Kusumanchi
-
ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఉద్రిక్తత
-
మంత్రి, ఎమ్మెల్యేకే ఫ్లెక్సీలు కడతారా?
కూసుమంచి: ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్‌లో మత్స్యశాఖ ఆధ్వర్యాన ఆదివారం ఏర్పాటుచేసిన చేప పిల్లల విడుదల కార్యక్రమం ప్రొటోకాల్ వివాదానికి దారితీసింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్రకు అధికారులు ఆహ్వానం అందించారు. కార్యక్రమం ఉదయం 10 గంటలకు మొదలుకావలసి ఉండగా, పదిన్నర సమయాన హైదరాబాద్ నుండి ఎమ్మెల్సీ, ఎంపీలు రిజర్వాయర్ వద్దకు వచ్చారు. అప్పటికింకా ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి చేరుకోలేదు. దీంతో ఎమ్మెల్సీ తాతా మధు.. ఎమ్మెల్యే ఎక్కడి వరకు వచ్చారంటూ ఆరాతీయగా మార్గమధ్యలో ఉన్నారని డీఎఫ్‌వో ఆంజనేయస్వామి బదులిచ్చారు. సమయపాలన లేకుంటే ఎలా? అంటూ ఎమ్మెల్సీ ఒకింత అసహనానికి గురవుతూనే, పక్కనే ఉన్న ఫ్లెక్సీలలో.. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, కలెక్టర్ గౌతమ్ ఫొటోలతో మూడు ఫ్లెక్సీలను గమనించారు. దీంతో ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. ‘మీరు ఆఫీసర్లు ఆఫీసర్లుగా ఉండాలి.. పనికిమాలిన పనులు చేయొద్దు. మీరు గవర్నమెంట్ అధికారి కాబట్టి ఎవరికీ ఊడిగం చేయొద్దు.. అందరికీ ఫ్లెక్సీలు ఎందుకు పెట్టలేదు? ఎమ్మెల్యే, మంత్రికే ఫ్లెక్సీలే ఎందుకు పెట్టారు.. గవర్నమెంట్ మీకు చెప్పిందా?’ అంటూ ఆగ్రహంతో ఊగిపోతూ అక్కడి నుండి ఎంపీలు, ఎమ్మెల్సీ ఖమ్మం వెళ్లిపోయారు. కాసేపటికి వచ్చిన ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి రిజర్వాయర్‌లో చేపపిల్లలను విడుదల చేశారు. అంతకుముందు జరిగిన ఘటనపై అధికారులను మందలించడమే కాక ప్రొటోకాల్ పాటించకపోతే ఎలా? అంటూ ప్రశ్నించారు. కాగా, కార్యక్రమం ముగిశాక ఎంపీ, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీని అధికారులు ఏర్పాటు చేయడం కొసమెరుపు. ఇదీ చదవండి: ఈడీ లేకుంటే బీజేపీనే లేదు -
ఎంత అమానుషం!.. చందా ఇవ్వలేదని కుల బహిష్కరణ
సాక్షి, ఖమ్మం: దేవుడి ఉత్సవానికి చందా ఇవ్వలేదనే కారణంతో ఓ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసిన ఘటన కూసుమంచి మండలంలోని నేలపట్లలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలోని దళిత వాడలో పది రోజుల క్రితం బంగారు మైసమ్మ ఉత్సవ నిర్వహణ కోసం ఉత్సవ కమిటీ సభ్యులు, కులపెద్దలు చందాలు వసూలు చేశారు. కులస్తులంతా ఇంటికి రూ.1,500 చొప్పున వేసుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో కలకొండ వీరబాబు అనే వ్యక్తి ఇంటికి వెళ్లి చందా అడగగా, తాను కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నానని, చందా ఇవ్వలేనని చెప్పాడు. దీంతో ఆగ్రహించిన కులపెద్దలు వీరబాబుకు కులస్తులు ఎవరూ సహాయం చేయవద్దని హుకుం జారీ చేశారు. దీంతో కులానికి చెందిన వారు ఎవరూ సహకరించకుండా ఉండడంతో వీరబాబు, అతడి తల్లి సుగుణమ్మ కులపెద్దల వద్దకు వెళ్లి రూ.1,500 ఇస్తామని చెప్పగా.. తాము అడిగినప్పుడు ఇవ్వనందున ఇప్పుడు రూ.10 వేలు ఇవ్వాలని కులపెద్దలు అన్నారు. దీంతో చేసేదేమీలేక వీరబాబు కుటుంబసభ్యులు మిన్నకుండి పోయారు. అప్పటి నుంచి ఆ కుటుంబానికి కిరాణ సరుకులు అమ్మకపోవటం, వీరబాబు భార్య వీరకుమారికి నలతగా ఉంటే మందుల కోసం అదే కులానికి చెందిన ఆశ కార్యకర్త వద్దకు వెళ్లినా ఇవ్వకపోవడంతో తమకు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నారు. ఈ విషయమై వీరబాబు, అతడి భార్య పోలీసులను ఆశ్రయించారు. చదవండి: కోట్ల అక్రమ ఆస్తులు.. శంషాబాద్ మాజీ పంచాయతీ అధికారి అరెస్ట్ -
20 రకాల కూరలతో సుష్టుగా తినొచ్చు.. ధర తక్కువే! ఎక్కడో తెలుసా?
కూసుమంచి (ఖమ్మం జిల్లా): భోజనం చేసేందుకు ఏదైనా హోటల్‌కు వెళ్తే ఓ నాలుగు కూరలు, ఒక చట్నీ, సాంబారు, పెరుగుతో సరిపెడతారు. దీంతో కడుపు నిండినట్టు అనిపించనప్పటికీ సర్దుకుపోతాం. ఒకవేళ ఎక్కువగా తీనాలంటే మరింత ఖర్చు చేయాల్సి వస్తుంది. అంత ఖర్చు పెట్టలేని వారు అసంతృప్తితోనే బయటకు వస్తుంటారు. కానీ కూసుమంచిలోని నాగన్న, శివ హోటళ్లలో మాత్రం 20కి పైగా రకాల కూరలను వడ్డిస్తూ భోజన ప్రియులను సంతృప్తి పరుస్తున్నారు. సామాన్యులు వెచ్చించగల బడ్జెట్లోనే పసందైన భోజనం అందిస్తూ ఆకలి తీరుస్తున్నారు. ఇలాంటి హోటళ్లు ఎక్కడా లేవంటూ పలువురు మెచ్చుకుంటున్నారు. (చదవండి: భక్తుల వద్ద హోంగార్డు చేతివాటం, క్రిమినల్ చర్యలకు ఈవో ఆదేశం) నాగన్నతో మొదలు.. కూసుమంచిలోని నాగన్న (రామకృష్ణ ) హోటల్లో గత కొన్నేళ్లుగా వివిధ కూరలతో భోజనాలు వడ్డిస్తున్నారు. దీంతో ఈ హోటల్ ప్రత్యేకతను సంతరించుకుంది. కూసుమంచిలో ఖమ్మం– సూర్యాపేట రాష్ట్రీయ రహదారి పక్కన ఉండటంతో ఇక్కడ 24 కూరల భోజనం గురించి తెలుసుకుని అనేక మంది ప్రయాణికులు ఆగి మరీ భోజనాలు చేస్తుంటారు. పలువురు సినీ, రాజకీయ రంగాలకు చెందిన వారు కూడా ఈ హోటల్లో భోజనం చేసి అభినందించారు. ఈ హోటల్ యజమాని బెల్లంకొండ నాగన్న గత 20 ఏళ్లకు పైగా సేవలు అందిస్తూ గుర్తింపు పొందారు. శివ హోటల్‌కు క్రేజ్.. కూసుమంచిలోని సూర్యాపేట రోడ్డులో ఏర్పాటు చేసిన శివ హోటల్ సైతం నాగన్న హోటల్ మాదిరిగా 24 కూరలను అందిస్తూ క్రేజ్‌ను సొంతం చేసుకుంటుంది. ఈ హోటల్లో కూరలతో పాటు చికెన్ కర్రీని అదనంగా వడ్డించడం ప్రత్యేకత. కాలానుగుణంగా అందుబాటులో ఉన్న అన్ని రకాల కూరగాయలు, ఆకు కూరలను యజమాని శివ సొంతంగా కొన్నింటిని పండిస్తూ, మరికొన్ని కొనుగోలు చేస్తూ 20 కూరలకు తగ్గకుండా భోజనాలు అందిస్తున్నారు. వెజిటేరియన్ కాకుండా నాన్‌వెజ్‌లో భాగంగా బిర్యానీ, చికెన్, చేప కూరలను ప్రత్యేకంగా అందిస్తున్నారు. అనతికాలంలోనే ఈ హోటల్ కూడా ఆదరణ పొందింది. మండల ప్రజలతో పాటు ఖమ్మం తదితర ప్రాంతాలకు చెందిన వారు ప్రత్యేకంగా కూసుమంచికి వచ్చి భోజనాలు చేస్తుండటం విశేషంగా చెప్పుకోవచ్చు. (చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ముఖం చాటేశాడు..) వడ్డించే కూరలు... కూసుమంచిలోని నాగన్న, శివ హోటళ్లలో వివిధ రకాల కూరలు వడ్డిస్తున్నారు. వాటిలో పప్పు, దోసకాయ, దొండకాయ, గోరుచిక్కుడు, చిక్కుడు కాయ, సొరకాయ, పొట్లకాయ, వంకాయ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బీట్రూట్, బంగాళదుంప, చామగడ్డ, క్యారట్, కాకరకాయ, టమాట, బీర, సొరకాయ, బెండకాయ, పాలకూర, బచ్చలికూర, చుక్క కూర, గోంగూర, మామిడికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడితో పాటు సాంబారు, పెరుగు వడ్డిస్తారు. కాగా కూరలు సీజన్‌ను బట్టి కొంచెం మారుతుంటాయి. అయినప్పటికీ 20 కూరలకు తగ్గకుండా వడ్డిస్తుండటం ప్రత్యేకత. సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా భోజనం రూ.100 మాత్రమే తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎక్కడా చూడలేదు.. మాది వరంగల్ జిల్లా కేసముద్రం. మేం కూసుమంచికి పనిమీద వచ్చాం. ఇక్కడ 20 కూరల భోజన హోటల్ బోర్డు చూసి వచ్చి తిన్నాం. ఇన్ని కూరలు వడ్డించే హోటల్ ఎక్కడా చూడలేదు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. కూరలు కూడా చాలా బాగున్నాయి. – లక్ష్మి, కేసముద్రం, వరంగల్ జిల్లా తృప్తి మిగులుతుంది.. మా హోటల్లో రోజూ 20కి తగ్గకుండా కూరలు తయారు చేస్తాం. కస్టమర్ల తృప్తి మేరకు భోజనాలు వడ్డిస్తున్నాం. భోజన ప్రియుల అభిరుచి మేరకు నాన్‌వెజ్ ఐటమ్స్ కూడా ప్రత్యేకంగా తయారు చేస్తున్నాం. మంచి భోజనం అందిస్తున్నామనే తృప్తి మిగులుతుంది. – భూక్యా శివ, శివ హోటల్ యజమాని -
ఖమ్మం జిల్లాలో వెయ్యేళ్లనాటి శివాలయం-అతిపెద్ద శివలింగం
కూసుమంచి (ఖమ్మం): కాకతీయుల భక్తిభావం, కళావైభవానికి ప్రత్యక్షసాక్ష్యం కూసుమంచిలోని శివాలయం. ఈశివాలయాన్నే గణపేశ్వరాలయంగా, రామలింగేశ్వరస్వామి ఆలయంగా కూడా పిలుస్తున్నారు. క్రీ.శ 11–12వ శతాబ్ధంలో కాకతీయుల కాలంలో వెయ్యిన్నొక్కటి శివాలయాల నిర్మాణ క్రమంలో గణపతి దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ప్రతీతి. ఈ ఆలయంలోని శివలింగం దక్షిణ భారతదేశంలో అతిపెద్ద శివలింగాల్లో ఒకటిగా ప్రసిద్ది చెందింది. ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఉత్తర దిశగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణం ఓ చేయి, కాలు లేని శిల్పి చేశాడనేది ప్రచారంలో ఉంది. ఈ ఆలయాన్ని పెద్దపెద్ద బండరాళ్లతో పేర్చిన ఘనత ఆ శిల్పికే దక్కింది. (చదవండి: అపార్ట్మెంట్లో బోర్‌వాటర్ వివాదం.. వాటర్‌ట్యాంక్ ఎక్కి దంపతుల హల్చల్) శివాలయంలోని శివలింగం ఆలయాన్ని పైగుండా చూస్తే నక్షత్రాకారంలో, మరోవైపు శివలింగాకారం ఉన్నట్లుగా బండరాళ్లను పేర్చి వాటిపై ఆలయాన్ని నిర్మించటం విశేషం. ఇక ఆలయంలో ఉన్న శివలింగం 6 అడుగుల ఎత్తు. 5.3 సెంమీ వ్యాసార్థంతో ప్రతిష్టించగా అది నున్నటి గ్రానైట్ రాయిని పోలి ఉంటుంది. శివలింగంపై ప్రతినిత్యం సూర్యోదయ సమయాన సూర్యకిరణాలు ప్రసరించేలా ఆలయాన్ని నిర్మించటం మరో విశేషం. వందలాది సంవత్సరాల పాటు కంపచెట్లు, మట్టిదిబ్బలతో జీర్ణావస్థకు చేరింది. గ్రామంలో గొప్ప ఆలయం ఉన్నా దాన్ని ఎవరూ పట్టించుకోక పోవటంతో అది ఎలా ఉందో కూడా గ్రామస్తులకు తెలియని పరిస్థితి. నాటి కూసుమంచి సీఐగా ఉన్న సాథు వీరప్రతాప్‌రెడ్డి దృష్టికి ఆలయం విషయం రావటంతో గ్రామస్థుల సహకారంతో ఈఆలయాన్ని వెలుగులోకి తీసుకవచ్చారు. దాన్ని అభివృద్ది పరిచి పూజలు ప్రారంభింపజేశారు. భక్తుల చొరవతో ఈ ఆలయం క్రమంగా వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత మహా ఆలయంగా వెలుగొందుతోంది. ఈ ఆలయాన్ని దర్శించటం పునర్జన్మ సుకృతంగా పెద్దలు అభివర్ణిస్తున్నారు. కూసుమంచి శివాలయాన్ని దర్శిస్తే కోరిన కోరికలు తీరుతాయనేది భక్తుల నమ్మకం. అందుకే ఈశివాలయం భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతూ.. నానాటికి దినదినాభివృద్ధి చెందుతోంది. ప్రతి శివరాత్రికి ఖమ్మం జిల్లాతో పాటు పొరుగున ఉన్న ఉమ్మడి నల్లగొండ, వరంగల్ నుండి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ప్రతియేడు వేల మంది భక్తులు ఈ శివాలయాన్ని దర్శించుకుంటున్నారు. (చదవండి: జంగు ప్రహ్లాద్ కన్నుమూత.. సీఎం కేసీఆర్ సంతాపం..) -
వ్యాక్సిన్ వేసుకుంటే డబ్బు ఇస్తాం.. వృద్ధురాలిపై అమానుషం
కూసుమంచి: కరోనా వ్యాక్సిన్ రెండు డోస్‌లు వేసుకున్న వారికి ప్రభుత్వం నగదు ఇస్తోందంటూ నమ్మబలికిన ఓ వ్యక్తి వృద్ధురాలి నోటికి ప్లాస్టర్ వేసి మూడున్నర తులాల బంగారు గొలుసు లాక్కెళ్లిన ఘటన ఇది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చిన్న పోచారం గ్రామంలో గురువారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చదవండి: చిన్న పోచారం గ్రామానికి చెందిన రామసహాయం వసుమతి (75) ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఈక్రమంలో గురువారం మధ్యాహ్నం వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి కరోనా టీకా రెండు డోసులు వేసుకున్నారా అంటూ ప్రశ్నించాడు. దీనికి ఆమె టీకా వేయించుకున్నట్లు సమాధానం చెప్పగా.. ప్రభుత్వం రూ.వెయ్యి నగదు ఇవ్వమని పంపించిందని జేబులోని నగదు తీసి ఇచ్చాడు. అనంతరం ఫొటో తీసుకోవాలని చెబుతూ కుర్చీలో కూర్చున్న ఆమె ఫొటో తీస్తున్నట్లు నటిస్తూ నోటికి ప్లాస్టర్ వేశాడు. ఆ వెంటనే ఆమె మెడలోని మూడున్నర తులాల బంగారు గొలుసు లాక్కుని పారిపోయాడు. తేరుకున్న వృద్ధురాలు బయటకు వచ్చి స్థానికులకు చెప్పగా వారు పోలీసులకు సమాచారం అందించారు. శిక్షణ ఎస్సై విజయ్‌కుమార్ గ్రామానికి చేరుకుని బాధిత మహిళతో మాట్లాడి వివరాలు సేకరించారు. కాగా, అదే దుండగుడు బుధవారం మధ్యహ్నం కూడా తన ఇంటికి వచ్చి టీకా వేసుకున్నారా అని అడిగి వెళ్లినట్లు మరో మహిళ చెప్పింది. దీంతో పక్కాగా రెక్కీ నిర్వహించాకే చోరీకి పాల్పడినట్లు భావిస్తున్నారు. -
కన్నుమూస్తూ మరొకరికి పునర్జన్మ
సాక్షి, హైదరాబాద్/కూసుమంచి: కానిస్టేబుల్ కన్నుమూస్తూ మరొకరికి పునర్జన్మను ప్రసాదించారు. చనిపోయి కూడా ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. ఖమ్మం జిల్లా కుసుమంచికి చెందిన వీరబాబు(35) కొండాపూర్ స్పెషల్ బ్రాంచ్‌లో కానిస్టేబుల్. మూడు రోజుల క్రితం బైక్‌పై ఖమ్మం వెళ్తూ మార్గమధ్యలో గొల్లగూడ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు.మలక్‌పేట యశోద ఆస్పత్రికి తరలించగా అప్పటికే తలకు బలమైన గాయమై మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆరోగ్యపరిస్థితి విషమించింది. ఈ క్రమంలో వైద్యులు మంగళవారం సాయంత్రం బ్రెయిన్ డెడ్‌గా డిక్లేర్ చేశారు. ఈ నేపథ్యంలో వీరబాబు అవయవాలు దానం చేసేందుకు బంధువులు అంగీకరించడంతో వైద్యులు వెంటనే జీవన్‌దాన్‌కు సమాచారమిచ్చారు. 9.8 కిలోమీటర్లు.. 12 నిమిషాల్లో... ఖమ్మం జిల్లాకు చెందిన పెయింటింగ్ కార్మికుడు తుపాకుల హుస్సేన్(33) అప్పటికే గుండె పనితీరు పూర్తిగా దెబ్బతినడంతో గుండెమారి్పడి చికిత్స నిమిత్తం గుండె కోసం జీవన్‌దాన్‌లో సోమవారం రిజిస్టర్ చేసుకున్నారు. దాత కోసం ఎదురు చూస్తుండగా ఆ మరునాడే వీరబాబు గుండె ప్రదానం విషయం ఖరారు కావడం విశేషం. డాక్టర్ సాయిసునీల్, డాక్టర్ రవితేజలతో కూడిన వైద్య బృందం బుధవారం ఉదయం మలక్‌పేట యశోద ఆస్పత్రికి చేరుకుని అక్కడి వైద్యుల సహకారంతో దాత శరీరం నుంచి గుండెను వేరు చేసింది. దానిని ప్రత్యేక బాక్స్‌లో భద్రపరిచి రోడ్డుమార్గంలో అంబులెన్స్‌లో నిమ్స్‌కు చేర్చింది. అప్పటికే ట్రాఫిక్ పోలీసులుగ్రీన్‌చానల్ ఏర్పాటు చేశారు. అంబులెన్స్ మధ్యాహ్నం 1.44 గంటలకు యశోద ఆస్పత్రి నుంచి బయలుదేరి 9.8 కిలోమీటర్లు ప్రయాణించి 1.56 గంటలకు.. అంటే కేవలం 12 నిమిషాల్లో నిమ్స్‌కు చేరుకుంది. గుండెను భద్రపరిచిన బాక్స్‌ను తీసుకువస్తున్న నిమ్స్ వైద్య బృందం పదిమంది.. ఆరు గంటలు శ్రమించి డాక్టర్ అమరేష్‌రావు నేతృత్వంలోని డాక్టర్ గోపాల్, డాక్టర్ మధుసూదన్, డాక్టర్ పద్మజ, డాక్టర్ నర్మద, డాక్టర్ అర్చనలతో కూడిన బృందం మధ్యాహ్నం రెండు గంటలకు గుండె మారి్పడి చికిత్స ప్రారంభించి రాత్రి ఎనిమిది గంటలకు పూర్తి చేసింది. స్వీకర్త నుంచి సేకరించిన గుండెను విజయవంతంగా దాతకు అమర్చినట్లు వైద్యబృందం ప్రకటించింది. బాధితుడు ఐసీయూలో కోలుకుంటున్నట్లు తెలిపింది. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఉచితంగా గుండె మారి్పడి చికిత్స చేసినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ చికిత్సను నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ సహా ఆస్పత్రి సూపరింటిండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ పర్యవేక్షించారు. కాగా, గుండె దాత, స్వీకర్త ఇద్దరూ ఒకే మండలవాసులు కావడం విశేషం. గుండెదాత వీరబాబు స్వగ్రామం కూసుమంచికాగా, స్వీకర్త పెయింటర్ తుపాకుల హుస్సేన్(33) స్వగ్రామం కూసుమంచి మండలంలోని మునిగేపల్లి. -
పిలిస్తే వస్తుంది.. చికెన్ మాత్రమే తింటుందీ కోడి!
కూసుమంచి: ఈ చిత్రంలోని కోడి పేరు మోటూ! అది దాణా బదులు చికెన్ తింటోంది. యజమాని చెప్పినట్లు వింటోంది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు గ్రామంలోని తెలంగాణ చికెన్ సెంటర్ యజమాని ఇలియాస్ ఆ కోడిని పెంచుతున్నాడు. బ్రాయిలర్ కోళ్లను దిగుమతి చేసుకుని చికెన్ విక్రయించే ఇలియాస్‌కు గత నెలలో వచ్చిన ఈ కోడి నచ్చింది. దానికి మోటూ అని ముద్దు పేరు పెట్టి దాణా బదులు చికెన్ ముక్కలు, స్కిన్ అలవాటు చేశాడు. దీంతో అది చికెన్ తప్ప దాణా ముట్టుకోవడం లేదు. ఆ కోడిని యజమాని ‘మోటూ ఇదర్ ఆవో’అని పిలిస్తే చాలు వచ్చేస్తోంది. యజమాని వెంటే తిరుగుతూ... ఆయన సైగలకు అనుగుణంగా నడుచుకుంటోంది. కాగా, ఈ కోడిని కొందరు రూ.5వేల వరకు అడిగినా ఇవ్వలేదని ఇలియాస్ తెలిపారు. కాలువలో 5 కి.మీ. కొట్టుకుపోయిన గేదెలు నేలకొండపల్లి: ప్రమాదవశాత్తూ నాలుగు పాడి గేదెలు కాలువలో పడ్డాయి. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో 5 కిలో మీటర్ల మేర కొట్టుకుపోయాయి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో అమ్మగూడెంనకు చెందిన రైతు అడపాల రమేశ్‌కు నాలుగు గేదెలు ఉన్నాయి. మంగళవారం వాటిని మేతకు తీసుకెళ్తుండగా నందిగామ బ్రాంచ్ కాలువలో గేదెలు జారి పడ్డాయి. అయితే గేదెలు పైకి ఎక్కడానికి ఎక్కడా మార్గం లేకపోవడం, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో దాదాపు ఐదు కిలోమీటర్ల మేర కొట్టుకుపోతూ నేలకొండపల్లికి చేరాయి. అప్పటికే అమ్మగూడెంనకు చెందిన పలువురు రైతులు కాలువ కట్ట వెంట పరుగెత్తుతూ గేదెలను బయటకు లాగేందుకు శ్రమించారు. చివరకు నేలకొండపల్లి బ్రిడ్జి సమీపంలో రైతులంతా కాలువలోకి దూకి వాటిని అడ్డుకుని తాళ్లుకట్టి పైకి లాగారు. చదవండి: బాబోయ్ బార్.. భయపడుతున్న యజమానులు -
చేపతో కాజాలు ఎలా చేయాలంటే?
కూసుమంచి: ‘నీకేం తెలుసు.. చేపల పులుసు’ అని తేలిగ్గా తీసిపారేయొద్దు. చేపలతో 90 రకాల వెరైటీలు చేయొచ్చని తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఈ వంటకాల తయారీలో మహిళలకు శిక్షణనిస్తూ ఘు మఘుమలాడుతోంది ఖమ్మం జిల్లా పాలేరులోని పీవీ నర్సింహారావు మత్స్య పరిశోధన కేంద్రం. పోషకాహార విలువలు కలిగిన చేపలు.. చికెన్, మటన్‌తో పోలిస్తే చౌకగానే లభిస్తాయి. చేపలతో చేసే విభిన్న వంటకాలకు ప్రస్తుతం మార్కెట్లో మం చి గిరాకీ ఉంది. ఈ క్రమంలోనే చేపల వంటకాల తో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మత్స్య పరి శోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విద్యాసాగర్‌రెడ్డి పర్యవేక్షణలో మహిళలకు శిక్షణనిస్తున్నారు. ఇక్కడ ఇదే తొలిసారి మహిళా మత్స్యకారులు కేవలం చేపలను పట్టి విక్రయిస్తేనే లాభం లేదు.. చేపల ఉత్పత్తులతో వంటకాలు తయారుచేసి విక్రయిస్తే అదనపు ఆదాయం పొందవచ్చనే ఉద్దేశంతోనే ఇప్పటివరకు మూడు దఫాలుగా 180 మంది మహిళా మత్స్యకారులకు శిక్షణనిచ్చారు. ప్రస్తుతం పంజాబ్‌లోని లూథియానాకు చెందిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ హార్వెస్ట్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎస్సీ సబ్‌ప్లాన్‌లో భాగంగా ఎస్సీ మహిళలకు దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా చేపల ఉత్పత్తుల తయారీలో శిక్షణనిస్తున్నారు. ఇందుకు వేదికైన పాలేరులోని మత్స్య పరిశోధన కేంద్రంలో ప్రస్తుతం కూసుమంచి మండలం గైగొళ్లపల్లికి చెందిన 50 మంది మహిళలు తర్ఫీదు పొందుతున్నారు. శిక్షణానంతరం వీరంతా తాము తయారుచేసే చేపల ఉత్పత్తులతో స్వయం ఉపాధి కల్పించుకోవచ్చు. మాంసంతో పచ్చళ్లు.. స్నాక్స్ ఏపీలోని భీమవరానికి చెందిన చేపల ఉత్పత్తుల తయారీ నిపుణురాలు పెన్మత్స భాగ్యలక్ష్మి పలు వంటలను పరిచయం చేస్తున్నారు. చేపల పులుసు, ఫ్రై, పచ్చడితోపాటు చేప కాజాలు, చేప చపాతీ, చేప ఫింగర్స్, చేప బజ్జీ, చేప పసంద్, చేప బిర్యానీ, ఫిల్లెట్స్, లాలీపాప్, సమోసాలు, రొయ్యల పొడి, రొయ్యల రోల్స్.. ఇంకా చేప మెత్తటి మాంసంతో కూర, పచ్చళ్లు, బోన్స్.. అందులోని కీమాతో స్నాక్స్.. ఇలా చేపలతో 90 రకాల వంటలను చేయవచ్చని ఇక్కడ చెబుతున్నారు. -
ఒకరిని విడిచి ఒకరు ఉండలేక..
సాక్షి, కూసుమంచి : ఇద్దరూ తోటి కోడళ్లు. ఒకరు అనారోగ్యంతో మృతిచెందారు. మరొకరు ఆమె మృతదేహంపై పడి రోదిస్తూ అపస్మారక స్థితికి చేరుకుని తనువు చాలించారు. ఈ విషాదకర సంఘటన కూసుమంచి మండలం గంగబండతండాలో మంగళవారం చోటుచేసుకుంది. తండాకు చెందిన వడ్త్యి సోనా(52) కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురయింది. ఆమెకు ఖమ్మంలోని ఆస్పత్రిలో చికిత్స చేయించి ఇంటికి తీసుకెళ్లగా.. మళ్లీ ఆరోగ్యం విషమించి సోమవారం రాత్రి మృతిచెందింది. అయితే ఈ విషయం తెలుసుకుని మంగళవారం ఉదయం మండలంలోని లోక్యాతండాలో స్థిరపడిన ఆమె తోటి కోడలు వడ్త్యి సక్రి(45) గంగబండతండాకు చేరుకుంది. ఈ క్రమంలో సోనా మృతదేహంపై పడి సక్రి బోరున విలపించింది. పది నిమిషాలు దాటినా ఆమె లేవకపోవడంతో పక్కనే ఉన్న వారు సక్రిని లేపే ప్రయత్నం చేయగా.. ఆమె అప్పటికే స్పృహ కోల్పోయి ఉంది. దీంతో హుటాహుటిన ఆటోలో కూసుమంచిలోని ఓ ప్రైవేటు వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా.. అతడు ఖమ్మం తరలించాలని సూచించారు. దీంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారు. దీంతో గంగబండతండా, లోక్యాతండాల్లో విషాద చాయలు అలుముకున్నాయి. -
అవినీతి సబ్‌రిజిస్ట్రార్
సాక్షి, కూసుమంచి: కూసుమంచి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. అక్కడ మశీదు లేనిదే ఏ పని అవ్వదు. భూములు, ప్లాట్ల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ కొరకు వచ్చే వారి నుంచి సిబ్బంది అందినకాడికి పిండుకుంటున్నారు. కార్యాలయంలో ప్రైవేటుగా పనిచేస్తున్న కొందమంది సబ్‌రిజిçస్ట్రార్తో పాటు ఇతర సిబ్బందితో చేతులు కలిపి అవినీతి సామ్రాజ్యాన్ని సృష్టించారు. దీనిలో భాగంగా సోమవారం కార్యాలయంలో రూ.2 వేలు లంచం తీసుకుంటూ సబ్‌రిజిస్ట్రార్ ఉమాదేవి, అటెండర్ జానీ, ప్రైవేటు వ్యక్తి (డాక్యుమెంట్ రైటర్) అనినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి చిక్కిన సంగతి విధితమే. దీంతో కార్యాలయంలో లంచం లేనిదే పనులు జరిగే పరిస్థితి జరగదన్న సంగతి జగమెరిగింది. స్టాంపుల సొమ్ము మాయంలో.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ కార్యాలయంలో 2017 అక్టోబర్‌లో రూ.16 లక్షల రిజిస్ట్రేషన్ స్టాంపుల సొమ్ము మాయంలో షరాఫ్(క్యాషియర్‌గా) పనిచేస్తున్న బద్దె శ్రీనివాసరావుతో పాటు దాంట్లో ప్రయేయం ఉన్న నాటి సబ్‌రిజిస్ట్రార్ యామినిపై కూడా సస్సెన్షన్ వేటు పడింది. రసీదు.. మశీదు.. కూసుమంచి సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలో కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, రఘునాథపాలెం మండలాలకు చెందిన భూములు, ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు జరగుతుంటాయి. దీంతో ప్రభుత్వ పరంగా రిజిస్ట్రేషన్లకు రసీదు చెల్లించినా కార్యాలయ సిబ్బందికి అంతకంటే ఎక్కువ మశీదు రూపంలో లంచం చెల్లించాల్సిందే. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఈ కార్యాలయ పరిధిలో జోరుగా సాగుతుండగా సిబ్బందికి చేతినిండా డబ్బులే. పలుకుబడి కలిగిన వ్యక్తుల భూముల రిజిస్ట్రేషన్లు అంటే సిబ్బందే అన్నీ తామై చూసుకుంటారు. భారీగానే ముడుపులు స్వీకరిస్తారు. ఇదంతా బహిరంగ రహస్యమే. కిందిస్థాయి సిబ్బంది నుంచి సబ్‌రిజిస్ట్రార్ వరకు అందరికీ వాటాలు అందాల్సిందే. ఇదంతా ప్రైవేటు వ్యక్తుల ద్వారా నడిపించే తతంగం. కాగా ఈ కార్యాలయం ఏడాదికి లక్షలాది రూపాయల ఆదాయాన్ని పొందాల్సి ఉండగా లక్ష్యం నెరవేరలేని పరిస్థితి ఉందంటే సిబ్బంది చేతివాటం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. -
ఏసీబీ వలలో సబ్‌రిజిస్ట్రార్
సాక్షి, కుసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ అంటెండర్, డాక్యుమెంట్ రైటర్ సహాయకుడు పట్టుబడ్డారు. నేలకొండపల్లి మండలం రాంచంద్రాపురం గ్రామానికి చెందిన కానిస్టేబుల్ తీర్థాల కిరణ్ భార్య పేరుమీద ఉన్న భూమి డాక్యుమెంట్‌ను మార్చాలని కోరగా సబ్‌రిజిస్ట్రార్ రూ.5 వేలు డిమాండ్ చేయటంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కానిస్టేబుల్ అయిన అతను ధైర్యంగా వారికి విషయం చెప్పాడు. దీంతో ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ వేసి డబ్బు అడిగిన సబ్‌రిజిస్ట్రార్‌ను, ఆమె సూచనలతో డబ్బు తీసుకున్న డాక్యుమెంట్ రైటర్ సహాయకుడిని, అందుకు సహకరించిన అటెండర్‌ను ఆధారాలతో సోమవారం అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్ విలేకరులకు వెల్లడించిన వివరాల మేరకు.. రాంచంద్రాపురానికి చెందిన తీర్థాల కిరణ్ ఖమ్మం అర్బన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. 2016లో వ్యవసాయ భూమిలో 2వేల గజాలను పక్కా వ్యూహంతోనే.. ఏసీబీ అధికారులు కిరణ్‌కు వీడియో రికార్డర్‌ను అమర్చగా అతను అదేరోజు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి సబ్ రిజిస్ట్రార్‌తో రిజిస్ట్రేషన్‌పై ప్రస్తావించాడు. ఆమె రూ.5వేలు అడగటంతో చివరకు రూ.2వేలకు అంగీకరించి డాక్యుమెంటేషన్ చేయించాడు. వీరి మధ్య జరిగిన సంభాషణను రికార్డు చేశారు. కిరణ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంటేషన్‌ను తీసుకెళ్లేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సోమవారం రాగా అతని వద్ద ఉన్న పది రూ.200 నోట్లను సబ్‌రిజిస్ట్రార్‌కు ఇవ్వబోగా ఆమె అటెండర్ జానీకి ఇవ్వమని సూచించారు. జానీ నగదును డాక్యుమెంట్ రైటర్ వద్ద అసిస్టెంట్‌గా పని చేస్తున్న కపిల్ అనే ప్రైవేటు వ్యక్తికి ఇవ్వమని చెప్పడంతో ఆ నగదును అప్పగించాడు. ఈ మొత్తాన్ని వీడియో రికార్డు చేయడంతో పాటు కిరణ్ ఇచ్చిన నోట్ల నంబర్లను రాసుకున్నారు. కపిల్ వద్ద తాము ఇచ్చిన నోట్లే లభించాయని ఏసీబీ డీఎస్పీ వివరించారు. దీంతో లంచం అడిగినందుకు సబ్ రిజిస్ట్రార్ ఉమాదేవిని, డబ్బు తీసుకున్న కపిల్‌ను, అందుకు ప్రేరేపించిన అటెండర్ జానీని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్లు రమణమూర్తి, ప్రవీణ్ (ఖమ్మం), సతీష్ (వరంగల్)పాల్గొన్నారు. కన్వర్షన్ చేయించి పెట్రోల్ బంక్ కోసం తన భార్య మమత, తల్లి నాగమణి, వదిన శ్వేత పేరున రిజిస్ట్రేషన్ చేయించాడు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో భార్య పేరు తొలగించి తన పేరు చేర్చి రీ డాక్యుమెంటేషన్ చేయాలంటూ గత నెల 19న కూసుమంచి సబ్‌రిజిస్ట్రార్ ఉమాదేవిని కలవగా అది ప్రభుత్వ భూమి అని రిజిస్ట్రేషన్‌కు అభ్యతరం తెలిపారు. దీంతో కిరణ్ ఆర్టీఓ నుంచి కన్వర్షన్, నేలకొండపల్లి తహసీల్దారు నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్‌ను తీసుకొచ్చాడు. అయినా సబ్ రిజిస్ట్రార్ తనకు రూ.5 వేలు ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పటంతో గత నెల 30న ఏసీబీ డీఎస్పీకి విషయాన్ని తెలిపాడు. మరెవరికీ ఇబ్బంది కలగొద్దని..: భూమిని నా భార్యపేరు నుంచి మార్చుకోవాలంటే సబ్‌రిజిస్ట్రార్ అనేక ఇబ్బందులు పెట్టారు. రూ.5వేల లంచం అడిగారు. నా వలన కాదన్నా వినలేదు. మా నాన్నను కూడా ఇబ్బంది పెట్టారు. చివరకు రూ.2 వేలు కావాలన్నారు. ఎలాగైనా బుద్ధి చెప్పాలని, నాలా ఎవరికీ ఇలా కావద్దని ఏసీబీ అధికారులను ఆశ్రయించాను. కిరణ్, కానిస్టేబుల్ -
ఓటర్ల జాబితాపై సమీక్ష
సాక్షి, కూసుమంచి: ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితాలపై మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ఎన్నికల అధికారి, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, ఈ నెల 22న సాయంత్రం 5 గంటలలోపు ఎంపీడీఓ కార్యాలయంలో లిఖిత పూర్వకంగా తెలియజేయాలని కోరారు. తహసీల్దారు స్వర్ణ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా సహకరించాలని కోరారు. వివిధ పార్టీల బ్యానర్లు, ఫ్లెక్సీలు, గోడలపై రాతలు నిషేధమని అన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు బొల్లంపల్లి సుధాకర్‌రెడ్డి, ఆసిఫ్‌పాషా, సీపీఎం మండల కార్యదర్శి బారి మల్సూర్, బీజేపీ నాయకులు గడ్డం వెంకటేశ్వర్లు, బీఎస్పీ మండల అధ్యక్షుడు ఉపేందర్‌తో పాటు ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది కవిరాజ్, సురేష్, ఎంసీఓ అంజిరెడ్డి పాల్గొన్నారు. తిరుమలాయపాలెం: ఎంపీటీసీల ఓటర్ల జాబితా ముసాయిదాపై మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో రాజకీయ పార్టీల నాయకులతో మండల పరిషత్ అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఎంపీటీసీల వారీగా ప్రదర్శించిన ఓటరు జాబితా సవరణలపై రాజకీయ పార్టీల నాయకుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆయా గ్రామ పంచాయతీలలో అందుబాటులో ఉంచిన ఓటరు జాబితాపై ఈ నెల 25 వరకు అభ్యంతరాలు తెలియజేయవచ్చని మండల ఈఓఆర్డీ రాజేశ్వరి తెలిపారు. ఆ కార్యక్రమంలో ఆయా రాజకీయ పార్టీల నాయకులు, మండల పరిషత్ కార్యాలయ ఉద్యోగులు ఈశ్వర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
తస్మాత్ జాగ్రత్త..
సాక్షి, కూసుమంచి: మండల కేంద్రమైన కూసుమంచిలో దొంగలు అలజడి సృష్టిస్తున్నారు. తాళ్లాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. వారం వ్యవధిలోనే రెండు దొంగతనాలు జరగటంతో ప్రజలు హడలిపోతున్నారు. ఈఘటనలు పోలీసులకు కూడా సవాల్‌గా మారడంతో వారు దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫిబ్రవరి 26వ తేదీ రాత్రి గ్రామానికి చెందిన ఓ పత్రికా విలేకరి, పురుగుమందుల వ్యాపారి ఎండీ రంజాన్ ఆలీ ఇంట్లో దొంగలు పడి 18 తులాల బంగారం, లక్ష రూపాయల నగదును, ఎల్ఈడీ టీవీ ఎత్తుకెళ్లారు. కొద్ది రోజుల వ్యవథిలోనే మార్చి 8న గ్రామానికి చెందిన అర్వపల్లి మౌలాలీ ఇంట్లో దొంగలు పడి 5తులాల బంగారు ఆభరణాలు, 60వేల రూపాయకల నగదును ఎత్తుకెళ్లారు. ఈ రెండు గృహాలు జనం రద్దీగా ఉండే ప్రాంతాలే. అయినప్పటికీ దొంగలు చాకచక్యంగా చోరీలకు పాల్పడటంతో గృహాల వారికి కునుకు పట్టడం లేదు. ఈ ఘటనలతో బాధితులతో పాటు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దొంగల బెడదను అరికట్టాలని పోలీసుశాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు. అసలే వేసవికాలం చోరీలు ఎక్కువగా జరిగే సీజన్. ఇప్పటికే చోరీలు ప్రారంభం కావటంతో పోలీసులు నిఘాను పెంచారు. -
‘మరుగు’న‘బడి’!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మరుగుదొడ్ల నిర్మాణంలో అడుగడుగునా అలసత్వం కనిపిస్తోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం.. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పనులు ముందుకు సాగడం లేదు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు మల, మూత్ర విసర్జన కోసం ఇబ్బందిపడొద్దనే ఉద్దేశంతో ఉపాధిహామీ పథకంలో భాగంగా ప్రభుత్వం మరుగుదొడ్ల నిర్మాణాలను చేపట్టింది. ముఖ్యంగా విద్యార్థినుల సౌకర్యార్థం మరుగుదొడ్ల నిర్మాణాలను ప్రతి పాఠశాలలో చేపట్టారు. అయితే నిర్మాణాలు సకాలంలో పూర్తికాకపోవడంతో విద్యార్థినులు, ఉపాధ్యాయినులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించాల్సిన ఆవశ్యకతను అధికారులు గుర్తించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 251 పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. గుర్తించిన పనులపై నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందించారు. దీంతో పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించేందుకు అనుమతులు మంజూరయ్యాయి. ఒక్కో మరుగుదొడ్డికి రూ.1.20లక్షల నుంచి రూ.1.50లక్షల వరకు మంజూరు చేసింది. ఇందులో విద్యాశాఖ 60శాతం, ఉపాధిహామీలో 40శాతం నిధులను వినియోగించాల్సి ఉంటుంది. తొమ్మిది శాతమే పూర్తి.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగొద్దనే ఉద్దేశంతో మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. ఏళ్లు గడుస్తున్నా.. అనుకున్న మేరకు పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేయలేకపోతున్నారు. అనేక పాఠశాలల్లో నిర్మాణాలు ఇంకా ప్రారంభం కాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం 251 పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినా.. కట్టడాలు మాత్రం పూర్తి కాలేదు. ఇప్పటివరకు కేవలం 94 పాఠశాలల్లో మాత్రమే మరుగుదొడ్ల నిర్మాణం ప్రారంభమైంది. ఇందులో 70 మరుగుదొడ్లు నిర్మాణంలో ఉండగా.. 24 నిర్మాణాలు పూర్తయ్యాయి. అంటే మొత్తం మరుగుదొడ్ల లక్ష్యంలో 9.56 శాతం నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. మిగతావి ఎప్పటికి పూర్తవుతాయో కూడా తెలియని పరిస్థితి. నిర్మాణాలకు నిధులు విడుదలవుతాయో? లేదో? అనే సందేహంతో కాంట్రాక్టర్లు నిర్మాణాలపై దృష్టి సారించడం లేదని తెలుస్తోంది. వీటి నిర్మాణం విషయంలో అధికారులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు శ్రద్ధ తీసుకుంటేనే నిర్మాణాలు ముందుకు సాగే అవకాశం ఉంది. మరుగుదొడ్లు లేకపోవడంతో.. పాఠశాలల్లో మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడంతో అక్కడ విద్యనభ్యసిస్తున్న విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. మూత్ర విసర్జన చేయాలంటే సుదూర ప్రాంతానికి వెళ్లాల్సి వస్తోంది. నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయించాల్సి ఉన్నప్పటికీ ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం విశేషం. ఎస్ఎంసీలతోపాటు ఆయా గ్రామాల సర్పంచ్‌లు మరుగుదొడ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయించేలా బాధ్యత తీసుకోవాల్సి ఉంది. పలుచోట్ల గతంలో సర్పంచ్‌లు కూడా కాంట్రాక్టర్లుగా వ్యవహరించగా.. వీరి పరిధిలోని నిర్మాణాలు ముందుకు సాగలేదు. పలు పాఠశాలల్లో నత్తనడకన.. జిల్లాలోని పలు పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదు. తిరుమలాయపాలెం మండలంలోని పాఠశాలల్లో 12 మరుగుదొడ్లు మంజూరయ్యాయి. అయితే ఇక్కడ ఒక్కటి కూడా ప్రారంభం కాలేదు. ఖమ్మం రూరల్ మండలంలో 10 మరుగుదొడ్లు మంజూరు కాగా.. ఒక్కటి మాత్రమే ప్రారంభమైంది. కారేపల్లి మండలంలో 12 మరుగుదొడ్లు మంజూరు కాగా.. ఒక్కటి మాత్రమే ప్రారంభమైంది. నేలకొండపల్లిలో 10 మంజూరు కాగా.. రెండు మాత్రమే ప్రారంభమయ్యాయి. కామేపల్లిలో 16 మంజూరు కాగా.. ఒకటి మాత్రమే ప్రారంభమైంది. ఖమ్మం అర్బన్‌లో 17 మంజూరు కాగా.. ఒక్కటి మాత్రమే ప్రారంభమైంది. త్వరితగతిన పూర్తి చేయిస్తాం.. మరుగుదొడ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటాం. క్షేత్రస్థాయిలో ఎంపీడీఓలు, ఎంఈఓలు, ఉపాధిహామీ సిబ్బంది మరుగుదొడ్ల నిర్మాణాలను పర్యవేక్షిస్తున్నారు. నిర్మాణాలు ప్రారంభం కాని వాటిపై దృష్టి కేంద్రీకరించి త్వరితగతిన పనులు ప్రారంభించి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. – మదన్మోహన్, జిల్లా విద్యాశాఖాధికారి -
అటకెక్కిన ‘సాలీడ్‌వేస్ట్’ ప్రాజెక్ట్
సాక్షి, కూసుమంచి: మండల కేంద్రంలో చెత్తా చెదారం, వ్యర్థాలు లేకుండా చేసేందుకు అధికారులు వినూత్నంగా చేపట్టాలనుకున్న సాలీడ్‌వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు అటకెక్కింది. దీనిలో భాగంగా పంచాయతీ ఆధ్వర్యంలో ప్రతి ఇంటా డస్ట్బిన్లు (చెత్త డబ్బాలను) ఏర్పాటు చేసి సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తారు. అక్కడ వ్యర్థాలతో కంపోస్ట్ తయారు చేసేందుకు వీలుగా అధికారులు ప్రాజెక్టును రూపొందించారు. 2015లో ప్రతిపాదించిన ఈప్రాజెక్టు నేటికీ కార్యరూపం దాల్చలేదు. కేవలం కాగితాలకే పరిమితమైంది. ప్రస్తుతం మండల కేంద్రంలో నెలకు టన్నుల కొద్ది చెత్తా, వ్యర్థాలు తయారవుతున్నాయి. ఇళ్లలోని చెత్తతోపాటు బస్టాండ్ సెంటర్లో ఉన్న బడ్డీకొట్లు, చికెన్ సెంటర్లు, పండ్లు తదితర దుకాణాల నుంచి చెత్త టన్నుల కొద్ది వస్తోంది. వీటిని నేలకొండపల్లి వెళ్లే రహదారి పక్కన వేస్తున్నారు. దీంతో ఆరోడ్డు పై ప్రయాణించే వాహనదారులు, పాదాచారులు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. ముక్కు మూసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. సాలీడ్‌వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు ఉంటే ఈ వ్యర్థాలతో ఎరువును తయారు చేయవచ్చు. పొడిచెత్తను వేరుచేసి విద్యుత్ ప్రాజెక్టుల్లో వినియోగించుకునేందుకు వీలుండేది. కాగా ఈప్రాజెక్టుకు నిధులు లేకపోవటంతో అది ప్రతిపాదనలకే పరిమితం అయింది. అధికారులు, ప్రభుత్వం ఈప్రాజెక్టుపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. పాలేరులోనూ అంతే... పాలేరు గ్రామ పంచాయతీలో కూడా చెత్త, వ్యర్థాలను నివాసాల దగ్గర లోనే రోడ్డు పక్కన పడవేస్తున్నారు. గ్రామంలోని చర్చి సమీపంలో వ్యర్థాలను వేస్తున్నారు. దీంతో అటుగా వెళ్లేవారు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. మురికి కూపంగా మారిన ఆప్రాంతలో నివాసస్థుల పరిస్థితి వర్ణణాతీతం. అధికారులు స్పందించి చెత్త తొలగించాలని కోరుతున్నారు. ప్రాజెక్టు కోసం కృషి చేస్తా మండల కేంద్రంలో సాలీడ్‌వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు అధికారులతో మాట్లాడి దాని అమలుకు కృషిచేస్తా. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలి. పంచాయతీ తరుపున చర్యలు చేపడతాం. – చెన్నా మోహన్, సర్పంచ్ -
‘మతి’లేకున్నా.. మంచోడు..!
కూసుమంచి ఖమ్మం జిల్లా : ఇతడు ఇక్కడి వారందరికీ సుపరిచితుడు. అందరూ యాండో (పిచ్చోడు) అని పిలుస్తుంటారు. ఈ ఫొటో చూశారా...? ఇద్దరు వృద్ధుల చేతులు పట్టుకుని రోడ్డు దాటిస్తున్నాడు. అక్కడ ఇంకెంతోమంది ‘మంచి’మనుషులు ఉన్నారు. వారెవరూ ఇతడిలా సాయపడేందుకు ముందుకు రాలేదు. ఇప్పుడు చెప్పండి... ఇతడిని పిచ్చోడా...? పిచ్చోడిలా కనిపిస్తున్న మంచోడా...?! ఈ దృశ్యం ఖమ్మం–సూర్యాపేట రాష్ట్రీయ రహదారిలోని కూసుమంచి బస్టాండ్ సెంటర్లో కనిపించింది. ఈ రోడ్డు దాటాలంటే చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఇక వృద్ధుల సంగతి చెప్పనక్కరలేదు. అలాంటి రద్దీగా ఉండే రోడ్డుపై శనివారం ఇద్దరు వృద్ధులను రోడ్డు దాటించి మానవత్వాన్ని చాటుకున్నాడు. -
‘కేజ్‌కల్చర్’కు జాతీయ అవార్డు
కూసుమంచి : పాలేరు జలాశయంలో స్థానిక మత్స్య సహకార సంఘం, మత్స్యకారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేజ్‌కల్చర్ యూనిట్ల నిర్వహణకు జాతీయ స్థాయిలో అవార్డు దక్కింది. జాతీయ మత్స్య రైతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 10న కోల్‌కత్తాలో అందజేశారు. మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు నిమ్మరబోయిన లింగయ్య అవార్డును అందుకున్నారు. అలాగే రెండు నెలల క్రితం హైదరాబాద్‌లో నిర్వహించిన ఆక్వా ఎక్స్‌పోలో నేషనల్ అవార్డుకు పాలేరు యూనిట్లు ఎంపికైన విషయం తెలిసిందే. పాలేరు రిజర్వాయర్‌లో ప్రయోగాత్మకంగా 2015లో ప్రభుత్వం మత్స్యకారుల ఆధ్వర్యంలో కేజ్‌కల్చర్ (పంజర వలల్లో చేపలు పెంపకం) చేపట్టించింది. పాలేరుకు చెందిన 14 మంది మత్స్యకారులు జార్ఖండ్ రాష్ట్రంలో ఇందుకోసం ప్రత్యేక శిక్షణను కూడా పొందారు. తొలి ఏడాదిలోనే రాష్ట్రంలోని ఇతర కేజ్ యూనిట్ల కంటే ఇక్కడి యూనిట్లలో పెంచిన చేపలు మంచి దిగుబడులను ఇచ్చాయి. మత్స్యకారుల ఆదాయం కూడా రెట్టింపు అయింది. దీంతో మత్స్యకారులు ప్రస్తుతం కొత్తగా ఐదు యూనిట్లను నెలకోల్పగా మరో ఐదు యూనిట్లను నెలకోల్పేందుకు చర్యలు చేపట్టారు. గత సంవత్సరం కేజ్ యూనిట్లలో 20 టన్నుల చేపలను మత్స్యకారులు దిగుబడి చేయగలిగారు. దక్షిణాఫ్రికా దేశానికి చెందిన ప్రతినిధులు కూడా ఇక్కడి యూనిట్లను సందర్శించి కితాబు ఇవ్వడం గమనార్హం. యూనిట్ల నిర్వహణ, దిగుబడులు మంచిగా ఉండటంతో ఐసీఏఆర్(సెంట్రల్ ఇన్‌ల్యాండ్ ఫిషరీష్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్) ఆధ్వర్యంలో అందించే జాతీయస్థాయి అవార్డుకు ఇక్కడి యూనిట్లు ఎంపికయ్యాయి. దీంతో మత్స్యకారులు రెట్టింపు ఉత్సాహంతో రిజర్వాయర్‌లో కేజ్యూనిట్ల ద్వారా చేపలు పెంచేందుకు ముందుకు సిద్ధమవుతున్నారు. -
ఆటో డ్రైవర్ నిజాయితీ
కూసుమంచి: హైదరాబాద్ వెళుతున్న ఓ మహిళ తన బ్యాగును పాలేరు ప్రాంతంలో పోగొట్టుకోగా అదే గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌కు బ్యాగ్ దొరకగా పోలీసుల ద్వారా ఆమెకు అందించి తన నిజాయితీని చాటుకున్నాడు. వివరాలిలా ఉన్నా యి. నల్గొండ జిల్లా తిప్పర్తి గ్రామానికి చెందిన మంగమ్మ అనే మహిళ హైదరాబాద్‌లో ఉంటోంది. తన యజమాని కుటుంబ సభ్యులతో కలిసి ఖమ్మం రాగా, ఆమె కూడా వారితో వచ్చింది. తిరిగి ఈ నెల 1వ తేదీ రాత్రి కారులో హైదరాబాద్ బయలుదేరారు. ఈ క్రమంలో పాలేరు సమీపంలోకి రాగానే ఒకరికి వాంతుల కావడంతో కారును రోడ్డుపక్కన నిలిపారు. ఈ క్రమంలో మంగమ్మ కారు దిగుతుండగా తన చేతిలోని బ్యాగు కిందపడి పోయింది. దీన్ని ఆమె గమనించలేదు. వారు తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. అటువైపు నుంచి వస్తున్న పాలేరుకు చెందిన ఆటో డ్రైవర్ దాట్ల నాగరాజుకు బ్యాగు దొరకగా, పోలీసులకు అప్పగించాడు. బ్యాగులోని ఫోన్నంబర్ల ఆధారంగా బ్యాగు మంగమ్మదిగా గుర్తించి ఆమెకు ఎస్ఐ రఘు సమాచారం అందించారు. ఆదివారం ఎస్ఐ సమక్షంలో బ్యాగును ఆమెకు అందజేశారు. బ్యాగులో ఆరు తులాల బంగారు వస్తువులతో పాటు సెల్ఫోన్లు, కొంత నగదు ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. తనకు దొరికిన బ్యాగును నిజాయితీగా అప్పగించిన ఆటో డ్రైవర్ నాగరాజును ఎస్ఐ, సిబ్బంది అభినందించారు. బాధితురాలు కృతజ్ఞతలు తెలిపింది. -
వారికి పుట్టగతులు ఉండవు
కూసుమంచి : దేశాన్నే ఆకర్షిస్తున్న రైతుబంధు పథకంపై విమర్శలు చేయడమంటే అది కోడిగుడ్డుపై ఈకలు పీకడం లాంటిదని, అలాంటి వారికి పుట్టగతులుండవని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పెరికసింగారం గ్రామంలో ఆయన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఈ నాలుగేళ్లలో ప్రవేశపెట్టిన పలు పథకాలు విజయవంతమయ్యాయని, రైతుబంధు పథకం ప్రజలు, రైతుల గుండెల్లో నిలుస్తుందని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు మాత్రం ఈ పథకంపై విమర్శలు చేస్తున్నారని, చేతనైతే రైతులకు సహాయం చేసేగుణం ఉంటే, ఈ పథకంలో పాలుపంచుకోవాలని అన్నారు. కాంగ్రెస్ హయాంలో చెరువులు ఎండి, సాగునీరు లేక ప్రాజెక్టుల్లో అవినితి జరిగి రైతులు ఎంతో నష్టపోయారని తెలిపారు. తెలంగాణా వచ్చాక అట్టి కష్టాలు తీర్చామని అన్నారు. భట్టి విక్రమాక్ర వట్టి మాటలు కాకుండా గట్టి మాటలు మాట్లాడాలని హితవు పలికారు. ఆయన చేసే సవాల్‌కు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ చర్చకు సిద్ధం అని ప్రకటించారు. గాంధీభవన్ పైరవీలకే పరిమితం అయిందని, కాంగ్రెస్ చరిత్ర అంతా అవినీతి మయమేనని మంత్రి తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, ఎంపీపీ రామసహాయం వెంకటరెడ్డి, సీడీసీ చైర్మన్ జూకూరి గోపాలరావు, ఆర్ఎస్ఎస్ మండల కన్వీనర్ జొన్నలగడ్డ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
డ్రైవ ర్ను కొట్టి.. నగదుతో పరారీ
కూసుమంచి: ఇదొక ఘరానా మోసం. సూర్యాపేట నుంచి ఛత్తీస్‌గఢ్‌కు ఓ లారీ వెళుతోంది. మండలంలోని జీళ్లచెరువు సమీపంలో దీనిని మంగâ¶వారం సాయంత్రం ఓ ఆగంతకుడు మోటార్ సైకిల్‌పై వచ్చి అడ్డగించాడు. ‘‘నేను కానిస్టేబుల్ని. యాక్సిడెంట్ చేసి తప్పించుకుని తిరిగొస్తున్నావా..? కాగితాలు చూపించు’’ అని డ్రైవర్ రోంపాక బాబాయ్‌ను బెదిరించాడు. పోలీస్ స్టేషన్‌కు రావాలంటూ బైక్‌పై ఎక్కించుకున్నాడు. నేలకొండపల్లి రహదారి వైపు తీసుకెళ్లాడు. నేలకొండనల్లి మండలం రాజేశ్వరపురం కాలువ సమీపంలో అతడిని కొట్టాడు. అతని వద్దనున్న రూ.30వేలు తీసుకుని, ఆ డ్రైవర్‌ను అక్కడే వదిలేసి బైక్‌పై పరారయ్యాడు. ఆ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదుతో సీఐ వసంత్‌కుమార్, ఎస్ఐ రఘు కేసు నమోదు చేశారు. ఆగంతకుడి కోసం గాలింపు చేపట్టారు. కూసుమంచిలో ఏఎస్ఐ రవూఫ్ ఆద్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ మండలంలో వారం కిందట ఇలాంటి ఘటనే జరిగింది. ఇది రెండోది. -
తల్లిదండ్రులను, భార్యాబిడ్డలను చంపి..
ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి - ఆత్మహత్య చేసుకున్న ప్రబుద్ధుడు - తండ్రి ప్రవర్తనతో విసిగి వేసారి ఘాతుకం - రిజర్వాయర్‌లోకి నెట్టివేసిన వైనం సాక్షి, ఖమ్మం/కూసుమంచి: తండ్రి ప్రవర్తనతో విసిగి వేసారిన ఓ కొడుకు తల్లిదండ్రులు, భార్యాబిడ్డలను రిజర్వాయర్‌లో తోసి చంపేసి.. తనూ ఆత్మహత్య చేసుకున్న ఉదంతం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో బుధవారం జరిగింది. తండ్రి నిత్యం మద్యం మత్తులో తల్లిని వేధించడం.. తన భార్యను లైంగికంగా వేధించడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కూసుమంచి మండలం జీళ్లచెరువుకు చెందిన పెంటుసాహెబ్ బ్యాండ్ మేళం వాయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య మహబూబీ, కొడుకులు షేక్ సలీం, లాల్ సాహెబ్ ఉన్నారు. షేక్ సలీం జిల్లా కేంద్రంలోని ఓ విత్తనాల కంపెనీలో మార్కెటింగ్ అధికారిగా పని చేస్తున్నాడు. వీరిలో పెద్ద కొడుకు సలీంకు వివాహం కాగా.. అతడికి భార్య రజియా, ఇద్దరు కుమార్తెలు షహనాజ్, నస్రీనా ఉన్నారు. లాల్సాహెబ్కు ఇంకా వివాహం కాలేదు. అయితే, పెంటుసాహెబ్ తరచూ మద్యం తాగి వచ్చి భార్య మహబూబీని దుర్భాషలాడడంతో పాటు కోడలు రజియాను లైంగికంగా వేధించేవాడని ఆరోపణలున్నాయి. తన భార్య పట్ల తండ్రి ప్రవర్తనపై పలుమార్లు హెచ్చరించినా అతడి పరిస్థితిలో మార్పు రాకపోవడం, తల్లిని దూషిస్తుం డడంతో సలీం మనోవేదనకు గురయ్యాడు. ఇందుకు చావే పరిష్కారంగా ఎంచుకున్నాడు. ఇంట్లో మంచి జరగాలని చెప్పి.. ఇంట్లో మంచి జరగాలంటే పాలేరు కాలువ వద్దకు వెళ్లి స్నానం చేసి.. పూజలు చేయాలని మంగళవారం కుటుంబసభ్యులకు చెప్పాడు. తమ్ముడిను పిలిచి బైక్‌పై తనను, తండ్రిని పాలేరు కాలువ వద్ద దింపమని కోరాడు. తమ్ముడు వారిని పవర్ హౌస్ కాలువ వద్ద దింపగా.. తల్లితో సహా తన భార్యాపిల్లలను కూడా తీసుకురమ్మని చెప్పాడు. అతను వారిని తీసుకొచ్చేందుకు వెళ్లిన క్రమంలో తండ్రి పెంటూసాహెబ్ను కాలువలోకి తోసేశాడు. లాల్‌సాహెబ్ తల్లి, వదిన, పిల్లలను తీసుకొని వచ్చాడు. ఈ క్రమంలో సలీం.. తమ్ముడితో ఇంట్లో టీవీపై డబ్బాలో పూజా సామగ్రి లిస్టు ఉందని.. దానిని తీసుకురావాలని చెప్పి సోదరుడిని పంపించాడు. అతను వెళ్లగానే సలీం తన లుంగీని చీల్చి తల్లి మహబూబీ, భార్య రజియా నడుముకు కట్టి కాలువలోకి నెట్టేశాడు. ఇద్దరు పిల్లల నడుముకు గుడ్డకట్టి కాలువలో నెట్టేశాడు. తర్వాత తనూ కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి వెళ్లిన లాల్ సాహెబ్ తన కుటుంబం ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సలీం రాసిన లేఖ చూసి.. వెంటనే వెనక్కి తిరిగి వచ్చాడు. అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో.. చుట్టుపక్కల ప్రాంతాల్లో స్నేహితులతో కలిసి గాలించాడు. రాత్రంతా వారి కోసం వెతికి.. కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నారనే అనుమానంతో స్థానిక మత్స్యకారులు కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న ఎస్ఐ రఘు వచ్చి గాలింపు చర్యలను పర్యవేక్షించారు. ఈ క్రమంలో తొలుత ఇద్దరు పిల్లలు షహనాజ్(7), నస్రీనా(5)మృతదేహాలు నీటిలో తేలగా.. అనంతరం రజియా(28), మహబూబీ(45) మృతదేహాలు వెలికి తీశారు. సలీం(30), పెంటుసాహెబ్(50) మృతదేహాలను మత్స్యకారులు బయటకు తీశారు. తన సోదరిపై మామ పెంటుసాహెబ్ అమర్యాదగా ప్రవర్తించడంతోపాటు లైంగిక వేధింపులకు పాల్పడేవాడని, వీటిని తట్టుకోలేకే సలీం ఇంతటి దారుణానికి ఒడిగట్టాడని మృతురాలు రజియా సోదరుడు యాకూబ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మరణాలపై అనుమానాలెన్నో.. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటిల్లిపాదికి ఈతరాదని తెలిసినా తల్లి, భార్యను.. పిల్లలను కట్టేసి రిజర్వాయర్‌లోకి తోయడంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తల్లి.. భార్యను కట్టేస్తుండగా వారు ఎందుకు ప్రతిఘటించలేదు. కనీసం కేకలు ఎందుకు వేయలేదని.. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిపై ఇంత జరుగుతున్నా ఎవరూ పట్టిం చుకోలేదా? అని అనుమానిస్తున్నారు. సలీం రాసిన సూసైడ్ నోట్లో పలు అంశాలు అనుమానాలు రేకెత్తించేలా ఉన్నాయి. తమ్ముడిని జాగ్రత్తగా ఉండమని లేఖలో పేర్కొనడం, పిల్లలతో సహా అమ్మ, నాన్న, భార్య, తాను చనిపోతున్నామని ఆ లేఖలో పేర్కొన్నాడు. తండ్రిని చంపి తాను చనిపోతే నా పిల్లలు బతకడం కష్టం.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా.. అని తమ్ముడిని ఉద్దేశించి రాశాడు. -
'నల్లబెల్లం విక్రయిస్తే గ్రామ బహిష్కరణే'
కూసుమంచి (ఖమ్మం) : సారా తయారీకి వాడే నల్లబెల్లాన్ని విక్రయించిన వారికి గ్రామ బహిష్కరణ శిక్ష విధించటానికి కూడా వెనుకాడబోమని ఖమ్మం జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గణేష్, డీఎస్పీ దక్షిణామూర్తి హెచ్చరించారు. మంగళవారం వారు కూసుమంచి మండల కేంద్రంలో 'సారా నిర్మూలన- బెల్లం విక్రయాలు' అంశంపై నల్లబెల్లం విక్రేతలకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు. నల్లబెల్లం విక్రయిస్తే ముందుగా సాధారణ కేసులు పెడతామని, దారిలోకి రాకుంటే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని తెలిపారు. అయినా విక్రయాలు మానకుంటే కలెక్టర్ ప్రత్యేక అనుమతితో గ్రామ బహిష్కరణ దండన విధిస్తామని తెలిపారు. సారా తయారీ నిర్మూలనకు అధికారులతో సహకరించాలని కోరారు. -
చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయాలి
కూసుమంచి: సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పద్ధతిన విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు చెత్తను ఉపయోగించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మున్సిపల్ శాఖ రీజినల్ డెరైక్టర్ (హైదరాబాద్) ఎస్.శ్రీనివాసరెడ్డి తెలిపారు. మండల శివారు నల్లగొండ జిల్లా మోతే మండలంలోని హేమశ్రీ విద్యుత్ ప్లాంట్‌లో నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులతో ఆయన శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు రెండు ప్రైవేటు ప్లాంట్లు ఏర్పాటయ్యాయని తెలిపారు. వాటిలో ఒకటి కరీంనగర్ జిల్లాలోని శాలివాహన పవర్‌ప్లాంట్, రెండోది మోతేలోని హేమశ్రీ పవర్ ప్లాంట్ అన్నారు. వీటిలో 55 శాతం మేర చెత్త, 15 శాతం బొగ్గు, 30 శాతం బయోమిల్తో విద్యుత్‌ను తయారు చేసే వీలుందని అన్నారు. హేమాశ్రీ ప్రాజెక్టు మరో ఆరు నెలల్లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించనున్న నేపథ్యంలో దాని క్లస్టర్ పరిధిలోని ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిలాల్లోని 21 మున్సిపాలిటీల నుంచి చెత్తను సమీకరించే ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మున్సిపాలిటీల పరిధిలో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలన్నారు. సమావేశంలో రిటైర్డ్ ఆర్జేడీ (మున్సిపల్ సర్వీసెస్) ఖాదర్‌బాబా, 21 మున్సిపాలిటీలకు చెందిన కమిషనర్లు, ఇతర అధికారులు, హేమశ్రీ ప్లాంట్ మేనేజింగ్ డెరైక్టర్ బ్రిజేష్‌కుమార్ రెడ్డి, చంద్రారెడ్డి, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
మంత్రి సభలో వాగ్వాదం
కూసుమంచి : ఆసరా పథకం పింఛన్ల పంపిణీ కోసం కూసుమంచిలో శనివారం ఏర్పాటు చేసిన సభ రసాభాసగా మారింది. పింఛన్ల పంపిణీకి రాష్ట్ర మంత్రి పద్మారావు ముఖ్య అతిథిగా రాగా పాల్గొన్న ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాన్ని విమర్శించారు. దీంతో సభలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే మాట్లాడుతూ మేం జిల్లాలో 2.45 లక్షల మందికి పింఛన్లు ఇస్తే ఈ ప్రభుత్వం తగ్గిస్తోందని, పింఛన్లు ఎందుకు తగ్గిస్తారని, ఏ ఒక్క పింఛన్ పోయినా తాను ఊరుకోనని, పోరాడుతానని అన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లకు కూడా బడ్జెట్లో వెయ్యి కోట్లు ఇస్తే ఎందుకు సరిపోవడం లేదని, పెండిండ్ బిల్లులే రూ.1500 కోట్లు ఉన్నాయని, వీరు ఇచ్చింది ఏ ముందని ప్రశ్నించారు. అసలు తెలంగాణ తెచ్చింది, ఇచ్చింది మేమేనని ఎమ్మెల్యే అనడంతో టీఆర్ఎస్ పాలేరు నియోజకవర్గ ఇన్చార్జ్ బత్తుల సోమయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అసలు మీ ప్రభుత్వం ఏమి చేసిందని ..? మీ ప్రభుత్వంలోనే ఇళ్ల బిల్లులు రాలేదని, మీరే తెలంగాణ ద్రోహి’ అంటూ ఎమ్మెల్యే ప్రసంగానికి అడ్డుతగిలారు. ఆయనకు టీఆర్ఎస్ కార్యకర్తలు మద్దతు పలికి జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. దీంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ క్రమంలో డీఎస్సీ బాలకిషన్, సీఐ రవీందర్‌రెడ్డి కలుగ జేసుకుని సోమయ్యను, కార్యకర్తలను శాంతింపజేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు మద్దతుగా కాంగ్రెస్ కార్యకర్తలు జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ కార్యకర్త ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుర్చీని వేదికపైకి విసిరేందుకు యత్నించగా పోలీసు లు అడ్డుకున్నారు. దీంతో మంత్రి పద్మారావు కల్పించుకుని టీఆర్ఎస్ కార్యకర్తలను వారించారు. సభా వేదికపై ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని విమర్శిస్తుండగా జడ్పీ చైర్మన్ కవిత అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో వారి మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేకు మంత్రి చురకలు... ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడిన ఎమ్మెల్యేకు మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి తనదైన శైలిలో చురకలు వేశారు. మంత్రి మాట్లాడుతూ రాంరెడ్డి వెంకటరెడ్డి అన్నకు తనకు ముప్పై ఏళ్లుగా పరిచయం ఉందని, ఆయనున్న తాను రామన్న అంటూ పిలుస్తానని కవ్వింపుగా మాట్లాడారు. అన్నా అంటూ పిలిచిన తనను మంచిగా హైదరాబాద్‌కు పంపుతాడేమోనని అనుకుంటే పక్కనే ఉంటూ బొక్కేసిండూ అంటూ చురకలేశాడు. అన్నా మీరు మాట్లాడింది బాగానే ఉంది కానీ, మీ ప్రభుత్వంలోనే తెలంగాణకు ఒక్క పైసాగూడా ఇవ్వమని అప్పటి ఆంధ్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినప్పుడు మీరు మంత్రిగానే ఉన్నారు కదా..? అప్పుడు తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే నివ్వెర పోయారు. ఈ ప్రభుత్వం వచ్చి ఐదు నెలలే అవుతోందని, అప్పుడే విమర్శిస్తే ఎలా..? అభివృద్ధికి సహకరించాలంటూ మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.