Limbadri
-
లాసెట్‌లో 72.66 శాతం ఉత్తీర్ణత
సాక్షి, హైదరాబాద్: న్యాయవాద విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (లాసెట్)లో ఈ ఏడాది 72.66 శాతం మంది అర్హత సాధించారు. మూడేళ్ల కాలపరిమితి ఉన్న లా కోర్సులో 73.27 శాతం, ఐదేళ్ల లా కోర్సులో 65.12 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పోస్టు–గ్రాడ్యుయేషన్ లాసెట్ (పీజీఎల్‌సెట్)లో 84.65 శాతం మంది అర్హత సాధించారు. లాసెట్ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్.లింబాద్రి గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా లాసెట్ కన్వినర్ బి.విజయలక్ష్మి మాట్లాడుతూ, మూడేళ్ల లా కోర్సుకు 27,993 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా, 25,510 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఐదేళ్ల కోర్సుకు 8,412 మంది హాజరుకాగా, 5,478 మంది ఉత్తీర్ణులయ్యారని, పీజీఎల్‌సెట్‌కు 3,863 మంది హాజరుకాగా, 3,270 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. లాసెట్, పీజీఎల్‌సెట్‌కు ఈసారి మొత్తం 50,684 మంది దరఖాస్తు చేసుకోగా, 40,268 మంది హాజరయ్యారని చెప్పారు.వారిలో 29,258 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. ఈసారి లాసెట్‌కు ఐదుగురు ట్రాన్స్జెండర్లు దరఖాస్తు చేసుకోగా, పరీక్షకు హాజరైన నలుగురు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ రిజి్రస్టార్ లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ జి.బి.రెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు వి.వెంకటరమణ, ఎస్కే మహమూద్, కార్యదర్శి శ్రీరామ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. టాపర్లు వీరే.. మూడేళ్ల లా కోర్సులో హైదరాబాద్‌కు చెందిన పీజీఎం అంబేడ్కర్ 97.49 మొదటి ర్యాంకు, గచ్చిబౌకి చెందిన ప్రత్యూష్ సరస 96.65 రెండో ర్యాంకు, ఖమ్మం జిల్లా సింగరేణికి చెందిన తల్లూరి నరేష్ 95.74 మార్కులతో మూడు ర్యాంకు సాధించారు. అలాగే ఐదేళ్ల లా కోర్సులో మియాపూర్‌కు చెందిన శ్రీరాం బొడ్డు 87 మార్కులతో మొదటి ర్యాంకు సాధించగా, కామారెడ్డికి చెందిన పిప్పిరిశెట్టి దినేష్ 87 మార్కులతో రెండో ర్యాంకు, మల్కాజిగిరికి చెందిన ఆర్పీ విజయనందిని 84 మార్కులతో మూడు ర్యాంకు పొందారు. పీజీఎల్‌సెట్‌లో సికింద్రాబాద్‌కు చెందిన పెరి బాలసాయి విష్ణువర్ధన్ 76 మార్కులతో మొదటి ర్యాంకు సాధించగా, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లాకు చెందిన అభినీతి జాసన్ 70 మార్కులతో రెండో ర్యాంకు, హైదరాబాద్‌కు చెందిన నిమన్ సిన్హా 67 మార్కులతో మూడో ర్యాంక్ సాధించారు. -
టీఎస్ ఐసెట్ షురూ
కేయూ క్యాంపస్: రాష్ట్రంలో ఏంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకుగాను టీఎస్ ఐసెట్‌ను బుధవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 116 కేంద్రాల్లో నిర్వహించారు. ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ పద్ధతిన జరిగిన ఈ ప్రవేశ పరీక్షకు నిమిషం నిబంధన ఉండడంతో అభ్యర్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి వరంగల్ కాకతీయ యూనివర్సిటీలోని టీఎస్ ఐసెట్ కార్యాలయంలో ఉదయం 8గంటలకే ప్రశ్నపత్రం సెట్‌ను డ్రా పద్ధతిలో ఎంపిక చేశారు. ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12–30గంటల వరకు మొదటి సెషన్ ప్రవేశ పరీక్షను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని111 పరీక్ష కేంద్రాల్లో 27,801మంది అభ్యర్థులకు గానూ 25,086 మంది హాజరు(90.2శాతం) కాగా, ఏపీలోని నాలుగు కేంద్రాల్లో 1,130మంది అభ్యర్థులకు గానూ 896మంది (79.3శాతం) హాజరయ్యారని టీఎస్ ఐసెట్ కన్వీనర్, కాకతీయ యూ నివర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంటు కళాశాల ప్రొఫెసర్ ఎస్.నర్సింహాచారి వెల్లడించా రు. గురువారం జరిగే మొదటి సెషన్‌తో ఈ ప్రవేశ పరీక్ష ముగుస్తుందని నర్సింహాచారి తెలిపారు. -
50 వేల డిగ్రీ సీట్లకు కోత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కళాశాలల్లో డిగ్రీ సీట్లు ఈ ఏడాది దాదాపు 50 వేలు తగ్గే అవకాశం ఉంది. డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే దోస్త్‌లో సీట్లను తగ్గించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కొన్నేళ్ళుగా సీట్ల భర్తీ లేకపోవడమే దీనికి కారణంగా ఉన్నత విద్యా మండలి చెబుతోంది. గత విద్యా సంవత్సరంలో కూడా దాదాపు లక్ష సీట్లను కుదించారు.వంద కాలేజీల్లో ఆర్ట్స్ కోర్సుల్లో జీరో ప్రవేశాలు: రాష్ట్రంలో ఉన్న 1050 డిగ్రీ కాలేజీల్లో 4.60 లక్షల డిగ్రీ సీట్లున్నాయి. కానీ ప్రతీ సంవత్సరం గరిష్టంగా 2.25 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అవుతున్నాయి. ఇందులోనూ బీకాం కోర్సులోనే ఎక్కువగా చేరుతున్నారు. తర్వాత స్థానంలో బీఎస్సీ ఉంటోంది. బీఏ కోర్సులో ప్రవేశాలు 40 శాతం మించడం లేదు. దాదాపు వంద కాలేజీల్లో ఆర్ట్స్ కోర్సుల్లో జీరో ప్రవేశాలు నమోదు అవుతున్నాయి.మరో 150 కాలేజీల్లో కనీసం 15 శాతం విద్యార్థులు కూడా చేరడం లేదు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కాలేజీలే విద్యార్థులు ఇష్టపడుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంత కాలేజీల్లో సీట్లు భారీగా మిగిలిపోతున్నాయి. ఇటీవల ఉన్నత విద్యా మండలి ఈ పరిస్థితిని సమీక్షించింది.డిమాండ్ లేని కోర్సులకు సంబంధించిన బ్రాంచీలకు అనుమతించకూడదని సూత్రప్రాయంగా నిర్ణయించింది. 15 శాతం కన్నా విద్యార్థులున్న కాలేజీల్లోనూ ప్రవేశాలకు అనుమతించే అవకాశం కన్పించడం లేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో పలు కాలేజీలు ఈ ఏడాది మూతపడే అవకాశాలున్నాయని అధికార వర్గాలు అంటున్నాయి. కొత్త కోర్సులకే ప్రాధాన్యం.. డిగ్రీ తర్వాత విద్యార్థులు ఉపాధి అవకాశాలను కోరుకుంటున్నారు. మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా డిగ్రీ కోర్సుల్లో కొన్నేళ్ళుగా మార్పులు తెస్తున్నారు. కొన్ని కాంబినేషన్ కోర్సులను ప్రవేశపెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా 19 రకాల స్కిల్ కోర్సులను సిఫార్సు చేసింది. రిటైల్ మార్కెటింగ్, కార్పొరేట్ సెక్టార్లో అవసరమైన సేవలు అందించే టెక్నికల్ కోర్సులు, స్టార్టప్స్ పెట్టుకోగల కోర్సులను అందించాలని సూచించింది. కామర్స్‌లో ఫైనాన్సింగ్, ఇన్సూరెన్స్, బీఎస్సీలో బయో మెడికల్ వంటి కొత్త కోర్సులను ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. రూరల్‌లో కొత్త కోర్సులు తెచ్చినా..? హైదరాబాద్ నగర పరిసరాల్లో ఉన్న ప్రైవేటు కాలేజీలు కొత్త కోర్సులపై ఆసక్తి చూపుతున్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లోని డిగ్రీ కాలేజీలు మాత్రం ముందుకు రావడం లేదు. దీనివల్ల మౌలిక వసతుల కల్పన, అధ్యాపకుల కొరతతో పాటు ఫీజులు పెంచితే విద్యార్థులు చేరేందుకు అవకాశం లేదని ఆ కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. మరోవైపు ఫీజు రీ ఎంబర్స్మెంట్ సకాలంలో ప్రభుత్వం అందించడం లేదని కాలేజీల యాజమాన్యాలు వాపోతున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కొత్త కోర్సులకు వెళ్ళలేమని గ్రామీణ ప్రాంత డిగ్రీ కాలేజీల నిర్వాహకులు అంటున్నారు. లైప్సైన్స్ కోర్సులను గత కొన్నేళ్ళుగా అందుబాటులోకి తెచ్చినా కూడా గ్రామీణ ప్రాంత డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు 30 శాతం మించడం లేదు. మార్పులు అనివార్యండిగ్రీ కోర్సుల్లో మార్పు లు అనివార్యం. మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కొత్త కోర్సులు తీసుకొస్తున్నాం. కాలేజీల్లో అన్ని విధాల మౌలిక వసతులు ఉంటేనే అనుమతులు ఇస్తాం. డిమాండ్ లేని కాలేజీల్లో సీట్లు తగ్గించే ఆలోచన చేస్తున్నాం. ఏపీఈసెట్ తర్వాతే దోస్త్ నోటిఫికేషన్ ఇస్తాం.కొత్త కోర్సులను కూడా ఇందులో చేర్చే ఆలోచనలో ఉన్నాం. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్యా మండలి చైర్మన్) -
ఈసారి ఇంకా ఆలస్యంగా టీఎస్ఈఏపీ కౌన్సెలింగ్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి కౌన్సెలింగ్ ఈ ఏడాది మరింత ఆలస్యమయ్యేలా కన్పిస్తోంది. ప్రైవేటు కాలేజీలకు అనుబంధ గుర్తింపు ప్రక్రియ ఇప్పటికీ మొదలవ్వకపోవడం ఈ అనుమానా లకు తావిస్తోంది. ఇంజనీరింగ్‌కు సంబంధించిన కొన్ని బ్రాంచీల్లో సీట్ల పెంపునకు పెద్ద ఎత్తున దరఖాస్తులొచ్చాయి. మరికొన్ని బ్రాంచీల్లో సీట్ల కుదింపును కాలేజీలు కోరుకుంటున్నాయి. వీట న్నింటిపైనా అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సీట్లపై స్పష్టత వచ్చినప్పటికీ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు కాలేజీలకు అను బంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం యూనివర్సిటీ బృందాలు కాలే జీలను సందర్శించాల్సి ఉంటుంది. మౌలిక వస తులు ఏ మేరకు ఉన్నాయి? ఫ్యాకల్టీ పరిస్థితి ఏమిటి? అనే అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. అన్ని అర్హతలు ఉన్నప్పుడు మాత్రమే అనుబంధ గుర్తింపు ఇస్తారు. అప్పుడే కాలేజీలు కౌన్సెలింగ్‌లో పాల్గొనే వీలుంటుంది. కానీ ఇప్ప టివరకు ఇందుకు సంబంధించిన సమావేశమే జరగలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆలస్యానికి కారణాలేంటి? రాష్ట్ర ఈఏపీసెట్ మే 7వ తేదీ నుంచి మొదలై 11తో ము గుస్తుంది. నెల రోజుల్లో ఫలి తాలు వెల్లడిస్తారు. అదే రోజు కౌన్సెలింగ్ తేదీలనూ ప్రకటిస్తారు. కౌన్సెలింగ్ మొదలయ్యే నాటికి రాష్ట్రంలోని 175 కాలేజీల్లో ఉండే కన్వీనర్ కోటా సీట్లను బ్రాంచీల వారీగా వెల్లడించాల్సి ఉంటుంది. గత ఏడాది లెక్కల ప్రకారం 90 వేలకు పైగా ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. గత ఏడాది మొత్తం 14 వేల సీట్లు కంప్యూటర్ సైన్స్ బ్రాంచీల్లో పెరిగాయి. ఈ ఏడాది కూడా మరి కొన్ని సీట్లు పెంచాలని కాలేజీలు కోరుతు న్నాయి. గత ఏడాది తనిఖీల ప్రక్రియపై ఆరో పణలు వచ్చాయి. మౌలిక వసతులు, సరైన అధ్యాపకులు లేకుండా అనుబంధ గుర్తింపు ఇచ్చి నట్టు కొన్ని వర్సిటీలపై విమర్శలు వచ్చాయి. దీంతో ఈసారి ప్రత్యేక బృందాలను నియమించాలని నిర్ణయించారు. వసతులు లేని కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ బ్రాంచి సీట్ల కుదింపు అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ ఆల స్యమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. అయితే కౌన్సెలింగ్ సకాలంలోనే జరుగుతుందని భావిస్తు న్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. -
రాజకీయమార్పులకు వేదికల్లా వర్సిటీలు ఎదగాలి
వ్యవస్థను మార్చే నిప్పుకణాలకు విశ్వవిద్యాలయాలే పునాదులు వేస్తాయన్నది ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి అభిప్రాయం. ఉప్పొంగే ఆ యువరక్తంలో కనిపించేది ఆవేశమే కాదు... భావితరాల ఆలోచనా విధానం అనేది ఆయన విశ్లేషణ. రాజకీయ చిత్రపటంలో అత్యున్నత శిఖరాల్లో కనిపించే నేటితరం నేతల ఆశయ పునాదులు యూనివర్సిటీల్లో కన్పిస్తాయని విశ్లేషిస్తారాయన. సమ్మిళితమైన చదువు, రాజకీయాలను వేర్వేరుగా చూడలేమన్నది ఆయన భావన. ఉ ద్యమాల పురిటిగడ్డలైన తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుడిగా రాణించిన నేపథ్యం లింబాద్రిది. అంచెలంచెలుగా ఎదిగి, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్ లింబాద్రి అసెంబ్లీ ఎన్నికల వేళ తన మనోభావాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. అది ఆయన మాటల్లోనే ... రాజకీయాలకు విద్యార్థి దశే కీలకం విలువలతో కూడిన రాజకీయాలకు విద్యార్థి దశే పునాది వేస్తుంది. విద్యతో పాటు రాజకీయ అవగాహన ఉండాలి. మార్పును కోరుకునేదే విద్య. అలాంటప్పుడు రాజకీయ మార్పును ఎందుకు ఆశించకూడదు? యువ చైతన్యాన్ని ఎందుకు స్వాగతించకూడదు? రాజకీయాల్లో కీలకపాత్ర పోషి స్తున్న ఎంతోమందిని చూడండి. ఆకాశాన్ని తాకే వారి ఆలోచనా శక్తి విద్యార్థి నేపథ్యం నుంచే కన్పిస్తుంది. అందుకే యువతరాన్ని రాజకీయాల్లోకి రానివ్వాల్సిందే. ప్రోత్సహించాల్సిందే. నిజానికి రేపటి అభివృద్ధిని అంచనా వేయగలిగేది విద్యార్థి లోకమే. భావితరం ఉన్నతికి బాటలేసేది యువతరమే. ఆ దిశగానే విద్యా బోధన ఉండాలి. సరికొత్త మార్పును ప్రేరేపించే విధానపరమైన లక్ష్యాలు విద్యలో జొప్పించాలి. ఉదాహరణకు సాంకేతికతనే తీసుకోండి. ఎన్ని మార్పులొచ్చాయి. సంప్రదాయ కోర్సుల స్థానంలో టెక్నాలజీ కోర్సుల వైపు యువత మొగ్గుచూపుతున్నారు. విశ్వవ్యాప్తంగా వచ్చిన ఈ మార్పును మనమూ అందిపుచ్చుకోవాలి. ఆ క్రమంలో ఆలోచన విధానంలోనూ మార్పు లు తేవాలి. మార్కెట్లో మన శక్తిసామర్థ్యాలు నిరూపించుకునే సత్తా మన యువతరానికి ఉంది. దీన్ని మరింత పెంచగలిగే విధానపరమైన నిర్ణయాలు ప్రజల నుంచి వచ్చే నేతలు చేయాలి. విద్యార్థి దశలోనే రాజకీయ నేపథ్యం ఉన్న నేతకు ఇది మరింత బోధపడుతుందనేది నా అభిప్రాయం. సర్కారీ కొలువునే ఉద్యోగం అనుకోవద్దు.. ప్రతీ ఎన్నికల్లోనూ యువత, ఉపాధి అవకాశాలు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాయి. ఈ దిశగా అన్ని పార్టీలూ స్పందిస్తున్నాయి. కానీ వాస్తవాలను యువత తెలుసుకోవాలి. సర్కారీ కొలువునే ఉద్యోగం అనుకోవద్దు. లక్షల్లో గ్రాడ్యుయేట్లు తయారవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు వేలల్లో ఉంటున్నాయి. అంతమాత్రాన ఉపాధి లేకుండా పోతుందా? ఉద్యోగం కావాలనుకునే ప్రతీ వ్యక్తి తన నైపుణ్యాన్ని పెట్టుబడిగా పెట్టి ఉద్యోగాలు సృష్టించాలి. ఆ దిశగా మన ఎన్నికల ప్రణాళికలూ ఉండాలి. ఈ వాస్తవాన్ని నేతలు యువతకు వివరించి చెప్పాలి. ఆలోచనలు రేకెత్తించాలి. నిజానికి ఈ తరహా విద్య వైపు తెలంగాణ అడుగులు వేస్తోంది. ఉద్యోగం రాలేదనే తాత్కాలిక అసంతృప్తిని పక్కనబెడితే... ఉపాధి బాటలు వేయగల సామర్థ్యం ఉందని గుర్తిస్తే చాలు.. శాశ్వత పరిష్కారం దొరికినట్టే. విద్యారంగ శ్రేయస్సే పార్టీల ఎజెండా కావాలి విద్యార్థి లోకాన్ని వెన్నుతట్టి ప్రోత్సహించడంలో ప్రభుత్వాల కృషి మరువలేనిది. ప్రతిభకు దన్నుగా నిలిచే గురుకులాలు, రెసిడెన్షియళ్లు, ఊతం ఇచ్చే వివిధ రకాల సంక్షేమాలు అభినందనీయమే. నిజానికి విద్యను భావితరాల పెట్టుబడిగానే చూడాలి. అత్యుత్తమ మానవ వనరులు అందించే కేంద్రంగానే పరిగణించాలి. ఆ దిశగా పార్టీల మేనిఫెస్టోలు ఉండాలి. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రపంచవ్యాప్తంగా మార్పులొస్తున్నాయి. దీన్ని అందుకోవాలంటే బోధన నాణ్యత పెంచాల్సిందే. అందుకు అనుగుణంగా ఖాళీల భర్తీ అనివార్యం. మన విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికీ పెద్ద ఎత్తున ఖాళీలున్న మాట వాస్తవం. వాటి భర్తీకి చేపట్టిన చర్యలు, పారదర్శక నియామక విధాన నిర్ణయం ఆమోదించాల్సిందే. ఈ దిశగా చేపట్టిన కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు మరో అడుగుగానే చెప్పాలి. ప్రశ్నించే తత్వమే రాజకీయ పునాది ప్రశ్నించే తత్వం నుంచే ఆలోచనలు ఉద్భవిస్తాయి. నిలదీసే నైజం నుంచే కోరుకున్న మార్పూ సాధ్యమవుతుంది. అది విద్యార్థి దశ నుంచే మొదలవ్వాలి. ఒక్కో విద్యార్థికి ఒక్కో ఆశయం ఉంటుంది. ఆ కలల స్వప్నంలోంచే గొప్ప రాజకీయవేత్తలూ పుట్టుకొస్తారు. పారిశ్రామిక వేత్తలూ ఆవిర్భవిస్తారు. రచయితలు, సైంటిస్టులూ.. రాజకీయ విశ్లేషకులు... ఇలా అన్ని వర్గాల మేధావులు సరికొత్త ఆలోచనల్లోంచే తెరపైకి వస్తారు. విద్యార్థికి రాజకీయాలెందుకు? అనే వాదనలో అర్థం లేదు. నిజానికి ఆ దిశగా విద్యార్థి లోకాన్ని ప్రోత్సహించాల్సిన అవసరమూ ఉంది. మార్కుల పరుగులే కాదు... రాజకీయ మార్పులకు వేదికల్లా విశ్వవిద్యాలయాలు ఎదగాల్సిందే. -గౌటే దేవేందర్ -
లాసెట్‌లో 80.21 శాతం పాస్
సాక్షి, హైదరాబాద్: న్యాయవాద కోర్సుల్లో ప్రవేశానికి గత నెల ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్ లాసెట్–2023) ఫలితాలను ఉన్నత విద్య మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి గురువారం విడుదల చేశారు. వివరాలను ఆయన మీడియాకు వివరించారు. ఈ పరీక్షకు 43,692 మంది దరఖాస్తు చేసుకోగా, 36,218 మంది పరీక్ష రాశారని, ఇందులో 29,049 (80.21 శాతం) మంది అర్హత సాధించారని తెలిపారు. మొత్తం 120 మార్కులకు జరిగిన ఈ పరీక్షలో ఎస్సీ, ఎస్టీలకు 25 శాతం, ఇతరులకు 35 శాతం అర్హత మార్కులుగా నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల పరిధిలో 7,560 లా సీట్లున్నాయి. ఇందులో మూడేళ్ల లా కోర్సుల్లో 4,630, ఐదేళ్ల లా కోర్సులో 2 వేలు, పీజీ లా కోర్సులో 930 సీట్లున్నాయి. త్వరలో లాసెట్ కౌన్సెలింగ్ చేపడతామని లింబాద్రి వెల్లడించారు. విలేకరుల సమావేశంలో ఉన్నత విద్యామండలి కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్, లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ బి.వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 60 ఏళ్లు పైబడిన వాళ్లుకూడా... న్యాయవాద వృత్తి చేపట్టాలనే ఆకాంక్ష 16 ఏళ్ల నుంచి 60 ఏళ్లు పైబడిన వాళ్లలోనూ కనిపించింది. 60 సంవత్సరాలకు పైబడి మూడేళ్ల లాసెట్ రాసిన వాళ్లలో 185 మందికిగాను 149 మంది, ఐదేళ్ల లాసెట్‌లో 10కి 9 మంది, పీజీ లాసెట్‌లో 68 మందికి 65 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే మూడేళ్ల లాసెట్ రాసిన వాళ్లలో బీకాం నేపథ్యం ఉన్నవాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. బీకాం ప్రధాన కోర్సుగా ఉన్నవాళ్లు 8,164 మంది పరీక్ష రాయగా 5,861 మంది అర్హత సాధించారు. ఆ తర్వాత స్థానంలో బీఎస్సీ, బీటెక్ నేపథ్యం వాళ్లున్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన వాళ్లు 53 మంది లాసెట్ రాశారు. -
ఈసెట్‌లో 93 శాతం ఉత్తీర్ణత
సాక్షి, హైదరాబాద్: పలు డిప్లొమా కోర్సులు పూర్తిచేసి, ఇంజనీరింగ్ ద్వితీ య సంవత్సరంలో ప్రవేశానికి గత నెలలో నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్ ఈసెట్–2003) ఫలితాల ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫె సర్ ఆర్.లింబాద్రి మంగళవారం విడుదల చేశారు. ఈ పరీక్షలో 20,988 మంది (93.07 శాతం) అర్హత సాధించారని వెల్లడించారు. ఉత్తీర్ణత సాధించినవారి లో 14,415 మంది పురుషులు, 6,484 మంది మహిళలు ఉన్నారు. బీఎస్సీ (మ్యాథ్స్), కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రాని క్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికే షన్ ఇంజనీరింగ్, ఇనుస్ట్రు మెంటేషన్ ఇంజనీరింగ్, మెకానికల్, మెటలర్జికల్, మైనింగ్, ఫార్మసీ బ్రాంచీల్లో 9 వేల సీట్లు ఉన్నా యని, వీటికి త్వరలో కౌన్సెలింగ్ చేపడతామని లింబాద్రి తెలిపారు. విలే కరుల సమావేశంలో ఈసెట్ కన్వీనర్ శ్రీరాం వెంకటేష్, ఉన్నత విద్యా మండలి కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్, ఓయూ వీసీ డి.రవీందర్ పాల్గొన్నారు. -
డిగ్రీలో సమూల మార్పులు
సాక్షి, హైదరాబాద్: జాతీయ విద్యావిధానం–2020కి అనుగుణంగా డిగ్రీలో సరికొత్త మార్పులకు ఉన్నత విద్యామండలి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కసరత్తు మొదలు పెట్టింది. విద్యార్థులు కోరుకున్న సబ్జెక్టులతో డిగ్రీ పూర్తి చేసేందుకు అవకాశం కల్పించేలా వచ్చే విద్యాసంవత్సరం నుంచి ‘బకెట్’విధానాన్ని తీసుకొస్తున్నామని ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి నేతృత్వంలో గురువారం మండలి కార్యాలయంలో కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిత్తల్‌సహా ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాందీ, శాతవాహన, పాలమూరు, తెలంగాణ యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లతో సమావేశం నిర్వహించింది. సమావేశ వివరాలను లింబాద్రి మీడియాకు వివరించారు. నచ్చిన కోర్సు... ♦ ఇప్పటి వరకూ డిగ్రీ కోర్సులు మూస విధానంలో ఉండేవి. బీఏ హెచ్‌పీపీ తీసుకుంటే హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్లు మాత్రమే చదవాలి. అయితే కొత్త విధానంలో ఏ, బీ, సీ, డీ బకెట్లుగా సబ్జెక్టులను విడగొడతారు. వీటిల్లో వేటినైనా ఎంచుకోవచ్చు. ఉదాహరణకు... ఎ గ్రూపులో అరబిక్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ పాలసీ, లిటరేచర్ ఇలా కొన్ని సబ్జెక్టులుంటాయి. బి గ్రూప్‌లో ఎకనామిక్స్, హిందీ, ఇంగ్లిష్, తెలుగు, సాహిత్యం, ట్రావెల్ టూరిజం వంటి కొన్ని కోర్సులుంటాయి. ఇలా సి, డీ గ్రూపుల్లోనూ కొన్ని కోర్సులుంటాయి. విద్యార్థులు ఏవేని మూడు బకెట్స్ నుంచి ఒక్కో సబ్జెక్టును ఎంపిక చేసుకోవచ్చు. ♦ డిగ్రీలో క్రెడిట్ సిస్టమ్ అమలు చేయడం వల్ల ప్రతీ దాన్ని క్రెడిట్ విధానంలో కొలుస్తారు. బకెట్ విధానం వల్ల బీఏ విద్యార్థి కూడా కంప్యూటర్ సైన్స్ కోర్సు, సాహిత్యం, మరే ఇతర కోర్సు అయినా చేయవచ్చు. ♦ ఈ విధానం క్షేత్రస్థాయిలో అన్ని కాలేజీల్లో ఎలా అమలు చేయాలనే దానిపై మండలి ఓ కమిటీని నియమించి, దాని సూచనల మేరకు మార్పులు చేస్తుంది. విభిన్న సబ్జెక్టులతో డిగ్రీ చేసిన విద్యార్థికి మార్కెట్ అవసరాలకు తగిన నైపుణ్యం వచ్చే వీలుంది. మరికొన్ని మార్పులు ♦ విద్యార్థి కాలేజీలోనే కాకుండా ఆన్లైన్ ద్వారా కూడా దేశ, విదేశాల్లో ఎక్కడైనా ఒక కోర్సు చేసే వీలుంది. దానికి సంబంధిత సంస్థలే పరీక్షలు నిర్వహిస్తాయి. క్రెడిట్స్‌ను ఆయా సంస్థలకు బదలాయిస్తాయి. ♦ డిగ్రీ స్థాయిలో సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తోపాటు మరికొన్ని కంప్యూటర్ అనుబంధ కోర్సులను సబ్జెక్టులుగా తీసుకురానున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ కోర్సుల బోధనకు అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ♦ రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ కాలేజీ మొదలయ్యే నాటికే పూర్తి చేయాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది జూలై నుంచే డిగ్రీ క్లాసులు మొదలవ్వాలని తీర్మానించారు. ♦ కోవిడ్ మూలంగా చాలామంది విద్యార్థుల్లో అభ్యసన నష్టాలు కన్పిస్తున్నాయి. వీటిని పూడ్చడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. దీనికి పక్కా ప్రణాళికను త్వరలో ఖరారు చేయబోతున్నారు. -
టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల
కేయూ క్యాంపస్: ఈ విద్యాసంవత్సరం (2023–2024) ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకుగాను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్.లింబాద్రి టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మంగళవారం వరంగల్ కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల సెమినార్ హాల్లో టీఎస్ ఐసెట్ చైర్మన్ తాటికొండ రమేశ్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. అపరాధ రుసుము లేకుండా మార్చి 6 నుంచి మే 6వ వరకు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు, దివ్యాంగ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.550, ఇతరులకు రూ.750 చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. రూ.250 అపరాధ రుసుముతో మే 12 వరకు, రూ.500తో మే 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. హాల్‌టికెట్లను మే 22 నుంచి సంబంధిత వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రవేశ పరీక్ష ఇలా... టీఎస్ ఐసెట్ ప్రవేశపరీక్షను మే 26, 27 తేదీల్లో నాలుగు సెషన్లలో నిర్వహిస్తారు. ►26న మొదటి సెషన్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12–30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2–30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మూడో సెషన్ మే 27న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12–30 గంటల వరకు, నాలుగో సెషన్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. ►14 ప్రాంతీయ కేంద్రాలు, సుమారు 75 పరీక్షకేంద్రాలను కూడా గుర్తించారు. ►ప్రాథమిక కీని జూన్ 5న విడుదల చేస్తారు. ►ప్రాథమిక కీపైన అభ్యంతరాలు ఉంటే జూన్ 8వ తేదీ వరకు తెలియజేయాల్సింటుంది. ►ఫలితాలు జూన్ 20న విడుదల చేస్తారు. 25 శాతం అర్హత మార్కులు టీఎస్ ఐసెట్‌లో ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు కనీస అర్హత మార్కులు లేవని, మిగతా కేటగిరీలవారికి అర్హత మార్కులు 25%గా నిర్ణయించినట్లు లింబాద్రి తెలిపారు. సిలబస్, మోడల్ పేపర్, సూచనలు, ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ విధాన, ఆన్లైన్ పరీక్ష, పరీక్ష కేంద్రాల జాబితా, మాక్ టెస్టుల సమాచారం జ్టి్టpట//జీఛ్ఛ్టి.్టటజ్ఛి.్చఛి.జీn లో అందుబాటులో ఉన్నట్లు టీఎస్ ఐసెట్ కన్వీనర్ పి.వరలక్ష్మి తెలిపారు. -
పీజీ సెట్ షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ పీజీఈ సెట్–2023 షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి శుక్రవారం విడుదల చేశారు. జేఎన్టీయూహెచ్ ఈ పరీక్షను నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. హైదరాబాద్, వరంగల్‌లో పరీక్ష కోసం ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేశామన్నారు. రూ.1,100 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలు రూ.600)తో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాల కోసం https:// pgecet.tsche.ac.in వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వాలని ఆయన సూచించారు. -
బీటెక్‌లోకి అనుమతించండి
సాక్షి, హైదరాబాద్: రెండేళ్లపాటు కరోనా కారణంగా పీయూసీలో తక్కువ జీపీఏ వచ్చినందున.. మానవతా దృక్పథంతో బీటెక్‌లోకి అనుమతించాలని బాసర ట్రిపుల్ ఐటీలో చదివిన పలువురు విద్యార్థులు విద్యా మంత్రి సబిత ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రిని కలిసి వేడుకున్నారు. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చా మని తమ పరిస్థితిని వివరించారు. టెన్త్‌లో అత్య« దిక మార్కులు వస్తేనే బాసర ట్రిపుల్ ఐటీలో సీటు వస్తుందని ప్రభుత్వానికీ తెలుసునని వారు స్పష్టం చేశారు. పీయూసీలో గ్రేడ్ తక్కువ రావడానికి రెండేళ్లుగా ఉన్న పరిస్థి తులే కారణమని గుర్తించకపోవడం సరికాదని పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా ఆన్లైన్ క్లాసులు నిర్వహించారని, తమ కుటుంబాల్లో సెల్‌ఫోన్ కూడా కొనలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి స్మార్ట్ ఫోన్లు కొనిచ్చినా నెట్ బ్యాలెన్స్‌కు ఖర్చు పెట్టలేకపోయామని వారు తెలిపారు. నెట్వర్క్ సరిగ్గా పనిచేయని పల్లెల్లో ఉండటం వల్ల ఆన్లైన్ క్లాసులు సరిగా వినలేకపోయామనినిజామాబాద్‌కు చెందిన విద్యార్థిని ఎం.అంజలి వాపోయింది. విద్యార్థుల ఆవేదనపై ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫె సర్ ఆర్.లింబాద్రి స్పందిస్తూ వెంటనే విషయాన్ని బాసర అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విద్యా ర్థులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.ఈ విషయమై బాసర ట్రిపుల్ ఐటీ వీసీ ప్రొఫెసర్ వి.వెంకట రమణ స్పంది స్తూ, 6 జీపీఏ లేకుండా ఇంజనీరింగ్‌లోకి అనుమ తించకూడదనే నిబంధన ఉందని స్పష్టం చేశా రు. అయినప్పటికీ ఈ విషయాన్ని బోర్డ్ సమా వేశంలో చర్చిస్తామని, సానుకూల నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. -
ఉన్నత విద్యాసంస్థల్లో అసాంఘిక చర్యలపై ఉక్కుపాదం
సాక్షి, హైదరాబాద్: సరికొత్త చట్టాలు, అధునాతన సాంకేతికత సహాయంతో ఉన్నత విద్యాసంస్థల్లో అసాంఘిక చర్యలపై ఉక్కుపాదం మోపాలని ఉన్న త విద్యా, పోలీసుశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీనికిగాను ప్రస్తుత చట్టాలను మరింత కఠినతరం చేయాలని అభిప్రాయపడ్డారు. ఉన్నత విద్యామండలి నేతృత్వంలో గురువారం ఇక్కడ ‘విద్యాసంస్థల్లో భద్రతాచర్యలు, రక్షణ విధానం’అనే అంశంపై విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. యూనివర్సిటీలు, కాలేజీల్లో మాదవద్రవ్యాలు, సైబర్ నేరాలు, వివక్ష, వేధింపుల నియంత్రణ సవాల్‌గా మారిందని పోలీసు అధికారులు చెప్పినట్లు తెలిసింది. విద్యాసంస్థల్లోకి పోలీసుల ప్రవేశాన్ని అడ్డుకునే చట్టాలను మార్చాలని, స్వేచ్ఛగా ప్రవేశించి, ఏ కేసునైనా శోధించే వీలు కల్పించాలని, నిఘా వ్యవస్థ కోసం పటిష్టమైన చర్యలకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని పోలీ సు అధికారులు అభిప్రాయపడ్డారు. సీసీ కెమెరా లు, కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని పలువురు సూచించగా వీటన్నింటికీ నిధుల సమ స్య ఉందని విద్యాశాఖ ఉన్నతాధికారులు చెప్పినట్లు తెలిసింది. అంతిమంగా పోలీసు, విద్యాశాఖ కలిసి పనిచేయాలని, ఈ దిశగా కొన్ని మార్గదర్శకాలు విడుదల చేయాలని నిర్ణయించారు. సమావేశంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ, కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిత్తల్, మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, వైస్ చైర్మన్ వి.వెంకటరమణ, డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు సీవీ ఆనంద్, మహేశ్ భగవత్, స్వాతి లక్రా, సుమతి తదితరులు పాల్గొన్నారు. భద్రత ముఖ్యమే: లింబాద్రి సమావేశం అనంతరం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.లింబాద్రి మీడియాతో మాట్లాడారు. నాణ్యమైన విద్యను అందించేందుకు విద్యాసంస్థల్లో భద్రత కీలకమైన అంశమని, దీని కోసం పోలీసు లు, విద్యాశాఖ సమన్వయంతో ముందుకువెళ్లాలని నిర్ణయించామని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ విద్యార్థులుండే వర్సిటీ క్యాంపస్‌ల్లో డ్రగ్స్, సైబర్ నేరాలను అరికట్టడం వంటి విషయాలపై అవగాహనకు సరికొత్త విధానాలు అనుసరించాలని నిర్ణయించినట్టు చెప్పారు. కొత్తగా కాలేజీల్లోకి అడుగుపెట్టే వారిలో న్యూనతాభావం తొలగించేందుకు, ఒత్తిడికి లోనవ్వకుండా కౌన్సెలింగ్ కేంద్రాల ఏర్పాటు అవసరంపై చర్చించనట్టు తెలిపారు. ఇందుకు సంబంధించి త్వరలో మార్గదర్శకాలు వెలువడే వీలుందని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల బారి నుంచి కాపాడే క్రమంలో వాటిని వినియోగించే విద్యార్థులను నేరస్తులుగా చూడబోమన్నారు. గవర్నర్ ఆమోదించగానే ఖాళీల భర్తీ: మంత్రి సబిత సాక్షి, రంగారెడ్డి జిల్లా: అసెంబ్లీ ఆమోదం పొంది, గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న విద్యాశాఖ బిల్లులపై అనుమానాలను నివృత్తి చేశానని విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి స్పష్టం చేశారు. ఆమె గురువారం బషీర్‌బాగ్‌లోని తన క్యాంపు కార్యాలయంలో పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. కొంత కాలంగా గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులకు ఆమోదం లభించిన వెంటనే వర్సిటీల్లోని ఖాళీ లను భర్తీ చేస్తామని చెప్పారు. బిల్లులను గవర్నర్ ఎందుకు ఆమోదించడం లేదో తనకు తెలియ ద ని పేర్కొన్నారు. కరోనా కాలంలో తెలంగాణ లోనే ఉన్న చంద్రబాబు ఒక్కసారైనా ఇక్కడి ప్రజలను కలిసే ప్రయత్నం చేయలేదని ఆమె వి మర్శించారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ ప్రజలపై మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. -
విద్యార్థుల భద్రతపై సమావేశం
సాక్షి, హైదరాబాద్: విద్యాసంస్థల్లో విద్యార్థులకు భద్రత, రక్షణ వ్యవస్థ ఏర్పా టుపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహిస్తున్నట్టు మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా జరిగే ఈ కార్యక్రమంలో డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిత్తల్, అదనపు డీజీ స్వాతిలక్రా సహా రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఉప కులపతులు పాల్గొంటారని ఆయ న తెలిపారు. కళాశాలల్లో చేరే విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవ్వకుండా, సైబర్ నేరాలకు ఆకర్షితులవ్వకుండా, వివిధ కారణాల వల్ల ఆత్మన్యూనత భావానికి లోనవ్వకుండా ఏ తరహా జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారని తెలిపారు. -
విద్యార్థులకేం కావాలి..?
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలోకి ప్రవేశించే విద్యార్థులు ఏం ఆశిస్తున్నారనే అంశంపై లోతుగా అధ్యయనం చేపట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి అభిప్రాయపడింది. విద్యార్థులకేం కావాలి.? వాళ్లు ఏం కోరుకుంటున్నారు.. అనే ప్రాతిపదికన పరీక్షల విధానం, వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు మూల్యాంకన విధానం రూపొందించే దిశగా ముందుకెళుతోంది. ఉన్నత విద్యామండలి, కమిషనర్ ఆఫ్ కాలేజీ ఎడ్యుకేషన్ సంయుక్తంగా ఉన్నత విద్య పరీక్షల విధానంలో తీసుకురావాల్సిన మార్పులపై అధ్యయనానికి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) తోడ్పాటు తీసుకోనున్నాయి. ఇందుకోసం ఐఎస్బీతో ప్రత్యేక అధ్యయనం చేయిస్తున్నట్టు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఇక్కడ కీలక భేటీ జరిగింది. సమావేశంలో పలు విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్లు, ఏడు డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. పరీక్షలు, మూల్యాంకన విధానంలో తీసుకురావాల్సిన మార్పులపై చర్చించారు. ఉన్నత విద్య పూర్తి చేసిన విద్యార్థులకు మార్కెట్లో ఉన్న అవకాశాలు, పారిశ్రామిక రంగం కోరుకునే అర్హతలపై ఐఎస్బీ విశ్లేషణకు ఈ డేటాను వాడుకోనుంది. మార్పు అనివార్యం: నవీన్ మిత్తల్ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మూల్యాంకన విధానంలో మార్పులు అవసరమని, దీనికి ప్రత్యేక అధ్యయనం చేయాలని కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిత్తల్ అభిప్రాయపడ్డారు. ఈ ఉద్దేశంతోనే ఐఎస్బీతో క్షేత్రస్థాయి అధ్యయనం చేపట్టినట్టు తెలిపారు. దీనివల్ల ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు. ఉపాధి, ఎంటర్ ప్రెన్యూర్, సాధికారతకు మూల్యాంకన, విద్యా బోధనలో మార్పులు చేసేందుకు ఐఎస్బీ అధ్యయనం కీలకం కానుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి అన్నారు. ఐఎస్బీ అధ్యయనం తర్వాత ఉపాధి అవసరాలకు తగ్గట్టుగా బోధన ప్రణాళికల్లో మార్పు వచ్చే వీలుందన్నారు. తాము చేపట్టబోయే అధ్యయనం గురించి ఐఎస్బీ ప్రతినిధి ప్రొఫెసర్ చంద్రశేఖర్ శ్రీపాద ఈ సందర్భంగా వివరించారు. కార్యక్రమంలో మండలి వైస్–చైర్మన్ ప్రొఫెసర్ వి. వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు. -
ఆధునిక కోర్సుల్లో చేరాలి
నర్సాపూర్ : ఇంజనీరింగ్ విద్యార్థులు సాంప్రదాయ కోర్సులతోపాటు ఆధునిక కోర్సులను చదవాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్, ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.లింబాద్రి అన్నారు. ఆదివారం నర్సాపూర్‌లోని బీవీ రాజు ఇంజినీరింగ్ కాలేజీలో 8వ స్నాతకోత్సవం ఏర్పాటు చేయగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సాంప్రదాయ కోర్సులైన మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్‌లతో పాటు పాటు ఫార్మా రంగాలకు మంచి భవిష్యత్ ఉందని, నూతన కంప్యూటర్ కోర్సులను చదవాలన్నారు. విద్యార్థులకు మంచి విద్యతోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న విద్యా సంస్థల్లో బీవీఆర్ఐటీ ఒకటని ఆయన కాలేజీ యాజమాన్యాన్ని అభినందించారు. స్నాతకోత్సవంలో పాల్గొన్నందుకు తనకు సంతోషంగా ఉందని వివరిస్తూ విద్యార్థులు మంచి నడవడికతో దేశానికి, సమాజానికి సేవా భావం కల్గి ఉండాలని, నిజాయితీగా ఉండాలని హితవు పలికారు. ఆయా కోర్సుల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఆయన మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో శ్రీ విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ వైస్ చైర్మన్ రవిచంద్రన్ రాజగోపాల్, కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మిప్రసాద్, కాలేజీలోని పలు బ్రాంచ్‌ల హెచ్ఓడీలు, కాలేజీ డీజీఎం కాంతారావు, ఏఓలు బాపిరాజు, అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్నాతకోత్సవంలో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి పాల్గొన్నారు. సర్టిఫికెట్లు పొందిన విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బందితో కలిసి ఆనందం వ్యక్తం చేశారు. -
డిగ్రీలో ద్వితీయ భాషగా ఫ్రెంచ్
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది నుంచి డిగ్రీలో ద్వితీయ భాషగా ఫ్రెంచ్ను ప్రవేశపెడుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు ఇచ్చింది. ప్రభుత్వ పరిధిలోని అన్ని రెసిడెన్షియల్ కాలేజీల్లో దీన్ని ముందుగా అందుబాటులోకి తెస్తున్నారు. ఇతర ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు ఆసక్తి చూపిస్తే వాటిలోనూ అనుమతిస్తామని అధికారులు తెలిపారు. ఫ్రాన్స్‌కు చెందిన ఫ్రాంచైజ్ అలయెన్స్ ఆర్గనైజేషన్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి సంయుక్తంగా ఫ్రెంచ్ భాషను తీసుకురావడంపై కొన్నాళ్లు కసరత్తు చేశాయి. ఉస్మానియా యూనివర్సిటీ పాఠ్యప్రణాళిక రూపకల్పనలో కీలకపాత్ర పోషించింది. ఫ్రాన్స్ విదేశీ మంత్రిత్వశాఖతో కలిసి రాష్ట్రంలో అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఓయూ పరిధిలోని కాలేజీల్లో ఈ ఏడాది ప్రయోగాత్మకంగా ఈ కోర్సును ప్రవేశపెట్టి, వచ్చే ఏడాది నుంచి ఇతర విశ్వవిద్యాలయాల పరిధిలోని కాలేజీలకు విస్తరిస్తారు. ఇప్పటివరకూ హిందీ, తెలుగు సహా ఇతర భాషలు డిగ్రీలో ద్వితీయ భాషలుగా ఉన్నాయి. అయితే, ఫ్రెంచ్ భాషను రాష్ట్రంలో డిప్లొమా, ఇతర సర్టిఫికెట్ ప్రోగ్రాములుగా అందించారు. కొన్నేళ్లుగా కొంతమంది ఈ సబ్జెక్టులను నేర్చుకున్నారు. సీనియర్ డిప్లొమా చేసిన వాళ్లు కూడా రాష్ట్రంలో అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు వీళ్లను ఫ్రెంచ్ అధ్యాపకులుగా గుర్తించబోతున్నారు. వీరికి బోధనకు అనుకూలంగా ప్రత్యేక తర్ఫీదు ఇచ్చామని ఓయూ అధికారులు తెలిపారు. ఫ్యాకల్టీ సిద్ధం: చైర్మన్, ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యామండలి ఫ్రెంచ్ భాషను ద్వితీయ భాషగా తెచ్చేందుకు కొన్నేళ్లుగా చేస్తున్న కృషి ఈ ఏడాది కార్యాచరణకు నోచుకుంటోంది. మంచి పాఠ్య ప్రణాళికతోపాటు సుశిక్షితులైన బోధకులను సిద్ధం చేశాం. ఈ భాష నేర్చుకున్న విద్యార్థి మంచి ఉద్యోగాలు పొందే వీలుంది. ఫలితంగా డిగ్రీ కోర్సులు మరింత ఆదరణ పొందుతాయి. ఉపాధి అవకాశాలు ఫ్రెంచ్ భాష నేర్చుకోవడం వల్ల బహుళజాతి సంస్థల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కొన్నేళ్లుగా చూస్తే రాష్ట్రంలో ఈ తరహా భాష మిళితమైన కార్పొరేట్ సంస్థల వ్యాపార లావాదేవీలు పెరిగాయి. సంస్థల ఏర్పాటు విస్తరిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బహుళజాతి కంపెనీల్లో ఫ్రెంచ్, ఇతర విదేశీ భాషలు తెలిసిన వారికి ప్రాధాన్యత లభిస్తోంది. భవిష్యత్‌లో డిగ్రీ స్థాయిలో ఫ్రెంచ్‌తో పాటు జర్మనీ ఇతర కోర్సులు అందుబాటులోకి తెచ్చే వీలుంది. పీజీలోనూ ఈ భాషల ప్రాధాన్యత పెరిగే అవకాశముంది. – ప్రొఫెసర్ డి.రవీందర్, వీసీ, ఉస్మానియా వర్సిటీ -
పీజీఈసెట్‌లో 91.48% ఉత్తీర్ణత
సాక్షి హైదరాబాద్: రాష్ట్రంలో ఎం.టెక్, ఎం.ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పోస్టు గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీజీఈసెట్ 2022)లో 91.48 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఆగస్టు 2 నుంచి 5 వరకు జరిగిన ఈ పరీక్షలకు 12,592 మంది విద్యార్థులు హాజరుకాగా, 11,520 మంది అర్హత సాధించారు. అందులో 6,440 మంది అమ్మాయిలు, 5,080 మంది అబ్బాయిలు ఉన్నారు. శనివారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో చైర్మన్ ఆర్.లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డి.రవీందర్, రిజిస్ట్రార్, పీజీఈసెట్ కన్వీనర్ లక్ష్మీనారాయణ, కో కన్వీనర్ రాజశేఖర్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 19 సబ్జెక్టులకు పీజీఈసెట్ పరీక్ష నిర్వహించినట్లు కన్వీనర్ లక్ష్మీనారాయణ చెప్పారు. ఈ పరీక్ష ద్వారా 115 కోర్సులలో ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు. పీజీఈసెట్‌లో అమ్మాయిల ఉత్తీర్ణత 93 శాతంగా నమోదు కాగా, అబ్బాయిల ఉత్తీర్ణత 89.62 శాతం నమోదైనట్లు పేర్కొన్నారు. ఫార్మసీలో అధికం పీజీఈసెట్‌కు హాజరైన వారిలో ఫార్మసీ విద్యార్థులే అధికంగా ఉన్నారు. ఈ పరీక్షకు మొత్తం 12,592 మంది హాజరుకాగా, అందులో 5,452మంది కేవలం ఫార్మసీ విద్యార్థులే ఉన్నారు. వారిలో 5,186 మంది ఉత్తీర్ణత సాధించారు. ఆ తర్వాత సివిల్ ఇంజనీరింగ్‌కు సంబంధించి 2,027మంది పరీక్షకు హాజరుకాగా, 1,782 మంది అర్హత సాధించారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి 1,279 మంది హాజరుకాగా,1,211 మంది ఉత్తీర్ణత సాధించారు. -
Telangana: ఎంసెట్ వాయిదా
సాక్షి, హైదరాబాద్: తీవ్ర తర్జనభర్జనలు, విద్యార్థి సంఘాల నిరసనల నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో జరగాల్సిన ఎంసెట్‌ను వాయిదా వేశారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి ఈమేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. అయితే 14, 15 తేదీల్లో జరగాల్సిన వ్యవసాయ, మెడికల్ విభాగానికి చెందిన ఎంసెట్ మాత్రమే వాయిదా వేశామని, 18 నుంచి 20వరకూ జరిగే ఇంజనీరింగ్ విభాగం ఎంసెట్ యథావిధిగా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. వాయిదా పడ్డ ఎంసెట్ ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని తెలి పారు. రాబోయే మూడు రోజులూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ఐటీ కన్సల్టెన్సీ సంస్థ నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోనికి తీసుకున్న మండలి వర్గాలు కూడా వర్షాలున్నా ఎంసెట్‌ను నిర్వహించి తీరుతామని తొలుత స్పష్టం చేశాయి. విద్యార్థి సంఘాల నుంచి ఒత్తిడి రావడంతో ఎంసెట్‌ను వాయిదా వేయడానికి ప్రభుత్వం అంగీకరించక తప్పలేదు. 16 వరకు ఓయూ పరీక్షలు వాయిదా: ఓయూ పరిధిలో ఈనెల 16 వరకు అన్ని పరీక్షలను వాయిదా వేసిన్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ బుధవారం తెలిపారు. ప్రధాన కార్యాలయాలు యథావిధిగా కొనసాగుతాయని సపోర్టింగ్ స్టాఫ్ విధులకు హాజరుకావాలన్నారు. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ పరీక్షలు వాయిదా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఈనెల 14, 15 తేదీల్లో జరగాల్సిన పీజీ రెండో సంవత్సరం పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పరాంకుశం వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు. వాయిదా పడ్డ పరీక్షలను నిర్వహించే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. -
ఎటూ తేలని ఎంసెట్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 13న జరగాల్సిన ఈసెట్ పరీక్షను వాయిదా వేస్తున్నామని, ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. అయితే 14న జరగాల్సిన ఎంసెట్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న వర్ష బీభత్స పరిస్థితులపై ఉన్నతస్థాయి సమీక్ష జరిపామని చెప్పారు. వర్షాలు తగ్గని పక్షంలో ఎంసెట్ కూడా వాయిదా తప్పదని, దీనిపై మంగళవారం వరకూ వేచి చూస్తామని అన్నారు. అయితే దీనిపై బుధవారం నిర్ణయిద్దామని ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) ఉన్నత విద్యామండలికి తెలిపినట్లు సమాచారం. ఈ నెల 14, 15 తేదీల్లో ఎంసెట్ మెడికల్, అగ్రికల్చర్ విభాగం పరీక్ష జరగాల్సి ఉంది. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎంసెట్ మెడికల్ విభాగం ప్రవేశ పరీక్షనైనా వాయిదా వేస్తే మంచిదని ఉన్నత విద్యా మండలి భావించింది. ఇదే విషయమై సోమవారం ఉన్నతాధికారులు చర్చించారు. అయితే, ఎంసెట్ విభాగానికి ఐటీ కన్సల్టెన్సీ సేవలు అందిస్తున్న సంస్థ వాయిదాపై సాంకేతిక పరమైన కారణాలు లేవనెత్తింది. తాము జాతీయ స్థాయి పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఎంసెట్ తేదీలను ఖరారు చేశామని, ఇప్పుడీ పరీక్ష వాయిదా వేస్తే, మళ్లీ తేదీలను సెట్ చేయడం కష్టమని తెలిపింది. ఈ నేపథ్యంలో మండలి ఉన్నతాధికారులు తర్జనభర్జనలో పడ్డారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో వర్షాలు ఇలాగే ఎడతెరిపి లేకుండా ఉంటే, ఎంసెట్ నిర్వహణ కష్టమేనని ప్రభుత్వ వర్గాలూ భావిస్తున్నాయి. శిథిలావస్థలో ఉన్న భవనాల్లో పరీక్షలు నిర్వహిస్తే, వానల కారణంగా అనుకోని ఘటనలు జరిగితే ప్రభుత్వం విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడినట్టు తెలిసింది. కన్సల్టెన్సీ సంస్థ మాటలు నమ్మి ఈ పరిస్థితుల్లో ఎంసెట్ నిర్వహించడం సరికాదని ఆయన కరాఖండిగా చెప్పినట్టు తెలిసింది. అయితే, వర్షాలు ఇదే స్థాయిలో ఉంటే బుధవారం ఎంసెట్ పరీక్షపైనా నిర్ణయం తీసుకుందామని మండలి అధికారులకు సీఎంవో తెలిపినట్టు సమాచారం. -
జూలై 20న ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీజీఈటీ–2022) నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి సోమవారం విడుదల చేశారు. జూలై 20న ఈ పరీక్ష ఉస్మానియా వర్సిటీ పర్యవేక్షణలో జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా ఎలాంటి అపరాధ రుసుము లేకుండా జూలై 7వ తేదీ వరకూ దరఖాస్తు చేసు కోవచ్చు. ప్రవేశ పరీక్ష కంప్యూటర్ ఆధారితంగానే ఉంటుంది. ప్రవేశ పరీక్షలో ర్యాంకును బట్టి ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, కొత్తగా ఏర్పడబో తున్న తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, జేఎన్ టీయూహెచ్ పరిధిలోని 320 కాలేజీల్లో ప్రవేశాలు పొందవచ్చు. మొత్తం 50 కోర్సుల్లో 112 విభాగాలకు విద్యార్థులు ఒకే ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు పొందే వీలుంది. పరీక్ష ఫీజును ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.800, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.600గా నిర్ణయించారు. అదనపు సబ్జెక్టులకు ఒక్కో దానికి రూ.450 చెల్లించాలి. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో లింబాద్రితో పాటు ఓయూ ఇన్చార్జి వీసీ సీతారామారావు, రిజి స్ట్రార్ పి. లక్ష్మీనారాయణ, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ వి. వెంకటరమణ, సెక్రటరీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లింబాద్రి సెట్ వివరాలు వెల్లడించారు. డిగ్రీ ఏదైనా పీజీలో నచ్చిన కోర్సు.. ►రాష్ట్రవ్యాప్తంగా 44,604 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. గత ఏడాది ఇంతే సంఖ్యలో సీట్లున్నా, చేరిన వారి సంఖ్య 22,812 మాత్రమే. వీరిలోనూ 16,163 (71%) మహిళలు, 6,649 (29%) పురుషులు చేశారు. ►ఈసారి పీజీ కోర్సుల ప్రవేశాల ప్రక్రియలో గుణాత్మక మార్పులు తెచ్చారు. డిగ్రీలో ఏ సబ్జెక్టు చేసినా, పీజీలో ఇష్టమొచ్చిన సామాజిక కోర్సుల్లో చేరేందుకు వీలు కల్పిస్తున్నారు. ఆఖరుకు ఎంబీబీఎస్, బీటెక్ విద్యార్థులు కూడా ఎంఏ, ఎంకామ్ వంటి కోర్సుల్లో చేరే వీలుంది. ఎంఏ తెలుగు, ఇంగ్లిష్ కోర్సులకు ఏ గ్రూపుతో డిగ్రీ చేసినా అర్హులే. ►నేషనల్ ఇంటిగ్రేషన్ కోటాను 5% నుంచి 20%కి పెంచారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులు చేరేందుకు ముందుకొస్తే సూపర్ న్యూమరరీ పోస్టులు క్రియేట్ చేస్తారు. ఆన్లైన్, డిస్టెన్స్మోడ్లోనూ వర్సిటీ నుంచి పీజీ కోర్సులు చేసే అవకాశం కల్పిస్తున్నారు. ►పీజీ సెట్ రాయాలనుకునే వారు తాజాగా తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని జతచేయాలి. కుల ధ్రువీకరణ, ఇతర సర్టిఫికెట్లను ఆన్లైన్లో పొందుపర్చాలి. మిగిలిపోతున్న సీట్లు.. ప్రతీ ఏటా సీట్లు మిగిలిపోతున్నాయి. కొన్ని సబ్జెక్టుల్లో మరీ తక్కువ ప్రవేశాలుంటున్నాయి. గతేడాది గజ్వేల్ కాలేజీలో పీజీ కెమిస్ట్రీలో ఐదుగురే చేరారు. వాళ్లను వేరే కాలేజీలకు పంపాల్సి వచ్చింది. దీనిపై ఉన్నత విద్యా మండలి సరైన విధానం అనుసరించాలి. ఈ ఏడాది కూడా 44 వేల సీట్లున్నాయి. కొత్త కోర్సులకు అనుమతిస్తే మరో వెయ్యి సీట్లు పెరిగే వీలుంది. – ప్రొఫెసర్ ఐ. పాండురంగారెడ్డి (సీపీజీఈటీ–2022 కన్వీనర్) -
ఇక ఎంసెట్ ద్వారా నర్సింగ్ కోర్సులో ప్రవేశం
సాక్షి, హైదరాబాద్: ఇక నుంచి ఎంసెట్ ర్యాంకు ఆధారంగానే బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశం ఉంటుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా వెలువడినట్టు చెప్పారు. ఈ విధానం 2022–23 విద్యా సంవత్సరం నుంచే అమలులోకి వస్తుందని వెల్లడించారు. మండలి కార్యాలయంలో లింబాద్రి మంగళవారం మీడియాతో ముచ్చటించారు. నర్సింగ్ కోర్సులో ప్రవేశానికి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్)తో పనిలేదని పేర్కొంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం మార్గద ర్శకాలు విడుదల చేసిందని, రాష్ట్రాల ఇష్టానుసారం వివిధ పరీక్షల ద్వారా ప్రవేశాలు చేపట్టవచ్చని స్పష్టం చేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్ ర్యాంకుల ద్వారా ఆయా సీట్లు భర్తీ చేయాలని నిర్ణయించిందన్నారు. నాలుగేళ్ల నర్సింగ్ కోర్సులో ఇప్పటివరకు ఇంటర్ (బైపీసీ) మార్కులను బట్టి ప్రవేశం కల్పించేవారని చైర్మన్ వివరించారు. మే 28 వరకు దరఖాస్తులకు అవకాశం ఉన్నత విద్యా మండలి ఇప్పటికే ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 28 వరకూ ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఎంపీసీ విద్యార్థులు ఇంజనీరింగ్ విభాగానికి, బైపీసీ చేసిన వారు అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి ఎంసెట్ రాయాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. బైపీసీ విద్యార్థులు అందరికీ ఒకే పరీక్ష ఉంటుందని, ర్యాంకులు ప్రకటించిన తర్వాత వారు నర్సింగ్ కోర్సును ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని లింబాద్రి తెలిపారు. ఎంసెట్ దరఖాస్తు గడువు మే 28 వరకూ ఉన్నందున ఇందుకోసం ప్రత్యేకంగా గడువు పొడిగించాల్సిన అవసరం లేదని చెప్పారు. ర్యాంకులు ప్రకటించిన తర్వాత సంబంధిత కాలేజీలు ప్రవేశ ప్రక్రియ మొదలు పెడతాయని వివరించారు. నర్సింగ్‌లో 5,300 సీట్లు రాష్ట్రవ్యాప్తంగా 81 నర్సింగ్ కాలేజీలున్నాయి. ఇందులో ప్రభుత్వ కాలేజీలు 9 అయితే, 81 ప్రైవేటు కాలేజీలున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో 680 సీట్లు, ప్రైవేటు కాలేజీల్లో 4,620 సీట్లు కలిపి మొత్తం 5,300 ఉన్నాయని మండలి ప్రకటించింది. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో 70 శాతం సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. నర్సింగ్ కోర్సుల్లో మాత్రం ప్రైవేటు కాలేజీల్లోని సీట్లలో 60 శాతం కన్వీనర్, 40 శాతం మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ చేస్తారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోటా, ఇతర రిజర్వేషన్లన్నీ నిబంధనల ప్రకారమే అమలు చేస్తామని, దీనికి సంబంధించిన నియమ నిబంధనలను పరిశీలిస్తున్నామని లింబాద్రి తెలిపారు. -
ఇక పరీక్షలన్నీ సకాలంలోనే..
సాక్షి, హైదరాబాద్: కేంద్ర విద్యాసంస్థల్లో ప్రవేశం పొందేందుకు రాష్ట్ర విద్యార్థులకు ఇబ్బంది లేకుండా సకాలంలో పరీక్షలు పూర్తి చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. అలాగే రాష్ట్ర యూనివర్సిటీల్లో జాతీయ, అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశాన్ని పెంచే చర్యలు చేపట్టనుంది. ఆరు యూనివర్సిటీల ఉపకులపతులతో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి శనివారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చర్చించిన అంశాలను ఆయన మీడియాకు వెల్లడించారు. కేంద్ర విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన కౌన్సెలింగ్ ఆగస్టులోనే నిర్వహిస్తుండగా ఇందులో సీటు పొందాలనుకొనే విద్యార్థులకు రాష్ట్రంలో సకాలంలో తుది సెమిస్టర్ పూర్తికాక అవకాశం కోల్పోతున్నారని చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని జూన్ చివరి నాటికే డిగ్రీ కోర్సుల తుది సెమిస్టర్ పరీక్షలు పూర్తి చేయాలని తీర్మానించామన్నారు. ఇందుకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలిపారు. మేలో పీజీ నోటిఫికేషన్.. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని, ఈ బాధ్యతను ఓయూ తీసుకోవాలని సమావేశం తీర్మానించింది. పీజీ సెట్‌కు మేలో నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్టులో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. అన్ని విశ్వవిద్యాలయాలతో ఉన్నత విద్యామండలి సమన్వయం చేసుకుంటుందని ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. అఖిల భారత సర్వే కోసం అవసరమైన డేటాను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేయాలని వీసీలకు సూచించారు. ‘న్యాక్’ స్పీడ్ పెంచాలి.. రాష్ట్రంలో ఎక్కువ విద్యాసంస్థలు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకొనేలా ప్రోత్సహించాలని, దీని కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని వీసీల సమావేశంలో నిర్ణయించారు. అలాగే గుర్తింపు కాలపరిమితి తీరిన కాలేజీలను తిరిగి దరఖాస్తు చేయించడం, గుర్తింపు ఉన్న కాలేజీల స్థాయి పెంపునకు చర్యలు చేపట్టాలని తీర్మానించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వి. వెంకటరమణ, వర్సిటీల వీసీలు రవీందర్, రవీంద్రగుప్తా, గోపాల్‌రెడ్డి, రమేశ్, రాథోడ్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
6 నుంచి లాసెట్ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: మూడు, ఐదేళ్లు, పోస్టు గ్రాడ్యుయేట్ లా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే లాసెట్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి శుక్రవారం ప్రకటించారు. ఈ నెల 6 నుంచి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లు పంపవచ్చని చెప్పారు. పరీక్ష ఫీజును ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.500, మిగతావారికి రూ.800గా నిర్ణయించారు. పీజీ లాసెట్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.800, మిగతావారికి రూ.1,000 ఉంటుంది. ఈ కార్యక్రమంలో మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వి.వెంకటరమణ, ఉస్మానియా వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్, లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ జీబీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జూలై అంతా ‘సెట్’
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం (2022–23)లో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి ప్రకటించారు. లాసెట్, ఐసెట్, ఎడ్‌సెట్ తదితర పరీక్షలను జూలైలోనే నిర్వహించనున్నట్టు తెలిపారు. అయితే ఇతర పరీక్షలు రాయాల్సి వస్తే ఆయా సెట్ల తేదీల్లో మార్పులు ఉంటాయని చెప్పారు. మండలి కార్యాలయంలో మంగళవారం వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వి.వెంకటరమణ, కార్యదర్శి డాక్టర్ ఎస్.శ్రీనివాస్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కోవిడ్‌తో చోటుచేసుకున్న ఆర్థిక నష్టాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఏ ప్రవేశ పరీక్షకూ ఫీజులు పెంచడం లేదని స్పష్టం చేశారు. గతంలో ఉన్న ఫీజులే వర్తిస్తాయని చెప్పారు. ఎంసెట్ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైందని, లాసెట్, ఎడ్‌సెట్, ఐసెట్, పీజీఈ సెట్ల నోటిఫికేషన్లు వీలైనంత త్వరగా విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. సెట్లకు దరఖాస్తు చేసుకోవడానికి కావల్సిన విద్యార్హతలు, ఇతర వివరాలు నోటిఫికేషన్లో వెల్లడిస్తామన్నారు. అన్ని పరీక్షలను ఆన్లైన్ పద్ధతిలోనే నిర్వహిస్తామని తెలిపారు. ఐసెట్ నిర్వహణ బాధ్యతను కాకతీయ వర్సిటీకి, ఇతర సెట్ల బాధ్యతను ఉస్మానియా వర్సిటీకి అప్పగించామని చెప్పారు. కాగా జూలై 13న ఈసెట్, జూలై 14 నుంచి 20 మధ్య ఎంసెట్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. -
ఉన్నత విద్యామండలి కృషి భేష్
సాక్షి, హైదరాబాద్: బ్రిటిష్ కౌన్సిల్ దక్షిణ భారత విభాగంతో కలిసి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన బోధన ప్రణాళికను రూపొందించే ప్రయత్నంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి అనూహ్య పురోగతి సాధిస్తోందని బ్రిటిష్ కౌన్సిల్ సౌత్ ఇండియా డైరెక్టర్ జనక పుష్పనాథన్∙ప్రశంసించారు. ఉన్నత విద్యలో లోతైన విషయ పరిజ్ఞానం, ప్రపంచ స్థాయి నైపుణ్యాలు అందించి, ఉపాధి అవకాశాలు పెంచేలా డిగ్రీ పాఠ్య ప్రణాళికను రూపొందించాలని ఉన్నత విద్యా మండలి భావించింది. ఈ ప్రక్రియలో భాగంగా 2018లో బ్రిటిష్ కౌన్సిల్, టీఎస్ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. ఆ తర్వాత యూకేకి చెందిన బంగోర్, అబ్యరిస్విత్ యూనివర్సిటీలు– తెలంగాణలోని ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల మధ్య 2020 మార్చిలో విద్యా ప్రాజెక్టుల రూపకల్పనపై ఎంవోయు జరిగింది. దీని పురోగతిపై మంగళవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ చైర్మన్ వెంకటరమణ, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్, కాకతీయ వర్సిటీ వీసీ టి.రమేశ్ నేతృత్వంలో సమావేశం జరిగింది. బ్రిటిష్ కౌన్సిల్ దక్షిణాది డైరెక్టర్ జనక పుష్పనాథన్, ఉన్నత విద్య డైరెక్టర్ సోను ఈ సమావేశంలో పాల్గొన్నారు. భాగస్వామ్య విశ్వవిద్యాలయాల సహకారంతో జూన్ 2023 నాటికి ఆశించిన కొత్త విద్యా ప్రణాళికను రూపొందించాలని సమావేశంలో నిర్ణయించారు.