new books
-
కొత్త పాఠాలు.. కొంగొత్త విషయాలు
సాక్షి, అమరావతి: నూతన జాతీయ కరిక్యులమ్ ఫ్రేమ్వర్కు– 2020 ప్రకారం పాఠశాల విద్యలో పాఠ్యాంశాల సవరణ ప్రక్రియను జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) చేపట్టింది. 2024–25 విద్యా సంవత్సరం నుంచి నూతన పాఠ్య పుస్తకాలను అందుబాటులోకి తెస్తోంది. ‘నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)కి అనుగుణంగా సవరించిన కొత్త పాఠ్యాంశాలు ఉంటాయని ఎన్సీఈఆర్టీ ప్రకటించింది. కోవిడ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పాఠ్య పుస్తకాల రూపకల్పనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎన్సీఈఆర్టీ వినియోగిస్తోంది. విద్యా సంస్థలు తెరిచి ఉన్నా, తెరవలేని పరిస్థితులు వచ్చినా అభ్యసనకు ఆటంకం లేకుండా పాఠ్య పుస్తకాలను రూపొందిస్తోంది. కొత్త పుస్తకాలు ప్రింటుతో పాటు డిజిటల్ రూపంలోనూ అందుబాటులో ఉంటాయని ఎన్సీఈఆర్టీ వివరించింది. ఎవరైనా వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత 2024–25 విద్యా సంవత్సరం నుంచి అన్ని స్థాయిల్లోని పాఠశాల విద్యార్థులకు కొత్త పాఠ్య పుస్తకాలను ఎన్సీఈఆర్టీ రూపొందిస్తోంది. ఇప్పటివరకు ఎన్సీఈఆర్టీ ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ భాషల్లో మాత్రమే పాఠ్య పుస్తకాలను అందిస్తోంది. ఇప్పుడు 22 భారతీయ భాషల్లో వీటిని అందించనుంది. జాతీయ నూతన విద్యా విధానం ప్రకారం 5వ తరగతి వరకు మాతృ భాషల్లో బోధన సాగాలన్న నిబంధనను అనుసరించి ప్రీప్రైమరీ నుంచి 5వ తరగతి వరకు 22 భారతీయ భాషల్లో స్టడీ మెటీరియల్‌ను బాలలకు అందించనున్నట్లు ఎన్సీఈఆర్టీ వివరించింది. ఈ పుస్తకాలు ప్లే బుక్‌ల మాదిరిగా, నాటక ఆధారితంగా రూపొందిస్తున్నట్లు పేర్కొంది. ఈ పుస్తకాలు ప్లే–వే పద్ధతిలో ఉంటాయి. విద్యార్థుల్లో సమస్యలను పరిష్కరించే మెళకువలు, సామాజిక భావోద్వేగ సామర్థ్యాలను పెంపొందించేలా వీటిని రూపొందిస్తోంది. ఇప్పటికే ప్రీ–సూ్కల్ నుండి 2వ తరగతి వరకు పుస్తకాల రూపకల్పనకు కరిక్యులమ్ ఫ్రేమ్వర్కును ఎన్సీఈఆర్టీ విడుదల చేసింది. ఇతర తరగతుల కోసం ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తోంది. ప్రైవేటు పబ్లిషర్లకూ ఎన్ఈపీ మార్గదర్శకాలు ప్రైవేటు పబ్లిషర్లు ముద్రించే వివిధ విద్యా సంబంధిత పుస్తకాలు జాతీయ విద్యా విధానాని (ఎన్ఈపీ)కి అనుగుణంగా ఉండేలా ఎన్సీఈఆర్టీ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కొన్ని ప్రైవేటు పబ్లిషర్లు ప్రీసూ్కల్, 1, 2 తరగతుల పుస్తకాలను ఎన్ఈపీకి అనుగుణంగా రూపొందిస్తున్నట్లు వివరించింది. మిగతా పబ్లిషర్లు కూడా ఎన్ఈపీ మార్గదర్శకాల ప్రకారం పుస్తకాలు ప్రచురిస్తున్నారా? లేదా అనే విషయాన్ని ఎన్సీఈఆర్టీ పరిశీలిస్తోంది. -
మదర్ ఫెయిర్
‘మనసు ఉంటే మార్గమూ ఉంటుంది’. చెన్నై బుక్ ఫెయిర్ ఈ నానుడిని నిజం చేస్తోంది. కోవిడ్ కారణంగా ఇల్లు కదలని వాళ్లు కూడా బుక్ ఫెయిర్‌కు వస్తున్నారు. ఫిబ్రవరి 24వ తేదీ మొదలైన ఈ బుక్ ఫెయిర్ మార్చి తొమ్మిది వరకు కొనసాగుతుంది. చెన్నైలోని నందనం, వైఎమ్‌సీఏలో ఏడు వందల స్టాళ్లతో మొదలైన ఈ బుక్ ఫెయిర్‌లో వేలాది పుస్తకాలున్నాయి. సాధారణంగా బుక్ ఫెయిర్‌లో పుస్తకప్రియులతోపాటు రచయిత లు ఎక్కువగా కనిపిస్తుంటారు. ఈ దఫా కూడా రచయితలు తమ పుస్తకాల పట్ల పాఠకుల రెస్పాన్స్ తెలుసుకోవడం కోసం రోజూ బుక్ ఫెయిర్ కు వస్తున్నారు. అయితే ఈ ఏడాది ప్రత్యేకం ఏమిటంటే... పేరెంట్స్ తమ పిల్లలను బుక్ ఫెయిర్‌కు తీసుకురావడం. పేరెంట్స్‌లో కూడా తల్లులే అధికంగా కనిపిస్తున్నారు. కోవిడ్ కారణంగా ఏడాది నుంచి గడపదాటలేదు. ఆన్లైన్ క్లాసుల్లో పాఠాలతో పిల్లలు విసిగిపోతున్నారు. వాళ్లకు నచ్చే పుస్తకాలు కొనిద్దామని తీసుకువచ్చామని చెబుతున్నారు బుక్ ఫెయిర్‌కి పిల్లలతో వచ్చిన తల్లులు. ‘ఈ కోవిడ్ విరామం పిల్లలకు ఇష్టమైన పుస్తకాలు చదువుకోవడానికి బాగా ఉపకరిస్తుంది. మనకు నచ్చినవి కొనుక్కుని వెళ్లి వీటిని చదవండి అంటే పిల్లలకు చదవాలనే ఆసక్తి కలగదు. వాళ్లనే తీసుకు వచ్చి చూపించినట్లయితే తమకు ఇష్టమైన వాటినే ఎంచుకుంటారు, ఇష్టంగా చదువుతారు కూడా’ అన్నారు తన ఇద్దరు పిల్లలతో బుక్ ఫెయిర్ కొచ్చిన రాజి. బుక్ ఫెయిర్‌లో జనసమ్మర్ధం విపరీతంగా ఉంటుందేమోనని రావడానికి కొంచెం భయపడ్డాం. కానీ ఇక్కడ ఎప్పుడూ ఉండే రష్ లేదు. మాస్కు లేకుండా వచ్చిన వాళ్లను వెనక్కి పంపించకుండా ఇక్కడ మాస్కు ఇస్తున్నారు. శానిటైజర్ కూడా అందుబాటులో ఉంచారు. నిర్వహకులు కోవిడ్ ప్రోటోకాల్ కచ్చితంగా పాటిస్తున్నారు. దాంతో ధైర్యంగా ఎక్కువ సమయం ఉండగలుగుతున్నాం. కొత్త పుస్తకాలను కూడా డిస్కౌంట్లో ఇస్తున్నారు. దాంతో నాలుగు కొనాలనుకున్న వాళ్లు కూడా మరో రెండు ఎక్కువగా తీసుకుంటున్నాం’ అన్నారామె. చెన్నై బుక్ ఫెయిర్‌లో షాపింగ్ -
హ్యుమానిటీస్‌కు కొత్త పాఠ్య పుస్తకాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం హ్యుమానిటీస్‌కు కొత్త పాఠ్య పుస్తకాలను ఇంటర్మీడియట్ బోర్డు అందుబాటులోకి తెచ్చింది. ప్రతి ఐదేళ్లకోసారి సిలబస్ మార్పులో భాగంగా ఈసారి ప్రథమ సంవత్సర కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్, హిస్టరీ, జియోగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పుస్తకాల సిలబస్‌ను మార్పు చేసింది. ఆ పుస్తకాలను బోర్డు కార్యాదర్శి అశోక్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పుస్తకాలను ముద్రించిన తెలుగు అకాడమీ డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డైలీ దౌడ్
ఎవరో కుర్రవాడు రన్నింగ్ రేస్ చేస్తున్నవాడిలా పేవ్మెంట్ మీద బాణంలాగా పరుగెత్తిపోతున్నాడు. రామచంద్రమూర్తి ఒక్క క్షణం ఆగి వెనుదిరిగి చూస్తూ నిలబడ్డాడు. అంతలోనే ఆ కుర్రవాడు కనుచూపుమేర దాటిపోయాడు. వేగంగా పరుగెత్తుతున్న వారెవరిని చూచినా అతడు అలాగే నిలబడిపోతాడు. తర్వాత నవ్వుకుంటాడు. అతడు మళ్లీ నడవడం ప్రారంభించాడు. మరొక ఫర్లాంగు దూరం నడిస్తే కానీ బస్సు స్టాపు చేరుకోలేడు. ఎంత పెందలాడి యింట్లో నుంచి బయలుదేరితే తప్ప బస్సు అంది ఆఫీసుకు చేరుకోవడం కష్టం. అప్పటికి సీతమ్మ ఎంతో పెందలకడనే– నిద్రలేచి పనులు ప్రారంభిస్తుంది. అవి సర్దుకొని, యివి సర్దుకొని వంటకు ఉపక్రమించి ఎంత ఉరుకులు పరుగుతు పెడుతూ చెమటలు కక్కుతూ పనిచేసినా తొమ్మిది గంటల లోపున వంట తయారు కాదు. నాలుగు మెతుకులు నోట వేసుకుని తాను తయారయ్యేసరికి తొమ్మిదిన్నర అవుతుంది. ఎంత వేగంగా నడిచినా బస్‌స్టాపుకు చేరుకునే సరికి మరొక పావుగంట. ఆ తర్వాత బస్సు కోసం పడిగాపులు పడి ఉండాలి. ఎంతకూ తనెక్కవలసిన బస్సు రాదు. పోనీ ఓపిక చేసుకుని నడిచిపోదామా అంటే ఆఫీసు దగ్గరా దాపూ కాదు. అయిదు కిలోమీటర్ల దూరంలో ఊరికి అవతలి వైపున ఉంటుంది.‘పోనీ ఆఫీసుకు దగ్గర్లో ఏదైనా యిల్లు చూసుకోరాదూ?’ అన్నారు చాలామంది. కానీ అక్కడి అద్దెలు తాను భరించలేడు. ఆఫీసులో కొందరు జల్సారాయుళ్లు ఉన్నారు. కొత్త కరెన్సీ నోటుల్లా పెళపెళ లాడుతుంటారు. కానీ వారి సీట్లు అటువంటివి. తన సీటు అటువంటిది కాదు. చాకిరీకి మాత్రం ఏమీ తక్కువ ఉండదు. టన్నుల కొద్దీ ఫైళ్లు పేరుకుపోతుంటాయి. ఫలితం మాత్రం నెల తిరిగేసరికి వచ్చే ఆ జీతపు రాళ్లే. అందులో బోలెడన్ని కట్లూ, కత్తిరింపులూ. అతడు కోటు వేసుకుంటాడు. ‘మీకేమండీ కోటు తొడుక్కుంటారు దర్జాగా’ అంటారు కొందరు. వారికి తెలియదు తన లోపలి చొక్కాలోని ఎన్ని చిరుగులను బయటికి కనబడకుండా ఆ కోటు కప్పుతున్నదో! ఎండ చిటచిట లాడుతున్నది. రామచంద్రమూర్తి నుదుట పట్టిన చెమటను అరచేత్తో తుడుచుకుంటూ వీధి చివరకు కళ్లు చికిలించి చూశాడు. ఏదో బస్సు వస్తున్నది. నంబరు సరిగా కనిపించడం లేదు. చత్వారం వస్తున్నదేమో! ఎస్సెల్సీ రిజిస్టరులో ఉన్న తన పుట్టిన తేదీ నిజమే అయితే తనకిప్పుడు నలభై ఎనిమిది వెళ్లి రెండు నెలలయింది. ఇంకా ఏడేళ్లు సర్వీసున్నది. బస్సు దగ్గరికి వచ్చాకకానీ నంబరు సరిగా కనిపించ లేదు. అది తన బస్సు కాదు. రామచంద్రమూర్తి ఆలోచిస్తూ నిలబడ్డాడు. తాను ఆఫీసుకు నడిచిపోతే ఎంతసేపటిలో పోగలడు? వేగంగా నడవగలిగితే గంట. పరుగెత్తి పోతే? ఇప్పుడు తాను పరుగెత్తగలడా? ఒకప్పుడు పరుగెత్తాడు. తమ జిల్లా పేరు నిలబెట్టాడని విపరీతంగా మెచ్చుకున్నారు. ఫొటోలు తీశారు, దండలు వేశారు. తానప్పుడు రోజూ పరుగెత్తేవాడు. మైళ్ల కొద్దీ దూరం అతని సన్నని కాళ్ల క్రింద తరిగిపోయేది. ఆ కండరాలకు అలుపు తెలిసేది కాదు. ఇంతకాలం తరువాత పరుగెత్తగలడా?పక్కనే నిలబడి ఉన్న వ్యక్తిని ‘‘ఏమండీ! టైమెంత అయింది?’’ అని అడిగాడు. కొంచెం విసుగుతో చేతి గడియారం వంక చూసి ‘‘నైన్ ఫిఫ్టీ’’ అని సమాధానం చెప్పాడు. బాప్రే. తాను పదిగంటలకల్లా సీటులో ఉండాలి. లేకపోతే ఆ కొత్త ఆఫీసరు అగ్గిరాముడై పోతాడు. అసలా మనిషి ముఖం చూస్తేనే అదొక రకంగా ఉంటుంది. మెడ అంతా కొవ్వుపట్టి ఉంటుంది. ఎవరి వంకైనా చూడదలుచుకుంటే మెడ ఒక్కటీ తిప్పి చూడలేడు. మొత్తం శరీరమే గిర్రున తిరగవలిసి ఉంటుంది.