Hitaishi
-
ఎంతటి ఆత్మవంచన: వేరే దేశంలో గొడవలట.. ఏపీకి పోలికట!
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం మీడియా అకృత్య ఆగడాలకు అంతులేకుండా పోతోంది. టీడీపీ కన్నా వీరికి ఎక్కువ ప్రస్టేషన్ వస్తోంది. ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగా ఏదో ఒక కథనం రాయాలా అన్న ఆతృతలో ఉచ్చనీచాలు మర్చిపోతున్నారు. టీడీపీ మీడియాలుగా ఉన్న ఈనాడు, ఆంద్రజ్యోతి ఈ విషయంలో పోటీ పడుతున్నాయి. ఒకరోజు ఒక మీడియా బట్టలూడదీసుకుని నిస్సిగ్గుగా తిరుగుతుంటే మరో రోజు ఇంకో మీడియా అదే పనిలో ఉంటోంది. కొద్ది రోజుల క్రితం ఆంద్రజ్యోతిలో వచ్చిన రెండు కథనాలు చూస్తే మతిపోతుంది. వీళ్ల కల్పితాలకు ఆకాశమే హద్దుగా కనిపిస్తుంది. అదేదో దేశం సియార్రా లియోన్ ఉందట. అక్కడ అరాచకం తాండవిస్తోందట. ప్రజలను ఏదో రకంగా తప్పుదోవ పట్టించే యత్నం ఆ దేశానికి ఏపీని పోలిక పెట్టి ఒక చెత్త కథనం రాశారు. ఏదైనా రాష్ట్రంలో నిజంగానే అరాచకం ఏర్పడితే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా!గతంలో బాబ్రి మసీదును కూల్చిన తర్వాత తీవ్రమైన అశాంతి ఏర్పడితే ఆనాటి పీవీ నరసింహారావు ప్రభుత్వం నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాలలోని ప్రభుత్వాలను రద్దు చేసి రాష్ట్రపతి పాలనను పెట్టింది. ఏపీలో గతంలో జై ఆంద్ర ఉద్యమం వచ్చినప్పుడు తీవ్రమైన హింస ప్రజ్వరిల్లగా, అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న పీవీ నరసింహారావు ప్రభుత్వాన్ని తప్పించి, శాసనసభను తాత్కాలికంగా సస్పెండ్ చేసి రాష్ట్రపతి పాలన పెట్టారు. ఆ మాత్రం తెలియకుండా పనికిమాలిన రాతలు రాసి ఆ పత్రిక ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తోంది. తెలంగాణలో ఒకలా.. ఏపీలో మరొకలా! నిజానికి ఏపీలో ప్రశాంత వాతావరణం ఉంది. ఎక్కడైనా ఒకటి, అర ఘటనలు జరగవచ్చు. తెలంగాణలో ఈ మధ్యకాలంలో జరిగిన విద్యార్దినుల ఆత్మహత్యలు కాని, కుక్కల బెడద వంటివి కానీ ఏపీలో జరిగి ఉంటే ఈపాటికి ఈ మీడియాతో పాటు, టీడీపీ, జనసేన తదితర పక్షాలు ఎంతో అలజడి చేసేవి. తెలంగాణలో కుక్కల కాట్లకు పలు చోట్ల అనేక మంది గాయపడితే ఈనాడు తన వార్తలలో కానీ, సంపాదకీయంలో కాని ప్రభుత్వాన్ని తప్పు పట్టలేదు. అధికారులు సరిగా చేయడం లేదని రాసింది. అదే ఏపీలో జరిగి ఉంటే వాటన్నిటికి ముఖ్యమంత్రి జగనే కారణమని విరుచుకుపడేవి. జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ఏపీలో గతంలో జరిగిన ఒక విద్యార్ది ఆత్మహత్య ఘటనకు ప్రభుత్వానికి బాధత అంటగట్టి స్టేట్ మెంట్ ఇచ్చారు. అదే తెలంగాణలో జరిగితే ప్రభుత్వం జోలికి పోకుండా సాదాసీదాగా హితబోధతో కూడిన ప్రకటన ఇచ్చారు. అంధ జ్యోతిగా ఆంధ్రజ్యోతి కేసీఆర్ ప్రభుత్వం అంటే ఈనాడు ఎంతగా భయపడుతోందో, సీఎంను ఏ రకంగా కాకా పడుతోందో తెలుసుకోవడానికి అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. కేసీఆర్ ప్రభుత్వంపై అడ్డగోలుగా రాయాలని అనడం లేదు. ఏపీలో అవాంఛనీయ ఘటనలు జరిగితే వెంటనే పోలీసు యంత్రాంగం స్పందించి కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం వంటివి చేస్తోంది. ఏ ప్రభుత్వం ఉన్నా ఆ మేరకు జాగ్రత్తలు తీసుకుంటారు. ఆంధ్రజ్యోతి అంధజ్యోతిగా మారి ఒక దేశంతో ఏపీని పోల్చి వార్తలు రాయగలిగిందంటే ఎంత స్వేచ్చ ఉందీ అర్దం కావడం లేదా! ముందు రోజు ఈనాడు రాసిన తరహాలో మరింత అతిగా ఆలోచించి ఏదో దేశంలో జరిగే గొడవలను ఏపీకి పోల్చి ఆత్మవంచన చేసుకుంది. సహజ వనరుల దోపిడీ, ప్రైవేటు సైన్యం, నిత్యం దాడులు ఆ దేశంలో జరుగుతుంటాయని, ఎపిలో కూడా అటు,ఇటూగా అదే పరిస్థితి అని చండాలంగా కధనాన్ని వండి వార్చారు. మరో వార్త కూడా ఇచ్చారు. అదేమంటే ఎపికి కేంద్రం ఉదారంగా అప్పులు మంజూరు చేస్తోందట. ఒక పక్క ప్రదానమంత్రి శ్రీలంక, పాకిస్తాన్ ల గురించి హెచ్చరిస్తూ ఎపికి ఎలా అప్పులు ఇస్తారని ఈ పత్రిక ప్రశ్నిస్తోంది. ఎపి పై ఎంత ఏడుపో చూడండి. విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే కేంద్రం ఏ రాష్ట్రానికి అయినా ప్రత్యేక రుణపరిమితి ఇస్తోంది. దానిని ఏపీ వాడుకుంటోంది. అసలు సంస్కరణలు అమలుకాకుండా, మోటార్లకు మీటర్లు పెట్టవద్దంటూ పనికిమాలిన వాదనను తెలుగుదేశం, అనుబంధ మీడియా ప్రచారం చేశాయి. మీటర్లు పెడితే ఉరితాడే అంటూ దారుణమైన అసత్యాన్ని చెప్పి ప్రజలను భయపెట్టాలని చూశాయి. దానికి కారణం ఆ సంస్కరణలు అమలు అయితే ఎపికి కేంద్రం ఆర్దికంగా సాయపడుతుందనే బాధతోనే అన్న సంగతి ఇప్పుడు ఇచ్చిన ఏడుపుగొట్టువార్తతో తేలిపోయింది. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు విద్యుత్ సంస్కరణలు తెచ్చినప్పుడు ఆయనకాబట్టి సంస్కరణలు తెచ్చి రాష్ట్రాన్ని బాగు చేస్తున్నారని ఈ మీడియా డబ్బా కొట్టింది. చంద్రబాబుకు చిడతలు వాయించడమే పని చంద్రబాబు అయితే తానే విద్యుత్ సంస్కరణలు తెచ్చానని,తద్వారా వచ్చిన ఆదాతో పేదలను ఆదుకుంటానని అనేవారు. ఇప్పుడు అదే చంద్రబాబు మీటర్లను వ్యతిరేకించడం ద్వారా తన డొల్లతనాన్ని బయటపెట్టుకుంటే, ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి మీడియాలు ఆయన పాడిన పాటకల్లా చిడతలు వాయించి అప్రతిష్టపాలయ్యాయి. జగన్ ప్రభుత్వం వీరిని పట్టించుకోలేదు కాబట్టి సరిపోయింది కాని, వీరు చేసే ప్రతి దారుణమైన ప్రచారానికి భయపడితే అడుగు ముందుకు పడేది కాదు. పిల్లలకు ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం ప్రవేశపెట్టిన కార్యక్రమం నుంచి ,రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువచ్చే కార్యక్రమం వరకు వీరు అడ్డుపుల్ల వేయడమే పనిగా పెట్టుకున్నారు. దీనివల్ల ఏపీకి జరిగే నష్టం ఇంతా అంతా కాదు.. ప్రతి దానిపై హైకోర్టుకు వెళ్లడం, ప్రభుత్వాన్ని వేరే పనిచేసుకోనివ్వకుండా ఈ వ్యాజ్యాలకు సమాధానం ఇచ్చేలా చేయడం, హైకోర్టులో కొందరు గౌరవ న్యాయమూర్తులు చేసే వ్యతిరేక వ్యాఖ్యలను మొదటి పేజీలో ప్రముఖంగా ఇచ్చి ఏదో జరిగిపోతోందన్న భ్రమ కల్పించడం చేస్తున్నారు. తాజాగా వలంటీర్ల వ్యవస్థపై పడినట్లుగా ఉన్నారు. ప్రజలకు అత్యధికంగా ఉపయోగపడుతున్న ఈ వలంటీర్ల వ్యవస్థను అడ్డుకోకపోతే తెలుగుదేశం గెలవదని భయపడుతున్నారేమో తెలియదు కాని, ఆ వ్యవస్థ వచ్చిన మూడు సంవత్సరాల తర్వాత పలు సందేహాలు రేకిత్తిస్తూ హైకోర్టులో పిటిషన్లు వేశారు. గౌరవ న్యాయమూర్తిగారు అసలు ఈ వలంటీర్లు ఎవరు? లబ్దిదారుల ఎంపికను వారు ఎలా చేస్తారు ? ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు కదా?ఇలా కొన్ని ప్రశ్నలను తన సందేహ నివృత్తి కోసం అడిగి ఉండవచ్చు. కాని దానిని భూతద్దంలో చూపుతూ టిడిపి మీడియా మొదటి పేజీలో కదనాలు ఇచ్చింది . ఇప్పటికే కోర్టుల ద్వారా ప్రజలకు అందవలసిన మేళ్లను అందనీయకుండా చేస్తున్నారన్న అభిప్రాయం ఉన్న నేపద్యంలో టిడిపి వారు కాని, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా వారు కాని ఆ పద్దతిని మానుకోకపోతే, వారికే నష్టం అని వేరే చెప్పనవసరం లేదు. పలుమార్లు అది అనుభవం అవుతున్నా వీరు మానుకోవడం లేదు. ఏదో రకంగా ప్రజల మనసులలో విషం నింపాలన్నదే వీరి లక్ష్యం .కాని సోషల్ మీడియా, డిజిటల్ మీడియా విస్తారంగా పెరగడం తో వీరి ఆటలు అంతగా సాగడం లేదు.అయినా వీరి జిత్తుల మారి ఎత్తుగడలను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సదా అప్రమత్తంగా ఉండాల్సిందే. -హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్ -
సీఎం జగన్ ప్రశ్నలకు చంద్రబాబు, పవన్ సమాధానాలు చెప్పగలరా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పీడ్ పెంచారు. ఆయన ధాటిగా మాట్లాడటమే కాదు.. ప్రతిపక్షాన్ని సెంటిమెంటు ఆయుధంతో దెబ్బ కొడుతున్నారు. ప్రతిపక్షం బలహీనతను ఆయన నొక్కి మరీ ప్రశ్నిస్తున్నారు. మరో వైపు ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేనలు 175 సీట్లలో పోటీచేయగలరా? అని జగన్ సవాల్ విసురుతున్నారు. జగన్ ప్రసంగంలోని వివిధ అంశాలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ ఎంతవరకు సమాధానం చెప్పగలుగుతారన్నది సందేహమే. తెనాలిలో జరిగిన రైతు భరోసా -పి.ఎమ్.కిసాన్ సాయం పంపిణీ సందర్భంగా ఆయన ఉపన్యసిస్తూ పలు ప్రశ్నలు సంధించారు. రాజకీయంగా టీడీపీ, జనసేనల బలహీనతలపై దెబ్బ కొడుతూ వారు శాసనసభ ఎన్నికలలో మొత్తం అన్ని సీట్లకు పోటీచేయలేని నిస్సహాయ స్థితిని ప్రజల ముందుంచారు. టీడీపీ, జనసేనల బలహీనత తెలిసేలా.. 2019 శాసనసభ ఎన్నికలలో టీడీపీ ఒంటరిగా పోటీచేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. జనసేన పరిస్థితి మరీ దయనీయం. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణే రెండు చోట్ల పోటీచేసి ఓడిపోయారు. వామపక్షాలు, బీఎస్పితో ఆయన పొత్తు పెట్టుకుని కూడా ఈ పరాభవానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో జనసేనతో కలిస్తే ఏమైనా రాజకీయ లబ్ధి కలుగుతుందా అన్న ఆశతో టీడీపీ శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. చంద్రబాబు ఇందుకోసం తన మంత్రాంగం కొనసాగిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా తాను గెలిస్తే చాలన్నట్లుగా టీడీపీతో ఎలా జట్టుకట్టాలా అని తంటాలు పడుతున్నారు. ఒకవేళటీడీపీతో కలిస్తే జనసేనకు కేవలం 25 నుంచి సీట్ల లోపే ఇవ్వవచ్చన్న అంచనా ఉంది. ఇది ఒక విధంగా పవన్ కళ్యాణ్‌కు అవమానమే. అయినా దానిని భరించడానికి ఆయన సిద్ధపడుతున్నారని అంతా భావిస్తున్నారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ పాదయాత్ర చేస్తున్నందున పవన్ తన వారాహి యాత్రను కూడా వాయిదా వేసుకున్నారని కూడా రాజకీయ వర్గాలు అంటున్నాయి. దీనిని పవన్ కళ్యాణ్ ఖండించలేదు. అంటే జనసేన ఎటూ 175 సీట్లలో పోటీచేసే అవకాశమే లేదు. అసలు ఆ పార్టీకి అన్ని నియోజకవర్గాలలో క్యాడరే లేదు. సాయం కోసం టీడీపీ ఎదురుచూపు.. ఇక టీడీపీకి అన్ని నియోజకవర్గాలలో క్యాడర్ ఉన్నా, బలం క్షీణించిపోవడంతో బిక్కుబిక్కుమంటూ చూస్తోంది. ఎవరైనా వచ్చి సాయం చేయకపోతారా అని ఎదురుచూస్తోంది. స్థానిక ఎన్నికలలో కేవలం 25 శాతం ఓట్లే రావడం వారికి తీవ్ర ఆశాభంగం కలిగించింది. అందువల్ల జనసేనతో కలిస్తే ఏమైనా పోటీ ఇవ్వగలుగుతామా? అన్నది వారి ఆలోచన. అందుకే జనసేనకు కొన్ని సీట్లు ఇస్తే 175 సీట్లలో పోటీచేసే పరిస్థితి టీడీపీకి ఉండదు. ఆ విధంగా టీడీపీ, జనసేనల బలహీనతను జనానికి తెలిసేలా చేయగలిగారు. సీఎం జగన్‌కు అడ్వాంటేజ్.. మరో వైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం అన్ని సీట్లకు పోటీకి సై అంటూ సవాల్. తద్వారా ప్రజలలో తమకు ఆదరణ ఉందన్న నమ్మకాన్ని ,అన్ని చోట్ల పార్టీ బలంగా ఉందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేయగలుగుతోంది. ఆ కాన్ఫిడెన్స్ ప్రతిపక్షంలో కొరవడడం జగన్‌కు అడ్వాంటేజ్ అని చెప్పాలి. దీనికి సమాధానంగా టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీతో కలిసి వచ్చే పార్టీలు ఉన్నాయా? అని పిచ్చి ప్రశ్న వేశారు. 2014లో బిజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఆ పార్టీ నాయకత్వం కోరినా జగన్ ఒప్పుకోలేదు. తాను ఒంటరిగా పోటీచేసి గెలవగలమన్న దమ్ము ఆయనకు ఉండడమే దీనికి కారణం 2014లో అధికారం రాకపోయినా, ఏ ఇతర పార్టీ పొత్తుకోసమో ఆయన తెలుగుదేశం మాదిరి అర్రులు చాచలేదన్న సంగతి సోమిరెడ్డి గ్రహించాలి. జగన్ సెంటిమెంట్ ఇక ఇతర అంశాలలో జగన్ సెంటిమెంట్ పండించారంటే అతిశయోక్తి కాదు. చంద్రబాబు టైమ్ లో 300కి పైగా కరువు మండలాలు ఉన్న స్థితిని ఆయన గుర్తు చేస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ, అంతకుముందు తన తండ్రి హయాంలో కానీ పుష్కలంగా వర్షాలు పడ్డాయని సభలో పాల్గొన్న రైతులకు జగన్ గుర్తు చేశారు. చంద్రబాబు ఆ రోజులలో రెయిన్ గన్ అంటూ షో చేసి, వాటితోనే కరువును పొగొట్టినంత బిల్డప్ ఇచ్చేవారు. అది వందల కోట్ల మేర దండగమారి ఖర్చుగానే మిగిలిపోయింది. దాంతో రైతులలో బలంగా ఒక అభిప్రాయం నాటుకుపోయింది. చంద్రబాబు పాలనలో కరువు తప్పదన్న భావన సర్వత్రా ఏర్పడింది. అదే జగన్ పాలన ఆరంభమైన సంవత్సరం నుంచి నాలుగేళ్లలో పుష్కలంగా వర్షాలు పడడం, నదులు పొంగిపొర్లడం, చెరువులు ,రిజర్వాయిర్లు నిండడంతో పంటలు బాగా పండుతున్నాయి. భూగర్భ జలాల మట్టం బాగా పెరిగింది. సాధారణంగానే వైఎస్సార్సీపీ నేతలు.. కరువు, చంద్రబాబు కవల పిల్లలని విమర్శిస్తుంటారు. దానికి కొనసాగింపుగా ముఖ్యమంత్రి జగన్ రైతుల సభలో చంద్రబాబు ప్రభుత్వ టైమ్‌లో కరువు పరిస్థితులను తన స్పీచ్ లో గట్టిగా వినిపించారు. రైతులకు తన ప్రభుత్వం అమలు చేసిన వివిధ స్కీములను ఆయన వివరించారు. తదుపరి రాజకీయ అంశాలను ప్రస్తావిస్తూ పేదలు, రైతులకు , పెత్తందార్లకు మధ్య యుద్దం జరగబోతోందని ఆయన చెప్పారు. తాము హామీ ఇచ్చినట్లు భరోసా డబ్బు పంపిణీ చేశామని, అదే చంద్రబాబు నాయుడు రైతులకు రుణమాఫీ చేస్తామని చివరికి వారిని మోసం చేశారని ఆయన పేర్కొన్నారు. అలాగే పేదల పిల్లలకు ఆంగ్ల మీడియంలో చదువు చెప్పిస్తున్న తనకు, ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం వద్దంటున్న పెత్తందార్లకు మధ్య యుద్దం జరగబోతోందని ఆయన చెబుతున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యంగా.. ఇవన్నీ సెంటిమెంట్ తో కూడిన అంశాలే అవుతాయి. జగన్ ప్రభుత్వం స్కూళ్లను నాడు-నేడు కింద బాగు చేయడమే కాకుండా ఆంగ్ల మీడియం కూడా ప్రవేశపెట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తెలుగుదేశం, జనసేన వంటి పార్టీలు ఆంగ్ల మీడియంకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాయి. అదే టైమ్‌లో ఆ పార్టీలు జనంలో పలచన అయ్యాయి. ఫలితంగా తాము ఆంగ్ల మీడియంకు వ్యతిరేకం కాదని ఆ పార్టీల నేతలు చెప్పవలసి వస్తోంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ విషయంలో జగన్ ధైర్యంగా ముందడుగు వేశారు. ఇది ఆయనకు సానుకూల పరిణామంగా ఉంది. అన్నింటినీ మించి వందల హామీలు ఇచ్చి వాటిని అమలు చేయని చంద్రబాబుకు, ఇచ్చిన హామీలలో 98.5 శాతం అమలు చేసిన తనకు మధ్య పోటీ జరగబోతోందని, హామీలు నెరవేర్చినవారిని తిరిగి ఎన్నుకోకపోతే, భవిష్యత్తులో ఎవరూ ఎన్నికల మానిఫెస్టో అమలుపై దృష్టి పెట్టరని జగన్ హెచ్చరించారు. మాట తప్పే వ్యక్తిగా చంద్రబాబును ఫోకస్ చేయడంలో జగన్ సఫలం అవుతున్నారు. అదే ధైర్యంతో జగన్ వచ్చే ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. తెనాలి సభకు పెద్ద ఎత్తున హాజరైన రైతులు, ఇతర వర్గాల ప్రజలు, వారు ఆయా సమయాలలో జగన్ స్పీచ్ కు వ్యక్తం చేసిన స్పందన గమనిస్తే జగన్‌కు జనంలో తిరుగులేదన్న అభిప్రాయం మరోసారి కలుగుతుంది. -హితైషి -
టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యత తీసుకున్నారా రామోజీ?
ఆంద్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి అధికార ప్రతినిధిగానే కాకుండా, వర్కింగ్ అద్యక్ష బాద్యత కూడా ఈనాడు మీడియా అధినేత రామోజీరావు తీసుకున్నట్లుగా ఉంది. అచ్చంగా ఒక రాజకీయ పార్టీ మాదిరి వ్యవహరిస్తుండడమే కాకుండా, తెలుగుదేశం పార్టీని మించి అబద్దాలను ప్రచారం చేస్తున్నారు. మామూలుగా అయితే ఏదైనా కథనం ఇవ్వదలిచినప్పుడు ఏ పార్టీకి చెందని మీడియా అయితే రెండువైపులా ఉన్న వాదనలను ఇస్తుంటుంది. కానీ ఈనాడు మాత్రం పూర్తి ఏకపక్షంగా ,టీడీపీ నేతలకన్నా ఘోరంగా...కాదు..కాదు..నీచంగా వార్తలను వండి వార్చుతోంది. ఈనాడుకి ఏమైంది?.. రామోజీకి మతి స్థిమితం తప్పిందా? సోమవారం నాడు ఇచ్చిన బ్యానర్ కథనం చూసినవారికి ఎవరికైనా ఏమిటి? ఈనాడుకు ఏమైంది. రామోజీరావుకు పూర్తి మతి స్థిమితం తప్పిందా? అన్న సందేహం వస్తుంది. ఒక వైపు ఏపీకి భారీ స్థాయిలో పరిశ్రమలు,పెట్టుబడులు తెప్పించడానికి ప్రభుత్వం తపన పడుతుంటే ఏపీని నాశనం చేయడం ఎలా అన్న ధ్యేయంతో ఈనాడు పనిచేస్తోంది.పారిశ్రామిక సదస్సుకు వారం రోజుల ముందునుంచే చండాలపు కదనాలు ఇస్తూ పారిశ్రామికవేత్తలకు తప్పుడు సంకేతాలు పంపిస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవడినట్లు, ఇక్కడ అధికారపార్టీ, ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తున్నట్లుగా ప్రచారం చేయడానికి ఈనాడు రామోజీరావు నడుం కట్టారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేదట. గొంతెత్తితే దాడులు జరుగుతున్నాయట. ఏ విమర్శను సహించడం లేదట. వైకాపా నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారట. ప్రతిపక్షనేతలపై దౌర్జన్యాలు, కొట్లాటలు దాడులు అట. వాక్ స్వాతంత్రమే లేదంటూ పచ్చి అభూత కల్పనతో బ్యానర్ కథనాన్ని ఇచ్చారు. మళ్లీ ఫ్యాక్షన్ వాతావరణం వచ్చిందని వారి మనసులోని ద్వేషాన్ని వెళ్లగక్కారు. అది ఆత్మవంచన కాక మరేమిటి రామోజీ? ఎవరు తప్పు చేసినా తప్పే.రెండువైపులా లోటుపాట్లను రాయవచ్చు. కానీ ఈనాడు మీడియా అలా చేయడం లేదు. గన్నవరంలో జరిగిన గొడవతో సహా ఎక్కడెక్కడి ఘటనలనో చిన్నా,చితకా వాటిని వైఎస్సార్ కాంగ్రెస్‌కు పులుముతూ చెత్త కథనాన్ని ఇచ్చి ఈనాడు ఆత్మ సంతృప్తి చెందింది. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు రావాలన్న వారి దుష్ట తలంపు అందరికి ఇట్టే తెలిసిపోతుంది. తెలుగుదేశం పార్టీవారు మహాత్మగాంధీ వారసులన్నట్లుగా, చంద్రబాబు, పట్టాభి వంటివారు స్వాతంత్రయోదులు అయినట్లు వార్తలు ఇస్తున్నారు. వారు ముఖ్యమంత్రి జగన్ పైన, వైసీపీ నేతలపైన ఎలాంటి దూషణలకు దిగినా, అవి పరమ పవిత్ర భాషణలుగా రామోజీ భావిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి ప్రతిపక్ష టీడీపీకి బాగా మేలు చేయవచ్చని రామోజీ భావిస్తుంటే, అది ఆత్మ వంచనే అవుతుంది. మాచర్లలో పరిస్థితి రాక్షసత్వంగా ఉందట. అక్కడ టీడీపీ నేత ఫ్యాక్షన్ రాజకీయాలు చేయడంలో దిట్ట అయితే ఆయనలో గొప్ప ప్రజాస్వామ్యవాదిని ఈనాడు చూస్తోంది.ఇద్దరు టీడీపీ నేతలు ఘర్షణ పడితే వారిలో ఒకరిని వైసీపీవాడిగా చిత్రీకరిస్తూ వక్ర వార్తలు అందిస్తోంది. టీడీపీ పాలనలో జరిగిన అనేక ఘటనలను దాచిపెడుతూ ,ప్రజల చెవిలో పూలు పెట్టాలని విశ్వయత్నం చేస్తోంది. ప్రస్తుతం మంత్రిగా ఉన్న జోగి రమేష్ గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక వివాదానికి సంబందించి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు వినతిపత్రం ఇవ్వాలని ఆయన ఇంటి వద్దకు వెళ్లారు. పోలీసులు ఆయనను ముందుగానే నిలువరించారు. జగన్ ప్రభుత్వంపై రాళ్లు వేయడమే లక్ష్యంగా .. అయినా ఈనాడు ఏమీ రాసిందో, ప్రసారం చేసిందో చూడండి. మాజీ ముఖ్యమంత్రి ఇంటిపై దండయాత్రకు జోగి వెళ్లారట. ఇలాంటి పచ్చి అబద్దాలను ప్రచారం చేయడానికి ఈనాడు మీడియా, ఆ సంస్థల అధినేత రామోజీరావు ఏ మాత్రం సిగ్గుపడడం లేదు. ఏ కథనంలో అయినా రెండో వర్షన్ ఉండాలని కనీస సూత్రాన్ని విస్మరించి జగన్ ప్రభుత్వంపై రాళ్లు వేయడమే లక్ష్యంగా ఈ మీడియా పనిచేస్తోంది. ఇంతవరకు మరో రెండు టీడీపీ మీడియా సంస్థలే బట్టలూడదీసుకుని తిరుగుతున్నాయని అనుకునేవారం. కానీ వారితో పోటీలో తాము వెనుకబడుతున్నామని అనుకున్నారో ఏమో కానీ వీరు మారీచ వేషం కూడా వదలివేసి, మరీ నీచంగా బట్టలు లేకుండా తిరుగుతున్నట్లుగా ప్రవర్తిస్తున్నారు.కొద్ది రోజుల క్రితమే రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగోలేదంటూ ఒక భారీ కథనాన్ని ఇచ్చింది. మళ్లీ వారం లోపే అదే తరహా వార్తను మళ్లీ ప్రచారంలో పెట్టడం ఆశ్చర్యంగా ఉంటుంది. జర్నలిజం ప్రాధమిక సూత్రాల ప్రకారం ఏదైనా ఒక కథనం ఒకసారి ఇస్తే,దానికి ఫాలో అప్ వార్త ఉంటే ఇస్తారు.అలాకాకుండా ఏకంగా మళ్లీ,మళ్లీ ఒకే తరహా వార్తను ఇస్తున్నారంటే ప్రజల మనసులలో విషం నింపాలన్న తాపత్రయం తప్ప మరొకటి కాదు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తున్నారట. ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తున్నారట. ప్రతిపక్షాలను బతకనివ్వడం లేదట. ఎన్ని అసత్యాలు చూడండి. అదే నిజమైతే ఈనాడు మీడియా ఇంత చండాలంగా వార్తలు రాయగలుగుతుందా?వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ తమకు ఏమి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ, విషం ఎలా కక్కగలుగుతోంది?గతంలో చంద్రబాబు టైమ్ లో కాపు ఉద్యమ టైమ్ లో రెండు టివీ చానళ్లను బాన్ చేసినప్పుడు ఈనాడు మీడియా నోట్లో బెల్లం పెట్టుకుని కూర్చుంది. అంతేకాదు..అప్పట్లో సాక్షి మీద ముఖ్యమంత్రి హోదాలో విరుచుకుపడితే ఆయనలో ప్రజాస్వామ్యవాదిని చూసి ఈనాడు మురిసిపోయింది. రామోజీ పతనం ఇంకా ఎంత ఘోరంగా ఉంటుందో మరి..! మరో సంగతి చెప్పాలి. ఇదే మీడియా ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు చేసే అడ్డదిడ్డమైన ప్రకటనలను ,ప్రసంగాలను కవర్ చేయడంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. టీడీపీకి రాజకీయంగా నష్టం వస్తుందనుకున్నా, జనంలో నవ్వుల పాలు అవుతారని అనుకున్నా, వాటిని ఎడిట్ చేసి కథనాలు ఇస్తోంది. ఉదాహరణకు తెలంగాణ వారికి బియ్యం అన్నం తినడం నేర్పింది తెలుగుదేశం అని చంద్రబాబు వ్యాఖ్యానిస్తే, దానిని కాస్త సరిచేసి ,మరికొంత ఎడిట్ చేసి ఆయనకు ఇబ్బంది లేకుండా వార్త ఇచ్చింది.ఈ రకంగా రామోజీరావు ఈనాడు మీడియాను తెలుగుదేశంకు తాకట్టు పెట్టేశారు. ఎలాగైనా ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న లక్ష్యంతో రామోజీరావు తానే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యత తీసుకున్నట్లుగా రెచ్చిపోయి రాస్తున్నారు. తన టీవీలో ప్రసారం చేస్తున్నారు. టీడీపీ చోటా నాయకుడు పట్టాభి అరాచకపు ప్రవర్తనకు, రామోజీరావు అరాచక రాతలకు పెద్ద తేడా లేకుండా పోవడమే విషాదం. రామోజీరావు పతనం ఇంకా ఎంత ఘోరంగా ఉంటుందో తెరపైనే చూడాలి. -హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్. -
దేశంలో కాంగ్రెస్ పరిస్థితికి సోనియా గాంధీదే బాధ్యత!
