New High
-
ఏడాదిలో భారత్- యూఏఈ బంధం ఎలా బలపడింది?
ప్రధాని నరేంద్ర మోదీ తన 2 రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం(ఫిబ్రవరి 13) యూఏఈ చేరుకోనున్నారు. ఫిబ్రవరి 14న అబుదాబిలో నిర్మించిన బీఏపీఎస్ ఆలయాన్ని ప్రారంభించనున్నారు. కాగా గత ఏడాది కాలంలో భారతదేశం- యూఎఈ మధ్య సంబంధాలలో మరింత సాన్నిహిత్యం ఏర్పడింది. అనేక అంశాల్లో కలిసి పని చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. గడచిన ఏడాదిలో రెండు దేశాల మధ్య ఐదు ఉన్నత స్థాయి పర్యటనలు జరిగాయి. ప్రధాని మోదీ జూలై 2023లో ద్వైపాక్షిక పర్యటన నిమిత్తం యూఏఈ వెళ్లి, అధ్యక్షుడు హెచ్‌హెచ్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్‌ను అబుదాబిలో కలిశారు. దుబాయ్‌లో కాప్-28లో పాల్గొంటున్నప్పుడు కూడా అంటే గత ఏడాది నవంబరు 30 ప్రధాని మోదీ యూఏఈ సందర్శించారు. అప్పుడు ప్రధాని మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రెసిడెంట్ హిస్ ఎక్సలెన్సీ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, వైస్ ప్రెసిడెంట్‌ను కలుసుకున్నారు. భారతదేశ మద్దతుతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బ్రిక్స్‌లో సభ్యదేశంగా చేరింది. వాణిజ్య రంగంలో కూడా ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు ఊపందుకున్నాయి. సరిహద్దు లావాదేవీల కోసం రూపాయి, దిర్హమ్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో యూఏఈ భారతదేశంలో 3.5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిన నాల్గవ అతిపెద్ద దేశంగా అవతరించింది. 2024, జనవరి 10న యూఎఈ అధ్యక్షుడు హెచ్‌హెచ్ షేక్ మహ్మద్ బిన్ జాయెద్ గుజరాత్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. 2026-39 వరకు అంటే 14 సంవత్సరాల దీర్ఘకాలిక ఒప్పందం కింద 1.2 ఎంఎంటీ ఎల్ఎన్జీ కొనుగోలు చేయడానికి ఐఓసీఎల్, ఏడీఎన్ఓసీ మధ్య ఒప్పందాలు కుదిరాయి. ఇది భారత్, యూఏఈ మధ్య కుదిరిన మొదటి దీర్ఘకాలిక ఒప్పందం. తాజాగా అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ఏడీఎన్ఓసీ) గ్యాస్ గెయిల్ ఇండియాకు సంవత్సరానికి 0.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎల్ఎన్జీని సరఫరా చేసేందుకు 10 సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకుంది. రక్షణ రంగంలో గత ఏడాది కాలంలో రెండు దేశాల మధ్య ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. 2024 జనవరిలో భారత్-యూఎఈల ద్వైపాక్షిక సైనిక కసరత్తు రాజస్థాన్‌లో జరిగింది. 2024, జనవరి 21న భారత్- యూఏఈ, ఫ్రాన్స్‌ల వైమానిక దళాలతో కూడిన ఎక్సర్సైజ్ డెసర్ట్ నైట్ యూఏఈలోని అల్ దఫ్రా విమానాశ్రయంలో జరిగింది. ఇటీవల ఎడ్జ్, హెచ్‌ఏఎల్‌లు ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం క్షిపణి వ్యవస్థల ఉమ్మడి రూపకల్పన, అభివృద్ధితో సహా సహకార రంగాలలో ఇరు దేశాలు పరస్పరం సహాయ సహకారాలు అందించుకోనున్నాయి. -
‘ఎక్స్’లెంట్: ట్విటర్ సరికొత్త రికార్డ్! షేర్ చేసిన మస్క్
‘ఎక్స్’(X)గా పేరు మారిన ట్విటర్ (Twitter) సరికొత్త రికార్డ్ సాధించింది. మంత్లీ యూజర్ల సంఖ్యలో నూతన గరిష్ట స్థాయికి చేరుకున్నట్లు దాని అధినేత ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. మంత్లీ యూజర్ల సంఖ్య 540 మిలియన్లను దాటినట్లు చూపుతున్న గ్రాఫ్‌ను షేర్ చేశారు. ఇటీవల పడిపోయిన ప్రకటనల ఆదాయాన్ని పెంచుకునేందుకు సంస్థలో సంస్థాగత మార్పులు చేపట్టిన తరుణంలో యూజర్ల సంఖ్య రికార్డ్ స్థాయిలో పెరగడం గమనార్హం. మరోవైపు ఇంకొక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ మెటా.. ట్విటర్‌కు పోటీగా థ్రెడ్స్ అనే మైక్రో బ్లాగింగ్ యాప్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. గత అక్టోబర్‌లో మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేయడానికి ముందు 2022 మే నాటికి ట్విటర్ 229 మిలియన్ల మంత్లీ యాక్టివ్ యూజర్లు ఉండగా తన ఆధీనంలోకి వచ్చాక 2022 నవంబర్‌లో 259.4 మిలియన్ డైలీ యాక్టివ్ యూజర్లు ఉన్నట్లు మస్క్ పోస్ట్ చేశారు. తన ఆధీనంలోకి వచ్చినప్పటి నుంచి మస్క్ ట్విటర్లో అనేక మార్పులు తీసుకొచ్చారు. బ్లూటిక్‌ను పెయిడ్ సర్వీస్‌గా మార్చారు. అస్తవ్యస్తమైన మార్పుల ఫలితంగా ప్రకటనల ఆదాయం క్రమంగా పడిపోతూ వచ్చింది. ఈ నేపథ్యంలో గత మేలో ఎన్బీసీ యూనివర్సల్ అడ్వర్టైజింగ్ చీఫ్‌గా ఉన్న లిండా యాకారినోను ట్విటర్ (ఎక్స్)కు సీఈవోగా నియమించారు. తద్వారా తనకు సబ్స్క్రిప్షన్ రాబడితోపాటు ప్రకటనల ఆదాయం కూడా కీలకమని సంకేతాలిచ్చారు. ఇదీ చదవండి ➤ Elon Musk: అతని కోపం ప్రళయం.. మస్క్ గురించి కీలక విషయాలు చెప్పిన మాజీ ఉద్యోగిని ప్రకటనల ఆదాయంలో దాదాపు 50 శాతం తగ్గిపోయిందని, అలాగే పెరిగిన రుణ భారం కారణంగా నగదు లోటును ఎదుర్కొంటున్నట్లు జులై నెల ప్రారంభంలో మస్క్ చెప్పారు. ఇంతలో ట్విటర్‌ని ‘ఎక్స్’గా రీబ్రాండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే మెటా, మైక్రోసాఫ్ట్‌తోపాటు మరికొన్ని కంపెనీలు ఇప్పటికే ‘ఎక్స్’ అక్షరంపై మేధో సంపత్తి హక్కులను కలిగి ఉన్నాయి. కాబట్టి దీనిపై చట్టపరమైన చిక్కులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. 𝕏 monthly users reach new high in 2023 pic.twitter.com/trqLGBEvvA — Elon Musk (@elonmusk) July 28, 2023 -
బాహుబలి ‘సిప్’ ప్రతి నెలా రూ.12,000 కోట్లపైనే
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులు పెట్టే విషయంలో రిటైల్ ఇన్వెస్టర్లు ఎంతో పరిణతి చూపిస్తున్నారు. ఇటీవలి కాలంలో మార్కెట్లలో అస్థిరతలతో సంబంధం లేకుండా ప్రతి నెలా నికర సిప్ పెట్టుబడులు క్రమంగా పెరుగుతూ ఉండడం దీన్నే సూచిస్తోంది. గత నాలుగు నెలలుగా నెలవారీ సిప్ పెట్టుబడుల రాక రూ.12,000 కోట్లపైనే నమోదవుతోంది. ఆగస్ట్‌లో సిప్ పెట్టుబడులు అత్యధికంగా రూ.12,693 కోట్లకు చేరాయి. ఒక నెలలో ఇదే గరిష్ట సిప్ పెట్టుబడులు ఇవి. ఈ ఏడాది మే నెలకు రూ.12,286 కోట్లు, జూన్‌లో రూ.12,276 కోట్లు, జూలైలో రూ.12,140 కోట్ల చొప్పున సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో పెట్టుబడులు వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో వచ్చిన పెట్టుబడులు రూ.11,863 కోట్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో సిప్ పెట్టుబడులు రూ.61,258 కోట్లకు చేరాయి. ఇక గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద సిప్ పెట్టుబడులు రూ.1.24 లక్షల కోట్లుగా ఉన్నాయి. క్రమబద్ధమైన పెట్టుబడులు.. సిప్ ద్వారా ప్రతి నెలా పెట్టుబడులు పెట్టడం వల్ల మార్కెట్ల ర్యాలీల్లో పాల్గొనొచ్చు. అదే సమయంలో మార్కెట్లలో కరెక్షన్ల సమయంలోనూ కొనుగోలుకు అవకాశం లభిస్తుంది. ఏకమొత్తంలో పెట్టుబడికి ఈ వెసులుబాటు ఉండదు. అందుకని సిప్ రూట్లో పెట్టుబడుల వల్ల దీర్ఘకాలంలో అస్థిరతలను సులభంగా అధిగమించి రాబడులు పొందేందుకు వీలుంటుంది. ఈ వెసులుబాటే సిప్‌కు ఆదరణ పెంచుతోంది. వేతన జీవులు ప్రతి నెలా క్రమం తప్పకుండా సిప్ పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సిప్ అన్నది పొదుపు అలవాటును ప్రోత్సహిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మొత్తం మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని సిప్ ఆస్తులు (పెట్టుబడులు) 2022 మర్చి చివరికి రూ.5.76 లక్షల కోట్లుగా ఉంటే, ఆగస్ట్ చివరికి రూ.6.4 లక్షల కోట్లకు వృద్ధి చెందాయి. వార్షికంగా సిప్ ఆస్తులు 30 శాతం మేర పెరిగాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణ ఆస్తుల వృద్ధి కంటే ఇది రెండు రెట్లు అధికంగా ఉంది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల వద్ద నమోదైన మొత్తం సిప్ ఖాతాలు ఆగస్ట్ చివరికి 5.72 కోట్లుగా ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ప్రధానంగా సిప్ పెట్టుబడులపైనే ఆధారపడి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే 43 మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఉమ్మడిగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో రూ.64.935 కోట్ల ఈక్విటీ పెట్టుబడులను ఆకర్షించగా, ఇందులో రూ.61,258 కోట్లు సిప్ రూపంలో రావడం దీన్నే తెలియజేస్తోంది. వచ్చే 18-24 నెలల్లో సిప్ ద్వారా ప్రతి నెలా వచ్చే పెట్టుబడులు రూ.20,000 కోట్లకు చేరతాయని భావిస్తున్నట్టు మోతీలాల్ ఓస్వాల్ ప్రైవేటు వెల్త్ ఎండీ, సీఈవో ఆశిష్ శంకర్ పేర్కొన్నారు. -
