలు చేపట్టాలని కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని టైగర్ రిజర్వ్ ఫారెస్టుల్లో డ్రోన్ల సేవలు ఉపయోగించుకోవడానికి ఉన్న అవకాశాలు పరిశీలించేందుకు ఎన్ఆర్ఎస్ఏ సేవలను తీసుకోనున్నట్టు సమాచారం. డ్రో న్ల వినియోగంపై అధ్యయనం చేసేందుకు కన్హా జాతీయ పార్కుకు ఒక అధ్యయన బృందాన్ని పంపాలనే యోచనలో అటవీశాఖ ఉంది. -
టెక్నాలజీతో అటవీ సంరక్షణ
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక పరిజ్ఞానంతో అడవుల పరిరక్షణ చర్యలు చేపడుతున్నట్లు పీసీసీఎఫ్ ప్రశాంత్‌కుమార్.ఝా తెలిపారు. ఇందులో భాగంగా టెక్నాలజీ ద్వారా అడవుల ఆక్రమణలు, అగ్ని ప్రమాదాలను గుర్తించి సమాచారం అందించేందుకు ఇప్పటికే నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీతో అటవీ శాఖ ఒప్పందం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అరణ్య భవన్లో శుక్రవారం జరిగిన తెలంగాణ ఫారెస్ట్ ప్రొటెక్షన్ టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో అడవుల సంరక్షణలో టెక్నాలజీని మరింత సమర్థవంతంగా ఎలా వినియోగించాలన్న దానిపై అధికారులతో చర్చించారు. ఈసందర్భంగా పీసీసీఎఫ్(విజిలెన్స్) రఘువీర్ మాట్లాడుతూ.. అడవుల సంరక్షణకు సరిహద్దుల గుర్తింపు, వాటి చుట్టూ 8 వేల కిలోమీటర్ల మేర కందకాలు తవ్వటం (సీపీటీ– క్యాటిల్ ప్రూఫ్ ట్రెంచెస్) గట్లపై రక్షణకు గచ్చకాయ మొక్కలు నాటుతున్నట్టు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాల వల్ల పర్యావరణం, అడవులపై ఒత్తిడి పెరుగుతున్నందున వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా మాజీ డైరెక్టర్ జనరల్ దేవేంద్ర పాండే పేర్కొన్నారు. ఖాళీ ప్రదేశాల గుర్తింపు... హరితహారం లక్ష్యం ఈ ఏడాది వంద కోట్ల మొక్కలకు పెరగటంతో కొత్తగా మరిన్ని ఖాళీ ప్రదేశాలను గుర్తించేందుకు రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ వాడాలని అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ సమావేశంలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఐ.జీ ఏకే మొహంతీ, తెలంగాణ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ౖఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సీటీ సైంటిస్ట్ రవి శంకర్ రెడ్డితో పాటు పీసీసీఎఫ్ పీ.కే.ఝా, రఘువీర్, అదనపు పీసీసీఎఫ్ లు లోకేష్ జైశ్వాల్, శోభ పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌ను దూరంగా ఉంచితే మంచిది..
కేసముద్రం(మహబూబాబాద్) : రాష్ట్ర అభివృద్ధి చూసి ఓర్వలేని కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదని రాష్ట్ర గిరిజన సంక్షేమ సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అన్నారు. గురువారం మండలంలోని కోరుకొండపల్లిలో ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో తాటివనంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కాంగ్రెస్‌పార్టీ కోర్టులకు వెళ్లినా చుక్కెదురవుతోందని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమాన్ని కోరుకునే మనిషి అన్నారు. ప్రతి ఒక్కరూ నాటిన మొక్క నాది అనేభావంతో, ఒక కొడుకులా, బిడ్డలాగ చూసుకోవాలన్నారు. హాస్టళ్లలో ప్రతి విద్యార్థికి మొక్క ఇచ్చి, ఆ విద్యార్థి పేరు రాసుకుంటే బాధ్యతతో పెంచుతాడని చెప్పారు. పూల మొక్కలు, పండ్ల మొక్కలు పెంచాలని సూచించారు. అందరి ఆరోగ్యం కోసం ఈనెల 15 నుంచి కంటివెలుగు పథకానికి శ్రీకారం చుట్టి ప్రజలకు కంటి పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం మంత్రికి గీతాకార్మికులు ఈత మొక్కలను బహూకరించారు. అయ్యగారిపల్లిలో జీపీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి కేసముద్రం మండలం ఇనుగుర్తి శివారు అయ్యగారిపల్లి కొత్త గ్రామపంచాయతీగా ఏర్పాటుకా గా, గురువారం ఇక్కడికి వచ్చిన మంత్రి అజ్మీరా చందూలాల్ జీపీ భవన్నాన్ని రిబ్బన్ కట్‌చేసి ప్రారంభించారు. మంత్రి సమక్షంలో స్పెషల్ఆఫీసర్గా విద్యాసాగర్, కార్యదర్శిగా అలీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదన్నారు. అన్ని గ్రామాలు, తండాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందడానికి సీఎం కేసీఆర్ నూతనంగా జీపీలను ఏర్పాటు చేశారని అన్నారు. అ నంతరం గ్రామస్తులు మంత్రిని, కలెక్టర్‌ను సన్మానించారు. 96లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం జిల్లాలో నాలుగో విడతలో 96లక్షల మొక్కలను నాటడమే లక్ష్యమని కలెక్టర్ శివలింగయ్య అన్నారు. గురువారం కోరుకొండపల్లిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడో విడత వరకు జిల్లాలో 2కోట్ల 3లక్షల మొక్కలను నాటామన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ హరితహరంలో భాగస్వాములు కావాలని, నాటిన మొక్కలన్నింటినీ బతికించుకోవాలన్నారు. ప్రజలసంక్షేమం కోసం సీఎం కృషి రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ నిరంతరం కృషిచేస్తున్నారని మానుకోట ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. గురువారం ఇక్కడ జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగా జీపీలను ఏర్పాటు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన భాద్యత అందరిపై ఉందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, నాటిన మొక్కను బతికించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీ కోటిరెడ్డి, జేసీ దామోదర్‌రెడ్డి, డీఎఫ్‌వో కిష్టగౌడ్, డీఏవో చత్రునాయక్, జిల్లాఎక్సైజ్ అధికారి దశరథ్, ఎంపీపీ కదిర రాధిక, జెడ్పీటీసీ బండారు పద్మ, ఎంపీడీవో అరుణాదేవి, తహసీల్దార్ యోగేశ్వర్రావు పాల్గొన్నారు. వర్షంతో అంతరాయం ఇనుగుర్తి గ్రామ శివారు అయ్యగారిపల్లి నూతన గ్రామపంచాయతీని మంత్రి అజ్మీరా చందూలాల్ గురువారం ప్రారంభించిన తర్వాత సభాప్రాంగణంలో వేదిక పైనున్న వారు మాట్లాడుతుండగా వర్షం మొదలైంది. దీంతో టెంట్ల నుంచి వర్షపు దారలు జనంపై పడుతుండటంతో కొందరు లేచి పక్కకు వెళ్లగా, మరికొందరు అలాగే కూర్చున్నారు. వేదికపై మంత్రి కూర్చున్న చోట వర్షపునీరు టెంటు నుంచి దారగా పడుతుండటంతో మంత్రి కుర్చిని కాస్త పక్కకు జరిపారు. వర్షపు నీరు పడకుండా గొడుగు పట్టుకోవడంతో మంత్రి సభలో ప్రసంగించారు. సీఎం పదవి కోసం కాంగ్రెస్ కొట్లాట : మంత్రి చందూలాల్ కొత్తగూడ(ములుగు) : ఎన్నికలు రాకముందే సీఎం పదవి కోసం కాంగ్రెస్ నాయకులు కొట్లాడుతున్నారని గిరిజన సంక్షేమ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీర చందూలాల్ అన్నారు. మారుమూల గ్రామాల్లో మంత్రి గురువారం మంత్రి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నూతనంగా ఏర్పడ్డ మొండ్రాయిగూడెం గ్రామ పంచాయతీని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మొద్దని, వారి మాటలు నమ్మితే నెలకో ముఖ్యమంత్రిని మార్చుకుంటారన్నారు. చిన్న గ్రామ పంచాయతీలతో గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని చెప్పారు. రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఏజెన్సీలో చిన్న చిన్న కారణాలతో అందని రైతుబంధు చెక్కులు తొందరలోనే పరిష్కరిస్తామన్నారు. రూ.2.50లక్షలతో గుండంపల్లి నుంచి పాకాల వరకు బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. పాకాల శిఖంను ఆనుకుని ఉన్న రెవెన్యూ పట్టాలను ఫారెస్ట్ అంటూ తొలగించారని గుండంపల్లి గ్రామస్తులు మంత్రికి విన్నవించారు. మంత్రి స్పందిస్తూ విషయాన్ని కలెక్టర్‌తో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు. మండలకేంద్రంలో