Panchayati Raj Department
-
పల్లెకు.. తగ్గిన ప్రాధాన్యం
⇒ వార్షిక బడ్జెట్లో ‘పల్లె’కు కాస్త ప్రాధాన్యం తగ్గినట్లు కనిపిస్తోంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరంగా 2024–25 బడ్జెట్లో రూ. 29,816 కోట్లు కేటాయించారు. అందులో పంచాయతీరాజ్ శాఖకు రూ. 9,341.56 కోట్లు, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 1,317.95 కోట్లను ప్రతిపాదించగా ఇతర పథకాల కింద వచ్చే గ్రాంట్లు, ఇతర నిధులను కలిపి మొత్తంగా రూ. 29,816 కోట్లు ప్రతిపాదించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఈ శాఖకు ఏకంగా రూ. 40,080 కోట్లు కేటాయించగా ఈసారి కేటాయింపులు సుమారు రూ. 10 వేల కోట్లు తగ్గడం గమనార్హం. – సాక్షి, హైదరాబాద్పెంచిన పెన్షన్ల అమలు లేనట్టేనా?⇒ ఈ శాఖ పరిధిలోకి వచి్చన కేటాయింపుల విషయానికొస్తే 2024–25 బడ్జెట్లో చేయూత (ఆసరా పించన్లు) పెన్షన్ల కోసం రూ. 14,628.91 కోట్లు ప్రతిపాదించారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు సహా వివిధ కేటగిరీల పెన్షన్లను రూ. 2,016 నుంచి రూ.4 వేలకు, దివ్యాంగులకు రూ. 4 వేల నుంచి రూ. 6 వేలకు పెంపు అమలును ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటివరకు ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే మాత్రం ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా పెంచిన పెన్షన్ల అమలు ఇప్పుడప్పుడే ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ప్రస్తుతం దివ్యాంగులకు నెలకు రూ. 4 వేల చొప్పున, వివిధ కేటగిరీల వారికి రూ. 2,016 చొప్పున చెల్లించేందుకు నెలకు రూ. 950 కోట్ల చొప్పున ఏడాదికి రూ.11,400 కోట్లు ఖర్చవుతోంది. ఇప్పుడు బడ్జెట్లో చేయూత పెన్షన్ల కోసం రూ. 14,628.91 కోట్లను ప్రతిపాదించడాన్నిబట్టి రూ. 3,228.91 కోట్లు అధికంగా కేటాయించారు. పెంచిన పెన్షన్ల అమలుకు రూ. 23 వేల కోట్ల దాకా (నెలకు రూ. 1,910 కోట్లు) అవసరమవుతాయి.అయితే ఈ బడ్జెట్‌ను పెంచిన పెన్షన్లకు అనుగుణంగా ఖర్చు చేస్తారా లేక బడ్జెట్ కేటాయింపులకే పరిమితమవుతారా అన్నది వేచిచూడాల్సి ఉందంటున్నారు. పెంచిన చేయూత పెన్షన్లను ఆగస్టు 15 నుంచి అమలు చేసేందుకు ప్రభుత్వపరంగా సిద్ధమవుతున్నట్లు పంచాయతీరాజ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి.ఇతర కేటాయింపులు.. ⇒ గ్రామీణాభివృద్ధిశాఖకు (కమిషనర్ కార్యాలయం) రూ. 12,820 కోట్లు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) రూ. 295 కోట్లు, సీ డీ అండ్ పంచాయతీలు రూ. 3,117 కోట్లు, గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ఆర్థిక సంఘం గ్రాంట్ల కింద రూ. 1,142 కోట్లు ప్రతిపాదించారు. దీంతోపాటు డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాల కోసం రూ. 750 కోట్ల మేర కేటాయింపులు చేశారు.అలాగే మహిళా సంఘాల సభ్యులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ‘ఇందిరా మహిళాశక్తి పథకం’కోసం రూ. 50.41 కోట్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ. 10 లక్షల జీవితబీమా కోసం ‘ఇందిరా జీవిత భీమా’కు రూ. 96.53 కోట్లు ప్రతిపాదించారు. స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణకు రూ. 120 కోట్లు కేటాయించారు. గ్రామీణ తాగునీటి సరఫరా (మిషన్ భగీరథ) కోసం రూ. 3046.26 కోట్లు, గ్రామీణ రోడ్ల నిర్మాణానికి రూ. 72 కోట్లు, రోడ్లు, బ్రిడ్జీల నిర్మాణానికి రూ. 20 కోట్లు కేటాయించారు.ప్రస్తుతం వివిధ కేటగిరీలవారీగా ‘భరోసా’పింఛన్లు పొందుతున్న వారి సంఖ్య (వృద్ధులు, ఇతర కేటగిరీలవారికి నెలకు రూ. 2,016 చొప్పున, దివ్యాంగులకు రూ. 4 వేల చొప్పున)వృద్ధులు 15,81,630 వితంతువులు 15,54,525 దివ్యాంగులు 5.05,836 బీడీ కారి్మకులు 4,24,292 ఒంటరి మహిళలు 1,42,252 గీత కార్మికులు 65,196 నేత కార్మికులు 37,051 ఎయిడ్స్ రోగులు 35,670 బోదకాలు బాధితులు 17,995 డయాలిసిస్ రోగులు 4,337 మొత్తం 43,70,751 -
ఎన్నికల సంఘం కసరత్తులో.. సమరానికి ఇంకొంత సమయం!
నాగర్‌కర్నూల్: శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామపంచాయతీ పోరుపై కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుత పాలకవర్గాల పదవీ కాలం వచ్చే ఏడాది జనవరి 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం యంత్రాగాన్ని సమాయత్తపరుస్తోంది. ఇందులో భాగంగా పోలింగ్ సిబ్బంది వివరాలను సమర్పించాల్సిందిగా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా వివరాలు ఈ నెల 30లోగా టీ–పోల్ యాప్‌లో అప్లోడ్ చేయాలని పేర్కొంది. ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించాలని ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలోని నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాలో శాసనసభ ఎన్నికల విధుల్లో పాల్గొన్న వారి వివరాలను అధికారులు యాప్‌లో పొందుపరుస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టం–2019 ఎన్నికల స్థానాలకు రిజర్వేషన్లు పదేళ్ల పాటు వర్తిస్తాయని పేర్కొంది. ఉమ్మడి జిల్లాలో ఎస్టీలకు 318 గ్రామపంచాయతీలు, ఎస్సీలకు 295, బీసీలకు 355, జనరల్ అభ్యర్థులకు 716 గ్రామపంచాయతీలను రిజర్వేషన్లు వర్తింపజేసింది. ఇందులో సగం మహిళలకు కేటాయించారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తుందా? లేక ఏమైనా మార్పులు చేస్తుందా? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. షెడ్యూల్ ఏరియాలోని పంచాయతీల్లో వందశాతం ఎస్టీలకు రిజర్వేషన్ వర్తిస్తోంది. ఒక వేళ చట్టంలో మార్పులు చేస్తే జనాభా ప్రాతిపదికన గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కేటాయించే అవకాశం ఉంది. ఇందు కోసం ప్రస్తుత చట్టాన్ని మార్చాలి. ఇది జరగాలంటే మరో కొత్త చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి. ఆపై ఆమోదం పొందాలి. ఇంత ప్రక్రియ జరగాలంటే మరింత సమయం పడుతుంది. మరోవైపు పాలకవర్గాల పదవీ కాలం ముగియడానికి మూడు నెలల ముందే ఎన్నికల ప్రక్రియను కమిషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అంత సమయం లేదు. ఆయా పరిణామాల నేపథ్యంలో స్థానిక సంగ్రామం సకాలంలో జరగకపోవచ్చు అనే అభిప్రాయం అధికారులు, రాజకీయ పార్టీల్లో వ్యక్తమవుతోంది. ఇదే జరిగితే పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన అమలులోకి రావడం అనివార్యమవుతుంది. బ్యాలెట్ పోరు.. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అసెంబ్లీ ఎన్నికల ఓటరు జాబితానే ప్రామాణికంగా తీసుకుంటారు. అయితే దాన్ని పంచాయతీలు, వార్డుల వారీగా విభజించాల్సి ఉంటుంది. కొత్తగా అభ్యంతరాలు, స్వీకరణ, పరిశీలన జరిపి తుది జాబితా వెల్లడించడం తప్పనిసరి. ఈ ప్రక్రియకు కనీసం నెల రోజుల సమయం పడుతుందని ఎన్నికల విభాగం అధికారులు చెబుతున్నారు. శాసనసభ ఎన్నికల జాబితాల్లో దొర్లిన తప్పుల సవరణకు సంబంధించి ఓటర్లకు అవకాశం ఇవ్వాలి. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం పంచాయతీ పోరుకు తుది ఓటరు జాబితాను పకడ్బందీగా సిద్ధం చేసే వీలుంది. ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్ పెట్టెలు సేకరించాలి. బ్యాలెట్ పత్రాలను ముద్రించాలి. ఇదంతా జరగాలంటే ఇప్పుడున్న సమయం కూడా చాలదన్న అభిప్రాయం ఎన్నికల అధికారుల్లో వ్యక్తమవుతోంది. ఈ కోణంలో చూసి ఎన్నికల నిర్వహణ సాధ్యమా? అనే వాదన వినిపిస్తోంది. ఇవి చదవండి: బదిలీల కలకలం! బీఆర్ఎస్ బ్రాండ్ అధికారులపై వేటు.. -
జెడ్పీ చైర్మన్, ఎంపీపీ పదవులకు ప్రత్యక్ష ఎన్నిక!
సాక్షి, అమరావతి : జెడ్పీ చైర్పర్సన్, మండలాధ్యక్ష పదవులకు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికల నిర్వహణపై కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది. అవసరమైతే రాజ్యాంగంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలకు ఉద్దేశించిన ఆర్టికల్ 243 (సీ) క్లాజ్ 5 (బీ)కి సవరణలు చేయాలని ఆలోచన చేస్తోంది. ఇందుకోసం అన్ని రాష్ట్రాల్లో పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం ఉండే అన్ని వర్గాల ప్రతినిధులతో చర్చించేందుకు వచ్చే నెల 4, 5 తేదీల్లో హైదరాబాద్‌లో జాతీయ స్థాయి వర్క్‌షాప్ నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లోని జాతీయ పంచాయతీరాజ్ శిక్షణ సంస్థలో ఈ ప్రత్యేక వర్క్‌షాప్ జరుగుతుంది. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అడిషనల్ సెక్రటరీ చంద్రశేఖర్‌కుమార్ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు (సీఎస్‌లు), పంచాయతీరాజ్ శాఖ విభాగాధిపతులకు ఇటీవల లేఖలు కూడా రాశారు. కేంద్రం సవరణ చేసినా, సగం రాష్ట్రాలు ఆమోదం తర్వాతే అమల్లోకి ఒకవేళ.. కేంద్రం ఇప్పుడు దేశమంతటా జెడ్పీ చైర్పర్సన్, ఎంపీపీ పదవులకు ప్రత్యక్ష విధానంలో ఎన్నుకొనేలా రాజ్యాంగ సవరణ చేసినా.., అది అమలులోకి రావాలంటే సగానికి పైగా రాష్ట్రాలు ఆమోదం తెలపాలని పంచాయతీరాజ్ శాఖ అదికారులు చెప్పారు. అన్ని దశల ప్రక్రియ పూర్తవడానికి చాలా కాలం పడుతుందని తెలిపారు. రాష్ట్రం నుంచి 9 మంది.. అన్ని రాష్ట్రాల నుంచి 261 మంది.. ఈ వర్క్‌షాప్‌లో పాల్గొని సూచనలు చేసేందుకు అన్ని రాష్ట్రాల నుంచి జెడ్పీ చైర్పర్సన్, ఎంపీపీ, గ్రామ పంచాయతీ సర్పంచుల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఎంపిక చేయాలని కేంద్రం లేఖలో పేర్కొంది. వీరితో పాటు రాష్ట్రాల పంచాయతీరాజ్ శాఖ అధికారులు, జెడ్పీ సీఈవోలు, ఎంపీడీవోలు (చాలా రాష్ట్రాల్లో బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ – బీడీవోలు అంటారు), రాష్ట్రాల్లోని పంచాయతీరాజ్ శాఖ శిక్షణ సంస్థ ప్రతినిధులు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొనాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మొత్తం 9 మంది హాజరవనున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి మొత్తం 261 మంది పాల్గొనాలని ఆ లేఖలో పేర్కొన్నారు. 1995కి ముందు ఆ పదవులకు రాష్ట్రంలోనూ ప్రత్యక్ష ఎన్నికలే.. రాష్ట్రంలో ప్రస్తుతం జెడ్పీ చైర్మన్, మండలాధ్యక్షులను పరోక్ష పద్ధతిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీలు ఎన్నుకొంటున్నారు. 1995కి ముందు కొంతకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ పదవులకు ప్రత్యక్ష పద్దతిలోనే నేరుగా ప్రజలే ఎన్నుకొనేవారు. స్థానిక సంస్థలకు ప్రత్యేకాధికారాలు కల్పిస్తూ 1994లో కేంద్రం తీసుకొచ్చిన 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా ఈ ఎన్నికల విధివిధానాల్లో మార్పులు చేశారు. దాని ప్రకారం పరోక్ష పద్ధతిలో ఎన్నుకోవాలని నిర్దేశించారు. గ్రామ పంచాయతీలలో సర్పంచి పదవులకు మాత్రం రాష్ట్రాల ఇష్టానుసారం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్నుకోవచ్చని కేంద్రం ఆ సవరణల్లో పేర్కొంది. ఈ సవరణల మేరకు అన్ని రాష్ట్రాలు రాష్ట్రస్థాయిలో కొత్త పంచాయతీరాజ్ చట్టాలను తీసుకొచ్చాయి. ఆ మేరకు మన రాష్ట్రంలో గ్రామ పంచాయతీ సర్పంచిని ప్రత్యక్ష విధానంలో, జెడ్పీ చైర్పర్సన్, మండలాధ్యక్షులను పరోక్ష పద్ధతిలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీల ద్వారా ఎన్నుకొనేలా 1995లో కొత్త పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చిం ది. -
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలపై సమీక్ష.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
తాడేపల్లి: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఈ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, మహిళల స్వయం సాధికారిత కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం లాంటి పలు పథకాల ద్వారా వారికి జీవనోపాధి కల్పించే మార్గాలను మరింత విస్తృతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. చేయూత కింద అర్హత సాధించిన లబ్ధిదారులకు వరుసగా నాలుగేళ్లపాటు క్రమం తప్పకుండా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని సీఎం అన్నారు. అలానే ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పథకాల కింద కూడా నిర్ణయించిన వ్యవధి మేరకు క్రమం తప్పకుండా వారికి ఆర్థిక సహాయం అందుతుందని సీఎం అన్నారు. ఈ డబ్బు వారి జీవనోపాధికి ఉపయోగపడేలా ఇప్పటికే ప్రభుత్వం బ్యాంకుల సహాయంతో స్వయం ఉపాధి మార్గాలను అమలు చేస్తోందని, దీన్ని మరింత విస్తృతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ►లబ్ధిదారులకు పథకాన్ని అందుకునే మొదటి ఏడాదినుంచే వారిని స్వయం ఉపాధి మార్గాలవైపు మళ్లించే కార్యక్రమాలను మరింత పెంచాలని, దీనివల్ల గ్రామ స్థాయిలో సుస్థిర ఆర్థిక ప్రగతి దిశగా వేగంగా అడుగులుపడతాయన్న సీఎం ►అర్హులైన మహిళల్లో మరింత అవగాహన కల్పించి బ్యాంకుల నుంచి కూడా రుణాలు ఇప్పించి ఉపాధి కల్పించే మార్గాలను సమర్థవంతంగా కొనసాగించాలన్న సీఎం ►మహిళలు తయారు చేస్తున్న వస్తువులు, ఉత్పాదనలకు సంబంధించి మంచి మార్కెట్ వ్యవస్ధ ఉండాలన్న సీఎం ►దీనికోసం బహుళజాతి కంపెనీలతో అనుసంధానం కావాలన్న సీఎం ►45-60 సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల సాధికారతే లక్ష్యంగా చేయూత పథకం ►ఇప్పటివరకూ చేయూత పథకం ద్వారా 9 లక్షలమంది స్వయం ఉపాధి పొందుతున్నారని అధికారులు వెల్లడి ►హిందుస్తాన్ యూనీలీవర్, ఐటీసీ లిమిటెడ్, రిలయెన్స్, అజియో, జీవీకే, మహేంద్ర, కాలాగుడి, ఇర్మా, నైనా, పీ అండ్ జీ వంటి అంతర్జాతీయ సంస్ధలతో ఇప్పటికే ఒప్పందాలు జరిగాయన్న అధికారులు ►ఈ కార్యక్రమం ద్వారా చేయూత మహిళా మార్టు, వస్త్ర, చింతపండు ప్రాసెసింగ్ యూనిట్, లేస్ పార్కు, ఇ– కామర్స్, ఇ–మిర్చ, బ్యాక్ యార్డు పౌల్ట్రీ, ఆనియన్ సోలార్ డ్రయ్యర్లు ఏర్పాటు వంటి కార్యక్రమాలను చేపడుతున్నట్టు తెలిపిన అధికారులు. ►గ్రామీణ ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులను మార్కెట్ ధర కంటే తక్కువకే అందించాలన్న లక్ష్యంతో స్వయం సహాయక సంఘాల మహిళలతో సూపర్ మార్కెట్లు ఏర్పాటు ►జిల్లాకు కనీసం రెండు సూపర్ మార్కెట్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపిన అధికారులు ►మొత్తం 27 చేయూత మహిళా మార్టులు ఏర్పాటు ►ఒక్కో సూపర్ మార్టులో కనీసం నెలకు రూ.30 లక్షలు టర్నోవర్ లక్ష్యంగా ఏర్పాటు ►వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు డోర్ డెలివరీ, ఆన్లైన్ బుకింగ్, వాట్సప్ బుకింగ్ సౌకర్యా్ని అందుబాటులోకి తెస్తున్నామన్న అధికారులు ►మల్టీ నేషన్ కంపెనీలతో భాగస్వామ్యం వల్ల వారి ఉత్పత్తుల్లో కనీసం 8 నుంచి 25 శాతం మార్జిన్ ఉండేట్టు ఏర్పాటు చేశామని వెల్లడి ►కాకినాడ జిల్లాలో సామర్లకోటలో వస్త్ర పేరుతో ఏర్పాటు చేసిన దుస్తుల తయారీ యూనిట్లో 200 మంది మహిళలకు ఉపాధి ►ట్రెండ్స్, అజియో వంటి కంపెనీలతో ఒప్పందం ►చిత్తూరు జిల్లా కురుబలకోటలో చింతపండు ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు ►ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 3వేల కుటుంబాలకు చేయూత. ఉపాధి హామీపైనా సమీక్ష ►ఉపాథి హామీలో భాగంగా ఈ ఏడాది 1500 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యం ►ఇప్పటివరకూ 215.17 లక్షల పనిదినాల కల్పన ►పనిదినాల రూపంలో రూ. 5280 కోట్ల రూపాయలు ఉపాధిహామీ కింద ఖర్చు చేయాలని లక్ష్యం ►మెటీరియల్ రూపంలో రూ.3520 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని లక్ష్యం ►మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.8800 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యం ►గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా రావాల్సిన ఉపాథిహామీ డబ్బులు సుమారు రూ.880 కోట్లు రావాల్సి ఉందని తెలిపిన అధికారులు ►ఈ డబ్బులు తెచ్చుకోవడంపై వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం ►గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్కులు పూర్తిచేయాలన్న సీఎం ►గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీల నిర్మాణం పైన కూడా దృష్టిపెట్టాలన్న సీఎం ►రోడ్ల నాణ్యతపైనా మరింత దృష్టిపెట్టాలన్న సీఎం ►రోడ్డు వేస్తే కనీసం ఐదేళ్లపాటు నిలిచేలా నాణ్యత పాటించాలి ►వేసిన మరుసటి సంవత్సరమే మళ్లీ రిపేరు చేయాల్సిన పరిస్థితి రాకూడదు ►ఆ మేరకు అధికారులు అన్ని చర్యలూ తీసుకోవాలన్న సీఎం ►ఇంజినీర్లు వీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్‌రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ సూర్యకుమారి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ పి బసంత్ కుమార్, సెర్ప్ సీఈఓ ఏ ఎండి ఇంతియాజ్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: ‘అవినాష్‌ను అనుమానించదగ్గ ఆధారాలు సీబీఐ దగ్గర లేవు’ -
పంచాయతీరాజ్ శాఖలో ఇక అంతా ఆన్లైన్లోనే
సాక్షి, అమరావతి: పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం చేపట్టే రోడ్లు, ఇతర ప్రభుత్వ పనుల్లో పూర్తి పారదర్శకత తీసుకొచ్చి అక్రమాలను అరికట్టేందుకు ఆ శాఖ ఆన్లైన్ విధానాన్ని అందుబాటులోకి తెస్తోంది. పనులకు సంబంధించి ముందస్తు అంచనాల (ఎస్టిమేట్స్) తయారీ, టెండర్లు, జరిగిన పనికి ఎం –బుక్ నిర్వహణ అంతా ఆన్లైన్ విధానంలోకి తేనుంది. ఇందుకోసం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తోంది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఈఎన్సీ బాలూ నాయక్, ముఖ్య ఇంజనీరింగ్ అధికారులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అనుభవం, నైపుణ్యం ఉన్న కొందరు అధికారులు బృందాలుగా ఏర్పడి ఈ సాఫ్ట్వేర్ ఎలా ఉండాలో నివేదికను కూడా సిద్ధం చేశారు. నూతన సాఫ్ట్‌వేర్‌తో పనుల అంచనాల రూపకల్పన, టెండర్ల ప్రక్రియ, ఎం–బుక్ నిర్వహణలో పారదర్శకత ఉంటుందని, అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట పడుతుందని ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు వెల్లడించారు. పనుల్లో నాణ్యత కూడా పెరుగుతుందని తెలిపారు. (చదవండి: జేఈఈ మెయిన్ సిటీ ఇంటిమేషన్ లెటర్లు విడుదల) -
అద్దాల్లా రోడ్లు..! నిరంతరం పర్యవేక్షణ, మరమ్మతులు
సాక్షి, హైదరాబాద్: ‘‘ఇంజనీర్లు సంప్రదాయ పద్ధతిలో కాకుండా చైతన్యవంతంగా, విభిన్నంగా ఆలోచన చేయాలి. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని నిరంతరం సమీక్షించాలి. వానలు, వరదలకు పాడైన రోడ్లకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలి. రోడ్లు చెక్కు చెదరకుండా అద్దాల్లా ఉండేందుకు నిరంతర పర్యవేక్షణ, నిర్వహణ చేపట్టాల్సిన బాధ్యత ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖలదే..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు టెండర్లు పిలిచి వారంలో కార్యాచరణ ప్రారంభించాలని.. వచ్చేనెల రెండో వారంలోగా టెండర్లు పూర్తి కావాలని ఆదేశించారు. వానలు, వరదల కారణంగా దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్లను గుర్తించి మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖలపై కేసీఆర్ గురువారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల శాఖ తరహాలోనే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించుకుని రోడ్ల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. రోడ్లు ఎక్కడెక్కడ, ఏమూలన పాడయ్యాయో సంబంధించిన క్షేత్రస్థాయి ఇంజనీర్ల వద్ద పూర్తి వివరాలు ఉండాలని చెప్పారు. ఆర్అండ్బీ శాఖ పునర్వ్యవస్థీకరణ రాష్ట్రంలో గుణాత్మక ప్రగతికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో కావాల్సినంత సిబ్బందిని నియమించుకుని, బాధ్యతల వికేంద్రీకరణ దిశగా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇతర శాఖల తరహాలోనే ఆర్‌అండ్‌బీలో సైతం ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ)ల విధానాన్ని తీసుకురావాలన్నారు. ఐదారు ఆసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక ఈఎన్సీ ఉండాలని, టెరిటోరియల్ సీఈలను కూడా నియమించాలని సూచించారు. సమర్థవంతంగా పనిచేయడానికి ఎస్ఈలు, ఈఈలు ఎంత మంది ఉండాలో ఆలోచన చేయాలన్నారు. సమర్థవంతంగా పర్యవేక్షణ ఉండేలా పని విభజన జరగాలని.. ఆ దిశగా సమీక్ష జరిపి తుది నివేదిక ఇస్తే తదుపరి మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదించేందుకు వీలుంటుందని తెలిపారు. ఇక ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహాలపైనా సమావేశంలో చర్చించారు. ‘బాధ్యతల పునర్విభజన; వానలు, వరదలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, నిర్వహణ; మరమ్మతులు, ఇతర పనులపై సత్వర నిర్ణయం; వెంటనే పనులు చేపట్టేదిశగా కిందిస్థాయి ఇంజనీర్లకు నిధుల కేటాయింపు..’ వంటి వ్యూహాలను అవలంబించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇంజనీర్లు ఎక్కడికక్కడ రోడ్లను విభజించుకుని పని విభజన చేసుకోవాలన్నారు. కేజ్ వీల్స్‌పై ఇక కఠినంగా.. గ్రామాల్లో ట్రాక్టర్లను కేజ్ వీల్స్‌తో నడుపుతుండడంతో రోడ్లు పాడవుతున్నాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఇలా చేయకుండా రైతులు, ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లను చైతన్యవంతం చేయాలని, అవసరమైతే కఠినంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. అటవీ భూములు అడ్డం రావడంతో రోడ్ల నిర్మాణం ఆగిపోతే.. ఆ శాఖతో సమన్వయం చేసుకుని సమస్యను పరిష్కరించాలని సూచించారు. రోడ్ల నిర్మాణానికి వినియోగించే మెటీరియల్‌ను హైదరాబాద్ కేంద్రంగా ఉత్పత్తి చేసుకోవాలని, తద్వారా సమయం ఆదా చేయడంతోపాటు, నాణ్యతను కాపాడుకోవచ్చని చెప్పారు. క్షేత్రస్థాయి ఇంజనీర్లకు స్వీయ విచక్షణ నిధులు నీటి పారుదల శాఖ తరహాలోనే రోడ్ల మరమ్మతుల కోసం ఆర్అండ్బీ శాఖకు కూడా మెయింటెనెన్స్ నిధులు పెంచినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. క్షేత్రస్థాయి ఇంజనీర్లు ప్రతి చిన్నపనికి హైదరాబాద్‌కు వచ్చి సమయం వృథా చేసుకోవద్దని.. వారి స్థాయిని బట్టి స్వీయ విచక్షణతో ఖర్చు చేసేలా నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుందని చెప్పారు. స్వీయ విచక్షణతో ఖర్చు చేసేందుకు డీఈఈ, ఈఈ, ఎస్ఈ స్థాయి అధికారులకు ఎన్ని నిధులు కేటాయించాలో సిఫార్సు చేయాలని సీఎం సూచించారు. రోడ్ల నిర్వహణ సమర్థవంతంగా జరగాలంటే ఏ స్థాయి ఇంజనీర్లకు బాధ్యతలు అప్పగించాలో తేల్చాలని కోరారు. పటిష్టంగా కొత్త ఆస్పత్రుల నిర్మాణం రాష్ట్రంలో కొత్త సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను పటిష్టంగా నిర్మించాలని ఆర్అండ్బీ శాఖను సీఎం ఆదేశించారు. వరంగల్, హైదరాబాద్‌లలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఈఎన్టీ, డెంటల్, ఆప్తాల్మాలజీ విభాగాలకు ఒక అంతస్తును కేటాయించాలని సూచించారు. ఈ మేరకు ఆయా ఆస్పత్రుల డిజైన్లను పరిశీలించి పలు మార్పులను సూచించారు. అన్ని విభాగాలకు ప్రత్యేక వసతులతో ఎత్తైన భవనాలను నిర్మించాలని కోరారు. వైద్య విద్యార్థులు, ప్రజలకు సౌకర్యవంతంగా ఆస్పత్రులు ఉండాలన్నారు. కార్పొరేట్‌కు ధీటుగా వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఉండాలన్నారు. అయితే సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్ర ప్రభుత్వ శాఖల పనితీరుపై సీఎం కేసీఆర్ సమీక్ష జరపడం గమనార్హం. ఇదీ చదవండి: బుల్లెట్ ప్రూఫ్‌తో సీఎం ఛాంబర్.. అత్యాధునిక హంగులతో నూతన సచివాలయం -
చెత్త సేకరణపై నిఘా.. సిటిజన్ యాప్‌ను రూపొందించిన పంచాయతీరాజ్ శాఖ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ‘క్లాప్’మిత్రలు రోజూ చెత్తను సేకరిస్తున్నారా లేదా అన్నది తెలుసుకునేందుకు పంచాయతీరాజ్ శాఖ యాప్ అ్రస్తాన్ని ప్రయోగిస్తోంది. ఇందుకోసం ‘సిటిజన్ యాప్’ను రూపొందించింది. దీనిని ప్రతీ కుటుంబంలో స్మార్ట్ఫోన్లు ఉన్న వారితో పంచాయతీ కార్యదర్శులు, క్లాప్‌మిత్ర (క్లీన్ ఆంధ్రప్రదేశ్)లు డౌన్లోడ్ చేయిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 99,84,421 కుటుంబాలు ఉండగా, ఇప్పటివరకు 67,08,960 మంది తమ ఫోన్లలో ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. మిగిలిన కుటుంబాల వారికీ ఆ యాప్‌ను అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎనీ్టఆర్, తూర్పు గోదావరి, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో అత్యధిక కుటుంబాలు ఈ యాప్‌ను ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్నాయి. బదులిచ్చేవారు తక్కువే.. మరోవైపు.. చెత్త సేకరణపై పంపే మెసేజ్‌లకు ప్రతిస్పందిస్తున్న వారి సంఖ్య అతి తక్కువగా ఉన్నట్లు పంచాయతీరాజ్ శాఖాధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 70 లక్షల ఇళ్ల నుంచి రోజూ చెత్త సేకరణ చేస్తున్నట్లు వారు తెలిపారు. వీటిలో దాదాపు 50 లక్షల కుటుంబాలకు పైగానే రోజూ మెసేజ్‌లు పంపుతున్నామని.. కానీ, బదులిస్తున్న వారి సంఖ్య ఐదువేలలోపే ఉంటోందన్నారు. 20 రోజుల క్రితమే ఈ యాప్ ప్రక్రియ మొదలైందని.. అందరూ దానిపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవడానికి మరో రెండు మూడు నెలల సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. అదే జరిగితే గ్రామాల్లో చెత్త సేకరణకు యాప్ పూర్తిస్థాయిలో దోహదపడుతుందని వారు చెబుతున్నారు. చెత్త సేకరణపై రోజూ మెసేజ్‌లు.. ఇక సిటిజన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న ప్రతీ ఫోనుకు ‘ఈ రోజు మీ ఇంటి నుంచి చెత్తను సేకరించారా’ అని ప్రశ్నిస్తూ ‘ఎస్’ లేదా ‘నో ’ చెప్పాలని పంచాయతీరాజ్ శాఖ మెసేజ్ పంపుతోంది. ఎవరైనా ‘నో’ అని బదులిస్తే, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి సంబంధిత జిల్లా పంచాయతీ అధికారి ద్వారా ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి, క్లాప్‌మిత్ర నుంచి వివరణ కోరతారు. అదే రోజు లేదా మర్నాడు ఆ ఇంటి నుంచి చెత్తను సేకరించేలా మండల, జిల్లాస్థాయి అధికారులు చర్యలు చేపడతారు. చదవండి:‘బల్క్’ కుట్ర బహిర్గతం.. టీడీపీ పన్నాగం బట్టబయలు -
ప్రతి గ్రామంలో కరోనా ఐసోలేషన్ సెంటర్లు
సాక్షి, అమరావతి: అవసరం మేరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో కరోనా ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా సోకి.. ఇంటిలో ఉండి చికిత్స పొందడానికి తగిన వసతి లేనివారి కోసం ఈ సెంటర్లను ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్.. అన్ని జిల్లాల కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలను ఆదేశించారు. ప్రతి చోటా పురుషులకు, మహిళలకు వేర్వేరు గదులు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం గ్రామాల్లో సాధారణ లక్షణాలు ఉన్నవాళ్లు ఇళ్లల్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. అయితే.. ఎక్కువ శాతం మందికి ఒకే పడక గది, ఒకే టాయిలెట్ ఉన్నాయి. దీంతో ఆ ఇంటిలో ఎవరైనా కరోనా బారినపడితే.. మిగిలిన కుటుంబ సభ్యులు దూరంగా ఉండటానికి అవకాశం ఉండటం లేదు. ఈ నేపథ్యంలో వారికి కూడా కరోనా సోకే ప్రమాదం ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు లేదా ఇతర ప్రభుత్వ భవనాల్లో అవసరం మేరకు వెంటనే ఐసొలేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గ్రామ సర్పంచ్ల పర్యవేక్షణలో.. – కరోనా ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటు, వాటిలో మౌలిక వసతుల ఏర్పాటు బాధ్యతలను ఆయా గ్రామాల సర్పంచ్‌లకు అప్పగించారు. – కరోనా లక్షణాలను గుర్తించిన వెంటనే నిర్ధారణ పరీక్ష కోసం వేచి చూడకుండా వెంటనే ఐసోలేషన్ కేంద్రానికి తరలిస్తారు. రోగులు తమ ఇంటిలోనే వేరుగా ఒక గదిలో ఉండడానికి ఇష్టపడితే అందుకు ప్రాధాన్యత ఇస్తారు. – ఐసొలేషన్ సెంటర్లో చేరేవారు ఆహారం, దుప్పట్లు, సబ్బు, బ్రష్, మందులు వంటివాటిని వారే తెచ్చుకోవాల్సి ఉంటుంది. – దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చే చోట రోగులకు పౌష్టికాహారం అందజేస్తారు. – రోగుల ఆరోగ్య పరిస్థితిని ఏఎన్ఎంలు నిరంతరం పర్యవేక్షిస్తారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ఒక రిజిస్టర్లో నమోదు చేసుకొని.. స్థానిక పీహెచ్సీ వైద్యుడికి సమాచారం అందిస్తారు. – పీహెచ్సీ వైద్యుడు వారంలో రెండు రోజులు ఐసొలేషన్ కేంద్రాన్ని సందర్శించి రోగుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటారు. – ఎవరికైనా అత్యవసర చికిత్స అందించాల్సిన పరిస్థితి ఏర్పడితే అప్పటికప్పుడు అంబులెన్స్ ద్వారా వారిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్చుతారు. – కాగా.. ఇంటిలోనే ఉంటూ చికిత్స పొందుతున్న వారి ఇళ్లకు హోం ఐసోలేషన్ స్టిక్కర్లను ఏర్పాటు చేస్తారు. – ఐసొలేషన్ కేంద్రాల్లో రోజూ సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తారు. – గ్రామంలో కరోనా కేసుల సంఖ్య జీరోకు చేరే వరకు ఐసోలేషన్ కేంద్రాలను కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. – ఐసోలేషన్ కేంద్రాల పర్యవేక్షణకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా, మండలాల వారీగా ఎన్ని గ్రామాల్లో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.. వాటిలో ఎంత మంది చేరారు వంటి వివరాలను వారానికి రెండుసార్లు కమిషనర్ కార్యాలయానికి పంపాలి. -
గ్రామాల్లో సోడియం హైపోక్లోరైట్ పిచికారీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనాను నివారించేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కట్టడి చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా ప్రతి రోజూ రాష్ట్రంలోని ఐదు వేలకు పైగా గ్రామాల్లో సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తోంది. రాత్రి వేళల్లోనూ ప్రతి రోజూ రెండు వేలకు పైగా గ్రామాల్లో ఫాగింగ్ (పొగ) చేస్తోంది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 5,916 గ్రామాల్లో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయగా.. ఆదివారం 5,881 గ్రామాల్లో.. శనివారం 5,838 గ్రామాల్లో పిచికారీ చేశారు. సోమవారం రాత్రి సమయంలో 2,380 గ్రామాల్లో ఫాగింగ్ చేయగా.. ఆదివారం 2,296 గ్రామాల్లో, శనివారం 2,435 గ్రామాల్లో ఫాగింగ్ చేశారు. దేశమంతటా, రాష్ట్రంలోనూ కరోనా తీవ్రత పెరిగిన నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం గ్రామాల్లో 16 రకాల కరోనా కట్టడి చర్యలు చేపడుతుంది. మరో ఐదు విధానాల్లో ప్రజా చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఆయా కార్యక్రమాలు గ్రామాల వారీగా అమలు జరుగుతున్న తీరును కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్‌శాఖ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ, ప్రత్యేకించి కరోనా కేసులు నమోదు అవుతున్న గ్రామాల్లో యుద్ధప్రాతిపదికన కరోనా కట్టడి చర్యలను ముమ్మరం చేస్తున్నారు. కేసుల నమోదు తీవ్రత ఎక్కువగా ఉన్న గ్రామాల్లో సోడియం హైపో క్లోరైట్ ద్రావణం కనీసం రోజు విడిచి రోజైనా పిచికారీ చేస్తుండగా.. రాష్ట్రంలోని మిగిలిన గ్రామాలన్నింటిలో ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్, మురుగు కాల్వల్లో ఫెనాయిల్ పిచికారీ చేస్తున్నారు. మంచినీటి పథకాల ద్వారా తాగునీటి సరఫరా చేసే సమయంలో సిబ్బంది పర్యవేక్షణలో ప్రత్యేక క్లోరినేషన్ చర్యలు చేపడుతున్నారు. ఒక్కొక్క గ్రామంలో వారానికి రెండు మూడు సార్లు కూడా సోడియం హైపో క్లోరైట్ పిచికారీ చేస్తున్నారు. గ్రామాల్లో 1.08 కోట్ల కుటుంబాలకు.. పంచాయతీరాజ్ శాఖ వివరాల ప్రకారం గ్రామీణ ప్రాంతంలో మొత్తం 1,08,07,994 కుటుంబాలు ఉండగా.. ప్రతి కుటుంబాన్ని కరోనా కట్టడి సేవల పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రామంలో ఏ రోజు ఏ ప్రాంతంలో ఏ రకమైన చర్యలు చేపడుతున్నారన్న సమాచారాన్ని తెప్పించుకుంటూ మండల, జిల్లా, రాష్ట్ర అధికారులు పర్యవేక్షిస్తున్నారు. -
పోటీలో ఉన్న పార్టీల అభ్యర్థులు చనిపోయిన చోట వేరుగా ఎన్నికలు
సాక్షి, అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో గుర్తింపు ఉన్న రాజకీయ పార్టీల తరఫున పోటీలో ఉండి, పోలింగ్‌కు ముందే మరణించిన వారి స్థానాల్లో ఈ నెల 8న కాకుండా వేరుగా.. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) కసరత్తు చేపట్టింది. కరోనాతో ఏడాది క్రితం వాయిదా పడిన ఈ ఎన్నికల ప్రక్రియలో 2020 మార్చి 14న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలిచిన వారితో పాటు పోటీలో ఉన్న మొత్తం 116 మంది అభ్యర్థులు చనిపోయినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు నిర్ధారించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం.. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉండి మరణించిన చోట మాత్రం ఈనెల 8నే పోలింగ్ యథావిధిగా నిర్వహిస్తున్నారు. కానీ, గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీ తరఫున పోటీలో ఉండి అభ్యర్థి చనిపోయిన చోట మాత్రం ఎన్నికను తాత్కాలికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. 94 చోట్ల ఎన్నికలు వాయిదా ► ఎంపీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన 14 మంది అభ్యర్థులతో పాటు పోటీలో ఉన్న 87 మందితో కలిపి మొత్తం 101 మంది.. జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన వారిలో ఇద్దరు, పోటీలో ఉన్న మరో 13 మంది కలిపి మొత్తం 15 మంది మరణించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. ► పోటీలో ఉండి మరణించిన 87 మంది ఎంపీటీసీ అభ్యర్థుల్లో ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు. నిబంధనల ప్రకారం.. ఈ ఐదు స్థానాల్లో ఈనెల 8న ఎన్నికలు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. కానీ, మిగిలిన 82 మంది గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీల తరఫున పోటీలో ఉన్నందున అక్కడ ఎన్నికలు తాత్కాలికంగా వాయిదా వేశారు. ► పోటీలో కొనసాగుతూ మరణించిన 13 మంది జెడ్పీటీసీ అభ్యర్థుల్లో ఒకరు స్వతంత్ర అభ్యర్థి. ఆ స్థానంలో ఎన్నిక యథావిధిగా 8న ఎన్నిక జరుగుతుంది. గుర్తింపు కలిగిన పార్టీ అభ్యర్థులు చనిపోయిన 12 చోట్ల మాత్రం ఎన్నికలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ► ఇలా 82 ఎంపీటీసీ స్థానాలలో.. 12 జెడ్పీటీసీ స్థానాల్లో కలిపి మొత్తం 94 చోట్ల ఎన్నికలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఇక్కడ రాజకీయ పార్టీ తరఫున మాత్రమే మరో అభ్యర్థితో నామినేషన్‌కు అవకాశం ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ► ఎన్నికలు వాయిదా పడిన 94 స్థానాల్లో తిరిగి ఎన్నికలు నిర్వహించేందుకు వారం రోజులలోపే కొత్త నోటిఫికేషన్ జారీచేసే అవకాశముందని ఎస్ఈసీ వర్గాలు వెల్లడించాయి. అయితే, వీటితో పాటు ఏకగ్రీవంగా గెలుపొందిన అభ్యర్థులు (ఎంపీటీసీ సభ్యులు 14 మంది, జెడ్పీటీసీ సభ్యులు ఇద్దరు) చనిపోయిన చోట్ల ఎన్నికలు జరిపే విషయంపై ఎస్ఈసీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. -
కార్పొరేషన్ల చైర్మన్లకు జెడ్పీల్లో ఎక్స్అఫిషియో సభ్యత్వం
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్లకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిషత్‌లలో ఎక్స్ అఫిషియో సభ్యత్వం కల్పించనుంది. ఇందుకు పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు తీసుకొచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టింది. సాధారణంగా.. జిల్లా పరిషత్‌లో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్స్ అఫిషియో సభ్యులుగా కొనసాగుతుంటారు. అలాగే, ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు కూడా తమతమ వర్గాల సమస్యలను జెడ్పీ సమావేశాల్లో ప్రస్తావించేందుకు వీలుగా వారికీ ఎక్స్ అఫిషియో సభ్యత్వం కల్పించేందుకు సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. దీంతో ప్రభుత్వం ఇప్పుడు చట్ట సవరణకు చర్యలు చేపట్టింది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ప్రస్తుతమున్న 61 కార్పొరేషన్ల చైర్మన్లు తాము కోరుకున్న జిల్లాలో ఎక్స్అఫిషియో సభ్యునిగా హోదా పొందే వీలు కలుగుతుంది. ఓటు హక్కు మాత్రం ఉండదు ఇదిలా ఉంటే.. జెడ్పీలో ఇప్పటికే ఎక్స్ అఫిషియో సభ్యులుగా కొనసాగుతున్న ఎమ్మెల్యేలు, ఎంపీలకు జెడ్పీ చైర్మన్ ఎంపిక తదితర అంశాల్లో ఓటు హక్కు లేదు. అలాగే, కార్పొరేషన్ చైర్మన్లకూ ఇది వర్తిస్తుందని పంచాయతీరాజ్ శాఖాధికారులు వెల్లడించారు. కానీ, జిల్లా స్థాయిలో ఏర్పాటయ్యే స్టాండింగ్ కమిటీల్లో ఎక్స్ అఫిషియో సభ్యుని హోదాలో ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు స్టాండింగ్ కమిటీ సభ్యునిగా కూడా నియమితులయ్యే వీలుంటుందని వారు వివరించారు. -
గ్రామాల్లో అక్రమ లే–అవుట్లు 10,000 పైనే
సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంతాల చుట్టుపక్కల గ్రామాల పరిధిలోని పంట భూముల్లో ఇబ్బడి ముబ్బడిగా ఇళ్ల ప్లాట్ల లే అవుట్లు పుట్టుకొస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 6,049 ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అక్రమ లే అవుట్లు వెలిసినట్లు 2015లో పంచాయతీరాజ్ శాఖ అధికారులు గుర్తించగా ఇప్పుడు వాటి సంఖ్య పది వేలకు పైనే ఉంటుందని అంచనా. ప్రతి లే అవుట్లో సగటున 50 ఇంటి ప్లాట్లు ఉంటాయని అంచనా వేసినా దాదాపు 5 లక్షల మంది అక్రమ లే అవుట్లలో స్థలం కొనుగోలు చేసి మోసపోయినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. అనుమతులు తప్పనిసరి గ్రామాల పరిధిలో కొత్తగా ఇళ్ల ప్లాట్లతో లే అవుట్ వేయాలంటే అనుమతి తప్పనిసరి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలోనే 2002 ఫిబ్రవరి 26న గ్రామ పంచాయతీ ల్యాండ్ డెవలప్మెంట్ (లేఅవుట్ అండ్ బిల్డింగ్)పై సమగ్ర విధానాలతో పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం కొత్త లే అవుట్ వేయాలంటే రోడ్లు, పార్కు, ఆటస్థలం లేదా పాఠశాల తదితరాల కోసం నిర్దేశించిన స్థలాన్ని సంబంధిత గ్రామ పంచాయతీకి ఉచితంగా రాసివ్వాలి. గ్రామ పంచాయతీలకు ఇలా ఉచితంగా రాసి ఇవ్వాల్సిన స్థల పరిమితి లే – అవుట్ మొత్తం విస్తీర్ణంలో పది శాతం విస్తీర్ణానికి పైబడి ఉంటుందని అధికారులు తెలిపారు. ఎప్పుడైనా చర్యలు తీసుకునే అధికారం.. అనుమతి లేకుండా ఏర్పాటయ్యే అక్రమ లే–అవుట్లలలో నిబంధనల ప్రకారం ఇంటి ప్లాన్ అప్రూవల్, కరెంట్ కనెక్షన్, మంచినీటి కొళాయి కనెక్షన్లు మంజూరు చేయరు. బ్యాంకు లోను కూడా రాదు. అక్రమ మార్గాల్లో అనుమతులు తెచ్చుకున్నా ఎప్పుడైనా చర్యలు తీసుకునే అధికారం గ్రామ పంచాయతీకి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఇబ్బంది లేకుండా రెగ్యులరైజేషన్ అక్రమ లే–అవుట్లలో స్థలాలు కొనుగోలు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇటీవల సమీక్షలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వద్ద పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఈ విషయాన్ని ప్రస్తావించగా ఎన్నో ఏళ్ల కిత్రం తెలియక అక్రమ లే–అవుట్లలో స్థలం కొన్న వారికి ఇబ్బంది లేకుండా, గ్రామ పంచాయతీలకు నష్టం జరగకుండా రెగ్యులరైజ్ చేయడంపై మార్గాలను సూచించాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో అక్రమ లే–అవుట్ల రెగ్యులరైజ్ కోసం ఇప్పటికే మార్గదర్శకాలు జారీ అయ్యాయని, గ్రామాల్లో అక్రమ లే అవుట్లపై పంచాయతీరాజ్ శాఖ విడిగా విధివిధానాలు రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇల్లు కట్టుకున్నా ఆందోళనే.. గుంటూరు జిల్లా నరసరావుపేటలో చిన్న మెడికల్ షాపు నిర్వహిస్తున్న రాము కష్టార్జితంతో పట్టణ శివారులోని కొత్త లే అవుట్లో నాలుగు సెంట్ల స్థలం కొనుక్కున్నాడు. ఇంటి పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోగా అక్రమ లే అవుట్ అని తెలియడంతో నివ్వెరపోయాడు. లక్షలు ధారపోసి కొన్న స్థలాన్ని అలా వదిలేయలేక అక్రమ మార్గంలో భారీగా డబ్బులు ముట్టజెప్పి అనుమతులు తెచ్చుకున్నాడు. బ్యాంకు రుణం రాకపోవడంతో అధిక వడ్డీకి ప్రైవేట్‌గా అప్పు చేసి ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేశాడు. ఇంత చేశాక తాను ఇల్లు కట్టింది అక్రమ లే అవుట్లో కావడంతో భవిçష్యత్‌లో ఇబ్బందులు తప్పవని మనసులో ఓ మూల భయం రామును తొలుస్తూనే ఉంది. -
గ్రామాలకు వైభవం
శ్రీకాకుళం జిల్లాలో మారుమూల ప్రాంతంలో ఉండే జీరుపాలెం, జగన్నాథపురం గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడేవారు. ఎన్‌హెచ్–16 జాతీయ రహదారి నుంచి ఈ గ్రామాలను, రూ.8 కోట్లతో రణక్షేత్రం మండలంలోని 21 చిన్న, చిన్న గ్రామాలను కలుపుతూ 15 కి.మీ. పొడవున రోడ్డు నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అనంతపురం జిల్లాలో సుమారు వెయ్యి జనాభా ఉండే రేకులకుంట గ్రామంలో ప్రస్తుతం రూ.79.30 లక్షల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రూ.40 లక్షలతో సచివాలయ భవనం, రూ.21.80 లక్షలతో రైతు భరోసా కేంద్రం, రూ.17.50 లక్షలతో హెల్త్ క్లినిక్ భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆరు నెలల కిందటే ఆ గ్రామంలో రూ.5 లక్షల వ్యయంతో సిమెంట్ రోడ్డు నిర్మించారు. సాక్షి, అమరావతి: ఏడాది కాలంలో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ఒక్క పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారానే రూ.11,192 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటి వరకు రోడ్డు వసతికి నోచుకోని చాలా గ్రామాలకు కొత్తగా తారు రోడ్లను మంజూరు చేసింది. దెబ్బతిన్న రోడ్డు స్థానంలో రోడ్డు వేయడానికి ఇంకొన్ని చోట్ల అనుమతిచ్చింది. చాలా గ్రామాల్లో హెల్త్ క్లినిక్ భవనం, రైతు భరోసా కేంద్రం నిర్మాణాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి రుణం తీసుకొని గత ప్రభుత్వం ఎన్నికలకు ముం దు అనుమతిచ్చిన రూ.4,404 కోట్ల రోడ్ల పనులనూ కలుపుకుంటే గ్రామీణ ప్రాంతంలో రోడ్ల నిర్మాణానికి, ఇతర మౌలిక వసతుల కల్పనకు కలిపి మొత్తం రూ.15 వేల కోట్లకు పైబడి ఒక పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా అభివృద్ధి పనులను ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఏడాది కాలంలో కొత్తగా మంజూరు చేసిన పనులివే.. ► మారుమూల గ్రామాలను, వాటికి సమీపంలోని పెద్ద గ్రామం లేదా పట్టణానికి కలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా 3,285 కి.మీ. పొడవునా కొత్తగా రోడ్డు నిర్మాణ పనులకు గడిచిన ఏడాది కాలంలో ప్రభుత్వం అనుమతి తెలిపింది. ఈ పనులకు మొత్తం రూ.1,950 కోట్లు ఖర్చవుతుందని అంచనా. 2,214 కి.మీ. పొడవునా 284 పనులు గుర్తించి, ఇప్పటికే టెండరు ప్రక్రియను మొదలుపెట్టారు. ► రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ ఆఫ్ లెఫ్ట్ వింగ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ పథకంలో భాగంగా మరో రూ.755 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులను ప్రభుత్వం మంజూరు చేసింది. ► రాష్ట్ర వ్యాప్తంగా రూ.4,356 కోట్ల వ్యయంతో 10,876 గ్రామ సచివాలయ భవనాల నిర్మాణానికి ప్రభు త్వం అనుమతి తెలపగా.. ఇప్పటికే దా దాపు అన్ని పనులు మొదలయ్యాయి. దాదాపు 127 చోట్ల పనులు పూర్తయినట్టు అధికారులు వెల్లడించారు. ► గ్రామాల్లో వైద్య సేవలందించడానికి రూ.2,245 కోట్ల వ్యయంతో 10,062 గ్రామాల్లో హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణానికి అనుమతి తెలపగా, 802 చోట్ల ఆయా భవన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ► 8,567 గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల నిర్మాణానికి రూ.1,511 కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. ప్రస్తుతం 506 గ్రామాల్లో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ► అంగన్వాడీ కేంద్రాలకు కొత్త భవనాల నిర్మాణానికి రూ.375 కోట్ల పనులకు ప్రభుత్వం అనుమతి తెలిపింది. పంచాయతీ భవనం లేకుంటే రూ.80 లక్షల పనులు పంచాయతీ భవనం కూడా లేని మా గ్రా మానికి హెల్త్ క్లినిక్ భవనం, రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయ భవన నిర్మాణాలకు అనుమతి ఇవ్వడం సంతోషంగా ఉంది. ఏడాది కాలంలో దాదాపు రూ.80 లక్షల విలువ చేసే పనులు మా ఊరులో మొదలయ్యాయి. – సాకే లక్ష్మినారాయణ, రేకులకుంట, బుక్కరాయసముద్రం మండలం, అనంతపురం జిల్లా పనులన్నీ ప్రారంభం గ్రామీణ ప్రాం తాల్లోని ప్రతి నివాసిత ప్రాం తానికి రోడ్డు వసతి కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్ భవనాలను నిర్మించాలన్నది ఈ ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలు. అందుకనుగుణంగా ఆయా పనుల్లో మూడో వంతు ఇప్పటికే మొదలయ్యాయి. – సుబ్బారెడ్డి, ఈఎన్సీ,పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం -
14 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా..
సాక్షి, విజయవాడ: ఉపాధి హామీ పనుల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్‌వన్‌గా నిలిచిందని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 14 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా పని కల్పించామని, కరోనా కష్టకాలంలో అత్యధికంగా ఉపాధి కల్పించగలిగామని ఆయన వెల్లడించారు. (కాంట్రాక్ట్ ఉద్యోగులపై సీఎం జగన్ సమీక్ష) ‘‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టార్గెట్ మేరకు 57 లక్షల మంది కూలీలకు పని కల్పించాం. జూన్ ఒక్క నెలలోనే అత్యధికంగా 8 కోట్ల పని దినాలు కల్పించాం. కరోనా కాలంలో పని కల్పించి రూ.4 వేల కోట్ల వేతనాలు చెల్లించామని’’ ఆయన పేర్కొన్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, నాడు - నేడు పాఠశాలల పనులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆస్తుల నిర్మాణంలోనూ దేశంలోనే ఏపీని నంబర్‌వన్ స్థానంలో నిలిపామని, పారదర్శకంగా వేతనాల చెల్లింపుల్లోనూ అందరికంటే ముందజలో ఉన్నామని గిరిజా శంకర్ వెల్లడించారు. (‘గిరిజనులకు మెరుగైన వైద్యమే లక్ష్యం’) -
నేడే ‘స్థానిక’ రిజర్వేషన్లు ఖరారు
సాక్షి, అమరావతి: హైకోర్టు తీర్పునకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా గురువారం ఖరారు కానున్నాయి. జెడ్పీ చైర్మన్, ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ పదవులకు పంచాయతీరాజ్ శాఖ తాజాగా నేటి మధ్యాహ్నంలోగా రిజర్వేషన్లు ఖరారు చేయనుంది. జిల్లాలవారీగా గెజిట్ జారీ చేసి ఆ వెంటనే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు కాపీని అందచేయడంతోపాటు వెబ్‌పోర్టల్‌లో అప్లోడ్ చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయ అధికారులు తెలిపారు. సర్పంచి, వార్డు సభ్యుల పదవులకు శుక్రవారం రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశం ఉంది. హైకోర్టు తీర్పు వెలువడగానే విధివిధానాలపై ఉత్తర్వులు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్లోనే ఉత్తర్వులు ఇచ్చింది. మంత్రివర్గ సమావేశంలోనూ ఆమోదించింది. ఆమేరకు రిజర్వేషన్లను ఖరారు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ కొందరు టీడీపీ నేతలు కోర్టును ఆశ్రయించడంతో రిజర్వేషన్లను 50 శాతానికే పరిమితం చేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా పదవుల రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం నూతన విధివిధానాలను ఖరారు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారులో అనుసరించాల్సిన నియమ నిబంధనలపై హైకోర్టు తీర్పు వెలువడిన 2వ తేదీనే పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రిజర్వేషన్ల ఖరారులో తాజా విధివిధానాలు.. - ఒక మండలంలో జెడ్పీటీసీ, మండల పరిషత్ అధ్యక్ష స్థానాలు ఒకే కేటగిరీ రిజర్వేషన్లో ఉంచకూడదు. ఉదాహరణకు ఏదైనా మండలంలో జెడ్పీటీసీ బీసీ జనరల్‌కు రిజర్వయితే ఎంపీపీ పదవి అదే కేటగిరికీ రిజర్వు చేయకూడదు. ఎంపీపీని బీసీ మహిళ లేదా మరే ఇతర రిజర్వేషన్ కేటగిరీకి రిజర్వు చేయవచ్చు. - జెడ్పీటీసీని ఎస్సీ మహిళకు రిజర్వు చేసిన మండలంలో ఎంపీపీ స్థానాన్ని ఎస్సీ మహిళకు రిజర్వ్ చేయడానికి వీల్లేదు. అదే సమయంలో జెడ్పీటీసీ అన్ రిజర్వు కేటగిరిలో ఉన్న మండలంలో ఎంపీపీ పదవి అన్ రిజర్వు కేటగిరిలో ఉండవచ్చు. - గ్రామ సర్పంచి, ఎంపీటీసీ పదవులను మండల జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. - మండలంలో సర్పంచి లేదా ఎంపీటీసీ పదవులను ఏ కేటగిరికి ఎన్ని రిజర్వు చేస్తారన్నది ఆ ప్రాంత ఆర్డీవో ఖరారు చేస్తారు. ఏ స్థానం ఏ కేటగిరికి రిజర్వు చేశారన్నది ఆర్డీవోనే ఖరారు చేసి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. - ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులను జిల్లాలోని మొత్తం జనాభా ప్రాతిపాదికన ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. - జిల్లాలోని బీసీ ఓటర్ల సంఖ్య ఆధారంగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. - జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించే స్థానాలు మొత్తం స్థానాల్లో సగానికి మించకూడదు. - జిల్లాలో ఎంపీపీ, జడ్పీటీసీ పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎన్ని స్థానాలు రిజర్వు చేయాలన్నది కలెక్టర్లు నిర్ణయిస్తారు. ఏ స్థానాలు ఏ కేటగిరికి కేటాయిస్తారో కలెక్టరే ఖరారు చేసి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. - జెడ్పీ చైర్మన్ పదవుల రిజర్వేషన్లను పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ నిర్ధారిస్తారు. - రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్న హైకోర్టు తీర్పు మేరకు 13 జడ్పీ చైర్మన్ పదవుల్లో ఎస్టీలకు ఒకటి, ఎస్సీలకు రెండు, బీసీలకు మూడు చొప్పున రిజర్వు అవుతాయని పంచాయతీరాజ్ శాఖ కార్యాలయ అధికారులు పేర్కొన్నారు. - ఏడు జడ్పీ చైర్మన్ పదవులు అన్ రిజర్వు కేటగిరిలో ఉంటాయి. - షెడ్యూల్ ఏరియాలో మాత్రం ఎస్టీలకు ఒకే మండల పరిధిలో ఎంపీటీసీ, గ్రామ సర్పంచి పదవులకు 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేస్తారు. ఈ మేరకు రాజ్యాంగంలోనే స్పష్టంగా నిబంధనలు ఉన్నాయని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయ అధికారులు తెలిపారు. - షెడ్యూల్ ఏరియాలో ఉండే జెడ్పీటీసీ పదవులను పూర్తిగా ఎస్టీలకే రిజర్వు చేస్తారు. -
స్థానిక సంస్థలకు మరిన్ని అధికారాలు
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీలతో పాటు మండల, జిల్లా పరిషత్‌లకు మరిన్ని అధికారాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో అమలవుతున్న 1994 నాటి పంచాయతీరాజ్ చట్టం స్థానంలో కొత్త పంచాయతీరాజ్ చట్టం రూపకల్పన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ నేతృత్వంలో.. తూర్పు గోదావరి జిల్లాలోని పంచాయతీరాజ్ శాఖ శిక్షణా కేంద్రం ప్రిన్సిపాల్ ఆనంద్‌తో పాటు మరో ముగ్గురు అధికారుల బృందం కొత్త చట్టం ముసాయిదా తయారీ పనిలో ఉంది. ఈ బృందం వివిధ జిల్లాల్లో పనిచేసే పంచాయతీరాజ్ శాఖ సీనియర్ అధికారులతో కలిసి ఈ నెల 22, 23, 24 తేదీల్లో ముసాయిదా చట్టం రూపకల్పనపై కమిషనర్ కార్యాలయంలో వర్క్‌షాప్ నిర్వహించింది. 15–20 రోజులలో కొత్త చట్టం ముసాయిదా నివేదికను తయారు చేసి, ప్రభుత్వానికి అందజేయనున్నట్టు బృందంలోని ఒక సభ్యుడు ‘సాక్షి’కి వివరించారు. -
ఫిబ్రవరి నుంచి ఇంటి వద్దకే పింఛన్
సాక్షి, అమరావతి: ఫిబ్రవరి నుంచి లబ్ధిదారుల ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమం మొదలు కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. వలంటీర్ల ద్వారా నేరుగా చేరవేయాలన్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పనితీరుపై బుధవారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పనులు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణంతో పాటు నాడు– నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలల ప్రహరీ గోడల నిర్మాణం, వాటర్ గ్రిడ్ అంశాలపై చర్చించారు. వివిధ సర్వేలంటూ ముడిపెట్టి అసలైన నిరుపేదలకు ఇళ్ల పట్టాలను నిరాకరించే పరిస్థితి ఉండకూడదని సీఎం అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయి పరిశీలన చేసి, ఆ మేరకు లబ్ధిదారులను గుర్తించాలన్నారు. అర్హులు ఎంత మంది ఉన్నా పట్టాలు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. గ్రామాల్లో మినీ గోడౌన్ల నిర్మాణం రైతులు తమ పంటలకు గిట్టుబాబు ధర వచ్చేంత వరకు నిల్వ ఉంచుకునేందుకు వీలుగా ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో మినీ గోడౌన్ల నిర్మాణంపై అధికారులు దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. గ్రామ సచివాలయ భవనాలు, వాటికి అనుబంధంగా నిర్మించే రైతు భరోసా కేంద్రాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి రైతులకు అవసరమైన వాటన్నింటినీ రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ చేసేలా ప్రణాళిక బద్దంగా పని చేయాలని సూచించారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురిసినందున గ్రామాల్లో ఎక్కడికక్కడ వ్యవసాయ రంగంలో కూలీలకు పనులు లభిస్తున్నాయని ఈ సందర్భంగా అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అయినప్పటికీ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పని కల్పించడంలో ఈ ఏడాది పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు. ఈ పథకం ద్వారా చేపట్టే ప్రతి పని పకడ్బందీగా, ప్రజలకు ప్రయోజనం కలిగించేదిగా ఉండాలని సీఎం సూచించారు. సచివాలయాల్లో ఖాళీలను భర్తీ చేయండి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడున్న 11,158 గ్రామ సచివాలయాలకు అదనంగా మరో 300 వరకు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై సీఎం సానుకూలంగా స్పందించారు. ఇందుకు కొత్తగా మరో 3 వేలకు పైగా ఉద్యోగ నియామకాలు చేయాల్సి ఉంటుందని అధికారులు సీఎం దృష్టికి తీసుకురాగా.. సచివాలయాల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 15,971 ఉద్యోగాలతో పాటే వీటిని భర్తీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
‘సచివాలయ’ ఉద్యోగాలకు ఆన్లైన్ ఆమోదం
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు పొందిన వారు ఆన్లైన్లో ఆమోదం తెలపాలని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. ఉద్యోగ అంగీకార పత్రాన్ని గ్రామ సచివాలయ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు పొందిన వారు ఒక ఉద్యోగాన్ని మాత్రమే ఎంపిక చేసుకోవాలన్నారు. ఏ ఉద్యోగాన్ని ఎంపిక చేసుకున్నారో ఆన్లైన్లో ఆప్షన్ ఇవ్వాలని సూచించారు. ఉద్యోగం పొందిన వారు ఏ మండలంలో పనిచేస్తారో కూడా వెబ్సైట్లో తెలపాలన్నారు. ఉద్యోగానికి ఎంపికయిన ప్రతిఒక్కరూ విధిగా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని తెలిపారు. (చదవండి: ప్రతీ ఏటా ఉద్యోగ నోటిఫికేషన్: సీఎం జగన్) -
వెయిటేజ్ దరఖాస్తులు 1.08 లక్షలు
సాక్షి, అమరావతి: సచివాలయ ఉద్యోగ రాత పరీక్షల్లో వెయిటేజ్ మార్కులు కోరుతూ 1,08,667 మంది దరఖాస్తుల్లో కోరినట్టు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. వీరిలో ఎక్కువ మందికి వెయిటేజ్ మార్కులు పొందడానికి అర్హత లేకపోయినా దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్.. వెయిటేజ్ మార్కులు కోరిన వారందరి వివరాలను ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసిన వివిధ శాఖలకు పంపారు. వారికి వెయిటేజ్ పొందే అర్హత ఉందా? లేదా? ఉంటే ఎవరికి ఎన్ని మార్కులు వెయిటేజ్ ఇస్తున్నది మంగళవారం ఉదయంలోగా సీల్డ్ కవర్లో పంపాలని కోరారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. కొన్ని ఉద్యోగాలకు సంబంధిత శాఖలు తమ శాఖలో అదే ఉద్యోగంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేసే వారికి వారి సర్వీసు కాలాన్ని బట్టి గరిష్టంగా 15 మార్కులు వెయిటేజ్ ఇవ్వనున్నట్టు నోటిఫికేషన్లలో ప్రకటించాయి. నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం.. ఉదాహరణకు ప్రస్తుతం కాంట్రాక్ట్ పద్ధతిలో ఏఎన్ఎంగా పనిచేసే మహిళా అభ్యర్థికి ఏఎన్ఎం ఉద్యోగ రాతపరీక్షలో మాత్రమే వెయిటేజ్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. డిజిటల్ అసిస్టెంట్, మహిళా పోలీస్ వంటి పోస్టులకు అదనంగా దరఖాస్తు చేసుకున్నా ఆ రెండు పోస్టులకు వెయిటేజ్ ఉండదని పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఆ మహిళా అభ్యర్థి ఏఎన్ఎం పోస్టుకు దరఖాస్తు చేసుకోకుండా డిజిటల్ అసిస్టెంట్, మహిళా పోలీసు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నా వెయిటేజ్ పొందేందుకు అర్హత ఉండదని అంటున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నవారంతా తాము ప్రభుత్వంలో పనిచేస్తున్నామంటూ వెయిటేజ్ కోరినట్టు అధికారులు గుర్తించారు. వెయిటేజ్‌పై నేడు స్పష్టత దరఖాస్తుల్లో వెయిటేజ్ మార్కులు కోరిన 1,08,667 మందిలో ఎంతమంది అర్హులో మంగళవారం ఉదయం నాటికి స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆయా ప్రభుత్వ శాఖలు సీల్డ్ కవర్ ద్వారా వివరాలు తెలియజేస్తాయని అంటున్నారు. ఆ తర్వాత ఫలితాలు ప్రకటించే ముందు రాతపరీక్షల్లో అభ్యర్థులకు వచ్చిన మార్కులతో కలిపి తుది ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొంటున్నారు. -
ఏపీలో కొలువుల జాతర... 1,26,728 పోస్టులకు నోటిఫికేషన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ కనివినీ ఎరుగని రీతిలో ఒకే విడతలో 1,26,728 ప్రభుత్వోద్యోగ నియామకాలకు సంబంధించిన రెండు నోటిఫికేషన్లు శుక్రవారం రాత్రి విడుదలయ్యాయి. గ్రామ సచివాలయాల్లో 95,088 ఉద్యోగాలకు పంచాయతీరాజ్ శాఖ.. పట్టణ వార్డు సచివాలయాల్లో 31,640 ఉద్యోగాలకు పట్టణాభివృద్ది శాఖ నోటిఫికేషన్లను వేర్వేరుగా జారీచేశాయి. శనివారం ఉ.11 గంటల నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఆగస్టు 10వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. సెప్టెంబరు ఒకటవ తేదీన రాత పరీక్ష నిర్వహిస్తారు. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన రోజునే గ్రామ, వార్డు స్థాయిలో సచివాలయాల వ్యవస్థను కొత్తగా ఏర్పాటుచేసి, ప్రతి సచివాలయంలో పనిచేసేందుకు 10 నుంచి 12 మంది చొప్పున నియమించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల్లో 11,158 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తుండగా.. పట్టణ ప్రాంతాల్లో 3,786 వార్డు సచివాలయాలను ఏర్పాటుచేస్తున్నారు. వైద్య ఆరోగ్య, రెవెన్యూ, పోలీస్ తదితర 11 ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ మొత్తం 22 రకాల ఉద్యోగాలను సర్కారు భర్తీచేస్తుంది. మూడు ప్రత్యేక వెబ్సైట్ల ద్వారా.. కాగా, ఆయా ఉద్యోగాలకు అర్హులైన నిర్యుదోగ యువత నుంచి అన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించేందుకు gramasachivalayam. ap. gov. in, vsws. ap. gov. in, wardsachivalayam. ap. gov. in అనే మూడు ప్రత్యేక వెబ్సైట్లను సిద్ధంచేశారు. శనివారం ఉ.11 గంటల నుంచి ఇవి దరఖాస్తుదారులకు అందుబాటులోకి వస్తాయని పంచాయతీరాజ్, పట్టణాభివృద్ది శాఖ అధికారులు చెబుతున్నారు. నిర్ణీత ఫార్మాట్లో దరఖాస్తు ఫారం, 22 రకాల ఉద్యోగాలకు వేర్వేరుగా ఏ ఉద్యోగానికి ఏయే విద్యార్హతలు, వయో పరిమితి, ఎంపిక విధానం, రాత పరీక్షకు సంబంధించిన సిలబస్ వంటి వివరాలను ఆయా వెబ్సైట్లలోనే అందుబాటులో ఉంచుతారు. రెండంచెల పరీక్ష విధానం.. అన్ని రకాల ఉద్యోగాల భర్తీకి రెండంచెల పరీక్ష విధానం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ప్రతి ఉద్యోగానికి 150 మార్కులకు రెండు పేపర్ల విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. తప్పు సమాధానానికి నెగిటివ్ మార్కింగ్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టనున్నారు. గ్రామ సచివాలయాల్లో పనిచేయడం కోసం భర్తీచేసే వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, మహిళా పోలీసు, వేల్పేర్ మరియు ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టులకు ఉదయం 75 మార్కులకు జనరల్ నాలెడ్జిలో, సాయంత్రం 75 మార్కులకు రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ అంశాలపై పరీక్ష నిర్వహిస్తారు. అలాగే, ఏఎన్ఎం, సర్వే అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్, విలేజీ అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజీ హార్టికల్చర్ అసిస్టెంట్, విలేజీ సెరికల్చర్ అసిస్టెంట్ పోస్టులకు ఉదయం 50 మార్కులకు జనరల్ నాలెడ్జిపై.. సాయంత్రం వంద మార్కులకు రీజనింగ్, మెంటల్ ఎబిలిటీతో పాటు ఆయా ఉద్యోగానికి సంబంధించిన అంశాలపై పరీక్ష ఉంటుంది. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వెయిటేజీ కాగా, ఇప్పటికే ఆయా శాఖల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తూ నోటిఫికేషన్లో పేర్కొన్న మేరకు వారికి అర్హత ఉండి రాత పరీక్షకు హాజరైతే.. అలాంటి అభ్యర్థులకు వెయిటేజీ ఇవ్వాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఒక్కో ఉద్యోగానికి ఆ శాఖలో ఉన్న నిబంధనలకు అనుగుణంగా ఈ వెయిటేజీ వేర్వేరుగా ఉంటుంది. 9,359 లైన్మెన్ పోస్టుల భర్తీ కూడా. ఇదిలా ఉంటే.. 9,359 ఎనర్జీ అసిస్టెంట్ (లైన్మెన్) ఉద్యోగాల భర్తీకి కూడా వేరుగా నోటిఫికేషన్ రానుంది. విద్యుత్ డిస్కంలు దీనిని జారీచేస్తాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. గ్రామ సచివాలయాల్లో పనిచేసేందుకు 5,573 గ్రామ ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులను, వార్డు సచివాలయాల్లో పనిచేసేందుకు 3,786 వార్డు ఎనర్జీ సెక్రటరీ పోస్టులను డిస్కంలు వేరుగా భర్తీచేస్తాయి. ప్రభుత్వ ఉద్యోగ నియామక నిబంధనలకు, డిస్కం ద్వారా చేపట్టే ఉద్యోగ నియామకాల తీరు వేర్వేరు కావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఈ నోటిఫికేషన్ కూడా ఒకట్రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. గ్రామ సచివాలయాల సంఖ్య పెంపునకు ప్రతిపాదన మొదట 11,114 గ్రామ సచివాలయాలను ఏర్పాటుచేయాలని సర్కారు నిర్ణయించగా.. తాజాగా ఆ సంఖ్యను 11,158కు పెంచాలని కోరుతూ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ శుక్రవారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాలో మొదట ప్రతిపాదించిన వాటి కన్నా కొన్ని అదనంగా గ్రామ సచివాలయాల ఏర్పాటుకు ప్రతిపాదించారు. -
‘ఉపాధి నిధుల వినియోగంలో ముందుండాలి’
హైదరాబాద్: హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామాలకు అభివృద్ధి నిధుల కేటాయింపుల్లో ప్రాధాన్యత కల్పిస్తామని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కల సంరక్షణ ఆధారంగానే జీపీ భవనాలు, సీసీ రోడ్లు మంజూరు చేస్తామని పేర్కొన్కారు. దీంతోపాటు ఉపాధి హామీపథకం నిధుల వినియోగంలో రాష్ట్రం ముందుండాలని సూచించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సదస్సులకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీలో వైకుంఠధామం కచ్చితంగా నిర్మించాలన్నారు. కాగా ఉపాధి హామీ పనులు గ్రామ పంచాయతీ ఆమోదంతో జరగాలని పేర్కొన్నారు. అదేవిధంగా గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో ఉండాలని సూచించారు. -
పంచాయతీలకు పగ్గాలు
గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పూర్తిస్థాయిలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా పనుల పర్యవేక్షణ, గుర్తింపు బాధ్యతలను గ్రామ పాలక వర్గాలకు ఇవ్వనుంది. కొత్త పంచాయతీరాజ్ చట్టం అమలులోకి వచ్చిన నాటి నుంచే ఈ బాధ్యతలను గ్రామ పంచాయతీలకు అప్పగించాలని నిర్ణయించినా వరుస ఎన్నికల నేపథ్యంలో వీలుకాలేదు. ప్రస్తుతం అవి పూర్తి కావడంతో త్వరలోనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుంది. సాక్షి, నాగర్‌కర్నూల్: కొత్త విధానంలో ఫీల్డ్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ కీలకం కానున్నారు. క్షేత్రస్థాయిలో ఆయా గ్రామాలకు ఏయే పనులు కావాలో, ఎంతమంది కూలీలు అవసరమో, ఏ పనులు చేపడితే గ్రామీణాభివృద్ధి సాధ్యమవుతుందో పాలక వర్గాలు సమగ్రంగా చర్చించిన తర్వాతే పనులను కేటాయిస్తారు. ఇంతవరకు ఈ పనుల్లో కీలకంగా వ్యవహరించిన మండల పరిషత్‌లు ఇక కేవలం పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టడం వరకే పరిమితం కానున్నాయి. పనుల గుర్తింపు, చేపట్టిన వాటిని పూర్తి చేయడంలో పంచాయతీలు కీలకపాత్ర పోషిస్తాయి. మరోవైపు ఉపాధిహామీ పనుల్లో అవినీతి, అక్రమాలను నివారించేందుకు ప్రభుత్వం ఫిర్యాదల పెట్టె ఏర్పాటు చేస్తారు. ప్రజలు, కూలీలు, రైతులు ఎవరైనా పనుల్లో చోటు చేసుకునే లోపాలపై ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేయవచ్చు. దీనిపై ఇప్పటికే డీఆర్డీఓలకు పంచాయతీరాజ్ కమిషనర్ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఇది క్షేత్రస్థాయిలో అమలైతే మరింత ప్రయోజనం చేకూరనుంది. ఉపాధి హామీలో పారదర్శకత 2005 నుంచి ఉపాధిహామీ పనులు కొనసాగుతున్నాయి. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూనే ఉంది. మండల పరిషత్తు అధికారుల పర్యవేక్షణలో పనులు చేస్తున్నా.. గ్రామీణ స్థాయిలో మాత్రం పారదర్శకత లోపించింది. పలుచోట్ల అవతవకలు చోటు చేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల పనులు చేపట్టకున్నా జరిగినట్లు రికార్డులు సృష్టిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని భావిస్తోంది. గతంలో మట్టిపనులకే పరిమితమైన ఈ పథకంలో వ్యవసాయ రంగానికి అనుకూలంగా ఉండే పనులను సైతం చేపడుతుంది. పూడికతీత, సేద్యపు కుంటలు, కాల్వలు, శ్మశానవాటికలు, డంపింగ్‌యార్డులు, ఇంకుడుగుంతలు, వరద నీటికి అడ్డుకట్ట వేసేందుకు చెక్‌డ్యాంల నిర్మాణం, హరితహారం వంటి 74 రకాల పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఈ పనులను ఉపాధిహామీ పథకానికి అనుసంధానం చేసి.. వాటి నిర్వహణ బాధ్యతను గ్రామ పంచాయతీలకు అప్పగించనున్నారు. 6.85లక్షల జాబ్‌కార్డులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,698 గ్రామ పంచాయతీల్లో 6,85,377 లక్షల జాబ్‌కార్డులు, 14,73,999లక్షల మంది కూలీలు ఉన్నారు. కొత్త విధానం ప్రకారం పనులన్నీ గ్రామ పంచాయతీల వారీగా జరుగుతాయి. పాత గ్రామ పంచాయతీల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. కొత్త పంచాయతీల్లో కార్యదర్శే ఉపాధిహామీని పర్యవేక్షించనున్నారు. అలాగే కూలీలకు వేతన స్లిప్‌లను వారు అందజేస్తారు. పనులు లేనప్పుడు గ్రామ పంచాయతీకి వెళ్లి అడిగితేవెంటనే ‘ఉపాధి’కి చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఫీల్డ్ అసిస్టెంట్లు చేపట్టాల్సిన పనులను గుర్తించి నామమాత్రంగా గ్రామ సభ నిర్వహించి వాటికి ఆమోదం పొందినట్లు రికార్డులు నమోదు చేసేవారు. ఇకపై అలాంటి వాటికి చెక్ పడనుంది. పంచాయతీ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను గుర్తిస్తారు. ఆ తర్వాతా గ్రామసభ నిర్వహించి అవసరమైన వాటికే ఆమోదం తెలుపుతారు. ఇలా చేయడం వల్ల సకాలంలో పూర్తి కావడానికి అవకాశం ఉంటుంది. ఈ పనులను పంచాయతీలకు అప్పగిస్తే ఫీల్డ్ అసిస్టెంట్ గ్రామ పంచాయతీల వద్దే ఉంటారు. ఉదయం ఏడు గంటలకే కూలీలకు అందుబాటులోకి రావాలి. ఇందుకోసం అతనికి గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే ఏర్పాట్లు చేస్తారు. అందులో పనికి సంబంధించిన రికార్డులు, కూలీల హాజరు రిజిస్టర్లు, ఇతర ఫైళ్లు ఉంటాయి. వాటిని సర్పంచి, పంచాయతీ కార్యదర్శి తనిఖీ చేసే అధికారం ఉంటుంది. ప్రత్యేకంగా ఫిర్యాదుల పెట్టె గ్రామీణ నిరుపేదలకు కనీస పనిదినాలు కల్పించే ఈ ఉపాధిహామీ పథకంలో ఇక నుంచి మండల పరిషత్ ఆజమాయిషీ తగ్గి పంచాయతీ పాలక వర్గాలకే పూర్తి పర్యవేక్షణ ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఏయే పనులు చేపడితే కూలీలకు ఉపాధి దొరుకుతుందో వాటిని మాత్రమే చేసేలా చర్చించాలి. గతంలో కొన్ని చోట్ల అవసరం లేని పనులు సైతం చేపట్టడంతో ప్రజాధనం వృథా అయింది. కోట్లాది రూపాయలు వెచ్చిం చినా గ్రామీణులు సంపూర్ణమైన ఫలితాలు పొందలేక పోయారనే ఫిర్యాదులు వచ్చాయి. ఉపాధిహామీ పనుల్లో అవినీతి, అక్రమాలను నివారించేందుకుగాను గ్రామ పంచాయతీల్లో ఫిర్యాదుల పెట్టే ఏర్పాటు చేయనున్నారు. -
పంచాయతీరాజ్ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి
హైదరాబాద్: పంచాయతీరాజ్ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడంతో పాటుగా, బీసీలకు పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో ఆయన నివాసంలో శుక్రవారం ఆర్.కృష్ణయ్య చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లను 34% నుంచి 22% తగ్గిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమే రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరిపారని, దీనిమూలంగా 1,600 సర్పంచ్ పదవులు, 20 వేల వార్డు మెంబర్లు బీసీలకు దక్కకుండా పోయాయని వాపోయారు. రాష్ట్రంలో బీసీలు సమగ్ర సర్వే ప్రకారం 52% ఉంటే 34% రిజర్వేషన్లు మాత్రమే ఇవ్వడం పట్ల బీసీల్లో అసంతృప్తి ఉందన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 34% రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు జరపాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి రాజ్యాంగ సవరణకు సీఎం అధ్యక్షతన అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానితో చర్చలు జరపాలని మంత్రికి విన్నవించారు. పార్లమెంటు సమావేశాలు జరగడంలేదు కాబట్టి రాష్ట్రపతి ద్వారా ఆర్డినెన్స్ జారీ చేయించవచ్చునన్నారు. దీనికి మంత్రి సానూకులంగా స్పందిస్తూ.. కేసీఆర్ నాయకత్వంలో కొత్తగా ఏర్పడే కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి రాజ్యాంగ సవరణ ద్వారా రిజర్వేషన్లు పెంచడానికి ప్రయత్నిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
48 గంటల్లో మరణ ధ్రువీకరణ పత్రం
సాక్షి, హైదరాబాద్: రైతు బీమా కింద క్లెయిమ్స్‌కు అవసరమైన రైతు మరణ ధ్రువీకరణ పత్రం ఇక 48 గంటల్లోనే రానుంది. ఈ పత్రాలను అందించడంలో గ్రామ కార్యదర్శి వేగంగా స్పందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పంచాయతీరాజ్ శాఖను ఆదేశించారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఒకవేళ రైతు పట్టణాల్లో చనిపోయినా మున్సిపల్ కమిషనర్ 48 గంటల్లోగా మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాలని సీఎం స్పష్టంచేసినట్లు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి ‘సాక్షి’కి తెలిపారు. ఈ నెల 14 నుంచి రైతు బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా రైతు బాండ్ల పంపిణీ పూర్తికానుంది. మంగళవారం నుంచి రైతులెవరైనా చనిపోతే వారికి ఎల్ఐసీ నుంచి బీమా సొమ్ము అందనుంది. బాండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇప్పటికే పూర్తి చేసిన వ్యవసాయ శాఖ.. ఇప్పుడు క్లెయిమ్స్ ఇప్పించే అంశంపై దృష్టి సారించింది. వాస్తవంగా ఈ కార్యక్రమాన్ని ఎల్ఐసీనే చేపట్టాలి. కానీ ఎల్ఐసీకి విస్తృత నెట్వర్క్ లేనందున ఆలస్యమయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ భావిస్తోంది. అందుకే ఎక్కడైనా రైతు చనిపోయిన వెంటనే తక్షణమే వారికి మరణ ధ్రువీకరణ ఇప్పించడంతోపాటు ఇతరత్రా అన్ని వివరాలను ఎల్ఐసీకి పంపి పది రోజుల్లో క్లెయిమ్స్ ఇప్పించాలని నిర్ణయించింది. 27 లక్షల మంది రైతులకు బీమా రైతు చనిపోతే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా సొమ్ము అందించడమే రైతు బీమా ఉద్దేశం. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసు ఉండి, రైతుబంధు చెక్కు పొందిన ప్రతి రైతుకూ బీమా సౌకర్యం ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం 48.77 లక్షల మంది రైతులకు రైతుబంధు చెక్కులను పంపిణీ చేశారు. వ్యవసాయ నివేదిక ప్రకారం 47.31 లక్షల మంది రైతులు బీమా కోసం వ్యవసాయ విస్తరణాధికారులను సంప్రదించారు. ఇందులో 27,00,416 మంది రైతులు నిబంధనలకు అనుగుణంగా బీమాకు అర్హులయ్యారు. వారిలో ఎవరైనా చనిపోతే మంగళవారం నుంచి బీమా క్లెయిమ్స్ అందిస్తారు. రైతు కుటుంబాలకు పది రోజుల్లోనే క్లెయిమ్స్ అందించేందుకు వ్యవసాయశాఖ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించనుంది. అందుకు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) సహకారంతో వ్యవసాయశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. రైతు చనిపోతే వ్యవసాయశాఖ అధికారులు.. క్లెయిమ్ కం డిశ్చార్జి ఫారం, మరణ ధ్రువీకరణ పత్రం జిరాక్స్ కాపీ, సదరు రైతు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, నామినీ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, రైతు బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్‌లను స్కాన్ చేసి పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు. ఎన్ఐసీకి ఆ సమాచారం పంపుతారు. ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఎన్ఐసీ నుంచి ఆటోమెటిక్‌గా ఎల్ఐసీకి రైతు డాక్యుమెంట్లతో సమాచారం వెళ్తుంది. డాక్యుమెంట్లను పరిశీలించిన వెంటనే ఎల్ఐసీ వర్గాలు నామినీ బ్యాంకు ఖాతాలో క్లెయిమ్ సొమ్ము జమ చేస్తారు. మరోవైపు ఇప్పటివరకు దాదాపు 2 లక్షల మంది రైతులు బీమా పథకంలో చేరేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం. -
పంచాయతీ పాలిట్రిక్స్
పంచాయతీ సర్పంచ్ల పదవీకాలం ముగిసింది. ప్రత్యేకాధికారుల పాలన కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అంతే... జిల్లాలో హడావుడి మొదలైంది. తమకు నచ్చిన అధికారులను నియమించుకునేందుకు అధికార పార్టీ నేతలు ఆరాటపడుతున్నారు. అక్రమాలు సజావుగా సాగించుకునేందుకు అనువైన అధికారుల కోసం వెతుకులాడుతున్నారు. ఉన్నతాధికారులు ప్రతిపాదనలు కాదని తమకు అనుకూలమైన అధికారుల పేర్లతో కూడిన జాబితాలు అందజేస్తున్నారు. నియామకాలను పూర్తిచేస్తున్నారు. ఇన్నాళ్లూ ప్రజాధనం దోచుకున్న వీరి తాపత్ర యం చూస్తే మళ్లీ ఎన్నికలు జరిగే వరకు ఆగడాలకు చెక్‌పడేలా లేవన్న వాదన వినిపిస్తోంది. సాక్షి ప్రతినిధి విజయనగరం: పంచాయతీ ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేని టీడీపీ 2013లో ఏర్పడి తాజాగా గడువు ముగి సిన జిల్లాలోని 920 పంచాయతీల పాలనను ప్రత్యేకాధికారులకు అప్పగించింది. ఇన్నాళ్లూ తమ చెప్పుచేతల్లో ఉన్న పంచాయతీలు చేజారిపోకూడదని టీడీపీ నేతలు భావిస్తున్నా రు. దీంతో తమకు అనుకూలంగా ఉండేవారినే ప్రత్యేకాధికారులుగా నియమించాలనిచూస్తున్నా రు. మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా తమ అనుచరులతో సమావేశాలు నిర్వహించి అనుకూలుర జాబితా తయారు చేశారు. ప్రతిపక్షానికి ఎక్కువమంది సర్పంచ్‌లు ఉండటంతో వారి స్థానంలో ఇప్పుడు టీడీపీ అనుకూల అధికారులను ఉంచాలని రూపొందించిన జాబితాలు శనివారం విడుదలయ్యాయి. తహసీల్దార్, డీప్యూటీ తహసీల్దార్, ఎంపీడీఓ, అగ్రికల్చర్ ఏఓ, ఐ సీడీఎస్ సూపర్వైజర్లు, ఆర్డబ్ల్యూఎస్ జేఈ, ఇరిగేషన్ జేఈ, ఎండీఓ ఆఫీస్ సూపరింటెండెంట్ స్థాయి అధికారులు 351 మందిని ప్రత్యేకాధికారులుగా నియమించారు. ఎన్నికలముందు ఎక్కువగా విడుదలయ్యే నిధులతోపాటు, గ్రామాల్లో ఎన్నికల లబ్ధికోసం టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మ రోవైపు ఇప్పుడీ లోకల్ పాలి‘ట్రిక్స్’టీడీపీలో వర్గపోరును బహిర్గతం చేస్తోంది. ఆధిపత్య పోరు...: గ్రామాల్లో తమ వారినే నియమించాలని కొందరు టీడీపీ నేతలు అధికారుల పేర్లను సిఫారసు చేశారు. వాటిని మంత్రులు, ఎమ్మెల్యేల వద్ద ఉంచుతున్నా రు. అయితే, తమ వర్గం వారి జాబితాలకే ప్రజా ప్రతినిధులు మొగ్గుచూపిస్తుండటంతో మరోవర్గం అసంతృప్తికి గురవుతోంది. బొబ్బిలి మండలంలో పాతటీడీపీ వర్గం (తెంటు వర్గం) తరఫున జన్మభూమి కమిటీ అధ్యక్షుడు అల్లాడ భాస్కరరావు, కొత్త టీడీపీ(రాజుల టీడీపీ)తరఫున తమ్మిరె డ్డి దామోదరరావులు 15 మంది అధికారులతో జాబితాను జిల్లాకు ఈనెల 2న పంపారు. అయితే, నిరంతరం మంత్రి సుజయ్ కృష్ణ రంగారావుతో తిరిగే మంత్రి కోటరీ సభ్యులు 15 మంది అధికారుల జాబితాను మారుస్తూ, వీరు పంపిన పేర్లను తొలగించి, మరి కొందరిని చేర్చి కొత్త జాబితాను మార్చి ఈ నెల 3న నెట్లో ఎంపీడీఓ కార్యాలయానికి పంపారు. బొబ్బిలిలో ఉండే లోకల్ నాయకులు అల్లాడ భాస్కరరావు, తమ్మిరెడ్డి దామోదరరావు ఈజాబితాను అంగీకరించే ది లేదని, తెంటు లకు‡్ష్మనాయుడుకు, బేబీ నాయనకు తెలిపి తిరిగి తాము పంపిన జాబితానే ఆమోదించాలని జిల్లాకేంద్రానికి తిరిగి పంపారు. మంత్రి కోటరీ కూడా తమ జాబితానే ఆమోదించాలని పట్టుపడుతున్నారు. దీంతో ఇక్కడే కాకుండా బొబ్బిలి నియోజకవర్గం మొత్తం ప్రత్యేకాధికారుల నియామకంలో స్పష్టత రాలేదు. అదే పనిలో అందరూ... మంత్రిస్థాయిలోనే కాదు ఇటు ఎమ్మెల్యేల స్థాయిలోనూ ప్రత్యేకాధికారుల పేర్ల జాబి తా తయారీపై తీవ్రంగా కసరత్తు జరిగింది. చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి మృణాళిని రెండు రోజుల ముందే టీడీపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మండల కేంద్రాల్లో, ముఖ్యంగా మేజర్ పంచాయతీల్లో టీడీపీకి అనుకూలంగా ఉన్నవారెవరు, ఏ అధికారిని నియమిస్తే తమకు మేలు జరుగుతుందనేదానిపై వారితో చర్చించారు. పనిలోపనిగా తనకు వ్యతిరేకంగా ఉండే స్వపార్టీ వారికి చెక్ పెట్టాలనుకున్నారు. చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ మీసాల సరోజిని భర్త, జెడ్పీటీసీ వరహాలనాయుడికి ఎమ్మెల్యేకు మధ్య నిత్య వివాదం నడుస్తోంది. ఇప్పుడు సరోజిని పదవీకాలం ముగియడంతో ఆ పంచాయతీకి తన మాట వినే అధికారిని పంపించాలని మృణాళిని భావించారు. అనుకున్నట్లుగానే అక్కడి తహసీల్దార్‌కు మండలంలోని చిన్న పంచాయతీని అప్పగించి తనకు అనుకూలంగా ఉంటాడనే కారణంతో అగ్రికల్చర్ ఏడీని ప్రత్యేకాధికారిగా సిఫార్సు చేసి నియమించుకున్నారు. జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఒక్కో అధికారిని రెండు, మూడు పంచాయతీలకు ప్రత్యేకాధికారిగా నియమించారు. ము ఖ్యంగా మేజర్ పంచాయతీలు, తమకు ఇన్నాళ్లూ పట్టులేని పంచాయతీలను తమ అనుకూల అధికారులకు ఒకటి, రెండు చొప్పున అప్పగించేశారు. ప్రాధాన్యంలేని పంచాయతీలను తటస్తులైన అధికారులకు అప్పగించారు. ఇక రేపటి నుంచి పంచాయతీల్లో ఏ పని జరగాలన్నా ప్రజలు, ప్రతిపక్షం గోడు వినేనాథుడు కనిపించకపోవచ్చు. అధికారపార్టీ కనుసన్నల్లోనే పాలన సాగుతోంది. ఇప్పటికే జన్మభూమి కమిటీల పేరుతో సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక పక్షపాతంగా చేస్తున్న టీడీపీ ఆగడాలకు ఇప్పుడు అ«ధికారి అండ దొరికినట్టయ్యింది.