occupied
-
పాలస్తీనాను అదీనంలో ఉంచుకోవడం చట్టవిరుద్ధం
ది హేగ్: పాలస్తీనా ఆక్రమిత ప్రాంతాలను ఇజ్రాయెల్ తమ అ«దీనంలో ఉంచుకోవడం చట్ట విరుద్ధమని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ న్యాయస్థానం శుక్రవారం స్పష్టం చేసింది. ఆక్రమిత ప్రాంతాల నుంచి వైదొలగాలని, అక్కడ స్థిర నివాసానికి కాలనీల నిర్మాణాన్ని తక్షణం నిలిపివేయాలని సూచించింది. 57 ఏళ్ల కిందట ఆక్రమించిన పాలస్తీనా ప్రాంతాలపై ఇజ్రాయెల్ అజమాయిషీని తప్పుపడుతూ అంతర్జాతీయ న్యాయం స్థానం తీర్పు ఇవ్వడం అసాధారణ విషయంగా పేర్కొంటున్నారు. వెస్ట్‌బ్యాంక్, తూర్పు జెరూసలెంలలో ఇజ్రాయెల్ సెటిల్మెంట్లను నిర్మించడం, విస్తరించడం, ఆక్రమిత ప్రాంతాలను స్వా«దీనం చేసుకోవడం, వాటిపై నియంత్రణ, అక్కడి సహజ వనరులను వినియోగించుకోవడం, పాలస్తీనియన్లపై వివక్షతో కూడిన విధానాలను అమలు చేయడం.. ఇవన్నీ అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనేనని జడ్జీల ప్యానెల్ అభిప్రాయపడింది. ఆక్రమిత ప్రాంతాలపై ఇజ్రాయెల్‌కు సార్వ¿ౌమాధికారం లేదని, పాలస్తీనాలోని ప్రాంతాలను బలవంతంగా ఆక్రమించడంఅంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనేనని పేర్కొంది. అయితే అంతర్జాతీయ న్యాయ స్థానం ఇచి్చన ఈ తీర్పుకు కట్టుబడి ఉండాల్సిన, పాటించాల్సిన అవసరం ఇజ్రాయెల్‌కు లేదు. ఇదొక అభిప్రాయం మాత్రమే. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు దీనిపై స్పందిస్తూ.. ఆ ప్రాంతాలు యూదు ప్రజల చారిత్రక మాతృభూమిలో భాగమన్నారు. -
Russia-Ukraine war: జపొరిజియా అణు ప్లాంట్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు
కీవ్: రష్యా ఆక్రమిత జపొరిజియా అణు విద్యుత్ ప్లాంట్‌పై డ్రోన్ దాడి జరిగిందని అధికారులు తెలిపారు. ప్లాంట్‌లోని ఆరో యూనిట్ డోమ్ సహా పలు చోట్ల ఉక్రెయిన్ మిలటరీ డ్రోన్లు ఆదివారం దాడి చేశాయన్నారు. అయితే ఎటువంటి నష్టం వాటిల్లలేదని, ఎవరూ చనిపోలేదని అన్నారు. ప్లాంట్‌లో అణుధారి్మకత స్థాయిలు కూడా సాధారణంగానే ఉన్నట్లు వివరించారు. దాడి సమాచారం తమకు అందిందని అంతర్జాతీయ అణు శక్తి సంస్థ(ఐఏఈఏ) తెలిపింది. ఇటువంటి దాడులతో భద్రతాపరమైన ప్రమాదాలున్నాయని హెచ్చరించింది. యూరప్‌లోనే అతి పెద్దదైన జపొరిజియా అణు విద్యుత్కేంద్రం 2022 నుంచి రష్యా ఆ«దీనంలోనే ఉంది. ఇందులోని ఆరు యూనిట్లు కొద్ది నెలలుగా మూతబడి ఉన్నాయి. -
గాజా.. మరుభూమి!
దెయిర్ అల్ బలాహ్/జెరూసలేం/టెల్ అవీవ్: గాజాలో పరిస్థితులు నానాటికీ విషమిస్తున్నాయి. కరెంటు తదితర సదుపాయాలతో పాటు నిత్యావసరాలన్నీ పూర్తిగా నిండుకోవడంతో కొద్ది రోజుల క్రితం నుంచే పూర్తిగా పడకేసిన ఆస్పత్రులు క్రమంగా మృత్యుదిబ్బలుగా మారుతున్నాయి. రోగులు, నవజాత శిశువుల నిస్సహాయ సామూహిక మరణాలకు వేదికలుగా మారుతున్నాయి. గాజాలోని ప్రధాన ఆస్పత్రి అల్ షిఫాలో మృతుల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది. ఏకంగా 179 మృతదేహాలను ప్రాంగణంలోనే ఒకే చోట సామూహికంగా ఖననం చేసినట్టు ఆస్పత్రి డైరెక్టర్ అబూ సలామియా తాజాగా నిర్ధారించడం పరిస్థితికి అద్దం పడుతోంది! వీరిలో చాలామంది ఐసీయూ రోగులు, నవజాత శిశువులేనని సమాచారం. అక్కడ 30కి పైగా శవాలను ఖననం చేస్తుండగా చూసినట్టు అక్కణ్నుంచి బయటపడ్డ ప్రత్యక్ష సాక్షి కూడా వెల్లడించారు. పలు ఇతర ఆస్పత్రుల్లోనైతే మృతదేహాలు కుళ్లి దుర్వాసన వెదజల్లుతున్నట్టు సమచారం. ప్రస్తుతం ఉత్తర గాజాలో అల్ అహ్లి బాప్టిస్ట్ ఆస్పత్రి మాత్రమే కాస్తో కూస్తో పని చేస్తోందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఒక్క మంగళవారమే 500 మందికి పైగా క్షతగాత్రులు అందులో చేరినట్టు వివరించింది. కరెంటు లేకపోవడం, ఆక్సిజన్, ఇంధనంతో పాటు ఆహార పదార్థాలు, నిత్యావసరాలన్నీ నిండుకుంటుండటంతో అది కూడా ఏ క్షణమైనా పూర్తిగా మూతబడే పరిస్థితి నెలకొందని ఆవేదన వెలిబుచ్చింది. మరోవైపు గాజా అంతటా ఎటు చూసినా వ్యర్థాల కుప్పలే కనిపిస్తున్నాయి. ఎటు చూసినా మురుగు నీరు పొంగి పొర్లుతోంది. వాటిద్వారా ఇప్పటికే పలు అంటురోగాలు ప్రబలుతున్నాయి. ఇవి మరింత విజృంభిస్తే గాజా మరుభూమిగా మారుతుందంటూ ఆందోళన వ్యక్తమవుతోంది. చలి, చెదురుమదురు వర్షాలతో పరిస్థితి మరింతగా దిగజారుతోంది. జబాలియాలో 30 మంది మృతి: మరోవైపు, గాజాలో ఇజ్రాయెల్ యుద్ధ బీభత్సం మంగళవారం కూడా యథాతథంగా కొనసాగింది. ఆస్పత్రులతో పాటు ఇంకా చెదురుమదురుగా మిగిలి ఉన్న భవనాలన్నీ క్షిపణి, బాంబు దాడులు, కాల్పులతో అల్లాడిపోయాయి. ఉత్తర గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంపై జరిగిన బాంబు దాడులు మరో 30 మందిని బలిగొన్నట్టు తెలుస్తోంది. గాజాలోని పార్లమెంటు భవనాన్ని ఇజ్రాయెల్ సైనికులు ఆక్రమించారు. భవనం లోపల ఇజ్రాయెల్ పతాకాలతో ఉన్న సైనికుల ఫొటోలు ఆ దేశ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్)కు చెందిన గోల్డెన్ బ్రిగేడ్ గాజా పార్లమెంటును స్వా«దీనం చేసుకున్నట్టు సమాచారం. మరోవైపు ఇప్పటిదాకా 100 మందికి పైగా ఐరాస వర్కర్లు యుద్ధానికి బలయ్యారు. మరణించిన పాలస్తీనావాసుల సంఖ్య 11,550 దాటినట్టు గాజా ఆరోగ్య శాఖ చెబుతోంది. వీరిలో మూడొంతులు మహిళలు, పిల్లలేనని పేర్కొంది. ఆస్పత్రులను కాపాడాలి: బైడెన్ బందీల విడుదలకు కృషి చేస్తున్నట్టు తాము కూడా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. అల్ షిఫాతో పాటు గాజాలో ఆస్పత్రులన్నింటినీ ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిగా కాపాడాలన్నారు. ఏ ఆస్పత్రి మీదా ఇజ్రాయెల్ సైన్యం దుందుడుకు చర్యలకు పాల్పడరాదని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో, పట్టు వీడేందుకు ఇప్పటిదాకా ససేమిరా అంటున్న ఇజ్రాయెల్ కూడా కాస్త దిగొస్తున్నట్టు కన్పిస్తోంది. గాజా ఆస్పత్రుల్లో మృత్యుముఖంలో ఉన్న నవజాత శిశువులను సురక్షితంగా తరలించేందుకు ఇంక్యుబేటర్లను పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తాజాగా ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది. ఆస్పత్రులే కమాండ్ సెంటర్లు: ఇజ్రాయెల్ ఆస్పత్రులను హమాస్ తన స్థావరాలుగా మార్చుకుందని ఇజ్రాయెల్ మరోసారి ఆరోపించింది. ఇందుకు ఆధారాలున్నట్టు పేర్కొంది. రంటిసీ పిల్లల ఆస్పత్రిలో గ్రెనేడ్లు, పేలుడు పదార్థాలతో కూడిన కమాండ్ సెంటర్‌ను గుర్తించామంటూ సంబంధిత వీడియోలు, ఫొటోలు విడుదల చేసింది. ఇజ్రాయెల్ బందీలను కూడా అక్కడే దాచారని అనుమానం వెలిబుచ్చింది. వీటిని హమాస్ మరోసారి ఖండించింది. ఆస్పత్రులపై నిస్సిగ్గు దాడులను సమర్ధించుకునేందుకే ఇజ్రాయెల్ నిరాధారణ ఆరోపణలు చేస్తోందని దుయ్యబట్టింది. వాళ్లు రోగులు.. జంతువులు కాదు! కంటతడి పెట్టిస్తున్న డాక్టర్ ఇంటర్వ్యూ అల్ షిఫా ఆస్పత్రిని తక్షణం వీడాలన్న ఇజ్రాయెల్ ఆదేశాలను వైద్య సిబ్బంది మంగళవారం కూడా తిరస్కరించారు. 700 మందికి పైగా నిస్సహాయులైన రోగులను ప్రాణాపాయ పరిస్థితుల్లో వదిలి వెళ్లలేమని స్పష్టం చేశారు! ఈ క్రమంలో ఆస్పత్రికి చెందిన హమామ్ అల్లో అనే నెఫ్రాలజిస్టు మరణానికి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడందరినీ కంటతడి పెట్టిస్తోంది. ‘‘ఆస్పత్రిలో, ఐసీయూ వార్డుల్లో అంతమంది ఉన్నారు. వారంతా రోగులు. జంతువులు కారు. నేను వెళ్లిపోతే వారికి చికిత్స అందించేదెవరు? చికిత్స పొందడం వారి హక్కు. వారి కర్మకు వారిని వదిలి వెళ్లలేం. 14 ఏళ్ల పాటు వైద్య విద్య నేర్చుకున్నది ఇలా కేవలం నా జీవితాన్ని కాపాడుకునేందుకు రోగులను నిస్సహాయ స్థితిలో వదిలేసి వెళ్లిపోయేందుకు కాదు’’ అంటూ కొద్ది రోజుల క్రితం డెమొక్రసీ నౌ అనే స్వతంత్ర పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కుండబద్దలు కొట్టారు. కుటుంబంతో పాటు దక్షిణ గాజాకు వెళ్లిపోవాలన్న ఇజ్రాయెల్ హెచ్చరికలను హమామ్‌తో పాటు ఆయన కుటుంబం కూడా బుట్టదాఖలు చేసింది. అత్తగారింట్లో ఉండగా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హమామ్‌తో పాటు ఆయన తండ్రి, మామ, బావమరిది దుర్మరణం పాలయ్యారు! స్వేచ్ఛాయుత పాలస్తీనా కోసం హమామ్ నిత్యం కలలు కనేవాడని గుర్తు చేసుకుంటూ తోటి నెఫ్రాలజిస్టు బెన్ థామ్సన్ కన్నీటి పర్యంతమయ్యాడు. కాల్పులాపితే బందీల విడుదల: హమాస్ యుద్ధానికి ముగింపు ఇప్పట్లో కనిపించని పరిస్థితుల్లో, కనీసం కాల్పుల విరామం కోసం హమాస్ ప్రయత్నిస్తోంది. ఐదు రోజుల పాటు కాల్పులాపితే తమ వద్ద ఉన్న ఇజ్రాయెలీ బందీల్లో 70 మంది మహిళలు, చిన్నారులను విడుదల చేసేందుకు సంసిద్ధత వెలిబుచ్చింది. ఖతార్ మధ్యవర్తుల ద్వారా దీన్నిప్పటికే ఇజ్రాయెల్‌కు చేరవేసినట్టు తెలిపింది. ఇజ్రాయెల్ చెరలో ఉన్న 200 మంది పాలస్తీనా చిన్నారులు, 75 మంది మహిళలను వదిలేస్తే తమ వద్ద ఉన్న బందీల్లో మహిళలు, పిల్లలను విడుదల చేస్తామని గత వారం కూడా హమాస్ ప్రకటించడం తెలిసిందే. హమాస్ చెరలో 240 మందికి పైగా ఇజ్రాయెలీలున్నట్టు సమాచారం. అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ అధ్యక్షురాలు మిర్జానా స్పొల్జారిక్ మంగళవారం ఇజ్రాయెల్‌లో వారి కుటుంబాలను కలుసుకుని ధైర్యం చెప్పారు. మరణానంతర ప్రసవాలు! ఆస్పత్రులపై ఇజ్రాయెల్ దాడులు అంతులేని దారుణాలతో పాటు పలు విషాదాలకూ కారణంగా మారుతున్నాయి. సౌకర్యాల లేమి తదితరాల కారణంగా ఆస్పత్రుల్లో ఎందరో నిండు గర్భిణులు దుర్మరణం పాలైనట్టు హమాస్ ఆరోగ్య శాఖ ఆవేదన వెలిబుచ్చింది. ‘‘అలాంటి పరిస్థితుల్లో కూడా వైద్యులు తమ వృత్తి ధర్మం మరవలేదు. ఎప్పటికప్పుడు ఆ మృతదేహాలకు హుటాహుటిన సిజేరియన్ చేసి వీలైనంత మంది శిశువులను బయటికి తీసి కాపాడుతూ వచ్చారు’’ అని పేర్కొంది. ఇంక్యుబేటర్లతో పాటు ఏ సదుపాయాలూ లేక ఆ నవజాత శిశువులు కూడా మృత్యువుకు చేరువవుతున్నట్టు చెప్పింది. బయటపడ్డ కశ్మిరీ మహిళ లుబ్నా నజీర్ షాబూ అనే కశ్మిరీ మహిళ తన కూతురు కరీమాతో పాటు గాజా నుంచి మంగళవారం సురక్షితంగా బయట పడింది. వారిద్దరూ ఈజిప్టు చేరినట్టు భర్త వెల్లడించారు. ఈజిప్టులోని భారత మిషన్ల కృషి వల్లే తాను, తన కూతురు గాజా నుంచి బయట పడ్డట్టు లుబ్నా చెప్పారు. గాజాలో సర్వం నేలమట్టమైందని ఆవేదన వెలిబుచ్చారు. -
రష్యాపై ఎదురుదాడికి ఉక్రెయిన్ సన్నాహాలు!
