inter caste marriage
-
అత్తారింటికి దారేది?
శంకరపట్నం (మానకొండూర్): పొరుగింటి వ్యక్తిని ప్రేమపెళ్లి చేసుకుందని ఆ తల్లిదండ్రులు తమ కూతురుపై కోపం పెంచుకున్నారు. దీంతో పొరుగింటికి దారి లేకుండా సీసీరోడ్డుపై ఇటుకలతో గోడకట్టారు. దీనిపై గ్రామ పెద్దలతో చెప్పించినా వారు వినకపోవడంతో కూతురు తన తల్లిదండ్రులపై స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే వాళ్లుసైతం తన సమస్యను పట్టించుకోవడం లేదని శుక్రవారం మీడియా ఎదుట గోడు వెళ్లబోసుకుంది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామానికి చెందిన మమత తమ పొరుగింటి వ్యక్తి అయిన కనకం రత్నాకర్‌ను 2023 ఫిబ్రవరి 16న ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఆ పెళ్లి మమత కుటుంబానికి ఇష్టం లేదు. దీంతో మమత, రత్నాకర్ కేశవపట్నంలో అద్దెకుంటున్నారు. అక్కడే జిరాక్స్ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కాగా, రత్నాకర్ తల్లిదండ్రులు మాత్రం ఎరడపల్లిలోనే నివాసం ఉంటున్నారు. మమత తల్లి ఇంటి ఎదుట నుంచే రత్నాకర్ ఇంటికి వెళ్లాల్సి ఉండగా.. రత్నాకర్ కుటుంబం ఆ దారిగుండా నడవకుండా మమత కుటుంబసభ్యులు ఆరు నెలల క్రితం రోడ్డుపై అడ్డంగా సిమెంట్ ఇటుకలతో గోడ కట్టారు. ఇప్పటి నుంచి దొడ్డిదారి గుండా నడుస్తున్నామని, తన అత్తారింటికి వెళ్లేందుకు దారి లేకుండా చేసి, ఇబ్బందులు పెడుతున్న తన తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని మమత నాలుగు రోజల క్రితం కేశవపట్నం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మమత కోరింది. -
బొట్లపాలెం ఘటనలో నిందితుల అరెస్ట్
ఒంగోలు టౌన్/దర్శి: కులాంతర వివాహం కేసులో దళిత మహిళను బంధించి పెట్రోలు పోసి హతమార్చేందుకు ప్రయత్నించిన ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఎస్పీ మలికా గర్గ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. దర్శి మండలం బొట్లపాలేనికి చెందిన గంగిరెడ్డి బ్రహ్మరెడ్డి, పుల్లమ్మల కుమార్తె భార్గవి.. అదే గ్రామానికి చెందిన దళితుడు జక్కుల సాయిరాంను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తమ కుమార్తె కులాంతర వివాహం చేసుకోవడం ఇష్టంలేని బ్రహ్మారెడ్డి దంపతులు ఆ కుటుంబంపై కక్ష పెంచుకున్నారు. సోమవారం అర్ధరాత్రి మంచినీళ్లు పట్టుకునేందుకు కొళాయి వద్దకు వెళ్లిన సాయిరాం తల్లి అనురాధ, సోదరి కామునూరి మౌనిక మీద దాడి చేసి విచక్షణరహితంగా కొట్టారు. మౌనికను దుస్తులు చింపేసి ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. తమ ఇంటి వరండాలో ఆమెను తాళ్లతో కట్టేసి పెట్రోలు పోసి హతమార్చేందుకు యత్నించారు. అయితే ఈ లోపు అనురాధ స్థానికుల సాయంతో 100కు కాల్ చేయడంతో వెంటనే దర్శి ఎస్ఐ డి.రామకృష్ణ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని యువతిని కాపాడారు. చికిత్స నిమిత్తం పోలీస్ వాహనంలో దర్శి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఎస్పీ ఆదేశాల మేరకు ట్రైనీ ఐపీఎస్ అంకితా సురాన ఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేసిన దర్శి డీఎస్పీ టి.అశోక్‌వర్థన్.. మంగళవారం మధ్యాహ్నం తూర్పు గంగవరం బస్టాండ్ సెంటర్లో నిందితులను అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన నిముషాల్లోపే అక్కడికి చేరుకున్న పోలీసులు గంటలోపే కేసు రిజిస్టర్ చేశారు. వీలైనంత త్వరగా కోర్టులో చార్జిషీటు దాఖలు చేస్తామని, నిందితులకు శిక్ష పడేలా చేస్తామని ఎస్పీ వివరించారు. కాగా, దళిత మహిళలపై దాడి ఘటనలో నిందితులు గంగిరెడ్డి బ్రహా్మరెడ్డి, భార్య పుల్లమ్మలకు ఈ నెల 29 వరకు రిమాండ్ విధిస్తూ బుధవారం దర్శి ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ తీర్పునిచ్చారు. -
Karnataka Honour Killing: ఘోరాన్ని ముందే ఊహించి.. తల్లిదండ్రులు నన్ను చంపేస్తారంటూ..
మైసూరు: ప్రేమకు పణంగా తన ప్రాణం పోతుందని, అది తల్లిదండ్రుల చేతిలోనేనని ఆ యువతి ఊహించడం నిజమైంది. మైసూరు జిల్లాలోని పిరియా పట్టణ తాలూకా కగ్గుండి గ్రామంలో దళిత కులానికి చెందిన యువకున్ని ప్రేమించి పెళ్ళి చేసుకుందన్న కోపంతో కూతుర్ని తల్లిదండ్రులు హత్య చేసిన సంఘటన అంతటా సంచలనం సృష్టిస్తోంది. తల్లిదండ్రులు సురేష్, బేబి తనను వదలరని, చంపడానికి కూడా వెనుకాడరని హతురాలు, పీయూసీ చదివే శాలిని (17) రాసిన సుదీర్ఘ లేఖను పోలీసులు కనుగొన్నారు. హత్య జరగడానికి ముందు శాలిని అన్ని వివరాలతో పిరియా పట్టణ పోలీసులకు మూడు పేజీల లేఖను రాసింది. తను చనిపోతే అందుకు తల్లిదండ్రులే కారణమని, నన్ను హత్య చేయడానికి వారు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారని అందులో పేర్కొంది. తన జీవితంలో ఎలాంటి సంతోషం లేదని, తల్లిదండ్రులు చిత్రహింసలకు గురి చేసేవారని ఆవేదన వ్యక్తం చేసింది. ఒకవేళ తాను మరణిస్తే ప్రియుడు మంజునాథ్‌కు ఎలాంటి సంబంధం లేదని, తల్లిదండ్రులు మాత్రమే కారణమని స్పష్టం చేసింది. చదవండి: (ట్రాప్ చేసింది ప్రజాప్రతినిధుల కుమారులే!) ఏడాది కిందట ఒక పరువు హత్య కాగా, గత ఏడాది జూన్‌లోనూ ఒక పరువు హత్య మైసూరు జిల్లాలో జరిగింది. పిరియాపట్టణలో ఇతర కులానికి చెందిన యువకున్ని ప్రేమిస్తోందన్న అక్కసుతో గాయత్రి అనే యువతిని ఆమె తండ్రి జయరాం పొలంలో నరికి చంపి పోలీసులకు లొంగిపోయాడు. ఈ నేపథ్యంలో జిల్లాలో పరువు హత్యలు పెరుగుతున్నాయన్న ఆందోళన నెలకొంది. -
ప్రేమ వివాహం చేసుకున్నాం.. రక్షణ కల్పించండి
కాకినాడ సిటీ: కుటుంబ పెద్దల నుంచి రక్షణ కల్పించాలని ఓ ప్రేమజంట జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబును కోరింది. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వీరు ఎస్పీని కలసి తాము ప్రేమ వివాహం చేసుకున్నామని, పెద్దలు తమ వివాహాన్ని నిరాకరిస్తున్నారని, వీరి వల్ల ప్రాణభయం ఉందంటూ ఫిర్యాదు చేశారు. పిఠాపురం మండలం సీతారామపురం గ్రామానికి చెందిన ఆళ్ల శశాంకలక్ష్మి, కాశీవారిపాకలకు చెందిన వాసంశెట్టి శివమణికంఠ ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను ఇరు కుటుంబ పెద్దలు నిరాకరించారు. దీంతో ఇంటి నుంచి వెళ్లి పోయి రామచంద్రపురంలోని ఓ దేవాలయంలో వివాహం చేసుకున్నట్లు తెలిపారు. శశాంకలక్ష్మి విలేకర్లతో మాట్లాడుతూ తమ గురించి ఇంట్లోవారికి చెప్పినా ఒప్పుకోకుండా మరో వివాహం చేసేందుకు ప్రయత్నించడంతో ఇంట్లోంచి బయటకు వచ్చి ఇద్దరం కలిసి వారం రోజుల క్రితం ఊరు నుంచి వెళ్లి పోయినట్లు తెలిపారు. తమ సామాజిక వర్గాలు వేర్వేరు కావడంతో తమ కుటుంబం ఈ పెళ్లికి అంగీకరించదని, తమకు రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని కోరినట్లు తెలిపింది. ఈ పెళ్లి ఇద్దరి ఇష్ట్రపకారమే జరిగిందని దీనిలో ఎవరి ప్రమేయం లేదని తెలిపింది. చదవండి: (తిరుపతి–పీలేరు రహదారికి మహర్దశ.. వెయ్యి కోట్లతో..) -
పెళ్లైనప్పటి నుంచి మాటలు లేవు.. నా భర్తను చంపింది వాళ్లే: నీరజ్ భార్య
సాక్షి, హైదరాబాద్: తన భార్తను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మృతుడు నీరజ్ భార్య సంజన కోరారు. నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేశారు. కాగా బేగంబజార్‌కు కోల్సివాడికి చెందిన నీరజ్ పన్వార్ (21) శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో నలుగురు దుండగులు కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. తాతతో కలిసి నీరజ్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా చేపల మార్కెట్ సమీపంలో మాటేసిన దుండగులు ఒక్కసారిగా అతనిపై దాడి చేసి.. కత్తులతో పొడిచి చంపారు. వేరే కులానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నందుకే యువతి కుటుంబ సభ్యులు కక్ష పెంచుకుని హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇటీవల సరూర్‌నగర్‌లో జరిగిన పరువు హత్యను మరువక ముందే చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనం సృష్టించింది ఈ ఘటనపై నీరజ్ భార్య స్పందిస్తూ.. వివాహం అయినప్పటి నుంచీ వారి నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయని చెప్పారు. తన కజిన్ విజయ్, సంజులే ఈ హత్య చేశారని, మరో ముగ్గురుతో కలిసి ఈ దారుణానికి తెగబడ్డారని తెలిపింది. వారి నుంచి తనకు, తన అత్త, మామలకు కూడా ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. నీరజ్‌తో పెళ్లి అయినప్పటి నుంచి వారితో సంబంధాలు లేవని తెలిపింది. ‘నేను వివాహం చేసుకున్న తర్వాత నా బిడ్డ చనిపోయింది అని వారు నన్ను వదిలేశారు. కానీ వాళ్లు ఇప్పుడిలా చేయడం వల్ల నాకు అన్యాయం జరిగింది’ అంటూ సంజన వాపోయింది. ఇక వ్యాపారి నీరజ్ పన్వార్ హత్యను నిరసిస్తూ బేగంబజార్ వ్యాపారులు మార్కెట్ బంద్ పాటిస్తున్నారు. నీరజ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వ్యాపారవేత్తలందరూ ఈ హత్యను ఖండిస్తున్నామని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను శిక్షించాలని కోరుతున్నారు. పోలీసులు వేగంగా స్పందించిన నిందితులను అరెస్ట్ చేయడంపై కృతజ్ఞతలు తెలిపిన వ్యాపారులు వారికి త్వరగా శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడితేనే ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగవని చెబుతున్నారు. తన కుమారుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మృతుడు నీరజ్ పన్వార్ తండ్రి జగదీష్ ప్రసాద్ పన్వార్ డిమాండ్ చేశారు. తెలంగాణ సీఎం , కమిషనర్ ఆఫ్ పోలీస్ తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. చదవండి: పురిటి నొప్పులతో ఆసుపత్రికి.. అమ్మతనం ఆస్వాదించకుండానే.. -
పరువు హత్యలు మానవతకు అవమానం!
దేశంలో రాజ్యాంగం అమలు లోకి వచ్చి 71 వసంతాలు గడిచిపోయాయి. భారత రాజ్యాంగం పౌరులందరికీ కుల మత ప్రాంతాలకు అతీతంగా సమానత్వం, సమ న్యాయం, వ్యక్తిగత స్వేచ్ఛ, లింగ వివక్ష లేని సౌభ్రాతృత్వాన్ని ప్రసాదించింది. అందులో భాగంగా ఆర్టికల్ 21 వ్యక్తిగత స్వేచ్ఛతో స్వతంత్రంగా జీవించే హక్కును కల్పించింది, ఆర్టికల్ 17 అంటరానితనాన్ని నిషేధించింది. దేశం కుల రహిత సమాజంగా రూపాంతరం చెంది పౌరుల మధ్య సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు తొలగించడం రాజ్యాంగ అంతిమ లక్ష్యం. ఇవే అంశాలను సుప్రీంకోర్టు 2011లో ‘కేకే భాస్కరన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు’, ‘నందిని వర్సెస్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్‌గఢ్’ కేసుల తీర్పుల్లో స్పష్టంగా తెలియజేసింది. పురాతన ఆచార సంప్రదాయాలు మానవాళిని అభివృద్ధి పథంలో నడిపించేలా ఉండాలి. కానీ, సంప్రదాయాల చుట్టూ అవివేకంగా పరిభ్రమించేలా ఉండకూడదు. నానాటికీ పరువు హత్యల పేరుపై కులాంతర వివాహాలు చేసుకున్న వారినీ, చేసుకోవడానికి సిద్ధమైన వారినీ, వారి కుటుంబ సభ్యులనూ హత్యలు చేయడం లేదా దాడులు చేయడం ఎక్కువవుతోంది. ముఖ్యంగా నయా క్షత్రియ కులాలు, దళిత – బహుజన కులాల మధ్య జరుగుతున్న ప్రేమ వివాహాల సంఖ్య కంటే రెట్టింపు సంఖ్యలో హత్యలు/దాడులు జరుగుతున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 1936లో కులాంతర వివాహాలతోనే కుల నిర్మూలన సాధ్యమని చెప్పిన సంగతిని అందరూ గుర్తుపెట్టకోవాలి. కేంద్ర ప్రభుత్వం 2013లో ‘లా’ కమిషన్ ఇచ్చిన 242వ నివేదిక ఆధారంగా... ప్రేమ వివాహితుల హత్యల నివారణకు చట్టాన్ని ప్రతిపాదించింది. సదరు చట్టంపై రాష్ట్ర ప్రభుత్వాల నుండి సూచనలు, సలహాలను స్వీకరించే పనిలో ఉన్నారు. కుల అహంకార హత్యల కట్టడికి ప్రత్యేక చట్టం లేని కారణంగా ప్రస్తుతం ఐపీసీ సెక్షన్ 300 ప్రకారం హత్యకేసు నమోదు చేస్తుండడంతో... దోషులు బెయిల్ పొందేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. (చదవండి: వివక్షను బయటి నుంచి చూస్తే ఎలా?) సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనాలు 2018లో ‘శక్తి వాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’, 2021లో ‘హరి వర్సెస్ స్టేట్ అఫ్ ఉత్తర ప్రదేశ్’ కేసుల తీర్పుల్లో కుల అహంకార హత్యల నివారణ, విచారణకు సంబంధించి... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాయి. దేశంలో గత ఐదు సంవత్సరాల్లో జరిగిన హత్యలను జిల్లాల వారీగా లెక్కించడంతోపాటూ ఆయా జిల్లాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి నివారణ చర్యలు చేపట్టాలి. ప్రతి జిల్లాలో 24 గంటల హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. కులాంతర/ మతాంతర వివాహ జంటలను గుర్తించి వారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక రక్షణలను కల్పించాలి. అధికారుల నిర్లక్ష్యంతో హత్యలు జరిగినట్లయితే సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి అనేవి ఇందులో ముఖ్యమైనవి. (చదవండి: నేరస్థుల గుర్తింపు బిల్లుపై చర్చ ఏది?) రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 ప్రకారం అంటరాని తనం నిషేధితమయ్యింది కనుక షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు సామాజిక భద్రత కల్పనలో భాగంగా 1989లో అత్యాచార నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా కులనిర్మూలన జరగాలన్నా, కుల అహంకారంతో చేస్తున్న పరువు హత్యలను కట్టడి చేయాలన్నా రాజ్యాంగ సవరణ చేసి ఆర్టికల్ ‘17ఏ’ను చేర్చి కుల వ్యవస్థను నిషేధించాలి. దీన్ని అన్ని రాజకీయ పార్టీలూ ప్రధాన అంశంగా తీసుకోవాలి. అలాగే అన్ని మతాలకు సంబంధించిన పెద్దలు ముందుకువచ్చి పరువు హత్యలకు వ్యతిరేకంగా గళం విప్పాలి. అప్పుడే ఈ అమానవీయ హత్యాకాండకు తెరపడుతుంది. - కోడెపాక కుమారస్వామి సామాజిక విశ్లేషకులు -
అత్తింటి ముందు కోడలు బైఠాయింపు
సాక్షి, చీరాల అర్బన్: కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడనే నెపంతో కాన్పుకు పుట్టింటికి వెళ్లి తిరిగి పసిబిడ్డతో ఇంటికి వచ్చిన కోడల్ని ఇంటిలోకి రానివ్వక పోవడంతో ఆ యువతి అత్తింటి ముందు బైఠాయించింది. ఈ ఘటన ఆదివారం వేటపాలం మండలం కొత్తపేట పంచాయతీ టైలర్స్ కాలనీలో జరిగిది. వివరాల్లో వెళితే.. వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీ టైలర్స్‌కాలనీకి చెందిన గుంటి దీపు, ఇంకొల్లుకు చెందిన రోజాలు కులాంతర వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న రోజు నుంచి అత్తమామలు వేధిస్తున్నారనని ఆమె ఆరోపిస్తుంది. కాన్పుకు వెళ్లి ఏడు నెలల పసిబిడ్డతో ఆదివారం ఇంటికి రాగా ఇంటిలోకి రానివ్వలేదని ఆమె వాపోయింది. సమాచారం అందుకున్న టూటౌన్ ఎస్సై రత్నకుమారి సంఘటనా స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ యువతిని ఇంటిలోకి పంపించారు. పోలీసుల జోక్యంతో వ్యవహారం సద్దుమణిగింది. -
దయచేసి నా భార్యను అప్పగించండి!
చెన్నై, టీ.నగర్: తన భార్యను అప్పగించాలని కోరుతూ ఓ యువకుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. కోయంబత్తూరు గౌండమ్‌పాళయం సమీపంలోని ఇడయార్‌పాళయం విద్యా కాలనీకి చెందిన రాజేంద్రన్ కుమారుడు కార్తికేయన్ (35). తిరుచ్చి సంజీవి నగర్‌కు చెందిన సుందరరాజన్ కుమార్తె తమిళిని ప్రభ (25). వేర్వేరు కులాలకు చెందిన వీరు ప్రేమించుకుని కోవైలో ఈ నెల 5వ తేదిన వివాహం చేసుకున్నారు. వీరి వివాహాన్ని తమిళిని ప్రభ తల్లిదండ్రులు అంగీకరించలేదు. అయితే కార్తికేయన్ తల్లిదండ్రులు అంగీకరించారు. ఇలా ఉండగా ఐదు రోజుల క్రితం యువతి తల్లిదండ్రులు, బంధువులు కార్తికేయన్ ఇంటికి వచ్చి కార్తికేయన్, అతని తల్లిపై దాడి చేసి తమిళిని ప్రభను బలవంతంగా కారులో తీసుకెళ్లారు. (మనోవేదనతో సర్పంచ్ ఆత్మహత్య ) ఈ దృశ్యాలు అక్కడున్న నిఘా కెమెరాల్లో నమోదయ్యాయి. దీని గురించి కుడియలూరు పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు కేసు నమోదు చేసి తమిళిని ప్రభను, రక్షించేందుకు తిరుచ్చికి వెళ్లారు. ఆ సమయంలో తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తన తండ్రి అనారోగ్యంగా ఉన్నందున రెండు, మూడు రోజుల్లో ఊరికి తిరిగి వస్తానని తమిళిని ప్రభ పోలీసులకు తెలిపారు. ఇలా ఉండగా కార్తికేయన్ మద్రాసు హైకోర్టులో మంగళవారం ఒక పిటిషన్ దాఖలు చేశారు. అందులో కులాంతర వివాహం చేసుకున్నందున తన భార్యను కిడ్నాప్ చేశారని, ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఆమెను పరువు హత్య చేసే అవకాశముందని, భార్యను తనకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. (కులాంతర వివాహాలు చేసుకునే వారికి గుడ్‌న్యూస్) -
ఆదర్శ వివాహాలకు ప్రభుత్వం చేయూత
సాక్షి, మిర్యాలగూడ: ఇరువురు ఇష్టపడి కులాంతర వివాహం చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందజేస్తోంది. కాగా ఈ కులాంతరం చేసుకున్న వారికి 1980 నుంచి ప్రోత్సాహకాలను అందిస్తుండగా.. అప్పట్లో ఈ ప్రోత్సాహకం రూ. 30వేలు ఉండేది. 1993లో దీనిని రూ. 40వేలకు పెంచింది. 2011లో రూ. రూ. 50వేలకు చేయగా.. 2019 అక్టోబరు 30న ఎస్సీలకు చెందిన యువతీ, యువకులను వివాహ చేసుకున్న వారికి నజరానా రూ. 2.50లక్షలకు పెంచింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను కూడా జారీ చేసింది. జిల్లాలో ఎస్సీ కులాంతర వివాహాల ప్రోత్సాహకాల బాధ్యతను జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారులకు అప్పగించింది. కులాంతర వివాహాలు చేసుకున్న జంటలు సమాజంలో ఎదురయ్యే పరిణామాలను దీటుగా ఎదుర్కొనేందుకు ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచే విధంగా ప్రభుత్వం చేయూతనిస్తోంది. ఇందుకోసం కులాంతర వివాహం చేసుకున్న జంటలు ఆన్లైన్లో www.telanganaepass.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారులు పేర్కొంటున్నారు. కాగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వధువు కాని వరుడు కాని కులాంతర వివాహం చేసుకొని ఉండాలని, వదుధు లేదా వరుడికి రూ. 2లక్షల లోపు ఆదాయం ఉండాలని అధికారులు పేర్కొంటున్నారు. సమర్పించాల్సిన పత్రాలు.. ఇరువురి ఆధార్ కార్డులను జత చేయాలి వధూవరులకు బ్యాంకులో జాయింట్ అకౌంట్ కలిగి ఉండాలి. కుల, ఆధాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలి వివాహం జరిగినట్లు రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. కులాంతర వివాహం చేసుకున్నట్లు సాక్షుల ఆధార్ కార్డులు సైతం జత చేయాల్సి ఉంటుంది. వధూవరులు పూర్తి చిరునామా కలిగి ఉండాలి. ఇప్పటి వరకు ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు కులాంతర వివాహం చేసుకున్న వారికి ఇప్పటివరకు రూ. 50వేలు ఉండగా.. ప్రభుత్వం వారికి చేయూతనిచ్చేందుకు రూ. 2.50లక్షలకు పెంచింది. అయితే కులాంతర వివాహం చేసుకున్న వారికి 3 ఏళ్ల పాటు డిపాజిట్ చేసిన చెక్కును అందించడం జరుగుతుంది. దరఖాస్తు చేసుకున్న వారికి ఈ ప్రోత్సాహకాలు తప్పనిసరిగా అందుతాయి. పూర్తి స్థాయిలో అన్ని ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలి. – రాజ్‌కుమార్, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ అధికారి, నల్లగొండ -
‘ప్రేమ’ లేకుండా పోదు
కూతుర్ని గుండెలపై ఆడిస్తున్నప్పుడు కూతురితో పాటు ఆమెకు ఇష్టమైన బొమ్మా తండ్రి గుండెలపై ఆడే ఉంటుంది. ఈ క్షణంలో.. కూతురు వెళ్లిపోయిన ఈ క్షణంలో.. అది ఆ తండ్రికి గుర్తుకు రాకపోవచ్చు. గుర్తు లేకుండా అయితే పోదు. నేలపైనా కాకుండా, నింగిలోనూ కాకుండా తన గుండెల మీద ఉంటేనే బంగారు తల్లి భద్రంగా ఉంటుందని నాన్నకొక నమ్మకం. నిశ్చింత. జన్మనివ్వడం కోసం అమ్మ పడే నొప్పులకు తక్కువేం కాదు.. కూతురు కాసేపు కనిపించకపోతే నాన్న పడే నొప్పులు. ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంట్లోనూ ఉండేదే. నాన్న నిద్ర లేస్తాడు. కళ్లు తెరవగానే బంగారు తల్లి కనిపించాలి. నాన్న బయటి నుంచి వస్తాడు. రాగానే బంగారు తల్లి కనిపించాలి. సూర్యుడు, చంద్రుడు అని పైన ఇద్దరు ఉంటారు కదా.. లోకానికి బాగా కావలసినవాళ్లు.. వాళ్లు అక్కర్లేదు ఆయనకు! వెలుగూ కూతురే, వెన్నెలా కూతురే. అమ్మ మోయడం కనిపించేది ఆ తొమ్మిది నెలలే. తర్వాత అంతా నాన్నే మోయడం గుండెల మీద! బరువనిపించదు. కూతురు దిగితేనే గుండె బరువెక్కుతుంది. తనకై తను కూతురు దిగాలని చూస్తోందా, కాలు కిందపెట్టాలని చూస్తోందా.. నాన్నకిక నొప్పులు మొదలు! విలవిల్లాడిపోతాడు. భద్రం తల్లీ నేల. భద్రం తల్లీ నింగి. నేలపైనా కాకుండా, నింగిలోనూ కాకుండా తన గుండెల మీద ఉంటేనే బంగారు తల్లి భద్రంగా ఉంటుందని నాన్నకొక నమ్మకం. నిశ్చింత. జన్మనివ్వడం కోసం అమ్మ పడే నొప్పులకు తక్కువేం కాదు.. కూతురు కాసేపు కనిపించకపోతే నాన్న పడే నొప్పులు. కాసేపటికే ఆయన అలా అయిపోతే, గుండెల్ని ‘తేలిక చేసి’ కూతురు కిందికి దిగిపోతే? దిగిపోతే ఎలా ఉంటుందో మిర్యాలగూడ మారుతీరావుకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు యూపీలోని రాజేశ్ మిశ్రాకు తెలుస్తోంది. బిఠారీ చైన్పూర్ ఎమ్మెల్యే ఆయన. ఆయన కూతురు సాక్షి ఈ నెల మూడున తండ్రి గుండెల మీద నుంచి దిగి పోయింది! మర్నాడే ప్రయాగరాజ్‌లోని ఒక గుళ్లో తను ప్రేమించినవాడిని పెళ్లి చేసుకుంది. అతడి పేరు అభిజిత్. దళితుడు. సాక్షి బ్రాహ్మలమ్మాయి. పైగా ఎమ్మెల్యే కూతురు. పైగా బీజేపీ ఎమ్మెల్యే కూతురు. పైగా యూపీలో పవర్లో ఉన్న పార్టీ ఎమ్మెల్యే కూతురు. రాజేశ్ మిశ్రా గుండె బరువెక్కింది ఈ ‘పైగా’ల వల్ల కాకపోవచ్చు. తెల్లారి లేచి చూస్తే గుండెలపై పిల్ల లేదు. ఊపిరెలా ఆడుతుంది ఏ తండ్రికైనా! మిర్యాలగూడ మారుతీరావు నొప్పులకు, బిఠారీ ఎమ్మెల్యే రాజేశ్ మిశ్రా నొప్పులకు పోలికలున్నాయి. కూతురు నడిచిన ముద్దు ముద్దు పాదాల ముద్రలు ఆ ఇద్దరి గుండెలపైనా ఇంకా అలాగే ఉన్నాయి. ఆ పాదాలకున్న గజ్జెలు ఇంకా చెవుల్లో ఘల్లుఘల్లుమంటూనే ఉన్నాయి. ఇద్దరూ సంఘంలో పరువు మర్యాదలు ఉన్నవారే. ఇద్దరూ కూతురే తమ పరువుమర్యాదగా బతుకుతున్నవారే. ఇంకొక పోలిక ఉంది కానీ అది వాళ్లు ఇష్టపడే పోలిక కాదు. మారుతీరావు కూతురు ప్రేమించిందీ దళితుడినే, రాజేశ్ మిశ్రా కూతురు ప్రేమించిందీ దళితుడినే. మున్ముందు మరొక పోలిక కూడా ఉండే ప్రమాదం ఉంది. ఇక్కడ మిర్యాలగూడలో ఈ తండ్రి ఏం చేయించాడని అనుకుంటున్నామో, అక్కడ యూపీలో ఆ తండ్రీ అదే చేయించబోయే ప్రమాదం! అమృత ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిని కిరాయి హంతకులు చంపేశారు. సాక్షి ప్రేమించి, పెళ్లి చేసుకున్న యువకుడినీ ఎవరైనా అలాగే చేయబోతారా? పది రోజులుగా సాక్షిని, అభిజిత్‌ని ఎవరో వెంటాడుతున్నారు. ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. ‘వాడిని చేసుకుంటావా!’ అని ఆమెను, ‘గొప్పింటి వాళ్లమ్మాయి కావాల్సి వచ్చిందా!’ అని అతడినీ వేధిస్తున్నారు. నూతన వధూవరులిద్దరికీ గట్టి భద్రత కల్పించాలని నిన్న సోమవారం అలహాబాద్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అంతకన్నా ముందుగా.. వీళ్ల పెళ్లి చెల్లుబాటు అవుతుంది అని ప్రకటించింది. కోర్టు చెప్పిందని తండ్రి మనసు కుదుటపడుతుందా పెళ్లి చట్టబద్ధమైపోయింది కనుక ఇక కూతురు హ్యాపీగా ఉంటుందని?! సాక్షి తన భర్త అభిజిత్‌తో కలిసి మీడియాను ఉద్దేశించి మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ‘‘నా భర్తపై కోర్టు ప్రాంగణంలోనే నల్లకోటు ధరించిన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆయన ప్రాణాలకు ముప్పు ఉంది’’ అని చెప్పింది సాక్షి. ‘‘నాన్నా.. మమ్మల్ని వదిలెయ్. నా భర్తకు హాని తలపెట్టకు. దూరంగా ఎటైనా వెళ్లి బతుకుతాం’’ అని అదే వీడియోలో తండ్రిని ప్రాథేయపడింది. మరొక వీడియోలో తన భార్యను ఆమె తండ్రి నుంచి కాపాడాలని పోలీసులను వేడుకున్నాడు అభిజిత్. అయితే ‘‘నా కూతురి కన్నా అతడు తొమ్మిదేళ్లు పెద్దవాడు. అంతకుమించి నా అభ్యంతరం ఏమీ లేదు’’ అంటున్నారు రాజేశ్ మిశ్రా. ఎవరిది పెద్దకష్టం? కూతురిపై ప్రేమను పెంచుకున్న తండ్రిదా? దళితుడితో ప్రేమను పంచుకున్న కూతురిదా? ఇద్దరివీ కష్టాలే. కూతురు అలా చేసినందుకు చాలా పోగొట్టుకోవాలి తండ్రి. పరువు, ప్రతిష్ట, వంశ గౌరవం.. ఇలాంటివన్నీ. అదృష్టం ఏంటంటే.. ఎన్ని పోయినా ఒకదాన్ని మాత్రం పోగొట్టుకోకుండా ఉండడం తండ్రి చేతుల్లోనే ఉంది. అది.. కూతురిపై ఆయనకున్న ప్రేమ! కూతుర్ని గుండెలపై ఆడిస్తున్నప్పుడు కూతురితోపాటు ఆమెకు ఇష్టమైన బొమ్మా ఆయన గుండెలపై ఆడే ఉంటుంది. ఈ క్షణంలో.. కూతురు వెళ్లిపోయిన ఈ క్షణంలో.. అది ఆ తండ్రికి గుర్తుకు రాకపోవచ్చు. గుర్తులేకుండా అయితే పోదు. కూతురిదీ తక్కువ కష్టమేం కాదు. తండ్రి సర్వస్వాన్నీ తను ధ్వంసం చేసి వెళ్లిన ఆ క్షణంలో.. తండ్రిని, తల్లిని, తోబుట్టువుల్ని వదిలి వచ్చేసిన ఆ క్షణంలో.. ఆమె పడే మనోవేదన తండ్రి కోసమే కానీ ఆయన అంగీకరించని తన ప్రేమ కోసం కాదు. తండ్రికి ఇష్టం లేని పని చేశానని కూతురు, కూతురి ఇష్టాన్ని మన్నించలేకపోయానని తండ్రీ.. ఎవరికి వారు మనసు కష్టపెట్టుకోవడంలో ఉండేది ఎటుతిరిగీ తండ్రీ కూతుళ్ల బంధమే! అనుబంధమే!! -మాధవ్ శింగరాజు -
సాక్షి భయపడినట్టే.. కోర్టు ఆవరణలోనే ఘటన
ఉత్తరప్రదేశ్ బీజేపీ నేత కూతురు సాక్షి మిశ్రా కులాంతర వివాహం విషయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తను భర్త అజితేష్ కుమార్ ప్రాణానికి ప్రమాదం ఉందంటూ మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్న సాక్షి మిశ్రాకు భయంకరమైన అనుభవం ఎదురైంది. తమకు రక్షణ కల్పించాలంటూ కోర్టు గుమ్మం తొక్కిన ఈ జంటను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారన్న వార్త కలకలం రేపింది. అలహాబాద్ హై కోర్టులో బరేలీకి చెందిన సాక్షి దంపతులు దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. దీంతో యువ జంట కోర్టు గేట్ నంబర్ 3 వెలుపల వేచి వుండగా బ్లాక్ ఎస్‌యూవీలో వచ్చి కొంతమంది సాయుధ వ్యక్తులు తుపాకీ గురిపెట్టి మరీ అపహరించుకు పోయారని మొదట నివేదికలు వెలువడ్డాయి. ఉదయం 8.30 గంటలకు ఈ సంఘటన జరిగినట్టు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం యూపీ 80 అనే రిజిస్ట్రేషన్ నంబర్‌గల ఎస్యూవీ వెనుక ‘ఛైర్మన్’ రాసి ఉంది. సీసీటీవీ ఫుటేజీని స్కాన్ చేస్తున్నామని, వాహనాల తనిఖీ ప్రారంభించినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. స్పెషల్ పోలీస్ సూపరింటెండెంట్ బరేలీ మునిరాజ్ మాట్లాడుతూ, ఈ దంపతులు ప్రస్తుతం ఎక్కడున్నదీ తమ వద్ద సమాచారం లేదనీ, ఆచూకీ గురించి తెలియజేస్తే, వారికి భద్రత కల్పిస్తామని చెప్పారు. అయితే తమను కిడ్నాప్ చేయడానికి కొంతమంది ప్రయత్నించారని సాక్షి దంపతులు ఆరోపించారు. కిడ్నాప్‌ను ప్రతిఘటించిన తామిద్దరిపైనా తీవ్రంగా దాడి చేశారన్నారు. మరోవైపు వీరిద్దరి వివాహానికి సహాయం చేసిన వారి స్నేహితులలో ఒకర్ని 2018లో ఒక కేసుకు సంబంధించి అరెస్టు చేయడం గమనార్హం. ఇతను ఎమ్మెల్యే రాజేష్ మిశ్రా తండ్రికి సన్నిహితుడని చెబుతున్నారు. అటు అజితేష్ కుమార్ తండ్రి హరీష్ కుమార్ తమ కొడుకు కోడలి ఆచూకీ తెలియదనీ, వారి ప్రాణాలకు ముప్పు వస్తుందనే భయంతో కుటుంబంతో సహా తాను బరేలీని విడిచి దూరంగా వెళ్లిపోయామని వాపోయారు. వారి వివాహం చట్టబద్ధమైందే- కోర్టు ఇదిఇలా వుంటే సాక్షి అజితేష్ వివాహాన్ని చట్టబద్దమైందిగా అలహాబాద్ హైకోర్టు ప్రకటించింది. అలాగే వారికి తగిన భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేసిందని ప్రశ్నించింది. తాజా ఘటనపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు, దీనిపై స్పందించాలని జిల్లా యంత్రాంగాన్ని కోరింది. కాగా దళితుడిని పెళ్లి చేసుకున్నందుకు, తన తండ్రి ద్వారా తమకు ప్రాణహాని వుందని, ఇప్పటికే అనేక బెదిరింపులు ఎదురయ్యాయంటూ సాక్షి మిశ్రా సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు భర్త అజితేష్‌తో కలిసి ఆమె సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో అప్లోడ్ చేశారు. తమకు సహాయం చేయాల్సిందిగా మీడియా, పోలీసులకు విఙ్ఞప్తి చేశారు. చదవండి : మా నాన్న మమ్మల్ని బతకనివ్వరు : ఎమ్మెల్యే కూతురు -
ప్రియుడితో పారిపోయిందని వివాహితకు ..
-
ప్రియుడితో పారిపోయిన వివాహితకు అమానుష శిక్ష!
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఇతర కులానికి చెందిన వ్యక్తితో పారిపోయిందని ఓ వివాహితకు వింత శిక్ష విధించారు గ్రామ పెద్దలు. ఇంట్లో నుంచి పారిపోయిన ఆమెను పట్టుకొచ్చి మరి దారుణంగా హింసించారు. పరాయి కులస్తుడితో వెళ్లినందుకు శిక్షగా భర్తను భుజంపై ఎక్కించి ఊరేగించారు. గ్రామపెద్దల ఆదేశాలతో చేసేది ఏమి లేక భర్తను తన భుజాలపై కూర్చోబెట్టుకుని ఆమె నడక ప్రారంభించింది. ఆమె అలా నడుస్తూ వెళ్తుంటే ముందు కొందరు వ్యక్తులు డ్యాన్సు చేస్తూ గుంపుగా వెళ్లారు. అతడి బరువును మోయలేక ఆమె ఆగితే వెంటనే చుట్టూ ఉన్న జనం అరుపులు, కేకలతో కర్రలతో దాడి చేశారు. దీన్ని మరికొందరు వీడియోలు తీశారు. ఈ వీడియోలు వాట్సాప్‌లో చక్కర్లు కొట్టడంతో పోలీసుల దృష్టికెళ్లింది. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన 12 మందిపై కేసునమోదు చేసినట్లు చెప్పారు. ఈ అమానుష ఘటనపై ఎస్పీ వినీత్ జైన్ మాట్లాడుతూ.. ‘10 రోజుల క్రితం సదరు మహిళ తన ప్రియుడితో పారిపోయింది. 10-12 రోజుల తర్వాత ఆ ప్రియుడు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. ఇంతలో ఆమెను వెతుక్కుంటూ భర్త, అతని సోదరులు వచ్చారు. ఆమెను ఇంటికి తీసుకెళ్లి కులపెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. వారు అమానుషంగా భర్తను భుజాలపై ఎక్కించుకొని ఊరేగాలని శిక్షవిధించారు. అంతేకాకుండా చున్నీని లాగేసి తీవ్రంగా అవమానించారు. ఇలాంటి అమానవీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటాం’ అని ఎస్పీ మీడియాకు తెలిపారు. -
కులాంతర వివాహం.. ఒక్కటైన దివ్యాంగులు
మాకవరపాలెం: దివ్యాంగులు ఒక్కటయ్యారు. కులమతాలు పక్కనపెట్టారు. ప్రాంతం వర్గం వేరైనా అందరి సమక్షంలో వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు. వివరాల్లోకి వెళితే. చింతపల్లికి చెందిన షేక్.దర్గాబాబు చిన్నప్పుడే తల్లిదండ్రులు మరణించారు. దీంతో దర్గాబాబును మోహన్ అనేవ్యక్తి కొండలఅగ్రహారంలో ఉన్న ఇమ్మానుయేలు సంస్థలో చేర్చాడు. అప్పటినుంచి సంస్థ డైరెక్టర్ బిషప్ కె.జీవన్‌రాయ్ సంరక్షణలోనే ఉంటూ ఉన్నత చదువులు పూర్తి చేశాడు. ఆంధ్రాయూనివర్సిటీ నుంచి ఎంఏ పట్టా పొందాడు. ఇక ఇమ్మానుయేలు ఎడ్యుకేషనల్ క్యాంపస్‌లో బీఈడీ కూడా పూర్తి చేసిన దర్గాబాబు ఇక్కడే ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నాడు. దర్గాబాబు బాగోగులు చూసుకునే జీవన్‌రాయ్ దంపతులు వివాహ విషయంలోనూ కూడా శ్రద్ధ తీసుకుని విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన సిగనం కృష్ణవేణితో వివాహం కుదిచ్చారు. ఈ మేరకు గురువారం తామరంలో జీవన్‌రాయ్, నలినీరాయ్ చేతుల మీదుగా వీరిద్దరి ఆదర్శ వివాహం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగులు ఏ విషయంలోనూ తక్కువ కాదని, వారికి ప్రోత్సాహం, సహాయ సహకరాలు అందిస్తే వారికాళ్లమీద వారు నిలబడతారన్నారు. ఇలాంటి వివాహాల ద్వారా సమాజంలో ఎందరికో ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వికలాంగ శాఖ ప్రతినిధులు, ఇమ్మానుయేలు సిబ్బంది నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
గులాబీ తోటలో పరువు హత్య
కర్ణాటక, దొడ్డబళ్లాపురం: ప్రేమకు చిహ్నమైన గులాబీ తోటలో గులాబీ పొదలు ప్రేమికుని రక్తంతో తడిసిపోయాయి. గులాబీ తోటల్లో విహరించాల్సిన వరుడు అక్కడే విగతజీవిగా మారిపోవడంతో కొత్త కాపురంలో శాశ్వతంగా విషాదం తాండవిస్తోంది. ఐటీ సిటీ శివార్లలో పరువు హత్య కలకలం సృష్టిస్తోంది. యువకుణ్ని ‘గుర్తు తెలియని దుండగులు’ గొంతుకోసి దారుణంగా హత్యచేసిన సంఘటన దేవనహళ్లి తాలూకా నల్లూరు గ్రామంలో చోటుచేసుకుంది. ఇదే తాలూకా అరిశినకుంట గ్రామానికి చెందిన గిరిజన కుటుంబానికి చెందిన హరీష్ నాయక్ (30) హత్యకు గురైన యువకుడు. ఆరు నెలల క్రితం నల్లూరు గ్రామానికి చెందిన బీసీ వర్గం యువతిని హరీష్ ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. స్థానికంగా ఇతడు ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేసవాడు. తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తారు. అమ్మాయి తరఫువారు సమాజంలో పలుకుబడి ఉన్నవారని తెలిసింది. అప్పటి నుంచి హరీష్‌కు బెదిరింపులు వస్తున్నట్లు బంధుమిత్రులు చెబుతున్నారు. బుధవారం ఉదయం.. ఇలా ఉండగా మంగళవారం రాత్రి నల్లూరు వద్ద ఒక గులాబీ తోటలో హరీష్ హత్యకు గురయ్యాడు. గొంతు కోసి ఉంది. హత్య ఎవరు చేశారు, ఎలా, ఎందుకు చేశారనే విషయాలు తెలిసిరాలేదు. బుధవారం పొద్దున శవాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలాన్ని చెన్నరాయపట్టణ పోలీసులు పరిశీలించారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో గొడవలు జరగకుండా పోలీసులు నిఘా వేశారు. -
మంత్రిపై ప్రేమజంట ఫిర్యాదు
టీ.నగర్: తమను విడదీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కులాంతర వివాహం చేసుకున్న ప్రేమజంట మంత్రిపై ఫిర్యాదు చేసింది. దీనిపై హోసూరు డీఎస్పీ శుక్రవారం విచారణ జరిపారు. వివరాలు.. హోసూరు సమీపం దాసరపల్లి గ్రామానికి చెందిన రైతు మునిరెడ్డి కుమార్తె పవిత్ర (23). బీకాం చదివిన ఈమె ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. అదే ప్రాంతానికి చెందిన పిల్లప్పా కుమారుడు ఆనంద్ (29) హోసూరులో కూరగాయల మండి నడుపుతున్నాడు. పవిత్ర, ఆనంద్ రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇద్దరూ వేర్వేరు కులాలకు చెందినవారు కావడంతో వారి ప్రేమకు పవిత్ర తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో ఇంటి నుంచి పరారైన ప్రేమజంట గత నెల 31న సూళగిరిలోని తిమ్మరాయప్పన్ గుడిలో వివాహం చేసుకున్నారు. వారానికి పైగా కుటుంబం నడిపిన వీరు ప్రస్తుతం తెలుగులో మాట్లాడిన వీడియో ఫేస్బుక్లో విడుదల చేశారు. తాము రెండేళ్లుగా ప్రేమించుకుని వివాహం చేసుకున్నామని వధువు పవిత్ర బంధువులు, అదే వర్గానికి చెందిన మంత్రి బాలకృష్ణారెడ్డి తమను బెదిరిస్తున్నట్లు తెలిపారు. పోలీసుల ద్వారా బెదిరిస్తుండడంతో తమకు ఆత్మహత్య చేసుకోవాలన్న విరక్తిలో ఉన్నట్లు వారు తెలిపారు. తమకు భధ్రత కల్పించాలని కోరుతూ కృష్ణగిరి, ధర్మపురి ఎస్పీ కార్యాలయాలను ఆశ్రయించారు. హోసూరు డీఎస్పీ కార్యాలయానికి శుక్రవారం వెళ్లిన ప్రేమజంట వద్ద డీఎస్పీ మీనాక్షి విచారణ జరిపారు. దీనిపై మీనాక్షి మాట్లాడుతూ తన కుమార్తె కనిపించలేదని పవిత్ర తండ్రి బాగలూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ప్రేమజంట వద్ద విచారణ జరిపామని, మంత్రి ఉత్తర్వులతో ప్రేమజంటను బెదిరించినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని అన్నారు. -
పెట్రోల్ పోసుకుని యువజంట హంగామా
కర్ణాటక, కోలారు: పెళ్లయి సంతోషంగా గడపాల్సిన జంట వేధింపులతో ఆవేదన చెందుతోంది. కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న ప్రేమికులు ఇంట్లో వారి వేధింపులు తాళలేక పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించిన ఘటన సోమవారం నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ ముందు కలకలం సృష్టించింది. కోలారు తాలూకా దండిగానహళ్లి గ్రామానికి చెందిన నవ దంపతులు హేమంత్‌కుమార్ (22), చైత్ర (20) తొమ్మిది నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. దీంతో రెండు కుటుంబాల మధ్య తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పెళ్లయిన కొత్తలో కొంతకాలం వేరే ఇంట్లో కాపురం ఉన్నారు. ప్రస్తుతం భార్య గర్భిణి కావడంతో హేమంత్‌కుమార్ తన ఇంటికి తీసుకు వచ్చాడు. అయితే ఇది ఇష్టం లేని హేమంత్‌కుమార్ కుటుంబం వారు చైత్రను వేధించడం మొదలుపెట్టారు.దీనిని భరించలేని దంపతులు సోమవారం నేరుగా రూరల్ స్టేషన్ వద్దకు వచ్చి తమ వద్ద తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పటించుకోవడానికి ప్రయత్నించారు. వెంటనే అక్కడ ఉన్న వారు అడ్డుకుని రక్షించడంతో ఘోరం తప్పింది. అత్తమామలు వేధిస్తున్నారు : చైత్ర చైత్ర మాట్లాడుతూ హేమంత్‌కుమార్ తండ్రి శ్రీనివాస్, తల్లి మునిరత్నమ్మ తమ్ముడు కార్తీక్‌లు తనను నిత్యం వేధిస్తున్నారని ఆరోపించారు. దీనిపై పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం కనిపించలేదని తెలిపారు. తనపై దాడి చేస్తున్నారని వాపోయింది. పోలీసులు తన అత్తమామ, మరిదిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కోలారు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
నా భర్త ఆత్మహత్యకు కులాంతర వివాహమే కారణం
చిత్తూరు, రొంపిచెర్ల: తన భర్త ఆత్మహత్యకు కులాంతర వివాహమే కారణమని మృతుని భార్య వెంకటరత్నమ్మ బోరున విలపించారు. ఆమె శనివారం మాట్లాడుతూ మధు తిరుపతిలో డిగ్రీ చదివే సమయంలో తాను కూడా అక్కడే చదువుకుంటున్నానని చెప్పింది. తనను ప్రేమిస్తున్నానని వెంట పడుతుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని పేర్కొంది. పోలీసులు ఎదుట మధు పెళ్లి చేసుకుంటానని చెప్పాడని వివరించింది. అందుకు మధు తల్లిదండ్రులు ఒప్పుకోలేదని తెలిపింది. వారిని ఎదిరించి కులాంతర వివాహం చేసుకున్నామని పేర్కొంది. మొదట్లో గ్రామంలో అందరూ తమను అంటరానివారిగా చూసేవారిని వాపోయింది. పీలేరులో కాపురం పెట్టామని చెప్పింది. స్వగ్రామానికి వస్తే కోళ్లఫారం పెట్టిస్తామని అత్తామామలు చెప్పడంతో వచ్చామని తెలిపింది. కోళ్లఫారంలో వచ్చిన ఆదాయాన్ని అత్తింటి వారే తీసుకునే వారని, దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని వాపోయింది. 15 రోజుల క్రితం తన బిడ్డకు అనారోగ్యంగా ఉంటే తల్లి సాయంతో చికిత్సలు తీసుకోవాలని పుట్టింటికి వెళ్లానని తెలిపింది. ఈ నెల 27న తన భర్త పోన్ చేశాడని, బిడ్డ వైద్యం కోసం డబ్బులు అవసరం అవుతాయని చెప్పానని పేర్కొంది. తన దగ్గర డబ్బు లేదని, నీవు ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని తిరిగి రావాలని చెప్పాడని తెలిపింది. శనివారం సాయంత్రం ఎస్ఐ ప్రసాద్ తనకు ఫోన్ చేసి మధు ఆత్మహత్య చేసుకున్నాడని తెలియజేశారని కన్నీరుమున్నీరైంది. కులాంతర వివాహం చేసుకున్నాడని తల్లిదండ్రులు చిన్నచూపు చూడడంతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు తమకు ఎవరు దిక్కని బోరున విలపించింది. బా«ధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
కులాంతర వివాహం.. వరుడి ఇల్లు ధ్వంసం
కర్ణాటక,మాలూరు: యువతీ యువకుడు కులాంతర వివాహం చేసుకోగా వధువు తల్లిదండ్రులు వరుడి ఇంటిని ధ్వంసం చేశారు. ఈఘటన గురువారం రాత్రి తాలూకాలోని హురళగెరె గ్రామంలో చోటు చేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన శశికుమార్(25 డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదే క్రమంలో ఇదే గ్రామానికి చెందిన రమ్య (21)తో పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరు కులాలు వేరు కావడంతో వారి పెళ్లికి తల్లిదండ్రులు వ్యతిరేకించారు. దీంతో ప్రేమికులు ఇతర ప్రాంతానికి వెళ్లి వివాహం చేసుకొని గ్రామానికి వచ్చారు. కోపోద్రిక్తులైన రమ్య పోషకులు రాత్రి 11 గంటల సమయంలో శశికుమార్ ఇంటిపై దాడి చేశారు. శశికుమార్‌ను చితకబాది ఇంటిని ధ్వంసం చేశా రు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రమ్య తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. -
పేదింటి యువతికి అండగా.. కులాంతర వివాహం
టెక్కలి: టెక్కలిలో విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన నిరుపేద యువతి శ్రీదేవి వివాహానికి విశ్వబ్రాహ్మణులంతా అండగా నిలిచారు. తల్లిదండ్రుల పాత్రలో కన్యాదానం ఇచ్చారు.. కుటుంబ సభ్యులు మాదిరిగా హాజరై బ్రాహ్మణ యువకునితో వైభవంగా వివాహం జరిపించారు. వివరాల్లోకి వెళితే.. టెక్కలిలోని రెడ్డికవీధికి చెందిన లక్కోజు నీలవేణి, కుమార్తె శ్రీదేవిలు నిరుపేదలు. దీంతో శ్రీదేవికి వివాహం చేసే బాధ్యతను పట్టణంలోని విశ్వబ్రాహ్మణులంతా వారి భుజాన వేసుకున్నారు. ఇదే సందర్భంలో హైదరాబాద్‌లో ఉంటున్న లోకేశ్‌శర్మ అనే బ్రాహ్మణ యువకుడు పేదింటి యువతిని వివాహం చేసుకునేందుకు ఆలోచన చేశాడు. ఈ క్రమంలో టెక్కలి మండలం సుఖదేవ్పేట గ్రామానికి చెందిన బొడ్డు ఢిల్లేశ్వరరావుకు పరిచయం కలిగిన వ్యక్తులు హైదరాబాద్‌లో ఉండడంతో వారి ద్వారా శ్రీదేవి గురించి తెలుసుకున్నాడు. టెక్కలిలో విశ్వబ్రాహ్మణ సంఘాన్ని సంప్రదించి వివాహానికి సిద్ధమయ్యాడు. దీంతో బుధవారం టెక్కలి లక్ష్మీ నృసింహా స్వామి ఆలయంలో వీరి వివాహం జరిగింది. -
కులం పేరుతో దూషించారని వివాహిత ఆత్మహత్య
సాక్షి, హిందూపురం అర్బన్ : కులం పేరుతో దూషించారని మనస్తాపం దళిత సామాజిక వర్గానికి చెందిన అరవింద (24) అనే వివాహిత బుధవారం ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ సీఐ చిన్నగోవిందు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని వీవర్స్కులానికి చెందిన ప్రసాద్, దళిత అరవింద(24)ను కులాంతర వివాహం చేసుకున్నాడు. ఆరు నెలల కలిసిబాగానే ఉన్నప్పటికి సీమంతం సమయంలో అరవిందను కులంపేరుతో భర్త వేధింపులకు గురిచేశాడు. మనస్తాపానికి గురైన అరవింద బుధవారం ఇంటి పైకప్పునకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి వెంకటేశులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎస్పీ జిల్లా నాయకులు వెంకటరాముడు, గంగాధర్, శివశంకర్‌లు మృతురాలి ఇంటికి వెళ్లి వివరాలు ఆరా తీశారు. వివాహిత మృతికి కారకులైన భర్తను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
అనంతపురం జిల్లాలో ప్రేమ వ్యవహారంపై ఉద్రిక్తత
సాక్షి, అనంతపురం : జిల్లాలోని తాడిపత్రిలో ప్రేమ వ్యవహారం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. లక్ష్మీ, రఘు అనే యువతి, యువకులు ప్రేమించుకుని ఇటీవలే కులాంతర వివాహం చేసుకున్నారు. దీనిపై పెద్దలు పోలీసు స్టేషన్లో పంచాయతీ పెట్టించి ఆ జంటను విడదీశారు. దీంతో మనస్తాపానికి గురైన లక్ష్మీ ఆత్మహత్య చేసుకుంది. అనంతరం రఘు కుటుంబ సభ్యులు, బంధువులు స్థానిక టీడీపీ నేతలతో కలిసి లక్ష్మీని ఆమె తల్లిదండ్రులే హత్య చేశారంటూ తాడిపత్రి పోలీసు స్టేషన్‌పై దాడికి పాల్పడ్డారు. పోలీసు జీపు అద్దాలను పగలగొట్టి స్టేషన్‌లోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. టీడీపీ నేతలు మీడియా ప్రతినిధులపై దౌర్జనానికి పాల్పడ్డారు. ప్రేమ వ్యవహారాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
కులాంతర వివాహం చేసుకుందని ప్రేమ జంటపై దాడి
-
ప్లీజ్... ప్రాణాలు తీయొద్దు!
'ఆవేశంలోనే నా కూతుర్ని చంపుకున్నా'... కులాంతర వివాహం చేసుకున్న కన్నకూతుర్ని కడతేర్చిన తండ్రి నోటి నుంచి వచ్చిన మాటలివి. కూతురు వేరే సామాజిక వర్గానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకుందన్న కోపంతో అతడీ దుశ్చర్య పాల్పడ్డాడు. సమాజం ఎంత ముందుకు పోతున్నా కొన్ని జాడ్యాలు ఇంకా కొనసాగుతున్నాయనడానికి ఇలాంటి పరువు తక్కువ హత్యలే రుజువు. పరువు పేరుతో జరుగుతున్న ఈ దారుణాలు నానాటికీ పెరుగుతుండడమే అత్యంత ఆందోళన కలిగించే అంశం. గుంటూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీరు దీప్తిని ఆమె తండ్రే హత్య చేశాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా అంగీకరించాడు. కూతురు కులాంతర వివాహం చేసుకోవడంతో అతడీ ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమ పెళ్లి చేసుకోవడమే తాము చేసిన నేరమా అంటూ దీప్తి భర్త కిరణ్‌కుమార్ ప్రశ్నిస్తున్నాడు. కులాంతర వివాహం చేసుకోవడం పాపమా అంటూ నిలదీస్తున్నాడు. దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల్లో కుల దురహంకారం ఒకటి. వేరే సామాజిక వర్గానికి చెందిన వారిని ప్రేమించారనో, పెళ్లిచేసుకున్నారనో పెద్దలు పిల్లలు ఉసురు తీస్తున్న ఘటనలు దేశవ్యాప్తంగా రోజూ జరుగుతున్నాయి. పరువు పోయిందనే అక్కసుతో అకారణంగా ప్రేమికుల ప్రాణాలు తీస్తున్నారు కుల దురహంకారులు. ఆధునికత వైపు వడివడిగా అడుగులు వేస్తున్న నవ నాగరికులు మానవత్వం మర్చిపోతున్నారు. నైతిక విలువలకు తిలోదకాలిస్తున్నారు. విచక్షణ విడిచిపెడుతున్నారు. సాంకేతికపరంగా ఎంత ఎదిగినా మానవ సంబంధాల విషయంలో కుంచించుకుపోతున్నారు. కుల, మత, ప్రాంత వైషమ్యాలతో విద్వేషాలు పెంచుకుంటున్నారు. ప్రాణాలు దీయడానికి వెనుకాడడం లేదు. ఉన్నత చదువులు చదివిన వారు సైతం ఈవిధంగా వ్యవహరిస్తుండడం విస్మయపరుస్తోంది. పిల్లల ప్రేమను ఒప్పుకోకపోయినా ఫర్వాలేదు కానీ, వారి ప్రాణాలు తీయకండి. వారిని ఆదరించకపోయినా వారి బతుకు వారిని బతకనీయండి. -
చందన హత్య కేసులో నిందితుల అరెస్టు
మతాంతర వివాహం చేసుకున్న చందనప్రియను హతమార్చిన కేసులో నిందితులు రామ్‌నగర్‌కు చెందిన షేక్ ఇస్సామ్, షేక్ నిస్సార్ ఉద్దీన్ అలియాస్ నిస్సార్ అహ్మద్ అలియాస్ దినా, షేక్ ఉస్సేన్ పీరాను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి ఒక పిడిబాకు, రక్తము తుడిచిన గుడ్డలను స్వాధీనం చేసుకున్నారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు అనంతపురం శివారులోని బుక్కరాయసముద్రం గ్రామంలోని మహ్మద్ దవానుగుట్ట వద్ద అరెస్టు చేసినట్లు టూ టౌన్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మన్సూరుద్దీన్, ఎస్ఐ రెడ్డప్ప వెల్లడించారు. చందనను పాశవికంగా హత్య చేసిన ఘటనను ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన నేపథ్యంలో మృతురాలి చిన్నాన్న సుధాకర్ ఫిర్యాదు మేరకు అనంతపురం డీఎస్పీ నాగరాజ, జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు నగర టూ టౌన్ పోలీసులు ఈ కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగారు. సీఐ, ఎస్ఐ తెలిపిన మేరకు.. ప్రేమ వివాహం చేసుకున్న చందనప్రియ, ఇషాక్ స్థానిక రామ్‌నగర్ ఈ-సేవా రోడ్డులో శ్రీజ్ఞాన సరస్వతి ఇంగ్లిష్ మీడియం స్కూల్ సమీపంలో నివాసముంటున్నారు. ఆమెను వివాహం చేసుకున్నప్పటి నుంచి భర్త తన చెల్లెలను, తమ్ముడిని, ఇతర బంధువులను సక్రమంగా చూడడం లేదు. వారి పెళ్లయినప్పటి నుంచి ఆమె మరిది షేక్ నిస్సార్‌కు అమ్మాయిని ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీనికి తోడు చందన తన మరిదికి భోజనం కానీ, టిఫిన్ కానీ పెట్టేది కాదు. చీటికీమాటికి సూటిపోటి మాటలు అనేదని, దీంతో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని మరిది ఆమెపై ఈర్ష, ద్వేషం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 12న మధ్యాహ్నం 12 గంటల సమయంలో వదిన చందనతో షేక్ నిస్సార్ అహ్మద్ గొడవ పడి, ఆమెను కత్తితో ఎడమవైపు మెడకు, చెవి కింద బలంగా పొడిచి చంపి పారిపోయాడు. అనంతరం హతురాలి ఇద్దరు కూతుళ్లను తన అక్క ఇంటిలో వదిలడంతో ఆమె అనుమానంతో చందన భర్తకు ఫోన్ చేసి చెప్పింది. అతను వెంటనే ఇంటికి వెళ్లి చూడగా అప్పటికే భార్య చందన చనిపోయి ఉంది. వెంటనే తన తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. అందరూ చర్చించుకుని నిస్సార్‌ను కాపాడేందుకు ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్న హతురాలి రక్తాన్ని దుప్పట్లతో శుభ్రం చేసి, వాటిని రవి పెట్రోలు బంకు వద్ద మురికి కాలువలో పడేశారు. అనంతరం ఆమె మృతదేహాన్ని ఎవరికీ చెప్పకుండా అశోక్‌నగర్‌లోని మరానీ కబరస్తాన్‌లో పూడ్చి వేశారు. కాగా ఈ కేసును త్వరగా ఛేదించి నిందితులిన అరెస్ట్ చేసిన సీఐ, ఎస్ఐ, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. చందన మృతదేహానికి పోస్టుమార్టం.. చందనప్రియ మృతదేహానికి స్థానిక అశోక్ నగర్ శ్మశాన వాటికలో తహశీల్దార్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గురువారం పోస్టుమార్టం నిర్వహించారు. టూ టౌన్ సీఐ మన్సూరుద్దీన్, రెవెన్యూ, పోలీసు సిబ్బంది సమక్షంలో డాక్టర్ శంకర్ పోస్టుమార్టం చేశారు. గొంతుకు పక్క భాగాన, ఎడమ కంటికి కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. తదుపరి నివేదిక మూడు వారాల అనంతరం వెల్లడిస్తామని వారు తెలిపారు.