అఖిల భారత కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ అధ్యక్షపదవి నుంచి దిగిపోయిన కారణంగా ఇన్నింగ్స్ ముగిసిందని ప్రకటించినా, లేక ఇతర కారణాలతో రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించినా, ఎలాగైనా దేశ రాజకీయాలలో ఒక పెద్ద పరిణామంగానే పరిగణించాలి. ఒకప్పుడు దేశంలోనే తిరుగులేని సామ్రాజ్ఞిగా చక్రం తిప్పిన ఆమె ప్రస్తుతం రాజకీయంగా బాగా దెబ్బతిన్నారనే చెప్పాలి. అయినా ఒక జాతీయ పార్టీకి నాయకత్వం వహించగలగడం , ఇంకా ఆ పార్టీ వారి గౌరవం పొందగలగడం విశేషమే . కాంగ్రెస్ గత పాతికేళ్లలో ఉత్ధాన,పతనాలకు ఆమెనే బాద్యత వహించాలి. ఒకప్పుడు కాంగ్రెస్ ,ఇతర పార్టీలతో కలిసి ఐక్య ప్రగతిశీల కూటమి పేరుతో ఒక ప్రంట్ ను ఏర్పాటు చేసి, అధికారం రావడానికి దోహదపడిన ఆమె , తదనంతర కాలంలో తనకు ఎదురు లేదన్న భావనతో తప్పుల పరంపర సాగించి కాంగ్రెస్ ను పాతాళానికి తీసుకువెళ్లారనే చెప్పాలి. పాతికేళ్ల రాజకీయ చరిత్రలో పార్టీలో చేరిన రెండు నెలలకే ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యారు. రికార్డు స్థాయిలో సుమారు 22 ఏళ్ళు ఆమె ఆ పదవిలో ఉన్నారు. సుమారు రెండున్నరేళ్లు ఆమె కుమారుడు రాహుల్ గాంధీ అద్యక్షుడుగా ఉన్నారు. గతంలో ఆమె దేశ ప్రధాని పదవికి ప్రయత్నించకపోలేదు. కానీ ఆమె విదేశీయురాలు అన్న కారణంగా ఆయా పార్టీల నేతలు వ్యతిరేకించారు. అప్పట్లో కాంగ్రెస్‌లోనే ఉన్న శరద్ పవార్ వంటివారు కూడా ఆమెను ప్రధాని అభ్యర్ధిగా ఒప్పుకోవడానికి నిరాకరించారు. 1999లో ఒక్క ఓటుతేడాతో వాజ్ పేయి ప్రభుత్వాన్ని పడవేయడం, అందుకు అప్పటి ఒడిషా కాంగ్రెస్ ముఖ్యమంత్రి గమాంగో ఓటే కారణం అవడం సంచలనం అయింది. దాని వల్ల కాంగ్రెస్ కు నష్టం జరిగింది. ఆ సంవత్సరం జరిగిన ఎన్నికలలో బీజేపీ ఆద్వర్యంలోని ఎన్.డి.ఎ.కూటమి విజయం సాధించింది. కానీ 2004 నాటికి ఇతర ప్రాంతీయ, వామపక్ష పార్టీ లతో కలిసి కూటమి కట్టి అధికారంలోకి రావడానికి సోనియాగాంధీ నాయకత్వం కొంత ఉపయోగపడింది. అప్పటికి బీజేపీ ఇప్పుడున్న శక్తిమంతంగా లేకపోవడమే కారణం. పదేళ్లపాటు సోనియాగాందీ మకుటం లేని మహారాణిలా దేశాన్ని ఏలిందనే చెప్పాలి. పేరుకు మన్మోహన్ సింగ్ ప్రదాని అయినా, ఆయన గౌరవ ప్రపత్తులు ఉన్న వ్యక్తే అయినా, మొత్తం పవర్ అంతా ఈమె చేతిలోనే ఉందన్న అభిప్రాయం ఉండేది. జాతీయ సలహామండలిని ఏర్పాటు చేసి , దానికి చైర్ పర్సన్‌గా సోనియాగాంధీ వ్యవహరించారు. పలు కీలకమైన నిర్ణయాలను ఆ మండలిలో తీసుకునేవారు. గతంలో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు సోనియాగాంధీతో విబేధాలు వచ్చాయి. చివరికి పీవీ మరణించాక ఆయన పార్దీవదేహాన్ని ఏఐసీసీ ఆఫీస్ లోపల పెట్టనివ్వలేదంటే అవి ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించుకోవచ్చు. మన్మోహన్ తో ఇబ్బంది లేకుండా సాగిపోయింది. ఇదంతా ఒక కధ అయితే, 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్‌కు 30 సీట్లు రావడం దేశంలో అధికారం రావడానికి ఎంతో ఉపయోగపడింది. అప్పుడు నాయకత్వం వహించిన వైఎస్ రాజశేఖరరెడ్డి బలమైన నేతగా అవతరించారు. అది గిట్టని కొందరు ఆయనకు వ్యతిరేకంగా సోనియాగాంధీ చెవినిల్లు కట్టుకుని ఫిర్యాదులు చేసేవారు. అయినా 2009లో వైఎస్ తిరిగి అధికారం సాదించడమే కాకుండా మళ్లీ ముప్పైకి పైగా లోక్ సభ స్థానాలను సాధించిపెట్టారు.ఈ ఎన్నికలలో కూడా ఏపీ నుంచి అన్ని సీట్లు రాకపోతే కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రావడం కష్టం అయ్యేది. ఈ విషయాన్ని స్వయంగా మన్మోహన్ సింగే చెప్పేవారు. ఎపిలో అన్నీ సీట్లు రావడం వైఎస్ వల్ల కాదని, అదంతా సోనియాగాంధీ ప్రభావం అని వైఎస్ వ్యతిరేకులు ప్రచారం చేసేవారు. దీనిని ఆమె కూడా నమ్మినట్లే అనిపిస్తుంది. వైఎస్‌ను ఎదగనిస్తే రాజకీయంగా ప్రమాదమని కోటరి భావించిందని అంటారు. వైఎస్ మాత్రం ఇందిరాగాంధీ కుటుంబీకులైన సోనియా, రాహుల్ గాంధీల పట్ల విధేయతను వీడలేదనే చెప్పాలి. అయినా వైఎస్ కుటుంబానికి సోనియాగాంధీ తీరని అన్యాయం చేశారు. అనూహ్యంగా వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత ఆయన కుమారుడు జగన్‌తో రాజకీయంగా డీల్ చేసిన పద్దతి ఆమెలోని నియంతృత్వ దోరణి స్పష్టంగా కనిపించింది. పదేళ్ల అధికార సమయంలో కూడా అనేకసార్లు ఆమె తన అధికార దర్పాన్ని ప్రదర్శించినా, ఏపీ రాజకీయ పరిణామాలలో ఆమె ప్రవర్తించిన తీరు కాంగ్రెస్ పార్టీకి ఎనలేని నష్టం చేసింది. జగన్ ఓదార్పు యాత్ర విషయంలోకానీ, ఆయన సొంతంగా పార్టీ పెట్టుకుంటే కేసులు పెట్టించి పదహారు నెలలు జైలులో ఉంచడంలోగాని ఆమె కీలకభూమిక పోషించారని అంతా నమ్ముతారు. పైగా కాంగ్రెస్ కు ప్రత్యర్ధి అయిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుతో ఈ విషయంలో చేతులు కలపడం కూడా కాంగ్రెస్‌కు తీరని నష్టం చేసింది. అధికారం బాగా తలకెక్కితే ఇలాగే చేస్తారేమో అన్న అభిప్రాయం ప్రజలలో ఏర్పడింది. సోనియాగాంధీ తండ్రి ఇటలీలో ఒకప్పుడు నేషనల్ ఫాసిస్ట్ పార్టీకి మద్దతు ఇచ్చేవారట. ఆయన హిట్లర్ నాజీలకు అనుకూలంగా యుద్దంలో కూడా పాల్గొన్నారట. బహుశా ఆయనలోని ఆ లక్షణాలు కొన్ని ఆమెకు వచ్చి ఉండాలి. ఆమె భర్త రాజీవ్ గాంధీ బతికి ఉన్నప్పుడు ఆమె రాజకీయాలలోకి రాకుండా, పరోక్షంగానే జోక్యం చేసుకునేవారని అంటారు. తదుపరి 1997లో ఏర్పడిన పరిణామాలలో కాంగ్రెస్‌లో చేరి అధ్యక్ష స్థానం కైవసం చేసుకున్నారు. ఆయా రాష్ట్రాలలో నాయకత్వాన్ని ఎదగనివ్వకుండా చేసి, కాంగ్రెస్‌ను ఇప్పుడు ఈ క్షీణ దశకు తేవడంలో కూడా ఆమె పాత్ర ఉందనే చెప్పాలి. చివరికి లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కాంగ్రెస్‌కు రాకుండాపోయింది. శరద్ పవార్, మమత బెనర్జీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అజిత్ జోగి ఇలా పలువురు నేతలు సొంతంగా తమ రాష్ట్రాలలో పార్టీలు పెట్టుకున్నారు. ఆమె కుమారుడు రాహుల్ గాంధీ ప్రస్తుతం జోడో యాత్ర పేరుతో దేశం అంతటా పాదయాత్ర చేసినా, ఆశించినంత ఫలితం వచ్చినట్లు అనిపించడం లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాహుల్ చేసిన కొన్ని పిచ్చి చేష్టలు కూడా కాంగ్రెస్ కు చేటు చేశాయి. ప్రధాని పదవికి అవకాశం వస్తే వదలుకోవడం, మన్మోహన్ సింగ్ జారీ చేసిన ఆర్డినెన్స్ కాపీలను బహిరంగంగా చించివేయడం , నెలల తరబడి విదేశాలలో ఉండి రావడం వంటి చర్యలతో ప్రజలలో ఆయన నమ్మకం కోల్పోయారు. నరేంద్ర మోదీని ఎదుర్కోవడం ఈయన వల్ల కాదన్న అభిప్రాయం బలపడింది. ఉమ్మడి ఏపీని విభజించిన తీరుతో కాంగ్రెస్ పూర్తిగా తుడుచుకుపోయింది. జగన్‌కు అధికార పగ్గాలు దక్కకూడదన్న తలంపుతో విభజనను హడావుడిగా చేసిన ఫలితంగా రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ దెబ్బతినిపోయింది. తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ తెలంగాణ ఇస్తే తన పార్టీ టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి ముందుకు వచ్చినా, ఆమె తెలివిగా వ్యవహరించలేకపోయారు. దాంతో తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడం, కాంగ్రెస్‌కు పూర్తి గడ్డు పరిస్థితులు ఏర్పడడం జరిగిపోయింది. సోనియాగాంధీకి ప్రధాన సలహాదారులుగా ఉన్న దిగ్విజయ్ సింగ్, గులాం నబీ అజాద్ వంటివారి వ్యవహార శైలి కూడా నష్టం చేసిందని పలువురు నమ్ముతారు. విభజిత ఏపీలో అయితే కాంగ్రెస్ జీరోకి వెళ్లిపోగా, తెలంగాణలో కునారిల్లిపోయి, మళ్లీ లేవడానికి నానా తంటాలు పడవలసి వస్తోంది. బెంగాల్,పంజాబ్, ఒడిషా, మహారాష్ట్ర, హర్యానా, యూపీ, తమిళనాడు ,బీహారు వంటి ముఖ్యమైన రాష్ట్రాలలో కాంగ్రెస్ ఉనికిని నిలబెట్టుకోవడమే సమస్యగా ఉంది. పార్టీలో పాతికేళ్లపాటు, అధికారంలో పదేళ్లపాటు తన హవా సాగించిన సోనియాగాంధీ ప్రపంచలోనే శక్తిమంతమైన అతి కొద్దిమంది నేతలలో ఒకరిగా అప్పట్లో గుర్తింపు పొందారు. అలాగే ఆయా యూనివర్శిటీలు డాక్టరేట్లు ఇచ్చాయి. ఒక విదేశీ వనిత ఈ రకంగా భారత్ లో ఒక ప్రముఖ స్థానంలోకి వెళ్లడం గొప్ప విషయమే అయినా, దానిని ఆమె నిలబెట్టుకోలేకపోవడం కూడా చారిత్రక విషాదమే. ఆమె 76 ఏళ్ల వయసులో ఇన్నింగ్స్ ముగిస్తుంటే, ఎనభైఏళ్ల ఖర్గే ఎఐసీసీ అధ్యక్షుడుగా ఉన్నారు. దీనిని బట్టే కొత్త శక్తులు, యువతను కాంగ్రెస్‌లోకి తీసుకు రావడంలో ఆమె విఫలం అయ్యారు. అందివచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయారు. మొత్తం తానే అని భ్రమించి కాంగ్రెస్‌ను ఈ స్థితికి తెచ్చారు. ఈ దశలో ఆమె రిటైరైనా,రిటైర్ కాకపోయినా, ఏదైనా కొత్త శక్తి వచ్చి కాంగ్రెస్ ను కాపాడితే తప్ప మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పలేం. -హితైషి -
గతం గుర్తుందా రామోజీ?.. ఆ విషయం ‘ఈనాడు’కు తెలియదా!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పరిశ్రమలు రాకుండా అడ్డుకోవడానికి ఈనాడు మీడియా ప్రయత్నాలు గట్టిగానే చేస్తోంది. ఏపీ అభివృద్దికి పెద్ద శత్రువుగా ఈ మీడియా మారిందంటే ఆశ్చర్యం కాదు. ఒక వైపు రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు, పరిశ్రమలు తేవడానికి ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం విశాఖపట్నంలో భారీ స్థాయిలో గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్‌ను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. మార్చి 3,4 తేదీలలో ఈ సదస్సు జరగబోతోంది. దీనికి వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలను రప్పించడానికి మంత్రులు, ఐఎఎస్ అధికారులు విశేష కృషి చేస్తుంటే దానిని ఎలా చెడగొట్టాలా అని ఈనాడు మీడియా ఆలోచన చేస్తోంది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అమర్నాథ్ తదితరులు బెంగుళూరు, ముంబై, హైదరాబాద్ వంటి నగరాలలో పర్యటించి సన్నాహక సదస్సులు పెడుతున్నారు. వారి సమావేశాలకు ప్రముఖులు హాజరువుతున్నారు. ఏపీకి ఉన్న అపార అవకాశాలను మంత్రులు తెలియచేస్తున్నారు. విశాఖ సమ్మిట్ సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తుండడంతో ఈనాడు మీడియా పుల్లలు వేయడం ఆరంభించింది. అందులో భాగంగా శనివారం నాడు ఒక కథనాన్ని ఇచ్చింది. పారిశ్రామిక రాయితీ జాడేది అని హెడింగ్ పెట్టి మొదటి పేజీలో పరిచారు. ప్రభుత్వం ప్రోత్సహాకాలను సకాలంలో చెల్లించలేదట. తీరా చూస్తే అదంతా కలిపి 728 కోట్లేనని ఆ మీడియాలోనే తెలిపారు. పైగా అది కూడా గత ఆగస్టునుంచే ఉన్న బకాయి. నిజానికి ఏ ప్రభుత్వంలో అయినా పారిశ్రామిక ఇన్సెంటివ్‌లు ఒకసారిగా చెల్లింపులు జరగవు. క్రమేపీ విడతల వారీగా ఇస్తుంటారు. గతంలో నాలుగైదేళ్ల పాటు కూడా పరిశ్రమలకు బకాయిలు చెల్లించని ఘట్టాలు చాలానే ఉన్నాయి. తెలుగుదేశం హయాంలో ఈ బకాయిలు ఎలా ఉన్నాయో మాత్రం ఈ మీడియా రాయలేదు. అప్పుడంతా బకాయి లేకుండా చెల్లించారా?. టీడీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి 3400 కోట్ల రూపాయల బకాయి ఉందట. ఆ ప్రభుత్వం సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు చెల్లించవలసిన సుమారు వెయ్యి కోట్ల రూపాయల పైగా బకాయిలను జగన్ ప్రభుత్వం చెల్లించిందన్న సంగతి ఈనాడు మీడియాకు తెలియదా! ఎవరైనా పారిశ్రామికవేత్తలు ఆంద్రకు రావాలని అనుకుంటే,వారిని చెడగట్టడానికి గాను ఇక్కడ బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం సరిగా చెల్లించడం లేదన్న సంకేతం ఇవ్వడానికి, ఇలా దురుద్దేశపూరితంగా కథనం రాసిన సంగతి అర్దం అవుతూనే ఉంది. జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈనాడు వారు ఇలాంటి దిక్కుమాలిన కథనాలు ఎన్ని వండి వార్చారో! కియా పరిశ్రమ వెళ్లిపోతోందని తెలుగుదేశంకు మద్దతు ఇచ్చే ఈనాడు, జ్యోతి, టివి 5 వంటి మీడియా సంస్థలు విపరీత ప్రచారం చేశాయి. కాని ఆ సంస్థ వారు అదనంగా 400 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడాతమని ప్రకటించారు. ఏపీకి ఎన్నడూ రాని ఆదిత్య బిర్లా వచ్చి పరిశ్రమలు పెడుతున్నారు. అయినా ఇక్కడకు పరిశ్రమలు రావడం లేదని దుష్ప్రచారం చేస్తుంటారు. విశాఖలో ఎల్జి పాలిమర్స్ సంస్థ నుంచి గ్యాస్ వెలువడడంతో పదమూడు మంది మరణించారు. ఆ సంస్థ తిరిగి తెరవడానికి వీలు లేదని టీడీపీ, ఎల్లో మీడియా వాదించాయి. అదే చిత్తూరు జిల్లాలో టీడీపీ ఎంపికి చెందిన సంస్థలో పొల్యూషన్ సమస్య సృష్టిస్తుంటే, వారికి నోటీసు ఇవ్వగానే నానా యాగి చేశాయి. ఇదే ఎంపీ తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటిస్తే, ఇంకే ముంది ఏపీకి రానివ్వడం లేదని అన్నారు. తదుపరి ఆయనే ఏపీలో కూడా పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటిస్తే ఈ మీడియా నోరుమూసుకుంది. కాకినాడ వద్ద ఫార్మా హబ్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపితే, అది వద్దని టీడీపీ ఏకంగా లేఖ రాస్తే, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా తందాన అంటూ వంతపాడాయి. గతంలో శ్రీసిటీకి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం భూమి సేకరిస్తుంటే, రాష్ట్రంలో పారిశ్రామక సెజ్ లకు ఏర్పాట్లు చేస్తుంటే ఈనాడు రామోజీరావు దానిని వ్యతిరేకిస్తూ ఏకంగా సంపాదకీయం రాశారు. అదంతా ప్రజా వంచనగా వ్యాఖ్యానించారు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2016 లో ఒక వార్త రాస్తూ అదంతా భాగ్యసీమ అయిపోయిందని రాసింది. అసలు ఆ పారిశ్రామికవాడ రావడానికి కృషి చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు మాత్రం ప్రస్తావించకుండా జాగ్రత్తపడింది. అదే పద్దతిలో ఇప్పుడు కూడా జగన్ ప్రభుత్వం పరిశ్రమలు తీసుకువస్తుంటే వ్యతిరేక కథనాలు రాయడానిక నానా పాట్లు పడుతోంది. నెల్లూరు జిల్లా రాపూరు వద్ద సోలార్ ప్రాజెక్టుల కోసం పారిశ్రామికవాడను ఏర్పాటు చేస్తుంటే దానిని ఫలానా వారికి ఇస్తున్నారు.. అది ముఖ్యమంత్రి జగన్ సన్నిహితులది అంటూ దిక్కుమాలిన రాతలకు పాల్పడింది. అంతే తప్ప ఆ పారిశ్రామికవాడ వస్తే వేలాది మందికి ప్రయోజనం కలుగుతుందని మాత్రం రాయడానికి వారికి మనసు ఒప్పలేదు. తెలంగాణకు గత ఏడాదికాలంలో సుమారు రెండువేల కోట్ల పెట్టుబడులే వచ్చినా, చాలా గొప్పగా వచ్చాయని, అదే ఏపీకి సుమారు నలభై వేల కోట్ల పెట్టుబడులు వచ్చినా, ఏమీ రాలేదని ఉన్నవిలేనట్లు, లేనివి ఉన్నట్లు ఈనాడు ప్రచారం చేయడం దుర్మార్గంగా ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో గత మూడేళ్లుగా ఏపీ నెంబర్ ఒన్ స్థానంలో ఉన్నా, వీరు మాత్రం గుర్తించరు. ఇలాంటి దుష్టచతుష్టయాన్ని ఎదుర్కుంటూ జగన్ ప్రభుత్వం కొత్త పరిశ్రమల ఏర్పాటుకు చాలా కృషి చేయవలసి వస్తోంది. చంద్రబాబు టైమ్‌లో విశాఖలో సదస్సులు పెట్టి దారిపోయేవారితో ఒప్పందాలు చేసుకున్నా, ఆహా, ఓహో అంటూ వీరే ఊదరగొట్టారు. వాటిలో పదో వంతు కూడా వాస్తవరూపం దాల్చకపోయినా, ఎన్నడూ వీరు ఆ విషయాలను ప్రజలకు చెప్పలేదు. మాల్ ఏర్పాటుకు విశాఖలో అత్యంత విలువైన స్థలాన్ని లూలూ అనే కంపెనీకి కేటాయిస్తే, వారు ఏళ్ల తరబడి దానిని నిర్మించలేదు. ఈ ప్రభుత్వం ఆ స్తలాన్ని వెనక్కి తీసుకుని వేరే అవసరాలకు కేటాయిస్తే తప్పు పడుతుంది. అమరావతి పేరుతో ఉన్న పల్లెల్లలో బిఆర్ షెట్టి అనే ఆయనకు వంద ఎకరాలను గత ప్రభుత్వం కేటాయించింది. అక్కడ ఆస్పత్రి తదితర నిర్మాణాలు చేస్తారని తెలిపింది. కాని అలాంటివి ఏమీ చేయకపోయినా ఆ ప్రభుత్వ పట్టించుకోలేదు.పైగా బిఆర్ షెట్టిపై దుబాయిలో కేసులు వచ్చాయన్న సంగతి ఆ తర్వాత వార్తలలో వచ్చింది. అప్పట్లో బోగస్ కంపెనీలతో హడావుడి చేస్తే, ఇప్పుడు నిజమైన కంపెనీలు వస్తుంటేనే ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటోంది. జిందాల్ స్టీల్స్ జమ్మలమడుగులో 8800 కోట్ల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. అంతా సిద్దం అయ్యాకే అక్కడ జగన్ శంకుస్థాపనకు వెళ్లారు. అయినా ఒక్కోసారి కొన్ని పరిశ్రమలు అనుకున్నట్లు రావచ్చు. రాకపోవచ్చు. అది ఏ ప్రభుత్వంలోనైనా జరుగుతుంటుంది. కాని టీడీపీ ప్రభుత్వంలో అలాంటివాటిని కప్పిపుచ్చి, ఈ ప్రభుత్వంలో ఏదైనా చిన్న ఘటన జరిగినా చిలవలు, పలవులు చేసి వార్తలు ఇవ్వడం ఈనాడుకు రివాజుగా మారింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదాని గతంలో చంద్రబాబును కలిస్తే గొప్ప విషయంగా ప్రాజెక్టు చేశారు. అదే జగన్‌ను కలిస్తే రాష్ట్రాన్ని రాసిచ్చేస్తున్నారని దుర్మార్గపు రాతలకు టీడీపీ మీడియా పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉండాలి. వచ్చే పరిశ్రమలను ఏదో రకంగా అడ్డుకుని, మళ్లీ ఆ నెపాన్ని ప్రభుత్వంపైనే నెట్టే ప్రమాదం ఉంది. చదవండి: రామోజీ తప్పు చేస్తే ఉద్యోగులు బలిపశువులా? ఏ మీడియా అయినా ప్రభుత్వంలోని లోటుపాట్లు రాయడం తప్పుకాదు. కాని నిర్మాణాత్మక విధానంలో కాకుండా, రాష్ట్ర అభివృద్దిని ఎలా చెడగొట్టాలన్న ధ్యేయంతో ఈ మీడియా పనిచేస్తోంది. సరిగ్గా విశాఖ సమ్మిట్‌కు ముందు ఇలాంటి దారుణమైన కథనాలు రాయడం ఆరంభించారంటేనే వారి దుష్ట తలంపు తెలుస్తూనే ఉంది. పరిశ్రమల మంత్రి అమరనాథ్ మీడియా సమావేశంలో చెప్పిన వాటికి తన పైత్యం జోడించి మళ్లీ రాశారు. అందుకే ఈనాడు, తదితర టీడీపీ మీడియా అంతా ఇప్పుడు ఏపీ పాలిట విలన్‌గా మారాయని ఒకటికి పదిసార్లు చెప్పవలసి వస్తోంది. చివరిగా ఒక మాట!. ఆంగ్ల దినపత్రిక అయిన టైమ్స్ ఆఫ్ ఇండియా ఏపీకి పెట్టుబడులు భారీగా వస్తున్నాయని ప్రముఖంగా రాస్తే, ఏపీలో పుట్టి పెరిగిన తెలుగు దినపత్రిక అయిన ఈనాడు ఆ పెట్టుబడులు రాకుండా ఎలా చేయాలా అన్న యావతో కథనాలు ఇస్తోంది. దీనినే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడమని అంటారు. -హితైషి -
చంద్రబాబు భయపడుతున్నారా?.. ఎందుకంత ఫ్రస్ట్రేషన్?
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు రోజురోజుకు చిత్రాచిత్రంగా, పట్టరాని అసహనంతో మాట్లాడుతున్నట్లుగా ఉంది. కృష్ణా జిల్లా గన్నవరంలో పర్యటించిన సందర్భంగా మాట్లాడిన విషయాలు గమనిస్తే ఆయన ఏదో తేడాగా వ్యవహరిస్తున్నారన్న అనుమానం సహజంగానే వస్తుంది. చంద్రబాబు అన్న మాటలు ఏమిటో చూడండి. దొంగాటలు వద్దు.. లగ్నం పెట్టుకుందాం రండి.. తాడోపేడో తేల్చుకుందాం.. ధైర్యం ఉంటే పోలీసులు లేకుండా సైకోని కూడా తీసుకురండి.. అని అంటున్నారంటే ఏమని అనుకోవాలి. ఇది అసలు ఒక సీనియర్ నేత మాట్లాడవలసిన తీరేనా!పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పదిహేనేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి అర్దం, పర్దం లేకుండా ఆవేశపడడం ఒక ఎత్తు అయితే రండి.. కొట్టుకుందాం అని అంటున్నారంటే ఏమనాలి? ఆయనకు నిజంగా అంత భయం లేకపోతే తన చుట్టూ ఉన్న బ్లాక్ క్యాట్ కమాండోస్‌కు చెందిన వంద మంది భద్రతా సిబ్బందిని వెంటబెట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు. ఆయన కూడా తనకు ఆస్థాయి భద్రత అవసరం లేదని, సాధారణ భద్రత సరిపోతుందని ఎందుకు చెప్పలేకపోతున్నారు. ఆయనకు భద్రత వద్దనడం లేదు. కాని తానేమో పూర్తి భద్రత వలయంలో ఉండి, టిడిపి కార్యకర్తలను రెచ్చగొడుతున్న తీరు చాలా దారుణంగా ఉంది. గన్నవరంలో ఆయన పర్యటనలో స్థానికులు పెద్దగా పాల్గొనలేదట. ఆయనేదో నాలుగు డైలాగులు చెప్పి, యధా ప్రకారం ముఖ్యమంత్రిపైన, వైసీపీపైన దూషణలకు పాల్పడి నోటి తీట తీర్చుకున్నట్లు అనిపిస్తుంది. అంతేకాదు. అన్ని చోట్ల పోలీసులను బెదిరించడం ఒక అలవాటుగా మార్చుకున్నారు. వారిని జైలుకు పంపిస్తామని హెచ్చరిస్తున్నారు. తెలుగుదేశం మద్దతుదారులుగా పోలీసులు మారకపోతే ఆయన ఊరుకోరట. ప్రభుత్వం వైపు ఉండకూడదట. నిజానికి గన్నవరం లో జరిగిన ఘటనలో పోలీసులు తమ బాధ్యత నిర్వహించకుండా ఉంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉండేది. అలా జరగలేదన్నదా చంద్రబాబు బాద అనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా తీవ్రమైన ఘటన జరిగి ఉంటే, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ప్రచారం మరింతగా చేయవచ్చన్నదా ఆయన ఆలోచన అనిపిస్తుంది. ఒకవైపు టిడిపి కార్యకర్తలు పోలీసులపై రాళ్లు రువ్వడం, వారిని దూషించడం అన్నిటికి చంద్రబాబే బాధ్యత వహించాలి. ఎందుకంటే ఆయన ఒక టార్గెట్ పెట్టుకుని టీడీపీ వారిని రెచ్చగొడుతున్నారు. మీరేమైనా చేయండి, కేసుల సంగతి మేం చూసుకుంటాం అని ఆయన గతంలోనే చెప్పారు. పోలీసులను ఏకంగా సంఘ విద్రోహ శక్తులంటూ ఇష్టారాజ్యంగా అనపర్తిలో, ఇతర చోట్ల మాట్లాడారు. తద్వారా తెలుగుదేశం కార్యకర్తలు పోలీసులపైన దాడులు చేయాలని ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు. చుట్టూ భద్రతా వలయం ఉంది కనుక తన జోలికి రావాలంటే అంత ఈజీకాదని ఆయన భావన కావచ్చు. అందువల్ల ఆయన అందరిని రెచ్చగొట్టి తాను మాత్రం సేఫ్ గా ఉంటున్నారు. గత ఎన్నికల ముందు తనను సీబీఐ అరెస్టు చేస్తుందని, అందరు వచ్చి తన చుట్టూ ఉండాలని అంటుండేవారు. ఇప్పుడు ఏమో తేల్చుకుందాం రండి, లగ్నం పెట్టుకుందాం రండి అంటున్నారు. ఆ లగ్నానికి ఆయన పార్టీ నేత పట్టాభి వంటివారిని కూడా తీసుకువస్తారేమో తెలియదు. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. పట్టాభి పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తించి అరెస్టు అయిన తర్వాత మామూలుగా అయితే వెంటనే బెయిల్ పిటిషన్ వేసేవారు. అలాంటిది ప్రస్తుతం మాత్రం అంత తొందరేమీ లేదని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిద్వారా సానుభూతి సంపాదించాలన్నది టీడీపీ ప్లాన్ అట. అంటే తన దిక్కుమాలిన రాజకీయం కోసం తన పార్టీవారిని సైతం బలి చేయడానికి చంద్రబాబు వెనుకాడరా అని టీడీపీలోనే చర్చ జరుగుతోందట. వైఎస్సార్సీపీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని స్పందిస్తూ, చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలకుగాను ఆయనను అయితే జైలులో పెట్టాలి.. లేదా పిచ్చాసుపత్రిలో చేర్చాలి అని అన్నారు. చంద్రబాబు లగ్నం పెట్టాలని అంటున్నారని అందుకు తాము సిద్దమేనని ఆయన సవాల్ చేశారు. చంద్రబాబు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తన చుట్టూ ఉన్న బ్లాక్ క్యాట్ కమాండోలను వదలిపెట్టి రావాలని నాని సూచించారు. మరి ఇందుకు చంద్రబాబు సిద్దపడతారా? ఇవేవి జరిగేవి కావు. కేవలం కార్యకర్తలను దాడులకు పురికొల్పడానికే చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారన్నది బహిరంగ రహస్యమే. చంద్రబాబు కు బాలకృష్ణ పూనినట్లు ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. నిజంగానే బాలకృష్ణకు సినిమా డైలాగులు తప్ప రాజకీయ డైలాగులు చెప్పడం అంతగా చేతకాదు. ఏదేదో మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఆయన కోవలోకి చంద్రబాబు వచ్చారన్నది నాని అభిప్రాయం కావచ్చు. ఇక వివేకా హత్య కేసుపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు ఇన్నీ ,అన్నీ కావు.. వివేకా హత్య జరిగింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కదా! మరి అప్పుడు తన ప్రభుత్వంలోని పోలీసు అదికారులు విచారణ సరిగా చేయలేకపోయారని అది తమ ప్రభుత్వ అసమర్థత అని ఒప్పుకుంటున్నారా? ఎలాగొలా ముఖ్యమంత్రి జగన్‌పైన బురద పూయాలని నానా పాట్లు పడుతున్నారు. సిబిఐ తీరు కూడా పలు అనుమానాలకు దారి తీస్తోంది. అన్ని కోణాలలో ఎందుకు విచారణ చేయడం లేదో తెలియడం లేదని ఆ కేసును పరిశీలిస్తున్నవారు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో జగన్ కేసులలో అచ్చంగా టిడిపి, కాంగ్రెస్ నేతలు సూచించిన విధంగా సీబిఐ డీల్ చేసిందని ప్రజలంతా నమ్మారు. సీబీఐ విచారణను జనం నమ్మలేదు కాబట్టే 2019లో ప్రజలంతా జగన్ కు పట్టం కట్టారు. ఇప్పుడు కూడా సిబీఐ అలాగే అతిగా ,ఏకపక్షంగా దర్యాప్తు చేస్తే రాజకీయంగా చంద్రబాబుకు ఉపయోగపడకపోగా, అది మరింత నష్టం చేసే అవకాశం ఉందని కొందరు ప్రముఖ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ , అభివృద్ది కార్యక్రమాల ఎజెండానుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి చంద్రబాబుతో పాటు, ఈనాడు, తదితర ఎల్లో మీడియా విపరీతంగా శ్రమిస్తోంది. అదికారంలోకి వస్తే తాము ప్రజలకు ఏమి చేస్తామో చెప్పలేని దైన్య స్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇతరత్రా జగన్ ను ఏ రకంగా ఇబ్బంది పెట్టవచ్చా అని ఆలోచించి కుట్ర ప్లాన్ లను ముందుకు తీసుకు వస్తున్నది. ఇలాంటివి ఫలిస్తాయని అనుకోవడం భ్రమే అవుతుంది. ప్రజలంతా అమాయకులని భావిస్తే పప్పులో కాలేసినట్లే అవుతుందని చెప్పవచ్చు. -హితైషి చదవండి: హతవిధీ! ఇక్కడే ఇలా ఉంటే.. ఇతర జిల్లాల్లో మన పరిస్థితి ఏంటి? -
చిల్లర నేత చిందులాట.. రామోజీకి తన సినిమా డైలాగ్ గుర్తుందో లేదో?
కుట్రలు, కుతంత్రాలు ఏదో ఒక రోజు బటయపడతాయని అంటారు. అబద్దాలు ఆడేవారు ఎప్పుడో ఒకప్పుడు దొరికిపోతారన్నది నానుడి. సరిగ్గా ఈనాడు మీడియా పరిస్థితి అలాగే ఉందని చెప్పాలి. గత నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపైనా విషం కక్కుతున్న వైనం ఇప్పుడు మరింత ఓపెన్‌గా బహిర్గతమైంది. తెలుగుదేశం పార్టీ చోటా నాయకుడిని మహానాయకుడిగా చూపించడానికి, అతగాడు చేసే విన్యాసాలను మహా పోరాటంగా చిత్రించడానికి ఈనాడు పడ్డ పాట్లు ఇట్టే తెలిసిపోయాయి. రామోజీ ఈ డైలాగ్ గుర్తుందా? ఈనాడు బ్యానర్ చూడగానే ప్రఖ్యాత స్వాతంత్రయోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య ఏమైనా బతికి వచ్చారా? ఆయనకు ఏమైనా జరిగిందా? అన్న సందేహం వచ్చింది. తీరా మొత్తం కథనం చదివితే ఇదంతా ఒక చిల్లర నేత చేసిన ఆరోపణ అని అర్ధం అవుతుంది. ఈనాడు ఈ రకంగా తన స్థాయిని ఇంతగా దిగజార్చుకుంటుందని గతంలో ఊహించలేకపోయాం. తన క్షుద్ర రాజకీయం కోసం ఈనాడు ఎంతకైనా పతనం అవుతుందని ఈ ఘటన తెలియచెబుతుంది. సుమారు 35 ఏళ్ల క్రితం ఈనాడు అధినేత రామోజీరావు ఒక సినిమా తీశారు. దాని పేరు ప్రతిఘటన. అందులో కొన్ని పవర్ ఫుల్ డైలాగులు ఉంటాయి. ఒక రౌడీకి ఖద్దరు చొక్కా తొడిగి రాజకీయ నాయకుడిని చేశారని అందులో ఒక స్వాతంత్ర యోధుడు అంటారు. సరిగ్గా ఇప్పుడు ఈనాడు అదే పనిలో ఉన్నట్లు అనిపిస్తుంది. బురద చల్లడమే ఈనాడు కర్తవ్యం.. తెలుగుదేశంలో ఎవరు చిల్లరమల్లరగా వ్యవహరిస్తారో, నోటికి వచ్చినట్లు ముఖ్యమంత్రి జగన్‌ను దూషిస్తారో వారందరికీ విపరీత ప్రాధాన్యం ఇస్తూ వారిని మహా నాయకులుగా చిత్రీకరించడానికి తంటాలు పడుతోంది. తద్వారా వైఎస్సార్సీపీపై బురద చల్లడమే ఈనాడు తన కర్తవ్యంగా పెట్టుకుంది. బుధవారం నాటి పత్రిక గమనిస్తే సహజంగానే సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రకమైన ఆరోపణలను టీడీపీ చేసిన విషయం గుర్తుకు వస్తుంది. ఒక చోటా నేతను పోలీసులు కొట్టారంటూ ఏవో కొన్ని ఫొటోలను అప్పట్లో ప్రచురించారు. అదే తరహాలో మళ్లీ ఫొటోలు వచ్చాయేమిటా అనిపించింది. ఆ తర్వాత కొద్ది గంటల్లో అసలు రహస్యం బట్టబయలు అయింది. గతసారి వేసిన ఫొటోలనే ఇప్పుడు కూడా వేసి ఆ చోటా నేతను పోలీసులు కొట్టారంటూ కథ అల్లింది. సరే, కోర్టులో కూడా అదే తరహాలో చెప్పారు. అది వేరే సంగతి. వైద్యులు ఆ చోటా నేతను పోలీసులు కొట్టలేదని ధృవీకరించారు. ఈలోగా ఈనాడు ఎందుకో భయపడింది. రెండేళ్ల క్రితం వేసిన ఫొటోలనే ప్రచురించి తప్పు చేశారన్న సంగతి సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ అవడంతో తప్పనిసరి స్థితిలో టీవీలలో పాత ఫొటోలను ప్రచారం చేశామని, అది సాంకేతిక తప్పిదం వల్ల జరిగిందని.. ఇందుకు విచారిస్తున్నామని తెలిపింది. దీంతో, ఈనాడు మీడియా పరువు పూర్తిగా పోయినట్లయింది. బహుశా తాను చేసిన మోసాన్ని పోలీసులు పట్టుకుని కేసులు పెడతారని ఆందోళన చెంది ఈనాడు వారు ఈ వివరణ ఇచ్చి ఉంటారనిపిస్తుంది. అందులో కూడా నిజాయితీ కనిపించలేదు. ఇదే మొదటిసారి కాదు.. మంగళవారం తీసిన ఫొటో అంటూ సన్నాయి నొక్కుడుకు పాల్పడింది. మంగళవారం నాటి ఫొటోనే అయితే.. రెండేళ్ల క్రితం ఫొటో అక్కడ ఎలా ప్రత్యక్షమవుతుందో తెలియదు. ఇదంతా అబద్దమని, చేసిన తప్పును సమర్ధించుకునే యత్నమని తెలిసిపోతుంది. ఈనాడు ఇవ్వాళ ఒక్కరోజే ఇలా చేసిందని అనుకోజాలం. కొద్ది రోజుల క్రితం ఛీప్ సెక్రటరీ వైఎస్సార్ జిల్లాలో పర్యటించినప్పుడు కడపలో వేరే కేసులో సీబీఐ విచారణకు హాజరైన ముఖ్యమంత్రి.. ఓఎస్డీని కారులో ఎక్కించుకుని వెళ్లారంటూ తప్పుడు వార్తను ప్రచారం చేసింది. దానిని ఛీప్ సెక్రటరీ జవహర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అప్పుడు ఏ మీడియా అయినా ఏం చేయాలి. వారు ప్రచారం చేసిన వార్త సరైనదే అయితే, తమ వార్తకు కట్టుబడి ఉన్నామని చెప్పాలి. లేదా విచారం వ్యక్తం చేయాలి. కానీ.. వారు కేవలం సీఎస్ ఇచ్చిన ప్రకటనను కొద్దిగా ఇచ్చేసి వదలివేశారు. నిత్యం ముఖ్యమంత్రి జగన్‌ను, వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ఈనాడు విశేష కృషి చేస్తోంది. 86ఏళ్ల వయసులో ఆ పత్రిక అధినేత రామోజీరావు తన పరువు, ప్రతిష్ట మంటకలిసిపోయినా ఫర్వాలేదు కానీ.. వైఎస్సార్సీపీ అధికారంలో ఉండడానికి వీల్లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వంలో లోటుపాట్లు వార్తలుగా ఇస్తే తప్పు కాదు. కానీ, అదే పనిగా తప్పుడు ప్రచారం చేయడానికి, అభూత కల్పనలు కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒకే తరహా వార్తలను తెలంగాణలో ఒక రకంగాను, ఏపీలో మరో రకంగాను ఇస్తున్నారు. ఏపీలో పెట్టుబడులు కనిపించవా? ఉదాహరణకు తెలంగాణలో 200 కోట్ల పెట్టుబడి వచ్చినా, చాలా గొప్ప విషయంగా మొదటి పేజీలో ప్రచురిస్తుంటారు. అదే ఏపీలో వేల కోట్ల పెట్టుబడులు వచ్చినా, అసలు ప్రాధాన్యమే ఇవ్వరు. ఈ మధ్య జమ్మలమడుగు వద్ద 8,800 కోట్ల రూపాయల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు పారిశ్రామికవేత్త జిందాల్ శంకుస్థాపన చేస్తే దానిని మొక్కుబడిగా కవర్ చేశారు. పైగా బ్యానర్‌గా రోజువారీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసే ఒక చెత్త వార్తను ప్రచురించారు. విశాఖలో రిషి కొండపై ఎన్ని దారుణమైన వార్తలు రాస్తున్నారో చూస్తున్నాం. ఇదే రిషి కొండపై గత ప్రభుత్వ హయాంలో రోడ్డు వేస్తే, కొండకే హారం చుట్టినట్లు రాసిన ఈ పత్రిక.. ఇప్పుడు అక్కడ వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది పనులను మాత్రం విధ్వంసంగా ప్రచారం చేస్తోంది. చంద్రబాబు కన్నా ఆయనే తోపా? ఈ రెండు క్లిప్పింగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలా ఒకటని కాదు.. అనేక కథనాలలో ఇలాగే చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకుని ప్రచారం చేస్తున్న ఈనాడు బుధవారం నాటి పత్రికలో గన్నవరంలో ఆ పార్టీ చోటా నేత, మరికొందరు చేసిన అల్లరి పక్కనపెడితే, ఆ చోటా నేతను పోలీసులు కొట్టారంటూ కథనాలు ఇచ్చారు. స్క్రిప్ట్ ప్రకారమే ఆ చోటా నేత కూడా తనను పోలీసులు హింసించారంటూ కోర్టుకు తెలిపారు. ఈ వార్తలకు ఈనాడు పత్రిక ఏకంగా మూడు పేజీలను కేటాయించిందంటే వారు ఎంత కక్షకట్టారో ఇట్టే తెలిసిపోతుంది. టీడీపీలో ఆ చోటా నేతే చంద్రబాబు కన్నా ప్రముఖుడు అన్నట్లుగా వార్తలు ఇవ్వడం టీడీపీలోని వారికే మింగుడు పడటంలేదు. ఇతగాడు పార్టీ పరువును తీస్తున్నాడని వాపోతున్నారట. అసలు ఈయనకు ఇంత ధైర్యం అన్న విశ్లేషణ చేస్తే ఒక విషయం బయటపడుతోంది. గతసారి ముఖ్యమంత్రి జగన్‌ను దూషించిన కేసులో గౌరవ హైకోర్టు వారు అడ్వాన్స్ బెయిల్ ఇచ్చారు. దాంతో అతనికి అతి విశ్వాసం వచ్చి ఉండవచ్చు. న్యాయ వ్యవస్థను తేలికగా తీసుకోవచ్చన్న భావన ఏర్పడి ఉండవచ్చు. ఈ క్రమంలో అప్పటి నుంచి మరింతగా రెచ్చిపోయి వైఎస్సార్సీపీ వారిపై దూషణలకు పాల్పడటం, నిత్యం అబద్దాలు ప్రచారం చేయడం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కానీ, ఆయన కుమారుడు లోకేష్ కానీ.. ఇతనికి ఇస్తున్న ప్రాధాన్యత చూసి ఇతర ముఖ్యనేతలే ఆశ్చర్యం చెందుతున్నారు. ఎప్పుడో ఓసారి ఇతను ఏకుమేకై చంద్రబాబునే బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారట. వల్లభనేని వంశీపై వ్యతిరేక ప్రచారం.. నిజంగా గన్నవరం ఘటనల నేపథ్యంలో పోలీసులు ఎవరినైనా కొట్టి ఉంటే ఎవరూ సమర్దించరు. కానీ, పోలీసులను గాయపరచడమే కాకుండా, వారినే బెదిరించడమే పనిగా టీడీపీ నేతలు పెట్టుకుంటున్నారు. దానివల్ల వారికి రాజకీయ ప్రయోజనం వస్తుందనుకుంటే అది భ్రమే అవుతుంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గత ఎన్నికలలో టీడీపీ నుంచి ఎన్నికయ్యారు. తదుపరి ఆయన పార్టీకి దూరం అయ్యారు. అప్పటి నుంచి ఆయనపై టీడీపీ సోషల్ మీడియాలో దారుణమైన వ్యతిరేక ప్రచారం చేస్తుంటారట. దానిని ఆయన తిప్పికొడుతూ తీవ్ర వ్యాఖ్యలే చేస్తుంటారు. గత కొంతకాలంగా ఇది జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో టీడీపీ చోటా నేత ఎంటర్ అయి వంశీపైన నోరుపారేసుకోవడం, లేని ఆరోపణలు చేయడం, వైఎస్సార్సీపీ వారిని రెచ్చగొట్టేలా వ్యవహరించడం చేశారని వార్తలు వచ్చాయి. దాంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు కూడా కొంత తొందరపడి ఉండవచ్చు. పోలీసులు రెండువైపులా కేసులు పెట్టారు. ఇరుపక్షాల నుంచి అదుపులోకి తీసుకున్నారు. అయినా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ పార్టీ వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అనడం ఆనవాయితీగా మార్చుకున్నారు. రాష్ట్రంలో ఏదో విధంగా శాంతి భద్రతల సమస్య సృష్టించాలని తెలుగుదేశం, ఈనాడు వంటి మీడియా సంస్థలు తీవ్రంగా యత్నిస్తున్నాయి. అందులో భాగంగానే వైఎస్సార్సీపీ వారిని ఎలాగోలా రెచ్చగొట్టేలా చేయాలన్నది వారి వ్యూహం కావచ్చు. చంద్రబాబు కన్నింగ్ ప్లాన్ ఇదే.. దానికి తోడు ప్రభుత్వం లేదా వైఎస్సార్సీపీ ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు దానిని ప్రజల దృష్టి నుంచి మళ్లించడానికి చంద్రబాబు ఇలాంటి వ్యూహాలు అమలు చేయడంలో దిట్టగా భావిస్తారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో 18 స్థానాలకు గాను 11 మంది బీసీలకు పదవులు ఇవ్వడానికి వైఎస్సార్సీపీ ప్రకటన చేసిన రోజునే ఈ గొడవ సృష్టించడంలో ఆంతర్యం ఇదేనని పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. మొత్తం పరిణామక్రమం, టీడీపీ రాజకీయ చరిత్ర గమనిస్తే, ఇది వాస్తవమే అనిపిస్తుంది. అయినప్పటికీ టీడీపీ రెచ్చగొట్టినా వైఎస్సార్సీవారు ఆవేశపడకుండా ఉండాలని ఈ ఘటన తెలియచెబుతుంది. వారు సంయమనంగా లేకపోతే మొత్తం నెపం అంతా ప్రభుత్వంపైన, వైఎస్సార్సీపీపైన నెట్టేసి బద్నాం చేయాలని టీడీపీ యత్నిస్తుంది. ఇదే సందర్భంలో మరో మాట చెప్పాలి. పాదయాత్ర చేస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి లోకేష్.. వైఎస్సార్సీపీ వారు ఒక్క టీడీపీ ఆఫీసుపై దాడి చేస్తే, తాము వంద వైఎస్సార్సీపీ ఆఫీసులపై దాడి చేస్తామని అనడం శోఛనీయం. అంతేకాదు.. కట్ డ్రాయర్ల మీద ఉరికిచ్చి కొడతారట. ప్రభుత్వం వస్తే ఈయనే పోలీసుల పోస్టింగ్స్ ఇస్తారట. ఇన్ని రకాలుగా రెచ్చగొడుతూ పోలీసు అధికారులను బెదిరిస్తున్న తీరు అర్దం అవుతూనే ఉంది కదా!. వైఎస్సార్సీపీ వారిని రెచ్చగొట్టాలన్నదే వారి వ్యూహం. కనుక ఈ ఎన్నికల సంవత్సరంలో అధికార వైఎస్సార్సీపీ కార్యకర్తలు అత్యంత జాగ్రత్తగా, పూర్తి సంయమనంగా ఉండాలి. -హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్. -
ఏపీలో బీజేపీ ఆ నానుడి మార్చివేసిందా?
ఆంద్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి ఏమీ తోచడం లేదు.పెద్దగా పని ఉండడం లేదు. అప్పుడప్పుడూ గుడులనో, గోపురాలనో హడావుడి చేస్తేనన్నా పార్టీ ఉనికి నిలబడుతుందని అనుకున్నారేమో తెలియదు కానీ, తాజాగా ఒక కారికేచర్ ఆధారంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపైన విమర్శలు కురిపించి నిరసనలకు దిగారు. ఒకప్పుడు మానవ సేవే మాధవ సేవ అనేవారు. కాని ఏపీలో బీజేపీ ఆ నానుడిని మార్చివేసినట్లుగా ఉంది. పసిపిల్లవాడికి శివరాత్రి నాడు ముఖ్యమంత్రి జగన్ పాలుపడుతున్నట్లుగా ఒక కారికేచర్ వచ్చింది. దానిని వైసీపీ అధికారిక ట్విటర్ లో పోస్టు చేశారట. అందులో ఏదో పెద్ద తప్పు ఉన్నట్లు బీజేపీ నేతలు కనిపెట్టేశారు. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా వారు నిరసనలు, ధర్నాలు అంటూ రంగంలోకి దిగారు. ఇక ప్రకటనల ఊదర ఎటూ ఉంటుంది. దానిపై వైసీపీ ఎమ్మెల్యేలు , మంత్రులు సీరియస్ గా స్పందించారు. నిజానికి బీజేపీ వారి చేష్టలపై అసలు స్పందించకపోయినా పెద్దగా పోయేదేమీ లేదు. కాని మతపరమైన అంశంగా బీజేపీ చిత్రీకరిస్తున్న నేపధ్యంలో ఈ వ్యవహారం సున్నితంగా ఉంటుంది కనుక వైసీపీ నేతలు దానిపై మాట్లాడినట్లు ఉన్నారు. ఆ కారికేచర్ గమనించినవారికి ఎవరికైనా ముందుగా వచ్చే ప్రశ్న అందులో ఏమి తప్పు ఉందని! ఇందులో హిందువుల మనోభావాలు ఎలా దెబ్బతింటాయని! బీజేపీ అద్యక్షుడు సోము వీర్రాజు, పార్టీ ఇన్ చార్జీ సునీల్ ధియోదర్, రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు తదితర ముఖ్యనేతలతో పాటు చిన్నా,చితక నేతలు కూడా దీనిపై ప్రచారం చేపట్టారు. ఈ ప్రభుత్వం ఏకంగా హిందూ వ్యతిరేక ప్రభుత్వమని వారు తేల్చేశారు. అదెలాగంటే పసిపిల్లవాడికి పాలు పట్టడమట. ఇంతకన్నా విడ్డూరం ఏమైనా ఉంటుందా? చిన్నారి బాలుడికి పాలు పడితే శివుడికి క్షీరాభిషేకం చేయడాన్ని అపహాస్యం చేసినట్లయిందని వారు ఆరోపిస్తున్నారు. హిందువులపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వారు విమర్శించారు. ఏదో ఈనాడు, తదితర టీడీపీ మీడియా ప్రచార సంస్థల ద్వారా ప్రచారం పొందడానికి తప్ప బీజేపీ నేతల చర్య ఎందుకన్నా ఉపయోగం ఉంటుందా?ఈనాడు కూడా అసలు ఆ ఫోటోలో ఏముందో రాయకుండా శివలింగానికి క్షీరాభిషేకాన్ని అవహేళన చేసేలా ఫోటో ఉందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారని మాత్రమే పేర్కొనడం గమనించదగిన అంశం. ఆ ఫోటోను సవివరంగా ప్రచురిస్తే అసలు విషయం బయటపడిపోయి,ప్రజలకు వాస్తవం తెలిసిపోతుందన్నది ఈనాడు భయం కావచ్చు. సరే!వారి బాద వారిది! ఎక్కడ ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా మహా ప్రసాదంగా ఈనాడు భావిస్తోంది . అది వేరే సంగతి.సోము వీర్రాజు ఆద్వర్యంలో ఏకంగా మార్కాపురం, గిద్దలూరులలో ధర్నాలు కూడా చేసేశారు. ఆయనేదో అక్కడకు టూర్ కు వెళ్లినట్లున్నారు. ఏదో ఒకటి చేస్తే పోలా అని చేసినట్లుంది తప్ప ఏ మాత్రం ఇందులో అర్దం లేదు.ఏపీలో మతపరమైన వైరుధ్యాలు క్రియేట్ చేయడానికి గతంలోను బీజేపీతో పాటు జనసేన, టీడీపీలు ప్రయత్నాలు చేయకపోలేదు. గుడులలో చోరీలు జరిగాయనో, విగ్రహాలను పాడు చేశారనో , ఏవో సాకులతో అలజడి సృష్టించడానికి కృషి చేశారు. కాని అవేవి ఫలించలేదు. ప్రభుత్వం అలాంటి చిన్న ఘటన జరిగినా వెంటనే సీరియస్‌గా రియాక్ట్ అవడమే కారణమని వేరే చెప్పనవసరం లేదు. ఉదాహరణకు అంతర్వేదిలో రధం దగ్దం అయిన ఘటనపై విపక్షం నానా రాద్దాంతం చేసింది. వెంటనే సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాని కేంద్రం దానిపై స్పందించలేదు.శ్రీకాకుళం జిల్లాలో ఒక విగ్రహాన్ని తరలించిన ఘటనను వివాదాస్పదం చేశారు. తీరా చూస్తే టీడీపీవారే కావాలని అలా చేసి యాగీ చేశారని సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా వెల్లడైంది. రామతీర్దంలో రాముడి విగ్రహాన్ని ద్వంసం చేశారంటూ మరో గొడవను సృష్టించారు. ప్రభుత్వం వెంటనే మరో కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించింది. ఈ రకంగా హిందువుల మనోభావాలకు ఎక్కడా దెబ్బ తగలకుండా చర్యలు చేపడుతుంటే విపక్షానికి ఏమి చేయాలో పాలుపోవడం లేదు. అంతేకాదు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అత్యంత నిష్టతో ప్రతి హిందూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సంక్రాంతి ,ఉగాది .. ఇలా ఒకటేమిటి? ఆలయాలలో ఉత్సవాలు పలు సందర్భాలలో ఆయనే పూజా కార్యక్రమాలకు హాజరవుతున్నారు. అయినా బీజేపీ నేతలకు ఈ ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వంగా కనిపిస్తోంది. కొంతకాలం క్రితం వరకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి పిచ్చి ప్రచారం ద్వారా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని యత్నించి భంగపడ్డారు. ఆయా కేసులలో టీడీపీవారే నిందితులుగా పట్టుబడుతుండడంతో ఆయన సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత అలాంటి ఘటనలే దాదాపు జరగకుండా ఆగిపోయాయి. ఏమి దొరకక బీజేపీవారికి ఈ చిన్న పిల్లాడి బొమ్మను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని చూడడం దారుణం. అదే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ , మాజీ మంత్రులు కొడాలి నాని, కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు ప్రస్తావించారు. హిందూ మతం బీజేపీ సొంతం కాదని వారు స్పష్టం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో 40 గుళ్లను కూల్చివేస్తే బీజేపీ నేతలు అప్పట్లో నోరు మెదపని విషయాన్ని వారు గుర్తు చేసి ప్రశ్నించారు. వీటికి వారి వద్ద సమాధానం ఉండదు. బీజేపీవారు ఇంతటి శ్రద్దను పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో, ప్రత్యేక హోదా అంశంలో ,రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం విషయంలో చూపించి ఉంటే మంచి పేరు వచ్చేది. బీజేపీకి సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ గుడ్ బై చెప్పడం, జనసేన తమతో పొత్తులో ఉంటుందో, ఉండదో తెలియని వైనం తదితర కారణాలతో రాజకీయాలను డైవర్ట్ చేయడానికి బీజేపీ పూనుకున్నట్లు కనిపిస్తుంది. అందుకే ఏదో ఒక సాకుతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకుని బీజేపీ ఈ విమర్శలు చేసినట్లుగా ఉంది. కానీ అవి హేతుబద్దంగా లేకపోవడం, అర్ధవంతంగా లేకపోవడం వల్ల బీజేపీనే నవ్వులపాలవుతోంది. అందువల్ల ఇలా చిన్నపిల్లాడికి పాలు పడితే కూడా తప్పుపట్టే విధంగా బీజేపీ నేతలు మాట్లాడకుండా ఉంటేనే వారికి పరువు దక్కుతుంది. -హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్. -
బలహీన వర్గాలకు బలమైన పునాది.. మార్పు గమనించారా?
ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి వైఎస్సార్సీపీ తన అభ్యర్థులను ఎంపిక చేసిన తీరు వర్తమాన రాజకీయంలో ఒక మాస్టర్ స్ట్రోక్‌లా అనిపిస్తోంది. మొత్తం 18 స్థానాలకు అభ్యర్దులను ఎంపిక చేయడం ద్వారా పార్టీ ఎంత సమర్ధవంతంగా పనిచేస్తున్నదో తెలియచేసినట్లు అయ్యింది. వర్తమాన రాజకీయాల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు జరిగే ఎన్నికలలో బలహీనవర్గాలవారు పోటీ పడే పరిస్థితి తక్కువగా ఉంటోంది. పోటీ చేసినా వివిధ కారణాల వల్ల గెలవడం చాలా కష్టంగా ఉంటోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని తేలికగా శాసనమండలికి ఎన్నికయ్యే రీతిలో బలహీనవర్గాలకు అవకాశం కల్పించడం విశేషం. బహుశా మొదటిసారిగా బలహీనవర్గాలకు ఈ స్థాయిలో పెద్ద పీట వేసినట్లు అవగతమవుతుంది. ఈ ఎంపికతో వైఎస్సార్సీపీ బలహీనవర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదన్న సందేశాన్ని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి పంపించారు. తద్వారా తనకు సామాజిక న్యాయం పట్ల ఎంత కమిట్మెంట్ ఉన్నదో తెలియచేశారు. ఒకరకంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ఇది షాక్ వంటిదే. పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విషయాలను సమగ్రంగా వివరిస్తూ గతంలో తెలుగుదేశం హయాంలో శాసనమండలిలో సామాజికవర్గాల కూర్పు ఎలా ఉంది? తమ హయాంలో ఎలా ఉంది? ఎంత తేడా ఉన్నది వివరించారు. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేవలం 37 శాతం మందికి మాత్రమే అవకాశం ఇవ్వగా, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఈ బలహీనవర్గాలకు 68 శాతం ఎమ్మెల్సీ పదవులు కేటాయించినట్లు తెలిపారు. తమది బీసీల పార్టీ అని ఆయా సందర్భాలలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పుకుంటారు. కానీ, ముఖ్యమంత్రి జగన్ అదంతా ఒట్టిదే అని నిరూపిస్తూ వెనుకబడిన వర్గాలకు అధికార వ్యవస్తలో ఎలా భాగస్వామ్యం కల్పించాలో తాను చేసి చూపించారని అనుకోవచ్చు. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో బీసీలకు అవకాశాలు రాలేదనడం అతిశయోక్తి కాదు. అంతేకాదు.. ఇలాంటి పదవుల ఎంపికకు టీడీపీలో చివరి క్షణం వరకు కసరత్తు చేస్తున్నట్లు చంద్రబాబు కనిపించేవారు. కానీ, సీఎం జగన్ తమ పార్టీ నేతలతో సంప్రదింపులు జరపడం, ఎవరికి పదవులు ఇస్తే అటు సమాజంలో మంచి గుర్తింపు, ఇటు రాజకీయంగా ప్రయోజనం సాధించే విధంగా ముందుగానే అభ్యర్దులను ప్రకటించడం కూడా విశేషమే. తాజాగా 18 పదవులకు గాను 11 స్థానాలను బీసీలకు కేటాయించడం ఒక రికార్డే. అలాగే, మరో మూడు స్థానాలను ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చారు. నాలుగు సీట్లకు మాత్రమే అగ్రవర్ణాల వారిని ఎంపిక చేశారు. బీసీల్లో ఎన్నడూ చట్టసభలు చూడని కులాలకు కూడా అవకాశం కల్పించారు. తమ జనాభా నిష్పత్తి ప్రకారం పదవులు ఇవ్వాలని బీసీలతో సహా బలహీనవర్గాలు డిమాండ్ చేస్తుంటాయి. దానిని నిజం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌దే అని చెప్పాలి. సాధారణంగా పలుకుబడి కలిగిన అగ్రవర్ణాల నేతల నుంచి చాలా ఒత్తిడి ఉంటుంది. వాటన్నింటిని తట్టుకుని ఆయన బలహీనవర్గాల వారికి పదవులు ఇవ్వడం అంటే ఒక రకంగా ధైర్యంతో కూడిన విషయమే అని చెప్పాలి. అదే సమయంలో పార్టీని నమ్ముకున్నవారికి, పార్టీని నమ్మి , ప్రతిపక్ష టీడీపీ నుంచి వచ్చిన వారికి కూడా పదవులు లభించాయి. ఉదాహరణకు నర్తు రామారావు, కోలా గురువులు, వంకా రవీంద్రనాథ్, చంద్రగిరి ఏసురత్నం, కుంభా రవి, మర్రి రాజశేఖర్ వంటి వారు గత కొన్నేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. వీరిలో కొందరు 2014లో ఎన్నికలలో పోటీచేసి 2019లో పార్టీ సూచన ప్రకారం పోటీ నుంచి తప్పుకుని వేరే వారికి అవకాశం ఇచ్చారు. ఇలాంటి పలువురికి కార్పోరేషన్ పదవులు ఇచ్చినా, తిరిగి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడం ద్వారా జగన్ మాట తప్పరని రుజువు చేసుకున్నారు. విధేయతకు ఎప్పటికైనా గుర్తింపు ఉంటుందని స్పష్టం చేసినట్లయింది. మర్రి రాజశేఖర్‌కు పదవి ఇవ్వడంలో కొంత జాప్యం అయినా, పార్టీపరంగా బాధ్యతలు ఇస్తూ వచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కూడా అవకాశం ఇచ్చారు. రెడ్డి, కమ్మ, కాపు, క్షత్రియ వర్గాల నుంచి ఒక్కొక్కరికే ఈసారి ఛాన్స్ వచ్చింది. ఎన్నికల సంవత్సరం కావడం, బలహీనవర్గాలు సీఎం జగన్‌కు పెద్ద అండగా ఉన్న నేపథ్యంలో వారికే ప్రాధాన్యం ఇవ్వాలని భావించారు. వేరే పార్టీ నుంచి వచ్చిన రామసుబ్బారెడ్డి, పోతుల సునీత, జయమంగళ వెంకటరమణలకు హామీ ప్రకారం పదవులు లభించాయి. వీరిలో వెంకటరమణ అదృష్టవంతుడని చెప్పాలి. వడ్డీ కులానికి చెందిన ఈయన కైకలూరు ప్రాంతంలో బలమైన నేతగా ఉన్నారు. కొద్ది రోజుల క్రితమే పార్టీలోకి వచ్చారు. అయినా చెప్పిన విధంగా ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కేటాయించారు. శెట్టి బలిజ వర్గానికి చెందిన ఇద్దరికి కవురు శ్రీనివాస్, కుడిపూడి సూర్యనారాయణ.. వీరిద్దరూ పశ్చిమగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు చెందినవారు కావడం విశేషం. . అలాగే అంబేద్కర్ జిల్లాకే చెందిన ఒక ఎస్సీ నేతకు, పశ్చిమగోదావరి నుంచి ఒక కాపు నేతకు పదవులు ఇచ్చారు. అలాగే మత్య్సకార వర్గానికి చెందిన ఇద్దరికి కోలా గురువులు, కర్రి పద్మశ్రీలకు పదవులు దక్కాయి. ఇది కూడా వ్యూహాత్మకంగానే కనిపిస్తుంది. ఇప్పటికే మండలి చైర్మన్ పదవి ఎస్సీకి, డిప్యూటీ ఛైర్మన్ పదవిని మైనార్టీకి కేటాయించడం, ఇప్పడు బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం గమనించవలసిన అంశం. జమ్మలమడుగులో బలమైన నేతగా ఉన్న రామసుబ్బారెడ్డికి , అలాగే టీడీపీ నుంచి గత ఎన్నికలలో గెలుపొందిన మద్దాలి గిరిధర్‌కు సీటు కేటాయించడం కోసం ఇంతకు ముందు పోటీచేసి ఓడిపోయిన చంద్రగిరి ఏసురత్నానికి ముందుగానే ఎమ్మెల్సీ పదవి ఇచ్చేస్తున్నారు. ఈ రకంగా వ్యూహాత్మకంగా సీఎం జగన్ అడుగులు వేశారు. మార్చి ఆఖరు నాటికి శాసనమండలిలో వైఎస్సార్సీపీ సంఖ్య మూడింట రెండువంతులకు పైనే ఉండబోతోంది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మరింతగా క్షీణించబోతోంది. ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికలలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనమండలిలో టీడీపీ ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. శాసనమండలిలో కొంతకాలం క్రితం టీడీపీకి మెజార్టీ ఉండేది. దానిని అడ్డు పెట్టుకుని మూడు రాజధానుల బిల్లుతో సహా పలు బిల్లులను పాస్ కానివ్వకుండా చేసేది. చివరికి బడ్జెట్‌కు కూడా ఆటంకం కల్పించింది. ఆ సమయంలో విసుగు చెందిన వైఎస్సార్సీపీ మండలి రద్దుకు అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. కానీ, ఆ తర్వాత వైఎస్సార్సీపీకి మెజార్టీ వచ్చింది. దానిని దృష్టిలో ఉంచుకుని ఆ తీర్మానాన్ని విరమించుకుని, ఆ పదవుల ద్వారా సామాజిక న్యాయం చేయడానికి సీఎం జగన్ సంకల్పించారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న ఈ సంచలన ఎంపిక వచ్చే శాసనసభ ఎన్నికలలో విజయానికి సోపానం అవుతుందంటే అతిశయోక్తి కాదు. - హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్. -
బీజేపీకి ‘కన్నం’ అందుకేనా?.. నెక్ట్స్ ఏంటి?.. జరిగేది అదేనా?
అద్దెకు వచ్చినవారు ఎప్పుడూ అదే అద్దె ఇంటిలో ఉంటారా? రాజకీయాలలో కూడా ఇలాగే అద్దె ఇళ్ల మాదిరి కొన్ని పార్టీలు ఉపయోగపడుతుంటాయి. బీజేపీ ఏపీ శాఖ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ అలాగే ఆ పార్టీని ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవలసింది ఏమీ లేదు. ఆయన కూడా కాంగ్రెస్‌లో ఉంటూ గ్రూపులు మార్చడంలో కాని, ఆ తర్వాత పార్టీలు మార్చడంలో కాని ఆరితేరినవారే. తన అవసరార్ధం కన్నా బీజేపీలో చేరారు. ఆయనేదో రాష్ట్రం అంతటిని, కనీసం కాపు సామాజికవర్గంలో అయినా ప్రభావితం చేస్తారేమోనని ఆశపడి బీజేపీ భంగపడింది. చివరికి ఆయన తన దారి తాను చూసుకున్నారు. పోతూ, పోతూ బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజుపై, పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావులపై నాలుగు రాళ్లు వేసి వెళ్లారు. బీజేపీ అర్డెంట్‌గా జనసేనతో పాటు టీడీపీతో కూడా పొత్తు పెట్టుకోవాలన్నది ఆయన మనసులో మాట కావచ్చు. కాని అందుకు పార్టీ అధిష్టానం ఇష్టపడడం లేదు. బీజేపీని దారుణంగా మోసం చేసి, అవమానించిన చంద్రబాబుతో జతకట్టడానికి అగ్రనేతలు మోదీ, అమిత్ షాలు ససేమిరా అంటున్నారు. మరోసారి ఎలాగోలా ఎమ్మెల్యేగా అయినా గెలవాలని తాపత్రయపడుతున్న కన్నా లక్ష్మీనారాయణ ,ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కొత్త కూటమి ఏర్పడితే కాని అది సాధ్యం కాదని భావిస్తుండవచ్చు. కాకపోతే ఆ మాట చెప్పకుండా, బీజేపీ ఏదో అన్యాయం చేసినట్లు, తన వర్గంవారిని పదవుల నుంచి తొలగించడంపైన ఏవేవో ఆరోపణలు చేశారు. అది వేరే విషయం. కన్నా చరిత్ర చూస్తే ఒకరకంగా అదృష్టవంతుడే అని చెప్పాలి. గతంలో కావూరి సాంబశివరావు, ఎన్.జి.రంగా వంటివారి ద్వారా తొలిసారి పెదకూరపాడు నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్ టిక్కెట్ పొందారు. అప్పట్లో ఆయన నేదురుమల్లి జనార్దనరెడ్డి వర్గానికి సన్నిహితం అయ్యారు. తొలుత చెన్నారెడ్డి క్యాబినెట్లో స్థానం దక్కలేదు. కాని నేదురుమల్లి మంత్రివర్గంలో స్థానం పొందారు. మొదటిసారే శాసనసభకు ఎన్నికైనా ఆయనకు ఈ అవకాశం రావడం అదృష్టమే. ఆ తర్వాత నేదురుమల్లి కోటాలో కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గంలో కూడా కొనసాగారు. 1994,99, 2004 లలో కూడా ఆయన అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ఆయనకు పడేది కాదు. ఆయనపై తీవ్ర విమర్శలు చేస్తుండేవారు. కాని 2004 నాటికి వైఎస్ వర్గానికి దగ్గరయ్యారు. వైఎస్ క్యాబినెట్లో కూడా మంత్రి పదవి పొందారు. 2009లో నియోజకవర్గాల డిలిమిటేషన్ కారణంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మారి మళ్లీ గెలిచారు. అప్పటికే సీనియర్ నేతగా గుర్తింపు పొంది తిరిగి వైఎస్ మంత్రివర్గంలో తన బెర్త్ తాను పొందారు. వైఎస్ అనూహ్య మరణం తర్వాత ఆయన మళ్లీ గ్రూపు మార్చుకున్నారు. రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి క్యాబినెట్లలో మంత్రిగా ఉన్నారు. ఒకప్పుడు రోశయ్యకు, కన్నాకు గుంటూరు రాజకీయాలలో పడేది కాదు. అది వేరే అంశం. రాష్ట్ర విభజన సమయంలో పీసీసీ అధ్యక్ష రేసులోకి వచ్చారు. సీఎం సీటుకు కూడా పోటీపడాలని ప్రయత్నించారు. కాని అవి దక్కలేదు. 2014లో ఆయన కాంగ్రెస్‌లోనే పోటీచేసి ఓడిపోయారు. గుంటూరు రాజకీయాలలో కన్నాకు పెద్ద ప్రత్యర్దిగా ఉన్న రాయపాటి సాంబశివరావు అప్పటికే కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి మారి ఎంపిగా గెలిచారు. టీడీపీ, బీజేపీలు మిత్రపక్షాలుగా ఉండడంతో రాయపాటి కేంద్రంలో కాని, రాష్ట్రంలో కాని తన పలుకుబడి ఉపయోగించి ఎక్కడ తనను ఇబ్బంది పెడతారోనని సందేహించారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు వీరిద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర అవినీతి ఆరోపణలు చేసుకునేవారు. ఈ నేపథ్యంలో రాజకీయంగా ఏమి చేయాలా అన్నదానిపై ఆలోచించి వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి రావడానికి సన్నాహాలు చేసుకున్నారు. ఆయన ఇంటి వద్ద ఇందుకు సంబంధించి ప్లెక్సీలు కూడా వెలిశాయి. కాని సడన్‌గా అమిత్ షా పోన్ చేసి బీజేపీలో చేరాలని ఆహ్వానించారు. వారి మధ్య అప్పుడు ఏమి జరిగిందో కాని, ఆయన వైసీపీలోకి వచ్చే ఆలోచన విరమించుకుని సాకు కోసం ఆస్పత్రిలో చేరారు. బీజేపీలోకి వెళితే సేఫ్ అని ఆయన నమ్మారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు, కన్నాకు మధ్య ఉప్పు, నిప్పుగా పరిస్థితి ఉండేది. కన్నా స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వంగవీటి రంగాతో పాటు తనను కూడా హత్య చేయించడానికి చంద్రబాబు కుట్రలు చేశారని ఆరోపించారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని కన్నా బీజేపీలో చేరితే అక్కడ జాక్ పాట్ తగిలినట్లుగా ఆయన బీజేపీ అధ్యక్షుడు అయ్యారు. దాంతో రాష్ట్ర స్థాయి ఎలివేషన్ బాగా వచ్చింది. 2019 లో నరసరావుపేట నుంచి లోక్ సభకు పోటీచేసి డిపాజిట్ పోగొట్టుకున్నారు. ఆ ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. మొదట వైసీపీకి చెందిన కొందరు ప్రముఖులతో సన్నిహిత సంబంధాలే మెయిన్ టెయిన్ చేసినట్లు చెబుతారు. కాని తాను కోరిన కొన్ని పనులు జరగడం లేదని అసంతృప్తి ఉండేదట. దాంతో ఆయన క్రమంగా వైసీపీకి దూరంగా ఉండడం ఆరంభించారు. అంతలో ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల బిల్లును తీసుకు రావడం, అమరావతి పేరుతో ఒక కృత్రిమ ఉద్యమానికి చంద్రబాబు నాయకత్వం వహించడం వంటి ఘట్టాలు జరిగాయి. ఈ అమరావతి వ్యవహారంతో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కాస్త దగ్గరయ్యారు. తిరుపతిలో జరిగిన ఒక సభలో చంద్రబాబుతో కలిసి చేతులు ఎత్తారు. ఇది ఒకరకంగా ఆశ్చర్యం కలిగించే అంశమే. గతంలో శాసనసభలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్న వీరిద్దరూ ఇలా కలుస్తారని ఊహించగలరా? అంతేకాదు.. గతంలో టీడీపీలో ఉండి, తదుపరి బీజేపీలో చేరిన సుజనా చౌదరితో ఈయన సన్నిహితంగా కనిపించేవారు. అమరావతిలో ఏమైనా ప్రయోజనమో, లేక రాజకీయ బందమో తెలియదు కాని టీడీపీతో దగ్గరవుతున్న సంకేతాలు చాలాకాలంగా వస్తూనే ఉన్నాయి. మరో విషయం ఏమిటంటే 2019లో పార్టీ పంపించిన డబ్బు పంపిణీలో కూడా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు కూడా వచ్చాయి. బీజేపీ అధినాయకత్వానికి కన్నా పై క్రమేపి విశ్వాసం తగ్గింది. ఆ క్రమంలో ఆయనను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించినా, అది పెద్ద విషయం ఏమీ కాదనే చెప్పాలి. అయినా కన్నా బీజేపీపై కన్నా, పక్కచూపులే ఎక్కువగా చూస్తున్నారన్న ప్రచారం జరిగేది. దానికితోడు కన్నా తనతో పాటు జిల్లాల పార్టీ అధ్యక్షులు కొందరు తనకు సన్నిహితులైనవారిని కూడా బీజేపీ నుంచి బయటకు తీసుకువెళతారమోనన్న అనుమానంతో కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు వారిని తొలగించారు. అది కన్నాకు చాలా పెద్ద ఇష్యూ అయింది. ఈలోగా జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఈయనను కలిసి రాజకీయాలు చర్చించారు. జనసేనలోకి వచ్చి టీడీపీతో కలిసి పోటీ చేయాలని కన్నా భావించారు కాని, పవన్ కళ్యాణ్ ఇప్పటికిప్పుడు ఆయనను పార్టీలో చేర్చుకోవడానికి వెనుకాడారట. బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన నేతను జనసేనలో చేర్చుకుంటే ఇబ్బంది వస్తుందన్నది ఆయన భావనగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కన్నా బహుశా టీడీపీలో చేరడానికి మానసికంగా సన్నద్దమయ్యే బీజేపీని వీడారని భావిస్తున్నారు. కన్నా అనుచరులు టీడీపీలోకి వెళదామని సూచించారట. బీజేపీతో పొత్తులో ఉన్న జనసేనలోకి వెళ్లవద్దని చెప్పారట. మరి ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ ఇలా తన పార్టీలోకి వద్దామనుకున్నవారిని చేర్చుకుంటే ఎలా ఫీల్ అవుతారో తెలియదు. జనసేన కార్యకర్తలనే తీవ్రంగా అవమానించిన నటుడు బాలకృష్ణ ఎదుట కూర్చున్న వ్యక్తికి ఇది పెద్ద విషయం కాకపోవచ్చేమో!. ఒకప్పుడు చంద్రబాబును తీవ్రంగా దూషించిన కన్నా ఇప్పుడు ఆయనలో తన భవిష్యత్తు చూసుకుంటున్నారట దీనిని బట్టి ఏమి అర్దం అవుతుంది. రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న సంగతి మరోసారి నిర్దారణ అవుతుంది. దీని వల్ల కన్నా లక్ష్మీనారాయణకు గౌరవం పెరుగుతుందని చెప్పలేకపోయినా, ఎన్నికల ఫలితాన్ని బట్టి చూసుకోవచ్చులే అని ఆయన సరిపెట్టుకుని ఉంటారు.అందుకే కన్నా అద్దె ఇంటి వంటి బీజేపీని ఖాళీ చేసి బయటకు వెళ్లిపోయారు. కాకపోతే కన్నాకు కొత్త ఇంటి కోసం వెదుకుతూ చివరికి తన ఒకప్పటి రాజకీయ శత్రువు ఇల్లే శరణ్యం అవడమే ఆయన దయనీయ స్థితికి అద్దం పడుతోందని అనుకోవచ్చు! - హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్ -
ఆ పల్లెల్లో నిరసన తెలపకూడదని శాసించింది చంద్రబాబు కాదా?
ఆంధ్ర ప్రదేశ్‌లో రాజకీయాలు రోజురోజుకు దిగజారుతున్నాయి. పదిమందికి చట్టం గురించి, ప్రభుత్వ నిబంధనల గురించి, వాటిని పాటించవలసిన అవసరం గురించి చెప్పవలసిన మాజీ ముఖ్యమంత్రే ఉల్లంఘిస్తున్నారు. గతంలో పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనపర్తిలో చేసిన షో చూస్తే, పబ్లిసిటీ కోసం ఆయన ఏమైనా చేస్తారన్న సంగతి ఇట్టే బోధపడుతుంది. రోడ్లపై బహిరంగ సభలు వద్దని ప్రభుత్వం జీవో ఇచ్చింది. దానిపై టీడీపీ ఇప్పటికే హైకోర్టుకు వెళ్లింది. మొదట ఒక జడ్జిగారు పదిరోజుల పాటు ఆ జీవోని సస్పెండ్ చేశారు. దాన్ని ఆహో, ఓహో అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ,ఇతర కొన్ని పార్టీల వారు మెచ్చుకున్నారు. ప్రభుత్వం ఆ జీవో ఇవ్వడం పెద్ద తప్పు అన్నట్లు ప్రచారం చేశారు. చంద్రబాబుకు అవేవీ పట్టవు అంతే తప్ప ఇరుకు సందులలో సభలు పెట్టుకుని ప్రజలను ఇబ్బంది పెట్టబోమని అనలేదు. తదుపరి హైకోర్టు డివిజన్ బెంచ్ ఆ జీవో సస్పెన్షన్ ను కొనసాగించడానికి నిరాకరించింది. అప్పుడు చంద్రబాబు కానీ, ఇతర నేతలు కాని షాక్‌కు గురయ్యారు. ప్లాన్ ప్రకారం ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి జరిగిన ప్రయత్నం ఈ రకంగా బెడిసికొట్టింది. అయినా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ లు మొండికేస్తున్నారు. తాము అడ్డంగా రోడ్లపై సభలు పెట్టాల్సిందే అంటున్నారు. దానిని పోలీసులు వ్యతిరేకిస్తే రచ్చ,రచ్చ చేస్తున్నారు. అనపర్తిలో జరిగిన గలభాను చూడండి. అనపర్తి సెంటర్ లో మీటింగ్ పెట్టాల్సిందే అని చంద్రబాబు పట్టుబట్టిన తీరు చూస్తే, ఏదో విదంగా పోలీసులను రెచ్చగొట్టి, శాంతి భద్రతల సమస్యను సృష్టించాలన్న తాపత్రయమే కనిపిస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన జీవోని ప్రతిపక్షంగా వ్యతిరేకించదలిస్తే తప్పు కాదు. దానికి నిరసన చెప్పవచ్చు. అందుకు ఒక పద్దతి ఉంటుంది. కాని చంద్రబాబు అవేవి తనకు పట్టవు అంటున్నారు. కందుకూరు,గుంటూరు సభలలో పదకుండు మంది మరణించిన ఘట్టాలను ఆయన మర్చిపోవడం దురదృష్టకరం.ఈ అనుభవాల రీత్యా అయినా రోడ్లపై అందులోను ఇరుకు రోడ్లపై సభలు పెట్టి జనాన్ని మభ్య పెట్టే యత్నాలు చేయకుండా ఉంటే బాగుండేది. కానీ అది ఆయన బ్లడ్ లోనే లేదు. ఎంతసేపు క్షుద్ర రాజకీయం చేయడమే ఆయన పనిగా పెట్టుకుంటారు. అధికారం లేకపోతే ఇలాంటి అల్లర్లు, అదికారం ఉంటే, ఎవరూ ఎక్కడా నిరసనలు చెప్పడానికి వీలు లేదని తీవ్రమైన నిర్భంధాలు, ఆంక్షలు పెట్టడం ఆయనకు అలవాటే. ఉదాహరణకు విజయవాడలో ఎవరికి కనబడని చోట మాత్రమే ఆయన టైమ్‌లో ధర్నాలకు అవకాశం ఇచ్చారు. ఆనాడు శాసించింది ఎవరు బాబు? అమరావతి రాజధాని పల్లెల్లో ఎక్కడా ఎవరూ నిరసన తెలపడానికి వీలు లేదని ఆయన శాసించారు. ఉండవల్లి తదితర కొన్ని గ్రామాల ప్రజలు ఎన్ని రకాలుగా నిరసనలు తెలిపినా వారిపై కేసులు పెట్టారు తప్ప వారి గోడు మాత్రం వినలేదు. చివరికి ప్రభుత్వమే పంటలు తగులపెట్టే దశకు ఆ రోజుల్లో వెళ్లింది. అవే కాదు. విశాఖలో కాండిల్ ర్యాలీకి వెళ్లిన ఆనాటి ప్రతిపక్ష నేత జగన్‌ను విమానాశ్రయం రన్ వే పైనే నిలువరించి వెనక్కి పంపించిన చరిత్ర చంద్రబాబుదే. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా, ఆయన ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటూ ఊదరగొడుతున్నారు. ఆయనకు పవన్ కళ్యాణ్, రామోజీరావు వంటి వారు చిటెకలు వేస్తున్నారు. అనపర్తి విషయానికి వస్తే చంద్రబాబు నడిరోడ్డుపై సభ పెట్టుకోవడానికి పోలీసులు అనుమతించి, ఆ తర్వాత విత్ డ్రా చేస్తే వారిదే తప్పు అవుతుంది. కాని పోలీస్ ఉన్నతాధికారి చెప్పినదాని ప్రకారం అనపర్తిలో రోడ్ పై సభ పెట్టుకోవడానికి చంద్రబాబుకు అనుమతి ఇవ్వలేదు. ప్రత్యామ్నాయంగా రెండు స్థలాలను పోలీసులు సూచించినా టీడీపీ అంగీకరించలేదు. పైగా జీవో ని ఉల్లంఘించి రోడ్డుమీదే సభ పెడతామంటూ హై డ్రామా సృష్టించారు. చంద్రబాబును పోలీసులు అడ్డగిస్తే ఆయన నడుచుకుంటూ వెళ్లారని బిల్డప్ ఇవ్వడానికి ఈనాడు చాలా తంటాలు పడింది. ఎప్పుడైనా రామోజీ ఫిలిం సిటీ వద్ద ఉద్యోగులు ఎవరైనా నిరసన తెలిపితే వారిని అణచివేసే చర్యలు చేపట్టే ఈనాడు రామోజీరావు , ఇప్పుడు ఎపిలో మాత్రం రోడ్లపై సభలు పెట్టుకోనివ్వాలని ఊదరగొడుతున్నారు. ఎలా రెచ్చగొట్టాలా అనేది యెల్లో మీడియా ఎజెండానా? తన సంస్థలలో సమ్మెలకు దిగితే వారిని ఉద్యోగాలనుంచి తీసివేసే రామోజీరావు ప్రభుత్వ ఉద్యోగులతో ఎలా ఆందోళనలు, సమ్మెలు చేయించాలా అని రెచ్చగొట్టే పనిలో ఉన్నారు.ఎక్కడ వీలైతే అక్కడ శాంతిభద్రతల సమస్య సృష్టించడమే తెలుగుదేశం పార్టీ, ఈనాడు, జ్యోతి ,టివి 5 మీడియా సంస్థల ఎజెండాగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీనిని గమనంలోకి తీసుకునే పోలీసులు అనపర్తిలో అయినా, ఇతర చోట్ల అయినా చాలా సంయమనంగా ఉంటున్నారు. చివరికి టీడీపీ వారు చంద్రబాబు సమక్షంలోనే బస్ లపై రాళ్లు వేసే స్థితికి వెళ్లారంటే ఆ పార్టీలో క్రమశిక్షణ ఎలా ఉందో, అరాచక శక్తులు ఎలా పెరిగాయో అర్దం చేసుకోవచ్చు. గతంలో పరిటాల రవి హత్య తర్వాత జిల్లాలకు పోన్ లు చేయించి పార్టీవారితో ఆర్టిసి బస్ లను తగులబెట్టించిన చరిత్ర కూడా టీడీపీకి ఉందని చెబుతారు. అందువల్ల ఈ ఏడాది అంతా ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అసలు ఎందుకు చంద్రబాబు నడిరోడ్లపైనే ,అది కూడా సన్నగా ఉండే రోడ్లపైనే సభలు పెట్టాలని అనుకుంటున్నారు? ఇదేమి బ్రహ్మ రహస్యం కాదు. రోడ్లమీద అయితే రెడిమేడ్ గా జనం అందుబాటులో ఉంటారు. వారంతా తన సభకే వచ్చినట్లు చెప్పుకోవచ్చు. అదే ఓపెన్ మైదానంలో అయితే జనాన్ని తరలించవలసి ఉంటుంది. దానికి బోలెడు ఖర్చు పెట్టాలి. అందుకు టీడీపీ స్థానిక నేతలు ఇష్టపడకపోవచ్చు. దీనికి బదులు ప్రజలను ఇబ్బంది పెట్టి అయినా రోడ్లపైన సభలు పెట్టుకోవాలని చంద్రబాబు,లోకేష్ లు యత్నిస్తున్నట్లుగా ఉంది. అధికారంలో లేకపోతే ఎవరూ రూల్స్ పాటించకూడదా చంద్రబాబు? ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. అనపర్తిలో ఉద్రిక్తత ఏర్పడినట్లు టీడీపీ మీడియా సంస్థలు ఒక ప్రచారం చేశాయి. చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారని, వేలాది మంది టీడీపీ కార్యకర్తలు, ప్రజలు ఆయన వెంట నడుస్తున్నారని స్క్రోలింగ్ లు ,వార్త కదనాలు ప్రసారం చేసి హడావుడి చేశారు. అప్పుడు సహజంగానే ఒక సందేహం వస్తుంది. నిజంగానే వేలాది మంది చంద్రబాబు వెంట ఉండి ఉంటే, ఓపెన్ మైదానంలో సభ పెట్టుకోవడానికి ఇబ్బంది ఏముంటుందన్న డౌటు వస్తుంది! అయినా ఎదో రకంగా చంద్రబాబుకు మైలేజీ వచ్చేలా చేయాలన్న యావలో టీడీపీ మీడియా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తోందన్న విషయం అర్ధం అవుతుంది. నడి రోడ్డు మీద సభ పెట్టకపోతే జనం రాని పరిస్థితి తెలుగుదేశంకు ఏర్పడిందన్న సంగతిని చంద్రబాబే ఒకటికి ,రెండుసార్లు చెబుతున్నట్లుగా ఉంది. చంద్రబాబు అధికారంలో ఉంటే అందరూ రూల్స్ పాటించాలి. ఆయన అధికారంలో లేకుంటే తన మద్దతుదారులు ఎవరూ రూల్స్ పాటించగూడదు. ప్రభుత్వంపై జనం అంతా తిరుగుబాటు చేయాలి. ఇలాంటి డబుల్ గేమ్ వల్లే తెలుగుదేశం పార్టీ అప్రతిష్టపాలైంది. అయినా ఇప్పటికీ అదే రీతిలో ఆయన వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఒక సామెతను చెప్పుకోవాలి. నల్ల తోలును ఏడాది ఉతికినా రంగు మారదన్నట్లుగా, పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా, పదిహేనేళ్లుగా ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు దుష్ట బుద్ది ఎప్పటికీ మారదని అనుకోవాలి. -హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్. -
బాబు.. మీరు తలుపుచెక్క వాడితే వారు తమలపాకు ఇవ్వరు కదా!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు బాగా ఫ్రస్టేషన్ లో కనిపిస్తున్నారు. ఆయన తాను ఏమి మాట్లాడుతున్నారో తనకే అర్ధం అవడంలేదనిపిస్తుంది. ఆయన కొన్ని డైలాగుల వీడియోలు వింటే ఆశ్చర్యం కలుగుతుంది. అమెరికాలో ఆ దేశ పౌరులకన్నా తెలుగువారికే ఎక్కువ ఆదాయం వస్తోందట. అందుకు ఆయన చూపిన చొరవే కారణమట. సెల్ ఫోన్ రావడానికి ఆయన దోహదపడ్డారట. కాని ప్రజలు ఆ సంగతి మర్చిపోయారట. ఇలాంటి అర్దం పర్దం లేని మాటలే కాదు. పోలవరం ప్రాజెక్టును ముంచేశారని ఆయన ఆరోపించారు. విశేషం ఏమిటంటే అదే రోజు పోలవరం ప్రాజెక్టులో కీలక ఘట్టం దిగువ కాఫర్ డామ్ నిర్మాణం పూర్తి అయిందని మీడియాలో కథనం. అఫ్ కోర్స్.. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే ఈనాడు తదితర మీడియా సంస్థలు ఈ వార్తను కప్పిపుచ్చడానికి తంటాలు పడ్డాయి. అది వేరే విషయం. అసత్యాలు చెబుతూ ప్రసంగించడం బాబుకే సొంతం ఇవే కాదు. అవినీతిపై ఎన్టీఆర్‌తో పాటు చంద్రబాబు కూడా పోరాడారట. ఈ విషయం కూడా ఆయన ఏమాత్రం భేషజం లేకుండా చెబుతున్నారు. ఇలాంటి వింతలు, విడ్డూరాలు ఎన్నో చంద్రబాబు ప్రసంగాలలో కనిపిస్తాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆయన పర్యటిస్తూ ప్రసంగాలు చేస్తున్నారు. ఆయన పర్యటన చేయడం తప్పుకాదు. సభలు పెట్టుకోవడం ఆక్షేపణీయం కాదు. కాని అసత్యాలు, అర్దసత్యాలు చెబుతూ ప్రజలను మభ్య పెట్టాలన్న ఆయన ఆలోచనే దారుణంగా ఉంటుంది. ఇంకో సంగతి చెప్పాలి. ఆయనకాని, ఆయన కుమారుడు లోకేష్ కాని మరో ప్రచారం చేస్తున్నారు. పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమేస్తున్నారన్నది వారి ఆరోపణ.అదే టైమ్‌లో వైఎస్సార్‌జిల్లా జమ్మలమడుగులో 8800 కోట్ల రూపాయల వ్యయంతో జిందాల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా జిందాల్ ముఖ్యమంత్రి జగన్ ఎంత బాగా మెచ్చుకుంది అంతా విన్నాం. అదే చంద్రబాబును ఎవరైనా పొగిడితే బానర్లు కట్టే ఈనాడు తదితర మీడియాలకు ఆ మాటలు వినడం ఇబ్బందిగానే ఉండవచ్చు. అలాగే ముఖ్యమంత్రి జగన్ తన బాబాయిని బాత్ రూమ్ లో చంపించారన్నంత నీచమైన ఆరోపణ చేయడానికి కూడా ఆయన వెనుకాడలేదు. అందులో లేశమంత వాస్తవం లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగిన ఈ హత్య కేసులో జగన్ పై ఎలాంటి సందేహం వ్యక్తం చేయని సంగతి తెలియనిదా! జగన్‌పై ఆరోపణ చేస్తూ ఇటీవల ముద్రించిన పిచ్చి పుస్తకంపై అది తెలుగుదేశం ముద్రణ అని, చంద్రబాబే వేయించారని ధైర్యంగా ఎందుకు ప్రచురించలేకపోయారు. దీనిని బట్టి ఏమి అర్ధం అవుతుంది. చంద్రబాబు ఎలాంటి నీచ స్థాయికి దిగజారడానికి వెనుకాడరని తెలియడం లేదా! తనపై కేసులు వస్తే అవన్ని అక్రమం అని ప్రచారం చేస్తారు. అదే ఎదుటివారిపై ఆయనే ఆరోపణ చేసి, కేసులు పెట్టిస్తుంటారు. ప్రత్యర్ధుల వ్యక్తిత్వాన్ని కించపరచడం ద్వారా తాను ఎదగాలని చంద్రబాబు యత్నిస్తారు. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ లపై అదే ప్రయోగం చేశారు. అప్పట్లో రాజశేఖరరెడ్డి ఒక మాట చెప్పేవారు. తనపై చంద్రబాబు టైమ్ లో పనికిమాలిన కేసులు పెట్టారని, పార్టీ బానర్ కట్టారని, ఏదో రూలు ఉల్లంఘన చేశానని..ఇలా 29 కేసులు పెట్టి, తనను నేరాలు చేసే వ్యక్తిగా చంద్రబాబు ప్రొజెక్టు చేశారని ఆయన అనేవారు. ఆ 29 కేసులను కోర్టులు కొట్టివేశాయి. అన్ని కేసులు పోయాక ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ క్లిప్పింగ్ తనది కాదని చంద్రబాబు చెప్పగలరా! చంద్రబాబు అవినీతిపై పోరాటంలో ఎన్టీఆర్ తనను తాను కలుపుకోవడం మరో వింత. పాపం.. ఎన్టీఆర్.చనిపోయి ఎక్కడ ఉన్నారో కాని, ఈ మాట విని ఉంటే, ఇప్పుడు ఆత్మహత్య చేసుకునేవారేమో! స్వయంగా ఎన్టీఆర్.తన అల్లుడు చంద్రబాబు నాయుడు ఎంత దారుణమైన వ్యక్తో వీడియోలోనే చెప్పారు కదా! ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తన ప్రభుత్వాన్ని కూల్చారని ఎన్టీఆరే ఆరోపించారు. అప్పుడేమి ఖర్మ.. 2014 లో మరోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు 23 మందిని కొనుగోలు చేసి, ఇప్పుడు తాను కూడా స్వచ్చమైన వ్యక్తిని అన్నట్లు పిక్చర్ ఇచ్చుకునే ప్రయత్నం చేయడానికి ఎంత ధైర్యం ఉండాలి. ఆయన ఏమైనా చేయగలరు. ఇవన్నికాదు. ఓటుకు నోటు కేసులో ఏభై లక్షలు ఇస్తూ అప్పట్లో టిడిపిలో ఉన్న రేవంత్ రెడ్డి పట్టుబడ్డ తర్వాత మనవాళ్లు బ్రీఫ్ డ్ మి అన్న ఆడియో క్లిప్పింగ్ తనది కాదని చెప్పగలరా! చంద్రబాబు ఆస్తులపై సిబిఐ విచారణ చేయడానికి హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై స్టే తెచ్చుకోవడానికి, ఆ తర్వాత దానిని కొట్టివేయించుకోవడానికి తాపత్రయపడ్డారే కానీ, ధైర్యంగా తాను విచారణ ఎదుర్కుంటానని ఎందుకు చెప్పలేకపోయారు. అ కేసులను ముందుకెళ్లకుండా చేసిన చరిత్ర ఎవరిది? తన పీఏ ఇంటిలో సోదాలు జరిపిన ఆదాయపన్ను శాఖ రెండువేల కోట్ల రూపాయల మేర అక్రమ లావాదేవీలు జరిగాయని సీబీటీడీ ప్రకటన చేసింది అసత్యమా! స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో 221కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రభుత్వం వెల్లడించింది. అమరావతి రాజధానిలో ఎంత అవినీతి జరిగిందో ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ఒక్కదానిని కూడా ముందుకు వెళ్లకుండా చేసిన చరిత్ర ఎవరిది? అస్సైన్డ్ భూముల స్కామ్ కు సంబంధించి ఆయనపై కేసు నమోదు అయింది కదా! అయినా తాను సత్యవంతుడనని చెప్పుకోగలగడం ఆయనకే చెల్లింది. ముఖ్యమంత్రిని ఉద్దేశించి దరిద్రం వంటి పదాలు వాడడం ఆయన సీనియారిటీకి తగునా! ఆ వెంటనే మాజీ మంత్రి కన్నబాబు ఏమన్నారు.. రాష్ట్రానికి పట్టిన దరిద్రం చంద్రబాబే అని విమర్శించారు కదా? అనడం ఎందుకు అనిపించుకోవడం ఎందుకు? ఆయన కుమారుడు లోకేష్ మరీ ఘోరంగా మాట్లాడుతున్నారు. తన తల్లిని అవమానించారంటూ లేని విషయాన్ని ప్రొజెక్టు చేసుకునే యత్నం చేసిన ఆయన వేరే పార్టీ మహిళలను ఉద్దేశించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ,ఎదురు తిట్టించుకున్నారు. ఆ సంగతి మరిస్తే ఎలా లోకేష్? వైసీపీ మహిళలు ఆయన బొమ్మ ఉన్న ప్లెక్సీని చీపుళ్లతో కొట్టారు. ఇదంతా అవసరమా! మంత్రి రోజాను ఉద్దేశించి డైమండ్ పాప, జబర్దస్త్ ఆంటీ అనడంలో ఆంతర్యం ఏమిటి? దానితో మండిన రోజా ఏమన్నారు. లోకేష్ భార్య బ్రాహ్మణిని హెరిటేజ్ పాప అని, తల్లి భువనేశ్వరిని హెరిటేజ్ ఆంటీ అని అంటామని ధ్వజమెత్తారు. తన ఇంటిలోను మహిళలు ఉన్న విషయాన్ని విస్మరిస్తే ఇలాగే ఉంటుంది. లేకుంటే తన ఇంటిలోని వారిని అంటే అన్నారులే అని సరిపెట్టుకుంటే మనం ఏమి చేయలేం. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. గతంలో లోకేష్ మరీ కుర్రాడుగా ఉన్నప్పుడు కొందరు యువతులతో ఆయన విలాసవంతంగా గడిపిన సన్నివేశాలను జనం మర్చిపోయారని ఎలా అనుకుంటారు. తనవైపు లోపాలు ఉన్నప్పుడు ఎదుటివారిపై రాళ్లు వేయవచ్చా!. అద్దాలమేడలో ఉండి రాళ్లు వేస్తే ఏమవుతుందో, ఇప్పుడు లోకేష్‌కు అదే అనుభవం ఎదురైంది కదా! విధానాలపైన, తాము అధికారంలోకి వస్తే చేయదలచిన కార్యక్రమాల గురించి చెప్పుకుంటే ఎవరైనా గౌరవిస్తారు కాని.. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఏమి విలువ ఉంటుంది. చంద్రబాబు, లోకేష్‌లు ఇద్దరికి ఈ మాట వర్తిస్తుంది. ఈ ఏడాది అంతా చంద్రబాబు, లోకేష్‌లు ఇలాగే మాట్లాడాలని నిర్ణయించుకుంటే చేయగలిగింది ఏమీ లేదు. తలుపుచెక్కతో ఎదుటివారిని ఏమైనా చేయదలిస్తే వారు తమల పాకుతో బదులు ఇవ్వరు కదా! వారు తలుపు చెక్కే వాడతారు అన్న సంగతి గుర్తుంచుకోవాలి. -హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్. -
సీఎం జగన్ విజయమిది..
ఒకప్పుడు విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఆ తర్వాత కానీ.. విశాఖలో ఉక్కు ప్యాక్టరీ ఏర్పాటు కాలేదు. ఇప్పుడు ఎలాంటి నిరసనలు అవసరం లేకుండానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సారధ్యంలో వైఎస్సార్ జిల్లా జమ్మల మడుగు నియోజకవర్గం సున్నపురాళ్ల పల్లె వద్ద ఉక్కు కర్మాగారానికి బీజం పడింది. ఇది నిజంగా రాయలసీమ ప్రాంత వాసులే కాకుండా మొత్తం విభజిత ఏపీ ప్రజలంతా సంతోషించాల్సిన సమయం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న చొరవను ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ గొప్పగా ప్రశంసించారు. ఆంధ్రలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలను కూడా ఆయన మెచ్చుకున్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. 8,800 కోట్ల వ్యయంతో ఈ స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని, భవిష్యత్తులో ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ స్టీల్ ప్లాంట్‌గా రూపొందించడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని ఆయన ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చడానికి ప్రభుత్వం కూడా 700 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తోందని తెలిపారు. ఒకవైపు కొప్పర్తి ఎలక్ట్రానిక్ పారిశ్రామికవాడ, మరో వైపు స్టీల్ ప్లాంట్ సిద్దమైతే ఈ జిల్లా ముఖ చిత్రం మారిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మామూలుగా అయితే ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చుతుందా? లేదా? అన్న సందేహం ఉండేది. ఈసారి స్టీల్ ప్లాంట్లను నిర్వహిస్తున్న జిందాలే దీనిని టేకప్ చేయడం , భూమి పూజ పూర్తి చేయడం, తన ప్రణాళికను వెల్లడించడంతో నమ్మకం పెరుగుతుంది. ఆయన ఇప్పటికే కర్నాటక, మహారాష్ట్రల్లో భారీ స్టీల్ కర్మాగారాలను నడుపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన వ్యక్తి. ఈ రంగంలో ఆయనో దిగ్గజం. అందువల్ల ఈ ప్లాంట్ వచ్చే రెండు, మూడేళ్లలో ఒక రూపానికి వస్తుందన్న విశ్వాసం వ్యక్తమవుతోంది. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లుతున్న తీరు మరి కొద్దినెలల్లోనే క్షేత్ర స్థాయిలో అర్ధం అవుతుంది కూడా.. నిజమే! పదిహేనేళ్ల క్రితమే ఈ ఉక్కు ఫ్యాక్టరీ ఊపిరి పోసుకుని ఉండవలసింది. వివిధ కారణాల వల్ల అది సాధ్యపడలేదు. ఇదే ప్రాంతంలో కర్నాటకకు చెందిన మాజీ మంత్రి గాలి జనార్ధనరెడ్డి ఉక్కు ప్యాక్టరీ పెట్టడానికి ముందుకు వచ్చారు. అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆయన ఇందుకోసం సుమారు రెండువేల ఎకరాల భూమి సేకరణ చేశారు. నిర్వాహకుల లోపాలతో పాటు తెలుగుదేశానికి చెందిన వారు, ఆ పార్టీకి సంబంధించిన మీడియా వారు పలు అడ్డంకులు సృష్టించారు. బల్లులు కూడా గుడ్లు పెట్టని స్థలాన్ని ఇందుకోసం ఎంపిక చేస్తే టీడీపీ మీడియా ఆనాడు ఏమని వార్తా కథనాలు రాసిందో తెలుసా!. అక్కడ సెలయేర్లు, జలపాతాలు ఉన్నాయని, జింకలు, లేళ్లు చెంగు చెంగున గంతులు వేస్తుంటాయని, పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని అబద్దపు కథనాలు ఇచ్చారు. అయినా ప్రాజెక్టు ముందుకు వెళ్లి ఉండేదేమో. కానీ.. దురదృష్టవశాత్తు వైఎస్ రాజశేఖరరెడ్డి అనూహ్యంగా హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించడంతో అది వెనుకపడిపోయింది. ఇక్కడ మరో సంగతి కూడా ప్రస్తావించాలి. వైఎస్సార్ మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలలో ఆయన కుమారుడు సీఎం వైఎస్ జగన్ కాంగ్రెస్‌ను వీడి సొంత పార్టీ పెట్టుకోవడం, దాంతో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం జగన్‌పై సీబీఐ కేసులు పెట్టి జైలుపాలు చేయడం వంటివి కూడా ఏపీకి తీరని నష్టం చేశాయి. అప్పట్లో సోనియాగాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వారి చేతిలో పనిముట్టుగా మారిన సీబీఐ అధికారి ఒకరు కలిసి రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేశారు. పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వచ్చినవారిని ఏదో ఒక సాకు చూపి జైలులో పెట్టించారు. ఒకవైపు పరిశ్రమలు స్థాపిస్తామని బ్యాంకుల వద్ద వేల కోట్ల రూపాయల రుణాలు పొందిన కొందరు రాజకీయ ప్రముఖులు ఆయా జాతీయ పార్టీలలో సేఫ్‌గా ఉండగా, పరిశ్రమలు పెడుతున్నవారు నానా ఇక్కట్లు పడవలసి వచ్చింది. దానికి తోడు తెలంగాణ ఉద్యమ ప్రభావం ఉండనే ఉంది. దీంతో ఏపీలో పరిశ్రమలు పెట్టాలంటేనే భయపడేలా చేశారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. విభజన చట్టంలో కడప స్టీల్ ప్లాంట్ పై అధ్యయనం చేయాలని ఒక క్లాజ్ పెట్టారు. దాని ప్రకారం కేంద్రం చర్యలు తీసుకోవలసి ఉండగా, ఆయా కారణాలతో కేంద్రం చొరవ తీసుకోలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మిత్ర పక్షంగా ఉన్న తెలుగుదేశం ఏపీలో అప్పట్లో అధికారంలో ఉంది. కానీ.. వారు కూడా ప్రత్యేక శ్రద్ద పెట్టలేకపోయారు. దీనిపై ప్రజలలో వ్యతిరేకత వస్తోందని శంకించిన టీడీపీ ప్రభుత్వం 2018లో అంటే ఎన్నికల ముందు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన అంటూ హడావుడి చేసింది. దానికి ముందుగా రాజ్యసభ సభ్యుడు సీ.ఎమ్. రమేష్ నిరాహార దీక్ష డ్రామా కూడా జరిగింది. అదేదో కర్మాగారం వచ్చేసినంత హడావుడి చేశారు. అదంతా ఉత్తుత్తిదే అన్న సంగతి ప్రజలకు అర్ధం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. 2019లో టీడీపీ ఓడిపోయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే ముఖ్యమంత్రి జగన్ ఏపీ ప్రభుత్వమే దీని ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని భావించి శంకుస్థాపన చేశారు. ఇందుకోసం భాగస్వామిని ఎంపిక చేసే యత్నం జరిగింది. ఇంతలో కరోనా సమస్య అతలాకుతలం చేయడంతో రెండేళ్లపాటు ఇది ఆలస్యం అయింది. అయినా సీఎం జగన్ దీనిని వదలిపెట్టలేదు. పట్టువదలని విక్రమార్కుడి మాదిరి ఈ రంగంలో అనుభవజ్ఞులతో సంప్రదింపులూ జరిపి, వారిని ఒప్పించడానికి ప్రయత్నించారు. ఎట్టకేలకు ఆ కృషి ఫలించి ఇప్పుడు అది కార్యరూపం దాల్చుతోంది. ఈ ప్లాంట్ సజావుగా పూర్తి అయి, వేలాది మందికి ఉపాధి కల్పించడమే కాకుండా ఏపీ పారిశ్రామిక చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాందీ పలుకుతుందని ఆశిద్దాం. - హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్. -
చెప్పాడంటే చేస్తాడంతే.. సీఎం జగన్ సక్సెస్ మంత్రా ఇదే..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వపరంగానే కాదు.. పార్టీ పరంగా కూడా వినూత్న కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. వాటిని అమలు చేస్తున్నారు. పార్టీ పరంగా గృహ సారధులు పేరుతో కొత్తగా కార్యకర్తలను తయారు చేస్తున్న విధానం భవిష్యత్తులో దేశ వ్యాప్తంగా ఆకర్షించే అవకాశం ఉంటుంది. ఒక రాజకీయ పార్టీని క్షేత్ర స్థాయిలో ఎలా నడిపించవచ్చో ఆయన చేసి చూపిస్తున్నారు. సీఎం జగన్ చేస్తున్న ప్రయోగం సఫలం అయితే వచ్చే శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి భారీ గెలుపు ఖాయం. ఇంటింటికి సంక్షేమ ఫలాలు.. ఇందుకోసం పార్టీలో పెద్ద కసరత్తే చేశారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకు రావడం ప్రభుత్వపరంగా ఒక సంచలనం. దానికి వలంటీర్ల వ్యవస్థను అనుసంధానం చేయడం ఎవరూ ఊహించని విషయం. తద్వారా ప్రజలకు ప్రభుత్వం లేదా పరిపాలన తమ ఇళ్ల వద్దే అందుబాటులో ఉందన్న నమ్మకాన్ని కలిగించారు. ఇది ప్రభుత్వపరంగా జరిగిన ఒక సఫల ప్రక్రియ. దీనిని పార్టీకి అనుసంధానం చేసుకోవడానికి సీఎం జగన్ సచివాలయ స్థాయిలో కన్వీనర్లు, వారి పరిధిలో గృహ సారధులను నియమిస్తున్నారు. ఇప్పటికే ఐదు లక్షల మంది పార్టీ సైన్యాన్ని సిద్దం చేశారట. ప్రభుత్వపరంగా వలంటీర్ల వ్యవస్థ ఉంటే, వారితో సమాంతరంగా ప్రతి 50 ఇళ్లకు పార్టీ పరంగా ఈ గృహ సారధులు పనిచేస్తారని అనుకోవచ్చు. సూక్ష్మ స్థాయికి కార్యకర్తల వ్యవస్థ.. గతంలో బీజేపీ బూత్ కమిటీ కాన్సెప్ట్ తెచ్చినప్పుడు అది సాధ్యమేనా అన్న అనుమానం వచ్చేది. కానీ, ఆయా రాష్ట్రాలలో బీజేపీ ఆ మోడల్ అనుసరించి విజయవంతం అయింది. దాంతో ఇప్పుడు దాదాపు అన్ని పార్టీలు బూత్ లెవెల్లో కమిటీలు వేస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ మరో అడుగు ముందుకు వేసి మరింత సూక్ష్మస్థాయికి కార్యకర్తల వ్యవస్థను తీసుకువెళుతున్నారన్నమాట. ఇది అంత తేలికైన విషయం కాదు. ఒక రకంగా నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలో నేతలతో పాటు వీరు కూడా కీలకం కాబోతున్నారు. ఏ చిన్న నేత అయినా వీరిపై ఆధారపడే పరిస్థితి వస్తుంది. వీరు కాకుండా సాధారణ కార్యకర్తలు ఎటూ ఉంటారు. వలంటీర్లను వైఎస్సార్సీపీ తన ప్రచారానికి వాడుకుంటుందని ఇప్పటికే ప్రతిపక్షాలు అనుమానిస్తూ ఆరోపణలు చేస్తున్నాయి. అయితే, ఆ గొడవ లేకుండా గృహ సారధుల పార్టీ వ్యవస్థను తెస్తున్నారు. 40 ఇయర్స్ కాపీ పేస్ట్ గతంలో ఏ ముఖ్యమంత్రి లేదా ఏ పార్టీ అధినేత ఇంత క్షేత్రస్థాయిలో పార్టీని నడిపించలేదనే చెప్పాలి. గత 30 ఏళ్లుగా టీడీపీ ప్రాంతీయ పార్టీని నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు సైతం సీఎం జగన్ వ్యూహాలను ఎదుర్కోవడానికి సతమతమవుతున్నారు. చంద్రబాబు ఒక ఎత్తు వేసేలోపు ముఖ్యమంత్రి జగన్ పది ఎత్తులు వేయగలుగుతున్నారు. చంద్రబాబు సచివాలయ, వలంటీర్ల వ్యవస్థల ఏర్పాటు ద్వారా ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకు వెళ్లవచ్చన్న ఆలోచన ఏనాడు చేయలేదు. సీఎం జగన్ ఆ వ్యవస్థల గురించి ప్రకటించగానే చంద్రబాబు విమర్శలు చేశారు. వలంటీర్లను ఎద్దేవా చేశారు. కానీ, ఇప్పుడు ఆ వ్యవస్థలు ప్రజల్లోకి విస్తృతంగా దూసుకెళ్లడంతో చంద్రబాబు నిస్సహాయ స్థితిలో పడ్డారు. తాము కూడా ఆ వ్యవస్థలను కొనసాగిస్తామని చెప్పక తప్పలేదు. అవి అలా ఉండగానే ముఖ్యమంత్రి జగన్ పార్టీ పరంగా కూడా దాదాపు అలాంటి వ్యవస్థలనే ప్రవేశ పెట్టారు. ఇప్పుడు దీనిని ఎలా ఎదుర్కోవాలన్నది చంద్రబాబుకు, ఆయన పార్టీ నేతలకు పెద్ద సవాలు కావచ్చు. అంతేకాదు.. సీఎం జగన్ వీరందరిని మార్చి 18-26 వరకు ప్రతీ ఇంటికి వెళ్లాలని ఆదేశించారు. వీరు ప్రభుత్వపరంగా జరుగుతున్న కార్యక్రమాలు వివరించాల్సి ఉంటుంది. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వీరు చెబుతారు. దీనికి జగనన్నతోనే మన భవిష్యత్తు అని పేరు కూడా పెట్టారు. ఇలాంటి పేరు పెట్టడానికి ధైర్యం కావాలి, విశ్వాసం కావాలి. ఎల్లోస్.. ఫ్యాక్ట్స్ ప్లీజ్.. గత నాలుగేళ్లలో ప్రభుత్వపరంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన నేతగా సీఎం జగన్ ఆ నమ్మకం పొందారని అనుకోవచ్చు. అయినా, ఆ మార్పులను ప్రజలు మర్చిపోయేలా ఏమార్చడానికి టీడీపీ, ఆ పార్టీ అనుబంధంగా ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 వంటి మీడియా సంస్థలు ఉన్నవి.. లేనివి కల్పించి అభూత కల్పనలను ప్రచారం చేస్తున్నాయి. వాటిని ఎదుర్కోవడానికి గృహ సారధుల వ్యవస్థ బాగా ఉపయోగపడుతుందని సీఎం జగన్ అంచనా వేస్తుండవచ్చు. అదే సమయంలో చంద్రబాబు పేరుతో టీడీపీ నేతలు ఒక ప్రచారం ఆరంభిస్తున్నారు. మళ్లీ మీరే రావాలి అన్న నినాదాన్ని ఇస్తున్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ ఆయన వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్న నినాదంతో ప్రజలను ఆకట్టుకునే యత్నం చేసింది. నినాదం ఫలించింది కానీ.. ప్రజలకు ఆయన ఒరగబెట్టింది ఏమీ లేదన్న భావన అప్పట్లో నెలకొంది. 2019లో జగన్ అంతకు మించిన నినాదాలు ఇచ్చారు. కావాలి జగన్, రావాలి జగన్, నేను విన్నాను.. నేను ఉన్నాను.. అన్న నినాదాలు ఇచ్చారు. అంతేకాకుండా ఎన్నికల మేనిఫెస్టోను సింపుల్‌గా ప్రజలకు అర్ధం అయ్యేలా తయారు చేసి తన కార్యక్రమాలను పాజిటివ్‌గా తీసుకు వెళ్లారు. అదే చంద్రబాబు నాయుడు వందల కొద్ది హామీలను మేనిఫెస్టోలో పెట్టి, చివరికి వెబ్సైట్ నుంచి దానిని తొలగించారు. సీఎం జగన్ మాత్రం ఇప్పుడు కూడా తన మేనిఫెస్టోలోని అంశాలను వివరిస్తూ 98 శాతం అమలు చేశానని ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. అందులోనూ ప్రత్యేకించి పేద ప్రజల కోసం ఆయన తీసుకు వచ్చిన స్కీములు విపక్షాల మైండ్‌ను బ్లాంక్ చేశాయంటే ఆశ్చర్యం కాదు. కొంతకాలం వాటికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన టీడీపీ, జనసేనలు, తదుపరి వాటిని తాము కూడా అమలు చేస్తామని, ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పవలసి వచ్చింది. అందులోనే జగన్ సక్సెస్ ఉంది. ఈ నేపధ్యంలో జగనన్నతోనే మన భవిష్యత్తు అన్న నినాదాన్ని ప్రజలలోకి తీసుకు వెళ్లడానికి, ఎన్నికల నిర్వహణలో కీలకంగా బాధ్యతలు నిర్వహించడానికి గృహ సారధుల వ్యవస్థ పార్టీకి ఎంతగానో ప్రయోజనం కలిగించవచ్చు. - హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్. -
అలా మాట్లాడటం కేసీఆర్ వ్యూహాత్మక రాజకీయమేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శాసనసభలో చేసిన ప్రసంగం సహజంగానే ఎవరినైనా ఆకట్టుకుంటుంది. ఆయన తెలివిగా రాష్ట్ర ప్రభుత్వం, బడ్జెట్ పై కన్నా, కేంద్రంపైన, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనితీరుపైన అధికంగా మాట్లాడినట్లు అనిపిస్తుంది. ఆయన ఉపన్యాసం చూస్తే లోక్ సభలో ప్రతిపక్ష నేత మాట్లాడినట్లుగా ఉంది. వచ్చే ఎన్నికలలో మోదీని గద్దె దించడానికి సిద్దంగా ఉన్న జాతీయ పార్టీ నేత మాదిరిగా ఆయన స్పీచ్ సాగింది. ఒకప్పుడు మోదీని బాగా పొగిడిన కేసీఆర్ ఇప్పుడు తీవ్రంగా విమర్శిస్తున్నారు. దానికి ప్రత్యేక కారణాలు ఉండవచ్చు. బీజేపీ వ్యతిరేక స్టాన్స్ ఎక్కువగా తీసుకుంటే తెలంగాణ శాసనసభ ఎన్నికలలో రాజకీయ ప్రయోజనం అధికంగా ఉంటుందని ఆయన నమ్ముతుండవచ్చు. అదే టైమ్‌లో కాంగ్రెస్‌ను పెద్దగా విమర్శించకపోగా, మన్మోహన్ సింగ్ ప్రదానిగా ఉన్న దశాబ్దకాలాన్ని మోదీ పాలనతో పోల్చి సింగ్ పాలనే బెటర్ అని చెప్పడం కూడా గమనించదగ్గ అంశమే. అలాగే నెహ్రూ, ఇందిరా గాంధీలను మోదీ విమర్శించడాన్ని కూడా ఆయన తప్పు పట్టారు. తద్వారా కాంగ్రెస్ వారిని గందరగోళంలో పడేయడానికి కూడా ఆయన ఈ అవకాశాన్ని వాడుకున్నారని చెప్పవచ్చు. కేసీఆర్ దేశంలో వృద్ది రేటు, ఎగుమతుల వృద్ది రేటు, పారిశ్రామికభవృద్ది రేట్ మొదలైన సంగతులు గురించి చెప్పారు కానీ, మధ్యలో రెండేళ్లపాటు కరోనా కారణంగా జరిగిన నష్టాన్ని ఆయన కావాలనే విస్మరించారన్న భావన కలుగుతుంది. అదేదో మోదీ ప్రభుత్వం మొత్తం నాశనం చేసిందని చెప్పాలన్నది ఆయన ఉద్దేశంగా ఉంది. వెయ్యి, ఐదు వందల రూపాయల నోట్లను రద్దు చేసినప్పుడు కేసీఆర్ ప్రధానిని ఆకాశానికి ఎత్తుతూ మాట్లాడారు. కచ్చితంగా సమర్ధించాలని ఆనాడు అన్నారు. కానీ ఈనాడు ఏమంటున్నారు..తనకు అప్పుడు చెప్పింది వేరు.. తర్వాత చేసింది వేరు అని అంటున్నారు. ఆ తేడా ఏమిటో తెలియదు. ప్రస్తుతం మిత్రపక్షాలు గా వామపక్షాలు కానీ, కాంగ్రెస్ కానీ నోట్ల రద్దు ప్రక్రియను తీవ్రంగా తప్పుపట్టినా, అప్పట్లో కేసీఆర్ మాత్రం సమర్ధించారు.ఇప్పుడు వారికంటే ఈయనే ఎక్కువగా విమర్శిస్తున్నారు.నోట్ల చెలామణి బాగాపెరిగిందని గణాంకాలు చెబుతున్నారు. కెసిఆర ఏ పరిస్థితిని అయినా తనకు అనుకూలంగా మలచుకోవడంలో సిద్దహస్తుడని మరోసారి రుజువు చేసుకున్నారు. మోదీ గెలిచారు కానీ, ప్రజలు ఓడారని జనరల్ డైలాగును ఆయన వాడారు. మోదీ ప్రభుత్వం వచ్చే ఎన్నికలలో ఓడిపోక తప్పదని ఆయన జోస్యం చెబుతున్నారు. కానీ సర్వేలు మాత్రం అందుకు విరుద్దంగా వస్తున్నాయి. అయినా కేసీఆర్ ఇదే కోణంలో విమర్శ చేస్తున్నారంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అన్న సంగతి అర్ధం అవుతూనే ఉంది. జాతీయ రాజకీయాలపైన, కేంద్రం తీరుతెన్నుల మీద ఎక్కువ చర్చ జరిగితే ఈ తొమ్మిదిన్నరేళ్ల కేసీఆర్ పాలనపై ప్రజలలో అంత రచ్చ ఉండదు. ఏమైనా వైఫల్యాలు ఉన్నా వాటన్నిటిని కేంద్రం ఖాతాలో జమ చేయడానికి కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు అనిపిస్తుంది. అలా అని కేంద్రం అన్నీ ఒప్పుల కుప్పగా చేసిందని కాదు. కానీ ఒక రాష్ట్ర శాసనసభలో ఒక ప్రాంతీయ పార్టీ ముఖ్యమంత్రి ఈ స్థాయిలో కేంద్రంపైన, ప్రదాని మోదీపైన రాజకీయ విమర్శలు చేయడం చిన్న విషయం కాదు. అయితే వ్యక్తిగత దాడిగా కాకుండా విధానపరంగానే జరగడం మంచిదే. తప్పు అయినా, ఒప్పు అయినా రాజకీయాలు ఇంతవరకు పరిమితం అయితే సమంజసమే. కేంద్రం కన్నా తెలంగాణ ప్రభుత్వమే బాగా పని చేసిందని ఆయన వాదించారు. పైగా జీఎస్డీపీలో తెలంగాణలో మూడు లక్షల నష్టం వాటిల్లిందని ఏదో లెక్క చెప్పారు. అదే సమయంలో తెలంగాణ అప్పు అన్ని రకాలు కలిపి సుమారు నాలుగున్నర లక్షల కోట్లకు ఎందుకు పెరిగింది కూడా ఆయన వివరించి ఉంటే బాగుండేది. విద్యుత్ గురించి ఆయన సభలో మాట్లాడుతున్న తరుణంలోనే కొన్ని టీవీ చానళ్లలో ఆదిలాబాద్ జిల్లాలో కరెంట్ కష్టాలు, వరంగల్ జిల్లాలో ఏదో గ్రామంలో విద్యుత్ కోతకు నిరసనగా ధర్నా అంటూ వార్తలు ప్రసారమవుతున్నాయి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఈ ఏడాది ఏమైనా కొంత ఇబ్బంది ఏర్పడి ఉంటే ఉండి వచ్చుకానీ, గత తొమ్మిదేళ్లలో కరెంటు విషయంలో పెద్దగా ఇబ్బంది లేకుండానే చేయగలిగారు. అదే సమయంలో డిస్కంలు భారీ ఎత్తున బాకీ పడిన విషయాన్ని విపక్షాలు గుర్తు చేస్తుంటాయి. తెలంగాణ అంతా సస్యశ్యామలం అయిపోయిందని చెబుతున్నారు. పాలమూరు నుంచి వలసలు ఆగిపోయాయని అంటున్నారు. అది నిజమే అయితే సంతోషించవలసిందే. కానీ వలసలు అన్నవి ఆయా వ్యక్తుల అవసరాలను బట్టి కూడా జరుగుతుంటాయి. కాకపోతే ప్రభుత్వాల వైఫల్యం వల్ల వలసలు వెళ్లే పరిస్థితి లేదని చెప్పడం ఆయన ఉద్దేశం కావచ్చు. అంతవరకు తప్పు లేదు. కానీ ఈ క్రమంలో చంద్రబాబు టైమ్ లో ఇంకుడు గుంతలు, వైఎస్ ఆర్ టైమ్ లో బొంకుడు గుంతలు అంటూ రిధమిక్ డైలాగు వాడారు. చంద్రబాబు ఇంకుడు గుంతల ప్రచారం చేసినప్పుడు కేసీఆర్ కూడా అందులో భాగస్వామే అన్న సంగతి ఆయన మర్చిపోయి ఉండవచ్చు. కాగా వైఎస్ ఉమ్మడి ఏపీలో తలపెట్టిన జలయజ్ఞం ముందుకు సాగబట్టే రెండు ప్రాంతాలలో సాగునీటి సదుపాయాలు బాగా మెరుగు అయ్యాయన్నది వాస్తవం. ఆయన కుమార్తె షర్మిల ఇక్కడ రాజకీయ పార్టీ పెట్టడంపై కోపం తో వైఎస్ పై విమర్శ చేసి ఉండవచ్చు.ప్రధానిని పొగడడంపై ఒక పిట్టకద వినిపించినా ,ప్రజాస్వామ్య ప్రక్రియ గురించి ప్రస్తావించినా, ఆ వ్యాఖ్యలు తనకు వర్తిస్తాయన్న సంగతి ఆయన మర్చిపోకూడదు.తెలంగాణ సచివాలయ గుమ్మటాలు కూల్చుతామన్న బీజేపీ అద్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యకు ఘాటు రిప్లై ఇస్తూ , అలా చేస్తే చూస్తూ ఊరుకుంటామా? కాళ్లు, రెక్కలు విరగగొడతారని హెచ్చరించారు. కేసీఆర్ చేసిన ఒక ముఖ్యమైన విమర్శ అదాని గ్రూప్ షేర్ల పతనం అంశం. ఈ విషయంపై పార్లమెంటులో ప్రదాని కానీ, ఇతర కేంద్ర మంత్రులు కానీ నోరు విప్పకపోవడం కచ్చితంగా ప్రశ్నించదగిందే. దానిని గట్టిగానే కేసీఆర్ ప్రస్తావించారు. అదే సమయంలో డిల్లీ లిక్కర్ స్కామ్ లో తన కుమార్తె కవిత గురించి చార్జీషీట్ లో పేర్కొనడంపై కేసీఆర్ ఎ క్కడా వివరణ ఇచ్చినట్లు లేదు. బహుశా మోదీపైన విమర్శలు గట్టిగా చేయడంలో ఈ నేపద్యం కూడా ఉండవచ్చు.తన ఏలుబడిలో తెలంగాణ బ్రహ్మండంగా అభివృద్ది చెందిందని, దేశం మాత్రం మోదీ నాయకత్వంలో వెనుకబడి పోయిందని చెప్పడం ఆయన లక్ష్యం. అంతవరకు ఆయన సఫలం అయినట్లే.కాకపోతే బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆయన సమాదానం ఇచ్చి ఉంటే బాగుండేది. రాష్ట్ర ఆర్దిక పరిస్థితిపై, ఐదు లక్షల కోట్ల అప్పులపై కేసీఆర్ ఎందుకు చర్చ జరపలేదని ఆయన ప్రశ్నించారు. అలాగే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, నిరుద్యోగ భృతి , దళితులకు మూడు ఎకరాల భూమి తదితర హామీల అమలు ఏమైందని ఆయన ప్రశ్నించారు. కాగా పెండింగులో ఉన్న రైతు రుణ మాఫీకి నిధులు కేటాయిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గురించి, అలాగే కాంగ్రెస్ నేతలు కొందరి గురించి కేసీఆర్ పాజిటివ్‌గా మాట్లాడడం వ్యూహాత్మక రాజకీయమే అని అంటున్నారు. తద్వారా ఆయా పార్టీలలో వారిపై అనుమానాలు వ్యాప్తి చేయడమే కావచ్చన్న భావన ఉంది. అసెంబ్లీలో కాంగ్రెస్,బీజేపీలు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, వాటివల్ల కేసీఆర్ కు పెద్ద ఇబ్బంది ఏమీ రాలేదనే చెప్పవచ్చు. జాతీయ స్తాయిలో మోదీకి అనుకూలంగా సర్వేలు వస్తున్నట్లుగానే రాష్ట్ర స్థాయిలో కేసీఆర్‌కు ప్రస్తుతానికి అనుకూలంగా సర్వేలు వస్తున్నాయి. అయినా వచ్చే తొమ్మిది నెలలు బీఆర్ఎస్కు అత్యంత కీలకం అని వేరే చెప్పనవసరం లేదు. దానికి ప్రాతిపదికగా కేసీఆర్ ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో రెండుగంటలకు పైగా సమాధానం ఇచ్చారు. చివరిగా ఒక మాట చెప్పాలి. ఒకప్పుడు ఇరవై తొమ్మిది రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు జరిగేవి. అలాంటిది ఇప్పుడు కేవలం వారం, పది రోజులకే పరిమితం అవుతుండడం ఆశ్చర్యంగానే ఉంటుంది. చిన్న రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఈ పరిస్థితి వచ్చిందా?లేక శాసనసభలో చర్చలు జరపవలసినంత సీన్ లేకుండా పోయిందా? ఏమో!ఏమైనా కావచ్చు. - హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్. -
TS: ఈ గుమ్మటాల గోలేంది.. అసలేం జరుగుతోంది?
తెలంగాణలో నేతలు ఒకరిని మించి ఒకరు పోటీ పడి డైలాగులు విసురుతున్నారు. తాజాగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదస్పదమే. ఆయన సచివాలయ గుమ్మటాలను కూల్చివేస్తామని ప్రకటించారు. బీజేపీ అధికారంలోకి వస్తే అలా చేస్తామని ఆయన అంటున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రగతి భవన్‌ను పేల్చాలని అంటే సంజయ్ ఏమో సచివాలయం గుమ్మటాలపై పడ్డారు. కేవలం మూడు సీట్లు ఉన్న బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి కేంద్ర పార్టీ నేతలు , రాష్ట్ర నేతలు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు తెలంగాణను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాజకీయం చేస్తున్నారు. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ను ఇరుకున పెట్టడానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ను తెరపైకి తెచ్చారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత పేరున లిక్కర్ స్కామ్ చార్జీషీట్లో చేర్చడం కలకలం రేపింది. అంతేకాదు. వీరికి సంబంధించిన ఆడిటర్ బుచ్చిబాబును కూడా అరెస్టు చేశారు. ఈ పరిణామం ఏదో సంకేతం ఇస్తున్నట్లుగా ఉంది. మరి కొంత ప్రముఖుల వద్దకు ఈ కేసు చేరే అవకాశం కనబడుతోంది. అలా జరిగితే తెలంగాణ రాజకీయం మరింత గరం, గరం అవుతుంది. ఇలా ఒకవైపు వ్యవహారం సాగుతుండగా, మరో వైపు బీజేపీ రాష్ట్ర నాయకులు వీధి మీటింగ్‌లు పేరుతో జనాన్ని ఆకట్టుకోవడానికి యత్నిస్తున్నారు. ఆ క్రమంలో బండి సంజయ్ తీవ్రమైన డైలాగులు విసురుతున్నారు. తెలంగాణలో కొత్తగా నిర్మించిన సచివాలయ గుమ్మటాలను కూల్చడం అంటే ఒకరకమైన సెంటిమెంట్ ను ప్రేరించడానికి ఆయన యోచిస్తున్నారన్నమాట. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఈ నిర్మాణాలను ప్రశంసించడమే కాకుండా తాజ్ మహల్‌తో పోల్చారు. ఈ నేపథ్యంలో సంజయ్‌కు తాజ్ మహల్లో సమాధి గుర్తుకు వచ్చింది. నిజానికి తాజ్ మహల్ ప్రపంచ వింతలలో ఒకటిగా గుర్తింపు పొందింది. అమెరికాతో సహా ఆయా దేశాల అధినేతలు తాజ్నును సందర్శించి అనుభూతి పొందారు. అలాంటి ప్రసిద్ద కట్టడాన్ని సంజయ్ సమాధితో పోల్చడం సరికాదు. బహశా ఆయన మనసులో మరో అంశం పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నారేమో! గతంలో అయోధ్యలోని బాబ్రీ మసీదును కర సేవకులు కూల్చివేశారు. ఆ మసీదుకు కూడా గుమ్మటం ఉండేది. మొత్తాన్ని గుణపాలతో తవ్వేశారు. అక్కడ రామాలయం ఉండేదన్నది వారి వాదన. రామాలయం కోసం బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వాని రథయాత్ర చేసినప్పుడు పలు చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. బాబ్రీ మసీదు కూల్చినప్పుడు దేశం అంతా అట్టుడికింది. అయినా ఆ ఘట్టం బీజేపీ ఎదుగుదలకు బాగా ఉపయోగపడి , ఆ పార్టీ కేంద్రంలో అదికారంలోకి వచ్చే స్థాయికి ఎదిగింది. ఇప్పుడు అలా కాకపోయినా, తాము అధికారంలోకి వస్తే గుమ్మటాలను కూల్చుతామని సంజయ్ హెచ్చరిస్తున్నారు. ఆ గుమ్మటాలు భారతీయ, తెలంగాణ సంస్కృతిలో భాగం కాదని, నిజాం సంస్కృతిలోవని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే సంజయ్ విమర్శించిన వాటిలో ఒకటి మాత్రం హేతుబద్దంగానే ఉంటుంది. అంతకుముందు బాగున్న భవనాలను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూల్చివేసి కొత్త నిర్మాణాన్ని చేసింది. దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఒక అందమైన భవనాన్ని నిర్మించి అంబేద్కర్ పేరు పెట్టారు. ఈ భవనంపై గుమ్మటాల నిర్మాణాలు కనిపిస్తుంటాయి. బీఆర్ఎస్ ఆఫీస్ భవనం కూడా ఒకరకంగా ఇదే మోడల్లో పైన గుమ్మటాలతో కనిపిస్తుంటుంది. అది బీజేపీకి అంత నచ్చకపోవచ్చు. అంతమాత్రాన కొత్త సచివాలయ గుమ్మటాలను కూల్చివేస్తామంటే జనంలో సెంటిమెంట్ పెరుగుతుందా అన్నది డౌటే. బీజేపీ వారు కూడా కేంద్రంలో పార్లమెంటుకు కూడా కొత్త భవనాన్ని నిర్మించారు. ఆ విషయాన్ని కూడా మర్చిపోరాదు. కాకపోతే అది చాలాకాలం నాటిది కాబట్టి , మొత్తం కేంద్ర కార్యాలయాలన్నిటిని ఒకే చోటకు తీసుకు వచ్చే క్రమంలో ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు భవనాల నిర్మాణం కోర్టుల వరకు వెళ్లి క్లియర్ అయ్యాయి. ఏది ఏమైనా అదేదో వేరే మత సంస్కృతిలో భాగంగా కనిపిస్తున్నాయి కాబట్టి కూల్చాలని ప్రచారం చేస్తే ఏమి ప్రయోజనం ఉంటుంది? మంత్రి కేటీఆర్ రోడ్లపై ట్రాఫిక్‌కు అడ్డంగా ఉన్న మసీదులు, దేవాలయాలను తొలగించాలని అనడంపై కూడా సంజయ్ ఆక్షేపణ తెలిపారు. ముందుగా పాతబస్తీలోని మసీదులను తొలగించగలరా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్న సంగతి ఎలా ఉన్నా గుజరాత్లో దీనికి సంబంధించి అప్పటి మోదీ ప్రభుత్వం ఒక చట్టం కూడా తెచ్చి రోడ్లపై ప్రార్ధనా మందిరాలను తొలగించిందని చెబుతారు. ఈ సంగతి కూడా సంజయ్ గుర్తుంచుకోవాలి. తెలంగాణలో అయినా మరో రాష్ట్రంలో అయినా ఇలాంటి విషయాలలో ఏకాభిప్రాయం అవసరం అని చెప్పాలి. బీజేపీ ఇకనైనా గుమ్మటాల గోల వదలిపెట్టి విధానపరమైన అంశాలపైన స్పీచ్‌లు ఇస్తే మంచిది. -హితైషి చదవండి: పాదయాత్రల్లో బ్యాలెన్స్ తప్పుతున్న నేతలు -
పాదయాత్రల్లో బ్యాలెన్స్ తప్పుతున్న నేతలు
తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న పాదయాత్రలు ఎంతవరకు ఫలితాలు ఇస్తాయన్నది చర్చనీయాంశంగా ఉంది. పాదయాత్రలను సఫలం చేయడం కోసం, ప్రజలను , కనీసం తమ పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరచడం కోసం వారు చేస్తున్న తీవ్ర వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి. తెలంగాణలో ఈ పాదయాత్రలు పోటాపోటీగా సాగుతుంటే, ఆంద్రప్రదేశ్‌లో ఒక పాదయాత్ర జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ అద్యక్షుడు రేవంత్ రెడ్డి కాని, ఏపీలో టీడీపీ నేత మాజీ మంత్రి లోకేష్ కానీ పదజాలం వాడడంలో బ్యాలెన్స్ కోల్పోతున్నారు. రేవంత్ పార్లమెంటరీ నియోజకవర్గాల వారిగా పాదయాత్ర చేస్తున్నారు. మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో యాత్ర సాగిస్తున్న సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్య పూర్తిగా ఆక్షేపణీయం. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్‌ను పేల్చేయాలని ఆయన మావోయిస్టు భాష మాట్లాడడంపై అధికార బీఆర్ఎస్ మండి పడింది. ఆయనపై పిడి చట్టం పెట్టి అరెస్టు చేయాలని కూడా డిమాండ్ చేసింది. రేవంత్ పొరపాటున ఈ మాట అని ఉంటే వెంటనే సరిచేసుకునేవారు. కాని ఆయన కావాలనే ప్రగతి భవన్‌ను పేల్చివేయాలని అన్నారని అర్ధం అవుతుంది. ఎందుకంటే దానిని సమర్ధించుకుంటూ తన ఉద్దేశాన్ని వివరిస్తున్నారు. ప్రగతి భవన్ లోకి ప్రజలను రానివ్వడం లేదని, ఎంపీలు ఎమ్మెల్యేలను అనుమతించడం లేదని అలాంటి ప్రగతి భవన్ ఉంటే ఏమిటి?లేకుంటే ఏమిటి అని ప్రశ్నించారు. రైతుల రుణమాఫీ చేయలేదని, నిరుధ్యోగ బృతి హామీని నెరవేర్చలేదని ఇలా పలు కారణాలు ఆయన చెబుతున్నారు. రాజకీయంగా ఎలాంటి విమర్శలు చేసినా తప్పులేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల మానిఫెస్టోలో చేసిన వాగ్దానాలను అమలు చేయకపోతే ప్రశ్నించవచ్చు.అలాకాకుండా ఏకంగా ప్రభుత్వ భవనాన్ని పేల్చి వేస్తామని అనడం రేవంత్ రెడ్డి నోటి దురుసుతనానికి నిదర్శనం అవుతుంది. గతంలో కూడా ఆయన ఇలాగే ముఖ్యమంత్రిపై నోరు పారేసుకున్నారు. ఆయన మరో మాట కూడా అన్నారు. 2000 సంవత్సరం నాటికి కేసీఆర్ కుటుంబం రబ్బరు చెప్పులతో ఉందని , ఇప్పుడు కోట్లకు పడగలెత్తిందని ఆయన ఆరోపించారు. అది వాస్తవం కాదు. 1985 నుంచే కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. వరసగా ఓటమి లేకుండా గెలుస్తూ వస్తున్నారు. మంత్రి పదవి నిర్వహించారు. 2000 తర్వాత సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. కాంగ్రెస్ తో సహా అనేక పార్టీలను తనదారిలోకి తెచ్చుకున్నారు. తెలంగాణ సాధనలో ఆయన అత్యంత ప్రముఖ పాత్ర పోషించి రాష్ట్రాన్ని సాదించిన నేతగా గుర్తింపు పొందారు. తొమ్మిదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న నేతపై రాజకీయ విమర్శలు చేయవచ్చుకాని, వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఒకవేళ ఏవైనా ఆరోపణలు చేయదలిస్తే నిర్దిష్ట ఆధారాలతో చేయాలి. రేవంత్ రెడ్డి ఒక రకంగా ప్రస్టేషన్ లో ఉన్నారని చెప్పాలి. ఆయన పిసిసి అధ్యక్షుడు అయ్యాక జరిగిన ఉప ఎన్నికలలో సైతం కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది.బిజెపి రెండో స్థానంలో ఉంటోంది. ఒకప్పుడు కాంగ్రెస్‌కు గట్టి బేస్ ఉన్న తెలంగాణలో ఈ పరిస్థితి ఊహించనిదే. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ ఉనికిని నిలబెట్టుకోవడానికి, అలాగే ప్రజలలో మళ్లీ ఆదరణ పొందడానికి రేవంత్ నానా పాట్లు పడుతున్నారు. ఒకపక్క కాంగ్రెస్ లో వర్గ కలహాలు, మరోవైపు కాంగ్రెస్ నానాటికి దెబ్బతింటున్నదేమోనన్న ప్రచారం నేపద్యంలో ఆయన తొందరపాటుగా మాట్లాడుతున్నారు. రేవంత్ మాటలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఏమి చేస్తారన్నది పక్కనబెడితే మంత్రి కెటిఆర్ అడిగినట్లు ప్రగతి భవన్ ను పేల్చడం కాంగ్రెస్ విధానమా అంటే దానికి పార్టీ నేతలు జవాబు ఇవ్వలేకపోయారు. జానారెడ్డి, మల్లు భట్టి వంటివారు దీనిని ఆమోదిస్తారా అని కెటిఆర్ ,హరీష్ రావు ఇతర నేతలు ప్రశ్నిస్తున్నారు. మాటల దాడి చేయడం అన్నిసార్లు కలిసిరాకపోవచ్చు. అది అర్ధవంతమైనది అయితే ఫర్వాలేదు కాని, హింసను ప్రేరేపించేదిలా ఉంటే అది పార్టీకి నష్టం జరుగుతుంది. జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ కు ఒక పెద్ద సమస్య అవుతుంది. దానిని రేవంత్ గుర్తుంచుకుని డైలాగులు వదలితే మంచిదని చెప్పాలి. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో లోకేష్ చేస్తున్న పాదయాత్ర నిత్యం వివాదాస్పదం అవుతోంది. నిబంధనలకు విరుద్దంగా రోడ్లపై సభలు నిర్వహించడమే కాకుండా, వద్దని వారించినపోలీసులపై అనుచితంగా లోకేష్ మాట్లాడుతున్నారు.ఒక సభలో లోకేష్ పోలీసులను ఉద్దేశించి వేలు చూపుతూ ,వారిని జైలుకు పంపుతానని హెచ్చరించారు. ఇది ఏ పాటి విజ్ఞతో ఆయనే తెలుసుకోవాలి. అంతేకాదు .. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఎంత మాట పడితే అంత మాట మాట్లాడడం సరైన విధానం కాదు. అందులోను ఒరేయ్ అంటూ సంభోధించడం దారుణంగా ఉంది. అందువల్లే వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ సమాధానం ఇస్తూ చంద్రబాబును తాము ఒరేయ్ అంటే ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. ఇరువైపులా ఇలాంటి విషయాలలో సంయమనంగా ఉండాల్సిన అవసరం ఉంది. లోకేష్ కు ఉనికి సమస్య ఎదురుఅవుతోంది. ఆయన పాదయాత్రకు జనం పెద్దగా రావడం లేదన్న బాధ ఉండవచ్చు. దానికి తోడు పార్టీ ఏపీ అద్యక్షుడు అచ్చెన్నాయుడు గంగాధర నెల్లూరు నియోజకవర్గ టీడీపీ నేత ఒకరితో మాట్లాడిన ఆడియో లీక్ అయింది. అందులో కొన్ని చోట్ల లోకేష్ పాదయాత్రకు జనం లేకపోవడాన్ని ఆయన ప్రస్తావించి చంద్రబాబు బాదపడ్డారని చెప్పారు. అందుకు ప్రత్యామ్నాయంగా ఎలా జనాన్ని పోగు చేయాలో, వాహనాలలో ఎలా చేరవేయాలో వారు చర్చించుకున్నారు. లోకేష్ ముందుగా తన తెలుగు పరిజ్ఞానాన్ని పెంచుకుని, ఆ తర్వాత మంచి భాషతో ప్రసంగాలు చేయడం నేర్చుకుంటే ఆయనకు ఉపయోగం ఉంటే ఉండవచ్చేమో కాని, ఇప్పుడు మాదిరి ఏది పడితే అది మాట్లాడితే ఆయనకే నష్టం. తెలంగాణలో వైఎస్ ఆర్ టిపి నేత షర్మిల, బిజెపి అద్యక్షుడు బండి సంజయ్ లు కూడా పాదయాత్రలు సాగిస్తూ ఘాటైన ప్రసంగాలు చేస్తున్నారు. ఎవరికి వారు ప్రజలను ఆకట్టుకోవడానికి ఒక్కోసారి పరిధులు దాటుతున్నారన్న భావన కూడా లేకపోలేదు. ఏది ఏమైనా నేతలు మరీ రెచ్చిపోకుండా మాట్లాడితే మంచిదని చెప్పాలి. కాని ఇది అత్యాశే అవుతుందా! కొసమెరుపు ఏమిటంటే టీడీపీ నేత జెసి దివాకరరెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ శాసనసభ పక్ష కార్యాలయానికి వెళ్లి పాదయాత్రల వల్ల ప్రయోజనం లేదని, ఆ రోజులు పోయాయని వ్యాఖ్యానించారు. అటు రేవంత్‌కు ఇటు లోకేష్‌కు దివాకరరెడ్డి ఈ సందేశం ఇస్తున్నారా! -హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్. -
ఆ విషయాన్ని మాత్రం ‘ఈనాడు’ ఎందుకు చెప్పదు?
ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు రాష్ట్రంపై విషం కక్కుతున్న ఈనాడు, తదితర టీడీపీ మీడియా సంస్థలు ఎలా అబద్దాలు ఆడుతున్నాయో కేంద్ర ప్రభుత్వ సమాచారం వెల్లడి చేసింది. ఈ మూడున్నరేళ్లలో బహుశా ఈనాడు పత్రిక రాష్ట్ర అప్పులపై రాసినన్ని కథనాలు మరే రాష్ట్రంలోను, ఏ పత్రిక రాసి ఉండదు. ప్రజలలో ఏదో రకంగా అనుమానం క్రియేట్ చేయడానికి, రాష్ట్రం అప్పులపాలైపోయిందని ప్రచారం చేయడానికి ఈనాడు ఎంత నిస్సిగ్గుగా పనిచేసింది ఈ సమాచారం విశ్లేషిస్తే అర్థం అవుతుంది. ఇంతకాలం ఏమని రాశారు! రాష్ట్రం అప్పు ఎనిమిది లక్షల కోట్లు దాటిపోయిందని, ఇంకోసారి అది పది లక్షల కోట్లకు చేరిందని ఇలా తప్పుడు వార్తలు రాశారు. వీరికి తోడుగా టీడీపీ ఎంపీలు తరచుగా రాష్ట్ర ప్రభుత్వం అప్పులపై ప్రశ్నలు వేయడం, వారేమో వీరు ఆశించినంతగా భారీ అప్పులు ఉన్నట్లు చెప్పకపోవడం జరుగుతోంది. దీంతో ఏపీ ప్రభుత్వంపై బురద చల్లాలనుకున్న వీరి ఆశ నిరాశ అవుతోంది. టీడీపీ నేతలకంటే ఈనాడు, జ్యోతి వంటి మీడియాలకు మరీ బాధగా ఉంటోంది. అయినా ఏ మాత్రం సిగ్గుపడకుండా ఉన్నవి, లేనివి కలిపి వండి మొదటి పేజీలలో ప్రచురిస్తున్నాయి. పెద్ద ఎత్తున టివీలలో ప్రసారం చేస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర అడిగిన ప్రశ్నకు బదులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పు అంతా 4.42 లక్షల కోట్ల రూపాయలని తెలిపింది. దాంతో నిరుత్సాహానికి గురైన ఈనాడు పత్రిక ఈ వార్తను లోపలి పేజీకే పరిమితం చేసింది. అదే నిజంగానే ఏ ఎనిమిది లక్షల కోట్లు అయి ఉంటే, అదే సమాచారం కేంద్రం ఇచ్చి ఉంటే, నానా రచ్చ చేస్తూ బానర్ కథనాలుగా ఇచ్చి ఉండేది. ఇప్పుడు ఆ అవకాశం దొరకలేదు. నిజానికి వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక రెండేళ్లు కరోనా కారణంగా ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కుంది. ఆ విషయం మాత్రం టీడీపీ మీడియా వారు కప్పిపెడుతుంటారు. పోని పొరుగు రాష్ట్రాల అప్పుల గురించి, కేంద్రం అప్పు గురించి రాస్తారా అంటే అదేమీ చేయరు. వారంటే అంత భయం. కాని ఏపీకి వచ్చేసరికి ఎక్కడ లేనంతగా బురద చల్లుడులో బిజీగా ఉంటున్నారు. గతంలో పది లక్షల కోట్లు అని ప్రచారం చేశాం కదా.. కాని అది నాలుగున్నర లక్షల కోట్లే ఉందని, తప్పు రాశామని వివరణ కూడా ఇవ్వరు. ఏదో మొక్కుబడిగా వార్త ఇస్తారు. మరో సంగతి ఏమిటంటే ఈ 4.2 లక్షల కోట్ల అప్పులో 2.64 లక్షల కోట్ల అప్పు గత తెలుగుదేశం ప్రభుత్వం పాలన ముగిసేనాటికి ఉంది. రాష్ట్ర విభజన జరిగేనాటికి ఏపీ అప్పు సుమారు లక్ష కోట్ల వరకు ఉంటే, చంద్రబాబు ప్రభుత్వం ఒకటిన్నర రెట్ల మేర అప్పు చేసిందన్నమాట. ఆ విషయాన్ని మాత్రం ఎక్కడా ఈనాడు మీడియా చెప్పదు. కాని జగన్ ప్రభుత్వం చాలా అప్పు చేసిందన్న భ్రమ కల్పించడానికి యత్నిస్తుంటుంది. కార్పొరేషన్లు ద్వారా, ఇతరత్రా బడ్జెట్‌తో సంబంధం లేకుండా వేల కోట్ల అప్పులు చేస్తున్నారని ఈనాడు కొంతకాలం గగ్గోలు పెట్టింది. అవి కూడా రాష్ట్ర బడ్జెట్ అప్పులగానే చూస్తామని కేంద్రం చెప్పింది. దాంతో వీరికి సంతోషం కలిగింది. జగన్ ప్రభుత్వం తీసుకు వచ్చిన అప్పులను పేద ప్రజలను ఆదుకోవడానికి ఉపయోగించిందని లెక్కలు చెబుతున్నాయి. మరి టీడీపీ పాలనలో అంత అప్పు తెచ్చి ఏమి చేశారో చెప్పలేని దయనీయ పరిస్థితి. పైగా చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయేనాటికి ఖజానాలో వంద కోట్లే మిగిల్చి వెళ్లారు. ఈ విషయాలు ప్రజలు మర్చిపోయారని వారి విశ్వాసం. చదవండి: ప్రత్యేక హోదా, మూడు రాజధానులపై కుండబద్దలు కొట్టిన వైఎస్సార్సీపీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు పుట్టకుండా పోతాయని టీడీపీ, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఈనాడు తదితర మీడియా సంస్థలు భావించాయి. కాని జగన్ ప్రభుత్వం విజయవంతంగా ఆర్ధిక వనరులు సమకూర్చుకోవడం వీరికి జీర్ణం కావడం లేదు. అందువల్లే కొద్ది రోజుల క్రితం కూడా ఈనాడు పత్రిక రాష్ట్రం అప్పులు అంటూ మొదటి పేజీలో వార్త ఇచ్చింది. కాని ఇప్పుడు కేంద్రం ఇచ్చిన సమాచారాన్ని మాత్రం లోపలిపేజీలోనే ప్రచురించింది. అప్పుల గురించి వార్తా కథనాలు ఇవ్వదలిస్తే, గత ప్రభుత్వం ఎలా అప్పులు చేసింది.. ఈ ప్రభుత్వం ఎలా తీసుకు వచ్చింది. అప్పటి పరిస్థితి, ఇప్పటి పరిస్థితి. మధ్యలో కరోనా వంటి సంక్షోభాలు మొదలైనవాటిని విశ్లేషించాలి. కాని అప్పట్లో విభజన వల్ల రాష్ట్రం నష్టపోయిందని, అందువల్ల అప్పులు చేయక గత్యంతరం లేకుండా పోయిందని టీడీపీ పాలన టైమ్‌లో సమర్ధించారు. ప్రస్తుతం మాత్రం అప్పులు చేయడానికి వీలు లేదన్నట్లుగా వార్తలు రాస్తున్నారు. ఏది ఏమైనా అప్పుడప్పుడు అయినా టీడీపీ మీడియా వాస్తవాలు ప్రచారం చేస్తే వారికే మంచిది. లేకుంటే ప్రజలువారిని అసలు నమ్మరు. -హితైషి -
అన్‌స్టాపబుల్‌గా ఏమైనా చేసుకోండి, కానీ.. ఈ కామెంట్లు అవసరమా బాలయ్యా?
తెలుగుదేశం హిందుపూర్ శాసనసభ్యుడు, ప్రముఖ నటుడు బాలకృష్ణ, జనసేన అధినేత, మరో ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్అ న్‌స్టాపబుల్ అంటూ ఏమైనా మాట్లాడుకోనివ్వండి. ఆపకుండా నవ్వుకోనివ్వండి. ఎవరికి అభ్యంతరం లేదు. కాని మధ్యలో ప్రజలను ఉద్దేశించి , లేదా సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టింగులు చేసేవారి గురించి వాడిన భాష అభ్యంతరకరంగా ఉంది. ప్రత్యేకించి బాలకృష్ణ ఊరకుక్కల భాష వాడడం దారుణం. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు గురించి ఎవరైనా మాట్లాడితే ఊరకుక్కలతో సమానం అట. అసలు ఊరకుక్కలు ఏమి చేస్తాయో ఆయనకు తెలుసా! వావి వరసలతో నిమిత్తం లేకుండా లైంగిక కార్యకలాపాలకు పాల్పడతాయని, రోడ్లపై ఇష్టారీతిలో సంచరిస్తాయని ఊరకుక్కలు అంటారు. ఏ రంగంలో ఎవరు ఇలా వ్యవహరిస్తారో ఇలాంటి చెత్త పనులు ఎక్కువగా చేస్తారో చెప్పుకుంటే సిగ్గుపోతుంది. మనకు సభ్యత అడ్డువస్తుంది. కాని అలాంటి వాటితో నిమిత్తం లేని వారు ఏమైనా మాట్లాడగలరు. గతంలో ఇదే బాలకృష్ణ ఏమన్నారు. ఆడపిల్ల కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి. లేక... చేయాలి అని అన్నారు. ఆక్షేపణీయపు భాష వాడడం ఇష్టం లేక డాట్ లు పెట్టాల్సి వచ్చింది. ఆడపిల్లల తండ్రి ఎవరైనా ఇలా మాట్లాడతారా? అంతేకాదు .. సినిమాలలో డబుల్ మీనింగ్ డైలాగులు, అర్ధనగ్న నృత్యాలు, అబ్జెక్షనబుల్ సన్నివేశాలు ఎన్ని కనిపిస్తుంటాయో, వాటిపై అప్పుడప్పుడు మహిళా సంఘాలు ఎందుకు ఆందోళనలు చేస్తుంటాయో.. ఇవేవి ప్రజలకు తెలియవా? కేవలం మూడు పెళ్లిళ్లు అని ప్రస్తావిస్తేనే ఊరకుక్కలతో సమానం అయితే పైన చెప్పినవాటిని ఏ మాత్రం సిగ్గుపడకుండా చేసేవారిని ఏమనవలసి వస్తుంది. తన ఇంటిలోనే ఇద్దరిపై కాల్పులు జరిపినవారిని ఏమనాలి? సినిమాలతో పాటు రాజకీయాలలో ఉన్నవారు ఎంత బాధ్యతగా మాట్లాడాలి. సమాజంలో ఎంతో కొంత ప్రభావం చూపే వ్యక్తులు నోటికి వచ్చినట్లు మాట్లాడితే వారి అభిమానులు కూడా ఇలాగే తయారవ్వరా? సడన్ గా బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ పై రాజకీయ అవసరాల రీత్యా అభిమానం ఏర్పడవచ్చు. అంతకుముందు జనసేనవారిని ఉద్దేశించి అలగాజనం అని, మరొకటి అని అన్నా, పవన్ కళ్యాణ్ పెద్దగా ఫీల్ కాకపోతే అది ఆయన ఇష్టం. కాని ఆయన మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడితే ఊరకుక్కలతో సమానం అంటే మాత్రం కచ్చితంగా చాలామంది బాదపడతారు. దానిపై అదే స్థాయిలో స్పందిస్తుంటారు. అందువల్లే సోషల్ మీడియాలో బాలకృష్ణపై విమర్శలు వెల్లువెత్తున్నాయట. పవన్ కు బాలకృష్ణ సర్టిఫికెట్ ఇచ్చేస్తే జనం ఒప్పేసుకోవాలా! ఇక పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చూసినా చిత్రంగానే ఉంటాయి. అసలు ఇలాంటి ప్రశ్నలను అవాయిడ్ చేయవచ్చు. అయినా వారిద్దరూ కావాలని మాట్లాడుకున్నారు. తద్వారా అదేదో మూడు పెళ్లిళ్లు చేసుకోవడం తప్పుకాదు.. అది చాలా చిన్న విషయం అన్నట్లుగా వీరి సంభాషణ కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు కొత్త సంగతులు చెబుతుంటారు. వాటిలో నిజం ఉందో లేదో ఎవరికి అర్ధం కాదు. ఈసారి ఏకంగా ఆయన బ్రహ్మచారిగా ఉండాలని అనుకున్నానని, యోగ మార్గాన్ని అనుసరించాలని అనుకున్నా అని ఆయన చెప్పారు. కాని, మూడు సార్లు పెళ్లి జరిగింది తనకేనా అనిపిస్తుందట. ఒకేసారి ముగ్గురిని పెళ్లి చేసుకోలేదని, ముగ్గురితో ఒకేసారి ఉండ లేదని ఆయన అంటూ పెళ్లిళ్లకు కారణాలు చెప్పారు. కాని ఇక్కడ కూడా ఆయన నిజం చెప్పలేకపోయారు. ఆయన యోగి అవుతాననుకున్నది నిజమా? కాదా అన్నది మనకు అనవసరం. ఒక పెళ్లి చేసుకుని మరో మహిళతో సహజీవనం చేశారన్నది ఆయనపై కొందరు చేసే అబియోగం. అది వాస్తవమా? కాదా? అన్నదానిపై ఆయన క్లారిటీ ఇస్తే ఆయనలోని నిజాయితీ ప్రజలకు కాకపోయినా, అభిమానులకు అయినా అర్దం అయ్యేది. విడాకులు ఇచ్చి పెళ్లిళ్లు చేసుకోవడం తప్పుకాదు. ఆయన అన్నది అంతవరకు వాస్తవమే. కాని అలా చేయలేదన్నది ఆయన ప్రత్యర్ధులు చేసే ఆరోపణ. ఇక పవన్ కళ్యాణ్ కొందరు విశిష్ట వ్యక్తుల పేర్లు ప్రస్తావిస్తూ, అంబేద్కర్, పూలె, తరిమెల నాగిరెడ్డి, రామ్ మనోహర్ లోహియా వంటివారు రచించిన పుస్తకాలు చదివానని అంటారు. ఏదైనా సందేహం తీర్చుకోవాలంటే ఆ పుస్తకాలపై ఆధారపడతారట. అసలు వారు రాసిననాటి పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు సంబంధం ఉందా? 2009లో ప్రజారాజ్యం, 2014 లో జనసేనను స్థాపించి టిడిపి, బిజెపిలకు మద్దతు ఇవ్వడం, 2019లో బిఎస్పి, వామపక్షాలతో కలిసి పోటీచేయడం, తదుపరి బిజెపివారిని బతిమలాడుకుని పొత్తు పెట్టుకోవడం. వీటన్నిటిలో ఆ ప్రముఖుల పుస్తకాలతో ఏమి సంబంధం. పాపం.. ఆ మహనీయులు జీవించి ఉంటే ఎంత క్షోభ పడేవారో! ఏదో ఒకటి చెప్పి తానేదో గొప్ప చదువరిని అని ప్రొజెక్టు చేసుకోవడం తప్ప మరొకటి కాదు. సిపిఐ సీనియర్ నేత చంద్రశేఖర్ టీవీలలో ఒక వ్యాఖ్య చేసేవారు. పవన్ కళ్యాణ్ ఎనభైవేల పుస్తకాలు చదవలేదని, వాటి అట్టలను మాత్రమే చూసి ఉంటారని పేర్కొన్నారు. మరి ఎవరు కరెక్టో వారే చెప్పాలి. అయితే ఒకటి మాత్రం వాస్తవం. తనకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురువు వంటివారని, ఆయనతో ఆయా అంశాలతో చర్చిస్తానని అన్నారు. ఏమి చర్చిస్తారో తెలియదు కాని, పవన్ కళ్యాణ్ ఆయన రాసిచ్చే డైలాగులనే సభలలో వాడుతుంటారని అంతా చెబుతుంటారు. కొంతలో కొంత ఇదైనా నిజం చెప్పినందుకు సంతోషించాలి. ఇలాంటి అన్ స్టాపబుల్ కార్యక్రమాలతో ఒటిటికి ఏమైనా లాభం కొంత ఉండవచ్చేమో కాని, రాజకీయంగా ప్రయోజనం అంతంతమాత్రమే అని చెప్పాలి. -హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్. -
ప్రత్యేక హోదా, మూడు రాజధానులపై కుండబద్దలు కొట్టిన వైఎస్సార్సీపీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో రెండు ప్రశ్నలకు గట్టి జవాబే ఇచ్చినట్లనిపిస్తుంది. ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభలో చేసిన ప్రసంగం ఆ విషయాన్ని స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా అంశంతో పాటు, మూడు రాజధానుల గురించి ఆయన మాట్లాడిన తీరు గమనించాల్సిందే. ప్రత్యేక హోదాకు సంబంధించి భారతీయ జనతా పార్టీని కూడా ఆయన ఏకిపారేశారు. వామపక్షాలు తరచూ ఈ మధ్య టిీడీపీ జోలికి పోకుండా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తున్నాయి. బీజేపీకి వైసీపీ భయపడిపోతోందని వారు అంటుంటారు. అందుకే ప్రత్యేక హోదా గురించి నిలదీయడం లేదని వారు ఆరోపిస్తుంటారు. టీడీపీ వారు బీజేపీని ఒక్క మాట అనకపోయినా వామపక్షాలు ముఖ్యంగా సీపీఐ మాత్రం ఆ పార్టినీ తప్పుపట్టకుండా, ఎలాగోలా ఆ పార్టీ పంచన చేరాలని ప్రయత్నిస్తోందన్న అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో విజయసాయి పార్లమెంటులో మాట్లాడుతూ బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడు ఆ రోజుల్లో ఏపీకి పదేళ్ల ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన వాగ్ధానాన్ని అమలు చేయడం లేదని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ,బీజేపీలు విభజన చట్టంలోని హామీలు అమలు చేయడంలో విఫలం అయ్యాయని, తత్పలితంగానే ఈ రెండు పార్టీలకు ఏపీలో జీరో ఫలితాలు వచ్చాయని ఆయన ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయం అని బీజేపీ అంటున్నదని, కానీ అది ఎప్పటికీ ముగియదని, ప్రత్యేక హోదా సాధించేవరకు తమ పోరాటం ఆగదని విజయసాయి స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నారు. ప్రధాని మోదీని కానీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కానీ కలిసి వినతిపత్రాలు ఇచ్చే సందర్భంలోను కచ్చితంగా ప్రత్యేక హోదా ఒక పాయింట్ గా ఉంటోంది. చదవండి: సెస్సులు, సర్‌చార్జీల్లో రాష్ట్రాలకు వాటా లేదు: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అయినా ఏపీలో ప్రతిపక్షం వైసీపీపై దాడి చేస్తుంటుంది. చిత్రంగా బీజేపీని ఒక్క మాట అనని టీడీపీ కూడా వైఎస్సార్సీపీనే తప్పుపడుతూ ప్రత్యేక హోదా సాధనలో విఫలం చెందిందని అంటుంది. విశేషం ఏమిటంటే అసలు ప్రత్యేక హోదాపై పలు రకాలుగా మాటలు మార్చింది తెలుగుదేశం పార్టీనే. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు బాధ్యతలను తమకు అప్పగించాక , ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోదా బదులు ప్యాకేజీకి అంగీకరించారు. దానిపై ప్రజలు తీవ్రంగా స్పందించారు. వైఎస్సార్సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు. దాంతో భయపడి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ తన మాట మార్చుకుని ప్రత్యేక హోదా పాట పాడసాగారు. కానీ వైఎస్సార్సీపీ మాత్రం ఒకే మాట మీద నిలబడుతోంది. అందులో భాగంగానే విజయసాయి రెడ్డి పార్లమెంటులో ఘాటుగానే స్పీచ్ ఇచ్చారు. ఇక మూడు రాజధానుల విషయంలో న్యాయ వ్యవస్థను ఆయన ధైర్యంగా తప్పుపట్టారు. పలు రాష్ట్రాలలో రెండు రాజధానులు ఉన్న సంగతిని గుర్తు చేస్తూ, ఏపీకి ఎందుకు ఒప్పుకోరని ఆయన ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థ తన పరిధి అధిగమించి తీర్పు ఇచ్చిందని ఆయన ఆక్షేపించారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాజధాని అన్నది రాష్ట్రాలకు సంబంధించిన అంశమని స్పష్టంగా చెప్పినా, న్యాయ వ్యవస్థ భిన్నమైన తీర్పు ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ది కోసం తీసుకున్న ఈ నిర్ణయంపై కోర్టు ఇచ్చిన తీర్పు ఏపీపై వివక్ష చూపుతున్నట్లుగా ఉందని కూడా విజయసాయి వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు రాబోతున్న తరుణంలో వైఎస్సార్సీపీ తన అభిప్రాయాన్ని మరోసారి కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడిందని చెప్పవచ్చు. ఈ విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తను ఈ రెండు విషయాలలో ఎక్కడా రాజీపడలేదని రుజువు చేసుకుందని అనుకోవచ్చు! -హితైషి -
సీఎంగా కేటీఆర్‌కు ముహుర్తం ఫిక్స్?
తెలంగాణ మున్సిపల్ , ఐటీ శాఖల మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి సమయం మరికాస్త దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. శాసనసభలో ఆయన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి జవాబు ఇచ్చిన తర్వాత పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి అభినందించారు. ఆ నేపధ్యంలో కేటీఆర్ త్వరలోనే ముఖ్యమంత్రి అవుతారేమోనని ఆ పార్టీలో చర్చలు సాగుతున్నాయి. ఒకటి, రెండు ఆంగ్ల పత్రికలు సైతం ఆ కోణంలో విశ్లేషణలు ఇచ్చాయి. ఈ ఏడాది డిసెంబర్లో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ లోగానే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? లేక వచ్చే ఎన్నికలలో గెలిస్తే సీఎం అవుతారా? అన్న చర్చ జరుగుతోంది. సాధారణంగా గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగే చర్చకు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు జవాబు ఇస్తారు. కానీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ జవాబు ఇవ్వకుండా కేటీఆర్‌తో మాట్లాడించారు. గతంలో ఎన్నడూ ఇలా జరిగిన సందర్భం లేదు. ఎప్పుడైనా అరుదుగా ఉంటే, ఉందేమో తెలియదు కానీ.. ముఖ్యమంత్రులు ఈ జవాబు ఇవ్వడాన్ని ప్రతిష్టగా తీసుకుంటారు. తద్వారా తన ప్రభుత్వ విజయాలను చెప్పుకోవడానికి దీనిని ఒక అవకాశంగా భావిస్తారు. గత సంవత్సరం అసలు గవర్నర్ ప్రసంగం లేదు కనుక సమాధానం ఇవ్వాల్సిన అవసరం రాలేదు. అయినా ఆయా సమయాలలో కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగాలు చేశారు. ఈసారి గవర్నర్ తమిళిసైకి, కేసీఆర్‌కు మధ్య విబేధాలు బాగా పెరగడం, చివరికి బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదం ఇవ్వకుండా నిలపడం, ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లడం, తదుపరి రెండు వర్గాలు రాజీపడటం జరిగాయి. ఆ తర్వాత గవర్నర్‌ను కేసీఆర్ సగౌరవంగానే ఆహ్వానించి, స్పీచ్ తర్వాత మర్యాదగానే వీడ్కోలు పలికారు. గవర్నర్ కూడా స్పీచ్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. కానీ, ఇప్పుడు కేసీఆర్ కాకుండా కేటీఆర్ సంబంధిత తీర్మానంపై జవాబు ఇవ్వడం సహజంగానే చర్చకు దారి తీస్తుంది. కేసీఆర్‌కు ఈ అంశంపై సభలో మాట్లాడడం ఇష్టం లేదని, అందువల్లే కేటీఆర్‌కు అవకాశం ఇచ్చారని కొందరు అంటున్నారు. ఒకవేళ సీఎం ప్రసంగించకపోతే, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి మాట్లాడవచ్చు. లేదా ఆర్ధిక మంత్రి, సీనియర్ అయిన హరీష్ రావుకు అప్పగించవచ్చు. కానీ.. కేటీఆర్‌తో మాట్లాడించడం ద్వారా కాబోయే సీఎం ఆయనే.. అన్న సంకేతాన్ని బలంగా ఇప్పించినట్లు అనుకోవచ్చు. ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కూడా ఇచ్చి పార్టీ పగ్గాలు ఇచ్చారు. పార్టీలో ఆయనకు పెద్దగా పోటీ లేకుండా వాతావరణం ఏర్పాటు చేశారు. కేటీఆర్ కూడా సమర్ధంగానే డీల్ చేస్తుంటారు. ప్రత్యేకించి తెలుగుతో పాటు, ఆంగ్లం, హిందీలలో అనర్గళంగా మాట్లాడగలరు. కేసీఆర్ కుటుంబానికి ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. కేటీఆర్ తమది కుటుంబ పాలన అంటూ, నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబం అని చెప్పడం ఆసక్తికరంగా ఉంది. కాకపోతే ఇక్కడ ఒక చిక్కు ఉంది. ప్రత్యర్దులు ఇకపై కేటీఆర్ తమది కుటుంబ పాలన అని ఒప్పుకున్నారు అనే వరకే తీసుకుని ప్రచారం చేసే అవకాశం ఉంది. అది వేరే విషయం. కేటీఆర్ తన ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వివిధ అబివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించడంతో పాటు, ప్రధాని మోడీపై, పారిశ్రామికవేత్త ఆదానీలపైన కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశం అంటే మోదీ, అదానీలేనా అని ప్రశ్నల వర్షం కురిపించారు. బీజేపీపై ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ దాడి చేస్తున్న నేపథ్యంలో సహజంగానే కేంద్రంపై ఘాటు వ్యాఖ్యలకు ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. కాగా, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీతో సంవాదం మాత్రం ఆశ్చర్యంగా ఉంది. నిజానికి బీఆర్ఎస్, ఎంఐఎంలు మిత్రపక్షాలుగానే ఉన్నాయి. 19 మంది ఉన్న కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా లేకుండా చేసి ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీకి ప్రతిపక్షనేత హోదాను బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించింది. ఆయా ఎన్నికలలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ రెండు పార్టీలు సహకరించుకుంటుంటాయి. అలాంటిది వచ్చే ఎన్నికలలో 50 సీట్లలో పోటీచేస్తామని, పదిహేను సీట్లతో శాసనసభలోకి వస్తామని అక్బర్ చెప్పినా అది నమ్మశక్యంగా లేదు. ఎంఐఎంకు హైదరాబాద్‌లో అది కూడా పాతబస్తీలోని ఏడు సీట్లలో తప్ప, మిగిలిన చోట్ల పెద్దగా బలం లేదు. కాకపోతే, ఆయా నియోజకవర్గాలలో కొంతమేర ఆ పార్టీకి ఓటర్లు ఉన్నారు. ఒకవేళ 50 సీట్లలో పోటీచేస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్న చర్చ కూడా జరుగుతోంది. కానీ, ఈ పరిణామానికి పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అంగీకరించవలసి ఉంటుంది. కేసీఆర్, అసద్‌ల మధ్య మంచి రాజకీయ ఈక్వేషన్ ఉంది. అసలు అక్బర్ విద్వేష ప్రసంగం కేసు నుంచి బయటపడటానికి ప్రభుత్వం ఎంతగా సాయపడిందో అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య వివాదం వస్తుందా అన్నది సందేహమే. పైకి ఇలా మాట్లాడినా.. లోపల అంతా బాగానే ఉండవచ్చన్న అభిప్రాయం ఉంది. అందువల్లే ఇదేదో మ్యాచ్ ఫిక్సింగ్ లాగా ఉందని కొందరు అనుమానిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలకన్నా ఎంఐఎం పార్టీనే ప్రతిపక్షం అన్న భావన కల్పించడం ఇందులోని అంతరార్ధం కావచ్చేమో. కేసీఆర్ దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అభివృద్దికి పర్యటించాలని భావిస్తున్నారు. ఒకవేళ కేంద్రానికి ఆయన వెళ్లాలనుకుంటే వచ్చే లోక్‌సభ ఎన్నికలలో పోటీచేసే అవకాశం ఉంటుంది. అప్పుడు కేటీఆర్ తప్పనిసరిగా ముఖ్యమంత్రి అవుతారని అనుకోవచ్చు. వచ్చే శాసనసభ ఎన్నికలలో బీఆర్ఎస్ గెలిస్తే ఈ పరిణామం జరగడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చు. - హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్. -
పవన్‌కు బాలకృష్ణ సర్టిఫికెట్ ఇస్తే జనం ఒప్పేసుకోవాలా!
తెలుగుదేశం హిందుపూర్ శాసనసభ్యుడు , ప్రముఖ నటుడు బాలకృష్ణ.. జనసేన అధినేత , మరో ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్‌లు అన్ స్టాపబుల్ అంటూ ఏమైనా మాట్లాడుకోనివ్వండి. ఆపకుండా నవ్వుకోనివ్వండి. ఎవరికి అభ్యంతరం లేదు. కానీ మధ్యలో ప్రజలను ఉద్దేశించి , లేదా సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టింగ్ లు చేసేవారి గురించి వాడిన భాష అభ్యంతరకరంగా ఉంది.ప్రత్యేకించి బాలకృష్ణ ఊరకుక్కల భాష వాడడం దారుణం.పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు గురించి ఎవరైనా మాట్లాడితే ఊరకుక్కలతో సమానం అట. అసలు ఊరకుక్కలు ఏమి చేస్తాయో ఆయనకు తెలుసా! వావి వరసలతో నిమిత్తం లేకుండా లైంగిక కార్యకలాపాలకు పాల్పడతాయని, రోడ్లపై ఇష్టారీతిలో సంచరిస్తాయని ఊరకుక్కలు అంటారు. ఏ రంగంలో ఎవరు ఇలా వ్యవహరిస్తారో ఇలాంటి చెత్త పనులు ఎక్కువగా చేస్తారో చెప్పుకుంటే సిగ్గుపోతుంది. మనకు సభ్యత అడ్డువస్తుంది.కాని అలాంటి వాటితో నిమిత్తం లేని వారుఏమైనా మాట్లాడగలరు. గతంలో ఇదే బాలకృష్ణ ఏమన్నారు. ఆడపిల్ల కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి. లేక...చేయాలి అని అన్నారు. ఆక్షేపణీయపు భాష వాడడం ఇష్టం లేక డాట్లు పెట్టాల్సి వచ్చింది. ఆడపిల్లల తండ్రి ఎవరైనా ఇలా మాట్లాడతారా? అంతేకాదు.. సినిమాలలో డబుల్ మీనింగ్ డైలాగులు, అర్ధనగ్న నృత్యాలు, అబ్జెక్షనబుల్ సన్నివేశాలు ఎన్ని కనిపిస్తుంటాయో, వాటిపై అప్పుడప్పుడు మహిళా సంఘాలు ఎందుకు ఆందోళనలు చేస్తుంటాయో ..ఇవేవి ప్రజలకు తెలియవా?కేవలం మూడు పెళ్లిళ్లు అని ప్రస్తావిస్తేనే ఊరకుక్కలతో సమానం అయితే పైన చెప్పినవాటిని ఏ మాత్రం సిగ్గుపడకుండా చేసేవారిని ఏమనవలసి వస్తుంది. తన ఇంటిలోనే ఇద్దరిపై కాల్పులు జరిపి తనకు మెంటల్ అని సర్టిఫికెట్ తెచ్చుకుని కేసునుంచి బయటపడ్డవారిని ఏమనాలి?సినిమాలతో పాటు రాజకీయాలలో ఉన్నవారు ఎంత బాధ్యతగా మాట్లాడాలి. సమాజంలో ఎంతో కొంత ప్రభావం చూపే వ్యక్తులు నోటికి వచ్చినట్లు మాట్లాడితే వారి అభిమానులు కూడా ఇలాగే తయారవ్వరా?సడన్ గా బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ పై రాజకీయ అవసరాల రీత్యా అభిమానం ఏర్పడవచ్చు. అంతకుముందు జనసేనవారిని ఉద్దేశించి అలగాజనం అని ,మరొకటి అని అన్నా , పవన్ కళ్యాణ్ పెద్దగా ఫీల్ కాకపోతే అది ఆయన ఇష్టం .కాని ఆయన మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడితే ఊరకుక్కలతో సమానం అంటే మాత్రం కచ్చితంగా చాలామంది బాదపడతారు. దానిపై అదే స్థాయిలో స్పందిస్తుంటారు. అందువల్లే సోషల్ మీడియాలో బాలకృష్ణపై విమర్శలు వెల్లువెత్తున్నాయట. పవన్‌కు బాలకృష్ణ సర్టిఫికెట్ ఇచ్చేస్తే జనం ఒప్పేసుకోవాలా! ఇక పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చూసినా చిత్రంగానే ఉంటాయి. అసలు ఇలాంటి ప్రశ్నలను అవాయిడ్ చేయవచ్చు.అయినా వారిద్దరూ కావాలని మాట్లాడుకున్నారు.తద్వారా అదేదో మూడు పెళ్లిళ్లు చేసుకోవడం తప్పుకాదు.. అది చాలా చిన్న విషయం అన్నట్లుగా వీరి సంభాషణ కనిపిస్తుంది.పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు కొత్త సంగతులు చెబుతుంటారు. వాటిలో నిజం ఉందో లేదో ఎవరికి అర్ధం కాదు. ఈసారి ఏకంగా ఆయన బ్రహ్మచారిగా ఉండాలని అనుకున్నానని, యోగ మార్గాన్ని అనుసరించాలని అనుకున్నా అని ఆయన చెప్పారు .కాని మూడు సార్లు పెళ్లి జరిగింది తనకేనా అనిపిస్తుందట. ఒకేసారి ముగ్గురిని పెళ్లి చేసుకోలేదని, ముగ్గురితో ఒకేసారి ఉండ లేదని ఆయన అంటూ పెళ్లిళ్లకు కారణాలు చెప్పారు. కాని ఇక్కడ కూడా ఆయన నిజం చెప్పలేకపోయారు. ఆయన యోగి అవుతాననుకున్నది నిజమా?కాదా అన్నది మనకు అనవసరం. ఒక పెళ్లి చేసుకుని మరో మహిళతో సహజీవనం చేశారన్నది ఆయనపై కొందరు చేసే అభియోగం. అది వాస్తవమా?కాదా? అన్నదానిపై ఆయన క్లారిటీ ఇస్తే ఆయనలోని నిజాయితీ ప్రజలకు కాకపోయినా, అభిమానులకు అయినా అర్దం అయ్యేది. విడాకులు ఇచ్చి పెళ్లిళ్లు చేసుకోవడం తప్పుకాదు. ఆయన అన్నది అంతవరకు వాస్తవమే. కాని అలా చేయలేదన్నది ఆయన ప్రత్యర్ధులు చేసే ఆరోపణ. ఇక పవన్ కళ్యాణ్ కొందరు విశిష్ట వ్యక్తుల పేర్లు ప్రస్తావిస్తూ, అంబేద్కర్, పూలె, తరిమెల నాగిరెడ్డి,రామ్ మనోహర్ లోహియా వంటివారు రచించిన పుస్తకాలు చదివానని అంటారు. ఏదైనా సందేహం తీర్చుకోవాలంటే ఆ పుస్తకాలపై ఆధారపడతారట. అసలు వారు రాసిననాటి పరిస్థితులకు ,ఇప్పటి పరిస్థితులకు సంబంధం ఉందా? 2019లో ప్రజారాజ్యం, 2014లో జనసేనను స్థాపించి టీడీపీ, బీజేపీలకు మద్దతు ఇవ్వడం, 2019లో బిఎస్పి, వామపక్షాలతో కలిసి పోటీచేయడం, తదుపరి బీజేపీవారిని బతిమలాడుకుని పొత్తు పెట్టుకోవడం. వీటన్నిటిలో ఆ ప్రముఖుల పుస్తకాలతో ఏమి సంబందం.పాపం..ఆ మహనీయులు జీవించి ఉంటే ఎంత క్షోభ పడేవారో! ఏదో ఒకటి చెప్పి తానేదో గొప్ప చదువరిని అని ప్రొజెక్టు చేసుకోవడం తప్ప మరొకటి కాదు. సిపిఐ సీనియర్ నేత చంద్రశేఖర్ టీవీలలో ఒక వ్యాఖ్య చేసేవారు. పవన్ కళ్యాణ్ ఎనభైవేల పుస్తకాలు చదవలేదని, వాటి అట్టలను మాత్రమే చూసి ఉంటారని పేర్కొన్నారు. మరి ఎవరు కరెక్టో వారే చెప్పాలి. అయితే ఒకటి మాత్రం వాస్తవం. తనకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురువు వంటివారని, ఆయనతో ఆయా అంశాలతో చర్చిస్తానని అన్నారు. ఏమి చర్చిస్తారో తెలియదు కాని, పవన్ కళ్యాణ్ ఆయన రాసిచ్చే డైలాగులనే సభలలో వాడుతుంటారని అంతా చెబుతుంటారు. కొంతలో కొంత ఇదైనా నిజం చెప్పినందుకు సంతోషించాలి. ఇలాంటి అన్ స్టాపబుల్ కార్యక్రమాలతో ఓటిటికి ఏమైనా లాభం కొంత ఉండవచ్చేమో కాని, రాజకీయంగా ప్రయోజనం అంతంతమాత్రమే అని చెప్పాలి. - హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్. -
టీడీపీ పతనమైందని లోకేష్ ఒప్పుకున్నట్టేనా?
తెలుగుదేశం శాసనమండలి సభ్యుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ఒక వ్యాఖ్య చేస్తూ నెల్లూరు నుంచే వైస్సార్సీపీ పతనం ప్రారంభమైందని అన్నారు. ఇది వినడానికి టీడీపీ వారికి బాగానే ఉన్నట్లు అనిపిస్తున్నా.. అదే సూత్రం ఆ పార్టీకి వర్తింపచేస్తే టీడీపీ ఇప్పటికే పతనమైపోయిందని వారే ఒప్పుకున్నట్లు అవుతుంది. ఎందుకంటే ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీకి దూరం అయితే పతనం అయిపోతే టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు మూడేళ్ల క్రితమే బయటకు వచ్చేశారు కదా!. మరి ఇప్పటికే పార్టీ పతనం అయిందని అంగీకరిస్తారా?. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినప్పటికీ వైఎస్సార్సీపీ, పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెక్కుచెదరలేదు. అదరలేదు.. బెదరలేదు. అలాంటిది ఇలాంటి ఉడత ఊపులకు ఉలిక్కిపడతారా!. నెల్లూరు రూరల్, వెంకటగిరి నియోజకవర్గాల శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిలు అసమ్మతిగళం విప్పడం పార్టీకి కొద్దిగా చికాకే కావచ్చు. కానీ, పార్టీ అదినాయకత్వం వెంటనే సర్దుబాటు చర్యలు తీసుకుంది. శ్రీధర్ రెడ్డి బదులు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర రెడ్డిని, రామనారాయణరెడ్డి స్థానంలో నేదురుమల్లి రాం కుమార్ రెడ్డిని నియోజకవర్గాల బాధ్యుయులుగా ప్రకటించింది. ఆదాల ప్రభాకర రెడ్డి ఒకప్పుడు తెలుగుదేశంలోనే ఉండేవారు. మంత్రి కూడా అయ్యారు. కానీ, అప్పట్లో టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో సరిపడక కాంగ్రెస్‌లోకి వచ్చారు. తదుపరి సోమిరెడ్డిని శాసనసభ ఎన్నికలలో ఓడించారు. విభజన సమయంలో కొంతకాలం టీడీపీలో ఉన్నా 2019లో వైఎస్సార్సీపీలో చేరి నెల్లూరు ఎంపీగా గెలుపొందారు. ఆయన మందీ మార్బలం ఉన్న నేతగా గుర్తింపు పొందారు. నెల్లూరు రూరల్‌లో ఆయన రంగంలోకి దిగడం వల్ల వైఎస్సార్సీపీ మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అత్యంత విధేయుడనని తనకు తానే ప్రకటించుకునేవారు. తాను చనిపోతే సీఎం జగన్ వచ్చి పార్టీ జెండా కప్పాలన్నదే తన కోరిక అన్నంతవరకు కూడా వెళ్లేవారు. ఇలాంటి మాటలను బహిరంగసభలలో పెద్ద స్వరంతో చెప్పేవారు. తాను మధ్య తరగతి కుటుంబీకుడిని అయినా సీఎం జగన్ చేరదీసి తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారని, ఆ విశ్వాసాన్ని ఎన్నటికీ మరువబోనని చెప్పేవారు. అలాంటి కోటంరెడ్డి రెండోసారి శాసనసభకు ఎన్నికయ్యాక మంత్రి పదవిపై ఆశ పుట్టింది. అందులో తప్పు లేదు. కానీ, వివిధ కారణాల రీత్యా ఆయనకు పదవి లభించలేదు. అంతమాత్రాన ఆయన ఇలా అవిధేయుడుగా మారతారని ఎవరూ ఊహించలేదు. నిజానికి శ్రీధర్ రెడ్డి అప్పడప్పుడు సంకేతాలు ఇవ్వకపోలేదు. అమరావతి రైతుల పేరుతో కొందరు చేసిన పాదయాత్రకు సంఘీభావం ప్రకటించడం, పార్టీ కార్యక్రమాలుగా కాకుండా సొంతంగా తన పేరుతోనే నియోజకవర్గంలో ప్రోగ్రాంలు పెట్టుకోవడం వంటివి చేశారు. అప్పుడప్పుడు అధికారులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు కూడా చేశారు. టీడీపీ నేతలు గతంలో కోటంరెడ్డిపై దౌర్జ్యన్యకారుడని, బెట్టింగ్ రాయుడని పలు ఆరోపణలు చేయడం, వాటిన ఆయన ఖండించడం జరిగేవి. ఒక మహిళా అధికారి పట్ల దురుసుగా వ్యవహరించిన అభియోగంపై కేసు నమోదు అయింది. ఇవన్ని ఎలా ఉన్నా ఇటీవలి కాలంలో టీడీపీ నేతలు ఆయనపై విమర్శలు చేయకుండా ఉండటం కూడా గమనించాల్సిన అంశమే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా ఆనం రామనారాయణరెడ్డిని మెచ్చుకోవడం కూడా గుర్తు చేసుకోవాలి. ఈ నేపథ్యంలో వీరిద్దరిని తమ ట్రాప్‌లోకి తెచ్చుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగానే వ్యవహరించారు. ప్రముఖ విద్యా సంస్థల అధినేత, అమరావతి భూ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కుంటున్న నారాయణతో ఆపరేషన్ నిర్వహించారన్న సమాచారం బయటకు వస్తోంది. ఆయన వీరిద్దరిని తమ ట్రాప్‌లోకి తెచ్చుకోగలిగారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్‌తో పాటు ఆర్థికవనరులు సమకూర్చే బాధ్యత ఆయన తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇంత జరుగుతున్నా వైఎస్సార్సీపీ నాయకులు కోటంరెడ్డి విషయంలో పెద్దగా అనుమానించలేదని అనుకోవాలి. అలా భావించి ఉంటే ఇటీవలే ముఖ్యమంత్రి జగన్.. ఆయనను పిలిచి మందలించేవారు కారు. అప్పుడే కొత్త ఇన్ఛార్జీని నియమించేవారు. కోటంరెడ్డి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంటూ ఆరోపణలు చేయడం సహజంగానే ప్రతిపక్షానికి ఒక అస్త్రం దొరికినట్లయింది. విశేషం ఏమిటంటే ఫోన్ ట్యాపింగ్‌లో ఆరితేరిన చంద్రబాబు నాయుడు దీని గురించి మాట్లాడటం. ఆయన వద్ద ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన అధికారి అప్పట్లో ఇజ్రాయిల్ సాఫ్ట్వేర్ కొనుగోలు చేసి విపక్షంపై నిఘా పెట్టాలని ప్రయత్నించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ కేసులోనే ఆయన సస్పెండ్ కూడా అయి కేసును ఎదుర్కొంటున్నారు. కోటంరెడ్డి విషయంలో ప్రభుత్వ నిఘా విభాగం అధినేత అనవసరంగా తనకు వచ్చిన ఒక సమాచార రికార్డును శ్రీధర్ రెడ్డికి పంపినట్లు అనిపిస్తుంది. ముందస్తు జాగ్రత్తగా ఆ అధికారి చెప్పబోతే, పరిస్థితిని అర్ధం చేసుకున్న కోటంరెడ్డి అప్రమత్తమై అన్ని విషయాలు బహిర్గతం అయిపోతున్నాయని భావించి ఈ ఆరోపణ చేసినట్లుగా ఉంది. మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ఈయన నారా లోకేష్‌తో ఎప్పటి నుంచో టచ్‌లో ఉన్నట్లు టీడీపీ నేతలే వెల్లడించారని చెప్పారు. అలాగే, చంద్రబాబుతో కూడా అన్నీ మాట్లాడుకునే ఈ ఆరోపణలు చేశారని అంటున్నారు. లేకుంటే టీడీపీ టిక్కెట్ వచ్చేస్తుందని ఎలా చెప్పగలుగుతారు?. ఇంతవరకు వైఎస్సార్సీపీని వీడలేదు.. టీడీపీలో చేరలేదు. అయినా, నియోజకవర్గంలో టీడీపీ పెత్తనం తనదే అయినట్లుగా అంటున్నారంటే ఆ పార్టీ ఎంత బలహీనంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నది సర్వత్రా ఉన్న అభిప్రాయం. పోనీ, ఆయన అనుకున్నట్లు వస్తే సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డినో, లేక ఏ ఇతర సీనియర్ నేతనో కాదని కోటంరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడానికి చంద్రబాబు ఒప్పుకున్నారా?. దీనిని ఆయన నమ్మగలరా?. అసలు సమస్య ఏమిటంటే ఈయన ప్రవర్తన తీరుతెన్నులు, ఇతర అంశాలపై పార్టీ నాయకత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు వస్తుంటాయి. వాటి ఆధారంగా 2024 ఎన్నికలలో టిక్కెట్ రాదన్న భావన ఈయనకు వచ్చి ఉండవచ్చు. గెలిచినా, ఓడినా రాజకీయాల్లో కొనసాగాలంటే ఏదో పార్టీ నుంచి పోటీచేయాలని నేతలు అనుకుంటారు. అందువల్లే కోటంరెడ్డి తన విధేయతను అవిధేయతగా మార్చుకుని ఉండవచ్చనిపిస్తుంది. అతిగా పొగిడే వారిని అంతగా నమ్మరాదనే లోకోక్తి కూడా ఉంది. అతి వినయం ధూర్త లక్షణం అంటారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గతంలో సీఎం జగన్‌ను అంతగా పొగిడింది తన పదవిపైన ఆశతోనే అన్న విషయం ఇప్పుడు స్పష్టమైంది. ఇలాంటి ఫిరాయింపుదారులు చరిత్రలో ఎంతో మంది కనిపిస్తారు. వారిలో అత్యధికులు రాజకీయంగా కనుమరుగైపోయిన ఘట్టాలే ఎక్కువ. - హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్. -
ఆ సందర్భాల్లో చంద్రబాబు ఇంగ్లీష్ స్పీచ్ విసుగు తెప్పించేదా?
ఢిల్లీలో జరిగిన ఏపీ ఇన్వెస్టర్స్ గ్లోబల్ మీట్ సన్నాహక సదస్సులో ముఖ్యమంత్రి జగన్ చేసిన స్పీచ్ కాని, అక్కడ పలువురు ప్రముఖులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు కాని గమనిస్తే ఏపీకి ఆశాజనక పరిస్థితులు ఏర్పడుతున్నాయనిపిస్తుంది. జగన్ ముఖ్యంగా ఆంగ్లంలో మాట్లాడిన తీరు ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని బాగా పెంచిందని చెప్పవచ్చు. గతంలో ఇలాంటి సందర్భాలలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చీరాని ఆంగ్ల భాషలో మాట్లాడుతుంటే వినేవారికి చాలా ఇబ్బందిగా ఉండేది. భాష పరిపూర్ణంగా రాకపోవడం తప్పుకాదు. కాని దానికి ప్రత్యామ్నాయంగా ఆయన రిటెన్ స్పీచ్ చదువుతుంటే సరిపోయేది. ఆయన అలా చేయకపోవడమే కాక, సుదీర్ఘంగా మాట్లాడుతుండేవారు. అది పెద్ద,పెద్ద పారిశ్రామికవేత్తలకు విసుగు తెప్పించేదని అంటారు. కాకపోతే మర్యాద కోసం భరించేవారని చెబుతారు. చంద్రబాబు తనకు అన్ని తెలుసునన్నట్లుగా వ్యవహరించేవారు. కాని జగన్ అలా కాకుండా చక్కటి ఆంగ్లంలో అందరిని ఆకట్టుకునేలా మాట్లాడారు. అది ఆయనకు ఉన్న అడ్వాంటేజ్ అని చెప్పారు. ఏపీలో ఉన్న అపార వనరులు, అవకాశాలు, ఈ మూడున్నరేళ్లలో ప్రభుత్వపరంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ వంటి వాటిలో నంబర్ వన్‌గా ఉండడం తదితర అంశాలను ఆయన ప్రస్తావించి పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునే యత్నం చేశారు. ఒక్క ఫోన్ కాల్ దూరంలో తాను అందుబాటులో ఉంటానని ఆయన అన్ని చోట్ల చెబుతున్నట్లుగానే ఇక్కడా చెప్పారు. మార్చి మొదటివారంలో విశాఖలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌కు అంతా రావాలని ఆయన ఆహ్వానించారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీకి కూడా ఆయన కృతజ్ఞత చెప్పడం ద్వారా తన మెచ్యూరిటీని ప్రదర్శించారు. తద్వారా కేంద్రంతో తనకు సత్సంబంధాలు ఉన్నాయన్న సంకేతం పంపించారు. ఈ కార్యక్రమానికి పారిశ్రామిక సంఘాల ప్రముఖులతో పాటు పలువురు దౌత్యవేత్తలు కూడా హాజరయ్యారు. ఈ సమావేశానికి ప్రాధాన్యత రాకూడదన్న దురుద్దేశంతో తెలుగుదేశం కాని, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఈనాడు వంటి పత్రికలు కాని సీఎం ఢిల్లీ టూర్‌ను వక్రీకరించడానికి యత్నించాయి. కడప ఎంపీ అవినాశ్‌రెడ్డిని సీబీఐ విచారణకు పిలిచిన నేపథ్యంలో జగన్ ఢిల్లీ వెళుతున్నారని ప్రచారం చేశారు. జగన్ తన విమానంలో సాంకేతిక లోపం ఏర్పడి వెనక్కి వచ్చి, మళ్లీ వెంటనే మరో విమానంలో ఢిల్లీ వెళ్లి, అక్కడ పూర్తి సమయం పారిశ్రామికవేత్తలతో గడిపారు. అదే కనుక ఈ సదస్సుతో పాటు జగన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను, ప్రధాని మోదీని కలిసి ఉంటే, ఇంకేముంది సీబీఐ కేసు గురించే అని విపరీత ప్రచారం చేసేవారు. కాని ఆయన ఎవరిని కలవకుండా హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ఈ సదస్సులో జగన్‌ను ఆయా ప్రముఖులు ప్రశంసించిన తీరును గమనించండి. జగన్ ముఖ్యమంత్రిగా ఉండడమే ఏపీకి పెద్ద ఆస్తి అని ఆసోచామ్ అధ్యక్షుడు సుమంత్ సిన్హా వ్యాఖ్యానించారంటేనే ఏపీలో పారిశ్రామిక ప్రగతికి ఏ రకమైన బాటలు పడుతున్నది అర్ధం చేసుకోవచ్చు. అదే చంద్రబాబును కనుక ఇలా మెచ్చుకుని ఉంటే టీడీపీ పత్రికలు బానర్ కథనాలు ఇచ్చి ఉండేవి. వ్యాపార విస్తరణలో ఏపీ ఉత్తమంగా ఉందని క్యాడ్ బరీ ఇండియా ప్రెసిడెంట్ పేర్కొన్నారు. తమ సంస్థ ఇక్కడ విస్తరణ చేస్తుందని కూడా ఆయన తెలిపారు. తమ పెట్టుబడులు రెట్టింపు చేస్తామని టోరే ఇండస్ట్రీస్ ఎండి ప్రకటించడం కూడా హర్షదాయకం. ఇలా ఒకరు కాదు.. అనేక మంది ప్రముఖులు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ప్రత్యేకించి గ్రీన్ ఎనర్జీకి ఏపీ ప్రధాన కేంద్రంగా మారుతోందని జగన్ వివరించారు. ఇలా ఆయా రంగాలకు సంబంధించి విశాఖలో పెట్టుబడుల సద్సులో అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. అప్పట్లో టీడీపీ పాలనలో విశాఖలో జరిగిన కొన్ని సదస్సులలో ఎవరిని పడితే వారితో ఒప్పందాలు చేసుకున్నట్లు చూపించారు. తీరా పరిశీలిస్తే అవన్ని ఉత్తిత్తి ఒప్పందాలుగా తేలాయి. చదవండి: సీఎం జగన్ స్పష్టమైన సంకేతం.. ఇక తగ్గేదేలే! ఇరవై లక్షల కోట్ల రూపాయల విలువైన పరిశ్రమలు రాబోతున్నాయని ఊదరగొట్టారు.. కాని వాటిలో వచ్చినవి అతి స్వల్పం అని చెప్పాలి. లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేశాయని కూడా ప్రచారం చేసేవారు. అవన్ని భ్రమలేనని ఆ తర్వాత అందరికి అవగాహన అయింది. అందువల్లే టీడీపీ దారుణంగా ఓటమిపాలైంది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక క్రమ పద్దతిలో పరిశ్రమల స్థాపనకు యత్నిస్తున్నారు. అందువల్లే ఈజ్ ఆఫ్ డూయింగ్ లో వరసగా మూడేళ్లు నెంబర్ ఒన్ స్థానంలో రాష్ట్రం ఉంది. టీడీపీ మీడియా ఎంతగా అడ్డుపడుతున్నా ఆయన మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గకుండా పరిశ్రమలను ఎంకరేజ్ చేస్తూ ముందుకు వెళుతున్నారు. పోర్టుల ఏర్పాటు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం, కొప్పర్తి పారిశ్రామికవాడ, గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లు, సెంచురి ప్లైవుడ్ ప్లాంట్, కాకినాడ వద్ద ఫార్మా హబ్ తదితర పలు పారిశ్రామిక సముదాయాలు ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో విశాఖ సమ్మిట్ కు నాందీగా జరిగిన ఈ సన్నాహక సదస్సు సఫలం అయిందని చెప్పడానికి ఎలాంటి సందేహం అవసరం లేదు. వీటన్నిటిని గమనిస్తే ఏపీకి పెద్ద ఎత్తున పెట్టబడులు వచ్చే అవకాశం ఉందన్న నమ్మకం కలుగుతోంది. వియ్ విష్ ఆంద్రప్రదేశ్ ఆల్ ద బెస్ట్ ! -హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్ -
CM YS Jagan: సీఎం జగన్ స్పష్టమైన సంకేతం.. ఇక తగ్గేదేలే!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంత పట్టుదలతో ఉంటారో మరోసారి రుజువైంది. తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరం అయిన విశాఖపట్నాన్ని రాజధానిగా ఎంపిక చేసుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని వేగవంతం చేయవచ్చన్న భావనతో ఉన్న జగన్ ఆ దిశగా ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చేశారు. విశాఖపట్నమే ఏపీ రాజధాని అని ఆయన డిల్లీలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్ సన్నాహక సదస్సులో పేర్కొన్నారు. రాబోయే నెలల్లో విశాఖ రాజధాని అవుతుందని, తాను విశాఖకు మారి అక్కడ నుంచే పాలన చేస్తానని ఆయన వెల్లడించారు. బహుశా ఈ మధ్యకాలంలో ఇంత క్లారిటీతో ఈ విషయాన్ని చెప్పడం ఇదే మొదటిసారి కావచ్చు. మూడేళ్ల క్రితం మూడు రాజధానుల అంశం ప్రకటించి సంచలనం సృష్టించిన జగన్ వివిధ కారణాలతో వెంటనే దానిని అమలు చేయలేకపోయారు. తెలుగుదేశం, జనసేన వంటి పక్షాలు ఇందుకు అడ్డపడడం, హైకోర్టుకు వెళ్లి మూడు రాజధానుల నిర్ణయానికి ఆటంకాలు సృష్టించడంతో, పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అప్పటికి మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకోవడం జరిగాయి. కాని అప్పుడే మళ్లీ కొత్త బిల్లును మరింత ప్రయోజనకరంగా, మూడు ప్రాంతాలకు ఉపయోగపడేలా తీసుకువస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వం అమరావతి పేరుతో విజయవాడ, గుంటూరు ల మధ్య గ్రామాలను రాజధానిగా ఎంపిక చేసుకుంది. అక్కడ లక్షల కోట్ల వ్యయం చేస్తేకాని రాజధాని నిర్మాణం పూర్తి చేయలేని పరిస్థితిని సృష్టించుకుంది. బలవంతంగా పలు చోట్ల రైతుల నుంచి భూములను సమీకరించింది. కొన్ని చోట్ల పంటలను కూడా దగ్దం చేసిందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. సుమారు ఏభైవేల ఎకరాలలో రాజధాని నిర్మాణం అంటే లక్షల కోట్ల వ్యయం చేయల్సి ఉంటుంది. తొలి దశలో లక్షా తొమ్మిదివేల కోట్ల రూపాయల మేర మౌలిక వసతుల కోసం వెచ్చించాలని అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారు. కాని కేంద్రం మాత్రం కేవలం 2500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఆచరణ సాధ్యం కాని ప్రతిపాదనలతో ఆయన హడావుడి చేశారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాల ప్రజలలో అమరావతిపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. చివరికి ఆ గ్రామాలు ఉన్న తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాలలో సైతం టీడీపీ ఓటమిపాలైంది. తదుపరి అదికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజధాని అంశంపై బోస్టన్ గ్రూప్ తో అధ్యయనం చేయించింది. ఆ తర్వాత నిపుణుల కమిటీని నియమించింది. అంతకుముందు కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ చేసిన సిఫారస్‌లను కూడా పరిగణనలోకి తీసుకుని విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా జగన్ సర్కార్ ప్రకటించింది. కాని దీనిని తెలుగుదేశం, జనసేన తదితర కొన్ని పక్షాలు వ్యతిరేకించాయి. అమరావతి రాజధానిని రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చడం, ఇన్ సైడ్ ట్రేడింగ్ వంటి ఆరోపణలు రావడం నెగిటివ్ పాయింట్లుగా మారాయి. అంతేకాక జాతీయ రహదారికి సుదూరంగా మారుమూల గ్రామాలలో రాజధాని నిర్మించాలన్న ఆలోచనపై వివిధ వర్గాలు పెదవి విరిచాయి. అక్కడకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని గత ప్రభుత్వం ఆశించినా, అందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపలేదు. దానికి కారణం అమరావతిలో నగర వాతావరణం లేకపోవడం, కాస్మొపాలిటన్ కల్చర్ కాకుండా, సామాజికవర్గ ఆధిపత్య ధోరణి ఉండడమే అని వేరే చెప్పనవసరం లేదు. అదే విశాఖ అయితే పెద్ద నగరం కావడం, అక్కడ ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండడం, కాస్మోపాలిటన్ కల్చర్, కులాల రొంపి పెద్దగా లేకపోవడం వంటివి అడ్వాంటేజ్‌గా మారాయి. అక్కడకు పెట్టుబడిదారులు రావడం, ఐటీ వంటి పరిశ్రమలు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తుండడం కూడా కలిసి వస్తోంది. గతంలో సైతం పెట్టుబడుల సదస్సులను విశాఖలోనే నిర్వహించేవారు. తద్వారా ఆ నగర ప్రాముఖ్యతను అప్పటి ప్రభుత్వం కూడా ఒప్పుకున్నట్లయింది. కాని విశాఖ నగరం అయితే తమ రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు దెబ్బతింటాయని తెలుగుదేశం పార్టీ ముఖ్యులు భావించి కృత్రిమ ఉద్యమం సృష్టించారు. కాని అది కాలక్రమేణా నీరుకారిపోయింది. తాజాగా మూడు రాజధానుల అంశం సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. అసలు చట్టం చేసే అధికారమే అసెంబ్లీకి లేదని ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వడం, అది కూడా చట్టం ఉపసంహరణ తర్వాత తీర్పు చెప్పడం ఆశ్చర్యం కలిగింది. దీనిపై గౌరవ అత్యున్నత స్థానం ఏమి చెబుతుందన్నది ఉత్కంఠ కలిగించే అంశం. చదవండి: లోకేష్ పాదయాత్రలో ఏం కనిపించింది?.. వర్కౌట్ అవుతుందా? ఈ నేపథ్యంలో జగన్ విశాఖను రాజధానిగా మరోసారి ఉద్ఘాటించడం ద్వారా తన ఆత్మ విశ్వాసాన్ని తెలియచెప్పారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో విశాఖ రాజధాని కావాలన్న ఆకాంక్ష బలంగా ఏర్పడింది. పలు చోట్ల ర్యాలీలు, సదస్సులు జరిగాయి. కాని విశాఖను రాజధాని కాకుండా అడ్డుకోవడానికి టీడీపీ, దాని అనుబంధ మీడియా విశ్వయత్నం చేస్తున్నాయి. అక్కడ ఎలాంటి అభివృద్దికి ప్రయత్నించినా, నిరోధించడానికి రకరకాల వ్యూహాలు పన్నుతున్నాయి. అయినా జగన్ ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. ఏపీ దిశ,దశను మార్చే ఈ నిర్ణయాన్ని ఎంత త్వరగా అమలు చేస్తే అంత మంచిదని చెప్పాలి. ఏప్రిల్ నాటికి విశాఖ నుంచి సీఎం పాలన చేస్తారని టీడీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా ప్రకటించారు. ఇదే సమయంలో అమరావతి ప్రాంతంలో శాసన సభ ను ఉంచడమే కాకుండా, అక్కడ అభివృద్ది పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. ఏది ఏమైనా జగన్ రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తున్న ఈ ప్రయత్నం సఫలం కావాలని ఆకాంక్షిద్దాం. -హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్