Proteins
-
ఏ వయసులో ఏ ఆహారం?
ఆహారానికి వయసు ఉండదు కానీ, ఏ వయసుకు తగ్గ ఆహారం ఆ వయసులో తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయంటున్నారు పోషకాహార నిపుణులు. ఎదిగే వయసు పిల్లలు తీసుకోవలసిన ఆహారంలో ఉండవలసినవి వృద్ధులు తీసుకోవలసిన ఆహారం ఒకటి కాదు. అదేవిధంగా టీనేజీ అమ్మాయిలు, యాభైలలో ఉండే స్త్రీలు వేర్వేరు ఆహారాలు తీసుకోవాలి. ఇంతకీ ఏ వయసు వారు ఏ ఆహారం తీసుకుంటే మంచిదో చూద్దామా?ఇప్పుడు పిల్లలు తినే ఆహారంలోప్రోటీన్లు తక్కువ; పిండి పదార్థాలు, కొవ్వులు ఎక్కువ ఉంటున్నాయి. ఇలాంటి ఆహారం తినటం వల్ల వయసుకు తగిన పెరుగుదల ఉండదు. అధిక బరువు, హార్మోన్లలో మార్పుల లాంటి సమస్యలు మొదలవుతాయి. కాబట్టి ఈ వయసు నుంచే సమతులాహారం ఇస్తూ ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోగలిగితే భవిష్యత్తులో హైపర్‌టెన్షన్, మధుమేహం, రక్తపోటు మొదలైన ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి కాబట్టి గుడ్లు, ఆకుకూరలు, తాజాపళ్లు, కూరగాయలు ∙బాదం, వాల్నట్స్, వేరుసెనగ ∙గోధుమలు, పెసలు, పాలు, వెన్న, పెరుగు ∗మాంసం, చేపలు, జున్ను ∙రాజ్మా, సెనగలు, బొబ్బర్లు, సాయంత్రం అల్పాహారంగా బాదం, పిస్తా, వాల్నట్స్, ఉడకబెట్టిన సెనగలు, మొక్కజొన్నలాంటివి ఇవ్వాలి.15 నుంచి 25 ఏళ్ల వయసు∙తక్కువ నూనె, తీపి, మసాలాలతో రుచికరమైన స్నాక్స్ వండే విధానాలను నేర్చుకుని పిల్లల మనసు గెలవగలిగితే బజార్లో దొరికే ఫాస్ట్ ఫుడ్స్‌కు పిల్లలు ఆకర్షితులవకుండా ఉంటారు ∙అలాగే మాంసాహారం వండేటప్పుడు ఎక్కువ నూనెలో వేయించకుండా ఆవిరి మీద ఉడికించి ఇవ్వాలి ∗మాంసాహారంతోపాటు కూరగాయలు కూడా ఇవ్వాలి ∗ఆహారంలో తగినంత పీచు పదార్థం ఉండేలా చూసుకుంటే పోటీన్ ఫుడ్ వల్ల మలబద్ధకం తలెత్తకుండా ఉంటుంది ∗ఉదయం అల్పాహారంలో బ్రెడ్, శాండ్విచ్లకు బదులుగా గోధుమ రవ్వతో చేసిన ఉ΄్మా, పెసలతో చేసిన ΄పోంగల్, పెసరట్టు, రాగి, క్యారట్ ఇడ్లీ లాంటివి ఇవ్వాలి కేక్‌ల తయారీలో డ్రై ఫ్రూట్స్, పళ్ల ముక్కలు ఎక్కువగా వాడాలి ∗బాదం, పిస్తా, వాల్నట్స్, ఉడకబెట్టిన సెనగలు, మొలకలు అందుబాటులో ఉంచాలి ∗ఫ్రిజ్ ట్రేలలో చాక్లెట్లు, బిస్కెట్లకు బదులుగా పళ్లు, సలాడ్లు, పాలు, గుడ్లు ఉంచాలి. ఎక్కువగా ఆటలాడుతూ ఉంటారు కాబట్టి రోజుకి కనీసం గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తినేలా చూసుకోవాలి. ఉదయం, సాయంత్రం కలిపి కనీసం అర లీటరు పాలు తాగేలా చూసుకోవాలి ∗ఉడికించిన సెనగలు, బొబ్బర్లు ఎక్కువ సమయంపాటు శక్తినిస్తాయి. కాబట్టి బాస్కెట్‌బాల్, క్రికెట్‌లాంటి ఆటల్లో పాల్గొనే పిల్లలకు వీటిని శ్నాక్స్‌గా ఇస్తూ ఉండాలి.టీనేజ్‌లో... కొంతమంది టీనేజర్లు...మరీ ముఖ్యంగా అమ్మాయిలు బరువు పెరిగిపోతామనే బెంగతో తగినంత ఆహారం తీసుకోకుండా పోషక లో΄ాలకు గురవుతూ ఉంటారు. ఇలాంటి టీనేజర్లను కనిపెట్టి తల్లులు పాష్టికాహారం వల్ల భవిష్యత్తులో ఒరిగే ప్రయోజనాల గురించి వారికి అవగాహన కల్పించాలి ∗చిన్న వయసు నుంచే శరీరానికి పోషకాలు అందిస్తూ గర్భం దాల్చే సమయానికి శరీరాన్ని ఎలా సన్నద్ధం చేయాలో, అలా చేయకపోతే ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయో వివరించాలి ∗ఉదయం అల్పాహారం స్కిప్ చేయకుండా చూసుకోవాలి ∗తగినంత క్యాల్షియం, పోటీన్ తీసుకుంటూ వ్యాయామం చేస్తే ఎత్తు పెరగటంతో΄ాటు, చక్కటి శరీర సౌష్టవం కూడా సొంతమవుతుంది.45 ఏళ్ల నుంచి వృద్ధాప్యం వరకూ...∗ఈ వయసు స్త్రీలలో హార్మోన్ల స్రావాలు తగ్గిపోతాయి కాబట్టి శరీరం కాల్షియంను శోషించుకునే శక్తి కోల్పోతుంది. ఫలితంగా ఎముకలు, కీళ్ల నొప్పులు మొదలవుతాయి. పురుషుల్లో కండరాలు పటుత్వం కోల్పోతాయి కాబట్టి క్యాల్షియంను సప్లిమెంట్ల రూపంలో తీసుకోవటం అవసరం. దీంతోపాటు మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజ లవణాల సప్లిమెంట్లను వైద్యుల సూచనమేరకు వాడాలి ∙ఈ వయస్కుల్లో కంటి చూపు, జ్ఞాపకశక్తి తగ్గిపోతూ ఉంటుంది. బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉండే కాలిఫ్లవర్, క్యారెట్, చిలకడ దుంపలు, గుమ్మడికాయ మొదలైనవి తీసుకోవాలి ∙వాల్నట్స్, బాదం కూడా ఎక్కువగా తినాలి. -
నీరసంగా అనిపిస్తోందా..? ఇవి లాగించండి, తక్షణమే శక్తి వస్తుంది..!
కొన్ని సార్లు వీపరీతంగా ఆకలి అనిపిస్తుంది. తక్షణం శక్తి కావాలనిపిస్తుంది. తినగానే వెంటనే శక్తిని ఇచ్చే ఆహార పదార్థాలు ఏవి? ఆహారంలో ఏ ఏ రకాలు ఉంటాయి? ఏవి తింటే మంచిది? వాటి గురించి తెలుసుకోండి. కార్బోహైడ్రేట్లు: కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తి రావడానికి ప్రాథమిక మూలం. పండ్లు, కూరగాయలు, రొట్టె, పాస్తా మరియు అన్నం వంటి ఆహార పదార్థాల్లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల వీలైనంత త్వరగా శక్తిని పొందవచ్చు. ప్రోటీన్లు: శరీర కణజాలాల పెరుగుదల మరియు మరమ్మత్తులకు ప్రోటీన్లు చాలా అవసరం. గుడ్లు, గింజలు, చీజ్ మరియు లీన్ మీట్ వంటి ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ తినడం వల్ల స్థిరమైన శక్తిని శరీరానికి లభించవచ్చు. ఆరోగ్యకరమైన కొవ్వులు: గింజలు, అవకాడోలు మరియు చేపలలో లభించే ఆరోగ్యకరమైన కొవ్వులు దీర్ఘకాల శక్తిని అందిస్తాయి. ఇవి ఆరోగ్యానికి మంచిది కూడా. కెఫిన్ అధికంగా ఉండే ఆహారాలు: కాఫీ, టీ మరియు చాక్లెట్ వంటి కెఫీన్ కలిగిన ఆహారాలు మరియు పానీయాలు కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపించడం ద్వారా తాత్కాలిక శక్తిని అందిస్తాయి. అయితే ఇవి ఆరోగ్యానికి ఎంత వరకు మేలు చేస్తాయన్న ఆలోచనను బట్టి అవసరమైన మోతాదులో మాత్రమే తీసుకోవాలి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు: కణాలకు ఆక్సిజన్‌ను చేరవేసే హిమోగ్లోబిన్‌ను ఉత్పత్తి చేయడానికి శరీరానికి ఐరన్ అవసరం. బచ్చలికూర, కాయధాన్యాలు, రెడ్ మీట్ మరియు టోఫు వంటి ఇనుము అధికంగా ఉండే ఆహారాలు అలసటను నివారించడంలో మరియు శక్తిని అందించడంలో సహాయపడతాయి. ఈ ఆహారాలు తక్షణ శక్తిని అందించగలవని గమనించడం ముఖ్యం. శక్తి స్థాయిలను నిర్వహించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం వివిధ రకాల పోషకాలను కలిగి ఉన్న సమతుల్య ఆహారాన్ని తినడం మాత్రమే. అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, జంక్ ఫుడ్ లాంటివి వీలైనంత వరకు తినకూడదు. దీని వల్ల చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. -డా.నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు -
Sleep tips: వేడి పాలు తాగితే వెంటనే నిద్ర వస్తుంది.. ఎందుకో తెలుసా?
చిన్నప్పుడు మన పేరెంట్స్ రాత్రి భోజనాలయ్యాక పసుపు కలిపిన పాలు లేదా బాదం పాలు తాగమని పోరుపెట్టేవారు. ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా? నిద్రపోయే ముందు వేడి పాలు తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. అసలు కారణం ఇదేనట.. పాలల్లో పెప్టైడ్ అనే ప్రొటీన్ హార్మోన్ (సీటీఎచ్) ఒత్తిడిని తగ్గించి, నిద్ర వచ్చేలా ప్రేరేపిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. అమెరికన్ కెమికల్ సొసైటీకి చెందిన అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రి జర్నల్ ప్రచురించిన నివేదిక కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. వేడిపాలల్లో సహజంగా నిద్రకుపక్రమించేలా చేసే ప్రత్యేక పెప్టైడ్లను గుర్తించినట్టు ఈ నివేదిక పేర్కొంది. చదవండి: బ్రేక్ ఫాస్ట్ మానేస్తున్నారా? ఈ సమస్యలు పొంచి ఉన్నట్లే!! సీటీఎచ్‌లో నిద్రను పెంచే కారకాలు (లక్షణాలు) ఉన్నట్లు ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో బయటపడింది. ఇతర ఎలుకలతోపోలిస్తే వేడి పాలు తాగిన ఎలుకల్లో 25 శాతం త్వరగా నిద్రపోయినట్టు సైంటిస్టులు గుర్తించారు. అంతేకాకుండా ఎక్కువ సమయం నిద్రపోయాయట కూడా. చదవండి: టీనేజర్స్ మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా బ్యాడ్ ఎఫెక్ట్..! కాబట్టి శరీరంతోపాటు, మనసుకు కూడా విశ్రాంతినిచ్చి గాఢనిద్ర పట్టాలంటే.. మీ డిన్నర్ అయిన తర్వాత ఒక గ్లాస్ వెచ్చని పాలను తాగితే చాలు! ఆందోళన (యంటీ యంగ్జైటీ) తగ్గించి, మంచి నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ గుర్తుంచుకోండి.. దీనిని అమలుచేసేముందు మీకేమైనా అనారోగ్య సమస్యలున్నట్లయితే ముందుగా మీ డాక్టర్ సలహాతీసుకోవడం మంచిది. చదవండి: అప్పుడు కన్నీళ్లు తాగి ఆకలి తీర్చుకున్నాడు.. ఇప్పుడు ఎందరికో ఆసరా..! -
Weight Loss: ఫైబర్, విటమిన్ ‘సి’,పొటాషియం, జింక్, ఐరన్.. వీటితో వేగంగా..
బరువు తగ్గడం అంత సులువైన పనేంకాదు. అందుకు చాలా ఓపిక, పట్టుదల, సమయం అవసరమౌతుంది. సమతుల ఆహారం, ఆరోగ్యకరమైన జీవన శైలి ద్వారా ఏ విధంగా బరువు తగ్గొచ్చో ప్రముఖ నూట్రీషనిస్ట్ రూపాలి దత్తా ఈ కింది చిట్కాల ద్వారా సూచిస్తున్నారు. అవేంటో చేసేద్దామా.. ప్రొటీన్లు బరువు తగ్గేందుకు ఉపయోగపడే పోషకాల్లో ప్రొటీన్లు చాలా ముఖ్యమైనవి. గుడ్డు, పప్పు, చికెన్, తృణ ధాన్యాల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిల్లోని మాంసకృత్తులు శరీరంలో అధిక సమయం నిల్వ ఉండటం వల్ల జంక్ ఫుడ్ లేదా ఇతర రూపాల్లో బయటినుంచి క్యాలరీలను తీసుకోవడం అదుపుచేయవచ్చు. ఫైబర్ జీవ క్రియ సక్రమంగా ఉంటే బరువు తగ్గడం అంత కష్టమేమీ కాదు. ఫైబర్ (పీచు పదార్ధాలు) ఎక్కువగా ఉంగే ఆహారం తినడం వల్ల జీర్ణ వ్యవస్థ, జీవక్రియ మెరుగుపరచడానికి, బరువును వేగంగా తగ్గించడానికి సహాయపడుతుంది. అందుకే నిపుణులు బరువు తగ్గాలనుకునే వారికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోమని సూచిస్తుంటారు. ఆకుపచ్చ కూరగాయల్లో, డ్రైఫ్రూట్స్, తృణ ధాన్యాలు, పప్పు దినుసులు మొదలైన వాటిల్లో ఫైబర్ నిండుగా ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు కొవ్వులేని ఆహారం తీసుకుంటే వేగంగా బరువు తగ్గొచ్చని మీరనుకుంటే అది కేవలం అపోహ మాత్రమే.ఎందుకంటే మన శరీరం సక్రమంగా పనిచేయాలంటే తగుమోతాదులో మంచి కొవ్వులు అందిచే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అవసరం అవుతాయి. చేప, డ్రైఫ్రూట్స్, ఆకు కూరల్లో ఇవి నిండుగా ఉంటాయి. విటమిన్ ‘సి’ శరీరం సక్రమంగా పనిచేయాలంటే హానికారక ద్రావణాలను ఎప్పటికప్పుడు బయటికి పంపించెయ్యాలి. కాబట్టి యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే జీవాణువిషాలను బయటకి పంపి, ఫ్రీ రాడికల్ డ్యామేజ్ల నుంచి శరీరాన్ని కాపాడుతాయి. విటమిన్ ‘సి’ లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కేవలం విషహరణానికి మాత్రమేకాక బరువు తగ్గే ప్రక్రియను కూడా వేగవంతం చేస్తుంది. ఆల్మా, ఆరెంజ్.. ఇతర సిట్రస్ పండ్లలో విటమిన్ ‘సి’ అధికంగా ఉంటుంది. పొటాషియం జీవక్రియను వేగవంతం చేయండంలో పొటాషియం కూడా కీలకంగా వ్యవహరిస్తుంది. ఇది బరువు తగ్గడానికి మరింత సహాయపడుతుంది. డ్రైఫ్రూట్స్, శనగలు, అవిసెగింజలు, రాజ్మా.. వంటి ఆహార పదార్ధాల్లో పొటాషియం దొరుకుతుంది. ఐరన్ బరువు తగ్గించేందుకు ఐరన్ ఉపయోగపడుతుందని మీకు తెలుసా? అవునండీ.. ఇది ఐరన్ లోపాన్ని నివారించడమేకాకుండా, శరీర కండరాలకు, కణాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. ఇంకా.. శరీరంలోని కొవ్వును హరించడానికి సహాయపడుతుంది. బీట్రూట్, రొయ్యలు, డ్రైఫ్రూట్స్ వంటి ఆహార పదార్ధాల్లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. జింక్ జింక్ పుష్కలంగా ఉండే ఆహారంతో కూడా అధికబరువుకు చెక్ పెట్టొచ్చు. బాదం, నువ్వులు, పప్పు, పన్నీర్ మొదలైన వాటిల్లో జింక్ అధికంగా ఉంటుంది. ఈ ఆహారపు అలవాట్లతో శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంతోపాటు బరువును వేగంగా తగ్గించుకోవచ్చని రూపాలి దత్త సూచిస్తున్నారు. చదవండి: Weight Loss: ప్రతి ఉదయం ఈ డ్రింక్ తాగారంటే.. మీరే ఆశ్చర్యపోతారు!! -
మిగిలిన మెట్రోలకన్నా.. మనమే మెరుగు
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యమే మహాభాగ్యం. మరి ఆరోగ్యానికి కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు సమపాళ్లలో అవసరం. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా రోగ నిరోధక శక్తికి కావాల్సిన ప్రొటీన్లు శరీరానికి అందడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ‘సౌత్ ఇండియా ప్రొటీన్ గ్యాప్’ పేరిట నిర్వహించిన సర్వేలో ప్రొటీన్లపై మన హైదరాబాదీలకు మెరుగైన అవగాహన ఉందని తేల్చింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో ప్రొటీన్‌పై అవగాహనకు సంబంధించి ఈ సర్వే నిర్వహించారు. సిటీ టాప్... పాలు తీసుకోని వారిలో 83 శాతం మంది ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారని నగరానికి చెందిన ఓ డెయిరీ ప్రొడక్ట్ నిర్వహించిన ఈ సర్వే వెల్లడించింది. అలాగే 68 శాతం మందిలో రోజువారీగా శరీరానికి అవసరమైన ప్రొటీన్ పరిమాణంపై అవగాహన లేదు. ఈ సర్వేలో పాల్గొన్న హైదరాబాదీల్లో 68 శాతం మంది రోజువారీగా తమకు ఎంత ప్రొటీన్ అవసరం అనేది చెప్పగలిగారు. అదే చెన్నై విషయానికి వస్తే 25 శాతం మందిలోనే ఈ విషయంలో అవగాహన ఉంది. ఇక 5 శాతంతో బెంగుళూర్వాసులు ప్రొటీన్‌పై అవగాహనతో మరీ వెనుకబడ్డారు. (చదవండి: ఏడాదికి రాష్ట్ర ప్రజలు తింటున్న కోడికూర లెక్క ఇదీ!) లో‘పాలూ’కారణమే... రోగనిరోధక శక్తిని కాపాడుకోవడంలో ప్రొటీన్లది కీలకపాత్ర. ఒక పురుషునికి రోజుకు 56 గ్రాముల ప్రొటీన్లు అవసరం. అదే మహిళకైతే 46 గ్రాములు కావాలి. రోజుకు ఒక వ్యక్తి 400–500 మి.లీ. పాల ఉత్పత్తులు తీసుకుంటే అవి అవసరమైన ప్రొటీన్‌ను అందిస్తాయి. ప్రపంచంలోనే పాల ఉత్పత్తుల్లో భారత్ అతి పెద్దదిగా పేరు పొందినా.. పెద్దల్లో 32% మందే పాలు తీసుకుంటారు. సర్వే ప్రకారం.. 54% మంది పెద్దల్లో ప్రొటీన్ లోపం ఉండగా, శాకాహారుల్లో ఇది 62%గా ఉంది. -
‘ప్రోటీన్ల’ను పట్టించుకోరేమీ!
సాక్షి, అమరావతి: కోవిడ్–19 వైరస్ మహమ్మారిని మన శరీరం ఎదుర్కోవాలంటే.. మనలో రోగనిరోధక శక్తి ఉండాలి. ఇందుకు ‘ప్రోటీన్లు’ అత్యధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇంతటి కీలకమైన పోషక పదార్థాలపై భారతీయుల్లో సరైన అవగాహన లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. భారతీయ తల్లుల్లో అత్యధికశాతం మంది ఆహారంలో వీటి ఆవశ్యకతను గుర్తించడం లేదని ప్రముఖ సంస్థ నిల్సన్ తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ‘ప్రోటీన్లు మన హక్కు’ అనే నినాదంతో దేశవ్యాప్త అవగాహన కార్యక్రమంలో భాగంగా.. దేశంలోని మెట్రో, ద్వితీయశ్రేణి నగరాల్లో ఈ సర్వే నిర్వహించింది. నిల్సన్ సర్వేలోని ప్రధాన అంశాలు ఇవీ.. ► ప్రోటీన్లపై భారతీయులకు సరైన అవగాహన లేదు. పేదల్లోనే కాదు మధ్యతరగతి, ఉన్నతవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ► భారతీయులు సగటున తక్కువ పరిమాణంలో పోట్రీన్లతో కూడిన ఆహారాన్ని తీసుకుంటున్నారు. కేవలం 3శాతం మందికి మాత్రమే వీటి అవశ్యకత తెలుసు. ► రోగనిరోధక శక్తిని అందించి, కండరాల శక్తిని పెంపొందించడంలో ప్రోటీన్లు కీలకమనే విషయం 90% మంది తల్లులకు తెలియదు. ► రోజువారి ఆహారంలో 82% మంది తల్లులు ప్రోటీన్లకు తక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ► 80% మంది మాతృమూర్తులకు ప్రోటీన్లు ముఖ్యమైనవి అని తెలుసు కానీ రోజూ ఆహారంలో వాటికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ప్రోటీన్లు త్వరగా జీర్ణం కావని.. వీటిని ఎక్కువుగా తీసుకుంటే బరువు పెరుగుతారని.. ఇలా పలురకాల దురభిప్రాయాలు ఉన్నాయి. ప్రోటీన్లతోనే ఆరోగ్యభారత్ చిన్నతనం నుంచే ప్రోటీన్లు ఎక్కువుగా ఉండే ఆహారం ఇవ్వడం ద్వారానే ఆరోగ్య భారత్‌ను రూపొందించగలమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. నిల్సన్ సంస్థ వెల్లడించిన సర్వే ఫలితాలు భారతీయులకు కనువిప్పు కలిగించాలని ఇండియన్ డయాబెటిక్ అసోసియేషన్ప్రెసిడెంట్ డా.జగ్మీత్ మదన చెప్పారు. ‘ప్రోటీన్ పారడాక్స్’పేరిట నిర్వహించిన ఈ అధ్యయనం దేశానికి సరైన మార్గనిర్దేశం చేసిందని న్యూట్రీటెక్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్ డా.సురేశ్ ఇటపు అభిప్రాయపడ్డారు. ప్రోటీన్లు ఎక్కువుగా ఉండే ఆహారం ► మొక్కజొన్న, స్వీట్‌కార్న్ ► ఆకు కూరలు ► పాలు ► పెరుగు ► పప్పు దినుసులు ► బీన్స్, చిక్కుళ్లు, రాజ్మా, సోయా, కాబూలీ శనగలు ► వేరుశనగ(పొట్టు తీయకుండా) ► పుట్టగొడుగు ∙గుడ్లు ► పళ్లు... ప్రధానంగా సిట్రస్ ఉండే దానిమ్మ, నిమ్మ, జామ, దబ్బ, ► స్కిన్లెస్ చికెన్, చేపలు -
ఫార్మా రంగంలోకి అమెజాన్..
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌తో నాటిలస్ బయోటెక్నాలజీ అనే ప్రముఖ స్టార్టప్ ఫార్మా కంపెనీ జతకట్టనుంది. ఈ కంపెనీ మొదటగా 2016లో అంకుర పరిశ్రమగా ప్రారంభమయ్యి ప్రస్తుతం దిగ్గజ కంపెనీల జాబితాలో నిలిచింది. రోగుల ప్రొటీన్‌ను మ్యాపింగ్ చేసి విశ్లేషించడమే కంపెనీ ముఖ్య లక్ష్యమని సహ వ్యవస్థాపకుడు సుజల్ పటేల్ పేర్కొన్నారు. రోగుల ప్రొటీలన్లను మ్యాపింగ్ చేయడం వల్ల క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక జబ్బులకు తక్కువ ఖర్చుతో చికిత్స అందించవచ్చని కంపెనీ పేర్కొంది. వైద్యులకు చికిత్స అందించేందుకు, మందుల తయారీకి.. ప్రొటిన్ మ్యాపింగ్, రక్తనమూనాలను విశ్లేషించడం ఎంతో కీలకమని కంపెనీ ముఖ్య ప్రతినిథులు అభిప్రాయపడ్డారు. మరోవైపు సరికొత్తగా పుట్టుకొస్తున్న వైరస్ల వల్ల ఫార్మా రంగానికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆరోగ్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
టొమాటో మాటున ఆరోగ్యం
ప్రాచీన భారతదేశీయ వైద్యమైన ఆయుర్వేదంలో టొమాటో ప్రస్తావన లేదు. ఇది మన దేశపు పంట కాకపోవటమే ఇందుకు కారణం. మౌలికంగా ఇది అమెరికా సీమకు చెందినది. క్రీ.శ. 7వ శతాబ్దంలో పెరూ, చిలీ, బొలీవియా దేశాలలో ఈ పంట ప్రారంభమైంది. అనంతరం 16వ శతాబ్దం లో ఐరోపా వాసులకు పరిచయమైంది. తదనంతరం పోర్చుగీసు వారి ద్వారా భారతదేశానికి సంక్రమించింది. ఈ పండు ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. ఈ రక్త వర్ణానికి భయపడి ప్రారంభదశలో దీనిని విషతుల్యంగా భావించి తినేవారు కాదు. క్రమేణా దీని రుచిని, ఆరోగ్య ప్రయోజనాలను ఆస్వాదించటం మొదలైంది. వాస్తవానికి ఈ చెట్టు కాండంలోనూ, ఆకులలోనూ ఉండే సొలానిన్ అనే పదార్థం దుర్గుణాలను కలిగి ఉంటుంది. అందుకే ఏ జంతువూ ఈ చెట్ల జోలికి పోదు. దీంట్లో ప్రధానంగా పులుపు, తీపి రుచులు ఉంటాయి. కొద్దిగా లవణ రసం (ఉప్పగా) కూడా ఉంటుంది. కనుక ఏ కూరగాయలతో దీనిని కలిపి వండినా, పచ్చిగా సేవించినా వాటి రుచి మరింత పెరుగుతుంది. వాతహరంగా ఉపకరిస్తుంది. ఆధునికశాస్త్రరీత్యా పోషక విలువలు సుమారుగా ఒక కప్పు (150 గ్రా.) టొమాటో పండ్లలోని పోషక విలువల శాతాలు ఈ క్రింది విధంగా ఉంటాయి. క్యాలరీలు (శక్తి) 1%, పిండి పదార్థాలు 2%, ఆహారపు పీచు 7%, శర్కర 2.8%, ఒమేగా త్రీ ఫాటీ యాసిడ్స్ 3%. విటమిన్లు ఎ – 25%, సి – 32%, ఇ – 4%, కె –15%, బీ కాంప్లెక్సు – సరాసరి 4% ఖనిజ లవణాలు (మినరల్స్) క్యాల్షియం– 1%, ఐరన్ – 4%, మెగ్నీషియం – 4%, ఫాస్ఫరస్ – 4% జింక్ – 2%, కాపర్ – 4%, మాంగనీసు – 8%, పొటాషియం–10%. లైకోపిన్, ల్యూటిన్, బీటాకొరెటిన్ సమృద్ధిగా ఉంటాయి. ఉండనివి (శూన్యం) కొలెస్టరాల్, స్టార్చ్, సోడియం, సెలీనియం (విషం), విటమిన్ డి అండ్ బి12. ప్రయోజనాలు: వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. చర్మకాంతి, కంటి చూపు మెరుగుపడతాయి. కేశాలు దృఢంగా పెరుగుతాయి. గుండెకు బలం, కండరాల శక్తి పెరుగుతాయి. అధిక రక్త్తపీడనం (అధిక బీపీ) అదుపులోకి వస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ గుణం కలిగి రోగాలను దరిచేరనీయదు. బరువు తగ్గేవారికి ఇదిమంచి ఆహారం. శరీరానికి నీటి శాతం పుష్కలంగా అందుతుంది. క్యాబేజీ కుటుంబానికి చెందిన బ్రొకోలీతో టొమాటోను కలిపి తింటే ప్రొస్టేట్ క్యాన్సర్, పాంక్రియాసిస్ క్యాన్సర్లు తగ్గుతాయని ఇటీవలి పరిశోధనలు వెల్లడి చేస్తున్నాయి. గమనిక: దీంట్లో పొటాషియం అధికంగా ఉంటుంది కనుక ‘మూత్రపిండాలలో రాళ్లు’ వ్యాధిగ్రస్తులు దీనిని సేవించరాదు. -
వ్యాయామానికి ప్రత్యామ్నాయంగా ప్రొటీన్ సప్లిమెంట్?
వయసులో ఉన్నప్పుడు వ్యాయామం గట్రా చేయడం పెద్ద ఇబ్బందేమీ కాకపోవచ్చు. వద్ధులు... వికలాంగులు, గాయాలపాలైన వారి పరిస్థితి ఏమిటి? వారికి వ్యాయామం అవసరమున్నా.. చేయలేని పరిస్థితి. కొంచెం చిత్రమైన ఈ సమస్యను అధిగమించేందుకు మిషిగన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పద్ధతిని ఆవిష్కరించారు. కేవలం ఒక ప్రొటీన్ సప్లిమెంటను ఆహారంగా తీసుకోవడం ద్వారా వ్యాయామం తాలూకూ అన్ని ప్రయోజనాలు పొందవచ్చునని వీరు అంటున్నారు. శరీరంలో సహజంగా ఏర్పడే సెస్ట్రిన్ అనే ప్రొటీన్ వ్యాయామం తరువాత కండరాల్లో పేరుకుపోతుందని గతంలోనే గుర్తించారు. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని తాము ప్రయోగాలు మొదలుపెట్టామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న జూ హన్ లీ తెలిపారు. ఈగలపై తాము పరిశోధనలు చేశామని ఒక గుంపు సాధారణమైన ఈగలు కాగా.. ఇంకోదాంట్లో సెస్ట్రిన్ ఉత్పత్తి జరక్కుండా చూశామని, మూడోదాంట్లో ఎక్కువ స్థాయిలో సెస్ట్రిన్ ఉత్పత్తి అయ్యేలా చేశామని జూ హన్ లీ వివరించారు. మూడు గుంపుల ఈగలూ శారీరకంగా శ్రమపడేలా చేసినప్పుడు సెస్ట్రిన్ ఎక్కువగా ఉన్న ఈగల సామర్థ్యం బాగా పెరిగినట్లు గుర్తించారు. శారీరక శ్రమ లేనప్పుడు కూడా వీటి సామర్థ్యం తగ్గకపోవడాన్ని బట్టి సెస్ట్రిన్ ద్వారా వ్యాయామం తాలూకూ ఫలితాలు అందుతున్నట్లు గుర్తించారు. భవిష్యత్తులో ఈ సెస్ట్రిన్ ప్రొటీన్‌ను సప్లిమెంట్‌గా ఇవ్వడం ద్వారా శ్రమ లేకుండానే వ్యాయామం తాలూకూ ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంటుందని ఈ పరిశోధనలు చెబుతున్నాయి. -
రాగులు ఎంత ఆరోగ్యకరమంటే...
ఇటీవల ఆరోగ్యం కోసం రాగులను ఆహారంగా తీసుకోవడం పెరిగింది. రాగిముద్ద అని పిలిచే రాగిసంకటి ఇప్పుడు చాలా రెస్టారెంట్లలో ఓ ట్రెండీ ఫుడ్. రాగులను పిండి రూపంలో తీసుకోవడం ద్వారా దీంతో రాగిరొట్టెలు, రాగి అంబలి ఇలా అనేక రూపాల్లో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తీసుకుంటున్నాం. కొందరు రాగి దోసెలూ, ఇడ్లీలు, లడ్డూలంటూ చాలా ఐటమ్సే తయారు చేస్తున్నారు. రాగులు ఆరోగ్యానికి చాలా మంచివి కావడంతో వీటితో రకరకాల పదార్థాలు వంటలు చేసుకోవడం ఇటీవల బాగా పెరిగింది. రాగుల్లో పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్స్) చాలా ఎక్కువ. ఆ తర్వాత ప్రోటీన్లు, ఆ తదిపరి స్థానంలో పీచు పదార్థాలు ఉన్నాయి. ఇక రాగిపిండిలో ఉండే కొవ్వు శాతం చాలా చాలా తక్కువ. రాగులకు ఉన్న ఆదరణ వల్ల ఇప్పుడు రాగిపిండి మార్కెట్లో రెడీమేడ్‌గా లభిస్తోంది. వంద గ్రాముల రాగి పిండిలో... వంద గ్రాముల రాగి పిండితో 336 క్యాలరీలు లభ్యమవుతాయి. రాగుల్లో 80 శాతం కార్బోహైడ్రేట్లే. 12 శాతం తేమ ఉంటుంది. రాగిపిండిలో క్యాల్షియం చాలా ఎక్కువ. వంద గ్రాముల రాగిపిండిలో 350 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. అందుకే ఎముకల ఆరోగ్యానికీ, పటిష్టతకూ రాగిపిండి చాలా మేలు చేస్తుంది. ఐరన్ కూడా కొంతమేరకు ఉంటుంది. రాగిపిండిలో మన శరీరానికి బాగా అవసరమైన ఎన్నోరకాల అమైనో ఆసిడ్స్ (ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్) పుష్కలంగా లభ్యమవుతాయి. వ్యాలైన్, మిథియోనైన్, ఐసోల్యూసిన్, థ్రియోనైన్, ట్రిప్టోఫాన్ వంటి అత్యావశ్యక అమైనో ఆసిడ్స్ అన్నవి మన ఆరోగ్య నిర్వహణ కోసం చాలా అవసరం. రాగుల్లో పీచుపదార్థాలు బాగా ఎక్కువే. దీంతోపాటు రాగిపిండి గ్లూటెన్ ఫ్రీ కావడం వల్ల తేలిగ్గా జీర్ణమవుతుంది. తేలిగ్గా ఒంటికి పడుతుంది. (గ్లూటెన్ అంటే... పిండిని కంచంలో రాశిగా పోసి మధ్యలో గురుగు చేసి (గుంట పెట్టి) అందులో నీళ్లు పోసినప్పుడు పొడి పిండి కాస్తా... పిండిముద్దగా మారుతుంది కదా. ఇలా పొడి పిండిని, పిండిముద్దలా మార్చడానికి పిండిలోని గ్లూటెన్ అనే ప్రోటీన్ తోడ్పడుతుంది. కొందరి ఒంటికి ఈ గ్లూటెన్ సరిపడదు. దాంతో వాళ్లకు గ్లూటెన్ ఉన్న పిండితో చేసిన వంటకం తిన్న వెంటనే కడుపులో ఇబ్బంది, కడుపునొప్పి, వికారం, నీళ్ల విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీరిని ‘గ్లూటెన్ ఇన్టాలరెన్స్’ ఉన్న వ్యక్తులుగా పేర్కొంటారు. ఇలాంటి వారి కోసమే... ఆయా పిండులతో గ్లూటెన్ లేకుండా కూడా తయారు చేస్తున్నారు. అంటే ఆ పిండి నుంచి గ్లూటెన్ను తొలగిస్తారన్నమాట. ఇలాంటి పిండిని ‘గ్లూటెన్ ఫ్రీ’ పిండి అని అభివర్ణిస్తుంటారు. కొన్ని రకాల పిండిలలో స్వాభావికంగానే గ్లూటెన్ ఉండదు). ఆరోగ్యానికి ప్రయోజనాలెన్నో... రాగుల్లో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆసిడ్ వల్ల వెంటనే ఆకలి తీరినట్లు ఉంటుంది. మనం రోజూ తినే తెల్ల అన్నంతో పోలిస్తే రాగిపిండిలో ఉండే పీచుపదార్థాలు చాలా ఎక్కువ. కొవ్వులు దాదాపు లేనట్టే. ఈ పీచుపదార్థాల వల్ల తిన్న వెంటనే కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. దాంతో రాగిపిండితో చేసిన పదార్థాలు తినేవారు బరువు పెరగకపోవడం, స్థూలకాయం రాకపోవడం వంటి ప్రయోజనాలు చేకూరతాయి. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది మంచి ఆహారం. ఇక ఇందులోని పీచుపదార్థాల కారణంగా రాగిపిండితో చేసిన వంటకాలు మెల్లగానూ, తేలిగ్గానూ జీర్ణమవుతాయి. ఇందులో క్యాల్షియమ్తో పాటు విటమిన్ ‘డి’ కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఎముకల బలానికి ఇది బాగా తోడ్పడుతుంది. అందుకే ఎదిగే పిల్లలకు రాగిపిండితో చేసిన వంటకాలు ఇవ్వడం వల్ల వాళ్లు బాగా, వేగంగా ఎత్తు పెరుగుతారు. ఇక యువకులు, పెద్దవాళ్ల ఎముకల ఆరోగ్య నిర్వహణకూ రాగులు సమర్థంగా పనిచేస్తాయి. రాగిపిండి తినేవాళ్లలో ఎముకలు బలంగా ఉండటం వల్ల ఫ్రాక్చర్స్ అయ్యే రిస్క్ చాలా తక్కువ. డయాబెటిస్ నియంత్రణ... రాగులలో పాలీఫినాల్‌తో పాటు పీచు పదార్థాలు (డయటరీ ఫైబర్) ఉండటం వల్ల డయాబెటిస్తో పాటు, జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక వ్యాధులను నివారిస్తాయి. ఇందులోని పీచు వల్ల రాగులతో చేసిన వంటలు తిన్న తర్వాత రక్తంలో చక్కెర పెరగడం అన్నది చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఇందులో ఉండే లెసిథిన్, మిథియోనైన్ వంటి అమైనో ఆసిడ్లు కొలెస్ట్రాల్‌ను బాగా తగ్గిస్తాయి. అంతేకాదు... కాలేయంలో పేరుకుపోయిన అదనపు కొవ్వులనూ అవి తొలగిస్తాయి. అందుకే కాలేయంలో కొవ్వు పేరుకుంటున్నవారు రాగులతో చేసిన ఆహారాన్ని తినడం చాలా మంచిది. రక్తహీనత నివారించే రాగులు రాగులలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అందుకే వీటితో చేసిన ఆహారాలను తీసుకుంటూ ఐరన్ శరీరంలోకి ఇంకడానికి దోహదపడే విటమిన్ ‘సి’ ఉండే పండ్లు ఎక్కువగా తింటే రక్తహీనత (అనీమియా) సమస్య వేగంగా తగ్గుతుంది. ఒత్తిడినీ తగ్గిస్తాయి... తృణధాన్యాల్లో వేరే వాటికి లేని ఒక మంచి గుణం రాగులకు ఉంది. రాగులు ఒత్తిడిని సమర్థంగా తగ్గిస్తాయి. అందుకే యాంగై్జటీ, డిప్రెషన్, మైగ్రేన్‌తో బాధపడేవారికి రాగులు మంచి ఆహారం. ఇందులో ఉండే ట్రిప్టోఫాన్ నిద్ర వచ్చేలా చేసి నిద్రలేమి (ఇన్సామ్నియా) సమస్యను స్వాభావికంగా తగ్గిస్తుంది. మన ఒంటికి చాలా అవసరమైన ఎన్నెనోన అమైనో ఆసిడ్స్ ఇందులో ఉన్నాయి. ఉదాహరణకు థ్రియోనైన్, వ్యాలైన్, ఐసోల్యూసిన్, మిథియోనైన్ వంటివి మన కణజాలాన్ని అనుక్షణం రిపేర్ చేస్తూ, శరీర జీవక్రియలకూ, ఎముకల ఆరోగ్య నిర్వహణకు ఉపయోగపడతాయి. అంతేకాదు మన ఎముకలను రిపేర్ ప్రక్రియలోనూ ఈ అమైనోయాసిడ్స్ పాలుపంచుకుంటాయి. చాలా ఇతర తృణధాన్యాలలో సామాన్యంగా లభ్యం కాని మిథియోనైన్ ఇందులో ఉంటుంది. ఇది శరీరం నుంచి కొవ్వులను తొలగించడానికి, విషాలను తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నందున రాగులతో చేసే వంటకాలు ఆరోగ్యానికి ఆరోగ్యం. రుచికి రుచి. -
హెల్దీ టేస్టీ లంచ్ బాక్స్
ఇక వచ్చే వారం నుంచి మళ్లీ పిల్లలకు స్కూళ్లు మొదలవ్వబోతున్నాయి. వేసవి సెలవుల వల్ల ఇప్పటివరకూ ఇంట్లోనే కళ్ల ముందు ఉన్న పిల్లలు నేడో రేపో బడికి వెళ్లక తప్పదు. బాక్స్ కట్టి ఇచ్చినా అక్కడ వాళ్లేం తింటారో ఎలా తింటారో అసలు తింటారో లేదో అన్న బెంగ తల్లులకు వారం రోజుల ముందునుంచే మొదలైపోతుంది. ఇప్పటివరకూ ఇంట్లో ఉంటేనే ఎన్నోసార్లు బతిమిలాడితేగానీ పిల్లలు ఇంతన్నా తినరు. అలాంటి ఆ లంచ్ టైమ్‌లో ఎంత తింటారో తెలియదు. అందుకే స్కూల్ మొదలయ్యాక... మన ఎదిగే పిల్లలకు పోషకాలేమీ మిస్ కాకుండా ఇవ్వాల్సిన ఆహారం ఎలా ఉండాలో తెలుకునేందుకే ఈ కథనం. స్కూలుకు బయలుదేరేముందు పిల్లలు చాలా హడావుడిగా ఏదో తినేస్తుంటారు. బడికి టైమ్ అవుతుందన్న తొందరలో ఇంత నోట్లో వేసుకొని బయలుదేరుతారు. పైగా చాలా స్కూళ్లు ఎనిమిదింటికల్లా మొదలైపోతుంటాయి. దాంతో పిల్లలు నింపాదిగా, నిమ్మళ్లంగా తినడానికే టైమ్ ఉండదు. అయితే స్కూల్‌కు వెళ్లే ముందర కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు ఉన్న ఆహారం తీసుకోవడం పిల్లలకు చాలా మేలు చేస్తుంది. వాళ్లు ఆరోగ్యకరంగా ఎదగడానికి చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు... అలా పొద్దున్నే టిఫిన్ తిన్న పిల్లల్లో ఏకాగ్రత, విజయసాధన అవకాశాలు చాలా ఎక్కువని అనేక అధ్యయనాలు తెలుపుతున్నాయి. వివిధ వయసుల్లోని స్కూలు పిల్లలకు ఏయే పోషకాలు అవసరమో తెలుసుకుందాం. ప్రోటీన్ ఇవ్వడం మరవద్దు రోజును మంచి ప్రోటీన్‌తో ప్రారంభించడం పిల్లలకు ఎంతో మేలు చేస్తుంది. ఎదిగే వయసు పిల్లల విషయంలో ప్రోటీన్లను ‘బిల్డింగ్ బ్లాక్స్’గా చెబుతుంటారు ఆహార నిపుణులు. అంటే భవన నిర్మాణానికి ఇటుకలు ఎలాగో... శరీర నిర్మాణానికి ప్రోటీన్లు అలాగన్నమాట. పైగా ప్రోటీన్లు మన కండరాల్లో అయిన గాయాలను ఎప్పటికప్పుడు రిపేర్లు చేస్తుంటాయి.అందుకే ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో పిల్లలకు ప్రోటీన్లు పుష్కలంగా ఉండే గుడ్డు పెట్టవచ్చు. దాంతోపాటు వెన్న, పెరుగు వంటి వాటిల్లోనూ ప్రోటీన్ ఎక్కువగానే ఉంటుంది. అలాగే పప్పులో కూడా ప్రోటీన్ ఎక్కువ. అందుకే పూరీ/చపాతీతో పాటు పప్పు లేదా శనగల వంటివి ఇవ్వడం వల్ల అటు పూరీ/చపాతీలోని కార్బోహైడ్రేట్లతో పాటు ఇటు పప్పు, శనగలు, గుడ్డు వంటి వాటి నుంచి ప్రోటీన్ కూడా సమకూరుతుంది. స్కూల్ నుంచి రాగానే... పిల్లలు స్కూల్ నుంచి రాగానే వారికి ‘‘పవర్’’ శ్నాక్స్ ఇవ్వడం మంచిది. అంటే ఇందులో భాగంగా పొట్టు తీయని ధాన్యంతో తయారు చేసిన బ్రెడ్ ముక్కలకు వెన్న, చీజ్ వంటివి పుష్కలంగా రాసి, ఆ బ్రెడ్ ముక్కల మధ్యన తాజా ఆకుకూరలు, కీర, టొమాటో వంటి కాయగూరలు నింపి శాండ్విచ్లు తయారు చేసి ఇవ్వాలి. వీటితో పాటు అరటిపండ్లు ఇవ్వడం మంచిది. పిల్లలు స్కూల్ల్లో బాగా ఆటలాడి వచ్చినా లేదా స్కూల్ నుంచి రాగానే ఆటలకు వెళ్లాలనుకున్నా ఈ తరహా శాండ్విచ్లు వారికి అవసరమైన పోషకాలను, తక్షణ శక్తిని ఇస్తాయి. రాత్రి వేళలో ద్రవాహారాలు ఇవ్వండి పిల్లల రాత్రి భోజనం సమయంలో వారికి ద్రవాలు ఎక్కువగా ఇవ్వడం మంచిది. ఎందుకంటే ఉదయం నుంచి స్కూలుకు వెళ్లడం, ఆటలాడటం వంటి కార్యకలాపాలతో వారు చేసిన శారీరక శ్రమ వల్ల వారు కోల్పోయిన వారి ఒంట్లోని లవణాలు, ద్రవాలు మళ్లీ భర్తీ చేయాల్సిన అవసరం ఉంటుంది. పిల్లల లంచ్‌బాక్స్ ఎలా ఉండాలంటే... పిల్లలు స్కూల్లో దాదాపుగా ఒక పూట లేదంటే రెండు పూటలు తింటారు. ఆ బాక్స్ ఈ కిందివిధంగా ఉండటం వారి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.పిల్లల లంచ్–బాక్స్ ఎలా ఉండాలనేందుకు చాలా సింపుల్ ఫార్ములా ఉంది. అదేమిటంటే... వారి లంచ్‌బాక్స్‌లో సగం... రంగురంగుల తాజా పండ్ల ముక్కలతో నింపండి. (ఇందులో కనీసం రెండు నుంచి మూడు రకాలు ఉండాలి). ఆ తర్వాత మరో పావు భాగం దంపుడు బియ్యం (పాలిష్ చేయని బియ్యం)తో వండిన అన్నం లేదా పొట్టు తీయని ధాన్యాలతో చేసిన చపాతీలు నింపండి. ఇక మిగతా పావు భాగాన్ని ప్రోటీన్ పుష్కలంగా ఉండే కూరలతో నింపండి. అంటే శాకాహారులైతే బీన్స్, కిడ్నీ–బీన్స్, ఛోలే వంటి వాటితో వండిని కూరలు గానీ... మాంసాహారులైతే చికెన్, చేపలతో వండిన కూరలను ప్రతిరోజూ మార్చి మార్చి వారికి ఇస్తుండాలి. ఇక వారు రోజూ తగినన్ని నట్స్ కూడా తినేలా చూడాలి. ఇక అన్నం, చపాతీలకు బదులుగా తమకు అందుబాటులో ఉన్నవారు హోల్‌గ్రెయిన్ పాస్తా, క్వినోవా వంటి వాటినీ వండి ఇవ్వవచ్చు. ►అరబాక్స్ పండ్లలో ఏమేం ఉండాలంటే... తాజా ద్రాక్ష, ఆపిల్స్, పుచ్చపండు ముక్కలు, స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, అరటిపండ్లు వంటివి ►రంగురంగుల పచ్చికాయగూరల్లో... క్యారట్, దోస, కీర, బ్రాకలీ, బెల్‌పెప్పర్ (బెంగుళూరు మిర్చీల పేరిట ఇవి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగుల్లో లభ్యమవుతుంటాయి), టొమాటోల వంటి వాటిని ముక్కలుగా కోసి పండ్ల ముక్కలతో పాటు కలిపి కొన్ని ఇవ్వాలి ►ప్రోటీన్లు పుష్కలంగా ఉండే ఆహారాలివే... బీన్స్, శనగలు, పీనట్ బటర్, చికెన్, చేపలు, ఉడకబెట్టిన గుడ్లు ►ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు ఏమిటంటే... పొట్టు తీయని పాస్తా, పొట్టు తీయని ధాన్యాలతో చేసిన బ్రెడ్, ముడిబియ్యంతో వండిన అన్నం, ఓట్స్ వంటివి ►ద్రవాహారాలుగా పాల ఉత్పాదనలివి... పాలు, ఫ్లేవర్డ్ మిల్క్, పెరుగు, వెన్న, కాటేజ్ చీజ్, సోయా పాలు, (అందుబాటులో ఉన్నవారు సోయా యోగర్ట్ వంటివి తీసుకోవచ్చు). వీటిలో పిల్లల ఎముకలను బలంగా చేయడానికి, వారు ఆరోగ్యంగా ఎదగడానికి ఉపయోగపడే క్యాల్షియమ్, విటమిన్–డి పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్లు కూడా ఉండనే ఉంటాయి. ఇక పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వారికి మీరే భోజనం ఎలాగూ పెడతారు. వారు ఇంట్లో ఉన్నప్పుడు తక్కువ మోతాదుల్లో వీలైనన్ని ఎక్కువ సార్లు మీరు ఇంట్లో తినే ఆరోగ్యకరమైన భోజనం పెట్టండి. వేర్వేరు వయసుల పిల్లలకు లంచ్ బాక్స్ ఇలా... మూడున్నర ఏళ్ల నుంచి ఆరేళ్ల పిల్లల లంచ్‌బాక్స్ : ఇప్పుడు పిల్లలు మూడున్నర ఏళ్ల నుంచే ప్రీ–స్కూల్ అంటూనో, ఎల్కేజీ, యూకేజీ అంటూనో స్కూలుకు వెళ్తున్నారు. ఆ వయసు నుంచి ఆరేళ్ల లోపు వారి లంచ్ బాక్స్ ఈ కింద ఉన్న పదార్థాలతో ఉండటం మంచిది. వారి బాక్స్‌లో పొట్టు తీయని ధాన్యాలతో చేసిన రొట్టెలు (రోటీ–పప్పు), ముడిబియ్యంతో వండిన అన్నం (దాల్–చావల్), శాండ్విచ్ పరాఠాలు వంటివి ఇవ్వవచ్చు. ఈ వయసు పిల్లలు తినే ఆహార పదార్థాల్లో కొన్ని ఆప్షన్స్ చూద్దాం 1 క్యారట్ రైస్ + బీన్స్ కూర + ఆకుకూరలతో చేసిన కూర+ పెరుగు + పండ్లు 2 పాలక్ రైస్ + పప్పు (1 కప్పు) + ఏదైనా ఆకుకూర/కాయగూర (1 కప్పు) + పెరుగు + పండ్లముక్కలు 3 బీట్రూట్ రోటీ + ఏదైనా ఆకుకూర/కాయగూర (ఒక కప్పు) + ఒక ఉడకబెట్టిన గుడ్డు + పెరుగు + పండ్లముక్కలు 4 మిక్స్డ్ వెజిటబుల్ రైస్ గ్రీన్‌పీస్ పనీర్ కూర లేదా చిక్కుళ్ల వంటి ప్రోటీన్ కూర + పెరుగు + పండ్ల ముక్కలు. 6 – 12 ఏళ్ల పిల్లల లంచ్ బాక్స్: ఈ పిల్లల్లో ఎదుగుదల చాలా వేగంగా జరగుతుంటుంది. వాళ్లకు అవసరమైన రోజువారీ శక్తి (ఎనర్జీ) కూడా ఎక్కువే. ఈ రెండు అవసరాలు తీరేలా వారి ఆహారం ఉండాలి. వారి ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజలవణాలు ఎక్కువగా ఉండాలి. అయితే వారికి చాలా ఎక్కువ శక్తి అవసరం కాబట్టి వారి ఆహారంలో అధిక క్యాలరీలను ఇచ్చే ఆరోగ్యకరమైన పదార్థాలే ఉండాలి తప్ప... ఎక్కువ క్యాలరీలను ఇచ్చే చక్కెర పదార్థాలు (కోలా డ్రింక్స్‌లో ఉండే షుగర్స్ వంటివి), చెడు కొవ్వు పదార్థాలు (ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు వాడే మార్జరిన్ వంటి నూనెలతో చేసిన పదార్థాలు) ఉండకూడదు. అందుకే వారికి సాఫ్ట్‌డ్రింక్స్, చిప్స్, క్యాండీలు, తియ్యటి డెజర్ట్స్ చాలా తక్కువగా/పరిమితంగా మాత్రమే ఇవ్వాలి. ఎప్పుడో ఒకసారి రుచికోసం మాత్రమే ఇవి అని వారు గుర్తుంచుకునేలా వారికి మంచి ఆహారపు అలవాట్లను మప్పాలి. ఈ వయసు పిల్లల్లో ముడి బియ్యం, పొట్టుతీయని ధాన్యాలతో వండిన పదార్థాల వల్ల వారికి కార్బోహైడ్రేట్లతో పాటు పీచుపదార్థాలు, విటమిన్–బి కాంప్లెక్స్ వంటివి దొరుకుతాయి. ఇక తాజా పండ్లు, ఆకుకూరలు, కాయగూరల నుంచి విటమిన్–ఏ, విటమిన్–సి, పొటాషియమ్, పీచుపదార్థాలు లభ్యమవుతాయి. అందుకోసం వారి రాత్రి భోజనంలో అన్నంతో పాటు కరకర నమిలి తినే క్యారట్లు, ఆపిల్స్ ఇవ్వాలి. డిన్నర్లో వారి కూరల్లో బ్రాకలీ, బెల్‌పెప్పర్, మొక్కజొన్న గింజలు, గ్రీన్‌సలాడ్స్ అందేలా చూడాలి. ఆరెంజ్ వంటి తాజా పండ్లు ఇవ్వాలి. పిల్లల ఎదిగే అవసరాల కోసం క్యాల్షియమ్, పొటాషియమ్, మ్యాంగనీస్, ఫాస్ఫరస్ వంటివి బాగా అందేలా చూడాలి. ఇందుకోసం వీలైతే మూడు పూటలా లేదా కనీసం రెండు పూటలా పాలు, పాల ఉత్పాదనలు తీసుకునేలా చూడాలి. ఒకవేళ పాలు తాగని వారు సోయామిల్క్, సోయా పెరుగు, క్యాల్షియమ్ సెట్ టోఫూ తీసుకునేలా చూడాలి.వారి ప్రోటీన్ అవసరాల కోసం కొవ్వు తక్కువగా ఉండే చికెన్, తాజా చేపల కూర, బీన్స్, నట్స్, ఇవ్వాలి. అలాగే ఆ మాంసాహారం వల్లనే వారికి ఐరన్, జింక్‌తో పాటు బి–విటమిన్‌లోని బి12 వంటివీ సమకూరతాయని గుర్తుంచుకోండి. ఈ వయసులోని పిల్లలకు వారంలో వీలైనన్ని సార్లు గుడ్లు ఇవ్వవచ్చు. రోజుకో గుడ్డు తప్పక ఇవ్వడమూ వారికి మేలు చేస్తుంది. అలాగే ఈ వయసు పిల్లలు ఆటలు ఎక్కువ ఆడతారు. కాబట్టి వారు తరచూ వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగేలా చూసుకోవాలి ఈ వయసులో పిల్లలు చాలా వేగంగా ఎదుగుతుంటారు. వాళ్ల ఎదుగుదలకు తగ్గట్లుగా పోషకాలు అందేలా వాళ్ల లంచ్ బాక్స్ ఉండాలి. ఒకవేళ అన్ని పోషకాలు అందక వాళ్ల ఎదుగుదల తగినంత వేగంగా జరగకపోయినా లేదా అనీమియా వంటి లోపాలు కనిపించినా డాక్టర్ సలహాలతో న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ వాడటం మంచిది. ఎందుకంటే ఈ వయసులో ఆహార లోపాలవల్ల భవిష్యత్తులో వాళ్లకు హార్మోన్ సమస్యలు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 13–18 ఏళ్ల పిల్లల లంచ్‌బాక్స్... ఈ వయసు పిల్లల్లో పెరుగుదల చాలా ఎక్కువ. పైగా మిగతా అన్ని దశలతో పోలిస్తే ఆహారం, పోషకాల అవసరం ఈ దశలో చాలా ఎక్కువ. ఫ్రెండ్స్ ప్రభావాలతో ఆహారపు అలవాట్లు మారిపోయే అవకాశం కూడా ఉంది. తమ స్నేహితులతో కలిసి తినేందుకు వారు లంచ్ బాక్స్‌ను కూడా స్కిప్ చేస్తుంటారు. ఇలాంటి వారు జంక్‌ఫుడ్‌కు అలవాటు పడే ప్రమాదం ఉంది. స్వీట్స్, బాగా ప్రాసెస్ చేసిన ఆహారం, వేపుళ్లు, ఫాస్ట్ఫుడ్స్ వైపు మొగ్గుచూపి ఆరోగ్యకరమైన ఆహారానికి దూరమయ్యేందుకు అవకాశాలు ఎక్కువ. చిప్స్, పిజ్జా, బర్గర్స్కు సాధ్యమైనంత దూరంగా ఉంచి అన్ని రకాల ఆకూకూరలు, కూరగాయలు, మాంసాహారంతో ఆరోగ్యకరమైన సమతుల ఆహారం అందేలా చూడాలి. 6–12 ఏళ్ల పిల్లలకు ఇచ్చే ఆహారాలే మరింత ఎక్కువ మోతాదుల్లో వీరి లంచ్‌బాక్స్‌లో ఉండాలి. ఈ వయసు పిల్లలు లంచ్ బాక్స్ తీసుకెళ్లేలా పేరెంట్స్ జాగ్రత్త తీసుకోవాలి. ఏయే ఆహారాలలో ఎన్నెన్ని క్యాలరీలు ►ఆరు అంగుళాల వ్యాసంతో ఉన్న రోటీలో దాదాపు 85 క్యాలరీలు ఉంటాయి. కొవ్వులు దాదాపు 0.5 గ్రాముల వరకు ఉంటాయి ►150 గ్రాముల మినప్పప్పులో 154 క్యాలరీలు ఉంటాయి. కొవ్వులు 6 గ్రాముల వరకు ఉంటాయి ►150 గ్రాముల శనగలు / రాజ్మా లో 153 క్యాలరీలు ఉంటాయి. కొవ్వులు 5 గ్రాముల వరకు ఉంటాయి ►150 గ్రాముల మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ (కూరలో) 142 క్యాలరీలు ఉంటాయి. దాదాపు 15 గ్రాముల కొవ్వులు ఉంటాయి. (ఈ కొవ్వుల పాళ్లు కూర కోసం వాడిన నూనె పరిమాణం మీద ఆధారపడిఉంటాయి) ►100 గ్రాముల చికెన్ కర్రీలో 300 క్యాలరీలు ఉంటాయి. ఇందులో 15–35 గ్రాముల కొవ్వుల వరకు ఉండవచ్చు. (ఇది స్కిన్‌తో ఉన్న చికెనా, స్కిన్లెస్నా, ఇక అందులో వాడిన నూనె ఎంత అనే అంశాల మీద ఆధారపడి ఉంటుంది) ∙ఒక సాధారణ ప్లెయిన్ దోశ లో 125 క్యాలరీలు ఉంటాయి. దాదాపు 3 గ్రాముల కొవ్వు ఉంటుంది ∙రెండు సాధారణ సైజ్ ఇడ్లీల్లో 132 క్యాలరీలు ఉంటాయి. దాదాపు 3 గ్రాముల కొవ్వు ఉంటుంది ∙100 గ్రాముల పెరుగన్నం (కర్డ్ రైస్)లో 190 క్యాలరీలు ఉంటాయి. కొవ్వులు దాదాపు 7 గ్రాముల ఉంటాయి ∙100 కోకోనట్ రైస్‌లో 369 క్యాలరీలు ఉంటాయి. దాదాపు 15 గ్రాముల కొవ్వు ఉంటుంది. కంటి నిండా నిద్ర పోనివ్వండి చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదువుకోవాలని, ఈ వయసులోనే కష్టపడాలంటూ ఉదయం చాలా త్వరగా నిద్రలేపేస్తుంటారు. ఎదిగే వయసులోని ఏ పిల్లలైనా సరే... ఎనిమిది గంటలకు తగ్గకుండా నిద్రపోయేలా చూడండి. ఆ నిద్రే లేకపోతే వారు చదివేదంతా మెదడులో సరిగా నిక్షిప్తం కాదు. మంచి నిద్ర సమయంలోనే చదివిందంతా పర్మనెంట్ మెమరీలోకి వెళ్తుందని గుర్తుంచుకోండి. సుజాతా స్టీఫెన్, చీఫ్ న్యూట్రిషనిస్ట్ యశోద హాస్పిటల్స్, మలక్‌పేట, హైదరాబాద్ -
ప్రొటీన్‌లో మార్పుతో రేడియో ధార్మికత నుంచి రక్షణ!
కేన్సర్‌కు అందుబాటులో ఉన్న చికిత్సల్లో రేడియో ధార్మికత ఒకటి. ఈ పద్ధతితో వ్యాధి నుంచి ఉపశమనం కలుగుతుందన్న మాట నిజమైనప్పటికీ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. కేన్సర్ కణాలతోపాటు ఆరోగ్యకరమైన కణాలు కూడా రేడియో ధార్మికత కారణంగా నాశనం కావడం దీనికి కారణం. ఈ సమస్యను అధిగమించేందుకు స్పెయిన్‌కు చెందిన సీఎన్ఐఓ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మన పేగుల్లోని ఒక ప్రొటీన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా రేడియోధార్మికత దుష్ప్రభావాల నుంచి రక్షణ పొందవచ్చునని వీరు అంటున్నారు. ఎలుకలపై తాము జరిపిన పరిశోధనలు దీనికి రుజువని చెబుతున్నారు. ఈ పద్ధతి కేన్సర్ రోగులకు మాత్రమే కాకుండా అణు ప్రమాదాల బాధితులు, భవిష్యత్తులో సుదూర గ్రహాలకు వెళ్లే వ్యోమగాములకూ ఉపయోగపడుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఆల్ముడెనా ఛావెజ్ ప్రెజ్ తెలిపారు. రేడియోధార్మికత కారణంగా నాశనమైన పేవు కణాలతోపాటు యుఆర్ఐ ప్రొటీన్ ఎక్కువగా కనిపించిన నేపథ్యంలో తాము దానిపై పరిశోధనలు చేపట్టామని ఆయన తెలిపారు. ఈ ప్రొటీన్ ఉత్పత్తిని నియంత్రించిన ఎలుకలను, సాధారణమైన వాటిని తీసుకుని రెండింటినీ రేడియోధార్మికతకు గురిచేసినప్పుడు మొదటి రకం ఎలుకలు 70 శాతం మరణించాయని, ఎక్కువ ప్రొటీన్‌ను ఉత్పత్తి చేసిన ఎలుకలన్నీ చికిత్సను తట్టుకోగలిగాయని వివరించారు. పేగు మూలల్లో ఉన్న మూలకణాలను ప్రేరేపించడం ద్వారా ఈ ప్రొటీన్ కణాలకు రక్షణ కల్పిస్తున్నట్లు తెలిసిందని చెప్పారు. కేన్సర్‌కు కొత్త, నిరపాయకరమైన చికిత్సలు అందించేందుకు తమ పరిశోధన ఉపకరిస్తుందని.. వివరాలు సైన్స్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయని ప్రెజ్ తెలిపారు. -
మా బాబు ముఖం ఉబ్బుతోంది...తగ్గేదెలా?
మా బాబు వయసు తొమ్మిదేళ్లు. ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు ముఖం, కాళ్లు వాపు వచ్చాయి. యూరిన్‌లో ప్రోటీన్స్ పోయాయనీ, నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని చెప్పి చికిత్స చేశారు. నెలరోజులు మందులు వాడిన తర్వాత యూరిన్‌లో ప్రోటీన్ పోవడం తగ్గింది. మందులు ఆపేశాము. మళ్లీ 15 రోజుల తర్వాత యూరిన్‌లో మళ్లీ ప్రోటీన్లు పోవడం ప్రారంభమైంది. మళ్లీ మందులు వాడితే ప్రోటీన్లు పోవడం తగ్గింది. మందులు వాడినప్పుడల్లా తగ్గి, ఆపేయగానీ యూరిన్‌లో మళ్లీ ప్రోటీన్లు పోతున్నాయి. అయితే ఎక్కువకాలం మందులు వాడితే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉందా అని ఆందోళనగా ఉంది. వాటివల్ల ఏవైనా సైడ్ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలూ ఉన్నాయా? నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉన్నప్పుడు మొదటిసారి పూర్తిగా మూడు నెలల పాటు డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడాలి. కొంతమంది పిల్లల్లో మందులు మానేయగానే మళ్లీ ప్రోటీన్ పోవడం ప్రారంభమవుతుంది. ఇలాంటి పిల్లల్లో తక్కువ మోతాదులో మందులను ఆర్నెల్ల నుంచి తొమ్మిది నెలల పాటు వాడాల్సి ఉంటుంది. కొంతమందిలో సైడ్ఎఫెక్ట్స్ కనిపించే అవకాశం ఉంటుంది. అప్పుడు వేరే మందులు వాడాల్సి ఉంటుంది. చాలామంది పిల్లల్లో ఈ వ్యాధి 12–14 సంవత్సరాల వయసప్పుడు పూర్తిగా నయమవుతుంది. కిడ్నీలు దెబ్బతినే అవకాశం చాలా తక్కువ. మీరు ఆందోళన పడకుండా డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడండి. తరతూ మూత్రంలో మంట... ఎలా తగ్గుతుంది? నా వయసు 36 ఏళ్లు. తరచూ జ్వరం వస్తోంది. మూత్రవిసర్జన సమయంలో మంటతో బాధపడుతున్నాను. మందులు వాడినప్పుడు తగ్గుతోంది. నెలలోపు మళ్లీ జ్వరం వస్తోంది. ఇలా పదే పదే జ్వరం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరు తరచూ జ్వరం, మూత్రంలో ఇన్ఫెక్షన్తో బాధపడుతుంటే, అది మళ్లీ మళ్లీ రావడానికి గల కారణాలు ఏమిటో ముందుగా నిర్ధారణ చేసుకోవాలి. షుగర్ ఉంటే కూడా ఇలా కొన్ని సందర్భాల్లో కావచ్చు. ఒకసారి షుగర్ పరీక్ష చేయించుకోండి. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకొని మూత్రవిసర్జన వ్యవస్థలో ఎక్కడైనా రాళ్లు ఉన్నాయేమో చూడాలి. యాంటీబయాటిక్స్ పూర్తి కోర్సు వాడకపోతే కూడా ఇన్ఫెక్షన్స్ ఇలా తిరగబెడతాయి. ఒకవేళ యాంటీబయాటిక్స్ పూర్తికోర్సు వాడకపోతే డాక్టర్ చెప్పిన మోతాదులో మూడు నెలల పాటు అవి వాడాలి. ఇన్ఫెక్షన్స్ తరచూ తిరగబెట్టకుండా ఉండాలంటే ఎక్కువగా నీళ్లు (రోజూ రెండు నుంచి మూడు లీటర్లు) తాగుతుండాలి. మూత్రవిసర్జనను ఆపుకోకూడదు. ఒకసారి మీరు డాక్టర్‌కు చూపించుకోండి. మూత్రం ఎర్రగా వస్తోంది? భవిష్యత్తులో సమస్యా? నాకు 34 ఏళ్లు. అప్పుడప్పుడూ మూత్రం ఎర్రగా వస్తోంది. గత ఐదేళ్ల నుంచి ఇలా జరుగుతోంది. రెండు మూడు రోజుల తర్వాత తగ్గిపోతోంది. నొప్పి ఏమీ లేదు. ఇలా రావడం వల్ల భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తుందా? కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందా? మీరు చెప్పినట్లుగా మూత్రంలో రక్తం చాలాసార్లు పోతుంటే... ఎందువల్ల ఇలా జరుగుతోంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. దానికి తగినట్లుగా చికిత్స తీసుకోవాలి. ఇలా మాటిమాటికీ మూత్రంలో రక్తస్రావం అవుతుండటానికి కిడ్నీలో రాళ్లు ఉండటం, ఇన్ఫెక్షన్ ఉండటం, కిడ్నీ సమస్య లేదా మరేదైనా కిడ్నీ సమస్య (గ్లోమెరూలో నెఫ్రైటిస్ వంటిది) ఉండవచ్చు. మీరు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోండి. మూత్రపరీ„ కూడా చేయించుకోవాలి. కిడ్నీలో రాళ్లుగానీ, ఇన్ఫెక్షన్ గానీ లేకుండా ఇలా రక్తం వస్తుంటే మూత్రంలో ప్రోటీన్ పోతుందేమోనని కూడా చూడాలి. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. ఒకవేళ రక్తంతో పాటు ప్రోటీన్ కూడా పోతుంటే కిడ్నీ బయాప్సీ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. కిడ్నీలు దెబ్బతినకుండా ఉండేందుకు మందులు వాడాల్సి ఉంటుంది. డయాలసిస్ తర్వాత చర్మంపై దురద... ఏం చేయాలి? నా వయసు 42 ఏళ్లు. ఒక ఏడాదిగా క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటున్నాను. నాకు ఈమధ్య విపరీతంగా చర్మం దురద పెడుతోంది. ఎందుకిలా జరుగుతోంది? దురద రాకుండా ఉండటానికి ఏం చేయాలి? డయాలసిస్ చేయించుకునే పేషెంట్స్‌లో చర్మం పొడిగా అవుతుంది. అంతేకాకుండా వాళ్ల రక్తంలో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండటంవల్ల కూడా దురద ఎక్కువగా వస్తుంటుంది. చర్మం పొడిగా ఉన్నవాళ్లు స్నానం తర్వాత చర్మంపై వాజిలేన్ లేదా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. రక్తంలో ఫాస్పరస్ తగ్గించే మందులు తీసుకోవడంతో పాటు ఆహారంలో పాల ఉత్పాదనలు, మాంసాహారం తీసుకోవడం తగ్గించాలి. రక్తహీనత ఉన్నవాళ్తు రక్తం పెరగడానికి మందులు వాడాలి. డాక్టర్ విక్రాంత్‌రెడ్డి, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
పాపకు నత్తి వస్తోంది... తగ్గేదెలా?
మా పాపకు పదేళ్లు. చదువులో ముందుంటుంది. కానీ మాట్లాడుతుంటే కొద్దిగా నత్తిగా వస్తుంటుంది. డాక్టర్‌ను కలిస్తే అంతా మామూలు అయిపోతుంది. మాటలు చక్కగానే వస్తాయి, కాకపోతే కాస్త ఆలస్యంగా కావచ్చు. అయితే మా పాప కంటే చిన్నవాళ్లు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. మా అమ్మాయి చక్కగా మాట్లాడాలంటే మేమేం చేయాలో సలహా ఇవ్వండి. ఉచ్చారణ విషయంలో మీ పాపకు ఉన్న సమస్యను స్టామరింగ్ లేదా స్టట్టరింగ్ అంటారు. ఈ కండిషన్ ఉన్న పిల్లలు ఒక పదాన్ని ఉచ్చరించే ముందు అదేమాటను పదే పదే పలుకుతూ ఉండటం, లేదా గబుక్కున అనలేక దాన్ని పొడిగించడం, ఒక్కోసారి మాట ఆగిపోవడం కూడా జరగవచ్చు. మన జనాభాలో దాదాపు ఒక శాతం మందికి ఈ సమస్య ఉంటుంది. ఇది అమ్మాయిల్లో కంటే అబ్బాయిల్లో ఎక్కువ. ఈ సమస్యకు నిర్దిష్టంగా ఇదే కారణం అని చెప్పలేకపోయినా... జన్యుపరమైన, న్యూరోఫిజియలాజికల్ మార్పుల వల్ల ఒక్కోసారి ఈ సమస్య రావచ్చు. ఇలాంటి పిల్లల్లో కొందరికి వినికిడి సమస్య కూడా ఉండవచ్చు. కాబట్టి పై సమస్యలు ఉన్నాయా లేదా అని పరీక్షించడం చాలా ముఖ్యం. పిల్లల మానసిక స్థితిని సరిగ్గా అర్థం చేసుకోకుండా వారిని ఇతరులతో పోల్చిచూడటం, బాగా రాణించాలని కోరుతూ ఒత్తిడి పెంచడం వంటి కారణాలతో స్టామరింగ్ ఇంకా ఎక్కువ కావచ్చు. మాటలు నేర్చుకునే వయసు పిల్లల్లో స్టామరింగ్ అన్నది చాలా సాధారణంగా కనిపించే సమస్య. అయితే వాళ్లలో వయసు పెరుగుతున్నకొద్దీ సమస్య తగ్గుతూ ఉంటుంది. పిల్లల్లో ఒకవేళ స్టామరింగ్ ఉంటే... ఐదేళ్లు వచ్చేనాటికి 65 శాతం మంది పిల్లల్లో, యుక్తవయసు వచ్చేదానికి ముందర (అర్లీ టీన్స్‌లో) 75 శాతం మందిలో ఈ సమస్య తగ్గిపోతుంది. ఇలాంటి పిల్లల్లో వాళ్లు చెప్పేది పూర్తిగా వినడం తల్లిదండ్రుల బాధ్యత. వాళ్లను తొందరపెట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. వాళ్లు చెప్పదలచుకున్నది పూర్తిగా చెప్పేలా ప్రోత్సహించడం అవసరం. ఇలాంటి పిల్లలకు నిర్దిష్టంగా ఒకే ప్రక్రియతో సమస్య మటుమాయం అయ్యేలా చేయడం జరగదు. కొన్ని మందులు వాడుకలో ఉన్నా వాటి వల్ల అంతగా ప్రయోజనం లేదు. స్పీచ్ ఫ్లుయెన్సీ, స్టామరింగ్ మాడిఫికేషన్ వంటి స్పీచ్‌థెరపీ ప్రక్రియల ద్వారా మీ పాపకు సమస్య చాలావరకు నయమవుతుంది. మీరు మొదట స్పీచ్ థెరపిస్ట్ కలిసి తగు చికిత్స తీసుకోండి. బాబుకు గేదెపాలు పట్టించవచ్చా? మా బాబు వయసు నెల రోజులు. తల్లికి పాలు పడకపోవడంతో ఆమె దగ్గర తగినన్ని పాలు లేవు. దాంతో గేదెపాలు పట్టిస్తున్నాం. ఇంత చిన్న బాబుకు గేదెపాలు తాగించవచ్చా? దీనివల్ల బాబుకి ఏమైనా సమస్యలు ఎదురవుతాయా? నెలల బిడ్డకు గేదె పాలు పట్టించడం అంత మంచిదికాదు. ఇటీవలి అధ్యయనాల ప్రకారం... పోతపాల (యానిమల్ మిల్క్)పై పెరిగే పిల్లల్లో కడుపునొప్పి వంటి ఉదరసంబంధమైన సమస్యలు, ఆస్తమా వంటి అలర్జిక్ వ్యాధులు, చెవి ఇన్ఫెక్షన్లు, స్థూలకాయం వంటి అనేక సమస్యలు రావచ్చని, ఆ సమస్యలకు ఇలా గేదె పాలు పట్టడం కూడా ఒక కారణమని తెలుస్తోంది. పైగా ఇటీవల పశువుల్లో పాల ఉత్పత్తిని పెంచడానికి అనేక హార్మోన్లు, మందులు, యాంటీబయాటిక్స్ ఉపయోగిస్తున్నారు. వీటి ఫలితంగా పిల్లల దీర్ఘకాలిక ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావం కనిపిస్తోంది. కాబట్టి పోతపాలు, సురక్షితం కాని పాలు (అన్పాష్చరైజ్డ్ మిల్క్) పిల్లలకు ఇవ్వడం సరికాదు. ఇక తల్లి పాలు ఇవ్వలేని తప్పనిసరి పరిస్థితుల్లో (అంటే లాక్టోజెన్ ఇన్టాలరెన్స్, ప్రోటీన్ ఇన్టాలరెన్స్ వంటి సమస్యలు ఉన్నప్పుడు) మార్కెట్లో దొరికే కొన్ని స్పెషల్ ఫార్ములా ఫీడ్స్ ఉపయోగించవచ్చు. కానీ వీటన్నింటికంటే తల్లిలోనే పాలు పెరిగేలా స్వాభావిక విధానాలు (ప్రోటీన్లు పుష్కలంగా ఉంటే పుష్టికరమైన ఆహారం ఇవ్వడం వంటివి) అనుసరించడం మంచిది. ఇక తప్పనప్పుడు డాక్టర్ సలహా మేరకు తల్లిలో పాలు పెరిగేందుకు కొన్ని మందులు ఉపయోగించాల్సి ఉంటుంది. పిల్లలకు తల్లిపాలే శ్రేయస్కరం. మీరు మరొకసారి మీ గైనకాలజిస్ట్‌ను కలిసి రొమ్ముకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉన్నాయేమో పరీక్షించుకోండి. వాటికి చికిత్స తీసుకుని తల్లిపాలే పట్టడానికి ప్రయత్నించండి. అదేమీ సాధ్యం కానప్పుడు మాత్రమే ఫార్ములా ఫీడ్స్ వెళ్లాల్సి ఉంటుంది. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్,రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ,హైదరాబాద్ -
వేసవిలో కేశాల ఆరోగ్యం కోసం...
కేశాలను క్రమంగా కత్తిరించండి వేసవిలో సాధారణంగా జుట్టు పొడిగా నిర్జీవంగా తయారు అవుతుంది, ఈ సమయంలో జుట్టు చివరలను కత్తిరించండి. చూడటానికి అందంగా కనపడటానికి, కేశాలను పావు అంగుళం కత్తిరించండి. ఫలితంగా కేశాలు ఆరోగ్యకరంగా కనిపిస్తాయి. పెరుగుదల కూడా మెరుగుపడుతుంది రెండురోజులకోసారి తలస్నానం వేసవిలో తలపైన చెమట ఎక్కువగా రావటం వలన తలపైన ఉండే చర్మం దుమ్ము ధూళితో నిండిపోయి, చికాకుగా అనిపిస్తుంది. దాంతో చాలామంది తలను రోజు శుభ్రపరుస్తుంటారు. ఇలా రోజూ తలస్నానం చేయడం వల్ల తల పైన ఉండే చర్మం సహజ నూనెలను కోల్పోయి జుట్టు కూడా నిర్జీవంగా కనిపిస్తుంది. అందువల్ల రెండు రోజులకు ఒకసారి తలస్నానం చేయడం మంచిది. కండిషనింగ్ కేశాలకు తరచు షాంపూలను వాడటం వలన ‘రీహైడ్రేషన్’కు గురవకుండా ‘ప్రోటీన్’లతో కూడిన కండిషనర్లను వాడటం మంచిది. అలాగని ఎక్కువ ప్రోటీన్లు ఉన్న కండిషనర్లను వాడరాదు. ఇలా వాడటం వలన కేశాలు పొలుసులుగా మారే అవకాశం ఉంది. కాబట్టి వారానికి ఒకసారి మంచి కండిషనర్ ఉన్న షాంపూలను వాడటం మంచిది. ఎక్కువగా దువ్వకండి ఎక్కువగా దువ్వటం వలన కేశాలు పాడయ్యే అవకాశం ఉంది. వేసవిలో ఉండే వేడికి తలపైన ఉండే చర్మం తేమని కోల్పోతుంది. దీనికితోడు బాగా దువ్వటం వలన కురులు పెళుసుబారి చిట్లిపోవడం లేదా ఊడిపోవడం జరుగుతుంది. తల స్నానం చేసిన వెంటనే ఫైబర్’తో తయారు చేసిన దువ్వెనలను వాడడం మరింత హానికరం. కాబట్టి వీలయినంత వరకు చెక్కదువ్వెనతో... అదీ కూడా జుట్టు బాగా ఆరిన తర్వాత దువ్వడం మంచిది. మీ కేశాలను కడగటానికి సమయం లేదు కదా అని అశ్రద్ధ చూపకండి, వెంట్రుకల మూలాలు, తలపైన చర్మంలో ఉండే దుమ్ము, నూనెల వలన దురదలు కలుగుతాయి, కొన్ని సమయాల్లో కేశాలు బలహీనంగా మారి వెంట్రుకలు ఉడిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి వారానికి మూడు లేదా కనీసం రెండుసార్లు తలస్నానం చేయడం మంచిది. నిమ్మరసం వాడండి ఒకోసారి అనుకోకుండా ఎండలో ఎక్కువసేపు ఉండవలసి వస్తుంది. అలాంటప్పుడు కేశాలకు కొద్దిగా నిమ్మరసం రాయడం మంచిది. -
ఉపవాసంతో వ్యర్థానికి మోక్షం!
లంఖణం పరమౌషధం అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఆధునిక శాస్త్రం కూడా ఈ విషయాన్ని చాలాసార్లు రుజువు చేసింది కూడా. హార్వార్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు జరిపిన తాజా పరిశోధనలు కూడా నిరాహారంగా ఉండటం, తరచూ వ్యాయామం చేయడం శరీరంలోని కణ వ్యవస్థను పూర్తిగా చైతన్యవంతం చేస్తుందని గుర్తించారు. ఈ చర్యల ఫలితంగా పాడైపోయిన ప్రొటీన్లను బయటకు పంపేందుకు శరీరానికి మరింత శక్తి లభిస్తుందని పరిశోధన పూర్వకంగా తెలుసుకున్నారు. శరీరాన్ని తనను తాను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు స్వయంగా కొన్ని పనులు చేసుకుంటుంది. చెడిపోయిన ప్రొటీన్లు, కణాలను వదిలించుకోవడం ఇందులో భాగం. అయితే కొన్నిసార్లు ఈ వ్యవస్థలు సక్రమంగా పనిచేయక వ్యాధులు వస్తూంటాయి. ప్రొటీన్‌ను ఒక నిర్దిష్ట పద్ధతిలో మడతపెట్టడం ద్వారా అవి బయటకు పోకుండా పోగుబడుతూంటాయని గుర్తించిన శాస్త్రవేత్తలు.. ఈ ప్రక్రియను నియంత్రించే మార్గాలను అన్వేషిస్తున్నారు. వ్యాయామం, ఉపవాసం వంటి చర్యల వల్ల శరీరంలో జరిగే హార్మోన్ మార్పులు కణాలపై ప్రభావం చూపుతున్నాయని... పాడైన ప్రొటీన్లను బయటకు పంపే వ్యవస్థను చైతన్యవంతం చేస్తున్నాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త వెట్ప్లాంక్ తెలిపారు. సైక్లింగ్ వ్యాయామం చేసే కొందరిపై పరీక్షలు జరిపినప్పుడు పాడైన ప్రొటీన్లు వేగంగా నశించిపోతున్నట్లు గుర్తించారు. -
చేపల వినియోగం పెరగాలి
సాక్షి, హైదరాబాద్: పౌష్టికాహారమైన చేపల వినియోగాన్ని పెంచేందుకు జాతీయ చేపల అభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్డీబీ) నిరంతరం కృషి చేస్తోందని ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఐఏఎస్ అధికారి రాణికుముదిని తెలిపారు. శరీరానికి కావాల్సిన ఆవశ్యక ప్రొటీన్లను అందించే చేపలు మెరుగైన ఆహారమన్నారు. వీటిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, చేపల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు పలు అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. చేపలు తింటే ముళ్లు గొంతులో ఇరుక్కుంటాయని, ఇతర అపోహలు ప్రజల్లో ఉన్నాయని.. ఇలాంటి వాటిని పోగొట్టేందుకు జాతీయ స్థాయిలో పలు ఫిష్ ఫెస్టివల్స్‌ను నిర్వహిస్తునట్లు పేర్కొన్నారు. 2018 జూలైలో విశాఖపట్నంలో తొలిసారిగా ఫిష్ ఫెస్టివల్ నిర్వహించామని, దీనికి అద్భుతమైన స్పందన వచ్చిందని చెప్పారు. ఈ ఏడాది తొలి ఫిష్ ఫెస్టివల్‌ను హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇందులో పాల్గొనే వారికి స్టాల్స్ కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. మాంసం విక్రయాలు 93 శాతం.. తెలంగాణలో చేపల వినియోగం మొదటి నుంచి తక్కువగానే ఉందని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. చికెన్, మటన్ వినియోగం ఏకంగా 93 శాతం ఉందన్నారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనిలో భాగంగానే రూ. 50 కోట్ల విలువైన పరికరాలు పంపిణీ చేసిందన్నారు. ముళ్లు లేని చేపల మాంసాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసిందని వెల్లడించారు. నగరంలో 15 మొబైల్ ట్రక్కుల్లో డీ బోనింగ్ (ముళ్లు, చర్మం తొలగించినవి) చేపలను విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇవి సఫలీకృతం కాగానే రాష్ట్రమంతా విస్తరిస్తామని తెలిపారు. -
ఆ గట్టు నుంటావా ఈ గట్టు కొస్తావా..
పప్పన్నం తినమంటే ముఖం అదోలా పెడతాం. అదే బంగాళ దుంపల వేపుడు అయితే ఇష్టంగా లాగించేస్తాం. వేపుళ్లు, అందులోనూ బంగాళాదుంప వినియోగం భారత్‌లో ఎక్కువగా ఉంటోందని ‘ఈట్–లాన్సెట్ కమిషన్’ తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. ఇది ఏమాత్రం దీర్ఘకాల ఆరోగ్యానికి మంచిది కాదని హెచ్చరించింది. భౌగోళిక, వాతావరణ పరిస్థితులకు తగినట్లుగా భారత ప్రజలు ప్రొటీన్లను ఎక్కువగా తీసుకోవాల్సి ఉన్నప్పటికీ.. పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని స్పష్టం చేసింది. తరచుగా భారతీయులు అనారోగ్యం పాలవడానికి కారణం శరీరానికి అవసరమైన స్థాయిలో ప్రొటీన్లు తీసుకోకపోవడమే కారణమని నివేదికలో పేర్కొంది. భారత్ సహా ప్రపంచదేశాలన్నీ ఆహారపు అలవాట్లను మార్చుకుంటే ఏటా 1.1కోట్ల ముందస్తు మరణాలను అరికట్టవచ్చని లాన్సెట్ మెడికల్ మ్యాగజైన్లో పేర్కొంది. చేపలు, మాంసం తగ్గిస్తేనే! మాంసాహారం, షుగర్ వినియోగాన్ని సగానికి సగం తగ్గించాల్సిందేనని నివేదిక పేర్కొంది. పళ్లు, గింజలు, కూరగాయలు తినడాన్ని రెట్టింపు చేయాలని చెబుతోంది. భారతీయులు బంగాళ దుంపలను ఎక్కువగా తింటున్నారని.. వీటి వాడకాన్ని వీలైనంత తగ్గించాలని సూచించింది. ‘భారత్‌లో అవసరానికంటే 1.5 రెట్లు ఎక్కువగా బంగాళ దుంపలు తింటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. వీటి బదులుగా ప్రొటీన్లను తీసుకోవడంపై దృష్టిపెట్టాలి. పప్పులు, గింజలు, పళ్లు మొదలైన శాకాహార ప్రొటీన్లను ఎక్కువగా తీసుకోవాలి. చేపలు, మాంసం వంటివి ఎంత మితంగా తింటే అంత మంచిది’ అని లాన్సెట్ కమిషన్ సభ్యుడు, న్యూఢిల్లీకి చెందిన పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. భారత్‌లో పప్పులు, కూరగాయలు, పండ్ల సాగు, వినియోగం విస్తృతంగా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. చక్కెర వినియోగాన్ని అరికట్టడంపై ప్రపంచదేశాలన్నీ ఏకమై ఉద్యమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. భూమండలమూ సురక్షితం ఈట్–లాన్సెట్ కమిషన్ పరిశోధనలో భాగంగా.. 16 దేశాలకు చెందిన 37 మంది శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు కలిసి మూడేళ్ల పాటు ప్రపంచ ఆహార అలవాట్లను అధ్యయనం చేశారు. మొత్తంమీద మాంసాహారం వినియోగాన్ని తగ్గించి శాకాహారాన్ని తినడం వల్ల ఈ భూగోళాన్ని కాపాడుకోగలమని కమిషన్‌కు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ జాన్ రాక్స్టామ్ అన్నారు. అదనపు భూమిని వినియోగించుకోకుండా, జీవవైవిధ్యాన్ని కాపాడుకుంటూ, నీటి వాడకాన్ని తగ్గించుకుంటూ, కర్బన ఉద్గారాల విడుదలను అరికట్టేవిధంగా ప్రపంచ జనాభా ఆహార అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ సమతుల ఆహారం తీసుకుంటేనే పర్యావరణం పరిరక్షణ జరుగుతుందని ఆయన వివరించారు. ఈ పరిశోధనల ఆధారంగా వీరు రూపొందించిన నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. - మనం ఎలాంటి ఆహారాన్ని తింటున్నాం అనేదే కాదు, అదెక్కడి నుంచి వచ్చిందో అన్నది కూడా ముఖ్యమే. - మాంసం, పాల ఉత్పుత్తుల వాడకాన్ని తగ్గించి, శాకాహారాన్ని అధికంగా తీసుకుంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండటంతో పాటు.. భూగోళం కూడా పచ్చగా ఉంటుంది. - మొక్కల నుంచి వచ్చే గింజలు, కూరగాయలు, పండ్ల వినియోగం 100% పెంచాలి. మాంసం, షుగర్ వాడకాన్ని 50%తగ్గించాలి. - మాంసం వినియోగం పెరిగే కొద్దీ గ్రీన్ హౌస్ ఉద్గారాలు పెరుగుతాయి. - మాంసాహారం తినడం వల్ల వచ్చే వ్యాధుల్ని అరికట్టేందుకు యాంటీబయాటిక్స్‌ను ఎక్కువగా వినియోగించాల్సి వస్తుంది. ఇది ఆరోగ్యానికి హానికరం. - ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది ఆకలితో మాడుతుంటే.. ఆహారపు అలవాట్లు సరిగా లేని వారు 200 కోట్ల వరకు ఉన్నారు. - కేవలం ఆహారపు అలవాట్ల కారణంగానే ఏటా ప్రపంచవ్యాప్తంగా కోటి మందికిపైగా చనిపోతున్నారు. - గత ఏభై ఏళ్లుగా ఆహార అలవాట్లలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. - కేలరీలు ఎక్కువగా ఉన్న తిండి తింటున్నాం. ప్రతీ రోజూ సగటున 2,500 కేలరీల ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అంతకు మించి తీసుకోవడం వల్ల ప్రపంచ దేశాలు ఊబకాయం సమస్యని ఎదుర్కొంటున్నాయి. - ఉత్తర అమెరికా వంటి దేశ్లాలో మాంసాన్ని అవసరమైన దాని కంటే 6 రెట్లు ఎక్కువగా తీసుకుంటున్నారు. అదే దక్షిణాసియా దేశాల్లో తినాల్సిన దానికంటే 50% తక్కువగా మాంసం తింటున్నారు. - 2050కి జనాభా 1000 కోట్లకు చేరుకోవచ్చు నని అంచనా, వారందరి కడుపు నిండాలంటే ప్రస్తుతం ఉన్న ఆహార అలవాట్లను అందరూ తప్పనిసరిగా మార్చుకోవాల్సిందే. - ఆహారపు అలవాట్లు మారేలా ప్రభుత్వాల విధానాలు కూడా మారాలి. ప్రజల ఆరోగ్యానికి హాని చేసే ఆహారాపదార్థాలపై కొత్త పన్నులు విధించాలి. వాటి అమ్మకంలో పరిమితులు విధించాలి. ఇంకా అవసరమైతే వాటిని నిషేధించాలి. -
కేన్సర్‌పై పోరాటానికి ప్రొటీన్ సిద్ధమైంది
దుష్ప్రభావాలు ఏమీ లేకుండానే కేన్సర్‌కు చికిత్స కల్పించాలన్న శాస్త్రవేత్తల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తున్నాయి. వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇందుకోసం ఒక ప్రొటీన్‌ను కృత్రిమంగా సిద్ధం చేశారు. రోగ నియంత్రణ వ్యవస్థలో కీలకమైన ఇంటర్‌ల్యూకిన్ –2 (ఐఎల్–2) కేన్సర్‌తోపాటు మధుమేహం, ఆర్థరైటిస్ వంటి అనేక ఆటోఇమ్యూన్ వ్యాధులకు చికిత్స కల్పించగలదు. అయితే దుష్ప్రభావాలు చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన ప్రొటీన్ డిజైన్ విభాగం కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా ఐఎల్–2 ను పోలిన కృత్రిమ ప్రొటీన్‌ను డిజైన్ చేశారు. జంతువుల్లో జరిగిన ప్రయోగాల్లో ఈ కృత్రిమ ప్రొటీన్ కేన్సర్ కణాలపై దాడి చేయగల టీ– కణాలను చైతన్యవంతం చేసినట్లు స్పష్టమైంది. అంతేకాదు.. నియో –2/15 అని పిలిచే ఈ కృత్రిమ ప్రొటీన్ ఇంటర్‌ల్యూకిన్ –15 ప్రొటీన్‌లా కూడా పనిచేస్తుంది. శాస్త్రవేత్తలు దాదాపు 30 ఏళ్లుగా ఐఎల్–2ను సురక్షితంగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. నియో –2/15 ద్వారా ఇది సాధ్యమవుతోందని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డేయిన్ అడ్రియానో సిల్వా తెలిపారు. అన్నీ సవ్యంగా సాగితే నియో –2/15 ద్వారా కేన్సర్‌కు మరింత మెరుగైన, దుష్ప్రభావాలు ఏవీ లేని చికిత్స అందుతుందని అంచనా -
రెండు మందులతో కేన్సర్‌కు చెక్!
