Minister Harish Rao
-
తెలంగాణ ద్రోహులంతా ఒక్కటయ్యారు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణను దెబ్బ తీయడానికి, రాష్ట్రాన్ని ఆగం చేయడానికి కాంగ్రెస్, బీజేపీల ముసుగులో తెలంగాణ ద్రోహులంతా ఒక్కటయ్యారని మంత్రి టి.హరీశ్‌రావు ధ్వజమెత్తారు. శుక్రవారం సంగారెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘పవన్‌కల్యాణ్‌తో బీజేపీ చేతులు కలిపారు. షర్మిలమ్మ కాంగ్రెస్‌లో కలుస్తుందంటా.. వీరిద్దరూ తెలంగాణ ద్రోహులు కాదా. తెలంగాణ ప్రకటిస్తే భోజనం మానేసిన పవన్‌తో బీజేపీ చేతులు కలిపింది. తెలంగాణ అంటే సిగరేటా.. బీడీనా అన్న షర్మిల, కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తుందట. లోపల నుంచి చంద్రబాబు కూడా సపోర్టు చేస్తారంటా. ఓట్లు చీలవద్దని చంద్రబాబు తెలంగాణలో పోటీ చేయబోమని ప్రకటించారు. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ ద్రోహులంతా ఒక్కటవుతున్నారని అర్థమవుతోంది’అని విమర్శించారు. రేవంత్ క్రిమినల్ నం.4170 తెలంగాణ గెలవాలంటే ప్రజలు కేసీఆర్ పక్షాన నిలవాలని, తెలంగాణ ఓడాలంటే రేవంత్‌రెడ్డి క్రిమినల్ గ్యాంగ్‌కు మద్దతు ఇవ్వాలని హరీశ్‌రావు ఘాటుగా వాఖ్యానించారు. ఈ క్రిమినల్ గ్యాంగుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఓటుకు నోటు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా రూ.50 లక్షలతో దొరికిన రేవంత్‌రెడ్డే క్రిమినల్. ఆయన క్రిమినల్ నం.4170 బెయి ల్ మీద బయట ఉన్న ఖైదీ రేవంత్ అని చెప్పారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే తిప్పలు తప్పవు.. కాంగ్రెస్ పార్టీ రకరకాల కుట్రలతో బయలు దేరిందని, తప్పిపోయి ఆ పార్టీకి ఓటేస్తే తిప్ప లు తప్పవని హరీశ్‌రావు అన్నారు. ‘కర్ణాటకలో ఐదుగంటల కరెంటు కూడా ఉండటంలేదని వార్తలు వస్తున్నాయి. ఆ పరిస్థితి తెలంగాణలో కూడా వస్తుంది. సాఫీగా కేసీఆర్ పాలన జరు గుతున్న ఈ తరుణంలో రిస్క్ ఎందుకో ఆలోచించుకోవాలి’అని ఆయన ప్రజలకు సూచించారు.] ఇదిలా ఉండగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిపైనా హరీశ్‌రావు విమర్శలు చేశారు. ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం రాజీనామా చేయాలని డిమాండ్ వచ్చినప్పటికీ కిషన్‌రెడ్డి పదవి పట్టుకుని వేలాడారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి బీఆర్ ఎస్ అభ్యర్థి చింత ప్రభాకర్, టీఎస్‌ఎంఎస్‌ఐ డీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
3 గంటలు కావాలా?.. 24 గంటలు కావాలా?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/రామన్నపేట/తుంగతుర్తి: ‘మీ ఇంటి ముందున్న అభివృద్ధిని చూడండి.. మీ కళ్ల ముందుండే అభ్యర్థిని చూసి బీఆర్ఎస్కు ఓటు వేయండి’ అని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. నకిరేకల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి లింగయ్యను గెలిపించి సీఎం కేసీఆర్‌ను హ్యాట్రిక్ సీఎంను చేయాలన్నారు. నకిరేకల్ పట్టణంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. హరీశ్‌రావు మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సిగ్గులేకుండా 3 గంటల కరెంట్ చాలని మాట్లాడారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వస్తే 3 గంటల కరెంటే ఉంటుందని, బీఆర్ఎస్ వస్తే 24 గంటలు వస్తుందని, ఏది కావాలో ప్రజలు ఆలోచించాలని సూచించారు. 3 గంటల కరెంటు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని, 24 గంటల కరెంటు కావాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలన్నారు. కోమటిరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్‌రెడ్డిలు పేర్లుకే పెద్దమనుషులు నల్లగొండ జిల్లాకు చెందిన కొందరు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని, వారు పేరుకే పెద్దమనుషులని హరీశ్ వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్లు పెద్దవే తప్ప వాళ్లు చేసే పనులు చిన్నవన్నారు. వారు జిల్లాను ఏనాడైనా పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వారి పాలనలో శవాన్ని కాల్చేసి స్నానం చేద్దామంటే కరెంట్ లేని పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిందన్నారు. ఆనాడు ఉచిత కరెంట్ అని ఉత్త కరెంట్ ఇచ్చారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది బీఆర్ఎస్ పార్టీయేనని, నకిరేకల్ అభివృద్ధి కొనసాగాలంటే ఎమ్మెల్యేగా లింగయ్యను గెలిపించాలని పిలుపునిచ్చారు. వంద రకాలుగా తెలంగాణకు ద్రోహం చేసిన కాంగ్రెస్ః జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రజల ముఖాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీదేనని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ‹Ùరెడ్డి అన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ వంద రకాలుగా ద్రోహం చేస్తే. బీఆర్ఎస్ ప్రభుత్వం వంద మంచి పనులు చేసిందన్నారు. ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే మేనిఫెస్టో వస్తుంది ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే విధంగా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో రాబోతుందని హరీశ్‌రావు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి 35 నియోజకవర్గాల్లో అభ్యర్థులు కరువయ్యారని, మనం పనికిరారంటూ పక్కన పెట్టిన వారిని పార్టీలో చేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ వాంరటీ అయినా గ్యారంటీ అయినా కేసీఆరే తెలంగాణ వాంరటీ అయినా గ్యారంటీ అయినా కేసీఆరే అని మంత్రి హరీష్‌రావు అన్నారు. తుంగతుర్తి సభలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌తో కలిసి మాట్లాడారు. అసెంబ్లీ టిక్కెట్లను కాంగ్రెస్ పార్టీ రూ.15కోట్లకు అమ్ముకుంటోందని ఆరోపించారు. రేపు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అమ్ముకుంటారని హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటల, నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలో, నకిరేకల్‌లో, సూ ర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి హరీశ్ శంకుస్థాపనలు ప్రారంబోత్సవాలు చేశారు. -
కాంగ్రెస్‌వి దొంగ డిక్లరేషన్లు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ ప్రకటించినవన్నీ దొంగ డిక్లరేషన్లేనని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. వాటిని నమ్మితే ప్రజలు నిలువునా మోసపోతారన్నారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు టౌన్షిప్లో జీహెచ్ఎంసీ నిర్మించిన డబుల్ బెడ్రూం గృహాలను గురువారం 4,800 మంది లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో హరీశ్‌రావు మాట్లాడు తూ కేసీఆర్ కిట్టు.. న్యూట్రీషియన్ కిట్టు.. ఎన్సీడీ కిట్టు.. ఇలా బీఆర్ఎస్ సర్కారు లబ్ధిదారులకు కిట్లు పంపిణీ చేస్తుంటే.. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలు తిట్లకే పరిమితం అవుతున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధిని చూసి సినీ నటుడు రజనీకాంత్ మెచ్చుకున్నప్పటికీ., ఇక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలకు చెందిన గజనీగాళ్లకు మా త్రం అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్ బెంగళూరును మించి పోయిందనీ, ఇప్పుడు ఈ రంగంలో దేశంలోనే హైదరాబాద్ నం.1 స్థానంలో నిలుస్తోందన్నారు. ఇచ్చే రూ.60 వేలల్లోనూ లంచాలు తీసుకునేవారు.. కాంగ్రెస్ హయాంలో ఇంటి నిర్మాణానికి ఇచ్చే రూ.60 వేలల్లోనూ ఆ పార్టీ నేతలు లంచాలు అడిగే వారని హరీశ్‌రావు ఆరోపించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎలాంటి లంచాలు లేకుండా ఇంటిని కేటాయిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ఒక్కొక్కరు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా నదీ జలాల్లో 90 టీఎంసీల నీటి వాటా మనకే దక్కిందని, పాలమూరు ఎత్తిపోతల పథకానికి కూడా అనుమతి తెచ్చుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, అరికెపూడి గాంధీ, దానం నాగేందర్, ప్రకాశ్‌గౌడ్, మాగంటి గోపీ నాథ్, సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ పాల్గొన్నారు. -
ఔను.. 6 నెలలకు సీఎం మారడం గ్యారంటీ
పెద్దశంకరంపేట (మెదక్) / కంగ్టి (నారాయణఖేడ్): కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ కార్డు పథకాలపై ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ కార్డులు అమలు కావని, ఆరు నెలలకు ముఖ్యమంత్రి మారడం మాత్రం గారంటీ అని విమర్శించారు. అదేవిధంగా 6 నెలలకు ఒక కర్ఫ్యూ, రైతులకు 6 గంటల కరెంటు, పరిశ్రమలకు వారానికి రెండు పవర్ హాలిడేలు ఉండటం మాత్రం గ్యారంటీ అని ఎద్దేవా చేశారు. మంగళవారం మెదక్ జిల్లా పెద్దశంకరంపేట, సంగారెడ్డి జిల్లా కంగ్టిలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఎలాగూ అధికారంలోకి రాలేమని తెలిసి కాంగ్రెస్ నేతలు కల్లగోల్లి మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఇక రెండో రాజధాని బెంగళూరు అవుతుందేమో ఎమ్మెల్యేలకు ఢిల్లీ హైకమాండ్ అవుతుందని, దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లాలంటే వయా బెంగళూరు మీదుగా వెళ్లాలని, ఇక బెంగళూరు మనకు రెండో రాజధాని అవుతుందని హరీశ్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హామీలు పోస్టుడేటెడ్ చెక్కులాంటివన్నారు. కర్ణాటకలో అధికారంలో ఉండి రూ.600లు పింఛన్ ఇస్తున్న ఆ పార్టీ.. తెలంగాణలో రూ.4000 ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమంటూ ప్రస్తుతం అక్కడ బస్సులు తగ్గించారన్నారు. బీఆర్ఎస్ 24 గంటలూ ఉచిత కరెంటు సరఫరా చేస్తుందని, గతంలో ఉచిత కరెంటు హామీ ఇచి్చన కాంగ్రెస్ అధికారంలో ఉండి ఉత్త కరెంటు ఇచ్చిందని మంత్రి గుర్తు చేశారు. కిట్లు ఇచ్చే వారు కావాలో, కేసీఆర్‌ను తిట్టే వారు కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు. త్వరలో బీఆర్ఎస్ నుంచి అద్భుతమైన మేనిఫెస్టో వస్తుందని వెల్లడించారు. -
హైదరాబాద్ లో కార్ఫ్యూ వస్తుంది: మంత్రి హరీష్ రావు
-
మాది స్లోగన్ సర్కార్ కాదు.. సొల్యూషన్ సర్కార్
లక్డీకాపూల్: మాది స్లోగన్ సర్కార్ కాదు.. సొల్యూషన్ సర్కార్ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీలు కేవలం నినాదాల పార్లు .. బీఆర్ఎస్ మాత్రమే నినాదాలను నిజం చేసే పార్టీ అని పేర్కొన్నారు. గురువారం –నిమ్స్‌లో ఏర్పాటు చేసిన ఆయుష్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్‌ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. నకిలీ హామీలు, వెకిలి చేష్టలతో ఆ రెండు పార్లు ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. అమిత్ షా, ఖర్గేలు పర్యాటకుల్లా వచ్చి.. అవగాహన లేమితో ఇక్కడి నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్లిపోయారన్నారు. గుజరాత్లో బీజేపీ గుడ్డి పాలనను దారిలో పెట్టడం చేతగాని అమిత్ షా ఇక్కడికి వచ్చి అర్థం పర్థం లేని ఆరోపణలు చేసి వెళితే ఎవరు నమ్ముతారని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో మూడు నెలలకే కాంగ్రెస్ తీరేమిటో తేలిపోయిందని, ముందుగా ఖర్గే తన సొంత రాష్ట్రాన్ని చక్కదిద్ది ఇక్కడ కొచ్చి మాట్లాడాలని సూచించారు. వివిధ పార్టీల డిక్లరేషన్లు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని..బీఆర్ఎస్కు మూడోసారి అధికారం ఇవ్వాలని ఎపుడో సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్నారని మంత్రి పేర్కొన్నారు. నిమ్స్‌లో ఆయుష్ ఏర్పాటు రాష్ట్రంలోనే తొలిసారి నిమ్స్‌లో ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందంటూ.. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిన సీఎస్ శాంతి కుమారికి హరీశ్‌రావు అభినందనలు తెలిపారు. ఈ తరహా వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం రాష్ట్రంలోనే తొలిసారన్నారు. ఆయుర్వేదం, యునాని, హోమియోపతి, సిద్ధ, ప్రకృతి వైద్యం.. అన్ని వైద్య విధానాలు ఇక్కడ ఒకే వేదికగా అందుబాటులో ఉంటాయని చెప్పారు. వికారాబాద్, భూపాలపల్లి, సిద్ధిపేటల్లో 50 పడకల కొత్త ఆయుష్ ఆసుపత్రుల నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. వచ్చే నెల రెండో వారంలో మరో 9 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. దీంతో కొత్తగా 900 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయని వివరించారు. త్వరలో మరో 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించి.. ప్రతి జిల్లాకూ ఒక మెడికల్ కాలేజీ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్ సృష్టించబోతుందని హరీశ్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, నిమ్స్ సంచాలకులు నగరి బీరప్ప, ఆయుష్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు. -
అవసరమైన చోట ఎక్కువమంది ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించే ప్రజారోగ్య సంచాలకుల విభాగాన్ని బలోపేతం చేయాలనే ఆలోచనతో హేతుబద్దికరణ చేపట్టాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. దీనిపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఏర్పాటు చేసిన కమిటీ ప్రతిపాదనల మేరకు గురువారం మార్గదర్శకాలు విడుదల చేస్తూ ఆ శాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వులు జారీచేశారు. ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని ఉద్యోగుల హేతుబద్దికరణ ప్రక్రియకు అనుమతించారు. రోగుల తాకిడికి అనుగుణంగా తగిన వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసుకునేలా మార్గదర్శకాలు రూపొందించారు. కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్‌లో ఇప్పటివరకు ఒక్క డీఎంహెచ్‌వో మాత్రమే ఉన్నారు. హైదరాబాద్‌లో ఇక ఆరుగురు డీఎంహెచ్వోలు పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత, భవిష్యత్ వైద్య అవసరాలు గుర్తించిన ప్రభుత్వం అదనంగా 5 డీఎంహెచ్వోలను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. చార్మినార్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోన్ల వారీగా వీటి ఏర్పాటుకు అంగీకరించింది. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం ఆరుగురు డీఎంహెచ్వోలు ఉంటారు. కొత్త డీఎంహెచ్వోలను కలుపుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 38 మంది ఉంటారు. ఇక రాష్ట్రంలో 636 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా, అందులో సిబ్బంది ఏకరీతిగా లేదు. వైద్యాధికారి, పర్యవేక్షక సిబ్బంది పోస్టులు ఏకరీతిగా పంపిణీ జరగలేదు. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది ఏకరీతిగా ఉండేలా ప్రస్తుతం పునర్వ్యవస్థీకరించారు. కొత్తగా 40 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కొత్తగా ఏర్పడిన 40 మండలాల్లో పీహెచ్‌సీలు లేవు. వీటిలో 40 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది. గతంలో 30 మండలాల్లో ఉన్న పీహెచ్‌సీలను ఆసుపత్రులుగా అప్‌గ్రేడ్ చేశారు. ఈ ప్రదేశాలలో ఔట్రీచ్ కార్యకలాపాలు సీహెచ్‌సీలతో నిర్వహి స్తున్నారు. అయితే అన్ని సీహెచ్‌సీలను తెలంగాణ వైద్య విధాన పరిషత్‌కు బదిలీ చేయడం వల్ల, ఔట్రీచ్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఈ ప్రదేశాలలో పీహెచ్‌సీల అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో 30 మండలాల్లో పీహెచ్‌సీలను మంజూరు చేశారు. రాష్ట్రంలోని 235 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (యూపీహెచ్సీ)లను బలోపేతం చేయడానికి, తగిన సిబ్బందిని నియమించాలని నిర్ణయించింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో డెంటల్ అసిస్టెంట్ సర్జన్ల సేవలు వినియోగించేందుకు వీలుగా, డెంటల్ అసిస్టెంట్ సర్జన్లను టీవీవీపీ ఆసుపత్రుల పరిధిలోకి తీసుకొచ్చారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ఉన్న ప్రభుత్వ టీబీ ఆసుపత్రిని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి తీసుకువచ్చారు. 4,246 ఎంపీహెచ్ఏ పోస్టులు మంజూరు 1,712 పోస్ట్‌లను సూపర్‌న్యూమరరీ పోస్ట్‌లుగా మార్చారు. మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (మహిళ) కేడర్ ఈ హేతుబద్ధీకరణలో కవర్ చేయలేదు. దాంతో పీహెచ్‌సీలు, ఇతర సంస్థలలో మంజూరు చేసిన ఎంపీహెచ్ఏ (ఎఫ్) పోస్టుల స్థానం మారదు. దాంతో 4,246 ఎంపీహెచ్ఏ (మహిళ) పోస్టులను మంజూరు చేశారు. అయితే ఈ పోస్టులకు సంబంధించిన స్పష్టతను వైద్య, ఆరోగ్యశాఖ ఇవ్వలేదు. మార్గదర్శకాల్లో కొంత గందరగోళం ఉందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. కాగా, ఈ హేతుబద్ధీకరణ ప్రక్రియలో రోగుల తాకిడికి అనుగుణంగా, అవసరాల మేరకు సిబ్బందిని స్థానచలనం చేయడానికి ప్రభుత్వం వీలు కలి్పంచింది. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి మూడు నెలల గడువు విధించింది. -
రుణమాఫీలో రికార్డు
సాక్షి, హైదరాబాద్: రైతుల పక్షాన నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం కేవలం తెలంగాణలో మాత్రమే ఉందని, పదేళ్ల కాలంలో రెండుసార్లు రైతులకు పంట రుణాలు మాఫీ చేసి రికార్డు సృష్టించిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. కరోనా వల్ల రాష్ట్రానికి ఆదాయం తగ్గినప్పటికీ రైతుల ప్రయోజనం కోసం రుణమాఫీ అమలు చేస్తున్నట్లు చెప్పారు. తాజాగా రాష్ట్రంలోని 37 లక్షల మందికి రూ.20,141 కోట్ల మేర రుణమాఫీ చేసే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటివరకు రూ.99,999 వరకు రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ అమలు చేశామని, రూ.16.66 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.8,098 కోట్లు జమ అయ్యాయని వివరించారు. రుణమాఫీ, రెన్యువల్ తీరును పరిశీలించేందుకు టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తామని, ఇందులో ఆర్థిక, వ్యవసాయ శాఖ కార్యదర్శులు, బ్యాంకింగ్ రంగ ప్రతినిధులు ఉంటారని తెలిపారు. సోమవారం బేగంపేటలోని వివాంటా హోటల్లో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం(ఎస్ఎల్బీసీ) జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఆ ఘనత ముఖ్యమంత్రిదే..! దేశంలో పలు రాష్ట్రాలు రుణమాఫీ అంశంపై అనేక పరిమితులు విధించాయని, కానీ ఎలాంటి నిబంధనలు లేకుండా రుణమాఫీ అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మాత్రమే అని హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ మినహా మరే రాష్ట్రం కూడా పూర్తిస్థాయిలో రైతులకు రుణమాఫీ చేయలేదని పేర్కొన్నారు. రుణమాఫీతో రైతుకు భారీ ఊరట లభిస్తుందని అన్నారు. ఒకవేళ రైతు రుణ మొత్తాన్ని చెల్లించి ఉంటే ఆ మేరకు నగదును రైతుకు ఇవ్వాలని సూచించారు. కొందరు రైతులకు బ్యాంకుల్లో వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు వంటి పాత రుణాలు ఉండొచ్చని, ఇప్పుడు వచ్చిన డబ్బులను పాత అప్పు కింద జమ చేయకూడదని స్పష్టం చేశారు. రుణమాఫీ ప్రక్రియను నెలరోజుల్లోగా పూర్తి చేసేలా బ్యాంకులు లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని సూచించారు. రైతు సంక్షేమం ధ్యేయంగా, ఆర్థిక భారాన్ని మోస్తూ రైతు రుణమాఫీని సీఎం కేసీఆర్ ప్రారంభించారని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. వ్యవసాయాన్ని నమ్ముకుంటే అభివృద్ధి సాధించలేమన్న అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి మార్చేశారని ప్రశంసించారు. -
జేపీ నడ్డా పర్యటన.. మంత్రి హరీష్‌రావు ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు రాగానే రాష్ట్రానికి టూరిస్ట్ నాయకులు క్యూ కడుతున్నారంటూ మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యం గురించి మా ప్రభుత్వం తపిస్తే.. అనారోగ్య రాజకీయాల కోసం ప్రతిపక్షాలు తపిస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు అధమ స్థానంలో ఉన్నాయి. అసత్యాలు ప్రచారం చేస్తే ఊరుకోం’’ అంటూ మండిపడ్డారు. ‘‘అభివృద్ధి, ఆరోగ్య రంగంలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణకు నీతులు చెబుతారు. బాధతో చెబుతున్నా.. ఇన్నేళ్ల స్వతంత్రంలో తల్లిబిడ్డల ఆరోగ్యాలకు కూడా మన దేశంలో భరోసా ఇవ్వలేకపోతున్నాం. ఇలాంటి అంశాల గురించి దేశ నాయకులు ఆలోచించాల్సింది పోయి రాజకీయాల గురించి ప్రతిసారీ మాట్లాడటం సిగ్గుచేటు’’ అంటూ మంత్రి దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్.. ఎంఎంఆర్, ఐఎంఆర్ గణనీయంగా తగ్గించి దేశానికి తెలంగాణను రోల్ మోడల్ చేశారు. మరొకరికి జన్మనిచ్చే అమ్మకు, ఊపిరిపోసుకునే బిడ్డ ఆరోగ్యానికి అనేక పథకాలు, కార్యక్రమాల ద్వారా కేసీఆర్ భరోసా ఇచ్చారు. మానవ సంపదే మహోన్నత సంపద అనే భావనతో సీఎం కేసీఆర్ పని చేస్తే, ఓట్లు, సీట్లే పరమావధిగా కొందరు విమర్శలు చేస్తుంటారు. నడ్డాలు, పాండేలు, సుఖ్విందర్ సింగ్ సుక్కు సహా, తెలంగాణకు వచ్చి నీతులు చెప్పే బిజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆలోచించుకోవాలి. ఇక్కడికి వచ్చి మా నుంచి నేర్చుకొని వెళ్లండి’’ అంటూ మంత్రి హరీష్‌రావు హితవు పలికారు. చదవండి: ఢిల్లీలో హీటెక్కిన తెలంగాణ పాలిటిక్స్.. హస్తినాలో ఏం జరుగుతోంది? -
కుర్రోకుర్రు.. కేసీఆర్ పీఎం.. హరీశ్‌రావు సీఎం
సాక్షి, సిద్ధిపేట: ఆత్మీయ సమ్మేళనంలో సిద్దిపేట అర్బన్ మండలం నాంచారిపల్లికి చెందిన చిన్నారి మైత్రి సభావేదికపై కుర్రో కుర్రు అంటూ మంత్రి హరీశ్‌రావుకు సోది చెప్పింది. హరీశ్‌రావుకు నరదృష్టి బాగా ఉందని పేర్కొంది. నరంలేని నాలుక 40 మాటలు అంటుందని.. అవన్నీ పట్టించుకోవద్దని సూచించింది. తన నోరు సత్యమే పలుకుతుందని.. తన మాట తప్పదంటూ దేశానికి కేసీఆర్ పీఎం కావాలనుకుంటే హరీశ్‌రావు రాష్ట్రానికి సీఎం కావాలని ఆ చిన్నారి సోది చెప్పింది. మండల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి తన్నీరు హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీకి చెందిన మేస్త్రీలు ఇటీవల తనను కలిసినప్పుడు తెలంగాణ అభివృద్ధిలో చెమట చుక్కలు కార్చిన ప్రతి ఒక్కరూ తమ బిడ్డలేనని చెప్పానన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఇక్కడే ఉండాలని వారికి సూచించానన్నారు. చదవండి: హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పి అల్లుడితో లాడ్జికి వెళ్లిన అత్త.. షాకింగ్ ట్విస్ట్! -
మంచి కాన్సెప్ట్ అనిపిస్తోంది
సిద్ స్వరూప్, కార్తికేయ రెడ్డి, ఇందు ప్రియ ప్రధాన పాత్రల్లో సూర్యనారాయణ అక్కమ్మ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘దోస్తాన్’. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు రిలీజ్ చేసి, మాట్లాడుతూ – ‘‘ఫస్ట్ లుక్ చూస్తుంటే మంచి కాన్సెప్ట్ ఉన్న కథను సెలక్ట్ చేసుకుని చిత్ర యూనిట్ సినిమా తీశారని అనిపిస్తోంది. ఈ సినిమాలో నటించిన అందరికీ మంచి పేరు వచ్చి, నిర్మాత సూర్యనారాయణకు పెద్ద హిట్‌గా నిలవాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ‘‘సిద్ స్వరూప్ అందించిన కథ నచ్చడంతో ఈ సినిమా చేశాం. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది’’ అన్నారు సూర్యనారాయణ. ‘‘మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలో నటించే చాన్స్ ఇచ్చిన సూర్యనారాయణ అక్కమ్మగారికి థ్యాంక్స్’’ అన్నారు సిద్ స్వరూప్. -
కాళేశ్వరం ప్రాజెక్ట్ తో రాష్ట్ర జీడీపీ పెరిగింది: హరీష్ రావు
-
ఆ విషయం బీజేపీ ఎంపీకి ముందే ఎలా తెలుసు?
