Polytechnic education
-
మా గోడు వినండి!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉద్యోగుల వెతలు మళ్లీ మొదలయ్యాయి. చట్టంలోని నిబంధనలను అమలు చేసి ఉద్యోగులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో చట్ట ప్రకారం ఇచి్చన జీవోలను అమలు చేయకుండా తాత్సారం చేస్తోంది. ఫలితంగా ఉద్యోగులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వివిధ శాఖల్లో కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేసే మహాయజ్ఞాన్ని తలపెట్టింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో దశాబ్దాలుగా కాంట్రాక్టు పద్ధతిపై వర్క్‌షాప్ అటెండర్లుగా విధులు నిర్వహిస్తున్న 22 మందిని రెగ్యులర్ చేస్తూ.. ఈ ఏడాది మార్చి 16న జీవో నంబర్–8 జారీ చేసింది. అనంతరం ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో జీవో అమలు తాత్కాలింగా నిలిచిపోయింది. కొత్తగా అధికారంలోకి వచి్చన కూటమి ప్రభుత్వం ఉద్యోగుల శ్రేయస్సును విస్మరించి న్యాయంగా వారికి దక్కాల్సిన హక్కులను దూరం చేస్తోంది. 50 ఏళ్లు పైబడిన వారే ఎక్కువ ఏపీలో కాంట్రాక్టు ఉద్యోగుల చట్టంలోని నిబంధనల ప్రకారం వర్క్‌షాప్ అటెండర్లుగా పని చేస్తున్న వారిని గత ప్రభుత్వం రెగ్యులర్ చేసింది. వీరు ఐటీఐ, డిప్లొమా విద్యార్హతతో దాదాపు 15 ఏళ్లుగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో పని చేస్తున్నారు. సుమారు 50 ఏళ్ల వయసులో ప్రభుత్వం తమ సేవలను గుర్తించి క్రమబదీ్ధకరించడంతో వారంతా సంతోషం వ్యక్తం చేశారు. పదవీ వివరణ 62 ఏళ్లు ఉండటంతో.. మిగిలిన పుష్కర కాలం శాశ్వత ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసే అవకాశం దక్కిందనే ఆనందం కాస్తా రెండు నెలల్లోనే ఆందోళనగా మారింది. గత ప్రభుత్వం రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినా సాంకేతిక విద్యాశాఖ మాత్రం వాటిని అమలు చేస్తూ పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వకుండా జాప్యం చేయడం కలవరపెడుతోంది. వాస్తవానికి 22 మంది రెగ్యులర్ ఉద్యోగుల పరిధిలోకి వచ్చినప్పటికీ సాంకేతిక కారణాలతో గడచిన మూడు నెలలుగా కాంట్రాక్టులోనే కొనసాగుతున్నారు. అయితే.. సీఎఫ్ఎంఎస్ ఐడీని మాత్రం బ్లాక్ చేశారు. ఫలితంగా జూన్ నెలలో రావాల్సిన జీతాలు సైతం పెండింగ్‌లో పడ్డాయి. జీతాలపై ఆధారపడటంతో కుటుంబాల పోషణ భారంగా మారుతోంది. ఎందుకింత ఆలస్యం? సాంకేతిక విద్యాశాఖలో కాంట్రాక్టు పద్ధతిపై పని చేస్తున్న వారిలో 22 మంది పార్క్షాపు అంటెండర్లు, ఇద్దరు లెక్చర్లను క్రమబదీ్ధకరిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచి్చంది. ఇద్దరు లెక్చరర్లు నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులర్ అయ్యారంటూ కొంతమంది కోర్టులో సవాల్ చేశారు. అయితే న్యాయస్థానం మాత్రం ఆ ఇద్దరు లెక్చరర్లు తప్ప మిగిలిన వారందరికీ నియామక ఉత్తర్వులు ఇవ్వాలని గతంలోనే ఆదేశించింది. కానీ, సాంకేతిక విద్యాశాఖ అధికారులు మాత్రం కావాలనే జాప్యం చేస్తున్నట్టు వర్క్‌షాపు అటెంటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ పేరుచెప్పి ఒకసారి, కోర్టు కేసుల పేరు చెప్పి మరోసారి తమకు అన్యాయం చేస్తున్నారని వాపోతున్నారు. -
'పాలిటెక్నిక్' లో నవోదయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్య సరికొత్త బ్రాండ్ ఇమేజ్ను సృష్టిస్తోంది. పదో తరగతి ఉత్తీర్ణులై.. మూడేళ్ల డిప్లొమా కోర్సు పూర్తి చేసేలోగా బహుళజాతి సంస్థల్లో లక్షల రూపాయల జీతాలతో ఉద్యోగాలు కల్పిస్తోంది. గడచిన ఐదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో వివిధ కంపెనీల్లో దక్కుతున్న ఉద్యోగాలకు సంబంధించిన ప్లేస్మెంట్లు క్రమేణా పెరుగుతున్నాయి. 2023–24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ఏకంగా 12 వేల మందికి ఉద్యోగాలు దక్కడం విశేషం.గతేడాది అత్యధిక వార్షిక వేతనం రూ.6.25 లక్షలుగా ఉంటే.. ఈ ఏడాది రూ.8.60 లక్షలకు పెరిగింది. ప్రతి వి ద్యార్థి సగటున రూ.3 లక్షల ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఒకప్పుడు 2019కి ముందు 400 కూడా దాటని ఉద్యోగ అవకాశాలు.. ఇప్పడు వేల మందికి చేరు వ అవుతున్నాయి.2019–20లో 575 ఉద్యోగాలు, 2020–21లో 652 పోస్టులు, 2021–22లో 780 కొలువులు మాత్రమే వచ్చాయి. 2022–23లో 6వేల మంది క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఎంపికైతే.. ఈ ఏడాది రెట్టింపైంది. ఇంటర్మీడియెట్, ఇంజనీరింగ్ కోర్సులను ఆరేళ్లు చదివి పూర్తి చేసిన తర్వాత అందుకునే వేతనాలను మూడేళ్ల డిప్లొమాతో 18 ఏళ్ల వయసులోనే దక్కించుకోవడం మార్కెట్లో పాలిటెక్నిక్ విద్య డిమాండ్‌కు అద్దం పడుతోంది. ఒకవైపు ఉద్యోగం.. మరోవైపు ఉన్నత చదువులు రాష్ట్రవ్యాప్తంగా 88 ప్రభుత్వ, 179 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో 35,533 మంది డిప్లొమా ఫైనలియర్ చదువుతుంటే.. వీరిలో 12వేల మందికి ఉద్యోగాలు దక్కాయి. ఇందులో 50 శాతం ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర పాలిటెక్నిక్ విద్యా చరిత్రలో తొలిసారిగా బహుళజాతి సంస్థ టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ రూ.8.60 లక్షల వార్షిక వేతనంతో విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసింది. ఈ సంస్థ సాధారణంగా జాతీయ స్థాయిలో పేరొందిన ఐఐటీలు, ఎన్ఐటీలు నుంచి బీటెక్ గ్రాడ్యుయేట్లను మాత్రమే తమ సంస్థలో ఉద్యోగాలకు ఎంపిక చేసేది. కానీ.. ఏపీలో నైపుణ్యాలతో కూడిన విద్యను అభ్యసిస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులకు అరుదైన అవకాశం కల్పించింది.ఇక్కడ అత్యధిక ప్యాకేజీలతో రూ.8.60 వార్షిక వేతనానికి 9 మంది ఎల్రక్టానిక్స్ విద్యార్థులకు టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ ల్యాబ్ ఇంటర్న్‌లుగా, రూ.8 లక్షల వార్షిక వేతనంతో థాట్వర్క్ల కోసం సాఫ్ట్వేర్ డెవలపర్లుగా 35 మంది కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించాయి. ఈ రెండు సంస్థలతో పాటు మెగా ఇంజనీరింగ్, జీఈ ఏరోస్పేస్, మోస్ చిప్, సుజ్లాన్, అమరరాజా, ఆర్సెలర్ మిట్టల్ అండ్ నిప్పన్ స్టీ ల్, ఎఫ్ట్రానిక్స్, మేధా సర్వో, డాక్టర్ రెడ్డీస్ లే»ొరేటరీస్, షాపూర్జీ పల్లోంజీ, ఆల్ఫా లావాల్, మారుతీ సుజుకి రాయ ల్ ఎన్ఫీల్డ్, వీల్స్ ఇండియా, స్మార్ట్‌డివి టెక్నాలజీస్, నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, హెచ్ఎల్ మాండో ఆనంద్ ఇండియా వంటి ప్రధాన సంస్థల్లో డిప్లొమా విద్యార్థులు కొలువుదీరారు.డిప్లొమా స్థాయిలో ఉద్యోగాలు పొందిన విద్యార్థులను సైతం ఉన్నత చదువుల వైపు ప్రోత్సహించేలా సాంకేతిక విద్యాశాఖ కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే ఆయా సంస్థలు రెండేళ్లు అనుభవం గడించిన తర్వాత ఉద్యోగులందరికీ బీటెక్ విద్యను అభ్యసించేలా తోడ్పాటును అందించనున్నాయి. ఇక్కడ ఉన్నత చదువులకయ్యే మొత్తం ఫీజును కూడా కంపెనీలే భరించనున్నాయి. ప్రత్యేక క్యాంపస్ రిక్రూట్మెంట్ శిక్షణసాంకేతిక విద్యాశాఖ విద్యార్థులను మార్కెట్లోకి రెడీ టు వర్క్‌గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కరిక్యులమ్ అమలు చేస్తోంది. అకడమిక్ లెర్నింగ్, ఇండస్ట్రీ అవసరాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి వర్క్‌షాపులను నిర్వహిస్తోంది. పారిశ్రామికవేత్తలు, ఐటీ తదితర కంపెనీల ప్రతినిధుల నుంచి వచ్చిన సూచనలతో పరిశ్రమ ఆధారిత కోర్సులను ప్రారంభించింది. అన్ని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రభుత్వం వర్చువల్ డిజిటల్ క్లాస్‌రూమ్‌లను ఏర్పాటు చేసినందున విద్యార్థులకు లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా థియరీ, ప్రాక్టికల్ సబ్జెక్టుల బోధన పకడ్బందీగా అందుబాటులోకి వచ్చింది.పారిశ్రామిక రంగంలో వస్తున్న మార్పులకనుగుణంగా సిలబస్‌ను మార్పు చేయడంతో పాటు వాటి బోధనకు వీలుగా సిబ్బంది కోసం ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లను అమలు చేయిస్తున్నారు. పారిశ్రామిక శిక్షణ కార్యక్రమాల కోసం విద్యాసంస్థలను పరిశ్రమలతో అనుసంధానిస్తున్నారు. వీటితో పాటు క్యాంపస్ రిక్రూట్మెంట్ శిక్షణ ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు ఇంటర్వ్యూల్లో చక్కగా రాణించేలా సంసిద్ధం చేసింది. కళాశాల స్థాయి, క్లస్టర్ల వారీగా, కమిషనరేట్ స్థాయి వరకు మల్టీ లెవల్ ప్లేస్మెంట్ డ్రైవ్‌లు చేపట్టింది. తద్వారా మహిళా పాలిటెక్నిక్‌లు, మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్,మైనారిటీ పాలిటెక్నిక్‌ల విద్యార్థులు గణనీయంగా ఉద్యోగాలు పొందారు. పాడేరు, చీపురుపల్లి, శ్రీకాకుళం, అద్దంకి, శ్రీశైలం, చోడవరం వంటి మారుమూల ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులు ప్రఖ్యాత కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విజయం సాధించింది. రూ.8.60 లక్షల వేతనంతో.. మాది అనంతపురం జిల్లా పామిడి గ్రామం. నాన్న డ్రైవర్. అమ్మ గృహిణి. వాళ్లిద్దరూ కష్టపడి చదివించడంతో నేను డిప్లొమాలో ఎలక్ట్రికల్ అండ్ ఎల్రక్టానిక్స్ (ఈఈఈ) పూర్తి చేశాను. చివరి ఏడాది చదువుతుండగానే బెంగళూరులోని టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ కంపెనీలో రూ.8.60 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం వచ్చింది. ఇది మల్టీ నేషనల్ కంపెనీ. నాకు రాయల్ ఎన్ఫీల్డ్లోనూ ఉద్యోగం వచ్చినప్పటికీ చిన్న ప్యాకేజీ కావడంతో చేరలేదు. మా కాలేజీలో చదువుతో పాటు ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలను ముందుగానే నేరి్పంచారు. ల్యాబ్స్, కరిక్యులమ్, క్యాంపస్ ఇంటర్వ్యూల్లో రాణించేలా ఇచ్చిన ప్రత్యేక శిక్షణ మాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఉద్యోగం చేస్తూనే ఉన్నత చదువులు కొనసాగించాలని ఉంది. – ఎన్.గౌతమి, ప్రభుత్వ పాలిటెక్నిక్, అనంతపురం‘రెడీ టూ వర్క్’ లక్ష్యంతో.. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పాలిటెక్నిక్ విద్యను అందించడంలో ఏపీ విజయం సాధించింది. ఏటా పెరుగుతున్న క్యాంపస్ ఎంపికలే ఇందుకు నిదర్శనం. టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, థాట్వర్స్, మేధా సర్వో, జీఈ ఏరో స్పేస్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు సాంకేతిక విద్యలోని విప్లవాత్మక మార్పులను చూసి ఎంతో ప్రశంసించారు. దేశవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యలో ఇంతటి స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కలి్పస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ ఒకటే.మారుతున్న సాంకేతిక, అవసరాలకు తగ్గట్టు బోధన ఉండేలా లెక్చరర్లకు పరిశ్రమల్లో నైపు ణ్య శిక్షణ ఇస్తున్నాం. విద్యార్థులను రెడీటూ వర్క్‌గా తీర్చిదిద్దుతున్నాం. అందుకే రాష్ట్రానికి అంతర్జాతీయ, జాతీయ బహుళజాతి కంపెనీలు వస్తున్నాయి. డిప్లొమాతో ఉద్యోగం పొందిన విద్యార్థులకు ఆయా సంస్థలే ఉన్నత చదువులకు ప్రోత్సహించేలా కంపెనీలు సైతం అంగీకరించాయి. చివరి సంవత్సరంలో ఉండగానే క్యాంపస్ రిక్రూట్మెంట్పై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకున్నాం. అందుకే ప్లేస్మెంట్లు రెట్టింపయ్యాయి. – చదలవాడ నాగరాణి, కమిషనర్, సాంకేతిక విద్యాశాఖ -
మరో 12 పాలిటెక్నిక్ కాలేజీలకు ఎన్బీఏ గుర్తింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్(ఎన్బీఏ) గుర్తింపు సాధనలో దూసుకెళ్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యనందిస్తూ గణనీయమైన ప్లేస్మెంట్లు నమోదు చేస్తున్నాయి. తాజాగా మరో 12 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలకు ఎన్బీఏ సర్టిఫికేషన్ దక్కింది. అనంతపురం, శ్రీశైలం, తిరుపతి, పిల్లరిపట్టు, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, జమ్మలమడుగు, కదిరి, నందిగామ, పలమనేరు, కడప మహిళా పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు మదనపల్లె మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజీకి కూడా ఎన్బీఏ సర్టిఫికేషన్ దక్కింది. పక్కా ప్రణాళికతో ముందుకు.. రాష్ట్రంలో మొత్తం 87 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలుండగా.. తొలి దశలో 41 కాలేజీలకు ఎన్బీఏ సర్టిఫికేషన్ సాధించేలా సాంకేతిక విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే మొత్తం 31 పాలిటెక్నిక్ కాలేజీల్లోని 60 విభాగాల్లో ఎన్బీఏ సర్టిఫికేషన్‌ను సాధించింది. ఈ విద్యా సంవత్సరం ముగిసేలోగా ఎన్బీఏ బృందం మరిన్ని కాలేజీలను కూడా పరిశీలించనుంది. పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్న సాంకేతిక విద్యా శాఖ పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించడంతో పాటు ల్యాబ్‌లు, వర్క్‌షాప్‌లు, సొంత భవనాల నిర్మాణాలను చేపడుతోంది. వచ్చే ఏడాదికి వీలైనన్ని కాలేజీల్లో హాస్టల్ సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చేలా ప్రత్యేక దృష్టి సారించింది. పాలిటెక్నిక్ విద్య ద్వారా లభించే ఉద్యోగ, ఉపాధి అవకాశాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థుల చేరికలను ప్రోత్సహిస్తోంది. పాలిసెట్ కోసం ఉచితంగా కోచింగ్‌ను కూడా అందుబాటులోకి తెస్తోంది. ఇది సరికొత్త చరిత్ర సీఎం జగన్ ఆదేశాలకు అనుగుణంగా విద్యా ప్రమాణాలను పెంపొందిస్తున్నాం. అందువల్లే ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలకు అత్యంత ప్రతిష్టాత్మక ఎన్బీఏ సర్టిఫికేషన్ దక్కుతోంది. భవిష్యత్‌లో ప్రతి కాలేజ్‌నూ ఎన్బీఏ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తాం. ఇప్పటికే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కరిక్యులమ్‌లో మార్పులు తెచ్చాం. ఉద్యోగ అవకాశాలు పెంచేలా 674 పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకున్నాం. గత విద్యా సంవత్సరంలో 7 వేల మంది చదువులు పూర్తి చేసుకుంటే 4 వేల మందికి పైగా ప్లేస్మెంట్లు సాధించారు. పది శాతంగా ఉన్న ప్లేస్మెంట్లను 60 శాతానికి తీసుకువచ్చాం. ఇది సరికొత్త చరిత్ర. – చదలవాడ నాగరాణి కమిషనర్, సాంకేతిక విద్యాశాఖ -
ఏరోస్పేస్ శిక్షణకు 25 మంది డిప్లొమా విద్యార్థుల ఎంపిక
మురళీనగర్ (విశాఖ ఉత్తర): పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు చేసిన ప్రతి విద్యార్థికి అత్యున్నత ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ (డీడీ) డాక్టర్ ఎంఏవీ రామకృష్ణ చెప్పారు. ఏరోస్పేస్ రంగంలో పారిశ్రామిక శిక్షణకు విద్యార్థుల ఎంపిక ప్రక్రియను ఆయన ఆధ్వర్యంలో విశాఖ కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో శుక్రవారం నిర్వహించారు. ఏరోస్పేస్ రంగంలో విశాఖ అభివృద్ధి చెందుతున్నందున ఇక్కడ నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేందుకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని ఎంపిక చేశామన్నారు. గ్లోబల్ ఏరోస్పేస్ కంపెనీ బోయింగ్, లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ సహకారంతో మెకానికల్ డిప్లొమా విద్యార్థులకు 6 నెలల పారిశ్రామిక శిక్షణకు గాను రెండో బ్యాచ్ ఎంపిక ప్రక్రియ నిర్వహించినట్లు చెప్పారు. ఈ ప్రక్రియలో 134 మంది పాల్గొనగా రాత, మౌఖిక పరీక్ష ద్వారా 25 మందిని ఏరోస్పేస్లో శిక్షణకు ఎంపిక చేసినట్లు చెప్పారు. వీరిలో 12 మంది బాలురు, 13 మంది బాలికలున్నట్లు చెప్పారు. వీరికి అచ్యుతాపురంలోని ఎంఎస్ఎంఈ టెక్నాలజీ కేంద్రంలో శిక్షణనిస్తారని, శిక్షణ కాలంలో బోయింగ్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్‌కు నిధులు అందిస్తుందని తెలిపారు. లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ సంస్థ ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్లో శిక్షణ తీసుకునే విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.35,000 కోర్సు ఫీజుతోపాటు నెలకు రూ.3,000 ఉపకార వేతనం చెల్లిస్తుందన్నారు. -
‘ఎన్బీఏ’ గుర్తింపే లక్ష్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యను ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కరిక్యులమ్‌లో మార్పులు చేయడంతో పాటు మొట్టమొదటిసారి సాంకేతిక విద్యా, శిక్షణ మండలి ద్వారా పాఠ్యపుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది. ఇండస్ట్రీ కనెక్ట్ పేరుతో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ విద్యార్థులకు బోధన సమయంలోనే లభించేలా చర్యలు తీసుకుంది. కోర్సు పూర్తయ్యేలోగా విద్యార్థులకు మెరుగైన కొలువులు లభించేలా సంస్కరణలు తెచ్చిది. అలాగే రాష్ట్రంలో మొత్తం 87 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలుండగా.. తొలి దశలో 41 కాలేజీలకు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్(ఎన్బీఏ) గుర్తింపు లభించేలా ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే తొమ్మిది కాలేజీల్లోని 16 ప్రోగ్రామ్‌లకు ఎన్బీఏ గుర్తింపు లభించింది. మిగిలిన 32 కాలేజీలు కూడా ఈ విద్యా సంవత్సరం చివరి నాటికి ఎన్బీఏ గుర్తింపు పొందేందుకు సిద్ధమయ్యాయి. వీటిలోని 5 కాలేజీల్లో అన్ని రకాల తనిఖీలు పూర్తవ్వగా.. ఈనెల చివరి వారంలో మరో 5 కాలేజీల్లో ఎన్బీఏ బృందాల సందర్శనకు షెడ్యూల్ ఖరారైంది. రెండో దశలో భాగంగా వచ్చే విద్యా సంవత్సరంలో మరో 43 కాలేజీలకు ఎన్బీఏ గుర్తింపు లభించేలా సాంకేతిక విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. వృత్తి విద్యా రంగంలో నాణ్యత, కొలువులు సాధించే సామర్థ్యాలను నిర్ధారించే అంతర్జాతీయ ప్రమాణాల అక్రెడిటింగ్ ఏజెన్సీగా భారతదేశంలో ఎన్బీఏ వ్యవహరిస్తోంది. విద్యార్థుల సంఖ్య, అధ్యాపకుల నిష్పత్తి, పీహెచ్డీ స్థాయి అర్హతలు, ఆర్థిక వనరుల వినియోగం, ఐపీఆర్–పేటెంట్లు, స్వీయ మూల్యాంకనం, జవాబుదారీతనం, నిపుణుల తయారీ తదితర అంశాలను ఎన్బీఏ పరిశీలిస్తుంది. వీటన్నింటి ఆధారంగా పాలిటెక్నిక్ కాలేజీలకు గుర్తింపునిస్తుంది. కాగా, ప్రభుత్వం ఇటీవల కొత్తగా 3 పాలిటెక్నిక్ కాలేజీలను ప్రారంభించింది. వీటికి మూడేళ్ల తర్వాతే ఎన్బీఏ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకునే అర్హత లభిస్తుంది. ప్రభుత్వ కృషితో పెరిగిన ప్లేస్‌మెంట్స్ మరోవైపు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల విద్యార్థులకు బోధన సమయంలోనే ఉపాధి లభించేలా వివిధ పరిశ్రమలతో సాంకేతిక విద్యా శాఖ 674 అవగాహన ఒప్పందాలు చేసుకుంది. దీంతో క్యాంపస్ ప్లేస్మెంట్ల సంఖ్య భారీగా పెరిగింది. 2022–23 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 7,073 మంది విద్యార్థులు చదువు పూర్తి చేసుకోగా.. వారిలో 4 వేల మందికిపైగా విద్యార్థులు కొలువులు సాధించారు. గతంలో పది శాతానికే పరిమితమైన ప్లేస్‌మెంట్స్.. ఇప్పుడు 59.6 శాతానికి పెరిగాయి. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు గతంలో ఎన్బీఏ గుర్తింపు సాధించడంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు వెనుకబడ్డాయి. ఈ విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్బీఏకు అనుగుణంగా కాలేజీల్లో ప్రమాణాలు పెంచాలని సాంకేతిక విద్యా శాఖను ఆదేశించింది. ఈ నేపథ్యంలో తీసుకువచ్చిన సంస్కరణల ఫలితంగా శ్రీకాకుళం, విజయవాడ, కుప్పం, అనకాపల్లి, గన్నవరం, కళ్యాణదుర్గం, ఆమదాలవలస, కాకినాడ, గుంటూరు పాలిటెక్నిక్ కాలేజీలకు ఎన్బీఏ గుర్తింపు దక్కింది. ఆయా కాలేజీల్లో పరిసరాల పరిశుభ్రత మొదలు భవనాల మరమ్మతులు, కొత్త నిర్మాణాలు, ప్రయోగశాలల ఆధునికీకరణ, విద్యార్థులకు వసతుల మెరుగు, సిబ్బంది రేషనలైజేషన్ తదితర మార్పులు తీసుకువచ్చాం. తద్వారా ప్రభుత్వ పాలిటెక్నిక్‌లకు ఎన్బీఏ గుర్తింపు లభించేలా చర్యలు తీసుకున్నాం. – చదలవాడ నాగరాణి, కమిషనర్, సాంకేతిక విద్యా శాఖ -
11 నుంచి పాలిటెక్నిక్ ప్రవేశాలకు ఆప్షన్ల ఎంపిక
సాక్షి, అమరావతి: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల షెడ్యూల్‌ను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి బుధవారం విడుదల చేశారు. విధానపరమైన కారణాలతో వాయిదా పడిన పాలిసెట్ ప్రవేశాల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమయింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆగస్టు 11 నుంచి 14వ తేదీ వరకు నాలుగు రోజుల్లోగా ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఆగస్టు 16వ తేదీ ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చన్నారు. 18వ తేదీన సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. 19వ తేదీ నుంచి 23లోగా విద్యార్థులు సీట్లు పొందిన కళాశాలల్లో నేరుగా రిపోర్టు చేయాలన్నారు. 23వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. మొత్తం 88 ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో 18,141 సీట్లు, 182 ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో 64,933 సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. చదవండి: మచిలీపట్నం కలెక్టరేట్లో.. కాబోయే కలెక్టర్-ఎస్పీలు.. సింపుల్‌గా దండలు మార్చేసుకున్నారు -
పాలిటెక్నిక్ విద్యార్థిని బలవన్మరణం
హిందూపురం అర్బన్: స్థానిక ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిని శ్రావణి (18) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. కనగానపల్లి మండలం మామిళ్లపల్లి గ్రామానికి చెందిన నరసింహులుకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తూ పిల్లలను చదివించుకుంటున్నాడు. ఈ క్రమంలో పెద్ద కుమార్తె శ్రావణి (18) హిందూపురంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కళాశాల క్యాంపస్‌లోని హాస్టల్లో ఉంటున్న ఆమె మంగళవారం ఉదయం 10.20 గంటలకు స్నానాలగదిలో అపస్మారక స్థితిలో పడి ఉండగా గమనించిన స్నేహితుల నుంచి సమాచారం అందుకున్న ప్రిన్సిపాల్ హరీష్‌బాబు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. క్రిమి సంహారక మందు తాగినట్లుగా వైద్యులు గుర్తించి చికిత్స మొదలు పెట్టారు. పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న ఎస్ఐ హరూన్‌బాషా కళాశాల వసతి గృహానికి చేరుకుని పరిశీలించారు. క్రిమి సంహారక మందు తాగే ముందు శ్రావణి రాసి పెట్టిన ఓ ఉత్తరాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందులో తన మృతికి కారకులు ఎవరూ కాదని ఆమె పేర్కొంది. క్యాన్సర్‌తో బాధపడుతున్నానని, తనకు ఆపరేషన్ అంటే భయమని వివరించింది. తల్లిదండ్రులకు తాను భారం కాకూడదనే ఉద్దేశ్యంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
నేడు ఏపీ ఈసెట్
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పాలిటెక్నిక్, బీఎస్సీ(గణితం) ఉత్తీర్ణులైన విద్యార్థులు నేరుగా ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఈసెట్–23 పరీక్షను మంగళవారం ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 103 పరీక్షా కేంద్రాలు, హైదరాబాద్‌లో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు 38,255 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 28,640 మంది బాలురు, 9,615 మంది బాలికలు ఉన్నారు. ఈ పరీక్షను ఆన్లైన్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఉదయం సెషన్లో అగ్రికల్చరల్, సిరామిక్ టెక్నాలజీ, సివిల్ ఇంజినీరింగ్, సీఎస్ఈ, కెమికల్, బీఎస్సీ(గణితం) ఈఈఈ విభాగాలకు, మధ్యాహ్నం సెషన్లో ఈసీఈ, ఈఐఈ, మెకానికల్ మెటలర్జికల్, మైనింగ్ ఇంజినీరింగ్, ఫార్మసీ విభాగాల పరీక్ష నిర్వహిస్తారు. ఈ నెల 23న ప్రాథమిక కీ విడుదల చేస్తామని, 25 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని, జూలై మొదటి వారంలో ఫలితాలు విడుదల చేస్తామని ఈసెట్–2023 చైర్మన్, జేఎన్టీయూకే వీసీ ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాదరాజు సోమవారం తెలిపారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు 8500404562 హెల్ప్‌లైన్ నంబరు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. -
పాలిటెక్నిక్‌తో.. కొలువు పక్కా!
విశాఖ విద్య: పదో తరగతి ఉత్తీర్ణత తర్వాత ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి మార్గం వేసే పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల వైపు విద్యార్థులు మొగ్గుచూపుతున్నారు. పదో తరగతి తర్వాత మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు అభ్యసిస్తే చాలు మంచి ఉద్యోగావకాశాలు తలుపు తడుతున్నాయి. అంతేకాకుండా డిప్లొమా పూర్తి చేశాక ఏపీ ఈసెట్ రాసి నేరుగా బీటెక్ సెకండియర్‌లో చేరే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ కోర్సులు చదివేవారికి సత్వర ఉపాధి, ఉద్యోగావకాశాలు దక్కేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2023–24 విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 34 వేల మందికి పైగా విద్యార్థులు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రాష్ట్రంలో 84 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 17 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలో 250కి పైగా కాలేజీలు ఉన్నాయి. పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్–2023లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా ఇటీవలే పూర్తయింది. విద్యార్థులు కళాశాలల్లో చేరికకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కోరుకున్న కాలేజీలో నచ్చిన బ్రాంచ్ ఎంచుకునేలా సాంకేతిక విద్యాశాఖాధికారులు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 26 జిల్లాల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఈ నెల 12 నుంచి సదస్సులు నిర్వహిస్తున్నారు. వీటిని ఈ నెల 24 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. పాలిటెక్నిక్‌తో దండిగా అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవతో రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు తరలివస్తున్నాయి. పారిశ్రామికీకరణతో భవిష్యత్తులో సాంకేతిక కోర్సులు చేసిన వారికి దండిగా ఉపాధి, ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. మూడేళ్లలోనే చేతికొచ్చే డిప్లొమా సర్టిఫికెట్తో ఉపాధి లేదా ఉద్యోగం పొందే వీలు ఉండటం.. అలాగే ఏపీ ఈసెట్ రాసి నేరుగా బీటెక్‌లో సెకండియర్‌లో చేరే అవకాశం ఉండటంతో విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సులపై ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రభుత్వ కాలేజీల బలోపేతం దిశగా.. పాలిటెక్నిక్ కోర్సులకు డిమాండ్ పెరగడంతో అధికారులు ప్రభుత్వ కాలేజీల్లో నూరు శాతం సీట్లు భర్తీ అయ్యేలా దృష్టి సారించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అర్హులకు ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో ఇస్తుండటంతో గతంలో మూత పడిన కాలేజీలను సైతం ప్రైవేట్ యాజమాన్యాలు మళ్లీ తిరిగి ప్రారంభిస్తున్నాయి. అయితే ఇలాంటి ప్రమాణాలు లేని కళాశాలల్లో విద్యార్థులు చేరకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అవగాహన సదస్సుల్లో భాగంగా కాలేజీల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ కాలేజీల్లో ఉన్న మౌలిక సౌకర్యాలు, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ వంటి అంశాలపై వివరిస్తున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో చదివి.. ఉన్నత స్థానాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులను సైతం సదస్సులకు ఆహ్వానించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన వసతులు.. ఉన్నత విద్య, ఉద్యోగాల పరంగా మంచి అవకాశాలు ఉండటంతో విద్యార్థులు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో మెరుగైన వసతులున్నాయి. క్యాంపస్ ప్లేస్మెంట్ల ద్వారా ఉద్యోగాలు కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. అవగాహన సదస్సుల ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. – డాక్టర్ ఎన్.చంద్రశేఖర్, అధ్యక్షుడు, ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ పాలిటెక్నిక్ టీచర్స్ అసోసియేషన్, విశాఖపట్నం -
పాలిసెట్‌లో మెరిసిన గోదావరి విద్యార్థులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డిప్లొమా సాంకేతిక విద్యకు ఉద్దేశించిన పాలిటెక్నిక్ ఎంట్రన్స్– 2023 (పాలిసెట్)లో గోదావరి జిల్లాల విద్యార్థుల హవా కొనసాగింది. కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన 15 మంది 120కి 120 మార్కులు సాధించి ప్రథమ–ర్యాంకర్లుగా నిలిచారు. మొదటి ర్యాంకును కాకినాడ జిల్లాకు చెందిన గోనెళ్ల శ్రీరామ శశాంక్ సాధించాడు. మే 10న నిర్వహించిన పాలిసెట్ ఫలితాలను రాష్ట్ర సాంకేతిక విద్యా సంచాలకులు సి.నాగరాణి శనివారం విజయవాడలో విడుదల చేశారు. పరీక్ష జరిగిన పది రోజుల్లోనే ఫలితాలను వెల్లడించామని ఆమె చెప్పారు. పాలిసెట్‌కు 1,43,625 మంది హాజరయ్యారని, 1,24,021 మంది (86.35 శాతం) విద్యార్థులు అర్హత సాధించారని చెప్పారు. ఉత్తీర్ణుల్లో 74,633 మంది బాలురు (84.74శాతం), 49,388 మంది బాలికలు (88.90శాతం) ఉన్నట్టు వివరించారు. అత్యధికంగా 10,516 మంది విద్యార్థులు విశాఖపట్నం జిల్లా నుంచి అర్హత సాధించారన్నారు. 120 మార్కులకు 30 మార్కులు (25 శాతం) అర్హతగా పరిగణించామన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పరీక్షకు హాజరైన అందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించినట్టు వివరించారు. ప్రవేశ పరీక్షలో ఒకే మార్కులు పొందిన విద్యార్థులకు గణితం మార్కుల ఆధారంగా ర్యాంకులు నిర్ణయించామని, గణితంలోనూ ఒకేలా వస్తే భౌతిక శాస్త్రం మార్కులు, అందులోనూ సమానంగా వస్తే పదో తరగతి మార్కులను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. అక్కడా సమాన మార్కులుంటే పుట్టిన తేదీ ఆధారంగా ఎక్కువ వయసున్న వారికి మొదటి ప్రాధాన్యం ఇచ్చినట్టు చెప్పారు. ర్యాంకు కార్డులను https://polycetap.nic.in/ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈనెల 25న వెబ్ కౌన్సెలింగ్ తేదీలను ప్రకటిస్తామని, 29 నుంచి కౌన్సెలింగ్ ఉంటుందని చెప్పారు. అడ్మిషన్ కోసం విద్యార్థులు వెబ్ అప్లికేషన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు 39 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జూలై 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. 31 కోర్సుల్లో 77,177 సీట్లు ఈ ఏడాది నుంచి నంద్యాల జిల్లా బేతంచెర్ల, వైఎస్సార్ జిల్లా మైదుకూరు, అనంతపురం జిల్లా గుంతకల్లులో 840 సీట్లతో కొత్తగా మూడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ప్రారంభిస్తున్నామన్నారు. వీటితో కలిపి మొదటి సంవత్సరం విద్యార్థులకు 268 ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ కళాశాలల్లో రెండేళ్లు, మూడేళ్లు, మూడున్నరేళ్ల వ్యవధితో కూడిన 31 కోర్సుల్లో 77,177 సీట్లు ఉన్నాయన్నారు. ఈ ఏడాది నుంచి గన్నవరం ప్రభుత్వ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్‌లో రెండు కోర్సులు, కాకినాడ బాలికల కళాశాలలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. విద్యార్థుల కోసం 33 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లలో కొత్త కరిక్యులమ్‌తో శిక్షణ ఇస్తున్నామన్నారు. 4 వేల మందికి ప్లేస్‌మెంట్స్ ఈ ఏడాది ప్రభుత్వ కాలేజీల్లో చివరి సంవత్సరం చదువుతున్న 4 వేల మందికి పైగా విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్లు సాధించినట్టు వివరించారు. వార్షిక వేతనం అత్యధికంగా రూ.6.25 లక్షలు, సరాసరి వేతనం రూ.2.50 లక్షలుగా ఉందని చెప్పారు. 84,117 మంది విద్యార్థులు తొలి విడత జగనన్న విద్యా దీవెన కింద రూ.44.37 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ అందుకున్నారని, 79,768 మంది విద్యార్థులు తొలి విడత జగనన్న వసతి దీవెనగా రూ.57.44 కోట్ల ఆర్థిక సాయాన్ని పొందారని తెలిపారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ బోర్డు కార్యదర్శి కేవీ రమణబాబు, జాయింట్ డైరెక్టర్ వి.పద్మారావు, ప్లేస్మెంట్ సెల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. 120 కి120 మార్కులు సాధించిన విద్యార్థులు ♦ గోనెళ్ల శ్రీరామ శశాంక్ (కాకినాడ) ♦ వనపర్తి తేజశ్రీ (తూర్పు గోదావరి) ♦ కొంజర్ల శంకర్ మాణిక్ (తూర్పు గోదావరి) ♦ దువ్వి ఆశిష్ సాయి శ్రీకర్ (తూర్పు గోదావరి) ♦ శీల గౌతమ్ (తూర్పు గోదావరి) ♦ గ్రంధె గీతిక (తూర్పు గోదావరి) ♦ అగ్గాల కృష్ణ సాహితి (తూర్పు గోదావరి) ♦ ఉరింకాల జితు కౌముది (తూర్పు గోదావరి) ♦ పాల గేయ శ్రీ సాయి హర్షిత్ (తూర్పు గోదావరి) ♦ కోటిపల్లి యశ్వంత్ సాత్విక్ (తూర్పు గోదావరి) ♦ కొడవటి మోహిత్ శ్రీరామ్ (పశ్చిమ గోదావరి) ♦ దొంగ శ్రీ వెంకట శర్వణ్ (పశ్చిమ గోదావరి) ♦ కానూరి భాను ప్రకాష్ (పశ్చిమ గోదావరి) ♦ దుద్దుపూడి రూపిక (తూర్పు గోదావరి) ♦ కప్పల వెంకటరామ వినేష్ (తూర్పు గోదావరి) -
AP POLYCET 2023 Exam: నేడు పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ పాలిసెట్–2023 పరీక్ష బుధవారం (నేడు) జరగనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 61 పట్టణాల్లో 499 కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు ఉదయం 10 గంటల్లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్ష రాసే అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలన్నారు. పరీక్ష కేంద్రంలోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. పాలిసెట్‌కు మొత్తం 1,59,144 మంది దరఖాస్తు చేశారని వివరించారు. వీరిలో 96,429 మంది బాలురు, 62,715 మంది బాలికలు ఉన్నారన్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 21 వేల దరఖాస్తులు పెరిగాయని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో చేపట్టిన ప్రత్యేక అవగాహన కార్యక్రమాలతో 26,698 మంది ఎస్సీ, 9113 మంది ఎస్టీ అభ్యర్థులు పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఉచితంగా కోచింగ్ అందించాం.. పాలిటెక్నిక్ విద్యతో ప్రయోజనాలు, ఉపాధి అవకాశాల గురించి ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్‌ల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ద్వారా పదో తరగతి విద్యార్థులకు అవగాహన కల్పించినట్టు నాగరాణి తెలిపారు. రాష్ట్రంలో 84 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 9 వేల మంది విద్యార్థులకు పాలిసెట్‌కు ఉచితంగా కోచింగ్ అందించి స్టడీ మెటీరియల్ పంపిణీ చేశామన్నారు. ఈ ఏడాది కొత్తగా మరో మూడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో తరగతులు ప్రారంభిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 87 ప్రభుత్వ, 171 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో 29 బ్రాంచ్‌ల్లో మూడేళ్ల డిప్లొమా కోర్సులు అందిస్తున్నామన్నారు. కాగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్యార్థులు ఈ ఏడాది నాలుగు వేలకు పైగా ప్లేస్మెంట్లు సాధించారని వెల్లడించారు. -
పాలిటెక్నిక్ కోర్సులకు ‘కొత్త’ ఊపు
విశాఖ విద్య: ఒకప్పుడు పాలిటెక్నిక్ అడ్మిషన్లకు తీవ్రమైన పోటీ ఉండేది. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్ కోర్సులు చేసిన వారికి కొలువు గ్యారెంటీగా దక్కేది. ఈ మూడేళ్ల కోర్సు అనంతరం ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలోకి నేరుగా ప్రవేశం పొందొచ్చు. అయితే, గత పాలకుల నిర్లక్ష్యంతో పాలిటెక్నిక్ కాలేజీలు క్రమంగా నిర్వీర్యమైపోయాయి. ఇప్పుడు మళ్లీ వీటికి కొత్త ఊపు తీసుకొచ్చేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం దృష్టిసారించింది. జీఐఎస్ ఒప్పందాలతో నయా జోష్ విశాఖపట్నం వేదికగా ఇటీవల జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023 (జీఐఎస్)లో ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో రూ.13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. దీంతో 6 లక్షల మందికి పైగా నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. పెద్దఎత్తున నెలకొల్పే పరిశ్రమలకు మానవ వనరుల అవసరం దృష్ట్యా, మూడేళ్ల కాల వ్యవధి గల పాలిటెక్నిక్ కోర్సులపై అందరి దృష్టి పడింది. దీంతో తక్కువ సమయంలోనే ఎక్కువ మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిం చేలా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. కొత్త కోర్సులకు రూపకల్పన ఎనర్జీ, ఐటీ, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఖనిజ, పెట్రో కెమికల్స్, ఫార్మాస్యూటికల్ వంటి రంగాల్లో పెద్దఎత్తున పరిశ్రమలు నెలకొల్పేందుకు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో ఒప్పందాలు జరిగాయి. రాష్ట్రంలో వీటి విస్తరణకు అనువైన పరిస్థితులు ఉండటమే ఇందుకు కారణం. ఆయా రంగాలకు అవసరమైన నిపుణులైన యువతను అందించేందుకు వీలుగా పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్త కోర్సులను ప్రారంభించాలని సాంకేతిక విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. తొలిదశలో నాలుగుచోట్ల ఈ నేపథ్యంలో.. తిరుపతి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ప్రస్తుతం నిర్వహిస్తున్న కెమికల్ సుగర్ టెక్నాలజీ స్థానంలో ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఇండస్టీ ఇంటిగ్రేటెడ్), సత్యవేడులో మెకానికల్ ఇంజనీరింగ్ స్థానంలో మెకానికల్ రిఫ్రిజరేటర్ అండ్ ఎయిర్ కండిషనర్, గన్నవరంలో కొత్తగా కంప్యూటర్ సైన్సు, గుంటూరులో గార్మెంట్ టెక్నాలజీ స్థానంలో డిజైన్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులకు అనుమతిచ్చారు. 2023–24 విద్యా సంవత్సరం నుంచే వీటిలో ప్రవేశాలు కల్పించేలా చర్యలు చేపట్టారు. దశల వారీగా రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో ఆయా ప్రాంతాల అవసరాల మేరకు సరికొత్త కోర్సుల రూపకల్పన చేసేలా సాంకేతిక విద్యాశాఖ ముందుకెళ్తోంది. 84 కాలేజీలు.. 17వేల సీట్లు.. 28 రకాల కోర్సులు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో 84 కాలేజీలు నిర్వహిస్తుండగా, వీటి పరిధిలో 17వేల వరకు సీట్లున్నాయి. వీటిలో సివిల్, మెకానికల్, ఎల్రక్టానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, మైనింగ్, కెమికల్, బయోమెడికల్, మెటలర్జి, 3డి యానిమేషన్ అండ్ గ్రాఫిక్స్, పెట్రోలియం, టెక్స్టైల్ వంటి 28 రకాల కోర్సులను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాలిటెక్నిక్ కాలేజీల బలోపేతంపై సాంకేతిక విద్యాశాఖ కార్యాచరణలోకి దిగింది. కొత్త కోర్సులు అవసరం ప్రభుత్వం మంచి ఆలోచన చేస్తోంది. పాలిటెక్నిక్‌లో కొత్త కోర్సుల ఆవశ్యకత ఉంది. ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. భవిష్యత్తులో ఈ రంగంలో నిపుణులు అవసరం. క్యాడ్ కామ్, పవర్ సిస్టమ్, ఎల్రక్టానిక్స్ కమ్యూనికేషన్ వంటి కోర్సులు తీసుకొస్తే ఎంతో మేలు. – డాక్టర్ ఎన్. చంద్రశేఖర్, ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ పాలిటెక్నిక్ టీచర్స్ ఆర్గనైజేషన్ (ఏఐఎఫ్‌పీటీఓ) అధ్యక్షులు పాలిటెక్నిక్ కాలేజీలకు మంచిరోజులు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో నైపుణ్యంతో కూడిన శిక్షణ అందించేలా సకల సౌకర్యాలున్నాయి. కొత్త కోర్సులకు సాంకేతిక విద్యాశాఖ అనుమతులిస్తోంది. పాలిటెక్నిక్ కాలేజీలకు మంచి రోజులొస్తున్నాయి. ఈసారి అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉంది. – జీవీవీ సత్యనారాయణమూర్తి, పాలీసెట్ కనీ్వనర్, ఉమ్మడి విశాఖ జిల్లా క్యాంపస్ కొలువు కొట్టా మాది విశాఖ నగరంలోని తాటిచెట్లపాలెం. తండ్రి గోదాములో కలాసీగా పనిచేస్తున్నారు. అమ్మ ఇంటిదగ్గర మిషన్ కుడుతుంది. సత్వర ఉపాధి కోసమని పాలిటెక్నిక్‌లో ఎలక్ట్రికల్ కోర్సు ఎంచుకున్నాను. క్యాంపస్ సెలక్షన్స్‌లో టాటా ప్రాజెక్టులో ఏడాదికి రూ.3.25 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించా. – ఈతకోట సియోన్, విశాఖపట్నం -
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి: యువతకు మంచి భవిష్యత్‌ను అందించాలనే ఆలోచనలను ఆచరణలో పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.100 కోట్లతో 3 పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సౌరభ్ గౌర్ సోమవారం గెజిట్ విడుదల చేశారు. ఈ వివరాలను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. నంద్యాల జిల్లా బేతంచెర్ల, అనంతపురం జిల్లా గుంతకల్, వైఎస్సార్ జిల్లా మైదుకూరుల్లో పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ కాలేజీలు అందుబాటులోకి వస్తే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కెమికల్, మెటలర్జికల్ విభాగాల్లో డిప్లొమా కోర్సుల కోసం సుదూర ప్రాంతాలు వెళ్లాల్సిన అవసరం ఉండదని చెప్పారు. ముఖ్యంగా గ్రామీణ యువతకు మరింత వెసులుబాటు ఉంటుందన్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ మరింత మెరుగుపడి విద్య పూర్తవగానే ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని తెలిపారు. మంజూరైన 3 పాలిటెక్నిక్ కాలేజీల్లో ఒకదాన్ని రూ.30 కోట్లతో తన నియోజకవర్గం డోన్ పరిధిలోని బేతంచెర్లలో ఏర్పాటు చేస్తుండటం పట్ల సీఎం వైఎస్ జగన్‌కు బుగ్గన రాజేంద్రనాథ్ కృతజ్ఞతలు తెలియజేశారు. 3 కాలేజీలను వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికే కేటాయించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. చదవండి: మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్ -
25, 26 తేదీల్లో పాలిటెక్నిక్ విద్యార్థులకు జాబ్‌మేళా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యార్థుల కోసం ఈ నెల 25, 26 తేదీల్లో విజయవాడలోని ఐలాపురం కన్వెన్షన్ సెంటర్లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు రవాణా సేవలను అందిస్తున్న మేధా సర్వో డ్రైవ్స్ సంస్థలో రూ.3లక్షల వార్షిక ప్యాకేజీతో వంద మందిని ఇంజనీరింగ్ ట్రైనీలుగా తీసుకునేందుకు ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచ్‌లలో 2022 సంవత్సరంలో ఉత్తీర్ణులైన విద్యార్థులు నేరుగా వాక్ ఇన్ ఇంటర్వూ్యలకు హాజరుకావొచ్చని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం 9346207421, 6309953362 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు డిప్లమో విద్యార్థులకు తక్షణ ఉపాధి అవకాశాలు కల్పించేలా సాంకేతిక విద్యాశాఖ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇప్పటికే గత డిసెంబరులో రూ.3 లక్షల ప్యాకేజీతో మేధా సర్వో డ్రైవ్స్ 31 మందికి పారిశ్రామిక శిక్షణతో కూడిన ఉద్యోగ అవకాశాలు కల్పించిందని నాగరాణి పేర్కొన్నారు. -
కొత్త విధానం.. ఇక పరీక్షల్లో చూసి రాయడమే.. ఎలాంటి అనుమానలొద్దు!
సాక్షి, హైదరాబాద్: ఏడాదిపాటు పుస్తకాలు తిరగేయడం... ముఖ్యమైనవి బట్టీపట్టడం... ఆఖరులో పునశ్చరణతో హడావుడి చేయడం.. ఇదీ ఇప్పటివరకూ అందరికీ తెలిసిన పరీక్ష విధానం. ఇందులో పరీక్ష హాల్లోకి చిన్న చిట్టీని కూడా అనుమతించరు. కానీ, ఈ సంప్రదాయ విధానానికి భిన్నంగా రాష్ట్ర సాంకేతిక విద్యామండలి పరీక్షలు నిర్వహించింది. పుస్తకాలు చూసి మరీ పరీక్షలు రాసేందుకు అనుమతించింది. గత నవంబర్‌లో జరిగిన పాలిటెక్నిక్ పరీక్షలో ఈ సరికొత్త పద్ధతిని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. అప్లైడ్ ఇంజనీరింగ్ మేథమెటిక్స్ పేపర్లో అకడమిక్ పుస్తకాన్ని చూసి పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు తాజాగా వెల్లడయ్యాయి. ఇందులో 59 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. పుస్తకాలు చూడకుండా 2021 ఫిబ్రవరిలో నిర్వహించిన ఇదే సబ్జెక్టు పరీక్షలో కేవలం 35 శాతం మాత్రమే ఉత్తీర్ణత వచ్చింది. ఇక నుంచీ ఇదే తరహా పరీక్ష విధానాన్ని మరికొన్ని సబ్జెక్టులకు విస్తరించాలనే యోచనలో అధికారులున్నారు. కాపీ కొట్టడం కాదు.. క్రియేటివిటీ పెంచడం చూచి రాస్తే మార్కులు రావా? రిజల్ట్ పెరిగితే గొప్పా? ఇలాంటి అనుమానులొస్తే పొరపాటే అంటున్నారు అధికారులు. ఇంతకాలం బట్టీ పట్టే పద్ధతిని దూరం చేసి, విద్యార్థుల ఆలోచనాశక్తిని పెంచడమే దీని ఉద్దేశమని చెబుతున్నారు. పరీక్షకు మండలి సూచించిన అకడమిక్ పుస్తకాల్లో రెండింటిని మాత్రమే అనుమతిస్తారు. పరీక్షలో ప్రశ్నలు అడగడంలోనే అసలు కిటుకు ఉంటుంది. ప్రశ్నలను నేరుగా కాకుండా, పరోక్ష విధానంలో అడుగుతారు. క్వశ్చన్ బ్యాంక్‌లో ఉన్నట్టు సమాధానాలు ఈ అకడమిక్ పుస్తకాల్లో నేరుగా దొరకవు. ఉదాహరణకు త్రికోణమితిని పాఠ్యాంశంలో పొందుపరిస్తే.. పరీక్షలో వచ్చే ప్రశ్న ఇదే మూస పద్ధతిలో ఉండదు. ఆ లెక్కను పూర్తిగా సాధన చేస్తే... సూత్రాల ప్రకారం అనుసరిస్తేనే సమాధానం దొరుకుతుంది. ఒక రకంగా ఇది విద్యార్థి మరింత ఆలోచించి సమాధానం ఇవ్వగలిగేలా ప్రోత్సహిస్తుందని నిపుణులు అంటున్నారు. చాప్టర్ మొత్తం చదవడమే కాకుండా, ఏ కోణంలోనైనా సమాధానం రాయగల నేర్పును ముందు నుంచే విద్యార్థి అలవర్చుకోవాలి. అప్పుడే ఓపెన్ బుక్ విధానంలో సమాధానం రాసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. గతంలో బట్టీ విధానంలో ట్విస్ట్ చేసి ప్రశ్న ఇస్తే ఆన్సర్ ఇచ్చే ఆలోచన దిశగా విద్యార్థి వెళ్లలేదని ఫలితాలను బట్టి తెలుస్తోందని అధికారులు అంటున్నారు. ఓపెన్ బుక్ విధానంపై ముందే అవగాహన కల్పించడం వల్ల వివిధ కోణాల్లో ఆలోచనాశక్తిని పెంచుకున్నారని చెబుతున్నారు. పరీక్షల నాణ్యత పెరుగుతుంది విద్యార్థి పట్టాతో బయటకు రావడం కన్నా... మంచి నైపుణ్యం, ఆలోచనాశక్తితో రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేటి తరం మార్కెట్లో మంచి కేరీర్‌కు ఇదే దోహదపడుతుంది. ఓపెన్ బుక్ విధానంతో విద్యార్థి నైపుణ్యాన్ని కొలవడానికి వీలుంటుంది. ఈ దిశగానే కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చాం. –డాక్టర్ సి.శ్రీనాథ్, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి ఆలోచనకు పదును క్లోజ్డ్ బుక్ విధానానికి, ఓపెన్ బుక్ విధానానికి చాలా తేడా ఉంది. పుస్తకం దగ్గరున్నా, ప్రశ్నలకు జవాబులు వెతుక్కోవడానికి చాప్టర్ మొత్తం చదవాల్సి వచ్చింది. దీనిపై ముందే అవగాహన కల్పించడంతో సబ్జెక్ట్‌పై కమాండ్ తెచ్చుకున్నాం. బట్టీ పద్ధతి కాకుండా, మరింత ఆలోచించి సమాధానాలు రాశాం. మున్ముందు పోటీ పరీక్షల్లోనూ సులువుగా జవాబులు రాయొచ్చనే విశ్వాసం పెరిగింది. – ఎన్.ప్రవీణ్ కుమార్, పాలిటెక్నిక్ విద్యార్థి, హైదరాబాద్ -
పాలిటెక్నిక్ చేసినా.. ఇంటర్లో చేరొచ్చు
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ కోర్సు మొత్తం పూర్తి చేస్తే... ఇంజనీరింగ్ రెండో ఏడాదిలో చేరే వీలుంది. కానీ ఇక మీదట పాలిటెక్నిక్ ఏడాది పూర్తి చేసినా.. రెండో సంవత్సరం ఇంటర్లో చేరే అవకాశం రాబోతోంది. ఇందుకు సంబంధించిన మార్పులకు సాంకేతిక విద్యా మండలి శ్రీకారం చుట్టనుంది. ఇంజనీరింగ్‌లో ఈ విధానం ఈ ఏడాది నుంచే అమలులోకి తీసుకొచ్చారు. ఇంజనీరింగ్ రెండేళ్ళు పూర్తి చేసిన విద్యార్థులకు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అనే డిగ్రీ ఇవ్వాలనే విధానాన్ని అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరహా ఎగ్జిట్ విధానాన్ని ఇక మీదట పాలిటెక్నిక్‌కు అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. పాలిటెక్నిక్ లోనూ మధ్యలో మానేసిన వారికి క్రెడిట్స్ విధానంతో కూడిన డిగ్రీని ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. సాంకేతిక విద్యా మండలి ఈ దిశగా పూర్తి స్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సమయం వృథా కాకుండా... ‘క్రెడిట్ ’ టెన్త్ తర్వాత చాలామంది విద్యార్థులు పాలి టెక్నిక్‌ను ఎంచుకుంటారు. గత కొన్నేళ్ళుగా పాలి టెక్నిక్ కాలేజీల్లో సరైన సదుపాయాలు లేకపోవ డం, ప్రైవేటు కాలేజీలు ఫ్యాకల్టీకి ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల సదరు కోర్సులో ఉత్తీర్ణత పెద్దగా ఉండటం లేదు. చాలా మంది వివిధ సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతున్నారు. ఎన్ని సార్లు పరీక్షలు రాసినా ఉత్తీర్ణులు కాలేకపోతు న్నారు. ఈ కారణంగా మధ్యలోనే విద్యను మానే స్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. దీన్ని నివారించేందుకు క్రెడిట్ విధానం తీసుకొస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. చదివినంత వరకైనా కొన్ని క్రెడిట్స్‌ను నిర్ధారిస్తూ డిగ్రీ ఇస్తే ఉపయోగంగా ఉంటుందనే ఆలోచనకు వచ్చారు. ఇంటర్లో చేరే అవకాశం.. పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం పూర్తి చేసి, ఆ తర్వాత ఆపివేస్తే ఇంటర్ ఫస్టియర్‌కు సమానమైన సర్టిఫికెట్ ఇవ్వాలని సాంకేతిక విద్యామండలి ప్రతిపాదించింది. అంటే ఫస్టియర్ పాలిటెక్నిక్, ఇంటర్ మొదటి సంవత్సరానికి సమానమైందని ధ్రువీకరించనున్నారు. దీంతో ఆ విద్యార్థి ఇంటర్ సెకెండియర్లో చేరేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా మూడేళ్ల పాలిటెక్నిక్‌లో రెండేళ్ళు పూర్తి చేసి, ఆ తర్వాత మానేసినా, మూడేళ్ళు చదివి, మూడో ఏట ఫెయిల్ అయినా, ఆ విద్యార్థి క్రెడిట్స్‌ను 90 సాధిస్తే సర్టిఫికెట్ ఇన్ ఇంజనీరింగ్ ఇస్తారు. వీళ్లు బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సుల్లో చేరేందుకు అవకాశం లభిస్తుంది. పాలిటెక్నిక్ మూడేళ్ళ కోర్సుకు 150 క్రెడిట్స్‌ను నిర్థారిస్తున్నారు. ఇందులో 130 క్రెడిట్స్ వస్తే పాలిటెక్నిక్ పూర్తి చేసినట్టు లెక్క. వీరికి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అని సర్టిఫికెట్ ఇస్తారు. ఏదేమైనా మూడేళ్ళు చది వితే తప్ప పాలిటెక్నిక్ చదువు సార్థకత అవుతుందనే విధానం ఇక మీదట తెరమరుగు కానుంది. -
పాలిటెక్నిక్ విద్యార్థుల ముంగిటకే ఉద్యోగావకాశాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాలిటెక్నిక్ డిప్లొమా విద్యలో సమూల మార్పుల దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు చేపడుతోంది. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసే విద్యార్థులకు ఉపాధి మెరుగుపడేలా, వారి ముంగిటకే ఉద్యోగావకాశాలు వచ్చేలా నూతన ప్రణాళికలను అమల్లోకి తెస్తోంది. ప్రస్తుతం ఉన్న సిలబస్‌లో సమూల సంస్కరణలు చేస్తోంది. అలాగే కొత్తగా పలు పరిశ్రమ ఆధారిత కోర్సులను ప్రవేశపెడుతోంది. ఈ కోర్సుల బోధనకు వీలుగా అధ్యాపకులకు సైతం ప్రత్యేక శిక్షణ అందిస్తోంది. రాష్ట్రంలో 84 ప్రభుత్వ, 165 ప్రైవేట్, 1 ఎయిడెడ్ పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. వీటిలో 25 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులను కొత్త అంశాలతో సాంకేతిక విద్యాశాఖ అభివృద్ధి చేస్తోంది. కంపెనీల సూచన మేరకు పరిశ్రమ ఆధారిత కోర్సులను కూడా ప్రారంభిస్తోంది. ఎక్కువమంది విద్యార్థులు జాబ్ మార్కెట్లో డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ వంటి కోర్సులకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. మరోవైపు ఆఫీస్ ఆటోమేషన్, ఫైర్ సేఫ్టీ, ఇండస్ట్రియల్ సేఫ్టీ, బ్యూటిఫికేషన్, ఫుడ్ ప్రాసెసింగ్, ఏసీ మెషిన్స్, ఫుట్‌వేర్ టెక్నాలజీ తదితర అంశాల్లో 6 నుంచి 18 నెలల కాలవ్యవధితో సర్టిఫికెట్ కోర్సులకు కూడా సాంకేతిక విద్యా శాఖ శ్రీకారం చుట్టింది. ఉపాధి లభించే కోర్సులకు పెద్దపీట.. పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పాలిటెక్నిక్‌ల్లో ప్రభుత్వం కోర్సులను ప్రవేశపెడుతోంది. ఉపాధి అవకాశాలు ఉన్న సిరామిక్స్ టెక్నాలజీ, టెక్స్టైల్స్ టెక్నాలజీ, మెటలర్జీ వంటి కోర్సుల్లో ఎక్కువమంది చేరుతుండడంతో వాటిలోనూ సీట్లు పెరిగాయి. అన్ని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రభుత్వం వర్చువల్ డిజిటల్ క్లాస్‌రూమ్‌లను ఏర్పాటు చేసింది. అలాగే పారిశ్రామిక శిక్షణా కార్యక్రమాల కోసం విద్యాసంస్థలను పరిశ్రమలతో అనుసంధానిస్తున్నారు. అధ్యాపకులను కూడా దశలవారీగా గంగవరం పోర్టు, పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు ప్రాంతాలకు, పరిశ్రమలకు శిక్షణ కోసం పంపుతున్నారు. విద్యార్థులకు స్టైఫండ్‌తో ఇంటర్న్‌షిప్.. పాలిటెక్నిక్ విద్యార్థులకు ఆయా పరిశ్రమల్లో స్టైఫండ్‌తో కూడిన శిక్షణ అందించడానికి చర్యలు చేపట్టారు. పాలిటెక్నిక్‌ల్లో మూడున్నరేళ్లు, మూడేళ్ల డిప్లొమా కోర్సులు ఉన్నాయి. మూడేళ్ల కోర్సు విద్యార్థులకు ఆరు నెలలు, ఇతర విద్యార్థులకు ఏడాది పాటు ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల ద్వారా 11,604 మంది, ప్రైవేట్ పాలిటెక్నిక్‌ల ద్వారా 24,669 మంది విద్యార్థులు ఇంటర్న్‌షిప్ పొందుతున్నారు. దీనికోసం సాంకేతిక విద్యాశాఖ 566 పరిశ్రమలు, ఇతర సంస్థలతో చర్చించి ఏర్పాట్లు చేసింది. ఇంటర్న్‌షిప్‌లో విద్యార్థులకు పరిశ్రమలు నెలకు రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు స్టైఫండ్ అందిస్తున్నాయి. విద్యార్థులకు నైపుణ్యాల పెంపు ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసినవారితోపాటు డిప్లొమా విద్యార్థుల వైపు కూడా కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. అందుకనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపునకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఫలితంగా 90 శాతం మంది విద్యార్థులు ఉద్యోగావకాశాలు దక్కించుకుంటున్నారు. డిప్లొమా విద్యార్థులకు ప్లేస్మెంట్లను పెంచేందుకు సాంకేతిక విద్యాశాఖ పరిశ్రమలతో ఎప్పటికప్పుడు చర్చిస్తోంది. కియా, అపాచీ, ఎఫ్ట్రానిక్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్), శ్రీసిటీతో సహా కొన్ని కంపెనీలకు వెళ్లి సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ సి.నాగరాణి చర్చలు జరిపారు. ప్రతి కాలేజీలో ప్లేస్మెంట్ సెల్‌లను ఏర్పాటు చేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా విద్యార్థులందరికీ ఉద్యోగావకాశాలను కల్పించడానికి క్లస్టర్ ఆధారిత ప్లేస్మెంట్ మోడల్‌ను అమలు చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు వివిధ ప్రాంతాల్లో క్యాంపస్ డ్రైవ్‌లు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. నైపుణ్యాల పెంపునకు పలు సంస్థలతో ఒప్పందాలు పరిశ్రమ అవసరాలకనుగుణంగా విద్యార్థులను తయారు చేసేందుకు సిస్కో, ఏడబ్ల్యూఎస్, రెడ్–హేట్, పాలో–ఆల్టో, బ్లూప్రిజమ్ మాక్రోచిప్ వంటి ప్రముఖ సంస్థలతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నారు. విద్యార్థులు తమ కోర్సులతోపాటు ఇతర ఆన్లైన్ కోర్సులను నేర్చుకోవడానికి వీలుగా ‘స్పోకెన్ ట్యుటోరియల్’ కోసం ఐఐటీ–బాంబేతో ఎంవోయూ చేసుకున్నారు. 17 స్కిల్ హబ్‌లు ఏర్పాటు చేయగా మరో 17 హబ్‌లను సిద్ధం చేస్తున్నారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో కంప్యూటర్లు, ఇతర ల్యాబ్ పరికరాలను ఆధునికీకరిస్తున్నారు. వీటితో పాటు కాలేజీలకు నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) గుర్తింపు వచ్చేలా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం కళ్యాణదుర్గం, కుప్పంలోని కాలేజీలకు ఈ గుర్తింపు ఉండగా మరో 49 కాలేజీలకు అక్రిడిటేషన్ వచ్చేలా చర్యలు చేపడుతున్నారు. పాలిటెక్నిక్ల్లోనూ నాడు–నేడు పాలిటెక్నిక్‌లను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కావాల్సిన మేర నిధులను కేటాయిస్తోంది. నాబార్డ్–ఆర్ఐడీఎఫ్ ఆధ్వర్యంలో 70 సివిల్ పనులకు రూ.365.46 కోట్లు మంజూరు కాగా రూ.218.66 కోట్లతో 49 పనులు పూర్తయ్యాయి. వీటితోపాటు మరో 15 సివిల్ పనులకు రూ.82.84 కోట్లకు రాష్ట్ర ప్రణాళిక గ్రాంట్లు మంజూరయ్యాయి. ఇవి కాకుండా 16 ఎస్సీ హాస్టళ్లు, 27 మహిళా హాస్టళ్ల పనులు పురోగతిలో ఉన్నాయి. నాడు–నేడు కింద పాలిటెక్నిక్‌లను కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరాం. రూ.10 లక్షల ప్రైజ్‌మనీతో ఇటీవల డిప్లొమా విద్యార్థుల కోసం పాలీ టెక్‌ఫెస్ట్–2022ని కూడా నిర్వహించాం. ప్రాంతీయ స్థాయిలో 1,081 ప్రాజెక్టులు ప్రదర్శించగా.. రాష్ట్ర స్థాయికి 253 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఫెస్ట్‌లో వచ్చిన ఆలోచనలను ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సహకారంతో అభివృద్ధి చేస్తాం. పేటెంట్లు పొందడానికి దరఖాస్తులు కూడా పంపనున్నాం. – చదలవాడ నాగరాణి, కమిషనర్, సాంకేతిక విద్యా శాఖ -
రైతుల గోస తీరేలా..!
రాయదుర్గం (హైదరాబాద్): వారు వ్యవసాయ కుటుంబాలకు చెందిన విద్యార్థినులు.. ఆరుగాలం పండించిన పంట వానలకు తడిసిపోతూ తల్లిదండ్రులు బాధపడుతుంటే చూడలేకపోయారు. ఆ కష్టాలను తీర్చడంపై దృష్టిపెట్టారు. ఓ మెంటార్ సాయంతో ‘రైతన్న కిట్’ను రూపొందించారు. మూడు వేల ఖర్చుతో మళ్లీ వాడుకునే ప్రత్యేక టార్పాలిన్ బ్యాగ్‌తో కూడిన ఈ కిట్‌కు టీహబ్‌లో నిర్వహించిన ‘యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్’పోటీలో మొదటిస్థానం దక్కడం గమనార్హం. నెల రోజులు కష్టపడి.. వరంగల్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌లో వి.లహరిక, జి.చందన, ఎన్.శ్వేత ముగ్గురు ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వ్యవసాయ కుటుంబాలకు చెందిన వీరు.. ఏటా తమ తల్లిదండ్రులు పండించిన ధాన్యం వానకు తడవడం, ఎండబెట్టేందుకు వారుపడే పాట్లు, తడిసిన ధాన్యానికి తక్కువ ధరతో ఇబ్బందిపడటం కళ్లారా చూశారు. దీంతో ఈ సమస్యపై దృష్టిసారించారు. ఇదే సమయంలో వారికి ‘యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్’కార్యక్రమం అందివచ్చింది. ఈ కార్యక్రమం కింద తమ కు మెంటార్‌గా వచ్చిన మెట్టు రాజారెడ్డికి విద్యార్థినులు తమ ఆలోచనను వివరించారు. సమస్యను గమనించి.. వానలు వచ్చినప్పుడు రైతులు టార్పాలిన్లను కప్పుతుంటారు. వాటి నుంచి నీళ్లు లీకై ధాన్యం తడుస్తుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేలా విద్యార్థినులు ఒక కిట్‌ను రూపొందించారు. దానికి కేసీఆర్ కిట్ స్ఫూర్తితో ‘రైతన్న కిట్’అని పేరుపెట్టారు. పరిష్కారాలన్నీ కలిపి చేర్చి.. విద్యార్థినులు నలుపు రంగులో ఉండే నాణ్యమైన రెండు టార్పాలిన్లను తీసుకున్నారు. వాటికి మధ్య లో జిప్‌ను ఏర్పాటు చేసి.. అది పెడితే ప్రత్యేకమైన బ్యాగ్‌లా మార్చేలా తీర్చిదిద్దారు. జిప్ వద్ద నీళ్లు పోకుండా అంటించేందుకు, ఒకవేళ చిరిగినా, రంధ్రం పడినా అంటించేందుకు టేపు, గ్లౌజులు, ఎలుకలు కొట్టకుండా ర్యాట్ స్ప్రే, టార్పాలిన్ దెబ్బతినకుండా పారలకు పెట్టేందుకు రబ్బర్ స్ట్రిప్‌లు, అత్యవసర ప్రాథమిక చికిత్స కిట్‌ను ఏర్పాటుచేశారు. వీటన్నింటినీ కలిపి ఒక కిట్లా సిద్ధం చేశా రు. అంతా సిద్ధం చేసి పరిశీలించేందుకు విద్యార్థినులకు నెల రోజులు సమయం పట్టింది. ఒక్కో కిట్‌లో 20 క్వింటాళ్ల ధాన్యం బస్తాలను నిల్వ చేయవచ్చు. జిప్ తీసి పరిస్తే విశాలమైన స్థలంలో ధాన్యాన్నిగానీ, ఇతర ఉత్పత్తులను గానీ ఎండబెట్టొచ్చు. ►గాలి ఆడేందుకు టార్పాలిన్ బ్యాగ్‌కు ఒకచోట చిన్నపాటి రంధ్రం చేసి మెష్‌ను అమర్చారు. టార్పాలిన్కు ర్యాట్ స్ప్రే చేస్తే 6 నెలల వరకు కూడా ఎలుకలు కొట్టకుండా ఉంటాయి. ►నల్లని టార్పాలిన్ వేడిని గ్రహించి ధాన్యంలోని తేమశాతం తగ్గేందుకు తోడ్పడుతుందని విద్యార్థినులు చెబుతున్నారు. వారి ఆలోచన నన్ను కదిలించింది రైతులైన తమ తల్లిదండ్రుల బాధ తీర్చాలన్న విద్యార్థినుల ఆలోచన నన్ను కదిలించింది. దీనిపై పరిశీలన జరిపి ‘రైతన్న కిట్’ను తయారు చేశాం. టీహబ్‌లో ప్రదర్శించగా మొదటి స్థానం, రూ.1.50 లక్షల నగదు బహుమతి వచ్చింది. ఒక కిట్ తయారీకి రూ.3,100 ఖర్చవుతుంది. ప్రభుత్వం సహకారం అందిస్తే రైతులకు మేలు జరుగుతుంది. – మెట్టు రాజారెడ్డి, రైతన్న కిట్ మెంటార్ ఉచితంగా ఇస్తే మేలు.. రైతులందరికీ మేలు జరిగేలా కిట్‌ను రూపొందించాం. దీని రూపకల్పనలో మెంటార్ రాజారెడ్డి సహకారం మరవలేనిది. మా ఉత్పత్తిని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు ఉచితంగా ఇస్తే ఎంతో మేలు జరుగుతుంది. – ‘రైతన్న కిట్’రూపకర్తలు చందన, శ్వేత, లహరిక -
పాలిటెక్నిక్ కాలేజీల్లో 72.5% సీట్లు భర్తీ
సాక్షి, హైదరాబాద్: టెన్త్ తర్వాత డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన పాలిసెట్–2022 కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 118 పాలిటెక్నిక్ కాలేజీల్లోని దాదాపు 25 బ్రాంచీల్లో 28,562 సీట్ల భర్తీకి చేపట్టిన కౌన్సెలింగ్‌లో 20,709 సీట్లు (72.51%) నిండాయని సెట్ కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. 21 ప్రభుత్వ కాలేజీలు, 3 ప్రైవేటు కాలేజీల్లో 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయని చెప్పారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 10 నాటికి లాగిన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సీటును నిర్ధారించుకొని కాలేజీలో ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయకుంటే సీటు రద్దవుతుందన్నారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో సోమవారం నుంచి అకడమిక్ సెషన్ ప్రారంభం కానుండగా 16వ తేదీ వరకు ఓరియంటేషన్, ఈ నెల 17 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. 8 బ్రాంచీల్లో సీట్లన్నీ ఫుల్... పాలిటెక్నిక్ కోర్సుల్లో 8 బ్రాంచీల్లో 100% సీట్లు భర్తీ అయ్యాయి. ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్, ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్, బయో మెడికల్ ఇంజనీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా, కెమికల్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్ బ్రాంచీల్లో సీట్లన్నీ నిండాయి. టెక్స్టైల్ టెక్నాలజీ, లెదర్ గూడ్స్ అండ్ ఫుట్‌వేర్ టెక్నాలజీ, మెటర్లాజికల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో అతితక్కువగా సీట్లు భర్తీ అయ్యాయి. -
సీఎం జగన్‌ను కలిసిన పాలిటెక్నిక్ లెక్చరర్ల జేఏసీ ప్రతినిధులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో పాలిటెక్నిక్ లెక్చరర్స్ జేఏసీ ప్రతినిధులు కలిశారు. ఆరు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఏఐసీటీఈ పేస్కేల్స్-2016ను పాలిటెక్నిక్ లెక్చరర్స్‌కు వర్తింపజేస్తూ జీవో నెంబర్ 10ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పాలిటెక్నిక్ లెక్చరర్స్ జేఏసీ కన్వీనర్ సి.రాజేంద్రప్రసాద్, కో-కన్వీనర్లు రామ్మోహన్ రెడ్డి, సురేంద్ర రెడ్డి, రఘునాథరెడ్డి, బాలమోహన్, ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి సీఎంను కలిశారు. చదవండి: బాబూ..ఆ డబ్బులు ఏమయ్యాయి? -
సీఎం జగన్ రుణం తీర్చుకోలేనిది: పాలిటెక్నిక్ అధ్యాపకులు
కడప(వైఎస్సార్ జిల్లా): ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేసే బోధన సిబ్బందికి అఖిల భారత సాంకేతిక విద్యామండలి పేస్కేల్–2016 అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులివ్వటంపై పాలిటెక్నిక్ అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం కడప పాలిటెక్నిక్ కళాశాలలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. చదవండి: ఆదుకో.. మావయ్యా.. గమనించిన సీఎం జగన్ కాన్వాయ్ ఆపి.. పాలిటెక్నిక్ లెక్చరర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాఘవరెడ్డి మాట్లాడుతూ.. ఈ పేస్కేల్ ద్వారా 84 ప్రభుత్వ పాలిటెక్నిక్, 2 ఎయిడెడ్ పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న సిబ్బందితో పాటు పదవీ విరమణ చేసిన సుమారు 2,500 మంది లెక్చరర్లకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఇందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. -
పాలిటెక్నిక్‌లో కొత్త కోర్సులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత మెరుగు పడేలా పాలిటెక్నిక్, ఐటీఐ విద్యా సంస్థల్లో పలు కొత్త కోర్సులు ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర ఆర్థిక, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. మాన్యుఫ్యాక్చరింగ్‌తో పాటు హాస్పిటాలిటీ, నర్సింగ్ తదితర కొత్త కోర్సులను ప్రవేశపెట్టి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని తెలిపారు. హోటల్ ఇండస్ట్రీలో అనేక మంది ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి చేరుతున్నారని, అలాగే నర్సింగ్ వంటి సేవలకు జాతీయంగా, అంతర్జాతీయంగా చాలా డిమాండ్ ఉందని చెప్పారు. పాలిటెక్నిక్, ఐటీఐలలో, స్కిల్ డెవలప్మెంట్ సంస్థల్లో ఈ కొత్త కోర్సులు ప్రవేశపెడతామన్నారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్ –2022 ఫలితాలను ఆయన శనివారం విజయవాడలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొత్త కోర్సులు, కరిక్యులమ్‌లో మార్పులు చేసి మరింత నాణ్యమైన విద్యను అందిస్తామని వివరించారు. మెడికల్, ఇంజనీరింగ్ కోర్సులతో సమానంగా ఈ డిప్లొమా కోర్సులను కూడా తీర్చిదిద్దుతామని అన్నారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతో పాటు పలువురు ప్రముఖులు డిప్లొమా కోర్సుల్లో చేరి పైకి వచ్చిన వారేనని వివరించారు. 2021 విద్యా సంవత్సరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 3డీ, యానిమేషన్, మల్టీ మీడియా కోర్సులను ప్రవేశపెట్టామన్నారు. రానున్న బ్యాచుల వారికి క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్‌డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషీన్ లెర్నింగ్, కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్ కోర్సులు ప్రవేశ పెడుతున్నట్లు మంత్రి చెప్పారు. విద్యార్థులు బాగా రాణించాలంటే తల్లుల పాత్ర కీలకమన్నారు. ఈ సమావేశంలో స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ముఖ్య కార్యదర్శి సౌరభ్‌గౌర్, కమిషనర్ పోలా భాస్కర్, స్టేట్ టెక్నికల్ బోర్డ్ ఆఫ్ ట్రైనింగ్ సెక్రటరీ విజయభాస్కర్, జేడీ ఎ.నిర్మల్‌కుమార్ ప్రియ తదితరులు పాల్గొన్నారు. బాలికల ముందంజ పాలిటెక్నిక్ ఫలితాల్లో బాలురకన్నా బాలికలు ఉత్తీర్ణత శాతంలో ఆధిక్యంలో నిలిచారు. మొత్తం 1,31,608 మంది పరీక్షలు రాయగా వారిలో 1,20,866 (91.84 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 74,510 మంది (90.56 శాతం), బాలికలు 46,356 మంది (93.96 శాతం) ఉత్తీర్ణులయ్యారు. చల్లా సత్య హర్షిత మొదటి ర్యాంకు సాధించింది. టాప్ 10 ర్యాంకుల్లో తూర్పు గోదావరి జిల్లా ఎక్కువ దక్కించుకుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించగా ఓసీలు 91.39 శాతం ఉత్తీర్ణులయ్యారు. -
కొలువు సొంతమ(వు)ను
నేటి పోటీ ప్రపంచంలో చదువులు, మార్కులతోపాటు భావ వ్యక్తీకరణ, సాఫ్ట్‌స్కిల్స్ అవసరం.సాంకేతిక విషయ పరిజ్ఞానం, ఆంగ్లభాషపై పట్టు, అంకితభావం విజయంలో ముఖ్య భూమిక పోషిస్తాయి. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సీటీ (మను) ఉర్దూ పాలిటెక్నిక్ విద్యార్థులు అంగ్ల మాధ్యమంలోనే కాదు ఉర్దూ మీడియంలో చదువుతూ ఉద్యోగాలను సాధించవచ్చని నిరూపించారు. ఎంచుకున్న రంగంలో నైపుణ్యాలు సాధించి కొలువులు పొందారు. సంతోషంగా జీవ నం సాగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కడప ఎడ్యుకేషన్: మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సీటీ (మను) అనుబంధ సంస్థ అయిన మను పాలిటెక్నిక్ కళాశాల వైఎస్సార్ జిల్లా విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది. మను ఆధ్వర్యంలో 2018లో దీనిని దేవుని కడప వద్ద ఏర్పాటు చేశారు. తర్వాతఈ కళాశాలకు రాష్ట్ర ప్రభుత్వం కడప రిమ్స్ వద్ద 10.15 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఇందులో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్,మినిస్ట్రియల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వారి ఆర్థిక సహాయం రూ. 20 కోట్లతో నూతన భవనాలు నిర్మించారు. అలాగే రూ. 5 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ , కళాశాల ఆవరణ మొత్తం ప్రహరీని ఏర్పాటు చేశారు. నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా బీహార్‌లోని దర్బాంగ, ఒరిస్సాలోని కటక్, కర్ణాటకలోని బెంగళూరు, తెలంగాణలోని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో మాత్రమే ఈ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. వందశాతం ఉత్తీర్ణత: ఈ కళాశాలలో 2021 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణతను సాధించారు. గతేడాదికి సంబంధించి పలువురు విద్యార్థులు కొలువులను సాధించారు. ఈ సంవత్సం పలువురు ఇండస్ట్రియల్ ట్రైనింగ్‌ను తీసుకుంటున్నారు. ఇందులో రేణిగుంటలోని అమర్‌రాజా కంపెనీ, కడప ఎండీహెచ్ గ్రూపు, బెంగళూరు మెగాస్ట్రక్చర్, బీహార్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ముంబై, ఝార్జండ్లోని ఆల్ట్రాటెక్లలో అప్రెంటీస్ పూర్తి చేసి ఆయా కంపెనీల్లో ఉద్యోగాలను పొందారు. ఉద్యోగాలకు ఎంపికైన కంపెనీల్లో వార్షిక జీతం 1.50 లక్షల నుంచి 3 లక్షల వరకు పొందుతున్నారు. అవసరాలకు అనుగుణంగా కోర్సుల రూపకల్పన నేటి సాంకేతిక యుగంలో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా మను ఉర్దూ పాలిటెక్నిక్ కళాశాలలో కోర్సులు రూపకల్పన చేశారు. ఇందులో డిప్లమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్, డిప్లమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్, డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సులు టెక్నికల్ పరంగా ఉండటంతో కొలువులు అందిపుచ్చుకుంటున్నారు. యూనివర్సిటీలో పలువురు ఉన్నత చదువులు ... మను పాలిటెక్నిక్‌లో కోర్సులు పూర్తి చేసిన మరి కొంత మంది విద్యార్థులు పలు యూనివర్సిటీలలో ఉన్నత చదువులు చదువుతున్నట్లు కళాశాల సిబ్బంది తెలిపారు. మను పాలిటెక్నిక్ కళాశాలలో ప్రస్తుతం మూడో సంవత్సరం చదువుతున్న 27 మంది చెన్నైలోని పోరెసియా ఇండియా లిమిటెడ్, మరో 10 మంది హిందూపూర్‌లోని టెక్స్ఫోరులో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అబ్దుల్ ముఖ్సిత్‌ఖాన్, ప్లేస్మెంట్ కో ఆర్డినేటర్ డ్టాక్టర్ హకీముద్దీన్ తెలిపారు. తొలిప్రయత్నంలోనే... నేను మదరసా బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చి కడప మను పాలిటెక్నిక్‌లో ఎలక్ట్రికల్ పూర్తి చేసి తొలి ప్రయత్నంలోనే సౌదీ అరేబియాలో బేటూర్ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఎలక్ట్రికల్ సూపర్వైజర్గా ఎంపికయ్యాను.నెలకు రూ.40 వేల జీతం వస్తుంది. నేను మను పాలిటెక్నిక్‌లో చదువుకున్నందుకు గర్వంగా ఉంది. – ఆతిఫ్ ఆలం, దర్బాంగ, బీహార్. సంతోషంగా ఉంది... నేను మోకానికల్ ఇంజినీరింగ్ చేశాను. చదువు పూ ర్తికాగానే కడపలోని ఎండీహెచ్ హుందాయిలో స్పేర్‌పార్ట్ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది. నాకు ప్రస్తుతం నెలకు 10 వేలు జీతం వస్తుంది. – అసదుల్లాహ్ అజాం, ఉత్తరప్రదేశ్ ఆనందంగా ఉంది నా పేరు షేక్ నిజాముద్దీన్, కడపలోని మాసాపేట. నేను కడపలోని మున్సిపల్ ఉర్దూ బాయిస్ హైస్కూల్ ఉర్దూ మీడియం చదివా. తరువాత మనులో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాను, ఇటీవల కొప్పర్తిలోని త్రివిసిన్ కంపెనీలో క్వాలిటీ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం వచ్చింది. నా జీతం ఏడాదికి 1,32,000 . చాలా సంతోçషంగా ఉంది. – షేక్ నిజాముద్దీన్, మాసాపేట, కడప. అమర్‌రాజా బ్యాటరీస్‌లో.. నేను మను పాలిటెక్నిక్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేశాను. అమర్‌రాజా బ్యాటరీస్‌లో జె పవర్ సొల్యూషన్స్‌గా పనిచేస్తున్నాను. నాకు ఏడాదికి 1,44,000 జీతం వస్తుంది. నేను ఉర్దూ మీడియంలో చదివినా ఉద్యోగాన్ని సులభంగా తెచ్చుకున్నాను. – షేక్ ముస్తఫా, కడప ఏపీ ప్రజలకు వరం... మను ఉర్దూ పాలిటెక్నిక్ కళాశాలను కడపలో ఏర్పాటు చేయడం వైఎస్సార్‌జిల్లా ప్రజలతోపాటు ఏపీ ప్రజలకు వరం. ఎలాంటి ఖర్చు లేకుండా ఫీజులతోమాత్రమే పాలిటెక్నిక్‌ను పూర్తి చేయవచ్చు. చదువుకునే విద్యార్థులకు నేషనల్ స్కాలర్ షిప్స్ వంటివి కూడా వస్తాయి. ప్రస్తుతం ఈ కళాశాలలో ఉత్తర్‌ప్రదేశ్, బీహార్, జార్ఖడ్, బెంగాల్, తెలంగాణా రాష్ట్రాలతోపాటు ఏపీకి చెందిన పలువురు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. – డాక్టర్ ఎండీ అబ్థుల్ ముఖ్సిత్‌ఖాన్,ప్రిన్సిపాల్, మనుపాలిటెక్నిక్ కళాశాల, కడప ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేస్తున్నాను.. నేను మనులో అప్పీరెల్ టెక్నాలజీలో పాలిటెక్నిక్ చివరి సంవత్సరం చదువుతున్నాను, ఇండస్ట్రియల్ ట్రైనింగ్‌లో భాగంగా హిందూపూరులో టెక్స్ఫోర్టు అప్పిరెల్ స్లీవ్ యూనిట్లో శిక్షణ తీసుకుంటున్నాను. నాతోపాటు మరికొందరు శిక్షణ తీసుకుంటున్నారు. – మొఘల్ నబియా, కడప. సామాజిక బాధ్యత గురించి అవగాహన విద్యార్థులకు చదువుతోపాటు సామాజిక బాధ్యత అంటే ఏమిటో ఎన్ఎస్ఎస్ ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. ఎన్ఎస్ఎస్ క్యాంపుల ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవలందించడం, రోడ్లు శుభ్రం చేయడం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను చేయిస్తున్నాం. అలాగే మద్యం తాగడం వల్ల ఏం జరుగుతుందో కూడా వివరిస్తున్నాం. – మహమ్మద్ సికిందర్ హుస్సేన్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్లేస్మెంట్ ఆఫీసర్, ఎన్ఎస్ఎస్ పోగ్రాం కోఆర్డినేటర్. -
లీకేజీ వెనుక ఒప్పందం?
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 8, 9 తేదీల్లో జరిగిన పాలిటెక్నిక్ రెండు, మూడో ఏడాదికి సంబంధించిన మూడు, ఐదవ సెమిస్టర్ పరీక్షల ప్రశ్నపత్రం లీకేజీపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హైదరాబాద్ శివార్లలోని స్వాతి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి జరిగిన ఈ లీకేజీలో సిండికేట్ అయిన కాలేజీలు ఎన్ని? లీక్ అయిన ఎంతసేపటికి వాట్సాప్ ద్వారా పేపర్లు వెళ్లాయి? అనే సమాచారం సేకరిస్తున్నారు. దీనివెనుక సాంకేతిక విద్యామండలి సిబ్బంది పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు సాగిస్తున్నారు. కాల్‌డేటాపై దృష్టి... పరీక్ష పేపర్ 8, 9 తేదీల్లో లీక్ అవగా 9వ తేదీన లీకేజీ వ్యవహారాన్ని ఓ ప్రభుత్వ కాలేజీ సిబ్బంది గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే 8వ తేదీనే లీకేజీని సిబ్బంది ఎందుకు గుర్తించలేకపోయారనే కోణంలో పోలీసులు పలువురు విద్యార్థుల వాట్సాప్ నంబర్లను సేకరించారు. సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా ఆ సెల్ నంబర్ల నుంచి రెండు రోజులపాటు వెళ్లిన కాల్స్‌ను పరిశీలిస్తున్నారు. మరోవైపు కాలేజీ యాజమాన్యం, సిబ్బంది సెల్ నంబర్లనూ పరిశీలించగా మొత్తం 10 కాలేజీలకు ఆ నంబర్ల నుంచి ఫోన్లు వెళ్లినట్లు తేలింది. వివిధ ప్రాంతాలకు చెందిన పాలిటెక్నిక్ కాలేజీల యాజమాన్యాలతో స్వాతి ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యానికి ఉన్న లింకేంటి? ముందే ఒప్పందం చేసుకొని పేపర్ లీక్ చేశారా? అనే కోణంలో విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని పోలీసులు చెబుతున్నారు. పాస్వర్డ్ అధికారులు పంపినదేనా? స్వాతి ఇంజనీరింగ్ కాలేజీ గుర్తింపును గతంలోనే రద్దు చేశామని, పాలిటెక్నిక్ ఫస్టియర్ అడ్మిషన్లకు అనుమతి లేదని సాంకేతిక విద్య అధికారులు తెలిపారు. ఈ స్థాయిలో విశ్వసనీయత లేని కాలేజీకి ముందే పాస్వర్డ్ చేరడం, అధికారుల బాధ్యతారాహిత్యాన్ని స్పష్టం చేస్తోందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. అసలు పాస్వర్డ్ అధికారులు పంపిందేనా? మరో మార్గంలో పాస్వర్డ్ రాక ముందే హ్యాక్ చేశారా? ఇలా జరిగితే ఉన్నత విద్యామండలి అధికారుల పాత్ర ఉందా? అనే సందేహాలు తెరపైకి వస్తున్నాయి. సంబంధిత అధికారులనూ విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు భావిస్తున్నారు. నేర స్వభావం, అధికారుల వివరణ పరస్పర విరుద్ధంగా ఉండటం ఈ కేసులో కొత్త అనుమానాలకు తావిస్తోంది. నిబంధనల ప్రకారం అరగంట ముందు పరీక్ష కేంద్రాలకు పాస్వర్డ్ పంపాలి. కాలేజీ నిర్వాహ కులు, బాధ్యతగల అధికారుల పర్యవేక్షణలో పేపర్‌ను డౌన్లోడ్ చేయాలి. కానీ స్వాతి ఇంజనీరింగ్ కాలేజీలో నిర్ణీత గడువుకన్నా ముందే పాస్వర్డ్ చేరిందనే సందేహాలు బలపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పాస్వర్డ్ వెళ్లిన సమయానికి ముందే పాస్వర్డ్ ఇవ్వడం వెనుక ఉద్దేశమేంటనే దిశగానూ దర్యాప్తు జరుగుతోంది. కాగా, ఈ కేసులో ముగ్గురు కాలేజీ సిబ్బంది పాత్రను నిర్ధారిం చిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. మరోవైపు కాలేజీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశామని.. ఇంకా యాజమాన్యం బదులివ్వలేదని సాంకేతిక విద్య అధికారులు తెలిపారు. -
హైదరాబాద్‌లో పాలిటెక్నిక్ ప్రశ్నాపత్రాల లీకేజీ కలకలం