Nehru
-
ఒకే సీటుపై మూడు సార్లు పోటీకి దిగిన మూడో ప్రధానిగా మోదీ!
యూపీలోని వారణాసి పార్లమెంట్ స్థానం నుంచి మూడోసారి నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. దేశ తొలి ప్రధాని నెహ్రూ, వాజ్‌పేయిల రికార్డును సమం చేశారు. ఈ మాజీ దివంగత ప్రధానులిద్దరూ ఒకే లోక్‌సభ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి భారీ ఓట్లతో విజయం సాధించారు. ఇప్పుడు మోదీ కూడా ఒకే లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పారు.పండిట్ నెహ్రూ 1951, 1957, 1962లో మూడుసార్లు ప్రయాగ్‌రాజ్ జిల్లాలోని ఫుల్పూర్ సీటుకు ఎంపీగా ఉన్నారు. మూడుసార్లు ప్రధానిగా దేశ పగ్గాలను చేపట్టారు. భారతరత్న పండిట్ అటల్ బిహారీ వాజ్‌పేయి లక్నో నుంచి ఐదుసార్లు ఎంపీగా ఉన్నప్పటికీ, 1996, 1998, 1999లో ఎంపీ అయిన తర్వాత ప్రధాని పదవిని చేపట్టారు. తాజాగా నరేంద్ర మోదీ 2014, 2019లో వారణాసి ఎంపీగా ఎన్నికయ్యారు. రెండు పర్యాయాలు ఆయన నేతృత్వంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. వారణాసి నుంచి మూడోసారి నామినేషన్ దాఖలు చేయడం ద్వారా, ఒకే లోక్‌సభ స్థానం నుంచి వరుసగా మూడుసార్లు ఎన్నికల్లో పోటీ చేసిన ఘనత దక్కించుకున్నారు.భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో 14 మంది ప్రధానులు దేశాన్ని పాలించారు. వారిలో తొమ్మిది మంది ఉత్తరప్రదేశ్‌కు చెందినవారే కావడం విశేషం. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ నుంచి మొదలైన ఈ ట్రెండ్ నరేంద్ర మోదీ వరకూ వచ్చింది. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధి, చౌదరి చరణ్ సింగ్, రాజీవ్ గాంధీ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, చంద్రశేఖర్, అటల్ బిహారీ వాజ్‌పేయి యూపీలోని వివిధ స్థానాల నుండి ఎన్నికలలో గెలిచి పార్లమెంటుకు చేరుకున్నారు. -
నెహ్రూ జాకెట్ సాహిత్యం
నెహ్రూ గారిని నిలదీయడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయిందిగాని నిజానికి ఆయనను నిలదీయాల్సింది నెహ్రూ జాకెట్‌ను ఎందుకు పాప్యులర్ చేశావయ్యా అని. రచయితలు, కవులు, విమర్శకులు మున్ముందు రోజులలో లాల్చీ పైజమా ధరించడమేగాక నెహ్రూ జాకెట్‌ను కూడా తగిలించారంటే గనక చచ్చినట్టు వారు సాహిత్యకారులుగా మన దేశంలో చలామణి అవుతారని ఆయన ఊహించి ఉండడు. ఎరిగిన సాహిత్యకారులు అడపా దడపా ఆ అదనపు వస్త్రాన్ని ధరించినా తాము సాహిత్యకారులమే అని తప్పక నిరూపించుకోవాలనుకునే వారికి మాత్రం నెహ్రూ జాకెట్ కవచ కుండలం. పూర్వం రోజులలో కొందరు సాహితీ తాపసులు పెన్నును బుగ్గకు పెట్టుకుని, నుదుటిని నింగి వంక ఎత్తి పెట్టి ఫొటో దిగి, పుస్తకం వెనుక వేసుకోవడం వల్ల వారు రచయితలని, కవులని నమ్మాల్సి వచ్చేది. మరికొందరు టెలిఫోన్ రిసీవర్‌ను చెవి దగ్గర పెటుకొన్న ఫొటోను పుస్తకం వెనుక వేయడం వల్ల అమ్మో వీరు రచయితలేస్మీ అనుకోకుండా ఉండలేకపోయేవారం. ‘మానవతా... ఎక్కడమ్మా నీ చిరునామా?’ అని గూగుల్ మేప్స్ లేని కాలంలో ఎవరు పై అడ్రస్ అడుగుతూ కవిత్వం రాసినా వారు కవులు కాకుండాపోలేదు. ఇక ఏ కాలంలో అయినా ఎల్.ఎస్.వి.శేషాచలం, మునవర్తి సుబ్రహ్మణ్యం, విక్టర్ మనోహర్, ప్రొఫెసర్ చారులత వంటి ప్రముఖ విమర్శకులు ఉంటారు కనుక వారు ముందు మాట రాసి వదిలారంటే– ఎందుకొచ్చిన గొడవ అని నోరు మెదపక అట్టి రచయితలను రచయితలే అనుకోవడమూ కద్దు. ఏదేని ఒక శాఖ కలిగిన రాష్ట్రమంత్రితో, ఏదేని ప్రాదేశిక ఇన్ కమ్టాక్సు కమిషనర్‌తో, లేదంటే స్థానిక వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్‌తో... ఈ ముగ్గురితో కాని కనీసం వీరిలో ఇద్దరితో కాని ఫొటోలు దిగి, ఫేస్బుక్లో పెట్టి, ఇక మమ్మల్ని సాహిత్యకారులం కాదు అనంటే తంతాం అనేవారు ఉన్నారంటే నోరు నొక్కుకోవాల్సిన పని లేదు. జీవితంలో అక్షరమ్ముక్క రాయకపోయినా రాసే వాళ్లందరి ఫోన్ నంబర్లు కలిగి ఉండటమే కాదు వారికి కాల్ చేసి ‘ఏవోయ్ ఎలా ఉన్నావ్’ అనిగానీ, ‘నమస్కారమండీ... టిఫినయ్యిందా’ అనిగానీ అడగ్గలిగే చనువు ఉన్నందుకు కనీసం డజను మంది తెలుగునాట ప్రముఖ సాహిత్యకారులుగా చలామణి అవుతున్నారంటే గుండె పొంగే సంగతి. ‘శుంఠల్లారా... ఇదా మీ ప్రతాపమూ... నన్ను గనక కళ్లకు గంతలు గట్టి ఢిల్లీలో ఏమూల వదిలినా నేరుగా సాహిత్య అకాడెమీ ఆఫీసుకు చేరుకోగలను’ అనేవారి ప్రదక్షిణ పటిమ వారికి ఇస్తున్న అతిశయం అంతా ఇంతా కాదు. ‘అడుగడుగున నుడి ఉంది’, ‘అక్షర రశ్మీ జయతు’, ‘మనమంతా కలం కులం’... వాట్సప్ గ్రూప్‌లను స్థాపించి, ఒక దానిలో నూట పదహారుకు తక్కువ కాకుండా సభ్యులను చేసి, అడ్మిన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏకైక హోదా వల్ల సాహిత్య దశా దిశను నిర్దేశించాలని కన్నీళ్లతో తపన పడేవారెందరో మన హృదయాలను చెమ్మగిల్ల చేస్తున్నారు. ఈ యొక్క వాట్సప్ గ్రూప్‌లలో ప్రతి ఒక్క కవిత, వ్యాఖ్యకు మరువక లైక్ కొట్టేవారిని దృష్టిలోకి తీసుకుని మాసాంతంలో వారికో అవార్డు బహూకరించడం మరో విశిష్ట ప్రోత్సాహక ప్రోత్సహితం. జూమ్‌లో స్లాట్ బుక్ చేసి, కార్డు డిజైన్ చేయగల వనరులు కలిగినవారు వారానికి పది మందిని సాహితీ సమాలోచనంలో ముమ్మరం చేయడం చూస్తే ఏమిచ్చి వీరి రుణం తీర్చుకోగలం అనిపిస్తుంది. గుర్తు తెలియని విదేశాలకు వెళ్లి స్థానిక గాంధీనగర్ అసోసియేషన్ స్థాయి సాహితీ సమ్మేళనంలో పాల్గొని రుజువు పత్రంతోనూ, తెల్లవాళ్లతోనూ ఫొటోలు దిగి బెదురు, బెరుకు పుట్టించే వారిది స్వీయ విమానచార్జీలు భరించగలిగే స్థాయి. సాహిత్యం అంటే అందరికీ ఇష్టం. పాఠకులుగా ఉత్తమ సాహిత్యాన్ని ఇష్టపడేవారూ సృజన కారులుగా ఉత్తమ సాహిత్యసృష్టికి పెనుగులాడేవారూ ఎప్పుడూ ఉంటారు. ఈ ఇద్దరూ ప్రతి ప్రాంతంలో, భాషలో, దేశంలో తమ తమ సాహిత్యాన్ని గౌరవ భంగం కలగకుండా కాపాడుకుంటూ వస్తారు. అలాగే ప్రతి సందర్భంలో, ప్రతి సన్నివేశంలో ఈ సాహిత్యంలో భాగం కావాలని నిజాయితీగా అభిలషించేవారూ ఉంటారు.వీరి ప్రయత్న శుద్ధి, సృజన సామర్థ్యం, విడదీయలేని స్వభావం ఇవ్వవలసిన గుర్తింపు ఇస్తూనే ఉంటాయి. వీరు కాక ఔత్సాహిక పాఠకులు, ఔత్సాహిక సాహితీ సేవకులూ ఉంటారు. వీరు తమను తాము సాహితీకారులుగా భావించుకుని కార్యాచరణలో దిగడమూ, సాహిత్యానికి ప్రతినిధులుగా మారడం నేటి సోషల్ మీడియా కాలంలో విస్తృతమైంది. సాహిత్యం ఇచ్చే గుర్తింపు ఆనందాన్ని, ఆత్మసంతృప్తిని కలిగించడమేగాక ఏదో ఒక ఊతం దొరికింది కదా అనుకునేలా చేయడం ఇందుకు కారణం. ఇవన్నీ ఉండాల్సినవే. ఉండతగ్గవే. కాకుంటే శ్రుతి మించి అసలు కొంత, కొసరు మరింతగా మారడం నేటి దుఃస్థితి. వాస్తవానికి రెండు రాష్ట్రాలలోని చిన్న ఊళ్లలో ఉంటూ మంచి కవిత్వాన్ని, కథను రాస్తున్న యువతరం ఎందరో ఉన్నారు. అలాగే ఏళ్లకేళ్లు తమ మానాన తాము రాసుకుంటూ పాఠకుల గౌరవం పొందినవారూ ఉన్నారు. వీరంతా పి.ఆర్. చేయకపోవచ్చు. తమను తాము ముందుకు నెట్టుకోకపోవచ్చు. అంతమాత్రాన రాష్ట్ర, జాతీయస్థాయి వేదికల మీద వీరు కనపడాల్సిన పనిలేదు అనుకోరాదు. అదే సమయంలో పరిచయ సామర్థ్యమే సాహితీ సామర్థ్యంగా చెల్లుబాటయ్యే వారు అట్టి వేదికల మీద పదే పదే సాహితీ ముఖాలుగా కనిపించడాన్నీ ఉపేక్షించాల్సిన పని లేదు. ‘సత్యముతో పని ఏల, మిడియోకర్లతో కలిసి నడిచి ప్రయోజనాలు పొందితే పోలా’ అనుకునే నిజ సాహితీకారులదీ ఈ దోషం. కళ్లు మూత. ఏమైనా మాట్లాడే సందర్భం వస్తుంది. అభినయ సాహిత్యకారులూ కొంచెం నెమ్మదించండి! -
Birthday Special: ‘వాజపేయి ప్రధాని కావడం తథ్యం’.. నెహ్రూ ఎందుకలా అన్నారు?
నేడు (డిసెంబరు 25) దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి జన్మదినం. ఆయన ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. మరోవైపు వాజపేయి అద్భుతమైన ప్రసంగాలకు, ఇతరులను ఆకట్టుకునే సామర్థ్యానికి ప్రతీకగా నిలిచారు. అందరినీ కలుపుకొని పోయేవిధంగా రాజకీయాలు నడుపుతూ, ప్రత్యర్థులను కూడా తన వెంట తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. వాజపేయి వాక్చాతుర్యం, తర్కం ముందు ఎవరూ నిలబడలేకపోయేవారని చెబుతుంటారు. ఆయన జన్మదినమైన డిసెంబర్ 25న దేశంలో సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటారు. అటల్ బిహారీ వాజపేయి 1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జన్మించారు. హిందీ, సంస్కృతం, ఆంగ్లం, రాజనీతి శాస్త్రంలో విద్యాభ్యాసం చేశారు. ఒకప్పుడు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, జనతా పార్టీలో కొనసాగిన అటల్ బిహారీ వాజపేయి భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులలో ఒకరు. ఐక్యరాజ్యసమితిలో హిందీలో ప్రసంగించిన ప్రపంచంలోనే మొదటి వ్యక్తిగా వాజపేయి ఘనత సాధించారు. వాజపేయి మొదటి నుంచి తన ప్రసంగాలతో ఇతరులను అమితంగా ప్రభావితం చేసేవారు. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కూడా వాజపేయి ప్రసంగాలకు ప్రభావితమయ్యారు.. ఏదో ఒకరోజు అటల్జీ ప్రధాని అవుతారని నెహ్రూ అన్నారు. వాజపేయి ప్రతి ప్రసంగంలోనూ ఆయనలోని కవి మేల్కొనేవాడు. ఒకప్పుడు భారత రాజకీయాల్లోని పలుపార్టీలు భారతీయ జనతా పార్టీకి దూరంగా మసలేవి. బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు చేసేవి. అయితే వాజపేయి దీనికి భిన్నమైన గుర్తింపు దక్కించుకున్నారు. ప్రత్యర్థులు కూడా ఆయనను విమర్శించడానికి భయపడేవారు. వాజపేయి హిందుత్వవాదాన్ని బహిరంగంగా సమర్థించారు. విమర్శకుల నోరు మూయించడంలో సమర్థుడైన నేతగా నిలిచారు. వాజపేయి 2018, ఆగస్టు 16న కన్నుమూశారు. ఇది కూడా చదవండి: గుడ్‌బై 2023: సుఖోయ్-30.. మిరాజ్-2000 ఢీకొన్న వేళ.. -
ఆయనకు చరిత్ర తెలుసని అనుకోను: రాహుల్‌గాంధీ
ఢిల్లీ: రాజ్యసభలో సోమవారం జమ్మకశ్మీర్‌కు సంబంధించి రెండు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. అయితే ఆ టైంలో చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూపై, గత కాంగ్రెస్ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై నెహ్రూ మనవడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ‘‘పండిట్ నెహ్రూ తన జీవితాన్ని ఈ దేశానికి అంకితమిచ్చారు. దేశ ప్రజల కోసం ఏళ్ల తరబడి జైల్లో ఉన్నారు. అమిత్‌షాకు చరిత్ర తెలియదు. తెలుసుకుంటారని కూడా నేను అనుకోను. అందుకే పదే పదే దాన్ని తిరగరాస్తూనే ఉన్నారు’’ అని రాహుల్ కౌంటర్ ఇచ్చారు. దేశంలో నెలకొన్న ప్రధాన సమస్యల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే భాజపా ఇలాంటి ఆరోపణలు చేస్తోందని రాహుల్ అన్నారు. ‘‘కుల గణన, నిరుద్యోగం, దేశంలోని ధనమంతా ఎవరి చేతుల్లో ఉంది.. ఇవన్నీ ప్రధాన అంశాలు. వీటిపై చర్చించేందుకు బీజేపీ భయపడుతోంది. అందుకే వీటి నుంచి పారిపోతోంది’’ అని రాహుల్ ఎద్దేవా చేశారు. రాజ్యసభలో జమ్ము కశ్మీర్ బిల్లులపై చర్చ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ‘‘కేవలం ఒకేవ్యక్తి పొరపాటు వల్ల భారత్‌లో జమ్ముకశ్మీర్ భాగం కావడం ఆలస్యమైంది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సైతం భగ్గుమంది. ఇదిలా ఉంటే.. జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ), జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లులకు కేంద్రం రూపం తెచ్చింది. కశ్మీరీ శరణార్థుల నుంచి ఇద్దరిని, పాక్ ఆక్రమిత కశ్మీర్ నిర్వాసితుల నుంచి ఒకరిని శాసనసభకు నామినేట్ చేసేందుకు, కొన్ని వర్గాలకు రిజర్వేషన్ ఇచ్చేందుకు ఈ బిల్లులు వీలు కల్పిస్తాయి. లోక్‌సభ కిందటి వారమే ఈ బిల్లుల్ని ఆమోదించగా.. రాజ్యసభలో సోమవారం దాదాపు నాలుగు గంటల చర్చ తర్వాత ఆమోదం లభించింది. తర్వాతి దశలో రాష్ట్రపతి ఆమోదంతో ఈ బిల్లులు చట్టంగా మారనున్నాయి. -
పీఓకే అంశంలో నెహ్రూది హిమాలయమంతటి తప్పిదం: అమిత్ షా
జమ్ము కశ్మీర్: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) అంశంలో మాజీ ప్రధాని నెహ్రూపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. పీవోకే సమస్యకు నెహ్రూదే బాధ్యత అంటూ నిప్పులు చెరిగారు. పీవోకే విషయంలో నెహ్రూ చేసింది చిన్న తప్పు కాదు.. హిమాలయమంతటి తప్పిదమని ధ్వజమెత్తారు. దేశంలో చాలా భూభాగాన్ని నెహ్రూ వదిలివేశారని తప్పుబట్టారు. జమ్ము కశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు-2023, జమ్ము కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2023పై పార్లమెంట్లో అమిత్ షా ప్రసంగించారు. #WATCH | Union Home Minister Amit Shah says, "Two mistakes that happened due to the decision of (former PM) Pandit Jawaharlal Nehru due to which Kashmir had to suffer for many years. The first is to declare a ceasefire - when our army was winning, the ceasefire was imposed. If… pic.twitter.com/3TMm8fk5O1 — ANI (@ANI) December 6, 2023 మాజీ ప్రధాని నెహ్రూ రెండు భారీ తప్పులు చేశారని షా అన్నారు. మొదటిది కాల్పుల విరమణ చేయడం కాగా రెండోది.. మన అంతర్గత పీఓకే అంశాన్ని ఐరాసకు తీసుకువెళ్లి నెహ్రూ మరో తప్పిదం చేశారని అమిత్ షా చెప్పారు. అప్పట్లో కాల్పుల విరమణ మరో మూడు రోజులు చేయకుండా ఉంటే.. పీఓకే ఇప్పుడు జమ్ముకశ్మీర్‌లో భాగంగా ఉండేదని తెలిపారు. పీఓకే ఎప్పటికైనా భారత్‌దే అని షా పునరుద్ఘాటించారు. కాగా.. నెహ్రూ గురించి అమిత్ షా మాట్లాడుతుంటే.. సభ నుంచి కాంగ్రెస్ వాకౌంట్ చేసింది. ప్రస్తుతం పీఓకేకు 24 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తున్నట్లు షా పేర్కొన్నారు. గతంలో జమ్మూలో 37 సీట్లు ఉండగా, ఇప్పుడు 43 ఉన్నాయని స్పష్టం చేశారు. కశ్మీర్లో గతంలో 46 సీట్లు ఉండగా.. ప్రస్తుతం 47 స్థానాలు ఉన్నాయి. పీఓకేకు 24 సీట్లు కేటాయించామని అమిత్ షా స్పష్టం చేశారు. ఇదీ చదవండి: పీఓకేపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు -
4 రాష్ట్రాలను తాకే ఏకైక జిల్లా ఏది? ‘స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా’ ఎందుకయ్యింది?
