The High Court
-
ఆయేషా మీరా కేసు పునర్విచారణకు సిట్
సాక్షి, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసు పునర్విచారణ బాధ్యతలను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. విజయవాడలోని ఇంబ్రహీంపట్నం హాస్టల్లో 2007 డిసెంబర్లో ఆయేషా మీరా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సత్యంబాబును 2008 ఆగస్టు 17న నిందితుడిగా అరెస్టు చేశారు. సెల్‌ఫోన్ దొంగతనం కేసులో సత్యంబాబు పట్టుబడటంతో ఆయన్ను ఆయేషా హత్య కేసులో నిందితుడిగా చూపించారనే ఆరోపణలు వచ్చాయి. హత్య కేసును విచారించిన విజయవాడ మహిళా కోర్టు 2010 సెప్టెంబర్ 29న సత్యంబాబును దోషిగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు విధించింది. దీంతో సత్యంబాబు హైకోర్టును ఆశ్రయించగా, ఆయన్ను నిర్దోషిగా ప్రకటిస్తూ ఈ ఏడాది మార్చి 31న తీర్పు వెలువరించింది. ఈ కేసులో అసలైన దోషులను పట్టుకోవడంలో పోలీసుల అలక్ష్యాన్ని తప్పుబట్టిన హైకోర్టు.. పునర్విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఆయేషా మీరా హత్య కేసు పునర్విచారణకు డీజీపీ నండూరి సాంబశివరావు ప్రతిపాదించడంతో ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. డీఐజీ స్థాయి అధికారి సిట్‌కు నేతృత్వం వహిస్తారని రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్ ఆనురాధ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సిట్ దర్యాప్తును విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ పర్యవేక్షించనున్నారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి సోమాజిగూడ: పర్యావరణ పరిరక్షణకు అటుప్రభుత్వాలు..ఇటు పౌరసమాజం చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరం ఉందని, ఇది అందరి బాధ్యతగా గుర్తించాలని పాట్నా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి అన్నారు. ఒక చెట్టు నరికితే 10 మొక్కలు నాటేలా ఆచరణీయమైన చర్యలు అవసరమని పేర్కొన్నారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ (సీజీఎస్ ) ఆధ్వర్యంలో బేగంపేట సెస్ ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన ఎర్త్‌డే, 7 వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నాగరికత పేరుతో విధ్వంసం సృష్టిస్తున్నారని, అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతూకం దెబ్బతిందన్నారు. పంచభూతాల మయమైన సృష్టిలో ఇప్పటికే గాలి, నీరు, భూమి కలుషితమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డదిడ్డమైన విధానాలు, ఆచరణీయమైన దృక్పథం లేకపోవడం, మానవ స్వార్థం మరింత చేటు చేస్తున్నాయన్నారు. ఒక సృష్టమైన విధానంతో ముందుకు వెళ్తేనే మనుగడ సాధ్యమన్నారు. పర్యావరణం, మెక్కల పెంపకం, తూర్పు కనుమల పరిరక్షణకు అంకిత భావంతో కృషి చేస్తున్న సీజీఎస్ సంస్థను అభినందించారు. ముఖ్యమంత్రి ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ప్రభుత్వాన్ని ఇల్లు, నీరు అడుగుతారని, దాంతో పాటు మెక్కలు కూడా పెంచాలని డిమాండ్ చేయాలని సూచించారు. మొక్కల పెంపకంలో విద్యార్థులను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అంబేద్కర్ వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ సీతారామరావు మాట్లాడుతూ సంస్థ గత ఏడేళ్లుగా చేస్తున్న సేవలను అభినందించారు. సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ లక్ష మెక్కల పెంపకం లక్ష్యంతో ఏడేళ్ల క్రితం ప్రారభమైన సీజీఎస్ సంస్థ నేడు లక్షలాది మొక్కలు పెంచే స్థాయికి చేరుకోవడంతో పాటు దాదాపు 1700 కిలోమీటర్లు విస్తరించి ఉన్న తూర్పు కనుమల పరిరక్షణ, నీటి సంరక్షణ కార్యక్రమాలు చేపడుతూ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఈ క్రమంలో సంబంధిత రాష్ట్రాల ఎంపీలు, అధికారులు, సంస్థల మద్దతు కూడా కూడగట్టడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది నుండి ప్రత్యేక అవార్డులు ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది నుండి సీజీఆర్ ఫౌండేషన్ లెక్చర్ కార్యక్రమం కూడా ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. సంస్థ వ్యవస్థాపకులు లీలా లక్ష్మారెడ్డి గత ఏడేళ్ల ప్రగతిని వివరించారు. పర్యావరణ వేత్త పురుషోత్తంరెడ్డి సంస్థతో తన అనుబంధం గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పర్యావరణ సమస్యలపై స్పందిస్తున్న వందేమాతరం ఫౌండేషన్, కళాకారుడు లెనిన్‌బాబు, నాగర్‌కర్నూల్ జిల్లా సిలార్పల్లిని గ్రీన్విలేజ్గా తీర్చిదిద్దిన యువకులు, రైతు నీలాలక్ష్మి, ఎన్జీవో సత్యశ్రీ, నెక్కొండలోని యూపీఎస్ స్కూల్, డెక్కన్ క్రానికల్ జర్నలిస్ట్ సుధాకర్‌రెడ్డి , విద్యార్థి రమేష్‌లను సత్కరించి మెమొంటోలు అందజేశారు. కార్యక్రమంలో పలువురు పర్యావరణ ప్రియులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఇదేం తీరు!
► స్వతంత్ర సంస్థ అన్నది గుర్తుంచుకోండి ► స్థానిక ఎన్నికలపై హైకోర్టు ఆగ్రహం ఎన్నికల యంత్రాంగం స్వతంత్ర సంస్థ అన్నది గుర్తుంచుకోండి, స్వతంత్రంగా వ్యవహరించండంటూ రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం తీరుపై మద్రాసు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తీరు మారని పక్షంలో ఎన్నికల అధికారిని కోర్టు మెట్లు ఎక్కించాల్సి ఉంటుందని న్యాయమూర్తులు హెచ్చరించారు. సాక్షి, చెన్నై: గత ఏడాది కోర్టు కన్నెర్రతో స్థానిక సంస్థలకు జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. సింగిల్ బెంచ్ తీర్పును వ్యతిరేకిస్తూ దాఖలైన అప్పీలు పిటిషన్ విచారణ న్యాయమూర్తులు రామ్మోహన్ రావు, ఎస్ఎం.సుబ్రమణ్యం నేతృత్వంలోని బెంచ్ విచారిస్తోంది. ఎన్నికల ఆగడం, అప్పీలు పిటిషన్ విచారణతో స్థానిక సంస్థలకు ప్రత్యేక అధికారుల్ని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పరిస్థితుల్లో గత విచారణ సమయంలో ఎన్నికల నిర్వహణకు తగ్గట్టు ప్రస్తుతం తీసుకున్న చర్యలపై కోర్టుకు నివేదిక సమర్పిం చాలని న్యాయమూర్తు లు ఆదేశించారు. ఏప్రిల్‌లోపు ఎన్నికలు నిర్వహించేందుకు తగ్గ ఏర్పాట్లతో ఆ నివేదిక సమర్పించాలని సూచించారు. అయితే, ఏప్రిల్‌లోపు ఎన్నికల నిర్వహణ అసాధ్యమని పేర్కొంటూ, ప్రత్యేక అధికారుల పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ వివరాలతో కూడిన నివేదిక కోర్టు ముందుకు గత వారం చేరింది. నివేదిక పరిశీలనానంతరం శుక్రవారం మళ్లీ పిటిషన్ విచారణకు వచ్చింది. ఎన్నికల నిర్వహణకు తగ్గట్టు ఎన్నికల యంత్రాంగం ఎలాంటి చర్యలు ఇంత వరకు తీసుకోకపోవడంపై హైకోర్టు బెంచ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. స్వతంత్ర సంస్థ: న్యాయమూర్తులు రామ్మోహన్ రావు, సుబ్రమణ్యం నేతృత్వంలోని బెం చ్ ఉదయం విచారణను చేపట్టగా, డీఎంకే తరఫు న్యాయవాది విల్సన్ హాజరై వాదనల్ని వినిపించారు. ఎన్నికల నిర్వహణకు ఇంత వరకు ఎలాంటిచర్యలు తీసుకోలేదని బెంచ్ ముందు ఉంచారు. ఈసందర్భంగా ఎన్నికల యంత్రాంగం తరఫు న్యాయవాది పి కుమార్ తన వాదనల్ని వినిపించారు. అన్ని ఏర్పాట్లకు తాము సిద్ధంగా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంత వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదని వివరించారు. ప్రభుత్వం నుంచి తమకు కొన్ని రకాల అనుమతులు, ఉత్తర్వులు రావాల్సి ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇందుకుగాను మరింత సమయం తమకు కేటాయించాలని కోరారు. దీంతో న్యాయమూర్తులు తీవ్రంగానే స్పందించారు. ఎన్నికల యంత్రాంగం స్వతంత్ర సంస్థ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. స్వతంత్రంగా వ్యవహరించకుండా ప్రభుత్వ అనుమతి, ఉత్తర్వులు అని జాప్యం చేయడం మంచి పద్ధతి కాదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత వరకు కనీస ఏర్పాట్లుకూడా చేయకపోవడం శోచనీయమని అసహనం వ్యక్తం చేశారు. పద్ధతి మారని పక్షంలో రాష్ట్ర ఎన్నికల అధికారిని కోర్టుమెట్లు ఎక్కించాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ, తదుపరి విచారణ 14వ తేదీకి వాయిదా వేశారు. స్థానిక ఎన్నికల నిర్వహణలో సాగుతున్న అలసత్వంపై కోర్టు సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం బట్టి చూస్తే, రాష్ట్రంలో పరిపాలన ఏ మేరకు సంక్షోభంలో ఉన్నదో స్పష్టం అవుతోందని డీఎంకే కార్యనిర్వహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ విమర్శించారు. -
బార్ కౌన్సిల్ అధ్యక్షునిగా మోహనకృష్ణన్
సాక్షి ప్రతినిధి, చెన్నై: మద్రాసు హైకోర్టు న్యాయవాదుల సంఘం (బార్ కౌన్సిల్) అధ్యక్షునిగా మోహనకృష్ణన్ మరోసారి ఎన్నికయ్యారు. మద్రాసు హైకోర్టు న్యాయవాదుల సంఘంలో సుమారు 4,777 మంది సభ్యులున్నారు. ఈ సంఘానికి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి, సీనియర్ కార్యనిర్వాహక సభ్యులు జూని యర్ కార్యనిర్వాహక సభ్యు లు, లైబ్రేరియన్ ఉంటారు. ఈ కార్యవర్గానికి రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తారు. 2016-18 సంవత్సరానికిగానూ సంఘం ఎన్నికలు బుధవారం జరి గారుు. అధ్యక్ష పదవికి మాజీ అధ్యక్షులు మోహన్కృష్ణన్, ప్రస్తుత కార్యదర్శి అరివళగన్, పీఎం.దురైస్వామి, ఎస్.కాశీరామలింగం, ఎల్. ఉరుగవేలు, కే. సత్యపాల్, సి.విజయకుమార్ ఇలా మొత్తం ఏడుగురు పోటీపడ్డా రు. ఉపాధ్యక్ష పదవికి ఎ.అబ్దుల్‌రెహమాన్, జార్జ్ చార్లస్, ఎం. జయకుమార్, మదివానన్, ఏ. మోహన్‌దాస్, ఆర్ మురళీ, ఎస్.ముత్తురామన్ ఎస్ పద్మ, ఎన్ ప్రభాకరన్, రువా, ఎమ్ఏఏఆర్ సుధా, విక్టర్, సామువేల్ ఇలా 13 మంది బరిలోకి దిగారు. అలాగే కార్యదర్శి పదవికి పీవీ ఇళంగో, కృష్ణకుమార్, ఎస్ శశికుమార ఆర్ శివశంకర్ ఇలా మొత్తం నలుగురు పోటీపడ్డారు. కోశాధికారి స్థానానికి సీ ఆరోగ్యదాస్, ఎస్ కామరాజ్, టీ శివషణ్ముగం, కే సుబ్రమణియన్ పోటీలో నిలిచారు. ఇక మిగిలి ఉన్న లైబ్రేరియన్ స్థానానికి గజలక్ష్మి రాజేంద్రన్, కే కుమరేశన్, మహావీర్ శివాజీ, వీఎమ్ రఘు, ఏ. రాజారాం, జి. రాజేష్, టి.రవికుమార్, కేకే శివకుమార్, కే తిప్పుకల్థాన్ పోటీపడ్డారు. బుధవారం పోలింగ్ జరిగిన తరువాత బ్యాలెట్ బాక్సులను సంఘం కార్యాలయంలో గట్టి బందోబస్తు మధ్య భద్రపరిచగా గురువారం ఓట్ల లెక్కింపు సాగింది. అధ్యక్షపదవికి పోలైన ఓట్లను తొలుత లెక్కించారు. గతంలో అధ్యక్షులుగా పనిచేసిన మోహనకృష్ణన్, ప్రస్తుత కార్యదర్శి అరివళగన్ల మధ్య గట్టిపోటీ నెలకొన్నట్లు ఓట్ల లెక్కింపులో తేలింది. మొదటి రౌండు నుంచి మోహనకృష్ణన్ ఆధిపత్యాన్ని చాటుకుని 1001 ఓట్ల మెజారిటీ తో అధ్యక్షులుగా మరోసారి ఎన్నికయ్యారు. -
1,506 వ్యవసాయ, ఉద్యాన పోస్టులకు గ్రీన్‌సిగ్నల్
► 4 వారాల తర్వాత భర్తీకి హైకోర్టు అనుమతి ► త్వరలో ఫలితాలు విడుదల సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ, ఉద్యానశాఖలో 1,506 మండల స్థాయి అధికారుల పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులతో పోస్టుల భర్తీకి హైకోర్టు అనుమతించింది. పోస్టులను నాలుగు వారాల తర్వాత భర్తీ చేయాలని తీర్పు చెప్పింది. దీంతో ఈ వ్యవహారంలో తదుపరి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు శుక్రవారం కేవియట్ దాఖలు చేసినట్లు వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి వెల్లడించారు. హైకోర్టు తీర్పు ప్రకారం నాలుగు వారాల తర్వాత వ్యవసాయ పోస్టులను భర్తీ చేస్తామని ఆయన వెల్లడించారు. టీఎస్పీఎస్సీ ఫలితాలు వెల్లడించాక అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే ప్రక్రియ మొదలవుతుందన్నారు. పోస్టుల భర్తీలో తమకు వెయిటేజీ కల్పించడంతోపాటు విద్యార్హతల్లోనూ సడలింపు ఇవ్వాలన్న విజ్ఞప్తిని టీఎస్పీఎస్సీ తోసిపుచ్చడాన్ని సవాల్‌చేస్తూ కొందరు కాంట్రాక్టు ఏఈవోలు గతేడాది హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు...పరీక్ష నిర్వహణకు అనుమతించి తుది ఫలితాల వెల్లడిపై మాత్రం స్టే విధించింది. 6,250 ఎకరాలకు ఒక ఏఈవో... రైతులకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా ప్రతి 6,250 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో)ని ప్రభుత్వం నియమించనుంది. వ్యవసాయశాఖ కోసం 1,311 ఏఈవో, 120 ఏవో పోస్టులను, ఉద్యానశాఖ కోసం 75 ఉద్యానశాఖ అధికారి (హెచ్‌వో) పోస్టులను భర్తీ చేయనుంది. వారికి కొన్ని రోజులపాటు శిక్షణ ఇచ్చి రాబోయే ఖరీఫ్ నాటికి 1,506 మందిని అందుబాటులోకి తేవడమే లక్ష్యమని పార్థసారథి తెలిపారు. 6,250 ఎకరాలకు ఒక ఏఈవో అంటే దాదాపు ఒకట్రెండు గ్రామాలకు ఒక ఏఈవో ఉండే అవకాశం ఉంది. సగానికిపైగా మహిళలే... మండలాలు, గ్రామాల్లో పనిచేయబోయే ఏవో, ఏఈవో, హెచ్వోలలో సగానికిపైగా మహిళలే ఉండే అవకాశాలున్నాయి. వ్యవసాయ కోర్సులు చదివే వారిలో 60 శాతం నుంచి 70 శాతం వరకు మహిళలే ఉంటున్నారు. కాబట్టి 1,506 మందిలో సగానికిపైగా మహిళలే ఉంటారని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. -
డీడీసీఏకు ఢిల్లీ హైకోర్టు షాక్
న్యూఢిల్లీ: ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ సంఘా(డీడీసీఏ)నికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జస్టిస్ ముకుల్ ముద్గల్ నియమించిన ముగ్గురు సెలక్టర్లను తొలగిస్తూ డీడీసీఏ తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి ఈ విషయంలో డీడీసీఏ హద్దు మీరి ప్రవర్తించిందని, ఇది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని జస్టిస్ రవీంద్ర భట్, దీపా శర్మలతో కూడిన బెంచ్ తీవ్రంగా తప్పుపట్టింది. ఢిల్లీ క్రికెట్ సంఘానికి చెందిన వ్యవహారాలను పర్యవేక్షించేందుకు గతంలోనే ఆ రాష్ట్ర హైకోర్టు జస్టిస్ ముకుల్ ముద్గల్‌ను నియమించింది. అలాగే 48 గంటల్లోగా ఆటగాళ్లకు బకారుులు చెల్లించాల్సిందిగా డీడీసీఏను కోర్టు ఆదేశించింది. -
పక్కా సమాచారంతోనే కూంబింగ్!
► మొదట మావోలే మాపై కాల్పులు జరిపారు ► లొంగిపొమ్మని హెచ్చరించినా వినలేదు ► వారి కాల్పుల్లో కమాండో అబూ బాకర్ చనిపోయారు ► ఆత్మరక్షణ కోసమే ఎదురుకాల్పులు ► హైకోర్టులో విశాఖ ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ కౌంటర్ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దుల్లో(ఏవోబీ) మావోయిస్టు అగ్రనేతల కదలికలపై విశ్వసనీయ సమాచారం అందుకున్న తరువాతనే గ్రేహౌండ్స్‌తో కలిసి కూంబింగ్ కార్యకలాపాలు చేపట్టామని విశాఖపట్నం ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ హైకోర్టుకు నివేదించారు. కూంబింగ్ సందర్భంగా తారసపడ్డ మావోయిస్టులు తమపై మొదట కాల్పులు జరిపారని, తమ గుర్తింపును తెలియచేసి లొంగిపోవాలని కోరినప్పటికీ వినిపించుకోకుండా కాల్పులు జరుపుతూనే ఉన్నారన్నారు. వారి కాల్పుల్లో మొదట పోలీసులే గాయపడ్డారని, ఈ పరిస్థితుల్లో ఆత్మరక్షణ కోసమే ఎదురు కాల్పులు జరపామన్నారు. ఈ ఘటనలో పోలీసులు ఎక్కడా చట్ట ఉల్లంఘనలకు పాల్పడలేదని శర్మ తెలిపారు. మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై ఏపీ పౌరహక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మొత్తం వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు విశాఖ రూరల్ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ బుధవారం కౌంటర్ దాఖలు చేశా రు. దీనికి సమాధానమిచ్చేందుకు గడువు కావాలని పిటిషనర్ తరఫు న్యాయవాది రఘునాథ్ ధర్మాసనాన్ని కోరారు. ధర్మాసనం అంగీకరిస్తూ తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న మావోలు ‘విశాఖ జిల్లా ముంచింగ్‌పుట్ పోలీస్‌స్టేషన్ పరిధి నుంచి ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేతలు సంచరిస్తూ స్థానికులను చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేలా రెచ్చగొడుతున్నట్లు మాకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఏపీ, ఒడిశా పోలీసులు, గ్రేహౌండ్ కమాండోస్ సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. మావోయిస్టులు తమ చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, బిహార్, మహారాష్ట్రలకు విస్తరించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్‌లో ఉన్న పలు కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు. గత నెల 24న రామగుహ పరిధికి పోలీసులు చేరుకున్నారు. వారిని చూడగానే మావోయిస్టులు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో గ్రేహౌండ్ కమోండో సతీష్ గాయపడగా, మరో కమోండో అబూబాకర్ మృతి చెందారు. తమ గుర్తింపును తెలియచేసి లొంగిపోవాలని హెచ్చరించినా మావోలు పట్టించుకోలేదు. దీంతో ఆత్మరక్షణ కోసం మేం కూడా ఎదురు కాల్పులు జరిపాం’ అని రాహుల్‌దేవ్ తన కౌంటర్లో పేర్కొన్నారు. ఒడిశా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ‘ఈ ఘటనపై చిత్రకొండ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కాల్పుల్లో మొత్తం 24 మంది చనిపోయినట్లు ఒడిశా పోలీసుల ద్వారా తెలిసింది. ఇందులో 13 మంది పురుషులు, 11 మంది మహిళలు ఉన్నారు. 11 మంది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేశాం. మిగిలిన మృతదేహాలను తీసుకునేందుకు ఎవరూ రాకపోవడంతో ఖననం చేశాం. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడా చట్ట ఉల్లంఘనలకు పాల్పడలేదు. ఘటన జరిగింది ఒడిశాలో. కేసు ఆ రాష్ట్ర పరిధిలోనే నమోదైంది. వాస్తవాలను వక్రీకరిస్తూ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అందువల్ల వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాన్ని కొట్టేయండి.’ అని శర్మ తన కౌంటర్లో కోరారు. -
20లోగా కౌంటర్ దాఖలు చేయండి...
- హైకోర్టు ఆదేశం -108 ఉద్యోగులకు సెప్టెంబర్ వేతనాలు ఇప్పటికీ ఇవ్వలేదు సాక్షి, హైదరాబాద్ 108 అంబులెన్సులు నిర్వహణ దక్కించుకున్న యుకెఎస్‌ఎఎస్-బీవీజీ కన్సార్టియంపై జీవీకే సంస్థ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల 20లోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో సర్కారు ఏంచేయాలో పాలుపోవడం లేదు. టెండరు నిబంధనల ప్రకారం ఈ రెండు సంస్థల కన్సార్టియంకు అర్హత లేదని జీవీకే సంస్థ కోర్టుకు పత్రాలను దాఖలు చేసింది. దీంతో 108 అంబులెన్సులను తక్షణమే ఆ సంస్థలకు ఇవ్వకుండా ఉపసంహరించుకోవాలని స్టే విధించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ప్రభుత్వం ఈ సంస్థలకు అర్హత ఉందని ఎలా చేయాలో కసరత్తు చేస్తోంది. కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా కౌంటర్ దాఖలు చేయడంలో భాగంగా టెండరు దక్కించుకున్న సంస్థల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గతంలో కాల్ సెంటర్‌గానీ, అంబులెన్సులు నిర్వహించిన అనుభవం గానీ ఈ సంస్థలకు లేదని జీవీకే హైకోర్టుకు చెప్పింది. సెప్టెంబర్ జీతాలు ఇప్పటికీ లేవు అక్టోబర్ నెల ముగుస్తున్నా 108 ఉద్యోగుల నిర్వహణకు ఇవ్వాల్సిన వేతనాలు ఇప్పటికీ ఇవ్వలేదు. ఉద్యోగులకు తామే సెప్టెంబర్ నెల వేతనాలు చెల్లించాలని, సర్కారు నుంచి తమకు రావాల్సిన వేతనాలు ఇంకా రాలేదని జీవీకే సంస్థ ప్రతినిధులు చెప్పారు. సుమారు రూ.7 కోట్ల బకాయిలు ఉన్నాయని, నిధులు తక్షణమే చెల్లించాలని కోరుతున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా సుమారు 6 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగిన వాహనాలన్నీ మరమ్మతులతో ఆగిపోతున్నాయని, దీంతో ఎమర్జెన్సీ కాల్స్‌కు సకాలంలో హాజరు కాలేకపోతున్నట్టు చెప్పుకొచ్చారు. 108 అంబులెన్సుల పరిస్థితి రోజురోజుకూ దిగజారుగుతోంది. -
హైకోర్టుకు 13న సెలవు దినం
ఉమ్మడి హైకోర్టుతో పాటు ఉభయ రాష్ట్రాల్లో ఉన్న కింది కోర్టులకు బక్రీద్ సందర్భంగా ఈ నెల 13వ తేదీని సెలవు దినంగా ప్రకటించారు. వాస్తవానికి హైకోర్టు గతంలోనే బక్రీద్ సందర్భంగా 12వ తేదీని సెలవుగా ప్రకటించింది. అయితే 13న బక్రీద్ నిర్వహిస్తుండటం, సుప్రీంకోర్టు కూడా ఆ రోజునే సెలవు ప్రకటించిన నేపథ్యంలో హైకోర్టు కూడా 13నే సెలవుగా ప్రకటించింది. 12వ తేదీ యథాతథంగా కోర్టు విధులు కొనసాగుతాయని రిజిష్ట్రార్ జనరల్ సిహెచ్.మానవేంద్రనాథ్‌రాయ్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
మంత్రులపై పిటిషన్ కొట్టివేత
ఎన్నికల తరువాత పార్టీ ఫిరాయించి అధికార పార్టీలో చేరినందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డిలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంత్రి పదవులు కట్టబెట్టారని, దీని వెనుక అవినీతి దాగి ఉందని, దీనిపై విచారణకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం కొట్టేసింది. ముఖ్యమంత్రి సిఫారసు మేరకు మంత్రులను గవర్నర్ నియమిస్తారని పిటిషనర్‌కు గుర్తు చేసిన హైకోర్టు, పార్టీ ఫిరాయింపుల అంశంపై ఇదే హైకోర్టు ధర్మాసనం ఇప్పటికే స్పష్టమైన తీర్పునిచ్చిందని, అందువల్ల వారికి మంత్రి పదవులు కట్టబెట్టడం అవినీతి కింద పరిగణించలేమని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని అధికరణ 164 కింద గవర్నర్ ఉపయోగించే అధికారాన్ని అవినీతి కిందకు రాదని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ మంగళవారం తీర్పు వెలువరించారు. తలసాని శ్రీనివాసయాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డిలకు పదవులు ఆశజూపి పార్టీ మారేలా చేశారని, తద్వారా ప్రతిపక్షాలు లేకుండా చేసేందుకు కుట్ర పన్నారని, దీని వెనుక అవినీతి కూడా దాగి ఉందని, అందువల్ల దీనిపై ఏసీబీ విచారణకు ఆదేశించాలని కోరుతూ టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు, సామాజిక కార్యకర్త ఫర్హత్ ఇబ్రహీం హైదరాబాద్ మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిని పరిశీలించిన కోర్టు ఈ ఫిర్యాదును తోసిపుచ్చింది. కింది కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఇబ్రహీం హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు తలసాని, ఇంద్రకరణ్‌రెడ్డిలను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై వాదనలు విని ఈ నెల 16న తీర్పును వాయిదా వేసిన న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ మంగళవారం తన తీర్పును వెలువరించారు. ముఖ్యమంత్రి తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకష్ణారెడ్డి చేసిన వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. అవినీతి నిరోధక చట్టం కింద చేసే ఫిర్యాదులను ఆ చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టులు మాత్రమే విచారించగలవని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. ఫిర్యాదుదారు ఏ కోర్టులో అయితే ఫిర్యాదు దాఖలు చేశారో అది ప్రత్యేక కోర్టు కాదన్నారు. అందువల్ల అక్కడ దాఖలు చేసిన ఫిర్యాదుకు విచారణార్హతే లేదని స్పష్టం చేశారు. తలసాని, ఇంద్రకరణ్‌రెడ్డిల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం స్పీకర్ పరిధిలోని అంశమని, ఇందులో జోక్యం చేసుకోలేమంటూ ఇదే హైకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చిందని, వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందన్న ఏజీ వాదనలను న్యాయమూర్తి ఈ సందర్భంగా తన తీర్పులో ప్రముఖంగా ప్రస్తావించారు. మంత్రుల నియామకం గవర్నర్ చేస్తారని, గవర్నర్ ఉపయోగించే అధికారాలు అవినీతి చట్ట పరిధిలోకి రావన్నారు. పిటిషనర్ లేవనెత్తిన అంశాలు ఏ కోణంలో చూసినా అవినీతి నిరోధక చట్ట పరిధిలోకి రావని, అందువల్ల ఈ వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నట్లు జస్టిస్ ప్రవీణ్‌కుమార్ తన తీర్పులో పేర్కొన్నారు. -
‘గ్రీన్ ఫార్మాసిటీ’ ఏ1నోటీసుపై స్టే
8 వారాలపాటు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు {పభుత్వానికి నోటీసులు.. కౌంటర్ల దాఖలుకు ఆదేశం తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా హైదరాబాద్: గ్రీన్ ఫార్మాసిటీ కోసం అవసరమైన 493 ఎకరాల భూమిని చర్చలు, సంప్రదింపుల ద్వారా కొనుగోలు చేసేందుకు వీలుగా మండల తహసీల్దార్ ఈ ఏడాది జనవరిలో జారీ చేసిన ఏ1 నోటీసు అమలును హైకోర్టు తాత్కాలికంగా నిలిపేసింది. ఎనిమిది వారాల పాటు నోటీసు అమలును నిలిపేస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట గ్రామంలో ఈ ఫార్మాసిటీ నిర్మించతలపెట్టిన విషయం విదితమే. అయితే చర్చల ద్వారా భూముల కొనుగోలు చేసే నిమిత్తం గత ఏడాది జూలైలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 45ను సవాలు చేస్తూ ఎం.భారతమ్మ, మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ జీవో ద్వారా కందుకూరు మండలంలోని సర్వే నంబర్ 112లోని 493 ఎకరాల భూములను గ్రీన్ ఫార్మాసిటీ కోసం కొనుగోలు చేసేందుకు తహసీల్దార్ జారీ చేసిన ఏ1 నోటీసును కూడా వారు సవాలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు విచారణ చేపట్టారు. 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయకుండా తప్పించుకోవడానికే ప్రభుత్వం ఈ జీవో 45 జారీ చేసిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. పిటిషనర్లందరూ కూడా అసైన్మెంట్ పట్టాదారులని వివరించారు. సంప్రదింపుల పేరుతో భూములను బలవంతంగా తీసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారన్నారు. అయితే ఈ వాదనలను ప్రభుత్వ న్యాయవాది తోసిపుచ్చారు. స్వచ్ఛందంగా భూములను కొనుగోలు చేసే వ్యవహారంలో ఎవరికైనా అభ్యంతరాలుంటే వాటిని తెలుసుకునేందుకే తహసీల్దార్ ఏ1 నోటీసు జారీ చేశారని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. తహసీల్దార్ జారీ చేసిన ఏ1 నోటీసు అమలును ఎనిమిది వారాల పాటు నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. -
'జీవో 123పై అప్పీల్ చేస్తే మేమూ ఇంప్లీడ్'
రాష్ర్టప్రభుత్వం జీవో 123 రద్దుపై హైకోర్టులో అప్పీల్ చేస్తే తాము కూడా ఇంప్లీడ్ అవుతామని సీపీఎం పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. భూసేకరణ జీవోను కొట్టేసి హైకోర్టు వేసిన చెంపదెబ్బ నుంచి గుణపాఠం నేర్చుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని, ఆ తీర్పుపై అప్పీల్ చేస్తామని మంత్రి హరీష్‌రావు చెబుతున్నారన్నారు. అయితే ప్రభుత్వం, మంత్రి హరీష్‌రావు అప్పీల్ ప్రకటనను పక్కనపెట్టి హైకోర్టు లేవనెత్తిన ఆయా అంశాలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారిగా వ్యవహరించడం, పేదలకు కాకుండా పెద్దలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని హైకోర్టు వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందన్నారు. అయినా పేదలకు తాము వ్యతిరేకమన్న విధంగా ప్రభుత్వం ముందుకు సాగడం సరికాదన్నారు. -
జైలు నుంచి బెయిల్‌పై లాయర్ల విడుదల
స్వాగతం పలికిన బార్ అసోసియేషన్ నాయకులు హైకోర్టును విభజించాలని నినాదాలు పోచమ్మమైదాన్ : న్యాయమూర్తిపై దాడి కేసులో అరెస్టరుున న్యాయవాదులు బుధవారం సాయంత్రం విడుదలయ్యారు. మొద టి అదనపు కోర్టు జడ్జి కేవీ నర్సింహులు తనపై న్యాయవాదులు దాడి చేశారని ఫిర్యాదు చేయడంతో 8 మంది న్యాయవాదులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైకో ర్టు విభజన చేయాలని గత 20 రోజులుగా న్యాయవాదులు సాముహికంగా విధులు బహిష్కరించి ఉద్యమిస్తున్నారు. రంజిత్, శ్యాంకృష్ణ, రాజేంద్ర ప్రసాద్, అంబటి శ్రీనివా స్, అల్లం నాగరాజు, రమణ, తీగల జీవన్‌గౌడ్, అఖిల్‌పాషాను మంగళవారం జైలుకు తరలించారు. విడుదలైన న్యాయవాదులు బయటకు వచ్చిన తర్వాత హైకోర్టును విభజించాలని నినాదాలు చేశారు. జై తెలంగాణ నినాదాలతో జైలు ఆవరణ హోరెత్తింది. విడుదలైన న్యాయవాదులను బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జయాకర్ మాట్లాడుతూ ఎన్ని కేసులు పెట్టినా హైకోర్టు విభజన కోసం ఉద్యమం కోనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు సహోదర్‌రెడ్డి, వద్దిరాజు గణేష్, సంజీవ్ పాల్గొన్నారు. -
మార్గదర్శకాల ప్రకారమే ప్రకటన
కరువు మండలాలపై హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వం హైదరాబాద్: కరువు మండలాల ప్రకటన విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన మార్గదర్శకాల ప్రకారమే వ్యవహరిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. కరీంనగర్ జిల్లాలోనూ ఆ మార్గదర్శకాలను అనుసరించే కరువు మండలాలను ప్రకటించినట్లు వివరించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ (విపత్తుల నిర్వహణ) ముఖ్య కార్యదర్శి బి.ఆర్.మీనా.. హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. కరీంనగర్ జిల్లాలో కలెక్టర్ సిఫారసులకు విరుద్ధంగా 40 మండలాలకుగాను కేవలం 19నే కరువు మండలాలుగా ప్రకటించడాన్ని సవా లు చేస్తూ జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పిల్ వేసిన విషయం తెలిసిందే. గతేడాది నైరుతి రుతుపవనాల సమయంలో రాష్ట్రంలో సగ టు వర్షపాతం 713.6 మి.మి. ఉండగా, 610 మి.మి. మాత్రమే నమోదయిందని, ఈ నేపథ్యంలో కరువు మండలాల ప్రకటనకు ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసి సిఫారసులు కోరిందని కౌంటర్లో మీనా పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో కలెక్టర్ 40 మండలాలను కరువు ప్రాంతాలుగా సిఫారసు చేయగా, కమిటీ 19 మండలాలనే ఓకే చేసిందన్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం పిటిషనర్ వినతి పత్రాన్ని పరిగణనలోకి తీసుకున్నామని, ఆ ప్రకారం కేశవపట్నానికి మాత్రమే కరువు మండలంగా గుర్తించే అర్హత ఉందన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని వ్యాజ్యాన్ని కొట్టేయాలని మీనా కోర్టుకు విజ్ఞప్తి చేశారు. -
సాక్షి టీవీ ప్రసారాల పునరుద్ధరణ
జర్నలిస్టుల విజయోత్సాహం నిరంతరాయంగా సాగిన ఉద్యమం ఒత్తిడి పెంచింది. హైకోర్టు అఫిడవిట్ దాఖలు చేయమనడం దానికి తోడైంది. గత్యంతరం లేక సర్కారు దిగొచ్చింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేస్తూ ఇచ్చిన మౌఖిక ఆదేశాలను ఉపసంహరించుకుంది. ఫలితంగా మంగళవారం రాత్రికే విశాఖ నగరంలో సాక్షి ప్రసారాలు పునఃప్రారంభమయ్యాయి. దీనికోసమే మొక్కవోని దీక్షతో గత 12 రోజులుగా రోడ్లేక్కి ఆందోళనలు చేసిన జర్నలిస్టుల సంఘాలు, సాక్షి సిబ్బంది బుధవారం విజయోత్సవాలు జరుపుకున్నారు. అందరికీ స్వీట్లు పంచి ఆనందం పంచుకున్నారు. -
హైకోర్టుకు ట్యుటోరియల్స్
విద్యాశాఖ కోర్టు ధిక్కారంపై పిటిషన్లు మినహాయింపు ఉన్నా వేధిస్తున్నారని ఫిర్యాదు విశాఖపట్నం: విద్యాశాఖ అధికారుల తీరుతో ఆందోళన చెందుతున్న ట్యుటోరియల్ స్కూళ్ల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. గుర్తింపు నుంచి మినహాయింపు పొందిన తమ స్కూళ్లను విద్యాశాఖ అధికారులు సీజ్ చేస్తున్నారంటూ నిర్వాహకులు కొద్ది రోజుల నుంచి ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఇప్పటికే జిల్లా విద్యాశాఖాధికారి, కలెక్టర్, ఇతర అధికారులకు వీరు వినతి పత్రాలు అందజేశారు. మరోవైపు జిల్లా విద్యాశాఖ కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందంటూ హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేస్తున్నాయి. తాజాగా ఈనెల 13న నగరంలోని పెదగంట్యాడకు చెందిన రాజీవ్ ట్యుటోరియల్స్ నిర్వాహకులు తమ స్కూలును విద్యాశాఖాధికారులు సీజ్ చేశారంటూ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఇందులో రాష్ట్ర విద్యాశాఖ, విద్యాశాఖ కమిషనర్, డీఈవో, ఎంఈవో (పెదగంట్యాడ)లను ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై 16న విచారణ చేపట్టిన హైకోర్టు విద్యాశాఖ అధికారులు రాజీవ్ ట్యుటోరియల్స్‌ను మూసివేయడం నిరంకుశమని, అక్రమమని, రాజ్యాంగ విరుద్ధమని, సహజ న్యాయసూత్రాలకు వ్యతిరేకమని స్పష్టం చేసింది. తక్షణమే సీలు వేసిన తాళాలను తెరచి ట్యుటోరియల్ నడపడానికి వీలు కల్పించాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వుల నేపథ్యంలో జిల్లా, నగర వ్యాప్తంగా ఉన్న ఇతర ట్యుటోరియల్ స్కూళ్ల తరఫున హైకోర్టును ఆశ్రయించనున్నట్టు ఏపీ ప్రైవేటు ట్యుటోరియల్ స్కూల్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఎన్.విశ్వేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎస్.సూర్యనారాయణ శుక్రవారం ‘సాక్షి’కి చెప్పారు. తాము ట్యుటోరియల్స్‌ను నడుపుకోవడానికి అనుమతులున్నా విద్యాశాఖాధికారులు ఏటా బడులు తెరిచే సమయానికి ఇబ్బందులు పెడుతూ స్కూళ్లను మూసివేస్తున్నారని ఆరోపించారు. తమ ట్యుటోరియల్స్‌ను రిజిస్టర్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదని తెలిపారు. -
ఆ ఒక్కటి వదిలేస్తే..!
ఇంకెక్కడ స్థలం కావాలన్నా ఓకే ఒకవైపు స్వాధీనానికి నోటీసులు.. మరోవైపు బేరసారాలు బడాబాబుల పక్షాన వుడా ద్వంద్వవైఖరి అలా కుదరదన్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ వందలాది స్థలాలు ఖాళీగా ఉన్నా పట్టించుకోలేదు అడ్డగోలుగా ముందుకెళ్లి.. బోల్తా పడిన వుడా నిబంధనలు అలా ఉన్నాయంటున్నారు.. ఏళ్ల తరబడి ఖాళీగా ఉంటే స్వాధీనం చేసుకుని తీరుతామని బీరాలు పోతున్నారు. కానీ నగరంలో ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు ఇచ్చిన వందలాది స్థలాలు ఏళ్ల తరబడి ఖాళీగానే పడున్నాయి. అడపదడపా నోటీసులివ్వడం తప్ప.. వాటి జోలికి ఏనాడూ వెళ్లని వుడా బాబులు.. కేంద్ర ప్రభుత్వ సంస్థకు ఇచ్చిన స్థలం విషయంలో ఎందుకింత కఠినంగా వ్యవహరించారని ఆరా తీస్తున్న కొద్దీ కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. పైగా స్వాధీనం చేసుకుంటామన్న వారు.. మధ్యలో దాన్ని వదిలేసుకుంటే.. ప్రత్యామ్నాయంగా మరో స్థలం ఇస్తామని బేరాసారాలకు దిగడమేమిటన్న తాజా వివాదం రాజుకుంటోంది. విశాఖపట్నం : వంద కోట్ల విలువైన ఎన్ఎండీసీకి చెందిన భూమిని వెనక్కి తీసుకోవాలన్న వుడా వివాదాస్పద నిర్ణయం వెనుక మరో కోణం వెలుగుచూస్తోంది. పాతికేళ్ల క్రితం ఎన్ఎండీసీ కొనుగోలు చేసిన అర ఎకరా భూమిని అడ్డగోలుగా స్వాధీనం చేసుకుని ఇంటర్ గ్లోబ్ హోటల్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు నామమాత్రపు ధరకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో వుడా బరితెగింపునకు అడ్డుకట్ట పడినా.. తెరవెనుక జరిగిన వ్యవహారాలు ఇప్పుడు ఒక్కోటీ బయటకు వస్తున్నాయి. ఖాళీగా వందలాది స్థలాలు ఏళ్ల తరబడి ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా ఖాళీగా వదిలేయడం వల్లే బీచ్‌రోడ్డులో ఉన్న జాతీయ ఖనిజాభివృద్ధి సంస్ఖ (ఎన్ఎండీసీ) స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టామని వుడా అధికారులు బీరాలు పోతున్నారు. నిబంధనల మేరకే అలా చేశామని వాదిస్తున్నారు. వాస్తవానికి అలా ఖాళీగా వదిలేసిన స్థలాలు నగరంలో లెక్కలేనన్ని ఉన్నాయి. ఆయా స్థలాల యజమానులకు అడపాదడపా నోటీసులు ఇవ్వడం తప్పించి ఒక్క గజం భూమిని కూడా స్వాధీనం చేసుకునేందుకు వుడా అధికారులు కనీస చర్యలు చేపట్టలేదు. కానీ ఏకంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ స్థలానికి ఎసరు పెట్టేందుకు మాత్రం నిబంధనలను సాకుగా చూపించారు. మరోవైపు ఎన్ఎండీసీతో తెరవెనుక రాయబేరాలూ సాగించారు. బీచ్ రోడ్డులోని స్థలం అప్పజెబితే..నగరంలో ఎక్కడ కావాలంటే అక్కడ మరో స్థలం ఇస్తామని హామీ ఇవ్వడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే స్వాధీనం చేసుకోవాలే గానీ.. ప్రత్యామ్నాయ స్థలం ఇస్తామని బేరం పెట్టడం చూస్తే.. వుడా కుట్ర ఏమిటో అర్థమవుతుంది. ఇంటర్ గ్లోబ్ ఎంచుకున్న స్థలమట పర్యాటకాభివృద్ధి కోసం రాష్ర్టంలో పెట్టుబడులు పెట్టాలన్న ప్రభుత్వ ఆహ్వానంపై జాతీయస్థాయి కార్పొరేటు సంస్థలు ఇటీవల విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాల్లో పర్యటించాయి. ఆ క్రమంలో విశాఖలో పర్యటించిన ఇంటర్ గ్లోబ్ హోటల్స్ ప్రతినిధులను బీచ్ రోడ్డులో సువిశాలంగా ఉన్న ఎన్ఎండీసీకి చెందిన ఖాళీ స్థలం ఆకర్షించింది. ఇక్కడైతే స్టార్ హోటల్ కట్టేందుకు తాము సిద్ధమని అప్పటికప్పుడే వారు ప్రకటించేశారు. పర్యాటకశాఖ అధికారులు ఈ విషయమై జీవీఎంసీ, రెవెన్యూ ఉన్నతాధికారులతో మాట్లాడగా, అది గతంలో వుడా విక్రయించిన స్థలమని తేలింది. అంతే.. ఆ స్థలాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకునే పనిని ప్రభుత్వ పెద్దలు వుడా అధికారులకు అప్పజెప్పారు. మొదట్లో వుడా అధికారులు తటపటాయించినా బడాబాబులు రంగప్రవేశం చేయడంతో అడ్డగోలుగా ముందుకు వెళ్లిపోయారు. ఆ భూమిని వెనక్కి తీసుకునే ప్రక్రియను వేగవంతం చేశారు. కండిషనల్ రిజిస్ట్రేషన్‌లో ఉన్న నిబంధనను తెరపైకి తెచ్చి స్థలాన్ని వెనక్కి తీసుకునేందుకు నోటీసులిచ్చారు. వుడా అధికారులకు అక్కడా అవమానమే.. ఖాళీగా ఉన్న స్థలంలో వెంటనే నిర్మాణాలు చేపడతామని, వెనక్కి తీసుకునే చర్యలు ఉపసంహరించుకోవాలన్న ఖనిజాభివృద్ధి సంస్థ విశాఖ అధికారుల గోడును పట్టించుకోని వుడా అధికారులు.. ఇదే సమయంలో ఎన్ఎండీసీ ఉన్నతస్థాయి అధికారులతో రాయబేరం నడిపారు. బీచ్‌రోడ్డు పక్కన స్థలాన్ని వదిలేస్తే ప్రత్యామ్నాయంగా మీకు మరో చోట స్థలం ఇస్తామనే ప్రతిపాదన తీసుకొచ్చారు. వెంటనే కావాలంటే రుషికొండ సమీపంలో ఇప్పటికే నిర్మించిన రే హౌసింగ్ ప్లాట్స్ ను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు వుడా వీసీ టి.బాబూరావునాయుడు మే నెలలో హైదరాబాద్ వెళ్లి ఎన్ఎండీసీ చైర్పర్సన్ భారతి ఎస్.సిహాగ్ను కలిసేందుకు ప్రయత్నించారు. వుడా వ్యవహారశైలితో గుర్రుగా ఉన్న ఆమె వీసీకి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని తెలిసింది. దీంతో ఆగ్రహించిన వుడా అధికారులు ఈ నెల 6న ఎన్ఎండీసీకి కేటాయించిన స్థలాన్ని వెనక్కి చేసుకుంటామంటూ నోటీసులు జారీ చేశారు. దీనిపై ఎన్ఎండీసీ ఉన్నతాధికారులు హైకోర్టుకు వెళ్లడంతో వుడా నిర్ణయాన్ని రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇక కేంద్ర గనులు, ఉక్కు శాఖ మంత్రి తోమర్ ఎన్ఎండీసీకి జరిగిన అన్యాయంపై ప్రధాని నరేంద్రమోదీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఓ పక్క కోర్టు అక్షింతలు, మరో పక్క కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆగ్రహావేశాలతో వుడా పరువు నట్టేట మునిగినట్టయిందని స్వయంగా వుడా వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. -
లా శాఖకు హైకోర్టు చురక!
- విశ్లేషణ యాసిడ్ దాడి, రేప్‌కు ప్రయత్నించిన వ్యక్తిని చంపే అధికారం మహిళలకు ఉందంటూ.. పార్లమెంటు ఐపీసీకి చేసిన సవరణ మరుగునపడితే మహిళ లకు తమను తాము రక్షించుకునే హక్కు ఉందని ఎలా తెలుస్తుంది? బెంగళూరు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (ఎన్‌ఎల్‌ఎస్‌యూఐ) విద్యార్థి వంశ్ శరద్ గుప్తకు భారతీయ క్రైస్తవ వివాహ చట్టం 1972 పూర్తి పాఠం అవసరమైంది. ఎక్కడా దొర కలేదు. న్యాయ మంత్రిత్వ శాఖ లా విభాగం అధికారిక వెబ్సైట్ http://indiacode.nic.inలో ఆ చట్టం పాఠం ఉన్నా ఒక్క వాక్యం కూడా వరసగా చదవలేనంత జటిలంగా ఉంది. విద్యార్థులకు ఉపయోగమయ్యే ఈ వెబ్సైట్లో కొన్ని చట్టాలు అసలు చదవలేమనీ, ప్రైవేట్ పబ్లిషర్లు ప్రచురించే పుస్తకాలలో మూల చట్టం తప్పులు లేకుండా ఉందనలేమనీ, అధికారిక ప్రతినిధుల ఈమెయిల్ ఐడీలు పనిచేయడం లేదని ఫిర్యాదు చేశారు. 1908లో రూపొందించిన సివిల్ ప్రొసీజర్ కోడ్ తాజా ప్రతి అధికారిక వెబ్సైట్లో లేదు. అడిగితే 1908 నాటి ప్రతిని, ఆ తరువాత పార్లమెంటు చేసిన వందకు పైగా సవరణల ప్రతులను ఇస్తున్నారు. వీటన్నింటిని సమన్వయం చేసి చట్టం పాఠం ఏమిటో తెలుసుకోవాలంటే కొన్ని నెలలు పడుతుంది. సవరణలను చేరుస్తూ నవీకరించిన తాజా ప్రతిని తయారు చేయవలసిన బాధ్యత శాసనాల విభాగానిదే. సవరించిన చట్టాల్ని ప్రైవేటు ప్రచురణ కర్తలు అమ్ముకుంటున్నారు. అధికారికంగా ప్రభుత్వం సవరించిన ప్రతిని అందుబాటులోకి తేవలసి ఉంది. సవరించిన రూపంలో వందలాది చట్టాలను ఇచ్చే స్థితి లేదు. శాసన విభాగం పీఐఓ సవరించిన తాజా శాసన పాఠాలను రూపొందించి అందుబాటులోకి తెచ్చే కార్యక్రమం మొదలైందని, ఇంకా కొన్నేళ్ల సమయం పడుతుందని వివరించారు. హిందీ భాషలో కూడా చట్టాలను అనువదించే కార్యక్రమం సాగుతున్నదని చెప్పారు. ఈ కార్యక్రమం ప్రస్తుత దశ, పూర్తయ్యే గడువు వివరాలు ఇవ్వాలని సీఐసీ ఆదేశించింది. దరఖాస్తుకు నెలరోజుల్లో జవాబు ఇవ్వలేదు. మొదటి అప్పీలు పట్టించుకోలేదు. తమ ఈ మెయిల్ పనిచేస్తుందో లేదో చూసుకోరు. తాము పాటించవలసిన చట్టాలను తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని, ఈ చట్టాల సమాచారం ప్రభుత్వం స్వయంగా వెల్లడించాల్సింది పోయి అడిగినా చెప్పకపోవడం ఆర్టీఐ ఉల్లంఘన అవుతుందంటూ విద్యార్థులకు కలిగిన నష్టాన్ని పూరించడానికి రూ.10 వేలను యూనివర్సిటీ గ్రంథాలయానికి ఇవ్వాలని సీఐసీ ఆదేశించింది. ప్రభుత్వమే నడిపే విశ్వవిద్యాలయానికి రూ. 10వేలు ఇస్తే ప్రభుత్వానికి ఏ నష్టమూ లేదు. ఇవ్వకపోతే యూనివర్సిటీ సీఐసీలో ఫిర్యాదు కూడా చేయకపోవచ్చు. ఈ తీర్పు చట్ట విరుద్ధమని, అన్యాయమనీ నష్టపరిహారం ఆదేశం రద్దు చేయాలని శాసన మంత్రిత్వ శాఖ ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. చట్టాన్ని అస్పష్టంగా, అసందిగ్ధంగా అందుబాటులో లేకుండా చేయడం అంటే దాన్ని రహస్యంగా మార్చి చట్టాలను తెలుసుకునే ప్రజల హక్కును భంగపరచరాదని, ఐటీని ఉపయోగించుకుని చట్టాలను ప్రజలకు అందుబాటులోకి తేవడం ప్రభుత్వ బాధ్యత అనీ, సవరణలతో సంస్కరించిన చట్టాల పూర్తి ప్రతులను వెబ్సైట్లో ఉంచాలనీ, గ్రంథాలయానికి పదివేలు పరిహారం ఇవ్వాలనీ, ిసీఐసీ ఆదేశిస్తే దానిపై రిట్ పిటిషన్ వేయడాన్ని ఢిల్లీ హైకోర్ట్టు ప్రశ్నించింది. ఇది ప్రభుత్వ కనీస బాధ్యత. మహిళ తనపై యాసిడ్ దాడి జరిగినా, రేప్ ప్రయత్నం జరిగినా ఆత్మరక్షణ కోసం దాడి చేసే వ్యక్తిని చంపే అధికారం ఉందంటూ నిర్భయ చట్టం ద్వారా పార్లమెంటు ఇటీవల ఐపీసీని సవరించింది. ఈ సవరణతో కూడిన తాజా ఐపీసీని సులువుగా ప్రజలకు అందుబాటులో ఉండేట్టు చేయకపోతే మహిళలు తమను రక్షించుకునే హక్కు ఉందని ఎలా తెలుసుకుంటారు? ఇటువంటి తాజా శాసన సవరణ విషయాలను ఎప్పటిలోగా ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారో చెప్పాలని సీఐసీ ఆదేశించింది. దీనిపైన రిట్ దాఖలు చేసిన విద్యార్థి ఆర్టీఐని సరైన రీతిలో దరఖాస్తు వేయలేదని, ఫీజు ఇవ్వలేదని, మొదటి అప్పీలు వేయలేదని కనుక రెండో అప్పీలు వినరాదని శాసన విభాగం వాదించింది. దీన్ని తిప్పికొడుతూ ఢిల్లీ హైకోర్టు గణనీయమైన తీర్పు ఇచ్చింది. ిసీఐసీ తీర్పుపై విచారించేందుకు హైకోర్టు అప్పీలు కోర్టు కాదని, కొన్ని సాంకేతిక కారణాలు చూపుతూ అసలు న్యాయానికి అడ్డుతగలకూడదని హితవు చెప్పింది. సీఐసీ ఇచ్చిన ఆదేశం సమంజసమనీ, న్యాయ విధానాన్ని ముందుకు నడిపేదిగానూ ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ సింగ్ వివరించారు. అసలు చట్టాలు ఒక క్లిక్‌లో అందు బాటులో తేవాల్సిన బాధ్యత ఆర్టీఐ చట్టం ప్రకారం ప్రభుత్వంపైన ఉందని సీఐసీ సరిగ్గానే చెప్పారు... ప్రభుత్వమే అన్ని చట్టాలను అందుబాటులో ఉంచాలి. రూ.10వేల పరిహారం గురించి లేవనెత్తిన వివాదాన్ని ప్రస్తావిస్తూ ఈ పిటిషన్ వేయడానికి రూ.10వేల కన్న ఎక్కువే ప్రభుత్వం ఖర్చుచేసి ఉంటుంది. కనుక సీఐసీ ఆదేశించిన రూ.10వేలను ఈ పిటిషన్ వేయడానికి కారకులైన అధికారుల జీతాలనుంచి మినహాయించి పరిహారం చెల్లించాలి అని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. సామాన్య జనంపై.. కోర్టుల్లో ప్రభుత్వాలే సుదీర్ఘ సమరాలు చేయడం ఎంత అసమంజసమో ఢిల్లీ హైకోర్టు ఈ తీర్పులో వివరించింది. (సీఐసీలో ఈ రచయిత ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు రిట్ పిటిషన్(సి) 4761-2016లో మే 24 2016న ఇచ్చిన తీర్పు ఆధారంగా) - మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
రాజ్యాంగంపై విశ్వాసానికి ఈ ఉత్తర్వులు ప్రతీక
రోజా తరపు న్యాయవాది ఇందిరా జైసింగ్ హైదరాబాద్: రోజాపై ఏడాది పాటు సస్పెన్సన్ వేటు వేస్తూ చేసిన తీర్మానం అమలును నిలిపేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆమెతరపు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఉత్తర్వుల ద్వారా రోజా రాజ్యాంగపరమైన హక్కులు పునరుద్ధరించబడ్డాయని వ్యాఖ్యానించారు. రాజ్యాంగంపై విశ్వాసానికి ఈ ఉత్తర్వులు ప్రతీక అన్నారు. హక్కులకు భంగం కలిగినప్పుడు న్యాయం చేసేందుకు న్యాయస్థానాలు ఉన్నాయన్న ప్రజల నమ్మకాన్ని ఇటువంటి ఉత్తర్వులు నిలబెడతాయన్నారు. ఇవి మధ్యంతర ఉత్తర్వులు మాత్రమేనని వీటిపై ఇంతకుమించి తానేమీ వ్యాఖ్యానించబోనని స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వుల వల్ల రోజా శాసనసభకు హాజరు కావచ్చునని తెలిపారు. -
స్పీకర్ ఆఫీస్ తీరు ఇదేనా?
ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారంలో సుప్రీం ధర్మాసనం వ్యాఖ్య సాక్షి, న్యూఢిల్లీ ‘‘ఏవో సాంకేతిక కారణాలు చూపి ఒక సభ్యురాలి హక్కులకు భంగం కలిగిస్తారా? స్పీకర్ కార్యాలయం ఏం చేస్తోంది? ప్రజాప్రతినిధి పట్ల ఇలాగే వ్యవహరిస్తారా? ఒక నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధితో వ్యవహరించేది ఇలాగేనా? సమ్ థింగ్ రాంగ్.. పిటిషన్‌ను హైకోర్టు రిజిస్ట్రార్ ఎలా తిరస్కరిస్తారు? హైకోర్టు ఏం చేస్తోంది? జ్యుడీషియల్ ఆర్డర్‌ను ఎందుకు పరిగణనలోకి తీసుకోరు? ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది. ఇది కేవలం ఒక్క అసిస్టెంట్ రిజిస్ట్రార్ మాత్రమే చేసినట్లు కనిపించడం లేదు.’’ ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి ఏడాదిపాటు సస్పెన్షన్‌కు గురైన నగరి శాసనసభ్యురాలు, వైఎస్సార్సీపీ నేత ఆర్.కె.రోజా పిటిషన్‌ను విచారిస్తూ సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యలివి. నిబంధనలకు విరుద్ధంగా అసెంబ్లీ నుంచి తనను సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో రోజా పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెల్సిందే. అయితే విచారణార్హత లేదంటూ రోజా పిటిషన్‌ను హైకోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్ తిరస్కరించారు. ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ రోజా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రోజా అప్పీలుపై జస్టిస్ గోపాల గౌడ, జస్టిస్ అరుణ్ మిశ్రాతో కూడిన సుప్రీం ధర్మాసనం దాదాపు గంటకు పైగా విచారించింది. ఆ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో సుప్రీం ధర్మాసనం జరిపిన విచారణ ఇలా సాగింది... ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే... తొలుత రోజా తరపున సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు ప్రారంభిస్తూ ‘‘ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యకలాపాల నిబంధనావళిలోని 340(2) నిబంధన ప్రకారం ఒక సభ్యుడిని ఆ సెషన్లో మిగిలిన రోజులకు చెల్లుబాటయ్యేలా మాత్రమే సస్పెండ్ చేసేందుకు వీలుంది. కానీ రోజా విషయంలో నిబంధనలకు విరుద్ధంగా సభా తీర్మానం పేరుతో శీతాకాల సమావేశాల్లో (డిసెంబరు 18న) ఏడాదిపాటు సస్పెన్షన్ విధించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21 ద్వారా సంక్రమించిన ప్రాథమిక హక్కులను ఈ సస్పెన్షన్ ఉల్లంఘిస్తోంది. అంతేకాకుండా స్పీకర్ హోదాకు ఉన్న వన్నెను తగ్గిస్తుంది. ఇది సభా నిబంధనావళిని ఉల్లంఘించడమే అవుతుంది. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రోజాను సస్పెండ్ చేశారు. సమావేశాలు డిసెంబరు 22తో ముగుస్తుండగా.. ఆ సెషన్లో మిగిలిన దినాలైన 18 నుంచి 22 వరకు మాత్రమే సస్పెండ్ చేసేందుకు నిబంధనల ప్రకారం వీలుంది. కానీ ఏడాదిపాటు సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినట్టు ఉత్తర్వు కాపీ కూడా ఇవ్వలేదు. అసెంబ్లీకి వెళితే పోలీసులు అమానుషంగా ప్రవ ర్తించారు. సస్పెన్షన్‌కు సంబంధించిన కాపీ ఇవ్వాలని ఎన్నిసార్లు లేఖరాసినా స్పందన లేదు. ప్రతిపక్ష నేత లేఖ రాసినా స్పందన లేదు. చిట్టచివరకు ఆ సస్పెన్షన్ ఉత్తర్వు కాపీని మార్చి 3, 2016న హైకోర్టులో విచారణ సందర్భంలో ఇచ్చారు..’’ అని వివరించారు. హైకోర్టు రిజిస్ట్రార్ తిరస్కరించారు... ‘‘రోజా పిటిషన్ హైకోర్టులో ఫిబ్రవరి 15, 16, 17, 29 తేదీల్లో విచారణకు వచ్చింది. ఫిబ్రవరి 29న కౌంటర్దాఖలు చేయాలంటూ సింగిల్ జడ్జి ప్రతివాదికి నోటీసులు ఇస్తూ మార్చి 9కి విచారణను వాయిదావేశారు. మరోవైపు బడ్జెట్ సెషన్ మార్చి 5న ప్రారంభం కానున్న నేపథ్యంలో పిటిషనర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరుగుతుండగా మార్చి 3న అదనపు అడ్వొకేట్ జనరల్ సస్పెన్షన్ తీర్మానం కాపీని హైకోర్టులో ఇచ్చారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అత్యవసర పిటిషన్‌గా పరిగణించాలని రోజా కోరినా సింగిల్ జడ్జి బెంచి ఈ పిటిషన్‌ను వినేందుకు తిరస్కరించింది. మార్చి 9నే విచారిస్తానని పేర్కొంది. ఈ నేపథ్యంలో మార్చి 4వ తేదీనే సింగిల్ జడ్జి బెంచ్ వద్ద ఉన్న పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు వీలు కల్పించాలని, తమకు లభించిన సస్పెన్షన్ తీర్మానం ప్రతి ఆధారంగా మరిన్ని వాదనల తో తాజాగా మరో రిట్‌పిటిషన్ దాఖలు చేసుకుంటామని పిటిషనర్ రోజా దరఖాస్తు చేసుకున్నారు. అందుకు బెంచ్ సమ్మతించింది. ఈ నేపథ్యంలో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేయగా రిజిస్ట్రార్ ఆ పిటిషన్‌కు విచారణార్హత లేదంటూ తిరస్కరించారు. అందుకే సుప్రీం కోర్టును ఆశ్రయించాం.. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందున సభ్యురాలిని సమావేశాలకు హాజరయ్యేలా ఉత్తర్వులు జారీచే యాల్సిందిగా కోరుతున్నాం..’’ అని విన్నవించారు. హైకోర్టు ఏం చేస్తోంది? రోజా తరపు న్యాయవాది అభ్యర్థన విన్న తరువాత జస్టిస్ అరుణ్‌మిశ్రా జోక్యం చేసుకుంటూ ‘మరో పిటిషన్ దాఖలు చేసుకునేందుకు సింగిల్ జడ్జి బెంచ్ స్వేచ్ఛనిచ్చినా రిజిస్ట్రార్ తిరస్కరించారా? రిజిస్ట్రార్‌కు ఏం సంబంధం? పిటిషన్‌ను ఎలా తిరస్కరిస్తారు?’ అని ప్రశ్నించారు.. అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇచ్చిన తిరస్కరణ ఉత్తర్వును న్యాయవాది ధర్మాసనానికి విన్నవించారు. ‘అయితే అది చట్టబద్ధం కాని కారణాల వల్ల అలా జరిగి ఉండొచ్చు..’ అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో జస్టిస్ గోపాల గౌడ జోక్యం చేసుకుంటూ ‘హైకోర్టు ఏం చేస్తోంది? జ్యుడీషియల్ ఆర్డర్‌ను ఎందుకు పరిగణనలోకి తీసుకోరు? పిటిషన్‌కు విచారణార్హత లేదంటూ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎలా రాస్తారు? అలా చెప్పే పని ఆయనది కాదే? ’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఇది పద్ధతి కాదు. ఇలా ఎలా వ్యవహరిస్తారు? బడ్జెట్ సెషన్ జరుగుతుండగా.. ఇలాంటి పద్ధతికి ఎలా పాల్పడుతారు?’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంలో రోజా తరఫు న్యాయవాది మరోసారి లేచి బడ్జెట్ సెషన్లో రోజా మహిళల సమస్యలను లేవనెత్తాల్సి ఉందని ప్రస్తావించారు. దీంతో జస్టిస్ గోపాల గౌడ స్పందిస్తూ ‘అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎలా జ్యుడీషియల్ ఉత్తర్వులను పట్టించుకోకుండా తనకు సంబంధం లేని విధులను ఎలా నిర్వర్తిస్తారు? హైకోర్టు రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఏం జరుగుతుందో హెకోర్టు చీఫ్ జస్టిస్ తప్పకుండా తెలుసుకుని తీరాలి..’ అని వ్యాఖ్యానించారు. ‘రెండు రోజుల్లో ఈ కేసును పరిష్కరించాలని మేం చీఫ్ జస్టిస్‌కు సూచనలు ఇస్తాం.’ అని చెబుతుండగా న్యాయవాది మరోసారి తన వాదనలు వినిపించారు. ఆ తీర్పులు చూడండి.. న్యాయవాది లేచి ‘ఆర్టికల్ 32 కింద నా అభ్యర్థనను ఇక్కడే విచారించండి. గతంలో సుప్రీం కోర్టు పలు సందర్భాల్లో ఇలాంటి విషయాలను విచారణకు స్వీకరించింది. ఇటీవలే అలగాపురం ఆర్.మోహనరాజు అండ్ అదర్స్ వర్సెస్ తమిళనాడు శాసనసభ కేసులో జస్టిస్ చలమేశ్వర్ ఇచ్చిన తీర్పును పరిశీలించండి. రాజారాంపాల్ వర్సెస్ లోక్‌సభ స్పీకర్ కేసును పరిశీలించండి..’ అని విన్నవించారు. దీంతో జస్టిస్ గోపాల గౌడ స్పందిస్తూ ‘మీ పిటిషన్ విచారించాలని మేం హైకోర్టుకు సూచిస్తాం. రిజిస్ట్రార్ చేసిన వ్యాఖ్యలు సరికాదు. చాలా తెలివిగా రాశారు. వెంటనే రోస్టర్ బెంచికి ఈ పిటిషన్ కేటాయించాలని సూచిస్తాం..’ అని పేర్కొన్నారు. దీంతో మరోసారి ఇందిరా జైసింగ్ వాదిస్తూ ‘త్వరలో బడ్జెట్ సమావేశాలు ముగియబోతున్నాయి. ఈ నేపథ్యంలో నేను అక్కడికి వెళ్లి మధ్యంతర ఉత్తర్వులు గానీ, ఉపశమనం గానీ దక్కించుకుంటానన్న నమ్మకం లేదు.. ’ అని వాపోయారు. ‘ఈ కోర్టులో కూడా రెండు ధర్మాసనాలు కేసు విచారణ నుంచి తప్పుకున్నాయి..’ అని వాపోయారు. దీనికి జస్టిస్ గౌడ స్పందిస్తూ ‘లేదు. మా ఉత్తర్వులు తప్పకుండా అమలవుతాయి.. ఒకవేళ మా ఉత్తర్వులు అమలు కానిపక్షంలో ఎలా అమలు చేయించాలో మాకు తెలుసు.. హైకోర్టులో ఒక పిటిషన్ విచారణలో ఉండగా మేం దీనిని విచారించలేం..’ అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాదిపై ఆగ్రహం.. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది బసవ ప్రభు పాటిల్ లేచి వాదనలు వినిపించబోతుండగా జస్టిస్ గోపాల గౌడ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మీరు ఒకవేళ ఈ కేసులో వాదనలు వినిపిం చడం ప్రారంభిస్తే పిటిషన్‌ను ఇక్కడే విచారిస్తాం. ఇది డెలిబరేట్లీ(ఉద్దేశపూర్వకంగా) జరిగింది. ఇది కేవలం ఒక్క అసిస్టెంట్ రిజిస్ట్రార్ మాత్రమే చేసినట్లు కనిపించడం లేదు..’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో పాటిల్ మరోసారి ‘మా వాదన కూడా వినండి..’ అని కోరగా ‘ఇంకేం వినమంటారు? అసిస్టెంట్ రిజిస్ట్రార్ రాసింది మేం చూశాం కదా.. మీరు ఒకవేళ వాదనలు ప్రారంభిస్తే మేం కేసును వింటాం..’ అని హెచ్చరించారు. ‘దక్షిణ భారత దేశంలో ఎన్ని రిట్ పిటిషన్లు ఉన్నాయి. మా దగ్గర సమాచారం లేదా? ఒక అసిస్టెంట్ రిజిస్ట్రార్ చేయాల్సిన పనా ఇది? డిప్యూటీ రిజిస్ట్రార్, అదనపు రిజిస్ట్రార్ లేరా?..’ అని జస్టిస్ గౌడ వ్యాఖ్యానించారు. పిటిషనర్ సస్పెండయ్యాక రెండు నెలల వరకు కోర్టును ఆశ్రయించలేదని మళ్లీ పాటిల్ వాదించబోగా ‘మీరు ఇన్బిట్వీ న్ లైన్స్(మా భావాన్ని) గా అర్థం చేసుకోండి..’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంలో జైసింగ్ లేచి కనీ సం సస్పెన్షన్ తీర్మానం కాపీని కూడా ఇవ్వలేదని విన్నవించారు. ‘ఎందుకు ఇలా.. స్పీకర్ కార్యాలయం సస్పెన్షన్ తీర్మానాన్ని ఇవ్వలేదా? దేశంలో ఏం జరుగుతోంది? మీరు ఏదో సాంకేతిక కారణా లు చూపి ఒక సభ్యురాలి హక్కులకు భంగం కలిగి స్తారా? స్పీకర్ కార్యాలయం ఏం చేస్తోంది? ప్రజాప్రతినిధి పట్ల ఇలాగే వ్యవహరిస్తారా? ఒక నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధితో వ్యవహరించేది ఇలాగేనా? మమ్మల్ని బాధించింది.. సమ్ థింగ్ రాంగ్.. సమ్ థింగ్ రాంగ్..’ అంటూ పేర్కొన్నారు. జస్టిస్ అరుణ్ మిశ్రా కల్పించుకుని ‘పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉందని ఊరుకుంటున్నాం. కానీ మీరు ప్రభుత్వానికి మద్దతుగా వాదిస్తున్నారు. అలాగే డిఫెండ్ చేస్తానంటే ఈ కేసును ఆర్టికల్ 32 కింద ఇక్కడే విచారిస్తాం.. అసెంబ్లీ నడుస్తుండగా ఇలా ఎలా వ్యవహరిస్తారండీ? మీ క్లయింట్‌కు సరైన సలహా ఇవ్వండి’ అంటూ ఏపీ ప్రభుత్వ న్యాయవాది బసవ ప్రభు పాటిల్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. అదే మా తొలి ప్రశ్న అవుతుంది.. ‘మీరు వాదిస్తానంటే చెప్పండి.. 340(2) నిబంధన కింద ఏడాదిపాటు ఎలా సస్పెండ్చేస్తారన్నదే మా తొలి ప్రశ్నగా ఉంటుంది. అది మిమ్మల్ని ఇరకాటంలో పెడుతుంది..’ అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఉత్తర్వులు జారీ చేసేందుకు సంసిద్ధులవుతూ ‘సింగిల్ జడ్జి బెంచ్ విని ఉండాల్సింది. వినకపోవడం న్యాయంగా లేదు.. అసిస్టెంట్ రిజిస్ట్రార్ పని చట్టబద్ధంగా లేదు..’ అని పేర్కొన్నారు. ‘మేం పిటిషనర్‌ను బుధవారం ఉదయం 10 గంటలకు హైకోర్టు చీఫ్ జస్టిస్ వద్ద కేసును ప్రస్తావించాలని సూచిస్తున్నాం. చీఫ్ జస్టిస్ ఈ కేసును రోస్టర్ ప్రకారంగా గానీ, లేదా ఏ బెంచికైనా గానీ ఈ పిటిషన్‌ను కేటాయించి విచారించేలా చూడాలి. మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీచేయాలి. ప్రతివాదులు కూడా ఈ కేసులో హాజరవ్వాలి. అలాగే మా ఉత్తర్వుల అమలుతో కూడిన నివేదికను ఈమెయిల్ ద్వారా, టెలెక్స్ ద్వారా మాకు సాయంత్రానికల్లా తెలపాలి.. అలాగే పిటిషన్‌కు విచారణార్హత ఉందని మా ఉత్వర్వుల్లో స్పష్టం చేస్తున్నాం. తక్షణం ఈ ఉత్తర్వులను హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు తెలియపరచాలి..’ అని రిజిస్ట్రార్‌ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. సంతోషంగా ఉంది: రోజా ‘ఆర్టికల్ 32 కింద మా పిటిషన్‌ను విచారించాలని కోరాం. ఒక్క రోజులోనే పిటిషన్‌ను విచారించాలని హైకోర్టుకు సుప్రీం కోర్టు మార్గదర్శనం చేసింది.. నాకు చాలా సంతోషంగా ఉంది..’ అని రోజా పేర్కొన్నారు. విచారణ అనంతరం సుప్రీం కోర్టు ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘సస్పెండైన రెండు నెలల వరకూ కోర్టుకు రాలేదని ప్రతివాది తరపు న్యాయవాది ఏదో చెప్పే ప్రయత్నం చేశారు.. కానీ మా ఎమ్మెల్యేలు, మా నేత రాసిన ఉత్తరాలు ఉన్నాయి.. అవన్నీ చెప్పాం.. బడ్జెట్ సమావేశాల్లో మహిళల సమస్యలపై, అధికార పార్టీ అకృత్యాలపై మాట్లాడతానని నన్ను సస్పెండ్ చేశారు. కాల్ మనీ రాకెట్‌పై మాట్లాడినందుకే, వారిని నిలదీసినందుకే నన్ను సస్పెండ్ చేశారు.. నన్ను మాత్రమే టార్గెట్ చేశారు..’ అని విమర్శించారు. అసెంబ్లీ జరుగుతున్న తీరుపై మాట్లాడుతూ ‘అధికార పార్టీ నేతలు బజారు రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారు. ప్రజల సమస్యలపై కూడా మాట్లాడొద్దంటే ఎలా? అవిశ్వాస తీర్మానం పెడితే మా నేతను అన్‌పార్లమెంటరీ పదాలతో తిట్టారు. మా నేత మాట్లాడుతుండగానే తీర్మానాన్ని ముగించారు. ప్రజల బాధను ప్రతిపక్షాలు ఆవేదనగా, ఆవేశంగా చెప్తాయి. దాన్ని వక్రీకరించి ఇలా చేయడం సరికాదు..’ అని పేర్కొన్నారు. -
‘సెస్’ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు
► అభ్యర్థి లేదా ఏజెంట్‌కు అనుమతి ► కౌంటింగ్‌కు నాలుగు టేబుళ్లు ► హైకోర్టు నిర్ణయంపైనే ► ఉత్కంఠ కోర్టు నిర్ణయానికి లోబడి ఫలితాలు ► ఎన్నికల అధికారి చంద్రమోహన్‌రెడ్డి సిరిసిల్ల : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిరిసిల్ల పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, పోటీ చేసిన అభ్యర్థులు, లేదా వారి తరఫున ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు. ఎన్నికల ఫలితాలు సాయంత్రం 3 గంటల వరకు వెల్లడయ్యే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. పోలింగ్ సరళిపై చర్చలు ‘సెస్’ ఎన్నికల్లో పోలింగ్ సరళిపై అంచనాలు వేస్తూ.. తమకు వచ్చే ఓట్ల గురించి అభ్యర్థులు ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. సిరిసిల్ల పట్టణంలో పది మంది బరిలో ఉండగా ఇద్దరి మధ్యే తీవ్ర పోటీ నెలకొంది. ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేటల్లో ద్విముఖ పోటీ ఉండడంతో గెలుపుపై ఎవరికి వారు అంచనాలు వేస్తున్నారు. ముస్తాబాద్‌లో నలుగురు పోటీలో ఉండగా అధికార టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి గెలుపుపై ధీమాగా ఉన్నారు. వేములవాడ పట్టణంలో ఆరుగురు బరిలో ఉండగా విజయంపై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. వేములవాడ రూరల్‌లో అధికార పార్టీ గెలుపుపై ధీమాగా ఉంది. చందుర్తిలో చతుర్ముఖ పోటీ ఉన్నా విజయంపై అందరూ ఆశలు పెట్టుకున్నారు. కోనరావుపేటలో చతుర్ముఖ పోటీలో గెలుపెవరిదో అంతుచిక్కని పరిస్థితి. ఇల్లంతకుంటలో ఆరుగురు, బోయినపల్లిలో నలుగురు పోటీలో ఉన్నారు. 11 డెరైక్టర్ స్థానాలకు 50 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. హైకోర్టుదే తుది నిర్ణయం ‘సెస్’ ఎన్నికల ఫలితాలపై హైకోర్టుదే తుది నిర్ణయంగా భావిస్తున్నారు. ఎన్నికల్లో అర్హులైన ఓటర్లను బకాయిల పేరుతో ఓటింగ్‌కు దూరం చేశారని, చనిపోయిన ఓటర్ల స్థానంలో వారి వారసులకు అవకాశం కల్పించలేదని పేర్కొంటూ సిరిసిల్లకు చెందిన డి.ప్రభాకర్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు మధ్యంతర ఆదేశాలను జారీ చేసింది. ఎన్నికల పక్రియను కొనసాగించాలని, ఫలితాలు ఎలా వచ్చినా కోర్టు ఉత్తర్వులకు కట్టుబడి ఉండాలని ఆదేశించింది. పిటిషనర్ ప్రభాకర్‌రావు వాదనను కోర్టు సమర్థిస్తే ఎన్నికలే రద్దయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఆయన వాదనతో ఏకీభవించకుంటే ‘సెస్’ ఎన్నికలకు ఎలాంటి ప్రమాదం లేదని సహకార శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కోర్టు నిర్ణయానికి లోబడి ఫలితాలు సెస్’ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తిచేశాం. మంగళవారం కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇస్తాం. బుధవారం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అభ్యర్థి లేదా అతని తరఫున ఏజెంట్‌ను కౌంటింగ్ కేంద్రంలోకి ఎవరినో ఒక్కరినే అనుమతిస్తాం. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థికి ధ్రువీకరణ పత్రం అందిస్తాం. ఆ పత్రంలో నోట్ పెట్టి కోర్టు నిర్ణయానికి లోబడి ఉండాలనే నిబంధనను స్పష్టం చేస్తాం. ఓట్ల లెక్కింపునకు 25 సిబ్బందిని నియమించాం. గురువారం ‘సెస్’ ఆఫీస్‌లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మెజార్టీ డెరైక్టర్ల ఆమోదం మేరకు జరుగుతుంది. అంతిమంగా కోర్టు నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే - జి.చంద్రమోహన్‌రెడ్డి, ఎన్నికల అధికారి -
పార్టీ ఫిరాయింపులతో ప్రజాస్వామ్యం అపహాస్యం
హైకోర్టు సీనియర్ న్యాయవాది, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ మాజీ కార్యదర్శి చిత్తరువు తెనాలి : ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేసేలా ఉన్నాయని హైకోర్టు సీనియర్ న్యాయవాది, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్‌సెల్ మాజీ కార్యదర్శి చిత్తరువు శివనాగేశ్వరరావు అన్నారు. మాతృవియోగం కారణంగా తెనాలిలో ఉన్న శివనాగేశ్వరరావును బుధవారం సాయంత్రం వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున పరామర్శించారు. ఈ సందర్భంగా శివనాగేశ్వరరావు విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికార పార్టీలో చేరుతున్నట్టు ఎమ్మెల్యేలు చెబుతున్నారని గుర్తు చేస్తూ, ఏపీలో 67 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాలకు అభివృద్ధి, సంక్షేమ నిధులను విడుదల చేయొద్దని ఉత్తర్వులు ఏమైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి, ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. దురదృష్టకరం : డాక్టర్ మేరుగ నాగార్జున మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను తాకట్టుపెడుతూ కొందరు ఎమ్మెల్యేలు అధికారపక్షం వైపు చూడటం దురదృష్టకరమన్నారు. ప్రలోభాలకులోనై పార్టీలు మారినవారికి భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. జిల్లాలో తమ ఎమ్మెల్యేలకు పార్టీ మారాల్సిన పని లేదన్నారు. పార్టీ నేతలు పెరికల కాంతారావు, గుంటూరు కృష్ణ, గాదె శివరామకృష్ణారెడ్డి ఉన్నారు. -
సీమకు అన్యాయం చేస్తే సహించం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం సాధన కోసం విద్యార్థి సంఘాలు గర్జించాయి. సీమకు అన్యాయం చేస్తే సహించమంటూ నినాదాలు చేశాయి. రాయలసీమ రాష్ట్ర సాధనే ధ్యేయమని ప్రకటించాయి. సీమపై పాలకులు చూపుతున్న వివక్షపై దండెత్తాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోస్తా జపం చేయడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి పరిషత్, ఇంజినీరింగ్ స్టూడెంట్ ఫెడరేషన్, రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన విద్యార్థి గర్జన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. సుమారు మూడు వేల మంది విద్యార్థులు హాజరై సీమ సమస్యలపై గళమెత్తారు. ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ విద్యార్థి పరిషత్ అధ్యక్షుడు వీవీనాయుడు అధ్యక్షతన మున్సిపల్ ఓపెన్ ఎయిర్ థియేటర్లో నిర్వహించిన విద్యార్థి గర్జన కార్యక్రమానికి పలు ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నేతలు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నక్కలమిట్ల శ్రీనివాసులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బీవై రామయ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 20 స్మార్ట్ సిటీలను ప్రకటించగా వెనుకబడిన రాయలసీమలో ఒక్కటి లేకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర విభజనతో రాళ్ల సీమగా మారిన రాయలసీకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కర్నూలుకు రావాల్సిన రాజాధాని అమరావతికి తరలించారని, హైకోర్టును అక్కడే స్థాపించేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. దీంతో సీమకు రావాల్సిన పరిశ్రమలు కోస్తాకు తరలిపోతున్నాయని, అక్కడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయన్నారు. రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ఇక్కడ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుతుందన్నారు. అంతకుముందు రాజవిహార్ నుంచి కొండారెడ్డి బురుజు వరకు 3000 మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు రాధాకృష్ణారావు, బాలసుందరం, అరుణ్‌శర్మ, రవికుమార్, నాగేశ్వరరెడ్డి, సుహాన్బాష, రాజునాయుడు, శివకుమార్, క్రాంతికుమార్, రఘునాథ్‌రెడ్డి పాల్గొన్నారు. -
సీఎం వ్యాఖ్యలపై న్యాయపోరాటం
పుంగనూరు : ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబునాయుడు దళితులను అవమానపరిచేలా మాట్లాడడం సరికాదని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, దళిత నేత ఎన్.రెడ్డెప్ప స్పష్టం చేశారు. హైకోర్టులో కేసు దాఖలు చేస్తామన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ‘దళితులుగా పుట్టాలని ఎవరు అనుకుంటారు’ అంటూ మాట్లాడడం వారి మనోభావాలను దెబ్బతీయడమే అవుతుందని అన్నారు. సమాజంలో దళితులు దుర్భరజీవితం గడుపుతున్నారని, వారిని ఆదుకోవాల్సింది పోయి అవహేళన చేయడం శోచనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఏ కులాలను అవమానపరచినా సహించేది లేదని ఈ సంద ర్భంగా రెడ్డెప్ప హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎంపీపీలు నరసింహులు, అంజిబాబు, కౌన్సిలర్ మనోహర్, దళిత నాయకులు సురేష్, రమణ తదితరులు పాల్గొన్నారు. -
మార్పు తప్పదు!
బీటీపీఎస్ నిర్మాణంపై నీలినీడలుముందుచూపు లేని టీఎస్ జెన్కోకేంద్రం సీరియస్ కావడంతోపునరాలోచన పనులు నిలిచిపోవడంతో కాంట్రాక్టర్ల గగ్గోలు మణుగూరు: భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్(బీటీపీఎస్) నిర్మాణంపై అస్పష్టత నెలకొంది. మణుగూరు, పినపాక మండలాల సరిహద్దులోని సాంబాయిగూడెం, చిక్కుడుగుంట, దమ్మక్కపేట, సీతారాంపురం గ్రామాల వద్ద నిర్మించే ప్లాంటు, ఉత్పత్తికి సంబంధించి కాలంచెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడడమే కాక కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు ల శాఖ నుంచి ఎలాంటి పర్యావరణ అనుమతులు రాకుండానే హడావుడిగా బీహెచ్ఈఎల్ ద్వారా టీఎస్ జెన్కో నిర్మాణ పనులు మొదలుపెట్టి.. శరవేగంగా చేయిస్తుండడంతో పరిస్థితి మొదటికొచ్చింది. అత్యంత కీలకమైన పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే గత ఏడాది సెప్టెంబర్ నుంచే యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించారు. ఒక్కొక్కటి 270 యూనిట్ల సామర్థ్యం కలిగిన 4 యూనిట్ల ద్వారా 1,080 మొగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో సుమారు 1100 ఎకరాల్లో ప్లాంట్ నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి భూనిర్వాసిత కుటుంబాలకు పూర్తిస్థాయిలో ప్యాకేజీలు చెల్లించకపోవడంతోపాటు ఉద్యోగాలు కోరుకున్న 371 మంది యువతకుఇప్పటికీ ఉద్యోగ హామీ పత్రాలు ఇవ్వలేదు. ఈ క్రమంలో పర్యావరణ అనుమతులు లేకుండానే పనులు మాత్రం శరవేగంగా జరిగాయి. 2016 డిసెంబర్ కల్లా మొదటి యూనిట్ నుంచి 270 మెగావాట్ల ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో యూనిట్ పనులతోపాటు స్విచ్‌యార్డ్, బాయిలర్, చిమ్నీ పనులు సైతం పునాది దశను దాటాయి. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు మానవ హక్కుల వేదిక ద్వారా నేషనల్ ట్రీన్ ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పర్యావరణ అనుమతులు లేనందున భద్రాద్రి పనులు నిలిపేయాలని జెన్కోను ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈ ఆదేశాలపై స్టే కోరుతూ టీఎస్ జెన్కో హైకోర్టును ఆశ్రయించింది. పర్యావరణ అనుమతులు లేనందున పనులెలా చేస్తారని హైకోర్టు సైతం జెన్కోను ప్రశ్నించింది. ఇందులో హైకోర్టు కేంద్ర పర్యావరణ శాఖను ప్రతివాదిగా చేర్చింది. దీంతో కేంద్ర పర్యావరణ శాఖ నుంచి వచ్చిన డిప్యూటీ డెరైక్టర్ కరుపయ్య గత నెల 9వ తేదీన ప్లాంట్ పనులను తనిఖీ చేసుకుని వెళ్లి.. నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని నివేదిక ఇచ్చారు. ఈ క్రమంలో విషయాన్ని కేంద్ర పర్యావరణ శాఖ సీరియస్‌గా పరిగణించడంతోపాటు హైకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్ సైతం పర్యావరణ అనుమతులు లేకుండా చేస్తున్న పనులపై ప్రశ్నించింది. దీంతో 20 రోజుల కిందట ప్లాంట్ పనులు పూర్తిగా నిలిపేశారు. తిరిగి పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయనే విషయమై ఇప్పటివరకు స్పష్టత లేకుండా పోయింది. ఏ అధికారి సైతం ఈ విషయమై స్పందించే పరిస్థితి లేకుండా పోయింది. మరోవైపు సబ్ కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటివరకు చేసిన పనులకు బిల్లులు రాకపోగా, యంత్రాలు ఆపివేయడంతో అవి దెబ్బతింటాయని ఆందోళనకు గురవుతున్నారు. సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అవలంబిస్తేనే అనుమతులు.. మారిన పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర పర్యావరణ, విద్యుత్ శాఖల నిబంధనల ప్రకారం 600 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంకన్నా ఎక్కువగా ఉంటే సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడాల్సి ఉంది. అయితే 1080 మెగావాట్ల సామర్థ్యంతో ఈ ప్లాంట్ నిర్మిస్తున్నందున కాలుష్యం తక్కువగా వెదజల్లే సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడాల్సి ఉంది. అయితే దీనికి విరుద్ధంగా కాలంచెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ మాత్రమే వాడుతుండడంతో కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించింది. అయినప్పటికీ పనులు చేపట్టడంతో పరిస్థితి గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టు వరకు వెళ్లింది. ప్రస్తుతం బంతి హైకోర్టు పరిధిలో ఉంది. మరోవైపు కేంద్ర పర్యావరణ శాఖ కూడా ఈ అంశాలపై హైకోర్టులో వాదనలు వినిపించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ క్రమంలో సబ్ క్రిటికల్ టెక్నాలజీ నుంచి సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి మారడంతోపాటు దీనికి సంబంధించిన అన్ని రకాల మెటీరియల్ మారిస్తేనే పర్యావరణ అనుమతులు వచ్చే పరిస్థితి ఏర్పడింది. పైగా ఇప్పటివరకు యుద్ధప్రాతిపదికన పనులు చేయడంతో జెన్కోపై చర్యలు తీసుకోవాలని పర్యావరణ శాఖ కేంద్రానికి నివేదిక ఇచ్చింది. దీంతో టీఎస్ జెన్కో పునరాలోచనలో పడింది. మరోవైపు కాలం చెల్లిన మెటీరియల్ వదిలించుకునేందుకు బీహెచ్ఈఎల్ పనికిరాని పరికరాలను టీఎస్ జెన్కోకు అంటగట్టేందుకు ప్రయత్నించిందనే అనుమానాలను పలువురు నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ టెక్నాలజీ, పరికరాలు మారిస్తేనే బీటీపీఎస్‌కు పర్యావరణ అనుమతులు వచ్చే అవకాశం ఉంది.