Monetary Policy Committee
-
ధరల భయం.. వడ్డీరేట్లు యథాతథం!
ముంబై: ద్రవ్య, పరపతి విధానాన్ని యథాతథంగా కొనసాగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం స్పష్టం చేసింది. దీనితో వరుసగా తొమ్మిదవసారి బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే బెంచ్‌మార్క్ వడ్డీరేటు– రెపో యథాతథంగా 6.5 శాతంగా కొనసాగనుంది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ రుణ రేట్లు దాదాపు యథాపూర్వం మున్ముందూ కొనసాగనున్నాయి. గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన (ఎంపీసీ) కమిటీ మూడురోజుల సమావేశ నిర్ణయాలు గురువారం వెలువడ్డాయి. 0.25 శాతం రేటు తగ్గింపునకు ఇద్దరు మొగ్గు గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీలో నలుగురు యథాతథ 6.5 శాతం రేటు కొనసాగించడానికి మొగ్గుచూపగా, పావు శాతం రేటు తగ్గింపునకు ఇద్దరు ఓటువేశారు. వీరిలో ఎక్స్టర్నల్ సభ్యులు జయంత్ వర్మతోపాటు అషిమా గోయల్ ఉన్నారు. ‘ఆహార ద్రవ్యోల్బణం తీవ్రత తాత్కాలికమే కావచ్చు. అయితే అధిక ద్రవ్యోల్బణం కొనసాగుతున్న ప్రస్తుత వాతావరణంలో ద్రవ్య విధాన కమిటీ దీనిని సహించబోదు’ అని పాలసీ ప్రకటనలో గవర్నర్ ఉద్ఘాటించారు. మారని వృద్ధి, ద్రవ్యోల్బణం అంచనాలు... ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వృద్ధి, ద్రవ్యోల్బణం అంచనాలను ఆర్బీఐ పాలసీ సమీక్ష వరుసగా 7.2 శాతం, 4.5 శాతాలుగా యథాతథంగా కొనసాగించింది. ఒకపక్క ద్రవ్యోల్బణాన్ని కట్టడిచేస్తూ మరోవైపు వృద్దికి ఊతం ఇచ్చే చర్యలను ఆర్బీఐ కొనసాగిస్తుందని గవర్నర్ స్పష్టం చేశారు. దీనికి దేశంలో తగిన వర్షపాతం దోహదపడుతుందని అన్నారు. 2024–25లో 4 త్రైమాసికాల్లో వృద్ది రేట్లు వరుసగా 7.1%, 7.2%, 7.3%, 7.2%గా కొనసాగుతాయన్నది పాలసీ సమీక్ష అంచనా. 2025–26 తొలి త్రైమాసికంలో (2026 ఏప్రిల్–జూన్) వృద్ధి 7.2%గా ఉంటుందని కూడా ఆర్బీఐ అంచనావేసింది. ఇక రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు త్రైమాసికాల్లో వరుసగా 4.9%, 4.4%, 4.7%, 4.3%గా ఉంటాయని విశ్లేషించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఈ స్పీడ్ 4.4%గా ఉంటుందన్నది ఆర్బీఐ అంచనా. 2% అటు ఇటుగా 4% వద్ద రిటైల్ ద్రవ్యోల్బణం ఉండేలా చూడాలని ఆర్బీఐకి కేంద్రం సూచిస్తోంది. పాలసీ ముఖ్యాంశాలు... → మందగమనంలో ఉన్నప్పటికీ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సవాళ్లను తట్టుకునే స్థాయిలోనే కొనసాగుతోంది. → దేశీయ ఆర్థిక, ఫైనాన్షియల్ వ్యవస్థలు పటిష్ట ధోరణిలోనే కొనసాగుతున్నాయి. → దేశంలోకి ఒక నిర్దిష్ట కాలంలో వచీ్చ–వెళ్లే విదేశీ నిధులకు సంబంధించిన కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) నిర్వహణ బాగుంది. → విదేశీ మారకద్రవ్య నిల్వలు 675 బిలియన్ డాలర్ల చరిత్రాత్మక గరిష్ట స్థాయిలో ఉన్నాయి. → 2024–25లో ఇప్పటి వరకూ రూపాయి తీవ్ర ఒడిదుడుకులతో కాకుండా ఒక నిర్దిష్ట స్థాయిలోనే కొనసాగుతోంది. → గృహ రుణాలతో సహా నిర్దేశించిన అవసరాలకు టాప్–అప్ను వినియోగించకపోవడం ఆందోళనకరమే. అయితే ద్వైపాక్షిక ప్రాతిపదికన సమస్యను పరిష్కరించడానికి చర్యలు కొనసాగుతాయి. → చెక్ క్లియరెన్స్‌ని వేగవంతం చేయడానికి చర్యలు ఉంటాయ్. → అక్టోబర్ 7 నుంచి 9 వరకూ తదుపరి పాలసీ సమీక్ష చేపట్టనున్నారు.అనధికార డిజిటల్ లెండింగ్పై ఉక్కుపాదం అనధికార సంస్థల ఆట కట్టించడానికి డిజిటల్ లెండింగ్ యాప్‌ల పబ్లిక్ రిపాజిటరీ ఏర్పాటు కానుంది. నియంత్రణలోని సంస్థలు (ఆర్ఈ) ఈ రిపోజిటరీలో తమ డిజిటల్ లెండింగ్ యాప్‌ల గురించిన సమాచారాన్ని నివేదించాలి. అలాగే ఎప్పటికప్పుడు సంబంధిత లావాదేవీల వివరాలను అప్డేట్ చేయాలి. అనధికార రుణ యాప్‌లను గుర్తించడంలోవినియోగదారులకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. యూపీఐ ద్వారా రూ.5 లక్షల వరకు పన్ను చెల్లింపులు యూపీఐ ద్వారా పన్ను చెల్లింపుల పరిమితిని ఒక్కో లావాదేవీకి రూ. లక్ష నుండి రూ. 5 లక్షలకు పెంచాలని పాలసీ నిర్ణయించింది. ఇది యూపీఐ ద్వారా పన్ను చెల్లింపులను మరింత సులభతరం చేయనుంది. ఇక యూపీఐ లావాదేవీలు చేయడానికి ఒక వ్యక్తి మరో వ్యక్తిని అను మతించడానికి సంబంధించి తాజాగా ‘డెలిగేటెడ్ పేమెంట్’ సదుపాయం ఏర్పాటు చేస్తుండడం మరో కీలకాంశం. బ్యాంక్ డిపాజిట్లు పెరగాలి ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గాల వైపు గృహ పొదుపులు మారడంపై శక్తికాంత దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకులు తమ విస్తారమైన బ్రాంచ్ నెట్వర్క్ ను ఉపయోగించుకోవడం, అలాగే వినూత్న ఉత్పత్తులు, సేవల ద్వారా డిపాజిట్లను సమీకరించాలని కోరారు.ఫుడ్ వెయిటేజ్‌పై సమీక్ష బెంచ్‌మార్క్ వడ్డీ రేటును నిర్ణయించేటప్పుడు ఆహార ద్రవ్యోల్బణాన్ని మినహాయించాలన్న తాజా ఆర్థికసర్వే సూచనలను గవర్నర్ దాస్ పరోక్షంగా తోసిపుచ్చారు. ద్రవ్య విధానాన్ని రూపొందించేటప్పుడు ఆర్బీఐ ఆహార ద్రవ్యోల్బణాన్ని విస్మరించబోదని స్పష్టం చేశారు. అయితే వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణంలో ఆహార వెయిటేజ్ 2011–12 నుంచి 46 శాతంగా కొనసాగుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, దీనిని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం తీరిది... అయితే రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం పూర్తి లక్ష్యాన్ని సాధించడంలో ఆహార ధరలు ఒడిదుడుకులు తీవ్ర అడ్డంకిగా మారుతున్నాయి. ఇదే అంశంపై ఆందోళన వ్యక్తంచేస్తూ ఆర్బీఐ 2023 ఫిబ్రవరి నుంచి యథాతథ వడ్డీరేట్ల వ్యవస్థను కొనసాగిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లను నిర్ణయించడంలో ఆర్బీఐ ఆహార ద్రవ్యోల్బణాన్ని చూడటం మానేయాలని ఇటీవలి ఆర్థిక సర్వే సూచించింది. అధిక ఆహార ధరలను ఎదుర్కోవటానికి పేదలకు కూపన్లు లేదా ప్రత్యక్ష నగదు బదిలీని ప్రభుత్వం అన్వేíÙంచాలని సర్వే పేర్కొంది. అధిక ఆహార ధరలు చాలా సందర్భాల్లో సరఫరాలకు సంబంధించిన సమస్యే తప్ప, డిమాండ్ ప్రేరితం కాదని కూడా సర్వే స్పష్టం చేసింది. అయితే ఈ సూచనను తాజాగా ఆర్బీఐ పక్కనబెట్టడం గమనార్హం. ఆహార ధరల కట్టడే ధ్యేయంఆహార ద్రవ్యోల్బణం ‘మొండిగా’ అధిక స్థాయిలోనే ఉంది. ధరల స్థిరత్వం లేకుండా, అధిక వృద్ధిని కొనసాగించలేము. ద్రవ్యోల్బణం కట్టడికి తగిన ద్రవ్య విధానాన్ని సెంట్రల్ బ్యాంక్ కొనసాగించాల్సిందే. నిరంతర ఆహార ద్రవ్యోల్బణం నుండి ఉత్పన్నమయ్యే సవాళ్లు, లేదా రెండవ దశ ప్రభావాలను నివారించడానికి అలాగే ఇప్పటివరకు సాధించిన ప్రయోజనాలను పరిరక్షించుకోవడానికి ఎంపీసీ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్నియంత్రణా మార్పులు హర్షణీయం ఆహార ద్రవ్యోల్బణాన్ని జాగ్రత్తగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. ఇక పాలసీలో ప్రతిపాదించిన కొన్ని నియంత్రణా పరమైన సంస్కరణలు హర్షణీయం. ముఖ్యంగా డిజిటల్ లెండింగ్ మార్కెట్ క్రమబద్ధీకరణ పాలసీ నిర్ణయాల్లో కీలకాంశం. యూపీఐ సేవల విస్తరణ, పారదర్శకతకు చర్యలను స్వాగతిస్తున్నాం. – దినేష్ ఖారా, ఎస్బీఐ చైర్మన్ -
ఊహించిందే జరిగింది.. ఆర్బీఐ సమావేశంలో ముఖ్యాంశాలు..
భారతీయ రిజర్వ్ బ్యాంక్ పరపతి విధాన కమిటీ సమావేశంలో రెపో రేటును 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. ఇలా రెపో రేటును మార్చకపోవడం ఇది వరుసగా తొమ్మిదోసారి. మార్కెట్ వర్గాలు కూడా ఈసారి ఎలాంటి మార్పులుండవనే భావించాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు సెప్టెంబర్‌లో జరిగే మానిటరీ పాలసీ సమావేశంలో కీలక వడ్డీరేట్లను తగ్గిస్తే, అందుకు అనువుగా ఆర్బీఐ వడ్డీరేట్లలో మార్పు చేసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్బీఐ సమావేశంలోని ముఖ్యాంశాలను గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.మానిటరీ పాలసీ సమావేశం(ఎంపీసీ)లో ద్రవ్యోల్బణం పోకడలు, ఆహార ద్రవ్యోల్బణం ఆందోళనలపై చర్చలు జరిగాయి.ఎంపీసీలోని మొత్తం ఆరుగురు సభ్యుల్లో నలుగురు రెపో రేటును యథాతథంగా ఉంచాలని నిర్ణయించారు. మరికొందరు 25 బేసిస్ పాయింట్లు కట్ చేయాలన్నారు.రెపో రేటును స్థిరంగా 6.50 శాతం వద్దే కొనసాగిస్తున్నాం.స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డీఎఫ్) రేటు: 6.25 శాతంమార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) రేటు, బ్యాంక్ రేటు: 6.75 శాతం2024-25 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జీడీపీ అంచనా 7.2%గా ఉంటుందని అంచనా. అది మొదటి త్రైమాసికంలో 7.3 శాతం నుంచి 7.2కి స్వల్పంగా తగ్గింది. రెండో త్రైమాసికంలో 7.2 శాతం, మూడు, నాలుగో త్రైమాసికంలో వరుసగా 7.3 శాతం, 7.2 శాతం వద్ద ఉంటుంది. ద్రవ్యోల్బణం 4.5 శాతం నమోదవుతుంది.జూన్-ఆగస్టులో (ఆగస్టు 6 వరకు) 9.7 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిలువలు భారత్‌కు వచ్చాయి.ఇదీ చదవండి: 15 రోజుల్లో రూ.24.57 కోట్లు చెల్లించాలిఏప్రిల్-మే 2024లో స్థూల ఎఫ్‌డీఐలు 20 శాతానికి పైగా పెరిగాయి.భారతదేశం విదేశీ మారక నిల్వలు ఆగస్టు 2,2024 నాటికి 675 బిలియన్ డాలర్లతో చారిత్రక గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.రుతుపవనాలు ఆలస్యంగా ప్రారంభమైనా ఆశించిన వర్షపాతం నమోదవుతుంది. దాంతో ఆహార ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటుంది.అనధికార రుణదాతలను కట్టడి చేసేందుకు డిజిటల్ లెండింగ్ యాప్‌ల కోసం పబ్లిక్ రిపోజిటరీని రూపొందించాలి.యూపీఐ ద్వారా చేసే పన్ను చెల్లింపుల పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు ఆర్బీఐ పెంచింది.చెక్ క్లియరెన్స్ సమయాన్ని గణనీయంగా తగ్గించేందుకు నిరంతర చెక్ క్లియరింగ్ వ్యవస్థ ఉండాలని చెప్పింది. -
RBI Monetary Policy 2024: ఆర్బీఐ ఏడోసారీ
ముంబై: ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే ఎక్కువ ఉండొచ్చన్న వాతావరణ శాఖ అంచనాలతో ఆహార ద్రవ్యోల్బణంపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ వరుసగా ఏడోసారీ కీలక వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. రెపో రేటును ప్రస్తుత 6.5 శాతం స్థాయిలోనే కొనసాగించాలని నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ ఈ మేరకు పాలసీ నిర్ణయం తీసుకుంది. దీంతో గృహ, వాహన రుణాలపై ఈఎంఐలు మరికొన్నాళ్ల పాటు స్థిరంగా ప్రస్తుత స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉంది. 2023 ఫిబ్రవరి నుంచి రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును మార్చలేదు. అంటే ఏడు ద్వైమాసిక సమావేశాల నుంచి ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో రేటు యథాతథంగా కొనసాగింది. తాజాగా రెపో రేటును యథాతథంగా ఉంచాలన్న ప్రతిపాదనను మానిటరీ పాలసీ కమిటీలోని (ఎంపీసీ) ఆరుగురు సభ్యుల్లో ఒకరు వ్యతిరేకించగా అయిదుగురు సభ్యులు సానుకూలత వ్యక్తపర్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి 7 శాతం స్థాయిలోనూ (2023–24లో 7.6 శాతం), ద్రవ్యోల్బణం 4.5 శాతం స్థాయిలోను (2023–24లో 5.4 శాతం) ఉంటుందన్న అంచనాలను ఆర్బీఐ కొనసాగించింది. ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.1 శాతంగా, ఆహార ధరల బాస్కెట్ ద్రవ్యోల్బణం 8.66 శాతంగా నమోదైంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణం క్యూ1లో 4.9 శాతం, క్యూ2లో 3.8 శాతం, క్యూ3లో 4.6 శాతం, క్యూ4లో 4.5 శాతం చొప్పున మొత్తం మీద సగటున 4.5 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేస్తోంది. కాగా విదేశాల నుంచి స్వదేశానికి పంపించే డబ్బుకు (రెమిటెన్స్) సంబంధించి భారత్ తొలి స్థానంలో ఉన్నట్లు ఆర్బీఐ పేర్కొంది. ► యూపీఐని వినియోగించడం ద్వారా త్వరలో బ్యాంకుల్లో నగదు డిపాజిట్ సౌకర్యం ► ప్రభుత్వ బాండ్లలో రిటైల్ భాగస్వామ్యం సులభతరానికి మొబైల్ యాప్ ప్రారంభం ► ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సెంటర్లో సావరిన్ గ్రీన్ బాండ్ల ట్రేడింగ్‌కు అనుమతి ► డాలర్ మారకంలో రూపాయి విలువ స్థిర శ్రేణిలో కదలాడుతోంది. ఆందోళక అక్కర్లేదు ► నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు వ్యవస్థాగతంగా ఎటువంటి ఇబ్బందులూ లేవు ► జూన్ 5 నుంచి 7 వరకూ 2024–25 ఆర్బీఐ రెండవ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష ► సీబీడీసీ వాలెట్లను అందించడానికి నాన్–బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లకు అనుమతి ► బ్యాంకింగ్ ద్రవ్య సంబంధ ఇబ్బందులు పడకుండా లిక్విడిటీ కవరేజ్ రేషియో సమీక్ష ► 2023–24లో ఎఫ్‌పీఐల పెట్టుబడులు 41.6 బిలియన్ డాలర్లు. 2014–15 తర్వాత అత్యధికం పసిడి నిల్వల పెంపు విదేశీ మారకద్రవ్య నిల్వల పటిష్టతలో భాగంగా పసిడి వాటాను భారత్ పెంచుకుంటుందని ఆర్బీఐ పేర్కొంది. మార్చి 29వ తేదీ నాటికి భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు ఆల్ టైమ్ హై 645.6 బిలియన్ డాలర్లకు చేరితే, అందులో పసిడి వాటా 51.487 బిలియన్ డాలర్లుగా ఉంది. సాగుపై చల్లని అంచనాలు తీవ్ర వేసవి, నీటి ఎద్దడి భయాందోళనల నేపథ్యంలో ఆర్బీఐ ఎకానమీపై చల్లని అంచనాలను వెలువరించింది. తగిన వర్షపాతం అంచనాల నేపథ్యంలో వ్యవసాయ, గ్రామీణ క్రియాశీలతలో సానుకూలతలు కనిపిస్తున్నాయని పేర్కొంది. ఆశించిన స్థాయిలో సాధారణ రుతుపవనాల అంచనాలు, మంచి రబీ గోధుమ పంట, ఖరీఫ్ పంటల మెరుగైన అవకాశాలు దీనికి కారణంగా పేర్కొంది. బలమైన గ్రామీణ డిమాండ్, ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గడం, తయారీ– సేవల రంగంలో స్థిరమైన పురోగతి ప్రైవేట్ వినియోగాన్ని పెంచడానికి దోహదపడే అంశాలుగా పేర్కొంది. అయితే దీర్ఘకాలిక భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య మార్గాలలో పెరుగుతున్న అంతరాయాలు దేశ ఎకానమీకి ఆందోళన కలిగిస్తున్న అంశాలుగా పేర్కొంది. ఆహార ధరలపై అనిశ్చితి.. ఆహార ధరల్లో నెలకొన్ని అనిశ్చితి రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం తీరుతెన్నులపై ప్రభావం చూపవచ్చు. ఈ ఏడాది వేసవిలో కూరగాయల ధరల కదలికలపై మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఒకవైపు వృద్ధికి ఊతమిస్తూనే మరోవైపు లకి‡్ష్యంచుకున్న స్థాయికి (4 శాతం) ద్రవ్యోల్బణం దిగి వస్తే కీలక రేట్లను తగ్గించడంపైనే ఎంపీసీ ప్రధానంగా దృష్టి పెడుతుంది. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ -
రేటు తగ్గించే పరిస్థితి లేదు
ముంబై: బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వసూలు చేసే వడ్డీరేటు– రెపోను తగ్గించే పరిస్థితి ప్రస్తుతం లేదని గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ ఉద్ఘాటించింది. అదే జరిగితే.. ధరలు తగ్గుదలకు ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలు ప్రయోజనం లేకుండా పోతాయని అభిప్రాయపడింది. ధరల కట్టడే ఆర్బీఐ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేసింది. ఈ నెల ప్రారంభంలో జరిగిన ఆర్బీఐ పాలసీ సమీక్షా సమావేశం మినిట్స్ ఈ అంశాలను వెల్లడించాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్బీఐ 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. అయితే ద్రవ్యోల్బణం కొద్దిగా అదుపులోకి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో ఈ నెల ప్రారంభ సమీక్ష సహా గడచిన ఐదు ద్వైమాసిక సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్బీఐ పెద్దపీట వేసింది. 4 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యం... రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం ప్లస్, 2 శాతం మైనస్‌తో 4 శాతంగా ఉండాలని కేంద్రం ఆర్బీఐకి నిర్దేశిస్తున్నప్పటికీ తమ లక్ష్యం 4 శాతమేనని గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టం చేస్తూ వస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతం నుంచి 4.5 శాతానికి తగ్గుతుందని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో 5 శాతం ద్రవ్యోల్బణం నమోదవుతుందని ఆర్బీఐ భావిస్తోంది. తగిన స్థాయిలో వర్షపాతం నమోదయితే.. 2024–25 క్యూ1,క్యూ2, క్యూ3, క్యూ4లలో వరుసగా 5 శాతం, 4 శాతం, 4.6 శాతం, 4.7 శాతం చొప్పున ద్రవ్యోల్బణం నమోదవుతని పాలసీ సమీక్ష అంచనా వేసింది. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సరఫరా వ్యవస్థను ప్రభావితం చేస్తోందని, వస్తువుల ధరలపై ఇది తీవ్ర ఒత్తిడి తెస్తోందని, ఆహార ధరల్లో అనిశ్చితి ప్రధాన ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతోందని కమిటీ అభిప్రాయపడింది. -