బెర్లిన్: రష్యా ఆక్రమించిన ప్రాంతాలకు తిరిగి విముక్తి కల్పించడానికి ఎదురుదాడికి దిగుతామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. అయితే రష్యా భూభాగంపై దాడులకు పాల్పడబోమని స్పష్టం చేశారు. జర్మనీ పర్యటనకు వెళ్లిన జెల్‌న్‌స్కీ ఆదివారం జర్మనీ ఛాన్సలర్ ఒలఫ్ స్కాల్జ్‌తో సమావేశమయ్యారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సరిహద్దు ప్రాంతాలకు విముక్తి కల్పించడమే తమ మీడియాకు లక్ష్యమని తెలిపారు. తమ ప్రాంతాలను రష్యాపై నుంచి తీసుకుంటామన్నారు. రష్యాపై దాడికి దిగేటంత ఆయుధ సంపత్తి తమ దగ్గర లేదన్నారు. రష్యా అక్రమంగా స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను తిరిగి తీసుకుంటామని చెప్పారు. తమకు అండదండగా ఉంటూ 300 కోట్ల డాలర్ల విలువైన మిలటరీ సాయం చేసిన జర్మనీ ఛాన్సలర్ ఒలఫ్కు ధన్యవాదాలు తెలిపారు. -
మరోసారి ఆక్రమిత ఉక్రెయిన్‌లోకి పుతిన్
కీవ్: యుద్ధం మొదలై దాదాపు 13 నెలలు పూర్తవుతున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ సోమవారం ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో పర్యటించి తమ సైన్యం సన్నద్ధతను సమీక్షించారు. మొదట ఖేర్సన్ ప్రావిన్స్‌కు చేరుకున్న పుతిన్ అక్కడి రష్యా సేనల కమాండ్ పోస్ట్‌కు వెళ్లారు. తర్వాత లుహాన్సŠక్లోని రష్యన్ నేషనల్ గార్డ్ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. ఖేర్సన్, లుహాన్సŠక్లో సైనిక ఉన్నతాధికారులతో సమావేశమై తాజా పరిస్థితిని సమీక్షించారు. రష్యా అధీనంలోకి వచ్చిన ఉక్రెయిన్ ప్రాంతాల్లో పుతిన్ పర్యటించడం గత రెండు నెలల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. కొన్ని నెలల క్రితమే ఆక్రమించాక ఉక్రెయిన్‌లోని ఖేర్సన్, లుహాన్సŠక్, డోనెట్స్కŠ, జపోరిజియా ప్రావిన్స్‌లను స్థానిక ‘రెఫరెండమ్’ల ద్వారా గత సెప్టెంబర్‌లో రష్యా తనలో కలిపేసుకున్న విషయం తెల్సిందే. -
ఆక్రమిత మేరియుపోల్‌లో పుతిన్
కీవ్: ఉక్రెయిన్‌లోని ఆక్రమిత తీర ప్రాంత నగరం మేరియుపోల్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆకస్మికంగా పర్యటించారు. సెప్టెంబర్‌లో తమ సైన్యం ఈ నగరాన్ని స్వాధీనం చేసుకున్నాక పుతిన్ మొదటిసారిగా అక్కడికి వెళ్లారని రష్యా వార్తా సంస్థలు తెలిపాయి. హెలికాప్టర్లో అక్కడికి చేరుకున్న పుతిన్, సొంతంగా వాహనం నడుపుతూ నగరంలోని స్మారకప్రాంతాలను సందర్శించారు. పుతిన్ శనివారం మేరియుపోల్‌కు దగ్గర్లోనే ఉన్న క్రిమియాకూ వెళ్లారు. -
షాకింగ్.. హైదరాబాద్ పరిధిలో 134 జలాశయాలు కబ్జా
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో స్వచ్ఛమైన వర్షపు నీటితో కళకళలాడాల్సిన చెరువులు కబ్జాల చెరలో చిక్కిశల్యమవుతున్నాయి. ఒకవైపు మురుగు ముప్పు.. మరోవైపు ఆక్రమణలు ఆయా జలాశయాల ఉసురు తీస్తున్నాయి. మహానగరం పరిధిలో మొత్తంగా 185 చెరువులుండగా వీటిలో ఇప్పటివరకు 134 చెరువులు కబ్జాలకు గురైనట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జాతీయ హరిత ట్రిబ్యునల్‌కు నివేదించడం గమనార్హం. ఇందులో పలు జలాశయాల ఫుల్ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్), బఫర్ జోన్లలో ఆక్రమణలు అధికంగా ఉన్నట్లు ఈ నివేదికలో తెలిపింది. మొత్తంగా 134 జలాశయాల ఎఫ్టీఎల్ పరిధిలో 8,718 .. బఫర్‌జోన్‌లో 5,343 అక్రమ నిర్మాణాలున్నట్లు పేర్కొంది. సదరు అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు ప్రభుత్వం నివేదికలో స్పష్టంచేసింది. 51 చెరువులకు ఊరట.. మహానగరం పరిధిలో కేవలం 51 చెరువులు మాత్రమే కబ్జాలకు గురికాకుండా ఉన్నాయని ప్రభుత్వం నివేదికలో తెలిపింది. ఇక 30 చెరువులు 85 శాతం ఆక్రమణకు గురైనట్లు తేల్చింది. మరో 104 జలాశయాలు 15 శాతం కబ్జాకు గురైనట్లు నివేదికలో పేర్కొంది. గ్రేటర్ పరిధిలోని మొత్తం 185 జలాశయాలకు సంబంధించి ఎఫ్టీఎల్ హద్దులను సిద్ధం చేసి హెచ్ఎండీఏ పరిధిలోని లేక్ ప్రొటెక్షన్ కమిటీకి సమర్పించినట్లు తెలిపింది. ఇప్పటికే 157 చెరువుల ఎఫ్టీఎల్ బౌండరీలకు సంబంధించి తుది నోటిఫికేషన్ హెచ్ఎండీఏ వెబ్సైట్లో ప్రదర్శిస్తున్నామని పేర్కొంది. నూతనంగా ఆయా జలాశయాల్లో ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే రెవెన్యూ, జీహెచ్ఎంసీ విభాగాల సహకారంతో సంబంధిత వ్యక్తులపై ఇరిగేషన్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని వివరించింది. న్యాయపరమైన చిక్కులతో సాగని పనులు.. నగరంలో పలు చెరువుల్లో ఆక్రమణలకు పాల్పడిన వ్యక్తులు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో ఇరిగేషన్ శాఖ ఆయా జలాశయాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం సాధ్యపడడం లేదని నివేదికలో తెలిపింది. న్యాయపరమైన చిక్కులు లేని చోట ఆక్రమణలను తొలగించి ఎఫ్టీఎల్ బౌండరీల చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేశామని పేర్కొంది. నగరంలో 63 జలాశయాల చుట్టూ రక్షణ కంచె ఏర్పాటుకు ఇప్పటివరకు జీహెచ్ఎంసీ రూ.94 కోట్లు వ్యయం చేసినట్లు తెలిపింది. లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటుతోపాటు ఆయా జలాశయాల చుట్టూ సీసీటీవీలను ఏర్పాటు చేసి అక్రమార్కులపై నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. -
Russia-Ukraine War: ఖేర్సన్‌పై పట్టు బిగిస్తున్న ఉక్రెయిన్
కీవ్: రష్యా ఆక్రమిత ఖేర్సన్ ప్రాంతంపై ఉక్రెయిన్ తిరిగి పట్టు బిగిస్తోంది. ఖేర్సన్ను ఉక్రెయిన్ మిలటరీ పాక్షికంగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. నిరంతరాయంగా ఆ ప్రాంతంపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ పరిణామాలతో ఖేర్సన్ ప్రాంతానికి చీఫ్‌గా నియమితుడైన వ్లాదిమర్ సాల్దో ఆ ప్రాంతం నుంచి రష్యాకు ఎవరైనా వెళ్లిపోతామంటే వారికి ఉచితంగా వసతి సదుపాయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ చట్టవిరుద్ధంగా ఖేర్సన్‌సహా నాలుగు ప్రాంతాలను తమ భూభాగంలో కలిపేసుకున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఖేర్సన్ ప్రాంతంలోని ప్రజల ప్రాణాలను రక్షించడానికి రష్యన్ ప్రాంతాలైన రోస్తోవ్, క్రానోడర్, స్ట్రావోపోల్, క్రిమియాకు తరలిస్తామని చెప్పారు. యుద్ధ సమయంలో అనాథమైన వేలాది మంది పిల్లల్ని రష్యాకు బలవంతంగా తరలిస్తోందని, ఇలా చేయడం యుద్ధ నేరాల కిందకే వస్తుందని పలు స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
ఉక్రెయిన్ యుద్దంలో అనూహ్య పరిణామం
మాస్కో: ఉక్రెయిన్ ఆక్రమిత ప్రాంతాల విలీనం పేరిట రష్యా వేసిన పథకం మొత్తానికి ఫలించింది. ఎనిమిదేళ్ల కిందట క్రిమియా ఆక్రమణ తరహాలోనే.. ఇప్పుడు ఉక్రెయిన్‌కు చెందిన మరో నాలుగు కీలక ప్రాంతాలను తనలో విలీనం చేసుకోబోతోంది. శుక్రవారం క్రెమ్లిన్ భవనంలో జరగబోయే కార్యక్రమంలో ఉక్రెయిన్ నుంచి ఆక్రమించుకున్న నాలుగు ప్రాంతాలను అధికారికంగా తనలో కలిపేసుకోనుంది రష్యా. ఈ మేరకు గ్రాండ్ క్రెమ్లిన్ ప్యాలెస్‌లోని జార్జియన్ హాల్లో శుక్రవారం ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా కొత్త సరిహద్దులు రష్యాలోని చేరనున్నాయి అని పుతిన్ వ్యక్తిగత ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. అంతేకాదు.. ఈ పరిణామంపై అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రసంగం చేస్తారని వెల్లడించారు. దీంతో పుతిన్ ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫిబ్రవరి నుంచి మొదలైన ఆక్రమణలో భాగంగా.. క్రెయిన్ సరిహద్దుల్లోని లుగన్స్క్, డోనెట్స్క్, ఖేర్సన్, జాపోరిజ్జియా ప్రాంతాల్ని రష్యా సైన్యం ఇదివరకే ఆక్రమించేసింది. ఇప్పటికే ఈ ప్రాంతంలోని పౌరులు రష్యాలో చేరేందుకు సుముఖంగా ఉన్నారంటూ ఆయా ప్రాంతాల్లో క్రెమ్లిన్ నియమించిన రష్యన్ అధికారులు వెల్లడించారు. -
Russia-Ukraine war: ఉక్రెయిన్‌లో జెండా పాతేద్దాం
ఊహించని ఎదురుదెబ్బల నేపథ్యంలో ఉక్రెయిన్‌లో రష్యా వ్యూహం మార్చింది. ఆక్రమిత ప్రాంతాలన్నింటినీ శాశ్వతంగా అట్టిపెట్టుకునేలా పుతిన్ పథక రచన చేస్తున్నారు. చాపకింద నీరులా ఆ దిశగా ఒక్కో చర్యా తీసుకుంటూ వస్తున్నారు. ఇప్పటిదాకా ఆక్రమించిన 20 శాతం భూ భాగాన్ని రష్యాలో విలీనం చేసుకునేలా చర్యలను వేగవంతం చేశారు. కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగి 100 రోజులు దాటింది. అధ్యక్షుడిని కూలదోసి తమ అనుకూల నేతను గద్దెనెక్కించడంతో రోజుల వ్యవధిలో ముగిసిపోతుందనుకున్న పోరు కాస్తా నెలలు దాటినా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యూహం మార్చారని, ఉక్రెయిన్ నుంచి వైదొలగరాదని నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. ఇప్పటిదాకా ఆక్రమించిన ప్రాంతాలను శాశ్వతంగా సొంతం చేసుకోనున్నట్టు చెప్తున్నారు. ఆ దిశగా ఇప్పటికే రష్యా పలు చర్యలకు దిగింది కూడా. ఉక్రెయిన్‌లోని దక్షిణ ఖెర్సన్, హ్రివ్నియా ప్రాంతాల్లో రష్యా కరెన్సీ రూబుల్ అధికార కరెన్సీగా మారింది. అక్కడి పౌరులకు రష్యా పాస్‌పోర్టులు కూడా ఇస్తున్నారు. ఆయా ప్రాంతాలను అధికారికంగా రష్యాలో భాగంగా ప్రకటించే దిశగా చర్యలు ఊపందుకున్నాయి. దీంతోపాటు తూర్పున డోన్బాస్లోని రష్యా అనుకూల వేర్పాటువాద పాలకులు కూడా పూర్తిగా ఆ దేశంతో కలిసిపోవాలన్న ఆకాంక్షలు వ్యక్తం చేస్తున్నట్టు క్రెమ్లిన్ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ 2019 నుంచి ఇప్పటిదాకా రష్యా 7 లక్షలకు పైగా పాస్పోర్టులిచ్చింది! ఇలాంటి చర్యలతో ఉక్రెయిన్ భూ భాగాలను కొంచెం కొంచెంగా రష్యా విలీనం చేసుకుంటూ వెళ్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సైనిక విజయాలను వృథా పోనివ్వబోమన్న పుతిన్ అధికార ప్రతినిధి పెస్కోవ్ వ్యాఖ్యల అంతరార్థం కూడా ఇదేనంటున్నారు. సైనికులు కావలెను! మరోవైపు, రష్యా ముట్టడిని దీటుగా అడ్డుకుంటూ వస్తున్న ఉక్రెయిన్ తాజాగా పెద్ద సమస్య ఎదుర్కొంటోంది. యుద్ధంలో సైన్యాన్ని భారీగా నష్టపోయిన నేపథ్యంలో దేశాన్ని బలగాల కొరత తీవ్రంగా వేధిస్తున్నట్టు సమాచారం. రోజుకు కనీసం 60 నుంచి 100 మంది దాకా సైనికులను కోల్పోతున్నట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వయంగా ప్రకటించారు. మరోవైపు రష్యాకు సైనిక నష్టాలు యుద్ధం తొలి రోజులతో పోలిస్తే ఇటీవల బాగా తగ్గాయని జెలెన్స్కీ సలహాదారు మిఖాయిలో పొడోల్స్క్ శనివారం ఒక ఇంటర్వ్యూలో అంగీకరించారు. జెలెన్స్కీ లెక్క ప్రకారం ఉక్రెయిన్ ఇప్పటిదాకా 10 వేల మంది సైనికులను కోల్పోయినట్టే. కానీ వాస్తవ ప్రాణ నష్టం అంతకంటే చాలా ఎక్కువగా ఉందని తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా తూర్పున డోన్బాస్ ప్రాంతంపై రష్యా సైన్యం ప్రధానంగా దృష్టి సారించినప్పటి నుంచీ అక్కడ ఉక్రెయిన్ సైనికులు పెద్ద సంఖ్యలో మరణిస్తున్నట్టు తెలుస్తోంది. యుద్ధానికి ముందు ఉక్రెయిన్‌కు 2.5 లక్షల మంది సైనికులున్నారు. యుద్ధం మొదలయ్యాక లక్ష మంది దాకా స్వచ్ఛందంగా ముందుకొచ్చి సైన్యంలో చేరారు. ఈ 100 రోజుల యుద్ధంలో వీరిలో ఎంతమంది మరణించిందీ ఉక్రెయిన్ స్పష్టంగా వెల్లడించలేదు. యుద్ధం సుదీర్ఘ కాలం పాటు కొనసాగేలా కన్పిస్తున్న నేపథ్యంలో ఈ భారీ సైనిక నష్టం ఉక్రెయిన్ను బాగా కలవరపెడుతోంది. దీన్ని తగ్గించుకోవాలంటే అత్యంత శక్తిమంతమైన, అత్యాధునికమైన ఆయుధాలు తక్షణావసరమని ఉక్రెయిన్ సైనికాధికారులు చెబుతున్నారు. పౌరులు పెద్ద సంఖ్యలో సైన్యంలో చేరుతున్నా వారికి శిక్షణ తదితరాలకు చాలా సమయం పడుతుందని గుర్తు చేస్తున్నారు. భారీగా చేరికలు: ఉక్రెయిన్ తమ సైనికులు పెద్ద సంఖ్యలో చనిపోతుండటం వాస్తవమేనని ఉక్రెయిన్ సైన్యాధ్యక్షుడు ముజెంకో అంగీకరించారు. అయితే, ‘‘ఈ మేరకు జెలెన్స్కీ చేసిన ప్రకటన వాస్తవానికి మాకు చాలా మేలు చేస్తుంది. దానివల్ల మాకు పశ్చిమ దేశాల సాయుధ సాయం మరింతగా పెరుగుతుంది. ప్రజలందరికీ నిజం తెలిసింది గనుక దేశ రక్షణ కోసం వారు భారీ సంఖ్యలో ముందుకొస్తారు. అలా జరుగుతోంది కూడా. తద్వారా సైన్యంలో నైతిక స్థైర్యం బాగా పెరుగుతోంది’’ అని చెప్పుకొచ్చారు. ఉక్రేనియన్లకు రష్యా పౌరసత్వం ఉక్రెయిన్‌లో ఐదో వంతు ఇప్పటికే తమ అధీనంలోకి వచ్చిందని రష్యా తాజాగా ప్రకటించింది. ఇది నిజమేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా అంగీకరించారు. డోన్బాస్తో పాటు ఖెర్సన్, జపోరిజియా ప్రాంతాల్లో కూడా జూలై లోపే రిఫరెండం నిర్వహించే యోచన ఉన్నట్టు ఉక్రెయిన్‌తో చర్చల్లో పాల్గొన్న రష్యా బృందం సభ్యుడు లియోనిడ్ స్లట్స్కీ వెల్లడించారు! మెలిటోపోల్ వంటి నగరాల్లో రష్యా పౌరసత్వం కోసం పౌరుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు తీసుకుంటున్నారు కూడా. మారియుపోల్ వంటి రష్యా ఆక్రమిత నగరాల్లో పలువురు పౌరులు ఈ పరిణామాన్ని స్వాగతిస్తుండటం విశేషం! ‘‘రష్యా పౌరునిగా మారాలన్నది నా చిన్నప్పటి కల. ఇప్పుడు ఇంటినుంచి అడుగు కూడా కదల్చకుండానే అది నెరవేరేలా కన్పిస్తోంది’’ అని ఓ మారియుపోల్వాసి ఉత్సాహంగా చెప్పుకొచ్చారు. అయితే ఇలాంటి పరిస్థితి అంతటా లేదు. తమ అధీనంలోకి వచ్చిన ఖెర్సన్, ద్నిప్రోపెట్రోవ్స్క్, మారియుపోల్ తదితర ప్రాంతాల్లో రష్యన్లను స్థానిక అధికారులుగా క్రెమ్లిన్ నియమించగా పలుచోట్ల వారికి స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చెరువులకు శాపం ఇలా.. రక్షణ చర్యలు తీసుకోవాలిలా...
సాక్షి, హైదరాబాద్: మహానగరానికి మణిహారంలా ఉన్న జలాశయాల పరిరక్షణ, సుందరీకరణ విషయంలో సర్కారు విభాగాలు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని 185 చెరువులతోపాటు ఔటర్‌రింగ్‌రోడ్డు లోపలున్న వందలాది జలాశయాలు కబ్జాలతో కుంచించుకుపోయాయి. మరికొన్నింట గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల వ్యర్థజలాలు చేరి వాటిని కాలుష్య కాసారాలుగా మార్చివేశాయి. ఈ విషయంలో ఇరిగేషన్, జీహెచ్ఎంసీ, పీసీబీ, పరిశ్రమలు, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర విభాగాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జలాశయాల పరిరక్షణ విషయంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ పలు సందర్భాల్లో జారీచేసిన మార్గదర్శకాలను సర్కారు యంత్రాంగం అమలు చేయాలని పర్యావరణ వేత్తలు డిమాండ్ చేస్తున్నారు. చెరువులకు శాపం ఇలా... ► పలు చెరువుల్లో ఇటీవలికాలంలో గుర్రపుడెక్క ఉద్ధృతి అనూహ్యంగా పెరిగింది. ► సమీప కాలనీలు, బస్తీలు, పారిశ్రామిక వాడలు, వాణిజ్య సముదాయాల నుంచి వెలువడుతున్న వ్యర్థజలాలు మురుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధిచేయకుండానే ఈ చెరువుల్లోకి చేరుతున్నాయి. దీంతో అందులోని హానికారక మూలకాలు నీటిని దుర్గంధభరితంగా మార్చేస్తున్నాయి. ► ఈ ప్రభావంతో ఆయా జలాశయాల్లో నీటిలో సూక్ష్మజీవులు, జలచరాల మనుగడకు అవసరమైన కరిగిన ఆక్సిజన్ మోతాదు దారుణంగా పడిపోవడం గమనార్హం. ► సమీప ప్రాంతాల మురుగు నీరు నేరుగా చెరువుల్లోకి చేరడంతోనేఈ దుస్థితి తలెత్తింది. ► గత 20 ఏళ్లుగా పలు చెరువులు కబ్జాలకు గురవడం.. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో భారీగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు ఏర్పడడంతో మురుగు కూపమౌతున్నాయి. ► చాలా చెరువులు తమ ఎఫ్టీఎల్ పరిధిలో సగం భూములను కోల్పోయి చిక్కిశల్యమై కనిపిస్తున్నాయి. పైపై మెరుగులకే జీహెచ్ఎంసీ ప్రాధాన్యం ► రోజువారీగా గ్రేటర్‌వ్యాప్తంగా వెలువడుతోన్న 1400 మిలియన్ లీటర్ల వ్యర్థజలాల్లో సగం మా త్రమే ఎస్టీపీల్లో శుద్ధిచేసి మూసీలోకి వదులుతున్నారు. మిగతా 700 మిలియన్ లీటర్ల మురుగునీరు ఎలాంటి శుద్ధిలేకుండానే చెరువులు, మూసీ లో కలుస్తుండడంతో పరిస్థితి విషమిస్తోంది. రక్షణ చర్యలు తీసుకోవాలిలా... ► చెరువుల ప్రక్షాళన, పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై గతంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలని సేవ్ అవర్ అర్భన్‌లేక్స్ సంస్థ పలు సూచనలు చేసింది. ► గ్రేటర్ పరిధిలోని 185 చెరువుల్లో తక్షణం పూడిక తొలగించాలి. ఆయా చెరువుల్లో అట్టడుగున పేరుకుపోయిన ఘనవ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా తొలగించాలి. ► జలాశయాల ఉపరితలపై ఉద్ధృతంగా పెరిగిన గుర్రపు డెక్కను పూర్తిగా తొలగించాలి. ► చెరువుల్లో ఆక్సిజన్ మోతాదు పెరిగేందుకు ఏరియేషన్ వ్యవస్థలు ఏర్పాటుచేయాలి. ► గృహ,వాణిజ్య,పారిశ్రామిక సముదాయాల నుంచి నేరుగా వ్యర్థజలాలు చేరకుండా దారి మళ్లించాలి. ► ఆయా నీటిని మురుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేసిన అనంతరమే చెరువులో చేరే ఏర్పాట్లు చేయాలి. ► అన్యాక్రాంతం కాకుండా ఎఫ్టీఎల్ బౌండరీలు,రక్షణ కంచె ఏర్పాటుచేయాలి. నిరంతరం నిఘా పెట్టాలి. జలాశయాల చుట్టూ పెద్ద ఎత్తున హరితహారం చేపట్టాలి. ► వర్షపునీరు చేరే ఇన్‌ఫ్లో ఛానల్స్‌ను ప్రక్షాళన చేయాలి. వాటిపై ఉన్న ఆక్రమణలను తొలగించాలి. ► జలాశయాల సంరక్షణలో స్థానికులను భాగస్వాములను చేయాలి. ప్రత్యేక కమిటీలు ఏర్పాటుచేయాలి. ► కాలుష్యం, కబ్జాలకు కారణమైన వారిపై క్రిమినల్ కేసులు నమోదుచేయాలి. -
వెలగపూడి వైరస్: పేదల ఫుడ్ కోర్టుపై ‘పడగ’
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు... ఈయన గారి నేర చరిత్ర ఎంత చెప్పుకున్నా తక్కువే. వంగవీటి మోహన రంగా హత్య కేసులో నిందితుడుగా పరారై ఇక్కడకు వలస వచ్చిన దరిమిలా విశాఖ నగరంలో విష సంస్కృతికి బీజం వేసిన ప్రబుద్ధుడీయన. కోడి పందేలు.. దౌర్జన్యాలు.. మద్యం మాఫియా ఆగడాలు, భూ దందాలు.. అక్రమార్జన.. ఇలా విశాఖకు మునుపెన్నడూ ఎరగని నయా మాఫియాకు తెరలేపిన ’పచ్చ’ నేత ఈయన. దాదాపు పదిహేనేళ్లుగా తూర్పు నియోజకవర్గాన్ని చెరబట్టిన ఈయన గారి నిర్వాకాలకు, దందాలకు గత రెండేళ్లుగా బ్రేక్ పడుతూ వస్తోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. వెలగపూడి బ్యాచ్ భూదందాలు, కోడిపందాలు, మద్యం మాఫియాకు దాదాపు అడ్డుకట్టపడిందనే చెప్పాలి. అయితే అక్రమార్జన అలవాటుపడిన సదరు వెలగపూడి బ్యాచ్ చివరికి చిరు వ్యాపారుల ఫుడ్ కోర్ట్‌పై కూడా పడిపోయారు. నగరమంతటా కోవిడ్ వైరస్ కలకలం సృష్టిస్తుంటే.. నైట్‌ఫుడ్ కోర్టులో మాత్రం వెలగపూడి వైరస్ ప్రబలింది. ఇంతకీ.. ఆ వైరస్ ఏంటి.. నైట్‌ఫుడ్ కోర్టులో అసలేం జరుగుతోందో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి రండి. మహా నగర పరిధిలోని స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కోసం జీవీఎంసీ 2019 ఫిబ్రవరిలో జైల్ రోడ్డులో 27 ఫుడ్ స్టాల్స్‌తో నైట్ ఫుడ్ కోర్టు ప్రారంభించింది. ఆ తర్వాత క్రాఫ్ట్ బజార్ కూడా ఇందులో ప్రారంభించాలని అధికారులు భావించారు. అయితే.. అదే ఏడాది మార్చి నుంచి కరోనా కలకలం మొదలవ్వడంతో లాక్‌డౌన్‌తో కొన్నాళ్లు వ్యాపారాలు మూతపడ్డాయి. పర్యవేక్షించాల్సిన జీవీఎంసీ అధికారులంతా కోవిడ్ నియంత్రణ చర్యల్లో 24‘‘7 బిజీగా అయిపోయారు. గతేడాది మే నుంచి నుంచి నెమ్మది నెమ్మదిగా కోలుకుంటున్నప్పటికీ.. వైరస్ వ్యాప్తి చెందకుండా నగర ప్రజల్ని కాపాడే బాధ్యతని జీవీఎంసీ భుజానికెత్తుకొని.. నైట్ ఫుడ్ కోర్టు విషయాన్ని పక్కన పెట్టేసింది. ఆ తర్వాత లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత అన్ని వ్యాపారాల మాదిరిగానే ఫుడ్ కోర్టు కూడా మొదలైంది. ఇదే అదనుగా ఎమ్మెల్యే వెలగపూడి అనుచరులు ఫుడ్‌కోర్టుని ఆక్రమించేశారు. పేదల కోసం ఏర్పాటు చేసిన ప్రాంతంలో పచ్చజెండా పాతేశారు. అనుమతి 27 స్టాల్స్‌కి.. ఉన్నవి 138 అప్పటివరకు ఎంవీపీ కాలనీ, బీచ్‌రోడ్డులో స్ట్రీట్‌ఫుడ్ దందా సాగిస్తున్న వెలగపూడి బ్యాచ్ జైల్‌రోడ్డులోని నైట్‌ఫుడ్ కోర్టుని ఆక్రమించేసింది. వెలగపూడి తన అనుచరుల ద్వారా ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయించేశారు. అక్కడితో ఆగకుండా మహారాష్ట్ర, ఒడిశా, రాజస్తాన్, కర్ణాటక, తమిళనాడు ఇలా.. వివిధ రాష్ట్రాలకు చెందిన వారికీ స్టాల్స్ పెట్టుకోడానికి వాళ్లే సొంత అనుమతులిచ్చేశారు. వీరిని చూసి.. మిగిలిన మరికొందరు సైతం తమకు నచ్చినట్లుగా ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నారు. జీవీఎంసీ అధికారుల దృష్టికి తీసుకురాకుండానే ఓ రకంగా. మొత్తం ఫుడ్ కోర్టుని తమ ఆధీనంలోకి తీసేసుకున్నారు. మొత్తం 27 స్టాల్స్‌కు మాత్రమే అనుమతులుండగా ప్రస్తుతం 138 వరకూ వచ్చేశాయి. ఇందులో సగానికి పైగా వెలగపూడి అనుచరులకు చెందిన ఫుడ్ స్టాల్స్ ఉన్నాయని అంటున్నారు. ఒక్కొక్కరూ తమ బంధువుల పేరుతోనే నాలుగైదు స్టాల్స్ ఏర్పాటు చేసుకొని చిరు వ్యాపారుల్ని మాత్రం వాటి దరి చేరకుండా తమ గుప్పిట్లోకి తీసేసుకున్నారు. జీవీఎంసీలో పెండింగ్‌లో 500 దరఖాస్తులు ఫుడ్ కోర్టు ఏర్పాటు చేసిన కొద్ది రోజులకే మంచి స్పందన రావడంతో నగరంలోని వివిధ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ జీవీఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 500కి పైగా దరఖాస్తులు వచ్చాయని యూసీడీ విభాగాధికారులు చెబుతున్నారు. గతంలో ఉన్న 27 మందికి మాత్రమే ఇప్పటివరకు ఫుడ్ కోర్టులో స్టాల్స్ పెట్టుకోవాలని తాత్కాలిక అనుమతి ఇచ్చామనీ.. ఇంకెవ్వరినీ అనుమతించలేదని స్పష్టం చేస్తున్నారు. కోవిడ్ పరిస్థితుల నుంచి బయటపడిన తర్వాతే ఫుడ్ కోర్టు విషయమై ఏం చేయాలో ఆలోచిస్తామని అధికారులు అంటున్నారు. స్టాల్ స్టాల్‌కీ.. వసూళ్ల పర్వం జీవీఎంసీ తమ ఆదాయ వనరుగా నైట్ ఫుడ్ కోర్టుని ఏర్పాటు చేస్తే.. వెలగపూడి బ్యాచ్ దాన్ని తమకు అనుకూలంగా మలచుకున్నారు. ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయాలంటే లక్ష నుంచి రెండు లక్షల రూపాయిల వరకూ వసూలు చేశారు. పోనీ.. జీవీఎంసీకి వీటి వల్ల ఆదాయం వస్తుందా అంటే.. ఇప్పటివరకూ నైట్ ఫుడ్ కోర్టు నుంచి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఆదాయం రాలేదని అధికారులే చెబుతున్నారు. మొదట అధికారికంగా ఏర్పాటు చేసిన 27 స్టాల్స్ నుంచి కూడా ఫీజు వసూలు చేయలేదనీ.. కరోనా కారణంగా మినహాయింపునిచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. చిరు వ్యాపారులను తొక్కేసి.. రోడ్లపై చిరుతిళ్లు అమ్ముతూ బతుకులీడ్చుతున్న నగరానికి చెందిన చిన్న వ్యాపారుల అభివృద్ధికి ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్ చివరికి బడా వ్యాపారస్తుల కేంద్రంగా మారిపోయింది. ఆ ఫుడ్‌కోర్టులోకి అడుగు పెడితే కొన్ని స్టాళ్లలో పెద్ద హోటల్స్‌తో పోటీగా ధరలుంటాయి. మొత్తంగా ఫుడ్ కోర్ట్ ఏర్పాటు సదుద్దేశ్యాన్ని పక్కదారి పట్టించి... చిరు వ్యాపారులను మింగేసిన పచ్చ రాబందులపై జీవీఎంసీ అధికారులు ఇప్పటికైనా దృష్టిసారిస్తారో లేదో చూడాలి. చదవండి: టీడీపీ నేతకు షాక్: అక్రమ నిర్మాణం కూల్చివేత.. నేడే చూడండి.. గణబాబు ఆక్రమణ ‘చిత్రం’ -
చిత్తగించండి.. ఇదిగో ‘హరి’ చిట్టా..
♦.. లేస్తే మనిషిని కాదన్నట్టు ఎప్పుడూ కుర్చీల్లో కూర్చుని టీవీల్లో కనిపిస్తూ సుద్ద పూసలా మాట్లాడే మాజీ మేయర్ సబ్బం హరి అసలు బండారం ఇప్పుడు బయటపడింది. ♦ఘాజీ సబ్‌మెరైన్‌ను విశాఖ తీరానికి తానే తీసుకువచ్చానని అర్ధం పర్ధం లేని విశ్లేషణలు చేస్తూ.. తనకు తాను పెద్ద మనిషిలా బిల్డప్ ఇచ్చే హరి వారి నిజరూపం ఇప్పుడు విశాఖ ప్రజలకు నిలువెత్తుగా దర్శనమిచ్చింది. ♦ఆయన నోటి నుంచి ఎటువంటి మాటలు వస్తాయో.. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిని కనీస స్పృహ లేకుండా ఎంత దారుణంగా మాటలు అంటారో... ప్రభుత్వ అధికారులను ఇష్టమొచ్చినట్టు ఎలా దునుమాడుతారో ఇన్నేళ్లకు స్పష్టంగా తెలుసొచ్చింది. ♦హరి ఓవర్ యాక్షన్ ఎందుకో తెలుసు కదా... ఆయన మేయర్‌గా వెలగబెట్టిన కాలంలో అడ్డగోలుగా కట్టేసిన ఓ అక్రమ నిర్మాణాన్ని కూలి్చవేయడమే అధికారులు, సర్కారు ఘోర తప్పిదమైనట్టు శనివారం రెచ్చిపోయాడాయన. ♦సీతమ్మధారలోని రేసపువానిపాలెం సర్వే నంబర్ 7లో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి దర్జాగా రెస్ట్‌రూం, ప్రహరీ నిర్మాణం చేసేసిన నిర్వాకంపై స్థానికుల ఫిర్యాదు మేరకు శనివారం జీవీఎంసీ అధికారులు స్పందించి కూలగొట్టారు. అంతే.. దానికి నానాయాగీ చేస్తూ... అధికారులనే కాదు.. పాలకులను సైతం బండబూతులు తిడుతూ కనీస స్పృహ కూడా లేకుండా చేసిన సబ్బం గబ్బు చూసి సామాన్యులు సైతం ఛీ కొట్టారంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇంతకూ అసలు సుద్దపూసలా కబుర్లు చెబుతున్న సబ్బం హరి జీవిత ప్రస్థానం ఏమిటో ఒక్కసారి చూద్దాం రండి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సబ్బం హరి.. నమ్మక ద్రోహానికి నిలువెత్తు రూపం... విశ్వాస ఘాతుకానికి అసలు సిసలు ప్రతిరూపం... ఇదేంటి అన్నేసి మాటలు. అని అనుకుంటున్నారా... అయితే సబ్బం హరి చిట్టా విప్పాల్సిందే.. ►విశాఖ నగరంలో పనీ పాటా లేకుండా చిల్లర వేషాలు, రౌడీవ్యవహారాలు, సెటిల్మెంట్లు చేస్తూ కాలం గడిపేసిన సబ్బం హరిని అదృష్టం వరించి 1995లో అనూహ్యంగా విశాఖ నగరపాలకసంస్థ మేయర్ అయ్యారు. గౌరవప్రదమైన మేయర్ పదవిలో ఉండి...ఓ సారి కార్పొరేటర్లను కిడ్నాప్ చేసిన ఉదంతంలో అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత ద్రోణంరాజు సత్యనారాయణ ఫిర్యాదు మేరకు ఆనాటి పోలీస్‌కమిషనర్ ఆర్íపీ మీనా, డీఎస్పీ రామచంద్రరాజులు బూటుకాళ్లతో బుద్ధి చెప్పారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన మేయర్‌గా ఉంటూనే.. ఏకంగా సీతమ్మధారలో ప్రభుత్వ పార్కు స్థలాన్ని కబ్జా చేసేశారు. ఇప్పుడు ఆ అక్రమ నిర్మాణాన్నే జీవీఎంసీ అధికారులు కూలగొట్టారు. (చదవండి: సబ్బం హరి కాదు.. పబ్బం హరి) ►ఒక్క దఫా మేయర్‌గా పని చేసి... చెరిగిపోని మరకలు అంటించుకున్న సబ్బం హరిని కాంగ్రెస్ పార్టీనే కాదు.. నగర ప్రజలు కూడా దూరంగా పెట్టేశారు. అందుకే 1999 ఎన్నికల్లో విశాఖ–1 నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే దారుణ పరాభవం రుచిచూపించారు. అటు తర్వాత మారిన మనిషినని నమ్మించి మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అనుచరుడిగా ముద్రపడ్డాడు. ఓ దఫా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడన్న ఆరోపణతో అప్పటి విశాఖ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి సదరు సబ్బం హరిని సస్పెండ్ కూడా చేయించారు. అప్పుడు కూడా వైఎస్ పెద్దమనసుతో మన్నించి నేదురుమల్లిని ఒప్పించి తిరిగి హరిని పార్టీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి దగ్గరుండి అనకాపల్లి లోక్‌సభ సీటు ఇప్పించి గెలిపించారు. మహానేత హఠాన్మరణం తర్వాత సబ్బం హరి ఎలాంటి ‘కృతజ్ఞత’ చూపించారో అందరికీ తెలుసు. (చదవండి: మెడలు విరిచేస్తా.. అంతు తేలుస్తా) 2014 ఎన్నికల్లో సమైక్యాంధ్ర చివరి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పెట్టిన జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున విశాఖ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసి.. ఆనక చివరి నిమిషంలో బీజేపీ అభ్యర్థి హరిబాబుకు ఓటేయాలని పిలుపునిచ్చాడు. ఆ ఎన్నికల తర్వాత ఐదేళ్లు 2014 నుంచి 2019 వరకు బయటకు మొహం చూపించలేని దుస్థితి దాపురించింది. 2019లో సరిగ్గా ఎన్నికల సమయంలో తెర మీదకు వచ్చి తెలుగుదేశం పారీ్టలో ఎవ్వరూ వద్దన్న భీమిలి బరిలో నిలుచుని వైఎస్సార్సీపీ అభ్యర్థి, ప్రస్తుత మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుపై భారీ ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు. సబ్బం రుద్దుడు భరించలేక భీమిలి ప్రజలు తిప్పికొట్టడంతో ఎన్నికల తర్వాత బయటకు మొహం చూపించలేక టీవీలకే పరిమితమయ్యాడు. కేవలం టీవీల్లో తప్పించి బయట ఎక్కడా కానరాని సబ్బం హరి విన్యాసాలు చూస్తే.. జబర్దస్త్ కామెడీకి మించి ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అయితే శనివారం ఆ కామెడీ శృతి మించి సీరియస్ కావడంతో సబ్బం హరిపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన హరిపై అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకునేందుకు వెనుకాడబోమని జీవీఎంసీ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. -
‘అందుకే సబ్బం హరి నిర్మాణాన్ని తొలగించాం’
సాక్షి, విశాఖపట్నం : అనుమతులకు విరుద్ధంగా మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి నిర్మాణం చేపట్టారని విశాఖ మున్సిపల్ కమిషనర్ తెలిపారు. సబ్బంహరి అక్రమ నిర్మాణానికి సంబంధించి విశాఖ కమిషనర్ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. ఇందులో పార్కు స్థలం కబ్జా చేసి ఇల్లు కట్టారని సెప్టెంబర్ 5న ఏపీఎస్ఈబీ కాలనీ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. సీతమ్మధారలోని రేసపువానిపాలెం సర్వే నెం.7లో ఏపీఎస్ఈబీ పార్కు ఉందన్నారు. 2012లో ఇంటి నిర్మాణానికి సంబంధించి అనుమతి తీసుకున్న సబ్బం హరి 592.93చ.మీ విస్తీర్ణంలో జీ+1 కోసం అనుమతి తీసుకున్నారని తెలిపారు. ()సబ్బం హరికి ఝలక్.. జేసీబీతో కూల్చివేత) ఇంటి ముఖం 58 ఫీట్లకు అనుమతి తీసుకుని 70 ఫీట్లు కట్టినట్లు వెల్లడించారు. మొత్తం మీద పార్క్‌లోని 212 గజాలను ఆక్రమించిన సబ్బం హరికి ఆక్రమణలకు సంబంధించి 406 సెక్షన్ కింద నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. నోటీసులు తీసుకోవడానికి ఆయన నిరాకరించడంతో నోటీసులను సబ్బం హరి భవనానికి కమిషనరేట్ సిబ్బంది అతికించారు. నోటీసులకు ఏమాత్రం పట్టించుకోకపవంతో శనివారం ఉదయం జేసీబీతో వచ్చిన అధికారులు మాజీ ఎంపీకి ఝలక్ ఇచ్చారు. ప్రభుత్వ స్థలంలోని అక్రమ నిర్మాణాన్ని తొలగించారు. ఆక్రమించిన ఖాళీ స్థలంలో కంచె ఏర్పాటు చేశారు. కాగా సీతమ్మధారలో మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి వద్ద పార్కు స్థలం కబ్జాకు గురైందని వైజాగ్ జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లత తెలిపారు. స్థానికుల ఫిర్యాదుతో అక్రమ నిర్మాణాన్ని తొలగించామని వెల్లడించారు. ముందుగా సబ్బం హరికి ఆక్రమణ నోటీసు ఇచ్చాము కానీ ఆయన తీసుకోలేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. -
పార్క్ స్థలాన్ని కబ్జా చేసిన మాజీ ఎంపీ సబ్బంహరి
-
సబ్బం హరికి ఝలక్.. జేసీబీతో కూల్చివేత
సాక్షి, విశాఖపట్నం : మాజీ ఎంపీ సబ్బంహరి వివాదంలో చిక్కుకున్నారు. ప్రభుత్వానికి చెందిన స్థలాన్ని ఎంచక్కా కబ్జా చేసి టాయిలెట్‌ను నిర్మించారు. 12 అడుగుల పార్క్‌స్థలాన్ని ఆక్రమించి సొంత నిర్మాణాన్ని చేపట్టారు. అంతేకాకుండా మరికొంత ప్రభుత్వం స్థలం ఇంటి స్థలంలో కలిపేసుకున్నారు. ఈ విషయం కాస్తా స్థానిక అధికారుల దృష్టికి రావడంతో అక్రమ నిర్మాణన్ని తొలగించాలని నోటీసులు జారీచేశారు. నోటీసులకు ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో శనివారం ఉదయం జేసీబీతో వచ్చిన అధికారులు మాజీ ఎంపీకి ఝలక్ ఇచ్చారు. ప్రభుత్వ స్థలంలోని అక్రమ నిర్మాణాన్ని తొలగించారు. ఆక్రమించిన ఖాళీ స్థలంలో కంచె ఏర్పాటు చేశారు. అయితే అక్కడి చేరుకున్న అధికారులపై సబ్బం హరి నోరుపారేసుకున్నారు. మెడలు విస్తానంటూ బెదిరింపులకు దిగారు. ఆయన అనుచరులు సైతం అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఘటనాస్థలానికి పోలీసు చేరుకుని సముదాయించే ప్రయత్నం చేశారు. తాజా వివాదంపై జీవీఎంసీ ఏసీపీ మహాపాత్ర మాట్లాడుతూ.. ‘12 అడుగుల ప్రభుత్వ స్థలం సబ్బం హరి కబ్జా చేశారు. రికార్డ్ ప్రకారం ఆ స్థలం ప్రభుత్వంది. కబ్జా స్థలంలో నిర్మించిన నిర్మాణాలను తొలగించాము. ఆక్రమించిన కాళీ స్థలంలో కంచె ఏర్పాటు చేశాము. సమాచారం లేకుండా తొలగించాము అన్న సబ్బం హరి మాటల్లో వాస్తవం లేదు. అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని నోటీసు జరిచేసాము. నోటీసుకు సబ్బం హరి స్పందించలేదు. నోటీసుకు స్పందించక పోవడంతోనే టాయిలెట్ తొలగించి, ఆక్రమించిన స్థలాన్ని స్వాధీనం చేసుకున్నాము.’అని తెలిపారు. -
తీరంలో ‘భూ’చోళ్లు
సముద్ర తీర భూములు కబ్జా అవుతున్నాయి. కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను ఆక్వా పరిశ్రమలు అప్పనంగా కలుపుకుంటున్నాయి. రికార్డుల్లో సర్కార్ భూమిగా ఉంటుంది. స్వరూపం చూస్తే అక్కడ పెద్ద పెద్ద కంపెనీల భవనాలు కనిపిస్తుంటాయి. ఐదెకరాల ప్రైవేట్ భూమిని కొని దాని చుట్టు పక్కల పది ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ప్రహరీలు నిర్మించుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో అధికారులను మామూళ్లతో లోబర్చుకుని అందిన కాడికి భూమిని కలుపుకుని దర్జాగా అనుభవిస్తున్నారు. జిల్లాలోని ఇందుకూరుపేట తీరం భూ కబ్జాలకు నిలయంగా మారింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలోని ఇందుకూరుపేట పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది. మైపాడు తీరంలో బీచ్, రిసార్ట్స్ ఉన్నాయి. ఇక్కడి తీరం అనువుగా ఉండడంతో ఆక్వా హేచరీలు సైతం సీడ్ ఉత్పత్తిని ప్రారంభించాయి. పదిహేనేళ్ల క్రితం నుంచి ఇక్కడ హేచరీలు ఒక్కొక్కటిగా ఏర్పడ్డాయి. మైపాడు, కొరుటూరు ప్రాంతాల్లోనే హేచరీలు అధికంగా ఉన్నాయి. ఒక్క మైపాడు పరిసర ప్రాంతంలోనే సుమారు 30 వరకు హేచరీలు ఉన్నాయి. హేచరీలు అధికంగా రావడం, మైపాడు బీచ్ పర్యాటకంగా అభివృద్ధి చెందడంతో ఈ ప్రాంతానికి డిమాండ్ ఏర్పడింది. ♦హేచరీల ఏర్పాటు ముందు వరకు ఎకరా రూ.5 లక్షలు పలికిన భూమి ప్రస్తుతం రూ.50 లక్షలకు చేరింది. ♦జిల్లాలోని వివిధ రంగాల వ్యాపారులు, రాజకీయ పార్టీల నేతలు, కొందరు డాక్టర్లు అందరూ అభివృద్ధి చెందుతున్న ప్రాంతమని పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయడంతో బహిరంగ మార్కెట్ విలువ భారీగా పెరిగింది. ♦ఈ క్రమంలో రెవెన్యూ అధికారుల సహకారంతో ప్రభుత్వ భూముల స్వాహా పర్వానికి మొదట్లోనే ఒకటి..రెండు హేచరీల నిర్వాహకులు తెర తీశారు. ♦అలా ప్రారంభమైన భూ ఆక్రమణ పర్వం నేటికి అప్రతిహతంగా కొనసాగుతోంది. 12 సర్వే నంబర్లలో 150 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కొందరు తమ ప్రైవేట్ భూముల్లో కలుపుకుని హేచరీలు నిర్మించారు. ♦తాజాగా ప్రభుత్వం జిల్లాలో పేదలకు ఇళ్లు ఇచ్చేందుకు అనువైన స్థలాలను జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసింది. ఈ క్రమంలో అన్ని మండలాల్లో ప్రభుత్వ భూములకు సంబంధించి రికార్డులను అధికారులు పరిశీలించారు. దీంతో మైపాడు, కొరుటూరులో 150 ఎకరాలకు పైగా భూమి ఆక్రమణలో ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రైవేట్ భూమి మాటున.. ఇందుకూరుపేట మండలం మైపాడు, కొరుటూరు గ్రామాలు సముద్ర తీర ప్రాంతం కావడంతో ప్రభుత్వ భూమికి కొదవ లేదు. ఈ భూముల మధ్య మధ్యలో ప్రైవేట్ భూమి కూడా ఉంది. ఇదే హేచరీల నిర్వాహకులకు వరంగా మారుతోంది. ♦కొంత ప్రైవేట్ భూమిని కొనుగోలు చేసి దానికి రెట్టింపులో ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేశారు. ♦ప్రభుత్వ భూమికి సంబంధించిన సర్వే నంబర్లకు ఆనుకుని అనేక ప్రైవేట్ భూములు కూడా ఉన్నాయి. ♦హేచరీల యాజమాన్యం ప్రైవేట్ భూములను అధికారికంగా కొనుగోలు చేసి వాటిలో ప్రభుత్వ భూములు కలుపుకుని ప్రహరీ నిర్మించడం సముద్రం వరకు పైపులైన్లు ఏర్పాటు చేసుకోవడం వంటివి చేస్తున్నారు. ♦ఒక్క కొరుటూరులోనే 10 సర్వే నంబర్లలో 70 ఎకరాలకు పైగా భూమి హేచరీల్లో కలిసి ఉంది. ♦కొందరు హేచరీ నిర్వాహకులు గతంలో అధికారులను లోబర్చుకుని రికార్డులను కూడా తారుమారు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ♦గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన హేచరీలు కాల్వ పోరంబోకు, ప్రభుత్వ డొంక, శ్మశాన డొంక, చెరువు పోరంబోకు ఇలా ఏ ఒక్క దాన్ని వదలకుండా అందిన మేరకు కలుపుకున్నాయి. ♦దీనిపై గతంలోనూ ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో అధికారులు నామమాత్రంగా నోటీసులు ఇచ్చి విచారణతో సరి పెట్టారు. ♦కొరుటూరులో 544, 545, 546, 543, 547, 526, 527, 557, 559, 560 తదితర సర్వే నంబర్లలో 10 హేచరీ నిర్వాహకులు ప్రభుత్వ భూమిని కలుపుకుని దర్జాగా అనుభవిస్తున్నారు. ♦పది సర్వే నంబర్లలో ప్రధానమైన పది కంపెనీలు కలుపుకున్న 70 ఎకరాల భూమి విలువ సుమారు రూ.35 కోట్లు పైమాటే. ♦ఇక మండలం మొత్తంలోనూ ఇదే పరిస్థితి. మండలంలో సుమారు 400 ఎకరాలకు పైగా భూమి ఆక్రమణలో ఉన్నట్లు నిర్ధారించారు. వీటి విలువ మొత్తం సుమారుగా రూ.200 కోట్లపై మాటేనని అధికారులు ధ్రువీకరిస్తున్నారు. ♦ఆక్వా పరిశ్రమల భూ ఆక్రమణలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించారు. -
దర్జాగా భూములు కబ్జా
సాక్షి, శ్రీకాకుళం : ప్రభుత్వ భూములను కబ్జా చేసుకున్న అక్రమార్కులు దర్జాగా అక్రమ కట్టడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఓ వైపు పేదలకు పట్టాలు ఇచ్చేందుకు గాను రెవెన్యూ అధికారులు భూముల కోసం సర్వేలు చేస్తుండగా మరోవైపు రియల్టర్లు సర్వే నంబర్లు మార్చుస్తూ ప్రభుత్వ భూములకే పంగనామం పెడుతున్నారు. దీనికి తోడు ఆర్ఐ, వీఆర్వోలు సైతం చూసిచూడనట్టుగా వ్యవహారించడం, అక్రమార్కులకు కోట్లు కుమ్మరిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ భూములను చాప కింద నీరులా రియల్డరంతా కలిసి గెద్దెల్లా లాక్కోవడం ఎక్కడికక్కడే జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పట్టాలు పంపిణీ చేసే దిశగా భూములు కోసం రెవెన్యూ సిబ్బందితో మండలంలోని పలు ప్రాంతాల్లో సర్వే చేపట్టగా, సెంటు భూము లేదని సర్వేయర్లు ఉన్నతాధికారులకు నివేదికలు ఇవ్వడం నిత్యకృత్యంగా జరుగుతోంది. ప్రభుత్వ స్థలాల్లో కొంతమంది ఆక్రమణదారులు పాగ వేస్తూ రెవెన్యూ యంత్రాంగాన్ని తమ గుప్పెట్లోకి తెచ్చుకొని ఎంతో కొంతవారికి ముట్టచెబుతూ దొడ్డిదారిన నిర్మాణాలు చేపడుతున్నారు. విలువైన స్థలాల్లో పుట్టగొడుగుల్లా అక్రమ బిల్డింగ్లు వెలుస్తున్నా రెవెన్యు యంత్రాంగం మాత్రం ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. మండల పరిధిలోని మునసబుపేటలో గల విధాత్రి స్కూల్‌ను ఆనుకొని సింగుపురం రెవెన్యూ పరిధిలో గల ల్యాండ్ సీలింగ్ భూమిలో ఓ మండల టీడీపీ నాయకుడు అనుచరుడు ఏకంగా 80 సెంట్లు విస్తీర్ణంలో ఓ భవంతిని అక్రమంగా నిర్మించినట్టు ఆరోపణలున్నాయి. ఇది రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 446లో గల ప్రభుత్వ ల్యాండ్ సీలింగ్ భూముల పరిధిని చూపిస్తుంది. జాతీయ రహదారిని ఆనుకొని ఉండడంతో ఇక్కడ సెంటు భూమి ధర రూ.5లక్షలు పలుకుతోంది. సుమారు నాలుగుకోట్లు విలువైన భూమిని కేవలం పక్క సర్వే నంబర్‌తో చేజెక్కించుకున్నారు. ఇప్పటికే మూడు ఫ్లోర్ల బిల్డింగ్ నిర్మాణం పూర్తయింది. గత ప్రభుత్వ పాలనలోనే ఈ బిల్డింగ్ వ్యవహారమంతా గత టీడీపీ ప్రభుత్వ పాలనలోనే జరిగింది. మండలానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు తన సమీప బంధువుకు సంబంధించినది కావడంతో ఆయన కనుసైగల్లోనే పూర్తిస్థాయిలో ఆమోదమైనట్టు సమాచారం. ప్రస్తుతం జాతీయ రహదారి విస్తరణ పనులు వేగవంతంగా కావడంతో ఆ పరిసర ప్రాంతంలో గల భూ ములకు మరింత గిరాకీ పెరిగింది. దీంతో ప్రభుత్వ భూములోనే ఆ బిల్డింగ్ నిర్మాణ పనులు ఆగమేఘాలపైన జరుగుతున్నాయి. చక్రం తిప్పుతున్న వీఆర్వో ఎవరు వాస్తవంగా రెవెన్యూ రికార్డుల భూముల వ్యవహారంలో ఓ వీఆర్వో తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే వీఆర్వోల బదిలీల వ్యవహారంలో కుడా ఆయన చేతివాటం తీవ్రస్థాయిలో ప్రదర్శించినట్టు సమాచారం. ప్రభుత్వ భూముల సమాచారంపై ముందస్తుగా రియల్టర్లు ఈయన్నే సంప్రదిస్తారు. ప్రస్తుతం విదాత్రీ స్కూల్ పక్కన ఉన్న ల్యాండ్‌సీలింగ్ భూముల్లో వెలసిన మూ డంతస్తుల భవంతిలో కుడా ఈయన చేతివాటంతోనే సర్వే నంబర్లలో మార్పులు చేర్పు లు జరిగినట్టు పలువురు చెబుతున్నారు. నా దృష్టికి రాలేదు సింగుపురం రెవెన్యూ పరిధిలో గల ల్యాండ్ సీలింగ్ భూముల్లో ఓ భవంతిని అక్రమంగా నిర్మిస్తున్నారన్న విషయం నా దృష్టికి రాలేదు. మరో రెండు రోజుల్లో ఆయా భూములపై సర్వే నిర్వహిస్తాం. అక్రమంగా ఎవరైనా నిర్మాణాలు చేపడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఉగాది నాటికి పట్టాలు ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం భూమలు కోసం సర్వే చేయమన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడా ఉన్నాయో ఆ దిశగా సర్వే చేస్తున్నాం. – ఐటి కుమార్, తహసీల్దార్, శ్రీకాకుళం -
రికార్డులు మార్చి.. ఏమార్చి!
అంతర్జాతీయ విమానాశయ్రం పేరుతో టీడీపీ నేతలు భూదందాకు పాల్పడ్డారు. రూ.కోట్లు గడించారు. నిర్మాణానికి సంబంధించి గత ఐదేళ్లలో ఒక్క అడుగు ముందుకు పడలేదు. కానీ దీనిని అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకులు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు. అధికారులను పావులుగా ఉపయోగించుకుని వలస వెళ్లిన వారి భూములను కాజేశారు. రికార్డులను తారు మారు చేశారు. భూములు కోల్పోయిన వారికి ఇచ్చిన పరిహారాన్ని సైతం స్వాహా చేశారు. టీడీపీ నేతల భూ, ధన దాహానికి సహకరించిన రెవెన్యూ అధికారులు సస్పెండ్ కూడా అయ్యారు. సాక్షి, కావలి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2008లో అంతర్జాతీయ విమానాశ్రయానికి బీజాలు పడ్డాయి. కావలి నియోజకవర్గంలోని దగదర్తి మండలం దామవరం వద్ద నిర్మించ తలపెట్టిన ఎయిర్‌పోర్టు శరవేగంగా నిర్మా ణం చేయాలని ఆయన ఆదేశాలు కూడా జారీ చేశారు. చెన్నె– కోల్కత్తా జాతీయ రహదారి పైనే ఉన్న ఈ ప్రదేశంలో విమానాశ్రయాన్ని నిర్మిస్తే ఇటు నెల్లూరు జిల్లా ప్రజలకు, అటు ప్రకాశం జిల్లా అందుబాటులో ఉంటుందని భావించారు. దీనికి 2,200 ఎకరాలు భూమి అవసరమని ‘ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అయితే మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం తర్వాత ముఖ్యమంత్రులు అయిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి పట్టించుకోలేదు. టీడీపీ అధికారంలోకి రావడంతో.. ఈ తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే టీడీపీ నేతలు విమానాశ్రయం నిర్మించ తలపెట్టిన భూములపై రాబందుల్లా వాలిపోయారు. ప్రధానంగా దామవరం, కేకేగుంట గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూములపై పడి నకిలీ రిజిస్ట్రేషన్లు, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. విమానాశ్రయ భూముల్లో అసలు యజమానులు ఎవరో, నకిలీలు ఎవరో తేల్చుకోలేక అధికారులు సైతం హడలిపోయారు. ఏ నిర్ణయం తీసుకొంటే తమ ఉద్యోగాలకు ఎసరు తెస్తుందో అని వణికిపోయారు. ఈ క్రమంలో 2016లో జిల్లా కలెక్టర్‌గా ఉన్న జానకి దామవరంలో విమానాశ్రయ నిర్మాణానికి భూసేకరణ చేయడం సాధ్యం కాదని, అన్నీ కూడా వివాదాస్పద భూములే అని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీంతో 18 మే 2017వ తేదీ నెల్లూరుకు వచ్చిన అప్పటి రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు కల్పన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌జైన్ ఒక స్టార్ హోటల్లో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌తో సమావేశం ఏర్పాటు చేసి, దామవరంలో విమానాశ్రయం నిర్మాణ ప్రతిపాదనలను రద్దు చేసి, దానిని మరో జిల్లాకు తరలించడానికి చర్యలు తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. భూ సేకరణకు ఎక్కువ ధర డిమాండ్ చేస్తున్నారని, ఇప్పటికే రూ.20 కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టామని, ఇక ఏ విధమైన అవకాశం లేనందున విమానాశ్రయం ఏర్పాటును రద్దు చేస్తున్నామన్నారు. ధరలు తగ్గింపు విషయంలో యజమానులు ముందుకు వస్తే పునరాలోచించడం జరుగుతుందన్నారు. ఇలా విమానాశ్రయం ఏర్పాటుకు రైతులే అడ్డం పడుతున్నట్టుగా నెపం వేసేలా అప్పటి ప్రభుత్వం యత్నించిందన్న విమర్శలు సైతం వచ్చాయి. అప్పటి ప్రభుత్వ ప్రకటనలపై ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పక్షాన నిలిచారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విమానాశ్రయాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గ్రీన్ ఫీల్డ్ నుంచి.. బుల్లి ఎయిర్పోర్ట్ విమానాశ్రయం నిర్మాణానికి 2,200 ఎకరాలు అవసరమని భావించినప్పటికీ, అక్కడ నెలకొని ఉన్న భూ వివాదాల నేపథ్యంలో కేవలం 613 ఎకరాలు సరిపోతుందని స్వయంగా ‘ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ సర్దుబాటు ధోరణిలో చెప్పింది. తర్వాత జరిపిన చర్చలు తర్వాత జిల్లా అధికార యంత్రాంగం విమానాశ్రయం కోసం దగదర్తి మండలంలోని దామవరంలో 1,075 ఎకరాలు, కొత్తపల్లి కౌరుపల్లిగుంట (కేకేగుంట)లో 323 ఎకరాలు కలిపి 1,399 ఎకరాలు భూమిని సేకరించాలని నిర్ణయించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 1,379.71 ఎకరాల విస్తీర్ణంలో విమానాశ్రయం నిర్మాణం పేరుతో టీడీపీ నాయకులు చంద్రబాబుతో ఉత్తుత్తి శంకుస్థాపన చేయించి చేతులు దులుపుకొన్నారు. అయితే భూ సేకరణ పనులు ఇంకా పూర్తి కాలేదు. కేవలం 1,061.095 ఎకరాలు మాత్రమే రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి అప్పగించారు. ఇంకా 318.615 ఎకరాలు అప్పగించాల్సి ఉంది. ఇక విమానాశ్రయ భూములను ఆనుకొని ఉన్న 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని టీడీపీ నాయకుడు ఒకరు కొల్లగొట్టేశాడు. ఇదిలా ఉండగా టీడీపీ నాయకులు బ్రోకర్లుగా అవతరించి నష్టపరిహారంలో వాటాలు తీసుకొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన రూ.50 కోట్లు నష్టపరిహారాన్ని కూడా దేశం నేతలు కాజేశారు. విమానాశ్రయ స్వప్నం సాకారం జిల్లా ప్రజల విమానాశ్రయ స్వప్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాకారం చేస్తున్నారు. టీడీపీ నాయకులు విమానాశ్రయం నిర్మించాలని ఏ రోజు అనుకోలేదు. విమానాశ్రయాన్ని అడ్డం పెట్టుకొని రైతుల భూములు కాజేసి వారి కడుపుకొట్టారు. ఆ పాపం ఊరికనే పోదు. మాకు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడాల్సిన అవసరం లేదు. వీలైతే రైతులకు సహాయం చేయడానికి చట్టం ఇబ్బందిగా ఉంటే దానిని సవరించి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాం. తప్పులు, దోపిడీలు చేయాల్సిన కర్మ మాకు పట్టలేదు. – రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే, కావలి -
వక్ఫ్ భూమి హాంఫట్
సాక్షి, కోడుమూరు: కర్నూలు నగర శివారులో అత్యంత విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. వక్ఫ్ భూములను సైతం చెరబడుతున్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారుల సహకారం కూడా ఉండడంతో రియల్టర్లు చెలరేగిపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో వందలాది ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. ఈ క్రమంలోనే కల్లూరు మండలం పందిపాడు గ్రామ పరిధిలోని ఇండస్ స్కూల్ ఎదురుగా ఉన్న వక్ఫ్‌బోర్డు భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించారు. దీన్ని ప్లాట్లుగా మార్చి యథేచ్ఛగా అమ్ముతున్నారు. అడిగే వారేరీ? పందిపాడు గ్రామ సర్వే నంబర్లు 5, 7/ఏ, 22, 94లలో మొత్తం 21.58 ఎకరాల వక్ఫ్‌బోర్డు భూమి ఉంది. ఇక్కడ ఎకరా భూమి విలువ రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు పలుకుతోంది. వక్ఫ్ బోర్డుకు చెందిన భూములని తెలిసినా రియల్ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లు వేసి అమ్ముతున్నారు. ఈ ప్రాంతంలో అధునాతన భవనాలు సైతం నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అక్రమంగా రిజిస్ట్రేషన్లు ఈ ఏడాది జూలైలో కల్లూరు సబ్ రిజిస్ట్రార్ బదిలీపై వెళుతూ దాదాపు ఎకరన్నర వక్ఫ్ భూమిలోని ప్లాట్లకు అక్రమ రిజిస్ట్రేషన్ చేయించిన విషయం వెలుగు చూసింది. సర్వే నంబర్ 7/ఏలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించారు. ఇందుకు ప్రతిఫలంగా రియల్టర్ల నుంచి దాదాపు రూ.25 లక్షలు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. సర్వే నంబర్ 7/ఏలోని 12.12 ఎకరాల భూమి ఎంతోకాలంగా రిజిస్ట్రేషన్స్ నిషేధిత జాబితాలో ఉంది. అయినప్పటికీ బదిలీపై వెళ్తున్నానన్న ధీమాతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలుస్తోంది. అలాగే మరికొన్ని ప్లాట్లను సర్వే నంబర్ మార్చి రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా వక్ఫ్‌బోర్డు అధికారులు పట్టించుకోలేదు. కనీసం భూమి ఉన్న ప్రాంతంలో నోటీస్ బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో రియల్ఎస్టేట్ వ్యాపారులు రోడ్లు వేసి, రాళ్లు పాతి ప్లాట్లను అమ్ముకుంటున్నారు. ఒక్క జూలైలోనే దాదాపు 30 ప్లాట్లను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలిసింది. -
ఆక్రమించిన ‘డబుల్’ ఇళ్లు ఖాళీ
సాక్షి, ఖమ్మం : మండల పరిధిలోని ముసలిమడుగు గ్రామంలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లలో అక్రమంగా ప్రవేశించిన వారిని అధికారులు బుధవారం ఖాళీ చేయించారు. గ్రామంలో నిర్మాణం పూర్తయిన 20 డబుల్ బెడ్ రూం ఇళ్లలోకి గత ఆదివారం రాత్రి కొందరు అక్రమంగా ప్రవేశించారు. ఇళ్లకు వేసిన తాళాలు పగుల గొట్టి సామగ్రి సర్దుకున్నారు. విషయం తెలిసిన తహసీల్దార్ జన్ను సంజీవ గ్రామానికి చేరుకుని ఇళ్లను ఖాళీ చేయాలని సూచించారు. ఆక్రమణదారులు ఖాళీ చేయకపోవడంతో తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌ను స్వయంగా కలిసి పరిస్థితి వివరించారు. దీంతో కలెక్టర్ పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి ఆక్రమణదారులను ఖాళీ చేయించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో సీపీ తఫ్సీర్ ఇక్బాల్ ఆదేశాల మేరకు ఇళ్లను ఆక్రమించుకున్న 20 మంది వ్యక్తులపై మంగళవారం రాత్రి వైరా పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం డబుల్ బెడ్ రూం ఇళ్ల వద్దకు రెవెన్యూ అధికారులు పోలీసులను తీసుకుని వెళ్లారు. డీఆర్వో శిరీష, తహసీల్దార్ సంజీవ, డీసీపీ దాసరి ప్రసన్నకుమార్, సీఐ రమాకాంత్, ఎస్సైలు తాండ్ర నరేష్, శ్రీనివాస్, ఎల్లయ్య, సుమారు 100 మంది పోలీసు సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఇళ్లు ఖాళీ చేయాలని ఆక్రమణదారులను హెచ్చరించారు. ఖాళీ చేయబోమంటూ ఆక్రమణదారులు ఆందోళనకు దిగారు. తమకు ఇళ్లు ఇస్తామంటేనే గతంలో ఇక్కడ ఉన్న 35 గుడిసెలు తొలగించామని, ఇప్పుడు తమకు ఇళ్లు ఇవ్వకపోతే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంటానంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుంది. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. అర్హులకు ఇళ్లు అందేవిధంగా చర్యలు తీసుకుంటామని అధికారులు నచ్చజెప్పి ఇళ్లను ఖాళీ చేయించారు. అనంతరం తాళాలు వేసి సీల్ వేశారు. కాగా కొందరు డీఆర్ఓ శిరీష కాళ్ల మీద పడి కన్నీటి పర్యంతమయ్యారు. తమకు న్యాయం చేయాలని కోరారు. అర్హులకు న్యాయం చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. దీంతో మూడు రోజుల నుంచి ఉత్కంఠ రేపుతున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల ఆక్రమణ వివాదం సద్దుమణిగింది. -
మార్టిగేజ్ ల్యాండ్ మాయం?
సాక్షి, సిరిసిల్లటౌన్:మున్సిపల్ ఆస్తులకు రక్షణ కరువైంది. కొందరు మధ్యవర్థుల అడ్డగోలు వ్యవహారం.. అధికారుల గుడ్డినమ్మకం ఇందుకు కారణమైంది. రూ.25 లక్షల విలువ చేసే మార్టిగేట్ స్థలం వివాదంలో చిక్కింది. టౌన్ ప్లానింగ్ వైఫల్యంతో.. మున్సిపల్‌కు చెందిన ఆస్తుల రక్షణలో టౌన్‌ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలకు ఈసంఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. సాయినగర్‌లో 729/ఏ, 729/బి తదితర సర్వే నంబర్లలో 2000, 2001 ప్రాంతంలో పలువురు తమ స్థలాలను ప్లాట్లుగా మార్చుతూ అనుమతులు పొందారు. ఈప్రాంతం అభివృద్ధి కోసం మున్సిపల్‌కు 31 గుంటలు కేటాయించినట్లు సమాచారం. మున్సిపల్ స్థలాలకు రక్షించే చర్యలో భాగంగా సదరు సర్వే నంబర్లలోని లేఅవుట్ భూమి 31 గుంటలు ఉండగా మున్సిపల్ కేవలం 16 గుంటలకే ప్రహరీ నిర్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం నర్సరీ నిర్వహిస్తున్నారు. ఇదే స్థలాన్ని ఆనుకుని మిగతా 15 గుంటలకు ప్రహరీ నిర్మించకపోవడంలో ఆంతర్యం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చిన్నలోటు.. పెద్దతప్పు.. సాయినగర్ ప్రాంతంలోని రెండు వేర్వేరు వెంచర్ల ద్వారా మున్సిపల్‌కు 31 గుంటల స్థలం సంక్రమించింది. ఇందులో ఒక వెంచర్‌ను ముగ్గురి తరఫున ప్లాట్ నంబరు 21 పేరుతో మున్సిపల్ ఫీజు కింద కమిషనర్ పేరిట మార్టిగేజ్ చేశారు. ప్లాటింగ్ అనుమతిలో డీటీసీపీ నుంచి అనుమతి వచ్చినపుడు సదరు ప్లాటు నంబరు 25గా మారిం ది. హద్దులు మాత్రం వెనకాల మున్సిపల్ నర్సరీ, ముందు భాగంలో రోడ్డు వంటివి ప్లాన్‌లో నిర్ధారణ చేసినట్లు మిగతా ఇద్దరు బాధితులు తెలిపారు. అయినా మూడోవ్యక్తి కమిషనర్ పేరిట మార్టిగేజ్ చేసిన స్థలాన్ని విక్రయించడం..ఇటీవలే ఆ ప్లాటులో టౌన్‌ప్లానింగ్ నుంచి ఇంటి నిర్మాణానికి అనుమతి రావడం వివాదానికి తెరలేపింది. అడ్డదారులు పట్టిస్తున్న గుడ్డినమ్మకం.. మధ్యవర్థులపై అధికారులకు ఉన్న గుడ్డినమ్మకం అడ్డదారులకు తావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా.. ఇంటి నిర్మాణ అనుమతి మంజూరులో స్థానిక మున్సిపల్ ప్లానర్స్తోపాటు మరికొందరు మధ్యవర్థిత్వం నెరుపుతున్నట్లు సమాచారం. ఈవిషయంలో ఓ ప్లానర్ అ«ధికారులు, ప్లాటు విక్రయదారులకు మధ్యవర్థిత్వం నెరిపి విచారణ లేకుండా ఇంటి నిర్మాణానికి అనుమతి మంజూరు చేయించినట్లు చర్చసాగుతోంది. సాయినగర్‌లోని మున్సిపల్ మార్టిగేజ్ ల్యాండ్‌ను ఇతరులకు అమ్మిన వ్యక్తి ప్రముఖుడు కావడంతో ఎలాంటి వి చారణ లేకుండానే ఇంటిపర్మిషన్ ఇచ్చినట్లు విమర్శలున్నాయి. ప్రస్తుతం సదరు మార్టిగేజ్ ల్యాండ్ విడుదల కోసం ఇద్దరు బాధితులు దరఖాస్తు చేసుకుని న్యాయం కావాలని కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం మార్టిగేజ్ ల్యాండ్ విక్రయంపై మాకు ఫిర్యాదు రాలేదు. ఈవిషయంలో విచారణ చేపట్టి చర్యలు చేపడతాం. మున్సిపల్‌కు సంబం««ధించిన స్థలాలను ఆక్రమించినా..దుర్వినియోగం చేసినా కఠినంగా వ్యవహరిస్తాం. – రమణాచారి, మున్సిపల్ కమిషనర్ -
కాల్వను మింగేసిన కబ్జాదారులు
సాక్షి, రాజేంద్రనగర్: నదిపై వంతెన, రోడ్డు నిర్మాణం చేపట్టాలంటే లక్షలాది రూపాయలు, సంవత్సరం పాటు సమయం పడుతుంది. అదే కబ్జాదారులకు ఆ పని అప్పగిస్తే రాత్రికి రాత్రే రోడ్డును పూర్తి చేస్తారు. ఇది మాటల్లో కాదూ చేతల్లో చేసి చూపించారు కబ్జారాయుళ్లు... వివరాల్లోకి వెళితే.. హిమాయత్‌సాగర్ జలాశయం నుంచి వచ్చే వరద నీటిని కిస్మత్ఫూర్, బండ్లగూడ మీదుగా సంఘం వద్ద మూసీ నదిలోకి కలిసేలా గతంలో 220 అడుగుల కాల్వను ఏర్పాటు చేశారు. దీనికి ఈసీ నదిగా పేరు పెట్టారు. మూసీ పేరుతోనే ఈ కాల్వ ప్రస్తుతం కొనసాగుతుంది. బండ్లగూడ పీఅండ్‌టీ కాలనీ నుంచి జనచైతన్య వెంచర్‌కు మధ్యన మూసీ నది అడ్డుగా ఉంది. ఈ రెండు ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. దీంతో స్థానికంగా స్థలాలకు విపరీతమైన ధర పలుకుతోంది. ఈ రెండు ప్రాంతాలను కలుపుతూ కొందరు మట్టిపోసి రోడ్డును ఏర్పాటు చేశారు. ఇదే అదునుగా మరికొందరు భారీ వాహనాలు వెళ్లేలా మట్టిని పోసి రోడ్డును తయారు చేశారు. ప్రస్తుతం ఈ రోడ్డు గుండా లారీలు, కార్లు, ద్విచక్ర వాహనాలు సులువుగా వెళ్తున్నాయి. ఇదే అదునుగా కొందరు కబ్జాదారులు మూసిలో సైతం మట్టిపోసి ప్లాట్లుగా విభజించి విక్రయించారు. ప్రస్తుతం ఇక్కడ నిర్మాణాలు సైతం సాగుతున్నాయి. ఈ విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. -
సైన్యంలో పోరాటం కంటే ఇది కష్టం!
► సిపాయి భూమిని కబ్జా చేసిన అక్రమార్కులు ► భూమి ఇప్పించాలని నాలుగేళ్ల నుంచి తిరుగుతున్నా ఫలితం శూన్యం ‘ఒకప్పుడు దేశ సరిహద్దులను కాపలా కాశా.. విధి నిర్వహణలో మాతృభూమికి కోసం త్యాగాలకు సిద్ధపడ్డా.. ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడా.. పదవి విరమణ చేశా.. తర్వాత ప్రభుత్వం నాకు కొంత భూమి ఇచ్చింది. దాన్ని కొందరు కొబ్జా చేశారు. భూమిని దక్కించుకోవడానికి అధికారులతో అలుపెరగని పోరాటం చేస్తున్నా. సైన్యంలో పోరాటం కంటే ఈ పోరాటం నాకు కష్టంగా అనిపిస్తోంది. బతిమిలాడుకున్నా నాపై ఎవరికీ కనికరం లేదు..’ ఇవి సాక్షాత్తూ మూడు సార్లు శతృదేశాలతో ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొన్న ఓ సిపాయి మాటలు బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెం గ్రామానికి చెందిన మేడికొండ ఆదాం 1961–62లో భారత సైన్యంలో ఇన్ఫాంట్రీ విభాగంలో సిపాయిగా చేరాడు. 1962లో చైనాతో, 1965, 1971లలో పాకిస్థాన్‌తో మూడుసార్లు ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొన్నాడు. కళ్ల ముందు సాటి సైనికులు మృతి చెందినా దిగమింగి యుద్ధంలో ముందుకు సాగాడు. 15 ఏళ్ల పాటు సైన్యంలో కొనసాగి పదవి విరమణ పొందాడు. భూమి కబ్జా..! విరమణ తర్వాత జీవనం కోసం సాగు భూమి కేటాయించాలని అప్పట్లో ఆయన ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మండలంలోని సరికొండలపాలెం ఇందిర జలప్రభ కార్యక్రమానికి గ్రామానికి విచ్చేయగా మేడికొండ ఆదాం ఆయన భూమి సంగతి విన్నవించుకున్నారు. వెంటనే వైఎస్ స్పందించి వెల్లటూరు పరిసరాల్లోని సర్వేనెంబర్ 454/13–బి 19లో 2.50 ఎకరాలు, బి– 21లో 2 ఎకరాలు కలిపి 4.50 ఎకరాలు సర్వేచేసి హద్దులు చూపారు. అయితే.. కొన్నేళ్ల నుంచి సాగు చేయకపోవడంతో దళారులు అధికారులతో కుమ్మక్కై రికార్డులు మార్చి భూమి కాజేయాలని హస్తగతం చేసుకున్నారని ఆదాం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్ల నుంచి తనకు న్యాయం చేయాలని రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వం తనకు కేటాయించిన భూమిని అప్పగించాలని కోరుతున్నారు. -
చెరువుకు శోకం.. రైతుకు శాపం
టి.నరసాపురం : మెట్ట ప్రాంతంలోని సాగునీటి చెరువులు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కుచించుకుపోతున్నాయి. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. సాగునీటి ఎద్దడి తలెత్తి రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. తాగునీటికీ కటకటలు తప్పడం లేదు. చెరువుల్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నీరు–చెట్టు పథకాన్ని అమలు చేస్తున్నా ఆచరణలో అంతంతమాత్రంగానే ఉంది. అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ పథకాన్ని చెరబట్టారు. నిధులు.. చెరువుల్లోని మట్టిపైన కన్నేసి అసలు లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు. అక్కడక్కడా పనులు చేపట్టినా ఆక్రమణలు తొలగించకుండా తూతూమంత్రంగా మట్టి తొలగించి అమ్ముకోవడానికే పరిమితమయ్యారు. వర్షాకాలం వచ్చినా.. తొలకరి వర్షాలు జిల్లాను పలకరించాయి. వేసవిలో పూర్తిగా ఎండిపోయిన చెరువులు నేడోరేపో నీటితో నిండే అవకాశాలున్నా రైతులకు అక్కరకు వచ్చే పరిస్థితి లేదు. వీటి కళింగలు శిథిలమయ్యాయి. ఇన్లెట్, అవుట్ లెట్స్ పూడుకుపోయాయి. దీనివల్ల చెరువుల్లోని నీరు పొలా ల్లోకి పారే అవకాశం లేకుండా పోయింది. భారీ వర్షాలు కురిసినప్పుడు చెరువులు పొంగితే మాత్రం పొలాలన్నీ నీటమునిగి పంట నష్టం ఏర్పడుతోంది. జిల్లాలో 100 ఎకరాలకు పైగా విస్తీర్ణం గల సాగునీటి చెరువులు 450 ఉండగా, సాధారణ, మధ్యస్థాయి చెరువులు 3,100 ఉన్నాయి. మొత్తంగా ఈ చెరువులన్నీ 1.80 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేస్తే మెట్ట ప్రాంతంలో దాదాపు 10 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందుతుంది. దీంతో రైతుల కష్టాలు తీరిపోతాయి. కానీ.. చెరువుల అభివృద్ధిపై ప్రభుత్వం కనీస శ్రద్ధ కూడా చూపటం లేదు. జిల్లాలోని అన్ని చెరువులు ఆక్రమణల బారినపడి బక్కచిక్కాయి. జమ్మి చెరువు పెద్ద ఉదాహరణ టి.నరసాపురం మండలం ముక్కినవారి గూడెంలో 108 ఎకరాల విస్తీర్ణంలో జమ్మి చెరువు ఉంది. దీనిని మినీ రిజర్వాయర్‌గా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన నేటికీ అమలుకు నోచుకోలేదు. ఈ చెరువు ఎగువ, దిగువ తూముల కింద 3 వేల ఎకరాల ఆయకట్టులో పంటలు సాగయ్యేవి. చెరువులో నీరుండటం వల్ల భూగర్భ జలమట్టం పెరిగి 10 గ్రామాల్లోని పొలాలకు మేలు కలిగేది. ఈ చెరువు లోతట్టులో దాదాపు 40 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. ఎక్కడికక్కడ మడులు కట్టి మరీ వ్యవసాయం చేస్తున్నారు. గత ఏడాది కురిసిన వర్షాలకు చెరువు నిండి కళింగ పక్కన గండి పడింది. 6 వేల ఇసుక బస్తాలు వేసి గండిని తాత్కాలికంగా పూడ్చారు. ఈ చెరువు తూములు సైతం శిథిలావస్థకు చేరాయి. గత ఏడాది వేసిన ఇసుక బస్తాలు చివికిపోయాయి. ఇదే ప్రాంతంలో గండిపడే ప్రమాదం పొంచివుంది. అదే జరిగితే సమీపంలోని 3 వేల ఎకరాల్లో పంటలు నీటమునిగి రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. గండిపడితే ఆ పొలాల్లో ఇసుక మేటలు వేసే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జమ్మిచెరువులోని ఆక్రమణల్ని తొలగించి.. మరమ్మతులు చేపట్టాలని ఏళ్ల తరబడి రైతులు కోరుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ఈ పరిస్థితి ఒక్క జమ్మి చెరువుకే పరిమితం కాలేదు. మెట్టలోని అన్ని చెరువులు ఇలాంటి దుస్థితిలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. కొత్త తూములు కట్టిస్తాం జమ్మిచెరువుకు తిరిగి గండిపడే అవకాశాలు ఉన్న విషయాన్ని ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజినీర్ ఎస్.ఇమ్మానియేల్ దృష్టికి తీసుకెళ్లగా.. రెండు కొత్త తూములు నిర్మించేందుకు రూ.20 లక్షలు మంజూరయ్యాయని చెప్పారు. చెరువు కళింగను పూర్తిస్థాయిలో ఆధునికీకరించడానికి రూ.కోటి ఖర్చవుతుందని అంచనా వేసి, ప్రభుత్వానికి నివేదించామని చెప్పారు. నిధులొస్తే ఆ పనులు చేపడతామన్నారు. గొలుసుకట్టు చెరువుల అభివృద్ధిలో భాగంగా ఏనుగుబంధం చెరువు, చింతల చెరువుకు రూ.4.50 లక్షల చొప్పున మంజూరయ్యాయన్నారు. ఈ నిధులతో ఆ చెరువులకు తూములు నిర్మిస్తున్నామన్నారు. మళ్లీ గండి తప్పదు వర్షాకాలం నెత్తిమీదకు వచ్చింది. గత ఏడాది జమ్మి చెరువు కట్టకు గండిపడింది. తాత్కాలికంగా ఇసుక బస్తాలు వేశారు. పటిష్టమైన చర్యలు చేపట్టలేదు. ఈ ఏడాది ఏ మాత్రం వర్షాలు పడినా గండిపడి పొలాలు నీట మునుగుతాయి. ఇసుక మేటలు వేస్తాయి. అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. – మక్కిన వెంకట గోపాలరావు, మాజీ సర్పంచ్ పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలి మెట్ట ప్రాంతంలోని చెరువులన్నీ ఆక్రమణల బారినపడ్డాయి. తూములు, కళింగలు శిథిలావస్థకు చేరాయి. మరమ్మతులు చేయకపోవడంతో ఏటా రైతులు నష్టపోతున్నారు. భూగర్భ జలాలు పడిపోయాయి. అతిపెద్దదైన జమ్మిచెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలి. చెరువు కట్టకు గండిపడకుండా వెంటనే చర్యలు చేపట్టాలి. అన్ని చెరువుల్లో ఆక్రమణలు తొలగించాలి. – ఆకుల శ్రీను, రైతు, మక్కినవారి గూడెం ప్రధాన పనులు వదిలేసి.. ఎంతో ప్రాధాన్యత ఉన్న జమ్మి చెరువు అభివృద్ధిని గాలికొదిలేశారు. ఎందుకూ పనికిరాని ఏనుగు బంధం, చింతల చెరువులకు కొత్తగా తూములు కట్టిస్తున్నారు. ఆ చెరువుల కింద సాగయ్యే విస్తీర్ణం లేదు. నీరు పారే అవకాశం కూడా లేదు. అయినా అటువంటి చెరువులకు వృథాగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. రైతులందరికీ ఉపయోగపడే జమ్మి చెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలి. – సిరిమళ్ల వెంకట సత్యనారాయణ, రైతు, మక్కినవారి గూడెం