Immune System
-
స్ట్రాంగ్ రోగ నిరోధక శక్తికి సరిపోయే బూస్టర్స్ ఇవే..!
వాతావరణం మారుతోంది. ఇప్పుడే ఎండ... అంతలోనే చిటపట చినుకులు... రాత్రి అయేసరికి చలి.. ఈ పరిస్థితులలో దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లునొప్పులు వంటివి చాలామందికి సర్వసాధారణం. మన రోగ నిరోధక వ్యవస్థ సక్రమంగా ఉన్నంతవరకు మనల్ని ఏ రుగ్మతా ఏమీ బాధపెట్టలేదు. అయితే అలా మన ఇమ్యూన్ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ కొన్ని చిట్కాలు పాటించడం అవసరం. అవి మన వంటింట్లో సులువుగా దొరికే సహజసిద్ధమైనవైతే మరీ మంచిది. అలాంటి చిట్కాలేమిటో చూద్దాం...పొద్దున్నే లేచి బ్రష్ చేసుకోగానే ఆమ్లా, చియా సీడ్స్ వాటర్ తాగితే చాలామంచిది. ఈ జ్యూస్ తాగితే జీవక్రియలు సక్రమంగా జరగడం తోపాటు ఒంటికి సరిపడా సీ విటమిన్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి.క్రమం తప్పకుండా ఈ డ్రింక్ తాగుతుంటే కొద్దిరోజుల తర్వాత చర్మం పట్టులా నిగారించడంతోపాటు వాపులు, నొప్పులు తగ్గి, శరీరం తేలిక పడుతుంది. తిన్న ఆహారం చక్కగా ఒంటికి పడుతుంది. జుట్టు బాగా పెరుగుతుంది. కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. సుగర్ స్థాయులు అదుపులో ఉంటాయి. లివర్ పనితీరు బాగుంటుంది. కండరాలు దృఢపడతాయి. ఈ జ్యూస్ తయారీకి కావలసిందల్లా ముందుగా రెండు టీస్పూన్ల చియాసీడ్స్‌ను రాత్రిపూట నానబెట్టుకుని ఉంచుకోవాలి. పొద్దున లేవగానే చక్కగా కడిగి తరిగిన రెండు ఉసిరి కాయలను గింజలు తీసి రోటిలో వేసి దంచండి లేదా జ్యూసర్ లో అరగ్లాసు నీళ్లు కలుపుకుని రసం తీసి, వడ కట్టుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చియా సీడ్స్‌ను కలుపుకుంటే సరి! డ్రింక్ రెడీ!!(చదవండి: ‘నలుగురు కూతుళ్లేనా..’ కాదు డాక్టర్ డాటర్స్..!) -
నటి డైసీ రిడ్లీకి 'గ్రేవ్స్ వ్యాధి': ఎందువల్ల వస్తుందంటే..?
హాలీవుడ్ నటి, స్టార్ వార్స్ ఫేమ్ డైసి రిడ్లీకి 2023లో ఈ గ్రేవ్స్ వ్యాధి వచ్చినట్లు నిర్థారణ అయ్యింది. ఆమె ఇటీవలే తనకు వచ్చిన వ్యాధి గురించి ఉమెన్స్ హెల్త్ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. తాను 'గ్రేవ్స్ డిసీజ్' అనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు వివరించింది. ఇదొక "విచిత్రమైన అలసటగా" అభివర్ణించిది. ఇది శరీరమంతటా వ్యాపించి నిసత్తువుగా చేసేస్తుందంటూ బాధగా చెప్పుకొచ్చింది. అసలేంటి గ్రేవ్స్ వ్యాధి..?. ఎందువల్ల వస్తుందంటే..గ్రేవ్స్ వ్యాధి అంటే..?థైరాయిడ్ హార్మోన్ల అధిక ఉత్పత్తికి దారితీసే పరిస్థితిని హైపర్ థైరాయిడిజం అంటారు. ఈ పరిస్థితికి ఐరిష్ వైద్యుడు రాబర్ట్ గ్రేవ్స్ పేరు పెట్టారు. అతను 1800లలో తొలిసారిగా ఈ రుగ్మత గురించి వివరించాడు. గ్రేవ్స్ వ్యాధి అనేది స్వయం ప్రతిరక్షక ప్రతిస్పందన వల్ల వస్తుంది. ఇది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పొరపాటున థైరాయిడ్ గ్రంధిపై దాడి చేస్తుంది. దీంతో అధిక మొత్తంలో థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేసేందుకు కారణమవుతుంది. ఇప్పటి వరకు ఇలా ఎందుకు జరుగుతోందనేందుకు కారణాలు తెలియరాలేదు. ఇది కుటుంబ చరిత్ర, జన్యుపరిస్థితి, ఒత్తిడి వంటి వాటి కారణంగా వస్తుందని చెబుతుంటారు.లక్షణాలు:అలసట, బలహీనతవేగవంతమైన లేదా క్రమరహిత హృదయ స్పందనవణుకువిపరీతమైన ఆకలి, బరువు తగ్గడంఆందోళన, చిరాకు, మానసిక కల్లోలంతరచుగా ప్రేగు కదలికలుఉబ్బిన కళ్ళు (ఎక్సోఫ్తాల్మోస్), కళ్ల చుట్టూ ఉన్న మృదు కణజాలాల వాపుఇక్కడ నటి రిడ్లీ బరువు తగ్గడం, చేతి వణకు వంటి లక్షణాలు వచ్చినట్లు వివరించింది. ఈ అలసటను భరించలేని చిరాకుని కలిగిస్తుందని చెప్పుకొచ్చింది. ఆమె కొన్నేళ్లుగా శాకాహారి. ఈ రోగ నిర్థారణ తర్వాత నుంచి గ్లూటెన్ రహితంగా ఫుడ్ తీసుకోవడం మొదలుపెట్టినట్లు తెలిపింది. అంతేగాదు పలు ఆరోగ్య జాగ్రత్తులు తీసుకుంటున్నట్లు కూడా చెప్పింది. ప్రస్తుతం ఆమె ఆకుపంక్చర్, ఆవిరి స్నానాలు, క్రయోథెరపీ వంటివి తీసుకుంటోంది. ఈ వ్యాధిని జయించేందుకు కొద్దిపాటి వర్కౌట్ల తోపాటు మాససిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇచ్చేలా యోగా వంటి వాటిని చేస్తున్నట్లు వివరించింది. నిజానికి కొన్ని రకాల వ్యాధులు ఎందుకు వస్తాయనేందుకు ప్రత్యేక కారణాలు తెలియవు. అలాగే చికిత్స ఇది అని కూడా ఉండపోవచ్చు. అలాంటప్పుడూ మన రోజూవారి జీవనశైలిలో మార్పులు చేయడం, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం వంటి చిట్కాలతో ఎలాంటి వ్యాధినైనా జయించగలుగుతారు. ఈ నటి నుంచి స్పూర్తిగా తీసుకోవాల్సింది ఈ అంశాన్నే. ఏ వ్యాధి అయినా నయం అవ్వాలంటే మానసిక స్థైర్యం ఉంటేనే సాధ్యం అనేది గ్రహించాలి. (చదవండి: Monsoon Diet వర్షాకాలంలో తప్పనిసరిగా తినాల్సిన కూరగాయలివే..!) -
దోమ.. ప్రాణాంతకం! లాలాజలంలో వైరల్ ఆర్ఎన్ఏ గుర్తింపు
సాక్షి, అమరావతి: దోమ.. చూడటానికి చిన్నప్రాణే. కానీ.. ప్రపంచాన్ని వణికిస్తోంది. దోమను ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన ప్రాణిగా వర్జీనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ప్రకటించారు. రోగాలను మోసుకు రావడంలో ముందుండే దోమలు ఇప్పుడు మనిషి రోగనిరోధక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తున్నట్టు వెల్లడించారు. దోమ లాలాజలంలోని ఆర్ఎన్ఏ మానవ రోగ నిరోధక(ఇమ్యూనిటీ) వ్యవస్థను తీవ్రంగా నాశనం చేస్తున్నట్టు అధ్యయనంలో గుర్తించారు. సరికొత్త చికిత్సకు మార్గం దోమల ద్వారా సంక్రమించే వ్యాధులతో ఏటా ప్రపంచవ్యాప్తంగా 7.25 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో మలేరియాతో మరణించే వారి సంఖ్య 6 లక్షలు ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇక డెంగీ వ్యాధి బారిన పడుతున్న వారు 400 మిలియన్ల మంది ఉంటున్నారు. తీవ్రమైన జ్వరం, వాంతులు, చర్మంపై మచ్చలు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని సందర్భాలలో అంతర్గత రక్తస్రావంతో పాటు కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. డెంగీ వైరస్‌కు పూర్తిస్థాయిలో చికిత్స అందుబాటులోకి రాలేదని, డెంగీ లక్షణాలను తగ్గించే వైద్య పద్ధతులను మాత్రమే అనుసరిస్తున్నట్టు వర్జీనియా శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. ప్రస్తుత అధ్యయనం ద్వారా డెంగీ చికిత్సకు, ఔషధాల తయారీకి కొత్త మార్గం లభించినట్టయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. వెలుగులోకి కొత్త విషయాలు ఇటీవల వర్జీనియా శాస్త్రవేత్తలు డెంగీ వైరస్‌పై పరిశోధనలు చేయగా.. కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. దోమల లాలాజలంలోని వైరల్ ఆర్ఎన్ఏ మనిషిలోని రోగ నిరోధక వ్యవస్థను అడ్డుకుంటున్నట్టు తేలింది. వర్జీనియా విశ్వవిద్యాలయానికి చెందిన బయోకెమిస్ట్ తానియా స్ట్రిలెట్స్ నేతృత్వంలోని బృందం మూడు వేర్వేరు విశ్లేషణ పద్ధతుల ద్వారా దోమ సెలైవా(లాలాజలం)పై అధ్యయనం చేశారు. ఇందులో నిర్దిష్ట రకమైన వైరల్ ఆర్ఎన్ఏ (రిబోన్యూక్లియిక్ యాసిడ్)ను గుర్తించారు. ఇందులో ‘ఎక్స్ట్రా సెల్యులర్ వెసికిల్స్’ అని పిలిచే మెంబ్రేన్ (పొర) కంపార్ట్మెంట్లలో సబ్ జెనోమిక్ ఫ్లేవివైరల్ ఆర్ఎన్ఏ (ఎస్ఎఫ్ ఆర్ఎన్ఏ) ద్వారా డెంగీ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని గుర్తించారు. వైరస్ ఇన్ఫెక్షన్ స్థాయిని ఎస్ఎఫ్ ఆర్ఎన్ఏ పెంచిందని బృందం ధ్రువీకరించింది. ఇది దోమ లాలాజలంలో ఉంటుందని, మనిషి రోగ నిరోధక శక్తిని ఎస్ఎఫ్ ఆర్ఎన్ఏ శక్తివంతంగా అడ్డుకుంటోందని తానియా స్ట్రిలెట్స్ వెల్లడించారు. ఈ సబ్ జెనోమిక్ ఫ్లేవివైరల్ ఆర్ఎన్ఏను కీటకాల ద్వారా సంక్రమించే జికా, ఎల్లో ఫీవర్ వంటి రోగాల్లో కూడా గుర్తించారు. దోమ కుట్టినప్పుడు డెంగీ ఉన్న లాలాజలాన్ని శరీరంలోకి చొప్పిస్తుందని, దాన్ని అడ్డుకునేందుకు మానవ శరీరంలో ఉండే రోగనిరోధక వ్యవస్థ చేసే దాడిని లాలాజలంలోని ఎస్ఎఫ్ ఆర్ఎన్ఏ అడ్డుకుంటోందని తేల్చారు. -
మీకు తెలుసా?
పాలు అనగానే సాధారణంగా గేదెపాలు లేదా ఆవుపాలే అందరికీ తెలుసు. అయితే ఇటీవల గాడిదపాలు, మేకపాలు కూడా కొందరు తాగుతున్నారు. ఇవే కాదు, కొబ్బరిపాలు కూడా ఉన్నాయి. పచ్చికొబ్బరిని కోరి లేదా ముక్కలు చేసి తగినన్ని నీళ్లు చేర్చి రుబ్బి, వడపోయడం ద్వారా కొబ్బరిపాలను తయారు చేయవచ్చు. కొబ్బరిపాలను తాగడం ద్వారా చాల ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాం... ♦ ఆవు పాలకు సమానమైన పోషకాలను కలిగి ఉంటాయి. ♦ యాంటీ వైరల్ గుణాలు సమృద్ధిగా ఉండటంతో రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. ♦ శరీరంలో ఏర్పడే ఒత్తిడి తగ్గించడంతో పాటు కీళ్ల నొప్పులకు మందులా పనిచేస్తాయి. ♦ ఫాస్ఫరస్, కాల్షియం వంటి పోషకాలు ఉండడంతో దంతాలు, ఎముకలు బలంగా మారతాయి. మీ పిల్లలు మామూలు పాలు తాగడానికి మొగ్గు చూపనప్పుడు ఒకసారి కొబ్బరిపాలను పట్టించడానికి ప్రయత్నించండి. మంచి ఫలితం ఉంటుంది. -
చిన్నారుల్లో నిమోనియా!
చిన్న పిల్లల్లో నిమోనియా చాలా సాధారణంగా కనిపించే ఊపిరితిత్తుల వ్యాధి. మరీ ముఖ్యంగా ఐదేళ్ల కంటే వయసు తక్కువ చిన్నారుల్లో ఇది ఎక్కువగానే కనిపిస్తుంది. పెద్దల్లో వ్యాధి నిరోధక వ్యవస్థ బాగా పనిచేస్తుంటుంది కాబట్టి కాస్త తట్టుకుంటారు. కానీ పిల్లల్లో ఇమ్యూనిటీ అంతే పటిష్టంగా ఉండకపోవడం వల్ల ఒక్కోసారి ఇది ్రపాణాంతకమూ అయ్యే అవకాశముంది. ఇప్పుడున్న వైద్యపరిజ్ఞానంతో దీన్ని తేలిగ్గా తగ్గించవచ్చు కాబట్టి దీని పట్ల అవగాహన ముఖ్యం. బ్యాక్టీరియా, వైరస్, ఫంగై... ఇవన్నీ నిమోనియాకు కారణమవుతాయి. లక్షణాలు : నిమోనియా వల్ల పిల్లలందరిలోనూ ఒకేలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. ఏ కారణంగా నిమోనియా వచ్చిందనే అంశాన్ని బట్టి లక్షణాలు మారుతుంటాయి. సాధారణంగా కనిపించే లక్షణాలివి... ♦ దగ్గు వస్తుంటుంది. ఇది తెమడ/గళ్లను ఉత్పత్తి చేస్తుండటం వల్ల తడిదగ్గు ఎక్కువ. ♦ తీవ్రమైన జ్వరం. ♦ ఆకలి తగ్గిపోతుంటుంది. ♦ తీవ్రమైన అలసట, నీరసం, ♦ కొందరు పిల్లల్లో వాంతులు, విరేచనాలూ కావచ్చు. వైరల్ నిమోనియాలో ఊపిరి తీసుకోవడం కష్టం కావడం, ఆయాసం, ఊపిరి తీసుకుంటున్నప్పుడు శబ్దం రావడం (వీజింగ్) క్రమంగా కనిపిస్తాయి. బ్యాక్టీరియా కారణంగా వచ్చే నిమోనియా కంటే వైరల్ నిమోనియా ప్రమాదకరం. పిల్లల్లో వణుకు, ఆయాసం, తలనొప్పి, అయోమయం కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. నిర్ధారణ : ♦ ఛాతీ ఎక్స్‌రే, ♦ కొన్ని రక్తపరీక్షలు ♦ కళ్లె పరీక్ష ♦ సీటీ స్కాన్ (ఛాతీది) ♦ అవసరాన్ని బట్టి అరుదుగా బ్రాంకోస్కోపీ, ఊపిరితిత్తుల్లో నీరు చేరితే దాన్నీ పరీక్ష చేస్తారు. సెకండరీ నిమోనియా : పిల్లల్లో ఇంకేదైనా వ్యాధి (ముఖ్యంగా వైరల్ జ్వరాలు) వచ్చాక, అది నిమోనియాకు దారితీస్తే దాన్ని సెకండరీ నిమోనియా అంటారు. ఇది కాస్తంత ప్రమాదకరం. అందుకే హాస్పిటల్లో ఉంచి చికిత్స అందించాలి. ఇందులో తీవ్రతను బట్టి రక్తనాళం ద్వారా లేదా నోటి ద్వారా యాంటీబయాటిక్స్ ఇవ్వడం, సెలైన్ ఎక్కించడం, ఆక్సిజన్ ఇవ్వడం, పిల్లలు తమంతట తాము కళ్లె / గళ్ల తీయలేరు కాబట్టి వారు దాన్ని ఊసేసేలా వివరించి చెప్పడం, బాగా ఊపిరితీసుకోగలుగుతున్నారా అని చూడటం జరగాలి. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో చిన్నారులను తప్పనిసరిగా హాస్పిటల్లో ఉంచి చికిత్స అందించడం మేలు. నివారణ : ఇప్పుడు 13 రకాల నిమోనియాలకు తగిన వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ♦ అందరు పిల్లలకు ప్రతి ఏడాదీ ఫ్లూ వ్యాక్సిన్ వేయించాలి. వర్షాకాలానికి ముందు (ప్రీ–మాన్సూన్ పీరియడ్‌లో) ప్రతి ఏడాదీ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి. ♦ వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా పిల్లలకు శిక్షణ ఇవ్వడం, బాగా దగ్గుతున్న పెద్దలు, రోగగ్రస్తుల వద్దకు పిల్లలను కాస్త దూరంగా ఉంచడం, చాలాకాలం పాటు ధాన్యం నిల్వ ఉంచే గరిసెలకు, కోళ్ల వంటి పెంపుడు పక్షులకు పిల్లలను దూరంగా వంటి జాగ్రత్తలతో నిమోనియాను కొంతవరకు నివారించవచ్చు. అయితే పిల్లల్లో ఆగకుండా దగ్గు వస్తూ, ఆయాసం వస్తున్నప్పుడు ఒకసారి హాస్పిటల్లో చూపించి, తగిన చికిత్స తీసుకోవడమే మేలు. చికిత్స: బ్యాక్టీరియా వల్ల వచ్చే నిమోనియా మంచి యాంటీబయాటిక్స్‌తో తేలిగ్గా తగ్గిపోతుంది. అయితే వైరల్ ఇన్ఫెక్షన్తో నిమోనియా వస్తే దానికి నిర్దుష్టంగా మందులు లేకపోయినా కొన్నిసార్లు యాంటీవైరల్ మందులు ఇస్తారు. ఇలాంటి పిల్లలకు పుష్కలంగా నీళ్లు తాగించడం, గది కాస్తంత సౌకర్యంగా ఉండటంతో పాటు అందులో తగినంత తేమ ఉండేలా చూడటం, జ్వరం, దగ్గు వంటివి తగ్గడానికి లక్షణాలను బట్టి (సింప్టమాటిక్) చికిత్స ఇవ్వడం వంటివి చేస్తారు. - డా. శాశ్వత్ మొహంతీ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ అండ్ పీడియాట్రీషియన్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్, విశాఖపట్నం. ఫోన్ : 8882 730 730 www.rainbowhospitals.in -
క్యాన్సర్‌ను చంపే ‘ముసుగు మందు’..!
క్యాన్సర్‌కు చేసే చికిత్సలు చాలా కష్టంగా అనిపిస్తుంటాయి. దానికి కారణమూ ఉంది. క్యాన్సర్‌కు వాడే కీమో మందులైనా, రేడియేషన్ ఇచ్చినా... క్యాన్సర్ కణాలతో పాటు ఎన్నో కొన్ని / ఎంతో కొంత ఆరోగ్యకరమైన కణాలూ దెబ్బతింటాయి. చికిత్స తర్వాత సైడ్ఎఫెక్ట్స్ ఎలాగూ ఉండనే ఉంటాయి. ఆఖరికి శస్త్రచికిత్స చేసినా సరే... మళ్లీ పెరగకుండా ఉండేందుకు కొంత మార్జిన్ తీసుకుని, క్యాన్సర్ గడ్డకు ఆనుకుని ఉన్న మంచి కణాలనూ కొంతమేరకు తొలగిస్తుంటారు. చివరకు వ్యాధి నిరోధకతను పెంచడం ద్వారా క్యాన్సర్ కణాలనే నశింపజేసి, బాధితుల ఆయుష్షును పెంచే ఇమ్యూనోథెరపీల విషయంలోనూ ఇలాంటి నష్టం ఎంతో కొంతమేర జరుగుతుంది. ఒకవేళ మంచి కణాలకు ఏమాత్రం హాని చేయకుండా, కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే వెదికి వెదికి పట్టి తుదముట్టించే చికిత్స ప్రక్రియను కనుగొంటే ఎలా ఉంటుందన్న ఆలోచన చాలామంది శాస్త్రవేత్తల్లో ఉన్నప్పటికీ... యూనివర్సిటీ ఆఫ్ షికాగోకు చెందిన ప్రిట్జ్కర్ స్కూల్ ఆఫ్ మాలెక్యులార్ ఇంజనీరింగ్‌కు చెందిన కొంతమంది పరిశోధకులు ఓ ప్రయత్నం చేశారు. దాని ఫలితమే ఈ ముసుగు మందు!! దాని వివరాలివి... ముసుగు మందు పని తీరు ఇది క్యాన్సర్ కణాలకూ, ఆరోగ్యకరమైన కణాలకూ ఓ తేడా ఉంది. ఆరోగ్యకరమైన కణాలు క్రమపద్ధతిలో, నియమిత వేగంతో మాత్రమే పెరుగుతాయి. కానీ క్యాన్సర్ కణాల పెరుగుదల ఓ పద్ధతి లేకుండా చాలా వేగంగా కొనసాగుతుంది. ఇలా పెరగడానికి కొన్ని ఎంజైములు ఉత్పత్తి అవుతుంటాయి. కానీ అదే ఆరోగ్యకరమైన కణాలతో ఈ ఎంజైముల ఉత్పత్తి పరిమితంగా ఉంటుంది. ఈ తేడాలనే మరింత సురక్షితమైన ‘ఐఎల్–12’ వర్షన్‌ను రూపొందించడానికి శాస్త్రవేత్త లు ఉపయోగించుకున్నారు. దీని ఆధారంగా విపరీతంగా ప్రవర్తించే ఈ ‘ఐఎల్–12’ కణాలకు ఓ ‘మాలెక్యులార్ ముసుగు’ తొడిగారు. అవి క్యాన్సర్ గడ్డను చేరేవరకు వాటిపై ఆ ముసుగు అలాగే ఉంటుంది. చాలా వేగంగా ఉత్పత్తయ్యే కణజాలం ఎంజైములు తగిలినప్పుడు ఆ ముసుగు తొలగిపోతుంది. అంటే ఆ ఎంజైమే ఈ ముసుగును ఛిద్రం చేస్తుంది. అంటే... ‘ఐఎల్–12’ కణాలు క్యాన్సర్ గడ్డను చేరగానే ముసుగు తొలగిపోతుందన్నమాట. అక్కడ అవి తమ తీవ్రతా, వైపరీత్యం వంటి గుణాన్ని కోల్పోకుండా... అక్కడే తమ ప్రభావాలను చూపుతాయి. ఫలితంగా అక్కడ కిల్లర్ టీ–సెల్స్‌ను విపరీతంగా పెరిగేలా చేస్తాయవి. దాంతో క్యాన్సర్ గడ్డపై మాత్రమే ఆ తీవ్రత ప్రభావం తీక్షణంగా ఉంటుంది. మిగతా ఆరోగ్యకరమైన కణాలు సురక్షితంగా ఉంటాయి. ఒక క్లినికల్ పరీక్షలో ఈ అంశాన్ని ప్రయోగాత్మకంగా చూశారు. ‘ట్రోజెన్ డ్రగ్ డెలివరీ’ అనే కొత్త చికిత్సగా... ముసుగు వేసుకుని... లక్ష్యాన్ని చేరాక అక్కడ తీవ్రస్థాయిలో ప్రభావవంతంగా జరిగే ఈ చికిత్సనే ‘ట్రోజెన్ డ్రగ్ డెలివరీ’గా కూడా అభివర్ణిస్తారు. తమ యుద్ధతంత్రంలో భాగంగా... ఓ పెద్ద చెక్క గుర్రాన్ని తయారు చేసి, అందులో రహస్యంగా సైనికులను నింపి ఉంచి... శత్రువులకు బహూకరించాక... అందులోంచి ఒక్కపెట్టున సైనికులు వచ్చి దాడి చేసిన‘ట్రోజన్ వార్’ కథ తెలిసిందే. అందుకే ఈ చికిత్స ప్రక్రియకు ఆ పేరు పెట్టారు. అయితే... ఎంత ముసుగు వేసుకుని పోయినా కొన్నిసార్లు ఇది కొన్నిచోట్ల (మైక్రో ఎన్విరాన్మెంట్లో) అక్కడి కణాల కన్నుకప్పలేకపోవచ్చు. ఆ ఇబ్బందిని గనక అధిగమిస్తే... ఇమ్యూనోథెరపీనీ, కార్–టీ సెల్ థెరపీ (కైమరిక్ యాంటీజెన్ రీకాంబినెంట్ టీ సెల్ థెరపీ)ని... రెండింటినీ కలగలుపుకున్న ఈ థెరపీ మరింత సమర్థంగా రూపొందే అవకాశం ఉందనేది నిపుణుల భావన. అదే జరిగితే (జరిగే అవకాశాలే ఎక్కువ) ఇది తిరుగులేని చికిత్సగా ఆవిర్భవిస్తుందన్నది వైద్యశాస్త్రవేత్తలూ, నిపుణుల మాట. క్యాన్సర్ కణంపై రోగనిరోధక వ్యవస్థ పని చేసేదిలా! మన రోగనిరోధక వ్యవస్థలో సైటోకైన్స్ అనే ప్రోటీన్లు ఒక్కసారిగా దాడి చేసి హానికారక కణాలను తుదముట్టించడానికి ప్రయత్నిస్తాయి. ఈ ప్రయత్నంలో భాగంగా సైటోకైన్లు... తెల్లరక్తకణాల్లో ఒక రకానికి చెందిన ‘కిల్లర్ టీ–సెల్స్’ను పెద్ద ఎత్తున ప్రేరేపిస్తాయి. అప్పుడా ‘కిల్లర్ టీ–సెల్స్’ క్యాన్సర్ కణాలపై దాడి ప్రారంభిస్తాయి. ఈ దాడి ప్రభావపూర్వకంగా ఎలా జరగాలన్న అంశంపై ఈ సైటోకైన్ ప్రోటీన్లే... ‘కిల్లర్ టీ–సెల్స్’కు శిక్షణ అందిస్తాయి. ఇలా అవి క్యాన్సర్ కణాలనూ, గడ్డలనూ ఎదుర్కొని వాటిని సమూలంగా నాశనం చేయడానికి ప్రయత్నిస్తాయి. ఇలాంటి సైటోకైన్లలో ఒక రకమే ‘ఇంటర్‌ల్యూకిన్–12’. దీన్ని సంక్షిప్తంగా ‘ఐఎల్–12’ అని కూడా అంటారు. వాటి ప్రభావం ఇలా ఉంటుంది... ఐఎల్– 12ను కనుగొని దాదాపు 30 ఏళ్లయ్యింది. కానీ వీటిని చికిత్సలో ఉపయోగించినప్పుడు అవి వాపు, మంట కలిగించే అంశాలనూ పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తాయి. అంటే ఇన్ఫ్లమేటరీ మాలెక్యుల్స్ను పుట్టిస్తాయి. ఇవి దేహంలోని ఇతర కణాలను, ముఖ్యంగా కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. అందుకే... వీటిని ఉపయోగించాక కలిగే అనర్థాలూ, దుష్ప్రభావాల కారణంగా, ముఖ్యంగా కాలేయం వంటి కీలక అవయవాలకు జరిగే నష్టాల వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని... ఎఫ్‌డీఏ వీటిని చికిత్స ప్రక్రియలకు అనుమతించలేదు. ఆనాటి నుంచి శాస్త్రవేత్తలు ఒక ప్రయత్నాన్ని మొదలు పెట్టారు. క్యాన్సర్ కణాల పట్ల ఈ ‘ఐఎల్–12’ కణాల ప్రభావం తగ్గకూడదు. కానీ దేహం తట్టుకోగలిగేలా వాటిని రూపొందించాలి. ప్రయోగాత్మకంగా రెండు కేస్–స్టడీలివి... రొమ్ముక్యాన్సర్ వచ్చిన కొందరు బాధితులను పరిశీలించగా... సాధారణంగా ఇమ్యూనోధెరపీలో ఉపయోగించే ‘చెక్‌పాయింట్ ఇన్హిబిటార్’తో కేవలం 10 శాతం ఫలితాలు కనిపించగా... ఈ ‘మాస్క్డ్ ఐఎల్–12’తో 90 శాతం ఫలితాలు కనిపించాయి. ఇక ఒక పెద్దపేగు (కోలన్) క్యాన్సర్ కేస్–స్టడీలో ఈ ‘మాస్క్డ్ ఐఎస్–12’తో 100 శాతం ఫలితాలు కనిపించడం మరో విశేషం. డాక్టర్ సురేష్. ఏవీఎస్. మెడికల్ ఆంకాలజిస్ట్ -
యాంటీబయాటిక్స్ అతి వాడకంతో.. ముప్పే
బర్మింగ్‌హామ్: కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లు చిన్నచిన్న నలతలకు సైతం యాంటీబయాటిక్స్ వాడుతూ పోతే చివరకు పెను ప్రమాదం కొనితెచ్చుకుంటారని సైంటిస్టులు హెచ్చరిస్తునే ఉన్నారు. అతిగా యాంటీబయాటిక్స్ వాడితే రోగనిరోధవ్యవస్థలో లోపాలు ఏర్పడతాయని, దీంతో ప్రమాదకరమైన ఫంగల్ వ్యాధులు సోకే ప్రమాదం పెరుగుతుందని తాజాగా మరో నూతన అధ్యయనం వెల్లడించింది. చిన్నపాటి వ్యాధి నుంచి ప్రమాదకరమైన ఇన్వాసివ్ కాండిడియాసిస్ సోకేందుకు కాండిడా అనే ఫంగస్ కారణం. ఈ ఫంగస్ సోకేందుకు యాంటీ బయాటిక్స్ అతివాడకం కూడా ఒక కారణమని యూనివర్సిటీ ఆఫ్ బిర్మింగ్‌హామ్ పరిశోధకులు గుర్తించారు. యాంటీబయాటిక్స్‌ను ఎక్కువగా వాడితే జీర్ణవాహికలోని ప్రయోజనకరమైన బాక్టీరియా(ప్రొబయాటిక్స్) నశిస్తాయి. దీంతో ఈ బాక్టీరియా స్థానంలో జీర్ణవాహికలో జీవనం సాగించే కాండిడా వంటి ఫంగి చేరతాయని పరిశోధన వెల్లడించింది. ఇదే సమయంలో సదరు వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగినా లేదా కీమోథెరపీ లాంటి చికిత్స తీసుకున్నా జీర్ణవాహిక నుంచి ఈ ఫంగి రక్త ప్రవాహంలోకి ప్రవేశించి కాండిడియాసిస్ను కలిగిస్తుంది. ఐసీయూలో పేషెంట్లకు అతిగా యాంటీబయాటిక్స్ అందిస్తే కేథటర్ నుంచి కూడా ఈ ఫంగస్ రక్తంలోకి సోకే ప్రమాదముందని తేలింది. ప్రయోగ వివరాలు యాంటీబయాటిక్స్ వాడకంతో ఫంగల్ వ్యాధులు సోకే అవకాశాలు పెరగడంపై పరిశోధనలో భాగంగా ముందుగా ఎలుకలకు యాంటీబయాటిక్ మిశ్రమాన్ని ఇచ్చారు. అనంతరం ఈ ఎలుకలకు కాండిడా ఫంగస్ సోకేలా చేశారు. మరో సమూహం ఎలుకలకు యాంటీబయాటిక్స్ ఇవ్వకుండా కేవలం ఫంగస్‌ను సోకేలా చేశారు. అనూహ్యంగా యాంటీబయాటిక్స్ వాడిన ఎలుకల్లో ఫంగస్ ఎక్కువ ఇన్ఫెక్షన్ కలిగించినట్లు కనుగొన్నారు. సాధారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్లు సోకిన జీవుల్లో మూత్రపిండాలు బలహీనపడతాయి, దీంతో ఆ జీవులు అనారోగ్యం పాలవుతుంటాయి. ఈ ప్రయోగంలో ఎలుకలను మూత్రపిండాల బలహీనత కన్నా యాంటీబయాటిక్స్ మిశ్రమమే ఎక్కువ అనారోగ్యాన్ని కలిగించినట్లు గుర్తించారు. ఎలుకల్లోని సహజసిద్ధ యాంటీ ఫంగల్ ఇమ్యూన్ రెస్పాన్స్‌ను అది దెబ్బతీసిందని విశ్లేషించారు. రక్తంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ను గుర్తించే సైటోకైన్స్ అనే ప్రోటీన్ల ఉత్పత్తిని ఈ యాంటీబయాటిక్స్ తగ్గించాయి. దీంతో ఫంగస్ ఇన్ఫెక్షన్ను ఎదుర్కొనే రోగనిరోధకత ఈ ఎలుకల్లో తగ్గిపోయిందని తెలిసింది. సైటోకైన్స్‌ను విడిగా ఔషధ రూపంలో అందిస్తే యాంటీబయాటిక్ వల్ల ఫంగల్ వ్యాధులు సోకిన వారిలో మెరుగుదల ఉంటుందని నిపుణులు తెలిపారు. వాంకోమైసిన్ వల్ల ఫంగస్ ఇన్ఫెక్షన్ పెరిగే ప్రమాదం అధికమని గుర్తించారు. -
ఆ ఆలోచనతో 30 శాతం మరణం ముప్పు తగ్గుతుంది: హార్వర్డ్ పరిశోధన
‘‘సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా...’’ అన్నాడో కవి. సంతోషం సగం బలమే కాదు.. పూర్తి మనోబలం అంటున్నారు శాస్త్రవేత్తలు. పొద్దునలేస్తే వాట్సాప్‌లో ‘పాజిటివ్ థింకింగ్’కోట్స్... యూట్యూబ్, షేర్‌చాట్ అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ ‘బీ పాజిటివ్’అంటూ వీడియోస్. చుట్టూ ఇన్ని సమస్యలు పెట్టుకుని ఈ పాజిటివ్ గోలేంట్రా!? అని అనుకోని వారుండరు. ‘ఎవరెన్నైనా అనుకోనివ్వండి ఆలోచన అనేది మానసికంగానే కాదు.. శారీరక ఆరోగ్యంపైనా ప్రభావం చూపిస్తుంది. ఆలోచన బాగుంటే చాలు... అంతా బాగుంటుంద’న్నది శాస్త్రవేత్తల మాట. అందులో నిజానిజాలేంటో నేడు ‘వరల్డ్ థింకింగ్ డే’ సందర్భంగా తెలుసుకుందాం. ‘ఆశ... క్యాన్సర్ ఉన్నవాడినైనా బతికిస్తుంది. భయం.. అల్సర్ ఉన్నవాడినైనా చంపేస్తుంది’అని ఓ సినిమాలో డైలాగ్. అది నిజమేనంటున్నారు శాస్త్రవేత్తలు. పెట్టుకునే ఆశ అయినా... పెంచుకునే భయం అయినా... ప్రభావితం చేసేది బ్రెయిన్. మనం ఏది చెప్తే అదే స్వీకరించే బ్రెయిన్.. శరీర భాగాలు అలాగే స్పందించేలా చేస్తుంది. ఏదైనా జబ్బుతో డాక్టర్ దగ్గరకు వెళ్తే.. ఆయన మిమ్మల్ని రిసీవ్ చేసుకున్న తీరు, ట్రీట్ చేసిన విధానం నచ్చకపోతే ఫలితం ఒకలా ఉంటుంది. చికిత్స ఇద్దరిదీ ఒకటే అయినా... డాక్టర్ రిసీవ్ చేసుకున్న విధానం, మీతో మాట్లాడిన తీరు, మీకిచ్చిన భరోసా బాగుంటే... అదే సగం జబ్బును తగ్గిస్తుంది. డాక్టర్ నుంచి వచ్చిన స్పందన, దాంతో వచ్చిన సంతృప్తి తాలూకు ఫలితం అది. ఇదే చాలా విషయాలకూ వర్తిస్తుందని సైంటిస్టులు అంటున్నారు. మరణం ముప్పు తగ్గుతుంది... సంతోషంగా సానుకూల దృక్పథంతో ఉంటే.. క్యాన్సర్ ముప్పును 16 శాతం తగ్గించుకోవచ్చు. హృద్రోగాలతో మరణించే రిస్క్‌ను 38 శాతం తగ్గించొచ్చు. శ్వాస సంబంధిత జబ్బుల మర ణాలనుంచీ 38% బయటపడొచ్చు. గుండెపోటుతో మరణించే రిస్క్‌ను 38% తగ్గించొచ్చు. ఇతర ఇన్ఫెక్షన్ల బారి నుంచి 52 శాతం తప్పించుకోవచ్చని అధ్యయనం వెల్లడించింది. సానుకూల ఆలోచనకు సంతోషానికి, ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉందని హార్వర్డ్ బృందం తెలిపింది. ఈ సానుకూల ధోరణి శరీరంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించి, యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలను పెంచుతుందట. అలాగే రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇవన్నీ కలిపి.. వివిధ జబ్బుల రిస్క్ నుంచి కాపాడతాయి. అవుట్‌కమ్ మీద ఆలోచనల ప్రభావం... కీడెంచి మేలెంచాలని సామెత. ఎప్పుడూ మేలే ఎంచాలనేది పాజిటివ్ థింకింగ్ థియరీ. ‘ఏదైనా చేయగలననుకుంటే.. మెదడు అటువైపు నడిపిస్తుంది. చేయలేననుకుంటే.. నీరుగారుస్తుంది’ అని న్యూజిలాండ్ విక్టోరియా యూనివర్సిటీకి చెందిన సైకాలజిస్టులు చెబుతున్నారు. ఇదేమీ మ్యాజిక్కాదు... ఆలోచనలే ఆచరణమీద ప్రభా వం చూపి అవుట్‌కమ్‌ను ప్రభావితం చేస్తాయట. యవ్వనం, ఫిట్నెస్కూడా మైండ్ గేమే అంటున్నారు. అయితే ప్రతీదానికి పాజిటివ్ ఉండమంటూ... మనిషిలో ప్రశ్నించే తత్వాన్ని దూరం చేస్తున్నారనే మరో వాదనా ఉంది. ఎనిమిదేళ్ల ఆయుష్షు... ఆలోచనలు సానుకూల దృక్పథంతో ఉంటే... అంత ఎక్కువ కాలం బతుకుతారని ఓ అధ్య య నం తేల్చి చెప్పింది. ఆలోచనా విధానం బాగుంటే చావును ఎనిమిదేళ్లు వాయిదా వేయొచ్చట. ఆలోచనా దృక్పథం ఆయుష్షును ఎనిమిదేళ్లు పెంచుతుందని శాస్త్రవేత్తల బృందం తెలిపింది. అం దులోనూ మహిళల్లో ఈ ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయని తేల్చి చెప్పింది. అందుకే... రోగులకు మంచి ఆహారం తీసుకోమని, వ్యాయామం చేయమని చెప్పడమే కాదు.. వారిని సానుకూల ఆలోచనలను వైపు నడిపించా లని పరిశోధక బృందానికి నాయ కత్వం వహించిన డాక్టర్ ఎరిక్కిమ్ వైద్యులకు సూచిస్తున్నారు. వాటివల్ల అనేక ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు. హార్వర్డ్ ఈ పరిశోధనను 70వేల మంది మహిళల మీదే జరిపినా... పురుషులకూ ఇదే వర్తిస్తుందని అంటున్నారు. వివిధ జబ్బులతో బాధపడుతున్న మహిళలను కొన్నేళ్లపాటు పరీక్షించగా.. సానుకూల దృక్పథంతో ఉన్నవారిలో మరణం ముప్పు 30% తగ్గిందట. -
‘ఫ్లొరోనా’కలకలం..! లక్షణాలివే..
