Indian workers
-
Kuwait Fire Incident: 49లో 45 మంది భారతీయులే
కువైట్ సిటీ/ దుబాయ్: గల్ఫ్ దేశం కువైట్‌లో బుధవారం చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో అగ్నికి ఆహుతైన 49 మందిలో 45 మంది భారతీయులేనని అధికారులు తెలిపారు. మరో ముగ్గురు ఫిలిప్పీన్స్ దేశస్తులు కాగా మరో మృతదేహాన్ని గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. మృతుల్లో మలయాళీలు 24 మంది ఉన్నట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది. ఆ రాష్ట్ర వాసులు మరో ఏడుగురు వివిధ ఆస్పత్రుల్లో ఐసీయూల్లో చికిత్స పొందుతున్నట్లు గుర్తించామని వెల్లడించింది. విదేశాంగ శాఖ నుంచి ధ్రువీకరణ సమాచారం అందాక బాధితుల వివరాలను వెల్లడిస్తామని తెలిపింది. కువైట్ దక్షిణ అహ్మదీ గవర్నరేట్‌లో మాంగాఫ్ ప్రాంతంలోని ఏడంతస్తుల భవనంలో బుధవారం వేకువజామున జరిగిన ప్రమాదంలో 49 మంది మృతి చెందగా మరో 50 మంది వరకు గాయపడ్డారు. గురువారం కువైట్ చేరుకున్న విదేశాంగ మంత్రి కీర్తివర్థన్ సింగ్ క్షతగాత్రులైన భారతీయులతో మాట్లాడి, వారికి అవసరమైన సాయం అందేలా చూస్తున్నారు. ముబారక్ అల్‌కబీర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న భారతీయులను పరామర్శించారు. అదేవిధంగా, మృతదేహాలను సాధ్యమైనంత త్వరగా స్వదేశానికి తరలించే ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. నీళ్ల ట్యాంకుపైకి దూకి..ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో ఆ భవనంలో కేరళలోని త్రిక్కారిపూర్కు చెందిన నళినాక్షన్ కూడా నిద్రిస్తున్నారు. మూడో అంతస్తులో ఉన్న ఆయన జనం హాహాకారాలు విని, వెంటనే అప్రమత్తం అయ్యారు. భవనం సమీపంలోనే ఉన్న వాటర్ ట్యాంకుపైకి దూకారు. పక్కటెముకలు విరిగి, తీవ్రంగా గాయపడిన నళినాక్షన్ ట్యాంకుపైన చిక్కుకుపోయారు. కదల్లేని స్థితిలో ఆయన్ను ఉదయం 11 గంటల సమయంలో కొందరు గుర్తించి కిందికి దించి, ఆస్పత్రికి తరలించారని అతడి మామ బాలకృష్ణన్ చెప్పారు.కుమార్తెకు బహుమతిగా ఫోన్ ఇవ్వాలని..12వ తరగతి బోర్డు పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన తన కూతురికి ఫోన్ బహుమతిగా ఇవ్వాలనుకున్నారు లుకాస్. ఇంటికెళ్లాక కుమార్తెను స్వయంగా బెంగళూరు తీసుకెళ్లి నర్సింగ్ స్కూల్లో చేర్పిద్దామనుకున్నారు. అయితే, ఆ కల నెరవేరలేదు. కువైట్ ప్రమాదంలో అగ్నికి ఆహుతైన వారిలో కేరళలోని కొల్లంకు చెందిన లుకాస్ కూడా ఉన్నారు. బుధవారం వేకువజామున ప్రమాదం జరిగిన సమయంలో లూకాస్ తమ సొంతూళ్లోని చర్చి ఫాదర్‌తో ఫోన్లో మాట్లాడుతున్నారు. హఠాత్తుగా ఫోన్ డిస్ కనెక్టయ్యింది. తర్వాత చర్చి ఫాదర్ ఫోన్ చేసినా లూకాస్ లిఫ్ట్ చేయ్యలేదు. 18 ఏళ్లుగా కువైట్‌లో ఉంటున్న లూకాస్‌కు వృద్ధులైన తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. -
నిజామాబాద్ ఫస్ట్.. హైదరాబాద్ సెకండ్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం నుంచి ఇప్పటికీ గల్ఫ్ దేశాలకు భారీగా వలసలు కొనసాగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వీరి సంఖ్య గణనీయంగా పెరిగింది. వలస వెళ్లిన వారిలో అత్యధికులు నిజామాబాద్ జిల్లా వారు కాగా... హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. కేంద్రం అధీనంలోని విదేశాంగశాఖ ఇటీవల వెల్లడించిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2021లో రాష్ట్రం నుంచి మొత్తం 4,375 మంది గల్ఫ్ దేశాల బాట పట్టారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికే ఈ సంఖ్య 8,547కు చేరింది. ప్రభావం చూపని ఆ వృత్తులు.. హైదరాబాద్‌లోని పాతబస్తీతో పాటు తూర్పు మండలంలోని కొన్ని ప్రాంతాల నుంచి యువకులు ఖతర్, యూఏఈ, సౌదీ, ఒమన్, కువైట్, బర్హేన్‌లకు వలస వెళ్లడం ఏళ్లుగా సాగుతోంది. ఇలా అత్యధికులు అసంఘటిత రంగ కార్మికులుగానే వెళ్తున్నారు. ఆయా దేశాలకు వెళ్లిన వారికి నెలకు రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు ఆదాయం వస్తుంటుంది. ఇటీవల కాలంలో వివిధ రకాలైన డెలివరీ యాప్‌లకు డెలివరీ బాయ్స్‌గా, బైక్ ట్యాక్సీలు నిర్వహిస్తున్న వాళ్లు కూడా నగరంలో ఉంటూనే ఈ మొత్తాన్ని ఆర్జిస్తున్నారు. దీని ప్రభావంతో వలసల సంఖ్య నానాటికీ తగ్గాల్సి ఉంది. అయినప్పటికీ వలస వెళ్లే వారి సంఖ్య గతేడాది కంటే ఈ ఏడాది పెరగడం గమనార్హం. గతేడాది ఖతర్‌కే అత్యధికులు.. ఈసారి ఫిఫా వరల్డ్ కప్‌నకు ఖతర్ ఆతిథ్యమిచ్చింది. దీనికోసం దాదాపు రెండు మూడేళ్లుగా అక్కడ భారీ ఫుట్‌బాల్ స్టేడియాలు, క్రీడాకారులకు అవసరమైన బస కోసం ప్రాంగణాలు తదితరాలను నిర్మించారు. వీటిలో పని చేయడానికి అక్కడి వారితో పాటు పెద్ద ఎత్తున వలస కూలీలు అవసరమయ్యారు. ఈ కారణంగానే ఆయా కాంట్రాక్టర్లు దళారుల సాయంతో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అనేక మందిని ఆకర్షించారు. గతేడాది రాష్ట్రం నుంచి ఖతర్‌కు వెళ్లిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ ఏడాది ప్రారంభం నాటికే ఆయా నిర్మాణాలు పూర్తయ్యాయి. దీంతో ఆ దేశానికి వెళ్లే వారి సంఖ్య ఈ ఏడాది తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. గణనీయంగా పెరిగిన పుష్పింగ్.. ఆయా దేశాలకు అసంఘటిత, సెమీ స్కిల్డ్ లేబర్‌గా వెళ్లే వారు విమానాశ్రయంతో కచ్చితంగా తమ పాస్‌పోర్టు, వీసాలపై ఇమ్మిగ్రేషన్ స్టాంప్ వేయించుకోవాల్సి ఉంటుంది. ఇమ్మిగ్రేషన్ స్టాంప్ రిక్వైర్డ్గా (ఈసీఆర్) దీనికి అనేక నిబంధనలు ఉంటాయి. దీంతో అనేక మంది వలసదారులు ఇమ్మిగ్రేషన్ స్టాంప్ నాట్ రిక్వైర్డ్ (ఈసీఎన్ఆర్) విధానంలో దేశం దాటాలని భావిస్తుంటారు. ఇలాంటి వారికి సహకరించడానికి విమానాశ్రయం కేంద్రంగా కొందరు పని చేస్తుంటారు. విజిట్, టూరిస్ట్ వీసాలపై వెళ్తున్న వీరిని తనిఖీలు దాటించి విమానం ఎక్కించడాన్నే ‘పుష్పింగ్’ అని పిలుస్తుంటారు. ప్రతి నిత్యం శంషాబాద్ విమానాశ్రయం నుంచి అనేక మంది ఈ విధానంలో బయటకు వెళ్లిపోతున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. అక్రమంగా వెళ్లి అష్టకష్టాలు.. సాధారణంగా విదేశాల్లో పని చేయడానికి వెళ్లే వాళ్లు వర్క్ పర్మిట్ తీసుకుని వెళ్లాలి. ఇలా చేస్తే వారికి ఉద్యోగ, వ్యక్తిగత భద్రతతో పాటు ఇతరు సదుపాయాలు లభిస్తాయి. అయితే పుష్ఫింగ్ ద్వారా దేశం దానికి అక్రమ వలసదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీళ్లు గల్ఫ్ దేశాల్లో చిక్కుక్కుపోయి ఇబ్బందులు ఎదుర్కోవడం, కొన్నిసార్లు డిపోర్టేషన్ (బలవంతంగా తిప్పి పంపడం) ప్రక్రియను ఎదుర్కోవాల్సి వస్తోంది. కొందరు అక్రమ వలసదారులు ఆ దేశాల్లోని జైళ్లలోనూ మగ్గుతున్నారు. అక్కడ ఉండగా ఏదైనా జరగరానిది జరిగితే వారి కుటుంబీకులు, బంధువులకు కడసారి చూపులు దక్కడమూ గగనంగా మారుతోందని అధికారులు చెబుతున్నారు. (క్లిక్ చేయండి: ముంబై, బెంగళూరులను మించిపోయిన రంగారెడ్డి జిల్లా) -
ఖతర్‌లో అంతేనా.. కార్మికుల ప్రాణాలకు లెక్క లేదా
మోర్తాడ్ (బాల్కొండ): ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలకు ఆతిథ్యమిచ్చిన ఖతర్ అన్ని దేశాల దృష్టిని ఆకర్షించింది. గత నెల 20న ప్రారంభమైన ఫుట్‌బాల్ పోటీలు ఈనెల 18తో ముగియనున్నాయి. ఫిఫా క్రీడా సంగ్రామంతో దాదాపు రూ.1.40 లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్న ఖతర్.. తన గుర్తింపు కోసం రక్తం చిందించిన వివిధ దేశాల వలస కార్మికులను మాత్రం మరచిపోయిందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఫిఫా కోసం చేపట్టిన వివిధ నిర్మాణాల్లో భాగస్వాములైన వలస కార్మికులు ప్రమాదాల వల్ల, పని ఒత్తిడితో అనారోగ్యానికి గురై మరణించిన ఘటనలు ఉన్నాయి. మరణించిన వలస కార్మికుల్లో తెలంగాణకు చెందిన వాళ్లే సుమారు వంద మంది వరకు ఉంటారని గల్ఫ్ జేఏసీ అంచనాల్లో తేలింది. ‘చనిపోయిన వారిని స్మరించుకుందాం–బతికి ఉన్నవారి కోసం పోరాడుదాం’ అనే నినాదంతో గల్ఫ్ జేఏసీ ఆధ్వర్యంలో ఖతర్ ఫిఫా అమరులను స్మరిస్తూ నిజామాబాద్‌లో ఇటీవల సమావేశం నిర్వహించారు. ఖతర్‌లో ఫిఫా పనులు చేస్తూ మరణించిన వారి కుటుంబాలను ఐక్యం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఖతర్ సర్కార్‌కు బాధితుల గోడును వినిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. గల్ఫ్ జేఏసీ చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్, కాంగ్రెస్ ఎన్ఆర్ఐ సెల్ రాష్ట్ర కన్వీనర్ సింగిరెడ్డి నరేష్‌రెడ్డి, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల, గల్ఫ్ తెలంగాణ సాంస్కృతిక సంఘం అధ్యక్షుడు బసంత్‌రెడ్డి, న్యాయవాది బాస రాజేశ్వర్‌లు బాధిత కుటుంబాలతో సమావేశమై వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిరాశపరిచిన విదేశాంగ శాఖ.. పార్లమెంట్ సమావేశాల్లో ఖతర్ మృతుల ఆంశంపై ఎంపీలు వెంకటేశ్ నేత బొర్లకుంట, డాక్టర్ రంజిత్‌రెడ్డి, మాలోవత్ కవిత ప్రస్తావించారు. ఇందుకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ సమాధానం ఇస్తూ ఖతర్ కార్మిక చట్టాల ప్రకారం మృతుల కుటుంబాలకు పరిహారం అందుతుందని తెలిపారు. కానీ మృతుల సంఖ్యను వెల్లడించలేదు. కనీసం ఎంత మందికి పరిహారం అందించారనే విషయంలోనూ స్పష్టత లేదు. ఎంపీలు అడిగిన ప్రశ్నలకు విదేశాంగ శాఖ సమాధానం అస్పష్టంగా ఉండటం బాధిత కుటుంబాలను నిరాశపరిచిందనే అభిప్రాయ వ్యక్తమవుతోంది. (క్లిక్ చేయండి: కొండగట్టు ఆంజనేయుని ‘వెనకనున్న’ ఆ దంపతులు ఎవరో తెలుసా!) -
వలస కార్మికులకు బంపర్ ఆఫర్
మోర్తాడ్: వలస కార్మికులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పరిధిలోని ఏడీఎన్‌హెచ్ కంపాస్ కంపెనీ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. తమ సంస్థలో క్లీనింగ్ సెక్షన్లో ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఫ్రీ రిక్రూట్మెంట్కు శ్రీకారం చుట్టింది. కార్మికులకు ఉచిత వీసాలతోపాటు విమాన టికెట్ చార్జీలను కూడా ఆ సంస్థే భరించనుంది. జీటీఎం ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 14న జగిత్యాలలోని హోటల్ పీఎం గ్రాండ్లో, 15న నిజామాబాద్‌లోని వంశీ ఇంటర్నేషనల్ హోటల్లో ఇంటర్వ్యూలు నిర్వహించడానికి ఆ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. కరోనా విపత్కర పరిస్థితుల నుంచి కోలుకుంటున్న తరుణంలో వలస కార్మికులపై ఎలాంటి ఆర్థిక భారం మోపకుండా ఉచితంగా వీసాలను జారీ చేయడానికి ఏడీఎన్‌హెచ్ కంపెనీ ఫ్రీ రిక్రూట్‌మెంట్‌ను నిర్వహించడం ఇది రెండోసారి. క్లీనర్లుగా పని చేసే కార్మికులకు ప్రతి నెలా రూ.20 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. ఉచిత వసతి, భోజనం లేదా అలవెన్సుల రూపంలో అదనంగా చెల్లిస్తారు. వలస కార్మికులను ఒకచోటు నుంచి మరో చోటుకు తరలించడానికి రవాణా సదుపాయాన్ని కూడా కంపెనీయే కల్పించనుంది. ఉచితంగా జారీ చేస్తున్న వీసాలకు కార్మికులు ఎవరికీ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని, ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే ఏడీఎన్‌హెచ్ కంపెనీ ప్రతినిధుల దృష్టికి తీసుకురావాలని యాజమాన్యం స్పష్టం చేసింది. కాగా, కష్టాల్లో ఉన్న వలస కార్మికులకు మేలు చేసేందుకు యూఏఈ కంపెనీ ఉచిత వీసాలు, విమాన టికెట్లను జారీ చేస్తుండడం హర్షించదగ్గ విషయమని పలువురు వలస కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. (క్లిక్: రెవెన్యూలో పదోన్నతులు!) -
గల్ఫ్ వల.. విలవిల.. 4 నెలలుగా జైలులో మగ్గిపోతున్న మహిళలు
సాక్షి, కోనసీమ(అమలాపురం): గల్ఫ్ దేశాల్లో ఉపాధి కల్పిస్తామంటూ మాయమాటలు చెప్పి, అమాయక మహిళలపై కొందరు ఏజెంట్లు వల విసురుతున్నారు. వారి నుంచి రూ.లక్షల్లో వసూలు చేసి నకిలీ వీసాలతో విమానాలు ఎక్కిస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ తనిఖీల సమయంలో ఆ అమాయక మహిళలు నకిలీ వీసాలతో పోలీసులకు పట్టుబడి జైళ్లపాలవుతున్నారు. ఇదే తరహాలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 30 మంది మహిళలు మోసపోయిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. వీరిలో జిల్లాకు చెందిన మహిళలు ముగ్గురు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. అయితే మరింత మంది జిల్లా మహిళలు అక్కడి జైలులో చిక్కుకున్నారని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. మోసపోయారిలా.. ఉప్పలగుప్తం మండలం కూనవరానికి చెందిన రాంబాబు అనే ఏజెంటు గల్ఫ్‌లో ఉపాధి కల్పించే పేరుతో అమాయకులపై వల విసిరాడు. గల్ఫ్‌లో ఉపాధి పొందడం ద్వారా కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుందన్న ఆశతో పలువురు అతడికి రూ.లక్షలు సమర్పించుకున్నారు. అతడి ద్వారా వివిధ ప్రాంతాలకు చెందిన 30 మంది మహిళలు గత మే నెలలో గల్ఫ్‌కు బయలుదేరారు. వీరిలో మన జిల్లా మహిళలూ ఉన్నారు. వారికి ఏజెంటు రాంబాబు వీసాలు ఇచ్చి, గల్ఫ్కని చెప్పి, తొలుత హైదరాబాద్ పంపించాడు. అక్కడ రాజు అనే వ్యక్తి వారిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం ఎక్కించాడు. ఆ విమానం కేరళ రాష్ట్రం కొచ్చి ఎయిర్‌పోర్టుకు చేరింది. అక్కడ చేసిన తనిఖీల్లో ఈ 30 మంది మహిళల వీసాలూ నకిలీవని ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించారు. గత మే 8వ తేదీన వారిని అరెస్టు చేశారు. అప్పటి నుంచీ ఆ మహిళలు అక్కడి జైళ్లలోనే మగ్గుతున్నారు. ఏజెంట్ తమను మోసగించినట్టు గుర్తించిన బాధితులు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా విభాగాన్ని ఆశ్రయించారు. అరెస్టయిన 30 మంది మహిళల్లో ఐదుగురికి హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ బెయిల్ ఇప్పించింది. మిగిలిన 25 మంది మహిళలనూ విడిపించేందుకు చర్యలు చేపట్టాలని హ్యూమన్ రైట్స్ మహిళా విభాగం వైస్ చైర్పర్సన్ ఎన్.భవాని సారథ్యంలోని ప్రతినిధులు, బాధిత కుటుంబ సభ్యులు కలెక్టర్ హిమాన్షు శుక్లాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కలెక్టరేట్లో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో విజ్ఞాపన అందించారు. దీనిపై కలెక్టర్ శుక్లా, జిల్లా ఎస్పీ సీహెచ్ సుధీర్‌కుమార్‌రెడ్డి తక్షణమే స్పందించారు. సంబంధిత ఏజెంటుపై చర్యలు తీసుకోవడంతో పాటు, కేరళ జైలులో ఉన్న మహిళలను విడిపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గోదావరి జిల్లాల వారే ఎక్కువ కేరళలో జైలు పాలైన వారిలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. దడాల వెంకటలక్ష్మి (బందనపూడి, కాజులూరు మండలం), గీతారాణి (చల్లపల్లి, ఉప్పలగుప్తం మండలం), శాంతి (తాడికోన, అల్లవరం మండలం), లక్ష్మణరావు (ఆదుర్రు, మామిడికుదురు మండలం), రేలంగి జానకి (రామచంద్రపురం), గెల్లా మంగాదేవి (సుంకరపాలెం, తాళ్లరేవు మండలం), యలమంచిలి పార్వతి (దేవగుప్తం, అల్లవరం మండలం), గుబ్బల శ్రీలక్ష్మి (రావులపాలెం), ఇనగల శిరీష (కోరుకొండ), కోడి బేబీ (నిడదవోలు శివారు సుబ్బరాజుపేట) తదితరులున్నారు. కేరళకు అధికారుల బృందం ఏజెంట్ల మోసాలు, నకిలీ వీసాలు, మహిళల అరెస్టు తదితర అంశాలపై కలెక్టర్, ఎస్పీ చర్చించుకుని, కేరళలో అరెస్టయిన మహిళలను విడిపించేందుకు చర్యలు చేపట్టారు. కేరళ రాష్ట్రం ఎర్నాకుళం జిల్లా ఎస్పీతో కోనసీమ జిల్లా ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి ఫోనులో మాట్లాడారు. నకిలీ వీసాల విషయమై కొన్ని కేసులు నమోదైనట్టు ఎర్నాకుళం ఎస్పీ బదులిచ్చారు. అక్కడి జైళ్లలో చిక్కుకున్న జిల్లా మహిళలను విడిపించేందుకు కోనసీమ నుంచి ఒక పోలీసు అధికారి, ఒక ఐసీడీఎస్ అధికారితో కూడిన బృందాన్ని కేరళకు ఎస్పీ పంపించారు. నిలువునా మోసపోయాం నకిలీ వీసాలతో ఏజెంటు రాంబాబు, హైదరాబాద్‌లో రాజు అనే వ్యక్తుల చేతిలో తాము నిలువునా మోసపోయామని రావులపాలేనికి చెందిన బాధిత మహిళ శ్రీలక్ష్మి వాపోయింది. కలెక్టరేట్ వద్ద ఆమె విలేకర్లతో తన గోడు వెళ్లబోసుకుంది. కొచ్చి ఎయిర్‌పోర్టులో అరెస్టయిన 30 మంది మహిళల్లో శ్రీలక్ష్మి ఒకరు. అక్కడ జైలులో ఉండగా శ్రీలక్ష్మి భర్త చనిపోయాడు. హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ బెయిల్ ఇప్పించి, విడిపించడంతో ఆమె స్వగ్రామం రావులపాలెం చేరుకుంది. కొచ్చి జైలులో తాను రెండు వారాలు ఉన్నానని.. డబ్బులు లేక.. సరైన తిండి, నిద్ర లేక నరకం చూశామని ఆవేదన వ్యక్తం చేసింది. అక్కడ పడిన అవçస్థలను హ్యూమన్ రైట్స్ మహిళా ప్రతినిధులతో కలిసి కలెక్టర్‌కు శ్రీలక్ష్మి వివరించింది. ఐదుగురికి బెయిల్ ఇప్పించాం కొచ్చి విమానాశ్రయంలో నకిలీ వీసాలతో పట్టుబడి అరెస్టయిన 30 మంది మహిళల్లో ఐదుగురికి బెయిల్ మంజూరయ్యేలా మా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ మహిళా విభాగం కృషి చేసింది. బెయిలో పొందిన వారిలో శ్రీలక్ష్మి (రావులపాలెం), పార్వతి (అల్లవరం మండలం దేవగుప్తం), జానకి (రామచంద్రపురం), మంగాదేవి (యానాం), సౌజన్య (ఏలూరు) ఉన్నారు. ఇంకా కొంత మంది మహిళలు కేరళ రాష్ట్ర జైలులో ఉన్నట్లు మాకు సమాచారం వచ్చింది. – నల్లబోతుల భవాని, ఏపీ రాష్ట్ర వైస్ చైర్మన్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ వుమెన్ సెల్, రాజమహేంద్రవరం ఏజెంట్లపై చర్యలు గల్ఫ్‌లో ఉపాధి పేరుతో మహిళలను మోసగిస్తున్న ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. కేరళలో నకిలీ వీసాలతో అరెస్టయిన జిల్లా మహిళలున్నారన్న ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నాం. అక్కడ జిల్లా మహిళలు ముగ్గురు మాత్రమే ఉన్నారని తెలిసింది. వీరిలో ఒకరు బెయిల్‌పై వచ్చారు. మిగిలిన ఇద్దరినీ విడిపించేందుకు అక్కడికి ప్రత్యేక బృందాన్ని పంపించాం. – సీహెచ్ సుధీర్‌కుమార్‌రెడ్డి, జిల్లా ఎస్పీ -
కువైట్‌కు వలస వెళ్లే కార్మికులకు శుభవార్త
మోర్తాడ్ (బాల్కొండ): కువైట్‌కు వలస వెళ్లే కార్మికులకు శుభవార్త. ఆ దేశంలో పని చేసే భారత కార్మికులకు కనీస వేతనంగా నెలకు వంద దినార్లు అంటే మన కరెన్సీలో రూ.24,700 ఇవ్వాలని భారత విదేశాంగ శాఖ అధికారులు ప్రతిపాదించారు. కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (పీఏఎం)కు అధికారులు ఈ మేరకు ప్రతిపాదన చేశారు. కువైట్‌లోని వివిధ రంగాల్లో పని చేస్తున్న వలస కార్మికులకు చెల్లించాల్సిన కనీస వేతన ఆంశంపై అక్కడి ప్రభుత్వం వివిధ దేశాల కార్మిక శాఖలతో చర్చలు జరిపింది. ప్రధానంగా భారత్, ఈజిప్ట్, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్‌ల కార్మిక శాఖలతో కువైట్ ప్రభుత్వం చర్చలు నిర్వహించింది. ఈ మేరకు భారత వలస కార్మికులకు కనీస వేతనంగా రూ.24,700 చెల్లించాలనే ప్రతిపాదన సిద్ధమైంది. గతంలో కనీస వేతనంగా నెలకు 45 దినార్లు చెల్లించాలని విదేశాంగ శాఖ అధికారులు చెప్పడంతో కార్మికులనుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఇదిలా ఉండగా కరోనా కష్టాల సమయంలో కువైట్.. వలస కార్మికులకు కనీస వేతనం పెంచే విషయంపై ఆలోచన చేయడం హర్షణీయమని కార్మికులు అంటున్నారు. (క్లిక్: ఎంబసీ బాత్రూమ్లో స్పై కెమెరాల కలకలం) 60 ఏళ్లు నిండిన కార్మికులకు ఊరట.. 60 ఏళ్లు నిండిన వలస కార్మికులను స్వదేశాలకు పంపాలన్న నిర్ణయంపై కువైట్ వెనక్కు తగ్గింది. డిగ్రీ అర్హత లేదా 60 ఏళ్లు దాటినవారి వీసాలు, వర్క్పర్మిట్లను కొంతకాలం రెన్యూవల్ చేయలేదు. దీంతో నిపుణులైన కార్మికులు డిగ్రీ పట్టా లేక ఇంటిబాట పట్టాల్సి వచ్చింది. అయితే నైపుణ్యం ఉన్న కార్మికులకు కొరత ఏర్పడడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. డిగ్రీ పట్టా లేనివారి నుంచి 250 దినార్లను ఫీజుగా వసూలు చేసి వర్క్పర్మిట్లను రెన్యూవల్ చేస్తోంది. (క్లిక్: అరుదైన గౌరవం అందుకున్న కాజల్ అగర్వాల్) -
గల్ఫ్ వలస కార్మికులకు ఊరట
మోర్తాడ్ (బాల్కొండ): గల్ఫ్ దేశాల్లో పనిచేసే భారత కార్మికుల కనీస వేతనం (మినిమమ్ రెఫరల్ వేజెస్) కుదింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం తన తీరు మార్చుకుంది. ఈ విషయంలో గల్ఫ్ దేశాలకు జారీ చేసిన సర్క్యులర్‌ను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. గత సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ వల్ల గల్ఫ్ వలస కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారని, వారి శ్రమకు తగ్గ వేతనం దక్కడం లేదని గల్ఫ్ జేఏసీ సభ్యులు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. పాత వేతనాలనే భారత కార్మికులకు వర్తింప చేయాలని గల్ఫ్ దేశాలకు సూచించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ గురువారం రాజ్యసభలో స్పష్టం చేశారు. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. కేంద్రం గతంలో జారీ చేసిన సర్క్యుల ర్ను వెనక్కి తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నాం. వలస కార్మికులకు ఎప్పుడైనా వేతనాలు పెంచే విధంగానే విదేశీ వ్యవహారాల శాఖ గల్ఫ్ దేశాలపై ఒత్తిడి తీసుకురావాలి. – మంద భీంరెడ్డి, ఇమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుడు -
ఒమన్ పొమ్మంటోంది!
మోర్తాడ్ (బాల్కొండ): విదేశీ వలస కార్మికులకు అపారమైన ఉపాధి అవకాశాలు కల్పించిన ఒమన్ దేశం.. ఇప్పుడు వారిని వదిలించుకుంటోంది. స్వదే శీయులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో బయటవారిని సాగనంపుతోంది. దీంతో వలసదారులకు కష్టాలు మొదలయ్యాయి. కొంత కాలంగా ఆ దేశం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టా డుతోంది. దీంతో అక్కడివారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పెంచి, వలస కార్మికుల సంఖ్యను తగ్గించుకోవాలని ఒమన్ నిర్ణయించింది. ఇప్పటికే ఎందరో విదేశీ వలస కార్మికులను స్వదేశాలకు పంపించేసింది. ప్రభుత్వ రంగంలోని ఉద్యోగాలలో ఒమనీయులకు పెద్దపీట వేశారు. అలాగే, చిన్న, మధ్య తరహా వాహనాల డ్రైవింగ్‌లోనూ తమ ప్రజలకు అవకాశం కల్పిస్తూ, విదేశీ డ్రైవర్ల లైసెన్స్‌ల రెన్యూవల్‌ను నిలిపి వేశారు. దీనికి తోడు ప్రైవేటు రంగంలోనూ ఒమన్ పౌరులకు విస్తృతమైన ఉపాధి అవకాశాలు కల్పించాలని మంత్రివర్గం తీర్మానం చేసింది. ఇందులో భాగంగానే ఈ నెల 20 నుంచి వాణిజ్య రంగాలలో విదేశీ వలస కార్మికుల స్థానంలో ఒమన్ పౌరులకు ఉపాధి కల్పించనున్నారు. తెలంగాణ కార్మికులకు పెద్ద దెబ్బ.. ఒమన్ నిర్ణయం తెలంగాణ వలస కార్మికులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఒమన్‌లో ఇప్పటివరకు ఉపాధి పొందిన విదేశీ వలస కార్మికులలో భారత్‌కు చెందిన వలసదారుల సంఖ్యనే ఎక్కువగా ఉండగా, ఇందులో తెలంగాణ జిల్లాలకు చెందిన వారు 1.25 లక్షల మంది ఉంటారని అంచనా. తాజా నిర్ణయంతో 80 శాతం మంది ఉపాధి కోల్పోనున్నారని అంచనా. గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాం .ఒమన్‌లో కొన్ని నెలల నుంచి భారతీయులే కాకుండా ఇతర దేశాల వ్యాపారులు, ఉద్యోగులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆ దేశ ప్రభుత్వ నిర్ణయంతో భారతీయులకు కష్టకాలం ఏర్పడనుంది. ప్రత్యామ్నాయం చూసుకోకపోతే ఒమన్‌లో బతకడం కష్టమే. –నరేంద్ర పన్నీరు, ఒమన్ తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
కష్టాల్లో ఉన్నారు.. తీసుకురండి
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మధ్య ప్రాచ్య దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోరారు. ప్రత్యేక విమానాలు పంపి వారిని వెనక్కు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. కోవిడ్-19 మహమ్మారి విజృంభణతో వ్యాణిజ్యం కుదేలవడంతో వేలాది మంది భారత కార్మికులు ఉపాధి కోల్పోయి కష్టాల్లో ఉన్నారని తెలిపారు. వీరిని స్వదేశానికి తీసుకొచ్చి క్వారంటైన్లో ఉంచాలని కేంద్రానికి రాహుల్ గాంధీ సూచించారు. కాగా, గల్ప్ దేశాల్లో ఉద్యోగ, ఉపాధి రీత్యా గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన 87 లక్షల మంది భారతీయుల్లో 25 శాతం మంది ఉపాధి కోల్పోతారని అంచనా. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌తో అనేక కంపెనీలు కార్యకలాపాలను నిలిపివేయడంతో భారత కార్మికుల ఉపాధికి గండి పడింది. మరోవైపు ముడిచమురు ధరలు మునుపెన్నడూ లేనంతగా పతనం కావడం అన్ని రంగాల్లోని ఉపాధిపై ప్రభావం చూపి కొలువుల కోతకు దారితీస్తోంది. చదవండి: గల్ఫ్ కార్మికులపై ‘కరోనా’ పిడుగు -
బహ్రెయిన్‌లో 26న ఓపెన్ హౌస్
గల్ఫ్ డెస్క్: బహ్రెయిన్‌లోని భారతీయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ఈనెల 26న సీఫ్ పట్టణంలోని రాయబార కార్యాలయంలో ‘ఓపెన్ హౌస్’ నిర్వహిస్తున్నారు. బహ్రెయిన్‌లోని భారతీయులు తమకు ఏమైనా సమస్యలు, సందేహాలు ఉంటే ఈ ఓపెన్ హౌస్‌కు హాజరై నివేదించవచ్చని, కార్మికులు తమ సమస్యలపై సంబంధిత డాక్యుమెంట్లను తీసుకుని రావాలని అధికారులు సూచించారు. ఓపెన్ హౌస్‌లో రాయబార కార్యాలయం ప్రధాన అధికారితో పాటు సిబ్బంది పాల్గొంటారు. -
భారత కార్మికులకు కువైట్ పరిహారం
దుబాయ్: కువైట్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ ఖరాఫీ నేషనల్ కంపెనీకి చెందిన 700 మందికి పైగా భారత కార్మికులకు అక్కడి ప్రభుత్వం పరిహారం ఇవ్వనుంది. ఒక్కో కార్మికుడికి రూ.56,680 అందుతుందని కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఈ మొత్తం కార్మికుల బ్యాంకు అకౌంట్లలో నేరుగా జమ అవుతుందని పేర్కొంది. వీరంతా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, బిహార్, రాజస్తాన్ రాష్ట్రాలకు చెందిన వారంది. ఖరాఫీ నిర్మాణ సంస్థ గత ఏడాది దివాలా తీయడంతో ఆ సంస్థలో పనిచేస్తున్న 3,600 మంది భారతీయ కార్మికులకు వేతనాలు, పరిహారం అందించాల్సిన అవసరం ఏర్పడింది. భారత ప్రభుత్వం జోక్యం మేరకు చివరికి అర్హులైన 1,262 మంది కార్మికుల జాబితాను అక్కడి అధికారులకు అందజేసింది. అయితే, 710 మందికి మాత్రమే పరిహారం ఇచ్చేందుకు అంగీకరించారు. -
భారతీయ కార్మికులకు అండగా ఉంటాం
కువైట్ ప్రభుత్వం ప్రకటించిన ఆమ్నెస్టీ (క్షమాబిక్ష) పథకంలో వాపస్ రావాలనుకుని ఇబ్బందులు పడుతున్న ప్రవాస భారతీయ కార్మికులకు భరోసా, నైతిక మద్దతు కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో కార్మిక సంఘాలు, పౌర సమాజ సంస్థల సభ్యులతో కూడిన ప్రతినిధి బృందం శుక్రవారం కువైట్‌లో పర్యటించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఐఎన్టీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు రామచంద్ర కుంతియా వెంట మాజీ దౌత్యవేత్త, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నారై విభాగం చైర్మన్ డాక్టర్ బీఎం వినోద్‌కుమార్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ గల్ఫ్ ఎన్నారై విభాగం కన్వీనర్ నంగి దేవేందర్‌రెడ్డి, జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు జె.ఎన్.వెంకట్, ప్రవాసీ కార్మిక నాయకులు కె. ఎస్.రాం, ఎమ్మిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం (ప్రవాసీ సంక్షేమ వేదిక) అధ్యక్షుడు మంద భీంరెడ్డి ఉన్నారు. కువైట్ క్షమాబిక్ష పథకంలో స్వదేశానికి వెళ్లడానికి విమాన టికెట్లకు డబ్బులు లేక ఇబ్బందిపడుతున్న పేద ప్రవాసీ కార్మికుల్లో వంద మందికి కాంగ్రెస్ పార్టీ పక్షాన విమాన టికెట్లు ఇస్తున్నామని కుంతియా తెలిపారు. టికెట్లు ఇస్తానని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ప్రవాసీలను మోసగించిందని ఆయన ఆరోపించారు. తెలంగాణ కార్మికుల తిరుగు ప్రయాణానికి మానవతా దృక్పథంతో ఉచిత విమాన ప్రయాణ టికెట్లు ఇవ్వడానికి ముందుకువచ్చిన డాక్టర్ జేఎన్ వెంకట్ (కోరుట్ల), పొన్నం ప్రభాకర్ (కరీంనగర్), షబ్బీర్ అలీ (కామారెడ్డి), కేఆర్ సురేష్‌రెడ్డి (ఆర్మూర్), సుదర్శన్‌రెడ్డి (బోధన్), మహేశ్వర్‌రెడ్డి (నిర్మల్), ఈరవత్రి అనిల్ (బాల్కొండ), నంగి దేవేందర్‌రెడ్డి (మక్తల్)లను కుంతియా అభినందించారు. -
కువైట్‌లో చిక్కిన కార్మికులకు విమాన టికెట్లు
సాక్షి, హైదరాబాద్: ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లి చిక్కుకుపోయిన భారతీయ కార్మికులు తిరిగి స్వదేశానికి వచ్చేలా తోడ్పాటు అందించేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు, పౌర సమాజ సంస్థల ప్రతినిధులతో కూడిన బృందం కువైట్‌లో పర్యటిస్తోంది. ఏఐసీసీ కార్యదర్శి రామచంద్ర కుంతియా శుక్రవారం కువైట్‌లోని భారత రాయబార కార్యాలయానికి వెళ్లి కార్మికుల వివరాలు తెలుసుకున్నారు. సుమారు 30 వేల మంది భారతీయులు స్వదేశానికి రావడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో ఐదు వేల మంది వరకు తెలంగాణ వలస కార్మికులున్నారు. కానీ స్వదేశానికి వెళ్లడానికి విమాన టికెట్లకు డబ్బులు లేక ఇబ్బందిపడుతున్నారు. అలాంటి 100 మంది కార్మికులకు విమాన టికెట్లు ఇస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. తర్వాత వారిని మోసగించిందని ఆయన ఆరోపించారు. ఈ టికెట్ల ఖర్చును జేఎన్ వెంకట్ (కోరుట్ల), పొన్నం ప్రభాకర్ (కరీంనగర్), షబ్బీర్ అలీ (కామారెడ్డి), కెఆర్ సురేశ్‌రెడ్డి (ఆర్మూర్), సుదర్శన్‌రెడ్డి (బోధన్), మహేశ్వర్‌రెడ్డి (నిర్మల్), ఈరవత్రి అనిల్ (బాల్కొండ), నంగి దేవేందర్‌రెడ్డి (మక్తల్) భరిస్తున్నట్లు తెలిపారు. -
ట్రంప్ బాటలో సౌదీ : భారతీయులకు షాక్
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికన్లకే ఉద్యోగాలంటూ ట్రంప్ అనుసరించిన బాటలోనే సౌదీ అరేబియా పయనిస్తోంది. తాజాగా తమ పౌరులకే కంపెనీలు ఉద్యోగాలు కట్టబెట్టేలా ఒత్తిడి పెంచేందుకు, నిరుద్యోగం తగ్గించేందుకు 12 కీలక రంగాల్లో విదేశీయులు పనిచేయడాన్ని సౌదీ నిరోధించింది. ఈ కఠిన విధానాన్ని కార్మిక మంత్రి అలీ బిన్ నసీర్ అల్ ఘపీస్ ఆమోదముద్ర వేశారని ప్రభాత్ ఖబర్ పత్రిక వెల్లడించింది. ఈ పరిణామం సౌదీలో దశాబ్దాలుగా సేవలందిస్తున్న 1.2 కోట్ల మంది విదేశీయులపై పెనుప్రభావం చూపనుంది. వీరిలో అత్యధికులు తక్కువ వేతనాలతో కూడి వివిధ వృత్తుల్లో పనిచేసే కార్మికులే కావడం గమనార్హం. సౌదీలో పనిచేసి పొట్టపోసుకుంటున్న 30 లక్షల మందికి పైగా భారతీయులపైనా ఈ ఉత్తర్వులు ప్రభావం చూపనున్నాయి. 12 రంగాల్లో విదేశీ ఉద్యోగులు పనిచేయడాన్ని కార్మిక, సామాజిక సంక్షేమ మంత్రిత్వ శాఖ దశలవారీగా నియంత్రిస్తుంది. కారు, మోటార్ బైక్ షోరూమ్‌లు, రెడీమేడ్ క్లాత్ స్టోర్స్, హోం..ఆఫీస్ ఫర్నీచర్ దుకాణాలు, కిచెన్ సామాగ్రి దుకాణాల్లో ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి విదేశీ ఉద్యోగులు పనిచేయడంపై నియంత్రణలు అమల్లోకి రానుండగా..నవంబర్ నుంచి వాచీ దుకాణాలు, ఆప్టిక్స్ స్టోర్స్‌లో విదేశీ ఉద్యోగులు పనిచేయడంపై నియంత్రణలు విధిస్తారు. ఇక వచ్చే ఏడాది జనవరి 7 నుంచి వైద్య పరికరాల దుకాణాలు, భవన నిర్మాణ సామాగ్రి దుకాణాలు, ఆటో విడిభాగాల స్టోర్స్, కార్పెట్ దుకాణాలు, స్వీట్ షాపుల్లో విదేశీ ఉద్యోగులు పనిచేయడంపై నియంత్రణలు అమల్లోకి రానున్నాయి. -
కువైట్ కార్మికులకు క్షమాభిక్ష
న్యూఢిల్లీ: కువైట్‌లో అక్రమంగా ఉంటున్న వేలాది మంది భారతీయులకు పెద్ద ఊరటనిస్తూ ఆ దేశ ప్రభుత్వం మంగళవారం క్షమాభిక్షను ప్రకటించింది. కువైట్‌లో ఇన్నాళ్లూ అక్రమంగా ఉన్నందుకు వారిపై ఎలాంటి జరిమానాలు విధించబోమని ప్రభుత్వం చెప్పింది. కువైట్‌లోని ఖరాఫీ నేషనల్ అనే కంపెనీలో పనిచేయడానికి వెళ్లిన అనేక మంది భారతీయులకు వేతనాలు అందలేదు. దీంతో వీసా గడువు ముగిసినప్పటికీ తమ వేతనాలు రాబట్టుకునేందుకు అనేక మంది కార్మికులు అక్కడే ఉండిపోయారు. వీరంతా అక్రమంగా కువైట్‌లో నివసిస్తున్నందున రోజుకు రూ.424 జరిమానాగా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. అసలే జీతం లేక ఇబ్బందులు పడుతున్న వీరికి జరిమానాలు చెల్లించడం తలకు మించిన భారంగా ఉంది. ఈ నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం వీరికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. అక్రమంగా కువైట్‌లో ఉంటున్నవారు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 22 మధ్య క్షమాభిక్షను వినియోగించుకుని భారత్‌కు వెళ్లిపోవచ్చంది. వీరిపై ఎలాంటి జరిమానా విధించబోమంది. దీంతో ఎంతో మంది భారతీయ కార్మికులు వేతనాలపై ఆశ వదులుకుని మళ్లీ తమ కుటుంబాలతో కలసి గడిపేందుకు స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మరికొందరు మొత్తం వేతనాలు చేతికి అందితేగానీ వెనక్కు రాకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తెలుగు కార్మికులూ ఎక్కువే.. ఇప్పుడు క్షమాభిక్ష పొందిన వారు మరోసారి కువైట్‌కు చట్టబద్ధంగా వెళ్లి పనిచేసుకోవడానికి కూడా అర్హులు. ప్రస్తుతం కువైట్‌లో అక్రమంగా నివసిస్తున్న వారిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు కూడా భారీ సంఖ్యలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఖరాఫీ నేషనల్ కంపెనీ కూడా భారత కార్మికులను సంప్రదించి వేతనాల్లో 25 నుంచి 33 శాతం సొమ్మును చెల్లించేందుకు ముందుకొచ్చినట్లు తెలిసింది. అయితే కార్మికులు అందుకు ఒప్పుకోకుండా తమకు పూర్తి వేతనాలు చెల్లించాల్సిందేనని కోరుతున్నారు. వీరి సమస్య పరిష్కారం కోసం పోరాడిన సామాజిక కార్యకర్త షాహీన్ సయ్యద్ మాట్లాడుతూ ‘భారత కార్మికులకు ఇది గొప్ప ఉపశమనం’ అని అన్నారు. ఇటీవలే విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ కువైట్‌లో పర్యటించిన నేపథ్యంలో కువైట్ తాజాగా క్షమాభిక్షను ప్రకటించడం గమనార్హం. భారతీయ కార్మికుల అవస్థల గురించి వీకే సింగ్ కువైట్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. -
75వేల మంది భారతీయులు వెనక్కి
'' బై అమెరికన్, హైర్ అమెరికన్'' విజన్ కోసం ట్రంప్ కార్యాలయం తీసుకునే నిర్ణయాలతో భారీ మొత్తంలో భారతీయ వర్కర్లు వెనక్కి తిరిగి రావాల్సి వస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యురిటీ(డీహెచ్ఎస్) ప్రతిపాదనలతో, హెచ్-1బీ వీసాలు కఠినతరం కావడం, గ్రీన్ కార్డు అప్లికేషన్లు పెండింగ్‌లో పడటం వంటివి చోటుచేసుకుంటున్నాయి. దీంతో వేలకొద్దీ భారతీయ ఉద్యోగులు అమెరికా నుంచి భారత్‌కు వచ్చేయాల్సిన పరిస్థితి వస్తుందని తెలుస్తోంది. ఎక్కువగా ఐటీ రంగంపై ఈ ప్రభావం ఉండనున్నట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. భారతీయ వర్కర్లకు హెచ్-1బీ వీసాల అప్లికేషన్లకు గడువు పొడిగింపు కష్టతరం కావడంతో పాటు, శాశ్వత సభ్యత్వం కోసం పొందే గ్రీన్‌కార్డులు దరఖాస్తులు పెండింగ్‌లు పడుతున్నట్టు తెలిసింది. ఇప్పటివరకున్న నిబంధనలతో గ్రీన్ కార్డు ఆమోదం పొందలేని పక్షంలో హెచ్-1బీ వీసాలకు రెండు మూడేళ్ల పొడిగింపును ట్రంప్ కార్యాలయం చేపడుతోంది. కానీ డీహెచ్ఎస్ ప్రతిపాదనలతో హెచ్-1బీ వీసాల పొడిగింపు కష్టతరంగా మారుతోంది. దీంతో 50వేల నుంచి 75 వేల వరకు భారతీయ హెచ్-1బీ వీసా హోల్డర్స్ తిరిగి స్వదేశానికి రావాల్సి వస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. వీసా సంబంధిత సమస్యలపై సాఫ్ట్వేర్ ఇండస్ట్రి బాడీ నాస్కామ్, అమెరికా సెనేటర్లు, కాంగ్రెస్‌మెన్, అడ్మినిస్ట్రేషన్‌తో ఎప్పడికప్పుడూ చర్చలు జరుపుతూనే ఉంది. -
ఖతర్‌లో భారతీయుల వెతలు
ఖతర్‌తో ఇతర అరబ్ దేశాలు సంబంధాలు తెంచుకున్న ఫలితంగా అక్కడి నిర్మాణ రంగం కుదేలవ తోంది. ఫలితంగా ఆ రంగంలో ఉపాధి పొందుతున్న భారతీయ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. పనిలేక... మరోచోట పనిచేయడానికి వీల్లేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఖతర్‌లో ఉండలేక, స్వదేశానికి తిరిగి రాలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 2022 సాకర్ వరల్డ్‌కప్‌కు ఖతర్ ఆతిథ్యమిస్తోంది. అందుకోసం స్టేడియాల నిర్మాణంతో పాటు భారీగా మౌలిక సదుపాయాల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆంక్షలు అమల్లోకి వచ్చి నెలన్నర రోజులు దాటడంతో నిర్మాణ రంగానికి అవసరమైన మెటీరియల్ సరఫరాకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. సామగ్రి అందు బాటులో లేక నిర్మాణాలు నిలిచిపోతున్నాయి. సుమారు 20 లక్షల మంది విదేశీ కార్మికులుంటే వీరిలో అత్యధికులు నిర్మాణ రంగంలోనే పనిచేస్తున్నారు. ఖతర్ జనాభాలో 90% మంది విదేశీ కార్మికులే. నిర్మాణాలు నిలిచిపోవడంతో కంపెనీలు కార్మికుల్ని దీర్ఘకాలిక సెలవులపై ఇంటికి పంపేస్తున్నాయి. సాధారణంగా ఏడాదికి ఒక నెల సెలవు ఇచ్చే కంపెనీలు ఇప్పుడు ఐదునెలలు సెలవులు ప్రకటించాయి. కంపెనీ స్పాన్సర్డ్ వీసాలపై ఖతర్‌కు విదేశీ కార్మికులు వెళుతుంటారు. ఆ కంపెనీ పని కల్పిస్తే సరి. లేదంటే మరోచోట పనిచేయడానికి వారికి ఆస్కారం ఉండదు. దీంతో అక్కడ పనిలేక స్వదేశానికి తిరిగి వెళ్తే మళ్లీ రావడం ఆర్థికభారం కావడంతో ఖతర్ లోని విదేశీ కార్మికులు దిక్కుతోచని స్థితిలో పడిపోయా రు. ఇప్పటికే మూడు లక్షల మంది కార్మికులు ఖతర్‌ను వదిలివెళ్లినట్లు అంచనా. నిర్మాణాలు నిలిచిపో తుండటం తో విదేశీ కార్మికుల ఖతర్ కల చెదిరిపోతోంది. అలాగే ఖతర్ యజమానులు కొందరు సౌదీ అరేబియా లో తమ ఫామ్‌హౌస్‌లలో పనిచేయడానికి, పశువుల కాపరులుగా భారతీయ కార్మికుల్ని నియమిం చుకున్నా రు. ఖతర్ వీసాలపై వీరిని తీసుకొచ్చి తాత్కాలిక అనుమతులతో సౌదీలో పనిలో పెట్టుకున్నారు. ఖతర్ దేశస్తులు వెంటనే సౌదీని వదిలివెళ్లాల్సిందిగా ఆదేశించ డంతో యజమాను లు వెళ్లిపోయారు. రోడ్డుమార్గాన్ని మూసివేసినందువల్ల వారి వద్ద పనిచేస్తున్న భారతీయ కార్మికులు దోహాకు వెళ్లడానికి సౌదీ అనుమతించడం లేదు. దాంతో వీరంతా ఆహారం, డబ్బు లేక రోడ్డునపడ్డారు. వీరిని ఇప్పుడు చట్టవిరుద్ధంగా సౌదీలో ఉంటున్న వారిగా పరిగణిస్తారు. ఖతర్‌లో 6.5 లక్షల మంది భారతీయులు ఉగ్రవాదులకు మద్దతు ఇస్తోందని ఆరోపి స్తూ ఖతర్‌తో అన్నిరకాల సంబంధాల్ని తెంచు కుంటున్నట్లు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రయిన్, ఈజిప్టు జూన్ 5న ప్రకటించాయి. ఖతర్‌కు ఉన్న ఏకైక రోడ్డు మార్గాన్ని సౌదీ అరేబియా మూసివేసింది. పోర్టుల్లో ఖతర్‌కు వెళుతున్న నౌకలకు ప్రవేశాన్ని నిరాకరించాయి. విమానాలను రద్దు చేశాయి. తీవ్రవాద సంస్థలకు సాయం చేయకూడదని, అల్ జజీరా టీవీ ఛానల్‌ను మూసివేయాలని.. కొన్ని డిమాండ్లు పెట్టాయి. వీటికి ఖతర్ సమ్మతించడం లేదు. కువైట్ మధ్యవర్తిత్వం కూడా ఫలించలేదు. ఆర్థికంగా బలమైన దేశం కావడంతో ఖతర్ ఈ ఆంక్షల్ని తట్టుకొని.. ఇరాన్, టర్కీల నుంచి ఆహార పదార్థాలు, ఇతర సామగ్రిని తెచ్చుకుంటోంది. ఖతర్‌లో 6.5 లక్షల మంది భారతీయ కార్మికులు ఉండగా.. వీరు ఏటా రూ. 27 వేల కోట్లు భారత్‌కు పంపుతున్నారు. నిర్మాణ రంగం కుదేలవడంతో భారతీయ కార్మికులకు పనిలేకుండా పోతోంది. గతంలో చేసిన పనికి వేతనాలు అందక వీరిలో చాలామంది ఇబ్బందిపడుతున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఖతర్‌లో భారతీయ కార్మికులకు కష్టాలు
►ఖతర్‌లో కుదేలవుతున్న నిర్మాణరంగం ►భారతీయ కార్మికులపై ప్రభావం ఖతర్‌తో ఇతర అరబ్‌దేశాలు సంబంధాలు తెంచుకున్న ఫలితంగా అక్కడి నిర్మాణ రంగం కుదేలవుతోంది. ఫలితంగా ఆ రంగంలో ఉపాధి పొందుతున్న భారతీయ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనిలేక... మరోచోట పనిచేయడానికి వీల్లేక, ఖతర్‌లో ఉండలేక, స్వదేశానికి తిరిగి రాలేక... దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 2022 సాకర్ వరల్డ్‌కప్‌కు ఖతర్ ఆతిథ్యమిస్తోంది. దీనికోసం స్టేడియాలతో పాటు భారీ ఎత్తున్న మౌలిక సదుపాయాలను నిర్మిస్తోంది. ఆంక్షలు అమల్లోకి వచ్చి నెలన్నర రోజులు దాటడంతో నిర్మాణ రంగానికి అవసరమైన మెటీరియల్ సరఫరాకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. సామాగ్రి అందుబాటులో లేక నిర్మాణాలు నిలిచిపోతున్నాయి. సుమారు 20 లక్షల మంది విదేశీ కార్మికులుంటే... వీరిలో అత్యధికులు నిర్మాణ రంగంలోనే పనిచేస్తున్నారు. ఖతర్ జనాభాలో 90 శాతం మంది విదేశీ కార్మికులే. ఇప్పుడు నిర్మాణాలు నిలిచిపోవడంతో కంపెనీలు కార్మికులకు దీర్ఘకాలిక సెలవులపై ఇంటికి పంపేస్తున్నాయి. సాధారణంగా ఏడాది ఒక నెల సెలవు ఇచ్చే కంపెనీలు ఇప్పుడు ఐదునెలలు సెలవులు ఇస్తున్నాయి. కంపెనీ స్పాన్సర్డ్ వీసాలపైనే ఖతర్‌కు విదేశీ కార్మికులు వెళుతుంటారు. కాబట్టి ఆ కంపెనీ పని కల్పిస్తే సరి. లేదంటే మరోచోట పనిచేసుకోవడానికి ఆస్కారం ఉండదు. అక్కడుంటే పని లేదు... స్వదేశానికి తిరిగి వెళ్తే మళ్లీ రావడం ఆర్థికభారం. దీంతో ఖతర్‌లోని విదేశీ కార్మికులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇప్పటికే మూడు లక్షల మంది కార్మికులు ఖతర్‌ను వదిలివెళ్లినట్లు అంచనా. నిర్మాణాలు క్రమేపీ నిలిచిపోతుండటంతో విదేశీ కార్మికుల ఖతర్ కల చెదిరిపోతోంది. అలాగే ఖతర్ యజమానులు కొందరు సౌదీ అరేబియాలో తమ ఫామ్‌హౌస్‌లలో పనిచేయడానికి, పశువుల కాపరులుగా భారతీయ కార్మికులను నియమించుకున్నారు. ఖతర్ వీసాలపై వీరిని తీసుకొచ్చి తాత్కాలిక అనుమతులతో సౌదీలో పనిలో పెట్టుకున్నారు. ఖతర్ దేశస్తులు వెంటనే సౌదీని వదిలివెళ్లాల్సిందిగా ఆదేశించడంతో యజమానులు వెళ్లిపోయారు. రోడ్డుమార్గాన్ని మూసివేసినందువల్ల వారి వద్ద పనిచేస్తున్న భారతీయ కార్మికులు దోహాకు వెళ్లడానికి సౌదీ అనుమతించడం లేదు. దాంతో వీరంతా ఆహారం, నగదు లేకుండా రోడ్డునపడ్డారు. మరో సమస్య ఏమిటంటే వీరిప్పుడు చట్టవిరుద్ధంగా సౌదీలో ఉంటున్న వారవుతారు. ఉగ్రవాదులకు మద్దతు ఇస్తోందని ఆరోపిస్తూ ఖతర్‌తో అన్నిరకాల సంబంధాలను తెంచుకుంటున్నట్లు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రయిన్, ఈజిప్టు జూన్ 5న ప్రకటించాయి. ఖతర్‌కు ఉన్న ఏకైక రోడ్డు మార్గాన్ని సౌదీ అరేబియా మూసివేసింది. పోర్టుల్లో ఖతర్‌కు వెళుతున్న నౌకలకు ప్రవేశాన్ని నిరాకరించాయి. విమానాలను రద్దు చేశాయి. తీవ్రవాద సంస్థలకు సాయం చేయకూడదని, అల్ జజీరా టీవీ ఛానల్‌ను మూసివేయాలని.. ఇలా కొన్ని డిమాండ్లు పెట్టాయి. వీటికి ఖతర్ సమ్మతించడం లేదు. కువైట్ మధ్యవర్తిత్వం చేస్తోంది. ఆర్థికంగా బలమైన దేశం కావడంతో ఖతర్ ఈ ఆంక్షలను తట్టుకొని... ఇరాన్, టర్కీల నుంచి ఆహారపదార్థాలు, ఇతరత్రా సామాగ్రిని తెచ్చుకుంటోంది. ఖతర్‌లో 6.5 లక్షల మంది భారతీయ కార్మికులు ఉన్నారు. వీరు ఏటా 27 వేల కోట్ల రూపాయలను భారత్‌కు పంపుతున్నారు. నిర్మాణ రంగం కుదేలవడంతో భారతీయ కార్మికులకు పనిలేకుండా పోతోంది. గతంలో చేసిన పనికి వేతనాలు అందక వీరిలో చాలామంది ఇబ్బందిపడుతున్నారు. -
ఉపాధి కోసం వెళ్లి..సౌదీలో అనాథ శవాలుగా..
మృతుల్లో ఒకరు తెలంగాణ వాసి.. దుబాయ్: పొట్ట చేతబట్టుకొని సౌదీ అరేబి యాకు వెళ్లిన ఇద్దరు భారత కార్మికులు శవాలుగా మారారు. రియాద్‌లో ఒకే భవన నిర్మాణ కంపెనీలో కూలీలుగా పనిచేస్తున్న జగిత్యాల జిల్లాకు చెందిన పొన్నం సత్యనా రాయణ (48) మార్చి 11న, పంజాబ్‌లోని కపుర్తాలా జిల్లాకు చెందిన జస్వీందర్ సింగ్ (56) ఫిబ్రవరి 21న మరణించారు. అక్కడి కంపెనీ యజమానులు ఆర్థిక సాయానికి నిరాకరించి, మృతదేహాలను పట్టించుకోకపోవడంతో వారి శవాలు అనాథ శవాలుగా అక్కడే ఉండిపోయాయి. ఈ మేరకు అక్కడి వార్తా పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. వారి మరణాలకు గల కారణాలు తెలియ రాలేదు. 20 ఏళ్ల నుంచి వారు అక్కడే కూలీలుగా పనిచేస్తున్నారు. అక్కడి చట్టాల ప్రకారం యజమానులే మృతదేహాలను స్వదే శానికి పంపాలి. చనిపోవడానికి కొద్ది రోజుల ముందే వీరితో పాటు కొంతమందిని ఆ కంపెనీ తొలగించింది. పదవీ విరమణ ఫలాలు కోసం వారు అక్కడే నిరీక్షిస్తున్నారు. ఈ సమయంలోనే మరణించారు. అక్కడి తోటి కార్మికులు మాట్లాడుతూ ఏడాదిన్నరగా జీతాలు లేకుండానే విధులు నిర్వర్తిస్తున్నా మని, వారి మరణం మమ్మల్ని ఎంతగానో బాధించిందని వాపోయారు. -
యూకే వీసాల్లో సింహభాగం భారతీయులదే
లండన్ : నిపుణులైన విదేశీయులకు తామిచ్చే వీసాల్లో 57 శాతం భారతీయులకే లభించాయని యూకే హోంశాఖ వెల్లడించింది. 2016లో 53,575 మంది నైపుణ్యం గల భారతీయ కార్మికులకు వర్కింగ్ వీసాలు మంజూరైనట్లు తెలిపింది. ఈ జాబితాలో 9,348 వీసాలతో అమెరికా రెండోస్థానంలో నిలిచింది. గతేడాదిలో మొత్తం 93,244 వీసాలు మంజూరు చేయగా అందులో భారతీయులకే 53,575 వీసాలు లభించాయి. 2016లో 11,330 మంది భారతీయులకు విద్యార్థి వీసా మంజూరైనట్లు తెలిపింది. -
‘అక్రమ భారతీయుల’కు సాయం చేస్తాం
కువైట్ సిటీ: కువైట్‌లో అక్రమంగా పనిచేస్తున్న భారతీయులకు శుభవార్త! ఆ దేశంలో అక్రమంగా పనిచేస్తున్న భారతీయులు దేశం విడిచి వెళ్లిపోతామన్నా.. లేదా ఉద్యోగ వీసాల బదిలీ కోసం హోం శాఖను సంప్రదిస్తే.. వారికి జైలు శిక్షలు, జరిమానాలు విధించబోమని కువైట్ ప్రభుత్వం ప్రకటించింది. వారికి సాయం చేయడానికి తమ ఇమిగ్రేషన్ అధికారులు సిద్ధంగా ఉన్నారని చెప్పింది. కఠిన శిక్షలు ఉండే కువైట్ నుంచి ఇలాంటి ప్రకటన రావడం చాలా అరుదు. కువైట్‌లో ప్రస్తుతం దాదాపు 24 వేల మంది భారతీయులు అక్రమంగా పనిచేస్తున్నారని అంచనా. ఇలా ఇప్పటికే రెండు వేల మందికి పైగా భారతీయులను స్వదేశానికి పంపారు. -
ఖతార్‌లో భారతీయుల అష్టకష్టాలు
దోహ : ఖతార్ లోని భారత కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. ఓ ఎలక్ర్టికల్ కంపెనీలో పనిచేస్తున్న దాదాపు 400 మందికి గత నాలుగు నెలలుగా జీతాలు చెల్లించడలేదు. అబుదాబికి చెందిన ఓ కంపెనీలో పనిచేస్తున్న దాదాపు 400 మంది భారత కార్మికులకు గత నాలుగు నెలలుగా సదరు కంపెనీ జీతాలు చెల్లించలేదని ఖతార్ లోని భారత్ కు చెందిన ఓ చారిటీ ప్రతినిధి అర్విన్ పాటిల్ తెలిపారు. ఒకరో ఇద్దరో అయితే తామే డబ్బులు ఇచ్చేవారమని, కానీ 400 మందికి సాయం చేయడం చాలా కష్షతరమని అర్విన్ పేర్కొన్నారు. అయితే వారి సమస్యను పరిష్కరించే విషయంలో తమ వంతు సాయం చేస్తామని ఆయన హామి ఇచ్చారు. ఈ కార్మికులంతా వచ్చే రెండు మూడు వారాల్లో ఖతార్ లోని భారత రాయబారిని కలిసి తమ గోడు వెళ్లబోసుకోనున్నారని తెలిపారు. భారత్ నుంచి వచ్చిన వారికే కాకుండా ఇతర దేశాల నుంచి ఇక్కడకు వచ్చి పనిచేస్తున్నవారికి కూడా సదరు కంపెనీ జీతాలు ఇవ్వడం లేదన్నారు. కార్మికులకు ఎలక్ర్టానిక్ పద్ధతిలో వేతనాలు చెల్లించేలా గతేడాది ‘వేజ్ ప్రొటెక్షన్ సిస్టమ్‘ తీసుకొచ్చారు. దీనిని ఉల్లంఘించిన కంపెనీల యజమానులు జరిమానాలు లేదా జైలు శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఖతార్ లో పనిచేసే ఇతర దేశాల కార్మికుల్లో భారత్ కు చెందినవారే ఎక్కువ. దాదాపు 25 లక్షల మంది జనాభా కలిగిన ఖతార్ లో ఏకంగా 5.45 లక్షల మంది భారత కార్మికులు పనిచేస్తున్నారు. చమురు, సహజవాయువు ధరలు పడిపోవడంతో ఖతార్ ఆర్థికంగా సతమతమవుతోంది. అందువల్లే ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటోందని అధికారులు అంటున్నారు. కాగా 2022లో ఖతార్ సాకర్ వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇస్తోంది. అందుకుగాను స్టేడియాలను ఇప్పటి నుంచే నిర్మిస్తున్నారు. ఆ నిర్మాణ సమయంలో కూలీలు పెద్ద ఎత్తున మృత్యువాత పడుతున్నారని మానవ హక్కుల సంస్థలు ఎలుగెత్తుతున్నాయి. దీనిపై మాత్రం ఖతార్ ప్రభుత్వం నోరు మెదపడం లేదు. -
తినడానకి తిండీ లేదు.. నీళ్లూ లేవు!
జెడ్డా ఔట్ జైలులో 2వేల మంది భారతీయ కార్మికుల నరకయాతన మోర్తాడ్: సౌదీలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులతో కంపెనీలు మూతపడగా, వీసా, పాస్‌పోర్టు సరిగాలేని రెండువేల మంది భారతీయ కార్మికులు రోడ్డుపాలవగా, వారిని జైళ్లకు తరలించారు. జెడ్డా ఔట్‌జైలులో బందీలుగా ఉన్న కార్మికులు మూడు రోజులుగా తినడానికి తిండి దొరక్క, కనీసం తాగడానికి నీళ్లు కూడా లేక నరకయాతన అనుభవిస్తున్నారు. సౌదీలో పరిస్థితుల్ని రియాద్‌లో రిసార్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్న నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌వాసి పాలకుర్తి అజయ్‌గుప్తా ఫోన్ ద్వారా తెలిపారు. వారి ఇబ్బందులపై స్పందించిన విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్.. కార్మికుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కానీ సౌదీలోని మన రాయబార కార్యాలయం అధికారులు అనుసరిస్తున్న తీరు పూర్తి భిన్నంగా ఉంది. మంత్రి స్పందించిన తరువాత ఒకటి, రెండు రోజులు భోజన సదుపాయం, నీటి వసతి కల్పించారని, ఆ తర్వాత మళ్లీ పట్టించుకోవడం లేదని జైళ్లలో మగ్గుతున్నవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులను స్వదేశానికి రప్పించే చర్య లు చేపట్టాలని వారి కుటుంబీకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్ని కోరుతున్నారు. -
మూడు రోజులుగా జెద్దా ఔట్ జైలులో
- భారతీయ కార్మికుల నరకయాతన --ఆకలితో అలమటిస్తున్న రెండు వేల మంది మోర్తాడ్ (నిజామాబాద్ జిల్లా) పొట్టకూటి కోసం దేశంగాని దేశం వలసపోయారు. సౌదీలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులతో కంపెనీలు మూతపడగా, వీసా, పాస్‌పోర్టు సరిగాలేని వేలాది మంది భారతీయ కార్మికులు రోడ్డుపాలవగా, వారిని జైళ్లకు తరలించారు. జెద్దా ఔట్‌జైలులో బందీలుగా ఉన్న కార్మికులు మూడు రోజులుగా తినడానికి తిండి దొరక్క, కనీసం తాగడానికి నీళ్లు కూడా లేక నరకయాతన అనుభవిస్తున్నారు. సౌదీలో పరిస్థితుల్ని రియాద్‌లో రిసార్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్న నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌వాసి పాలకుర్తి అజయ్‌గుప్తా ఫోన్ ద్వారా తెలిపారు. అయితే సౌదీలో భారతీయ కార్మికులు పడుతున్న ఇబ్బందులపై స్పందించిన విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్.. కార్మికుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కానీ విదేశాంగశాఖ మంత్రి ప్రకటనలకు, సౌదీలోని మన రాయబార కార్యాలయం అధికారులు అనుసరిస్తున్న తీరు పూర్తి భిన్నంగా ఉంది. జెద్దా ఔట్ జైలులో దాదాపు రెండువేల మంది కార్మికులు బందీలుగా ఉన్నారు. ఔట్ జైలులో ఒక్కో గదిలో వందలాది మందిని బందీలుగా ఉంచారు. వారికి మూడు రోజుల నుంచి సరైన తిండి అందడం లేదు. కనీసం తాగడానికి నీరు కూడా ఇవ్వడం లేదని తెలిసింది. విదేశాంగశాఖ మంత్రి స్పందించిన తరువాత ఒకటి, రెండు రోజులపాటు భోజన సదుపాయం, నీటి వసతి కల్పించారని, ఆ తర్వాత మళ్లీ ఎవరూ పట్టించుకోవడం లేదని జైళ్లలో మగ్గుతున్నవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారతీయ కార్మికుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, వారిని స్వదేశానికి రప్పించే చర్యలు చేపట్టాలని వారి కుటుంబీకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్ని కోరుతున్నారు. -
గల్ఫ్ దేశాల్లో పనిచేయడం మనకు ప్రత్యక్ష నరకం
న్యూఢిల్లీ: పొట్ట కూటి కోసం గల్ఫ్ దేశాల బాట పట్టిన భారతీయులు ఆ దేశాల్లో అనుభవిస్తున్న బాధలు అంతా ఇంతా కాదు. కొంత మంది ఉద్యోగాలు ఊడిపోయి ఆకలి మంటలతో అలమటిస్తుండగా, మరికొంత మంది అక్రమంగా జైల్లో మగ్గిపోతున్నారు. ఇంకొందరు అకాల మరణాలకు గురవుతున్నారు. సౌదీ అరేబియా, కువైట్, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఓమన్, బహ్రెయిన్ గల్ఫ్ దేశాల్లో భారతీయ కార్మికులు ఏడాదికి 69 మంది అకాల మరణం పాలవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కార్మికుల మృతిసంఖ్య సగటున ఏడాదికి 26 ఉండగా, గల్ఫ్‌లోనే అత్యధికంగా ఉంది. అమెరికాలో జీవిస్తున్న భారతీయ కార్మికులతో పోలిస్తే సౌదీ అరేబియా, కువైట్‌లో చనిపోయే ప్రమాదం పది రెట్లు ఎక్కువగా ఉందని పలు నివేదికలు తెలియజేస్తున్నాయి. సౌదీ, ఓమన్, కువైట్, యూఏఈ నివేదికల ప్రకారం ఆయా దేశాల్లో ప్రతి లక్ష మంది కార్మికుల్లో 65 నుంచి 75 మంది భారతీయులు మరణిస్తున్నారు. పని ప్రదేశాల్లో సంభవించే ప్రమాదాల వల్ల, పని ఒత్తిడిని తట్టుకోలేక వచ్చే గుండెపోటు వల్ల, ఉన్న ఉద్యోగం ఊడిపోయి రోడ్డునపడి పస్తులుండడం వల్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయి. ఆరు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయ కార్మికుల్లో 87 శాతం మంది తమ దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్నామంటూ ఆయా దేశాల్లోని భారతీయ అంబసీలకు ఫిర్యాదు చేశారంటే వారి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఖతార్‌లోని భారతీయ అంబసీకి 13,624 ఫిర్యాదులు, సౌదీ అరేబియాలో 11,195 ఫిర్యాదులు, కువైట్‌లో 11,103 ఫిర్యాదులు అందయాని భారత విదేశాంగ శాఖే ఇటీవల పార్లమెంట్లో వెల్లడించింది. జీతాలు చెల్లించక పోవడం, చెల్లించినా రావాల్సిన దానికన్నా తక్కువ చెల్లించడం, చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చేయడం, ఎక్కువ పని గంటలు ఉండడం, ఎలాంటి సదుపాయాలులేని దుర్భర పరిస్థితుల్లో జీవించడం, భౌతికంగా హింసించడం, సకాలంలో వీసాలు, వర్క్ పర్మిట్ కార్డులు రిన్యువల్ చేయకపోవడం, వైద్య ఖర్చులు చెల్లించకపోవడం, కాంట్రాక్టు పీరియడ్ ముగిశాక మాతృదేశానికి విమాన టిక్కెట్లు ఇవ్వకపోవడం తదితర అంశాలపై ఈ ఫిర్యాదులు అందాయి. ప్రపంచవ్యాప్తంగా 7,213 మంది భారతీయ కార్మికులు జైళ్లలో మగ్గిపోతుండగా, ఒక్క సౌదీ అరేబియాలోనే 1,697 మంది మగ్గిపోతున్నారు. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 1,143 మంది భారతీయులు జైళ్లలో మగ్గిపోతున్నారు. సకాంలో వీసాలను రిన్యువల్ చేయక పోవడం వల్ల, తిరుగు ప్రయాణంలో విమాన టిక్కెట్లు కొనుగోలుచేసే శక్తి లేకపోవడం వల్ల పని ఒత్తిడి తట్టుకోలేక కంపెనీ నుంచి పారిపోవడం తదితర కారణాల వల్ల భారతీయ కార్మికులు జైళ్లలో మగ్గిపోతున్నారు.