Tele Conference
-
ఒక్కో ఓటునూ ఒడిసిపట్టండి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారంతోపాటు పోలింగ్ ముగిసేదాకా పార్టీ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని.. క్షేత్రస్థాయిలో ఒక్కో ఓటును ఒడిసిపట్టాలని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. అన్ని స్థాయిల నేతలు, కార్యకర్తలు సర్వశక్తులూ ఒడ్డి పనిచేయాలని ఆదేశించారు. పార్టీ కేడర్ ప్రతీ గడపకూ వెళ్లాలని, బీఆర్ఎస్కే ఓటేసేలా ప్రయత్నం చేయా లని సూచించారు. ఈ నెల 28న ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీ అభ్యర్థుల ప్రచార తీరుతెన్నులపై కేసీఆర్ శనివారం సుదీర్ఘంగా సమీక్షించారు. పార్టీ అభ్యర్థులు, ఇన్చార్జులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పలువురితో ఫోన్లలో మాట్లాడారు. సభ రద్దవడంతో.. శనివారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరగాల్సిన బీఆర్ఎస్ బహిరంగ సభ రద్దయిన నేపథ్యంలో.. కేసీఆర్ రోజంతా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో సమీక్షలు నిర్వహించారు. సర్వేలు, నిఘా సంస్థల నివేదికలు, వివిధ మార్గాల నుంచి అందిన సమాచారాన్ని విశ్లేషించారు. నియోజకవర్గాల వారీగా ప్రచార తీరుతెన్నులు, అభ్యర్థుల పనితీరు, ఇతర పార్టీల స్థితిగతులపై పార్టీ నేతలతో చర్చించారు. గెలుపు అవకాశాల ఆధారంగా నియోజకవర్గాలను కేటగిరీలుగా వర్గీకరించి, మెరుగుపడాల్సిన నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన దిద్దుబాటు చర్యలపై అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్చార్జులకు దిశానిర్దేశం చేశారు. తీవ్ర పోటీ ఉన్న నియోజకవర్గాల ఇన్చార్జులకు ప్రత్యేక సూచనలు చేశారు. పార్టీ గెలుపోటములపై మౌఖిక ప్రచారాలతో గందరగోళానికి గురికావద్దని నేతలకు కేసీఆర్ స్పష్టం చేశారు. తాజా సర్వే ఫలితాలు పార్టీకి అనుకూలంగా ఉన్నాయని, ఆత్మవిశ్వాసంతో పనిచేయాలని సూచించారు. మూడోసారీ అధికారంలోకి వస్తామని భరోసా ఇచ్చారు. క్షేత్రస్థాయి పరిస్థితిపై పోస్ట్‌మార్టం ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత గత నెల 15వ తేదీ నుంచి ఇప్పటివరకు కేసీఆర్ 82 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రచారం పూర్తి చేశారు. పరేడ్ మైదానంలో సభ రద్దయిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఎల్బీనగర్, కూకట్పల్లి, మేడ్చల్ లేక మల్కాజ్గిరి నియోజకవర్గాల పరిధిలో రోడ్‌షోలు నిర్వహించాలని శనివారం జరిగిన సమీక్షలో నిర్ణయించినట్టు సమాచారం. ప్రతిపక్షాల పోల్ మేనేజ్మెంట్ ప్రణాళికలు, పార్టీపరంగా అనుసరించాల్సిన పోల్ మేనేజ్మెంట్ వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక తదితరులు చేస్తున్న విమర్శలు, వాటిని తిప్పికొట్టాల్సిన తీరుపైనా సూచనలిచ్చారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావుల రోడ్‌షోలకు వస్తున్న స్పందన, మేనిఫెస్టోలోని అంశాలు ఎంతమేర ప్రజల్లోకి వెళ్లాయన్న దానిపై ఆరా తీశారు. ప్రధాని మోదీ వరుసగా మూడో రోజులు రాష్ట్రంలో ప్రచారం చేస్తున్న నేపథ్యంలో.. ఆయా నియోజకవర్గాలపై ఎంతమేర ప్రభావం ఉంటుందనే కోణంలో సర్వే, కన్సల్టెన్సీ సంస్థల నుంచి నివేదిక కోరినట్టు సమాచారం. -
Inter Exams 2023: నిఘా నీడలో ఇంటర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్స్ పేపర్ లీకేజీ నేపథ్యంలో ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించా లని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. గత కొన్ని నెలలుగా ఇంటర్ బోర్డ్‌లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈసారి పరీక్షలపై అప్రమత్తత అవసరమని ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించినట్టు తెలిసింది. దీంతో పరీక్షల నిర్వహణపై బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్ మంగళవారం సాయంత్రం ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు అవసరమైన సూచనలు చేశారు. ఇంటర్ బోర్డ్‌కు ప్రత్యామ్నాయ వ్యవస్థ నడుస్తోందని కొన్ని నెలల క్రితం ఇంటర్ బోర్డ్ కార్యదర్శి మిత్తల్ సందేహం వెలిబుచ్చారు. డేటా ట్యాంపరింగ్ జరిగిందని పోలీసులకు బోర్డ్ గతంలో ఫిర్యాదు చేసింది. ప్రైవేటు ఇంటర్ కాలేజీలతో బోర్డ్‌లోని కొంతమంది అధికారులే కలిసి పనిచేస్తున్నారనే అనుమానాలతో కొంతమందిని కీలకమైన స్థానాల నుంచి తప్పించారు. ఈ ఏడాది నుంచి ఆన్లైన్ మూల్యాంకన చేపట్టాలని నిర్ణయించడం, దీన్ని కొంతమంది ఆక్షేపిస్తూ వివాదాస్పదం చేసే ప్రయత్నాలు చోటుచేసుకున్నాయి. ఇవన్నీ పరీక్షల నిర్వహణలో అప్రమత్తతను సూచిస్తున్నాయి. పేపర్ల పంపిణీ దగ్గర్నుంచి... డేటా చోరీ వ్యవహారం తెరమీదకొచ్చిన తర్వాత ఇంటర్ బోర్డ్‌లో ప్రతీ వ్యవహారంలోనూ ఆచితూచి అడుగులేస్తున్నారు. కీలకమైన అంశాలపై చర్చించేందుకు ముఖ్యులను మాత్రమే అనుమతిస్తున్నారు. బోర్డ్‌లోని కొందరి సెల్‌ఫోన్లపైనా నిఘా పెట్టినట్టు తెలిసింది. ప్రస్తుత పరీక్షల నిర్వాహకులే లక్ష్యంగా బోర్డ్ లోని వ్యక్తులు, ప్రైవేటు కాలేజీలు, మరికొంత మంది కలిసి పరీక్షల్లో అవాంతరాలు సృష్టించే వీలుందనే అనుమానాలు ఉన్నత వర్గాల్లోనూ ఉన్నాయి. దీంతో పరీక్ష పేపర్లు పంపే విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అన్ని పరీక్ష కేంద్రాల్లో విధిగా సీసీ కెమెరాల ముందే ప్రశ్నపత్రాలు ఓపెన్ చేయాలని ఆదేశాలిచ్చారు. అదే విధంగా జవాబు పత్రాలు సురక్షితంగా చేరే వరకూ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. పరీక్ష లపై అసత్య ప్రచారం చేసేందుకు కొంతమంది సామాజిక మాధ్యమాలను వాడుకునే అవకాశముందని, ఈ అంశాలపైనా దృష్టి పెట్టాలని ఆదేశించారు. -
అన్ని స్థానాల్లో ఆత్మీయ సమ్మేళనాలు
సాక్షి, హైదరాబాద్: క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్త నుంచి పార్టీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర నాయకుల మధ్య ఆత్మీయ అనుబంధాన్ని బలోపేతం చేసుకునే దిశలో కార్యాచరణ రూపొందించుకోవాలని, ఇందుకోసం అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘ఆత్మీ య సమ్మేళనాలు’నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కె. తారకరామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ను బలోపేతం చేస్తూ, 60 లక్షల మంది పార్టీ శ్రేణులను మరింత చైతన్యపరిచేలా విస్తృతంగా కార్యక్రమాలను చేపట్టాలని ఆయన కోరారు. ఆదివారం పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు రూపొందించిన కార్యక్రమాల షెడ్యూల్‌ను ఆయన ఈ సందర్భంగా పార్టీ నేతలకు వివరించారు. వీలున్నంత మేరకు నాయకులు ప్రజల్లో ఉండేలా ఈ కార్యక్రమాలను రూపొందించామని చెప్పారు. కార్యకర్తలే బలం.. బీఆర్ఎస్కు పార్టీ కార్యకర్తలే బలమని, వారితో ఆత్మీ య సమ్మేళనాలు నిర్వహించాలని కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్‌లో నాయకులకు సూచించారు. ‘ఈ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలు ఎమ్మెల్యేలు తీసుకోవాలి. ఇందుకోసం ప్రతి 10 గ్రామాలను ఒక యూనిట్‌గా తీసుకోండి. ఆ 10 గ్రామాల కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేయండి. పట్టణాల్లో అయితే పట్టణానికి ఒక యూనిట్‌గా లేదంటే కొన్ని డివిజన్లను ఒక యూనిట్‌గా చేసి సమ్మేళనాలు నిర్వహించండి. ఈ సమావేశాలకు స్థానిక ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, ఇతర పార్టీ ముఖ్యులను ఆహ్వా నించండి’అని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏప్రిల్‌లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి ఈ సమ్మేళనాలు పూర్తయ్యేలా ఏ రోజు ఏ యూనిట్లో నిర్వహిస్తారనే షెడ్యూల్‌ను తేదీలతో సహా జిల్లా అధ్యక్షులు పార్టీకి తెలియజేయాలని సూచించారు. విద్యార్థి విభాగం బలోపేతం.. 2023–24 విద్యాసంవత్సరం జూన్ నెల నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో పార్టీ విద్యార్థి విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని, సభ్యత్వ నమోదు చేపట్టడంతో పాటు విద్యార్థి విభాగానికి నూతన కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని, ఇంటర్ నుంచి వృత్తి విద్యాకోర్సుల వరకు అన్ని స్థాయిల్లోని విద్యార్థులకు స్వాగత సభలు నిర్వహించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా నియోజకవర్గాల వారీగా పార్టీ ప్రతినిధుల సమావేశాలు ఏర్పాటు చేయాలని, పార్టీ జెండావిష్కరణ కార్యక్రమం చేయాలని సూచించారు. ఈ అంశాలన్నింటిపై పూర్తిస్థాయి కార్యాచరణ కోసం వారం రోజుల్లోగా రాష్ట్ర పార్టీ సమావేశం నిర్వహిస్తామని కేటీఆర్ పార్టీ నేతలకు తెలిపారు. అంబేడ్కర్ స్ఫూర్తిని గౌరవించుకుంటున్నాం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి జిల్లాల్లోని పార్టీ కార్యాలయాల ప్రారంబోత్సవాలను కూడా పూర్తి చేసుకోవాలని కేటీఆర్ ఆదేశించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బి.ఆర్. అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని, ఆ దిశగా జయంతి కార్యక్రమాల షెడ్యూల్‌ను తయారు చేసుకోవాలని సూచించారు. ‘దేశంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మరోవైపు నూతన సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టుకుంటున్నాం. దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా అంబేడ్కర్ వారసత్వ స్ఫూర్తిని ఇంత ఘనంగా గౌరవించుకోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం, పార్టీ చేపట్టిన ఈ అద్భుత కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఉత్సవాలు నిర్వహించాలి’అని చెప్పారు. -
గ్యాస్ మంటపై రేపు నిరసనలు
సాక్షి, హైదరాబాద్: ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియగానే ప్రధాన మంత్రి మోదీ వంటగ్యాస్ ధరలు పెంచారంటూ భారత రాష్ట్ర సమితి తీవ్రస్థాయిలో మండిపడింది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండల కేంద్రాల్లో వినూత్న కార్యక్రమాలతో నిరసనలు చేపట్టాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కె.తారక రామారావు పిలుపునిచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో ఆయన బుధవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు అయిన వెంటనే ప్రతిసారీ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడం కేంద్ర ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని ఆరోపించారు. గృహావసరాల సిలిండర్ ధరను రూ.50, వాణిజ్య సిలిండర్ ధరను రూ. 350 మేర భారీగా పెంచడంపై ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మహిళా దినోత్సవం సందర్భంగా దేశ మహిళలకు ప్రధాన మంత్రి మోదీ ఇచ్చిన కానుకా..? అని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం రాకముందు రూ.400 ఉన్న సిలిండర్ ధర ఈరోజు రూ. 1160 దాటి రూ.1200 వరకు పెరిగిందన్నారు. ఒకవైపు ఉజ్వల స్కీమ్ పేరుతో మాయమాటలు చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఈరోజు భారీగా గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ, వారిని సిలిండర్లకు దూరం చేస్తోందని విమర్శించారు. ఈ పథకంలో సిలిండర్లు పొందిన మహిళలు ఇప్పుడు వాటిని కొనలేక కట్టెల పొయ్యిపై వంట చేయాల్సిన పరిస్థితులు తలెత్తాతయని ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన ధరలను తక్షణమే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. అడ్డగోలుగా గ్యాస్ ధరల పెరుగుదలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలే కాదు అన్ని వర్గాల వారూ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. ప్రజల కష్టాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లే విధంగా, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ శుక్రవారం నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. -
ప్రజలందరికీ మేలు చేస్తున్న ప్రభుత్వం ఇది
సాక్షి, అమరావతి: కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉన్నా ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను విస్మరించకుండా సీఎం జగన్ కొనసాగిస్తున్నారని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు వేణుంబాక విజయసాయిరెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, శాసనసభ్యులు, సమన్వయకర్తలు, జిల్లాస్థాయి ప్లీనరీ అబ్జర్వర్లు, నియోజకవర్గస్థాయి ప్లీనరీ అబ్జర్వర్లతో మంగళవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతోపాటు మేనిఫెస్టోలో చెప్పనివి కూడా ఎన్నో చేశారని తెలిపారు. అయినా దీన్ని మనం చంద్రబాబులా ప్రచారం చేసుకోవడం లేదన్నారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజు నుంచే ప్రజల్లో సీఎం జగన్ నాయకత్వం పట్ల నమ్మకం, విశ్వాసం రెట్టింపయ్యాయని తెలిపారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ప్లీనరీ సమావేశాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని చెప్పారు. మరోపక్క జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశాలకు అందరూ నూతనోత్సాహంతో సమాయత్తమవుతున్న వాతావరణం సర్వత్రా నెలకొని ఉందన్నారు. వచ్చే నెలలో రాష్ట్రస్థాయి ప్లీనరీ జూలై 8, 9 తేదీల్లో రెండు రోజులపాటు రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్న విషయాన్ని విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రస్థాయి ప్లీనరీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు, నామినేటెడ్ పదవులు పొందిన వారు, పార్టీ గ్రామ, మండల, నగర, రాష్ట్ర స్థాయిలో వివిధ హోదాలలో పని చేస్తున్న నాయకులందరినీ వ్యక్తిగతంగా ఆహ్వానించాలన్నది సీఎం జగన్ ఆలోచన, ఆదేశం అని చెప్పారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్న వివిధ కమిటీల నాయకుల పేర్లు, నామినేటెడ్ పదవులు పొందిన వారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల జాబితాలను స్థానిక బాధ్యులకు పంపించడం జరిగిందన్నారు. ఆ జాబితాను పరిశీలించి, ఎవరైనా మృతి చెందిన లేదా పార్టీ నుంచి సస్పెండ్ అయినా లేక పార్టీ మారినా వారి పేర్లు తొలగించి, మార్పులు చేర్పులతో కూడిన జాబితాను వెంటనే వాట్సాప్ నంబర్ (93929–18001)కు గాని, మెయిల్ ద్వారా కానీ పంపాలని ఆయన చెప్పారు. ప్రతి ఊరిలో రెండు అన్న క్యాంటీన్లు పెట్టి చేసిన పాపాలకు చంద్రబాబు ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నారు. హుద్‌హుద్ తుపాను తర్వాత ఒడిశాకు 10 వేల కరెంటు స్తంభాలు, వెయ్యి ట్రాన్స్ఫార్మర్లు, జనరేటర్లు పంపిస్తున్నట్టు బాబు జాతీయ నాయకుడి రేంజిలో చెప్పుకున్నారన్నారు. అవి తమకు అందనే లేదని ఒడిశా ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. దొంగ బిల్లులు రాసి పంచుకున్న దాంట్లో గంజాయి పాత్రుడే కింగ్‌పిన్ అని విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. -
ఢిల్లీ నుంచి సీఎం కేసీఆర్ టెలీ కాన్ఫరెన్స్
-
ఇళ్లలోనే ఉండండి: సీఎం కేసీఆర్
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. వానలు, వరద ముంపు ప్రాంతాల ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేయకుండా సురక్షితంగా ఉండాలి. జిల్లాల కలెక్టర్లు, ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం పరిస్థితులను సమీక్షిస్తూ.. తక్షణం సహాయక చర్యలు చేపట్టాలి. ఎన్డీఆర్ఎఫ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థలను సిద్ధంగా ఉంచుకోవాలి. విద్యుత్ సరఫరా, రోడ్లు, నాలాల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. క్షేత్రస్థాయి సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలి. – సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: రాష్ట్రంలో ఎడ తెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేయవద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, నిరంతరం పరిస్థితులను సమీక్షిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ భారీ వర్షాలు, వరదల పరిస్థితిపై మంగళవారం అక్కడి నుంచే సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు పొంగిపొర్లుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు. వరద ప్రభావిత గ్రామాలు, మండలాల్లో తగిన చర్యలు చేపట్టేలా సంబంధిత శాఖల ఉద్యోగులను అప్రమత్తం చేయాలన్నారు. నీటి పారుదల శాఖ అధి కారులు నిరంతర వరదల పరిస్థితిని సమీక్షిం చాలని, ఇతర ప్రభుత్వ శాఖలకు ఆ వివరాలను అందజేయాలని సూచించారు. ముంపు ప్రాం తాల్లో శరవేగంగా సహాయక చర్యలు చేపట్టాలని.. ఎన్డీఆర్ఎఫ్, డిజాస్టర్ మేనేజ్ మెంట్ దళాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, రోడ్లు, నాలాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని.. మున్సిపల్, పంచాయతీరాజ్, రోడ్లు–భవనాలు, విద్యుత్ శాఖల అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందిని సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉంచాలని చెప్పారు. ప్రజాప్రతినిధులంతా తమ నియోజకవర్గాల్లోనే ఉండాలని.. ప్రభుత్వ యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ, సహాయక చర్యలను పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్: సీఎస్ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో.. ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశిం చారు. జిల్లాల్లోని అధికారులందరూ అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. మంగళవారం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. వర్ష ప్రభావిత 20 జిల్లాల కలెక్టర్లతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి, అవసరమైతే అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. చెరువులు, కుంటలు, ఇతర జల వనరులు పూర్తిగా నిండి ఉండటంతో.. అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా చెరువు కట్టల పటిష్టతను పర్యవేక్షించాలని సూచించారు. సమీప ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఇవీ చదవండి: తెలంగాణలో 65 వేల ఖాళీలు భర్తీ చేసేలా.. TS: రాష్ట్రానికి జ్వరం -
Harish Rao: సీటీ స్కాన్‌కు రూ.2 వేలే తీస్కోవాలి
మెదక్ జోన్: కరోనా నిర్ధారణ పరీక్షల నిమిత్తం సీటీస్కాన్ నిర్వాహణ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే అనుమతులు ఇవ్వాలని, సీటీస్కాన్‌కు రూ.5 వేల వరకు వసూలు చేస్తునట్లు తన దృష్టికి వచ్చిందని కేవలం రూ.2 వేలు మాత్రమే తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రస్తుతం జిల్లాలో 3 మాత్రమే సీటీస్కాన్లు ఉన్నాయని అందులో 2 మెదక్‌లో ఉండగా 1 మాత్రమే తూప్రాన్‌లో ఉందని చెప్పారు. కొత్తగా ఎవరు సీటీస్కాన్ నిర్వహణకు అనుమతి అడిగినా వారికి ఇవ్వాలని చెప్పారు. అలాగే జిల్లాలో కోవిడ్ పరిస్థితి ఏ విధంగా ఉందని, వ్యాక్సిన్, ఆక్సిజన్, లాక్డౌన్ తదితర అంశాలపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌తో పాటు వైద్యాధికారులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జిల్లా పరిషత్ చైర్మన్లు, తదితరులు పాల్గొన్నారు. చదవండి: కరోనా వ్యాక్సిన్: టీకా వేయించుకుంటే రూ.7 కోట్లు మీవే.. చదవండి: కంగారొద్దు: తెలంగాణలో రెమిడిసివిర్ కొరత లేదు -
పల్లె పల్లెకూ ఎల్ఈడీ వెలుగులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ఎల్ఈడీ వీధి లైట్ల ఏర్పాటుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. విద్యుత్, పంచాయతీరాజ్, ఇతర శాఖల అధికారులతో మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్ఈడీ వీధి దీపాలు బిగించడమే కాకుండా.. నిర్వహణపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు మంత్రి సూచించారు. వెలగని వీధి దీపాల సమాచారాన్ని తెలుసుకునేందుకు గ్రామ వలంటీర్ల సహకారం తీసుకోవాలన్నారు. ఈ వివరాలను ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. ఇవీ ప్రతిపాదనలు ► రాష్ట్రంలో ఇప్పటివరకూ 10,382 గ్రామ పంచాయతీలలో 23. 29 లక్షల ఎల్ఈడీ వీధి లైట్లను బిగించారు. ► తాజాగా ప్రజాప్రతినిధుల నుంచి ఎల్ఈడీ వీధి దీపాల కోసం విజ్ఞప్తులొస్తున్నాయి. ఇలాంటి 2,303 గ్రామాలను గుర్తించి.. అన్నిచోట్లా ఎల్ఈడీ లైట్లను అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ► ఎల్ఈడీ వీధి దీపాలు బిగించడం వల్ల ఏడాదికి 260 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేయవచ్చని, తద్వారా ఏటా రూ.156 కోట్ల విద్యుత్ బిల్లులు ఆదా అవుతాయని ఇంధన శాఖ అధికారులు మంత్రికి తెలిపారు. ► రాష్ట్రంలో మరోసారి భారీ ఎత్తున చేపట్టనున్న ఎల్ఈడీ వీధి లైట్ల కార్యక్రమానికి ఇంధన శాఖ పూర్తి స్థాయి లో సహకారం అందిస్తుందని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి తెలిపారు. ► వీధిలైట్ల ఏర్పాటుకు అనుమతి వస్తే జూన్ నెలలో అయినా పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ సంబంధిత అధికారులకు సూచించారు. ► టెలీకాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పాల్గొన్నారు. -
కరోనాకు మతం రంగు పులమొద్దు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో మతం ప్రస్తావన అనవసరమని, మతం రంగు పులిమి ప్రచారం చేయడం తగదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కుల, మత, ప్రాంత, వర్గ విభేదాలకు తావు లేకుండా ఈ మహమ్మారిని ఐక్యంగా ఎదుర్కోవాలన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా దేశానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. గాంధీభవన్ నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్‌తో పాటు ఫేస్బుక్ లైవ్‌లో ఆదివారం ఉత్తమ్ మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో రాష్ట్రంలోని ప్రజలు, పేదలను ఆదుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. -
మున్సిపల్ పోరు: అభ్యర్థులకు కేటీఆర్ దిశానిర్దేశం
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థులతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గురువారం నిర్వహించిన ఈ కాన్ఫరెన్స్‌లో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచారం నిర్వహించాల్సిన తీరుపై అభ్యర్థులకు దిశానిర్ధేశం చేశారు. అదే విధంగా వివిధ పట్టణాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. గత ఆరు సంవత్సరాలుగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అందించిందని, ప్రభుత్వం అందించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేస్తే సరిపోతుందని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ పథకాలను అభ్యర్థులకు కేటీఆర్ వివరించారు. పెన్షన్ల నుంచి మొదలుకొని సాగునీటి ప్రాజెక్టుల దాకా కేసీఆర్ కిట్లు, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, జిల్లాల వికేంద్రీకరణ.. ఇలా అనేక కార్యక్రమాలను జనాల్లోకి తీసుకెళ్లాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు రూ. 45 వేల కోట్ల రుపాయలతో సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తుందని, పట్టణాల కోసం ఇప్పటికే మిషన్ భగీరథలో భాగంగా బల్క్ వాటర్‌ను అందిస్తున్నామన్నారు.(ఎవరి సత్తా ఏంటో గల్లీలో తేలుతది) పట్టణాల కోసం 3,75,000 వేల ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. పట్టణాలకు ప్రత్యేక నిధులు, కార్పొరేషన్లకు బడ్జెట్లో నిధులు ఇస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్దేనని పేర్కొన్నారు. ఇప్పటికే టీయూఎఫ్ఐడీసీ ద్వారా రూ.25 వందల కోట్ల రూపాయలతో పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించామని అన్నారు. స్వచ్, హరిత పట్టణాల కోసం చెత్త తరలింపు ఆటోలు, ఇతర వాహనాలను సమకూర్చారని, ప్రతి పట్టణంలో నర్సరీ ఏర్పాటు చేయడంతోపాటు హరితహార కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో పోల్చితే టీఆర్ఎస్ ప్రభుత్వం పది రెట్లు ఎక్కువ నిధులను ఖర్చు చేసిందని తెలిపారు. కాంగ్రెస్ పాలనను.. టీఆర్ఎస్ పాలనను బేరీజు వేసుకుని ఓటు వేయాలని ప్రజలను కోరాలని అభ్యర్థలకు సూచించారు. నూతన మున్సిపాలిటీ చట్టాన్ని కఠినంగా అమలు చేసి ప్రజలకు మరింత పారదర్శక, వేగవంతమైన పౌర సేవలను అందిస్తామని తెలిపారు.(నన్ను చూసి.. వారికి ఓటేయండి: ఈటల) కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు కొన్ని స్థానాల్లో అభ్యర్థులు కూడా లేనిపరిస్థితి ఉందని ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయం అని ఆశాభావం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఎన్నికల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని సూచించారు. పార్టీ బీ ఫారం కోసం ప్రయత్నం చేసిన తోటి నాయకులతో కలుపుకుని సమిష్టిగా ఐక్యంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని హితవు పలికారు. పార్టీ అభ్యర్థులు ఈ నాలుగు రోజుల్లో కనీసం మూడు నుంచి అయిదు సార్లు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాల సమాచారాన్ని అందించి ఓట్లు అడగాలని సూచించారు. ప్రతి వార్డు, పట్టణాల అవసరాల మేరకు స్థానిక మేనిఫెస్టోను విడుదల చేయాలని, ఎన్నికలకు సంబంధించి కేంద్ర పార్టీ కార్యాలయం ఎప్పటికప్పుడు నివేదిక తెప్పించుకుంటుందని తెలిపారు. ప్రస్తుత స్థాయి నుంచి నివేదికల ప్రకారం టీఆర్ఎస్ పార్టీకి పురపాలక ఎన్నికలలో విజయం తథ్యమన్నారు. ఫలితాల తర్వాత గెలిచిన అందరూ అభ్యర్థులతో మరోసారి సమావేశం అవుతానని స్పష్టం చేశారు. -
కౌంటింగ్ ఏజెంట్లు చివరి వరకూ ఉండాలి
సాక్షి, అమరావతి : కౌంటింగ్ సందర్భంగా ఏజెంట్లు మధ్యలోనే లేచి వచ్చేయకుండా చివరి వరకూ ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి గురువారం ఆయన టీడీపీ అభ్యర్థులు, బూత్ కన్వీనర్లు, సేవామిత్రలతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఎన్నికల్లో కీలక ఘట్టమైన కౌంటింగ్ ప్రక్రియలో అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. చివరిదాకా ఓపిగ్గా ఉండే వారినే ఏజెంట్లుగా పెట్టాలని సూచించారు. కౌంటింగ్‌కు ముందస్తు ప్రిపరేషన్ అతి ముఖ్యాంశమని, ప్రతి నియోజకవర్గానికి కౌంటింగ్ సందర్భంగా ప్రత్యేక బృందాలు ఏర్పడాలని చెప్పారు. గతంలో కౌంటింగ్ అనుభవం ఉన్నవాళ్లనే ఎంపిక చేయాలని, ఒక అడ్వకేట్, ఒక ఐటీ నిపుణుడు బృందంలో ఉండేలా చూసుకోవాలన్నారు. నియోజకవర్గాల వారీగా కౌంటింగ్‌పై వర్క్‌షాప్‌లు నిర్వహించాలని, ఇందుకోసం టీడీ జనార్దన్, సాయిబాబు తదితరులతో రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. -
రేపు అర్ధరాత్రి వరకు విధుల్లోనే..
సాక్షి, హైదరాబాద్: మార్చి నెల ముగిసేందుకు ఇంకా రెండు రోజులే మిగిలి ఉంది. దీంతో వాణిజ్య పన్నుల శాఖ నిర్దేశిత టార్గెట్ పూర్తి కోసం శ్రమిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 31 అర్థరాత్రి వరకు అధికారులు విధులు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో ఆ రోజు పలు బ్యాంకులు తెరిచే ఉండనున్నాయి. బ్యాంకుల్లో జమ చేసిన, ఆన్లైన్లో చెల్లించిన పన్నుల లెక్కలు పూర్తి చేయడానికి ఆదివారం అర్ధరాత్రి వరకు పని చేయనున్నారు. ఇంకా 48 గంటలే మిగిలి ఉండటంతో అధికారులు టార్గెట్‌పై దృష్టి కేంద్రీకరించారు. ఏ డీలర్ రిటర్న్స్ దాఖలు చేయలేదు.. ఎంత బకాయి ఉందనే అంశాలను పరిశీలిస్తున్నారు. నగరంలోని ఏ వాణిజ్య పన్నుల కార్యాలయానికి వెళ్లినా శుక్రవారం ఇదే సీన్ కనిపించింది. ఉన్నతాధికారులు సిబ్బందికి ఎప్పటికప్పుడు యాప్‌ల్లో టార్గెట్లను నిర్దేశిస్తూ పర్యవేక్షిస్తున్నారు. భారీగా పెరగనున్న పన్ను రాబడి... గత ఏడాది కంటే ఈసారి వాణిజ్య పన్నుల రాబడి పెంచడానికి ఉన్నతాధికారులు శ్రమిస్తున్నారు. ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్, కమిషనర్ అనిల్‌కుమార్ ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నారు. ఇప్పటికే ఎంట్రీ టాక్స్ ద్వారా రూ.800 కోట్లు వసూలు అయింది. గత ఏడాది మార్చి నెలలో రూ.923 కోట్లు వసూలు కాగా, ఈ సారి మార్చి నెల 25వ తేదీ నాటికి రూ.1,070 కోట్లు వసూలు అయ్యాయి. మిగిలిన ఆరు రోజుల్లో ఇంకో రూ.300 కోట్లు వసూలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిపై 3 రోజుల క్రితం సోమేశ్‌కుమార్ 1,300 మంది సిబ్బందితో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. -
‘పెథాయ్‌ను సమర్థంగా ఎదుర్కొండి’
సాక్షి, నెల్లూరు : పెథాయ్ తుపాను నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేసేందుకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొవడానికి తగిన చర్యలు చేపట్టడంపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి మున్సిపాలిటీ పరిధిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు ముమ్మరం చేయాలని, ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా కట్టర్లు, జనరేటర్లు, వాటర్ ట్యాంకర్లు, డీజిల్ సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రజలకు ఆహారం అందించడానికి తగిన ఏర్పాట్లు వేగంగా చేయాలన్నారు. తుపాను ప్రభావం కలిగిన గంటల్లోనే సహాయక చర్యలు ప్రజలకు అందాలన్నారు. -
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గించండి!!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాజధాని ప్రాంతంలో 10 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు తగ్గించాలన్నారు. సోమవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి అధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వేసవిలో వడగాడ్పులు పెరిగే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చెరువులు, కాలువలు, జలాశయాల్లో నీటి నిల్వలు పెంచాలని, పచ్చ దనం, తుంపర సేద్యం ద్వారా ఉష్ణోగ్రతలను కొంత మేరకు తగ్గించగలమని చెప్పారు. -
ఎండలపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సోమవారం నీరు- ప్రగతి పథకంపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. నీరు - ప్రగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఎండలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉందన్న ఆయన ఉష్ణోగ్రతలు తగ్గించాలని అధికారులను ఆదేశించారు. మరీ ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గించాలని హుకుం జారీ చేశారు. అయితే చంద్రబాబు ఆదేశాలకు సదరు అధికారులు షాక్‌కు గురయ్యారు. ఎండలను తామెలా తగ్గించాలంటూ సీఎం వ్యాఖ్యలపై అధికారులు విస్మయం చెందారు. -
నిప్పుతో చెలగాటమా అని నిలదీయండి..
సాక్షి, అమరావతి : పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు మంగళవారం ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అవిశ్వాస తీర్మానం చర్చకొచ్చే నేపథ్యంలో ఎలా వ్యవహరించాలనే దానిపై ఎంపీలకు దిశానిర్ధేశం చేశారు. కేంద్రంపై ఎదురుదాడికి దిగాలని ఎంపీలకు సూచించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు తానని, వాళ్లకన్నా ముందుగా తాను సీఎం అయ్యానని గుర్తుచేయాలని చెప్పుకొచ్చారు. గతంలోనే జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పిన తనపై నిందలు వేస్తారా అని నిలదీయండని ఉద్భోదించారు. చిన్న మచ్చ కూడా లేని మా నేతపై మీ దాడి ఏంటని ప్రశ్నించండని కోరారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే ఎదురు దాడి చేయడంపై కేంద్రాన్ని నిలదీయాలని, మనల్ని విమర్శించనంత వరకూ అంశాలవారీగానే ముందుకు పోదామన్నారు. బీజేపీ నేతలు వ్యక్తిగతంగా పోతే మనం కూడా వ్యక్తిగత దాడికి వెనుకాడరాదని సూచించారు. ప్రధానికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నామని, రాజకీయాల్లో హుందాతనం అవసరమని విలువలు వల్లించారు. బీజేపీ నేతలు అప్పుడే మనకు కాంగ్రెస్‌తో పొత్తు అని ప్రచారం చేస్తున్నారని గతంలో ఎన్నడూ లేని విదంగా ఆ పార్టీలో కొత్త సంస్కృతి పుట్టుకొచ్చిందన్నారు. -
ఏపీని ఇబ్బంది పెట్టాలని చూస్తోంది: చంద్రబాబు
అమరావతి : పార్లమెంటు, అసెంబ్లీ పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీపి ఎంపీలు, అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘ అవిశ్వాసం చేపట్టకుండా కేంద్రం పదేపదే కావాలనే వాయిదాలు వేస్తోంది. కేంద్రం ప్రవర్తన కొంతకాలంగా భిన్నంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. రాష్ట్రానికి న్యాయం చేయాలని వారికి ఏ కోశానాలేదు. గతంలో ప్రత్యేక ఆర్ధిక సహాయానికి ఎందుకు ఒప్పుకున్నాం,ఇప్పుడెందుకు హోదాయే కావాలని అడుగుతున్నాం అనే దానిపై ప్రజలకు వివరించాలి. ఎవరికీ హోదా ఇవ్వం అంటేనే అప్పుడు ఆర్ధిక సహాయానికి అంగీకరించాం. తరువాత కేంద్రం మాట తప్పింది. హోదా రాష్ట్రాలకు 90:10 కింద నిధులు, ప్రోత్సాహకాలు కొనసాగిస్తోంది. వేరే రాష్ట్రాలకు ఇచ్చేటట్లయితే మనకూ అదేపేరుతో ఇవ్వాలనేది మన డిమాండ్ ’ అని స్పష్టం చేశారు. కేంద్రం చేస్తున్న అన్యాయంపై ప్రజలకు పూర్తి అవగాహన ఉందని వ్యాఖ్యానించారు. అందుకే టీడీపీకి మద్దతుగా అన్నివర్గాల ప్రజలు ఉన్నారని, తొలి ఏడాది నుంచే గొడవలు పెట్టుకుంటే రాష్ట్రం దెబ్బతింటుందని, అందుకే ఇన్నాళ్లూ ఓపికపట్టామని వివరించారు.రాష్ట్రానికి నిధులివ్వమని కోరితే తనపై కేంద్రం ఎదురుదాడి చేయిస్తోందని మొసలి కన్నీరు పెట్టారు. మూడు పార్టీలు కలిసి తనపై ముప్పేట దాడి చేస్తున్నారని విమర్శించారు. అయినా వెనుకంజ వేసేది ప్రసక్తే లేదని,రాష్ట్ర ప్రయోజనాలపై రాజీపడేది లేదన్నారు. ప్రజలే మాకు కొండంత అండ అని, తనను,లోకేష్‌ను, మంత్రులను, టీడీపీని టార్గెట్ చేస్తున్నారనిఆరోపించారు. కక్ష సాధింపు చర్యలు ఇంకా పెరుగుతాయని, టీడీపీ నాయకులు, కార్యాకర్తలందరూ సిధ్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. -
టీడీపీపై బీజేపీకి అనుమానం
అమరావతి: టీడీపీ ఎంపీలతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో పాటు అసెంబ్లీ వ్యూహ కమిటీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. తిరుపతిలో ఉన్నప్పటికీ ఢిల్లీ పరిణామాలపై సీఎం నిశితదృష్టి సారించారు. సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ప్రజలకోసం పోరాడుతున్నాం. న్యాయం కోసం పోరాడుతున్నాం. మన హక్కుల కోసం పోరాడుతున్నాం. చివరి రోజు వరకు ఇదే స్ఫూర్తితో పోరాడాలి, కలిసికట్టుగా పనిచేయాలి, సంఘటితంగా ఉండాలి. ఆగస్ట్ సంక్షోభంలో 161 మంది ఎమ్మెల్యేలు ఒకేతాటిపై చివరిదాకా నిలిచారు. ఘన విజయం సాధించారు. అదే స్ఫూర్తి ఇప్పుడు ఎంపీలు అందరిలో కనిపించాలి. రాష్ట్రానికి న్యాయం జరిగేవరకు పోరాడాలి. మనకు ఎవరిమీదా కోపం, ద్వేషం లేదు. కేంద్ర పెద్దలు చెప్పిన మాట నిలబెట్టుకోలేదు. పైపెచ్చు అన్యాయం చేశారనే భావన ప్రజల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలు జాతీయ స్థాయి అంశంగా మారాయి’ అని అన్నారు. బీజేపీ మినహా అన్ని పార్టీలు ఏపీ పట్ల సానుభూతిగా ఉన్నాయని, మద్ధతు కూడా ఇస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇది స్ఫూర్తిదాయక సమయమని, ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారు. కొంతకాలంగా టీడీపీపై బీజేపీ అనుమానం పెంచుకుందని అన్నారు. జాతీయ రాజకీయాల పట్ల తనకు ఆసక్తి లేదన్నా వాళ్లు నమ్మడం లేదని తెలిపారు. నాలుగేళ్లు ఎదురుచూశామని, ఆఖరి బడ్జెట్లో కూడా మనకు న్యాయం జరగలేదని, దీనితో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వచ్చిందన్నారు. ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందని వ్యాఖ్యానించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రెస్ మీట్ ప్రజల్లోకి బలంగా వెళ్లిందన్నారు. దేశరక్షణ, సైన్యం నిధులు అడిగామనడం ప్రజల్లో ఆవేశం పెంచిందని తెలిపారు. విభజనతో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కిపోయిందని పేర్కొన్నారు. వృద్ధిరేటులో తెలంగాణ కన్నా 2 శాతం ముందున్నామని, తలసరి ఆదాయంలో రూ.33 వేలు వెనుక ఉన్నామని వెల్లడించారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ అంతర్భాగం కాదా..? ఏపీకి సాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై లేదా..? అని ప్రశ్నించారు. -
గ్రామీణులకు డబ్బు అందించండి
విజయవాడ : గ్రామీణ ప్రజల నగదు అవసరాలను తక్షణమే తీర్చాలని జిల్లా కలెక్టర్ బాబు.ఏ బ్యాంకర్లను, అధికారులను ఆదేశించారు. నగరంలో క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ శనివారం బ్యాంకర్లు, రెవెన్యూ, మండల పరిషత్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాకు రు. 306 కోట్ల నగదు రిజర్వ్‌బ్యాంకు నుంచి సరఫరా అయిందని చెప్పారు. ఈ క్రమంలో ప్రతి బ్రాంచికి రూ. 25లక్షల నగదు సరఫరా చేసి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అవసరాలకు సరిపడా డబ్బు అందించేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను ఆదేశించారు. అన్ని బ్యాంకులలో నగదు అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లాలో బ్యాంకులు, ఏటీఎంల వద్ద ఎక్కడా క్యూలైన్లు కనపడకుండా బ్యాంకు అధికారులు నగదు పంపిణీ చేయాలన్నారు. రు. 500నోట్లను ఏటీఎంలు, బిజినెస్ కరస్పాండెంట్లకు అందిచాలని సూచించారు. పింఛన్లు, ఉపాధిహామీ కూలీల వేతనాలు ఎటువంటి ఆటంకం లేకుండా బిజినెస్ కరస్పాండెంట్లు డబ్బు అందిస్తారని చెప్పారు. బ్యాంకర్లు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆదివారం సెలవుదినంగా భావించకుండా పని చేయాలని ఆదేశించారు. 21, 22 తేదీల్లో సీఎం కాన్ఫరెన్స్ ఈనెల 21, 22 తేదీలలో నగరంలోని వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని చెప్పారు. ఇందుకు సంబంధించి జిల్లాలో లైజన్ ఆఫీసర్లు, ప్రోటోకాల్, సిట్టంగ్ తదితర ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. -
నెల రోజుల్లోనే ఉత్తీర్ణులమయ్యాం..!
- నగదు రహిత రాష్ట్రంపై చంద్రబాబు వ్యాఖ్య - బ్యాంకర్లు, ఆర్థిక శాఖాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ సాక్షి, అమరావతి: పెద్ద నోట్ల రద్దు ప్రకటన తర్వాత నెలరోజులకే రాష్ట్రాన్ని నగదు రహితంగా మార్చడంలో ఉత్తీర్ణులమయ్యామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. భౌతిక నగదు వినియోగం తగ్గించి, డిజిటల్ నగదు వాడకం పెంచడమే ప్రస్తుత సమస్యకు పరిష్కారమని అన్నారు. పెద్దనోట్ల రద్దు సమస్య నేపథ్యంలో ఈ నెల మొదటి వారాన్ని విజయవంతంగా ముగించామని, మిగతా రోజులు కూడా ఇదే స్ఫూర్తితో పని చేసి సమస్యను అధిగమించాలని చెప్పారు. బుధవారం తన నివాసం నుంచి బ్యాంకర్లు, ఆర్థిక శాఖ అధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స నిర్వహించారు. బ్యాంకు కరస్పాండెంట్లు, పంచారుుతీ కార్యదర్శులు ఇంటింటికీ వెళ్లి ప్రజలను డిజిటల్ లిటరసీపై చైతన్య పరిచేలా చూడాలని అధికారులను ఆదేశించారు. -
నోట్ల రద్దుపై బాబు టెలీ కాన్ఫరెన్స్
అమరావతి: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో రాష్ట్రంలో తలెత్తిన పరిస్థితులపై ఏపీ సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. బ్యాంకుల వద్ద షామియానాలు, మంచినీటి వసతి, పోలీసు బందోబస్తుతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. సహకార రంగంలోని సూపర్ బజార్లతో పెద్ద నోట్లను అనుమతించాలని సూచించారు. రైతు బజార్లతో కూడా పెద్ద నోట్లను అనుమతించే విషయమై కేంద్ర ఆర్థిక శాఖ అధికారులతో కలిసి చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. పెద్ద నోట్ల రద్దు వల్ల కలిగే ఇబ్బందులు తాత్కాలికమేనని, దీర్ఘకాలంలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ప్రజలు కూడా సహకరించాలని బాబు కోరారు. నిత్యావసర వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని, ఇందుకోసం వర్తక సంఘాల ప్రతినిధులను ఒప్పించాలని సీఎం సూచించారు. -
విద్యాదానానికి నిధులిచ్చేలా ప్రోత్సహించండి
- టెలీ కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు అమరావతి: సామాజిక బాధ్యత కింద పలు కార్పొరేట్ సంస్థలు దేవాలయాలు, ఆసుపత్రుల్లో అన్న, ప్రాణ దానాలకు నిధులు ఇచ్చేందుకు ముందుకు వస్తున్న నేపథ్యంలో విద్యాదానానికి నిధులు ఇచ్చేలా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. అన్న దానానికి కార్పస్‌ఫండ్ ప్రతి రోజూ పోగయినట్లుగానే విద్యాదానానికి విద్యా సంస్థల్లో పోగయ్యేలా చూడాలన్నారు. గురువారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి ప్రాధమిక, ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ అధికారులు, విశ్వవిద్యాలయ ఉప కులపతులు, ప్రిన్పిపల్స్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రులు గంటా శ్రీనివాసరావు, రావెల కిషోర్‌బాబు, విద్యా శాఖ ఉన్నతాధికారులు ఆదిత్యనాధ్ దాస్, సుమితా దావ్రా, ఉదయలక్ష్మి, సంధ్యారాణి, వల్లీకుమారి, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. విద్యా రంగంలో తాను గతంలో సీఎంగా ఉన్నపుడు చేపట్టిన సంస్కరణల ఫలితంగానే ప్రస్తుతం దేశ, విదేశాల్లో ఐటీ, సాఫ్ట్వేర్, రంగాల్లో ఇంజనీర్లు తమ ప్రతిభ చూపుతున్నారని తెలిపారు. రాష్ట్రాన్ని విజ్ఞాన, విద్యా కేంద్రంగా తయారు చేయటమే లక్ష్యంగా అధికారులు, అధ్యాపకులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. పాఠశాలలు పరిశుభ్రమైన ప్రాంతాలుగా తయారు కావాలని పేర్కొన్నారు. పాఠశాలల్లో ప్రతి నెల మొదటి శనివారం యోగా డే, ప్రతి మూడో శనివారం ఇన్నోవేషన్ డే, నాలుగో శనివారం సామాజిక కార్యక్రమాల్లో విద్యార్ధులు ఉత్సాహంగా పాల్గొనేలా శ్రద్ధ వహించాలని సూచించారు. వైద్య, పారా మెడికల్, ఫార్మసీ విద్యార్ధులతో మల్టీ స్టూడెంట్ డిసిప్లీన్ బృందాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ బృందాలు సంచార వైద్య శాలల్లో గ్రామాల్లో పర్యటించి అనారోగ్య సమస్యలకు కారణాలు విశ్లేషించాలని తెలిపారు. గ్రామీణుల ఆరోగ్యంపై వైద్య, పంట సంజీవిని, జల సంరక్షణపై ఇంజనీరింగ్ విద్యార్ధులు అధ్యయనం చేయాలన్నారు. ప్రతి విద్యార్ధిలో నాయకత్వ లక్షణాలు పెంపొందాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. వివిధ సబ్జెక్టులు, హాజరు, వ్యాయామ విద్యలో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్ధులకు ఉచిత విమాన ప్రయాణ సౌకర్యం కల్పించి విశాఖపట్నం, తిరుపతి, అమరావతి, రాజమండ్రి తదితర నగరాలకు తీసుకెళ్లి వారిలో చదువుపట్ల ఆసక్తి మరింత పెరిగేలా చూడాలని తెలిపారు. డిగ్రీ కళాశాలల్లో ఆరుగురు అధ్యాపకులతో ప్రిన్సిపల్ పర్యవేక్షణలో ఇన్నోవేషన్సెంటర్ ఏర్పాటు చేయాలని, అన్ని కళాశాలల్లో డిజిటల్ లిటరసీ క్లబ్స్ ఏర్పాటు చేయాని వివరించారు. ప్రతి జిల్లాకు ఒకటి లేదా రెండు ఇంక్యుబేషన్ సెంటర్లు నెలకొల్పనున్నట్లు తెలిపారు. వివిధ కళాశాలల నుంచి పేటెంట్ ఇండియాకు 48 దరఖాస్తులు వెళ్లటం పట్ల సీఎం అభినందించారు. ప్రభుత్వ కళాశాలల నుంచి 13 పీహెచ్‌డీలు రావటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. స్వచ్ఛభారత్‌పై విశ్వవిద్యాలయ స్థాయిలో ఉత్తమ కార్యచరణపై పరిశోధనలు జరగాలన్నారు. -
ఎన్ని ఉన్నా.. కూల్చేయాల్సిందే..
► అధికారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశం సాక్షి, సిటీబ్యూరో: నగరంలో అత్యంత ప్రమాదకరంగా ఉన్న శిథిలావస్థలోని భవనాలను వెంటనే కూల్చివేయాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందుకుగాను జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఏసీపీలు స్వయంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. నగరంలో ఎడతెగని వర్షం కురుస్తున్న నేపథ్యంలో బుధవారం రాత్రి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ అంశంలో అశ్రద్ధ వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. శిథిల భవనాల్లో ఉంటున్నవారిని ఖాళీ చేయాల్సిందిగా వారికి నచ్చజెప్పాలన్నారు. డిప్యూటీ కమిషనర్లు పదిశాతం, జోనల్ కమిషనర్లు ఐదు శాతం శిథిలావస్థలోని ఇళ్లను తనిఖీ చేయాలని, ఏసీపీలు నూరు శాతం ఇళ్లు తనిఖీ చేయాలని సూచించారు. ఇతర ఆశ్రయం లేని వారికి తాత్కాలిక షెల్టర్లు ఏర్పాట్లు చేయాలని సూచించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించనున్న ప్రాంతాల్లోని ప్రజలకు వాటి గురించి వివరించి వారిని ఒప్పించాల్సిందిగా జోనల్, డిప్యూటీ కమిషనర్లకు సూచించారు. భవన నిర్మాణ అనుమతులు, సెట్‌బ్యాక్స్ తదితరమైన వాటికి సంబంధించి వచ్చేవారం నుంచి బిల్డర్లు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా సూచించారు. ఎల్ఆర్ఎస్ ఫైళ్లను త్వరితంగా పరిష్కరించాలని సూచించారు. -
‘వనం-మనం’లో భాగస్వాములవుదాం
టెలీ కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు సాక్షి, విజయవాడ బ్యూరో/ హైదరాబాద్: ఈనెల 29న చేపట్టే ‘వనం-మనం’ కార్యక్రమంలో కోటి మొక్కలు నాటడంలో రాష్ట్ర ప్రజలందరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. సోమవారం ఆయన తన నివాసం నుంచి అధికారులు, ప్రజా ప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేయాలన్నారు. సోలార్ ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు జినర్జీ సంస్థ సంసిద్ధత సౌర విద్యుత్ వినియోగంతో తక్కువ ఖర్చులో మంచినీటి శుద్ధి(ఆర్వో) ప్లాంట్లకు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తామంటూ జినర్జీ సంస్థ ప్రతినిధులు సోమవారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి ప్రతిపాదించారు. కాగా, బయోటెక్నాలజీ రంగంలో రాష్ట్రంలో ప్రపంచస్థాయి ఎకో సిస్టం ఏర్పాటుచేయడానికి అమెరికాకు చెందిన ఫ్రాస్ట్ అండ్ సల్వాన్ కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసింది. సీఎంతో భేటీ అనంతరం కంపెనీ గ్లోబల్ అధ్యక్షుడు అనూప్ జుట్షీ ఈ విషయం చెప్పారు. మెట్రోపై సమీక్ష : విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణ వ్యవహారాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. త్వరలో అనుమతి వచ్చే అవకాశం ఉందని ఈలోపు మిగిలిన పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కాగా, మలేషియన్ ఆర్కిటెక్ట్ ఆర్డీ హరీష్ ముఖ్యమంత్రిని కలసి రాజధాని ప్రభుత్వ కాంప్లెక్స్ ఇతర భవనాల డిజైన్లపై చర్చించారు. రాజ్యసభ సభ్యునిగా సుజనా ప్రమాణం న్యూఢిల్లీ: కేంద్రమంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరి సోమవారం రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ తరఫున రెండోసారి రాజ్యసభకు ఆయన ఎన్నికయ్యారు. కాగా, సుజనా తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు.