private educational institutions
-
బాలిక అనుమానాస్పద మృతితో... రణరంగమైన స్కూలు
సాక్షి, చెన్నై: ప్రైవేటు విద్యా సంస్థలో ఓ బాలిక అనుమానాస్పద మృతి తమిళనాట తీవ్ర ఉద్రిక్తతకు, ఆస్తుల విధ్వంసానికి దారి తీసింది. కాళ్లకురిచ్చి జిల్లా చిన్న సేలం సమీపంలోని కన్నియమూరు గ్రామంలో ఓ ప్రైవేటు ఇంటర్నేషనల్ స్కూల్లో శ్రీమతి (17) అనే బాలిక ప్లస్–2 చదువుతోంది. రెండు రోజుల క్రితం హాస్టల్ భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రెండు రోజులుగా కుటుంబీకులు, బంధువులు అక్కడే శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. ఆదివారం గుర్తు తెలియని యువకులు వందలాదిగా చొరబడి విధ్వంసానికి దిగారు. దాంతో డీఐజీ పాండియన్‌తో పాటు 20 మంది పోలీసులు గాయపడ్డారు. మంత్రులు, డీజీపీ, హోం శాఖ కార్యదర్శి వచ్చి వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు! -
టెన్త్ ఫలితాల్లో ర్యాంకుల ప్రకటనలపై నిషేధం
సాక్షి, అమరావతి: టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలపై విద్యార్థులకు ర్యాంకులు అంటూ ప్రకటనలు చేసే ప్రైవేటు విద్యాసంస్థలు, ట్యుటోరియల్ సంస్థలపై చర్యలు తప్పవని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించి ప్రకటనలు చేస్తే ఆయా సంస్థల యాజమాన్యాలు, ఇతరులకు మూడేళ్లనుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారని స్పష్టం చేసింది. ఈమేరకు విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రయోజనాల పరిరక్షణ దృష్ట్యా ఎస్సెస్సీ పబ్లిక్ పరీక్షల్లో ర్యాంకులతో ప్రకటనలు జారీచేయడాన్ని నిషేధిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ బుధవారం 83వ నంబరు జీవో జారీచేశారు. ఎస్సెస్సీ పబ్లిక్ పరీక్షల్లో గతంలో గ్రేడింగ్ విధానంలో ఫలితాలను ప్రకటించే వారు. 2020 నుంచి గ్రేడ్లకు బదులు విద్యార్థులకు మార్కులు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు, ట్యుటోరియల్ విద్యాసంస్థలు విద్యార్థులకు ర్యాంకులను ఆపాదిస్తూ తమ సంస్థకే ఉత్తమ ర్యాంకులు, అత్యధిక ర్యాంకులు వచ్చాయంటూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో తప్పుడు ప్రకటనలు చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులను పక్కదారి పట్టిస్తున్నాయి. ఇలాంటి అక్రమాలతో ఆయా విద్యాసంస్థలు విద్యార్థులు, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించకుండా చర్యలు తీసుకోవాలని, వీటివల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతారని పలువురు పాఠశాల విద్యాశాఖకు వినతులు ఇచ్చారు. ఏపీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్–1997 ప్రకారం ఇటువంటి మాల్‌ప్రాక్టీస్, తప్పుడు ప్రకటనలను చేసే వారికి ఏడేళ్ల వరకు జైలు, రూ.లక్ష వరకు జరిమానా విధించనున్నారు. టెన్త్ పరీక్షల్లో గ్రేడ్లకు బదులు మార్కులతో ఫలితాలను ప్రకటించనున్నందున ఆయా సంస్థలు ర్యాంకులతో తప్పుడు ప్రకటనలు చేయరాదని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. విద్యాసంస్థలు ఏ రూపంలోను, ఏ స్థాయిలోను ర్యాంకులతో ఇలాంటి ప్రకటనలు చేయడానికి వీల్లేదని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను ఆదేశించారు. ఈ వారంలోనే ఫలితాలు ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 9వ తేదీవరకు నిర్వహించిన టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఈవారంలోనే విడుదలయ్యే అవకాశముంది. మూల్యాంకనాన్ని ముగించిన ఎస్సెస్సీ బోర్డు ఆ వివరాల కంప్యూటరీకరణ వంటి తదుపరి కార్యక్రమాల్లో నిమగ్నమైంది. టెన్త్ ఫలితాలను పదో తేదీలోపు విడుదల చేయాలన్న అభిప్రాయంతో ఉన్న బోర్డు వాటిని ఈ వారంలోనే ప్రకటించేలా చర్యలు చేపట్టింది. -
స్వాధీనానికి ఒత్తిడి చేయడం లేదు
సాక్షి, అమరావతి: ప్రైవేటు ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వ స్వాధీనం చేయాలని ఏ విద్యాసంస్థను ఒత్తిడి చేయడంలేదని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. విద్యాసంస్థలను, సిబ్బందిని స్వాధీనం చేయకపోయినా కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ కొనసాగుతుందంటూ ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన హామీని హైకోర్టు మరికొన్ని విద్యాసంస్థల విషయంలోనూ రికార్డ్ చేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వ స్వాధీనం చేయాలని ఎవరైనా ఒత్తిడి తెస్తే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని, ఒత్తిడి తెచ్చినవారి వివరాలను తమ ముందుంచాలని విద్యాసంస్థల న్యాయవాదులకు ధర్మాసనం సూచించింది. ఒత్తిడి తెచ్చిన వారిపై చర్యలకు తాము ఆదేశాలిస్తామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రైవేటుగా నిర్వహించుకోవడం లేదా వాటిని తమకు స్వాధీనం చేయాలంటూ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఆర్డినెన్స్, తదనుగుణ జీవోలను సవాలు చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలపై గురువారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. -
స్వాధీనం చేయకపోయినా గ్రాంట్ కొనసాగుతుంది
సాక్షి, అమరావతి: ప్రైవేటు ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని ఏ విద్యాసంస్థను కూడా ఒత్తిడి చేయడంగానీ, ఈ విషయంలో సమావేశాలు నిర్వహించడంగానీ చేయడానికి వీల్లేదంటూ రాష్ట్రంలోని రీజినల్ జాయింట్ డైరెక్టర్లు (ఆర్జేడీలు), జిల్లా విద్యాధికారులను (డీఈవోలను) రాతపూర్వకంగా ఆదేశించామని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. విద్యాసంస్థలను, సిబ్బందిని స్వాధీనం చేయకపోయినా కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ కొనసాగుతుందని ప్రభుత్వ న్యాయవాది కేవీ రఘువీర్ కోర్టుకు వివరించారు. ఈ మొత్తం వ్యవహారంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ జారీచేసిన ఆదేశాలను ఆయన హైకోర్టుకు చదివి వినిపించారు. ఈ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించే అధికారులపై చర్యలుంటాయని తెలిపారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. స్వాధీనానికి ముందుకురాని విద్యాసంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కొనసాగించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఒకవేళ ఏ అధికారి అయినా స్వాధీనానికి ఒత్తిడిచేస్తే ఆ వివరాలను తమ ముందుంచాలని, తాము తగిన ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం పిటిషనర్లకు తెలిపింది. ప్రైవేటు ఎయిడెడ్ విద్యాసంస్థలకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్, తదనుగుణంగా జారీచేసిన జీవోను సవాలు చేస్తూ పలు ఎయిడెడ్ విద్యాసంస్థలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వానికి స్వాధీనం చేసినా, చేయకపోయినా పాఠశాలలకు ఇస్తున్న గ్రాంట్‌ను నిలిపేసే అవకాశం ఉందన్నారు. దీనివల్ల విద్యాసంస్థలు మూతపడే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రభుత్వానిది ఏకపక్ష నిర్ణయమన్నారు. ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ స్పందిస్తూ.. పాఠశాలలు, సిబ్బంది స్వాధీనం స్వచ్ఛందమే తప్ప బలవంతం కాదని చెప్పారు. స్వాధీనం చేయకపోయినా గ్రాంట్ అందుతుందని, గతంలోలాగే ఆ పాఠశాలలు నడుస్తాయని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, ఇతర ప్రతివాదులను ఆదేశించింది. -
ఫీజుల ఖరారు.. అందరి మేలు కోసమే
సాక్షి, అమరావతి: తల్లిదండ్రులు, కాలేజీల యాజమాన్యాలందరి మేలును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో తొలిసారిగా ప్రైవేటు అన్ ఎయిడెడ్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు ఫీజులు ఖరారుచేశామని రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఆర్.కాంతారావు తెలిపారు. తల్లిదండ్రులు, 90 శాతానికి పైగా ప్రైవేటు విద్యాసంస్థల నిర్వాహకులు ఈ నిర్ణయాన్ని స్వాగతించడంతో పాటు సంతృప్తిని వ్యక్తంచేస్తున్నారన్నారు. కమిషన్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ ఎ. విజయశారదారెడ్డి, సభ్యుడు అజయ్‌కుమార్, కార్యదర్శి ఆలూరి సాంబశివారెడ్డితో కలిసి గురువారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ‘రాష్ట్రంలో దశాబ్దాల నుంచి ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు ఫీజులు వసూలు చేసుకుంటున్నారు. గత ఏడాదిలోనే ఫీజులను నిర్ణయించాలనుకున్నాం. కానీ, జీఓ–57 విడుదలైనా న్యాయవివాదంతో సస్పెండ్ కావడం, కరోనా పరిస్థితులవల్ల ముందుకెళ్లలేకపోయాం. ఇప్పుడు వివిధ వర్గాల వారందరితో చర్చించి ప్రాంతాల వారీగా ఆయా విద్యాసంస్థల నిర్వహణకయ్యే వాస్తవిక వ్యయాలను పరిగణనలోకి తీసుకుని పంచాయతీ, పట్టణ, నగర ప్రాంతాల వారీగా కొన్ని ప్రమాణాలను అనుసరించి ఫీజులు నిర్ణయించాం. రాష్ట్రవ్యాప్తంగా 15వేలకు పైగా స్కూళ్లు, 2,500కు పైగా కాలేజీలున్నాయి. సంస్థల వారీగా ఫీజులు నిర్ణయించడం సాధ్యంకాదు కనుక ఏ విద్యా సంస్థకైనా తమకు ఆ ఫీజు చాలదని భావిస్తే 15 రోజుల్లో జమా ఖర్చులకు సంబంధించిన అన్ని రికార్డులతో కమిషన్‌కు దరఖాస్తు చేయవచ్చు. దాన్ని పరిశీలించి కమిషన్ సానుకూల పరిష్కారం చూపిస్తుంది. చదవండి: డ్రోన్ల ఆపరేషన్ సులభతరం అధిక ఫీజులు వసూలుచేస్తే చర్యలు కనీస సదుపాయాల్లేకుండా అధిక ఫీజులు వసూలుచేసే సంస్థలపై చర్యలు తప్పవు. మూడేళ్ల వరకు ఈ ఫీజులు అమల్లో ఉంటాయి. ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు కమిషన్ నిర్ణయించిన ఫీజులు మాత్రమే చెల్లించాలి. ఎవరైనా ఒత్తిడి చేస్తే కమిషన్‌కు సంబంధించిన 9150381111 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలి. గత ఏడాదిలో నిబంధనలు పాటించని 120 విద్యాసంస్థలపై చర్యలు తీసుకున్నాం’.. అని జస్టిస్ కాంతారావు వివరించారు. విద్యారంగంలో మార్పు తెచ్చేందుకే.. వైస్ ఛైర్పర్సన్ డాక్టర్ ఎ. విజయశారదారెడ్డి మాట్లాడుతూ.. పాదయాత్రలో విద్యారంగ పరిస్థితిని గమనించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వాటిలో మార్పు తెచ్చేందుకు కమిషన్‌ను ఏర్పాటుచేశారని గుర్తుచేశారు. నర్సరీ నుంచి ఇంటర్మీడియెట్ వరకు స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లకు ప్రాంతాల వారీగా నిర్ణయించిన ఫీజులను వివరించారు. ప్రైవేటు విద్యాసంస్థలను నియంత్రించడమే కాకుండా ప్రభుత్వ విద్యారంగాన్ని ముఖ్యమంత్రి ఎంతో అభివృద్ధి చేస్తున్నారని.. నాడు–నేడు, జగనన్న గోరుముద్ద, విద్యకానుక తదితర కార్యక్రమాల గురించి చెప్పారు. చదవండి: సాగు చట్టాలపై దేశవ్యాప్త ఉద్యమం ! ప్రైవేట్ సంస్థలు జీతాలివ్వడంలేదు కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. గత 20 ఏళ్లుగా కార్పొరేట్ కాలేజీలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలుచేస్తున్నా ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు సీఎం దీనిపై దృష్టిపెట్టి ప్రభుత్వ విద్యా సంస్థలను అభివృద్ధి చేస్తూనే ప్రైవేటు సంస్థలపైనా నియంత్రణను పెట్టారని తెలిపారు. విద్యార్థిపై వెచ్చించే మొత్తం ఆధారంగా మాత్రమే ఫీజులు వసూలు చేయాలి కానీ అలా జరగడంలేదని.. దీనినే కమిషన్ అమలుచేస్తుందని చెప్పారు. చాలా ప్రైవేటు సంస్థలు సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వడంలేదని.. కనీసం అపాయింట్మెంటు ఆర్డర్ కూడ ఇవ్వడంలేదని ఆయన చెప్పారు. సర్వీసు రూల్సు అసలు లేవని.. వారికి ఇకపై సర్వీసు రూల్సు పెట్టనున్నట్లు సాంబశివారెడ్డి వెల్లడించారు. అలాగే, రానున్న కాలంలో ఆయా సంస్థల ప్రమాణాలను అనుసరించి ర్యాంకులు, అక్రిడిటేషన్‌ను అమలుచేస్తామని అని తెలిపారు. -
ప్రైవేట్ విద్యతో పేదలకు పిడుగుపాటే
