rangareddy distirict
-
ఫ్యూచర్‌సిటీ చుట్టుపక్కల గ్రామాల్లో వ్యవసాయ భూములపై దృష్టి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఫ్యూచర్‌సిటీ చుట్టూ ఉన్న గ్రామాల్లోని వ్యవసాయ భూములపై పలువురు ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారులు దృష్టి సారించారు. తమ సన్నిహితుల ద్వారా ఆయా గ్రామాల్లోని వ్యవసాయ పట్టా భూముల ధరలపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. వ్యవసాయానికి అనుకూలంగా, భూగర్భజలాలు పుష్కలంగా, ఎర్రటి నేలలున్న భూములను కొనుగోలు చేసి పెట్టాలని కోరుతున్నారు. రేవంత్‌రెడ్డి సర్కార్ యాచారం–కందుకూరు మండలాల సరిహద్దులో ఫ్యూచర్‌సిటీని నెలకొల్పడానికి సంకల్పించడం తెలిసిందే. కొంగరకలాన్ ఓఆర్ఆర్ నుంచి నిర్మించబోయే ఫ్యూచర్‌సిటీకి 300 అడుగుల రోడ్డు, మెట్రోరైలు మార్గానికి పచ్చజెండా ఊపింది. దీంతో భవిష్యత్తులో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందనే భావనతో వ్యవసాయ భూములు కొనుగోలు చేసి పెట్టుకోవాలని చూస్తున్నారు. కొద్ది రోజులుగా ఆయా గ్రామాల్లో తమ సన్నిహితులతో కలిసి వ్యవసాయ భూములను పరిశీలిస్తున్నారు. ఆ గ్రామాలపై ఫోకస్.. కందుకూరు మండల పరిధిలోని మీరాఖాన్‌పేట, ఆకులామైలారం, బెగరికంచె, ముచ్చర్ల, సాయిరెడ్డిగూడ, దాసర్లపల్లి, లేముర్, గూడూర్, యాచారం మండల పరిధిలోని నస్దిక్‌సింగారం, నందివనపర్తి, యాచారం, చౌదర్పల్లి, చింతుల్ల, కుర్మిద్ద, నానక్‌నగర్, తాడిపర్తి, నక్కర్తమేడిపల్లి గ్రామాల్లోని వ్యవసాయ భూములపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఆదిబట్ల, కొంగరకలాన్, మహేశ్వరం మండల పరిధిలోని రావిరాల, తుక్కగూడ తదితర గ్రామాల్లో వ్యవసాయ భూములకు ఎకరాకు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పైగా డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్‌సిటీకి సమీపంలోని యాచారం, కందుకూరు గ్రామాల పరిధిలోని గ్రామాల్లో ప్రస్తుతం రూ.50 లక్షల నుంచి రూ. 3 కోట్ల వరకు ధర పలుకుతోంది. చదవండి: మళ్లీ ‘రియల్’ డౌన్.. తెలంగాణ వ్యాప్తంగా తగ్గిన రిజిస్ట్రేషన్లు, రాబడులు ఫాంహౌస్లపై ఆసక్తి యాచారం, కందుకూరు మండలాల పరిధిలోని గ్రామాల్లో సారవంతమైన వ్యవసాయ భూములున్నాయి. భూగర్భ జలాలకు ఢోకా లేదు. అందుకే ఆయా గ్రామాల్లోని వ్యవసాయ భూములను కొనుగోలు చేసి ఫాంహౌస్‌లు నిర్మించుకుంటే భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంటుందనే నమ్మకం కొనుగోలుదారుల్లో ఉంది. అత్యధికంగా 5 నుంచి 10 ఎకరాల్లోపే కొనుగోలు చేసేలా దృష్టి సారించారు. ఫ్యూచర్‌సిటీపై భరోసాతో.. ఫ్యూచర్‌సిటీపై భరోసాతో సమీపంలోని గ్రామాల్లో వ్యవసాయ భూముల కొనుగోలుకు కొంత మంది పెద్దలు ఆసక్తి చూపిస్తున్నారు. కొందరైతే నేరుగా రైతులతోనే మాట్లాడుకుని వ్యవసాయ భూములను కొనుగోలు చేస్తున్నారు. – ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, రియల్ వ్యాపారి, హైదరాబాద్ -
రంగారెడ్డి: తుపాకీతో కాల్చుకుని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కొంగరకలాన్‌లో విషాదం చోటుచేసుకుంది. కలెక్టరేట్ కార్యాలయంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ బాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెల్లవారు జామున 3 గంటల సమయంలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.మృతుడి స్వగ్రామం రంగారెడ్డి జిల్లా మంచాల కాగా, 2018 బ్యాచ్‌కి చెందిన కానిస్టేబుల్‌గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇబ్రహీంపట్నంలో పరువు హత్య!
సాక్షి, రంగారెడ్డి: ఇబ్రహీంపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారం పరువు హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. నవ మాసాలు మోసి కన్న తన కూతురునే ఓ తల్లి కడతేర్చింది. దీంతో, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం దండుమైలారంలో పరువు హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డిగ్రీ మొదటి సంవత్సం చదువుతున్న భార్గవి, శశి అనే యువకుడు కొద్ది రోజలుగా ప్రేమించుకుంటున్నారు. ఇక, వీరి ప్రేమ విషయమై గత కొద్ది రోజులుగా కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరుగుతోంది. శశితో మాట్లాడటం, కలవడం మానేయాలని తన తల్లి జంగమ్మ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. భార్గవి ఇంట్లో ఉన్న ఉండగా శశి ఇటీవలే ఆమె ఇంటికి వచ్చాడు. ఈ విషయం భార్గవి తల్లికి తెలియడంతో వారి మధ్య మరోసారి గొడవ జరిగింది. ఈ సందర్బంగా శశినే పెళ్లిచేసుకుంటానని భార్గవి చెప్పడంతో జంగమ్మ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈలోపు.. సోమవారం భార్గవి తన ఇంట్లో విగతజీవిగా కనిపించింది. భార్గవిని ఎవరో చీరతో ఉరి వేసి చంపినట్టు ఆనవాళ్లను ఆమె సోదరుడు గుర్తించాడు. తన తల్లే భార్గవిని చంపినట్టు అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లి జంగమ్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక, శశి మృతిపై ఆయన తండ్రి మాట్లాడుతూ.. కన్న తల్లి ఎక్కడైనా కూతురును చంపుకుంటుందా?. భార్గవిని నా మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నాను. భార్గవి మాత్రం శశిని పెళ్లిచేసుకుంటానని చెప్పింది. నిన్న శశి మా ఇంటికి వచ్చాడు. నా భార్యను చూసిన వెంటనే ఇంట్లో నుంచి పారిపోయాడు. ఆ తర్వాతే ఇలా జరిగింది అని చెప్పారు. -
పెద్దమంగళారం 'పంచాయతీ టు అసెంబ్లీ'
సాక్షి, వికారాబాద్: మండల పరిధిలోని పెద్దమంగళారం రాజకీయ కీర్తిని ఘడించింది. ఉమ్మడి రాష్ట్రానికి ముగ్గురు ఎమ్మెల్యేలను అందించి రాజకీయ చరిత్రకెక్కింది. 1952, 1957లో షాబాద్ ఎమ్మెల్యేగా, 1959లో రెవెన్యూ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కొండా వెంకట రంగారెడ్డి పెద్దమంగళారం వాసి. 1978–82 మధ్యకాలంలో చేవెళ్ల ఎమ్మెల్యేగా ఉన్న చిరాగ్ ప్రతాప్‌లింగంగౌడ్, 1983–85 మధ్యకాలంలో చేవెళ్ల ఎమ్మెల్యే పదవిలో ఉన్న కొండా లక్ష్మారెడ్డి పెద్దమంగళారం పంచాయతీకి చెందినవారే. విలీనానికి వ్యతిరేకం కేవీఆర్.. 1890 డిసెంబర్ 12న పెద్దమంగళారంలో రైతు కుటుంబంలో జన్మించిన కొండా వెంకట రంగారెడ్డి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. జమీందార్లకు, జాగీర్దార్లకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఆయన రైతుల పక్షాన పోరాటం చేశారు. ఆ సమయంలో జైలు జీవితం సైతం అనుభవించారు. 1952–57 వరకు షాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. 1956లో హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రాలో విలీనం చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. పెద్దమనుషుల ఒప్పందంలో ఆయన కీలక భూమిక పోషించారు. 1959లో నీలం సంజీవరెడ్డి ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా పనిచేసిన ఆయన అనంతరం ఉపముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 1969లో తెలంగాణ ఉద్యమాన్ని లేవనెత్తి ప్రత్యేక రాష్ట్రంకోసం పోరాటం చేశారు. 1970 జూలై 24న ఆయన తుదిశ్వాస విడిచారు. ఇవి చదవండి: సీఎంను అందించిన భాగ్యనగరం! -
'చనిపోతున్నానంటూ తల్లికి వాట్సాప్ కాల్..' విషాద ఘటన..
హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ సమస్యలు తాళలేక తాను చనిపోతున్నానని తల్లికి వాట్సాప్ కాల్ చేసి ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. అనంతపురం జిల్లా, కొత్తపల్లి గ్రామానికి చెందిన జి.సతీష్‌కుమార్(42) ఫిలింనగర్ రోడ్ నెం.9లో కుటుంబంతో సహా నివాసం ఉంటున్నాడు. ఈ నెల 17న తన తల్లి అనసూయకు వాట్సాప్ కాల్ చేసిన అతను ఇంట్లో వేధింపులు ఎక్కువయ్యాయని ఆర్థిక ఇబ్బందులు కూడా దీనికి తోడయ్యాయని తాను చనిపోతున్నానని చెప్పాడు. తన కుమారుడు లిఖిత్తో పాటు అన్న కొడుకు వీరేంద్ర చౌదరి బాధ్యతలు తీసుకోవాలని తల్లికి కోరాడు. దీంతో ఆందోళనకు గురైన అనసూయ ఈ నెల 20న నగరానికి వచ్చి ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు. -
ఆన్లైన్ గేమ్‌లకు అలవాటు పడి.. చివరకు ఇలా..!
రంగారెడ్డి: ఆన్లైన్ గేమ్‌లు, దురలవాట్లకు బానిసై సులువుగా డబ్బులు సంపాదించేందుకు చోరీల బాటపట్టిన నలుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను కీసర పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 50 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, ల్యాప్‌టాప్, కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఎల్బీనగర్ సీపీ క్యాంప్ కార్యాలయంలో రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం... తమిళనాడు రాష్ట్రం, తిరునల్వేలి జిల్లా, నంగునేరికి చెందిన రామకృష్ణన్(35) పాత నేరస్తుడు. కొంత కాలం క్రితం హైదరాబాద్‌లోని జవహర్‌నగర్‌కు వలస వచ్చి చిరుధాన్యాల వ్యాపారం ప్రారంభించాడు. అదే ప్రాంతంలోని దేవేంద్రనగర్ కాలనీ చెందిన కాగ్ గోవింద్(36) స్థానికంగా బఠాణీలు, మరమరాలు వంటివి విక్రయించే షాపు నిర్వహిస్తున్నాడు. ► రామకృష్ణన్ తరుచూ గోవింద్ షాపు వద్దకు వచ్చేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఆన్లైన్ గేమ్‌లు ఆడేవారు. ఇద్దరూ పలు దురలవాట్లకు బానిసయ్యారు. అవసరమైన డబ్బులను సులువుగా సంపాదించేందుకు దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ► రామకృష్ణన్ తాను చోరీలు చేస్తానని, చోరీ సొత్తును ఇతర ప్రాంతాల్లో విక్రయించాలని గోవింద్‌కు పురమాయించాడు. రామకృష్ణకు కీసర, కుషాయిగూడ, జవహర్‌నగర్ పరిధిలోని ప్రాంతాలపై అవగాహన ఉండటంతో అక్కడ చోరీలు మొదలెట్టాడు. ► వీరికి అదే ప్రాంతానికి చెందిన బైక్ మెకానిక్ మహేందర్ పవార్(36), బాలాజీనగర్‌లో జ్యువెలరీ వర్క్ షాపు నిర్వహిస్తున్న బచ్చు సంతోష్(40) జత కలిశారు. రామకృష్ణన్ చోరీ చేసిన బంగారాన్ని గోవింద్‌కు ఇస్తే.. దానిని అతను మహేందర్ పవార్, సంతోష్‌లకు ఇచ్చి ఇతర ప్రాంతాల్లో అమ్మించేవాడు. వచ్చిన డబ్బును నలుగురూ పంచుకొనేవారు. ► రామకృష్ణన్ మంకీ క్యాప్, మాస్కు ధరించి తెల్లవారు జామున 3 నుంచి 4 గంటల సమయంలో బైక్‌పై కాలనీలో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇంటిని గుర్తించి దొంగతనం చేసేవాడు. బంధువుల ఇంట్లోనే దొంగతనం.. మహేందర్ పవార్ తన బంధువుల ఫంక్షన్‌కు వెళ్లాడు. ఈ విషయంపై రామకృష్ణన్‌కు సమాచారం ఇచ్చిన అతను బంధువుల ఇంట్లో ఎవ్వరూ లేరని, తాళం వేసి ఉందని చోరీ చేయమని చెప్పాడు. దీంతో రామకృష్ణన్ ఆ ఇంటి తాళం పగులగొట్టి లాకర్లో ఉన్న బంగారం, వెండి అభరణాలను చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కీసర పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టి నిందితులను సోమవారం తెల్లవారుజామున అరెస్టుచేశారు. వారి వద్ద నుంచి రూ. 50 లక్షల విలువైన బంగారం, వెండితో పాటు ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. రామకృష్ణన్‌పై 22 చోరీ కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు తెలిపారు. సమావేశంలో మల్కాజిగిరి ఎస్ఓటీ డీసీపీ గిరిధర్, కుషాయిగూడ ఏసీపీడీసీపీ వెంకట్‌రెడ్డి, కీసర సీఐ వెంకటయ్య ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
ఫార్మాసిటీ భూసేకరణ రద్దు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఫార్మా సిటీకి సంబంధించిన భూసేకరణ కేసులో ప్రకటన, అవార్డులు, పరిహారం డిపాజిట్ సహా తదుపరి అన్ని చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. మేడిపల్లి, కురిమిద్ద గ్రామవాసులైన 180 మంది పిటిషనర్ల నుంచి మళ్లీ అభ్యంతరాలను తీసుకొని, భూ సేకరణ ప్రారంభించాలని ఆదేశించింది. భూసేకరణలో చేపట్టాల్సిన కనీస విధానాన్ని కూడా పాటించకుండా అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడంపై అసహనం వ్యక్తం చేసింది. ఏదైనా భూమిని సేకరించేటప్పుడు అనుసరించాల్సిన విధానంపై 2017లో ప్రధాన కార్యదర్శి మెమోను జారీ చేసినా, దాన్ని అర్థం చేసుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని పేర్కొంది. పిటిషన్ వేసిన తర్వాత కూడా అధికారులు తమ తప్పును గుర్తించలేదని, తమ చర్యలను సమర్ధించుకునే ప్రయత్నం చేశా రని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియలో మూడేళ్లు గడిచినా ప్రతిష్టాత్మకమైన ఫార్మా సిటీ నిర్మాణం కూడా ముందుకుసాగలేదని పేర్కొంది. ఈ క్రమంలో ప్రభుత్వం 2020, జూలై 23న జారీ చేసిన భూసేకరణ ప్రకటనను కొట్టివేస్తున్నామని వెల్లడించింది. భూసేకరణ, పునరావాసం చట్టంలోని సెక్షన్ 15 కింద అభ్యంతరాలను 3 నెలల వ్యవధిలోగా తీసుకుని, మళ్లీ భూసేకరణ ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది. తీర్పు తేదీ ప్రామాణికంగా మార్కెట్ విలువ పేర్కొనాలి భూసేకరణ, పునరావాస చట్టప్రకారం తమకు ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వడం లేదని, ఇతర చర్యలు చేపట్టడం లేదని మేడిపల్లి, కురిమిద్ద గ్రామవాసులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎం.సుధీర్‌కుమార్ విచారణ చేపట్టి.. తీర్పు వెలువరించారు. పిటిషనర్ తరఫున రవికుమార్, ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ హరీందర్ పరిషద్ వాదనలు అందకుముందు వినిపించారు. ‘రెండు వారాల్లో పిటిషనర్లు అభ్యంతరాలను తెలియజేయాలి. అధికారులకు సహకరించాలి. ఈ తీర్పు తేదీని ప్రామాణికంగా తీసుకుని అధికారులు మార్కెట్ విలువ నిర్ణయించాలి. ఇరుపక్షాలు చర్చలతో ప్రయోజనాలను పొందాలి. 2015లోనే ప్రభుత్వం గ్రీన్ ఫార్మా సిటీ ప్రాజెక్టును చేపట్టేందుకు నిర్ణయించింది. చట్టపరమైన అడ్డంకులు, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కారణంగా ప్రభుత్వ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. చట్టాలు ఏం చెబుతున్నాయో కూడా ఐఏఎస్ అధికారులు అర్థం చేసుకోకపోవడం, భూసేకరణ చట్టాన్ని ఎలా అమలు చేయాలన్నది కూడా తెలియకపోవడం ఆక్షేపణీయం. దీని కారణంగానే రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి 2017, అక్టోబర్ 23న మోమో జారీ చేయాల్సి వచ్చింది. అందులో 2013 భూ సేకరణ చట్ట ప్రకారం.. సేకరణ సమయంలో అనుసరించాల్సిన విధానం ఏంటీ అన్నది చెబుతూ పలు మార్గదర్శకాలు వెల్లడించారు. పిటిషన్ వేసిన తర్వాత కూడా అధికారులు తమ తప్పును గ్రహించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గుడ్డిగా తమ నిర్ణయాన్ని సమర్థిస్తూ వచ్చారు. దీని కారణంగా ఎంతో విలువైన కోర్టు సమయం మూడేళ్లుగా వృథా అవుతూ వచ్చింది’అని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది. -
కండక్టర్ బలవన్మరణం!
రంగారెడ్డి: అనారోగ్య సమస్యలు భరించ లేక ఓ ఆర్టీసీ కండక్టర్ పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆలూరులో సోమవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన కుమ్మరి ప్రభాకర్(39) ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన కొన్ని రోజులుగా కడుపునొప్పి తదితర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగానికి కూడా వెళ్లడం లేదు. ఆయన భార్య నవనీత తన పిల్లలతో సహా పుట్టింట్లోనే ఉంటోంది. ఈ నెల 23న ప్రభాకర్ భార్యాపిల్లలను చూసి మధ్యాహ్నం స్వగ్రామానికి వచ్చాడు. సోమవారం ఉదయం పురుగు మందు సేవించి వచ్చి ఇంటి ఎదుట పడిపోవడంతో స్థానికులు గమనించి చేవెళ్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రంగారెడ్డి: భార్యకు కరెంట్ షాక్ పెట్టిన తాగుబోతు
క్రైమ్: ప్రేమించి ఆమెను పెండ్లి చేసుకున్నాడు. పదేళ్లు కాపురం కూడా చేసి పిల్లల్ని కన్నాడు. కానీ, మద్యం మత్తులో కుటుంబాన్ని ఆగం చేస్తూ వచ్చాడు. అయితే భర్త, బిడ్డలూ బాగుండాలని మద్యం తాగొద్దని బతిమాలిందామె. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. చివరకు కోపంతో ఆమెను కిరాతకంగా హతమార్చాడు భర్త. రంగారెడ్డి షాద్‌నగర్‌లో దారుణం జరిగింది. మద్యం తాగొద్దని అన్నందుకు కోపంతో నిద్రలో ఉన్న భార్యకు కరెంట్ షాక్ పెట్టాడు ఓ తాగుబోతు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పదేళ్ల కిందట.. కవిత, యాదయ్యలు ప్రేమవివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే.. యాదయ్య పోనుపోను మద్యానికి బానిస అయ్యాడు. ఈ క్రమంలో ఆ అలవాటు మానుకోవాలని ఆమె కోరింది. పంచాయితీలు జరగ్గా.. పెద్దలు ఆమెకు సర్దిచెప్పి పంపించారు. ఈ క్రమంలో ఆమెపై కోపం పెంచుకుని కిరాతకంగా చంపాడు. అనంతరం మత్తు దిగడంతో.. భయంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కరెంట్ షాక్‌తో చనిపోయిందని అబద్ధపు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు అనుమానంతో తమదైన శైలిలో ప్రశ్నించగా.. నిజం ఒప్పుకున్నాడు. ఈ ఘటనపై కొండుర్గు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తమ బిడ్డను అన్యాయంగా బలిగొన్నాడంటూ కవిత కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇదీ చదవండి: తాగనికి పైసల్లేవని ఆ తాత ఏం చేశాడంటే.. -
అమిత్‌షా చేవెళ్ల సభపై రాజకీయ వేడి
-
‘నాన్న.. అమ్మను కొట్టకు బాగా చూసుకో.. నేనింక బ్రతకను..’
తన భవిష్యత్తు కలలను విధి చిదిమేసింది. తన జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న చిన్నారిని ఛాతినొప్పి రూపంలో మృత్యువు వెంటాడింది. దీంతో, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అకాల మరణం పొందింది. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. అయితే, చివరి నిమిషాల్లో ఆమె మాటలు అందరినీ కన్నీరుపెట్టిస్తున్నాయి. వివరాల ప్రకారం.. జిల్లేడుగూడెం మండలం గుర్రంపల్లి గ్రామానికి చెందిన గడ్డ మీది కృష్ణయ్య, నీలమ్మ దంపతుల కుమార్తె నవనీత(13). ఆమె ప్రస్తుతం ఎనిమదో తరగతి చదువుతోంది. నవనీత పేరెంట్స్ మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, స్కూల్‌కు వెళ్లిన నవనీత.. ఒక్కసారిగా అస్వస్థతకు గురైంది. క్లాస్‌లో ఉన్న సమయంలోనే ఛాతిలో నొప్పి వస్తోందంటూ ఇంటికి తిరిగి వచ్చేసింది. ఈ విషయంలో తల్లిదండ్రులకు చెప్పడంతో.. ఆమెను వెంటనే షాద్‌నగర్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ సందర్బంగా ఆసుపత్రిలోని డాక్టర్లు నవనీతకు ప్రాథమిక వైద్యం అందించారు. చికిత్స సందర్భంగా చిన్నారి గుండెకు సంబంధించిన సమస్య ఉందని.. వెంటనే ఆమెను హైదరాబాద్‌లోని మరో ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. వైద్యుల సూచనల మేరకు తమ కుమార్తెను నిలోఫర్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ నవనీత శనివారం రాత్రి చనిపోయింది. దీంతో, ఆమె పేరెంట్స్ కన్నీటిపర్యంతమయ్యారు. తమ బిడ్డను కాపాడుకోలేకపోయామని ఆవేదనకు గురయ్యారు. ఇదిలా ఉండగా.. నీలోఫర్‌లో నవనీత చికిత్స పొందుతున్న సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆవేదనకు గురిచేశాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో నవనీత మాట్లాడుతూ..‘నాన్న అమ్మని బాగా చూసుకో.. అమ్మను కొట్టకు.. తిట్టకు. నేనింక బ్రతకను.. చనిపోతున్నాను. నా గురించి మర్చిపోండి’ అని కన్నీరుపెట్టుకుంది. ఆమె మాటలకు తండ్రి ధైర్యం చెబుతూ.. నీకేం కాదమ్మా.. అలా అనొద్దు అని చెబుతూనే కన్నీరు పెట్టుకున్నారు. ఇది చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. -
కేసీఆర్ సర్కార్ కాసుల వేట.. అసైన్డ్ భూములపై స్పెషల్ ఫోకస్!
సాక్షి, సిటీబ్యూరో: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్ర సర్కారు కాసుల వేట సాగిస్తోంది. ఖజానా నింపుకునేందుకు అసైన్డ్ భూములను అన్వేషిస్తోంది. వ్యవసాయేతర అవసరాలకు మళ్లిస్తున్న భూములను సేకరించి.. లేఅవుట్లుగా అభివృద్ధి చేసే దిశగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తోంది. ధరలు ఆకాశాన్నంటడంతో.. - రాజధానికి చేరువలో ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. పారిశ్రామికాభివృద్ధి, ఐటీ కంపెనీల తాకిడితో ఈ రెండు జిల్లాల్లో నగరీకరణ శరవేగంగా జరుగుతోంది. దీంతో స్థిరాస్తి రంగం మూడు పూలు ఆరు కాయలుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే అసైన్డ్ భూములు సైతం పరాదీనమవుతున్నాయి. భూమిలేని నిరుపేదలకు జీవనోపాధి నిమిత్తం వివిధ దశల్లో రాష్ట్ర ప్రభుత్వం భూములను పంపిణీ (అసైన్మెంట్) చేసింది. - ఈ భూములను వ్యవసాయ సాగుకు మాత్రమే వినియోగించుకోవాలని నిర్దేశించింది. ఒకవేళ ఇతర అవసరాలకు మళ్లించినా.. క్రయ విక్రయాలు జరిపినా చట్టరీత్యా నేరం. ఇవేమీ పట్టని కొందరు ఈ భూములను యథేచ్ఛగా విక్రయించారు. బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే కారుచౌకగా ఈ భూములు అందుబాటులో ఉండడంతో బడాబాబులు, ప్రజాప్రతినిధులు ఇబ్బడిముబ్బడిగా కొనుగోలు చేశారు. - ఇలా అసైన్మెంట్ చట్టాన్ని ఉల్లంఘించినా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో ఈ భూములక్రయ విక్రయాలకు అడూ అదుపూ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే అన్యాక్రాంతమవుతున్న అసైన్డ్ భూములను గుర్తించిన ప్రభుత్వం.. వీటిని ప్లాట్లుగా అభివృద్ధి చేయడం ద్వారా నిధుల సమీకరించుకోవాలనే ఆలోచన చేసింది. నగరానికి సమీపంలో ఉన్న ఈ తరహా భూములను గుర్తించి.. వాటిని లేఅవుట్లుగా అభివృద్ధి చేసి వేలం వేయాలని నిర్ణయించింది. ఈ అభివృద్ధి చేసిన భూమిలో ఎకరాకు 600 చదరపు గజాలను అసైన్డ్‌దారులకు ఇచ్చే విధంగా ప్రణాళికను రూపొందించింది. గజం రూ.40 వేల చొప్పున.. - ఉప్పల్ భగాయత్‌లో పట్టాదారుల భాగస్వామ్యంతో సేకరించిన హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) లేఅవుట్లుగా అభివృద్ధి చేసింది. దీంట్లో డెవలప్ చేసి ఎకరాకు వేయి గజాల చొప్పున పట్టాదార్లకు కేటాయించింది. ఇదే పద్ధతిని అసైన్డ్ భూములకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా మార్గదర్శకాలను ఖరారు చేసి భూములను గుర్తించాలని కలెక్టర్లకు లేఖ రాసింది. ఈ మేరకు చర్లపటేల్ గూడ, కుర్మల్‌గూడ, తొర్రూర్, కవాడిపల్లి, చందానగర్, మునగనూరు, కొల్లూరు, పసుమాముల, తుర్కయంజాల్, లేమూరు, కొల్లూరులలో దాదాపు 3వేల ఎకరాలను ప్రాథమికంగా ఎంపిక చేసింది. - సేకరిస్తున్న అసైన్డ్ భూములకు ఆయా ప్రాంతాల్లో ఉన్న విలువ ఆధారంగా ఎకరాకు 600 గజాల నుంచి 800 వరకు ఇవాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రైవేటు భూములతో పోలిస్తే అసైన్డ్ భూములకు ధర తక్కువ. వీటి క్రయవిక్రయాలపై నిషేధం ఉన్నందున.. ఇవి ఎకరాకు రూ.25 లక్షలు కూడా లభిస్తున్నాయి. - ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న సర్కారు వీటిని లేఅవుట్లుగా అభివృద్ధి చేయడం ద్వారా గజాన్ని సగటున రూ.40వేల చొప్పున విక్రయించవచ్చని అంచనా వేస్తోంది. దీంతో అటు అసైన్డ్‌దారులు.. ఇటు ప్రభుత్వానికి ఉభయతారకంగా లబ్ధి చేకూరుతుందని భావిస్తోంది. ఎన్నికల సంవత్సరం కావడం.. సంక్షేమ పథకాలకు నిధులు భారీగా అవసరం ఉండడంతో సాధ్యమైనంత త్వరగా అసైన్డ్ భూములను సేకరించి వెంచర్లుగా అభివృద్ధి చేసి నిధులను సమకూర్చుకోవాలనుకుంటోంది. దీంతో ఈ ప్రక్రియను వడివడిగా పూర్తి చేయాలని కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. -
అండలేని తాండా - బతుకు చిత్రం
-
పేదల సంక్షేమమే లక్ష్యం
మంచాల: పేదల సంక్షేమమే తన లక్ష్యమని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ప్రజాప్రస్థానంలో భాగంగా ఆమె చేపట్టిన పాదయాత్ర శనివారం రంగారెడ్డి జిల్లా మంచాల మండల పరిధిలోని జాపాల, రంగాపూర్, చీదేడ్, దాద్‌పల్లి గ్రామాల మీదుగా సాగింది. జాపాలలో మహిళలు ఆమెకు తిలకం దిద్ది స్వాగతం పలికారు. ఈ సందర్భంగా షర్మిల కుండలు తయారు చేస్తున్న కుమ్మరులను కలసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రంగాపూర్‌లో పొలం వద్ద రైతులతో ముచ్చటించారు. దాద్‌పల్లిలో గిరిజన మహిళలు బహూకరించిన లంబాడీ దుస్తులు ధరించి వారితో కలసి ఆడిపాడారు. చీదేడ్‌లో మాటాముచ్చట కార్యక్రమంలో ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఆయా వర్గాలనుద్దేశించి ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ నియంత పాలన పోవాలంటే.. రాజన్న రాజ్యం రావాలంటే అంతా వైఎస్సార్ తెలంగాణ పార్టీకి అండగా ఉండి ఆశీర్వదించాలని అన్నారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్మెంట్, రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు అందించిన ఘనత వైఎస్సార్‌దేనన్నారు. కేసీఆర్ ఏడేళ్ల పాలనలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు. పేదలకు పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు, రేషన్ కార్డులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చి రాష్ట్రాన్ని నట్టేట ముంచారని మండిపడ్డారు. కరోనా సమయంలోనూ సామాన్య, పేద ప్రజలను ఆదుకోలేని దుస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందన్నారు. మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందన్నారు. ఆత్మహత్యలు లేని తెలంగాణ, సామాజిక న్యాయం కావాలంటే వైఎస్సార్ టీపీ రావాలన్నారు. సేవ చేసేందుకే మీ ముందుకు వచ్చానని.. అందరి కోసం పోరాడతానని పేర్కొన్నారు. అందరికీ ఉచితంగా విద్య, వైద్యం, ఉపాధి అందే వరకు ఉద్యమిస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు పిట్టా రాంరెడ్డి, ఏçపూరి సోమన్న, వేణుగోపాల్‌రెడ్డి, అమృతసాగర్, మాదగోని జంగయ్య గౌడ్, నేనావత్ శ్రీనివాస్, నియోజకవర్గ నాయకులు జయరాజ్, భాస్కర్, మహేశ్, నందకుమార్, జంగయ్య గౌడ్, వేణు ప్రసాద్, మహేందర్, శ్రీకాంత్, నగేశ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
చినజీయర్ ఆశ్రమానికి కేసీఆర్
శంషాబాద్ రూరల్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సతీసమేతంగా సోమవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ శ్రీరామనగరంలోని జీవా ప్రాంగణంలో ఉన్న ఆశ్రమంలో శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామిని కలిశారు. ఈ సందర్భంగా వేద పండితులు సీఎంకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. సీఎం దంపతులను జీయర్‌స్వామి శాలువాతో సత్కరించి ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆశ్రమంలోని నిత్యాన్నదాన సత్రంలో సీఎం కేసీఆర్ సహపంక్తి భోజనం చేశారు. ఆ తర్వాత యాద్రాది ప్రారంభోత్సవంపై జీయర్ స్వామితో సీఎం కేసీఆర్ చర్చించారు. శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల నేపథ్యంలో గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ఎంపీ జోగినిపల్లి సంతోశ్‌కుమార్ పిలుపు మేరకు ఆశ్రమ ఆవరణలో జీయర్‌స్వామితో కలసి సీఎం కేసీఆర్ ఐదు జమ్మి మొక్కలను నాటారు. ‘ఊరు ఊరుకు జమ్మి–గుడి గుడికి జమ్మి’పేరిట ఎంపీ సంతోశ్ చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని చినజీయర్ స్వామి కొనియాడారు. హైందవ సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉన్న జమ్మి చెట్టును జాతీయ స్థాయిలో ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తున్న ఆయనకు శ్రీమన్నారాయణ ఆశీస్సులు ఉండాలని జీయర్‌స్వామి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మైహోం గ్రూప్ అధినేత, టీటీడీ బోర్డు సభ్యుడు జూపల్లి రామేశ్వర్రావు, కావేరి సీడ్స్ అధిపతి భాస్కర్‌రావు, కలెక్టర్ అమెయ్ కుమార్, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఆర్డీఓ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. యాద్రాది పర్యటన రద్దు.. ముచ్చింతల్ నుంచి చినజీయర్ స్వామితో కలసి సీఎం కేసీఆర్ యాద్రాది వెళ్లాలని నిర్ణయించుకోగా.. జీయర్‌స్వామి చాతుర్మాస దీక్షలో ఉన్నందును సాధ్యపడలేదు. నవంబర్ 19 నాటికి స్వామి దీక్ష పూర్తికానుంది. ఆ తర్వాతనే జీయర్ స్వామి యాద్రాదిని సందర్శించే అవకాశాలున్నాయి. కార్యక్రమం వాయిదా పడటంతో సీఎం తిరిగి గజ్వేల్‌లోని ఫాంహౌస్‌కు వెళ్లిపోయారు. జమ్మి మొక్క నాటుతున్న చినజీయర్‌స్వామి, సీఎం కేసీఆర్. చిత్రంలో ఎంపీ సంతోష్‌కుమార్ -
వ్యాక్సినేషన్ ప్రజా ఉద్యమంలా రూపొందాలి
శంషాబాద్ రూరల్: కరోనాపై పోరాడేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే ప్రత్యామ్నాయమని, వ్యాక్సినేషన్ ప్రజా ఉద్యమంలా రూపుదాల్చాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. స్వర్ణ భారత్ ట్రస్టు ఆధ్వర్యంలో తెలంగాణ, ఏపీల్లో మూడు కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కోవాగ్జిన్ ఉచిత టీకా పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ సమీపంలో ఉన్న ట్రస్టు ఆవరణలో వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అతి పెద్ద టీకా పంపిణీ కార్యక్రమం చేపట్టిందని, ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. టీకాకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న అపోహలు వీడాలని కోరారు. దేశీయంగా తయారీతో తగ్గిన ఖర్చు: దేశీయంగా టీకాలను ఉత్పత్తి చేయడం ద్వారా ఖర్చు తగ్గడమే కాకుండా అన్ని ప్రాంతాలకు టీకాలు అందించే వీలుంటుందని భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్లా అన్నారు. హైదరాబాద్‌తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లోని కేంద్రాల నుంచి కోవాగ్జిన్ టీకాను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సతీమణి ఉష పాల్గొన్నారు. -
బతికున్న మహిళ పేరిట రైతు బీమా : కో ఆర్డినేటర్ లీలలు
-
వేలానికి వేళాయె.. త్వరలో అసైన్డ్ భూముల వేలం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో పన్నేతర ఆదాయం కింద భారీగా 30 వేల కోట్ల రూపాయలను ప్రతిపాదించిన ప్రభుత్వం... ఆ నిధుల సమీకరణకు ఉద్యుక్తమవుతోంది. అందులో భాగంగా రాజధాని శివార్లలోని అసైన్డ్ భూముల అమ్మకం వ్యవహారంపై దృష్టి సారించింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు, మహేశ్వరం, శంషాబాద్, గండిపేట మండలాల్లో క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి అమ్మకానికి అనువుగా ఉన్నాయని గుర్తించిన 1,636 ఎకరాల భూమిని ప్రభుత్వం త్వరలోనే వేలానికి పెట్టనున్నట్లు సమాచారం. ఈ భూముల అమ్మకాల ద్వారా రూ.4 వేల కోట్ల దాకా వస్తాయని తొలుత అంచనా వేశారు. కానీ ప్రస్తుతం పెరిగిన మార్కెట్ ధరల ప్రకారం రూ.5 వేల కోట్ల వరకు రావొచ్చని రెవెన్యూ అధికారులు లెక్కలు గడుతున్నారు. వీటికి తోడు గండిపేట మండలం పుప్పాలగూడ గ్రామంలో ఖాళీగా ఉన్న మరో 188 ఎకరాల ప్రభుత్వ భూమిని విక్రయిస్తే రూ.3,500 కోట్ల వరకు సమకూరే అవకాశాలున్నాయి. ఈ లెక్కన అసైన్డ్ భూముల అమ్మకాల ద్వారా తొలివిడతలో రూ.8,500 కోట్ల వరకు రాబట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. లబ్ధిదారులకు నష్టం లేకుండా వాస్తవానికి నగర శివార్లలో ప్రభుత్వం వేలాది ఎకరాలను పలు దశల్లో పేదలకు అసైన్ చేసింది. ఎలాంటి ఆసరాలేని సదరు పేదలు ఈ భూముల్లో వ్యవసాయం చేసుకుని ఉపాధి పొందాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అయితే ఈ భూములు కొన్ని వ్యవసాయానికి అనుకూలంగా లేకపోవడం, పేదలు తమ అవసరాలకు భూములను ఇతరులకు విక్రయించడంతో... ఇప్పుడు ఎక్కువ భూములు అటు ప్రభుత్వం దగ్గర, ఇటు అసైన్డ్‌దారుల దగ్గర కాకుండా థర్డ్‌పార్టీ చేతిలో ఉన్నాయి. ఇలాంటి భూములెన్ని ఉన్నాయన్న లెక్క భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా ఇదివరకే ఓ కొలిక్కి వచ్చింది. హైదరాబాద్ శివార్లలో ఉన్న రంగారెడ్డి జిల్లా పరిధిలోని కొంగరఖుర్దు, మాదాపూర్, రావిర్యాల, తుమ్మలూరు, రాయన్నగూడ గ్రామాల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా సర్వే చేయించింది. ఈ గ్రామాల్లో అసైన్ చేసిన భూముల్లో అన్యాక్రాంతమైనవి, నిరుపయోగంగా ఉన్నవి కలిపి మొత్తం 1,636 ఎకరాలు అమ్మకానికి అనువుగా ఉన్నాయని తేల్చింది. గత ఏడాది కేవలం సర్వేకు మాత్రమే పరిమితమైన ప్రభుత్వం ఇప్పుడు ఈ భూములను వేలం వేయడం లేదా బహుళ జాతి సంస్థలకు విక్రయించే ప్రతిపాదనను సీరియస్‌గా పరిశీలిస్తోందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను మరోమారు తెప్పించుకున్న ఉన్నతాధికారులు దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని రెవెన్యూవర్గాలు చెపుతున్నాయి. అయితే అసైన్డ్ చేసిన పేదలకు నష్టం కలగకుండా ఈ భూములను స్వాధీనం చేసుకోవాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అసైనీల చేతిలో ఉన్నప్పటికీ వారు వ్యవసాయం చేయకుండా ఉన్న భూములు, అసైనీలు ఇతరులకు అమ్ముకున్న భూములను తీసుకోవాలని, ఈ క్రమంలో అసైనీలకు లేదంటే థర్డ్‌పార్టీకి మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని యోచిస్తోంది. ఇందుకు గాను రూ.1,200 కోట్ల వరకు ఖర్చవుతుందని కూడా రెవెన్యూ శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. పద్దు పూడాలంటే... అమ్మాల్సిందే! రాష్ట్ర ప్రభుత్వం 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ ఏడాది మార్చి 18న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో పన్నేతర ఆదాయం పద్దు కింద రూ.30,557 కోట్లను చూపెట్టింది. కానీ గత మూడేళ్ల లెక్కలను పరిశీలిస్తే ఎప్పుడూ పన్నేతర ఆదాయం రూ.10 వేల కోట్లను దాటలేదు. 2018–19లో రూ. 10,007 కోట్లు, 2019–20లో రూ.7,360 కోట్లు, 2020–21లో అయితే రూ.5వేల కోట్లు దాటలేదు. గత ఆర్థిక సంవత్సరంలో కూడా పన్నేతర ఆదాయం కింద రూ. 30,600 కోట్లు పద్దు చూపెట్టినా అందులో ఆరో వంతు మాత్రమే వచ్చింది. గత ఏడాదిలోనూ ప్రభుత్వ భూముల అమ్మకం ప్రతిపాదనలున్నప్పటికీ అమల్లోకి రాకపోవడంతో పన్నేతర ఆదాయం పెరగలేదు. ఈ నేపథ్యంలో 2021–22 ఆర్థిక సంవత్సరంలో కూడా రూ. 30,557 కోట్లను పన్నేతర పద్దు కింద ప్రభుత్వం చూపెట్టడంతో ఈసారి భూముల అమ్మకాలు అమల్లోకి వస్తాయని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. ఈ పరిస్థితుల్లోనే నగర శివార్లలోని అసైన్డ్ భూముల అమ్మకాల ప్రతిపాదన ఫైలును మరోమారు ప్రభుత్వం తెరుస్తోంది. భూములు అమ్మకాల తొలిదశలో భాగంగా ఈ అసైన్డ్ భూములతో పాటు మరో 188 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేయడం లేదంటే బహుళ జాతి సంస్థలకు నిర్దేశిత ధరకు విక్రయించడం చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. అమ్మకానికి అనువుగా ఉన్నాయని తేల్చిన అసైన్డ్ భూముల లెక్క ఇది గ్రామం ఎకరాలు ఆదాయం అంచనా (రూ.కోట్లలో) మాదాపూర్ 243.35 243 రావిర్యాల 281.19 843 తుమ్మలూరు 418.01 1254 రాయన్నగూడ 69.09 48.30 కొంగరఖుర్దు 435.18 1,196 (ఇవి గాక గండిపేట మండలం పుప్పాలగూడ గ్రామంలో 188 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని అమ్మితే రూ.3,500 కోట్లు వస్తాయని రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.) చదవండి: సీరియస్‌గా ఉంటేనే అడ్మిషన్ -
గుంతలో మొసలి.. జడుసుకున్న కూలీలు!
మర్పల్లి: వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం బిల్కల్ గ్రామంలోని ఓ ఫాంహౌస్‌లో షెడ్డు నిర్మాణం కోసం తీసిన పిల్లర్ గుంతలోకి మొసలి వచ్చింది. సోమవారం ఉదయం ఈ ఘటన వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి.. బిల్కల్లో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి ఫాంహౌస్ ఉంది. అందులో షెడ్డు నిర్మాణం కోసం కూలీలు పిల్లర్ గుంతలు తీస్తున్నారు. ఈ క్రమంలో సుమారు 200 కిలోల బరువున్న మొసలి ఉదయం ఓ పిల్లర్ గుంతలో కనిపించడంతో కూలీలు భయాందోళనకు గురయ్యారు. సర్పంచ్ శ్రీనివాస్ ఫారెస్టు అధికారులకు దీనిపై సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పిల్లర్ గుంతలో ఉన్న మొసలిని పైకి తీసి తాళ్లతో బంధించారు. బంట్వారం ఫారెస్టు సెక్షన్ అధికారి ఫరీద్ ఆధ్వర్యంలో మొసలిని సంగారెడ్డి జిల్లాలోని మంజీరా ప్రాజెక్టుకు తరలించి అందులో వదిలేశారు. బిల్కల్ గ్రామ సమీపంలోని మిలిగిరిపేట్ చెరువులోంచి మొసళ్లు వస్తున్నాయని సర్పంచ్ శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటికే మూడుసార్లు ఫారెస్టు అధికారులు మొసళ్లను బంధించి ప్రాజెక్టులో వదిలేశారని పేర్కొన్నారు. మొసళ్లు గ్రామాల్లోకి రాకుండా మిలిగిరిపేట్ చెరువు చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చదవండి: ఆ పక్షులు మంటలో దూకి ప్రాణాలు విడుస్తాయి -
నష్టాలు వచ్చాయని.. రియల్టర్ ఆత్మహత్య
సాక్షి, చేవెళ్ల: ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఓ రియల్టర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. చేవెళ్ల మండలంలోని కందవాడ గ్రామానికి చెందిన వడ్ల అంజన్‌చారి (35) కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలతో అతడు చేవెళ్లలోని టీచర్స్ కాలనీలో నివాసముంటున్నాడు. అయితే కరోనా కారణంగా వ్యాపారం పూర్తిగా దెబ్బతినటంతో అంజన్‌చారికి ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. అతని వద్ద పెట్టుబడులు పెట్టిన వారంతా తిరిగి డబ్బులు అడుగుతుండటంతో కొన్నిరోజులుగా ఆందోళనలో ఉన్నాడు. ఆగస్టు 31న ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన అంజన్‌చారి తిరిగి రాలేదు. ఫోన్ కూడా పనిచేయకపోవడంతో అదే రోజు రాత్రి భార్య మమత దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఐదు రోజుల తర్వాత శనివారం చేవెళ్ల మండల కేంద్రం నుంచి కందవాడ గ్రామానికి వెళ్లే దారి వైపున్న వెంచర్ వద్ద ఓ వ్యక్తి పురుగుల మందు తాగి మృతి చెందినట్లుగా గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో అక్కడికి వెళ్లి పరిశీలించిన పోలీసులు.. అంజన్‌చారిదే ఆ మృతదేహమని గుర్తించారు. మృతదేహం కుళ్లి ఉండటంతో అంజన్‌చారి ఇంట్లో నుంచి వెళ్లిన రోజునే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని చేవెళ్ల ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద లారీ బీభత్సం
సాక్షి, రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద మంగళవారం లారీ బీభత్సం సృష్టించింది. బైక్‌ను ఢీకొట్టిన లారీ, ఆ తర్వాత ట్రాన్స్ ఫార్మర్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ట్రాన్స్ ఫార్మర్ ను ఢీకొట్టడంతో లారీ డ్రైవర్ క్యాబిన్ లో చిక్కుకున్నాడు. డ్రైవర్ ను బయటకు తీసేందుకు స్థానికులు శ్రమిస్తున్నారు. -
లాక్డౌన్: 1,270 వాహనాలు సీజ్
సాక్షి, రంగారెడ్డి: కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం అమలుచేస్తున్న లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తున్న వారిసంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, ఇళ్లకే పరిమితం కావాలనే ఆదేశాలను బేఖాతరు చేస్తున్న తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆకతాయిలు అవసరం లేకున్నా రోడ్డెక్కుతూ సరదాగా తిరుగుతూ పోలీసులకు చిక్కుతున్నారు. ఇలా లాక్డౌన్ అమలవుతున్న గతనెల 23 నుంచి ఈనెల 11వరకు జిల్లాలోని గ్రామీణ ప్రాంతం పరిధిలో పోలీసులు కొరడా ఝళిపిస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 18 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. విజయవాడ, బెంగళూరు, నాగార్జునసాగర్, శ్రీశైలం, బీజాపూర్ రహదారుల్లో పెద్దఎత్తున తనిఖీలు చేస్తున్నారు. రాజేంద్రనగర్, షాద్‌నగర్, శంషాబాద్, మణికొండలో రెండు చొప్పున, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి, ఆమనగల్లు, కడ్తాల్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, బొంగుళూరు, మహేశ్వరం, మాల్లో ఒకటి చొప్పున చెక్‌పోస్టులు ఉన్నాయి. అంతటా నిత్యం తనిఖీలు చేస్తూ.. అనవసరంగా రోడ్డెక్కిన వాహనాలను సీజ్ చేస్తూ వాహనదారులపై కేసులు నమోదు చేస్తున్నారు. 1,270 వాహనాలు సీజ్.. గ్రామీణ ప్రాంతం పరిధిలో దాదాపు 23 ఠాణాలు ఉండగా.. దాదాపు 1,270 వాహనాలు సీజ్ అయ్యాయి. ఇందులో 70 శాతం మేర ద్విచక్ర వాహనాలే ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. 13 శాతం త్రిచక్ర వాహనాలు, 17 శాతం నాలుగు చక్రాల వాహనాలు ఉన్నట్లు పేర్కొంటున్నాయి. ఈ వాహనాలను పోలీసులు లాక్డౌన్ పూర్తయ్యాక కోర్టులకు అప్పగించనున్నారు. కోర్టులు విధించే జరిమానా చెల్లించి యజమానులు తిరిగి తీసుకోవాల్సి ఉంటుంది. 185 మందిపై కేసులు లాక్‌డౌన్‌ను పోలీసులు పకడ్బందీగా నిర్వహిస్తున్నా.. కొందరు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. పరిమిత సమయానికి మించి విక్రయాలు జరపడం, మరికొందరు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి వ్యాపారం నిర్వహించారు. అలాగే కూరగాయల మార్కెట్లు, ఇతర షాపులు, సూపర్ మార్కెట్ల వద్ద భౌతికదూరం పాటించడం లేదు. ఈమేరకు 185 మందిపై ఎపిడిమిక్ డిసీజెస్ యాక్ట్–1987, ఐపీసీ 188, జాతీయ విపత్తుల నియంత్రణ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. వీరిపై నేరం రుజువైతే రెండేళ్ల వరకు జైలు శిక్ష తప్పదు. కొన్ని సందర్భాల్లో కోర్టులు జరిమానా కూడా విధించవచ్చు. ఉమ్మినా.. మాస్క్ లేకున్నా.. మహమ్మారి కోవిడ్ రోజురోజుకూ విస్తరిస్తున్న తరుణంలో నివారణ కోసం రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. మాస్క్‌లు లేకుండా ఎవరూ బయట తిరగొద్దని తాజాగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయద్దు. ఈ అంశాలపై ప్రజల్లో పెద్దగా అవగాహన లేదు. ఇప్పుడిప్పుడే ఆయా విభాగాలు వీటిపై చైతన్యం కలి్పస్తున్నాయి. మరోరెండు మూడు రోజులపాటు దీన్ని కొనసాగించనున్నారు. ఆ తర్వాత మాస్క్ లేకుండా బయట తిరిగినా, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేసినా కేసులు నమోదు చేయకతప్పదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇంట్లో ఉంటేనే క్షేమం లాక్డౌన్ నిబంధనలను ప్రతిఒక్కరూ కచి్చతంగా పాటించాలి. అత్యవసరమైతే తప్ప గడప దాటొద్దు. రోడ్డెక్కొద్దు. ఈ నిబంధనలను కచి్చతంగా పాటిస్తేనే వారి కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. తద్వారా సమాజం కూడా బాగుంటుంది. ప్రభుత్వం ఏం చేసినా.. ప్రజల మేలు కోసమే. దీనిని ప్రతి వ్యక్తి గుర్తించి సహకరించాలి. స్వీయ రక్షణ.. భౌతికదూరంతోనే కరోనా వైరస్ వ్యాప్తిని నివారించగలం. మాస్‌్కలు ధరించకుండా బయట తిరిగితే, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా కేసులు తప్పవు. మాస్క్‌లు పంపిణీ చేయడానికి కొన్ని ఎన్జీఓలను గుర్తిస్తున్నాం. ఆయా సంస్థల ద్వారా మాస్‌్కలు అందజేస్తాం. – ప్రకాశ్ రెడ్డి, శంషాబాద్ డీసీపీ -
మైసమ్మ సన్నిధిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి
కడ్తాల్: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో వెలసిన మైసిగండి మైసమ్మ తల్లిని శనివారం సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి కుటుంబీకులతో కలిసి దర్శించుకున్నారు. వారికి ఆలయ అధి కారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు పూలమాలలు, శాలువాలతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో స్నేహలత, ట్రస్టీ చైర్మన్ శిరోలీ తదితరులు పాల్గొన్నారు. -
విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సర్పంచ్‌లకు షోకాజ్ జారీ
సాక్షి, రంగారెడ్డి: విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన, అనధికార లేఅవుట్లను అరికట్టడంలో విఫలమైన ఏడుగురు సర్పంచ్‌లు, ఇద్దరు ఉప సర్పంచ్‌లకు జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. షోకాజ్ నోటీసులు జారీచేయడానికి దారితీసిన అంశాలను ఆమె వివరించారు. 111 జీఓ పరిధిలో ఉన్న మొయినాబాద్ మండలం చిలుకూరులో అనధికార లేఅవుట్లను నిరోధించడంలో స్థానిక సర్పంచ్ గునుగుర్తి స్వరూప విఫలమయ్యారు. అలాగే అదే మండలంలోని తోలుకట్టలో అక్రమ లేఅవుట్లకు, ఇంటి నిర్మాణాలకు సర్పంచ్ కనకమామిడి శ్రీనివాస్ అనుమతులు ఇచ్చారు. కనకమామిడి గ్రామంలో సర్పంచ్ పట్లోళ్ల జనార్దన్‌రెడ్డి.. 111 జీఓ ఉల్లంఘనలు జరిగినా పట్టించుకోలేదు. ఆయా సర్వే నంబర్ల పరిధిలో 32 ఎకరాల విస్తీర్ణంలో అనధికార లేఅవుట్లను నిరోధించడంలో విఫలమయ్యారు. సురంగల్ సర్పంచ్ గడ్డం లావణ్య కూడా ఇదే తరహాలో విఫలమయ్యారు. కందుకూరు మండలం పులిమామిడి సర్పంచ్ వత్తుల అనిత.. 30 రోజుల ప్రణాళికలో భాగంగా చేసిన పనులకు ఎలాంటి తీర్మాణాలూ, ఎంబీ రికార్డులు, ఓచర్లు, బిల్లులు లేకుండా.. పంచాయతీ కార్యదర్శికి తెలియకుండా చెక్కులు ఇచ్చారు. మహేశ్వరం మండలం సిరిగిరిపురం సర్పంచ్ కాసుల సురేష్.. గ్రామ పంచాయతీ ఖాతాలో రూ.20.22 లక్షలు నిల్వ ఉన్నప్పటికీ నిధుల్లేవని వార్తా పత్రికల ద్వారా తప్పుడు ప్రచారం చేశారు. యాచారం మండలం మొండిగౌరెళ్లి సర్పంచ్ బండమీది కృష్ణ ఎంపీడీఓను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టి అధికారులను భయబ్రాంతులకు గురిచేశారు. గ్రామ పంచాయతీ పాలనలో పంచాయతీ సెక్రటరీ సహకరించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే కాకుండా అవమానకర రీతిలో ప్రవర్తించారు. శంకర్పల్లి మండలం ఇర్రికుంటతండా ఉప సర్పంచ్ పి.లక్ష్మణ్.. 30 రోజుల ప్రణాళికలో భాగంగా పనులు చేస్తుండగా పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి పంచాయతీ సెక్రటరీ విధులకు ఆటంకం కలిగించారు. జీపీ పరిధిలో గతంలో చేసిన అభివృద్ధి పనులకు, సిబ్బంది వేతనాలకు సంబంధించిన చెక్కులపై ఇదే మండలానికి చెందిన మాసానిగూడ ఉప సర్పంచ్ పి.వెంకటేశ్వర్‌రెడ్డి సంతకాలు చేయలేదు. వీటన్నింటిపై విచారణ జరిపిన డీపీఓ.. కలెక్టర్ హరీష్ ఆదేశాల మేరకు మంగళవారం షోకాజ్ నోటీసులు జారీచేశారు. -
పాత టికెట్లు ఇచ్చి పైసలు వసూలు చేసిన కండక్టర్
షాద్‌నగర్‌రూరల్ : ప్రయాణికులకు పాత టికెట్లు ఇచ్చి డబ్బులు వసూలు చేసిన తాత్కాలిక కండక్టర్ ఉదంతం ఒకటి శనివారం వెలుగు చూసింది. షాద్‌నగర్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో శనివారం ఫరూఖ్‌నగర్ మండలం నేరేళ్ళచెరువు గ్రామానికి చెందిన ప్రైవేట్ కండక్టర్ కె.శివకుమార్, డ్రైవర్ ఎండీ గౌస్ విధులు నిర్వహిస్తున్నారు. అయితే, బస్సును గద్వాల డిపో మేనేజర్ మురళీధర్‌రెడ్డి షాద్‌నగర్‌లో తనికీ చేశారు. టికెట్ల అమ్మకం ప్రకారం కండక్టర్ కె.శివకుమార్ క్యాష్ బ్యాగ్‌లో రూ.3143 ఉండాలి. కానీ, రూ.4470 ఉన్నట్లు గుర్తించారు. అదనంగా ఉన్న డబ్బుల గురించి కండక్టర్‌ను ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పడం లేదని డీఎం వివరించారు. ప్రయాణికులకు టికెట్లు అమ్మిన తర్వాత వాటిని తిరిగి కండక్టర్ ప్రయాణికుల నుంచి తీసుకొని బ్యాగులో ఉంచుకున్నట్లు తెలిపారు. కండక్టర్ కె.శివకుమార్ పాత టికెట్లను ప్రయాణికులకు ఇచ్చి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తాము గుర్తించామని డీఎం తెలిపారు. ఈ మేరకు శివకుమార్‌పై చర్యలు తీసుకోవాలని షాద్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు డిపో మేనేజర్ మురళీధర్‌రెడ్డి తెలిపారు. శివకుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పట్టణ సీఐ శ్రీధర్ కుమార్ తెలిపారు.