Sindhu
-
క్వార్టర్ ఫైనల్లో సింధు
ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ సింధు 18–21, 21–12, 21–16తో ప్రపంచ 7వ ర్యాంకర్ హాన్ యువె (చైనా)పై గెలిచింది. 63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌ను కోల్పోయినా నెమ్మదిగా తేరుకొని ఆ తర్వాతి రెండు గేముల్లో గెలిచి ముందంజ వేసింది. హాన్ యువెపై సింధుకిది ఏడో విజయం కావడం విశేషం. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 8వ ర్యాంకర్ గ్రెగోరియా మరిస్కా టున్‌జుంగ్ (ఇండోనేసియా)తో సింధు తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 10–2తో గ్రెగోరియాపై ఆధిక్యంలో ఉంది. -
చదువుల తల్లికి ఎంత కష్టం
సాక్షి, కర్నూలు జిల్లా: చదువుకోవాలని ఆశ ఉన్నా.. అందుకు కుటుంబ పరిస్థితులు సహకరించడం లేదు. దీంతో ఆ బాలిక వారంలో నాలుగు రోజులు పనికి వెళ్తోంది. మూడు రోజులు బడికి వెళ్తూ శ్రద్ధగా చదువుకుంటోంది. గోనెగండ్ల మండలం చిన్నమరివీడు గ్రామానికి చెందిన బోయ సింధు.. గ్రామంలోని ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు బోయ పార్వతి, బోయ గోవిందులకు ఇల్లు తప్ప ఏమీ లేదు. వీరు రోజూ కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. ఇల్లు గడవడం కష్టంగా ఉండటంతో వీరికి తోడుగా సింధు పొలం పనులకు వెళ్తోంది. తాము చాలా పేదరికంలో ఉన్నామని, బతుకు దెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినప్పుడు బిడ్డపై బెంగగా ఉంటుందని బోయ పార్వతి, గోవిందు తెలిపారు. బిడ్డ చదువుకు ఇబ్బంది లేకుండా అధికారులు కేజీబీవీలో సీటు ఇప్పించాలని వీరు కోరుతున్నారు. -
క్వార్టర్స్‌లో సింధు
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోకి వెళ్లింది. ప్రపంచ 10వ ర్యాంకర్ బీవెన్ జాంగ్ (అమెరికా)తో జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 13–21, 21–10, 21–14తో గెలిచింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) ద్వయం 21–18, 21–13తో ప్రపంచ 7వ ర్యాంక్ జంట యూకీ ఫకుషిమా–సయాక హిరోటా (జపాన్)ను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్ చేరింది. పురుషుల సింగిల్స్ ప్రి క్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ 78 నిమిషాల్లో 21–19, 12–21, 20–22తో గ్వాంగ్ జు (చైనా) చేతిలో ఓడిపోయాడు. -
చైనాకు భారత మహిళల షాక్
షా ఆలమ్ (మలేసియా): బ్యాడ్మింటన్‌లో మేటి జట్టయిన చైనాకు భారత్ చేతిలో ఎదురుదెబ్బ తగిలింది.. ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో చక్కటి ప్రదర్శనతో భారత మహిళల జట్టు 3–2తో చైనా బృందాన్ని కంగు తినిపించింది. అన్నింటికి మించి భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు చాన్నాళ్ల తర్వాత విజయంతో ఈ సీజన్‌ను ప్రారంభించింది. గాయాలు వెన్నంటే వైఫల్యాలతో గత సీజన్ ఆసాంతం నిరాశపర్చిన ఆమె ఈ ఏడాది గట్టి ప్రత్యర్థిపై ఘనమైన విజయంతో సత్తా చాటుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో సింధు 21–17, 21–15తో హన్ యుపై గెలిచి జట్టును 1–0తో ఆధిక్యంలో నిలిపింది. రెండు ఒలింపిక్ పతకాల విజేత అయిన సింధు కేవలం 40 నిమిషాల్లోనే తనకన్నా మెరుగైన ర్యాంకర్ ఆట కట్టించింది. రెండో గేమ్‌లో సింధు ఒక దశలో 10–13తో వెనుకబడినా...తర్వాతి 13 పాయింట్లలో 11 గెలుచుకొని విజేతగా నిలవడం విశేషం. అనంతరం జరిగిన డబుల్స్ పోటీల్లో అశ్విని పొన్నప్ప–తనీషా కాస్ట్రో జోడీ 19–21, 16–21తో లియు షెంగ్ షు–తన్ నింగ్ జంట చేతిలో ఓడటంతో స్కోరు 1–1తో సమమైంది. ఆ వెంటనే జరిగిన రెండో సింగిల్స్‌లో అషి్మత చాలిహ 13–21, 15–21తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ వాంగ్ జి యి చేతిలో ఓడిపోవడంతో భారత్ 1–2తో వెనుకబడింది. ఈ దశలో మరో తెలుగమ్మాయి పుల్లెల గాయత్రి... ట్రెసా జాలీతో కలిసి డబుల్స్ బరిలో దిగి మ్యాచ్ గెలుపొందడంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. గాయత్రి–ట్రెసా ద్వయం 10–21, 21–18, 21–17తో లి యి జింగ్–లు జు మిన్ జంటపై నెగ్గడంతో భారత్ 2–2తో చైనాను నిలువరించింది. దీంతో అందరి దృష్టి నిర్ణాయక పోరుపైనే పడింది. ఇందులో అంతగా అనుభవం లేని 472 ర్యాంకర్ అన్మోల్ ఖర్బ్ 22–20, 14–21, 21–18తో ప్రపంచ 149వ ర్యాంకర్ వు లు యుపై అసాధారణ విజయం సాధించి భారత్‌ను గెలిపించింది. తొలి సారి ఈ టోర్నీలో బరిలోకి జాతీయ చాంపియన్ అన్మోల్ తీవ్ర ఒత్తిడిని అధిగమించి విజయాన్ని అందుకోవడం విశేషం. ప్రణయ్ ఓడినా... పురుషుల టీమ్ ఈవెంట్లో భారత్ 4–1తో హాంకాంగ్‌పై జయభేరి మోగించింది. తొలి సింగిల్స్‌లో హెచ్.ఎస్.ప్రణయ్ 18–21, 14–21తో ఎన్గ్ క లాంగ్ అంగుస్ చేతిలో ఓడినా... తుది విజయం మనదే అయింది. ప్రపంచ నంబర్‌వన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి 21–16, 21–11తో లుయి చున్ వాయ్–యింగ్ సింగ్ చొయ్ ద్వయంపై అలవోక విజయం సాధించింది. రెండో డబుల్స్‌లో ఎమ్.ఆర్.అర్జున్–ధ్రువ్ కపిల జంట 21–12, 21–7తో చొ హిన్ లాంగ్–హంగ్ కుయె చున్ జోడీపై నెగ్గింది. 3–1తో విజయం ఖాయమవగా... ఆఖరి సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 21–14, 21–18తో జాసన్ గునవాన్‌పై గెలుపొందడంతో ఆధిక్యం 4–1కు పెరిగింది. మహిళల గ్రూప్ ‘డబ్ల్యూ’లో రెండే జట్లు ఉండటంతో భారత్, చైనా ఈ మ్యాచ్‌కు ముందే నాకౌట్‌కు అర్హత సాధించాయి. పురుషుల విభాగంలో మాత్రం గురువారం జరిగే పోరులో చైనాతో భారత్ తలపడుతుంది -
కొత్త సవాళ్లకు సిద్ధం
న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్, రెండు ఒలింపిక్ పతకాల విజేత పూసర్ల వెంకట (పీవీ) సింధు ప్రస్తుతం ఫామ్ కోల్పోయి తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. గత 18 నెలలుగా అటు టోర్నీల్లో వైఫల్యంతోపాటు గాయాలు కూడా ఆమెను వెంటాడాయి. 2023లో ఆమె ఒక్క టోర్నీ కూడా గెలవలేకపోయింది. ఈ నేపథ్యంలో కొంత విరామం తర్వాత సింధు మళ్లీ బరిలోకి దిగుతోంది. పారిస్ ఒలింపిక్స్ సన్నద్ధత కోణంలో చూస్తే ఈ ఏడాది సింధుకు కీలక ఏడాది కానుంది. ఈ నెల 13 నుంచి మలేసియాలో జరిగే ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో సింధు పాల్గొంటోంది. ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్‌కు తనకు పెద్ద సవాల్‌గా కనిపిస్తున్నాయని, ఈసారి మరింత జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుందని సింధు అభిప్రాయపడింది. గత కొంత కాలంగా సింధు బెంగళూరులో దిగ్గజ ఆటగాడు ప్రకాశ్ పడుకోన్ , ఇండోనేసియా కోచ్ అగుస్ ద్వి సాంతోసో వద్ద శిక్షణ తీసుకుంటోంది. ప్రకాశ్‌తో పాటు ఆమె ఇతర కోచింగ్ బృందంలో కూడా మార్పులు జరిగాయి. దీంతో మంచి ఫలితాలు రాబట్టగలనని ఆమె విశ్వాసంతో ఉంది. పలు అంశాలపై సింధు అభిప్రాయాలు ఆమె మాటల్లోనే... | ♦ గత రెండు ఒలింపిక్స్‌లతో పోలిస్తే ఈసారి జరగబోయే పోటీలు నాకు భిన్నమైన అనుభవాన్ని ఇవ్వబోతున్నాయి. 2016, 2020 ఒలింపిక్స్‌లతో పోలిస్తే నాకు పారిస్‌లో పెద్ద సవాల్ ఎదురు కానుంది. అయితే నాకు అనుభవం కూడా పెరిగింది. మరింత జాగ్రత్తగా, తెలివిగా ఆడాల్సి ఉంటుంది. ♦ మహిళల సర్క్యూట్లో టాప్ 10–15 షట్లర్లు బాగా బలమైనవారు. వారిని ఎదుర్కొనేందుకు భిన్న వ్యూహాలు అనుసరించాలి. ప్లాన్ ‘ఎ’ పని చేయకపోతే ప్లాన్ ‘బి’ కోసం సిద్ధంగా ఉండాలి. ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా ఉండే మానసిక దృఢత్వం కూడా అవసరం. ♦ ప్రకాశ్ సర్ లాంటి గొప్ప ఆటగాడితో కలిసి పని చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఆయన ఆలోచనలు, శిక్షణా పద్ధతులు నాకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. కొత్త ట్రెయినర్, ఫిజియో, న్యూట్రిషనిస్ట్, కోచ్, మెంటార్... ఇలా అందరూ మారారు. వీరంతా నాకు ఎంతో సహకరిస్తున్నారు. దీని వల్ల నా ఆటలో వచ్చిన మార్పులు మున్ముందు కనిపిస్తాయి. పూర్తి ఫిట్‌గా నేను ఆసియా టీమ్ చాంపియన్‌షిప్ కోసం సిద్ధమయ్యాను. ♦ గాయం నుంచి కోలుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఆటలో వేగం అందుకునేందుకు కొంత సమయం పడుతుంది. ప్రస్తుతం నేను అదే స్థితిలో ఉన్నాను. గతంలో ఇలాంటి కఠిన పరిస్థితులను అధిగమించాను. 2015లో కూడా నేను గాయాలతో బాధపడుతూనే ఆరు నెలల పాటు ఆడాను. అయితే కోలుకొని రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించగలిగాను. నా మీద నాకున్న నమ్మకంతో పోరాడి రజతం గెలిచాను. నాలుగేళ్ల తర్వాత మరిన్ని అంచనాలతో టోక్యో ఒలింపిక్స్ బరిలోకి దిగి సెమీస్‌లో ఓడటం చాలా బాధించింది. ఫైనల్ చేరకపోవడంతో ఏడ్చేశాను. కానీ నాలుగో స్థానానికి, కాంస్య పతకానికి తేడా చాలా ఉంటుందని నా కోచ్ ప్రోత్సహించడంతో మూడో స్థానం కోసం మ్యాచ్‌లో సత్తా చాటి గెలిచాను. ఈ కాంస్యం కోసం నేను ఎంతో కష్టపడ్డానని అనిపించింది. -
వరకట్న వేధింపులతో వివాహిత బలవన్మరణం
అచ్చంపేట: వరకట్న వేధింపులతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడగా.. యువతి తరఫు బంధువులు ఆగ్రహంతో భర్త పై దాడి చేయడంతో మృతిచెందాడు. ఘటనకు సంబంధించి వివరాలు.. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం చెన్నంపల్లికి చెందిన అతికారి సింధు (26), ఖమ్మం జిల్లాకు చెందిన నిమ్మతోట నాగార్జున (28) అచ్చంపేట ప్రగతి డిగ్రీ కళా శాలలో చదువుతున్న సమయంలో ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి 2021 మార్చిలో హైదరాబాద్ ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. నాగార్జున అచ్చంపేటలోని తన బాబాయ్ డాక్టర్ కృష్ణకు చెందిన శ్రీరాంసర్రాం ఆస్పత్రి లో పనిచేస్తున్నాడు. కొంతకాలం వీరి వైవాహిక జీవితం సవ్యంగా సాగింది. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులతో గొడ వలు మొదలయ్యాయి. దీంతో కొద్ది రోజులుగా కట్నం తీసుకురావాలని సింధును నాగార్జున, అతని కుటుంబ సభ్యులు వేధిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సింధు తమ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయతి్నంచింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం శ్రీరాంసర్రాం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు నాగర్‌కర్నూల్‌కు, అక్కడి నుంచి మహబూబ్‌నగర్, చివరికి అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలించారు. అయితే అప్పటికే సింధు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహం తీసుకువస్తుండగా.. కాగా, సింధు మృతదేహాన్ని భర్త నాగార్జున అ చ్చంపేటకు తీసుకొస్తుండగా ఆమన్‌గల్ సమీపంలో బంధువులు వాహనాన్ని అడ్డగించి నాగార్జునను మరో వాహనంలో తీసుకెళ్లి చితకబాది అచ్చంపేట తీసుకొచ్చారు. అప్పటికే పోలీసులకు విషయం తెలియడంతో సింధు బంధువుల వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన నాగార్జున మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. సింధు, నాగార్జున మృతదేహా లు ఒకే దగ్గర ఉంటే అల్లర్లు జరిగే అవకాశం ఉందని గ్రహించిన పోలీసులు సింధు మృతదేహాన్ని అచ్చంపేట ఆస్పత్రికి, నాగార్జున మృతదేహాన్ని కల్వకుర్తి ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. కాగా తమ కూతురు మృతికి డాక్టర్ కృష్ణ, అతని భార్య, నాగార్జున తల్లి, చెల్లి కారణమని సింధు తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. నాగార్జున బాబాయ్ డాక్టర్ కృష్ణ వరకట్నం డబ్బులు తేవాలని.. లేకపోతే తన కోరిక తీర్చాలని సింధుని వేధించినట్లు పోలీసులకు శనివారం ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సింధుది ఆత్మహత్య కాదని, హత్య చేసి ఆస్ప త్రుల చుట్టూ తిప్పారని వారు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి ఇరువురి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కల్వకుర్తి డీఎస్పీ పార్థసారథి, అచ్చంపేట సీఐ అనుదీప్, ఎస్ఐ గోవర్ధన్ తెలిపారు. -
శ్రమించి నెగ్గిన సింధు
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు శుభారంభం చేసి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 10వ ర్యాంకర్ సింధు 69 నిమిషాల్లో 12–21, 21–18, 21–15తో ప్రపంచ 7వ ర్యాంకర్ గ్రెగోరియా మరిస్కా టున్‌జంగ్ (ఇండోనేసియా)పై కష్టపడి గెలిచింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–13, 21–13తో లుకాస్ కోర్వి–రొనన్ లాబర్ (ఫ్రాన్స్) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. -
సెమీస్‌లో సింధు
ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ –750 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ పీవీ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు 21–19, 21–12తో సుపనిద కటెథోంగ్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. 47 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధుకు తొలి గేమ్‌లో గట్టిపోటీ ఎదురైంది. అయితే రెండో గేమ్‌లో సింధు పూర్తి ఆధిపత్యం చలాయించి విజయాన్ని ఖాయం చేసుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో కరోలినా మారిన్ (స్పెయిన్)తో సింధు తలపడుతుంది. ముఖా ముఖి రికార్డులో సింధు 5–10తో వెనుకబడి ఉంది. క్వార్టర్ ఫైనల్లో కరోలినా మారిన్ 19–21, 21–15, 21–18తో తై జు యింగ్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించింది. -
ప్రిక్వార్టర్స్‌లో సింధు
ఒడెన్స్: బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్ 750 టోర్నీ డెన్మార్క్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. ప్రత్యర్థినుంచి కొంత ప్రతిఘటన ఎదురైనా చివరకు తొలి రౌండ్ అడ్డంకిని అధిగమించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు 21–14, 18–21, 21–10 స్కోరుతో కిర్స్టీ గిల్మర్ (స్కాట్లండ్)పై విజయం సాధించింది. 56 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తొలి గేమ్‌ను సునాయాసంగా గెలుచుకున్న తర్వాత సింధుకు ఆ తర్వాత గిల్మర్ గట్టి పోటీనిచ్చి పోరును 1–1తో సమం చేసింది. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో సింధు తన స్థాయికి తగినట్లుగా చెలరేగింది. ఒక దశలో వరుసగా 7 పాయింట్లు సాధించి దూసుకుపోయిన భారత షట్లర్ చివరి వరకు దానిని కొనసాగించింది. మహిళల సింగిల్స్‌లో మరో భారత క్రీడాకారిణి ఆకర్షి కశ్యప్ కూడా ముందంజ వేసింది. తొలి రౌండ్లో ఆకర్షి 10–21, 22–20, 21–12 తేడాతో లి వైవోన్ (జర్మనీ)పై సంచలన విజయం సాధించింది. అయితే పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్‌ను నిరాశ ఎదురైంది. తొలి పోరులో శ్రీకాంత్ 21–19, 10–21, 16–21తో వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా) చేతిలో ఓడి నిష్క్రమించాడు. లక్ష్య సేన్ కూడా తొలి రౌండ్‌ను దాటలేకపోయాడు. థాయిలాండ్‌కు చెందిన కంటఫాన్ వాంగ్ చరన్ 21–16, 21–18తో లక్ష్యసేన్‌పై విజయం సాధించాడు. మరో వైపు ఆసియా క్రీడల స్వర్ణపతక జోడి సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి చివరి నిమిషంలో టోర్నీనుంచి నిష్క్రమించింది. ఈ జంట వాకోవర్ ఇవ్వడంతో మలేసియా ద్వయం ఆంగ్ యు సిన్ – టియో యీ యి రెండో రౌండ్‌కు చేరింది. -
క్వార్టర్ ఫైనల్లో సింధు
వాంటా (ఫిన్లాండ్): ఆర్క్టిక్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ లో భారత స్టార్ పీవీ సింధు మరో అలవోక విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 13వ ర్యాంకర్ సింధు 21–11, 21–10తో ప్రపంచ 22వ ర్యాంకర్ వెన్ చి సు (చైనీస్ తైపీ)పై గెలుపొందింది. ఈ ఏడాది వెన్ చి సుపై సింధుకిది వరుసగా మూడో విజయం కావడం విశేషం. ఆసియా క్రీడల్లో, ఆసియా చాంపియన్‌షిప్‌లో వెన్ చి సుపై సింధు వరుస గేముల్లో నెగ్గింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 26వ ర్యాంకర్ థయ్ లిన్ ఎన్గుయెన్ (వియత్నాం)తో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 1–0తో ఆధిక్యంలో ఉంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. కిడాంబి శ్రీకాంత్, కిరణ్ జార్జి ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో ఓడిపోయారు. శ్రీకాంత్ 15–21, 12–21తో కాంటా సునెయామ (జపాన్) చేతిలో... కిరణ్ జార్జి (భారత్) 10–21, 20–22తో లు గ్వాంగ్ జు (చైనా) చేతిలో ఓటమి పాలయ్యారు. -
పదిసార్లు ఫోన్ చేసినా సాయం లేదు.. డబ్బులేక ప్రాణాలు వదిలేసిన సింధు
కోలీవుడ్‌లో కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో నటి సింధు మరణించింది. ఈ ఘటన అక్కడి పరిశ్రమలో పెద్ద చర్చనీయాంశమైంది. గత కొన్నేళ్లుగా బ్రెస్ట్ క్యాన్సర్‌తో చికిత్స పొందుతూ.. వైద్య ఖర్చులకు డబ్బులేక, అంత పెద్ద ఇండస్ట్రీ నుంచి సాయం అందక ధీన స్థితిలో ప్రాణాలు వదిలిసేంది. ఈ వార్త తమిళనాట చాలా మందిని కలిచివేసింది. గతంలో సాయం కోసం ఆమె బహిరంగంగానే చేయి చాచింది. అందుకు సంబంధించిన వీడియోలను పలువురు నెటిజన్లు ఇప్పుడు షేర్ చేస్తున్నారు. 2020లోనే మీడియా ముందు సింధు కన్నీరు పెట్టుకుంటూ ఇలా మాట్లాడింది. ' నా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. చికిత్స చేస్తే జబ్బు నుంచి కోలుకుంటానని వైద్యులు తెలిపారు. కానీ అందుకు అవసరమైన డబ్బు లేదు. ఇప్పటికే నా భర్త మరణంతో కుటుంబం కష్టాల్లో ఉంది. అనారోగ్యంతో నేను కూడా చనిపోతే నా కుమార్తె అనాథ అవుతుంది. ఇండస్ట్రీలోని పెద్దలు ఎవరైన సాయం చేయాలి' అని ఆమె కోరింది. (ఇదీ చదవండి: గూగుల్ మ్యాప్స్కెక్కిన చిరంజీవి.. సినీచరిత్రలోనే తొలిసారి!) గతంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సింధు మరణం తర్వాత వైరల్ అవుతున్నాయి. సింధు లాంటి మంచి మనసున్న మహిళ ఇన్ని కష్టాలు పడాల్సి వచ్చిందంటూ నటి షకీలా కూడా తెలిపింది. కోవిడ్ వ్యాప్తి సమయంలో చాలామంది జీవితాలు అస్తవ్యస్తమై తినేందుకు అన్నం కూడా లేకుండా పలువురు రోడ్డున పడ్డారు. అలాంటి వారికి ఆహారం అందించడానికి సింధు చొరవ తీసుకుందని షకీలా గుర్తుచేసింది. కోవిడ్ సమయంలో ధాతల నుంచి సేకరించిన వాటితో ఎంతోమందికి సాయం చేసింది. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన సింధు చాలా కష్టాలు పడాల్సి వచ్చిందని, దేవుడు ఉన్నాడా..? అనే అనుమానం కూడా కలుగుతోందని షకీలా చెప్పింది. వాళ్లెవరూ సాయం చేయలేదు: సింధు స్నేహితులు సింధు మరణం తర్వాత తన స్నేహితులు మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. తమిళ పరిశ్రమలో ఉన్న సూపర్ స్టార్స్ ఎవరూ సింధుకు సహాయం చేయలేదని ఆమె స్నేహితులు అంటున్నారు. దీనిపై సినీ ఉలకం అనే తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. తనకు సహాయం చేయమని బహిరంగంగానే సింధు అభ్యర్థించింది. కానీ ఆమెకు చాలా తక్కువ మంది స్టార్స్ సాయం చేశారు. (ఇదీ చదవండి: జైలర్ రికార్డు స్థాయి వసూళ్లు, తొలిరోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?) రజనీకాంత్, విజయ్, అజిత్ లాంటి సూపర్ స్టార్లు ఎవరూ సహాయం చేయలేదు. బహుశా వారిలో ఏ ఒక్కరు సాయం చేసినా సింధును కాపాడి ఉండేవాళ్లమని స్నేహితులు ముక్తకంఠంతో చెప్పారు. చాలా రోజుల ముందే తమిళ మీడియాలో సింధు తన బాధలను బయటపెట్టింది. ఏడుస్తూనే సాయం కోసం అందరినీ వేడుకుంది. అయినా ఆమెకు ఎవరూ సాయం చేయకపోవడం బాధాకరమని వారు తెలిపారు. అజిత్ సాయం కోరితే... తనకు కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ కాగానే చికిత్స కోసం డబ్బు సాయం చేయమని చాలా మందిని సింధు వేడుకుంది. అందులో భాగంగానే హీరో అజిత్ మేనేజర్‌కి పదిసార్లు ఫోన్ చేసినప్పటికీ, అతను సింధుతో మాట్లాడలేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలిపింది. దీంతో డైరెక్ట్‌గానే అజిత్ మేనేజర్ వద్దకు వెళ్లి తన ఆరోగ్య సమస్య గురించి చెప్పి సాయం చేయాలని కోరానని ఆమె చెప్పింది. అప్పుడు అజిత్ వద్ద సాధారణ ఫోన్ మాత్రమే ఉంటుందని మెడికల్ రిపోర్ట్స్ పంపించేందుకు వీలు కాదని ఆయన చెప్పడంతో అక్కడి నుంచి వెనుతిరిగానని సింధు పేర్కొంది. కనీసం ఫోన్లో అయినా తమ గురించి అజిత్‌కు చెప్పమని కోరానని, తన సమస్యను అజిత్ వద్దకు మేనేజర్ తీసుకుపోయాడో లేదో తెలియదు కానీ ఆయన నుంచి ఎలాంటి సాయం అందలేదని కొద్దిరోజుల క్రితమే సింధు ఈ వ్యాఖ్యలు చేసింది. ఆ సమయంలో ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియదు కానీ అజిత్ సాయం చేసి ఉంటే సింధు ఖచ్చితంగా బతికి ఉండేదని తన స్నేహితులు తెలుపుతున్నారు. కోలీవుడ్‌లో ఒక చిన్న నటుడు కార్తీక్ మాత్రం సింధుకు రూ.20000 ఇచ్చాడని స్నేహితులు తెలిపారు. పరిశ్రమలో ఉండే గొప్ప కళాకారులకు సామాన్యుల మనస్సాక్షి ఎందుకు ఉండదని గతంలోనే కన్నీటితో సింధు ప్రశ్నించింది. కోలీవుడ్‌లో కూడా బిగ్ హీరోలందరూ కోట్ల పారితోషికం తీసుకుంటాన్నారు. అజిత్, విజయ్ ఒక సినిమాకు దాదాపు 100 కోట్ల పారితోషికం తీసుకుంటారు. వారి నుంచి సహాయం అందితే సింధు బతికి ఉండేదని పలువురు సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. (ఇదీ చదవండి: Actress Sindhu: దీనస్థితిలో కన్నుమూసిన నటి.. ఆ వ్యాధితో) -
ఆస్పత్రి ఖర్చులకు డబ్బుల్లేక ప్రముఖ నటి మృతి!
నటీనటులు అనగానే కోట్లకు కోట్లు గడిస్తారు. లగ్జరీ లైఫ్ అనుభవిస్తుంటారని మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఆ అదృష్టం తక్కువమందికి దక్కుతుందనేది నిజం. హీరోహీరోయిన్ల తప్పితే మిగతావాళ్లకు ఇచ్చే డబ్బులు తక్కువగానే ఉంటాయి. ఇక సైడ్ క్యారెక్టర్స్ చేసేవాళ్లయితే చాలావరకు సాధారణ జీవితం గడుపుతుంటారు. అలా ఉండే ఓ నటి.. ఇప్పుడు ఆస్పత్రి ఖర్చులకు డబ్బులేక ప్రాణాలు వదిలేసింది. సోమవారం వేకువజామున 2:15 గంటలకు చనిపోయింది. (ఇదీ చదవండి: పునీత్ రాజ్‌కుమార్ కుటుంబంలో విషాదం) తెలుగమ్మాయి అంజలి నటించిన 'షాపింగ్‌మాల్' సినిమా గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. 2010లో విడుదలైన ఈ మూవీలో సింధు(44) అనే నటి కూడా ఓ పాత్ర చేసింది. ఆ తర్వాత పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసింది. 2020లో ఈమె రొమ్ము క్యాన్సర్ బారిన పడింది. దీంతో పరిస్థితులు తారుమారు అయిపోయాయి. అసలే మధ్య తరగతి జీవితం.. దీనికి తోడు క్యాన్సర్ మహమ్మారి వల్ల ఏం చేయాలో అర్థం కాలేదు. చేతులో డబ్బులేక ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంది. కొన్నిరోజుల ముందు ఆరోగ్యం మరింత విషమించడంతో చేసేదేం లేక కిలిపక్కంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సింధు చేరింది. కానీ చికిత్స చేయించుకునేందుకు సరిపడా డబ్బుల్లేక.. ఇప్పుడు ప్రాణాలు వదిలేసింది. చిన్న వయసులోనే మరణించడంతో తోటీ నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈమె చిన్నప్పటి నుంచి కష్టాలతో పోరాడుతూ వచ్చింది. పేద కుటుంబంలో పుట్టిన సింధుకు 14వ ఏట పెళ్లి చేశారు. అదే ఏడాది ఓ బిడ్డకు జన్మనిచ్చింది. నటి అయినప్పటికీ సమస్యలు తగ్గలేదు. ఇప్పుడు క్యాన్సర్ మహమ్మారి ఈమెని కబళించేసి, కుటుంబ సభ్యులకు కన్నీళ్లు మిగిల్చింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు!) -
సింధు మృతి కేసులో నిందితుడి అరెస్టు
గుణదల (విజయవాడ తూర్పు): సీఏ విద్యార్థిని సింధు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన కేసులో నిందితుడు ప్రసేన్‌ను విజయవాడలోని మాచవరం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో సింధును లోబరుచుకుని మోసం చేయడంతో ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్న ప్రసేన్.. సింధును వదిలించుకోవాలన్న దురాలోచనతో ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు పోలీసులు వెల్లడించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వివరాలు సేకరించిన పోలీసులు 306 సెక్షన్ కింద ప్రసేన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. చదవండి: చార్టర్డ్ అకౌంటెంట్ సింధు అనుమానాస్పద మృతి -
సింధు మృతికి ప్రియుడే కారణం!?
గుణదల (విజయవాడ తూర్పు): ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ప్రియుడే సీఏ విద్యార్థిని సింధు మృతికి కారణమన్న అనుమానాలు బలపడుతున్నాయి. విజయవాడ గుణదలలో శనివారం వెలుగుచూసిన ఈ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పోలీసులు ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సింధును పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఆమె ప్రియుడు ప్రసేన్ కొంతకాలంగా మరో యువతితో సంబంధం ఏర్పర్చుకున్నాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆ యువతిని వివాహం చేసుకునేందుకే సింధును వదిలించుకోవాలని నిర్ణయించుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని అంటున్నారు. ఇక ఉద్దేశపూర్వకంగానే ప్రసేన్ తమ కుమార్తెను హత్యచేశాడని, అతడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. గదిలో సింధు పడిఉన్న తీరు కూడా వారి అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఆమె ఉరికి వేలాడకుండా నేలపై పడి ఉండడం గమనార్హం. ముక్కు నుంచీ తీవ్రంగా రక్తస్రావం జరిగిందని పోలీసులు తేల్చారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా కేసు ఆధారపడి ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతదేహంపై గాయాలు, దెబ్బలు వంటివి ఉన్నట్లు రిపోర్టులో వస్తే ఇది హత్య కిందే పరిగణించాల్సి ఉంటుందన్నారు. నిందితుడు ప్రసేన్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. -
చార్టెడ్ అకౌంటెంట్ సింధు మృతి పై పలు అనుమానం
-
హిమాలయాలపై భయాంకర నిజాలను వెల్లడించిన ఐఐటీ ఇండోర్
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల వారు ఎదుర్కొంటున్న సమస్య వాతావరణ మార్పులు. వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకోవడంతో అకాల వర్షాలు, తుఫాన్లు, ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి. గతంలో హిమాలయాల్లో గ్లేసియర్ కరిగిపోవడంతో ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఆకస్మిక వరదలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా తాజాగా హిమాలయన్ కరాకోరం ప్రాంతంలోని నదులపై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) ఇండోర్ బృందం నిర్వహించిన పరిశోధనలో భయంకర నిజాలను వెల్లడించింది. వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకోవడంతో హిమానీనదాలు, మంచు కరిగిపోయి సింధు, గంగా, బ్రహ్మపుత్ర వంటి నదులలో నీటి పరిమాణం, ప్రవాహం అధికంగా పెరిగి, ఆకస్మిక వరదలు ఏర్పడతాయని పేర్కొన్నారు. హిమానీనదాలు, మంచు కరిగిపోవడంతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సుమారు ఒక బిలియన్ పైగా ప్రజలను ప్రభావితం చేస్తుందని పరిశోధనలో తెలిపారు. హిమాలయాల్లో అదే తీరుగా మంచు కరిగితే గంగా, సింధు లాంటి జీవనదులు పూర్తిగా ఎండిపోతాయని హెచ్చరించారు. మైదానాలు పూర్తిగా ఏడారులే..! హిమాలయ నదీ పరీవాహక ప్రాంతాలు 2.75 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండగా, హిమానీనదాలతో ఈ ప్రాంతంలోని ఒక బిలియన్ మందికి పైగా నీటి అవసరాలు తీరుతాయి. ఒక శతాబ్దం అంతా హిమానీనదాల మంచు కరిగిపోతే, నదీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని పరిశోధన నిర్వహకులు డాక్టర్ ఆజామ్ తెలిపారు. గంగా నది పరివాహక ప్రాంతాలు పూర్తిగా ఏడారిగా మారే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఐఐటీ ఇండోర్ బృందం గ్లేసియర్ కరిగిపోతున్న సమస్యకు మూడు రకాల పరిష్కారాన్ని ప్రతిపాదించింది. ఎంచుకున్న హిమానీనదాలపై పూర్తిగా ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలను, పరిశీలన నెట్‌వర్క్‌లను విస్తరించడం ద్వారా హిమానీనదాలపై మెరుగైన పర్యవేక్షణను చేయాలని ఈ బృందం ప్రతిపాదించింది. ప్రస్తుతం ఉన్న గ్లేసియర్లపై కచ్చితంగా అధ్యయనాలను జరపాలి. ఈ పరిశోధనకు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిధులు సమకూర్చింది. చదవండి: Phone Hacking : మీ ఫోన్ హ్యాక్ అయ్యిందా? గుర్తించండిలా?! -
వెయిట్ లిఫ్టింగ్‌లో రాణిస్తున్న సింధూ
మహబూబ్‌నగర్ క్రీడలు: వనపర్తి జిల్లా కొన్నూర్‌లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన గంటల సింధూ వెయిట్ లిఫ్టింగ్‌లో మెరుగైన నైపుణ్యం ప్రదర్శిస్తూ జిల్లా, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. 2007లో స్పోర్ట్స్ స్కూల్ సెలెక్షన్స్‌లో సింధూ ప్రతిభ కనబరిచి 4వ తరగతిలో హైదరాబాద్ హకీంపేట స్పోర్ట్స్ హాస్టల్లో ప్రవేశం పొందింది. రెండేళ్లపాటు కండీషన్ ట్రైనింగ్ అనంతరం సింధూ వెయిట్ లిఫ్టింగ్‌కు ఎంపికైంది. అప్పటి నుంచి వెయిట్ లిఫ్టింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ అనతి కాలంలోనే రాష్ట్ర, జాతీయస్థాయిలో సత్తాచాటింది. 2018లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో వనపర్తి జిల్లా ఉత్తమ క్రీడాకారిణిగా మంత్రి నిరంజన్‌రెడ్డి చేతులమీదుగా అవార్డు అందుకుంది. 27 నేషనల్ పోటీల్లో 19 పతకాలు సింధూ ఇప్పటివరకు 30 జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 19 పతకాలు సాధించింది. మొదటగా 2010 హర్యానాలో జరిగిన జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్‌లో 48 కిలోల విభాగంలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది. అదే ఏడాది మహారాష్ట్ర (సాంగ్లీ)లో జరిగిన పోటీల్లో 53కిలోల విభాగంలో బంగారు పతకం పొందింది. చత్తీస్ఘడ్ (రాయ్‌పూర్)లో జరిగిన పోటీల్లో 53 విభాగంలో బంగారు పతకం సాధించింది. 2013లో అస్సాం (గౌహతి)లో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో 58 కిలోల విభాగంలో కాంస్య పతకం, 2015 హర్యానాలో 58 కిలోల విభాగంలో రజతం, 2016 పంజాబ్‌లో జరిగిన ఆలిండియా యూనివర్సిటీలో 55కిలోల విభాగంలో రజతం పతకాలు సాధించింది. 2017లో బెంగళూర్‌లో జరిగిన సీనియర్ నేషనల్ పోటీల్లో, 2018లో నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఆలిండియా యూనివర్సిటీ, వైజాగ్‌లో జరిగిన సీనియర్ నేషనల్ పోటీల్లో పాల్గొంది. గత ఏడాది డిసెంబర్లో తమిళనాడులోని ఎంఎస్‌యూ యూనివర్సిటీలో జరిగిన ఆలిండియా యూనివర్సిటీలో 55 కిలోల విభాగంలో రజత పతకం సాధించింది. ఈ ఏడాది ఫిబ్రవరి కోల్‌కత్తాలో జరిగిన సీనియర్ నేషనల్ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటింది. వెయిట్‌లిఫ్టింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న సింధూ కోల్కత్తా ఇన్‌కంటాక్స్ డిపార్ట్మెంట్లో ఈ ఏడాది మార్చిలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించింది. దేశానికి ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యం వెయిట్ లిఫ్టింగ్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించడమే నా లక్ష్యం. అందుకోసం తీవ్రంగా కష్టపడతా. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం వచ్చినందుకు సంతోషంగా ఉంది. పాలమూరురెడ్డి సేవా సమితి వారు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. మధ్యతరగతి అనే భావనను వీడి కష్టపడితే క్రీడల్లో ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు. – సింధూ, వెయిట్‌లిఫ్టర్ 2018లో.. ప్రస్తుత మంత్రి నిరంజన్‌రెడ్డి చేతులమీదుగా ఉత్తమ క్రీడాకారిణిగా అవార్డు అందుకుంటున్న సింధూ -
డిప్యూటీ కలెక్టర్‌గా సుబ్రహ్మణ్యం కుమార్తె
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఐఏఎస్ అధికారి డాక్టర్ సుబ్రహ్మణ్యం కుమార్తె పి.సింధును ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కారుణ్య నియామకాల నిబంధనలను అనుసరించి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సింధు కృష్ణా జిల్లాలో విధులు నిర్వర్తించనున్నారు. (చదవండి: అన్నిటికీ సీఎంను తప్పుబట్టడం సరికాదు: రామ్‌మాధవ్) -
టోక్యో ఒలింపిక్స్ వరకు... ‘టాప్’లో సైనా, సింధు, శ్రీకాంత్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టోర్నమెంట్లలో టైటిల్స్ గెలుస్తున్న మేటి షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌లకు టార్గెట్ ఒలింపిక్స్ పోడియం (టాప్) పథకాన్ని పొడిగించారు. సింగిల్స్‌లో వీరిద్దరితో పాటు కిడాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ, హెచ్.ఎస్.ప్రణయ్లకూ టోక్యో ఒలింపిక్స్–2020 దాకా ‘టాప్’ చేయూతనిచ్చేందుకు కేంద్ర క్రీడాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు సవరించిన ‘టాప్’ జాబితాను భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) బుధవారం ప్రకటించింది. అయితే మరో తెలుగుతేజం భమిడిపాటి సాయిప్రణీత్, లక్ష్య సేన్లను ఈ జాబితా నుంచి తప్పించింది. డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి, ప్రణవ్ చోప్రాలు ‘టాప్’ జాబితాలో ఉన్నారు. కాగా ప్రదర్శన బాగుంటే టాప్‌లో చేర్చే ‘వాచ్‌లిస్ట్’ లో జక్కంపూడి మేఘన, పూర్వీషారామ్, మను అత్రి, సుమీత్ రెడ్డిలు ఉన్నారు. ‘2024 ఒలింపిక్స్ డెవలప్మెంటల్ గ్రూప్’లో సైక్లింగ్‌ను చేర్చే అంశాన్ని బుధవారం నాటి సమావేశంలో చర్చించారు. జూనియర్ ఆసియా ట్రాక్ సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో ఇటీవల భారత్ 10 పతకాలు సాధించింది. దీంతో సైక్లిస్ట్‌లు అల్బెన్, రొనాల్డో సింగ్, జేమ్స్ సింగ్, రోజిత్ సింగ్‌లను ఈ డెవలప్మెంటల్ తుది జాబితాలో చేర్చారు. పారాలింపియన్లకు అండదండ... తాజా ‘టాప్’ పథకంలో పారా అథ్లెట్లకు పెద్దపీట వేశారు. పారాలింపిక్స్, పారా ఆసియా క్రీడల్లో భారత దివ్యాంగ క్రీడాకారులు పతకాలతో దేశానికి కీర్తిప్రతిష్టలు తెస్తుండటంతో ఈసారి ఏకంగా 12 మంది పారా అథ్లెట్లను ఎంపిక చేశారు. పారా ఆసియా క్రీడల స్వర్ణ విజేత శరద్ కుమార్ (హైజంప్), వరుణ్ భటి (హైజంప్), జావెలిన్ త్రోయర్లు సందీప్ చౌదరి, సుమిత్, సుందర్ సింగ్ గుర్జార్, రింకు, అమిత్ సరోహ (క్లబ్ త్రోయర్), వీరేందర్ (షాట్‌పుట్), జయంతి బహెరా (మహిళల 400 మీ. పరుగు) ‘టాప్’ జాబితాలో ఉన్నారు. -
పెంట్‌హౌస్ రాబరీ
మూడున్నరకే చీకటి పడిపోయినట్టుగా కనిపిస్తోంది. రాత్రికి భారీ వర్షం పడే సూచనలున్నాయని వార్తల్లో చెబుతున్నారు. రాయల్ అపార్ట్మెంట్ నిశ్శబ్దంగా ఉంది. పెంట్‌హౌస్ నుంచి కేకలు వినబడుతున్నాయి. అది మూడంతస్తుల అపార్ట్మెంట్. ఒక్కో అంతస్తులో నాలుగు, గ్రౌండ్ ఫ్లోర్లో మూడు ఫ్లాట్స్ ఉన్నాయి. పైన పెంట్‌హౌస్ ఉంది. బిల్డర్ జగ్గారావు ఫ్యామిలీతో పెంట్‌హౌస్‌లో ఉంటున్నాడు. పెంట్‌హౌస్‌పై నుంచి కేకలు వినబడుతూ ఉండటంతో మెయిన్ గేటు పక్కన ఉన్న ఔట్‌హౌస్‌లో జోగుతున్న వాచ్‌మేన్ అప్పారావు ఉలిక్కిపడ్డాడు. ఏదో జరిగిందని అర్థమై మెట్లెక్కి పైకి పరిగెత్తాడు. ఆ అపార్ట్మెంట్కి లిఫ్ట్ లేదు. కార్ పార్కింగ్ కూడా జగ్గారావు ఒక్కడికే ఉంది. మిగిలిన వారికి స్కూటర్ పార్కింగ్‌లే. అప్పారావు వెళ్లేసరికి సింధూరాణి ఆయాసపడిపోతూ ఉంది.‘‘ఏమైందమ్మా?’’ అని అడిగాడు అప్పారావు.‘‘సార్ పంపారని ఎవరో వచ్చారు. నిన్న ఇంట్లో పెట్టిన బ్రీఫ్‌కేస్ తెమ్మన్నారంటే నిజమే అనుకున్నాను. ఆయన నిన్న రాత్రి ఒక బ్రీఫ్‌కేస్ తెచ్చి బీరువాలో పెట్టమన్నారు. రేపు ఆఫీసుకి వెళ్లేటప్పుడు ఇవ్వమన్నారు. వెళ్లేటప్పుడు ఆయన అడగలేదు. నేను గుర్తు చెయ్యలేదు.’’ సింధూరాణి ఆయాసం పెరిగిపోయి మాట్లాడలేక ఆగింది. ఆమె అవస్థ గమనించి, ‘‘కూర్చోండమ్మా!’’ అన్నాడు అప్పారావు. ఆమె కూర్చుని చెప్పడం మొదలుపెట్టింది. ‘‘వచ్చిన ఇద్దరిలో ఎవరూ నాకు తెలిసిన వాళ్లు కాదు. బీరువాలోంచి బ్రీఫ్‌కేస్ తీశాను. ఇవ్వబోయే సమయానికి అనుమానం వచ్చింది. సరే, నేనే కాల్ చేసి అడుగుదామనుకున్నాను. టీపాయ్ మీదున్న ల్యాండ్‌లైన్ ఫోన్ డయల్ చేస్తున్నాను. సార్ నెంబర్ ఎంగేజ్ వస్తోంది. ఎవరితోనో మాట్లాడుతున్నట్టున్నారు. ఇంతలో వాళ్లలో ఒకడు టీపాయ్ మీద ఉంచిన బ్రీఫ్‌కేస్ తీసుకుని పరిగెత్తాడు. రెండోవాడూ వాడితోపాటు పోయాడు’’ చెప్పింది సింధూరాణి. ‘‘పోలీసులకు ఫోన్ చేశారా?’’ ఎవరో అడిగారు. ‘‘అమ్మా! ముందు సార్‌కి ఫోన్ చేయండి!’’ అన్నాడు అప్పారావు. సింధూరాణి తేరుకుని భర్తకి కాల్ చేసింది. అతను లైన్లోకి వచ్చాడు. ‘‘హలో!’’ అన్నాడు.‘‘ఏమండీ! చాలాసేపట్నుంచి మీకు ఫోన్ చేస్తున్నా. లైన్ కలవడం లేదు. దొంగతనం జరిగిందండీ..’’ అంటూ సింధూరాణి చెప్పడం మొదలుపెట్టింది. అరగంట తర్వాత పోలీసులు వచ్చారు. వర్షం పెద్దదైనట్టు ఉంది. అందరూ రెయిన్కోట్లు వేసుకున్నారు. అవి కొంతమేర తడిసివున్నాయి. సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ వస్తూనే సోఫాలో కూలబడ్డాడు. అతనుబాగా లావుగా బాన పొట్టతో ఉన్నాడు. అన్ని మెట్లు ఎక్కి వచ్చేటప్పటికి ఆయాసం వచ్చేసింది. ఎస్సై జోసఫ్, నలుగురు కానిస్టేబుల్స్ నిలబడి అందరివంకా చూస్తున్నారు.‘‘ఎవరయ్యా వాచ్‌మేన్?’’ అన్నాడు సీఐ. ‘‘సార్! నేనే..’’ అంటూ ముందుకు వచ్చాడు అప్పారావు.‘‘అందర్నీ పంపెయ్!’’ అన్నాడు.అప్పారావు అక్కడున్నవాళ్లని దూరంగా వెళ్లమని చెప్పి వచ్చాడు. ‘‘మీరేనా ఇందులో ఉండేది?’’ అన్నాడు సీఐ సింధూరాణితో. ‘‘ఔనండీ!’’‘‘మీ పేరు?’’‘‘సింధూరాణి’’‘‘మీవారు ఎవరు? ఏం చేస్తుంటారు?’’‘‘జగ్గారావండీ. ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు.’’‘‘అలాగా? ఏం జరిగింది?’’సింధూరాణి జరిగింది చెప్పింది.‘‘బ్రీఫ్‌కేస్‌లో ఏమున్నదమ్మా?’’‘‘తెలీదండీ! రాత్రి తెచ్చి బీరువాలో పెట్టమన్నారు. పొద్దున ఆఫీస్‌కి వెళ్లేటప్పుడు ఇవ్వమన్నారు. ఆయన వెళ్లేటప్పుడు అడగలేదు. పాపిష్టిదాన్ని నేనూ గుర్తు చేసుకుని ఇవ్వలేదు. ఇచ్చివుంటే ఇదంతా జరిగేది కాదు.’’ అంటూ ఏడుపు మొదలుపెట్టింది. సీఐ కళ్లు మూసుకుని ఆలోచనలో పడ్డాడు. కాసేపటికి కళ్లు తెరిచాడు. ‘‘మీ వారేరీ?’’ అడిగాడు సింధూరాణిని.‘‘జరిగిందంతా చెప్పానండీ! వస్తుంటారు.’’ అంది. ‘‘జోసెఫ్ ఆయన నెంబర్ తీసుకుని కాల్ చెయ్యి. అర్జెంటుగా రమ్మను.’’ అన్నాడు ఎస్సైతో. ‘‘ఎస్ సార్!’’ అని సింధూరాణిని అడిగి జగ్గారావు సెల్ నెంబర్ తీసుకున్నాడు. కాల్ చేస్తుంటే రింగవుతోంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. ‘‘సార్! ఆయన లిఫ్ట్ చేయడం లేదు.’’ చెప్పాడు జోసెఫ్.‘‘జర్నీలో ఉన్నాడేమో? ఓకే!’’ అన్నాడు సీఐ.‘‘వాచ్‌మేన్! ఇద్దరు మనుషులు మెయిన్‌గేట్ దాటి రావడం నువ్వు చూశావా?’’ ప్రశ్నించాడు సీఐ. ‘‘లేదండీ. నేనప్పుడు నా రూమ్‌లో ఉన్నాను.’’‘‘నువ్విక్కడ వాచ్మేన్వి. గేట్లో నుంచి వచ్చే పోయే వాళ్లని చూస్తుండొద్దా? ఏం చేస్తున్నావు? తాగి తొంగున్నావా?’’ గర్జించాడు సీఐ. అప్పారావు బెదిరిపోయాడు. ‘‘చూస్తూనే ఉంటానండీ. ఎవరోకళ్లు ఏదోక పని చెప్తుంటారండి. చెయ్యకపోతే కోపం. ఒక్కడ్నేనండి. ఎన్నని చెయ్యను!’’ నెమ్మదిగా చెప్పాడు అప్పారావు. ‘‘అట్లాంటప్పుడు ఆ పని చెప్పినవాళ్లని గేటు దగ్గర ఉండమని చెప్పాలి. ఇట్లా ఏదైనా జరిగినప్పుడు ఎట్లా?’’అప్పారావు మౌనంగా ఉండిపోయాడు. ‘‘అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు పెట్టించారా?’’అప్పారావు తల అడ్డంగా ఊపాడు. ‘‘సీసీ కెమెరాలు లేవు. లిఫ్ట్ లేదు. ఏం అపార్ట్మెంటమ్మా? ఏదైనా జరిగినప్పుడు మా చావుకొస్తుంది.’’ అసహనంతో అన్నాడు సీఐ. సీఐ మాటమాటకీ వాచ్ చూసుకుంటున్నాడు. ‘‘ఏవండీ! మీ ఆయన ఇంకా రాలేదు. ఎప్పుడొస్తారు?’’ సింధూరాణితో అన్నాడు.‘‘నేనూ ట్రై చేస్తున్నానండీ. ఫోన్ లిఫ్ట్ చెయ్యడం లేదు.’’ అంది ఆమె. ‘‘అయితే పోయిన బ్రీఫ్‌కేస్‌లో ఏముందో మీకు తెలియదన్నమాట?’’సింధూరాణి తల అడ్డంగా ఊపింది తెలియదన్నట్టుగా. అంతలో ల్యాండ్‌లైన్ ఫోన్ మోగింది. సింధూరాణి లిఫ్ట్ చేసి, ‘‘హలో!’’ అంది. అవతల చెప్పింది విని ఆమె ముఖం వివర్ణమయింది.‘‘ఎక్కడా?’’ అంది ఆందోళనపడుతూ. సింధూరాణి ఫోన్ పెట్టేసింది. అరవడం మొదలుపెట్టింది. ‘‘ఏమైందండీ!’’ అని అడిగాడు సీఐ.‘‘ఆయనకి గుండెపోటు వచ్చిందంటండీ! హాస్పిటల్లో చేర్పించారట. ఆఫీస్ వాళ్లు చెప్పారు.’’ ఏడుస్తూనే చెప్పింది సింధూరాణి. సీఐ మల్లికార్జున్ దీర్ఘంగా నిట్టూర్చాడు. ‘‘బ్రీఫ్‌కేస్ పోయిందని తెలియగానే గుండెపోటు వచ్చిందంటే, దాంట్లో డబ్బు ఉండుంటుంది..!’’ అన్నాడు ఎస్సై వైపు చూస్తూ. ‘‘ఎస్ సార్!’’ అన్నాడు జోసెఫ్. ‘‘జోసెఫ్! వర్షం బాగా కురుస్తోంది. పాపం మేడమ్ ఎట్లా వెళ్తారు? ఆమెను హాస్పిటల్లో డ్రాప్ చెయ్. ఆయనకి ఎట్లా ఉందో డాక్టర్స్‌ని ఎంక్వయిరీ చేసి, నాకు కాల్ చెయ్! నేనిక్కడే ఉంటాను.’’ అన్నాడు సీఐ. ‘‘ఎస్ సార్!’’ అన్నాడు జోసెఫ్. ‘‘అమ్మా! మీరు మా వాళ్లతో వెళ్లండి. హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. వర్రీ పడకండి. కష్టార్జితం ఎక్కడికీ పోదు. తప్పక దొరుకుతుంది.’’ ధైర్యం చెప్పాడు మల్లికార్జున్. ఎస్సైతో పాటు సింధూరాణి బయలుదేరింది. జగ్గారావు కోలుకున్నాడనీ, ఐసీయూ నుంచి రూమ్‌లోకి షిఫ్ట్ చేశారని సమాచారం వచ్చింది. సీఐ మల్లికార్జున్ తన స్టాఫ్‌తో హాస్పిటల్‌కి వెళ్లాడు. రూమ్‌లో అతని భార్య సింధూరాణి లేదు. వేరే ఇంకొక ఆమె ఉంది. ఎర్రగా పొడుగ్గా ఉంది. ఆమె పక్కన టీనేజ్ కుర్రాడు, పదేళ్ల పాప ఉన్నారు. ‘‘హలో సార్!’’ అని పలకరించాడు సీఐ. ‘‘నమస్తే!’’ అని లేవబోయాడు జగ్గారావు. ‘‘మీరు లేవొద్దు. ప్లీజ్!’’ అని ఆమె వైపు చూసి, ‘‘మీరు?’’ అన్నాడు ప్రశ్నార్థకంగా. ‘‘నా వైఫ్ రాజేశ్వరి. వీళ్లు నా పిల్లలు’’ చెప్పాడు జగ్గారావు. మల్లికార్జున్ షాక్ తిన్నట్టయ్యాడు. ఈవిడ వైఫ్ అయితే, మరి సింధూరాణి? గురుడికి ఇద్దరు భార్యలా? అనుకున్నాడు. ‘‘ఓకే! చెప్పండి జగ్గారావుగారూ. బ్రీఫ్‌కేస్‌లో ఏముంది?’’ ప్రశ్నించాడు సీఐ. ‘‘యాభై లక్షలు క్యాష్ సార్!’’ విచారంగా అన్నాడు.‘‘మై గాడ్! ఫిఫ్టీ ల్యాక్స్? అంత డబ్బు ఇంటికి తీసుకెళ్లినట్టు మీ స్టాఫ్‌లో ఎవరికైనా తెలుసా?’’‘‘మా అకౌంటెంట్‌కి తెలుసు.’’ ‘‘ఓకే.. అమ్మా! మీరు కొంచెం బయటకు వెళ్తారా?’’ రాజేశ్వరి వైపు చూసి అన్నాడు సీఐ మల్లికార్జున్. రాజేశ్వరి పిల్లల్ని తీసుకుని గది బయటికి వెళ్లిపోయింది. ‘‘ఏమండీ! మీకు ఇద్దరు భార్యలా?’’‘‘ఔనండీ! సింధూరాణికి పిల్లలు లేరు. తర్వాత రాజేశ్వరిని పెళ్లి చేసుకున్నాను.’’ చెప్పాడు జగ్గారావు. యాభై లక్షల క్యాష్ పోవడంతో అప్సెట్ అయ్యాడు జగ్గారావు. ఒక స్థలం కొనుగోలు చేయడానికి అంత క్యాష్ సమకూర్చుకునేసరికి చాలా కష్టమైంది. ఫ్రెండ్స్, తోటి బిల్డర్స్ దగ్గర సేకరించుకోవాల్సి వచ్చింది. స్థలం యజమాని క్యాష్ ఇవ్వమని ఒత్తిడి చేయడంతో అంత క్యాష్ తెచ్చి పెద్ద భార్య సింధూరాణి ఇంట్లో ఉంచాడు. ఉదయం వెంట తెచ్చుకోవాల్సింది కానీ ఈ రోజుకి అవసరం లేదని ఊరుకున్నాడు. అందుకే ఇలా జరిగింది. ‘‘మీ బ్రీఫ్‌కేస్ ఏ రంగులో ఉంది?’’‘‘సిమెంట్ కలర్ సార్!’’ అన్నాడు జగ్గారావు. జగ్గారావు ఆఫీసుకెళ్లి అకౌంటెంట్ని విచారించాడు సీఐ. అతను రామశర్మ. రిటైరైపోయిన వృద్ధుడు. అతను తనకు ఏం తెలియదని నొచ్చుకున్నాడు అనుమానించినందుకు. రామశర్మ అనుమానించదగ్గ మనిషి కాదని మల్లికార్జున్‌కి అర్థమైంది. ‘‘సార్! సింధూరాణి భర్త మీద చాలా కోపంగా ఉంది. తరచుగా ఘర్షణ పడుతుంటుందని వాచ్‌మేన్ అప్పారావు చెప్పాడు. అపార్ట్మెంట్లో ఆడవాళ్లు కొన్ని సంగతులు చెప్పారు. జగ్గారావు పెద్ద భార్య దగ్గరికి వారానికి ఒకసారి కూడా రాడట. ఎక్కువగా రెండో భార్య, పిల్లలతోనే గడుపుతాడట. గచ్చిబౌళిలోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో రెండో భార్యకు విల్లా కొని ఇచ్చాడట. అప్పట్నుంచి సింధూరాణి భర్త మీద మండి పడుతున్నదట.’’ చెప్పాడు ఎస్సై. సీఐకి కేసులో క్లూ దొరుకుతున్నట్టుగా అనిపిస్తోంది. ఇంతలో హెడ్ కానిస్టేబుల్ వాచ్‌మేన్ అప్పారావుని పట్టుకొచ్చాడు. స్టేషన్లోకి గడగడలాడుతూ వచ్చాడు అప్పారావు. వచ్చీ రావడంతోనే కాళ్ల మీద పడిపోయాడు. ‘‘సార్! నాకేం తెలీదు.’’ అన్నాడు ఏడుస్తూ. ‘‘నీకు తెలీదుగాని ఒక సంగతి చెప్పు! ఆ రోజు పొద్దున జగ్గారావు కారులో వెళ్లిపోయాడు. సాయంకాలం మూడున్నర, నాలుగు గంటలకు దొంగతనం జరిగింది. ఈ లోపల పెంట్‌హౌస్‌కి ఎవరు వచ్చారు?’’ ప్రశ్నించాడు. అప్పారావు అతని పేరు చెప్పాడు. ఆ ఇల్లు కూడా తనకి తెలుసు అన్నాడు. వాచ్‌మేన్‌ని వెంటపెట్టుకుని సీఐ స్టాఫ్‌తో పోలీస్ వ్యాన్‌లో బయలుదేరాడు.పోలీసులు తన ఇంటికి రావడంతో బెదిరిపోయాడు భిక్షపతి. ఇల్లంతా గాలిస్తే దొరికింది బ్రీఫ్‌కేస్. అది బరువుగానే ఉంది. తను ఓపెన్ చేయలేదన్నాడు. పోలీస్ స్టేషన్లో తలవంచుకుని నిలబడి ఉంది సింధూరాణి. ‘‘చెప్పవమ్మా! బ్రీఫ్‌కేస్ మీ నాన్నకు ఇచ్చి పంపి, దొంగలు ఎత్తుకెళ్లారని ఎందుకు నాటకం ఆడావు?’’ గద్దించాడు సీఐ. ‘‘మా ఆయన నన్ను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడండీ. చిన్న పెళ్లానికి కోటి రూపాయలు పెట్టి విల్లా కొనిచ్చాడు. నేను అదే అడిగితే నువ్వుండే పెంట్‌హౌస్ నీకే రాసిస్తాను అన్నాడు. అదీ చెయ్యడం లేదు. నాకీ పెంట్ హౌస్ వద్దు. ఇది అనాథరైజ్డ్. దీనికి విలువలేదు. పది లక్షలకు కూడా ఎవరూ కొనరు. నాకూ విల్లా కొనివ్వు అని అడిగాను. పిల్లా జెల్లా లేరు నీకెందుకే విల్లా అని తిట్టాడండీ. ఏం చేయమంటారు? అందుకే బ్రీఫ్ కేస్ దొంగలెత్తుకెళ్లారని నాటకం ఆడాను. నాకు తెలుసు, అందులో యాభై లక్షలున్నాయని.’’ తప్పు ఒప్పుకుంటూ చెప్పింది సింధూరాణి. వాణిశ్రీ -
మహిళల సింగిల్స్ సెమీస్‌లో సింధు
థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ పీవీ సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బ్యాంకాక్‌లో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు 21–17, 21–13తో సోనియా చెయా (మలేసియా)పై అలవోకగా గెలిచింది. శనివారం జరిగే సెమీఫైనల్లో గ్రెగోరియా మరిస్కా తున్జుంగ్ (ఇండోనేసియా)తో సింధు తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 2–0తో ఆధిక్యంలో ఉంది. -
అజయ్, సింధు శుభారంభం
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ర్యాంకింగ్ టోర్నీలో తెలంగాణ క్రీడాకారులు అజయ్ పృథ్విక్, సింధు జనగాం శుభారంభం చేశారు. ఫతేమైదాన్‌లోని ఎల్బీ స్టేడియంలో సోమవారం ప్రారంభమైన ఈ టోర్నీలో సింగిల్స్ విభాగాల్లో వీరిద్దరూ ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో అజయ్ 7–5, 6–1తో అభిషేక్ శుక్లాపై గెలుపొందగా... మహిళల విభాగంలో ఎనిమిదో సీడ్ సింధు 6–1, 6–2తో ఆకాంక్ష (మహారాష్ట్ర)ను చిత్తుగా ఓడించింది. ఇతర మహిళల తొలిరౌండ్ మ్యాచ్‌ల్లో స్మృతి 6–0, 6–0తో మేఘ ముత్తుకుమారన్ (తమిళనాడు)పై, సహజ (తెలంగాణ) 6–1, 6–3తో మౌలిక రామ్ (తెలంగాణ)పై, లిఖిత కాల్వ (తెలంగాణ) 6–0, 6–0తో శిల్పి స్వరూప దాస్ (ఒడిశా)పై, దీక్ష అజిత్ (ఏపీ) 6–0, 6–1తో వైశాలి ఠాకూర్ (తమిళనాడు)పై, లిఖిత లండా (ఏపీ) 6–0, 6–0తో ప్రియాంక రోడ్రిక్స్ (మహారాష్ట్ర)పై, ప్రతిభ (కర్నాటక) 6–2, 6–2తో అనీశ రాయుడు (ఏపీ)పై విజయం సాధించి రెండోరౌండ్‌కు చేరుకున్నారు. పురుషుల తొలిరౌండ్ మ్యాచ్‌ల ఫలితాలు శివదీప్ కొసరాజు (ఏపీ) 6–3, 2–6, 7–6 (5)తో కైవల్య వామనరావు (మహారాష్ట్ర)పై, హేవంత్ కుమార్ (తెలంగాణ) 7–6 (8/6), 6–1తో అమర్ (కర్ణాటక)పై, సాయి శరణ్‌రెడ్డి (ఏపీ) 6–4, 7–5తో శ్రీనివాస్ (ఏపీ)పై, అనికేత్ వెంకట్ (తెలంగాణ) 6–4, 3–6, 7–5తో అరవింద్ రెడ్డిపై, కృష్ణతేజ (తెలంగాణ) 6–4, 6–2తో సుభాష్‌పై, టి. వినయ్ కుమార్ (కర్నాటక) 6–3, 3–6, 6–3తో సౌరభ్ కుమార్‌పై, డి. అఖిల్ కుమార్ 3–6, 6–4, 6–2తో కె. రోహిత్‌పై, ఆయుశ్ (పంజాబ్)6–2, 6–3తో తరుణ్ కర్రా (తెలంగాణ)పై, పృథ్వీ శేఖర్ (తమిళనాడు) 7–5, 6–2తో దుర్గ హిమకేశ్ (తెలంగాణ)పై గెలుపొందారు. -
సైనా సింధులకు సన్మానం
-
కాళ్లపారాణి ఆరక ముందే..
చింతలపూడి : కాళ్ల పారాణి ఆరక ముందే నవవధువు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చింతలపూడి మండలం ఫాతిమాపురంలో శుక్రవారం చోటు చేసుకుంది. పెళ్లి జరిగి 24 గంటలు గడవకముందే నూతంకి సింధు (24) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 25న కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన జువ్వన రవికిరణ్‌తో ఫాతిమాపురం గ్రామానికి చెందిన నూతంకి సింధుకు నూజివీడులో వివాహం జరిగింది. మరుసటి రోజు 26న సింధు భర్తతో కలిసి పుట్టింటికి వచ్చింది. సాయంత్రం 4 గంటల సమయంలో భర్త పక్క గదిలో ఉండగా సింధు గదిలో ఉన్న సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం ఉదయం సమాచారం అందుకున్న సీఐ పి.రాజేష్, ఎస్సై సీహెచ్ వెంకటేశ్వరరావు ఘటనాస్థలానికి చేరుకుని విచారించారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. తహసీల్దార్ టి.మైఖేల్‌రాజ్ శవ పంచనామా నిర్వహించారు. సింధు ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. మృతురాలి తల్లిదండ్రుల నుంచి కాని, అత్తింటి నుంచి కానీ ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు. శవ పంచనామా అనంతరం పోస్టుమార్టం నిర్వహించాక సింధు మృతికి కారణాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. పెళ్లిలో నవ్వుతూ తుళ్లుతూ తిరిగిన సింధు హఠాత్తుగా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలియక కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తన మనసులోని బాధను తమతో చెప్పినా అర్థం చేసుకుని తీర్చేవారమని ఇలా అర్ధాంతరంగా విడిచిపెట్టి వెళ్తుందని అనుకోలేదని రోదిస్తున్నారు. సింధు మృతితో పెళ్లికి వచ్చిన బంధువులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
సింధు... మళ్లీ శ్రమించి
బర్మింగ్‌హామ్ : ఎంతోకాలంగా భారత మహిళా క్రీడాకారిణులకు అందని ద్రాక్షగా ఉన్న ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్‌ను సాధించే దిశగా తెలుగు తేజం పీవీ సింధు మరో అడుగు వేసింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో వరుసగా రెండో ఏడాది ఈ హైదరాబాద్ అమ్మాయి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 21–13, 13–21, 21–18తో ప్రపంచ 11వ ర్యాంకర్ నిచావోన్ జిందాపోల్ (థాయ్‌లాండ్)పై కష్టపడి గెలిచింది. 67 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు ఆటతీరులో నిలకడ లోపించింది. అయితే కీలకదశలో తన అనుభవాన్నంతా రంగరించి పోరాడి విజయాన్ని దక్కించుకుంది. నిర్ణాయక మూడో గేమ్‌లో ఒకదశలో సింధు 12–16తో నాలుగు పాయింట్లు వెనుకబడింది. కానీ కళ్లు చెదిరే స్మాష్‌లతో విరుచుకుపడి వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 17–16తో ఆధిక్యంలోకి వచ్చింది. ఈ దశలో జిందాపోల్ రెండు పాయింట్లు నెగ్గి 18–17తో ముందంజ వేసింది. కానీ సంయమనం కోల్పోకుండా ఆడిన సింధు ఈసారి వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 21–18తో మూడో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను దక్కించుకుంది. పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్)తో బుధవారం జరిగిన తొలి రౌండ్లోనూ సింధు మూడు గేముల్లో గెలిచింది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)తో సింధు తలపడుతుంది. బుధవారం ఆలస్యంగా ముగిసిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో హెచ్ఎస్ ప్రణయ్ (భారత్) 9–21, 21–18, 21–18తో ఎనిమిదో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)పై సంచలన విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–19, 21–18తో యుగో కొబయాషి–హోకి టకురో (జపాన్) జంటను ఓడించింది. రెండో స్థానానికి శ్రీకాంత్ గురువారం విడుదలైన ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య తాజా ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ శ్రీకాంత్ రెండోసారి కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్ రెండో స్థానానికి చేరుకున్నాడు. గతవారం మూడో స్థానంలో నిలిచిన శ్రీకాంత్ ఈసారి ఒక స్థానం మెరుగుపర్చుకున్నాడు. గత నవంబర్‌లో తొలిసారి రెండో ర్యాంక్ చేరిన శ్రీకాంత్ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో విజేతగా నిలిస్తే ప్రపంచ నంబర్‌వన్ అవుతాడు. భారత్‌కే చెందిన సాయిప్రణీత్ రెండు స్థానాలు పురోగతి సాధించి 12వ ర్యాంక్‌కు చేరాడు. మహిళల సింగిల్స్‌లో సింధు మూడో ర్యాంక్‌లో, సైనా 12వ ర్యాంక్‌లో ఉన్నారు.