నూతన మండల పరిషత్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనం తరం కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. జెడ్పీ చైర్పర్సన్ పద్మ, జెడ్పీటీసీ సభ్యురాలు దేశిడి అరుణ, వైస్ ఎంపీపీ పూల యాదగిరి, ఎంపీటీసీ సభ్యుడు బంగారి నారాయణ, తహసీల్దార్ తరంగిణి, ఎంపీడీఓ జయరాంనాయక్, టీఆర్ఎస్ నాయకులు నాగమల్లేశ్వర్రావు, ఈసం సమ్మయ్య, కొమ్మనబోయిన వేణు, విశ్వనాథం, సిరిగిరి సురేష్, శ్రీనివాస్‌రెడ్డి, వీరన్న, అజ్మీర్పాషా పాల్గొన్నారు. -
నాటిన ప్రతి మొక్క బతకాలి
గండేడ్ (మహబూబ్‌నగర్): ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో నాటిస్తున్న ప్రతి మొక్క బతకాలని, అప్పుడే లక్ష్యం నెరవేరుతుందని పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా బుధవారం మండల పరిధిలోని నంచర్ల గురుకుల పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ సమతౌల్యాన్ని కాపాడుకోవాలంటే అటవీసంపదను పెంచుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. పాఠశాల, కళాశాల, ప్రభుత్వ కార్యాలయాల మొక్కలతో పచ్చబడాలని కోరారు. గత ఏడాది హరితాహరం కార్యక్రమం ద్వారా నాటిన మొక్కలను బతికించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శాంతీబాయి, వైస్ ఎంపీపీ రాధారెడ్డి, ప్రిన్సిపల్ వెంకటమ్మ, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, నాయకులు కేఎం నారాయణ, జితేందర్‌రెడ్డి, శ్రీనివాస్, గోపాల్‌రెడ్డి, ఎఫ్ఆర్ఓ మగ్దూమ్, ఏపీఓ హరిచ్చంద్రుడు, ఎంపీటీసీలు చెన్నమ్మ, మంజుల తదితరులు పాల్గొన్నారు. -
హరితపథం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలో ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమ నిర్వహణకు అధి కారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతుండగా నాలుగో విడత హరితహారం గురువారం ప్రారం భం కానుంది. ఇప్పటికే నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉండగా.. శాఖల వారీగా అధికారులు లక్ష్యాలను నిర్దేశించారు. జూలై నెల మొదట్లో వర్షాలు కురవగా.. అప్పుడే హరిత హారంలో భాగంగా మొక్కలు నాటాలని అధికారులు భావించినా కుదరలేదు. దీంతో గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా నాలుగో విడత హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. గుంతలు.. మొక్కలు జిల్లావ్యాప్తంగా మొత్తం 185 నర్సరీలు ఉన్నాయి. ఇందులో అటవీ శాఖ ఆధ్వర్యాన 115, డీఆర్డీఓ ఆధ్వర్యాన 70 నర్సరీల్లో హరితహారానికి అవసరమైన మొక్కలు సిద్ధం చేశారు. గత నెలలో జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురవగా హరితహారం ప్రారంభించాలనుకున్నా మళ్లీ వెనుకడుగు వేశారు. అయినప్పటికీ కొన్నిచోట్ల మొక్కలు నాటా రు. ఇక నుంచి గురువారం నుంచి పూర్తిస్థాయిలో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే గుంతలు తీయడం పూర్తికాగా, నాటాల్సిన మొక్కలపై శాఖల వారీగా లక్ష్యాలను నిర్ధేశించారు. 1.97 కోట్ల మొక్కలు... నాలుగో విడత హరితహారంలోభాగంగా జిల్లాలో 1.97 కోట్లు మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు శాఖల వారీగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో 1.03 కోట్ల టేకు మొక్కలు, 15 లక్షలు ఈత మొక్కలను నర్సరీల్లో సిద్ధంగా ఉంచారు. ఇక అత్యధికంగా ఐకేపీ–డ్వామా(డీఆర్డీఓ) ఆధ్వర్యాన 1,56,28,000 మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించారు. అలాగే, ఎక్సైజ్‌కు 10 లక్షలు, అటవీ శాఖకు 10 లక్షలు, పశు సంవర్థక శాఖకు 3 లక్షలు, పోలీస్ శాఖకు 10 వేలు, పీయూకు 30 వేలు, ఆర్‌డబ్ల్యూఎస్‌కు 20 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. అంతేకాకుండా