ఇప్పుడు పది దాటుతున్నది కదా? ఈ బస్సు ఎప్పుడు వచ్చేట్టు? తానెలా ఎక్కేట్టు? ఎన్ని గంటలకు ఆఫీసుకు చేరుకునేట్టు? ఆఫీసరుకు ఏమి సంజాయిషీ ఇచ్చుకునేట్టు? అదుగో బస్సు. ఇంతకాలానికి దాని దర్శనమైంది. రామచంద్రమూర్తి కమ్మీ పట్టుకుని వదల్లేదు. దిగేవారు దిగగానే లోపలికి దూసుకుపోయాడు. బస్సెక్కడం అనే విద్యలో ఈ మాత్రపు ప్రాథమిక అనుభవమైనా లేకపోతే– ఆ సూట్‌వాలాలాగా పేవ్మెంట్ మీదనే గంటలు తరబడి నిలబడిపోక తప్పదు. సోదరా! దూసుకుపోయేవాడిదే రాజ్యం. లేకపోతే నీ సంగతి అంతే. రామచంద్రమూర్తి కళ్లముందు యెప్పటిదో దృశ్యం కనిపించింది. మరీ చిన్నప్పుడు తమ ఊరికి నాలుగు మైళ్ల దూరంలో ఉన్న చిన్న పట్నంలో స్కూలు చదువు. పొద్దున్నే లేచి చద్దన్నం తిని పుస్తకాల సంచీ భుజానికి తగిలించుకుని నడక ప్రారంభించేవాడు. సాయంకాలం తిరిగి వచ్చేటప్పుడు మరీ హుషారుగా ఉండేది. నాలుగు మైళ్లు పరుగెత్తుకుంటూ తిరిగి వచ్చేవాడు. ఆ విధంగా రన్నింగ్ అలవాటయింది. స్కూల్ పోటీలలో తానే ప్రథముడు. దాంతో ఇంకా అభిరుచి పెరిగింది. ఎక్కడికి వెళ్లినా పరుగెత్తుతూ వెళ్లడమే. బస్సు ఆగింది. రామచంద్రమూర్తి ఇద్దరు వ్యక్తులను నిర్దాక్షిణ్యంగా పక్కకు తోసి మళ్లీ కిందికి దిగాడు. టైమ్ కనుక్కున్నాడు. గుండె గతుక్కుమన్నది. మళ్లీ నడక. మరో అర ఫర్లాంగు దూరం. ఎండ నియంత పరిపాలనలా భయంకరంగా ఉంది. ఆ రోజు... అంతర్ జిల్లా ఎథ్లెటిక్స్ ముగింపు రోజు. రన్నింగ్ ఫైనల్స్. ట్రాక్ అంతా శుభ్రంగా ఉంది. మొత్తం పద్దెనిమిది మంది. మెత్తని ప్రేలుడు వినిపించగానే ముందుకు దూకాడు. కళ్లముందు ట్రాక్ తప్ప మనుషులు కనిపించలేదు. గుండెకు తగిలిన పలుచని దారం తెగిన తర్వాత కొద్ది గజాల దూరం పరుగెత్తిపోయి పచ్చికలో కూలబడిపోయాడు. జనం మూగారు. పైకెత్తి గాలిలోకి ఎగరవేశారు. కలెక్టరు తనకు ట్రోఫీ బహూకరిస్తున్నప్పుడు కరతాళ ధ్వనులతో ఆ ప్రదేశం అంతా మార్మోగిపోయింది. ‘ద ఫాస్టెస్ట్ రన్నర్ ఆఫ్ ద స్టేట్’ అని సావనీర్లో ఫొటో కింద వ్రాశారు.రామచంద్రమూర్తి ఆఫీసు మెట్లెక్కుతున్నాడు. ఆయాసంతో వగరుస్తున్నాడు. ఆ ట్రోఫీ ఇంకా తనదగ్గరే ఉంది. దాన్ని ఇతర చిన్న చిన్న కప్పులూ దాచేందుకు తన దగ్గర అద్దాల బీరువాలు లేవు. కొన్ని అసలైన వెండికప్పులు డబ్బు అవసరం వచ్చినప్పుడు వాటికి కాళ్లొచ్చి వెండి దుకాణాల్లోకి వెళ్లిపోయాయి. స్ప్రింగు డోరు తెరుచుకుని లోపల అడుగు పెట్టేసరికి అయ్యగారు పేపరు చదువుతున్నారు. శబ్దం విని కుర్చీ మొత్తం పక్కకు తిప్పి గడియారం వంక చూసి మొహాన గంటు పెట్టుకుని పేపరు బల్లమీద పడేసి ‘‘ఊ’’ అన్నాడు. రామచంద్రమూర్తి రిజిస్టరు అందుకోబోతూ ఉంటే ‘‘కాస్సేపాగండి– ఎలాగూ పన్నెండు అవుతుంది. ఈ పూటకు లీవు పెట్టేద్దురుగాని’’ అన్నాడు. ‘‘లీవు వుందా? అంతా వాడేసుకున్నారా?’’ రామచంద్రమూర్తి రిజిస్టరు మీద ఉన్న చేతిని వెనక్కి తీసుకుని ‘‘ఉందనే అనుకుంటానండి’’ అన్నాడు. ‘‘గూడ్. అది సరేనండీ. మీరెన్నింటికి బయలుదేరుతారు ఇంటినుంచి?’’ ‘‘బస్సులతో బాగా ఇబ్బందిగా ఉందండి. ఆపరు, ఎక్కించుకోరు’’ ‘‘గూడ్. కాబట్టి మనకు బస్సు సరిపడదని అర్థం– అంతేనా?’’ రామచంద్రమూర్తి తల వంచుకున్నాడు. ‘‘బస్సు మీద వస్తే లాభం లేదని తెలిశాక మీరు వేరే వసతి చూసుకోవాలి. మరో మీన్స్ ఆఫ్ కన్వేయన్స్. పోనీ ఒక స్కూటరు కొనుక్కోగూడదూ?’’ రామచంద్రమూర్తి నవ్వేందుకు ప్రయత్నించాడు. ‘‘డబ్బు కావాలి కదండీ’’ అన్నాడు. ‘‘గూడ్– డబ్బులేదు కాబట్టి కారు, స్కూటరు వగైరాలు వీల్లేదు. ఆగవు, ఎక్కించుకోవు కాబట్టి బస్సు వీల్లేదు. మరి కొంచెం ముందుగా యింటిదగ్గర బయలుదేరితే?’’ ‘‘అప్పటికి యింట్లో వంటకాదండి’’ ‘‘ఓహో అదొకటా? కాబట్టి అదీ వీలులేదు. ముందు లీవ్ లెటరు రాయండి. ఈ లోపల నేను ఉపాయం ఆలోచిస్తాను’’ లీవ్ వ్రాస్తున్నంతసేపూ ఆఫీసరు రామచంద్రమూర్తి వంక తమాషాగా చూస్తూ కూర్చున్నాడు. ‘‘ఆ ఉపాయం తట్టింది. అది బెస్టు’’. ‘‘చెప్పండి సార్’’ ‘‘తొమ్మిదింటికి ఇంట్లోనుంచి బయటికి రండి– వెంటనే పరుగు ప్రారంభించండి. ఎక్కడా ఆగకండి. అరగంటలో ఆఫీసులో ఉంటారు. పైగా వొంటికి ఎంతో మంచిది. ఏమంటారు?’’ ఈ మాటలని అతడు నవ్వడం ప్రారంభించాడు. రామచంద్రమూర్తి మొహం జేవురించింది. మనిషి నిలువెల్లా ఊగిపోయాడు. ‘‘మీ ధోరణి మీ హోదాకు తగినట్టు లేదు. అయామ్ సారీ. రియల్లీ సారీ. అన్నట్టు మీకు తెలియదేమో. పరుగెత్తమని సలహా ఇచ్చారు. ఐ వజ్ ఎ ఫేమస్ రన్నర్ వన్స్’’ అని స్ప్రింగ్ డోర్ మూసి యివతలికి వచ్చాడు. ∙∙ ఆ సాయంకాలం ఆఫీసు నుంచి బయటపడి రామచంద్రమూర్తి నుదురు చేత్తో రుద్దుకున్నాడు. చల్లనిగాలి వీస్తున్నది. వేగంగా నడవడం ప్రారంభించాడు. ఈ ప్రాంతంలో పెద్ద ఆవరణ ఉంది. కొందరు యువకులు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూవుంటారు. అతనికి పరుగెత్తాలని సరదా పుట్టింది. ప్యాంట్ కొంచెం పైకి మడిచాడు. కోటు చేతులు పైకి మడిచాడు. ‘‘రన్ రన్’’ అనుకున్నాడు. అలా తమ వీధికి చేరుకునేవరకూ పరుగెత్తుతూనే ఉన్నాడు. ఆయాసంతో వగర్చుతూ యింటికి వచ్చిపడ్డాడు. మంచం మీద కూలబడిపోయాడు. సీతమ్మ ఆదుర్దాగా ‘‘ఏమిటండీ’’ అంటూ వచ్చింది. ఆయాసంలోనే ‘‘మంచినీళ్లు... వద్దు కాఫీ’’ అన్నాడు. ఆమె లోపలికి వెళ్లింది. అతడు కాళ్లు చాపి మంచంలో వెల్లకిలా పడుకున్నాడు. అయిదు నిమిషాల తర్వాత వచ్చి చూసి ఆమె అదిరిపడింది. భయంతో పరుగెత్తుతూ వెళ్లి దగ్గర్లోనే ఉన్న డాక్టరును పిలుచుకొచ్చింది. ఆయన పరీక్ష చేసి ‘‘చిన్న పెరాలసిస్ స్ట్రోక్, అదే పక్షవాతం. కుడి కాలూ చెయ్యీ పడిపోయాయి. విశ్రాంతిగా పడుకోనివ్వండి. నేను మళ్లీ వచ్చి చూస్తాను. ప్రాణభయం ఏమీలేదు’’ అని చెప్పి వెళ్లిపోయాడు. రామచంద్రమూర్తి కళ్లలో నీళ్లు ఉబికి వచ్చి బుగ్గల మీదుగా కిందికి జారుతున్నాయి. ‘‘రన్... రన్ మై డియర్బాయ్ రన్...’’ -
రే బ్రాడ్బరీ
ఏడవడానికి గనక నీకు సమ్మతి లేకపోతే జీవితాన్ని సంపూర్ణంగా జీవించలేవు, అంటాడు రే బ్రాడ్బరీ. ఇంగ్లిష్ మూలాలున్న తండ్రికీ, స్వీడన్ మూలాలున్న తల్లికీ జన్మించిన అమెరికన్ రచయిత బ్రాడ్బరీ (1920–2012). చిన్నప్పటినుంచీ బాగా చదివేవాడు. బొమ్మలు వేసేవాడు. మేజిక్ మీద కూడా ఆసక్తి ఉండేది. భవిష్యత్తులో ఏదో ఒక కళలోకి ప్రవేశిస్తానని అతడికి ‘ముందే తెలుసు’. పన్నెండేళ్లప్పుడే ఎడ్గార్ అలెన్ పోను అనుకరిస్తూ హారర్ కథలు రాశాడు. కౌమార దశలోనే సైన్స్ పిక్షన్ రచయితల సమగ్ర సాహిత్యం చదివాడు. కాలేజీలు, యూనివర్సిటీల మీద ఆయనకు విశ్వాసం లేదు. తనను లైబ్రరీలు పెద్ద చేశాయంటాడు. వారంలో మూడు రోజులు లైబ్రరీకి వెళ్లి కూర్చునేవాడు. ఇరవై నాలుగేళ్ల కల్లా పూర్తి స్థాయి రచయితగా స్థిరపడ్డాడు. సైన్స్ ఫిక్షన్ సాహిత్యాన్ని ప్రధాన స్రవంతిలోకి తెచ్చిన రచయితగా తర్వాత పేరు తెచ్చుకున్నాడు. తనను తాను సైన్స్ ఫిక్షన్ రచయితగా చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. ఫాంటసీ, హారర్, మిస్టరీ జాన్రల్లో కూడా అంతే ప్రతిభ కనబరిచాడు. ‘ఫారెన్‌హీట్ 451’ నవల, ‘ద మార్షియన్ క్రానికల్స్’, ‘ది ఇలస్ట్రేటెడ్ మేన్’, ‘ఐ సింగ్ ద బాడీ ఎలెక్ట్రిక్’ కథా సంకలనాలు వెలువరించాడు. సినిమాలకు రచయితగా పనిచేశాడు. ఆయన రచనలు సినిమా, టీవీ తెరలకెక్కాయి. -
మార్కెట్లో ఇంటర్ ఫస్టియర్ కొత్త పుస్తకాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ప్రథమ సంవత్సరంలో వివిధ భాషలకు సంబంధించిన సిలబస్‌ను మార్పు చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. సంస్కృతం, హిందీ, ఉర్దూ, అరబిక్ భాషలకు సంబంధించిన పుస్తకాల్లో మార్పులు చేసినట్లు పేర్కొంది. ఈ సిలబస్ 2018–19 విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి వస్తుందని తెలిపింది. పుస్తకాలను మార్కెట్లో అందుబాటులోకి తెచ్చినట్లు వివరించింది. మరోవైపు గతంలో ఫెయిలైన విద్యార్థులు 2019 మార్చి వార్షిక పరీక్షల్లో, మే/జూన్ నెలలో జరిగే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో పాత సిలబస్‌లో పరీక్షలు రాయవచ్చని పేర్కొంది. మూడు రోజుల్లో రిఫండ్ చేస్తాం: టీఎస్పీఎస్సీ సాక్షి, హైదరాబాద్: పేమెంట్లు ఫెయిలైన అభ్యర్థులకు తిరిగి 3 రోజుల్లోగా రిఫండ్ చేస్తామని టీఎస్పీఎస్సీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. గ్రూప్–4, టీఎస్ఆర్టీసీలో వివిధ పోస్టుల భర్తీలో భాగంగా పేమెంట్లను ఎస్బీఐ ఈ–పే ద్వారా స్వీకరిస్తున్న తరుణంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయని పేర్కొంది. ఈ నెల 7 నుంచి 11వరకు చేసిన పేమెంట్ల సమస్యల్ని పరిష్కరించినట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. పాలీసెట్ చివరి దశ సీట్లు కేటాయింపు సాక్షి, హైదరాబాద్: పాలీటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలీసెట్–2018 ప్రవేశాల కౌన్సెలింగ్ ముగిసింది. చివరి దశ కౌన్సెలింగ్‌లో కొత్తగా 9,100మంది విద్యార్థులకు సీట్లు లభించినట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రం లోని 170 పాలిటెక్నిక్ కాలేజీల్లో 38,359 సీట్లు అందుబాటులో ఉండగా, చివరి దశ కౌన్సెలింగ్ కలుపుకొని 29,663 సీట్లు భర్తీ అయ్యాయని, 8,696 సీట్లు మిగిలిపోయాయని ఆయన తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థులు శుక్రవారం లోగా నెట్ బ్యాంకింగ్/క్రెడిట్‌కార్డు/డెబిట్‌కార్డు ద్వారా ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా సెల్ఫ్‌రిపోర్టింగ్ చేయాలని, కాలేజీల్లో నేడు, రేపు చేరాలని సూచించారు. -
ఈవారం పుస్తకాలు
ఈవారం పుస్తకాలు నేహల (చారిత్రక నవల) రచన: సాయి బ్రహ్మానందం గొర్తి; పేజీలు: 374; వెల: 250; ప్రతులకు: విశాలాంధ్ర, నవచేతన, నవోదయ, ప్రజాశక్తి పుస్తక కేంద్రాలు. నది కాలం అతడు (ఇస్మాయిల్ ఇతివృత్త కవితా సంపుటి) రచన: రవూఫ్; పేజీలు: 120; వెల: 100; ప్రతులకు: కవి, 13–3–41/ఎ, గుంటూరు వారి తోట, మూడో లైన్, గుంటూరు–520001. ఫోన్: 9849041167 సగం తెగిన చంద్రుడు (కవిత్వం) రచన: డాక్టర్ యశోద పెనుబాల; పేజీలు: 142; వెల: 200; ప్రతులకు: పెనుబాల ప్రచురణలు, హైదరాబాద్ – 500073. ఫోన్: 9866676734 ఎన్.గోపి సాహిత్య స్ఫూర్తి సంపాదకుడు: మోదుగుల రవికృష్ణ; పేజీలు: 112; వెల: 50; ప్రచురణ: బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్; ప్రతులకు: సంపాదకుడు, 26–19–10, జీరో లేన్, మెయిన్ రోడ్, ఏటీ అగ్రహారం, గుంటూరు–4. ఫోన్: 9440320580 ఆంధ్రప్రదేశ్‌లో పేరంటాళ్లు రచన: డాక్టర్ కోనేరు(కోగంటి) లక్ష్మీప్రమీల; పేజీలు: 260; వెల: 90; ప్రతులకు: రచయిత్రి, 54–16–1/10, ప్లాట్ నం. 5, రోడ్ నం. 1, వెటర్నరీ కాలనీ, విజయవాడ–520008. ఫోన్: 0866–2450088 -
కొత్త పుస్తకాలు
సదానంద్ శారద కథలు పేజీలు: 276; వెల: 180; ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్ హౌస్, గిరిప్రసాద్ భవన్, జి.ఎస్.ఐ. పోస్టు, బండ్లగూడ(నాగోల్), హైదరాబాద్–68. ఫోన్: 24224453 అర్ధాంగి పేరును తనకు జోడించుకున్న కథకుడు సదానంద్ శారద. ‘ఒక ప్రభుత్వం దేశాన్ని పాలించగలదేమో కాని సమాజాన్ని పాలించలేదు. సమాజాన్ని ప్రభావితం చేసేదీ, సంస్కరించేదీ సాహిత్యం’ అని నమ్ముతారు. ఆ లక్ష్యంతోనే ఆయన 1970, 80ల్లో కథలు రాశారు. 30 కథలతో ఈ సంకలనాన్ని నవచేతన అందుబాటులోకి తెచ్చింది. తలకిందుల లోకం మూలం: మనీషా సేఠి ‘కాఫ్కాలాండ్’; తెలుగు: ఆర్.శశికళ; పేజీలు: 168; వెల: 150; ప్రచురణ: మలుపు, 2–1–1/5, నల్లకుంట, హైదరాబాద్–500044. ఫోన్: 9866559868 ‘తలకిందుల లోకం కౌంటర్ టెర్రరిజానికి ఉన్న చీకటి కోణాలను వెలికి తీస్తుంది. ముంబై నుండి బెంగళూరు దాకా, ఢిల్లీ నుండి మధ్యప్రదేశ్ దాకా ఉన్న చాలా ముఖ్యమైన కేసులను పరిశీలించి, టెర్రర్ కేసుల విచారణ అంటే ఏదో ఒక మేరకు చట్టాన్ని ఉల్లంఘించడం మాత్రమే కాదనీ, తామేమి చేసినా ఎవ్వరూ ఏమీ అనరనే భరోసాతో ముందే ఏర్పరుచుకున్న దురభిప్రాయాలతో, క్రూరహింసను అమలుపరచడమనీ రచయిత నిరూపిస్తుంది’. అయితే అనువాదం మరింత సాఫీగా ఉండాల్సింది. అల్మార 1917 అక్టోబరు విప్లవం ఎందుకు పోయింది? సోవియట్ రష్యాలో ఏం జరిగింది? చార్లెస్ బెతల్‌హామ్ రాసిన ‘క్లాస్ స్ట్రగుల్స్ ఇన్ ది యు.ఎస్.ఎస్.ఆర్.’ అనే 4 సంపుటాల సంక్షిప్త పరిచయం: రంగనాయకమ్మ; పేజీలు: 456(రాయల్ సైజులో, హార్డ్బౌండుతో); వెల: 100; ప్రతులకు: అరుణా పబ్లిషింగ్ హౌస్, ఏలూరు రోడ్డు, విజయవాడ–520002. ఫోన్: 0866–2431181 సుప్రసిద్ధ వ్యక్తుల జీవితాల్లో అప్రసిద్ధ గాథలు రచన: కోడూరి శ్రీరామమూర్తి; పేజీలు: 118; వెల: 70; ప్రచురణ: క్లాసిక్ బుక్స్, 32–13/2–3ఎ, అట్లూరి పరమాత్మ స్ట్రీట్, మొగల్రాజపురం, విజయవాడ –520010. ఫోన్: 9866115655 ఆలోచించండి రచన: అనిశెట్టి ఆనంద స్వరూప్; పేజీలు: 130; వెల: 100; ప్రచురణ: సావిత్రీబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్, 1–225, సుసర్ల కాలనీ, బాజీ జంక్షన్, గోపాలపట్నం, విశాఖపట్నం–530027. ఫోన్: 0891–2716225 -
కొత్త పుస్తకాలు
అశ్శరభశరభ రచన: ఎన్నెస్ నారాయణ బాబు; పేజీలు: 62(ఎ 4 సైజ్); వెల: 150; ప్రతులకు: రచయిత, 8-2-310ఎ/77ఎ, ఇబ్రహీం నగర్, రోడ్ నం.10, బంజారాహిల్స్, హైదరాబాద్-34. ఫోన్: 9052950208 ‘‘దక్షయజ్ఞం’లోని వీరభద్ర ఘట్టంలో ‘అశ్శరభశరభ’ నినాద ఘోష నాటకం పేరులోని ఆంతర్యాన్ని సూచిస్తుంది. ‘స్త్రీ పట్ల అమానవీయ చర్యలను నిరసించేలా ప్రేక్షకులను రంజింపజేయడం ధ్యేయంగా ఆమె యొక్క అంతఃచేతనని ఆవిష్కరించే ప్రయత్నం జరిగింది’’. ‘ఈ నాటకాన్ని చలనచిత్ర, టి.వి. స్క్రిప్ట్ ఫార్మాట్లోనే, చెరిసగమైన పేజీలో ఒక పక్క యాక్షన్, ఒక పక్క మాటలుగా’ ఇచ్చారు. క్షణ వీక్షణాలు రచన: పాలపర్తి ధన్‌రాజ్; పేజీలు: 112; వెల: 100; ప్రతులకు: రచయిత, 70-17ఎ-18/2ఎ, శశికాంత్ నగర్, కాకినాడ- 533103; ఫోన్: 9550593901 ‘క్షణం- కాల ప్రమాణం, వీక్షణం- ఇంద్రియ లక్షణం. క్షణంలో జరిగిన దాన్ని వీక్షించి సమీక్షిస్తే- అదే క్షణవీక్షణం’. ‘పాత్రలు, వర్ణనలు, రసం, ధ్వని... ఈ సిద్ధాంతరాద్ధాంతాలేవీ లేకుండా’ ధన్‌రాజ్ రాసిన 100 ఒక పేజీ కథల సంకలనం ఇది. ‘ప్రస్తుతం ఉన్న స్పీడ్ యుగానికి తగ్గట్టుగా క్షణంలో అయిపోయే కథలు’ ఇవి. శ్రీకృష్ణదేవరాయలు రచన: యస్.డి.వి.అజీజ్; పేజీలు: 96; వెల: 100; ప్రతులకు: ఎస్.అబ్దుల్ అజీజ్, 46/634, బుధవారపేట, కర్నూలు-518002. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి 13 వారాల పాటు ప్రసారమైన రేడియో నాటకం ఇది. భారతదేశంలో పేరెన్నికగన్న పాలకుల్లో ఒకరైన రాయల కాలంలో ‘రాచరిక వ్యవస్థ ఎలాంటిదో, నాటి సామాజిక పరిస్థితులు ఎలాంటివో, రాచరిక వ్యవస్థలో రాజులు, చక్రవర్తులు చివరిదశలో ఎలా అశాంతికి లోనయ్యేవారో’ ఇందులో చిత్రీకరించారు. రుద్రమదేవి రచన: పాటిబండ్ల బేబి కౌసల్య; పేజీలు: 120; వెల: 100; ప్రతులకు: రచయిత్రి, 205, సాయికృప టవర్స్, 6వ లైను, కోబాల్టు పేట, గుంటూరు-2. ఫోన్: 9849799711 ‘గణపతిదేవ చక్రవర్తి రూపురేఖల వర్ణనతో ప్రారంభమైన ఈ నవల, సందర్భానుసారం, ఆయా ప్రసిద్ధ చారిత్రక వ్యక్తుల గుణగణాలను, ప్రతాప విశేషాలను పాఠకుల మనోనేత్రానికి గోచరింప జేస్తుంది. ముఖ్యంగా రుద్రమదేవిని ఒకవైపు స్త్రీ మూర్తిగా చిత్రిస్తూనే, ఇంకోవైపు రుద్రమదేవుడుగా పురుషరూపంలో రాజ్యపాలన చేయడం అనే విషయాన్ని వర్ణించడం కత్తిమీది సాము!’ -
కొత్త పుస్తకాలు
భారతంలో బంధాలు రచన: డాక్టర్ కడియాల జగన్నాథశర్మ; పేజీలు: 214; వెల: 150; ప్రతులకు: రచయిత, 12-11-1346/ఎ, బౌద్ధ నగర్, సికింద్రాబాద్- 61; ఫోన్: 9949353846 మహాభారతంలోని సమాజశాస్త్రంపై 35 ఏళ్ల క్రితం రచయిత పరిశోధన చేసి, డాక్టరేట్ డిగ్రీ పొందిన సిద్ధాంత వ్యాసానికి ‘ప్రధాన ఆవిష్కరణలకు భంగం కలగకుండా అనేక మార్పులు’ చేసి వెలువరించిన పుస్తకం ఇది. ‘ఈ గ్రంథంలో మహాభారత కాలంనాటి వివాహాచారాల్నీ, సామాజిక జీవనాన్నీ గురించి విశ్లేషించి వివరించడం జరిగింది’. మార్క్సే నా టీచరు! రచన: రంగనాయకమ్మ; పేజీలు: 184; వెల: 50; ప్రతులకు: అరుణా పబ్లిషింగ్ హౌస్, ఏలూరు రోడ్డు, విజయవాడ-520002; ఫోన్: 0866-2431181 ‘నేను రాసేవి ‘‘మార్క్సిజం’’ నించి నేర్చుకున్న భావాలతోనే’, ‘మార్క్సు గ్రహించినది, హేతుబద్దమైనది. దానినే నేర్చుకుని, దానిని తేలికగా చెప్పాలనేది, నా ప్రయత్నం’ అంటున్నారు రంగనాయకమ్మ. అలా ఆ కోణంలో రాసిన 17 వ్యాసాల సంపుటం ఇది. తరిమెల నాగిరెడ్డి మీద వేసిన పుస్తకం గురించీ, ‘గర్భాల్ని అద్దెల కోసం కొనే-అమ్మే మహిళామణు’ల గురించీ రాసిన వ్యాసాలూ, ‘అంబేద్కరిస్టుల భ్రమలు’, ‘బహుజన బూర్జువా రాజ్యాధికారం వల్ల పేదరికాల-కుల విధానాల విముక్తి కల్ల’ వంటి వ్యాసాలూ ఇందులో ఉన్నాయి. ప్రతాపరుద్రుడు రచన: ఎస్.ఎమ్. ప్రాణ్‌రావు; పేజీలు: 246; వెల: 150; ప్రచురణ: విజ్ఞాన సరోవర ప్రచురణలు; ప్రతులకు: రచయిత, 9-14/1, రవీంద్రనగర్ కాలనీ, హబ్సిగూడ, హైదరాబాద్-7; ఫోన్: 8008950101 ఈ ‘చారిత్రక నవల’లో రచయిత ‘కాకతీయ రాజ్య వైభవాన్ని ఉద్విగ్న హృదయంతో వర్ణించారు. కాకతీయుల ఐశ్వర్యం, వారి పాలనలోని జనరంజకత, అనేక కళల వికాసం- నాట్యము, శిల్పము, చిత్రకళ, దేశీనృత్యరీతులు, జానపదుల వినోదాలు అన్నీ ప్రతాపరుద్రుని పట్టాభిషేక సందర్భంలో కళ్లకు కట్టినట్టు వర్ణించారు’. కృష్ణార్పణం రచన: వరిగొండ కాంతారావు; పేజీలు: 156; వెల: 130; ప్రచురణ: శ్రీలేఖ సాహితి; ప్రతులకు: వరిగొండ సూర్యప్రభ, 35-5-220, జీవన్ మిత్ర నగర్, విద్యారణ్యపురి, హనుమకొండ-506009; ఫోన్: 9441886824 ఈ పది కథల సంపుటి ‘అధిక్షేప భావజాల, సున్నిత హాస్యచతురోక్తులతో వెలువడినది’. కథల్లో ‘సింహభాగం మధ్యతరగతి సంసారాల చుట్టూ అల్లబడ్డాయి. వాటిలోనూ ముఖ్యంగా క్షమ, గయాశ్రాద్ధం, అంతిమం కథలు అత్తాకోడళ్ల సంబంధాలపై కేంద్రీకరించబడ్డాయి’. -
మహాభారత ప్రమదావలోకనం
కొత్త పుస్తకాలు రచన: డాక్టర్ ప్రభల (నముడూరి) జానకి; పేజీలు: 468; వెల: 250; ప్రతులకు: రచయిత్రి, 206, Leiah అపార్ట్మెంట్స్, బి-15, వసుంధర ఎన్క్లేవ్, ఢిల్లీ-110096; ఫోన్: 91-9000496959 ‘మహాభారతంలో స్త్రీ పాత్రలు జీవితానికి అర్థం చెప్పి అన్వయించుకోవటం నేర్పుతాయి. జీవితానికి ఉన్న పరమార్థాన్ని వీక్షించుమంటాయి. జీవితం ఎపుడూ ఉరుకులుపెట్టే ప్రవాహంలా కాక సంగమాన్ని చేరే నదిలా ఉండాలని నొక్కి వక్కాణిస్తాయి’ అంటారు ప్రభల జానకి. అట్లా ఆ పాత్రల మీది ప్రత్యేకమైన ఆరాధనతో మహాభారతం, కవిత్రయ భారతంలోని 380 మంది స్త్రీ పాత్రల వ్యక్తిత్వాలను ఆవిష్కరించారు రచయిత్రి. వెలుతురు తెర కవి: బొల్లోజు బాబా; పేజీలు: 112; వెల: 100; ప్రతులకు: కవి, 30-7-31, సూర్యనారాయణపురం, కాకినాడ. ఫోన్: 0884-2368189 ‘రోజుకోరకంగా రూపు దిద్దుకొంటున్న జీవితాన్ని దాని సర్వసారాంశంతో పట్టుకొని- కవిత్వం చేయటం- లోతయిన అధ్యయనం, నిత్య సాధన ద్వారానే సాధ్యమవుతుందని- బాబా ఈ పాటికి గుర్తించివుంటాడు. (అతడిలో) గొప్ప Sensibility వుంది, గొప్ప చూపు వుంది, జీవితాన్ని ప్రకృతిని చూపి పరవశించే గుణముంది, మొద్దు బారనితనముంది, మొగలిపొదలా నిలబడే తత్వముంది’. అలాంటి కవి కవితాసంపుటి ఇది. కుర్చీ కవి: వనపట్ల సుబ్బయ్య; పేజీలు: 200; వెల: 100; ప్రతులకు: కవి, భార్గవి హెయిర్ స్టైల్స్, నల్లవెల్లి రోడ్, నాగర్‌కర్నూల్-509209; ఫోన్: 9492765358 ‘సామాజిక యుద్ధజీవి సాగిస్తున్న సృజన వ్యాపారమే ఇతని కవిత్వం. జీవితం నుంచీ, జీవన సమరం నుంచీ నిర్మించుకున్న ప్రాపంచిక దృక్పథాన్ని తన కవిత్వానికిస్తాడు సుబ్బయ్య’. ‘ఇరుకు సందుల గుండా గొందుల గుండా నడిచినప్పుడే ప్రధాన రహదారికి చేరుకుంటాం. అలాగే పుట్టిన కులం, ప్రాంతం, వర్గం, మతం, లింగం- ఆ ప్రత్యేక అస్తిత్వ స్పృహ ద్వారానే విశ్వజనీనతకు చేరువ కాగలుగుతాం. ఈ విషయం ఈ కవికి అలవోకగా పట్టుబడింది’. ఆంధ్ర దేశ చరిత్రలో కొత్త కోణాలు రచన: ఆచార్య వెలమకన్ని సుందరరామశాస్త్రి; సంపాదకులు: డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, డాక్టర్ వి.వి.సుబ్బారెడ్డి; పేజీలు: 170; వెల: 100; ప్రతులకు: వి.కన్యాకుమారి, 202, విశ్వలక్ష్మి టవర్స్, రవీంద్రనగర్ 3వ లైను, గుంటూరు; ఫోన్: 0863-2320760 ‘చరిత్ర రచనాశాస్త్రంలోనూ, శాసన పఠనంలోనూ పట్టు గలిగిన శాస్త్రిగారు, అందుబాటులో ఉన్న చరిత్రతో రాజీపడక, మళ్లీ శాసనాలను పునఃపరిశీలన చేసి, తెలుగు నేలను పాలించిన విష్ణుకుండినులలాంటి వంశీయుల చరిత్రను సమగ్రంగా ఆవిష్కరించారు. చరిత్ర, సంస్కృతికి సంబంధించి చరిత్రలో శాసనాల ప్రాముఖ్యత, వైదిక వాఙ్మయము- వేంకటేశ్వరుడు, ఆంధ్ర శిల్పము- గుహాలయ వాస్తువు (లాంటి) శీర్షికల క్రింద అపురూపమైన చారిత్రక, సామాజిక, ఆర్థిక, రాజకీయ విషయాలను చక్కగా శోధించి మనకందించారు’. తెలంగాణ చరిత్ర సంస్కృతి వారసత్వం రచన: వై.వై.రెడ్డి యానాల; పేజీలు: 430; వెల: 399; ప్రతులకు: రచయిత, 1-6-141/25/1, బైపాస్ రోడ్, విద్యానగర్, సూర్యాపేట-508213; ఫోన్: 9908979054 ‘రాజులు రాజవంశీయులు చేసిన యుద్ధములు, వారి జయాపజయాలు, సంధులు, వారి పాలనా వ్యవస్థ’ ‘జాతి పురోగతి, సాంఘిక ఆర్థిక మత పరిస్థితుల మధ్య ప్రజల జీవన విధానాల సంపర్కాల సమ్మేళనం’ ‘పూర్వీకులు నిర్మించిన కట్టడాలు, రాజప్రాసాదాలు, ఆలయాలు, మనోజ్ఞ శిల్ప స్థంభాలు’ (ఈ) మూడింటికి ‘సముచిత స్థానం’ కల్పిస్తూ ‘చారిత్రక పూర్వయుగం నుండి ఆధునిక యుగం 2014 జూన్ 2 వరకు’ సాగిన తెలంగాణ చరిత్ర ఇది. కవితలు కొన్ని చినుకులూ కొంత వాన, చెదిరిపోతున్న చూరులో పిచ్చుకలు చూసాక వాటి అరుపులకు అల్లాడిపోయే దాని పేరు మా అక్క. పుస్తకం చింపి పడవ చేసిన తమ్ముణ్ణి కొట్టే నాకు రేపు వరదొస్తే, చెరువు గండికాడ చేపలు పట్టాలనే కల. పుల్లలు దాచుకునే అమ్మకి గేదెల్ని లోపల కట్టేసే నాన్నకీ ఎప్పుడన్న భయమేసిందో లేదోగానీ మట్టిపొయ్యి తడిసి అంటుకోక మా అమ్మపడే యాతనే మా అందరి వానాకాలం. - కాశిరాజు 9701075118 దగ్ధాంతరంగం విత్తులో బ్రహ్మాండం ఉందంటావు నువ్వు నాకేమో, మొలకెత్తని ప్రతి గింజా మృతశిశువే మొక్క, ప్రపంచాన్ని నిలబెడుతుందంటావు మొక్కై ఒంగకూడదని మొక్కుకుంటాన్నేను పువ్వు, పరమ లలితమంటావు నువ్వు కాయల్ని కనకుండానే కమిలిపోతున్న పూల కాఠిన్యం నాకు తెలుసు దూది, చాలా తేలికంటావు నువ్వు అది, కొన్ని కొండల బరువుల్ని మీద కుమ్మరిస్తుందని నా అనుభవం పత్తిచేను, నూతన వస్త్రంలా కనిపిస్తుందంటావు అది, కలలో కూడా ఉరితాడులా కనిపించకూడదని ప్రార్థిస్తుంటాన్నేను - ఎమ్వీ రామిరెడ్డి 9866777870 ఈవెంట్ బతుకమ్మ బతుకు చిత్రం సమ్మేళనం తెలంగాణ సాహిత్య సమాఖ్య ఆధ్వర్యంలో ‘బతుకమ్మ బతుకు చిత్రం’ కవి సమ్మేళనం నేడు సాయంత్రం 5:30కు తెలంగాణ సారస్వత పరిషత్, బొగ్గులకుంట, హైదరాబాద్‌లో జరగనుంది. అధ్యక్షత: శ్రీరామోజు హరగోపాల్. ముఖ్య అతిథి: అమ్మంగి వేణుగోపాల్. చలసాని సాహిత్యం ఆవిష్కరణ విప్లవ రచయితల సంఘం, సిటీ యూనిట్ ఆధ్వర్యంలో- చలసాని ప్రసాద్ మొదటి వర్ధంతి సందర్భంగా, ‘చలసాని ప్రసాద్ సాహిత్య సర్వస్వం-1’ ఆవిష్కరణ అక్టోబర్ 14న సాయంత్రం 6 గంటలకు తెలంగాణ సారస్వత పరిషత్‌లో జరగనుంది. ఆవిష్కర్త: కాకరాల. అధ్యక్షత: గీతాంజలి. వక్తలు: అమ్మంగి వేణుగోపాల్, బజరా, ఎస్.చంద్రయ్య, వరవరరావు. బహుజన సాహిత్య సదస్సు బహుజన రచయితల సంఘం ఆధ్వర్యంలో, అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా, అక్టోబర్ 16న ఉదయం 10 గంటలకు మహబూబ్‌నగర్‌లోని జెడ్పీ హాల్లో బహుజన సాహిత్య సదస్సు జరగనుంది. అధ్యక్షత: వనపట్ల సుబ్బయ్య. ముఖ్య అతిథి: జి.లక్ష్మీనరసయ్య. జి.ఎస్.రామ్మోహన్, సూరేపల్లి సుజాత, స్కైబాబ, హెచ్చార్కె, పి.వి.విజయ్‌కుమార్ తదితరులు ముఖ్య అతిథులు. -
కొత్త పుస్తకాలు
రాణి చిన్నాదేవి: రచన: మువ్వల సుబ్బరామయ్య; పేజీలు: 136; వెల: 60; ప్రతులకు: జయంతి పబ్లికేషన్స్, కారల్ మార్క్స్ రోడ్, విజయవాడ-520002; ఫోన్: 0866-2577828 ‘ఎక్కడో కళింగలో పుట్టి పెరిగిన ప్రతాపరుద్ర గజపతి కుమార్తె చిన్నాదేవి, నరహరి పాత్రుడు చుట్టూ తిరిగిన కథ మలుపు తిరిగి, నరహరి పాత్రునికి దక్కాల్సిన చిన్నాదేవి, (విజయనగరాధీశ్వర) కృష్ణరాయని వరించాల్సి వచ్చిన నేపథ్యాన్ని ఎంతో నాటకీయంగా వర్ణించారు. కటకం, హంపీ, ఉదయగిరి, కొండవీడు, కొండపల్లి నగరాలు, బీదరు, బీజాపూరు దుర్గాల మధ్య జరిగిన చారిత్రక సంఘటనలను మనముందుంచటానికి చరిత్రకారునికంటే మిన్నగా తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు’. పద్యం వ్రాయడం ఎలా? రచన: బులుసు వేంకటేశ్వర్లు; పేజీలు: 74; వెల: 100; ప్రతులకు: రచయిత, కల్పవృక్షం, ఇ.ఎస్.ఐ. హాస్పిటల్ వద్ద, ఆదర్శనగర్, చిట్టివలస, విశాఖ-531162; ఫోన్: 9949175899 ‘(రచయిత) తన నాలుగు దశాబ్దాల అనుభవాల్ని రంగరించి తేలికభాషలో పద్యలక్షణాల్ని వివరించారు. పద్యాలు వ్రాద్దామనే ఔత్సాహికులు పాటించవలసిన పద్ధతులను విస్తృతంగా చర్చించారు. పద్యరచనలో గణ, యతి, ప్రాసల నుండి రసపోషణ వరకు అన్ని విశేషాలను స్థూలంగా నిరూపించారు. పూర్వకవుల పద్యాలతోపాటు ఆధునిక కవుల పద్యాలను కూడా ఇందులో ఉదహరించడం ఒక విశేషం’. శ్రీమద్భగవద్గీత- ఉపదేశగీత రచన: డాక్టర్ దాశరథి రంగాచార్య; పేజీలు: 262(రాయల్ సైజు); వెల: 225; ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్ హౌస్, గిరిప్రసాద్ భవన్, జి.ఎస్.ఐ. పోస్టు, బండ్లగూడ(నాగోల్), హైదరాబాద్-68. ఫోన్: 24224453 రంగాచార్య మరణానంతరం ఆయన ‘ఆఖరివ్యాఖ్య’గా వెలువడిన పుస్తకమిది. ‘నది’లో 2012-14 మధ్య ధారావాహికగా వెలువడిన ఉపదేశగీత ఇది. ‘ఉపదేశగీత కేవలం రంగాచార్య స్వకపోల కల్పితం కాదు. అది వేదోపనిషత్తుల నుండి మొదలై, పురాణాల గుండా ప్రవహిస్తూ, కావ్యేతిహాసాల కమ్మదనాన్ని మోసుకొచ్చిన మందాకిని. పద్దెనిమిది భాగాలుగా విస్తరించిన ఉపదేశగీత రంగాచార్య ప్రపంచజ్ఞానాన్ని స్పృశిస్తుంది’. ఏం చెప్పాయి వేదాలు? రచన: రంగనాయకమ్మ; పేజీలు: 216(రాయల్ సైజు, హార్డు బౌండు); వెల: 80; ప్రతులకు: అరుణా పబ్లిషింగ్ హౌస్, ఏలూరు రోడ్డు, విజయవాడ-2; ఫోన్: 0866-2431181 ‘వేదాల గురించి, ‘‘ఇలా వుంటాయి, అలా వుంటాయి’’ అని వ్యాసాలు రాస్తే, వాటి వల్ల, చదివినవాళ్ళకి నమ్మకం కలగదు. వేద గ్రంధాల్లో వున్న సాహిత్యాన్నే, ఆ కవితలని చూస్తేనే, పాఠకులకు నిజం తెలుస్తుంది. అందుకే, వేద కవిత్వాల్ని చూపించడమే పెట్టుకున్నాను.... వేద కవిత్వాలు ఎలా వున్నాయో, వాటివల్ల తెలుసుకోగలిగేదీ, నేర్చుకోగలిగేదీ, ఏమీ వున్నాయో, మీరే చదివి చూడండి!’ అంటూ రంగనాయకమ్మ చేసిన విమర్శా వ్యాఖ్యానం ఇది. చమన్ ఆవిష్కరణ సభ ‘చమన్’ (ముస్లిం సామాజిక వేదిక) పత్రిక ఆవిష్కరణ (సంపాదకుడు: స్కైబాబ) అక్టోబర్ 5న 5:30కు హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరగనుంది. ఆవిష్కర్త: ఖాదర్ మొహియుద్దీన్. ఇందులో, ఏశాల శ్రీనివాస్, సంగిశెట్టి శ్రీనివాస్, జి.లక్ష్మీనరసయ్య, ఖుతుబ్ సర్షార్, కె.విమల, భంగ్యా భూక్యా, తిప్పర్తి యాదయ్య పాల్గొంటారు. తెలుగు విజయం ప్రదర్శన ‘సంస్కృతి’ ఆధ్వర్యంలో- ‘తెలుగు విజయం’ సాహితీ రూపక ప్రదర్శన అక్టోబర్ 8న సాయంత్రం 6:30కు అన్నమయ్య కళావేదిక, బృందావన్ గార్డెన్స్, గుంటూరులో జరగనుంది. ఇందులో- బృహస్పతి, పురాణకవి, ప్రబంధ కవి, శతక కవి, అవధాన కవి, నాటక కవి, వాగ్గేయకారులుగా కడిమిళ్ల వరప్రసాద్, కందుకూరి రామకృష్ణ, కొట్టే కోటారావు, పసుపులేటి రామచంద్రరావు, బులుసు అపర్ణ, సి.వి.వి.సత్యనారాయణ మూర్తి, కొమ్ము సుబ్రహ్మణ్య వరప్రసాద్ నటిస్తారు. -
కొత్త పుస్తకాలు
చినుకుదీవి కవి: జి.వెంకటకృష్ణ; పేజీలు: 134; వెల: 100; ప్రతులకు: కవి, 87-1287-1, సోమిశెట్టి నగర్, కర్నూలు- 518002; ఫోన్: 8985034894 ‘సహానుభూతితో రాసిన కవిత్వం కంటే స్వానుభూతితో రాసిన కవిత్వంలో సాంద్రత ఎక్కువుంది. ‘‘జిల్లేడు వనము లాంటి వెన్నెల’’ గురించి రాసినా, ‘‘కదిలొచ్చే బంగారు పంట లాంటి బిడ్డ’’ గురించి రాసినా, ‘‘భయం శరీరంలో విడుదలయ్యే రసాయనం- గుండె జారనీయొద్దు’’ అని తనకు తానే కాకుండా మనకందరికీ ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినా అన్నింటా పదాలు వాటంతటవే వచ్చిపడినట్టుగా ఉంటుంది. పార్కులో కాకుండా సహజమైన అడవిలో తిరిగినట్టుగా ఉంటుంది’. వీరభద్ర విజయము రచన: బమ్మెర పోతన; వ్యాఖ్యానం: కాశీభొట్ల సత్యనారాయణ; పేజీలు: 400; వెల: 225; ప్రతులకు: ఎస్.ఆర్. బుక్ లింక్స్, దానయ్య వీధి, మాచవరం, విజయవాడ-4; ఫోన్: 0866-2436959 ‘వీరభద్ర విజయ గ్రంథాన్ని 1960లో కేవలం పద్యాలతో వావిళ్ల వారు ముద్రించారు’. అప్పట్నుంచీ పునఃముద్రణ జరగని ఈ ‘కావ్యంలోని పద్యాలకు తేలికగా అర్థమయ్యేలా భావాలందిస్తూ, వ్యాఖ్యానం కూడా చేర్చి’ కాశీభొట్ల సత్యనారాయణ ఈ పుస్తకాన్ని వెలువరించారు. హార్ట్ టచింగ్ స్టోరీస్ అనువాదం: మల్లాది వెంకట కృష్ణమూర్తి; పేజీలు: 144; వెల: 125; ప్రతులకు: లిపి పబ్లికేషన్స్, గాంధీనగర్, హైదరాబాద్-80; ఫోన్: 9849022344 తన పుట్టినరోజుకు పాప ఇచ్చిన జడ పిన్నుల పాకెట్‌కు మురిసిపోయే తల్లి కథ... గ్రౌండ్ఫోర్లో బాత్రూమ్ కట్టివ్వమని భార్య ఎందుకు అడిగిందో ఎప్పటికో కాని అర్థంకాని భర్త కథ... ఇలాంటి 77 కథలున్నాయిందులో. ‘ఈ సంపుటిలోని కథలన్నీ ఇంగ్లీష్‌లో అనేక చోట్ల ప్రచురించబడ్డాయి. ప్రపంచంలోని వివిధ దేశాల నించి అమెరికాకి వలస వచ్చిన ప్రజలు తమ వెంట తెచ్చిన ఈ ‘ఫీల్ గుడ్’ కథలు మనసును తట్టేవి’. నా రణం మరణం పైనే కవి: డాక్టర్ సి.నారాయణరెడ్డి; పేజీలు: 212; వెల: 200; ప్రచురణ: సమున్నత్ ప్రచురణలు; ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్ హౌస్, 4-10435, బ్యాంక్ స్ట్రీట్, విజ్ఞాన్ భవన్, హైదరాబాద్-1. ‘నారాయణరెడ్డిగారు అనేక సంవత్సరాలుగా పుట్టినరోజును తమ కొత్త పుస్తకం పుట్టినరోజుగా జరుపుకుంటున్నారు. ఈ సంప్రదాయం ప్రకారం వారి జన్మదిన శుభసందర్భంగా (జూలై 29) వెలువ(డిన) సరికొత్త గ్రంథం ‘‘నా రణం మరణం పైనే’’. వస్తువైవిధ్యం, భావవైశిష్ట్యం, అభివ్యక్తిగరిమ సంతరించుకున్న 116 నూతన కవితల సంపుటి ఇది’. ఆయుధం రచన: టి.ఎస్.ఎ.కృష్ణమూర్తి; పేజీలు: 264; వెల: 180; ప్రతులకు: రచయిత, 3-169-16, రామారావు కాలనీ, బాపూజీ మునిసిపల్ స్కూల్ ఏరియా, మదనపల్లె-517325; ఫోన్: 08571-221963 ఈ ‘నవలలో నడిచిన కథ 1940-2000 మధ్య దాదాపు అరవయి సంవత్సరముల కాలానికి పరిమితమైనది’. ‘ఆ రోజులలో పల్లె, గ్రామీణ ప్రజలు వారి జీవన విధానాలు, వృత్తులు ఎలావుండి ఎలా మార్పు చెందుతూ వచ్చాయో, ముఖ్యంగా యంత్ర వినియోగాలకు మునుపు వృత్తిపనులలో పని ఎంతటి శారీరక కష్టంతో కూడుకుని ఉండేదో దృశ్యమానం చెయ్యడానికి ఈ నవలలో ప్రయత్నం జరిగింది’. చెమట పువ్వుల చెట్లు వాళ్లకేం ఆశలుంటాయి కొండోలొచ్చిన మబ్బుకొమ్మకు కొన్ని చినుకు పూలుపూసి నేల పొత్తిళ్లలో జల్లులు జల్లులుగా కురవాలని... వాళ్లకు పెద్దగా కలలేముంటాయి బుసబుస పొంగిన భూమితల్లి ఒళ్లోని పైరు శిశువుకు తనివితీరా స్తన్యమిస్తున్నట్టు... మహా అయితే వాళ్లకు కోర్కెలేముంటాయి ఫలసాయం పదిమందికీ చెంది పల్లెలోగిలి పచ్చగా నవ్వు మొఖంతో కళకళలాడాలని... ఎందుకంటే వాళ్లు మెతుకు రూపు కట్టడానికి బతుకంతా ధారపోస్తున్న చెమట పువ్వుల చెట్లు గనుక - కొండి మల్లారెడ్డి 9441905525 -
కొత్త పుస్తకాలు
కొత్త పుస్తకాలు జీవరహస్య లిపి కవి: ఖాదర్ షరీఫ్; సంపాదకులు: అల్లు భాస్కరరెడ్డి, పెరుగు రామకృష్ణ; పేజీలు: 108; వెల: 100; ప్రతులకు: పెరుగు రామకృష్ణ, 25–1–949, ఐదో వీధి, నేతాజీ నగర్, నెల్లూరు–4. కవి ఫోన్: 9441938140 ‘ఖాదర్ షరీఫ్ కవిత్వం ఒక్కచోట నిలకడగా నిలవదు. టీని టీకప్పులో బంధించినట్లు అతని కవిత్వాన్ని కాగితం దేహానికి గుచ్చలేం. అది మస్తిష్కం నిండా విస్తరిస్తూ వెళ్తుంది’. ‘ఒక సజీవ దృశ్యాన్ని కవిత్వం చేసి పుష్పగుచ్ఛంలా ఇస్తాడు. ఒక్కో కవిత చదువుతున్నప్పుడు నిద్రించిన జ్ఞాపకానికి జీవమొచ్చినట్లు అన్పిస్తుంది. అన్నీ కూడా పరిణతి చెందిన భావాలు. జన జీవితాన్ని ఆలోచింపజేసి చైతన్యపరిచే బాధ్యతాయుతమైన కవిత్వం’. ఆటాడుకుందాం... రా! (హోసూరు కతలు) రచన: అగరం వసంత్; పేజీలు: 222; వెల: 150; ప్రతులకు: కృష్ణగిరి జిల్లా తెలుగు రచయితల సంఘం, 2/1097, బస్తి, ఆవులపల్లి రోడ్డు, హోసూరు–635109, కృష్ణగిరి జిల్లా, తమిళనాడు. ఫోన్: 09488330209 అ.. ఆ.. ఆట తెలుసా? కమల గిమల– గులుగులు గుమల– తారం తమల– నీ పేరు అమల; రమేసు గిమేసు– గులుగులు గుమేసు– తారం తమేసు– నీ పేరు అమేసు; ఈ పద్ధతిలో ఆడితే(పలికితే) ఏ పేరును తీసుకున్నా అది ‘అ’తో మొదలవుతుంది. ‘అచ్చ తెలుగు అమృతాన్ని తాగతా తెలుగమ్మ ఒడిలో ఊగతా’ ఉండినట్టుగా అనిపించే ఇలాంటి బాల్యపు ఆటలే వస్తువులుగా 100 కథలు రాశారు వసంత్. అవి ‘హోసూరు ప్రజలు తరతరాలుగా’ జీర్ణించుకున్న, చిన్నా పెద్దా, ఆడా, మగా ఆడుకునే 100 ఆటలు! అశుద్ధ భారత్ ఆంగ్లమూలం: భాషా సింగ్; తెలుగు: సజయ; పేజీలు: 240; వెల: 150; ప్రతులకు: హైదరాబాద్ బుక్ ట్రస్ట్, ప్లాట్ నం. 85, బాలాజీ నగర్, గుడిమల్కాపూర్, హైదరాబాద్–6; ఫోన్: 23521849 బెజవాడ విల్సన్ ముందుమాటతో వచ్చిన ‘అన్‌సీన్: ద ట్రూత్ ఎబౌట్ ఇండియాస్ మాన్యువల్ స్కావెంజర్స్’కు ఇది తెలుగు అనువాదం. ‘కేవలం పుట్టుక ద్వారా తోటి మనుషుల పియ్యిపెంటలను ఎత్తి పారబోసే పాకీ పనిచేసే వ్యక్తుల, సమూహాల వాస్తవ పరిస్థితి బయటపెట్టింది (ఈ) పుస్తకం’. ‘అనేక గణాంకాల కంటే కూడా అతి సామాన్యమైన పదాలతో భాషా సింగ్ భారతదేశ పాకీపనివారి కడగండ్లను, అలాగే వారి సామర్థ్యాలను శక్తిమంతంగా ఈ పుస్తకంలో వివరించారు’. కళ్యాణ మంజీరాలు హిందీ మూలం: అమృతలాల్ నాగర్; తెలుగు: కౌముది; పేజీలు: 188; వెల: 120; ప్రతులకు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, 33–22–2, చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ–4; ఫోన్: 0866–2430302 ‘కళ్యాణ మంజీరాలు(సుహాగ్ కే నూపుర్) అనే ఈ నవలను అమృతలాల్ నాగర్, తమిళ కావ్యం ‘శిలప్పదికారం’ ఆధారం చేసుకొని రాసారు. తమిళనాడులోని పేర్లు, సంఘటనలు ఇందులో కనపడతాయి. జైన బౌద్ధ మతాల ప్రభావం ఉన్న రోజుల్లో సాంఘిక పరిణామాలు, ఆచార వ్యవహారాలను ఈ నవల ప్రతిబింబిస్తున్నది’. తొలుత ‘కళంకిని’ పేరుతో అచ్చయిన ఈ నవల ఇప్పుడు ‘కళ్యాణ మంజీరాలు’గా పునర్ముద్రణ అయింది. -
కొత్త పుస్తకాలు
నిజామాబాదు జిల్లా కవిత్వం రచన: డాక్టర్ వి.శంకర్; పేజీలు: 240; వెల: 150; ప్రచురణ: తెలంగాణ రచయితల సంఘం; ప్రతులకు: హిరణ్మయి, 4–15, దేవీవిహార్ కాలనీ, దేవునిపల్లి, కామారెడ్డి. ఫోన్: 9440798954 ‘తెలంగాణ మీద అభిమానంతో స్థానికాంశాలపైనే పరిశోధన చేయాలన్న సంకల్పంతో’ రచయిత 2001లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పూర్తిచేసిన పీహెచ్డీ పరిశోధన ఆధారంగా రూపొందించిన పుస్తకం ఇది. అందంగా ముద్రించిన ఈ పుస్తకం ‘అవటానికి జిల్లా కవిత్వ చరిత్ర అయినప్పటికీ తెలంగాణ అవసరాల రీత్యా ఎంతో ప్రాధాన్యత ఉన్న పుస్తకం’. ‘తెలంగాణ కేంద్రంగా జరుగబోయే సాహిత్య పరిశోధనలకు, రచనలకు ఈ పుస్తకం మార్గదర్శనం చేస్తది’. కడలి కల్లోలం నవలారచన: గనారా; పేజీలు: 176; వెల: 125; ప్రతులకు: ప్రజాశక్తి బుక్‌హౌస్, 27–1–54, కారల్ మార్క్స్ రోడ్, విజయవాడ–2; ఫోన్: 0866–2577533 ‘భైరవపల్లెకు, నిగర్డెల్టాకు భౌగోళికంగా తప్ప మరి ఏ తేడాలున్నాయి! మనుషులను, మానవ సమూహాలను డిస్పోజ్ చేస్తున్న పెట్టుబడుల భాషకు ఏ తేడాలున్నాయి! ఎక్కడి ప్రజా పోరాటపు భాషలోనైనా తేడాలు మాత్రం ఏముంటాయి? ఈ రచన విభిన్నమైనది. ఎందుకంటే అభివృద్ధి రాజకీయాలను వాటి పర్యవసానాలను వీలయినంత వాస్తవికంగా, జీవితానికి సన్నిహితంగా చిత్రించి చూపింది’. స్వర్ణపుష్పాలు రచన: అలపర్తి వెంకట సుబ్బారావు; పేజీలు: 64; వెల: 35; ప్రచురణ: మంచిపుస్తకం, 12–13–439, వీధి నం.1, తార్నాక, సికింద్రాబాద్–17; ఫోన్: 9490746614 ‘‘ఏం పాపా! ఏమౌతావు/ ఎంచక్కా పెద్దయ్యాక?/ పంతులమ్మ అవుతావా?/ పాఠాలు నేర్పుతావా?/’’... ‘‘అమ్మను అవుతా,’’ అంది/ ఆ పాప ముచ్చటగా!! ఆ పాప హృదయంలో/ అమ్మబొమ్మ నిలిచింది!/ అందుకనే పాప/ ‘అమ్మను అవుతా’ అంది!!’. ఇలా చిన్న చిన్న పదాల్లో చెప్పిన బాల గేయ కథమాల ఇది. దీనికి బాల సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. లొంగిన ప్రతిసారీ కవి: పచ్చల కిరణ్‌కుమార్; పేజీలు: 94; వెల: 50; ప్రచురణ: విరసం; ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లో. ‘ఇందులో స్థూలంగా మూడు రకాల కవిత్వం ఉన్నది. సహజంగా బతుకును, బతుకు పోరాటాన్నీ ప్రేమించే కవి గనుక అటువంటి బతుకు బతికిన అమరుల మీద, అమరత్వం మీద కవితలున్నాయి. సమస్యల మీద, సంఘటనల మీద తన స్పందనలూ, పరిశీలనలూ ఉన్నాయి. ఇంక మూడో రకం కవిత్వం ఆయన వయసునూ, అనుభవాన్ని మించిన తాత్విక అవగాహనని అందించే పరిశీలనలూ వ్యాఖ్యల రూపంలో ఉన్నాయి’. -
కొత్త పుస్తకాలు
ఆది- అంతం రచన: పి.చంద్రశేఖర అజాద్; పేజీలు: 240; వెల: 150; ప్రచురణ: భాషా సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం; ప్రతులకు: రచయిత, 909, సఫైర్ బ్లాక్, మై హోమ్ జ్యూయల్, మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్-49; ఫోన్: 9246573575 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన పోటీలో బహుమతి పొందిన నవల ఇది. ‘విభిన్న పాత్రల మానసిక ఆంతరంగిక కల్లోలాలు, సంఘర్షణలు... వీటి నడుమ జీవితం, మనుషుల ప్రయాణం తాలూకు ప్రశ్నల పరంపర. సమాధానాల కోసం అన్వేషణ. ఏది ఆది? ఏది అంతం? ఆది-అంతం మధ్య జరుగుతున్న జగన్నాటకం. ఇది ఆలోచనాపరుల సమూహ చర్చావేదికగా నిలిచే ఆధునిక తాత్విక నవల’. తెలుగు నాటక రంగం వ్యాసకర్త: ఆచార్య ఎస్.గంగప్ప; పేజీలు: 208; వెల: 150; ప్రతులకు: కిన్నెర పబ్లికేషన్స్, 2-2-647/153, ఫ్లాట్ నం.101, 102, మద్దాళి గోల్డెన్ నెస్ట్, సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ, హైదరాబాద్-13. ఫోన్: 040-27426666 ఇందులో తెలుగు నాటకరంగానికి సంబంధించిన 19 వ్యాసాలున్నాయి. ‘నాటకకళా రంగానికి సంబంధించిన వివిధ విభాగాల గురించి అంటే ప్రాచీన సంస్కృత నాటకాలు మొదలుకొని నేటి నాటకరంగం పోకడలపై చర్చిస్తూ... కళారంగం వెలుగునీడల్ని ప్రదర్శించే బాధ్యతాయుతమైన అభిప్రాయాలు వెలిబుచ్చడం ప్రస్తుత నాటకరంగానికి ఎంతో ఉపయుక్తం’. గీతాంజలి అనువాదం: నాగరాజు రామస్వామి; పేజీలు: 140; వెల: 100; ప్రతులకు: అనువాదకుడు, తేజ 914, మై హోమ్ నవద్వీప, మాదాపూర్, హైటెక్ సిటీ, హైదరాబాద్-82; ఫోన్: 040-23112625 1914 నాటికే తెలుగులోకి అనువాదమైన రవీంద్రుడి గీతాంజలి మళ్లీ మళ్లీ తెలుగు కవుల్ని ఆకర్షిస్తూనే ఉంది. ఈ వరుసలో ఇప్పుడు నాగరాజు రామస్వామి చేరారు. ‘డెబ్బై ఏళ్ల వయస్సులో కవితా వ్యాసంగానికి దిగిన’ ఈయన స్వయంగా కవీ, జాన్ కీట్స్ కవిత్వాన్ని తెలుగులోకి తెచ్చిన సమర్థ అనువాదకుడూ. ‘ఇదివరకటి అనువాదాలకు కాస్త భిన్నమైన ఒరవడిలో ఈ అనువాదం ఒక ప్రవాహంలా నడిచింది’. మూడు కోరికలు మూలం: ఐజక్ బషేవిస్ సింగర్; అనువాదం; కె.బి.గోపాలం; పేజీలు: 112; వెల: 60; ప్రతులకు: మంచిపుస్తకం, 12-13-450, వీధి నం.1, తార్నాక, సికింద్రాబాద్-17; ఫోన్: 9490746614 ‘సింగర్ కథారచన శిల్పానికి మెచ్చి ఆయనకు నోబెల్ బహుమానం ఇచ్చారు. అంతటి రచయిత అందరికీ అర్థంకాని విషయాలేవో రాయాలని మనం అనుకుంటాం. కానీ, ఆయన మరోలా అనుకున్నాడు. ‘పిల్లలకు నచ్చే కథలు లేదా పిల్లల కథలు రాయగలుగుతానని అనుకోనే లేదు,’ అంటాడాయన. పిల్లల కథల్లో పిల్లలు మాత్రమే ఉండరు. జంతువులు ఉంటాయి. పెద్దవాళ్లూ ఉంటారు. మొత్తానికి ప్రపంచం ఉంటుంది’ అంటున్న కె.బి.గోపాలం ఆ సింగర్ సృజించిన ప్రపంచాన్ని తెలుగులోకి తెచ్చారు. -
కొత్త పుస్తకాలు
అమృతం కురవని రాత్రి కథారచయిత: చింతపట్ల సుదర్శన్; పేజీలు: 102; వెల: 75; ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్ హౌస్, బండ్లగూడ, హైదరాబాద్- 500068; ఫోన్: 040- 24224453 సెటైరిస్టుగానూ, అనువాదకుడిగానూ పేరొందిన చింతపట్ల సుదర్శన్ కథల సంపుటి ఇది. ఇందులో 14 కథలున్నాయి. ‘సుదర్శన్ రాసిన కథల్లో (ఒక కర్త ఖర్మ క్రియలో తప్ప) వ్యంగ్యం బాగా పండింది. వ్యంగ్యాత్మకంగా రచించబడిన ఈ కథల్లో ఈనాటి సమాజపు వికృతరూపం మనకు దిగ్భ్రమను కలిగిస్తుంది. ఈ కథల్లోని శైలి కవితాత్మకంగా సాగింది. చాలా క్లిష్టమైన మాంత్రిక వాస్తవికత అనే శిల్పాన్ని రచయిత చాలా చక్కగా, సులభంగా అర్థమయ్యేలా ప్రయోగించటం విశేషం’. దహనం నవలారచన: సాగర్ శ్రీరామకవచం; పేజీలు: 184; వెల: 80; ప్రతులకు: ఉషారాణి శ్రీరామ కవచం, 8-1-21, జమ్మిచెట్టు బజార్, లాయర్పేట్, ఒంగోలు. ఫోన్: 9885473934 ‘దహనం నవల వాస్తవిక చారిత్రక స్థితిని ఆవిష్కరించడానికి ప్రయత్నించింది. బ్రాహ్మణ సమాజం ఎలా పతనమవుతూ వచ్చింది చూపిస్తుంది. 80 సంవత్సరాల నాటి మానవ సమాజ పోకడలకి అద్దం పడుతుంది. చరిత్రని, కాల్పనికతని, వాస్తవికతని, ఆనాటి వ్యక్తుల డొల్లతనాన్ని, అమాయకత్వాన్ని, జాతీయ పోరాటాన్ని, అసాంఘికతను ఈ నవల చిత్రించింది’. పూలకుండీలు నవలారచన: శిరంశెట్టి కాంతారావు; పేజీలు: 136; వెల: 100; ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో. రచయిత ఫోన్: 08744- 256167 ‘ఈ నవలలోని వస్తువు అత్యాధునికమైనది. ఇంగ్లీషు భాషలో ‘సరోగసీ’ అనే పదానికి తెలుగులో ‘అద్దెగర్భం’ అని అనువాదం చేస్తూ అది కేంద్రంగా జరుగుతున్న వ్యాపారం మీద తెలుగులో కాసిని కథలు వచ్చాయి. బహుశా నవల మాత్రం ఇదే మొదటిది’. ‘విరివిగా కథలు రాస్తున్న కాంతారావు సమకాలీన సమాజంలో మండుతున్న ఇలాంటి వస్తువును తీసుకుని నవల రాయడం ఆయన పరిశీలనకు గుర్తు’. అగ్నిసుమం కవి: కె.శరచ్చంద్ర జ్యోతిశ్రీ; పేజీలు: 72; వెల: 60; ప్రచురణ: అభ్యుదయ రచయితల సంఘం (అరసం), గుంటూరు శాఖ. ప్రతులకు: అన్ని విశాలాంధ్ర, నవచేతన శాఖలు. ‘అభ్యుదయ రచయితగా నేడు పాలక పక్షాలు అనుసరిస్తున్న అసహన సంస్కృతిని తీవ్రంగా నిరసిస్తాడు శరత్. (ఇతని) కవిత్వంలో జాతీయత, అంతర్జాతీయత, విస్తృతంగా కనిపిస్తాయి. ఇంకా స్థానికత, హేతువాద భావనలు, తాత్విక చింతనలు వున్నాయి. ఇతని ఆలోచనలకు కేంద్రం మార్క్సిజమని స్పష్టమౌతుంది’. పేరులేని శ్రీమతులు రచన: రెవ॥సామ్యేల్‌బాబు బైరపోగు; పేజీలు: 160; వెల: 60; ప్రతులకు: రచయిత, ఎస్. యూనిక్ రెసిడెన్సీ, 202, సైదాబాద్, హైదరాబాద్-59; ఫోన్: 9347256600 బైబిల్లో కొందరు గొప్ప భార్యలున్నారు. కానీ వారికి పేర్లు లేవు. కయ్యీను భార్య, నోవహు భార్య, లోతు భార్య, యోబు భార్య, యోషయా భార్య అనే వారిని పిలుస్తారు. అలాంటి ఇల్లాళ్ల జీవిత విశేషాలను రచయిత ఈ పుస్తకంలో పొందుపరిచారు. పైగా ఇతర గ్రంథాల ఆధారంగా వారి అసలు పేర్లు కూడా పుస్తకం చివర చేర్చారు. మీ రచనలు పంపవలసిన చిరునామా: సాహిత్యం, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్-34; ఫోన్: 040-23256000; మెయిల్: sakshisahityam@gmail.com -
కొత్త పుస్తకాలు
శివారెడ్డి కవిత్వ తత్త్వదర్శనం రచన: డాక్టర్ ఎ.వి.వీరభద్రాచారి; పేజీలు: 350; వెల: 400; ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు; రచయిత ఫోన్: 9391310886 ‘శివారెడ్డి కవిత్వాన్ని ఎంతగా ప్రేమించాడో, శివారెడ్డి వ్యక్తిత్వాన్ని అంతగా అభిమానించిన’ వీరభద్రాచారి డి.లిట్. పట్టా కోసం సమర్పించిన సిద్ధాంత గ్రంథమిది. ఇది 5 అధ్యాయాలుగా సాగింది. ‘శివారెడ్డికున్న మార్క్సిస్టు విశ్వాసాలను, స్వాభావికంగా ప్రకృతిపట్ల ప్రేమానురాగాలను, ప్రాణగతంగా మానవ సంబంధాల మాధుర్యాలను వీరభద్రాచారి వింగడించాడు’. ‘శివారెడ్డిని వ్యక్తిగా అర్థం చేసుకోవటానికి, కవిగా అనుభూతి విస్తృతిని ఆకళింపు చేసుకోవటానికి, తాత్వికుడుగా జీవన సారాన్ని ఆస్వాదించడానికి వీరభద్రాచారి రచన తోడ్పడుతుంది’. కలలతో ప్రయాణం కవి: ఆశారాజు; పేజీలు: 166; వెల: 200; ప్రచురణ: ఝరి పొయెట్రీ సర్కిల్; ప్రతులకు: విశాలాంధ్ర, నవచేతన. కవి ఫోన్: 9392302245 ‘హైద్రాబాదు సంస్కృతినీ, సంస్కారాన్నీ ఒక కాస్మాపాలిటన్ కల్చర్‌ని’ యింతగా పీల్చి కవిత్వంగా పలుకుతున్న ఆశారాజు 18వ కవితాసంపుటి ఇది. ‘సరళంగానే, గాఢంగానే, సాంద్రంగానే, సస్టెయిన్డ్గానే సాగిన కావ్యమిది. ఒక థీమ్ వుంది. అది కొనసాగిన పద్ధతి సమ్మోహనంగా వుంటుంది. ఆశారాజు ఎప్పుడూ లిరికల్ పోయెట్. యిందులోనూ ఆ లిరికల్ క్వాలిటీ తగ్గకుండా, అన్నింటినీ మంత్రించి కవిత్వం ముద్దచేసి మనకందించాడు’. పూసపాటి నాగేశ్వరరావు బహుముఖీన ప్రతిభ రచన: డాక్టర్ పూసపాటి శంకరరావు; పేజీలు: 532; వెల: 350; ప్రతులకు: పూసపాటి జయలక్ష్మి, 103ఎ, అట్లాంటిక్ సిటీ అపార్ట్మెంట్స్, దీప్తిశ్రీ నగర్, మియాపూర్, హైదరాబాద్-49. ఫోన్: 040-40215873 అవధాని, ప్రౌఢపద్యకవి అయిన పూసపాటి నాగేశ్వరరావు ‘శిల్ప సుందరి’, ‘ఆదర్శ పద్మిని’, ‘శ్రీ వీరబ్రహ్మేంద్ర చరిత్రము’, ‘శ్రీ వాసవీ కన్యకా చరిత్ర’ అను పద్యకావ్యాలను వెలువరించారు. ‘విశ్వబ్రాహ్మణ సంస్కృతి- సాహిత్య చరిత్ర’, ‘దేవాలయాలు బూతు కొంపలా?’ అను పరిశోధిత గ్రంథ రచనలు చేశారు. ‘శంకర శతకం’, శ్రీ వీరబ్రహ్మసర్వేశ్వర శతకం, క్రీస్తు శతకాలకు పండిత పరిష్కారం చేశారు. ‘గుఱ్ఱం వీర గోపాల కృష్ణారెడ్ల చరిత్ర’ ఆయన వచన రచన. ‘మడికి సింగన’ ఆయన నాటిక. పేరుకు తగ్గట్టే, పూసపాటి నాగేశ్వరరావు బహుముఖీన ప్రతిభకు ఈ పీహెచ్డీ గ్రంథం అద్దం పడుతుంది. ‘శంకరరావుగారు నాగేశ్వరరావుగారి కవిత గోదావరిలో తాను మునిగి, మనతోనూ పుష్కర పవిత్రస్నానం చేయించారు. నాగేశ్వరరావుగారి కవిత్వంలోని జీవనాడిని పట్టుకున్నారు, దాని చైతన్యాన్ని మనకు పట్టిచూపించారు’. మీ అభిప్రాయాలనూ, రచనలనూ స్వాగతిస్తున్నాం. రచనలు పంపవలసిన చిరునామా: సాహిత్యం, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్-34; ఫోన్: 040-23256000; మెయిల్: sakshisahityam@gmail.com -
ఒక అరవై!
నేడు ఆవిష్కరణ 2015వ సంవత్సరంలో అచ్చయిన కవితల్లోంచి నాకు విశిష్టంగా కనబడిన అరవై కవితల్ని ఎంచుకుని ఈ ‘‘కవిత్వం 2015’’ సంకలనాన్ని తీసుకొస్తున్నాను, ఇష్టంగా, ఒక అవసరంగా, ఒకింత సాంస్కృతిక కర్తవ్యంగా. అరవై అనే లెక్క ఎందుకంటే - సంకలనం బిగువుగా వుండాలని. తెలుగు సంస్కృతికీ అరవైకీ వున్న అనుబంధం కూడా దీనికి ఓ అనుబంధ కారణం. ఒక సంవత్సరంలో వివిధ పత్రికల్లో (వెబ్ సంచికల్తో సహా) అచ్చయే తెలుగు కవితలు కొన్ని వేలల్లో వుంటాయి. వాటిలోంచి ఓ అరవై కవితల్ని ఎంచుకోవడం కష్టతరమైన పనే అని నా అనుభవం చెబుతున్నది. ఐతే దేశంలోనూ, బయటా వున్న అన్ని ప్రాంతాల్లోని తెలుగుకవుల కవిత్వానికి స్థూలంగా ఈ సంకలనంలో ప్రాతినిధ్యం వుండాలని భావించాను. 2015వ సంవత్సర కాలంలో మానవ జీవన ప్రస్థానంలోని ప్రధాన ఘటనలకు కవుల ప్రతిస్పందనను రికార్డు చేయడం ద్వారా కాలఛాయను సంకలనంలో చూపించాలని ప్రయత్నించాను. ఘటనలకే పరిమితం కాకుండా, మానవానుభవానికున్న అనేక పార్శ్వాల్నీ, చింతనల్నీ ఒక చోటికి చేర్చడం కూడా అత్యావశ్యకమని భావించాను. సామాజిక దృక్కోణం నుంచి వచ్చినవి కొన్నీ, ఆత్మగత అనుభవాల్నీ, అనుభూతుల్నీ ఆవిష్కరించినవి కొన్నీ, మానవ సంబంధాల్ని వ్యాఖ్యానించినవి కొన్నీ, జీవన తాత్విక సారాంశాన్ని వడగట్టినవి కొన్నీ, స్థానికతను నిర్దిష్టంగా వెల్తురులోకి తెచ్చినవి కొన్నీ, సౌందర్య చింతనలోంచి రూపుదిద్దుకున్నవి కొన్నీ, ఉద్యమాల నేపథ్యం నుంచి గొంతెత్తినవి కొన్నీ, ప్రకృతిని కవితా ప్రాంగణంలోకి ఆహ్వానించినవి కొన్నీ- వెరసి ఈ సంకలనం. 2015లో కవయిత్రి శివలెంక రాజేశ్వరీదేవి, 2016లో ప్రముఖ కవి, విమర్శకులు అద్దేపల్లి రామమోహనరావు మరియు అరుణ్ సాగర్ ఈ లోకం నుంచి నిష్ర్కమించారు. 2015లో అచ్చయిన వారి కవితల్ని ఈ సంకలనంలో చేర్చాను, వారికి నివాళిగా. -
కొత్త పుస్తకాలు
1) మహాసంకల్పం నవలా రచన: వాసుదేవ్; పేజీలు: 328; వెల: 200; ప్రతులకు: డాక్టర్ కడియాల వాసుదేవరావు, 3-30-9, 1వ లైను, నలందా నగర్, గుంటూరు-522006; ఫోన్: 7702498377 ‘యాభై ఏళ్లలో వైద్యరంగంలో వచ్చిన మార్పులను సందర్భోచితంగా డాక్టర్ వాసుదేవ్ చక్కగా వివరించారు. సమాంతరంగా మన దేశంలోనూ, ప్రపంచంలోనూ జరుగుతున్న పరిణామాలను కూడా ‘‘ఒక పక్షం వహించకుండా’’ వివరిస్తూ వచ్చారు’. ‘ప్రజల యెడల బాధ్యతగా వుండే డాక్టర్లు కీలక స్థానాలలోకి వస్తే ఎంతగా ప్రజలకు మేలు చేయవచ్చో డాక్టర్ రామేశ్వరం, డాక్టర్ అనసూయ పాత్రల ద్వారా చూపించారు.’ ‘చిరునవ్వు, సానుభూతి, మానవతా విలువలు వైద్యవృత్తికి పట్టుగొమ్మలు కావాలని, వీటిని మించిన ఔషధాలు లేవని నొక్కి చెబుతారు రచయిత’. 2) అసమాన వీరుడు - అనురాగ దేవత రచన: దోరవేటి; పేజీలు: 104; వెల: 80; ప్రతులకు: నవోదయా బుక్‌హౌస్, కాచిగూడ; ప్రచురణ కర్త ఫోన్: 9963770587 ‘రొమాన్స్, సాహసం, యుద్ధవ్యూహాలు, ఎత్తుగడలు, దేశభక్తి, మతవిశ్వాసాలు, బ్రాహ్మణాధిపత్యం, రాజనీతిజ్ఞత అన్నీ కలగలిపి బాజీరావు-మస్తానీల సాహస ప్రేమకథను దోరవేటి నవలగా మలిచిండు’. ‘18 ఏండ్లకే మరాఠా రాజ్య ప్రధానమంత్రి పదవి చేపట్టి, చేసిన అన్ని యుద్ధాల్ని గెలిచి కేవలం 42వ యేట 1740లో మరణించిన బాజీరావు కథ ఇది’. ‘మతమేదైనా ప్రేమించిన స్త్రీని ఎట్టి పరిస్థితుల్లోనూ పాణంగా చూసుకోవాలని చెప్పే కథ’. ‘తెలుగు చారిత్రక నవలా సాహిత్యానికి మేలైన జోడింపు’. 3) వత్తావా మా వూరికి కవి: సైదులు ఐనాల; పేజీలు: 104; వెల: 60; ప్రతులకు: పాలపిట్ట బుక్స్, 16-11-20/6/1/1, 403, విజయసాయి రెసిడెన్సీ, సలీంనగర్, మలక్‌పేట, హైదరాబాద్-36; ఫోన్: 040-27678430; కవి ఫోన్: 9948714105 ‘తన జ్ఞాపకాల్లోంచి, గ్రామీణ జీవిత నేపథ్యంలోంచి, తన అమ్మ, అమ్మమ్మ, తాతయ్యల జీవితాన్ని అవలోకిస్తూ, ఇవాళ్టి ప్రపంచంలో తన స్థానం కోసం వెదుక్కుంటూ కవిత్వంగా వ్యక్తం’ అయ్యాడు ఐనాల. ‘కవికి అనుభూతి అత్యంత ప్రధానం’. ‘తెలంగాణ పలుకుబడిలో సజీవమైన భాషలో వ్యక్తీకరించిన కవితలన్నీ నేటివిటీని మనముందు ఉంచుతాయి’. 4) రెండో అధ్యాయానికి ముందుమాట! కవి: విరించి విరివింటి; పేజీలు: 144; వెల: 100; ప్రతులకు: కవి, ప్లాట్ నం.18, శ్రీనివాసం, విజయాగార్డెన్స్ కాలనీ, బండ్లగూడ రోడ్, నాగోల్, హైదరాబాద్-68; ఫోన్: 9948616191 ‘పరాయీకరణకు బదులు సొంతదనం, లొంగిపోవడానికి బదులు తలెత్తడం, ద్వేషాలకి బదులు ప్రేమలు, కృత్రిమత్వానికి బదులు సహజత్వం, విడిపోవడానికి బదులు కలిసిపోవడాలు... ఇవీ ఈ కవి ఇష్టాలు. వీటినే పలు కవితల ద్వారా వ్యక్తపరిచాడు. ఈ వ్యక్తీకరణల్లో అతని స్వరం అసెర్టివ్‌గా వుంది. ఆరోగ్యకరమైన ఆలోచనల్ని కొత్త దారుల్లో పరిచి కవితలకు ప్రత్యేకమైన కాంతిని ఇచ్చాడు’. 5) తప్తస్పృహ కవి: మౌనశ్రీ మల్లిక్; పేజీలు: 152; వెల: 100; ప్రతులకు: స్వప్న ఆరెల్లి, 18-1-101/3/4, శివసాయి నగర్, ఉప్పుగూడ, హైదరాబాద్-53; ఫోన్: 9394881004 ‘మల్లిక్‌లో అన్ని విశ్వదర్శనాలు ఇముడుతాయి’. అతనిలో ‘కవి ఉన్నాడు. తాత్విక చింతన ఉన్నది’. ‘మంచి కవిత్వం, చెడు కవిత్వం అంటూ ఉండదు. కవిత్వం అంటే ఏమిటో తెలిసినవారు ఏదిరాసినా అది బాగుంటుందని నమ్ముతా’డు. ‘కవిత్వం కీర్తి కాదు ఆర్తి’ అనే మౌనశ్రీ మల్లిక్- ‘దిగంబర’, ‘గరళమ్’ తర్వాత వెలువరిస్తున్న 64 కవితల మూడో సంపుటి ఇది. 6) సమైక్యాంధ్ర ఉద్యమం - ‘అనంత’ అనుభవం రచన: ఎస్.సుభాస్; పేజీలు: 408; వెల: 100; ప్రచురణ: ఎస్.శ్రీవాణి, 660, రాగమయూరి గ్రీన్‌హిల్స్, కర్నూలు-2; ఫోన్: 9949992757 ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన గ్రంథానికి మూలం. కాగా, దాన్ని వ్యతిరేకిస్తూ వెల్లువెత్తిన రాష్ట్రవ్యాపిత ఉద్యమంలో భాగంగా, అనంతపురం జిల్లా ఉద్యమాన్ని గ్రంథస్తం చేశాడు రచయిత. కేవలం రోజువారీ ఉద్యమమే గాక, ఉద్యమ మూలాలు, ఆశయాలు, మంచిచెడ్డలు విపులీకరించాడు’. ‘తెలుగు నుడికారంపై, వాక్య నిర్మాణంపై, ఉద్యమ ఎత్తుపల్లాలు వర్ణించడంలో మెచ్చుకోదగ్గ నేర్పు ప్రదర్శించాడు’. -
కొత్త పుస్తకాలు
అద్దంలో అటువైపు కథకుడు: డాక్టర్ యండమూరి సత్యకమలేంద్రనాథ్; పేజీలు: 192; వెల: 120; ప్రతులకు: నవసాహితి బుక్ హౌస్, ఏలూరు రోడ్, విజయవాడ-2. ఫోన్: 0866-2432885 ఇందులో 22 కథలున్నాయి. దాదాపు ఐదేళ్ల కాలంలో రాసినవివన్నీ. ‘చాలా కథల్లో ముఖ్యపాత్ర డాక్టరుదవటానికి, బహుశా ఈ రచయిత అదే వృత్తిలో ఉండటం కారణం కావచ్చు. అయితే తనకు తారసపడిన వివిధ రకాల పేషెంట్ల మనస్తత్వ విశ్లేషణ ఈ కథల్లో కనబడుతుంది. అంతేకాదు, కొంత రొమాన్సు, కొంత కవిత్వం, హాస్యం కూడా ఇందులో ఉన్నాయి’. మరణం అంచున రచన: వర్ధెల్లి వెంకటేశ్వర్లు; పేజీలు: 110; వెల: 75; ప్రతులకు: పెద్ద పుస్తక షాపులతోపాటు, అడుగుజాడలు పబ్లికేషన్స్, 302, వైష్ణవి నెస్ట్, మూసారాంబాగ్, దిల్సుఖ్నగర్, హైదరాబాద్-36. ‘ఒక అనాదిజాతి(చెంచు) యావత్తూ మరణం అంచుకు నెట్టబడిన అమానుష సన్నివేశానికి మానవీయ దర్పణం ఈ పుస్తకం’. చెంచుల పట్ల అమితమైన తపనతో పదేళ్లపాటు నల్లమలలో తిరిగి రూపొందించిన పాత్రికేయ డాక్యుమెంట్. చెంచుల ఆహారపు అలవాట్లు, వివాహ వ్యవస్థ, ఆచారాలు, పండుగలతోపాటు వారి మనుగడను దెబ్బతీస్తున్న అంశాలను ‘నిఖార్సయిన సమాచారం’తో వెల్లడించిన రచన. తూరుపు వలస రచన: మన్నె సత్యనారాయణ; పేజీలు: 156; వెల: 75; ప్రతులకు: పల్లవి పబ్లికేషన్స్, డాక్టర్ ఎ.ప్రేమ్‌చంద్ కాంప్లెక్స్, అశోక్‌నగర్, విజయవాడ-10; ఫోన్: 9866115655 ‘ఆంధ్రదేశంలో ఒకపుడు జరిగిన అతి పెద్ద వ్యవసాయ వలస ద్వారా ఏర్పడిన ఆర్థికాభివృద్ధి, సాంస్కృతిక సమ్మేళనాలను పరిశీలించి వ్రాయబడిన తెలుగువారి కథ. విస్మరింపబడిన సమీపగతంలోని జీవన పరిస్థితులు, పరిభాష, ప్రజా చిత్రాన్ని నేటి తరం వారికి తెలియ చెప్పే నవల’. వాడుక భాష - రాసే భాష రచన: ఉన్నం వెంకటేశ్వర్లు; పేజీలు: 96; వెల: 50; ప్రతులకు: కె.ఉషారాణి, 12-628/25, 26, 6వ క్రాస్ రోడ్డు, సుందరయ్య నగర్, తాడేపల్లి, గుంటూరు జిల్లా-522501; ఫోన్: 9618976880 ఎందరో పాత్రికేయులకు శిక్షణ ఇచ్చిన ‘వి.వి.’ చెబుతున్న భాషా పాఠాలు ఇవి. అచ్చు తప్పులు, వాక్య నిర్మాణంలో దోషాలు, పదబంధాలు, వాడుకలో లేని మాటలు, రచనాశైలి మెరుగుపరుచుకోవడం లాంటి అంశాలను సుబోధకంగా వివరించిన పుస్తకం. వర్తమాన జర్నలిస్టులకు ఉపయుక్తం. తంగేడు వనం సంపాదకుడు: మామిడి హరికృష్ణ; పేజీలు: 350; ప్రతులకు: డెరైక్టర్, డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, కళాభవన్, రవీంద్రభారతి, హైదరాబాద్. ‘ప్రపంచ సాహితీ చరిత్రలో తంగేడు పూలపై అత్యధిక కవితల సంకలనం’గా వెలువడిన ఈ పుస్తకంలో 166 కవితలున్నాయి. బతుకమ్మకూ బతుకమ్మలో ప్రధాన పేర్పుగా ఉండే తంగేడుపూలకూ తెలంగాణ జీవితంలో చాలా ప్రాధాన్యత ఉంది. అట్లాంటి తంగేడు పూలకు ‘తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ’ అర్పించిన నివాళి ఇది. -
కొత్త పుస్తకాలు
అభ్యుదయ ప్రేమలు రచన: రంగనాయకమ్మ; పేజీలు: 204(రాయల్ సైజు, హార్డుబౌండు); వెల: 80; ప్రతులకు: అరుణా పబ్లిషింగ్ హౌస్, ఏలూరు రోడ్డు, విజయవాడ-2; ఫోన్: 0866-2431181 ఇందులో, 4 కథలతోపాటు, ‘ప్రేతాత్మల తత్వశాస్త్రం’ మీద రాసిన వ్యాసాలూ, విరసం మీద రాసిన వ్యాసాలూ, పాతవి ఫ్యూడల్నీ, కొత్తవి బూర్జువానీ చూపిస్తాయనీ చెప్పే సినిమా వ్యాసాలూ, ‘వర్గ నిర్మూలన’ లక్ష్యంగా రాసిన వర్గాల-కులాల వ్యాసాలూ మొత్తం కలిపి 27 వ్యాసాలున్నాయి. అలిశెట్టి ప్రభాకర్ కవిత సంపాదకులు: జయధీర్ తిరుమలరావు, నిజాం వెంకటేశం, బి.నర్సన్; పేజీలు: 336; వెల: 150; ప్రతులకు: బి.నర్సన్, 1-1-276/ఎ, ఫ్లాట్ నం.104, ఆర్.కె.అపార్ట్మెంట్స్, స్ట్రీట్ నం.1, చిక్కడపల్లి, హైదరాబాద్-27; ఫోన్: 9440128169 ‘రూపంలో సంక్షిప్తతనీ, వస్తువులో జీవిత విస్తృతినీ, సమాజపు లోతుల్నీ ఇమి’డ్చిన అలిశెట్టి ప్రభాకర్ కవితా సర్వస్వం ఇది. ‘ఎర్ర పావురాలు’, ‘మంటల జెండాలు’, ‘చురకలు’, ‘రక్తరేఖ’, ‘సంక్షోభ గీతం’, ‘సిటీ లైఫ్’, ‘మరణం నా చివరి చరణం కాదు’ అన్నింటినీ ఒక చోట కూర్చిన సంకలనం. షేక్స్పియర్ నాటక కథలు కథారూపం: జివిఎల్ నరసింహారావు; పేజీలు: 112; వెల: 80; ప్రతులకు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, చుట్టుగుంట, విజయవాడ-4; ఫోన్: 0866-2430302 షేక్స్పియర్ నాటకాలను చదవనివాళ్లకు స్థూలంగా వాటి కథేమిటో తెలియజెప్పే పుస్తకం ఇది. ఇందులో ఆరు నాటక కథలు - వెన్నిస్ వర్తకుడు, కింగ్ లియర్, కవల కలకలం, నడిరేయి మిడిమేలం, జూలియస్ సీజర్, మేక్బెత్- ఉన్నాయి. వీటిని, ‘జివిఎల్ సరళంగా సుబోధకంగా తెలుగులో అందిస్తున్నారు’. ‘మనుషుల్లో ప్రాథమికంగా ఉండాల్సిన దయ, కరుణ, ప్రేమలను ఈ కథలు ప్రబోధిస్తాయి’. ఇల్లూ వాకిలి రచన: బి.ఎస్.రాములు; పేజీలు: 184; వెల: 125; ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్ హౌస్, బండ్లగూడ, హైదరాబాద్-68. ఫోన్: 040-24224453 ‘సాహిత్య ప్రయోజనం, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసే’ బి.ఎస్.రాములు ‘ఒక ఉద్యమ భావజాలాన్ని ముందుకు తీసుకు’ పోయే లక్ష్యంతో రాసిన కథలివి. ఇందులో 15 కథలున్నాయి. ఇవి ‘1970 నుండి 2015 దాకా సాగిన తెలంగాణ సామాజిక పరిణామాలను, ఆయా సామాజిక వర్గాల ఉత్థాన, పతనాలను, ఉద్యమ తీరుతెన్నులను, ఒక ప్రత్యేక ప్రాపంచిక దృక్పథంతో చిత్రించాయి’. -
మార్కెట్లోకి కొత్త పుస్తకాలు
మ్యూజిక్ డైస్ కవి: అరుణ్ సాగర్; పేజీలు: 48(గ్లేజ్డ్ప్రింట్); వెల:70; ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు ‘మైదానవాసి నిర్వాసితుడవడం వేరు, ఆదివాసి నిర్వాసితుడవడం వేరు. విస్తాపన గిరిజనుడికి మరణమే’ అంటున్నాడు కవి. పోలవరం బ్యాక్‌వాటర్స్‌లో మునిగిపోనున్న ఆదివాసీలకు మద్దతుగా వెలువడిన ‘ఒక మరణవాంగ్మూలము’ ఇది. ‘ఉరికంబపు కొయ్యలకు వేలాడే నీడలు/... కోయలు కొండరెడ్లు గదబలు సవరలు’ కారుస్తున్న ‘కోట్ల క్యూసెక్కుల కన్నీ’ళ్లను చూస్తే కలిగిన తోడుదుఃఖం. ‘నీ జనమే పోరాడుతున్నచోట కనీసం గొంతయినా కలపకపోవడం నేరం’ అన్న ఎరుకతో చేస్తున్న ‘ఒక మద్దతు ప్రకటన’. కిటికీ తెరిస్తే... రచన: విహారి; పేజీలు: 130; వెల: 110; ప్రతులకు: చినుకు పబ్లికేషన్స్, గరికపాటివారి వీధి, గాంధీనగర్, విజయవాడ-520003; రచయిత ఫోన్: 9848025600 ‘కొందరు కేవలం కథకులు. కొందరు కవులు. కొందరు లాక్షణికులు. కొందరు విమర్శకులు. ఇవన్నీ సమపాళ్లలో ఉన్న అరుదైన రచయిత విహారి’. ఇది విహారి కలంపేరుతో రాసే జె.ఎస్.మూర్తి 12వ కథానికా సంపుటి. ఇందులో 15 కథలున్నాయి. ‘రేపు సంక్రాంతి’(కిటికీ తెరిస్తే); ‘ఇప్పుడు హాలంతా వెలుతురు రేకలే’(దృశ్యం - అదృశ్యం); ‘ధారాళంగా వీస్తున్న కమ్మతెమ్మర ‘ప్రోత్సాహ’కు మరింత ఉల్లాసాన్ని పంచుతోంది’(లక్ష్యం తోడు)... ఇలా ఆశావహ ముగింపుతోసాగే ఈ కథలు ఫీల్ గుడ్ భావన కలిగిస్తాయి. పరిగెచేను రచన: ఎలికట్టె శంకర్రావు; పేజీలు: 110; వెల: 70; ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్ హౌస్, బండ్లగూడ, హైదరాబాద్-68. ఫోన్: 040-24224453 ఇందులో 25 కథలున్నాయి. ‘రచయిత తన బాల్యాన్ని, తను చదువుకున్న పాఠశాల జీవితాన్ని, తన సార్లను, టీచరమ్మలను, తన స్నేహితులను మన ముందు సజీవంగా నిలుపుతాడు’. ‘మనలోని హాస్యప్రియత్వాన్ని బహిర్గతం చేయడానికి ఈ కథలు తోడ్పడతాయి’. అలాగే, ‘తెలంగాణ రైతు ఈతి బాధల్ని, ఆలోచనల్ని, అతని సంస్కారాన్ని అద్భుతంగా చూపించాడు శంకర్రావు’. -
కొత్త పుస్తకాలు
మట్టిమనసు తన కథలకు బహుమతులు కూడా అందుకున్న రామదుర్గం, వృత్తిరీత్యా పాత్రికేయుడు. భాష మీద మక్కువ గలవాడు. పదేళ్ల పైచిలుకు కాలంలో రాసిన 18 కథల్ని సంకలనంగా తెచ్చారు. ‘జీవితమే ముడిపదార్థం’గా ‘మంచి యన్నది పెంచడానికి’ రాసిన కథలివి. ఇందులో వెల్లడయ్యే స్త్రీ సాధికారత, సీమ రైతుల కష్టాలు రచయిత దృక్పథాన్ని పట్టిస్తాయి. పాత్రోచిత రాయలసీమ మాండలికం అదనపు అందం. రచన: రామదుర్గం మధుసూదనరావు; పేజీలు: 176; వెల: 120; ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలతోపాటు, ఆర్.జయలక్ష్మి, ప్లాట్ నం. 304, కౌస్తుభ టవర్స్, మోహన్‌నగర్, కొత్తపేట, హైదరాబాద్-36; ఫోన్: 9912199557 రెండు దోసిళ్ళ కాలం కవి: (శ్రీరామోజు) హరగోపాల్; పేజీలు: 168; వెల: 100; ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు. కవి ఫోన్: 9949498698 ఇది హరగోపాల్ మూడో కవితాసంపుటి. ‘ఒక వస్తువుని కవిత చేసేటప్పుడు- హరగోపాల్ పద్ధతి వేరు. తనది మనమీద ఇంపోజ్ చేయడు. ఆత్మగతం. స్వగతంగా మాట్లాడుకుంటూ కవితా నిర్మాణం జరుగుతుంది’. ‘చాల మామూలు ఘటనల గురించే, చాల మామూలు పదచిత్రాలతోనే చెపుతున్నప్పటికీ, అంతర్గతంగా దాగిన ప్రగాఢమైన, సాంద్రమైన తాత్విక దృక్పథం’ ఆలోచనలు రగిలిస్తుంది. శబ్దభేది కవి: ఎమ్మెస్ సూర్యనారాయణ; పేజీలు: 184; వెల: 100; ప్రతులకు: ఎం.రత్నమాల, ఆదిత్య కుటీర్, పొదలాడ - 533242, రాజోలు, తూర్పు గోదావరి; ఫోన్: 08862-220408 ఐదు కవిత్వ, మూడు కథా సంపుటాల ఎమ్మెస్ తాజా సంపుటి ఇది. కాలాన్ని తవ్వుతూ రాత్రుళ్లుగా, పగళ్లుగా... దాచిపెట్టిన కలల్ని ధారపోస్తున్నాడు. కాఫ్కా మూలుగుల్నీ, కోకిలని పొదిగిన హృదయాన్నీ వినిపిస్తున్నాడు. ‘తాత్వికునితో సర్దుబాటంటే/ తనలాగా తర్జుమా కావడం/ మన లోపల/ తామరాకు పుట్టడం’ అని ప్రేమగా హెచ్చరిస్తున్నాడు. అలౌకికం లలితానంద్ కవిత; పేజీలు: 304; వెల: 200; ప్రతులకు: బి.లలితానంద ప్రసాద్, 12-24, ‘సృజన’ రాధశాల వీధి, దుగ్గిరాల- 522330; ఫోన్: 08644-277559 ‘హృదయ మూలంలో జీవం పోసుకుని, మేధో మథనంతో రాటు తేలి అక్షర చిత్రాలుగా రూపు దిద్దుకున్న కవితలివన్నీ’. ‘భూమి పొరల మాటున లోతుగా చెలమ త్రవ్వి అందుకోవలసిన కవితా గంగ ఇది. మనసు పెట్టి ఆ గంగను చేదుకోవాలేకాని, ఆ తర్వాత మనకు అందేదంతా అపురూపమైన భావ సంచయమే’. -
పోటీ పరీక్షలకు మరో 8 పుస్తకాలు
సిద్ధం చేస్తున్న తెలుగు అకాడమీ వారంలో ఒకటి, నెలాఖరుకు మరో 7 అందుబాటులోకి తెలుగు అకాడమీ డెరైక్టర్ సత్యనారాయణరెడ్డి వెల్లడి హైదరాబాద్: రాష్ట్రంలో పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం తెలుగు అకాడమీ మరో 8 కొత్త పుస్తకాలను అందుబాటులోకి తేనుంది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ ప్రకటించిన పోటీ పరీక్షల సిలబస్‌లోని అంశాలకు సంబంధించిన వివిధ పుస్తకాలను అందుబాటులో ఉంచిన అకాడమీ వివిధ వర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లతో మరో 8 పుస్తకాలను సిద్ధం చేయిస్తోంది. ఈ నెలాఖరులోగా వాటిని అభ్యర్థులకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు అకాడమీ డెరైక్టర్ సత్యనారాయణరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటివరకు జాతీయ స్థాయి అంశాలైన భారత ఆర్థిక వ్యవస్థ-అభివృద్ధి, భారత రాజ్యాంగం, ప్రభుత్వ పాలన శాస్త్రం, భౌతిక, భూగోళ శాస్త్రం, భారత స్వాతంత్య్రోద్యమ చరిత్ర వంటి 12 రకాల పుస్తకాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇంటర్మీడియెట్ లో మార్పు చేసిన పుస్తకాల్లో తెలంగాణకు సంబంధించిన పలు అంశాలు ఇప్పటికే ఉన్నప్పటికీ పోటీ పరీక్షలకు అవసరమైన కోణం, పూర్తి విశ్లేషణలతో ఈ పుస్తకాలను అకాడమీ అందుబాటులోకి తెస్తోంది. వీటితోపాటు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా జనరల్ స్టడీస్ పుస్తకాన్ని అకాడమీ ప్రత్యేకంగా ముద్రిస్తోంది. మరో వారంలో ఇది అందుబాటులోకి రానుంది. కొత్త పుస్తకాల్లోని ప్రత్యేకాంశాలు.. త్వరలో అందుబాటులోకి రానున్న తెలంగాణ చరిత్ర-సంస్కృతి, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ భౌగోళిక చరిత్ర వంటి పుస్తకాల్లో తెలంగాణ పరిచయం, పూర్వ తెలంగాణ చరి త్ర, ప్రాచీన తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్య చరిత్ర, శాతవాహనుల పూర్వకాలం, శాతవాహనుల తరువాత కాలం, మధ్యయుగ తెలంగాణ చరిత్ర, కాకతీయుల కాలం, పద్మనాయకులు, నాయంకరణులు, ముసునూరి నాయకులు, బహమనీ పరిపాలన, కుతుబ్‌షాహీల కాలం, మెఘల్ల కాలం, అసఫ్జాహీలు, నిజాంల పాలన, స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, పూర్వ తెలంగా ణ ఉద్యమం, మలి దశ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, ఉద్యమాల్లో ప్రజా సంఘాలు, కవులు, కళాకారులు వంటి అంశాలను అకాడమీ పొందుపరుస్తోంది. ఇంటర్ పుస్తకాల్లోనూ తెలంగాణ సంబంధ అంశాలు ప్రస్తుతం ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పుస్తకాల్లోనూ తెలంగాణకు సంబంధించిన పలు అంశాలు ఉన్నాయని, అవి కూడా అభ్యర్థులకు ఉపయోగపడతాయని అకాడమీ డెరైక్టర్ సత్యనారాయణరెడ్డి చెప్పారు. వాటిలో తెలంగాణ చరిత్ర, భౌగోళిక, ఆర్థికశాస్త్రం, సామాజిక, రాజకీయ ఉద్యమాలు, పర్యావరణ పోరాటాలు, తెలంగాణ ఉద్యమం, రాజకీయ పార్టీలు, జేఏసీల పాత్ర, చరిత్ర ఆధారాలు, సంక్షిప్త రాజకీయ చరిత్ర, రాష్ట్ర నిర్మాణం, ఆర్థిక లక్షణాలు, తలసరి ఆదాయం, జనాభా లక్షణాలు, సంక్షేమ కార్యక్రమాలపై పాఠ్యాంశాలు ఉన్నాయి. త్వరలో అందుబాటులోకి రానున్న పుస్తకాలు . తెలంగాణ చరిత్ర-సంస్కృతి తెలంగాణ ఉద్యమం- రాష్ట్ర అవతరణ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ తెలంగాణ పర్యావరణ సమస్యలు- అభివృద్ధి {పభుత్వ పాలన శాస్త్రం సమాజ శాస్త్రం తెలంగాణ ప్రాంతీయ భౌగోళిక శాస్త్రం జనరల్ స్టడీస్ ఇదివరకే అందుబాటులో ఉంచినవి ఇండియన్ జియోగ్రఫీ భారత ఆర్థిక వ్యవస్థ ఇండియన్ సోషియాలజీ పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ స్పేస్ టెక్నాలజీ భారత రాజ్యాంగం {పభుత్వ పాలన శాస్త్రం భారత స్వాతంత్య్రోద్యమ చరిత్ర