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ దాడిని మంత్రి హరీష్‌రావు ఖండించారు. ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో ఎంఓటీ, మోడ్రన్ కిచెన్, దోబీఘాట్లను ప్రారంభించిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సీబీఐ నోటీసులు ఇస్తుందని బీజేపీ ఎంపీకి ఎలా తెలుసు? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పాలనను వదిలేసి ప్రతిపక్షాలను వేధిస్తోంది. 8 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను పడగొట్టారు. రాష్ట్రంలో పథకం ప్రకారం కుట్రలు చేస్తున్నారు. దర్యాప్తు సంస్థలు బీజేపీ జేబు సంస్థలుగా మారాయనే అనుమానం కలుగుతోందన్నారు. చదవండి: మునుగోడు ఉప ఎన్నిక: టికెట్ రెడ్డికా.. బీసీకా? కర్ణాటకలో కాంట్రాక్టు పనులకు 40 శాతం కమిషన్ ఇవ్వాలని అక్కడ కాంట్రాక్టర్ అసోసియేషన్ అంటుంది. అక్కడ ఎందుకు ఈడీ, సీబీఐ దాడులు ఎందుకు జరగవు అని హరీష్‌రావు ప్రశ్నించారు. మహారాష్ట్ర, బీహార్, ఢిల్లీతో పాటు నిన్న జార్ఖండ్‌లో బీజేపీ చేసిన నిర్వాకాన్ని అందరూ చూశారన్నారు. ప్రతిపక్షాలను లేకుండా చేయాలన్న ధోరణిలో బీజేపీ పనిచేస్తోందని దుయ్యబట్టారు. ఆ పార్టీని ఎవరు ప్రశ్నించినా వారిని టార్గెట్ చేస్తోందని, సీబీఐ, ఈడీలతో దాడులు చేయిస్తోందని హరీష్‌రావు ధ్వజమెత్తారు. -
గిరిజనుల మనోభావాలను కేద్రం దెబ్బ తీసింది: మంత్రి హరీష్ రావు
-
ఆరుసార్లు గెలిపిస్తే.. అవమానిస్తావా?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఆరుసార్లు గెలిపించిన హుజూరాబాద్ ప్రజలను ఈటల రాజేందర్ తన మాటలతో అవమానించాడని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం జమ్మికుంటలోని కొత్త వ్యవసాయ మార్కెట్లో నిర్వహించిన రెడ్డి ఆత్మీయ సమ్మేళనం సభలో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్దిరెడ్డి సుదర్శన్‌రెడ్డి, సతీశ్‌బాబు, రాసరి మనోహర్‌రెడ్డి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. హుజూరాబాద్‌లో రూ.కోటి వ్యయంతో చేపట్టిన రెడ్డి కమ్యూనిటీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌కు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం జమ్మికుంటలో ఈ సభ నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన దాదాపు 20 వేల మంది సభకు హాజరయ్యారు. సభలో మంత్రి హరీశ్‌రావు ఈటల రాజేందర్‌పై నిప్పులు చెరిగారు. ఇంతకాలం టీఆర్ఎస్లో ఉండి ఇటీవల పార్టీ మారిన ఈటల రాజేందర్, ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను విమర్శించడం ఏంటని మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ హుజూరాబాద్ ప్రజలను అవమానించడమేనని స్పష్టంచేశారు. బీజేపీ పంచన చేరిన ఈటల, చేతనైతే తెలంగాణకు విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీలను తీసుకురావాలని సవాలు విసిరారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటును సీఎం దృష్టికి తీసుకువెళ్తామని హరీశ్ హామీ ఇచ్చారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించి, కేసీఆర్‌కు అండగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. రెడ్డిలకు డబుల్ బెడ్రూం ఇళ్లు: గెల్లు చిన్నప్పటి నుంచి తమ కుటుంబానికి రెడ్డి సామాజికవర్గంతో అనుబంధం ఉందని హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తమ గ్రామంలో రెడ్డి సామాజికవర్గం నాయకుల సహకారంతోనే తన తల్లి సర్పంచ్‌గా గెలిచిన విషయాన్ని గుర్తుచేశారు. తనను మంత్రి నిరంజన్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాజకీయంగా ఎంతో ప్రోత్సహించారని తెలిపారు. తాను గెలిస్తే పేద ఓసీలకు డబుల్ బెడ్రూంలు ఇప్పించేందుకు కృషి చేస్తానని అన్నారు. కేసీఆర్‌ది రైతుసంక్షేమ ప్రభుత్వం: పోచారం సభకు ముఖ్యఅతిథిగా వచ్చిన స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను ఈ సభకు స్పీకర్ హోదాలో రాలేదని అన్నారు. కొంతకాలంగా తమ సామాజికవర్గంలో పేరు చివరన రెడ్డి అని పెట్టుకోకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిత్యం సామాజికసేవలో ముందుండే రెడ్లు తప్పకుండా పేర్లు పెట్టుకోవాల్సిందేనన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటు లాంటి ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టిందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఈ పథకాలు లేవు: నిరంజన్‌రెడ్డి 45 లక్షల ఎకరాలకు నీరిచ్చే కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం మూడేళ్లలో పూర్తి చేయడం రైతులపై కేసీఆర్‌కు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. రైతుబంధు, రైతుబీమా, ధాన్యం కొనుగోలు, రైతువేదికలు తదితర రైతు సంక్షేమ పథకాలు గుజరాత్లో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. మహిళలకు పెద్దపీట: సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ ఏర్పాటుకు ముందు రైతుల కష్టాలు తాము స్వయంగా చూశామని మంత్రి సబితారెడ్డి గుర్తు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ ఇస్తున్నారని, బాలికల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. రాజకీయాల్లో మహిళలు రాణించాలని 50 శాతం రిజర్వేషన్ తెచ్చారని, నామినేటెడ్ పోస్టుల్లోనూ 50 శాతం రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. -
ప్రజల దృష్టిలో చిల్లర కావద్దు
హుజూరాబాద్: ‘మిస్టర్ హరీశ్‌రావు! నీతోపాటు 18 ఏళ్లు పనిచేశాను. నీలాగే నేను కూడా ఉద్యమకారుడినే. నేను ఏనాడైనా ముఖ్య మంత్రి కావాలనుకున్నానా? కేవ లం మనుషులుగా గుర్తించమని అడిగింది మనిద్దరమే కదా? నన్ను మంత్రి పదవి నుంచి తీసేసినప్పు డు దళితుల భూములు ఆక్రమించుకున్నారని చెప్పారు. ఇప్పుడేమో ఈటల రాజేందర్, ముఖ్యమంత్రి కుర్చీకే ఎసరు పెట్టారని ఇక్కడి మహిళలతో చెబుతున్నావు. హరీశ్‌రావు.. నాపై చేసిన ఆరోపణలు నిజమేనని గుండెలపై చేయి వేసుకుని చెప్పగలవా? ఇంత నీచమైన స్థాయికి ఎందుకు దిగజారిపోయావు మిత్రమా? ఇలాంటి నీచమైన పనులు చేసి తెలంగాణ ప్రజల దృష్టిలో చిల్లర కాకు’అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ హితవు పలికారు. సోమవారం హుజూరాబాద్‌లో వివిధ పార్టీలకు చెందిన పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఈటల మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్‌లో డిపాజిట్ కోల్పో బోతోందని జోస్యం చెప్పారు. 2023కు హుజూరాబాద్ ఎన్నికలు రిహార్సల్ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మారావు, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు. -
ఎవరివైపు ఉంటారో ఆలోచించుకోండి: మంత్రి హరీశ్‌రావు
హుజూరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతున్న బీజేపీ వైపు ఉంటారో లేక ప్రభుత్వ ఆస్తులను కాపాడుతున్న సీఎం కేసీఆర్ వైపు ఉంటారో ఆలోచించుకోవాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సూచించారు. ఆర్టీసీకి ఏటా రూ. 2 వేల కోట్లు ఇచ్చి సీఎం కేసీఆర్ కాపాడుతుంటే కేంద్రం మాత్రం రైల్వే, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలను అమ్ముతోందని విమర్శించారు. శుక్రవారం హుజూరాబాద్‌లో రిటైర్డ్ ఉద్యోగుల కృతజ్ఞత సభలో మంత్రి హరీశ్ మాట్లాడుతూ సీఎం మంచి వేతన సవరణ చేసినందుకు రిటైర్డ్ ఉద్యోగులు కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారన్నారు. ‘మేము అమ్ముతున్నాం.. మీరు కూడా ప్రభుత్వరంగ సంస్థలను అమ్మితే బహుమానాలు ఇస్తాం’అని కేంద్రం రాష్ట్రానికి లేఖ రాసిందని హరీశ్ చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం యాదాద్రి, భద్రాద్రి లాంటి విద్యుత్ ఉత్పత్తి సంస్థలను నెలకొల్పి ఆస్తులు పెంచుతోందని వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏ రంగానికి మేలు చేసిందో చెప్పాలని హరీశ్ డిమాండ్ చేశారు. ఈటల గెలిస్తే ఆయనకే మేలు.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్ ప్రజలకు మేలు జరగాలని ఏమైనా రాజీనామా చేశారా? అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ఉప ఎన్నికలో ఒకవేళ ఈటల గెలిస్తే వ్యక్తిగా ఆయనకు మేలు జరుగుతుందని, కానీ ఇది ప్రజలకు నష్టమేనన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు శక్తివంతులని, ఒక్కొక్కరూ వంద మందిని ప్రభావితం చేయగలరన్నా రు. సమావేశంలో మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, నాయకులు రాజయ్య, వి. హన్మంత్‌గౌడ్, విష్ణుదాస్ గోపాల్‌రావు, మోహన్‌రావు, తదితరులు పాల్గొన్నారు. -
ఈటలకు ఓటమి భయం పట్టుకుంది
వీణవంక(హుజూరాబాద్): ‘‘ఈటల రాజేందర్‌కు ఓటమి భయం పట్టుకుంది, నేను నియోజకవర్గానికి వస్తే ఆయనకు అంత భయం ఎందుకు? పార్టీ ఆదేశిస్తే ఎక్కడికైనా వెళ్లి పనిచేస్తాను. ఈటల టీఆర్ఎస్ పార్టీలోకి మధ్యలోనే వచ్చిండు..మధ్యలోనే పోయిండు’’అని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం దేశాయిపల్లి క్రాస్‌లో గురువారం టీఆర్ఎస్ కార్యకర్తలు, సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. నాడు కేసీఆర్ ప్రజలకోసం రాజీనామా చేశారని, మరి ఈటల ఎవరికోసం ఎందుకోసం రాజీనామా చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు. రైల్వేలు, రోడ్లను అమ్మి వ్యవస్థను, ప్రభుత్వ ఆస్తులను బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. హుజురాబాద్ టీఆర్ఎస్ అడ్డా.. 2001లోనే అప్పటి కమలాపూర్ నియోజకవర్గంలో పార్టీ ఎంపీపీలు..జెడ్పీటీసీలు గెలిచిన చరిత్ర ఉందని, అప్పటికి ఈటల టీఆర్ఎస్ పార్టీలో చేరలేదని హరీశ్‌రావు గుర్తుచేశారు. హుజూరాబాద్ గులాబీ జెండా అడ్డా అని, పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపులో ఎలాంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యమ కారుడు, పేదింటి బిడ్డ అయిన శ్రీనివాస్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, దాసరి మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జెడ్పీ చైర్పర్సన్ విజయ, పాడి కౌశిక్‌రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు. -
మతతత్వపార్టీలో చేరి ఎర్రజెండా డైలాగులు
హుజూరాబాద్: బీజేపీ నేత, మాజీమంత్రి ఈటల రాజేందర్ మాటలకు, చేతలకు పొంతన ఉండదని, మతతత్వ పార్టీ అయిన బీజేపీలో చేరి, ఎర్రజెండా డైలాగులు కొడుతున్నారని రాష్ట్ర ఆర్థికమంత్రి టి.హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. రక్తసంబంధం కన్నా, వర్గసంబంధం గొప్పదని ఈటల అన్నారని, ఆ మాట మాట్లాడే అర్హత ఆయనకు లేదని హరీశ్ అన్నారు. వర్గ సంబంధమైన పార్టీని కాదని, మత సంబంధమైన పార్టీలో చేరింది ఎవరని నిలదీశారు. ఎప్పడు మాట్లాడినా తనది వామపక్ష భావజాలం, లెఫ్ట్ ఇజం అని చెప్పుకునే ఈటల బీజేపీలో చేరి ఆత్మవంచన చేసుకున్నారని విమర్శించారు. ఆదివారం హుజూరాబాద్‌లో ప్రజా ఉద్యమనాయకుడు పులవేని పోచమల్లు యాదవ్ టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హరీశ్ మాట్లాడారు. ఈటల పెట్టిన కష్టాలు, నష్టాలు భరించలేక పోచమల్లు టీఆర్ఎస్లో చేరారని తెలిపారు. ఏడేళ్లు మంత్రిగా ఉండి నియోజకవర్గంలో ఏమీ చేయలేని ఈటల బీజేపీ నుంచి గెలిస్తే అభివృద్ధిని ఎలా సాధిస్తారని ప్రశ్నించారు. హుజూరాబాద్ ప్రజలు అభివృద్ధి, సంక్షేమం కోరుకుంటున్నారని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయని అన్నారు. శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమంలో పనిచేశారని, పోలీసుల రబ్బర్ బుల్లెట్లకు అడ్డంగా ఉరికారని గుర్తు చేశారు. ఈటల ఓటమి ఖాయమని, తల కిందకు, కాళ్లు మీదకు పెట్టినా గెలిచే ప్రసక్తే లేదని అన్నారు. ఇప్పటికే గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయమైందని, ఇక మెజార్టీ ఎంతనేది తెలాల్సి ఉందని అన్నారు. ఈటల చారాణ బీసీ.. బారాణ రెడ్డి: గంగుల ఈటల ఏనాడూ బీసీలాగా ప్రవర్తించలేదని, అందుకే ఆయన చారాణ బీసీ, బారాణ రెడ్డి అని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఎద్దేవా చేశారు. అసలు సిసలైన బీసీ బిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించుకోవాలని, ఆయన కేసీఆర్ విడిచిన బాణం అని అన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మికాంతారావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీష్‌కుమార్, పాడి కౌశిక్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అపోహలొద్దు.. అందరికీ దళితబంధు
హుజూరాబాద్ /సాక్షి, కరీంనగర్: అర్హులైన వారందరికీ దళితబంధు అందజేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ఈ పథకంపై ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దని కోరారు. శనివారం హుజూరాబాద్‌లో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి హరీశ్ మీడియాతో మాట్లాడారు. దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఈనెల 16న హుజూరాబాద్ మండలంలోని శాలపల్లిలో సీఎం ప్రారంభించనున్నట్లు చెప్పారు. హుజూరాబాద్‌లోని ప్రతి దళిత కుటుంబానికీ ఈ పథకాన్ని అందిస్తామని స్పష్టం చేశారు. దళిత బంధును ఇక్కడ అమలు చేయడానికి రూ.2 వేల కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ నిధులతో 20 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. రైతు బంధు ఇక్కడినుంచి ప్రారంభించినప్పుడు కూడా.. కొందరికే వస్తుందని, ఎన్నికల కోసమే ఇస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. రైతు బంధు ఇదే నియోజకవర్గంలో ప్రారంభించినప్పుడు చప్పట్లు కొట్టిన కొందరు నాయకులు, ఇవాళ దళిత బంధు ప్రారంభిస్తుంటే అదే చేతులతో గుండెలు బాదుకుంటున్నారని అన్నారు. ఎన్నికల కోసం ఈ పథకం తెచ్చారంటున్నారని, కానీ బడ్జెట్ సమావేశాల సందర్భంగానే ఈ పథకం గురించి చెప్పామని హరీశ్ గుర్తుచేశారు. మార్చిలోనే ఈ కొత్త పథకాన్ని సీఎం ప్రకటించారని చెప్పారు. కేంద్రం రూ.40 లక్షలు ఇస్తే సంతోషిస్తాం ‘ఎంపీ బండి సంజయ్ రూ.50 లక్షలు ఇవ్వాలంటున్నారు. మాకు చేతనైనంత మట్టుకు రూ.10 లక్షలు ఇస్తున్నాం. మరో రూ.40 లక్షలు అదనంగా కేంద్రం నుండి తెచ్చిస్తే మీకు, మోదీకి ప్రజలు పాలాభిషేకం చేస్తారు. మొత్తంగా ప్రజలకు రూ.50 లక్షలు అందితే మేమెంతో సంతోషిస్తాం..’అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. సీఎం చేతుల మీదుగా 15 కుటుంబాలకు చెక్కులు 16న జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి 15 కుటుంబాలకు చెక్కులు అందజేస్తారని మంత్రి తెలిపారు. 16న మధ్యాహ్నం 2 గంటలకు సీఎం శాలపల్లికి వస్తారని, 4 గంటల వరకు సభ ఉంటుందని చెప్పారు. గ్రామసభలు నిర్వహించి.. సర్పంచ్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల సమక్షంలో ప్రజల మధ్యే అత్యంత పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, మేయర్ సునీల్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అత్యంత బీదలు తొలి లబ్ధిదారులు: సీఎస్ దళితబంధు అమలుపై శనివారం కలెక్టరేట్లో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్ బాల్కసుమన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, సీఎస్ సోమేశ్‌కుమార్, ఎస్సీ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, కలెక్టర్ కర్ణన్ తదితరులు సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎస్ విలేకరులతో మాట్లాడారు. అత్యంత బీదలైన దళితులను దళిత బంధు తొలి లబ్ధిదారులుగా ఎంపిక చేస్తామని చెప్పారు. అత్యంత పేదరికంలో ఉన్నవారితో మొదలుపెట్టి, అర్హులైన అందరికీ అందేలా చర్యలు చేపడతామన్నారు. సీఎం సభకు ఏర్పాట్ల పరిశీలన శాలపల్లిలో సీఎం సభ ఏర్పాట్లను మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ శనివారం పరిశీలించారు. ఐజీ నాగిరెడ్డి, సీపీ సత్యనారాయణకు పలు సూచనలు చేశారు. ఈ సభకు లక్షా 20 వేల మంది హాజరుకానున్నారు. సభకు దళితులను తీసుకురావడానికి 825 బస్సులను ఏర్పాటు చేశారు. -
మామ మెప్పు కోసం హరీశ్ ఆరాటం
ఇల్లందకుంట(హుజూరాబాద్): ‘నాతో 18 సంవత్సరాల అనుబంధాన్ని మరిచిపోయి.. మంత్రి హరీశ్‌రావు తన మామ కేసీఆర్ మెప్పు పొందడానికి ఆరాటపడుతున్నారు’అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. పచ్చి అబద్ధాలు మాట్లాడడంలో హరీశ్‌రావు మామ కేసీఆర్‌ను మించిపోయారని ఎద్దేవా చేశారు. గురువారం ఈటల కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హరీశ్‌రావు ఎంత ఆరాటపడ్డా కేసీఆర్ నమ్మరని పేర్కొన్నారు. 2018 ఎన్నికల్లో తనతోపాటు మరో 11 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఓడించడానికి కేసీఆర్ డబ్బులు పంపారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆర్థిక శాఖకు మంత్రిగా ఉన్న తాను.. తన శాఖ నుంచే ముఖ్యమంత్రికి జీతం ఇచ్చానని.. అలాంటి తాను నియోజకవర్గ అభివృద్ధిని ఎలా విస్మరిస్తానని ఆవేదన వ్యక్తం చేశారు. మూడుసార్లు మంత్రులతో కలసి ప్రగతి భవన్‌కు వెళ్తే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానపరిచారని పేర్కొన్నారు. 2003లో తనకున్న ఆస్తులెన్ని.. ఇప్పుడున్న ఆస్తులెన్నో తేల్చేందుకు సీబీఐతో విచారణకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. అదే సమయంలో ‘మీ ఆస్తులపై కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపేందుకు సిద్ధమా’అని నిలదీశారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కాకుండా మిగతా ఎక్కడా 2 వేలకు పైగా డబుల్ బెడ్రూం ఇళ్లు లేవని, అవి కూడా ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో కాంట్రాక్టులు తీసుకున్న వారు పూర్తి చేశారని తెలిపారు. అబద్ధాలు మాట్లాడితే దుబ్బాకలో ప్రజలు ఏ విధంగా కర్రు కాల్చి వాతపెట్టారో.. హుజూరాబాద్‌లో కూడా అలాగే చేస్తారని హెచ్చరించారు. సంక్షేమ పథకాలకు తాను వ్యతిరేకం కాదని, ఆ ఫలాలు నిజమైన లబ్ధిదారులకు మాత్రమే చేరాలని చెప్పానని వెల్లడించారు. హుజూరాబాద్, జమ్మికుంటలను అద్దంలా మార్చాలని రూ.25 కోట్ల చొప్పున జీవో తెస్తే, కేటీఆర్ నిధులు ఆపారని పేర్కొన్నారు. అది ప్రగతి భవన్ కాదు.. బానిసలకు నిలయమని రాసుకోమని ఎంపీ సంతోష్‌కుమార్‌కు చెప్పానని, రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఈటల అన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఈటల గెలిస్తే లాభమేంటి?
సిద్దిపేటజోన్: హుజూరాబాద్‌లో బీజేపీ ఏం చెప్పి ఓట్లు అడుగుతుందని, పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలను పెంచామని చెప్పి ఓట్లు అడుగుతారా అని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ గెలిస్తే ప్రజలకు వచ్చే లాభం ఏమిటని, ఆయన గెలిచినా నియోజకవర్గ అభివృద్ధి ఏమీ ఉండదన్నారు. వ్యక్తి ప్రయోజనమా.. హుజూరాబాద్ ప్రజల ప్రయోజనమా అనే అంశంపై చర్చ పెట్టాలని సోషల్ మీడియా వారియర్స్‌కు ఆయన సూచించారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలో టీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్‌తో నిర్వహించిన రాష్ట్రస్థాయి సమావేశంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. నాడు హుజూరాబాద్‌లో రైతుబంధును ప్రారంభిస్తే చప్పట్లు కొట్టిన ఈటల, నేడు అక్కడే దళితబంధు ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటిస్తే గుండెలు బాదుకొని గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. దళిత బంధును ఆపేందుకు బీజేపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని, అందుకే తొందరగా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసి ఒత్తిడి తెస్తున్నారన్నారు. దళితబంధు హుజూరాబాద్ ప్రజలకు ఇవ్వద్దంటారా? దీనిపై బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దళితబంధు పథకం ఎన్నికల కోసం అంటున్నారని, మార్చి నెలలోనే బడ్జెట్లో దళితుల అభ్యున్నతికి రూ.1,200 కోట్లతో దళిత ఎంపవర్మెంట్ స్కీంను అసెంబ్లీలో ప్రకటించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎర్రోళ్ల శ్రీనివాస్, గెల్లు శ్రీనివాస్, కౌశిక్ రెడ్డి, వివిధ జిల్లాల టీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. -
దమ్ముంటే కేసీఆర్,హరీశ్‌రావు నాపై పోటీచేయాలి:ఈటల
హుజూరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో దమ్ముంటే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు తనపై పోటీచేయాలని మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. ఉరుములు వచ్చినా.. పిడుగులు పడినా తన గెలుపును ఎవరూ ఆపలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం చెల్పూర్లో బీజేపీలో చేరిన దాదాపు 500 మంది ముదిరాజ్ కులస్తులకు ఈటల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ, ‘నన్ను బక్కపల్చటి పిలగాడు.. దిక్కులేని వాడని అనుకోవద్దు.. హుజూరాబాద్ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న బిడ్డను నేను’ అన్నారు. దళితబంధుతో రూ.10 లక్షలు ఇచ్చినా.. గొర్రెలిచ్చినా, కులాల వారీగా తాయిలాలిచ్చినా ప్రజల గుండెల్లో ఉంది తానేనని పేర్కొన్నారు. తాను పనిచేస్తేనే ఇక్కడి ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, జెడ్పీటీసీలుగా గెలిచారన్నారు. సీఎం కేసీఆర్‌కు దళితుల ఓట్ల మీద తప్ప, హుజూరాబాద్ దళితులపై ప్రేమ లేదని, ఆసరా పింఛన్లు, రేషన్‌కార్డులు ఇవ్వాలని కోరినందుకే తనపై కేసీఆర్ కోపం పెంచుకున్నారని తెలిపారు. కమ్యూనిటీ హాళ్లకు, ఆలయాలకు నిధులిస్తే తప్పులేదని, ఆ సొమ్మంతా ప్రజలదే అన్నారు. ఏమిచ్చినా తీసుకుని ఓటు మాత్రం పువ్వు గుర్తుకు వేయాలని ఈటల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
6 లక్షల మంది రైతులకు రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,850 కోట్ల మేర పంట రుణమాఫీ డబ్బులను జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రూ.25వేల నుంచి రూ.50 వేల లోపు పంట రుణాలున్న రైతుల రుణాలను మాఫీ చేస్తూ శుక్రవారం వ్యవసాయ శాఖ రెండు ఉత్తర్వులు జారీ చేసింది. రూ.50 వేల లోపు రుణాలన్నీ మాఫీ చేయాలని, బ్యాంకులు ఈ మొత్తాన్ని ఏ ఇతర బాకీ కింద జమ చేసుకోవద్దని ఆదేశించింది. ఆ సొమ్మును పూర్తిగా పంట రుణమాఫీ కిందే జమ చేయాలని స్పష్టం చేసింది. రుణమాఫీ జరిగిన రైతుల ఖాతాలను జీరో చేసి, కొత్తగా పంట రుణాలు ఇవ్వాలని సూచించింది. అంతకు ముందు ఇదే అంశంపై 42 బ్యాంకుల ప్రతినిధులతో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి బీఆర్కే భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, రూ.50 వేలలోపు రైతు రుణమాఫీకి సంబంధించి తగిన ఏర్పాట్లు చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. ఈ నెల 15వ తేదీన సీఎం కేసీఆర్ లాంఛనంగా రూ. 50 వేలలోపు రైతు రుణమాఫీని ప్రకటిస్తారన్నారు. అదే రోజు నుంచి ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,850 కోట్లు జమ అవుతాయన్నారు. రుణమాఫీ సొమ్ము జమ కాగానే ముఖ్యమంత్రి పేరుతో రైతు రుణం మాఫీ అయినట్లు లబ్ధిదారుల ఫోన్లకు ఎస్ఎంఎస్ వెళ్లాలని ఆదేశించారు. రైతు రుణమాఫీతో పాటు కొత్త పంట రుణానికి మీరు అర్హులని.. ఆ సందేశంలో తప్పకుండా పేర్కొనా లని సూచించారు. బ్యాంకులు సైతం రైతులకు రుణమాఫీ అయినట్లు స్పష్టమైన సందేశం పంపాలన్నారు. మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వానికి అన్ని బ్యాంకులు సహకరించాలన్నారు. ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా రైతులకు రుణ మాఫీ మొత్తం చేరవేయాలని కోరారు. -
చిన్నారులకు ‘పౌష్టికాహార కిట్స్
సిద్దిపేటజోన్: సిద్దిపేటలో అంగన్వాడీ పిల్లల కోసం మంత్రి హరీశ్‌రావు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. చిన్నారులకు కరోనా థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉందన్న వైద్యుల హెచ్చరికలతో వారిలో రోగనిరోధక శక్తి పెంపే లక్ష్యంగా ‘పౌష్టికాహారం కిట్స్’ పంపిణీని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నారు. కర్ణాటకలో సత్ఫలిస్తున్న ‘క్షీరభాగ్య’ తరహాలో చిన్నారుల్లో ఐరన్ లోపం, రక్తహీనత వంటి సమస్యలు అధిగమించే దిశగా ఇమ్యూనిటీ బూస్టర్ తరహాలో దీనిని రూపొందించారు. అన్నపూర్ణ ట్రస్ట్ సహకారం, దాతల తోడ్పాటుతో జిల్లాలోని చిన్నారులకు పౌష్టికాహారం అందించాలనుకుంటున్నారు. ఎన్ఐఎన్ నిర్ధారణతో... సిద్దిపేట జిల్లాలో ఆయా అంగన్వాడీ కేంద్రాల పరిధిలో గత ఏడాది జాతీయ పోషకాహర సంస్థ (ఎన్ఐఎన్) పర్యవేక్షణలో బృందాలు సర్వే చేసి చిన్నారులకు పోషకాహారలోపం ఉందని నిర్ధారించాయి. ఈ క్రమంలోనే కరోనా థర్డ్ వేవ్ రానుందని, ముఖ్యంగా చిన్నారులపై ప్రభావం చూపనుందని ప్రచారం సాగుతోంది. ఆరేళ్లలోపు చిన్నారుల పోషకాహారలోపం సరిదిద్ది బలవర్ధకమైన పౌష్టికాహారం అందించాలని మంత్రి హరీష్ సంకల్పించారు. ఈ నెల 8న స్థానిక ప్రభుత్వ ఇందిరానగర్ పాఠశాలలో దీనిని లాంఛనంగా ప్రారంభించనున్నారు. కిట్స్‌లో ఇలా ►జిల్లా మహిళ, శిశు సంక్షేమ శాఖ రికార్డుల ప్రకారం సుమారు 60 వేలమంది చిన్నారులు ఉండగా, వారిలో మూడేళ్ల నుంచి ఆరేళ్ల వయసులోపు ఉన్నవారు సుమారు 25 వేలు. ►వీరిలోని ప్రతి ఒక్కరికీ నెలకు 450 గ్రాముల పౌష్టికాహారం కిట్స్ పంపిణీ చేయనున్నారు. ►కిట్స్‌లో పాలు, షుగర్‌తో పాటు న్యూట్రీషియన్ పౌడర్, విటమిన్ సి, కాల్షియం, జింక్, ఐరన్, మెగ్నీషియం వంటివిS ఉంటాయి.