Implementation of welfare schemes
-
ఏపీలో మహిళలకు ప్రాధాన్యంపై జర్మనీ ప్రశంస
సాక్షి, అమరావతి: ఏపీలో మహిళల కోసం ప్రత్యేకంగా సంక్షేమ పథకాల అమలు, ఉపాధి అవకాశాల కల్పనపై జర్మనీ ప్రభుత్వ ప్రతినిధులు ప్రశంసించారు. నగరాలు, పట్టణాల పరిశుభ్రతకు ఈ–ఆటోలు అందించడం, వాటికి డ్రైవర్లుగా మహిళలనే నియమించడంపై ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సైతం అభినందనలు తెలిపారు. అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఇటీవల ‘హై లెవెల్ పొలిటికల్ ఫోరం’ పేరుతో అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఐక్యరాజ్యసమితి స్పెషల్ కన్సల్టెన్టివ్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్‌కుమార్ రాష్ట్రం తరఫున ఒక స్టాల్‌ను ఏర్పాటు చేశారు. సీఎం జగన్ ‘నాడు–నేడు’ కింద అమలు చేస్తున్న పలు పథకాలు, మహిళల కోసం ప్రత్యేక పథకాలు, సస్టెయినబుల్ గ్రీన్ సిటీస్ నిర్మాణం గురించి వివరిస్తూ ఫొటోలను ప్రదర్శించారు. వీటిలో ముఖ్యంగా మున్సిపల్ శాఖ చెత్త సేకరణ కోసం ఈ–ఆటోలు అందించడంతోపాటు డ్రైవర్లుగా మహిళలనే నియమించడం, పట్టణ పేద మహిళలకు రూపాయికే ఇల్లు అందించడం వంటి అంశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇంటింటి చెత్త సేకరణ, పట్టణాల్లో సామాజిక అడవులు, రహదారుల వెంబడి మొక్కల పెంపకం వంటి కార్యక్రమాలు అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్నట్లు షకిన్‌కుమార్ తెలిపారు. ఈ–ఆటోల ద్వారా చెత్త సేకరించడం, తడి, పొడి చెత్తను వేరుగా సేకరించడాన్ని వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు అభినందించారని, క్లీన్ అండ్ గ్రీన్ సిటీల అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. రూపాయికే ఇల్లు ఇవ్వడాన్ని యూఎన్‌ఓలోని అమెరికా ప్రతినిధి బిల్గ్రాహం మెచ్చుకున్నారని తెలిపారు. -
జగన్ పాలనలోనే.. మహిళలకు మహోన్నత గౌరవం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో మహిళలకు మహోన్నత గౌరవం దక్కుతోందని, ఇది దేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన అరుదైన ఘనత అని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ది హిందూ జాతీయ దినపత్రిక ఆధ్వర్యంలో ‘మహిళా సాధికారత, సమానత్వం’ అంశంపై మంగళవారం చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి రచయిత్రి ప్రసూన సంధానకర్తగా వ్యవహరించగా హిందూ జీఎం ఎస్డీటీ రావు కార్యక్రమాన్ని ప్రారంభించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన చర్చలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి రజిని మాట్లాడుతూ.. తాము ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించాలని మహిళలు అడిగినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని.. కానీ, సీఎం వైఎస్ జగన్ మాత్రం అడక్కుండానే మహిళలకు అనేక వరాలిస్తూ చరిత్ర సృష్టిస్తున్నారన్నారు. నవరత్నాల ద్వారా అమలుచేస్తున్న ప్రతి పథకం మహిళల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిందేనని మంత్రి అన్నారు. ఇక చర్చా గోష్టిలో పాల్గొన్న వారు ఏమన్నారంటే.. మహిళాంధ్రప్రదేశ్‌గా ఏపీ.. రాష్ట్రంలో మహిళను నిర్ణయాత్మక శక్తిగా తీర్చిదిద్దిన ఘనత సీఎం వైఎస్ జగన్‌దే. ఆంధ్రప్రదేశ్‌ను మహిళాంధ్రప్రదేశ్‌గా మార్చేశారు. అడక్కుండానే అన్నింట్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించారు. మహిళల కోసం ఇంతగా చేస్తున్న ప్రభుత్వం ఉంది కాబట్టే ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిరోజూ మహిళా దినోత్సవమే అని గర్వంగా చెప్పుకోవచ్చు. – వాసిరెడ్డి పద్మ, ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ దిశ బిల్లుతో అద్భుత ఫలితాలు దేశంలో మరెక్కడా లేని విధంగా ఏపీలోనే దిశ బిల్లు రూపుదిద్దుకుంది. ఇది చాలా విప్లవాత్మక విజయాలను సాధిస్తోంది. అనేక రాష్ట్రాలు దీనిపై ఆసక్తి చూపిస్తున్నాయి. అనేక కేసుల్లో నెలరోజుల్లోపే శిక్షలు పడుతున్నాయంటే అది దిశ బిల్లు ఘనతే. – కేజీవీ సరిత, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీ ఆర్థిక, రాజకీయ స్వావలంబన మెరుగుపడింది రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా మహిళలకు ఆర్థిక, రాజకీయ స్వావలంబన మెరుగుపడటం సంతోషకరం. మహిళలు పనిచేసే ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేయడంతోపాటు అణగారిన వర్గాల మహిళల సమస్యలపై ప్రభుత్వం దృష్టిసారించాలి. – చల్లపల్లి స్వరూపరాణి, ఏఎన్‌యూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ -
త్వరలో ఎస్సీ సదస్సు
సాక్షి, అమరావతి: దళితుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి జగన్ నిరంతరం కృషి చేస్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. దళితులకు సంక్షేమ పథకాల అమలుపై తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సమీక్ష జరిగింది. పార్టీ ఎస్సీ విభాగాన్ని మరింత పటిష్టం చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకునేలా చైతన్యం చేయడంపై చర్చించారు. దళితుల్లో నాయకత్వాన్ని పెంపొందించేలా చురుకైన కార్యకర్తలు, నేతలను గుర్తించి ప్రోత్సహించాలని నిర్ణయించారు. సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకరరావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి నాగార్జున మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ ప్రభుత్వంలో దళితులకు జరుగుతున్న మేలు, చేకూరుతున్న ప్రయోజనాలను వివరిస్తూ త్వరలో రాష్ట్రస్థాయి ఎస్సీ సదస్సు నిర్వహిస్తామని ప్రకటించారు. దళితులను మోసగించేందుకు టీడీపీ పన్నుతున్న కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ సూచించారు. చంద్రబాబు హయాంలో ఎస్సీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఎంపీ నందిగం సురేష్ పేర్కొన్నారు. ఎస్సీ విభాగానికి సంబంధించి అన్ని కమిటీలను బలోపేతం చేస్తామని సామాజిక న్యాయ సలహాదారుడు జూపూడి ప్రభాకరరావు తెలిపారు. సీఎం జగన్ అమలు చేస్తున్న కార్యక్రమాలను జగనన్న సందేశం పేరుతో ఇంటింటికీ తీసుకు వెళ్తామని చెప్పారు. -
బిహార్ కులకలం
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఏ ఇతర పార్టీ చేయని సాహసానికి పూనుకున్నారు. రాష్ట్రంలో కులగణనకి శ్రీకారం చుట్టారు. బడుగు, బలహీన వర్గాలకు శాస్త్రీయ విధానంలో సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే కులాలు లెక్కలు పక్కాగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ ప్రక్రియను ప్రారంభించారు. రెండు దశలుగా సాగే ఈ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా ఒక మొబైల్ అప్లికేషన్‌ను రూపొందించారు. దేశ ప్రయోజనాల కోసమే కులగణనను చేపడుతున్నామని, ఓబీసీల అసలు లెక్కలు ఎంతో తేల్చాలన్నదే తమ ఉద్దేశమని నితీశ్ కుమార్ బయటకి చెబుతున్నప్పటికీ రాజకీయ లబ్ధి కోసమే ఆయన ఈ సంక్లిష్ట ప్రక్రియను మొదలు పెట్టారన్న విమర్శలు మొదలయ్యాయి. కులగణనపై వివిధ వర్గాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. దేశంలో సామాజిక న్యాయం జరగాలంటే, సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందాలంటే కులాల వారీగా జనాభా లెక్కలు చేపట్టాల్సిందేనని ఒక వర్గం గట్టిగా పట్టుబడుతోంది. ఓబీసీలకు కేటాయించిన కోటా వారికి సమానంగా పంపిణీ చేయడం కోసం నియమించిన రోహిణి కమిషన్ ఓబీసీల్లో 2,633 కులాలు ఉన్నాయని తేల్చింది. అయితే ప్రస్తుతం మన దేశంలో అమలవుతున్న ఓబీసీల రిజర్వేషన్లలో ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వార్డ్ కేస్ట్స్ (ఈబీసీ)లకే అమలవుతున్నాయి. మరోవైపు 21 శతాబ్దంలో కూడా కులాల వారీగా జనాభా లెక్కిస్తే సమాజంలో మరిన్ని చీలికలు వస్తాయని మరో వర్గం వాదనగా ఉంది. ఇంకా కులాల కుంపట్లలోనే మగ్గిపోతూ ఉంటే గ్లోబల్ సూపర్ పవర్‌గా భారత్ ఎదిగే అవకాశాలకు గండిపడుతుందనే అభిప్రాయాలున్నాయి. ఎందుకీ కులగణన? స్వాతంత్య్రానంతరం ఇప్పటివరకు కులాలవారీగా జనాభా లెక్కింపు చేపట్టలేదు. 1990లో కేంద్రంలో జనతాదళ్ ఆధ్వర్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించింది. జనాభా ప్రాతిపదిక అంటూ ఏమీ లేకుండా 27% రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం 1992 నుంచి అమలవుతోంది. ఇప్పటివరకు మన దగ్గరున్న కులాల లెక్కలకు 1931 నాటి గణాంకాలే ఆధారం. వాటి ప్రకారం జనాభాలో ఓబీసీలు 52 శాతం! పదేళ్లకోసారి జరిగే జనాభా లెక్కింపులో ఎస్సీ, ఎస్టీల జనాభాను లెక్కిస్తున్నారు. జనాభా ప్రాతిపదికన వారికి రిజర్వేషన్లున్నాయి. అందుకే తమకూ అలాగే రిజర్వేషన్లను పెంచాలని ఓబీసీలు డిమాండ్ చేస్తున్నారు. కుల సమీకరణలు అధికంగా ఉన్న బిహార్‌లో ఓబీసీలే కీలకం. ఓబీసీ నాయకుడైన నితీశ్ మొదట్నుంచి కులగణనకు మద్దతుగా ఉన్నారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చాక దాన్ని ఆచరణలో పెట్టి రాజకీయ వేడిని పెంచారు. ఒక్కసారి చరిత్రలోకి చూస్తే.. భారత దేశంలో మొట్టమొదటి సారిగా బ్రిటిష్ ప్రభుత్వం 1871లో కులగణన చేపట్టింది. మన దేశంలో ఉన్న విభిన్న వర్గాల ప్రజల్ని అర్థం చేసుకోవడానికే ఈ ప్రక్రియ మొదలు పెట్టింది. అప్పట్లో సేకరించిన సమాచారం ఆధారంగా కులాలకు ప్రాధాన్యతా క్రమాలను నిర్దేశించింది. అలా మొదలు పెట్టిన కులగణన 1931లో చివరిసారిగా చేశారు. ఆ నాటి జనాభా గణాంకాల ప్రాతిపదికగానే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించారు. స్వాంతంత్య్రానంతరం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీలన్నీ కులగణనకు దూరంగా ఉన్నాయి. పదేళ్లకి ఒకసారి చేసే జనాభా లెక్కింపులో ఎస్సీ, ఎస్టీల డేటా సేకరణకు మాత్రమే పరిమితమయ్యారు. 2011లో యూపీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా సామాజిక, ఆర్థికంగా వెనుకబడిన కులాల వివరాలను కూడా సేకరించింది. కానీ వాటిని విడుదల చేయలేదు. ప్రస్తుతం కేంద్రంలో సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి ప్రతిమ భూమిక యూపీఏ హయాంలో జరిగిన కులగణన సరిగా జరగలేదని, అదంతా తప్పులతడకగా సాగిందని చెబుతున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితులకు ఆ డేటా పాతబడిపోయిందని వివరించారు. లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం ఎంత ? బిహార్‌లో కులగణన పూర్తయి లోక్‌సభ ఎన్నికల కంటే ముందే నివేదిక వస్తే నితీశ్ కుమార్, తేజస్వి యాదవ్లకే అత్యధికంగా లాభం చేకూరే అవకాశాలే కనిపిస్తున్నాయి. బిహార్‌లో ఓబీసీల్లో మరింతగా వెనుకబడిన వారైన అత్యంత వెనకబడిన తరగతులు(ఈబీసీ), దళితుల్లో మరింత అణగారిన మహాదళితుల కార్డుతో కొత్త సామాజిక సమీకరణలకి తెరతీసిన నితీశ్ రాజకీయంగా లబ్ధి పొందుతూ వస్తున్నారు. వీరి వాస్తవ సంఖ్య వెల్లడైతే ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఆయన పై చేయి సాధించవచ్చు. మహారాష్ట్ర, ఒడిశా వంటి రాష్ట్రాలు, ఎస్పీ, బీఎస్పీ, డీఎంకే వంటి పార్టీలు కులగణనకు మద్దతుగా ఉండడంతో దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ చేపట్టాలన్న స్వరం పెరుగుతుంది. ఇప్పుడు బిహార్‌లో ఓబీసీ జనాభా ఎంత ఉందో వాస్తవాలు వెల్లడైతే వారి ఓటు బ్యాంకే ప్రధానంగా కలిగిన ప్రాంతీయ పార్టీలు బలపడతాయి. ఇది జాతీయ స్థాయిలో ప్రధాన పార్టీలైన బీజేపీకి, కాంగ్రెస్‌కు కూడా ఎదురు దెబ్బగా పరిణమిస్తుంది. అంతే కాకుండా దేశంలో మరోసారి మండల్ వర్సెస్ కమండల్ రాజకీయాలకు తెరలేవచ్చు. 1990 దశకంలో బీజేపీ నేత అద్వానీ రథయాత్రకు కౌంటర్‌గా మండల్ కమిషన్ నివేదికతో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడం దేశవ్యాప్తంగా హింసకు దారి తీసింది ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలను మినహాయించి మిగిలిన కులాల జనగణన సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఇప్పుడు నితీశ్ కుమార్ చేపట్టిన ప్రక్రియ జాతీయ రాజకీయాలను ఎలాంటి మలుపులు తిప్పుతుందో వేచి చూడాల్సిందే. – సాక్షి, నేషనల్‌డెస్క్ -
బయోమెట్రిక్ బదులు ఇక ‘ఫేషియల్’
సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాల అమలులో ప్రస్తుతం ఉపయోగిస్తున్న ‘బయోమెట్రిక్’ విధానం స్థానంలో ‘ఫేషియల్ అథంటికేషన్’ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భవిష్యత్‌లో వేలిముద్రల ఆధారంగా కాకుండా ముఖం ఆధారంగా లబ్ధిదారులను గుర్తిస్తారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం అమలుచేస్తున్నా.. ముందుగా ఆయా పథకాల లబ్ధిదారుల అందరి నుంచి వేలిముద్రలను సేకరించి, వాటిని లబ్ధిదారుని ఆధార్ నమోదు సమయం నాటి వేలిముద్రలతో పోల్చి ధృవీకరించుకుంటారు. అదే ఫేషియల్ ఆథంటికేషన్ విధానం అమలులోకి వస్తే వేలిముద్రలకు బదులు లబ్ధిదారుని ముఖాన్ని, అతడి ఆధార్‌లోని ముఖకవళికలతో పోల్చి ధృవీకరించుకుంటారు. ప్రస్తుతం అమలుచేస్తున్న బయోమెట్రిక్ విధానంలో లబ్ధిదారుల వేలిముద్రలు సరిపోక సమస్యలు తలెత్తున్నాయి. వృద్ధులు, ఎక్కువ కాయకష్టం పనులు చేసేవాళ్ల వేలిముద్రలు అరిగిపోతుండడంతో బయోమెట్రిక్ సమయంలో సమస్యలొస్తున్నాయి. బయోమెట్రిక్‌కు బదులు ఐరిష్ విధానం అమలుచేసినా.. కళ్ల శుక్లం ఆపరేషన్ చేసుకున్న వారితో సమస్యలు ఏర్పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఉదా.. పింఛన్ల పంపిణీలో వేలిముద్రలు సరిపోక ప్రతీనెలా దాదాపు రెండు లక్షల మందికి ఆధార్‌తో సంబంధం లేకుండా పంపిణీ జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాంటి వారి ఫొటోలు ముందుగా యాప్‌లో నమోదు చేసి, పంపిణీ చేసే సమయంలో ఆ లబ్ధిదారుని ఫొటోతో సరిపోల్చుకుని పంపిణీ చేస్తున్నారు. ఇందులో సిబ్బంది చేతివాటం ప్రదర్శించే అవకాశముంది. దీంతో ఫేషియల్ అథంటికేషన్ విధానాన్ని అమలుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నిర్వహణ ఖర్చుల్లోనూ ఆదా.. ఇక సంక్షేమ పథకాల కోసం ప్రస్తుతం మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు మూడు లక్షల బయోమెట్రిక్ పరికరాలను ప్రభుత్వ యంత్రాంగం వినియోగిస్తోంది. అవి సున్నితమైనవి కావడంతో.. ఏటా 30–40 వేల పరికరాలు కొత్తవి కొనుగోలు చేయాల్సి వస్తోంది. అదే ఫేషియల్ అథంటికేషన్ విధానంలో అదనంగా ఎలాంటి పరికరాలు ఉపయోగించాల్సిన అవసరం ఉండదని అధికారులు వెల్లడించారు. మొబైల్ యాప్ ద్వారా లబ్ధిదారుని ముఖాన్ని స్కాన్ చేయగా, అది ఆధార్‌కు అనుసంధానమై లబ్ధిదారుని సమాచారంతో సరిపోల్చుకుంటుందన్నారు. కేంద్రం, యూఏడీ అనుమతి తప్పనిసరి ఈ రెండూ విధానాలు అధార్ డేటాతో అనుసంధానం అవుతున్నప్పటికీ బయోమెట్రిక్ విధానంలో తలెత్తే ఇబ్బందలన్నింటినీ ఫేషియల్ అథంటికేషన్ విధానంతో అధిగమించడంతోపాటు పూర్తి పారదర్శకంగానూ అమలుచెయ్యొచ్చని అధికారులు అంటున్నారు. అలాగే, బయోమెట్రిక్ స్థానంలో ఫేషియల్ అథంటికేషన్ అమలుచేయాలంటే కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫరేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆమోదంతో పాటు ఆధార్ డేటా మొత్తం అనుసంధానమై ఉండే యూఏడీ విభాగం అనుమతి తప్పనిసరి. ఇక దేశంలో ఫేషియల్ అథంటికేషన్ విధానం అమలుచేసే తొలి రాష్ట్రం మన ఏపీయే కావడం గమనార్హం. కనీసం 150 మందిపై పరిశీలన తర్వాతే.. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫరేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, యూఏడీ ఈ ఫేషియల్ అథంటికేషన్ విధానాన్ని రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా అమలుకు అనుమతి తెలపడంతో.. విజయవాడలోని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రధాన కార్యాలయంలో మొదటగా అమలుచేస్తున్నారు. ఐదు రోజులుగా ఉద్యోగుల హాజరును ఫేషియల్ అథంటికేషన్ విధానంలో అమలుచేస్తున్నారు. మొదట ఐదుగురు ఉద్యోగుల హాజరును పరిశీలిస్తున్నారు. తర్వాత కార్యాలయంలోని మొత్తం 150 మంది సిబ్బంది హాజరును పరిశీలించాక.. మంత్రిత్వ శాఖ, యూఏడీ విభాగం తుది ఆమోదం కోసం నివేదిక సమర్పిస్తారు. ఆ తర్వాతే అన్ని సంక్షేమ పథకాల అమలులో ఈ విధానం ప్రవేశపెట్టేందుకు వీలు ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. -
Andhra Pradesh: సుపరిపాలనలో నం.1
సాక్షి, అమరావతి: సుపరిపాలనలో ఆంధ్రప్రదేశ్ మరోసారి దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ‘స్కోచ్’ సంస్థ నిర్వహించిన సర్వేలో రాష్ట్రం వరుసగా రెండో ఏడాదీ తొలి స్థానంలో నిలవడం గమనార్హం. విప్లవాత్మక సంస్కరణలను అమలు చేయడం ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత పారదర్శకంగా పరిపాలన అందిస్తుండటం, సంక్షేమాభివృద్ధి పథకాలను సమర్థంగా అమలు చేస్తూ ఇంటి ముంగిటకే ఫలాలను చేరవేస్తుండటం వల్లే దేశంలో అన్నింటా ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తోందని, ‘స్కోచ్’ 2021 సర్వే ఫలితాలే అందుకు నిదర్శనమని సామాజికవేత్తలు విశ్లేషిస్తున్నారు. స్కోచ్ సంస్థ నిర్వహించిన సర్వేలో సుపరిపాలనలో ఏపీ మినహా దక్షిణాది రాష్ట్రాల్లో ఏ ఒక్కటీ తొలి ఐదు స్థానాల్లో నిలవకపోవడం గమనార్హం. రెండో స్థానంలో పశ్చిమ బెంగాల్, మూడో స్థానంలో ఒడిశా, 4వ స్థానంలో గుజరాత్, 5వ స్థానంలో మహారాష్ట్ర నిలవగా తెలంగాణ ఆరో స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్(7), మధ్యప్రదేశ్ (8), అస్సాం(9), హిమాచల్‌ప్రదేశ్ (10), బిహార్(11), హరియాణా (12) ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న పరిపాలన సంస్కరణలు, అన్ని వర్గాల సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు, సమగ్రాభివృద్ధికి తీసుకున్న చర్యలపై స్కోచ్ సంస్థ ఏటా అధ్యయనం చేస్తోంది. సంస్కరణలతో పారదర్శక పాలన.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టాక గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ విప్లవాత్మక సంస్కరణలు తెచ్చి పారదర్శక పాలన అందిస్తున్నారు. సచివాలయాలను ఏర్పాటు చేసి గ్రామ స్వరాజ్యానికి నాంది పలికారు. పట్టణ, నగర ప్రాంతాల్లో వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వాన్ని ప్రజల ముంగిటకు తెచ్చారు. ప్రజల నుంచి వచ్చే ఏ సమస్యనైనా నిర్దిష్ట కాలపరిమితితో పరిష్కరించేలా సచివాలయాలకు విధి విధానాలను రూపొందించారు. ఫలితంగా అత్యధిక సమస్యలు అక్కడే పరిష్కారమవుతున్నాయి. అర్హులకే సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. వలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రజల ఇళ్ల వద్దకే ప్రభుత్వ సేవలను తీసుకెళ్లారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్లను వలంటీర్ల ద్వారా ఇంటివద్దే అందజేస్తున్నారు. సుపరిపాలన వల్ల అన్ని రంగాల్లోనూ అవినీతికి అడ్డుకట్ట పడింది. స్కోచ్ సంస్థ నిర్వహించిన సర్వేలో సుపరిపాలనలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచేందుకు ఇవి దోహదం చేశాయి. గ్రామీణాభివృద్ధిలో మొదటి స్థానం.. సచివాలయాల ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని సీఎం జగన్ సాకారం చేశారు. ప్రతి సచివాలయంలోనూ సగటున పది మంది చొప్పున ఉద్యోగులను నియమించారు. సచివాలయాలకు సొంత భవనాల నిర్మాణంతోపాటు నాడు–నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి, స్వచ్ఛమైన తాగునీరు, అంతర్గత రహదారులు లాంటి కనీస మౌలిక సదుపాయాలను కల్పించారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి శరవేగంగా సాగుతోందని ‘స్కోచ్’ సర్వేలో వెల్లడైంది. దేశంలో గ్రామీణాభివృద్ధిలో రాష్ట్రం తొలి స్థానంలో నిలిచింది. శాంతి భద్రతల్లో మేటి.. శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అదుపులో ఉంటేనే రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యమిస్తూ దిశ బిల్లు ద్వారా పిల్లలు, మహిళలకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించారు. శాంతి భద్రతల విభాగంలో దేశంలోనే ఏపీ తొలి స్థానంలో నిలవడానికి ఇది దోహదం చేసింది. జిల్లా పరిపాలనలో మొదటి స్థానం.. పరిపాలన సంస్కరణల ద్వారా జిల్లాల్లో యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేశారు. సంక్షేమాభివృద్ధి పథకాల అమలు పర్యవేక్షణకు ప్రతి జిల్లాకు కలెక్టర్‌తోపాటు నలుగురు జాయింట్ కలెక్టర్లను నియమించారు. దీంతో సంక్షేమాభివృద్ధి పథకాల అమలు శరవేగంగా సాగుతూ ప్రజలకు సత్వరమే ఫలాలు అందుతున్నాయి. జిల్లా పరిపాలన విభాగంలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలవడానికి ఇది బాటలు వేసింది. వ్యవసాయంలో అగ్రభాగాన.. వ్యవసాయాధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో అధిక శాతం మంది ప్రజలు వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ వ్యవసాయం, అనుబంధరంగాలకు అత్యధిక ప్రాధాన్యం కల్పించారు. వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా అన్నదాతలకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు. గ్రామ సచివాలయాలకు అనుబంధంగా రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ఏర్పాటు చేసి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులను అందజేస్తున్నారు. వ్యవసాయ సహాయకుడి ద్వారా పంటల సాగులో సలహాలు ఇప్పిస్తున్నారు. పంటకు గిట్టుబాటు ధరలు దక్కేలా చర్యలు తీసుకున్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోతే రైతులను ఆదుకునేందుకు ఉచితంగా బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఏ సీజన్లో పంట నష్టపోతే అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీని అందజేసి రైతులకు దన్నుగా నిలుస్తున్నారు. అమూల్ సంస్థ ద్వారా పాడి రైతులకు మెరుగైన ధర దక్కేలా చేశారు. ఫలితంగా స్కోచ్ సంస్థ నిర్వహించిన సర్వేలో రాష్ట్రం వ్యవసాయంలో అగ్రభాగాన నిలిచింది. సర్వేలో తొలి ఐదు స్థానాల్లో నిలిచిన వాటిని స్టార్ రాష్ట్రాలుగా గుర్తించారు. స్టార్ రాష్ట్రాలు ఇవీ.. ఆంధ్రప్రదేశ్ (1) పశ్చిమ్‌బంగా (2) ఒడిశా (3) గుజరాత్ (4) మహారాష్ట్ర (5) సర్వేలో 6 నుంచి 10 స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలను సత్ఫలితాలు సాధిస్తున్న రాష్ట్రాలు(పర్ఫార్మర్స్)గా పేర్కొన్నారు. పర్ఫార్మర్ రాష్ట్రాలు ఇవే.. తెలంగాణ (6) ఉత్తరప్రదేశ్ (7) మధ్యప్రదేశ్ (8) అసోం (9) హిమాచల్‌ప్రదేశ్ (10) సర్వేలో 11 నుంచి 15 స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలను అవకాశాలను అందిపుచ్చుకుంటూ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు(క్యాచింగ్ అప్)గా గుర్తించారు. క్యాచింగ్ అప్ రాష్ట్రాలు ఇవే.. బిహార్ (11) హర్యానా (12) జమ్మూకశ్మీర్ (13) ఛత్తీస్‌గఢ్ (14) రాజస్థాన్ (15) -
ఏపీ సంక్షేమ పథకాలపై హిమాచల్‌ప్రదేశ్ ఆసక్తి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలుచేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుతెన్నులను హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్సుభాగ్ సింగ్ అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి పథకాల అధ్యయనానికి వచ్చిన ఆయనకు సోమవారం హైదరాబాద్ లేక్‌వ్యూ గెస్ట్ హౌస్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సమాచార, పౌర సంబంధాల శాఖ ఎక్స్అఫీఫియో కార్యదర్శి, కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. దాదాపు మూడు గంటలపాటు ఈ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడానికి ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనబడి నాడు–నేడు, విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ రైతన్నలకు అన్ని సేవలు అందిస్తున్న వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాలు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో ఏర్పాటైన వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, అవినీతికి తావులేకుండా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రజలకు అన్ని సేవలు ఒకేచోట అందించేందుకు ఏర్పాటుచేసిన గ్రామ, వార్డు సచివాలయాల సేవలపై రామ్సుభాగ్ సింగ్ ప్రత్యేక ఆసక్తి చూపించారు. తమ రాష్ట్రంలో ఈ కార్యక్రమాల అమలుకు కృషిచేస్తామని, వివిధ రాష్ట్రాలు అమలుచేస్తున్న అత్యుత్తమ పథకాలను తమ రాష్ట్రంలో అమలుచేసేందుకు ఆయా రాష్ట్రాల నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రతిమను విజయ్‌కుమారెడ్డి ఆయనకు బహూకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. -
టీడీపీ ప్రభుత్వంలో రైతులకు ఏం ఒరగబెట్టారు?
పొదలకూరు: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై తప్పుడు ప్రచారం చేయబోయిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి సోమవారం ఓ రైతు నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. వివరాల్లోకెళ్తే.. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం నేదురుమల్లిలోని రైతుభరోసా కేంద్రం వద్దకు వెళ్లారు. వైఎస్సార్సీపీకి చెందినవారికి మాత్రమే ఎరువులు అందిస్తున్నారంటూ గందరగోళం సృష్టించాలని చూశారు. ఇంతలో అదే గ్రామానికి చెందిన పతకమూరి నాగయ్యనాయుడు అనే రైతు సోమిరెడ్డి వద్దకు వచ్చి ‘మీ ప్రభుత్వంలో రైతులకు ఏమి ఒరగబెట్టారని ఇప్పుడు ఎరువుల పంపిణీపై ఆందోళన చేయడానికి వచ్చారు? టీడీపీ ప్రభుత్వ హయాంలో వృద్ధాప్య పింఛన్ తీసుకోవడానికి అర్హత ఉన్నా ఇవ్వకుండా క్షోభకు గురి చేశారు. గ్రామంలో జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి చివర వరకు నాకు పింఛన్ రాకుండా అడ్డుకున్నారు. జగన్ ప్రభుత్వం రైతుల ఇళ్ల వద్దే ఎరువులను అందిస్తుంటే అడ్డుకోవడానికి వచ్చారా? పార్టీలకతీతంగా రైతులకు ఆర్బీకేల ద్వారా ఎరువులు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న రైతు సంక్షేమ పథకాలకు చెడ్డపేరు తేవాలనే మీరు ఇక్కడకు వచ్చారు’ అంటూ సోమిరెడ్డిపై ధ్వజమెత్తారు. దీంతో అక్కడే ఉంటే ఇంకా అభాసుపాలవుతామని గ్రహించిన సోమిరెడ్డి అక్కడ నుంచి వెళ్లిపోయారు. -
హామీలన్నీ అమలు చేశాం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుసంపన్నమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో తప్పులుంటే చెప్పి, వాటిని మరింత మెరుగ్గా అమలు చేయడానికి నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాల్సిన విపక్షాలు ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నాయని మండిపడ్డారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఆయన కేక్ కట్ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు, వైఎస్సార్సీపీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. 2022 సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. సీఎం వైఎస్ జగన్ మార్గనిర్దేశకత్వంలో వైఎస్సార్సీపీ మరింత బాధ్యతతో వ్యవహరిస్తుందని చెప్పారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే.. ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రగతిపథం ► కోవిడ్ సహా ఎన్ని సవాళ్లు ఎదురైనా, మేనిఫెస్టోలో హామీలన్నింటినీ ఎన్నికలకు మూడేళ్ల ముందే అమలు చేశాం. సంక్షేమ పథకాలను సీఎం జగన్ పూర్తి శాచ్యురేషన్ విధానంలో పారదర్శకంగా అమలు చేస్తున్నారు. ఈ 30 నెలల్లోనే సంక్షేమ పథకాల ద్వారా రూ.1.16 లక్షల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం దేశ చరిత్రలోనే తొలిసారి. అవ్వా, తాతల పింఛను రూ. 2,500కు పెంచాం. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమం జరుగుతోంది కాబట్టే మిగతా రాష్ట్రాలు మన రాష్ట్రం వైపు చూస్తున్నాయి. ► రాష్ట్రంలో ప్రతి కార్యక్రమం ట్రెండ్ సెట్టరే. సచివాలయ వ్యవస్థ ద్వారా 1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. 600 జూనియర్ అసిస్టెంట్లు, మెడికల్ సిబ్బందిని నియమిస్తున్నాం. ఉద్యోగాల కల్పన బాధ్యత అనుకున్నామే తప్ప, ప్రచారంతో లబ్ధి పొందాలని చూడలేదు. ► జగనన్న కాలనీల్లో పేదలకు 30 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం. రూ.10 వేల కోట్లతో భూమి కొని, అక్కచెల్లెమ్మల పేరు మీద పట్టాలు ఇచ్చి, ఇంటి యజమానులుగా చేశాం. దీనిపై కడుపు మంటతోనే టీడీపీ కోర్టుకు వెళ్లింది. గృహ నిర్మాణ సంస్థ రుణంతో ఇళ్లు కట్టుకున్న 50 లక్షల మందికి రూ.10 వేల కోట్ల రుణం, రూ.4 వేల కోట్ల వడ్డీని మాఫీ చేసి.. నామమాత్రపు ధరతో పూర్తి హక్కులు కల్పిస్తున్నాం. టీడీపీ హయాంలో కనీసం ఆ రుణంపై వడ్డీని కూడా మాఫీ చేయలేదు. ఈ రెండు కార్యక్రమాల ద్వారా మళ్లీ ఎన్నికలకు వెళ్లే 2024 నాటికి రాష్ట్రంలో 80 లక్షల కుటుంబాలు సొంత ఇళ్లల్లో ఆనందంగా గడుపుతాయి. ► నాడు–నేడు కార్యక్రమం ద్వారా అంగన్వాడీల నుంచి కాలేజీల వరకు నూతన భవనాల్లో విద్యార్థులు చదువుకుంటున్నారు. గ్రామాల్లోని ఆస్పత్రులను ప్రభుత్వ ఆస్పత్రులు, సూపర్, మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రులతో అనుసంధానం చేయడం ద్వారా ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. ► ఆర్బీకేలు, సచివాలయాల ద్వారా రైతులకు సలహాలు, మద్దతు ధరలు, ఇతర సేవలు అందుతున్నాయి. అతి తక్కువ కాలంలో ఇంతకు మించి సాధించినవి గతంలో కానీ, భవిష్యత్‌లో కూడా ఉంటాయా? ► సీఎం జగన్ బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాలు, మహిళల సాధికారతకు వారికి అన్ని పదవుల్లో సముచిత స్థానం కల్పించారు. నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో వారికి 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఏకంగా చట్టం చేయడం ఒక చరిత్ర. ఆదర్శ పాలన ఓ వైపు సీఎం వైఎస్ జగన్ ప్రగతిశీల, ఆదర్శ పరిపాలనను అందిస్తుంటే... ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయి. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే, సామాజిక సమతుల్యత దెబ్బతింటుందనే వాదనకు బలం చేకూర్చేలా సీపీఐ వ్యవహరిస్తోంది. బీజేపీ మతమే అజెండాగా పనిచేస్తోంది. లేని విషయాలను పట్టుకుని.. అదే నిజమని భ్రమంపజేసేలా టీడీపీ విషప్రచారం చేస్తోంది. మత రాజకీయాలు చేసే శక్తులతో లౌకికవాదులమని చెప్పుకునే పార్టీలు తిరుపతిలో వేదికను ఎలా పంచుకున్నాయి? ప్రతిపక్షాల విష ప్రచారాన్ని ప్రజలు నమ్మడంలేదన్నది స్థానిక సంస్థల ఎన్నికల్లో రుజువైంది. 90 శాతం స్థానాల్లో వైఎస్సార్సీపీని గెలిపించి.. సీఎం వైఎస్ జగన్‌ను ప్రజలు ఆశీర్వదించారు. -
వారు పేదల శత్రువులు
పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లపై హక్కులు, ఇంగ్లిష్ మీడియం.. ఇలా ప్రతి మంచి కార్యక్రమానికీ ఏదో విధంగా అడ్డు తగలడమే వారి లక్ష్యం. చివరికి పేదవాడికి అందుబాటు రేటుకు వినోదాన్ని అందించాలని.. సినిమా టికెట్ల రేట్లు నిర్ణయిస్తే, దాని మీద కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు. వీళ్లా.. పేదల గురించి ఆలోచించే వాళ్లు? ఇలాంటి వారందరూ పేద వాడికి శత్రువులు కాదా? ఆలోచించండి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, గుంటూరు: ‘పేదలకు మంచి చేస్తుంటే చూడలేని కొందరు వాటిని అడ్డుకోవాలని చూస్తున్నారు. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని గతంలో ఇలాంటి మంచి పనులు చేసిన చరిత్ర లేని పార్టీలు విమర్శిస్తున్నాయి. ఇలాంటి వారందరూ పేదలకు శత్రువులే’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. కొత్త సంవత్సరం రోజున శనివారం గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు అందించే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ.. అవ్వాతాతలకు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో.. అందులోని ప్రతి అంశాన్ని నెరవేరుస్తున్నామన్నారు. అవ్వాతాతల పెన్షన్ రూ.3 వేల వరకు పెంచుకుంటూ పోతాం.. అని ఇచ్చిన మాట తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మీ అందరి సమక్షంలో పింఛన్ మొత్తాన్ని రూ.2,250కు పెంచుతూ సంతకం చేసి రెండున్నరేళ్లు అవుతోందన్నారు. ఈ రోజు దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో ఆ మొత్తాన్ని రూ.2,500కు పెంచే కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈ సభలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. అభాగ్యులెందరున్నారో తెలుసా? ► ఈ జగన్ చేస్తున్న ధోరణి సరిగా లేదని చెప్పే వాళ్లు చాలా మంది ఉంటారు. మంచి చేస్తుంటే దాన్ని విమర్శించే వాళ్లూ ఉంటారు. వీళ్లందరికీ నేను ఒక్కటే చెప్పదల్చుకున్నాను. తమకు తాముగా జీవితమంతా కష్టపడినా నాలుగు రూపాయలు కూడా మిగిలించుకోలేని నిర్భాగ్యులు ఎంత మంది ఉన్నారో వీళ్లెవరికైనా తెలుసా? ► కన్నపిల్లల నుంచి ఎటువంటి సహాయం లేని అభాగ్యులు, భర్తను కోల్పోయి తమకు తాము సంపాదించుకునే శక్తి లేని వితంతువులు, వివిధ సంప్రదాయ కుల వృత్తులలో తమ జీవితాలనే ధారపోసి, వయస్సు మళ్లుతున్న దశలో ఈరోజు ఆ కుల వృత్తి కొనసాగించలేక, ఆర్థికంగా ఆధారం లేక జీవితం ప్రశ్నార్థకంగా మారిన వృత్తులు ఎన్ని ఉన్నాయో వీళ్లందరికి ఎవరికైనా తెలుసా? ► ఇలాంటి వాళ్లకు మనం సాయం చేస్తే దాన్ని మంచి అంటారా? లేక చెడు అంటారా? విమర్శించే ఇటువంటి వాళ్లందరికీ మీరే సమాధానం చెప్పాలి. ఈ రోజు సామాజిక పింఛన్లు నెలకు రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచబోతున్నామని సగర్వంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు కేవలం క్యాలెండర్లు మాత్రమే మారటం లేదు. దాదాపు 62 లక్షల కుటుంబాల్లో మరిన్ని చిరునవ్వులు రాబోతున్నాయి. ► ఈ సమావేశం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వలంటీర్లు.. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పి చేయవలసిన ఈ కార్యక్రమాన్ని ఈరోజు మధ్యాహ్నం నుంచి చేపడతారు. ► పుట్టుకతో కానీ, పుట్టిన తర్వాత కానీ.. అంగ వైకల్యానికి గురైన అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు, తీవ్ర కిడ్నీ వ్యాధులతో బాధ పడుతున్న వారికి, తలసేమియా, సికిల్‌సెల్ ఎనీమీయా, హీమోఫీలియా, బోధకాలు, చివరికి పక్షవాతం వచ్చి మంచానికో, వీల్ చెయిర్‌కో పరితమితమైన వాళ్లకు, కండరాల క్షీణత, కుష్టు వ్యాధి, కాలేయం, గుండె వంటివి ట్రాన్స్‌ప్లాంట్ జరిగిన నిరుపేదలకు.. వీళ్లందరికీ కూడా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని విధంగా పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే. దేశంలోనే అత్యధిక పెన్షన్లు ► దేశంలోనే అత్యధిక పెన్షన్లు ఇస్తున్న, అత్యధిక మొత్తాన్ని పెన్షన్లుగా ఇస్తున్న రాష్టం మనదే. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి అంటే ఎన్నికలకు కేవలం రెండు నెలలు ముందు వరకు ఇస్తున్న పెన్షన్ ఎంతనేది మీ అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది. రూ.1,000 మాత్రమే. ► నేను ముఖ్యమంత్రిగా మొదటి సంతకం పెట్టినప్పటి నుంచి గత నెల వరకు మనం ఇచ్చిన పెన్షన్ రూ.2,250. ఇప్పుడు రూ.2,500. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆరు నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్లు కేవలం 39 లక్షలు మాత్రమే. ఈ రోజు మనందరి ప్రభుత్వం దాదాపు 62 లక్షల మందికి పెన్షన్ ఇస్తోంది. ఎంత తేడానో ఆలోచించండి. ► గత ప్రభుత్వ హయాంలో పింఛన్ల కోసం నెలకు కేవలం రూ.400 కోట్లు మాత్రమే ఖర్చు చేసేది. ఈ రోజు మనందరి ప్రభుత్వం ఏకంగా నెలకు రూ.1450 కోట్లు వెచ్చిస్తోంది. ఈ మొత్తం ఇకమీదట రూ.1,570 కోట్లు. ఈ 31 నెలల పాలనలో, కరోనా కష్ట కాలంలో, ఇతరత్రా ఇబ్బందులెన్ని ఉన్నప్పటికీ.. పేదల ఇక్కట్లు ఇంకా ఎక్కువ అని భావించి.. వారికి తోడుగా ఉండాలని ఒక్క పెన్షన్ల కోసమే దాదాపు రూ.40 వేల కోట్లపై చిలుకు ఖర్చు చేశాం. కులం, మతం, పార్టీలు చూడలేదు ► ఈ రోజు పెన్షన్లకు కోటాల్లేవు. కోతల్లేవు. లంచాలు లేవు. జన్మభూమి కమిటీల అడ్డంకులు లేవు. ఎంత ఎక్కువ మందికి ఎగ్గొట్టాలి.. అన్న కుతంత్రాలు లేవు. అందుకే కులం, మతం, వర్గం చూడలేదు. ఆఖరుకు మనకు ఓటు వేసినా వేయకపోయినా సరే ఇవ్వాలని చెప్పి ఏకంగా రూల్ తీసుకొచ్చాం. అర్హత ఉంటే చాలు.. పెన్షన్ వాళ్ల గడప వద్దకే వచ్చేట్టు చేస్తున్నాం. గత ప్రభుత్వానికి, నేడు మనందరి ప్రభుత్వానికి మధ్య ఒక్కసారి తేడా గమనించండి. ► ప్రతి నెలా ఒకటో తేదీన ఆ రోజు ఆదివారమైనా, సెలవు దినమైనా సరే సూర్యోదయానికి ముందే మీ గడప ముందుకు వచ్చి చిక్కటి చిరునవ్వుతో వలంటీర్ తలుపుతట్టి.. గుడ్ మార్నింగ్ చెప్పి, ఈసారైతే హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ చేస్తూ.. పెన్షన్లు ఇస్తున్నారు. ఆస్పత్రిలో ఉంటే అక్కడికే వెళ్లి ఇస్తున్నారు ► అవ్వాతాతలు అనారోగ్యం వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే నా వలంటీర్ అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు స్వయంగా అక్కడికి వెళ్లి పెన్షన్ అందజేస్తున్న గొప్ప వ్యవస్థ మన రాష్ట్రంలో ఉంది. దాదాపు 2.70 లక్షల మంది గ్రామ, వార్డు వలంటీర్లు ఇవాళ పెన్షన్ల పంపిణీ అనే యజ్ఞంలో పని చేస్తున్నారు. ► ప్రతినెలా ఒకటో తారీఖునే దాదాపు 95 శాతం మందికి పెన్షన్లు వాళ్ల చేతుల్లో పెడుతున్నారు. వాళ్లు ఇళ్ల వద్ద లేకపోతే 5వ తేదీ వరకు మూడు నాలుగుసార్లు వాళ్ల ఇంటికి వెళ్లి అందజేస్తున్నారు. ఇలాంటి గొప్ప వ్యవస్థ దేశం మొత్తం మీద ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే ఉంది. మిగిలిన రాష్ట్రాలు మన మాదిరిగా చేయడానికి ఆరాట పడుతున్నాయి. ► ఈ రోజు పెన్షన్ అందుకోవడంలో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ఆ గ్రామ, వార్డు సచివాలయాన్ని, లేక మీ వలంటీర్‌ను సంప్రదించండి. వారే దగ్గరుండి మీకు పెన్షన్ అందేలా సాయం చేస్తారు. ► ఈ కార్యక్రమంలో మంత్రులు మేకతోటి సుచరిత, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెరుకువాడ శ్రీ రంగనాథరాజు, జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఓర్వలేకే విమర్శలు ► ఇంతగా మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వాన్ని.. ఇలాంటి మంచి చేసిన చరిత్ర ఎప్పుడూ లేని పార్టీలు, నాయకులు ఓర్వలేక విమర్శిస్తున్నారు. ఇలాంటి వారు ఏ రోజూ కూడా పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియం చదువులు చెప్పించాలని, మన పిల్లల మాదిరే వాళ్లూ గొప్పగా చదవాలని ఆలోచించలేదు. పైగా ఇంగ్లిష్ మీడియం వద్దని అడ్డుకున్న వాళ్లు వీళ్లే. ► పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే.. ఆ పేదలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల విలువ చేసే ఆస్తి వాళ్ల చేతుల్లో పెడుతుంటే ఓర్వలేక పోతున్నారు. గతంలో వారు చేయక, ఇప్పుడు మనం చేస్తుంటే.. అడ్డుకునేందుకు కోర్టులకు వెళ్లి, స్టేలు తీసుకొచ్చే అధ్వాన్నమైన పరిస్థితి. ఇటువంటి వాళ్లు మనల్ని విమర్శిస్తున్నారు. ► రాజధాని అని చెప్పుకుంటున్న అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే డెమొగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందని.. అంటే కులాల మధ్య అసమతుల్యత కారణంగా ఇబ్బందులు వస్తాయని కోర్టులకెళ్లి పిటిషన్లు వేస్తున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యమైన నాయకులు ఉంటారా? ► పేదలు అవసరమొచ్చినప్పుడు వాళ్ల ఇంటిని అమ్ముకునే లేక తాకట్టు పెట్టుకునే స్వేచ్ఛ, లేదా ఈ పెద్దవాళ్లు చేస్తున్నట్టు వాళ్ల పిల్లలకు ట్రాన్స్ఫర్ చేసే స్వేచ్ఛతో.. పూర్తి హక్కులతో కూడిన రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామంటే కూడా జీర్ణించుకోలేక విమర్శిస్తూనే ఉంటారు. సినిమా టికెట్ల విషయంలోనూ ఇంతే. ► మంచి చేసేందుకు నాలుగు అడుగులు ముందుకు వేస్తే రకరకాల కారణాలతో, రకరకాల కోణాలతో రాజకీయ స్వార్థంతో అడ్డుతగలడమే పనిగా పెట్టుకున్నారు. ఇలాంటి వారికి 2022లో అయినా మంచి ఆలోచనలు కలగాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ రోజు జనవరి ఒకటి.. రాష్ట్రంలో ఉన్న ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ, ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి సోదరుడికీ, ప్రతి స్నేహితుడికీ, ప్రతి ఒక్కరికీ గుండెల నిండా ప్రేమతో మీ బిడ్డ హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తున్నాడు. ఏ సమాజమైనా చీకటి నుంచి వెలుగులోకి రావాలని, వెనుకబాటు నుంచి అభివృద్ధి వైపు అడుగులు పడాలని ఆరాట పడుతుంది. అసమానతల నుంచి సమానత్వం అందాలని, తద్వారా ఆత్మాభిమానంతో బతకాలని, అరాచకం నుంచి చట్టబద్ధ పాలన వైపు పాలకులు ప్రయాణం చేయాలని తాపత్రయ పడుతుంది. అలాగే ఏ మనిషైనా, ఏ కుటుంబమైనా.. నిన్నటి కంటే నేడు బాగుండాలని, నేటి కంటే రేపు ఇంకా బాగుండాలని, రేపటి కంటే తమ భవిష్యత్ ఇంకెంతో బాగుండాలని కోరుకుంటారు. అటువంటి పాలన దిశగా ఈ రోజు మీ బిడ్ద అడుగులు వేస్తూ.. అభివృద్ధి బాటలో నడిపించ గలుగుతున్నాడని గర్వంగా చెబుతున్నాను. -
ప్రభుత్వ పథకాలపై ప్రచార రథం
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో ఎన్నో మార్పులు తెస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ప్రతిపక్షాల విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మాదిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచార రథాన్ని బుధవారం ఆయన తాడేపల్లిలో జెండా ఊపి ప్రారంభించారు. నవరత్నాల ప్రయోజనాలను తెలియచేసేందుకు ప్రచార రథం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పేదలు మరింత ఎక్కువగా సంక్షేమ పథకాలను వినియోగించుకునే?ందుకు ఇలాంటి ప్రచారం అవసరమని చెప్పారు. రథాన్ని రాష్ట్రం అంతా తిప్పి అందరినీ జాగృతం చేయాలని కోరారు. సంతృప్త స్థాయిలో ప్రయోజనం.. ఓట్ల కోసం కాకుండా అర్హులైన పేదలందరికీ సంతృప్త స్థాయిలో ప్రయోజనం చేకూర్చాలనే లక్ష్యంతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు సజ్జల తెలిపారు. ఓటీఎస్ ప్రయోజనాలపై ప్రతి గ్రామంలోనూ విస్తృతంగా చర్చ జరగాలన్నారు. ఓటీఎస్ లబ్ధిదారులు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, మాదిగ సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు పెద్దిపోగు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమంలో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాల అమలులో అగ్రగామిగా నిలిచిన రాష్ట్రం దేశ వ్యాప్తంగా సంక్షేమాంధ్రప్రదేశ్‌గా ప్రశంసలు అందుకుంటోంది. పీఆర్ఎస్ ఇండియా ఆర్గనైజేషన్ విడుదల చేసిన రిపోర్టు ద్వారా మరోమారు ఇదే విషయం స్పష్టమైంది. 2021–2022 ఏడాదిలో దేశంలోని అన్ని రాష్ట్రాల బడ్జెట్ కేటాయింపులను అధ్యయనం చేసిన పీఆర్ఎస్ సంస్థ ‘రాష్ట్రాల ఆర్థిక స్థితి (స్టేట్ ఆఫ్ స్టేట్స్ పైనాన్సెస్)’ నివేదికను విడుదల చేసింది. బడ్జెట్ కేటాయింపుల్లో సంక్షేమానికి అత్యధిక నిధులు కేటాయించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన నిలిచిందని ఆ నివేదికలో పేర్కొంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి ఏపీ అత్యధిక కేటాయింపులు చేసినట్లు వివరించింది. ఆయా వర్గాల సంక్షేమానికి నిధుల కేటాయింపుల్లో మిగిలిన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ దరిదాపుల్లో లేకపోవడం గమనార్హం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది ఆమోదించిన వార్షిక బడ్జెట్లో ఏకంగా 13.1 శాతం నిధులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి కేటాయించినట్టు పీఆర్సీ నివేదిక వెల్లడించింది. ఆయా వర్గాల సంక్షేమానికి నిధుల కేటాయింపులో రెండవ స్థానంలో ఉన్న తెలంగాణ 7.9 శాతం, మూడవ స్థానంలో మహారాష్ట్ర 4.8 శాతం ఖర్చు చేసేలా బడ్జెట్ ప్రతిపాదనలు చేయడం గమనార్హం. దేశంలో ఐదు రాష్ట్రాలు మినహా మిగతా అన్ని రాష్ట్రాలు కేవలం 3 శాతానికి లోపుగానే ఈ వర్గాలకు నిధుల కేటాయింపులతో సరిపెట్టడం గమనార్హం. హిమాచల్‌ప్రదేశ్ అయితే కేవలం 0.2 శాతం నిధులు మాత్రమే కేటాయించి అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈ నివేదికలో ఇంకా ఏం చెప్పిందంటే.. అన్ని రాష్ట్రాలూ అప్పులు చేయక తప్పని పరిస్థితి ► 2019–20లో కనిపించిన ఆర్థిక మందగమనం రాష్ట్రాల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపింది. ఫలితంగా కేంద్రంతోపాటు దేశంలోని అనేక రాష్ట్రాలు అప్పులు చేయడంతో పాటు ఖర్చులు తగ్గించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ► జీఎస్టీ రాబడిలో 14 శాతం వార్షిక వృద్ధికి సంబంధించిన పరిహారం హామీ ముగియనుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయం పెంపునకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. రాష్ట్రాలకు ఆశించిన ఆదాయం కోసం పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాలనే డిమాండ్ కూడా ఉంది. ► మరోవైపు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ రాష్ట్రాల నుంచి అదనపు కేటాయింపులు, నిధుల హామీ కోసం విద్యుత్ పంపిణీ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. వాటిని ఆదుకునేలా కేటాయింపులు జరపాల్సిన అవసరం ఉంది. ► స్థానిక సంస్థల్లో ఆర్థిక సంస్కరణలు చేపట్టడం ద్వారా ఆరోగ్యానికి నిధుల కేటాయింపులు జరపాలన్న 15 వ ఆర్థిక సంఘం సిఫార్సును అమలు చేసేందుకు రాష్ట్రాలకు తగిన గ్రాంట్ల వాటాను పెంచాలి. కేంద్ర పన్నుల వాటా 41 శాతం కాగా, ప్రత్యేకంగా 2020–21లో సెస్, సర్‌చార్జ్‌ల ద్వారా వచ్చే ఆదాయంలో రాష్ట్రాలకు ఇచ్చే వాటా తగ్గింది. ► పన్నుకు బదులు సెస్, సర్‌చార్జ్‌ల పేరుతో వచ్చే ఆదాయంలో కేంద్రం రాష్ట్రాలకు తగిన కేటాయింపులు జరపడం లేదు. కోవిడ్–19 ప్రభావం, ఆర్థిక మందగమనం కారణంగా ఆదాయ వనరులు దెబ్బ తినడంతో మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రాలపై అప్పుభారం పెరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో 2021 నుంచి 2026 వరకు జీఎస్టీ, కేంద్ర ప్రభుత్వ వాటా నిధుల కేటాయింపు ద్వారా రాష్ట్రాలకు నిధులను పెంచి అందించాలి. కోవిడ్లోను ఆంధ్రప్రదేశ్‌లో ఆగని సంక్షేమం ► కోవిడ్–19 దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను పెద్ద దెబ్బ తీసింది. 2020–21లో దీని ప్రభావం ఎక్కువగా ఉండటంతో రాష్ట్రాలతో పాటు కేంద్రం కూడా అప్పులు చేయాల్సి వచ్చింది. 2019–20 నుండి 2020–21లో రాష్ట్రాల ఆదాయం తగ్గడంతో పాటు వ్యయం పెరిగింది. ► అయితే ఆదాయం తగ్గినప్పటికీ సంక్షేమ పథకాల వ్యయంలో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగంలో ఉంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, కేరళ, కర్ణాటక, అరుణాచల్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఆదాయం తగ్గినా సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించి ప్రజలను ఆదుకున్నాయి. ప్రతిఫలాపేక్ష లేకుండా అధ్యయనం పీఆర్సీ ఇండియా సంస్థ 2005 నుంచి జాతీయ స్థాయిలో ‘పీఆర్ఎస్ లెజిస్టేటివ్ రీసెర్చ్’ పేరుతో అనేక అంశాలపై అధ్యయనం చేసి రిపోర్టులు విడుదల చేస్తోంది. ప్రతిఫలాపేక్ష లేకుండా అధ్యయనం చేసి నివేదికలు ఇవ్వడంలో ఈ సంస్థకు గుర్తింపు ఉంది. తాజాగా బడ్జెట్ కేటాయింపులపై సుయష్ తివారి, సాకేత్ సూర్య పేరుతో నివేదిక విడుదలైంది. బడ్జెట్ కేటాయింపులు, నిధుల వినియోగం, నిర్వహణ వంటి అనేక అంశాలపై 35 పేజీల నివేదికలో అనేక కోణాలను ప్రస్తావించడం విశేషం. -
‘సమీకృతం’గా రైతులకు సాధికారత
గుంటూరు రూరల్: సమీకృత విధానంలో వ్యవసాయం ద్వారా రైతుల సాధికారత దిశగా కృషిచేయాలని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం సూచించారు. గుంటూరు సమీపంలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సమీకృత వ్యవసాయం ద్వారా రైతుల సాధికారతపై నిర్వహించిన రెండురోజుల జాతీయ సదస్సు బుధవారం ముగిసింది. రెండోరోజు సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అజేయ కల్లం మాట్లాడుతూ రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నదాతలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. అనంతరం రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షుడు ఎం.వి.ఎస్.నాగిరెడ్డి నేతృత్వంలో 11 విభాగాలపై చర్చలు జరిపి రైతుల అభివృద్ధికి తీర్మానాలు చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఎ.విష్ణువర్థన్‌రెడ్డి , డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ టి.జానకిరాం, మాజీ ఉపకులపతి డాక్టర్ రాఘవరెడ్డి, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ త్రిమూర్తులు, అగ్రివిుషన్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు డాక్టర్ ఎం.చంద్రశేఖర్‌రెడ్డి, ప్రిన్సిపల్ శాస్త్రవేత్త డాక్టర్ కె.గురవారెడ్డి, రైతులు, పాల్గొన్నారు. -
ప్రజల కోసం ఖర్చు చేస్తే.. నిధులు దారి మళ్లినట్లు కాదు..
సాక్షి, అమరావతి: వివిధ పథకాల అమల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శక విధానాన్ని అమలు చేస్తోందని, వివక్షకు, పక్షపాతానికి తావులేకుండా అర్హులందరికీ పథకాలు వర్తింపజేయడంతో పాటు అనర్హులకు చెందకూడదన్న లక్ష్యంతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడుతున్నదని గ్రామ, వార్డు సచివాలయాల రాష్ట్ర శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. సంక్షేమ పథకాల అమలులో నిధులు దారి మళ్లాయని కొంతమంది చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ప్రజల కోసం చేసే ఖర్చు ఎప్పుడూ దారి మళ్లినట్లు కాదని పేర్కొంది. అర్హతలను వర్తింపజేసేటప్పుడు ఒక ఏడాది అర్హుడిగా తేలిన వ్యక్తి.. ఆ తర్వాత ఏడాది అనర్హుడు కావొచ్చునని, వారి జీవన ప్రమాణాలు పెరిగి ఉండవచ్చునని లేదా ఉన్న ఉద్యోగం కోల్పోయి జీవన ప్రమాణాలు మరింత తగ్గవచ్చునని, వయసు పెరగ వచ్చు లేదా మృతి చెంది ఉండవచ్చునని పేర్కొంది. ఇలాంటి సందర్భాల్లో పాత వాళ్లు కొంత మంది అర్హత కోల్పోవడం..కొత్తవాళ్లు కొంత మంది అర్హత సాధించడం సర్వసాధారణమైన అంశమని, ఇది ఏటా జరిగే ప్రక్రియేనని వివరించింది. -
సంక్షేమ పథకాలకు ఆ మొత్తం ఖర్చు ప్రశంసనీయం: హైకోర్టు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు కోసం భారీ మొత్తాలు ఖర్చు చేస్తుండటం ప్రశంసనీయమని హైకోర్టు పేర్కొంది. సంక్షేమ పథకాల కోసం రూ.60 వేల కోట్లు ఖర్చు చేయడాన్ని బట్టి చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలహీనంగా లేదన్న విషయం అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. అయితే, అధికారుల తీరు వల్ల ప్రభుత్వం నిందలు పడాల్సి వస్తోందని ఆక్షేపించింది. అధికారుల తీరు దురదృష్టకరమన్న హైకోర్టు అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని.. ఆ తరువాతే తమ హోదాల ప్రకారం నడుచుకోవాలని హితవు పలికింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సీఎఫ్ఎంఎస్ లోపభూయిష్టంగా ఉందని తెలిపింది. గతంలో ట్రెజరీ ద్వారా రెండు వారాల్లో బిల్లుల చెల్లింపు జరిగేదని, ఇప్పుడు సీఎఫ్‌ఎంఎస్‌తో బిల్లుల చెల్లింపునకు రెండేళ్లు పడుతోందంటూ అసహనం వ్యక్తం చేసింది. సాంకేతికత పెరిగినప్పుడు సౌలభ్యం కూడా అదే స్థాయిలో ఉండాలని, కానీ సీఎఫ్‌ఎంఎస్‌తో పరిస్థితి భిన్నంగా ఉందని, ఆర్థిక వ్యవహారాలన్నీ చాలా క్లిష్టతరంగా మారిపోయాయని వ్యాఖ్యానించింది. సీఎఫ్ఎంఎస్ లోపాలపై దృష్టి సారించాలని ప్రభుత్వానికి సూచించింది. బిల్లులు చెల్లించడం లేదంటూ దాఖలు చేసిన పిటిషనర్లకు బిల్లులు చెల్లించామని అధికారులు చెప్పడంతో ఓ వ్యాజ్యాన్ని మూసివేసిన హైకోర్టు, మరో వ్యాజ్యాన్ని కౌంటర్ పరిశీలన నిమిత్తం పెండింగ్‌లో ఉంచింది. ఈ వ్యాజ్యంలో తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ఎదుట హాజరైన రావత్, ద్వివేది చిత్తూరు జిల్లా కంభంవారి పల్లె మండల పరిధిలో పూర్తి చేసిన పనులకు చెల్లించాల్సిన రూ.24.41 లక్షల బిల్లులను ప్రభుత్వం చెల్లించడం లేదంటూ కాంట్రాక్టర్ సీకే యర్రంరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. 2018, 2019లలో ఉపాధి పథకం కింద పూర్తి చేసిన రోడ్డు పనులకు రూ.26.39 లక్షల బిల్లులను చెల్లించలేదంటూ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ రాయపురెడ్డి శ్రీనివాసరావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు వ్యాజ్యాలు సోమవారం మరోసారి విచారణకు వచ్చాయి. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్‌సింగ్ రావత్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది కోర్టుకు హాజరయ్యారు. -
టీడీపీ నేతకు అండగా నిలిచిన సీఎం రిలీఫ్ ఫండ్
హిందూపురం: సంక్షేమ పథకాల అమలులో, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడమని చెప్పిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ లబ్ధి జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అనారోగ్యంతో కష్టాల్లో ఉన్న ఓ టీడీపీ నేతను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకున్నారు. అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు తిమ్మారెడ్డి కొంతకాలంగా పక్షవాతానికి గురై.. అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్యం కోసం రూ.లక్షలు ఖర్చు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ఇటీవల తిమ్మారెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు. అప్పుడే కొంత ఆర్థిక సాయం చేసిన ఇక్బాల్.. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం తిమ్మారెడ్డి కుటుంబ సభ్యుల ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేయించారు. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం తిమ్మారెడ్డికి రూ.2.70 లక్షలు మంజూరు చేసింది. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును బుధవారం ఎమ్మెల్సీ కార్యాలయంలో తిమ్మారెడ్డి కుమారుడు వెంకటేష్, కుమార్తె తేజస్విని అందుకున్నారు. అలాగే నియోజకవర్గానికి చెందిన 36 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరవ్వగా.. వారందరికీ చెక్కులు పంపిణీ చేశారు. -
సంక్షేమమే శ్వాసగా..
సాక్షి, అమరావతి: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఇది ప్రతిబింబించిందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. త్వరలో జరిగే పురపాలక, పరిషత్ ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తి కొనసాగాలని ఆకాంక్షించారు. శాశ్వత విజయానికి ప్రజల విశ్వాసం పొందడమే నేటితరం రాజకీయమని సూచించారు. ఆ దిశగా ప్రభుత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు క్షేత్రస్థాయిలో పునాదులు పటిష్టం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. మంగళవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సందర్భంగా తాజా పంచాయతీ ఎన్నికల ఫలితాలతో పాటు పలు రాజకీయ అంశాలపై చర్చ జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఆ వివరాలివీ.. ప్రజలే మనకు శ్రీరామరక్ష.. పంచాయతీ ఎన్నికల్లో 81 శాతం విజయంతో వైఎస్సార్సీపీకి జనం మద్దతివ్వడానికి సుపరిపాలనే కారణమని పలువురు మంత్రులు ప్రస్తావించారు. ఏడాదిన్నరగా అమలవుతున్న పథకాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. విశ్వసనీయతే కొలమానంగా సరికొత్త రాజకీయాలు తెచ్చామని, ప్రజలను ఓటుబ్యాంకుగా భావించే వారెవరూ ప్రజా మద్దతు కూడగట్టలేరన్న భావనను సీఎం వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉన్న ప్రభుత్వాన్ని ఎంతకైనా తెగించి కాపాడుకునేందుకు సిద్ధమవుతారని చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో ప్రజల మనోగతాన్ని అన్ని వేళలా గుర్తించాలని సూచించారు. విష ప్రచారాన్నే నమ్ముకున్న విపక్షం ఏ ఎన్నికల్లోనైనా ప్రజల్లోకి వెళ్లేందుకు సంక్షేమ పథకాలే వైఎస్సార్సీపీ బ్రహ్మాస్త్రాలుగా మంత్రివర్గం భావించింది. పథకాల అమలులో లోపాలను గుర్తించే సత్తాలేని టీడీపీ విష ప్రచారాన్ని నెత్తికెత్తుకున్న తీరుపై సమావేశంలో చర్చ జరిగింది. సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు టీడీపీ ఎంతకైనా తెగిస్తుందని సీఎం గుర్తు చేశారు. ఈ దిశగా అన్ని వ్యవస్థలను వాడుకునేందుకు ఏమాత్రం వెనుకాడబోదని, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకోవడం, మత విద్వేషాలు రెచ్చగొట్టే అంశాలను ముందుకు తేవడం లాంటి కుట్రలు జరిగాయన్నారు. సున్నితమైన అంశాల పట్ల అప్రమత్తంగా ఉంటూ టీడీపీ కుట్రలను తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారు. విపక్షం విమర్శలను తిప్పికొట్టడం ఎంత ముఖ్యమో ప్రజలకు సంక్షేమ ఫలాలను నిబద్ధతతో అందించడం కూడా అంతే ముఖ్యమన్నారు. ప్రజా ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం ఏమాత్రం రాజీ పడదన్న బలమైన సంకేతాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తే తప్పుడు ప్రచారం చేసే విపక్షం వైఖరిని ప్రజలే అర్థం చేసుకుంటారని చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కేంద్రంపై తెస్తున్న ఒత్తిడిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏ పోరాటానికైనా సిద్ధమనే సంకేతాలు ఇప్పటికే ఇచ్చిందని, టీడీపీ మాత్రం రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతోందని చెప్పారు. పథకాలే ఊపిరి.. పేదలు, బడుగు వర్గాల స్థితిగతులను మార్చే దిశగా తెస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని మంత్రివర్గం అభిప్రాయపడింది. ముఖ్యమంత్రి ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ పథకాల రూపకల్పనతోనే సరిపోదని క్షేత్రస్థాయిలో అమలు తీరును నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. కులమతాలు, రాజకీయాలకు అతీతంగా ఇంటి వద్దకే చేరవేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, గత ప్రభుత్వాలకు భిన్నంగా సాగుతున్న పారదర్శక పాలనను స్వాగతిస్తున్నారని తెలిపారు. దీన్ని దెబ్బతీసేందుకు విపక్షం చేస్తున్న కుట్రలను అడ్డుకునేందుకు మరింత కృషి చేయాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ మేలు చేసే ప్రయత్నంలో ఎక్కడైనా సమస్యలొస్తే తక్షణం పరిష్కరించాలన్నారు. సంక్షేమమే ఊపిరిగా ముందుకు సాగాల్సిన అవసరాన్ని సీఎం ప్రస్తావించారు. హామీలు నిలబెట్టుకోవడంలో వైఎస్సార్సీïపీ ప్రభుత్వ విశ్వసనీయతను ప్రజలే ప్రశంసిస్తున్న కారణంగా విపక్షం వేలెత్తి చూపలేక పోతోందన్నారు. -
‘సంక్షేమ’ క్యాలెండర్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల కింద ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి క్యాలెండర్‌ను ప్రకటించింది. 2021 ఏప్రిల్ నుంచి వచ్చే సంవత్సరం మార్చి 31వ తేదీ వరకూ పథకాల వారీగా అమలు చేసే నెలలను ఖరారు చేసింది. బడ్జెట్ కేటాయింపులను సైతం ఆమోదించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) వాటిని మీడియాకు తెలియచేశారు. ఆ వివరాలు ఇవీ... మంగళవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పథకాలతో 5,08,08,220 మందికి లబ్ధి సంక్షేమ పథకాల ద్వారా 5,08,08,220 మందికి ప్రయోజనం చేకూరనుంది. నెలవారీ పింఛన్లతో కలిపి 5,69,81,184 మందికి మేలు జరగనుంది. ఇవికాకుండా వైఎస్సార్ లా నేస్తం కింద దాదాపు 2,012 మందికి ప్రతి నెలా లబ్ధి కలగనుంది. జగనన్న గోరుముద్ద ద్వారా 36,88,618 మందికి, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా 30,16,000 మందికి, ఇమామ్, మౌజమ్‌లకు ఆర్థిక సాయం ద్వారా 77,290 మందికి ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తోంది. అర్హులందరికీ ఇళ్ల పట్టాల పంపిణీతోపాటు ఇంటికే రేషన్ ద్వారా సంక్షేమ ఫలాలను ఇంటి ముంగిటికే చేరవేస్తోంది. మధ్య తరగతి ప్రజల సొంతింటి కల సాకారం వైఎస్సార్ జగనన్న హౌసింగ్ ప్రాజెక్టులో భాగంగా పట్టణాలు, నగరాల్లో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలకే ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు 2021 ఏప్రిల్ నుంచి కొత్తగా వేసే ప్రైవేటు లేఅవుట్లలో 5 శాతం స్థలాన్ని కలెక్టర్లకు అప్పగించాలని నిర్ణయించారు. ప్రైవేటు లేఅవుట్లో 5 శాతం భూమి లభ్యత లేకపోతే 3 కిలోమీటర్ల దూరం లోపు కొనుగోలు చేసి కలెక్టర్లకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ల్యాండ్ బ్యాంకును వైఎస్సార్ జగనన్న హౌసింగ్ ప్రాజెక్టుకు ప్రభుత్వం వినియోగించనుంది. తద్వారా పట్టణాలు, నగరాల్లో మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేసేలా చర్యలు చేపట్టింది. మరోవైపు అనుమతి లేని లే అవుట్ల కట్టడికి ఇప్పటికే రిజిస్ట్రేషన్లను నిలిపివేసిన నేపథ్యంలో వాటికి కుళాయి, కరెంటు కనెక్షన్ కూడా ఇవ్వరాదని నిర్ణయించారు. పేదల ఇళ్లకు పెద్ద ఊరట 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్ల కోసం పేదల నుంచి గత సర్కారు వసూలు చేసిన డబ్బులను తిరిగి వెనక్కి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 1,43,600 మందికి ఒకే ఒక్క రూపాయితో టిడ్కో ఇళ్లను అప్పగించాలని నిర్ణయించారు. 365 చదరపు అడుగుల ఇళ్ల లబ్ధిదార్లకు రూ.25 వేలు, 430 చదరపు అడుగుల ఇళ్ల లబ్ధిదారులకు రూ.50 వేలు చొప్పున సబ్సిడీ ఇవ్వనున్నారు. ఈ మేరకు మినహాయించిన నగదును వెనక్కి ఇవ్వనున్నారు. టిడ్కో కాలనీలకు వైఎస్ జగనన్న నగర్‌గా పేరు పెట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. – రాజధాని అమరావతి ప్రాంతంలో మౌలిక వసతులు రోడ్లు, భూసమీకరణ పనులకు (సమీకరించిన భూముల్లో పనులు) సంబంధించి రూ.3 వేల కోట్ల నిధులకు ప్రభుత్వ గ్యారంటీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్బీకేలు పరిపుష్టం రైతు భరోసా కేంద్రాల పరిధిలో మల్టీ పర్పస్ సెంటర్లు, జనతా బజార్లు, ఫామ్ గేటు మౌలిక సదుపాయాల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో విత్తనం నాటుకునే ముందు, పంట చేతికి వచ్చిన తర్వాత రైతుకు అవసరమైన మౌలిక సదుపాయలు కల్పించడం మల్టీ పర్పస్ సెంటర్ల లక్ష్యం. రూ.2719.11 కోట్లతో ఫామ్ గేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మొత్తం పనులన్నింటినీ సుమారు రూ.12 వేల కోట్లతో ప్రభుత్వం చేపట్టనుంది. క్యాబినెట్ ఇతర నిర్ణయాలు ఇవీ – చిత్తూరు జిల్లా పెనుమూరు, కార్వేటినగరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 50 పడకల ఆసుపత్రులుగా మార్చేందుకు ఆమోదం. – పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు డిగ్రీ కళాశాలలో 24 టీచింగ్ పోస్టులు, 1 నాన్ టీచింగ్, 13 అవుట్ సోర్సింగ్ పోస్టులు మంజూరు. – వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంటు నిర్మాణానికి జాయింట్ వెంచర్ ఎంపిక ప్రక్రియకు ఆమోదం. ఎస్బీఐ క్యాప్ సిఫార్సులను బట్టి లిబర్టీ స్టీల్ ఇండియా లిమిటెడ్ జేవీగా ఎంపిక. స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి తొలి దశలో రూ.10,082 కోట్లు, రెండో దశలో రూ.6 వేల కోట్లు వ్యయం కానుంది. జేవీపై వైఎస్సార్ స్టీల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీకి ఎల్ఓఏ ఇచ్చేందుకు అనుమతి. – వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం పెద్దండ్లూరు, సున్నపురాళ్లపల్లె గ్రామాల్లో 3148.68 ఎకరాల భూమిని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏపీ హైగ్రేడ్ స్టీల్స్‌కు కేటాయించేందుకు ఆమోదం. ఈ స్ధలంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి నిర్ణయం. – వైఎస్సార్ జిల్లా వల్లూరు మండలం అంబాపురంలో 93.99 ఎకరాల్లో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో మెగా ఇండస్ట్రియల్ పార్కు కోసం భూమి కేటాయింపు. – వైఎస్సార్ జిల్లా సీకే దిన్నె మండలం కొప్పర్తిలో 598.59 ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి ఏపీఐఐసీకి స్ధలం కేటాయింపు. – తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం కోన గ్రామంలో 165.34 ఎకరాలు ఏపీ మారిటైం బోర్డుకు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం. పోర్టు కార్యకలాపాల కోసం భూమి కేటాయింపు. ఎకరా రూ.25 లక్షలు చొప్పున భూమి కేటాయింపు. – ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్టు –1974 సవరణకు ఆమోదం. – వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం ముద్దనూరులో నూతన అగ్నిమాపక కేంద్రం నిర్మాణానికి అనుమతి. 12 పోస్టులు మంజూరు. – చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం జీడీ నెల్లూరు, పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలో రెండు కొత్త అగ్నిమాపక కేంద్రాల నిర్మాణానికి ఆమోదం. – తిరుమల తిరుపతి దేవస్ధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు స్ధలాల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరిన టీటీడీ. అందుకు ఆమోదం. – ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ డిసిప్లినరీ కేసుల విచారణను 100 రోజుల్లోగా పూర్తి చేయాలని నిర్ణయం. – కాకినాడ సెజ్ కోసం గత సర్కారు బలవంతంగా భూములు లాక్కోవడంతో పరిహారం కూడా తీసుకోకుండా భూమి కోసం సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తున్న రైతులకు 2,180 ఎకరాలను తిరిగి ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్మోహన్రెడ్డి కాకినాడ పర్యటన సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీ మేరకు తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించింది. – రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో వ్యర్థాలాను సేకరించేందుకు 2,700 వాహనాలు కేటాయించాలని నిర్ణయం. వచ్చే మూడు నుంచి ఆరు నెలల్లో ప్రత్యేక కార్యాచరణ చేపట్టి ప్రతి మున్సిపాలిటీని ‘సూరత్’తరహాలో పరిశుభ్రంగా ఉంచేలా చెత్త సేకరణకు చర్యలు చేపట్టనున్నారు. బాబు బూటకపు హామీలు.. – కాకినాడ సెజ్ భూములపై మంత్రి నాని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పేవన్నీ బడాయి, బూటకపు మాటలేనని, సీఎం జగన్ మాట ఇస్తే కచ్చితంగా ఆచరించి నిలబెట్టుకుంటారనే విషయం కాకినాడ సెజ్ భూముల వ్యవహారంలో మరోసారి రుజువైందని మంత్రి పేర్ని నాని చెప్పారు. కాకినాడ సెజ్ భూములపై ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీకి సంబంధించిన వీడియో క్లిప్‌ను మీడియాకు మంత్రి చూపించారు. చంద్రబాబు తలపాగా చుట్టి సెజ్ భూముల్లో ఏరువాక సాగించారని, ఆ భూములు రైతులకు తిరిగి ఇచ్చి తన పుట్టిన రోజు వారి సమక్షంలో చేసుకుంటానని నమ్మబలికారన్నారు. చంద్రబాబును నమ్మి రైతులు ఓట్లేస్తే హామీని నిలబెట్టుకోలేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కాకినాడ పర్యటన సందర్భంగా మన ప్రభుత్వం రాగానే సెజ్ భూములు రైతులకు తిరిగి అప్పగిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అసెంబ్లీలో తీర్మానం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునేలా అవసరమైన అన్ని ప్రయత్నాలు చేయాలని మంత్రివర్గ సమావేశం తీర్మానించింది. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దంటూ ప్రత్యామ్నాయాలను సూచిస్తూ ప్రధాని మోదీకి ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారని మంత్రి పేర్ని నాని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవడం కోసం మొదట స్పందించి కేంద్రానికి లేఖ రాసింది ముఖ్యమంత్రేనని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు, కార్మిక సంఘాల జేఏసీ నేతలతో ముఖ్యమంత్రి జగన్ సమావేశమై అసెంబ్లీలో తీర్మానం చేస్తామనే విషయాన్ని స్పష్టంగా చెప్పారన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రై వేటీకరణ ప్రయత్నాలు విరమించుకుని చేయూతనివ్వాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం కాకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, ఢిల్లీలో ఎంపీలంతా కృషి చేస్తున్నారని, అవసరమైతే ఆందోళన నిర్వహించేందుకు కూడా వెనుకడుగు వేయబోమని చెప్పారు. అమరావతిని అభివృద్ధి చేస్తాం తమను దూషించినా.. ద్వేషించినా అమరావతిని అభివృద్ధి చేస్తామని, ఈ ప్రాంతం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. రాజధాని అమరావతి పేరుతో కొందరు నిరసన దీక్షలు చేపట్టి మంత్రులు, ఎంపీల గడ్డి బొమ్మలు ఏర్పాటు చేసి ఇష్టానుసారంగా తిడుతున్నప్పటికీ ప్రభుత్వం అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలా కార్యాచరణ చేపట్టిందని వివరించారు. అమరావతితోపాటు రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి జగన్ అభిలాష అని స్పష్టం చేశారు. పాలన వికేంద్రీకరణతో అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు విస్తరించే సంకల్పంతో ముఖ్యమంత్రి పని చేస్తున్నారని చెప్పారు. అమరావతిని వదిలేయలేదని, వేగంగా అభివృద్ధి చెందేలా జాతీయ రహదారికి అనుసంధానం చేస్తూ ప్రత్యేకంగా వంతెన, యాక్సెస్ రోడ్ల నిర్మాణానికి పక్కా కార్యాచరణతో పనిచేస్తున్నామని వివరించారు. అగ్రవర్ణ పేద మహిళలకు ‘ఈబీసీ నేస్తం’ ఆర్థికంగా వెనుకబడిన మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ‘ఈబీసీ నేస్తం’పథకాన్ని ప్రవేశపెట్టి కేబినెట్లో ఆమోదించింది. బ్రాహ్మణ, వెలమ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, ముస్లిం ఇతర అగ్రవర్ణ పేదలందరికీ ఏటా రూ.15 వేల చొప్పున వచ్చే మూడేళ్లలో రూ.45 వేలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. 45 నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న మహిళలకు పథకం వర్తిస్తుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ప్రభుత్వం ఇప్పటికే ఇస్తున్న వైఎస్సార్ చేయూత, కాపు నేస్తం తరహాలో అమలు కానుంది. ఇందుకోసం రూ.670 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపారు. 2021–22 నవరత్నాల క్యాలెండర్ అమలు ఇలా... ► ఏప్రిల్: వసతి దీవెన 15,56,956 మందికి లబ్ధి ► ఏప్రిల్, జూలై, డిసెంబర్, ఫిబ్రవరి: జగనన్న విద్యా దీవెన (సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్) 18,80,934 మందికి లబ్ధి ► జూన్: జగనన్న విద్యా కానుక– 42,34,322 మందికి లబ్ధి ► ఏప్రిల్: రైతులకు వడ్డీ లేని రుణాలు (రబీ 2019, ఖరీఫ్ 2020) 66,11,382 మందికి లబ్ధి ► ఏప్రిల్: పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలు – 90,37,255 మందికి లబ్ధి ► మే: 2020 ఖరీఫ్‌కి సంబంధించి పంటల బీమా చెల్లింపు ► మే, అక్టోబర్, జనవరి 2022: రైతు భరోసా (మూడు దఫాలుగా ), 54,00,300 మందికిపైగా రైతులకు ప్రయోజనం ► మే: మత్స్యకార భరోసా–1,09,231 మందికి లబ్ధి ► మే: మత్స్యకార భరోసా కింద డీజిల్ సబ్సిడీ చెల్లింపు, 19,746 మందికి లబ్ధి ► జూన్: వైఎస్సార్ చేయూత– 24,55,534 మందికి లబ్ధి ► జూలై: వైఎస్సార్ వాహన మిత్ర– 2,74,015 మందికి లబ్ధి ► జూలై: కాపునేస్తం–3,27,862 మందికి లబ్ధి ► ఆగస్టు: రైతులకు వడ్డీ లేని రుణాలు (ఖరీఫ్ 2021కి సంబంధించి)– 25 లక్షల మందికి లబ్ధి ► ఆగస్టు: ఎంఎస్ఎంఈ, స్పిన్నింగ్ మిల్లులకు ఇన్సెంటివ్‌ల చెల్లింపు– 9,800 పరిశ్రమలకు ప్రయోజనం ► ఆగస్టు: నేతన్న నేస్తం– 81,703 మందికి లబ్ధి ► ఆగస్టు: అగ్రిగోల్డ్ బాధితులకు నగదు పరిహారం చెల్లింపు– 3,34,160 మందికి లబ్ధి ► సెప్టెంబర్: వైఎస్సార్ ఆసరా–87,74,674 మందికి లబ్ధి ► అక్టోబర్: జగనన్న తోడు– 9.05 లక్షల మందికి లబ్ధి ► అక్టోబర్: జగనన్న చేదోడు (దర్జీలు, నాయీబ్రాహ్మణులు, రజకులకు)– 2,98,428 మందికి లబ్ధి ► నవంబర్: ఈబీసీ నేస్తం (ఆర్థికంగా వెను కబడిన కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ ఇతర అగ్రవర్ణాల మహిళలకు ల బ్ధి. దాదాపు 6 లక్షలకుపైగా లబ్ధిదారులు) ► జనవరి (2022): అమ్మఒడి– 44,48,865 మందికి లబ్ధి -
నవరత్నాల వెలుగులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న రెండోదఫా పూర్తి బడ్జెట్ జనరంజకంగా ఉండనుంది. రెండో ఆర్థిక ఏడాదిలో కూడా నవరత్నాల హామీలన్నీ నెరవేర్చడమే లక్ష్యంగా బడ్జెట్‌కు రూపకల్పన చేశారు. మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతలా భావిస్తామని సీఎం జగన్ పలు సందర్భాల్లో స్పష్టం చేసిన నేప థ్యంలో బడ్జెట్ దీన్ని ప్రతిబింబించనుంది. అన్నదాతలకు పెద్దపీట వేస్తూ బడ్జెట్ కేటాయింపుల ద్వారా ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని మరోసారి నిరూపించనుంది. ఈ ఏడాది మార్చి నుంచి ఇటు రాష్ట్రం, అటు కేంద్రం నుంచి ప్రభుత్వానికి రాబడులు పూర్తిగా తగ్గిపోయాయి. కరోనాతో ఆర్థిక వ్యవస్థ కుదేలైనా గత సర్కారు పెద్దఎత్తున పెండింగ్‌లో పెట్టిన బిల్లులను చెల్లిస్తూనే రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఆర్థిక వ్యవస్థ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ జనరంజకంగా బడ్జెట్‌ను తీర్చిదిద్దటంపై ముఖ్యమంత్రి జగన్, ఆర్థిక మంత్రి బుగ్గన సుదీర్ఘ కసరత్తు చేశారు. నవరత్నాల అమలుకు తేదీలతో క్యాలెండర్.. ► ఆర్ధిక పరిస్థితి దిగజారినప్పటికీ నవరత్నాలకు బడ్జెట్ కేటాయింపుల్లో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. నవరత్నాల పథకాల అమలుకు సంబంధించి వచ్చే ఏడాది మార్చి వరకు తేదీలతో సహా క్యాలెండర్‌ను ఇటీవల ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఆ పథకాలన్నింటికీ బడ్జెట్లో నిధులు కేటాయించనున్నారు. ► కొన్ని రంగాలకు బడ్జెట్ బయట నుంచి వ్యయం చేయనున్నారు. దీంతో కొన్ని కేటాయింపులు బడ్జెట్లో కనిపించవు. నాబార్డు, ఇతర ఆర్ధిక సంస్థల నిధులతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయనున్నారు. దీంతో ఆయా రంగాలపై వ్యయం బడ్జెట్ కేటాయింపుల కన్నా ఎక్కువగానే ఉండనుంది. కానీ ఆ నిధులను బడ్జెట్ కేటాయింపుల్లో చూపలేకపోతున్నారు. ► ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను రూపొందించడం రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటి చెబుతోంది. మరోపక్క వృధా, దుబారా, ఆర్భాటపు వ్యయాలకు తెర దించుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అన్ని రంగాల అభివృద్ధిని సమ్మిళితం చేస్తూ బడ్జెట్లో కేటాయింపులు చేశారు. పలు పథకాలు, ప్రాజెక్టులకు నిధులు.. ► పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల కోసం ‘వైఎస్ఆర్ ఆసరా’ పథకానికి బడ్జెట్లో నిధుల కేటాయింపులు చేస్తున్నారు. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసు కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్కల కోసం ‘వైఎస్ఆర్ చేయూత’ పథకానికి కూడా బడ్జెట్లో నిధులు కేటాయింపులు చేస్తున్నారు. అమ్మఒడి, వైఎస్ఆర్ రైతు భరోసా, పేదల గృహాలతో పాటు వ్యవపాయం, సాగునీటి రంగం, విద్య, వైద్య రంగాలకు బడ్జెట్లో ప్రాధానం కల్పించారు. ► ఈ ఏడాది పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించిన అవుకు టన్నెల్–2, వెలిగొండ, నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, వంశధార 2వ దశ, వంశధార–నాగావళి అనుసంధానం ప్రాజెక్టులకు తగిన నిధులను బడ్జెట్లో కేటాయింపులు చేశారు. ► రాయలసీమ దాహార్తి తీర్చేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి బడ్జెట్లో కేటాయింపులు చేయనున్నారు. కడప స్టీల్ ప్లాంటుతోపాటు పోర్టుల నిర్మాణాలకు కూడా బడ్జెట్లో నిధులు కేటాయించనున్నారు. కరోనాతో ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం గత సర్కారు మిగిల్చిన బకాయిలు, అప్పులు తీర్చడంతో పాటు కరోనాతో ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అయింది. మార్చి నుంచి రెవెన్యూ రాబడులు పూర్తిగా తగ్గిపోయాయి. మద్య నియంత్రణతో ఆదాయం గణనీయంగా తగ్గింది. ప్రజలకు ఇచ్చిన మాట మేరకు మేనిఫెస్టోలోని హామీలన్నింటినీ నెరవేర్చడం కత్తిమీద సాముగా మారినప్పటికీ ప్రభుత్వం సమతుల్యత పాటిస్తూ సంక్షేమం, అభివృద్ధికి బడ్జెట్ కేటాంపుల్లో ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. బడ్జెట్ బయట నిధుల నుంచి వ్యయం... ► ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ కింద రూ.21 వేల కోట్లకు పైగా వ్యయం చేయనున్నారు. అయితే మరో రూ.10 వేల కోట్లకుపైగా బడ్జెట్ బయట నిధుల నుంచి ఖర్చు చేయనున్నారు. రైతు భరోసా కేంద్రాలు, ఉచిత విద్యుత్ సబ్సిడీ, వైఎస్ఆర్ జనతా బజార్లతోపాటు నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రులు, సూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు భారీవ్యయం చేయనున్నారు. ఆర్ధిక పరిమితుల దృష్ట్యా ఈ వ్యయం బడ్జెట్లో పూర్తి స్థాయిలో కనిపించకపోయినప్పటికీ బడ్జెట్ బయట నిధులు వ్యయం చేయనున్నారు. ► కేంద్ర, రాష్ట్ర రాబడులు తగ్గిన నేపథ్యంలో 2020–21 పూర్తి స్థాయి బడ్జెట్‌ను రూ.2.25 లక్షల కోట్లతో రూపొందించినట్లు సమాచారం. మార్చిలో మూడు నెలలకు ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ కరోనా నేపథ్యంలో 2020–21 ఆర్ధిక సంవత్సరానికి మార్చి నెలలో పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలను నిర్వహించనందున తొలి త్రైమాసికానికి (ఏప్రిల్ – జూన్ వరకు) సంబంధించిన వ్యయానికి ద్రవ్య వినిమయ–ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్‌ను మంత్రివర్గం ఆమోదంతో మార్చిలో గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. తొలి త్రైమాసికంలో అన్ని రంగాలకు అవసరమైన రూ.70,994.98 కోట్ల వ్యయానికి ఆర్డినెన్స్ వీలు కల్పించింది. నేడు, రేపు బడ్జెట్ సమావేశాలు! కరోనాతో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు మంగళ, బుధవారాల్లో రెండు రోజులు మాత్రమే జరిగే అవకాశం ఉంది. దీనిపై నేడు ఉదయం జరగనున్న బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. జూలై నుంచి వ్యయం చేయాలంటే తప్పనిసరిగా ఈ నెలలోనే పూర్తి స్థాయి బడ్జెట్ సభ అమోదం పొందాల్సి ఉంది. తప్పనిసరిగా బడ్జెట్‌ను ఆమోదించాల్సి ఉన్నందున సమావేశాలు జరగనున్నాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ ప్రసంగం.. ఈ అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం ఉదయం 10 గంటలకు ఉభయ సభల సభ్యులనుద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజభవన్ నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు. అనంతరం సభ వాయిదా పడనుంది. ఆ వెంటనే శాసన సభ, మండలి వ్యవహారాల కమిటీలు (బీఏసీ) సమావేశమై సభల అజెండాను, సమావేశాలు నిర్వహించే రోజులను ఖరారు చేయనున్నాయి. ఉభయ సభలు తిరిగి ప్రారంభమై గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ఆమోదం తెలుపుతాయి. ఆ తరువాత మధ్యాహ్నాం 12–30 నుంచి 1 గంట మధ్యలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ అసెంబ్లీలో 2020–21 ఆర్ధిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను సమర్పిస్తారు. దీంతోపాటు 2019–20 ఆర్ధిక సర్వేను కూడా సభకు సమర్పిస్తారు. ఇదే సమయానికి ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ శాఖ) పిల్లి సుభాష్ చంద్రబోస్ శాసన మండలిలో బడ్జెట్‌ను చదువుతారు. వ్యవసాయ బడ్జెట్‌ను అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రవేశపెడతారు. ఇదే సమయానికి శాసన మండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ చదువుతారు. అనంతరం ఉభయ సభలు బుధవారానికి వాయిదా పడనున్నాయి. పద్దులు, ద్రవ్య వినిమయ బిల్లుకు రేపు ఆమోదం.. – బుధవారం ఉదయం ఉభయ సభల్లో శాఖల పద్దులను ప్రవేశపెట్టడం, ఆమోదించడం జరుగుతుంది. అనంతరం ద్రవ్య వినిమయ బిల్లులను ఆర్ధిక మంత్రి ప్రవేశపెట్టిన తరువాత సభ అమోదం పొందుతుంది. శాసనమండలి కూడా అదే రోజు పద్దులకు, ద్రవ్య వినిమయ బిల్లులకు ఆమోదం తెలుపుతుంది. పలు కీలక బిల్లులకు ఉభయ సభలు ఆమోదం తెలపనున్నాయి. దీంతో బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. నవరత్నాలకు పెద్ద పీట: బుగ్గన కరోనా నేపధ్యంలో ప్రభుత్వానికి రెవెన్యూ రాబడులు పూర్తిగా తగ్గిపోయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మేనిఫెస్టోలోని నవరత్నాలకు బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యం ఉంటుందని ఆయన సోమవారం ‘సాక్షి’కి తెలిపారు. ఆర్ధికంగా తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చాల్సిందేనని, దీనిపై మరో ఆలోచన చేయరాదనే లక్ష్యంతోనే బడ్జెట్ రూపొందించినట్లు చెప్పారు. పేదల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడంతో పాటు అభివృద్ధి, సంక్షేమం సమతూకంతో బడ్జెట్ ఉంటుందన్నారు. బడ్జెట్ నేపథ్యంలో ప్రధానికి సీఎం జగన్ లేఖ రాజ్యాంగపరమైన ప్రక్రియ మేరకు బడ్జెట్‌ను తప్పనిసరిగా ఆమోదించుకోవాల్సి ఉండటం, బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీలను ముందుగానే నిర్ణయించిన నేపథ్యంలో ప్రధాని మోదీతో ఈనెల 16, 17వ తేదీల్లో జరగనున్న ముఖ్యమంత్రుల సమావేశానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరు కాకపోవచ్చని సమాచారం. ఈమేరకు ప్రధానికి ముందుగానే సమాచారం ఇస్తూ ముఖ్యమంత్రి జగన్ లేఖ రాసినట్లు తెలిసింది. -
‘సంక్షేమం’లో సరికొత్త ఒరవడి
సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఒరవడికి శ్రీకారం చుడుతోంది. ప్రభుత్వ సేవలన్నీ గ్రామ, వార్డు సచివాలయాల్లో నిర్దిష్ట కాలపరిమితితో అర్హులందరికీ అందించే కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ మంగళవారం ప్రారంభించనున్నారు. దీంతో దేశంలోనే మరెక్కడా లేని విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కాలపరిమితి నిర్ణయించే పద్ధతిని ఆంధ్రప్రదేశ్‌లో అమలులోకి తీసుకురానున్నారు. నేను ఉన్నాను.. నేను విన్నాను అంటూ రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. తన పాలనలో విప్లవాత్మక మార్పులు తెస్తున్న సంగతి తెలిసిందే. ► నిజానికి సంక్షేమ ఫలాలు అందుకోవాలంటే గతంలో లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు సంక్షేమ పథకాలు అందుకోవడానికి లంచాలు ఇవ్వాల్సిన పనిలేదని, ఏళ్ల తరబడి నిరీక్షించాల్సిన అవసరంలేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ► ఈ కొత్త విధానం ప్రకారం.. దరఖాస్తు చేసిన పది రోజుల్లోనే బియ్యం కార్డు, పది రోజుల్లో పింఛన్ కార్డు, 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు, 90 రోజుల్లో అక్కచెల్లెమ్మల పేరుతో ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి అప్పగిస్తారు. ► ప్రధాన సేవలతోపాటు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 541 రకాల సేవలు నిర్దిష్ట కాలపరిమితితో ప్రజలకు అందనున్నాయి. లబ్ధిదారుల జాబితా, అర్హతలు, లబ్ధిపొందే విధానం వంటి వివరాలను అక్కడ ఏర్పాటుచేస్తారు. ► దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను వలంటీర్లు నిర్దిష్ట కాలపరిమితిలో పరిశీలన పూర్తిచేస్తారు. వాటికి సంబంధించిన సంక్షేమ ఫలాలను లబ్ధిదారుల ఇంటికే వెళ్లి అందజేస్తారు. ► ఇందుకు సంబంధించిన సలహాలు, సూచనలు, ఫిర్యాదులను 1902 టోల్ ఫ్రీ నంబర్‌కు తెలియజేయవచ్చు. ► వ్యవసాయ అనుబంధ సేవలకు 1907కు, టెలి మెడిసిన్ సేవలకు 14410, అవినీతిపై ఫిర్యాదులు 14400, దిశ 181, మద్యం అక్రమ తయారీ, అమ్మకం, రవాణా, ఇసుకపై ఫిర్యాదులను 14500కు ఫోన్ చేయవచ్చు. (సీఎం వైఎస్ జగన్ ఏడాది పాలన భేష్: టీడీపీ సీనియర్ నేత) -
భూముల వేలం నిలిపివేతకు ‘నో’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు కోసం అవసరమైన నిధులను సమీకరించే నిమిత్తం ప్రభుత్వ భూములను విక్రయించేందుకు ఈనెల 28న జరగనున్న తొలిదశ ఆన్లైన్ వేలం ప్రక్రియను నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంలో ఈ దశలో ఎటువంటి ఉత్తర్వులు జారీచేయడం సాధ్యంకాదని తేల్చిచెప్పింది. అయితే, ఈ భూముల విక్రయాలు మాత్రం ఈ వ్యాజ్యంలో తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేష్‌కుమార్, జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వం తలపెట్టిన భూముల విక్రయాన్ని అడ్డుకోవాలని కోరుతూ సామాజిక కార్యకర్త సురేష్‌బాబు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం జస్టిస్ రాకేష్‌కుమార్, జస్టిస్ సురేష్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. రాజకీయ ముసుగులో ‘పిల్’లు ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. అణగారిన వర్గాలు, కోర్టులను ఆశ్రయించలేని పేదలు, తదితరుల కోసం ఉద్దేశించిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) నేడు తీవ్రస్థాయిలో దుర్వినియోగమవుతోందని వివరించారు. రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల ముసుగులో ‘పిల్’లు దాఖలు చేయడం ఇటీవల కాలంలో ఎక్కువైపోయిందన్నారు. ఇప్పుడు ప్రభుత్వ భూముల విక్రయాన్ని అడ్డుకోవాలంటూ దాఖలు చేసిన ఈ వ్యాజ్యం కూడా రాజకీయ ప్రయోజనాలను ఆశించే దాఖలు చేశారని వివరించారు. పిల్‌ను దుర్వినియోగం చేయడమంటే, అది న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనన్నారు. భూములమ్మే అధికారం ప్రభుత్వానికి ఉంది ప్రభుత్వ భూములను విక్రయించడం ఇదేమీ మొదటిసారి కాదని, గత ప్రభుత్వాలు కూడా విక్రయించాయని ధర్మాసనం దృష్టికి పొన్నవోలు తీసుకొచ్చారు. ప్రభుత్వ భూములను విక్రయించే అధికారం ప్రభుత్వానికి ఉందని.. విక్రయించరాదని ఎక్కడా నిషేధం లేదన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, లాక్డౌన్ సమయంలో ఏ రకమైన వేలం ప్రక్రియలు చేపట్టరాదని హైకోర్టు గతంలోనే ఆదేశాలిచ్చింది కదా అని గుర్తుచేసింది. వేలం విషయంలో ప్రభుత్వాన్ని నియంత్రించలేదని సుధాకర్‌రెడ్డి తెలిపారు. అయినా.. పేద రాష్ట్రంగానే ఎందుకుంది? అందరి వాదనలు విన్న ధర్మాసనం, మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడానికి నిరాకరించింది. అయితే.. భూముల విక్రయాలు మాత్రం తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టంచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సమయంలో ధర్మాసనం కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఆంధ్రప్రదేశ్‌లో మంచి సారవంతమైన భూములున్నాయి.. మంచి పంటలు పండుతాయి.. ఇక్కడ ప్రజలు సంపన్నులు.. అయినప్పటికీ పేద రాష్ట్రంగానే ఎందుకుంది’ అని వ్యాఖ్యానించింది. దీనికి సుధాకర్‌రెడ్డి బదులిస్తూ.. రాష్ట్ర విభజన తరువాతే ఏపీ ఆర్థికంగా బాగా నష్టపోయిందని, పరిశ్రమలన్నీ హైదరాబాద్‌లోనే ఉండిపోయాయని చెప్పారు. ప్రభుత్వం తీసుకునే ప్రతీ విధాన నిర్ణయాన్ని ఇలా రాజకీయ కారణాలతో సవాలు చేస్తూ ఉంటే తాము చేసేది ఏముంటుందని సుధాకర్‌రెడ్డి తెలిపారు. తాము రాజకీయాల జోలికి వెళ్లడంలేదంటూ ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. గతంలో లాగా జేబులు నింపుకోవడానికి అమ్మడంలేదు.. డబ్బు కోసం ఇలా ప్రభుత్వ భూములను అమ్మడం సబబేనా? అని ధర్మాసనం ప్రశ్నించింది. గతంలో లాగా జేబులు నింపుకోవడానికి భూములు అమ్మడంలేదని.. ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుకు అవసరమైన నిధుల కోసం భూములు అమ్ముతున్నామని సుధాకర్‌రెడ్డి చెప్పారు. ఈ సమయంలో పిటిషనర్ తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు జోక్యం చేసుకుంటూ.. గుంటూరులో మార్కెట్ స్థలాన్ని అమ్మేస్తున్నారని చెప్పారు. దీనిపై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి అభ్యంతరం తెలిపారు. అక్కడ ఇప్పుడు మార్కెట్ లేదని, మరోచోట మార్కెట్ నిర్మించామని, చక్కగా అక్కడ కార్యకలాపాలు సాగుతున్నాయని చెప్పారు. ఈనెల 28న ఆన్లైన్ వేలం ఉందని, అందువల్ల వేలాన్ని అడ్డుకుంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరగా.. ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని పొన్నవోలు అభ్యర్ధించారు. -
ప్రభుత్వం మా పల్లెకొచ్చింది
పల్లె నవ్వింది. కష్టాల కారు మేఘాల నుంచి బయటపడి ఎల్లుట్ల మెరుపల్లే మెరిసింది. ఆనందంతో నిలువెల్లా మురిసింది. వలంటీర్ల సేవలకు చేతులెత్తి సలాం చేస్తోంది. గ్రామం అభివృద్ధికి ఆమడ దూరం అనే మాటకు కాలం చెల్లింది. రేపటి ఆశల పచ్చని పందిరి.. ఎల్లుట్లను చూసొద్దాం రండి రామలక్ష్మికి ఇప్పుడు తాగునీటి బెంగలేదు. నాగలక్ష్మికి మగ్గం ఆగుతుందన్న చింత లేదు.పింఛన్ కోసం తిరుపాలు ఇప్పుడు ఏ గుమ్మం తొక్కాల్సిన పనిలేదు. ఆటో చక్రం ఆగితే ఓబులయ్య చేతులు సాచే పనిలేదు. గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం ఇక ఎంతమాత్రమూ కల కాదు. అది తలెత్తుకు నిలబడిన ఎల్లుట్ల గ్రామమంతటి వాస్తవం. రాష్ట్రంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పడటంతో రూపుదిద్దుకున్న వైభవం. సాక్షి, అనంతపురం: ఆ ఊరు మండల కేంద్రం నుంచి విసిరేసినట్లు చిట్టచివరలో ఉంటుంది. గ్రామం నుంచి మండల కేంద్రానికి దాదాపు 30 కిలోమీటర్లు. పాసుబుక్కులు, బ్యాంకు, ఎమ్మార్వో, ఎంపీడీఓ, హౌసింగ్, అగ్రికల్చర్ కార్యాలయం ఇలా ఏ చిన్న పనికోసం వెళ్దామన్నా బస్సులు, ఆటోలు లేవు. బైకులు ఉంటే సరే. బస్సులో వెళ్లాలంటే దాదాపు 65 కిలోమీటర్లు చుట్టేసుకుని వెళ్లాలి. ఇంత శ్రమ పడి అక్కడికి వెళ్లినా ఒక్కరోజులో పని అవుతుందనే నమ్మకం ఉండేది కాదు. చాలా పనులు కాక, మళ్లీ అంతదూరం వెళ్లలేక ఆ పనులు పెండింగ్ పడిపోయేవి. ఇవీ అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామ ప్రజల కష్టాలు. ఇప్పుడు పరిస్థితి మారింది. నేరుగా ఇంటివద్దనే సేవలందుతున్నాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సచివాలయాల వ్యవస్థ ఈ ఊరి ప్రజల కష్టాలను దూరం చేసింది. రేషన్‌కార్డు మొదలుకుని 1–బీ, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, సంక్షేమ పథకాల అమలుకు దరఖాస్తు ఇక్కడే చేసుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి గ్రామస్థాయిలో ఏ విధంగా ఉన్నాయనే అంశాలను పరిశీలించేందుకు ‘సాక్షి’ బృందం ఎల్లుట్ల గ్రామాన్ని సందర్శించింది. గ్రామస్తుల మాటలు వినండి.. 20 ఏళ్ల సమస్య 2 నెలల్లో పరిష్కారం ► గ్రామంలోని అంబేడ్కర్ కాలనీలో దాదాపు 110 కుటుంబాలు ఉన్నాయి. 20 ఏళ్లుగా ఈ కాలనీలో మంచి నీటికి కటకట. లెక్కలేనన్నిసార్లు పుట్లూరుకు వెళ్లి ఎంపీడీఓ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు వినతిపత్రాలు అందజేసినా లాభం లేకపోయింది. ► 2019లో సచివాలయం ఏర్పడ్డాక కాలనీ వాసులు ఒక అర్జీ ఇవ్వగానే 14వ ఆర్థిక సంఘం నిధులతో పైప్‌లైన్‌కు మరమ్మతులు చేయించి 2 నెలల్లో నీళ్లు వచ్చేలా చేశారు. ► ఏడాది కాలంగా గ్రామంలో శానిటేషన్ సెక్రటరీ నిత్యం పారిశుధ్య పనులపై దృష్టి పెడుతున్నాడు. గ్రామంలోని 11 మంది వలంటీర్లు కూడా ఈ విషయంపై బాగా శ్రద్ధ చూపుతున్నారు. ‘అనంత’ జిల్లా..ఎల్లుట్ల గ్రామం అడగ్గానే అడంగల్ ► సచివాలయం వద్దకు వెళ్లి 1బీ అడంగల్ కావాలని అడిగితే కాసేపట్లేనే ఇచ్చేస్తున్నారు. అమ్మ ఒడి దరఖాస్తులో పేరు తప్పుగా పడిందని వెళితే వెంటనే మార్చేశారు. నిజంగా ఈ ఆఫీసు రావడం వల్ల ఇంత ఉపయోగం ఉంటుందని ఊహించలేదు. ఏదో చెబుతున్నా రు.. ఏం చేస్తారో ఏమో అనుకున్నాం. కానీ నిజంగా మాకు చాలా కష్టాలు తప్పాయి. సమయం ఆదా అయింది. ► పాసుబుక్కులు, ఎమ్మార్వో, ఎంపీడీఓ, హౌసింగ్, అగ్రికల్చర్ కార్యాలయం.. ఇలా ఏ చిన్న పనికోసం మండల కేంద్రానికి బైకుల్లో వెళితే 30 కిలోమీటర్లు ఉంటుంది. బస్సులో వెళ్లాలంటే దాదాపు 65 కిలోమీటర్లు చుట్టేసుకుని వెళ్లాలి. అలా వెళ్లలేక పనులన్నీ అలాగే నిలిచిపోయేవి. ఒకవేళ వెళ్లినా పని అవుతుందన్న నమ్మకం ఉండేది కాదు. ఇప్పుడు మా ఎదుటే సచివాలయం ఉండడంతో అర్జీ ఇచ్చిన వెంటనే స్పందిస్తున్నారు. ► ఏ విషయం గురించి అడిగినా వలంటీర్లు, సచివాలయం ఉద్యోగులు వెంటనే చెబుతున్నారు. వారికి తెలియక పోతే పై అఫీసర్లను కనుక్కుని చెబుతున్నారు. ఇంటికే పంట విత్తనాలు ► గతంలో ఖరీఫ్ సీజన్ వచ్చిందంటే సబ్సిడీ విత్తన వేరుశనగ కోసం మండల కేంద్రం పుట్లూరుకు వెళ్లి పడిగాపులు కాసేవారం. ఉదయం నుంచి సాయంత్రం దాకా క్యూలో నిల్చున్నా చివరికి దొరికేవి కాదు. మరుసటిరోజు పోయినా అదే సమస్య ఉండేది. దీంతో విసుగెత్తి వదులుకునేవారం. కానీ ఇప్పుడు గ్రామానికే తీసుకొచ్చి ఇస్తున్నారు. ► మా గ్రామంలో ఉన్న రెండు బెల్టుషాపులను ఎత్తేశారు. మద్యం తాగేవారి సంఖ్య బాగా తగ్గింది. ఎవరైనా మద్యం తాగా లనుకున్న వారు 12 కిలోమీటర్ల దూరంలోని నార్పలకు వెళ్లాలి. ► ఏ చిన్నపని కోసమైనా మండల కేంద్రం పుట్లూరుకు బస్సుల్లో వెళ్లాలంటే నార్పల, అక్కడి నుంచి తాడిపత్రికి అక్కడి నుంచి పుట్లూరుకు వెళ్లేవాళ్లం. ఇప్పుడు పరిస్థితి మారింది. నేరుగా ఇంటి వద్దకే సేవలందుతున్నాయి. పైసా ఖర్చు లేకుండా 65 కిలోమీటర్లు కాదు కదా.. 65 మీటర్ల దూరంలోని సచివాలయంలోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతున్నాయి. ► రేషన్‌కార్డు మొదలుకుని కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, సంక్షేమ పథకాలకు దరఖాస్తులు.. అన్నీ ఇక్కడే. ఏ పథకానికి ఎవరికి అర్హత ఉందో వలంటీర్లు మరీ అడిగి దరఖాస్తు చేయిస్తున్నారు. నాలుగు పథకాల లబ్ధి నా కూతురు డిగ్రీ చదువుతోంది. విద్యా దీవెన , వసతి దీవెన పథకాల కింద సొమ్ము అందింది. నాకు ఇద్దరు మగ పిల్లలు. 8వ తరగతి చదువుతున్నారు. అమ్మ ఒడి పథకం కింద రూ. 15 వేలు తల్లి ఖాతాలో జమ చేశారు. నాకు రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం అందజేశారు. – నరసింహులు, రైతు వలంటీర్‌కు అప్లికేషన్ ఇచ్చిన వెంటనే పింఛన్ వచ్చింది గత టీడీపీ ప్రభుత్వంలో ఎన్ని సార్లు పింఛన్ కోసం అర్జీలు ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పింఛన్ వచ్చేది. టీడీపీ ప్రభుత్వంలో నా పేరును తీసేశారు. నాకు వయస్సు ఉంది సామి అని మొత్తుకున్నా పట్టించుకోలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వలంటీర్‌కు నా ఆధార్ కార్డు, అప్లికేషన్ ఇచ్చా. వెంటనే పింఛన్ మంజూరు చేశారు. ప్రతినెలా రూ.2,250 ఇంటివద్దకు తెచ్చిస్తున్నారు. – తిరుపాలు, వృద్ధాప్య పింఛన్‌దారుడు ఎలాంటి సిఫార్సు లేకుండానే ‘నేతన్న నేస్తం’ మగ్గం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నాకు వైఎస్సార్ నేతన్న నేస్తం కింద ఆర్థికసాయం అందింది. ఈ సొమ్ముతో మగ్గానికి మోటర్లను ఏర్పాటు చేసుకున్నా. మగ్గం పనులు చేపడుతుండటంతో ఎలాంటి సిఫార్సు లేకుండానే వలంటీర్లు ఫోటోలు తీసుకుని నాకు ఆర్థిక సహాయం వచ్చేలా చేశారు. నాకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు జితేంద్ర ప్రసాద్ బిటెక్ మెకానికల్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. వసతి దీవెన కింద లబ్ధి చేకూరింది. – నాగలక్ష్మి, చేనేత కార్మికురాలు -
ఏపీలో పాలన పరుగులు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రైతన్నల సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించి వారి ఇబ్బందులను పరిష్కరించి భరోసా కల్పించే లక్ష్యంతో ప్రతి జిల్లాకు మూడో జాయింట్ కలెక్టర్ (జేసీ) పోస్టులను మంజూరు చేసిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఉత్తర్వులిచ్చింది. దీనివల్ల అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు వేగంగా పరిష్కారం కానున్నాయి. రాష్ట్రంలో అదనంగా 13 జాయింట్ కలెక్టర్ (కేడర్) పోస్టులు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జేసీ పోస్టులను మూడు విభాగాలుగా రీ డిజిగ్నేషన్ చేయడంతోపాటు పర్యవేక్షించాల్సిన విభాగాలను కూడా ప్రభుత్వం కేటాయించింది. తద్వారా పరిపాలనా వ్యవస్థ జిల్లాల స్థాయిలో బలోపేతం కావడంతోపాటు లోపరహితంగా, శరవేగంగా సేవలు అందనున్నాయి. అందరి సంక్షేమమే లక్ష్యం.. ‘అవినీతికి తావులేని, జవాబుదారీ పరిపాలన అందించడంతోపాటు సమాజంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ‘మిషన్ మోడ్’లో నిర్వహించాలని నిర్ణయించాం. చిట్టచివరి వ్యక్తికి కూడా సత్వర సేవలు అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థలను తెచ్చింది. రాష్ట్రంలో సీనియర్ టైమ్ స్కేల్లో పెద్ద స్థాయిలో ఉన్న ఐఏఎస్ అధికారులు కీలక బాధ్యతలు చేపట్టడానికి ముందు విస్తృతంగా క్షేత్రస్థాయిలో పనిచేసిన అనుభవం అవసరం. స్టేట్ సివిల్ సర్వీస్ (ఎస్సీఎస్), నాన్ స్టేట్ సివిల్ సర్వీసెస్ (నాన్ ఎస్సీఎస్) అధికారులు ఐఏఎస్‌లుగా ప్రమోషన్ పొందడానికి ముందు క్షేత్రస్థాయిలో పనిచేసిన మంచి ట్రాక్ రికార్డు ఉండటం అవసరం. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మూడో జేసీ పోస్టు మంజూరు చేస్తున్నాం’ అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 3 విభాగాలుగా జేసీలు ► ప్రస్తుతం ఉన్న జాయింట్ కలెక్టర్–1ను జాయింట్ కలెక్టర్– రైతు భరోసా, రెవెన్యూ (ఆర్బీ– ఆర్)గా ప్రభుత్వం మార్చింది. ఇందులో సీనియర్ టైమ్ స్కేలు, అంతకంటే ఎక్కువ స్థాయి ఐఏఎస్ అధికారిని నియమిస్తారు. ► జేసీ–గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి (వి, డబ్ల్యూఎస్–డి)ని కొత్తగా సృష్టించారు. దీన్ని సీనియర్ టైమ్ స్కేలు, అంతకంటే ఎక్కువ స్థాయి ఐఏఎస్ అధికారితో భర్తీ చేస్తారు. ► ప్రస్తుతం ఉన్న జేసీ–2ను జాయింట్ కలెక్టరు – ఆసరా, సంక్షేమం అని మార్చారు. ఇందులో ఎస్సీఎస్, నాన్ ఎస్సీఎస్ అధికారులను(స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ కేడర్) నియమించనున్నారు. జేసీ– ఆసరా–సంక్షేమం (ఏ అండ్ డబ్ల్యూ) (పర్యవేక్షించే విభాగాలు) ► గ్రామీణాభివృద్ధి (డీఆర్డీఏ –డీడబ్ల్యూఎంఏ) ► అన్ని రకాల సంక్షేమం (మహిళా శిశు సంక్షేమం, బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, డిసేబుల్డ్ వెల్ఫేర్, మైనారిటీల సంక్షేమం) ► పరిశ్రమలు – వాణిజ్యం ► దేవదాయ 4 స్కిల్ డెవలప్మెంట్. జేసీ– గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి (వీ, డబ్ల్యూఎస్–డి) (పర్యవేక్షించే విభాగాలు) ► గ్రామ, వార్డు సచివాలయాలు, గ్రామ, వార్డు వలంటీర్లు ► పంచాయతీరాజ్ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం ► పాఠశాల, సాంకేతిక, ఉన్నత విద్య ► పురపాలక, పట్టణాభివృద్ధి గృహ నిర్మాణం ► మీసేవ– ఆర్టీజీ, ఐటీఈ, సి విభాగాలు ► ఇంధన, జలవనరుల శాఖలు మినహా అన్ని రకాల ఇంజనీరింగ్ విభాగాలు -
జిల్లాకు మరో జేసీ
సాక్షి, అమరావతి: పాలనా వ్యవస్థలో మరింత జవాబుదారీతనం తీసుకురావడానికి.. అవినీతి రహితంగా పాలన సాగించడానికి.. సమాజంలోని అన్ని వర్గాలకు సమర్థవంతంగా సంక్షేమ ఫలాలు అందించడానికి జిల్లా యంత్రాంగంలో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం జిల్లాల్లో ఇద్దరేసి జాయింట్ కలెక్టర్లు ఉన్నారు. తాజాగా ఇప్పుడు మరో జాయింట్ కలెక్టర్ పోస్టును ప్రభుత్వం సృష్టించనుంది. ఈ పోస్టులో సీనియర్ టైమ్ స్కేలు ఉన్న ఐఏఎస్ అధికారిని నియమించనున్నారు. ఈ మేరకు నేడో, రేపో ఉత్తర్వులు వెలువడనున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణతో పాటు పలు సంక్షేమ పథకాల అమలు బాధ్యతను కొత్తగా నియమితులు కానున్న జేసీకి అప్పగించనున్నారు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకు చేర్చడంలో గ్రామ, వార్డు సచివాలయాలు కీలకంగా పనిచేస్తున్న విషయం విదితమే. కొత్తగా జాయింట్ కలెక్టర్ పోస్టు ఏర్పాటుచేస్తుండడంతో.. ఇక నుంచి ప్రతి జిల్లాలో మొత్తం ముగ్గురు జాయింట్ కలెక్టర్లు ఉంటారు. పని విభజన విషయంలో ముగ్గురు జేసీలకు ప్రభుత్వం మరింత స్పష్టత ఇవ్వనుంది. ఏ జాయింట్ కలెక్టర్ ఏ పథకాలను పర్యవేక్షించాలో, ఏఏ విభాగాలను చూడాలనే విషయంలో ఉన్నతాధికారులు విస్పష్టంగా జాబితా రూపొందించారు. చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ సేవలు.. సంక్షేమ ఫలాలు సమర్థవంతంగా, సజావుగా అందించాలన్నదే ఈ మార్పు లక్ష్యమని సమాచారం. ఈ ముగ్గురు జేసీలు జిల్లా కలెక్టర్‌కు పాలనలో సహకారం అందిస్తారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో సీనియర్ టైమ్ స్కేలులో ఐఏఎస్ అధికారులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కలెక్టర్లుగా బాధ్యత స్వీకరించే ముందే వారికి క్షేత్రస్థాయిలో పాలన అనుభవం అవసరం అని ప్రభుత్వం భావిస్తోంది. స్టేట్ సివిల్ సర్వీసు (ఎస్సీఎస్) అధికారులకు, నాన్–ఎస్సీఎస్ అధికారులకూ ఐఏఎస్‌లుగా పదోన్నతి పొందడానికి ముందు క్షేత్రస్థాయిలో విశేష అనుభవం అవసరం. దీనిని దృష్టిలో పెట్టుకొని జిల్లా స్థాయి పాలనా వ్యవస్థలో మార్పులు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. మార్పులు ఇలా.. 1 జాయింట్ కలెక్టర్–1ను ఇక మీదట జాయింట్ కలెక్టర్ (రైతు భరోసా మరియు రెవెన్యూ)గా పునర్యవస్థీకరించనున్నారు. వీరిని జేసీ–ఆర్బీ అండ్ ఆర్గా పిలుస్తారు. వీరు రైతు భరోసా మొదలు వ్యవసాయం, అనుబంధ రంగాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇసుక, గనులు, ఎక్సైజ్, శాంతిభద్రతలు తదితర విభాగాలకూ బాధ్యత వహించాలి. రెవెన్యూ విభాగం, సబ్ కలెక్టర్లనూ పర్యవేక్షించాలి. 2 ‘జాయింట్ కలెక్టర్–విలేజ్ అండ్ వార్డు సెక్రటేరియట్’ అని కొత్త పోస్టు సృష్టించనున్నారు. వీరిని జేసీ–వీ అండ్ డబ్ల్యూఎస్‌గా పిలుస్తారు. ఈ పోస్టులో సీనియర్ టైమ్ స్కేలు ఉన్న ఐఏఎస్ అధికారిని నియమిస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణతో పాటు పలు సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షిస్తారు. 3 ఇప్పుడున్న జాయింట్ కలెక్టర్–2ను జాయింట్ కలెక్టర్–హెల్త్ అండ్ ఎడ్యుకేషన్‌గా పునర్యవస్థీకరించనున్నారు. ఇది నాన్–క్యాడర్ పోస్టు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి ఎస్సీఎస్/నాన్–ఎస్సీఎస్ కేడర్‌ను ఈ పోస్టులో నియమిస్తారు.వీరు జిల్లాలో వైద్య, ఆరోగ్య విభాగం, విద్యా శాఖను పర్యవేక్షిస్తారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, దిశ చట్టం అమలు బాధ్యతలు చూడనున్నారు. -
సచివాలయాలు @ 237 సేవలు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు 237 సేవలను అందించనున్నామని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. ఇందులో 72 గంటల్లోనే 115 సేవలు ప్రజలకు అందించనున్నామని, మిగతా 122 సేవలను ఎప్పటిలోగా అందించగలమో వర్గీకరించాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 2 నుంచి గ్రామ, వార్డు సచివాలయాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన సన్నాహాలు, సంక్షేమ పథకాల అమలు ప్రణాళికపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో బుధవారం ఆయన సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నాలుగు నెలల వ్యవధిలో 4 లక్షలకు పైగా నియామకాలు చేయగలిగామని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై సీఎం స్పందిస్తూ పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన అధికారులందరికీ అభినందనలు తెలిపారు. గ్రామ సచివాలయాలు, గ్రామ వలంటీర్లకు ఉద్దేశించిన కాల్ సెంటర్లలో ఉన్న వారికి శిక్షణ ఇస్తున్నామని.. ఫిర్యాదులు, సమస్యలను నివేదించడానికి 1902 కాల్ సెంటర్‌ను సిద్ధం చేస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రజల సమస్యలపై స్థానికంగా స్పందించడానికి గ్రామ సెక్రటేరియట్‌కు ప్రత్యేకంగా ఒక నంబర్ ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. మౌలిక వసతులపై ఆరా..: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పాటు చేయాల్సిన మౌలిక వసతులను సమకూర్చారా? లేదా? అని ముఖ్యమంత్రి ఆరా తీశారు. గ్రామ సచివాలయ ఉద్యోగుల జాబ్ చార్టులను అడిగి తెలుసుకున్నారు. 72 గంటల్లోగా సమస్యను పరిష్కరించడానికి అవసరమైన విధంగా సచివాలయాల్లో ఏర్పాట్లు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో డేటా సెంటర్ కూడా ఉండాలని, సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించాలని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాలతో ఎమ్మార్వో, ఎంపీడీవో, కలెక్టర్, సంబంధిత శాఖ కార్యదర్శి.. ఇలా అందరితో అనుసంధానం ఉండాలని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, గ్రామ వలంటీర్ల వ్యవస్థపై పర్యవేక్షణ చాలా ముఖ్యమైనదని, నాలుగు లక్షల మందితో పని చేయించుకోవడం చాలా ప్రాధాన్యత ఉన్న అంశంగా చూడాలని సీఎం పేర్కొన్నారు. ఈ వ్యవస్థ కోసం మంచి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. ఇళ్ల స్థలాలపై వలంటీర్ల సర్వే పూర్తయ్యిందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికపై గ్రామ సచివాలయాల్లో సామాజిక తనిఖీలు జరగాలని సీఎం సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల భవనాలు ఒకే నమూనాలో ఉండేలా చూడాలని సీఎం కోరారు. రైతులకు వర్క్‌షాప్‌ల నిర్వహణ, నాణ్యమైన ఎరువులు, విత్తనాల కోసం ఒక షాపు కూడా ఉండాలని సూచించారు. ఏ పథకాన్ని కూడా సాంకేతిక కారణాలతో నిరాకరించరాదని చెప్పారు.