Heat winds
-
ఏపీకి వడగాడ్పుల వార్నింగ్ బెల్
సాక్షి, విశాఖపట్నం: మునుపెన్నడూ లేనివిధంగా నెలరోజుల ముందుగానే రాష్ట్రంలో వడగాడ్పులు వార్నింగ్ బెల్ మోగిస్తున్నాయి. తొలుత ఇవి రాయలసీమతోనే మొదలుకానున్నాయి. దీని ఫలితంగా ఏప్రిల్ ఆఖరి నాటి ఉష్ణోగ్రతలు ఆరంభంలోనే నమోదు కానున్నాయి. సాధారణంగా మార్చి ఆఖరు, ఏప్రిల్ మొదటి వారం వరకు రాష్ట్రంలో సాధారణంగా పగటి ఉష్ణోగ్రతలు 34–39 డిగ్రీలకు మించవు. కానీ, రాష్ట్రంలో పలుచోట్ల అప్పుడే 38–42 డిగ్రీల మధ్య రికార్డవుతున్నాయి. అంటే.. ఇవి సాధారణంకంటే 3–4 డిగ్రీలు అధికం. ఈ నేపథ్యంలో.. సోమవారం నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింతగా తీవ్రం కానున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో వీటి తీవ్రత అధికంగా ఉండనుంది. రానున్న నాలుగు రోజులు వైఎస్సార్, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40–43 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం నాటి బులెటిన్‌లో వెల్లడించింది. అలాగే, ఉత్తరాంధ్రలోని పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోనూ 40–44 డిగ్రీలకు చేరుకోవచ్చని తెలిపింది. వీటి ఫలితంగా ఆయా జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని, ఆ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇంకా పల్నాడు జిల్లాలో 40–42, ప్రకాశం, శ్రీకాకుళం, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో 40–41 డిగ్రీల చొప్పున రికార్డయ్యే అవకాశం ఉంది. ఇక దక్షిణ, ఉత్తర కోస్తాంధ్రల్లో ఉష్ణతాపం, తేమతో కూడిన అసౌకర్య వాతావరణం ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఉత్తర, కోస్తాంధ్రలో.. మరోవైపు.. వడగాడ్పుల ప్రభావం ఆదివారం నుంచే మొదలైంది. రాష్ట్రంలో అత్యధికంగా నంద్యాల, అనంతపురం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇంకా కర్నూలు, కడప, తూర్పు గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో 41, నందిగామ, జంగమహేశ్వరపురం, విజయనగరం, ఏలూరు, పల్నాడు జిల్లాల్లో కొన్నిచోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రానున్న రోజుల్లో ఇవి మరింతగా పెరుగుతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆదివారం తెలిపింది. -
నిప్పుల కొలిమి.. తీవ్రమైన వేడి ప్రాంతంగా రాష్ట్రంలోని ఆ జిల్లాలు
సాక్షి, అమరావతి: భానుడి విశ్వరూపంతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం అన్ని జిల్లాల్లోనూ (శ్రీ సత్యసాయి మినహా) ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయాయి. దక్షిణ కోస్తా జిల్లాల్లో అయితే ఎండ మండిపోయింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లోని అన్ని మండలాల్లో 42 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవడాన్ని బట్టి అక్కడ ఎండ తీవ్రతను అంచనా వేయవచ్చు. మన్యం ప్రాంతంలోనూ ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల వరకు నమోదయ్యాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు ఇక్కడే శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురంలో అత్యధికంగా 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత ప్రకాశం జిల్లా పచ్చవలో 46.2, కృష్ణా జిల్లా కొండూరులో 46, గుంటూరు జిల్లా పొన్నూరులో 45.9, పల్నాడు జిల్లా రావిపాడులో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2021, 22 సంవత్సరాల్లో వేసవి ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో 46 డిగ్రీలు దాటలేదు. 45 డిగ్రీలకు చేరుకున్నా అది కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. కానీ ఈ సంవత్సరం 46 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవగా, మెజారిటీ ప్రాంతాల్లో 42 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదైంది. వచ్చే రెండు రోజులు మరింత తీవ్రం వచ్చే రెండు రోజులు ఎండలు మరింత తీవ్రం కానున్నాయి. కోస్తా జిల్లాల్లో తీవ్రమైన హీట్ వేవ్ ఉంటుందని ఇప్పటికే భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. మంగళవారం 9 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 194 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల, కొల్లిపర, మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి, తాడికొండ, తుళ్లూరు మండలాలు, కృష్ణా జిల్లా పెనమలూరు మండలం, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో తీవ్రవడగాల్పులు ఉండే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణిలు, బాలింతలు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎండబారిన పడకుండా చూసుకోవాలన్నారు. ఎక్కువగా నీరు తాగాలి ఈ ఉష్ణోగ్రతల ప్రభావంతో శరీరంలో నీటిశాతం తగ్గిపోయి హెపటైటిస్–బి వచ్చే ప్రమాదం ఉంది. ఎండలో పనిచేసే వారు ఎక్కువగా నీటితో పాటు పళ్లరసాలు, బార్లీ, మజ్జిగ వంటివి తీసుకోవాలి. ఎండలో పనిచేసేవారిలో విపరీతమైన నీరసం, తలనొప్పి, పిక్కలు పట్టేయడం, తల విసిరేయడం వంటి లక్షణాల్లో ఏ ఒక్కటి ఉన్నా డీహైడ్రేషన్‌కు గురైనట్లు గుర్తించాలి. వారు నీడలోకి చేరి నీరు ఎక్కువగా తీసుకుని సేదతీరాలి. కళ్లకు ఇబ్బందులు రాకుండా నల్ల కళ్లద్దాలు వాడాలి. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటలు వరకు ప్రయాణాలు చేయకూడదు. – డాక్టర్ వడ్డాది సురేష్, ఎండీ, రాజమహేంద్రవరం. వడదెబ్బకు ప్రకాశంలో నలుగురు మృతి ఒంగోలు: ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బకు గురై సోమవారం ప్రకాశం జిల్లాలో నలుగురు మృతిచెందారు. జరుగుమల్లి మండలం కె.బిట్రగుంటకు చెందిన సాబినేని సుబ్బమ్మ (56), పాపిశెట్టి సూరిబాబు(57), పొందూరి సుబ్బరామిరెడ్డి (68), సింగరాయకొండ మండలం పాతసింగరాయకొండ పంచాయతీకి చెందిన కొట్టే పేరమ్మ(65) వడదెబ్బకు గురై మరణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయం నుంచే ఎండ తీవ్రత.. ఉదయం 6 గంటలకే మొదలవుతున్న ఎండ వేడి సాయంత్రం 6 గంటలు దాటినా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకే ఉష్ణోగ్రతలు 28 నుంచి 30 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. మధ్యాహ్నం 12 గంటల సమయానికి 40 డిగ్రీలు, 2, 3 గంటల సమయానికి 44 నుంచి 46 డిగ్రీలకు పెరుగుతోంది. రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం 30 నుంచి 36 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. -
ఏపీలో గ్రీష్మతాపం.. హీట్‌వేవ్స్ ప్రతాపం.. ఎందుకిలా!?
ఆంధ్రప్రదేశ్ హీటెక్కిపోతోంది. వేసవిలో వడగాడ్పుల రోజుల సంఖ్య పెరుగుతోంది. దేశంలోకెల్లా ఎక్కువ రోజులు వడగాడ్పులు వీచే రాష్ట్రంగా రాజస్థాన్ నిలుస్తుండగా.. రెండో స్థానంలో ఒడిశా ఉండేది. దశాబ్దకాలంగా పరిస్థితిలో మార్పు వచ్చింది. ఒడిశాను పక్కకు నెట్టేసి ఆ స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ ఆక్రమించింది. దక్షిణ భారతదేశంలో ఏపీ మొదటి స్థానంలో నిలుస్తోంది. సాక్షి, విశాఖపట్నం: పదేళ్లుగా రాష్ట్రంలో వేసవి గరిష్ట ఉష్ణోగ్రతల పెరుగుదల కొనసాగుతోంది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. అంతేకాదు.. వడగాడ్పులు కొనసాగే రోజులూ అధికమవుతున్నాయి. 2011–2021 సంవత్సరాల మధ్య వేసవి ఉష్ణోగ్రతల గణాంకాలను బట్టి రాజస్థాన్ తర్వాత అత్యధిక హీట్‌వేవ్స్ రోజులు ఆంధ్రప్రదేశ్‌లోనే రికార్డవుతున్నాయని కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూవిజ్ఞాన శాస్త్ర శాఖ మంత్రి జితేంద్రసింగ్ ఇటీవల రాజ్యసభలో వెల్లడించారు. గడచిన దశాబ్ద కాలంలో నడి వేసవి కాలంలో రాజస్థాన్‌లో 119, ఆంధ్రప్రదేశ్‌లో 106, ఒడిశాలో 103 వడగాడ్పుల రోజులు నమోదయ్యాయి. ఈ దశాబ్దంలోని ఆరేళ్లలో సగటున ఏడాదికి పది కంటే ఎక్కువ హీట్‌వేవ్స్ రోజులు నమోదైన ఏకైక రాష్ట్రంగా కూడా ఆంధ్రప్రదేశ్ రికార్డులకెక్కింది. ఈ దశాబ్దంలో పొరుగున ఉన్న తెలంగాణాలో 69, తమిళనాడులో 56 వడగాడ్పుల రోజులు నమోదయ్యాయి. వేసవిలో సాధారణ ఉష్ణోగ్రతలకంటే 4.5 డిగ్రీలకు మించి అధికంగా రికార్డయితే వడగాడ్పులు వీస్తాయి. రాష్ట్రంలో 40 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదైతే వేసవి తాపం ప్రభావం మొదలవుతుంది. అలా అవి పెరిగే కొద్దీ వడగాడ్పుల తీవ్రత కూడా పెరుగుతుంది. మరోవైపు 2014–17 మధ్య రాష్ట్రంలో వడదెబ్బకు 2,776 మంది మృత్యువాతపడ్డారు. కాకినాడ, కళింగపట్నాల్లో భిన్నంగా.. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర, రాయలసీమ పరిధిలో 8 వాతావరణ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో 6 స్టేషన్లలో వేసవి సీజన్లో హీట్‌వేవ్ సరళి పెరుగుదల నమోదైంది. కానీ.. కాకినాడ, కళింగపట్నం స్టేషన్లలో మాత్రం అందుకు భిన్నంగా హీట్‌వేవ్ రోజులు తగ్గుతున్నట్టు గుర్తించారు. 1961 నుంచి 2021 సంవత్సరాల మధ్య వేసవిలో (ఏప్రిల్, మే, జూన్ నెలల్లో) నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలను బట్టి ఈ నిర్ధారణకు వచ్చారు. మరోవైపు అనంతపురం, వైఎస్సార్, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, మచిలీపట్నం, విశాఖపట్నం ప్రాంతాలలో హీట్‌వేవ్ ట్రెండ్ పెరుగుతున్నట్టు తేల్చారు. ప్రకాశం జిల్లా వెలిగండ్లలో 2016 మే రెండో తేదీన 48.6 (49) డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయినట్టు రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళికల సంస్థ పేర్కొంది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కావడం విశేషం. దేశవ్యాప్తంగా 103 వాతావరణ స్టేష్టన్లలో వేసవి తాపం, వడగాడ్పుల తీవ్రతపై సమీక్షించగా కేవలం 20 స్టేషన్ల పరిధిలోనే హీట్‌వేవ్ తగ్గుదల నమోదవుతున్నట్టు నిర్ధారించారు. వేసవిలో వడగాలులు (హీట్‌వేవ్స్) రాజస్థాన్ నుంచి తెలంగాణ మీదుగా రాష్ట్రంపైకి వీస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో 974 కిలోమీటర్ల మేర తీరప్రాంతం విస్తరించి ఉంది. వేసవిలో మధ్యాహ్నం తర్వాత సముద్రం నుంచి గాలులు వీస్తుంటాయి. అవి ఉష్ణతాపాన్ని తగ్గిస్తాయి. కానీ.. కొన్నేళ్లుగా ఈ గాలులు సక్రమంగా వీయకపోవడం, ఆలస్యంగా వీయడం వంటివి జరుగుతున్నాయి. ఫలితంగా ఉష్ణ తీవ్రత పెరిగి వడగాడ్పుల ఉధృతిని, ఉక్కపోత తీవ్రతను పెంచుతున్నాయని భారత వాతావరణ విభాగం రిటైర్డ్ అధికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’తో చెప్పారు. అదే సమయంలో ఏప్రిల్‌కు కొద్దిరోజుల ముందు నుంచే వేసవి ఛాయలు మొదలవడం, నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించడం వంటివి రాష్ట్రంలో హీట్‌వేవ్స్ రోజులు పెరగడానికి దోహదపడుతున్నాయని వివరించారు. -
కాస్త... ఉపశమనం
సాక్షి, విశాఖపట్నం: కొన్ని రోజులుగా ఎండలు, వడగాలులతో ఉక్కిరిబిక్కిరయిన రాష్ట్రం.. శనివారం కాస్త చల్లబడింది. ఇన్నాళ్లూ 45 డిగ్రీలకు పైగా నమోదైన ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రానున్న 3 రోజుల పాటు సముద్ర గాలులు బలంగా వీయడం వల్ల.. వడగాలుల తీవ్రత తగ్గుముఖం పడుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు దక్షిణ కోస్తా నుంచి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర వైపు గాలులు విస్తరిస్తుండగా.. మధ్య భారత దేశం నుంచి గాలులు వీస్తూ.. ఉత్తరాంధ్ర కొండల ప్రాంతాల్లో కలవడం వల్ల.. అక్కడక్కడా అకాల వర్షాలు కురిశాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లో శనివారం ఉరుములతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. రానున్న రెండు రోజుల పాటు ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కురుస్తాయనీ, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలిక పాటి వానలు పడతాయని నిపుణులు చెబుతున్నారు. రాయలసీమలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురిసే సూచనలున్నాయని పేర్కొన్నారు. మరోవైపు పశ్చిమ గాలుల కారణంగా.. రాయలసీమలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలున్నాయని నిపుణులు తెలిపారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఏప్రిల్ 14 తర్వాత ప్రీ మాన్సూన్ సీజన్ ప్రారంభమై.. రాష్ట్రంలో తేలికపాటి వానలు కురుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఏపీ తీరంలో ఉపరితల ఆవర్తనం.. ఉత్తర అండమాన్‌లో వాయుగుండం మయన్మార్ తీరంవైపు కదులుతూ క్రమంగా తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ తీరం, పరిసర ప్రాంతాల్లో 2.1 కిమీ ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు, రేపు ఉత్తర కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గడచిన 24 గంటల్లో.. తిరుపతిలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా కర్నూలులో 41.2, కడపలో 40.6, అనంతపురంలో 40.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో.. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పాలవలసలో సూరిబాబు(45) అనే వ్యక్తి పిడుగుపాటుకు గురై మృతి చెందారు. -
ఠారెత్తించిన ఎండలు
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: రాష్ట్రంలో శుక్రవారం కూడా ఎండలు ఠారెత్తించాయి. వడగాలులు కూడా తోడవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. అత్యధికంగా ప్రకాశం జిల్లా కందుకూరులో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సముద్రంపై నుంచి తేమగాలుల రావడంతో వడగాడ్పుల తీవ్రత తగ్గి రాబోయే రెండ్రోజుల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. -
సెగలు పుట్టిస్తున్న ఎండ
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతిబ్యూరో: రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరిగి ప్రజలను ఠారెత్తిస్తోంది. ఈ సీజన్లో బుధవారం తొలిసారి 45.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. దీనికి వడగాలులు తోడవడంతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మార్చి నెలలోనే ఈ స్థాయి ఉష్ణోగ్రత, వడగాలులతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రాష్ట్రంలోని 670 మండలాలకుగాను 110 మండలాల్లో బుధవారం ఎక్కువ ఉష్ణోగ్రత, తీవ్రమైన వడగాలులు వీచాయి. మరో 207 మండలాల్లో ఎండ, వడగాడ్పుల ప్రభావం కనిపించింది. ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో 15 మండలాలు, విజయనగరం జిల్లాలో 14, విశాఖలో 18, తూర్పుగోదావరిలో 13, కృష్ణాలో 11, గుంటూరు జిల్లాలో 15, ప్రకాశంలో 10 మండలాల్లో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదై తీవ్రమైన వడగాలులు వీచాయి. ఎండల తీవ్రత దృష్ట్యా విపత్తుల నిర్వహణ శాఖ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేసింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వడగాలుల బారిన పడకుండా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు సూచించారు. 68 ఏళ్ల తర్వాత బెజవాడలో రికార్డు ఉష్ణోగ్రత బెజవాడలో భానుడు రికార్డు సృష్టించాడు. 68 ఏళ్ల రికార్డును తిరగరాశాడు. బుధవారం ఇక్కడ 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత మార్చిలో ఇంతలా అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే తొలిసారి. 1953 మార్చి 29న విజయవాడలో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. మార్చిలో ఇప్పటివరకు ఇదే ఆల్‌టైం రికార్డుగా భారత వాతావరణ విభాగం గుర్తించింది. బుధవారం నమోదైన 43 డిగ్రీల ఉష్ణోగ్రత సాధారణం కంటే ఆరు డిగ్రీలు అధికం. తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రంలో తుపాను ప్రభావంతో ఏర్పడిన అల్ప పీడనంతో వాతావరణంలో పలు మార్పులు చోటుచేసుకోనున్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. రాబోయే 24 గంటల్లో ఉత్తర అండమాన్ సముద్రం, పరిసరాలపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ కారణంగా అండమాన్ నికోబార్ దీవులు, ఆగ్నేయ బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాల్లో అక్కడక్కడ బుధ, గురువారాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో మంగళవారం సాధారణం కంటే 5.1 డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. రానున్న రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 2, 3, 5 తేదీల్లో కోస్తాంధ్ర, యానాంలలో ఉరుములతో కూడిన వర్షాలు, 30, 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. వాతావరణ శాఖ హెచర్చికలు, వివరాలు, ఈదురుగాలుల వివరాలు తెలుసుకోవడానికి మౌసమి, మేఘదూత్, దామిని యాప్‌లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఐఎండీ సూచించింది. 4 వరకు ఇదే పరిస్థితి.. రాబోయే రోజుల్లో రాష్ట్రంపై వడగాలుల తీవ్రత పెరగనుంది. ఉత్తర భారతదేశం నుంచి వేడి గాలులు రాష్ట్రం వైపుగా వీస్తున్నాయి. ఇదే సమయంలో సూర్యుడు భూ మధ్య రేఖని దాటి.. భారత్‌పై ఉంటున్న సమయంలో ఈ గాలులు వీస్తుండటం వల్ల పొడి వాతావరణం ఏర్పడి వడగాలుల తీవ్రత పెరుగుతూ వస్తోందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. ఈ తీవ్రత ఏప్రిల్ 4 వరకు కొనసాగుతుందని తెలిపారు. ముఖ్యంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో వడగాలుల తీవ్రత విపరీతంగా ఉంటుందని వెల్లడించారు. ఈ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే 5 నుంచి 6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. -
Summer 2021: 'ఎండ' ప్రచండం
రాష్ట్రంపై భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులతో నిప్పుల వాన కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం 111 మండలాల్లో, రానున్న 48 గంటల్లో 12 మండలాల్లో వడగాడ్పులు సెగలు పుట్టించనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అప్రమత్తం చేస్తోంది. సాక్షి, విశాఖపట్నం: భానుడి భగభగలతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మార్చి నెలాఖరు నుంచే వేసవి సెగ పుట్టిస్తోంది. మే నెలలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఇప్పటి నుంచే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓవైపు తేమ గాలులు, మరోవైపు ఆగ్నేయ, దక్షిణ గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాబోయే 48 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంపై అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయి. ఇది తదుపరి 24 గంటల్లో ఉత్తర అండమాన్ దాని పరిసర ప్రాంతాల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ కారణంగా.. మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో సూర్యుడు నిప్పుల వాన కురిపించనున్నాడని పేర్కొంది. మంగళవారం అనేక మండలాల్లో సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీలు, రేపు (బుధవారం) సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని హెచ్చరించింది. మంగళవారం రాష్ట్రంలోని 111 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని వెల్లడించింది. రాగల 48 గంటల్లో 12 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 80 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని హెచ్చరించింది. సోమవారం మొత్తం 42 మండలాల్లో వడగాడ్పులు వీచాయని అధికారులు వివరించారు. 31న తీవ్ర వడగాడ్పుల ప్రభావం ఉండే మండలాలు.. గరుగుబిల్లి (విజయనగరం), కొయ్యూరు (విశాఖపట్నం), గొలుగొండ (విశాఖపట్నం), అడ్డతీగల (తూర్పుగోదావరి), రాజవొమ్మంగి (తూ.గో), నెల్లిపాక (తూ.గో), కూనవరం (తూ.గో), చింతూరు (తూ.గో), వేలేరుపాడు (ప.గో), కంచికచర్ల (కృష్ణా), వీరులపాడు (కృష్ణా), ఇబ్రహీంపట్నం (కృష్ణా). -
ఇక వడ దడ!
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో వడగాడ్పులు దడ పుట్టించనున్నాయి. వీటి ప్రభావం శనివారం నుంచే మొదలు కానున్నప్పటికీ ఆదివారం నుంచి మరింత ఉధృతరూపం దాల్చనున్నాయి. మొత్తం 670 మండలాలకు గాను శనివారం వివిధ జిల్లాల్లోని 94 మండలాలు, ఆదివారం 102 మండలాల్లోను వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ శుక్రవారం వెల్లడించింది. విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో వడగాడ్పుల ప్రభావం ఉండనుంది. అదే సమయంలో విజయనగరం, విశాఖపట్నం, ఆయా ప్రాంతాల్లో సాధారణం కంటే 4–6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. ప్రధానంగా తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో 36 మండలాలు, విజయనగరం జిల్లాలో 34, పశ్చిమ గోదావరిలో 32, కృష్ణాలో 30, విశాఖపట్నంలో 22, శ్రీకాకుళంలో 20కి పైగా మండలాల్లో 40 డిగ్రీలకు మించి పగటి ఉష్ణోగ్రతలు రికార్డు కానున్నట్టు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వాయవ్య దిశ నుంచి వీస్తున్న గాలులే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్ 1నుంచి ఉష్ణోగ్రతల పెరుగుదల మరింత అధికమవుతుందని, వడగాడ్పుల ప్రభావమూ పెరుగుతుందని చెబుతున్నారు. -
నేటి నుంచి వడగాడ్పులు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల్లోని 15 మండలాల్లో మంగళవారం నుంచి వడగాడ్పులు ఉంటాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. విశాఖలో సోమవారం 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణంలో తేమశాతం ఎక్కువగా ఉండడం వల్ల ఎండలు మండుతున్నాయని, వేడిగాలులు ఉంటాయని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు. కొద్దిరోజులు ఇలాగే ఉంటుందని, ప్రస్తుతం గాలులు ఉత్తర దిశ నుంచి వీస్తున్నాయని తెలిపారు. సాధారణం కంటే 2 డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. రాయలసీమలో ఎండలు మరింత పెరిగే సూచనలున్నాయని అధికారులు తెలిపారు. -
మార్చిలోనే మంటలు!
సాక్షి, అమరావతి బ్యూరో: ఈ వేసవి అధిక ఉష్ణతాపాన్ని వెదజల్లనుంది. అంతేకాదు ఈ ఏడాది ముందుగానే భానుడి భగభగలతో ఎండల తీవ్రత పెరగనుంది. తీవ్ర వడగాడ్పులకూ అవకాశం ఉంది. ఇదే విషయాన్ని భారత వాతావరణ విభాగం (ఐఎండీ), వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మారిన వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణమని చెబుతున్నారు. సాధారణంగా ఏప్రిల్ నుంచి వేసవి సెగలు మొదలవుతాయి. ఈసారి మార్చి ఆరంభం నుంచే ఎండలు మండుతున్నాయి. ఫిబ్రవరి ఆఖరు నుంచే రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువలో నమోదవుతున్నాయి. ఇవి మున్ముందు మరింత ఉధృతం కానున్నాయి. మార్చి నుంచి మే వరకు కొంకణ్, గోవాలతో పాటు కోస్తాంధ్రలో వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐఎండీ తాజా నివేదికలో వెల్లడించింది. కోస్తాంధ్రలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. పొరుగున ఉన్న చత్తీస్‌గఢ్, ఒడిశాలో ఉష్ణతాపం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో దాని ప్రభావం కోస్తాంధ్రలోనూ అధికంగా ఉండనుంది. ఈ వేసవి ఎందుకిలా..? ఏటా ఉత్తర భారత దేశంలో మార్చి ఆఖరి వరకు పశ్చిమ ఆటంకాలు (వెస్టర్న్ డిస్టర్బెన్స్) చురుగ్గా ఉంటూ ప్రభావం చూపుతాయి. దీంతో ఆకాశంలో మేఘాలేర్పడి ఉష్ణతీవ్రతను తగ్గిస్తాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అవి చురుకుదనాన్ని తగ్గించుకున్నాయి. ఫలితంగా ఆకాశంలో మేఘాలేర్పడకుండా నిర్మలంగా ఉండడం ఉష్ణోగ్రతలు పెరగడానికి దోహదపడుతోంది. మరోవైపు సముద్రం నుంచి నైరుతి, దక్షిణ గాలులు కూడా ప్రస్తుతం రావడం లేదు. ఈ గాలులొస్తే చల్లదనాన్ని మోసుకొస్తాయి. పశ్చిమ ఆటంకాల చురుకుదనం తగ్గడం, సముద్ర గాలులు రాకపోవడంతో ముందుగానే వేసవి తాపం పెరగడానికి కారణమవుతోందని ఐఎండీ రిటైర్డ్ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. ‘వాస్తవానికి మే నుంచి సముద్ర గాలుల రాక తగ్గుతుంది. కానీ ఈ ఏడాది మార్చి ఆరంభం నుంచే చల్లగాలులు నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ వేసవిలో సాధారణం కంటే 2–5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదై వడగాడ్పులు, అక్కడక్కడ తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి’ అని ఆయన వివరించారు. మొదలైన వేసవి తాపం.. ఇప్పటికే రాష్ట్రంలో వేసవి తాపం కనిపిస్తోంది. సాధారణం కంటే 2 నుంచి 3.5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం తునిలో 38 (+3.5), నందిగామ 37 (+1), మచిలీపట్నం 34.4 (+2), కాకినాడ 34 (+1.2), నర్సాపురం 33.6 (+1.3) కళింగపట్నం 33 (+1.4), బాపట్ల (+1), విశాఖపట్నం 32.3 (+2) డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాష్ట్రంలో పలుచోట్ల నాలుగు రోజుల క్రితమే ప్రస్తుత ఉష్ణోగ్రతలకంటే అధికంగా నమోదు కావడం విశేషం. -
కోస్తాలో నిప్పుల ఉప్పెన!
సాక్షి, విశాఖపట్నం/అమరావతి : నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే సమయంలో ఎప్పుడూ లేనంతగా భానుడు మరింత భగభగమంటున్నాడు. ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడగాడ్పులు రాష్ట్రాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. మరో రెండు మూడ్రోజుల పాటు కోస్తాంధ్రలో ఇదే పరిస్థితి ఉంటుంది. సాధారణంకంటే ఐదు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదైతే వడగాడ్పులుగాను, అంతకుమించి రికార్డయితే తీవ్ర వడగాడ్పులు గాను పరిగణిస్తారు. కానీ, కోస్తాంధ్రలో ఇప్పటికే 4–6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమ, మంగళవారాలు అంతకు మించి ఉష్ణోగ్రతలు రికార్డయి తీవ్ర వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి నివేదికలో వెల్లడించింది. దీంతో రానున్న రెండు రోజులు కోస్తాంధ్ర నిప్పుల కుంపటిలా మారనుంది.రాయలసీమలో మాత్రం సాధారణం కంటే 2–4 డిగ్రీలు మాత్రమే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. అదే సమయంలో సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. ఆయా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని సూచించింది. ఒకట్రెండు రోజుల్లో రుతుపవనాలు కాగా, ఒకట్రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించనున్నాయి. దీంతో ఈనెల 18 తర్వాత నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తువరకూ ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంవల్ల మూడు నాలుగు రోజుల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అప్పట్నుంచి రాష్ట్రంలో వర్షాలు ఊపందుకునే అవకాశాలున్నాయి. మరోవైపు.. నైరుతీ రుతుపవనాలు నైరుతీ, వాయవ్య బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలకు మరింతగా విస్తరించినట్లు హైదరాబాద్‌లోని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది. ప్రస్తుతం కర్ణాటకలోని మంగళూరు, మైసూరు, తమిళనాడులోని సేలం, కడలూరు, ఒడిశాలోని గోపాలపురం, సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్ వరకు నైరుతీ రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయి. -
మరో వారం ఒంటిపూట బడులు
సాక్షి అమరావతి: రాష్ట్రంలో పాఠశాలల ఒంటిపూట పనిదినాలు మరో వారం రోజులు పొడిగించారు. వేసవి ఉష్ణోగ్రతల తీవ్రత వల్ల వేడి గాలులు ఇంకా వీస్తుండటంతో ఒంటిపూట బడులను ఈ నెల 22 వరకు పొడిగిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 12 నుంచి పాఠశాలలు తెరిచినప్పటికీ ఎండ తీవ్రత కారణంగా 15వ తేదీ వరకు ఒంటిపూట బడులు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఉష్ణోగ్రతల తీవ్రత ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఒంటిపూట బడులను 22వ తేదీవరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. -
నేడూ భగభగలే..!
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. వర్షాలతో చల్లదనం పంచాల్సిన కాలంలో వడగాడ్పులు విజృంభిస్తూ మరింత మంటెక్కిస్తున్నాయి.. ఇప్పటికే ఉష్ణతాపంతో కోస్తాంధ్ర భగ్గుమంటోంది. సాధారణం కంటే 3నుంచి6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ దడ పుట్టిస్తున్నాయి. ఇదే పరిస్థితి శనివారం కూడా కొనసాగుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం రాత్రి నివేదికలో తెలిపింది. కోస్తాంధ్ర అంతటా శనివారం వడగాడ్పులు వీస్తాయని, రాయలసీమలో సాధారణంకంటే 2నుంచి4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని పేర్కొంది. అలాగే శనివారం నుంచి నాలుగు రోజులపాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు గానీ, వర్షం గానీ కురుస్తుందని వివరించింది. అదే సమయంలో దక్షిణ కోస్తాంధ్రలో గంటకు 30నుంచి40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, వర్షంతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా శుక్రవారం రాష్ట్రంలో పలుచోట్ల వడగాడ్పులు వీచాయి. -
నేడు దక్షిణ కోస్తాలో వడగాడ్పులు!
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వడగాడ్పులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఇప్పటికే పలుచోట్ల సాధారణం కంటే 4–6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం కూడా ఈ వడగాడ్పులు ప్రభావం చూపనున్నాయి. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో వీటి తీవ్రత అధికంగా ఉండనుంది. మరోపక్క పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మంగళవారం ఈశాన్య బంగాళాఖాతంలోకి మళ్లింది. ఇది సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు కోస్తాంధ్రలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు గాని, వర్షాలు గాని కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం రాత్రి తన నివేదికలో తెలిపింది. అదే సమయంలో కోస్తాంధ్రలో అక్కడక్కడ గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, కొన్ని చోట్ల పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నెల 14 నుంచి రాయలసీమలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని, పిడుగులకు ఆస్కారం ఉందని తెలిపింది. -
వానలు.. వడగాడ్పులు!
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, గుంటూరు/నిమ్మనపల్లె(చిత్తూరు జిల్లా): రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఒక పక్క ఎండలు, వడగాడ్పులు, మరోపక్క పిడుగులు, వానలు.. వీటికి ఈదురు గాలులు తోడవుతున్నాయి. వీటి ధాటికి ఇటు కోస్తాంధ్ర, అటు రాయలసీమ ప్రజలు భయాందోళనలకు లోనవుతున్నారు. ఏకధాటిగా ఎండలు కాస్తూ ఉష్ణతాపాన్ని వెదజల్లుతుండగా అనూహ్యంగా ఆకాశంలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడుతున్నాయి. ఆ వెనువెంటనే ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. కాసేపటికే ఈ మేఘాలు మాయమై మామూలు వాతావరణం నెలకొంటోంది. రుతుపవనాలకు ముందు ఇలాంటి పరిస్థితులు (ప్రీమాన్సూన్ థండర్ స్టార్మ్) సాధారణమేనని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా–దక్షిణ ఒడిశాలకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్రమట్టానికి 3.6 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది. దీని ప్రభావంతో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు మంగళవారం కోస్తాంధ్రలో వాతావరణం సాధారణంగాను, రాయలసీమలో సాధారణం కంటే 2–4 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగాను నమోదవుతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి నివేదికలో తెలిపింది. బుధవారం నుంచి కోస్తాంధ్రలో వడగాడ్పులు వీస్తాయని వెల్లడించింది. అదే సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని ఐఎండీ వివరించింది. అందువల్ల ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గడచిన 24 గంటల్లో రామగిరిలో 7, కంబదూరులో 6, చెన్నేకొత్తపల్లి, కనుర్పి, పెనుకొండ, కనేకల్, కురుపాంలలో 5, పాడేరు, రోళ్ల, ఆత్మకూరు, రోళ్ల, మడకసిరల్లో 4, ఇచ్ఛాపురం, ఓబులదేవరచెరువు, శాంతిపురం, అమరాపురం, హిందూపురం, ఓరుమామిళ్ల, ఆమడగూరు, ఆలూరుల్లో 3 సెం.మీల వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లాలో భారీ వర్షం గుంటూరు జిల్లాలోని పొన్నూరు, చేబ్రోలు, వేమూరు, రేపల్లె, తెనాలి, కొల్లూరు, నిజాంపట్నం, చెరుకుపల్లి, నగరం, కొల్లిపర, భట్టిప్రోలు, అమృతలూరు, కర్లపాలెం సహా పలు మండలాల్లో సోమవారం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. పొన్నూరు, చేబ్రోలు సహా పలు మండలాల్లో మామిడి, అరటి, దొండ, కాకరకాయ తోటలు దెబ్బతిన్నాయి. గుంటూరు నగరం, చిలకలూరిపేట, బాపట్ల సహా పలు పట్టణాల్లో సైతం ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిశాయి. పిడుగుపడి 45 గొర్రెల మృతి పిడుగుపడి 45 గొర్రెలు మృతి చెంది.. నాలుగు లక్షల రూపాయల దాకా ఆస్తినష్టం జరిగిన ఘటన చిత్తూరు జిల్లా పూలవాండ్లపల్లెలో జరిగింది. బాధిత దంపతులు వెంకటరమణ, కాంతమ్మ కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. అదే సమయంలో 45 గొర్రెలున్న మందపై పిడుగు పడడంతో అవన్నీ అక్కడికక్కడే ప్రాణాలొదిలాయి. వాటి విలువ సుమారు నాలుగు లక్షల రూపాయల దాకా ఉంటుంది. గొర్రెల మృతితో జీవనాధారం కోల్పోయామని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరున్నారు. -
వడగాడ్పులు.. పిడుగుల వానలు!
సాక్షి, విశాఖపట్నం/తాడేపల్లి: రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకపక్క ఉష్ణతీవ్రతతో వడగాడ్పులు కొనసాగుతుండగా మరోపక్క పిడుగులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. సాధారణంకంటే 3–5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల వడగాడ్పులు ప్రభావం మరో మూడు రోజుల పాటు కొనసాగుతాయని ఐఎండీ సోమవారం రాత్రి నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో సోమవారం వడగాడ్పులకు 8 మంది మృతి చెందారు. గుంటూరు జిల్లాలో ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. రాయలసీమ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు తమిళనాడు మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో రానున్న మూడు రోజులు కోస్తాంధ్రలో, రెండు రోజులు రాయలసీమలో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని, కొన్నిచోట్ల పిడుగులు పడతాయని ఐఎండీ హెచ్చరించింది. గడచిన 24 గంటల్లో ఆళ్లగడ్డ, గుత్తిలో 5, వింజమూరు, అర్థవీడు, జియ్యమ్మవలస, మార్కాపురం, కోయిలకుంట్ల, రాయదుర్గం, పమిడిల్లో 3 సెం.మీ వర్షపాతం నమోదైంది. సోమవారం రాత్రి విశాఖలో ఉరుములు, పిడుగులతో వర్షం కురిసింది. రానున్న 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇలా.. - మే 28న ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 46 నుంచి 48 డిగ్రీలు, శ్రీకాకుళం, ప్రకాశం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో 44 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నివారణ సంస్థ తెలిపింది. - మే 29న విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో 46 నుంచి 47 డిగ్రీల వరకు, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో 44 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి. - మే 30న ఉభయగోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు, శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 43 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. - మే 31వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 43 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతల నమోదుకు అవకాశం ఉంది. జూన్ ఒకటిన.. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 44 నుంచి 45 డిగ్రీల వరకు, విశాఖ, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంత జిల్లాల్లో 42 నుంచి 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. -
రామగుండం అగ్నిగుండం!
సాక్షి, హైదరాబాద్: ఉత్తర వాయువ్య దిశ నుంచి వడగాడ్పులు వీస్తుండటంతో తెలంగాణ, ఏపీలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మే 4 నుంచి తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, జూన్ రెండో వారం వరకు ఇదే రకమైన పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. జూన్ రెండో వారంలో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశంతో వాతావరణం చల్లబడే అవకాశముందని వాతావరణ కేంద్రం వర్గాలు వెల్లడించాయి. సోమవారం అత్యధికంగా రామగుండంలో 47.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌లో 45.8, నిజామాబాద్‌లో 45.3, మెదక్‌లో 44.8, ఖమ్మంలో 44.6, హన్మకొండలో 44, భద్రాచలంలో 43.2, హైదరాబాద్, మహబూబ్‌నగర్‌లలో 42.5 డిగ్రీ సెల్సియస్‌ల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రస్తుతం రాయలసీమ నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు ఇంటీరియర్ తమిళనాడు మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. మరోవైపు ఛత్తీస్‌గఢ్, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా ప్రాంతాలలో 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రాబోయే మూడు రోజుల్లో వర్షాలు.. రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల్లో ఉరుము లు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు కొన్ని ప్రాంతాలలో వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. కోస్తాంధ్ర ప్రాంతంలో రాబోయే రోజుల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. దక్షిణ కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాలలో వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. రాయలసీమలో మంగళ, బుధవారాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. -
మరో నాలుగు రోజులు మంటలే!
సాక్షి, అమరావతి/తాడేపల్లి రూరల్ (మంగళగిరి)/ సాక్షి, విశాఖపట్నం: రోహిణి కార్తె ఆగమనానికి సూచికా అన్నట్లు శనివారం ఎండలు భగ్గుమన్నాయి. ఉష్ణోగ్రతలు భారీగా పెరగడమే కాకుండా సాయంత్రం ఐదు గంటలకు కూడా చాలా ప్రాంతాల్లో వడగాడ్పులు వీచాయి. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళితే సూర్యకిరణాలు అగ్నికీలల్లా తాకాయి. విజయవాడ, గుంటూరు నగరాల్లో సాయంత్రం తర్వాత కూడా ఉష్ణతాపం ఏమాత్రం తగ్గలేదు. రోహిణిలో రోళ్లు పగులుతాయనే సామెతను గుర్తు చేస్తూ ఈ కార్తె ప్రవేశించిన రోజే సూర్య ప్రతాపం పెరిగింది. రాష్ట్రంలో 20కి పైగా ప్రాంతాల్లో 45 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గుంటూరు జిల్లా నూజెండ్లలో గరిష్టంగా 46.39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రోళ్లు పగులుతాయ్! రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు కాస్తాయని నానుడి. శనివారం నుంచి రోహిణి కార్తె ప్రారంభం కావడంతో ఉష్ణోగ్రతలు మరింతగా పెరగనున్నాయి. సాధారణం కంటే 3–6 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, వడగాడ్పులు వీస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో సాధారణం కంటే 3–4 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నేడు కృష్ణా, గుంటూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు; తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41 డిగ్రీల నుంచి 42 డిగ్రీల వరకు; శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 38 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగత్రలు నమోదయ్యే అవకాశం ఉందని గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) ఒక ప్రకటనలో వెల్లడించింది. అదేవిధంగా రేపు.. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకు; విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు; శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల నుంచి 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే వీలుంది. ఎల్లుండి.. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకు; విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. 29న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకు; శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు; విశాఖపట్నం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి జల్లులకు అవకాశం రాయలసీమ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు తమిళనాడు మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఫలితంగా రానున్న రెండు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు లేదా వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ శనివారం రాత్రి నివేదికలో తెలిపింది. అదే సమయంలో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మరోపక్క ఇప్పటికే దక్షిణ అండమాన్‌లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు తాజాగా ఆగ్నేయ బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రం, నికోబార్ దీవుల్లోకి విస్తరించాయి. ఈ నెల 29, 30 నాటికి ఇవి అండమాన్ సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. -
వడ..దడ!
సాక్షి, విశాఖపట్నం: భానుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. రోజురోజుకూ తన ప్రతాపాన్ని తీవ్రతరం చేస్తున్నాడు. ఇప్పటికే కొద్దిరోజులుగా రాయలసీమలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఆ ప్రాంతంలో వడగాడ్పులు హడలెత్తిస్తున్నాయి. మరో రెండ్రోజుల్లో కోస్తాంధ్రలోనూ వడగాడ్పులు మొదలు కానున్నాయి. ప్రస్తుతం మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మధ్య మహారాష్ట్ర, విదర్భ, జార్ఖండ్‌ల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. అటు నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరగడానికి దోహదపడుతున్నాయి. ఉత్తర కర్ణాటక నుంచి కేప్ కొమరిన్ ప్రాంతం వరకు తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు గాని, వర్షంగాని కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం రాత్రి నివేదికలో తెలిపింది. అదే సమయంలో గురువారం నుంచి నాలుగు రోజులపాటు రాయలసీమలోని అన్ని జిల్లాల్లో నిప్పుల కుంపటిని తలపించేలా వడగాడ్పులు వీస్తాయని.. అలాగే, కోస్తాంధ్రలో ఈనెల 25 నుంచి వడగాడ్పుల ప్రభావం మొదలవుతుందని పేర్కొంది. కోస్తాంధ్రలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటుందని వివరించింది. ఈ ప్రాంతాల్లో 46డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చునని తెలిపింది. జూన్ మొదటి వారం వరకు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతూ వడగాడ్పులకు దోహదమవుతాయని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. కాగా, గడచిన 24 గంటల్లో నందికొట్కూరులో 3, ఆలూరు, నంద్యాల, డోర్నిపాడు, పాడేరుల్లో ఒక్కో సెంటీమీటరు చొప్పున వర్షపాతం నమోదైంది. -
అండమాన్‌కు ‘నైరుతి’
సాక్షి, విశాఖపట్నం/మంగళగిరి: నైరుతి రుతు పవనాలు నేడో, రేపో అండమాన్ సముద్రం, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించనున్నాయి. ఇవి కేరళలో ప్రవేశించడానికి దాదాపు పది రోజుల ముందు అంటే మే 20వ తేదీ నాటికి అండమాన్‌ను తాకుతాయి. కానీ, ఈ ఏడాది రెండు రోజుల ముందుగానే ఇవి అండమాన్‌లోకి ప్రవేశించే వీలుందని ఐఎండీ శుక్రవారం రాత్రి నివేదికలో వెల్లడించింది. రానున్న రెండు రోజుల్లో రాయలసీమలో కొన్నిచోట్ల వడగాడ్పులు వీస్తాయని తెలిపింది. అక్కడ సాధారణం కంటే 3నుంచి 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని పేర్కొంది. వచ్చే మూడు రోజులు కోస్తాంధ్రలో అక్కడక్కడా తేలికపాటి జల్లులు లేదా వర్షం కురిసే అవకాశం ఉందని వివరించింది. వడదెబ్బ బారినపడి శుక్రవారం విశాఖ జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు, విజయనగరం జిల్లాలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరోవైపు విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మోస్తరు వర్షాలు కురిశాయి. చోడవరంలో భారీగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం పడింది. బుచ్చయ్యపేట, దుంబ్రిగుడ, కొయ్యూరు, పాడేరు, అనకాపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో వర్షం కురిసింది. ఐదు రోజులూ ఎండలు మండుతాయ్ రాష్ట్రంలో రానున్న ఐదు రోజులపాటు ఎండలు మండుతాయని గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) తెలిపింది. శుక్రవారం ఒక ప్రకటన చేస్తూ.. శనివారం ఉభయ గోదావరి, కృష్ణా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43 నుంచి 46 డిగ్రీల వరకు, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 19న విజయనగరం, విశాఖ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43 నుంచి 44 డిగ్రీల వరకు, శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది. 20న విశాఖ, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు, విజయనగరం, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43 నుంచి 44 డిగ్రీల వరకు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 41 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది. 21న ప్రకాశం, వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 43 నుంచి 44 డిగ్రీల వరకు, పశ్చిమ గోదావరి జిల్లాలో 41 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. 22న తూర్పుగోదావరి, నెల్లూరు, వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 46 నుంచి 47 డిగ్రీల వరకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో 44 నుంచి 45 డిగ్రీల వరకు, గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది. -
సూర్య ప్రతాపం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో వడగాడ్పుల తీవ్రతతో బుధవారం 24 మంది మృత్యువాతపడ్డారు. ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో అత్యధికంగా ఆరుగురు చొప్పున వడదెబ్బ తగిలి చనిపోయారు. గుంటూరు జిల్లాలో నలుగురు, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున వడదెబ్బ తగిలి మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ఈ భగభగలు మరో రెండ్రోజులు కొనసాగనున్నాయి. పలుచోట్ల వడగాడ్పులు వీయనున్నాయి. గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 45 నుంచి 48 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) సూచించింది. ఆ తర్వాత రెండు రోజులు అకాల వర్షాలు కురవనున్నాయి. అకాల వర్షాలతో పాటు ఈదురుగాలులు బీభత్సం సృష్టించనున్నాయి. ప్రస్తుతం ఉత్తర ఒడిశా నుంచి రాయలసీమ వరకు చత్తీస్‌గఢ్, తెలంగాణల మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో కోస్తాంధ్రలో, ఆదివారం రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు, అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. అదే సమయంలో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్రలోని తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోను, గురువారం రాయలసీమలోని చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లోను అక్కడక్కడ వడగాడ్పులు వీస్తాయని వివరించింది. రాయలసీమలో వచ్చే రెండు రోజులు పొడి వాతావరణం నెలకొననుంది. ఆ తర్వాత అక్కడ ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు/జల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. బుధవారం రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా జంగమహేశ్వరపురం (రెంటచింతల)లో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కాగా ప్రకాశం జిల్లా కురిచేడులో బుధవారం 46.50 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని ఆర్టీజీఎస్ తెలిపింది. -
రాష్ట్రం... నిప్పుల కుంపటి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నిప్పుల కుంపటిగా మండిపోతోంది. వడగాడ్పులు వీస్తుండటంతో జనం విలవిలలాడిపోతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు రావడానికి భయపడిపోతున్నారు. పట్టణాలు, నగరాల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. సోమవారం రాష్ట్రంలో అత్యధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మంలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు వెల్లడించారు. నల్లగొండలో 45 డిగ్రీలు, ఆదిలాబాద్, భద్రాచలం, నిజామాబాద్, రామగుండంల్లో 44 డిగ్రీలు, మహబూబ్‌నగర్, మెదక్‌ల్లో 43 డిగ్రీలు, హన్మకొండ, హైదరాబాద్‌ల్లో 42 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్లా 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం విలవిలలాడిపోతున్నారు. పలుచోట్ల కలుషిత నీటి వల్ల వాంతులు, విరోచనాల బారిన పడుతున్నారు. మే నెల మొత్తం దాదాపు వడగాడ్పుల రోజులు అధికంగా ఉంటాయని, రానున్న రోజుల్లో 47–48 డిగ్రీలకూ ఉష్ణోగ్రతలు పెగోచ్చని వాతావరణ కేంద్రం చెబుతోంది. ఇదిలావుండగా దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు తెలంగాణ, రాయలసీమ, ఇంటీరియర్ తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. అయితే దీని ప్రభావం రాష్ట్రంపై ఏమీ ఉండదని, రానున్న మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో వచ్చే మూడు రోజులు ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణల్లో కొన్ని ప్రాంతాల్లో వడగాడ్పులు వీచే అవకాశముందని రాజారావు తెలిపారు. వడదెబ్బతో ఐదుగురి మృతి సాక్షి నెట్వర్క్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వడదెబ్బతో సోమవారం ఐదుగురు మృతి చెందారు. ఖమ్మం రైల్వేస్టేషన్లో ఓ గుర్తు తెలియనివ్యక్తి, అశ్వారావు పేట మండలం నారాయణపురం కాలనీకి చెందిన బుర్రి వెంకటేష్(40), అదే మండలం తిరుమల కుం టకు చెందిన మడకం నాగేశ్వరరావు (55), బూర్గంపాడు గౌతమీపురం కాలనీకి చెందిన మేకల రామలక్ష్మి(65), సత్తుపల్లి మండలం గౌరీగూడెంకి చెందిన పట్లె కుమారి(44) వడదెబ్బతో మృతి చెందారు. -
నిప్పుల కుంపటిలా రాష్ట్రం!
సాక్షి, అమరావతి/విశాఖ సిటీ: రోహిణి రాలేదు.. అయినా రోళ్లు పగిలే ఎండలతో రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. రోడ్లు కొలిమిలా మండుతుండటంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈ నెల మొదటి వారంలోనే భగభగ మండేలా ఎండలు వేస్తుండటంతో ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి తలెత్తుతోంది. పొడి వాతావరణం, వేడిగాలులు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్నీ ఉక్కిరిబిక్కిరికి గురిచేస్తున్నాయి. సాధారణంగా ప్రతి వేసవిలో రాయలసీమలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. కానీ.. ఈసారి కోస్తా, రాయలసీమ అనే తేడా లేకుండా భానుడి భగభగలకు అన్ని జిల్లాలూ మలమలా మాడిపోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే మొదలవుతున్న ఉక్కపోత సాయంత్రం 7 గంటలు దాటినా తగ్గడం లేదు. ఆదివారం కృష్ణా, గుంటూరుతోపాటు ఉభయగోదావరి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో వడగాలులు బలంగా వీచాయి. రాష్ట్రంలో ప్రతి చోటా సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. అనేక ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల సెల్సియస్‌పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత రెండు రోజులుగా పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో గరిష్టంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోయారు. రాష్ట్రం నిప్పుల కుంపటిగా మారిందనడానికి ఈ గణాంకాలే ప్రత్యక్ష నిదర్శనాలు. ఈ నేపథ్యంలో ప్రజలెవరూ మధ్యాహ్నం 10 గంటల నుంచి ఎండ ప్రభావం తగ్గే వరకూ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని వాతావరణ నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు. మరో మూడు రోజులు వడగాలులు తొమ్మిది జిల్లాల్లో మరో మూడు రోజులు వడగాలులు నమోదయ్యే ప్రమాదం ఉందని, అందువల్ల అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రజలను హెచ్చరించింది. ‘కృష్ణా, గుంటూరు, ప్రకాశం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో 6 నుంచి 8 తేదీ వరకూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అందువల్ల వడగాలుల ముప్పు ఉంటుంది. ఈ విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. వడదెబ్బ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి’ అని ఐఎండీ వెబ్సైట్లో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ కూడా ప్రజలను, ఆయా జిల్లాల అధికార యంత్రాంగాన్ని ఇదే విషయమై అప్రమత్తం చేసింది. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) కూడా ఇదే రకమైన హెచ్చరికలు జారీ చేసింది. చెట్ల కింద సేదదీరుతున్న వ్యవసాయ కూలీలు ఉదయం 11 గంటల తర్వాత ద్విచక్ర వాహనాలపై వెళ్తున్నవారికి తగులుతున్న వేడిగాలులు వడదెబ్బబారిన పడేలా చేస్తున్నాయి. వ్యవసాయ కూలీలు ఎండను భరించలేక ఆముదం ఆకులు, రాగి ఆకులను తలపాగాగా చుట్టుకుని పనిచేస్తున్నారు. గతంలో సాయంత్రం వరకూ వ్యవసాయ పనులు చేసే కూలీలు పెరిగిన వేడిని భరించలేక మధ్యాహ్నం 12 గంటలకే పనులు ఆపేసి చెట్ల నీడన సేదదీరుతున్నారు. ‘పైన సూరీడు, కింద భూమాత తాపానికి తట్టుకోలేక పనివేళలు మార్చుకున్నాం. తెల్లవారుజామునే పొల్లాల్లోకి చేరుకుని పనులు ప్రారంభించి మధ్యాహ్నం 12 గంటలకే ఆపేస్తున్నాం. ఆ తర్వాత ఎండలో పనిచేస్తే వడదెబ్బకు పడిపోవాల్సి వచ్చేలా పరిస్థితి ఉంది. ఆముదం, రావి, కానుగ ఆకులను తలపాగాగా చుట్టుకుని పనిచేస్తున్నాం. మధ్యాహ్నం భోజన సమయంలో తీస్తే ఆకులు రంగుమారిపోతున్నాయి. ఎండ తీవ్రత అధికంగా ఉందనడానికి ఇది నిదర్శనం’ అని గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన కూరపాటి వరప్రసాద్ అన్నారు. కూల్.. కూల్.. వేడి తీవ్రత పెరిగిన నేపథ్యంలో కొబ్బరి బోండాలకు బాగా గిరాకీ పెరిగింది. పండ్ల రసాలు, శీతల పానీయాల దుకాణాలు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. మజ్జిగ విక్రయాలు గతంలో పోల్చితే రెండు రెట్లు పెరిగా>యని తిరుపతి రైల్వేస్టేషన్ సమీపంలోని శీతల పానీయాల దుకాణం యజమాని వెంకటేశ్ ‘సాక్షి’కి తెలిపారు. రహదారులపై శీతల పానీయాలు, నన్నారి, సాల్ట్ సోడా, సుగంధ షర్బత్ అమ్మే దుకాణాలు భారీగా పెరిగాయి. జ్యూస్ కోసం పుచ్చకాయలు, అనాస, చీనీ, ద్రాక్ష, అరటి పండ్లకు గిరాకీ పెరిగిందని వ్యాపారులు పేర్కొన్నారు. ఎండ పెరిగిన నేపథ్యంలో టోపీలకు కూడా డిమాండ్ పెరిగింది. మహిళలు గొడుగులతో రక్షణ పొందుతున్నారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లే మహిళలు, యువతులు స్కార్ప్ చుట్టుకుని కళ్లకు రక్షణ కోసం చలువ అద్దాలు ధరిస్తున్నారు. పురుషులు కూడా తలకు నూలు వస్త్రం చుట్టి హెల్మెట్ ధరించడం ద్వారా కొంతవరకు ఉపశమనం పొందుతున్నారు. కుండనీరే ఉత్తమం వేసవి నేపథ్యంలో రిఫ్రిజిరేటర్లోని నీటి కంటే మట్టి కుండలోని చల్లని నీరు సేవించడం అత్యుత్తమమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ‘ఎండ వల్ల డీహైడ్రేషన్ (చెమట రూపంలో లవణాలు బయటకు వెళ్లడం) ఎక్కువగా ఉంటుంది. పోయిన లవణాలకు ప్రత్యామ్నాయంగా శరీరానికి అందించేందుకు వీలుగా ఉప్పు కలిపిన మజ్జిగ, ఉప్పు, జీలకర్ర పొడి, నిమ్మకాయ రసం కలిపిన నీరు ఎక్కువసార్లు తీసుకోవడం మంచిది. వేడివల్ల వృద్ధులు, పిల్లలు ఎక్కువగా బడలికకు గురవుతారు. అందువల్ల కొబ్బరి నీరు, మజ్జిగ వీలైనన్ని ఎక్కువసార్లు తీసుకోవడం ఉత్తమం. ఇళ్లలో కూడా వేడి ఎక్కువగా ఉన్నట్లైతే కిటికీలకు జనపనార గోనె సంచులు, లేదా వట్టి వేళ్ల చాపలు కట్టి చల్లని నీరు చల్లాలి. దీనివల్ల గది వాతావరణం కొంత వరకూ చల్లగా అవుతుంది. ముతక రంగు వస్త్రాలు వేడిని ఆకర్షిస్తాయి. అందువల్ల వదులైన తెల్లని లేదా లేత రంగు కాటన్ వస్త్రాలు ధరించాలి. సాధ్యమైనంత వరకూ ఎండ సమయంలో బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. వృద్ధులు, గర్భిణులు, గుండె, ఊపిరితిత్తుల సమస్యలున్నవారు, చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలి’ అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగత్రలు రాష్ట్రంలోని అనేక చోట్ల ఆదివారం 46 డిగ్రీల సెల్సియస్‌కు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయిదు జిల్లాల పరిధిలోని 20 ప్రాంతాల్లోని ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లలో ఆదివారం 46 డిగ్రీల సెల్సియస్ పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయయిన రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. ఆదివారం విజయవాడలో 45.6 , ఒంగోలులో 44.3 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణ్రోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ విభాగం ప్రకటించింది. ఎండలు భగభగ మండుతున్నాయనడానికి ఈ గణాంకాలే నిదర్శనాలు. వడదెబ్బకు 19 మంది మృతి రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో రాష్ట్రం విలవిలాడిపోతోంది. ఓవైపు ఎండవేడి మరోవైపు ఉక్కపోత జనాలకు ఊపిరాడనీయకుండా చేస్తోంది. నానాటికీ వడగాడ్పుల తీవ్రత పెరుగుతోంది. దీంతో వృద్ధులు, పిల్లలు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు అల్లాడిపోతున్నారు. శని, ఆదివారాల్లోనే రాష్ట్రంలో పందొమ్మిదిమంది మృత్యువాత పడ్డారంటేనే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది. గుంటూరు జిల్లాలో నలుగురు, తూర్పుగోదావరి జిల్లాలో వృద్ధ దంపతులు, అనంతపురం జిల్లాలో ముగ్గురు, చిత్తూరు జిల్లాలో ముగ్గురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు, శ్రీకాకుళం, విజయనగరం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున వడదెబ్బ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లా కొల్లూరు మండలం ఈపూరుకు చెందిన కొల్లి అంజయ్య (53) తన ఇంటి సమీపంలోని టీ స్టాల్ వద్ద టీ తాగుతూ కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయాడు. అలాగే నగరం మండలం వెనిగళ్లవారిపాలేనికి చెందిన కర్రా వెంకట సుబ్బారావు (60) అస్వస్థతకు గురై మృతి చెందాడు. అదే విధంగా దాచేపల్లి మండలం శ్రీనగర్‌కు చెందిన గోళ్ల శేషమ్మ (80), కొల్లూరుకు చెందిన గరికపాటి బసవపూర్ణమ్మ (62) వడదెబ్బకు తాళలేక మృతి చెందారు. వృద్ధ దంపతుల మృతి.. తూర్పు గోదావరి జిల్లాలో భార్య మృతి చెందిన అరగంటలోనే భర్త మృతి చెందడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ పాతకోరంగిలో రత్నాలమ్మ అమ్మవారి ఆలయ సమీపంలో నివసిస్తున్న దంపతులు గుబ్బల కామరాజు (75), సుభద్రమ్మ (70) కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం ఎండ ప్రభావం ఎక్కువగా ఉండడంతో వడదెబ్బ బారిన పడ్డారు. రాత్రి నుంచీ అనారోగ్యంగా ఉండడంతో సుభద్రమ్మ ఆదివారం ఉదయం కన్నుమూసింది. భార్య మృతిని జీర్ణించుకోలేని కామరాజు అరగంట గడవకుండానే కుప్పకూలిపోయి మృతి చెందాడు. అనంతలో ముగ్గురు.. అనంతపురం జిల్లా గుత్తిలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన తపిల నాగేశ్వరరావు (62), బత్తలపల్లి ప్రభుత్వాస్పత్రి ఉద్యోగి పెద్దన్న (60), కొత్త చెరువుకు చెందిన గోవిందు (43) వడదెబ్బకు మృతి చెందారు. కాగా, చిత్తూరు జిల్లాలో ముగ్గురు మరణించారు. పిచ్చాటూరు మండలంలోని సీరామాపురం ఏఎడబ్ల్యూ గ్రామానికి చెందిన రాంబాబు (49), పిచ్చాటూరుకు చెందిన మణి మొదలియార్ (65), కార్వేటినగరంలో కోటదళితవాడకు చెందిన టి.పురుషోత్తం (60) మృత్యువాత పడ్డారు. ప్రకాశం జిల్లాలో ముగ్గురు.. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన దర్శనం కోటయ్య (70), గిద్దలూరు అర్బన్ కాలనీలో 55 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి, ఇంకొల్లులో అబ్దుల్ జబ్బార్ (78) మృతి చెందారు. శ్రీకాకుళంలో వృద్ధుడి మృతి.. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని కొరసవాడ గ్రామానికి చెందిన ఈద్దుం కర్రయ్య (88) వడదెబ్బకు గురై మృతి చెందినట్లు ఎస్ఐ ఇ.చిన్నంనాయుడు తెలిపారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తామరాపల్లికి చెందిన వృద్ధుడు సారిపల్లి దేవుడు(60) మృతిచెందాడు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం కాకావారిపాళేనికి చెందిన గిరిజనుడు మీరయ్య(62) వీడదెబ్బకు మృత్యువాత పడ్డాడు. వైఎస్సార్ జిల్లాలో యువకుడి మృతి.. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని నడింపల్లె ప్రాంతానికి చెందిన టి.నాగేంద్ర (33) స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో మృతి చెందాడు. -
నిప్పుల వాన
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. ఓవైపు కణకణ మండుతున్న సూర్యుడు, మరోవైపు భగభగమంటున్న భూతాపంతో వడగాడ్పుల తీవ్రత పెరుగుతోంది. నిప్పులు కక్కే ఎండలతో వడగాడ్పులు వీస్తున్నాయి. సాధారణం కంటే 4–7 డిగ్రీలు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతూ జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం ఈ సీజన్లోనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల 45 డిగ్రీల సెల్సియస్ పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఉత్తర, వాయవ్య భారతదేశంలో ఉష్ణతీవ్రత ఎక్కువగా ఉంది. ఫొని తుపాను వాయవ్య, పశ్చిమ గాలులను తన వైపు లాక్కుంటోంది. ఫలితంగా చల్లదనాన్నిచ్చే దక్షిణ గాలులు వీయడం లేదు. ఫొని తుపాను పూర్తిగా బలహీన పడే దాకా గాలులు ఇలాగే కొనసాగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఫొని అల్పపీడనంగా మారాక మరో రెండు మూడు రోజుల వరకు సాధారణ స్థితికి వచ్చే అవకాశం లేదు. అంటే ఈ నెల పదో తేదీ వరకు అధిక ఉష్ణోగ్రతలు తప్పవని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటోంది. వేడి గాలులను తట్టుకోలేక జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో వేడిగాలులు అగ్నికీలల్లా తగులుతున్నాయి. వ్యవసాయ కూలీలు మధ్యాహ్నం 11–12 గంటల వరకే పనిచేసి, తర్వాత చెట్ల నీడకు వెళుతున్నారు. గర్భిణులు, గుండె, ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారు, వృద్ధులు, పిల్లలు వేడికి తట్టుకోలేక అవస్థలు పడుతున్నారు. ఇంట్లోనే ఉన్నప్పటికీ భవనం పైకప్పు నుంచి, గోడల నుంచి వస్తున్న వేడి, ఉక్కపోతను తట్టుకోలేపోతున్నామని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న మూడు రోజులు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల, విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అంటే విజయనగం, శ్రీకాకుళం మినహా రాష్ట్రంలో అన్ని జిల్లాలకు వడగాడ్పులు తప్పవన్నమాట. వడగాడ్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వీలైనంత వరకూ ఎండ సమయంలో బయటకు వెళ్లకపోవడం ఉత్తమమని ఐఎండీ సూచించింది. 47 డిగ్రీల దాకా నమోదు కానున్న ఉష్ణోగ్రతలు వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం.. ఈ నెల 5న (ఆదివారం) కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44–45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నెల 6న కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 44–45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ నెల 7న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 45–47 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం, ఉభయ గోదావరి, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 42– 45 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ నెల 8న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 44–45 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ నెల 9న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 45–46 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రజలను చైతన్య పర్చండి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటున్నందున వడగాడ్పులు తీవ్రమవుతాయని భారత వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. వడగాడ్పుల బారిన పడకుండా ప్రజలను చైతన్య పరిచేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఆయా జిల్లాల అధికార యంత్రాంగాలను ఆదేశించింది. ఈ మేరకు విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి వరప్రసాద్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. వడగాడ్పుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విపత్తు నిర్వహణ శాఖ రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేయాలని సూచించారు. జాగ్రత్తలు తప్పనిసరి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ప్రజలు.. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ‘‘ఎండ సమయంలో సాధ్యమైనంత వరకూ బయటకు వెళ్లకుండా ఇళ్లల్లో గానీ, నీడపట్టున గానీ ఉండాలి. తప్పనిసరై బయటకు వెళ్లాల్సి వస్తే తలకు, ముఖానికి నేరుగా ఎండ తగలకుండా గొడుగు ఉపయోగించాలి. తెలుపు లేదా లేత రంగు నూలు వస్త్రాలు ధరించాలి. నీరు, మజ్జిగ, కొబ్బరినీరు లాంటివి సేవించాలి. డీహైడ్రేషన్ నుంచి రక్షణ కోసం ఉప్పు కలిపిన మజ్జిగ సేవించడం ఉత్తమం. ఇళ్లల్లో కూడా వేడి ఎక్కువగా ఉంటే గది వాతావరణాన్ని తగ్గించుకోవాలి. ఇందుకోసం కిటికీలకు వట్టివేర్ల తెరలను కట్టి నీరు చల్లాలి. ఒకవేళ ఎవరైనా వడదెబ్బకు గురైతే వెంటనే చల్లని ప్రదేశానికి తరలించి, గాలి తగిలేలా చూడాలి. చల్లని నీటిలో తడిపిన వస్త్రంతో శరీరాన్ని తుడవాలి. ఫ్యాన్ కింద ఉంచవచ్చు. అప్పటికీ కోలుకోలేకపోతే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. తగిన వైద్యం అందించాలి’’ అని నిపుణులు చెప్పారు. -
నేడు, రేపు వడగాడ్పులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నింపుల కుంపటిలో మగ్గుతోంది. తీవ్రమైన వడగాడ్పులు వీస్తున్నాయి. ఆది, సోమవారాల్లోనూ కొన్ని జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. నిర్మల్, ఆదిలాబాద్, కొమురంభీం, మంచి ర్యాల, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో తీవ్రమైన వడగాడ్పులు ఉంటాయని హెచ్చరించింది. శనివారం రాష్ట్రంలో అన్నిచోట్లా తీవ్రమైన ఎండలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్‌లో 45.3 డిగ్రీలు నమోదైంది. నిజామాబాద్, రామగుండం, నల్లగొండల్లో 44 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 43, భద్రాచలం, హన్మకొండ, ఖమ్మం, మెదక్‌లలో 42 డిగ్రీలు, హైదరాబాద్‌లో 41 డిగ్రీల వంతున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.