అత్యల్పంగా బీసీ సంక్షేమ శాఖ, సివిల్ సప్లయీస్, రవాణా శాఖలకు కేవలం వెయి చొప్పున లక్ష్యం నిర్ణయించారు. ఇక మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో 2 లక్షలు, నారాయణపేట పరిధిలో 50 వేల మొక్కలు నాటనున్నారు. మొక్కల ఆవశ్యకతపై విద్యార్థుల్లో అవగాహన పెంచాలి జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): మొక్కల పెంపకం ఆవశ్యకతపై విద్యార్థుల్లో అవగాహన పెంచాల్సిన బాధ్యత ఉపాద్యాయులపై ఉందని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యాన స్థానిక పిల్లలమర్రి సమావేశ హాల్లో హరిత పాఠశాల, స్వచ్ఛ పాఠశాల అంశాలపై విద్యా శాఖ అధికారులకు బుధవారం అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ భావి తరాలైన విద్యార్థులకు మొక్కలు నాటాల్సిన ఆవశ్యకత, వాటితో లాభాలను వివరించాలన్నారు. పాఠశాలతో పాటు ఇళ్లలో మొక్కలను పెంచేలా విద్యార్థులకు ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. మొక్కలను ఎలా నాటాలి, ఎంత లోతు గుంత తీయాలనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం డీఎఫ్ఓ గంగారెడ్డి మాట్లాడుతు ప్రతీ మండలం నుంచి ఎంఈఓ, ఓ హెచ్ఎంతో పాటు అటవీ శాఖ ఉద్యోగికి అవగాహన కల్పించగా.. వారు క్షేత్ర స్థాయిలో విద్యార్థులకు వివరించాల్సి ఉంటుందని తెలిపారు. అనంతరం ప్రత్యేకంగా ముద్రించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈత మొక్కలను కాపాడుకోవాలి పాలమూరు: ఈత మొక్కలను కాపాడుకోవ డం వల్ల గీత కార్మికులకు భవిష్యత్‌లో ఉపాధి లభిస్తుందని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఎక్సైజ్ శాఖకు ప్రజలందరూ సహకరిస్తే హరితహారం విజయవంతమవుతుందన్నారు. హరితహారంలో భాగంగా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యాన బుధవారం హన్వాడ మండలం చిన్నదర్పల్లి శివారులోని సహదేవుడుగౌడ్ పొలంలో ఎమ్మె ల్యే, ఆబ్కారీ శాఖ ఉమ్మడి జిల్లా డీసీ జయసేనారెడ్డితో పాటు అధికారులు, గీత కార్మికులు కలిపి 3వేల ఈత మొక్కలు నాటారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ హరితహారంలో అన్నివర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సీజన్ లో జిల్లావ్యాప్తంగా 11 లక్షల ఈత మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎక్సై జ్ ఈఎస్ అనిత, సీఐ దామోదర్‌రెడ్డి, ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మొక్కలతోనే మానవ జీవనానికి మనుగడ స్టేషన్ మహబూబ్‌నగర్: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని, అప్పుడే మానవ జీవనానికి మనుగడ ఉంటుందని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బి.వరప్రసాద్ అన్నారు. స్థానిక డిపో ఆవరణలో బుధవారం హరితహారంలో భాగంగా ఆయన మొక్కలు నాటి మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారంలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డివిజనల్ మేనేజర్ మహేశ్, స్థానిక డిపో మేనేజర్ రాజగోపాలాచారితోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆర్టీసీ ఆర్ఎం బి.వరప్రసాద్ -
ఒక్కో మహిళ.. ఆరు మొక్కలు
భీంపూర్(బోథ్): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారంపై ప్రత్యేక దృష్టి సారించింది. నాలుగో విడతలో మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షించే బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగిస్తోంది. ఇందిరా క్రాంతి పథం ద్వారా గ్రామాల్లోని మహిళా సంఘాల సభ్యులకు సంరక్షణ బాధ్యతలు అప్పగిస్తున్నారు. హరితహారం విజయవంతం కావాలనే సదుద్దేశంతో ప్రతీ మహిళా సభ్యురాలు ఆరు మొక్కలు నాటించాలని సంబంధిత మండల సీసీలు, ఏపీఎంలు సూచిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతీ మండలంలో సంబంధిత అధికారులు మండల సమాఖ్య మహిళలకు ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామస్థాయితోపాటు మండలాల్లో అవగాహన కల్పించగా.. గ్రామాల్లోని ఎస్‌హెచ్‌జీ(స్వయం సహాయక సంఘాలు) మహిళలకు అందిస్తున్న మొక్కల వివరాలపై ప్రతీరోజు ఉన్నతాధికారులకు రోజువారీగా నివేదికలను కూడా పంపిస్తున్నారు. 96,244 మంది.. జిల్లాలోని 18 మండలాల్లో మొత్తం 532 వీఓల పరిధిలో 9,348 మహిళా సంఘాలుండగా.. అందులో 96,244 మంది సభ్యులు ఉన్నారు. వీరు ఆరు మొక్కల చొప్పున నాటేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. వీరందరూ హరితహారంలో భాగస్వాములు కానున్నారు. ఇందులో తాంసి మండలంలో అతి తక్కువగా 3,447మంది సభ్యులుండగా.. అత్యధికంగా జైనథ్ మండలంలో 8,792మంది ఉన్నారు. జిల్లా మొత్తంగా 96,244 మంది సభ్యులు ఒక్కొక్కరూ ఆరు మొక్కలు నాటేందుకు అన్ని రకాల సరంజామాను ఏర్పాటు చేస్తున్నారు. అవగాహన.. కొనసాగుతున్న సర్వే.. మొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణ ఎలా చేపట్టాలనే విషయమై మండల స్థాయి సమావేశాల్లో ఏసీలు, ఏపీయంలు, సీసీలు వివరించారు. అన్ని మండలాల్లో హరితహారంపై సంఘాల మహిళలకు ఇప్పటికే అవగాహన కల్పించారు. కొన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా గుంతలు తవ్వించి సంఘాల సభ్యులకు మొక్కలు అందించాలని సూచనలు ఉన్నట్లు ఆయా మండలాల ఏపీఎంలు తెలిపారు. ఇంటి పెరట్లో, పాఠశాలలు, కార్యాలయాలు, గ్రామపంచాయతీ పరిసరాలు, మొక్కలకు సంరక్షణ ఉన్న చోట్ల మొక్కలు నాటాలని ఈ అవగాహన కార్యక్రమాల్లో చెప్పారు. ఇప్పటికే ఆయా స్థలాల్లో మొక్కలు నాటి ఉంటే పెరట్లలో, గట్లపై నాటాల్సి ఉంది. వారం రోజులుగా గ్రామాల్లో ఇంటింటి సర్వే కొనసాగుతోంది. ఏ సంఘం సభ్యులు ఏ మొక్క నాటుతారో ముందుగానే సర్వే ద్వారా తెలియజేస్తున్నారు. ఆ సర్వే వివరాలను ప్రతీరోజు సంబంధిత డీఆర్డీఓ కార్యాలయానికి చేరవేస్తున్నట్లు ఆయా మండలాల సీసీలు చెబుతున్నారు. ఉండమ్మా బొట్టు పెడతా.. గ్రామాల్లో ఇప్పటికే మహిళా సంఘాల సభ్యులకు ఐకేపీ అధికారులు అవగాహన కల్పించగా.. ఆయా మండలాల్లో మండలాల్లో ఉన్న సంప్రదాయ పద్ధతులను అనుసరించి మహిళలకు తెలియజేస్తున్నారు. గ్రామాల్లో తమ పెరట్లలో, గట్లపై ప్రతీ ఒక్క మహిళా సభ్యురాలు విధిగా ఆరు మొక్కలు నాటాలని చెబుతూ బొట్టుపెట్టే కార్యక్రమం కొనసాగుతోంది. అందరికీ అవగాహన కల్పించాం.. మండల స్థాయి సమావేశంతోపాటు ఇప్పటికే అన్ని గ్రామాల్లో సభ్యురాలికి బొట్టుపెట్టి మొక్కలు నాటే పద్ధతులు వివరించాం. తదనుగుణంగా గ్రామాల్లో నాటే ఆరు మొక్కల వివరాల సేకరణపై సర్వే కూడా పూర్తవుతోంది. మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షించాలని అందరికీ తెలియజేస్తున్నాం. కే.ప్రసాద్‌రాజ్, ఏపీఎం, భీంపూర్ -
ఇంట్లో ఎందరుంటే అన్ని మొక్కలు నాటాలి
-
సీడ్‌బాల్స్‌తో అటవీ సంరక్షణ
హరితహారంలో భాగంగా విత్తన బంతుల తయారీతో హరితహారం లక్ష్యం చేరుకునేందుకు గత ఏడాది ఈ పద్ధతిని సర్కారు ప్రయోగించింది. ప్రభుత్వం ఆదేశం మేరకు ఈ సారి కూడా ఇదే తరహాలో మొక్కలను పెద్దఎత్తున నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లోనూ ఇదే పద్ధతిని అనుసరిస్తుడడంతో ప్రభుత్వం కూడా ఈ పద్ధతికే మొగ్గు చూపుతోంది. ఈవిధానంతో అడవి శాతాన్ని పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వికారాబాద్ అర్బ్న్ : నూతనంగా ఏర్పడ్డ వికారాబాద్ జిల్లా విస్తీర్ణంలో 1.1 లక్షల ఎకరాల్లో మాత్రమే అడవులు ఉన్నాయి. భౌగోళికంగా ఇది 14శాతం మాత్రమేనని అటవీశాఖ అధికారులు తెలిపారు. దీన్ని 37శాతానికి పెంచేందుకు పలు రకాల చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో అడవుల శాతాన్ని 37 