stray dog
-
వీధి కుక్క స్వైర విహారం.. గంటలో 17 మందిపై దాడి
ఉత్తరప్రదేశ్‌లో ఓ వీధి కుక్క స్వైర విహారం చేసింది. కనిపించిన వారిని కనిపించినట్లే మీద పడి గాయపరిచింది. చిన్న, పెద్ద, ముసలి తేడా లేకుండా కేవలం గంట వ్యవధిలోనే కంట పడిన 17 మందిపై దాడి చేసింది. కుక్క దాడిలో గాయపడిన వారిలో మహిళతోపాటు చిన్నారులు కూడా ఉన్నారు. అయితే ఈ ఘటన గోరఖ్‌పూర్‌లోని షాపూర్లో ఆగష్టు 14న జరగ్గా.. సీసీటీవీ ఫుటేజీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.ఇందులో 22 ఏళ్ల విద్యార్ధి ఆశిష్ యాదవ్.. ఆవాస్ వికాస్ కాలనీలోని తన ఇంటి ముందు నిలబడి ఫోన్లో మాట్లాడుతుండగా వీధి కుక్క తీవ్రంగా దాడి చేసింది. ఇంటి ముందు వెళ్తున్న కుక్క.. అకస్మాత్తుగా యువకుడి వైపుకు పరుగెత్తుకొచ్చి కరిచింది. అయితే దాని నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. ఆ కుక్క ఎంతకు తగ్గలేదు.అతడిపైకి ఎగురుతూ, మరింత వేగంగా కరిచేందుకు యత్నించింది. ఆశిష్ కిందపడిపోవడంతో అతని కాలుపై, ముఖంపై గాయపరిచింది. అనంతరం అక్కడి నుంచి పారిపోయింది. కుక్క దాడిలో అతని ముఖం, నోరు, కళ్లు, పెదవులు దెబ్బతిన్నాయి. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే రేబిస్ వ్యాక్సిన్ కోసం జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లగా.. వ్యాక్సిన్ అయిపోయిందని చెప్పారని ఆశిష్ తండ్రి విజయ్ యాదవ్ తెలిపారు. కుక్కల దాడిపై నగరపాలక సంస్థకు సమాచారం అందించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు వాపోయారు.ఈ ఘటన తరువాత కుక్కు ఇంటి గేటు వద్ద నిలబడిన మరో మహిళపై దాడి చేసింది. ఆమె మోకాలి, కాలుపై కరిచి వెళ్లిపోయింది. దీంతో మహిళ మోకాలిపై లోతైన గాయమవ్వగా కుట్లు పడ్డాయి. దీని తర్వాత ఇంటి బయట ఆడుకుంటున్న ఇద్దరు బాలికలపై కుక్క దాడి చేసింది. ఇలా ఆ పిచ్చి కుక్క దాదాపు 17 మందిని గాయపరిచింది.దీనిపై గోరఖ్‌పూర్ అదనపు మున్సిపల్ కమీషనర్ దుర్గేష్ మిశ్రా మాట్లాడుతూ.. ఈ సంఘటన గురించి తనకు తెలియదని, ఎటువంటి ఫిర్యాదులు అందలేదని చెప్పారు. వీధికుక్కలకు స్టెరిలైజేషన్ కోసం నిరంతరం ప్రచారం నిర్వహిస్తున్నామని, యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్‌ను కూడా నిర్మిస్తున్నామని చెప్పారు. వీధికుక్కలను పట్టుకుని స్టెరిలైజ్ చేయడంతోపాటు పెంపుడు కుక్కలకు వ్యాక్సినేషన్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. -
కుక్కలకు మీ ఇంటి వద్దే భోజనం పెట్టండి
వెంగళరావునగర్: ‘వీధి కుక్కలకు మీ ఇంటి వద్దనే ఆహారాన్ని పెట్టండి మహాప్రబో.. రోడ్ల మీద పెట్టకండి.. కుక్కల నుంచి ప్రజల ప్రాణాలను రక్షించండి’అంటూ మధురానగర్ కాలనీలో స్థానికులు వినూత్నరీతిలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల ఏర్పాటుకు గత ఏడాది నుంచి జరుగుతున్న కాలనీవాసుల ఆందోళనే ప్రధాన కారణం. దాదాపు ఏడాదిన్నర నుంచి కాలనీలో కుక్కల బెడద మరీ ఎక్కువగా ఉంది. శునకాలు పదుల సంఖ్యలో సంచరిస్తూ ఇప్పటికే 50 మందిపై దాడి చేసి గాయపర్చాయి. ఆందోళన చెందిన కాలనీవాసులు అసోసియేషన్‌కు మొర పెట్టుకున్నారు. కొందరు రోడ్ల మీదనే కుక్కలకు ఆహారాన్ని ఇవ్వడం వల్ల అవి కాలనీలో తిష్ట వేశాయని, కనిపించిన ప్రతి ఒక్కరిపై దాడి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఇప్పటికే పోలీసుస్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయి. ప్రజల ఆవేదన దృష్టిలో పెట్టుకుని మధురానగర్‌కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ విధమైన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వీధి కుక్కలను తమ ఇంటి వద్దకు తీసుకెళ్ళి ఆహారాన్ని అందించినట్టయితే వాటికి కడుపు నిండుతుందని, కాలనీవాసులకు రక్షణ ఉంటుందని విజ్ఞప్తి చేస్తున్నట్టుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని అసోసియేషన్ నేతలు పేర్కొన్నారు. ఇప్పటికైనా కుక్కల ప్రేమికులు కాలనీవాసుల సమస్యను కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. పెంపుడు కుక్కలు వీధుల్లో మల విసర్జన చేస్తే తక్షణమే యజమానులు వాటిని తొలగించాలని కోరారు. కాలనీ వీధుల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చూసిన ప్రజలు అసోసియేషన్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు. -
ఊరకుక్క దాడిలో చిన్నారి దుర్మరణం
తాండూరు రూరల్: దగ్గర్లోనే పనిచేస్తున్న భర్తకు మంచినీళ్లు ఇచ్చొద్దామని వెళ్లిందా తల్లి. ఇంతలోనే అంత ఘోరం జరిగిపోతుందని ఊహించలేదు. ఇంటికి తిరిగి వచ్చేసరికి తన ఐదు నెలల చిన్నారి రక్తపు మడుగులో కన్పించాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న శిశువుపై ఊరకుక్క దాడి చేసింది. మెడ, కన్ను భాగంలో కరవడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. వైద్యులు చికిత్సకు ఏర్పాట్లు చేస్తుండగానే బాలుడు మరణించాడు.దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. మరోవైపు కోపోద్రిక్తులైన చుట్టుపక్కల ఉండే కార్మికులు కుక్కను కొట్టి చంపేశారు. మంగళవారం ఉదయం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని బసవేశ్వర్‌నగర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. రూరల్ సీఐ అశోక్, ఎస్ఐ విఠల్‌రెడ్డి, బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.గదిలో బాలుడు ఒంటరిగా ఉండటంతో..కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌కు చెందిన నీలం మధు, మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి సమీపంలోని దుప్పల్లికి చెందిన లావణ్యల వివాహం నాలుగేళ్ల క్రితం జరిగింది. వీరికి ఐదు నెలల క్రితం సాయినాథ్ పుట్టాడు. కాగా స్టోన్ పాలిషింగ్ పనిచేసే మధు వారం క్రితమే బసవేశ్వర్‌నగర్‌లోని సంగెం కలాన్ గ్రామానికి చెందిన నాగభూషణం పాలిషింగ్ యూనిట్లో చేరాడు. సమీపంలోనే ఓ అద్దె గదిలో దంపతులు నివసిస్తున్నారు. మంగళవారం ఉదయం చిన్నారిని ఇంట్లో పడుకోబెట్టిన లావణ్య పక్కనే వంద అడుగుల దూరంలో పనిచేస్తున్న మధుకు మంచినీళ్లు ఇవ్వడానికి వెళ్లింది.బాబుకు ఉక్కపోస్తుందని, వెంటనే తిరిగొస్తాను కదా అన్న ఉద్దేశంతో గది తలుపు వేయలేదు. లావణ్య అలా బయటకు వెళ్లగానే పరిసర ప్రాంతంలో తిరుగుతున్న ఓ ఊరకుక్క ఇంట్లోకి చొరబడింది. ఒంటరిగా ఉన్న సాయినాథ్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. నాలుగేళ్లుగా సంతానం కోసం ఎదురు చూసి, ఎన్నో మొక్కులు మొక్కగా పుట్టిన ఒక్కగానొక్క కొడుకు కళ్ల ముందే చనిపోవడంతో తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. ‘నాన్నా లే నాన్నా’అంటూ లావణ్య రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఈ నెల 24న తిరుపతి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నామని, ఇంతలోనే ఇలా జరిగిందని మధు విలపించాడు.అందరూ ఎన్నికలకు వెళ్లడంతో..సాధారణ రోజుల్లో పాలిషింగ్ యూనిట్ సమీపంలోని కార్మికుల గదుల వద్ద సందడి ఉంటుంది. అయితే ఎన్నికల నేపథ్యంలో చాలావరకు కుటుంబాలు ఇళ్లకు తాళాలు వేసి స్వగ్రామాలకు వెళ్లడంతో పెద్దగా మనుషుల అలికిడి లేకుండాపోయింది. దీనికి తోడు మధు కుటుంబం నివాసం ఉంటున్న గది ఒక్కటే విడిగా ఉండటం, పక్కన ఇతర నివాసాలు లేకపోవడంతో కుక్క దాడి చేసేందుకు అవకాశం ఏర్పడింది. -
వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి
దేశ రాజధాని ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ ప్రాంతంలో మూడు, నాలుగు వీధి కుక్కలు ఏడాదిన్నర బాలికను బలిగొన్నాయి. చుట్టుపక్కలవారు రక్షించే సమయానికే ఆ బాలిక తీవ్రంగా గాయపడింది. కుటుంబసభ్యులు బాధిత బాలికను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఆ చిన్నారి మృతి చెందిందని నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత బాలికను దివాన్షిగా గుర్తించారు. మృతురాలు దివాన్షి తుగ్లక్ లేన్‌లోని చమన్ ఘాట్ ప్రాంతంలో తన కుటుంబంతోపాటు ఉంటోంది. బాలిక తండ్రి రాహుల్ దుస్తులను ఇస్త్రీ చేస్తుంటాడు. ఈ ప్రాంతంలో వీధి కుక్కలు విపరీతంగా సంచరిస్తుంటాయని రాహుల్ సన్నిహితుడు వివేక్ కుమార్ తెలిపాడు. రాత్రి భోజనం చేశాక రాహుల్ కుటుంబ సభ్యులు బయటకు వచ్చారు. వారికి తమ కుమార్తె కనిపించలేదు. ఇంటికి కొంత దూరంలో రక్తపుమడుగులో ఆ చిన్నారి కనిపించింది. ఆ సమయంలో చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేస్తున్నాయి. ఘటనాస్థలికి సమీపంలో డీజే ప్లే అవుతున్నదని స్థానికులు తెలిపారు. ఆ సందడిలో చిన్నారి ఆర్తనాదాలు ఎవరికీ వినిపించలేదు. చివరికి చుట్టుపక్కలవారు ఎలాగోలా కుక్కల బారి నుంచి ఆ చిన్నారికి విముక్తి కల్పించారు. విషయం తెలుసుకున్న జనం అక్కడ పెద్ద ఎత్తున గుమిగూడారు. ఇంతలో ఈ ఘటనపై ఎవరో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రజలను శాంతింపజేసి, బాధిత బాలికను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆ చిన్నారి మృతి చెందిందని నిర్ధారించారు. -
Hyderabad: విషాదం.. చిన్నారిని బలిగొన్న వీధి కుక్కలు
శంషాబాద్: హైదరాబాద్‌లో మరో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. వీధి కుక్కల దాడిలో ఏడాది వయసున్న చిన్నారి మృతి చెందింది. ఈ హృదయ విదారక సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో మున్సిపాలిటీ ప్రాంతంలో చోటుచేసుకుంది. శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం నాగారానికి చెందిన సూర్యకుమార్, యాదమ్మ దంపతులు బతుకుదెరువు కోసం శంషాబాద్‌కు వలస వచ్చారు. అయితే వారు రాళ్లగూడ సమీపలోని ఓ గుడిసెలో తమ ఏడాది వయసున్న కుమారుడు నాగరాజుతో కలిసి నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం యాదమ్మ నిండు గర్భిణి కావటంతో ఆమెను స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. బుధవారం రాత్రి చిన్నారి పాల కోసం ఏడవగా తండ్రి ఆ చిన్నారికి పాలు తాగించి నిద్రపుచ్చాడు. తెల్లవారుజామున ఆ చిన్నారి మళ్లీ ఏడుస్తూ గుడిసె బయటకు రాగా రోడ్డుమీద ఉన్న వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. అక్కడి నుంచి వస్తున్న శబ్దాలను విన్న పలువురు వాహనదారులు పల్లాడిపై దాడి చేస్తున్న కుక్కలను తరిమేశారు. వారు చిన్నారిని పరిశీలించగా.. అప్పటికే మృతి చెందాడు. ఈ దంపతులకు పుట్టిన ఇద్దరు పిల్లలు ఇప్పటికే మృతి చెందగా.. మరో చిన్నారి వీధి కుక్కలు బలితీసుకోవంటంతో బోరున విలపిస్తున్నారు. -
వీధి కుక్క దాడిలో చేతిని కోల్పోయిన మహిళ..ట్విస్ట్ ఏంటంటే..?
ఒక్కోసారి మనం ఆశ్రయం కల్పించిన జంతువులే మనపై దాడి చేస్తాయి. అలా జరుగతుందన్న ఊహ కూడా రాదు. అలాంటి స్థితిలోనూ సంయమనం కోల్పోకుండా వ్యవహరించి సానూకూలదృక్పథంతో మాట్లాడటం కొందరికే సాధ్యం. అలాంటి కోవకు చెందింతే ఈ మహిళ. తాను ఆశ్రయకల్పిస్తున్న వీధికుక్కల్లో ఒక్క కుక్క ఆమె దారుణంగా దాడి చేసింది. ఎంతలా అంటే.. ఆ దారుణ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడి కోమాలోకి కూడా వెళ్లిపోయింది. అసలేం జరిగిందంటే..అమెరికాకు చెందిన కాలిస్టా మునోజ్ అనే 25 ఏళ్ల మహిళ తన వద్ద ఆశ్రయం పొందుతున్న వీధికుక్కే ఆమెపై దాడి చేసి గాయపరిచింది. ఈ దిగ్బ్రాంతికర ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయింది. చివరకి తన చేతిని కూడా కోల్పోయింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ..తాను ఆ వీధి కుక్కను తీసుకొచ్చి షెల్టర్‌లో ఉంచేంతవరకు కూడా చాలా రోజుల వరకు నార్మల్‌గానే ఉందని. మరో కుక్కతో గొడవ పడవడంతో ఒక్కసారిగా కర్కశంగా మారి ఇలా తనపై దాడి చేసిందని చెప్పుకొచ్చారు మునోజ్. అయితే ఈ దాడిలో ఈ కుక్క తన చేతిపై ఘోరంగా దాడి చేయడంతో స్ప్రుహతప్పి పడిపోయానని తెలిపింది. ఆ తర్వాత తాను ఆస్పత్రిలోనే నెల రోజులపాటు ఉండాల్సి వచ్చిందని వెల్లడించింది. అంతేగాదు తాను చాల రోజుల వరకు కోమాలో ఉన్నట్లు పేర్కొంది. అయితే కుక్క దారుణంగా దాడి చేయండంతో తీవ్ర ఇన్ఫెక్షన్కి గురై తన కుడి చేతిని కూడా కోల్పోవాల్సి వచ్చిందని వెల్లడించిది. ఈ ఘటన వల్ల తాను ఇంతలా బాధ పడినప్పటికీ ఆ కుక్కను మాత్రం నిందించనని చెబుతోంది. ఇది విషాదంతో కూడిన గొప్ప అనుభవం, పైగా మరొకరికి తన అనుభవం పనికొస్తుందని చాలా సమన్వయ దృక్ఫథంతో మాట్లాడింది. కాగా, సదరు మహిళ ఎన్నో వీధికుక్కలకు, పిల్లులకు షెల్టర్లు ఏర్పాటు చేసి వాటి సంరక్షణ బాధ్యతలు చూస్తుంది. ప్రతి పైసా కూడా వాటి సంరక్షణ కోసం ఖర్చుపెడుతుందని గో ఫండ్ మీ అనే స్వచ్ఛంద వెబ్సైట్ పేర్కొంది. ఈ వెబ్సైట్లో అమానుషంగా గాయపడినవారు లేదా నయంకానీ వ్యాధితో బాధపడుతున్నవారికి సాయం అందించే స్వచ్ఛంధ వెబ్సైట్. ఇలాంటి ఘటనలు మనుషుల నుంచి కూడా ఎదురవ్వుతాయి. ఇక్కడ జంతువులకు విచక్షణ జ్ఞానం ఉండదు, పైగా వాటికున్న సహజగుణంతో దాడి చేయడం జరగుతుంది. కానీ అన్నీ తెలిసిన మనుషులు సైతం జంతువుల కన్న ఘోరంగా ప్రవర్తిస్తున్న ఘటనలు కోకొల్లలు. సాయం చేసిన వారికే వెన్నుపోటు పొడడవడం, ఇబ్బందులకు గురిచేయడం వంటివి చేస్తారు కొందరు దుర్మార్గులు. ఇలాంటి ఘటనల కారణంగా ఒక్కసారిగా మంచిగా ఉండేవారు సైతం చెడ్డగా మారిపోతుంటారు. ఇక్కడ సమన్వయంతో కూడిన సానుకూలద ృక్పథాన్ని పెంపొందించుకోవడానికి యత్నించాలి. అంతేగాదు హాని చేసే అలవాటు వారిదే గానీ నాది కాదు అని మనస్తతత్వాన్ని అవరచుకోవాలేగానీ ప్రతి ఘటనకు పాల్పడకూడదు. ఇలా వ్యవహరిస్తే ఏదో ఒక రోజు ఆయా మనుషుల్లో పశ్చాతాపంతో కూడిన మార్పు తప్పక వస్తుంది. ఆ చేదు ఘటనలతో మన వైఖరి మారిపోకూడదనే విషయం ఈ మహిళ వ్యవహరించిన తీరు చెప్పకనే చెబుతోంది కదూ!. (చదవండి: ఎవరీ ఉమ్ముల్ ఖేర్? ఏకంగా 16 ఫ్రాక్చర్లు 8 శస్త్ర చికిత్పలు అయినా..) -
జయకు పాస్‌పోర్ట్ వచ్చిం... దహో!
హమ్మయ్య! జయకు పాస్‌పోర్ట్ అండ్ వీసా వచ్చింది. జయ ఇక హాయిగా నెదర్లాండ్స్‌కు వెళ్లవచ్చు. కొత్త జీవితాన్ని మొదలు పెట్టవచ్చు. ఇంతకీ సదరు జయ మనిషి కాదు. వీధి శునకం. ల్యాబ్రడార్, జర్మన్ షెప్పర్డ్, పమేరియన్లను ముద్దు చేసే వాళ్లలో చాలామంది వీధికుక్కలను మాత్రం ‘అసుంట’ అంటారు. మెరల్ మాత్రం అలా అనుకోలేదు. నెదర్ ల్యాండ్స్‌కు చెందిన మెరల్ మన దేశానికి వచ్చింది. వారణాసిలో ఆమెకు ఒక వీధికుక్క కనిపించింది. ఈ శునకంపై వేరే శునకాలు దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు వాటి బారినుంచి మెరల్ దానిని కాపాడింది. ఆ కృతజ్ఞతతో మెరల్ ఎటు వెళితే అటు వచ్చేది కుక్క. ఆ కుక్కను చూస్తే మెరల్‌కు జాలిగా అనిపించింది. దాని చురుకుదనం, అందం మెరల్‌కు నచ్చి, ఆ కుక్కను దత్తత తీసుకొని నెదర్లాండ్స్‌కు తీసుకు పోవాలని డిసైడైపోయింది. దత్తత, పాస్‌పోర్ట్, వీసా ప్రక్రియ కోసం కొంతకాలం అదనంగా మన దేశంలో ఉంది. ‘పెద్ద ప్రక్రియ పూర్తయి పోయింది. ఎట్టకేలకు జయను నాతోపాటు తీసుకువెళుతున్నందుకు సంతోషంగా ఉంది’ అంటూ కామెంట్ పెట్టింది మెరల్. -
వీధి కుక్కల దాడి ఘటనపై స్పందించిన నటి అమల? ఏమందంటే!
హైదరాబాద్ నగరంలో వీధి కుక్కుల దాడిలో మరణించిన చిన్నారి ఘటన ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఇటీవల అంబర్ పేట్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనతో అయిదేళ్ల బాలుడు ప్రదీప్ ప్రాణాలు కొల్పోవడం విషాదకరం. ఈ ఘటనతో రాష్ట్రం ఉలిక్కిపడింది. దీనిపై సమాజం రకరకాలుగా స్పందిస్తోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. వివాదస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తరచూ దీనిపై ట్విట్ చేస్తూ అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: ‘ఖడ్గం’లో ఆ సీన్ చేస్తుండగా నన్ను హేళన చేశారు: నటి సంగీత ఇలాంటి ఘటనలు పునరావుతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని అంతా డిమాండ్ చేస్తుంటే.. డాగ్ లవర్స్ మాత్రం మరోలా స్పందిస్తున్నారు. వాటికి సపరేట్గా వసతి కల్పించాలని, అవి మనలాగే ప్రాణులంటూ ఇటీవల జంతు ప్రేమికురాలు, యాంకర్ రష్మీ కామెంట్స్ చేసింది. దీంతో ఆమెపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై బ్లూక్రాస్ సోసైటీ ఆఫ్ హైదరాబాద్ నిర్వహకురాలు, నటి అమల అక్కినేని స్పందించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఈ ఘటనపై మాట్లాడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: అప్పుడే ఓటీటీకి వచ్చేస్తోన్న ‘బుట్టబొమ్మ’! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే.. ఈ నేపథ్యంలో వీధి కుక్కల దాడిలో బాలుడు ప్రదీప్ మృతిపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఓ జంతుప్రేమికురాలిగా అమల కుక్కలను శత్రువులుగా చూడోద్దని సూచించారట. ‘ఒక కుక్క తప్పు చేస్తే అన్ని కుక్కలను శిక్షిస్తామా? ఒక మనిషి తప్పు చేస్తే మొత్తం మానవ జాతిని శిక్షిస్తున్నామా? మరి ఒక కుక్క చేసిన పనికి అన్నింటినీ శిక్షించడ సరికాదు కదా? కుక్కలు ఎప్పుడూ మనషులను ప్రేమిస్తూనే ఉంటాయి.. అవి మనల్ని రక్షిస్తుంటాయి’ అని అమల వ్యాఖ్యానించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు సంబంధించిన వార్తను సురేఖ వాణి కూతురు సుప్రిత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. దీంతో అమల కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ఆమె నిజంగానే ఈ కామెంట్స్ చేసిందా? లేదా? అనేది మాత్రం క్లారిటీ లేదు. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అమల స్పందించేవరకు వేచి చూడాలి. -
వీధి కుక్కల ఘటన: రష్మీని కుక్కతో పోల్చిన నెటిజన్, యాంకర్ ఘాటు రిప్లై..
బుల్లితెరపై యాంకర్ రష్మీ గౌతమ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందచందాలతో పాటు తనదైన మాటతీరుతో ప్రస్తుతం టాప్ యాకర్స్‌లో ఒకరుగా కొనసాగుతుంది. బుల్లితెరపైనే కాకుండా అప్పుడప్పుడు వెండితెరపై కూడా మెరుస్తూ అలరిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీ అయింది. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. చదవండి: పెద్దగా ఆఫర్స్ లేవు.. అయినా ఆ స్టార్ హీరోలకు నో చెప్పిన సాయి పల్లవి తన వ్యక్తిగత విషయాలను, ఫొటోలను షేర్ చేయడమే కాదుసమాజంలో జరిగే సంఘటనలపై స్పందిస్తూ ఉంటుంది. బెసిగ్గా రష్మీ జంతు ప్రేమికురాలనే విషయం తెలిసిందే. మూగ జీవాలను హింసించిన సంఘటనలపై తరచూ ఆమె సీరియస్‌గా రియాక్ట్ అవుతుంది. ఇదిలా ఉంటే ఇటీవల హైదరబాద్‌లో జరిగిన వీధి కుక్కల దాడి ఘటనపై ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూనే కుక్కలు కూడా మనలాగే ప్రాణులని, వాటికి ప్రత్యేకంగా వసతి కల్పించాలంటూ ట్వీట్ చేసింది. ఇక ఆమె ట్వీట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చదవండి: బడా వ్యాపారవేత్త కూతురితో హీరో శింబు పెళ్లి? గుట్టు చప్పుడు కాకుండా ఏర్పాట్లు! కొందరు ఆమె అభిప్రాయానికి మద్దతు ఇస్తుంటే మరికొందరు తప్పు బడుతున్నారు. ఈ క్రమంలో రష్మీని దారుణంగా ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఏకంగా ఓ నెటిజన్ అయితే రష్మీని కుక్కతో పోల్చాడు. ‘ఈ కుక్క రష్మీని.. కుక్కను కొట్టినట్టు కొట్టాలి’ అని ఆమె ట్వీట్‌పై కామెంట్ చేశాడు. దీంతో అసహనానికి గురైన రష్మీ అతడితో వార్‌కు దిగింది. ‘‘తప్పకుండా.. నీ అడ్రెస్ చెప్పు. నేనే వచ్చి నిన్ను కలుస్తా. ఎలా కొడతావో నేను చూస్తా. నీకు ఇదే నా చాలెంజ్’’ అంటూ అతడికి సవాలు విసిరింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Sure Pls share your address I'll come personally Let's see how you can handle the situation then It's an open challenge https://t.co/SMhAIhWWY4 — rashmi gautam (@rashmigautam27) February 24, 2023 -
షాకింగ్ ఘటన: వీధి కుక్కలకి ఆహారం పెడుతుండగా..ర్యాష్‌గా దూసుకొచ్చిన కారు
రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేలా ఎన్ని కట్టుదిట్టమైన వాహన చట్టాలను తీసుకొచ్చినా.. ఏదో ఒక దుర్ఘటన జరుగుతూనే ఉంటోంది. మొన్నటి మొన్న ఒక మహిళను కారుతో ఢీ కొట్టి కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లిన దారుణ ఘటన మరువక మునుపే ఇలాంటి వరుస ఘటనలు చోటు చేసుకోవడం బాధకరం. అచ్చం అలానే ఇక్కడొక యువతి ఘోర రోడ్డుప్రమాదం బారిన పడింది. వివరాల్లోకెళ్తే..25 ఏళ్ల తేజస్వీత, ఆమె తల్లి మంజీదర్ కౌర్‌లు ఇంటి సమీపంలోని ఫుట్‌పాత్‌పై ఉన్న వీధి కుక్కలకు ఆహారం పెడుతున్నారు. సరిగ్గా అదే సమయానికి ఒక ఎస్యూవీ కారు యూటర్న్ తీసుకుని వచ్చి మరి తేజస్వీతను దారణంగా ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో తేజస్వీత తలకు తీవ్ర గాయాలయ్యాయి. కానీ ఆ కారు కనీసం ఆగకుండా అంతే వేగంగా వెళ్లిపోయింది. ఈ అనుహ్య ఘటనతో బిత్తరపోయిన ఆమె తల్లి మంజీదర్ కౌర్ వెంటనే తేరుకుని పోలీసుకు ఫోన్ చేసి తదనంతర కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. ఆమెను కుటుంబసభ్యులు హుటాహుటినా ఆస్పత్రికి తరిలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో కోటుకుంటుందని తెలిపారు. బాధితురాలి తండ్రి ఓజస్వీ కౌల్ మాట్లాడుతూ..తేజస్విత ఆర్కిటెక్కర్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సివిల్ సర్వీస్ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. ప్రతి రోజు ఆమె వీధి కుక్కలకి ఆహారం పెట్టేందుక తన తల్లితో కలిసి వెళ్తుంటుందని ఆవేదనగా చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. Caught On CCTV: Chandigarh Woman Hit By Car While Feeding Stray Dog https://t.co/xs6vfKpoPR pic.twitter.com/fgngCqWq4X — NDTV (@ndtv) January 16, 2023 (చదవండి: ప్రయాణికుడి కోసం విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..అయినా దక్కని ప్రాణాలు) -
అందరి ‘బందు’వయ.. కన్నీళ్లు పెట్టిస్తున్న కుక్క త్యాగం
‘మనుషుల కంటే మూగజీవాలు ఎంతో నయం’.. ఈ మాట విన్నప్పుడల్లా అదేదో అతిశయోక్తితో చెప్తున్నారేమో అనుకుంటారు కొందరు. కానీ, అదే నిజమని పదే పదే కొన్ని ఘటనలు నిరూపిస్తూ వస్తున్నాయి. రోజూ పట్టెడు అన్నం పెడుతున్నారని కాపలాగా ఉండడమే కాదు, వాళ్లను ఆపద నుంచి రక్షించాలనే ఉద్దేశంతో ముందుకెళ్లిన ఓ మూగజీవి.. పాపం ప్రాణం పోగొట్టుకుంది. అందరితో కంటతడి పెట్టిస్తోంది ఈ ఘటన. ముంబై భాందప్ ‘డ్రీమ్స్ మాల్’ దగ్గర ఓ కుక్క ఆరేళ్ల నుంచి ఉంటోంది. దానికి ఆ కాంప్లెక్స్‌లో ఉన్న దుకాణాల ఓనర్లు రోజూ అన్నం పెడుతుంటారు. స్థానికులంతా దానిని ముద్దుగా ‘బందు’ అని పిల్చుకుంటారు. ఆ తర్వాత కొన్నాళ్లకు దానికి ‘బాలు’ అనే మరో కుక్క తోడైంది. ఈ రెండూ ఆ మాల్లో ఉన్న షాపులకు కాపలాగా ఉంటాయి. ఎవరైనా దొంగ చూపులు చూసుకుంటూ వెళ్లినా.. దొంగతనాలకు ప్రయత్నించినా మొరగడంతో పాటు వెంటపడి మరీ పట్టేసుకుంటాయి. మాల్‌కు వచ్చే వాళ్ల దొంగతనాలను సైతం ఎన్నోసార్లు అడ్డుకున్నాయి ఈ శునకాలు. అందుకే మళ్లీ వచ్చినప్పుడు వాటిని ఏమైనా తిండి పెట్టేవాళ్లు కూడా. దొంగల్ని గుర్తించడంలో బంధు ఎంతో స్మార్ట్.. అలాగే సెన్సిటివ్ కూడా. కిందటి ఏడాది ఆ మాల్లో ఉన్న ఓ నర్సింగ్ హోంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందట. అది గుర్తించి గట్టి గట్టిగా మొరిగి అందరినీ అప్రమత్తంగా చేసింది బందునే. ఆ ఘటన తర్వాత ఈ రెండు కుక్కలు కొన్నాళ్లు దిగాలుతో తినడం సైతం మానేశాయట. తాజాగా శుక్రవారం ఈ మాల్లో మరోసారి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సెక్యూరిటీ గార్డులు సామాన్లను బయటకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బందు మాత్రం వాళ్లు ఆపదలో ఉన్నారేమో అనుకుని పొరబడింది. మొరుగుతూ లోపలికి పరిగెత్తింది. ఆ మంటల్లో చాలాసేపు ఉండేసరికి.. పొగకు ఉక్కిరి బిక్కిరి అయిపోయి స్పృహ కోల్పోయింది. అది గమనించిన సెక్యూరిటీ గార్డులు బయటకు తీసుకొచ్చారు. కాసేపటికి కోలుకున్నట్లే అనిపించింది. అయితే.. ఊపిరి ఆడక.. ఆ మరుసటి ఉదయమే అది మాల్ మెట్ల కింద కన్నుమూసింది. ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. సాధారణంగా మూగ జీవాలు మంటలు చూస్తే దూరంగా పరిగెడతాయి. అలాంటిది బందు మాత్రం కేవలం మనుషుల్ని కాపాడే ఉద్దేశంతోనే వెళ్లి ప్రాణం పోగొట్టుకుంది. అందుకే మాల్ దగ్గర బందు స్మారక స్థూపం నిర్మిస్తాం అని ప్రకటించారు యానిమల్ యాక్టివిస్ట్ డాక్టర్ నందినీ కులకర్ణి. దుకాణాల ఓనర్లు, సెక్యూరిటీ గార్డుల ఆశ్రునయనాల మధ్య ఆదివారం బందు అంత్యక్రియలు మాల్ దగ్గరే నిర్వహించారు. బందు అంటే మరాఠీలో నిజాయితీ అని అర్థం. ఆ పేరుకు తగ్గట్లే సార్థక జీవితం గడిపి.. తుది శ్వాస విడిచింది ఆ మూగ జీవి. నష్టం జరిగితే జరిగింది..కానీ, బందు లాంటి విశ్వాసాన్ని, నిలువెత్తు నిజాయితీ మళ్లీ చూడగలమా? అంటూ బాధపడుతున్నారు ఆ దుకాణాల ఓనర్లు. పాపం..బందు లేకపోయేసరికి బాలు కూడా రెండు రోజులుగా ఏం ముట్టట్లేదట!. -
వీధి కుక్కకు హారతి ఇచ్చి మరీ ఘన స్వాగతం!..ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Mumbai Society Gives A Grand Welcome To Stray Dog: ఇంతవరకు జంతువులకు సంబంధించిన పలు కథనాలను విన్నాం. పెంపుడు జంతువులు తన యజమాని పట్ల కనబరిచే విశ్వాసం, ప్రేమ గురించి అందరికీ తెలిసిందే. . వీధి కుక్కలను ఆదరించే వాళ్లు కూడా ఉన్నారు. ఒకరో ఇద్దరో వాటికి ఆహారం పెట్టడం వంటివి చేస్తుంటారు. అవి కూడా వాళ్ల పట్ల మాత్రమే ప్రేమగా ఉంటాయి. కానీ ఈ వీధి కుక్క అందుకు భిన్నం అందరీ ప్రేమాభిమానలను గెలుచుకుంది ఎలాగో తెలుసా! అసలు విషయంలోకెళ్తే...ముంబైలో ప్రభాదేవిలోని ఒక సొసైటీ విస్కీ అనే వీధి కుక్క ఉంది. ఆ కుక్కని ఆ సోసైటీ వాళ్లంతా ప్రేమగా చూసుకునేవారు. ఒకరోజు ఉన్నట్టుండి హఠాత్తుగా కనిపించకుండా పోయింది. దీంతో ఆ సోసైటి వాసుల నిద్రహారాలు మాని మరీ ఆ కుక్క కోసం వెతకడం ప్రారంభించారు. ఏడు రోజులు అనంతరం ఆ కుక్క విల్సన్ కాలేజీకి సమీపంలోని మైదానంలో కనిపించింది. దీంతో ఆ కాలనీ వాసులు ఆ కుక్కను సోసైటీకి కారులో తీసుకకువచ్చి హారతీ ఇచ్చి మరి ఘన స్వాగతం పలికారు. పైగా ఆ సోసైటీ వాసులు అది మాకు కుక్క కాదు అని చెప్పడం విశేషం. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనం ఇది అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. View this post on Instagram A post shared by StreetdogsofBombay (@streetdogsofbombay) (చదవండి: అమ్మ నాన్న ఐ లవ్ యూ !..వైరల్ అవుతున్న ఉక్రెయిన్ సైనికుడి చివరి వీడియో!) -
బాత్రూంలో నక్కిన కుక్క.. ఇంతలో చిరుత ఎంట్రీ
బెంగళూరు: కర్ణాటకలోని బిలినెళ్లి అనే గ్రామంలోని ఓ ఇంటి మరుగుదొడ్డిలో బుధవారం ఓ వీధి కుక్కతో పాటు చిరుత పులి దర్శనమివ్వడం స్థానికంగా కలకలం రేపింది. ఇంటి యజమానురాలు బాత్రూం వెళ్దామని డోర్ తీయగా చిరుత, దాన్ని చూస్తూ భయంతో వణికిపోతున్న వీధి కుక్క దర్శనమివ్వడంతో వెంటనే అప్రమత్తమైన ఆమె.. డోర్‌కు గొల్లెం పెట్టి, పోలీసులకు సమాచారం చేరవేసింది. ఇంతకీ ఈ రెండు జంతువులు మరుగుదొడ్డిలోకి ఎలా చేరాయని ఆరా తీస్తే.. గ్రామంలో సంచరిస్తున్న వీధి కుక్క, అనుకోని అతిధి చిరుత కంట పడింది. దాని నుంచి తప్పించుకునే క్రమంలో వీధి కుక్క.. సమీపంలోని ఓ ఇంటి మరుగుదొడ్డిలో దాక్కుంది. ఆ కుక్క హమ్మయ్యా అనుకునే లోపు చిరుత దాన్ని వెంబడిస్తూ అదే బాత్రూంలోకి చేరింది. చిరుతను దగ్గరగా చూసిన కుక్క భయంతో వణికిపోతుండగా, ఇప్పుడెలా తప్పించుకుంటావు అన్నట్టుగా చిరుత గంభీరంగా కుక్క వైపు చూస్తుంది. ఇంతలో ఇంటి యజమానురాలు బాత్రూం డోర్ తీసి, పోలీసులకు సమాచారమిచ్చింది. హుటాహుటిన రంగప్రవేశం చేసిన పోలీసులు.. పులి బారి నుండి కుక్కను రక్షించి, పులిని బంధించాలని ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు బాత్రూం పైకప్పును తొలగించి రెస్క్యూ అపరేషన్ చేపడుతుండగా.. చిరుత అమాంతంపైకి ఎగిరి, గోడల మీదుగా దూకుతూ అక్కడి నుంచి తప్పించుకుంది. ఈ మొత్తం సన్నివేశాలన్నీ బాత్రూం డోర్ మధ్య సందుల్లో నుంచి స్థానికులు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. -
నెవెర్ బిఫోర్..ఎవర్ ఆఫ్టర్ ఫైట్ సీన్!
బలవంతుడ్ని చూసి భయపడాల్సిన బలహీనుడు తిరగబడితే ఎలా ఉంటుంది?... గెలుపు ఎవరిదన్న సంగతి పక్కన పెడితే.. ఓ చిన్న ప్రయత్నం.. పోయేదేముంది. చరిత్రలో మిగిలిపోతాము లేదా మనమేం పిరికివాళ్లం కాదని లోకానికి చాటి చెబుతాం. ఉద్దేశ్యం వేరైనా ఓ కుక్క ఏకంగా సివంగితోనే కయ్యానికి కాలు దువ్వింది. దాని దెబ్బలకు ఎదురొడ్డి కొద్దిసేపు తలపడింది. కానీ, సివంగి బలం ముందు తన బలం ఎందుకూ కొరగాదన్న సత్యం తెలుసుకుని కాళ్లకు బుద్ధి చెప్పింది. అలా కాకుండా మొండి ధైర్యంతో ముందుకు పోయింటే మాత్రం కుక్క తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి ఉండేది. ( చిరుతకు ఝలక్: ఈ జింక చర్య ఊహాతీతం ) ఈ సంఘటనకు సంబంధించిన 1:34 సెకన్ల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు 1.6 లక్షల వ్యూస్ సంపాదించుకుంది. ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కశ్వాన్ ఈ వీడియో తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘ జీవితంలో ఈ మాత్రం నమ్మకం ఉంటే చాలు. సివంగితో కుక్క పోరాటం. వీధి కుక్కలు, క్రూర మృగాల పోరాటాలలో ఇదే హైలెట్ సంఘటన’’ అని పేర్కొన్నారు. Need this much confidence in life. Dog vs Lion. It also highlights issue of stray dogs & wildlife interaction. @zubinashara pic.twitter.com/lNu7X4ALm5 — Parveen Kaswan, IFS (@ParveenKaswan) January 10, 2021 -
అదా బలమైనది... తనో బక్కప్రాణి
జూలు లేని గ్రామ సింహం నిద్దుర లేచింది. కాదు, కాదు, ఆకలి నిద్దుర లేపింది. ‘అబ్బా నిన్న రాత్రే కదా కడుపునిండా నీళ్లు తాగింది. అప్పుడే ఆకలేంటి’ అనుకుంది. తన చుట్టుపక్కల మొత్తం ఇష్టమైన ఆహారంతో నిండిపోయి ఉన్నట్లు రాత్రి కల వచ్చింది దానికి. సగం తెరిచిన కళ్లతో చూట్టూ చూసింది. చెత్త, చెదారం తప్ప ఏమీ కనిపించలేదు. మళ్లీ నిరాశ. మెల్లగా పైకి లేచి, బద్ధకంగా ఒళ్లు విరిచింది. అలవాటుగా ఎంతో ఉత్సాహంతో బస్తీలోని పూరిగుడిసెల వైపు పరుగులు తీసింది. కొద్ది సేపటి తర్వాత ఓ గుడిసె ముందు ఆగి, లోపలికి చూస్తూ ఉండిపోయింది. ఇంతలో ఓ పదేళ్ల కుర్రాడు గుడిసెలోంచి బయటకు వచ్చాడు. ఒకరిని, ఒకరు చూసుకున్నారు. స్నేహ పూర్వకంగా పలకరిస్తున్నట్లు తోక ఊపిందది. ఆ పిల్లాడు సంతోషంతో ‘‘అమ్మా! నల్లకుక్క వచ్చిందే’’ అన్నాడు లోపలికి చూస్తూ. ఓ మధ్య వయస్కురాలైన మహిళ బయటకు వచ్చి, దాని వైపు కోపంగా చూస్తూ..‘‘ పాడు కుక్క మళ్లీ వచ్చిందా! దీని నడుం విరగ్గొట్టినా పాపం లేదు’’ అంటూ నేల మీద ఉన్న కర్ర తీసుకుని దానిపైకి విసిరిగొట్టింది. అది నేరుగా వెళ్లి దాని తలకు బలంగా తగిలింది. నల్లకుక్క బాధతో గట్టిగా కుయ్, కుయ్ అంటూ అక్కడి నుంచి పరుగుపెట్టింది. వారం రోజులక్రితం ఆ సంఘటన జరగనంత వరకు నల్లకుక్కకు ఆ కుటుంబంతో మంచి అనుబంధమే ఉండేది. కూలీ పని కోసం నగరానికి వలస వచ్చిన ఆ కుటుంబం తమతో పాటు తెచ్చుకున్న దాన్ని సొంత మనిషిలా చూసుకునేది. దానికి స్నూపీ, టామీ, జాకీలాంటి ముద్దు పేర్లు పెట్టకపోయినా... కడుపునిండా నాలుగు ముద్దలు పెట్టేవారు. కరోనా లాక్‌డౌన్‌తో వారి జీవితాలే కాదు దాని జీవితం కూడా అధ్వాన్నంగా తయారైంది. దాతలు సహాయం చేస్తే గానీ, కడుపు నింపుకోలేని పరిస్థితి వారిది. మూడు పూటలా కడుపునిండా తిని రోజులు గడుస్తున్నాయి. నల్లకుక్క మీద ఉన్న ప్రేమతో కొన్ని రోజులు తినేదాంట్లో కొంత దానికి పెట్టేవారు. ఆకలి బాధ పెరుగుతూ వస్తున్న కొద్దీ దాని మీద ప్రేమ తగ్గుతూ వచ్చింది. ఒక్కపూట తిండితో తాము బ్రతకటమే కష్టం... ఈ కుక్కకు ఎక్కడినుంచి తెచ్చిపెట్టాలి అనుకున్నారు. అప్పటినుంచి దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయటం మొదలుపెట్టారు. వారి పరిస్థితి అర్థంకాని అది, పొద్దున్నుంచి రాత్రి వరకు ఎదైనా పెట్టక పోతారా అని ఆశగా ఎదురుచూసేది. ఒక్కోసారి మెతుకులు కూడా దొరికేవి కావు. ఓ రోజు బాగా ఆకలిగా ఉన్న సమయంలో పచ్చిక బయలులో ఏపుగా పెరిగిన గడ్డి తింటున్న మేక కనిపించింది దానికి. ఆ దృశ్యాన్ని చూడగానే దాని మెదడులో ఓ ఆలోచన మెదిలింది. ఆ వెంటనే మేక గడ్డి తింటున్న వైపు పరుగులు తీసింది. కుక్క తనవైపు పరిగెత్తుకుంటూ రావటం గమనించిన మేక భయంతో యాజమాని వైపు వెళ్లిపోయింది. నల్లకుక్క మాత్రం ఆ గడ్డి దగ్గరే ఆగి దాన్ని పరపరమంటూ నమలడం మొదలుపెట్టింది. కష్టంగా ఉన్నా ఇష్టం వచ్చినట్లు గడ్డిని నమిలి మింగేసింది. కొద్దిగా కడుపు నిండగానే అక్కడినుంచి గుడిసె దగ్గరకు వచ్చేసింది. సరిగ్గా ఓ గంట తర్వాత దాని కడుపులో తిప్పేసినట్లై గడ్డితో పాటు, అంతకుముందు రాత్రి తిన్న పాచిపోయిన అన్నం కూడా వాంతి చేసుకుంది. కడుపు పూర్తిగా ఖాళీ అయిపోవటంతో దానికి విపరీతంగా ఆకలి వేసింది. ఇంట్లో వాళ్లు గుర్రుపెట్టి నిద్రపోతుండగా చప్పుడు చేయకుండా ఇంట్లోకి ప్రవేశించింది. పొయ్యి గడ్డపై పెద్ద గిన్నె కనపించింది దానికి. మెల్లగా గిన్నె దగ్గరకు చేరుకుని పైనున్న ప్లేటు పక్కకు జరిపి, దాంట్లో ఉన్న అన్నాన్ని తినటం మొదలుపెట్టింది. కొద్దిసేపటికి గిన్నె పైనున్న ప్లేటు పక్కకు జరిగి కింద పడింది. పెద్ద శబ్దం! అందరూ లేచారు. అన్నం తింటున్న నల్లకుక్కను వెంటపడి తరిమారు. ఇక అప్పటినుంచి ఆ ఇంటికి, నల్లకుక్కకు బంధం తెగిపోయింది. కానీ, ప్రతిరోజు ఓ సారి ఆ ఇంటి ముందుకు పోవటం దెబ్బలు తిని వెనక్కురావటం అలవాటైంది దానికి. కాసేపటి తర్వాత పెద్ద మార్కెట్ వీధిలోకి చేరుకుంది. దానికంతా మాయగా ఉంది. రెండు నెలల ముందు వరకు ఈ వీధులన్నీ ఎంతో రద్దీగా ఉండేవి. వీధులంతా చెత్తతో నిండిపోయి ఉండి, తినడానికి బోలెడంత తిండి దొరికేది. హోటళ్లు, టిఫిన్ సెంటర్ల దగ్గర ఎంతో రుచికరంగా తినేది. అంతా ఒక్కసారిగా కళ్ల ముందునుంచి మాయమైనట్లు జరిగిపోయింది. ఇక మాంసపుకొట్ల సంగతి చెప్పనక్కర్లేదు. కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది. కండలు తిరిగిన కుక్కలతో పోటీ పడలేక అటువైపు వెళ్లటమే మానేసింది. ఓ గంట పాటు వీధులు పట్టుకు తిరిగి బాగా అలిసిపోయింది. ఓ మెయిన్ రోడ్డు మీద ఉన్న గుడి దగ్గరి చెట్టు కింద చతికిలబడింది. రోడ్డు మీద అటు, ఇటు తిరుగుతున్న మనుషుల్ని గమనిస్తూ ఉండిపోయింది. ప్లాస్టిక్ కవర్లలో వాళ్లు తీసుకెళుతున్న తినుబండారాలు చూడగానే నోరూరింది. కొన్నిసార్లు అవి తీసుకెళుతున్న వారి వెంట ఆశగా తోక ఊపుతూ నడిచింది. కుక్క తమను వెంబడిస్తోందని గమనించిన సదరు వ్యక్తులు గట్టిగా అరిచి దాన్ని తరిమేశారు. కొద్దిసేపు అటు, ఇటు తిరిగి గుడి ప్రాంగణంలోకి చేరింది. నీళ్ల కొళాయి ముందు ఏర్పడ్డ చిన్న నీటి చెలమలో నీళ్లు తాగి మళ్లీ చెట్టు కిందకు చేరింది. నిద్ర ముంచుకు వస్తుండటంతో కళ్లు మూతలు పడటం మొదలైంది. ఎక్కడి నుంచో గుర్.. గుర్ మనే శబ్ధాలు వినిపించాయి దానికి. ఎంతో శ్రద్ధతో చెవులు రిక్కించి వింది. ‘ఆ శబ్ధం చేస్తున్నది ఎలుకకానీ, పిల్లిగానీ ఈ రోజు నా ఆకలి తీరాల్సిందే!’ అని గట్టిగా అనుకుంది. మెల్లగా తల తిప్పి అటుఇటు చూసింది. ఏ ప్రాణీ కనిపించలేదు. కొద్దిసేపటి తర్వాత గుర్ర్‌ర్ర్‌ర్ర్ మనే శబ్ధం వచ్చింది. అప్పుడర్థమైంది దానికి ఆ చప్పుడు తన కడుపులోంచి వస్తోందని. నీరసంగా పైకి లేచి, అడుగులో అడుగు వేసుకుంటూ అక్కడినుంచి కదిలింది. ... మధ్యాహ్నం ఎండ నిప్పుల కుంపటిలా ఉంది. అంత ఎండలో తారు రోడ్డుమీద నడవటం చాలా కష్టంగా ఉంది దానికి. గబగబా పరిగెడదామంటే ఒంట్లో సత్తువ కూడా లేదు. అప్రయత్నంగా నాలుక బయటపెట్టబోయి ఆగింది. వేడి గాలులకు లాలాజలం ఊరటం మాట అటుంచి నాలుక కాలిపోయేలా ఉంది పరిస్థితి. కాళ్లీడ్చుకుంటూ ఓ చెట్టుకిందకు చేరింది. చుట్టూ కలియ చూసింది. ఎడమ వైపు కొద్ది దూరంలో ఓ వీధి కనిపించింది. ఆ వీధిలోకి చేరుకోగానే ఓ చోట పెద్ద చెత్త కుప్ప దర్శనమిచ్చింది. ఆశగా చెత్తకుప్ప దగ్గరకు వెళ్లి ఆహారం కోసం వెతకటం మొదలుపెట్టింది. తినడానికి పనికొచ్చేవి ఒక్కటి కూడా కనిపించలేదు. అయినా ఏదో ఆశ! పది నిమిషాల తర్వాత ఓ కవరు, దానిలో సగానికి ఎండిపోయిన బ్రెడ్డు ముక్కలు కనిపించాయి. ఆత్రంగా దాన్ని బయటకు లాగి కొద్దిగా పక్కకు తెచ్చుకుంది. తినడానికి వీలుగా కవర్‌ను పీలికలు చేసింది. ఎంతో సంతోషంతో ఓ బ్రెడ్డు ముక్కను నోట్లో పెట్టుకుంది. ఎక్కడినుంచి వచ్చిందో కానీ, ఓ పెద్ద కుక్క దానిపైకి దూకింది. అది బెదిరి పక్కకు పడగానే పెద్దకుక్క బ్రెడ్ ముక్కల్ని ఆక్రమించింది. ‘ఇది నాది’ అన్నట్లుగా దాని వైపు చూస్తూ గుర్రుమని ఉరిమింది. నల్లకుక్క కొద్దిగా భయపడింది. కొన్ని క్షణాలు ఆగి ఎంతో వినయంగా తోకను ముడిచి, కవర్ వైపు తల పోనిచ్చింది. పెద్దకుక్క వెంటనే దాని తలను గట్టిగా కొరికింది! విడిపించుకోవటానికి ప్రయత్నం చేయగా ఇష్టం వచ్చినట్లు ఒళ్లంతా చీల్చిపడేసింది. అదా బలమైనది... తనో బక్కప్రాణి దాంతో తలబడే ధైర్యం లేక చావు తప్పించుకుని అక్కడినుంచి పరుగులు పెట్టింది. ... పూర్తిగా నీరసించి కిందపడిపోయే స్థితిలో ఉండగా.. ఎడారిలో ఒయాసిస్సులా అడుగుల దూరంలో ఓ దృశ్యం కనిపించింది దానికి. బైకు మీద వచ్చిన ఓ వ్యక్తి రోడ్డు ప్రక్కన ఉన్న కుక్కపిల్లలకు బిస్కెట్లు పడేసి వెళ్లిపోయాడు. అవి వాటిని తినడం మొదలుపెట్టాయి. కనీకనిపించకుండా కనిపించిన ఆ బిస్కెట్ ముక్కలను చూడగానే నల్లకుక్క నోట్లో నీళ్లూరాయి. ‘కుక్క పిల్లల్ని తరిమి కొట్టి బిస్కెట్లు తినేసెయ్!’ మెదడు వేగంగా ఆలోచించింది. అంతే వేగంగా మనసు మధ్యాహ్నం జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంది. ఒంటి మీదైన గాయాల వైపు చూసుకుంది. కుక్కపిల్లల నోటి కాడి కూడు లాక్కోవటం తప్పు అనిపించింది. పొట్టలోనుంచి గుర్ర్ర్ర్మని పెద్ద శబ్దం. తేరుకుంది. ‘ఛీ నీ కుక్క బతుకు!’ అనుకుని గట్టిగా అరుస్తూ కుక్కపిల్లల వైపు పరిగెత్తింది. వాటిని పక్కకు తరిమేసి బిస్కెట్లను తినేయడానికి... ♦ బండారు వెంకటేశ్వర్లు -
కుక్క వర్సెస్ చిరుత : చివరకు ఏమైదంటే..
ముంబై : నగరంలోని అంధేరీ తూర్పులో చిరుత సంచారం కలకలం రేపింది. సోమవారం తెల్లవారుజామున సీప్జ్ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ వీధి కుక్కపై చిరుత దాడికి పాల్పడింది. సీప్జ్‌కు ఎదురుగా ఉన్న టెలికామ్ పవర్‌గేట్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుక్కను కొద్ది దూరం లాక్కెళ్లిన చిరుత దానిపై దాడికి యత్నించింది. చిరుత బారి నుంచి తప్పించుకునేందుకు కుక్క తీవ్రంగా ప్రయత్నించింది. ఆ ప్రాంతంలో రక్తం కూడా చిందింది.. అయినప్పటికీ కుక్క చిరుతతో పోరాడింది. చివరకు చిరుత అక్కడి నుంచి పరిగెత్తుతుండగా.. కుక్క దాని వెంబండించింది. అయితే చిరుత, కుక్క అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియలేదు. కుక్కపై చిరుత దాడికి పాల్పడిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లోనమోదయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై అక్కడి పరిసరాల్లో పనిచేస్తున్న ఓ సెక్యూరిటీ గార్డు మాట్లాడుతూ.. తాను తెల్లవారుజామున 3 గంటలకు చిరుత రాకను గుర్తిచినట్టు తెలిపారు. దీంతో భయం వేసి తన క్యాబిన్ డోర్‌ను గట్టిగా లాక్ చేసుకున్నట్టు చెప్పారు. చిరుత సంచారంపై అవాజ్ వాయిస్ ఎన్జీవోకు ఫోన్ చేశానని.. దీంతో వారు అక్కడికి చేరుకుని చిరుత దాడిలో గాయపడిన కుక్కకు ప్రాథమిక చికిత్స అందించారని తెలిపారు. ఈ ఘటనను అటవీశాఖ అధికారి సంతోష్ కాంక్ ధ్రువీకరించారు. చిరుత సంచారాన్ని గుర్తించి.. దానిని పట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు వెల్లడించారు. అంధేరీ తూర్పు ప్రాంతంలో పెట్రోలింగ్ కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం చిరుత దాడిలో గాయపడిన కుక్కకు చికిత్స అందిస్తున్నారు. కాగా, జనావాసాల్లో చిరుత సంచరించడంపై స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. -
కుక్క వర్సెస్ చిరుత : చివరకు ఏమైదంటే..
-
మూగజీవి అని కూడా చూడకుండా..
గురుగ్రామ్ : ఓ వీధి కుక్కపై కొందరు సెక్యూరిటీ గార్డులు విచక్షణారహితంగా దాడికి పాల్పడటం గురుగ్రామ్‌లో కలకలం రేపింది. మూగజీవి అని కూడా చూడకుండా దారుణంగా హింసించారు. అంతేకాకుండా బతికుండానే దానిని పాతిపెట్టేందుకే యత్నించారు. వివరాల్లోకి వెళ్తే.. గురుగ్రామ్ సెక్టార్ 49లోని ఓ కాస్ట్లీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లోకి శుక్రవారం సాయంత్రం ఓ వీధి కుక్క ప్రవేశించింది. దీంతో ఆ అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డులు వీధి కుక్కను బయటకు పంపించే ప్రయత్నం చేశారు. కానీ ఆ కుక్క బయటకు వెళ్లలేదు. దీంతో సెక్యూరిటీ సూపర్వైజర్ ఆదేశాల మేరకు అక్కడి గార్డులు కుక్కపై తమ వద్ద ఉన్న లాఠీలతో దాడి చేశారు. అది మూగజీవి అన్న సంగతి మరచి తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడిలో కుక్క కాలుకు, తలకు బలమైన గాయాలు కావడంతో అది అక్కడే నేలమీద పడిపోయింది. అలా పడిపోయిన కుక్కను అపార్ట్మెంట్ బయటకు తీసుకెళ్లిన సెక్యూరిటీ గార్డులు.. ఖాళీ స్థలంలో పూడ్చిపెట్టే ప్రయత్నం చేశారు. అయితే దీనిని గమనించిన కొందరు జంతు ప్రేమికులు గార్డుల చర్యను అడ్డుకున్నారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీవ్రంగా గాయపడిన కుక్కను.. దగ్గర్లోని వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ కుక్క పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. జంతు పరిరక్షణ చట్టం ప్రకారం ఆ అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డులు, వారి సూపర్వైజర్పై కేసు నమోదు చేశామని తెలిపారు. అక్కడ సీసీటీవీ దృశ్యాల్లో వారు కుక్కను హింసించిన దృశ్యాలు నమోదయ్యాయని.. దాని ఆధారంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కుక్కపిల్లలపై విద్యార్థుల దాడి.. బెంగళూరు : అలాగే బెంగళూరులో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. నలుగురు స్కూల్ విద్యార్థులు.. ఓ ఖాళీ ప్లాట్‌లో నిద్రిస్తున్న కుక్క పిల్లలపై దాడికి ప్పాలడ్డారు. వాటిపైకి రాళ్లు రువ్వారు. దీంతో అవి అరవడం మొదలు పెట్టాయి. ఆ అరుపులు విన్న చుట్టుపక్కల వారు అక్కడి చేరుకుని విద్యార్థులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ వారు అప్పటికే అక్కడ నుంచి పారిపోయారు. సాయంత్రం తిరిగి అక్కడికి వచ్చినవారు.. ఒక కుక్కపిల్లను రాడ్డుతో గట్టిగా కొట్టి పారిపోయారు. తీవ్రంగా గాయపడ్డ ఆ కుక్క పిల్లను స్థానికులు దగ్గర్లోని వెటర్నరీ వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. మళ్లీ మూడోసారి అక్కడికి వచ్చిన విద్యార్థులు మిగిలిన రెండు కుక్కపిల్లలపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఆ విద్యార్థుల పనులతో ఆగ్రహానికి లోనైన ఓ స్థానికుడు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఆ విద్యార్థులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్యార్థుల దాడిలో గాయపడ్డ ఆ మూగజీవాలను ప్రస్తుతం ఆస్పత్రిలో చేర్చారు. అందులో ఓ కుక్కపిల్లకు దవడ విరిగినట్టు వైద్యులు గుర్తించారు. కాగా, ఆ విద్యార్థుల వయసు 7 నుంచి 15 సంవత్సరాల మధ్య ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. -
ముంబై వాసులను రక్షిస్తున్న చిరుత పులులు!
సాక్షి, న్యూఢిల్లీ: ముంబై నగరంలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్‌లో సంచరించే చిరుత పులులు అప్పుడప్పుడు బయటకు జనావాస ప్రాంతాల్లోకి రావడం చూసి ప్రజలు భయభ్రాంతులవుతున్నారు. వాస్తవానికి వాటి వల్ల ప్రజలకు పెద్దగా ముప్పేమి వాటిల్లడం లేదు. అవి జనావాస ప్రాంతాల్లోకి ప్రజల కోసం రావడం లేదు. వీధి కుక్కల కోసం అవి వస్తున్నాయని, వాటి వల్ల ముంబై ప్రజలకు మేలే ఎక్కువ జరుగుతోందని తేలింది. చిరుత పులులు తాము రోజు తీసుకొనే ఆహారంలో దాదాపు 40 శాతం వీధి కుక్కలే ఉంటున్నాయి. ఈ విషయాలు ‘ఫ్రాంటయిర్స్ ఇన్ ఎకాలజీ అండ్ ది ఎన్విరాన్మెంట్’ పత్రికలో ప్రచురితమయ్యాయి. 104 చదరపు కిలోమీటర్లు విస్తరించిన సంజయ్ గాంధీ నేషనల్ పార్క్‌లో 42 చిరుత పులులు ఉన్నాయి. గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గరి నుంచి ముంబై నగరంలోని ప్రతి కూడలిలో, ప్రతి వీధి చివరలో కొన్ని వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ముంబై నగరం మొత్తం మీద ఏ రోజున లెక్కించిన సరాసరి 95 వేల వీధి కుక్కలు ఉంటాయన్నది ఓ అంచనా. వీటి వల్ల ఏటా ప్రజలకు 75 వేల గాయాలు అవుతున్నాయి. ఇవి అధికారికంగా నమోదయిన గాయాలు మాత్రమే. నమోదు కాకుండా కూడా మరికొన్ని వేల గాయాలవుతున్నాయన్నది అంచనా. ఈ గాయాల వల్ల రాబిస్ సోకి వందల మంది మరణిస్తున్నారు. అధికారికంగా నమోదైన లెక్కల ప్రకారం గత 20 ఏళ్లలో నగరంలో వీధి కుక్కల గాయాల వల్ల 420 మంది మరణించారు. పార్క్ సమీపంలో ఏడాదికి 800 నుంచి రెండువేల వీధి కుక్కలు చిరుత పులులకు ఆహారంగా మారుతున్నాయని, తద్వారా ముంబై నగరంలో వీధి కుక్కలు అదుపులో ఉంటున్నాయని పాపులేషన్ బయోలజిస్ట్ లెక్స్ ఐబీ, వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన సర్వేయర్ నికిత్ చేసిన తాజా అధ్యయనంలో తేలింది. చిరుత పులులు వీధి కుక్కలను వేటాడడం వల్ల కుక్కల స్టెరిలైజేషన్‌కు అయ్యే ఖర్చు ఏటా దాదాపు 18 లక్ష రూపాయలు మున్సిపాలిటీకి మిగులుతోందని కూడా సర్వే తేల్చింది. చిరుత పులులను తరలించినట్లయితే... సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ నుంచి చిరుత పులులను తరలించినట్లయితే పట్టణీకరణ పెరుగుతుంది, అటవి ప్రాంతం తరగిపోతుంది. అసంఖ్యాకంగా వీధి కుక్కలు పెరిగి పోతాయి. పర్యావరణ సమతౌల్యత దెబ్బతింటుంది. అంతేకాకుండా ఏటా వీధి కుక్కల కాట్లు దాదాపు ఐదువేలు పెరుగుతాయి. వాటి చికిత్స కోసం ఏటా 1.38 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. చిరుత పులులు కుక్కలు, పందులనే కాకుండా అప్పుడప్పుడు మనుషులపై కూడా దాడులు చేస్తున్నట్లు వార్తలు వచ్చినప్పుడు ప్రజలు భయందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఒక్క 2002లోనే 25 మంది చిరుత పులుల కారణంగా మృత్యువాత పడ్డారు. ఆ సంఘటనలపై దర్యాప్తు జరపగా ఇతర పార్కుల నుంచి నేషనల్ పార్కుకు తరలించిన చిరుతల వల్లనే ఆ దాడులు జరిగాయని తేలింది. పార్క్‌లో ఉన్న చిరుతలు పూర్తిగా కుక్కల ఆహారానికే అలవాటు పడ్డాయి. గత నాలుగేళ్లుగా చిరుతల కారణంగా ఒక్కరు కూడా ఇక్కడ మృత్యువాత పడకపోవడం కూడా ఈ విషయాన్ని నిరూపిస్తోంది. -
హార్ట్ టచింగ్ ఫొటో.. వైరల్
కళ్లముందే సాటి మనిషి కష్టాల్లో ఉంటే పట్టించుకోకుండా మన పనుల్లో నిమగ్నమవుతాం. ప్రాణాలు పోతున్నా గుడ్లప్పగించి చూస్తాం తప్పితే ఆపన్నహస్తం అందించం. కానీ మూగజీవాలు అలా కాదు. సాటి జంతువుకు కష్టమొస్తే అండగా నిలబడతాయి. మేమున్నామంటూ అండగా నిలుస్తాయి. ఇలాంటి ఘటనకు సంబంధించిన హార్ట్ టచింగ్ ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బ్రెజిల్‌కు చెందిన సులెన్ షుమలొయ్ఫెల్ అనే జర్నలిస్టు ఈ ఫొటోను తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ఆమెను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఈ ఫొటో తీశారు. గతేడాది వీరిద్దరూ ఎనిమిది నెలల వయసున్న లానా అనే కుక్క పిల్లను తెచ్చుకున్నారు. బాగా చలిగా ఉండడంతో రెండు వారాల తర్వాత దాని కోసం ప్రత్యేకంగా దళసరిగా ఉన్న బ్లాంకెట్ కొన్నారు. తర్వాతి రోజు ఉదయం లేచి చూసిన సులెన్ పియాన్స్కు ఊహకు అందని దృశ్యం కనపడింది. బ్లాంకెట్‌కు ఒక చివర లానా, మరోవైపున వీధి కుక్క పడుకునివుండడం చూసి ఆయన ఆశ్చర్యపోయారు. ఒక దుప్పటిని రెండు మూగజీవాలు పంచుకుని చలిని జయించిన తీరును చూసి ఆయన చలించిపోయారు. తనకోసం తెచ్చిన దుప్పటిని సాటి కుక్కకు పంచిన లానాను అభినందనపూర్వకంగా చూశారు. వెంటనే ఈ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించారు. ఈ ఫోటోను ఫేస్బుక్లో పోస్టు చేయగా 45 వేల మందిపైగా స్పందించారు. 26 వేల సార్లు షేర్ చేశారు. లానా లాంటి మంచి మనసున్న కుక్కను తన జీవితంలో ఎప్పుడు చూడలేదని సులెన్ పొంగిపోతున్నారు. లానాలోని మరో కోణాన్ని తమకు పరిచయం చేసిన వీధి కుక్కకు రోజు ఆహారం, మంచినీళ్లు అందిస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే దానికి కూడా మంచి గూడు ఏర్పాటు చేస్తామన్నారు. -
పిచ్చికుక్క దాడిలో 10మందికి గాయాలు
గుంటూరు: పిచ్చికుక్క దాడిలో పది మంది చిన్నారులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన గుంటూరులోని తమ్మారెడ్డినగర్లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఆదివారం కావడంతో ఇళ్ల వద్ద ఆడుకుంటున్న చిన్నారులపై ఓ పిచ్చికుక్క దాడి చేసింది. ఇది గుర్తించిన చిన్నారుల కుటుంబ సభ్యులు పిల్లలను చికిత్స నిమిత్తం జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వీధుల్లో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నా కార్పొరేషన్ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
తన కారుపై కుక్క మూత్రం పోసిందని!
-
తన కారుపై కుక్క మూత్రం పోసిందని!
నోరులేని మూగ జీవాలపై మనుషుల అమానుష దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నటికిమొన్న హైదరాబాద్‌లో ఓ కిరాతకుడు కుక్కను చంపి.. దానిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఇద్దరు మెడికల్ విద్యార్థులు కుక్కను బంగ్లా మీద నుంచి కిందకు విసిరేసి.. ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇటీవల కొందరు పిల్లలు సరదా కోసం కుక్క తోక పట్టుకొని గిరగిరా తిప్పి విసిరేశారు. తాజాగా ఇదేరీతిలో ముంబైకి చెందిన ఓ వ్యక్తి శునకంపై దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఖరీదైన తన కారుపై వీధి కుక్క మూత్రం పోసిందని.. అది పడుకున్న సమయంలో దానిపైనుంచి పోనిచ్చాడు. దీంతో తీవ్రగాయపడిన కుక్క బాధతో విలవిలలాడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫొటోలు, వివరాలను తాజాగా ‘ఫీడ్ ఏ స్ట్రే. ఎవ్రీడే’ ఫేస్బుక్ పేజీ వెలుగులోకి తెచ్చింది. వెంటనే ఈ పోస్టు వైరల్‌గా మారిపోయింది. ముంబైకి చెందిన సౌరబ్ దుఖాండే అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు ఈ ఫేస్బుక్ పేజీ వెల్లడించింది. ‘సిగ్గులేని వ్యక్తి.. అమాయకమైన జీవులపై మనుషులు ఇంత క్రూరంగా ఎలా ఉండగలరు. తన కారుపై మూత్రం పోసిందనే కారణంగా పగ దీర్చుకోవాలని ఈ కుక్కపిల్ల పడుకొని ఉన్న సమయంలో దానిపై నుంచి కారును పోనిచ్చాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాడు చేసినా పట్టించుకోలేదు’ అని ఈ ఫేస్బుక్ పేజీ యూజర్ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే, ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన తర్వాత పోలీసులు నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని మరో నెటిజన్ తెలిపారు. -
చిన్నారిపై వీధికుక్క దాడి
సంగం : ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై ఓ వీధి కుక్కదాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ సంఘటన సంగం రాళ్లచెలికలో ఆదివారం జరిగింది. రాళ్లచెలికకు చెందిన వెంకటరమణమ్మ, రమణయ్య దంపతుల నాలుగేళ్ల బాలుడు చందు ఆదివారం ఉదయం ఇంటికి సమీపంలో ఆడుకుంటున్నాడు. ఒక్కసారిగా పిచ్చికుక్క చిన్నారిపై దాడి చేసింది. చందు పెద్దగా కేకలు వేయడంతో గమనించిన తల్లిదండ్రులు బయటకు వచ్చి చూసే సరికి కుడి కంటి నుంచి తీవ్ర రక్తస్రావం కావడంతో వైద్యశాలకు తరలించారు. అక్కడ చిన్నారికి వైద్యులు కుడికన్ను పైభాగంలో 12 కుట్లు వేయాల్సి వచ్చింది. -
వీధికుక్కకు పోస్టుమార్టం పూర్తి
► మెదడు భాగాలు విశ్లేషణ కోసం ఇన్స్టిట్యూట్కు ► కళేబరం జంతు పరిరక్షణ బృందానికి అప్పగింత ► కేసు దర్యాప్తులో ఉంది: ఇన్స్పెక్టర్ నరేందర్ గౌడ్ పెద్దఅంబర్‌పేట: హయత్‌నగర్‌లోని భాగ్యలత కాలనీలో వెంకటేశం, మల్లేష్‌ల చేతిలో ‘హత్య’కు గురైన వీధికుక్క కళేబరానికి పోస్టుమార్టం పూర్తయింది. ఈ ఉదంతంపై జంతు ప్రేమికురాలు ప్రియాంక ఫిర్యాదు మేరకు హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. భాగ్యలత కాలనీ పాతరోడ్డుకు చెందిన వెంకటేశం భార్యను ఓ వీధికుక్క కరిచింది. దీంతో ఆగ్రహం చెందిన ఆయన కుమారుడు మల్లేష్‌తో కలిసి సోమవారం మధ్యాహ్నం దాన్ని చంపారు. ఆ కళేబరాన్ని వీరు పట్టుకుని వెళ్తుండగా స్థానికంగా ఉండే ప్రియాంక గమనించారు. ఆమె ఈ విషయాన్ని జంతు పరిరక్షణ బృందమైన బ్లూక్రాస్కు తెలిపారు. దీంతో బ్లూక్రాస్ ప్రతినిధి ప్రవళిక కళేబరాన్ని హయత్‌నగర్ పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. దాన్ని చంపిన వారిపై కేసు నమోదు చేయాలని ఇన్స్పెక్టర్ జె.నరేందర్‌గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. వెంకటేశం, మల్లేష్‌లపై పోలీసులు ఐపీసీలోని 428 (ఉద్దేశపూర్వకంగా దుందుడుకు స్వభావంతో జంతువును చంపడం), ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాల్టీ టు యానిమల్స్ యాక్ట్-1950 లోని సెక్షన్ 11, యానియల్ బర్త్ కంట్రోల్ రూల్స్-2011 కింద కేసు నమోదు చేసి కళేబరాన్ని భద్రపరిచారు. ఆ వీధికుక్కకు వాక్సినేషన్ వేశారని, అది కరిచినా ఎలాంటి ప్రమాదం లేదని, దాన్ని ఎందుకు చంపాల్సి వచ్చిందని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న సమయంలో ప్రవళిక వాదించారు. వెంకటేశం, మల్లేష్లతో పాటు కొందరు స్థానికులు సైతం ఆ కుక్కకు పిచ్చిపట్టిందని, వరుసగా అనేక మందిని కరుస్తోందని ఆరోపించారు. దీంతో కుక్క కళేబరానికి పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించాలని హయత్‌నగర్ పోలీసులు నిర్ణయించారు. కళేబరాన్ని పోలీసుస్టేషన్లోనే భద్రపరిచిన అధికారులు మంగళవారం ఉదయం హయత్‌నగర్‌లోని వెటర్నరీ ఆస్పత్రిలో డాక్టర్ ఆనంద్‌రెడ్డి ద్వారా పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించారు. తలపై దెబ్బ తగలడం వల్లే కుక్క మరణించిందని వైద్యులు ధ్రువీకరించినట్లు ఇన్స్పెక్టర్ నరేందర్‌గౌడ్ తెలిపారు. అయితే దానికి ర్యాబిస్ వ్యాధి ఉందా? లేదా? దానికి పిచ్చిపట్టిందా? లేదా? అనేవి నిర్ధారించడం కోసం మెదడు నుంచి ఓ పొరను సేకరించిన వైద్యులు దాన్ని విశ్లేషణ నిమిత్తం రాజేంద్రనగర్‌లోని వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు పంపారు. ‘పోస్టుమార్టం అనంతరం శునక కళేబరాన్ని ఖననం చేస్తామని కోరడంతో జంతు పరిరక్షణ బృందానికే అప్పగించాం. వెంకటేశం, మల్లేష్‌లపై నమోదైన కేసు దర్యాప్తులో ఉంది. వెలుగులోకి వచ్చిన వివరాలు, నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని ఇన్స్పెక్టర్ నరేందర్ గౌడ్ ‘సాక్షి’కి తెలిపారు.