కేన్సర్ చికిత్సకు వాడే రెండు మందులను వేర్వేరుగా కాకుండా కలిపి వాడటం ద్వారా ఎక్కువ ఫలితం ఉంటుందని అంటున్నారు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు. ఈ రెండు మందుల్లో ఒకటి రైబోన్యూక్లియస్కు సంబంధించింది.. రెండోది ప్రొటీన్ కైనేస్ ఇన్హిబిటర్. కేన్సర్‌కు సమర్థమైన చికిత్సగా భావిస్తున్న రైబో న్యూక్లియస్ మందులు మానవ కణాల నుంచి తయారవుతాయి. వీటి పని చాలా సింపుల్. మనకు అవసరం లేని కణాల పోగులను, వైరస్‌లను బయటికి పంపించడమే! ఈ సామర్థ్యాన్ని కేన్సర్‌కు విరుగుడుగా వాడేందుకు కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకోవైపు ప్రొటీన్ కైనేస్ ఎంజైమ్‌లు కణ విభజన ప్రక్రియ నెమ్మదించేలా చేస్తాయి. ఈ రెండు మందులు వేర్వేరుగా కేన్సర్‌పై ప్రభావం చూపుతున్నప్పటికీ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఈ రెండింటిని కలిపి కొన్ని రకాల కేన్సర్లకు వాడారు. తక్కువ మోతాదుతోనే మెరుగైన ఫలితాలు కనపడటంతో ప్రస్తుతం వారు ఎలుకలపై ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. -
ఆ ప్రొటిన్‌తో కొవ్వు ఖాళీ!
ఊబకాయాన్ని తగ్గించుకోవాలనుకునే వారికి ఓ శుభవార్త. సహజసిద్ధమైన ప్రొటిన్ సాయంతోనే శరీరంలోని కొవ్వులను మూడొంతుల వరకూ తగ్గించవచ్చునని జార్జ్‌టౌన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిరూపించడం దీనికి కారణం. ఎలుకలపై జరిగిన పరిశోధనల్లో బీపీ3 అని పిలిచే ఈ ప్రొటిన్ కేవలం 18 రోజుల్లో కొవ్వులను కరిగించినట్లు తెలిసింది. కొవ్వులను తగ్గించడంతోపాటు జీవక్రియలకు సంబంధించిన ఇతర జబ్బులకూ సహజసిద్ధమైన ప్రొటీన్ ద్వారా మెరుగైన చికిత్స కల్పించేందుకు ఈ పరిశోధన ఉపకరిస్తుందని అంచనా. బీపీ3 సహజమైన ప్రొటిన్ కావడం వల్ల దీనిపై నేరుగా పరిశోధనలు నిర్వహించేందుకు అవకాశముందని, తద్వారా ఈ ప్రొటిన్ ఆధారిత మందు వేగంగా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంటుందని ఆంటన్ వెల్స్టీన్ అనే శాస్త్రవేత్త తెలిపారు. కేన్సర్‌పై పరిశోధనలు చేస్తూండగా తమకు ఈ ప్రొటీన్ కొవ్వులను కరిగించేందుకు ఉపయోగపడుతుందని తెలిసిందని ఆయన చెప్పారు. -
ఫ్యాట్కిన్స్ డైట్
1972లో ఒక పుస్తకం సంచలనం రేపింది.డాక్టర్ ఆట్కిన్ అనే ఆయన ‘ఆట్కిన్స్ డైట్’ పేరుతో ఆ పుస్తకం రాసి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. బరువు తగ్గడానికి ఇది శ్రేష్టమైన మార్గమనిసూచించాడు.ఆచరించినవాళ్లు అవునని అన్నారు.మీరూ ఆచరించి చూడండి... ఫ్యాట్‌తో ఫ్యాట్‌ని కిల్ చేసే ఈ డైట్‌ని పరిశీలించి చూడండి. బరువు తగ్గడానికి సమర్థంగా సహకరించే డైట్ ప్రక్రియల్లో ఆట్కిన్స్ డైట్ ఒకటి. ఇది తక్కువ పిండిపదార్థాలు ఎక్కువ ప్రొటీన్లు, కొవ్వులు ఉన్న డైట్ ప్రక్రియ. డాక్టర్ రాబర్ట్ సి. ఆట్కిన్ అనే ఫిజీషియన్ 1972లో రాసిన ఒక పుస్తకంలో దీన్ని పొందుపరచాడు. ఆ పుస్తకం ఆనాటి బెస్ట్ సెల్లర్‌గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ఈ ఆహార ప్రక్రియలను అంతో ఇంతో తమ తమ ప్రాంతాలకు అనుగుణంగా, అనువుగా మార్చుకుని ప్రయోజనం పొందారు. ఈ ఆహార ప్రక్రియలోని ప్రధాన ప్రిన్సిపుల్ స్వాభావికమైన కొవ్వులైన నెయ్యి వంటి శాచ్యురేటెడ్ ఫ్యాట్స్‌ను ఎంతైనా తీసుకోమని చెప్పడం. ఎందుకంటే అవి అంత హానికరం కాదు. మార్కెట్ లో దొరికే లో–ఫ్యాట్ డైట్స్ కంటే ఇలాంటి శాచ్యురేటెడ్ కొవ్వులే రక్తంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడం, చెడు కొలెస్ట్రాల్‌ను పరిమితం చేయడం ద్వారా గుండెజబ్బులను నివారిస్తాయి. బరువును తగ్గిస్తాయి. ఈ ఆహార విధానంలోని మరో ముఖ్యాంశం పిండిపదార్థాలను తగ్గించడం. దీని వల్ల బరువు తగ్గుతారు. ఎందుకంటే పిండిపదార్థా లతో ఎంతోసేపటికి గానీ తృప్తి కలగదు. అదే ప్రొటీన్లు తినడం వల్ల త్వరగా తృప్తి కలుగుతుంది. దాంతో కార్బోహైడ్రేట్లను తగ్గించడం వల్ల ప్రొటీన్లను ఒంటికి అవసరమైనంతే తినడంతో ఆటోమేటిగ్గా బరువు తగ్గుతారు. ఆట్కిన్స్ ౖడైట్ అనుసరించేవారు నాలుగు దశల్లో దీన్ని అమలు పరచవచ్చు. అవి... ►మొదటి దశలో (దీన్ని ఇండక్షన్ దశ అంటారు): రోజుకు కేవలం 20 గ్రాముల కంటే తక్కువ పిండిపదార్థాలను (అంటే ఆకుకూరలు, కాయ గూరలను) మాత్రమే తీసుకుంటూ రెండు వారాలు కొనసాగించాలి. ఈ సమయంలో ఎక్కువ ప్రొటీన్, ఎక్కువ కొవ్వులు ఉండే మాంసాహారాలు రోజుకు మూడుపూటలా తీసు కోవచ్చు. ►రెండో దశలో (దీన్ని బ్యాలెన్సింగ్ దశ అంటారు) : ఇప్పుడు రెండువారాలుగా తీసుకునే ఆహారానికి మెల్లగా నట్స్, డ్రైఫ్రూట్స్, పండ్లు వంటి వాటిని జతచేయవచ్చు. ఇలా మరో రెండు వారాలు కొనసాగించాలి. ►మూడో దశలో (దీన్ని ఫైన్–ట్యూనింగ్ దశ అంటారు) : ఇందులో మీరు కోరుకున్న లక్ష్యానికి చేరువ అవుతూ చాలావరకు బరువు తగ్గుతారు. అప్పుడు మీ ఆహారానికి మరికొన్ని కార్బో హైడ్రేట్లను చేర్చవచ్చు. ►నాలుగో దశలో (దీన్ని నిర్వహణ దశ లేదా మెయింటెనెన్స్ దశ అంటారు): ఇక ఇప్పటి నుంచి మీరు ఆరోగ్యకరమైన పిండిపదార్థాలను మాత్రమే తీసుకుంటూ ఉన్నప్పటికీ ఎలాంటి పైన పేర్కొన్న మూడు దశల్లోని హై–ప్రొటీన్లు, ఎక్కువ కొవ్వులు తీసుకుంటున్నా బరువు పెరగకుండా స్థిరంగా ఉంటారు. ఒక సూచన : ఇక్కడ పేర్కొన్న దశలు పాటించడానికి కాస్త సంక్లిష్టంగానే ఉంటాయి. అందుకే కొంతమంది ఇండక్షన్ దశలోకి వెళ్లకుండానే నేరుగా రెండో దశ నుంచి ప్రారంభిస్తారు. అయితే కొంతమంది మాత్రం ఎంతకూ ఇండక్షన్ దశలోనే ఉండిపోతారు. ఈ ఆట్కిన్స్ డైట్ ప్రభావవంతంగా పనిచేసే ప్రక్రియే. ఇది ఇంచుమించూ కాస్త కీటోజెనిక్ డైట్ ప్రక్రియకు దగ్గరగా ఉంటుంది. ఆట్కిన్స్ ప్రక్రియలో దూరంగా ఉండాల్సిన ఆహారాలు : ►చక్కెరలు : శీతల పానీయాలు, పళ్లరసాలు, కేకులు, క్యాండీలు, ఐస్‌క్రీములు. ► ధాన్యాలు : గోధుమలు, రే, బార్లీ, వరి. ► వెజిటెబుల్ ఆయిల్స్ : సోయా నూనె, మొక్కజొన్న నూనె, పత్తిగింజల నుంచి తీసిన నూనె (కాటన్ సీడ్ ఆయిల్)... ఇలాంటివే మరికొన్ని. ► కొవ్వులు / ట్రాన్స్‌ఫ్యాట్స్ : హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ అని పిలిచే ప్రాసెస్ చేసిన నూనెల నుంచి దూరంగా ఉండాలి. ► కార్బ్ డైట్ : ఎక్కువ చక్కెరలు ఉండే కార్బోహైడ్రేట్ డైట్. ► హై–కార్బ్ వెజిటెబుల్స్ : క్యారెట్లు, టర్నిప్లకు దూరంగా ఉండాలి. ► హై–కార్బ్ పండ్లు : అరటిపండ్లు, ఆపిల్స్, నారింజ, పియర్స్, ద్రాక్ష పండ్లకు దూరంగా ఉండాలి. ► పిండి పదార్థాలు (స్టార్చ్) : బంగాళదుంప (ఆలూ), చిలగడదుంపలకు దూరంగా ఉండాలి. (వీటిని ఇండక్షన్ దశలో మాత్రమే తీసుకోవచ్చు) ► లెగ్యూమ్‌లు : చిక్కుళ్లు, బీన్స్, చిక్పీస్ వంటివాటికి దూరంగా ఉండాలి. (వీటిని ఇండక్షన్ దశలో మాత్రమే తీసుకోవచ్చు) తీసుకోదగిన ఆహారాలు : ఆట్కిన్స్ డైట్లో భాగంగా ఈ కింద పేర్కొన్న ఆహారాలను తీసుకోవచ్చు. ►మాంసాహారాలు : వేట మాంసం, చికెన్ ►చేపలు / సీఫుడ్ : సాల్మన్, సార్డిన్ చేపలు. ► గుడ్లు : ఒమెగా 3– ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న అన్ని ఆరోగ్యకరమైన గుడ్లు. ►తక్కువ పిండిపదార్థాలు ఉండే కూరగాయలు / ఆకుకూరలు : పాలకూర, బ్రాకలీ, అస్పారగాస్ వంటివి. ► కొవ్వులు ఎక్కువగా ఉండేవి: వెన్న, చీజ్, మీగడ, కొవ్వులు తీయని పెరుగు. ►ఎండుఫలాలు / నట్స్ : బాదం, మాకడామియా నట్స్, వాల్నట్, పొద్దుతిరుగుడు గింజలు... మొదలైనవి. ►ఆరోగ్యకరమైన నూనెలు : ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, కొబ్బరినూనె, అవకాడో నూనె. మీ ఆహారంలో పిండిపదార్థాలు తక్కువగానూ, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, నట్స్ ఎక్కువ గానూ ఉన్నంతకాలం మీరు బరువు పెరిగేందుకు అవకాశం ఉండదు. తీసుకోదగిన పానీయాలు : ఆట్కిన్స్ డైట్ తీసుకుంటున్నప్పుడు తీసుకో దగిన పానీయాలు ఇవి. ►నీళ్లు: మీరు ఎప్పుడు తాగినట్టుగానే నీళ్లు తాగవచ్చు. ►కాఫీ : కొన్ని అధ్యయనాల ప్రకారం కాఫీలో ఆరోగ్యాన్నిచ్చే కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నందువల్ల పరిమితంగా కాఫీ తీసుకోవచ్చు. ►గ్రీన్ టీ : ఇది ఎంతో ఆరోగ్యకరమైన పానీయం. మొత్తం మీద ఇలా ఆట్కిన్స్ డైట్ అన్నది బరువు తగ్గడానికి ఒక నమ్మకమైన ప్రక్రియ అనీ, అది చాలావరకు నిరాశ పరచదన్నది నిపుణుల మాట. ఆట్కిన్స్ డైట్లో తీసుకోదగ్గ కూరలతో తమకు ఇష్టమైన రీతిలోనూ తమ సౌలభ్యాన్నీ, తినుబండారాల లభ్యతను బట్టి ఆయా వ్యక్తులు తమ డైట్ తీసుకోవచ్చు. లేదా నిపుణులతో చర్చించి తమకు అనువైన వ్యక్తిగతమైన డైట్‌ను రూపొందించుకోవచ్చు. అలా చేయలేనప్పుడు ఈ కింద పేర్కొన్న సాధారణ డైట్ ప్లాన్‌ను అనుసరించవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా వారం రోజుల పాటు తీసుకోవాల్సిన డైట్ ఇలా... శాకాహారులకు డైట్ – డైట్ ప్లాన్ ఇక శాకాహారులైతే ఈ కింద పేర్కొన్న ఆహారా లను తమ డైట్ ప్లాన్‌గా చేసుకోవచ్చు. వీటిని లంచ్ / డిన్నర్ ఆప్షన్‌గా లేదా ఏ కాంబినేషన్లతో నైనా, ఎలాగైనా ఎంచుకొని మార్చుకుంటూ తీసుకోవచ్చు. అవి... ► రాజ్మా టొమాటో కర్రీ/దీనికి చాలా రకాల ఆకు కూరలు కలుపుకొని సలాడ్‌గా తీసుకో వచ్చు. ► ఉడికించిన శనగలు / చిక్ పీస్‌ను రాగి రొట్టెలు లేదా రాగి జావతో తీసుకోవచ్చు. ► ఆలివ్‌నూనెలో టొమాటోలతో పాటు కాస్తంత వేపిన మొలకెత్తిన పెసర్లు ►అన్ని రకాల గింజల మొలకలను రుబ్బుకొని దోశలా వేసుకోవచ్చు. ఈ దోశను కొబ్బరినూనె లేదా వెన్నలో వేసుకోవచ్చు. ► శనగపిండిలో పాలకూర కలుపుకొని వెన్నలో తేలిగ్గా వేపుకోవచ్చు. ► సజ్జరొట్టె / జొన్నరొట్టెలను సోయాబీన్ టొమాటో కర్రీతో పాటు తీసుకోవచ్చు. ► పనీర్ బుర్జీ ► పాలకూరతో పాటు పెసరతో చేసిన చట్నీ లేదా పెసర పప్పు ► శనగపప్పు + పాలకూర ► పనీర్ టిక్కా (ఇంట్లో చేసుకున్నది) డా. సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
శాకచక్యంగా తగ్గండి
ఫుడ్డు విషయంలో ప్రపంచంబాగా ఫాస్ట్ అయిపోయింది!అదృష్టం.. మనిమింకా స్లోగా మూవ్ అవుతున్నాం.ఫాస్ట్ అంటే యన్వీ. స్లో అంటే వెజ్. వెజ్ మన ఆరోగ్యానికే కాదు..బరువు తగ్గడానికీ పనికొస్తుంది.ఎలాగంటారా?! శాకల్ని కాస్త చాకచక్యంగా తినాలంతే. బరువు తగ్గడానికి ఉపయోగపడే ఆహారాల్లో ‘వెజిటేరియన్ డైట్’ ఒకటి. మాంసాహారంలో ప్రొటీన్లు ఉన్నా దానివల్ల కొవ్వులు పేరుకుంటాయని రెడ్‌మీట్ వంటి వాటివల్ల బరువు పెరుగుతుందని, అందుకే శాకాహారమే మంచిదని, దాని వల్ల బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యమూ సమకూరుతుందని నిపుణులు చెబుతుంటారు. ఇక ప్రస్తుతం శాకాహారం తినడం సాంస్కృతిక జీవనశైలిగా మారింది. సాటి జీవులను చంపే అధికారం, హింసించే హక్కు లేదంటూ చాలామంది పూర్తిగా శాకాహారానికి మారిపోతున్నారు. మాంసాహరం తామస గుణాన్ని పెంపొందిస్తుందనీ, అదే శాకాహారం అమృతాహారమని చాలామంది పేర్కొంటుంటారు. ‘వెజిటేరియనిజమ్’ను పాటించే మరికొందరైతే జంతువుల నుంచి వచ్చే ఉత్పాదనలైన పాలు, పెరుగులను కూడా నిరసిస్తూ ఉంటారు. ఇలాంటి వారినే ‘వేగన్స్’ అని, వారు ఆచరించే శాకాహార ప్రియత్వాన్ని వేగనిజమ్ అని వ్యవహరిస్తుంటారు. ఈ ధోరణి ఎలా ఉన్నా బరువు తగ్గించడానికి శాకాహారం బాగా ఉపయోగపడుతుందని మాత్రం నిపుణులు చెబుతున్నారు. శాకాహారులలో రకాలు శాకాహారం తినేవాళ్లలో కూడా కొన్ని గ్రూపులు ఉన్నాయి. వీళ్ల ధోరణిని బట్టి వీళ్లకు పేర్లు కూడా ఉన్నాయి. ఉదాహరణకు... లాక్టో–వెజిటేరియన్స్: వీరు మాంసం, చేపలు, చికెన్, గుడ్లు వంటి వాటిని మాత్రమే మాంసాహారంగా పరిగణిస్తుంటారు. జంతువుల నుంచి వచ్చే ఉత్పాదనలైన పాలు, వెన్న, పెరుగు వంటి వాటిని శాకాహారంగా పరిగణిస్తుంటారు. లాక్టో–ఓవో వెజిటేరియన్స్: వీరు పాలను శాకాహారంగా పరిగణిస్తారు. ఓవో–వెజిటేరియన్స్: వీరు గుడ్లను శాకాహారంగా పేర్కొంటారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న గుడ్లలో పిండం ఉండదు కాబట్టి వాటిని శాకాహారంగానే పరిగణిస్తారు. గుడ్లలోని ల్యూటిన్తోబరువు తగ్గుతుందన్నది తెలిసిందే. వేగన్స్: వీరు జంతువుల నుంచి లభించే ఎలాంటి ఉత్పాదననైనా మాంసాహారంగానే పరిగణిస్తారు. మాంసం, చేపలు, గుడ్లను మాత్రమేగాక పాలు, పెరుగు వంటి వాటిని కూడా మాంసాహారంగానే చూస్తారు. వాటిని ముట్టుకోరు. ఫ్లెక్సిటేరియన్స్: వీరు వీలైనంత వరకు జంతువులను చంపకుండా, హింసించకుండా లభ్యమయ్యే జంతు ఉత్పాదనలను మాత్రం తీసుకుంటూ, వాటికి హాని చేకూర్చడం వల్ల లభ్యమయ్యే ఆహారాన్ని పూర్తిగా పరిహరిస్తున్నారు. వీరికి శాకాహార ప్రియత్వం ఉన్నా వీలును బట్టి జంతువుల నుంచి లభ్యమయ్యే ఉత్పాదనలను తింటారు కాబట్టి తమను తాము ఫ్లెక్సిటేరియన్స్గా పేర్కొంటున్నారు. వీరిలో కొందరు చేపలను శాకాహారంగానే పరిగణిస్తారు. చేపల్లో ఉండే తక్కువ కొవ్వుతో పాటు ఒమెగా 3–ఫ్యాటీ యాసిడ్స్ బరువు పెరగకుండా తోడ్పడతాయి. శాకాహారం బరువును ఎలా తగ్గిస్తుందంటే... కాయగూరల్లో (ఉదాహరణకు సొరకాయ, బీరకాయ వంటివి) నీటిశాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరల్లో పీచు పాళ్లు ఎక్కువ. మాంసాహారంతో పోలిస్తే శాకాహారం త్వరగా కడుపు నిండిపోతుంది. నీరు ఎక్కువగా ఉండటం వల్ల, తక్కువ క్యాలరీలను కలిగి ఉండటం వల్ల చాలా ఎక్కువగా తిన్నా కొద్ది క్యాలరీలు మాత్రమే ఒంటిలోకి చేరతాయి. మాంసాహారాన్ని తినాలంటే ఎంతో కొద్దిపాళ్లలో మసాలాలు (స్పైసెస్) వాడాల్సిందే. మసాలాల కారణంగా కడుపు నిండాక కూడా ఇంకాస్త తినాలని అనిపిస్తుంటుంది. శాకాహారం అలా కాదు. తిన్న వెంటనే సంతృప్తభావన వచ్చేస్తుంది. ఇలా పీచు, నీటి పాళ్లతో పాటు, మసాలాలు తక్కువ అనే అంశాల కారణంగా శాకాహారాన్ని తక్కువే తింటాం. పైగా మాంసాహారంలోలా శాకాహారంలో కొవ్వులు ఉండనే ఉండవు. ఫలితంగా తిన్న క్యాలరీలను ఖర్చు చేయగలిగితే శాకాహారంతో అసలు స్థూలకాయం వచ్చే అవకాశమే దాదాపుగా ఉండదు. ఖనిజాలూ బరువు తగ్గిస్తాయి: మాంసాహారాలతో పోలిస్తే శాకాహారంలో ఖనిజాలు, లవణాలు ఎక్కువ. ఈ ఖనిజ లవణాలూ బరువు తగ్గించడానికి తోడ్పడతాయి. ఎలాగంటే...శాకాహారంలోని ఖనిజాలు, లవణాలు, విటమిన్లు సమతులంగా అందడం వల్ల జీవక్రియలు మెరుగుపడతాయి. చురుకైన జీవక్రియల వల్ల బరువు పెరగడానికి ఆస్కారం ఉండదు. శాకాహరంలోని ఖనిజాలన్నింటిలోనూ బరువు తగ్గించడంలో క్రోమియం భూమిక అగ్రస్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. అది రక్తంలోని చక్కెరలను సమతౌల్యం చేస్తుంది. ఇన్సులిన్‌ను తగిన పాళ్లలో విడుదలయ్యేలా చేస్తుంది. ఈ ఆరోగ్య అంశాల ద్వారా అది బరువు తగ్గించడంలో తోడ్పడుతుంది. నట్స్, గింజలు, అన్ని ఆకుకూరలు, కాయగూరల్లో క్రోమియం పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గించడంలో ఉపయోగపడే ఖనిజాల్లో క్రోమియం తర్వాతి స్థానం మెగ్నీషియమ్ది. ఇది నాడీవ్యవస్థ పనితీరును మెరుగుపరచడం, రక్తంలోని చక్కెర సమతౌల్యంగా ఉండేలా చూడటం, ఎముకలను పటిష్టపరచడం, వాటి ఆరోగ్యం బాగుండేలా చూడటంతో పాటు జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేసేలా, జీర్ణక్రియ వేగవంతమయ్యేలా చూస్తూ క్యాలరీలను త్వరగా దహనమయ్యేలా చేస్తుంది. ఈ మెగ్నీషియమ్ ముదురాకుపచ్చ ఆకుకూరలు, కాయగూరలు, నట్స్, పెరుగు, ఇతర పాల ఉత్పాదనల్లో ఎక్కువగా ఉంటుంది. జింక్ హార్మోన్ల సమతౌల్యతకు తోడ్పడటంలో భాగంగా బరువును నియంత్రిస్తుంది. జింక్ కూడా ఆకుకూరలు, కాయగూరలు, నట్స్‌తో పాటు పుట్టగొడుగులు, చిక్కుళ్లలో ఎక్కువ. ఐరన్ రక్తప్రవాహాన్ని సాఫీగా జరపడం, జీవక్రియలను మెరుగుపరచడం ద్వారా బరువును నియంత్రిస్తుంది. ఇది నట్స్, పాలకూర, డార్క్ చాకొలేట్స్, సబ్జా గింజలు (చియా సీడ్స్),, స్పిరులినాలో ఎక్కువ. లవణాల విషయానికి వస్తే పొటాషియమ్ అనేక జీవక్రియలను వేగవంతం చేయడం ద్వారా బరువును నియంత్రిస్తుంది. ఇది ఆకుకూరలు, కాయగూరలతో పాటు పెరుగు, సబ్జాగింజలు, పొట్టుధాన్యాలు, కొబ్బరినీళ్లు, బాదాం వంటి నట్స్‌లో ఎక్కువ. క్యాల్షియమ్ కూడా జీవక్రియలను మెరుగుపరుస్తూ బరువును నియంత్రిస్తుంది. ఇది పాలు, పాల ఉత్పాదనలతో పాటు బాదాం, సబ్జాగింజలలో ఉంటుంది. ఇవే గాక సల్ఫర్, సెలీనియమ్, చాలా కొద్ది పరిమితిలో సోడియమ్ కూడా అవసరమవుతాయి. బరువు తగ్గడానికి థెర్మోజెనిక్ శాకాహారాలు: ఒంట్లో వేడిని మరింత పెంచే శాకాహారాలను థెర్మోజెనిక్ శాకాహారాలు అనవచ్చు. థెర్మోజెనిక్ శాకాహారాలతో బరువు తగ్గడం మరింత సులువు. ఇవి తీసుకోవడం వల్ల మన ఆహారాల్లోని క్యాలరీలు మరింత వేగంగా దహనం అవుతాయి. ఆ వివరాలు:మిరియాలు (రెడ్ హాట్ పెప్పర్స్ / బ్లాక్ పెప్పర్) ఒంట్లో వేడిని పెంచి (థెర్మోజెనెసిస్ ద్వారా) క్యాలరీలను త్వరగా దహనం చేస్తాయి. గ్రీన్ టీలోని క్యాటెచిన్, పాలీఫీనాల్స్లో థెర్మోజెనిక్ గుణాలు ఉన్నాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి గ్రీన్–టీ ఒక వరప్రదాయిని. పసుపులోని కార్క్యుమిన్ స్థూలకాయం నివారించడమే కాదు... స్థూలకాయ సంబంధిత అనేక వ్యాధులను నివారిస్తుంది. కాలీఫ్లవర్, బ్రాకోలీ, క్యారెట్లు, దోస వంటి వెజిటబుల్స్ కూడా తమ థెర్మిక్ గుణంతో బరువును నియంత్రిస్తాయి. శాకాహారంతో ఇతర ప్రయోజనాలివే... ఇటీవలి పరిశోధనలు మాంసాహారం కంటే శాకాహారం ఎన్నో రకాల ప్రయోజనకారి అని తెలుపుతున్నాయి. ఉదాహరణకు... శాకాహారంలో ఎలాంటి కొవ్వులూ ఉండవు. ముదురు ఆకుపచ్చ ఆకుకూరలలో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. పొట్టు తీయని ధాన్యాల్లోనూ అంతే. ఇవి బరువు తగ్గడానికి గణనీయంగా తోడ్పడతాయి. మాంసాహారం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి గుండెజబ్బులు, పక్షవాతం, కంటి జబ్బులు, హైబీపీకి దారితీస్తున్నాయి. మాంసాహారం తిన్నప్పుడు చాలాసేపు మనిషి మందకొడిగా మారతాడు. శాకాహారంలో కొవ్వులు లేకపోవడం అన్న ప్రయోజనం బరువు పెరగకుండా ఉండటానికి, బరువును నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. శాకాహారం మనలో పేరుకున్న చాలా విష పదార్థాలను స్వాభావికంగా తొలగిస్తుంది. అందుకే దీన్ని స్వాభావికమైన డిటాక్స్ (విష–హరిణి)గా చెప్పవచ్చు. వెజిటేరియన్ డైట్లో పీచు ఎక్కువగా ఉంటుంది, విటమిన్లు, ఖనిజలవణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభ్యమవుతాయి. ఈ డీటాక్సిఫైయింగ్ కూడా బరువు తగ్గడానికి చాలావరకు తోడ్పడుతుంది. రంగుల మిలమిలలు: మాంసాహారం సాధారణంగా ఒకేరంగుతో కంటికి అంత ఇంపుగా ఉండకపోవచ్చు. శాకాహారంలోని రకరకాల పదార్థాలు అనేక రకాల రంగులీనుతూ ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ స్వాభావికమైన అనేక రంగుల ఆహారపదార్థాలతో ఆరోగ్యం బాగుంటుంది. చాలా రకాల పోషకాలు సమకూరడం కూడా మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుంది. తేలిగ్గా జీర్ణం: శాకాహారంలో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మొలలు, స్థూలకాయం, డయాబెటిస్, మలబద్ధకం, హయటస్ హెర్నియా, డైవర్టిక్యులైటిస్, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, పిప్పి పళ్లు (డెంటల్ కేరిస్), పిత్తాశయంలో రాళ్లు వంటి అనేక వ్యాధుల నివారణ స్వాభావికంగానే జరుగుతుంది. ఆకుకూరలతో మేలు అంతా ఇంతా కాదు: ఆకుకూరలతో ఆరోగ్యానికి ఒనగూరే మేలు అంతా ఇంతా కాదు. ఇందులోని పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల బరువు నియంత్రణలో ఉండటం, బీపీ నియంత్రణలో ఉండటం, గుండెజబ్బులకు ఆస్కారం లేకపోవడం వంటివి జరుగుతాయి. ఆకుకూరలు, పండ్లలో కాపర్, మెగ్నీషియమ్ వంటి ఖనిజాలు, లవణాలు ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేసే ఫ్లేవనాయిడ్స్ లభిస్తాయి. కొవ్వుల్లోనూ ఒమెగా 3, మ్యూఫా, ప్యూఫా వంటి ఆరోగ్యవంతమైన కొవ్వులు లభ్యమవుతాయి. మాంసాహారం తినేవారితో పోలిస్తే శాకాహారం తినేవాళ్లలో టైప్–2 డయాబెటిస్ (మధుమేహం) వచ్చేందుకు అవకాశాలు తక్కువ. అదే మాంసాహారం ఎక్కువ తినేవారిలో స్థూలకాయం వస్తుంది. ఈ స్థూలకాయం మళ్లీ మధుమేహం, రక్తపోటు వంటి అనేక వ్యాధులకు ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఇక శాకాహార ఆకుకూరలు తినేవాళ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల చర్మానికి ఎప్పటికప్పుడు మంచి పోషణ, విటమిన్స్ లభిస్తాయి కాబట్టి వాళ్లలో మేని మెరుపు చాలా బాగుంటుంది. శాకాహారం పరిమితులు: బరువు తగ్గించుకోడానికి శాకాహారాన్ని ఒక మార్గంగా అనుసరించే వారు కొన్ని పరిమితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. శాకాహారం ఆరోగ్యానికి మంచిదే అయినా కేవలం అది మాత్రమే పూర్తి పోషకాలను అందించలేదు. ఉదాహరణకు ప్రొటీన్ల లభ్యత. ప్రొటీన్లు కావాలంటే: ప్రొటీన్లు శాకాహారం కంటే మాంసాహారంలోనే ఎక్కువ. అయితే శాకాహారంతోనే ప్రొటీన్లు లభ్యం కావాలంటే పప్పులు, చిక్కుళ్లు, సోయా ఉత్పాదనలైన... సోయా బీన్స్, సోయా చీజ్, సోయా మిల్క్, టోఫూ వంటి ఆహార పదార్థాలపై ఆధారపడాలి. క్యాల్షియం కోసం: యుక్తవయసు వచ్చిన నాటి నుంచి అంటే... 19 ఏళ్ల యువకుడు మొదలుకొని 50 ఏళ్ల వ్యక్తి వరకు ప్రతి ఒక్కరికీ 1000 ఎం.జీ. క్యాల్షియం అవసరం. ఇది డెయిరీ ఉత్పాదనల్లో పుష్కలంగా లభ్యమవుతుంది. అయితే వేగనిజమ్ అవలంబించే వారికి అదే మొత్తంలో క్యాల్షియం లభ్యం కావాలంటే వాళ్లు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలు అంటే పాలకూర, బ్రకోలీ, పొద్దుతిరుగుడు గింజలు, సోయా మిల్స్ ఉత్పాదనల వంటి వాటిపై ఆధారపడాలి. వాటిని రోజూ తీసుకోవాలి. వెజిటేరియనిజమ్ పేరిట పాలను పరిహరించి, ప్రత్యామ్నాయాలను తగినంతగా తీసుకోలేకపోతే ఎముకలకు నష్టం వాటిల్లుతుంది. విటమిన్ డి: మన శరీరంలోకి క్యాల్షియం చక్కగా ఇంకిపోవాలంటే విటమిన్–డి అవసరం. ఇది పాల ఉత్పాదనలో, సూర్యకాంతిలో లభ్యమవుతుంది. సాధారణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరికీ ప్రతిరోజూ 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ (ఐయూ) విటమిన్–డి అవసరం. జంతువుల నుంచి కాకుండా వెజిటేరియన్ ఉత్పాదనల ద్వారానే అది లభ్యం కావాలంటే సోయా మిల్క్ ఉత్పాదనలపై ఆధారపడాలి. ఐరన్: మనలో రక్తహీనత రాకుండా ఉండటానికి ఐరన్ చాలా అవసరం. ఇది మాంసాహారంలో తక్షణం లభిస్తుంది. అయితే శాకాహారం ద్వారానే ఇది లభ్యం కావాలంటే ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలు (పాలకూర, బ్రకోలీ), డ్రైఫ్రూట్స్, గుమ్మడి గింజలు, నువ్వులు, సోయాబీన్ నట్స్ వంటివి పుష్కలంగా తీసుకోవాలి. విటమిన్–సి ఎక్కువగా ఉండే నిమ్మజాతి పండ్లు టమాటాలు తినడం వల్ల కూడా ఐరన్ తేలిగ్గా శరీరంలోకి ఇంకుతుంది. విటమిన్ బి12: ఇది మాంసాహారంలోనే పుష్కలంగా లభిస్తుంది. ఆ తర్వాత పాలలో అధికంగా ఉంటుంది. శాకాహారం నుంచే దీన్ని తీసుకోవాలంటే సోయామిల్ వంటి వాటిపై ఆధారపడాలి. దీని లోపం వల్ల మెదడు నరాల నుంచి అవయవాలకు ఆదేశాలు అందడంలో ఆటంకాలు, స్పృహతప్పడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఎండలో తగినంతగా తిరగకుండా ఇన్‌డోర్స్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, కేవలం శాకాహారాన్ని మాత్రమే తీసుకునే వారిలో విటమిన్–డి, విటమిన్–బి12 లోపంతో వచ్చే నరాల సమస్యలు ఇటీవల చాలా పెరిగాయి. అందుకే కేవలం వెజిటేరియన్ ఆహారంపైనే ఆధారపడే వారు విటమిన్–డి, విటమిన్–బి12, ఐరన్ వంటి కీలకమైన పోషకాల కోసం ప్రత్యామ్నాయాలపై మరింత ఎక్కువ దృష్టిపెట్టాలి. పైన పేర్కొన్న ప్రత్యామ్నాయాలు ఆచరిస్తూ, శాకాహారం వైపు మళ్లితే అది బరువు తగ్గడానికి బాగా తోడ్పడటంతో పాటు... ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. శుభ్రం చేయడం చాలా ముఖ్యం ఆకుకూరలు /కాయగూరలపై రకరకాల పురుగుమందులు, మట్టి, బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉన్నందున వాటిని శుభ్రంగా కడగాలి. అన్ని కూరగాయలు / ఆకుకూరలను ధారగా పడే నీళ్లలో కడగాలి. పలుచటి చర్మం ఉన్న కూరగాయలను కాస్తంత వైట్ వెనిగర్ కలిపిన నీళ్లలో కడుక్కోవడం మంచిది. ఆకుకూరలను ముందుగా కోసి ఆ తర్వాత కడగటం కంటే బాగా శుభ్రంగా కడిగాక మాత్రమే కోయాలి. నేలనుంచి తీసే వెజిటబుల్స్‌ను మట్టి అంతా శుభ్రమయ్యేలా బాగా కడగాలి. సుజాతా స్టీఫెన్, చీఫ్ న్యూట్రిషనిస్ట్ యశోద హాస్పిటల్స్, మలక్‌పేట, హైదరాబాద్ -
కొవ్వు పదార్థాలు తినొచ్చా?
గర్భిణులు కొవ్వు పదార్థాలు తినడం వల్ల పుట్టబోయే బిడ్డల్లో మానసిక సమస్యలు తలెత్తుతాయని చదివాను. ఇది ఎంత వరకు నిజం? ఏయే పదార్థాల్లో కొవ్వు ఎక్కువగా ఉంటుందనే విషయం మీద నాకు పెద్దగా అవగాహనలేదు. కాస్త వివరంగా తెలియజేయగలరు. – జి.మయూరి, నెల్లిమర్ల గర్భిణీగా ఉన్న సమయంలో సాధారణంగా తీసుకునే ఆహారం కంటే 300 క్యాలరీల ఆహారం ఎక్కువగా తీసుకోవడం మంచిది. అధిక క్యాలరీలు తల్లిలో మార్పులకు, బిడ్డ పెరుగుదలకు ఉపయోగపడతాయి. తల్లి ఆహారంలో 50 శాతం కార్బోహైడ్రేట్లు, 25 శాతం ప్రొటీన్లు, 25 శాతం కొవ్వు ఉంటే, బిడ్డ పెరుగుదల ఆరోగ్యంగా ఉంటుంది. తల్లి తీసుకునే ఆహారంలో కొవ్వు బిడ్డలోని నాడీ వ్యవస్థ, కళ్లు ఏర్పడటానికి, హార్మోన్ల ఉత్పత్తికి ఉపయోగపడతాయి. తల్లి మరీ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల బిడ్డలోని కాలేయం(లివర్) కణాలు పాడయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశోధకుల అంచనా. దానివల్ల బిడ్డలో రోగనిరోధకశక్తి తగ్గడం, ఆస్తమా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే బిడ్డ అధిక బరువు, తర్వాతి కాలంలో షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లి ఎక్కువగా కొవ్వు పదార్థాలు తీసుకోవడం వల్ల, కొంతమంది పిల్లల్లో మెదడు ఎదుగుదలపై ప్రభావం పడి, వారిలో ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉండవచ్చు అని పరిశోధకుల విశ్లేషణ. జంక్ఫుడ్స్, వేపుడ్లు, గుడ్లు, మాంసం, చీజ్, బటర్, డ్రై ఫ్రూట్స్, నూనె వస్తువులు, కొన్ని రకాల చేపలు, వంటి ఆహారంలో కొవ్వు అధికంగా ఉంటుంది. వీటిలో పాలు, పెరుగు, గుడ్లు, కొద్దిగా మాంసం, డ్రై ఫ్రూట్స్ వంటివి మితంగా తీసుకోవడం మంచిది. అంతేకాని అసలు తీసుకోకుండా ఉండకూడదు. ఎందుకంటే బిడ్డ ఎదుగుదలకు 25 శాతం ఆహారంలో కొవ్వు ఉండాలి. మా కజిన్ చాలా చురుకైన అమ్మాయి. ప్రస్తుతం తను ప్రెగ్నెంట్. కారణం తెలియదుగానీ తన స్వభావానికి విరుద్దంగా మూడీగా ఉంటోంది. ఒంటరితనాన్ని ఇష్టపడుతోంది. దీన్ని ప్రెనెటెల్ డిప్రెషన్ అంటారని, సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయం కాదని కొందరంటున్నారు. మరికొందరేమో దీని వల్ల పుట్టబోయే బిడ్డకు తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయని అంటున్నారు. నాకు ఆందోళనగా ఉంది. సలహా ఇవ్వగలరు. – పి.సంతోషి, మచిలీపట్నం కొంతమంది గర్భం దాల్చిన తర్వాత శారీరకంగా, మానసికంగా వచ్చే మార్పులతో, హార్మోన్లలో మార్పులతో డిప్రెషన్లోకి వెళ్లడం జరుగుతుంది. దీన్నే ప్రెనెటెల్ డిప్రెషన్ అంటారు. మొదటి మూడునెలలు వికారం, వాంతులు, నీరసం, నిద్ర పట్టకపోవడం వంటి లక్షణాలతో ఆందోళన చెందడం జరుగుతుంది. అలాగే, శారీరక మార్పులు, బరువు పెరగడం, ఆయాసం, ఓపిక లేకపోవడం, నడుం నొప్పులు, వంటి ఇబ్బందులు, కొందరిలో ఆర్థిక పరిస్థితులు, కొందరిలో భర్తకి తనమీద శ్రద్ధ తగ్గుతుందేమోనని ఆందోళన వంటి అనేక కారణాల వల్ల కొంతమంది గర్భిణీలు ప్రెనెటెల్ డిప్రెషన్లోకి వెళ్లడం జరుగుతుంది. కొందరిలో వాళ్లు వీళ్లు చెప్పిన మాటలు వినడం, వేరే వాళ్లకు వారి గర్భంలో వచ్చిన సమస్యలు వినడం, ఇంటర్నెట్ ఎక్కువగా వాడటం, అందులో ఉన్న కాంప్లికేషన్స్ తమకూ వస్తాయేమోని ఆందోళన, బిడ్డకి ఏమైనా సమస్యలు వస్తాయేమోనని భయం, బిడ్డని ఎలా చూసుకోవాలి, వంటి ఆలోచనలు, భయాలతో కూడా కొందరు డిప్రెషన్లోకి వెళ్లడం జరుగుతుంది. దీనివల్ల వీరు ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, డల్‌గా ఉండటం, ఒంటరిగా ఉండటం, ఎవరితోనూ సరిగ్గా మాట్లాడకపోవడం, ఏడుపు రావడం, వంటి అనేక లక్షణాలు ఏర్పడుతుంటాయి. దీనివల్ల బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలలో కూడా సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి చికిత్సలో భాగంగా కౌన్సిలింగ్, కుటుంబ సభ్యుల సహకారం, భర్త ప్రేమగా తనతో మాట్లాడటం, సమయం కేటాయించడం, బయటకు తీసుకువెళ్లడం వంటివి చెయ్యడం వల్ల వీరు చాలావరకు డిప్రెషన్ నుంచి బయటపడతారు. అలాగే యోగా, మెడిటేషన్, నడక వంటివి చెయ్యడం వల్ల చాలావరకు డిప్రెషన్ నుంచి బయటపడవచ్చు. ఇన్ని విధాల ప్రయత్నించినా, ఉపశమనం లేనప్పుడు యాంటి డిప్రెసంట్స్ మందులు డాక్టర్ పర్యవేక్షణలో అతి తక్కువ డోస్‌లో కొద్దిగా రిస్క్ తీసుకుని వాడవచ్చు. నా వయసు 33. ముప్ఫై దాటాక పెళ్లి చేసుకున్నాను. తర్వాత ఏడు నెలలకే గర్భం దాల్చాను. స్కానింగ్‌లో ఫెయింట్ ఫీటల్ అని రావడంతో అబార్షన్ చేశారు. మళ్లీ ఆరు నెలలకు గర్భం దాల్చాను. అప్పుడూ అంతే. రెండో అబార్షన్ తర్వాతి నుంచి కడుపులో నొప్పి వస్తోంది. మరో డాక్టర్ని కలిస్తే అబార్షన్ చేసినప్పుడు గర్భసంచికి గీత పడింది అంటున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? అసలు నాకు ఆరోగ్యకరమైన గర్భం ఎందుకు రావడం లేదు? నాకు బిడ్డ కావాలి. సలహా ఇవ్వండి.– రత్నం, అడ్డతీగల గర్భం గర్భసంచిలో మొదలయ్యి అందులో పిండం ఏర్పడుతుంది. ఆరు వారాలకు దాని గుండె కొట్టుకో వడం మొదలవుతుంది. కొందరికి హార్మోన్ల అసమ తుల్యత లేదా జన్యుపరమైన కారణాల వల్ల పిండం సరిగ్గా ఏర్పడదు. గర్భంలో పిండం పెరగదు. దీనినే ఆ జీజజ్టి ౖఠ్చిఝ అంటారు. కొందరిలో పిండం ఏర్పడు తుంది కానీ గుండె కొట్టుకోదు. లేదా కొన్నిరోజుల తర్వాత గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. కొన్నిసార్లు అండం నాణ్యత సరిగ్గా లేకపోయినా, తల్లిదండ్రుల్లో జన్యు సమస్యలు ఉన్నా కూడా పిండం పెరగకపోవచ్చు. థైరాయిడ్‌తో పాటు ఇతరత్రా హార్మోన్ల సమస్య, అధిక బరువు, పీసీఓ, మధుమేహం, రక్తంలో యాంటీ ఫాస్పాలిపిడ్ యాంటిబాడీస్ వంటివి ఉన్నా కూడా మొదటి మూడు నెలల్లో పిండం సరిగ్గా ఏర్పడక అబార్షన్లు అవుతుంటాయి. అబార్షన్ చేసేటప్పుడు కొన్నిసార్లు గర్భసంచికి చిల్లుపడే అవకాశం ఉంటుంది. మీరు గీత పడింది అన్నదానికర్థం ఇదే అనుకుంటు న్నాను. అలాంటివి మెల్లగా మానిపోతాయి. కాకపోతే మళ్లీ వెంటనే గర్భం దాల్చకుండా కొన్ని నెలలు ఆగితే మంచిది. కొంతమందికి 30, 35 యేళ్లు దాటిన తర్వాత అండాల నాణ్యత తగ్గడం వల్ల కూడా పిండం సరిగ్గా ఏర్పడక అబార్షన్లు జరుగుతుంటాయి. బరువు ఎక్కు వుంటే తగ్గడానికి ట్రై చేయండి. రెండుసార్లు అబార్షన్ తప్పలేదు కాబట్టి మీలో ఇంకేమైనా సమస్యలున్నా యేమో తెలుసుకోవడం మంచిది. కాబట్టి ఇఆ్క, ఉ ఖ, ౖఎఖీఖీ, ఊ ఏ, ఖీ ఏ, అ్కఅ, ట. అ్కఖీఖీ పరీక్షలతో పాటు షుగర్, ప్రొలాక్టిన్ వంటి హార్మోన్ టెస్టులు కూడా చేయించుకోండి. ఏదైనా తేడా ఉంటే ముందు నుంచే చికిత్స తీసుకుంటూ గర్భం కోసం ప్రయత్నించండి. అవసరమైతే భార్యాభర్తలిద్దరూ ఓ్చటy్టౌypజీnజ అనే జన్యుపరీక్ష చేయించుకుని, ఏవైనా జన్యు సమస్యలుంటే కౌన్సెలింగ్‌కి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే గర్భం దాల్చ డానికి మూడు నెలల ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ మాత్రలు రోజుకొకటి చొప్పున తీసుకోండి. - డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ హైదరాబాద్ -
శిశువులు – ఆరోగ్యకర ఆహారం
‘ఆషోడశాత్ భవతే బాలః కుమారః’ అంటుంది ఆయుర్వేదం. 16 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలు వివిధ దశల్లో పరిణతి చెందుతారనేది దీనర్థం. వారి ఆరోగ్య పరిరక్షణకు ఇది చాలా విశిష్టమైన సమయం. తల్లిదండ్రులు సూచించే ఆహారవిహారాల పైనే పెరిగే వయసులో ఉన్న పిల్లల శారీరక, మానసిక, సామాజిక ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. శారీరక వ్యాయామం, వినయవిధేయతలు, సామాజిక సాంస్కృతిక స్పృహ... వీటి మీద కూడా పిల్లల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ‘లోకో భిన్న రుచిః’ అన్న ఆర్యోక్తి వాస్తవమే అయినా, పెరిగే వయసులో ఉన్న పిల్లలకు తల్లిదండ్రులు నేర్పే ఆహారపుటలవాట్లు వారిపై జీవితాంతం ప్రభావం చూపుతాయన్నది శాస్త్ర సమ్మతం. మనం చేసే అలవాటుని బట్టే మన నాలుక రుచుల్ని కోరుతుందన్నది మరచిపోకూడదు. శరీర పోషణకు ఎలాంటి ఆహారం అవసరమన్నది తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. ఇది కల్తీ పదార్థాల వ్యాపారంతో నిండిన కాలమని అర్థం చేసుకుని, పిల్లలకు ఇచ్చే ఆహారపదార్థాలను నిర్ణయించుకోవాలి. వీటిని తీసుకోకూడదు... ఉప్పుని అతి తక్కువ ప్రమాణంలోనే అంటే రోజు మొత్తం మీద మూడు గ్రాములు దాటి సేవించకూడదు. నూనెను మరిగించి (డీప్ ఫ్రై) చేసే వంటకాలు (పూరీలు, గారెలు, సమోసా, చిప్స్ వంటివి) నెలకు రెండు సార్లకు మించి ఎక్కువగా తినకూడదు. పంచదార నిషేధం. (దానికి బదులు బెల్లం, తేనె, ఖర్జూరం వాడుకోవచ్చు). రిఫైన్డ్ ఆయిల్స్ బదులు నువ్వులనూనె వాడటం మంచిది. బజారులో అమ్మే తినుబండారాలను విడిచిపెట్టడం ఉత్తమం. ఐస్‌క్రీములు, చాకొలేట్లు, లాలీపాప్, స్వీట్స్, భుజియా, సేవ్, నూడుల్స్, పిజ్జా, బర్గర్, శీతల పానీయాలు, బిస్కెట్లు, బ్రెడ్ మొదలైనవి. మైదాపిండి వాడకం మానేస్తే మంచిది. ఎందుకు తినకూడదు... పైన చెప్పిన పదార్థాలలో పోషక విలువలకి సంబంధించి ‘విటమిన్లు, ఖనిజలవణాలు, ప్రొటీన్లు ఉండవు. పైగా కొవ్వులు, శర్కర కలిగిన పిండి పదార్థాలు అధిక స్థాయిలో ఉండి, అక్కర్లేని అధిక క్యాలరీలను మాత్రం అందిస్తాయి. వీటి తయారీలో వాడే కృత్రిమ రంగులు, తీపికోసం + నిల్వ కోసం వాడే కెమికల్స్, అధిక ఉప్పు, చౌకబారు కారం, నూనెలు మొదలైనవన్నీ రోగాలు కలిగిస్తాయి. బయట అమ్మే చెరుకురసం, పానీపూరీ వంటి వాటిలో కల్తీతో పాటుగా ఇన్ఫెక్షన్ సమస్య ప్రధానమైనది. వాంతులు, విరేచనాలు, వివిధ జ్వరాలు, పచ్చకామెర్ల వంటివి చాలా తొందరగా వచ్చే అవకాశాలు ఎక్కువ. వీటిని తినొచ్చు... ∙ఇంట్లో వండుకుని తయారుచేసుకున్నవి మాత్రమే పిల్లల ఆరోగ్యానికి మంచిది. ∙ఇడ్లీ, దోసెలు, పెసరట్లు లేదా రకరకాల ఇతర అట్లు చక్కగా తినొచ్చు. ∙రాగులు కంద కూడా వాడుకోవచ్చు ∙సాధారణంగా వరి అన్నంతో పులిహోర తయారుచేస్తాం. కొర్రల వంటి ఇతర బియ్యాలను కూడా వాడుకుంటే మంచిది. ∙అటుకులు, నిమ్మరసం, కొత్తిమీర ఉపయోగించి వంటకాలు చేసుకుంటే అధిక పోషక విలువలు లభిస్తాయి. ∙బొంబాయిరవ్వతో చేసే ఉప్మా కంటే బియ్యపురవ్వతో చేసుకునే ఉప్పుడు పిండి మంచిది. ఇందులో ఇంగువ కూడా వాడితే రుచితోపాటు ఆరోగ్యానికి కూడా మంచిది. ∙కిచిడీ, పులగం, బిరియానీలలో పోషకాలు లభిస్తాయి. ∙మినపరొట్టె, పప్పు బియ్యపు రొట్టె వంటివి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మొదలైన తాజా చట్నీలతో తింటే బలకరం. ∙సేమ్యా ఉప్మా అప్పుడప్పుడు తింటే పరవాలేదు.∙కాయగూరలతో చేసిన సూప్స్‌లో కొంచెం మిరియాల పొడి, నిమ్మరసం కలుపుకోవాలి. అలాగే క్యారట్, టొమాటో, పచ్చి జ్యూస్, గ్రీన్ సలాడ్స్ తినడం మంచిది. ∙బెల్లానికి బదులు పచ్చి ఖర్జూరాల్ని వాడుకుని, వేరుసెనగ పలుకుల ఉండలు, చక్కీలు, మరమరాల ఉండలు, అటుకుల ఉండలు, నువ్వుల ఉండలు, డ్రైఫ్రూట్స్ ఉండలు పిల్లలకు ఇస్తే పోషక విలువలు సమృద్ధిగా ఉండటమే కాకుండా, అధిక క్యాలరీలు, కల్తీల సమస్య ఉండదు. ∙బెల్లంతో చేసే మినపసున్ని, కొబ్బరి ఉండలు కూడా మంచిది. ∙సేమ్యాపాయసం, బియ్యం పాయసం, జున్ను మొదలైనవాటిని తేనెతో చేస్తే పోషకాలు బావుంటాయి. గుమ్మడి, టొమాటో, ఆకుకూరలతో చేసిన వడియాలు, పిండి వడియాలు, పేల వడియాలు అప్పుడప్పుడు తినడం ప్రయోజనకరం. ∙అరటిపండ్లు, సీతాఫలం, సపోటా, మామిడి, పనసతొనలు లభించడాన్ని బట్టి తినడం మంచిది. ∙దానిమ్మ, జామ, బొప్పాయి పండ్ల వలన చాలా పోషకాలు లభిస్తాయి. ∙బత్తాయి, కమలా, పుచ్చకాయలు ‘రస’ ప్రధానమైనవి. ఇవి కూడా మంచిది. ∙ద్రాక్ష, ఆపిల్ వంటివి అత్యధిక క్రిమిసంహారక మందుల ప్రభావానికి గురవుతాయి కనుక వాటి జోలికి పోవకపోవడమే మంచిది. ∙డ్రైఫ్రూట్స్‌ని తగు ప్రమాణంలో ప్రతిరోజూ పిల్లలకు ఇవ్వాలి. ∙ చెరకుని నమిలి తినడం, కొబ్బరినీళ్లు, అల్లం, కరివేపాకులతో చేసిన పలుచని మజ్జిగ మొదలైనవి మంచిది. ∙పళ్ల రసాల కంటే పండుని మొత్తంగా తినడం మంచిది. గమనిక: కార్బైడ్, పెస్టిసైడ్స్ వంటి విషాలు చాలా ప్రమాదకరం. ప్రస్తుతం ఇది ఒకసామాజిక సమస్యగా మారింది. పండ్ల వలన కలిగే లాభాల కన్నా, ఈ విషాల వల్ల కలిగే హాని అధికంగా ఉంది. వీటి గురించి వైద్యులు వివరించగలరే కాని ‘నివారణ/నిర్మూలన’ వారి చేతుల్లో లేదని గమనించాలి. డ్రైఫ్రూట్స్: తగు ప్రమాణంలో మితంగా తినడం మంచిది. ప్రతిరోజూ కొంచెం కొంచెం పిల్లలకివ్వాలి. పానీయాలు: చెరకుని నమిలి తినడం, కొబ్బరినీళ్లు, అల్లం, కరివేపాకులతో చేసిన పలుచని మజ్జిగ మొదలైనవి మంచిది. పళ్ల రసాల కంటే పండుని మొత్తంగా తినడం మంచిది. – డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి, ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు