mallanna sagar project
-
కాళేశ్వరం తెలంగాణ రైతుకు వెయ్యి ఏనుగుల బలం: హరీశ్
దుబ్బాక: కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతుకు వెయ్యి ఏనుగుల బలమని, మేడిగడ్డ కొట్టుకుపోయిందని, కాళేశ్వరంలో లక్ష కోట్లు గంగపాలయ్యాయని చిల్లర రాజకీయా లు చేసిన కాంగ్రెస్..ఇవాళ సిగ్గుతో తలదించుకోవాలని మాజీమంత్రి టి.హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్ ప్రాజెక్టులోకి రికార్డు స్థాయిలో 21 టీఎంసీల నీరు చేరడంతో ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, సునీతారెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలసి శుక్రవారం హరీశ్‌రావు సందర్శించి పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయి ఉంటే ఈ రోజు మల్లన్నసాగర్‌లోకి ఇంత నీరు ఎక్కడి నుంచి వచి్చందో కాంగ్రెస్ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎల్లంపల్లి నుంచి లక్ష్మీబరాజ్, అన్నపూర్ణ బ్యారేజ్ నుంచి రంగనాయకసాగర్, అక్కడి నుంచి మల్లన్నసాగర్.. ఇక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్ దాక గోదావరి జలాలు ప్రవహిస్తున్నాయంటే అది కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండటం వల్లనే సాధ్యమైందని చెప్పారు. మల్లన్నసాగర్ వద్ద ఉద్రిక్తత మల్లన్నసాగర్‌ను సందర్శనకు హరీశ్‌రావు తదితరులు వస్తున్నారని తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. కాంగ్రెస్ నాయకుల ను బలవంతంగా అక్కడి నుంచి పోలీసులు పంపించారు. మధ్యాహ్నం భారీ కాన్వాయ్, వందలాది మంది బీఆర్ఎస్ శ్రేణులతో హరీశ్‌రావు అక్కడికి చేరుకున్నారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు మల్లన్నసాగర్ పరిసరాలు అంతా పోలీస్ నిఘా నీడలోనే కనిపించాయి. -
మల్లన్న సు‘జలం’ సిద్ధం.. 6.57 లక్షల గృహాలకు తాగునీరు
సాక్షి, సిద్దిపేట: కొమురవెల్లి మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను శుద్ధిచేసి ఆరు జిల్లాల్లోని 1,922 ఆవాసాలు, 16 మున్సిపాలిటీలలో 6.57లక్షల గృహాలకు తాగునీటిని అందించే బృహత్తర పథకం అమలుకు రంగం సిద్ధమవుతోంది. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం మంగోల్ వద్ద రూ.1,212 కోట్ల వ్యయంతో 540 ఎంఎల్డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ (డబ్ల్యూటీపీ) నిర్మాణ పనులు పూర్తి కావొచ్చాయి. 270 ఎంఎల్డీ చొప్పున రెండు ప్లాంట్లను నిర్మించగా, ఒక ప్లాంట్ పూర్తికావడంతో సోమవారం ట్రయల్ రన్ నిర్వహించారు. మరో 270ఎంఎల్డీ డబ్ల్యూటీపీ పనులు ఆగస్టులో పూర్తికానున్నాయి. మల్లన్నసాగర్ నుంచి 7.26టీఎంసీల నీరు.. కొమురవెల్లి మల్లన్నసాగర్‌ను 50టీఎంసీల నీటి సామర్థ్యం ఉండేలా నిర్మించారు. ఏటా 7.26టీఎంసీల నీటిని తాగునీటిగా వినియోగించాలని నిర్ణయించారు. రా వాటర్‌ను శుద్ధి చేసేందుకు కుకునూరుపల్లి మండలం తిప్పారం వద్ద ఆరు మోటార్ల ద్వారా 5.6 కిలోమీటర్ల పైప్‌లైన్‌తో మంగోల్‌లోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కు చేరుస్తారు. 540 ఎంఎల్డీ (మిలియన్ లీటర్ ఫర్ డే) సామర్థ్యంతో రెండు నీటి శుదీ్ధకరణ ప్లాంట్లు ఒక్కోటి 270 ఎంఎల్డీ చొప్పున నిర్మించారు. మల్లన్నసాగర్ నుంచి వచ్చిన నీళ్లు మంగోల్ వద్ద శుదిŠధ్ చేసి, 3 కిలోమీటర్ల దూరంలోని లకుడారంలో 6 ఎంఎల్(మిలియన్ లీటర్లు) సామర్థ్యం కలిగిన గ్రౌండ్ లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (జీఎల్‌బీఆర్)లోకి పంపిస్తారు. ఇందుకు జీఎల్‌బీఆర్ వద్ద రెండు పాయింట్స్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి కొమురవెల్లి కమాన్ వద్ద ఉన్న ట్యాంక్‌లోకి తరలిస్తారు. అక్కడి నుంచి జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాలకు తాగునీరు అందుతుంది. అక్కారంలోని నాలుగు పాయింట్ల నుంచి.. కొమురవెల్లి కమాన్ నుంచి మరో పాయింట్ ద్వారా 29 కిలోమీటర్ల దూరంలోని సిద్దిపేట నియోజకవర్గానికి నీటిని తరలిస్తారు. లకుడారం నుంచి 16 కిలోమీటర్ల దూరంలోని అక్కారం వద్ద 6ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన సంపులోకి పంపిస్తారు. అక్కారం వద్ద ఏర్పాటు చేసిన నాలుగు పాయింట్లలో.. ఒక పాయింట్ నుంచి 33.6 కిలోమీటర్ల దూరంలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘనపురం గుట్టకు నీటిని పంపింగ్ చేస్తారు. ఈ గుట్ట నుంచి మేడ్చల్, ఆలేరు, భువనగిరికి ప్రస్తుతం ఉన్న పైప్‌లైన్‌తో నీటిని పంపిస్తారు. రెండో పాయింట్‌ను 5.4 కిలోమీటర్ల దూరంలో గజ్వేల్ కోమటిబండ లైన్‌కు కలుపుతారు. ఇక్కడి నుంచి గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలతో పాటు మెదక్ జిల్లాలోని కొన్ని మండలాలకు ఈ జలాలు వెళ్తాయి. మూడో పాయింట్ నుంచి సంగాపూర్ వద్ద నిర్మించిన ఆర్అండ్ఆర్ కాలనీలోని మల్లన్నసాగర్ నిర్వాసితులకు తరలిస్తారు. నాలుగో పాయింట్‌ను భవిష్యత్ అవసరాల దృష్ట్యా మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గానికి పంపింగ్ చేయనున్నారు. 6 జిల్లాలు, 1,922 ఆవాసాలు, 16 మున్సిపాలిటీలకు మొత్తంగా మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలు ఆరు జిల్లాలలో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 1,922 ఆవాసాలు, 16 మున్సిపాలిటీలలోని 6,57,203 గృహాలకు తాగునీటిని అందించనున్నారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 4,81,217 గృహాలకు నీటి సరఫరా కానున్నాయి. సిద్దిపేట, గజ్వేల్, చేర్యాల, మేడ్చల్, దుబ్బాక, ఆలేర్, జనగామ, భువనగిరి, యాదగిరిగుట్ట, తుప్రాన్, మోత్కూర్, పోచంపల్లి, ఘట్కేసర్, దిండిగల్, గుండ్ల పోచంపల్లి, తిరుమలగిరి పట్టణాల్లో 1,75,986 గృహాలకు నీటిని సరఫరా చేస్తారు. జూలై నాటికి సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో 439 ఆవాసాలకు, గజ్వేల్, దుబ్బాక, తుప్రాన్ మున్సిపాలిటీలకు, ఆగస్టు నాటికి మేడ్చల్, యాదాద్రి జిల్లాల్లో 611 ఆవాసాలు, ఘట్కేసర్, మేడ్చల్, దుండిగల్, గుండ్లపోచంపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, ఆలేరు, మోత్కూరు, పోచంపల్లి మున్సిపాలిటీలకు తాగు నీటిని అందించేందుకు ప్రణాళికలు రూపొందించారు. నెల రోజుల్లో సరఫరా డబ్ల్యూటీపీ ట్రయల్ రన్ విజయవంతమైంది. ఈ ప్లాంట్ ద్వారా నెల రోజుల్లో పంపింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఆగస్టు నాటికి 6 జిల్లాలు, 1,922 ఆవాసాలు, 16 మున్సిపాలిటీలకు మల్లన్న సాగర్ నుంచి శుద్ధిచేసిన గోదావరి జలాలను సరఫరా చేస్తాం. – రాజయ్య, మిషన్ భగీరథ గ్రీడ్ ఈఈ చదవండి: టీఎస్పీఎస్సీ లీకేజీ.. రంగంలోకి ఈడీ -
సీఎం కేసీఆర్‌తో ప్రకాశ్ రాజ్ భేటీ!
Prakash Raj Meets Telangana CM KCR: సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ శనివారం మల్లన్న సాగర్ రిజర్వాయర్‌ను సందర్శించారు. అలాగే గజ్వేల్ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్‌ను కూడా ఆయన పరిశీలించారు. దేశంలోనే ఎక్కడాలేని విధంగా ఒకేచోట అన్ని నిత్యావసరాలు దొరికేలా విశాలమైనమార్కెట్‌ను నిర్మించడం అభినందనీయమని కొనియాడారు. వ్యవసాయ మార్కెట్‌కు సంబంధించిన అంశాలను చైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మహతి ఆడిటోరియం, ఆర్అండ్ఆర్ కాలనీలను సందర్శించారు. అంతకుముందు మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ వద్దకు వెళ్లి అక్కడ పంప్‌హౌస్, కట్టను పరిశీలించారు. ప్రకాశ్‌రాజ్ శుక్రవారం సాయంత్రం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని సీఎం వ్యవసాయ క్షేత్రంలో ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. సాయంత్రం అక్కడే బస చేసి ఉదయం మల్లన్న సాగర్‌ను సందర్శించారు. శనివారం సాయంత్రం మళ్లీ ఫాంహౌస్‌కు వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. -
పది జిల్లాలకు జల ప్రసాదం: మంత్రి హరీశ్‌రావు
దుబ్బాక టౌన్: ‘దేశ చరిత్రలోనే లేనివిధంగా నదిలేని చోట నిర్మించిన పెద్ద ప్రాజెక్టు మల్లన్నసాగర్. నదికే నడక నేర్పి తానే స్వయంగా ఇంజనీరింగ్ నిపుణులతో కలిసి డిజైన్ చేసి ఇంత పెద్ద ప్రాజెక్టును నిర్మించిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్..’అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సహజంగా ప్రాజెక్టులు నదికి అడ్డంగా కడతారని.. కానీ నదిలేని చోట సముద్ర మట్టానికి 667 మీటర్ల ఎత్తులో 50 టీఎంసీల కెపాసిటీతో మల్లన్నసాగర్ నిర్మించిన కారణ జన్ముడు అని కొనియాడారు. మల్లన్నగర్ ప్రాజెక్టుతో సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, సిరిసిల్ల, జనగామ, కామారెడ్డి, నిజామాబాద్, యాదాద్రి, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో 20 లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయని తెలిపారు. బుధవారం మల్లన్నసాగర్ ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత జరిగిన సభలో ఆయన మాట్లాడారు. మండుటెండల్లోనూ మత్తడులు దునికించారు మల్లన్నదేవుడు పుట్టినరోజునే ప్రాజెక్టును ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని, ప్రాజెక్టు ఆపాలని కోర్టులో వేసిన కేసులు కొట్టివేయడం కూడా ఇదే తేదీన కావడం గమనార్హమని హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ నడిగడ్డపై మల్లన్నసాగర్ నిర్మించడంతో సగం తెలంగాణలో శాశ్వతంగా కరువు అనేదే ఉండదని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో వానాకాలం కూడా ఎండాకాలం లాగానే ఉండేదని, గ్రామాల్లో తాగునీరు లేక ప్రజలు బిందెలు రోడ్డుకు అడ్డంగా పెట్టేవారని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక ఎండాకాలం కూడా వానా కాలమైందన్నారు. మండు టెండల్లో కూడా వాగులు, వంకలు, చెరువులు మత్తడిలు దునికించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ కొత్త ప్రబాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, రసమయి బాలకిషన్, సతీష్ కుమార్, పద్మా దేవేందర్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, శేరి సుభాష్‌రెడ్డి, యాదవరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, కార్పొరేషన్ల చైర్మన్లు ప్రతాప్‌రెడ్డి, ఎర్రోల్ల శ్రీనివాస్, చిట్టి దేవేందర్‌రెడ్డి, ఈఎన్సీ హరేరాం, కలెక్టర్ హనుమంతరావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
మల్లన్న సాగర్ ఘనత కేసీఆర్‌దే
-
మల్లన్నసాగర్లో చిక్కుకున్న పశువులు
మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లో పశువులు చిక్కుకుపోయాయి. సిద్దిపేట జిల్లా తుక్కాపూర్ గ్రామానికి చెందిన బర్రెంకల చిన చంద్రయ్యకు 40 వరకు ఎడ్లు, ఆవులు ఉన్నాయి. శనివారం ఉదయం ఆయన పశువులను మేతకోసం అడవిలోకి వదిలిపెట్టాడు. ఆ రోజు సాయంత్రం మల్లన్నసాగర్ చుట్టూ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడంతో చంద్రయ్య పశువుల వద్దకు వెళ్లలేకపోయాడు. ఆదివారం తెల్లవారు జామున మల్లన్నసాగర్‌లోకి గోదావరి జలాలను వదలడంతో పశువులు పక్కనే ఉన్న బ్రాహ్మణ బంజేరుపల్లి శివారులోని గుట్ట సమీపంలోకి వెళ్లాయి. మరొక పక్కన గతంలో కొండపోచమ్మసాగర్‌కు నీటిని తరలించిన కాల్వ ఉంది. ప్రస్తుతం ఈ కాలువ ద్వారా నీరు మల్లన్నసాగర్‌లోకి వెళుతోంది. కాగా తుక్కాపూర్‌కు చెందిన మరో రైతుకు చెందిన నాలుగు గేదెలు కూడా చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.– తొగుట (దుబ్బాక) అక్కడే నిరసన..అక్కడే నిద్ర వీరంతా జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలానికి చెందిన ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లు. రెవెన్యూ అధికారుల తప్పిదంతో తొమ్మిది గ్రామాలకు చెందిన వేలాది మంది రైతుల పట్టాభూములు అసైన్డ్ భూములుగా నమోదయ్యాయి. ఈ తప్పును సరిదిద్దాలంటూ బుధవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో నిరసన దీక్షను ప్రారంభించి.. రాత్రంతా సమావేశపు గదిలోనే పడుకున్నారు. గురువారం కూడా నిరసన కొనసాగించారు. మరోపక్క వీరికి మద్దతుగా రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి.. విధులకు హాజరయ్యేందుకు వచి్చన తహసీల్దార్ స్వప్న, రెవెన్యూ సిబ్బందిని లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. 15 రోజుల్లో రికార్డులు సరిచేసి న్యాయం చేస్తామని అడిషనల్ కలెక్టర్ భాస్కర్‌రావు ప్రజాప్రతినిధులకు, రైతులకు హామీనివ్వడంతో ఆందోళనకు తెరపడింది.– జఫర్‌గఢ్ -
మల్లన్నసాగర్ నుంచే దేవాదులకు గోదావరి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం సిద్ధం చేసిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి దేవాదుల ప్రాజెక్టులోని తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు అనుసంధానించే తుది ప్రణాళిక ఖరారైంది. దేవాదుల ప్రాజెక్టులో నీరందని చివరి ఆయకట్టు ప్రాంతాలకు పూర్తి భరోసా ఇచ్చేలా మల్లన్నసాగర్ నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా నీరందించే పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. మొత్తంగా రూ.405 కోట్లతో గ్రావిటీ కెనాల్ తవ్వడం ద్వారా దేవాదులలోని సుమారు 1.30 లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందించేలా కార్యాచరణను త్వరలోనే మొదలుపెట్టనుంది. నిజానికి దేవాదుల ప్రాజెక్టులో భాగంగా గంగాపురం ఇంటేక్ పాయింట్ నుంచి నీటిని ఎత్తిపోస్తూ 6.21 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాల్సి ఉంది. నిర్ణీత ఆయకట్టుకు నీటిని తరలించాలంటే 200 కిలోమీటర్లకుపైగా నీటి తరలింపు చేయాల్సి ఉంది. తపాస్‌పల్లి రిజర్వాయర్ వరకు నీటిని తరలించాలంటే కనీసంగా 460 మీటర్ల మేర నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. ఇది వ్యయప్రయాసలతో కూడుకున్నది కావడంతో తపాస్‌పల్లి కింది ఆయకట్టుకు కాళేశ్వరం జలాలను తరలించేలా ప్రణాళికలు రూపొందించాలని గతంలోనే సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో మల్లన్నసాగర్ నుంచి 10.06 కిలోమీటర్ల మేర గ్రావిటీ కెనాల్ నిర్మించి రోజుకు 1,600 క్యూసెక్కుల నీటిని కనీసం 4 నెలలపాటు తరలించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో ఓపెన్కెనాల్తోపాటు 3.60 కిలోమీటర్ల మేర సొరంగం నిర్మించాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనతో కనీసం 13 నుంచి 14 టీఎంసీల నీటిని తరలించడం ద్వారా తపాస్‌పల్లి కింద నిర్ణయించిన 74,955 ఎకరాలతోపాటు, కొన్నబోయినగూడెం, వెల్దండ, లద్దనూరుతోపాటే దారి పొడవునా ఉండే చెరువుల కింద మరో 55 లక్షల ఎకరాలు కలిపి మొత్తం 1.30 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనను కేబినెట్ సైతం ఆమోదించినట్లు తెలుస్తోంది. -
మల్లన్న సాగర్‌లోకి గోదారి ట్రయల్‌రన్ విజయవంతం
దుబ్బాకటౌన్/తొగుట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. గోదావరి జలాలు కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లోకి అడుగుపెట్టాయి. ప్రాజెక్టు ఈఎన్సీ హరిరాం, ఎస్ఈ వేణు, ఈఈ వెంకటేశ్వర్రావు ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ పంపుహౌస్ వద్ద ప్రత్యక పూజలు నిర్వహించి మోటార్లను ప్రారంభించారు. పంపుల నుంచి దూసుకెళ్లిన గోదావరి నీళ్లు.. గలగలమంటూ కొద్దిసేపట్లోనే మల్లన్నసాగర్‌లోకి అడుగుపెట్టాయి. మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లో నీటిని నింపాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో.. అధికారులు కొద్దిరోజులుగా రాత్రింబవళ్లు కష్టపడ్డారు. ట్రయల్‌రన్ విజయవంతం అవడంతో సంబురాలు జరుపుకొన్నారు. 10 టీఎంసీలు నింపేందుకు.. మల్లన్నసాగర్లో ప్రస్తుతం 10 టీఎంసీల నీటిని నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తుక్కాపూర్ పంపుహౌజ్‌లోని మొత్తం ఎనిమిది పంపులకుగాను.. మూడు పంపుల (రెండో, ఆరో, ఏడో నంబర్ పంపుల) ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. ఒక్కో మోటార్ ద్వారా రోజుకు (24 గంటల్లో) 1.5 టీఎంసీల నీటిని పంపింగ్ చేసే అవకాశం ఉంది. ఈ లెక్కన మూడింటిని పూర్తిస్థాయిలో నడిపితే.. రెండు, మూడు రోజుల్లోనే మల్లన్నసాగర్లో 10 టీఎంసీలు చేరే అవకాశం ఉంది. భారీగా బందోబస్తు మల్లన్నసాగర్లో నీళ్లు నింపుతున్న నేపథ్యంలో పోలీసులు శనివారం మధ్యాహ్నమే రిజర్వాయర్ పరిధిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తుక్కాపూర్, రాంపురం వాగుగడ్డ, ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామాలకు వెళ్లే రహదారిపై పికెట్లు ఏర్పాటు చేశారు. ఎవరినీ కట్ట వద్దకు వెళ్లనీయడం లేదు. గ్రామస్తులను కూడా పూర్తి వివరాలు అడిగి నిర్ధారించుకున్నాకే వెళ్లనిస్తున్నారు. అర్ధరాత్రి గ్రామాలు ఖాళీ మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లోని కుటుంబాలను రెవెన్యూ అధికారులు శనివారం అర్ధరాత్రి ఖాళీ చేయించారు. వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, పల్లెపహాడ్, బి.బంజేరుపల్లి గ్రామాల నుంచి అందరినీ బయటికి తరలించారు. నిజానికి ఈ గ్రామాలను ఖాళీ చేయాలని అధికారులు గతంలోనే ఆదేశించారు. కానీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి కొందరు ఖాళీ చేయలేదు. వారిని ఇప్పుడు బయటికి తరలించారు. గట్టు గుట్ట పూజారి అక్కడే..! వేములఘాట్ శివారు అటవీప్రాంతంలోని గట్టు గుట్టపై దీకొండ మైసమ్మ, ఆంజనేయస్వామి ఆలయాలు ఉన్నాయి. ఏటిగడ్డ కిష్టాపూర్ తండాకు చెందిన మంగీలాల్.. ఆలయంలోనే నివసిస్తూ పూజారిగా పనిచేస్తున్నారు. ముంపు గ్రామాలన్నీ పూర్తిగా ఖాళీ చేస్తుండటంతో.. ఏటిగడ్డ కిష్టాపూర్ సర్పంచ్ ఆయనతో మాట్లాడి బయటికి రావాలని కోరారు. కానీ మంగీలాల్ తిరస్కరించారు. అధికారులు ఆయనను బయటికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ స్వప్నం సాక్షాత్కారం: మంత్రి హరీశ్ ‘కేసీఆర్ స్వప్నం సాక్షాత్కారం.. తెలంగాణకు అమృత జలాభిషేకం’ అని పేర్కొంటూ రిజర్వాయర్‌లోకి నీటి విడుదల ఫొటోలను ట్విట్టర్లో మంత్రి హరీశ్‌రావు పోస్టు చేశారు. ‘సాకారమైన సాగరం.. అనుమానాలు, అపశకునాలు, అవరోధాలు తలవంచి తప్పుకున్నాయి.కుట్రలు, కుహానా కేసులు, వందల విమర్శలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. గోదారి గంగమ్మ మల్లన్నసాగరాన్ని ముద్దాడింది. తెలంగాణ రైతాంగం ఆనందంతో మురిసింది. పట్టుదలతో పనిచేస్తే కానిదేదీ లేదని తెలంగాణ ప్రభుత్వం ప్రపంచానికి చాటింది..’’ అని పేర్కొన్నారు. -
Mallanna Sagar: ముల్లె సర్దుకున్న.. ఎళ్లిపోతావున్న
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు నర్సమ్మ. ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టులో ఇల్లు, వ్యవసాయ భూమి కోల్పోయింది. కోల్పోయిన ఇంటికి అధికారులు పరిహారం అందించారు కానీ, సాగు భూమి 1.7 ఎకరాలకు సంబంధించిన పరిహారం అందించలేదు. దీంతో రాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని వడ్డెర కాలనీలోనే నివాసం ఉంటోంది. మంగళవారం అధికారులు ఇల్లు ఖాళీ చేయాలని ఆదేశించడంతో ఖాళీ చేసింది. ఊరిని వదిలిపెట్టి పోతున్నా అంటూ కన్నీటి పర్యంతం అయింది. ఆ భూమికి డబ్బులు ఇచ్చి మా కుటుంబాన్ని అదుకోవాలని అధికారులను వేడుకుంది. సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో 50 టీఎంసీల సామర్థ్యంతో కొమురవెల్లి మల్లన్నసాగర్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ప్రాజెక్ట్ పనులు చివరి దశకు చేరడంతో ముంపు గ్రామాలను పూర్తి స్థాయిలో ఖాళీ చేయిస్తున్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్ట్‌లో 8 గ్రామ పంచాయతీలలో 16 గ్రామాలు ముంపు నకు గురవుతున్నాయి. ముంపు గ్రామాల్లో 5,618 కుటుంబాలు నివాస గృహాలు, భూమి కోల్పోతున్నట్లు గుర్తించారు. పరిహారం 90% వరకు అందించారు. ఒంటరి మహిళలు, పురు షులు, పలువురికి ఎలాంటి పరిహారం అందక పోవడంతో అక్కడే నివాసం ఉన్నారు. కొముర వెల్లి మల్లన్నసాగర్ ప్రాజెక్ట్‌లోకి త్వరలో నీటిని వదలనుండటంతో ముంపు గ్రామాలను పూర్తి స్థాయిలో ఖాళీ చేయిస్తున్నారు. రెండు రోజు లుగా అధికారులు డీసీఎంలను పంపించి నివాసితులను మరోచోటకు పంపిస్తున్నారు. మంగళవారం 25 మంది నిర్వాసితులకు త్వరలో డబ్బులు అందజేస్తాం అని చెప్పి ఖాళీ చేయించారు. ఒక పక్కన గృహాలు ఖాళీ చేయిస్తూనే, మరో పక్క జేసీబీలతో ఇళ్లను నేలమట్టం చేశారు. ఈ సందర్భంగా నిర్వాసితులు ఊరి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. మళ్లీ కలుసుకుంటామో లేదో అని రోదించారు. ఇంట్లోనుంచి వస్తూ గుమ్మాలను, గోడలను అప్యాయంగా తడుముకుంటూ వెళ్లడం అందరినీ కంటతడి పెట్టించింది. -
కన్నీరు తుడవంగ.. సొంతింట్లోకి సగర్వంగా
సాక్షి, గజ్వేల్: కన్నతల్లిలాంటి ఊరు.. అక్కడి మట్టితో బంధాన్ని తెంచుకుని.. కన్నీళ్లను దిగమింగుకుని మల్లన్నసాగర్ నిర్వాసితులు కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. పాత జ్ఞాపకాల స్థానే కొత్త ఆశలు.. ఆకాంక్షలతో సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజ్‌పల్లి ఆర్అండ్ఆర్ (రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్) కాలనీలోకి చేరుకుంటున్నారు. ఇప్పటికే 2000కుపైగా కుటుంబాలు ఇక్కడికి వచ్చాయి. నిన్నమొన్నటి వరకు పచ్చని పంట పొలాలు, ప్రాణాధారంలాంటి చెరువులు, కుంటలు, పాడిపశువుల మధ్య స్వేచ్ఛగా గడిపిన వీళ్లంతా కాంక్రీటు వనంలో కొత్త అనుభవాలను ఎదుర్కోబోతున్నారు. నిర్వాసితుల ఉద్విగ్న పరిస్థితులపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. ఉపాధిపై ఆందోళన మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల కోసం గజ్వేల్ మున్సిపాలిటీలోకి వచ్చే ముట్రాజ్‌పల్లి, సంగాపూర్ గ్రామాల పరిధిలో రూపుదిద్దుకున్న ఆర్అండ్ఆర్ కాలనీలో ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణంతో తొగుట మండలం పల్లెపహాడ్, వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, లక్ష్మాపూర్, రాంపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లి, కొండపాక మండలం సింగారం, ఎర్రవల్లి గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నిర్వాసితులంతా ఆర్అండ్ఆర్ కాలనీకి తరలివస్తున్నారు. ముంపు గ్రామాల ప్రజలు ఇప్పుడు కొత్త బతుకును వెతుక్కుంటున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయ పునరావాసం పక్కనపెడితే... ఇకపై తమ ఉపాధి పరిస్థితి ఏమిటనే అంశంపై అనేకమంది ఆందోళన చెందుతున్నారు. ఇదే ఆవేదనతో చాలామంది కన్నీరు పెట్టుకుంటున్నారు. గేటెడ్ కమ్యూనిటీ తరహాలో.. ముంపు గ్రామాల ప్రజలకు 650 ఎకరాల్లో 6 వేల మందికి ఇళ్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం ముట్రాజ్‌పల్లి, సంగాపూర్‌లో గతంలో 300 ఎకరాలు సేకరించగా.. ఇటీవల మరో 350 ఎకరాలను సేకరించారు. నిర్వాసితులు కోరిన ప్రకారం ఇళ్లను ఎంత మందికి అవసరమైతే అంత మందికి నిర్మించి ఇవ్వడానికి గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ముందే నిర్మాణ పనులను చేపట్టారు. ప్రభుత్వం కట్టే ఇళ్లు వద్దనుకునేవారికి ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే రూ.5.04 లక్షలను అందిస్తున్నారు. ఇప్పటికే 2,400 ఇళ్ల నిర్మాణం పూర్తికాగా 2 వేలకుపైగా పంపిణీ చేశారు. మరో 3,400 మందికి ఓపెన్ ప్లాట్లు పంపిణీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా ఒక్కో ఇంటిని 250 గజాల్లో సుమారు 563 ఎస్ఎఫ్టీ వైశాల్యంతో నిర్మించారు. ఇంటి నిర్మాణానికి పోగా మిగిలిన భూమిలో రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, రెండు ఫంక్షన్ హాళ్లు, ఒక మార్కెట్, 8 అంగన్ వాడీ కేంద్రాలు, 3 ప్రాథమికోన్నత పాఠశాలలు, 2 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు నిర్మిస్తున్నారు. ఇళ్ల నిర్మాణాల కోసం రూ. 250 కోట్లు, ఇతర వసతుల కల్పన కోసం మరో రూ. 200 కోట్లకుపైగా ప్రభుత్వం వెచ్చిస్తోంది. కొన్ని నెలలుగా నివాసం ఆర్అండ్ఆర్ కాలనీని సకల సౌకర్యాలతో రూపొందిస్తున్నారు. ఇప్పటికే రాంపూర్, లక్ష్మాపూర్, ఎర్రవల్లి, సింగారం గ్రామస్తులు ఆర్అండ్ఆర్ కాలనీ పక్కనే ఉన్న డబుల్ బెడ్రూమ్ మోడల్ కాలనీలో కొన్ని నెలలుగా నివాసముంటున్నారు. ఆర్అండ్ఆర్ కాలనీ పనులు తుది దశకు చేరుకోవడంతో త్వరలోనే లక్ష్మాపూర్‌కు చెందిన 175 ఇళ్లు, ఎర్రవల్లికి చెందిన 553, సింగారానికి చెందిన 181 ఇళ్లలో కొత్తగా గృహ ప్రవేశాలు జరుగనున్నాయి. కొన్ని రోజులుగా వేములఘాట్, పల్లెపహాడ్, ఏటిగడ్డ కిష్టాపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లికి చెందిన నిర్వాసితులు ఇక్కడికి చేరుకుంటున్నారు. శుక్రవారం నాటికి దాదాపు 986 కుటుంబాలు కొత్త ఇళ్లలో గృహ ప్రవేశాలు చేశాయి. ఇదిలా ఉండగా ఆర్అండ్ఆర్ కాలనీ పనులను జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కాలనీలో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ప్రత్యేక బృందాలు కృషి చేస్తున్నాయి. చదవండి: వైద్య సిబ్బందిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు -
ఊరితో బంధం తెంచుకుంటూ.. కన్నీళ్లు పెడుతూ
తొగుట(దుబ్బాక): కొమురవెల్లి మల్లన్నసాగర్ నిర్వాసిత కటుంబాలు గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ఆర్అండ్ఆర్ కాలనీకి బుధవారం తరలివెళ్లారు. ముంపు గ్రామాలైన వేములఘాట్, పల్లేపహడ్ గ్రామాల ప్రజలు తమ కుటుంబాలతో కలిసి వెళ్లిపోయారు. ఆరు నెలల క్రితం లక్ష్మాపూర్ ప్రజలు గ్రామాన్ని ఖాళీచేసి వెళ్లిన విషయం తెలిసిందే. రిజర్వాయర్ కట్ట మధ్యలో ఉన్న లక్ష్మాపూర్, రాంపూర్ గ్రామాలను అధికారులు ఖాళీ చేయించారు. కాగా సంగాపూర్‌లోని ఆర్అండ్ఆర్ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను లక్ష్మాపూర్ వాసులకు ప్రభుత్వం తాత్కాలికంగా కేటాయించింది. కాగా ప్రస్తుతం వేములఘాట్, పల్లేపహడ్ గ్రామాల ప్రజలు వారం రోజుల నుంచి వారికి కేటాయించిన ఇళ్లలోకి వెళ్తున్నారు. ఈ క్రమంలో, వేములఘాట్ నుంచి 140 కుటుంబాలు, పల్లేపహడ్ నుంచి 103 కుటుంబాలు బుధవారం వెళ్లారు. నిర్వాసిత కుటుంబాలను తరలించేందుకు ప్రభుత్వం వాహనాలను ఏర్పాటు చేసింది. దీంతో పలు కుటుంబాలు నేడు గజ్వేల్‌కు తరలివెళ్లాయి. గ్రామాన్ని వదిలి వెళ్తున్న క్రమంలో మహిళలు, పురుషులు భావోద్వేగానికి గురయ్యారు. ఇన్నాళ్లుగా గ్రామంతో ఉన్న అనుబంధాన్ని తెంచుకొని వెళ్తున్న క్రమంలో మహిళలు ఒకరిపై ఒకరు పడి బోరున విలపించారు. పుట్టి పెరిగిన ఊరి జ్ఞాపకాలను వదిలివెళ్లి పోతున్నామంటూ ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామంలో ఇన్నాళ్లుగా కష్టసుఖాల్లో అందరం అండగా ఉండేవారమని తలుచుకుంటూ విలపించారు. ఆర్అండ్ఆర్ కాలనీకి చేరుకున్న గ్రామస్తులు గజ్వేల్‌రూరల్: మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు బాధితులు వేములఘట్ గ్రామస్తులు గజ్వేల్ మున్సిపాలిటీ పరిధి ముట్రాజ్‌పల్లి ఆర్అండ్ఆర్ కాలనీలోకి చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా బుధవారం వేములఘట్‌కు చెందిన బాధిత కుటుంబాలు డీసీఎం వాహనాల్లో తీసుకువచ్చిన సామగ్రిని ఆర్అండ్ఆర్ కాలనీలో తమకు కేటాయించిన ఇళ్లలోకి తరలించారు. -
కోర్టుధిక్కార కేసులో ఐఏఎస్‌లకు ఫైన్, ఆర్డీవోకు జైలు
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసేకరణపై దాఖలైన కోర్టు ధిక్కార కేసులో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు జరిమానా, మరో అధికారికి జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, గతంలో కలెక్టర్‌గా పనిచేసిన కృష్ణభాస్కర్ (ప్రస్తుతం సిరి సిల్ల జిల్లా కలెక్టర్)లకు రూ.2 వేల చొప్పున జరిమానా విధించింది. జరిమానా చెల్లించకుంటే నెల రోజులు జైలు శిక్ష అనుభవించాలంది. కాళేశ్వరం ప్రాజెక్టు యూనిట్–3 భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ (సిద్దిపేట ఆర్డీవో) జయచంద్రారెడ్డికి 2 నెలల జైలు శిక్షతో పాటు రూ.2 వేలు జరిమానా చెల్లించాలని, జరిమానా చెల్లించకుంటే నెల రోజుల జైలు శిక్ష అనుభవించాలని తీర్పు చెప్పింది. ముగ్గురు అధికారులు రూ.2 వేలు చొప్పున పిటిషనర్లకు చెల్లించాలని పేర్కొంది. ఈ మేరకు 2 వేర్వేరు కోర్టు ధిక్కార కేసుల్లో న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ఈ నెల 24న తీర్పు చెప్పారు. అప్పీల్‌కు వీలుగా తీర్పు అమలును 4 వారాలు నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. తిరిగి నోటిఫికేషన్.. ఈ తీర్పు ప్రతి అందిన 6 మాసాల్లోగా గతంలోని కోర్టు ఉత్తర్వుల మేరకు భూసేకరణకు తిరిగి డిక్లరేషన్, అవార్డు వంటి సెక్షన్ 11 (1) ప్రకారం చెల్లదని, వాటితో పాటు ఫాం–సీ ప్రొసీడింగ్, నోటిఫికేషన్లను తిరిగి జారీచేయాలని, భూసేకరణ చట్టం–2013 ప్రకారం రైతులకు పరిహారం చెల్లించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. కింది స్థాయిలో అధికారులు కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడానికి ఆ ముగ్గురు ఉన్నతాధికారుల బాధ్యతారాహిత్యమే కారణమని, ఉద్దేశపూర్వకంగానే ఆదేశాల్ని ఉల్లంఘించారని తప్పుపట్టింది. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి చేపట్టిన భూసేకరణ నోటిఫికేషన్ విషయంలో హైకోర్టు ఆదేశాల్ని అమలు చేయలేదని గాండ్ల లక్ష్మి, రాం రెడ్డి ఇతరులు దాఖలు చేసిన కోర్టు ధిక్కారం వ్యాజ్యాలపై న్యాయమూర్తి 16 పేజీల తీర్పు చెప్పారు. ‘సిద్దిపేట జిల్లా తోగుట మండలం వేములఘాట్‌కు చెందిన రైతుల అభ్యంతరాలను పరిష్కరించాకే మల్లన్నసాగర్ ప్రాజెక్టు పనులు, భూముల కోసం అవార్డు ప్రకటించాలి. పిటిషనర్ల అభ్యంతరాలు పరిష్కరించకుండా భూముల విషయంలో ముందుకు వెళ్లరాదు. ప్రాజెక్టుకు చెందిన పూర్తి వివరాలు, మ్యాప్, తెలుగు డీపీఆర్ ప్రతులు రైతులకివ్వాలి’అని గత ఉత్తర్వులను అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని హైకోర్టు తాజా తీర్పులో పేర్కొంది. భూముల స్వాధీనం చెల్లదు.. 2018లో మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ భూసేకరణకు సంబంధించి రైతుల అభ్యంతరాలు వినకుండా డిక్లరేషన్‌ను ఇచ్చారనే పిటిషనర్ల వాదనను హైకోర్టు ఆమోదించింది. భూసేకరణ చట్టం– 2013కు వ్యతిరేకంగా అధికారులు వారి భూముల్ని స్వాధీనం చేసుకోవడం చెల్లదని తేల్చింది. హైకోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయనప్పుడు వాటిని పొడిగించాలనీ అధికారులు హైకోర్టును కోరలేదని తప్పుపట్టింది. ఆ చట్టంలోని సెక్షన్ 13 నిబంధనకు వ్యతిరేకంగా అధికారుల చర్యలున్నాయని పేర్కొంది. అదే చట్టంలోని సెక్షన్ 19 (1) కింది భూమి కోసం డిక్లరేషన్, ఎంక్వయిరీ నోటీసు, భూసేకరణ నోటిఫికేషన్, ఆ తర్వాత భూసేకరణ చేయాలనే నిబంధనను అధికారులు అమలు చేయలేదని స్పష్టంచేసింది. తొలుత ఆర్డీవోగా ఉన్న ముత్యంరెడ్డి రైతుల అభ్యంతరాలు స్వీకరించారని, అయితే ఆయన తర్వాత ఆర్డీవోగా వచ్చిన జయచంద్రారెడ్డి నాలుగు వారాల్లో చేయాల్సిన పనులకు 8 వారాలు తీసుకున్నారని, అయినా అభ్యంతరాలపై విచారణ పూర్తి కాలేదని కోర్టు పేర్కొంది. రైతుల వినతిపత్రాలపై ఆర్డీవో ఏవిధమైన సమాచారం ఇవ్వలేదు కాబట్టి రైతుల వినతిని ఆమోదించినట్లే అవుతుందని అభిప్రాయపడింది. ఈ కేసులో జిల్లా కలెక్టర్ స్వయంగా గతంలో హైకోర్టు విచారణకు కూడా హాజరయ్యారని, అయినా తామిచ్చిన ఉత్తర్వుల్ని అమలు చేయకుండానే ప్రాజెక్టు పనుల పేరుతో భూమిని స్వాధీనం చేసుకున్నారని పేర్కొంది. గతంలోని తీర్పును అమలు చేయకపోవడానికి చెప్పిన కారణాలు సహేతుకంగా కూడా లేవని, కావాలనే ఉత్తర్వుల్ని అమలు చేయలేదని తీర్పులో స్పష్టంచేసింది. భూసేకరణ చట్ట నిబంధనలకు అనుగుణంగా భూనిర్వాసితులకు న్యాయపరంగా పరిహారం చెల్లించిన తర్వాతే భూసేకరణ చేయాలని కోర్టు ఆదేశించింది. -
‘నిర్వాసితులను భయపెడుతున్నారు’
సాక్షి, సిద్ధిపేట : కొండపోచమ్మ, మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల పట్ల ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని సూచించారు. ప్రాజెక్టులకు తమ పార్టీ వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. భూ నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వానిదేనన్నారు. కోర్టు తీర్పును ఒక చిల్లర పంచాయితీగా అభివర్ణించిన సీఎం కేసీఆర్.. నిందలన్నీ కాంగ్రెస్ పార్టీపై మోపుతున్నారని మండిపడ్డారు. అదే విధంగా నర్సారెడ్డి పట్ల పోలీసుల తీరును ఎండగట్టారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయి, రైతుల భూములు సస్య శ్యామలం కావాలని.. వీటితో పాటు భూనిర్వాసితులకు కూడా ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మానసిక ఆనందం పొందుతున్నాడే తప్ప.. ‘ఇప్పటివరకు వరకు మేనిఫెస్టో గురించి గానీ, రైతుల సమస్యల గురించి గానీ పట్టించుకోకుండా.. ఎంతసేపు ఫెడరల్ ప్రంట్ పేరుతో తీర్థయాత్రలు తిరగుతూ మానసిక ఆనందం పొందుతున్నాడే తప్ప.. సీఎం కేసీఆర్ ఏ ఒక్క సమస్య గురించి మాట్లాడకపోవడం దారుణం. ప్రాజెక్ట్ పనులలో జాప్యం చేస్తూ ఆ నిందలు కాంగ్రెస్ పార్టీపై రుద్దుతున్నాడు. హైకోర్టు స్టేతో ఆగిపోయిన పనులను.. నిర్వాసితులను భయబ్రాంతులకు గురిచేసి ప్రభుత్వం పూర్తి చేస్తోంది. కోర్టు ప్రత్యేక నివేదిక తెప్పించుకుని నిర్వాసితులకు న్యాయం చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో రైతులు ఆత్మహత్యా యత్నం చేయడం దారుణం అని పొన్నం ప్రభాకర్ కేసీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మూడో టీఎంసీ లెక్క కొలిక్కి!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక అంకానికి ప్రాణం పోసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే మేడిగడ్డ నుంచి రోజుకు 2 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోసేలా చర్యలు చేపడుతున్న ప్రభుత్వం.. కొత్తగా మూడో టీఎంసీ నీటిని తీసుకునేందుకు కార్యాచరణ రూపొందించి అనుమతులిచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో అదనపు మోటార్ల ఏర్పాటుకు అయ్యే వ్యయం, మిడ్‌మానేరు నుంచి మల్లన్నసాగర్ వరకు అయ్యే వ్యయ అంచనాలు సిద్ధం చేసి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అనుమతి కోసం నీటిపారుదల శాఖ పంపింది. దీనికి సీఎం ఆమోదం తెలిపిన వెంటనే ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేయనుంది. ఆమోదమే తరువాయి.. రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా మేడిగడ్డ పంప్‌హౌజ్ వద్ద 11, అన్నారం వద్ద 8, సుందిళ్ల వద్ద 9 మోటార్లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మూడో టీఎంసీ నీటిని తీసుకునేందుకు వీటికి అదనంగా మూడు పంప్‌హౌజ్‌లలో కలిపి మరో 15 మోటార్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పుడున్న వాటితో కలిపి అదనంగా మేడిగడ్డలో 6, అన్నారంలో 4, సుందిళ్లలో 5 మోటార్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ అదనపు మోటార్ల ఏర్పాటుతో పాటు, వాటి ఏర్పాటుకు అనుగుణంగా పలు నిర్మాణాలు చేయాల్సి ఉండటంతో వ్యయం పెరుగుతోంది. పెరిగిన అంచనా వ్యయం.. గత అంచనా ప్రకారం మూడు పంప్‌హౌజ్‌లకు కలిపి రూ.7,998 కోట్లు ఉండగా, ప్రస్తుతం అది రూ.12,392 కోట్లకు చేరనుంది. ఈ పంప్‌హౌజ్‌ల ద్వారా ఎల్లంపల్లికి వచ్చే నీటిని మిడ్‌మానేరు వరకు తరలించే ప్రక్రియ కోసం అప్రోచ్ చానల్, గ్రావిటీ కాల్వ, టన్నెళ్ల నిర్మాణాలకు రూ.10,500 కోట్లు అంచనా వేశారు. మిడ్‌మానేరు నుంచి ఒక టీఎంసీ నీటిని అనంతగిరి రిజర్వాయర్, అటునుంచి రంగనాయక్‌సాగర్ తిరిగి అటునుంచి కొమురవెల్లి మల్లన్నసాగర్ వరకు తరలించేలా కొత్త ప్రణాళిక సిద్ధం చేశారు. దీనికోసం అదనంగా 11,500 క్యూసెక్కుల సామర్థ్యంతో గ్రావిటీ కాల్వలు, అప్రోచ్ చానల్, టన్నెళ్లు, 3 పంప్‌హౌజ్‌ల నిర్మాణాలు అవసరం ఉంటాయని లెక్కగట్టారు. దీనికై మొత్తంగా రూ.12,594కోట్లు ఖర్చవుతుందని ప్రణాళిక వేశారు. మొత్తం రూ.27,488 కోట్ల మేర అదనపు వ్యయం అవుతుందని అంచనా వేశారు. -
బృహత్తరంగా కాళేశ్వరం
తరలింపు ఇలా.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో అదనపు పంపుల బిగింపు ,ఎల్లంపల్లి దిగువన అదనపు టన్నెల్‌తో మిడ్‌మానేరుకు తరలింపు..మిడ్‌మానేరు నుంచి పైప్‌లైన్, గ్రావిటీ ద్వారా మల్లన్నసాగర్ వరకు. సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ద్వారా వచ్చే వర్షాకాలానికే గోదావరి నీటిని ఎత్తిపోసేలా యుద్ధప్రాతిపదికన నిర్మాణ పనులు కొనసాగిస్తున్న ప్రభుత్వం.. దీనికి సమాంతరంగా మరో బృహత్ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. మేడిగడ్డ నుంచి రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ప్రస్తుతం పనులు కొనసాగిస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడో మూడో టీఎంసీ నీటిని కూడా తరలించే ప్రక్రియపై దృష్టి పెట్టింది. అదనపు టీఎంసీ నీటి తరలింపుకు అవసరమైన నివేదికలు సిధ్దం చేస్తోంది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు 3 టీఎంసీల నీటి తరలింపునకు ఇప్పటికే సివిల్ పనులు కొనసాగుతుండగా, అదనంగా పంపులు, మోటార్లు బిగించేందుకు అవసరమైన లెక్కలు వేస్తున్నారు. ఇక ఎల్లంపల్లి దిగువన మిడ్‌మానేరు వరకు, అటునుంచి మల్లన్న సాగర్ వరకు నీటిని తరలించే మార్గాలు, అయ్యే వ్యయం ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తోంది. ఇప్పటివరకు 2.. ఇకపై మూడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 13 జిల్లాల్లోని 18.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, మరో 18.82 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం మేడిగడ్డ బ్యారేజీ నుంచి 195 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు ప్రణాళిక రూపొందించిన విషయం తెలిసిందే. ఆయకట్టుకు అవసరమయ్యే నీటితో పాటు హైదరాబాద్‌కు తాగునీటి అవసరాలు, పారిశ్రామిక అవసరాలకు కలిపి 225 టీఎంసీలు అవసరం కాగా, ఇందులో 180 టీఎంసీల నీటిని మేడిగడ్డ నుంచి ఎత్తిపోతల ద్వారా మళ్లించారు. రోజుకు రెండు టీఎంసీల చొప్పున 90 రోజుల పాటు మళ్లించి, మిగిలిన నీటిని భూగర్భజలం ద్వారా వినియోగించుకునేలా వ్యూహాలు సిద్ధం చేశారు. ప్రస్తుతం 2టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా మేడిగడ్డ పంప్‌హౌజ్ వద్ద 11, అన్నారం వద్ద 8, సుందిళ్ల వద్ద 9 మోటార్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి నుంచి నీటిని ఎల్లంపల్లికి, అటునుంచి వరద కాల్వ ద్వారా మిడ్‌మానేరుకు రెండు టీఎంసీలు తరలించేలా ప్రస్తుత ప్రణాళిక ఉంది. అయితే ప్రభుత్వం మిడ్‌మానేరుకు వచ్చే రెండు టీఎంసీల్లో ఒక టీఎంసీ నీటిని శ్రీరాంసాగర్ ఆయకట్టు స్థిరీకరణకు తరలించేలా ‘ఎస్సారెస్పీ పునరుజ్జీవన’పథకాన్ని చేపట్టింది. దీంతో మిడ్‌మానేరు దిగువన మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ మొదలుకుని.. గంధమల, బస్వాపూర్ రిజర్వాయర్ వరకు ఒక టీఎంసీ నీరు మాత్రమే లభ్యతగా ఉంటుంది. ప్రస్తుతం ఈ ఏడాది ఖరీఫ్ నుంచి రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా ఒక టీఎంసీని ఎస్సారెస్పీ, పునరుజ్జీవ పథకానికి, మరో టీఎంసీని కొండపోచమ్మ సాగర్ వరకు తరలించేలా ప్రణాళిక వేసింది. రెండు టీఎంసీ తరలింపు ప్రక్రియ ముగింపుదశకు చేరుకుంటున్న నేపథ్యంలో.. భవిష్యత్తు అవసరాలకు మూడో టీఎంసీ అవసరమున్న నేపథ్యంలో దానికి పనులు ఆరంభించాలని ముఖ్యమంత్రి ఇంజనీర్లను ఆదేశించారు. ఈ నేపథ్యంలో మూడో టీఎంసీ ప్రణాళిక సిద్ధమైంది. 25వేల కోట్లు దాటనున్న వ్యయం అదనపు టీఎంసీ నీటి తరలింపుపై అధికారులు వివిధ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నీటిపారుదల వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంప్‌హౌజ్‌ల పరిధిలో 15 మోటార్లు అదనంగా అమర్చనున్నారు. ఇప్పడున్న వాటితో కలిపి అదనంగా మేడిగడ్డలో 6, అన్నారంలో 4, సుందిళ్లలో 5 మోటార్లు ఏర్పాటు చేయనున్నారు. వీటికి అదనంగా రూ.1600కోట్ల మేర వ్యయం కానుందని అంచనా వేస్తున్నారు. ఇక ఎల్లంపల్లి దిగువన తాళ్లకొత్తపేట నుంచి వరద కాల్వ 92 కి.మీ. పాయింట్ వద్ద కలిపే వరకు 32 కిలోమీటర్లలో 3 కిలోమీటర్ల మేర అప్రోచ్ చానల్, దాదాపు 17 కిలోమీటర్ల టన్నెల్, అండర్‌గ్రౌండ్ పంప్‌హౌజ్‌లు ఉండనున్నాయి. ఈ నిర్మాణానికి రూ.10,500 కోట్ల వ్యయం కానుందని అంచనా వేశారు. ఇక మిడ్‌మానేరు దిగువన మల్లన్నసాగర్ వరకు మొదట టన్నెల్ ద్వారా నీటిని తరలించాలని నిర్ణయించినా, దీని నిర్మాణాలకు చాలారోజులు పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రెషర్ మెయిన్, పైప్లైన్లు, గ్రావిటీ కాల్వల ద్వారా నీటిని తరలించేలా తుది ప్రణాళిక సిద్ధమవుతోంది. ఈ నీటి తరలింపునకు 3 స్థాయిల్లో లిఫ్టులను ఏర్పాటు చేయాల్సి రావడం.. 40 నుంచి 45 కిలోమీటర్ల దూరం ఉండటంతో ఈ నిర్మాణానికి రూ.14,500 కోట్ల మేర వ్యయం అవుతుందని ప్రాధమిక అంచనా వేశారు. అదనపు టీఎంసీ నిర్మాణానికి మొత్తంగా రూ.25వేల కోట్లకు మించి అదనపు వ్యయం కానుంది. ప్రస్తుతం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.80,500 కోట్లు కాగా, ఈ మొత్తం వ్యయం కలిపితే ప్రాజెక్టు వ్యయం లక్ష కోట్లను దాటనుంది. ఇప్పటికే ప్రాజెక్టులో భూసేకరణ, ఆర్–ఆర్ అవసరాలను పక్కన పెడితే కేవలం పనులకు సంబంధించి రూ.66,227 కోట్లతో ఒప్పందాలు జరిగాయి. ఇందులో ఇప్పటికే రూ.40వేల కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. మిగతా నిధులకై రుణాలు తీసుకోగా, అదనంగా అయ్యే వ్యయానికి సైతం రుణాలు తీసుకునే అవకాశాలున్నాయి. -
‘మల్లన్నసాగర్’ వచ్చేనెల షురూ
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్న మల్లన్నసాగర్ రిజర్వాయర్ పనులు ఎట్టకేలకు ప్రారంభం కానున్నాయి. 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే ఈ రిజర్వాయర్‌కు సంబంధించి భూసేకరణ కొలిక్కి వచ్చింది. మొత్తం భూసేకరణలో మిగిలి ఉన్న 100 ఎకరాల సేకరణను రెండు, మూడ్రోజుల్లో పూర్తి చేసి వచ్చే నెల నుంచి పనులు మొదలు పెట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 13 లక్షల ఆయకట్టుకు నీరు..: మల్లన్నసాగర్ రిజర్వాయర్ కింద మెదక్ జిల్లాలో 5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దీంతోపాటు ఇక్కడి నుంచి నల్లగొండ జిల్లాలోని గంధమల, బస్వాపూర్‌లకు లింకేజీ ఉంది. అలాగే కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో నిర్మించనున్న 7 రిజర్వాయర్లకు మల్లన్నసాగర్ నుంచే నీటిని తరలించేందుకు ప్రణాళిక రూపొందించారు. మరోవైపు సింగూరు ప్రాజెక్టుకు, నిజాంసాగర్ ఆయకట్టు స్థిరీకరణకు మల్లన్నసాగర్ నుంచే నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 13 లక్షల ఆయకట్టుకు నీరందించనున్నారు. ఈ భారీ నిర్మాణానికి 13,970 ఎకరాల భూ సేకరణ అవసరమవుతోంది. మూడున్నరేళ్లుగా భూ సేకరణ పనులు జరుగుతున్నా, నిర్వాసితుల నుంచి వచ్చిన అభ్యంతరాలు, కోర్టు కేసుల నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతూ వస్తోంది. ఇందులో అత్యంత కీలకంగా వేములఘాట్, తొగిట, ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామాల్లో భూ సేకరణ జరగక పనులు మొదలు కాలేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ గ్రామాల పరిధిలోని నిర్వాసితులతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో వెయ్యి ఎకరాలకు గానూ 900 ఎకరాలను ఎకరం రూ.7.75 లక్షల చొప్పున కొనుగోలు చేశారు. కేవలం మరో 100 ఎకరాల సేకరణ మాత్రమే మిగిలి ఉంది. ఈ సేకరణ పూర్తయిన వెంటనే ప్రాజెక్టు పనులు మొదలు కానున్నాయి. ఇప్పటికే రిజర్వాయర్ పనులకు సంబంధించి రూ.6,805 కోట్లతో టెండర్ల ప్రక్రియ పూర్తయింది. రిజర్వాయర్ నిర్మాణంలో ఏకంగా 13 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర మట్టి పని, 60 మీటర్ల ఎత్తుతో కట్ట నిర్మాణం చేయాల్సి ఉంది. ఈ పనుల పూర్తికి రెండున్నరేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. -
మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాదే
సిద్దిపేట జోన్: ‘ఈ మట్టిలో పుట్టి.. ఈ మట్టిలోనే కలసిపోయేవాళ్లం. మీ గురించి ఆలోచించే బాధ్యత మాపై ఉంది. ఎక్కడో హైదరాబాద్‌లో ఉండేవారు భవిష్యత్తులో మీ గురించి ఆలోచించరు. తెలంగాణను సస్యశ్యామలం చేసే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆస్తులు, భూములు ఇచ్చిన మీరంతా మా ఆత్మీయులే. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాదే. మీ మంచి మనసుకు శిరస్సు వంచి వందనం చేస్తున్నా’అని నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ భవనంలో మల్లన్న సాగర్ రిజర్వాయర్ ముంపు గ్రామం వేములఘాట్ నిర్వాసితులకు మంత్రి రూ.17.10 కోట్ల పరిహారాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. మల్లన్నసాగర్ పరిధిలోని 8 గ్రామాల్లో 7 చోట్ల వందశాతం భూసేకరణ పూర్తయిందన్నారు. వేములఘాట్‌లో ఇప్పటి వరకు 80 శాతం భూసేకరణ జరిగిందని, మిగతా 20 శాతం కొద్ది మంది స్వార్థ రాజకీయాల వల్ల ఆగిందని తెలిపారు. వ్యక్తిగతంగా తమకు ఎవరిపైనా ద్వేషం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ అవసరాల కోసమే ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. రంగనాయకసాగర్ ప్రాజెక్ట్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయని.. త్వరలోనే నీరు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మల్లన్నసాగర్కింద 13 వేల ఎకరాల భూసేకరణ జరిగిందని.. ఇంకా 700 ఎకరాలు చేయాల్సి ఉందని చెప్పారు. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఆస్తులు ఇచ్చినవారిని ప్రభుత్వం కాపాడుకుంటుందన్నారు. ప్రతి ఇంటికి రూ.7.50 లక్షల ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, డబుల్ బెడ్రూం ఇళ్లు, ప్రాజెక్టులో చేపల ఆదాయంపై వాటా, హక్కులు కల్పిస్తామన్నారు. గజ్వేల్‌లో కొత్తగా ఇల్లు కట్టి ఇచ్చిన తర్వాతే.. పాత ఇల్లు ఖాళీ చేయాల్సి ఉంటుందని, పాత ఇంటికి కూడా డబ్బులు చెల్లిస్తామని హరీశ్ భరోసా ఇచ్చారు. ప్రాజెక్ట్‌పై జరుగుతున్న గోబెల్స్ ప్రచారాన్ని నమ్మవద్దని, ప్రాజెక్ట్ నిర్మాణ పనుల పురోగతిని చూడాలన్నారు. భూసేకరణలో భాగంగా చివరి ప్రయత్నం చేస్తున్నామని, అవసరమైతే ఆ కొద్ది మంది కోసం కోర్టులో డబ్బు డిపాజిట్ చేస్తామని వివరించారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ వల్ల నిజాంసాగర్, యాదాద్రిలోని గంధమల్ల, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలకు సాగునీరు, హైదరాబాద్‌కు తాగునీరు అందుతుందని వెల్లడించారు. పరిహారం డబ్బులను వృథా చేయవద్దని, వాటిని భూమిపై పెట్టుబడిగా పెట్టాలని హరీశ్‌రావు సూచించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఆర్డీఓ ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కొమరవెల్లి మల్లన్నపై సినిమా
కొమురవెల్లి(సిద్దిపేట) : మల్లన్న జీవిత చరిత్ర ఆధారంగా గౌలికర్ శ్రీనివాస్ దర్శక, నిర్మాణంలో నిర్మిస్తున్న సినిమా షూటింగ్ నాలుగో షెడ్యూల్ ప్రారంభించారు. గురువారం కొమురవెల్లి మండలకేంద్రంలో పలువురు సినిమా నటులు, సీరియల్ నటులు షూటింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా దర్శకులు గౌలికర్ శ్రీనివాస్ మాట్లాడుతూ మల్లన్న జీవిత చరిత్రపై నిర్మిస్తున్న సినిమాను 7 షేడ్యూల్లలో 7 సెట్లలలో తీస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 60శాతం షూటింగ్ పూర్తి చేసినట్లు తెలిపారు. మల్లన్న వేశాధరణ ప్రత్యేక పాత్రలో సినీనటుడు సుమన్, మిగతా మల్లన్న పాత్రను లాలాజీ ఘన్‌శ్యాం నటిస్తున్నట్లు తెలిపారు. సినిమాకు సహా నిర్మాతలుగా క్రాంతిక్రిష్ణా, మహేందర్‌రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్‌గా కె.నవీన్మాధవ్, కోరియోగ్రాఫర్లుగా శ్యామిల్, జోజో, ఘన్‌శ్యాం, సంగీతం విజయ్ కూరకాల, విజువల్ ఎఫెక్టŠస్ శ్రీనివాస్, ముఖ్య తారాగణం ఆనంద్ భూపతి, శ్రీదేవి, కుమార్ మిట్టపల్లి, సహకారం మందాల బాబు, మందాల శేఖర్, సిద్దిపేట శ్రీనివాస్‌లతో పాటు పలువురు నటులు పాల్గొన్నారు. -
వాటి ఫలితమే టీఆర్ఎస్ విజయం: కోదండరామ్
డల్లాస్: ఎన్నికలను మేనేజ్ చేయడం వల్లగానీ, మీడియాను మేనేజ్ చేయడంతోగానీ రాజకీయ పార్టీలు విజయాలు సాధించలేవని ప్రొఫెసర్ కోదండరామ్ అభిప్రాయపడ్డారు. డల్లాస్‌లో తెలంగాణ ఎన్ఆర్ఐలు నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్‌లో పాల్గొన్న సందర్భంగా కోదండరామ్ పలు అంశాలను ప్రస్తావించారు. ‘సామాజిక ఉద్యమాలు, ఘర్షణలు, కదలికలు, అప్పటి పరిస్థితులు ఎన్నికలకు మూలమని విశ్వసిస్తున్నాను. రాజకీయమంటే మీడియాను మేనేజ్ చేయడం, డబ్బులు పంచడం, ఎన్నికలను మేనేజ్ చేయడం కాదు. తెలంగాణ ప్రాంతంలోని సామాజిక పరిస్థితులు, ఉద్యమం, ఇతరత్రా కారణాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అదే కారణంగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ ఎన్నికల్లో విజయం సాధించింది. కానీ ఇప్పడు అలాంటి పరిస్థితులు లేవు. ఎన్నికల్లో నెగ్గిన ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ పార్టీ సైతం ప్రస్తుతం ఎన్నికల కోసం అభ్యర్థులను ఎలా కొనగలం, ఇతర పార్టీల నేతలను ఏ విధంగా మన పార్టీలోకి రప్పించాలని చూస్తున్నారు. ఎన్నికల్లో మన నిర్వహణ సామర్థ్యం ఎలా పెంచుకోగలమని ఆలోచిస్తున్నారు. తొలిదశ ఉద్యమకాలంలో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఉద్యమపార్టీ టీపీఎస్ నుంచి సాధారణ అభ్యర్థులు బరిలోకి దిగి.. కాంగ్రెస్‌ను ఓడించారు. అయితే ఆ సమయంలో పేపర్ తప్పా ఇతర మీడియా లేకున్నా ఆనాటి పరిస్థితుల కారణంగా టీపీఎస్ గెలుపొందింది. అప్పుడు ఎవరూ ఎన్నికలను గానీ, మీడియాను గానీ మేనేజ్ చేయలేదు. ఉద్యమం ఫలితంగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని సాధించుకున్న టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది. డీపీఆర్ చెప్పండి, చూపించాలని మల్లన్నసాగర్ ప్రాజెక్టు వివరాలు అడిగితే ఏ విషయాలు చెప్పడం లేదు. సాధారణ రైతులకు జవాబు చెప్పడం లేదు, సిటీ నుంచి వచ్చిన ఓ వ్యక్తి ప్లాన్ వివరాలు అడిగితే అలాంటివేం లేవు సార్.. ఆ కనిపిస్తున్న చోటు నుంచి ఇక్కడివరకూ భూమి తీసుకోవాలని చెప్పారని అధికారులు చెప్పారని గుర్తుచేశారు. మీకు గుర్తింపు ఉంది కానీ మీకు రాజకీయాలు రావు. అందుకే మీరు ఉంటే మాకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. మీరు ముందుండండి మేం పనులు చూసుకుంటామని కొందరు అన్నారు. ఎన్నికలను ప్రధానం చేసి ఆలోచిస్తున్నారు. మోసం, దగా తెలియాలి, మాయమాటలు చెప్పడం రావాలి అంటున్నారు. మరికొందరు మాత్రం మీతో డబ్బులు లేవు, మీ వల్ల ఇలాంటివి సాధ్యం కావని చెప్పారు. ఈ ఇద్దరినీ ఒక ప్రశ్న అడుగుతున్నాం. మేం ఉండాలంటారు.. కానీ పనులు మాత్రం మీరే చూసుకుంటాం అంటున్నారు. అలాంటప్పుడు మేం ఉండటం ఎందుకు అని ప్రశ్నించారు. మల్లన్న సాగర్‌లోకి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి, ఏం చేస్తారని అడిగితే వాటికి సమాధానం కరువైందంటూ’ ప్రొఫెసర్ కోదండరాం తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. -
గజ వాహనంపై మల్లన్న గ్రామోత్సవం
-
ఆ పరిహారంపై విచారణ చెల్లదు
సాక్షి, హైదరాబాద్: భూసేకరణ సమయంలో రైతుల అభ్యంత రాల్ని తెలుసుకోకుండా పరిహార చెల్లింపుపై విచారణ చేయడం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. సిద్దిపేట జిల్లా వేములఘాట్ గ్రామంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు భూమి ని సేకరించే ముందు రైతులు, భూసేకరణ వల్ల ప్రభావితుల అభ్యంతరాల్ని తెలుసుకు న్న తర్వాతే పరిహారంపై విచారణ జరపాల ని ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం తమ అభ్యంతరాల్ని పరిగణనలోకి తీసుకోవాలన్న నిబంధనను ఉల్లంఘించి పరిహార చెల్లింపు విచారణ చేయడం చెల్లదంటూ వేముల ఎల్లవ్వ మరో 22 మంది రైతులు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని న్యాయమూర్తి శుక్రవారం విచారించారు. ‘‘భూసేకరణ చట్టంలోని 19(1) ప్రకారం రైతుల అభ్యంతరాలు తెలుసుకోకుండా పరిహార చెల్లింపు విచారణ చెల్లదు. రైతులతోపాటు భూసే కరణ వల్ల ప్రభావితమయ్యే వారి అభ్యంతరాల్ని కూడా స్వీకరించాలి’’ అని తెలంగాణ ప్రభుత్వానికి న్యాయమూర్తి తేల్చి చెప్పారు. పిటిషనర్ల భూములే కాకుండా 600 మంది అభ్యంతరాల్ని అధికారులు పరిగణనలోకి తీసుకోకుండా పరిహార చెల్లింపుపై విచారణ జరుపుతున్నారని పిటిషనర్ల న్యాయవాది వాదించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో కొండం, ముంచిప్ప చెరువులను కలుపుతున్న పనుల్లో ఆచితూచి వ్యవహరించాలని ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి అధికారులకు మరో కేసులో ఆదేశాలు జారీ చేశారు. చెరువుల్ని కలపడం వల్ల రైతుల భూములతోపాటు అటవీ ప్రాంతం కూడా ముంపునకు గురవుతుందంటూ ముగుపాల్ మండలం ముంచిప్ప గ్రామస్తులు బానోతు ఈశ్వర్ సింగ్, మరో 60 మంది హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. విచారణ 18కి వాయిదా పడింది. -
భూ విలువల సవరణ ఉత్తర్వుల సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం సిద్దిపేట జిల్లా వేములఘాట్‌లో సేకరించనున్న భూములకు భూవిలువల సవరణ ఉత్తర్వులు అమలుకాకుండా హైకోర్టు నిలిపివేసింది. మార్కెట్ విలువలను సవరిస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ ఇటీవల ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి ఎమ్మెస్ రామచందర్‌రావు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. మార్కెట్ ధరకు అనుగుణంగా కలెక్టర్ జారీ చేసిన సవరణ ఉత్తర్వులు లేవని, భూసేకరణ చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా ఉత్తర్వులు ఇచ్చారని పేర్కొంటూ నర్సింహారెడ్డి, మరో 23 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కలెక్టర్ ఉత్తర్వుల్ని సస్పెండ్ చేసిన న్యాయమూర్తి.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. తమ వాదనలతో కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని ఆదేశించారు. -
గ్రామ సభ నిర్వహిస్తాం..
సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్ పరిధిలో నిర్మిస్తున్న మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం భూమిని సేకరించేందుకు చట్ట ప్రకారం గ్రామసభ నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నాకే భూ సేకరణను కొనసాగిస్తామని తెలిపింది. ప్రభుత్వ హామీని నమోదు చేసుకున్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మల్లన్నసాగర్ కోసం చేస్తున్న భూ సేకరణకు సంబంధించి పూర్తి వివరాలను తెలియజేయడం లేదని, అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు ప్రభుత్వం సమయం ఇవ్వడం లేదంటూ రైతు తిరుపతి, మరో 29 మంది రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ప్రాజెక్టుకు అనుమతులు రాక ముందే ప్రభుత్వం పనులు ప్రారంభించిందని పిటిషనర్ తరఫు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. జీవో 123 కొట్టేసిన తరువాత పలు గ్రామాల్లో 1,600 ఎకరాలను సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. ఈ విషయంలో పూర్తి వివరాలను తెలుగులో ఇవ్వాలని కోరినా పట్టించుకోవడం లేదని వివరించారు. ముందస్తు సమాచారం లేకుండా నోటీసులు జారీ చేశారన్నారు. అభ్యంతరాలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదన్నారు. గ్రామ సభ నిర్వహించకుండానే భూ సేకరణను ప్రభుత్వం కొనసాగిస్తోందని వివరించారు. అందువల్ల భూ సేకరణపై స్టే ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) డి.ప్రకాశ్‌రెడ్డి స్పందిస్తూ గ్రామ సభ నిర్వహణకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
పర్యావరణ అనుమతులు రాకుండా టెండర్లా?
మల్లన్నసాగర్‌పై హైకోర్టు సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు రాకుండానే టెండర్లు పిలవడంపై హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. అనుమతులు రానప్పుడు టెండర్ నోటిఫికేషన్ ఎలా జారీ చేస్తారో చెప్పాలని ఆదేశిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. పర్యావరణ అనుమతులు లేకుండా మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిందని, ఇది చట్ట విరుద్ధమంటూ వేములఘాట్‌కు చెందిన గండ్ల లక్ష్మి, మరో ఐదుగురు వేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది సీహెచ్ రవికుమార్ వాదనలు వినిపించారు. -
రంగంలోకి కేసీఆర్
♦ ‘మల్లన్నసాగర్’ పెండింగ్ భూసేకరణపై దృష్టి ♦ మిగిలిపోయిన 1,250 ఎకరాల కోసం నిర్వాసితులతో సీఎం సమావేశం ♦ ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో నాలుగు గంటల పాటు చర్చలు ♦ ఆదుకుంటాం.. సహకరించాలంటూ సీఎం విజ్ఞప్తి ♦ ఉపాధి అవకాశాలు, డబుల్ బెడ్రూం ఇళ్లు ♦ రెండు పంటలు పండే భూములకు ప్రత్యేక పరిహారం ఇస్తామని హామీ గజ్వేల్ : జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారిన ‘మల్లన్నసాగర్’వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చేందుకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు రంగంలోకి దిగారు. పెం డింగ్‌లోని 1,250 ఎకరాల భూములను సేకరించి ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమం చేసే యత్నం మొదలుపెట్టారు. అందులోభాగంగా శనివారం ‘మల్లన్నసాగర్’ముంపు గ్రామం వేములఘాట్ నిర్వాసితులను సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌కు ఆహ్వానించి చర్చించారు. ఏడాదిగా పెండింగ్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం సిద్దిపేట జిల్లాలోని తొగుట మండలం వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, పల్లెపహాడ్, తొగుట, కొండపాక మండలం ఎర్రవల్లి, సింగారం పంచాయతీల పరిధిలో 17,430 ఎకరాల భూమి అవసరం. ఇందులో 2,500 ఎకరాలు అటవీభూమి కాగా.. మిగతా భూమి అంతా రైతులదే. మంత్రి హరీశ్‌రావు పలుమార్లు ముంపు గ్రామాల ప్రజలతో సమావేశమై 95 శాతానికిపైగా భూసేకరణను పూర్తి చేయించారు. ఇంకా వేములఘాట్ గ్రామంలో 1,150 ఎకరాలు, ఏటిగడ్డ కిష్టాపూర్‌లో 50, తొగుటలో మరో 50 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ముఖ్యంగా వేములఘాట్ గ్రామస్తులు భూసేకరణను నిరసిస్తూ, పలు డిమాండ్లతో 410 రోజులుగా దీక్షలు చేస్తున్నారు. ఆదుకుంటాం.. సహకరించండి! మల్లన్నసాగర్ నిర్వాసితులతో సుదీర్ఘంగా జరిగిన చర్చల్లో సీఎం కేసీఆర్ పలు హామీలు ఇచ్చినట్లు తెలిసింది. ప్రభుత్వం తరఫున స్వయం ఉపాధి, కులవృత్తులకు ఉపాధి కల్పిస్తామని.. గేదెలు అందజేస్తామని, డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని గ్రామానికి పంపి రెండు పంటలు పండే భూముల వివరాలతోపాటు పూర్తి స్థాయిలో ఇతర సమాచారాన్ని సేకరిస్తామని.. 2 పంటలు పండే భూముల నిర్వాసితులను ప్రత్యే కంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చినట్లు తెలిసిం ది. దశాబ్దాలుగా నీటి గోసతో అల్లాడుతున్న తెలం గాణ సస్యశ్యామలం కావాలంటే ప్రాజెక్టుల నిర్మాణ మే శరణ్యమని.. ‘మల్లన్నసాగర్’నిర్మాణానికి సహక రించాలని సీఎం కేసీఆర్ కోరినట్లు సమాచారం. బాధితులను ఆదుకునే విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని హామీ ఇచ్చారని.. ఇక ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం చేస్తా మని, అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. కాగా మల్లన్నసాగర్ భూనిర్వాసితులతో సీఎం భేటీ కావడంతో ఫామ్‌హౌస్ చుట్టూ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భూనిర్వాసి తులను ఫామ్‌హౌస్ గేటు వద్ద క్షుణ్నంగా తనిఖీ చేసి లోపలికి పంపించారు. నేరుగా సీఎం చర్చలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో నిర్మిస్తున్న ‘కొండపోచమ్మ సాగర్’రిజర్వాయర్ భూసేకరణ విషయంగా కూడా నిర్వాసితులు తొలుత ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో సీఎం కేసీఆర్ స్వయంగా చొరవ తీసుకుని నిర్వాసితు లతో నేరుగా చర్చలు జరిపారు. ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్న ‘మల్లన్నసాగర్’ వ్యవహారంపై దృష్టి సారించారు. మల్లన్నసాగర్ నిర్వాసితులను శనివారం చర్చలకు ఆహ్వానిం చారు. దీంతో వేములఘాట్ గ్రామానికి చెందిన వంద మందికిపైగా రైతులు, ఏటిగడ్డ కిష్టాపూర్ నుంచి కొందరు రైతులు వచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మొదలైన చర్చలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగాయి. సీఎంతోపాటు సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, గజ్వేల్ డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేకాధికారి హన్మంతరావు, సిద్దిపేట ఆర్డీవో ముత్యంరెడ్డి తదితరులు కూడా చర్చల్లో పాల్గొన్నారు.