దేశంలోని ప్రతి రాష్ట్రంలో అనేక జిల్లాలు ఉన్నప్పటికీ, భౌగోళిక ప్రత్యేకతల విషయానికి వస్తే, ఉత్తరప్రదేశ్‌లోని ఆ జిల్లా పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. యూపీలోని సోన్‌భద్ర జిల్లా అనేక ప్రత్యేకతలను కలిగివుంది. విస్తీర్ణం పరంగా ఉత్తరప్రదేశ్‌లోని రెండవ అతిపెద్ద జిల్లా సోన్‌భద్ర. నిజానికి సోన్‌భద్ర భారతదేశంలోని ఒక ప్రత్యేకమైన జిల్లా. ఇది నాలుగు రాష్ట్రాల సరిహద్దులను తాకుతుంది. ఈ ప్రత్యేకత కారణంగా పోటీ పరీక్షలలో సోన్‌భద్ర జిల్లాకు సంబంధించిన ప్రశ్నలను అడుగుతుంటారు. సోన్‌భద్ర యూపీలో ఉన్నప్పటికీ దాని సరిహద్దులు మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లను తాకుతాయి. సోన్‌భద్ర మైనింగ్ గనుల పరంగానే ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడి కైమూర్ కొండలలో ఖనిజాలు పెద్ద మొత్తంలో లభిస్తాయి. సోన్‌భద్ర ప్రాంతంలో బాక్సైట్, సున్నపురాయి, బొగ్గు, బంగారం కూడా లభ్యమవుతుంది. 1989కి ముందు సోన్‌భద్ర యూపీలోని మీర్జాపూర్ జిల్లాలో ఉండేది. అయితే 1998లో దీనిని వేరు చేసి సోన్‌భద్ర అనే పేరు పెట్టారు. ఇక్కడ ప్రవహించే నది కారణంగా ఈ ప్రాంతానికి సోన్‌భద్ర అనే పేరు వచ్చింది. ఇక్కడ సోన్ నది ప్రవహిస్తుంది. ఈ జిల్లాలో కన్హర్, పంగన్లతో పాటు రిహాండ్ నది కూడా ప్రవహిస్తుంది. సోన్‌భద్ర జిల్లా వింధ్య , కైమూర్ కొండల మధ్య ఉంది. ఇక్కడి అందమైన దృశ్యాలు ఇట్టే ఆకట్టుకుంటాయి. పండిట్ నెహ్రూ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ జిల్లాలోని ప్రకృతి అందాలను చూసి, ఈ ప్రాంతానికి ‘స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా’ అనే పేరు పెట్టారు. సోన్‌భద్రలో అడుగడుగునా పచ్చదనం, అందమైన పర్వతాలు కనిపిస్తాయి. ఇక్కడి నదుల ప్రవాహం కనువిందు చేస్తుంది. ఇక్కడ పలు పవర్ ప్లాంట్లు ఉన్నకారణంగా ఈ ప్రాంతాన్ని పవర్ క్యాపిటల్ అని కూడా పిలుస్తారు. ఇది కూడా చదవండి: ఆ బాబాలు ఏం చదువుకున్నారు? -
‘జో నెహ్రూ’ ఎవరు? ఇందిర, సోనియా, ప్రియాంకలకు ఏమి బహూకరించారు?
స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రాజకీయ వారసత్వం అమితమైన ఆసక్తిని కలిగిస్తుంటుంది. ఆ మధ్య చరిత్రకారుడు రామచంద్ర గుహ మాట్లాడుతూ ‘జవహర్లాల్ నెహ్రూ ఎదుర్కొన్న సవాళ్లను ఆధునిక భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడూ ఎదుర్కోలేదనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. నెహ్రూ దేశానికి సారధ్యం వహించే సమయంలో దేశం ఒక జాతిగా దాని సొంత కాళ్లపై కూడా నిలబడలేని స్థితిలో ఉన్నదన్నారు. జవహర్లాల్ నెహ్రూ దేశ తొలి ప్రధానిగా అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రజాస్వామ్యం, నైతికత, లౌకికవాదం, సోషలిజం మొదలైనవాటిని దేశంలో పెంపొందించేదుకు నెహ్రూ కృషి చేశారని చెబుతారు. అయితే నెహ్రూ వ్యక్తిత్వానికి సంబంధించిన అంశాలు, వ్యక్తిగత సంబంధాలు, అభిరుచులు, ఇష్టాలు, అయిష్టాలు చాలావరకూ తెరమరుగునే ఉన్నాయి. నెహ్రూకు గాలిపటాలు ఎగురవేయడం అంటే చాలా ఇష్టం. ఈ అభిరుచి అతనికి ఇంగ్లాండ్‌లోని హారో, కేంబ్రిడ్జ్లలో ఉంటున్నప్పుడు ఏర్పడింది. అదేవిధంగా నెహ్రూకు న్యాయశాస్త్రం చదవడమంటే ఏ మాత్రం ఇష్టం లేకపోయినా, తండ్రి కోరిక మేరకు లా పూర్తిచేసి, న్యాయవాదిగా మారారు. జవహర్లాల్ నెహ్రూకి సంబంధించి బయటి ప్రపంచానికి అంతగా తెలియని కొన్ని అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జవహర్లాల్ నెహ్రూను కేంబ్రిడ్జ్‌లోని ట్రినిటీ కాలేజీలో అతని సహవిద్యార్థులు ‘జో నెహ్రూ’ అని పిలిచారు. దీనికి కారణం అలా పిలవడం చాలా సులభమని వారు భావించేవారు. నెహ్రూను పూర్తి పేరుతో పిలవడం వారికి కష్టంగా అనిపించేదట. హారో, కేంబ్రిడ్జ్‌లో చదువుతున్నప్పుడు నెహ్రూకు గాలిపటం ఎగురవేయడమనేది ఒక క్రీడగా పరిచయం అయ్యింది. గాలిపటాలపై నెహ్రూకు మక్కువ మరింతగా పెరిగి, వాటిని బాగా ఎగురవేయగలిగే నైపుణ్యం సంపాదించారు. ఈ నేపధ్యంలో నెహ్రూ భారతదేశం నుండి మంచి గాలిపటాలను తెప్పించుకుని, వాటి ఎగురవేస్తూ ఆనందం పొందేవారు. నెహ్రూ తన తండ్రి ఒత్తిడి మేరకు న్యాయశాస్త్రం చదివారు. నిజానికి నెహ్రూ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఆర్థిక శాస్త్రం చదువుకోవాలనుకున్నారు. తనను లాయర్‌గా మార్చినందుకు నెహ్రూ తన తండ్రిపై తరచూ పలు ఆరోపణలు చేసేవాడు. గాంధీజీ మరణానంతరం నెహ్రూ చేసిన ‘మన జీవితాల్లో వెలుగులు ఆరిపోయాయి’ అనే ప్రసంగం ఆయన చేసిన ప్రముఖ ప్రసంగాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ ప్రసంగాన్ని ఆయన ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా చేయడం విశేషం. జైలులో ఉన్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ తన కుమార్తె ఇందిర వివాహానికి లేత గులాబీ ఖాదీ చీరను నేశారు. ఆ తర్వాత సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ కూడా తమ తమ పెళ్లిళ్లలో అదే ధరించారు. నెహ్రూకు పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. ఆయన తన ఇంటిలో పెద్ద సంఖ్యలో వివిధ రకాల పెంపుడు జంతువులను పెంచేవారు. వీటిలో ఒక పాండా కూడా ఉండేది. జవహర్లాల్ నెహ్రూ తన వస్త్రధారణలో జాకెట్, షేర్వానీ, క్యాప్ ధరించి కనిపించేవారు. ఈ లుక్ నెహ్రూకు అపారమైన ప్రజాదరణను తెచ్చిపెట్టింది. ఈ లుక్ ఎంత పాపులర్ అయ్యిందంటే చివరికి అది నేషనల్ డ్రెస్ కోడ్లా మారింది. నెహ్రూ ప్రభావంతో ఘనా అధ్యక్షుడు క్వామే న్క్రుమా, ఇండోనేషియా అధ్యక్షుడు సుహార్తో, చైనా నేత మావో కూడా నెహ్రూ తరహాలో దుస్తులను ధరించేందుకు ఇష్టపడేవారట. 1963 అక్టోబర్‌లో ప్లేబాయ్ పత్రిక జవహర్లాల్ నెహ్రూను ఇంటర్వ్యూ చేసింది. ఈ పత్రికలో తన గురించి లోతైన కథనాలు ప్రచురితమయ్యాయని నెహ్రూ భావించారు. నెహ్రూ తన సోదరి విజయలక్ష్మి పండిట్‌ను నయన్ అని పిలిచేవారు. ఆమె అతనికి అత్యంత నమ్మకస్తురాలని చెబుతుంటారు. నెహ్రూ తన తల్లి, భార్య భార్యకు మించి విజయలక్ష్మి పండిట్‌తో ఓపెన్‌గా మాట్లాడేవారట. ఇది కూడా చదవండి: నేతాజీకి అండగా నిలిచిన మహిళా సేనాని ఎవరు? -
అమేథీతో గాంధీ- నెహ్రూ కుటుంబానికున్న సంబంధం ఏమిటి?
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేస్తారని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కొత్త చీఫ్ అజయ్ రాయ్ ప్రకటించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇదే స్థానంలో బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. 1967లో ఏర్పడిన అమేథీ.. నాటి నుంచి కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. గత నాలుగు సంవత్సరాలుగా 1970-1990వ దశకాల ప్రారంభంలో మినహా, నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వారు లేదా వారి విధేయులు ఈ నియోజకవర్గంలో గెలుపొందుతూ వస్తున్నారు. అమేథీతో నెహ్రూ-గాంధీ కుటుంబానికి గల దశాబ్దాల నాటి సంబంధం గురించి ఇప్పుడు తెలుకుందాం. సంజయ్ గాంధీ (1980–81) గాంధీ-నెహ్రూ కుటుంబంలో అమేథీ లోక్‌సభ నుంచి పోటీ చేసిన తొలి వ్యక్తి సంజయ్ గాంధీ. ఎమర్జెన్సీ ముగిసిన వెంటనే జరిగిన 1977 లోక్‌సభ ఎన్నికల్లో సంజయ్ అమేథీ నుంచి పోటీ చేశారు. అయితే జనాభా నియంత్రణ కోసం సంజయ్ చేపట్టిన బలవంతపు స్టెరిలైజేషన్ కార్యక్రమం కారణంగా అతను ఘోరమైన ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. నాటి ఎన్నికల్లో జనతా పార్టీకి చెందిన రవీంద్ర ప్రతాప్ సింగ్ విజయం సాధించారు. సంజయ్ గాంధీ తిరిగి 1980 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేసి, ఎంపీ అయ్యారు. అయితే 1981లో జరిగిన విమాన ప్రమాదంలో సంజయ్ మరణించారు. అమేథీ ఎంపీగా స్వల్పకాలమే పనిచేశారు. రాజీవ్ గాంధీ (1981–1991) సంజయ్ మరణంతో రాజీవ్ గాంధీ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1981 మే 4న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఇందిరా గాంధీ తన చిన్న కుమారుని పేరును అమేథీ అభ్యర్థిగా ప్రతిపాదించారు. సమావేశానికి హాజరైన కాంగ్రెస్ సభ్యులందరూ ఈ సూచనను ఆమోదించారు. అనంతరం రాజీవ్ అమేథీ నుంచి తన అభ్యర్థిత్వాన్ని దాఖలు చేశారు. రాజీవ్ నాటి ఉప ఎన్నికలో అఖండ విజయాన్ని సాధించారు. లోక్‌దళ్ అభ్యర్థి శరద్ యాదవ్‌పై 2 లక్షలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. రాజీవ్ 1981 ఆగస్టు 17న అమేథీ నుంచి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. దీని తరువాత కూడా రాజీవ్ 1984, 1989,1991లో అమేథీ నుండి గెలిచారు. దాదాపు దశాబ్దం పాటు ఈ సీటును నిలబెట్టుకున్నారు. 1991లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం రాజీవ్ గాంధీని హత్య చేసిన తర్వాత అమేథీలో తిరిగి ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి సతీష్ శర్మ విజయం సాధించారు. 1996 ఎన్నికల్లోనూ ఆయన తన విజయాన్ని పునరావృతం చేశారు. ఇది కూడా చదవండి: నకిలీ టీచర్లకు ప్రమోషన్లు.. దర్జాగా విద్యార్థులకు పాఠాలు.. 14 ఏళ్ల ముసుగు తొలగిందిలా! సోనియా గాంధీ (1999–2004) 1999లో రాజీవ్ గాంధీ సతీమణి సోనియా గాంధీ అమెథీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు ఇక్కడి జనం నెహ్రూ-గాంధీ కుటుంబానికిచెందిన చెందిన నేతకు మరోసారి ఓటు వేశారు. అయితే అదే స్థానం నుంచి ఆమె మరోమారు ఎన్నికల బరిలోకి దిగలేదు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో సోనియా స్వయంగా రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయగా, రాహుల్ గాంధీ అమేథీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్ గాంధీ (2004-2019) రాహుల్ తన తొలి ప్రయత్నం(2004)లోనే అమేథీ నుంచి గెలుపొందారు. 2009లో 3.70 లక్షల ఓట్ల భారీ తేడాతో తిరిగి ఎన్నికయ్యారు. 2014లో కూడా రాహుల్ ఇక్కడి నుంచే గెలిచారు. అయితే నాడు అతని ప్రత్యర్థి స్మృతి ఇరానీ అతనికి గట్టి పోటీనిచ్చారు. అయితే స్మృతి ఇరానీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌ను ఓడించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ మళ్లీ అమేథీలో సత్తా చాటుతారని కాంగ్రెస్ భావిస్తోంది. రాహుల్ ఇటీవల చేపట్టిన భారత్ జోడో యాత్ర, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం ఇందుకు కలసివస్తాయనే అంచనాలున్నాయి. ఇది కూడా చదవండి: కళలతో కోట్లు.. వీరి టర్నోవర్ చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే..! -
‘హార్మోనియం’ను నెహ్రూ, ఠాగూర్ ఎందుకు వ్యతిరేకించారు? రేడియోలో 3 దశాబ్దాల నిషేధం వెనుక..
హార్మోనియం.. భారతదేశంలో ప్రసిద్ధి చెందిన సంగీత వాయిద్య పరికరం. ఇది నిజంగా భారత దేశానికి చెందినదేనా? అనే సందేహం చాలామందిలో దశాబ్దాలుగా ఉంది. అయితే కొందరు ఇది భారతీయులదేనని గాఢంగా నమ్ముతుంటారు. 1900ల ప్రారంభంలో స్వాతంత్ర్య పోరాటం ఊపందుకున్నప్పుడు భారతీయ శాస్త్రీయ సంగీతానికి హార్మోనియం అనువైనదా కాదా అనే చర్చ జరిగింది. మహాత్మా గాంధీ చేపట్టిన స్వదేశీ ఉద్యమంలో పలువురు హార్మోనియం భారతీయులది కాదంటూ వ్యతిరేకించారు. 1940లో ఆల్ ఇండియా రేడియో పాశ్చాత్య సంగీత విభాగ అధిపతి అందించిన కథనానికి స్పందనగా దాదాపు మూడు దశాబ్దాలపాటు ‘ఆకాశవాణి’లో హార్మోనియం నిషేధించారు. ఈ నిషేధం 1971లో పాక్షికంగా ఎత్తివేశారు. అనంతర కాలంలో ఈ నిషేధాన్ని పూర్తిగా తొలగించారు. ఫ్రెంచ్ ఆవిష్కర్త హార్మోనియం పేటెంట్ హార్మోనియం 1700లలో ఐరోపాలో ఆవిర్భవించింది. అనేక మార్పులకు లోనైన తర్వాత ఇది భారతదేశానికి చేరువయ్యింది. దీని మొదటి నమూనాను కోపెన్హాగన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఫిజియాలజీ ప్రొఫెసర్ క్రిస్టియన్ గాట్లీబ్ క్రాట్జెన్స్టెయిన్ రూపొందించారని చెబుతారు. దీని తరువాత హార్మోనియంలో అనేక మార్పులు వచ్చాయి. 1842లో అలెగ్జాండ్రే డెబెన్ అనే ఫ్రెంచ్ ఆవిష్కర్త హార్మోనియం డిజైన్‌కు పేటెంట్ పొంది, దానికి 'హార్మోనియం' అని పేరు పెట్టారు. హార్మోనియంను 19వ శతాబ్దం చివరలో పాశ్చాత్య వ్యాపారులు, మిషనరీలు భారతదేశానికి తీసుకువచ్చారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం భారతీయ చేతి వాయిద్యంగా మారిన హార్మోనియంను 1875లో కోల్‌కతాలో ద్వారకానాథ్ ఘోష్ రూపొందించారు. అన్ని రాగాలను సరిగ్గా పలికించలేదని.. 1915 నాటికి భారతదేశం హార్మోనియంల రూపకల్పనలో అగ్రగామిగా మారింది. అలాగే ఈ వాయిద్యం భారతీయ సంగీతంలో అంతర్భాగంగా మారింది. హార్మోనియంలో 12 స్వరాలు, 22 శృతులను పలికించవచ్చని చెబుతారు. అయితే భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసులలోని ఒక విభాగం హార్మోనియం అన్ని రాగాలను సరిగ్గా పలికించలేదని, అన్ని శాస్త్రీయ స్వరాలను పరిపూర్ణంగా పలికించే సామర్థ్యాన్ని కలిగి లేదని ఎత్తి చూపింది. దీని గురించి ప్రఖ్యాత హార్మోనియం ప్లేయర్ రవీంద్ర కటోటి మాట్లాడుతూ పరిమితి అనేది విశ్వవ్యాప్త వాస్తవం. ప్రతి స్వరానికి, ప్రతి పరికరానికి దాని పరిమితులు ఉంటాయన్నారు. ఠాగూర్ వాదన ఇదే.. హార్మోనియం భారతీయమా కాదా, ఇది భారతీయ సంగీతానికి సరిపోతుందా లేదా అనే చర్చ నడుస్తున్నప్పుడు బహుముఖ ప్రజ్ఞాశాలి, నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ వాయిద్య పరికరం భారతీయతకు సరిపోదన్నారు. ఇది గమకాలను పలికించలేదన్నారు. ఈ నేపధ్యంలోనే ఆకాశవాణిలో హార్మోనియంను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఒక సాహితీవేత్త కోల్‌కతాలోని ఆల్ ఇండియా రేడియోకి లేఖ రాశారు. ఆల్ ఇండియా రేడియో పాశ్చాత్య సంగీత విభాగం అధిపతి జాన్ ఫోల్డ్స్ భారతీయ శాస్త్రీయ సంగీతానికి ఎంతో అవసరమైన మైక్రోటోన్ల విషయంలో హార్మోనియం మ్యూట్‌గా ఉందని తన కథనాలలో వివరించారు. కంట్రోలర్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్గా ఉన్న లియోనెల్ ఫీల్డెన్.. ఫోల్డ్స్ వాదనతో ఏకీభవించారు. దీంతో 1940, మార్చి 1న ఆల్ ఇండియా రేడియో హార్మోనియంను నిషేధించింది. స్వాతంత్య్రానంతరం కూడా.. సంగీత విద్వాంసుడు అభిక్ మజుందార్ ఈ అంశం గురించి మాట్లాడుతూ.. కళా చరిత్రకారుడు ఆనంద్ కుమారస్వామి, స్వాతంత్ర్య సమరయోధునిగా జవహర్లాల్ నెహ్రూ కూడా హార్మోనియం భారతీయతకు చెందినది కాదన్నారు. స్వాతంత్య్రానంతరం కూడా ఈ వాయిద్య పరికరంపై నిషేధం కొనసాగిందని, సమాచార ప్రసార శాఖ మంత్రి బివి కేస్కర్, విద్వాంసుడైన గాయకుడు విఎన్ భత్ఖండే విద్యార్థి దీనికి కారణమని తెలిపారు. ఇది కూడా చదవండి: మూత్రం ఆపుకోలేని పిల్లాడిపై పోలీసుల ప్రతాపం.. జైలుకు తరలించి.. -
అణుబాంబు ఆవిష్కర్తకు భారత పౌరసత్వం.. నెహ్రూ ఆఫర్‌ను తిరస్కరించిన ఓపెన్‌హైమర్!
ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ రూపొందించిన ‘ఓపెన్‌హైమర్’ సినిమా విడుదల అయిన నేపధ్యంలో అమెరికన్ శాస్త్రవేత్త రాబర్ట్ జె ఓపెన్‌హైమర్ జీవితం గురించి తెలుసుకోవానే ఆసక్తి పలువురిలో నెలకొంది. ఇటీవలే విడుదలైన ఒక పుస్తకంలో ప్రముఖ శాస్త్రవేత్త రాబర్ట్ ఓపెన్హైమర్కు భారత్‌తో ముడిపడి ఒక విషయం చర్చనీయాంశంగా మారింది. భారత దివంగత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ.. శాస్త్రవేత్త రాబర్ట్ ఓపెన్హైమర్కు భారత పౌరసత్వం ఆఫర్ చేశారనే విషయం ఆ పుస్తకంలో ఉంది. ఈ పుస్తకాన్ని ప్రముఖ భారతీయ పార్సీ రచయిత భక్తియార్ కే దాబాభాయి భారత శాస్త్రవేత్త హోమీ భాభా జీవితం ఆధారంగా రచించారు. రెండవ ప్రపంచయుద్ధం ముగిశాక.. ఈ పుస్తకంలో అమెరికా శాస్త్రవేత్త రాబర్ట్ జె ఓపెన్‌హైమర్- హోమీ బాబాల స్నేహానికి సంబంధించిన ప్రస్తావన కూడా ఉంది. ‘హోమీ జే భాభా: ఏ లైఫ్’ పేరుతో భక్తియార్ కే దాదాభాయి రాసిన ఈ పుస్తకంలో ‘రెండవ ప్రపంచయుద్ధం ముగిశాక రాబర్ట్ జె ఓపెన్‌హైమర్‌ను భాభా కలుసుకున్నారు. అనంతరం వీరిద్దరూ మంచి స్నేహితులుగా మారారు. భాభా మాదరిగానే రాబర్ట్ జె ఓపెన్‌హైమర్ కూడా గౌరవమర్యాదలతో మెలిగిన వ్యక్తి. రాబర్ట్ జె ఓపెన్‌హైమర్ సంస్కృత భాషను కూడా నేర్చుకున్నారు. దీనితో పాటు ఆయనకు లాటిన్, గ్రీకు భాషలు కూడా వచ్చు’ అని పేర్కొన్నారు. బాంబు తయారీ వరకే తన బాధ్యత.. బీబీసీ తెలిపిన వివరాల ప్రకారం రాబర్ట్ జె ఓపెన్‌హైమర్ తయారు చేసిన అణుబాంబును రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌లోని హీరోషిమా, నాగసాకిలో ప్రయోగించారు. అయితే అంతటి శక్తిమంతమైన బాంబు తయారు చేయడం తగినది కాదని రాబర్ట్ జె ఓపెన్‌హైమర్‌పై విమర్శలు వచ్చాయి. దీనికి ఆయన సమాధానమిస్తూ బాంబు తయారు చేయడం వరకే తన బాధ్యత అని, దానిని ఎలా వినియోగించాలనే దానిపై నిర్ణయం తీసుకోవడంతో తనకు సంబంధం లేదన్నారు. తాను అమెరికా విడిచిపెట్టబోనంటూ.. అయితే ఆ తరువాత రాబర్ట్ జె ఓపెన్‌హైమర్ తన వైఖరిని మార్చుకున్నారు. దీనికిమించిన శక్తివంతమైన హైడ్రోజన్ బాంబు తయారీని వ్యతిరేకించారు. ఈ నేపధ్యంలో అతనికి అమెరికా ప్రభుత్వం నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యింది. అప్పటివరకూ అతని ఇచ్చిన రక్షణ వ్యవస్థను కూడా తొలగించారు. ఆ పుస్తకంలో పేర్కొన్న వివరాల ప్రకారం సరిగ్గా అదే సమయంలో నాటి భారత ప్రధాని నెహ్రూ.. శాస్త్రవేత్త రాబర్ట్ జె ఓపెన్హైమర్కు భారత పౌరసత్వం ఇవ్వజూపారు. అయితే ఆయన దీనిని తిరస్కరించారు. అమెరికాలో తనపై వచ్చిన ఆరోపణలన్నింటి నుంచి విముక్తి కలిగేవరకూ తాను అమెరికా విడిచిపెట్టబోనని ఓపెన్‌హైమర్ స్వయంగా నెహ్రూకు తెలియజేశారట. రాబర్ట్ జె ఓపెన్‌హైమర్ అమెరికా దేశభక్తుడైనందున కూడా ఈ ఆఫర్ తిరస్కరించారని కూడా నిపుణులు చెబుతుంటారు. ఇది కూడా చదవండి: పోలీసు నిర్లక్ష్యంతోనే జాహ్నవి మృతి?.. ఆలస్యంగా ఆధారాలు వెలుగులోకి.. -
'ప్రతీకార చర్య..' నెహ్రూ మ్యూజియం పేరు మార్పుపై జైరాం రమేశ్ ఫైర్..
ఢిల్లీ:నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరు మార్పుపై ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్ విమర్శించారు. నెహ్రూ మ్యూజియం ప్రపంచ మేధోసంపత్తికి నిలయంగా ఉందని అన్నారు. అనేక పుస్తకాలకు,59 ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా ఉందని చెప్పారు. ఈ చర్య ప్రతీకారంతో కూడినదని ఆరోపించారు. 'భారతదేశ రూపశిల్పి పేరును, వారసత్వాన్ని రూపుమాపడానికి కావాల్సినవన్నీ ప్రధాని చేస్తున్నారు. సామాన్యుడు అభద్రతా భావంతో బతికేలా చేయడమే విశ్వగురువుగా అనాలా?' అని ప్రశ్నించారు. గురువారం ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరును ప్రధానమంత్రి మ్యూజియం అండ్ సొసైటీగా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో పేరు మార్చారు. తొలి ప్రధాని నెహ్రూ అధికారిక భవనాన్నే మ్యూజియంగా మార్చేశారు. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షుడు కాగా.. రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఇదీ చదవండి:మత మార్పిడి నిరోధక చట్టాన్ని వెనక్కి తీసుకోనున్న కర్ణాటక ప్రభుత్వం -
విలువల్లోనూ పట్టువిడుపులు!
వాజ్‌పేయిని ‘భావోద్వేగాల ఒంటరితనంలో నిరాశ్రయుడైన పురుష బాలకుడి’గా అర్థం చేసుకున్నారు అభిషేక్ చౌధరి. అటల్ సంక్లిష్టమైన వ్యక్తిగత జీవితానికి అది తగిన వివరణ కాగలదా? వాజ్‌పేయిని ‘విలువల్లోనూ పట్టువిడుపులు పాటించే మనిíషి’ అంటారాయన. 2002లో గోవాలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో కేంద్ర కేబినెట్ సహచరుల అభీష్టానుసారం ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రి చేత రాజీనామా చేయించలేక పోవడానికి ఈ పట్టువిడుపుల స్వభావం నుంచే మనం సమాధానాన్ని రాబట్టుకోవాలా? ‘మహాత్ముడి మరణాన్ని అటల్ అస్సలేమాత్రం మానవాళికి సంభవించిన తీవ్రమైన నష్టంగా పరిగణించనే లేదు’ అని చౌధరి రాశారు. అయితే యౌవనానంతర దశలో పరిణతి కలిగిన నాయకుడిగా తన పూర్వపు ధోరణికి భిన్నంగా అటల్ బిహారీ వాజ్‌పేయి మారిపోయారు. అటల్ బిహారీ వాజ్‌పేయి గురించి మనకు తెలుసనే అనుకుంటాం. నిజంగానే మనకు తెలుసా? ఎందరికో ఆయన ఆరాధ్యులు. చాలామందికి ఆయనొక మంచి ప్రధాని కూడా. ఇక ఆయన వాగ్ధాటికైతే మంత్రముగ్ధులు కానివాళ్లెవరు! అయిన ప్పటికీ, ఆయనేమిటో పూర్తిగా మనకు తెలుసా? వాజ్‌పేయి ఛాయ వెనుక ఉన్న వాజ్‌పేయి గురించి మనకు తెలుసా? ఇటీవల విడుదలైన వాజ్‌పేయి జీవిత చరిత్రలో మనకు తెలి యని, మనం ఊహించని ఎన్నో అంశాలు ఉన్నాయి. అవి మాత్రమే కాదు, ఆయన గురించి కచ్చితమైనవిగా మనం ఇప్పటివరకూ భావిస్తూ వస్తున్న కొన్ని కథనాలకు రుజువులు లేవని ఆ పుస్తకం ద్వారా తెలుస్తుంది. సంప్రదాయబద్ధం కాని వాజ్‌పేయి వ్యక్తిగత జీవితాన్ని కూడా పుస్తకం స్పృశించింది. ఆయనను బాగా ఎరిగిన వాళ్లు సైతం వాజ్‌పేయిలోని ఈ అసంప్రదాయపరత్వాన్ని ఎక్కడా బయట పెట్టలేదు. తాజాగా అభిషేక్ చౌధరి రాసిన ‘వాజ్‌పేయి: ది అసెంట్ ఆఫ్ ది హిందూ రైట్ 1924–1977’ అనే పుస్తకంలోని విశేషాలు ఇవన్నీ. రెండు సంపుటాల ప్రయత్నంలోని మొదటి భాగం ఇది. రెండో భాగం డిసెంబరులో రానుంది. వాజ్‌పేయి ఆహార ప్రియులనీ, విలాసజీవుడనీ మనం విన్నాం. ‘భంగ్ ఆయనకు ప్రీతికరమైనది. తగు మోతాదుల్లో సేవించేవారు’. ‘చైనా వంటల్ని అదే తన జీవితేచ్ఛ అన్నట్లుగా ఆరగించేవారు’. న్యూయార్క్‌లో ఉన్నప్పుడు రాత్రి క్లబ్బులు ఆయన్ని రంజింప జేశాయి. ఆ అనధికార సందర్శనలలో ఒకటీ అరా పెగ్గులు మనసారా గ్రోలేవారు. చౌధరి అనడం అటల్ తన యౌవనంలో ముస్లిం వ్యతిరేకి అని. ‘జీవిక కోసం భారతదేశాన్ని ఎంపిక చేసుకున్న ముస్లింలను దేశ ద్రోహులుగానే చూడాలని అటల్ వాదించేవారు’ అని రాశారు. అటల్ ‘రాష్ట్రధర్మ’ పత్రికకు రాసిన ఒక వ్యాసంలో ముస్లింలను ‘ఫిప్త్ కాలమిస్ట్‌లు’ (ఆశ్రయమిచ్చిన దేశంలో ఉంటూనే ఆ దేశానికి వ్యతి రేకంగా పోరాడేవారు) అని పేర్కొన్నారు. యౌవనానంతర దశలో మాత్రం తన పూర్వపు ధోరణికి పూర్తి భిన్నంగా ఆయన మారి పోయారు. అది నిజం. ఆ మార్పు ఎంత గొప్పదో చెప్పే వెల్లడింపులు కొన్ని ఈ పుస్తకంలో ఉన్నాయి. మహాత్మా గాంధీ పట్ల వాజ్‌పేయి వైఖరిని గురించి చెబుతూ, ‘మహాత్ముడి మరణాన్ని అటల్ అస్సలు ఏమాత్రం మానవాళికి సంభవించిన తీవ్రమైన నష్టంగా పరిగణించనే లేదు. అటల్ రాసిన అనేక వ్యాసాలు దేశ విభజనకు కారకుడిగా మహాత్ముడినే బాధ్యుడిని చేశాయి. నీతి కాని రీతిలో ముస్లింలను గాంధీజీ సంతృప్తిపరిచే ప్రయత్నం చేయడం అన్నది ఆయన్ని హత్య చేసేంతగా పర్యవసాన పరిణా మాలను విషతుల్యం చేసిందని అటల్ విమర్శించారు’ అని అభిషేక్ రాశారు. ఇదేమైనా నిందను సంకేతిస్తోందా? కావచ్చు. వాజ్‌పేయి గురించి బాగా ప్రచారంలో ఉన్న కొన్ని కథనాల్లో అసలు నిజమే లేదనీ, అవి కేవలం అపోహలేననీ ఈ పుస్తకం తేల్చే స్తుంది. 1971 భారత్–పాక్ యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయిన డిసెంబర్ 16వ తేదీ నాడు ఇందిరాగాంధీని దుర్గాశక్తిగా అటల్ కీర్తించారని ఒక కథనం. అయితే అది నిజం కాదని, ‘ఆ సాయంత్రం అటల్ పార్లమెంటులోనే లేరు. అప్పుడు ఆయన ఏదైనా ప్రయాణంలో గానీ, లేదా స్వల్ప అస్వస్థతతో గానీ ఉండి ఉండాలి’ అని అభిషేక్ రాశారు. అలాగే, అటల్ గురించి నెహ్రూ గొప్పగా భావించేవారనీ, ఆయనను భావి భారత ప్రధానిగా గుర్తించేవారనీ ఒక ప్రచారం ఉంది. అది అబద్ధం కాదు. అయితే మునుపు మనకు తెలియని విషయం ఒకటి కూడా ఈ పుస్తకంలో ఉంది. తొలినాళ్లలో అటల్‌పై నెహ్రూ అభిప్రాయం ఇంకోలా ఉండేదని! మొదట్లో ఆయన వాజ్ పేయిని ‘అత్యంత అభ్యంతరకరమైన వ్యక్తి’గా భావించారు. ‘జమ్మూలో మితిమీరిన తెంపరితనాన్ని ప్రేరేపిస్తున్నాడు’, ‘అతడిని జమ్మూలోకి అడుగుపెట్టనివ్వకండి’ అని నెహ్రూ తన క్యాబినెట్ కార్యదర్శి విష్ణు సహాయ్ని కోరినట్లు ఈ పుస్తకం చెబుతోంది. స్వాతంత్య్రోద్యమంలో వాజ్‌పేయి పాత్ర లేదన్న కాంగ్రెస్ వాదనను కూడా రచయిత కొట్టిపారేశారు. ‘గ్వాలియర్‌లో జరిగిన క్విట్ ఇండియా నిరసనల్లో వాజ్‌పేయి పాల్గొన్నారన్నది నిజం’. మరీ ముఖ్యంగా, బ్రిటిష్ వారికి అటల్ సమాచారం చేరవేస్తుండేవాడు అని ‘బ్లిట్జ్’ పత్రిక కలిగించిన ప్రేరేపణ పచ్చి అబద్ధం.’ మిమ్మల్ని ఆశ్చర్యపరచగల మరికొన్ని ముఖ్యమైన వివరాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. బాల్యంలో వాజ్‌పేయి పేద విద్యార్థి. స్కూల్లో చాలా అరుదుగా మాత్రమే ఆయనలోని ప్రతిభ బయట పడేది. ‘పాంచజన్య’ పత్రిక మాత్రం ఆయన్ని ఆకాశానికెత్తింది. అటల్ ఎప్పుడూ తరగతిలో రెండో స్థానంలో నిలవలేదని రాసింది. ఆయనకు ఎల్ఎల్బి డిగ్రీ ఉందన్న మాటలో కూడా నిజం లేదు. నిజానికి, ‘అటల్ లా డిగ్రీ చదువును మధ్యలోనే వదిలేశారు.’ శ్రోతల్ని కట్టిపడేసే వక్తగా ప్రసిద్ధి చెందిన మనిషి, తన తొట్టతొలి స్కూల్ డిబేట్లో ఘోరంగా ఓడిపోయాడని తెలుసుకోవడం నన్ను ఆహ్లాదపరిచింది. ‘అతడి కాళ్లు చల్లబడ్డాయి. తడబడటం మొదలు పెట్టాడు. ప్రసంగ పాఠం మర్చేపోయాడు. అదొక అవమానకరమైన అనుభవం. సాటి విద్యార్థుల ఆనాటి వెక్కిరింతల్ని జీవితాంతం ఆయన గుర్తుచేసుకుంటూనే ఉన్నారు’. వాజ్‌పేయిని ‘భావోద్వేగాల ఒంటరితనంలో నిరాశ్రయుడైన పురుష బాలకుడి’గా అర్థం చేసుకున్నారు పుస్తక రచయిత. అటల్ సంక్లిష్టమైన వ్యక్తిగత జీవితానికి అది తగిన వివరణ కాగలదా? వాజ్ పేయిని ‘విలువల్లోనూ పట్టువిడుపులు పాటించే మనిíషి’ అంటా రాయన. 2002లో గోవాలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో కేంద్ర కేబినెట్ సహచరుల అభీష్టానుసారం ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రి చేత రాజీనామా చేయించలేకపోవడానికి ఈ పట్టువిడుపుల స్వభావం నుంచే మనం సమాధానాన్ని రాబట్టు కోవాలా? రెండవ సంపుటి కూడా మొదటి సంపుటం మాదిరిగానే అనేక విశేషాలతో కూడి ఉన్నట్లయితే 1977–2004 మధ్య వాజ్‌పేయి గురించిన సత్యాలను తెలుసుకోడానికి నేను ఎక్కువ కాలం వేచి ఉండలేను. అది ఉత్తమ భాగం అవుతుంది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
‘నెహ్రూ వారసత్వం దీపస్తంభం వంటిది’
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని నెహ్రూ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఘనంగా నివాళులర్పించారు. నెహ్రూ వారసత్వం దీపస్తంభంలా నిలిచిపోతుందని, భారతదేశ ఆదర్శం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలను ప్రకాశింప జేస్తుందని రాహుల్ పేర్కొన్నారు. నెహ్రూ దూరదృష్టి, విలువలు ఎల్లప్పుడూ మనకు మార్గదర్శకాలుగా నిలుస్తాయని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, రాహుల్ తదితరులు శనివారం శాంతివన్‌లోని నెహ్రూ స్మారకాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించారు. ‘మన మాజీ ప్రధాని నెహ్రూకు వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నా’అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. -
నెహ్రూ హిందువు కాదంటారా?
నెహ్రూ నిజంగానే హిందువులకు వ్యతిరేకిగా ఉన్నారా? ఆయన జీవితాన్ని తరచి చూసిన ఏ సత్యాధ్యయనమైనా వంచనాపూరితమైన ఈ దుష్ప్రచారాన్ని బహిర్గతం చేస్తుంది. రామాయణ, మహాభారత, భగవద్గీతల పట్ల నెహ్రూకు ఉన్న ప్రీతి, గౌరవ ప్రపత్తులకు సాక్ష్యాల వెల్లువలు ఆయన రచనల్లో కనిపిస్తాయి. గుడిలో ప్రదక్షిణాలు చేసే హిందువు కాదు నెహ్రూ. కానీ హిందూ ఆధ్యాత్మికత, మార్మికతలపై ప్రగాఢమైన ఆసక్తులతో పెరిగారు. హిమాలయాలు, గంగానది భారతీయ నాగరికతకు ఉయ్యాలలు అని నెహ్రూ చేసిన అభివర్ణన మనల్ని వాటి దివ్యత్వంలో ఓలలాడిస్తుంది. దురదృష్టవశాత్తూ నెహ్రూ హిందువని సంఘ్ పరివార్, కాంగ్రెస్ రెండూ మరిచిపోయాయి. తప్పుడు సమాచారానికి విస్తృత ప్రచారం కల్పించడంలో బీజేపీలోని కేంద్రీకృత సోషల్ మీడియా కమ్యూనికేషన్ వ్యవస్థ ఎంతో సమర్థంగా పని చేస్తుంటుందని ఢిల్లీ కాలేజీలో పాఠాలు చెబుతుండే నా మిత్రుడొకరు అన్నారు. ‘‘ఢిల్లీ నుంచి పంపిన సమాచారం వేలాది వాట్సాప్ గ్రూపుల ద్వారా దేశం మొత్తానికి చేరుతుంది. ఉదాహరణకు, నేనొకసారి బిహార్‌లోని నా గ్రామస్థులు కొందరిని...‘విద్య వల్ల నేను ఆంగ్లేయుడిని, సంస్కృతి వల్ల మహమ్మదీయుడిని, యాదృచ్ఛికంగా మాత్రమే హిందువును’ అని ఒక నాయకుడు చెప్పుకున్నారని అంటారు. ఆ నాయకుడెవరో మీకు తెలుసా?’ అని అడిగాను. ఆ ప్రశ్నకు తటాలున వచ్చిన సమా ధానం: ‘నెహ్రూ’! భారతదేశ తొలి ప్రధాని నెహ్రూ అంటే గిట్టని హిందూ జాతీయవాద రాజకీయ పార్టీ ‘హిందూ మహాసభ’ 1950లో తొలి సారి, ‘‘నెహ్రూ విద్య చేత ఆంగ్లేయుడు. సంస్కృతి చేత మహమ్మ దీయుడు. యాదృచ్ఛికంగా మాత్రమే హిందువు’’ అని విమర్శించింది. తదనంతర కాలంలో ఆ మాటను నెహ్రూను ద్వేషించేవారంతా నెహ్రూకే ఆపాదించి, స్వయంగా ఆయనే తన గురించి ఆ విధంగా చెప్పుకొన్నట్లు ప్రచారంలోకి తెచ్చారు. గత ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ, ‘‘యాదృచ్ఛికంగా మాత్రమే తాము హిందువులమని చెప్పుకున్న వారి వారసులు తమను తాము హిందువులమని చెప్పు కోకూడదు’’ అని రాహుల్ గాంధీపై చురకలు వేయడంతో ఉద్దేశ పూర్వకమైన ఆ ఆపాదింపునకు పునరుద్ధరణ జరిగినట్లయింది. సుసంపన్న భారత ఆనవాళ్లు నెహ్రూ నిజంగానే హిందువులకు వ్యతిరేకిగా ఉన్నారా? ఆయన జీవితాన్ని తరచి చూసిన ఏ సత్యాధ్యయనమైనా వంచనాపూరితమైన ఈ దుష్ప్రచారాన్ని బహిర్గతం చేస్తుంది. నెహ్రూ రాసిన ‘గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ’ (1934), ‘యాన్ ఆటోబయాగ్రఫీ’ (1936), ‘ద డిస్క వరీ ఆఫ్ ఇండియా’ (1946) మూడూ ప్రభావశీలమైనవి. డిస్కవరీ ఆఫ్ ఇండియా కారాగార వాసంలో రాసిన ఒక క్లాసిక్. (బ్రిటిష్ వాళ్లు ఆయన్ని 14 సార్లు జైలుకు పంపారు. 3,259 రోజులు కటకటాల వెనుక గడిపారు.) ఆయన ప్రసంగ సంకలనాలు, వ్యాసాలు, లేఖలు (పక్షానికొకసారి ముఖ్యమంత్రులకు ఆయన రాసిన లేఖలే ఐదు భారీ సంపుటాలు అయ్యాయి!) ... ఇవన్నీ కూడా ఇస్లాం, ఇతర బాహ్య ప్రభావాల చేత సుసంపన్నమైనదిగా నెహ్రూ భావించిన భారతదేశం తాలూకూ ప్రాచీన హిందూ నాగరికత సార్వత్రికత, సమగ్రతలతో నిండి ఉన్నవే. రామాయణ, మహాభారత, భగవద్గీతల పట్ల నెహ్రూకు ఉన్న ప్రీతి, గౌరవ ప్రపత్తులకు సాక్ష్యాల వెల్లువలు ఆయన రచనల్లో కనిపి స్తాయి. వేదాలు, ఉపనిషత్తులు, తదితర గ్రంథాలలోని మన రుషుల జ్ఞానం, భక్తియుగంలోని సాధువులు, కవులు, సంఘ సంస్కర్తలు; రామకృష్ణ పరమహంస, స్వామీ వివేకానంద, మహర్షి అరబిందో, ఆధునిక కాలంలో జాతీయతా భావం మేల్కొనేందుకు దోహదపడిన ఇతర హిందూ తాత్విక మహర్షుల గొప్పదనాన్ని నెహ్రూ రచనలు దర్శింపజేస్తాయి. ఇక తన గురువు, హిందూ మతబోధనలతో జీవిత మార్గాన్ని ఏర్పరచిన మహాత్మాగాంధీపై ఆయనకున్న గురి ఎంతటిదో తెలిసిందే. నెహ్రూ తన చివరి సంవత్సరాలలో ఉపనిషత్తులపై చర్చించడానికి తరచు తనను కలిసేందుకు వచ్చేవారని భారత రాష్ట్రపతి (1962–67), హిందూ తాత్వికతపై ప్రశంసలు పొందిన అనేక పుస్తకాలకు రచయిత అయిన ఎస్.రాధాకృష్ణన్ ఒక సందర్భంలో వెల్లడించారు. ఆలోచనల ప్రతిధ్వనులు నెహ్రూ ప్రాపంచిక దృక్పథానికి, ఆయన కాలం నాటి కొందరు జనసంఘ్ హిందూ నాయకుల దృష్టి కోణానికి మధ్య స్పష్టమైన సారూప్యాన్ని కూడా మనం చూడవచ్చు. ఉదాహరణకు, బీజేపీ తన సైద్ధాంతిక మార్గదర్శిగా పరిగణించే పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రంథం ‘ఇంటెగ్రల్ హ్యూమనిజం’... పెట్టుబడిదారీ, కమ్యూనిస్టు వ్యవస్థలను విడిచిపెట్టి భారతదేశం సమగ్ర అభివృద్ధి మార్గాన్ని అనుసరించాలన్న నెహ్రూ ఆలోచనను ప్రతిధ్వనిస్తుంది. నెహ్రూ మాదిరిగానే దీన్‌దయాళ్ కూడా మన ప్రాచీన సంస్కృతిలో మంచిది ఏదో దానిని తీసుకుని, అందులోని చెడును రూపుమాపడానికి సంసి ద్ధమవడాన్ని గర్వంగా భావించాలని చెప్పారు. ఆయన ఇలా రాశారు: ‘‘మనం మన ప్రాచీన సంస్కృతిలోని ప్రత్యేకతను గుర్తించకపోలేదు. అలాగని మనం పురావస్తు శాస్త్రజ్ఞులం కాలేము. విస్తారమైన ఈ పురావస్తు మ్యూజియానికి సంరక్షకులం కావాలన్న ఉద్దేశం కూడా మనకు లేదు. మన సమాజంలో విలువలను, జాతీయ ఐక్యతను పెంపొందించడానికి అవసరమయ్యే కొన్ని సంస్కరణలైతే చేయాలి. అందుకోసం కొన్ని సంప్రదాయాలకు స్వస్తి చెప్పాలి’’. నెహ్రూకు, ఆర్ఎస్ఎస్, జనసంఘ్, మోదీ–పూర్వపు బీజేపీ లలోని నెహ్రూ విమర్శకులకు మధ్య తీవ్రమైన కొన్ని విభేదాలు ఉండొచ్చు. వాటిని దాచేయలేం. కానీ ఇప్పుడు నెహ్రూపై మనం చూస్తున్న క్రూర, విషపూరితమైన దూషణలు అప్పుడు లేవు. 1964 మేలో ఆయన మరణించినప్పుడు పార్లమెంటులో అటల్ బిహారీ వాజ్‌పేయి... ‘‘తన ముద్దుల యువరాజు దీర్ఘ నిద్రలోకి కనురెప్పలు వాల్చడంతో భరతమాత శోక సముద్రంలో మునిగిపోయింది’’ అని ఘనంగా నివాళులు అర్పించారు. నెహ్రూను శ్రీరామచంద్రుడితో పోలుస్తూ, ‘‘వాల్మీకి గాథలో కనిపించే గొప్ప భావనలు మనకు పండిట్జీ జీవితంలో లభిస్తాయి’’ అన్నారు. ‘‘రాముడిలా నెహ్రూ కూడా అసాధ్యమైన, అనూహ్యమైన వాటికి రూపకర్త. ఆయన వ్యక్తిత్వ బలం, ఆ చైతన్యం, మనోస్వేచ్ఛ; ప్రత్యర్థికి, శత్రువుకు సైతం స్నేహ హస్తం చాచే గుణం, ఆ పెద్ద తరహా, ఆ గొప్పతనం బహుశా భవి ష్యత్తులో కనిపించకపోవచ్చు’’ అని నివాళులు అర్పించారు. ఆర్ఎస్ఎస్ రెండవ చీఫ్ ‘గురూజీ’ గోల్వాల్కర్... నెహ్రూ దేశభక్తిని, మహోన్నతమైన ఆదర్శవాదాన్ని కొనియాడుతూ, ఆయనకు ‘భరత మాత గొప్ప పుత్రుడి’గా హృదయపూర్వక అంజలులు ఘటించారు. భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థకు బలమైన పునాది వేసినందుకు ఎల్.కె. అద్వానీ తరచు నెహ్రూను ప్రశంసించేవారు. 2013లో ఆయన తన బ్లాగులో, ‘‘నెహ్రూ లౌకికవాదం హైందవ పునాదులపై ఆధార పడి ఉంది’’ అని విశ్లేషించారు. అలాగే, తీవ్ర మనో వేదనతో నెహ్రూ అకాల మరణం చెంద డానికి కారణం అయిన (1962 చైనా దురాక్రమణ యుద్ధంలో) భారత్ పరాజయం తర్వాత నెహ్రూ ఆర్ఎస్ఎస్, జనసంఘ్లను తిరిగి అంచనా వేయడం ప్రారంభించారనేందుకు కొన్ని ఆధారాలు ఉన్నాయి. తన మరణానికి కొద్ది వారాల ముందు జర్నలిస్టుల బృందంతో జరిపిన సంభాషణలో కమ్యూనిస్టు అనుకూల వార్తా పత్రిక అయిన ‘ది పేట్రియాట్’ ప్రతినిధి జనసంఘ్‌ను ‘జాతీయ వ్యతిరేక పార్టీ’ అనడంతోనే నెహ్రూ ఆ ప్రతినిధిని వారించారు. ‘‘కాదు, జనసంఘ్ దేశభక్త పార్టీ’’ అని బదులిచ్చారు. దురదృష్టవశాత్తూ నెహ్రూ హిందుత్వాన్ని జనసంఘ్, కాంగ్రెస్ రెండూ మరిచిపోయాయి. బదులుగా అవి తమ మధ్య ఉన్న వ్యత్యా సాన్ని నిరంతరంగా ఆరున్నరొక్క రాగం తీస్తున్నాయి. ఏదేమైనప్పటికీ భారతీయ నాగరికతను యుగయుగాలుగా నిలబెట్టిన ప్రత్యేక లక్షణం ‘సమన్వయాన్ని సాధించగల సామర్థ్యం’, ‘వ్యతిరేకతల్ని పరిష్కరించు కోవడం’, ‘ఒక కొత్త కలయిక’ అని వారు గుర్తుంచుకోవాలి. రెండు ధ్రువాలుగా విడిపోతున్న నేటి ప్రమాదకర కాలానికి... జాతి ప్రయోజ నాల కోసం ‘సంవాదం’ (సంభాషణ) ద్వారా ‘సమన్వయం’ సాధించిన నెహ్రూ ఆదర్శప్రాయులు. సుధీంద్ర కులకర్ణి వ్యాసకర్త మాజీ ప్రధాని వాజ్‌పేయి సహాయకులు (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
పండిట్ నెహ్రూ, ఇందిరమ్మ రికార్డులను ఎవరు తిరగరాస్తారు!
దేశంలో ఒక ప్రధాని వరుసగా పదేళ్లు అధికారంలో ఉండడం గొప్ప విషయంగా మారిన రోజులివి. 2004లో అనూహ్య పరిస్థితుల్లో కాంగ్రెస్ తరఫున ప్రధాని అయిన డా.మన్మోహన్ సింగ్ అధికారంలో ఉండగా జరిగిన ఎన్నికల్లో పార్టీ బలం పెరిగాక రెండోసారి ప్రధానిగా ప్రమాణం చేసి పదేళ్లు ఆ పదవిలో ఉన్నారు. ఆయన తర్వాత బీజేపీ నేత నరేంద్ర మోదీ.. డా.మన్మోహన్ మాదిరిగా రెండోసారి ఎన్నికల్లో గెలిచి ప్రధానిగా ఇప్పుడు 9 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. ఊహించని పరిణామాలు జరగకపోతే మన్మోహన్ జీ మాదిరిగానే 21వ శతాబ్దంలో వరుసగా పదేళ్లు భారత ప్రధానిగా పని చేసిన రికార్డును మోదీ సమం చేస్తారు. వీరిద్దరి కంటే ముందు వరుసగా ఎక్కువ కాలం ప్రధాని పదవిలో ఎవరెవరు ఉన్నారో పరిశీలిద్దాం. లాంగ్ రికార్డ్ నెహ్రూదే స్వతంత్ర భారతంలో అత్యధిక కాలం పదవిలో కొనసాగిన రికార్డు తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూది. భారత రాజ్యాంగం అమలులోకి రావడానికి 2 ఏళ్ల 4 నెలల ముందు అంటే–1947 ఆగస్ట్ 15న ప్రధానిగా ప్రమాణం చేసిన నెహ్రూజీ 1964 మే 27న కన్నుమూసే వరకూ పదవిలో కొనసాగారు. ఆయన దేశ ప్రధానిగా 16 ఏళ్ల 286 రోజులు పదవిలో ఉండి సృష్టించిన రికార్డును ఈరోజుల్లో తిరగరాయడం కష్టమేనని రాజకీయ పండితులు భావిస్తున్నారు. నెహ్రూ మరణానంతరం తాత్కాలిక ప్రధాని గుల్జారీలాల్ నందా 13 రోజుల పాలన తర్వాత కాంగ్రెస్ తరఫున ప్రధాని అయిన లాల్ బహదూర్ శాస్త్రీ 1966 జనవరి 11న గుండెపోటుతో మరణించడంతో ఆయన పదవిలో ఉన్నది ఏడాది 216 రోజులే. శాస్త్రీ జీ తర్వాత మళ్లీ తాత్కాలిక ప్రధానిగా 13 రోజుల జీఎల్ నందా సర్కారు దిగిపోయాక 1966 జనవరి 11న తొలిసారి ప్రధాన మంత్రి పదవి చేపట్టిన నెహ్రూ జీ కుమార్తె ఇందిరాగాంధీ వరుసగా 1967, 1971 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను విజయపథంలో నడిపించారు. ఇందిరమ్మ 1977 మార్చి ఎన్నికల్లో పార్టీ ఓడిపోయే వరకూ పదవిలో కొనసాగారు. తండ్రి తర్వాత కుమార్తెదే రికార్డు: ఇందిరమ్మ వరుసగా 11 ఏళ్ల 59 రోజులు ప్రధానిగా అధికారంలో కొనసాగి, తండ్రి నెహ్రూ తర్వాత ఎక్కువ కాలం పదవిలో కొనసాగిన రికార్డు స్థాపించారు. 1980 జనవరి 14న చివరిసారి ప్రధాని అయిన ఇందిరమ్మ 1984 అక్టోబర్ 31న హత్యకు గురికావడంతో ఆమె చివరి పదవికాలం 4 ఏళ్ల 291 రోజులకే ముగిసింది. ఇందిరమ్మ వారసుడిగా అధికారంలోకి వచ్చిన ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ 1984 డిసెంబర్ లోక్ సభ ఎన్నికల తర్వాత రెండోసారి ప్రధానిగా ప్రమాణం చేశారు. కాని క్లిష్ట రాజకీయ పరిణామాల కారణంగా ప్రధానిగా ఆయన కొనసాగిన మొత్తం కాలం 5 ఏళ్ల 32 రోజులే. రాజీవ్ తర్వాత ప్రధానులైన వి.పి.సింగ్, చంద్రశేఖర్ లలో ఏ ఒక్కరూ ఏడాది పాటు ప్రధానిగా కొనసాగలేకపోయారు. వారి తర్వాత ప్రధాని అయిన కాంగ్రెస్ అధ్యక్షుడు పీవీ నరసింహారావు మరుసటి ఎన్నికల వరకూ దాదాపు ఐదేళ్లు అధికారంలో ఉన్నారు. కమల సారథ్యం 1990లో దేశంలో బీజేపీ బలపడిన క్రమంలో ఈ పార్టీ అగ్రనేత అటల్ బిహారీ వాజపేయి మొదటిసారి 1996లో ప్రధానిగా ప్రమాణం చేసి మెజారిటీ లేక రెండు వారాలకే దిగిపోవాల్సివచ్చింది. ఆయన తర్వాత ప్రధానులైన జనతాదళ్ నేతలు హెచ్డీ దేవెగౌడ, ఐకే గుజ్రాల్ లలో ఏ ఒక్కరూ కూడా ఏడాది కాలం పదవిలో కొనసాగలేకపోయారు. 1998, 1999 పార్లమెంటు మధ్యంతర ఎన్నికల తర్వాత వరుసగా రెండుసార్లు బీజేపీ నేతగా ప్రధాని అయిన వాజపేయి ఈ రెండు సార్లు కలిపి మొత్తం 6 ఏళ్ల 64 రోజులు అధికారంలో ఉన్నారు. చదవండి: భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం: సుస్థిరత నుంచి సుస్థిరతకు! వాజపేయి పదవీకాలాన్ని డా.మన్మోహన్, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ.. ఇద్దరూ దాటేశారు. ప్రధానిగా మోదీ వచ్చే ఏడాది మే నెలలో పదేళ్లు పూర్తిచేసుకుని మన్మోహన్ రికార్డును సమం చేసే అవకాశాలు సుస్పష్టమే. అయితే, వరుసగా 11 సంవత్సరాల 59 రోజులు ప్రధాని పదవిలో కొనసాగిన (నెహ్రూ తర్వాత రెండో రికార్డు) ఇందిరాగాంధీ రికార్డును దాటిపోయే అవకాశం బీజేపీ రెండో ప్రధానికి 2024 లోక్ సభ ఎన్నికల ఫలితాలు కల్పిస్తాయా? అనే విషయం ఏడాదిలో తేలిపోతుంది. -విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు -
Tamil Nadu: అధికార డీఎంకేలో భగ్గుమన్న వర్గపోరు.. మంత్రి Vs ఎంపీ!
తిరుచ్చి వేదికగా అధికార డీఎంకే వర్గపోరు రచ్చకెక్కింది. పార్టీలో కీలకంగా ఉన్న ఇద్దరు నేతలకు చెందిన మద్దతు దారుల మధ్య బుధవారం ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ప్రొటోకాల్ ప్రకారం తమ నేతకు విలువ ఇవ్వడం లేదంటూ ఎంపీ శివ అనుచరులు మంత్రి నెహ్రూకు వ్యతిరేకంగా తొలుత నల్ల జెండాలను ప్రదర్శించడం వివాదానికి దారి తీసింది. దీంతో పోలీస్ స్టేషన్లోకి చొరబడి మరీ ఎంపీ అనుచరులను మంత్రి వర్గీయులు చితక్కొట్టారు. సాక్షి, చెన్నై: డీఎంకేలో నగరాభివృద్ధి శాఖ మంత్రిగా, పారీ్టలో సీనియర్ నేతగా కేఎన్ నెహ్రూ మంచి గుర్తింపు పొందారు. ఇక, ఎంపీ శివ ఢిల్లీ వేదికగా డీఎంకే రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నారు. ఈ ఇద్దరు తిరుచ్చికి చెందిన వారే. ఇదే జిల్లా నుంచి మరో మంత్రిగా అన్బిల్ మహేశ్ కూడా ఉన్నారు. మంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేకున్నా, మంత్రి నెహ్రూ, ఎంపీ తిరుచ్చి శివ మాత్రం ఉప్పు..నిప్పులా వ్యవహరిస్తున్నారు. నిరసనతో మొదలై.. తిరుచ్చిలో బుధవారం పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, కొత్త భవనాల నిర్మాణాలకు శంకు స్థాపనలు, నిర్మాణాలు పూర్తి చేసుకున్న వాటికి ప్రారంభోత్సవాలు పెద్దఎత్తున జరిగాయి. ఈ కార్యక్రమాల్లో మంత్రి నెహ్రూ బిజీ అయ్యారు. అయితే ఈ కార్యక్రమాలకు ఎంపీ తిరుచ్చి శివను ఆహ్వానించక పోవడాన్ని ఆయన వర్గీయులు తీవ్రంగా పరిగణించారు. అదే సమయంలో తిరుచ్చి కంటోన్మెంట్‌లోని ఎంపీ శివ ఇంటికి సమీపంలోని ఓ క్రీడా మైదానం ప్రారంభోత్సవానికి ఉదయాన్నే మంత్రి నెహ్రూ వచ్చారు. ఈ సమయంలో శివ వర్గీయులు నల్ల జెండాలను ప్రదర్శించి నిరసన తెలియజేయడం వివాదానికి ఆజ్యం పోసింది. శివ వర్గీయులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ ప్రా రంబోత్వవాన్ని ముగించుకుని మంత్రి నెహ్రూ తిరుగు ప్రయాణంలో ఉండగా, ఆయన మద్దతుదారులు రెచ్చి పోయారు. తిరుచ్చి శివ ఇంటి ముందు ఆగి ఉన్న కారు, రెండు ద్విచక్ర వాహనాలు, ఇంటి ముందు ఉన్న వస్తువులు, ఫర్నీచర్ ధ్వంసం చేయడంతో వివాదం ముదిరింది. మంత్రి కళ్లెదుటే ఈ దాడులు జరగడం గమనార్హం. అంతటితో వదిలి పెట్టక నేరుగా మంత్రి మద్దతుదారులు పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ భద్రతా విధుల్లో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు మాత్రమే ఉన్నారు. 100 మందికి పైగా వచ్చిన మంత్రి మద్దతుదారులు లోనికి చొరబడి వీరంగం సృష్టించారు. తిరుచ్చి శివ వర్గీయులపై దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ శాంతికి గాయాలు కావడంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. ఎంపీ శివ ఇంటి వద్ద పోలీసు భద్రతను పెంచారు. పోలీసు స్టేషన్లోకి చొరబడి దాడులకు పాల్పడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. పార్టీ నాయకుల వీరంగంపై సీఎం స్టాలిన్ సమాధానం చెప్పాలని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణి స్వామి డిమాండ్ చేశారు. தேர்தலுக்கு முன்னாடியே போலீஸ் ஸ்டேசனுக்கு லஞ்சம் குடுத்த @KN_NEHRU வை அமைச்சரா ஆக்குனா ஸ்டேசன்ல இதான் நடக்கும். pic.twitter.com/XezvEN06DW — Savukku Shankar (@Veera284) March 15, 2023 నెల్లైలోనూ వివాదం.. తిరుచ్చిలో ఇద్దరు కీలక నేతల మద్దతు దారుల మధ్య వార్ చోటు చేసుకుంటే, తిరునల్వేలిలో మేయర్, జిల్లా కార్యదర్శి మధ్య సమరం రాజధానికి చెన్నైకు చేరింది. తిరునల్వేలి కార్పొరేషన్ మేయర్ శరవణన్, జిల్లా పార్టీ కార్యదర్శి అబ్దుల్ వకాబ్ మధ్య వివాదంతో ఆ కార్పొరేషన్ డీఎంకే చేజారే పరిస్థితి నెలకొంది. అబ్దుల్ వకాబ్ మద్దతుగా 30 మందికి పైగా కార్పొరేటర్లు మేయర్ శరవణన్‌కు వ్యతిరేకంగా తిరుగు బావుట ఎగుర వేశారు. మేయర్‌ను తప్పించాలని నినాదిస్తూ చెన్నైకు బుధవారం ప్రయాణమయ్యారు. మా«ర్గంమధ్యలో తిరుచ్చిలో మంత్రి కేఎన్ నెహ్రూను కలిసి కొందరు కార్పొరేటర్లు వినతి పత్రం సమరి్పంచారు. గురువారం చెన్నైలోని డీఎంకే కార్యాలయంలో మేయర్‌పై ఫిర్యాదు చేయనున్నారు. ఐదుగురికి పార్టీ నుంచి ఉద్వాసన పార్టీ నాయకులు, కార్యకర్తలు పరస్పరం దాడుల నేపథ్యంలో పోలీసు స్టేషన్లోకి చొరబడి వీరంగం సృష్టించిన వారిపై డీఎంకే అధిష్టానం కన్నెర్రజేసింది. తిరుచ్చి కార్పొరేటర్లు ముత్తసెల్వం, విజయ్, రాందాసు, యూనియన్ నేత దురై రాజ్, ఉపనేత తిరుపతిని పార్టీ నుంచి తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు డీఎంకే కార్యాలయం ప్రకటించింది. దీంతో ఈ ఐదుగురు పోలీసు స్టేషన్లో లొంగి పోయారు. పోలీస్ స్టేషన్లోకి చొరబడి ప్రత్యర్థులపై జరిపిన దాడికి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ వీరంతా పోలీసులకు లొంగిపోయినట్లు వెల్లడించారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదైనట్లు తెలిపారు. -
రాహుల్ స్పీచ్‌లు చూసి వాళ్లు భయంతో వణికిపోతున్నారు: సీఎం స్టాలిన్
చెన్నై: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ప్రశంసల వర్షం కురిపించారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. భారత్ జోడో యాత్రలో రాహుల్ స్పీచ్‌లు చూసి కొందరు భయంతో వణికిపోతున్నారని అన్నారు. ఆయన ప్రసంగాలు చూస్తుంటే జవహర్లాల్ నెహ్రూ గుర్తుకు వస్తున్నారని కొనియాడారు. నేహ్రూ, గాంధీల వారసులు మాట్లాడుతుంటే గాడ్సే భక్తులకు మండుతోందని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ తన స్పీచ్‌లలో ఎన్నికలపరమైన రాజకీయాల గురించి మాట్లాడటం లేదని, సిద్ధాంతపరమైన రాజకీయాల గురించే ప్రస్తావిస్తున్నారని స్టాలిన్ పేర్కొన్నారు. ఈ ప్రసంగాలు చూసి కొన్ని పార్టీలు భయపడుతున్నాయన్నారు. భారత తొలి ప్రధాని నెహ్రూ నిజమైన ప్రజాస్వామ్యవాది అని స్టాలిన్ అన్నారు. కానీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని విస్మరిస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ సంస్థలను అమ్మెస్తోందని, పార్లమెంటులో ప్రతిపక్షాలు మాట్లాడటానికి కూడా అనుమతించకుండా గొంతు నొక్కుతోందని మండిపడ్డారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భారత్-చైనా బలగాల ఘర్షణ విషయంపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టగా బీజేపీ నిరాకరించింది. సభ్యులు సభలో ఆందోళనలు చేయడంతో రోజూ వాయిదాల పర్వాన్నే కొనసాగించింది. ఈ నేథ్యంలోనే శీతాకాల సమావేశాలను ఆరు రోజులు ముందుగానే ముగించింది. చదవండి: మోదీ ప్రజాదరణ, అమిత్ షా వ్యూహాలు.. 2022లోనూ తిరుగులేని బీజేపీ! -
జాతి పండగకు జేజేలు
సాక్షి, హైదరాబాద్: భారత స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా నగరంలోని అబిడ్స్ జీపీఓ సర్కిల్ నెహ్రూ విగ్రహం వద్ద మంగళవారం ఉదయం 11 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన జరగనుంది. కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఉద్యోగులతో పాటు కళాశాల విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గోనున్నారు. జీపీఓ సర్కిల్ వద్ద స్వాతంత్య్ర సమరయోధుల చిత్ర పటాలు ప్రదర్శించనున్నారు. రంగురంగుల బ్యానర్లు, గీతాలాపన చేయడానికి మైక్ ఏర్పాట్లు చేశారు. గోల్కొండ కోటలో జాతీయ పతాకంతో కళాకారుడి ఆనంద హేల సామూహిక గీతాలాపన ఏర్పాట్లను సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ పరిశీలించారు. ట్రాఫిక్ నిబంధనలు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట జీఏడీ కార్యదర్శి శేషాద్రి, అడిషనల్ డీజీపీ జితేందర్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఉన్నత విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, కార్యదర్శి వాకాటి కరుణ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ అమయ్ కుమార్, సిటీ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తదితరులు ఉన్నారు. ర్యాలీ నిర్వహిస్తున్న అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యాపకులు తిరంగా సంబరం తరంగమై ఎగిసింది. నగరం అంగరంగ వైభవంగా మెరిసింది. మువ్వన్నెల జెండా వజ్రోత్సవంలా మురిసింది. స్వాతంత్య్ర శోభ వెల్లివిరిసింది. ఇళ్లు, వీధులు, వాహనాలపై త్రివర్ణ పతాకాలు సమున్నతంగా ఆవిష్కృతమయ్యాయి. సోమవారం నగరంలో స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలు అంబరమంటాయి. ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో భారీ జెండాలతో బైక్ ర్యాలీలు, కారు ర్యాలీలు జోరుగా సాగాయి. భారీ జాతీయ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాతబస్తీలో జాతీయ జెండాలతో ఉత్సాహంగా ముస్లిం మహిళలు వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతి పది మీటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసిన పతాకాలు చూడముచ్చగా కనువిందు చేశాయి. సంజీవయ్య పార్క్ సమీపంలో జాతీయ జెండాలతో వింటేజ్ కార్లతో చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. అబిడ్స్ మొజంజాహీ మార్కెట్ వేదికగా అతి పొడవైన జాతీయ జెండాతో చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కళాశాలు, స్కూళ్లలో వేడుకలు ఆనందోత్సాహాలతో సాగాయి. కళాకారులు దేశభక్తి ఉట్టిపడేలా తయారైన విధానం అందరినీ ఆకట్టుకుంది. ట్యాంక్‌బండ్‌పై త్రివర్ణ పతాకాలతో ర్యాలీ నగరంలోని చారిత్రక కట్టడాలు, ప్రభుత్వ భవనాలతో పాటు నలుమూలలా వ్యాపించి ఉన్న కార్పొరేట్ ఆఫీసుల్లో, ఐటీ కంపెనీల్లో, విద్యా సంస్థల్లో 75 వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గోల్కొండ కోట వేదికగా ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలతో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈసారి స్వాతంత్య్ర దినోత్సవాల్లో నగర యువత ఆసక్తిగా పాల్గొని సందడి చేశారు. వజ్రోత్సవాల్లో భాగంగా నగరానికి చెందిన మైక్రో ఆరి్టస్టు కృష్ణ ఉట్ల బియ్యపు గింజపై జాతీయ జెండాను రూపొందించారు. చిన్న పరిమాణంలో ఉండే బియ్యపు గింజపై అశోక చక్రం, మూడు వర్ణాలతో ఉన్న జాతీయ జెండాను వేసి దేశభక్తిని చాటుకున్నాడు. – సాక్షి, సిటీబ్యూరో (చదవండి: దేశాన్ని విచ్ఛిన్నం చేసే రాజకీయ శక్తులను అడ్డుకోవాలి) -
నెహ్రూ టు నరేంద్ర
భారత స్వాతంత్య్ర సమరం, స్వాతంత్య్రం వచ్చిన సందర్భం, రెండో ప్రపంచ యుద్ధానంతర పరిణామాలు, ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం, ప్రపంచ పరిస్థితులు కలసి భారత ప్రధానమంత్రి పదవికి రూపురేఖలను ఇచ్చాయి. దేశంలో బ్రిటిష్ వలస వాసనలు, మారిన రాజకీయ తాత్త్వికతలను అవగతం చేసుకుంటూ, అవి తెచ్చిన సమస్యలను అధిగమిస్తూ దేశాన్ని పునర్నిర్మాణం చేసే గురుతర బాధ్యతను మన ప్రధానులు నిర్వహించారు. 1947 నుంచి 2022 వరకు భారతీయులు 14 మంది ప్రధానుల పాలనను వీక్షించారు. ఒక్కొక్క ప్రత్యేకతతో ఒక్కొక్క ప్రధాని చరిత్ర ప్రసిద్ధులయ్యారు. 1947–1977 ప్రథమ ప్రధాని జవాహర్లాల్ నెహ్రూ. 16 ఏళ్ల 286 రోజుల నెహ్రూ పాలనా కాలమే ఇప్పటికి వరకు రికార్డు. తరువాత ఆయన కుమార్తె ఇందిరాగాంధీ హయాం 11, 4 సంవత్సరాలతో రెండో స్థానంలో నిలిచారు. రెండు పర్యాయాలు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ మూడో స్థానంలో నిలుస్తారు. లాల్ బహదూర్‌శాస్త్రి (19 నెలలు), గుల్జారీలాల్ నందా (రెండు పర్యాయాలు ఆపద్ధర్మ ప్రధాని, 27 రోజులు), రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహారావు (ఐదేసి సంవత్సరాలు) ప్రధాని పదవిలో ఉన్నారు. మొత్తంగా 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ ప్రధానులే దాదాపు 56 ఏళ్లు ఆ పదవిలో ఉన్నారు. భారత్‌కు స్వాతంత్య్రం ఇవ్వాలన్న నిర్ణయం తరువాత ఏర్పడిన జాతీయ ప్రభుత్వానికి (1946) నాయకత్వం వహించినవారు నెహ్రూయే. ఆపై 1947 ఆగస్ట్ 15 నుంచి స్వతంత్ర భారత తొలి ప్రధాని. దేశ విభజన నాటి నెత్తుటి మరకలు ఆరకుండానే 1947 అక్టోబర్‌లో పాకిస్తాన్ తో యుద్ధం చేయవలసి వచ్చింది. రాజ్యాంగ రచన, అలీన విధానం, పంచవర్ష ప్రణాళికలు, ఐఐటీలు, భారీ నీటిపారుదల పథకాలు, భారీ పరిశ్రమలు ఆయన హయాం ప్రత్యేకతలు. 1962లో ఆయన పాలనలోనే చైనాతో యుద్ధం జరిగింది. అది చేదు ఫలితాలను మిగిల్చింది. 1964 లో నెహ్రూ మరణంతో లాల్ బహదూర్‌శాస్త్రి ప్రధాని అయ్యారు. 1965లో పాకిస్తాన్ తో యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో ఓడిన పాకిస్తాన్ తో శాంతి ఒప్పందం మీద సంతకాలు చేయడానికి తాష్కెంట్ (సోవియెట్ రష్యా) వెళ్లిన శాస్త్రి అక్కడే అనుమానాస్పద పరిస్థితులలో మరణించారు. జైజవాన్ జై కిసాన్ ఆయన నినాదమే. తరువాత 1966లో ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారు. ఇందిర పాలన అంటే కొన్ని వెలుగులు, ఎక్కువ చీకట్ల సమ్మేళనం. ఆమె బ్యాంకులను జాతీయం చేశారు. రాజభరణాలు రద్దు చేశారు. 1969 నాటి రాష్ట్రపతి ఎన్నికలో ఆమె నిర్వహించిన విధ్వంసక భూమికతో కాంగ్రెస్ చీలిపోయింది. పార్టీ నిర్ణయించిన నీలం సంజీవరెడ్డిన ఓడించి, తాను నిలబెట్టిన వీవీ గిరిని ‘ఆత్మ ప్రబోధం’ నినాదంతో గెలిపించిన అపకీర్తి ఆమెది. 1971లో ఇందిర కూడా పాకిస్తాన్ తో యుద్ధం చేశారు. ఆ యుద్ధ ఫలశ్రుతి భారత్ గెలుపు, బంగ్లాదేశ్ ఆవిర్భావం. ఇందిర హయాంకు మకుటాయమానమైనది 1974 నాటి పోఖ్రాన్ అణపరీక్ష (స్మైలింగ్ బుద్ధ). దీనితో భారత్ ప్రపంచంలోనే అణుపాటవం ఉన్న ఆరోదేశంగా ఆవిర్భవించింది. 1975లో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ఇందిర చరిత్రలో తన స్థానాన్ని తానే చిన్నబుచ్చుకున్నారు. అలా కాంగ్రెస్‌కు ఒక ప్రత్యామ్నాయాన్ని సృష్టించి పెట్టిన ఘనత కూడా ఆమెదే. అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తరువాత 1977లో జనతా పార్టీ ఏర్పడింది. అందులో భారతీయ జనసంఘ్ భాగస్వామి అయింది. ద్వంద్వ సభ్యత్వం కారణంగా జనతా పార్టీని వీడిన జనసంఘ్ సభ్యులు 1980లో భారతీయ జనతా పార్టీని స్థాపించారు. భారత రాజకీయాలలో జాతీయ స్థాయి పార్టీగా కాంగ్రెస్‌కు ఉన్న స్థానాన్ని కూలదోసిన పార్టీగా బీజేపీ ఎదగడం చరిత్ర. జనతా పార్టీ, ప్రభుత్వం కుప్ప కూలిపోవడంతో 1980లో మధ్యంతర ఎన్నికలు జరిగి ఇందిర మళ్లీ ప్రధాని అయ్యారు. ఇది కూడా చరిత్రలో ఒక అనూహ్య ఘట్టమే. అత్యవసర పరిస్థితి తరువాత ఘోరంగా ఓడిపోయిన పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. రెండో దశ ఏలుబడిలో ఆమె చేసిన సాహసోపేత నిర్ణయం అమృత్సర్ స్వర్ణాలయం మీద ఆపరేషన్ బ్లూ స్టార్, పేరిట సైనిక చర్య. కానీ అది సాహసం కాదు, దుస్సాహసమేనని చరిత్ర రుజువు చేసింది. ఆ చర్య నుంచి వచ్చిన ప్రతీకార జ్వాలకే ఆమె 1984లో ఆహుతయ్యారు. అంగరక్షకులే కాల్చి చంపారు. ఇందిర భారత తొలి మహిళా ప్రధానిగానే కాదు, హత్యకు గురైన తొలి ప్రధానిగా కూడా చరిత్రకు ఎక్కారు. 1977–1980 ఈ కొద్దికాలంలోనే భారతదేశం ఇద్దరు ప్రధానులను చూసింది. ఒకరు మొరార్జీ దేశాయ్, మరొకరు చౌధురి చరణ్‌సింగ్. నెహ్రూతో, ఇందిరతో ప్రధాని పదవికి పోటీ పడిన మొరార్జీ దేశాయ్ జనతా పార్టీ గెలిచిన తరువాత ప్రధాని పదవిని చేపట్టారు. స్వాతంత్య్ర సమరస్ఫూర్తి, గాంధేయవాదం మూర్తీభవించిన ప్రధాని ఆయన. వరసగా పది కేంద్ర బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఘనత ఉన్న మొరార్జీ ప్రధానిగా రెండు సంవత్సరాల నాలుగు నెలలు మాత్రమే పదవిలో ఉన్నారు. జనతా పార్టీ పతనమే ఇందుకు కారణం. ద్వంద్వ సభ్యత్వం, రాజ్ నారాయణ్ రగడ, మాజీ జనసంఘీయుల నిష్క్రమణ వంటి కారణాలు ఆయన రాజీనామాకు దారి తీశాయి. తరువాత చౌదరి చరణ్‌సింగ్ ప్రధాని అయ్యారు. ప్రధానిగా పార్లమెంట్‌కు వెళ్లకుండా రాజీనామా చేసిన ప్రధానిగా మిగిలారు. భారత్‌కు సంకీర్ణ ప్రభుత్వాలు తప్పవన్న సంకేతం ఈ కాలం ఇచ్చింది. 1984–1996 ఇందిర హత్య తరువాత ఆమె పెద్ద కుమారుడు రాజీవ్‌గాంధీ ప్రధాని అయ్యారు. తల్లి హత్యతో ప్రధాని పదవిని అధిష్టించిన రాజీవ్, మాజీ ప్రధానిగా తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో హత్యకు గురయ్యారు. షాబోనో కేసు, హిందువుల కోసం అయోధ్య తలుపులు తెరవడం, భోపాల్ విషవాయువు విషాదం, బోఫోర్స్ తుపాకుల అవినీతి వ్యవహారం ఆయన హయాంలోనే జరిగాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ బలోపేతానికి ఆయన కృషి ఆరంభించారు. రాజీవ్ మంత్రివర్గంలోనే ఆర్థిక, రక్షణ శాఖలను నిర్వహించిన విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ బోఫోర్స్ వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేసి, జనతాదళ్ కూటమి బలంతో ప్రధాని పదవిని చేపట్టారు. ఉపప్రధాని దేవీలాల్‌తో వీపీ సింగ్‌కు విభేదాలు తీవ్రమైనాయి. అలాంటి సందర్భంలో సింగ్ మండల్ కమిషన్ నివేదికను బయటకు తీశారని చెబుతారు. ఎల్‌కె అడ్వాణిని అయోధ్య రథం మీద నుంచి దించడంతో వీపీ సింగ్‌ను ప్రధాని పదవి నుంచి బీజేపీ దించివేసింది. సింగ్ తరువాత చంద్రశేఖర్ కాంగ్రెస్ ‘బయటి నుంచి మద్దతు’తో ప్రధాని అయ్యారు. చంద్రశేఖర్ సమాజ్‌వాదీ జనతా పార్టీ మైనారిటీ ప్రభుత్వం బడ్జెట్‌ను కూడా ఆమోదింప చేయలేకపోయింది. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి ఈ ప్రభుత్వం బంగారాన్ని కుదువ పెట్టవలసి వచ్చింది. చంద్రశేఖర్ తరువాత తెలుగువారు పీవీ నరసింహారావు ప్రధాని అయ్యారు. ఆర్థిక సంస్కరణల ద్వారా దేశాన్ని ఒక తీవ్ర సంక్షోభం నుంచి బయటపడవేసిన వారు పీవీ. కానీ అయోధ్య వివాస్పద కట్టడం ఆయన హయాంలోనే కూలింది. మైనారిటీ ప్రభుత్వమే అయినా ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన ఘనత పీవీ ప్రభుత్వానికి ఉంది. 1996–2004 ఒక రాజకీయ సంక్షుభిత దేశంగానే భారత్ కొత్త మిలీనియంలోకి అడుగు పెట్టింది. కాంగ్రెస్ ప్రభను కోల్పోతుండగా, బీజేపీ బలపడుతున్న కాలమది. అలాగే హంగ్ యుగం కూడా. ఏ పార్టీకి మెజారిటీ రాని పరిస్థితి చిరకాలం కొనసాగింది. 1996లో జరిగిన ఎన్నికలలో అతి పెద్ద మెజారిటీ సాధించిన పార్టీగా బీజేపీ అవతరించింది. కానీ హంగ్ లోక్‌సభ ఏర్పడింది. వాజపేయి తొలిసారి 1996 మే 16 న ప్రధానిగా ప్రమాణం చేశారు. 1996 జూన్ 1 న రాజీనామా చేశారు. తరువాత హెచ్డి దేవెగౌడ ప్రధాని అయ్యారు. కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడింది. సీతారాం కేసరి నాయకత్వంలోని కాంగ్రెస్ యథాప్రకారం బయట నుంచి మద్దతు ఇచ్చింది. కానీ 11 మాసాలకే ఆయన ప్రభుత్వం పడిపోయింది. దేవెగౌడ వారసునిగా ఇందర్‌కుమార్ గుజ్రాల్ పదవీ స్వీకారం చేశారు. విదేశ వ్యవహారాలలో దిట్ట అయిన గుజ్రాల్ కూడా 11 మాసాలు మాత్రమే అధికారంలో ఉన్నారు. ఇరుగు పొరుగు దేశాలతో భారత్ సంబంధాల గురించి గుజ్రాల్ సిద్ధాంతం పేరుతో ఒక విధానం ప్రసిద్ధమైంది. 1998లో మళ్లీ మధ్యంతర ఎన్నికలను దేశం ఎదుర్కొనవలసి వచ్చింది. ఈసారి చాలా పార్టీలు బీజేపీ వెనుక నిలిచాయి. నేషనల్ డెమాక్రటిక్ అలయెన్స్ కూటమి ఏర్పడి, వాజపేయి ప్రధాని అయ్యారు. కూటమిలో భాగస్వామి అన్నా డీఎంకే మద్దతు ఉపసంహరించుకొనడంతో ఒక్క ఓటుతో ప్రభుత్వం కూలిపోయింది. 1999లో మళ్లీ ఉప ఎన్నికలు జరిగి ఎన్ డీఏ విజయం సాధించింది. వాజపేయి ప్రధానిగా ప్రమాణం చేశారు. కొద్ది నెలలు మినహా పూర్తి సమయం అధికారంలో కొనసాగారు. తన పదమూడు మాసాల పాలనలోనే వాజపేయి పోఖ్రాన్ 2 అణుపరీక్ష జరిపించారు. మూడోసారి ప్రధాని అయినప్పుడు పాకిస్తాన్ తో కార్గిల్ సంఘర్షణ జరిగింది. లాహోర్ బస్సు దౌత్యం వంటి ప్రయత్నాలు కూడా జరిగాయి. 2004–2022 2004లో జరిగిన ఎన్నికలలో మళ్లీ కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చింది. పీవీ నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థికమంత్రి, ఆర్థిక సంస్కరణల శిల్పి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు. 2009 ఎన్నికలలో కూడా మళ్లీ యూపీఏ గెలిచి ఆయనే ప్రధాని అయ్యారు. యూపీఏ మొదటి దశ సజావుగానే సాగినా, రెండో దశ అవినీతి ఆరోపణలను మూటగట్టుకుంది. 2014 ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. 2019లో జరిగిన ఎన్నికలలో మరొకసారి మోదీకే భారతీయులు పట్టం కట్టారు. ముప్పయ్ ఏళ్ల తరువాత తిరుగులేని మెజారిటీ సాధించిన పార్టీగా 302 సీట్లు బీజేపీ సాధించింది. కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణాన్ని మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. గిరిజన మహిళ ద్రౌపది ముర్మును భారత రాష్ట్రపతిగా ఎంపిక చేసిన ఘనతను కూడా బీజేపీ దక్కించుకుంది. – డా. గోపరాజు నారాయణరావుఎడిటర్, ‘జాగృతి’ (చదవండి: మహాత్మా మన్నించు..) -
లక్ష్యం ఒక్కటే దారులు వేరు!
నెహ్రూ స్వతంత్ర భారత తొలి ప్రధాని. రాజేంద్ర ప్రసాద్ తొలి రాష్ట్రపతి. ఇద్దరు పని చేస్తున్నది ఒకే లక్ష్యంతోనే అయినా ఇద్దరి భావాలు, సిద్దాంతాలు వేరుగా ఉండేవి. నెహ్రూ ఆధునికం అయితే రాజేంద్ర ప్రసాద్ సంప్రదాయం. అయితే ఈ మాటల్ని మనం ఉన్నవి ఉన్నట్లుగా కాకుండా వారిలోని వైరుధ్యానికి ఓ తేలికపాటి పోలికగా మాత్రమే తీసుకోవాలి. అర్ధరాత్రి కొట్టగానే కదా దేశానికి స్వాతంత్య్రం వచ్చింది.. 1947 ఆగస్టు 15న! భారత్ సంకెళ్లు తెగిపోయాయి. ఇప్పుడిక భారత్ తనేమిటో ప్రపంచ దేశాలకు చూపించుకోవాలి. స్వాతంత్య్రం సంపాదించుకుని, స్వాతంత్య్రంతో ఏమీ చేయకపోతే ఎలా! వలస పాలకులు భారత ప్రజా గర్జనకు పక్షుల్లా ఎగిరిపోయాక, భారత్ స్వేచ్ఛా విహంగమై నెహ్రూ, రాజేంద్రల భుజాలపై వాలింది. దేశ భవిష్యత్తును ఇక నిర్మించవలసింది, నిర్ణయించవలసిందీ ప్రధానంగా వాళ్లిద్దరే. ధ్వనించని మెత్తటి చిరు నవ్వులా ఉండేవారు డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్. గాంధీజీ ఆదర్శాల నుంచి తెచ్చుకున్న గుణం అది. నెహ్రూకు తోడ్పాటుగా ఉండేందుకు ఆ స్వభావం ఆయనకెంతో తోడ్పడింది. నెహ్రూతో విభేదించేవారు. అయితే ఆ విభేదం.. ఐక్యతతోనే! ఇది సాధ్యమేనా? సాధ్యం చేసుకున్నారు కనుకనే నెహ్రూ, రాజేంద్ర గొప్ప నాయకులుగా, పాలనకు నమ్మకమైన స్తంభాలుగా నిలబడ్డారు. అభిప్రాయ భేదాలు సాధారణంగా ప్రధాని చెప్పినదానికి రాష్ట్రపతి కాదనేదేమీ ఉండదు. రాష్ట్రపతి కాదనరు కదా అని ఆయన అభిప్రాయం తీసుకోకుండా ప్రధానీ ఏమీ చెయ్యరు. నెహ్రూ, రాజేంద్ర కూడా సఖ్యతగానే ఉన్నారు. అయితే స్వీయ విశ్వాసాలు, సిద్ధాంతాల దగ్గరికి వచ్చేటప్పటికి వారికి అభిప్రాయ భేదాలు వచ్చేవి. దేశం అభివృద్ధి చెందడానికి శాస్త్ర, సాంకేతిక నైపుణ్యాలు అవసరం అని నెహ్రూ బలంగా నమ్మేవారు. ప్రార్థనా స్థలాలకంటే పరిశ్రమలు, పాఠశాలలు ముఖ్యం అనేవారు. రాజేంద్ర ప్రసాద్ అందుకు భిన్నమైన నమ్మకాలను కలిగి ఉండేవారు. దేశ పురోభివృద్ధికి పరిశ్రమలు, శాస్త్ర పరిజ్ఞానాలు అవసరమే అయినా.. సంస్కృతీ సంప్రదాయాలను, మత విశ్వాసాలను విస్మరించడానికి లేదని రాజేంద్ర ప్రసాద్ భావించేవారు. ఈ రెండు దారులు వేటికవి సాగుతున్నంత వరకు వాళ్లిద్దరి మధ్య ఘర్షణ తలెత్తలేదు. ఓ సందర్భంలో మాత్రం ఆ రెండు దారులు ఒకదాన్ని ఒకటి దాటవలసి వచ్చింది! ఆ సందర్భం.. సోమనాథ ఆలయ ప్రారంభోత్సవం! ఆలయ పునరుద్ధరణ గుజరాత్‌లోని సోమనాథ ఆలయం క్రీ.శ. 1వ శతాబ్దం నాటిది. కాలక్రమంలో ఆలయం శిథిలమైపోగా, ఆ శిథిలాలపైనే క్రీ.శ.649 లో రెండో ఆలయాన్ని నిర్మించారు. క్రీ.శ.722లో అరబ్బులు సింధు ప్రాంతంలో బలపడ్డాక జరిగిన దాడులలో ఆలయం ధ్వంసమయింది. చాళుక్యులు వచ్చాక ఆలయ పునరుద్ధరణ జరిగింది. 1026లో మహమ్మద్ ఘజనీ దండయాత్రలో సోమనాథ ఆలయం మళ్లీ దెబ్బతినింది. 1114లో హిందూ రాజులు ఆలయాన్ని పునరుద్ధరించారు. తర్వాత 1299లో అల్లా ఉద్దీన్ ఖిల్జీ ఆలయంపై పడి శివలింగాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. 1331లో జునాఘడ్ రాకుమారుడు తిరిగి అక్కడ లింగ ప్రతిష్ఠ చేశాడు. 1459లో మహమ్మద్ బేగ్దా ఆ శివలింగాన్ని తొలగించి, ఆలయాన్ని మసీదుగా మార్చేశాడు. 1783లో ఇండోర్ మహారాణి అహల్యాబాయి మసీదు స్థానంలో తిరిగి సోమనాథ ఆలయాన్ని పునర్నిర్మించారు. శత్రువుల బారిన పడకుండా లింగప్రతిష్ఠను భూగర్భంలో జరిపించారు. కాలగమనంలో ఆలయం శిథిలమవుతూ వచ్చింది. నెహ్రూ వెళ్లొద్దన్నారు! దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1951లో ఈ ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాల ప్రారంభోత్స వానికి అధ్యక్షత వహించవలసిందిగా అందిన ఆహ్వానాన్ని రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్వీకరించారు. అది తెలిసి నెహ్రూ పరోక్షంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. భారత సమాజంలో ప్రార్థనా స్థలాల ప్రాముఖ్యంపై నెహ్రూ–రాజేంద్రల మధ్య భిన్నమైన వాదనలు బహిరంగంగానే వినిపిస్తూ ఉన్న సమయం అది. అలాంటి కార్యక్రమానికి రాష్ట్రపతి వెళ్లకూడదని నెహ్రూ అభిప్రాయం. వెళ్లడమే సరైనదని రాజేంద్ర వాదన. ‘ఏమైనా ఈ సమయంలో ఇలాంటి మత పరమైన అభివృద్ధికి దేశాధినేతలను ప్రాధాన్యం ఇవ్వడం తగదు. దానికింకా ఎంతో సమయం ఉంది. సరే ఎలాగూ అధ్యక్షతకు అంగీకరించారు కనుక అలాగే కానివ్వండి’ అని నెహ్రూ ఆ తర్వాత రాజేంద్రతో అన్నట్లు ‘పిలిగ్రిమేజ్ టు ఫ్రీడమ్’ పుస్తకంలో రచయిత కె.ఎం. మున్షీ రాశారు. (చదవండి: శతమానం భారతి: నవ భారతం) -
చైతన్య భారతి నెహ్రూ యోగా గురువు
స్వామి కువలయానంద ప్రసిద్ధ యోగా గురువు. ఆయన అసలు పేరు జగన్నాథ గణేశ గుణే. 1883 ఆగస్టు 30న జన్మించారు. ఆయన యోగా గురువు మాత్రమే కాదు. యోగా పరిశోధకులు కూడా. కువలయానంద ప్రధానంగా యోగా శాస్త్రీయ పునాదులపై తన మార్గదర్శక పరిశోధనకు పేర్గాంచారు. 1920లో యోగాపై పరిశోధన ప్రారంభించి, 1924లో యోగా అధ్యయనం కోసం ‘యోగా మీమాంస’ అనే పుస్తకాన్ని ప్రచురించారు. స్వామి కువలయానంద గుజరాత్ రాష్ట్రంలోని ధబోయ్ గ్రామంలో సంప్రదాయ కర్హడే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. కువలయానంద తండ్రి శ్రీ గణేశ గుణే ఉపాధ్యాయులు. తల్లి సరస్వతి గృహిణి. పేద కుటుంబం కావడంతో ప్రభుత్వ, ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థలపై వారు కొంతకాలం ఆధారపడవలసి వచ్చింది. కువలయానంద చదువు కోసం కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆయన 1903లో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులయ్యారు. బరోడా కాలేజీలో చదువుకోవడానికి స్కాలర్షిప్ పొందారు. కువలయానంద విద్యార్థి రోజుల్లో శ్రీ అరబిందో, లోకమాన్య తిలక్ వంటి రాజకీయ నాయకుల వల్ల ప్రభావితమయ్యారు. ఆయన జాతీయ భావవాదం, దేశభక్తి ఉద్వేగం ఆయన తన జీవితాన్ని మానవాళి సేవకు అంకితం చేయడానికి ప్రేరేపించాయి. ఈ సమయంలోనే జీవితాంతం బ్రహ్మచర్యం పాటించేందుకు ప్రతిజ్ఞను తీసుకున్నాడు. 1916 నుండి 1923 వరకు ఉన్నత పాఠశాల, కళాశాల విద్యార్థులకు భారతీయ సంస్కృతిపై పాఠాలు బోధించారు. అందులో యోగా అంతర్లీనమై ఉండేది. యోగాలో కువలయానంద మొదటి గురువు బరోడాలోని జుమ్మదాడ వ్యాయామశాల ప్రొఫెసర్ రాజారత్న మాణిక్‌రావు. 1919లో కవలయానంద నర్మదా నది ఒడ్డున బరోడా సమీపంలోని మల్సార్లో స్థిరపడిన బెంగాలీ యోగి పరమహంస మాధవదాస్ను కలిశారు. మాధవదాస్ మార్గదర్శకత్వంలో కువలయానందకు యోగా క్రమశిక్షణ అలవడింది. కువలయానంద ఆధ్యాత్మికంగా ఆదర్శవాది అయినప్పటికీ, అదే సమయంలో కఠినమైన హేతువాది. కాబట్టి యోగా ప్రభావాల శాస్త్రీయతలపై పరిశోధనలు జరిపారు. 1930ల నాటికే కువలయానంద భారతదేశంలో యోగావంటి శారీరక విద్యను వ్యాప్తి చేయడానికి ఒక మార్గంగా యోగా ఉపాధ్యాయుల సమూహాలకు శిక్షణ ఇచ్చారు. ఆయన దగ్గర యోగాలో శిక్షణ పొందిన వారిలో జవహర్లాల్ నెహ్రూ కూడా ఒకరు! 1929 లో నెహ్రూ కువలయానందను కలవడం జరిగింది. ఆయనతో పరిచయం ఆయ్యాకే నెహ్రూకు యోగాపై గురి ఏర్పడింది. 1931 నుంచీ నెహ్రూ క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తూ వచ్చారు. కువలయానంద తన 82 ఏళ్ల వయసులో 1966 ఏప్రిల్ 18న మరణించారు. (చదవండి: సామ్రాజ్య భారతి.. 1876/1947) -
Rajiv Gandhi వర్ధంతి.. ఆ దుర్ఘటనే రాజకీయాల్లోకి లాక్కొచ్చింది
వెబ్‌డెస్క్ స్పెషల్: భారత దేశ ఆరవ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి నేడు(మే 21). భారత దేశానికి అత్యంత పిన్నవయస్కుడైన ప్రధాని కూడా(40). 1991, మే 21వ తేదీన జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో దుర్మరణం పాలయ్యారు ఆయన. అప్పటికి ఆయన వయసు 46 సంవత్సరాలు. అయితే తాత, దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ.. రాజీవ్ రాజకీయాల్లోకి రావాలని ఏనాడూ కోరుకోలేదట!. మరి రాజీవ్‌ను రాజకీయాల్లోకి లాగిన పరిస్థితులు ఏంటో చూద్దాం. ► రాజీవ్ గాంధీ.. 1944 అగష్టు 20న బాంబేలో జన్మించారు. ఇందిర-ఫిరోజ్ గాంధీలు తల్లిదండ్రులు. ఆయన బాల్యమంతా తాత నెహ్రూతో పాటే ఢిల్లీలోని తీన్‌మూర్తి హౌజ్‌లో గడిచింది. ఆపై డెహ్రూడూన్‌లోని వెల్హమ్ స్కూల్, డూన్ స్కూల్స్‌లో చదువుకున్నాడు. ► రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రావడం అన్యమనస్కంగానే జరిగిపోయింది. వాస్తవానికి తన మనవడు రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రావాలని నెహ్రూ ఏనాడూ కోరుకోలేదట. ► బాగా చదువుకుని రాజీవ్ పైలెట్ అవ్వాలని కోరుకున్నాడు నెహ్రూ. ఆయన కోరికకు తగ్గట్లే.. రాజీవ్ చదువులు కొనసాగాయి. కానీ, పరిస్థితులు బలవంతంగా రాజీవ్‌ను రాజకీయాల్లోకి దింపాయని ఇందిరా గాంధీ సైతం పలు ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు కూడా. ► రాజీవ్ పైచదువులు.. కేంబ్రిడ్జిలోని ట్రినిటీ కాలేజీ, లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో చదివారు. మెకానికల్ ఇంజినీరింగ్ చేశారాయన. ► కేంబ్రిడ్జిలో చదువుతున్నప్పుడే సోనియా మైనో(సోనియా గాంధీ)తో పరిచయం ఏర్పడింది. 1968లో వీళ్ల వివాహం జరిగింది. ► ఇంగ్లండ్ నుంచి భారత్‌కు చేరుకున్నాక.. ఢిల్లీ ఫ్లైయింగ్ క్లబ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ కావడంతో పాటు కమర్షియల్ పైలెట్ లైసెన్స్ కూడా దక్కించుకున్నారు రాజీవ్ గాంధీ. తద్వారా డొమెస్టిక్ నేషనల్ కెరీర్లో ఆయన పైలెట్ కాగలిగారు. ► 1983లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో సోదరుడు సంజయ్ గాంధీ దుర్మరణం పాలయ్యాడు. అప్పటిదాకా జనాల్లోకి రావడం ఇష్టడని రాజీవ్ గాంధీ.. బలవంతంగా బయటకు రావాల్సి వచ్చింది. ఇది ఇందిరా గాంధీకి కూడా ఇష్టం లేదని చెప్తుంటారు కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు. ► ఇందిరా గాంధీ హత్య తర్వాత.. పార్టీ శ్రేణుల మద్ధతు, సీనియర్ల అండతో 1984లో రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. ► 1984లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో.. 508 స్థానాలకు గానూ ఏకంగా 401 సీట్లు దక్కించుకుంది రాజీవ్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ. ► కేవలం 40 ఏళ్ల వయసులో దేశానికి ప్రధాని బాధ్యతలు చేపట్టారు రాజీవ్ గాందీ. ఆ ఘనతను ఇప్పటివరకు ఎవరూ చెరిపేయలేకపోయారు. ► టెలిఫోన్లు, కంప్యూటర్లు ఈయన హయాంలోనే భారత్‌లో ఎక్కువ వాడుకలోకి వచ్చాయి. ఫాదర్ ఆఫ్ ఐటీ అండ్ టెలికాం రెవల్యూషన్ ఆఫ్ ఇండియా అని రాజీవ్ గాంధీని ప్రశంసిస్తుంటారు. ► రాహుల్, ప్రియాంక.. రాజీవ్‌గాంధీ-సోనియాగాంధీల సంతానం. ► తమిళనాడు శ్రీపెరంబుదూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో.. ఎల్టీటీఈ జరిపిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్ గాంధీ మరణించారు. రాజీవ్ గాంధీ తర్వాత.. యూపీకి చెందిన జనతాదళ్ నేత విశ్వనాథ్ ప్రతాప్ సింగ్(వీపీ సింగ్) ప్రధాని అయ్యారు. -
మన తొలి ప్రభుత్వం అలా ఏర్పడింది.. ఆయన ప్రధానైతే కథ వేరేలా.. !
ఈ సువిశాల భారతం ఒకే ప్రభుత్వం కింద ఉన్న కాలం చరిత్రలో తక్కువే. క్రీస్తుపూర్వమో, మధ్య యుగాలలోనో కొంతకాలం కొంతమంది మన పాలకులు మొత్తం భారతావనిని పాలించే అవకాశం దక్కించుకున్నారు. అప్పుడు కూడా కొన్ని భూభాగాలు చక్రవర్తులో, పాదుషాలో వారి అధీనంలో లేవు. అయినా యావద్భారతావనిని వారు ఏలారని అనుకోవచ్చు. కొన్ని శతాబ్దాల క్రితం భారతదేశం కోల్పోయిన ఆ అవకాశం మళ్లీ 1946లోనే వచ్చింది. తాత్కాలిక ప్రాతిపదికనే కావచ్చు, అప్పుడే భారత దేశానికి భారతీయులతో కూడిన ప్రభుత్వం కొలువైంది. ఇది చరిత్రలో అపురూపం. రాజకీయ ఏకత్వానికి ఆధునిక యుగంలో అదే తొలి అడుగు. కొద్దినెలలే అయినా ఆ తాత్కాలిక సంకీర్ణం అఖండ భారతాన్ని పాలించిందన్న విషయం ప్రత్యేకమైనదే. కానీ రక్తపాతాల మధ్య భారత విభజన పనిని పూర్తి చేసినదీ ఆ ప్రభుత్వమే. రెండో ప్రపంచ యుద్ధం తరువాత తన వలస దేశాలలో యూనియన్ జాక్‌ను అవనతం చేయాలని ఇంగ్లండ్ నిర్ణయించుకుంది. ఎంత ఇష్టం లేకపోయినా అలా వదులుకోవలసిన దేశాలలో భారత్ మొదటిది. దీనికి తొలిమెట్టు పాలనా వ్యవహారాలలో బ్రిటిష్ ప్రభుత్వం పక్కకు తొలగి, జాతీయ సంకీర్ణ ప్రభుత్వాన్ని ప్రతిష్ఠించడమే. బ్రిటిష్ ఇండియా ఏర్పాటు చేస్తున్న ఇలాంటి ప్రభుత్వంలో భాగస్వాములు కావలసిందని వైస్రాయ్ లార్డ్ ఆర్చిబాల్డ్ వేవెల్ 1946 జూలై 22న భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు జవహర్లాల్ నెహ్రూకు, ముస్లింలీగ్ నేత మహమ్మద్ అలీ జిన్నాకు లేఖలు రాశాడు. ఆ ప్రభుత్వంలో 14 శాఖలు ఉంటాయనీ, ఆరు కాంగ్రెస్‌కు, ఐదు లీగ్‌కు, మైనారిటీలకు మూడు వంతున ఇవ్వాలని నిర్ణయించినట్టు కూడా అదే లేఖలో వివరించాడు వేవెల్. ముఖ్యమైన శాఖల విషయంలో కాంగ్రెస్, లీగ్‌ల మధ్య సమతౌల్యం పాటిస్తామనీ చెప్పాడు. కానీ ఈ ప్రతిపాదనను ఆ ఇద్దరూ నిరాకరించారు. భారత కార్యదర్శి సలహా మేరకు వేవెల్ ముస్లింలీగ్‌ను పక్కన పెట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 1946 ఆగస్ట్ 12న కాంగ్రెస్‌ను ఆహ్వానించాడు. అదే సమయంలో తన ప్రతిపాదనలు ఏమైనప్పటికీ వాటిని జిన్నాతో చర్చించే అధికారం కూడా అప్పగించాడు వేవెల్. నెహ్రూ జిన్నాతో చర్చించారు. కానీ ప్రయోజనం కనిపించలేదు. మరొక పక్క మత కల్లోలాలు తీవ్రమవుతున్నాయి. నెహ్రూను తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచి తప్పు చేశానేమోనని వేవెల్ శంకించడం మొదలుపెట్టాడు. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుతో దేశంలో తిరుగుబాటు వస్తుందేమోనని బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ అట్లీ భయపడ్డాడు. కొన్ని ముందు జాగ్రత్త చర్యలు కూడా వైస్రాయ్ వేవెల్ తీసుకున్నాడు. ఇన్ని పరిణామాల తరువాత 1946 సెప్టెంబర్ 2న కాంగ్రెస్ తాత్కాలిక ప్రభుత్వంలో భాగస్వామి అయింది. ఈ ప్రభుత్వంలో చేరేవారిని అంతకు ముందే ఆవిర్భవించిన భారత రాజ్యాంగ పరిషత్ నియమించింది. భారత రాజ్యాంగ పరిషత్‌లో 389 మంది సభ్యులకు అవకాశం కల్పించారు. ఇందులో 292 మందిని 11 ప్రావిన్సుల శాసనసభల ప్రజా ప్రతినిధులు ఎన్నుకున్నారు. 93 మంది సంస్థానాల ప్రతినిధులు. మరొక నలుగురు ఢిల్లీ, అజ్మీర్–మార్వాడా, కూర్గ్, బ్రిటిష్ బలూచిస్తాన్ల నుంచి వచ్చిన సభ్యులు. 1946 ఆగస్ట్ నాటికి 11 ప్రావిన్స్‌ల చట్టసభలకు ఎన్నికలు జరిగాయి. అంటే 292 స్థానాలు. ఇందులో కాంగ్రెస్ 208 స్థానాలు గెలిచింది. ముస్లింలీగ్ 73 స్థానాలు గెలిచింది. హిందువులు ఆధిక్యం ఉన్నచోట కాంగ్రెస్, ముస్లింలు ఎక్కువగా ఉన్న చోట లీగ్ ప్రధానంగా గెలిచాయి. రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికైనా, ముస్లిం లీగ్ కాంగ్రెస్‌కు సహకరించడానికి నిరాకరించింది. చదవండి: రెస్టారెంట్ విచిత్ర షరతు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు! తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు ఒక విస్తృత ధ్యేయాన్ని నిర్వర్తించడానికి ఏర్పాటు చేశారు. విభజన ప్రక్రియను సజావుగా సాగించి, అధికార బదలీని వేగవంతం చేయడానికి అది ఏర్పాటైందన్నది నిజం. బ్రిటిష్ ప్రభుత్వం విన్నపం మేరకు కాంగ్రెస్ ఇందులో చేరడానికి అంగీకరించింది. మరోవైపు ముస్లింల కోసం వేరొక రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేయాలని లీగ్ కొత్త కోర్కెను తెర మీదకు తెచ్చింది. రాజ్యాంగ పరిషత్‌లో మెజారిటీ కాంగ్రెస్‌దే కాబట్టి, కాంగ్రెస్ అంటే హిందువుల సంస్థ అనే లీగ్ నిశ్చితాభిప్రాయం కాబట్టి లీగ్ ఈ గొంతెమ్మ కోర్కె కోరింది. తమతో కలసి పనిచేయడానికి లీగ్ నిరాకరించినందున పార్టీకే చెందిన 12 మందిని కాంగ్రెస్ ఎంపిక చేసింది. వీరిలో ముగ్గురు ముస్లింలు. తరువాత మనసు మార్చుకున్న ముస్లిం లీగ్ అక్టోబర్ 26న తాత్కాలిక ప్రభుత్వంలో చేరింది. కానీ తమ మంత్రులు నెహ్రూకు జవాబుదారీగా ఉండబోరని షరతు పెట్టింది. ముగ్గురు ముస్లిం లీగ్ సభ్యులకు అవకాశం కల్పించడానికి వీలుగా ముగ్గురు కాంగ్రెస్ వారు రాజీనామా చేశారు. వారు శరత్చంద్ర బోస్, సయ్యద్ అలీ జహీర్, షఫత్ అహ్మద్ ఖాన్. తాత్కాలిక ప్రభుత్వంలోని కార్యనిర్వాహక విభాగానికి వైస్రాయ్ కార్యనిర్వాహక మండలి అనుబంధంగా పని చేస్తుంది. తాత్కాలిక ప్రభుత్వానికి ఉపాధ్యక్షుడిగా (అధ్యక్షుడు వైస్రాయ్), జవహర్లాల్ నెహ్రూ ఎంపికయ్యారు. విదేశ వ్యవహారాలు, కామన్వెల్త్ శాఖలు ఆయన దగ్గరే ఉన్నాయి. ఇంకా వల్లభ్‌భాయ్ పటేల్ (హోం, సమాచార, ప్రసార శాఖలు), బల్దేవ్ సింగ్ (రక్షణ), డాక్టర్ జాన్ మత్తయ్ (పరిశ్రమలు, రవాణా), సి. రాజాజీ (విద్య, కళలు), సిహెచ్ భాభా (పనులు, గనులు, విద్యుత్), బాబూ రాజేంద్ర ప్రసాద్ (ఆహారం, వ్యవసాయం), అసఫ్ అలీ (రైల్వే), జగ్జీవన్ రావ్ (కార్మిక), ముస్లిం లీగ్ నుంచి లియాఖత్ అలీ ఖాన్ (ఆర్థిక), టిటి చుంద్రిగర్ (వాణిజ్యం), అబ్దుర్ రబ్ నిష్తార్ (కమ్యూనికేషన్లు), గజాన్ఫార్ అలీ ఖాన్ (ఆరోగ్యం), జోగీంద్రనాథ్ మండల్ (న్యాయం. ఈయన తరువాత పాకిస్తాన్ ప్రభుత్వంలో అదే శాఖను నిర్వహించి, తరువాత భారత్ వచ్చారు). భారత్‌లో తొలిసారి భారతీయులతో ఏర్పడిన సంకీర్ణం ఏర్పాటులో గాంధీజీ పాత్ర ఏమిటి? కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నెహ్రూ ఎంపిక కావాలన్న తన ఆకాంక్షను 1946 ఏప్రిల్ 20న గాంధీజీ వ్యక్తం చేశారు. అప్పటికే జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎక్కడ లేని ప్రాముఖ్యం వచ్చింది. స్వతంత్ర భారతదేశ ప్రధానిగా కాంగ్రెస్ అధ్యక్షుడే ఎన్నికవుతాడు. నిజానికి ఆ పదవిని తాను కూడా ఆశించానని మౌలానా అబుల్‌కలాం ఆజాద్ తన జీవిత చరిత్రలో రాసుకున్నారు. కానీ ఈ ఇద్దరినీ కాకుండా 15 ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలకు గాను 12 సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌ను ఎన్నుకున్నాయి. మిగిలిన మూడు కమిటీలు ఓటు చేయలేదు. ఈ సంగతి స్వయంగా గాంధీజీయే నెహ్రూకు చెప్పారు. రెండో స్థానం నెహ్రూకు ఆమోదయోగ్యం కాదనీ గాంధీయే చెప్పడంతో పటేల్ నెహ్రూకు అనుకూలంగా రంగం నుంచి తప్పుకున్నారు. తాత్కాలిక ప్రభుత్వం 1947 ఆగస్ట్ 15 వరకు పనిచేసింది. గాంధీజీ కోరుకున్నట్టు నెహ్రూ ప్రధానమంత్రి అయ్యారు. రాజ్యాంగ పరిషత్ 1949 నవంబర్ 26 నాటికి రాజ్యాంగ నిర్మాణం పూర్తి చేసింది. 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అదే సంవత్సరం సర్దార్ పటేల్ కన్నుమూశారు. మరి...ఆయనను ప్రధానిని చేసి ఉంటే? - డా. గోపరాజు నారాయణరావు చదవండి: Unknown Facts About China: చైనా గుట్టు రట్టు చేసే.. 20 షాకింగ్ నిజాలు! -
జలియన్‌వాలాబాగ్ దురంతం: ఒక జాతి ఆత్మను తాకిన తూటా..
1919 ఏప్రిల్ 13: ఆ రోజు జరిగిన నెత్తుటికాండను అంచనా వేయడంలో నాటి ప్రపంచం, విఖ్యాత మేధావులు అవమానకరంగా విఫలమయ్యారు. కాలమే చెప్పింది, మానవాళి చరిత్రలో అదెంత బీభత్సమో! అదే జలియన్‌వాలాబాగ్ దురంతం. అది భారతీయ ఆత్మ మీద దాడి. ఆ కాల్పులలో 379 మంది చనిపోయారని ప్రభుత్వం చెప్పింది. మృతుల సంఖ్య 1500 వరకు ఉంటుందని నాటి భారతీయుల వాదన. ఈ ఘటన మీద విచారణకు నియమించినదే విలియం హంటర్ కమిషన్. సాక్షులను ఢిల్లీ, అహ్మదాబాద్, బొంబాయి, లాహోర్లకు పిలిచారు. లాహోర్‌లోని అనార్కలీ బజార్లో ఉన్న టౌన్‌హాలు అందుకు వేదిక. 1919 నవంబర్ 19న అక్కడికే వచ్చి వాంగ్మూలం ఇచ్చాడు జనరల్ రెజినాల్డ్ ఎడ్వర్డ్ హ్యారీ డయ్యర్. నిరాయుధుల మీద 90 మంది సైనికుల చేత కాల్పులు జరిపించినవాడు ఇతడే. చాలా ఆలస్యంగా ఘటన వివరాలు బయటకు వచ్చాయి. జాతీయ కాంగ్రెస్ కూడా విచారించింది. తుపాకీ గుళ్లకు బలైన వాళ్లలో ఏడుమాసాల పసిగుడ్డు సహా 42 మంది చిన్నారులూ ఉన్నారని మదన్మోహన్ మాలవీయ చెప్పారు. ప్రభుత్వం లెక్క కూడా దీనికి దగ్గరగానే ఉంది. ఇక వెలుగు చూడని అంశాలూ ఎన్నో! 1919 ఆఖర్లో ఓ రోజు నెహ్రూ అమృత్సర్ నుంచి ఢిల్లీ వరకు ప్రయాణించారు. రాత్రి బండి. ఆయన ఎక్కిన బోగీ దాదాపు నిండిపోయి ఉంది. ఒక్క బెర్త్, అదీ అప్పర్ బెర్త్, ఖాళీగా ఉంది. ఎక్కి నిద్రపోయారు. తెల్లవారుతుంటే తెలిసింది, ఆ బోగీలో ఉన్నవారంతా సైనికాధికారులని. అప్పటికే వాళ్లంతా పెద్ద పెద్ద గొంతులతో మాట్లాడుకుంటున్నారు. ఒకడు మరీ పెద్ద గొంతుతో, కటువుగా మాట్లాడుతున్నాడు. అతడు అంత బిగ్గరగా చెబుతున్నవి, అప్పటికి దేశాన్ని కుదిపేస్తున్న అమృత్సర్, జలియన్‌వాలాబాగ్ అనుభవాలే. అసలు ఆ పట్టణమంతా తనకి ఎలా దాసోహమైందో చెబుతున్నాడు. తిరుగుబాట్లూ, ఉద్యమాలూ అంటూ అట్టుడికినట్టుండే పంజాబ్ తన ప్రతాపంతో ఎలా మోకరిల్లిందో వర్ణిస్తున్నాడు. ముదురు ఊదారంగు చారల దుస్తులలో ఉన్నాడతడు. మొదటి ప్రపంచ యుద్ధంలో పదిలక్షల మంది భారతీయులు పోరాడారు. 60వేల మంది చనిపోయారు. యుద్ధం తరువాతైనా ఏదో ఒరుగుతుందని ఎదురుచూశారు. ఏం లేకపోగా, అణచివేత ఎక్కువయింది. అందుకే ఒక తిరుగుబాటు మనస్తత్వం వచ్చింది. రాజ్యాంగ సంస్కరణలు జరుగుతాయన్న ఆశ మధ్య తరగతిలో ఉంది. అంటే స్వయంపాలనకు అవకాశం. దీని గురించి ప్రజలు మాట్లాడుకోవడం ఆరంభించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఇది బాగా ఉండేది. ఇక పంజాబ్‌లో అయితే మొదటి ప్రపంచ యుద్ధం కోసం రకరకాల పేర్లతో తమ యువకులను సైన్యంలో చేర్చుకున్న సంగతి గుర్తు చేసుకుంటున్నారు. అదే కాకుండా కామగాటమారు నౌక ఉదంతం, అనంతర పరిణామాలు వారిని బాధిస్తున్నాయి. ప్రపంచ యుద్ధం నుంచి తిరిగి వచ్చిన సైనికులు గతంలో మాదిరిగా లేరు. దేశదేశాల సైనికులతో కలసి పనిచేసి ప్రపంచ జ్ఞానంతో వచ్చారు. దశాబ్దాలుగా భారతీయ సైనికులకు జరుగుతున్న అన్యాయం పట్ల గుండె మండిపోతోంది. అలాంటి సందర్భంలో రౌలట్ చట్టం వచ్చింది. ఎలాంటి విచారణ, ఆరోపణ లేకుండానే ఎవరినైనా అరెస్టు చేసే అధికారం ఈ చట్టంతో అధికారులకు వచ్చింది. దేశమంతా ఆగ్రహోదగ్రమైంది. మితవాద కాంగ్రెస్ నాయకులకు కూడా ఆవేశం వచ్చింది. రౌలట్ చట్టాన్ని తీసుకురావద్దని గాంధీజీ కోరారు. ఆ చట్టానికి వ్యతిరేకత తెలియచేయడానికి సత్యాగ్రహ సభ పేరుతో ఉద్యమం ప్రారంభించారు. పంజాబ్ మరీ ఉద్రేకపడింది. ఫలితం జలియన్‌వాలాబాగ్. పంజాబ్‌కూ మిగిలిన దేశానికీ మధ్య బంధం తెగిపోయింది. సైనిక శాసనం నడుమ చిన్న వార్త కూడా రావడం లేదు. ఆ దురంతం జరిగిందని తెలుసు. అది ఎంత ఘోరంగా ఉందోనని దేశంలో గుబులు. సైనిక శాసనం ఎత్తేశారు. దీనితో కాంగ్రెస్ నాయకులు వెల్లువెత్తారు. పండిట్ మదన్మోహన్ మాలవీయ, స్వామి శ్రద్ధానంద నాయకత్వంలో పునరావాస కార్యక్రమం ప్రారంభించారు. వాస్తవాల సేకరణ పనిలో మోతీలాల్, చిత్తరంజన్‌దాస్ ఉన్నారు. దాస్‌కు సహాయకుడు నెహ్రూ (నెహ్రూ స్వీయచరిత్ర, 1936 నుంచి). పది నుంచి పదకొండు నిమిషాలు సాగిన కాల్పులే. కానీ ఆ తుపాకుల నెత్తుటి చరిత్ర అంతటా ప్రతిధ్వనిస్తూనే ఉంది. దీనితో పాటు ఆనాటి ఆర్తనాదాలు కూడా. కాల్పులు జరపకుండా జనం అక్కడ నుంచి వెళ్లిపోవడానికి అవకాశం ఉన్నా అలా చేయని సంగతిని హంటర్ కమిషన్ ముందు జనరల్ డయ్యర్ ఒప్పుకున్నాడు. ఎందుకు? అలా చేస్తే వాళ్లు తనను చూసి నవ్వుతారన్న అనుమానం. ఇంకా ఎక్కువ మందిని చంపాలంటే మిషన్ గన్లే ఉపయోగించేవాడినని అన్నాడు. గాయపడిన వాళ్ల సంగతి పట్టించుకోవడం తన పని కాదనీ అన్నాడు. ఆ ఘట్టం గురించి చెబుతున్నప్పుడు ‘బీభత్సమైనది’ అనేవాడు. ‘ది బుచర్ ఆఫ్ అమృత్సర్: జనరల్ రెజినాల్డ్ డయ్యర్’ పేరుతో నీజెల్ కోలెట్ రాసిన జీవితకథలో విస్తుపోయే విషయాలు ఉన్నాయి. తాను ఎంత చట్టవిరుద్ధంగా ప్రవర్తించాడో డయ్యర్కూ తెలుసు. అందుకే ఘటన జరిగిన రెండుమూడు రోజులు కథనాలు మార్చి వినిపించాడు. కానీ పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఓడ్వయ్యర్ నుంచి మద్దతు లభించింది. తరువాత చాలామంది బ్రిటిష్ ప్రముఖులు గొప్ప పని చేశాడని పొగడ్తలతో ముంచెత్తారు. స్వర్ణదేవాలయం పెద్దలు జనరల్ డయ్యర్‌ను ‘గౌరవ సిక్కు’ను చేశారు (రిచర్డ్ కావెండిష్, హిస్టరీ టుడే వాల్యూమ్ 59, ఇష్యూ 4, ఏప్రిల్ 2009). 1920 జూలై 8న బ్రిటిష్ పార్లమెంట్ ప్రభువుల సభలో చర్చ జరిగింది. ఎక్కువమంది డయ్యర్‌ను సమర్థించారు. యుద్ధ వ్యవహారాల కార్యదర్శి విన్స్టన్ చర్చిల్ మాత్రం అది బ్రిటిష్ విధానం కాదని అన్నాడు. హంటర్ కమిషన్ తీవ్ర విమర్శలతో డయ్యర్‌ని ఆ ఏడాదే ఉద్యోగం నుంచి తొలగించి ఇంగ్లండ్ పంపేశారు. అయినా ‘బాగ్ హీరో’గా ‘మార్నింగ్ పోస్ట్’ అనే బ్రిటిష్ పత్రిక తన నిధితో డయ్యర్‌ను సత్కరించదలిచింది. ఇంగ్లండ్ పత్రికలు సరే, బ్రిటిష్ ఇండియా నుంచి ‘కలకత్తా స్టేట్స్‌మన్’, ‘మద్రాస్ మెయిల్’ వంటి పత్రికలూ నిధి సేకరించాయి. మొత్తం 28,000 పౌండ్లు. కానీ అది తీసుకోవడానికి డయ్యర్ నిరాకరించాడు. అప్పటికే అతనిలో అభద్రతాభావం పేరుకుపోయింది. పైగా ఆర్టియోసెరిలోసిస్ వ్యాధి. చిన్నపాటి ఉద్వేగానికి గురైనా చావు తప్పదు. అంతేకాదు, బాగ్ ఘటన పేరుతో తాను మళ్లీ ప్రపంచానికి గుర్తుకు రావడం ఇష్టం లేదన్నాడు. బ్రిస్టల్ పట్టణం శివార్లలో ఎవరికీ పట్టనట్టు ఉండే సోమర్సెట్ కుగ్రామంలోని చిన్న కొండ మీద కట్టిన కాటేజ్‌లో భార్య అనీతో కలసి రహస్యంగా జీవించాడు. అక్కడే 1927 జూలై 23న చనిపోయాడు. మొదట గుండెపోటు వచ్చింది. అప్పుడు కూడా అతడు బాగ్ గురించే ప్రస్తావించాడంటారు జీవితకథ రాసిన కోలెట్. డయ్యర్‌కు రెండుసార్లు అంత్యక్రియలు జరిగాయట. మొదట అతని స్వగ్రామంలో, మళ్లీ సైనిక లాంఛనాలతో. అలా ముగిసింది అతని జీవితం. ఆరోజు రైలు ప్రయాణంలో నెహ్రూ చూసిన ఆ ఊదారంగు చారల దుస్తులలో ఉన్న వ్యక్తి ఢిల్లీలో దిగిపోయాడు. లాహోర్‌లో ఏర్పాటు చేసిన విచారణ సంఘం ముందు హాజరై వస్తున్నాడు. అతడే జనరల్ డయ్యర్. - డా. గోపరాజు నారాయణరావు -
నెహ్రూ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు..
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గురించి మాట్లాడే అర్హత మంత్రి జగదీశ్వర్ రెడ్డికి లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. మాజీ ప్రధానిపై మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద స్పందిస్తూ.. దేశ ప్రయోజనాల కోసం తన సొంత ఆస్తులను ధారాదత్తం చేసిన నెహ్రూపై మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు. నెహ్రూ లాంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని, క్యారెక్టర్ లేని జగదీశ్వర్ రెడ్డి విమర్శించడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. జగదీశ్వర్ రెడ్డి ఎంటో తనకు బాగా తెలుసునని, త్వరలో అతని బండారం మొత్తం బయటపెడతానని ఆయన హెచ్చరించారు. పవర్ మంత్రి అయిన జగదీవ్వర్ రెడ్డికి ఒంట్లో పవరే లేదని ఆయన ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌కు విస్కీలో సోడా కలిపే వ్యక్తి కూడా మాజీ ప్రధానిని విమర్శించడం ఏంటని ప్రశ్నించారు. తాము తిట్టడం మొదలు పెడితే తట్టుకొని, బయట తిరగగలిగే దమ్ముందా అని సవాల్ విసిరారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే మంత్రి అవినీతి మొత్తం బయటికి తీస్తామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ వద్ద చెంచాగిరి చేసే వ్యక్తి, మహా నేత నెహ్రూని విమర్శించడం విడ్డూరమని పేర్కొన్నారు. మద్యం మత్తులో పవర్ మంత్రి ఎక్కడ సంతకం పెడతాడో తనకే తెలీదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జగ్గారెడ్డి మాట్లాడుతూ.. కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చేందుకే ప్రాజెక్ట్‌ను చేపట్టారని, ప్రాజెక్ట్ నిర్వహణలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు.