Roads and Buildings Department
-
TG: ఎనిమిది మంది ఐఏఎస్‌ల బదిలీ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) శనివారం(ఆగస్టు3) ఉత్తర్వులు జారీ చేసింది. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టి.కె. శ్రీదేవిని ఎస్సీ డెవలప్మెంట్ కమిషనర్‌గా బదిలీ చేశారు. వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్‌గా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. విపత్తుల నిర్వహణ విభాగం సంయుక్త కార్యదర్శి ఎస్.హరీశ్‌ను రవాణా, రోడ్లు భవనాలు సంయుక్త కార్యదర్శిగా నియమించారు. మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌గా ఉదయ్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు ఇచ్చారు. పురపాలక శాఖ ఉప కార్యదర్శిగా ప్రియాంక, హాకా ఎండీగా చంద్రశేఖర్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ ఎండీగా శ్రీనివాస్‌రెడ్డిని నియమించారు. రవాణా, రోడ్లు భవనాలు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్‌రాజ్ బదిలీ అయ్యారు. -
పల్లెబాటల్లో ప్రగతి వేగం.. హర్షం వ్యక్తం చేస్తున్న పల్లె ప్రజలు!
కర్నూలు(అర్బన్): దశాబ్దాల తరబడి గుంతలు పడిపోయి, కనీసం నడిచేందుకు కూడా వీలు లేని గ్రామీణ రోడ్లు అభివృద్ధి చెందుతున్నాయి. ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన పల్లె రోడ్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి. నాబార్డు నిధులు రూ.189.29 కోట్లతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 39 పనులు చేపట్టారు. ఈ పనులు పూర్తయితే రెండు జిల్లాల్లో 257.79 కిలోమీటర్ల మేర రోడ్లు అభివృద్ధి చెందనున్నాయి. కోడుమూరు మండలం క్రిష్ణాపురం రోడ్డు పనులను పరిశీలిస్తున్న అధికారులు రహదారులు అభివృద్ధి చెందుతుండటంతో పల్లె ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అందిన ప్రత్యేక ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలో 11, నంద్యాల జిల్లాలో 28 రోడ్లను బాగు చేసున్తన్నారు. ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.187.27 కోట్లతో పాలనా అనుమతులు కూడా మంజూరు చేసింది. దీంతో ఆయా పనులను ప్రారంభించి వేగంగా పూర్తి చేసేందుకు పీఆర్ ఇంజినీర్లు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వేగంగా జరుగుతున్న పనుల్లో కొన్ని ... ► పత్తికొండ నియోజకవర్గం మండల కేంద్రమైన మద్దికెర నుంచి మొలగవెల్లి మీదుగా ఆలూరు వరకు రూ.8.15 కోట్లతో 14.90 కిలోమీటర్లు అభివృద్ధి చేస్తున్నారు. ► కోడుమూరు మండలం కర్నూలు – బళ్లారి ప్రధాన రహదారి నుంచి క్రిష్ణాపురం వరకు రూ.2.97 కోట్లతో 4.10 కిలోమీటర్ల మేర రోడ్డును అభివృద్ధి చేస్తున్నారు. ► కోడుమూరు మండలం వర్కూరు నుంచి మెరుగుదొడ్డి వరకు రూ.4.50 కోట్లతో 12.05 కిలోమీటర్ల మేర రోడ్డును వేస్తున్నారు. ► దేవనకొండ మండలం కర్నూలు – బళ్లారి మెయిన్ రోడ్డు నుంచి కొత్తపేట మీదుగా పుల్లాపురం వరకు రూ.3 కోట్లతో 5.8 కిలోమీటర్ల మేర కొత్త రోడ్డు వేస్తున్నారు. నిరంతర పర్యవేక్షణ ప్రాధాన్యత రోడ్ల పనుల్లో భాగంగా చేపట్టిన పనులు పూర్తయితే దాదాపు వంద గ్రామాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 11 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ పనులు కొనసాగుతున్నాయి. వీటిని పూర్తి నాణ్యతతో నిర్ణీత సమయంలోగా పూర్తి చేసేందుకు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖకు చెందిన అధికారులు పర్యవేక్షిస్తున్నారు. గతంలో మద్దికెర – ఆలూరు రోడ్డు ప్రస్తుతం మద్దికెర – ఆలూరు రోడ్డు పనులు ఏఈ స్థాయి నుంచి డీఈఈ, ఈఈ, ఎస్ఈ వరకు వారంలో ఎవరో ఒక అధికారి ఈ పనులను పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలు చేస్తున్నారు. దీంతో పనుల్లో వేగం పెరుగుతోంది. దశల వారీగా నాణ్యతను సంబంధిత అధికారులు పరీక్షించిన తర్వాత మరో దశ పనులు చేపడుతున్నారు. నిధుల కొరత లేదు ప్రభుత్వం ఆమోదించిన రోడ్ల పనులకు ఎలాంటి నిధుల కొరత లేదు. ఈ పనులను నిర్ణీత సమయంలోగా పూర్తి నాణ్యతతో పూర్తి చేయనున్నాం. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో మొత్తం 39 రోడ్ల పనులు ప్రారంభం అయ్యాయి. ఈ రోడ్ల పనులు పూర్తయితే రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. ఆయా నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధులు కూడా ఈ పనులను వేగంగా పూర్తి చేయించేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. – కే సుబ్రమణ్యం, పీఆర్ ఎస్ఈ -
తెలంగాణను దేశంలోనే రోల్ మోడల్ చేస్తా..
-
4 నెలల్లో 3,500 కి.మీ.రోడ్లు
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో రహదారుల పునరుద్ధరణను మరింత వేగవంతం చేసింది. కొత్తగా 3,500 కిలోమీటర్ల 437 రోడ్ల పనుల కోసం రూ.1,122 కోట్లు కేటాయించింది. ఆగస్టుకి టెండర్ల ప్రక్రియ చేపట్టి డిసెంబర్‌కి ఆ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. దీంతో టెండర్ల ప్రక్రియకు రోడ్లు, భవనాల (ఆర్ అండ్ బి) శాఖ చర్యలు చేపట్టింది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటికే నాలుగేళ్లలో రెండు దశల్లో రూ.4,492.99 కోట్లు వెచ్చించి 12,894 కి.మీ. రోడ్లు నిర్మించింది. ఇప్పుడు మూడో దశ పనులకు నిధులు కేటాయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా పునరుద్ధరించాల్సిన రోడ్లను శాస్త్రీయంగా ఎంపిక చేశారు. ఆర్ అండ్ బి శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి అత్యధిక రద్దీ ఉన్న రోడ్లను ఎంపిక చేశారు. వీరిచ్చిన నివేదికను ప్రభుత్వం ఆమోదించింది. జిల్లా కేంద్రాలను అనుసంధానించే రోడ్లు, మండల కేంద్రాలను జిల్లా కేంద్రంతో అనుంధానించే 437 రోడ్లను తగిన నిష్పత్తిలో నిర్ణయించారు. వాటిలో 1,289.80 కి.మీ. మేర 132 రాష్ట్ర రహదారులు ఉన్నాయి. వీటిని రూ.490.80 కోట్లతో పునరుద్ధరించనున్నారు. కొత్త జిల్లా కేంద్రాలకు మండల కేంద్రాలతో అనుసంధానించే రోడ్లకు ప్రాధాన్యమిచ్చారు. అందుకే జిల్లా ప్రధాన రహదారుల కేటగిరీలోని 2,210.20 కి.మీ. మేర 305 రోడ్లను రూ.631.20 కోట్లతో పునరుద్ధరించనున్నారు. ప్రాధాన్యక్రమంలో బిల్లుల చెల్లింపు రోడ్ల పునరుద్ధరణ పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు కోసం ఆర్ అండ్ బి అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఇటీవల రూ.500 కోట్ల బిల్లులను చెల్లించారు. మిగిలిన బిల్లుల చెల్లింపును వేగవంతం చేశారు. ఇక మూడో దశ కింద చేపట్టనున్న రోడ్ల పనుల బిల్లుల చెల్లింపునకు కూడా ముందస్తు ప్రణాళిక రూపొందిస్తున్నారు. పనులు పూర్తి చేసి బిల్లులు అప్లోడ్ చేసిన వెంటనే ప్రాధాన్యక్రమంలో చెల్లించే విధానాన్ని రూపొందించారు. దీనిపై కాంట్రాక్టర్లకు అవగాహన కల్పిస్తున్నారు. -
రోడ్లకు వాన దెబ్బ.. గాలికొదిలేసిన ప్రభుత్వం
గత రెండు మూడేళ్లుగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. భారీ, అతి భారీ వానలతో వరద పోటెత్తడంతో చాలా ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. తీవ్రంగా దెబ్బతిన్న చోట పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాల్సి ఉన్నా ప్రభుత్వం అందుకు తగ్గ ఏర్పాట్లు చేయలేదు. పలుచోట్ల నామ్కేవాస్తేగా పైపైన సాధారణ మరమ్మతులు చేసినా.. ఇటీవలి వర్షాలకు మరింతగా పాడయ్యాయి. చాలా చోట్ల గతుకులు, గుంతలు పడ్డాయి. కొన్నిచోట్ల పైన తారు కొట్టుకుపోయి.. మట్టిరోడ్లలా మారిపోయాయి. దీనితో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా కనిపిస్తోంది. మరో నెల రోజుల్లో వానాకాలం ముంచుకొస్తుండగా.. ఇప్పటికీ రోడ్ల మరమ్మతు అంశం కొలిక్కి రాలేదు. రోడ్ల పీరియాడికల్ రెన్యువల్స్‌కు సంబంధించి నిర్ధారించుకున్న నిడివిలో కేవలం 20 శాతమే పూర్తయింది. వానాకాలం మొదలైతే పనులు ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. రోడ్ల పీరియాడికల్ రెన్యువల్స్ తీరు ఇదీ.. మొత్తం ఎంపిక చేసిన రోడ్ల నిడివి: 6,617 కి.మీ. ఇందుకు మంజూరు చేసిన నిధులు: రూ.2,852 కోట్లు ఇప్పటివరకు పూర్తయిన రెన్యువల్: 1,400 కి.మీ. ఇంకా పనులు జరుగుతున్న రోడ్లు: 1,350 కి.మీ. పనులు ప్రారంభం కావాల్సిన నిడివి: 2,263 కి.మీ. టెండర్లు కూడా ఖరారు కాని రోడ్లు: 1,190 కి.మీ. భారీ వర్షాలు పడితే ఇబ్బందే.. గత రెండు వానాకాలాల్లో కలిపి దాదాపు రూ.2 వేల కోట్ల మేర రోడ్లకు నష్టం జరిగినట్టు అంచనా. ఎప్పటికప్పుడే రోడ్లను మెరుగుపరిస్తే.. తదుపరి వరదకు అంతగా నష్టం ఉండదు. అదే మరమ్మతులు చేయని పక్షంలో.. మళ్లీ వరద పోటెత్తితే ఆ రోడ్లు పూర్తిగా కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు రోడ్లను పూర్తిగా పునరుద్ధరించాల్సిన పరిస్థితి వస్తుంది. ఖర్చు భారీగా పెరుగుతుంది. రాష్ట్రంలో గత రెండేళ్లుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గుంతలు, దెబ్బతిన్న రోడ్ల కారణంగా ప్రమాదాలు జరుగుతాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనులు మొదలుపెట్టినా.. 2021 వానాకాలంలో భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు దాదాపు రూ.800 కోట్లు అవసరమని అంచనా వేశారు. గతేడాది భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు రూ.1,200 కోట్లు అవసరమని నిర్ధారించారు. 2021లో దెబ్బతిన్న రోడ్లను సకాలంలో బాగు చేయకపోవటంతో.. వాటి పటుత్వం తగ్గి 2022లో మరింతగా దెబ్బతిన్నాయి. అయినా సకాలంలో పునరుద్ధరణ చేపట్టలేదు. గతేడాది చివరలో రోడ్ల పీరియాడికల్ రెన్యూవల్స్ చేపట్టాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. రూ.2,852 కోట్లను మంజూరు చేసింది. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించేసరికి ఫిబ్రవరి వచ్చేసింది. ఏప్రిల్ రెండో వారం నాటికి 20 శాతం పనులు పూర్తి చేశారు. కానీ అప్పటి నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో పనులు నిలిచిపోయాయి. పదేళ్ల తర్వాత రెన్యూవల్స్.. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నిబంధనల ప్రకారం.. ప్రతి ఐదేళ్లకోసారి రోడ్లకు రెన్యూవల్స్ జరగాలి. అంటే పైన దెబ్బతిన్న తారు పూతను పూర్తిగా తొలగించి కొత్తగా వేయాలి. దీనికి భారీగా వ్యయం అవనున్నందున.. ఐదేళ్లకు బదులు కనీసం ఏడేళ్లకోసారి కొత్తగా వేసినా సరిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు. కానీ తెలంగాణ ఏర్పడ్డాక అసలు పీరియాడికల్ రెన్యూవల్స్ చేపట్టలేదు. దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారి ఇప్పుడు పనులకు శ్రీకారం చుట్టారు. 6,617 కిలోమీటర్ల మేర రోడ్లను పునరుద్ధరించాలని నిర్ణయించి.. వరదలతో దెబ్బతిన్న రోడ్లను ఇందులో చేర్చి పనులు ప్రారంభించారు. కానీ అనుమతులు, నిధుల విడుదలలో జాప్యంతో పనులు ఆలస్యంగా చేపట్టారు. మరో నెలలో వానాకాలం మొదలవుతుండటంతో.. గతంలో రోడ్లు మరింతగా పాడైపోయే పరిస్థితి నెలకొందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జడ్చర్ల–వనపర్తి మధ్య బిజినేపల్లి ప్రాంతంలో రోడ్డు కనీస మరమ్మతులు కూడా లేక వానలకు దెబ్బతిని ఇలా గోతులమయంగా మారింది. ఈ మార్గంలో పెద్ద సంఖ్యలో టిప్పర్లు తిరుగుతుండటంతో గోతులు మరింత పెరిగి వాహన దారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గతంలో బిజినేపల్లి–జడ్చర్ల మధ్య ప్రయాణ సమయం అరగంట అయితే... ఇప్పుడు గోతుల వల్ల గంటకుపైగా పడుతోంది. బిజినేపల్లి సమీపంలోని నల్లవాగుపై నిర్మిస్తున్న వంతెనపై రోడ్డుమీద రెండు చిన్న వంతెనల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పక్కన నిర్మించిన తాత్కాలిక రోడ్డు వానలకు పాడైపోయింది. ఇటీవల ఈ రోడ్డుమీద అదుపుతప్పిన ఓ టిప్పర్ కరెంటు స్తంభాన్ని ఢీకొంది. తెగిన కరెంటు వైరు ఆ పక్కగా వస్తున్న ఆర్టీసీ బస్సుపై పడింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో విద్యుత్ సరఫరాను నిలిపివేసి ఉండటంతో.. బస్సులో ఉన్న 70 మంది పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. నల్గొండ జిల్లా యాద్గార్పల్లి– కేశవాపురం మధ్య ఉన్న సింగిల్ రోడ్డు కాస్తా భారీ వర్షాలకు ధ్వంసమైంది. వరదలతో దెబ్బతిన్న రోడ్లను బాగుచేసే క్రమంలో ఇలా పునరుద్ధరించారు. ఇప్పుడు ప్రయాణాలు సాఫీగా సాగుతున్నాయి. -
యూత్ పవర్ అంటే ఇదే, త్వరలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
సమీప భవిష్యత్తు అంతా భారతదేశానిదే ‘ఈ దశాబ్దం చివరికల్లా (2029–30) ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా అవతరిస్తుంది. దేశంలోని కార్మికులు, కర్షకులు ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు,’ అన్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖడ్ మాటలు నిజమవుతాయని అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణ సంస్థలు సైతం ధ్రువీకరిస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజలకు ప్రభుత్వం నుంచి ప్రయోజనాలను వారి ముంగిట్లోనే అందజేస్తున్నారని అంటూ భారత్ సాధించే విశేష ప్రగతిపై విశ్వాసం వ్యక్తం చేశారు ధంఖడ్. ఉపరాష్ట్రపతి అభిప్రాయాలతో ఏకీభవించే విధంగా ప్రఖ్యాత గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ డాయిష్ బ్యాంక్ కూడా ఇండియాపై తన అంచనాలు ప్రకటించింది. ‘ప్రస్తుత భారత వార్షిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 3.5 లక్షల కోట్ల డాలర్ల నుంచి 7 లక్షల కోట్ల డాలర్లకు 2030 నాటికి పెరుగుతుంది. ఇంతటి ఆర్థికాభివృద్ధిని మధ్యకాలంలో నిలకడగా సాధించాలంటే–తరచు చెప్పే అధిక జనాభా లేదా వస్తు వినియోగం మాత్రమే సరిపోదు. ఈ రెండూ ఇండియాకు ఆర్థికంగా సత్తువ ఇచ్చే కీలకాంశాలు,’ అని డాయిష్ బ్యాంక్ వ్యాఖ్యానించింది. తన అంచనాకు కారణాలు వివరిస్తూ, ‘ప్రస్తుత దశాబ్దంలో భారత్ మంచి ప్రగతి సాధించడానికి ఇంకా అనేక కారణాలు ఉన్నాయి. దేశంలో గణనీయ సంఖ్యలో ఉన్న యువత జనాభా ఆర్థిక అభివృద్ధికి ప్రధాన కారణం కాగా, ప్రభుత్వ విధానాలు దీనికి తోడవుతున్నాయి,’ అని ఈ సంస్థ వివరించింది. అయితే, భారత ఆర్థిక వ్యవస్థ 2025 కల్లా ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర మంత్రులు విశ్వాసం వ్యక్తం చేస్తుండగా, 2027 నాటికి భారతదేశం ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవరిస్తుందని ప్రపంచ దేశాల ఆర్థిక గమనాన్ని నిరంతరం విశ్లేషించే అంతర్జాతీయ ఆర్థిక సంస్థ మోర్గాన్ స్టాన్లీ ఇటీవల అంచనా వేసింది. డిజిటలైజేషన్, ఫైనాన్షియలైజేషన్ తో ఆర్థిక వ్యవస్థ దూకుడు నగదు వాడకం స్థానంలో డిజిటలైజేషన్ ప్రవేశపెట్టడంతో ఉత్పాదకత పెరిగింది. ఫైనాన్షియలైజేషన్ (మార్కెట్లు వంటి ఫైనాన్షియల్ సంస్థల సైజు, ప్రభావం పెరగడం) వల్ల సమాంతర ఆర్థిక వ్యవస్థ తగ్గిపోయింది. పరిశుభ్రమైన ఇంథన వినియోగం వల్ల కూడా వ్యవస్థలో సామర్ధ్యం పెరుగుతుందని డాయిష్ బ్యాంక్ అభిప్రాయపడింది. మరో ప్రోత్సాహకర అంశం ఏమంటే–ఇండియాలో పనిచేసే వయసున్న జనాభా సైజు విస్తరించడం. ప్రస్తుతం ఇలాంటి యువత సంఖ్య 2007లో చైనాలో ఉన్న స్థాయిలో ఇండియాలో ఉంది. భారత సమగ్ర జీడీపీ, తలసరి స్థూల దేశీయ ఉత్పత్తి ఇదే విధంగా చైనాను పోలి ఉన్నాయి. వచ్చే పదేళ్లలో దేశంలో పనిచేసే యువతరం సంఖ్యకు అదనంగా 9 కోట్ల 80 లక్షల మంది తోడవుతారు. ప్రపంచంలో పనిచేసే జనాభా సంఖ్యలో పెరుగుదల ఒక్క ఇండియాలోనే 22 శాతంగా ఉంటుందని కూడా ఈ జర్మన్ సంస్థ అంచనావేసింది. సంతృప్తికర కొనుగోలు శక్తి ఉండే భారత మధ్య తరగతి ప్రపంచంలోనే అతిపెద్దది. ప్రస్తుతం 37 కోట్ల 10 లక్షల మంది మధ్య తరగతి (మిడిల్ క్లాస్) దేశంలో వస్తు వినిమయం పెరగడానికి దోహదం చేస్తోంది. వచ్చే దశాబ్దాల్లో కూడా వినియోగం పెరగడానికి భారత మధ్య తరగతి ప్రజానీకం కారణమౌతారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంస్కరణల ఫలితంగా గ్రామీణ ప్రాంతాల మహిళలు కేవలం ఇంటి పనులకు పరిమితం కాకుండా ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. భారత అభివృద్ధికి మరో కీలకాంశం ఏమంటే జేఏఎం (జన్ ధన్ అకౌంట్, ఆధార్ నంబర్, మొబైల్ ఫోన్) అనే మూడు ఆయుధాలు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పక్కదారులు పట్టకుండా కాపాడుతున్నాయి. జేఏఎం ద్వారా నగదు బదిలీ వేగంగా, సునాయాసంగా జరుగుతున్న కారణంగా కోట్లాది మంది సామాన్య ప్రజానీకానికి మేలు చేకూరుతోంది. మౌలిక సందుపాయాల్లో అత్యంత ప్రధానమైన రహదారుల అభివృద్ధి, విస్తరణ మున్నెన్నడూ లేని విధంగా ముందుకుసాగుతున్నాయి. రహదారుల వ్యవస్థకు ప్రభుత్వాలు ఇస్తున్న ప్రాధాన్యం వల్ల ఇప్పుడు దేశంలో రోజుకు సగటున 36 కిలోమీటర్ల పొడవైన రోడ్డు మార్గాలు నిర్మిస్తున్నారు. గడచిన పది సంవత్సరాల్లో ఇండియాలో మొత్తం 73,000 కిలోమీటర్ల పొడవు గల రహదారులు నిర్మించారు. ఇటీవల కాలంలో దేశంలో విద్చుచ్ఛక్తి సరఫరా, శుభ్రమైన వంట పద్ధతులు అమలు చేయడంలో సాధించిన ప్రగతి కూడా దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టడానికి పురికొల్పుతోంది. విజయసాయిరెడ్డి, వైఎస్సార్సిపి, రాజ్యసభ సభ్యులు -
Ap Budget 2023-24: పరిశ్రమలు, వాణిజ్యానికి రూ. 2,602 కోట్ల కేటాయింపు
సాక్షి, అమరావతి: పరిశ్రమలు, మౌలిక సదుపాయల అభివృద్ధి ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపడమే కాక, వివిధ రంగాలలో ఉత్పాదక సామర్థ్యాలను వెలికితీస్తూ, ఉపాధి కల్పనను ప్రోత్సహిస్తుంది. ఇటీవల విశాఖపట్టణంలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు అద్భుతమైన స్పందన వచ్చి, ఆకర్షణీయమైన ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీ రాష్ట్రం పటిష్టతను ఈ సదస్సు నిరూపించింది. 8,000 మందికి పైగా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రూప్, జిందాల్ స్టీల్ అండ్ వపర్, భారత్ బయోటెక్, జీఎంఆర్ గ్రూప్, దాల్మియా గ్రూప్, రెన్యూ పవర్, బజాజ్ ఫిన్సర్వ్ లిమిటెడ్, సెంచురీ ఫ్లైబోర్డ్స్, శ్రీ సిమెంట్, రామ్‌కో సిమెంట్స్, అపోలో హాస్పిటల్స్‌తోపాటు అనేక ఇతరప్రముఖ పారిశ్రామిక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ప్రతిపాదించాయి. ఈ సదస్సులో 48 దేశాల నుంచి రాయబారులు, దౌత్యవేత్తలు, విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇజ్రాయెల్, పోలాండ్, డెన్మార్క్,న ఆర్వే, నెదర్లాండ్స్, సింగపూర్, జపాన్ల నుంచి ఏడు అంతర్జాతీయ వ్యాపార ప్రతినిధుల బృందాలు ఏపీ పారిశ్రామిక సామర్థ్యాలపై ఎంతో ఆసక్తిని కనబరిచాయి. ఈ అవకాశాలను అన్వేషించడానికి యూఏఈ, నెదర్లాండ్స్, వియత్నాం, పశ్చిమ ఆస్ట్రేలియా దేశాలతో నాలుగు సమావేశాలు జరిగాయి. 13.42 లక్షల కోట్ల రూపాయల అంచనా పెట్టుబడితో ఏపీలో 6 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించే అవకాశంతో, 378 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయడంతో ఈ సదస్సు ముగియడం ఎంతో గర్వించదగ్గ విషయం. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు నుంచి వచ్చిన ఈ విశేష, స్పందన, అనుకూలమైన ప్రభుత్వ పారిశ్రామిక అభివృద్ధి విధానానికి, విశ్వసనీయతకు నిదర్శనం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ ప్రథమ స్థానంలో నిలిచింది. పెట్టుబడిదారుల అన్ని అవసరాల కోసం సింగిల్ డెస్క్ పోర్టల్ సర్వర్లు వన్ స్టాప్ షాప్‌గా ఉంటాయి. దీనిలో భాగంగా ఏప్రిల్ 2019, నుంచి 36,972 దరఖాస్తులు స్వీకరించండి. వాటిలో 36,049 దరఖాస్తులు ఆమోదించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 31, 2022 వరకు, 13 పెద్ద, భారీ ప్రాజెక్ట్‌లు 15,099 కోట్ల రూపాయల పెట్టుబడి, 12,490 మందికి ఉపాధిని కల్పించి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించాయి. అదే విధంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎమ్ఎస్ఎమ్ఈ) రంగంలో 7,742 కోట్ల రూపాయల పెట్టుబడితో 54,430 యూనిట్లు 2,11,219 మందికి ఉపాధి కల్పనతో ఉత్పత్తిలోకి ప్రవేశించాయి. చదవండి: AP Budget 2023-24: పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 15,873 కోట్ల డిసెంబర్ 2022 వరకు, పారిశ్రామిక ప్రోత్సాహకాల క్రింద జనరల్ కేటగిరీలోని 902 సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా (ఎం.ఎస్.ఎం.ఈ.) యూనిట్లకు, ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన 448 యూనిట్లకు, షెడ్యూలు కులాలకు చెందిన 3,748 యూనిట్లకు షెడ్యూలు తెగలకు చెందిన 602 యూనిట్లకు మొత్తం 482 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. అలాగే ఈ ప్రభుత్వం క్లస్టర్ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది. సూక్ష్మ, చిన్న తరహా సంస్థలు-క్లస్టర్ అభివృద్ధి (ఎమ్ఎస్ఈసీడీపీ) ప్రాజెక్టుల కింద కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీ ప్రభుత్వం ఐదు క్లస్టర్ల నిర్మాణానికి అనుమతిని పొందింది. అంతే కాకుండా మన రాష్ట్రం జాతీయ పారిశ్రామిక వాడల అభివృద్ధి సంస్థ విశాఖపట్నం నోట్లోని నక్కపల్లి క్లస్టర్, శ్రీకాళహస్తి-ఏర్పేడు నోడ్లోని చిత్తూరు సౌత్ క్లస్టర్, విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ (వీసీఐసీ) కింద కడప నోడ్ కొప్పర్తి క్లస్టర్ ఈ మూడు పారిశ్రామిక వాడల అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు ఆమోదం తెల్పింది. 3,155 ఎకరాలలో కొప్పర్తి సమీపంలో వైఎస్సార్ జగనన్న భారీ పారిశ్రామిక వాడను అభివృద్ధి చేస్తోంది. ఈ పారిశ్రామిక వాడ బహుళ ఉత్పత్తుల భారీ పారిశ్రామిక పార్క్ గా 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 75,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. భారీ పారిశ్రామిక వాడకు ఆనుకుని వైఎస్సార్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది దీని ద్వారా సుమారు 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించాలని 25,000 మందికి ఉపాధిని కల్పించే అవకాశం ఉంటుంది. జిందాల్ స్టీల్ వర్క్స్ కంపెనీ 3,300 కోట్ల రూపాయల పెట్టుబడితో, సంవత్సరానికి రెండు మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయగల సామర్ధ్యంతో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో కడప ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నది. దీని మొదటి దశలో 1000 ఉద్యోగాల వరకు ప్రత్యక్ష ఉపాధిని, రెండవ దశలో ప్రత్యక్షంగా 2,500 ఉద్యోగాలను, పరోక్షంగా 10,000 మందికి ఉపాధిని కల్పిస్తుంది. ఈ ప్రాజెక్టు కడప ప్రాంత ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది. ► 2023-24 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమలు మరియు వాణిజ్యం కోసం 2,602 కోట్ల రూపాయల కేటాయించింది. రవాణా, రహదారుల మౌలిక సదుపాయాలు రాష్ట్రంలో దాదాపు 32,725 కి.మీ. ప్రధాన జిల్లా రహదారులు, జిల్లాల్లోని ఇతర రోడ్ల నిర్వహణతోపాటు 4,000 కి.మీ పొడవున ఉన్న బి.టి. రోడ్లను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవడమైంది. రూ. 400 కోట్ల రూపాయలతో దెబ్బతిన్న రోడ్ల నిర్వహణ, అత్యవసర మరమ్మతులను ప్రభుత్వం చేపట్టింది. 2,205 కోట్ల రూపాయలతో 8,268 కి.మీ. రాష్ట్ర రహదారుల, జిల్లా ప్రధాన రహదారుల అభివృద్ధిని సాధించింది. 'రహదారుల అనుసంధాన ప్రాజెక్ట్' క్రింద కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలకు 437.59 కి.మీ. పొడవుగల రోడ్లకు సంబంధించి 391 కోట్ల రూపాయలతో 46 పనులను మంజూరు చేయడమైనది. డిసెంబర్ 2022 నాటికి 383.66 కి.మీ. పొడవు మేర రహదారి పనులు పూర్తయ్యాయి. ► 2023-24 ఆర్థిక సంవత్సరానికి రవాణా, రహదారుల మరియు భవనాల శాఖకు 9,118 కోట్ల రూపాయల కేటాయించింది. -
గ్రామాలను పట్టణాలకు కలుపుతూ మరో 976 కి.మీ. రోడ్లు
సాక్షి, అమరావతి: గ్రామాలను సమీప పట్టణాలకు కలుపుతూ రాష్ట్రంలో మరో 976 కిలోమీటర్ల పొడవున కొత్త రోడ్ల నిర్మాణం జరగనుంది. పీఎంజీఎస్వైలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు 40:60 నిష్పత్తిన మొత్తం రూ.1,110.1 కోట్లు వెచ్చించనున్నాయి. దీన్లో రూ.607.87 కోట్లతో 976 కిలోమీటర్ల రోడ్లు నిర్మించనుండగా, రూ.502.23 కోట్లతో 76 బ్రిడ్జిలు నిర్మిస్తారు. జిల్లాల వారీగా కొత్తగా నిర్మించే రోడ్ల వివరాలతో రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు కేంద్రానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపారు. దీనికి తుది ఆమోదం కోసం ఉగాది పండుగ రోజు (ఈ నెల 22న) కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారుల సమావేశం జరగనుంది. ఈ సమావేశం లాంఛనమేనని, రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలన్నింటికీ కేంద్రం ఇప్పటికే సూత్రపాత్రయంగా అంగీకారం తెలిపిందని రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గత ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇప్పటివరకు పీఎంజీఎస్‌వై ద్వారా రాష్ట్రంలో 1,291 కిలోమీటర్ల పొడవున 268 కొత్త రోడ్ల నిర్మాణం పూర్తిచేసినట్టు తెలిపారు. వాటికి సంబందించి జనవరి నెలాఖరు వరకు బిల్లులను కూడా ప్రభుత్వం కాంట్రాక్టర్లకు చెల్లించిందని చెప్పారు. -
కథ కంచికి.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఎన్నో దశాబ్దాల పాటు ‘పేదింటి’కి పెన్నిధిగా నిలిచిన గృహనిర్మాణ శాఖ కథ కంచికి చేరింది. వేల కుటుంబాలకు నీడను కల్పించిన ఆ శాఖ ఇప్పుడు రోడ్లు–భవనాల శాఖలో విలీనమైంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విలీనానికి సంబంధించి కొన్నిరోజుల కింద జరిగిన కేబినెట్ భేటీలోనే తీర్మానించినా శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. గృహనిర్మాణ శాఖలో అంతర్భాగమైన హౌసింగ్ కార్పొరేషన్ (గృహనిర్మాణ సంస్థ), హౌసింగ్ బోర్డు (గృహ నిర్మాణ మండలి), రాజీవ్ స్వగృహ కార్పొరేషన్, హౌసింగ్‌బోర్డుకు అనుబంధంగా ఏర్పాటైన డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (డీఐఎల్) తదితర విభాగాలన్నీ రోడ్లు–భవనాల శాఖ పరిధిలోకి వెళ్లిపోయాయి. రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత హౌసింగ్ బోర్డు, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్లకు పనిలేకుండా పోయింది. పేదల ఇళ్లకు సంబంధించి డబుల్ బెడ్రూం పథకాన్ని తొలుత హౌసింగ్ కార్పొరేషన్ పర్యవేక్షించినా.. దాని ఆధ్వర్యంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. సీఎం కేసీఆర్ దీనిపై ఏసీబీతో విచారణకు ఆదేశించి, ఆ శాఖలోని ఉద్యోగులను ఇతర కార్పొరేషన్లు, శాఖల పరిధిలోకి మార్చారు. దీంతో హౌసింగ్ కార్పొరేషన్ నామమాత్రంగా మారింది. డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం అమలును జిల్లా కలెక్టర్లకు అప్పగించటంతో.. రుణాలు తీసుకోవడానికే ఇది పరిమితమైంది. ఒకప్పుడు వందలాది ఉద్యోగులతో కళకళలాడిన ఈ సంస్థలో ప్రస్తుతం 50 మందే ఉన్నారు. వీరికీ లెక్కలు క్రోడీకరించడం మినహా పనిలేకుండా పోయింది. ఇప్పుడు వీరు ఆర్ అండ్ బీ పరిధిలోకి వెళ్తున్నారు. హౌసింగ్ బోర్డు, ‘స్వగృహ’ కథ కంచికే! అల్పాదాయ, మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వర్గాలకు ఇళ్లు నిర్మించి ఇచి్చన హౌసింగ్ బోర్డు.. పేదలకు చవకగా ఇళ్లు కట్టించేందుకు 2007లో ప్రారంభమైన రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ల పరిస్థితీ ఇంతే. రాష్ట్ర ఏర్పాటు తర్వాత గృహ నిర్మాణ కార్యకలాపాలు చేపట్టకపోవడంతో వీటికి ఎలాంటి పని లేకుండా పోయింది. అప్పట్లోనే కట్టి అసంపూర్తిగా మిగిలిన వాటిని ఉన్నవి ఉన్నట్టుగా అమ్ముకోవటానికే స్వగృహ కార్పొరేషన్ పరిమితమైంది. ఇక ఈ రెండు విభాగాల కథ కంచికి చేరినట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పేదల గృహ నిర్మాణం అన్నది ఎన్నికల ప్రధాన హామీల్లో ఒకటి కావడంతో హౌజింగ్ కార్పొరేషన్ మాత్రం కొనసాగే వీలుందని అంటున్నారు. ఇక పోలీసు సిబ్బందికి ఇళ్లు నిర్మించే పోలీసు హౌసింగ్ కార్పొరేషన్, వైద్యారోగ్య సిబ్బందికి ఇళ్లు నిర్మించి ఇచ్చే సంస్థలను కూడా ఆర్అండ్బీ శాఖ పరిధిలోకి తీసుకురానున్నట్టు సమాచారం. పూర్తికాని ఆస్తుల పంపకం రాష్ట్రం విడిపోయాక హౌసింగ్‌బోర్డు ఆస్తుల పంపకం వివాదంగా మారింది. దీనిని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 9వ షెడ్యూల్లో చేర్చారు. రాజీవ్ స్వగృహ ఆస్తులను మాత్రం ఎక్కడివి అక్కడే పద్ధతిలో రెండు రాష్ట్రాల మధ్య పంచారు. దాని అప్పులను కూడా పంచగా.. తెలంగాణకు రూ.900 కోట్ల రుణాలు వచ్చాయి. ప్రస్తుతం సర్కారు స్వగృహ ఆస్తులను క్రమంగా వేలం వేస్తోంది. మూసీ వరదలతో తెరపైకి ‘హౌజింగ్ బోర్డు’! గృహనిర్మాణ శాఖలో ప్రధాన విభాగంగా ఉన్న హౌసింగ్ కార్పొరేషన్ కంటే కొన్ని దశాబ్దాల ముందే హౌసింగ్ బోర్డుకు బీజం పడింది. 1908లో మూసీ వరదలతో దెబ్బతిన్న హైదరాబాద్ నగరాన్ని పునరుద్ధరించటంతోపాటు విశాలమైన రహదారుల నిర్మాణం, మెరుగైన పారిశుధ్య వ్యవస్థ ఏర్పాటు, వరదలతో నిరాశ్రయులైన వారికి ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్.. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ‘సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు’ను ప్రారంభించారు. మూసీ వరదలతో దెబ్బతిన్న నగరాన్ని ఆ బోర్డు ఆధ్వర్యంలోనే పునరుద్ధరించారు. వేల సంఖ్యలో ఇళ్లను నిర్మించి ఇచ్చారు. తర్వాత సికింద్రాబాద్ ప్రాంతంలో మౌలిక వసతులు మెరుగుపర్చేందుకు 1931లో ‘టౌన్ ఇంప్రూవ్మెంట్ ట్రస్టు’ను ఏర్పాటు చేశారు. 1956లో ఈ రెండింటినీ విలీనం చేస్తూ గృహనిర్మాణ మండలి (హౌజింగ్ బోర్డు)ను ఏర్పాటు చేశారు. ఆసియాలోనే అతిపెద్ద హౌజింగ్ కాలనీ కూకట్పల్లి హౌజింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ) కాలనీ.. ఒకప్పుడు ఆసియాలోనే మారుమోగిన పేరు. ఇక్కడ ఏడు ఫేజ్‌లలో అల్పాదాయ, మధ్య ఆదాయ, ఎగువ మధ్య ఆదాయ వర్గాలకు ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ పేర్లతో హౌజింగ్ బోర్డు దాదాపు 9 వేల ఇళ్లను నిర్మించింది. అప్పట్లో ఆసియాలోనే ఇది అతిపెద్ద హౌజింగ్ కాలనీ. అంతకుముందు హైదరాబాద్‌లో తొలి హౌసింగ్ బోర్డు కాలనీగా విజయనగర్ కాలనీని నిర్మించారు. తర్వాత మౌలాలి, ఎస్సార్ నగర్, వెంగళరావునగర్ కాలనీలను కట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రధాన పట్టాణాల్లోనూ కాలనీలు నిర్మించారు. ప్రభుత్వం నుంచి నిధులు లేకుండా సెల్ఫ్ ఫైనాన్సింగ్ పద్ధతిలో ఇది కొనసాగింది. అయితే 1980 దశకం చివరికి వచ్చేసరికి ప్రైవేటు బిల్డర్ల హవా మొదలై.. హౌజింగ్ బోర్డు ప్రాభవం తగ్గుతూ వచి్చంది. అడపాదడపా కొన్ని కాలనీల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టినా సింగపూర్ టౌన్షిప్, మలేíÙయా టౌన్‌షిప్‌లు మినహా పెద్దగా గుర్తుండిపోయే ప్రాజెక్టులు లేవు. చివరిగా ఉమ్మడి రాష్ట్రంలో ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలోని రావిర్యాలలో ఇళ్లను నిర్మించింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏ ప్రాజెక్టూ చేపట్టలేదు. మొత్తంగా తెలంగాణ పరిధిలో 20వేలకుపైగా ఇళ్లను బోర్డు స్వయంగా నిర్మించింది. వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్‌తో.. చెన్నారెడ్డి సీఎంగా ఉండగా హౌజింగ్ బోర్డుకు చైర్మన్‌గా వ్యవహరించిన ధర్మారెడ్డి దీనికి భారీగా ల్యాండ్ బ్యాంకు సిద్ధం చేశారు. కూకట్పల్లి నుంచి మాదాపూర్ వరకు ఏకంగా 6 వేల ఎకరాల భూమిని సమీకరించారు. తర్వాత ప్రైవేటు సంస్థలతో కలిసి ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రత్యేకంగా డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (డీఐఎల్)ను ప్రారంభించి... కొన్ని వేల ఎకరాలను దానికి బదలాయించారు. కానీ కొన్ని బడా సంస్థలు వందల ఎకరాల భూమిని తీసుకుని బోర్డుకు పూర్తి డబ్బులు చెల్లించకుండా ఎగ్గొట్టి నష్టపర్చాయి. ఇప్పటికీ ఆ వివాదాలు కొనసాగుతున్నాయి. జేఎన్టీయూ సమీపంలో హౌజింగ్ బోర్డు ఉద్యోగులకు 1978లో కాలనీని నిర్మించారు. దానికి ధర్మారెడ్డి పేరే పెట్టుకున్నారు. అప్పట్లో ఉద్యోగులకు రూ.5.80కు గజం చొప్పున స్థలాన్ని కేటాయించటం గమనార్హం. పీజేఆర్ టు కేసీఆర్.. పేదలకు ఇళ్లను నిర్మించి ఇచ్చే పథకం తొలుత సంక్షేమశాఖ అ«దీనంలో ఉండేది. 1990లలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న పి.జనార్దన్‌రెడ్డి ప్రత్యేకంగా గృహనిర్మాణ శాఖను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి అంగీకరించడంతో ప్రత్యేక శాఖగా ఏర్పాటైంది. నాటి నుంచి వివిధ విభాగాలు, కార్పొరేషన్లతో విస్తరించి.. పేదలు, మధ్యతరగతి ఇళ్లు కట్టించిన గృహనిర్మాణ శాఖ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో కాలగర్భంలోకి వెళ్లిపోయింది. వైఎస్సార్ హయాంలో చరిత్ర సృష్టించి.. పేదల కోసం నిరంతరం తపించిన వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదల గృహ నిర్మాణ పథకానికి కొత్త నిర్వచనం చెప్పారు. పాదయాత్ర సమయంలో జనం బాధలను ప్రత్యక్షంగా చూసిన ఆయన.. ప్రతి పేద కుటుంబానికి సొంతింటిని అందించాలన్న లక్ష్యంతో ఇందిరమ్మ పథకాన్ని ప్రారంభించారు. తెలంగాణ ప్రాంతంలోనే ఏకంగా 18 లక్షల ఇళ్లను మంజూరు చేశారు. అప్పట్లో ఇది దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. దానిని చాలా రాష్ట్రాలు అనుసరించాయి. వైఎస్సార్ కన్నుమూసిన తర్వాత ఆ పథకం క్రమంగా నీరుగారుతూ వచ్చింది. దివిసీమ ఉప్పెన నిరాశ్రయులకు ఇళ్ల నిర్మాణంతో మొదలు.. 1977లో కృష్ణా–గుంటూరు ప్రాంతాలను కుదిపేసిన దివిసీమ ఉప్పెనలో నిరాశ్రయులైన పేదలకు గూడు కల్పించేందుకు నాటి చెన్నారెడ్డి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమమే.. క్రమంగా గృహనిర్మాణ సంస్థ ఆవిర్భావానికి దారితీసింది. 1979లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం గృహనిర్మాణ పథకాన్ని చేపట్టి.. ప్రత్యేకంగా దివిసీమలో ఇళ్ల నిర్మాణం చేపట్టింది. తర్వాత ముఖ్యమంత్రి అయిన ఎన్టీ రామారావు.. ఈ కార్యక్రమాన్ని మొత్తంగా ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పేదలకు ఇళ్లు కట్టించే పథకంగా మార్చారు. ఏటా లక్షన్నర చొప్పున ఇళ్లు నిర్మించేలా పంచవర్ష ప్రణాళికను చేపట్టారు. -
రోడ్ల కోతకు ‘ఎఫ్డీఆర్’తో చెక్
సాక్షి, అమరావతి: నదీపరివాహక ప్రాంతాల్లో దశాబ్దాలుగా వేధిస్తున్న రోడ్ల కోతకు రాష్ట్ర ప్రభుత్వం ముగింపు పలకనుంది. అందుకోసం ఫుల్ డెప్త్ రిక్లమేషన్ (ఎఫ్డీఆర్) టెక్నాలజీతో రోడ్లు నిర్మించాలని నిర్ణయించింది. మెత్తటి నేలల్లో రోడ్లు నిర్మిస్తున్నా.. వర్షాలు పడినా, వరదలు వచ్చినా నదీతీర ప్రాంతాల్లో రోడ్లు కోతకు గురవుతున్నాయి. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దశాబ్దాలుగా ఈ సమస్య వేధిస్తోంది. ఈ జిల్లాల్లో నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉండటమే అందుకు కారణం. ఈ సమస్యను గుర్తించినప్పటికీ గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. సాధారణ పరిజ్ఞానంతో రోడ్లు నిర్మిస్తూ తమ అనుయాయులైన కాంట్రాక్టర్లకు ప్రయోజనం కల్పించింది. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం మెత్తటి నేలల్లో కూడా పటిష్టమైన రోడ్లు నిర్మించాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ (ఆర్డీసీ) రాష్ట్రంలో మొదటిదశ కింద చేపట్టిన రోడ్ల పునరుద్ధరణ పనుల్లో ఎఫ్డీఆర్ సాంకేతికతతో రోడ్లు నిర్మించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా తూర్పు గోదావరి జిల్లాలోని గోపాలపురం నియోజకవర్గంలో గజ్జరం నుంచి హుకుంపేట వరకు 7.50 కిలోమీటర్ల మేర ఎఫ్డీఆర్ టెక్నాలజీతో రోడ్డు నిర్మించారు. ఆ రోడ్డును పరిశీలించిన సీఐఆర్ నిపుణులు సంతృప్తి వ్యక్తం చేశారు. వెయ్యి కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎఫ్డీఆర్ టెక్నాలజీతో వెయ్యి కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. అందులో ఆర్ అండ్ బి శాఖకు చెందిన 500 కిలోమీటర్ల రోడ్లు, పంచాయతీరాజ్ శాఖకు చెందిన 500 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. కిలోమీటరుకు సింగిల్ లైన్ అయితే రూ.80 లక్షలు, డబుల్ లైన్ అయితే రూ.1.40 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. యాన్యుటీ విధానంలో ఈ రోడ్లు నిర్మిస్తారు. త్వరలోనే టెండర్ల ప్రక్రియ చేపట్టి నిర్మాణ పనులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎఫ్డీఆర్ టెక్నాలజీ అంటే.. మెత్తటి నేలలపై ఉన్న పాత రోడ్లను 300 మిల్లీమీటర్ల లోతువరకు తొలగిస్తారు. సిమెంట్, ఎమ్యల్షన్ అనే ప్రత్యేక ఎడెటివ్ రసాయనంతో చేసిన మిశ్రమాన్ని రోడ్డు, గ్రానైట్ వ్యర్థాల మిక్స్‌లతో కలిపి రోడ్లు నిర్మిస్తారు. ఈ రోడ్లు 15 ఏళ్లపాటు నాణ్యతతో ఉంటాయి. దీంతోపాటు ఎఫ్డీఆర్ టెక్నాలజీ పర్యావరణ హితమైనదని కూడా కావడం విశేషం. -
Telangana: రూ.3 వేల కోట్లు.. 4 వేల కిలోమీటర్లు
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో రోడ్లను మెరుగుపరిచే నిర్వహణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. కనీసం నాలుగు వేల కిలోమీటర్ల మేర రోడ్లను పూర్తిస్థాయిలో మరమ్మతు చేసి మెరుగుపరచాలని రోడ్లు, భవనాల శాఖ నిర్ణయించింది. అలాగే గత రెండేళ్లలో కురిసిన భారీ వర్షాలతో తీవ్రంగా దెబ్బతిని వాహనదారులకు నరకాన్ని చూపుతున్న రోడ్లను కూడా బాగు చేయనున్నారు. ఇందుకు రూ.3 వేల కోట్లు ఖర్చు కానున్నట్టు రోడ్లు, భవనాల శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రోడ్లను అద్దాల్లా మెరిసేలా చేయాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ కదలిక వచ్చింది. గతంలోనూ నిధుల కోసం పలుమార్లు ప్రతిపాదనలు రూపొందించి వాటి విడుదల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో, ఈసారి స్వయంగా ముఖ్యమంత్రే ఆదేశించిన నేపథ్యంలో నిధులు వెంటనే మంజూరయ్యే అవకాశం ఉందని అంటున్నారు. బడ్జెట్ కేటాయింపుల పరిమితితో సంబంధం లేకుండా ఈ నిధులు విడుదల కానున్నాయి. ఏడో వంతు మాత్రమే.. రాష్ట్ర రహదారుల విభాగం పరిధిలో 28 వేల కిలోమీటర్ల రోడ్ నెట్వర్క్ ఉంది. ఇందులో ఇప్పుడు 4 వేల కి.మీ. పరిధిలో మాత్రమే పనులు జరగనున్నాయి. అంటే ఏడో వంతు మాత్రమే. ప్రతిరోడ్డుకు ఐదేళ్లకోసారి రెన్యూవల్ పనులు జరగాలని ఇండియన్ రోడ్ కాంగ్రెస్ చెప్తోంది. అయితే అది ఖర్చు తో కూడుకున్న వ్యవహారం అయినందున కనీసం ఏడేళ్లకోసారి అయినా మరమ్మతు జరగాలన్నది నిపుణుల మాట. రాష్ట్రంలో 28 వేల కి.మీ. రాష్ట్ర రహదారులున్నందున ప్రతియేటా 4వేల కి.మీ. రోడ్లకు మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలో పెద్ద ఎత్తున డబుల్ రోడ్ల నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు ఈ రోడ్ల పనులు చేపట్టారు. ఇందులో కొన్నింటిని పూర్తి చేశారు. వీటి నిర్మాణం వల్ల ఆయా ప్రాంతాల్లో ఏర్పడ్డ కొత్త రోడ్లనే రెన్యువల్స్‌గా భావిస్తున్నారు. అవి తప్ప విడిగా రోడ్డు రెన్యువల్ పనులు చేపట్టలేదు. ఫలితంగా చాలా రోడ్లు బలహీనపడ్డాయి. గత మూడేళ్లుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆ రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. పునరుద్ధరణ పనులకు నిధులులేక.. బాగా దెబ్బతిన్న ప్రాంతాల్లో వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు. రోడ్ల దుస్థితిపై తీవ్ర విమర్శలు వస్తుండటంతో ఇటీవల ముఖ్యమంత్రి సమీక్షించి వాటిని మెరుగు పరిచేందుకు ఆదేశాలివ్వటంతో సుదీర్ఘ విరామం తర్వాత వాటికి మంచిరోజులు రాబోతున్నాయి. రూ.3 వేల కోట్లలో దాదాపు రూ.700 కోట్లు వరదలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుకు కేటాయించారు. -
AP: రూ.1,700 కోట్లు.. 6,150 కిలో మీటర్లు.. మరింత వేగవంతం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రోడ్ల పునరుద్ధరణ పనులను మరింత వేగవంతం చేసేందుకు ఆర్ అండ్ బి శాఖ సన్నద్ధమవుతోంది. ఈ మేరకు రూ.1,700 కోట్లతో 6,150 కి.మీ.మేర రహదారుల పునరుద్ధరణ ప్రణాళికను ఖరారు చేసింది. గతంలో టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వీటి పునరుద్ధరణకు తీసుకున్న రూ.3వేల కోట్ల రుణాన్ని కూడా ఎన్నికల ముందు పసుపు–కుంకుమ పథకానికి మళ్లించడంతో పరిస్థితి మరింత దిగజారింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రోడ్ల పునరుద్ధరణపై దృష్టిసారించింది. ఇందుకోసం తీసుకున్న రుణాన్ని ప్రత్యేక బ్యాంకు ఖాతా ద్వారా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తోంది. దీంతో నిధులను ఇతర అవసరాలకు మళ్లించకుండా ప్రభుత్వం సరైన విధానాన్ని ఏర్పర్చింది. మొదటి దశ కింద రూ.2,205 కోట్లతో రాష్ట్రంలో 6,500 కి.మీ. మేర రోడ్ల పునరుద్ధరణ పనులు దాదాపు పూర్తికావచ్చాయి. ఇప్పటికే 85శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. మిగిలిన 15శాతం పనులు డిసెంబర్ చివరి నాటికి పూర్తిచేయనుంది. దాంతో రెండో దశ కింద రాష్ట్రంలో రోడ్ల పునరుద్ధరణ పనులపై ఆర్ అండ్ బి శాఖ జిల్లాల నుంచి ప్రతిపాదనలను తెప్పించుకుంది. ఆ ప్రతిపాదనలతో రెండో దశ ప్రణాళికను రూపొందించింది. రూ.1,700 కోట్లతో ప్రణాళిక ఇలా.. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో మొత్తం 953 రోడ్లను రెండో దశలో పునరుద్ధరించాలని నిర్ణయించింది. వాటిలో రాష్ట్ర ప్రధాన రహదారులు 292, జిల్లా ప్రధాన రహదారులు 661 ఉన్నాయి. తద్వారా మొత్తం 6,150 కి.మీ. మేర రోడ్లను పునరుద్ధరిస్తారు. ఇందుకోసం రూ.1,700 కోట్లతో ప్రణాళికను ఖరారుచేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర ప్రధాన రహదారులకు రూ.673 కోట్లు, జిల్లా ప్రధాన రహదారులకు రూ.1,027 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. దీనికి ఆమోదముద్ర లభించిన తరువాత టెండర్ల ప్రక్రియ చేపడతారు. అనంతరం ఏడాదిలోగా పనులు పూర్తిచేయాలన్నది ఆర్ అండ్ బి శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. -
అద్దాల్లా రోడ్లు..! నిరంతరం పర్యవేక్షణ, మరమ్మతులు
సాక్షి, హైదరాబాద్: ‘‘ఇంజనీర్లు సంప్రదాయ పద్ధతిలో కాకుండా చైతన్యవంతంగా, విభిన్నంగా ఆలోచన చేయాలి. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని నిరంతరం సమీక్షించాలి. వానలు, వరదలకు పాడైన రోడ్లకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలి. రోడ్లు చెక్కు చెదరకుండా అద్దాల్లా ఉండేందుకు నిరంతర పర్యవేక్షణ, నిర్వహణ చేపట్టాల్సిన బాధ్యత ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖలదే..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు టెండర్లు పిలిచి వారంలో కార్యాచరణ ప్రారంభించాలని.. వచ్చేనెల రెండో వారంలోగా టెండర్లు పూర్తి కావాలని ఆదేశించారు. వానలు, వరదల కారణంగా దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్లను గుర్తించి మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖలపై కేసీఆర్ గురువారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల శాఖ తరహాలోనే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించుకుని రోడ్ల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. రోడ్లు ఎక్కడెక్కడ, ఏమూలన పాడయ్యాయో సంబంధించిన క్షేత్రస్థాయి ఇంజనీర్ల వద్ద పూర్తి వివరాలు ఉండాలని చెప్పారు. ఆర్అండ్బీ శాఖ పునర్వ్యవస్థీకరణ రాష్ట్రంలో గుణాత్మక ప్రగతికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో కావాల్సినంత సిబ్బందిని నియమించుకుని, బాధ్యతల వికేంద్రీకరణ దిశగా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇతర శాఖల తరహాలోనే ఆర్‌అండ్‌బీలో సైతం ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ)ల విధానాన్ని తీసుకురావాలన్నారు. ఐదారు ఆసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక ఈఎన్సీ ఉండాలని, టెరిటోరియల్ సీఈలను కూడా నియమించాలని సూచించారు. సమర్థవంతంగా పనిచేయడానికి ఎస్ఈలు, ఈఈలు ఎంత మంది ఉండాలో ఆలోచన చేయాలన్నారు. సమర్థవంతంగా పర్యవేక్షణ ఉండేలా పని విభజన జరగాలని.. ఆ దిశగా సమీక్ష జరిపి తుది నివేదిక ఇస్తే తదుపరి మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదించేందుకు వీలుంటుందని తెలిపారు. ఇక ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహాలపైనా సమావేశంలో చర్చించారు. ‘బాధ్యతల పునర్విభజన; వానలు, వరదలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, నిర్వహణ; మరమ్మతులు, ఇతర పనులపై సత్వర నిర్ణయం; వెంటనే పనులు చేపట్టేదిశగా కిందిస్థాయి ఇంజనీర్లకు నిధుల కేటాయింపు..’ వంటి వ్యూహాలను అవలంబించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇంజనీర్లు ఎక్కడికక్కడ రోడ్లను విభజించుకుని పని విభజన చేసుకోవాలన్నారు. కేజ్ వీల్స్‌పై ఇక కఠినంగా.. గ్రామాల్లో ట్రాక్టర్లను కేజ్ వీల్స్‌తో నడుపుతుండడంతో రోడ్లు పాడవుతున్నాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఇలా చేయకుండా రైతులు, ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లను చైతన్యవంతం చేయాలని, అవసరమైతే కఠినంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. అటవీ భూములు అడ్డం రావడంతో రోడ్ల నిర్మాణం ఆగిపోతే.. ఆ శాఖతో సమన్వయం చేసుకుని సమస్యను పరిష్కరించాలని సూచించారు. రోడ్ల నిర్మాణానికి వినియోగించే మెటీరియల్‌ను హైదరాబాద్ కేంద్రంగా ఉత్పత్తి చేసుకోవాలని, తద్వారా సమయం ఆదా చేయడంతోపాటు, నాణ్యతను కాపాడుకోవచ్చని చెప్పారు. క్షేత్రస్థాయి ఇంజనీర్లకు స్వీయ విచక్షణ నిధులు నీటి పారుదల శాఖ తరహాలోనే రోడ్ల మరమ్మతుల కోసం ఆర్అండ్బీ శాఖకు కూడా మెయింటెనెన్స్ నిధులు పెంచినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. క్షేత్రస్థాయి ఇంజనీర్లు ప్రతి చిన్నపనికి హైదరాబాద్‌కు వచ్చి సమయం వృథా చేసుకోవద్దని.. వారి స్థాయిని బట్టి స్వీయ విచక్షణతో ఖర్చు చేసేలా నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుందని చెప్పారు. స్వీయ విచక్షణతో ఖర్చు చేసేందుకు డీఈఈ, ఈఈ, ఎస్ఈ స్థాయి అధికారులకు ఎన్ని నిధులు కేటాయించాలో సిఫార్సు చేయాలని సీఎం సూచించారు. రోడ్ల నిర్వహణ సమర్థవంతంగా జరగాలంటే ఏ స్థాయి ఇంజనీర్లకు బాధ్యతలు అప్పగించాలో తేల్చాలని కోరారు. పటిష్టంగా కొత్త ఆస్పత్రుల నిర్మాణం రాష్ట్రంలో కొత్త సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను పటిష్టంగా నిర్మించాలని ఆర్అండ్బీ శాఖను సీఎం ఆదేశించారు. వరంగల్, హైదరాబాద్‌లలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఈఎన్టీ, డెంటల్, ఆప్తాల్మాలజీ విభాగాలకు ఒక అంతస్తును కేటాయించాలని సూచించారు. ఈ మేరకు ఆయా ఆస్పత్రుల డిజైన్లను పరిశీలించి పలు మార్పులను సూచించారు. అన్ని విభాగాలకు ప్రత్యేక వసతులతో ఎత్తైన భవనాలను నిర్మించాలని కోరారు. వైద్య విద్యార్థులు, ప్రజలకు సౌకర్యవంతంగా ఆస్పత్రులు ఉండాలన్నారు. కార్పొరేట్‌కు ధీటుగా వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఉండాలన్నారు. అయితే సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్ర ప్రభుత్వ శాఖల పనితీరుపై సీఎం కేసీఆర్ సమీక్ష జరపడం గమనార్హం. ఇదీ చదవండి: బుల్లెట్ ప్రూఫ్‌తో సీఎం ఛాంబర్.. అత్యాధునిక హంగులతో నూతన సచివాలయం -
భళా బూడిద..!
సాక్షి, అమరావతి: బూడిద అనగానే ఎందుకూ పనికిరాదని తేలిగ్గా తీసేస్తాం. కానీ, అలా తీసిపడేసిన బూడిదతోనే కంకర తయారు చేసి పటిష్టంగా రహదారులు, భవనాలను నిర్మించవచ్చు. అది కూడా సిమెంటు అవసరం లేకుండానే. ఈ మేరకు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) లిమిటెడ్ చేసిన ప్రయోగం ఫలించింది. దీనివల్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి వచ్చే బూడిదతో ఇబ్బందులు తొలగి జీవరాశులకు, పర్యావరణానికి మేలు కలుగనుంది. రోడ్లు, భవనాల నిర్మాణంలో ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. బూడిద విక్రయాల వల్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు ఆదాయమూ పెరగనుంది. ఫలించిన పరిశోధనలు థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే వ్యర్థాల్లో బూడిద (ఫ్లై యాష్) ప్రధానమైంది. దేశంలో బొగ్గుతో నడిచే థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఏటా సుమారు 258 మిలియన్ మెట్రిక్ టన్నుల బూడిద ఉత్పత్తి అవుతోంది. ఇందులో 78 శాతం బూడిదను సిమెంట్, సిరామిక్ వంటి పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు. బూడిద స్వభావాన్ని బట్టి వేరుచేసి టన్ను రూ.80 చొప్పున విక్రయిస్తారు. మిగిలినది యాష్ పాండ్లలో మిగిలిపోతుంది. అది గాలి, నీరులో కలిసి వాటిని కలుషితం చేస్తోంది. ఫలితంగా వాతావరణం దెబ్బతిని, దాని ప్రభావం జీవరాశులపై పడుతోంది. ఈ నేపథ్యంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని తగ్గించాలని ఓ వైపు ప్రయత్నాలు కొనసాగుతుండగా, మరోవైపు ప్రస్తుతం వస్తున్న బూడిద వినియోగంపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) లిమిటెడ్... బూడిదను ఉపయోగించి జియో పాలిమర్ ముతక కంకరను అభివృద్ధి చేసింది. ఈ కంకర జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్స్ (ఎన్‌సీసీబీఎం) ధ్రువీకరించింది. ఇది సహజ కంకరకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. ఏటా దేశంలో 2వేల మిలియన్ మెట్రిక్ టన్నుల కంకరకు డిమాండ్ ఉంటుంది. థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడిన బూడిదతో చేసిన కంకర ఈ డిమాండ్‌ను చాలావరకు తీర్చే అవకాశం ఉంది. రాతి కంకర కోసం కొండలు, భూమిని తవ్వడం వల్ల ఏర్పడే పర్యావరణ అసమతౌల్యాన్ని కూడా తగ్గిస్తుంది. ఖర్చు తగ్గుతుంది జియో పాలిమర్ కంకర ఉపయోగించినప్పుడు సిమెంట్ అవసరం లేదు. థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే బూడిద ఆధారిత జియోపాలిమర్ కంకరే బైండింగ్ ఏజెంటుగా పని చేస్తుంది. ఈ కంకర కర్బన ఉద్గారాలను తగ్గించడంలోనూ తోడ్పడుతుంది. నీటి వినియోగాన్ని కూడా తగ్గిస్తుంది. మరోవైపు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ జారీచేసిన మార్గదర్శకాలను అనుసరించి థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి అయిన బూడిదను మూడేళ్లలో వంద శాతం వినియోగించాలి. అందువల్ల త్వరలోనే జియో పాలిమర్ కంకర అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. -
పైసలు రావు పనులు కావు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త రోడ్ల నిర్మాణం పూర్తిగా ఆగిపోయింది. గతంలో ప్రారంభించిన.. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు రెండు వరసల రహదారుల నిర్మాణం ఎక్కడికక్కడ నిలిచిపోయింది. చివరకు నిర్వహణ పనుల్లో భాగంగా క్రమం తప్పకుండా జరగాల్సిన పునరుద్ధరణ (రెన్యువల్స్) పనులు చేసే అవకాశం కూడా లేకుండా పోయింది. తెలంగాణ వచ్చిన కొత్తలో దేశంలో మరే రాష్ట్రంలో లేనట్టుగా ఏకంగా రూ.15,470 కోట్లతో రోడ్ల పనులు చేపట్టారు. కానీ ప్రస్తుతం రోడ్లపై పడ్డ గుంతలను పూడ్చడం తప్ప రోడ్ల నిర్మాణం మచ్చుకైనా కనిపించటం లేదు. దీంతో రోడ్లు భవనాల శాఖలో రాష్ట్ర రహదారుల విభాగానికి చేసేందుకు పని లేని పరిస్థితి ఎదురైంది. కేటాయింపు కష్టమై.. ►తెలంగాణ ఏర్పడక పూర్వం రాష్ట్రవ్యాప్తంగా డబుల్ రోడ్లు నామమాత్రంగానే ఉండేవి. జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు, కొన్ని ప్రధాన పట్టణాల మధ్య తప్ప అన్నీ సింగిల్ రోడ్లే. 2014 నాటికి రాష్ట్రప్రభుత్వ అధీనంలోని రోడ్ల నిడివి 24,245 కి.మీ. కాగా, అందులో కేవలం 27.9% మాత్రమే డబుల్ రోడ్లు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రోడ్లపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్, అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, ప్రతి జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు డబుల్ రోడ్లు ఉండాలని నిర్ణయించి ఏకంగా రూ.15,470 కోట్లతో 9,578 కి.మీ. నిడివిగల రహదారులను డబుల్ రోడ్లుగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ పనులు అధిక ప్రాధాన్యంతో సాగటంతో 2018 నాటికే సింహభాగం పూర్తయ్యాయి. ప్రస్తుతం 7,540 కి.మీ. పనులు పూర్తయ్యాయి. మిగతావి మాత్రం మూడేళ్లుగా నిలిచిపోయాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా చివరలో ఏర్పడ్డ కొత్త మండలాలకు డబుల్ రోడ్ల భాగ్యం దక్కలేదు. తొలుత 145 మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు రోడ్లకు సంబంధించి 1,835 కి.మీ. పనులు ప్రతిపాదించగా 1,651 కి.మీ పనులు పూర్తయ్యాయి. మిగతావి పెండింగులోపడ్డాయి. కొత్త మండలాలకు సంబంధించి 450 కి.మీ. పనులు చేయాల్సి ఉంది. ఇందుకు రూ.1,000 కోట్లు కావాలని అంచనా వేశారు. వీటితోపాటు పాత పనులకు ఇంకా రూ.3 వేల కోట్లు కావాల్సి ఉంది. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిలో అన్ని నిధులు కేటాయించటం కష్టంగా మారటంతో పనులు దాదాపుగా నిలిపివేశారు. బకాయిలు చెల్లిస్తేనే పనులు.. ►ఇటీవల రోడ్ల రెన్యువల్స్ పనుల కోసం టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. రెండుసార్లు టెండర్లు పిలిచి స్పందన లేక అధికారులు మిన్నకుండిపోయారు. పనులు చేస్తే బిల్లులు వస్తాయన్న నమ్మకం లేకనే కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ప్రస్తుతం వారికి రూ.700 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఇవి గతంలో రూ.1,200 కోట్లుగా ఉండగా, అడపాదడపా కొన్ని చొప్పున చెల్లిస్తూ రావడంతో ఈ మాత్రానికి తగ్గాయి. ఇవి దాదాపు రెండేళ్లుగా పేరుకుపోయి ఉండటంతో, కాంట్రాక్టర్లు స్టేట్ రోడ్ల పనులంటేనే వెనకడుగు వేస్తున్నారు. ఏడున్నరేళ్లలో ఇలా ►తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 7,180 కి.మీ రెండు వరసల రోడ్లను నిర్మించారు. ►321 కి.మీ. మేర నాలుగు వరసల రోడ్ల నిర్మాణం జరిగింది. ►39 కి.మీ. మేర ఆరు వరసల రోడ్లు రూపొందాయి. ►430 వంతెనలు కొత్తగాఏర్పడ్డాయి ఆ రోడ్లతో బంతాట.. పంచాయతీరాజ్ శాఖ ఆధీనంలో ఉన్న కొన్ని రోడ్లు అభివృద్ధి చేసే క్రమంలో గతంలో రోడ్లు, భవనాల శాఖకు బదిలీ అయ్యాయి. అలా విడతల వారీగా 6 వేల కి.మీ. రోడ్లను అప్పగించారు. ఈ రోడ్లను రాష్ట్ర రహదారుల స్థాయికి తేవాలంటే రూ.5 వేల కోట్లు కావాలని లెక్కలేశారు. చేపట్టిన పనులే పూర్తి చేసే పరిస్థితి లేకపోవటంతో, ఈ రోడ్లను ఇక ముట్టుకునేందుకు కూడా జంకుతున్నారు. వీలైతే తిరిగి పంచాయతీరాజ్ శాఖకు అప్పగించేందుకు రోడ్లు భవనాల శాఖ సిద్ధంగా ఉంది. పేరుకే స్టేట్ రోడ్లు.. జాతీయ రహదారుల తర్వాత రాష్ట్ర రహదారులు విశాలంగా, అనువుగా ఉంటాయి. అలా రాష్ట్ర రహదారుల జాబితాలో ఉండి కూడా కనీసం కంకర రాయి కూడా పడని కచ్చా మట్టి రోడ్లు ఏకంగా 719 కి.మీ. మేర ఉండటం పరిస్థితిని స్పష్టం చేస్తోంది. వీటిపై తొలుత కంకరపరిచి మెటల్ రోడ్లుగా మార్చాలి. ఆ తర్వాత తారు రోడ్ల స్థాయికి తేవాలి. ఇక కంకర పరిచి తారు కోసం ఎదురుచూస్తున్న రోడ్ల నిడివి 615 కి.మీ మేర ఉంది. వెరసి స్టేట్ రోడ్ల జాబితాలో ఉన్నప్పటికీ ఇంకా 1,330 కి.మీ మేర కచ్చా రోడ్లే ఉండటం గమనార్హం. -
ఆటంకాలున్నా.. అభివృద్ధి బాటే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, పునరుద్ధరణ, మరమ్మతుల పనులను సత్వరమే పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన వంతెనలు, ఆర్వోబీలు, ఫ్లై ఓవర్ల నిర్మాణ పనులను ప్రాధాన్యతగా చేపట్టి వేగంగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని సూచించారు. జూలై 15వతేదీ కల్లా మునిసిపాలిటీల్లో రహదారులపై గుంతలు పూడ్చి ఆ వెంటనే జూలై 20 నాటికి అన్ని చోట్లా ఫొటో గ్యాలరీలు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు వెళ్లే రెండు లేన్ల రహదారుల పనులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గత సర్కారు హయాంలో రోడ్ల మరమ్మతుల కోసం ఐదేళ్లలో రూ.1,300 కోట్లు ఖర్చు చేస్తే ఇప్పుడు మూడేళ్లలోనే రూ.2,400 కోట్లు వ్యయం చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఆగిపోవాలని ఏకైక అజెండాతో ప్రతిపక్షాలు పని చేస్తున్నాయని మండిపడ్డారు. ఎన్ని ఆటంకాలు కల్పిస్తున్నా సడలని సంకల్పంతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపేలా ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఆర్అండ్బీ.. పంచాయతీరాజ్, పురపాలక, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలో జరుగుతున్న రహదారుల పనులపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ మంగళవారం సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఆ వివరాలివీ... సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తేడా కచ్చితంగా కనిపించాలి రాష్ట్రవ్యాప్తంగా రహదారుల మరమ్మతుల పనులు చురుగ్గా సాగుతున్నాయి. నాడు – నేడు ద్వారా చేపట్టిన పనుల్లో మంచి పురోగతి కనిపిస్తోంది. గతంలో పనులు ప్రారంభమై ఆసంపూర్తిగా ఉన్న రోడ్లు, వంతెనలు, ఆర్వోబీలు, ఫ్లై ఓవర్లను పూర్తి చేసేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలి. వీటికి అత్యంత ప్రాధాన్యమిచ్చి ఎక్కడా పెండింగ్‌లో లేకుండా చూడాలి. వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి. ఫలితాలు కచ్చితంగా కనిపించాలి. అసంపూర్తిగా ఉన్న రోడ్లను పూర్తి చేయడమే కాకుండా గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దాలి. నివర్ తుపాను కారణంగా కొట్టుకుపోయిన ప్రాంతాల్లో కొత్త వంతెనల నిర్మాణాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలి. తుపానుతో దెబ్బతిన్న ప్రాంతాల్లో పనులు వెంటనే చేపట్టాలి. రూ.2,205 కోట్లతో మరమ్మతులు ఆర్ అండ్ బీ పరిధిలో రోడ్ల మరమ్మతులు, ప్రత్యేక పనుల కింద 7,804 కి.మీ. మేర 1,168 పనులు చేపట్టాం. వాటి కోసం ప్రభుత్వం రూ.2,205 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇప్పటికే 675 పనులు పూర్తి కాగా మరో 491 కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 62.09 శాతం పనులను రూ.1369 కోట్లతో ప్రభుత్వం పూర్తి చేసింది. మిగిలిన పనులు వీలైనంత త్వరగా పూర్తి కావాలి. నాబార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ (నిడా–1) కింద చేపట్టిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. రూ.2,479.61 కోట్లతో 233 పనులు చేపట్టాం. ఇప్పటికే రూ.1,321.08 కోట్ల విలువైనవి పూర్తి చేశాం. మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయాలి. వ్యత్యాసాన్ని వెల్లడించేలా ఫొటో గ్యాలరీలు రోడ్ల నిర్మాణమే కాకుండా క్రమం తప్పకుండా నిర్వహణ, మరమ్మతులపై పంచాయతీరాజ్ శాఖ కార్యాచరణ సిద్ధం చేయాలి. 1,843 రోడ్ల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం రూ.1,072.92 కోట్లు ఖర్చు చేస్తోంది. తద్వారా 4,635 కి.మీ. మేర రహదారులు మెరుగుపడనున్నాయి. గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని రోడ్ల నిర్మాణం, మరమ్మతులపై దృష్టిపెట్టి ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలి. కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో చురుగ్గా మరమ్మతులు చేపట్టాలి. మునిసిపాలిటీల్లో జూలై 15 కల్లా గుంతలు పూడ్చాలి. జూలై 20న నాడు – నేడు ద్వారా వ్యత్యాసాన్ని తెలియచేసేలా అన్ని చోట్లా ఫొటో గ్యాలరీలు ఏర్పాటు చేయాలి. హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు సమీక్షలో ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి) బూడి ముత్యాలనాయుడు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఆర్ అండ్ బీ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్‌దండే, పురపాలక శాఖ కమిషనర్ ప్రవీణ్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు రాష్ట్రంలో అభివృద్ధి పనులను ముందుకు సాగనివ్వకుండా కొందరు రకరకాల కుట్రలు పన్నుతున్నారు. కేసులు వేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రుణాలు ఇవ్వకూడదని, కేంద్రం నుంచి డబ్బులు రాకూడదని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అభివృద్ధి పనులు ఆగిపోవాలనే ఏకైక అజెండాతో ప్రతిపక్షాలు పని చేస్తున్నాయి. అయినప్పటికీ సడలని సంకల్పంతో అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నాం. ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న రంగాల్లో అభివృద్ధి పనులకు ఎక్కడా నిధుల లోటు రాకుండా, చెల్లింపుల సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలను పూర్తి చేస్తున్నాం. -
రూ.903 కోట్లతో రోడ్ల అభివృద్ధి
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో రూ.903.21 కోట్లతో వివిధ రహదారుల అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు తెలిపారు. ఇందులో ఇప్పటికే కొన్ని రోడ్ల పనులు పూర్తి అయి ప్రజలకు అందుబాటులోకి కూడా వచ్చాయన్నారు. ఈ విషయం తెలుసుకోకుండా కొన్ని పత్రికలు రహదారులపై తప్పుడు కథనాలు ప్రచురితం చేయడంతో వాస్తవాలు వెల్లడిస్తున్నట్లు చెప్పారు. రోడ్లకు సంబంధించి ఎంతో పురోగతి ఉన్నప్పటికీ చెప్పుకోలేకపోతున్నామని, ఇక నుంచి ప్రతి సోమవారం రహదారుల నిర్మాణాలపై సమీక్ష నిర్వహిస్తామని, ‘స్పందన’ కార్యక్రమంలో పూర్తయిన రహదారుల వివరాలను నాడు–నేడు కింద ప్రదర్శించనున్నట్లు చెప్పారు. శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపిన వివరాలు.. జిల్లాలో ఆర్అండ్బీ ఆధ్వర్యంలో మొత్తం 1,887 కిలోమీటర్ల రహదారులు ఉన్నాయి. ఇందులో 243 కిలోమీటర్లకు సంబంధించి ఎలాంటి మరమ్మతులు అవసరం లేదు. మిగిలిన 791 కిలోమీటర్ల రోడ్లకు మరమ్మతులు, విస్తరణ పనులు చేయాల్సి ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం రూ. 517 కోట్లను మంజూరు చేసింది. మొత్తం 134 పనులు మంజూరు కాగా ఇప్పటి వరకు 55 పనులు పూర్తయ్యాయి. ఇందులో 42 పనులు జరుగుతున్నాయి. మరో 37 పనులను జూలై మొదటి వారంలోపు ప్రారంభిస్తారు. సెప్టెంబర్ నాటికి అన్నీ పనులు పూర్తి చేస్తారు. పంచాయతీరాజ్ విభాగంలో జూలై 1 నుంచి రూ.25.49 కోట్లతో 216.03 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణాలు ప్రారంభిస్తారు. ఈ పనులకు సంబంధించి ఈనెల 20న టెండర్లు ఫైనల్ అవుతాయి. మూడు నెలల వ్యవధిలో పనులు పూర్తి అయ్యేలా ప్రణాళిక రూపొందించారు. అలాగే పీఆర్ విభాగంలో రెండో విడత కింద రూ.133.69 కోట్లతో 577.18 కిలోమీటర్ల మేర రోడ్లు వేసేందుకు ప్రభుత్వానికి జిల్లా అధికారులు నివేదించారు. ఈనెల 22వ తేదీ తరువాత ఆ పనులు చేపట్టేందుకు పాలన పరమైన అనుమతులు వస్తాయి. 85 గ్రామాలకు మెయిన్ రోడ్డుకు కనెక్టివిటీ 250 మంది జనాభా కలిగి ఇప్పటి వరకు మెయిన్ రోడ్డుకు కనెక్టివిటీ లేని 85 గ్రామాలకు రోడ్లు వేసేందుకు చర్యలు తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ రూరల్ రోడ్స్ ప్రాజెక్ట్ కింద రూ.189.11 కోట్లతో 190 కిలోమీటర్ల రహదారుల పనులు జరుగుతున్నాయి. ఇందులో ఇప్పటికే 30.82 కిలోమీటర్ల పొడవున పనులు పూర్తి కాగా, అక్టోబర్ 22 నాటికి మిగిలిన 160 కిలోమీటర్ల పనులు పూర్తి చేస్తారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద 8 పనులకు సంబంధించి రూ.27.03 కోట్లతో 91.07 కిలోమీటర్ల రహదారుల పనులు జరుగుతున్నాయి. ఇందులో ఇప్పటికే 7 పనులు పూర్తి కాగా, మంత్రాలయం నియోజకవర్గంలో శాతనూరు నుంచి దొడ్డి వరకు జరుగుతున్న రహదారి పనిని జూలై 15వ తేదీలోపు పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. అలాగే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఇన్సెంటివ్స్ కింద జిల్లాకు 24 రహదారుల మంజూరయ్యాయి. ఇందులో రూ.10 కోట్లతో 77 కిలోమీటర్ల మేర పనులను చేపట్టగా 18 రహదారుల నిర్మాణాలు పూర్తి అయ్యాయి. మిగిలిన 6 రోడ్లు జూలై ఆఖరులోపు పూర్తి అవుతాయి. రహదారులు వేస్తున్నా దుష్ప్రచారం చేస్తున్నారు: కాటసాని జిల్లాలో దాదాపు రూ.900 కోట్ల విలువైన రహదారుల పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నా.. లేదని దుష్ప్రచారం చేస్తున్నారని, ఇలా చేయడం సరికాదని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. ఓర్వకల్లు మండలం హుసేనాపురానికి చెందిన మహబూబ్‌బాషా అసలు కాంట్రాక్టరే కాదని, అతను ఆత్మహత్య చేసుకుంటే కొన్ని పత్రికలు పనిగట్టుకొని రూ.80 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నట్లు రాయడం అన్యాయమన్నారు. ఆయన లేబర్ కాంట్రాక్టరని, కాంట్రాక్టర్‌కు లేబర్ కాంట్రాక్టర్‌కు తేడా లేదా అని ప్రశ్నించారు. రహదారుల నిర్మాణాల్లో క్వాలిటీ లేకపోతే కాంట్రాక్టర్లకు పైసా కూడా బిల్లులు చెల్లించమన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత బస్తిపాడు–నాగలాపురం, మార్కాపురం– పెద్దపాడు, నన్నూరు బ్రిడ్జి, కృష్ణానగర్ ఫ్లై ఓవర్లను ఏడాదిలోపే పూర్తి చేసి ప్రజలకు అంకితం చేసినట్లు చెప్పారు. రహదారులకు సంబంధించి ఈ ఏడాది ఎన్నో పనులు చేపట్టామని, అయినా, ఇంకా కావాలని ముఖ్యమంత్రి వెఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు. తాను తప్పు చేసినా..తన ప్రభుత్వం తప్పు చేసినా మీడియా ఎత్తి చూపవచ్చని, అయితే కొన్ని మీడియా సంస్థలు అదే పనిగా ప్రభుత్వంపై బురద జల్లడం సరికాదన్నారు. -
ముమ్మరంగా రహదారుల పనులు
తుని: రాష్ట్రంలో అత్యంత నాణ్యతా ప్రమాణాలతో, పారదర్శక విధానాలతో రహదారుల అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతుంటే ఓ వర్గం మీడియా పని గట్టుకొని పాత ఫొటోలు చూపించి దుష్ప్రచారం చేస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా మండిపడ్డారు. శనివారం కాకినాడ జిల్లా తుని మున్సిపల్ కార్యాలయంలో ఆయన ఆర్అండ్బీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, కలెక్టర్ కృతికా శుక్లాతో కలిసి మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రహదారులు దెబ్బ తిన్నాయని, ప్రస్తుత ప్రభుత్వం వాటిని అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకుందన్నారు. ఈ సమావేశంలో మంత్రి ఇంకా ఏమన్నారంటే.. ► ఓ వర్గం మీడియా పని గట్టుకొని పాత ఫొటోలు చూపించి దుష్ప్రచారం చేస్తోంది. చంద్రబాబు చర్యలతో పాడైన ఒక్కో వ్యవస్థను కచ్చితమైన ప్రణాళికతో సరిదిద్దుతున్నాం. ► రాష్ట్రంలో సీఎం జగన్ పాలనకు మెచ్చి.. కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖ మంత్రి నితన్ గడ్కరీ ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని జాతీయ రహదారుల ప్రాజెక్టులను మన రాష్ట్రానికి మంజూరు చేశారు. ► 8,268 కిలోమీటర్ల మేర రాష్ట్ర హైవేలు, జిల్లా రహదారుల అభివృద్ధికి సంబంధించి 1,167 మేజర్ పనులు చేపట్టేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.2,205 కోట్ల రుణం తీసుకున్నాం. ఇందులో 438 పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మిగిలిన పనులు ఈ నెలాఖరుకు పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నాం. ► పూర్తి చేసిన 2,756 కిలోమీటర్లు పనులకు రూ.700 కోట్ల మేర కాంట్రాక్టర్లకు చెల్లించాం. గత ప్రభుత్వ హయాంలో మంజూరై ఆగి పోయిన 233 పనులు చేపట్టేందుకు ఎన్ఐడిఏ పథకం కింద నాబార్డు రూ.1,558 కోట్లు రుణం ఇచ్చింది. వీటిలో 182 పనులు పూర్తి కాగా, 51 పనులు ఈ నెలఖారుకు పూర్తవుతాయి. ► 2021–22లో గుంతలు పూడ్చడానికి రూ.86 కోట్లు మంజూరు చేశాం. èఒకప్పుడు రహదారులు ఏలా ఉండేవి? ప్రస్తుతం అభివృద్ధి చేసిన రోడ్లు ఎలా ఉన్నాయి? అనే విషయాలను ప్రజలకు తెలియజేసేందుకు నాడు–నేడు ఫొటో ప్రదర్శన రాష్ట్రంలోని కలెక్టరేట్లలో ఏర్పాటు చేశాం. -
రూ.వెయ్యి కోట్లతో గ్రామీణ రోడ్లకు రిపేర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధీనంలోని 6,425.88 కి.మీ. పొడవైన గ్రామీణ లింకు రోడ్లకు రూ.1,072.92 కోట్లతో ప్రభుత్వం పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టనుంది. దెబ్బతిన్న రోడ్లవారీగా మరమ్మతులకు సంబంధించి అంచనాల తయారీ ప్రక్రియ ఇప్పటికే పూర్తైందని, ఈ నెల 19వతేదీ నుంచి కాంట్రాక్టర్లు ఆన్లైన్లో టెండర్ దాఖలుకు వీలు కల్పించామని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు వెల్లడించారు. 3 విభాగాలు... అత్యంత నాణ్యంగా పనులు రాష్ట్రవ్యాప్తంగా 157 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1,845 రోడ్లలో 193.98 కిలోమీటర్ల మేర గుంతలు పూడ్చుతారు. మరో 1,972.26 కిలోమీటర్ల పొడవున గుంతలు పూడ్చడంతో పాటు ఆ రోడ్డు మొత్తం పొడవునా పై వరుస తారు లేయర్ కొత్తగా వేస్తారు. రోడ్డు బాగా దెబ్బతిన్న 2,468.65 కిలోమీటర్ల పొడవున ముందుగా పాత రోడ్డును పూర్తి స్థాయిలో బలోపేతం చేసి తర్వాత తారు లేయర్ వేస్తారు. మరమ్మతుల పనులే అయినప్పటికీ పూర్తి నాణ్యతతో జరిగేలా తారు, కంకరను కలిపే హాట్ మిక్సింగ్ యూనిట్లతో పనులు చేపడతారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈ పనులను ప్యాకేజీలుగా వర్గీకరించారు. మరమ్మతులు రూ.ఐదు కోట్లు లోపు ఉంటే ఒక ప్యాకేజీగా వర్గీకరించారు. రూ.5 కోట్లకు మించితే పనుల విలువ ఆధారంగా రెండు మూడు ప్యాకేజీలుగా వర్గీకరించారు. రాష్ట్రంలో మొత్తం 1,845 పనులను 272 ప్యాకేజీలుగా విభజించారు. అత్యధికంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 146 పనులను 29 ప్యాకేజీలుగా వర్గీకరించారు. పనులను పదికి పైగా ప్యాకేజీలుగా వర్గీకరించిన జిల్లాలు.. అనకాపల్లి (15), చిత్తూరు (12), తూర్పుగోదావరి (10), ఏలూరు (17), కాకినాడ (12), కోనసీమ (11), కృష్ణా (12), పల్నాడు (11), ప్రకాశం (11), శ్రీకాకుళం (11), తిరుపతి (12), విజయనగరం (14), పశ్చిమ గోదావరి (11) -
సీపోర్టు టు ఎయిర్‌పోర్టు 'సువిశాల రహదారి'
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో సుందర సాగర తీరాన్ని ఆనుకుని ఆరులేన్ల సువిశాల రహదారి రానుంది. విశాఖపట్నం నుంచి భీమిలి మీదుగా భోగాపురం వరకు బీచ్ కారిడార్ నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది. అలాగే విశాఖపట్నం పోర్ట్ టెర్మినల్ నుంచి నాలుగు లేన్ల జాతీయ రహదారిని నిర్మించి దానిని బీచ్ కారిడార్‌కు అనుసంధానించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దాదాపు రూ. 3 వేల కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టనున్న ఈ ప్రాజెక్టుతో పర్యాటక, పారిశ్రామిక అభివృద్ధికి రాచబాట పరచుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ విశాఖపట్నం బీచ్ కారిడార్ నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రూపొందించే ప్రక్రియ చేపట్టింది. రెండు దశలుగా బీచ్ కారిడార్.. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణకు సన్నద్ధమైంది. దానిలో భాగంగా విశాఖపట్నం బీచ్‌కారిడార్‌ను నిర్మించనుంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఇప్పటికే పలు దఫాలుగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. రెండు దశలుగా బీచ్‌కారిడార్‌ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అందులో మొదటిగా విశాఖపట్నం నుంచి భీమిలి మీదుగా భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టును అనుసంధానిస్తూ బీచ్‌కారిడార్‌ను 20.20 కి.మీ. మేర ఆరు లేన్లుగా నిర్మిస్తారు. విశాఖపట్నంలో రుషికొండ, ఎండాడ, భీమిలి ప్రాంతాలు పర్యాటక, ఐటీ రంగాలకు కేంద్రస్థానంగా మలచాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. అందుకోసం ఈ బీచ్‌కారిడార్ నిర్మాణం ఎంతగానో ఉపకరించనుంది. ఈ బీచ్ కారిడార్ వెంబడి పర్యాటక ప్రాజెక్టులు, దిగ్గజ ఐటీ, కార్పొరేట్ సంస్థలు కొలువు దీరేందుకు సౌకర్యంగా ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధికి ఈ బీచ్ కారిడార్ చోదక శక్తిగా పనిచేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆరులేన్ల బీచ్ కారిడార్ నిర్మాణానికి సుముఖత తెలిపిన కేంద్ర ప్రభుత్వం.. డీపీఆర్ రూపొందించే ప్రక్రియ చేపట్టింది. ఇక ఈ బీచ్ కారిడార్ కోసం దాదాపు 346 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించనుంది. అందుకు దాదాపు రూ. 1,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. పోర్ట్‌ను అనుసంధానిస్తూ నాలుగు లేన్ల రహదారి... ఇక ఈ ప్రాజెక్టులో రెండో దశ కింద బీచ్ కారిడార్‌ను విశాఖపట్నం పోర్టుతో అనుసంధానించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. విశాఖపట్నం పోర్టు టెర్మినల్‌ను జాతీయ రహదారితో అనుసంధానిస్తూ నాలుగు లేన్ల రహదారి నిర్మిస్తారు. ఆ రహదారిని విశాఖపట్నం–భోగాపురం బీచ్‌కారిడార్‌కు అనుసంధానిస్తారు. అంటే పోర్ట్ టెర్మినల్ నుంచి బీచ్ కారిడార్ ప్రారంభం వరకు నాలుగు లేన్ల రహదారి.. అక్కడ నుంచి తీరాన్ని ఆనుకుని విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు ఆరు లేన్ల రహదారి నిర్మించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఆరు లేన్ల బీచ్ కారిడార్, నాలుగు లేన్ల విశాఖపట్నం పోర్ట్ టెర్మినల్ రహదారికి కలిపి దాదాపు రూ. 2 వేల కోట్లు ఖర్చు చేసేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టుతో ప్రధానంగా విశాఖపట్నం పోర్ట్‌ను భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానించడం సాధ్యమవుతుంది. దాంతో సరుకు రవాణాకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందని, విశాఖపట్నం లాజిస్టిక్ హబ్‌గా అభివృద్ధి చెందేందుకు దోహదపడుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. విశాఖపట్నం పోర్ట్ టెర్మినల్ నుంచి బీచ్ కారిడార్ వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణంపై కూడా జాతీయ రహదారుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ త్వరలో డీపీఆర్ ప్రక్రియ చేపడుతుందని ఎన్హెచ్ఏఐ వర్గాలు చెప్పాయి. -
రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలకు చెక్
సాక్షి, అమరావతి: రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలను నివారించేందుకు రోడ్లు, భవనాల శాఖ సన్నద్ధమైంది. రాష్ట్రంలో కొత్తగా ఆరు రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్వోబీ)లు నిర్మించనుంది. రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలను అరికట్టేందుకు పెద్ద సంఖ్యలో ఆర్వోబీల నిర్మాణంపై కార్యాచరణను వేగవంతం చేసింది. ఇప్పటికే 22 ఆర్వోబీలు నిర్మాణంలో ఉన్నాయి. 2022–23లో రూ.724 కోట్లతో మరో ఆరు ఆర్వోబీల నిర్మాణాలకు ఆర్ అండ్ బీ శాఖ ఆమోదం తెలిపింది. ప్రధానంగా విజయవాడ – నరసాపురం – నిడదవోలు మార్గంలో ఉన్న రైల్వే లెవల్ క్రాసింగ్‌ల వద్ద ఆర్వోబీల నిర్మాణాన్ని ప్రతిపాదించారు. ఎందుకంటే ఇప్పటికే విజయవాడ–మచిలీపట్నం మధ్య డబ్లింగ్ పనులు పూర్తి చేశారు. ఇక మచిలీపట్నం – నరసాపురం – నిడదవోలు మార్గంలో డబ్లింగ్ పనులు తుది దశకు చేరుకుంటున్నాయి. దీంతో ఆ మార్గంలో రైళ్లు, గూడ్సు రైళ్ల తాకిడి పెరగనుంది. ఈ నేపథ్యంలో ఆ మార్గంలో రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఆర్వోబీల నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చారు. కేంద్ర ఉపరితల, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ ఖరారు చేసిన వార్షిక ప్రణాళికలో భాగంగా సేతుభారతం ప్రాజెక్టు కింద వీటిని నిర్మిస్తారు. వాటికి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు రూపొందించే ప్రక్రియను ఆర్ అండ్ బీ శాఖ చేపట్టింది. అనంతరం భూసేకరణ చేసి టెండర్లు పిలవనుంది. రెండు లేన్లుగా ఆర్వోబీలు ఈ ఆరు ఆర్వోబీలను రెండు లేన్లుగా నిర్మించనున్నారు. విజయవాడ–భీమవరం సెక్షన్లో గుడివాడ వద్ద రూ.110 కోట్లతో 4.7 కి.మీ, కైకలూరు వద్ద రూ.125 కోట్లతో 1.3 కి.మీ, పాలకొల్లు వద్ద రూ.65 కోట్లతో 1.9 కి.మీ.భీమవరం–నరసాపురం సెక్షన్లో పెన్నాడ అగ్రహారం–శృంగవృక్షం రైల్వేస్టేషన్ల మధ్య రూ.150 కోట్లతో 1.5 కి.మీ. భీమవరం–ఉండి రైల్వేస్టేషన్ల మధ్య రూ.200 కోట్లతో 1.90 కి.మీ, అన్నమయ్య జిల్లా మదనపల్లి సమీపంలో రూ.74 కోట్లతో 1.5 కి.మీలలో ఆర్వోబీలను నిర్మించనున్నారు. -
పల్లెవించిన నాగరికత.. మారిన గ్రామీణ రోడ్లు
ఇది ఓబుళదేవరచెరువు మండలం ఇనగలూరు పంచాయతీలోని గొల్లపల్లె రహదారి. ఒకప్పుడు ఈ ఊరికి మట్టిరోడ్డే గతి. అడుగడుగునా కంకర తేలి, గుంతలమయంగా దర్శనమిచ్చేది. ప్రయాణానికి ఏమాత్రం అనువుగా ఉండేది కాదు. అత్యవసర పరిస్థితుల్లో ఎవరినైనా ఆస్పత్రులకు తరలించాలన్నా సాధ్యం కాని పరిస్థితి. చివరకు ఈ ఊరి యువకులకు పిల్లనిచ్చేందుకూ ఎవరూ ఆసక్తి చూపే వారు కాదు. అయితే, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిపోయింది. రూ.1.50 కోట్లతో 3.9 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్డు నిర్మించారు. ప్రస్తుతం రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. ఇది నల్లమాడ మండలం చారుపల్లి నుంచి సి.రెడ్డివారిపల్లి వరకు వెళ్లే రహదారి. దశాబ్దాలుగా ఈ రోడ్డు పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. కొత్త ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజులకే రూ.1.10 కోట్లతో కిలోమీటర్ మేర సిమెంట్ రోడ్డు నిర్మించారు. ప్రస్తుతం గ్రామ ప్రజలు హాయిగా ప్రయాణం సాగిస్తున్నారు. చుట్టుపక్కల పల్లెలతో రవాణా అనుసంధానమూ పెరిగింది. సాక్షి, పుట్టపర్తి/ అనంతపురం సిటీ: నాగరికతకు రహదారులను చిహ్నాలుగా భావిస్తారు. రోడ్లు బాగుంటే ఒక ప్రాంతానికి, మరో ప్రాంతానికి మధ్య అనుసంధానం పెరుగుతుంది. రవాణా సౌకర్యాలు మెరుగవడంతో అభివృద్ధి కూడా వేగంగా సాగుతుంది. ఈ విషయాలన్నింటికీ అధిక ప్రాధాన్యమిచ్చిన వైఎస్సార్సీపీ సర్కారు రహదారులకు మహర్దశ తీసుకొచ్చింది. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంత రహదారులపై దృష్టి సారించి దశాబ్దాలుగా రాళ్లురప్పలతో అధ్వానంగా దర్శనిమిచ్చిన దారులను సుందరంగా మార్చేసింది. శ్రీసత్యసాయి జిల్లాలో 2021–22 ఆర్థిక సంవత్సరంలో 170 గ్రామీణ రహదారులు నిర్మించారు. మొత్తం 591.41 కిలోమీటర్ల మేర రోడ్లు కొత్తగా వేసి సౌకర్యాలు మెరుగుపరిచారు. దీంతో పాటు మరో 52 ప్రధాన రహదారుల్లో మరమ్మతుల కోసం రూ. 70 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే రూ. 30 కోట్లు ఖర్చు చేసి 39 చోట్ల పనులు పూర్తి చేశారు. మరో 11 రహదారులకు సంబంధించి పనులు టెండర్ దశలో ఉన్నట్లు అధికారులు వివరించారు. టీడీపీ హయాంలో జనం మొత్తుకున్నా వినలేదు.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రహదారుల్లో గుంతలు ఏర్పడి ప్రయాణం నరకంగా ఉండేది. రోడ్లను అభివృద్ధి చేయాలని గ్రామీణులు అనేక సార్లు విన్నవించినా అప్పట్లో నేతలు పట్టించుకోలేదు. కొన్ని చోట్లయితే తూతూమంత్రంగా శంకుస్థాపనలు చేసి ఆ తర్వాత మర్చిపోయారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక ఎన్నో ఏళ్ల సమస్యలకు పరిష్కారం దొరకడంతో గ్రామీణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల కల నెరవేరింది దాదాపు 50 ఏళ్లు మోకాళ్లలోతు గుంతలు, రాళ్లు తేలిన మట్టిరోడ్డుతో చాలా ఇబ్బంది పడేవాళ్లం. టీడీపీ హయాంలో పలుసార్లు శంకుస్థాపనలు చేశారే తప్ప రోడ్డు నిర్మించలేదు. చారుపల్లి నుంచి సీ రెడ్డివారిపల్లికి సీసీ రోడ్డు నిర్మించడంతో మా దశాబ్దాల కల నెరవేరింది. చౌటతండా మీదుగా కొండమనాయునిపాలెం వరకు తారురోడ్డు నిర్మిస్తే రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుంది. – మధుసూదన్‌రెడ్డి, సీ రెడ్డివారిపల్లి, నల్లమాడ మండలం చాలా సంతోషంగా ఉంది మా పల్లెకు సీసీ రోడ్డు వేయడం చాలా సంతోషంగా ఉంది. గతంలో రోడ్డు చాలా అధ్వానంగా ఉండేది. ఎన్నోసార్లు అధికారులు, నాయకులకు విన్నవించినా ప్రయోజనం లేకపోయింది. సీసీ రోడ్డు నిర్మాణంతో రవాణా ఇబ్బందులు తొలగిపోయాయి. ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని సీసీ రోడ్డు వేయించినందుకు కృతజ్ఞతలు. – అశ్వర్థనారాయణ, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్, సీ రెడ్డివారిపల్లి త్వరితగతిన పనులు రహదారుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాం. దశాబ్దాల నుంచి అధ్వానంగా ఉన్న గ్రామీణ దారులకు ప్రాధాన్యమివ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు ప్రణాళిక రూపొందించి పనులు చేపడుతున్నాం. త్వరితగతిన పూర్తి చేయాలనే లక్ష్యంతో సాగుతున్నాం. – ఓబుళరెడ్డి, ఎస్ఈ, రోడ్లు, భవనాల శాఖ -
దారి.. అద్దంలా మారి..
సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం: చాన్నాళ్లుగా ప్రజలకు నరకం చూపిస్తున్న రహదారులు బాగుపడుతున్నాయి. పాఠశాలల తరహాలోనే ‘నాడు–నేడు’ పథకం కింద రహదారుల తీరుతెన్నులనూ మార్చాలని ప్రభుత్వం సంకల్పించింది. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఏనాడూ రోడ్ల బాగుకు తట్ట మట్టి వేసిన దాఖలా లేదు. దీంతో రోడ్లలో అత్యధికం అధ్వాన స్థితికి చేరుకున్నాయి. కరోనా పరిస్థితులు సద్దుమణగడంతో ప్రభుత్వం వీటి రూపురేఖలు ఆధునీకరించేందుకు గట్టిగా పూనుకుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు తొలి విడతలో ప్రత్యేక మరమ్మతులకు రూ.196 కోట్లు కేటాయించింది. జూన్ నెలాంతానికి పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. దీంతో రోడ్లు, భవనాల శాఖాధికారులు రెండు నెలలుగా యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. రెండు నెలల క్రితం మరమ్మతుకు టెండర్లు పిలిచినా ఒక్కరూ ముందుకు రాలేదు. తర్వాత టెండర్లను ఆహ్వానిస్తే జిల్లాలో 97 రహదారుల ఆధునీకరణకు కాంట్రాక్టర్లు ఉత్సాహంగా దాఖలు చేశారు. వర్షా కాలం రాకుండా పనులన్నింటినీ పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. అంతకంటే నెల రోజులు ముందుగానే ఆధునీకరణ పనులను పూర్తి చేయాలని ఆర్అండ్బీ అధికారులు గట్టి సంకల్పంతో కదులుతున్నారు. అమలాపురం–బొబ్బర్లకం రోడ్డుపై ప్రయాణమంటేనే వెనకడుగు వేసే పరిస్థితి. కోనసీమ జిల్లా వాసులకు రాజమహేంద్రవరం వెళ్లాలంటే ఇదే ప్రధాన రహదారి. ఈ రోడ్డుపై నిలువెత్తు గోతులుండేవి. వాహనం వెళ్లాలంటేనే గుండెలు జారిపోయేవి. అటువంటి అధ్వాన రహదారిపై రెండు నెలలుగా దృష్టి పెట్టి రూ.రూ.7.70 కోట్లతో ఆధునీకరించారు మే నెలాఖరుకు పూర్తి చేస్తాం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటికే 30 రోడ్ల ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి. మిగిలిన రహదారుల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. మే నెలాఖరు నాటికి అన్ని రోడ్లనూ ఆధునీకరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. రోజూ పనులను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్నాం. – ఎ.హరిప్రసాద్‌బాబు,ఎస్ఈ, ఆర్అండ్బీ గతుకుల సమస్య తీరింది నిత్యం కాకినాడ వెళ్లేందుకు కొత్తూరు మీదుగా ప్రయాణించేవాళ్లం. యు.కొత్తపల్లి వెళ్లాలన్నా పండూరు నుంచి దగ్గర. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ రిపేర్లలో భాగంగా ఆర్అండ్బీ రహదారి నిర్మాణం చేపట్టింది. దీంతో రహదారుల ఇబ్బందులు తప్పాయి. క్షేమంగా రాకపోకలు సాగిస్తున్నాం. – వెల్లంకి భాస్కరరమేష్, పెనుమర్తి, కాకినాడరూరల్ ప్రయాణం సాఫీగా సాగుతోంది చాలా ఏళ్ల నుంచి అమలాపురం–బొబ్బర్లంక రహదారి మరమ్మతులు జరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నా్నం. ఇప్పుడు కొత్తగా రహదారి ఆధునీకరణతో ప్రయాణం సాఫీగా సాగుతోంది. – నందుల ఆదినారాయణ, పుల్లేటికుర్రు -
AP: ప్రగతి బాటలుగా ప్రధాన రహదారులు
ప్రధాన రహదారులు ప్రగతి బాటలుగా మారుతున్నాయి. జిల్లా కేంద్రాలకు అనుసంధానంగా ఉండే రోడ్లు కళకళలాడుతున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా రోడ్ల మరమ్మతులు, నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రభుత్వం మూడు డివిజన్ల పరిధిలో రూ.207.55 కోట్లను కేటాయించగా పనులు ముమ్మరంగా జరిగేలా అధికారులు పటిష్ట కార్యాచరణ అమలు చేస్తున్నారు. – సాక్షిప్రతినిధి, ఏలూరు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గతంలో ఎన్నడూలేని విధంగా ఏకకాలంలో వందల కోట్లతో రహదారుల అభివృద్ధి, మరమ్మతుల పనులు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా రహదారుల అభివృద్ధికి రూ.2 వేల కోట్లను వెచ్చించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా ఉమ్మడి జిల్లాలో 71 పనులకు రూ.207.55 కోట్లు కేటాయించారు. ఏలూరు, కొవ్వూరు, భీమవరం ఆర్అండ్బీ డివిజన్ల వారీగా పనులు జరుగుతున్నాయి. మూడు డివిజన్ల పరిధిలో 3,219 కిలోమీటర్ల రోడ్లు విస్తరించి ఉన్నాయి. దీనిలో 44 కిలోమీటర్ల మేర నాలుగు లైన్లు, 792 కిలోమీటర్ల మేర డబుల్ లైన్, 2,383 కిలోమీటర్ల మేర సింగిల్ లైన్ రహదారులు ఉన్నాయి. అనుసంధాన రహదారులపై ప్రత్యేక దృష్టి జిల్లా రోడ్లపై ముందుగా దృష్టి కేంద్రీకరించిన అధికారులు జిల్లా కేంద్రాలకు అనుసంధానంగా ఉన్న రోడ్ల మరమ్మతులు పూర్తిచేశారు. అనంతరం పూర్తిస్థాయిలో నిర్మాణాలకు చర్యలు తీసుకున్నారు. ప్రధాన పట్టణాలకు అనుసంధానంగా ఉండే జంగారెడ్డిగూడెం–ఏలూరు, చింతలపూడి–ఏలూరు, ఏలూరు–భీమవరం, భీమవరం–తాడేపల్లిగూడెం, నరసాపురం–భీమవరం, నిడదవోలు–కొవ్వూరు ఇలా ప్రతి పట్టణానికి అనుసంధానంగా ఉండే రహదారుల నిర్మాణాలను పూర్తిచేస్తున్నారు. ఇప్పటికే జంగారెడ్డిగూడెం, చింతలపూడి, ౖMðకలూరు, భీమవరంలో రోడ్ల పనులు పూర్తికాగా మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. ఎన్డీబీ నిధులతో.. నేషనల్ డెవలప్మెంట్ బ్యాంకు నిధుల ద్వారా ఫేజ్–1లో 11 రోడ్ల పరిధిలో 74 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేస్తున్నారు. ఫేజ్–2లో 13 రోడ్ల పరిధిలో 108 కిలోమీటర్ల మేర అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. సీఆర్ఐఎఫ్ పథకం ద్వారా 29 కిలోమీటర్ల మేర 3 రోడ్ల పనులను చేయనున్నారు. రాష్ట్ర రహదారులపై గోతులు పూడ్చి, మరమ్మతులు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. హై లెవిల్ బ్రిడ్జిలకు నిధులు ఉమ్మడి జిల్లాలో రూ.29.50 కోట్లతో 3 హైలెవిల్ బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వంతెనల మరమ్మతులకు సైతం సన్నాహాలు చేస్తున్నారు. డివిజన్ల వారీగా.. ఏలూరు డివిజన్ పరిధిలో రూ.9 కోట్లతో 5 పనులను పూర్తిచేయగా.. రూ.76 కోట్లతో 21 పనులు జరుగుతున్నాయి. కొవ్వూరు డివిజన్ రూ.5.41 కోట్లతో 3 పనులను పూర్తిచేయగా.. రూ.74.43 కోట్లతో 21 పనులు పలు దశల్లో ఉన్నాయి. రూ.11 లక్షలతో ఐదు రో డ్లు పూర్తిచేయగా.. రూ.30 లక్షలతో 15 పనులు పలు దశల్లో ఉన్నాయి. -
చరిత్రలో సరికొత్త ‘బాట’
సాక్షి, అమరావతి: చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో ముమ్మరంగా రోడ్ల మరమ్మతులు, నిర్వహణ, పునరుద్ధరణ, విస్తరణ, కొత్త హైవే ప్రాజెక్టులను చేపడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. 8 వేల కిలోమీటర్ల నిడివి ఉన్న రోడ్ల మెయింటెనెన్స్ పనులు రూ.2,500 కోట్లతో ముమ్మరంగా జరుగుతుండగా ఇప్పటికే రూ.800 కోట్ల బిల్లులు చెల్లించామన్నారు. ‘నిడా’ (నాబార్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అసిస్టెన్స్) ద్వారా రూ.1,158 కోట్లు వెచ్చించి 720 కి.మీ. రహదారులను వెడల్పు చేస్తున్నామన్నారు. ఇప్పటికే రూ.700 కోట్లు బిల్లులు చెల్లించామని, జూన్ నాటికి ఈ పనులు పూర్తవుతాయని తెలిపారు. స్పందనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మంగళవారం దీనిపై సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ.. మే నెలలో పనులు ప్రారంభం సుమారు రూ.6,400 కోట్లతో న్యూ డెవలప్మెంట్ బ్యాంకు సహాయంతో మండల కేంద్రాల నుంచి ఉమ్మడి జిల్లా కేంద్రాలకు రోడ్లు వెడల్పు చేస్తున్నాం. మే నెలలో ఈ పనులు ప్రారంభం అవుతాయి. రెండో విడత పనులు డిసెంబరులో మొదలవుతాయి. రూ.1,017 కోట్లతో సుమారు 5 వేల కిలోమీటర్ల పంచాయితీరాజ్ రోడ్ల పనులను వచ్చే నెలలో ప్రారంభిస్తాం. జాతీయ రహదారుల కింద 99 ప్రాజెక్టులకు సంబంధించి సుమారు 3,079 కిలోమీటర్ల మేర పనులు చేçపడుతున్నాం. దీనికోసం దాదాపు రూ.29,249 కోట్లు ఖర్చు చేస్తున్నాం. మరో 45 ప్రాజెక్టుల కింద సుమారు మరో 3 వేల కిలోమీటర్ల పనులు డీపీఆర్ దశ దాటాయి. ఇందుకు దాదాపు రూ.29 వేల కోట్లు వ్యయం కానుంది. ఇవికాకుండా ఇంటర్ స్టేట్ కనెక్టివిటీ కింద ఆరు ప్రాజెక్టులకుగానూ నాలుగు ప్రాజెక్టుల టెండర్లు పూర్తయ్యాయి. పనులు కూడా ప్రారంభం అవుతున్నాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు పనులు డిసెంబరులో ప్రారంభం అవుతాయి. జాతీయ రహదారులు, ఇంటర్ స్టేట్ కనెక్టివిటీ కోసం మొత్తం రూ.90 వేల కోట్ల విలువైన పనులను రాష్ట్రంలో చేపడుతున్నాం. ఉపాధి అవకాశాలు విస్తృతం.. ఈ ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగాలంటే భూ సేకరణ సకాలంలో పూర్తి కావాలి. దీనిపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. వీటివల్ల ఉపాధి మెరుగుపడుతుంది. పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది. భూ సేకరణలో ఎలాంటి జాప్యం ఉండకూడదు. దీనికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ఇంత డబ్బు ఇదే తొలిసారి.. పనులు పూర్తి చేసిన రోడ్లను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టర్లు పరిశీలించాలి. దీనివల్ల నాణ్యతపై పర్యవేక్షణ ఉంటుంది. చరిత్రలో ఇంత డబ్బు ఎప్పుడూ రోడ్ల కోసం ఖర్చు చేయలేదు. మరమ్మతులు, విస్తరణ, కనెక్టివిటీ... ఇలా పలు రూపాల్లో జరుగుతున్న పనులను ప్రజలకు తెలియచేయాలి. విద్య, ఆరోగ్యంపై రూ.32 వేల కోట్ల వ్యయం నాడు – నేడు పనుల కోసం భారీగా ఖర్చు చేస్తున్నాం. ఆరోగ్య రంగంపై దాదాపు రూ.16 వేల కోట్లు, విద్యారంగంలో మరో రూ.16 వేల కోట్లు వెచ్చిస్తున్నాం. నాడు –నేడు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. మొత్తం 1,125 పీహెచ్‌సీల్లో 977 చోట్ల నాడు– నేడు కింద పనులు చేపట్టగా 628 ఆస్పత్రుల్లో పూర్తయ్యాయి. మిగిలిన చోట్ల వేగవంతం చేయాలి. మరో 148 చోట్ల కొత్తవాటి నిర్మాణం చేపడుతున్నాం. 168 సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో కూడా పనులను వేగవంతం చేయాలి. మే 15 కల్లా అన్ని కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలు ప్రారంభం కావాలి. వచ్చే సమీక్ష నాటికి అన్ని బోధనాసుపత్రుల పనులు ప్రారంభం కావాలి. లేదంటే కలెక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది. 26,451 స్కూళ్లలో నాడు–నేడు రెండో దశ నాడు–నేడు రెండో దశ పనులను 26,451 స్కూళ్లలో చేపడుతున్నాం. దాదాపు రూ.8 వేల కోట్లకుపైగా నిధులను వెచ్చిస్తున్నాం. మే 2 నుంచి ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో పర్యటించి నాడు– నేడు పనులు పూర్తైన దాదాపు 15 వేల స్కూళ్లను ప్రారంభిస్తారు. దీంతోపాటు రెండో దశ పనులను ప్రారంభిస్తారు. ఇందులో కలెక్టర్లు పాలుపంచుకోవాలి. పనులను చేపట్టే స్కూలు కమిటీలకు తోడుగా నిలవాలి. కొత్తగా 28 వేల తరగతి గదులను కూడా నిర్మిస్తాం. ఆస్పత్రులైనా, స్కూళ్లైనా నిర్వహణ బాగుండాలి. దీనిపై ప్రోటోకాల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సమీక్షలో ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఎం ముఖ్యసలహాదారు అజేయ కల్లం, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి.సాయిప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, గృహ నిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్, విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు పాల్గొన్నారు.