jntu
-
కలికిరి జేఎన్టీయూలో ర్యాగింగ్.. విద్యార్థి ఆత్మహత్య
సాక్షి అన్నమయ్య జిల్లా: కలికిరి జేఎన్టీయూలో ర్యాగింగ్ కలకలం రేగింది. కడప జిల్లా, మైదుకూరు మండలం జీవి సత్రానికి చెందిన ప్రవీణ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతూ మృతిచెందాడు.ఈ నెల 12న కలికిరి జెన్టీయూలో బీటెక్ చదివేందుకు కాలేజీలో జాయిన్ అయ్యాడు. ప్రవీణ్‌ను సీనియర్లు ర్యాగింగ్ చేయడంతో ఈ నెల 26న రాత్రి ఇంటికెళ్లి విషం తాగాడు. ఈ సంఘటనపై తల్లిదండ్రులు మైదుకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కలికిరి సిఐ.. ప్రిన్సిపల్, తోటి విద్యార్థులను విచారించారు. ర్యాగింగ్ నిజమని తేలితే బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. ర్యాగింగ్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బాధిత బంధువులు కోరుతున్నారు. -
జేఎన్టీయూ మెస్‌లో పిల్లి ఘటనపై అనుమానాలు!
హైదరాబాద్, సాక్షి: సుల్తాన్పూర్ జేఎన్టీయూ మెస్‌లో చట్నీలో ఎలుక ఘటన మరువక ముందే.. హైదరాబాద్ జేఎన్టీయూ మెస్‌లో పిల్లి ఆహారాన్ని ముట్టినట్లు ఓ వీడియో చక్కర్లు కొట్టింది. ఇది మీడియాకు ఎక్కడంతో.. జేఎన్టీయూ అధికారులు ఘటనపై విచారణ జరుపుతున్నారు. అయితే ఈ ఘటనపై అనుమానాలు ఉన్నాయని, ఇది ఎవరో కావాలని చేసిన పని అయ్యి ఉంటుందని ప్రిన్సిపాల్ నర్సింహారెడ్డి అంటున్నారు. ‘‘నిజానికి హాస్టల్లో కిటికీ తెరిచిన కారణంగానే పిల్లి లోపలికి వచ్చింది. ఒకవేళ పిల్లి వచ్చినా.. తినే టైంలో అక్కడ విద్యార్థులు, స్టాఫ్ ఉంటారు కాబట్టి భోజనం దగ్గరకు అవి వచ్చే అవకాశం ఉండదు. విద్యార్థులు భోజనం చేశాకే ఈ ఘటన చోటు చేసుకుంది. ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఆ వీడియో తీసి ఉంటారు. లేకుంటే.. వార్డెన్‌కో, ప్రిన్సిపాల్‌కో ఫిర్యాదు చేయకుండా నేరుగా నెట్లో పెడతారా?. సోషల్ మీడియా ప్రచారాల కోసమే అలా చేసి ఉంటారని భావిస్తున్నాం. ఘటనపై విచారణ చేస్తున్నాం. బాధ్యులెవరైనా సరే చర్యలు మాత్రం కఠినంగా ఉంటాయి అని ప్రిన్సిపాల్ అన్నారు. జేఎన్టీయూ కళాశాల మంజీరా వసతిగృహం భోజనశాలలోని ఆహార పదార్థాల గిన్నెల్లో పిల్లి మూతి పెట్టిన దృశ్యాలు ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వెంటనే ఈ అంశంపై పరిశీలన కోసం కూకట్పల్లి గవర్నమెంట్ ఫుడ్ వెరిఫికేషన్ కమిటీ అధికారులు హాస్టల్లో పరిశీలనలు జరిపారు. ఎలాంటి వంటకాలను పిల్లి ముట్టుకోలేదని ప్రకటించారు. అయితే.. వంటగది, నిత్యావసరాల స్టోర్‌రూమ్‌ను తనిఖీ చేయగా.. అపరిశుభ్రంగా నీరు నిలిచి ఉండడాన్ని గమనించారు. కొన్ని కూరగాయలు పాడైపోవడంతో పారబోయించారు. వంటపాత్రలపై మూతలు, కిటికీలకు మెష్‌లు లేవు. కేర్టేకర్లు మెస్‌లో 24గంటలూ ఉండాలన్నారు. నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నామని, వారి ఆదేశాలకు అనుగుణంగా చర్యలుంటాయన్నారు. -
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై అనుమానం వద్దు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ప్రతీ పేదవాడి బిడ్డ గొప్పగా చదవాలని ఆనాడు వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ నిర్ణయం తీసుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం జేఎన్టీయూలో క్వాలిటీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్‌పై ఇంటరాక్షన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ‘ప్రభుత్వ విధానాలను వివరించాలనే ఈ కార్యక్రమం చేపట్టాం. ప్రతీ పేదవాడి బిడ్డ గొప్పగా చదవాలని ఆనాడు వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ నిర్ణయం తీసుకున్నారు. రకరకాల పరిస్థితుల్లో ప్రాధాన్యతలు మారి.. ఫీజు రీయింర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోయాయి. పాత బకాయిలపై ఎలా ముందుకెళ్లాలనే అంశాన్ని పరిష్కరించే బాధ్యత మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగిస్తున్నాం. ఈ అకాడామిక్ ఇయర్ నుంచి ఆన్‌టైమ్‌లో ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించేందుకు ప్రయత్నిస్తాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మీకు ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై త్రిముఖ వ్యూహంతో మా ప్రభుత్వం ముందుకు వెళుతుంది. దేశంలో, ప్రపంచంలో గొప్ప నిర్మాణాలన్నీ ఇంజనీర్లు సృషించినవే. మానవనిర్మిత అద్భుతాలన్నీ ఇంజనీర్లు ఆవిష్కరించినవే. ఇంజనీరింగ్ కాలేజీలు నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మాగారంగా మారకూడదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి దేశ భవిష్యత్తును నిర్మించేలా ఉండాలి. అందుకు కావాల్సిన సాయాన్ని అందించేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేవలం ఉద్యోగాలను సృష్టించే సంస్థలుగా కాదు.. దేశానికి మేధావులను అందించే సంస్థలుగా ఇంజనీరింగ్ సంస్థలు ఉండాలి. ఇంజనీరింగ్‌లో కేవలం కంప్యూటర్ సైన్స్‌పైనే కాదు.. సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ లాంటి అన్ని రకాల కోర్సులనూ ప్రోత్సహించాలి. స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా టాటా భాగస్వామ్యంతో రూ.2400 కోట్లతో ప్రభుత్వం ఐటీఐల రూపురేఖలు మారుస్తోంది. ఫార్మా, ఐటీ తరువాత ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ ప్రపంచాన్ని నడిపించబోతోంది. యువత కోసం త్వరలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం. ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం. మా ప్రభుత్వానికి భేషజాలు లేవు. నిరుద్యోగులకు మేలు జరిగేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి. నోటిఫికేషన్ల ప్రకారమే ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో ముందుకెళుతోంది. పదేళ్లు ఉద్యోగాల భర్తీ చేయాలని నిరుద్యోగ యువత కొట్లాడింది. కానీ.. ఇప్పుడు పరీక్షల వాయిదా కోసం కొన్ని రాజకీయ శక్తులు, కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఆమరణ దీక్షలు చేస్తున్నారు. త్వరలోనే జాబ్ క్యాలెండర్‌ను తీసుకురాబోతున్నాం. యూపీఎస్సీ తరహాలో ప్రతీ ఏటా క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తాం. విద్యాసంస్థలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారకూడదు అనేదే మా ప్రభుత్వ విధానం. మేం అధికారంలోకి వచ్చిన మొదటి 30 రోజుల్లోనే 30వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. ఆర్ధిక భారం, ఇతర సమస్యలు ఉన్నా.. ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ మా ప్రభుత్వం ముందుకు వెళుతోంది’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. -
చట్నీలో చిట్టెలుక
సంగారెడ్డి: సుల్తాన్పూర్ జేఎన్టీయూ హాస్టల్ వంట గదిలోని చట్నీ పాత్రలో చిట్టెలుక ప్రత్యక్షమవ్వడం కలకలం రేపింది. ఈ సంఘటనపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలివి. సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండలం సుల్తా¯Œన్పూర్ జేఎన్టీయూ హాస్టల్ మెస్ పనితీరు వారం రోజులుగా బాగా లేదని విద్యార్థులు పలుమార్లు ప్రి¯Œన్సిపాల్కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి విద్యార్థులు తినే చట్నీలో చిట్టెలుక ప్రత్యక్షమైంది. దాన్ని విద్యార్థులు వీడియో తీసి మంగళవారం సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో వైరంగా మారింది. విషయం తెలియగానే కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహ మంగళవారం ఉదయం హాస్టల్‌కు వెళ్లి పరిశీలించారు. చట్నీలో ఎలుక పడటం వాస్తవమేనని, కానీ విద్యార్థులు తిన్న తర్వాత కడిగేందుకు నీళ్లు పోసి ఉంచిన పాత్రలోనే ఎలుక ఉందని ఆయన స్పష్టం చేశారు. చట్నీలో ఎలుక పడిన ఘటనపై మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తక్షణం విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని అదనపు కలెక్టర్, ఆర్డీవో, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లోని హాస్టళ్లు, క్యాంటీన్లలో తనిఖీలు నిర్వహించాలన్నారు. నిబంధనలు పాటించని సంస్థల లైసెన్స్‌లను వెంటనే రద్దు చేయాలని ఆదేశించారు. హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, హాస్టళ్లు, క్యాంటీన్లలో ఆహార పదార్థాలు తయారు చేసే నిర్వాహకులపై నిఘా ఉంచాలని సూచించారు. అపరిశుభ్రతపై అడిషనల్ కలెక్టర్ ఆగ్రహం అడిషనల్ కలెక్టర్ మాధురి హాస్టల్‌ను సందర్శించి అక్కడి అపరిశుభ్ర వాతావరణంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులుగా శుభ్రం చేయకుండా పాత్రలను అలాగే ఉంచడమేమిటని కాంట్రాక్టర్‌ను నిలదీశారు. బాధ్యులను వెంటనే తొలగించాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆమె వెంట అందోల్ ఆర్డీవో పాండు, ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేందర్ తదితరులు ఉన్నారు. -
సాంబార్ లో ఎలుక
-
‘చట్నీలో చిట్టెలుక’.. సాక్షి కథనంపై స్పందించిన అధికారులు