RBI MPC Meeting 2024: ఆరో‘సారీ’.. తగ్గించేదేలే..!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) రెపో రేటును యథాతథంగా 6.5 శాతం వద్ద కొనసాగించాలని నిర్ణయించింది. ముంబైలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలో మూడు రోజుల పాటు జరిగిన ఆరుగురు సభ్యుల ఆర్బీఐ ఎంపీసీ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష గురువారం ముగిసింది. సమావేశ వివరాలను గవర్నర్ వివరిస్తూ, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల నేపథ్యం, దేశంలో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ప్రభుత్వం నిర్దేశిస్తున్న విధంగా 4 శాతానికి దిగిరావాలన్న లక్ష్యం వంటి అంశాల నేపథ్యంలో రెపో రేటును ప్రస్తుతమున్నట్టుగానే కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీంతో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు (రెపో) 6.5 శాతంగా కొనసాగనుంది. ఫలితంగా బ్యాంకింగ్ రుణ రేట్లలో కూడా దాదాపు ఎటువంటి మార్పులూ జరగబోవని నిపుణులు అంచనావేస్తున్నారు. వరుసగా ఆరవసారి ‘యథాతథం’.. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్బీఐ 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. అయితే ద్రవ్యోల్బణం కొద్దిగా అదుపులోకి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో తాజా సమీక్ష సహా గడచిన ఐదు సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్బీఐ పెద్దపీట వేసింది. పాలసీలో కీలకాంశాలు... ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023–24లో వృద్ధి రేటు 7.3 శాతంగా అంచనా. ► ఇదే కాలంలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.4% నుంచి 4.5 శాతానికి డౌన్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో 5 శాతం ద్రవ్యోల్బణం నమోదవుతుందని అంచనా. ► నియంత్రణా పరమైన మార్గదర్శకాలను ఎంతోకాలంగా పాటించకపోవడమే పేటీఎంపై చర్యకు దారితీసినట్లు గవర్నర్ దాస్ పేర్కొన్నారు. ఈ చర్యలు వ్యవస్థకు ముప్పు కలిగించేవిగా భావించరాదని కూడా స్పష్టం చేశారు. ► డిజిటల్ రూపాయి వినియోగదారులు ఇకపై పరిమిత ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లోనూ లావాదేవీలను త్వరలో నిర్వహించగలుగుతారు. తక్కువ లేదా పరిమిత ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో లావాదేవీల కోసం సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ–రిటైల్(సీబీడీసీ–ఆర్) ఆఫ్‌లైన్ కార్యాచరణను ఆర్బీఐ త్వరలో ఆవిష్కరించనుంది. ► రుణ ఒప్పంద నిబంధనల గురించి కీలక వాస్తవ ప్రకటన (కేఎఫ్ఎస్)ను కస్టమర్లకు అందించవలసి ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. దీని ప్రకారం బ్యాంకింగ్ ఇకపై రిటైల్‌తోపాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రుణగ్రహీతలకు కూడా కేఎఫ్‌ఎస్‌ను అందించాల్సి ఉంటుంది. ► తదుపరి పాలసీ సమీక్ష ఏప్రిల్ 3 నుంచి 5వ తేదీ వరకు జరుగుతుంది. వచ్చే పాలసీలో రేటు తగ్గొచ్చు దేశంలో హౌసింగ్ డిమాండ్ పెంచడానికి వచ్చే ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపో రేటు తగ్గింపు నిర్ణయం ఉంటుందని భావిస్తున్నాం. ప్రస్తుతానికి వడ్డీరేట్ల స్థిరత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం. దీనివల్ల డిమాండ్ ప్రస్తుత పటిష్ట స్థాయిలోనే కొనసాగుతుందని పరిశ్రమ భావిస్తోంది. దేశ ఎకానమీ స్థిరంగా ఉండడం పరిశ్రమకు కలిసివచ్చే అంశం. – బొమన్ ఇరానీ, క్రెడాయ్ ప్రెసిడెంట్ వృద్ధికి బూస్ట్ రేటు యథాతథ విధానాన్ని కొనసాగిస్తూ తీసుకున్న నిర్ణయం ప్రగతిశీలమైంది. సుస్థిర ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. అంతర్జాతీయ, దేశీయ సవాళ్లు– ఆహార రంగానికి సంబంధించి ధరల సమస్యల వంటి అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటూ... వినియోగదారు ప్రయోజనాలే లక్ష్యంగా జరిగిన నిర్ణయాలు హర్షణీయం. జాగరూకతతో కూడిన విధానమిది. – దీపక్ సూద్, అసోచామ్ సెక్రటరీ జనరల్ -
6.3 శాతం నుంచి 6.7 శాతానికి అప్
న్యూఢిల్లీ: భారత్ మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.7 శాతం వృద్ధి సాధిస్తుందని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) తాజా నివేదిక పేర్కొంది. ఈ మేరకు సెపె్టంబర్ నాటి అవుట్‌లుక్ 6.3 శాతం వృద్ధి అంచనాలను 40 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెంచింది. రెండవ త్రైమాసికం (జూలై–సెపె్టంబర్) త్రైమాసిక స్థూల దేశీయోత్పత్తి ఫలితాలు అంచనాలకు మించి 7.6 శాతంగా వెలువడ్డం తమ తాజా నిర్ణయానికి కారణమని ఆసియన్ డెవలప్మెంట్ అవుట్‌లుక్– డిసెంబర్ 2023లో వివరించింది. 2022–23లో భారత్ జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతం. 2023–24లో ఈ రేటు 6.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) తొలుత అంచనావేసింది. క్యూ1లో 8 శాతం వృద్ధి అంచనాకు భిన్నంగా 7.8 శాతం ఫలితం వెలువడింది. క్యూ2లో 6.5 శాతం అంచనాలు వేయగా ఇందుకు 1.1 శాతం అధికంగా ఫలితం వెలువడింది. దీనితో ఆర్బీఐ కూడా ఇటీవలి పాలసీ సమీక్షలో తన జీడీపీ వృద్ధి అంచనాలను 7 శాతానికి పెంచింది. క్యూ3లో 6 శాతం, క్యూ4లో 5.7 శాతంగా ఆర్బీఐ అంచనా వేస్తోంది. 2024–25 మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు 6.6 శాతంగా ఉంటుందని భావిస్తోంది. ఏప్రిల్ నుంచి సెపె్టంబర్ వరకూ చూస్తే... రియల్ జీడీపీ విలువ రూ.76.22 లక్షల కోట్ల నుంచి రూ. 82.11 లక్షల కోట్లకు ఎగసింది. అంటే ఆరు నెలల్లో వృద్ధి రేటు 7.7 శాతంగా నమోదయ్యింది. క్యాలెండర్ ఇయర్ మూడు త్రైమాసికాల్లో వృద్ధి 7.1 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో ఏడీబీ తాజా అవుట్‌లుక్ అంశాలను పరిశీలిస్తే.. ► 2024–25లో ఎకానమీ 6.7 శాతం వృద్ధి సాధిస్తుందని భావిస్తున్నాం. ► తయారీ, మైనింగ్, నిర్మాణంసహా కీలక పారిశ్రామిక రంగం కూడా రెండంకెల వృద్ధిని సాధిస్తున్నట్లు ఆర్థిక గణాంకాలు సూచిస్తున్నాయి. ► వ్యవసాయ రంగం కొంత నెమ్మదించినా.. దీనిని పారిశ్రామిక రంగం భర్తీ చేసే అవకాశం ఉంది. ► ప్రైవేటు వినియోగ వ్యయాలు, ఎగుమతుల్లో కొంత బలహీనతలు ఉన్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యయాలు వ్యవస్థలో డిమాండ్ పెరుగుదలకు దోహదపడే అంశం. ► వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటును 5.5 శాతంగా కొనసాగవచ్చు. ఇది ఆర్బీఐ అంచనా 5.4 శాతం కంటే అధికం కావడం గమనార్హం. 2023, 2024 భారత్ ద్రవ్యోల్బణం లెక్కలు అంచనాల పరిధిలోనే ఉంటాయి. రెపో రేటు యథాతథ పరిస్థితి 2024 లో కూడా కొనసాగవచ్చు. ► పలు ఆగ్నేయాసియా ఆర్థిక వ్యవస్థలలో మహమ్మారి అనంతరం పరిస్థితులు మెరుగుపడినప్పటికీ, తిరిగి నిరాశాజనక పరిస్థితులు నెలకొంటున్నాయి. అధిక–ఆదాయ సాంకేతిక ఎగుమతిదారుల నుండి వస్తువుల ఎగుమతుల్లో స్థిరత్వమే తప్ప ప్రోత్సాహకరంగా లేవు. -
భారత్ ఎకానమీ వృద్ధి 6.8 శాతం
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023 ఏప్రిల్–2024 మార్చి) 6.8 శాతం వృద్ధి సాధిస్తుందని పరిశ్రమల చాంబర్– సీఐఐ అంచనావేసింది. ఇంతక్రితం వేసిన 6.5–6.7 శాతం వృద్ధి శ్రేణికన్నా తాజా అంచనాలు అధికం కావడం గమనార్హం. ఇక 2024–25లో వృద్ధి రేటు 7 శాతానికి చేరుతుందని విశ్లేíÙంచింది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, వ్యాపార వాతావరణం సులభతరం చేయడంపై ప్రభుత్వం నిరంతర దృష్టి సారించడం వంటి అంశాలు ఎకానమీ పురోగతికి కారణంగా పేర్కొంది. 2022–23లో భారత్ జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతం. 2023–24లో ఈ రేటు 6.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) అంచనావేస్తోంది. క్యూ1లో 8 శాతం వృద్ధి అంచనాకు భిన్నంగా 7.8 శాతం ఫలితం వెలువడింది. క్యూ2లో 6.5 శాతం అంచనాలు వేయగా ఇందుకు 1.1 శాతం అధికంగా 7.6 శాతం వృద్ధి ఫలితం వెలువడింది. క్యూ3లో 6 శాతం, క్యూ4లో 5.7 శాతంగా ఆర్బీఐ అంచనా వేస్తోంది. 2024–25 మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు 6.6 శాతంగా ఉంటుందని భావిస్తోంది. ఆర్బీఐ అంచనాలను మించి తాజాగా సీఐఐ అంచనాలు వెలువడ్డం గమనార్హం. టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్‌కు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ కూడా అయిన సీఐఐ ప్రెసిడెంట్ ఆర్ దినేష్ తాజాగా ఇచి్చన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్న అంశాలు ఇవీ.. ► తాజా పాలసీ కొనసాగింపునకు... ఇటీవలి రాష్ట్ర ఎన్నికల ఫలితాలు (మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు), స్టాక్ మార్కెట్, పరిశ్రమ సానుకూలంగా ఉన్నాయి. ►విధానపరమైన నిర్ణయాల కొనసాగింపును మేము స్వాగతిస్తాము. ఆయా అంశాలు దేశ పురోగతికి దోహదపడతాయన్న విషయంలో ఏకాభిప్రాయం ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా విధానపరమైన అంశాల్లో మార్పు ఉండకూడదని మేము వివరించి చెప్పడానికి ప్రయతి్నస్తాము. స్టాక్ మార్కెట్ కూడా ఇదే విధమైన చర్యల పట్ల సానుకూలంగా ఉంటుంది. ►పెట్టుబడులకు భారత్ తగిన ఆకర్షణీయ ప్రాంతమని మేము విశ్వసిస్తున్నాము. మౌలిక వనరుల అభివృద్ధి, తగిన వాతావరణ సానుకూల పరిస్థితుల ఏర్పాటుపై కేంద్రం తగిన విధంగా దృష్టి సారించడం దీనికి కారణం. ►రాబోయే ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షల్లో రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాతం. ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి వరకూ ఈ రేటును ఆర్బీఐ 4 శాతం నుంచి 6 శాతానికి పెంచింది. గడచిన నాలుగు ద్వైమాసిక సమావేశాల్లో రేటు పెంపు నిర్ణయం తీసుకోలేదు) తగ్గించాలని మేము కోరడం లేదు. రేటు తగ్గించాలని కోరడానికి ఇది తగిన సమయం అని మేము భావించడం లేదు. ఎందుకంటే ద్రవ్యోల్బణం బెంచ్‌మార్క్ (4 శాతం) కంటే ఎక్కువగా ఉంది. ►ఇప్పుడు పలు రంగాలు తమ మొత్తం సామర్థ్యంలో 75 నుంచి 95 శాతాన్ని మాత్రమే వినియోగించుకుంటున్నాయి. గత 3 త్రైమాసికాల నుంచీ ఇదే పరిస్థితి. అయితే త్వరలో పరిస్థితి మారుతుందని విశ్వసిస్తున్నాం. పలు కంపెనీలు తమ మూలధన పెట్టుబడులను పెంచుతున్నాయి. ►మేము మా సభ్యత్వ సంస్థల ప్రతినిధులతో సర్వే చేశాము. మెజారిటీ సభ్యులు వాస్తవానికి ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలలతో పోలి్చతే (2023 ఏప్రిల్–సెప్టెంబర్) రెండవ అర్థ భాగంలో (2023 అక్టోబర్–మార్చి 2024) అధిక పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారని సర్వేలో వెల్లడైంది. -
కీలక వడ్డీ రేటు యథాతథమే..!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి కమిటీ (ఎంపీసీ) సమీక్షా సమావేశం డిసెంబర్ 6వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. పాలసీ వివరాలను 8వ తేదీన గవర్నర్ వెల్లడిస్తారు. గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ ఎకానమీ వృద్ధే లక్ష్యంగా ప్రస్తుత యథాతథ రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాతం)నే కొనసాగిస్తుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. యథాతథ రేటు కొనసాగిస్తే ఈ తరహా నిర్ణయం ఇది వరుసగా ఐదవసారి అవుతుంది. ద్రవ్యోల్బణం అదుపులోనికి వచి్చనట్లు కనబడుతున్నప్పటికీ, దీని కట్టడికి కఠిన రేటు విధానాన్నే అవలంభించాలని ఆర్బీఐ కమిటీ భావిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, క్రూడ్ ఆయిల్ ధరల తీవ్రత, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్బీఐ 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. అయితే ద్రవ్యోల్బణం కొద్దిగా అదుపులోనికి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో గత నాలుగు సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్బీఐ పెద్దపీట వేసింది. -
RBI Monetary Policy: ధరల కట్టడే ధ్యేయం..
