Raithu bandhu scheme
-
రైతు భరోసాపై కీలక ప్రకటన
-
1.31 కోట్ల ఎకరాల నుంచి 2.38 కోట్ల ఎకరాలకు
తెలంగాణలో రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో 2014–15లో 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్న పంటల సాగువిస్తీర్ణం 2022–23 నాటికి 2.38 కోట్ల ఎకరాలకు పెరిగింది. అంటే పదేళ్ల కాలంలో కోటి ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగింది. సాగు విస్తీర్ణం పెరగడంతో పంట ఉత్పత్తి కూడా అదే స్థాయిలో 1.50 కోట్ల టన్నుల నుంచి 3.62 కోట్ల టన్నులకు పెరిగింది. అంటే పంట ఉత్పత్తి 2014తో పోలి్చతే ఏకంగా 137 శాతం పెరగడం గమనార్హం.వరిసాగులో దేశంలో అగ్రగామిగా నిలిచింది. 2014–15లో 35 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు కాగా, 2022–23లో ఇది ఏకంగా 121 లక్షల ఎకరాలకు పెరిగింది. అంటే తొమ్మిదేళ్ల కాలంలో 86 లక్షల ఎకరాల్లో వరి సాగు పెంపు కారణంగా, ధాన్యం ఉత్పత్తి కూడా భారీగా పెరిగింది. 2014–15లో 68 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా, 2022–23 నాటికి ఇది 2.60 కోట్ల టన్నులకు పెరిగింది. – సాక్షి, హైదరాబాద్రూ.75 వేల కోట్లు రైతుబంధు కింద జమ ⇒ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద ప్రతి ఎకరాకు ఏడాదికి రూ.10 వేల చొప్పున రైతులకు అందించారు. ఈ పెట్టుబడి సాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలోనే జమ చేశారు. ప్రతి సీజన్లో సుమారు 65 లక్షల మందికి రూ.7,500 కోట్ల వరకు అందించేవారు. ఈ విధంగా ఇప్పటివరకు మొత్తం రూ. 75 వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చింది. ⇒ కేసీఆర్ రైతుబీమా పథకాన్ని తీసుకొచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వివిధ కారణాలతో మరణించిన సుమారు 1.15 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ. 5,566 కోట్ల పరిహారాన్ని అందించింది. లక్ష రుణమాఫీఅప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతులకు రుణ విముక్తి చేయడమే లక్ష్యంగా గత ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించింది. ఇందులో భాగంగానే తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. లక్ష వరకు రుణమాఫీ చేసిన కేసీఆర్ సర్కారు.. 2018లో మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రూ.లక్ష మాఫీకి హామీ ఇచ్చింది. ఇందులో 2014లో తొలిసారి 35.31 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ. 16,144 కోట్ల రుణాలను మాఫీ చేసింది.ఇక రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 23 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.13 వేల కోట్ల రుణాలను మాఫీ చేయగా, మరో రూ. 6 వేల కోట్ల రుణాల మాఫీ పెండింగ్‌లో ఉంది. ఎన్నికల కోడ్ రావడంతో అడ్డంకి ఏర్పడింది. ఇప్పుడు రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం దాదాపు రూ. 35 వేల కోట్లు అవసరమవుతాయని అంటున్నారు. -
Somesh Kumar: క్విడ్ ప్రోకోతో భూముల కొనుగోలు!
హైదరాబాద్: మాజీ సీఎస్, ధరణి రూపకర్తగా పేరున్న సోమేష్ కుమార్ ఆస్తుల చిట్టాలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. పాతిక ఎకరాల భూమిని తక్కువ ధరలకు చెల్లించి ఆయన కొనుగోలు చేయడం.. అదీ ఫార్మా సిటీ ప్రాంతంలోనే కావడంతో కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో క్విడ్ ప్రోకో అంశంపై తెరపైకి వచ్చింది. ఫార్మాసిటీ వస్తుందని ముందే తెలుసుకుని.. ప్లాన్ప్రకారమే యాచారంలో భూములు కొన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. 2018లో ఫార్మాసిటీ ప్రాంతం అయిన కొత్తపల్లిలో 25 ఎకరాల్ని నలుగురి దగ్గరి నుంచి ఆయన కొన్నారు. అందుకుగానూ ఎకరానికి రూ.2 లక్షలు చెల్లించారు. అయితే అది సోమేష్ భార్య పేరిట ఉన్నట్లు ధరణి రికార్డుల్లోనూ ఇది నమోదు అయ్యింది. లక్షల్లో రైతుబంధు సొమ్ము తక్కువ ధరకు కొనుగోలు చేసిన ఈ భూముల ద్వారా సోమేశ్ కుమార్ లక్షల్లో రైతుబంధు తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తపల్లి విలేజ్‌లో కొనుగోలు చేసిన భూమిపై ఇప్పటివరకు 14 లక్షల 5 వేల 550 రూపాయల రైతుబంధు తీసుకున్నట్లు సమాచారం. భూమి సాగు చేయకపోయినా రైతుబంధు తీసుకున్నట్లు తెలుస్తోంది. 25 ఎకరాల 19 గుంటలు భూమి మొత్తం రాళ్లు, గుట్టలు మాత్రమే ఉన్నాయి. కానీ, సోమేశ్ కుటుంబం.. సాగు చెయ్యకుండానే రైతుబంధు పొందినట్లు తెలుస్తోంది. అదేకాకుండా ఆయన బంధువులు మొత్తం 150 ఎకరాలకు సంబంధించి భూమిపై రైతుబంధు డబ్బులు తీసుకున్నట్లు సమాచారం. ఇక.. ఏడాదికి రెండు దఫాల్లో 2 లక్షల 52,750 రూపాయల రైతుబంధు డబ్బును సోమేశ్ కుమార్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు భూముల కొనుగోలులో క్విడ్ ప్రోకో జరిగినట్లు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే రెరా సెక్రటరీగా పని చేసిన శివబాలకృష్ణ అక్రమాస్తుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో సోమేష్‌కుమార్ కూడా రెరాలో పని చేయడంతో ఏమైనా లింకులు ఉన్నాయా? అనే కోణంలోనూ దర్యాప్తు నడుస్తోంది. -
నత్తనడకన ‘రైతుబంధు’.. రైతులకు తప్పని అప్పుల తిప్పలు!
నల్లగొండ అగ్రికల్చర్: రైతుబంధు పథకం డబ్బుల జమ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ప్రక్రియను ప్రారంభించి ఐదు రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు జిల్లాలోని 86 వేల మంది రైతుల ఖాతాల్లో రూ.20 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అరెకరం, ఎకరం లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో మాత్రమే రైతుబంధు డబ్బులను జమ చేసినట్లు గణాంకాలు చెపుతున్నాయి. యాసంగి సీజన్ ఆరంభమై నెల రోజులు దాటినా రైతుబంధు డబ్బులు అందకపోవడంతో రైతులు పెట్టుబడుల కోసం తిప్పలు పడుతున్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే.. కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన విధంగానే ఈ సీజన్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయడానికి పచ్చజెండాను ఊపింది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురానున్న రైతు భరోసా పథకంపై ఇప్పటివరకు ఎలాంటి విధి విధానాలను రూపొందించలేదు. దీని కారణంగా పాత పద్ధతినే రైతులకు డబ్బు జమచేసే ప్రక్రియను ఈ నెల 12 నుంచి ప్రారంభించింది. రంగారెడ్డి ట్రెజరీ నుంచి రైతులు దశల వారీగా డబ్బులను జమ చేస్తామని పేర్కొంది. తొలుత ఎకరం లోపు వారికి.. ఆ తర్వాత దశల వారీగా రోజుకు ఎకరం చొప్పున పెంచుతూ రెండు ఎకరాలు, మూడు ఎకరాలు, ఆ తరువాత పై ఎకరాల వారికి రైతుబంధు డబ్బులను జమచేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రకటించింది. నల్లగొండలో జిల్లాలో 5.30 లక్షల మంది రైతులు రైతుబంధు పథకానికి అర్హులుగా ఉన్నారు. వారికి సంబంధించిన రూ.610 కోట్లు ఖాతాల్లో జమచేయాల్సి ఉంటుంది. పెట్టుబడులకు తప్పని తిప్పలు యాసంగి సీజన్ ప్రారంభమై నెల దాటింది. రుణమాఫీ సక్రమంగా కాకపోవడంతో బ్యాంకర్లు పంట రుణాలు ఇవ్వడానికి ఆసక్తి చూపించడం లేదు. దీంతో రైతులు పంటరుణాలు అందక, రైతుబంధు సాయం రాక పెట్టుబడల కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే రైతుబంధు డబ్బుల జమ ప్రక్రయను వేగవంతం చేయాలని జిల్లా రైతులు కోరుతున్నారు. వానాకాలంలో కూడా కొందరికి అందలే.. గత వానాకాలంలో సీజన్లో కూడా వేలాది మంది రైతుల వరకు రైతుబంధు డబ్బులు జమ కాలేదు. వివిధ సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ ఆ సీజన్ ముగిసే నాటికి కూడా డబ్బులు రాకపోవడంతో రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ తిరిగినా వారికి సరైన సమాధానం రాలేదు. ప్రస్తుత యాసంగి సీజన్ కూడా డబ్బుల జమ ప్రక్రియ నత్తనడకన సాగుతుండడంతో వానాకాలం పరిస్థితి ఏర్పడుతుందోనన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. దశల వారీగా జమ అవుతాయి రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సీజన్ రైతుబంధు డబ్బులు జమ చేయడాన్ని ప్రారంభించింది. ముందుగా ఎకరంలోపు రైతులకు ఆ తరువాత రెండెకరాలోపు వారికి ఇలా దశవారీగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయి. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి రైతుకూ రైతుబంధు సాయం అందుతుంది. – పాల్వాయి శ్రవణ్‌కుమార్, డీఏఓ -
ఎన్నికల ముందు బిగ్ షాక్...రైతుబంధు ఎవరికి షాకిస్తుంది
-
కేసీఆర్ ఫామ్ హౌస్ సీఎం కాదు.. ఫామింగ్ సీఎం: హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ దృష్టి అంతా రైతుల మీద ఉంటుందని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్ సీఎం కాదు.. ఒక ఫామింగ్ సీఎం అని కొనియాడారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్, రైతుబంధుతో కేసీఆర్ వ్యవసాయం పండగ చేశారని పేర్కొన్నారు. కేసీఆర్ ఒక రైతు బిడ్డని గుర్తు చేశారు. ఇన్నాళ్లు నీళ్ళు లేక, పెట్టుబడి లేక రైతులు ఇబ్బందులు పడ్డారు. మళ్ళీ కాంగ్రెస్ చేతిలో పడితే రాష్ట్రం ఏమవుతుంది అనేదే భయమని అన్నారు. రిస్క్ తీసుకోవద్దు.. కారుకు ఓటేసి బీఆర్ఎస్ను గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రశ్న: బీఆర్ఎస్ కాకుండా వేరే పార్టీ వస్తే పరిస్తితి ఏంటి? హరీష్ రావు: పేదలకు బీజేపీ, కాంగ్రెస్‌లు చేసిందేమీ లేదు. అయిదు గ్యారంటీలతో కర్ణాటకలో కాంగ్రెస్ జనాన్ని మోసం చేసింది. రాహుల్, ప్రియాంక తమది గ్యారంటీ అన్నారు. ఆరు నెలలు అవుతున్నా ఎన్నికల హామీలు అమలు చేయటం లేదు. ఏడాదికి 2లక్షల ఉద్యోగాలు అన్నారు. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. నిన్న నిరుద్యోగుల వద్దకు వెళ్లి రాహుల్ గాంధీ డ్రామాలు చేస్తున్నారు. కర్ణాటకలో 5 గ్యారెంటీలు ఏమో గానీ ఉన్న గ్యారంటీలు పోయాయి. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వటం లేదు. 80 శాతం ఫీజుల్లో కోత పెట్టారు. అన్నింట్లో కోత పెట్టింది కర్ణాటక ప్రభుత్వం. రేవంత్ రెడ్డి 3 గంటల కరెంట్, కర్ణాటక డిప్యూటీ సీఎం 5 నుంచి 7 గంటల కరెంట్ చాలు అంటున్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే 3 గంటల కరెంట్, 5 గంటల కరెంట్ ఒప్పుకున్నట్టే. ప్రజలు ఆలోచించాలి. రైతు బంధు కాంగ్రెస్ పార్టీ రూ.15 వేలు ఇస్తామని చెప్తోంది. కానీ మేము రూ.16 వేలు ఇస్తామని చెప్తున్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కరెంట్ కష్టాలు ఉండే. మనం రిస్క్ తీసుకోవద్దు. ప్రశ్న: కర్ణాటక హామీల ప్రకటనలు ఇస్తోంది ఇక్కడ? హరీష్ రావు: కర్ణాటక ఇచ్చే యాడ్ అంత అబద్దం. యువశక్తి అని యాడ్ ఇచ్చారు. అక్కడ ఉద్యోగాలు ఇచ్చారా? బస్సులు కూడా లేకుండా చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ కర్ణాటక యాడ్ ఇవ్వటం ఎందుకు? ప్రశ్న: బీఆర్ఎస్ పరిపాలనలో పాజిటివ్‌తో వెళ్లాల్సిన బీఆర్ఎస్ భయపడుతుంది కాంగ్రెస్ కు అనే వాదన వస్తోంది? హరీష్ రావు: మాకు భయం అనేదే లేదు. ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు. మేము 12 సార్లు రైతు బంధు ఇచ్చాం. కాంగ్రెస్‌లో అధికారంలోకి వస్తే 12 ముఖ్యమంత్రులు ఖాయం. ప్రశ్న: ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ కూడా సీఎంలను మార్చలేదు ఇక్కడ ఎందుకు మారుస్తాం అంటున్నారు? హరీష్ రావు: తెలంగాణ రాకముందు ఇక్కడ సీఎంలను మార్చలేదా మనం చూడలేదా? కర్ణాటక మోడల్ అంటే ఏంటి? కరెంట్ ఇవ్వక పోవడమా? రైతు బంధు ఇచ్చాము, కరెంట్ ఇచ్చాము.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇవన్నీ రద్దు అవుతాయి. ప్రశ్న: కాంగ్రెస్ గాలి వీస్తుంది అనే వార్తలు వస్తున్నాయి? ఏమంటారు? హరీష్ రావు: మేము నిర్వహించిన మహబూబాబాద్, నర్సం పేట, పాలకుర్తి, భువనగిరిలో ఎక్కడ చూసినా ఇసుక వేస్తే రాలనంత జనం వస్తున్నారు. కానీ రాహుల్ సభకు, ప్రియాంక సభకు జనం లేక వెలవెలభోతున్నాయి. ఖాళీ కుర్చీలకు ఉపన్యాసం ఇస్తున్నారు. జనం ముమ్మాటికీ మా వైపే ఉన్నారు. ఇంటింటికి మంచి నీరు, 24 గంటల కరెంట్, సాగు నీరు అందిచాం. ప్రశ్న: 24 గంటల కరెంట్, మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్ళు ఇవ్వలేదు? వెళ్లి చూద్దామా? అని ప్రతిపక్షాలు అంటున్నాయి మంత్రి హరీష్: 'ఇవన్నీ రాకపోతే టీవీ లోనో, పేపర్ లోనో రావాలి కదా. కరెంట్, నీళ్ళు ఇస్తే కారుకు ఓటెయ్యండి. రాని వాళ్ళు కాంగ్రెస్‌కు ఓటెయ్యండి. రిస్క్ వద్దు అనేది మా అభిప్రాయం. సాఫీగా తెలంగాణ పాలన సాగుతోంది. సంక్షేమ రంగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. అనేక రంగాల్లో మార్గదర్శకంగా తెలంగాణను దేశంలో.నంబర్ 1 స్థానంలో ఉంచాం. హర్ గర్ జల్ అని కేంద్రం మిషన్ భగీరథను కాపీ కొట్టింది. కేసీఆర్‌కు వాగు వంక, చెట్టు పుట్ట అన్ని తెలుసు. ప్రతిపక్ష నాయకులకు ఏది తెలియదు. కొన్ని పథకాలు తప్ప వేరే కనపడటం లేదు. చేసింది, చూసిందే గమనించాలి అంటున్నాం. అందుకే ఇవ్వన్నీ గమనించి ఓటేయాలి.' అని మంత్రి హరీష్ రావు చెప్పారు. ప్రశ్న: స్కూళ్ళు మూత పడుతున్నాయి? మంత్రి హరీష్: 'ఒక్క విద్యార్థి కూడా లేని చోట మూత పడ్డాయి అంతే' అని హరీష్ రావు సమాధామిచ్చారు. ప్రశ్న: ధరణి విషయంలో విమర్శలు ఎందుకు? ధరణి ప్లాప్ అంటోంది కాంగ్రెస్? మంత్రి హరీష్: 'మా బలం ఏందో ప్రతిపక్షాలకు తెలుసు. మా బలం మీద విమర్శ చేస్తేనే దుష్ప్రచారం చేస్తేనే జనం నమ్ముతారు అని వారి ఆలోచన' అని హరీష్ రావు అన్నారు. ప్రశ్న: తెలంగాణలో జనరేటర్లు, ఇన్వర్టర్లు లేవు.. ధరణితో భూములు లాక్కుంటున్నారు అంటున్నారు? మంత్రి హరీష్: 'ప్రజల్లో అపనమ్మకం సృష్టించి జనాన్ని ఇబ్బందులు పెట్టాలని కాంగ్రెస్ చూస్తోంది. 60 యేళ్లు పాలించిన కాంగ్రెస్ ఏనాడైనా రైతు గురించి ఆలోచించిందా. మా అధికారం అంత ప్రజలకు ఇచ్చాము.'అని హరీష్ రావు సమాధానమిచ్చారు. ప్రశ్న: కుటుంబ పాలన చేస్తున్నారని విమర్శ? మంత్రి హరీష్: 'ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీరంతా ఎవరు? మేము ప్రజా క్షేత్రం నుంచి వచ్చిన వాళ్ళం. కుటుంబ పార్టీ ఎలా అవుతుంది. సంక్షేమ రంగంలో అద్భుతాలు చేశాం. ప్రతిపక్షాలు చెప్పడానికి ఏం లేక, పదే పదే సొల్లు చెప్తోంది. దళిత బంధు ఓట్ల కోసం కాదు, దళితులను ఆర్థికంగా ఎదగాలని తీసుకొచ్చాం' అని హరీష్ రావు చెప్పారు. ప్రశ్న: దళిత బంధు, డబుల్ బెడ్ రూం ఇల్లు బీఆర్ఎస్కు గుది బండలా మారుతుందా? మంత్రి హరీష్: 'దశల వారీగా ఈ పథకం అందరికీ అందిస్తాం. దళితులు ఆర్థికంగా ఆదుకోవటానికి ఇది తీసుకొచ్చాం. రైతు అందుబాటులో ఉన్న సమయంలో కరెంట్ తో నీళ్ళు పారించటానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. 24 గంటల కరెంట్ మధ్యలో అంతరాయం వస్తుంటేనే మళ్ళీ ఫోన్లు వస్తున్నాయి. ఇది చాలాదా అందరికీ నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం.' అని మంత్రి హరీష్ రావు చెప్పారు. ప్రశ్న: కాళేశ్వరం లక్ష కోట్లు అవీనీతి అంటున్నారు? మంత్రి హరీష్: 'ప్రాజెక్ట్ మొత్తం రూ.80 వేల కోట్లు అయ్యింది. లక్ష కోట్ల అవినీతి ఎలా అవుతుంది. ఆ ప్రాజెక్టుతో వ్యవసాయం సస్యశ్యామలం అయ్యింది.' అని హరీష్ రావు చెప్పారు. ప్రశ్న: డిజైన్ లో లోపాలు ఉన్నాయా? ఎందుకు కుంగిపోయింది.? మంత్రి హరీష్: 'ఇంత పెద్ద ప్రాజెక్టులో చిన్న పిల్లర్ కుంగింది. ఇది ఎల్ అండ్ టీ టేకప్ చేసిన ప్రొజేక్ట్. ప్రజలపై భారం పడకుండా మళ్ళీ మరమత్తులు చేస్తామని చెప్పారు. ఓట్ల కోసం ఇంత రాజకీయం అవసరమా. ప్రాజెక్టు కూలితే కేంద్రం ఊరుకుంటుందా?' అని హరీష్ రావు చెప్పారు. ప్రశ్న: భారీ వర్షాలు పడితే హైదరాబాద్ పరిస్తితి దారుణంగా ఉంది? మంత్రి హరీష్: 'హైదరాబాద్ విషయంలో కేటీఆర్ బాగా కష్టపడుతున్నారు.' అని హరీష్ రావు చెప్పారు. ప్రశ్న: ఓయూ వెళ్ళడానికి బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారా? మంత్రి హరీష్: 'ఓయూ వెళ్ళడానికి భయపడేది మేము కాదు. రేవంత్ రెడ్డి భయపడుతున్నారు. విద్యార్థులను బీర్లు, బిర్యానీ ఇస్తే ఏమైనా చేస్తారు అని అన్నాడు. వచ్చే ప్రభుత్వంలో ఉద్యోగ కాలెండర్ ప్రకటిస్తాం. అత్యుత్తమ పారిశ్రామిక విధానం ద్వారా ప్రవేట్ ఉద్యోగాలు వచ్చాయి. మొత్తం ఉద్యోగాల్లో 3 శాతం మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి. పేపర్ లీకేజీలు ఇతర రాష్ట్రాల్లో జరగటం లేదా? మేము దాన్ని ముందు పెట్టడం లేదు. కొన్ని లోపాలు జరిగాయి. మేమే దాన్ని గుర్తించాం. అత్యంత పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేస్తాం' అని హరీష్ రావు చెప్పారు. ప్రశ్న: బీజేపీకి ఓటేస్తే బీఆర్ఎస్ కు ఓటేసినట్టే. కాంగ్రెస్‌కు వేస్తే బీఆర్ఎస్కు వేసినట్టే అనే ఆరోపణ వస్తోంది? మంత్రి హరీష్: 'మేము ఎవరికీ బీ టీమ్ కాదు. వీళ్లు వాళ్ల మీద.. వాళ్ళు వీళ్ళ మీద చెప్పుకుంటూ మా మీద ఆరోపణ చేస్తున్నారు' అని హరీష్ రావు చెప్పారు. ప్రశ్న: కొంత వ్యతిరేకత ఉందని సర్వే లు చెప్తున్నాయి? మంత్రి హరీష్: 'అవన్నీ ఫేక్ సర్వేలు, పెద్ద పేరున్న ఛానళ్ళు చేస్తే ఓకే, పేపర్ల మీద సర్వే లు చేస్తే ఎలా?' అని హరీష్ రావు చెప్పారు. ప్రశ్న: మైనoపల్లి విమర్శలు ఎలా చూస్తారు? మంత్రి హరీష్: 'ఆయన మాట్లాడిన భాష ఆయన స్థాయికి నిదర్శనం. ఆయన విజ్ఞతకే వదిలేస్తాం. ప్రజలే తగిన బుద్ధి చెప్తారు. అలాంటి వారి గురించి మాట్లాడి నా స్థాయి తగ్గించుకోను.' అని హరీష్ రావు చెప్పారు. ప్రశ్న: కొంత మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది.కానీ అయిన వారికే టికెట్ల ఇచ్చారు అని వాదనపై మీ స్పందన? మంత్రి హరీష్: 'వ్యతిరేకత కాదు పాజిటివ్ కూడా ఉండొచ్చు కదా. సంక్షేమ పథకాల లబ్ధి ఎమ్మెల్యేల ద్వారానే వెళ్తుంది కదా. 80 సీట్లతో మేమే అధికారంలోకి వస్తాం. రేవంత్ రెడ్డి హెడ్ లైన్స్ కోసం సెన్సేషన్ కోసమో ఆయన ఆ భాషతో మాట్లాడుతున్నారు. మేము బాధ్యతాయుతంగా ఉండేవాళ్ళం. మేము పాలన సక్రమంగా అందించాలని అనుకునే వాళ్ళం. ప్రధాని ఎన్నో చెప్తాడు. నిజంగా కేటీఆర్ ను సీఎం చేయాలంటే మా ఎమ్మెల్యేలు కావాలి కానీ, ఎంపీలు ప్రధాని సపోర్ట్ ఎందుకు? మోడీ కేసీఆర్‌ను ఎన్ని సార్లు మెచ్చుకున్నారు. ప్రశ్న: కేటీఆర్ ను సీఎం చేయాలనడంపై హరీష్ రావు అభిప్రాయం ఏంటి? మంత్రి హరీష్: 'మా పార్టీ ఏది అనుకుంటే అది చేస్తుంది. మాకు కేసీఆరే సీఎం కావాలని అనుకుంటున్నాం. మా ఎమ్మెల్యేలకు తీరిక ఉండదు. అన్ని పనులు సక్రమంగా సాగుతున్నాయి' అని హరీష్ రావు చెప్పారు. -
పోడుదారులకు రైతుబంధు.. రైతులు వివరాలు అందించాలి
నర్సంపేటరూరల్/ఖానాపురం/నెక్కొండ/నల్లబెల్లి : పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. హక్కుపత్రాలు పొందే రైతులకు రైతుబంధు సైతం అందించడానికి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలోని ఖానాపురం, నల్లబెల్లి, నెక్కొండ, నర్సంపేట మండలాల్లో పోడు భూముల కోసం 3,353 మంది దరఖాస్తు చేసుకున్నారు. సర్వే చేసిన అనంతరం 3,271 మంది లబ్ధిదారులు.. 7,333 ఎకరాల భూమిని అధికారులు గుర్తించారు. సాంకేతిక కారణాలతో 3,262 మందికి పట్టాలను సైతం తయారీ చేయించి పంపిణీకి సిద్ధం చేశారు. హక్కుపత్రాలు పొందే రైతులకు రైతుబంధు సైతం అందించనుంది. ఇప్పటికే ఇతర రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ అవుతున్నాయి. వీరితోపాటు గిరిజన రైతులకు సైతం అందించడానికి వివరాలు సేకరిస్తున్నారు. హక్కుపత్రాలు పొందిన గిరిజన రైతుల వివరాలను ఇప్పటికే ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులు.. మండల వ్యవసాయ అధికారులకు అందించారు. వివరాల ఆధారంగా గిరిజన రైతుల వద్ద నుంచి ఆధార్, బ్యాంకు ఖాతాల జిరాక్స్ పత్రాలను స్వీకరిస్తున్నారు. ఖానాపురం మండలలో సుమారు 1,829 మంది గిరిజన రైతులు, సుమారు 700 ఎకరాల భూమిని గుర్తించారు. వీరిలో సుమారు 1200 మంది నుంచి గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఎఫ్ఆర్సీ కమిటీ సభ్యులు వివరాలు సేకరించి వ్యవసాయ అధికారులకు చేరవేస్తున్నారు. సుమారు మరో 629 మంది రైతులు ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలు అందించాల్సి ఉంటుంది. ఈనెల 30 లోపు వ్యవసాయ అధికారులకు అందజేస్తే జూలై 3 లోపు ఆన్లైన్లో నమోదు చేయడానికి అవకాశం ఉంటుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. కాగా, ఇప్పటి వరకు 560 దరఖాస్తులను వ్యవసాయ అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారు. కాగా, ఇప్పటికే రైతుల వివరాలు ఆన్లైన్ చేయగా రైతు బంధు డబ్బులు సైతం ఖాతాల్లో జమ అవుతున్నట్లు రైతులు చెబుతున్నారు. నల్లబెల్లి మండలంలో 1083 మంది పోడు రైతులు హక్కుపత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా, గ్రామస్థాయిలో 964 మంది రైతుల దరఖాస్తులు ఆమోదించారు. ప్రభుత్వం 906 దరఖాస్తులను ఆమోదించి, 2,700 ఎకరాలకు హక్కుపత్రాలు అందించనుంది. నెక్కొండలో 220 మంది రైతులకు 355 ఎకరాలకు, నర్సంపేట మండలంలో 120 మందికి 237 ఎకరాల భూమికి సంబంధించి హక్కుపత్రాలు అందించనుంది. ఈ మండలాల్లో కూడా అధికారులు పోడు రైతుల వివరాలు సేకరిస్తున్నారు. ఆన్లైన్ చేసేందుకు గడువు పొడిగించాలి రైతుబంధు కోసం గిరిజన రైతుల నుంచి వివరాలు సేకరించి ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఏఈఓలు ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 70దరఖాస్తులను ఆన్లైన్ చేస్తున్నారు. నమోదు సమయంలో సర్వర్ మొరాయిస్తోంది. ఉ దయం, రాత్రి వేళ నిత్యం కంప్యూటర్‌తో కుస్తీ పడి తే సుమారు 120 నుంచి 150 వరకు ఆన్లైన్ అవుతున్నాయి. సమయం తక్కువగా ఉండడంతో వ్యవసాయ అధికారులు సైతం ఒత్తిడికి గురవుతున్నారు. గడువు పొడిగించాలని రైతులు కోరుతున్నారు. రైతులు వివరాలు అందించాలి హక్కుపత్రాలు కలిగిన వివరాలు పంచాయతీ కార్యదర్శులకు అందాయి. వాటి ఆధారంగా గిరిజన రైతులు ఆధార్, బ్యాంకు ఖాతాల జిరాక్స్‌లను వ్యవసాయ విస్తరణ అధికారులకు లేదా పంచాయతీ కార్యదర్శులకు అందించాలి. సకాలంలో ఆన్లైన్ చేస్తేనే రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వివరాలు అందించని రైతులు రైతుబంధును కోల్పోవాల్సి వస్తుంది. – బోగ శ్రీనివాస్, వ్యవసాయ అధికారి, ఖానాపురం -
సబ్సిడీ పథకాలకు మంగళం.. విత్తనాలు, పనిముట్లపై సబ్సిడీ ఎత్తివేత
ఇచ్చోడ(బోథ్): జిల్లాలోని అన్నదాతలు కోటి ఆశలతో వానాకాలం పంటల సాగు మొదలుపెట్టారు. మృగశిర కార్తె ప్రవేశంతో పొలం బాట పట్టారు. అయితే రైతులకు సర్కారు నుంచి ప్రోత్సాహం లభించడంలేదు. ప్రత్యామ్నాయ లాభాసాటి పంటలు వేయాలని ప్రభుత్వం సూచనలు చేస్తూనే రాయితీపై విత్తనాలు, రుణమాఫీ, వ్యవసాయ పని ముట్లు, అందించే పథకాలు క్రమంగా కనుమరుగు చేస్తోంది. రైతుబంధు పథకం వచ్చిన తర్వాత సబ్సిడీ పథకాలన్నీ ఎత్తేయడంతో రైతులు విత్తనాల నుంచి మొదలు వ్యవసాయ పనిముట్ల వరకు పూర్తి గా సొమ్ము చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో రైతన్నకు సాగు భారంగా మారుతోంది. రూ.8.5 కోట్ల అదనపు భారం జిల్లాలో పత్తి పంట తర్వాత అత్యధికంగా సాగయ్యే పంట సోయా. గతంలో ప్రభుత్వం సోయా విత్తనాలను రైతులకు 50 శాతం సబ్సిడీపై అందజేసేది. కానీ మూడేళ్లుగా సబ్సిడీ పూర్తిగా నిలిపేసింది. దీంతో పూర్తి ధర చెల్లించి రైతులు బహిరంగ మార్కెట్లో విత్తనాలు కొనుగోలు చేయాల్సివస్తోంది. సబ్సిడీ ఎత్తివేతతో జిల్లా రైతులపై రూ.8.5 కోట్ల అదనపు భారం పడుతోంది. జాడలేని పంటల బీమా వాతావరణ ఆధారిత పంటల బీమా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడింది. కొన్నేళ్ల నుంచి పత్తి పండిస్తున్న రైతులు అతివృష్టి, అనావృష్టి కారణంగా దిగుబడులు రాక త్రీవంగా నష్టపోతున్నారు. వారికి లబ్ధిచేకూర్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆరేళ్ల కిత్రం వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టాయి. పథకంలో 80 శాతం మంది రైతులు చేరారు. రెండేళ్ల క్రితం అతివృష్టితో నష్టపోయిన రైతులు ఎకరాకు రూ.12 వేల చొప్పున పరిహారం పొందారు. ఆతర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేసింది. ఫలితంగా ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన రైతులు పరిహారానికి నోచుకోవడంలేదు. ‘యంత్రలక్ష్మి’కి మంగళం రైతులు ఆధునిక వ్యవసాయం చేసేందుకు సాగులో యాంత్రీకరణ పెంచేందుకు ప్రభుత్వం యంత్రలక్ష్మి పథకాన్ని ప్రవేశ పట్టింది. దీని ద్వారా చిన్న సన్న కారు రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు, రొటోవేటర్లు, నాగళ్లు, పవర్‌స్ప్రేలు, యంత్రాలు రాయితీపై అందించేది. యంత్ర లక్ష్మి పధకాన్ని పూర్తిగా ఎత్తివేసింది. దీంతో రైతులు పనిముట్లు సైతం బయట మార్కెట్లో కొనుగోళ్లు చేయాల్సి వస్తోంది. రద్దయిన పావలా వడ్డీ పంటలపై తీసుకున్న రుణాలు మార్చి 30లోపు చెల్లించిన వారికి గతంలో పావలా వడ్డీ మాత్రమే వసూలు చేసేవారు. మిగితా వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేది. మూడేళ్ల కిత్రం పావలా వడ్డీని ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో రైతులకు పంట రుణాలపై వడ్డీ భారం తప్పడంలేదు. అటకెక్కిన రుణమాఫీ 2018 డిసెంబర్ 11 లోపు రైతులు తీసుకున్న రూ.లక్ష లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నాలుగేళ్లు దాటినా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ఇప్పటి వరకు కేవలం 20 వేల మంది రైతులకు సంబంధించిన కేవలం రూ.39 వేలలోపు రుణాలు మాత్రమే మాఫీ చేశారు. మరో 80 వేల మంది రైతుల రుణాలు మాఫీ కావాల్సి ఉంది. విత్తనాలు సబ్సిడీపై అందించాలి విత్తనాలు సబ్సిడీపై అందించక పోవడంతో చిన్న సన్న కారు రైతులపై అదనపు భా రం పడుతోంది. రైతులకు సంబంధించిన పథకాలపై ప్రభుత్వం పునరాలోచించాలి. విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు సబ్సిడీపై అందించాలి. – బొర్రన్న, రైతు స్వరాజ్యవేదిక జిల్లా అధ్యక్షుడు -
తెలంగాణలో సోమవారం నుంచి రైతుబంధు సొమ్ము జమ...ఇంకా ఇతర అప్డేట్స్
తెలంగాణలో వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతుబంధు పథకం సొమ్మును ప్రభుత్వం సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనుంది.
-
‘ఐదు ఎకరాల్లోపే’ రైతుబంధు ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న వారికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయంగా రైతుబంధు పథకాన్ని వర్తింపజేసేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ, వ్యవసాయ, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులతోపాటు వ్యవసాయ శాఖ కమిషనర్లను ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి గతంలో రెండు పిటిషన్లు దాఖలయ్యాయని ప్రభుత్వ న్యాయవాది నివేదించారు. దీంతో ఈ వ్యాజ్యాన్ని వాటితో కలిపి విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేస్తూ తదుపరి విచారణను మార్చి 25కు వాయిదా వేసింది. హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది తల్లాడ నందకిశోర్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని (పిల్) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావలితో కూడిన ధర్మాసనం ఇటీవల విచారించింది. ‘రాష్ట్రవ్యాప్తంగా 1.43 కోట్ల ఎకరాల భూమి సాగులో ఉంది. ఇందులో మెజారిటీ వ్యవసాయ భూములను కౌలుదారులే సాగుచేస్తున్నారు. వారికి ప్రభుత్వం ఎటువంటి పరిహారం ఇవ్వడం లేదు. కొందరు రాజకీయ నాయకులకు వందలాది ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. వీరికీ రైతుబంధు కింద ఆర్థికసాయం అందుతోంది. అర్హులైన ఐదెకరాలలోపు ఉన్న రైతులకు మాత్రమే ఆర్థిక సాయం అందేలా ఆదేశాలు జారీ చేయండి’ అని పిటిషన్లో కోరారు. -
రైతుబంధు.. అక్కడికెళ్తే సాయం బందు.. నిరాశగా వెనుదిరుగుతున్న రైతన్న
సాక్షి, హైదరాబాద్: యాసంగి సీజన్‌కు గాను పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్న డబ్బులు రాష్ట్రంలో చాలామందికి అందడం లేదు. రైతులు తీసుకున్న రుణాల కింద, రుణాలకు సంబంధించిన వడ్డీల కింద ఆ మొత్తాన్ని బ్యాంకులు జమ చేసుకుంటున్నాయి. కొన్ని బ్యాంకులు రైతుబంధు నిధులు రైతులు తీసుకోకుండా వారి ఖాతాలను ముందే ‘హోల్డ్’లో పెట్టేస్తున్నాయి. అంటే వారెలాంటి లావాదేవీలు నిర్వహించడానికి వీల్లేకుండా చేస్తున్నాయన్న మాట. రుణం లేదా వడ్డీ చెల్లిస్తే కానీ ‘హోల్డ్’తీసివేయబోమని నిక్కచ్చిగా చెబుతుండటంతో.. ప్రభుత్వ సాయం కోసం ఎంతో ఆతురతతో బ్యాంకులకు వెళ్లిన రైతులకు తీవ్ర నిరాశే మిగులుతోంది. బ్యాంకర్ల వైఖరిపై కొందరు రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట రుణాలు, వడ్డీలకు సంబంధించి కానీ, రుణాల రెన్యువల్‌కు సంబంధించి కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే.. సర్కారు సాయం తమకు అందకుండా ఎలా చేస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నాటికి 57,60,280 మంది రైతులకు రైతుబంధు కింద రూ.5,294 కోట్లు పంపిణీ చేశారు. ఇందులో 10 శాతం వరకు అంటే రూ.500 కోట్లకు పైగా మొత్తాన్ని బ్యాంకులు ఈ విధంగా ‘హోల్డ్’చేయడం లేదా రుణాల కింద జమ చేసుకోవడం జరిగి ఉంటుందని వ్యవసాయ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత సీజన్లో ఇలాగే వ్యవహరించిన బ్యాంకులపై అప్పట్లో ప్రభుత్వం సీరియస్ అయినా, తీరు మార్చుకోకుండా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు బ్యాంకర్లను పిలిపించి మాట్లాడటంలేదన్న ఆరోపణలూ విన్పిస్తున్నాయి. రూ.5,294 కోట్లు పంపిణీ పంటల సాగు సీజన్లో పెట్టుబడి సొమ్ము లేక ఇబ్బందులు పడే రైతుల్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ‘రైతుబంధు’పథకాన్ని ప్రవేశపెట్టింది. ఏడాదికి రెండుసార్లు యాసంగి, వానాకాలం సీజన్లకు ముందు ఎకరానికి రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం కింద నిర్ణీత మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ క్రమంలోనే యాసంగి సీజన్‌కు సంబంధించిన నిధుల పంపిణీని ప్రభుత్వం ఇటీవల ప్రారంభించింది. ఈ సీజన్లో 66.61 లక్షల మంది రైతులకు చెందిన దాదాపు 1.52 కోట్లకు పైగా ఎకరాలకు గాను రూ.7,645 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఇప్పటి వరకు 60,16,697 మంది రైతులకు రూ.6008.27 కోట్లు పంపిణీ చేశారు. అయితే తమ వద్ద రుణం తీసుకొని చెల్లించని రైతులకు బ్యాంకులు చుక్కలు చూపిస్తున్నాయి. ఆర్బీఐ చట్టం ప్రకారం రికవరీ చేయాల్సిందే: బ్యాంకు వర్గాలు రుణాలు తీసుకున్న ఖాతాదారుల నుంచి డబ్బులు తిరిగి రికవరీ చేయడం తాము సొంతగా తీసుకున్న నిర్ణయమేమీ కాదని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనల ప్రకారమే ఇది జరుగుతుందని బ్యాంకర్లు వివరిస్తున్నారు. తాము ప్రత్యేకంగా ఆపరేట్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉండదని, కంప్యూటర్ జనరేటెడ్ సిస్టమ్‌లో బ్యాంకులో ఎవరైనా ఖాతాదారుని రుణం పెండింగ్‌లో ఉంటే.. అకౌంట్లో ఏవైనా డబ్బులు జమ అయితే అవి అప్పు కింద జమ అవుతాయని అంటున్నారు. అయితే ప్రస్తుతం రైతుబంధు నిధులను రైతు రుణాల కింద జమ చేసుకుంటున్న బ్యాంకుల్లో ఎక్కువగా చిన్న బ్యాంకులే ఉన్నాయని తెలుస్తోంది. జాతీయ స్థాయిలో నడిచే పెద్ద పెద్ద బ్యాంకుల్లో ఇలాంటి సమస్యలు లేవని బ్యాంకర్లు చెపుతుండగా, వడ్ల కొనుగోలు కింద ప్రభుత్వం జమ చేసిన నిధులను కూడా అంతకుముందు తీసుకున్న అప్పుల కింద కొన్ని బ్యాంకులు బిగపడుతున్నాయని రైతులు లబోదిబోమంటున్నారు. బ్యాంకులకు గతంలోనే చెప్పాం: వ్యవసాయ శాఖ వర్గాలు రైతుబంధు నిధులను బ్యాంకర్లు రుణాల కింద జమ చేసుకోవడం సరైంది కాదని వ్యవసాయ శాఖ వర్గాలంటున్నాయి. ఆర్బీఐ నిబంధనలు ఏవైనా ఉండొచ్చు కానీ రైతులకు ప్రభుత్వం సాయం చేయడంలోని ఉద్దేశాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉందని వారు చెబుతున్నారు. రైతుబంధు నిధులు బ్యాంకులు జమ చేసుకునే పక్షంలో, ప్రభుత్వం సాయం చేసినా ప్రయోజనం ఏముందని ప్రశ్నిస్తున్నారు. అవసరమైతే రైతులకు కొత్తగా రుణాలు ఇచ్చి, వాటిని గత రుణాల కింద జమ చేసుకోవాలని, కొత్త రుణాలను క్రమం తప్పకుండా చెల్లించేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఇదే విషయాన్ని ఇప్పటికే పలుమార్లు బ్యాంకులకు చెప్పామని, లేఖలు సైతం రాశామని తెలిపారు. తమ ఒత్తిడి కారణంగానే 2019–20లో బ్యాంకర్లు జమ చేసుకున్న రైతుబంధు సాయాన్ని తిరిగి ఇచ్చేశారని ఓ ఉన్నతాధికారి తెలిపారు. 'మహబూబ్‌నగర్ జిల్లా గండేడ్ పంచాంగల్ తండాకు చెందిన లావుడ్యా నాయక్‌కు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పంట రుణం కింద గతంలో గండేడ్ ఎస్బీహెచ్లో రూ.1.5 లక్షలు తీసుకున్నాడు. బ్యాంకు నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో రెన్యువల్ చేయలేదు. ప్రస్తుతం అందరి రైతుల మాదిరిగానే ఆయనకు కూడా ప్రభుత్వం నుంచి రైతుబంధు డబ్బులు రూ.20 వేలు బ్యాంక్ ఖాతాలో జమయ్యాయి. అయితే ఈ మొత్తాన్ని బ్యాంకు అధికారులు అప్పు కింద అట్టే పెట్టుకున్నారు. వారం క్రితం వరకు ఆయన బ్యాంకు ఖాతాను ‘హోల్డ్’లో (లావాదేవీల నిలిపివేత) పెట్టలేదు. కానీ రైతుబంధు పడుతోందని తెలియగానే హోల్డ్‌లో పెట్టేశారని నాయక్ తెలిపాడు. డబ్బులు తీసుకురావడానికి బ్యాంకుకు వెళ్తే పంట రుణం బాకీ చెల్లిస్తేనే రైతుబంధు డబ్బులు ఇస్తామని అధికారులు చెబుతున్నారని' వాపోయాడు -
ప్రతిరోజు లక్షలు సంపాదిస్తున్నాడు.. మళ్లీ రెండు సార్లు రైతుబంధు
హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడిలో భూమి కొని అందులో రిసార్ట్ నిర్వహిస్తున్నారు. పెళ్లిళ్లు, రిసెప్షన్లు, పుట్టినరోజు వేడుకల వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రతిరోజు లక్షలు ఆర్జిస్తున్నాడు. అయితే రెవెన్యూ రికార్డుల్లో ఆ భూమి వ్యవసాయ భూమిగా నమోదై ఉండటంతో ప్రభుత్వం అందించే పంట పెట్టుబడి సాయం ‘రైతుబంధు’ఏడాదికి రెండుసార్లు అతని ఖాతాలో జమవుతోంది. మొయినాబాద్ మండలానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి తన వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చకుండానే మూడేళ్ల క్రితం క్రీడా మైదానం ఏర్పాటుచేసి రోజూ అద్దెకు ఇస్తున్నారు. సాధారణ సమయాల్లో రోజుకు రూ 2,000–4,000, వారాంతాల్లో రూ.8,000– 10,000 అద్దె వసూలు చేస్తున్నారు. ఇలా సంవత్సరం మొత్తం అద్దెకిచ్చే క్రీడా మైదానానికీ రైతుబంధు డబ్బులు అందుతున్నాయి. ఇదే తరహాలో జిల్లాలో వ్యవసాయేతర కార్యకలాపాలు నిర్వహించే చాలా భూముల యజమానులకు రైతుబంధు డబ్బు తేరగా వస్తోంది. మొయినాబాద్: రైతులకు ఆర్థికంగా చేయూతనందించడానికి ప్రభుత్వం 2018 మే 10న రైతుబంధు పథకాన్ని ప్రారంభించింది. పంట పెట్టుబడి సహాయం పేరుతో వ్యవసాయంచేసే ప్రతి రైతుకు ఎకరాకు ఏడాదికి రూ.8 వేల చొప్పున అందిస్తా మని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించి మొదటి విడతలో రైతుల పేరుతో చెక్కులు పంపిణీ చేసింది. ఆపై రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. 2019 నుంచి ఈ సహాయాన్ని వానాకాలం, యాసంగి పంటలకు ఎకరాకు రూ.5వేల చొప్పున ఎకరాకు సాలీనా రూ.10 వేలకు పెంచింది. తాజాగా యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు డబ్బులను ప్రభుత్వం జమ చేస్తోంది. రికార్డుల్లో వ్యవసాయం.. క్షేత్రంలో వాణిజ్యం రైతులను ఆదుకునేందుకు ఇస్తున్న రైతుబంధు కొందరి స్వార్థం కారణంగా పక్కదారి పడుతోంది. పంటలు సాగుచేసే వ్యవసాయ భూములకు మాత్రమే ఈ సాయం అందాలనేది ప్రభుత్వ ఉద్దేశం. కానీ వ్యవసాయేతర కార్యకలాపాలు నిర్వహిస్తున్న భూములకూ రైతుబంధు డబ్బులు జమ అవుతున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఇటీవల క్రీడా మైదానాలు, ఫాంహౌస్‌లు, రిసార్ట్స్, ఫంక్షన్‌హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు ఎక్కువయ్యాయి. ఇవి వెలసిన భూములన్నీ రెవెన్యూ రికార్డుల్లో వ్యవసాయ భూములుగానే కొనసాగుతున్నాయి. నిబంధనల ప్రకారం పట్టా భూములకు రైతుబంధు ఇవ్వాలనే మార్గదర్శకాలకు అనుగుణంగా వీరికి యథావిధిగా సాయం అందుతోంది. దీంతో బడా వ్యాపారులు, సంపన్నవర్గాలు, సెలబ్రిటీలు, ఆ భూములను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తూ రైతుబంధును తీసుకుంటున్నారు. ఇలా రాజధాని శివార్లలోని రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వ్యాపార కార్యకలాపాలు కొనసాగించే భూములు వేల ఎకరాల్లో ఉన్నాయి. వాటన్నింటికీ రైతుబంధు ఇస్తుండటంతో ఏటా కోట్ల రూపాయలు ‘పెద్ద’ రైతుల ఖాతాల్లోకి వెళుతున్నాయి. గుర్తించని అధికారులు రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయేతర కార్యకలాపాలు జరిగే పంట భూములను గుర్తించడంలో యంత్రాం గం విఫలమవుతోందనే విమర్శలున్నాయి. వ్యవసాయానికి కాకుండా ఇతర అవసరాలకు వాడే భూములను నాలా కింద మార్చాల్సి ఉంటుంది. కానీ చాలామంది నాలా మార్పిడి చేయకుండానే వ్యవసాయ భూములను వ్యాపార కార్యకలాపాలకు వాడుతున్నారు. ఇదిలావుండగా, 111 జీవో పరిధిలో వ్యవసాయేతర కార్యకలాపాలపై ప్రభు త్వం ఆంక్షలున్నాయి. మొత్తం విస్తీర్ణంలో కేవలం పదిశాతమే వ్యవసాయేతర అవసరాలకు విని యోగించుకోవాలనే నిబంధనలున్నాయి. దీంతో వ్యవసాయేతర భూముల మార్పిడి కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో కొందరు బడాబాబులు, రియల్టర్లు తమ భూములను వ్యవసాయేతర అవసరాలకు మళ్లిస్తూ.. ప్రభుత్వం కళ్లుగప్పుతున్నారు. నిజమైన రైతులకు అందాలి ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు నిజమైన రైతులకు అందట్లేదు. వాణి జ్య భూములకు రైతుబంధు ఇస్తున్న ప్రభు త్వం అసైన్డ్ భూములు సాగుచేసుకునే పేదరైతులకు ఇవ్వట్లేదు. వాణిస్య భూములకు రైతుబంధును నిలిపివేయాలి. పేదలకు అసైన్డ్ చేసిన భూములపై వారికే హక్కులు కల్పించి రైతుబంధు ఇవ్వాలి. – ఉప్పరి శ్రీనివాస్, అసైన్డ్ భూమి సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, మొయినాబాద్ 111 జీవో పరిధిలో నాలా కన్వర్షన్ లేదు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే భూములను వ్యవసాయేతర భూములుగా మార్చుకోవాలి. కానీ 111 జీవో పరిధిలో నాలా కన్వర్షన్ లేదు. దీంతో ఈ ప్రాంతంలోని వ్యవసాయేతర భూములు కూడా రికార్డుల్లో వ్యవసాయ భూములుగానే ఉన్నాయి. దీనిపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాలి. – అనితారెడ్డి, తహసీల్దార్, మొయినాబాద్ -
టీ సర్కార్ గుడ్‌న్యూస్: పాస్‌బుక్ ఉన్న కొత్త రైతులకు రైతుబంధు
సాక్షి, హైదరాబాద్: పట్టాదారు పాసు పుస్తకం ఉన్న కొత్త రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ప్రస్తుత యాసంగి సీజన్లో వీరికి కూడా ‘రైతుబంధు’పథకం మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయశాఖ కమిషనర్ జిల్లా వ్యవసాయశాఖ అధికారులకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దరఖాస్తు సందర్భంగా రైతులు పాస్‌బుక్ లేదా తహసిల్దార్ డిజిటల్ సంతకంతో కూడిన పత్రం, ఆధార్‌కార్డు , బ్యాంక్ సేవింగ్ అకౌంట్ పాస్‌బుక్ జిరాక్స్‌లను జతచేయాలని తెలిపారు. (చదవండి: లక్షణాలు లేవు.. అలక్ష్యం వద్దు) -
ఈటల కావాలా? టీఆర్ఎస్ కావాలా? అన్నది చర్చ పెట్టాలి: హరీశ్ రావు
సిద్దిపేట: దళితులకు రూ.10 లక్షల నగదు సహాయం అందించే పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ దళిత బంధు పథకం’ అని పేరు ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై అధికార, ప్రతిపక్ష నేతలు విమర్షలు గుప్పించుకుంటున్నారు. దళితబంధు పథకానికి బండి సంజయ్ రూ.50 లక్షలు ఇవ్వాలంటున్నారని, కానీ తమ ప్రభుత్వం రూ.10 లక్షలు ఇస్తుందని హరీశ్ రావు అన్నారు. మిగతా రూ.40 లక్షలు కేంద్రం నుంచి బండి సంజయ్ తేవాలని అడిగారు. ఇక రైతు బంధు, దళిత బంధు దండగ అని ఈటల అంటున్నారని, ఈటల కావాలా? టీఆర్ఎస్ కావాలా? అన్నది చర్చ పెట్టాలని మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. హుజురాబాద్‌లో బీజేపీ ఓటు అడిగే ముందు.. రైతుబంధు, దళితబంధుపై బీజేపీ వైఖరి ప్రకటించాలని హరీశ్ రావు అన్నారు. హుజురాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని.. కేంద్ర ఎన్నికల సంఘంపై బీజేపీ ఒత్తిడి తేవాలని హరీశ్ రావు పేర్కొన్నారు. -
రైతుబంధు పథకం తరహాలో త్వరలో చేనేతబంధు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నేత కార్మికుల సంక్షేమం కోసం రైతుబంధు తరహాలో త్వరలో చేనేతబంధు పథకాన్ని తీసుకొస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగం కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు, ఈ రంగం అభివృద్ధిపై మరింత దృష్టిపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం పరిశ్రమల శాఖకు అనుబంధ విభాగంగా ఉన్న చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగాన్ని ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేసి కార్యదర్శిని నియమించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ శాఖకు కమిషనర్ హోదాలో ఉన్న అధికారి పనిచేస్తుండగా పరిశ్రమల శాఖ నుంచి విభజన తర్వాత కార్యదర్శి హోదాలో అధికారిని నియమించే అవకాశమున్నట్లు సమాచారం. తెలంగాణ టెక్స్టైల్ అండ్ అపెరల్ పాలసీ (టీ–టాప్)ను మరింత ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ తరహా మార్పులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. మరోవైపు చేనేత బంధు పథకం మార్గదర్శకాలకు చేనేత విభాగం తుదిరూపు ఇచ్చినట్లు తెలియవచ్చింది. 18 నుంచి 59 ఏళ్ల వయసుగల సుమారు 70 వేల మందికి ఈ పథకాన్ని వర్తింపజేసేందుకు ఇప్పటికే నేత కార్మికుల వివరాలను అధికారులు సేకరించారు. సహకార రంగంతోపాటు సహకారేతర రంగం వారికి కూడా చేనేతబంధు పథకాన్ని అమలు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. త్వరలో చేనేత బీమా పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి మళ్లీ ‘నేతన్నకు చేయూత’... జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ‘నేతన్నకు చేయూత’పథకాన్ని శనివారం తిరిగి ప్రారంభించనున్నారు. నేత కార్మికుల పొదుపు కోసం ఉద్దేశించిన ఈ పథకం కింద కార్మికులు తమ వంతు వాటాగా 8 శాతం నిధులు జమ చేస్తే పరిశ్రమలశాఖలోని చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగం మరో 16 శాతం నిధులను జోడించనుంది. ఈ పథకం కోసం ప్రస్తుత వార్షిక బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 338 కోట్లు కేటాయించగా నాలుగు రోజుల క్రితం ఈ పథకానికి మరో రూ. 30 కోట్లు అదనంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పథకంపై ఆసక్తి ఉన్న కార్మికులు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి తమ వివరాలు నమోదు చేసుకొనేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఈ పథకం కింద 26 వేల మందికిపైగా కార్మికులు పేర్లు నమోదు చేసుకొని రూ. 31 కోట్లు పొదుపు చేయగా ప్రభుత్వం రూ. 62 కోట్లు తన వంతు వాటాగా చెల్లించింది. మూడేళ్ల తర్వాత కార్మికులు రూ. 50 వేల నుంచి రూ. 1.25 లక్షల వరకు రుణం తీసుకొనే వెసులుబాటు ఉండగా కరోనా నేపథ్యంలో గతేడాది మేలో రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను సడలించి కార్మికులకు నిధులు విడుదల చేసింది. -
బతికున్న మహిళ పేరిట రైతు బీమా : కో ఆర్డినేటర్ లీలలు
-
ధరణి.. సంస్కరణ కాదు సంక్షోభం
సాక్షి, అదిలాబాద్: గత కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన అనేక సబ్సిడీలకు కోత పెట్టి.. రైతుబంధు పేరుతో కేసీఆర్ అన్నదాతలను మోసం చేస్తున్నారని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క మండిపడ్డారు. భట్టి విక్రమార్క ఆధ్వర్యంలోని సీఎల్పీ బృందం బుధవారం రైతులతో ముఖాముఖీ కార్యక్రమాన్ని ఏర్రాటు చేసింది. ఈ కార్యక్రమంలో భట్టితో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు, కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు భరత్ చౌహాన్, జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి దుర్గాభవానీ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు లింగంపల్లి చంద్రయ్య, స్థానిక మండల ఇంఛార్జి పొద్దుటూరి సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కడెం రైతులతో సమావేశం అయ్యారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. రైతు బంధు పేరు మీద ప్రభుత్వం ద్వారా రావాల్సిన సహాయాన్ని, సబ్సిడీనికి కేసీఆర్ ప్రభుత్వం ఆపేసిందని రైతులకు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న మోసాలు ప్రజలకు, రైతులుకు అర్థమవుతోందన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం కేవలం భూములున్న భూస్వాములకు, వందల ఎకరాల బీడు భూమి ఉన్న ఆసాములకు మాత్రమే ఉపయోగపడుతోంది తప్పా.. నిజంగా భూమిని దున్నే రైతులకు ఉపయోగపడడం లేదని పేర్కొన్నారు. భూమిని నమ్మి పంట పండించే రైతులకు మద్దతు ధరలేక.. పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదన్నారు. అంతేగాక గత ప్రభుత్వాలు ఇచ్చిన సబ్సిడీలు కూడా లేక... అన్నదాతలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ ప్రాంతంలో నాటి దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదలు పెట్టిన సదర్‌మఠ్ ప్రాజెక్టును కుట్రతోనే డిజైన్ మార్చి.. ఈ ప్రాంత వాసులకు నీళ్లు రాకుండా చేశారని భట్టి ఆరోపించారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పేద రైతుల కోసం నిర్మించిన కడెం ప్రాజెక్టు ద్వారా చివరి భూములకు నీళ్లు అందించేలా ప్రతి ఏడాది మెయింటెనెన్స్ చేయడం జరిగేదన్నారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక మెయిటెనెన్స్ చేయకపోవడంతో కింది ప్రాంత రైతులకు నీళ్లు రావడం లేదని ఆయన ధ్వజమెత్తారు. కడెం ప్రాజెక్టు మెయింటెనెన్స్ కోసం మంజూరు చేసిన 130 మంది ఉద్యోగులను గత కాంగ్రెస్ ప్రభుత్వం నియమిస్తే.. కేసీఆర్ ప్రభుత్వం 101 మందిని తొలగించి.. కేవలం 29 మందితో ప్రాజెక్టు నిర్వహణ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 74 వేల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ అలసత్వం వహించడంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కడెం ప్రాజెక్టును రైతులకు దూరం చేసే ఒక దుర్మార్గమైన ఆలోచన కేసీఆర్ చేస్తున్నారని మండిపడ్డారు. ధరణితో రైతులందరిని కేసీఆర్ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టిందని భట్టి ధ్వజమెత్తారు. ధరణి అనేది సంస్కరణ కాదు.. సంక్షోభం అని ఆయన అన్నారు. రాష్ట్రంలో 95 శాతం మంది రైతులు 5 ఎకరాల్లోపు ఉన్నవారే.. వారంతా పండించిన పంటను సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లి ఎలా అమ్ముకుంటారని ప్రశ్నించారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ సెంటర్లు కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలు.. దేశ రైతాంగాన్ని వణికిస్తున్నాయని భట్టి విక్రమార్క పెర్కొన్నారు. -
మార్కెట్లో సీఎం కేసీఆర్..రందీ వడకుర్రి అంటూ..
గజ్వేల్: సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి కూరగాయల మార్కెట్‌ను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. బుధవారం మార్కెట్ యార్డును ఆకస్మికంగా సందర్శించారు. మార్కెట్‌యార్డులో పంటను అమ్ముకోవడానికి వచ్చిన రైతులు, కమీషన్ ఏజెంట్లతో ఆయన మాట్లాడారు. అనంతరం సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కూరగాయ రైతులకు భారీ ప్రయోజనం చేకూర్చేలా వంటిమామిడి మార్కెట్‌ను విస్తరించాల్సిన అవసరముందని చెప్పారు. ప్రస్తుతమున్న స్థలానికి అదనంగా మరో 14 ఎకరాలను సేకరించి 50 ఎకరాల విస్తీర్ణంలో మార్కెట్ ఉండేలా చూడాలని సూచించారు. అవసరమైతే ఢిల్లీ, కోల్‌కతాలోని కూరగాయల మార్కెట్లను సందర్శించి వాటికి దీటుగా వంటిమామిడిని తీర్చిదిద్దాలన్నారు. గజ్వేల్ ప్రాంతాన్ని ‘వెజిటబుల్ హబ్’గా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకోవాలన్నారు. 16 ప్రభుత్వ కౌంటర్లు.. ములుగు మండలం తున్కిబొల్లారం వద్ద 25 ఎకరాల భూమిని సేకరించి కోల్డ్ స్టోరేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. మార్కెట్లో కూరగాయల ధరలు నిలకడ లేక రైతులు నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పారు. వంటిమామిడి మార్కెట్ యార్డులో ఖాళీగా ఉన్న 16 దుకాణాల్లో వెంటనే ప్రభుత్వం తరఫున కౌంటర్లు తెరిచి రైతుల వద్ద నుంచి కూరగాయలు కొనుగోలు చేయాలని, వీటిని కిలో రూ.14కు తగ్గకుండా రైతులకు చెల్లించాలని ఆదేశించారు. ఈ కూరగాయలను ప్రభుత్వ వసతి గృహాలకు, మెస్‌లకు, ఇతర సంస్థలకు పంపే ఏర్పాట్లు చేయాలని సూచించారు. అధిక కమీషన్‌పై సీఎంకు ఫిర్యాదు వంటిమామిడి మార్కెట్లో ఏజెంట్లు 8% కమీషన్ వసూలు చేస్తున్నారని పలువురు రైతులు సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. మార్కెట్ సందర్శన సందర్భంగా పలువురు రైతులు తమ ఇబ్బందులను వివరించారు. 8 శాతం కమీషన్ వసూలుపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై 4 శాతం కమీషన్ మాత్రమే వసూలు చేయాలని ఆదేశించారు. కాగా, ఆలుగడ్డ ధర గణనీయంగా పడిపోయిన తీరుపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బిన్నీస్, టమాటా రైతులు కూడా తమ ఇబ్బందులను వివరించారు. సీఎం కేసీఆర్ వంటిమామిడి మార్కెట్ యార్డును సందర్శించిన సందర్భంగా రైతులతో ముచ్చటించారు. ఆ వివరాలు.. సీఎం: ఏం పెద్దమనిషి నీ పేరేంది? రైతు: మద్దికుంట కృష్ణమూర్తి. మాది తున్కిఖల్సా గ్రామం. వర్గల్ మండలం సీఎం: ఏ పంటలెక్కువ సాగు చేస్తవ్? రైతు: ఆలుగడ్డ ఎక్కువ సాగు చేస్త. సీఎం: గట్లనా.. నేను కూడా ఆలుగడ్డ సాగు చేసిన. విత్తనం ఎక్కడి నుంచి తెచ్చినవ్? రైతు: ఆగ్రా నుంచి తెచ్చిన సారూ.. 50 కిలోలకు రూ.3 వేల ధర పడ్డది. పోయినసారి వెయ్యి రూపాయలకే దొరికింది. సీఎం: అయ్యో గట్లనా.. నేను కూడా ఎక్కువ ధర పెట్టే విత్తనం కొన్న. ఆలుగడ్డ ధర ఎట్లుంది? రైతు: ఇన్నేండ్ల ఆలుగడ్డ సాగు లో నాకు లాసు ఎర్కలే. ఈ సారి మాత్రం లాసైతుంది సారూ.. 10 కిలోలకు రూ.80–110 అంటుండ్రు. గతంలో రూ.250 దాకా పలికేది. సీఎం: గంత తక్కువైందా..? అయితే లాసు కాకుండా ఏదైనా మార్గం ఆలోచిద్దాం. విత్తనాలు కూడా మీకు ఇక్కడే దొరికేటట్లు చేస్తా. మరో రైతుతో ఇలా.. సీఎం: నీ పేరేంది? ఏం చేస్తుంటవ్.. రైతు: పసుల స్వామి. మాది తున్కిమక్త, వర్గల్ మండలం. నేను రైతును, మార్కెట్లో కమీషన్ ఏజెంటును. సీఎం: ఆలుగడ్డ ధర ఎందుకు తగ్గింది? నీకేమైనా తెలుసా? రైతు: కొన్ని రోజుల దాకా ఈ మార్కెట్ నుంచి ఆలుగడ్డ విజయవాడ, ఖమ్మం, కర్ణాటకకు ఎగుమతి అయ్యేది. ఇప్పుడు ఎగుమతులు ఆగిపోయాయి. ధర తగ్గింది. సీఎం: ఇప్పుడు ధర ఎంత పలుకుతుంది ? రైతు: 10 కిలోలకు రూ.90–110 మాత్రమే పలుకుతుంది సార్. సీఎం: ఆలుగడ్డ ఎన్ని ఎకరాలల్ల సాగు చేసినవ్? రైతు: 16 ఎకరాలల్ల చేసిన సారూ.. ఈసారి నష్టం జరిగేటట్టుంది. సీఎం: ఏం రంది వడకుర్రి.. ఇబ్బందులు తీర్చే ప్రయత్నం చేస్తా. వంటిమామిడి మార్కెట్‌ను గొప్పగా తీర్చిదిద్దుతాం. దీనికి అనుబంధంగా తున్కిబొల్లారంలో కోల్డ్ స్టోరేజీని ఏర్పాటు చేస్తాం. సీజన్ ముందే తక్కువ ధరలో విత్తనాలు అందుబాటులో ఉండేలా చూస్తా. (సీఎం వీరిద్దరితోనే కాకుండా నెంటూరు గ్రామానికి చెందిన కిచ్చుగారి స్వామి, గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్‌కు చెందిన మల్లేశంతోనూ సంభాషించారు) -
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : నియంత్రిత సాగు విధానంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో నియంత్రిత సాగు విధానం అవసరం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం ప్రగతి భవన్లో వివిధ రకాల పంటల కొనుగోళ్లు సహా ఇతర సాగు అంశాలపై సమీక్ష జరిగిన సీఎం.. పంటల నియంత్రణ నిర్ణయంపై వెనక్కి తగ్గారు. రైతులు ఏ పంట వేయాలో ఇకపై వాళ్లదే నిర్ణయమని పేర్కొన్నారు. పంటల విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు ఉండవన్నారు. పంట కొనుగోలు ద్వారా మొత్తం రూ.7,500 కోట్లు నష్టం రావడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయం చట్టాకు అనుగుణంగా రైతులు పంటకు ఎక్కడ ఎక్కువ ధర వస్తే అక్కడే అమ్ముకోవచ్చని స్పష్టం చేశారు. గ్రామాల్లో పంట కొనుగోలు కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల రద్దు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా నియంత్రిత సాగు విధానం రాష్ట్రంలో తొలినుంచీ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై విపక్షాలతో సహా.. రైతుల సంఘాల నేతలు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రేపటి నుంచి రైతుబంధు అలాగే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు నగదు పంపిణీపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రేపటి (సోమవారం) నుంచి నగదు పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 61.49 లక్షల మంది రైతులకు ఈ పథకం వర్తించనుంది. ఎకరాకు రూ.5వేల చొప్పున రూ.7,515 కోట్లు పంట సాయం అందించనున్నారు. -
రైతుబంధు సమితి కన్వీనర్‌పై హత్యాయత్నం
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): రైతుబంధు సమితి కాల్వ శ్రీరాంపూర్ మండల కన్వీనర్ నిదానపురం దేవయ్యపై మంగళవారం అర్ధరాత్రి హత్యాయత్నం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని తన ఇంట్లో దేవయ్య నిద్రిస్తున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు ముసుగులు ధరించి, తలపులు తట్టారు. అన్న పిలుస్తున్నాడంటూ ఆయనను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లారు. జమ్మికుంటకు వెళ్లే రహదారి పక్కన దేవయ్యను కొట్టి, గాయపరిచారు. అనంతరం తుపాకీతో కాల్చేందుకు ప్రయత్నించగా ఆయన దాన్ని లాక్కొని, సమీపంలోని పొలాల్లోకి విసిరేశాడు. దేవయ్య కూతురు అరవడంతో దుండగులు పారిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఆర్అండ్బీ రహదారి పక్కన నూతనంగా ఇల్లు నిర్మించుకుంటున్నానని తెలిపారు. గ్రామానికి చెందిన కనకేశ్ అనే వ్యక్తితో భూ తగాదా ఉందని, అతనికి దారి ఎందుకు ఇవ్వడం లేదని కొందరు తనను తుపాకీతో కాల్చేందుకు ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కూతురు సౌమ్య అరవడంతో చుట్టపక్కల వారు నిద్రలేచారని, ఇంతలో వారు పారిపోయారని పేర్కొన్నారు. మండలంలో చర్చనీయాంశమైన ఘటన నిందితులు దేవయ్యను కాలుస్తామని బెదిరించింది బొయ్య తుపాకీతోనని పోలీసులు తెలిపారు. నిజమైనదే అయితే దేవయ్య ప్రాణాలు పోయేవని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆయనపై దాడి మండలంలో చర్చనీయాంశంగా మారింది. బాధితుడి ఫి ర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేశామని కాల్వ శ్రీరాంపూర్ ఎస్సై వెంకటేశ్వర్ తెలిపారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని, విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. -
రైతుల కళ్లలో ఆనందం
సాక్షి, మెదక్: ప్రస్తుతం కరోనా సమయంలో సైతం రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను నిలిపివేయకుండా వాటిని కొనసాగిస్తోందని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. రైతుబంధు కింద రూ.7,200 కోట్లు రైతుల ఖాతాల్లో జమయ్యాయని తెలిపారు. ప్రస్తుతం రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తోందని.. రానున్న రోజుల్లో రైతే రాజు అనేది నిజం కానుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం చెరువులో మంగళవారం ఆయన చేప పిల్లలను వదిలారు. మెదక్ కలెక్టరేట్లో జిల్లాలో కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలకు సంబంధించి వైద్యశాఖాధికారులతో సమీక్షించారు. అనంతరం వ్యవసాయ, విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల ప్రగతిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. రైతులు మబ్బులు కాకుండా డబ్బులను చూసి సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేసి.. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రైతుబంధు, 24 గంటల ఉచిత కరెంట్ సరఫరా, ఎరువులు, విత్తనాలు సకాలంలో అందజేయడంతో పాటు ఎప్పటికప్పుడు వారి ఖాతాల్లో రైతులకు డబ్బులు జమ చేసి రైతు ప్రభుత్వం అనిపించుకున్నామని పేర్కొన్నారు. దేశంలోనే తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా నిలుపుతామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. చేపలు, రొయ్యల ఎగుమతి దిశగా.. వర్షాకాలంలోనే కాకుండా ఎండా కాలంలో కూడా చెరువులు, కాల్వల్లో ఎల్లప్పుడూ నీరు ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మత్స్యకారులకు ప్రభుత్వం ఎంతగానో చేయూతనిస్తోందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐదారు చెరువుల్లో చేప పిల్లలను వదిలే వారు.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80 కోట్ల చేప పిల్లలను వదిలేందుకు చర్యలు చేపడుతున్నామని వివరించారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి చేపలు, రొయ్యలను ఎగుమతి చేసే దిశగా తమ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కాళేశ్వరం ద్వారా ఓటీ పెట్టడం వల్ల మత్స్యకారుల ఆర్థికాభ్యున్నతితో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని ఆశాభావం వ్యసక్తం చేశారు. మత్స్యకారులు దళారులను నమ్మకుండా చేపలను సొంతంగా మార్కెటింగ్ చేసుకునేలా అవసరమైన చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. కాగా, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణలో మెదక్ జిల్లా రోల్ మోడల్‌గా నిలిచిందని మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. -
‘రైతు బంధుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు’
సాక్షి, రాజన్న సిరిసిల్ల: రైతు బంధు ఎగ్గొడతారని ప్రతిపక్ష పార్టీల నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి కె.తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఆ ఆలోచన లేదని స్పష్టం చేశారు. రైతు బంధు పెట్టిన తరువాతనే దేశంలో ప్రధానమంత్రి పీఎం కిసాన్ యోజన పథకం ప్రవేశ పెట్టారని గుర్తు చేశారు. కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని సీఎం కేసీఆర్ ఆదుకుంటే కాంగ్రెస్ జాతీయ నాయకుడు అభిషేక్ సింగ్వీ అభినందించారని తెలిపారు. జిల్లా కేంద్రంలో మోడల్ రైతు బజారును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ... (చదవండి: ఆహ్లాదం అంచున అగాధం!) ‘ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టాలంటే దశాబ్దాలు గడిచేవి. కాళేశ్వరం మూడేళ్లలో పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది. ఏటికి ఎదిరీదినట్లు కాళేశ్వరం ప్రాజెక్టుతో 85 మీటర్ల నుంచి 618 మీటర్ల ఎత్తుకి నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఈ ఏడాది ఆర్థికంగా ఇబ్బందులున్నా ప్రభుత్వం 12 వందల కోట్ల రుణమాఫీ చేసింది. 52 లక్షల ఖాతాల్లో రైతు బంధు జమ చేశాం. కరోన సమయంలో భౌతిక దూరాన్ని పాటిస్తూ వ్యాపారాలు చేసుకునే విదంగా రైతు బజార్ నిర్మించాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగున్నప్పుడే తెలంగాణ బాగుంటుంది. నియంత్రిత సాగుకు కొందరు వక్ర భాష్యం చెప్తున్నారు. రాష్ట్రంలో అన్ని చోట్ల సమీకృత రైతు బజార్లు నిర్మిస్తాం. తెలంగాణ వ్యాప్తంగా మత్స్య పరిశ్రమ పెరుగుతోంది. నీలి విప్లవం రాబోతోంది. పౌల్ట్రీ రంగంలో అగ్రగామిగా ఉన్నాం. సిరిసిల్ల జిల్లాను ప్రయోగ కేంద్రంగా తీసుకోబోతున్నాం. సిరిసిల్లలో జరిగిన అభివృద్ధి అన్ని మున్సిపాలిటీల్లో జరుగుతుంది. సిరిసిల్ల నియోజకవర్గన్ని రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే అగ్రశ్రేణిలో నిలబెడతాను’అని మంత్రి పేర్కొన్నారు. (చదవండి: మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు వేయాలి: కేటీఆర్) -
చెప్పిన పంటలే వేయాలని సీఎం అనలేదు: కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల : రాష్ట్రంలోని అన్ని చెరువులు, కుంటలు నింపాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో గురువారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యాభై ఏళ్లలో ఎన్నడూ చూడని అద్భుత దృశ్యం ప్రస్తుతం చూస్తున్నామన్నారు. ఎర్రటి ఎండల్లో చెరువులు మత్తడి దుంకుతున్నాయన్నారు. ఒకప్పుడు సిరిసిల్ల ఎడారిలాగా ఉండేదని, ఇప్పుడు ఎక్కడ చూసినా నీళ్లు దూకి పొలాలు పచ్చగా కనిపిస్తున్నాయన్నారు. అన్నం తెలియదని వెక్కిరిచ్చిన వాళ్ల చెంపపై కొట్టేలా దేశానికే అన్నం పెట్టేలా తెలంగాణ రైతులు ఎదుగుతున్నారని ప్రశంసించారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం నుంచే అత్యధిక ధాన్యం కొనుగోళ్లు జరిగాయని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానే చెప్పిందని మంత్రి గుర్తు చేశారు. (తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు నోటీసులు) దేశంలో 70 ఏళ్లలో రైతుబంధు ఇచ్చే ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని మంత్రి కేటీఆర్ అన్నారు. కరోనా కష్టకాలంలో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా రైతులకు ఇబ్బందులు లేకుండా రైతు బంధు విడుదల చేశారని తెలిపారు. మిడ్ మానేరు నిండటంతో సిరిసిల్ల జిల్లాలో 6 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయని, దేశంలో ఇదే రికార్డు అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ముస్సోరీలోని సివిల్ సర్వీస్ ఐఎఎస్ అధికారులకు శిక్షణలో పాఠాలుగా బోధిస్తున్నారని, ఇది తెలంగాణ రాష్ట్రానికే గర్వ కారణమని కేటీఆర్ కొనియాడారు. కరెంటు మీద ఆధారపడకుండా 2 పంటలు పండించి చూపిస్తామని తెలిపారు. తెలంగాణ వచ్చాక ఇంత త్వరగా నీళ్లొస్తాయని ఎవరూ ఊహించలేదని, సముద్రానికి 82 మీటర్ల ఎత్తులో ఉన్న మేడిగడ్డ నుంచి గోదావరి జలాలను 618 మీటర్ల పైన కొండపోచమ్మకు గోదావరి జలాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చారని ప్రస్తావించారు. (తనకు వచ్చిన కష్టం మరొకరికి రాకూడదని) 1.25 కోట్ల ఎకరాల భూములకు సాగునీరిచ్చి రెండో హరిత విప్లవం తీసుకు వస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. గ్రామాల్లో రైతు బాగుంటే అన్ని కులవృత్తుల వారికి ఉపాధి దొరుకుతుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఒక రైతు బిడ్డ అని, ఆయనకు రైతుల సమస్యలు తెలుసని అన్నారు. రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి కూడా కేసీఆర్ పట్ల అపారమైన నమ్మకం ఉందన్నారు. ఏ ఒక్క పథకాన్ని ఎగ్గొట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదని, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రతీ గ్రామపంచాయతీకి తిరిగి ప్రతీ రైతుకు రైతుబంధు అందేలా చూడాలని సూచించారు. (ముత్తిరెడ్డిని కలిసిన ఏపీ టీడీపీ ఎమ్మెల్యే) జులై 15 తేదీ లోపు జిల్లాలో ఏ భూమిలో ఏ పంట వేశారో అధికారులు, ప్రజాప్రతినిధులు సమగ్ర నివేదిక అందించాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. రైతు బంధు విషయంలో కొంత మంది దుష్ప్రచారం చేస్తున్నారని, వారి మాటలు నమ్మొద్దని హితవు పలికారు. రైతుల కోసం ఎన్నో పనులు చేసిన కేసీఆర్ మించిన ముఖ్యమంత్రి లేరని, రైతులకు మద్ధతు ధరకు మించి డబ్బులు రావాలన్నదే సీఎం ఆలోచన అని పేర్కొన్నారు. వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకే నియంత్రిత పంటల విధానం తెచ్చామని, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు వేయడం వల్ల రైతు ధనవంతుడు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. తాను చెప్పిందే వేయాలని సీఎం కేసీఆర్ చెప్పడం లేదని, డిమాండ్ ఉన్న పంటలు వేసుకోవాలని చెబుతున్నారని పునరుద్ఘాటించారు. రైతు వేదికల ద్వారా అన్నదాతలను సంఘటితం చేసి బంగారు పంటలు పండేలా సమాలోచనలు చేసుకోవచ్చని రైతులకు కేటీఆర్ సూచించారు. -
రైతుబంధుకూ ‘లెక్కాపత్రం’
సాక్షి, హైదరాబాద్: రానున్న వానాకాలం, యాసంగి సీజన్లకు రైతుబంధు సొమ్ము విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. రెండు సీజన్లలో సీజన్‌కు ఎకరానికి రూ.5వేల చొప్పున ఇవ్వనున్న పెట్టుబడి సాయాన్ని నేరుగా రైతు ఖాతాల్లోకి ఈ–కుబేర్ ద్వారా జమ చేస్తామని, నిధుల లభ్యతను బట్టి తక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకు తొలి ప్రాధాన్యమిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం జనవరి 23, 2020న భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) ఇచ్చిన పట్టాదారుల రికార్డుల ఆధారంగా రైతుబంధు పంపిణీ చేస్తారు. కాగా, రైతుల ఖాతాల్లో నగదు జమయిన తర్వాత రికార్డులను ఆడిట్ టీంలు పరిశీలిస్తాయి. వ్యవసాయ శాఖ నియమించిన ఆడిటర్లు లేదా కాగ్ ప్రతినిధులు ఆడిటింగ్‌లో పాల్గొంటారు. నాబార్డు, కాగ్, ఆర్బీఐ నిబంధనలకనుగుణంగా తనిఖీలుంటాయి. ‘రైతుబంధు’ అమలుకు మార్గదర్శకాలివే.. ► ఈ ఆర్థిక సంవత్సరానికి అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించిన సమయంలో సీసీఎల్ఏ ఇచ్చిన రికార్డుల ఆధారంగా భూమి యజమానులకు మాత్రమే రైతుబంధు వర్తిస్తుంది. ఆ తర్వాత రికార్డుల్లో పేర్లు మారినా కొత్త రైతులకు మాత్రం మళ్లీ వానాకాలం నుంచే రైతుబంధు వర్తింపజేస్తారు. రబీలోనూ వీరిని పరిగణనలోకి తీసుకోరు. ► సీసీఎల్ఏ నుంచి ఏడాదికి ఒక్కసారే అర్హులైన రైతుల వివరాలు తీసుకుంటారు. అంటే జనవరి 23, 2020న తీసుకున్న రికార్డుల్లో మార్పులు చేయాలనుకుంటే ఏడాది వరకు ఆగాల్సిందే. ► గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఇచ్చిన జాబితా ఆధారంగా అటవీ భూములపై హక్కు పత్రాలు (ఆర్వోఎఫ్ఆర్)న్న రైతులకూ రైతుబంధు వర్తిస్తుంది. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం పాలితం గ్రామ హామ్లెట్ కాసులపల్లిలో రంగనాయకస్వామి దేవాలయ భూములను దీర్ఘకాలికంగా సాగు చేసుకుంటున్న 621 మంది రైతులకు కూడా ఆర్వోఎఫ్ఆర్ తరహాలో ప్రత్యేక కేసు కింద పరిగణించి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఇచ్చే విస్తీర్ణపు అంచనా మొత్తానికి రైతుబంధు వర్తింపజేస్తారు. ► ఒక రైతుకు సంబంధించిన భూమి రాష్ట్రంలో ఎక్కడున్నా సదరు రైతు ఆధార్ వివరాల ఆధారంగా అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటారు. ► గత మూడు సీజన్ల తరహాలోనే ఈ–కుబేర్ వ్యవస్థ ద్వారా నేరుగా రైతు ఖాతాల్లోకే నిధులు జమ చేస్తారు. ► ఆర్థిక శాఖ నుంచి రైతుబంధు నిధులు దశలవారీగా వస్తే.. తక్కువ విస్తీర్ణం ఉన్న రైతుల నుంచి ఎక్కువ విస్తీర్ణం ఉన్న రైతుల వరకు బిల్లులు ప్రాధాన్యతా క్రమంలో పాస్ అవుతాయి. ► ఎవరైనా రైతు పెట్టుబడి సాయం వద్దనుకుంటే మండల వ్యవసాయ విస్తరణాధికారి లేదా వ్యవసాయ అధికారికి ‘గివిట్ అప్’ దరఖాస్తు పూర్తిచేసి ఇవ్వాలి. తద్వారా రైతుబంధు పోర్టల్‌లో ఆ పట్టాదారు కాలమ్‌లో ‘గివిట్‌అప్’ అని నమోదుచేస్తారు. ► ఈ పథకం అమలు పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలో కమిటీ ఏర్పాటుచేశారు. కమిటీ చైర్మన్‌గా వ్యవసాయ శాఖ కార్యదర్శి, కన్వీనర్‌గా కమిషనర్, సభ్యులుగా ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి, రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్, రాష్ట్ర సమాచార అధికారి (ఎన్ఐసీ) ఉంటారు. ► కలెక్టర్ల మార్గదర్శనం మేరకు జిల్లాస్థాయిలో వ్యవసాయ అధికారులు పథకం అమలు బాధ్యతలు తీసుకుంటారు. ► మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఏర్పా టు చేసుకునే వ్యవస్థల ఆధారంగా, రెవెన్యూ శాఖతో సంప్రదింపులు జరుపుతూ జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో పథకం అమ లుకు సంబంధించిన ప్రతి వినతిని 30 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుంది. -
చిన్న రైతుకే తొలి సాయం!
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడి సాయాన్ని తక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకు ముందుగా ఇవ్వాలని వ్యవసాయ శాఖ భావిస్తోంది. పట్టాదారుల వివరాలను ఏఈఓలు నమోదు చేసిన వెంటనే చిన్న కమతాల నుంచి మొదలుపెట్టి పెద్ద కమతాల రైతులకు రైతుబంధు సొమ్మును జమ చేయనుంది. సీసీఎల్ఏ ఇప్పటికే జనవరి వరకు డిజిటల్ సంతకాలు అయిన పట్టాదారుల వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖకు సమర్పించింది. ఇందులో 59.30 లక్షల మంది పట్టాదారులుండగా, వీరికి 1.47 కోట్ల ఎకరాల విస్తీర్ణం ఉంది. ఆర్ఓఎఫ్ఆర్ రైతుల సంఖ్య, విస్తీర్ణం కలిపితే ఈ మొత్తం మరింత పెరుగుతుంది. సీసీఎల్ఏ ఇచ్చిన సమాచారంలో దాదాపు 8 లక్షల మంది రైతుల ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు లేవు. ప్రస్తుతం వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో వీటిని సేకరించే పనిలోఉన్నారు. ఒకట్రెండు రోజుల్లో ఈ ప్రక్రియ ముగియనున్నట్లు తెలుస్తోంది. పంటలు ఫ్రీజ్ చేసిన వివరాలతో రైతుబంధు సొమ్మును జమ చేయనుంది. తాజాగా సీసీఎల్ఏ మరో డేటాను వ్యవసాయ శాఖకు పంపినట్లు తెలిసింది. దీని ప్రకారం మునుపు ఇచ్చిన దానికంటే ఎక్కువ విస్తీర్ణం, ఎక్కువ పట్టాదారులు ఉన్నట్లు సమాచారం. సాగునీటి ప్రాజెక్టులకు, ఇతర వ్యవసాయేతర వాటికి బదలాయించిన భూములను ఇందులో నుంచి తీసివేసినట్లు తెలిసింది. ఈ వివరాలను వ్యవసాయ శాఖ ఏఈఓలకు అందుబాటులో ఉంచుతుందా లేదా అనేది తెలియాలి.