lifted
-
TS High Court: టెన్త్ హిందీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో విద్యార్థిపై డిబార్ ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్: టెన్త్ హిందీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో విద్యార్థిపై డిబార్‌ను తెలంగాణ హైకోర్టు ఎత్తివేసింది. కమలాపూర్ పరీక్ష కేంద్రంలో విద్యార్థి హరీష్‌ను డీఈవో డీబార్ చేసిన విషయం తెలిసిందే.. దీనిపై విద్యార్థి హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో పదో పరీక్షలు హరీష్ రాశాడు. హరీష్ పదో తరగతి ఫలితాలను అధికారులు హోల్డ్‌లో పెట్టారు. హరీష్‌పై డీబార్ ఉత్తర్వులు కొట్టివేస్తూ హైకోర్టు.. గురువారం తీర్పునిచ్చింది. హరీష్ రాసిన పరీక్షల ఫలితాలను వెంటనే ప్రకటించాలని హైకోర్టు ఆదేశించింది. వరంగల్ జిల్లాలోని కమలాపూర్ జడ్పీ బాలుర హైస్కూల్లో టెన్త్ హిందీ ప్రశ్నాపత్రం లీక్ అవ్వడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే టెన్త్ విద్యార్థి హరీష్ నుంచి పదో తరగతి ప్రశ్నాపత్రం బయటకు వచ్చినట్లు తేలడంతో విద్యార్థిని అధికారురలు డీబార్ చేశారు. తన కుమారుడు హరీష్ పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వాలని తండ్రి హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తన కుమారుడిని బెదిరించడంతోనే ప్రశ్నాపత్రం ఇతరులకు ఇచ్చాడని.. అదే వాట్సప్‌లో వచ్చిందన్నారు. తన కుమారుడిని పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు హరీష్‌ను పదో తరగతి పరీక్ష రాసేందుకు అనుమతించింది. తర్వాత ఫలితాలు విడుదల సమయంలో హరీష్ ఫలితాలను వెల్లడించకుండా హోల్డ్‌లో పెట్టారు. దీంతో మరోసారి విద్యార్థి న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. విద్యార్థిపై ఉన్న డీబార్‌ను కొట్టివేస్తూ.. తక్షణమే ఫలితాలు వెల్లడించాలంటూ ధర్మాసనం తీర్పునిచ్చింది. చదవండి: ఎవరిది తప్పు.. ఎవరికి ముప్పు ? -
మళ్లీ ఆఫీసులు కళకళ
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావం గణనీయంగా తగ్గిపోవడంతో కార్యాలయాలు తిరిగి ఉద్యోగులతో సందడిగా మారుతున్నాయి. కార్యాలయాలకు వచ్చి పనిచేయాలని కంపెనీలు తమ ఉద్యోగులను కోరుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు లోగడ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో మెజారిటీ ఉద్యోగులు పనిచేయడం తెలిసిందే. కరోనా ఒమిక్రాన్ వేరియంట్ తర్వాత నుంచి ఈ పరిస్థితిలో క్రమంగా మార్పు వస్తోంది. వారంలో కొన్ని రోజుల పాటు ఉద్యోగులు కార్యాలయాలకు వస్తున్నారు. కొన్ని కంపెనీలు అయితే వర్క్‌ఫ్రమ్ హోమ్‌కు మంగళం కూడా పలికాయి. కంపెనీలు తమ పని విధానాలను సమీక్షించుకుంటున్నాయి. ఐటీ పరిశ్రమలో పని విధానాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిపై ప్రభావం చూపుతాయి. కనుక కంపెనీల్లో ప్రస్తుతం అమలవుతున్న పని విధానాలు ఎలా ఉన్నాయి, భవిష్యత్తు విధానాల గురించి తెలుసుకునేందుకు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) ఓ సర్వే నిర్వహించింది. ఈ సంఘంలో 300కు పైగా కంపెనీలు భాగస్వాములుగా ఉంటే, మూడింట ఒక వంతు కంపెనీలు సర్వేలో పాల్గొని వివరాలు తెలిపాయి. సర్వేలోని అంశాలు.. ► ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు వచ్చి పనిచేసేందుకు కంపెనీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. కంపెనీలు తీసుకుంటున్న చర్యలు ఫలితంగా మూడింట ఒక వంతుకు పైగా కంపెనీల్లో 60 శాతానికి పైగా ఉద్యోగులు ఇప్పుడు వారంలో కనీసం రెండు రోజులు ఆఫీసులకు వచ్చే పనిచేస్తున్నారు. పెద్ద కంపెనీల్లో కార్యాలయాలకు వచ్చే వారు 22 శాతంగా ఉంటే, చిన్న, మధ్య స్థాయి కంపెనీల్లో 38 శాతంగా ఉన్నారు. ► 62 శాతం కంపెనీల్లో 19 శాతం మంది ఉద్యోగులు హైదరాబాద్‌కు వెలుపల ఉన్న చోట నుంచే పనిచేస్తున్నారు. ఈ మేర ఉద్యోగులు ఆఫీసులకు రాకుండా పనిచేయడం అన్నది 2023లోనూ, ఆ తర్వాత కూడా కొనసాగుతుందని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. 21 శాతం కంపెనీల్లో అయితే 20–39 శాతం మేర ఉద్యోగులు, 13 శాతం కంపెనీల్లో 40–59 శాతం మేర ఉద్యోగులు హైదరాబాద్ బయటి నుంచే సేవలు అందిస్తున్నారు. ► 26 శాతం కంపెనీల్లో నూరు శాతం ఉద్యోగులు వారంలో అన్ని రోజులూ (సెలవులు మినహా) కార్యాలయాలకు వచ్చి పనిచేస్తున్నారు. 28 శాతం కంపెనీల్లో మూడు రోజుల కార్యాలయ పనివిధానం నడుస్తోంది. 14 శాతం కంపెనీల్లో వారంలో రెండు రోజులు కార్యాలయాలకు వస్తుంటే, 15 శాతం కంపెనీలు ఫ్లెక్సీ (వీలునుబట్టి ఎక్కడి నుంచి అయినా) పని విధానాన్ని ఆచరిస్తున్నాయి. ► భవిష్యత్తులో అవసరమైతే 2–5 రోజుల పాటు ఇంటి నుంచి పనిచేసేందుకు వీలుగా కంపెనీలు విధానాలను రూపొందించుకున్నాయి. వారంలో కనీసం మూడు రోజులు కార్యాలయాలకు వచ్చి పనిచేస్తారని భావిస్తున్నాయి. ► భవిష్యత్తులో పూర్తిగా ఆఫీసుకే వచ్చి పనిచేసే విధానాన్ని అమలు చేస్తామని 35 శాతం కంపెనీలు చెప్పాయి. వారంలో మూడు రోజులు అయినా ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి పనిచేయాల్సి ఉంటుందని 26 శాతం కంపెనీలు తెలిపాయి. 12 శాతం కంపెనీలు వారంలో రెండు రోజుల విధానాన్ని అనుసరిస్తామని పేర్కొన్నాయి. ► టీమ్ వర్క్, సహకారం, సంస్థలో పని సంస్కృతి, గుర్తింపు, విధేయత, వ్యక్తిగత, వృత్తిపరమైన వృద్ధి అంశాలు ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు రావడంపై ప్రభావం చూపించనున్నాయి. ► సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో మెజారిటీ ఐటీ రంగం నుంచే ఉన్నాయి. 27 శాతం ప్రొడక్ట్ కంపెనీలు కాగా, 24 శాతం ఇంటెగ్రేటెడ్ ఐటీ, ఐటీఈఎస్ సేవల రంగానికి చెందినవి ఉన్నాయి. -
Viral Video: మ్యాన్ హోల్ ను డంబెల్ లా ఎత్తేశాడు.. కానీ..!
-
GO 111: 84 గ్రామాలకు జీవో 111 నుంచి విముక్తి
సాక్షి, హైదరాబాద్: వివాదాస్పదమైన జీవో 111ను ఎత్తేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఓ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది ప్రభుత్వం. జీవో 111 పరిధి నుంచి 84 గ్రామాలకు విముక్తి కలిగిస్తున్నట్లు.. తెలంగాణ ప్రభుత్వం బుధవారం 69 పేరిట కొత్త జీవో జారీ చేసింది. ఇకపై జంట జలాశయాల పరిరక్షణకు చర్యలు తీసుకోనున్నారు. ఇందులో భాగంగా.. ఎస్టీపీల నీరు జంట జలాశయాల్లో కలవకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. అంతేకాదు.. జంట జలాశయాల చుట్టుపక్కల గ్రామాల్లో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. తద్వారా భూగర్భ జలాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోనున్నారు. జంట జలాశయాల పరిరక్షణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్. కమిటీ సభ్యులుగా మున్సిపల్, ఫైనాన్స్ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, వాటర్ బోర్డ్ ఎండి, పొల్యూషన్ కంట్రోల్ మెంబర్ సెక్రటరీ, HMDA డైరెక్టర్ ఉంటారు. జంట జలాశయాల పరిరక్షణకు తీసుకోవాల్సిన మార్గదర్శకాల రూపకల్పన చేయనున్న సీఎస్ నేతృత్వంలోని ఈ కమిటీ. ► గ్రీన్ జోన్ ల గుర్తింపు ► మురుగు నీరు వెళ్లే టాక్ లైన్స్ ఏర్పాటు ప్లానింగ్ ► STP లను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై నివేదిక ► 84 గ్రామాల్లో భవనాల నిర్మణాలకు సంబంధించిన ప్లానింగ్ ఎలా ఉండాలి ► వీటిపై ఖచ్చితమైన మార్గదర్శకాలు తయారు చేయనుంది ఈ కమిటీ. -
మాస్క్ ఇక తప్పనిసరి కాదు.. ఆంక్షలు పూర్తిగా ఎత్తివేత
ముంబై: కొవిడ్ నిబంధన విషయంలో.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంక్షల్ని పూర్తిగా ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై మాస్క్‌లు ధరించడం తప్పనిసరి ఏం కాదని పేర్కొంది. ఈ మేరకు ఏప్రిల్ 1, శుక్రవారం నుంచి సడలింపు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మాస్క్ ధరించకపోతే.. పెనాల్డీ విధించబోమని పేర్కొంది. మరోవైపు కరోనా వైరస్ నియంత్రణంలో ఉందని, కాబట్టి, ఆంక్షల సడలింపులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ 2005 యాక్ట్ ప్రకారం ఇంతకాలం అమలు చేసిన ఆంక్షల్ని ఎత్తేసినట్లు పేర్కొంది. అయితే కరోనా ముప్పు ఇంకా పూర్తి స్థాయిలో తొలగిపోలేదు కాబట్టి ప్రజలంతా స్వచ్చందంగా మాస్క్‌లు ధరించాలని మాత్రం మహా సర్కార్ సూచించింది. బీఎంసీ కూడా మాస్క్ తప్పనిసరి కాదని, ఫైన్ విధించబోమని చెబుతూ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి శనివారం నుంచి ఇది అమలులోకి రావాల్సి ఉంది. అయితే.. ఒకరోజు ముందస్తుగానే ఈ ఆదేశాలను విడుదల చేసింది ప్రభుత్వం. Maharashtra Government issues order withdrawing all COVID19 restrictions. pic.twitter.com/wTaKCPUa7G — ANI (@ANI) April 1, 2022 కరోనా వైరస్ 2020లో ప్రపంచాన్ని కుదిపేయగా.. డబ్ల్యూహెచ్‌వో తో పాటు వైద్య నిపుణులంతా ముఖానికి మాస్క్ ధరించడం వల్లనే వైరస్ కట్టడి అవుతుందని సూచించిన విషయం తెలిసిందే. ఇక మహారాష్ట్ర, ప్రత్యేకించి ముంబైలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభించింది. ఈ నేపథ్యంలో మాస్క్ ధరించని వాళ్ల నుంచి కనిష్టంగా 200రూ. నుంచి.. గరిష్టంగా బాగానే ఫైన్ వసూల్ చేశారు అక్కడి అధికారులు. -
హోంక్వారంటైన్‌కు బ్రిటన్ గుడ్‌బై
లండన్: కరోనాతో సహజీవనం అనే ప్రణాళికకు బ్రిటన్ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా కోవిడ్–19 సోకితే 10 రోజులు హోంక్వారంటైన్ ఉండాలన్న నిబంధనలను ఎత్తివేసింది. దీనిపై సోమవారం అధికారిక ప్రకటన వెలువడనుంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గత కొద్ది రోజులుగా కరోనాతో సహజీవనం అనే ప్రణాళికపైనే దృష్టిసారించారు. కొద్ది రోజుల క్రితం మాస్కులు తప్పనిసరి కాదని చెప్పిన ఆయన ఇప్పుడు సెల్ఫ్ ఐసొలేషన్ నిబంధనల్ని కూడా ఎత్తేశారు. బోరిస్ జాన్సన్ ఆదివారం ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ కోవిడ్‌పై వ్యాక్సినే బ్రహ్మాస్త్రమని, గత రెండేళ్లలో టీకాలు తీసుకుంటూ కరోనా వైరస్‌ను ఎదుర్కొనే రోగనిరోధకతను సాధించామన్నారు. ప్రజ లందరిలోనూ వైరస్ పట్ల శాస్త్రీయపరమైన అవగాహన రావడంతో ఇకపై కోవిడ్‌తో సహజీవనం చేసే విధంగా ప్రణాళికలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘కోవిడ్ హఠాత్తుగా అదృశ్యమైపోదు. ఈ వైరస్‌తో కలిసి బతుకుతూ దాని నుంచి అనుక్షణం మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నాలు చేయాలి. మన స్వేచ్ఛకు అడ్డంకిగా మారిన ఆంక్షల్ని సడలించాలి’’ అని జాన్సన్ పేర్కొన్నారు. దేశ జనాభాలో 12 ఏళ్లకు పైబడిన వారిలో 91 శాతం మందికి మొదటి డోసు పూర్తయితే, 85 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. నిబంధనలు ఎత్తివేయడంపై ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే, ప్రతిపక్ష లేబర్ పార్టీ యుద్ధం ముగిసే ముందు జాన్సన్ విజయాన్ని ప్రకటించుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తోంది. క్వీన్ ఎలిజబెత్‌కు కరోనా బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణైంది. ఆమెకి లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని బకింగ్హమ్ ప్యాలెస్ వెల్లడించింది. రాణి ఆరోగ్యాన్ని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. ఆమె రెండు డోసులతో పాటు బూస్టర్ డోసు కూడా తీసుకున్నారు. -
H1B Visa: హెచ్1బీ వీసాలపై గుడ్‌న్యూస్
వాషింగ్టన్: మాజీ అధ్యక్షుడు తెచ్చిన హెచ్1బీ వీసా నిషేధాన్ని కొనసాగించకూడదని ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ భావిస్తున్నారు. ఈ క్రమంలో ట్రంప్ తెచ్చిన నిషేధ కాలవ్యవధి బుధవారం ముగుస్తుండగా, దీన్ని పొడిగించకూడదని బైడెన్ భావించినట్లు తెలిసింది. ఈ నిషేధం కారణంగా పలు టెక్ కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. తాజాగా నిషేధం తొలగిపోవడం, నిషేధాన్ని బైడెన్ వద్దనుకోవడం.. టెక్ కంపెనీలకు మంచిదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ విషయమై ఇంకా వైట్‌హౌస్ అధికారిక ప్రకటన చేయలేదు. కొందరు అధికారులు మాత్రం నిషేధాన్ని వెంటనే ఎత్తివేస్తే అమెరికా కంపెనీలకు మంచిది కాదని, అందువల్ల నెమ్మదిగా తొలగించాలని భావిస్తున్నారు. కరోనా కారణంగా కొత్త గ్రీన్ కార్డులు జారీ చేయకూడదన్న ట్రంప్ నిర్ణయాన్ని బైడెన్ రద్దుచేయడం తెల్సిందే. ఈ నిర్ణయాలు అమెరికాకు, ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలమని బైడెన్ వ్యాఖ్యానించారు. వీసాపై నిషేధాన్ని అమెరికాలో లేబర్ యూనియన్లు స్వాగతించాయి. హెచ్1బీ ప్రాథమిక ఈ–రిజిస్ట్రేషన్ ఎంపిక పూర్తి రాబోయే ఆర్థిక సంవత్సరానికి హెచ్1బీ విదేశీ వర్కర్ వీసాల పరిమితి పూర్తయినట్లు అమెరికా ప్రకటించింది. ఇందుకు సంబంధించి ప్రాథమిక రిజిస్ట్రేషన్ íపీరియడ్‌లో సరిపడ్డా ఈ– అప్లికేషన్లు వచ్చాయని, 2022 ఆర్థిక సంవత్సరానికి హెచ్1బీ వీసాలకు సంబంధించి ప్రాథమిక ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ఎంపిక ప్రక్రియను పూర్తి చేశామని తెలిపింది. అమెరికాలో ఉద్యోగానికి వెళ్లే భారతీయ ఐటీ నిపుణులకు ఈ వీసాలు ఎంతో కీలకం. ఈ వీసాల కోసం సరైన ఆధారాలతో సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి లాటరీ విధానం ద్వారా ఎంపిక చేస్తామని అమెరికా పౌరసత్వం మరియు వలసదారుల సేవా కేంద్రం (యూఎస్సీఐఎస్) పేర్కొంది. అమెరికా కంపెనీల్లో పనిచేయాలంటే విదేశీ వృత్తి నిపుణులకు హెచ్1బీ వీసాలు తప్పనిసరి. వీటికి కేవలం భారత్ నుంచే కాక పలు దేశాల నుంచి గట్టి పోటీ ఉంది. -
యూకేలో నిబంధనల సడలింపు
లండన్: లాక్డౌన్ నిబంధనలను యూకే స్వల్పంగా సడలించింది. సోమవారం నుంచి ప్రజలు బహిరంగ ప్రదేశాలకు వెళ్లేందుకు అనుమతిం చింది. అయితే, ఆరుగురికి లేదా రెండు కుటుంబాలకు మించరాదని సూచించింది. బాస్కెట్‌బాల్, గోల్ఫ్, టెన్నిస్, స్విమ్మింగ్ వంటి ఔట్‌డోర్ క్రీడలకు కూడా అనుమతించింది. ప్రభుత్వం ఇప్పటివరకు 3 కోట్ల మందికి, అంటే దేశ వయోజనుల్లో దాదాపు 56% మందికి తొలి డోసు కరోనా టీకాను ఇచ్చింది. ఈ జూలై నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికి తొలి డోసు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఇస్తున్న ఆస్ట్రాజెనెకా, బయోఎన్‌టెక్(ఫైజర్) టీకాలకు తోడు ఏప్రిల్‌లో అమెరికాకు చెందిన మోడెర్నా టీకా సైతం అందుబాటులోకి వస్తుందని బ్రిటన్ మంత్రి ఒలివర్ డౌడెన్ వెల్లడించారు. కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని యూకే పోలీసులు పౌరులను హెచ్చరించారు. పెద్ద సంఖ్యలో అతిథులు హాజరయ్యే కార్యక్రమాలకు అనుమతి లేదని, వాటిని నిర్వహించడం, వాటిలో పాల్గొనడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. కరోనా ప్రభావం తీవ్రంగా పడిన యూరోప్ దేశాల్లో యూకే ఒకటి అన్న విషయం తెలిసిందే. అక్కడ 1.26 లక్షల మందికి పైగా కోవిడ్ 19తో మృతి చెందారు. యూరోప్‌లోనే ఇది అత్యధికం. లాక్డౌన్ ఆంక్షలను స్వల్పంగా సడలిస్తున్నప్పటికీ.. పౌరులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఆంక్షల సడలింపునకు అర్థం కరోనా ముప్పు తొలగిపోయిందని కాదని వివరిస్తోంది. సాధ్యమైనంత వరకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ను కొనసాగించాలని సూచిస్తోంది. స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌ల్లోనూ నిబంధనలను స్వల్పంగా సడలించారు. ప్రయాణ నిబంధనలను సడలించడంతో వేల్స్లో బీచ్‌లకు పౌరులు పోటెత్తారు. ఇంగ్లండ్‌లో పబ్‌లు, రెస్టారెంట్లు, జిమ్‌లు, సినిమా హాళ్లు తదితర అత్యవసరం కాని, ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడే అవకాశమున్న వ్యాపారాలకు ఇంకా అనుమతించలేదు. యూకే ప్రభుత్వ రోడ్ మ్యాప్ ప్రకారం జూన్ 21వ తేదీ నాటికి పూర్తిగా లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తారు. -
మరిన్ని మరణాలు, ఆర్థిక నష్టం
వాషింగ్టన్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన ‘స్టే ఎట్ హోం’ నిబంధనలను వేగంగా ఎత్తివేస్తే అమెరికాలోని రాష్ట్రాలు మరిన్ని మరణాలు, ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వైట్‌హౌస్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు, సాంక్రమిక వ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథొనీ ఫాసీ హెచ్చరించారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు లాక్డౌన్ నిబంధనలను సడలించేందుకు అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నిస్తున్న తరుణంలో ఫాసీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అమెరికాలోని సుమారు 24 రాష్ట్రాల్లో లాక్డౌన్ నిబంధనలు ఎత్తివేసిన నేపథ్యంలో డాక్టర్ ఫాసీ సెనేట్ కమిటీకి ఓ వాంగ్మూలమిచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన కమిటీని ఉద్దేశించి మాట్లాడుతూ ఇళ్లకే పరిమితం కావాలన్న నిబంధనను వేగంగా ఎత్తివేయడం వల్ల పరిస్థితులు అదుపు చేయలేని స్థితికి చేరుకునే అవకాశముందని స్పష్టం చేశారు. కరోనా టీకా, మందులు అందుబాటులోకి వచ్చే అవకాశాలు హెచ్చుగా ఉన్నప్పటికీ అది పాఠశాలలు తెరిచేలోపు మాత్రం కాదని ఫాసీ అన్నారు. మరోవైపు లాక్డౌన్ నిబంధనలు ఎత్తివేసిన దాదాపు 17 రాష్ట్రాలు ఇందుకు సంబంధించి వైట్‌హౌస్ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించలేదని అసోసియేటెడ్ ప్రెస్ జరిపిన ఒక అధ్యయనం ద్వారా తెలిపింది. చైనాపై అమెరికా ఆంక్షల బిల్లు కోవిడ్ విచారణకు సంబంధించి చైనాపై ఆంక్షలకు అమెరికా సంసిద్ధమౌతోంది. చైనాలో ప్రబలిన కరోనా మహమ్మారికి సంబంధించిన అన్ని వివరాలను ప్రపంచానికి తెలపాలనీ, లేని పక్షంలో చైనాపై ఆంక్షలు విధించేందుకు ట్రంప్‌కి అధికారాన్నిచ్చే బిల్లుని అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. సెనేటర్ లిండ్ సే గ్రాహం సహా ఎనిమిది మంది సెనేటర్లు రూపొందించిన బిల్లును కాంగ్రెస్ ఎగువసభలో ప్రవేశపెట్టారు. -
అమెరికాలో లాక్డౌన్ ఎత్తివేత ఫలితం?
న్యూయార్క్: అమెరికాలోని పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ నిబంధనలు ఎత్తివేసిన నేపథ్యంలో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నట్లు నిపుణులు గుర్తించారు. మంగళవారం ఒక్కరోజే దాదాపు 20 వేల కొత్త కేసులు నమోదు కాగా.. వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయినట్లు జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాలు చెబుతున్నాయి. లాక్డౌన్ నిబంధనలను సడలించడంతో పెరుగుతున్న ఇన్ఫెక్షన్ రేటును అదుపు చేయకుంటే మరిన్ని మరణాలు తప్పవని ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ సారి మరణాలు వేల సంఖ్యలో ఉంటాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: అసలు సవాలు ఇప్పుడే! అమెరికాలో లాక్డౌన్ కొనసాగుతున్న ప్రాంతాలను పరిగణలోకి తీసుకుంటే కొత్త కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ న్యూయార్క్ దాని పరిసర ప్రాంతాలను మినహాయించి చూస్తే ఐదు రోజుల్లో నమోదైన కేసుల సగటు ప్రతి లక్ష మందికి 6.2 నుంచి 7.5కు పెరిగినట్లు అసోసియేటెడ్ ప్రెస్ జరిపిన ఒక అధ్యయనం చెబుతోంది. న్యూయార్క్‌లో కొన్ని రోజులుగా కోవిడ్ మరణాలు తగ్గుముఖం పట్టాయి కానీ చాలా ప్రాంతాల్లో పెరిగాయి. పరీక్షలు ఎక్కువ చేయడం వల్ల ఎక్కువ కేసులు నమోదవుతున్నాయన్న వాదన అమెరికా విషయంలో పనిచేయదని, వాస్తవంగా కేసులు ఎక్కువయ్యాయని కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్త జువో ఫెంగ్ జాంగ్ తెలిపారు. న్యూయార్క్‌కు దూరంగా ఉన్న ప్రాంతాల్లోనూ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. అయోవాలో మంగళవారం రికార్డు స్థాయిలో 19 మంది ప్రాణాలు కోల్పోగా టైసన్ ఫుడ్ పోర్క్ ప్లాంట్‌లో దాదాపు 730 మందికి వైరస్ సోకింది. కాన్సస్‌లోని షానీ కౌంటీలో వారం రోజులుగా కేసుల సంఖ్య రెట్టింపు అవుతోందని ఒక నివేదికలో వెల్లడైంది. లాక్డౌన్ నిబంధనలు సడలించిన రోజు నుంచే కేసుల పెరుగుదల నమోదు కావడం ఇక్కడ గమనార్హం. భౌతిక దూరం పాటించడం వంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే ఆగస్టు నాటికి అమెరికా మొత్తమ్మీద కోవిడ్ కారణంగా 1.34 లక్షల మంది మరణించే అవకాశముందని వాషింగ్టన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త క్రిస్టఫర్ ముర్రే సిద్ధం చేసిన మోడల్ హెచ్చరించడం తెల్సిందే. చదవండి: ‘ఇన్‌స్టా’లో ‘బాయిస్’ బీభత్సం పోరులో మలిదశలో ఉన్నాం వాషింగ్టన్: కరోనా వైరస్ కేసుల గ్రాఫ్‌ను ఇప్పటికే చదును చేసిన అమెరికా.. మలిదశలో సురక్షితంగా.. దశలవారీగా లాక్డౌన్ నిబంధనలను సడలించే ప్రక్రియలో ఉందని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. పౌరుల చిత్తశుద్ధి కారణంగా వైరస్ గ్రాఫ్‌ను చదును చేయగలిగామని, తద్వారా లెక్కలేనని అమెరికన్ పౌరుల ప్రాణాలు కాపాడుకోగలిగామని ఆయన ఫీనిక్స్‌లో మాస్క్‌లు తయారు చేసే ఫ్యాక్టరీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు. వారం రోజులుగా దేశం మొత్తమ్మీద కేసులు, మరణాల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల నమోదైంది. ఈ అంశం ఆధారంగానే ట్రంప్ గ్రాఫ్ వంపును చదునుచేసి చెబుతున్నట్లు అంచనా. ఈ మహమ్మారి కారణంగా అమెరికా వస్తు సేవల సరఫరా అవసరాన్ని మరోసారి నొక్కి చెప్పిందని, స్థానికంగా వస్తువుల తయారీ కేంద్రాల నిర్మాణం జరగాలని చెబుతోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతకు ముందు ట్రంప్ ఒక రౌండ్‌టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ కరోనా ఓ గట్టి ప్రత్యర్థేనని కానీ.. దానిపై విజయం సాధిస్తున్నామని భరోసానిచ్చారు. అమెరికా ఇప్పుడు వెంటిలేటర్లు వంటి అత్యవసర సరుకులను అందివ్వడం ద్వారా నైజీరియా వంటి దేశాలను ఆదుకునేపనిలో ఉందని అన్నారు. -
కరోనాతో కలిసి జీవించడానికి సిద్ధం కావాలి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని మళ్లీ తెరవాల్సిన సమయం వచ్చిందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కరోనా వైరస్‌తో కలిసి జీవించడానికి ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆయన ఆదివారం మీడియాతో ఆన్లైన్ ద్వారా మాట్లాడారు. మొత్తం ఢిల్లీని కాకుండా కంటైన్మెంట్ ప్రాంతాలను మాత్రమే రెడ్ జోన్లుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం ఢిల్లీలోని మొత్తం 11 జిల్లాలను రెడ్జోన్లుగా ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పటికిప్పుడు ఆగిపోదని అన్నారు. కరోనా కేసులు సున్నాకు చేరడం అసాధ్యమని తేల్చిచెప్పారు. అందుకే మనమంతా కరోనాతో కలిసి జీవించక తప్పదన్నారు. లాక్‌డౌన్‌ను ఎక్కువ కాలం కొనసాగించడం ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదన్నారు. వ్యాపారాలు, వాణిజ్య కార్యకలాపాలు లేక ప్రజలు ఉద్యోగాలు కోల్పోతున్నారని, వ్యాపారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేజ్రీవాల్ వాపోయారు. -
వీకెండ్ ఎంజాయ్మెంట్
వాషింగ్టన్/లండన్/మాస్కో/రోమ్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తగ్గుముఖం పడుతూ ఉండడంతో అమెరికా నుంచి ఆసియా వరకు చాలా దేశాలు లాక్డౌన్లను దశల వారీగా ఎత్తేస్తున్నాయి. ఇన్నాళ్లూ నాలుగ్గోడల మధ్య ఉండిపోయిన ప్రజలు బయట గాలిని పీల్చుకుంటున్నారు. చైనాలో వీకెండ్ హాలిడేస్‌లో పార్కులు, టూరిస్టు ప్రాంతాలకు జనం వెల్లువెత్తారు. శని, ఆదివారాల్లో చైనాలో పర్యాటక కేంద్రాలను పది లక్షల మంది వరకు సందర్శించినట్టు ఒక అంచనా. స్పెయిన్‌లో కూడా ఈ వీకెండ్ సందడి వాతావరణం కనిపించింది. బంధుమిత్రులతో కలిసి తమకు నచ్చిన ప్రాంతాలకు వెళ్లిన వారంతా ఇన్నాళ్లూ పడిన ఒత్తిడి నుంచి తేరుకున్నట్టు కనిపించారు. ఇటలీలో కూడా ఆంక్షలు చాలా వరకు సడలించడంతో రోడ్లపైకి ప్రజలు వచ్చి ఆనందంగా అందరితోనూ మాట్లాడుతూ కనిపించారు. సోమవారం నుంచి పార్కులు, పబ్లిక్ గార్డెన్లు, బైక్ రైడింగ్‌లకు అనుమతి ఇవ్వడంతో ప్రజలంతా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రతీ ఒక్కరూ భౌతికదూరం పాటిస్తూ మాస్కులతోనే కనిపించారు. అమెరికాలోనూ తెరుచుకున్న పార్కులు అమెరికాలో కోవిడ్‌తో అతలాకుతలమైన న్యూయార్క్, న్యూజెర్సీలలో పార్కులు తెరుచుకున్నప్పటికీ ప్రతీ చోటా సాధారణంగా వచ్చే ప్రజల్లో 50శాతం మంది మాత్రమే రావాల్సిందిగా అనుమతులిచ్చారు. ఇక వాషింగ్టన్లో సోమవారం నుంచి సెనేట్ ప్రారంభం కానుంది. రిపబ్లికన్ పార్టీకి మెజార్టీ ఉన్న సెనేట్ తెరుచుకుంటూ ఉంటే, డెమొక్రాట్ల ఆధిక్యం కలిగిన ప్రతినిధుల సభకి మాత్రం ఇంకా తాళం తీయడం లేదు. అమెరికాలో వైద్యులకి వందనం అమెరికాలో ఫ్రంట్‌లైన్ సిబ్బంది అహోరాత్రాలు నిర్విరామంగా పనిచేసినందుకు గాను ఎయిర్ ఫోర్స్,నేవీ సంయుక్తంగా విన్యాసాలు చేసి వారికి ధన్యవాదాలు తెలిపారు. బ్లూ ఏంజెల్స్, థండర్ బర్డ్స్‌కు చెందిన సుశిక్షితులైన పైలట్లు వాషింగ్టన్, అట్లాంటా, బాల్టిమోర్ మీదుగా ప్రయాణిస్తూ విన్యాసాలు చేసి వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. రష్యాలో ఒకే రోజు 10వేలకు పైగా కేసులు రష్యాలో ఆదివారం 10,633 తాజా కేసులు నమోదయ్యాయి. వీటిలో సగానికిపైగా కేసులు మాస్కోలో నమోదయ్యాయి. బ్రిటన్‌లో కూడా మృతుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. -
‘కరోనా’కు మందు! మార్కెట్ ముందుకు...
కరోనా వైరస్ చికిత్సలో అమెరికా గిలీడ్ ఔషధం సత్ఫలితాలు ఇస్తుండటంతో గురువారం స్టాక్ మార్కెట్ భారీగా లాభపడింది. ఏప్రిల్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు రోజు కావడంతో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు జోరుగా సాగడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో 57 పైసలు పుంజుకోవడం, పారిశ్రామిక రంగానికి మరో ప్యాకేజీని కేంద్రం ఇవ్వనున్నదన్న అంచనాలు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను దశలవారీగా తొలగించనుండటం... ఈ అంశాలన్నీ సానుకూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 33,500 పాయింట్లపైకి, నిఫ్టీ 9,850 పాయింట్లపైకి ఎగబాకాయి. స్టాక్ సూచీలు వరుసగా నాలుగో రోజూ లాభపడ్డాయి. సెన్సెక్స్ 997 పాయింట్ల లాభంతో 33,718 పాయింట్ల వద్ద, నిఫ్టీ 307 పాయింట్లు ఎగసి 9,860 పాయింట్ల వద్ద ముగిశాయి. వారంలో నిఫ్టీ 8 శాతం అప్... ఈ వారంలో సెన్సెక్స్ 2,390 పాయింట్లు, నిఫ్టీ 706 పాయింట్ల మేర లాభపడ్డాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 7.6 శాతం, నిఫ్టీ 7.7 శాతం చొప్పున ఎగిశాయి. గత తొమ్మిదేళ్లలో ఈ రెండు సూచీలకు ఇది రెండో అత్యధిక వార లాభం. ఏప్రిల్ నెలలో సెన్సెక్స్ 13 శాతం, నిఫ్టీ 14 శాతానికి పైగా లాభపడ్డాయి. ఒక నెలలో నిఫ్టీ ఇంతగా లాభపడటం గత 11 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. వాహన, చమురు, గ్యాస్, లోహ, ఐటీ షేర్లు కూడా జోరుగా పెరిగాయి. ► ఓఎన్జీసీ షేర్ 13.4 శాతం లాభంతో రూ.80 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు చెరో 3 శాతం ఎగిశాయి. ► 30 సెన్సెక్స్ షేర్లలో నాలుగు–సన్ ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌యూఎల్‌లు మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 26 షేర్లు లాభాల్లో ముగిశాయి. ► దాదాపు 250కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. ఫ్యూచర్ కన్సూమర్, రిలయన్స్ క్యాపిటల్, ఐనాక్స్ విండ్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► టాటా మోటార్స్‌కు చెందిన చైనా ప్లాంట్లలో 70 శాతం మేర ఉత్పత్తి మొదలైందని, రిటైల్ షోరూమ్‌లు కార్యకలాపాలు ప్రారంభించాయన్న వార్తలతో టాటా మోటార్స్ షేర్ 19 శాతం లాభంతో రూ.93 వద్ద ముగిసింది. ఈ షేర్‌తో పాటు ఇతర వాహన షేర్లు కూడా మంచి లాభాలు సాధించాయి. 4 రోజులు...రూ.7.68 లక్షల కోట్లు గత 4 రోజుల లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.7.7 లక్షల కోట్ల మేర ఎగసింది. బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 7,68,168 కోట్లు ఎగసి రూ.129.41 లక్షల కోట్లకు చేరింది. మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు స్టాక్ మార్కెట్‌కు సెలవు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో ట్రేడింగ్ జరగదు. -
లాక్డౌన్లో మరిన్ని సడలింపులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గుర్తించిన కోవిడ్–19 హాట్స్పాట్లు, కట్టడి జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో కొన్ని కార్యకలాపాలను అనుమతిస్తూ ఈ నెల 15వ తేదీన జారీ చేసిన మార్గదర్శకాల్లో కేంద్రం మరికొన్ని సడలింపులను చేర్చింది. ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రి హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రాలు గుర్తించిన కంటైన్మెంట్ జోన్లకు ఈ సడలింపులు వర్తించవని తెలిపింది. హాట్స్పాట్లు, కంటైన్మెంట్ జోన్లపై గతంలో ప్రకటించిన ఆంక్షలు మే 3వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపింది. రెస్టారెంట్లు, హెయిర్ సెలూన్లు తెరవరాదనీ, మద్యం, సిగరెట్లు, గుట్కా అమ్మకాలపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి సడలింపులపై అంతిమ నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలదేనని పేర్కొంది. అత్యవసర వస్తువులను సరఫరా చేసే ఈ–కామర్స్ సంస్థలకు సడలింపు కొనసాగుతుందని స్పష్టత ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాలు (పురపాలక సంఘాల వెలుపలి ప్రాంతాలు): గ్రామీణ ప్రాంతాల్లోని రాష్ట్ర షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం కింద నమోదై ఉన్న షాప్స్. రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లు, మార్కెట్ కాంప్లెక్స్‌లలో ఉన్న షాపులకూ సడలింపు వర్తిస్తుంది. అయితే సింగిల్ బ్రాండ్, మల్టీ బ్రాండ్ మాల్స్‌కు మాత్రం ఇది వర్తించదు. అంటే షాపింగ్ మాల్స్ ప్రాంగణాల్లోని వాటికి వర్తించదు. అలాగే 50% మించకుండా సిబ్బంది పనిచేయాలి. వారంతా మా స్కులు ధరించి ఉండాలి. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఉండాలి. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో: మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో రాష్ట్ర షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం కింద నమోదై ఉన్న షాప్స్‌కు సడలింపు వర్తిస్తుంది. ఇరుగుపొరుగున ఉన్న షాపులు, స్టాండ్ ఎలోన్ షాపులు, రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లలో ఉన్న షాపులకూ ఇది వర్తిస్తుంది. ఈ జాబితాలో దుస్తులు, సెల్‌ఫోన్, హార్డువేర్, స్టేషనరీ దుకాణాలు తెరవచ్చు. అయితే, మార్కెట్ కాంప్లెక్స్‌లలోని షాపులకు, షాపింగ్ కాంప్లెక్స్‌ల్లోని షాపులకు, సింగిల్ బ్రాండ్, మల్టీ బ్రాండ్ మాల్స్‌కు ఇది వర్తించదు. అలాగే 50 శాతం మించకుండా సిబ్బంది పనిచేయాలి. వారంతా మాస్కులు ధరించి ఉండాలి. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఉండాలి. -
యస్ బ్యాంక్‌కు ఆర్బీఐ 60 వేల కోట్లు
న్యూఢిల్లీ: మారటోరియంపరమైన ఆంక్షలు తొలగి, పూర్తి స్థాయి సర్వీసులు ప్రారంభించిన యస్ బ్యాంక్‌కు అత్యవసరంగా నిధులు అవసరమైన పక్షంలో తోడ్పాటునిచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ చర్యలు తీసుకుంది. సుమారు రూ. 59,000 కోట్ల మేర రుణ సదుపాయం అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. డిపాజిట్‌దారులకు చెల్లింపులు జరపడంలో సమస్యలు తలెత్తకుండా యస్ బ్యాంక్‌కు ఇది తోడ్పడుతుంది. అయితే, దీనిపై యస్ బ్యాంక్ సాధారణంగా కంటే ఎక్కువ వడ్డీ రేటు చెల్లించాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2004లో గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు కూడా ఆర్బీఐ ఇదే తరహా రుణ సదుపాయం కల్పించింది. అటుపై 16 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలాంటి చర్య తీసుకోవడం ఇదే ప్రథమం. అప్పట్లో గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకును ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో విలీనం చేశారు. గడిచిన కొన్నాళ్లుగా విత్‌డ్రాయల్స్ కన్నా డిపాజిట్లే అధికంగా ఉన్నాయని, యస్ బ్యాంక్ ఇప్పటిదాకానైతే రుణ సదుపాయం వినియోగించుకోలేదని .. అసలు ఆ అవసరం కూడా రాకపోవచ్చని ఆర్బీఐ వర్గాలు తెలిపాయి. మరోవైపు, ఖాతాదారుల సొమ్ము భద్రంగానే ఉందని యస్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ ప్రశాంత్ కుమార్ మరోసారి భరోసానిచ్చారు. బ్యాంకు వద్ద తగినన్ని నిధులు ఉన్నాయని, బైటి వనరులపై ఆధారపడాల్సిన అవసరం లేదని తెలిపారు. రుణ వితరణలో లొసుగులు, మొండిబాకీలు, నిధుల కొరతతో సంక్షోభంలో చిక్కుకున్న యస్ బ్యాంక్‌పై మార్చి 5న ఆర్బీఐ మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. ఎస్బీఐ సహా పలు బ్యాంకులు పెట్టుబడులు పెట్టడంతో బుధవారం నుంచి యస్ బ్యాంక్ కార్యకలాపాలు యధావిధిగా ప్రారంభమయ్యాయి. పూరి జగన్నాథుని డిపాజిట్లు ఎస్బీఐలోకి మళ్లింపు.. పూరి జగన్నాథస్వామి ఆలయానికి చెందిన రూ. 389 కోట్ల ఫిక్సిడ్ డిపాజిట్ ఖాతాను ఎస్బీఐకి బదలాయించినట్లు యస్ బ్యాంక్ తెలిపింది. ఈ ఎఫ్డీపై రూ. 8.23 కోట్ల మేర వడ్డీ జమైనట్లు వివరించింది. మరో రూ. 156 కోట్ల రెండు ఎఫ్డీలను ఈ నెలాఖరులోగా బదలాయించనున్నట్లు శ్రీ జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ కృష్ణన్ కుమార్‌కు యస్ బ్యాంక్ లేఖ రాసింది. ఈడీ విచారణకు అనిల్ అంబానీ.. యస్ బ్యాంక్ ప్రమోటర్ రాణా కపూర్ తదితరులపై మనీ ల్యాండరింగ్ కేసుకు సంబంధించి అడాగ్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. ఆయన్ను దాదాపు తొమ్మిది గంటలపాటు ప్రశ్నించినట్లు. ఈ నెల 30న మరోసారి హాజరు కావాలని సూచించినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. అంబానీ గ్రూప్‌నకు చెందిన తొమ్మిది కంపెనీలు యస్ బ్యాంక్ నుంచి రూ. 12,800 కోట్ల మేర రుణాలు తీసుకున్నాయి. బడా కార్పొరేట్లకు యస్ బ్యాంక్ ద్వారా రుణాలిప్పించినందుకు గాను రాణా కపూర్, ఆయన కుటుంబ సభ్యులు దాదాపు రూ. 4,300 కోట్ల పైగా ముడుపులు అందుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు, మార్చి 21న విచారణకు హాజరు కావాలంటూ ఎస్సెల్ గ్రూప్ చైర్మన్, రాజ్యసభ ఎంపీ సుభాష్ చంద్రకు ఈడీ తాజాగా మరోసారి సమన్లు జారీ చేసింది. -
యస్పై మారటోరియం ఎత్తివేత
ముంబై: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ 13 రోజుల తర్వాత మారటోరియంపరమైన ఆంక్షల నుంచి బైటపడింది. బుధవారం సాయంత్రం 6 గం.ల నుంచి పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ సేవలను పునరుద్ధరించింది. గురువారం నుంచి మూడు రోజుల పాటు బ్యాంకింగ్ వేళలను కూడా పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీని ప్రకారం మార్చి 19 నుంచి 21 దాకా ఉదయం 8.30 గం.లకే శాఖలు తెరుచుకుంటాయి. సీనియర్ సిటిజన్ ఖాతాదారుల కోసం మార్చి 19 నుంచి 27 దాకా సాయంత్రం 4.30 గం.ల నుంచి 5.30 గం.ల దాకా సేవలు అందిస్తాయి. అయితే, సేవలు పునరుద్ధరించిన కాస్సేపటికే మొబైల్ యాప్ క్రాష్ కావడం, వెబ్సైట్ పనిచేయకపోవడంతో ఖాతాదారులు అసహనానికి లోనయ్యారు. సోషల్ మీడియాలో బ్యాŠంక్ను ట్యాగ్ చేస్తూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ సమస్యలిక పడలేమని, తాము డిపాజిట్లను మరో బ్యాంకుకు మార్చేసుకుంటామని సూచిస్తూ పలువురు పోస్ట్ చేశారు. దీంతో ఖాతాదారులకు కలిగిన అసౌకర్యానికి యస్ బ్యాంక్ క్షమాపణలు కోరింది. సమస్యను సత్వరం పరిష్కరిస్తున్నామని పేర్కొంది. మార్చి 5 నుంచి నెలరోజులపాటు యస్ బ్యాంక్‌పై ఆర్బీఐ మారటోరియం విధించడం, ఈ వ్యవధిలో రూ. 50,000కు దాటకుండా విత్డ్రాయల్స్పై ఆంక్షలు విధించడం తెలిసిందే. ఎస్బీఐ సహా ఇతరత్రా బ్యాంకులు.. యస్ బ్యాంక్‌లో ఇన్వెస్ట్ చేయడంతో మారటోరియం తొలగింది. మరోవైపు, యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌పై మనీ లాండరింగ్ కేసులో డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు మరోసారి విచారణకు గైర్హాజరయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి భయాలను ఇందుకు కారణంగా వారు చూపారు. ఇండస్ఇండ్ బ్యాంకు పటిష్టంగానే ఉంది బ్యాంకు యాజమాన్యం ప్రకటన న్యూఢిల్లీ: ఆర్థికంగా బలమైన స్థితిలో, తగినన్ని నిధులతో, లాభాలతో, బలమైన నిర్వహణతో నడుస్తున్నట్టు ఇండస్ఇండ్ బ్యాంకు ప్రకటించింది. యస్ బ్యాంకు సంక్షోభం అనంతరం ఇండస్ఇండ్ బ్యాంకు ఆర్థిక సామర్థ్యంపై పెద్ద స్థాయిలో మార్కెట్ వదంతులు, ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఈ వివరణ ఇచ్చింది. డిసెంబర్ త్రైమాసికం నాటికి బ్యాంకు స్థూల ఎన్పీఏలు 2.18%గా ఉన్నాయని, పెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో ఇది తక్కువగా ఉందని తెలిపింది. ‘‘క్రితం త్రైమాసికం స్థాయిలోనే స్థూల ఎన్పీఏలు ప్రస్తుత త్రైమాసికంలోనూ ఉండొచ్చు. అలాగే, క్రితం త్రైమాసికం నాటికి 1.05%ఉన్న నికర ఎన్పీఏలు ప్రస్తుత త్రైమాసికంలో 1%లోపునకు తగ్గనున్నాయి’’ అని బ్యాంకు తన ప్రకటనలో వివరించింది. ఫిబ్రవరి నాటికి వాణిజ్య, నివాస రియల్టీ, జెమ్స్, జ్యుయలరీ రంగాలకు ఎక్స్పోజర్ లేదని స్పష్టం చేసింది. -
‘యస్’పై 18న మారటోరియం ఎత్తివేత
న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ పునరుద్ధరణ ప్రణాళిక అమల్లోకి రావడంతో మార్చి 18న బ్యాంకుపై మారటోరియం తొలగిపోనుంది. ప్రస్తుతం ఆర్బీఐ నియమిత అడ్మినిస్ట్రేటరుగా ఉన్న ప్రశాంత్ కుమార్ ఆ తర్వాత సీఈవో, ఎండీగా బాధ్యతలు చేపడతారు. ఆయన సారథ్యంలో కొత్త బోర్డు ఏర్పాటవుతుంది. పునర్వ్యవస్థీకరించిన బోర్డులో సునీల్ మెహతా (పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాజీ నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్).. నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గాను, మహేష్ కృష్ణమూర్తి, అతుల్ భెడా నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఉంటారు. మార్చి 13 నుంచి యస్ బ్యాంక్ పునరుద్ధరణ స్కీమ్ 2020ని అమల్లోకి తెస్తూ జారీ చేసిన నోటిఫికేషన్లో ప్రభుత్వం ఈ అంశాలు పొందుపర్చింది. ‘ప్రణాళిక అమల్లోకి తెచ్చిన మూడో పని దినం సాయంత్రం 6 గం.లకు మారటోరియం తొలగిపోతుంది. ఆ పైన 7 రోజుల తర్వాత కొత్త బోర్డు ఏర్పాటవుతుంది’ అని నోటిఫికేషన్లో పేర్కొంది. ఏప్రిల్ 3 దాకా విత్‌డ్రాయల్స్‌ను రూ. 50,000కు పరిమితం చేస్తూ మార్చి 5న యస్ బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. ఎన్పీఏల ఒత్తిడి కొనసాగుతుంది.. మొండిబాకీలు తీవ్రం కావడంతో భారీనష్టాలు ప్రకటించిన యస్ బ్యాంక్ .. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ)పరమైన ఒత్తిడి కొనసాగుతుందని పేర్కొంది. అయితే, కొత్తగా వచ్చే రూ. 10,000 కోట్ల పెట్టుబడులతో బ్యాంక్ నిలదొక్కుకోగలదని, సమస్యలను అధిగమించగలదని ప్రశాంత్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. షేర్లకు మూడేళ్ల లాకిన్.. పునరుద్ధరణ ప్రణాళిక ప్రకారం.. యస్ బ్యాంక్‌లో 49 శాతం దాకా వాటాలు తీసుకునే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వచ్చే మూడేళ్లలో తన వాటాలను 26 శాతం లోపు తగ్గించుకోవడానికి వీల్లేదు. ఇతర ఇన్వెస్టర్లు, ప్రస్తుత షేర్‌హోల్డర్ల పెట్టుబడుల్లో 75 శాతం షేర్లకు మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. తమ దగ్గరున్న మొత్తం షేర్లలో 25 శాతానికి మించి విక్రయించుకోవడానికి వీలు ఉండదు. అయితే, 100 లోపు షేర్లు ఉన్న వారికి ఈ లాకిన్ పీరియడ్ వర్తించదు. నోటిఫికేషన్ ప్రకారం.. యస్ బ్యాంక్‌లో 49% వాటాలు తీసుకునే ఎస్బీఐ.. ఇద్దరు డైరెక్టర్లను నామినేట్ చేస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఒకరు లేదా అదనంగా మరింత మంది డైరెక్టర్లను నియమించవచ్చు. ఎస్బీఐ మినహా 15 శాతం వోటింగ్ హక్కులు ఉన్న ఇతర ఇన్వెస్టర్లు ఒక్కొక్క డైరెక్టరు చొప్పున యస్ బ్యాంక్ బోర్డుకు నామినేట్ చేయొచ్చు. పునరుదద్ధరణ ప్రణాళిక ప్రకారం.. యస్ బ్యాంక్ అధీకృత మూలధనం రూ. 6,200 కోట్లుగా ఉంటుంది. యస్ బ్యాంక్ ఉద్యోగులు గత జీతభత్యాలు, సర్వీస్ నిబంధనల ప్రకారమే కొనసాగుతారు. అయితే ‘మేనేజ్మెంట్లో కీలక ఉద్యోగుల’ సేవలను కొత్త బోర్డు ఎప్పుడైనా ఉపసంహరించవచ్చని నోటిఫికేషన్ పేర్కొంది. క్యూ3 నష్టాలు రూ.18,654 కోట్లు భారీగా పెరిగిన మొండి భారం ముంబై: కష్టాల్లో కూరుకుపోయిన యస్ బ్యాంక్ ను తాజాగా ప్రకటించిన ఆర్థిక ఫలితాలు మరింత నిరాశపరిచాయి. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(2019–20, క్యూ3)లో రూ.18,654 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.1,009 కోట్ల నికర లాభం నమోదైంది. మొండి బకాయిలు భారీగా పెరిగిపోవడంతో కేటాయింపులు కూడా బాగా పెరగడం, డిపాజిట్లు తరిగిపోవడంతో నికర నష్టాలు ఈ స్థాయిలో పెరిగాయి. కాగా ఈ ఏడాది క్యూ2లో నష్టాలు రూ.600 కోట్లు. స్థూల మొండి బాకీలు ఈ ఏడాది మూడో త్రైమాసికంలో రూ.40,709 కోట్లకు(18.87 శాతం) ఎగిశాయి. నికర మొండి బకాయిలు 5.97 శాతానికి చేరాయి. -
పునరుద్ధరణ ప్రణాళిక ‘యస్’!
ముంబై: సంక్షోభంలో చిక్కుకున్న యస్ బ్యాంక్‌ను పునరుద్ధరించే ప్రణాళికను రిజర్వ్ బ్యాంక్ ఖరారు చేసింది. మారటోరియం ఎత్తివేసినా నిధుల లభ్యతపరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగు పరిష్కారమార్గాలు ఇందులో పొందుపర్చింది. ప్రణాళిక ప్రకారం.. ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తిగా ఉన్న ప్రభుత్వ రంగ ఎస్బీఐతో పాటు ఇతరత్రా బ్యాంకుల నుంచి తుది మాట తీసుకున్నాక.. ఆర్బీఐ ముందుగా ఒక ప్రకటన చేయనుంది. ప్రకటన వచ్చిన రెండో రోజున బ్యాంకులు దాదాపు రూ. 20,000 కోట్ల నిధులను ఈక్విటీ కింద సమకూరుస్తాయి. మూడో రోజున ప్రభుత్వ రంగ బ్యాంకులు... సుమారు రూ. 30,000 కోట్ల మొత్తాన్ని యస్ బ్యాంక్ సర్టిఫికెట్స్ ఆఫ్ డిపాజిట్స్ (సీడీ)లో ఇన్వెస్ట్ చేస్తాయి. నాలుగో రోజున మారటోరియం తొలగిస్తారు. ఇన్వెస్ట్ చేస్తున్న బ్యాంకుల నుంచి హామీ వచ్చాక ఆర్బీఐ సత్వరమే ప్రణాళికను ప్రకటించనుంది. ప్రైవేట్ బ్యాంకులు కూడా రంగంలోకి.. ఎస్బీఐతో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి ప్రైవేట్ దిగ్గజాలు కూడా యస్ బ్యాంక్‌లో ఇన్వెస్ట్ చేసే ప్రతిపాదనలు ఉన్నాయి. తద్వారా యస్ బ్యాంకు సామర్థ్యంపై నమ్మకం పెరిగి, ఇతర బ్యాంకులు కూడా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రావచ్చని భావిస్తున్నారు. యస్ బ్యాంక్ సీడీల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు చేసే పెట్టుబడులు.. వాటి ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోల్లో భాగంగా మారతాయి. కొత్తగా జారీ చేసే ఈక్విటీలో రూ. 20,000 కోట్లు ఇన్వెస్ట్ చేసే బ్యాంకులకు యస్ బ్యాంకులో 75 శాతం వాటాలు దక్కుతాయి. షేర్ల పరిమాణం భారీగా పెరగడంతో ప్రస్తుతమున్న షేర్‌హోల్డర్ల వాటా నాలుగో వంతుకు తగ్గుతుంది. మొండిబాకీలు, నిధుల కొరత, గవర్నెన్స్ లోపాలతో సంక్షోభంలో చిక్కుకున్న యస్ బ్యాంక్‌ను పునరుద్ధరించే క్రమంలో ఆర్బీఐ మారటోరియం విధించడం, బ్యాంక్ బోర్డును రద్దు చేయడం తెలిసిందే. ఇన్వార్డ్ ఆర్టీజీఎస్ సేవల పునరుద్ధరణ.. ఇన్వార్డ్ ఆర్టీజీఎస్ సేవలను కూడా యస్ బ్యాంక్ పునరుద్ధరించింది. దీంతో యస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాలు, క్రెడిట్ కార్డులకు సంబంధించి రూ. 2 లక్షలకు పైగా జరపాల్సిన చెల్లింపులను ఇతర బ్యాంకు ఖాతాల నుంచి చెల్లించవచ్చని బ్యాంక్ తెలిపింది. తమ బ్యాంకులో కరెంటు ఖాతాలున్న సంస్థలు.. ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించడంలో ఎలాంటి సమస్యలు ఉండబోవని వివరించింది. అయితే మారటోరియం ఎత్తివేసే దాకా యస్ బ్యాంక్ ఖాతాల నుంచి ఇతరత్రా ఆన్లైన్లో జరపాల్సిన చెల్లింపులపై ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొంది. మరోవైపు, మార్చి 14న (శనివారం) ప్రస్తుత ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు యస్ బ్యాంక్ తెలియజేసింది. యస్ బ్యాంక్ ఖాతాలపై ఐసీఏఐ సమీక్ష.. 2017–18, 2018–19 సంవత్సరాలకు సంబంధించి యస్ బ్యాంక్ ఆర్థిక ఫలితాలను తమ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ రివ్యూ బోర్డు (ఎఫ్‌ఆర్‌ఆర్‌బీ) సమీక్షించనున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) తెలిపింది. ఒకవేళ ఏవైనా అవకతవకలు ఉన్నాయని తేలిన పక్షంలో ఆడిటర్లపై చర్యలు తీసుకునేలా డైరెక్టరుకు సిఫార్సు చేయనున్నట్లు పేర్కొంది. ఇక, అన్సెక్యూర్డ్ పెట్టుబడుల రద్దు విషయానికొస్తే.. ముందుగా ఈక్విటీ ఇన్వెస్టర్లు, ప్రిఫరెన్స్ షేర్‌హోల్డర్ల తర్వాతే అదనపు టియర్ 1 బాండ్ల విషయం పరిశీలించాలని సెబీ, ఆర్బీఐలను కోరినట్లు మ్యూచువల్ ఫండ్స్ సమాఖ్య యాంఫీ సీఈవో ఎన్ఎస్ వెంకటేష్ తెలిపారు. రుణాలు పూర్తిగా చెల్లిస్తాం: అడాగ్ వ్యాపార అవసరాల కోసం యస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాలన్నింటికీ పూర్తి పూచీకత్తు ఉందని, మొత్తం చెల్లించేస్తామని అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్(అడాగ్) వెల్లడించింది. రాణా కపూర్, ఆయన కుటుంబసభ్యులతో ఎలాంటి లావాదేవీలు లేవని తెలిపింది. అడాగ్‌లో భాగమైన తొమ్మిది సంస్థలు యస్ బ్యాంక్‌కు రూ. 12,800 కోట్ల దాకా రుణాలు చెల్లించాల్సి ఉంది. షేరు జూమ్.. పునరుద్ధరణ ప్రణాళిక వార్తలతో బుధవారం యస్ బ్యాంక్ షేరు బీఎస్ఈలో ఏకంగా 35 శాతం పెరిగి రూ. 28.80 వద్ద క్లోజయ్యింది. రుణాలివ్వాలంటూ కపూర్ ఒత్తిళ్లు: రవ్నీత్ గిల్ యస్ బ్యాంక్‌లో కీలక హోదా నుంచి రిజర్వ్ బ్యాంక్ తప్పించినా వ్యవస్థాపకుడు రాణా కపూర్ పలు మార్లు తన మాట నెగ్గించుకునే ప్రయత్నాలు చేశారు. నిష్క్రమణ తర్వాత కూడా అనేక కార్పొరేట్ సంస్థలకు భారీగా రుణాలిచ్చేలా అధికారులపై ఒత్తిళ్లు తెచ్చారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణలో యస్ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో రవ్నీత్ గిల్ ఈ విషయాలు వెల్లడించినట్లు సమాచారం. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్ఎఫ్ఎల్) మాత్రమే కాకుండా ఇతరత్రా కంపెనీలకు కూడా యస్ బ్యాంక్ ఇచ్చిన రుణాల గురించి ప్రశ్నించేందుకు ఈడీ ఆయన్ను పిలిపించింది. ఈ సందర్భంగా కపూర్ ఒత్తిళ్ల గురించి గిల్ చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వివిధ సంస్థలకు యస్ బ్యాంక్ జారీ చేసిన రుణాలకు ప్రతిగా కపూర్, ఆయన కుటుంబానికి దాదాపు రూ. 4,500 కోట్ల ముడుపులు లభించాయని ఆరోపణలు ఉన్నాయి. మిషన్ కపూర్.. రాణా కపూర్ అరెస్టు, యస్ బ్యాంక్‌ను గట్టెక్కించేందుకు ప్రభుత్వం ఎస్బీఐని రంగంలోకి దింపడం తదితర పరిణామాల వెనుక చాలా వ్యవహారమే నడిచింది. ఓవైపు యస్ బ్యాంక్ సంక్షోభం నుంచి బైటపడటం కోసం నిధులు సమీకరించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటే.. మరోవైపు స్వయంగా వ్యవస్థాపకుడు రాణా కపూరే వాటికి గండి కొడుతూ వచ్చారు. ప్రయత్నాలన్నీ విఫలమైతే ఆర్బీఐ చివరికి మళ్లీ తననే పిలిచి బాధ్యతలు అప్పగిస్తుందనే ఆశతో ఆయన ఇదంతా చేశారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన ఇన్వెస్టర్లంతా ఆఖరు దశలో తప్పుకుంటూ ఉండటంపై సందేహం వచ్చిన ఆర్బీఐ కూపీ లాగితే ఈ విషయాలు వెల్లడయ్యాయి. సంబంధిత వర్గాల కథనం ప్రకారం .. డీల్ కుదుర్చుకునేందుకు వచ్చిన ఇన్వెస్టర్ల దగ్గరకు కపూర్ అనుయాయులు వెళ్లి, ఏదో రకంగా దాన్ని చెడగొట్టేవారు. ఇదంతా గ్రహించిన ఆర్బీఐ .. యస్ బ్యాంక్‌ను మళ్లీ ఆయనకే అప్పగించేందుకు తాము సానుకూలంగా ఉన్నట్లుగా సంకేతాలు పంపి లండన్ నుంచి భారత్ రప్పించింది. ఆయన రాగానే వివిధ దర్యాప్తు ఏజెన్సీలు కపూర్‌పై అనుక్షణం నిఘా పెట్టాయి. కానీ ఆర్బీఐ, ప్రభుత్వం ఉద్దేశాలు కనిపెట్టిన కపూర్ మళ్లీ లండన్ వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్లు అధికారులకు తెలిసింది. దీంతో ముందు కపూర్‌ను అరెస్ట్ చేయాలా లేక బ్యాంకు పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టాలా? అన్న మీమాంస తలెత్తింది. కపూర్‌ను అరెస్ట్ చేసిన పక్షంలో బ్యాంక్‌పై కస్టమర్ల నమ్మకం సడలి.. ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి తలెత్తే ముప్పుందని ప్రభుత్వం ఆలోచనలో పడిం ది. చివరికి సమయం మించిపోతుండటంతో.. ధైర్యం చేసి అన్ని చర్యలు ఒకేసారి తీసుకుంది. బ్యాంకుపై మారటోరియం, పునర్వ్యవస్థీకరణ ప్రణాళికల ప్రకటనతో పాటు కపూర్‌ను అరెస్ట్ కూడా చేశారు. ఈనెల 16 దాకా ఈడీ కస్టడీలో కపూర్.. యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్ .. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీని మరో అయిదు రోజులు పొడిగిస్తూ మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) ప్రత్యేక కోర్టు ఆదేశాలిచ్చింది. మూడు రోజుల కస్టడీ అనంతరం బుధవారం ఈడీ ఆయన్ను కోర్టులో హాజరుపర్చింది. విచారణ సందర్భంగా మార్చి 16 దాకా కస్టడీని పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది. -
యస్ బ్యాంకు ఖాతాదారులకు స్వల్ప ఊరట
సాక్షి, ముంబై: యస్ బ్యాంకు సంక్షోభంతో ఆందోళనలో పడిన బ్యాంకు ఖాతాదారులకు స్వల్ప ఊరట కలగనుంది. నగదు ఉపసంహరణకు సంబంధించి ఇటీవల ఆర్బీఐ విధించిన ఆంక్షలను త్వరలోనే ఎత్తివేయ నుంది. యస్‌బ్యాంకు ఖాతాదారులు ఈ వారాంతానికే ఎలాంటి పరిమితి లేకుండా తమ నగదును విత్‌డ్రా చేసుకునే వెసులు బాటు కలగనుంది. ఈ విత్‌డ్రాయల్‌ను మార్చి 15 వరకే పరిమితం చేసి తర్వాత ఎత్తివేసే అవకాశం ఉందని కొత్తగా నియమితులైన యస్‌బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ ఎస్బీఐమాజీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ సోమవారం ప్రకటించారు. మొదట రూ.50,000 విత్‌డ్రా చేసుకునే అవకాశం నెలరోజులు కాలపరిమితిగా ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం దానిని మార్చి 15వరకే పరిమితం చేయనున్నారు. ఆ తర్వాత ఖాతాదారులు తమ అకౌంట్లలోని నగదును ఎంతకావాలంటే అంత మొత్తం నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. యస్‌బ్యాంక్ కార్యకలాపాలను ఏప్రిల్ 3నాటికి పునరుద్దరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇంకా యస్‌బ్యాంక్‌ను ఎస్బీఐలో విలీనం చేస్తారనే ఊహాగానాల్లో వాస్తవం లేదని, యస్ బ్యాంక్ స్వంతంత్రంగానే పనిచేస్తుందని పునరుద్ఘాటించారు. మూలధనం సమకూర్చలేనప్పుడు మాత్రమే విలీనం అవసరమేర్పడుతుందని అన్నారు. ప్రస్తుతం ఇతర బ్యాంకులతో చర్చిస్తున్నామని వివరాలన్నింటిని మార్చి 14న వెల్లడిస్తామని తెలిపారు. అటు యస్ బ్యాంకులో 49 శాతంవాటాల కొనుగోలు ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు ఎస్బీఐ ఆమోదం తెలిపింది. తొలి దశలో భాగంగా ఎస్బీఐ రూ. 2450 కోట్లను యస్ బ్యాంకులో ఇన్వెస్ట్ చేయనుంది. ఈ వార్తల నేపథ్యంలో సోమవారం భారీ పతనంలో కూడా యస్ బ్యాంకు షేర్ల కొనుగోళ్లకు పెట్టుబడి దారులు ఆసక్తి చూపారు. దీంతో 32 శాతం ఎగిసిన యస్ బ్యాంకు షేరు 21.35 వద్ద ముగిసింది. కాగా యస్‌బ్యాంక్‌లో అక్రమాలు నేపథ్యంలో ఆర్బీఐ ఆంక్షలను విధించిన సంగతి తెలిసిందే. బ్యాంకు లావాదేవీలపై నెల రోజుల పాటుమారటోరియం విధించింది. కేవలం రూ.50వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకునేలా ఆంక్షలు విధించింది. మరోవైపు యస్‌బ్యాంక్ పునరుద్ధరణకు ఆర్బీఐ సత్వర చర్యలు ప్రక్రియను వేగవంతం చేసింది. చదవండి: యస్ బ్యాంక్ రాణా కపూర్ అరెస్ట్!! -
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కేసుల ఎత్తివేత
సాక్షి, అమరావతి: పలు ఉద్యమాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులను ఎత్తివేస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి కేఆర్ఎం కిశోర్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 2016 జనవరిలో తుని, తూర్పుగోదావరి జిల్లాలో కాపు ఉద్యమం నేపథ్యంలో నమోదైన కేసులను ఎత్తివేస్తున్నట్టు తెలిపారు. దీంతో పాటు భోగాపురం విమానాశ్రయం భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో నమోదైన కేసులను కూడా ఎత్తివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గుంటూరు, అనంతపురం సహా వివిధ ప్రాంతాల్లో రిలయన్స్ ఆస్తుల ధ్వంసం కేసులను ఎత్తివేసున్నామని కిశోర్ కుమార్ చెప్పారు. -
నాగార్జునసాగర్ ఆరు క్రస్ట్ గేట్లు ఎత్తివేత
సాక్షి, నల్గొండ: ఎగువన కురుస్తున్న వర్షాలతో నాగార్జునసాగర్ డ్యామ్‌కు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు డ్యామ్ ఆరు క్రస్ట్ గేట్లను పది అడుగుల ఎత్తు వరకు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం సాగర్‌లో ఇన్ ఫ్లో 1,51765 క్యూసెక్కుల ఉండగా.. ఔట్ ఫ్లో 1,39,9908 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు ఉండగా.. ప్రస్తుతం నీటి మట్టం 589.50 అడుగులుగా నమోదైంది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుతం 310.5510 టీఎంసీల నీటి నిల్వ ఉంది. -
మహారాష్ట్ర: బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేత
-
మేఘాలయలో ఏఎఫ్ఎస్పీఏ ఎత్తివేత
న్యూఢిల్లీ: మేఘాలయలో భద్రతా దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్పీఏ) కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో పాక్షికంగా తొలగించింది. భద్రతా దళాలు ఆపరేషన్లు నిర్వహించేందుకు ఎవరినైనా, ఎక్కడైనా, ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా అరెస్టు చేసేందుకు అధికారం కల్పిస్తున్న ఏఎఫ్ఎస్పీఏను మార్చి 31 నుంచి మేఘాలయలోని అన్ని ప్రాంతాల్లో ఎత్తివేశారు. భద్రత పరంగా మేఘాలయలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తోందని, అందుకే ఈ చట్టాన్ని తొలగించామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, దేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు విదేశీయులపై ఉన్న నిబంధనలను కేంద్రం ఎత్తేసింది. ప్రత్యేక పర్మిట్ ఏదీ అవసరం లేకుండానే పర్యటించవచ్చని స్పష్టం చేసింది. అయితే పాకిస్తాన్, చైనా, ఆఫ్ఘనిస్తాన్ వంటి పలు దేశాల పర్యాటకులకు మాత్రం అనుమతివ్వలేదు. -
ఎన్డీఎస్ఎల్లో లేఆఫ్ ఎత్తివేయాలి
మెదక్ రూరల్: ఎన్డీఎస్ఎల్లో లేఆఫ్‌ను ఎత్తివేసి తమకు రావాల్సిన వేతనాలు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు చేపట్టిన నిరాహార దీక్షలు మంగళవారం నాటికి 71వ రోజుకు చేరాయి. మంగళవారం కార్మికులు పారిశ్రామిక వివాదాల కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు పల్లె సిద్దిరాంలు మాట్లాడుతూ తమ కేసును కోర్టులో వేసినందున న్యాయవాది సూచన మేరకు నిరసన కార్యక్రమాలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం దీక్షల్లో కూర్చున్న వారిలో బాపురెడ్డి, రాజు, శంభుప్రసాద్, జాకబ్, షంశీర్అలీ, రాజాగౌడ్, లక్ష్మణ్‌రావు, కృష్ణ, తిరుపతిరెడ్డి, ఉపెందర్, పెంటయ్య, కిషన్, ధర్మేందర్, వెంకటేశం, విఠల్ తదితరులు పాల్గొన్నారు. -
జమ్మూ లో కర్ఫూ ఎత్తివేత
శ్రీనగర్: రెండు వారాల ఘర్షణల అనంతరం జమ్ము కశ్మీర్ లోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫూని ఎత్తివేశారు. శ్రీనగర్ లోని కొన్ని ప్రాంతాలతో పాటు నాలుగు జిల్లాల్లో నిషేధాజ్ఞలను ఎత్తివేశారు. ముందు జాగ్రత్త చర్యగా కొన్ని జిల్లాల్లో కర్ఫూ అమల్లో ఉంది. పరిస్థితి కొంచెం మెరుగు పడిందని భావించిన ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకుంది. బందిపొరా, బారాముల్లా, బద్గమ్, గందర్బల్ జిల్లాలతో పాటు శ్రీనగర్ లోని కొన్నిప్రాంతాల్లో కర్ఫూని ఎత్తివేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కర్ఫూ ఎత్తివేసినా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పౌరులు గుంపులుగా సంచరించడానికి వీళ్లేదని అధికారులు తెలిపారు. కర్ఫ్యూ లోయలోని ఎనిమిది పోలీస్ స్టేషన్ల పరిధిలో, అనంతనాగ్ , కుల్గామ్ , కుప్వారా , పుల్వామా మరియు షోపియాం జిల్లాల్లో అమలులో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. జులై 9 న హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బర్హాన్ వానీ ని భద్రతాదళాలు హతమార్చిన నాటి నుంచి ఆ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు జరిగిన ఆందోళనల్లో 45 మంది మృతి చెందారు.3,400 మంది గాయపడ్డారు. రాజ్ నాథ్ కశ్మీర్ పర్యటన: రెండురోజులు పర్యటన నిమిత్త రాజ్ నాథ్ ఈరోజు ఉదయం శ్రీనగర్ చేరుకున్నారు. ఈ రోజు ప్రభుత్వ అధికారులు, సామాజిక సంఘాలు, పలు రాజకీయపక్షాలతో సమావేశమవనున్నారు. రేపు కూడా రాజ్ నాథ్ పలువురితో చర్చలు జరుపనున్నారు.