సంగారెడ్డి, సాక్షి: సుల్తాన్ పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ క్యాంటీన్ చట్నీలో చిట్టెలుక ఉరుకులు పెట్టడంపై సాక్షి ఇచ్చిన కథనం.. ప్రభుత్వం దృష్టికి వెల్లింది. ఘటనపై ఆగ్రహం వ్యక్తి చేసిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ.. కారకులపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. దీంతో అధికార యంత్రాంగం కదిలింది. నాణ్యతలేని అల్పాహారం, భోజనంతో హాస్టల్ విద్యార్థులు వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈలోపు.. తాజాగా హాస్టల్ క్యాంటీన్ చట్నీలో చిట్టెలుక చక్కర్లు కొట్టడాన్ని కొందరు విద్యార్థులు వీడియో తీసి వైరల్ చేశారు. సాక్షిలో ఈ కథనం ప్రముఖంగా ప్రసారమైంది. దీంతో ప్రభుత్వం స్పందించింది. ఆ వెంటనే మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతో సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ మాధురి రంగంలోకి దిగారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ మాధురి, అందోల్ జోగిపేట డివిజన్ ఆర్డీవో పాండు మంగళవారం మధ్యాహ్నాం క్యాంపస్ హాస్టల్ చేరుకొని జరిగిన సంఘటనపై విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కొంతకాలంగా మెస్‌లో నాణ్యత లేని భోజనం అందిస్తున్నారన్న విద్యార్థుల ఫిర్యాదుల్ని.. అలాగే ఇవాళ్టి ఎలుక వీడియోను ఆమె పరిశీలించారు. కాంట్రాక్టర్‌ను తొలగించడంతో పాటు కేర్ టేకర్ పైనా లీగల్‌యాక్షన్ తీసుకుంటామని, నాణ్యమైన భోజనం అందేలా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ఘటనతో అలర్ట్.. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో, కళాశాలలో ఉన్న బోర్డింగ్, హాస్టలను , క్యాంటీన్లను తనిఖీలు నిర్వహించాలన్నారాయన. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తూనే.. ఆహార పదార్థాలను తయారు చేసే నిర్వాహాకులు తప్పనిసరిగా FSSAI లైసెన్స్ ను తీసుకోవాలని మంత్రి సూచించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని సంస్థల లైసెన్సులను వెంటనే రద్దు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మరోవైపు.. హోటల్స్, రెస్టారెంట్స్ తో పాటు బేకరీలు, బోర్డింగ్, హాస్టల్స్, క్యాంటీన్లు, ఆహార పదార్థాలు తయారు చేసే నిర్వాహకుల పై నిఘా ఉంచాలని ఫుడ్ సేఫ్టీ అధికారుల్ని మంత్రి ఆదేశించారు. -
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
అనంతపురం: ‘మా ప్రభుత్వం వ చ్చింది. మావాళ్లే పాలిస్తారు. మీరంతా రాజీనామా చేసి వెళ్లిపోవాలి. అలాగే యూనివర్సిటీలోని వైఎస్సార్ విగ్రహాన్ని శుక్రవారం ఐదు గంటల్లోపు తొలగించాలి. లేకపోతే మీ ఇష్టం..’ అంటూ తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (టీఎన్ఎస్ఎఫ్) నాయకులు, టీడీపీ కార్యకర్తలు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం(ఎస్కేయూ) వీసీ కె.హుస్సేన్‌రెడ్డి, రిజిస్ట్రార్ ఎంవీ లక్ష్మయ్యలకు అల్టిమేటం జారీ చేశారు. ఎన్నికల్లో టీడీపీ గెలిచిన నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు గురువారం ఎస్కేయూ ప్రధాన ద్వారం వద్ద సంబరాలు నిర్వహించారు. అనంతరం రిజిస్ట్రార్ ఎంవీ లక్ష్మయ్య చాంబర్‌కు వెళ్లి వెంటనే రాజీనామా చేయాలని పట్టుబట్టారు. ‘ప్రభుత్వం మారింది. మాకు అనుకూలమైన అధికారిని నియమించుకుంటాం. వెంటనే వెళ్లిపోండి..’ అని హెచ్చరించారు. అనంతరం వీసీ హుస్సేన్‌రెడ్డి చాంబర్‌కు వెళ్లి పదవికి రాజీనామా చేయాలని పట్టుబట్టారు. ఎస్కేయూలో ఏర్పాటుచేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని వెంటనే తొలగించాలన్నారు. ఇందుకోసం యూనివర్సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజినీర్‌ను పిలిపించాలని డిమాండ్ చేశారు. దీంతో భయపడిన వీసీ యూనివర్సిటీ ఎస్ఈని పిలిపించారు. యూనివర్సిటీలోని వైఎస్సార్ విగ్రహాన్ని తక్షణమే తొలగించాలని ఆయన్ను కూడా టీఎన్ఎస్ఎఫ్ నాయకులు హెచ్చరించారు. సమాచారం అందుకున్న ఇటుకలపల్లి సీఐ, ఎస్ఐ చేరుకుని టీఎన్ఎస్ఎఫ్ నేతలు, టీడీపీ కార్యకర్తలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. వర్సిటీ ఉద్యోగి తిమ్మప్ప కూడా వీసీని బెదిరించడం మంచి పద్ధతి కాదని, క్రమశిక్షణగా ఉండాలని కోరారు. దీంతో వారంతా వైఎస్సార్ విగ్రహాన్ని ఎప్పటిలోగా తొలగిస్తారో చెబితే తాము వెళ్లిపోతామన్నారు. ఆరో తేదీ వరకు ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో శుక్రవారం వైఎస్సార్ విగ్రహం తొలగిస్తామని అధికారులు తెలిపారు. దీంతో టీఎన్ఎస్ఎఫ్, టీడీపీ నాయకులు వెళ్లిపోయారు. అప్పటికప్పుడు పాలకమండలి సమావేశం ఎస్కేయూలో వైఎస్సార్ విగ్రహాన్ని పాలకమండలి అనుమతితో ఏర్పాటుచేసినందున విగ్రహం తొలగించేందుకు కూడా పాలకమండలి అనుమతి కావాలి. దీంతో వీసీ, రిజిస్ట్రార్ గురువారం సాయంత్రం అందుబాటులో ఉన్న పాలకమండలి సభ్యులతో సమావేశం ఏర్పాటుచేశారు. యూనివర్సిటీలో వైఎస్సార్ విగ్రహం తొలగింపు డిమాండ్ గురించి ప్రభుత్వానికి లేఖ రాసి, ప్రభుత్వ సూచన మేరకు వ్యవహరించాలని పాలకమండలి నిర్ణయించింది. కాగా, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జేఎన్టీయూ(ఏ)లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఆడిటోరియానికి ఎన్టీఆర్ పేరు పెట్టారు. అయినప్పటికీ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించలేదు. ఆడిటోరియం పేరును మార్చలేదని, టీడీపీ ఇంకా అధికారం చేపట్టకమునుపే ఇలాంటి చర్యలకు పూనుకోవడాన్ని విద్యార్థులు, అధ్యాపకులు తప్పుపడుతున్నారు. -
అనంతపురం: మాజీ ప్రిన్సిపాల్ దారుణహత్య.. అంతలోనే మరో విషాదం
అనంతపురం: వ్యక్తిగత కక్షతో సొంత మేనమామను గొంతుకోసి హత్య చేసిన ఘటన అనంతపురం పట్టణాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. మేనల్లుడి చేతిలో హతమైన మూర్తిరావు (58) గురించి తెలిసేలోపే భర్త వియోగాన్ని తట్టుకోలేక ఆయన భార్య శోభ కూడా గుండెపోటుతో మరణించడంతో స్థానిక జేఎన్టీయూ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి... అనంతపురం జిల్లా పామిడికి చెందిన మూర్తిరావు ఖోకలే దశాబ్దాల క్రితమే అనంతపురంలోని జేఎన్టీయూఏ ప్రధాన ద్వారం ఎదురుగా స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. ఆరేళ్లుగా అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న ఈయనకు ఓ కుమారుడు, కుమార్తె. కుమార్తెకు పెళ్లి సంబంధాలు చూస్తున్న నేపథ్యంలో నాలుగు నెలల క్రితం ఆయన ఉద్యోగం మానేశారు. భార్య కళ్లెదుటే దారుణం.. మూర్తిరావుకు షాపింగ్ కాంప్లెక్స్‌తో పాటు సొంతిల్లు ఉంది. వీటిని అద్దెకు ఇచ్చేసి ఆయన నగరంలోని ఓ అపార్ట్మెంట్లో కుటుంబసభ్యులతో ఉంటున్నారు. ఇంట్లో అద్దెకున్న మణికంఠ అనే వ్యక్తి ఆదివారం ఇల్లు ఖాళీ చేసి మూర్తిరావుకు ఫోన్ చేశారు. ఖాళీ చేసిన ఇంటిని చూసుకుని తాళాలు తీసుకు వెళ్లాల్సిందిగా కోరారు. దీంతో తన భార్య శోభతో కలసి ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటిని పరిశీలిస్తూ శోభ లోపలకు వెళ్లారు. అదే సమయంలో అక్కడే పొంచి ఉన్న మేనల్లుడు ఆదిత్య లోపలకు చొరబడి కత్తితో మూర్తిరావు గొంతులోకి పొడిచాడు. రెప్పపాటులోనే పలు మార్లు పొడిచి, అనంతరం అదే కత్తితో గొంతుకోశాడు. కళ్ల ముందే జరుగుతున్న దారుణం చూసి, భయపడిన శోభ గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగుతీసింది. ఇంతలో ‘అత్తా... నేనేక్కడికీ పారిపోను.. ఇక్కడే ఉంటా’ అంటూ ఆదిత్య అక్కడే ఉండిపోయాడు. హతుడి పక్కనే కూర్చొని.. మూర్తిరావును హతమార్చిన అనంతరం ఆదిత్య ఇంటి వెనుక ఉన్న బాత్రూమ్కు వెళ్లి చేతికి అంటిన రక్తాన్ని శుభ్రం చేసుకుని, మృతదేహం పక్కనే కూర్చుండి పోయాడు. ఇంతలోనే అక్కడకు చేరుకున్న పోలీసులు వచ్చి ఆదిత్యను అదుపులోకి తీసుకున్నారు. కాగా, నాలుగు రోజుల క్రితం మూర్తిరావు ఇంటికి ఎదురుగానే బ్యాచ్‌లర్‌లా పరిచయం చేసుకున్న ఆదిత్య ఓ గదిని అద్దెకు తీసుకుని అందులోకి మకాం మార్చినట్లు తెలుస్తోంది. పథకం ప్రకారమే మూర్తిరావును హత్య చేయాలని కుట్ర పన్నినట్లుగా సమాచారం. తమ కుటుంబాన్ని ఎదగనీయకుండా మామ చూస్తున్నారని, తనకు పెళ్లి సంబంధాలు రాకుండా అడ్డుకుంటున్నారనే అనుమానంతో హత్య చేసినట్లు పోలీసుల ఎదుట నిందితుడు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్‌లైన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. నిందితుడిని సోమవారం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. వివాదరహితుడు మేనల్లుడి చేతిలో కిరాతకంగా మూర్తిరావు హత్యకు గురికావడం.. అది జీర్ణించుకోలేక శోభ గుండెపోటుతో కన్నుమూయడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. జేఎన్టీయూఏలో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్, ఎంటెక్ పూర్తి చేసి పీహెచ్డీ పొందిన మూర్తిరావు పలు ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. వివాదరహితుడు, సౌమ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సివిల్ ఇంజినీరింగ్‌లో నిష్ణాతుడు. మంచి పరిశోధకుడు. అందరినీ ఆప్యాయంగా పలకరించే మూర్తిరావు హత్యకు గురైన విషయం తెలియగానే నగరం ఉలిక్కిపడింది. ఆయనను కడసారి చూసేందుకు జేఎన్టీయూఏ ప్రొఫెసర్లు, అనంతలక్ష్మి కళాశాల విద్యార్థులు బారులు తీరారు. కాగా, మూర్తిరావు భార్య శోభ... శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం పినదర్రి గ్రామ జెడ్పీహెచ్ఎస్లో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. కొడుకు ఉజ్వల్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా, కుమార్తె వైష్ణవి బెంగళూర్‌లో బ్యాంక్ ఉద్యోగిగా స్థిరపడ్డారు. -
ఓటు వేయకుంటే ఆత్మహత్య చేసుకుంటా.. తమిళిసై సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కౌశిక్ రెడ్డి ప్రచారంలో ఓట్లు అడిగిన విధానంపై తాజాగా తమిళిసై స్పందించారు. ఈ క్రమంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈరోజు హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఈవో వికాస్‌రాజ్, రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారధి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్‌రాస్ విచ్చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ..‘ఓటు వేయడం మన హక్కు. స్టేట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్‌కు మధ్య వారధిగా ఉండటం నా బాధ్యత. జనరల్ ఎన్నికలను విజయవంతంగా జరిపినందుకు శుభాకాంక్షలు. మొదటిసారి ఇంటి నుంచే ఓటు వేయడం అనేది మంచి పరిణామం. ఓటింగ్ రోజు సెలవు అనేది సరదా కోసం కాదని యువత గుర్తుంచుకోవాలి. ఓటు హక్కు వినియోగం అనేది యుద్ధంలో పాల్గొన్నట్టు అనుకోవాలి. ఓటు వేసిన మార్క్ చూసి గర్వంగా ఫీలవ్వాలి. నేను నోటాకు వ్యతిరేకం. ఎన్నికల బరిలో ఉన్న ఎవరో ఒకరిని యువత ఎన్నుకోవాలన్నారు. పాడి కౌశిక్ రెడ్డిపై ఫైర్.. ఇదే సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో ఓ అభ్యర్థి ఓట్లు అడిగిన అంశాన్ని తమిళిసై ప్రస్తావించారు. ఎన్నికల్లో తనకు ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా అని ఓ అభ్యర్థి అన్నారు. ఎన్నికల కమిషన్ అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి. కాగా, సదరు అభ్యర్థి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిగా తెలుస్తోంది. ఓటర్లను ఎవరూ బెదిరించకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. ఓటు శాతం పెరగడానికి ప్రకటనలు ఒక్కటే ఉపయోగపడవు అనేది ఈసీ ఆలోచన. ఓటు అనేది మోస్ట్ పవర్ ఫుల్ ఆయుధం. ప్రజాస్వామ్యం బ్రతకాలంటే ఓటు వేయాలి. మంచి అభ్యర్థిని ఓటర్ ఎన్నుకుంటే మంచి పాలన అందుతుంది. ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలి’ అని కామెంట్స్ చేశారు. అనంతరం, 18 ఏళ్లు పూర్తి చేసుకొని కొత్తగా ఓటును పొందిన మనీషా అనే యువతికి గవర్నర్ తమిళిసై ఓటర్ ఐడీని అందించారు. అలాగే, జనరల్ ఎన్నికల్లో మెరుగైన పనితీరు కనబరిచిన పలువురు ఐఏఎస్ , ఐపీఎస్, వలంటీర్లకు గవర్నర్ సర్టిఫికేట్ అందించారు. -
లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నాం: వికాస్‌రాజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నట్టు తెలిపారు సీఈఓ వికాస్‌రాజ్. ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ఫైనల్ లిస్ట్ ప్రకటించనున్నట్టు స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఓటు హక్కు వినియోగించుకోవడం మన అందరి బాధ్యత అని కామెంట్స్ చేశారు. కాగా, ఈరోజు హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఈవో వికాస్‌రాజ్, రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారధి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్‌రాస్ విచ్చేశారు. ఈ సందర్భంగా వికాస్‌రాజ్ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నాం. ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తాం. జనరల్ ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిపాం. మొదటిసారి హోం ఓటింగ్ విజయవంతంగా నిర్వహించాం. ఓటు హక్కును వినియోగించుకోవడం మనందరి బాధ్యత. తొమ్మిది లక్షల ఓటర్స్‌ను కొత్తగా నమోదు చేసినట్టు తెలిపారు. -
Hyderabad: గూబ గుయ్‌మంటోంది.. నిద్రపోని మహానగరం
అర్ధరాత్రి ఒంటి గంట.. రెండు గంటలు.. ఎప్పుడైనా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ మెయిన్‌రోడ్లు చూశారా.. బంపర్ లైట్లు వేసుకుంటూ.. గట్టిగా హారన్లు కొట్టుకుంటూ కార్లు, టూవీలర్లు లెక్కకు మించి అతివేగంగా వెళ్తుంటాయి. ఏదో ఒక్క రోజు.. రెండు రోజులో కాదు.. ప్రతిరోజూ ఇదే వరస.. వాస్తవానికి సగటున పగటిపూట కంటే కూడా ఆయా రోడ్లపై రాత్రి పూట తిరిగే వాహనాలే ఎక్కువని ఓ అంచనా. హైదరాబాద్ మహానగరంలో రాత్రిళ్ల ఉద్యోగాలు, ప్రజల జీవనశైలి అలవాట్లలో వచ్చిన మార్పులకు పగలు, రాత్రి అనే తేడాలు చెరిగిపోయాయి. అయితే వచ్చిన చిక్కల్లా ఏమిటంటే విపరీతమైన శబ్దకాలుష్యం. చెవులకు చిల్లులు పడే ధ్వనుల మోత. పెరిగిన వాహనాలతోపాటు పెద్దఎత్తున సాగుతున్న గృహనిర్మాణ, మౌలిక సదుపాయాల కల్పన పనులు, పరిశ్రమలు.. డీజే సౌండ్లు, హడావుడితో అర్ధరాత్రి ఫంక్షన్లు తదితర రూపాల్లో పరిమితులకు మించి శబ్దాలు వెలువడుతున్నాయి. సాక్షి, హైదరాబాద్ : తాజాగా తెలంగాణ కాలుష్య నియంత్రణబోర్డు (పీసీబీ) గణాంకాలను పరిశీలిస్తే... పగలు కంటే కూడా రాత్రి సమయాల్లోనే మోతాదుకు మించి శబ్దాలు వెలువడుతున్నట్టు వెల్లడైంది. ఎప్పటి లెక్కో కాదు...తాజాగా ఈ నెల 1 నుంచి 14వ తేదీల మధ్య వెలువడిన శబ్దాలకు సంబంధించిన సమాచారం గమనిస్తే... జూబ్లీహిల్స్, జేఎన్టీయూ, తార్నాక, జూ పార్కు, గచ్చిబౌలిలలో పగటిపూట కంటే కూడా రాత్రిళ్లు ధ్వనులు ఎక్కువగా వెలువడుతున్నట్టు స్పష్టమవుతోంది. ఈ ఏడాది ప్రారంభం జనవరి 1 నుంచి జూన్ 30 వరకు దాదాపుగా ఇదే ట్రెండ్ కొనసాగిందంటే వాస్తవ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. మారిన జీవనశైలి అలవాట్లతో... పగలు, రాత్రి అనే తేడా లేకుండా వాహనాలు, ఇతర రూపాల్లో అంతకంతకూ పెరుగుతున్న విపరీతమైన ధ్వనులతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. నిర్ణీత పరిమితులకు మించి వెలువడుతున్న శబ్దాలతో చిన్నపిల్లలు మొదలు వృద్ధుల వరకు ప్రభావితమవుతున్నారు. జీవనశైలి అలవాట్లలో వచ్చిన మార్పు చేర్పులతో పగటి కంటే కూడా రాత్రిపూట పొద్దుపోయే దాకా వాహనాల రాకపోకలు, పెద్దశబ్దంతో హారన్లు మొగించడం, ఫంక్షన్లు, ఇతర కార్యకలాపాలు శబ్దాల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 7 లోపు నిర్ణీత ఆఫీస్ పనివేళల్లో పనిచేసే వారితోపాటు అమెరికా, యూరప్, బ్రిటన్ వేళలను బట్టి పనిచేసేవారు కూడా ఉంటున్నారు. రోజుకు మూడు, నాలుగు షిఫ్టుల్లో ఉద్యోగ విధులు, బాధ్యతల నిర్వహణలో నిమగ్నమవుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువు, ఇతర విధులు, బాధ్యతల్లో నిమగ్నమైనవారు పనిచేసే సమయాలు కూడా మారిపోతున్నాయి. అధిక ధ్వనులతో ఆరోగ్యంపై దుష్ప్రభావం రాత్రిపూట విశ్రాంతి తీసుకునే సమయంలో వాహనాలు, ఇతర రూపాల్లో ధ్వనులు పెరగడం వంటివి వివిధ సమస్యలకు పరోక్షంగా కారణమవుతున్నట్టుగా నిపుణులు చెబుతున్నారు. మోతాదుకు మించి అధికంగా వెలువడే ధ్వనులతో ఆరోగ్యం, మానసికస్థితి తదితరాలపై తమకు ఎలాంటి దుష్ఫలితాలు కలుగుతాయన్న దానిపై ప్రజలకు ఇంకా పూర్తిస్థాయి అవగాహన ఏర్పడలేదు. వాయుకాలుష్యం కారణంగా ఎలాంటి సమస్యలు వస్తాయో తెలిసినంతగా శబ్దకాలుష్యం గురించి అంత అవగాహన కలగకపోవడంతో వివిధ రూపాల్లో రోజువారీ జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ప్రస్తుతం సోషల్లైఫ్లోనూ ఎంటర్టైన్మెంట్ పేరుతో బర్త్‌డేలు, ఇతర ఫంక్షన్లను పెద్ద శబ్దాలతో డీజేలు వంటివి నిర్వహిస్తున్నారు. 80 డెసిబుల్స్‌కు మించి వెలువడే శబ్దాలకు 8 గంటలపాటు ఎక్సోపోజ్ అయితే వినికిడి శక్తిపై ప్రభావం పడుతుంది. చెవుల్లో గింగురమనే శబ్దాల(టినిటస్)తో మానసిక ఒత్తిళ్లు పెరిగేందుకు కారణమవుతున్నాయి. ఏకాగ్రత దెబ్బతింటోంది. ఉదయం నుంచి రాత్రి దాకా పరిమితులకు మించి వెలువడే శబ్దాలు మనుషుల ‘హ్యుమో డైనమిక్స్’ పైనా ప్రభావం చూపి రక్తపోటు రావొచ్చు. గుండె సంబంధిత సమస్యలకు దారి తీయొచ్చు. రాత్రిళ్లు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయాల్లో వెలువడే శబ్దాలు వృద్ధులు, పిల్లలు, విద్యార్థులపై ప్రభావం చూపుతాయి. ప్రస్తుతం ప్రజల జీవనశైలి అలవాట్లు మారినందున దానికి తగ్గట్టుగా ప్రభుత్వం అధిక«శబ్దాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ ఎం.మోహన్‌రెడ్డి -
జేఎన్టీయూ ఆధ్వర్యంలో స్టాఫ్ నర్సుల రాత పరీక్ష
సాక్షి, హైదరాబాద్: స్టాఫ్ నర్సుల పోస్టులకు నిర్వహించే రాత పరీక్ష బాధ్యతను జేఎన్టీయూకు అప్పగించాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. జేఎన్టీయూ ఆధ్వర్యంలోనే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. అయితే పరీక్ష పేపర్‌ను మాత్రం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోనే తయారు చేస్తారు. మే నెలలో రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. ఇటీవల టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీ నేపథ్యంలో స్టాఫ్ నర్స్ పోస్టుల పరీక్షను నిర్వహించడంపై అధికారుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు భారీగా కసరత్తు ప్రారంభించారు. టీఎస్పీఎస్సీ లీకేజీని దృష్టిలో పెట్టుకొని అదనపు చర్యలు తీసుకుంటున్నారు. భారీ డిమాండ్... స్టాఫ్ నర్స్ పోస్టులకు భారీగా డిమాండ్ ఏర్పడింది. వైద్య ఆరోగ్యశాఖ 5,204 స్టాఫ్ నర్స్ పోస్టులకు నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. వాటిని తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ భర్తీ చేయనుంది. మొత్తంగా 40 వేల దరఖాస్తులు వచ్చినట్లు బోర్డు వెల్లడించింది. ఒక్కో స్టాఫ్ నర్స్ పోస్టుకు ఎనిమిది మంది పోటీపడుతున్నారు. ఈ పోస్టులకు పేస్కేల్ రూ. 36,750 – రూ. 1,06,990 మధ్య ఉంటుంది. దాంతో అభ్యర్థుల నుంచి భారీగా డిమాండ్ ఏర్పడింది. కాగా వేలాది మంది అభ్యర్థులు ఇప్పటికే కోచింగ్ తీసుకుంటున్నారు. కాగా, రాత పరీక్షలో మార్కులకు గరిష్టంగా 80 పాయింట్లు ఉంటాయి. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు గరిష్టంగా 20 పాయింట్ల వరకు అదనంగా ఇస్తారు. గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించిన వారికి ప్రతి 6 నెలలకు 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే 2 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. రాతపరీక్ష సిలబస్ ఇదీ.. అనాటమీ ఫిజియాలజీలలో 14 అంశాలు, మైక్రోబయాలజీలో 6 అంశాలు, సై కాలజీ, సోషియాలజీ, ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్, ఫస్ట్ ఎయిడ్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, ఎన్విరాన్మెంటల్ హైజీన్, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, న్యూట్రిషన్, మెడికల్ సర్జికల్ నర్సింగ్, మెంటల్ హెల్త్ నర్సింగ్, చైల్డ్ హెల్త్ నర్సింగ్, మిడ్ వైఫరీ గైనకాలాజికల్ నర్సింగ్, గైనకాలజియల్ నర్సింగ్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, నర్సింగ్ ఎడ్యుకేషన్, ఇంట్రడక్షన్ టు రీసెర్చ్, ప్రొఫెషనల్ ట్రెండ్స్ అండ్ అడ్జస్ట్మెంట్, నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వార్డ్ మేనేజ్మెంట్లకు సంబంధించి రాత పరీక్ష సిలబస్ ఉంటుంది. ఈ మేరకు అభ్యర్థులు తయారు కావాలని నిపుణులు సూచిస్తున్నారు. -
