latha mangeshkar
-
Christmas 2024 నింగికెగిసిన తారలు, కళ్లు చెమర్చే AI ఫోటోలు
-
యుగళధారతో మ్యూజిక్ థె‘రఫీ’
రఫీ సోలోలు వేన వేలు... వాటికి అభిమానులు ఉన్నారు. రఫీ డ్యూయెట్లు వేలకు వేలు... వాటికీ అభిమానులు ఉన్నారు. ఈ స్వీటు కావాలా ఆ జున్ను కావాలా అంటే చాయిస్ ఏమైనా ఉంటుందా ఎవరికైనా? రెండూ కావాలి. కాని రఫీతో డ్యూయెట్లు పాడి సరిజోడుగా నిలిచి సంగీతాభిమానులను మెప్పించిన అద్భుత గాయనీమణులను రఫీతో పాటు స్మరించుకోవాలి. డిసెంబర్ 24 రఫీ శతజయంతి. మరి ఆయనతో కలిసి పాడుదామా యుగళగీతం.లాహోర్ నుంచి ఒక అన్నను తోడు చేసుకుని బాంబేకు బయలుదేరిన రఫీ (Mohammed Rafi) తాను గాయకుడిగా బతకాలంటే ముందు సంగీత దర్శకుణ్ణి మెప్పించాలని తెలుసుకున్నాడు. ఆ రోజుల్లో నౌషాద్ చాలా పెద్ద డిమాండ్‌లో ఉన్నాడు. కాని ఆయనను నేరుగా కలిసే శక్తి రఫీకి లేదు. అందుకని అన్నాదమ్ములు ఆలోచించి నేరుగా లక్నో వెళ్లారు. అక్కడ నౌషాద్ తండ్రి ఉంటారు. ఆయన దగ్గర సిఫార్సు ఉత్తరం తీసుకుని బాంబే తిరిగి వచ్చి అప్పుడు నౌషాద్‌ను కలిశారు. ‘లాహోర్ నుంచి వచ్చావా? పాడతావా? ఏం పాడతావ్... నిన్ను వద్దనడానికి లేనంత పెద్ద రికమండేషన్ తెస్తివి’ అని నౌషాద్ రఫీని పరికించి చూసి తన టీమ్‌లోకి తీసుకున్నాడు. అప్పటికి తలత్ ఊపు మీదున్నాడు. అయినా సరే ‘దులారీ’ (1949)లో రఫీ పాడిన సోలో ‘సుహానీ రాత్ ఢల్ చుకీ నా జానే తుమ్ కబ్ ఆవొగే’ పాట పెద్ద హిట్ అయ్యి రఫీ దేశానికి పరిచయం అయ్యాడు. అయినప్పటికీ రావలసినంత పేరు రాలేదు. అప్పుడు నౌషాదే ‘బైజూ బావరా’ (1952)లో మళ్లీ పాడించాడు. ఆ సినిమాలో రఫీ పాడిన సోలో పాటలు ‘ఓ దునియాకే రఖ్వాలే’, ‘మన్ తర్పత్ హరి దర్శన్ కో ఆజ్’ పాటలు ఇక రఫీని తిరుగులేని గాయకుని స్థానంలో కూచోబెట్టాయి. రఫీ రేంజ్‌ను తెలిపిన పాటలు అవి. అయితే అప్పటికే నూర్జహాన్ పాకిస్తాన్ వెళ్లిపోగా ప్రతిభను, ప్రొఫెషనలిజాన్ని నిలబెట్టుకుంటూ లతా మంగేశ్కర్ ‘మహల్’ (1949)లో ‘ఆయేగా ఆయేగా ఆనేవాలా ఆయేగా’ పాటతో స్థిరపడింది. రఫీ, లతా తొలి పాట కామెడీ సాంగ్ అయినా ఆ తర్వాత వారి డ్యూయెట్లు సరైన రొమాంటిక్ టచ్‌ను అందుకున్నాయి. అందుకు ‘బైజూ బావరా’లోని ఈ పాటే సాక్ష్యం.తూ గంగాకి మౌజ్ మై యమునా కా ధారహో రహేగా మిలన్ యే హమారా హోహమారా తుమ్హారా రహేగా మిలన్...మేల్ సింగర్ కొందరికి సరిపోతాడు.. కొందరికి సరిపోడు అనే ధోరణి ఉంది. రఫీ.. రాజ్‌కపూర్‌కు(Raj Kapoor) మేచ్ కాడు. దిలీప్ కుమార్, దేవ్ ఆనంద్‌లకు బాగా సరిపోయేవాడు. కాని లతాకు ఆ అడ్డంకి లేదు. ఏ హీరోయిన్ గొంతైనా లతా గొంతే. మీనా కుమారి, నర్గిస్, వైజయంతీ మాల, మాలా సిన్హా.. అందరికీ లతా గొంతు. అందువల్ల రఫీ, లతాల పాటలు రాజ్ కపూర్ సినిమాల్లో తప్ప తక్కిన అన్నింటిలో కొనసాగాయి. అందరు సంగీత దర్శకులు సరైన తీపితో తయారైన రవ్వలడ్ల వంటి పాటలను వారి చేత పాడించారు.∙దో సితారోంకా జమీ పర్ హై మిలన్ ఆజ్ కీ రాత్ (కోహినూర్)∙ఓ జబ్ యాద్ ఆయే బహుత్ యాద్ ఆయే (పరాస్మణి)∙దిల్ పుకారే ఆరె ఆరె ఆరె (జువెల్ థీఫ్)∙జిల్ మిల్ సితారోంక ఆంగన్ హోగా (జీవన్ మృత్యు)∙వాదా కర్లే సాజ్నా (హాత్ కీ సఫాయి)..వీటికి అంతే లేదు. రఫీ తన కెరీర్లో షమ్మీ కపూర్‌కు పాడటానికి ఎక్కువ సరదా చూపాడు. వాళ్లిద్దరిదీ హిట్ పెయిర్. షమ్మీ కపూర్ సినిమాలో రఫీ డ్యూయెట్లు ఎక్కువగా ఆశా భోంస్లేకు (Asha Bhosle) వెళ్లినా లతా కూడా పాడింది. రఫీ–లతాల జోడి వెన్నెల–వెలుతురు లాంటిది. ఆ చల్లదనం వేరు.→ ఆశా భోంస్లేవ్యాంప్లకు పాడుతూ మెల్లమెల్లగా కుదురుకున్న గాయని ఆశా రఫీతో కలిసి గొప్ప పాటలు పాడింది. అన్నింటిలోకి కలకాలం నిలిచే పాట ‘అభీ నా జావో ఛోడ్ కర్ కె దిల్ అభీ భరా నహీ’ (హమ్ దోనో). ఈ పాటలో రఫీ బాగా పాడుతున్నాడా ఆశానా అనేది చెప్పలేం. ఓపి నయ్యర్ ఆశా చేత ఎక్కువ పాడించడం వల్ల ‘కశ్మీర్ కి కలీ’లో రఫీతో ‘దీవానా హువా బాదల్’, ‘ఏక్ ముసాఫిర్ ఏక్ హసీనా’లో ‘బహుత్ షుక్రియా బడీ మెహర్బానీ’ వంటి సూపర్హిట్లు సాధించింది. ఆర్.డి.బర్మన్ తన సంగీతంలో రఫీ, ఆశాలను అద్భుతమైన పాటల్లో కూచోబెట్టాడు. ‘ఓ మేరే సోనరే సోనరే సోనరే’ (తీస్రీ మంజిల్), ‘చురాలియా హై తుమ్నే జో దిల్‌కో’ (యాదోంకి బారాత్)... ఒంట్లో నిస్సత్తువను వదలగొట్టే పాటలు.→ గీతా దత్ఎంతో గొప్ప గాయని అయి ఉండి తక్కువ కాలం పాడిన గీతా దత్ (గీతా రాయ్) గురుదత్ సినిమాల్లో రఫీతో మురిపమైన పాటలు పాడింది. ‘సున్ సున్ సున్ జాలిమా’ (ఆర్ పార్), ‘హమ్ ఆప్కే ఆంఖోమే ఇస్ దిల్ కో బసాదేతో’(ప్యాసా) ఇవి రెండు గురుదత్ మీద తీసినవి. ‘సిఐడి’లో దేవ్ ఆనంద్, షకీలా మీద తీసిన ‘ఆంఖోహి ఆంఖోమే ఇషారా హోగయా’..పెద్ద హిట్. గురుదత్ సినిమాల్లో కమెడియన్ జానీ వాకర్‌కు పాటలు ఉంటాయి. జానీ వాకర్‌కు కూడా రఫీనే పాడతాడు. తోడు గీతా దత్. ‘అయ్ దిల్ ముష్కిల్ హై జీనా యహా’ (సిఐడి), ‘జానే కహా మేరా జిగర్ గయా జీ’(మిస్టర్ అండ్ మిసెస్ 55)... ఇవన్నీ దశాబ్దాలైనా నిలిచి ఉన్న పాటలు. రఫీతో పాటు గాయనీమణులు నిలబెట్టిన పాటలు.→ సుమన్ కల్యాణ్పూర్రాయల్టీ విషయంలో లతా మంగేష్కర్‌కు (Lata Mangeshkar) రఫీకు విభేదాలు వచ్చాయి. రాయల్టీ కావాలని లతా, అక్కర్లేదని రఫీ మూడేళ్లు విభేదించి పాడలేదు. 1961 నుంచి 63 వరకు సాగిన ఈ కాలంలో రఫీతో డ్యూయెట్లు పాడిన గాయని సుమన్ కల్యాణ్‌పూర్. ‘పూర్‌మేన్స్ లతా’గా పేరుబడ్డ సుమన్‌కు గొప్ప ప్రతిభ ఉన్నా తక్కువ అవకాశాలు దొరికాయి. అయినా సరే రఫీ, సుమన్ కలిసి మంచి హిట్స్ ఇచ్చారు. వీటిలో ‘బ్రహ్మచారి’ కోసం పాడిన ‘ఆజ్ కల్ తెరె మెరె ప్యార్ కే చర్చే హర్ జబాన్ పర్’, ‘జబ్ జబ్ ఫూల్ ఖిలే’లో ‘నా నా కర్తే ప్యార్ తుమ్హీసే కర్బైఠే’ పెద్ద హిట్స్‌గా నిలిచాయి. ‘రాజ్ కుమార్’లోని ‘తుమ్నే పుకారా ఔర్ హమ్ చలే ఆయే’ కూడా పెద్ద హిట్టే. అయితే లతా, రఫీల మధ్య సంధి కుదరడంతో సుమన్ వెనక్కు వెళ్లిపోయింది.వీళ్లే కాదు ఎందరో గాయనులతో రఫీ డ్యూయెట్స్ పాడాడు. షంషాద్ బేగంతో ‘లేకె పెహలా పెహలా ప్యార్’, ముబారక్ బేగంతో ‘ముజ్కో అప్నే గలే లగాలో’, హేమలతాతో ‘తూ ఇస్ తర్హా మేరి జిందగీమే’... లాంటి ఎన్నో మంచి పాటలు ఉన్నాయి. సుశీలతో ‘ఇద్దరి మనసులు ఒకటాయె’, జానకితో ‘నా మది నిన్ను పిలిచింది గానమై’... ఈ పాటలు అపురూపం. రఫీ ఘనతలో రఫీ ఫ్రతిభకు మరో సగమై నిలిచిన గాయనీమణులందరికీ రఫీ శతజయంతి సందర్భంగా జేజేలు పలకాలి. రఫీకి జిందాబాద్‌లు కొట్టాలి. -
చూపున్న పాట
‘నవ్వినా ఏడ్చినా కన్నీళ్లు వస్తాయి’ అన్నాడు కవి. పట్టలేని ఆనందంలో, ప్రశంసించడానికి మాటలు దొరకని పరిస్థితుల్లో కూడా కన్నీళ్లు వస్తాయి. మేనుక పౌదెల్ పుట్టు అంధురాలు. మంచి గాయకురాలు. ఇండియన్ ఐడల్ 14 సీజన్లో ‘లగాన్’ సినిమాలో లతా మంగేష్కర్ పాడిన ‘ఓ పాలన్ హరే’ పాట పాడింది. అద్భుతమైన ఆమె పాట వింటూ జడ్జీలలో ఒకరైన శ్రేయా ఘోషల్ ఏడ్చేసింది. ఈ ఎపిసోడ్ ఇంటర్నెట్లో వైరల్ అయింది. వైరల్ కావడం మాట ఎలా ఉన్నా ‘శ్రేయ ఓవర్‌గా రియాక్ట్ అయ్యారు’ అని కొందరు విమర్శించారు. మరి ఆమె అభిమానులు ఊరుకుంటారా? వాళ్లు ఇలా స్పందించారు...‘రెండు దశాబ్దాలకు పైగా శ్రేయ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్నారు. ఎన్నో జాతీయ అవార్డ్లు అందుకున్నారు. ఆమెకు ప్రతిభ లేకపోతే ఇలా వచ్చి అలా వెళ్లిపోయేవారు. ఇలాంటి టాలెంటెడ్ సింగర్ గురించి నెగెటివ్ కామెంట్స్ పెట్టడం తగదు’. -
నా పాట విని లతా మంగేష్కర్ భయపడింది..
-
వాళ్లు నన్ను పట్టించుకోలేదు.. అలా ఎవరకీ జరగకూడదు: వాణీ జయరామ్
ఏ వృత్తిలో అయినా పోటీ సహజం. అలా వాణీ జయరామ్ బాలీవుడ్‌కి తన వాణి వినిపించడానికి వెళ్లినప్పుడు అప్పటికే అక్కడ ‘స్టార్ సింగర్స్’గా వెలుగుతున్న అక్కచెల్లెళ్లు లతా మంగేష్కర్, ఆశా భోంస్లేల నుంచి గట్టి పోటీ ఎదురైంది. హిందీ చిత్రం ‘గుడ్డి’ (1971)లో పాడిన ‘బోలె రే పపీ హరా..’ పాట ద్వారా బాలీవుడ్‌కి పరిచయమై ‘మధురమైన కంఠం’ అని శ్రోతల నుంచి కితాబులు అందుకున్నారు వాణీ జయరామ్. అయినప్పటికీ ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. లత, ఆశాలు వాణీకి అవకాశాలు రాకుండా చేశారనే ఓ టాక్ ఇప్పటికీ ఆ నోటా ఈ నోటా వినిపిస్తుంటుంది. (చదవండి: మూగబోయిన వాణి) ఇదే విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో వాణీ జయరామ్ మాట్లాడుతూ – ‘‘కెరీర్ పరంగా నేను ఎవరి పేర్లూ ఉద్దేశించి మాట్లాడను. లతాజీ, ఆశాజీ గొప్ప గాయనీమణులు. వాళ్లు నాకేమైనా చేశారా? చేయలేదా? అనే విషయం గురించి నేను మాట్లాడను. ఒకరు ఏం చేశారనే విషయంపై నేను ఓ నిర్ణయానికి రాకూడదు. అయితే హిందీలో నేను విజయాలు సాధించినప్పటికీ నన్ను పెద్దగా పట్టించుకోలేదు. అది దురదృష్టం. అలా ఎవరికీ జరగకూడదు’’ అని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆమె గాయనీమణులు శంషాద్ బేగం, సుమన్ కల్యాణ్‌పూర్‌ల పేర్లను ప్రస్తావించారు. ‘‘శంషాద్, సుమన్‌లు మంచి సింగర్స్ అయినప్పటికీ అనుకున్నంతగా రీచ్ కాలేకపోయారు. ఇలా ఎందరికో జరిగి ఉండి ఉంటుంది. వారిలో నేను ఒకదాన్ని... అంతే. అయితే ఇలా జరగడానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది’’ అని కూడా వాణి అన్నారు. -
అయోధ్యలో లతా మంగేష్కర్ చౌక్ ఏర్పాటు
-
స్నేహమొక్కటి నిలిచి వెలుగును
ఉస్తాద్ బడే గులామ్ అలీఖాన్ ఎప్పుడు మద్రాసు వచ్చినా ఘంటసాల ఇంట్లో బస చేసేవారు. ఇప్పటిలా ఉదయమొచ్చి సాయంత్రానికి వెళ్లిపోవడం కాదు. నెలా రెండు నెలలు ఉండిపోవడమే. మేడ మీద వారు ఉంటే అన్నము, రొట్టెలు నిరాటంకంగా ఘంటసాల ఇంటి నుంచి వెళ్లేవి. బడే గులామ్ అలీఖాన్ ‘మొఘల్ ఏ ఆజమ్’లో నాలుగైదు నిమిషాల ఆలాపనకు 25 వేల రూపాయలు తీసుకున్నారు– 1960లో. అంటే నేటి విలువ 20 కోట్లు. అంత ఖరీదైన, మహా గాత్ర విద్వాంసుడైన బడే గులామ్ అలీఖాన్ ఏం చేసేవారో తెలుసా? తనకు బస ఇచ్చిన ఘంటసాల స్నేహాన్ని గౌరవిస్తూ, అన్నం పెడుతున్న ఘంటసాల సతీమణి సావిత్రమ్మను గౌరవిస్తూ తాను ఉన్నన్నాళ్లు ప్రతి శుక్రవారం పిలిచి ప్రత్యేకం వారిద్దరి కోసమే పాడేవారు. గంట.. రెండు గంటలు... పాడుతూనే ఉండిపోయేవారు. స్నేహం అలా చేయిస్తుంది. లతా మంగేష్కర్ వృద్ధిలోకి వచ్చిందని ఎవరికో కన్ను కుట్టింది. ఆమెకు స్లో పాయిజన్ ఇచ్చి చంపడానికి వంట మాస్టర్ని ప్రవేశ పెడితే స్లో పాయిజన్ ఉన్న వంట తినీ తినీ ఒక్కసారిగా ఆమె జబ్బు పడింది. మూడు నెలలు మంచం పట్టింది. బతుకుతుందో లేదో, మరల పాడుతుందో లేదో తెలియదు. కానీ గీతకర్త మజ్రూ సుల్తాన్‌పురి ఆమెను రోజూ మధ్యాహ్నం చూడటానికి వచ్చేవాడు. సాయంత్రం ఏడూ ఎనిమిది వరకు కబుర్లు చెబుతూ కూచునేవాడు. ఒక రోజు కాదు రెండు రోజులు కాదు... ఆమె తిరిగి రికార్డింగ్ థియేటర్లో అడుగుపెట్టే రోజు వరకూ అతడా పని మానలేదు. స్నేహం అలానే చేయిస్తుంది. గబ్బర్‌సింగ్‌గా విఖ్యాతుడైన అంజాద్ ఖాన్, అమితాబ్‌కు ఆప్తమిత్రుడు. కుటుంబంతో గోవా వెళుతూ తీవ్రమైన కారు యాక్సిడెంట్ జరిగితే అందరూ చచ్చిపోతాడనే అనుకున్నారు. అమితాబ్‌కు ఈ విషయం తెలిసి ఆగమేఘాల మీద ఆస్పత్రికి వచ్చాడు. ఇంటికెళ్లక దివారాత్రాలు కాపలా కాశాడు. ఏమి సాయం కావాలంటే ఆ సాయం చేయడానికి సిద్ధం. అతి కష్టమ్మీద అంజాద్ ఖాన్ బతికాడు. స్నేహితుడు అమితాబ్ బచ్చన్ తన కంటికి కునుకు పట్టే అనుమతినిచ్చాడు. ఈద్ అంటారొకరు. పండగ అంటారొకరు. దువా అంటారొకరు. ప్రార్థన అంటారొకరు. మక్కా మదీనాల ఫొటో ఒక గుమ్మం మీద! విఘ్నేశ్వరుడి చిత్రపటం ఒక వాకిలికి! అమ్మ వండితే ‘ఖీర్’ అంటారొకరు. ‘పాయసం’ అని లొట్టలు వేస్తారొకరు. విరజాజుల పూలతీవ ఇరు ఇళ్ల మీద ఒక్కలాంటి పరిమళమే వెదజల్లుతుంది. ప్రభాతాన సుప్రభాతం అయితే ఏమిటి... వినిపించే అజాన్ అయితే ఏమిటి... ఒడలు పులకరింప చేస్తుంది. ‘క్యా భాయ్’ అని ఒకరు.. ‘ఏవోయ్’ అని ఒకరు! స్నేహం దేవుళ్ల అనుమతితో జరగదు. అది హృదయాల దగ్గరితనంతో సంభవిస్తుంది. కళే మతం అనుకునే కళాకారులకు ఈ స్నేహం ఒక ఆరాధనగా ఉంటుంది. ‘ప్యార్ కియా జాయ్’ (ప్రేమించి చూడు)లో మెహమూద్, ఓం ప్రకాశ్‌ల కామెడీ విపరీతంగా పండింది. సినిమా పిచ్చోడైన మెహమూద్, తండ్రి ఓం ప్రకాశ్‌ను పెట్టుబడి పెట్టమని పీడించుకు తింటుంటాడు. చివరకు ఒకనాడు ‘అసలేం తీస్తావో కథ చెప్పు’ అని ఓం ప్రకాశ్ అంటే మెహమూద్ దడుచుకు చచ్చే హారర్ స్టోరీ చెబుతాడు. నవ్వూ, భయమూ ఏకకాలంలో కలిగే ఆ సన్నివేశంలో మెహమూద్ యాక్షన్ ఎంత ముఖ్యమో ఓం ప్రకాశ్ రియాక్షన్ అంతే ముఖ్యం. ఆ సన్నివేశం మెహమూద్‌కు ఆ సంవత్సరం బెస్ట్ కమెడియన్‌గా ఫిల్మ్‌ఫేర్ సంపాదించి పెడితే వేదిక మీద అవార్డ్ అందుకున్న మెహమూద్ కారు ఎక్కి ఆనందబాష్పాలతో నేరుగా ఓం ప్రకాశ్ ఇంటికి వెళ్లాడు. ‘మనిద్దరం చేసిన దానికి నాకొక్కడికే అవార్డు ఏంటి? ఇది నీదీ నాదీ’ అని పాదాల దగ్గర పెట్టాడు. స్నేహితులు ఇలాగే ఉంటారు. స్నేహారాధన తెలిసిన కళాకారులు ఇలాగే! కళ ఈ దేశంలో ఎప్పుడూ మతాన్ని గుర్తు చేయనివ్వలేదు. మతం మనిషికి మించింది కాదని చెబుతూనే వచ్చింది. ఒక హిందూ సితార్తో ఒక ముస్లిం తబలా జుగల్బందీ చేసింది. ఒక హిందూ గాత్రంతో ఒక ముస్లిం సారంగి వంత పాడింది. ఒక హిందూ నర్తనతో ఒక ముస్లిం షెహనాయి గంతులేసింది. ‘మిమ్మల్ని అమెరికా పట్టుకెళతాం... హాయిగా సెటిల్ అవ్వండి’ అని బిస్మిల్లా ఖాన్‌తో అంటే, ‘తీసుకెళతారు నిజమే... నేను పుట్టిన ఈ కాశీ పురవీధులు, ఈ పవిత్ర గంగమ్మ ధార... వీటిని నాతో పాటు తేగలరా’ అని జవాబు పలికాడు. ఈ జవాబే ఈ దేశ సిసలైన సంస్కృతి. సంతూర్ విద్వాంసుడు పండిట్ శివ్‌కుమార్ శర్మ మొన్నటి దినాన మరణిస్తే ఆయనతో సుదీర్ఘ స్నేహంలో ఉన్న, కలిసి వందలాది కచ్చేరీలు చేసిన తబలా మేస్ట్రో ఉస్తాద్ జకీర్ హుసేన్ ఆయన పార్థివ దేహానికి తన భుజం ఇచ్చాడు. దహన సంస్కారాలు మొదలయ్యాక అందరూ పక్కకు తొలగినా స్నేహితుణ్ణి విడిచి రాను మనసొప్పక పక్కనే ఒక్కడే చేతులు కట్టుకుని నిలుచున్నాడు. ఈ ఫొటో వైరల్‌గా మారితే... ‘ఇది గదా ఈ దేశపు నిజమైన సంస్కారం’ అని ఎందరో కళ్లు చెమరింప చేసుకున్నారు. కష్టపెట్టేవాటిని ప్రకృతి ఎక్కువ కాలం అనుమతించదు. వడగాడ్పులను, తుపాన్లను, భూ ప్రకంపనాలను, విలయాలను లిప్తపాటే అనుమతిస్తుంది. ద్వేషానికి, విద్వేషానికి కూడా అంతే తక్కువ స్థానం, సమయం ఇస్తుంది. ప్రేమ దాని శిశువు. స్నేహం దాని గారాల బిడ్డ. ఆ గారాల బిడ్డకు అది పాలు కుడుపుతూనే ఉంటుంది. ఈ దేశం ప్రేమ, స్నేహాలతో తప్పక వర్ధిల్లుతుంది. -
రూ. 200 కోట్లకు పైగా లతా ఆస్తులు ఎవరికి? వీలునామాలో ఏం ఉంది..
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఇక లేరన్న వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. లతాజీ మరణంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొన్నివేల పాటలతో సంగీత ప్రియులను మైమరిపించిన ఆమె 92 ఏళ్ల వయసులో కన్నుమూసింది. అనారోగ్యంతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఐదేళ్ల వయసు నుంచి పాడటం ప్రారంభించిన లతా మంగేష్కర్ ఇండియన్ నైటింగల్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. హిందీ, మరాఠీ, తెలుగు సహా వివిధ భాషల్లో 50వేలకు పైగా పాటలు పాడిన ఈ ఇండియన్ నైటింగల్ తన గొంతుతో సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నారు. అలా చివరి వరకు స్టార్ గాయనిగా వెలుగువెలిగిన లతాజీ రెమ్యునరేషన్ కూడా అత్యధికంగానే తీసుకునేవారు. పెళ్లి కూడా చేసుకోని లతా మంగేష్కర్ ఆస్తుల చిట్టా చాలా పెద్దది. ఆమె నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 200 కోట్లపైనే. సాధారణంగా మరణాంతరం వారి ఆస్తులు పిల్లలకు లేదా భర్తకు చెందుతాయి. కానీ చివరి వరకు బ్రహ్మచారినిగా ఉన్న లతాజీ ఆస్తులు ఇప్పుడు ఎవరికి చెందుతాయనేది ప్రశ్నగా మారింది. ఆమె చెల్లెల్లు ఆశా భోంస్లే, మీన ఖడికర్, ఉషా మంగేష్కర్ సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్లకు దగ్గుతాయని అంటున్నారు. అలాగే తన తండ్రి పేరుపై కట్టించిన ట్రస్ట్‌కు కూడా లతా ఆస్తులు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆమె చెల్లెల్లు, సోదరుడు గాయకులుగా మంచి పోజిషన్లో ఉన్నారు. ఆస్తులు కూడా బాగానే సంపాదించుకున్నారు. వారంత ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. దీంతో లతా ఆస్తులు ట్రస్ట్‌కు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు. చిన్నప్పటి నుంచి కూడా చదువు మానేసి మరీ తన జీవితం అంతా కుటుంబాన్ని పోషించడం కోసం కష్టపడింది. మరి ఆమె మరణాంతరం ఆస్తులు ఎవరి పేరుపై ఆమె రాశారనేది సస్పెన్స్‌లో ఉండిపోయాయి. మరి దీనిపై ఆమె లాయరు ఎలాంటి ప్రకటన ఇవ్వనున్నాడనేది కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. కాగా ఓ మీడియా రిపోర్టు ప్రకారం.. లతా మంగేష్కర్ మొత్తం ఆస్తుల విలువ దాదాపు దాదాపు 200 కోట్లకు పైనే ఉంటాయని సమాచారం. ఆమె చివరి వరకు ప్రభు కుంజ్ అనే నివాసంలో ఉన్నారు. అంతేకాక ముంబై పెద్దర్ రోడ్లో మరో విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది. ఆమెకి పాటల ద్వారానే కాక రెంట్స్ రూపంలో కూడా సంపాదన వస్తుంది. ఆమె పాడిన పాటలకు రాయల్టీ ద్వారా సంవత్సరానికి దాదాపు 5 కోట్ల పైగానే ఆదాయం వస్తోందని తెలుస్తుంది. -
Lata Mangeshkar: ప్రేమ గుడ్డిదని తెలుసు.. చెవిటిదని తొలిసారి తెలుసుకున్నా!
లతాలో తెలిసిన మనిషి ఎంత ఉన్నదో తెలియని మనిషి అంత ఉన్నది. పట్టుదల జాస్తి. గెలవాలన్న మొండితనం. తన సామర్థ్యం తనకు తెలుసు కనుక మిగిలిన వారు అక్కర్లేదన్నంత అహం. పొగడ్తలు ఆమెకే. విమర్శలూ ఆమెకే. లతా చిన్నా పెద్ద తగాదాలు పెట్టుకోని సంగీత దర్శకులు లేరు. సి.రామచంద్ర, ఎస్.డి.బర్మన్లను ఆమె కొన్నాళ్లు బాయ్‌కాట్ చేసింది. పాట పాడి రెమ్యూనరేషన్ తీసుకున్నాక ఇక దాని సంగతి పట్టించుకోవాల్సిన పని లేదు అని రఫీ అభిప్రాయం. కాని రికార్డులు అమ్ముడైనంత కాలం రాయల్టీ ఇవ్వాల్సిందే అని లతా వ్యాపారసూత్రం. తన మాటను పడనివ్వడం లేదని రఫీతో కొన్నాళ్లు పాడటం మానేసింది. ఆమె దగ్గర చాలా పదునైన వ్యంగ్యం ఉంది. శంకర్ జైకిషన్లోని శంకర్ గాయని శారదతో పాటలు పాడించడం ఆమెకు ఇష్టం లేదు. శారద, శంకర్ సన్నిహితం అని ఆమెకు తెలుసు. ‘ప్రేమ గుడ్డిదని తెలుసుగాని చెవిటిదని మొదటిసారి తెలుసు కున్నాను’ అని కామెంట్ చేసింది శారద అపస్వరాలను శంకర్ భరిస్తున్నాడు అనే అర్థంలో. తండ్రి మరణించి కుటుంబం నానా కష్టాల్లో ఉండగా చెల్లెలు ఆశా భోంస్లే తమ మేనేజర్ గణపత్ రావు భోంస్లేతో పెళ్లి పేరుతో వెళ్లి పోవడం లతా అసలు సహించలేదు. ఎన్నో ఏళ్లు ఆశాను దూరం పెట్టింది. భర్త ఇంటి నుంచి ఆశా పారిపోయి వచ్చినా కనికరించలేదు. వాళ్లిద్దరూ డ్యూయెట్స్ పాడాల్సి వచ్చినప్పుడు తను ఆశా ముఖం చూడకుండా డైరీ అడ్డు పెట్టుకుని పాడేది. క్యాబరే పాటలు చేస్తున్న హెలెన్ తనకు లతా పాడదు కాబట్టి ఆశాను నిలబెట్టింది. లతాతో జీవితంలో ఒక్క పాటా పాడించని ఓ.పి.నయ్యర్ కూడా. ఆ తర్వాత కాలంలో అక్కచెల్లెళ్లు కలిశారు. ‘వీరిద్దరూ కొంచెమైనా చదువుకుని ఉంటే ప్రవర్తనా దోషాలు తగ్గి ఉండేవి’ అని నౌషాద్ అన్నాడు. ముంబైలో కొత్త గాయనులు వీరి ప్రాభవం వల్ల ఊపిరి పీల్చడానికి ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా లతాకు భయపడి ఇండస్ట్రీ కొత్త గాయని గొంతును ఎదగనిచ్చేది కాదు. సుమన్ కల్యాణ్‌పూర్, హేమలత, వాణి జయరామ్ ఆల్మోస్ట్ ముంబై ఖాళీ చేశారు. నాజియా హసన్ వచ్చి ‘ఆప్ జైసా కోయి మేరే జిందగీ మే ఆయే’ పాడితే ఆ ఫ్రెష్‌నెస్‌కు నాజియా దుమారానికి లతా బెంబేలెత్తిందని అంటారు. అనురాధా పౌడ్వాల్ టి సిరిస్ గుల్షన్ కుమార్ వల్ల నెగ్గుకొని వచ్చింది. లతా కొంత దారి ఇచ్చింది అల్కా యాగ్నిక్, కవితా కృష్ణమూర్తిలకే. ఇప్పటి కాలంలో శ్రేయ ఘోషాల్, సునిధి చౌహాన్ ఇష్టం అని ఆమె చెప్పుకుంది. లతా తన పాటలు తాను వినదు... తప్పులు కనపడతాయని. ఎప్పుడైనా తానే పాడిన మీరా భజన్స్ మాత్రం వింటానని చెప్పుకుంది. లతా తన ఇంటి ఎదురుగా ఉన్న రోడ్డు మీద ఫ్లై ఓవర్ వేయడానికి ఒప్పుకోలేదు... ట్రాఫిక్ అంతరాయం అని. ముంబై ఖాళీ చేస్తాను అనంటే ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఇంత మొండితనం ఉన్న లతా అంతే మొండితనంతో తండ్రి పేరున దీనానాథ్ మంగేష్కర్ హాస్పిటల్‌ను కట్టి ప్రజలకు అప్పజెప్పింది. చదవండి: Lata Mangeshkar: లతా పాట.. 20 లక్షలు జమయ్యాయి.. వరల్డ్‌కప్ విన్నర్స్ టీమిండియాలో ఒక్కొక్కరికి లక్ష! -
లతా మంగేష్కర్ మరణం...చివరి సమావేశాన్ని వాయిదా వేసిన ఆర్బీఐ..!
గాన కోకిల, మెలోడి క్వీన్, భారత రత్న లతా మంగేష్కర్ ఆదివారం రోజున మరణించిన విషయం తెలిసిందే. లతా మంగేష్కర్ మృతికి సంతాపంగా మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం రోజున సెలవు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశాన్ని రీషెడ్యూల్ చేస్తున్నట్టు ఆర్బీఐ ఆదివారం ప్రకటించింది. దీంతో సోమవారం ప్రారంభం కావాల్సిన సమావేశం మంగళవారం ప్రారంభం కానుంది. రివర్స్ రెపో రేటు.. పెరిగే అవకాశం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) చివరి సమీక్షా సమావేశం మంళవారం జరగనుంది. ఈ సందర్భంగా కీలక రేట్లను పావు శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బ్రిటిష్ బ్రోకరేజీ సంస్థ బార్క్లేస్ అంచనా వేసింది. ‘‘ఒమిక్రాన్ వేరియంట్ విస్తరణ నేపథ్యంలో వృద్ధిపై ఆందోళనలు వ్యక్తమవుతున్న సందర్భంలో వృద్ధికి మద్దతుగా ఆర్బీఐ సర్దుబాటు విధానాన్నే కొనసాగించొచ్చు. రివర్స్ రెపో రేటును 0.20–0.25 శాతం వరకు పెంచొచ్చు అని బార్క్లేస్ అంచనా వేసింది. ప్రస్తుతం ఈ రేటు 3.35%గా ఉంది. ప్రభుత్వం ఊహించని విధంగా రుణ సమీకరణ పరిమాణాన్ని బడ్జెట్లో పెంచినందున ఇది పాలసీ సాధారణీకరణ దిశగా ఆర్బీఐకి సంకేతం ఇచ్చినట్టేనని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బడ్జెట్లో మూలధన వ్యయాలపై దృష్టి సారించడం ఆర్థిక వ్యవస్థకు ప్రేరణనిస్తుందని.. ద్రవ్యోల్బణం సహా స్థూల ఆర్థిక నేపథ్యాన్ని మార్చదని బార్క్లేస్ పేర్కొంది. -
స్వర్గం కొత్త కాంతులతో వెలుగుతుంది
భారత గానకోకిల, దిగ్గజ గాయని లతా దీదీ ఇక లేరు. ఆమె లేని లోటు ఎవరూ పూడ్చలేరు. సంగీతం సజీవంగా ఉన్నంత వరకు ఆమె పాటలు వినిపిస్తూనే ఉంటాయి. – చిరంజీవి లతాగారి మరణం దేశానికే కాదు.. సంగీత ప్రపంచానికే తీరని లోటు. దేశంలో ఎన్నో అవార్డులు, రివార్డులు పొందారామె. విదేశాలు కూడా పురస్కారాలతో ఆమెను గౌరవించడం గర్వకారణం. – బాలకృష్ణ నైటింగేల్ ఇక లేరని తెలిసి నా హృదయం ముక్కలయింది. లతాగారు ఎందరికో స్ఫూర్తి ఇచ్చారు. ఆమె లేని లోటు ఎప్పటికీ శూన్యాన్ని సృష్టిస్తుంది. – వెంకటేశ్ లతాజీ మరణం తీరని లోటు. భారతదేశ నైటింగేల్‌కి నా హృదయపూర్వక నివాళులు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. – రాజమౌళి, డైరెక్టర్ భారతీయ సినీ సంగీత లోకంలో ధ్రువతార, గాన కోకిల లతా మంగేష్కర్‌గారు తుదిశ్వాస విడి చారన్న విషయం ఆవేదనను కలిగించింది. లతాజీ అస్తమయం భారతీయ సినీ సంగీతానికే తీరని లోటు. బాల్యం నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఆమె నిలిచి, గెలిచిన తీరు స్ఫూర్తిదాయకం. – పవన్ కల్యాణ్ మా గానకోకిల మూగబోయింది. మా మధ్య భౌతికంగా మీరు లేకపోవచ్చేమో కానీ మీ పాటలు మాత్రం ఎప్పటికీ సజీవంగా ఉంటాయి. పాటలో ఒకే ఒక్క లైన్‌తో మమ్మల్ని ఎన్నో అనుభూతులకు గురి చేశారు. – మహేశ్‌బాబు పాకిస్తాన్–బర్మా యుద్ధంలో బర్మా తరఫున యుద్ధం చేస్తున్న మన దేశ సైనికులు చాలామంది అమరులయ్యారు. కొంతమంది గాయాలపాలయ్యారు. ఆ సమయంలో లతా మంగేష్కర్తో పాటు చాలామంది ప్రముఖులు సైనికులను పరామర్శించడానికి బర్మా వెళ్లారు. గాయపడ్డ ఓ సైనికుడు ‘లతాగారిని చూడాలని, ఆమె పాట వినాలని ఉంది’ అని డాక్టర్‌కి చెప్పాడు. లతగారు అతన్ని ఆలింగనం చేసుకుని, ‘ఆరాధన’ సినిమాలోని పాట పాడారు. ఆ పాటతో అతనిలో ఊపిరి వచ్చి కోలుకొని బతికాడు.. దటీజ్ లతా మంగేష్కర్. – ఆర్. నారాయణమూర్తి భారతీయ సినిమా నైటింగేల్ లతా మంగేష్కర్‌ను కోల్పోయినందుకు మాకు చాలా బాధగా ఉంది. మా సంస్థ నిర్మించిన ‘ఆఖరి పోరాటం’ సినిమాలోని ‘తెల్ల చీరకు..’ పాటకు మీరు (లతా మంగేష్కర్) ఇచ్చిన వాయిస్ మీతో మాకు ప్రత్యేక అనుబంధాన్ని కలగజేసింది. – వైజయంతి మూవీస్ భారతీయ సంగీతంలో ఆరేడు దశాబ్దాలుగా తన అద్భుత స్వరంతో సంగీత శ్రోతలను మైమరచిపోయేలా చేశారు లతా మంగేష్కర్‌గారు. ఆమె మరణం నాలో ఓ శూన్యతను నెలకొల్పింది. ఈ శోకం నుంచి నేను ఎలా బయటకు రావాలో అర్థం కావడం లేదు. ఒక్క మ్యూజిక్ ఇండస్ట్రీకే కాదు.. ఆమె మరణం ప్రపంచానికే తీరని లోటు. కానీ ఆమెతో కలిసి పని చేశాననే భావన నన్ను కాస్త ఓదార్చుతోంది. మనందరి హృదయాల్లోని లతా మంగేష్కర్ స్థానం ఎవరూ భర్తీ చేయలేనిది. – ఇళయరాజా మా నాన్నగారితో (సంగీతదర్శకుడు ఆర్కే శేఖర్) లతా మంగేష్కర్‌గారు వర్క్ చేశారు. అప్పట్లో నేను ఆమె రికార్డింగ్స్‌ను చూస్తూ ఎంతో స్ఫూర్తి పొందాను. ప్రతి లిరిక్‌ను ఎంతో స్పష్టంగా, ఎంతో బాగా పాడతారామె. భారతీయ సంగీతంలో ఆమె ఓ భాగం. లతగారు పాడిన పాటలకు నేను సంగీతం అందించడం, ఆమెతో కలిసి పాటలు పాడటం, కలిసి స్టేజ్ షేర్ చేసుకోవడం వంటివాటిని నేను మర్చిపోలేను. ఆమె నుంచి నేను ఎంతో స్ఫూర్తి పొందాను. – ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇండస్ట్రీకి బ్లాక్ డే. లతాగారిలాంటి సింగర్ వస్తారా? అనేది నాకో క్వశ్చన్ మార్క్. లతా మంగేష్కర్గారిని రెండుసార్లు కలిసే అవకాశం నాకు లభించింది. ముంబైలోని ఉన్నప్పుడు ఆమె స్టూడియోలో వర్క్ చేసేవాడిని. ఓ సందర్భంలో ఆవిడ అక్కడకు వచ్చారు. అప్పుడు అక్కడి వారు నన్ను ఆవిడకు పరిచయం చేశారు. అంత పెద్ద గాయని అయ్యుండి ‘నమస్తే.. అనూప్ జీ’ అని ఎంతో గౌరవంగా మాట్లాడారు. – అనూప్ రూబెన్స్ భారతదేశం పాటలు పాడుతున్నంత కాలం లతా మంగేష్కర్ జీవించే ఉంటారు. ఆమె అద్భుతమైన సింగరే కాదు. మంచి మానవతావాది కూడా. నా దర్శకత్వంలో వచ్చిన హిందీ చిత్రం ‘లేకిన్’ (1991)కు లతా మంగేష్కర్ ఓ నిర్మాత. ఆ సినిమా షూటింగ్ సమయంలో చిత్రయూనిట్ సభ్యులకు ఆమె బహుమతులు ఇచ్చారు. ‘లేకిన్’ సినిమాలోని పాటకు బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్‌గా లతా మంగేష్కర్‌కు జాతీయ అవార్డు రావడం హ్యాపీగా ఉంది. గౌతమ బుద్ధుని ప్రతిమలను సేకరించే అలవాటు నాకు ఉందని తెలుసుకున్న ఆమె నాకు నాలుగు బుద్ధుని ప్రతిమలను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆరు నెలల క్రితం కూడా ఆవిడ నాకు ఓ గౌతమ బుద్ధుని ప్రతిమను బహుమతిగా పంపారు. ఆమె వ్యక్తిత్వానికి ఇదో నిదర్శనం. – గుల్జార్ లతా మంగేష్కర్‌గారి మరణం తీరని లోటు. ఆమె పాటలతో పాటు ఆమె వ్యక్తిత్వం కూడా ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. – శత్రుఘ్న సిన్హా కొన్ని రోజుల క్రితం లతా మంగేష్కర్గారితో హాస్పిటల్లో మాట్లాడాను. లతా మంగేష్కర్‌గారు తిరిగి కోలుకుంటారని డాక్టర్స్ చెప్పేవారు. కానీ ఊహించనిది జరిగింది. నా జీవితంలో నన్ను ఎన్నోసార్లు మోటివేట్ చేశారు. ఆవిడతో నాకు మంచి అనుబంధం ఉంది. – ధర్మేంద్ర ఆమె మనల్ని విడిచి వెళ్లిపోయారు. ఎన్నో శతాబ్దాలు నిలిచి ఉండగల స్వరం మనకు దూరమైపోయింది. ఆ స్వరం ఇప్పుడు స్వర్గంలో ప్రతిధ్వనిస్తోంది. – అమితాబ్ బచ్చన్ లతా మంగేష్కర్‌గారు ఆదర్శప్రాయమైన వ్యక్తిత్వం ఉన్నవారు. ఆమె పాడిన ఎన్నో హిట్ సాంగ్స్‌లో నా పెర్ఫార్మెన్స్ ఉండటాన్ని నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఫిబ్రవరి 6 బ్లాక్ డే. వ్యక్తిగతంగా కూడా నాకు తీరని లోటు. లతా స్వరం ఇకపై స్వర్గంలో వినిపిస్తుంది. – హేమమాలిని మన నైటింగేల్‌ను మిస్ అవుతున్నాం. కానీ మీ (లతా మంగేష్కర్) స్వరం మాత్రం ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. – సల్మాన్ ఖాన్ -
గగన కచేరికి గాన కోకిల
ముంబై: గాన కోకిల, సుమధుర గాయని, భారతరత్న లతా మంగేష్కర్ ఇక లేరు. 140 కోట్ల మంది భారతీయులనే గాక ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను శోకసముద్రంలో ముం చుతూ గంధర్వ లోకానికి మరలిపోయారు. దాదాపు 80 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు అందరినీ అలరించి, మైమరపించిన ఆమె మధుర గాత్రం శాశ్వతంగా మూగవోయింది. చిన్నా పెద్దా అందరికీ లతా దీదీగా సుపరిచితురాలైన ఈ మెలొడీ క్వీన్ 92 ఏళ్ల వయసులో ఆదివారం ముంబైలో కరోనాతో కన్నుమూశారు. జనవరిలోనే స్వల్ప కరోనా లక్షణాలు కన్పించడంతో బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో చేరిన లత, తర్వాత నిమోనియాతో కూడా బాధపడ్డారు. ఆదివారం ముంబైలో లతా మంగేష్కర్ పార్ధివదేహం వద్ద నివాళులర్పిస్తున్న ప్రధాని మోదీ లత కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న ప్రధాని మోదీ. చిత్రంలో ఆశా భోంస్లే, శ్రద్ధా కపూర్ తదితరులు శనివారం ఉదయానికి పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. చివరికి కీలక అవయవాల వైఫల్యంతో ఆదివారం ఉదయం 8.12 గంటలకు తుదిశ్వాస విడిచారు. రాష్ట్రపతి మొదలుకుని ప్రముఖులంతా లత మృతి పట్ల ప్రగాఢ సంతాపం వెలిబుచ్చారు. కేంద్రం దేశవ్యాప్తంగా రెండు రోజుల సంతాప దినాలు ప్రకటించింది. అధికారిక కార్యక్రమాలన్నింటినీ వాయిదా వేశారు. రెండు రోజులూ త్రివర్ణ పతాకాన్ని సగం మేర అవనతం చేసి ఉంచుతారు. పార్లమెంటు సోమవారం లతకు నివాళులు అర్పించనుంది. అనంతరం ఆమె గౌరవార్థం ఉభయ సభలను గంటపాటు వాయిదా వేస్తారు. తల్లడిల్లిన దేశం లత మరణ వార్త విని దేశమంతా తల్లడిల్లిపోయింది. ఉదయాన్నే ఆమె పాటలతోనే లేచి, వాటిని వింటూనే రాత్రి నిద్రలోకి జారుకునే కోట్లాది మంది అభిమానులు ఈ దుర్వార్తను జీర్ణించుకోలేకపోయారు. కడసారి చూపు కోసం ముంబై పొద్దార్ రోడ్డులోని లత నివాసం ‘ప్రభు కుంజ్’ముందు బారులు తీరారు. అక్కడి నుంచి శివాజీ పార్కు దాకా 10 కిలోమీటర్ల పొడవునా సాగిన అంతిమయాత్రకు అశేషంగా తరలివచ్చారు. అశ్రు నయనాలతో ఆమె పార్థివ దేహంతో పాటు సాగారు. లతా దీదీ అమర్ రహే అంటూ నినదించారు. చెట్లు, బిల్డింగుల పైకెక్కి అంతిమయాత్రను వీక్షించారు. లత అంత్యక్రియలకు కుమార్తెతో వచ్చిన అమితాబ్ కోట్లాది మంది టీవీల్లో చూస్తూ విలపించారు. సైనిక, పోలీసు దళాలు సెల్యూట్ చేస్తూ ముందు సాగుతుండగా లత సోదరి, ప్రఖ్యాత గాయని ఆశా భోంస్లేతో పాటు తోబుట్టువులంతా పార్థివ దేహంతో పాటు వాహనంలో వెళ్లారు. శివాజీ పార్కు వద్ద ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకుని బాలీవుడ్ తదితర సినీ, క్రీడా ప్రముఖులంతా త్రివర్ణ పతాకంలో చుట్టిన లత భౌతిక కాయాన్ని సందర్శించారు. పుష్పగుచ్ఛాలుంచి ఘనంగా కడసారి నివాళులర్పించారు. కుటుంబీకులను మోదీ ఓదార్చి వెనుదిరిగారు. అనంతరం పూర్తి ప్రభుత్వ లాంఛనాల మధ్య జరిగిన అంత్యక్రియల్లో బాలీవుడ్ నటులు షారూక్ ఖాన్, ఆమిర్ ఖాన్, క్రికెట్ దిగ్గజం సచిన్ తదితర ప్రముఖులెందరో బాధాతప్త హృదయాలతో పాల్గొన్నారు. సోదరుడు హృదయనాథ్ లత చితికి నిప్పంటించారు. తిరుగులేని కెరీర్ లత 1929 సెప్టెంబర్ 28న ఇండోర్‌లో జన్మించారు. ఐదేళ్ల వయసులోనే సంగీత సాధన మొదలు పెట్టడంతో స్కూలు చదువు అంతగా సాగలేదు. 1942లో 13వ ఏట కితీ హసాల్ అనే మరాఠీ చిత్రంలో పాడటం ద్వారా గాయనిగా కెరీర్ మొదలుపెట్టారు. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. అనితరసాధ్యమైన కంఠ మాధుర్యంతో దేశదేశాల అభిమానులను ఉర్రూతలూగించారు. ‘ప్యార్ కియా తో డర్నా క్యా’, ‘సత్యం శివం సుందరం’, ‘పానీ పానీ రే’... ఇలా చెప్పుకుంటూ పోతే లత సుమధుర గళం నుంచి జాలువారిన అజరామరమైన పాటల జాబితాకు అంతే ఉండదు. 80 ఏళ్ల అద్భుత కెరీర్లో హిందీలోనే గాక తెలుగు, తమిళ్, కన్నడతో పాటు ఏకంగా 36 భాషల్లో 30 వేలకు పైగా పాటలు పాడి అలరించారు. 2012 అక్టోబర్‌లో చివరి పాట పాడారు లత. దేశ చరిత్రలో అత్యుత్తమ ప్లేబ్యాకర్ సింగర్‌గా నిలిచిన ఆమెను వరించిన అవార్డులకు లెక్కే లేదు. పలు ఫిల్మ్ఫేర్లు, నేషనల్ ఫిల్మ్ అవార్డులతో పాటు దాదాసాహెబ్ ఫాల్కే, పద్మభూషణ్, పద్మవిభూషణ్, 2001లో భారతరత్న అందుకున్నారు. ఆమె అవివాహితగానే మిగిలిపోయారు. దిగ్గజ గాయకులు, సంగీత దర్శ కులు, నటీనటులెందరో లతను అమితంగా అభి మానించేవారు. అపర సరస్వతిగా కీర్తించేవారు కూ డా. ఈ పొగడ్తను, ఆప్యాయతలను ఆమె వినమ్రం గానే స్వీకరించేవారు. ‘‘అంతా నా తల్లిదండ్రులు, ఆ భగవంతుని ఆశీర్వాదం’’ అని గత అక్టోబర్‌లో తన చివరి ఇంటర్వ్యూలో చెప్పారామె. రాయల్ హాల్లో ప్రదర్శన ఇచ్చిన తొలి భారత ఆర్టిస్టు లండన్‌లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్లో 1974లో లత సంగీత విభావరి నిర్వహించారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ఆర్టిస్టుగా రికార్డు సృష్టించారు. ఆమెకు అదే తొలి అంతర్జాతీయ ప్రదర్శన కూడా. ‘‘ఇన్హీ లోగోం నే’, ‘ఆజా రే పర్దేశీ’, ‘ఆయేగా ఆనేవాలా’అంటూ లత లైవ్‌లో పాడిన బాలీవుడ్ ఆపాత మధురాలు వినేందుకు అభిమానులంతా విరగబడ్డారు. దాంతో ఆడిటోరియం కిక్కిరిసిపోయింది. ‘పూల సుగంధానికి రంగు లేదు. పారే నీటికి హద్దుల్లేవు. సూర్య కిరణాలకు మత భేదాల్లేవు. లతా మంగేష్కర్ గళానికి ఎల్లల్లేవు. పరిమితులు అసలే లేవు’అంటూ ఆమె గురించి బాలీవుడ్ దిగ్గజం దిలీప్‌కుమార్ ఉర్దూలో కవితాత్మక పరిచయ వాక్యాలతో అలరించారు. ఈ షో తాలూకు ఎల్పీ రికార్డింగులు రెండు వాల్యూమ్లుగా విడుదలై అప్పట్లో రికార్డు స్థాయిలో 1.33 లక్షల కాపీలు అమ్ముడుపోయాయి. లతాజీ మరణం కలచివేసింది లతా మంగేష్కర్ మరణించారన్న వార్త నన్ను ఎంతగానో కలచివేసింది. నాతోపాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. భౌతికంగా జీవించి లేకపోయినా ఆమె పాడిన పాటలకు మాత్రం మరణం లేదు. భారతరత్న లతా మంగేష్కర్ సాధించిన విజయాలు అసామాన్యం. భావి తరాలకు ఆమె ఒక స్ఫూర్తి ప్రదాత. ఒక గాయనిగానే కాకుండా గొప్ప మానవతావాదిగా లతాజీ గుర్తుండిపోతారు. కొన్ని శతాబ్దాల కాలంలో ఆమెలాంటి వారు ఒక్కరే జన్మిస్తారు. – రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అద్భుత స్వరం దూరమైంది లతా మంగేష్కర్ మరణం గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతి చెందా. లతాజీ మృతితో భారతదేశానికి అద్భుత స్వరం దూరమయ్యింది. ఆమె కొన్ని దశాబ్దాల పాటు ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియులను అలరించారు. – ఎం.వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి భారతీయ సంస్కృతికి ప్రతీక గానకోకిల లతాజీని రాబోయే తరాలు భారతీయ సంస్కృతికి ప్రతీకగా స్మరించుకుంటాయి. ఆమె నాపై కురిపించిన ఆప్యాయతను గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఆమెతో మాట్లాడిన క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను. దశాబ్దాలుగా భారతీయ సినిమా పరిణామ క్రమానికి ప్రత్యక్ష సాక్షి లతా దీదీ. కేవలం సినిమాలే కాదు, దేశాభివృద్ధిని సైతం కాంక్షించారు. భారత్‌ను బలమైన, అభివృద్ధి చెందిన దేశంగా చూడాలని ఎల్లప్పుడూ కోరుకునేవారు. లతా దీదీతో చక్కటి బాంధవ్యం ఉండేదని నాలాంటి ఎంతోమంది మున్ముందు గర్వంగా చెప్పుకుంటారు. భౌతికంగా ఆమె మనమధ్య లేకపోయినా పాటల రూపంలో ఎప్పటికీ మనతోనే ఉంటారు. మధురమైన ఆమె గాత్రం మనతో ఉండిపోతుంది. – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లతాజీ సేవలను వర్ణించలేం కేవలం భారత్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో లతా మంగేష్కర్ అభిమానులు ఉన్నారు. ఆమె తన స్వరంతో అందరినీ అలరించారు. సంగీత ప్రపంచానికి లతాజీ చేసిన సేవలను మాటల్లో వర్ణించడం అసాధ్యం. ఆ మె మరణం వ్యక్తిగతంగా నాకు తీరని నష్టం కలిగించింది. ఎన్నోసార్లు ఆమె నుంచి ఆశీస్సులు అందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. – కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దేశం గొప్ప బిడ్డను కోల్పోయింది భారత గానకోకిల లతా మంగేష్కర్. భారత్ తన గొప్ప బిడ్డను కోల్పోయింది. ఆమె మరణంతో దేశానికి పూడ్చలేని నష్టం వాటిల్లింది. లతాజీ స్థానాన్ని భర్తీ చేయడం అసాధ్యం. ఆమె తన పాటల ద్వారా దేశంలో సాంస్కృతిక వికాసానికి ఎనలేని సేవ చేశారు. లతా మంగేష్కర్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. – మన్మోహన్ సింగ్, మాజీ ప్రధానమంత్రి ఆ స్వరానికి మరణం లేదు లతా మంగేష్కర్ అమృత స్వరం అభిమానుల గుండెల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఆ స్వరానికి మరణం లేదు. ఆమె మరణించారని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యా. లతాజీ మృతితో భారతీయ కళా ప్రపంచానికి ఎంతో నష్టం వాటిల్లింది. – రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఒక శకం ముగిసింది లతా మంగేష్కర్ మరణంతో భారతీయ సంగీతంలో ఒక శకం ముగిసింది. ఆ స్వరకోకిల గాత్రం ప్రపంచమంతటా ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఆ స్వర మాధుర్యం అభిమానులెవరూ మర్చిపోలేనిది. – అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి నమ్మలేకపోతున్నాం.. లతా మంగేష్కర్ అద్భుతమైన గాత్ర మాధుర్యంతో భారతీయులందరి హృదయాలను కదిలించారు. భారత గానకోకిల ఇక లేరన్న విషయం నమ్మలేకపోతున్నాం. ఆమె మరణాన్ని తలచుకొంటే మనసు బరువెక్కుతోంది. దశాబ్దాలపాటు వివిధ భాషల్లో వేలాది పాటలు పాడి ప్రజలను అలరించడం సాధారణ విషయం కాదు. – ఎంకే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి పాటలు విని పరవశించా.. లతాజీ గొంతు నుంచి జాలువారిన మధురమైన పాటలు విని పరవశించిపోయా. బెంగాల్‌తోపాటు ఈశాన్య ప్రాంతాల కళాకారులను ఆమె అభిమానించేవారు. ఆమె తన కళాప్రపంచంలో బెంగాల్‌కు స్థానం కల్పించారు. కోట్లాది మంది లాగే నేను కూడా లతాజీకి పెద్ద అభిమానిని. ఆమె మన నుంచి దూరం కావడం దురదృష్టకరం. – మమతా బెనర్జీ, పశ్చిమబెంగాల్ సీఎం -
కోకిల వెళ్లిపోయింది!
వసంతంలో కోకిల గొంతు సవరించుకుంటుంది. పంచమ శ్రుతిలో తన స్వరమాధుర్యాన్ని జనాలకు అయాచితంగానే పంచిపెడుతుంది. ఇది ప్రకృతి ధర్మం. కానీ, వసంత పంచమితో పాటూ ఆ గాన కోకిల వెళ్ళిపోయింది. ఎంత చేటుకాలం ఇది! ఎంత పాడుకాలం ఇది! మాయదారి మహమ్మారి ఇప్పటికే ఎందరెందరినో గద్దలా తన్నుకుపోయింది. మనసులకు మారాకులు వెయ్యనివ్వని ఆశ రాలుకాలం ఇది. కోకిలను పోగొట్టుకున్న అశేష సంగీతాభిమానులకు అకాల బాష్పవర్షాకాలం ఇది. ‘కరోనా‘ కరాళకాలం మొన్నటికి మొన్న మన గానగంధర్వుడిని గల్లంతు చేసింది. అభిమానులు ఆ విషాదం నుంచి తేరుకుంటూ ఉన్నారనేలోగానే, మిగిలి ఉన్న గాన కోకిలనూ ఇప్పుడు తీసుకుపోయింది. వసంత పంచమి మరునాటి ఉదయమే అస్తమించిన గానకోకిల లతామంగేష్కర్ భారతీయ సినీసంగీత సామ్రాజ్యానికి మకుటంలేని మహారాణి. స్వతంత్ర భారతదేశంలో పుట్టిన వారిలో ఆమె స్వరఝరిలో తడిసి తరించనివారంటూ ఎవరూ ఉండరు. ఇది అతిశయోక్తి కాదు. స్వభావోక్తి మాత్రమే! ఆమె స్వరప్రస్థానం భారతదేశ స్వాతంత్య్ర ప్రస్థానంతో పాటే సాగింది. ఇన్నేళ్లలోనూ స్వాతంత్య్ర భారతం ఎన్నో ఎగుడుదిగుళ్లను చవిచూసింది గాని, లతా గాత్రం మాత్రం ఏనాడూ చెక్కుచెదరలేదు. వన్నెతరగని ఆమె స్వరమాధుర్యం దాదాపు ఏడున్నర దశాబ్దాలుగా కొన్నితరాల శ్రోతలను సేదదీర్చింది, ఊరడించింది, ఉర్రూతలూపి ఓలలాడించింది. లతా పాట ఎల్లలులేని పిల్లతెమ్మెర. ఆమె అభిమానుల్లో దేశాధినేతలు మొదలుకొని అమిత సామాన్యుల వరకు కోట్లమంది ఉన్నారు. లతా పాట గలగలల సెలయేరు. ఆమె అభిమానుల్లో ఉద్దండ పండితులూ ఉన్నారు, పరమ పామరులూ ఉన్నారు. లతా పాట జోలలూపే ఉయ్యాల. ఆమె అభిమానుల్లో పసిపిల్లలూ ఉన్నారు, పండు ముదు సళ్లూ ఉన్నారు. లతా పాట ఒక అమృత« దార. అక్షరాలా ఆబాలగోపాలాన్నీ అలరించిన అద్భుత గానమాధుర్యం ఆమెది. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో లతా మంగేష్కర్ ఒక హిమవత్ శిఖరం. సినీ సంగీత రంగంలో రాణించాలనుకునే ఔత్సాహిక గాయనీగాయకులకు ఆమె ఒక అత్యున్నత ప్రమాణం. ఆమెతో గొంతు కలిపితే చాలు, తమ జన్మ చరితార్థమైనట్లే అనుకునే యువ గాయకులు ఎందరో! ఆమె స్థాయిలో పదోవంతును అందుకోగలిగినా చాలు, తమ కెరీర్‌కు తిరుగుండదని భావించే కొత్తతరం గాయనీమణులు ఎందరో! ఆమె పాటలకు స్వరకల్పన చేసే అవకాశం దొరకడమంటే నవ తరం సంగీత దర్శకులకు అదొక హోదాచిహ్నం! ఎంచుకున్న రంగంలో అత్యున్నత శిఖరానికి చేరు కోవడం అంత ఆషామాషీ పని కాదు. ఒకసారి చేరుకున్నాక, కడవరకు ఆ స్థానాన్ని పదిలంగా కాపాడుకోవడం మరెంతటి కఠోరదీక్షతో సాధించిన ఘనత అయి ఉండాలి! ఆ ఘనత కారణంగానే దేశంలోని అత్యున్నత సత్కారమైన ‘భారతరత్న’ సహా అసంఖ్యాకమైన అవార్డులు, బిరుదులు, రాజ్యసభ సభ్యత్వం వంటి గౌరవ పదవులు ఆమెను కోరి మరీ వరించాయి. రాజ్యసభలో కొన సాగిన ఆరేళ్లూ రూపాయి వేతనమైనా తీసుకోకుండా సేవలందించిన అరుదైన వ్యక్తిత్వం ఆమెది. పదమూడేళ్ల పసిప్రాయంలోనే తండ్రిని కోల్పోయి, కుటుంబ భారాన్ని నెత్తికెత్తుకున్న ఒక సాదాసీదా అమ్మాయి అంచెలంచెలుగా ఎదిగి, ఎవరూ అందుకోలేనంత స్థానానికి చేరుకోవడం దాదాపు ఊహాతీతం. సినిమాను తలపించే లతా జీవితంలో ఇది వాస్తవం. తొలినాళ్లలో ఆర్థిక కష్టాలతో సతమతమవుతూనే, సంగీత సాధన కొనసాగించేది. సినీ అవకాశాల కోసం ప్రయత్నించే తొలినాళ్లలో ‘పీల గొంతు’ అనే పెదవి విరుపులతో తిరస్కారాలనూ ఎదుర్కొంది. తిరస్కారాలకు చిన్నబుచ్చుకుని అక్కడితోనే ఆగిపోయి ఉంటే, ఆమె లతా అయ్యేదే కాదు. పట్టువదలని దీక్షతో ముందుకు సాగడం వల్లనే ఆమె రుతువులకు అతీతమైన ‘గానకోకిల’ కాగలిగింది. మాతృభాష మరాఠీ, హిందీ పాటలకే పరిమితమై ఉంటే, లతా మంగేష్కర్‌కు ఇంతటి ప్రఖ్యాతి దక్కేది కాదు. ఆమె మన తెలుగు సహా అనేక భారతీయ భాషల్లో పాటలు పాడింది. అందుకే, దేశవ్యాప్తంగా మారుమూల పల్లెల్లోనూ ఆమెకు అభిమానులు ఉన్నారు. అత్యధిక సంఖ్యలో సినిమా పాటలు పాడిన గాయనిగా 1974లోనే గిన్నిస్ రికార్డు సాధించిన ఘనత ఆమెకే దక్కింది. అప్పటికే ఆమె వివిధ భాషల్లో పాతికవేల పైగా పాటలు పాడింది. శతాధిక సంగీత దర్శకుల స్వరకల్పనలకు తన గాత్రంతో ప్రాణం పోసింది. నాలుగు తరాల గాయకులతో గొంతు కలిపింది. ఐదు చిత్రాలకు సంగీతం అందించడమే కాక, 4 చిత్రాలను నిర్మించింది. తన సుదీర్ఘ ప్రస్థానంలో ఆమె అందుకోని విజయాల్లేవు. ఆమె గొంతు పలకని భావోద్వేగాలు లేవు. ఆమె గాత్రంలో ఒదగని సంగతులు లేవు. భారతదేశంలో లతా భాషాతీతంగా ప్రతి ఇంటి అభిమాన గాయని. అందుకే, ఆమె మరణవార్త యావత్ దేశాన్ని్న విషాదసాగరంలో ముంచేసింది. ఆమె మరణవార్త వెలువడిన మరునిమిషం నుంచే సామాజిక మాధ్యమాల్లో సంతాప సందేశాల ప్రవాహం మొదలైంది. ఆమె జ్ఞాపకాలను తలచుకుంటూ అభిమానులు ఆమె పాటల వీడియోలతో పెట్టిన పోస్టులతో సామాజిక మాధ్య మాలు హోరెత్తిపోవడం మొదలైంది. లతానే ప్రేరణగా తీసుకుని, ఆమె స్ఫూర్తితోనే సినీసంగీత రంగంలోకి అడుగుపెట్టిన సంగీత కళాకారులంతా ఆమె మరణవార్తకు కన్నీరు మున్నీరయిన దృశ్యా లను టీవీల్లో చూసిన అభిమానులూ కన్నీటి పర్యంతమయ్యారు. భారతీయ సినీ సంగీతరంగంలో ఎందరో గాయనీమణులు ఉన్నా, లతా మంగేష్కర్ది ఒక అత్యున్నత ప్రత్యేకస్థానం. ఇప్పుడది ఖాళీ అయిపోయింది. దానినెవరూ ఎప్పటికీ భర్తీ చేయలేరు! -
లతా మంగేష్కర్ కడసారి వీడ్కోలు.. బారీగా వచ్చిన అభిమానులు
-
గగన కోకిల - లతా మంగేష్కర్
-
మీరెక్కడ ఉన్న.. మా కోవెలే..మా ఇంటి కోకిలే
-
లతా మంగేష్కర్‌కు నివాళులు అర్పించిన ప్రధాని మోదీ
-
కోకిలమ్మ- లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ జర్నీ
-
ముంబై శివాజీ పార్కుకు లతా మంగేష్కర్ పార్థివదేహం తరలింపు
-
నైటింగేల్ ఆఫ్ ఇండియా లతాజీ అస్తమయం
-
కోవిడ్‌ను జయించిన 92 ఏళ్ల లతా మంగేష్కర్.. కానీ!
Lata Mangeshkar Latest Health Update: ప్రముఖ లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్యంపై మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే కీలక ప్రకటన చేశారు. కరోనా బారినపడిన చికిత్స పొందుతున్న లతా మంగేష్కర్ తాజాగా కోవిడ్‌ను జయించినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటుందని, రెండు రోజుల క్రితమే వెంటిలేటర్ కూడా తీసేసినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా న్యూమోనియా నుంచి కూడా లతాజీ కోలుకున్నట్లు వివరించారు. అయితే మరికొన్ని రోజుల పాటు ఆమెను ఐసీయూలోనే వైద్యుల బృందం పర్యవేక్షించనున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈనెల 8న కరోనాతో లతా మంగేష్కర్ ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. I spoke with Dr Pratit Samdani who is treating singer Lata Mangeshkar. She's recovering, was on a ventilator for some days, but is better now. She is no more on ventilator. Only oxygen is being given to her. She is responding to the treatment: Maharashtra Minister Rajesh Tope pic.twitter.com/qOSP2H9OLl — ANI (@ANI) January 30, 2022 -
లతా మంగేష్కర్ హెల్త్ అప్డేట్: వెంటిలేటర్ తీసేసినా..
Lata Mangeshkar Latest Helath Update: లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్యంపై లేటెస్ట్ అప్డేట్ విడుదలైంది. ఇంకా ఐసీయూలోనే చికిత్స పొందుతున్న ఆమెకు వెంటిలేటర్ తొలగించేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. ఈనేపథ్యంలోనే వెంటిలేటర్ లేకుండా ఆమె ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేందుకు ఈ ఉదయం కాసేపు వెంటిలేటర్ తొలగించారు. ప్రస్తుతం లతా మంగేష్కర్ కోలుకుంటున్న సూచనలు కనిపిస్తున్నట్లు ఆమె కుటుంబసభ్యులు వెల్లడించారు. డాక్టర్ ప్రతీత్ సందానీ నేతృత్వంలోని వైద్యబృందం లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిని అనుక్షణం గమనిస్తోందని తెలిపారు. లతాజీ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఈనెల 8న కరోనాతో లతా మంగేష్కర్ ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. pic.twitter.com/xDxD43SHsw — Lata Mangeshkar (@mangeshkarlata) January 27, 2022 -
లతా మంగేష్కర్ ఆరోగ్యంపై కీలక ప్రకటన..
Lata Mangeshkar Health Update: ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిపై ఆమె అధికార ప్రతినిధి కీలక ప్రకటన విడుదల చేశారు. గత కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆమె ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా లతా మంగేష్కర్ ఆరోగ్యం క్షీణించిందటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆమె అధికార ప్రతినిధి ఖండించారు. ఈ వదంతులను నమ్మవద్దంటూ క్లారిటీ ఇచ్చారు. లతా దీదీ ఇంకా ఐసీయూలోనే ఉంది. డాక్టర్ ప్రతీత్ సందానీ ఆధ్వర్యంలో వైద్యుల బృందం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. దయచేసి పుకార్లను ప్రచారం చేయవద్దు. లతా మంగేష్కర్ కుటుంబానికి, వైద్యులకు ప్రైవసీ ఇవ్వాలి అంటూ ప్రకనటలో పేర్కొన్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దంటూ విఙ్ఞప్తి చేశారు. #LataMangeshkar health update: She's showing signs of improvement, still in ICUhttps://t.co/h5TekiPHOp — India Today Showbiz (@Showbiz_IT) January 22, 2022 -
ఇంకా ఐసీయూలోనే లతా మంగేష్కర్.. లేటెస్ట్ హెల్త్ బులెటిన్ విడుదల
Lata Mangeshkar Latest Health Bulletin Released: కరోనాతో ఆసుపత్రిలో చేరిన లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఇంకా ఐసీయూలోనే ఉన్నారు. తాజాగా ఆమె ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ అప్డేట్ రిలీజ్ అయ్యింది. 'ప్రస్తుతం కోవిడ్ పాజిటివ్‌తో బాధపడుతున్న లతా మంగేష్కర్ ఇంకా ఐసీయూ వార్డులోనే చికిత్స పొందుతున్నారు. మరో 10-12 రోజుల పాటు ఆమె అబ్జర్వేషన్లో ఉండనున్నారు. కోవిడ్‌తో పాటు న్యూమోనియాతో బాధపడుతున్నారు' అని తెలిపారు. ఈ మేరకు లతా మంగేష్కర్‌కు చికిత్స అందిస్తున్న డాక్టర్ ప్రతీత్ సంధాని హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కాగా తన పాటలతో లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న లతా మంగేష్కర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. "Singer Lata Mangeshkar continues to be in the ICU ward. She will be under observation for 10-12 days. Along with COVID, she is also suffering from pneumonia," says Dr Pratit Samdhani, who is treating her at Mumbai's Breach Candy Hospital pic.twitter.com/Z0e3KUip4g — ANI (@ANI) January 12, 2022 -
ఐసీయూలో ప్రముఖ గాయని లతా మంగేష్కర్
Lata Mangeshkar Hospitalised After Contracting Covid, In Icu: ప్రముఖ గాయని, భారతరత్న లతా మంగేష్కర్(92)కు కోవిడ్ సోకింది. ప్రస్తుతం ఆమె ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని లతా మంగేష్కర్ మేనకోడలు రచనా ద్రువీకరించారు.'స్వల్ప లక్షణాలున్నాయి. కానీ వయసు రీత్యా ముందు జాగ్రత్త కోసం మాత్రమే ఐసీయూలో ఉంచారు. దయచేసి మా గోప్యతను గౌరవించండి' అని పేర్కొన్నారు. కాగా గతంలో 2019లో శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ లతా మంగేష్కర్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. 1929,సెప్టెంబర్28న జన్మించిన లతా మంగేష్కర్ భారత అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కె, పద్మ భూషణ్, పద్మవిభూషణ్, సహా ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఇండియన్ నైటింగల్‌గా పేరు సంపాదించిన ఆమె ఇప్పటివరకు 50వేలకు పైగా పాటలు పాడారు. "She is doing fine; has been kept in ICU only for precautionary reasons considering her age. Please respect our privacy and keep Didi in your prayers," singer Lata Mangeshkar's niece Rachna to ANI — ANI (@ANI) January 11, 2022