యూఎస్ మార్కెట్ల సరికొత్త రికార్డ్
న్యూయార్క్, సాక్షి: యూఎస్ కాంగ్రెస్‌లో డెమక్రాట్ల ఆధిపత్యం కారణంగా కొత్త ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్న జో బైడెన్‌పై అంచనాలు పెరిగాయి. దీంతో కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కొనే బాటలో ప్రభుత్వం ఇకపై భారీ సహాయక ప్యాకేజీలకు తెరతీయవచ్చన్న అంచనాలు పెరిగాయి. మరోపక్క ప్రస్తుత ప్రెసిడెంట్ ట్రంప్‌ను గడువుకంటే ముందే అధికారం నుంచి తప్పించేందుకు చర్యలు మొదలైనట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి గురువారం యూఎస్ స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను తాకాయి. డోజోన్స్ 212 పాయింట్లు(0.7 శాతం) ఎగసి 31,041 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 56 పాయింట్ల(1.5 శాతం) వృద్ధితో 3,804 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 327 పాయింట్లు(2.6 శాతం) జంప్‌చేసి 13,067 వద్ద స్థిరపడింది. ఇవి సరికొత్త గరిష్టాలుకావడం విశేషం! చదవండి: (మారిన ఐటీ కంపెనీల ఫోకస్) బాండ్ల ఈల్డ్స్ అప్ 10ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్ 10 నెలల గరిష్టం 1.081 శాతానికి ఎగశాయి. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 0.5 శాతం బలపడి 89.78ను తాకింది. మరోపక్క పసిడి ధరలు ఔన్స్ 0.3 శాతం నీరసించి 1914 డాలర్లకు చేరాయి. కాగా.. గత వారం నిరుద్యోగ క్లెయిములు అంచనాలకంటే తగ్గడంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు తెలియజేశారు. (ప్రపంచ కుబేరుడిగా ఎలన్ మస్క్?) టెస్లా జోరు ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా ఇంక్ 8 శాతం జంప్‌చేసి 816 డాలర్లను తాకింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 773 బిలియన్ డాలర్లను అధిగమించింది. ఫలితంగా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ సంపద 188 బిలియన్ డాలర్లను తాకింది. టెస్లా ఇంక్‌లో మస్క్‌కు 20 శాతం వాటా ఉన్న సంగతి తెలిసిందే. ఫలితంగా ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా మస్క్ ఆవిర్భవించినట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా.. ఐఫోన్ల దిగ్గజం యాపిల్, ఇంటర్నెట్ దిగ్గజం అల్ఫాబెట్, ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్, ఎంటర్టైన్మెంట్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్, ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ 3.5-1 శాతం మధ్య జంప్‌చేశాయి. దీంతో ఎస్అండ్పీ, నాస్డాక్ భారీగా బలపడినట్లు నిపుణులు తెలియజేశారు. డీఎక్స్‌సీ టెక్నాలజీ కొనుగోలుకి ఫ్రాన్స్ ఐటీ కన్సల్టింగ్ గ్రూప్ అటోస్ ఎస్ఈ 10 బిలియన్ డాలర్ల ఆఫర్‌ను ప్రకటించడంతో డిక్సన్ షేరు 9 శాతం దూసుకెళ్లింది. -
మెటల్స్ మెరుపులు- సెన్సెక్స్ రికార్డ్
ముంబై, సాక్షి: దేశీయంగా కోవిడ్-19 కట్టడికి ఒకేసారి రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో స్టాక్ మార్కెట్లలో జోరు కొనసాగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ మార్కెట్ చరిత్రలో తొలిసారి 48,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. వెరసి 9వ రోజూ మార్కెట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ 308 పాయింట్లు ఎగసి 48,177 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 114 పాయింట్లు జమ చేసుకుని 14,133 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 48,220 వద్ద, నిఫ్టీ 14,148 వద్ద చరిత్రాత్మక గరిష్టాలను తాకడం విశేషం! (స్ట్ర్రెయిన్ ఎఫెక్ట్- పసిడి, వెండి హైజంప్) పీఎస్‌యూ బ్యాంక్స్ ఓకే ఎన్ఎస్ఈలో దాదాపు అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా మెటల్ 5 శాతం, ఐటీ 2.7 శాతం, ఆటో 1.6 శాతం చొప్పున ఎగశాయి. పీఎస్‌యూ బ్యాంక్స్, ఫార్మా, మీడియా సైతం 1 శాతం స్థాయిలో బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా స్టీల్, హిందాల్కో, ఐషర్, ఓఎన్జీసీ, టీసీఎస్, బీసీసీఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, గెయిల్, గ్రాసిమ్, హెచ్‌సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టెక్ మహీంద్రా టాటా మోటార్స్ 8.4-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. బ్లూచిప్స్‌లో కేవలం హీరోమోటో, కొటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, టైటన్, ఏషియన్ పెయింట్స్, పవర్‌గ్రిడ్ మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 1.6- 0.5 శాతం మధ్య నీరసించాయి. మెటల్ జూమ్ డెరివేటివ్ స్టాక్స్‌లో చోళమండలం, జిందాల్ స్టీల్, సెయిల్, నాల్కో, వేదాంతా, ఎన్ఎండీసీ, ఐడియా, కమిన్స్, అశోక్ లేలాండ్, భెల్ 7-5 శాతం మధ్య దూసుకెళ్లాయి. అయితే మరోవైపు జీ, జూబిలెంట్ ఫుడ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, బంధన్ బ్యాంక్, ఐబీ హౌసింగ్ 2.6-0.6 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.4 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 2,096 లాభపడగా.. 993 మాత్రమే నష్టాలతో ముగిశాయి. పెట్టుబడులవైపు నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 506 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 69 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 1,136 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 258 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
ఆరో రోజూ ర్యాలీ- 14,000 చేరువలో నిఫ్టీ
ముంబై, సాక్షి: ఈ నెల డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు ముందున్న నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు తొలుత తడబడినప్పటికీ చివరికి లాభాలతో నిలిచాయి. వెరసి వరుసగా ఆరు రోజూ ర్యాలీ బాటలో సాగాయి. సెన్సెక్స్ 133 పాయింట్లు పుంజుకుని 47,746కు చేరగా.. నిఫ్టీ 49 పాయింట్లు బలపడి 13,982 వద్ద స్థిరపడింది. ఇవి సరికొత్త రికార్డులుకాగా.. తొలుత 13,865 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరిన నిఫ్టీ చివర్లో 13,997 వరకూ ఎగసింది. వెరసి 14,000 పాయింట్ల మైలురాయికి చేరువలో నిలిచింది. ఇక సెన్సెక్స్ సైతం 47,808-47,358 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నేటితో కలిపి 21 సెషన్లలో 15సార్లు మార్కెట్లు సరికొత్త గరిష్టాలను అందుకున్న నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీనికితోడు గురువారం డిసెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టులు ముగియనుండటంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. ఫార్మా డీలా ఎన్ఎస్ఈలో ప్రధానంగా మెటల్, ఆటో, రియల్టీ 1.3 శాతం చొప్పున పుంజుకోగా.. బ్యాంకింగ్, ఫార్మా 0.2 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో అల్ట్రాటెక్, గ్రాసిమ్, శ్రీ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, ఐషర్, యూపీఎల్, మారుతీ, ఎంఅండ్ఎం, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్ 4.5-1.5 శాతం మధ్య ఎగశాయి. అయితే ఇండస్ఇండ్, సన్ ఫార్మా, యాక్సిస్, ఎస్బీఐ, ఎయిర్టెల్, టీసీఎస్, గెయిల్, సిప్లా, ఇన్ఫోసిస్ 1.5-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. సెయిల్ ప్లస్ డెరివేటివ్ స్టాక్స్‌లో సెయిల్, రామ్‌కో సిమెంట్, బాలకృష్ణ, జీఎంఆర్, అంబుజా, కెనరా బ్యాంక్, ఎన్ఎండీసీ, జిందాల్ స్టీల్ 7.5-2.3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు ఆర్ఈసీ, అదానీ ఎంటర్, పీఎఫ్సీ, పేజ్, బంధన్ బ్యాంక్, ఇండస్ టవర్స్, పీఎన్బీ, భారత్ ఫోర్జ్, సన్ టీవీ 2-1.2 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.4 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,671 లాభపడగా.. 1,282 నష్టాలతో ముగిశాయి. ఎఫ్‌పీఐల జోరు నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,349 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,010 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 1,589 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 1,387 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
అలుపులేని మార్కెట్లు- రికార్డ్స్ నమోదు
ముంబై, సాక్షి: ఇటీవల రికార్డుల ర్యాలీ చేస్తున్న దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి జోరు చూపాయి. సెన్సెక్స్ 259 పాయింట్లు జంప్‌చేసి 47,613 వద్ద ముగిసింది. నిఫ్టీ 59 పాయింట్లు ఎగసి 13,933 వద్ద నిలిచింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. ఈ నెలలో ఇప్పటివరకూ 20 ట్రేడింగ్ సెషన్లలో 14సార్లు మార్కెట్లు రికార్డులను నెలకొల్పడం విశేషం! ప్రెసిడెంట్ ట్రంప్ 2.3 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీపై సంతకం చేయడంతో సోమవారం యూఎస్ మార్కెట్లు 0.7 శాతం బలపడ్డాయి. తద్వారా సరికొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. ఇక కోవిడ్-19 కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానుండటంతో దేశీయంగానూ సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో మార్కెట్లు నిరవధిక ర్యాలీ చేస్తున్నట్లు వివరించారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 47,714 వద్ద, నిఫ్టీ 13,967 వద్ద చరిత్రాత్మక రికార్డులను అందుకున్నాయి. రియల్టీ డౌన్ ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్, ఐటీ రంగాలు 1.5-0.8 శాతం మధ్య బలపడగా.. మీడియా, మెటల్, ఆటో, ఫార్మా, రియల్టీ 1.5-0.25 శాతం మధ్య బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్ఇండ్, టెక్ మహీంద్రా, యాక్సిస్, ఐసీఐసీఐ, హెచ్‌సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ ద్వయం, ఐటీసీ, గెయిల్ 6-1 శాతం మధ్య లాభపడ్డాయి. బ్లూచిప్స్‌లో హిందాల్కో, నెస్లే, కోల్ ఇండియా, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఆర్ఐఎల్, సిప్లా 2-1 శాతం మధ్య నీరసించాయి. ఐజీఎల్ జూమ్ డెరివేటివ్ స్టాక్స్‌లో ఐజీఎల్, జీఎంఆర్, ఎక్సైడ్, ఎంజీఎల్, పీఎన్బీ, ఎస్కార్ట్స్, శ్రీరామ్ ట్రాన్స్, బంధన్ బ్యాంక్, అపోలో టైర్, నౌకరీ 6-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు జిందాల్ స్టీల్, మ్యాక్స్ ఫైనాన్స్, వేదాంతా, క్యాడిలా హెల్త్, ఎన్ఎండీసీ, మెక్‌డోవెల్, పిరమల్ 3- 1.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో స్మాల్ క్యాప్స్ 0.15 శాతం పుంజుకుంది. ట్రేడైన షేర్లలో 1,559 లాభపడగా.. 1,464 నష్టాలతో ముగిశాయి. ఎఫ్‌పీఐల జోరు నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,589 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) దాదాపు రూ. 1,387 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. శుక్రవారం మార్కెట్లకు సెలవుకాగా.. గురువారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 1,226 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. డీఐఐలు మాత్రం రూ. 1,898 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 536 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 1,327 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
19 సెషన్లలో 13 సార్లు కొత్త రికార్డ్స్
ముంబై, సాక్షి: కోవిడ్-19 భయాల నుంచి బయటపడి రికార్డుల ర్యాలీ చేస్తున్న దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి దూకుడు చూపాయి. సెన్సెక్స్ 380 పాయింట్లు జంప్‌చేసి 47,354కు చేరగా.. నిఫ్టీ 124 పాయింట్లు ఎగసి 13,873 వద్ద ముగిసింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో వరుసగా నాలుగో రోజూ మార్కెట్లు లాభాల బాటలో కదిలాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 47,407 సమీపంలోనూ, నిఫ్టీ 13,885 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. వెరసి ఈ నెలలో ఇప్పటివరకూ 19 ట్రేడింగ్ సెషన్లలో 13సార్లు మార్కెట్లు రికార్డులను నెలకొల్పడం విశేషం! కొద్ది నెలలుగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19కు చెక్ పెట్టేందుకు పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్న వార్తలతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు యూఎస్ కాంగ్రెస్ ఆమోదించిన భారీ ప్యాకేజీపై ప్రెసిడెంట్ ట్రంప్ సంతకం చేయడంతో ఇన్వెస్టర్లు హుషారొచ్చినట్లు తెలియజేశారు. దీంతో మార్కెట్లు నిరవధిక ర్యాలీ చేస్తున్నట్లు వివరించారు. ఫార్మా వీక్ ఎన్ఎస్ఈలో ఫార్మా(0.3 శాతం) మినహా అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా రియల్టీ, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్స్ 2.6 శాతం స్థాయిలో ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, ఎస్బీఐ, టైటన్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్, ఎల్అండ్టీ, గెయిల్, ఇండస్ఇండ్, అల్ట్రాటెక్, టాటా స్టీల్, ఐవోసీ, కొటక్ బ్యాంక్, గ్రాసిమ్, బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, హెచ్‌ఢీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్ 6-1.2 శాతం మధ్య లాభపడ్డాయి. బ్లూచిప్స్‌లో కేవలం హెచ్‌యూఎల్, సన్ ఫార్మా, సిప్లా, శ్రీసిమెంట్, బ్రిటానియా అదికూడా 0.5-0.3 శాతం మధ్య బలహీనపడ్డాయి. (14,000 పాయింట్లవైపు నిఫ్టీ పరుగు!) గోద్రెజ్ జూమ్ డెరివేటివ్ స్టాక్స్‌లో సెయిల్, ఐబీ హౌసింగ్, టాటా పవర్, ఆర్బీఎల్ బ్యాంక్, గోద్రెజ్ ప్రాపర్టీస్, మదర్సన్, నాల్కో, బెల్, ఎల్అండ్టీ ఫైనాన్స్, కెనరా బ్యాంక్, యూబీఎల్, జిందాల్ స్టీల్, పీఎన్బీ, ఫెడరల్ బ్యాంక్ 7.5-3.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు బయోకాన్ 3.5 శాతం పతనంకాగా.. ఎస్కార్ట్స్, ఇండస్ టవర్, అపోలో హాస్పిటల్, కమిన్స్, అమరరాజా, ఎంఆర్ఎఫ్, క్యాడిలా హెల్త్ 1.2-0.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1-1.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 2,021 లాభపడగా.. 997 మాత్రమే నష్టాలతో నిలిచాయి. ఎఫ్‌పీఐల జోరు శుక్రవారం మార్కెట్లకు సెలవుకాగా.. నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 1,226 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. దేశీ ఫండ్స్(డీఐఐలు) మాత్రం రూ. 1,898 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 536 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 1,327 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
నాలుగో రోజూ- రికార్డులతో షురూ
ముంబై, సాక్షి: క్రిస్మస్ సందర్భంగా వారాంతాన దేశీ స్టాక్ మార్కెట్లకు సెలవుకాగా.. వరుసగా నాలుగో రోజు హుషారుగా ప్రారంభమయ్యాయి. వెరసి ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 47,354ను అధిగమించడం ద్వారా సరికొత్త గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం సెన్సెక్స్ 284 పాయింట్లు జంప్‌చేసి 47,258కు చేరగా.. ఈ బాటలో నిఫ్టీ సైతం తొలుత 13,865 పాయింట్ల వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని చేరింది. ప్రస్తుతం 90 పాయింట్లు ఎగసి 13,839 వద్ద ట్రేడవుతోంది. కొద్ది నెలలుగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19కు చెక్ పెట్టేందుకు పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్న వార్తలతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశారు. అన్ని రంగాలూ ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా రియల్టీ, మెటల్, బ్యాంకింగ్, ఆటో 3-1 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ, ఎస్బీఐ లైఫ్, టాటా స్టీల్, ఇండస్ఇండ్, గెయిల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, యాక్సిస్, ఐసీఐసీఐ, హెచ్‌ఢీఎఫ్‌సీ బ్యాంక్ 4-1 శాతం మధ్య లాభపడ్డాయి. బ్లూచిప్స్‌లో కేవలం ఏషియన్ పెయింట్స్, టీసీఎస్ అదికూడా 0.2 శాతం చొప్పున బలహీనపడ్డాయి. (14,000 పాయింట్లవైపు నిఫ్టీ పరుగు!) గోద్రెజ్ జూమ్ డెరివేటి స్టాక్స్‌లో గోద్రెజ్ ప్రాపర్టీస్, పీవీఆర్, డీఎల్ఎఫ్, ఇండిగో, ఫెడరల్ బ్యాంక్, మదర్సన్, శ్రీరామ్ ట్రాన్స్, చోళమండలం, ఐబీ హౌసింగ్, జిందాల్ స్టీల్, అపోలో టైర్, ఎంఅండ్ఎం ఫైనాన్స్ 4.3-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు వేదాంతా, బయోకాన్, ఇండస్ టవర్, జూబిలెంట్ ఫుడ్, అంబుజా, అపోలో హాస్పిటల్, ఏసీసీ 1.3-0.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ దాదాపు 1 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,697 లాభపడగా.. 586 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్‌పీఐల పెట్టుబడులు శుక్రవారం మార్కెట్లకు సెలవుకాగా.. నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 1,226 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. దేశీ ఫండ్స్(డీఐఐలు) మాత్రం రూ. 1,898 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 536 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 1,327 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
ఐటీ షేర్ల దూకుడు- సరికొత్త రికార్డ్స్
ముంబై, సాక్షి: వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో సాగుతున్నాయి. తొలుత కొంతమేర ఊగిసలాటకు లోనైనప్పటికీ ప్రస్తుతం సెన్సెక్స్ 311 పాయింట్లు జంప్‌చేసింది. 46,318కు చేరింది. నిఫ్టీ సైతం 91 పాయింట్లు ఎగసి 13,557 వద్ద ట్రేడవుతోంది. కాగా.. కోవిడ్-19 నేపథ్యంలోనూ సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం యాక్సెంచర్ పటిష్ట ఫలితాలు సాధించడంతో దేశీ ఐటీ కౌంటర్లకు డిమాండ్ కొనసాగుతోంది. యాక్సెంచర్ అంచనాలను మించిన గైడెన్స్ ప్రకటించడంతో ఐటీ రంగానికి డిమాండ్ పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీనికితోడు విప్రో తాజాగా జర్మన్ దిగ్గజం మెట్రో ఏజీ నుంచి 70 కోట్ల డాలర్ల డీల్‌ను కుదుర్చుకోవడం, రూ. 9,500 కోట్లతో ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను చేపట్టనుండటం వంటి అంశాలు జత కలిసినట్లు పేర్కొన్నారు. దీంతో ఇన్వెస్టర్లు ఐటీ కౌంటర్లలో కనుగోళ్లకు ఎగబడుతున్నట్లు తెలియజేశారు. ఫలితంగా అటు బీఎస్ఈలోనూ, ఇటు ఎన్ఎస్ఈలోనూ ఐటీ ఇండెక్సులు తాజాగా సరికొత్త గరిష్టాలను చేరాయి. అంతేకాకుండా ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్‌తోపాటు.. ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, ఎంఫసిస్ చరిత్రాత్మక గరిష్టాలను తాకాయి. వివరాలు చూద్దాం.. (ఐటీ రికార్డ్- మళ్లీ 46,000కు సెన్సెక్స్) రికార్డుల బాట ఎన్ఎస్ఈలో ఐటీ ఇండెక్స్ 24,162ను అధిగమించగా.. బీఎస్ఈలో 24,174కు చేరింది. సాఫ్ట్వేర్ సేవల కంపెనీలలో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, ఎంఫసిస్, బిర్లా సాఫ్ట్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ సరికొత్త గరిష్టాలకు చేరాయి. ఇంట్రాడేలో టీసీఎస్ రూ. 2,919 వద్ద, ఇన్ఫోసిస్ రూ. 1255 సమీపంలో, టెక్ మహీంద్రా రూ. 960 సమీపంలో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రూ. 933 సమీపంలో సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. ఈ బాటలో ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ రూ. 3,685 సమీపంలో, ఎంఫసిస్ రూ. 1,533 వద్ద, బిర్లాసాఫ్ట్ రూ. 265 సమీపంలో, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ రూ. 1,459 వద్ద చరిత్రాత్మక గరిష్టాల రికార్డులను సాధించాయి. (యూనికార్న్‌కు చేరిన డైలీహంట్ స్టార్టప్) లాభాల్లో ఇతర కౌంటర్లలో బీఎస్ఈలో రామ్‌కో సిస్టమ్స్, ఈక్లెర్క్స్, హెచ్జీఎస్, ఫస్ట్‌సోర్స్, మాస్టెక్, టాటా ఎలక్సీ, ఎన్ఐఐటీ లిమిటెడ్, మైండ్‌ట్రీ, ట్రైజిన్, ఇంటెలెక్ట్ డిజైన్, శాస్కెన్ టెక్నాలజీస్, సొనాటా సాఫ్ట్వేర్ తదితరాలు 8-3.5 శాతం మధ్య జంప్ చేయడం విశేషం! -
ఐటీ రికార్డ్- మళ్లీ 46,000కు సెన్సెక్స్
ముంబై, సాక్షి: దేశీ స్టాక్ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్ సాధించాయి. ముందు రోజు నమోదైన భారీ పతనం నుంచి బంతిలా పైకెగశాయి. వెరసి సెన్సెక్స్ మళ్లీ 46,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించింది. చివర్లో ఊపందుకున్న కొనుగోళ్లతో సెన్సెక్స్ 453 పాయింట్లు జంప్‌చేసి 46,007 వద్ద ముగిసింది. నిఫ్టీ 138 పాయింట్లు ఎగసి 13,466 వద్ద నిలిచింది. రూపు మార్చుకుని యూరోపియన్ దేశాలలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్ కారణంగా సోమవారం సెన్సెక్స్ 1400 పాయింట్లకుపైగా పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే నేటి ట్రేడింగ్‌లోనూ తొలి రెండు సెషన్లలో మార్కెట్లు ఆటుపోట్లను చవిచూశాయి. సెన్సెక్స్ 46,080- 45,112 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 13,492-13,193 పాయింట్ల మధ్య ఊగిసలాటకు లోనైంది. (దిగివచ్చిన పసిడి, వెండి ధరలు) అన్ని రంగాలూ ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా ఐటీ 3.4 శాతం ఎగసింది. 23,681 వద్ద ఐటీ ఇండెక్స్ సరికొత్త గరిష్టానికి చేరింది. ఈ బాటలో ఫార్మా, మెటల్, ఆటో, బ్యాంకింగ్ 2.3-1 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో అదానీ పోర్ట్స్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, గెయిల్,విప్రో, పవర్‌గ్రిడ్, సన్ ఫార్మా, ఎల్అండ్టీ, నెస్లే, సిప్లా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, దివీస్, ఐషర్, ఏషియన్ పెయింట్స్ 5.5-2 శాతం మధ్య జంప్‌చేశాయి. బ్లూచిప్స్‌లో కేవలం కొటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్, ఇండస్ఇండ్, ఆర్ఐఎల్, హిందాల్కో 1-0.2 శాతం మధ్య డీలాపడ్డాయి. (అందరికీ వ్యాక్సిన్లు కష్టతరమే!) కోఫోర్జ్ జోరు డెరివేటి స్టాక్స్‌లో కోఫోర్జ్, మైండ్‌ట్రీ, అదానీ ఎంటర్, ఐజీఎల్, బంధన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, సన్ టీవీ, ఇండిగో, వేదాంతా, టాటా పవర్, సెయిల్, క్యాడిలా, టాటా కెమ్ 7.5-3.4 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. మరోపక్క పీవీఆర్, శ్రీరామ్ ట్రాన్స్, పీఎన్బీ, భారత్ ఫోర్జ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఎస్కార్ట్స్, ఎల్ఐసీ హౌసింగ్, అపోలో టైర్, ఎంఅండ్ఎం ఫైనాన్స్ 6-1 శాతం మధ్య బలహీనపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,568 లాభపడగా.. 1,352 నష్టాలతో నిలిచాయి. ఎఫ్‌పీఐల వెనకడుగు నగదు విభాగంలో ఇటీవల పెట్టుబడులకే కట్టుబడుతున్నవిదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) సోమవారం దాదాపు రూ. 324 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టారు. అయితే దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 486 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. కాగా.. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 2,721 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 2,425 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
47,000 దాటేసింది- వెనకడుగు వేస్తోంది
ముంబై, సాక్షి: కొద్ది రోజులుగా సరికొత్త రికార్డులతో దూసుకెళుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు తాజాగా కన్సాలిడేషన్ బాట పట్టాయి. స్వల్ప ఆటుపోట్ల మధ్య కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 126 పాయింట్లు క్షీణించి 46,764కు చేరింది. నిఫ్టీ సైతం 36 పాయింట్లు క్షీణించి 13,705 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ మార్కెట్ చరిత్రలో తొలిసారి 47,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించింది. 47,026 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. అయితే తదుపరి అమ్మకాలు తలెత్తడంతో 46,744 వద్ద కనిష్టానికీ చేరింది. ఇక నిఫ్టీ 13,771-13,693 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. ఆర్థిక రికవరీ అంచనాలు, ఈక్విటీలలో ఎఫ్‌పీఐల నిరవధిక పెట్టుబడుల కారణంగా ఇటీవల దేశీ స్టాక్ మార్కెట్లు రికార్డుల ర్యాలీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. గురువారం యూఎస్ స్టాక్ ఇండెక్సులు చరిత్రాత్మక గరిష్టాల వద్ద ముగిశాయి. నాస్డాక్ వరుసగా మూడో రోజు సరికొత్త గరిష్టంవద్ద నిలవడం గమనార్హం. (బెక్టర్స్ ఫుడ్ ఐపీవో- వెల్లువెత్తిన బిడ్స్) ఐటీ అప్ ఎన్ఎస్ఈలో ఐటీ ఇండెక్స్ దాదాపు 2 శాతం జంప్‌చేగా.. ఎఫ్ఎంసీజీ 0.15 శాతం పుంజుకుంది. రియల్టీ, ప్రయివేట్, పబ్లిక్ బ్యాంక్స్, మెటల్, మీడియా 0.8-0.4 శాతం మధ్య బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, టీసీఎస్, యూపీఎల్, బజాజ్ ఆటో, ఎల్అండ్టీ, డాక్టర్ రెడ్డీస్, హీరో మోటో 2,7-0.8 శాతం మధ్య ఎగశాయి. అయితే హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, కొటక్ బ్యాంక్, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఇండస్ఇండ్, బజాజ్ ఫైనాన్స్, ఐషర్ 1.4-0.7 శాతం మధ్య నీరసించాయి. కోఫోర్జ్ ప్లస్ డెరివేటివ్స్‌లో కోఫోర్జ్, మైండ్‌ట్రీ, నౌకరీ, పిడిలైట్, కాల్గేట్ పామోలివ్ 4.25-1.2 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోవైపు శ్రీరామ్ ట్రాన్స్, సన్ టీవీ, ఇండస్ టవర్, ఆర్ఈసీ, సెయిల్, అశోక్ లేలాండ్ 2-1 శాతం క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6 శాతం చొప్పున డీలాపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,435 నష్టపోగా.. 699 లాభాలతో ట్రేడవుతున్నాయి. ఎఫ్‌ఫీఐల జోరు నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,355 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,494 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 1,982 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1,718 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
46,000 దాటేసిన సెన్సెక్స్‌ప్రెస్
ముంబై, సాక్షి: రికార్డుల సాధనే లక్ష్యంగా దేశీ స్టాక్ మార్కెట్లు చెలరేగుతున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో మరోసారి సరికొత్త రికార్డులకు తెరతీశాయి. సెన్సెక్స్ 495 పాయింట్లు జంప్‌చేసి 46,103 వద్ద ముగిసింది. వెరసి మార్కెట్ చరిత్రలో తొలిసారి 46,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 136 పాయింట్లు జమ చేసుకుని 13,529 వద్ద స్థిరపడింది. తద్వారా చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. కోవిడ్-19 కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నవార్తలతో మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం రికార్డ్ గరిష్టాల వద్ద ముగిశాయి. దీంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభించినట్లు స్టాక్ నిపుణులు పేర్కొన్నారు. ఆర్థిక రికవరీపై అంచనాలు, కోవిడ్-19 వ్యాక్సిన్లపై ఆశలు దేశీయంగా సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు తెలియజేశారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 46,164 వద్ద, నిఫ్టీ 13,549 వద్ద కొత్త రికార్డులను సాధించాయి. చదవండి: (బ్యాంకింగ్: డిజిటల్ సేవల్లో సవాళ్లేంటి?) మీడియా స్పీడ్.. ఎన్ఎస్ఈలో ప్రధానంగా మీడియా, ప్రయివేట్ రంగ బ్యాంక్స్, రియల్టీ, ఐటీ, ఎఫ్ఎంసీజీ 4-1 శాతం మధ్య ఎగశాయి. అయితే పీఎస్‌యూ బ్యాంక్స్, మెటల్ 1-0.5 శాతం చొప్పున డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో యూపీఎల్, ఐవోసీ, ఏషియన్ పెయింట్స్, కొటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, యాక్సిస్, ఐటీసీ, ఆర్ఐఎల్, ఐటీసీ, హెచ్‌యూఎల్ 4.7-1.3 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే హిందాల్కో, అల్ట్రాటెక్, శ్రీసిమెంట్, విప్రో, గ్రాసిమ్, టాటా స్టీల్, మారుతీ, ఎస్బీఐ, బజాజ్ ఆటో, సిప్లా 1.5-0.4 శాతం మధ్య డీలాపడ్డాయి. చదవండి: (వ్యాక్సిన్ షాక్- పసిడి ధరల పతనం) సిమెంట్ వీక్ డెరివేటివ్స్‌లో పీవీఆర్, ఆర్ఈసీ, కమిన్స్, ఐడిఎఫ్సీ ఫస్ట్, జీఎంఆర్, ఐడియా, సన్ టీవీ, బీఈఎల్ డీఎల్ఎఫ్ 7.5-3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు కెనరా బ్యాంక్, పీఎన్బీ, టీవీఎస్ మోటార్, సెయిల్, జూబిలెండ్ ఫుడ్, అపోలో టైర్, ఏసీసీ, రామ్‌కో సిమెంట్, అంబుజా, పెట్రోనెట్ 6.6- 1.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,767 లాభపడగా.. 1,200 నష్టాలతో నిలిచాయి. ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,910 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,641 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 3,792 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 2,767 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
రికార్డులే హద్దుగా.. మార్కెట్లు షురూ
ముంబై, సాక్షి: రికార్డుల సాధనే లక్ష్యంగా దేశీ స్టాక్ మార్కెట్లు చెలరేగుతున్నాయి. దీంతో మరోసారి చరిత్రాత్మక గరిష్టాల వద్ద ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 284 పాయింట్లు ఎగసి 45,893కు చేరింది. నిఫ్టీ సైతం 80 పాయింట్లు బలపడి 13,473 వద్ద ట్రేడవుతోంది. కోవిడ్-19 కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నవార్తలతో మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం రికార్డ్ గరిష్టాల వద్ద ముగిశాయి. దీంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభించినట్లు స్టాక్ నిపుణులు పేర్కొన్నారు. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్ 45,926ను తాకింది. ఈ బాటలో నిఫ్టీ 13,484కు చేరింది. ఇవి సరికొత్త గరిష్టాలుకాగా.. ఆర్థిక రికవరీపై అంచనాలు, కోవిడ్-19 వ్యాక్సిన్లపై ఆశలు దేశీయంగా సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు ఈ సందర్భంగా మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. జోరుగా.. ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా మీడియా పీఎస్‌యూ బ్యాంక్స్, ఫార్మా, ఐటీ, రియల్టీ 2-1 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో సన్ ఫార్మా, యూపీఎల్, హెచ్‌సీఎల్ టెక్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, గెయిల్, ఏషియన్ పెయింట్స్, దివీస్ ల్యాబ్స్, టీసీఎస్ 2.25-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే హెచ్డీఎఫ్సీ లైఫ్, మారుతీ, ఐషర్, శ్రీసిమెంట్, టైటన్, అల్ట్రాటెక్, బ్రిటానియా, బజాజ్ ఆటో మాత్రమే అదికూడా 0.5-0.2 శాతం మధ్య డీలాపడ్డాయి. పీఎస్‌యూ షేర్లు అప్ డెరివేటివ్స్‌లో బీఈఎల్ 7 శాతం దూసుకెళ్లగా.. ఆర్ఈసీ, భెల్, జీఎంఆర్, పీఎన్బీ, జీ, పీవీఆర్, బీవోబీ, పీఎఫ్సీ, గ్లెన్‌మార్క్ 4.2-2.2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు రామ్‌కో సిమెంట్, అపోలో టైర్, ఏసీసీ, అంబుజా, బంధన్ బ్యాంక్, ఎక్సైడ్ 1- 0.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,532 లాభపడగా.. 681 నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,910 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,641 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 3,792 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 2,767 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
ఈ షేర్లు- రేస్ గుర్రాలు
ముంబై, సాక్షి: ఓవైపు దేశీ స్టాక్ మార్కెట్లు రికార్డుల ర్యాలీ చేస్తుంటే.. మరోవైపు సానుకూల వార్తల నేపథ్యంలో కొన్ని ఎంపిక చేసిన కౌంటర్లు భారీ లాభాలతో దూసుకెళ్లాయి. వెరసి నేటి ట్రేడింగ్‌లో కొన్ని కంపెనీల షేర్లు సరికొత్త గరిష్టాలను తాకాయి. జాబితాలో అల్ట్రాటెక్, గుడ్ఇయర్ ఇండియా, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం.. మార్కెట్ క్యాప్ సిమెంట్ రంగ దిగ్గజం అల్ట్రాటెక్ షేరు ఎన్ఎస్ఈలో 3 శాతం ఎగసి రూ. 5.211 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 5,237 వద్ద సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 1.5 లక్షల కోట్లను తాకడం విశేషం. ఇటీవల 12.8 ఎంటీపీఏ ప్లాంటు ఏర్పాటుకు బోర్డు అనుమతించింది. ఇందుకు రూ. 5,477 కోట్లు వెచ్చించనుంది. దీంతో కంపెనీ మొత్తం సిమెంట్ తయారీ సామర్థ్యం 136.25 ఎంటీపీఏకు చేరనుంది. బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో రెసిడెన్షియల్ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించడంతో గోద్రెజ్ ప్రాపర్టీస్ షేరు 4 శాతం లాభపడి రూ. 1,255 వద్ద ముగిసింది. తొలుత రూ. 1262 వద్ద లైఫ్‌టైమ్ గరిష్టానికి చేరింది. 18 ఎకరాలలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు కంపెనీ తెలియజేసింది. చదవండి: (పసిడి, వెండి- 2 వారాల గరిష్టం) డీమార్ట్ జోరు వాటాదారులకు షేరుకి రూ. 80 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించడంతో గుడ్ఇయర్ ఇండియా షేరు ఎన్ఎస్ఈలో తొలుత 18 శాతం దూసుకెళ్లింది. రూ. 1,179 సమీపంలో సరికొత్త గరిష్టాన్ని చేరింది. చివరికి 16 శాతం లాభపడి రూ. 1,157 వద్ద ముగిసింది. డివిడెండ్ చెల్లింపునకు ఈ నెల 17 రికార్డ్‌డేట్‌గా పేర్కొంది. గత 7 రోజుల్లో ఈ షేరు 41 శాతం పెరిగింది! ఇక డీమార్ట్ స్టోర్ల కంపెనీ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ షేరు ఎన్ఎస్ఈలో 6 శాతం బలపడి రూ. 2,678 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో రూ. 2,689 వద్ద రికార్డ్ గరిష్టాన్ని తాకింది. గత 6 రోజుల్లో ఈ షేరు 16 శాతం ర్యాలీ చేసింది. కోవిడ్-19 లాక్‌డవున్‌ల తదుపరి తిరిగి బిజినెస్ జోరందుకోవడంతో ఈ కౌంటర్‌కు డిమాండ్ పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. -
లాభాలతో షురూ- కొత్త గరిష్టాలకు మార్కెట్లు
ముంబై, సాక్షి: దేశీ స్టాక్ మార్కెట్ల స్పీడ్ కొనసాగుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 238 పాయింట్లు జంప్‌చేసి 45,665కు చేరింది. నిఫ్టీ సైతం 62 పాయింట్లు పెరిగి 13,418 వద్ద ట్రేడవుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 45,675 వద్ద, నిఫ్టీ 13,426 వద్ద సరికొత్త గరిష్టాలను తాకాయి! ఆర్థిక రికవరీపై అంచనాలు, కోవిడ్-19 వ్యాక్సిన్లపై ఆశలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు ఈ సందర్భంగా మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. మెటల్ వీక్ ఎన్ఎస్ఈలో మెటల్(0.3 శాతం) మినహా అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్, రియల్టీ, ఆటో 1.3 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో మారుతీ, యూపీఎల్, అల్ట్రాటెక్, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ, గెయిల్, ఎంఅండ్ఎం, హెచ్‌సీఎల్ టెక్, ఆర్ఐఎల్ 2.6-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్, గ్రాసిమ్, ఐవోసీ, ఐసీఐసీఐ 1.3-0.3 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఫైనాన్స్ జోష్ డెరివేటివ్స్‌లో కెనరా బ్యాంక్, పీఎన్బీ, బీవోబీ, ఎక్సైడ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, యూబీఎల్, ఐడియా 7.4-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు లుపిన్, జిందాల్ స్టీల్, మ్యాక్స్ ఫైనాన్స్, శ్రీరామ్ ట్రాన్స్, ఆర్బీఎల్ బ్యాంక్ 1-0.5 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,566 లాభపడగా.. 621 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 3,792 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,767 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 2,970 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 1,972 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విదితమే. -
ప్యాకేజీ ఆశలు- యూఎస్ మార్కెట్ల రికార్డ్స్
న్యూయార్క్: కొత్త ప్రెసిడెంట్‌గా జనవరిలో బాధ్యతలు స్వీకరించనున్న జో బైడెన్ ప్రభుత్వం సహాయక ప్యాకేజీకి తెరతీయనుందన్నఅంచనాలు వారాంతాన అమెరికా స్టాక్ మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. ఇన్వెస్టర్లు ప్రధానంగా ఎయిర్‌లైన్స్, క్రూయిజర్, ఇంధన రంగ కౌంటర్లలో కొనుగోళ్లకు ఎగబడటంతో శుక్రవారం మార్కెట్లు సరికొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. డోజోన్స్ 249 పాయింట్లు(0.85 శాతం) ఎగసి 30,218 వద్ద నిలిచింది. ఎస్అండ్పీ 32 పాయింట్లు(0.9 శాతం) లాభపడి 3,699 వద్ద ముగిసింది. నాస్డాక్ సైతం 87 పాయింట్లు(0.7 శాతం) బలపడి 12,464 వద్ద స్థిరపడింది. ఎనర్జీ, మెటీరియల్స్, ఇండస్ట్రియల్స్ రంగాలకు కొనుగోళ్ల మద్దతు లభించినట్లు మార్కెట్ నిపుణులు తెలియజేశారు. ఉపాధి వీక్ నవంబర్‌లో వ్యవసాయేతర రంగంలో 2.45 లక్షల మందికి మాత్రమే ఉపాధి లభించినట్లు కార్మిక శాఖ గణాంకాలు వెల్లడించాయి. గత ఆరు నెలల్లో ఇది కనిష్టంకాగా.. 4.69 లక్షల మందికి ఉపాధి లభించగలదని విశ్లేషకులు వేసిన అంచనాలకు దెబ్బ తగిలింది. అక్టోబర్‌లో 6.1 లక్షల ఉద్యోగాల కల్పన జరగడం గమనార్హం! గత నెలలో ఉపాధి క్షీణించడానికితోడు.. సెకండ్‌వేవ్‌లో కేసులు పెరగడం, శీతల సమస్యల కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించనున్నట్లు కొత్త ప్రెసిడెంట్‌గా ఎంపికైన జో బైడెన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. దీంతో జీడీపీకి దన్నుగా కాంగ్రెస్ సాధ్యమైనంత త్వరగా సహాయక ప్యాకేజీని ఆమోదించవలసి ఉన్నట్లు డిమాండ్ చేశారు. ఉద్యోగ గణాంకాలు నిరాశపరచినప్పటికీ బైడెన్ వ్యాఖ్యలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. 5.4 శాతం అప్ ఇటీవల చమురు ధరలు బలపడుతుండటంతో ఎనర్జీ రంగం 5.4 శాతం ఎగసింది. డైమండ్‌బ్యాక్ ఎనర్జీ, ఆక్సిడెంటల్ పెట్రోలియం 13 శాతం చొప్పున దూసుకెళ్లాయి. షెవ్రాన్ కార్పొరేషన్ 4 శాతం పుంజుకోగా.. 787 డ్రీమ్‌లైనర్ విమానాల తయారీని తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతో బోయింగ్ ఇంక్ 2 శాతం క్షీణించింది. ఇతర కౌంటర్లలో నార్వేజియన్ క్రూయిజ్ 3.3 శాతం, అమెరికన్ ఎయిర్‌లైన్స్ 2 శాతం చొప్పున లాభపడ్డాయి. -
కొత్త రికార్డులతో మార్కెట్లు షురూ
ముంబై, సాక్షి: కరోనా వైరస్ కట్టడికి ఫైజర్ వ్యాక్సిన్‌ను యూకే ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్ వచ్చింది. దీంతో హుషారుగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 137 పాయింట్లు పెరిగి 44,755కు చేరగా.. నిఫ్టీ 50 పాయింట్లు జమ చేసుకుని 13,163 వద్ద ట్రేడవుతోంది. తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 44,953వరకూ ఎగసింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. తద్వారా 45,000 పాయింట్ల మార్క్‌కు చేరువైంది. ఇక నిఫ్టీ 13,216ను అధిగమించడం ఇంట్రాడే గరిష్టం రికార్డును సాధించింది. ఈ ఏడాది క్యూ3లో దేశ ఆర్థిక వ్యవస్థ రికవర్‌కానున్న అంచనాలు సైతం సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. మీడియా, మెటల్స్ అప్ ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. మీడియా, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్స్ 2-1.2 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో మారుతీ, గెయిల్, హిందాల్కో, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హీరో మోటో, ఎస్బీఐ 3-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఎస్బీఐ లైఫ్, ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, యాక్సిస్, గ్రాసిమ్, అల్ట్రాటెక్, యూపీఎల్, ఐటీసీ, టీసీఎస్, బజాజ్ ఆటో 1.3-0.4 శాతం మధ్య నీరసించాయి. ఎఫ్‌అండ్‌వోలో డెరివేటివ్స్‌లో టాటా కెమ్, జీ, ఐబీ హౌసింగ్, భారత్ ఫోర్జ్, కోఫోర్జ్, సెయిల్, శ్రీరామ్ ట్రాన్స్, మదర్సన్ 4-2.6 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే అదానీ ఎంటర్, గోద్రెజ్ సీపీ, బాష్ 1 స్థాయిలో డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.7 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 357 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,636 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 3,242 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. అయితే డీఐఐలు రూ. 1,043 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
డోజోన్స్ కొత్త రికార్డ్- ఎందుకీ స్పీడ్?
న్యూయార్క్, సాక్షి: మంగళవారం యూఎస్ స్టాక్ మార్కెట్లలో మరో కొత్త రికార్డ్ నమోదైంది. డోజోన్స్ 455 పాయింట్లు(1.55 శాతం) ఎగసి 30,046 వద్ద ముగిసింది. తద్వారా మార్కెట్ చరిత్రలో తొలిసారి 30,000 పాయింట్ల మైలురాయిని అందుకుంది. ఈ బాటలో ఎస్అండ్పీ 58 పాయింట్లు(1.6 శాతం) పురోగమించి 3,635 వద్ద నిలవగా.. నాస్డాక్ 156 పాయింట్లు(1.3 శాతం) బలపడి 12,037 వద్ద స్థిరపడింది. కాగా.. ఈ నెలలో ఇప్పటివరకూ డోజోన్స్ 13 శాతం దూసుకెళ్లింది. ఇంతక్రితం 1987 నవంబర్‌లో మాత్రమే ఈ స్థాయి లాభాలు ఆర్జించగా.. ఎస్అండ్పీ 11 శాతం, నాస్డాక్ 10.3 శాతం చొప్పున ర్యాలీ చేశాయి. తద్వారా ఈ ఏడాది ఏప్రిల్ తదుపరి గరిష్టంగా లాభపడ్డాయి. బ్లూచిప్స్ అండ మంగళవారం డోజోన్స్‌కు బలాన్నిచ్చిన కౌంటర్లలో షెవ్రాన్ 5 శాతం, జేపీ మోర్గాన్ చేజ్ 4.6 శాతం, గోల్డ్‌మన్ శాక్స్ 3.8 శాతం చొప్పున జంప్ చేశాయి. మార్కెట్లకు ప్రోత్సాహాన్నిచ్చిన ఇతర కౌంటర్లలో టెస్లా ఇంక్ 6.5 శాతం దూసుకెళ్లగా.. ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, గూగుల్, నెట్‌ఫ్లిక్స్, యాపిల్ 3-1 శాతం మధ్య ఎగశాయి. కాగా.. ఫార్మా దిగ్గజాలలో మోడర్నా ఇంక్ 2.5 శాతం, ఆస్ట్రాజెనెకా 2 శాతం చొప్పున క్షీణించాయి. జోరు ఎందుకంటే? ఇటీవల ఫార్మా దిగ్గజాలు ఫైజర్, మోడర్నా ఇంక్ కోవిడ్-19 కట్టడికి రూపొందించిన వ్యాక్సిన్లు 95 శాతం ఫలితాలనిచ్చినట్లు వెల్లడించడంతో సెంటిమెంటు బలపడింది. ఈ బాటలో బ్రిటిష్ కంపెనీ ఆస్ట్రాజెనెకా సైతం ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్‌ను విడుదల చేయగలమని భావిస్తున్నట్లు పేర్కొంది. ఇక మరోవైపు యూఎస్ కొత్త ప్రెసిడెంట్‌గా జో బైడెన్ బాధ్యతలు చేపట్టేందుకు అడ్డంకులు తొలగిపోవడంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. రాజకీయ అనిశ్చితులకు చెక్ పడటం ఇందుకు సహకరించింది. గతంలో కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్‌కు చైర్‌పర్సన్‌గా పనిచేసిన జానెట్ యెలెన్‌ను ఆర్థిక మంత్రిగా బైడెన్ ఎంపిక చేసుకునే వీలున్నట్లు వెలువడిన వార్తలు ఈ సానుకూల అంశాలకు జత కలసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మార్కెట్ల ఫ్రెండ్లీగా వ్యవహరించే యెలెన్ వడ్డీ రేట్లను నేలకు దించడం ద్వారా ఆర్థిక రికవరీకి పాటుపడినట్లు తెలియజేశారు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో మరోసారి ప్రభుత్వం భారీ సహాయక ప్యాకేజీకి రూపకల్పన చేసే అవకాశమున్నట్లు అంచనాలు బలపడ్డాయి. వెరసి మార్కెట్లు సరికొత్త రికార్డుల బాటలో పరుగు తీస్తున్నట్లు నిపుణులు వివరించారు. -
రికార్డ్స్ రికార్డ్స్- తొలిసారి 13,000కు నిఫ్టీ
ముంబై, సాక్షి: కరోనా వైరస్ కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్న వార్తలు ఇన్వెస్టర్లకు జోష్‌నిస్తున్నాయి. దీంతో దేశీ స్టాక్ మార్కెట్లలో రికార్డుల ర్యాలీ కొనసాగుతోంది. వెరసి నిఫ్టీ.. మార్కెట్ చరిత్రలో తొలిసారి 13,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ఇక సెన్సెక్స్ సైతం ట్రేడింగ్ ప్రారంభంలోనే 44,421 పాయింట్ల వద్ద ఇంట్రాడేలో చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. ప్రస్తుతం సెన్సెక్స్ 320 పాయింట్లు ఎగసి 44,397 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 95 పాయింట్లు పెరిగి 13,021 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో నిఫ్టీ 13,027 వరకూ జంప్‌చేసింది. కోవిడ్-19 కట్టడికి ఈ ఏడాది చివరికల్లా ఫైజర్, మోడర్నా, ఆస్ట్రాజెనెకాసహా పలు కంపెనీలు వ్యాక్సిన్లను విడుదల చేయనున్న వార్తలు సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. బ్యాంక్స్ భేష్ ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఆటో, మెటల్, రియల్టీ 1 శాతం స్థాయిలో వృద్ధి చూపాయి. నిఫ్టీ దిగ్గజాలలో అదానీ పోర్ట్స్, మారుతీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్, ఐసీఐసీఐ, పవర్‌గ్రిడ్, ఓఎన్జీసీ, ఐటీసీ, ఎల్అండ్టీ, ఏషియన్ పెయింట్స్ 3.2-1.2 శాతం మధ్య ఎగశాయి. బ్లూచిప్స్‌లో కేవలం హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ, సన్ ఫార్మా అదికూడా 0.5-0.2 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఇన్ఫ్రాటెల్ జూమ్ డెరివేటివ్ కౌంటర్లలో ఇన్ఫ్రాటెల్ 8 శాతం జంప్‌చేయగా.. మైండ్‌ట్రీ, జీఎంఆర్, ఆర్బీఎల్ బ్యాంక్, ఎస్ఆర్ఎఫ్, అపోలో టైర్, ఐడియా, టాటా కెమికల్స్ 3-2 శాతం మధ్య బలపడ్డ్డాయి. అయితే మరోపక్క ముత్తూట్ ఫైనాన్స్, ఐడీఎఫ్సీ ఫస్ట్, బీహెచ్ఈఎల్, టీవీఎస్ మోటార్, యూబీఎల్, కేడిలా హెల్త్, ఎన్ఎండీసీ, సన్ టీవీ 1-0.4 శాతం మధ్య డీలా పడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.8 శాతం చొప్పున ఎగశాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,255 లాభపడగా.. 526 నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 4,738 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,944 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. వారాంతాన ఎఫ్‌పీఐలు రూ. 3,861 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 2,869 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
మార్కెట్లు: రికార్డులే రికార్డులు
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లలో దీపావళి సందడి కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడుతుండటంతో ఇండెక్సులు నిరవధికంగా పరుగు తీస్తున్నాయి. వెరసి రోజుకో కొత్త రికార్డును సృష్టిస్తున్నాయి. తాజాగా సెన్సెక్స్ 315 పాయింట్లు ఎగసి 43,953 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 94 పాయింట్లు పుంజుకుని 12,874 వద్ద నిలిచింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. ఇంట్రాడేలో తొలిసారి సెన్సెక్స్ 44,000 పాయింట్ల మార్క్‌ను అందుకుంది. నిఫ్టీ సైతం 13,000 పాయింట్ల మార్క్ సమీపానికి అంటే 12,934కు చేరింది. ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్ ఆశలు రేపగా.. తాజాగా మోడర్నా ఇంక్ సైతం వ్యాక్సిన్ విజయవంతమైనట్లు పేర్కొంది. దీంతో సోమవారం యూఎస్ మార్కెట్లు సరికొత్త గరిష్టాల వద్ద నిలవగా.. దేశీయంగానూ ఇన్వెస్టర్లకు జోష్ వచ్చినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఆటో సైతం ఎన్ఎస్ఈలో ప్రధానంగా మెటల్, బ్యాంకింగ్, రియల్టీ రంగాలు 2.5-2 శాతం లాభపడగా.. ఆటో 1 శాతం బలపడింది. మీడియా, ఫార్మా, ఐటీ 1.3-0.3 శాతం మధ్య డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ లైఫ్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్, ఎల్అండ్టీ 6.2- 2.4 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే బీపీసీఎల్, హీరో మోటో, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌యూఎల్ 4.3-0.6 శాతం మధ్య క్షీణించాయి. చదవండి: (వ్యాక్సిన్ ఆశలు- యూఎస్ కొత్త రికార్డ్స్) చిన్న షేర్లు అప్ డెరివేటివ్ కౌంటర్లలో అదానీ ఎంటర్, జిందాల్ స్టీల్, అపోలో టైర్, నాల్కో, ఐసీఐసీఐ ప్రు, ఎంఆర్ఎఫ్, పేజ్, అంబుజా, టాటా పవర్ 6-3.4 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. మరోపక్క పిరమల్, టొరంట్ ఫార్మా, సన్ టీవీ, ఐబీ హౌసింగ్, లుపిన్, బాష్, ముత్తూట్ 3.2- 1.8 శాతం మధ్య నీరసించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,564 లాభపడగా.. 1,254 నష్టపోయాయి. చదవండి: (జుకర్‌బర్గ్‌ను దాటేసిన ఎలన్ మస్క్?) అమ్మకాలవైపు నగదు విభాగంలో శనివారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 78.5 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 20.3 కోట్లు కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 1,936 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 2,462 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. కాగా.. ఈ నెలలో 2-13 మధ్య కాలంలో ఎఫ్‌పీఐలు దేశీ స్టాక్స్‌లో నికరంగా రూ. 29,436 కోట్లను ఇన్వెస్ట్ చేయడం విశేషం! -
వ్యాక్సిన్ ఆశలు- యూఎస్ కొత్త రికార్డ్స్
న్యూయార్క్: కోవిడ్-19 సెకండ్ వేవ్‌తో వణుకుతున్న ప్రపంచ దేశాలకు తాజాగా మోడర్నా ఇంక్ వ్యాక్సిన్ ద్వారా అభయం ఇవ్వడంతో సోమవారం యూఎస్ మార్కెట్లకు హుషారొచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో డోజోన్స్ 479 పాయింట్లు(1.6 శాతం) జంప్‌చేసి 29,959 వద్ద ముగిసింది. ఈ బాటలో ఎస్అండ్పీ 42 పాయింట్లు(1.2 శాతం) ఎగసి 3,627 వద్ద నిలవగా.. నాస్డాక్ 95 పాయింట్లు(0.8 శాతం) పెరిగి 11,924 వద్ద స్థిరపడింది. వెరసి మార్కెట్లు లైఫ్‌టైమ్ గరిష్టాలకు చేరాయి. ఇంతక్రితం ఈ ఏడాది ఫిబ్రవరిలో మాత్రమే ప్రధాన ఇండెక్సులు మూడూ ఒకేరోజు చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ రసెల్-2000 సైతం ఆల్‌టైమ్ హైను తాకడం విశేషం! ఇప్పటికే తమ వ్యాక్సిన్ 90 శాతంపైగా సురక్షితమంటూ ఫార్మా దిగ్గజంఫైజర్ డేటాను విశ్లేషించిన విషయం విదితమే. దీంతో సెంటిమెంటు మరింత బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. చదవండి: (మరోసారి మార్కెట్లకు దివాలీ జోష్?!) ఫైజర్ డీలా కోవిడ్-19 కట్టడికి రూపొందించిన వ్యాక్సిన్ 94.5 శాతం సురక్షితమంటూ ప్రకటించిన మోడర్నా ఇంక్ షేరు 10 శాతం దూసుకెళ్లింది. అయితే ఇతర ఫార్మా కౌంటర్లలో ఫైజర్ ఇంక్ 3.3 శాతం, ఆస్ట్రాజెనెకా 2 శాతం చొప్పున డీలా పడ్డాయి. వ్యాక్సిన్ అంచనాలతో ఎయిర్‌లైన్, క్రూయిజర్ స్టాక్స్‌కు సైతం డిమాండ్ పెరిగింది. కార్నివాల్ గ్రూప్ 10 శాతం జంప్‌చేయగా. నార్వేజియన్ క్రూయిజ్లైన్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్, అమెరికన్ ఎయిర్‌లైన్స్, సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ 6-4 శాతం మధ్య పురోగమించాయి. ఈ బాటలో ప్రత్యర్థి సంస్థ టాబ్మెన్ సెంటర్స్ కొనుగోలు ధరను 80 శాతం తగ్గించిన వార్తలతో సైమన్ ప్రాపర్టీ గ్రూప్ షేరు దాదాపు 6 శాతం ఎగసింది. ఈ వారం రిటైల్ రంగ దిగ్గజాలు వాల్‌మార్ట్ ఇంక్, హోమ్ డిపో, టార్గెట్ కార్ప్, లోవ్స్ క్యూ3(జులై- సెప్టెంబర్) త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నాయి. చదవండి: (సెన్సెక్స్‌ప్రెస్- 44,000 దాటేసింది!) -
ముహూరత్ అదుర్స్- మార్కెట్ల రికార్డ్స్
గత దీపావళి నుంచి ఈ దీపావళి వరకూ విశేషాలు సెన్సెక్స్ : 43,638= దాదాపు 4400 పాయింట్లు(11.4 శాతం) అప్ నిఫ్టీ: 12,780= సుమారు 1150 పాయింట్లు(10.18 శాతం) ప్లస్ డాలరుతో రూపాయి మారకం= 74.60- రూ. 3.76(5.3 శాతం) డౌన్ ముంబై: సరికొత్త ఏడాది సంవత్ 2077 తొలి రోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో బోణీ కొట్టాయి. అంతేకాకుండా సెన్సెక్స్, నిఫ్టీ లైఫ్‌టైమ్ గరిష్టాలను తాకాయి. దీపావళి సందర్భంగా నిర్వహించిన ముహూరత్ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 195 పాయింట్లు ఎగసి 43,638 వద్ద నిలిచింది. నిఫ్టీ 60 పాయింట్లు పుంజుకుని 12,780 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 43,831 వద్ద, నిఫ్టీ 12,829 వద్ద సరికొత్త గరిష్టాలకు చేరాయి. వెరసి సాయంత్రం 6.15-7.15 మధ్య నిర్వహించిన మూరత్ ట్రేడింగ్‌లో మార్కెట్లు మరోసారి సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. రోజంతా మార్కెట్లు లాభాల మధ్యే కదలడం విశేషం! మార్కెట్లకు ప్రధానంగా విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ఆర్థిక రికవరీపై ఆశలు, కోవిడ్-19 కట్టడికి వెలువడనున్న వ్యాక్సిన్లపై అంచనాలు బలాన్నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. దివాలీ బలిప్రతిపద నేపథ్యంలో సోమవారం స్టాక్ మార్కెట్లకు సెలవు. చదవండి: (కొనసాగుతున్న రూపాయి పతనం) బీపీసీల్ భళా ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ 0.5-0.2 శాతం మధ్య లాభపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో బీపీసీఎల్ 5.2 శాతం జంప్ చేయగా.. ఐవోసీ, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, సన్ ఫార్మా, కోల్ ఇండియా, గెయిల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్ 3-1 శాతం మధ్య వృద్ధి చూపాయి. అయితే హిందాల్కో, హీరో మోటో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, శ్రీ సిమెంట్, టైటన్, యాక్సిస్, పవర్‌గ్రిడ్, ఇండస్ఇండ్ 1.2-0.35 శాతం మధ్య బలహీనపడ్డాయి. చదవండి: (సంవత్ 2076కు లాభాల వీడ్కోలు) ఐడియా జోరు డెరివేటివ్స్‌లో ఐడియా 6.3 శాతం జంప్‌చేయగా.. కంకార్, హెచ్‌పీసీఎల్, ఐడీఎఫ్సీ ఫస్ట్, ఎన్ఎండీసీ, భెల్, గోద్రెజ్ ప్రాపర్టీస్ 5.2-1.4 శాతం మధ్య ఎగశాయి. హిందాల్కో, పిరమల్, శ్రీరామ్ ట్రాన్స్, జీఎంఆర్, ఆర్ఈసీ, అరబిందో, డీఎల్ఎఫ్, పీవీఆర్, ఎంఅండ్ఎం ఫైనాన్స్ 1 శాతం స్థాయిలో క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6-0.8 శాతం మధ్య బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,842 లాభపడగా.. 606 నష్టాలతో ముగిశాయి. ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,936 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,462 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 1514 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్ రూ. 2,239 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
మార్కెట్ల జోరు చూడతరమా..!!
ముంబై: వరుసగా 8వ రోజు దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడు చూపాయి. సెన్సెక్స్ 316 పాయింట్లు జంప్‌చేసి 43,594 వద్ద ముగిసింది. నిఫ్టీ 118 పాయింట్లు ఎగసి 12,749 వద్ద స్థిరపడింది. వెరసి ఇండెక్సులు మూడో రోజూ సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. అయితే మిడ్‌సెషన్‌కల్లా మార్కెట్లు లాభాలను పోగొట్టుకుని నష్టాలలోకి ప్రవేశించాయి. 8 రోజుల భారీ ర్యాలీ నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడం ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. తొలుత సెన్సెక్స్ 43,708 వరకూ దూసుకెళ్లింది. తదుపరి అమ్మకాలు తలెత్తడంతో 42,970 వరకూ వెనకడుగు వేసింది. అంటే గరిష్టం నుంచి దాదాపు 740 పాయింట్లు క్షీణించింది. ఇక నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 12,770- 12,571 మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. మెటల్స్ మెరుపులు ఎన్ఎస్ఈలో ఫార్మా, మెటల్ 3.5 శాతం చొప్పున జంప్‌చేయగా.. ఐటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ, రియల్టీ1.6-0.8 శాతం మధ్య బలపడ్డాయి. పీఎస్‌యూ బ్యాంక్స్, మీడియా 0.5-0.3 శాతం నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో హిందాల్కో, టాటా స్టీల్ 8 శాతం స్థాయిలో పురోగమించాయి. ఈ బాటలో డాక్టర్ రెడ్డీస్, యాక్సిస్, ఐషర్, ఐటీసీ, బజాజ్ ఫిన్, హీరో మోటో, టాటా మోటార్స్, సిప్లా, గెయిల్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, కొటక్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బీపీసీఎల్, అల్ట్రాటెక్, దివీస్ 4.2-2.8 శాతం మధ్య ఎగశాయి. అయితే ఇండస్ఇండ్ 5.25 శాతం, ఆర్ఐఎల్ 4.2 శాతం చొప్పున పతనమయ్యాయి. ఇతర బ్లూచిప్స్‌లో టైటన్, ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2-0.4 శాతం మధ్య డీలాపడ్డాయి. అపోలో అప్ డెరివేటివ్ కౌంటర్లలో అపోలో హాస్పిటల్స్, అరబిందొ, ఐజీఎల్, లుపిన్, సెయిల్, లుపిన్, జూబిలెంట్ ఫుడ్, టొరంట్ ఫార్మా, ఆర్ఈసీ, అంబుజా, మదర్సన్ 8-3.3 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. భారత్ ఫోర్జ్, ఎన్ఎండీసీ, ఐడీఎఫ్సీ ఫస్ట్, హావెల్స్, బాటా, చోళమండలం, ఎంఅండ్ఎం ఫైనాన్స్, బీవోబీ 4-2.4 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.8-0.3 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,433 లాభపడగా.. 1,295 నష్టాలతో ముగిశాయి. ఎఫ్‌పీఐల కొనుగోళ్లు నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 5,627 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. అయితే దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,309 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 4,548 కోట్లు ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 3,036 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నెల తొలి వారంలో ఎఫ్‌పీఐలు ఏకంగా రూ. 13,399 కోట్ల పెట్టుబడులు కుమ్మరించడం గమనార్హం! అక్టోబర్‌లో రూ. 14,537 కోట్లు మాత్రమే ఇన్వెస్ట్ చేశారు. -
మార్కెట్లు అదుర్స్- సెన్సెక్స్ ట్రిపుల్
ముంబై: మరోసారి దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడు చూపుతున్నాయి. వరుసగా 8వ రోజు లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు మూడో రోజూ సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 318 పాయింట్లు జంప్‌చేసి 43,596ను తాకగా.. నిఫ్టీ 104 పాయింట్లు బలపడి 12,735 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో నిఫ్టీ 12,753కు చేరగా.. సెన్సెక్స్ 43,675ను అధిగమించింది. వెరసి మార్కెట్లు మరోసారి చరిత్రాత్మక గరిష్టాలను సాధించాయి. నిఫ్టీ-50 మార్కెట్ క్యాప్(విలువ) రూ. 100 లక్షల కోట్లను అధిగమించడం విశేషం! చదవండి: (మళ్లీ చమురు ధరల సెగ) అన్ని రంగాలూ ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా ఆటో, ఫార్మా, బ్యాంకింగ్ 1.5 శాతం స్థాయిలో ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో గెయిల్, ఎంఅండ్ఎం, హీరో మోటో, కొటక్ బ్యాంక్, ఓఎన్జీసీ, సిప్లా, హెచ్డీఎఫ్సీ, దివీస్ ల్యాబ్స్, హిందాల్కో, ఐటీసీ 4-1.5 శాతం మధ్య పుంజుకున్నాయి. బ్లూచిప్స్‌లో కేవలం హెచ్‌యూఎల్, పవర్‌గ్రిడ్, హెచ్‌సీఎల్ టెక్ అదికూడా 0.7-0.2 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఎన్ఎండీసీ వీక్ డెరివేటివ్ కౌంటర్లలో బాలకృష్ణ, సెయిల్, లుపిన్, ఐబీ హౌసింగ్, అరబిందో, అపోలో హాస్పిటల్స్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, జీ, ఐజీఎల్, ఎస్కార్ట్స్, పీఎన్బీ, సన్ టీవీ 4-2 శాతం మధ్య జంప్ చేశాయి. అయితే ఎన్ఎండీసీ 4 శాతం పతనంకాగా.. బాటా, జీఎంఆర్, అపోలో టైర్, ఇండిగో, ఐడియా, హావెల్స్, వోల్టాస్ 1.2-0.4 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,119 లాభపడగా.. 551 నష్టాలతో కదులుతున్నాయి.