జేఎన్టీయూ వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జేఎన్టీయూ వద్ద శనివారం రాత్రి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. జేఎన్టీయూ మెట్రోస్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలు చెలరేగి క్షణాల్లో బస్సు మొత్తం వ్యాపించాయి. అయితే అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే బస్సు నుంచి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. స్థానికులు సమాచారంతో అగ్నిమాపకశాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా బస్సులో మంటలు చెలరేగడానికి కారణాలు తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
JNTU విశ్వవిద్యాలయంలో విద్యార్థిని ఆత్మహత్య
-
JNTU Vizianagaram: చదువు+ ఉద్యోగం= జేఎన్టీయూ
జేఎన్టీయూ గురజాడ విజయనగరం యూనివర్సిటీ... చక్కని చదువుల నిలయం. ఆహ్లాదకర వాతావరణంలో ఉన్న వర్సిటీ.. విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తోంది. ప్రమాణాలతో కూడిన ఇంజినీరింగ్ విద్యను బోధిస్తోంది. నైపుణ్యాభివృద్ధిని పెంపొందిస్తోంది. ఉద్యోగ సాధనకు తోడ్పడుతోంది. పారిశ్రామిక వేత్తలుగా మలుస్తోంది. వివిధ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతోంది. వర్సిటీలో అమలుచేస్తున్న నూతన విద్యావిధానం, నిర్వహిస్తున్న కోర్సులు, ఉపాధికల్పనకు ‘సాక్షి’ అక్షరరూపం. విజయనగరం అర్బన్: విజయనగరం పట్టణానికి సమీపంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో 2007వ సంవత్సరంలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పడింది. ప్రస్తుత సీఎం జగన్మోహన్రెడ్డి కృషితో కళాశాల కాస్త వర్సిటీగా రూపాంతరం చెందింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న వర్సిటీ ఇంజినీరింగ్ చదువులకు నిలయంగా మారింది. విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించేలా.. వారిలో నైపుణ్యాలను పెంపొందించేలా ఈ ఏడాది మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ కోర్సుల్లో ఆనర్స్, మైనర్ పేరుతో విస్తరణ డిగ్రీలను ప్రవేశపెట్టింది. జాతీయ నూతన విద్యా విధానానికి అనుగుణంగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి రూపొందించిన నూతన సిలబస్, బోధనా విధానాన్ని అమలు లోకి తెచ్చింది. మొత్తం 8 సెమిస్టర్స్‌లో తొలి మూడు మినహా మిగిలిన ఐదు సెమిస్టర్స్తోపాటు 10 నెలల ఇంటెర్న్షిప్ చేయిస్తారు. ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ట్రిపుల్ఈ, ఐటీ, మెకానికల్ డిగ్రీలలో 66 సీట్ల చొప్పున, సివిల్, మెటలడ్జికల్ సబ్జెక్టు బీటెక్ డిగ్రీలలో 33 సీట్ల చొప్పున వర్సిటీలో బోధన సాగుతోంది. ఇంజినీరింగ్ ఆనర్స్ డిగ్రీ విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలకు అనుగుణంగా ఇంజినీరింగ్ డిగ్రీని మూడు విధాలుగా విభజించారు. ఎప్పటి మాదిరిగా ఇచ్చిన కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులకు యథావిధిగా సాధారణ బీటెక్ డిగ్రీ వస్తుంది. డిగ్రీ సిలబస్‌తోపాటు ఇతర (డిగ్రీ సబ్జెక్టులకు సంబంధం లేని) అదనపు ప్రతిభాంశాలను ఉన్నట్లు నిర్ధారించుకున్న వారికి ఆనర్ డిగ్రీ ఇస్తారు. దీనికోసం మొత్తం ఎనిమిది సెమిస్టర్స్లోనూ 80 శాతం ఉత్తీర్ణతను చూపాల్సి ఉంటుంది. తొలుత రెండో సంవత్సరం మొదటి సెమిస్టర్ ఫలితాలలో అప్పటికి పూర్తయిన మూడు సెమిస్ట్లో 80 శాతంతో చూపిన ఫలితాల (ఒకే సారి ఉత్తీర్ణత పొందాలి) ఆధారంగా రిజస్టర్ అయిన విద్యార్థిని ఆనర్ డిగ్రీ విభాగంలోకి తీసుకుంటారు. అప్పటి నుంచి చివరి సెమిస్టర్ వరకు కనీసం 160 క్రెడిట్ పాయింట్లతో పాటు అదనపు నైపుణ్యాలపై మరో 20 క్రెడిట్ పాయింట్లు తెచ్చుకోవాలి. 1,075 మందికి ప్లేస్మెంట్ కళాశాలలో ఏడు కోర్సులలో బీటెక్ డిగ్రీని విద్యార్థులకు అందిస్తోంది. ఇప్పటివరకు 1,079 మంది విద్యార్థులు వివిధ కంపెనీలలో ఉద్యోగాలు సాధించారు. 11.5 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మరికొందరు పారిశ్రామిక వేత్తలుగా రాణిస్తున్నారు. ప్రస్తుతం నడుస్తున్న విద్యాసంవత్సరం నాలుగో సంవత్సర విద్యార్థులు ఇప్పటివరకు 75 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. రానున్న రెండు నెలల్లో మరో 10 కంపెనీలు ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్టు వర్సిటీ వర్గాలు తెలిపాయి. 26 కంపెనీలతో వర్సిటీ ఎంఓయూ చేసుకున్నట్టు వెల్లడించాయి. ఇంజినీరింగ్ మైనర్ డిగ్రీ బీటెక్ కోర్సులో చేరే విద్యార్థులు ప్రధాన సబ్జెక్టుతోపాటు ఇతర ఇంజినీరింగ్ కోర్సుల్లో మరో సబ్జెక్టులో కూడా ప్రతిభ చూపాలనుకునే వారికి ఈ డిగ్రీ రూపంలో అవకాశాన్నిచ్చారు. మొదటి మూడు సెమిస్టర్ ఫలితాలలో 80 శాతం పాయింట్లను తెచ్చుకున్న వారికి మైనర్ డిగ్రీ కోర్సులకు రిజిస్టర్ చేయిస్తారు. నైపుణ్యం సాధించేలా బోధన అమెజాన్ సుపోర్టు ఇంజినీరింగ్ సంస్థలో ఉద్యోగం వచ్చింది. వార్షిక వేతనం రూ.11 లక్షలుగా నిర్ణయించారు. చాలా ఆనందంగా ఉంది. కళాశాలలో నైపుణ్యాభివృద్ధికి అనుగుణంగా అందించే బోధనలు వల్లే ఉద్యోగం సాధించగలిగాను. ఇంజినీరింగ్ సబ్జెక్టులతోపాటు ఉద్యోగావకాశాల అదనపు అంశాల్లో అందించిన గైడెన్స్ బాగుంది. – పి.సాహితి జ్యోత్స్న, సీఎస్ఈ విద్యార్థిని, జేఎన్టీయూ విజయనగరం ఉద్యోగ కల్పనే లక్ష్యంగా... ఉద్యోగ కల్పనే లక్ష్యంగా విద్యార్థుల నైపుణ్యాలు మెరుగుపరిచే ప్రణాళికలను రూపొందించాం. దేశ, అంతర్జాతీయ స్థాయిలోని 26 ప్రతిష్టాత్మకంగా కంపెనీలతో ఉద్యోగ నియామక ఒప్పందాలు పెట్టుకున్నాం. ఇంజినీరింగ్ కోర్సులపై అత్యాధునిక బోధనా విధానాన్ని అనుసరించడంతో పాటు విద్యార్థుల్లో ఉన్న అభిరుచికి అనుగుణంగా వారిలోని నైపుణ్యాలను వెలికితీస్తాం. దీనికోసం జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నాం. గత ఏడాది మొదటి సంవత్సరం నుంచి నూతన విద్యావిధానాన్ని అమలుచేస్తున్నాం. – ప్రొఫెసర్ శ్రీకుమార్, ప్రిన్సిపాల్, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, విజయనగరం చక్కని శిక్షణ టీసీఎప్ డిజిటల్ సంస్థలో 7.5 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాన్ని సాధించాను. ప్లేస్మెంట్ ఇంటర్వ్యూలో ఇంజినీరింగ్ సబ్జెక్టు అంశాలతో పాటు ఆ సంస్థకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞాన సామర్థ్యాలను పరీక్షించారు. కళాశాలలో ప్రత్యేకించి ఉన్న ప్లేస్మెంట్ విభాగం ఆ దిశగా అందించిన శిక్షణ వల్ల ఉద్యోగం సాధించగలిగాను. – ఎం.జాహ్నవి, సీఎస్ఈ, జేఎన్టీయూ, విజయనగరం -
జేఎన్టీయూ ముంగిలి..ఆనంద లోగిలి
అనంతపురం విద్య: రాయలసీమకే తలమానికంగా మారి, వజ్రోత్సవాల కీర్తి సొంతం చేసుకుని, ఇంజినీరింగ్ నిపుణుల ఖిల్లాగా పేరొందిన జేఎన్టీయూ అనంతపురం శనివారం ఆనంద లోగిలైంది. దేశం గర్వించదగ్గ ఎందరో శాస్త్రవేత్తలను అందించిన విద్యాలయంలో 12వ స్నాతకోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆద్యంతం అట్టహాసంగా సాగిన ఈ కార్యక్రమానికి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చాన్సలర్ హోదాలో హాజరుకావడం కొత్తకళను తెచ్చిపెట్టింది. గవర్నర్ హాజరైనప్పటి నుంచి ముగిసేవరకు విద్యార్థులు, అధికారులు క్రమశిక్షణతో మెలిగారు. గవర్నర్ ప్రసంగానికి యువత ముగ్దులయ్యారు. ముఖ్య అతిథిగా ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్. సోమనాథ్ హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. విశేష విజయ ప్రస్థానం కలిగిన భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ)కి చైర్మన్, వర్సిటీ పూర్వ విద్యార్థి డాక్టర్ జి. సతీష్ రెడ్డికి గౌరవ డాక్టరేట్ ఇవ్వడంతో వర్సిటీ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కీలకోపన్యాసం చేస్తూ.. నూతన ఆవిష్కరణలతో సమాజ ప్రగతికి పాటుపడాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులకు పతకాలు, పట్టాలు ప్రదానం చేశారు. ఏడాదికి 10 వేల మంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశం భారత రక్షణ రంగంలో ఏడాదికి 10 వేల మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తున్నట్లు డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ జి. సతీష్ రెడ్డి అన్నారు. గౌరవ డాక్టరేట్ అందుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు డీఆర్డీఓలో అవకాశం కల్పిస్తామన్నారు. ఎంటెక్ కోర్సుల్లో డిఫెన్స్ టెక్నాలజీ బ్రాంచ్‌లు ప్రవేశపెడతామన్నారు. జేఎన్టీయూ పూర్వ విద్యార్థిగా గౌరవ డాక్టరేట్ అందుకోవడం గర్వకారణంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆవిష్కర్తలకు ప్రోత్సాహం నూతన ఆవిష్కరణలు చేసే విద్యార్థులను ఇస్రో తరఫున ప్రోత్సహిస్తామని సంస్థ చైర్మన్ సోమనాథ్ అన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన ఆయన విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. శాస్త్ర సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతోందని, మరణాన్ని జయించడం, జీవిత కాలాన్ని పెంపొందించడంపై ఇప్పటికే ప్రయోగాలు సాగుతున్నా యన్నారు. సైన్స్ మద్దతుతో ఆకలి, వ్యాధులను జయించేందుకు చేసిన కృషి సత్ఫలితాలనిచ్చిందన్నారు. ‘రాకెట్‌ను ఒక శిశువుగా పరిగణిస్తా, రూప కల్పన నుంచి ప్రయోగం వరకూ అనేక జాగ్రత్తలు తీసుకున్నా.. ఒక్కోసారి విఫలమవుతుంటాం. జీవితంలో కూడా అనుభవం నుంచే పాఠాలు నేర్చుకోవాలి’ అని వివరించారు. అత్యుత్తమ సాంకేతికత గతల దేశాలే అభివృద్ధి చెందుతున్నాయని, ఈ విషయాన్ని విద్యార్థులు దృష్టిలో ఉంచుకోవాలన్నారు. అంతరిక్షంలోకి రోబోలను పంపి సమాచార సేక రణపై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. ఐదేళ్లలో వర్సిటీకి రూ.1,296 కోట్లు జేఎన్టీయూ (ఏ)కు మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ (మెరూ) గుర్తింపు దక్కిందని వీసీ ప్రొఫెసర్ జింకా రంగజనార్దన అన్నారు. వర్సిటీ ప్రగతి నివేదికను ఆయన వివరించారు. మెరూతో వచ్చే ఐదేళ్లలో రూ.1,296 కోట్ల నిధులు రానున్నాయన్నారు. వర్సిటీలో రూ.98 కోట్లతో పాలనా భవనం, ఫార్మసీ బ్లాక్, జిమ్ హాల్, యోగా, మెడిటేషన్ భవనాల నిర్మాణం జరుగుతోందని, మరో రూ.23 కోట్లతో ధ్యాన్‌చంద్ ఇండోర్ స్టేడియం నిర్మించనున్నట్లు తెలిపారు. పులివెందుల కళాశాలకు చెందిన ఎం. హర్షిత అమెజాన్ కంపెనీలో ఏడాదికి రూ.44 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం దక్కించుకుందన్నారు. 2020–21 విద్యా సంవత్సరంలో వర్సిటీ కాలేజీల్లో 565 మంది విద్యార్థులకు ఉద్యోగాలు లభించగా, అనుబంధ కళాశాలల్లో 5,904 మందికి ఉద్యోగాలు దక్కాయన్నారు. జయంత్‌కుమార్ రెడ్డి, గీతాచరణ్ గేట్– 2022లో టాప్–10 ర్యాంకులు సాధించారన్నారు. హాజరైన ప్రముఖులు స్నాతకోత్సవానికి పలువురు ప్రముఖులు, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి సిసోడియా, యూపీఎస్సీ మాజీ సభ్యుడు ప్రొఫెసర్ వై. వెంక ట్రామిరెడ్డి, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సీఈఓ ఆలూరి సాంబశివారెడ్డి, ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ రామకృష్ణా రెడ్డి, రెక్టార్ మల్లికార్జున రెడ్డి, రాయలసీమ వర్సిటీ వీసీ ఆనందరావు, ఎమ్మెల్సీ కత్తి నరసింహా రెడ్డి, రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి, కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్, జేసీ కేతన్‌గార్గ్, జేఎన్టీయూ రెక్టార్ విజయకుమార్, రిజిస్ట్రార్ శశిధర్, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ కేశవ రెడ్డి, తదితరులున్నారు. ‘బంగారు’ కొండలు జేఎన్టీయూ (ఏ) స్నాతకోత్సవం సందర్భంగా మొత్తం 22 మంది విద్యార్థులకు 35 బంగారు పతకాలను ప్రకటించారు. వీరిలో 19 మంది స్నాతకోత్సవ వేదికపై పతకాలు అందుకోగా..వివిధ కారణాలతో ముగ్గురు గైర్హాజరయ్యారు. మొత్తం పతకాలలో డి.సుప్రజ (జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ, అనంతపురం) ఏకంగా ఆరు బంగారు పతకాలు అందుకోగా.. ఎం.సతీష్‌కుమార్ రెడ్డి (అనంతపురం), కె.మైథిలి (అనంతపురం) మూడేసి చొప్పున, టి.అనూష (అనంతపురం), బి.సరయూ (అనంతపురం), బి.వీరవంశీ కుమార్ (అనంతపురం), సి.భావన రెడ్డి ( జేఎన్టీయూ కాలేజీ, పులివెందుల) రెండేసి బంగారు పతకాలు, వి.మౌనిక (అనంతపురం), జి.శ్రేయారెడ్డి (అనంతపురం), ఏ.సుధీర్ (పులివెందుల), కె.దేవహర్ష (పులివెందుల), బి.షేక్ షబీహా (పులివెందుల), కే. గురుతేజస్విని (పులివెందుల), యు.విష్ణువర్ధన్ రెడ్డి (అనంతపురం) ఒక్కొక్క బంగారు పతకం అందుకున్నారు. అలాగే వర్సిటీ అనుబంధ ప్రైవేటు కాలేజీల విభాగంలో ఎ.కిశోర్ ( విశ్వోదయ ఇంజినీరింగ్ కాలేజీ, కావలి), కె.సుప్రియ (ఎస్వీ ఇంజినీరింగ్ కాలేజ్ ఆఫ్ ఉమెన్, తిరుపతి), టి.శ్రీకాంత్ ( శ్రీవెంకటేశ పెరుమాళ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, పుత్తూరు), ఆర్.విష్ణుశ్రీ (శ్రీవెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, కొడవలూరు, నెల్లూరు జిల్లా), టి.హరిత (పీబీఆర్ విశ్వోదయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కావలి), నాగరోహిణి (నారాయణ ఇంజినీరింగ్ కాలేజీ, నెల్లూరు), కె.మనోజ (ఎస్వీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, తిరుపతి), బి.పెంచల కుమారి (అన్నమాచార్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, రాజంపేట) ఒక్కొక్క పతకం కైవసం చేసుకున్నారు. తండ్రి మరణించినా.. : నెల్లూరుకు చెందిన డి.సుప్రజ (జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ, అనంతపురం) ఏకంగా ఆరు బంగారు పతకాలు కైవసం చేసుకుని సత్తా చాటారు. ఎలక్ట్రికల్ విభాగంలో విశేష ప్రతిభ చూపి ‘బంగారు కొండ’గా నిలిచారు. సుప్రజ తల్లిదండ్రులు శివప్రసాద్, సరోజ. రెండేళ్ల క్రితం శివప్రసాద్ గుండెపోటుతో మరణించారు. తల్లి సరోజ ప్రోత్సాహంతో బీటెక్‌ను విజయవంతగా పూర్తి చేశారు. కళాశాల టాపర్‌గా నిలవడంతో పాటు బెస్ట్ అకడమిక్ ఫెర్ఫార్మర్ అమాంగ్ గర్ల్స్, చల్లా సుబ్బరాయుడు ఎండోమెంట్ గోల్డ్‌మెడల్, టీఎస్ రాఘవన్ ఎండోమెంట్ గోల్డ్‌మెడల్, చందుపల్లె వెంకట్రాయులు, సరోజమ్మ ఎండోమెంట్ గోల్డ్‌మెడల్‌ను సుప్రజ సొంతం చేసుకున్నారు. ఎలక్ట్రికల్‌కు సంబంధించిన పబ్లిక్ రంగ కంపెనీలో ఉద్యోగం సాధిస్తానని, నూతన ఆవిష్కరణలపై దృష్టి సారిస్తానని ఈ సందర్భంగా సుప్రజ చెప్పారు. -
కౌన్సెలింగ్‌కు ముందే కాలేజీల్లో తనిఖీలు
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్‌కు ముందే ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో తనిఖీలు చేపట్టాలని హైదరాబాద్ జేఎన్టీయూ యోచిస్తోంది. తనిఖీల కోసం ఈ ఏడాది కూడా అనుభవజ్ఞులతో కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు అవసరం. గుర్తింపు ఇవ్వాలంటే విశ్వవిద్యాలయం అధికారులు కాలేజీల్లోని వసతులను పరిశీలించాల్సి ఉంటుంది. గత రెండేళ్లుగా కరోనా నేపథ్యంలో ఈ ప్రక్రియ సజావుగా సాగలేదు., మౌలిక వసతులు లేని కాలేజీలను గుర్తించినా, ఆఖరి నిమిషంలో అనుబంధ గుర్తింపు ఇవ్వాల్సి వచ్చిందని అధికారులు అంటున్నారు. ఈసారి మాత్రం ఈ అవకాశం ఇవ్వబోమని జేఎన్టీయూహెచ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కంప్యూటర్ సైన్స్‌పై గురి గత కొన్నాళ్లుగా కంప్యూటర్ సైన్స్ కోర్సులకు ప్రాధాన్యత పెరుగుతోంది. గతేడాది కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కొత్త కోర్సుల్లో దాదాపు 5 వేల సీట్లు పెరిగాయి. మెకానికల్, సివిల్‌లో సీట్లు తగ్గించుకుని కొత్త కోర్సులకు అనుమతులు పొందాయి. అయితే, చాలా కాలేజీల్లో కంప్యూటర్ కోర్సుల బోధన ఆశించినస్థాయిలో లేదని జేఎన్టీయూహెచ్ గుర్తించింది అత్యున్నత ప్రమాణాలున్న ఫ్యాకల్టీ లేదని, లోతుగా అధ్యయనం జరగడంలేదనే నిర్ణయానికి వచ్చింది. అధ్యాపకుల అటెండెన్స్ కోసం తీసుకొచ్చిన బయోమెట్రిక్ కూడా సరిగా అమలవ్వడంలేదనే ఆరోపణలున్నాయి. అధికారిక లెక్కల్లో ఫ్యాకల్టీ ఒకరు ఉంటే, వాస్తవంగా బోధించేది వేరొకరనే విమర్శలు వస్తున్నాయి. దీన్ని అరికట్టేందుకు అధ్యాపకుల పాన్ నంబర్ ఆధారంగానూ వాస్తవాలు తెలుసుకుంటామని జేఎన్టీయూహెచ్ తెలిపింది. కానీ ఇది ఆచరణ సాధ్యం కాలేదు. ఇలాంటి సమస్యలన్నీ ఈసారి పరిష్కరించే దిశగా కృషి చేయాలని భావిస్తున్నట్టు అధికారులు తెలిపారు. మౌలిక వసతులు, కంప్యూటర్ కోర్సుల్లో సరైన ఫ్యాకల్టీ లేని కాలేజీలకు ముందుగా నోటీసులు ఇవ్వాలనుకుంటున్నట్టు తెలిపారు. కౌన్సెలింగ్‌కు ముందే.. జేఈఈ మెయిన్స్, ఇంటర్ పరీక్షల తేదీల్లో మార్పు కారణంగా ఈసారి ఎంసెట్ పరీక్ష కూడా ఆలస్యమయ్యే అవకాశం కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబర్ వరకూ కొనసాగే వీలుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కాలేజీల తనిఖీలు కౌన్సెలింగ్‌కు ముందే చేపట్టి, వాస్తవ నివేదికను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. అనుబంధ గుర్తింపు లభించిన కాలేజీలనే కౌన్సెలింగ్‌కు అనుమతించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు మండలి ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
JNTU లో పడగవిప్పిన ర్యాగింగ్ భూతం
-
విద్యల నగరానికి సాంకేతిక విద్యాహారం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విద్యల నగరంగా పేరొందిన విజయనగరం వాసులకు ఇన్నాళ్లకు యూనివర్సిటీ లేని లోటు తీరింది. ఉత్తరాంధ్ర ప్రజలకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. విజయనగరంలోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం–కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీకి పూర్తిస్థాయి యూనివర్సిటీ హోదాను కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. గురజాడకు గౌరవం.. విజయనగరంలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ఇన్నాళ్లూ జేఎన్టీయూ–కాకినాడకు అనుబంధంగా కొనసాగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో ఇప్పుడు జేఎన్టీయూ గురజాడ విజయనగరం (జేఎన్టీయూ–జీవీ) యూనివర్సిటీగా అవతరించింది. ఈ మేరకు రాష్ట్ర యూనివర్సిటీల చట్టాన్ని సవరించగా తాజాగా అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేసిన ఇంజనీరింగ్ కళాశాలను యూనివర్సిటీగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మార్పు చేశారు. అంతేకాదు సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు పేరుతో వర్సిటీని నెలకొల్పి ఉత్తరాంధ్ర ప్రతిష్టను ఇనుమడింపజేశారు. వైఎస్సార్ హయాంలో ఏర్పాటు.. పేద విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించేలా ప్రభుత్వ విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తానని నాడు దివంగత వైఎస్సార్ పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చారు. అనంతరం విజయనగరం శివారులో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలను 2007లో 80 ఎకరాల విస్తీర్ణంలో ప్రశాంత వాతావరణంలో నెలకొల్పారు. ఎప్పటికైనా యూనివర్సిటీగా విస్తరించాలని భావించారు. ఐదు గ్రూప్‌లతో ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభమైంది. తొలుత స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో తరగతులను నిర్వహించారు. మూడేళ్లలోనే రెండు వసతి గృహాలను నిర్మించారు. పక్కా భవనాల నిర్మాణం పూర్తి కావడంతో 2010 నుంచి సొంత స్థలంలోనే కళాశాల ప్రారంభమైంది. ఐదు కోర్సులకు సంబంధించి ఫ్యాకల్టీ పోస్టులను మంజూరు చేస్తూ వైఎస్సార్ హయాంలోనే ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం ఏడు ఇంజనీరింగ్ కోర్సులతో ఏడాదికి 420 మంది బీటెక్ విద్యార్థులు పట్టభద్రులవుతున్నారు. ఆరు కోర్సుల్లో ఎంటెక్ నిర్వహిస్తున్నారు. ఎంసీఏ కూడా ఉంది. ఉత్తరాంధ్ర విద్యార్థులకు వరం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలను యూనివర్సిటీగా విస్తరించడం ఉత్తరాంధ్ర విద్యార్థులకు వరం లాంటిది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో దాదాపు 40 ఇంజనీరింగ్ కళాశాలల నిర్వహణ జేఎన్టీయూ–కాకినాడ పర్యవేక్షణలో జరుగుతోంది. విద్యార్థులు ఎలాంటి సమస్య తలెత్తినా, మార్కుల జాబితాలు, ఇతరత్రా ధ్రువపత్రాల కోసం కాకినాడ వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడే యూనివర్సిటీ ఏర్పాటు కావడం వల్ల ఆ సమస్యలు ఉండవు. మరింత నాణ్యమైన బోధన అందుతుంది. – ప్రొఫెసర్ జి.స్వామినాయుడు, ప్రిన్సిపాల్, జేఎన్టీయూ విజయనగరం పెరిగిన ప్లేస్‌మెంట్స్, నాణ్యత.. వైఎస్సార్ హఠాన్మరణం అనంతరం జేఎన్టీయూ కళాశాలపై పాలకులు నిర్లక్ష్యం వహించారు. నిధులు కేటాయించక పోవడంతో పూర్తి స్థాయిలో బోధన, బోధనేతర సిబ్బందిని నియమించలేని పరిస్థితి ఏర్పడింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన హామీ మేరకు యూనివర్సిటీగా సీఎం జగన్ మార్పు చేశారు. రెండేళ్లుగా ఏటా 150 మందికిపైగా విద్యార్థులకు ప్లేస్మెంట్లు లభించడంతో నాణ్యత పెరిగింది. కొండవాలున సుందర ప్రాంగణం విజయనగరం శివారులోని కొండవాలున జేఎన్టీయూ ఏర్పాటైంది. దాదాపు 15,265 చదరపు మీటర్ల స్థలంలో మూడు అకడమిక్ బ్లాక్ భవనాలు, 2,865 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కళాశాల కేంద్ర గ్రంథాలయ భవనం ఇక్కడి ప్రత్యేకత. విద్యార్థులకు వైద్య సదుపాయాల కోసం 354 చదరపు మీటర్ల స్థలంలో డిస్పెన్సరీకి పక్కా భవనం ఉంది. శాఖల వారీగా వర్క్‌షాప్ షెడ్స్, ల్యాబ్‌లు, క్యాంటీన్లకు పక్కా భవనాలున్నాయి. చెరో రెండు చొప్పున విద్యార్థులు, విద్యార్థినులకు వసతి గృహాలను కేటాయించారు. క్రీడా మైదానం, ఇండోర్ స్టేడియం సదుపాయాలు కూడా ఉన్నాయి. -
అగ్రదేశాల్లో.. మనం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘భారతీయులు ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోరు. యుద్ధాలు జరగకుండా చూడటానికే ప్రయత్నిస్తాం. అదే సమయంలో మన రక్షణ రంగ సామర్థ్యాన్ని కూడా ఎప్పటికప్పుడు బలోపేతం చేస్తూనే ఉంటాం. శత్రు దుర్బేధ్య దేశంగా నిర్మించుకోవడం కోసం ఆధునిక సాంకేతికతతో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రస్తుతం శాస్త్రసాంకేతిక, రక్షణ, అంతరిక్ష పరిశోధనల్లో భారత్ అగ్రగామిగా వెలుగొందుతోంది’ అని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) చైర్మన్ డాక్టర్ జి.సతీష్‌రెడ్డి చెప్పారు. జేఎన్టీయూ–అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల వజ్రోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. సతీష్‌రెడ్డి ఇదే కళాశాలలో విద్యనభ్యసించారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడిన వివరాలివీ.. అన్నింటా స్వదేశీ పరిజ్ఞానమే.. అంతరిక్ష, రక్షణ రంగ పరిశోధనల్లో టాప్–5 దేశాల్లో భారత్‌కు స్థానం దక్కింది. ఇస్రో ప్రయోగాలకు సొంత సాంకేతిక పరిజ్ఞానాన్నే ఉపయోగిస్తున్నాం. అటామిక్ ఎనర్జీ, రక్షణ రంగంలోనూ ఆధునిక దేశీయ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాం. ఇప్పుడు మన దేశం ‘మేకిన్ ఇండియా నుంచి మేడ్ ఫర్ ద వరల్డ్’ స్థాయికి ఎదుగుతోంది. ఉపగ్రహాల కాల వ్యవధి ముగిసిన వెంటనే.. వాటిని కూల్చివేయడానికి వీలుగా ఏ–శాట్‌ను అభివృద్ధి చేశాం. తద్వారా భారత్ టాప్–4(అమెరికా, రష్యా, చైనా సరసన)లో నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత సుదూర ప్రాంతాల్లో ఉండే లక్ష్యాన్ని చేరుకునే గన్ 155 ఎం.ఎం ఆవిష్కరణ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో భారత్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. భారత్‌కు చైనా, పాకిస్తాన్ వంటి దేశాలతో తరచూ సరిహద్దుల్లో సమస్యలు వస్తున్నాయి. మనం ఎప్పటికప్పుడు అత్యాధునిక సర్వైలెన్సు వ్యవస్థ ఏర్పాటు చేసి, దీనిని సరిహద్దు భద్రతకు ఉపయోగిస్తున్నాం. పరిశోధన రంగాల వైపు వచ్చే ఇంజనీరింగ్ విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇది శుభపరిణామం. విద్యార్థులు గొప్ప ఆవిష్కరణలతో వస్తే.. ఆ ప్రాజెక్టుకు రూ.10 కోట్లు ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నాం. ‘అనంత’లో ఉండగానే.. అగ్ని ప్రైమ్ శుభవార్త అగ్ని ప్రైమ్ మిస్సైల్ ప్రయోగం శనివారం విజయవంతమైంది. కళాశాలలో పైలాన్ ఆవిష్కరించిన వెంటనే ఈ శుభవార్త నాకు తెలిసింది. ఆ వెంటనే రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు అభినందనలు తెలిపారు. నేను విద్యనభ్యసించిన కళాశాలలో ఉండగా ఇలాంటి ఘనత దక్కడం సంతోషంగా ఉంది. ఇక్కడి ప్రజల ఆప్యాయత చాలా గొప్పది. యువ ఇంజనీర్లకు డీఆర్డీవో చేయూత అనంతపురం విద్య: యువ ఇంజనీర్లకు డీఆర్డీవో తగిన చేయూతనిస్తోందని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ జి.సతీష్‌రెడ్డి తెలిపారు. శనివారం అనంతపురంలో జరిగిన జేఎన్టీయూ(ఏ) ఇంజనీరింగ్ కళాశాల వజ్రోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వజ్రోత్సవాల పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. జేఎన్టీయూ(ఏ)విద్యార్థులు ఎంటెక్ (డిఫెన్స్ టెక్నాలజీ) కోర్సు చదవడానికయ్యే మొత్తం ఖర్చును భరిస్తామని హామీ ఇచ్చారు. ఎంటెక్(డిఫెన్స్ టెక్నాలజీ) రెండో సంవత్సరం విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తామన్నారు. జేఎన్టీయూ(ఏ)లో డీఆర్డీవో ఎక్స్‌లెన్స్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, వీసీ జింకా రంగ జనార్దన, రెక్టార్ ఎం.విజయకుమార్, రిజిస్ట్రార్ సి.శశిధర్, ప్రిన్సిపాల్ పి.సుజాత పాల్గొన్నారు. -
కొత్త కోర్సులకు ఎన్వోసీ అవసరం లేదు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో నూతన కోర్సుల ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) తీసుకోవాలన్న జేఎన్టీయూ నిబంధనను హైకోర్టు తప్పుబట్టింది. ఇంజనీరింగ్ కళాశాలలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) మార్గదర్శకాల మేరకు కోర్సుల నిర్వహణ ఉంటుందని, ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అధికారం ఉండదని స్పష్టం చేసింది. ఈ మేరకు జేఎన్టీయూ అఫిలియేషన్ నిబంధనల మేరకు కొత్త కోర్సుల ప్రారంభానికి, తొలగింపునకు రాష్ట్ర ప్రభుత్వ ఎన్వోసీ తప్పనిసరి అంటూ జారీచేసిన మార్గదర్శకాలను నిలిపివేసింది. హైకోర్టును ఆశ్రయించిన 11 ఇంజనీరింగ్ కళాశాలలకు గుర్తింపు ఇవ్వాలని జేఎన్టీయూను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. శ్రీనిధి, కేశవ్ మెమోరియల్, సీఎంఆర్, వీఎన్ఆర్, వర్ధమాన్‌తోపాటు మరో ఆరు ఇంజనీరింగ్ కళాశాలలు దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. ఏఐసీటీఈ మార్గదర్శకాల మేరకు దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలలు నడుచుకుంటాయని, కొత్త కోర్సుల ప్రారం భానికి సంబంధించి నిబంధనల రూపకల్పనలో రాష్ట్ర ప్రభుత్వానికి, జేఎన్టీయూకు ఎటువంటి అధికారం లేదని ఇంజనీరింగ్ కళాశాలల తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఎన్వోసీ తప్పనిసరన్న నిబంధన సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని తెలిపారు. తెలంగాణ విద్యా హక్కు చట్టం ప్రకారం ఎన్వోసీ ఉండాలన్న నిబంధనను పెట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్న జేఎన్టీయూ తరఫు న్యాయవాది వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. -
పేర్లు మార్చి.. ప్రేమ పేరుతో నమ్మించి..
కర్నూలు (టౌన్): వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో పేర్లు మార్చుకుంటూ.. యువతులను ప్రేమ పేరుతో నమ్మించి మోసగిస్తున్న బీటెక్ విద్యార్థిని కర్నూలు ఒకటో పట్టణ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వివరాలివీ.. అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం తగ్గపర్తి గ్రామానికి చెందిన అన్వేష్ అనంతపురం జేఎన్టీయూలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. సోషల్ మీడియాలో యువతుల మొబైల్ నంబర్లు తెలుసుకుని వారిని ట్రాప్‌లో పడేసి ప్రేమిస్తున్నట్లు నమ్మిస్తున్నాడు. అన్వేష్ అనే వ్యక్తిగా ఒకరితో, భరత్ అనే పేరుతో మరో అమ్మాయితో, చరణ్ అనే పేరుతో ఇంకో అమ్మాయితో మాట్లాడుతూ ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నాడు. ఈ క్రమంలో ఒక అమ్మాయికి వివాహం కాగా, ఆమె ఫొటోలను వాట్సాప్‌లో ఆమె కుటుంబ సభ్యులకు పంపిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో బాధితులు కర్నూలు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఒకటో పట్టణ సీఐ కళా వెంకటరమణ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. నిందితుడు అన్వేష్‌ను కర్నూలు కలెక్టరేట్ వద్ద గుర్తించి అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. సోషల్ మీడియాలో ఉన్న అమ్మాయిలు ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సీఐ హెచ్చరించారు. -
వెయిటేజీ రద్దుతో నష్టం జరగదు
సాక్షి, హైదరాబాద్: కరోనా పరిస్థితుల్లో విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని జాగ్రత్తలతో ఎంసెట్ నిర్వహించేందుకు జేఎన్టీయూ ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల 4, 5, 6, 9, 10వ తేదీల్లో ప్రవేశ పరీక్ష జరగనుంది. కోవిడ్–19 వ్యాప్తి కారణంగా ఇంటర్ పరీక్షలను రద్దు చేయడం, సిలబస్ తగ్గింపు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంసెట్‌ను నిర్వహించాలని జేఎన్టీయూ నిర్ణయించింది. పరీక్ష జరగనున్న తీరు, చేస్తున్న ఏర్పాట్లు తదితర అంశాలపై ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ ఎ.గోవర్ధన్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే... ఇంటర్ పరీక్షల రద్దుతో వెయిటేజీ రద్దు గతేడాది వరకు ఇంటర్ మార్కులకు ఎంసెట్‌లో 25 శాతం వెయిటేజీ ఉండేది. అయితే ఈసారి వెయిటేజీని ప్రభుత్వం రద్దు చేసింది. కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలను రద్దు చేయడంతో, వెయిటేజీని కూడా రద్దు చేయాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. ఇలా వెయిటేజీ రద్దు చేయడం వల్ల విద్యార్థులకు ప్రత్యేకంగా ఎలాంటి నష్టం జరగదు. దీనిపై ఎవరూ ఫిర్యాదు కూడా చేయలేదు. పైగా సెకండ్ ఇయర్ పరీక్షలు లేకపోవడంతో చాలామంది వెయిటేజీ రద్దును ఆహ్వానించారు. ఎక్కువ ఆప్షన్లు ఉండవు కరోనా కారణంగా ఇంటర్ సెకండ్ ఇయర్లో సిలబస్‌ను 70 శాతానికి కుదించారు. అందుకు అనుగుణంగానే ఎంసెట్‌లోనూ సిలబస్ తగ్గించి, ఆ ప్రకారమే ప్రశ్నలు ఇస్తున్నాం. మొదటి సంవత్సరానికి సంబంధించి 100 శాతం, రెండో ఏడాదికి 70 శాతం సిలబస్‌ను తీసుకున్నాం. ప్రశ్నలను మొదటి, రెండో ఏడాదికి సంబంధించిన సిలబస్‌ను బట్టి సాపేక్షికంగా ఇస్తాం. దీనివల్ల మొదటి ఏడాది ప్రశ్నలు సహజంగానే ఎక్కువ వస్తాయి. సిలబస్‌ను కుదించడం వల్ల జేఈఈ మాదిరిగా ఎక్కువ ఆప్షన్లను ఇవ్వడం లేదు. గతేడాది కంటే తక్కువగా సెషన్లు ఆగస్టు 4, 5, 6 తేదీల్లో ఇంజనీరింగ్, 9, 10 తేదీల్లో వ్యవసాయ, మెడికల్ విద్యార్థుల కోసం పరీక్షలు ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక సెషన్, సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు మరొక సెషన్ ఉంటుంది. ఈసారి తక్కువ సెషన్లు పెట్టాం. గతేడాది ఇంజనీరింగ్‌కు 8 సెషన్లు పెడితే, ఈసారి 6 సెషన్లు పెడుతున్నాం. వ్యవసాయ, మెడికల్ కోర్సులకు గతేడాది నాలుగు సెషన్లు పెడితే, ఈసారి మూడు సెషన్లలోనే నిర్వహిస్తున్నాం. తెలంగాణలో 82 సెంటర్లు, ఆంధ్రప్రదేశ్‌లో 23 సెంటర్లలో పరీక్ష జరుగుతుంది. గతేడాది కంటే 27 వేల మంది ఎక్కువగా ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అందరూ ఇంటర్ పాస్ కావడం ఇందుకు కారణం కావొచ్చు. మాస్క్ ధరించాలి.. శానిటైజర్ తెచ్చుకోవాలి గతేడాది కంటే ఈసారి కరోనా జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటున్నాం. విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. శానిటైజర్, 500 ఎంఎల్ వాటర్ బాటిల్ తెచ్చుకోవచ్చు. కోవిడ్‌కు సంబంధించి ప్రతి విద్యార్థి సెల్ప్ డిక్లరేష¯Œన్ ఫారం ఇవ్వాలి. జ్వరం, జలుబు ఉందా లేదా అనేది డిక్లరేషన్‌లో స్పష్టం చేయాలి. జ్వర పరీక్ష చేస్తాం. ఒకవేళ జ్వరం, జలుబు వంటివి ఉంటే ప్రత్యేక ఏర్పాటు చేస్తాం. పరీక్ష సమయానికి కోవిడ్ నిర్ధారణ అయినవాళ్లు ముందుగా ఈ–మెయిల్ ద్వారా తెలియ జేయాలి. కరోనా పాజిటివ్ అని ఉన్న రిపోర్ట్‌ను జత చేయాలి. ఇలాంటి వారికి తర్వాత పరీక్షలు పెట్టే అవకాశముంది. ఇలా ఎవరైనా నిర్ధారించిన తేదీల్లో పరీక్షకు హాజరుకాలేకపోతే, వారు కూడా ముందస్తు సమాచారం ఇవ్వాలి. వారిని కూడా తదుపరి తేదీన జరిగే పరీక్షకు హాజరయ్యేలా అనుమతిస్తాం. మొత్తం 160 మార్కులకు పరీక్ష మొత్తం 160 మార్కులకు పరీక్ష ఉంటుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులు అర్హత సాధించాలంటే 40 మార్కులు రావాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అర్హత మార్కు ఉండదు. వారికి సున్నా మార్కు వచ్చినా సీటు పొందొచ్చు. పరీక్ష పేపర్ ఇంగ్లీషు–తెలుగు, ఇంగ్లీషు–ఉర్దూ, ఇంగ్లీష్లలో ఉంటుంది. అత్యధికంగా 1,96,500 మంది ఇంగ్లీషు పేపర్ ఒక్కటే ఆప్షన్‌గా ఇచ్చారు. 2018 నుంచి జేఈఈ పరీక్ష మాదిరి నార్మలైజేష¯Œన్ ప్రాసెస్ అనే పద్ధతిని పాటిస్తున్నాం. ఇది శాస్త్రీయంగా జరుగుతుంది. పేపర్‌కు స్కేలింగ్ ఉంటుంది. స్టాటిస్టికల్ ఫార్ములా ఉంటుంది. ఆ ప్రకారం మార్కులను లెక్కగట్టి ర్యాంకులను ప్రకటిస్తాం. కాబట్టి ఎవరికీ అన్యాయం జరగదు. రెండు గంటలు ముందు నుంచే అనుమతి ఈసారి హాల్ టికెట్‌తో పాటు పరీక్ష జరిగే కేంద్రం రూట్ మ్యాప్‌ను కూడా ఇస్తున్నాం. విద్యార్థులను రెండు గంటల ముందు నుంచే పరీక్షా ప్రాంగణంలోకి అనుమతిస్తాం. 1.15 గంటల ముందు హాల్లోకి అనుమతిస్తాం. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించం. మొబైల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, వాచ్‌లు అనుమతించరు. జర్కిన్లు వేసుకొని రాకూడదు. దరఖాస్తుకు నేడే చివరి తేదీ ఫైన్‌తో కలిపి ఎంసెట్‌కు ఈ నెల 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటివరకు 2.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఏపీ నుంచి 50 వేల మంది, ఇతర రాష్ట్రాల నుంచి 1,400 మంది ఉన్నారు. -
సెమిస్టర్ పరీక్షలకు ‘వసతి’ గండం!