శాతానికి పెంచేందుకు గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపడుతుంది. ఇందులో భాగంగానే అటవీశాఖ, ఉపాధిహామీ పథకం కింద నర్సరీల్లో మొక్కలు పెంచి అన్నీ గ్రామాలకు అందిస్తున్నారు. ఈ రకంగా అడవి ప్రాంతాల్లో, ఇతర ప్రాంతాల్లో నాటుతున్న మొక్కలు రక్షణ లేక ఎండిపోతున్నాయి. వర్షాలు పుష్కలంగా ఉండి వీటికి నీరు అందించినా ఎండిపోతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకే అటవీ శాఖ ఆధ్వర్యంలో విత్తన బంతి ప్రయోగాన్ని ముందుకు తీసుకొచ్చారు. ప్రత్యేక ఆకర్షణగా సీడ్‌బాల్.. సీడ్ బాల్స్ ప్రయోగాన్ని గత ఏడాది హరితహారంలో అమలుపరిచి విజయం సాధించిన అటవీశాఖ అధికారులు ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున విత్తన బంతులు తయారు చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే సుమారు లక్ష విత్తన బంతులు తయారు చేసి నిల్వ ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హరితహారం ప్రారంభం కాగానే విత్తన బంతులను అన ంతగిరి అడవిలో విసిరేందుకు సిద్ధంగా ఉంచారు. ఈ సీడ్ బాల్స్ ద్వారా చేపట్టే హరితహారం కార్యక్రమంలో యువజన సంఘాలను, స్వచ్ఛంద సంస్థలను, విద్యార్థులు పాల్గొనేలా అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కర్ణాటకలో సత్ఫలితాలు.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన విశ్రాంత ఐఏఎస్ అ ధికారి అమర్ నారాయణ విత్తన బంతులను ప్ర యోగాత్మకంగా ప్రవేశపెట్టి విజయం సాధించా డు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మన రాష్ట్రంలో కూడా గత ఏడాది ఈ పద్ధతి ఫలితాన్ని ఇచ్చింది. జిల్లాలో అటవీ శాతం పెంచేందుకు.. జిల్లాలో అనంతగిరి అటవి శాతాన్ని పెంచేందుకు అటవీ శాఖ అధికారులు సీడ్ బాల్స్ ప్రయోగాన్ని అమలు చేయనున్నారు. అనంతగిరి అటవీ ప్రాంతం 3,700 ఎకరాల వరకు విస్తరించి ఉంది. ఎత్తయిన కొండలు, లోయలతో కూడిన ఈ అనంతగిరిలో కొంత కాలంగా అటవి అంతరించిపోయే పరిస్థితికి వచ్చింది. ఒకప్పుడు పచ్చని చెట్లతో కళకళలాడిన అనంతగిరి కొండలు నేడు కళ తప్పాయి. దీంతో ఈ ప్రాంతంలో అటవి శాతాన్ని పెంచి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అటవీశాఖ అధికారులు సీడ్ బాల్ ప్రయోగాన్ని అమలు చేయబోతున్నారు. అనంతగిరి పర్యాటక కేంద్రానికి వచ్చే పర్యాటకులు ట్రెక్కింగ్‌కు వెళ్తుంటారు.ఆ సమయంలో వారికి విత్తన బంతులు ఇచ్చి విసిరేయించే ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు అనంతగిరిలోని ఫారెస్టు గెస్టహౌస్లో విత్తన బంతులను సిద్ధంగా ఉంచనున్నారు. విత్తన బంతుల తయారీ విధానం.. విత్తన బంతిలో ఉండే విత్తనం పుచ్చిపోకుండా పాడవకుండా ఉండడానికి కారణం బంతి తయారీలో వాడే పదార్థాలే. విత్తన బంతిని తయారు చేయాలంటే స్థానికంగా లభించే విత్తనాన్ని ముందుగా ఎండబెట్టి సిద్ధంగా ఉంచుకోవాలి. తర్వాత వర్మీకంపోస్టు ఎరువు, ఎర్రమట్టి, పశువుల పేడ, గో మూత్రం, బెల్లం, శనగపిండి పదార్థాలు తగినంత నీటిలో మిశ్రమం చేసి చిన్న పాటి లడ్డూల మాదిరిగా తయారు చేసుకోవాలి. ఎండబెట్టిన విత్తనాన్ని లడ్డూ మాదిరి తయారు చేసిన విత్తన బంతి మధ్యలో విత్తనాన్ని ఉంచి గుం డ్రంగా బంతిలా తయారు చేయాలి. ఈ బంతులు నెల నుంచి రెండు నెలల పాటు నిల్వ ఉంటాయి. వర్షాలు కురుస్తున్న సమయంలో విత్తన బంతులను అటవి ప్రాంతంలో, పొలాల వద్ద విసిరేస్తే మొక్కలుగా మొలుస్తాయి. మామూలుగా పెరిగే మొక్కకంటే విత్తన బంతి ద్వారా నాటిన మొక్క త్వరగా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఏ ప్రాంతాలు అనుకూలం.. అటవీ ప్రాంతం తక్కువగా ఉన్న చోట్ల, బంజరు భూములు, పొలం గట్లు, ప్రభుత్వ భూముల్లో విత్తన బంతులను చల్లాలి. కొద్దిపాటి తేమ, మట్టి ఉన్న భూములను ఎంపిక చేసుకోవాలి. రాయి ఉన్న భూములు పనికి రావు. ఖర్చు తక్కువ.. అటవీశాఖ, ఉపాధి హామీ నర్సరీల్లో పెంచే మొక్కలకు ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు చేస్తుంది. ఒక్కో మొక్కపై సుమారు రూ. 20 నుంచి రూ. 30వరకు ఖర్చు చేస్తుంది. అయితే విత్తన బంతి ఖర్చుమాత్రం చాలా తక్కువ అవుతుంది. ఒక్కో బంతి తయారీకి కేవలం రూ. 5 లోపే ఖర్చు అవుతున్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. -
పురపాలికల్లో భారీగా ‘హరితహారం’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పురపాలికల్లో హరితహారాన్ని విజయవంతం చేయాలని ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. గురువారం హరితహారంపై అటవీ, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జూలై రెండోవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా హరితహారం చేపట్టనున్నట్లు ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణ అధికారి పీకే ఝా, హరితహారం కార్యక్రమ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ మంత్రికి తెలిపా రు. జూన్‌లో హరితహారంపై పెద్దఎత్తున ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు కేటీఆర్ సూచించారు. ముందుగా అన్నీ మున్సిపాలిటీల కమిషనర్లతో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలని సీడీఎంఏ శ్రీదేవిని మంత్రి ఆదేశించారు. మొక్కలునాటే స్థలాల ఎంపిక కోసం స్థానిక రెవెన్యూ సిబ్బంది సహకారం తీసుకోవాలన్నారు. పార్కులు, ఖాళీ స్థలాల్లో మొక్కలు హైదరాబాద్‌లో హరితహారాన్ని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీలు విజయవంతం చేయాలని కేటీఆర్ అన్నారు. నగరంలోని పార్కులు, ఖాళీ స్థలాలను ఎంపిక చేయడంతోపాటు ఎన్ని మొక్కలు నాటాలనేదానిపై అంచనాకు రావాలని అధికారులకు సూచించారు. నగరంలోని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లతో జోనల్, సర్కిల్ వారీగా హరితహారంపై అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. పట్టణాల్లో ఏఏ ప్రాంతాల్లో మొక్కల పంపిణీ జరుగుతుందో ప్రజలకు తెలపడంతోపాటు డిసెంట్రలైజేషన్ పద్ధతిన మొక్కల పంపిణీకి ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలన్నారు. నగరంలోని చెరువుల చుట్టూ మొక్కలు నాటేందుకు సాగునీటి, రెవెన్యూ అధికారులతో కలసి పనిచేయాలని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులను ఆదేశించారు. హరితహారంతో చెరువులకు నేచురల్ ఫెన్సింగ్ వేసేలా మొక్కలను నాటాలన్నారు. పట్టణాల్లోని శ్మశానవాటికల్లో మొక్కలు, డంప్యార్డుల్లో సువాసనలు వెదజల్లే మొక్కలు నాటాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు వంద పారిశ్రామికవాడల్లో హరితహారం అమలుపై ప్రత్యేకంగా చర్చించారు. కనీసం 30 శాతానికిపైగా పచ్చదనం ఉండాలన్న నిబంధన మేరకు ఆయా కంపెనీలు మొక్కలు నాటేలా చూడాలని, ఈ విషయంలో టీఎస్ఐఐసీ పూర్తి బాధ్యత తీసుకోవాలని ఎండీ వెంకటనర్సింహారెడ్డికి సూచించారు. సమావేశంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, సీడీఎంఏ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఫారెస్ట్, టీఎస్ఐఐసీ అధికారులు పాల్గొన్నారు. -
హరితహారానికి సన్నాహాలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల్లో హరితహారం ఒకటి. మూడేళ్లుగా ప్రభుత్వం రాష్ట్ర మంతటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఉమ్మడి జిల్లాలో మూడేళ్లుగా సుమారు 6 కోట్ల మొక్కలు నాటినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా నాలుగోవిడత హరితహారం లక్ష్యం ప్రభుత్వం విడుదల చేసింది. గతంలో కంటే ఎక్కువ మొక్కలు నాటాలని అటవీ, డ్వామా అధికారులను ఆదేశించింది. ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో 4.87 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించింది మిర్యాలగూడ రూరల్ : ఉమ్మడి జిల్లాలో 70 మండలాలు 1,159 పాత పంచాయతీలు ఉన్నాయి. గతంలో ప్రతి పంచాయతీకి 30 వేల మొక్కలు నాటించిన అధికారులు ఈ సంవత్సరం మాత్రం తప్పని సరిగా 40 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించింది. మూడవ విడత హరితహారం ముగిసిన వెంటనే, నాల్గవ విడత హరితహారానికి ప్రతి పాదనలు పంపాలని ,రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లా స్థాయి అధికారులను కోరారు. కాగా జిల్లా అధికారులు 2కోట్ల మొక్కలు నాటడానికే ప్రతిపాదనలు పంపారు. యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల పరిధిలో అటవీవిస్తీర్ణం పెంచేదులు విరివిరిగా మొక్కలు నాటాలని ఉన్నతాధికారులు సూచించారు. ఐదుకోట్ల మొక్కలు నాటేలా లక్ష్యం నిర్దేశించుకోవాలని వారు సూచించారు.పంచాయతీల వారీగా లక్ష్యం నిర్దేశించడంతో ఉమ్మడి జిల్లాలో లక్ష్యం మారి 4.87 కోట్లకు చేరుకుంది. గత ఏడాది అక్టోబర్ నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేట జిల్లాలో పర్యటించి ఇంటికి ఆరుమొక్కలు నాటి పెంచాలని ప్రజలను కోరారు. కాగా అందుకు అనుగునంగా ఉద్యాన వన శాఖ అధికారులు తమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే నర్సరీల్లో పండ్ల , పూల మొక్కలు పెంచుతున్నట్లు చెబుతున్నారు. శాఖల వారీగా నర్సరీల సాగు ప్రభుత్వం నిర్దేశించిన మొక్కలు పెంచేందుకు శాఖల వారీగా అటవీ, డ్వామా, ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నారు. ఒక్కొక్క నర్సరీలో లక్ష మొక్కలు సాగు చేసే లక్ష్యంతో నర్సరీలు నిర్వహిస్తున్నారు. నల్లగొండ జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో 159 నర్సరీల్లో 1కోటి 59 లక్షల మొక్కల పెంపకం ప్రారంభించారు.ఆలటవీశాఖ ,డ్వామా ద్వారా నిర్వహించే నర్సరీల్లో టేకు మొక్కలు సాగుచేయాలని అధికారులు నిర్ణయం తీసుకుని ఆదిశగా పనిచేస్తున్నారు. అదే విధంగా సూర్యాపేట జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో 59 నర్సరీల్లో 59 లక్షల మొక్కలు, డీఆర్డీఏ ఆధ్వర్యంలో 40 నర్సరీల్లో 40 లక్షల మొక్కలు, ఉద్యాన వన శాఖ ఆధ్వర్యంలో 8నర్సరీల్లో పండ్ల ,పూల మొక్కలు 8 లక్షల మొక్కలు పెంచుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అటవీశాఖ, డ్వామా ఆధ్వర్యంలో 90 నర్సరీల్లో 90లక్షల మొక్కలు పెంచాలని నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నారు. సూర్యాపేట జిల్లాలో ఇంటింటికీ ఆరు మొక్కలు అందించాలన్న లక్ష్యంతో„ý 10 లక్షల మొక్కలు ప్రత్యేకంగా సాగు చేస్తున్నారు. ఇంటి ఆవరణలో పూల, పండ్ల మొక్కలు కాగా ఇంటి ఆవరణలో ఆసక్తిగా పెంచుకొనేందుకు కావలసిన పండ్ల, పూల మొక్కలు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక నర్సరీలు సాగుచేస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో నాటేందుకు వేప, కానుగ. మర్రి, ఉసిరి,నేరేడు, చింత మొక్కలను పెంచుతున్నారు. నర్సరీలకు ఎండదెబ్బ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో సాగవుతున్న నర్సరీలకు ఎండ దెబ్బ ఇబ్బంది పెడుతోంది. నర్సరీల్లో సాగు చేసిన మొక్కలు లేతవి కావడంతో సూర్య ప్రతాపం వల్ల వడబారి పోతున్నాయి. కొన్ని మొక్కలు వాటిపోయి ఎండిపోదున్నాయి. నాటిన ప్రతి మొక్కా బతికేలా చూడాలి హరితహారంలో నాటిన ప్రతి మొక్క బతికేలా చూడాలి. లేక పోతే ఎన్ని సంవత్సరాలు, ఎన్ని కోట్ల మొక్కలు నాటిన ప్రయోజనం శూన్యం. ప్రభుత్వం రెండు సంవత్సరాల మొక్క పెరిగే వరకు ప్రత్యేక రక్షణ కల్పించాలి. ప్రజలను, అధికారులను బాధ్యులు చేయాలి –పోలాగాని వెంకటేష్, రాయినిపాలెం