Pregnant woman in Israel was found to be infected with ‘florona’: ఓ వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యావత్తు ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న తరుణంలో ఇజ్రాయెల్‌లో మరో కొత్త రకం వ్యాధి కలకలం రేపుతోంది. అక్కడ తొలి ‘ఫ్లొరోనా’ కేసు నమోదయ్యినట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం గురువారం మీడియాకు వెల్లడించింది. ఓ గర్భిణీ స్త్రీలో మొదటి కేసు వెలుగు చూసినట్లు తెలిపింది. ఐతే ఆమె ఇంతవరకూ వ్యాక్సిన్ వేయించుకోలేదని స్పష్టం చేసింది. ఇది కొత్త రకం వెరియంట్ కాదని, ఒకే సమయంలో ఫ్లూ, కోవిడ్లకు చెందిన రెండు రకాల వైరస్లు శరీరంలోకి ప్రవేశించడం వల్ల రోగనిరోధకత వ్యవస్థ విచ్ఛిన్నమై ఫొరోనా సోకి ఉండవచ్చని ఇజ్రాయెల్ వైద్యులు తెలిపారు. అంతేకాకుండా గత కొన్ని వారాలుగా దేశంలో ఇన్‌ఫ్లూయెంజా కేసులు పెరుగుతున్నాయని, ఈ క్రమంలో అది ఉద్భవించి ఉండవచ్చని పేర్కొన్నారు. దీంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై, కొత్త వ్యాధి వ్యాప్తి కట్టడికి పూనుకుంది. ఇమ్యునిటీ వ్యవస్థను బలపరిచేందుకు శుక్రవారం నుంచే కోవిడ్ 19 నాలుగో డోస్ వ్యాక్సిన్లు వేయడం ప్రారంభించింది. అలాగే అనారోగ్యంతో ఉన్న వృద్ధులకు కూడా కరోనా వ్యాక్సిన్ వేసేందుకు అనుమతించింది. ఇక మూడో డోస్ వేసి 4 నెలలు గడుస్తున్న కారణంగా రోగనిరోధకత తగ్గిన వ్యక్తుల కోసం బూస్టర్ డోస్‌లు వేసున్నామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ నాచ్మన్ యాష్ పేర్కొన్నారు. కాగా ఇజ్రాయెల్ దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. అక్కడి వైద్య శాఖ తాజా గణాంకాల ప్రకారం ఒక్క గురువారం నాడే 5000 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏమిటీ ఫ్లొరోనా? ఫ్లొరోనా అనేది కోవిడ్, ఇన్‌ఫ్లూయెంజా వైరస్లు ఒకే సమయంలో శరీరంలో ప్రవేశించడం వల్ల ఏర్పడిన డబుల్ ఇన్ఫెక్షన్. ఫ్లొరోనా వ్యాధి లక్షణాలివే.. ఫ్లొరోనా వ్యాధి తాలూకు లక్షణాలు కొంత ప్రమాదకరస్థాయిలో ఉన్నట్లు డేటా తెలుపుతోంది. ఐతే కోవిడ్-19 లక్షణాలతోపాటు గుండె కండరాలలో నొప్పి/మంట వంటి అదనపు లక్షణాలు కనిపిస్తాయి. అలాగే న్యుమోనియా, ఇతర శ్వాసకోశ సమస్యలతోపాటు, మయోకార్డిటిస్‌కు కూడా దారితీయవచ్చు. సరైన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోకపోతే రోగి మృతి చెందే ప్రమాదం కూడా ఉంది. ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి? వ్యాధి తీవ్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్‌తో పాటు ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ సిఫార్సు చేస్తోంది. ఈ వ్యాధిని ఎదుర్కోవడంలో రోగనిరోధకత పాత్ర ఏమిటి? రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటే ఫ్లొరోనా ఇన్ఫెక్షన్ తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇమ్యునిటీని పెంపొందించుకునేందుకు బూస్టర్ డోసులు వేసుకోవడంతోపాటు, ఇతర జాగ్రత్తలు కూడా విధిగా పాటించాలని సూచిస్తున్నారు. చదవండి: Omicron: ‘ఆస్పత్రుల సామర్థ్యాన్ని తక్షణమే పెంచండి... ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేం!’ -
Covid Alert: 70 రెట్లు వేగంతో వ్యాపిస్తున్న ఒమిక్రాన్! నిపుణుల హెచ్చరికలు..
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90 దేశాల్లో ఒమిక్రాన్ ఉధృతి కొనసాగుతోంది. ఏడాది ప్రారంభంలో గరిష్ఠ స్థాయిలో మారణహోమాన్ని రగిలించిన కోవిడ్ రెండో వేరియంట్ డెల్టాప్లస్ కంటే కూడా ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ శర వేగంగా విస్తరిస్తోంది. ఐతే తాజా అధ్యయనాల ప్రకారం త్వరలో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతాయని, వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి మూడో వేవ్ తాకే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దేశం మొత్తంలో 200 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఐతే డెల్టా ప్లస్ కంటే ఒమిక్రాన్ 70 రెట్లు వేగంగా వ్యాపిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ హాంగ్ కాంగ్ అధ్యయన నివేదిక వెల్లడించింది. అంతేకాదు రోగనిరోధక వ్యవస్థపై దాడిచేసి పతనంచేస్తుందని, రానున్న కాలంలో మరిన్ని వేరియంట్లు ఉద్భవించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటివరకూ వెలుగుచూసిన ఒమిక్రాన్ కేసుల్లో గొంతు నొప్పి, అలసట వంటి తేలికపాటి లక్షణాలు మాత్రమే బయటపడ్డాయి. ఇంట్లోనే తగు జాగ్రత్తలతో కోలుకుంటున్నారు కూడా. దేశంలో ఇప్పటివరకూ ఒక్క ఒమిక్రాన్ మృతి నమోదవ్వనప్పటికీ, అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం సంభవించడంతో యావత్ ప్రపంచం భయాందోళనల్లో ఊగిసలాడుతోంది. చదవండి: ఈ దగ్గుమందు చాలా ప్రమాదకరమైనది, పిల్లలందుకే మృతి చెందారు: డీజీహెచ్ఎస్ -
కరోనాకు ‘కత్తెర’ పడినట్టే!.. సరికొత్త చికిత్స అందుబాటులోకి
ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మందిని గడగడలాడిస్తున్న కరోనాకు ‘కత్తెర’ పడే టైం వచ్చేస్తోంది. కరోనా ఎన్ని కొత్త రూపాంతరాలు మార్చుకున్నా.. ఎన్నిమార్పులు చేసుకున్నా దొరకబుచ్చుకుని అంతం చేసే సరికొత్త చికిత్స అందుబాటులోకి రానుంది. అత్యంత ఆధునికమైన జన్యు ఎడిటింగ్ టెక్నాలజీతో కోవిడ్‌కు చెక్‌పెట్టే దిశగా ఈ పరిశోధనలు జరుగుతున్నాయి. ఒక్క కరోనా అనే గాకుండా చాలా రకాల వైరస్‌లను ఈ విధానంలో నిర్మూలించవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరి ఈ పరిశోధన వివరాలు ఏమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ రూపు మార్చుకుంటూ.. భయపెడుతూ.. కరోనా వ్యాప్తి మొదలై ఏడాదిన్నర దాటింది. ఇప్పటికే రెండు వేవ్‌లతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఇబ్బందిపెట్టి.. లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. ఎప్పటికప్పుడు రూపు మార్చుకుంటూ పంజా విసురుతోంది. శాస్త్రవేత్తలు పగలూరాత్రీ కష్టపడి వ్యాక్సిన్లను అభివృద్ధి చేసినా.. వాటి ప్రభావం నుంచి, మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునే సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ఇలాంటి సమయంలో మళ్లీ ప్రపంచవ్యాప్తంగా కేసులు,మరణాలు పెరుగుతుండటంతో అలజడి మొదలైంది.కరోనాను పూర్తిస్థాయిలో ని ర్మూలించే చికిత్సలపై అందరిదృష్టిపడింది.ఈ క్ర మంలోనే ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ యూనివర్సి టీ ఇన్ఫెక్షన్ అండ్ ఇమ్యూనిటీ ఇన్స్టిట్యూట్, పీటర్ మెకల్లమ్ కేన్సర్‌సెంటర్ శాస్త్రవేత్తలు ‘క్రిస్పర్ క్యాస్’ సాంకేతికతతో కోవిడ్‌కు చెక్‌పెట్టే పరిశోధన చేపట్టారు. కరోనా మూలంపైనే టార్గెట్.. కోవిడ్ వైరస్‌లో అంతర్గతంగా జన్యు పదార్థం ఉండి.. దానిచుట్టూ కొన్ని ప్రొటీన్లు, ఆపై కొవ్వు పదార్థంతో కూడిన పొర, దానిపై స్పైక్ ప్రొటీన్లు ఉంటాయి. కరోనా వ్యాక్సిన్లుగానీ, ప్రస్తుతం చికిత్సలో వాడుతున్న యాంటీవైరల్ మందులుగానీ.. వైరస్‌లోని స్పైక్ ప్రొటీన్, మరికొన్ని ఇతర ప్రొటీన్లను టార్గెట్ చేస్తాయి. మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ కూడా వీటినే లక్ష్యంగా చేసుకుంటుంది. అయితే కరోనా వైరస్.. ఈ ప్రొటీన్లలో మార్పులు చేసుకుని, కొత్త వేరియంట్లుగా మారుతుండటంతో.. వ్యాక్సిన్లకు, మందులకు చిక్కడం లేదు. ఈ నేపథ్యంలోనే వైరస్‌లో మార్పు చెందకుండా ఉండే జన్యు పదార్థంపై నేరుగా దాడి చేసే చికిత్సపై మెల్బోర్న్ వర్సిటీ శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు. ఏమిటీ ‘క్రిస్పర్ క్యాస్’? భూమ్మీద జీవులన్నింటికీ మూలాధారం జన్యువులే. ఒక రకంగా చెప్పాలంటే.. మనకు మెదడు ఎలాంటిదో, ప్రతి కణానికి డీఎన్ఏ పదార్థం అలాంటిది. ఆ కణం ఏమిటి? దాని విధులు ఏమిటి? కణంలోని భాగాలు ఏయే పనులు చేయాలి? ఏం ఉత్పత్తి చేయాలి? ఎలా వ్యవహరించాలి అన్నది జన్యువులే చూసుకుంటాయి. బ్యాక్టీరియాల వంటి సూక్ష్మజీవులు మొదలుకుని చెట్లు, జంతువులు, మనుషులు సహా అన్నిజీవుల కణాల్లో ఈ డీఎన్ఏ ఉంటుంది. ఇలాంటి జన్యువుల్లో మార్పులు, చేర్పులు చేయడం ద్వారా కణాల విధులు, లక్షణాల్లో మార్పులు తేవొచ్చు. ఇందుకు తోడ్పడే అత్యాధునిక సాంకేతికతనే ‘క్రిస్పర్ క్యాస్’. ఇందులో క్రిస్పర్ అనే వ్యవస్థ ద్వారా ‘క్యాస్–9’ అనే ఎంజైమ్ ఎంజైమ్‌ను ఉపయోగించి.. డీఎన్ఏను కత్తిరించడం, అందులోని ఏదైనా భాగాన్ని తొలగించడం, మరేదైనా భాగాన్ని కలపడం చేస్తారు. ఈ ‘క్రిస్పర్ క్యాస్9’ విధానాన్ని అభివృద్ధి చేసిన ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలు.. మ్యాక్స్‌ప్లాంక్ యూనిట్ ఆఫ్ సైన్స్‌కు చెందిన ఎమ్మాన్యుయెల్ చార్పింటర్, కాలిఫోర్నియా వర్సిటీ ప్రొఫెసర్ జెన్నిఫర్ దౌడ్నాలకు 2020 రసాయన శాస్త్ర నోబెల్ రావడం గమనార్హం. కరోనా జన్యు పదార్థాన్ని ముక్కలు చేసేలా.. జీవుల్లో జన్యుపదార్థం ‘డీఎన్ఏ’ రూపంలో ఉంటుంది. వైరస్లు పూర్తిస్థాయి జీవులు కాదు. వాటిలో ‘ఆర్ఎన్ఏ’ రూపంలో ఉంటుంది. క్యాస్9 ఎంజైమ్‌లు డీఎన్ఏను మాత్రమే కత్తిరిస్తాయి. దీంతో మెల్బోర్న్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఆర్ఎన్ఏను కత్తిరించగలిగే.. ‘క్యాస్13బీ’ ఎంజైమ్‌ను అభివృద్ధి చేశారు. ల్యాబ్‌లో కరోనాపై ప్రయోగించి చూశారు. ►‘‘ఈ ప్రయోగంలో కరోనా వైరస్‌ను గుర్తించిన ‘క్యాస్13బీ’ ఎంజైమ్.. దాని ఆర్ఎన్ఏకు అతుక్కుని, వైరస్ పునరుత్పత్తికి తోడ్పడే భాగాలను కత్తిరించేసింది. వేర్వేరు కరోనా వేరియంట్లపైనా ప్రభావవంతంగా పనిచేసింది’’ అని పరిశోధనకు నేతృ త్వం వహించిన శాస్త్రవేత్త షరోన్ లెవిన్ తెలిపారు. వ్యాక్సిన్ కాదు.. చికిత్స.. కరోనాకు మ్యూటేషన్ చెందే సామర్థ్యం ఎక్కువని, భవిష్యత్తులో వ్యాక్సిన్ల ప్రభావం తగ్గిపోతుందని షరోన్ లెవిన్ అభిప్రాయపడ్డారు. అందువల్ల కరో నా సోకిన తర్వాత అందించే చికిత్స కీలకమన్నారు. ప్రస్తుతం తాము రూపొందించినది ఒక రకంగా యాంటీ వైరల్ చికిత్స అని తెలిపారు. దీన్ని జంతువులపై ప్రయోగించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని.. తర్వాత మానవ ప్రయోగాలు చేపడతామన్నారు. ►క్రిస్పర్ క్యాస్ విధానం ద్వారా ఒక్క కరోనా మా త్రమేగాకుండా చాలా రకాల వైరస్‌లకు చెక్‌పెట్టవచ్చని షరోన్ తెలిపారు. ఇప్పటికే కేన్సర్, హెచ్ఐవీలను ఈ విధానంలో నియంత్రించేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయని వెల్లడించారు. -
స్త్రీ శక్తికి కరోనా సలామ్..!
స్త్రీ శక్తి స్వరూపిణి.. ఆడది అబల కాదు సబల.. అని పెద్దలు ఊరికే అనలేదు. ఈ మాటలను నిజం చేస్తున్నాయి తాజా పరిశోధనలు. రోగాల బారిన పడిన సందర్భాల్లో మగవారి కన్నా ఆడవారిలో అధిక రోగ నిరోధకత కనిపిస్తుందని పలు అధ్యయనాలు ప్రకటించాయి. తాజాగా కరోనా సైతం మహిళల్లో ఎక్కువ ప్రభావం చూపలేదని, మగవారిపై మాత్రం విరుచుకుపడుతోందని అమెరికాలోని యేల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన పరిశోధన చెబుతోంది. ఈ వివరాలను సైన్స్ సిగ్నలింగ్ జర్నల్‌లో ప్రచురించారు. లండన్: కరోనా వైరస్ సోకినప్పుడు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ స్పందించే తీరు ఆడవారిలో, మగవారిలో వేర్వేరుగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు కరోనా సోకిన ఆడవారి కన్నా మగవారిలో లక్షణాలు ఎక్కువగా ఉంటాయని, చనిపోయే అవకాశం కూడా మగవారిలో అధికమని అధ్యయనం వెల్లడించింది. ఇమ్యూన్ రెస్పాన్స్‌కు సంబంధించిన ఒక మెటబాలిక్ పాత్వే మగవారిలో మాత్రమే కనిపించిందని తెలిపింది. కోవిడ్ పేషెంట్లలో ఆడవారితో పోలిస్తే మగవారిలో కైనూరెనిక్ యాసిడ్ స్థాయిలు అధికంగా ఉన్నట్లు పరిశోధన పేర్కొంది. ఈ యాసిడ్ ఎల్– ట్రిప్టోపాన్ అనే అమైనో ఆమ్ల జీవక్రియ(మెటబాలిజం)లో ఉత్పత్తి అయ్యే ఒక మెటబొలైట్(మెటబాలిజంలో ఉత్పన్నమయ్యే పదార్థం). నియాసిన్ అనే న్యూట్రియంట్ తయారవడంలో ఈ యాసిడ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ యాసిడ్ స్థాయిలు అధికంగా ఉంటే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు భావిస్తారు. ‘‘ఒక వ్యాధి సోకినప్పుడు శరీరంలో జరిగే బయోకెమికల్ మార్పులను అవగాహన చేసుకోవడం అవసరం. అప్పుడే సదరు వ్యాధికి కచ్చితమైన ఔషధాన్ని తయారు చేయగల మార్గాన్ని చేరగలం’’ అని పరిశోధకుల్లో ఒకరైన నికోలస్ రాట్రే చెప్పారు. తమ పరిశోధనను మరింత విస్తృతీకరించడం ద్వారా ఒక్కో మనిషి ఇమ్యూన్ వ్యవస్థను అర్ధవంతంగా విశ్లేషించవచ్చన్నారు. ఈ అధ్యయనం కోసం 22 మంది ఆడ, 17మంది మగ కోవిడ్ బాధితుల నుంచి రక్త నమూనాలు తీసుకున్నారు. అనంతరం 20 మంది వ్యాధి సోకనివారి నమూనాలతో వీటిని పోల్చి అధ్యయనం చేశారు. సుమారు 75 మెటబొలైట్స్‌ను సైంటిస్టులు ఈ పరిశోధనలో గమనించారు. వీటిలో 17 మెటబొలైట్స్ కరోనా వ్యాధితో సంబంధం కలిగిఉన్నట్లు, వీటిలో కైనూరెనిక్ యాసిడ్ స్థాయిలు మగ పేషెంట్లలో అధికంగా ఉండటాన్ని గుర్తించారు. ఆడవారిలోనే టీ సెల్స్ అధికం కోవిడ్ వచ్చిన మగ పేషెంట్లతో పోలిస్తే ఆడ పేషంట్లలో టీ సెల్ యాక్టివేషన్ అధికమని యేల్ యూనివర్సిటీ పరిశోధన నిరూపించింది. మనిషి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో ఈ టీసెల్స్ కీలక పాత్ర పోషిస్తాయి. బీ సెల్స్ లాగా ఇవి యాంటీబాడీలను ఉత్పత్తి చేయవు కానీ, నేరుగా హోస్ట్ కణాలను నాశనం చేస్తాయి. ఇదే సమయంలో ఇతర ఇమ్యూనిటీ కణాలను యాక్టివేట్ చేస్తాయి. వయసు పెరిగే కొద్దీ మగ కోవిడ్ పేషంట్లలో ఈ టీసెల్ రెస్పాన్స్ క్షీణిస్తోందని, కానీ ఆడ పేషెంట్లలో వయసుతో సంబంధం లేకుండా టీసెల్ యాక్టివిటీ ఉందని అధ్యయనం తెలిపింది. పరిశోధన కోసం 98 మంది ఆడ, మగ పేషెంట్ల నుంచి శాంపిల్స్ సేకరించారు. వ్యాధి ముదిరేకొద్దీ సైటోకైన్స్ పెరగడంతో సైటోకైన్ స్ట్రోమ్ అనే అవలక్షణం మగ పేషెంట్లలో మొదలైందని,దీంతో ఊపిరితిత్తుల్లో ద్రవాలు పెరగడం, ఆక్సీజన్ స్థాయిలు తగ్గడం, అవయవాలు పనిచేయకపోవడం వంటి సమస్యలు వచ్చాయన్నారు. ఆడ పేషెంట్లలో అధికంగా టీసెల్స్ పెరిగాయన్నారు. మగవారిలో టీసెల్స్ తక్కువగా విడుదల కావడంతో వారిలో వ్యాధి మరింత ముదిరిందని, ఆడవారిలో టీసెల్స్ యాక్టివిటీ పెరగడంతో వ్యాధి ముదరడం మందగించిందని గుర్తించారు. ఇమ్యూనిటీ రెస్పాన్స్ ఎక్కువ మానవ ఆవిర్భావం నుంచి పురుషుల్లో కన్నా మహిళల్లో వైరస్, బ్యాక్టీరియాలు కలిగించే వ్యాధులను ఎదుర్కొనే ఇమ్యూన్ రెస్పాన్స్ ఎక్కువని అధ్యయనాలు వివరిస్తున్నాయి. ఇందుకు కారణం ఎక్స్ క్రోమోజోములని గుర్తించారు. స్త్రీలలో ఎక్స్ ఎక్స్ అని రెండు క్రోమోజోములంటాయని, మగవారిలో ఒక ఎక్స్, ఒక వై క్రోమోజోమ్ ఉంటుందని తెలిసిందే! ఆడవారిలో ఉండే డబుల్ ఎక్స్ క్రోమోజోమ్ వారిలో బలమైన ఇమ్యూన్ రెస్పాన్స్‌కు కారణమని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. దీనికితోడు ఆడవారిలో విడుదలయ్యే ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్లు ఇమ్యూన్ రెస్పాన్స్‌ను ప్రోత్సహిస్తాయని గమనించారు. ఫ్లూ వ్యాక్సిన్లు తీసుకున్న తర్వాత ఫ్లూ వైరస్‌కు గురైన మహిళల్లో మగవారి కన్నా రెండింతల యాంటీబాడీలు విడుదలవడం సైతం గుర్తించారు. మహిళల్లో రోగనిరోధకత అధికంగా ఉండడం మంచిదే కానీ కొన్ని కేసుల్లో ఈ ఓవర్ ఇమ్యూనిటీ వల్ల కొందరు ఆటో ఇమ్యూన్ వ్యాధుల బారిన పడే ప్రమాదాలున్నాయని సైంటిస్టులు వివరించారు. అందువల్లే ప్రపంచంలో మగవారి కన్నా ఆడవారు ఎక్కువగా ఇలాంటి ఆటో ఇమ్యూన్ వ్యాధుల బారిన పడుతుంటారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
ఎంతో కీలకమైన బాడీ క్లాక్ గురించి ఈ విషయాలు తెలుసా?
రాత్రి, పగలు తేడా లేకుండా శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ నిరంతరం పహారా కాస్తుంటుందని, ఎలాంటి చొరబాటు (వ్యాధి)పైనైనా వెంటనే స్పందిస్తుందని అందరం అనుకుంటాం! కానీ ఇటీవలి పరిశోధనలు ఇమ్యూనిటీ వ్యవస్థ పనితీరు రాత్రి ఒకలాగా, పగలు ఒకలాగా ఉంటుందని అలాగే టీకా ప్రభావం కూడా తీసుకున్న సమయాన్ని బట్టి తేడాగా ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం జీవ గడియారం లేదా బాడీ క్లాక్... అసలేంటీ బాడీ క్లాక్? ఇమ్యూనిటీపై దీని ప్రభావమేంటి? టీకా తీసుకునే సమయాన్ని బట్టి ప్రభావం మారుతుందా? చూద్దాం... బాడీ క్లాక్ లేదా జీవ గడియారం.. మనిషిలో ఒక్క రోజులో రూపుదిద్దుకోలేదు. ప్రస్తుత బాడీ క్లాక్ రూపొందడానికి లక్షల సంవత్సరాలు, వేల తరాలు పట్టింది. శరీరంలోని ఇమ్యూనిటీ కణాలతో సహా ప్రతి కణం ఈ గడియారంలో భాగమే! ప్రతి కణంలో కూడా టైమ్‌ను సూచించే ప్రోటీన్లుం టాయి. ఇవన్నీ సమాహారంగా పనిచేసి మనకు రాత్రి, పగలు తేడాను తెలియజేయడమేకాకుండా, తదనుగుణంగా పనిచేస్తుంటాయి. ఉదాహరణకు మధ్యాహ్నం ఒంటిగంటకు ఠంచనుగా ఆకలవుతుంది. కానీ అర్ధరాత్రి అదే సమయానికి నిద్రలో ఉంటాము. అంటే మన బాడీక్లాక్ మనం ఎప్పుడు ఏ పనిచేయాలని సమయానుగుణంగా తెలియజేస్తుంటుంది. ఈ ప్రక్రియను కొనసాగించేందుకు బాడీక్లాక్ 24 గంటల రిథమ్స్‌ను ఉత్పత్తి చేస్తుంటుంది. వీటిని సిర్కాడియన్ రిథమ్స్ అంటారు. ఈ రిథమ్స్కు అనుగుణంగా ఆయా కణాలు ఆయా పనులు చేస్తుంటాయి. ఇందుకు మరో ఉదాహరణ.. రాత్రి అయినప్పుడు మాత్రమే శరీరంలో మెలటోనిన్ ఉత్పత్తి అవుతుంది. ఈ రసాయనం మూలంగా మనం అలసిన ఫీలింగ్ కలిగి నిద్రలోకి జారుకుంటాము. ఒక్కోసారి ఒక్కోలా..: ఇమ్యూనిటీపై బాడీ క్లాక్ ప్రభావం గుర్తించేందుకు చేసిన ప్రయోగాల్లో ఆశ్చర్యకరమైన అంశాలు బయటపడ్డాయి. ఒకే తరహా సూక్ష్మక్రిమి మన శరీరంలోకి ప్రవేశించి వ్యాధిని కలిగించినా, అది పగలు ప్రవేశించిందా? రాత్రి ప్రవేశించిందా? అనే అంశం ఆధారంగా వ్యాధి తీవ్రత ఉంటుందని ప్రయోగాలు వెల్లడిస్తున్నాయి. అలాగే వ్యాధులను అరికట్టేందుకు మనం తీసుకునే ఔషధాలు అవి తీసుకున్న సమయాన్ని బట్టి కూడా పనితీరులో తేడాలు చూపుతాయని తేలింది. ఉదాహరణకు నిద్రించేసమయంలో కొలెస్ట్రాల్ ఉత్పత్తి జరుగుతుంది కాబట్టి, రాత్రి సమయంలో కొలెస్ట్రాల్ తగ్గించే ఔషధం తీసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్నమాట! టీకా టైమ్..: ఇమ్యూనిటీపై జీవగడియార ప్రభావం ఇంతలా ఉందంటే, వ్యాక్సిన్లపై కూడా దీని ప్రభావం అధికంగానే ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. నిజానికి టీకా అనేది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థపైకి జరిపే ఉత్తుత్తి దాడి. టీకా కారణంగా ఇమ్యూనిటీ కణాలు సదరు ఇన్ఫెక్షన్ను మెమరైజ్ చేసుకుంటాయి. అందువల్ల టీకా తీసుకునే సమయం కూడా దాని పనితీరుపై ప్రభావం చూపుతుందన్నది నిపుణుల మాట. ఇందులో నిజానిజాలు తెలుసుకునేందుకు పలువురికి ఒక్కరోజులో వివిధ సమయాల్లో ఇన్‌ఫ్లూయెంజా టీకా ఇచ్చి పరిశోధన చేశారు. వీరిలో ఉదయం 9–11 గంటల మధ్య టీకా తీసుకున్నవారిలో మధ్యాహ్నం తీసుకున్నవారి కన్నా అధిక యాంటీబాడీల ఉత్పత్తి కనిపించింది. అలాగే మరికొందరిపై బీసీజీ టీకా ఇచ్చి చూడగా, వీరిలో సైతం ఉదయం పూట టీకా తీసుకున్నవారిలో మధ్యాహ్నం బ్యాచ్ కన్నా ఎక్కువ నిరోధకత కనిపించింది. అలాగే హెపటైటిస్ టీకా తీసుకున్నవారు ఆ రోజు తగినంత నిద్రపోతే వారిలో సైతం అధిక యాంటీబాడీలు కనిపించినట్లు తెలిసింది. జీవగడియారం, నిద్ర, ఇమ్యూనిటీ మధ్య ఒక సంబంధం ఉందని, దీంతో ఉదయం పూట టీకా తీసుకోవడం మరింత ప్రభావకారకమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక్కసారి గుర్తిస్తే చాలు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో పలురకాల ఇమ్యూనిటీ కణాలుంటాయి. ఇవన్నీ ఎల్లప్పుడూ శరీరంలోకి జరిగే చొరబాట్లను పసిగట్టేందుకు పహారా కాస్తుంటాయి. అయితే వీటిలో ఏ కణాలు, ఏ ప్రాంతంలో, ఏ సమయంలో పహారా కాయాలనేది జీవ గడియారం నిర్దేశిస్తుందని తాజా పరిశోధన వెల్లడిస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే పగటి పూట ఈ కణాలు కణజాలాల్లో ఉండిపోయి, రాత్రుళ్లు శరీరమంతా తిరుగుతుంటాయి. ఇమ్యూనిటీ కణాల సిర్కాడియన్ రిథమ్ ఏర్పడేందుకు వేల ఏళ్లు పట్టింది. ఒకప్పుడు ఆదిమానవుడు ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశాలుండేవి. ఆ రోజుల్లో ఈ రిథమ్ రూపుదిద్దుకోవడం ఆరంభించింది. రాత్రుళ్లు ఈ కణాలు శరీరమంతా తిరిగి లింఫ్ గ్రంథుల్లో ఆగి ఆ రోజు మొత్తం మీద ఎదుర్కొన్న అంశాలను జ్ఞప్తీకరించుకుంటాయి. అంటే భవిష్యత్‌లో ఎప్పుడైనా అవి అప్పటికే ఎదుర్కొన్న ఇన్ఫెక్షన్ లక్షణాలు గుర్తిస్తే తదనుగుణంగా స్పందిస్తాయన్నమాట. కరోనా టీకా.. కిం కర్తవ్యం? ప్రస్తుతం కరోనా సంక్షోభ సమయంలో ప్రపంచమంతా వ్యాక్సినేషన్ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. ఈ సమయంలో కోవిడ్ వైరస్‌పై బాడీ క్లాక్ స్పందన చాలా కీలకంగా మారింది. కోవిడ్ 19 వైరస్ మానవ శరీర కణాల్లోకి ప్రవేశించేందుకు అవసరమైన కణ గ్రాహకాలు(సెల్ రిసెప్టార్లు) బాడీక్లాక్ కంట్రోల్లో ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. మానవ శ్వాసకోశ మార్గంలో ఈ రిసెప్టార్లు రోజులో కొన్ని సమయాల్లో అధిక చురుగ్గా ఉంటాయని తేలింది. అంటే అలాంటి సమయాల్లో కరోనా సోకే అవకాశాలు ఎక్కువ. కానీ ఈ విషయమై ఇంకా లోతైన పరిశోధనలు జరగాల్సిఉంది. బాడీక్లాక్‌ను అనుసరించి కోవిడ్ టీకా ఏ సమయంలో తీసుకుంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందనే అంశంపై కూడా ఇంకా పూర్తి పరిశోధనలు జరగాల్సిఉంది. కానీ సంక్షోభ సమయంలో ఫలానా టైంలోనే టీకా తీసుకోవాంటే కుదిరేపని కాదు కాబట్టి, ఎవరి వీలును బట్టి వారు టీకా తీసుకోవడమే ప్రస్తుతం చాలా ముఖ్యం. కానీ భవిష్యత్‌లోనైనా బాడీక్లాక్‌ను అనుసరించి ‘‘సరైన’’ సమయంలో టీకా తీసుకోవడం అధిక ప్రభావశీలంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భుజంపైనే టీకాలు ఎందుకు?
ఇండియానాపొలిస్(అమెరికా): దేశం మొత్తమ్మీద కోవిడ్–19 నిరోధక టీకాలు తీసుకున్న వారి సంఖ్య 20 కోట్లకు చేరువ అవుతోంది. తొలి డోసు ఎడమ భుజంపై, రెండో డోసు ఇంకో భుజంపై తీసుకోవడం మనలో చాలామంది గమనించే ఉంటారు. పోలియో, రోటా వైరస్ వంటి వ్యాధుల నిరోధానికి ఉపయోగించే వ్యాక్సిన్లను నోటిద్వారా, మరికొన్ని టీకాలను చర్మం కింద ఇస్తూంటే.. కోవిడ్ టీకాలను ఇంట్రామస్క్యులర్ అంటే భుజం కండరాల ద్వారా మాత్రమే ఎందుకిస్తున్నారు? ఆసక్తికరమైన ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే... భుజం పైభాగంలో ఉండే డెల్టాయిడ్ కండరాల్లో రోగనిరోధక వ్యవస్థ తాలూకూ ముఖ్యమైన కణాలు ఉంటాయి. వైరస్ తాలూకూ అవశేషాలను అంటే యాంటిజెన్లను ఇవే గుర్తిస్తాయి. టీకాలను.. వైరస్‌ను నిర్వీర్యం చేయడం ద్వారా లేదా అందులోని భాగాలతో తయారు చేస్తారన్నది ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. ఈ యాంటిజెన్లను గుర్తించే కణాలు ఉండే డెల్టాయిడ్ కండరం వద్ద టీకా ఇస్తే రోగ నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేయడం, తద్వారా యాంటీబాడీల సృష్టి వేగంగా జరుగుతుందన్నమాట. కొన్ని రకాల కోవిడ్ టీకాల్లో యాంటిజెన్లు ప్రత్యక్షంగా లేకపోయినా వాటిని తయారు చేసే ప్రణాళిక ఉంటుంది. కండరాల్లోని రోగనిరోధక వ్యవస్థ కణాలు వీటికీ తేలికగానే స్పందిస్తాయి. టీకాను రోగ నిరోధక వ్యవస్థ కణాలు గుర్తించగానే యాంటిజెన్ల వివరాలను వినాళ గ్రంథులకు అందజేస్తాయి. ఈ వినాళ గ్రంథుల్లో మరిన్ని రోగ నిరోధక వ్యవస్థ కణాలు యాంటిజెన్లను గుర్తించి యాంటీబాడీలను తయారు చేసే ప్రక్రియ మొదలయ్యేలా చేస్తాయి. వినాళ గ్రంథులకు దగ్గరగా ఉండటం భుజంపై టీకా ఇవ్వడానికి ఇంకో కారణం. బాహు మూలాల్లో ఈ వినాళ గ్రంధులు ఉంటాయి. యాంటిజెన్లతోపాటు టీకాలో ఉండే ఇతర పదార్థాలు రోగ నిరోధక వ్యవస్థను ఉత్తేజితం చేసేందుకు ఉపయోగపడతాయి. స్థానికంగా కట్టడి... వ్యాక్సిన్ వేసుకున్నాక శరీరంపై దద్దుర్లు, ఎర్రటి మచ్చలు రావొచ్చు. భుజం కండరాల్లో వ్యాక్సిన్ ఇస్తే... ఇలాంటి వాటిని స్థానికంగా కట్టడి చేసే శక్తి డెల్టాయిడ్ కండరాలకు ఉంటుంది. అంతేకాకుండా కొవ్వు పేరుకుపోయే చోట ఉండే కండరాలకు ఇస్తే శరీరమంతటా దద్దుర్లు, ర్యాష్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే కొవ్వు పట్టిన చోట కండరాలకు రక్త సరఫరా సరిగా ఉండదు. ఫలితంగా వ్యాక్సిన్లను సరిగా సంగ్రహించలేవు. వీటితో పాటు భుజంపై టీకా తీసుకోవడానికి ఎవరికీ అభ్యంతరాలుండవు. టీకాను భుజంపైనే ఇవ్వడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. -
దేశంలో పంజా విసురుతున్న మ్యూకోర్మైకోసిస్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 మహమ్మారి బారినపడి, కోలుకున్నవారిలో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. బ్లాక్ ఫంగస్ రూపంలో మృత్యువు కాటేస్తోంది. గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్రలో బ్లాక్ ఫంగస్ ఆనవాళ్లు బయటపడ్డాయి. బ్లాక్‌ఫంగస్‌గా పిలిచే మ్యూకోర్మైకోసిస్ సంక్రమణ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా నుంచి కోలుకున్నవారిలో ఈ బ్లాక్ ఫంగస్ కనిపిస్తోంది. మహారాష్ట్రలో మ్యూకోర్మైకోసిస్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణంగా శనివారం కనీసం 8 మంది కోవిడ్–19 రోగులు ప్రాణాలు కోల్పోయారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బ్లాక్ ఫంగస్ కేసులు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. ఢిల్లీలో రెండు రోజుల వ్యవధిలో ఆరుగురు బ్లాక్ ఫంగస్ బారిన పడి చికిత్స కోసం సర్ గంగారాం ఆసుపత్రిలో చేరారు. గుజరాత్‌లోని సూరత్‌లో కిరణ్ సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో 50 మంది బ్లాక్ ఫంగస్ బాధితులు చికిత్స పొందుతున్నారు. చికిత్స కోసం మరో 60 మంది ఎదురు చూస్తున్నారు. ఈ బాధితులంతా ఇటీవలే కోవిడ్ నుంచి బయటపడిన వారే కావడం గమనార్హం. కరోనా చికిత్స సమయంలో రోగికి ఆక్సిజన్ సపోర్ట్‌పై ఉన్నప్పుడు ఆ కారణంగా ఏర్పడే తేమ వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ వారి రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేసి ప్రాణాంతకంగా మారుతోందని మహారాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (డీఎంఈఆర్) అధిపతి డాక్టర్ తత్యారావు లాహనే వెల్లడించారు. రోగి మెదడుకు ఫంగస్ చేరుకుంటే అది ప్రాణాంతకమని స్పష్టం చేశారు. రోగి ప్రాణాలను కాపాడేందుకు కళ్లలో ఒకటి శాశ్వతంగా తొలగించాల్సి ఉంటుందన్నారు. మ్యూకోర్మైకోసిస్ సాధారణ లక్షణాలు తలనొప్పి, జ్వరం, కళ్ల కింద నొప్పి, పాక్షికంగా దృష్టి కోల్పోవడం వంటివి ఉన్నాయని తెలిపారు. ఈ బ్లాక్ ఫంగస్ చికిత్సలో భాగంగా ఒక్కొక్కటి రూ.9 వేల విలువైన ఇంజెక్షన్లను 21 రోజుల పాటు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. చదవండి: (కరోనాతో ఊపిరి సమస్యలే కాదు.. మరో పెనుముప్పు కూడా!) -
డబుల్ మ్యూటెంట్.. పేరు వింటేనే దడపుట్టేస్తోంది!
డబుల్ మ్యూటెంట్... ఇప్పుడు ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాల్లో దడ పుడుతోంది. భారత్‌లో తొలిసారిగా కనిపించి, 10 దేశాలకు విస్తరించిన ఈ కొత్త రకం మ్యూటెంట్ ఎంత ప్రమాదకరమో, వ్యాక్సిన్లకు లొంగుతుందో లేదో తెలియక, తలో మాట వినిపిస్తూ ఉండడంతో ఇంటా, బయటా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వేరియెంట్ల కంటే భారత్‌లో డబుల్ మ్యూటెంట్ మరింత ప్రమాదకరమైనదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా కేంద్రం దానిని తక్కువ చేసిన చూపించడానికే ప్రయత్నాలు చేస్తోంది. దేశంలో రోజుకి 2 లక్షలకు పైగా కేసులు నమోదవుతూ వస్తున్నప్పటికీ రెండుసార్లు రూపాంతరం చెందిన వైరస్‌కు, కేసుల పెరుగుదలకి ఎలాంటి సంబంధం లేదని వాదిస్తోంది. అయితే, ఈ డబుల్ మ్యూటెంట్ శరవేగంగా వ్యాపించడమే కాకుండా, శరీరంలోని రోగనిరోధక వ్యవస్థని దెబ్బతీస్తుందని అశోకా యూనివర్సిటీ త్రివేది స్కూలు ఆఫ్ బయో సైన్సెస్ డైరెక్టర్, ప్రముఖ వైరాలజిస్టు డాక్టర్ షాహిద్ జమీల్ చెప్పారు. 10 దేశాల్లో డేంజర్ బెల్స్ భారత్‌కు చెందిన డబుల్ మ్యూటెంట్ వైరస్ ఇప్పటివరకు ఆస్ట్రేలియా, బెల్జియం, జర్మనీ, ఐర్లాండ్, నమీబియా, న్యూజిలాండ్, సింగపూర్, యూకే, యూఎస్, ఇజ్రాయెల్‌లో వెలుగులోకి వచ్చింది. బ్రిటన్, బ్రెజిల్ తరహా వేరియెంట్ల కంటే వ్యాప్తిలోనూ, రోగనిరోధక శక్తిని దెబ్బ తీయడంలోనూ ఇది ప్రమాదకరం కావడంతో డబ్ల్యూహెచ్‌వో కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. వ్యాక్సిన్‌కు లొంగుతుందా ? డబుల్ మ్యూటెంట్ వ్యాక్సిన్లకు లొంగుతుందా లేదా అన్న దిశగా పరిశోధనలు సాగుతున్నాయి. భారత్ డబుల్ మ్యూటెంట్‌పై ఇజ్రాయెల్ చేసిన పరిశోధనల్లో ఫైజర్ వ్యాక్సిన్ ఈ వైరస్‌ను పాక్షికంగా అరికట్టగలదని తేల్చింది. ఆ మర్నాడే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ దీనిని సమర్థంగా అడ్డుకోగలదని వెల్లడించింది. కరోనాలో వివిధ రకాల వేరియెంట్లతో పాటుగా డబుల్ మ్యూటెంట్ని కూడా ఈ వ్యాక్సిన్ బలంగా అడ్డుకున్నట్టుగా ఐసీఎంఆర్ బుధవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ‘‘కరోనా వైరస్ విజృంభణని అరికట్టడానికి గల అవకాశాలను పరిశీలించడానికి బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాతో పాటు భారత్ డబుల్ మ్యూటెంట్ కరోనా వైరస్‌ని విజయవంతంగా ఐసోలేట్ చేసి కల్చర్ చేశాము. కోవాగ్జిన్ వ్యాక్సిన్ అన్ని రకాల మ్యుటేషన్లను అడ్డుకుంటుందని మా పరిశోధనల్లో తేలింది’’అని ఐసీఎంఆర్ వెల్లడించింది. కాగా తమ కోవాగ్జిన్ టీకా సాధారణ, సీరియస్ కోవిడ్ కేసుల్లో 78% సమర్థతతో పనిచేస్తున్నట్లు మూడోదశ మధ్యంతర విశ్లేషణలో వెల్లడైందని భారత్ బయోటెక్ ప్రకటించింది. – నేషనల్ డెస్క్, సాక్షి ఎంత ప్రమాదకరం ►గత ఏడాది అక్టోబర్‌లో తొలిసారిగా డబుల్ మ్యూటెంట్ని కనుగొన్నారు. ►రెండుసార్లు జన్యు మార్పిడికి లోనైన రూపాంతరాలు ఈ484క్యూ, ఎల్452ఆర్లు కలిసి కనిపించే ఈ కొత్త రకాన్ని బి.1.617 అని పిలుస్తున్నారు ►మహారాష్ట్రలో మార్చిలో వచ్చిన కేసుల్లో 15–20 శాతం డబుల్ మ్యూటెంట్ ఉన్నప్పటికీ కేంద్రం దాని తీవ్రతను గుర్తించలేదు. ►ప్రసుతం దేశంలో నమోదవుతున్న కేసుల్లో 52% డబుల్ మ్యూటెంట్ కేసులే కాగా ముంబై వంటి నగరాల్లో 60 శాతానికి పైగా ఇదే రకానికి చెందినవి. ►డబుల్ మ్యూటెంట్ వైరస్ 20శాతం అధికవేగంతో వ్యాప్తి చెందుతుంది. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థని 50% తగ్గిస్తుంది. ►దేశంలోని 10 రాష్ట్రాల్లో డబుల్ మ్యూటెంట్ కేసులు కనిపిస్తున్నప్పటికీ నమోదవుతున్న కేసుల్లో తేడాలున్నాయి -
రౌడీ క్యాన్సర్లను రఫ్ఫాడించేద్దాం రండి!