నిజామాబాద్ జిల్లా మల్కాపూర్‌కు చెందిన జి.సౌజన్య కూకట్పల్లి జేఎన్టీయూలో బీటెక్ ఫైనలియర్ చదువుతోంది. ఇదివరకు ఇక్కడే ప్రైవేటు హాస్టల్లో ఉంటూ చదువుకోగా, కోవిడ్–19 నేపథ్యంలో ఏడాదిగా ఇంటి వద్ద నుంచి ఆన్లైన్ తరగతులకే పరిమితమైంది. ప్రస్తుతం సెమిస్టర్ పరీక్షలకు హాజరు కావడానికి రోజు తప్పించి రోజు ఇంటి నుంచి రాకపోకలు సాగిస్తోంది. దీంతో రోజుకు సగటున రూ. వెయ్యి ఖర్చవుతున్నాయి. ఇక్కడ ప్రైవేటు, సంక్షేమ, కాలేజీ హాస్టళ్లు ఇంకా తెరచుకోకపోవడం, నగరంలో ఉన్న బంధువుల ఇంటి వద్ద వసతి పొందే పరిస్థితి లేకపోవడంతో సౌజన్య తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. సాక్షి, హైదరాబాద్: ఆయా సెమిస్టర్ పరీక్షలకు హాజరవుతున్న అనేకమంది విద్యార్థులు వసతిలేక సౌజన్య మాదిరిగా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లోని డిగ్రీ, పీజీ విద్యార్థులకు (ఫస్టియర్ మినహా) సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. బీటెక్, జనరల్ డిగ్రీ విద్యార్థులకు ఈనెలాఖరు వరకు, పీజీ జనరల్, టెక్నికల్ కోర్సులు, ఇతర వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులకు ఆగస్టు రెండోవారం వరకు రోజు తప్పించి రోజు పరీక్షలు కొనసాగనున్నాయి. అయితే వసతిగృహాల్లో ఉండి చదువు కొనసాగించిన విద్యార్థులు ప్రస్తుతం వసతిలేక ఇబ్బంది పడుతున్నారు. కోవిడ్–19 వ్యాప్తి నేపథ్యంలో విద్యాసంస్థలతోపాటు మూతపడిన సంక్షేమ, ప్రైవేటు హాస్టళ్లు ఇంకా తెరచుకోలేదు. దీంతో దూరప్రాంతాల్లో ఉండే మెజార్టీ విద్యార్థులు నిత్యం ఇంటి వద్ద నుంచి కాలేజీలకు వచ్చి పరీక్షలు రాస్తున్నారు. రాష్ట్రంలో ఆయా సెమిస్టర్ పరీక్షలకు దాదాపు 4.72 లక్షలమంది హాజరవుతున్నారు. వీరిలో సంక్షేమ వసతిగృహాలు, ప్రైవేటు హాస్టళ్లలో, ప్రత్యేకంగా అద్దె గదుల్లో ఉండి చదువుకున్నవారి సంఖ్య 3 లక్షలు ఉన్నట్లు అంచనా. ఒకవైపు చార్జీలు, మరోవైపు తిండి ఖర్చులు విద్యార్థులకు భారంగా మారాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎక్కడ... దూరప్రాంతాల నుంచి వచ్చేవారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని విద్యార్థులు కోరుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. యూనివర్సిటీ హాస్టళ్లు, సంక్షేమ హాస్టళ్లు తెరిస్తే మేలు జరుగుతుందని విద్యార్థులు సూచించినా అధికార యంత్రాంగం స్పందించలేదు. హైదరాబాద్‌కు రెండ్రోజులకోసారి పరీక్షల కోసం వస్తున్నానని, దీంతో పరీక్షలపై ఏకాగ్రత పెట్టలేకపోతున్నానని కోదాడకు చెందిన ఇంజనీరింగ్ మూడో సంవత్సరం విద్యార్థి కె.అవినాశ్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశాడు. రాష్ట్రంలో 5 వేల విద్యార్థి వసతిగృహాలు రాష్ట్రంలో డిగ్రీ, పీజీ విద్యార్థులు వసతి పొందుతున్న హాస్టళ్లు 5 వేల వరకు ఉన్నట్లు అంచనా. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో 1,750 వసతిగృహాలున్నాయి. వీటిల్లో పోస్టుమెట్రిక్ కోర్సులు చదివే విద్యార్థుల కోసం వెయ్యి హాస్టళ్లు నిర్వహిస్తున్నారు. వీటి పరిధిలో 2 లక్షలకుపైగా విద్యార్థులున్నారు. ప్రైవేటు హాస్టళ్లు దాదాపు మూడువేలు ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు మూడు లక్షల మంది విద్యార్థులు వసతి పొందేవారు. -
పాత విధానంలోనే ఏపీ ఎంసెట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్ సహా వివిధ సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల ప్రవేశాలను గతంలో మాదిరిగానే యథాతథంగా నిర్వహించాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. పాత విధానంలోనే ఏపీ ఎంసెట్–2021ను నిర్వహించనుంది. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఇటీవల అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) కొత్త నిబంధనలను పేర్కొంటూ 2021–22 అప్రూవల్ హ్యాండ్‌బుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇంజనీరింగ్ చదవాలంటే ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్పనిసరిగా చదివి ఉండాలి. ఈ మూడు సబ్జెక్టులు చదవని ఇతర గ్రూపుల ఇంటర్ విద్యార్థులకూ ఇంజనీరింగ్ కోర్సుల్లోకి ప్రవేశాలు కల్పించేలా ఏఐసీటీఈ ఇటీవల నిబంధనలను విడుదల చేసింది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు అవసరమయ్యే కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఈసీఈ, సివిల్ ఇంజనీరింగ్ వంటి కోర్సులకు ఆ సబ్జెక్టులను తప్పనిసరి చేస్తూనే ఇతర కోర్సులకు ఇతర గ్రూపుల విద్యార్థులను అనుమతించాలని సూచించింది. ఇందుకు 14 ఆప్షనల్ సబ్జెక్టులను పేర్కొంటూ వీటిలో ఏ మూడింటి కాంబినేషన్‌తో ఇంటర్ చదివినా ఇంజనీరింగ్ కోర్సుల్లోకి అనుమతించవచ్చని తెలిపింది. అయితే అంతిమంగా ఈ నిబంధనలను అనుసరించడంపై నిర్ణయాన్ని ఆయా రాష్ట్రాల ఇష్టానికే వదిలేసింది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతోనే ఎంసెట్–2021 ఈ నేపథ్యంలో గతంలోని నిబంధనల ప్రకారమే ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. 2021–22 అప్రూవల్ హ్యాండ్‌బుక్‌లో ఏఐసీటీఈ పొందుపరిచిన వివిధ సబ్జెక్టుల కాంబినేషన్లు రాష్ట్రంలో లేకపోవడంతో పాత పద్ధతిలోనే అంటే.. ఇంటర్ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)తోనే ఇంజనీరింగ్‌లో అడ్మిషన్లు ఇవ్వనుంది. ఏపీ ఎంసెట్–2021లో కూడా ఇవే సబ్జెక్టులు ఉంటాయి. అయితే విద్యార్థులు ఇంటర్లో 45 శాతం (రిజర్వుడ్ కేటగిరీలకు 40 శాతం) మార్కులు సాధించి ఉండాలి. కరోనా నేపథ్యంలో ఇంటర్ తరగతులు ఆలస్యంగా ప్రారంభం కావడంతో సిలబస్‌ను 30 శాతం మేర తగ్గించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎంసెట్‌లో కూడా సిలబస్‌ను 30 శాతం మేర తగ్గించనున్నారు. ఏయే అంశాలపై బోధన జరిగిందో అవే అంశాల పరిధిలో ప్రశ్నలుండేలా ఉన్నత విద్యామండలి జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎంసెట్ నిర్వహణ బాధ్యత జేఎన్టీయూ–కాకినాడకే.. ఏపీ ఎంసెట్–2021 నిర్వహణ బాధ్యతను ఈసారి కూడా కాకినాడ జేఎన్టీయూకే అప్పగిస్తున్నారు. ఇప్పటికే వివిధ సెట్ల నిర్వహణ సంస్థలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఎంసెట్–2021 నిర్వహణ కమిటీ చైర్మన్‌గా జేఎన్టీయూకే వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎం.రామలింగరాజు వ్యవహరించనున్నారు. కన్వీనర్‌గా ప్రొఫెసర్ వి.రవీంద్ర ఉంటారు. ఎంసెట్‌ను కంప్యూటరాధారితంగా నిర్వహించనున్న నేపథ్యంలో ఐటీ సంస్థ ఎంపికపై ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి నివేదిక పంపింది. ప్రభుత్వ ఆమోదం రాగానే ఎంసెట్ సహా ఇతర సెట్ల షెడ్యూళ్లపై తదుపరి చర్యలు ప్రారంభించనుంది. కరోనా వల్ల గతేడాది ప్రవేశాలు ఆలస్యమైన నేపథ్యంలో ఈసారి కొంతముందుగానే పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నారు. పాత విధానంలోనే ఎంసెట్ – ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి ఇంజనీరింగ్ కోర్సులపై ఏఐసీటీఈ.. 2021–22 విద్యా సంవత్సరపు అప్రూవల్ హ్యాండ్‌బుక్‌లో కొన్ని కొత్త నిబంధనలు చేర్చినా వాటి అమలుపై రాష్ట్రాలకు వెసులుబాటు ఉంటుందని చెబుతోంది. కాబట్టి ఏపీ ఎంసెట్‌ను పాత విధానంలోనే నిర్వహిస్తాం. ఏఐసీటీఈ 14 సబ్జెక్టులతో ఆప్షన్లు పెట్టినా ఆ సబ్జెక్టులతో స్పెషల్ బ్రాంచ్‌ల కాంబినేషన్లు మన రాష్ట్రంలో లేవు. బీటెక్ బయోటెక్నాలజీలోకి ఇంటర్మీడియెట్ బైపీసీ విద్యార్థులను అనుమతిస్తున్నాం. ఆ విద్యార్థులకు మ్యాథ్స్‌లో బ్రిడ్జి కోర్సులు ప్రవేశపెట్టాం. కోవిడ్‌తో ఇంటర్ సిలబస్‌ను తగ్గించినందున ఎంసెట్‌ను కుదించిన సిలబస్ మేరకే నిర్వహిస్తాం.