partition
-
సీఎం రేవంత్‌కి విశ్వహిందూ పరిషత్ బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విశ్వహిందూ పరిషత్ బహిరంగ లేఖ రాసింది. భద్రాచలం శ్రీరాముడి భూముల రక్షణకై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.శ్రీరాముడి దేవాలయం తెలంగాణలో, ఆస్తులు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాం’’ అని విశ్వహిందూ పరిషత్ లేఖలో పేర్కొంది. -
దేశ విభజనకు మౌంట్ బాటన్ కారకుడా? సరిహద్దులు ప్రకటించినప్పుడు ఏం జరిగింది?
1947లో భారతదేశ స్వాతంత్ర్య ప్రక్రియలో మనదేశ చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ కీలకపాత్ర పోషించారు. బ్రిటీష్ వారు భారతదేశాన్ని విడిచిపెట్టి, జూన్ 1948 లోపు ఇంగ్లాండ్‌కు తిరిగి వచ్చేలా దేశంలో అధికార మార్పిడి ప్రక్రియను నిర్ధారించడానికి 1947 ఫిబ్రవరిలో లార్డ్ మౌంట్ బాటన్‌ను భారతదేశానికి పంపించారు. ఈ నేపధ్యంలో దేశ విభజన కోసం మౌంట్ బాటన్ ప్రణాళికను రూపొందించారు. అయితే దేశ విభజనకు లార్డ్ మౌంట్ బాటన్ ఎంతవరకు కారణమనే ప్రశ్న కొందరు మేథావులలో తలెత్తెతుంటుంది. మౌంట్‌బాటన్ భారత దేశానికి రాకముందే.. మౌంట్‌బాటన్ 1900, జూన్ 25న విండ్సర్‌లో జన్మించారు. బ్రిటీష్ నావికాదళంలో ఉన్నతాధికారిగా పనిచేశారు. అతనికి బ్రిటిష్ రాజకుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయి. మౌంట్‌బాటన్ భారత దేశానికి రాకముందే భారతదేశ విభజనకు పునాది పడింది. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారు భారీ నష్టాలను చవిచూశారు. యుద్ధం ముగిసే సమయానికి వారు భారతదేశాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం అనేక ప్రణాళికలు రూపొందించారు. వీటిలో వేవెల్ ప్లాన్, క్యాబినెట్ మిషన్ ప్లాన్లు భారతదేశంలో తిరస్కరణకు గురయ్యాయి. భారతదేశంలో హిందూ-ముస్లిం విభజన రెండవ ప్రపంచ యుద్ధ సమయంలోనే తీవ్రమైంది. ఢిల్లీ, ముంబై, రావల్పిండిలో మతకల్లోలాలు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇంగ్లండ్‌లోని నూతన బ్రిటిష్ ప్రభుత్వం 1947, ఫిబ్రవరి 20న లార్డ్ మౌంట్ బాటన్‌ను భారతదేశానికి కొత్త వైస్రాయ్గా నియమించింది. విభజనను వీలైనంత వరకు అడ్డుకోవాలని మౌంట్ బాటన్‌కు బ్రిటీష్ ప్రభుత్వం సూచించింది. అయితే పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసే స్వేచ్ఛ కూడా అతనికి అప్పగించారు. అయితే 1948 జూన్ నాటికి, బ్రిటిష్ వారు ఎట్టి పరిస్థితుల్లోనూ భారతదేశాన్ని విడిచిపెట్టాలనే నిర్ణయానికి వచ్చారు. మౌంట్ బాటన్ 1947, మార్చి 22న భారతదేశానికి వచ్చారు. ఆ సమయంలో ఢిల్లీ, ముంబై, రావల్పిండిలో మతకల్లోలాలు తలెత్తాయి. భారత్‌లో ఉన్నామా?.. పాకిస్తాన్లో ఉన్నామా? పరిస్థితులకు అనుగుణంగా దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడంలో జాప్యం జరిగితే, అంతర్యుద్ధం చెలరేగవచ్చునని మౌంట్ బాటన్ గ్రహించారు. విభజన లేకుండా దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాలని తొలుత మౌంట్ బాటన్ అనుకున్నారు. కానీ ముస్లిం లీగ్ పట్టుదల కారణంగా మౌంట్ బాటన్ విభజన నిబంధనతో 1047 జూన్ 3 ప్రణాళికను సమర్పించవలసి వచ్చింది. బ్రిటీష్ వారు భారతదేశాన్ని విడిచిపెట్టడానికి తొందరపడ్డారని, ఇందుకు మౌంట్ బాటన్ ఉద్దేశాలు కారణమని చెబుతుంటారు. మౌంట్ బాటన్ ప్రతిపాదన ప్రకారం, బ్రిటీష్ పార్లమెంట్ 1947 జూలై 4న భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవంగా ఆగస్టు 15ని నిర్ణయించింది. దీనితోపాటు భారత్-పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖను నిర్ణయించి, ఆగస్టు 17న లైన్ ప్రకటించారు. అప్పటి వరకు సరిహద్దుకు ఇరువైపున గల ప్రజలు భారత్‌లో ఉన్నామా, లేక పాకిస్తాన్లో ఉన్నామా అనేది తెలియని స్థితిలో ఉన్నారు. ఈ కారణంగా తలెత్తిన అల్లర్లలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఏదిఏమైనప్పటికీ మౌంట్‌బాటన్ విభజన విషాదాన్ని తగ్గించారా లేదా అనేది ప్రశ్నార్థకంగానే మిగిలింది. ఇది కూడా చదవండి: చంద్రునిపై భూకంపాలు వస్తాయా? విజ్ఞానశాస్త్రం ఏమి చెబుతోంది? -
'బెంగాల్ విభజనను సమర్థించింది ఎవరో..?' ధోవల్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్..
ఢిల్లీ:నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉండుంటే దేశం విడిపోయి ఉండేది కాదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. దేశ చరిత్రపై మాట్లాడుతూ ధోవల్ వంచకుల పక్షాన చేరిపోయాడని సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ ఆరోపించారు. బెంగాల్ విభజనకు మద్ధతు తెలిపిన వ్యక్తుల్లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కూడా ఉన్నారని చెప్పారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ స్థాపకుడు. జనసంఘ్ తదనంతరం బీజేపీగా అవతరించింది. ధోవల్ వ్యాఖ్యలపై స్పందించిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్..నేతాజీ గాంధీపై ఛాలెంజ్ చేశారా? బోస్ వామపక్షవాదా? లౌకికవాదా? అని ప్రశ్నలు సందిస్తూ బోస్ ఉంటే దేశం విడిపోకుండా ఉండేదా? ఎవరు చెప్పగలరు? అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. నేతాజీ అన్నయ్య శరత్ చంద్ర బోస్ వ్యతిరేకిస్తున్నప్పటికీ బెంగాల్ విభజనను శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సమర్థించారని అన్నారు. నెహ్రూ, బోస్ జీవితాలపై రుద్రాంక్షు ముఖర్జీ రాసిన పుస్తకాన్ని ధోవల్‌కు పంపిస్తానని జైరాం రమేశ్ అన్నారు. ఆ విధంగానైనా ధోవల్ సరైన చరిత్రను తెలుసుకుంటారని చెప్పారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ స్మారక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో అజిత్ ధోవల్ మాట్లాడారు. బోస్ ధైర్య సాహసాల గురించి చెప్పే క్రమంలో.. నేతాజీ ఉండుంటే దేశం విడిపోయి ఉండేది కాదని అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా దుమారం రేపాయి. Mr. Ajit Doval who doesn’t speak much has now joined the tribe of Distorians. 1. Did Netaji challenge Gandhi? Of course he did. 2. Was Netaji a leftist? Of course he was. 3. Was Netaji secular? Of course staunchly and stoutly so. 4. Would Partition not have happened if… pic.twitter.com/Uo8BZCQ51f — Jairam Ramesh (@Jairam_Ramesh) June 17, 2023 ఇదీ చదవండి:బోస్ ఉంటే దేశ విభజన జరిగేది కాదు -
లంగరు వేసుకుని చేసేది పాలన కాదు!
మరో పదమూడు మాసాలకు రాష్ట్ర విభజన జరిగి ఒక దశాబ్దకాలం పూర్తవుతుంది. ఇదే కాలంలో కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం– ‘జీ20’ అధ్యక్ష స్థానానికి ఎదిగింది. సాధారణంగా ప్రభుత్వ అధినేతలు ఇటు వంటి ఎదుగుదలను తమ ఖాతాలో వేసుకుంటారు. అది సహజమే అయినా తాత్కాలికం. చరిత్ర రచన– ‘ఎవరి కాలంలో అని కాకుండా, ఏ కాలంలో ఏమి జరిగింది?’ అనే ప్రతి పాదికగానే సాగుతుంది. దానికి కారణం, ప్రభుత్వాల నిర్ణయాల ‘వెనుక–ముందు’ అందుకు దోహదం చేసే అంశాల తాకిడి అదృశ్యంగా కొన్ని కొన్నిసార్లు నిలువరించలేనంత బలంగా ఉంటుంది. ఉదాహరణకు ఇందిరాగాంధీ తొలి ‘టర్మ్’ను (1966 –77) ‘వెల్ఫేర్ ఎరా’ అంటున్నంత మాత్రాన, దానికి ముందున్న రెండు దశాబ్దాల పరిణామాల్ని విస్మరించడానికి కుదరదు. అలాగే– మరో రెండు దశాబ్దాల తర్వాత 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మళ్ళీ గతాన్ని గుర్తుచేస్తూ – ‘ఇందిరమ్మ రాజ్యం – ఇంటింటా సౌభాగ్యం’ అంటూ రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని భర్తీ చేయడంలో ఉన్నది, రెండు వేర్వేరు కాలాల మధ్య ఉన్న ఒక – నిరంత రత్వం! ఈ రెండు సందర్భాల్లో కూడా ప్రభుత్వం ప్రజలకు చేరువ కావడం కనిపిస్తుంది. ఇటువంటి కొన్ని మినహాయింపులు కూడా చరిత్రలో నమోదు అవుతుంటాయి. ఇక్కడ – ‘ప్రభుత్వం’ ప్రజలకు చేరువ కావడం అంటే, అంతిమంగా – ‘రాజ్యం’ (‘స్టేట్’) ప్రజలకు చేరువ కావడం అని అర్థం చేసు కోవాలి. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం 13 జిల్లాలు ఉన్న రాష్ట్రాన్ని గత ఏడాది రిపబ్లిక్ దినోత్సవం నాడు 26 జిల్లాల రాష్ట్రంగా చేసింది. అందువల్ల, మునుపున్న ఒక్కొక్క జిల్లా రెండై – వాటికి ఇప్పుడు ఇద్దరు కలెక్టర్లు, ఇద్దరు ఎస్పీలు వచ్చారు. అలా ఈ ‘ప్రభుత్వం’ ప్రజలకు ‘రాజ్యాన్ని’ చేరువ చేసి, ‘బ్యూరోక్రసీ’ (పరిపాలన యంత్రాంగం) ద్వారా తాను కూడా మరింత దగ్గరయింది. ఇప్పుడీ ఉపోద్ఘాతం ఎందుకు అవసరం అయింది అంటే.. ఏప్రిల్ మొదటి వారంలో జరిగిన– 57 మంది ఐఏఎస్, 39 మంది ఐపీఎస్ అధికారుల బదిలీల్లో ఏడాది క్రితం కొత్తగా ఏర్పడిన జిల్లాల– కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు ఉన్నారు. పొరుగు రాష్ట్రాలతో మనం సరిహద్దు పంచుకొంటున్న – పార్వతీపురం మన్యం జిల్లా, పాడేరు– అల్లూరి జిల్లా (ఒడిస్సా), అన్నమయ్య జిల్లా (తమిళ నాడు), సత్యసాయి జిల్లా (కర్ణాటక) వంటివి కూడా ఉన్నాయి. ఉంటే ఏమైంది? దీన్ని– నాలుగేళ్ల క్రితం గ్రామ సచివాలయాలతో మొదలైన పరిపాలన సంస్కరణల ప్రవాహం, రాష్ట్రం ‘మ్యాప్’ అంచు ల్లోని – ‘టెయిల్ ఎండ్’కు చేరి (సింక్) ఇంకు తున్నట్టుగా చూడాల్సి ఉంటుంది. కొత్త జిల్లాల వల్ల ప్రజలకు నేరుగా పౌర సేవలు అందించే సచివా లయాల పనిని, జిల్లా కలెక్టర్లు మరింత దగ్గరగా ‘మోనిటర్’ చేస్తారు. ఈ ఏర్పాటుతో – రాజధానిలో చీఫ్ సెక్రటరీ నుంచి కింద గ్రామ సచివాలయాల వరకు – ‘నెట్ వర్క్’ అమరిక పూర్తి అయింది. ఇక్కడొక సందేహం సహజం. స్థిరమైన రాష్ట్ర రాజధాని నగరం అంటూ లేకుండా, ఇంతపెద్ద మానవ వనరుల సమూహాన్ని పరిపాలన యంత్రాంగంలో భాగం చేయడం ఎలా సాధ్యమయింది? ఈ సందేహానికి సమాధానం వెతకడం కోసం లోతైన చర్చ అవసరం. సంప్రదాయ రాజకీయాల దృష్టి నుంచి– ‘ఏపీ హైబ్రిడ్’ పరిపాలనను చూసేవారికి, ఇవి అంత తేలిగ్గా నప్పవు కూడా. ఒకప్పుడు పరిపాలన అంటే, రాజధాని ‘నగరం’లో లంగరు వేసుకుని కూర్చుని చేసే పని అనేది మనకున్న అవగాహన. ప్రపంచీ కరణ నేపథ్యంలో ఈ అవగాహన మేర పాలన సాగిస్తే అభివృద్ధి అంతంత మాత్రమే అవుతుంది. అయితే, రాష్ట్ర విభజన తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి ఈ సూక్ష్మం గ్రహింపు లేక పోయింది. ఒకప్పుడు మనమే అనుమతించిన– ‘టెక్నాలజీ’ ఈనాడు మనల్ని కూడా ‘అవుట్ డేటెడ్’ చేయడం ఇందులో గుర్తించవలసిన మర్మం. చివరిగా.. ప్రపంచీకరణతో వచ్చిన– ‘జియో పాలిటిక్స్’ వల్ల కేంద్రం ‘ఢిల్లీ’ విడిచి దేశం అంచు (మార్జిన్స్)లకు చేరడం కొత్త పరి ణామం! ఇవి ఇక ఎంతమాత్రమూ ఒకచోట కట్టు కొయ్య పాతుకుని కట్టేసుకుని కూర్చుని పరిపాలన చేసే రోజులు కావు. కనుకనే, ఈ నెల మొదటి వారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మిజోరాం వెళ్లి రూ. 1.76 లక్షల కోట్లతో ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలను కలుపుతూ – రోడ్డు, రైలు, విమాన సర్వీసులు 2025 లోపుగా పూర్తి చేస్తామని ప్రకటించారు. అక్కడే రూ. 2,500 కోట్లతో చేపట్టే 11 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మరో వారానికి ప్రధాని మోదీ గౌహతిలో జరిగిన ‘బిహూ’ డ్యాన్స్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. బ్రహ్మపుత్ర నదిపై నిర్మించే బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. ఇక గత ఏడాది చివరి ఆరునెలలు ప్రధాని మోదీతో సహా అరడజను మంది కీలక శాఖల మంత్రులు మన కాకినాడ – విశాఖల మధ్య అధికా రిక పర్యటనలు పెట్టుకున్నారు. ఉన్నట్టుండి వీరంద రికీ దేశం ‘మార్జిన్స్’ ఎందుకు ముఖ్యమయ్యాయి? ఈ ప్రశ్నకు సమాధానం – ‘మార్జినల్ సెక్షన్స్’ సీఎంగా పేరుపడ్డ వైఎస్ జగన్ వద్ద దొరకవచ్చు! వ్యాసకర్త సామాజిక, ఆర్థిక అంశాల విశ్లేషకులు -
విభజన అంశాలపై కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ ఆ«ధ్వర్యంలో నేడు రాష్ట్ర విభజన సమస్యలపై జరిగే కీలకభేటీలో ముందడుగు పడే అవకాశముంది. తెలంగాణ, ఏపీ ఉన్నతాధికారులు సమావేశమై పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు. ఈ మేరకు జరిగే వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరు కావాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధానకార్యదర్శులకు ఇప్పటికే హోంశాఖ సమాచారమిచ్చింది. రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లవుతున్నా పరిష్కారంకాని, ఇరు రాష్ట్రాల నడుమ భిన్నాభిప్రాయాలున్న ఒకట్రెండు అంశాల్లో ఈ సమావేశంలో స్పష్టత వస్తుందని తెలంగాణ భావిస్తోంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో సమర్పించేందుకుగాను ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయంలేని సమస్యల గురించి తెలంగాణ నివేదికలను సిద్ధం చేసింది. విభజన.. బకాయిలే ప్రధాన ఎజెండా విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్లోని సంస్థల విభజనపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశముంది. ఏపీ ఉన్నత విద్యామండలి, తెలుగు అకాడమీ, విజయ డెయిరీ లాంటి సంస్థల విషయంలో ఇరు రాష్ట్రాలు వాదనలను వినిపించనున్నాయి. ముఖ్యంగా సింగరేణి కార్పొరేషన్, దీనికి అనుబంధంగా ఉన్న ఏపీ హెవీ మిషనరీ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్(ఆప్మెల్)ల విభజన అంశం ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. ఎక్కడి కంపెనీలు ఆ రాష్ట్రానికే చెందుతాయని అటార్నీ జనరల్ న్యాయ సలహా ఇచ్చిన నేపథ్యంలో దీనిపై హోంశాఖ కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశముందని అధికారులంటున్నారు. షీలాబీడే కమిటీ సిఫారసులపై తెలంగాణ, ఏపీ భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ డిస్కంల నుంచి తమకు రూ.7,500 కోట్లు వస్తాయని ఏపీ అంటుండగా, దీనిపై ఏపీ ప్రభుత్వం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో వేసిన కేసును ఉపసంహరించుకుంటే వివాదాన్ని పరిష్కరించుకునేందుకు సిద్ధమని తెలంగాణ చెబుతోంది. ఏపీ నుంచి రావాల్సిన బకాయిలపై కూడా తెలంగాణ అధికారులు హోంశాఖకు నివేదిక ఇవ్వనున్నారు. ఏపీ రాష్ట్ర ఫైనాన్షియల్ కార్పొరేషన్ విభజన, నగదు, బ్యాంకు డిపాజిట్ల పంపిణీ, జనాభా దామాషా ప్రాతిపదికన పన్ను బకాయిల పంపకాలపై ఇరు రాష్ట్రాలు వాదనలు వినిపించనున్నాయి. తెలంగాణకు చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ విభజన చట్టానికి అనుగుణంగా అన్ని అంశాలను సామరస్యంగా పరిష్కరిం చుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేంద్ర హోంశాఖ ఎదుట వాదనలను సమర్థవంతంగా వినిపిస్తామని, చాలా వరకు అన్ని అంశాలపై స్పష్టత వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఆగస్టు 14: ప్రధాని మోదీ కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 14న విభజన కష్టాల స్మృతి దివస్‌గా పాటించాలని పిలుపునిచ్చారు. పాకిస్తాన్ ఇండియా విభజన సందర్బంగా ప్రజలు బాధలను, కష్టాలను ఎప్పటికీ మర్చిపోలేమని గుర్తుచేసుకున్న ప్రధాని ఆగస్టు 14వ తేదీని విభజన స్మృతి దివస్‌గా జరుపుకోవాలని ట్విటర్ వేదికగా పిలుపునిచ్చారు. దేశ చరిత్రలో విభజన కష్టాలను ఎన్నటికీ మర్చిపోలేమని, విభజన సమయంలో ప్రజల పోరాటం, త్యాగాలను గుర్తు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా లక్షలాదిమంది సోదర సోదరీ మణులు విడిపోవాల్సి వచ్చింది. అప్పటి ద్వేషం, హింస కారణంగా అనేకమంది ప్రాణాలు కోల్పోయారని ట్వీట్ చేశారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ ఆగస్టు 14వ తేదీని విభజన స్మృతి దివస్‌గా జరుపు కోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా సామాజిక విభేదాలు, అసమానతలు అనే విషాన్ని తొలగించడంతోపాటు, ఏకత్వం, సామాజిక సామరస్యం, మానవ సాధికారతా స్ఫూర్తిని మరింత బలోపేతం చేసుకోవాల్సి అవసరం ఉందని ప్రధాని మోదీ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. Partition’s pains can never be forgotten. Millions of our sisters and brothers were displaced and many lost their lives due to mindless hate and violence. In memory of the struggles and sacrifices of our people, 14th August will be observed as Partition Horrors Remembrance Day. — Narendra Modi (@narendramodi) August 14, 2021 -
స్వతంత్ర భారతంలో.. ఇంతటి ఘోర విషాదం లేదు: రిపోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి సెకండ్‌వేవ్ సృష్టించిన కల్లోలం అంతా ఇంకా కాదు. రికార్డు స్తాయిలో రోజుల వారీ 4 లక్షలకు పైగా కేసులతో, 4 వేలకు పైగా మరణాలతో పెను విపత్తును మరిపించింది. మందులకొరత, బెడ్ల కొరత, ఆక్సిజన్ దొరక్క బాధితుల బాధలు అన్నీ ఇన్నీ కావు. అయితే అధికారిక లెక్కలతో పోలిస్తే దాదాపు రెట్టింపు మరణాలను ప్రభుత్వం దాచిపెట్టిందన్న తీవ్ర విమర్శల మధ్య షాకింగ్ రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. నిజమైన మరణాలు వందల వేలు కాదు అనేక లక్షలు ఎక్కువ అని.. స్వాతంత్ర్యం తరువాత దేశంలో ఇదే అత్యంత ఘోరమైన మానవ విషాదమని వ్యాఖ్యానించింది. దేశ విభజన తరువాత భారతదేశంలో జరిగిన అత్యంత ఘోరమైన విషాదం మరొకటి లేదని సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ తయారుచేసిన ఒక నివేదిక పేర్కొంది. జూన్ 2021 నాటికి భారత అధికారిక కోవిడ్-19 మరణాల సంఖ్య 4 లక్షలుగా ఉండగా వాస్తవానికి, విపత్తుగా అధ్వాన్నంగా ఉందని వ్యాఖ్యానించింది. అధికారిక లెక్క లకంటే 49 లక్షల అదనపు మరణాలు సంభవించాయని తెలిపింది. 2020 జనవరి 2021 జూన్ మధ్య దాదాపు 50 లక్షలు (4.9 మిలియన్లు) మంది మరణించి ఉండవచ్చని నివేదిక అంచనా వేసింది. మొదటి వేవ్ కాలంలో 20 లక్షలమంది మరణించి ఉండవచ్చని కూడా తెలిపింది. ఫస్ట్‌వేవ్ ఉధృతిని, విషాదాన్ని, గుర్తించడంలో వైఫల్యమే సెకండ్ వేవ్ బీభత్సానికి దారితీసిందని అని నివేదిక పేర్కొంది. వాషింగ్టన్ ఆధారిత థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ దీన్ని తయారు చేసింది. అంతేకాదు భారత మాజీ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అరవింద్ సుబ్రమణియన్ సహ రచయితగా వ్యవహరించిడం విశేషం. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన అభిషేక్ ఆనంద్, సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్కు చెందిన జస్టిన్ సాండేఫర్ ఈ నివేదికను రూపొందించారు. సెరోలాజికల్ అధ్యయనాలు, గృహ సర్వేలు, రాష్ట్ర స్థాయి పౌర సంస్థల అధికారిక సమాచారం, అంతర్జాతీయ అంచనాల ఆధారంగా, వాషింగ్టన్ ఆధారిత గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్ దేశంలో మంగళవారం మూడు అంచనాలతో విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలను పేర్కొంది. కచ్చితమైన కోవిడ్ మరణాలను అంచనా వేయడం కష్టమే అని అంగీకరించినప్పటికీ అధికారిక లెక్కలతో పోలిస్తే వాస్తవ మరణాలు చాలా ఎక్కువ అని తెలిపింది. -
కరోనా క్యాబ్‌లు వచ్చేశాయ్!
కొచ్చి: కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడికి చేసేందుకు కేరళ ప్రభుత్వం వినూత్న చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రైవేటు ట్యాక్సీలో ప్రయాణికుల మధ్య భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేసింది. విదేశాల నుంచి విమానాలు, నౌకల్లో తిరిగి వస్తున్న వారిని తరలించేందుకు ఈ ట్యాక్సీలను వినియోగించనున్నారు. కారు లోపల ప్రయాణికులకు, డ్రైవర్‌కు మధ్య ప్లాస్టిక్ షీట్లతో పారదర్శక విభజన ఏర్పాటు చేశారు. పారదర్శక విభజనలతో కారు లోపల భౌతిక దూరం పెరగడంతో పాటు తుమ్మినా, దగ్గినా మరొకరికి వైరస్ వ్యాపించకుండా ఉంటుంది. ఎర్నాకుళలం జిల్లా అధికార యంత్రాంగం సూచన మేరకు పారదర్శక విభజనలు ఏర్పాటు చేసినట్టు ఎంజీఎస్ లాజిస్టిక్స్ సంస్థ వెల్లడించింది. (ప్రత్యేక రైళ్లు: ఎక్కువ మందిని తరలించేలా..) కాగా, పటిష్టమైన చర్యలతో కరోనా వైరస్ వ్యాప్తిని కేరళ సమర్థవంతంగా కట్టడి చేస్తోంది. కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజా గణింకాల ప్రకారం కేరళలో ఇప్పటివరకు 512 కరోనా పాజిటివ్ కేసులు నమోదుగా, నలుగురు చనిపోయారు. కోవిడ్-19 నుంచి 489 మంది కోలుకున్నారు. (కరోనాను అడ్డుపెట్టుకుని అణచివేస్తారా?) -
విభజన గాయం
దేశ విభజన రేపిన గాయం ఈనాటికీ ఇరు దేశాలనూ సలపుతూనే ఉంది. నేల మీద గీచిన గీత హృదయాలను భగ్నం చేసింది. ఆనాటి చరిత్ర, ఆ ప్రజల వేదన సాహిత్యంలో ప్రతిబింబించింది. భీష్మ సహాని రచన ‘తమస్’కు గోవింద్ నిహ్లాని ఇచ్చిన బుల్లితెర రూపమే ‘తమస్’. నాథు తన షాప్‌లో పనిచేసుకుంటూ ఉన్నాడు. థెకెదార్ అనే పశువైద్యుడు నాథు వద్దకు వచ్చి తన వైద్య అవసరాల కోసం ఓ పందిని చంపి తీసుకురావాలని అడుగుతాడు. తాను ఆ పని చేయలేనని, పందిని చంపడంలో తనకెలాంటి నైపుణ్యం లేదంటాడు నాథు. థెకెదార్ పట్టుబట్టి నాథుకు 5 రూపాయలు ఇచ్చి ఒప్పించడంతో ‘సరే, రేపు ఉదయం నాటికి చంపి తీసుకొస్తా’నని చెబుతాడు.నాథు పందిని చంపే మొట్టమొదటి సీన్ ప్రేక్షకుల్లో ఒక ఉత్కంఠను కలిగిస్తుంది. 1947 దేశ విభజన కాలంలో సిక్కులు, ముస్లింలు మత విద్వేషాలతో ఏ విధంగా రగిలిపో యారో బుల్లితెర మీద ధైర్యంగా చూపిన సీరీస్ ‘తమస్’. మరుసటి రోజు ఉదయం బక్షిజి, రాజకీయ పార్టీలోని కొంత మంది సభ్యులు ప్రచారంలో భాగంగా ముస్లిం మత పెద్ద మొహల్లా వద్దకు చేరుకుంటారు. అక్కడి మురికి కాలువలను శుభ్రపరచడం, దేశభక్తి గీతాలను పాడటం చేస్తూ... మొహల్లాతో పాటు ఉన్న ఇతర ముస్లింలను కూడా తమ కార్యక్రమంలో పాల్గొనమని కోరుతారు. వాళ్లు అందుకు ఒప్పుకోరు. అంతలోనే మసీదు మెట్ల వద్ద ఎవరో ఒక పంది మృతదేహాన్ని విసిరేశారనే వార్త దావానలంలా వ్యాపిస్తుంది. దీంతో అక్కడి ముస్లింల నుంచి పార్టీ సభ్యుల మీదకు రాళ్లు వచ్చి పడతాయి. ఇండ్లకు నిప్పు అంటుకుంటుంది. కాసేపట్లో అంతటా అశాంతి నెలకొంటుంది. అశాంతికి మూలం సమాజంలో ఏర్పడిన అశాంతికి భయపడి, ముస్లిం లీగ్ ప్రతినిధి బక్షిజీ, హయత్ బక్ష్ డిప్యూటీ కమిషనర్ రిచర్డ్‌ను కలిసి, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతారు. పోలీసులను మోహరించాలని లేదా కర్ఫ్యూ విధించాలని బక్షిజీ, హయత్ చేసిన సూచనలను రిచర్డ్ తిరస్కరిస్తాడు. బదులుగా పార్టీ సభ్యులే శాంతి భద్రతలను కాపాడాలని ఈ విషయాన్ని మిగతా వర్గాలను కోరమని చెబుతాడు. నాథు మసీదు వద్ద పంది మృతదేహాన్ని చూసి తాను గత రాత్రి చంపిన పంది అదేనని గుర్తుపట్టి ఆశ్చర్యపోతాడు. అశాంతికి లోనవుతాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు వీధిలో ఉన్న థెకెదార్ను చూస్తాడు. నాథు అతని దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. కాని, థెకెదార్ నాథుకి అందకుండా పరిగెత్తుతాడు. తాను చంపిన పంది వల్లే అల్లర్లు తలెత్తాయని తెలుసుకున్న నాథు అపరాధ భావనతో ఇంటికి వెళ్లి గర్భవతిగా ఉన్న తన భార్య కమ్మోకి అసలు విషయం చెబుతాడు. బయటనుంచి వినిపిస్తున్న గొడవలను చూసిన వాళ్లకు దూరాన ఇండ్లు కాలిపోవడం కనిపిస్తుంది. ఆ మత హింస కు తానే కారణమని నాథూ తనని తాను నిందించుకుంటాడు. ఇల్లు వదిలి... ప్రమాదాన్ని గ్రహించిన నాథు భార్య, తల్లితో కలిసి ఆ ప్రాంతం వదిలి సిటీకి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు. వాళ్లు కాలినడక తమ ప్రయాణాన్ని మొదలుపెడతారు. నాథు తన వికలాంగ తల్లిని వీపుపై మోస్తుంటాడు. ప్రయాణ సమయం లో నాథు తల్లి చనిపోతుంది. అడవిలోనే తల్లి భౌతిక కాయాన్ని కాల్చి, తల్లికి సరైన అంత్యక్రియలు చేయలేని తన దుస్థితికి దుఃఖిస్తాడు. కూతురు కోసం.. హర్నంసింగ్ అతని భార్య బాంటో లది సిక్కు కుటుంబం. పొరుగూర్లో ఉన్న తమ కుమార్తె జస్బీర్ ఇంటికి వెళ్లాలనుకుని బయల్దేరుతారు. వారు రాత్రంతా కాలినడకన ప్రయాణించి ఒక గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఎవరింటిలోనైనా కాసేపు విశ్రాంతి తీసుకొని బయల్దేరుదామని ఓ ఇంటి తలుపు తడతారు. ఆ ఇల్లు ముస్లిం ఎహ్సాన్ అలీకి చెందినది. అతను గతంలో హర్నం సింగ్‌కు స్నేహితుడే. తన కొడుకుకు తెలియకుండా స్నేహితుడి కుటుంబానికి ఆశ్రయం ఇస్తాడు ఎహ్సాన్. పగటిపూట వాళ్లు దాక్కున్నా రాత్రి సమయంలో ఎహ్సాన్ కొడుకు హర్నం సింగ్ వాళ్లను చూస్తాడు. తమ ఇంటిని తక్షణమే వదిలి వెళ్లమనడంతో అక్కణ్ణుంచి బయల్దేరుతారు హర్నం సింగ్, అతని కుటుంబం. మరుసటి రోజు ఉదయం నాథు, అతని భార్యను అడవిలో కలుస్తారు. అందరూ కలిసి గురుద్వారాకి బయల్దేరుతారు. గురుద్వారా ముస్లింలు నిరంతరం ఆయుధాలు సేకరిస్తున్నారని, తామంతా అదేవిధంగా ఆయుధ సంపత్తిని పెంపొందించుకోవాలని సిక్కుల సంఘం నాయకుడు గురుద్వారాలో తేజ్‌సింగ్ సిక్కులకు చెబుతుంటాడు. గురుద్వారాలో ఏర్పాటు చేసుకున్న సమావేశంలో తేజ్‌సింగ్ మాట్లాడుతూ సిక్కుల వద్ద తగినన్ని ఆయుధాలు లేవని, సంధి కోసం 2 లక్షల రూపాయలు అవసరం అవుతాయని చెబుతాడు. తేజ్‌సింగ్, సిక్కు కౌన్సిల్ అంత డబ్బు చాలా ఎక్కువగా భావించి ముస్లింలతో చర్చలు జరపడానికి జూనియర్ గ్రంథి, నాథూలను పంపుతుంది. అయితే, ముస్లిం గుంపు నాథు, గ్రంథీలతో పాటు గురుద్వారాను చుట్టుముట్టి దాడి చేస్తారు. దీంతో ఆగ్రహించిన సిక్కులు ఆయుధాలు తీసుకొని నినాదాలు చేస్తూ పోరాడటానికి బయల్దేరుతారు. గురుద్వారా వద్ద జస్బీర్ అనే వ్యక్తి సిక్కు మహిళలను బావిలోకి దూకి సామూహిక ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తాడు. ఆ సమయంలో కొంతమంది తల్లుల చేతుల్లో పసిపిల్లలు ఉంటారు. ♦ 1947లో పంజాబ్ విభజన సమయంలో అల్లర్లతో అట్టుడుకుతున్న పాకిస్తాన్ నేపథ్యంలో ఈ చిత్రం విభజన పర్యవసనాలను కళ్లకు కట్టింది. ఆ సమయంలో భారతదేశానికి వలస వచ్చిన సిక్కు, హిందూ కుటుంబాల దుస్థితిని చూపింది. 1988లో వచ్చిన ఈ సీరియల్ ఆ తర్వాత నాలుగు గంటల నిడివిగల చలనచిత్రంగా రూపొందింది. 35వ జాతీయ సినిమా అవార్డులో మూడు అవార్డులు ‘తమస్’ సినిమా గెలుచుకోవడం విశేషం. ♦ 1988 కాలంనాటి సీరీస్ తమస్. మొదటి సన్నివేశంలోనే ఓమ్ పురి పాత్ర ఒక పందిని చంపడానికి ప్రయత్నిస్తుంది. ఓపెనింగే ఒక ఆకట్టుకునే ప్రదర్శన. కానీ, భయం, హింస వంటి ఇతివృత్తాలతో ఒక చీకటి కోణాన్ని ఆవిష్కరించింది. దూరదర్శన్‌లో ప్రసారమైన ఈ మినీ సిరీస్‌కు స్వరకర్త వన్రాజ్ భాటియా సంగీతం మనల్ని వెంటాడుతుంది. రచయిత భిషమ్ సహ్ని హిందీ నవల తమస్ నుంచి దర్శకుడు గోవింద్ నిహ్లాని తీసుకుని ఈ సీరియల్‌ను రూపకల్పన చేశాడు. ♦ తమస్, అంటే చీకటి. భారత విభజన సమయంలో వలస వచ్చిన సిక్కులు, హిందూ కుటుంబాల కథ ఇది. ఈ కథాంశం నిహ్లానీని ఆశ్చర్యపరించింది. ‘ఇది సినిమాకు తగిన కథాంశం అవుతుంది’ అనుకున్నారు. అయితే, ఈ ప్రాజెక్ట్‌కు చాలా డబ్బు అవసరం అవుతుంది. ఇది అంత ఆచరణీయం కాకపోవచ్చు అని కూడా అనుకున్నాడు. ‘ఈ ఇతివృత్తాన్ని పరిచయం చేయడానికి ముందు దూదర్శన్ ప్రతినిధులతో మాట్లాడాను. వారూ ఆసక్తి కనబరిచారు. ఈ కథాంశం వివాదాస్పదమని, అభ్యంతరాలు ఉండవచ్చనీ భావించాను. ముందు కొంత భయపడ్డాను. ఈ సీరీస్‌ను నిషేధించవచ్చని కూడా అనుకున్నాను. నన్ను కొందరు హిందూ వ్యతిరేకి అనుకున్నారు. దేశ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తుందనీ భావించారు. కొందరు విభజన వాస్తవాలను కచ్చితంగా ప్రదర్శించలేదన్నారు’ అని నాటి విషయాలను ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు నిహ్లాని వివరించారు. ♦ ఇందులోని సీన్స్ కోసం గుర్గావ్లోని కొన్ని ప్రదేశాలు, అక్కడి ఫిల్మ్‌సిటీని ఎంచుకున్నారు. అప్పటికే పేరున్న నాటక, సినిమా రంగ అగ్ర నటీనటులు.. ఓమ్పురి, అమ్రిష్‌పురి, దినా పథక్, ఎ.కె.హంగల్, ఇఫ్త్ఖర్, సురేఖ సిక్రీ.. మొదలైనవారు ఇందులో నటించారు. కమిటీ ఏర్పాటు.. ఇంత ఘోరం జరిగాక రిచర్డ్ నగరంలోని ప్రముఖ వ్యక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, అక్కడి ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యల గురించి తెలియజేస్తారు. శాంతి సందేశాన్ని పంపడానికి నాయకులను అమన్ కమిటీ ఏర్పాటు చేయాలని కోరుతారు. బక్షిజీ, హయత్ బక్షన్ను అమన్ కమిటీ ఉపాధ్యక్షులుగా నియమిస్తారు. సమావేశం ముగింపులో థెకెదార్ మత సామరస్యం నినాదాలు చేస్తూ కనిపిస్తాడు. శరణార్ధి శిబిరంలో హర్నం సింగ్, బాంటో, కమ్మో ఉంటారు. ముస్లింలతో చర్చలు జరిపేందుకు జూనియర్ గ్రంథీతో వెళ్లినప్పటి నుండి కనిపించని నాథును కనుక్కోవడానికి సహాయం చేయాలని హర్నం సింగ్ ఒక ప్రభుత్వ ఉద్యోగిని అభ్యర్థిస్తాడు. నగరంలో ఆసుపత్రి గుడారాలన్నింటిలోనూ ఆరా తీయాలని ఆ ఉద్యోగిని అడుగుతాడు. నేల మీద వరసగా పడి ఉన్న మృతదేహాలను చూస్తూ, వాటిలో నాథు మృతదేహాన్ని గుర్తించి కమ్మో నిలువునా కూలిపోతుంది. నర్సులు ఆమెను ప్రసవానికి గుడారంలోకి తీసుకువెళతారు. గుడారం బయట కూర్చొని ఉన్న హర్నం సింగ్, బాంటోలకు ‘అల్లాహు అక్బర్’, హర్ హర్ మహాదేవ్’ నినాదాలతో పాటు గుడారం లోపల నుంచి అప్పుడే పుట్టిన పసిబిడ్డ ఏడుపులు వినిపిస్తాయి.– ఎన్.ఆర్. -
ముదిరిన ఏపీఎస్ఎఫ్సీ విభజన
• రూ.500 కోట్ల విలువైన భూములకు ఎసరుపెట్టిన ఏపీ • సమాచారం ఇవ్వకుండా విభజన ప్రణాళిక కేంద్రానికి పంపిన వైనం • ఏకపక్ష బోర్డు తీర్మానం చెల్లదంటూ తెలంగాణ ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ వైఖరితో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజనలో తెలంగాణకు భారీగా నష్టం వాటిల్లే పరిస్థితి తలెత్తింది. సమాచారం ఇవ్వకుండా విభజన చేయమని నమ్మబలికి, చెప్పాపెట్టకుండా బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసుకుంది. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని రూ.కోట్ల విలువైన భూములకు ఏపీ సర్కార్ ఎసరు పెట్టింది. దీంతో రంగారెడ్డి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎఫ్సీ) కేటాయించిన రూ.500 కోట్ల విలువైన తెలంగాణ భూములు చిక్కుల్లో పడ్డాయి. వాస్తవానికి విభజన చట్టం సెక్షన్ 53 ప్రకారం షెడ్యూల్ 9లోని సంస్థలకు సంబంధించిన ఆస్తులు ప్రధాన కార్యాలయం ఉన్నచోటనే పంచుకోవాలి. అయితే ప్రధాన కార్యాలయాన్ని నిర్వచించే అంశం కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉంది. పైగా ఏపీఎస్ఎఫ్సీ ప్రధాన కార్యాలయం రంగారెడ్డి జిల్లాలో లేదు. వీటితోపాటు ఏపీఎస్ఎఫ్సీ అధీనంలో ఉన్న రూ.కోట్ల డబ్బు పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. తమకున్న ఆస్తుల్లో ఎక్కువ వాటా ఏపీఎస్‌ఎఫ్‌సీకి దక్కేలా.. నామమాత్రంగా తెలంగాణ కార్పొరేషన్‌కు దక్కేలా సంస్థ విభజన పూర్తి చేసేందుకు గుట్టుచప్పుడు కాకుండా పావులు కదిలాయి. తెలంగాణ ప్రభుత్వానికి కనీస ప్రాధాన్యం ఇవ్వకుండా ఏపీఎస్ఎఫ్సీ బోర్డు ఏకపక్షంగా విభజన ప్రణాళికను ఆమోదించి కేంద్ర ఆర్థిక శాఖకు పంపింది. ఆలస్యంగా తేరుకున్న తెలంగాణ ప్రభుత్వం బ్యాంకుల్లో ఈ సంస్థ లావాదేవీలను నిలిపివేయాలని, తమకు తెలియకుండా డబ్బులు డ్రా కాకుండా చూడాలని బ్యాంకర్లకు లేఖలు రాసింది. మరోవైపు ఏపీ పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించేలా చేపట్టిన చర్యలన్నీ వెనక్కి తీసుకోవాలని, ఏపీఎస్ఎఫ్సీ పంపించిన విభజన ప్రణాళికను ఆమోదించవద్దంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో ఏపీఎస్ఎఫ్సీ విభజన వ్యవహారం ముదిరి పాకానపడింది. మూడేళ్లయినా.. విభజన జరిగి మూడేళ్లు కావస్తున్నా ఏపీఎస్ఎఫ్సీ విభజన వివాదం ఇప్పటికీ సమసి పోలేదు. గుట్టు చప్పుడు కాకుండా గతేడాది జనవరిలోనే ఏపీఎస్ఎఫ్సీ విభజన తతంగం నడిపింది. బోర్డు సమావేశం ఏర్పాటు చేసి ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఇది గ్రహించిన తెలంగాణ ప్రభుత్వం.. ఈ సందర్భంగా అనుసరించిన తీరును తప్పు బట్టింది. తమకు సమాచారం లేకుండా తమ ప్రమేయం లేకుండా విభజన ప్రణాళిక రూపొందించటంపై విస్మయం వ్యక్తం చేసింది. ఏపీఎస్ఎఫ్సీ బోర్డులో ఏపీకి సమానంగా తెలంగాణకు ప్రాతినిథ్యం లేదు. రెండు రాష్ట్రాలకు సరైన సంఖ్యలో సభ్యులుండేలా బోర్డును పునర్నియామకం చేయాలని, తర్వాతే విభజన చేపట్టాలని గతంలోనే తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ అంశం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. ఈలోగా విభజన ప్రణాళికను తయారు చేయటాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పుపట్టింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీఎస్ఎఫ్సీ తొమ్మిదో షెడ్యూలులో ఉంది. అందుకే చట్ట ప్రకారం ఆస్తులు, అప్పుల పంపిణీ జరగాల్సి ఉంది. విభజన ప్రణాళికను ఆమోదించవద్దు 9వ షెడ్యూలు సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీకి కేంద్రం షీలాబీడే కమిటీని నియమించింది. దాదాపు 60 సంస్థలకుపైగా విభజన వివాదాలన్నీ ఈ కమిటీ పరిధిలోనే పరిష్కారమయ్యాయి. ఏపీఎస్ఎఫ్సీ ఈ కమిటీని బేఖాతరు చేసింది. తమ కార్పొరేషన్ సెక్షన్ 70 ప్రకారం కమిటీ ఎదుట హాజరు కావాల్సిన అవసరం లేదని తెగేసి చెప్పింది. నేరుగా తమ విభజన వ్యవహారాన్ని కేంద్రానికి పంపిస్తామని, పాలక మండలి సభ్యుల ఆమోదం ఉంటే సరిపోతుందని వాదనకు దిగింది. ఇవన్నీ పునర్విభజన చట్టం ఉల్లంఘనలేనని, ఏపీఎస్ఎఫ్సీ ఎండీ పంపించిన విభజన ప్రణాళికను ఆమోదించవద్దని, ఆమోదిస్తే తమకు తీరని అన్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం తాజాగా కేంద్ర ఆర్థిక శాఖకు లేఖ రాసింది. -
డీఈఓ కార్యాలయ ఉద్యోగుల విభజనకు ప్రతిపాదన
విద్యారణ్యపురి : జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలోని వివిధ కేటగిరీల ఉద్యోగులను నాలుగు జిల్లాలకు విభజిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు డీఈఓ పి.రాజీవ్ ప్రతిపాదనలు పంపించారు. వరంగల్ జిల్లా డీఈఓ కార్యాలయంలో కేడర్ స్ట్రెంత్ ప్రకారం వివిధ కేటగిరీల్లో 60 పోస్టులు ఉండగా, ప్రస్తుతం 54 మంది పనిచేస్తున్నారు.అందులో సూపరింటెండెంట్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, అటెండర్లు ఉన్నారు. వీరితో సమావేశం నిర్వహించి ఆయా కేటగిరీలో సీనియారిటీప్రకారం వారినుంచి జిల్లాల ఆప్షన్ తీసుకున్నారు. సీనియర్లు వరంగల్, హన్మకొండ జిల్లాలు కోరుకోగా మిగిలిన వారు మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాలు ఎంచుకున్నారు. జూనియర్లు తమకు ఇష్టం లేకు న్నా భూపాలపల్లి ఆప్షన్ ఇవ్వక తప్పలేదని డీఈవో కార్యాలయంలో బుధవారం చర్చ జరిగింది. అసిస్టెంట్ డైరెక్టర్లు ఇద్దరే ఉండటంతో వారు రెండు జిల్లాలకు ఆప్షన్ ఇచ్చుకోగా మిగితా రెండు జిల్లాలకు కొరత ఉం డనుంది. సూపరింటెండెంట్లకే తాత్కాలిక ఏడీలుగా ఇన్చార్జి బాధ్యతలను అప్పగిస్తారని సమాచారం. ఇక ప్రస్తుతం డీఈఓ కార్యాలయం హన్మకొండలో ఉన్నందున వరంగల్ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాన్ని వరంగల్ ఎంఆర్సీ భవన్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అయితే ఆ భవనం సరిపోదని తెలుస్తోంది. దీంతో అక్కడే ఏదైనా ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయాలనే యోచన కూడా ఉంది. లేదంటే కొంతకాలం పాటు ప్రస్తుత కార్యాలయంలోనే కొనసాగించి హన్మకొండ జిల్లా కార్యాలయానికి ఎస్ఎస్ఏ భవనాన్ని కేటాయిస్తారే చర్చ కూడా సాగుతోంది. మహబూబాబాద్, భూపాలపల్లి డీఈఓ కార్యాలయాలను అక్కడి ఎమ్మార్సీ భవనాల్లో కొనసాగించాలని డీఈఓ రాజీవ్ ఉన్నతాధికారులకు ప్రతిపాదించినట్లు సమాచారం. -
సైబరాబాద్ కమిషనరేట్లకు రాజముద్ర
* సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్ విభజన, పరిధి పెంపు ఇక అధికారికం * గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన గవర్నర్ * జూన్ 15 నుంచి అమల్లోకి వచ్చినట్టుగా ఆర్డినెన్స్ * ఇక నూతన కమిషనరేట్ల నుంచే కొత్త ఠాణాల పాలన సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల విభజన, పరిధి పెంపు పరిపూర్ణమైంది. జూన్ 15న సైబరాబాద్ కమిషనరేట్‌ను సైబరాబాద్ ఈస్ట్, సైబరాబాద్ వెస్ట్గా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటి నుంచి ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చినట్టుగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శని వారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 2 కమిషనరేట్ల పరిధి, విధివిధానాలకు సంబంధించిన చట్టాన్ని శాసనసభ ఆమోదించాల్సి ఉండటం.. ఈ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో శాంతిభద్రతల కోణంలో దీని ఆవశ్యకతను గుర్తించి గవర్నర్ ‘రాజముద్ర’ వేశారు. కాగా, నగర శివారు ప్రాంతాల్లో పట్టణీకరణ ఊపందుకుంటుండటంతో పాటు భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగాఅవసరాలను బట్టి ఇతర జిల్లాలోని ఠాణాలను కలుపుకునేలా, లేదంటే ఇతర ప్రాంత పరిధిలోకి ఠాణాలు ఇచ్చేలా అధికారాలు కల్పిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. సైబరాబాద్ ఈస్ట్ కమిషనరేట్‌ను రాచకొండ పోలీసు కమిషనరేట్‌గా, సైబరాబాద్ వెస్ట్ కమిషనరేట్‌ను సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌గా మార్చేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేయడంతో తాజా ఆర్డినెన్స్ ప్రకారం త్వరలోనే ఉత్తర్వులు రానున్నాయి. ఇప్పటికే సైబరాబాద్ ఈస్ట్ పోలీసు కమిషనర్‌గా మహేష్ ఎం.భగవత్, సైబరాబాద్ వెస్ట్ పోలీసు కమిషనర్‌గా నవీన్ చంద్ బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జోన్‌కు ఎస్పీ స్థాయి అధికారి డీసీపీ హోదాలో, డివిజన్‌కు డీఎస్పీ స్థాయి అధికారి ఏసీపీ హోదాలో నేతృత్వం వహిస్తారు. సైబరాబాద్ ఈస్ట్‌లోకి భువనగిరి జోన్.. సైబరాబాద్ ఈస్ట్ పరిధిలో ఎల్బీనగర్, మల్కాజిగిరి జోన్లు ఉండగా తాజాగా భువనగిరి జోన్ వచ్చి చేరనుంది. భువనగిరి జోన్లో భువనగిరి, చౌటుప్పల్ డివిజన్లు ఉండనున్నాయి. మల్కాజిగిరి జోన్లో మల్కాజిగిరి, కుషాయిగూడ డివిజన్లు ఉంటాయి. ఎల్బీనగర్ జోన్లో ఎల్బీనగర్, వనస్థలిపురం, ఇబ్రహీంపట్నం డివిజన్లు ఉండనున్నాయి. మల్కాజిగిరి జోన్ పరిధిలో ఉన్న కీసర, ఘట్కేసర్ పోలీసుస్టేషన్లతో పాటు భువనగిరి టౌన్ అండ్ రూరల్, బొమ్మలరామారం, బీబీ నగర్ ఠాణాలు భువనగిరి జోన్లోకి వచ్చాయి. మ ల్కాజ్గిరి జోన్ పరిధిలోని అల్వాల్ డివిజన్‌ను కుషాయిగూడ డివిజన్‌గా పిలుస్తారు. శంషాబాద్ జోన్లోకి షాద్‌నగర్ డివిజన్.. సైబరాబాద్ వెస్ట్ పరిధిలో శంషాబాద్, మాదాపూర్, బాలానగర్ జోన్లు ఉండనున్నాయి. శంషాబాద్ జోన్లో శంషాబాద్, రాజేంద్రనగర్ డివిజన్లతో పాటు కొత్తగా మహబూబ్‌నగర్‌కు చెందిన షాద్‌నగర్ డివిజన్ చేరనుంది. మాదాపూర్ జోన్లో మాదాపూర్, కూకట్పల్లి డివిజన్లతో పాటు కొత్తగా మియాపూర్ డివిజన్ ఏర్పాటు చేస్తున్నారు. బాలానగర్ జోన్లో పేట్ బషీరాబాద్, బాలానగర్ డివిజన్లు ఉంటాయి. షాద్‌నగర్, కొందుర్గు, కేశంపేట్, కొత్తూరు ఠాణాలు షాద్‌నగర్ డివిజన్ పరిధిలో ఉంటాయి. శంషాబాద్ డివిజన్లో ప్రస్తుతమున్న శంషాబాద్, ఆర్జీఐ పోలీసు స్టేషన్లతో పాటు రంగారెడ్డి జిల్లాకు చెందిన చేవేళ్ల, షాబాద్ ఠాణాలు చేరనున్నాయి. బాధ్యత మరింత పెరిగింది.. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లకు పూర్తి స్వేచ్ఛను కల్పిస్తూ గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకురావడం ఆనందంగా ఉంది. ఇతర జిల్లాల్లోని మరిన్ని ఠాణాలు మా పరిధిలోకి రానుండటంతో మరింత బాధ్యత పెరిగినట్టైంది. ఇది మాకు చాలెంజ్ లాంటిదైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాం. కమిషనరేట్ల పరిధి పెంపుతో ఇక నుంచి సమర్థవంతంగా పనిచేస్తాం. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు చేరువవుతాం. - మహేష్ భగవత్, నవీన్ చంద్, సైబరాబాద్ కమిషనర్లు -
మూడు ఇన్.. మూడు ఔట్
ఇదీ వరంగల్ మండల పరిస్థితి.. పోచమ్మమైదాన్ : జిల్లాలోనే ఎక్కువ జనాభా కలిగిన మండలంగా పేరొందిన వరంగల్ మండ లం కొత్త మండలాల ఏర్పాటుతో రెండుగా చీలిపోనుంది. వరంగల్, హన్మకొండ పరిధిలోని పలు గ్రామాలను కలుపుకోని ఖిలావరంగల్, వరంగల్ మండలాలుగా వేరు చేస్తున్నారు. ప్రజలకు అనువుగా ఉండే ప్రాంతాలను ఖిలావరంగల్, వరంగల్ మండలాలకు కలిపుతున్నారు. 1997లో హన్మకొండ నుంచి వరంగల్ మండలంను వేరు చేశారు. ప్రస్తుతం ఈ మండలంలోని 2011 సంవత్సరంలో 3లక్షలకు పైగా వరంగల్ మండలం జనాబా పెరిగింది. అర్బన్ పరిధిలో 1.5లక్షలకే ఒక మండలం ఉండాల్సి ఉంది. ప్రస్తుత వరంగల్ మండలంలోని ఎనిమిది గ్రామాలు ఉండగా మూ డు గ్రామాలు ఖిలా వరంగల్, ఉర్సు, రంగశాయిపేట విడిపోయి.. హన్మకొండ మండలం నుంచి తిమ్మాపూర్, అల్లీపూర్, నక్కలపల్లి కలిసి ఖిలా వరంగల్ మండలంగా ఏర్పడుతాయి. ఇక వరంగల్‌లో గిర్మాజీపేట, రామన్నపేట. మట్టెవాడ, దేశాయిపేట, లక్ష్మీపురం మిగలనుండగా హన్మకొండ నుంచి మళ్లీ ఏనుమాముల, కొత్తపేట, పైడిపల్లి వచ్చి కలుస్తాయి. తద్వారా మళ్లీ ఎనిమిది మండలాల్లో వరంగల్ కొత్త రూపు సంతరించుకోనుండగా 1.6లక్షల జనాభా ఉంటుంది. ఖిలా వరంగల్ పెట్రోల్ పంప్ సమీపంలో కార్యాలయం ఖమ్మం రోడ్డులోని ఖిలా వరంగల్ పెట్రోల్ పంప్ సమీపంలో నూతనంగా ఏర్పాటయ్యే ఖిలావరంగల్ మండల తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతానికి అద్దె భవనం కోసం వేటలో ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత ఖిలావరంగల్ పెట్రోల్ పంప్ సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో సొంత భవనం నిర్మించనున్నారు. -
నలు దిక్కులా...
♦ పాఠశాలలు, టీచర్ల విభజనపై కసరత్తు ♦ పంపకాలపై విద్యా శాఖ దృష్టి ♦ ఎదురుకానున్న స్థానికత చిక్కు ♦ నివేదిక తయారీలో నిమగ్నం ఖమ్మం : జిల్లా విద్యా శాఖ పాఠశాలలు, టీచర్ల పంపకాలపై దృష్టి సారించింది. కొత్తగా ఏర్పడనున్న జిల్లాలకు ఎన్ని పాఠశాలలు.. ఎందరు ఉపాధ్యాయులు వెళ్తున్నారనే విషయంపై కసరత్తు చేస్తోంది. ఖమ్మం జిల్లాలో 41 మండలాలు ఉండగా.. భూపాలపల్లి జిల్లాకు రెండు, మహబూబాబాద్ జిల్లాలోకి మూడు.. కొత్తగూడెం జిల్లాలోకి 16 పోగా.. 20 మండలాలతో ఖమ్మం జిల్లా మిగలనుంది. ప్రస్తుతం 2,319 ప్రాథమిక, 626 ప్రాథమికోన్నత, 625 ఉన్నత పాఠశాలలతోపాటు హెచ్ఎస్ఎస్ పాఠశాలలు 15, జూనియర్ కళాశాలలు 141.. మొత్తం 3,799 ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నాయి. వీటిలో జిల్లావ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల్లో పీఎస్‌లో 810, యూపీఎస్‌లో 37, హెచ్ఎస్ 1,394, హెచ్ఎస్ఎస్లో 199.. మొత్తం 2,717 మంది ఉపాధ్యాయులు, మండల, జిల్లా పరిషత్‌లోని పీఎస్‌లలో 3,720 మంది, యూపీఎస్‌లో 1,778, హైస్కూల్లో 3,436.. మొత్తం 8,934 మంది పనిచేస్తున్నారు. వీరిలో 921 మంది ఉపాధ్యాయులను మహబూబాబాద్‌కు, 4,600 మంది కొత్తగూడెం, 5,573 మంది ఖమ్మంకు, 280 మంది భూపాలపల్లి జిల్లాల్లో కేటాయించిన ప్రాంతాల్లో పనిచేయనున్నారు. స్థానికత చిక్కు.. జిల్లాల పునర్విభజన జరిగితే ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు నాలుగు జిల్లాల పరిధిలోకి వెళ్లనున్నాయి. వాజేడు, వెంకటాపురం భూపాలపల్లి జిల్లాలోకి, బయ్యారం, గార్ల, ఇల్లెందు మహబూబాబాద్ జిల్లాలోకి, 16 మండలాలు కొత్తగూడెంలోకి, మిగిలిన 20 మండలాలు ఖమ్మం జిల్లాలోనే ఉంటాయి. అయితే నాల్గవ తరగతి నుంచి పదో తరగతి వరకు నాలుగేళ్లు ఏ జిల్లాలో విద్యాభ్యాసం చేస్తే స్థానికత ఆధారంగా ఆ జిల్లాకు కేటాయిస్తారు. అయితే జిల్లాలోని పాఠశాలలు నాలుగు జిల్లాల్లో కలిస్తే ఉపాధ్యాయుల స్థానికత కూడా మారే అవకాశం ఉంది. ప్రధానంగా ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, సత్తుపల్లి, ఇల్లెందు, మణుగూరు వంటి పట్టణాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన ఉపాధ్యాయులు స్థానికంగానే నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. దీనిని ఆధారం చేసుకుని ఉపాధ్యాయులను విభజన చేస్తారా? లేదా ఉపాధ్యాయులకు ఆప్షన్ ఇచ్చి విభజిస్తారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. స్థానికతనే ఆధారంగా తీసుకుంటే.. ఏళ్ల తరబడి వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఉపాధ్యాయులు వేరే ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అధికారులకు తప్పని విభజన పాఠశాలలు, ఉపాధ్యాయుల కేటాయింపు మాదిరిగానే విద్యా శాఖలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి కూడా విభజన సందర్భంగా స్థానచలనం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. డీఈఓ, ఏడీఈ, సూపరింటెండెంట్, సీనియర్, జూనియర్, రికార్డు అసిస్టెంట్, అటెండర్లను కూడా విభజించి.. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో కేటాయించేందుకు విద్యాశాఖాధికారులు జాబితా తయారు చేసినట్లు తెలిసింది. వారి సీనియారిటీ ఆధారంగా ఖమ్మంలో కొందరిని ఉంచి.. మిగిలిన వారిని కొత్తగూడెం పంపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. జిల్లా విద్యాశాఖ పరిధిలో 48 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. ఖమ్మం జిల్లాకు 26 మందిని, కొత్తగూడెం జిల్లాకు 22 మందిని కేటాయించే అవకాశం ఉన్నట్లు విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. అయితే ఖమ్మంలోనే సుదీర్ఘకాలంగా తిష్ట వేసిన ఉద్యోగులు ఖమ్మం విడిచి వెళ్లేది లేదని.. ఎలాగైనా తమను ఇక్కడే ఉంచేలా చూడాలని ఉన్నతాధికారులకు విన్నవించుకోవడం గమనార్హం. -
నేడో రేపో ‘రెండు’!
సైబరాబాద్ కమిషనరేట్ విభజన ప్రక్రియ కొలిక్కి సిబ్బందితో పాటు సామగ్రి కూడా విభజన సీఎం వద్ద దస్త్రం, త్వరలో ఉత్తర్వులు సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌ను ఈస్ట్, వెస్ట్ కమిషనరేట్లుగా విభజింజే అంశంపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు రీ ఆర్గనైజింగ్ వింగ్ పంపిన ప్రతిపాదనలపై ఈ నెలాఖరు లోపే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. విభజన నేపథ్యంలో సిబ్బందితో పాటు కుర్చీల దగ్గరి నుంచి చివరకు పోలీసు జాగిలాల దాకా...ఇలా ప్రతిదీ నిర్ణీత నిష్ఫత్తిలో పంపిణీ చేశారు. అన్ని ఠాణాలతో కూడిన జోన్లతో పాటు నేరగాళ్లను పట్టుకునేందుకు రంగంలోకి దిగే స్నిఫర్ డాగ్స్‌ను కూడా విభజించారు. సైబరాబాద్ పోలీసుల చేతుల్లో ఉన్న 12 డాగ్స్‌ను ఒక్కో కమిషనరేట్‌కు ఆరు చొప్పున కేటాయించారు. దాదాపు 1,300కు పైగా వాహనాలను రెండు కమిషనరేట్లకు సగం చొప్పున పంపిణీ చేయాలని లెక్కలతో సహా చూపినట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఆయుధాలతో పాటు కమ్యూనికేషన్ ఉపకరణాలు, ఎలక్ట్రికల్ ఐటమ్స్, ఫర్నీచర్, కేబుల్, ఇతర మెటీరియల్ ఇలా ప్రతిదీ రెండిటికీ పరిధిని బట్టి కేటాయించారు. సిబ్బంది విభజించిన లెక్కలివీ... ప్రస్తుతం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మినిస్టీరియల్ సిబ్బంది 40 మంది వరకు ఉన్నారు. సీసీఆర్బీలో 20 మంది, కంట్రోల్ రూమ్‌లో 50 మంది, అకౌంట్ సెక్షన్ 10 మంది వరకు ఉన్నారు. వీరందరినీ రెండు కమిషనరేట్లకు చెరి సగం చొప్పున కేటాయించారు. ఆర్మ్డ్ రిజర్వులో 1200, స్పెషల్ బ్రాంచ్‌లో 60, సైబర్‌క్రైమ్, సీఎస్ఎల్, సీటీసీలో ఉన్న 100 మందిని కూడా విభజించిన పోలీసు ఉన్నతాధికారులు వారికిష్టమున్న కమిషనరేట్‌ను ఎంచుకునే అప్షన్‌ను ఇప్పటికే కల్పించారు. నేరాల దర్యాప్తునకు ఎటువంటి ఆటంకం కలిగించొద్దనే ఉద్దేశంతో శాంతిభద్రతల విభాగంలో పనిచేస్తున్న 3,500 మందిని యథాతథా స్థానంలో కొనసాగిస్తే బాగుం టుందని ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలో రీ ఆర్గనైజింగ్ వింగ్ పేర్కొంది. అలాగే ట్రాఫిక్‌లోని 500 మంది, హోంగార్డులు 2,000 మంది ఎక్కడున్నవారు అక్కడి స్థానాల్లో కొనసాగేలా ఏర్పాట్లు చేశారు. ఎల్బీనగర్, మల్కాజిగిరి, భువనగిరి జోన్లతో ఈస్ట్ కమిషనరేట్, శంషాబాద్, మాదాపూర్, బాలానగర్ జోన్లతో వెస్ట్ కమిషనరేట్లుగా విభజిస్తూ రీ ఆర్గనైజింగ్ వింగ్ పంపిన ప్రతిపాదన సీఎం వద్ద పెండింగ్‌లో ఉంది. అయితే ఈ నెల 27 వరకు గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలోని మూడు, నాలుగు అంతస్తులను పూర్తిచేయాలని ఇప్పటికే డీజీపీ అనురాగ్‌శర్మ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు దాదాపు పనులు పూర్తి కావొచ్చాయి. ఆలోపు సైబరాబాద్ విభజనపై ప్రభుత్వ నిర్ణయం అధికారికంగా ప్రకటించే అవకాశముందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. కమిషనరేట్ల స్వరూపమిదే... ప్రస్తుతమున్న సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఐదు జోన్లు ఉన్నాయి. అయితే విభజన అంశం తెరపైకి వచ్చిన నేపథ్యంలో రెండు కమిషనరేట్లలో మూడు జోన్లు ఉండాలనే ఉద్దేశంతో ఈస్ట్ కమిషనరేట్ పరిధిలో మల్కాజిగిరి, ఎల్బీనగర్ జోన్లతో కొత్తగా భువనగిరి జోన్ ఏర్పాటుచేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. శంషాబాద్, మాదాపూర్, బాలానగర్ జోన్లతో వెస్ట్ కమిషనరేట్ ఏర్పాటుచేయాలన్న రీ ఆర్గనైజింగ్ వింగ్ అధికారులు శంషాబాద్ జోన్లో షాద్‌నగర్ డివిజన్‌ను, మాదాపూర్ జోన్లో మియాపూర్ డివిజన్లను కొత్తగా చేర్చారు. ప్రస్తుత సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో 12 ట్రాఫిక్ పోలీసుస్టేషన్లు ఉండగా...విభజన నేపథ్యంలో కొత్తగా మరో నాలుగు ట్రాఫిక్ ఠాణాలు ఏర్పాటుచేయనున్నారు. ఈస్ట్ కమిషనరేట్‌లో భువనగిరి, చౌటుప్పల్, వెస్ట్ కమిషనరేట్‌లో షాద్‌నగర్, చేవేళ్ల ట్రాఫిక్ పోలీసు స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. విభజన ప్రభావంతో రెండు కమిషనరేట్లలో వం దల సంఖ్యలో సిబ్బంది అవసరం కానుంది. ఈ మేరకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. -
హైకోర్టు విభజనకు తీర్మానం
అసెంబ్లీ ఉభయసభలు ఏకగ్రీవంగా ఆమోదం సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ఉమ్మడిగా ఉన్న హైకోర్టును వీలైనంత త్వరగా విభజించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీ తీర్మానించింది. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచాలని భావించిన రాష్ర్ట ప్రభుత్వం.. చట్టసభల్లో తీర్మానం చేసి కేంద్ర న్యాయ శాఖకు పంపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శాసనసభలో సీఎం కేసీఆర్, మండలిలో న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం విడివిడిగా తీర్మానాలను ప్రవేశపెట్టారు. దీనికి అన్ని పక్షాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. వీలైనంత తొందరలో హైకోర్టు విభజన జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు ఈ సందర్భంగా సీఎం శాసనసభలో పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు న్యాయ శాఖ కార్యదర్శిని ఢిల్లీకి పంపిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర విభజన జరిగి ఇన్ని నెలలవుతున్నా హైకోర్టు ఉమ్మడిగా ఉండడం వల్ల విభజన పరిపూర్ణంగా లేదని అన్నారు. దీనిపై తాను అవకాశం దొరికినప్పుడల్లా కేంద్రంతో మాట్లాడుతున్నానని, విభజనకు సంబంధించిన ప్రతిపాదన పంపితే చర్యలు తీసుకుంటామని కేంద్రం తాజాగా సమాచారమిచ్చిందని పేర్కొన్నారు. ఉభయసభల్లో చేసిన తీర్మాన ప్రతులను న్యాయ శాఖ కార్యదర్శికి ఇచ్చి ఢిల్లీకి పంపుతామని, వాటిని కేంద్ర న్యాయ శాఖ మంత్రికి అందించి తదుపరి చర్యలు తీసుకుంటామని సభ కు వెల్లడించారు. కాగా, ఈ తీర్మానం ఆహ్వానించదగినదని సీఎల్పీ నేత జానారెడ్డి పేర్కొన్నారు. హైకోర్టు విభజన జరిగేంత వరకు కోర్టులకు సంబంధించిన పోస్టుల భర్తీని నిలిపివేయాలని బీజేపీ సభ్యుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. జానారెడ్డి, కిషన్‌రెడ్డి సూచనలను విడిగా లేఖల రూపంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని సీఎం సమాధానమిచ్చారు. వెంటనే హైకోర్టు విభజన జరగాల్సి ఉందని, ఉభయసభల తీర్మానంతో అందుకు మార్గం సుగమమవుతుందని సీపీఐ, సీపీఎం, మజ్లిస్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. నేడు ఢిల్లీకి రాష్ట్ర బృందం కొత్త హైకోర్టుకు భవనాన్ని కేటాయించేందుకు రాష్ర్ట ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రానికి తెలిపేందుకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నేతృత్వంలో ప్రతినిధి బృందం గురువారం ఢిల్లీకి వెళ్లనుంది. అక్కడ కేంద్ర న్యాయ మంత్రిని కలిసి హైకోర్టు విభజనను వేగవంతం చేయాలని కోరనుంది. ఈ బృందంలో న్యాయవాద జేఏసీ కన్వీనర్ రాజేందర్‌రెడ్డి, హైకోర్టు సాధన సమితి అధ్యక్షుడు సహోదర్‌రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొండారెడ్డి, జేఏసీ నేతలు ఉన్నారు. మరోవైపు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తాతో సీఎం కేసీఆర్ బుధవారం సాయంత్రం భేటీ అయ్యారు. హైకోర్టు విభజనపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం. -
‘హోదా’ పరిశీలనలో ఉంది
కేంద్రమంత్రి వెంకయ్య వెల్లడి సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ సమావేశాల్లోనే ఏపీ విభజన చట్టంలో కొన్ని సవరణలకు సంబంధించిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశముందని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. విభజన చట్టంలో ఎలాంటి సవరణ ప్రతిపాదనపైనైనా రెండు రాష్ట్రాలతోనూ, సంబంధిత ప్రజాప్రతినిధులతో మాట్లాడాకే ముందుకెళతామన్నారు. శాసనమండలిలో సభ్యుల సంఖ్య, ఉద్యోగుల వ్యవహారాలు, కొన్ని ఇతర అంశాలకు సంబంధించి తానిప్పటికే రెండు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడినట్టు ఆయన తెలిపారు. ఆయా అంశాలపై కనీసం స్థూలంగానైనా ఏకాభిప్రాయం కుదిరితేనే కేంద్రం ఆ దిశలో ముందుకు సాగుతుందని చెప్పారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, ఏపీ రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి సుధీష్ రాంబొట్లతో కలసి ఆయన ఆదివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే అంశం కేంద్రం పరిశీలనలో ఉందని ఆయన చెప్పారు. దీనిలో కొన్ని చిక్కులు, సమస్యలు ఎదురవుతున్నాయని, వాటిని అధిగమించే ప్రయత్నాలపై అన్వేషణ కొనసాగుతోందని తెలిపారు. ఇది అంత సులభమైందే అయితే వాళ్లే(కాంగ్రెస్ పార్టీ) ఇచ్చేసి ఉంటే సరిపోయేది కదా? అని అన్నారు. హామీలపై డిమాండ్ చేసే హక్కుకాంగ్రెస్కు లేదని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ కేంద్రంలో చేరే ప్రతిపాదనేది లేదు.. కేంద్ర మంత్రివర్గంలోకి టీఆర్ఎస్ చేరే ప్రతిపాదనేదీ ఇప్పటికి లేదని వెంకయ్యనాయుడు చెప్పారు. అలాంటి చర్చ తనతోగానీ, ప్రధాని మోదీతోగానీ జరగలేదని ఒక ప్రశ్నకు జవాబుగా ఆయన చెప్పారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల విషయంలో ఏర్పడిన వివాదాన్ని తెలంగాణ, ఏపీల ముఖ్యమంత్రులిద్దరూ కలసి మాట్లాడుకుని పరిష్కరించుకోవడం సంతోషకర పరిణామమన్నారు. ఏ సమస్యనైనా ఇద్దరూ సమన్వయంతో పరిష్కరించుకోవాలని సూచించారు. -
‘విభజన’ పరిష్కారం ఇక వేగిరం!
గవర్నర్ చేతికి హైదరాబాద్ శాంతిభద్రతలు రూల్స్ జారీకి కేంద్ర హోంశాఖ సుముఖత సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీల మధ్య విభజన వివాదాల పరిష్కారం ఇక వేగవంతం కానుంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఎల్సీ గోయల్ నియామకం కావడంతో విభజన చట్టంలోని అంశాలను ఇక వేగంగా అమలుచేసే అవకాశముందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు, డీజీపీ జె.వి.రాముడు భావిస్తున్నారు. బుధవారంనాటి ఢిల్లీ పర్యటనలో సీఎస్, డీజీపీలు ప్రత్యేకంగా హోంశాఖ కార్యదర్శి గోయల్‌తో సమావేశమై విభజన అంశాలను వివరించారు. ఈ క్రమంలో గోయల్ సానుకూలంగా స్పందించినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవలి వరకు హోం కార్యదర్శిగా ఉన్న అనిల్ గోస్వామి కాలయాపన చేశారని, ఇప్పుడా పరిస్థితి ఉండదని ఏపీ కూడా భావిస్తోంది. విభ జన చట్టంలోని సెక్షన్ 8(సి) మేరకు హైదరాబాద్‌లో శాంతిభద్రతలను పదేళ్లపాటు గవర్నర్ పర్యవేక్షించాలి. దీనికి కేంద్ర హోంశాఖ రూల్స్ జారీ చేయలేదు. దీనిపై స్పందించిన గోయల్.. సాధారణ రూల్స్ జారీ చేయవచ్చని అన్నట్టు తెలిసింది. ఉద్యోగుల పంపిణీని కమలనాథన్ కమిటీ మార్గదర్శకాల మేరకు లేదా జనాభా నిష్పత్తి మేరకు పంపిణీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. సంస్థల ఆస్తుల పంపిణీ విషయంలో చట్టంలో హెడ్ క్వార్టర్స్ అని ఉండడంతో టీ ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ సంస్థల్లోని ఆస్తుల పంపిణీకే అంగీకరిస్తామని, మిగతా సంస్థల పంపిణీకి అంగీకరించబోమని పేర్కొంది. దీనిపై హెడ్ క్వార్ట ర్స్ అంటే అడ్మినిస్ట్రేటివ్ సంస్థలే అంటే కుదరదని, ఆర్టీసీకి ఉమ్మడి రాజధానిలో బాడీ బిల్డింగ్ యూనిట్‌ను, ఆసుపత్రిని నిర్మించారు దానిలో కూడా వాటా కావాలని ఏపీ కోరుతోంది. దీనిపై కూడా కేంద్రం వివరణ ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. 10వ షెడ్యూల్లో 107 సంస్థలుండగా ఆ సంస్థలు పదేళ్ల పాటు ఉమ్మడి యాజమాన్యంలో పనిచేసేలా ఇరు రాష్ట్రాలూ అవగాన ఒప్పందాలు చేసుకునేలా హోంశాఖ చర్యలు చేపట్టనుంది. -
‘పేట’ను ఆంధ్రలో కలిపితే పోరాటమే
వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అశ్వారావుపేట: ‘తెలంగాణ రాష్ర్టంలోని అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కలిపే ప్రసక్తే లేదు. అలాంటి చర్యలకు పాల్పడితే తెలంగాణ బిడ్డగా పోరాటం చేస్తాను’ అని వైఎస్సార్సీపీ రాష్ర్ట అధ్యక్షులు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అశ్వారావుపేట మండలంలో శనివారం ఆయన విస్తృతంగా పర్యటించారు. మండల పరిధిలోని నారంవారిగూడెం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. కొద్ది రోజులుగా అశ్వారావుపేట మండలాన్ని ఆంధ్రలో కలుపుతున్నట్లు ఊహాగానాలు, ప్రచారం జరుగుతోందన్నారు. దీనిపై స్థానికులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవ సరం లేదన్నారు. ఇదంతా దుష్ర్పచారం మాత్రమే అన్నారు. ఒకసారి విభజన జరిగిన తర్వత దాన్ని మార్చడం గాని, కొత్తగా చేర్పులు మార్పులు చేయడం ఉండవన్నారు. ఒకవేళ ఈ మండలాన్ని ఆంధ్రలో కలిపే ప్రయత్నాలు సాగితే మాత్రం తెలంగాణ బిడ్డగా ముందుండి ఉద్యమం చేస్తానన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతోనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. రైతుల మేలు కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ ఈసీ మెంబర్ జూపల్లి రమేష్, మండల కన్వీనర్ పుచ్చకాయల రాజశేఖర్‌రెడ్డి, జూపల్లి ప్రమోద్, కొల్లి సత్యనారాయణ, గేదెల సురేష్, సర్పంచ్ బెల్లం సుజాత, తహశీల్దార్ గంగా భవానీ, పంచాయతీ రాజ్ ఏఈఈ సుబ్బారావు, ట్రాన్స్ కో ఏఈఈ రామారావు, ఐటీడీఏ ఏఈఈ మహేష్, ఆర్ఐలు శ్రీనివాస్‌యాదవ్, శివకృష్ణ పాల్గొన్నారు. అంతకు ముందు ఆయన అచ్యుతాపురంలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. -
ఆర్టీసీ ఆర్ఎంపై దాడి!
మళ్లీ రాజుకున్న ఆర్టీసీ విభజన సెగ ఉన్నతాధికారి తీవ్రంగాగాయపడడమే కారణం ఆయనపై దాడి జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు విభజనపై త్వరగా తేల్చాలంటూ ఇద్దరు సీఎంలకు విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విడిపోయినా ఇంకా ఉమ్మడిగానే కొనసాగుతున్న ఆర్టీసీలో ఇప్పుడు ఏ చిన్న సంఘటన జరిగినా సంచలనమే అవుతోంది. ఆంధ్ర-తెలంగాణ అధికారులు పరస్పరం ఎదురుపడితే మాటల యుద్ధం షరా మామూలే అవుతోంది. అయితే, అది ఇప్పుడు దాడుల స్థాయికి చేరుకుందా? అనే అనుమానాలు ఆర్టీసీలో రేకెత్తుతున్నాయి. రెండు రోజుల క్రితం జరిగిన ఓ సంఘటనపై పోలీస్స్టేషన్లోనూ ఫిర్యాదు అందింది. దీంతో ఆర్టీసీలో మళ్లీ విభజన వేడి రాజుకుంది. ఆర్టీసీ ప్రధాన పరిపాలన కేంద్రం బస్‌భవన్‌లోని టాయిలెట్లో రీజనల్ మేనేజర్ ఒకరు అనుమానాస్పదస్థితిలో గాయపడడం సంచలనం కలిగిస్తోంది. మూడు రోజుల క్రితం సికింద్రాబాద్ రీజనల్ మేనేజర్ సత్యనారాయణ బస్‌భవన్‌కు వచ్చారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లోని టాయిలెట్లో గాయాలతో కుప్పకూలిన స్థితిలో ఉన్న ఆయనను గుర్తించిన సిబ్బంది తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రికి తరలించారు. తర్వాత అక్కడి నుంచి నాంపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన తాను టాయిలెట్‌కు వెళ్లిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తి తనపై దాడి చేశాడని, మొహంపైన, కడుపులో పిడిగుద్దులు గుద్ది తలను బలంగా గోడకేసి కొట్టాడని పేర్కొంటున్నారు. ఆయనపై దాడి జరిగిందంటూ పోలీస్స్టేషన్లోనూ ఫిర్యాదు అందింది. విభజన కోణంలో: ఆర్టీసీని వెంటనే విభజించాలంటూ కొద్ది రోజులుగా ఒత్తిడి పెరిగింది. ఇటీవల తెలంగాణ రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి కేంద్ర మంత్రి నితిన్గడ్కారీని కలసి ఇదే అంశంపై విజ్ఞప్తి చేయగా, త్వరలో రెండు రాష్ట్రాల సీఎస్‌లో సమావేశమై చర్చిస్తానని హామీ ఇచ్చారు. నెలరోజుల్లో విభజన జరుగుతుందని స్వయంగా ఆర్టీసీ ఎండీ రెండురోజుల క్రితం ప్రకటించారు. మరోవైపు.. ఖమ్మం నుంచి ఏపీలో కలసిన పోలవరం ప్రాంతానికి చెందిన సీనియర్ ఈడీ ఆంధ్రప్రదేశ్‌కే చెందాలని తెలంగాణ అధికారులు, కాదు తెలంగాణకే కేటాయించాలని ఆంధ్రప్రాంత అధికారులు పట్టుబట్టడంతో ఆర్టీసీలో తీవ్ర గందరగోళం నెలకొంది. అధికారుల కేటాయింపు అంశం ఎటూతేలకపోవడానికి ఇది కారణమైంది. ఇప్పుడు విభజనపై మరింత ఒత్తిడి తెచ్చే క్రమంలోనే ఆర్ఎం సత్యనారాయణ గాయపడిన అంశం కూడా అందులో చేరిపోయింది. ఈ నేపథ్యంలో వెంటనే రెండు రాష్ట్రప్రభుత్వాలు జోక్యం చేసుకుని అధికారులు, సిబ్బంది మధ్య ఉద్రిక్తతలు పెరగకముందే చర్యలు తీసుకోవాలనే డిమాండ్ పెరిగింది. ఈ అంశాన్ని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకువచ్చేందుకు సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. -
పరస్పర సహకారంతో పని చేద్దాం
ఏపీపీఎస్సీ ఇన్‌ఛార్జి ఛైర్మన్‌తో టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి సాక్షి, హైదరాబాద్: ఒకే భవనంలో ఉన్న ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ పరస్పర సహకారం, సోదరభావంతో పని చేయాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఆకాక్షించారు. కమిషన్ కార్యాలయంలో సోమవారం ఏపీపీఎస్సీ ఇన్చార్జి చైర్మన్ శివన్నారాయణను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీపీఎస్సీ కార్యాలయ భవనం, సిబ్బంది విభజన పూర్తికి రాష్ట్ర విభజన విభాగం తెలంగాణ కార్యదర్శి రామకృష్ణారావు హామీ ఇచ్చినట్టు ఘంటా తెలిపారు. అనంతరం సీఎస్ డాక్టర్ రాజీవ్‌శర్మ, సీఎం ముఖ్య కార్యదర్శి నరసింగరావులతో చర్చించారు. -
వెతకడానికే సరిపోతోంది
ప్రజా సమాచార అధికారులకు తప్పని అవస్థలు ‘యునెటైడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్’ సర్వేలో వెల్లడి సాక్షి, హైదరాబాద్: వివిధ శాఖల్లో సమాచార హక్కు చట్టం విభాగం కింద పనిచేస్తున్న ప్రజా సమాచార అధికారులు (పీఐఓ) అధిక సమయాన్ని ఆర్టీఐ దరఖాస్తుదారులు కోరిన సమాచారాన్ని వెతికి కనిపెట్టడానికే సరిపోతోంది. ప్రభుత్వ విభాగాల్లో రికార్డుల నిర్వహణ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. సమాచార హక్కు చట్టం అమలు తీరుపై ‘యునెటైడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్’ క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సహ చట్టం పదో సంవత్సరంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో క్షేత్రస్థాయి సర్వే ప్రాధాన్యత సంతరించుకొంది. సర్వే వివరాలను సంస్థ ఇటీవల వెల్లడించింది. ముఖ్యాంశాలివీ... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు ఆదిలాబాద్, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో సర్వే నిర్వహించారు. ఆర్టీఐ కింద అడిగిన సమాచారాన్ని వెతకడానికే అధిక సమయం వెచ్చించాల్సి వస్తోందని 73 శాతం మంది పీఐఓలు చెప్పారు. రికార్డు నిర్వహణ వ్యవస్థ సక్రమంగా లేకపోవడమే దానికి కారణం. 26 శాతం మంది పీఐఓల వద్ద ఆర్టీఐ చట్టం ప్రతి కూడా లేదు. కేవలం ఉన్నతాధికారుల ఆదేశానుసారమే పీఐఓలుగా ఉన్నామని 90 శాతం మంది చెప్పారు. 63 శాతం మంది పీఐఓలు ఎలాంటి శిక్షణా కార్యక్రమాలకు హాజరు కాలేదు. విభాగానికి సంబంధించిన సమాచారాన్ని స్వచ్ఛందంగా వెల్లడించడం లేదని దాదాపు పీఐఓలు అంతా చెప్పారు. అలాంటి నిబంధన ఉన్నట్లు తమకు తెలియదన్నారు. స్వచ్ఛందంగా సమాచారాన్ని వెల్లడిస్తే ఆర్టీఐ దరఖాస్తులు తగ్గుతాయని సగం మంది పీఐఓలు అభిప్రాయపడ్డారు. మీడియా, పౌర సంఘాలు విస్తృతంగా ప్రచారం చేయడం, అక్షరాస్యత పెరగడం వల్ల ప్రజల్లో ఆర్టీఐ చట్టం మీద అవగాహన పెరిగిందని పీఐఓలు అభిప్రాయపడ్డారు. ఆర్టీఐ చట్టం వచ్చిన తర్వాత పాలనా తీరు, నిర్ణయాలు తీసుకొనే ధోరణి, సమాచార నిర్వహణలో మార్పులు వచ్చాయని 55 శాతం మంది పీఐఓలు చెప్పారు. ఈ చట్టం వల్ల పారదర్శకత, జవాబుదారీతనం పెరిగి..అవినీతి తగ్గిందని సర్వేలో వెల్లడైంది. సామాన్యులకూ ప్రభుత్వ పనితీరు పరిశీలించే అవకాశం కలిగింది. సమర్థ అమలుకు ఏం చేయాలంటే... ఆర్టీఐ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ‘యునెటైడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్’ సూచనలివీ...అధికారులు, సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇవ్వడానికి, చట్టం గురించి ప్రచారం చేయడానికి ప్రత్యేక బడ్జెట్ ఉండాలి. ఆర్థికాంశాలు సహా ఆయా శాఖలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని స్వచ్ఛందంగా వెల్లడించడం, తాజా సమాచారాన్ని జోడించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. -
గతుకులే గతి
జిల్లాలో రోడ్లనిర్మాణానికి సర్కారు విముఖత రూ.8 కోట్లతో ప్రతిపాదనలకు ఎర్రజెండా తుపాన్లకు దెబ్బతిన్నవాటికి కలగని మోక్షం రహదారులు నాగరికతకు చిరునామాలు. ఎక్కడ రోడ్లు అభివృద్ధి చెందుతాయో అక్కడ నాగరికత పరిఢవిల్లుతుంది. జిల్లాలో ఈ రంగం పూర్తిగా కుదేలయింది. గ్రామీణ రోడ్లది అక్షరాలా కన్నీటి గాథే. రోజురోజుకు ఇవి అధోగతి పాలవుతున్నాయి. మోకాలిలోతు గోతులతో శిథిలమైన రోడ్ల కారణంగా వందలాది గ్రామాలకు రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. కొత్త ప్రభుత్వం వీటి నిర్మాణం, మరమ్మతులకు నిధులు విడుదలకు ససేమిరా అంటోంది. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో రోడ్లు చాలావరకు నడవడానికి వీల్లేకుండా ఉన్నాయి. సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో ఆర్అండ్బీ శాఖ అధీనంలోని విశాఖ, పాడేరు డివిజన్లలో మొత్తం 2198 కిలోమీటర్ల రహదారులున్నాయి. వీటిలో 721 కిలోమీటర్ల విస్తీర్ణంలో గ్రామీణ రోడ్లున్నాయి. వీటిలో 28 మండలాల్లో సగానికిపైగా పూర్తిగా ధ్వంసమై నడవడానికి వీలు లేకుండా ఉన్నాయి. నర్సీపట్నం, నక్కపల్లి, ఎలమంచిలి, పాయకరావుపేట, కోటవురట్ల, రోలుగుంటతోపాటు పాడేరు, అరకు డివిజన్లలో చాలా గ్రామాల్లో రహదారుల్లో నడవడానికి, ప్రయాణించడానికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఏడాదిన్నరగా ఇదే తంతు. అయినా ప్రభుత్వం గ్రామీణ, పట్టణ రోడ్ల నిర్మాణానికి ఆసక్తి చూపడం లేదు. సీఎం రోశయ్య హయాం నుంచి జిల్లాలో కొత్త రహదారుల నిర్మాణానికి ఆర్‌అండ్‌బీకి నిధులు పెద్దగా విడుదల కాలేదు. దీనికితోడు 2013లో వచ్చిన పలు తుపాన్లు, భారీ వర్షాలకు అనేక ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. సుమారుగా 280 కిలోమీటర్లు పూర్తిగా పాడయ్యాయని అధికారులు తేల్చారు. వీటి స్థానంలో కొత్త రోడ్లకు ప్రాథమికంగా రూ.8 కోట్లు విడుదల చేయాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించినా అతీగతీలేదు. కొత్త ప్రభుత్వం వచ్చాకైనా నిధులివ్వలేదు. విభజనకు ముందు ఇచ్చిన ప్రతిపాదనలతో తమకు సంబంధం లేదని, నిధులు ఇవ్వలేమని కరాకండీగా చెబుతోంది. దీంతో ఇప్పుడు ఆశాఖ అధికారులకు పాలుపోవడం లేదు. ఆర్థిక సంఘం నిధులు కూడా రాక చేష్టలుడిగి చూస్తున్నారు. ఇంకోపక్క ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఆర్అండ్బీ అధికారులపై ఒత్తిడి తెచ్చి పలు రోడ్లకు శంకుస్థాపనలు చేయించేశారు. కానీ నిధులు లేక ఇవి ఎక్కడివక్కడే ఆగిపోయాయి. దీంతో గ్రామాల్లో ప్రజలకు సమాధానాలు చెప్పలేక అధికారులు నీళ్లునములుతున్నారు. ఇదిలాఉంటే అసెంబ్లీ నియోజకవర్గ అభివద్ధి పథకం (ఏసీడీపీ) కింద ఎమ్మెల్యేలకు ఏటా రూ.కోటి నిధులు వచ్చేవి. వీటితో రోడ్లను కొంతవరకు స్థానికంగా అభివద్ధి చేసుకునేందుకు వీలుండేది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఏసీడీపీ నిధులు రద్దుచేయడంతో ఆర్అండ్బీ అధికారులకూ పెద్దగా పనిలేకుండా పోయింది. దీంతో ఇప్పుడు ఒకపక్క నిధులు లేక..చేయడానికి పనిలేక ఖాళీగా ఉంటున్నామని చెబుతున్నారు. -
శ్రీవారి అనుగ్రహంతో వచ్చా.. ఆజ్ఞతో వెళ్తా
- ‘సాక్షి’తో టీటీడీ ఈవో ఎంజీ గోపాల్ వెల్లడి సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘శ్రీవారి అనుగ్రహంతో వచ్చా.. ఆజ్ఞతో వెళ్తా’నని టీటీ డీ ఈవో ఎంజీ గోపాల్ స్పష్టీకరించారు. టీటీడీ ఈవో పోస్టు పొందేందుకు తానెవరి సహాయం కోరలేదని.. కొనసాగేం దుకూ ఎవరి సహాకరం అడగలేదని స్పష్టీకరించారు. గురువారం తిరుపతిలో తన క్యాంప్ ఆఫీసులో ఈవో ఎంజీ గోపాల్ ‘సాక్షి’తో మాట్లాడారు. నిజాయితీతో నిబద్ధతతో పనిచేసే తనను శ్రీవేంకటేశ్వరస్వామే టీటీడీ ఈవో పదవి ఇచ్చేలా చేశారని చెప్పారు. శ్రీవారి అనుగ్రహంతో టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి భక్తులకు స్వామివారిని మరింత దగ్గర చేసేందుకు ప్రయత్నించానన్నారు. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 4 వరకూ నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తాను ఆంధ్రప్రదేశ్‌లో జన్మించినా.. తెలంగాణలో పెరిగానన్నారు. ఐఏఎస్‌ల విభజనలో కేంద్ర ప్రభుత్వం తనను తెలంగాణకు కేటాయించిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తాను వ్యహరిస్తానని స్పష్టీకరించారు. టీటీడీ ఈవోగా కొనసాగేందుకు తానెవరి సహాయం కోరలేదన్నారు. శ్రీవారి ఆజ్ఞతో పనిచేస్తానని స్పష్టీకరించారు. -
దేశచరిత్రలో ఇలాంటి విభజన జరుగలేదు : శివరామకృష్ణన్
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వంటి విభజన దేశ చరిత్రలో జరుగలేదని ఏపిలో రాజధాని నిర్మించే ప్రాంతాన్ని సూచించడానికి కేంద్రం నియమించిన కమిటీ చైర్మన్ శివరామకృష్ణన్ చెప్పారు. ఆగస్టు మధ్యలో ఏపి రాజధానిపై కేంద్రానికి తుది నివేదిక ఇస్తామన్నారు. ఫలానా చోటే రాజధాని ఉండాలని తాము శాశించం అని అన్నారు. కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని ఎక్కడా అనేది నిర్ణయించేది ఏపీ ప్రభుత్వమేనన్నారు. నీరు, అన్ని రకాల రవాణా సదుపాయాలు ఉన్నచోటే నూతన రాజధానికి అనుకూలం అని చెప్పారు. రాష్ట్రంలో జలవనరుల పరిస్థితిపై చంద్రబాబుతో చర్చించినట్లు తెలిపారు. రాయలసీమలో సగటు వర్షం పాతంకూడా పడని అంశాన్ని చంద్రబాబుకు వివరించినట్లు చెప్పారు. రాష్ట్రంలో పెట్టాల్సిన సంస్థలను అన్ని ప్రాంతాలకు విస్తరింపచేజే అంశంపై చర్చినట్లు వివరించారు. పరిపాలనా కేంద్రాలు ఒకే చోట ఉండాలన్నది ప్రభుత్వం ఆలోచనగా చెప్పారు. కాని రాష్ట్రంలో అన్నిచోట్లా భూ లభ్యత అంత సులభంగా లేదన్నారు. ఒకటిరెండు ప్రాంతాల్లో మాత్రమే భూ లభ్యత ఉందని చెప్పారు. ఏ ప్రాంతమూ రాజధానికి పూర్తిస్థాయిలో అనుకూలత ఉందని చెప్పలేం అన్నారు. కాని కొన్ని ప్రాంతాలకు ఒకటిరెండు అంశాల్లో సానుకూలతలు ఉన్నాయని తెలిపారు. ఒకే ప్రాంతంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉండడం సాధ్యం కాదన్నది తమ అభిప్రాయంగా చెప్పారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా సమగ్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకోవాలన్నది తమ అభిప్రాయంగా తెలిపారు. వైజాగ్, తిరుపతి, రాయలసీమ, మధ్యాంధ్ర ప్రాంతాల్లో నగరాలను విస్తరించుకోవాలన్నది తమ అభిప్రాయంగా వివరించారు. కాని చాలా అంశాల్లో ఆర్థిక సంక్లిష్టతలు ఉన్నాయన్నారు. ఒక ప్రాంతంలోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలన్నది తమ అభిప్రాయంగా తెలిపారు. మాకు తగిన సమయం ఉన్నా ఆగస్టు మధ్యంతరంలోగా రాజధానిపై నివేదిక ఇస్తామని చెప్పారు. తాము రాజధానికి అవకాశాలున్న ప్రాంతాలు, పరిష్కారాలు, ఇతరత్రా అవకాశాలను వివరిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల ఆకాంక్షలు, అభిప్రాయాలను చెప్పినట్లు తెలిపారు. రాజధానిపై అనేక కోరికలు ఉండొచ్చునని, కాని భూముల లభ్యతకూడా ఉండాలి కదా? అని శివరామకృష్ణన్ ప్రశ్నించారు. 13 నుంచి 14 ప్రాంతాలను గుర్తించామని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లో మొత్తం 192 ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయని తెలిపారు. నీరులేని చోట మత్స్యశాఖ కార్యాలయాలను పెట్టలేం కదా? ఈ కార్యాలయాలను ఎక్కడ పెట్టాలి? ఏ ప్రాంతానికి తరలించాలన్నదానిపై దృష్టిపెట్టవలసిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 89 సంస్థలను ఎక్కడకు తరలించాలన్న విషయం ఆలోచించాలన్నారు. ఒకేచోట అన్నిఆఫీసులను ఉంచొద్దని చెప్పినట్లు శివరామకృష్ణన్ తెలిపారు. ఇలాంటి విభజన దేశచరిత్రలో ఎప్పుడూ లేదన్నారు. శ్రీకాళహస్తి - నడికుడి పూర్తయితే అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. ప్రతిఏటా రెండు నుంచి మూడు లక్షలు ఉద్యోగాలు కల్పించవలసి ఉందని, అయితే ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని, పరిశ్రమలే ఉద్యోగాలు ఇస్తాయని తెలిపారు. రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉండాలనడంలో ఎలాంటి వివాదం లేదని చెప్పారు. అతిపెద్ద నగరం అన్నింటికీ పరిష్కారాలు చూపలేదన్నారు. రాజధాని అనేది ప్రధాన నగరాలకు అనుబంధంగా నిర్మించిందేనని చెప్పారు. రాజధాని అంటే పెద్దపెద్ద భవనాలు అనే భావన వదిలేయాలన్నారు. భువనేశ్వర్ రాజధానులకు సరైన ఉదాహరణ అని చెప్పారు. వ్యవస్థలు నడవడానికి అనువైన వాతావరణం ఉండాలన్నారు. విజయవాడకు తాము వ్యతిరేకం కాదని, అయితే సర్వీసుల విషయంలో ఇబ్బందులు ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రజలు ఎక్కువుగా వస్తే అక్కడ సేవలు అందవన్నారు. రాజధాని ప్రాంతాన్ని గుర్తించడం అంత సులభంకాదని చెప్పారు. రాజధానిలో కేవలం 50 ప్రభుత్వ కార్యాలయాలు ఉంటే సరిపోతుందన్నారు. పర్యావరణం, నీరు, భూమి ఆధారంగా కొన్ని ఆప్షన్స్ ఇచ్చామని తెలిపారు. భూముల ధరలు విపరీతంగా ఉన్నాయని, భూముల కొనుగోలు కోసం విపరీతంగా ఖర్చుపెట్టొద్దని చెప్పామన్నారు.