‘‘సమానత్వం, సామాజిక న్యాయం సాధనలో ఒకే ఒక గొప్ప సాధనం విద్య. సమ్మిళిత, సమభావనతో కూడిన విద్య సమసమాజం సాధించడంలో కీలక భూమిక పోషిస్తుంది. ప్రతి పౌరుడు సమాజంలో గౌరవస్థానం పొందడానికి కలలుకంటూ వాటిని సాధించుకోవడానికి నిరంతరం తపనపడుతుంటారు. భారతదేశంలోని ప్రతి బాలుడు, బాలిక తాము అభివృద్ధి చెంద డానికి అవకాశాలు ఉండాలి. వారి పుట్టుక, సామాజిక నేపథ్యం వల్ల వాళ్ళు నిరాదరణకు గురి కావద్దు’’ అని కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టబోతోన్న ‘జాతీయ విద్యా విధానం’ విధాన పత్రంలో పేర్కొన్నారు. కస్తూరి రంగన్ నాయకత్వంలో నియమించిన కమిటీ తన నివేదికను డిసెంబర్ 15, 2018న ప్రభుత్వానికి సమర్పించింది. దాదాపు ఒకటిన్నర ఏడాది తర్వాత 2020, జూలై 19వ తేదీన కేంద్ర మంత్రి మండలి ఈ నివేదికకు ఆమోదం తెలిపింది. దాదాపు 484 పేజీలతో కూడిన ఈ నివేదిక సారాన్ని 66 పేజీలకు కుదించి, కేంద్ర ప్రభుత్వం తన విధానంగా ప్రకటించుకున్నది. అందులో 27 అంశా లను పొందుపరిచారు. పైన పేర్కొన్న వాక్యాలు ఆరవభాగంలోనివి. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన జాతీయ విద్యావిధానంపైన ఇప్పటికే చాలా మంది తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. కానీ అందరూ విస్మరించిన ఏకైక అంశం ఆరవ భాగం. ఈ మొత్తం విధానంలో ఇదే కీలకమైనదని భావిస్తున్నాను. వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత లభిస్తుందా? చారిత్రకంగా విద్య సముపార్జనలో ప్రాతినిధ్యం లేని వర్గాలకు న్యాయం జరగాలని ఆ ఆరవభాగం సారాంశం. దీనికి అనుబంధంగా ఈ విధానంలో 14వ భాగాన్ని కూడా జోడించారు. ఈ వర్గాలను సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన బృందాలుగా పేర్కొన్నారు. ఇందులో మళ్ళీ కొన్ని విభజనలు చేశారు. ఇందులో లింగ వివక్షను ఎదుర్కొంటోన్న మహిళలు, ట్రాన్స్ జెండర్స్, సామాజికంగా, సాంస్కృతికంగా అణగారిన వర్గాలుగా ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మైనారిటీలు, భౌగోళికంగా వివక్షకు గురవుతోన్న గ్రామీణ, చిన్నపట్టణాల, వెనుకబడిన జిల్లాల విద్యార్థులు, దివ్యాంగులు, అంతిమంగా సామాజికంగా, ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటోన్న వలస కార్మికులు, స్వల్ప ఆదాయ వర్గాలు, ఇలా ఎన్నో వర్గాలను ఇందులో పేర్కొన్నారు. యునైటెడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్(యు.డైస్) సర్వే ప్రకారం ఎస్సీ, ఎస్టీలలో, దివ్యాంగుల్లో బడిమానేస్తున్న వారి సంఖ్య అధికంగా ఉన్నదని కూడా ఈ నివేదికలో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పిల్లలు విద్యను ప్రత్యేకించి, నాణ్యమైన విద్యను అందుకోలేకపోతున్నారని కూడా నివేదిక స్వయంగా ప్రకటిం చుకున్నది. ఈ విషయాన్ని ఇంత వివరంగా చెప్పడానికి ఒక కారణం ఉన్నది. జాతీయ విద్యావిధాన పత్రంలో ఉన్న 27 భాగాల అంశాలు సాంకేతికపరమైనవి, పాలనాపరమైనవి, విధానపరమైనవి. అయితే ప్రభుత్వం నామకరణం చేసిన ఎస్.ఇ.డి.జి వర్గాలకు విద్య అందడా నికి ప్రభుత్వాలు నిర్దేశిస్తున్న విద్యను అందించడానికి ఎటువంటి విధానాలు అవలంబించాలనే దానిపై సమగ్రమైన ప్రణాళిక లేదని స్పష్టమౌతోంది. ప్రత్యేక నిధుల కేటాయింపు అభినందనీయం ఈ విధానపత్రంలోని 14వ భాగంలో ఏవో కొన్ని సూచనలు చేశారు. అందులో ప్రభుత్వం ఎన్.ఇ.డి.జి వర్గాల ఉన్నత విద్యకు అవసరమైన నిధులను ప్రత్యేకంగా కేటాయించాలని పేర్కొన్నారు. ప్రైవేట్, ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థల్లో చదివే ఈ వర్గాల విద్యార్థు లకు ఆర్థిక సహాయం, స్కాలర్షిప్లు అందించాలని సూచించారు. వీటితో పాటు మరికొన్ని ప్రతిపాదనలు చేశారు. సంతోషమే. అటువంటి నిర్ణయం చేయడంలో శ్రద్ధ చూపించినందుకు అభినందించాలి. అయితే వాటిని ఎట్లా అమలు చేస్తారు? అందులో ప్రభుత్వం ఏమేరకు చిత్తశుద్ధితో పనిచేస్తుందనేదీ ప్రశ్నార్థకమే. అయితే ఇప్పటివరకు గత ఆరేళ్ళలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ వర్గాల పట్ల అనుసరిస్తున్న వైఖరికీ, ఇప్పుడు వీరి విద్యా భివృద్ధికి మాట్లాడుతున్న మాటలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ప్రతి సంవత్సరం ఇచ్చే పోస్ట్‌మెట్రిక్ స్కాలర్షిప్లు గణనీయంగా క్షీణించడం ఒక ఉదాహరణ మాత్రమే. అయితే ప్రభుత్వం గత అనుభవాలను సమీక్షించుకొని, తన విధానాలలో మార్పులు తీసుకువస్తే, మంచి పరిణామమే అవుతుంది. అణగారిన వర్గాల అభివృద్ధే ప్రగతికి కొలమానం భారతదేశంలో అణగారిన వర్గాల సంఖ్య విస్మరించదగినది కాదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ విద్యా విధానంలో పేర్కొన్న ఎస్.ఇ.డి.జి.లు దాదాపు 80 శాతం నుంచి 90 శాతం వరకు ఉంటారు. ఈ దేశంలోని ఏ అభివృద్ధినైనా కొలవాలంటే వీరి ప్రగతిపైనే ఆధారపడి ఉంటుంది. భారతదేశం విద్యారంగంలో తలెత్తుకొని నిల బడాలంటే, ఈ వర్గాలు ఆత్మగౌరవంతో ఆర్థిక, సామాజిక రంగాల్లో ముందడుగు వేయాలి. అందుకుగాను విద్య ఎంతో ముఖ్యమైన అంశం అవుతుందని జాతీయ విద్యా విధాన పత్రమే స్పష్టం చేసింది. ఈ విషయంలో దక్షిణాదిలో ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు మార్గదర్శకంగా ఉన్నాయనడంలో సందేహం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్టాలు ఇంకా కొంత నిర్దిష్ట విధానాలను అవలంబిస్తున్నాయి. జాతీయ విద్యా విధానంలో పేర్కొన్న వర్గాల కోసం, ఈ రాష్ట్రాలు ఒక నమూనాగా నిలుస్తున్నా యనడంలో ఆశ్చర్యం లేదు. రెసిడెన్షియల్ స్కూల్ విధానం ప్రాణాధారం ఈ వర్గాల్లో విద్యావ్యాప్తి వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కనీసం చదువుకొనేందుకు సైతం వారి ఇండ్లు, పరిసరాలు అనువుగా ఉండవనేది ఒక సత్యం. అందుకుగాను ప్రత్యేక హాస్టల్స్, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు కావాలనేది 1927లో బాబాసాహెబ్ అంబేడ్కర్ బొంబాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో రెసిడెన్షియల్ స్కూల్ విధానం ప్రారంభమైంది. 2012 సంవ త్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించిన సబ్‌ప్లాన్ చట్టం తర్వాత ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలలు 188, ఎస్టీ 190, బీసీ 104లకు కొత్తగా అనుమతి లభించగా, ఇప్పటికే 84 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి. తెలంగాణలో ఎస్సీలకు 268, ఎస్టీలకు 183, బీసీలకు 142, మైనారిటీలకు 204 రెసిడెన్షియల్ విద్యా లయాలున్నాయి. తెలంగాణలో డిగ్రీ విద్యార్థులకు 30 రెసిడెన్షియల్ కళాశా లలున్నాయి. కర్ణాటకలో కూడా ఎస్సీలకు 500, ఎస్టీలకు 153, బీసీలకు 165 రెసిడెన్షియల్ పాఠశాలలున్నాయి. అయితే తెలంగాణలో మైనారిటీల కోసం నిర్వహిస్తున్న రెసిడెన్షియల్ పాఠశాలలు దేశంలోనే తొలి ప్రయత్నం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం, పాఠశాల విద్య కోసం ఎన్నో వినూత్న ప్రయోగాలు మొదలుపెట్టింది. పాఠశాలలు, కళాశా లల్లో మౌలిక వసతుల కోసం పన్నెండు వేలకోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఈ సంవత్సరం 3,800 కోట్లు ఖర్చు చేయాలని అంచనా వేశారు. అది పెరిగే అవకాశం కూడా ఉంది. దీనితో పాటు బడికి వెళ్ళే పిల్లల కుటుంబాలకు ఒక్కొక్కరికి 15 వేల చొప్పున దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారిని ఎంపిక చేసి ఇస్తున్నారు. దీన్నే అమ్మఒడి పథకంగా పిలుస్తున్నారు. జగనన్న విద్యాకానుక పేరుతో మూడు జతల యూనిఫాం, పుస్తకాలు, నోట్ బుక్స్, ఒక జత బూట్లు, బెల్ట్, బ్యాగ్‌తో సహా బడికెళ్ళిన రోజే అందిస్తున్నారు. 43 లక్షల మంది పిల్లలు దీని వల్ల లబ్ధిపొందుతున్నారు. 648 కోట్ల రూపాయలు దీనికి కేటా యించారు. గోరుముద్దతో పౌష్టికాహారానికి హామీ మధ్యాహ్న భోజన పథకానికి అదనపు బడ్జెట్ కేటాయించి, మంచి పౌష్టికాహారాన్ని జగనన్న గోరుముద్ద పేరుతో అందిస్తున్నారు. ఇది ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపుతుంది. వారికొక భరోసానిస్తుంది. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే, ప్రభుత్వ పాఠశాలలకు గౌరవం తెచ్చిపెట్టే ఇటు వంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలుచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. జాతీయ విద్యావిధాన పత్రంలో అత్యంత లోపభూయిష్టంగా ఉన్న విషయం, సమకాలీన, సామాజిక, ఆర్థిక పరిస్థితులను విస్మరించడం. ఈ రోజు డ్రాపౌట్స్ సంఖ్య విపరీతంగా పెరగడానికీ, నైపుణ్యత కలిగిన విద్యను అందుకోలేకపోవడానికి పేదరికమే ప్రధాన కారణం. దేశంలోని ఎస్.ఇ.డి.జి. వర్గాల సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు తీసుకు రాకుండా ఎటువంటి సంస్కరణలైనా తాత్కాలికమే అన్న విషయం ఇప్పటికైనా గుర్తించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా విద్య ప్రైవేటీకరణ విషయంలో సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. దానికి ఫిలాంత్రఫీ అనే ఒక పదాన్ని పదే పదే వాడారు. ప్రైవేట్ విద్యకు ఫిలాంత్రఫిస్టులు (ధర్మదాతలు) చేత ప్రోత్సహించాలని రాసు కున్నారు. ఇప్పటికీ జరుగుతున్నదదే. ప్రైవేట్ విద్యతో సమాజ సేవ బూటకం ప్రతి ప్రైవేట్ పాఠశాల, కార్పొరేట్ విద్యాసంస్థల అధినేతలందరూ తాము వ్యాపారం కోసం మాత్రమే కాక, సమాజ సేవకోసం విద్యా సంస్థలు నడుపుతున్నామనే చెప్పుకుంటారు. కానీ అసలు నిజం అందరికీ తెలుసు. ప్రైవేట్ విద్యను ప్రోత్సహించడమంటేనే, ఈ దేశం లోని 90 శాతం మంది ప్రజలను, విద్యార్థులను చీకట్లోకి నెట్టివేయ డమే తప్ప మరొకటి కాదు. లక్షల రూపాయల ఫీజులు కట్టి, చదివే విద్యార్థులతో చెట్లకింద చదివే విద్యార్థులు పోటీపడటం అసాధ్యం. అందుకే ప్రభుత్వాలు మాట్లాడే మాటలను ఆచరణతో పోల్చి చూసు కుంటే నిజా నిజాలు తేటతెల్లం అవుతాయి. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
ప్రైవేట్ విద్యాసంస్థలు బాధ్యత మరవొద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బందికి విధిగా ప్రతి నెలా జీతాలు చెల్లించే నైతిక బాధ్యత ఆయా ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలపై ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రైవేట్ సాంకేతిక కళాశాలల లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల సంఘం ప్రతినిధులు వినోద్ కుమార్‌ను ఆయన అధికారిక నివాసంలో ఆదివారం కలిశారు. తమ సమస్యలు వివరించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ భావిభారత పౌరులను తీర్చిదిద్దుతున్న ప్రైవేట్ ఉపాధ్యాయ, అధ్యాపకులకు విద్యా సంస్థలు జీతాలు చెల్లించకపోవడం బాధాకరమన్నారు. అవసరమైతే తెలంగాణ విద్యాచట్టం–82లో సవరణలకు ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని తెలిపారు. దీని ద్వారా ప్రతి నెలా ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఆయా విద్యాసంస్థల యజమానులు కచ్చితంగా నెలవారీ జీతాలు చెల్లించేలా వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. వినోద్‌ను కలిసిన వారిలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఐనేని సంతోష్ కుమార్, ఉపాధ్యక్షురాలు డాక్టర్ ఉమాదేవి, కార్యదర్శులు రాజు, నరేశ్, మదన్ తదితరులున్నారు. -
మైనారిటీ విద్యా సంస్థలకూ ‘నీట్’
న్యూఢిల్లీ: వైద్య విద్యలో ప్రవేశాలు కల్పించేందుకు ఉద్దేశించిన నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్) మైనారిటీ, ప్రైవేటు విద్యాసంస్థలకు వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎయిడెడ్, అన్ఎయిడెడ్ మైనారిటీ వైద్య విద్యాసంస్థలు, ప్రైవేటు వైద్య విద్యాసంస్థల్లో నీట్ ద్వారా∙గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు జరపాలని పేర్కొంది. కేంద్రం విడుదల చేసిన నీట్ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ వెల్లూర్‌లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, మణిపాల్ యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం మెడికల్ కాలేజ్ తదితర మైనారిటీ, ప్రైవేటు వైద్య విద్యా సంస్థలు దాఖలు చేసిన 76 పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి జరుగుతున్న అనేక అవకతవకలను అడ్డుకునే దిశగా ‘నీట్’ను ప్రారంభించినట్లు గుర్తు చేసింది. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టంలోని నిబంధనల వల్ల ఎయిడెడ్, అన్ఎయిడెడ్ మైనారిటీ విద్యా సంస్థల హక్కులకు ఎలాంటి భంగం కలగబోదని కోర్టు స్పష్టం చేసింది. ఆ చట్టంలోని నిబంధనలు స్థూలంగా ప్రజారోగ్య పరిరక్షణకు ఉద్దేశించినవని పేర్కొంది. అవి విద్యా సంస్థలు ఉన్నత ప్రమాణాలతో నడిపేందుకు ఉద్దేశించినవే కానీ.. ప్రత్యేక హక్కుల మాటున తప్పుడు పరిపాలన విధానాలు అవలంబించేందుకు కాదంది. ‘సేవా ధర్మ భావన నుంచి విద్యను అమ్మకం వస్తువుగా మార్చారు. సంపన్నులకే లభించే వస్తువుగా విద్య మారింది. పేదలు బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకుని చదువుకుని, ఆ అప్పులు, వడ్డీలు తీరుస్తూ ఇబ్బందులు పడుతున్నారు. మొగ్గలుగా ఉండగానే వారిని చిదిమేస్తున్నారు’అని వ్యాఖ్యానించింది. ‘ఎంసీఐ (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) తెచ్చిన చెడ్డపేరు కారణంగా మొత్తం వైద్య విద్య వ్యవస్థను మార్చాల్సి వచ్చింది. ఇప్పటికీ పరిస్థితి మెరుగవలేదు. ఇంకా కఠినంగా వ్యవహరించాల్సి ఉంది’అని పేర్కొంది. కొన్ని విద్యా సంస్థలు అంతర్జాతీయ స్థాయి వైద్యులను తయారు చేసిన విషయాన్ని కూడా విస్మరించలేమని వ్యాఖ్యానించింది. నీట్’పేర్కొన్న అత్యున్నత నాణ్యత నిబంధనలు పాటిస్తూ సొంతంగా ప్రవేశ పరీక్షలు జరుపుకుంటామని పలు మైనారిటీ విద్యా సంస్థలు చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. -
ప్రమాణాలే ప్రామాణికం
సాక్షి, అమరావతి: ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, ప్రమాణాలు పాటించని విద్యా సంస్థలపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ స్పష్టం చేసింది. పాఠశాలల్లో బోధన, నిర్వహణ ఖర్చులను అనుసరించి ఏప్రిల్ నాటికి ఫీజులు నిర్ణయిస్తామని తెలిపింది. ఫీజులపై చట్టబద్ధమైన విధివిధానాలు లేనందున ప్రత్యేక చట్టం కోసం ప్రభుత్వానికి లేఖ రాస్తామని పేర్కొంది. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ విద్యాసంస్థల్లో 25 శాతం సీట్లు పేదలకు అందాలని, దీన్ని అమలు చేయిస్తామని పేర్కొంది. సోమవారం విజయవాడలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో కమిషన్ చైర్మన్ జస్టిస్ కాంతారావు, వైస్ చైర్మన్ డాక్టర్ ఎ.విజయశారదారెడ్డి, కార్యదర్శి ఎ.సాంబశివారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల్లో వసతులు, ఫీజులు.. విద్యార్థులు– ఉపాధ్యాయుల నిష్పత్తి, మరుగుదొడ్లు, మంచినీరు, తరగతి గదులు, లైబ్రరీ లాంటి అంశాలను ప్రామాణికంగా తీసుకుని తనిఖీలు చేశామన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని చెప్పారు. వారు వెల్లడించిన వివరాలు ఇంకా ఇలా.. 260 విద్యా సంస్థల్లో తనిఖీలు – రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 13, 14వ తేదీల్లో 130 ప్రైవేట్ పాఠశాలలు, 130 ప్రైవేట్ జూనియర్ కాలేజీలను తనిఖీ చేయగా నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించాం. – లోపాలపై విద్యా సంస్థలకు నోటీసులిస్తాం. గడువులోగా సరిదిద్దుకోకుంటే చట్టపరమైన చర్యల కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాం. దిద్దుబాటుకు అవకాశం లేని విద్యాసంస్థల గుర్తింపు రద్దుకు సిఫార్సు చేస్తాం. – సీబీఎస్ఈ, ఐసీఎస్సీ పాఠశాలలు, కాలేజీల విషయంలో కూడా ఫీజులు, ఇతర అంశాలపై ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చర్యలుంటాయి. – పాఠశాలలు ఫీజు రూ.70 వేలు చెబుతూ రూ.95 వేలకు పైగా వసూలు చేస్తున్నారు. సృజనాత్మక బోధనకు బదులుగా బట్టీ విధానాల్లో పాఠాలు చెబుతున్నారు. – ప్రతి యూనిట్ టెస్టుకు విద్యార్ధులను ఒక సెక్షన్ నుంచి మరో సెక్షన్‌కు మారుస్తున్నారు. కఠిన శిక్షలు అమలు చేస్తుండడంతో విద్యార్థులు ఒత్తిడితో మానసిక స్థైర్యం కోల్పోతున్నారు. – విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు ఎక్కడా లేవు. బాలికలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 40 మంది పట్టే తరగతి గదుల్లో 80 – 100 మంది వరకు ఉంటున్నారు. – ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లు పూర్తి అపరిశుభ్ర వాతావరణంలో కొనసాగుతున్నాయి. విద్యార్థులతో పాటు సిబ్బంది పరిస్థితి దయనీయంగా ఉంది. రోజువారీ కూలీలకన్నా తక్కువ వేతనాలు ఇస్తున్నారు. – గతంలో విద్యార్థుల ఆత్మహత్యలు కూడా చోటు చేసుకున్నాయి. – ఇంజనీరింగ్, డాక్టర్ విద్య మాత్రమే చదువులన్నట్లుగా కార్పొరేట్ విద్యాసంస్థల ప్రచారం వల్ల విద్యార్థుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతూ ఒత్తిడికి గురవుతున్నాయి. నిబంధనల మేరకు వ్యవహరించాల్సిందే మీడియా సమావేశంలో కమిషన్ చైర్మన్ జస్టిస్ కాంతారావు, వైస్ చైర్మన్ డాక్టర్ విజయశారదారెడ్డి, కార్యదర్శి ఎ.సాంబశివారెడ్డి రాష్ట్రంలో ఏ విద్యా సంస్థ అయినా ప్రభుత్వ విధివిధానాల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది. సొసైటీల పేరిట కొన్ని సంస్థలు ఫీజుల్లో అక్రమాలకు పాల్పడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ప్రతి విద్యా సంస్థకు సంబంధించిన ఐటీ రిటర్న్‌లను తెప్పించి పరిశీలిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమ విద్యాబోధన, ప్రమాణాల విషయంలో స్పష్టమైన వైఖరితో ఉంది. నాణ్యతా ప్రమాణాలపై అలసత్వాన్ని ఉపేక్షించం. – జస్టిస్ కాంతారావు అనువైన వాతావరణం లేదు ప్రైవేట్ సంస్థలు నిపుణులైన ఉపాధ్యాయులను నియమించడం లేదు. బోధనా సిబ్బంది నాలుగైదు బ్రాంచిలకు వెళ్లి పాఠాలు చెబుతున్నారు. 3, 4, 5 తరగతుల పిల్లలకు ప్రత్యేక తరగతులంటూ ఇబ్బంది పెడుతున్నారు. సరైన ఆటస్థలం, చదువుకునేందుకు అనువైన వాతావరణం ఎక్కడా లేదు. అపార్టుమెంట్లు, బహుళ అంతస్థుల భవనాల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్, ఈ–మెయిల్ ప్రవేశపెడుతున్నాం. – విజయ శారదారెడ్డి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా విద్యాచట్టం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమ్మఒడి, నాడు–నేడు కార్యక్రమాలతో ప్రభుత్వ విద్యాలయాలను అభివృద్ధి చేస్తున్నారు. గత ప్రభుత్వం విద్యను వ్యాపారంగా మార్చింది. చంద్రబాబు బినామీ సంస్థలైన నారాయణ, చైతన్య విద్యాసంస్థలు ఇష్టానుసారం వ్యవహరించాయి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా విద్యాచట్టాన్ని మార్చి, సింగిల్ విండో ద్వారా ఆన్లైన్లో అనుమతులు ఇచ్చే విధానాన్ని రూపొందిస్తాం. – ఆలూరు సాంబశివారెడ్డి -
ప్రమాణాలు పాటించని ప్రైవేటు విద్యాసంస్థలపై కఠిన చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ నిబంధనలను అనుసరించకుండా.. ప్రమాణాలు పాటించకుండా నడిచే ప్రైవేటు విద్యా సంస్థలపై కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఏ మేరకు నాణ్యతా ప్రమాణాలు ఉంటున్నాయో పరిశీలించి.. నిబంధనల ప్రకారం ప్రమాణాలు లేని వాటిని మూసివేయించాలన్నారు. విద్యా రంగంలో చేపట్టాల్సిన సంస్కరణలపై ఏర్పాటైన నిపుణుల కమిటీ సీఎం వైఎస్ జగన్‌తో మంగళవారం వెలగపూడిలోని సచివాలయంలో సమావేశమైంది. పాఠశాల విద్య, ఇంటర్మీడియెట్, ఉన్నత విద్యలపై తమ సిఫార్సుల నివేదికను ప్రొఫెసర్ ఎన్.బాలకృష్ణన్ ముఖ్యమంత్రికి సమర్పించారు. కమిటీ సిఫార్సులపై సీఎం వైఎస్ జగన్ సుదీర్ఘంగా చర్చించారు. సిఫార్సుల అమల్లోనూ కమిటీ భాగస్వామ్యం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యా రంగంలో చేపట్టాల్సిన పలు సంస్కరణలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో 1 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రతి తరగతిలో సమగ్ర బోధనాభ్యసన ప్రక్రియలు కొనసాగాలని, ఇందుకోసం విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లు ఉండేలా చూడాలని సూచించారు. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నందున ఉపాధ్యాయులకు తగిన శిక్షణ ఇవ్వాల్సిన అవసరముందన్నారు. కాగా, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) తరహాలో స్టేట్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రైవేటు విద్యా సంస్థలపై నియంత్రణ ప్రైవేటు విద్యా సంస్థల్లో నిబంధనల అమలు, నాణ్యతా ప్రమాణాల స్థితిగతులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సీఎం ఆదేశించారు. ప్రైవేటు విద్యాసంస్థలు ఇబ్బడిముబ్బడిగా ఫీజులు వసూలు చేస్తున్నాయని.. వీటిని నియంత్రించాలన్నారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని తనిఖీలు చేపట్టాలని సూచించారు. సరైన సదుపాయాలు, ప్రమాణాలు పాటించని వాటిని మూసివేయాలని ఆదేశించారు. 100 ఎకరాలు ఉంటేనే వ్యవసాయ కళాశాలకు అనుమతి ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రైవేటు వ్యవసాయ కళాశాలల్లో ఈ మేరకు భూమి ఉండడం లేదని, విద్యార్థుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల విద్యలో ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్ ఉండాలన్నారు. చదువు యువతకు ఉపాధి లేక ఉద్యోగం కల్పించాలని అభిప్రాయపడ్డారు. ప్రైవేటు యూనివర్సిటీల్లో నాణ్యతా ప్రమాణాలపై ప్రభుత్వానికి నియంత్రణ ఉండాలని, అలా లేనప్పుడు వాటిని ఎందుకు ప్రోత్సహించాలని ప్రశ్నించారు. నాణ్యతా ప్రమాణాలు లేనప్పడు అవి ఇచ్చే సర్టిఫికెట్లకు ఏం విలువ ఉంటుందన్నారు. ‘విద్య అనేది వ్యాపారం కోసమో, డబ్బు కోసమో కాదు. దీన్ని ఒక ఛారిటీలా నిర్వహించాలి.’ అని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. రూ.5 కోట్లతో టీచర్లకు శిక్షణ: సుధా నారాయణమూర్తి కమిటీ సభ్యురాలు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ డాక్టర్ సుధా నారాయణమూర్తి మాట్లాడుతూ తమ ఫౌండేషన్ తరఫున రూ.5 కోట్లతో 1200 మంది టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. ఇంగ్లిష్ మాధ్యమం ప్రవేశపెట్టడం ద్వారా ప్రభుత్వ విద్యా రంగంలో మంచి మార్పులు వస్తాయన్నారు. సమావేశంలో విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేశ్, ఉన్నత విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి, పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, సాంకేతిక విద్య కమిషనర్ రమణ, నిపుణుల కమిటీ సభ్యులు సాంబశివారెడ్డి, రాజశేఖరరెడ్డి, జంధ్యాల తిలక్, ఈశ్వరయ్య, ప్రసాద్, ప్రొఫెసర్ దేశాయ్, నళినీ జునేజా, వెంకటరెడ్డి (ఎంవీ ఫౌండేషన్), తదితరులు పాల్గొన్నారు. -
హెచ్సీయూకు 11వ ర్యాంకు
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యాసంస్థల ర్యాంకుల జాబితాలో తెలంగాణ వర్సిటీల పంట పండింది. కొన్ని ప్రభుత్వ విద్యాసంస్థల ర్యాంకులు గతేడాది కంటే ఈసారి మెరుగయ్యాయి. దేశంలోని ఉత్తమ విద్యాసంస్థలకు 2016 నుంచి కేంద్ర మావన వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) బోధన, వసతులు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని ర్యాంకులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ – 2019 ర్యాంకులను ప్రకటించింది. ఇందులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 11వ ర్యాంకును సాధించింది. మన రాష్ట్రంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీలు కూడా ర్యాంకులజాబితాలో స్థానం దక్కింది. సోమవారం ఢిల్లీలో ఈ ర్యాంకులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థల్లో టీచింగ్ లర్నింగ్ రీసోర్సెస్, రీసర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్, గ్రాడ్యుయేషన్ ఔట్‌కమ్, ఔట్రీచ్ అండ్ ఇంక్లూజివిటీ, పర్సెప్షన్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎంహెచ్ఆర్డీ ఈ ర్యాంకులను ప్రకటిస్తోంది. ఇందులో ఓవరాల్ ర్యాంకింగ్‌లో 83.88 పాయింట్లతో ఐఐటీ మద్రాసు మొదటి స్థానంలో నిలువగా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 11వ స్థానంలో నిలించింది. ఇందులో ఉన్నత విద్యాసంస్థలకు ఓవరాల్ కేటగిరీలో, ఇంజనీరింగ్ కేటగిరీలో, యూనివర్సిటీల విభాగంలో, మేనేజ్మెంట్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు, లా, ఆర్కిటెక్చర్, మెడికల్ కాలేజీల విభాగాల్లో ర్యాంకులను ప్రకటించింది. ఓవరాల్ కేటగిరీలో 4 విద్యాసంస్థలు ఓవరాల్ కేటగిరీలో టాప్–100లో రాష్ట్రానికి చెందిన నాలుగు విద్యాసంస్థలు ర్యాంకులను సాధించాయి. దేశంలో టాప్ ఉన్నత విద్యా సంస్థల్లో (ఓవరాల్‌గా) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 61.85 పాయింట్లతో 11వ స్థానంలో నిలిచింది. గతేడాది కూడా 11వ స్థానమే లభించింది. గతేడాది 56.92 పాయింట్లతో 26వ స్థానంలో నిలిచిన హైదరాబాద్ ఐఐటీ ఈసారి కూడా 26వ స్థానంలో నిలువడం గమనార్హం. 2017–18లో 45వ ర్యాంకు సాధించిన ఉస్మానియా వర్సిటీ ఈసారి తమ ర్యాంకును మెరుగు పరుచుకుంది. 49.86 పాయింట్లతో 43వ ర్యాంకును సాధించింది. ఇక 46.06 పాయింట్లతో వరంగల్ ఎన్ఐటీ ఈసారి 61వ ర్యాంకును సంపాదించింది. గతేడాది వరంగల్ నిట్ 78వ స్థానంలో నిలిచింది. ఇక 101–150 ర్యాంకుల్లో హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ.. 151–200 జాబితాలో.. ఇఫ్లూతోపాటు పలు ప్రైవేటు విద్యాసంస్థలున్నాయి. ఇంజనీరింగ్ కేటగిరీలో.. ఇంజనీరింగ్ కాలేజీల కేటగిరీలో ఐఐటీ హైదరాబాద్‌కు 8వ స్థానం, వరంగల్ ఎన్ఐటీకి 26వ స్థానం లభించింది. హైదరాబాద్ ట్రిపుల్ఐటీకి 39వ స్థానం, హైదరాబాద్– జేఎన్టీయూకు 45వ స్థానం, యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్‌కు 83వ స్థానం లభించింది. వీటితోపాటు 101–150, 151–200 స్థానాల్లో పలు ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు చోటు సంపాదించుకున్నాయి. ఇందులో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌కు 6వ స్థానం లభించింది. దాంతోపాటు పలు ప్రైవేటు కాలేజీలకు ర్యాంకుల లభించాయి. డిగ్రీ కాలేజీల విభాగంలో పలు ప్రైవేటు కాలేజీలు ర్యాంకులు సాధించాయి. వర్సిటీల ర్యాంకింగ్‌లో.. యూనివర్సిటీల కేటగిరీలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి నాలుగవ ర్యాంకు లభించింది. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీకి 26వ స్థానం లభించింది. అగ్రికల్చర్ యూనివర్సిటీకి 79వ స్థానం, హైదరాబాద్ ట్రిపుల్ఐటీకి 82వ స్థానం లబించింది. 101–150వ స్థానంలో ఇఫ్లూ, 151–200వ స్థానంలో కాకతీయ యూనివర్సిటీ, మౌలానా ఆజాద్ యూనివర్సిటీలు ఉన్నాయి. -
స్వైన్ ఫ్లూ భయంతో గ్రామం వెలి!
కోడూరు(అవనిగడ్డ): విజ్ఞానం పెరిగే కొద్దీ మనుషుల మధ్య దూరం పెరుగుతోందనేందుకు కృష్ణా జిల్లాలో జరిగిన ఓ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. స్వైన్ ఫ్లూ భయంతో కోడూరు మండలం మందపాకల శివారు చింతకోళ్ల గ్రామాన్ని సమీప గ్రామాల ప్రజలు వెలివేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 5వ తేదీన చింతకోళ్ల గ్రామానికి చెందిన పేరే నాంచారయ్య స్వైన్‌ఫ్లూతో మృతిచెందారు. దీంతో నాంచారయ్యతో పాటు మిగిలిన గ్రామస్తులకు కూడా ఆ వైరస్ ఉందని, వీరు తమతో పాటు కలిస్తే ఆ వ్యాధి తమకు కూడా సోకుతుందంటూ ఆ ఊరి ప్రజలతో శివారు గ్రామస్తులు మాట్లాడడం కూడా మానేశారు. పాలు కూడా పోయడం లేదు. అలాగే మండల కేంద్రంలోని పలు ప్రైవేటు విద్యాసంస్థలు చింతకోళ్ల గ్రామం నుంచి వచ్చే చిన్నారులకు సెలవులు ప్రకటించాయి. తాము చెప్పేవరకు విద్యార్థులను పాఠశాలలకు పంపవద్దని పలు యాజమాన్యాలు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్లు సమాచారం. దీంతో పాటు స్కూల్ బస్సులను కూడా ఆ గ్రామానికి నిలిపివేశారు. గ్రామ ప్రజలను ఆటోవాలాలు తమ ఆటోల్లో ఎక్కించుకోకుండా దూరం పెడుతున్నట్లు చింతకోళ్లవాసులు వాపోతున్నారు. ఒకవేళ చింతకోళ్ల నుంచి ఆటో వస్తే ఆ ఆటో ఎవరు ఎక్కకుండా ఖాళీగా పంపించేస్తున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇక చింతకోళ్లకు బంధుత్వం ఎక్కువగా ఉన్న సమీప గ్రామాల్లో అయితే ఏకంగా ‘చింతకోళ్లకు వెళ్లవద్దు.. ఆ గ్రామస్తులను మన గ్రామంలోకి రానివద్దు అంటూ మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆ గ్రామ ప్రజలు కనీస అవసరాలు తీరక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎవరికీ జ్వరాలు లేవు స్వైన్‌ఫ్లూ మరణంతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చింతకోళ్ల గ్రామంలో నాలుగు రోజుల నుంచి ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి గ్రామస్తులందరికి వైద్యపరీక్షలు చేస్తున్నారు. మృతుడికి మినహా మిలిగిన ఎవరికీ జ్వరాలు లేవని, అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తేల్చారు. తమకు ఏవిధమైన వైరస్ సోకకపోయినా మిగిలిన గ్రామస్తులు తమను దూరం పెడుతున్నారని, తమతో మాట్లాడడం లేదని, నిత్యావసరాల కోసం వెళ్తే ఎవరూ స్పందించం లేదని చింతకోళ్లవాసులు తీవ్ర మనోవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి తమ గ్రామంలో ఏవిధమైన వైరస్ లేదంటూ చుట్టు పక్కల గ్రామాల్లో తెలియజెప్పాలని వారు వేడుకుంటున్నారు. వెలివేసినట్లు చూస్తున్నారు మా గ్రామంలో ఒక వ్యక్తి స్వైన్‌ఫ్లూతో మరణించడంతో గ్రామమంతా ఈ వైరస్ ఉందంటూ తమను చుట్టు పక్కలవారు వెలివేసినట్లుగా చూస్తున్నారు. పక్క గ్రామాల నుంచి వచ్చే పాల సరఫరాను కూడా నిలిపివేశారు. కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు మా గ్రామం నుంచి విద్యార్థులను పాఠశాలలకు రావద్దంటూ సెలవులు ప్రకటించాయి. ఇలా ప్రతి విషయంలో మాముల్ని దూరం పెడడంతో గ్రామస్తులంతా తీవ్ర మనోవేదన చెందుతున్నాం. – సుబ్రహ్మణ్యం, చింతకోళ్ల గ్రామస్తుడు అసత్య ప్రచారాన్ని నమ్మవద్దు చింతకోళ్ల గ్రామంలో స్వైన్‌ఫ్లూ వైరస్ ఉందంటూ మిగిలిన గ్రామాల ప్రజలు చేపట్టిన అసత్య ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దు. వైద్యాధికారులు నాలుగు రోజుల నుంచి ఇక్కడ ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి అందరికి రక్తపరీక్షలు కూడా చేశారు. గ్రామస్తులకు జ్వరాలు లేవని తేల్చారు. చింతకోళ్లవాసులపై వివక్షత చూపినవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. – కె.ఎ.నారాయణరెడ్డి, తహసీల్దార్ -
పోరుబాటలో ప్రైవేటు విద్యా సంస్థలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు విద్యా సంస్థ లు తమ సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధనకు మళ్లీ పోరుబాట పట్టాయి. అన్ని రాజకీయ పార్టీలు తమ సమస్యల పరిష్కారం, డిమాండ్లను తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చేలా ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించాయి. తద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని భావిస్తున్నాయి. ఇప్పటికే కేజీ టు పీజీ విద్యా సంస్థల జేఏసీగా ఏర్పాటైన యాజమాన్య సంఘాలు ఈ నెల 29న మధ్యాహ్నం 12 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహణకు చర్యలు చేపట్టాయి. నగర సమీపంలోని గౌరెల్లిలో తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థల పరిరక్షణ ఐక్య కార్యాచరణ సమితి (కేజీ టు పీజీ విద్యా సంస్థల జేఏసీ) ఆధ్వర్యంలో ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. ఈ సభలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, చాడ వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రం, ఆర్.కృష్ణయ్య తదితరులు పాల్గొంటారని పేర్కొంది. 3 వేల పాఠశాలలు మూతపడ్డాయి విద్యనే సామాజిక మార్పునకు ఏకైక సాధనం అన్న ఆలోచనతో విద్యారంగ వ్యాప్తికి కృషిచేస్తున్న తమను ప్రభుత్వం ఇబ్బందులపాలు చేస్తూ కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ముకాస్తోందని జేఏసీ చైర్మన్ రమణారెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ విధానాల వల్ల ఇప్పటికే 3 వేల సాధారణ పాఠశాలలు, 600 జూనియర్ కాలేజీలు, 300 డిగ్రీ కాలేజీలు, వందల్లో ఇతర వృత్తి విద్యా కాలేజీలు మూత పడ్డాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయనున్నట్లు వెల్లడించారు. మంత్రి కేటీఆర్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమావేశం ఏర్పాటు చేసి, సమస్యలను పరిష్కరిస్తామని చెప్పినా ఫలితం లేకుండాపోయిందని వాపోయారు. ఈ నేపథ్యంలో తమ డిమాండ్ల సాధన కోసమే తాము ఆత్మగౌరవ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. -
విద్యార్థిని ఆత్మహత్య
గుంటూరు రూరల్: నగర శివారుల్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. మండల నల్లపాడు పోలీస్‌స్టేషన్ సీఐ బాలమురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం ఫిరంగిపురం మండలం వేములూరిపాడుకు చెందిన ఆట్ల నాగమణి(20) ఓ కార్పోరేట్ కళాశాలలో హాస్టల్లో ఉంటూ బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అనారోగ్యంగా ఉందని ఉదయం జరిగే స్టడీ అవర్ క్లాసులకు వెళ్లకుండా హాస్టల్ రూంలోనే ఉంది. ఈ క్రమంలో తాను ఉండే గది పక్కనే ఉన్న మరో గదిలో స్నేహితుల బ్యాగులు వెతుకుతుండగా హాస్టల్లో ఉండే విద్యార్థులు గమనించి ఆమె నిలదీశారు. వార్డెన్‌కు ఫిర్యాదు చేసేందుకు విద్యార్థులు వెళ్లడంతో మనస్తాపానికి గురైన నాగమణి రూం తలుపులు వేసుకుని చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గదిలోకి వెళ్లి ఎంతకీ బయటకు రాకపోవటంతో గమనించిన అధ్యాపకులు కిటికీలనుంచి చూడగా అప్పటికే ఉరివేసుకుని ఫ్యానుకు వేలాడుతుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
27న రాష్ట్ర వ్యాప్త ప్రైవేట్ జూనియర్ కాలేజీల బంద్
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్త బంద్‌ను పాటించాలని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (టీపీజేఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు వి.నరేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నాంపల్లిలోని 21 సెంచరీ బిల్డింగ్‌లోని టీపీజేఎంఏ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్త బంద్ పోస్టర్ ఆవిష్కరణ సభ జరిగింది. వి.నరేందర్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు గౌరి సతీశ్, ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్‌రెడ్డిలతో కలసి పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. ప్రైవేట్ కళాశాలల సమస్యలను పరిష్కరించాలని అనేక మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. ఇంటర్ బోధన రుసుమును పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచాలని, పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం దిగిరాకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికైనా వెనుకాడబోమని హెచ్చరించారు. -
విద్యార్థులున్నా.. కాలేజీలు సున్నా
సాక్షి, హైదరాబాద్ : ♦ పాత మహబూబ్‌నగర్ జిల్లా దౌలతాబాద్ మండలంలో 6 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఓ ఎయిడెడ్ పాఠశాల, మరో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) ఉన్నాయి. వాటిల్లో 533 మంది పదో తరగతి చదువుతున్నారు. కానీ అక్కడ ఒక్క జూనియర్ కాలేజీ లేదు. దీంతో ఇంటర్ చదివేందుకు విద్యార్థులకు తంటాలు తప్పడం లేదు. ♦ వికారాబాద్ జిల్లా బొమ్రాస్పేట్ మండలంలో 4 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఓ కేజీబీవీ, ఓ గిరిజన ఆశ్రమ పాఠశాల ఉన్నాయి. వాటిల్లో 441 మంది పదో తరగతి చదువుతున్నారు. అక్కడా ఒక్క జూనియర్ కాలేజీ లేదు. దీంతో ఇంటర్ కోసం ఇతర మండలాల్లోని ప్రైవేటు కాలేజీలకు వెళ్లాల్సి వస్తోంది. ఆర్థిక స్తోమత లేని కొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలను దూర ప్రాంతాల్లోని ప్రభుత్వ కాలేజీలకు పంపిస్తుండగా మరికొంత మంది పదో తరగతి తరువాత చదువు ఆపేస్తున్నారు. ఇక్కడే కాదు.. రాష్ట్రంలోని 106 మండలాల్లో జూనియర్ కాలేజీలు లేక విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వ కాలేజీల ఏర్పాటుపై ఇప్పటివరకు ఇంటర్మీడియట్ విద్యా శాఖ అధికారులు దృష్టి సారించకపోగా, ప్రైవేటు కాలేజీల ఏర్పాటుకు యాజమాన్యాలు ముందుకు రాలేదు. దీంతో ఆయా మండలాల్లోని విద్యార్థులు నిత్యం ఇతర ప్రాంతాల్లోనే కాలేజీలకు వెళ్లేందుకు ఇబ్బంది పడాల్సి వస్తోంది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత 125 మండలాలు పెరిగాయి. దీంతో మండలాల సంఖ్య 584కి చేరింది. కానీ 106 మండలాల్లో ఒక్క కాలేజీ లేదని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. కొత్తగా ఏర్పడిన మండలాలే కాదు.. పాత మండలాల్లోనూ కాలేజీలు లేక పిల్లల్ని ఇతర మండలాలకు పంపాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రజా ప్రతినిధులు, స్థానికుల ఒత్తిడి రాష్ట్రంలో కొత్త జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పాటైన నేపథ్యంలో జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. గతంలో 10 జిల్లాలుండగా వాటిని 31 జిల్లాలు చేయడం.. పాత మండలాలు 459 ఉండగా 584కు పెంచడంతో జూనియర్ కాలేజీల ఏర్పాటుకు స్థానికులు డిమాండ్ చేస్తు న్నారు. ఐదారు ఉన్నత పాఠశాలలున్న గ్రామాల స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు ఒక్క జూనియర్ కాలేజీ లేని మండలాల్లో ఏర్పాటుకు ఒత్తిడి తెస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు ప్రతిపాదనలూ సిద్ధం చేయించి ఇంటర్ విద్యా శాఖకు పంపుతున్నారు. దీంతో ఏయే మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు లేవు.. ఏయే మండలాల్లో ప్రైవేటు కాలేజీలున్నాయి.. అసలు ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీ లు లేని మండలాలు ఏవో లెక్కలు తేల్చారు. మొత్తం గా 106 మండలాల్లో అటు ప్రభుత్వ జూనియర్ కాలే జీ గాని, ఇటు ప్రైవేటు కాలేజీ కానీ లేదని తేల్చారు. వాటి విషయంలో ఏం చేయాలని యోచిస్తున్నారు. కాలేజీలు లేని మండలాలు మరిన్ని.. వికారాబాద్ జిల్లా ధరూర్ మండంలో 8 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఓ కేజీబీవీ ఉంది. వాటిల్లో 459 మంది పదో తరగతి చదువుతున్నారు. అక్కడ ప్రభుత్వ లేదా ప్రైవేటు జూనియర్ కాలేజీ ఒక్కటీ లేదు. అదే జిల్లాలోని కోటపల్లిలో 5 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉండగా పదో తరగతి విద్యార్థులు 203 మంది ఉన్నారు. అక్కడా ఒక్క కాలేజీ లేదు. జనగా మ జిల్లాలో తరిగొప్పుల, వరంగల్ రూరల్ జిల్లా లోని దుగ్గొండి, నల్లబెల్లి, యాదాద్రి జిల్లాలోని ఆత్మకూరు, రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు, నిర్మల్ జిల్లా లోని బాసర, నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో జూనియర్ కాలేజీలు లేవు. డిమాండ్ ఉన్న చోట ఏర్పాటు చేయాలి ఉన్నత పాఠశాలలు, విద్యార్థులు ఎక్కువ మంది ఉన్న మండలాల్లో డిమాండ్ మేరకు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయాలి. కాలేజీలు లేని కొత్త మండలాలతో పాటు పాత మండలాల్లోనూ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వానికి ఇంటర్మీడియట్ విద్యా శాఖ ప్రతిపాదనలు పంపాలి. – పి.మధుసూదన్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు -
స్కూళ్లకు ప్రత్యేక స్లాబ్‌లో ఆస్తిపన్ను
సాక్షి, హైదరాబాద్: పాఠశాలలకు ప్రత్యేక స్లాబ్‌లో ఆస్తిపన్ను వసూలు చేసేలా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు. ప్రైవే ట్ విద్యా సంస్థల్లో విద్యార్థుల భద్రత విషయంలో ప్రభుత్వం, ప్రైవేట్ యాజమాన్యాలు కలిసి పని చేయాలని, విద్యార్థుల భద్రతలో రాజీపడేది లేదన్నా రు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో సమస్యలపై గురువారం పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, సంబంధిత శాఖల అధికారులతో కడియం శ్రీహరి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో విద్యాసంస్థల అనుమతులు, గుర్తింపు, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు మంత్రుల దృష్టికి తీసుకెళ్లాయి. అనంతరం సమావేశ వివరాలను కడియం శ్రీహరి మీడియాకు వెల్లడించారు. విద్యార్థుల భద్రతలో యాజమాన్యాలు కచ్చితమైన నిబంధనలు పాటించాల్సిందేనని, అగ్నిమాపక చర్యలు చేపట్టాలని యాజమాన్యాలకు మంత్రులు స్పష్టం చేశారు. జాతీయ అగ్నిమాపక నిబంధనలు రాకముందు ఏర్పాటైన పాఠశాలల భవనాలకు ఆ నిబంధనలు వర్తింపజేయడంలో ఎలాంటి వెసులుబాటు కల్పించాలనే దానిపై కమిటీ వేస్తామన్నారు. పాఠశాలలకు ఆస్తిపన్నును తగ్గించాలన్న యాజమాన్యాల విజ్ఞప్తిని మంత్రులు అంగీకరించి, ప్రత్యేక స్లాబులో ఆస్తిపన్ను వసూలు చేసేలా చర్యలు చేపడతామని, ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో అది అమల్లో ఉందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపుపై కమిటీ! ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులో డిగ్రీ, జూనియర్ కాలేజీలకు సరైన న్యాయం జరగడం లేదని పేర్కొనగా.. దానిపై మంత్రులు సానుకూలంగా స్పందించారు. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య చైర్ పర్సన్‌గా ఆర్థిక శాఖ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్యదర్శులు సభ్యులుగా కమిటీ వేసి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పాఠశాలలు, కాలేజీల అనుమతులకు ఎన్వోసీల జారీని వికేంద్రీకరించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. హాస్టళ్లకు అనుమతులు తీసుకోవాల్సిందేనని యాజమాన్యాలకు స్పష్టం చేశారు. ప్రైవేటు విద్యా సంస్థలపై కక్షసాధింపు ధోరణి ఏమీ లేదని, ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు విద్యలో నాణ్యత ప్రమాణాలను పెంపొందించాలని పేర్కొన్నారు. -
ప్రైవేటు కనికట్టు.. ఇంటర్ బోర్డు తాకట్టు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డును ఓ ప్రైవేటు సంస్థకు తాకట్టు పెట్టారు. అధికారులు, ప్రైవేటు సంస్థ ప్రతినిధులు కుమ్మక్కై బోర్డు అధికారిక వెబ్సైట్ నుంచే వ్యాపారానికి దారులు వేశారు. విద్యార్థుల వేలి ముద్రలు సేకరించే బయోమెట్రిక్ మెషీన్ల విక్రయాలకు బోర్డు వెబ్సైట్ ద్వారానే రాచబాట వేసి భారీగా దండుకుంటున్నారు. అసలు అవసరమే లేని.. ఒక్కోటి రూ.2 వేల విలువైన బయోమెట్రిక్ మెషీన్లను బోర్డు వెబ్సైట్ ద్వారా రూ.5 వేల చొప్పున కాలేజీలతో వేలాదిగా కొనుగోలు చేయించారు. అన్నీ అడ్డగోలు వ్యవహారాలే.. ఏటా 10 లక్షల మంది విద్యార్థుల సమాచారం, అడ్మిషన్లు, పరీక్షలు, ఫలితాల వెల్లడి వంటి వ్యవహారాలను ఇంటర్ బోర్డు సొంతంగా చేసుకునేలా ఓ సాఫ్ట్వేర్ సంస్థకు వచ్చిన ఆలోచనను అధికారులు ఆచరణలో పెట్టారు. తమకు భారీగా కమీషన్లు వస్తాయని ఉద్దేశంతో ఓకే చెప్పేశారు. ఇందులో భాగంగా విద్యార్థుల డేటా ప్రాసెసింగ్, రిజల్ట్ ప్రాసెసింగ్ పనులను సదరు సంస్థకు అప్పగించారు. ఏటా రూ.20 లక్షలే ఆ పనులకు ఖర్చవుతున్నా.. సదరు సంస్థ రూ.4.5 కోట్లతో ఇచ్చిన ప్రతిపాదనలకు అనుమతిచ్చేశారు. డేటా ప్రాసెస్ పనులను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) నుంచి తొలగించి ఆ సంస్థకు అప్పగించారు. పనులు దక్కించుకున్న సదరు సంస్థ తమ పనితీరును నిరూపించుకునేందుకు డేటా, రిజల్ట్స్ ప్రాసెసింగ్ టెస్టింగ్‌ను ఉచితంగా చేయాలి. కానీ అధికారులు టెస్టింగ్ కోసం కూడా రూ.75 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. అయితే టెస్టింగ్ ఏమైందో ఎవరికీ తెలియదు. ఒకటి తేలకుండానే ఇంకోటి.. టెస్టింగ్ ప్రాసెస్ తేలకముందే ఇంటర్ బోర్డు అదే సంస్థకు మరో పని అప్పగించింది. 2018–19కి సంబంధించి విద్యార్థుల ప్రవేశాలు, డేటా క్యాప్చర్ వంటి పనులను అప్పగించింది. మొదట ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశాలను ఆన్లైన్ చేసేందుకు సదరు సంస్థ చర్యలు చేపట్టింది. సాఫ్ట్వేర్ లేకపోవడం, ప్రోగ్రాం సరిగ్గా రూపొందించుకోని కారణంగా వీటిని సక్రమంగా చేయలేకపోయింది. సీజీజీ నుంచి గత ఏడాది ఆన్లైన్ ప్రవేశాల ప్రాసెస్ ప్రోగ్రాం మోడల్స్ తెచ్చుకొని కొంత మేర ఆన్లైన్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే అదీ కూడా సరిగ్గా చేయలేదు. ప్రభుత్వ కాలేజీల్లో రీ అడ్మిషన్లు, 37 వేల మంది సీబీఎస్ఈ విద్యార్థుల ప్రవేశాలు, ఒక కాలేజీ నుంచి మరో కాలేజీకి వెళ్లే విద్యార్థుల ప్రవేశాలు ఆన్లైన్ చేయలేకపోయింది. ప్రైవేటు కాలేజీల విద్యార్థుల ఆన్లైన్ ప్రవేశాలను ప్రాసెస్ చేయలేదు. మరో 30 రోజులు గడువు కావాలని కోరింది. దీంతో ఇంటర్ బోర్డు.. ప్రవేశాల వ్యవహారాలను తిరిగి సీజీజీకి అప్పగించింది. ప్రభుత్వ విధానాన్ని అడ్డుపెట్టుకొని.. విద్యార్థులకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదని, ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందే వారికే తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంది. దీంతో బయోమెట్రిక్ మెషీన్లను బోర్డు కొనుగోలు చేసింది. దీన్ని అడ్డుపెట్టుకొని సదరు సంస్థ రంగంలోకి దిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ మెషీన్లు కొనుగోలు చేయాలని కాలేజీలకు ఆ సంస్థ సమాచారం పంపింది. కాలేజీల సమాచారం ఆ సంస్థకు ఎలా వెళ్లిందన్నది ఇప్పుడు అర్థం కావడం లేదు. ఆ సమాచారమంతా ఇంటర్ బోర్డు, సీజీజీ, ప్రైవేటు సాఫ్ట్వేర్ సంస్థ వద్దే ఉంది.ఆ ప్రైవేటు సాఫ్ట్వేర్ సంస్థనే కాలేజీల సమాచారాన్ని బయోమెట్రిక్ మెషీన్ల కంపెనీకి ఇచ్చి ఉంటుందని బోర్డు అధికారు లు అనుమానిస్తున్నారు. బోర్డు వెబ్సైట్లో (http:// acad.tsbie.telangana.gov.in) కాలేజీలు లాగి న్ అయ్యాక.. ‘మెషీన్లను బోర్డు గుర్తించింది. వాటినే కొనుగోలు చేయాలి’ అని కనిపించేలా మార్పులను ఆ ప్రైవేటు సంస్థే చేసిందని భావిస్తున్నారు. భారీ కుట్ర! బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేస్తే బయోమెట్రిక్ మెషీన్లను కొనుగోలు చేయాలనే పేజీ కనిపించదు. కాలేజీ యాజమాన్యాలు తమ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌తో వెబ్సైట్లో లాగిన్ అయ్యాక మాత్రం ప్రత్యేకంగా ఓ పేజీనే ప్రత్యక్షమయ్యేలా కుట్రపన్నారు. పైగా అవి బోర్డు ధ్రువీకరించిన మెషీన్లని, వాటిని కొనుగోలు చేయాలంటూ వెబ్సైట్లోనే మార్పులు చేసి భారీ మోసానికి పాల్పడ్డారు. ఇలా ఓ ప్రైవేటు సాఫ్ట్వేర్ సంస్థ చేసిన మోసంతో యాజమాన్యాలు మెషీన్లను కొనుగోలు చేసి నష్టపోయా యి. రూ.కోట్ల వ్యవహారంలో బోర్డు అధికారులు కమీషన్ల రూపంలో భారీగా ముడుపులు పుచ్చుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో రహస్యంగా ఉండాల్సిన విద్యార్థుల సమాచారా న్ని, బోర్డు ఆన్లైన్ వ్యవహారాలను కనీస గోప్యత పాటించని సంస్థకు అప్పగించడం వెనుక భారీ కుట్ర ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు సంస్థ మెషీన్ కొనుగోలు పేజీ -
హైకోర్టు ఆదేశిస్తేగానీ స్పందించరా?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని కాలేజీల్లో ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఎస్ఏఎఫ్ఆర్సీ) తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫీజులు ఎలా ఉండాలన్న విధివిధానాలపై హైకోర్టు ఆదేశిస్తేగానీ కమిటీ స్పందించదా అని ప్రశ్నించింది. కమిటీ తీరు వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు సమస్యలు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించింది. రెండు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల ఖరారు వివాదంపై దాఖలైన వ్యాజ్యాలను శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. 2016–17 నుంచి 18–19 వరకు మూడేళ్ల విద్యాసంవత్సరానికి గాను ఇంజనీరింగ్ విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజు ఏడాదికి రూ.97 వేలుగా కమిటీ సిఫార్సు చేసింది. ఇలా చేయడాన్ని శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ, వాసవీ ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టులో సవాల్ చేశాయి. ఆ కాలేజీల ట్యూషన్ ఫీజు రూ.1.37 లక్షలు, రూ.1.60 లక్షలుగా చేయాలని గతంలో సింగిల్ జడ్జి ఉత్తర్వులిచ్చారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణ ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కమిటీ చైర్మన్ ఒక్కరే ఫీజుల్ని నిర్ణయించడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. మిగిలిన కమిటీ సభ్యులు ఏం చేస్తున్నారని, సమావేశాల మినిట్స్ పరిశీలిస్తే డొల్లతనం బట్టబయలు అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాజ్యాలపై తీర్పును తర్వాత వెలువరిస్తామని ధర్మాసనం ప్రకటించింది. -
అడ్డగోలు ప్రవేశాలకు అంతేలేదు!
సాక్షి, అమరావతి: ఇంటర్ విద్యను కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఆదాయ మార్గంగా మార్చేశాయి. నిబంధనలకు విరుద్ధంగా కుప్పలు తెప్పలుగా విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. వాస్తవ సంఖ్యకు, రికార్డుల్లో చూపించే లెక్కకు ఎక్కడా పొంతన ఉండదు. నిర్ణీత ఫీజు కంటే పది రెట్లు ఎక్కువగా పిండుకుంటున్నా ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరిస్తోంది. అనుమతులు లేకుండా హాస్టళ్లను తెరుస్తున్నా అధికారులు ఆవైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. మూడొంతుల మంది ప్రైవేట్ కాలేజీల్లోనే.. రాష్ట్రంలో 3,361 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 1,143 మాత్రమే ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీలు కాగా తక్కిన 2,218 కాలేజీలు కార్పొరేట్ సంస్థలవే. గతంలో ప్రభుత్వం రూపొందించిన గణాంకాల ప్రకారం శ్రీచైతన్య పరిధిలో 186 కాలేజీలుండగా అందులో 1.52 లక్షల మంది చదువుతున్నట్లు పేర్కొంది. నారాయణ పరిధిలోని 152 కాలేజీల్లో 85 వేల మంది, ఎన్ఆర్ఐ యాజమాన్యం పరిధిలోని 38 కాలేజీల్లో 14 వేల మంది, శ్రీగాయత్రి పరిధిలోని 27 కాలేజీల్లో 12 వేల మంది, ఇతర ప్రైవేట్ కాలేజీల్లో మిగతా విద్యార్థులు చదువుతున్నట్లు తేల్చారు. అప్పట్లో విద్యార్థుల సంఖ్య 7 లక్షలు మాత్రమే కాగా ఇప్పుడు ఇంటర్లో చేరే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల సంఖ్య గత ఏడాది 10.26 లక్షల వరకు ఉంది. వీరిలో 3 లక్షల మంది మాత్రమే ప్రభుత్వ కాలేజీల్లో చదువుతుండగా మిగతా వారంతా ప్రైవేట్ కళాశాలల్లోనే చేరుతున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలు కొన్ని కాలేజీలకే ఇంటర్ గుర్తింపు తీసుకుని పలు బ్రాంచీలు నిర్వహిస్తున్నాయి. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి తదితర పట్టణాల్లో ఇలా జోరుగా విద్యా వ్యాపారాన్ని సాగిస్తున్నాయి. ఎండాకాలంలోనే ప్రవేశాలు పూర్తి ఇంటర్ ప్రవేశాలకు సంబంధించి బోర్డు పలు నిబంధనలు విధిస్తూ సరŠుయ్యలర్లు జారీ చేసింది. నిర్ణీత షెడ్యూల్ విధించినా కార్పొరేట్ విద్యాసంస్థలు పట్టించుకోవడం లేదు. విద్యార్థులకు వార్షిక పరీక్షల అనంతరం మార్చి 29 నుంచి మే 31 వరకు సెలవులు ఇచ్చి జూన్ 1న కాలేజీలను పునః ప్రారంభించాలి. మొదటి విడత ప్రవేశాలను అప్పుడే నిర్వహించాల్సి ఉండగా ప్రైవేట్ కాలేజీలు అంతకు ముందే వేసవి సెలవుల్లోనే చేపడుతున్నాయి. ఒక్కో సెక్షన్‌కు గరిష్టంగా 88 మంది చొప్పున ఎన్ని సెక్షన్లకు అనుమతి ఉంటే అంత మందిని మాత్రమే చేర్చుకోవాల్సి ఉన్నా పరిమితికి మించి ప్రవేశాలను కల్పిస్తున్నాయి. రిజర్వేషన్లకు చెల్లుచీటీ నిబంధనల ప్రకారం ఆయా కాలేజీల్లోని మొత్తం సీట్లలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం సీట్లు కేటాయించాలి. వెనుకబడిన తరగతులకు 29% సీట్లు ఇవ్వాలి. అందులో బీసీ(ఏ) 7%, బీసీ(బీ) 10 శాతం, బీసీ(సీ) 1%, బీసీ(డీ) 7 శాతం, బీసీ(ఈ)కి 4% చొప్పున సీట్లు ఇవ్వాలి. దివ్యాంగులకు 3 శాతం, ఎన్సీసీ, క్రీడల కోటా కింద 5 శాతం, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు 3 శాతం సీట్లు కేటాయించాలి. అంతేకాకుండా ఆయా కేటగిరీల్లోని సీట్లలో 33.33% సీట్లు బాలికలకు కేటాయించాలి. ఈ నిబంధనలను కార్పొరేట్ కాలేజీలు ఎక్కడా పట్టించుకోవడం లేదు. ఆన్లైన్లో ప్రవేశాలతో ఫీజుల దందాకు తెర ఇంజనీరింగ్ మాదిరిగానే ఆన్లైన్లో ప్రవేశాల విధానాన్ని తెస్తే ప్రైవేట్ కాలేజీల అరాచకాలకు కొంతైనా అడ్డుకట్ట పడుతుందని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఫీజులను కూడా ప్రభుత్వమే ఆన్లైన్ ద్వారా సంబంధిత కాలేజీలకు చెల్లించేలా ఏర్పాటు చేస్తే అడ్డగోలు వసూళ్లకు తెర పడుతుందని, ప్రవేశాల్లో పారదర్శకత వస్తుందని సూచిస్తున్నారు. అయితే ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల విద్యా వ్యాపారానికి కొమ్ము కాస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు ముందుకు రావడం లేదు. చీమల పుట్టల్లా హాస్టళ్లు... ఒకవైపు లెక్కకు మించి ప్రవేశాలను కల్పిస్తున్న కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు అనుమతులు లేకుండానే కాలేజీలకు అనుబంధంగా ఇరుకు గదుల్లో హాస్టళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. కాలేజీల్లో ప్రవేశానికి నిబంధనల ప్రకారం డేస్కాలర్లకు రూ.12,500 చొప్పున మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా రూ.60 వేల నుంచి రూ.లక్షకు పైనే గుంజుతున్నాయి. ఇక హాస్టళ్లలో చేరేవారి నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల దాకా పిండుకుంటున్నాయి. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. -
విలువైన విద్యా.. విలువల విద్యా?
లక్షలు ఖర్చుపెట్టి కార్పొరేట్ కాలేజీల్లో అధిక శాతం మార్కులు, ర్యాంకులు సాధించడం అవసరమా? నైతిక విలువలు, మానవీయ వ్యక్తిత్వం, సృజనాత్మకతతో కూడిన విద్య అవసరమా అంటే ఎటూ తేల్చుకోలేని పరిస్థితి నేటి సగటు విద్యార్థిది. కేవలం ర్యాంకులు, మార్కులు, ఆంగ్ల భాషా నైపుణ్యాలుంటే ఐదంకెల ఉద్యోగం దొరుకుతున్న ఈ రోజుల్లో వ్యక్తిత్వం, విలువల గురించి మాట్లాడటం అమాయకత్వమే అవుతుందేమో! మనందరం మర్చిపోతున్న విషయమిది. తెలివి తేటలకు, ప్రతిభకు కొలమానం ఏంటి? సంపన్నులైన తల్లిదండ్రులు లక్షలు వెచ్చించి అంతర్జాతీయ పాఠశాలలు/కళాశాలల్లో చదివిస్తూ, ట్యూషన్లు, పాఠ్య పుస్తకాలు, మెటీరియల్ వంటి అన్ని మౌలిక వసతులు కల్పిస్తే చదివి అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థి ప్రతిభావంతుడా? ఏ అవకాశాలు లేకుండా.. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల నుంచి వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ అరకొర వసతులతో, ఓ మోస్తరు మార్కులతో ఉత్తీర్ణులైన వారు ప్రతిభావంతులా? దేశంలో రెండో వర్గపు దురదృష్టవంతులే ఎక్కువ. ఈ ర్యాంకుల గొడవ ఈనాటిది కాదు. బ్రిటిష్ వారు మన దేశంలో విద్యావ్యవస్థను స్థాపించినప్పటినుంచి కేవలం రెండు తరగతులే ఉండేవి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. ఫస్ట్ క్లాసులో పాసవ్వాలంటే ఆంగ్లేయ వలస విధానాలకు అనుగుణమైన పాఠ్యాంశాలను బట్టీపట్టాలి. ఈ విధానాలను అందుకోలేక వెనుకబడిన భారతీయుల కోసం ధర్డ్ క్లాస్ అనే మరో తరగతిని సృష్టించారు. చదువుకునే కూలీలను తయారు చేసి వారి అవసరాలకు అనుగుణంగా వాడుకోవడానికే ఈ మూడో తరగతి పనికొచ్చేది. నేటికీ ఇదే విధానం కొనసాగుతూ చదువుకున్న కూలీల సంఖ్యే దేశంలో ఎక్కువగా ఉంది. వీరెవ్వరికీ సృజనాత్మకత, స్వీయ ఆలోచనా సామర్థ్యం, విలువలు, నైతికత, నిజాయితీ, సామాజిక బాధ్యత వంటివి తెలీవు. అందుకే మనలో లేని విలువలను, నైతికతను, నిజాయితీని, మానవీయ గుణాలను మనపిల్లల్లో చూడాలనుకోవడం అవివేకం కాదా? ఆవు చేలో మేస్తుంటే, దూడ గట్టున మేస్తుందా? రాష్ట్రంలోనే ప్రథమ ర్యాంకు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులను చూశాం. అత్యధిక ర్యాంకులను సాధించిన విద్యా సంస్థలను చూశాం. అత్యున్నత బోధనతో అత్యధిక మార్కుల సాధనకు కృషి చేసే ఉపాధ్యాయులను చూశాం. కానీ మంచి వ్యక్తిత్వం, విలువలు, సృజన, బాధ్యత గల విద్యార్థులను రూపొందించే ఉపాధ్యాయులూ, విద్యాసంస్థలూ, తల్లిదండ్రులు నేడు అరుదుగా కనబడుతున్నారు. ఇవాళ సమాజంలో జరుగుతున్న అనేక అకృత్యాలలో పాఠశాల, కళాశాల విద్యార్థులే ఎక్కువగా దోషులుగా నిలబడుతున్నారు. ఆడపిల్లలపై జరుగుతున్న లైంగిక అత్యాచారాలలో అధికశాతం వీరిదే. మన పిల్లల్లో నేర, హింసా ప్రవృత్తి పెరగడానికి కారణం వీరికెక్కడా విలువలు గురించి ఆలోచించే సమయం, అవసరం లేకపోవడమే. ఉమ్మడి కుటుం బాలు కనుమరుగవడంతో పిల్లలను కనిపెట్టుకుని సరైన దారిలో నడిచేటట్టు చూసేవారు లేకుండా పోయారు. నేడు పిల్లలు తప్పుదోవ పట్టడానికి ప్రధాన కారణం పెద్దల పర్యవేక్షణ లేకపోవడమే. ఇటీవల హర్యానాలో 16 ఏళ్లున్న ఇంటర్మీడియట్ విద్యార్థి.. పాఠశాల ప్రిన్సిపల్‌ని తుపాకీతో కాల్చి చంపాడు. కారణం హాజరు తక్కువగా ఉన్నం దుకు ప్రిన్సిపల్ హెచ్చరించటంవల్ల, అందరి ముందూ పరువు పోయిందని భావించటం. గుర్గావ్కు చెందిన 7వ తరగతి విద్యార్థి తన తరగతి ఉపాధ్యాయురాలిపై లైంగిక దాడికి ప్రయత్నించి, ఆ మొత్తం సంఘటనను ఫేస్బుక్లో ఉంచటం అతనిలో భావోద్వేగాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. నేటి తరం విద్యార్థుల్లో పెద్దవారి పట్ల గౌరవ భావం, ఉపాధ్యాయులపట్ల భక్తిశ్రద్ధలు, తోటివారితో సంతోషంగా మెలగటం వంటి చిన్న చిన్న విషయాలు కూడా తెలియక పోవటం దురదృష్టం. స్మార్ట్ఫోన్ల శకంలో తామొక మానవ సమూహంలో ఉన్నానన్న స్పృహ కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. నేటి తరానికి అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులోకి రావటంవల్ల చూడకూడనివి చూస్తున్నారు. నేర్వకూడనివి నేర్చుకుంటున్నారు. ఇటువంటి పరిణామాలను నియంత్రించటం భౌతి కంగా అయ్యే పని కాదు. కేవలం విలువల ప్రాధాన్యత తెలియ చెప్పటం ద్వారా పరిణతి చెందిన ఆలోచనలతో స్వీయ నియంత్రణను అలవర్చుకుంటారు. ముఖ్యంగా నేటి తరానికి కష్టం అంటే ఏమిటో తెలియదు. విలాసవంతమైన, సుఖమయ జీవనం వీరి సొంతం. ఒకసారి సౌకర్యవంతమైన జీవన పరిధి దాటి బయటకొచ్చినప్పుడు విలువల్ని కాపాడుకోవటం చాలా కష్టం. ఆ కష్టాన్ని ఓర్చుకోవాలంటే గొప్ప వ్యక్తిత్వ నిర్మాణం అవసరం. విలువలు లేని విద్యతో వాటిని నాశనం చేసుకుంటే మున్ముందు మనిషనేవాడు కనపడడు. ఇప్పటికే ఎటు చూసినా మృగయా వినోదపు ఘీంకారాలు నలుదిశలా మ్రోగుతున్నాయి. వాటికి చరమగీతం పాడాలంటే విలువలతో కూడిన విద్యను మన ముందు తరాలకు అందించటానికి నడుం బిగించాలి. వ్యాసకర్త ప్రిన్సిపాల్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మొబైల్ : 78931 11985 -
వెట్టి కన్నా ఘోరం
సాక్షి, అమరావతి : అక్కడ పని వెట్టి కన్నా ఘోరం. చట్టాలు, నియమ నిబంధనలూ అస్సలు పట్టవు. ఉద్యోగం ఎన్నాళ్లుంటుందో... ఎప్పుడు తీసేస్తారో తెలియదు. ఇచ్చే వేతనాలూ అరకొర... అవీ ఎప్పుడిస్తారో దేవుడికే ఎరుక. ఇక మహిళల పరిస్థితి మరింత దారుణం. లైంగిక వేధింపులు షరా మామూలే. గర్భిణులు, బాలింతలకు ఇవ్వాల్సిన సెలవులు వీరికి వర్తించవు. ఇలా ఎన్ని చెప్పుకొన్నా తరగని ఈ వెతలు ప్రైవేటు విద్యాసంస్థల్లోని బోధన, బోధనేతర సిబ్బందివి. నియమాలు చట్టుబండలు... రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో కేవలం హైస్కూలు స్థాయి వరకే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎక్కువ ఉన్నాయి. ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, బీఈడీ, డీఈడీ ఇలా ఇతర కాలేజీలన్నీ అత్యధికం ప్రైవేటులోనే ఉన్నాయి. విద్యార్ధులూ ప్రభుత్వ సంస్థల్లో కన్నా ప్రైవేటులోనే అత్యధికంగా ఉన్నారు. వీరి నుంచి కోట్ల కొద్దీ సొమ్మును ఫీజుల రూపేణా వసూలు చేస్తున్న ఈ సంస్థలు.. సిబ్బందికి చెల్లించేది మాత్రం నామమాత్రమే. స్కూళ్లు, కాలేజీల్లో కలిపి దాదాపు 5 లక్షల మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు పనిచేస్తున్నట్లు అంచనా. సిబ్బంది గురించి స్పష్టమైన గణాంకాలను ఆయా సంస్థలు ఇవ్వకుండా రికార్డులను వేర్వేరుగా నిర్వహిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు విద్యాసంస్థలు వేలల్లో∙ఉన్నాయి. వీటిలో దాదాపు 5.5 నుంచి 6 లక్షల మంది వరకు బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని 61 వేల బడుల్లో ప్రైవేటు స్కూళ్ల సంఖ్య తక్కువే అయినా మొత్తం 72 లక్షల మందిలో సగం వీటిల్లోనే చదువుతున్నారు. ఇంటర్మీడియెట్‌లో 9 లక్షల మంది విద్యార్థులుండగా వీరిలో కేవలం 2 లక్షల మందే ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్నారు. మిగిలిన వారు ప్రైవేటులోనే ఉన్నారు. డిగ్రీ కళాశాలల విషయంలోనూ ఇదే పరిస్థితి. దయనీయ పరిస్థితులు బీఈడీ, ఎంఈడీ సహా పలు విద్యార్హతలున్న వారికి సైతం ఇచ్చేది రూ.10 నుంచి రూ.15 వేలే. అదికూడా 10 నెలలే. ఏడాదిపాటు చెప్పాల్సిన సిలబస్‌ను 5 నెలల్లో ముగించి టీచర్లను బయటకు పంపేస్తున్నారు. సీనియారిటీ పెరిగిన ఉద్యోగులకు వేతనాలుపెంచాల్సి వస్తుందన్న కారణంతో అకారణంగా ఉద్యోగం మానిపిస్తున్నారు. స్కూల్/కాలేజీల్లో పిల్లల్ని చేర్పించే టీచర్ల మీదే మోపుతున్నారు. ఇందులో టార్గెట్లు చేరుకోవాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లు తీçసుకొని, ఇవ్వకుండా వేధిస్తున్నారు. ఆదివారాలు, పండగలు, జాతీయ పర్వదినాల్లోనూ సిబ్బందికి సెలవు ఇవ్వరు. సరైన వసతులు ఉండవు. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు నిల్చునే పనిచేయాలి. మహిళల పరిస్థితి మరీ దారుణం.. మహిళా సిబ్బంది పరిస్థితి మరింత దయనీయం. మెటర్నీటీ లీవులు లేవు. నిండు గర్భంతో ఉన్నా విధులకు రావాల్సిందే. లేదంటే ఉద్యోగం మానుకోవాలి. కొన్ని సంస్థల్లో మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులూ జరుగుతున్నాయి. అవేవీ బయటకు రాకుండా యాజమాన్యాలు మేనేజ్ చేస్తున్నాయి. ఈ సంస్థల్లో విద్యార్ధులే కాదు టీచర్లూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చట్టం ఏం చెబుతోందంటే... ప్రభుత్వ పాఠ్యప్రణాళికను, పాఠ్యాంశాలను, సమయవేళలను తప్పనిసరిగా అనుసరించాలి. విద్యాసంస్థలను వ్యాపార దృక్పథంతో నడపరాదు. ఉద్యోగ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి. పీఎఫ్ వంటి ప్రభుత్వ నిబంధనలను టీచర్లకు, సిబ్బందికి వర్తింపచేయాలి. ఫీజుల్లో 5 శాతం మేనేజ్మెంటు ఉంచుకోవచ్చు, 15 శాతం స్కూలు నిర్వహణకు, 50 శాతం వేతనాలకు వినియోగించాలి. 15 శాతం మొత్తాన్ని సిబ్బంది గ్రాట్యుటీ, ప్రావిడెంటు ఫండ్, ఇన్సూరెన్సుల కింద మేనేజ్మెంటు వాటాగా చెల్లించడానికి వినియోగించాలి. ఉద్యోగుల్ని ఏకపక్షంగా తొలగించే అధికారం యాజమాన్యానికి లేదు. విధి నిర్వహణలో సరిగా లేకుంటే ఇంక్రిమెంట్ల కోత, సీనియార్టీ తగ్గింపు, అలవెన్సుల్లో కోత, వంటివి విధించవచ్చు. -
భద్రతలేని బతుకులు..!
సాక్షి, అమరావతి: అక్కడ ఉద్యోగం వెట్టి కన్నా ఘోరం.. ఉద్యోగం దినదిన గండం.. ఇచ్చే అరకొర జీతాలు ఎప్పుడిస్తారో దేవుడికే ఎరుక.. మహిళల పరిస్థితి మరీ అధ్వానం.. లైంగిక వేధింపులు సరేసరి.. ప్రత్యేక పరిస్థితుల్లో సెలవులు ఉండవు. గర్భవతులకు, బాలింతలకు చట్టబద్ధంగా ఇవ్వాల్సిన సెలవుల మాటేలేదు.. ఎవరైనా ప్రశ్నిస్తే అంతే సంగతులు, ఇంటికి పంపేస్తారు. కొన్నిచోట్ల పోలీసులతో బెదిరింపులు.. ఇదీ రాష్ట్రంలోని అనేక ప్రైవేటు విద్యా సంస్థల్లోని బోధన, బోధనేతర సిబ్బంది అనుభవిస్తున్న ప్రత్యక్ష నరకం. చట్టంలో ఎన్ని నిబంధనలున్నా ఈ సంస్థలకు పట్టవు. చట్టాలు వారికి చుట్టాలు. ప్రభుత్వాధికారులు కూడా అంతే. చూసీచూడనట్లు పోతారు. ఫలితంగా సిబ్బంది దశాబ్దాల తరబడి దారుణమైన దోపిడీకి గురవుతున్నారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ఈ సంస్థలు సిబ్బందికి మాత్రం మొక్కుబడిగా జీతాలిచ్చి శ్రమదోపిడీ, మేథో దోపిడీకి పాల్పడుతున్నాయి. రాష్ట్రంలో ప్రైవేటు యాజమాన్యంలో 16,684 స్కూళ్లు, 3,300 ఇంటర్మీడియెట్ కాలేజీలు.. 1,400 డిగ్రీ కాలేజీలతోపాటు ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, బీఈడీ, డీఈడీ, ఇలా పలు కోర్సులు నిర్వహించే ప్రైవేటు విద్యా సంస్థలూ అన్నీ కలిపి 3,500 వరకు ఉన్నాయి. వీటిలో దాదాపు 5.5 లక్షల నుంచి 6 లక్షల మంది వరకు బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 61వేల పాఠశాలల్లో ప్రైవేటు స్కూళ్ల సంఖ్య తక్కువే. అలాగే, మొత్తం 72 లక్షల మంది విద్యార్థుల్లో దాదాపు 40లక్షల మంది ప్రైవేటు సంస్థల్లోనే చదువుతున్నారు. ఇంటర్ కాలేజీల్లోని మొత్తం 9 లక్షల మంది విద్యార్థుల్లో 2–3 లక్షల మందే ప్రభుత్వ కాలేజీల్లో ఉండగా అంతా ప్రైవేటులోనే ఉన్నారు. ఇక డిగ్రీ కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి. ఈ విద్యార్ధుల నుంచి కోట్లలో ఫీజులు వసూలుచేస్తున్న యాజమాన్యాలు తమ సిబ్బందికి చెల్లించే జీతాలు మాత్రం నామమాత్రం. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో దాదాపుగా 5 లక్షల మందికి పైగా బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నట్లు అంచనా. వీరికి ఎక్కడా కనీస వేతన చట్టాన్ని అమలుచేస్తున్న దాఖలా లేదు. ఉ.8 నుంచి రాత్రి 8 వరకు వీరి పనివేళలు. వీరికి ఉద్యోగ భద్రత అనేదే లేదు. సిబ్బంది, విద్యార్థుల సంఖ్యల్లో దొంగలెక్కలు చూపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలు అసలు పట్టించుకోరు. టీచర్ల దయనీయ పరిస్థితులు – బీఈడీ, ఎంఈడీ సహ పలు విద్యార్హతలున్న వారికి సైతం ఇక్కడ ఇచ్చేది 10 నుంచి 15 వేలు మాత్రమే. కొన్ని సంస్థల్లో 5 వేలకన్నా తక్కువ వేతనమే ఉంటోంది. ఏడాది అంటే ఈ యాజమాన్యాల దృష్టిలో కేవలం 10 నెలలు మాత్రమే. – రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణ సంస్థ ద్వారా నిర్దేశించిన సిలబస్ కానీ, పాఠ్య ప్రణాళిక, క్యాలెండర్ కానీ వీటికి పట్టవు. – ఏడాదిపాటు చెప్పాల్సిన సిలబస్‌ను 5 నెలల్లో ముగించి ఆ తర్వాత పలుచోట్ల టీచర్లను బయటకు పంపేస్తున్నారు. – స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయించడం, వారిని స్కూలుకు రప్పించడం టీచర్లదే బాధ్యత. విద్యార్థుల సంఖ్య తగ్గితే టీచర్లకు జీతాలుండవు. అనేకచోట్ల వేతనాలు రెండు మూడు నెలలకు ఒకసారి ఇస్తున్నారు. – టీచర్ల నుంచి ముందుగా ఒరిజినల్ సర్టిఫికెట్లు, ప్రామిసరీ, నోటు, ఖాళీ చెక్కులు తీసుకుంటూ తరువాత వాటిని చూపించి బెదిరిస్తున్నారు. – ఒక రోజు సెలవు కావాలని అడిగినా.. అనారోగ్యం ఉన్నా సెలవులు ఇచ్చే పరిస్థితిలేదు. వేసవిలో ఆదివారాలు కూడా పనిచేయిస్తున్నారు. సెలవు పెడితే జీతం కట్టే. మహిళల పరిస్థితి మరీ దారుణం ప్రైవేట్ సంస్థల్లో మహిళా టీచర్ల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. చట్టబద్ధంగా ఉన్న మెటర్నీటీ లీవులు ఉండవు. నిండు గర్భంతో ఉన్నా రావలసిందే. లేదంటే ఉద్యోగం మానుకోవాలి. నడి వేసవి అయినా పిల్లల్ని చేర్పించడానికి వీధివీధి తిరగాలి. ఇందుకయ్యే ఖర్చులు టీచర్లే భరించుకోవాలి. కొన్ని సంస్థల్లో మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులూ జరుగుతున్నాయి. అవేవీ బయటకు రాకుండా యాజమాన్యాలు మేనేజ్ చేస్తున్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే పోలీసులతో బెదిరిస్తున్నారు. ప్రభుత్వం అంటే లెక్కేలేదు వేసవిలో ప్రభుత్వం ప్రకటించిన తేదీ నుంచి అన్ని స్కూళ్లు, కాలేజీలు తరగతులు నిర్వహించరాదు. కానీ, ప్రైవేటు విద్యాసంస్థలు వీటిని అస్సలు పట్టించుకోవు. 9వ తరగతి పిల్లలకు టెన్త్ పాఠాలు, 10 వారికి ఇంటర్ ఫస్టియర్, ఫస్టియర్ వాళ్లకు సెకండియర్, సెకండయర్ వాళ్లకు ఎంసెట్ తదితర కోచింగ్‌లు పెడుతున్నాయి. టీచర్లకు వేతనమే తప్ప ఇతర అదనపు ప్రోత్సాహకాలూ ఉండవు. ప్రభుత్వం నిర్ణయించిన పాఠ్య ప్రణాళికను, సిలబస్‌ను, క్యాలెండర్‌ను ఏమాత్రం గౌరవించవు. తమ సొంత సిలబస్‌ను, క్యాలెండర్‌ను అమలుచేస్తున్నాయి. పాఠ్యాంశాలకన్నా ఇతర కోచింగ్ అంశాలకు ప్రాధాన్యమిస్తూ చివర్లో పాఠ్యాంశాలను చెప్పిస్తున్నాయి. ఈ సంస్థల్లో విద్యార్థులే కాకుండా టీచర్లూ ఒత్తిళ్లకు గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలూ చేసుకుంటున్నారు. ప్రావిడెంటు ఫండ్‌ను టీచర్ కట్టిన దానికి సమానంగా సంస్థ భరించాలి. కానీ, రెండింటినీ టీచర్ జీతం నుంచే కట్ చేస్తున్నారు. వాటినీ సక్రమంగా జమచేయడం లేదు. కొన్నిసార్లు తప్పుçడు పేర్లతో జమచేస్తున్నారు. చివరకు ఆ ప్రావిడెంటు ఫండూ టీచర్ల చేతికి రావడంలేదు. గ్రాట్యుటీ వంటివి అసలే లేవు. చట్టం ఏం చెబుతోందంటే... – ప్రభుత్వ స్కూళ్లలోని సిబ్బందికి వర్తించే నియమావళినే ఇక్కడా పాటించాలి. – ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్య ప్రణళికను, పాఠ్యాంశాలను తప్పనిసరిగా అనుసరించాలి. – పీఎఫ్ వంటి ప్రభుత్వ నిబంధనలను వర్తింపజేస్తూ వాటిని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి జమచేయాలి. – ప్రభుత్వం నిర్దేశించిన సమయాలను కచ్చితంగా పాటించాలి. – గవర్నింగ్ బాడీ నిర్ణయించిన మేరకు సిబ్బందికి జీతాలు చెల్లించాలి. – వసూలైన ఫీజుల్లో 5 శాతం మేనేజ్మెంటు ఉంచుకోవచ్చు. 15 శాతాన్ని స్కూలు నిర్వహణకు ఖర్చుచేయాలి. 15 శాతం స్కూలు అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించాలి. 50 శాతం వేతనాలకు వినియోగించాలి. 15 శాతం మొత్తాన్ని సిబ్బంది గ్రాట్యుటీ, ప్రావిడెంటు ఫండ్, ఇన్సూరెన్సుల కింద మేనేజ్మెంటు వాటాగా చెల్లించాలి. – ఉద్యోగుల్ని డిస్మిస్ చేయడం, తొలగించడం నిర్ణీత ప్రక్రియల్లో మాత్రమే చేపట్టాలి. మా బతుకులు దుర్భరం ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న బోదన, బోధనేతర సిబ్బంది జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయి. కనీస వేతనాలు చెల్లించడంలేదు. ఉద్యోగ భద్రత అసలే లేదు. ఇక పీఎఫ్, ఈఎస్ఐ, గ్రూప్ ఇన్సూరెన్సు, గ్రాట్యుటీ వంటివీ లేవు. ప్రశ్నిస్తే నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నాయి. పిల్లలను చేర్పించకపోతే స్కూలుకు రావద్దని చెబుతున్నారు. అర్థంతరంగా తొలగిస్తుండడంతో కుటుంబాలతో రోడ్డున పడాల్సి వస్తోంది. సొంత ఆస్తులు పెంచుకుంటున్నారు. వేసవిలోనే కాదు ఏ ఇతర సెలవులూ ఇవ్వడంలేదు. మా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – డి. అంబేద్కర్, భరత్‌రెడ్డి.. రాష్ట్ర ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు -
కల్పిత కొలువులు!
నెల్లూరు నగరానికి చెందిన ఒక విద్యార్థి (పేరు వెల్లడించడానికి ఇష్టపడని) ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ప్రాంగణ ఎంపికల ద్వారా ఉద్యోగం పొందేందుకు ఆ కళాశాల యాజమాన్యానికి రూ. లక్ష చెల్లించాడు. ఉద్యోగం వస్తుందని బంధు, మిత్రులకు చెప్పి సంబరపడిపోయాడు. అయితే కొద్ది రోజులకే ఇంటికి చేరడంతో అదేమని అడిగితే నష్టపోయానని, నాలాగా ఎందరో ఉన్నారని వాపోయాడు. ప్రాంగణ ఎంపికల సమయంలో ఉపాధి ఏ విధంగా ఉంటుందో, విధులు ఏమిటో సంబంధిత కంపెనీ ప్రతినిధులు వివరించారు. తీరా చేరిన తర్వాత ముందు చెప్పిన దానికి, ఇచ్చే వేతనానికి, పనికి పొంతన లేకపోవడంతో వెనక్కి వచ్చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రీతిలో మోసపోయిన అనేక మంది విద్యార్థులు ఇప్పటికి ఆయా కళాశాలల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నెల్లూరు (టౌన్) : ఒకప్పుడు ఇంజినీరింగ్ విద్య అంటే క్రేజీగా ఉండేది. ప్రస్తుతం కొంత మేర ప్రాధాన్యత తగ్గినా మెజార్టీ విద్యార్థులు ఇంజినీరింగ్ వైపే చూస్తున్నారు. నాలుగేళ్లు చదువు పూర్తయిందంటే యువ ఇంజినీర్ చూపులన్నీ ఉపాధి వైపే ఉంటాయి. ఈ డిమాండ్‌ను మెజార్టీ ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు క్యాష్ చేసుకుంటున్నాయి. క్యాంపస్ సెలెక్షన్స్ పేరుతో ఉద్యోగాలు కల్పిస్తామని, ఇందులో పాల్గొనేందుకు ఒక్కో విద్యార్ధి నుంచి రూ.15 వేల నుంచి రూ.35 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఆయా ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్లు భర్తీ కోసం విస్తృత ప్రచారానికి కొన్ని ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఛీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాయనే ఆరోపణలు లేకపోలేదు. బోగస్ కంపెనీలు, డబ్బా కంపెనీలతో గొప్ప కంపెనీలుగా భ్రమింప చేసి క్యాంపస్ సెలెక్షన్స్ నిర్వహించి (అంతా పకడ్బందీగా) ఉద్యోగాలకు ఎంపిక చేస్తున్నారు. తీరా ఉద్యోగ ఒప్పంద పత్రాలు తీసుకుని ఉద్యోగాలకు వెళ్లితే కానీ.. ఆయా కంపెనీల డొల్లతనం బయటపడుతుంది. చదివిన చదువుకు, అక్కడి ఉద్యోగ బాధ్యతలకు పొంతన లేకపోవడంతో కొద్ది నెలల్లోనే ఉద్యోగాలకు గుడ్‌బై చెబుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చిందని గొప్పగా చెప్పుకుని.. తిరిగి ఇంటికి రాలేక ఇంకొందరు అరకొర జీతాలకు సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలకు వేట సాగిస్తున్నారు. సాధారణంగా చివరి సంవత్సరం పూర్తయ్యే నాటికి ఉద్యోగం కల్పించే దిశగా కళాశాలల యాజమాన్యాలు దృష్టి సారిస్తాయి. అందుకు దేశ, విదేశీ బహుళజాతి కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటాయి. ఆయా కంపెనీలకు అవసరమైన ఇంజినీర్లను ఎంపిక చేసుకునేందుకు ఆయా కళాశాలలకు వచ్చి ప్రాంగణ ఎంపికలు నిర్వహిస్తుంటాయి. నిజమైన, గుర్తింపు ఉన్న కంపెనీలు విద్యార్థుల్లో ఉన్న ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసుకుని ఉద్యోగాన్ని కల్పిస్తున్నాయి. ఇలాంటి కొన్ని కంపెనీల పేర్లు చెప్పి యాజమాన్యాలు విద్యార్థుల భవిష్యత్‌ను డొల్ల కంపెనీలకు తాకట్టుపెడుతున్నాయి. ఇటీవల కాలంలో కళాశాలలకు వచ్చే కంపెనీలను పరిశీలిస్తే ఏఏ ప్రాంతాల్లో బ్రాంచ్‌లు ఉన్నాయో, కంపెనీ వివరాలు తెలియకుండా గోప్యంగా ఉంచుతుండటం చర్చనీయింశంగా మారింది. కొందరికే అవకాశం జిల్లాలో ప్రతి ఏటా వేలాది మంది ఇంజినీరింగ్ పూర్తి చేస్తున్నారు. కానీ వారిలో చాలా మంది ఉత్తీర్ణత కావడం లేదు. ప్రతిభ ఉన్న విద్యార్థులను మాత్రమే కొన్ని కంపెనీలు ఎంపిక చేసుకుంటున్నాయి. జిల్లాలో కొన్ని కళాశాలల వైపు కార్పొరేట్, బహుళజాతి కంపెనీలు కన్నెత్తి చూడకపోయినా, మా కళాశాలలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించామని చెప్పుకుని వచ్చే ఏడాదికి అడ్మిషన్లుకు సిద్ధమవుతున్నాయి. ప్రాంగణ ఎంపికలంటే మౌఖిక పరీక్ష, వ్యక్తిత్వ వికాసం వంటివి కొలమానం కాదని, నేరుగా డబ్బులు చెల్లిస్తే సరిపోతాయంటూ మోసం చేస్తున్నాయి. రూ.15 వేలకు పైగానే .. ప్రాంగణ ఎంపికలు అనగానే ఇంజినీరింగ్ విద్యార్థుల్లో నూతనోత్సవం వస్తుంది. దీన్ని పెట్టుబడిగా మలుచుకునేందుకు కొన్ని కళాశాలలు ప్రయత్నిస్తున్నాయి. ప్రాంగణ ఎంపికలకు అడ్మిషన్ చార్జీల కింద ఒక్కో విద్యార్థి నుంచి రూ.15 వేల నుంచి రూ.35 వేల వరకు వసూలు చేస్తున్నాయి. మరికొన్ని కళాశాలలు రూ. 50 వేలు వసూలు చేసిన ఘటనలు కూడా ఉన్నాయిని విద్యార్థులే చెబుతున్నారు. అంత ఎందుకుని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తుంటే ఉద్యోగం ఇచ్చే కంపెనీకి ముందుగా కొంత మొత్తంను చెల్లించితే వెంటనే ఉద్యోగంలో చేరే అవకాశం ఉంటుందని, లేకంటే కళాశాల నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఉపాధి పొందడం కష్టమని చెబుతున్నారు. ముందే అంగీకార పత్రాలతో ముప్పతిప్పలు ప్రాంగణ ఎంపికలు నిర్వహించే కొన్ని కంపెనీలు ముందే కొన్ని షరతులు విధిస్తున్నాయి. రెండేళ్ల పాటు వారి కంపెనీలోనే పనిచేయాలని, ఎక్కడికి పంపితే అక్కడే ఉండి ఉద్యోగం చేయాలని అంగీకార పత్రాలను విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులతో కూడా రాయించుకుంటున్నారు. కంపెనీలో చేరిన తర్వాత తొలి నెల జీతం తమ అకౌంట్ల్లో వేయాలని విద్యార్థితో రాయించుకుంటున్నారు. ఇది పలువురు విద్యార్థులకు శాపంగా మారుతుంది. ఒక వేళ ఆ కంపెనీలో ఉద్యోగం నచ్చకుంటే బయటకు వచ్చే వీలుండదు. గట్టిగా కాదంటే ఒప్పందం ప్రకారం విద్యార్హత పత్రాలను వెనక్కి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అన్ని విషయాలు తెలుసుకుంటే మంచిది ఉద్యోగం పేరు చెప్పి కళాశాలలకు ప్రాంగణ ఎంపికల కోసం వస్తున్న కంపెనీ వివరాలు, ఎంత వరకు వేతనం ఇవ్వగలదు, ఏ ప్రాంతంలో విధులు నిర్వర్తించాలో తదితర విషయాలను ముందుగానే విద్యార్థులు తెలుసుకోవాలని విద్యా నిపుణులు చెబుతున్నారు. కొన్ని కళాశాలల్లో తాము ప్రాంగణ ఎంపికలు నిర్వహించి ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించామంటూ హడావుడి చేస్తున్నాయి. అలాంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. శిక్షణకు కొద్ది మొత్తాన్ని చెల్లించినా పెద్దగా నష్టం ఉండబోదంటున్నారు. రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు, నిబంధలు పాటించడం తదితర విషయాలు తెలసుకోవచ్చు. ఉద్యోగం పేరు చెప్పి రూ.లక్షలు చెల్లించమని అడిగారంటే అది గ్యారంటీగా నకిలీ కంపెనీగా తెలుసుకోవాలని విద్యా వేత్తలు పేర్కొంటున్నారు. -
నిబంధనలకు పాతర
జిల్లాలోని ప్రైవేటు డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు నిబంధనలకు నీళ్లొదులుతున్నాయి. వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నా అరకొర వసతుల మధ్య అద్దె భవనాల్లో కాలేజీలు నడుపుతూ విద్యార్థులను ఇక్కట్లకు గురిచేస్తున్నాయి. దీంతో ఏపీ ఉన్నత విద్యా మండలి జిల్లాలోని 24 డిగ్రీ కాలేజీలకు నోటీసులిచ్చింది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు : అద్దె భవనాలు..ఇరుకైన గదులు..ఆట స్థలం లేదు..అసలు కళాశాల వాతావరణమే కనిపించదు. ఫైర్ పర్మిషన్నూ ఉండదు. అంతెందుకు ప్రభుత్వ నిబంధనల మేరకు ఉండాల్సిన ఏ ఒక్కటీ కనిపించదు. జిల్లాలో చాలా వరకు డిగ్రీ కళాశాల తాజా పరిస్థితి ఇది. ఉన్నత విద్యామండలిలో కొందరు అధికారులు మామూళ్లు పుచ్చుకొని పట్టించుకోకపోవడంతో పలు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. వసతుల సంగతి పట్టించుకోకుండా విద్యార్థుల వద్ద వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ దండుకుంటున్నాయి. తాజాగా ఏపీ ఉన్నత విద్యామండలి జిల్లాలోని 24 డిగ్రీ కళాశాలలకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయా డిగ్రీ కళాశాలల పరిధిలోని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 8 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 12 ఎయిడెడ్ కళాశాలలుండగా, 112 అన్ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలున్నాయి. వీటి పరిధిలో ఏటా 25 వేల మంది పైచిలుకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. నిబంధనల మేరకు డిగ్రీ కళాశాలను అనుమతిచ్చిన ఐదు సంవత్సరాల వరకు అద్దె భవనాల్లో నిర్వహించుకోవచ్చు. ఆ తర్వాత తప్పనిసరిగా సొంత భవనాల్లోనే కళాశాలలు నిర్వహించాలి. విద్యార్థులకు సరిపడా గదులుండాలి. ఆట స్థలం ఉండాలి. ఫైర్ సర్టిఫికెట్, కళాశాలలో పనిచేసే బోధనా సిబ్బంది పీజీ సర్టిఫికెట్స్ తప్పనిసరిగా ఉండాలి. మొత్తంగా 24 రకాల వసతులు కలిగి ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే డిగ్రీ కళాశాలలు అనుమతులను కొనసాగించాల్సి ఉంది. అయితే చాలా మటుకు కళాశాలలు అద్దె భవనాలు, ఆట స్థలాల్లేని ఇరుకైన గదుల్లో కళాశాలలను కొనసాగిస్తున్నారు. కొందరు రేకుల షెడ్లు, మరికొందరు అపార్టుమెంట్లు తీసుకొని ఎక్కడపడితే అక్కడే కళాశాలలు నిర్వహిస్తున్నారు. కళాశాలలకు ఆట స్థలం దేవుడెరుగు. విద్యార్థులు తెచ్చుకునే సైకిళ్లు, బైకుల్లాంటి వాహనాల పార్కింగ్‌కు కూడా స్థలాల్లేని కళాశాలలు కోకొల్లలు. ఇక విద్యార్థుల వద్ద వేలకు వేలు ఫీజులు వసూలు చేసి వసతులు, నాణ్యమైన విద్యాబోధన సంగతి గాలికొదిలేశాయి. విధి లేని పరిస్థితుల్లో విద్యార్థులు ఇరుకు గదుల్లోనే విద్యనభ్యసించాల్సి వస్తోంది. అన్ని వసతులతో కళాశాలలుండాలని ఏపీ ఉన్నత విద్యామండలి పలు డిగ్రీ కళాశాలలకు చాలాసార్లు మొక్కుబడిగా నోటీసులు జారీ చేయడం మినహా చర్యలు తీసుకున్న పాపానపోలేదు. దీంతో యాజమాన్యాలు వారిని ఖాతరు చేయడం లేదు. కొందరు ఉన్నతాధికారులకు మామూళ్లు ముట్టజెప్పి యాజమాన్యాలు పని చక్కబెట్టుకుంటున్నాయి. 24 కళాశాలలకు నోటీసులు: నిబంధనల మేరకు సొంత భవనాల్లో కళాశాలలు ఎందుకు నడపడం లేదంటూ ఏపీ ఉన్నత విద్యామండలి జిల్లాలోని 24 కళాశాలలకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న నోటీసులకు సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఒంగోలు 3 డిగ్రీ కళాశాలలు, సంతనూతలపాడు 1, తర్లుపాడు 1, మార్కాపురం 2, మార్టూరు 1, మేదరమెట్ల 1, దర్శి 2, చీమకుర్తి 1, కంభం 2, గిద్దలూరు 1, కొమరోలు 1, చీరాల 2, పర్చూరు 1, కనిగిరి 1, బేస్తవారిపేట 1, అద్దంకి 1, యర్రగొండపాలెం 1 మొత్తం 24 కళాశాలలకు ఏపీ ఉన్నత విద్యామండలి నోటీసులు జారీ చేసింది. దీంతో ఇప్పుడు పలు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు చిక్కుల్లో పడ్డాయి. ఉన్నత విద్యామండలి చిత్తశుద్ధితో వ్యవహరిస్తే పలు డిగ్రీ కళాశాలలపై చర్యలు తప్పని పరిస్థితి. అదే జరిగితే తమ పరిస్థితి ఏమిటని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి డిగ్రీ కళాశాలలు నిబంధనల మేరకు సొంత భవనాలు తప్పనిసరిగా చూపించాల్సి ఉంది. అలా కాకుండా అద్దె భవనాల్లో అక్రమంగా కళాశాలలు నిర్వహించటంతోనే చివరికి ఈ పరిస్థితి తలెత్తింది. ఆన్‌లైన్‌తో తిప్పలు ఉన్నత విద్యామండలి డిగ్రీ కళాశాలల వివరాలను ఈ ఏడాది నుంచి ఆన్లైన్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఏపీ శామ్స్‌తో అనుసంధానమైన ఉన్నత విద్యామండలి మొత్తం వివరాలను ఈ నెల 5 నుంచి ఆన్లైన్ చేయడం ప్రారంభించారు. దీని ప్రకారం డిగ్రీ కళాశాలలకు సంబంధించిన కళాశాల డాక్యుమెంట్స్‌తో పాటు భవనం, గదుల వివరాలను ఆన్లైన్ చేయాల్సి ఉంది. గదులకు సంబంధించి పంచాయతీరాజ్ లేదా రోడ్లు, భవనాల శాఖ పరిధిలోని ఇంజినీర్లతో సర్టిఫై చేయించి సర్టిఫికెట్ ఆన్లైన్లో పెట్టాలి. గ్రౌండ్ వివరాలతో పాటు బోధనా సిబ్బంది పీజీ సర్టిఫికెట్లను సైతం ఆన్లైన్లో పెట్టాలి. ఫైర్ సర్టిఫికెట్ చూపించాలి. మొత్తంగా 24 కాలమ్స్ వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. అనంతరం యూనివర్సిటీ పరిధిలోని కమీషన్ ఫిజికల్‌గా వెరిఫికేషన్ చేస్తుంది. ఆ తర్వాత సర్టిఫికెట్ జారీ చేస్తుంది. అన్నీ సక్రమంగా ఉంటేనే కళాశాలలకు అనుమతులు లభిస్తాయి.