T-20 World Cup
-
ఆ రెండింటిలోనూ ఆడాలని ఉంది: రోహిత్
ముంబై: భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఈ ఏడాది ఐపీఎల్‌తోపాటు టి20 ప్రపంచకప్ కూడా జరగాలని ఆశిస్తున్నాడు. కరోనా మహమ్మారి వల్ల ఈ టోర్నీలపై ఇప్పటికీ స్పష్టత లేకుండాపోయింది. టీమిండియా వైస్ కెప్టెన్ మాత్రం తాను ఈ రెండు టోర్నీల్లోనూ ఆడాలనుకుంటున్నట్లు చెప్పాడు. అభిమానులతో ఇన్స్టాగ్రామ్ చాట్‌లో డాషింగ్ ఓపెనర్ మాట్లాడుతూ... ఆసీస్ పర్యటనలో జరిగే డే–నైట్ టెస్టు సవాలుతో కూడుకున్నదని చెప్పాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జెసన్ రాయ్‌ల ఆటను చూడటాన్ని ఆస్వాదిస్తున్నానని రోహిత్ తెలిపాడు. మాజీ సారథి ధోని గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఏం చెబుతారనే ప్రశ్నకు రోహిత్ బదులిస్తూ ‘లెజెండ్’ అని ముక్తాయించాడు. ఈ ఏడాది ఆఖర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత్ అక్కడ నాలుగు టెస్టులు ఆడనుంది. ఇందులో అడిలైడ్‌లో జరిగే రెండో టెస్టును పింక్‌బాల్‌తో ఫ్లడ్‌లైట్లలో నిర్వహిస్తారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో ఆస్ట్రేలియా ఆతిథ్యమిచ్చే ప్రపంచకప్‌పై ఇప్పటికే రెండుసార్లు సమావేశమైన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు ఈ మెగా టోర్నీ వాయిదా పడితే ఐపీఎల్ నిర్వహణకు మార్గం సుగమం అవుతుందనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు గంగూలీ మాట్లాడుతూ లీగ్‌పై ఆశలు రేపాడు. అన్ని అవకాశాల్ని, ప్రత్యామ్నాయాల్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు ప్రకటించాడు. -
కౌర్ పవర్ డైనమో!
-
కౌర్ పవర్!
సాక్షి క్రీడావిభాగం :గత ఏడాది జులైలో వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై హర్మన్ ఆడిన తుఫాన్ ఇన్నింగ్స్‌ను ఎవరూ మరచిపోలేరు. నాడు కేవలం 115 బంతుల్లో 20 ఫోర్లు, 7 సిక్సర్లతో 171 పరుగులు సాధించి ఆమె అజేయంగా నిలిచింది. ఇప్పుడు మరో ప్రపంచ కప్ వచ్చింది. ఈసారీ హర్మన్ స్పెషల్ ఇన్నింగ్స్‌తో తన సత్తాను ప్రపంచానికి చూపించింది. బంతిని బలంగా బాదడమే మంత్రంగా పని చేసే టి20లో ఏకంగా శతకం సాధించడంలో కౌర్ పవర్ ఏమిటో కనిపించింది.సిక్సర్ల సునామీతో విరుచుకు పడిన ఈ ‘పంజాబ్ కీ షేర్ని’ తొలి టి20 సెంచరీతో భారత మహిళల క్రికెట్లో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకుంది. హర్మన్ షాట్లలో ఎంత పదును కనిపించిందంటే ఆమె కొట్టిన సిక్సర్లలో ఎక్కువ భాగం స్టాండ్స్‌లో పడ్డాయి. పురుషుల క్రికెట్లోనైనా, ఎలాంటి మైదానంలోనైనా అవి కచ్చితంగా సిక్సర్లుగా మారేవే! శుక్రవారం కివీస్‌తో మ్యాచ్‌లో కౌర్ ఇన్నింగ్స్ నెమ్మదిగానే ప్రారంభమైంది.తాను ఎదుర్కొన్న తొలి 13 బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేసింది. అయితే వాట్కిన్ వేసిన పదో ఓవర్లో హర్మన్ ప్రతాపం ప్రారంభమైంది. ఈ ఓవర్లో రెండు భారీ సిక్సర్లతో తన ఉద్దేశాన్ని చాటింది. ఆ తర్వాత ప్రత్యర్థి కెప్టెన్ సాటర్‌వెయిట్ వేసిన 14వ ఓవర్లో పండగ చేసుకుంది. 2 సిక్సర్లు, ఫోర్‌తో చెలరేగిన భారత కెప్టెన్... 33 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత ఆమెను ఆపడం న్యూజిలాండ్ తరం కాలేదు. మరుసటి ఓవర్లో వరుసగా 4, 6...ఆ తర్వాతి రెండు ఓవర్లలో కలిపి మరో రెండు ఫోర్లు, సిక్సర్ బాదింది.హర్మన్ 85 పరుగుల వద్ద మళ్లీ స్ట్రయికింగ్‌కు వచ్చే సమయానికి ఇన్నింగ్స్‌లో 8 బంతులే మిగిలాయి. ఆమె సెంచరీ సాధించగలదా అనే సందేహం కనిపించింది. అయితే దానిని పటాపంచలు చేస్తూ 19వ ఓవర్ చివరి రెండు బంతులకు భారీ సిక్సర్లు కొట్టి 97కు చేరుకుంది. డెవిన్ వేసిన చివరి ఓవర్ మూడో బంతికి రెండు పరుగులు తీయడంతో భారత మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర నమోదైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు (మార్చి 8) పుట్టిన హర్మన్ అబ్బాయిలతో పోటీ పడి అసాధారణ క్రికెటర్‌గా ఎదిగింది.సెహ్వాగ్‌తో కలిసి ఓపెనింగ్ చేస్తావా అంటూ ఊర్లో కుర్రాళ్లు చేసిన వ్యంగ్య వ్యాఖ్యలకు సెహ్వాగ్‌లాంటి దూకుడైన ఆటతోనే జవాబు చెప్పింది. క్రికెట్ పిచ్చి ఉన్న తండ్రి ఆమె పుట్టినప్పుడు క్రికెటర్ బొమ్మ ఉన్న షర్ట్ తెచ్చి తొడగడం యాదృచ్ఛికమే కావచ్చు కానీ ఆయన ప్రోత్సాహంతో దేశం గర్వపడే క్రికెటర్‌గా ఎదిగేందుకు పట్టుదలతో శ్రమించింది. హర్మన్ మెరుపు బ్యాటింగ్ వెనక ఆమె అద్భుత ఫిట్నెస్ కూడా దాగి ఉంది. గత ఏడాది వన్డే ప్రపంచ కప్ తర్వాత జాతీయ క్రికెట్ అకాడమీలో ఆమె రెండు సార్లు యోయో టెస్టుకు హాజరైంది.పురుష క్రికెటర్లకే సాధ్యం కాని రీతిలో తొలిసారి 17.2 స్కోరు నమోదు చేసిన ఆమె మరో ఐదు నెలలకు దానిని మెరుగుపర్చుకొని 18.5కి తీసుకొచ్చింది. దీనిని చూసిన యువరాజ్ సింగ్ ‘ఇంత స్కోరు చేశావా... అదీ ఇండోర్‌లో...అంతా బాగానే ఉంది కదా’ అంటూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. నువ్వు సెహ్వాగ్లాగానే ఆడుతున్నావంటూ యువీ ఇచ్చిన ప్రశంస ఆమెలో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఆటలోనే కాకుండా సగటు పంజాబీ అమ్మాయిలలాగా మాటల్లో కూడా కౌర్ దూకుడు కనిపిస్తుంది. మైదానంలో సరిగా స్పందించని జట్టు సభ్యులపై ఆమె ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన ఘటనలు బోలెడు. అయితే పిన్న వయసులో భారత టి20 కెప్టెన్ కావడం నుంచి బిగ్‌బాష్ లీగ్‌లో ఆడిన తొలి భారత క్రికెటర్ వరకు అనేక ఘనతలు తన పేరిట లిఖించుకున్న హర్మన్ ఖ్యాతి తాజా ఇన్నిం గ్స్‌తో శిఖరానికి చేరిందంటే అతిశయోక్తి లేదు. -
తప్పులు దిద్దుకున్నానన్న హార్దిక్ పాండ్యా
‘వాస్తవం బోధపడింది’ కాన్పూర్: ఆల్‌రౌండర్‌గా అప్పటికే చక్కటి గుర్తింపు తెచ్చుకున్నా, గత ఏడాది టి20 ప్రపంచకప్‌లో విఫలం కావడంతో హార్దిక్ పాండ్యా భారత జట్టులో చోటు కోల్పోయాడు. జింబాబ్వే పర్యటనకు కూడా అతడిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. దీంతో తత్వం బోధపడిన పాండ్యా మళ్లీ శ్రమించి స్థానం దక్కించుకున్నాడు. ‘టి20 ప్రపంచ కప్ తర్వాత నాకు వాస్తవం తెలిసొచ్చింది. నేను ఇంకా చాలా మెరుగు పడాల్సి ఉందని అర్థమైంది. ‘ఎ’ జట్టులో సభ్యుడిగా ఆస్ట్రేలియాలో పర్యటించడం నేను ఎంతో నేర్చుకునేందుకు అవకాశం కల్పించిం ది. కోచ్ రాహుల్ ద్రవిడ్ నా ఆట తో పాటు మానసికంగా కూడా నా ఆలోచనాతీరును మార్చారు. అసిస్టెంట్ కోచ్ పారస్ మాంబ్రే కూడా సహకరించారు. తప్పులు సరిదిద్దుకొని మళ్లీ టీమ్‌లోకి వచ్చాను’ అని పాండ్యా వ్యాఖ్యానించాడు. సాయంత్రం 4.30కే టి20 మ్యాచ్: కాన్పూర్‌లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య గురువారం జరగనున్న తొలి టి20 మ్యాచ్ సాయంత్రం 4.30కే ప్రారంభం కానుంది. ఉత్తరాదిన తీవ్ర ప్రభావం చూపిస్తున్న మంచుతోపాటు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న గ్రీన్‌పార్క్ మైదానంలో ఫ్లడ్ లైట్ల సమస్య కూడా మరో కారణం. ‘లో లక్స్ లెవల్స్ కారణంగా ఇక్కడి ఫ్లడ్‌లైట్ల కాంతి తీవ్రత కాస్త తక్కువగా ఉంటుంది. అందుకే సాధ్యమైనంత ముందుగా మ్యాచ్ ముగించాలని భావించాం. ముందుగా మ్యాచ్ ప్రారంభించేందుకు బీసీసీఐ అనుమతి తీసుకున్నాం’ అని యూపీ క్రికెట్ సంఘం అధికారి ఒకరు వెల్లడించారు. -
ఆ ‘గాయం’ మానాలంటే... కరీబియన్లను కొట్టాల్సిందే!
-
ఆ ‘గాయం’ మానాలంటే... కరీబియన్లను కొట్టాల్సిందే!
► యూఎస్‌లో భారత్ మొదటి మ్యాచ్ ►నేడు వెస్టిండీస్‌తో తొలి టి20 ► ఉత్సాహంగా ధోని సేన ►సవాల్‌కు విండీస్ సిద్ధం దాదాపు ఐదు నెలల క్రితం ‘సొంతగడ్డపై భారత జట్టు టి20 ప్రపంచ కప్ గెలుచుకోవడం ఖాయం’ అని అభిమానులు ఆశలు పెట్టుకున్న స్థితిలో సెమీఫైనల్లో వెస్టిండీస్ చావుదెబ్బ కొట్టింది. 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడమే బాధ కలిగిస్తే... రెండు నోబాల్స్ కారణంగా వారికి అవకాశం లభించడం పుండు మీద కారం చల్లినట్లుగా అనిపించింది. నాటి మ్యాచ్ తర్వాత ఇరు జట్లు ఇప్పుడు మరోసారి పొట్టి ఫార్మాట్లో పోరుకు సిద్ధం అయ్యారుు. రెండు జట్లలోనూ ఆ మ్యాచ్‌లో ఆడిన చాలా మంది ఆటగాళ్లు బరిలో ఉన్నారు. గత మ్యాచ్‌కు ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ ఆశిస్తుండగా... ప్రపంచ చాంపియన్ హోదాలో తమ ఆధిపత్యం నిలబెట్టుకోవాలని విండీస్ భావిస్తోంది. అన్నింటికి మించి తొలిసారి అమెరికాలో భారత స్టార్ క్రికెటర్లు ఆడబోతుండటం ఒక్కసారిగా టి20 సిరీస్‌కు కొత్త ఆకర్షణ తెచ్చి పెట్టింది. గావస్కర్ కాలంనుంచి సచిన్ వరకు ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు చూడటంతోనే సంతృప్తి చెందిన అమెరికన్ భారతీయులకు ఇప్పుడు అసలైన ఇండియన్ ఇంటర్నేషనల్ మ్యాచ్ మజా దక్కనుంది. లాడర్‌హిల్ (ఫ్లోరిడా): టెస్టు సిరీస్‌లో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించిన భారత జట్టు ఇప్పుడు టి20ల్లో సత్తా చాటేందుకు సన్నద్ధమైంది. ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇక్కడి సెంట్రల్ బ్రావర్డ్ రీజినల్ పార్క్ స్టేడియంలో నేడు (శనివారం) తొలి మ్యాచ్ జరగనుంది. జింబాబ్వేపై జూనియర్ జట్టుతో విజయం సాధించిన అనంతరం ధోని మళ్లీ మైదానంలోకి వస్తుండగా... స్యామీ స్థానంలో కెప్టెన్‌గా ఎంపికైన కార్లోస్ బ్రాత్‌వైట్ తొలిసారి నాయకత్వం వహిస్తున్నాడు. టి20 బలాబలాల పరంగా చూస్తే విండీస్ చాలా బలంగా కనిపిస్తోంది కాబట్టి భారత్‌కు గెలుపు అంత సులువు కాదు. ఉత్సాహంగా ధోనిసేన టెస్టు సిరీస్ ముగిసిన అనంతరం టి20లకు ఎంపిక కాని భారత ఆటగాళ్లంతా స్వదేశం చేరుకోగా... మిగతావారంతా నేరుగా అమెరికాలో అడుగు పెట్టారు. టెస్టుల్లో మెరుగ్గా రాణించిన జట్టు మొత్తం ఆత్మవిశ్వాసంతో ఉంది. ఎప్పటిలాగే టీమిండియా బ్యాటింగ్ భారం విరాట్ కోహ్లిపైనే ఉంది. అతనితో పాటు ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ చెలరేగేందుకు సిద్ధమయ్యారు. మిడిలార్డర్లో రహానే కీలకం కానున్నాడు. ప్రపంచకప్ వరకు సుదీర్ఘ కాలంగా భారత టి20 జట్టులో అంతర్భాగంగా ఉన్న సురేశ్ రైనా ఈ సిరీస్‌లో లేకపోవడం ఒక్కటే జట్టులో కొత్తగా కనిపించే మార్పు. జట్టులోకి వచ్చీ రావడంతోనే ఆకట్టుకున్న రాహుల్‌కు ఇప్పుడు సీనియర్ల రాక తో తుది జట్టులో స్థానం దొరుకుతుందా చూడాలి. బౌలర్లలో బుమ్రా ఆరంభ ఓవర్లలో మళ్లీ కీలకం కానున్నాడు. ఇతర పేసర్లుగా షమీ, భువనేశ్వర్ తుది జట్టులో ఉంటారు. టెస్టుల్లో విండీస్ భరతం పట్టిన అశ్విన్ టి20ల్లోనూ సత్తా చూపించాల్సి ఉంది. వరల్డ్ కప్ సెమీస్‌లో నోబాల్‌తో తీవ్ర విమర్శల పాలు కావడం అతడిని ఇప్పటికే వెంటాడుతూనే ఉండవచ్చు. కొత్త కెప్టెన్ నేతృత్వంలో... ప్రపంచ కప్‌ను గెలిపించినా వ్యక్తిగత ప్రదర్శన పేలవంగా ఉందంటూ డారెన్ స్యామీని కెప్టెన్సీతో పాటు జట్టునుంచి కూడా విండీస్ బోర్డు అనూహ్యంగా తప్పించింది. టి20 వరల్డ్ కప్ ఫైనల్లో నాలుగు సిక్సర్లతో హీరోగా మారిపోరుున బ్రాత్‌వైట్ కెప్టెన్‌గా తన తొలి సిరీస్ ఆడుతున్నాడు. అరుుతే అతనికి పెద్దగా అనుభవం లేకపోరుునా... జట్టు మొత్తం టి20 స్టార్లతో నిండి ఉండటం కలిసొచ్చే అంశం. ముఖ్యంగా టెస్టు జట్టులో లేని క్రిస్ గేల్, డ్వేన్ బ్రేవో, ఆండ్రీ రసెల్, సిమన్‌సలతో ఆ జట్టు బ్యాటింగ్ దుర్బేధ్యంగా కనిపిస్తోంది. వీరికి బ్రాత్‌వైట్ మెరుపులు కూడా తోడైతే జట్టుకు తిరుగుండదు. ఇక వరల్డ్ కప్ ఆడని పొలార్డ్, నరైన్‌లు కూడా జట్టులోకి తిరిగి రావడంతో విండీస్ తుది జట్టులో స్థానం కోసం కూడా గట్టి పోటీ నెలకొంది. జట్లు (అంచనా) భారత్: ధోని (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కోహ్లి, రాహుల్, రహానే, అశ్విన్, షమీ, బుమ్రా, భువనేశ్వర్ లేదా రవీంద్ర జడేజా. వెస్టిండీస్: బ్రాత్‌వైట్ (కెప్టెన్), గేల్, చార్లెస్, రసెల్, బ్రేవో, హోల్డర్, కీరన్ పొలార్డ్, సిమన్స, శామ్యూల్స్, శామ్యూల్ బద్రీ, సునీల్ నరైన్. పిచ్, వాతావరణం గురువారం రాత్రి వరకు ఫ్లోరిడాను ఉరుములు, మెరుపులు ఇబ్బంది పెట్టారుు. అరుుతే ఆదివారం తుఫాన్ వచ్చే అవకాశం ఉన్నా... ఈ మ్యాచ్‌కు మాత్రం వర్షం ఇబ్బంది ఉండకపోవచ్చు. ఈ మైదానంలో ఆరేళ్ల క్రితం తొలిసారి మ్యాచ్‌లు నిర్వహించినప్పుడు తక్కువ స్కోర్లు నమోదయ్యారుు. అరుుతే ఇటీవలి కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో మాత్రం మంచి స్కోర్లు వచ్చారుు. కాబట్టి ఈ మ్యాచ్‌లో కూడా పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని భావిస్తున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో వెస్టిండీస్ చాలా అద్భుతంగా ఆడుతుంది. సమతూకంతో ఉన్న వారి జట్టులో వినోదాన్ని అందించే ఆటగాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. ఉదయం టి20 మ్యాచ్‌లు జరగడం అనేది కొంత కొత్తగా అనిపిస్తున్నా దాని ప్రభావం ఉండకపోవచ్చు. నా కెరీర్‌ను మరింత పొడిగించుకునేందుకు విరామ సమయాల్లో ఫిట్‌నెస్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టాను. కెప్టెన్సీ విషయంలో కుంబ్లే నుంచి నేను చాలా నేర్చుకున్నాను. క్రికెట్‌కు సంబంధించి అమెరికా ప్రత్యేక తరహా మార్కెట్. ఇక్కడ ఆటను అభివృద్ధి చేసేందుకు అన్ని అవకాశాలూ ఉన్నారుు. -ధోని, భారత కెప్టెన్ రా. గం. 7.30నుంచి స్టార్ స్పోర్ట్స -1లో ప్రత్యక్ష ప్రసారం -
టి20 ప్రపంచకప్‌లో సూపర్-12!
వచ్చే టి20 ప్రపంచ కప్ ప్రధాన రౌండ్లో మరో రెండు జట్లను అదనంగా చేర్చాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భావిస్తోంది. సూపర్-10కు బదులుగా సూపర్-12 నిర్వహించాలని శశాంక్ మనోహర్ నేతృత్వంలో ఎడిన్బర్గ్లో జరిగిన ఐసీసీ సమావేశంలో సభ్యులు ప్రతిపాదించారు. మరోవైపు 2024 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చే దిశగా మద్దతు కూడగట్టేందుకు ఐసీసీ... ఇటలీ, ఫ్రాన్స్ దేశాల ఒలింపిక్ సంఘాలతో కూడా చర్చలు జరుపుతోంది. -
పాకిస్తాన్ కోచ్‌గా మికీ ఆర్థర్
పాకిస్తాన్ నూతన కోచ్‌గా మికీ ఆర్థర్‌ను నియమించారు. ఈనెల చివర్లో ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు. టి20 ప్రపంచకప్‌లో జట్టు పేలవ ప్రదర్శన కారణంగా వఖార్ యూనిస్ ఈ పదవికి రాజీనామా చేయడంతో పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కొత్త కోచ్ వేటలో పడింది. 47 ఏళ్ల ఆర్థర్ గతంలో తన సొంత జట్టు దక్షిణాఫ్రికాతో పాటు ఆస్ట్రేలియా జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. -
కామెంటేటర్‌గా స్యామీ
కోల్‌కతా: సరిగ్గా నెల రోజుల క్రితం ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్ కెప్టెన్‌గా టి20 ప్రపంచకప్‌ను అందుకున్న డారెన్ స్యామీ... అదే ఈడెన్ గార్డెన్స్‌లో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా కామెంటేటర్ అవతారం ఎత్తాడు. కోల్‌కతా, పంజాబ్‌ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ ద్వారా కామెంటేటర్‌గా అరంగేట్రం చేశాడు. గతేడాది ఐపీఎల్లో బెంగళూరుకు ఆడిన స్యామీని ఈసారి వేలంలో ఏ జట్టూ తీసుకోలేదు. -
నా గొంతు కోస్తానన్నాడు!
ఫ్లింటాఫ్‌తో 2007 సంవాదంపై యువరాజ్ ముంబై: దాదాపు తొమ్మిదేళ్ల క్రితం టి20 ప్రపంచకప్‌లో స్టువర్ట్ బ్రాడ్ ఓవర్లో యువరాజ్ సింగ్ వరుసగా ఆరు సిక్సర్లు బాదిన విషయం అందరి మనసుల్లో నిలిచిపోయింది. దానికి ముందు మరో ఇంగ్లండ్ ఆటగాడు ఫ్లింటాఫ్‌తో గొడవ జరిగిన తర్వాతే తనలో ఆవేశం పెరిగిందని కూడా యువీ ఎన్నో సార్లు అన్నాడు. అయితే వారిద్దరి మధ్య సరిగ్గా ఏం సంభాషణ జరిగిందనేది ఇప్పటి వరకు బయటికి తెలీదు. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ సందర్భంగా యువీ ఆ విషయం వెల్లడించాడు. ‘బ్రాడ్ ఓవర్‌కు ముందు ఫ్లింటాఫ్ వేసిన 18వ ఓవర్లో నేను వరుసగా రెండు ఫోర్లు బాదాను. ఆ ఓవర్ తర్వాత బూతులతో ఫ్లింటాఫ్ తన ఆగ్రహాన్ని ప్రదర్శిస్తే నేను కూడా అదే తరహాలో బదులిచ్చాను. దాంతో మరింత కోపంతో ఫ్లింటాఫ్ నా గొంతు కోస్తానన్నాడు. నేను కూడా నా బ్యాట్ చూపిస్తూ దీంతో ఎక్కడ కొడతానో తెలుసా అంటూ గట్టిగా బదులిచ్చాను’ అని యువరాజ్ 2007నాటి డర్బన్ మ్యాచ్ ఘటనను గుర్తు చేసుకున్నాడు. ఆ గొడవ తర్వాత తనలో కోపం అమాంతం పెరిగిపోయిందని, ప్రతీ బంతినీ మైదానం బయట కొట్టాలనే కసితో బ్యాటింగ్ చేయడం వల్లే ఆరు సిక్సర్లు వచ్చాయని యువరాజ్ చెప్పుకొచ్చాడు. -
టి20 ప్రపంచకప్ రికార్డు స్థాయిలో వీక్షణ
దుబాయ్: ఇటీవల ముగిసిన ఐసీసీ టి20 ప్రపంచకప్‌కు సంబంధించిన మ్యాచ్‌లను అభిమానులు రికార్డు స్థాయిలో వీక్షించారు. భారత్‌లోని ఏడు వేదికల్లో జరిగిన 48 మ్యాచ్‌లను 32 కోట్ల మంది డిజిటల్, సోషల్ మీడియా ద్వారా తిలకించారు. ఇక ఐసీసీ నుంచి ప్రసార హక్కులు తీసుకుని వివిధ దేశాల్లో ప్రసారం చేసిన చానెల్స్ కూడా అత్యధిక వీక్షకులను సంపాదించాయి. భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ స్టార్‌స్పోర్ట్స్, దూరదర్శన్‌లో ప్రసారం కాగా ఇది 17.3 రేటింగ్ సాధించింది. 8 కోట్ల 30 లక్షల మంది అత్యంత ఆసక్తిగా తిలకించారు. 2007 టి20 ప్రపంచకప్ ఫైనల్ అనంతరం ఇదే అత్యధిక స్థాయి కావడం విశేషం. ఓవరాల్‌గా భారత్‌లో ఈ టోర్నీ 73 కోట్ల మందిని ఆకర్శించింది. -
ఇప్పటికీ కోలుకోలేదు
భారత్‌తో ఓటమిపై మహ్మదుల్లా ఢాకా: టి20 ప్రపంచకప్‌లో భారత్ చేతిలో ఓటమి షాక్ నుంచి ఇంకా కోలుకోలేదని బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ మహ్మదుల్లా చెప్పాడు. ఆ మ్యాచ్‌లో విజయానికి చివరి మూడు బంతుల్లో రెండు పరుగులు అవసరం కాగా... ముష్ఫికర్, మహ్మదుల్లా చెత్త షాట్లు ఆడి అవుట్ కావడంతో భారత్ సంచలనాత్మక విజయం సాధిం చింది. ‘ఆ రోజు నేను ఆడిన చెత్త షాట్‌ని తలచుకుని ఇప్పటికీ బాధపడుతున్నా. ఓటమికి పూర్తి బాధ్య త నాదే. అభిమానులు నన్ను క్షమించాలి. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితి ఎదురైతే పరిణతితో ఆడతాను’ అని మహ్మదుల్లా చెప్పాడు. -
‘చాంపియన్’లో ఏముంది!
► ఉర్రూతలూగిస్తున్న బ్రేవో పాట ► యూ ట్యూబ్‌లో రికార్డ్ హిట్స్ సాక్షి క్రీడావిభాగం ‘అందరికీ తెలుసు గేల్ చాంపియన్, లారా కూడా చాంపియన్... ఒబామా చాంపియన్, మండేలా చాంపియన్’... ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రేవో సింగిల్ ‘చాంపియన్’ సాహిత్యమిది! సాధారణ పదాలతో, వినేవారికి పెద్దగా శ్రమ కల్పించకుండా ఉంటూ అప్పటికప్పుడు అల్లుకున్న పాటలాగా ఇది అనిపిస్తుంది. క్రికెటర్‌గా బ్రేవోకున్న గుర్తింపు వల్ల పాట అందరికీ పరిచయమైతే... వెస్టిండీస్ వరల్డ్ కప్ విజయం ఇప్పుడు దానిని సూపర్‌హిట్ చేసింది. ‘చాంపియన్’ వీడియోకు యూ ట్యూబ్‌లో వారం వ్యవధిలోనే 4.5 మిలియన్ల హిట్స్ రావడం విశేషం. విండీస్ ఆటగాళ్లయితే దానిని తమ టీమ్ థీమ్ సాంగ్‌గా మార్చుకోగా... ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ పాట డ్యాన్స్ కదలికలను చాలా మంది క్రికెటర్లు, బాలీవుడ్ నటులు అనుకరించారు. రింగ్ టోన్లు, కాలర్ ట్యూన్లుగా పెట్టుకోవడంతో పాటు లెక్క లేనంత మంది అద్దం ముందు ఈ డ్యాన్స్‌ను చేసి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పోస్ట్ చేస్తున్నారు. మొదటి సారేం కాదు క్రికెట్‌తో పాటు వినోద ప్రపంచంలో కూడా గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న బ్రేవో ఆ క్రమంలో రూపొందించిన మూడో సింగిల్ చాంపియన్. ‘గో గ్యాల్ గో’ పేరుతో తొలి పాట అనంతరం 2013 ఐపీఎల్ సమయంలో చలో చలో అంటూ ఒక హింగ్లీష్ సాంగ్‌ను తయారు చేశాడు. ‘ఉలా’ అనే తమిళ చిత్రంలోనూ అతను ఒక పాట పాడాడు. చాంపియన్ పూర్తి వీడియో సాంగ్‌ను టి20 ప్రపంచ కప్ సందర్భంగా ఇటీవల విడుదల చేయడానికి మూడు నెలల ముందే అతను మెల్బోర్న్లో బిగ్‌బాష్ లీగ్ సందర్భంగా దీనిని వేదికపై ప్రదర్శించాడు. నాడు ప్రవాస భారత గాయని పల్లవి శారద అతనితో పదం కలిపింది. దీనిని ప్రమోట్ చేసేందుకు బ్రేవో లాస్ ఏంజెల్స్‌కు చెందిన వీనస్ మ్యూజిక్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. భారత్‌లో ‘వేగ’ ఈ వీడియోను విడుదల చేసింది. జోసెఫ్ ఫెర్నాండో దీనికి దర్శకత్వం వహించాడు. చాలెంజ్ కూడా... మన ‘స్టాలిన్’ సినిమాలాగా, సరిగ్గా చెప్పాలంటే ‘స్వచ్ఛ భారత్’ ప్రచారం లాగా ‘చాంపియన్’ పాటకు కూడా ఇలా చేయగలరా అంటూ చాలెంజ్ విసిరాడు. అందరికంటే ముందుగా స్పందిం చిన గేల్ అలాగే డ్యాన్స్ చేసి మరో మూడు పేర్లు అమితాబ్, డివిలియర్స్, కోహ్లిను డ్యాన్స్ చేయాలంటూ నామినేట్ చేశాడు. హర్భజన్ సింగ్ కూడా ఈ పాటకు నర్తించి తన భార్య గీతా బస్రాతో పాటు సచిన్‌కు కూడా సవాల్ విసిరాడు. ‘కరీబియన్ సంస్కృతిలోనే సంగీతం ఉంది. ప్రపంచంలోని చాలా మంది పేరున్న సంగీతకర్తలు ఇక్కడి నుంచి వచ్చారు. క్రికెట్‌తోనే కాకుండా నా అభిమానులను వినోదంతో కూడా ఆనందపరచాలనే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాను. చాంపియన్ ఇంత పెద్ద హిట్ అయి నా నమ్మకాన్ని నిలబెట్టింది’ అని బ్రేవో గర్వంగా చెప్పుకున్నాడు. మొత్తంగా ఆటతో పాటు విండీస్ పాట కూడా ఇప్పుడు సరికొత్త సంచలనంగా మారింది. ప్రముఖుల పేర్లతో... చాంపియన్’ పాటలో డ్యాన్స్ మొత్తం దాదాపు ఒకే తరహాలో సాగుతుంది. అది సునాయాసంగా కూడా ఉండటంతో చాలా మందికి ఎక్కేసింది. ఈ పాటలో బ్రేవో తనతో పాటు గేల్, పొలార్డ్, లారా, రిచర్డ్స్, మార్షల్‌లాంటి వెస్టిండీస్ ఆటగాళ్ల పేర్లు తీసుకున్నాడు. ఇతర క్రీడా రంగాలకు చెందిన సెరెనా, ఉసేన్ బోల్ట్, జోర్డాన్‌లను చాంపియన్లుగా ప్రస్తుతిస్తూ ఒబామా, మండేలాలాంటి ప్రపంచ ప్రముఖుల పేర్లు కూడా చేర్చాడు. ట్రినిడాడ్ వాళ్ళంతా చాంపియన్లే అని కూడా అతను లైన్‌ను చేర్చాడు. డ్వేవో ఎక్కడా బహిరంగంగా చెప్పకపోయినా... పరిశీలిస్తే ఈ పాటలో పేర్లన్నీ నల్ల జాతివారివే కనిపిస్తాయి. వారి గొప్పతనం చెప్పడం కూడా అతని ఉద్దేశం కావచ్చు. -
ఐపీఎల్లో ఎల్ఈడీ స్టంప్స్
న్యూఢిల్లీ: ఈ సీజన్ ఐపీఎల్ మ్యాచ్‌లు కొత్త వెలుగును సంతరించుకోనున్నాయి. టి20 ప్రపంచకప్‌లో వాడిన ఎల్ఈడీ స్టంప్స్‌ను తొలిసారి ఐపీఎల్‌లోనూ ఉపయోగిస్తున్నామని లీగ్ చైర్మన్ రాజీవ్ శుక్లాతెలిపారు. అలాగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో విండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో, మరికొంత మంది క్రికెటర్లు కలిసి ‘చాంపియన్ డాన్స్’ను స్టేజ్‌పై చేసి చూపించనున్నారు. -
విండీస్ కెప్టెన్ స్యామీకి అరుదైన గౌరవం
వెస్టిండీస్ జట్టుకు రెండుసార్లు టి20 ప్రపంచకప్ అందించినందుకు ఆ జట్టు కెప్టెన్ డారెన్ స్యామీకి అరుదైన గౌరవం లభించింది. అతడి సొంత దేశం సెయింట్ లూసియాలోని ప్రధాన క్రికెట్ స్టేడియానికి ఈ స్టార్ క్రికెటర్ పేరు పెట్టారు. ‘బ్యూసెజర్ క్రికెట్ మైదానాన్ని ఇకపై డారెన్ స్యామీ జాతీయ క్రికెట్ మైదానంగా పేరు మారుస్తున్నాం’ అని ఆ దేశ ప్రధాని కెన్ని. డి. ఆంథోని ప్రకటించారు. -
స్యామీపై విండీస్ బోర్డు ఆగ్రహం
► సమస్యల పరిష్కారానికి పిలుపు సెయింట్ జాన్స్/కోల్‌కతా: ప్రతిష్టాత్మక టి20 ప్రపంచకప్‌ను గెలుచుకున్నప్పటికీ ఆటగాళ్లకు, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసీబీ)కు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫైనల్ గెలిచిన అనంతరం తమ బోర్డు నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని కెప్టెన్ స్యామీ విమర్శలకు దిగిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలను విండీస్ బోర్డు తప్పుపట్టింది. స్యామీ విమర్శలకు దిగిన కొద్దిసేపటికే బోర్డు అధ్యక్షుడు డేవ్ కామెరూన్ ప్రకటన చేశారు. ‘బోర్డును రచ్చకీడ్చడం స్యామీకి సరికాదు. స్టేడియంలో స్యామీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిర్వాహకులకు క్షమాపణలు చెబుతున్నాను’ అని అన్నారు. అలాగే తమ మధ్య ఉన్న సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని ఆటగాళ్లకు పిలుపునిచ్చారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వేతన సమస్యలపై జూన్‌లో చర్చిస్తామని తెలిపారు. మరోవైపు తమ జట్టుకు విండీస్ బోర్డుకన్నా బీసీసీఐ మద్దతుగా నిలిచిందని ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో అన్నాడు. టైటిల్ గెలిచినా బోర్డు అధికారులు ఇప్పటికీ తమకు ఫోన్ చేయలేదని, అసలు టి20 ప్రపంచకప్ గెలవాలని వారు కోరుకోలేదని ఆరోపించాడు. నికోలస్ క్షమాపణలు వెస్టిండీస్ ఆటగాళ్లకు బుర్ర లేదని తన కాలమ్‌లో పేర్కొన్న ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మార్క్ నికోలస్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు తెలిపారు. ‘డారెన్ స్యామీకి, జట్టు ఆటగాళ్లకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను. నిజానికి ఆటగాళ్లకు బుర్ర లేదని నేను చెప్పలేదు. అయితే ఓ గొప్ప క్రికెట్ వారసత్వం కలిగిన విండీస్ గురించి అలాంటి అర్థం ధ్వనించేలా రాయాల్సింది కాదు’ అని నికోలస్ అన్నారు. -
మహిళల కొత్త చరిత్ర
► టి20 ప్రపంచకప్ టైటిల్ వెస్టిండీస్ సొంతం ► ఫైనల్లో ఆస్ట్రేలియాపై 8 వికెట్ల విజయం మహిళల క్రికెట్లో ఇదో సంచలనం. ఇన్నాళ్లూ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల గుత్తాధిపత్యంలా సాగిన టి20 ఫార్మాట్లో వెస్టిండీస్ మహిళలు కొత్త చరిత్ర సృష్టించారు. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను ఫైనల్లో చిత్తు చేసి తొలిసారి టైటిల్ సాధించారు. ఆస్ట్రేలియా స్కోరు 148... గెలిచేందుకు సరిపోయే స్కోరుకంటే తాము ఎక్కువగానే చేశామని ఆ జట్టు ప్లేయర్ విలాని చెప్పేసింది. తమతో పోలిస్తే బలహీనంగా కనిపిస్తున్న విండీస్‌ను కంగారూలు తక్కువగా అంచనా వేశారు. మొదటి మూడు ఓవర్లలో విండీస్ 9 పరుగులు చేయగానే సంబరపడి పట్టు సడలించారు. అంతే... ఆ తర్వాత మ్యాథ్యూస్, టేలర్‌ల సెంచరీ భాగస్వామ్యం కరీబియన్లను విశ్వవిజేతగా నిలపగా... నిరాశగా చూస్తుండటం మినహా ఆసీస్ ఏమీ చేయలేకపోయింది ఆదివారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఫైనల్లో విండీస్ 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. అనంతరం విండీస్ 19.3 ఓవర్లలో 2 వికెట్లకు 149 పరుగులు చేసి టోర్నీని చేజిక్కించుకుంది. వరుసగా గత మూడు వరల్డ్‌కప్‌లలో విజేతగా నిలిచి నాలుగో టైటిల్ మీద కన్నేసిన ఆసీస్‌కు భంగపాటు తప్పలేదు. మొదటి సారే ఫైనల్‌కు చేరినా... సమరోత్సాహం ప్రదర్శించిన విండీస్ ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించింది. కీలక భాగస్వామ్యం: ఆరంభంలోనే హీలీ (4)ను అవుట్ చేసి విండీస్ శుభారంభం చేసింది. అయితే విలాని (37 బంతుల్లో 52; 9 ఫోర్లు), కెప్టెన్ లానింగ్ (49 బంతుల్లో 52; 8 ఫోర్లు) కలిపి జట్టును నడిపించారు. ముఖ్యంగా దూకుడుగా ఆడిన విలాని 34 బంతుల్లోనే అర్ధ సెంచరీ నమోదు చేసింది. వీరిద్దరు రెండో వికెట్‌కు 10 ఓవర్లలో 77 పరుగులు జోడించారు. విలాని వెనుదిరిగినా... లానింగ్, పెర్రీ (23 బంతుల్లో 28; 2 సిక్సర్లు) కలిసి 34 బంతుల్లో 42 పరుగులు జోడించారు. అయితే చివర్లో కట్టడి చేసిన విండీస్ బౌలర్లు ఆఖరి 5 ఓవర్లలో 34 పరుగులే ఇవ్వడంతో ఆసీస్ స్కోరు 150 పరుగుల లోపే ఆగిపోయింది. ఆ ఇద్దరూ అదుర్స్: విండీస్ ఇన్నింగ్స్‌ను నెమ్మదిగానే ఆరంభించిన హేలీ మ్యాథ్యూస్ (45 బంతుల్లో 66; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ స్టెఫానీ టేలర్ (57 బంతుల్లో 59; 6 ఫోర్లు) ఆ తర్వాత జోరు పెంచారు. ఆసీస్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న వీరిద్దరు చక్కటి షాట్లతో దూసుకుపోయారు. ఈ జోడీని విడదీయడానికి ఆసీస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో ఏకంగా 120 పరుగులు జోడించిన అనంతరం ఎట్టకేలకు వికెట్ పడింది. 26 బంతుల్లో 29 పరుగులు చేయాల్సిన ఈ దశనుంచి విండీస్ వేగంగా విజయం వైపు దూసుకుపోయింది. లక్ష్యానికి చేరువైన తర్వాత టేలర్ కూడా అవుటైనా, డాటిన్ (12 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు) పని పూర్తి చేసింది. మ్యాథ్యూస్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలు వగా, టోర్నీలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టుకు టైటిల్ అందించిన స్టెఫానీ టేలర్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డును అందుకుంది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: హీలీ (సి) అండ్ (బి) మ్యాథ్యూస్ 4; విలాని (సి) టేలర్ (బి) టేలర్ 52; లానింగ్ (ఎల్బీ) (బి) మొహమ్మద్ 52; పెర్రీ (ఎల్బీ) (బి) డాటిన్ 28; బ్లాక్వెల్ (నాటౌట్) 3; ఆస్బోర్న్ (రనౌట్) 0; జొనాసెన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 148. వికెట్ల పతనం: 1-15; 2-92; 3-134; 4-147; 5-147. బౌలింగ్: కానెల్ 2-0-15-0; మ్యాథ్యూస్ 2-0-13-1; టేలర్ 3-0-26-0; డాటిన్ 4-0-33-2; ఫ్లెచర్ 1-0-9-0; మొహమ్మద్ 4-0-19-1; క్వింటైన్ 4-0-27-0. వెస్టిండీస్ ఇన్నింగ్స్: మ్యాథ్యూస్ (సి) బ్లాక్వెల్ (బి) బీమ్స్ 66; టేలర్ (సి) జొనాసెన్ (బి) ఫారెల్ 59; డాటిన్ (నాటౌట్) 18; కూపర్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (19.3 ఓవర్లలో 3 వికెట్లకు) 149. వికెట్ల పతనం: 1-120; 2-144. బౌలింగ్: జొనాసెన్ 4-0-26-0; పెర్రీ 3.3-0-27-0; షుట్ 3-0-26-0; ఫారెల్ 4-0-35-1; బీమ్స్ 4-0-27-1; ఆస్బోర్న్ 1-0-6-0. -
సిసలైన చాంపియన్
► టి20 ప్రపంచకప్ విజేత వెస్టిండీస్ ► ఫైనల్లో 4 వికెట్లతోఇంగ్లండ్పై విజయం ► రాణించిన శామ్యూల్స్ గెలిపించిన బ్రాత్‌వైట్ ► రెండో సారి టైటిల్ కైవసం కోల్‌కతా నుంచి సాక్షి క్రీడాప్రతినిధి:- వెస్టిండీస్ జట్టు మహాద్భుతం చేసింది. టి20 ప్రపంచకప్‌ను రెండో సారి గెలిచి చరిత్ర సృష్టించింది. తమకే సొంతమైన రీతిలో చివర్లో విధ్వంసకర బ్యాటింగ్ ప్రదర్శనతో అసలు సిసలు చాంపియన్‌లా ఆడి టైటిల్‌ను చేజిక్కించుకుంది. ఆదివారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన ఫైనల్లో వెస్టిండీస్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు చేసింది. జో రూట్ (36 బంతుల్లో 54; 7 ఫోర్లు), బట్లర్ (22 బంతుల్లో 36; 1 ఫోర్, 3 సిక్సర్లు) రాణించగా, బ్రాత్‌వైట్, బ్రేవోలకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం వెస్టిండీస్ 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులు చేసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మార్లోన్ శామ్యూల్స్ (66 బంతుల్లో 85 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు)కు తోడు బ్రాత్‌వైట్ (10 బంతుల్లో 34 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్సర్లు) చెలరేగి విండీస్‌ను జగజ్జేతగా నిలిపారు. 2012లో టైటిల్ నెగ్గిన విండీస్ రెండో సారి టి20 ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా నిలిచింది. రెండు సార్లూ కెప్టెన్ డారెన్ స్యామీనే కావడం విశేషం. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: ఆదుకున్న రూట్ పవర్‌లెస్ ప్లే ఫైనల్ మ్యాచ్ విండీస్ లెగ్‌స్పిన్నర్ బద్రీ సంచలన బౌలింగ్‌తో ప్రారంభమైంది. రెండో బంతికే అతను రాయ్ (0)ను క్లీన్‌బౌల్డ్ చేసి శుభారంభాన్ని అందించాడు. రసెల్ వేసిన తర్వాతి ఓవర్లో బౌండరీ కోసం ప్రయత్నించిన హేల్స్ (1) షార్ట్ ఫైన్‌లెగ్‌లో బద్రీకి సునాయాస క్యాచ్ ఇవ్వడంతో ఇంగ్లండ్‌కు షాక్ తగిలింది. టోర్నీలో ఘోరంగా విఫలమైన కెప్టెన్ మోర్గాన్ (5) అదే దారిలో నడిచాడు. మరో వైపు రూట్ నిలబడటంతో పవర్‌ప్లే ముగిసే సరికి జట్టు 33 పరుగులు చేయగలిగింది. ఆ ఐదు ఓవర్లు పవర్ ప్లే ముగిసిన తర్వాత రూట్, బట్లర్ దూకుడు ప్రదర్శించారు. వీరిద్దరి జోరు ఇంగ్లండ్‌ను కోలుకునేలా చేసింది. బెన్ బౌలింగ్‌లో బట్లర్ 3 భారీ సిక్సర్లు బాది సత్తా చాటాడు. దాంతో 7-11 మధ్య 5 ఓవర్లలో 10 రన్‌రేట్‌తో ఇంగ్లండ్ 50 పరుగులు చేసింది. మార్చేసిన బ్రేవో, బ్రాత్‌వైట్ నాలుగో వికెట్‌కు రూట్, బట్లర్ భాగస్వామ్యం 51 పరుగులకు చేరిన తర్వాత ఒక్కసారిగా ఇంగ్లండ్ పతనం మొదలైంది. జోరు మీదున్న బట్లర్... బ్రాత్‌వైట్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి డీప్‌లో బ్రేవోకు క్యాచ్ ఇచ్చాడు. మరో వైపు 33 బంతుల్లో రూట్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఈ దశలో బ్రేవో ఓవర్ ఇంగ్లండ్‌ను ముంచింది. అతను వేసిన నాలుగో బంతిని ఆడలేక స్టోక్స్ (13) సునాయాస క్యాచ్ అందించగా, చివరి బంతికి అలీ (0) వెనుదిరిగాడు. అప్పటి దాకా నిలకడగా ఆడుతూ వచ్చిన రూట్... బ్రాత్‌వైట్ ఓవర్లో స్కూప్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. 18 బంతుల వ్యవధిలో 27 పరుగులకే 4 వికెట్లు కోల్పోవడంతో ఇంగ్లండ్ పరిస్థితి మరింత దిగజారింది. చివర్లో విల్లీ (14 బంతుల్లో 21; 1 ఫోర్, 2 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో ఆఖరి 5 ఓవర్లలో ఇంగ్లండ్ 40 పరుగులు చేయగలిగింది. వెస్టిండీస్ ఇన్నింగ్స్: శామ్యూల్స్ పోరాటం రూట్ దెబ్బ... వెస్టిండీస్ ఇన్నింగ్స్ కూడా దాదాపు ఇంగ్లండ్‌లాగే సాగింది. విల్లీ తొలి ఓవర్లో ఒకే పరుగు ఇవ్వగా, అనూహ్యంగా రెండో ఓవర్ వేసిన రూట్ అద్భుత ఫలితం సాధించాడు. తొలి బంతినే భారీ షాట్ ఆడబోయి చార్లెస్ (1) మిడాన్‌లో చిక్కగా, మూడో బంతిని ఇదే తరహాలో ఆడి క్రిస్ గేల్ (4) క్యాచ్ ఇవ్వడంతో ఇంగ్లండ్ సంబరాలు మిన్నంటాయి. గత మ్యాచ్ హీరో సిమన్స్ (0) తొలి బంతికే ఎల్బీ కావడంతో విండీస్ కష్టాల్లో పడగా... జోర్డాన్ వేసిన ఆరో ఓవర్లో శామ్యూల్స్ 3 ఫోర్లు బాదడంతో పవర్‌ప్లే ముగిసే సరికి స్కోరు 37కు చేరింది. కొనసాగిన తడ‘బ్యాటు’ పవర్‌ప్లే తర్వాత విండీస్ నీరసించింది. కీపర్ పట్టుకున్న క్యాచ్ నేలను తాకడంతో అదృష్టవశాత్తూ అవుట్ కాకుండా బతికిపోయిన శామ్యూల్స్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అయితే ఇంగ్లండ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు పరుగులు తీయడమే కష్టంగా మారిపోయింది. ఎంత బలంగా బాదే ప్రయత్నం చేసినా బంతి ఫీల్డర్లను దాటిపోలేదు. 7-13 మధ్య 7 ఓవర్లలో 39 పరుగులే చేసిన ఆ జట్ట్టు కేవలం 3 ఫోర్లు మాత్రమే కొట్టింది. ఎట్టకేలకు 14వ ఓవర్లో ఒక భారీ సిక్స్ కొట్టిన బ్రేవో (27 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్) ఆ వెంటనే వెనుదిరిగాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 69 బంతుల్లో 75 పరుగులు జోడించారు. మరువలేని ఫినిషింగ్ 6 ఓవర్లలో 70 పరుగులు చేయాల్సిన దశలో ప్లంకెట్ ఓవర్లో శామ్యూల్స్ 2 సిక్సర్లు, ఫోర్ బాదడంతో 18 పరుగులు వచ్చాయి. అయితే విల్లీ చక్కటి బౌలింగ్‌కు తోడు ఇంగ్లండ్ అద్భుత ఫీల్డింగ్‌తో తర్వాతి ఓవర్లోనే రసెల్ (1), స్యామీ (2) వెనుదిరిగారు. 15-19 ఓవర్ల మధ్యలో విండీస్ 51 పరుగులు చేయగా... ఇక చివరి ఓవర్ విండీస్‌ను చరిత్రలో నిలబెట్టింది. ఆఖరి ఓవర్లో విజయానికి 19 పరుగులు కావలసి ఉండగా... స్టోక్స్ బౌలింగ్‌లో బ్రాత్‌వైట్ వరుసగా నాలుగు సిక్సర్లు బాది కొత్త చరిత్ర సృష్టించాడు. ఏడో వికెట్‌కు శామ్యూల్స్, బ్రాత్‌వైట్ 25 బంతుల్లో అజేయంగా 54 పరుగులు జత చేశారు. -
‘విధ్వంసం’ ఎవరిదో!
- బాదినోడే బాద్షా.. - టి20 ప్రపంచకప్ ఫైనల్ నేడు - వెస్టిండీస్‌తో ఇంగ్లండ్ అమీతుమీ పవర్ హిట్టింగ్‌కు పర్యాయపదం వెస్టిండీస్... సంప్రదాయక దూకుడుకు నిలువుటద్దం ఇంగ్లండ్... ప్రత్యర్థులు పటిష్టంగా ఉన్నా... పరిస్థితులు ప్రతికూలంగా మారినా... ఊహించని రీతిలో ఈ రెండు జట్లు టి20 ప్రపంచకప్‌లో జోరు చూపాయి భయం పుట్టించే భారీ షాట్లు.... అచ్చెరువొందే విన్యాసాలు... అనూహ్య మలుపులతో... బాదుడుకు మారుపేరుగా మారిన ఈ రెండు జట్లు ఇప్పుడు పొట్టి కప్‌లో ఫైనల్ సమరానికి సన్నద్ధమయ్యాయి. ఈడెన్ గార్డెన్స్‌లో నేడు (ఆదివారం) ఈ మ్యాచ్ జరగనుంది. ఇందులో ఎవరు గెలిచినా రెండోసారి ట్రోఫీని సాధించిన తొలి జట్టుగా రికార్డులకెక్కుతారు. బలం, బలహీనతల్లో రెండు జట్లూ సమానంగా ఉండటం విశేషం! కరీబియన్లకు గేల్ రాణించడం కీలకం. ఇంగ్లండ్ మాత్రం రాయ్, రూట్లను నమ్ముకుంది. టి20 ప్రపంచకప్ జరుగుతోంది భారత్‌లో... బ్యాటింగ్‌కు స్వర్గధామంలాంటి పిచ్‌లు, స్పిన్‌తో చెలరేగిపోయే బౌలర్లు... టోర్నీ ఇలాగే సాగుతుందని అంతా భావించారు. ఈ వికెట్లపై ఉపఖండపు జట్లకే అనుకూలత ఉంటుందని అంతా అనుకుంటే అలాంటి జట్టే లేకుండా తుది పోరు జరగబోతోంది. ఈ గడ్డపై ఒక్కసారి కూడా ఆడని 10 మందిని తీసుకొచ్చి కూడా ఇంగ్లండ్ ఫైనల్‌కు చేరితే... ఐపీఎల్ అనుభవాన్నంతా రంగరించి విండీస్ సత్తా చాటింది. సాంప్రదాయ, కళాత్మక ఆటను కాదు... ఇరు జట్లు దూకుడైన బ్యాటింగ్‌నే నమ్ముకున్నాయి. బౌలర్ ఎవరైనా, పిచ్ ఎలాంటిదైనా ఎదురుదాడితోనే ఫలితం సాధించాలనే తరహాలోనే ఆడాయి. అందుకే ఇతర జట్లను వెనక్కి తోసి ఈ రెండు టీమ్‌లు ఫైనల్‌కు చేరాయి. ఒకరిని మించి మరొకరు హిట్టర్లు ఉన్న జట్లలో చివరకు పైచేయి ఎవరిది...? ఎవరు విధ్వంసం సృష్టించి విశ్వాన్ని జయిస్తారో, ఎవరు విధ్వంసం బారిన పడతారో ఈడెన్‌లో నేడు తేలిపోనుంది. కోల్‌కతా ప్రపంచకప్ ఫైనల్‌కు చేరే క్రమంలో వెస్టిండీస్ జట్టు బ్యాట్స్‌మెన్ 36 సిక్సర్లు బాదితే... ఇంగ్లండ్ ఆటగాళ్లు 34 కొట్టారు. మరే జట్టు కూడా కనీసం 30 సిక్స్‌లు కొట్టలేదు. ఇది టోర్నమెంట్లో సరిగ్గా ఇరు ఫైనలిస్ట్‌ల శైలిని నిర్వచిస్తోంది. ఆటగాళ్ల గతానుభవంతో విండీస్ ఈ రీతిలో చెలరేగిపోగా... మారిపోయిన ఇంగ్లండ్ జట్టు కొత్తగా తమ ధాటిని ప్రదర్శించింది. పొట్టి ఫార్మాట్లో జగజ్జేతను నిర్ణయించే తుది పోరులో కూడా ఇప్పుడు ఇదే కనిపించబోతోంది. ఆదివారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగే టి20 ప్రపంచకప్ ఫైనల్లో వెస్టిండీస్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. 2010లో ఇంగ్లండ్, 2012లో వెస్టిండీస్ ఒక్కోసారి గెలిచాయి. ఇక్కడ విజయం సాధించే జట్టు రెండోసారి టైటిల్ గెలిచిన మొదటి జట్టుగా ఘనత సాధిస్తుంది. స్టార్లు వీరే: ఇంగ్లండ్ ప్రధానంగా జేసన్ రాయ్ బ్యాటింగ్‌ను నమ్ముకుంది. ఈ టోర్నీలో ఆ జట్టు తరఫున వెలుగులోకి వచ్చిన కొత్త స్టార్ అతను. బట్లర్, హేల్స్ ధాటిగా ఆడుతుండగా, జో రూట్ అద్భుతమైన ఫామ్‌తో నిలకడ చూపిస్తున్నాడు. టోర్నీలో మూడు మ్యాచ్‌లలో ఆ జట్టు భారీ స్కోర్లు నమోదు చేసింది. వెస్టిండీస్ తరఫున క్రిస్ గేల్ గురించి కొత్తగా చెప్పాల్సింది లేకపోయినా, సెమీస్‌తో సిమన్స్, రసెల్, చార్లెస్ కూడా తామేంటో చూపించారు. బ్రేవో, స్యామీ కూడా రాణిస్తే తిరుగుండదు. విండీస్ స్పిన్నర్ బద్రీ మినహా ఇరు జట్ల తరఫున బౌలర్ల నుంచి చెప్పుకోదగ్గ గొప్ప ప్రదర్శనలేమీ రాలేదు . కెప్టెన్లు విఫలం: తమ జట్లను నడిపించడంలో ఇరువురు కెప్టెన్లు విజయవంతమయ్యారు గానీ వ్యక్తిగతంగా జట్టుకు ఏమీ చేయలేకపోయారు. కేవలం 11 బంతులే ఆడిన స్యామీ 2 ఓవర్లే బౌలింగ్ చేశాడు. మోర్గాన్ అయితే రెండు సార్లు తొలి బంతికే అవుటయ్యాడు. అయితే ఇప్పటికే కెప్టెన్‌గా ఒక ప్రపంచకప్‌ను అందించిన స్యామీ, దిగ్గజం లాయిడ్ సరసన నిలవాలని భావిస్తుండగా... ఏడాది క్రితం బాధ్యతలు తీసుకొని ఇంగ్లండ్‌ను మార్చిన మోర్గాన్ టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉన్నాడు. ఇంగ్లండ్ సహాయక సిబ్బందిలో ఉన్న కాలింగ్‌వుడ్ (2010లో ఇంగ్లండ్‌ను గెలిపించిన కెప్టెన్) తనకు స్ఫూర్తి అని అతను చెప్పుకొచ్చాడు. మాకు బుర్ర లేదంటారా... ఐపీఎల్ వల్ల కావచ్చు... లేదంటే వెస్టిండీస్ క్రికెటర్లు మైదానంలో చేసే సందడి కావచ్చు... కారణం ఏదైనా భారత్‌లో వెస్టిండీస్ జట్టుకు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. కరీబియన్ క్రికెటర్లు కూడా భారత అభిమానులతో చాలా స్నేహంగా ఉంటారు. అయితే భారత్‌తో సెమీస్ విజయం తర్వాత ఓ మీడియాలో వచ్చిన వ్యాఖ్య వారిని బాధించింది. వాళ్లు ఆడే షాట్ల గురించి చెబుతూ ‘బుర్ర తక్కువవారు’ అనే వ్యాఖ్య వచ్చింది. దీనిపై స్యామీ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఎవరైనా తోటి మనుషులను బుర్ర లేనివారని ఎలా అంటారు. ఇది మమ్మల్ని చాలా బాధించింది. ఎన్నో ఘటనలు జరిగినా ఆటపై ప్రేమతోనే మేం ఇంత బాగా ఆడగలుగుతున్నాం. మా మనసులు కూడా అందమైనవి కాబట్టి దేవుడు మా పక్షానే ఉండి ఇంత గొప్ప క్రికెట్ ఆడిస్తున్నాడు’ అని స్యామీ వ్యాఖ్యానించాడు. 29 ఏళ్ల తర్వాత... ఇంగ్లండ్ జట్టు ఒక ఐసీసీ టోర్నీ ఫైనల్ కోల్‌కతాలో ఆడటం ఇది రెండో సారి. గతంలో 1987 రిలయన్స్ వన్డే వరల్డ్ కప్‌లో ఆ జట్టు ఆసీస్ చేతిలో 7 పరుగులతో ఓడింది. 254 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 2 వికెట్లతో 135 పరుగులతో పటిష్టంగా కనిపించిన ఇంగ్లండ్... మైక్ గ్యాటింగ్ అనాలోచిత రివర్స్ స్వీప్‌తో పతనమైంది. దేశం గుండె బద్దలైంది. ఇన్నాళ్ల తర్వాత మరో ఫార్మాట్లో ఈడెన్‌లో ఫైనల్ ఆడబోతోంది. జట్ల బలాబలాల గురించి ఎంతగా చెప్పుకున్నా... చివరకు అసలు బలం కనిపించేది అంకెల్లోనే. ఫైనల్లోకి అడుగు పెట్టే ముందు ఇరు జట్ల ప్రదర్శన ఎలా ఉందంటే... ⇒భారత్‌లో ఇరు జట్లు ఒక్క సారి మాత్రమే తలపడ్డాయి. అది ఈ టోర్నీ లీగ్ దశలోనే. 182 పరుగులు చేసి ఇంగ్లండ్ సంబరపడినా... క్రిస్ గేల్ (48 బంతుల్లో 100 నాటౌట్) సునామీతో విండీస్ 6 వికెట్లతో నెగ్గింది. ⇒వెస్టిండీస్ ఈ ప్రపంచకప్‌లో ఐదు మ్యాచ్‌లలోనూ టాస్ గెలవడం విశేషం. ఐదు సార్లు లక్ష్యాన్ని ఛేదించడాన్నే ఇష్టపడినా, అప్ఘన్ షాకిచ్చింది. గత ఐదు టి20 ప్రపంచకప్ ఫైనల్స్‌లో 4సార్లు టాస్ గెలిచిన జట్టుకే గెలుపు దక్కింది. ⇒ఇరు జట్ల మధ్య 13 టి20 మ్యాచ్‌లు జరిగితే వెస్టిండీస్ 9 గెలిచి 4 ఓడింది. వరల్డ్ కప్‌లోనైతే 4 సార్లూ విండీస్‌దే విజయం. టి20 చరిత్రలో విండీస్ ఇన్ని మ్యాచ్‌లు మరే జట్టుపై గెలవలేదు. ఇంగ్లండ్ ఇన్ని సార్లు ఎవరి చేతిలోనూ ఓడిపోలేదు. రెండు జట్లు ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి. ⇒టోర్నీలో ఇంగ్లండ్ జట్టు మాత్రమే ఓవర్‌కు తొమ్మిదికి పైగా పరుగులు చేసింది. ఆ జట్టు 9.12 రన్‌రేట్‌తో దూసుకువచ్చింది. విండీస్ 7.78 రన్‌రేట్‌తో పరుగులు చేయగలిగింది. ⇒ఇంగ్లండ్ బౌలింగ్ 8.68 ఎకానమీ రేట్‌తో అన్ని జట్లకంటే చెత్త ప్రదర్శన నమోదు చేసింది. కాగా విండీస్ ఎకానమీ రేట్ 7.41. ⇒భారత్‌పై గెలుపులో భారీ షాట్లతోనే సత్తా చాటిన విండీస్ ఈ టోర్నీలో పెద్ద సంఖ్యలో డాట్ బాల్స్ (45.44 శాతం) ఆడిన జట్టుగా నిలిస్తే, ప్రత్యర్థి ఇంగ్లండ్ (33.85 శాతం) అతి తక్కువ డాట్ బాల్స్ ఆడింది. ⇒విండీస్ టోర్నీలో తమ స్పిన్నర్లను కూడా బాగా నమ్ముకుంది. బద్రీ, బెన్ బాగా ప్రభావం చూపించగలిగారు. ఆ జట్టు స్పిన్నర్ల ఎకానమీ రేట్ 5.73 అద్భుతంగా ఉంది. ఇంగ్లండ్ ఎంతో ఆశలు పెట్టుకున్న ఆ జట్టు స్పిన్నర్లు అలీ, రషీద్ ఘోరంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ స్పిన్నర్లు అందరికంటే చెత్తగా 9.36 ఎకాన మీతో పరుగులిచ్చారు. ⇒ వెస్టిండీస్‌లో హిట్టర్లకు కొదవ లేకున్నా చివరి వరకు ధాటిగా పరుగులు చేయగల బ్యాట్స్‌మెన్ ఇంగ్లండ్‌కూ ఉన్నారు. టోర్నీలో 15-20 ఓవర్ల మధ్య అన్ని జట్లకంటే వేగంగా ఇంగ్లండ్ (ఓవర్‌కు 12.27) పరుగులు సాధించడం విశేషం. అదే బౌలింగ్‌లో 15-20 ఓవర్ల మధ్య ఇంగ్లండ్ బౌలర్ స్టోక్స్ తరహాలో 50 శాతం డాట్ బాల్స్ ఎవరూ వేయలేకపోయారు. ⇒టోర్నీలో వెస్టిండీస్ అత్యధికంగా 65.34 శాతం పరుగులు బౌండరీల ద్వారా సాధిస్తే, ఇంగ్లండ్ 62.93 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్న ఈ బౌండరీల జోరే వారిని ఫైనల్ చేర్చిందంటే అతిశయోక్తి కాదు. పిచ్, వాతావరణం మ్యాచ్‌కు ముందు రోజు ఇంగ్లండ్ వచ్చినప్పుడు పిచ్‌పై కాస్త పచ్చిక కనిపించినా... ఐసీసీ పిచెస్ చీఫ్ అట్కిన్సన్ సూచనలతో బాగా రోలింగ్ జరిగింది. సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలించే వికెట్. స్పిన్ కాస్త ప్రభావం చూపించవచ్చు. అయితే మంచు కారణంగా టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది. ఆదివారం వర్ష సూచన ఉంది. ఒకవేళ అంతరాయం కలిగినా ఫైనల్‌కు రిజర్వ్ డే ఉంది. మా జట్టులో ఆత్మవిశ్వాసం, పట్టుదల పెరిగాయి కాబట్టి మళ్లీ టైటిల్ గెలుస్తామనే నమ్మకం మాలో చాలా మందికి ఉంది. ఇంగ్లండ్ ఆటతీరును బాగా పరిశీలించాం. వారు బాగా ఆడగలరు కాబట్టే ఫైనల్‌కు వచ్చారు. ఆటగాళ్లందరి ప్రదర్శనను విశ్లేషించి సిద్ధంగా ఉన్నాం. మాతో ఓడిన తర్వాత ఆ జట్టు ఆట మరింత మెరుగైంది. ఆదివారం మా లక్ష్యం నెరవేరి కరీబియన్లు అందరికీ ఆనందం పంచాలనేదే మా కోరిక. మా అంతట మేం ఓడాల్సిందే కానీ ఎవరూ మమ్మల్ని ఓడించలేరనే నమ్మకంతో బరిలోకి దిగుతున్నాం. - స్యామీ సెమీ ఫైనల్ మ్యాచ్‌కు ముందు కూడా మేం ఇదే తరహాలో ఒత్తిడిని ఎదుర్కొన్నాం. అయితే ఆటగాళ్లంతా దానిని అధిగమించి అద్భుతంగా ఆడారు. ఇది ఏ రకంగా చూసినా సాధారణ మ్యాచ్ కాదు. గత ఏడాది కాలంగా కొత్త తరహాలో ఆడుతూ జట్టుగా మారి మేం పడిన శ్రమను సరైన చోట ప్రదర్శించాల్సిన సమయం వచ్చింది. వరల్డ్ కప్ గెలిస్తే మా అందరి కల నెరవేరినట్లే. -మోర్గాన్ -
ఒకరి కోసం మరొకరు..!
► ఒక్క అడుగు దూరంలో ‘మిషన్’ ► కరీబియన్ క్రికెట్లో కొత్త కళ కోల్‌కతానుంచి సాక్షి క్రీడా ప్రతినిధి :- క్రమశిక్షణ పేరుతో ఏడాది క్రితం ఇద్దరి ఆటగాళ్లపై వేటు... టెస్టు క్రికెట్ పరిస్థితి చూస్తే అధ్వాన్నం... బోర్డుకు, క్రికెటర్లకు మధ్య సు దీర్ఘ కాలంగా తెగని సమస్యలు... డబ్బులు దక్కని పరిస్థితుల్లో టోర్నీకి దూరమయ్యేం దుకు కూడా సిద్ధమైన ఆటగాళ్లు... అంతా గందరగోళం... టి20 ప్రపంచకప్ ఆరంభానికి ముందు వెస్టిండీస్ పరిస్థితి ఇది. అందుకే వ్యక్తిగతంగా చాలామంది టి20 స్టార్స్ ఉన్నా జట్టుగా కరీబియన్ల మీద ఎవరికీ అంచనాలు లేవు. కానీ భారత్‌ను సెమీస్‌లో ఓడించాక ఆ జట్టు మీద మరింత గౌరవం పెరిగింది. చాంపియన్ పాట నాలుగేళ్ల క్రితం శ్రీలంకలో జరిగిన టి20 ప్రపంచకప్‌లో గంగ్నమ్ స్టైల్ డ్యాన్స్‌తో వెస్టిండీస్ క్రికెటర్లు సందడి చేశారు. అనూహ్యంగా, అంచనాలకు అందకుండా రాణించి ఆ టైటిల్ గెలిచిన కరీబియన్లు ఒక రకంగా క్రికెట్ అభిమానుల్లో గంగ్నమ్ పాటకు క్రేజ్ పెంచారు కూడా. ఆ తర్వాత బంగ్లాదేశ్‌లో 2014లో విఫలమైన స్యామీ సేనపై ఈసారి కూడా టోర్నీ ఆరంభానికి ముందు అంచనాలు లేవు. అసలు ఈ ఏడాది ఈ జట్టు ఒక్క అంతర్జాతీయ టి20 కూడా ఆడలేదు. జట్టును ప్రకటించడానికి కూడా బోర్డు పలుసార్లు ఆలోచించింది. కాంట్రాక్టు వివాదంతో అసలు తాము వెళ్లమని సీనియర్లంతా బోర్డుతో గొడవపెట్టుకున్నట్లు ప్రచారం జరిగింది. ‘కొన్ని ఘటనలు జరిగి ఉండకపోతే మేం జట్టుగా ఇంతలా కలిసిపోయేవాళ్లం కాదేమో. టోర్నీకి ముందు కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. మా జట్టును ఎవరూ గౌరవించలేదు. ఇలాంటి ఘటనలతో అందరం ఒక్కటయ్యాం. ఒకరికోసం ఒకరనే మంత్రం జపించాం. అలాగే మేం సాధించగలం అనే నమ్మకాన్ని ఎప్పుడూ వీడలేదు. అదిప్పుడు ఆటలో కనిపిస్తోంది’ అని కెప్టెన్ స్యామీ ఉద్వేగంగా చెప్పాడు. ఇప్పుడు బ్రేవో పాట ‘చాంపియన్’ వారికి జాతీయగీతంలా మారిపోయింది. మైదానంలో వారి జోష్, సంబరాలు మరే జట్టుకు సాధ్యం కాని విధంగా సాగుతున్నాయి. తమను చిత్తు చేసిన చిన్న జట్టు అఫ్ఘానిస్తాన్‌తో కూడా ఆడిపాడగలగడం కరీబియన్లకే సాధ్యం. ఒకటే లక్ష్యం... మేం ఒక మిషన్‌తో భారత్ వచ్చాం అని పదే పదే స్యామీ చెబుతున్నాడు. ఆ మిషన్ కచ్చితంగా ప్రపంచకప్ టైటిల్. ఇక దీనిని అందుకోవడానికి అడుగు దూరంలో ఉన్నారు. అయితే ఫైనల్ ప్రత్యర్థి ఇంగ్లండ్ కూడా బలంగానే ఉంది. కానీ ప్రత్యర్థి ఎవరనే ఆలోచన ఎప్పుడూ వెస్టిండీస్‌కు ఉండదు. మా జట్టులో 15 మందీ మ్యాచ్ విన్నర్లే అని పదే పదే కెప్టెన్ చెప్పినా... అందరి చూపూ ప్రతిసారీ గేల్ మీదే ఉంటోంది. ఈ టోర్నీలో గేల్ విఫలమైన మూడు మ్యాచ్‌ల్లోనూ విండీస్ గెలిచింది. ముఖ్యంగా సెమీస్‌లో తీవ్ర ఒత్తిడిలో భారత్‌పై సిమన్స్, రసెల్, చార్లెస్ ఆడిన తీరు... ఆ జట్టులో అందరూ చాంపియన్లే అనే కెప్టెన్ నమ్మకానికి ప్రతీక. తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో అఫ్ఘానిస్తాన్ చేతిలో ఓడినా... భారత్‌తో ఆడిన తీరు చూస్తే సరైన సమయంలో గాడిలో పడ్డట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది వెస్టిండీస్ అండర్-19 ప్రపంచకప్ గెలవడం, మహిళల జట్టు కూడా టి20 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరడం చూస్తే ఇది వెస్టిండీస్ సీజన్‌లా ఉంది. ‘మేం ఒకరకంగా ప్రపంచం అందరితో ఏకకాలంలో పోరాడుతున్నాం. మా విజయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. టైటిల్ గెలిస్తే మాకు కలిగే ఆనందంతో పోలిస్తే ఏ ఇతర జట్టు గెలిచినా వారికి అంతటి సంతోషం దక్కదు’ అని స్యామీ చెప్పే మాటల్లో వాస్తవం ఉంది. ఎందుకంటే ఇప్పుడు విండీస్ విజ యాన్ని ఆస్వాదించేందుకు ఆ దేశం బయట కూడా పెద్ద సంఖ్యలో జట్టుకు అభిమానులు ఉన్నారు. మరి చాంపియన్ పాట ఫైనల్ తర్వాత కూడా అదే మోత మోగిస్తుందా?. -
కోహ్లి మినహా.....
క్రికెట్ జట్టుగా ఆడాల్సిన ఆట. వ్యక్తుల వల్ల కొన్ని మ్యాచ్‌లు గెలవచ్చు. కానీ జట్టుగా ఆడితే ప్రతి మ్యాచ్ గెలవొచ్చు. టి20 ప్రపంచకప్‌లో భారత్ జట్టులో ప్రధాన లోపం కూడా ఇదే. సచిన్ టెండూల్కర్ అంతటి దిగ్గజం కూడా ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ ఆడినా జట్టు నుంచి సహకారం లేక చాలాసార్లు నిరాశ చెందాడు. ఇప్పుడు కోహ్లి విషయంలోనూ అదే జరిగింది. ఒంటిచేత్తో భారత జట్టు భారాన్ని మోశాడు. అయినా మిగిలిన సహచరులు విఫలమయ్యారు. ఓడింది రెండు మ్యాచ్‌లే కదా... సెమీఫైనల్‌కు వచ్చారు కదా... అనే సంతృప్తి మనలో చాలా మందికి ఉండొచ్చు. కానీ సెమీస్‌కు చేరడానికి కూడా ఓ యోధుడి పోరాటం మాత్రమే కారణమని గుర్తించాలి. నిజానికి సెమీస్‌లో బ్యాటింగ్ పిచ్‌పై మినహాయిస్తే... టోర్నీలో అన్నీ స్లో వికెట్లపై కోహ్లి మినహా ఏ ఒక్క బ్యాట్స్‌మన్ కూడా సరిగా ఆడలేదు. ఏమైనా... వ్యక్తి మీద ఆధారపడితే జరిగే నష్టానికి ఈ టి20 ప్రపంచకప్‌లో భారత ప్రదర్శన పెద్ద ఉదాహరణ. ముంబై నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి :- టి20 ప్రపంచకప్ కోసం భారత్‌కంటే గొప్పగా ఎవరూ సిద్ధం కాలేదు. టోర్నీకి ముందు ఏకంగా 11 వరుస మ్యాచ్‌లు ధోని సేన ఆడింది. అందులో ఒకటే పరాజయం. వరుసగా రెండు సిరీస్‌లు, ఒక టోర్నీ నెగ్గింది. దాంతో ఆశలు, అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అదీ సొంతగడ్డపై ఆడుతుండటంతో... నిస్సందేహంగా 90 శాతంకు పైగా విశ్లేషకులు విజేత స్థానానికి భారత్‌కు ఓటు వేశారు. కానీ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమితోనే ‘డేంజర్ బెల్’ మోగింది. భారత జట్టు తమ సొంతగడ్డపై ఇంత పేలవంగా, అదీ స్పిన్‌కు తలవంచడం అసలు ఎప్పుడు జరిగిందో ఎవరికీ గుర్తుండకపోవచ్చు. స్థాయికి తగ్గట్లుగా ఆడలేదు చావో రేవో మ్యాచ్... సాధారణంగా ఏదో ఒక పరిస్థితుల్లో ఇలాంటి మ్యాచ్ ఆడాల్సి వస్తుంది. కానీ మనకు మాత్రం ప్రతీ మ్యాచ్ అలాగే మారిపోయింది. గెలిస్తేనే టోర్నీలో నిలవాల్సిన స్థితిలో ఒక్కో గండం దాటాం. ఈ మూడు మ్యాచ్‌లలోనూ మన బ్యాటింగ్ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. 90ల్లో సచిన్ టెండూల్కర్ ఏకవీరుడిలా పోరాటం చేయడం, మిగతా జట్టు విఫలమై ఓటమిని ఆహ్వానించడం రివాజుగా ఉండేది. ఇప్పుడు సరిగ్గా అదే తరహాలో కాకపోయినా విరాట్ కోహ్లికి, ఇతర బ్యాట్స్‌మెన్‌కు మధ్య హస్తిమశకాంతరం ఉంటోంది. లీగ్ దశలో టాప్-5లో ఇతర నలుగురు కలిపి చేసిన పరుగులకంటే విరాట్ ఒక్కడే ఎక్కువ పరుగులు చేశాడు. సరిగ్గా చెప్పాలంటే పాక్‌తో, ఆసీస్‌తో మ్యాచ్‌లను కోహ్లి ఒంటి చేత్తో గెలిపించాడు. అతను తప్ప వాటిలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. పిచ్‌లు మరీ నిస్సారంగా హైవేల తరహాలో ఉండి, పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తేనే మన బ్యాట్స్‌మెన్ పండగ చేసుకుంటారని, రికార్డులు కొల్లగొట్టగలరని ఈ ప్రదర్శనతో రుజువైంది. లేకపోతే సొంతగడ్డపై మన మెరుపు వీరులు ఇంతగా విఫలమవుతారని అసలు ఎవరైనా ఊహించగలరా. రోహిత్, ధావన్, రైనా... ముగ్గురు ఒకరితో ఒకరు పోటీ పడి పెవిలియన్‌కు చేరారు తప్ప సాధికారిక ఇన్నింగ్స్ ఆడలేదు. యువరాజ్ అయితే ఎప్పుడో కళ తప్పినా, తన గతాన్ని నమ్ముకొనే ఇన్ని రోజులుగా కొనసాగుతున్నట్లుగా అనిపించింది. బంగ్లాదేశ్ చేతకానితనం మనకు పరుగు తేడాతో గెలుపు అందించింది కానీ లేదంటే 145 పరుగులు చేసినప్పుడే కథ ముగిసేది. ధోని వికెట్ల మధ్య పరుగు, ఫిట్నెస్ను చూపించి మరికొంత కాలం ఆడగలడనే నమ్మకాన్ని అభిమానుల్లో పెంచాడు. కానీ టి20 తరహాలో అతను ఓ గొప్ప ఇన్నింగ్స్ ఆడి ఎన్నాళ్లయింది. టోర్నీలో 70 బంతులు ఆడితే రెండంటే రెండు సిక్సర్ల కొట్టగలిగాడంటే అది ధోని శైలి ఏమాత్రం కాదు. టి20ల్లో దూకుడుగా ఆడగల బ్యాట్స్‌మెన్‌తో నిండిన లైనప్ ఒక్కసారి కూడా స్థాయికి తగ్గట్లుగా ఆడలేదు. జట్టు మొత్తం తరఫున 3 అర్ధ సెంచరీలు మాత్రమే నమోదు కాగా, అవన్నీ కోహ్లివే. అంతంత మాత్రంగానే... సొంతగడ్డపై ప్రపంచకప్‌లో భారత్ ప్రధాన ఆయుధం అశ్విన్ అవుతాడనే అంతా భావించారు. ఏ షేన్‌వార్న్, మురళీధరన్ తరహాలో జట్టు బౌలింగ్‌కు నాయకత్వం వహించి టోర్నీని గెలిపించగల సత్తా అతనిలో ఉందని నమ్మారు. అదేంటో 5 మ్యాచ్‌లలో కలిపి అతను 15 ఓవర్లు మాత్రమే వేశాడు. కెప్టెన్ ఎంతో నమ్ముకున్న బౌలర్ కూడా పూర్తి కోటా వేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో అప్పటికి 2 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చినా... ఆఖరి ఓవర్లో అశ్విన్‌ను కాదని కోహ్లితో బౌలింగ్ చేయించడం చూస్తే... అశ్విన్‌పై కెప్టెన్‌కు నమ్మకం పోయిందా అనిపించింది. ఆస్ట్రేలియా గడ్డపై మొదలు ఆసియా కప్ వరకు వరుస విజయాలు సాధించడంతో భారత బౌలింగ్ తిరుగు లేనిదిగా కనిపించింది. సీనియర్ నెహ్రా, జూనియర్ బుమ్రా కాంబినేషన్... అశ్విన్, జడేజా జోడీతో ఇక జట్టులో మార్పులే అవసరం లేదని పరిస్థితి కొనసాగింది. కానీ ప్రపంచకప్ వచ్చేసరికి మాత్రం బౌలింగ్ సాదాసీదాగా కనిపించింది. పరుగులు నియంత్రించడంలో అప్పుడప్పుడు సఫలమైనా, వికెట్లు తీయడంలో మాత్రం అందరూ విఫలమయ్యారు. మ్యాచ్‌ను మ లుపు తిప్పే ఒక్క బౌలింగ్ ప్రదర్శన కూడా లేకపోయింది. నెహ్రా ఒక్కడే 6 లోపు ఎకానమీతో అత్యధికంగా 5 వికెట్లు పడగొట్టగా... మ్యాచ్‌లో ఒక్కసారి కూడా ఏ బౌలర్ కనీసం 3 వికెట్లు తీయలేకపోయారు. టోర్నీ ముందు వరకు తిరుగు లేకుండా ఉన్న బౌలింగ్ విభాగం, అసలు సమయంలో మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. వ్యూహం విఫలమైందా... పాకిస్తాన్, ఆస్ట్రేలియాలతో మ్యాచ్‌లలో ధోని కొత్త ఆలోచనలు అద్భుతమైన ఫలితాలు ఇవ్వగా, బంగ్లాదేశ్‌తో అయితే చివరి మూడు బంతుల ద్వారా కెప్టెన్‌గా తన స్థాయిని తానే మరింత పెంచుకున్నాడు. కానీ వెస్టిండీస్‌తో పరాజయానికి అతను నోబాల్స్‌తో పాటు మంచును కారణంగా చూపించడం కాస్త ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే వాంఖడే మైదానం ఆదినుంచి భారీ పరుగుల వేదిక, పైగా చిన్న గ్రౌండ్ కాబట్టి 200 పరుగుల స్కోరు కూడా అంత పెద్దదేం కాదనే విషయం ధోనికి కూడా తెలుసు. వెస్టిండీస్ పవర్ హిట్టర్ల గురించి అంచనా ఉంది. కాబట్టి మరిన్ని పరుగులు చేయాల్సింది. ఆసీస్‌తో పని చేసింది కదాని సింగిల్స్, డబుల్స్ వ్యూహంతో పరుగులు తీయడం బెడిసి కొట్టింది. పరుగు చూడటానికి సరదాగానే ఉంది కానీ... ఇంకెప్పుడూ కొడతారు బాబూ అనేట్లుగా కూడా అనిపించింది. చేతిలో ఎనిమిది వికెట్ల ఉన్నప్పుడు మరిన్ని భారీ షాట్లు ఆడకుండా పరుగెత్తడం అప్పటికి ఏమీ కనిపించకపోయినా చివర్లో అదే ప్రభావం చూపించింది. ఒక సిక్సర్ రావాల్సిన బంతికి రెండుతోనే సరిపెట్టడంతో లెక్క మారిపోయింది. ధోని ఇప్పటికి భారత్‌కు చాలా విజయాలు అందించాడు. అతని మాటలను బట్టి చూస్తే ఇంకా కొనసాగి మున్ముందు కూడా గెలిపించవచ్చు కూడా. కానీ స్వదేశంలో 2011 వన్డే వరల్డ్‌కప్ తరహాలోనే మరో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో అతను సొంతగడ్డపై మళ్లీ విశ్వ విజేతగా నిలుపుతాడని ఆశించిన అభిమానులకు మాత్రం టి20 ప్రపంచకప్ ఒక చేదు అనుభవం. -
కరీబియన్ మహిళలు తొలిసారి...
► ప్రపంచకప్ ఫైనల్లో వెస్టిండీస్ ► సెమీస్‌లో 6 పరుగులతో న్యూజిలాండ్ ఓటమి ముంబై నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి: టి20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ మహిళల జట్టు తొలిసారిగా ఫైనల్లోకి ప్రవేశించింది. అంచనాలకు మించి రాణించిన ఆ జట్టు గురువారం ఇక్కడ జరిగిన రెండో సెమీ ఫైనల్లో పటిష్టమైన న్యూజిలాండ్‌పై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. బ్రిట్నీ కూపర్ (48 బంతుల్లో 61; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీతో చెలరేగగా, స్టెఫానీ టేలర్ (26 బంతుల్లో 25; 2 ఫోర్లు) రాణించింది. కివీస్ బౌలర్లలో సోఫీ డెవిన్ 22 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టింది. అనంతరం న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. సారా మెక్‌గ్లాషన్ (30 బంతుల్లో 38; 2 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. సాటర్‌వెయిట్ (24), డెవిన్ (22) ఫ ర్వాలేదనిపించారు. స్టెఫానీ టేలర్‌కు 3 వికెట్లు దక్కా యి. విండీస్ చక్కటి బౌలింగ్, అద్భుత ఫీల్డింగ్‌తో కివీస్‌ను కట్టి పడేసింది. ఆదివారం కోల్‌కతాలో జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో వెస్టిండీస్ తలపడుతుంది. -
‘రాయ్’ల్గా... ఫైనల్‌కి
► సెమీస్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్ ► చెలరేగిన రాయ్, బట్లర్ ► టి20 ప్రపంచకప్ ఐపీఎల్ జట్లు తమను తీసుకోలేదన్న కసితో ఉన్నారేమో... భారత గడ్డపై ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ప్రతి మ్యాచ్‌లోనూ విశ్వరూపం చూపిస్తున్నారు. టోర్నీలో నిలకడగా విజయాలు సాధిస్తూ వచ్చిన బలమైన ప్రత్యర్థి న్యూజిలాండ్‌కు సెమీఫైనల్లో చుక్కలు చూపించారు. ఓపెనర్ జాసన్ రాయ్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో... న్యూజిలాండ్‌పై అలవోకగా నెగ్గిన ఇంగ్లండ్ రెండోసారి టి20 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది. న్యూఢిల్లీ: లీగ్ దశలో ఎంత ప్రతిభ చూపినా.... నాకౌట్ మ్యాచ్‌ల్లో మాత్రం న్యూజిలాండ్‌ను దురదృష్టం వెంటాడుతూనే ఉంది. గతేడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓడిన కివీస్... ఈసారి టి20 ప్రపంచకప్‌ను సెమీస్‌తోనే ముగించింది. ఈ టోర్నీలో అజేయశక్తిలా దూసుకుపోతున్న న్యూజిలాండ్‌ను సెమీఫైనల్లో ఇంగ్లండ్ ఏడు వికెట్లతో చిత్తు చేసింది. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 153 పరుగులు చేసింది. మున్రో (32 బంతుల్లో 46; 7 ఫోర్లు, 1 సిక్స్), విలియమ్సన్ (28 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. తర్వాత ఇంగ్లండ్ 17.1 ఓవర్లలో 3 వికెట్లకు 159 పరుగులు చేసి నెగ్గింది. జాసన్ రాయ్ (44 బంతుల్లో 78; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సంచలన ఆరంభం ఇవ్వగా... బట్లర్ (17 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) వేగంగా ముగించాడు. ఆఖర్లో తడబాటు న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగిన గప్టిల్ (12 బంతుల్లో 15; 3 ఫోర్లు) మూడో ఓవర్లోనే పెవిలియన్‌కు చేరినా... విలియమ్సన్, మున్రోలు చెలరేగిపోయారు. ఈ ఇద్దరి జోరుతో తొలి 10 ఓవర్లలో కివీస్ స్కోరు 89/1కు చేరింది. అయితే 11వ ఓవర్లో విలియమ్సన్ అవుట్‌కావడంతో రెండో వికెట్‌కు 8.2 ఓవర్లలో 74 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత అండర్సన్ (23 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడినా.... 14వ ఓవర్లో మున్రోను అవుట్ చేసి ఇంగ్లిష్ బౌలర్లు ట్రాక్‌లోకి వచ్చారు. 16 ఓవర్లలో 133/3 స్కోరుతో పటిష్టస్థితిలో ఉన్న కివీస్‌ను నాణ్యమైన బౌలింగ్‌తో అద్భుతంగా కట్టడి చేశారు. కేవలం 20 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు తీసి భారీ స్కోరును అడ్డుకున్నారు. దీంతో చివరి 10 ఓవర్లలో కివీస్ 64 పరుగులతో సరిపెట్టుకుంది. స్టోక్స్ 3 వికెట్లు తీశాడు. అదిరిపోయే ఆరంభం లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. తొలి ఓవర్లోనే రాయ్ నాలుగు ఫోర్లు బాదితే.. రెండో ఎండ్‌లో హేల్స్ (19 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్) కూడా దీటుగా స్పందించాడు. మెక్లీంగన్, మిల్నేలకు భారీ సిక్సర్ల రుచి చూపెట్టిన ఈ ఇద్దరు ఓవర్‌కు 10 పరుగులకు పైగా సాధించారు. దీంతో పవర్‌ప్లేలో 67 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో రాయ్ 26 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అయితే తొమ్మిదో ఓవర్లో హేల్స్‌ను సాంట్నర్ అవుట్ చేయడంతో తొలి వికెట్‌కు 8.2 ఓవర్లలో 82 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో రూట్ (22 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు) నెమ్మదిగా ఆడినా.. రాయ్ మాత్రం ఎలియట్ ఓవర్లో భారీ సిక్సర్‌తో మరింత జోరు పెంచాడు. అయితే 48 బంతుల్లో 44 పరుగులు చేయాల్సిన దశలో స్పిన్నర్ సోధి వరుస బంతుల్లో రాయ్, మోర్గాన్ (0)లను అవుట్ చేసినా ప్రయోజనం లేకపోయింది. చివర్లో రూట్ అండతో బట్లర్ ఒక్కసారిగా రెచ్చిపోయాడు. 24 బంతుల్లో 23 పరుగులు అవసరమైన దశలో మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌తో విజయ లాంఛనం ముగించాడు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 29 బంతుల్లోనే 49 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (సి) బట్లర్ (బి) విల్లే 15; విలియమ్సన్ (సి అండ్ బి) అలీ 32; మున్రో (సి) అలీ (బి) ఫ్లంకెట్ 46; అండర్సన్ (సి) జోర్డాన్ (బి) స్టోక్స్ 28; టేలర్ (సి) మోర్గాన్ (బి) జోర్డాన్ 6; రోంచి (సి) విల్లే (బి) స్టోక్స్ 3; ఎలియట్ నాటౌట్ 4; సాంట్నర్ (సి) జోర్డాన్ (బి) స్టోక్స్ 7; మెక్లీంగన్ రనౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1-17; 2-91; 3-107; 4-134; 5-139; 6-139; 7-150; 8-153. బౌలింగ్: విల్లే 2-0-17-1; జోర్డాన్ 4-0-24-1; ఫ్లంకెట్ 4-0-38-1; రషీద్ 4-0-33-0; స్టోక్స్ 4-0-26-3; మొయిన్ అలీ 2-0-10-1. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (బి) సోధి 78; హేల్స్ (సి) మున్రో (బి) సాంట్నర్ 20; రూట్ నాటౌట్ 27; మోర్గాన్ ఎల్బీడబ్ల్యు (బి) సోధి 0; బట్లర్ నాటౌట్ 32; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: (17.1 ఓవర్లలో 3 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1-82; 2-110; 3-110. బౌలింగ్: అండర్సన్ 1-0-16-0; మిల్నె 3-0-27-0; మెక్లీంగన్ 3-0-24-0; సాంట్నర్ 3.1-0- 28-1; సోధి 4-0-42-2; ఎలియట్ 3-0-21-0. ► రేసులో మిగిలిన మూడు జట్లు (ఇంగ్లండ్, వెస్టిండీస్, భారత్)లో ఎవరు గెలిచినా... రెండోసారి టి20 ప్రపంచకప్ సాధించిన తొలి జట్టుగా అవతరిస్తుంది. -
గేల్ x కోహ్లి
► గేల్‌కోహ్లి నేడు రెండో సెమీ ఫైనల్ ► వెస్టిండీస్‌తో భారత్ పోరు ► గాయంతో యువరాజ్ అవుట్ టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రస్థానాన్ని ఒక్క ముక్కలో తేల్చేయాలంటే కోహ్లి పేరు తప్ప మరొకటి వినిపించదు. టాప్-5లో మిగతా నలుగురు కలిపి 181 పరుగులు చేస్తే, కోహ్లి ఒక్కడే 184 పరుగులు సాధించాడు. కీలకమైన సెమీస్ మ్యాచ్‌లో ఇప్పుడు కూడా అతడినే దేశం నమ్ముతోంది. అతనిపైనే ఆశలు పెట్టుకుంది. అతను విఫలమైతే ఎలా అనే ఆలోచన కూడా రానంతగా ఫామ్‌లో ఉన్న కోహ్లి మరోసారి తన మ్యాజిక్ చూపించాల్సిన సమయమిది. వెస్టిండీస్ పరిస్థితి కూడా అలాగే ఉంది. వీర విధ్వంసం సృష్టించే క్రిస్‌గేల్ జట్టు భారాన్ని ఒంటిచేత్తో మోస్తున్నాడు. చాలా మంది హిట్టర్లు ఉన్నారని పేరుకు చెప్పుకున్నా... గేల్ అవుటైతే ఆ జట్టు కుప్పకూలిపోవచ్చు. మెరుపు సెంచరీతో అతను గెలిపించిన మ్యాచ్‌ను మినహాయిస్తే మిగతా రెండు మ్యాచ్‌లలో విజయం కోసం తీవ్రంగా శ్రమించిన జట్టు, అఫ్ఘానిస్తాన్ చేతిలో ఓడింది కూడా. బ్యాటింగ్‌తోనే కాదు మానసికంగా కూడా విండీస్‌పై అతని ప్రభావం ఎంతో ఉంది. ప్రపంచకప్ సెమీస్ పేరుకు ఇప్పుడు రెండు జట్ల మధ్య జరుగుతున్నా... కోహ్లి, గేల్ల మధ్య పోటీగానే భావించవచ్చు. ఈ ఇద్దరు ఆటగాళ్లలో ఎవరు తమ స్థాయికి తగినట్లుగా ఆడితే ఆ జట్టుకు గెలుపు ఖాయం. మరి రేసులో మిగిలేదెవరో..! ముంబై నుంచి సాక్షి క్రీడాప్రతినిధి:- వాంఖడే వేదికగా భారత జట్టు మరో మహా మ్యాచ్‌కు సిద్ధమైంది. నేడు (గురువారం) ఇక్కడ జరిగే టి20 ప్రపంచకప్ రెండో సెమీ ఫైనల్లో భారత్, వెస్టిండీస్‌తో తలపడుతుంది. తొలి మ్యాచ్‌లో అనూహ్య పరాజయం తర్వాత కోలుకొని భారత్ సెమీస్‌కు చేరగా...మూడు విజయాలతో సెమీస్ స్థానం సంపాదించాక అఫ్ఘానిస్తాన్ చేతిలో అనూహ్య ఓటమితో వెస్టిండీస్ ఈ మ్యాచ్‌కు వచ్చింది. కాలి మడమ గాయంతో ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఈ మ్యాచ్‌కు దూరం కావడం భారత్‌ను ఇబ్బంది పెట్టే పరిణామం. బలాబలాలు, అనుకూలతలు చూస్తే భారత్ ఒకింత ఆధిక్యంలో కనిపిస్తున్నా... టి20ల్లో మాజీ చాంపియన్ విండీస్‌ను తక్కువగా అంచనా వేయలేం. భారం పంచుకుంటారా..? టాప్-5లో నలుగురు ఆటగాళ్లు విఫలమైన తర్వాత కూడా భారత జట్టు సెమీఫైనల్‌కు చేరడం నిజంగా అద్భుతమే. ఈ నాలుగు మ్యాచ్‌లలో కోహ్లి ఒక్కడే 92 సగటు, 132.37 స్ట్రైక్‌రేట్‌తో చెలరేగగా... రోహిత్, ధావన్, రైనా, యువరాజ్ కలిపి కేవలం 11.31 సగటు, 103.87 స్ట్రైక్‌రేట్‌తో మాత్రమే పరుగులు చేయగలిగారు. ఇక మిగతావారు కూడా తమ సత్తా చాటాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ టోర్నీలో అన్ని వేదికలతో పోలిస్తే పరుగుల వరద పారింది ఇక్కడే. ఇలాంటి బ్యాటింగ్‌కు అనుకూలమైన వికెట్ అంటే మనోళ్లు సాధారణంగా రెచ్చిపోతుంటారు. అదే జరిగితే జట్టు గెలుపుపై ఆశలు పెంచుకోవచ్చు. చాలా రోజులుగా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడని రోహిత్ శర్మ తన విలువ చూపించేందుకు సొంతగడ్డపై అతనికి మంచి అవకాశం లభించింది. ధావన్, రైనా కూడా ధాటిగా ఆడితే భారత్‌కు విజయావకాశాలు ఉంటాయి. మూడు మ్యాచ్‌లలో నాటౌట్‌గా నిలిచిన ధోనికి మరిన్ని బంతులు ఆడే అవకాశం దక్కితే అతను మ్యాచ్ దిశను మార్చగలడు. యువరాజ్ స్థానంలో తుది జట్టులో ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తికరం. బ్యాట్స్‌మెన్ రహానే, పాండే అందుబాటులో ఉన్నారు. అయితే డెరైక్టర్ రవిశాస్త్రి గత మ్యాచ్‌లో యువరాజ్ వేసిన మూడు ఓవర్ల గురించి నొక్కి చెప్పడం చూస్తే నేగికి అవకాశం ఇస్తారా అనేది చూడాలి. ఆల్రౌండర్లపై నమ్మకం ఎవరు అవునన్నా, కాదన్నా గేల్ జోరుపైనే వెస్టిండీస్ ఆధారపడి ఉందంటే అతిశయోక్తి కాదు. అతను సృష్టించే విధ్వంసం గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. పైగా అతని సెంచరీ కూడా ఇదే మైదానంలో వచ్చింది. మరో ఓపెనర్‌గా ఆడే అవకాశం ఉన్న సిమన్స్ టోర్నీలో ఇదే తొలి మ్యాచ్ అయినా ముంబై ఇండియన్స్ ఆటగాడిగా అనుభవం ఉపయోగపడవచ్చు. చార్లెస్, శామ్యూల్స్ దూకుడుగా ఆడగల సమర్థులు. 9వ నంబర్ ఆటగాడి వరకు అందరూ బ్యాటింగ్ చేయగలరు. బ్రేవో, రసెల్, స్యామీల ఫామ్ అంత బాగోలేదు. బౌలింగ్‌లో ఆల్‌రౌండర్లు మినహా చెప్పుకోదగ్గ పేసర్ లేడు. దాంతో ఇద్దరు స్పిన్నర్లు బద్రీ, బెన్ కీలకం కానున్నారు. జట్లు (అంచనా) భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, రహానే/పాండే, హార్దిక్ పాండ్యా, జడేజా, అశ్విన్, నెహ్రా, బుమ్రా. వెస్టిండీస్: స్యామీ (కెప్టెన్), గేల్, సిమన్స్, చార్లెస్, శామ్యూల్స్, బ్రేవో, రసెల్, బ్రాత్‌వైట్, రామ్‌దిన్, బద్రీ, బెన్. పిచ్, వాతావరణం టోర్నీలో గత మూడు మ్యాచ్‌లలో ఉపయోగించని కొత్త పిచ్‌ను తొలిసారి భారత మ్యాచ్‌కు వాడుతున్నారు. బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉంది. అయితే స్పిన్ అనుకూలత కోసం కాస్త ఎక్కువగా రోలింగ్ చేసినట్లు కనిపిస్తోంది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించకపోవచ్చు. ►2 భారత్, వెస్టిండీస్‌ల మధ్య ఇప్పటివరకూ జరిగిన 4 టి20 మ్యాచ్‌ల్లో చెరో రెండు గెలిచాయి. ప్రపంచకప్‌లలో మూడు ఆడగా... భారత్ ఒకటి గెలిచి, రెండు ఓడింది. అశ్విన్ అతడిని ఆపాలి... క్రిస్ గేల్ క్రీజ్‌లో ఉంటే ఎంత ప్రమాదకరంగా మారతాడో ధోనికి తెలియనిది కాదు. అందుకే అది ఐపీఎల్ అయినా, అంతర్జాతీయ మ్యాచ్ అయినా అతడిని కట్టడి చేసేందుకు అశ్విన్ అనే ఆయుధాన్ని ధోని అనేక సార్లు ప్రయోగించాడు. అశ్విన్ కూడా కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు. టి20ల్లో వీరిద్దరు ఎదురెదురుగా 9 ఇన్నింగ్స్‌లలో తలపడితే అందులో నాలుగు సార్లు అశ్విన్ అవుట్ చేశాడు. అశ్విన్‌ను సమర్థంగా ఎదుర్కోలేక గేల్ పడే ఇబ్బందిని ఇప్పుడు భారత్ మళ్లీ సొమ్ము చేసుకోవాల్సి ఉంది. ప్రపంచంలో ప్రతీ బౌలర్‌ను చితకబాది ఏడిపించే గేల్ అశ్విన్ బౌలింగ్‌లో 70 బంతులు ఆడితే 57 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో 51 బంతులు పవర్‌ప్లేలో వేశాడు. అయినా సరే ఈ ఎత్తును చిత్తు చేయడం గేల్ వల్ల కాలేక కేవలం 3 ఫోర్లు, 3 సిక్సర్లతోనే సరిపెట్టాడు. ఇప్పుడు మరోసారి తొలి ఓవర్ అశ్విన్‌తో ప్రారంభించినా ఆశ్చర్యం లేదు. అతను అవుటైనా చాలా మంది బ్యాట్స్‌మెన్ ఉన్నారని వెస్టిండీస్ చెప్పుకోవచ్చు. కానీ గేల్ బ్యాటింగ్ చూపే ప్రభావమే వేరు. ఒక్కసారి అతను వెనుదిరిగితే విండీస్ కుప్పకూలడమో లేదంటే పడుతూ లేస్తూ తక్కువ స్కోరుకే పరిమితం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కోహ్లి రివర్స్ స్వీప్ టి20 క్రికెట్లో కూడా సంప్రదాయ షాట్లతోనే అద్భుతాలు చేసే విరాట్ కోహ్లి బుధవారం కాస్త కొత్తగా కనిపించాడు. సుదీర్ఘ సమయం పాటు సాగిన ప్రాక్టీస్ సెషన్లో అతను భారత బౌలర్లందరినీ ఎదుర్కొన్నాడు. అయితే ఎప్పుడూ లేని విధంగా రివర్స్ స్వీప్, స్విచ్ హిట్లను ఆడటం విశేషం. ముఖ్యంగా అశ్విన్ బౌలింగ్‌లో అతను కొట్టిన రివర్స్ స్వీప్‌లు ఎలాంటి తడబాటు లేకుండా పర్ఫెక్ట్ షాట్లుగా మారాయి. సరదాగా ఒకటి, రెండు బంతులు కాకుండా సీరియస్‌గానే సాధన చేసిన కోహ్లి మనసులో కొత్త ఆలోచనలేమైనా ఉన్నాయేమో. మరో వైపు రహానే, పాండేలు ఇద్దరిపై ప్రత్యేక దృష్టి పెడుతూ రవిశాస్త్రి మరో నెట్స్‌లో వీరిద్దరితో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయించారు. రా. గం. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్ 1లో ప్రత్యక్ష ప్రసారం -
మీ సంగతేంటి..?
► ఆందోళన కలిగిస్తున్న ఓపెనర్లు ► మిడిలార్డర్ కూడా అంతంత మాత్రమే మొహాలీ నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి: భారత జట్టు టి20 ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరినా జట్టు బ్యాటింగ్ ప్రదర్శన పట్ల పెద్దగా ఎవరికీ సంతృప్తి లేదు. కోహ్లి మినహా ఏ ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఇప్పటివరకూ ఆడలేదు. కోహ్లి పుణ్యమాని పాకిస్తాన్, ఆస్ట్రేలియాపై గెలిచాం. బంగ్లాదేశ్ స్వయంకృతాపరాధంతో గట్టెక్కాం. మొత్తానికి సెమీస్‌కు చేరాం. కానీ రేపు సెమీస్‌లో కోహ్లి పొరపాటున విఫలమైతే పరిస్థితి ఏమిటి? ఇప్పుడు భారత జట్టు సమాధానం వెతుక్కోవాల్సిన ప్రశ్న ఇది. ఓపెనర్ల వైఫల్యం వన్డేల్లో రెండు డబుల్ సెంచరీలు, టి20ల్లో కూడా సెంచరీ ఉన్న ఘనత రోహిత్ శర్మ సొంతం. కానీ అదంతా బ్యాటింగ్ పిచ్‌ల మహిమే తప్ప రోహిత్ గొప్పతనం కాదేమో అన్నట్లుగా అతని ఆట కొనసాగుతోంది. నాలుగు ఇన్నింగ్స్‌లలో ఒక్కసారి కూడా అతను కనీస ప్రభావం చూపలేకపోయాడు. మొత్తం టోర్నీలో అతను ఇప్పటి వరకు 45 పరుగులే చేశాడు. పిచ్ కాస్త బౌలర్లకు అనుకూలిస్తుంటే చాలు చేతులెత్తేస్తున్నాడు. పోరాటపటిమ అనేది మచ్చుకైనా కనిపించక పోగా, అవుటైన తీరు నిర్లక్ష్యంగా కనిపిస్తోంది. శిఖర్ ధావన్ కూడా ఘోరంగా విఫలమవుతున్నాడు. ఈసారి టోర్నీలో ఒక్క మ్యాచ్‌లో కూడా ప్రభావం చూపలేదు. ధావన్ వరుసగా 1, 6, 23, 13 పరుగులు చేశాడు. నేరుగా వచ్చిన బంతులను స్వీప్ ఆడి అతను రెండు సార్లు ఎల్బీడబ్ల్యూగా అవుట్ కావడం ఇంకా డెరైక్టర్, కోచ్‌లు గుర్తించినట్లు లేదు. గతంలో చాలా సందర్భాల్లో టి20లైనా సరే వీరిద్దరు ఆరంభంలో కాస్త నిలదొక్కుకొని ఆ తర్వాత చెలరేగిపోయేవారు. ఫలితంగా స్ట్రైక్‌రేట్ కూడా బ్రహ్మాండంగా ఉండేది. ఇప్పుడూ నిలబడే ప్రయత్నంలో బంతులు తినేస్తున్నారు. కానీ ఆ వెంటనే అవుట్ కావడంతో పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిగా మారుతోంది. గత నాలుగు మ్యాచ్‌లలో భారత ఓపెనింగ్ భాగస్వామ్యం 5 పరుగులు (5 బంతుల్లో), 14 (13), 42 (36), 23 (23)గా ఉంది. టి20ల్లో సాధారణంగా పవర్‌ప్లేలో కనిపించే మెరుపు ఆరంభానికి ఇది భిన్నం. మిడిల్ అంతంత మాత్రమే ఇక ఈ టోర్నీలో అందరికంటే దారుణం రైనా. బంగ్లాదేశ్‌పై చేసిన 30 పరుగులు మినహా ఏమాత్రం ఆడలేదు. పడుతూ లేస్తూ పరుగులు చేస్తున్న యువరాజ్‌ను చూసి సంతోషించాలో లేక గతంలో అతడి స్థాయిని గుర్తు చేసుకుని బాధపడాలో తెలియడం లేదు. ఒకప్పుడు గొప్ప మ్యాచ్ ఫినిషర్‌గా పేరున్న యువరాజ్ ఇప్పుడు చివరి వరకూ నిలబడలేకపోతున్నాడు. ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్‌లు కలిపి 52 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కొద్ది సేపు నిలబడగలిగితే ఆ మాత్రం పరుగులైనా వస్తున్నాయి కానీ లేదంటే ఆరంభంలో తడబడితే అక్కడితోనే సరి. కెప్టెన్ ధోని నుంచి కూడా ఆశించిన స్థాయిలో ఇప్పటివరకూ పరుగులు రాలేదు. ఆల్‌రౌండర్ పేరున్న జడేజా బ్యాటింగ్ మరచిపోయి చాలా కాలం అయింది కాబట్టి అతనిపై ఆశలు పెట్టుకోవడం కూడా అనవసరం. టోర్నీలో అత్యధిక పరుగుల చేసిన జాబితాలో కనీసం 100 పరుగులు చేసిన 23 మందిలో కోహ్లి మినహా మరెవరూ భారతీయులు లేకపోవడం మన బ్యాట్స్‌మెన్ ఆటకు ఉదాహరణ. ఇక స్ట్రైక్‌రేట్ పరంగా చూస్తే కోహ్లి (132.37)నే 46వ స్థానంలో నిలిచాడంటే మన స్టార్ బ్యాట్స్‌మెన్ వేగంగా కూడా ఆడలేకపోతున్నారని అర్థమవుతుంది. యువరాజ్ సరిగ్గా 100 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేస్తే...రోహిత్ (88.23), ధావన్ (82.69) బంతికో పరుగు కూడా చేయలేకపోయారు. మరోసారి టి20ల్లో విశ్వ విజేతగా నిలిచేందుకు, సొంతగడ్డపై వరుసగా ప్రపంచకప్ గెలిచేందుకు ఇక ఆడాల్సింది రెండు మ్యాచ్‌లే. ఇతర బ్యాట్స్‌మెన్ కూడా టోర్నీలో తమదైన ముద్ర వేసేందుకు ఇదే మిగిలిన అవకాశం. మరి ఇకనైనా కోలుకుంటారా..?