Poonam malakondayya
-
‘చాంపియన్’.. ఆర్బీకే!
సాక్షి, అమరావతి: విత్తనం నుంచి విక్రయాల దాకా రైతన్నలకు చేదోడువాదోడుగా నిలిచి గ్రామాల్లోనే సేవలన్నీ అందిస్తూ ప్రశంసలు అందుకుంటున్న వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు అంతర్జాతీయంగా అరుదైన గుర్తింపు దిశగా సాగుతున్నాయి. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో).. అంతర్జాతీయ స్థాయిలో అందించే అత్యున్నత, ప్రతిష్టాత్మక ‘‘ఛాంపియన్’’ అవార్డుకు ఆర్బీకేలను కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేయడం గమనార్హం. గ్రామగ్రామాన రైతన్నకు భరోసా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రం.. పేరుకు తగ్గట్టుగానే ప్రతి గ్రామంలో అన్నదాతకు అండదండగా నిలుస్తోంది. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే రైతులకు అన్ని రకాల సేవలందిస్తున్న ఓ వినూత్న, విప్లవాత్మక వ్యవస్థ ఇది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలో ఈ వ్యవస్థకు రూపకల్పన చేశారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల దృష్టిని ఆకర్షించిన ఆర్బీకేలు ఇప్పుడు అంతర్జాతీయ అవార్డుకు నామినేట్ అయ్యాయి. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు బీజం వేసిన ఆర్బీకేలను మన దేశం తరపున ఐరాస అనుబంధ సంస్థ ఎఫ్ఏవో అందించే ఛాంపియన్ అవార్డు కోసం కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. రెండేళ్ల క్రితం రూపుదిద్దుకుని.. ప్రపంచంలో మరెక్కడా లేని రీతిలో సాగు ఉత్పాదకాలను రైతుల ముంగిటకు తీసుకెళ్లాలన్న ముఖ్యమంత్రి జగన్ సంకల్పం మేరకు రాష్ట్రంలో సచివాలయాలకు అనుబంధంగా గ్రామ స్థాయిలో 10,778 ఆర్బీకేలు ఏర్పాటయ్యాయి. 2020 మే 30న శ్రీకారం చుట్టిన ఈ ఆర్బీకేల ద్వారా వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించిన సమస్త సేవలన్నీ రైతులకు అందిస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు.. ఇలా నాణ్యమైన సాగు ఉత్పాదకాలన్నీ అందించడమే కాకుండా రైతు పండించిన పంటను కూడా నాలెడ్జ్ హబ్‌లుగా తీర్చిదిద్దిన ఆర్బీకేల ద్వారానే కొనుగోలు చేస్తున్నారు. ఆర్బీకేల ద్వారా అందిస్తున్న సేవలను గుర్తించిన పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లోనూ అమలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఆర్బీకేలను సందర్శించి వాటి సేవలను ప్రశంసించాయి. తాజాగా ఎఫ్ఏవో అందించే ప్రతిష్టాత్మక ఛాంపియన్ అవార్డుకు నామినేట్ కావడం మరో అరుదైన గౌరవమని అధికారులు పేర్కొంటున్నారు. ‘ఆహార భద్రత – 2030’ లక్ష్యం.. ప్రపంచవ్యాప్తంగా మానవాళి చురుకైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపేలా ‘ఆహార భద్రత – 2030’ ద్వారా నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో ఎఫ్ఏవో కృషి చేస్తోంది. ఇందుకోసం ఐక్యరాజ్యసమితి భాగస్వామ్య దేశాలకు వివిధ రూపాల్లో చేయూతనిస్తోంది. అంతర్జాతీయంగా అగ్రి ఫుడ్ వ్యవస్థలను మార్చడం లేదా మార్పు కోసం స్థిరమైన అభివృద్ధి అజెండాతో పనిచేసే సంస్థలు, ప్రభుత్వాలను ఏటా అవార్డుతో సత్కరిస్తుంది. ఈ అవార్డు కింద 50 వేల యూఎస్ డాలర్లను అందజేస్తారు. పలు దశల్లో వడపోత.. ప్రతిష్టాత్మక ఛాంపియన్ అవార్డు కోసం ఎఫ్ఎవో అంతర్జాతీయంగా నామినేషన్లను ఆహ్వానించింది. ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్లుగా గ్రామస్థాయిలో సేవలందిస్తున్న వైఎస్సార్ ఆర్బీకేలను రోల్ మోడల్‌గా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మన దేశం తరపున ఈ అవార్డు కోసం ఎఫ్‌ఏవోకు నామినేట్ చేసింది. అందరికీ సుస్థిర ఆహార భద్రత కల్పించే లక్ష్యంతో అనుసరిస్తున్న వినూత్న విధానాలు, వ్యవస్థలు, వాటి ద్వారా వచ్చిన మార్పులు, ఉత్పత్తి, పోషకాహారం, పర్యావరణం, జీవన విధానాల్లో సాధించిన మెరుగైన ఫలితాలు లాంటి అంశాలను అవార్డుకు ప్రామాణికంగా తీసుకుంటారు. వివిధ దేశాల నుంచి అందిన నామినేషన్లను వివిధ దశల్లో వడపోస్తారు. చివరిగా అంశాల వారీగా అర్హత కలిగిన సంస్థలు, ప్రభుత్వాలను ఐరాస అత్యున్నత కౌన్సిల్ ఎంపిక చేస్తుంది. జూన్ 13 నుంచి 17వతేదీ వరకు ఐక్యరాజ్య సమితిలో జరిగే ఎఫ్ఏవో 169వ కౌన్సిల్ సమావేశంలో డైరెక్టర్ జనరల్ చేతుల మీదుగా ఎంపికైన సంస్థలు / ప్రభుత్వాలకు ఛాంపియన్ అవార్డును ప్రదానం చేస్తారు. అందరికీ ఆదర్శం... ఆర్బీకే వ్యవస్థ వినూత్నం, విప్లవాత్మకం. దేశమంతా అమలు చేయతగ్గ ఓ ప్రయోగం. ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేసేలా సిఫార్సు చేస్తాం. ఆర్బీకేలకు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందిస్తుంది. వీటి పనితీరును మరింత మెరుగు పరిచేందుకు లోతైన అధ్యయనం కూడా చేస్తుంది. – డాక్టర్ ఏకే సింగ్, ఐసీఎంఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ దేశమంతా అనుసరించాలి... ఆర్బీకేల ద్వారా అందిస్తున్న సేవలు జాతీయ స్థాయిలో అమలు చేయతగ్గవి. ఈ– క్రాప్ ద్వారా పంటలవారీగా సాగు విస్తీర్ణం, రైతుల వివరాలను నమోదు చేస్తున్న తీరు బాగుంది. వాస్తవ సాగుదారులకు పంట రుణాలతో పాటు అన్నిరకాల రాయితీలు అందేలా ఈ–క్రాప్‌ను ఈ కేవైసీతో అనుసంధానించడం మంచి ఆలోచన. బ్యాంకింగ్ కరస్పాండెంట్ల ద్వారా ఆర్బీకేల్లో గ్రామస్థాయిలో బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తేవడం గొప్ప విషయం. ఈ తరహా ప్రయత్నం దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇప్పటివరకు చూడలేదు. – కయా త్రిపాఠి, సోనాలి సేన్ గుప్తా, ఆర్బీఐ సీజీఎంలు మనకు గర్వ కారణం... అంతర్జాతీయ స్థాయిలో ఎఫ్ఏవో అందజేసే ఛాంపియన్ అవార్డుకు మన ఆర్బీకేలను కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేయడం గర్వకారణం. ఎఫ్ఏవో కంట్రీ హెడ్ టోమియో షిచిరీ బృందం గతంలో ఆర్బీకేలను స్వయంగా పరిశీలించి ప్రశంసించింది. ఆర్బీకేల ద్వారా రైతులకు మెరుగైన సాంకేతిక సామర్థ్యాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు అవగాహన ఒప్పందం కూడా చేసుకుంది. ప్రపంచంలో మరెక్కడా లేని ఆర్బీకేల వ్యవస్థకు ఛాంపియన్ అవార్డు కచ్చితంగా వస్తుందన్న నమ్మకం ఉంది. – పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్, వ్యవసాయ శాఖ ఇలాంటి వ్యవస్థ ఇంకెక్కడా లేదు.. ఆర్బీకే లాంటి వ్యవస్థ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు. ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్, ఆర్బీకే స్టూడియోలు ఓ వినూత్న ఆలోచన. వీటి ద్వారా గ్రామస్థాయిలో రైతు ముంగిటకు నేరుగా నాణ్యమైన సేవలందించడం నిజంగా ప్రశంసనీయం. ఆర్బీకేల బలోపేతానికి ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసే అవకాశం రావడాన్ని గర్వకారణంగా భావిస్తున్నాం. – ఆర్బీకేల సందర్శన సందర్భంగా టోమియో షిచిరీ, ఎఫ్ఏవో కంట్రీ హెడ్ -
ఫుడ్ ప్రాసెసింగ్‌కు చేయూత ఇవ్వండి
సాక్షి, అమరావతి: రైతులకు అదనపు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో పార్లమెంట్ నియోజకవర్గస్థాయిలో ఏర్పాటు చేస్తున్న 26 సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఆర్థిక చేయూతనివ్వాలని నాబార్డుకు వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య విజ్ఞప్తి చేశారు. ముంబైలోని నాబార్డు ప్రధాన కార్యాలయంలో సీజీఎం బి.రఘునాథ్‌తో గురువారం ఆమె సమావేశమయ్యారు. స్థానికంగా సాగు అయ్యే పంటల ఆధారంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. ప్రభుత్వమే వీటిని ఏర్పాటు చేసి ఆసక్తి కలిగిన జాతీయ, అంతర్జాతీయ బహుళజాతి సంస్థలకు నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తుందని వివరించారు. వీరికి కావాల్సిన ముడిసరుకు(పంట)ను.. ప్రభుత్వం నిర్దేశించిన ధరకు కొనుగోలు చేయాలని నిబంధన విధించినట్లు తెలిపారు. వాటికొచ్చే లాభాల్లో కూడా రైతులకు కొంత భాగం ఇచ్చేలా విధివిధానాలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. వీటి ఏర్పాటు కోసం ప్రభుత్వం ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ పర్యవేక్షణలో స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసిందన్నారు. స్థలాలను గుర్తించే ప్రక్రియ జరుగుతోందని, అవసరమైన ఆర్థిక చేయూతనందించాలని కోరారు. నాబార్డు సీజీఎం రఘునాథ్ మాట్లాడుతూ.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అవసరమైన ఆర్థిక చేయూతనిచ్చేందుకు సానుకూలంగా ఉన్నామని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీపై అధ్యయనం చేసేందుకు త్వరలోనే నాబార్డు బృందం ఏపీలో పర్యటిస్తుందన్నారు. సమావేశంలో ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ జి.శేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
లాభసాటి వ్యవసాయమే ప్రభుత్వ లక్ష్యం
వేజండ్ల(చేబ్రోలు): రైతులు లాభసాటి వ్యవసాయం చేసేలా చూడటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య అన్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజండ్లలోని రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే)ను శనివారం ఆమె తనిఖీ చేశారు. అనంతరం రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆర్బీకేల్లో అందించే ఎరువులు, పురుగు మందులు, విత్తనాల నాణ్యతకు ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పారు. రైతులు ఇబ్బంది పడకుండా ఏటా వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడిని కూడా ప్రభుత్వమే అందిస్తోందని గుర్తు చేశారు. బ్యాంకర్ల ద్వారా రుణాలు కూడా అందిస్తున్నట్లు వివరించారు. రైతులు అనవసరంగా పురుగు మందులు, ఎరువులు వాడవద్దని సూచించారు. ఆర్బీకేలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. టోల్ ఫ్రీ నంబరు 155251 ద్వారా రైతులు సలహాలు పొందవచ్చన్నారు. రైతు సాంబిరెడ్డి మాట్లాడుతూ.. తైవాన్ పవర్ స్ప్రేయర్లను గ్రూపుల ద్వారా అందిస్తున్నారని, వ్యక్తిగతంగా రైతులకు ఇస్తే ఉపయోగకరంగా ఉంటుందన్నారు. వెదురు బొంగుల ద్వారా వేసే కూరగాయ పందిళ్లకు గతంలో రాయితీ ఇచ్చేవారని దానిని కొనసాగించాలని కోరారు. రైతు హరికృష్ణ మాట్లాడుతూ.. కూరగాయ విత్తనాలకు సబ్సిడీ అందించాలన్నారు. రైతు వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఆర్బీకేల్లో ఎరువుల నిల్వలను అధికంగా ఉంచాలని కోరారు. వీటిపై పూనం మాలకొండయ్య స్పందిస్తూ.. రైతుల సూచనలను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ డైరెక్టర్ అమరేంద్ర కుమార్, జేడీ జేపీ వెంకటేశ్వర్లు, ఉద్యాన శాఖ డీడీ ఎన్.సుజాత, ఏడీహెచ్ రాజాకృష్ణారెడ్డి, జేడీఏలు డి.శ్రీధర్, విజయభారతి, ఏడీఏ సీహెచ్ తిరుమలాదేవి, ఏఓ పి.సంధ్యారాణి, జెడ్పీ వైస్ చైర్పర్సన్ బి.అనూరాధ, ఎంపీపీ కె.సాహితి, సర్పంచ్ జె.హైమావతి, ఎంపీటీసీ ఎస్.వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో చక్కెర బకాయిల చెల్లింపు
సాక్షి, అమరావతి: చెరుకు రైతులకు క్రషింగ్.. ఆ కర్మాగారాల్లోని ఉద్యోగుల జీతభత్యాల బకాయిలను సాధ్యమైనంత త్వరగా చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో మూతపడ్డ చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ, నిర్వహణ ఇతర అంశాలపై కురసాల కన్నబాబు, బొత్స సత్యనారాయణ, మేకపాటి గౌతమ్రెడ్డిలతో ఏర్పాటైన మంత్రుల బృందం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్–జీఓఎం) గురువారం వర్చువల్ విధానంలో సమావేశమైంది. ఫ్యాక్టరీల్లో పేరుకుపోయిన చక్కెర నిల్వల అమ్మకాలు, ఉద్యోగుల బకాయిల చెల్లింపు, వీఆర్ఎస్ అమలు, తదితర అంశాలపై చర్చించారు. వీటి చెల్లింపుల నిమిత్తం.. పేరుకుపోయిన చక్కెర నిల్వలు అమ్మేందుకు హైకోర్టు అనుమతినివ్వడంపట్ల హర్షం వ్యక్తంచేసిన మంత్రుల బృందం సాధ్యమైనంత త్వరగా మంచి రేటుకు ఈ నిల్వలను అమ్మే విషయమై చర్చించారు. 3.85 లక్షల క్వింటాళ్ల చక్కెర నిల్వలు రాష్ట్రంలోని ఐదు చక్కెర కర్మాగారాల్లో ప్రస్తుతం 3.85 లక్షల క్వింటాళ్ల పంచదార నిల్వలున్నాయని, వాటి అమ్మకాల ద్వారా కనీసం రూ.127 కోట్లు ఆదాయం వస్తుందని ఈ భేటీలో అంచనా వేశారు. ఒక్క చోడవరం షుగర్ ఫ్యాక్టరీలోనే 3.28 లక్షల క్వింటాళ్ల చక్కెర నిల్వలున్నాయని, వీటి అమ్మకం ద్వారా రూ.108.24 కోట్ల ఆదాయం వస్తుందని లెక్కతేల్చారు. అక్టోబర్ 5న టెండర్లు పిలిచేందుకు చోడవరం షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. ఇక చోడవరం, ఏటికొప్పాక, తాండవ చక్కెర కర్మాగారాల్లో రైతులకు చెల్లించాల్సిన క్రషింగ్ బకాయిలు రూ.46.48 కోట్లు ఉన్నాయి. ఈ కర్మాగారాలతో పాటు భీమసింగి చక్కెర కర్మాగారాల్లోని ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.25.50 కోట్లు. సీఎంతో భేటీ తర్వాతే ముందుకు.. ఇక మూతపడ్డ చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, ఉద్యోగులకు వీఆర్ఎస్ అమలు, చోడవరం, గోవాడ షుగర్ ఫ్యాక్టరీల ఆధునీకరణ అంశాలపై సీఎం జగన్‌తో సమావేశమైన తర్వాత ఆయన ఆదేశాల మేరకు ముందుకెళ్లాలని మంత్రుల బృందం ఈ భేటీలో నిర్ణయించింది. సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, డైరెక్టర్ ఆఫ్ షుగర్స్ వెంకట్రావు పాల్గొన్నారు. -
నవంబర్ నుంచి పత్తి కొనుగోలు
సాక్షి, అమరావతి: గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా దళారుల ప్రమేయం లేకుండా పత్తి కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. పత్తి సేకరణకు సంబంధించిన విధివిధానాలపై వ్యవసాయశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యతో కలిసి ఆయన మంగళవారం మార్క్‌ఫెడ్ కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు పండించిన పంటలను పారదర్శకంగా కొనుగోలు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుల నుంచి సేకరించిన పత్తిని కొనుగోలు కేంద్రాల నుంచి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కేంద్రాల వరకు సరఫరా చేసేందుకు రవాణా చార్జీలను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని గుర్తుచేశారు. ఇందుకోసం గతేడాది రూ.86.62 లక్షలు ఖర్చు చేసిందన్నారు. గతేడాది ఒక్క రైతు కూడా ఇబ్బందిపడకుండా సీసీఐ ద్వారా పత్తిని కొనుగోలు చేయించామన్నారు. అదేరీతిలో ఈ ఏడాది కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. గతేడాది 11 ఏఎంసీలు, 73 జిన్నింగ్ మిల్లుల వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా పత్తి సేకరిస్తే ఈ ఏడాది 50 ఏఎంసీలు, 73 జిన్నింగ్ మిల్లుల వద్ద సేకరిస్తున్నట్లు తెలిపారు. పత్తిని సేకరించే జిన్నింగ్ మిల్లుల సంఖ్యను మరింత పెంచాలని కోరామన్నారు. ఈ కేంద్రాల వద్ద దళారుల ప్రమేయం లేకుండా రైతులకు మేలు చేయాలని సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశించారని చెప్పారు. ఈ–పంట ఆధారంగా సీఎం యాప్ ద్వారా వాస్తవ సాగుదారుల నుంచి నేరుగా పత్తి కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. నవంబర్ మొదటి వారం నుంచి కొనుగోలు కేంద్రాలు రైతులకు అందుబాటులో ఉంటాయన్నారు. సీసీఐ నిబంధనల మేరకు కనీస మద్దతు ధరలకు పత్తి సేకరణ జరుగుతుందన్నారు. వాస్తవ సాగుదారులు కాకుండా పత్తిని ఎవరు తీసుకొచ్చినా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఆధార్ అనుసంధాన రైతుల బ్యాంక్ ఖాతాల్లో మాత్రమే నగదు చెల్లింపులు జరిగేలా చూడాలని చెప్పారు. ఈ సమావేశంలో మార్కెటింగ్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మధుసూదన్‌రెడ్డి, వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్, మత్స్యశాఖల కమిషనర్లు అరుణ్‌కుమార్, శ్రీధర్, ప్రద్యుమ్న, కన్నబాబు, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ అమరేంద్రకుమార్, సీసీఐ ప్రతినిధులు, మార్కెటింగ్ శాఖాధికారులు పాల్గొన్నారు. -
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రోత్సాహం
నూజివీడు: రాష్ట్రంలో ఫుడ్‌ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య పేర్కొన్నారు. నూజివీడు ఆటోనగర్‌లో ఉన్న గోర్మే పాప్‌కార్నిక ప్రాసెసింగ్ కంపెనీని బుధవారం ఆమె పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. నూజివీడులో మ్యాంగో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మొక్కజొన్న, మామిడి, మిర్చి, నిమ్మ, అరటి, టమోట, జీడిపప్పు తదితర వాటికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పినట్లయితే రైతులకు లాభసాటిగా ఉంటుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని తీసుకొచ్చిందని, దీనిలో భాగంగా ప్రతి రైతుభరోసా కేంద్రం వద్ద ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని భావిస్తుందని తెలిపారు. వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయం జాయింట్ డైరెక్టర్ వీడీవీ కృపాదాస్, కృష్ణా జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ టి.మోహన్‌రావు, ఉద్యానవనశాఖ డిప్యూటీ డైరెక్టర్ రవికుమార్, నూజివీడు ఏడీఏ కవిత తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో గొరక చేపల హేచరీలు
సాక్షి, అమరావతి: గొరక (తిలాపియా).. అత్యంత చౌక, ముళ్లు తక్కువగా ఉండే కాలువ చేప. రోడ్ సైడ్ రెస్టారెంట్లలో విరివిగా వాడే ఈ చేపలకు అమెరికా, సింగపూర్, చైనా, యూరోపియన్ దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఈ చేపల ఉత్పత్తిలో ప్రపంచంలోనే చైనా మొదటి స్థానంలో ఉంది. మన దేశంలో వీటి వినియోగం తక్కువే. మన రాష్ట్రం నుంచి ఎక్కువగా విదేశాలకు పిల్లెట్స్ రూపంలో ఎగుమతి చేస్తుంటారు. విదేశాల్లో ఉండే డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ చేపల సాగును ప్రోత్సహించే లక్ష్యంతో ఈ చేపపిల్లల ఉత్పత్తి కోసం ముందుకొచ్చే ప్రైవేటు హేచరీలకు అనుమతివ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం రాష్ట్రస్థాయిలో స్టీరింగ్ కమ్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వులు జారీచేశారు. మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీలో సీఐఎఫ్ఏ విజయవాడ రీజనల్ సెంటర్ సైంటిస్ట్ ఇన్చార్జి, ఎంపెడా విజయవాడ రీజనల్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్, స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ప్రిన్సిపల్‌తో పాటు కృష్ణాజిల్లా మానికొండలోని ఆర్‌జీసీఏలోని తిలాపియా సెంటర్ ప్రాజెక్టు మేనేజర్ సభ్యులుగా ఉంటారు. ఇప్పటికే తిలాపియా హేచరీ ఏర్పాటు కోసం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఆనంద గ్రూప్ దరఖాస్తు చేసింది. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత హేచరీ ఏర్పాటుకు అనుమతి ఇచ్చే విషయంలో నిర్ణయం తీసుకుంటుంది. ఇతర జిల్లాల నుంచి కూడా ఈ హేచరీల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చే అవకాశాలున్నట్టు అంచనా వేస్తున్నారు. -
వ్యవసాయానికి మినహాయింపు
సాక్షి, అమరావతి: కర్ఫ్యూ నుంచి వ్యవసాయ కార్యకలాపాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మినహాయింపునిచ్చింది. ఈ మేరకు పలు మార్గదర్శకాలతో వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్య శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన ఉద్యాన, పశుసంవర్థక, మత్స్య, డెయిరీ శాఖల పరిధిలో జరిగే కార్యకలాపాలకు కూడా కర్ఫ్యూ నుంచి మినహాయింపునిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలతో పాటు పనిముట్లు, యంత్ర పరికరాలను తరలించే వారికి ఆటంకం కలగకుండా చూడాలని ఆదేశించారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల తరలింపు, క్రయవిక్రయాలకు ఇబ్బంది కలిగించవద్దని సూచించారు. ఇందుకోసం అవసరమైతే ప్రత్యేక పాస్‌లు జారీ చేయాలని సూచించారు. వ్యవసాయ సంబంధిత షాపులు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు తెరిచి ఉంచవచ్చని పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్ కోసం ఈ నెల 17 నుంచి సబ్సిడీ విత్తనాలు సరఫరా చేయబోతున్నందున తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే వేరుశనగ విత్తన సేకరణ 91 శాతం పూర్తయ్యిందని తెలిపారు. వేలిముద్రల ద్వారా కాకుండా ఓటీపీ విధానంలో విత్తనాలు కావాల్సిన రైతుల వివరాలను నమోదు చేసేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ నిర్మాణం జోరుగా సాగుతోందని, వాటి నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. మార్కెట్ యార్డుల్లో కార్యకలాపాలకు ఆటంకం కలగకూడదని పేర్కొన్నారు. రైతు బజార్లలో నో మాస్క్, నో ఎంట్రీ బోర్డులు పెట్టి.. భౌతిక దూరం పాటిస్తూ అమ్మకాలు జరిగేలా చూడాలని ఆదేశించారు. అవసరాలకు అనుగుణంగా మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేసి వినియోగదారులు, రైతులు నష్టపోకుండా చూడాలని సూచించారు. -
రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి సంస్థ ఏర్పాటు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి సంస్థ (ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ) ఏర్పాటైంది. దీనితోపాటు ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ అడ్వైజరీ కమిటీలను, జిల్లా స్థాయి అమలు కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఈ మేరకు వ్యవసాయ, పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆక్వాకల్చర్ అభివృద్ధి సంస్థకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. వైస్ చైర్మన్‌గా పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజును నియమించారు. కో వైస్ చైర్మన్‌గా ఈ రంగంలో నిపుణుడ్ని ప్రభుత్వం నామినేట్ చేయనుంది. అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.. మెంబర్ సెక్రటరీగా వ్యవహరించనున్న ఈ కమిటీలో ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి సహా 24 మందిని సభ్యులుగా నియమించారు. అలాగే పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చైర్మన్‌గా, స్పెషల్ చీఫ్ సెక్రటరీ/ప్రిన్సిపల్ కార్యదర్శి/కార్యదర్శిలు వైస్ చైర్మన్‌గా ఏర్పాటైన అథారిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఏపీఎస్ఏడీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.. మెంబర్ సెక్రటరీగా వ్యవహరించనుండగా, 12 మందిని సభ్యులుగా నియమించారు. అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చైర్మన్‌గా ఏర్పాటు చేసిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీకి కాకినాడ ఎస్‌ఐఎఫ్‌టీ ప్రిన్సిపల్.. మెంబర్ సెక్రటరీగా వ్యవహరించనుండగా, 19 మందిని సభ్యులుగా నియమించారు. జిల్లా స్థాయి అమలు కమిటీకి కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా మత్స్యశాఖాధికారి మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో 12 మంది సభ్యులుగా ఉంటారు. -
సేంద్రీయ స్వదేశీ నాటు ఆవు పెంపకం క్షేత్రాలు
సాక్షి, అమరావతి: సేంద్రీయ ఏ2 పాల ఉత్పత్తి లక్ష్యంగా స్వదేశీ ఆవుల పెంపకం క్షేత్రాలను ఏర్పాటు చేయాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఇందుకు సంబంధించి అదనపు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు వ్యవసాయ పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మంగళవారం రాత్రి జీవో జారీ చేశారు. గతంలో నేషనల్ ఎడాప్షన్ ఫండ్ ఫర్ క్లైమేమెట్ చేంజ్ (ఎన్‌ఏఎఫ్‌సీసీ) ప్రాజెక్టు కింద నెల్లూరు, విజయనగరం, అనంతపురం జిల్లాల్లో రూ.5.40 కోట్ల అంచనాతో 18 యూనిట్లు, మిగిలిన పది జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో రూ.12 కోట్ల అంచనాతో 40 యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కాగా, తాజా గైడ్‌లైన్స్‌లో ఆర్కేవీవై, ఎన్‌ఏఎఫ్‌సీసీ ఆర్థిక చేయూతతో అన్ని జిల్లాల్లోనూ ఒకే రీతిలో 58 యూనిట్లు ఏర్పాటు చేయాలని మార్గదర్శకాలను జారీ చేశారు. లబ్ధిదారుల ఎంపిక కోసం జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేశారు. 25 దేశీయ ఆవులు అందజేత ఈ కమిటీలు లబ్ధిదారులను ఎంపిక చేస్తాయి. వీరికి ఒక్కొక్కటి రూ.75 వేల అంచనాతో రూ.17.50 లక్షల అంచనాతో 25 దేశీయ ఆవులు (గిర్, సాహివాల్, ఒంగోలు, పుంగనూరు తదితర జాతులు) అందజేస్తారు. ఇలా 58 యూనిట్ల కోసం రూ.10.15 కోట్లు ఇవ్వనున్నారు. ఈ గోవుల కోసం నిర్మించే షెడ్లు, ఫెన్సింగ్ కోసం ఒక్కో యూనిట్‌కు రూ.10 లక్షల చొప్పున రూ.5.80 కోట్లు, పాలు, పాల ఉత్పత్తిల తయారీ కోసం ఉపయోగించే పరికరాల కోసం ఒక్కో యూనిట్‌కు రూ.1,12,750 చొప్పున రూ.65.54 లక్షలు, నిర్వహణ ఖర్చుల కోసం ఒక్కో యూనిట్‌కు రూ.1,37,250 చొప్పున రూ.79.46 లక్షలు చెల్లించనున్నారు. ఈ విధంగా ఒక్కోయూనిట్ రూ.30 లక్షలుగా నిర్ణయించగా, దీంట్లో రూ.3 లక్షలు లబ్ధిదారులు భరించాల్సి ఉంది. రూ.18 లక్షలను ఆర్కేవీవై, ఎన్‌ఏఎఫ్‌సీసీ నిధుల నుంచి సమకూర్చనుండగా, రూ.9 లక్షలను వాణిజ్య బ్యాంకుల నుంచి రుణంగా మంజూరు చేయనున్నారు. కన్సల్టెంట్‌గా సురభి గోశాల నిర్వాహకుడు కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరకలపూడికి చెందిన సురభి గోశాల నిర్వాహకుడు వి.రవికుమార్‌ను కన్సల్టెంట్‌గా నియమించారు. లబ్ధిదారులకు శిక్షణనిచ్చే బాధ్యతను విశాఖపట్నం స్మైల్ అడిషనల్ డైరెక్టర్గు అప్పగించారు. ఈ ఆవులకు అవసరమైన ఇన్‌పుట్స్‌ను ఆర్బీకేల ద్వారా అందించనున్నారు. ఈ క్షేత్రాల నుంచి వచ్చే ఏ2 పాలు, పాల ఉత్పత్తులను ఆంధ్ర గో పుష్టి బ్రాండ్ నేమ్‌తో మార్కెటింగ్ చేయనున్నారు. అలాగే అమూల్, ఫిషరీస్ అవుట్‌లెట్స్‌తో పాటు జనతా బజార్లు, ఈ–మార్కెటింగ్ ద్వారా విక్రయాలను ప్రోత్సహించనున్నారు. మార్కెటింగ్ విక్రయాల కోసం జైవిక్ భారత్, ఇండియా ఆర్గానిక్ అనే యూనిఫైడ్ లోగోలను గుర్తించారు. ఇందుకోసం హైదరాబాద్‌కు చెందిన ఎన్ఐఎన్ సంస్థతో పశుసంవర్థక శాఖ ఎంవోయూ చేసుకోనుంది. -
సేంద్రీయ సాగు కోసం ప్రత్యేక పాలసీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సేంద్రీయ సాగును ప్రోత్సహించే లక్ష్యంతో తీసుకొస్తున్న ఏపీ స్టేట్ ఆర్గానిక్ ఫార్మింగ్ పాలసీ రూపకల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జీవ వైవిధ్యాన్ని కాపాడడంతో పాటు వ్యవసాయ–పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్రంలో సేంద్రీయ వ్యవసాయం విస్తీర్ణాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేంద్రీయ సాగులో ఉత్తమ పద్ధతులను తీసుకురావాలని సంకల్పించింది. ఇందుకోసం ఆర్గానిగ్ ఫార్మింగ్ పాలసీని తీసుకురానుంది. ఈ పాలసీ రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన కమిటీలో చైర్మన్‌గా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వ్యవహరిస్తారు. మరో 17 మందిని సభ్యులుగా నియమించారు. ఈ కమిటీ రాష్ట్రంలో సేంద్రీయ సాగు స్థితిగతులను అధ్యయనం చేయడంతో పాటు సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై డ్రాఫ్ట్ పాలసీని రూపొందించేందుకు అధ్యయనం చేసి 30 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. -
58 స్వదేశీ ఆవుల పెంపక క్షేత్రాలు
సాక్షి, అమరావతి: దేశీయ ఆవుల పెంపకం, ఏ–2 పాల ఉత్పత్తి, మార్కెటింగ్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో 58 స్వదేశీ ఆవుల పెంపక క్షేత్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలను పశుసంవర్ధక, డెయిరీల అభివృద్ధి, మత్స్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య సోమవారం రాత్రి విడుదల చేశారు. ఏ–2 పాల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యం రాష్ట్రంలో 30.50 లక్షల మంది పాడిరైతులున్నారు. వారివద్ద 13,56,523 ఆవులు, 21,46,695 గేదెలు ఉన్నాయి. వీటి ద్వారా 4.12 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. జెర్సీ, హెచ్ఎఫ్ జాతి పశువుల పాలను ఏ–1 మిల్క్ గా పిలుస్తారు. గిర్ (గుజరాత్), షాహివాలా (హరియాణా, పంజాబ్), ఒంగోలు జాతి పశువుల పాలను ఏ–2 మిల్క్‌గా పిలుస్తారు. క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధి నివారణకు ఎంతో ఉపయోగపడే ఏ–2 పాల ఉత్పత్తిని, వినియోగాన్ని పెంచడం, స్వదేశీ జాతులను సంరక్షించడం, తద్వారా సేంద్రియ సాగును ప్రోత్సహించడం లక్ష్యాలుగా ప్రభుత్వం ఈ క్షేత్రాలను ఏర్పాటు చేస్తోంది. ఎన్‌ఏఎఫ్‌సీసీ ప్రాజెక్టు కింద నెల్లూరు జిల్లా నార్త్ ఆములూరు, బిరదవోలు, విజయనగరం జిల్లా పెరిమి, వీరసాగరం, అనంతపురం జిల్లా గొట్లూరు, వెంకటరాజుకాలువ ప్రాంతాల్లో రూ.5.40 కోట్లతో 18 యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటికి లబి్ధదారులు రూ.7.50 లక్షలు భరించాలి. మిగిలిన రూ.22.50 లక్షల్ని ఎన్‌ఏఎఫ్‌సీసీ నుంచి సమకూరుస్తారు. లబ్ధిదారుల ఎంపిక ఇలా.. ఈ క్షేత్రాలు ఏర్పాటు చేయదలిచిన రైతులు, ఔత్సాహికులకు షెడ్ నిర్మాణానికి సొంతంగా లేదా కౌలుకు తీసుకున్న 2.5 ఎకరాల భూమి ఉండాలి. జాయింట్ లయబులిటీ గ్రూపు (జేఎల్‌జీ)లకు ప్రాధాన్యతనిస్తారు. జిల్లాస్థాయి మానిటరింగ్ కమిటీ ద్వారా గ్రామసభల్లో అర్హులను ఎంపిక చేస్తారు. జాయింట్ కలెక్టర్ (ఆర్బీకే) చైర్మన్‌గా ఉండే ఈ కమిటీకి పశుసంవర్ధక శాఖ జేడీ మెంబర్ కన్వీనర్‌గా, నాబార్డు ఎజీఎం, లీడ్ బ్యాంక్ మేనేజర్, వ్యవసాయశాఖ జేడీ సభ్యులుగా ఉంటారు. -
మహాసమాధిని దర్శించుకున్న పూనం మాలకొండయ్య
పుట్టపర్తి టౌన్ : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య పుట్టపర్తిలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. శనివారం ప్రత్యేక వాహనంలో రోడ్డుమార్గాన ప్రశాంతి నిలయం చేరుకున్న ఆమెకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ప్రసాద్‌రావు, డీఎంహెచ్ఓ వెంకటరమణ, సిమ్స్ డైరెక్టర్ డాక్టర్ గురుమూర్తి, తహసీల్దార్ సత్యనారాయణలు ఘనంగా స్వాగతం పలికారు. శాంతిభవన్ అథితి గృహంలో కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం ఆమె సాయికుల్వంత్ సభా మందిరంలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. ఆదివారం సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని సందర్శించి అక్కడి వైద్యసేవలను పరిశీలించనున్నారు. -
అధికారుల్లో క్రమశిక్షణ లేదు
రోగులకు ఇబ్బందులు లేకుండా చూడాలి రెండో రోజు కొత్త, పాత ప్రభుత్వాస్పత్రుల్లో పూనమ్ తనిఖీలు విజయవాడ (లబ్బీపేట) : అధికారుల్లో డిసిప్లిన్ లేదు.. ఇక కిందస్థాయి వారు ఎలా ఉంటారో అర్థమవుతుందంటూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనమ్ మాలకొండయ్య అసహనం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో పనిచేసే సమయంలో కొన్ని నిబంధనలు పాటించాలని, అవి అధికారులు పాటిస్తే కిందస్థాయి వారు పాటిస్తారని ఆమె తెలిపారు. కొత్త ప్రభుత్వాస్పత్రిలో సోమవారం అర్ధరాత్రి రెండు గంటల వరకు సమీక్ష జరిపిన ఆమె, మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకే పాత ప్రభుత్వాస్పత్రిలో తనిఖీలకు వెళ్లారు. అక్కడ ప్రత్యేక నవజాత శిశు విభాగాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ విభాగంలో చికిత్స పొందుతున్న శిశువుల తల్లులు వేచివున్న గదికి వెళ్లారు. ఈ సందర్భంగా పలువురిని సమస్యలు అడగగా, సిజేరియన్ అయిన ఐదు రోజులకే డిశ్చార్జి చేస్తున్నారని, ఇక్కడ కింద కూర్చోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన పూనమ్ మాలకొండయ్య, సిజేరియన్ అయిన వారి కోసం అక్కడ పడకలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రసూతి ఓపీ విభాగాన్ని, అక్కడి పరికరాలను పరిశీలించారు. అనంతరం కొత్త ప్రభుత్వాస్పత్రికి చేరుకుని డయాగ్నోస్టిక్ బ్లాక్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కుర్చీలు ఖాళీగా ఉండటంతో వారు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. పక్క గదిలో ఉన్న సిబ్బంది రాగా, మీరు యూనిఫామ్ వేసుకోరా అని నిలదీశారు. అనంతరం ఐసీటీసీ, ఏఆర్టీ విభాగాలను పరిశీలించారు. మధ్యాహ్నం డయాగ్నోస్టిక్ బ్లాక్ పైన నిర్మాణం పూర్తయిన రెండు అంతస్థులను పరిశీలించి, దానికి విద్యుత్ సౌకర్యం కల్పించి ప్రారంభోత్సవం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సూపర్ బ్లాక్, ఇతర సౌకర్యాలపై చర్యలు ప్రధానమంత్రి స్వాస్థ్ సురక్ష యోజన పథకం ద్వారా మంజూరైన రూ.150 కోట్ల నిధులతో చేపట్టనున్న భవన నిర్మాణాలకు సంబంధించి ప్లాన్‌ను డీఎంఈ డాక్టర్ టి.వేణుగోపాలరావు, ఏపీహెచ్ఎంఎస్ఐడీసీ చీఫ్ ఇంజనీర్ డి.రవీందర్‌లతో కలిసి చర్చించారు. బ్లడ్‌బ్యాంక్‌లో కాంపోనెంట్స్ యూనిట్ ఏర్పాటు, అదనపు యూనిట్ల మంజూరు వంటి అంశాలపై సూపరింటెండెంట్ చాంబర్లో ఉన్నతాధికారులతో మాట్లాడారు. రెండు రోజుల సందర్శనలో తన దృష్టికొచ్చిన అంశాలపై అధికారులతో చర్చించారు. సాయంత్రం పాత ప్రభుత్వాస్పత్రిని సందర్శించి రోగులకందుతున్న సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో రాష్ట్ర అధికారుల హడావుడి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనమ్ మాలకొండయ్య ప్రభుత్వాస్పత్రిలో చేపట్టాల్సిన పనులను పరిశీలించేందుకు పలువురు అధికారులు హడావుడి చేశారు. ఏపీహెచ్ఎంఎస్ఐడీసీ ఎండీ వెంకట గోపీనాధ్ సివిల్ పనులు, పరికరాల అంశాలను పరిశీలించగా, ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓ, డ్రగ్ కంట్రోల్ బోర్డు డెరైక్టర్ రవిశంకర్ అయ్యర్ బ్లడ్ బ్యాంక్‌ను పరిశీలించారు. వైద్యవిధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ బి.సోమరాజు, కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ డెరైక్టర్ డాక్టర్ సావిత్రి, అడిషనల్ డెరైక్టర్ డాక్టర్ నీరద, డీఈఈ రోహిణి, వైద్య ఆరోగ్యశాఖ సలహాదారు జితేంద్రశర్మ పలు వార్డుల్లో తనిఖీలు నిర్వహించారు. వారి వెంట ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యు.సూర్యకుమారి, డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ నాగమల్లేశ్వరి ఉన్నారు. -
ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నన్నపనేని
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారిని ప్రభుత్వం నియమించింది. ఐదేళ్లపాటూ ఆమె మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా కమిషన్ రోజు వారీ కార్యకలాపాలు నిర్వహించడానికి వీలుగా 19 మంది సిబ్బందిని ప్రభుత్వం మంజూరు చేసింది. -
ఐదు రోజుల పాటు చిరుధాన్యాల ప్రదర్శన
సాక్షి, హైదరాబాద్ : వర్షాభావ పంటలు పండించే రైతులను ప్రోత్సహించడానికి చిరు ధాన్యాల ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య గురువారం తెలిపారు. ఈ ప్రదర్శన ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు చెప్పారు. రాగి, జొన్న, సజ్జ తదితర చిరుధాన్యాలు పండించే రైతులకు సదస్సు కూడా నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. -
ఇందులోకి వచ్చాక... ప్రతిరోజూ ఓ పరీక్షే!
పూనమ్ మాలకొండయ్య... నిబద్ధత కలిగిన ఐఎఎస్ అధికారిణి. విద్య, సాంఘిక సంక్షేమ, వ్యవసాయ, రవాణా, ఆర్థిక, పంచాయితీరాజ్, వైద్య ఆరోగ్యం, రాష్ట్ర రోడ్డు రవాణా, పౌరసరఫరాలు, మహిళాశిశు సంక్షేమం వంటి రంగాల్లో పనిచేశారు. ఏ రంగంలో అవినీతి రాజ్యమేలుతుంటే అక్కడ ఆమెను నియమిస్తారు పాలకులు. ఏ రంగంలో సంస్కరణలు అవసరమో అక్కడ ఆమె పేరు గుర్తొస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఆమెను ‘ఉమెన్ ప్రొటెక్షన్ కమిటీ’కి చైర్‌పర్సన్‌గా నియమించింది. ఈ నేపథ్యంలో ఆమెతో ముఖాముఖి... దేశనిర్మాణం యువత చేతిలో ఉంటుంది. యువత చైతన్యవంతంగా ఉండాలి. ఒక్కొక్కరు ఒక్కో దీపం వెలిగిస్తే చీకటి దానంతట అదే తొలగిపోతుంది. నిజాయితీగల అధికారి, నిబద్ధతతో పనిచేసే అధికారిగా పేరు తెచ్చుకున్నారు. మీ ప్రిన్సిపుల్ ఏమిటి? మా తాతగారు పోలీసు అధికారిగా చేసిన సాహసాల గురించి మా అమ్మ చాలా చెప్పేది. చారిత్రక కథనాలను కళ్లకు కట్టినట్లు వర్ణించేది. ఆ కథల్లోనే మంచిచెడులు, నిజాయితీ అన్నీ కలగలిసి ఉండేవి. అన్నింటికీ మించి ‘నిజాయితీ ఎప్పటికీ నిలుస్తుంది. మనిషిని సమాజంలో హుందాగా నిలబెడుతుంది’ అని నమ్మే మనిషిని నేను. డాక్టరేట్ అందుకోవాల్సిన సమయంలో సివిల్స్ వైపు వచ్చేశారు. అప్పట్లో డాక్టరేట్ మిస్ అయిందనిపించలేదా? అనిపించేది. అందుకే ఐఎఎస్‌గా విధులు నిర్వర్తిస్తూనే ‘మహిళలు- అక్షరాస్యత’ అనే అంశం మీద పరిశోధన చేసి డాక్టరేట్ తీసుకున్నాను. మీ పరిశోధనాంశాలను మహిళాభివృద్ధి కోసం పొందుపరిచారా? కంటిన్యూయస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లో నిరక్షరాస్యులైన మహిళల కోసం ఓ ప్లాన్‌ను చేర్చాను. పెళ్లయి పిల్లలున్నా సరే చదువుకోవాలనిపిస్తే ఆరేళ్ల కాలంలో పన్నెండవ తరగతి పూర్తి చేసి సర్టిఫికేట్ అందుకోవచ్చు. ఆ తర్వాత డిఎడ్ శిక్షణ తీసుకుని టీచర్ ఉద్యోగానికి అర్హత సాధించవచ్చు. విద్యాశాఖలో పనిచేసినప్పుడు దీనిని రూపొందించాను. స్త్రీ విద్య పట్ల ప్రత్యేక ఆసక్తి ఉందా? దేశ నిర్మాణానికి స్త్రీ విద్య చాలా ముఖ్యం. అందుకే స్కూళ్లలో టాయిలెట్లు లేక బాలికలు చదువు మానేయడం, పోషకాహార లోపంతో మహిళలు అనారోగ్యం పాలవడం మీద దృష్టి పెట్టా.మీకు మీ ఉద్యోగబాధ్యతలపరంగా తృప్తి ఇచ్చిన రంగాలు... వ్యవసాయ, విద్య, వైద్యరంగాలు. వీటిలో ప్రజోపయోగ విధానాలను రూపొందించి అమలు చేసే అవకాశం ఎక్కువ. ఐఎఎస్ అధికారిగా ఎదుర్కొన్న పరీక్షలు..!ఐఎఎస్లోకి రావడానికి ఒక పరీక్ష పాసయితే చాలు. ఇందులోకి వచ్చిన తర్వాత ప్రతి రోజూ ఓ పరీక్షలాగే ఉంటుంది. మోస్ట్ చాలెంజింగ్ జాబ్. ఆసక్తి లేకుండా కొనసాగిన రంగాలు..! నేను డిపార్ట్మెంట్తో సాన్నిహిత్యాన్ని పెంచుకోను. సర్వీస్‌తో సన్నిహితంగా ఉంటాను. కాబట్టి ఏ శాఖలోనైనా నా లెవెల్ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఉమెన్ ప్రొటెక్షన్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఏం చేయబోతున్నారు? {పభుత్వానికి 77 రికమండేషన్స్‌తో నివేదిక ఇచ్చాను. వాటిలో కొన్ని... సిటీ బస్సులో మహిళలకు- మగవారికి మధ్య అడ్డుగా జాలీ ఏర్పాటు, షీ బృందాల వంటివి అమలులోకి వచ్చాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, ఈవ్ టీజింగ్‌ను నిరోధిస్తూ శాసనం, ఉమెన్ హెల్ప్‌లైన్ వంటివి అమలులోకి రానున్నాయి. మహిళ పరిస్థితి మారాలంటే?... బాలికల్లో ‘తాము ఎవరికంటే ఎక్కువా కాదు, తక్కువా కాదు’ అనే అభిప్రాయం బలంగా నాటుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి. ప్రమాదాన్ని ఎదుర్కోగలమనే భరోసా ఉంటే, బాలికలు తమంతట తామే అన్నింట్లో ముందడుగు వేస్తారు. విద్యావ్యవస్థ మీద మీకు కలిగిన అభిప్రాయం?...ఎనిమిది, తొమ్మిది తరగతుల నుంచి వారికి ఆసక్తి ఉన్న వృత్తివిద్యలను నేర్పించే విధంగా విద్యావిధానం మారాలి. అలాగే జాబ్ మార్కెట్‌కు అనుగుణంగా సిలబస్‌లో మార్పు తీసుకురావడం అనేది నిరంతర ప్రక్రియగా ఉండాలి. గొప్ప అధికారం ఉన్న ఉద్యోగం కదా! సివిల్స్ విద్యార్థులకు మీ సూచన..? ఇందులో అధికారం ఉంటుంది. కానీ అధికారం కోసం ఉద్యోగం కాకూడదు. ఇది పవర్ ఉన్న ఉద్యోగం అనుకోరాదు, దేశాన్ని పవర్‌ఫుల్‌గా మార్చగలిగే అవకాశం ఉన్న ఉద్యోగం అనుకోవాలి. - వి.ఎం.ఆర్ -
వెటర్నరీ వర్సిటీ వీసీగా మాలకొండయ్యకు అదనపు బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: పి.వి.నర్సింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్‌గా వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి సంబంధిత ఫైలుపై సంతకం చేసినట్లు సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. తెలంగాణ ఏర్పడిన నేపథ్యంలో వెటర్నరీ యూనివర్సిటీని విభజించారు. యూని వర్సిటీ పూర్తిస్థాయిలో పనిచేయడానికి వీసీ నియామకం అవసరమని భావించి ముఖ్యమంత్రి ఈ నియామకం చేపట్టారని ఆ ప్రకటనలో వెల్లడించారు. -
తేమ శాతం ఆధారంగా మద్దతు ధరలు
సీసీఐ, మార్క్ఫెడ్లకు పూనం మాలకొండయ్య ఆదేశం హైదరాబాద్: పంటలో ఏర్పడిన తేమ శాతం ఆధారంగా పత్తికి మద్దతు ధరలు చెల్లిస్తున్నామని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య పేర్కొన్నారు. కనీస మద్దతు ధరల అమలుపై ఆమె ఆదివారం సంబంధిత మార్కెటింగ్, వ్యవసాయ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మద్దతు ధర చెల్లింపులపై సమీక్షించారు. ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘మద్దతేది... మహాప్రభో’ కథనానికి స్పందించిన మాలకొండయ్య ఈ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. 8 శాతం తేమ ఉంటే రూ. 4,050 మద్దతు ధర చెల్లిస్తున్నామన్నారు. 9 శాతం ఉంటే రూ. 4,009.50, 10 శాతం ఉంటే రూ. 3,969, 11 శాతం ఉంటే రూ. 3,929.50, 12 శాతం ఉంటే రూ. 3,888 చెల్లింపులు జరుగుతున్నాయన్నారు. తెలంగాణలో 16.76 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేయగా 205.77 లక్షల క్వింటాళ్లు ఉత్పత్తి అవుతుందని అంచనా వేశామని తెలిపారు. పత్తి, మొక్కజొన్న, వరి రైతులకు కనీస మద్దతు ధర చెల్లించే విషయంలో ధాన్యం అయిపోయేంత వరకు కొనుగోళ్లు చేయాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), మార్క్‌ఫెడ్ సహా వివిధ కొనుగోలు సంస్థలను మాలకొండయ్య ఆదేశించారు. -
మహిళల భద్ర తా చర్యలు అమలుచేయాలి
అధికారులకు మహిళల రక్షణ కమిటీ చైర్మన్ పూనం మాలకొండయ్య ఆదేశం సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రతకు తీసుకునే చర్యలు అమలయ్యేలా చూడాలని రాష్ట్ర మహిళా భద్రత, రక్షణ కమిటీ చైర్మన్ పూనం మాలకొండయ్య సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన తొలి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యేలు కొండా సురేఖ, గొంగిడి సునీత, శోభ, కమిటీ కన్వీనర్ సునీల్ శర్మ, సభ్యులు శైలజా రామయ్యర్, చారుసిన్హా, సౌమ్యా మిశ్రా, స్వాతి లక్రా, ఆమ్రపాలి పాల్గొన్నారు. మహిళల భద్రత విషయంలో కచ్చితమైన చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని మహిళా ఎమ్మెల్యేలు కోరారు. మహిళల కేసుల కోసం జిల్లాల్లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు, మొబైల్ కోర్టులు ఏర్పాటు చేయాలని,ప్రతి జిల్లాలో మహిళా పోలీ స్ స్టేషన్ల సంఖ్య పెంచాలని, పాఠశాలల విద్యార్థినులకు డ్రెస్‌కోడ్ పెట్టాలని సూచనలు చేశారు. డ్వాక్రా, స్వయంసహాయక బృందాలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని, భార్యాభర్తలు ఉద్యోగస్తులైతే ఇద్దరూ ఒకే ప్రాంతంలో పనిచేసేలా అవకాశం కల్పించాలని అన్నారు. భ్రూణహత్యలు నివారించాలి భ్రూణహత్యల నివారణకు చర్యలు తీసుకోవాలని మహిళా ఎమ్మెల్యేలు సూచించారు. పుట్టబోయే శిశువు ఎవరనేది నిర్థారిస్తున్న స్కానింగ్‌సెంటర్ల అనుమతిని రద్దు చేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత కోరారు. టీనేజ్ అమ్మాయిలకు విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని, స్వయంరక్షణ (సెల్ ్ఫడిఫెన్స్)లో శిక్షణ ఇవ్వాలని అన్నారు. గృహహింసపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినపుడు అక్కడ వారిని సహృదయంగా ఆదరించాలని, ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళా పోలీసుల్ని ఉంచాలని, ఈవ్‌టీజింగ్, గృహహింస విషయంలో 2, 3 రోజుల్లోనే చర్య తీసుకునేలా చూడాలని ఆమె సూచించారు. మహిళల భద్రతకు ప్రాధాన్యం: మంత్రి మహేందర్‌రెడ్డి తమ ప్రభుత్వం మహిళల భద్రతకు ప్రాధాన్యతను ఇస్తున్నదని, ప్రధానంగాా ఆర్టీసి బస్సులలో మహిళల భద్రతకు ప్రత్యేకచర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పి. మహేందర్‌రెడ్డి తె లిపారు. ఆర్టీసి బస్సుల్లో మహిళల రక్షణకు సంబంధించి జరిగిన చర్చలో మంత్రి పి. మహేందర్‌రెడ్డితో పాటు ఆర్టీసి ఎండీ పూర్ణచందర్రావు, జేఎండీ రమణారావు, ఓఎస్డి సుధాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జంటనగరాల్లోని 2,600 బస్సు సర్వీసులకు 20 రోజుల్లో ప్రత్యేక కంపార్ట్మెంట్లు ఏర్పాటుచేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ఈ విధంగా చేయడం వల్ల సంస్థపై రూ.3.92 కోట్ల భారం పడుతుందని, ఇటు, అటు రెండు సీట్ల మేర స్థలం పోతుందని ఎండీ పూర్ణచందర్రావు పేర్కొనగా, ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఇచ్చిన మాట మేరకు ప్రత్యేక కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేయాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు. బస్సులు, బస్టాండులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెంచుతున్నట్లు చెప్పారు. -
మన రైతుల ఆవిష్కరణలు పనికిరావా?
రైతాంగాన్ని కుంగదీస్తున్న ముఖ్య సమస్యల్లో కూలీల కొరత ఒకటి. రైతుల ఆర్థిక స్తోమతకు, వారి ప్రత్యేక అవసరాలకు తగిన యంత్ర పరికరాలను అందుబాటులోకి తేవడం ముఖ్యం. ప్రస్తుతం మార్కెట్లోని యంత్ర పరికరాల్లో అత్యధికం ఆర్థిక స్తోమత ఉన్న పెద్ద, మధ్యతరగతి రైతులకు అందుబాటులో ఉండేవే. చిన్న, సన్నకారు రైతులు సొంతంగా కొని తమ చిన్న కమతాల్లో ఉపయోగించుకోగలిగే చిన్నతరహా యంత్ర పరికరాలను, పనిముట్లను.. తక్కువ ధరకు అందుబాటులోకి తేవాలి. ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇటీవల నిర్వహించిన సమావేశంలో యువ రైతులు ఇదే కోరారు. చైనా నుంచి ఇటువంటి యంత్ర పరికరాలు, పనిముట్ల ప్రొటోటైప్‌లను దిగుమతి చేసుకొని, స్థానికంగా వాటిని తయారుచేసి రైతులకిస్తామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఈ సందర్భంగా చెప్పారు. అయితే, దేశవ్యాప్తంగా మట్టిలో ఉన్న మాణిక్యాల్లాంటి మన ‘రైతు శాస్త్రవేత్త’లు సొంత తెలివితేటలు, సృజనాత్మకతలను కలబోసి ఆవిష్కరించిన యంత్ర పరికరాలెన్నో అందుబాటులో ఉన్న విషయమై ఎవరూ గుర్తుకు రాలేదు! ఇటువంటి అమూల్యమైన మన ‘రైతు శాస్త్రవేత్త’ల ఆవిష్కరణలను ‘సాక్షి’ దినపత్రిక ‘సాగుబడి’ పేజీ ద్వారా సామాజిక బాధ్యతతో వెలుగులోకి తెచ్చింది.. తెస్తోంది! అవసరమైన యంత్ర పరికరాలను చైనా నుంచైనా తెచ్చుకోవడంలో తప్పులేదు. అయితే, అంతకన్నా ముందు మన ‘రైతు శాస్త్రవేత్త’ల ఆవిష్కరణలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం సముచితం. రైతులోకం నుంచి అపూర్వ స్పందన రైతుల కోసం రైతులే స్వయంగా రూపొందించిన సృజనశీలమైన ఈ యంత్ర పరికరాలు స్థానిక వ్యవసాయ అవసరాలకు ఎంతో అనువైనవి. తక్కువ పెట్టుబడితో తయారు చేసుకోదగినవి. వీటిలో చాలా యంత్ర పరికరాలను కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖకు అనుబంధంగా ఉన్న నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్.ఐ.ఎఫ్.) గుర్తించింది. ‘హనీబీ నెట్వర్క్’, ‘పల్లెసృజన’ వంటి సంస్థల తోడ్పాటుతో ఈ అజ్ఞాత సూర్యుల్లో కొందరు రాష్ట్రపతి పురస్కారాలనూ అందుకున్నారు. ‘సాక్షి’ సాగుబడి పేజీ ద్వారా ఈ ఆవిష్కరణల గురించి తెలుసుకున్న రైతులోకం అపూర్వ రీతిలో స్పందించడమే వీటి ఆవశ్యకతను తెలియజెప్తున్నది. మచ్చుకు కొన్ని ఆవిష్కరణల వివరాలను టూకీగా ఇక్కడ పొందుపరుస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఇప్పటికైనా ఇటువంటి అమూల్యమైన ఆవిష్కరణలపై దృష్టి సారిస్తాయనుకోవడం అత్యాశ కాదేమో.. గ్రామీణ ఆవిష్కరణలకు ‘నారమ్’ సలామ్! భారతదేశపు వ్యవసాయ రంగంలో నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటున్న గ్రామీణ సృజనాత్మక ఆవిష్కరణల విప్లవాన్ని వ్యవసాయ శాస్త్రవేత్తల దృష్టికి తేవడానికి హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్(నారమ్) సంస్థ ఇటీవల ఒక సంకలనాన్ని ప్రచురించింది. 13 మంది రైతులు, ఇతర గ్రామీణ వృత్తిదారుల అమూల్యమైన సృజనాత్మక ఆవిష్కరణల గురించి ఈ పుస్తకం వివరిస్తుంది. సీనియర్ మహిళా శాస్త్రవేత్తలు డా. ఆర్. కల్పనా శాస్త్రి, ఓ.కె. తార సంయుక్తంగా ‘రూరల్ ఇన్నోవేషన్స్ ః గ్రాస్రూట్స్’ పేరిట ఈ సంకలనాన్ని వెలువరించారు. గ్రామీణ ఇన్నోవేటర్లు దేశ వ్యవసాయాభ్యుదయంలో ఒక ముఖ్యమైన పాత్రను నిర్వహిస్తున్నారని చాటిచెప్పటమే ఈ పుస్తకం ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు కూడా. గ్రామాల్లోని ఈ సృజనశీలురకున్న సహజ, సంప్రదాయ, క్రియాశీల జ్ఞానాన్ని.. సమస్యల అవగాహనా శక్తిని వ్యవసాయ పరిశోధనాశాలలు, శాస్త్రజ్ఞులు గుర్తించి శాస్త్రీయ పరిశోధనకు వినియోగించుకోవాలని ఆకాంక్షించారు. శాస్త్రవేత్తలకు, రైతు శాస్త్రవేత్తలకు మధ్య అనుసంధానం ఏర్పడడానికి ఈ గ్రంథం ఉపకరిస్తుందని ఆశిద్దాం. మహిపాల్ వీడర్‌తో కలుపు కష్టాలకు చెక్! కూరగాయ పంటలు, ఉద్యాన తోటల్లో కలుపు నివారణ రైతులకు తీవ్ర సమస్యగా మారింది. ఈ సమస్య పరిష్కారానికి మెట్ట పంటల్లో చేతితో నడిపే వీడర్లను తయారు చేశాడు కడివెండి మహిపాల్‌చారి. ఆయన స్వగ్రామం వరంగల్ జిల్లా పరకాల మండలంలోని సీతారాంపురం. రూ. 28 వేల ధరలో కూరగాయ పంటలకు 4 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన వీడర్‌ను.. పత్తి, మామిడి, అరటి, మల్బరీ తదితర తోటలకు 5 హెచ్‌పీ వీడర్‌ను తయారు చేశాడు. లీటరు డీజిల్‌తో 3 గంటల్లో ఎకరం పొలంలో నిలువు, అడ్డం దున్నేయవచ్చు. ఇప్పటికి 62 మంది రైతులకు తయారు చేసిచ్చాడు. ఆ రైతు భూమి తీరుకు అనుగుణంగా వీడర్‌ను తయారుచేయడం విశేషం. ప్రభుత్వం తలచుకుంటే వీటిని పెద్ద సంఖ్యలో రైతులకు అందుబాటులోకి తేవచ్చు. తెల్లకుసుమ పూరేకులను సేకరించే చేతి పరికరాన్ని కూడా రూపొందించాడు. మహిపాల్ మొబైల్: 98669 22168 (‘సాగుబడి’ కథనం తేదీ: 17-02-2014) వాయువేగం.. సుభానీ స్ప్రేయర్లు! అత్యంత వేగంగా పొలాలకు పురుగుమందులు/ జీవామృతం / కషాయాలు పిచికారీ చేసే స్ప్రేయర్లను తయారు చేసిన సృజనశీలి సయ్యద్ సుభానీ. కరువు కాలంలో పంటలపై నీటిని పిచికారీ చేయడానికి కూడా ఈ స్ప్రేయర్లు ఉపకరిస్తాయి. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలోని నాగభైరవపాలెం. సుభానీ వృత్తిరీత్యా వడ్రంగి. ట్రాక్టర్‌కు బిగించి శరవేగంతో పని పూర్తిచేసేందుకు 50 నుంచి 100 అడుగుల వెడల్పు రెక్కలు కలిగిన వేర్వేరు స్ప్రేయర్లను రూపొందించాడు. భారీ కమతాలున్న రైతుల కోసం పది నిమిషాల్లో హెక్టారులో పిచికారీని పూర్తి చేయగల స్ప్రేయర్ కూడా ఇందులో ఉంది. చిన్న, సన్నకారు రైతుల కోసం.. మోటారు సైకిల్‌కు అమర్చి 30 అడుగుల వెడల్పున పిచికారీ చేసే స్ప్రేయర్‌ను ఇటీవల తయారు చేశాడు. మహిళలు కూడా వినియోగించడానికి అనువుగా దీన్ని తయారు చేయడం విశేషం. సుభానీ మొబైల్: 98486 13687 (‘సాగుబడి’ కథనం తేదీ: 10-03-2014) గురవయ్య గొర్రు కూలీల కొరత సమస్యకు పరిష్కారం వెదుకుతూ రైతు తొండపి గురవయ్య అద్భుతమైన గొర్రును రూపొందించాడు. ఆయన స్వగ్రామం గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలోని రూపెనగుంట్ల. ఖరీఫ్‌లో వరి కోసిన వెంటనే మళ్లీ దుక్కి చేయకుండా.. తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో రెండో పంట వేయడానికి రైతులకు ఈ గొర్రు ఎంతో ఉపయోగపడుతోంది. విత్తనం, ఎరువు, కలుపు మందులను ఏకకాలంలో వేయడం దీని ప్రత్యేకత. విత్తనాన్ని ఒకటిన్నర సెంటీమీటర్ల దూరంలో వేసి, మట్టి కప్పుతుంది. ఐదో తరగతి చదివి 40 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న గురవయ్య చేతల్లో మెరిసిన సృజనాత్మకత శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరచింది. బాపట్ల, లాం వ్యవసాయ శాస్త్రవేత్తలతోపాటు రైతుల సూచనలు తీసుకొని దీన్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దడం విశేషం. రైతులు, ‘ఆత్మ’, నాబార్డు నిపుణులూ జేజేలు పలికారు. రూ. 3 లక్షల నగదుతో కూడిన ప్రతిష్టాత్మక ‘శాంసంగ్ ఇన్నోవేషన్ కోషంట్’ అవార్డు సహా అనేక అవార్డులు గురవయ్యను వెతుక్కుంటూ వచ్చాయి. ప్రభుత్వమే దీన్ని తయారుచేసి సబ్సిడీపై రైతులకివ్వాలి. గురవయ్య మొబైల్: 99890 87931 (‘సాగుబడి’ కథనం తేదీ: 27-01-2014) బోర్లు రెండు.. మోటారు ఒకటే! విద్యుత్ కొరత రైతుల మూలుగలు పీల్చేస్తోంది. ఇటువంటి తరుణంలో రెండు బోర్లున్న రైతు 50% మేరకు విద్యుత్‌ను ఆదా చేసుకోవడానికి ఉపకరించే అద్భుత టెక్నిక్‌ను కనుగొన్నాడు పందిరి పుల్లారెడ్డి. పదో తరగతి వరకు చదువుకొని వ్యవసాయం చేస్తున్న ఆయన స్వగ్రామం నల్లగొండ జిల్లా మునగాల మండలంలోని ముకుందాపురం. ఉన్న రెండు బోర్లలో నీరు అరకొరగా వస్తున్న నేపథ్యంలో ఈ రెంటిని కలిపి ఒకే మోటారుతో తోడాలన్న సృజనాత్మక ఆలోచన.. గొప్ప ఆవిష్కరణకు కారణభూతమైంది. అరకొరగా నీళ్లున్న రెండు బోర్లను కలిపి ఒకే మోటారుతో నడిపించడం వల్ల విద్యుత్ ఖర్చు, మోటార్లపై పెట్టుబడి సగానికి సగం తగ్గింది. ‘సాక్షి’ ఈ టెక్నిక్‌ను వెలుగులోకి తేవడంతో వేలాది మంది రైతులు పుల్లారెడ్డిని సంప్రదించారు. కొందరు ఆయన సేవలను వినియోగిం చుకున్నారు. 50% వ్యవసాయ విద్యుత్‌ను పొదుపు చేస్తున్న జ్ఞాని పుల్లారెడ్డి. ప్రభుత్వం తగిన రాయల్టీ చెల్లించి.. యువ రైతులకు ఈ టెక్నిక్ నేర్పించవచ్చు. పుల్లారెడ్డి మొబైల్: 9963239182 (‘సాగుబడి’ కథనం తేదీ: 3-3-2014) రాథోడ్ సైకిల్ పంపు! చెరువు, నీటి గుంట, కాలువల్లో నీరుండి.. పక్కనే చేను ఉన్నా నీటిని తోడుకోవాలంటే ఆయిల్ ఇంజినో, కరెంటు మోటారో ఉండాల్సిందే. చిన్న, సన్నకారు రైతులకు వీటిని సమకూర్చుకోవడం తలకుమించిన భారమే. ఇంజిన్, మోటారు, విద్యుత్ అవసరం లేకుండానే పంటకు నీరు అందించుకునేందుకు ఉపయోగపడే సైకిల్ పంపును తయారు చేశాడు ఆదివాసీ రైతు విక్రమ్ రాథోడ్. దీనిపైన కూర్చొని సైకిల్‌ను తొక్కినట్లే తొక్కుతూ ఉంటే పొలంలోకి నీరు పారుతుంది. ఎన్నడూ బడికెళ్లి ఎరుగని రాథోడ్‌కు నాలుగెకరాల చెలక(మెట్ట) భూమి ఉంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం జైత్రాంతండా నవాస్‌పూర్ ఆయన స్వగ్రామం. ఐటీడీఏ, పల్లెసృజన, హనీబీ నెట్వర్క్ తోడ్పాటుతో ఈ విషయం నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్(ఎన్ఐఎఫ్) దృష్టికి వెళ్లడంతో రాథోడ్‌కు 2003లోనే పేటెంట్ వచ్చింది. అప్పటి రాష్ట్రపతి కలామ్ నుంచి అవార్డు అందుకున్నాడు. ఈ సైకిల్ పంపులను పెద్దసంఖ్యలో ఉత్పత్తి చేయడానికి రాథోడ్‌కు ఏ బ్యాంకూ రుణం ఇవ్వలేదు. ప్రభుత్వం పట్టించుకోవాలి. విక్రమ్ రాథోడ్ మొబైల్: 98660 01678 (‘సాగుబడి’ కథనం తేదీ: 20-01-2014) శివప్రసాద్ ఆటో ఇంజిన్! చైనా పంపుసెట్లు రిపేరు చేసే అలవాటున్న రామ శివప్రసాద్ రైతుల బాధలు చూడలేక తక్కువ ఖర్చులో శక్తివంతమైన ఆయిల్ ఇంజిన్‌ను రూపొందించాడు. శివప్రసాద్ స్వస్థలం వరంగల్ జిల్లా శాయంపేట. బావులు, కాలువల్లో నుంచి తరచూ రిపేర్‌కొచ్చే చైనా పంపుసెట్లతో నీటిని తోడుకునే రైతులు నిత్యం ఎదుర్కొంటున్న ఇబ్బందులు తీర్చడానికి ఈ ఆవిష్కరణ పనికొచ్చింది. 24 గంటలు నడచినా వేడెక్కకుండా ఉండేలా ఆటో ఇంజిన్‌ను వాడి దీన్ని తయారు చేశాడు. ఇది 7.5 హెచ్‌పీ ఇంజిన్‌కన్నా ఎక్కువ నీటిని తోడుతుంది. గంటన్నర, 2 గంటలపాటు లీటర్ డీజిల్‌తో నడుస్తుంది. రూ. 22 వేల ఖర్చుతోనే ఇది తయారవుతుంది. దీనికి డైనమో బిగించి విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటే.. ఆ విద్యుత్‌తో రెండు మోటార్లు నడపొచ్చంటున్నాడు శివప్రసాద్. ప్రభుత్వం దృష్టిపెట్టి వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేయిస్తే మేలు. శివప్రసాద్ మొబైల్ : 95054 08937 (‘సాగుబడి’ కథనం తేదీ: 03-02-2014) రైతుల ప్రజ్ఞను సాంకేతికతకు జోడించాలి! రైతుల కోసం రైతులు, గ్రామీణ వృత్తిదారులు కనుగొన్న సృజనాత్మక యంత్ర పరికరాలు అట్టడుగున ఉన్న చిన్న కమతాలున్న చిన్న, సన్నకారు రైతుల అవసరాలను తీర్చడానికి బాగా ఉపయోగపడతాయి. ప్రజల ప్రజ్ఞ, జ్ఞానం మీద ఆధారపడిన పరిష్కారాలను పాలకులు విస్మరించడం వల్ల సమాజాభివృద్ధి కుంటుపడింది. ప్రభుత్వ పరిశోధనాశాలలు, ప్రైవేటు పరిశోధనా సంస్థలు చిన్న, సన్నకారు రైతుల సమస్యలను పట్టించుకోవటం లేదు. పరిశోధనలన్నీ పారిశ్రామిక క్షేత్రం వైపు, ధనం వెచ్చించే తాహతు కలిగిన వర్గాలవైపే మొగ్గు చూపుతున్నాయి. దీంతో కోట్లకొద్దీ చిన్న, సన్నకారు రైతులు, గ్రామీణులు(కనీసం 60% మంది) సమస్యలతో జీవిస్తున్నారు. పల్లె జ్ఞానాన్ని ప్రభుత్వాలు గుర్తించి, ప్రోత్సహించాలి. సాంకేతికతకు రైతుల ప్రజ్ఞను తోడుచేస్తే వారి అభివృద్ధి సునాయాసంగా సాధ్యమవుతుంది. బడుగు రైతులకు అవసరమైన యంత్ర పరికరాలకు, అందుబాటులోకి వస్తున్న యంత్ర పరికరాలకు మధ్య ఎంతో అంతరం ఉంది. దీన్ని గుర్తించి పూరించడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి. అమూల్యమైన గ్రామీణ ఇన్నోవేషన్లను విస్తృతంగా వినియోగంలోకి తేవాలి. - బ్రిగేడియర్(రిటైర్డ్) పి. గణేశం (98660 01678), బీడీఎల్ మాజీ డెరైక్టర్, అధ్యక్షులు, హనీబీ ఏపీ-పల్లెసృజన -
వ్యవసాయంలో దూర విద్య కోర్సు
దేశంలోనే తొలిసారిగా... యువరైతులను ప్రోత్సహించడమే లక్ష్యం వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య వెల్లడి రాజేంద్రనగర్ : చదువుకున్న యువరైతులకు వ్యవసాయరంగంలో వస్తోన్న ఆధునిక విధానాలు, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించే లక్ష్యంతో దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాలలో స్వల్పకాలిక దూరవిద్య కోర్సులను ప్రారంభిస్తున్నామని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. శనివారం రాజేంద్రనగర్ ఈఈఐ కాన్ఫరెన్స్ హాల్లో కోర్సు పాఠ్యాంశాల రూపకల్పనపై 9 జిల్లాల యువరైతులతో ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి మూడు నెలలపాటు ఉండే మొదటిబ్యాచ్ శిక్షణ కార్యక్రమాన్ని దూరవిద్య పద్ధతితో నిర్వహించనున్నామన్నారు. శిక్షణ కార్యక్రమంలో చేర్చాల్సిన అంశాలకు సంబంధించి ఆమె యువరైతుల నుంచి సూచనలను స్వీకరించారు. ప్రధానంగా వ్యవసాయ యాంత్రీకరణ, విత్తనోత్పత్తి, ఉద్యాన పంటలు, పూలతోటలసాగు, వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగువిధానాలలో మార్పులు, భూసార పరీక్షల ప్రాధాన్యత, తుపంర, బిందుసేద్యం నిర్వహణ, నీటియాజమాన్యం, పురుగుమందులు, ఎరువుల యాజమాన్యం, చేపలపెంపకం, పశుపోషణలో అనుసరించాల్సిన ఆధునిక పద్ధతులు తదితర అంశాలపై శిక్షణ అవసరమని యువరైతులు ఆమెకు వివరించారు. వ్యవసాయరంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని మొబైల్ అప్లికేషన్లు, సమాచార, ప్రసారమాధ్యమాల ద్వారా రైతులకు అందివ్వాలని వారు కోరారు. కాగా సర్టిఫికెట్ కోర్సును పూర్తిచేసినవారికి ఎలాంటి ఉద్యోగావకాశాలు లభించవని ఆమె స్పష్టం చేశారు. మూడు నెలల శిక్షణ కార్యక్రమానికి సంబంధించి పాఠ్యాంశాలను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ర్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందిస్తుందన్నారు. రానున్న రోజుల్లో యంగ్ఫార్మర్స్ వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించే చేస్తున్నామన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్యేకాధికారి డాక్టర్ వి. ప్రవీణ్‌రావు మాట్లాడుతూ... వ్యవసాయ సాగుపద్ధతులపై రైతులకు నైపుణ్యం పెంపొందించడానికి ఈ శిక్షణ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. కోర్సు రూపకల్పనకు సంబంధించిన అంశాలను వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ డి.రాజిరెడ్డి వివరించారు. అంతకుముందు తొమ్మిది జిల్లాల నుంచి వచ్చన 77 మంది యువరైతులను 5 గ్రూపులుగా విభజించి పాఠ్యాంశాలపై వారినుంచి సలహాలను స్వీకరించారు. -
అవగాహనతో అఘాయిత్యాలను అరికడదాం
మహిళా భద్రతా కమిటీ చైర్మన్ పూనం మాలకొండయ్య హైదరాబాద్: ‘మహిళలపై వేధింపులు, అత్యాచారాలను నిరోధించేందుకు ఎన్నో చట్టాలున్నా అకృత్యాలకు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. మహిళలు తమకోసమే ఏర్పాటైన చట్టాలపై అవగాహన పెంచుకొంటేనే అఘాయిత్యాలను అరికట్టగలుగుతాం’ అని మహిళా భద్రతా క మిటీ చైర్మన్ పూనం మాలకొండయ్య అన్నారు. మహిళా భద్రతా కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళా కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, పట్టణ మహిళా సమాఖ్యల ప్రతినిధులు పాల్గొన్నారు. పూనం మాల కొండయ్య మాట్లాడుతూ.. మెప్మా గ్రూపులతో కమ్యూనిటీ సెంటర్లలో మహిళలకు అవగాహన కల్పిస్తామన్నారు. మహిళల భద్రతకోసం తాము ప్రభుత్వానికి సిఫారసులు చేస్తామన్నారు. భద్రతా కమిటీ సభ్యులైన ఐఏఎస్ అధికారులు శైలజా రామయ్యర్, సునీల్‌శర్మ, ఐపీఎస్ అధికారులు స్వాతి లక్రా, సౌమ్య మిశ్రా, మెప్మా ఎండీ అనితా రామచంద్రన్ సమావేశానికి హాజరయ్యారు. -
మహిళల భద్రతపై 20న నివేదిక
పోలీసు శాఖలోని అన్ని విభాగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అవసరం 60 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక చైర్పర్సన్ పూనం మాలకొండయ్య హైదరాబాద్: మహిళల భద్రతపై తాము రూపొందించిన ప్రాథమిక నివేదికను ఈ నెల 20న ప్రభుత్వానికి అందిస్తున్నట్లు దీనిపై ఏర్పాటు చేసిన కమిటీ వివరించింది. జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సోమవారం ఈ బృందం హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని పలు పోలీస్స్టేషన్లకు చెందిన ఏసీపీ, ఇన్స్పెక్టర్, ఎస్సైలతో కమిటీ సభ్యులు సమావేశమయ్యారు.అనంతరం సమావేశంలో చర్చించిన పలు వివరాలను కమిటీ చైర్పర్సన్ పూనం మాలకొండయ్య విలేకరులకు వివరించారు. నగరంలోని చాలా పోలీస్స్టేషన్లలో చీటింగ్కేసులతోపాటు ప్రేమ, పెళ్లికి సంబంధించి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు. ఐపీసీ సెక్షన్ 470, 498కి సంబంధించిన కేసులు ఉంటున్నాయన్నారు. వీటికి అడ్డుకట్ట వేసేందుకు వివాహాల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేయాలని పలువురు సూచించారన్నారు. ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో మహిళా పోలీస్‌స్టేషన్‌తోపాటు, చైల్డ్ హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటుచేయాలన్నారు. పోలీసు శాఖలోని అన్ని విభాగాలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సూచించారు. ఎన్ఆర్ఐ చీటింగ్ కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంటున్నాయని వీటిలో నిందితులు విదేశాలకు వెళ్లి తప్పించుకోకుండా ప్రత్యేక కమిటీని వేయాలన్నారు. అత్యాచార కేసులలో కేసుల విచారణ వేగిరపరచాలని, వీటికి సంబంధించి ఆసుపత్రులందించే రిపోర్టులు ఆలస్యమవుతున్నాయన్నారు. ఈ నెల 20 వరకు నిర్వహించే సమీక్షల ఆధారంగా రూపొందించిన నివేదికను ప్రభుత్వానికి అందిస్తామన్నారు. ఇందులో తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై వివరిస్తామన్నారు. మిగిలిన రిపోర్టును 60 రోజుల్లో అందిస్తామని పూనం మాలకొండయ్య వివరించారు. -
చట్టాలు కఠినతరం చేయాలి
రాష్ట్ర మహిళా భద్రతా కమిటీ చైర్మన్ పూనం మాలకొండయ్య హైదరాబాద్: మహిళలపై వేధింపులు తగ్గాలంటే పోకిరీల పట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర మహిళా భద్రతాకమిటీ చైర్మన్, సీనియర్ ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్య అన్నారు. శుక్రవారం ఆమె నగరంలోని వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థినులతో బేగంపేట మహిళా డిగ్రీ కళాశాలలో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం పూనం మాలకొండయ్య మీడియాతో మాట్లాడుతూ... బస్‌స్టాప్, రైల్వే స్టేషన్లలో పోకిరీల వేధింపులు నిత్యకృత్యంగా మారాయన్నారు. ఆటోవాలాలు, కొన్ని రూట్లలో బస్ కండక్టర్ల ప్రవర్తన అసభ్యకరంగా ఉంటోందన్నారు. మహిళల రక్షణ కోసం నగరంలో ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు. వేధింపులకు పాల్పడే వారిని శిక్షించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు. మహిళా కళాశాలల వద్ద పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. నిర్భయ వంటి చట్టాలపై యువకులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. మహిళల భద్రతపై 18వ తేదీలోపు సలహాలు, సూచనలను ఠీఛిఛీటఛ్టిజ2014ఃజఝ్చజీ. ఛిౌఝ కు మెయిల్ చేయాలని సూచించారు.కమిటీ సభ్యులు సౌమ్యామిశ్రా, స్వాతిలక్రా, చారుసిన్హా, శైలజారామయ్యర్ పాల్గొన్నారు.