ముంబై: ధరల కట్టడికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) స్పష్టం చేసింది. బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను యథాతథంగా 6.5 శాతంగా కొనసాగించాలని ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ఈ తరహా ‘యథాతథ రెపో రేటు కొనసాగింపు’ నిర్ణయం తీసుకోవడం వరుసగా ఇది నాల్గవసారి. రిటైల్ ద్రవ్యోల్బణం 4%గా కొనసాగించడమే ప్రధాన లక్ష్యమని ఉద్ఘాటించిన ఎంపీసీ, ఈ దిశలో వ్యవస్థలో అదనపు ద్రవ్య లభ్యతను (లిక్విడిటీ) వెనక్కు తీసుకునే విధానాన్ని కొనసాగిస్తామని పేర్కొంది. ఇందులో భాగంగా బాండ్ విక్రయాల ను చేపడుతున్నట్లు తెలిపింది. ‘సరళతర ద్రవ్య విధానాన్ని వెనక్కుతీసుకునే’ ధోరణికే కట్టుబడి ఉన్నట్లు పాలసీ కమిటీ స్పష్టం చేసింది. మూడు రోజులపాటు జరిగిన కమిటీ సమావేశాల నిర్ణయాలను గవర్నర్ శక్తికాంతదాస్ మీడియాకు తెలిపారు. ‘ఆర్బీఐ ద్రవ్యోల్బణం లక్ష్యం 4%. 2 నుంచి 6% కాదు’ అని ఉద్ఘాటించారు. ప్లస్ 2, మైనస్ 2తో 4% వద్ద ద్రవ్యోల్బణం ఉండాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న సంగతి తెలిసిందే. పాలసీ ముఖ్యాంశాలు... ► 2023–24లో జీడీపీ 6.5 శాతం. ► రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతం. ► అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకుల బుల్లెట్ రీపేమెంట్ స్కీమ్ కింద పసిడి రుణాల పరి మితి రూ. 2 లక్షల నుంచి రూ. 4లక్షలకు పెంపు. రూ. 2,000 నోట్లు ఇప్పటికీ మార్చుకోవచ్చు.. రూ.2,000 నోట్లను అక్టోబర్ 8 నుంచి కూడా మార్చుకునే అవకాశాలన్నీ ఆర్బీఐ కలి్పంచింది. గవర్నర్ ఈ విషయంపై మాట్లాడుతూ రూ. 3.43 లక్షల కోట్ల రూ. 2,000 డినామినేషన్ నోట్లు ఇప్పటి వరకూ బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయ న్నారు. ఇంకా రూ.12,000 కోట్లకుపైగా విలువైన నోట్లు చెలామణీలో ఉన్నాయన్నారు. అక్టోబర్ 8 నుండి 19 ఆర్బీఐ కార్యాలయాల్లో వీటిని మార్చుకోవచ్చన్నారు. నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి మొదట సెపె్టంబర్ 30 వరకు గడువిచి్చన ఆర్బీఐ, ఈ తేదీని అక్టోబర్ 7 వరకూ పొడిగించింది. రాష్ట్ర రాజధానుల్లో ఆర్బీఐ కార్యాలయాలు ఉన్నందున, ఎక్కడివారైనా, 2,000 నోట్లను మార్చు కోవడానికి పోస్టల్ శాఖ సేవలను పొందవచ్చని దాస్ సూచించారు. కఠిన ద్రవ్య విధానం కొనసాగింపు.. ఆర్బీఐ 2022 మే నుంచి 250 బేసిస్ పాయింట్లు రెపో రేటును పెంచింది. అయితే ఇటు డిపాజిట్ల విషయంలో అటు రుణాల విషయంలో బ్యాంకులు కస్టమర్లకు ఈ రేట్లను పూర్తిగా బదలాయించలేదు. ఈ పరిస్థితుల్లో ‘సరళతర ద్రవ్య విధానాన్ని వెనక్కుతీసుకునే’ ధోరణినే కొనసాగించాలని ఆర్బీఐ భావిస్తోంది. అంటే ఇప్పటి వరకూ తీసుకున్న నిర్ణయాలు వ్యవస్థలో ఇంకా ప్రతిఫలించాల్సి ఉంది. – శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్ అంతర్జాతీయ ఆర్థిక అనిశి్చతిలోనూ దేశ ఆర్థికాభివృద్ధి పటిష్టతే లక్ష్యంగా ఉంది. – దినేష్ ఖారా, ఎస్బీఐ చీఫ్ ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. సమీపకాలంలో ధరలు తగ్గవచ్చు. – సుభ్రకాంత్ పాండా, ఫిక్కీ ప్రెసిడెంట్ వృద్ధికి మద్దతునిస్తూ, ద్రవ్యోల్బణం కట్టడే ఆర్బీఐ ధ్యేయంగా కనబడుతోంది – ప్రసేన్‌జిత్ బసు, చీఫ్ ఎకనమిస్ట్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ -
ఆర్బీఐ తొలి ద్వైమాసిక పాలసీ సమీక్ష ప్రారంభం
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి ద్వైమాసిక మూడు రోజుల సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ కీలక నిర్ణయాలు 6వ తేదీన వెలువడనున్నాయి. 3, 5, 6 తేదీల్లో సమావేశాలు జరుగుతాయి. 4వ తేదీ మçహావీర్ జయంతి సందర్భంగా సెలవు. ఈ సమావేశాల్లో రెపో రేటును మరో పావుశాతం పెంపునకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇదే జరిగితే బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు 6.75 శాతానికి పెరగనుంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4 శాతంగా ఉన్న రెపో రేటు, మే 4వ తేదీన మొదటిసారి 0.40 శాతం పెరిగింది. జూన్ 8, ఆగస్టు 5, సెప్టెంబర్ 30 తేదీల్లో అరశాతం చొప్పున పెరుగుతూ, 5.9 శాతానికి చేరింది. డిసెంబర్ 7న ఈ రేటు పెంపు 0.35 శాతం ఎగసి 6.25 శాతాన్ని తాకింది. ఫిబ్రవరి మొదట్లో జరిగిన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానంలో వరుసగా ఆరవసారి (పావు శాతం) రేటు పెంపుతో మే నుంచి 2.5 శాతం రెపో రేటు పెరిగింది. ఈ రేటు 6.5 శాతానికి ఎగసింది. -
2023–24 ఎంపీసీ భేటీ షెడ్యూల్ విడుదల
ముంబై: కీలక ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు తీసుకునే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశాలకు సంబంధించి 2023–24 ఆర్థిక సంవత్సరం షెడ్యూల్ విడుదలైంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటు రెపో (ప్రస్తుతం 6.5 శాతం) నిర్ణయంసహాపలు కీలక ద్రవ్య, పరపతి నిర్ణయాలు ఈ సమావేశాల్లో తీసుకునే సంగతి తెలిసిందే. -
రెపో రేటు పెంపును వ్యతిరేకించిన ఆ ఇద్దరు ఎంపీసీ సభ్యులు!
ముంబై: బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో ఇటీవలి పావుశాతం పెంపునకు గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ)లో ఇరువురు ఇరువురు వ్యతిరేకించారు. గవర్నర్‌సహా నలుగురు పెంపునకు అనుకూలంగా ఓటు చేశారు. ద్రవ్యోల్బణం భయాలతో ఈ నెల మొదట్లో రెపో పావుశాతం పెరిగి 6.5 శాతానికి చేరిన సంగతి తెలిసిందే. ఎంపీసీ ఆరుగురు సభ్యుల్లో గవర్నర్‌తోపాటు డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ రంజన్, ముగ్గురు ప్రభుత్వం నామినేట్ చేసిన– ఎక్స్‌టర్నర్ సభ్యులు –– శశాంక భిడే, అషిమా గోయల్, జయంత్ ఆర్ వర్మలు ఉన్నారు. వీరిలో వర్మ గోయల్‌లు ఇరువురూ రేటు పెంపును వ్యతిరేకించినట్లు బుధవారం వెలువరించిన మినిట్స్ తెలిపాయి. ద్రవ్యోల్బణం కట్టడిలోకి వస్తున్నందున, రేటు పెంపునకు బదులుగా వృద్ధికే ప్రాధాన్యత ఇవ్వాలని వీరు అభిప్రాయపడ్డారు. అక్టోబర్ వరకూ గడచిన 10 నెలల్లో రెపో రేటు నిర్ణయానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ఆరు శాతంపైబడి కొనసాగిన సంగతి గమనార్హం. నవంబర్, డిసెంబర్లలో ఇది 6 శాతం దిగువకు చేరడం ఇరువురు సభ్యుల అభిప్రాయాల నేపథ్యం. -
ద్రవ్యోల్బణం కట్టడిలో వైఫల్యంపై ఆర్బీఐ చర్చ
ముంబై: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 6 శాతం లోపు కట్టడిచేయడంలో వైఫల్యం ఎందుకు చోటుచేసుకుందన్న అంశంపై గవర్నర్ శక్తికాంత్‌దాస్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) గురువారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఇందుకు సంబంధించి కేంద్రానికి సమర్పించాల్సిన నివేదికాంశాలపై చర్చించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 5.9 శాతం) నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతంలోపు ఉండాల్సి ఉండగా, ఈ ఏడాది జనవరి నుంచి ఆపైనే ధరల స్పీడ్ కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందన్న అంశంపై కేంద్రానికి ఆర్బీఐ వివరణ ఇవ్వాల్సి ఉంది. కేంద్రానికి నివేదిక ఇవ్వనున్న విషయం ఇటీవలి ద్రవ్యపరపతి విధాన సమీక్ష సందర్బంగా గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. అయితే ఈ వివరాలను తెలపడానికి మాత్రం నిరాకరించారు. సెంట్రల్ బ్యాంక్ తన లక్ష్యాన్ని విఫలం కావడానికి సంబంధించిన ఆర్బీఐ చట్టం 45జెడ్ ఎన్ సెక్షన్ కింద ఈ సమావేశం జరిగిందని ఒక అధికారిక ప్రకటన తెలిపింది. -
3న ద్రవ్యోల్బణంపై ఆర్బీఐ ఎంపీసీ భేటీ
ముంబై: గవర్నర్ శక్తికాంత్‌దాస్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నవంబర్ 3వ తేదీన ద్రవ్యోల్బణం సవాళ్లపై ప్రత్యేకంగా సమావేశం కానుంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 5.9 శాతం) నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతంలోపు ఉండాల్సి ఉండగా, ఈ ఏడాది జనవరి నుంచి ఆపైనే ధరల స్పీడ్ కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందన్న అంశంపై కేంద్రానికి ఆర్బీఐ ఒక నివేదిక సమర్పించనుంది. ఈ నివేదిక రూపకల్పనపైనే నవంబర్ 3న జరిగిన ఆర్బీఐ ఎంపీసీ చర్చించనుందని అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. సెక్షన్ 45జెడ్ ఎన్ కింద... సెంట్రల్ బ్యాంక్ తన లక్ష్యాన్ని విఫలం కావడానికి సంబంధించిన ఆర్బీఐ చట్టం 45జెడ్ ఎన్ సెక్షన్ కింద ఈ సమావేశం జరగనుందని ఒక అధికారిక ప్రకటన తెలిపింది. తన చర్యల గురించి ఆర్బీఐ కేంద్రానికి వివరణ ఇవ్వడం 2016లో ఎంపీసీ ఏర్పాటయిన తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. మే తర్వాత సెంట్రల్ బ్యాంక్ ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా రెపో రేటును నాలుగు దఫాలుగా 4 నుంచి 5.9 శాతానికి పెంచింది. ఆర్బీఐ తదుపరి ద్వైమాసిక సమావేశం డిసెంబర్ 5 నుంచి 7వ తేదీ మధ్య జరగనున్న నేపథ్యంలో వచ్చేనెల 3న జరిగే ‘ద్రవ్యోల్బణంపై’ కీలక భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. -
పన్ను వసూళ్లు పెరగడానికి డీమానిటైజేషన్ కారణం
న్యూఢిల్లీ: పన్ను వసూళ్లు పెరిగేందుకు పెద్ద నోట్ల రద్దు (డీమానిటైజేషన్) కూడా తోడ్పడిందని రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సభ్యురాలు ఆషిమా గోయల్ తెలిపారు. అంతిమంగా .. పెద్ద సంఖ్యలో ట్యాక్స్‌పేయర్లపై తక్కువ స్థాయిలో పన్నులు విధించగలిగే ఆదర్శవంతమైన విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ఇది దోహదపడగలదని ఆమె పేర్కొన్నారు. నల్ల ధనం చలామణీని అరికట్టేందుకు, డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా 2016 నవంబర్ 8న రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ అసాధారణ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్లు, వ్యక్తిగత ఆదాయాలపై పన్నుల స్థూల వసూళ్లు 24 శాతం పెరిగి రూ. 8.98 లక్షల కోట్లకు చేరినట్లు ఆదాయ పన్ను విభాగం అక్టోబర్ 9న వెల్లడించింది. వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) వసూళ్లు వరుసగా ఏడో నెలా రూ. 1.40 లక్షల కోట్ల పైగానే నమోదయ్యాయి. సెప్టెంబర్‌లో 26 శాతం పెరిగి (గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే) రూ. 1.47 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. -
సవాళ్లు ఉన్నా... ప్రపంచంలో మనమే ఫస్ట్
ముంబై: భౌగోళిక రాజకీయ సంక్షోభం ఉన్నప్పటికీ భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో మొదట ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు జరిగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్ష సందర్భంగా దాస్ ఈ విశ్లేషణ చేశారు. అప్పటి మూడురోజుల సమావేశ మినిట్స్ శుక్రవారం విడుదలయ్యాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచడానికి ఈ సమావేశంలో ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. కమిటీలో సభ్యురాలు అషీమా గోయల్ మాత్రం 35 బేసిస్ పాయింట్ల మేర మాత్ర మే పెంపునకు తన అంగీకారం తెలిపారు. ఎకానమీ క్రమంగా పురోగతి చెందుతోందని, ఈ విషయంలో తగిన సానుకూల సంకేతాలు అందుతున్నాయని ఆర్బీఐ గవర్నర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మే తర్వాత 1.9 శాతం అప్ సెప్టెంబర్ తాజా సమీక్ష పెంపు నిర్ణయంతో రెపో రేటు కరోనా ముందస్తు స్థాయికన్నా ముప్పావుశాతం అధికం కావడం గమనార్హం. వృద్ధి మందగమనాన్ని నిరోధించడానికి 2019 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ 2020 మే 22 వరకూ మొత్తం 250 బేసిస్ పాయింట్ల రెపో రేటును తగ్గించింది. ఇందులో మహమ్మారి ప్రారంభమైన తర్వాత (2020 మార్చి నుంచి 2020 మే మధ్య) తగ్గింపే 115 బేసిస్ పాయింట్లు. అంటే మహమ్మారికి ముందు వరకూ రెపో రేటు 5.15 శాతంగా ఉంది. 2020, మే 22న రుణ రేటును కనిష్ట స్థాయికి (4 శాతానికి) తగ్గించిన నాటి నుంచి 4 శాతం వద్ద రెపో రేటు (వరుసగా 11 ద్వైమాసిక సమావేశాల్లో యథాతథ నిర్ణయం) కొనసాగింది. ద్రవ్యోల్బణం కట్టడిలోనే ఉంటుందన్న భరోసాను ఇస్తూ, వృద్ధే లక్ష్యంగా సరళతర ద్రవ్య పరపతి విధానాన్ని ఆర్బీఐ కొనసాగిస్తూ వచ్చింది. నాలుగేళ్ల తర్వాత (2018 ఆగస్టు అనంతరం) మొదటిసారి సారి ఆర్బీఐ మే 4వ తేదీన ఆకస్మికంగా రెపో రేటును 0.40 శాతం పెంచింది. జూన్ 8వ తేదీ, ఆగస్టు 5వ తేదీన 50 బేసిస్ పాయింట్ల చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నిర్ణయంతో రెపో మే తర్వాత 1.9 శాతం పెరిగినట్లయ్యింది. దీనితో బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్ల పెంపును షురూ చేశాయి. పెంపు దిశగా తప్పని అడుగులు 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం గాడిన పడుతూ, అప్పట్లో వ్యవస్థలోకి విడుదలైన అదనపు లిక్విడిటీని వెనక్కు తీసుకోడానికి చర్యలు ప్రారంభించే తరుణంలోనే పలు దేశాల వాణిజ్య యుద్ధం ప్రతికూలతను తీసుకువచ్చింది. ఈ సమస్య పరిష్కారంలోపే ప్రపంచంపై కోవిడ్–19 విరుచుకుపడింది. కరోనాను ఎదుర్కొనే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా అమెరికాసహా పలు దేశాలు మరింత సరళతర వడ్డీరేట్లకు మళ్లాయి. వ్యవస్థలో ఈజీ మనీ ప్రపంచ దేశాల ముందుకు తీవ్ర ద్రవ్యోల్బణం సవాలును తెచ్చింది. దీనికితోడు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేసింది. దీనితో ధరల కట్టడే లక్ష్యంగా అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్‌సహా ప్రపంచ దేశాలు కీలక రేట్లను పెంచడం ప్రారంభించాయి. ఇక ఇదే సమయంలో భారత్‌లో ఒకవైపు ద్రవ్యోల్బణం సవాళ్లు, మరోవైపు అమెరికా వడ్డీరేట్ల పెంపుతో ఈక్విటీల్లోంచి వెనక్కు వెళుతున్న విదేశీ నిధులు వంటి ప్రతికూలతలు ఎదురవడం ప్రారంభమైంది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 2–6 శాతం మధ్య కట్టడి చేయాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తుండగా, ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఆగస్టు వరకూ వరుసగా ఎనిమిది నెలలు (జనవరిలో 6.01 శాతం, ఫిబ్రవరిలో 6.07 శాతం, మార్చిలో 17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95 శాతం, ఏప్రిల్‌లో ఏకంగా ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతం, మేలో 7.04 శాతం, జూన్‌లో 7.01 శాతం, జూలైలో 6.71 శాతం, ఆగస్టులో 7 శాతం) ఈ రేటు అప్పర్ బ్యాండ్ దాటిపోవడం ప్రారంభమైంది. దీనితో భారత్ కూడా కఠిన ఆర్థిక విధానంవైపు అడుగులు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రెపో రేటు 6.5 శాతం వరకూ వెళ్లే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. కీలక నిర్ణయాల్లో కొన్ని... ► 2022–23లో ఆర్థిక వృద్ధి అంచనా 7 శాతంకాగా, సెప్టెంబర్ త్రైమాసికంలో 6.3 శాతం వృద్ధి నమోదవుతుందని ఆర్బీఐ భావిస్తోంది. డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో ఈ రేటు 4.6 శాతం చొప్పున ఉంటుందని అంచనావేసింది. జూన్ త్రైమాసికంలో 13.5 శాతం వృద్ధి నమోదయిన సంగతి తెలిసిందే. ► రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటు అంచనా 6.7 శాతంకాగా, క్యూ2 , క్యూ3, క్యూ4ల్లో వరుసగా 7.1 శాతం, 6.5 శాతం, 5.8 శాతంగా ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ రేటు 5.1 శాతానికి దిగివస్తుందని అంచనా వేసింది. -
RBI Monetary Policy: రుణాలు మరింత భారం!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు) మరో 50 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచింది. దీంతో ఈ రేటు 5.9 శాతానికి చేరింది. 2019 ఏప్రిల్ తర్వాత రెపో రేటు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. కేంద్రం నిర్దేశిస్తున్న 6% రిటైల్ ద్రవ్యోల్బణం హద్దు మీరి పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది మే నుంచి వరుసగా 4 సార్లు ఆర్బీఐ రెపోరేటు పెంచింది. మేలో 4%గా ఉన్న రెపో 190 బేసిస్ పాయింట్లు పెరిగింది. మరింత పెరగవచ్చని సైతం తాజాగా ఆర్బీఐ సంకేతాలిచ్చింది. తాజా పెంపుతో రెపో రేటు కరోనా ముందస్తు స్థాయికన్నా ముప్పావుశాతం అధికం కావడం గమనార్హం. జీడీపీ అంచనాలు కట్... వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)ని తగ్గించి తద్వారా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలన్నదే రెపోరేటు ఇన్స్ట్రుమెంట్ ఉద్దేశ్యం. ఆర్బీఐ తాజా నిర్ణయంతో గృహ, ఆటో, వ్యక్తిగత రుణాలు మరింత భారం కానున్నాయి. కాగా, పాలసీ నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2022–23లో 6.7 శాతంగా ఉంటుందన్న తన అంచనాలను యథాథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ పాలసీ పేర్కొంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు విషయంలో మాత్రం అంచనాను కిత్రం 7.2 శాతం నుంచి 7 శాతానికి ఆర్బీఐ కుదించింది. పాలసీ ముఖ్యాంశాలు... ► 2022–23లో ఆర్థిక వృద్ధి అంచనా 7% కాగా, సెప్టెంబర్ త్రైమాసికంలో 6.3 శాతం వృద్ధి నమోదవుతుందని ఆర్బీఐ భావిస్తోంది. డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో ఈ రేటు 4.6 శాతం చొప్పున ఉంటుందని అంచనావేసింది. జూన్ త్రైమాసికంలో 13.5 శాతం వృద్ధి నమోదయిన సంగతి తెలిసిందే. ► రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటు అంచనా 6.7 శాతం కాగా, క్యూ2, క్యూ3, క్యూ4ల్లో వరుసగా 7.1%, 6.5%, 5.8 శాతంగా ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ రేటు 5.1 శాతానికి దిగివస్తుందని అంచనావేసింది. ► డాలర్ మారకంలో రూపాయి విలువపై జాగ్రత్తగా పరిశీలన. సెప్టెంబర్ 28 వరకూ ఈ ఏడాది 7.4 శాతం పతనం. రూపాయిని నిర్దిష్ట మారకం ధర వద్ద ఉంచాలని ఆర్బీఐ భావించడం లేదు. తీవ్ర ఒడిదుడుకులను నిరోధించడానికి ఆర్బీఐ చర్యలు ఉంటాయి. వర్ధమాన దేశాల కరెన్సీలతో పోల్చితే రూపాయి విలువ బాగుంది. ► ఏప్రిల్‌లో 606.5 బిలియన్ డాలర్లు ఉన్న భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు, సెప్టెంబర్ 23 నాటికి 537.5 బిలియన్ డాలర్లకు తగ్గాయి. డాలర్ బలోపేతం అమెరికన్ బాండ్ ఈల్డ్ పెరగడం వంటి మార్పులే కావడం గమనార్హం. ► రూపాయిలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పరిష్కరించుకోవడానికి నాలుగైదు దేశాలు, అనేక బ్యాంకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. ► 2022–23లో బ్యాంకింగ్ రుణ వృద్ధి 16.2 శాతంగా ఉంటుందని అంచనా. ► తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్ 5 నుంచి 7 వరకు జరుగుతుంది. నేటి నుంచి టోకెనైజేషన్ దాదాపు 35 కోట్ల కార్డుల వివరాలు, లావాదేవీల గోప్యత లక్ష్యానికి సంబంధించిన టోకెనైజేషన్ వ్యవస్థ అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టీ రవి శంకర్ తెలిపారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం, ఆగస్టు నాటికి వ్యవస్థలో 101 కోట్ల డెబిట్, క్రెడిట్ కార్డులు ఉన్నాయి. సెప్టెంబర్‌లో దాదాపు 40% లావాదేవీల టోకెనైజేషన్ జరిగింది. వీటి విలువ దాదాపు రూ.63 కోట్లు. టోకెనైజేషన్ వ్యవస్థలో చేరడాన్ని తప్పనిసరి చేయకపోవడం వల్ల ఈ వ్యవస్థ వేగంగా ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొందని డిప్యూటీ గవర్నర్ తెలిపారు. -
వరుసగా నాలుగో విడత పెంపు
ముంబై: రిజర్వ్ బ్యాంకు మానిటరీ పాలసీ కమిటీ భేటీ ఈ నెల 28న మొదలు కానుంది. 30వ తేదీన తన నిర్ణయాలను ఎంపీసీ ప్రకటిస్తుంది. వరుసగా నాలుగో విడత ఆర్బీఐ రేట్ల పెంపును చేపడుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కనీసం 0.40–0.50 శాతం వరకు ఈ పెంపు ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది మే నుంచి ఆర్బీఐ మూడు విడతలుగా మొత్తం 1.4 శాతం మేర రెపో రేటును పెంచడం తెలిసిందే. దీంతో ప్రస్తుతం రెపో రేటు 5.4 శాతానికి చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరికి రెపో రేటు 6 శాతంగా ఉండొచ్చన్న అంచనాలు లోగడే వ్యక్తమయ్యాయి. ఒకవేళ 0.50 శాతం రేటు పెంపును ఆర్బీఐ చేపడితే అప్పుడు రెపో రేటు 5.9 శాతానికి చేరనుంది. వినియోగ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఆర్బీఐ గరిష్ట నియంత్రిత పరి మితి అయిన 6 శాతానికి పైనే గత కొన్ని నెలలుగా చలిస్తున్న విషయాన్ని నిపుణులు తమ అంచనాలకు ఆధారంగా తీసుకుంటున్నారు. -
సామాన్యులకు షాక్, రెపో రేట్లు పెంచనున్న ఆర్బీఐ?
Repo Rate Hike In September Policy: త్వరలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తీసుకోనున్న నిర్ణయం సామాన్యులకు మరింత భారంగా మారనున్నట్లు తెలుస్తోంది. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రెపో రేట్లను పెంచనున్నట్లు సమాచారం. రిటైల్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ)ఆధారంగా ద్రవ్యోల్బణం ఈ ఏడాది జూలై లో 6.71 శాతం నుండి ఆగస్టు నాటికి 7.0 శాతం నమోదు చేసింది. పెరిగిన ద్రవ్యోల్భణానికి కారణం ఆహారం, ఇంధర పెరుగుదలే కారణమని మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 30న ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) జరగనుంది. ఎంపీసీ సమావేశంలో ఐదు నెలల పాటు ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఆర్బీఐ రెపొ రేట్లు 35 - 50 బేసిస్ పాయింట్ల వరకు పెంచనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. రెపో రేటు అంటే ఏమిటి? ఆర్బీఐ..కమర్షియల్ బ్యాంకులకు వడ్డీకి రుణాలు ఇస్తుంది. ఆ రుణాల్ని రెపో రేటు అని పిలుస్తారు. ఆ రెపో రేట్లు పెరగడం వల్ల బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చే పర్సనల్, హోం లోన్, వెహికల్ లోన్ల వడ్డీ రేట్లను పెంచుతుంది. దీంతో కస్టమర్లు బ్యాంకులకు చెల్లించే ఈఎంఐ భారం పెరగుతుంది. -
వృద్ధి అవుట్‌లుక్‌కు భౌగోళిక ఉద్రిక్తతలే అవరోధం
న్యూఢిల్లీ: భారతదేశ వృద్ధి అవుట్‌లుక్‌కు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడమే అతిపెద్ద ప్రమాదకరంగా తయారయ్యిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సభ్యులు జయంత్ ఆర్ వర్మ ఉద్ఘాటించారు. ప్రత్యేకించి ఈ ఉద్రిక్తతలు ఆసియా ప్రాంతానికి వ్యాపిస్తే దేశ ఎకానమీకి మరింత సమస్యలు వచ్చిపడతాయని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► ద్రవ్యోల్బణం, ద్రవ్యోల్బణ అంచనాలు తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇది ఎకానమీకి మేలు చేకూర్చే అంశం. దేశంలో ఈ ఖచ్చితంగా దీర్ఘకాలికంగా ఈ సమస్య కొనసాగదని భావిస్తున్నా. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని నిర్దేశిత 6 స్థాయిలోపునకు తీసుకురావడానికి ఆర్బీఐ ద్రవ్యపరపతి విధానం కట్టుబడి ఉంది. ► ఎకానమీ పట్ల ఆశావహ పరిస్థితే ఉంది. పలు రంగాలు, పరిశ్రమలలో రికవరీ అసమానంగా ఉన్నప్పటికీ, వినియోగ డిమాండ్ కోలుకోవడం ప్రారంభమైంది. ఇది హర్షణీయ పరిణామం. ► పరిశ్రమ, వివిధ రంగాల సామర్థ్య వినియోగం పెరుగుతోంది. ఇప్పుడు వ్యాపార విస్తరణ కోసం మూలధన వ్యయాల పెంపుపై పలు రంగాలు వ్యూహ రచన చేస్తున్న సంకేతాలు ఉన్నాయి. ► పలు కీలక అంశాలు దేశీయ మారకపు రేటు కదలికలకు కారణాలుగా ఉంటాయి. అందులో ద్రవ్యోల్బణం ఒక కారణం. ప్రస్తుత రూపాయి పతనంపై ఆందోళన చెందాల్సిన పనిలేదు. -
ఇక వడ్డీరేట్లు పైపైకి!
ముంబై: విశ్లేషణలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) కేవలం ఐదు వారాల వ్యవధిలో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను మరో అరశాతం పెంచింది. దీనితో ఈ కీలక రేటు 4.9%కి చేరింది. గత నెల 4వ తేదీన ఆర్బీఐ అనూహ్యరీతిలో బ్యాంకులకు రెపోను 40 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు 1%) పెం చింది. దీనితో ఈ రేటు 4.4%కి చేరింది. మూడురోజుల భేటీ అనంతరం గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ మరోదఫా రెపో పెంపు నిర్ణయంలో కీలక రేటు 4.9%కి ఎగసింది. మొదటి విడత పెంపు నేపథ్యంలో పలు బ్యాంకులు తమ బెంచ్‌మార్క్ రుణ రేట్లను పెంచడం ప్రారంభించాయి. కొన్ని బ్యాంకులు ఈ స్వల్ప వ్యవధిలోనే రెండు దఫాలుగా వడ్డీరేట్లను పెంచాయి. తాజా నిర్ణయంతో బ్యాంకింగ్ గృహ, వాహన, వ్యక్తిగత, కార్పొరేట్ రుణాలు మరింత భారంగా మారనున్నాయి. అదనపు ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) నిర్వహణలో భాగంగా స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డీఎఫ్) మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎండీఎఫ్) రేటు అరశాతం పెంచుతున్నట్లు ఆర్బీఐ తెలిపింది. దీనితో ఈ రేట్లు వరుసగా 4.65%, 5.15%కి చేరాయి. ద్రవ్యోల్బణంపై అందోళన... అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ద్రవ్యోల్బణం అంచనాలుసైతం అనిశ్చితిలో ఉంటున్నట్లు ఆర్బీఐ తాజా సమీక్ష సందర్భంగా అభిప్రాయపడ్డం గమనార్హం. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2–6 శాతం శ్రేణిలో ఉండాలి. అయితే జనవరి (6.01 శాతం), ఫిబ్రవరి (6.07 శాతం), మార్చి (17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95 శాతం) నెలల్లో హద్దులు మీరి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పాలసీ నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్య్లోల్బణం ఏప్రిల్‌లో ఏకంగా ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతానికి ఎగసింది. దీనితో 2022–23 ఆర్థిక సంవత్సరం మొత్తంలో 5.7 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం ఉంటుందన్న కిత్రం అంచనాలను ఆర్బీఐ తాజాగా ఒకశాతం పెంచి 6.7 శాతానికి చేర్చింది. ధరల స్పీడ్ కట్టడికి సంబంధించి ఆర్బీఐకి కేంద్రం ఇస్తున్న నిర్దేశాల కన్నా ఇది 70 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) అధికం. ఏకగ్రీవ నిర్ణయం 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ జరిగిన పాలసీ సమీక్షలో ఆరుగురు సభ్యులు 4.9 శాతం వరకూ రేటు పెంపునకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. పాలసీ విధానాన్ని ‘‘రిమైనింగ్ అకామిడేటివ్’’ (తగిన ద్రవ్యలభ్యత ఉండే స్థాయి) నుంచి ‘‘ విత్‌డ్రాయెల్ ఆఫ్ అకామిడేటివ్’’ (ద్రవ్యలభ్యత ఉపసంహరణ)కు మార్చుతున్నట్లు పేర్కొన్న ఆర్బీఐ పాలసీ సమీక్ష, భవిష్యత్తు చర్యలపై మార్కెట్‌కు మరింత స్పష్టత ఇవ్వాలన్న లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. అయితే వృద్ధికి ఎటువంటి విఘాతం ఏర్పడకుండా తగిన చర్యలను అన్నింటినీ ఆర్బీఐ తీసుకుంటుందని పాలసీ సమీక్ష స్పష్టం చేసింది. వృద్ధి బాట పటిష్టం కాగా, ఒకవైపు వడ్డీరేట్లు పెరిగే పరిస్థితి నెలకొన్నప్పటికీ, భారత్ ఎకానమీ వృద్ధి బాట పటిష్టంగానే ఉంటుందన్న భరోసాను ఆర్బీఐ ఇచ్చింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతం వృద్ధి నెలకొంటుందన్న క్రితం అంచనాలను మరోసారి పునరుద్ఘాటించింది. ఏప్రిల్, మే నెలల్లో సూచీలు దేశీయ ఎకానమీ క్రియాశీలత పటిష్టతను సూచిస్తున్నట్లు ఆర్బీఐ పాలసీ సమీక్ష పేర్కొంది. మొదటి, రెండవ, మూడవ, నాల్గవ త్రైమాసికాల్లో వరుసగా వృద్ధి రేటు 16.2%, 6.2%, 4.1%, 4.0% వృద్ధి రేట్లు నమోదవుతుందని అంచనా వేసింది. అయితే భౌగోళిక ఉద్రిక్తతలు, గ్లోబల్ ఎకనామీ మందగమనం వంటి ప్రతికూలతలూ ఉన్నాయని గుర్తు చేసింది. ఆర్బీఐ ఇంతక్రితమే వృద్ధి రేటును 7.8% నుంచి 7.2%కి తగ్గించిన సంగతి తెలిసిందే. రిజిస్టర్‌కాని డిజిటల్ లెండింగ్ యాప్‌లపై హెచ్చరిక కాగా, డిజిటల్ లెండింగ్ యాప్‌లపై ప్రజల్లో నెలకొంటున్న ఆసక్తి నేపథ్యంలో ఆర్బీఐ అప్రమత్తత ప్రకటించింది. ఏదైనా అవకతవకలు జరిగితే రిజిస్టరయిన డిజిటల్ యాప్‌లపైనే ఆర్బీఐ చర్యలు తీసుకోగలుగుతుందని తెలిపింది. రిజిస్టర్ కాని యాప్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆర్బీఐ ప్రజలకు సూచించింది. డిజిటల్ లెండింగ్ యాప్‌ల ద్వారా వేధింపులు, అవి ఆత్మహత్యలకు దారితీయడం వంటి సంఘటనల నేపథ్యం లో ఆర్బీఐ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. క్రెడిట్ కార్డులకు ‘యూపీఐ’ లింక్ క్రెడిట్ కార్డులను యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)తో లింక్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ అనుమతించింది. యూపీఐ ప్లాట్‌ఫారమ్ వినియోగం విస్తృతికి, ఎక్కువ మంది ఈ విధానంలో చెల్లింపులు చేయడానికి దోహదపడే చర్య ఇది. ఇప్పటి వరకూ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన డెబిట్ కార్డులు మాత్రమే యూపీఐ అనుసంధానమైంది. ముందుగా రూపే క్రెడిట్ కార్డులను యూపీఐతో అనుసంధానం చేస్తారు. ప్రస్తుతం యూపీఐ చెల్లింపులు చేయడం ఉచితం. అయితే క్రెడిట్ కార్డ్ కంపెనీలు సాధారణంగా మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్)పై ఆధారపడి ఉంటాయి. ఆదాయ మార్గంగా మర్చంట్ పేమెంట్స్‌కు సంబంధించి ప్రతి వినియోగంపై ఎండీఆర్ చార్జ్ ఉంటుంది. తాజా ఆర్బీఐ నిర్ణయం నేపథ్యంలో యూపీఐతో అనుసంధానమయ్యే క్రెడిట్ కార్డుల విషయంలో వినియోగదారులకు మరిన్ని ప్రయోజనాలు ఒనగూరనున్నాయి. మేలో 594.63 కోట్ల లావాదేవీలకు సంబంధించి రూ.10.40 లక్షల కోట్లు యూపీఐ ద్వారా ప్రాసెస్ జరిగినట్లు గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఈ మ్యాండేట్ పరిమితి రూ.15,000కు పెంపు క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ప్రాతిపదికన నిర్వహించే రికరింగ్ చెల్లింపుల విషయంలో ఈ–మ్యాండేట్ (కస్టమర్ ఆమోదం తప్పనిసరి) పరిమితి పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ ఈ పరిమితి రూ.5,000 కాగా, దీన్ని రూ.15,000కు పెంచుతున్నట్లు తెలిపింది. అంటే ఇక రూ.15,000 లోపు లావాదేవీలకు ఈ–మ్యాండేట్ అవసరం లేదన్నమాట. రియల్టీ మందగమనమే ఆర్బీఐ తాజా నిర్ణయం వల్ల గృహ రుణాలు మరింత ప్రియం కానున్నాయి. విక్రయాలు తగ్గే పరిస్థితి నెలకొంది. వెరసి సమీప భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ మందగమనంలోకి జారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెపో రేటు పెంపు తప్పనిసరి అయినప్పటికీ, ఇది రియల్టీ రంగాన్ని రెడ్ జోన్లోకి నెట్టేసింది. – రమేష్ నాయర్, కొలియర్స్ ఇండియా సీఈఓ రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తే ద్రవ్యోల్బణం కట్టడి... 2022–23 ఆర్థిక సంవత్సరంలో ముడి చమురు ధర బ్యారల్‌కు (ఇండియన్ బాస్కెట్) 105 ఉంటుందని అంచనా వేస్తున్నాం. దీనితోపాటు 2022లో తగిన వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలతో ఉన్నాం. మే 21న కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు ద్రవ్యోల్బణం కట్టడి విషయంలో పట్టణ నివాసితుల నుంచి కొంత సంతృప్తి వ్యక్తం అవుతున్నట్లు మా సర్వేలో తెలిసింది. ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్రాలు వ్యాట్‌లను తగ్గిస్తే, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లతో పాటు ఈ అంచనాలను తగ్గించడానికి ఖచ్చితంగా దోహదం చేస్తుంది. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ సహకార బ్యాంక్ గృహ రుణ పరిమితి రెట్టింపు రియల్టీలో సహకార బ్యాంకులు ఇక మరింత క్రియాశీల పాత్ర పోషించనున్నాయి. గృహ రుణాలకు సంబంధించి సహకార బ్యాంకు ఒక వ్యక్తికి ఇచ్చే గరిష్ట రుణ మొత్తాన్ని రిజర్వ్ బ్యాంక్ రెట్టింపు చేసింది. గృహాల ధరలు పెరిగిన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు దశాబ్ద కాలం క్రితం చేసిన మార్గదర్శకాల్లో మార్పులు జరగనున్నాయి. ఆర్బీఐ గవర్నర్ తెలిపిన సమాచారం ప్రకారం, పట్టణ గ్రామీణ బ్యాంకుల విషయంలో గరిష్ట రుణ పరిమితి ప్రస్తుతం రూ.70 లక్షల నుంచి రూ.1.40 కోట్లకు పెరిగితే, గ్రామీణ సహకార బ్యాంకుల విషయంలో ఈ పరిమితి రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షలకు ఎగసింది. డెవలపర్లకు ఉత్సాహాన్ని ఇచ్చే దిశలో ఆర్బీఐ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లను ప్రారంభించిన బిల్డర్లకు రుణాలు ఇవ్వడానికి గ్రామీణ సహకార బ్యాంకులకు ఆర్బీఐ అనుమతిఇచ్చింది. ప్రస్తుతం దీనిపై నిషేధం ఉంది. గ్రామీణ సహకార బ్యాంకులు వాణిజ్య రియల్ ఎస్టేట్ – రెసిడెన్షియల్ హౌసింగ్ (సీఆర్ఈ–ఆర్‌హెచ్) రంగానికి రుణాలు ఇవ్వడానికీ ఆర్బీఐ అనుమతులు మంజూరు చేయడం ఈ రంగాలకు సానుకూల అంశం. వృద్ధులు, వికలాంగులకు సహాయం చేయడానికి డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవల నిర్వహణకు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులను అనుమతిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ తెలపడం మరో విశేషం. సమగ్ర అంచనాలు... ఆర్బీఐ పాలసీ సమీక్ష అంచనాలు సమగ్రంగా ఉన్నాయి. వృద్ధి–ద్రవ్యోల్బణం సమతౌల్యం తత్సంబంధ అంశాలన్నింటినీ పరిశీలనలోకి తీసుకుని ఆర్బీఐ కమిటీ ఎకానమీ పురోగమనానికి తగిన నిర్ణయాలు తీసుకుంది. రియల్టీ రుణాల విషయంలో సహకార బ్యాంకింగ్‌కు తగిన అనుమతులు ఇస్తూ తీసుకున్న నిర్ణయాలు ఈ రంగానికి సానుకూల అంశం. – దినేష్ ఖారా, ఎస్బీఐ చైర్మన్ కీలక దశ... ఒకపక్క వృద్ధి పురోగమనం. మరోపక్క ద్రవ్యోల్బణం కట్టడి. ఈ కీలక లక్ష్యాల సాధన దిశగా ఎకానమీ అడుగులు వేయాల్సిన పరిస్థితిలో ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుంది. పాలసీ సమీక్ష దాదాపు ఊహించిందే. వృద్ధి బాట చెక్కుచెదరకుండా ప్రభుత్వం, ఆర్బీఐ పరస్పర సహకారంతో పనిచేస్తున్నాయి. ఇదే ధోరణి మున్ముందూ కొనసాగుతుందని విశ్వసిస్తున్నాం. – చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్ సమతుల్య పాలసీ... ద్రవ్యోల్బణం తగ్గడానికి, వృద్ధి పురోగతికి తగిన చర్యలు తీసుకుంటూ ద్రవ్య, పరపతి అధికారులు తగిన నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఇందుకు సంబంధించి దేశీయంగా ఎదురవుతున్న సవాళ్లలో అధికభాగం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల వల్ల తలెత్తుతున్నవే. ఆర్థికాభివృద్ధికి– ధరల కట్టడికి ఆర్బీఐ పాలసీ కమిటీ తన నిర్ణయాలను తాను తీసుకుంది. – అజయ్ సేథ్, ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి. -
ఆర్బీఐ పాలసీ సమావేశాలు.. ‘వడ్డింపు’ భయాలు..
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) రెండవ ద్వైమాసిక సమావేశం సోమవారం ప్రారంభమైంది. గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను (ప్రస్తుతం 4.4 శాతం) మరో 35 బేసిస్ పాయింట్ల నుంచి 50 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) వరకూ పెంచే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినబడుతున్నాయి. ఏప్రిల్‌లో తొలి ద్వైమాసిక సమీక్షలో రెపో రేటును యథాతథంగా కొనసాగించిన ఆర్బీఐ ఎంపీసీ, మే తొలి వారంలో అనూహ్య రీతిలో సమావేశమై రెపో రేటును 2018 ఆగస్టు తర్వాత మొట్టమొదటిసారి 0.4 శాతం పెంచింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ద్రవ్యోల్బణం తీవ్రత దీనికి కారణం. ఇదే పెంపు ధోరణిని ఆర్బీఐ తాజా సమావేశంలోనూ కొనసాగిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రెపో రేటు 5.6 శాతం వరకూ పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. మే మధ్యంతర సమావేశంలో రెపో రేటుతోపాటు బ్యాంకులు ఆర్బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సిన ‘వడ్డీ రహిత’ నిధులకు సంబంధించిన నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని కూడా (రూ.87,000 కోట్లు వ్యవస్థ నుంచి వెనక్కు తీసుకోవడం లక్ష్యంగా) పరపతి విధాన కమిటీ 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 4.5 శాతానికి పెరిగింది. కొనసాగుతున్న బ్యాంకింగ్ ‘వడ్డింపు’ ఆర్బీఐ రెపో పెంపు నేపథ్యంలో బ్యాంకింగ్ పలు దఫాలుగా వడ్డీరేట్ల పెంపునకు శ్రీకారం చుట్టాయి. తాజాగా సోమవారం ఈ వరుసలో కెనరా బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంకులు నిలిచాయి. నెలవారీ చెల్లింపుల (ఈఎంఐ) ఆధారిత బెంచ్‌మార్క్ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించాయి. -
ఇంగ్లాండ్ సెంట్రల్ బ్యాంక్‌లో ఎన్నారైకి కీలక పదవి
లండన్: బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్లను నిర్ణయించే కీలక ద్రవ్య పరపతి విధాన కమిటీలో (ఎంపీసీ) ఎక్స్‌టర్నర్ సభ్యురాలుగా ప్రముఖ విద్యావేత్త, భారతీయ సంతతి మహిళ డాక్టర్ స్వాతి ధింగ్రా నియమితులయ్యారు.ఈ కీలక బాధ్యతల్లో భారతీయ సంతతి మహిళ నియమితులు కావడం ఇదే తొలిసారి. ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అప్లైడ్ మైక్రోఎకనామిక్స్‌లో స్పెషలైజేషన్ ఉన్న ధింగ్రా ప్రస్తుతం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (ఎల్ఎస్ఈ)లో ఎకనామిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ యూనివర్శిటీలో స్వాతి ధింగ్రా విద్యను అభ్యసించారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి మాస్టర్స్ పట్టా పొందారు. యూనివర్శిటీ ఆఫ్ విస్కాన్సిన్–మాడిసన్ నుండి ఎంఎస్, పీహెచ్డీ పూర్తి చేశారు. బ్రిటన్ ట్రేడ్ మోడలింగ్ రివ్యూ ఎక్స్పర్ట్ ప్యానెల్లో సభ్యురాలిగా ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టు 9న ఆమె ఎంపీసీలో చేరి, మూడేళ్లపాటు కీలక బాధ్యతలు నిర్వహి స్తారు. 2016 ఆగస్టు నుంచి ఎంపీసీ సభ్యునిగా పనిచేస్తున్న మైఖేల్ సాండ్రూస్ స్థానంలో ఆమె ఈ బాధ్యతలు చేపడతారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఎంపీసీలో గవర్నర్‌తోపాటు, ముగ్గురు డిప్యూటీ గవర్నర్లు సభ్యులుగా ఉంటారు. బ్యాంకులో ఒక సీనియర్ ఆధికారితోపాటు, నలుగురు బయటి స్వ తంత్రులు సభ్యులుగా ఉంటారు. వీరిని బ్రిటన్ ఆర్థికమంత్రి నియమిస్తారు. చదవండి: Elon Musk - Twitter Deal: ట్విటర్‌కి బ్రేకప్ చెప్పిన ఈలాన్ మస్క్? -
అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా చర్యలు
ముంబై: అంతర్జాతీయ పరిస్థితులు, పరిణామాలకు అనుగుణంగా ఎప్పుటికప్పుడు సకాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విధాన చర్యలు ఉండాలని గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య, పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయించింది. ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షకు సంబంధించి ఈ నెల 6 నుంచి 8 వరకూ జరిగిన సమావేశాల మినిట్స్ ఈ విషయాన్ని తెలిపింది. అనిశ్చితి ఆర్థిక పరిస్థితుల్లో నిర్ణయాలు అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా సకాలంలో తీసుకోవాలన్న గవర్నర్ అభిప్రాయానికి ఐదుగురు సభ్యులు మద్దతు పలికినట్లు మినిట్స్ వెల్లడించింది. ద్రవ్యోల్బణమే ప్రధాన సవాలు: పాత్ర కాగా, డి–గ్లోబలైజేషన్ ఆసన్నమైనట్లు కనిపిస్తున్న ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో ద్రవ్యోల్బణమే ప్రధాన సవాలు ఉండే అవకాశం ఉందని, ఈ సవాలును జాగ్రత్తగా ఎదుర్కొనాలని ఎంపీసీ సభ్యుడు, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ‘‘1980 నుంచి ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం 60 శాతం అభివృద్ధి చెందిన దేశాలు 5 శాతం కంటే ఎక్కువ ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో సగానికి పైగా ద్రవ్యోల్బణం 7 శాతం కంటే ఎక్కువగా ఉంది. ధరల పెరుగుదల సామాజిక సహన స్థాయిలను పరీక్షిస్తోంది’’ అని సమావేశంలో ఆయన పేర్కొన్నట్లు మినిట్స్ తెలిపాయి. మినిట్స్ ప్రకారం సమావేశంలో ముఖ్య అంశాలు, నిర్ణయాలు ► భారత్ ఎకానమీపై ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, ఈ నేపథ్యంలో తలెత్తిన భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ► ఏప్రిల్‌తో ప్రారంభమైన 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎకానమీ వృద్ధి రేటు అంచనాలను ఏకంగా 60 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గింపు. దీనితో ఈ అంచనా 7.8 శాతం నుంచి 7.2 శాతానికి డౌన్. ► పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలనూ పరపతి సమీక్ష భారీగా 1.2 శాతం మేర పెంఉ. దీనితో 2022–23లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలు 5.7 శాతానికి అప్. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం 6.3 శాతం, 5.8 శాతం, 5.4 శాతం, 5.1 శాతంగా ఉంటుందని అంచనా. ► ద్రవ్యోల్బణం కట్టడి దిశలో వ్యవస్థలో ఒకపక్క అదనంగా ఉన్న లిక్విడిటీ వెనక్కు తీసుకుంటూనే మరో వైపు వృద్ధే లక్ష్యంగా రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) యథాతథంగా 4 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయం. దీనితో ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా వరుసగా 11 ద్వైమాసిక సమావేశాలోనూ ఆర్బీఐ రెపో రేటును యథాతథంగా కొనసాగించినట్లయ్యింది. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్రూడ్ ఆయిల్ (ఇండియన్ బాస్కెట్) బ్యారల్ ధర 100 డాలర్లుగా అంచనా. ► అన్ని బ్యాంకుల కస్టమర్లకూ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయెల్స్‌కు వెసులుబాటు ► అదనపు లిక్విడిటీని వెనక్కు తీసుకోడానికి కొత్తగా ‘ఎస్డీఎఫ్’ ఇన్స్ట్రమెంట్. వడ్డీ రేట్ల పెంపు ఖాయం: కేకీ మిస్త్రీ వడ్డీ రేట్ల పెంపు విషయంలో ఇతర సెంట్రల్ బ్యాంకులతో పోలిస్తే రిజర్వ్ బ్యాంకు వెనుకబడి లేదని హెచ్డీఎఫ్సీ వైస్ చైర్మన్, సీఈవో కేకీ మిస్త్రీ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది క్రమంగా రెండు లేదా మూడు దఫాలుగా పెం చేందుకు అవకాశం ఉందని .. కానీ ఎకానమీపై దాని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఈ నెల తొలినాళ్లలో పరపతి విధానం ప్రకటించిన ఆర్బీఐ.. రెపో రేటును యధాతథంగా 4 శాతం స్థాయిలోనే కొనసాగించిన సంగ తి తెలిసిందే. ఇటు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తూ అటు వృద్ధికి కూడా ఊతమిచ్చేలా రేట్ల పెంపుపై ఉదారవాద ధోరణిని కొనసాగించాలని రిజర్వ్ బ్యాంక్ భావించింది. ఈ నేపథ్యంలోనే మిస్త్రీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికాలో ద్రవ్యోల్బణంతో భారత్‌లో ధరల పెరుగుదలను పోల్చి చూడరాదని ఆయన చెప్పారు. చరిత్ర చూస్తే అమెరికాలో ఎంతో కాలంగా ద్రవ్యోల్బణం అత్యంత కనిష్ట స్థాయుల్లో నమోదు అవుతుండగా .. భారత్‌లో భారీగా ఉంటోందని, రెండింటికి మధ్య 400 బేసిస్ పాయింట్ల మేర వ్యత్యాసం ఉంటోందని మిస్త్రీ తెలిపారు. అలాంటిది.. ప్రస్తుతం అమెరికాలో ఏకంగా 8.5 శాతం స్థాయిలో ద్రవ్యోల్బణం ఎగియగా.. భారత్‌లో 5.7 శాతం ద్రవ్యోల్బణం కావచ్చన్న అంచనాలు నెలకొన్నట్లు ఆయన చెప్పారు. ‘ఆ రకంగా చూస్తే అమెరికాతో పోల్చినప్పుడు మన దగ్గర ద్రవ్యోల్బణం 2.8 శాతం తక్కువగా ఉంది. ఇంత భారీ ద్రవ్యోల్బణం ఎన్నడూ చూడలేని అమెరికా .. వడ్డీ రేట్ల పెంపు వంటి తీవ్రమైన కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది‘ అని మిస్త్రీ పేర్కొన్నారు. అమెరికాను చూసి భారత్ కూడా అదే ధోరణిలో వెళ్లాల్సిన అవసరం కనిపించడం లేదన్నారు. -
డిజిటల్ కరెన్సీపై ఆచితూచి నిర్ణయం
న్యూఢిల్లీ: ప్రతిపాదిత సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)ని ప్రవేశపెట్టే విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ టి. రవి శంకర్ తెలిపారు. ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ రంగం, ద్రవ్య పరపతి విధానంపై డిజిటల్ కరెన్సీ ప్రభావాలను లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. రిస్కీ సాధనాలైన క్రిప్టోకరెన్సీలను కట్టడి చేసే విధంగా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఆధారిత డిజిటల్ కరెన్సీని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టడంపై ఆర్బీఐ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో శంకర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటివరకూ అధికారికంగా ఎక్కడా డిజిటల్ కరెన్సీ వినియోగంలో లేనందున దాని ప్రభావాలను ముందుగా అంచనా వేయగలిగే పరిస్థితి లేదని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఇతర సెంట్రల్ బ్యాంకులు కూడా దీని విషయంలో క్రమానుగతంగా ముందుకు వెళ్లే అవకాశం ఉందన్నారు. సీబీడీసీలతో ఒనగూరే ప్రయోజనాల వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో డిపాజిట్ల డిమాండ్‌పై, తత్ఫలితంగా రుణ వితరణ సామర్థ్యాలపై ప్రతికూల ప్రభావం పడవచ్చని శంకర్ అభిప్రాయపడ్డారు.