సమాజంలో రకరకాల మనుషులుంటారు. దేహంలో కణాలూ అంతే. వాటిల్లో ఎన్నెన్నో రకాలు. సమాజంలోని వ్యక్తులంతా సమాజం విధించిన నియమ నిబంధనలను పాటిస్తూ, చట్టాన్ని గౌరవిస్తూ ఉంటారు. దేహంలోని కణాలూ అంతే. జీవక్రియల విషయంలో తమకు అస్పగించిన విధులను నిర్వర్తిస్తూంటాయి. అయితే సమాజంలోని కొందరు వ్యక్తులు మాత్రం సామాజిక నియమనిబంధనలను లెక్కచేయరు. వారెంతో బలంగా మారతారు. ఎవరికీ లొంగరు. తమ బలం తో చట్టాలను అతిక్రమిస్తారు. వారినే ‘రౌడీ‘లనీ, సంఘవ్యతిరేక శక్తులనీ అంటాం. సమాజంలో వారెలాగో... కణాల్లోనూ జీవక్రియల నియమ నిబంధనలను అతిక్రమించే రౌడీకణాలే క్యాన్సర్ కణాలనుకోవచ్చు. ఈరోజు ‘వరల్డ్ క్యాన్సర్ డే’ సందర్భంగా క్యాన్సర్ అంటే ఏమిటో చాలా తేలిగ్గా అర్థం చేసుకునేందుకు... క్యాన్సర్‌ను సమాజం లోని సంఘవిద్రోహశక్తులతో పోలుస్తూ ఇస్తున్న ప్రత్యేక కథనమిది. రోడ్డు మీద అందరూ ఎడమపక్కనే నడవాలి. రెడ్‌లైట్ పడితే ఆగాలి. గ్రీన్‌లైట్ పడ్డప్పుడు జీబ్రాక్రా సింగ్ దగ్గర రోడ్డు దాటాలి. ఇవి సామాజిక నియమాలు. వీటిని పాటిస్తే ప్రమాదాలే జరగవు. రౌడీ కుర్రాళ్లు రెడ్‌లైట్ పడ్డాక కూడా బైక్‌ను దాటిస్తారు. జీబ్రాక్రాసింగ్ వద్ద జనాలు వెళ్తున్నప్పుడే వాళ్ల మీదికి వాహనాన్ని తీసుకెళ్తారు. ఏమాత్రం నియమ నిబంధనలను పాటించరు. అచ్చం ఇలాగే దేహంలోని క్యాన్సర్ కణం కూడా. నిశ్చితంగా ఒకేవిధంగా విభజితం కావాల్సిన కణాలు అలా కావు. నిర్దిష్టంగా పెరగాల్సిన ఒకవేపునకు పెరగవు. ఇష్టం వచ్చినట్లు దేహమంతా పాకేస్తాయి. ఆరోగ్య కణాలమీదికి దాడి చేస్తాయి. దోపిడీలూ, కబ్జాలు చేసే రౌడీ క్యాన్సర్ కణాలు M. G. Naga Kishore Chief Surgical Oncologist, Omega Hospitals, Guntur Ph: 0863 2223300 సమాజంలో మామూలు వ్యక్తులు దొంగతనాలు చేయగలరా? దోపిడీలకు పాల్పడగలరా? కబ్జాలు చేయగలరా? వారికా ధైర్యం ఉంటుందా? ఉండదు. కేవలం రౌడీతనంతో వ్యవహరించే వారే ఈ పనులన్నీ చేయగలరు కదా. అలాగే కణాల్లోనూ రౌడీ కణాల్లాంటి ఈ క్యాన్సర్ కణాలు దోపిడీలూ, కబ్జాలూ, మోసాలు చేస్తాయి. అదెలాగో చూద్దాం. దేహకణాల మనుగడకు ఆహారం, ఆక్సిజన్ కావాలి. ఇది రక్తం ద్వారా అందుతుంది. ఏ కణానికి ఎంత అవసరమో ఆయా కణాలు అంతే తీసుకుంటాయి. కానీ క్యాన్సర్ కణాలు తమకు కావాల్సిన ఆహారం, ఆక్సిజన్ కోసం రౌడీయిజమ్ చేస్తాయి! కబ్జా చేస్తాయి!! అదెలాగంటే... తమవైపు ఎక్కువగా రక్తం ప్రవహించేందుకు వీలుగా... మరిన్ని ఎక్కువ రక్తనాళాలను ఏర్పాటు చేసుకుని ఆహారాన్ని కబ్బా చేస్తాయి. సాధారణ కణాలు అన్ని కణాలకూ రక్తం అందేందుకు రక్త రవాణా వ్యవస్థను ఒక నిర్దిష్టమైన క్రమపద్ధతిలో నిర్మించుకుంటాయి. దానిపేరే ‘యాంజియోజెనెసిస్’. సాధారణంగా రక్తనాళంలోని లోపలి పొర అయిన ఎండోథీలియమ్ నుంచి ఈ రహదారులు ఏర్పడుతుంటాయి. ఇలా ప్రతి సాధారణ కణానికి రక్తనాళాలు ఏర్పడే ప్రక్రియను ‘నార్మల్ యాంజియోజెనెసిస్’ అంటారు. కానీ రౌడీలు దారిదోపిడీ చేసినట్లుగానూ, సామాన్యుల ఆస్తులను కబ్జా చేసినట్లుగానూ వ్యవహరింస్తూ ఆహార కబ్బాలకోసం అనుసరించే మార్గాన్ని వైద్యపరిభాషలో ట్యూమర్ యాంజియోసిస్ అంటారు. ఈ ‘ట్యూమర్ యాంజియోజెనెసిస్’ మార్గంలో పొరుగు ఆరోగ్యకణాలపై రౌడీయిజం చేసి, వాటిని ఎలా కొల్లగొట్టి కబ్జా చేస్తాయో కాస్త విపులంగా చూద్దాం. సాధారణ కణాలూ తమలోకి రక్తం ప్రవహించేందుకు రహదారి పడేలా సిగ్నల్స్ పంపుతాయి. సరిగ్గా అలాంటి సిగ్నల్స్‌నే ఈ క్యాన్సర్ కణాలు కూడా పంపుతాయి. అంతేకాదు.. పక్కన ఉండే హెల్దీ కణాలకు అందే రక్తం కూడా తమకే అందేలా ఆరోగ్యకరమైన కణం మీద దౌర్జన్యం చేస్తాయి. అలా పొరుగుకణాన్ని నాశనం చేస్తాయి. మోసాల... దొంగవేషాల కేడీలివి... Dr. Y Venkata Rami Reddy Medical Director, Omega Hospitals Kurnool, +91 6281066155 క్యాన్సర్ కణాలు చేసే మోసాల తీరు అచ్చం మన సమాజంలోని కేడీలు చేసినట్లుగానే ఉంటాయి. అదెలాగో చూడండి. సాధారణంగా మన దేహంలో నాలుగు ప్రధాన రకాల కణాలుంటాయి. అవి ఎపిథీలియల్, కనెక్టివ్, కండర (మజిల్ టిష్యూ), నాడీకణజాలాలు (నర్వ్ టిష్యూ). సాధారణంగా ఏ అవయవానికైనా... పైవైపున ఉండే కణజాలం ఎపిథీలియల్ కణాలనే కణజాలంతో నిర్మితమై ఉంటుంది. క్యాన్సర్గడ్డకు పైభాగంలో ఉండే ఎపిథీలియల్ కణజాలం కూడా తాను వ్యాధినిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునేందుకు ఒక దొంగవేషంతో మోసం చేస్తుంది. అదేలాగంటే... క్యాన్సర్ కణపు ఎపిథీలియమ్ కణజాలం కాస్తా... అకస్మాత్తుగా కనెక్టివ్ టిష్యూగా మారిపోతుంది. అంటే ఇక్కడ ఎపిథీలియన్ కణాలన్నీ కనెక్టివ్ కణాలుగా మారువేషం వేస్తాయన్నమాట. చాలా సంక్లిష్టంగా జరిగే ఆ ప్రక్రియను కాస్త మనకు అర్థమయ్యే తేలిక భాషలో చెప్పుకుందాం. ఓ పామును పట్టుకుంటే అది తన పైకుబుసాన్ని మన చేతిలో వదిలేసి, కింద కొత్త కుబుసంతో తప్పించుకుని జారిపోయినంత తేలిగ్గా ఈ పని జరుగుతుంది. దీన్నే నిపుణులు ‘ఇన్‌యాక్టివేషన్ ఆఫ్ మాలెక్యులార్ స్విచ్’ అంటారు. రౌడీలకు మద్యంలా ... క్యాన్సర్‌కు చక్కెర మన సినిమాల్లో రౌడీవిలన్లు ఎప్పుడూ చేతిలో మద్యం గ్లాసు పట్టుకుని కనిపిస్తుంటారు కదా. వారికి మద్యం ఎలా ఇష్టమో రౌడీక్యాన్సర్ కణానికి చక్కెర అలా ఇష్టం. వాటి పెరుగుదలకు శక్తి కావాలి. మిగతాక ణాల నుంచి కబ్జా చేసి పొందే ఆ శక్తి గ్లూకోజ్ రూపంలో క్యాన్సర్ కణాలకు అందుతుంటుంది. అనేక పోషకాలూ గ్లూకోజ్, ఆక్సిజన్‌తో కలిసి అందే ఆ శక్తిని పొందే చర్యంతా ‘సెల్ రెస్పిరేషన్’ అనే పేరున్న సంక్లిష్ట ప్రక్రియలో జరుగుతుంది. ఈ శక్తి (ఎనర్జీ)ని అందుకున్న క్యాన్సర్ కణం దాన్ని ఉపయోగించుకొని, మరింత అనియంత్రితంగా పెరుగుతుంది. ఇందుకు అవసరమైన గ్లూకోజ్ (చక్కెర) కోసం అది రౌడీలు మద్యం కోసం వెంపర్లాడినంతగా అన్నమాట! సాధారణ ఆరోగ్యకరమైన కణజాలాలు తమకు అందే గ్లూకోజ్ నుంచి ‘గ్లైకాలసిస్’ అనే ప్రక్రియ ద్వారా శక్తిని తయారు చేసుకుంటాయి. కానీ క్యాన్సర్ కణం ఇలా గ్లైకాలసిస్ను నమ్ముకోదు. పైన చెప్పిన ప్రక్రియ కారణంగా క్యాన్సర్ కణంలోని మైటోకాండ్రియా దెబ్బతింటుంది. Dr. Ch. Mohana Vamsy Chief Surgical Oncologist Omega Hospitals, Hyderabad Ph: 98480 11421, Kurnool 08518273001 మద్యం తాగిన వాడు ఆ మత్తులో ఎవరినీ లెక్క చేయడు. ఆ మద్యం ప్రభావంతో ఒక్కోసారి పోలీసులనూ ఎదిరిస్తుంటాడు కదా. అలాగే పైన చెప్పిన అక్రమ ప్రక్రియలో మద్యంలా ఎనర్జీ ని తాగేసి పుంజుకున్న బలంతో ఈ క్యాన్సర్ రౌడీ కణాలు... తమ పాలిటి పోలీస్ అయిన కీమోథెరపీని సైతం ధిక్కరిస్తూ ఉంటాయి. ఆరోగ్యకరమైన సమాజంలో రౌడీలూ, ఉగ్రవాదులు ఉండరు. సమాజం ఆరోగ్యకరంగా లేనప్పుడే అలాంటి సంఘవిద్రోహులు పుట్టుకొస్తారు. అలాగే దేహం ఆరోగ్యంగా లేనప్పుడూ ఆరోగ్యకరమైన క్యాన్సర్ కణంగా మారేందుకూ... వాటి నుంచి మరిన్ని క్యాన్సర్ కణాలు ఉద్భవించేందుకు ఆస్కారం ఉంది. అందుకే సమాజంలాగే దేహాన్నీ ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అందుకోసం మనం ఆరోగ్యకరమైన జీవనశైలితో, మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. కాలుష్యపూరితమైన వాతావరణానికి దూరంగా ఉండాలి. ప్రతిరోజూ ఎంతో కొంతసేపు దేహశ్రమ, వ్యాయామం చేస్తూ వ్యాధినిరోధకశక్తిని పెంచుకోవాలి. మన దేహం బాగుంటే మనందరమూ ఆరోగ్యంగా ఉంటే సమాజమూ బాగుంటుంది. అందరూ హాయిగా, హ్యాపీగా ఉంటారు. సాధారణ కణానికీ... రౌడీ కణానికీ తేడా చూద్దామా! సాధారణ జీవకణాలన్నీ కొన్ని నియమాలను పాటిస్తుంటాయి. అవి నిర్ణీత క్రమంలో విభజితమై పెరుగుతుంటాయి. కణజాలంలోని ఒక కణానికీ, మరో కణానికీ మంచి కమ్యూనికేషన్స్‌తో ఉంటాయి. ప్రోటీన్ల రూపంలో ఉండే సెల్కెమికల్స్ ద్వారా సిగ్నల్స్‌తో పలకరించుకుంటూ, పరస్పరం సహకరించుకుంటూ ఉంటాయి. ఇలా గుండెలో ఉండేవి అక్కడి విధులూ, మెదడు కణాలు వాటి విధులూ, కాలేయకణాలు తమకు నిర్దేశించిన పనులూ చేసుకుంటూ ఉంటాయి. అవి ఎంత క్రమశిక్షణతో వ్యవహరిస్తుంటాయంటే... తమ పనులు తాము చేసుకుంటూ ఉండటమే కాదు... ఒక్కోసారి ఒకవేళ తమకు ఏదైనా కారణంగా అనారోగ్యం కలిగితే.. తమ జబ్బు తమకు మాత్రమే పరిమితం చేసుకునేందుకూ, పక్క కణాలకు అంటకూడదని ‘సెల్‌డెత్’ పేరిట తమను తాము నాశనం చేసుకుంటాయి. అచ్చం సమాజంలోని ఆరోగ్యకరమైన వ్యక్తులు క్వారంటైన్లో ఉండి తమ వ్యాధి ఇతరులకు పాకకుండా ఉన్నట్లుగా అవీ వ్యవహరిస్తాయి. కానీ క్యాన్సర్ పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తుంది! ఉదాహరణకు మన చర్మంలోని కణాలు నిత్యం కొత్తవి పుడుతూ పాతవి చనిపోతూ ఉంటాయి. అలా కొత్తవి పుట్టినప్పటికీ చర్మం ఎప్పటిలా ఒకేలా ఉంటుంది. కానీ క్యాన్సర్ కణాలు పుడుతున్న కొద్దీ ఇష్టమొచ్చినట్టు పెరుగుతూ పోతాయి. అసహ్యకరమైన గడ్డల్లా అడ్డదిడ్డంగా పెరుగుతాయి. అవే క్యాన్సర్ ట్యూమర్లు. దొంగదారుల్లో దాక్కునే ఉగ్రవాదులాంటివి... సమాజంలోని రౌడీలు దొంగదారులు తొక్కుతారు. పోలీసులను తప్పించుకునేందుకు దొంగవేషాలు వేస్తారు. అచ్చం ఇలాగే ఈ క్యాన్సర్ కణాలూ దొంగవేషాలు వేస్తాయి. మన దేహంలో ఉండే వ్యాధినిరోధక వ్యవస్థ ఓ పోలీస్ వ్యవస్థలాంటిదే. రౌడీలూ, దొంగలూ పోలీసులను తప్పించుకునేందుకు అండర్ గౌండ్స్‌లో దాక్కోవడం, మారువేషాలతో మోసాలు చేయడం చూస్తుంటాం కదా. రౌడీ క్యాన్సర్ కణాలూ ఇలాగే చేస్తుంటాయి. అదెలాగో చూద్దాం. మన దేహంలో మనకు మేలు చేసే లింఫ్‌నోడ్స్ ఒక ప్రోటీన్‌ను రూపొందించుకుంటాయి. ఈ ట్యూమర్ కణాలు కూడా అచ్చం అలాంటి ప్రోటీన్‌నే రూపొందించుకుంటాయి. ఇది ఎలా ఉంటుందంటే... ఒక్కోసారి దొంగలే పోలీస్ డ్రస్సులతో వచ్చి వారిని బోల్తా కొట్టించినట్లుగా అవి కూడా తప్పించుకుంటాయి. తమపైని ప్రోటీన్‌ను... అచ్చం ఓ దొంగ ఐడీ కార్డులా, నకిలీ ఫోర్జరీ డాక్యుమెంట్ లా సృష్టించి వాడుకుంటాయి. ఆరోగ్యాన్ని కాపాడే ఈ వ్యాధినిరోధక వ్యవస్థ ఆ ఐడీలను చూసి ఆ కణాలు కూడా తమలాంటి ‘లింఫ్ టిష్యూ’లేమోనని పొరబడి వాటిని వదిలేస్తాయి. అలా రోగనిరో«ధక శక్తుల్లాంటి పోలీస్ వ్యవస్థ కనుగప్పి తప్పించుకోవడమే గాకుండా... క్యాన్సర్లన్నీ ఒంట్లో వివిధ ప్రదేశాలకూ, వేర్వేరు అవయవాలకూ పాకి.... అక్కడా ఆహారం, ఆక్సిజన్‌లాంటి వనరుల కబ్జా, దోపిడీలకు మళ్లీ పాల్పడుతుంటాయి. ఇదొక సైకిల్ కొనసాగుతూ ఇలా నిరంతరం జరిగిపోతుంటుంది. చికిత్సను తప్పించుకోడానికి రౌడీలు, ఉగ్రవాదులు ఒక్కోసారి కూంబింగ్ ఆపరేషన్స్‌నుంచి తప్పించుకునేందుకు... తాము ఉండటానికి ఎవరూ అనుమానించని చోటికి వెళ్లి దాక్కుంటారు. బయట సమాజంలో దాన్ని సేఫ్ షెల్టర్ జోన్ గా అంటుంటారు. అలాగే ఈ మోసకారి కణాలు కూడా సేఫ్ జోన్లలాంటి పక్క కణజాలాల్లోకి దూరిపోయి అక్కడ షెల్టర్ తీసుకుంటూ ఉంటాయి. ఉదాహరణకు కొన్ని రకాల లూకేమియాలకు కీమోథెరపీ చికిత్స తో ‘కూంబింగ్’ చేసే సమయంలో ఈ ఉగ్ర–క్యాన్సర్ కణాలు పక్కనే ఉండే ఎముకల్లోకి దూరిపోయి తమను తాము రక్షించుకుంటుంటాయి. -
వ్యాక్సిన్‌పై వాస్తవాలేంటి?
ఇంకొన్ని రోజుల్లో భారత్‌లో కోవిడ్ టీకాలు వచ్చేస్తున్నాయి. ఆరోగ్య సిబ్బందితో మొదలుపెట్టి వృద్ధులు.. ఆరోగ్య సమస్యలున్న వారు అన్న క్రమంలో... వరుసగా టీకాలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి! మరి గడ్డుకాలమిక తొలగిపోయినట్లేనా? ఇక అంతా మంచేనా? ఊహూ.. కానేకాదు! టీకా తీసుకున్నా మరికొంత కాలం జాగ్రత్తలు కొనసాగాల్సిందే అంటున్నారు నిపుణులు. ఈ అంశంతోపాటు టీకాలకు సంబంధించిన ఇతర సందేహాలకు సమాధానాలివిగో.. వ్యాక్సిన్లలో రకాలేమిటి? హా ఫైజర్, మోడెర్నా సంస్థలు మెసెంజర్ ఆర్ఎన్ఏతో(ప్రొటీన్ తయారీకి పనికొచ్చే డీఎన్ఏ పోగు)టీకాను అభివృద్ధి చేస్తున్నాయి. హా భారత్‌లోని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ టీకాలో వాడే వైరస్లు రోగ నిరోధక కణాలు గుర్తించే యాంటిజెన్లను సిద్ధం చేస్తాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకాలు తయారు చేస్తున్న కోవిషీల్డ్‌ను చింపాంజీకి చెందిన అడినోవైరస్‌ను వాహకంగా వాడుతున్నారు. హా భారత్ బయోటెక్ (హైదరాబాద్), గమలేయా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (రష్యా) నిర్వీర్యం చేసిన వైరస్ ఆధారంగా టీకాను తయారు చేస్తున్నాయి. ఈ వైరస్లు వ్యాధిని కలిగించవు కానీ.. రోగ నిరోధక వ్యవస్థ తాలూకూ కణాలు గుర్తించేందుకు ఉపయోగపడతాయి. ఏ వ్యాక్సిన్ సామర్థ్యం ఎంత? కోవిషీల్డ్ వ్యాక్సిన్ కోవిడ్–19 లక్షణాలు కనబరిచే వారిలో 70.4 శాతం సామర్థ్యంతో పనిచేస్తుంది. తీవ్రమైన లక్షణాలతో బాధపడుతున్న వారిలో 100 శాతం పనిచేస్తుందని అంచనా. ఫైజర్ టీకా సామర్థ్యం 95 శాతం కాగా, రష్యా టీకా స్పుత్నిక్–వీ 92 శాతం సామర్థ్యాన్ని కనబరిచింది. టీకాలు ఎవరెవరికి ఇవ్వవచ్చు? పైన పేర్కొన్న టీకాలను 18 లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారికి ఇవ్వవచ్చు. ఇందుకు తగ్గట్టుగా ప్రయోగాలు జరిగాయి. ప్రస్తుతం 12–18 ఏళ్ల వారిపై ఈ టీకాలు ఎలా పనిచేస్తాయన్నది పరీక్షిస్తున్నారు. అందుబాటులో ఉన్నాయా? కోవిషీల్డ్ టీకా అత్యవసర వాడకంపై అనుమతికి సీరమ్ ఇన్స్టిట్యూట్ దరఖాస్తు చేసుకుంది. భారత్ బయోటెక్, స్పుత్నిక్–వీ మూడో దశ ప్రయోగాలను పూర్తి చేయాల్సి ఉంది. ఫైజర్ వ్యాక్సిన్ ప్రైవేట్ రంగంలో అందుబాటులోకి రావచ్చు. 18 ఏళ్ల లోపువయసున్న వారికి ఏ టీకా అందుబాటులో లేదు. వ్యాధి సోకి నయమైన వారికి టీకా అవసరమా? కోవిడ్ బారిన పడి సహజసిద్ధంగా కోలుకున్న వారికి దీర్ఘకాలంలో వ్యాధి నుంచి రక్షణ ఉంటుందా? అన్నది ఇప్పటికీ అస్పష్టం. కాలక్రమంలో శరీరంలో యాంటీబాడీలు బలహీన పడే అవకాశాలు ఎక్కువైనప్పటికీ వ్యాధి నుంచి రక్షణ తగ్గిపోతుందని చెప్పలేమని నిపుణులు అంటున్నారు. అందుకే కోవిడ్ నుంచి బయటపడిన వారికి ఆఖరులో టీకా ఇవ్వాలని యోచిస్తున్నారు. ఒక్కో డోస్ ఎంత? ఎన్ని డోసులు? కోవిషీల్డ్ టీకా ఒక డోసుకు 0.5 మిల్లీలీటర్ ఉంటుంది. 28 రోజుల వ్యవధిలో 2 డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. ఫైజర్, మోడెర్నా, స్పుత్నిక్–వీ టీకాలను 21 రోజుల వ్యవధిలో 2 డోసులు ఇస్తారు. రెండు వారాల సమయంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని అంచనా. ఎంఆర్ఎన్ఏ టీకా మాత్రం తొలి డోసు తీసుకున్న 10 రోజుల్లోనే యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్లు తెలిసింది. రెండు డోసుల స్థానంలో ఒకటే తీసుకున్నా ఓమోస్తరు ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రెండు డోసులతో రక్షణ ఎంత కాలం? ప్రస్తుతానికి ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. కోవిషీల్డ్ టీకా తీసుకున్న వారిలో నాలుగు నెలల కంటే ఎక్కువ కాలం వ్యాధి నుంచి రక్షణ లభించింది. యాంటీబాడీలు బలహీన పడినా వ్యాధి నుంచి రక్షణ లభిస్తుందని అంచనా. బూస్టర్ టీకా అవసరం రాకపోవచ్చనే అనుకుంటున్నారు. టీకా తీసుకున్న వారిలో నొప్పి, జ్వరం వంటి కొన్ని దుష్ప్రభావాలు కనిపించే అవకాశం ఉంది. టీకా వేసుకున్నాక మామూలుగా తిరిగేయవచ్చా? ఏ వ్యాక్సిన్ అయినా 100 శాతం రక్షణ కల్పించదు. టీకా తీసుకున్న వారు మళ్లీ వ్యాధి బారిన పడకపోవచ్చుగానీ.. ఇతరులకు వైరస్‌ను అంటించే అవకాశం ఉంటుంది. అందుకే టీకా వేసుకున్న తరువాత కూడా మాస్కు ఉపయోగించడం, భౌతిక దూరాన్ని పాటించడం, చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం మరికొంత కాలం కొనసాగించాల్సి ఉంటుంది. – సాక్షి, హైదరాబాద్ -
ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్: ఆశాజనకంగా ఫలితాలు
లండన్ : కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ.. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ గుడ్ న్యూస్ చెప్పింది. తొలి నుంచి కరోనా వ్యాక్సిన్ ప్రయోగాల్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ముందు వరుసలో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యాక్సిన్ తొలిదశ క్లినికల్ ట్రయల్స్ సంబంధించిన డేటా వెలువడింది. లాన్సెట్ మెడికల్ జర్నల్‌లో ఈ ఫలితాలను ప్రచురించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తొలిదశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు ఆశాజనంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్ ద్వారా రోగనిరోధక ప్రతిస్పందన గుణం పెరుగుతుందని తెలిపారు. అలాగే ఇది సురక్షితమైనదని వెల్లడించారు. ఈ క్లినికల్ ట్రయల్స్‌లో దాదాపు 1,077 మందిపై వ్యాక్సిన్ ప్రయోగించగా.. వీరిలో యాంటీబాడీస్తోపాటుగా, కరోనాతో పోరాడగలిగే తెల్ల రక్తకణాలను ఏర్పరచడానికి తోడ్పడిందని తెలిపారు. ఈ వ్యాక్సిన్ ద్వారా భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ లేవని అన్నారు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్లలోని పలువురిలో జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించాయని.. అయితే పరిశోధకులు వాటిని పారాసిటమాల్‌తో తగ్గించగలిగారని చెప్పారు. అయితే ఈ వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో కరోనాను అడ్డుకోగలుగుతుందో లేదో తెలియాలంటే.. మరిన్ని పరీక్షలు జరగాల్సి ఉందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. -
‘అందుకే వారిలో మరోసారి కరోనా’
లండన్: కరోనాతో ప్రపంచం అంతా కకావికలమవుతోంది. ఈ మహమ్మారికి ఇంతవరకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. సరైన వైద్యం కూడా లేదు. ఇన్ని సమస్యల మధ్య ఒకసారి కరోనా బారిన పడ్డ వారిలో మరోసారి వైరస్ లక్షణాలు కనిపిస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో తాజాగా లండన్ కింగ్స్ కాలేజీ సంచలన విషయాలు వెల్లడించింది. కరోనా వైరస్ సోకిన వారిలో నెలల వ్యవధిలో రోగ నిరోధక శక్తి తగ్గడంతో.. మరోసారి తిరిగి వైరస్ బారిన పడుతున్నట్లు వెల్లడించింది. తేలికపాటి లక్షణాలు ఉన్న వారిలో కూడా రోగనిరోధక వ్యవస్థ కొంత ప్రతిస్పందనను కలిగి ఉన్నట్లు నివేదిక తెలిపింది. (త్వరలో శుభవార్త అందించబోతున్నాం) 90 మంది కరోనా రోగులను పరీక్షించిన తర్వాత ఈ నివేదిక వెల్లడించింది. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు 60 మందిలో వైరస్ సంక్రమించిన మొదటి వారాల్లో శక్తివంతమైన ప్రతిస్పందన చూపినట్లు నివేదిక వెల్లడించింది. అంతేకాక 16.7శాతం మందిలో మూడు నెలల తర్వాత కరోనా న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ అధిక స్థాయిలో ఉన్నట్లు వెల్లడించింది. అయితే ఎక్కువ అధిక శాతం మందిలో 90 రోజుల తర్వాత యాంటీబాడీస్ చాలా తక్కువ స్థాయిలో ఉన్నట్లు నివేదిక తెలిపింది. దానివల్ల రోగనిరోధక శక్తి సన్నగిల్లింది. అందువల్లే ఇలాంటి వారికి మరోసారి కరోనా వచ్చే అవకాశం ఉన్నట్లు నివేదిక తెలిపింది. శరీరంలో యాంటీబాడీస్ ఎక్కువ ఉన్నట్లయితే రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుంది. ఫలితంగా కొత్త వైరస్‌లను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నివేదిక ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. రాబోయే పరిణామాలకు తగ్గట్లు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడానికి ఈ నివేదిక ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. (పెళ్లి విందు అడ్డుకున్నారు..!) -
సరికొత్త యాంటీబాడీ పరీక్ష సిద్ధం
కరోనా వైరస్‌ను గుర్తించేందుకు ప్రస్తుతం పీసీఆర్ ఆర్సీటీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గొంతు, ముక్కు నుంచి సేకరించిన ద్రవ నమూనాల్లో వైరస్ తాలూకు డీఎన్ఏ పోగులను గుర్తించడం ఈ పరీక్షల పద్ధతి. అయితే ఇందుకు చాలా సమయం పడుతుంది. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ పరీక్షల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఫలితాలపై సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వైలీ అనే సంస్థ యాంటీబాడీ పరీక్ష ఒకదాన్ని సిద్ధం చేసింది. ప్రస్తుతం వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే వాటిని గుర్తించడం వీలవుతుండగా యాంటీబాడీ లేదా రక్త పరీక్షలు తొలిదశలోనే వైరస్‌ను గుర్తించగలవు. అంతేకాకుండా వైరస్ ఎంతమేరకు విస్తరించింది, ఒక్కో వ్యక్తి యాంటీబాడీ ప్రతిస్పందన ఎలా ఉంది? మరోసారి వైరస్ బారిన పడకుండా ఉండగలిగే సామర్థ్యం ఎందరికి ఉంది? అన్నది ఈ కొత్త యాంటీబాడీ పరీక్ష ద్వారా గుర్తించవచ్చు. కరోనా వైరస్‌లోని కీలకమైన ప్రొటీన్ భాగాలను ఉపయోగించడం ద్వారా వైరస్‌ను అడ్డుకునేందుకు శరీర రోగ నిరోధక వ్యవస్థ తయారు చేసిన యాంటీబాడీలను గుర్తించడం ఈ కొత్త పరీక్ష పద్ధతి విశేషం. లక్షణాలు లేని వారితోపాటు, కొద్దిపాటి తీవ్రత ఉన్నవారిలోనూ వైరస్ వ్యాప్తి ఎంతనేది ఈ పరీక్షల్లో స్పష్టంగా తెలుస్తుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వైరస్‌ను తట్టుకోగల రోగ నిరోధకశక్తి ఉన్న వ్యక్తులను గుర్తించడం కూడా ఈ పరీక్ష ద్వారా సాధ్యమవుతుంది. దీనివల్ల కరోనా వైరస్ సోకని వ్యక్తులనే రోగుల చికిత్సలో ఉపయోగించవచ్చు. తద్వారా వైరస్ ఇతరులకు సోకే అవకాశం తగ్గిపోతుంది. ఈ కొత్త పరీక్ష ఎలా నిర్వహించాలనేది కరెంట్ ప్రొటోకాల్స్ ఇన్ మైక్రోబయాలజీలో విశదీకరించారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ఊపు కరోనా నేపథ్యంలో ఐటీతోపాటు ఇతర ఉద్యోగాల్లోనూ ఇంటి నుంచే పనిచేయడమనే సంస్కృతి రానుంది. ఇప్పటివరకూ ఉద్యోగులు కంపెనీల ఐటీ బ్యాండ్‌విడ్త్‌ను ఉపయోగించుకుని పనులు చేస్తుంటే.. ఇప్పుడు ఇళ్లలోని ఇంటర్నెట్ కనెక్షన్లను వాడాలి. దీంతో బ్యాండ్‌విడ్త్ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో సరికొత్త వైఫై ప్రొటోకాల్ అందుబాటులోకి రావడం ఊరటనిచ్చే అంశం. ఇది అందుబాటులోకి వస్తే ఒకే కనెక్షన్‌పై బోలెడన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను జోడించుకుని నడిపించవచ్చు. ఇంట్లోని వారంతా హైస్పీడ్ వీడియోగేమ్‌లు, ఇతర సాఫ్ట్వేర్లు వాడుతున్నా ఇంటర్నెట్ వేగం ఏమాత్రం తగ్గదన్నమాట. అయితే ప్రస్తుతానికి ఈ కొత్త వైఫై ప్రొటోకాల్‌ను వాడుకోగల స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త వైఫైతో వీడియో కాన్ఫరెన్సింగ్, టెలిమెడిసిన్, ఆన్లైన్ క్లాసుల వంటివి బ్యాండ్‌విడ్త్ సాఫీగా నడుస్తాయని నిపుణులు చెబుతున్నారు. -
నిర్వీర్యం చేసిన వైరస్‌తో టీకా!
సాక్షి, హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్‌ను అంతమొందించేందుకు టీకా తయారీకి హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. నిర్వీర్యం చేసిన కరోనా వైరస్‌నే టీకాగా అభివృద్ధి చేస్తుండటం విశేషం. అన్నీ సవ్యంగా సాగితే ఇంకో ఏడాదిలో టీకా మన ముందుకు వస్తుందని సంస్థ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. సురక్షితమైన, సులువుగా తయారు చేసేందుకు వీలైన పద్ధతిలో తాము టీకా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ అని పిలిచే ఈ తరహా టీకాల తయారీ మానవ కణంలో వైరస్ సంతతిని గణనీయంగా పెంచడం ద్వారా మొదలవుతుంది. ఆ తర్వాత కొన్ని ప్రత్యేకమైన రసాయనాలను లేదా వేడిని ఉపయోగించడం ద్వారా వైరస్‌ను నిర్వీర్యం చేస్తారు. వైరస్ నిర్వీర్యమైనా, పునరుత్పత్తి సామర్థ్యం లేకపోయినా.. అందులోని ప్రొటీన్ కొమ్ము లాంటి భాగాలు మాత్రం చెక్కు చెదరకుండా ఉంటాయి. ఈ కొమ్ము సాయంతోనే వైరస్ కణాల్లోకి ప్రవేశిస్తుందన్నది మనకు తెలిసిన విషయమే. అయితే నిర్వీర్యమైన వైరస్ మన కణంలోకి ప్రవేశిస్తే.. రోగ నిరోధక వ్యవస్థ దాన్ని గుర్తిస్తుంది. తదనుగుణంగా యాంటీబాడీలను తయారు చేస్తుంది. వైరస్ ఎలాగూ నిర్వీర్యమైంది కాబట్టి దాని ద్వారా వ్యాధి లక్షణాలు కనిపించవు. ఇంకోలా చెప్పాలంటే.. ఈ టీకాను వాడటం సురక్షితమన్నమాట. బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్న వారు కూడా దీన్ని ఉపయోగించొచ్చు. సీసీఎంబీలో ప్రస్తుతం తాము ఈ ఇనాక్టివేటెడ్ టీకా తయారీకి సిద్ధమవుతున్నామని రాకేశ్ మిశ్రా తెలిపారు. నిర్వీర్యమైన వైరస్‌లను చెప్పుకోదగ్గ స్థాయిలో ఉత్పత్తి చేసి ఇంజెక్షన్ రూపంలో శరీరంలోకి ప్రవేశపెట్టాలన్నది తమ ఆలోచన అని వివరించారు. బయట పెంచడమే సవాల్.. వైరస్‌లన్నీ పరాన్న జీవులని తెలిసిన విషయమే. వీటికి స్వయంగా జీవం ఉండదు. కాకపోతే ఇతర జంతువుల కణాల్లోకి చొరబడి.. వాటి జన్యుపదార్థాన్ని హైజాక్ చేయడం ద్వారా వేగంగా వృద్ధి చెందుతాయి. ఇప్పుడు టీకా తయారీలో అతిపెద్ద సవాలు కూడా ఇదే. శరీరం బయట ఈ వైరస్‌లను పెంచాల్సి ఉంటుంది. సీసీఎంబీ శాస్త్రవేత్తలు ఈ సమస్యను అధిగమించేందుకు ఆఫ్రికాకు చెందిన కోతుల చర్మపు పై పొరలోని కణాలను వైరస్‌ను వృద్ధి చేసేందుకు ఉపయోగించాలన్న ఆలోచనలో ఉన్నారు. నిర్వీర్యమైన వైరస్‌లో అవసరమైన ప్రొటీన్లు అన్నీ ఉన్న వాటిని ఎంపిక చేసేందుకు రెండు, మూడు నెలల సమయం పడుతుందని, ఆ తర్వాత వేర్వేరు దశల్లో జంతు, మానవ ప్రయోగాలు చేపట్టేందుకు, మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు ఏడాది కంటే ఎక్కువ సమయం పడుతుందని రాకేశ్ మిశ్రా వివరించారు. వైరస్‌ను పెంచేందుకు తగిన పద్ధతిని కనుక్కోవడం భవిష్యత్తులో కరోనా చికిత్సకు అవసరమైన మందుల తయారీకి కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. ఒకసారి వైరస్‌ను కణంలోకి ప్రవేశపెడితే రెండు, మూడు రోజుల తర్వాత కణాలు చనిపోగా.. వైరస్లు ఇబ్బడిముబ్బడిగా ఉంటాయని.. మందుగా పనిచేస్తాయనుకున్న వాటిని నేరుగా ప్రయోగించి వాటి సామర్థ్యాన్ని లెక్కకట్టవచ్చని తెలిపారు. నాలుగు రకాల టీకాలు.. వ్యాధుల నివారణకు ఉపయోగపడే టీకాలను స్థూలంగా నాలుగు పద్ధతుల్లో తయారు చేస్తారు. బ్యాక్టీరియా, వైరస్ వంటి వాటి నుంచి ఎలా ఎదుర్కోవాలో శరీర రోగ నిరోధక వ్యవస్థకు నేర్పించడం టీకా ప్రధాన ఉద్దేశం. తద్వారా బ్యాక్టీరియా, వైరస్ల ద్వారా వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చన్నమాట. శాస్త్రవేత్తలు టీకాలను తయారు చేసేటప్పుడు బ్యాక్టీరియా/వైరస్‌లకు రోగ నిరోధక వ్యవస్థ ఎలా స్పందిస్తోంది.. ఎవరికి టీకా అవసరం.. టీకా తయారీకి మేలైన పద్ధతి, టెక్నాలజీ ఏది అన్న అంశాలను ముందుగా పరిగణనలోకి తీసుకుంటారు. వీటి ఆధారంగా నాలుగు రకాల టీకాల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకుంటారు. బలహీనమైన వైరస్‌లతో.. ఈ రకమైన టీకాను లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్ అని పిలుస్తారు. ఇందులో వైరస్‌కు విరుగుడుగా బలహీనమైన వైరస్‌ను ఉపయోగిస్తారు. ఈ రకమైన టీకాలోని వైరస్లు బలహీనంగా ఉంటాయి గానీ.. వీటికి కూడా రోగ నిరోధక వ్యవస్థ స్పందిస్తుంది. యాంటీబాడీలను తయారు చేసుకుంటుంది. ఒకట్రెండు డోసుల టీకాతోనే జీవితాంతం నిర్దిష్ట వైరస్ నుంచి రక్షణ లభిస్తుంది. అయితే ఈ రకమైన టీకాలు అందరికీ అనుకూలంగా ఉండవు. బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్నవారు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు.. అవయవ మార్పిడి చేసుకున్నవారు ఈ రకమైన టీకాలు వేయించుకునే ముందు వైద్యులను సంప్రదించడం మేలు. బలహీనమైన వైరస్‌లతో కూడిన టీకాలను ఎప్పుడూ చల్లగా ఉంచాల్సి ఉంటుంది. మశూచి, స్మాల్‌పాక్స్, చికెన్ పాక్స్ వంటి వ్యాధుల నుంచి రక్షణకు ఇచ్చే టీకాలు ఈ లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్లకు ఉదాహరణలు. సూక్ష్మజీవి భాగాలతో చేస్తే.. వ్యాధి కారక సూక్ష్మజీవి భాగాలను ఉపయోగించుకుని కూడా టీకా తయారు చేయొచ్చు. ప్రొటీన్లు, చక్కెరలు, సూక్ష్మజీవి చుట్టూ ఉండే తొడుగు వంటివి టీకా తయారీకి వాడతారు. వాడే భాగాన్ని బట్టి వీటిని సబ్యూనిట్/ రీకాంబినెంట్/పాలిశాకరైడ్/ కంజుగేట్ వ్యాక్సిన్లుగా పిలుస్తారు. విడిభాగం ఒక్కదాన్నేవాడటం వల్ల రోగ నిరోధక వ్యవస్థ స్పందన బలంగా ఉంటుంది. అవసరమైన వారందరికీ ఇచ్చేందుకు వీలైన టీకా ఇది. అయితే వ్యాధి నుంచి రక్షణ కావాలంటే.. తరచూ బూస్టర్ షాట్లు తీసుకోవాల్సి ఉంటుంది. హెపటైటిస్–బి, షింగిల్స్, మెనింజో కోకల్, న్యూమోకోకల్, హ్యూమన్ పాపిలోమా వైరస్ వంటి వ్యాధుల నుంచి రక్షణ కల్పించే టీకాలన్నీ ఇలా బ్యాక్టీరియా/వైరస్ విడిభాగాలతో తయారవుతాయి. విషాన్ని విరుగుడుగా ఇస్తే.. సూక్ష్మజీవులకు పడని విషాన్ని ఉపయోగించడం ద్వారా తయారయ్యే టీకాను టాక్సాయిడ్ వ్యాక్సిన్ అని పిలుస్తారు. ఇవి తీసుకున్నప్పుడు సూక్ష్మజీవి మొత్తానికి రోగ నిరోధక వ్యవస్థ స్పందించదు. వాడిన టాక్సిన్ (విషం) ఏదైతే ఉంటుందో దానికి మాత్రమే స్పందిస్తుంది. టాక్సాయిడ్ టీకాలు కూడా తరచూ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకట్రెండు డోసులతో జీవితాంతం రక్షణ లభించదు. టెటానస్, డిప్తీరియా వంటి వ్యాధుల నుంచి రక్షణకు ఉపయోగించేవి టాక్సాయిడ్ వ్యాక్సిన్లకు ఉదాహరణలు. నిర్వీర్యమైన సూక్ష్మజీవులతో.. ఈ రకమైన టీకాలను ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ అని పిలుస్తారు. వ్యాధి కారక సూక్ష్మజీవిని నిర్వీర్యం చేసిన తర్వాత వాడతారన్నమాట. లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్లతో పోలిస్తే అంత ప్రభావం చూపవు. ఎక్కువ డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. సూక్ష్మజీవి నిర్వీర్యమైనా.. అవి శరీరంలో ఉన్నప్పుడు రోగ నిరోధక వ్యవస్థ వాటిని గుర్తించి ప్రతిచర్యలు తీసుకుంటుంది కాబట్టి.. నిర్దిష్ట వ్యాధి సోకదన్నది ఈ టీకా వెనుక ఉన్న సూత్రం. పోలియో, రేబిస్, హెపటైటిస్–ఏ వంటి వ్యాధుల నివారణకు ఇచ్చే టీకాలు ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్లు! -
ఉప్పుతో ముప్పే
బెర్లిన్: ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే రక్తపోటు మొదలుకొని అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని మనం ఇప్పటికే చాలాసార్లు విని ఉంటాం. అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ఈ తరుణంలో ఉప్పుతో రోగ నిరోధక వ్యవస్థకూ చేటే అన్న కొత్త విషయం బయటపడింది. జర్మనీలోని బాన్ హాస్పిటల్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఎలుకలపై జరిపిన పరిశోధనలు ఈ విషయాన్ని రుజువు చేశాయి. ఎక్కువ ఉప్పు ఉన్న ఆహారం అందించిన ఎలుకల్లో బ్యాక్టీరియా సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు, మనుషుల్లోనూ రోజుకు మామూలు కంటే 6 గ్రాములు ఎక్కువ ఉప్పు తీసుకున్న వారిలో రోగ నిరోధక వ్యవస్థ బలహీన పడినట్లు గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇంకోలా చెప్పాలంటే ఫాస్ట్ఫుడ్తో రెండుసార్లు భోజనం చేస్తే రోగ నిరోధక వ్యవస్థ బలహీన పడుతుందన్నమాట. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం మనిషికి రోజుకు 5 గ్రాముల ఉప్పు సరిపోతుంది. ఇది ఒక టీస్పూ న్ ఉప్పుతో సమానం. ఉప్పు ఎక్కువగా తిన్న వారి రక్తాన్ని వారం తర్వాత పరిశీలించగా, రోగ నిరోధక వ్యవస్థలో భాగమైన గ్రాన్యులోసైట్స్ బ్యాక్టీరియాపై పోరాడటంలో బాగా వెనుకబడినట్లు తెలిసిందని శాస్త్రవేత్తలు తెలిపారు. -
యుద్ధానికి సిద్ధమెలా?
కరోనా వైరస్ పేరు చెప్పగానే మనమంతా వణికి పోతున్నాం గానీ.. ఇవి మనకు కొత్తేమీ కాదు. యుగాలుగా మనపై దాడి చేస్తూనే ఉన్నాయి.. ప్రతి దాడితో మనిషి మరింత బలపడ్డాడు. కొత్త వాటిని అడ్డుకునే శక్తి సంపాదించుకున్నాడు అంతా మన శరీరంలోని అత్యంత సంక్లిష్టమైన రోగ నిరోధక వ్యవస్థ ఫలితం! ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ఏం చేస్తే బలహీన పడుతుంది? మరింత బలం పుంజుకోవడం ఎలా? యుద్ధంలో మాదిరిగానే ఈ రోగ నిరోధక వ్యవస్థలోనూ.. చతురంగ బలాలు ఉంటాయి. సూక్ష్మజీవుల ఎత్తులకు పైఎత్తులేయడం.. అస్త్రశస్త్రాలతో వాటిని చిత్తు చేయడం.. నిత్యం జరిగేవే. వేగులు, సైనికులు, సమాచారం సేకరించే వారు.. బోలెడన్ని ఆయుధ కర్మాగారా లు ఈ వ్యవస్థలో భాగాలే. కణాలు, కణజాలాలు, శోషరస గ్రంథులు (లింఫ్‌నోడ్స్), అవయవాలతో కూడి ఉంటుంది ఈ వ్యవస్థ. సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశిస్తే వాటిని నాశనం చేయడం, లోపలికి చొరబడ్డ శత్రువు వివరాలను నిక్షిప్తం చేసుకుని భవిష్యత్తులో మళ్లీ అదే శత్రువు వస్తే అడ్డుకోవడం, క్రిములను చంపేయడం, సమాచారం ఒక చోటి నుంచి ఇంకోచోటికి చేరవేయడం వంటి సుమారు 12 పనులను ఈ వ్యవస్థ చేస్తుంది. ఈ పనులన్నీ చేసేందుకు సుమారు 21 రకాల కణాలు అందుబాటులో ఉంటాయి. ఎలా పనిచేస్తుంది? ఉదాహరణకు శరీరంపై ఏదైనా గాటు పడితే.. ఆ వెంటనే దాని గుండా బ్యాక్టీరియా వంటివి లోపలికి ప్రవేశించి బాగా పెరుగుతాయి. వీటిని అడ్డుకునేందుకు సరిహద్దులో గస్తీ సైనికుల మాదిరిగా మాక్రోఫేగస్ కణాలు రంగంలోకి దిగుతాయి. కొంచెం పెద్ద సైజు (21 మైక్రోమీటర్లు) ఉండే ఈ మాక్రోఫేగస్ ఒక్కొక్కటి వంద వరకు బ్యాక్టీరియాలను మింగేసి ఎంజైమ్‌ల సాయంతో నాశనం చేస్తాయి. మంట/వాపు కలిగించడం ద్వారా నీళ్ల లాంటి ద్రవం విడుదల చేయాల్సిందిగా రక్త కణాలకు సమాచారం పంపుతాయి. బ్యాక్టీరియా తగ్గకపోతే.. కొంతకాలం తర్వాత మాక్రోఫేగస్ విడుదల చేసే మెసెంజర్ ప్రొటీన్లతో రక్తంలో ప్రవహిస్తున్న న్యూట్రోఫిల్స్‌ను అదనపు బలగాల రూపంలో అందుబాటులోకి వస్తాయి. విష పదార్థాలను విడుదల చేయడం ద్వారా ఇవి బ్యాక్టీరియాను చంపేస్తాయి. బ్యాక్టీరియాను అడ్డుకునేందుకు తమను తాము నాశనం చేసుకునేందుకు కూడా ఇవి వెనుకాడవు. ఇంత జరిగినా బ్యాక్టీరియా ప్రభావం తగ్గలేదనుకోండి.. అప్పుడు రోగ నిరోధక వ్యవస్థకు మెదడు లాంటి డెండ్రటిక్ కణాలు రంగ ప్రవేశం చేస్తాయి. బ్యాక్టీరియా తాలూకు సమాచారం మొత్తం సేకరించి.. దగ్గరలోని శోషరస గ్రంథులను చేరుకుంటాయి. ఈ గ్రంథుల్లోని కోటాను కోట్ల హెల్పర్ టి–సెల్స్, కిల్లర్ టి–సెల్స్‌లో తగిన వాటిని గుర్తించి వాటిని చైతన్యపరుస్తాయి. ఈ టి, కిల్లర్ కణాలు గణనీయంగా వృద్ధి చెంది బ్యాక్టీరియాపై దాడి చేస్తాయి. ఈ క్రమంలో కొన్ని శోషరస గ్రంథిలోనే ఉంటాయి. భవిష్యత్తులో ఇదే రకమైన బ్యాక్టీరియా దాడి చేస్తే ప్రతిదాడికి సిద్ధంగా ఉంటాయి. కొన్ని హెల్పర్ టి–కణాలు గ్రంథుల్లోని శక్తిమంతమైన బి–కణాలను చైతన్యపరచడంతో అవి యాంటీబాడీలను తయారు చేసి బ్యాక్టీరియాపైకి వదులుతాయి. ఇవి బ్యాక్టీరియాకు అతుక్కుపోయి వాటిని నిర్వీర్యం చేస్తాయన్న మాట. దాడి చేసే సూక్ష్మజీవిని బట్టి రోగనిరోధక వ్యవస్థలోని కణాలు వేర్వేరు పద్ధతుల్లో వాటిని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తాయి. బలహీనపడేది ఇలా.. రోగ నిరోధక వ్యవస్థ బలహీన పడేందుకు వయసుతో పాటు ఒత్తిడి, దురలవాట్లు వంటి అనేక కారణాలు ఉంటాయి. పోషకాహార లోపాలు, కొన్ని రకాల మందులు, హెచ్ఐవీ/ఎయిడ్స్ వంటి రోగాలు కూడా కారణమే. మానసిక ఒత్తిడికి గురైనప్పుడు మెదడు కొన్ని రకాల హార్మోన్లను విడుదల చేయడం వల్ల రోగ నిరోధక వ్యవస్థలో కీలకమైన తెల్లరక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. ఒత్తిడి దీర్ఘకాలం కొనసాగితే కార్టిసోల్ వంటి మంచి చేసే హార్మోన్లు కూడా శరీరానికి హానికారకంగా మారిపోతాయి. రోగ నిరోధక వ్యవస్థలోని కణాలు ఈ హార్మోన్‌కు అలవాటు పడిపోయి తగువిధంగా స్పందించవు. కొన్ని రకాల అలవాట్లు కూడా శరీరాన్ని ఒత్తిడికి గురిచేయడం ద్వారా రోగ నిరోధక వ్యవస్థను బలహీన పరుస్తాయి. అయితే కొంతమందికి పుట్టుకతో బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ ఉంటుంది. మరికొందరిలో ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడం ద్వారా కీళ్లనొప్పులు, టైప్–1 మధుమేహం, మల్టిపుల్ స్లీ్కరోసిస్ వంటి రోగాలు వస్తూంటాయి. శక్తిమంతుడిగా మారాలంటే.. రోగ నిరోధక వ్యవస్థన బలపరుచుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. కాసింత జాగ్రత్తగా వ్యవహరిస్తే సరిపోతుంది. ఇందుకు మన జీవనశైలిని మార్చుకోవాల్సిన అవసరమూ ఉండదు. తగిన పోషకాలున్న ఆహారం సగం సమస్యలు తీరుస్తుంది. ఉదాహరణకు ప్రోటీన్లు.. రోగ నిరోధక వ్యవస్థలోని అన్ని కణాలకు, ఇతర కణాలకు కూడా ప్రొటీన్లలో ఉండే ఎల్–ఆర్జినిన్ అవసరముంటుంది. ఈ ఎల్–ఆర్జినిన్ శరీరంలో హెల్పర్ టి–సెల్స్ ఉత్పత్తి అయ్యేందుకు ఉపయోగపడతాయని పరిశోధనలు చెబుతున్నాయి. పండ్లు, కూరగాయలు తగినంత మోతాదులో తీసుకోవడం (భారతీయులు రోజుకు కనీసం 400 గ్రాములు తీసుకోవాలి) వల్ల శరీరానికి అవసరమైన పోషకాలన్నీ లభిస్తాయి. తద్వారా రోగ నిరోధక వ్యవస్థకు బలం చేకూరుతుంది. రోగనిరోధక కణాల్లో సుమారు 70 శాతం మన కడుపు/పేగుల్లో ఉంటాయని సైన్స్ చెబుతోంది. కాబట్టి జీర్ణ వ్యవస్థను కాపాడుకోవడం ద్వారా రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండేలా చూసుకోవచ్చు. జీర్ణ వ్యవస్థలో సుమారు వెయ్యి రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. వీటిలో అత్యధికం శరీరానికి మేలు చేసేవే కాబట్టి.. వీటిలో సమతుల్యం ఉండేలా చూడాలి. పెరుగు తదితర ప్రోబయోటిక్స్ తీసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థలో సమతుల్యత చెడకుండా చూసుకోవచ్చు. విటమిన్లు, యాంటీయాక్సిడెంట్లు తగినన్ని శరీరానికి అందేలా చేయడం ముఖ్యమే. సూర్యరశ్మితో శరీరంలో ఉత్పత్తి అయ్యే విటమిన్–డి మరీ ముఖ్యం. వ్యాయామం కూడా శరీర రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుందని ఇప్పటికే పలు పరిశోధనల ద్వారా స్పష్టమైంది. మంచి ఆహారం తీసుకోవాలి.. తగినంత వ్యాయామం చేయాలి.. ఒత్తిడి తగ్గించుకోవాలి.. ఇవన్నీ చేయగలిగితే కరోనాను దూరం పెట్టడం పెద్ద కష్టమేమీ కాదు! – సాక్షి, హైదరాబాద్ -
ఇదీ తుది దశ...
వైరస్ సోకిన తరువాత దగ్గు, జలుబు లక్షణాలు కనిపిస్తున్నా వైద్యం చేయించుకోకపోతే పొడిదగ్గు ఎంత తీవ్రమవుతుందంటే.. ఒక్కో దగ్గుకు మీ వెన్ను భాగం కలుక్కుమంటుంది. వైద్యులు పరీక్షలు జరిపి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారిస్తారు. ఐసోలేషన్ వార్డులో ఉంచుతారు. సీటీ స్కాన్ చేస్తే.. ఊపిరితిత్తుల్లో ద్రవాలు అక్కడక్కడా పోగుబడి ఉండటం స్పష్టంగా కనిపిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థకు, వైరస్‌కు మధ్య యుద్ధం జరిగేది ఈ ద్రవాలు ఉన్నచోటే. ఇంకోలా చెప్పాలంటే ఈ దశలో కోవిడ్‌తోపాటు ప్రమాదకర స్థాయిలో న్యుమోనియా కూడా ఉందన్నమాట. వైద్యులు ఐవీ ఫ్లూయిడ్స్‌తో చికిత్స మొదలుపెడతారు. దీంతో శరీరానికి తగిన పోషకాలు అందుతాయి. యాంటీ వైరల్ మందులు ఇస్తారు. వయసు మీరి ఉన్నా, మధుమేహం, గుండెజబ్బు వంటి ఆరోగ్య సమస్యలుంటే.. పరిస్థితి మెరుగుపడదు సరికదా, మరింత క్షీణిస్తుంది. రోజులపాటు వాంతులవుతాయి. గుండె కొట్టుకునే వేగం నిమిషానికి యాభైకి పడిపోతుంది. ఈ దశలో శరీర రోగ నిరోధక వ్యవస్థ సైటోకైన్స్‌ను విపరీతంగా ఉత్పత్తి చేస్తుంది. తెల్ల రక్త కణాలు ఊపిరితిత్తులపై దాడి చేస్తాయి. కణజాలం నశించిపోవడం, ద్రవాలు పేరుకుపోవడం ఎక్కువవుతుంది. దీంతో రక్తం నుంచి ఆక్సిజన్‌ను సేకరించే వ్యవస్థ నాశనమవుతుంది. తర్వాత ఒక్కో అవయవం పనిచేయడం ఆగిపోతుంది. కాలేయం పని చేయకపోతే రక్తంలోని విషాలు బయటకు వెళ్లవు. ఇంకోవైపు ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల మెదడు కణాలు నశించిపోతుంటాయి. డాక్టర్ల మాటలు సగం సగమే వినపడుతుంటాయి. ఊపిరితిత్తులు, గుండె పని చేసేందుకు బయటి నుంచి యంత్రాన్ని ఏర్పాటు చేస్తారు. కొన్ని గంటల నరకయాతన తరువాత.. శ్వాశ ఆగిపోతుంది. సబ్బుకు, వైరస్‌కు వైరమెందుకు 1. కరోనా వైరస్ పైపొర కొవ్వులు, ఇతర ప్రొటీన్లతో తయారై ఉంటుంది. మధ్యమధ్యలో కొన్ని ప్రొటీన్లు బయటకు పొడుచుకు వచ్చి ఉంటాయి. వీటిని స్పైక్ ప్రొటీన్లు అంటారు. స్పైక్ ప్రొటీన్: వైరస్ లోపలికి ప్రవేశించేందుకు కారణమవుతుంది. ఇది కొవ్వులు, ఇతర ప్రొటీన్లతో కూడిన పై పొర. 2. సబ్బు అణువులు హైబ్రిడ్ నిర్మాణం కలిగి ఉంటాయి. తల భాగానికి నీటితో అతుక్కుపోయే గుణం ఉంటే, తోక భాగం నీటిని వికర్షిస్తూంటుంది. హైడ్రోఫిలిక్ తల: నీటితో బంధం ఏర్పరచుకుంటుంది. హైడ్రోఫోబిక్ తోక: నీటితో కాకుండా, నూనెలు, కొవ్వులతో బంధం ఏర్పరచుకుంటుంది. 3. చేతులు కడుక్కునే క్రమంలో సబ్బు అణువుల్లోని తోకలు వైరస్ పైపొర వైపు ఆకర్షితమవుతాయి. సూదుల్లాంటి నిర్మాణం ఉండటం వల్ల కొవ్వులతో తయారైన పై పొరకు కన్నాలు పడతాయి. ఫలితంగా వైరస్ లోపల ఉండే ఆర్ఎన్ఏ జన్యుపదార్థం బయటకు వస్తుంది. వ్యర్థాలతోపాటు వైరస్ తాలూకు ముక్కలు మిసిల్లే అని పిలిచే చిన్నచిన్న బుడగల్లా మారిపోతాయి.